నిజ క్రైస్తవ జీవితం

రచయిత: యశ్వంత్ కుమార్
చదవడానికి పట్టే సమయం: 6 నిమిషాలు

 నన్ను బలపరచువానియందు నేను సమస్తమూ చేయగలనా? (ఫిలిప్పీ 4:13)

సంపద-సువార్తను ప్రకటించే ఒక దుర్బోధకుడు ఒకసారి ఇలా అన్నాడు - 'నీ కలలు సాకారం చేసుకోవడం సాధ్యమే. ప్రతి అవరోధాన్ని అధిగమించి విజయ పతాకాన్ని ఎగురవేయడం సాధ్యమే. ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమే. నీ గమ్యాన్ని చేరుకోవడం నీకు సాధ్యమే. అది ఎలా సాధ్యపడుతుందో నీకు అర్థం కాకపోవచ్చు కానీ నీ వల్ల అవుతుందనీ, నువ్వు తప్పక విజయం సాధించగలవనీ దేవుడు చెబితే .... నువ్వు తప్పకుండా సాధించగలవు. 'నన్ను బలపరచువానియందు నేను సమస్తమూ చేయగలను' అన్న నినాదంతో ముందుకు సాగిపో!'

ఈ వ్యాసం ద్వారా పాఠకులు ప్రాథమికంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే - ఫిలిప్పీ 4:13కీ, ఆ దుర్బోధకుడు చెప్తున్న వాక్యభావానికీ సంబంధమే లేదు.

అతను చెప్పిన మాటలు చదివినవారికీ, విన్నవారికీ ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న తలెత్తక మానదు. 'క్రీస్తు అనుగ్రహించు బలము చేత నేను సమస్తమూ చేయగలను' అన్న పౌలు మాటలలో 'సమస్తమూ' అన్న పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనం జీవితలక్ష్యంగా పెట్టుకున్న ప్రతిదానిలోనూ విజయం అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చా? ఒకవేళ అదే నిజమైతే క్రైస్తవుడు ఎప్పుడూ ఓడిపోకూడదు. కానీ అలా జరగదు కదా! అందరూ ఓడిపోయే అవకాశం ఉంది. అందరూ ఎప్పుడో అప్పుడు, ఏదో ఒకదాంట్లో ఓటమి పాలయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి?
ఈ వచనానికి ముందున్న వచనాలు పౌలు మాటలలోని సరైన ఉద్దేశ్యాన్ని మనకు స్పష్టం చేస్తాయి.

ఫిలిప్పీ 4:11-13 -
"11. నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు; నేనేస్థితిలో ఉన్నను ఆస్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని యున్నాను.
12. దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును; ప్రతివిషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండియుండుటకును ఆకలిగొనియుండుటకును, సమృద్ధికలిగియుండుటకును లేమిలో ఉండుటకును నేర్చు కొనియున్నాను.

13. నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను."
'సమస్తము' అంటే 'పైన చెప్పబడిన వాటన్నింటిలో' అని అర్థం చేసుకోవాలి. ఎంతో కఠినమైన పరిస్థితులలో సైతం సంతృప్తి కలిగి జీవించులాగున క్రీస్తు శక్తి తనను బలపరించిందని చెప్తున్నాడు. ఈ సందర్భంలో పౌలు ఇహసంబంధమైన జీవిత లక్ష్యాల గురించి మాట్లాడడం లేదు. తన మనసుకి నచ్చినదేదో సాధించడం కోసం, ఇష్టమైనదేదో సంపాదించుకోవడం కోసం క్రీస్తు శక్తి తనను బలపరచింది అని చెప్పడం లేదు. పరిచర్యలో భాగంగా తాను అనుదినం ఎదుర్కుంటున్న కష్టాల గురించి చెప్తున్నాడు.

పౌలు చెరసాలలో ఉన్నప్పుడు ఫిలిప్పీ సంఘ విశ్వాసులకి ఈ పత్రిక రాసాడు. ఆ సంగతులను ఈ పత్రిక ప్రారంభంలోనే ప్రస్తావించాడు.

ఫిలిప్పీ 1:12-14 -
"12. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి యెక్కువగా ప్రబలమగుటకే సమకూడెనని మీరు తెలిసికొనగోరుచున్నాను.
13. ఏలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారి కందరికిని తక్కినవారి కందరికిని స్పష్ట మాయెను.
14. మరియు సహోదరులైన వారిలో ఎక్కువమంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై, నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేషధైర్యము తెచ్చుకొనిరి."

రోమన్ జైలులో బంధీగా ఉన్నప్పుడు సైతం సమస్తమూ చేయునట్లు క్రీస్తు శక్తి తనను బలపరిచిందని పౌలు రాస్తున్నాడు. దైవికంగా అతను పొందుకున్న ఆ బలాన్ని బట్టి, తన బంధకాలను, శ్రమలను ఎంత మాత్రం లెక్కచెయ్యకుండా, వాటి ద్వారా సువార్త ప్రబలిన కారణాన్ని బట్టి సంతోషించగలుగుతున్నాడు.

పౌలు ఎప్పుడూ తనని తాను ఒక ఛాంపియన్ గా చూసుకోలేదు. తన వ్యక్తిగత కోరికలు తృప్తి పరచుకోవడం కోసమూ, తన కలలు సాకారం చేసుకోవడం కోసమూ పరితపించలేదు. సువార్త వ్యాపించి, ప్రబలడంలోనే అతని సంతోషం దాగి ఉంది. దాని కోసం ఎంత కష్టపడడానికైనా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. చెరసాలలో బంధీగా ఉన్నా, స్వేచ్ఛగా బయట తిరుగుతూ ఉన్నా ఒకటే పని, దేవుని పని. సువార్త నిమిత్తం శ్రమలు అనుభవించే విషయంలో పౌలు మనందరికీ ఒక benchmark set చేసాడు అని అనుకోవచ్చు (2 కొరింథీ 11:22-33). ఆ శ్రమలన్నింటినీ తట్టుకునేలా క్రీస్తు శక్తి అతనిని బలపరించింది అని చెప్పి సంతోషిస్తున్నాడు పౌలు.

కాబట్టి ఫిలిప్పీ 4:13 అన్ని సందర్భాలకు వర్తించదని గ్రహించాలి. ఉదాహరణకు నువ్వేదైనా పరీక్ష రాయడానికి వెళ్తూ ఈ వచనాన్ని ఒక వాగ్దానంలాగా ఎత్తిపట్టి ప్రార్థన చేసినంత మాత్రాన నువ్వు అనుకున్నంత ఉత్తీర్ణత సాధిస్తావు అని అనుకోవడానికి వీల్లేదు. అలాగే నువ్వు ఒకవేళ కబడీ పోటీలలో పాల్గొంటూ ఉంటే, ఈ వచనాన్ని ఆధారం చేసుకొని క్రీస్తు శక్తి నిన్ను బలపరచి, నీకు విజయాన్ని అనుగ్రహిస్తుందని అనుకోకూడదు. అటువంటి విజయాలేవీ ఈ వచనం వాగ్దానం చెయ్యడం లేదు. అలాగని ప్రార్థించడం తప్పని కానీ, దేవుడు సహాయం చెయ్యడని కానీ, బలపరచడని కానీ నేను చెప్పడం లేదు. అటువంటి విషయాలకు ఈ వచనం వర్తించదని మాత్రమే చెప్తున్నాను.

సందర్భంలో పౌలు మాటలను సరిగ్గా అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం అని పాఠకులకు ఈ పాటికే స్పష్టం అయ్యుండాలి. తనను బలపరిచే క్రీస్తు తనకు తోడుగా ఉంటే, మరణము పొందునంతగా శ్రమపెట్టబడినా, అన్ని శ్రమలను, ఒడిదుడుకులను తట్టుకొని నిలబడగల సమర్థుడను, బలవంతుడను నేను అని అంటున్నాడు పౌలు.

అలాగే, క్రీస్తు నిమిత్తం, సువార్త నిమిత్తం శ్రమ పడే విషయంలో పౌలు క్రైస్తవులందరికీ మంచి మాదిరిగా ఉన్నాడు. 'క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదకనుద్దేశించు వారందరు హింసపొందుదురు.'(2 తిమోతి 3:12). కాబట్టి హింస ఎదురైనప్పుడు క్రైస్తవుడు ఆశ్చర్యపోకూడదు. ‘నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము’ (ఫిలిప్పీ 1:21). తన బ్రతుకే క్రీస్తని చెప్తున్నాడు పౌలు. ఇటువంటి జీవితాన్ని జీవించే ప్రతి క్రైస్తవుడూ జీవితంలో ఎన్నో కష్టాలనూ, హింసలనూ, అవమానాలనూ ఎదుర్కొంటాడు. వాటన్నిటినీ ‘శ్రమలు’ అని అనవచ్చు. అవి అతని విశ్వాసాన్ని పరీక్షిస్తాయి. అతన్ని ఆత్మీయంగా బలపరుస్తాయి, స్థిరపరుస్తాయి. మనం కూడా పౌలుకు వలె క్రీస్తు నిమిత్తం శ్రమపరచబడిన ప్రతిసారీ ఫిలిప్పీ 4:13 ని హత్తుకొని, క్రీస్తు శక్తిని వాగ్దానం చేసే ఈ వచనాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి, కృపగల దేవుడు అనుగ్రహించే శక్తి చేత, బలము చేత నింపబడగలము.

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.