నిజ క్రైస్తవ జీవితం

రచయిత: పి. శ్రావణ్ కుమార్
చదవడానికి పట్టే సమయం: 10 నిమిషాలు

దేవుడు నమ్మదగినవాడనీ, తన విశ్వాస్యతను తన ప్రజలపట్ల కనబరిచేవాడనీ బైబిల్ మనకి తెలియజేస్తుంది. ఈ అంశం గురించి ఈ వ్యాసంలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. దేవుడు నమ్మదగినవాడని మాత్రమే కాకుండా, తన పట్ల నమ్మకంగా ఉండేవారికి దేవుడు ఏం చేస్తాడో కూడా తెలుసుకుందాం.

1) దేవుడు నమ్మకమైనవాడు/ నమ్మదగినవాడు

నమ్మకత్వం/విశ్వాస్యత అనేది ఒక వ్యక్తి యొక్క స్థితిని తెలియజేస్తుంది. దేవుని యొక్క గుణలక్షణాలలో విశ్వాస్యత అనేది ఒక గుణలక్షణం. దేవుని యొక్క విశ్వాస్యత ఆయన చుట్టూ ఆవరించి ఉంది అని కీర్తనలో మనం చూస్తున్నాం

“యెహోవా, సైన్యములకధిపతివగు దేవా, యెహోవా, నీవంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యతచేత నీవు ఆవరింపబడియున్నావు." కీర్తన 89:8

“అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు (loins) సత్యమును (faithfulness in English bible) నడికట్టుగా ఉండును" యెషయా 11:5

దేవుడు కొంతకాలం నమ్మకంగా ఉండి, తర్వాత మారిపోయేవాడు కాడు. ఆయన ఎల్లప్పుడూ విశ్వాస్యతను చూపించేవాడు

“యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. నీ విశ్వాస్యత తరతరములుండును" కీర్తన 119:89,90

దేవుని విశ్వాస్యత తరతరములు ఉండేది. అది కొంత కాలం ఉండి మరుగైపోయేది కాదు. దేవుడు మారనివాడు, మార్పులేనివాడు గనుక ఆయన విశ్వాస్యత నిత్యమూ నిలిచి ఉంటుంది. అంతమాత్రమే కాకుండా దేవుని విశ్వాస్యత పరిశుద్ధమైనది

“ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు (God of faithfulness and without injustice). ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. " ద్వితీయో 32:4

2) దేవుడు తన విశ్వాస్యతను, ఎవరిపట్ల చూపిస్తాడు?

దేవుడు తన విశ్వాస్యతను అందరి పట్ల చూపిస్తాడు, అయితే ఏ విధంగా చూపిస్తాడో లేఖనము స్పష్టంగా చెప్తుంది

“పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రాహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు (You will show faithfulness to Jacob and steadfast love to Abraham)" మీకా 7:20

దేవుడు తాను ప్రేమించినవారిపట్ల మరియు తనను ప్రేమించినవారిపట్ల తన విశ్వాస్యతను ప్రేమతో, కృపతో మరియు ఆశీర్వాదంతో కనపరుస్తాడు. అదే విధంగా తనను ద్వేషించేవారిపట్ల తీర్పుతో తన విశ్వాస్యతను కనపరుస్తాడు.

“భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు న్యాయమునుబట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును" కీర్తన 96:13

3) దేవుడు తన విశ్వాస్యతను దేనిని బట్టి చూపిస్తాడు

దేవుడు తాను ఇచ్చిన మాటను బట్టి, తాను చేసిన వాగ్ధానాలను బట్టి తన విశ్వాస్యతను చూపిస్తాడు.

“నీ పరిశుద్ధాలయముతట్టు నేను నమస్కారము చేయుచున్నాను నీ నామమంతటికంటె నీవిచ్చిన వాక్యమును నీవు గొప్పచేసియున్నావు. నీ కృపాసత్యములను (your steadfast love and your faithfulness) బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను" కీర్తన 138:2

ఈ విషయం గురించి మనం చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. దేవుడు అబ్రాహామును దీవిస్తాను అని వాగ్దానం చేసాడు, దానిని నెరవేర్చాడు. అలానే ఫరోని నాశనం చేస్తాను అని మోషేతో చెప్పాడు, అదే విధంగా చేసాడు. దీనిని బట్టి, దేవుడు తన మాటకు కట్టుబడి ఉంటాడనీ, తన విశ్వాస్యతను తన మాటను బట్టి తన వాగ్దానాన్ని బట్టి చూపిస్తాడనీ అర్ధమవుతుంది.

4) దేవుడు మనల్ని నమ్మకంగా ఉండాలని ఆదేశించాడు

విశ్వాస్యతను కనబరిచే మన దేవుడు, తన ప్రజలు తన పట్ల విశ్వాస్యత కలిగి ఉండాలని ఆజ్ఞాపించాడు.

“నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును." ద్వితీయో 28:1

“అతని యజమానుడు భళా, నమ్మకమైన (faithful) మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను………. " మత్తయి 25:21

మనం దేవునిపట్ల నమ్మకంగా ఉంటే, దేవుడు మనకి చాలా చేస్తాను అని చెప్పాడు. మనం నమ్మకంగా ఉంటే దేవుడు మనకి ఏమి చేస్తాడో చూద్దాం…!

4a) నమ్మకమైన వారిని ప్రభువు సంరక్షించి కాపాడుతాడు

మొదటిగా, తన పట్ల నమ్మకంగా ఉన్న తన ప్రజల "పాదములు తొట్రిల్లకుండా" వారిని కాపాడతాడు. అయితే దుర్మార్గులకు దేవుడు ఈ కాపుదల దయచేయడు అని కూడా చూస్తున్నాం.

“తన భక్తుల (faithful ones) పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడును దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు బలము చేత ఎవడును జయమునొందడు. " 1 సమూయేలు 2:9

“యెహోవా భక్తులారా, మీరందరు ఆయనను ప్రేమించుడి యెహోవా విశ్వాసులను కాపాడును (preserve) గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతికారము చేయును. " కీర్తన 31:23

తన భక్తులు అని తెలుగులో అనువదించబడిన పదం ఇంగ్లీష్ బైబిల్ లో "faithful ones" అని అనువదించబడింది. అంటే దేవుడు తన భక్తులను లేదా శిష్యులను నమ్మకమైన వారిగా పరిగణిస్తున్నాడు. అలా నమ్మకంగా ఉన్నవారు మాత్రమే ఆయనకు చెందినవారు.

పౌలు రాసిన థెస్సలొనీక పత్రికలో ఇంకొంచెం స్పష్టంగా, దేవుడు తన ప్రజలను (faithful ones) దుష్టత్వము నుండి కాపాడతాడు అని చెప్తున్నాడు.

“అయితే ప్రభువు నమ్మదగినవాడు; ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును" 2 థెస్స 3:3

దేవుడు మనకు భౌతికమైన సంరక్షణతో పాటు, మనల్ని దుష్టత్వం నుండి కాపాడడాన్ని బట్టి మనం పరిశుద్దపరచబడేలా సహాయం చేస్తాడు.

“సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. " 2 థెస్స 5:23

4b) నమ్మకమైన వారికి ప్రభువు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు

దేవుడు తనపట్ల నమ్మకంగా ఉన్నవారికి ప్రతిఫలం అనుగ్రహించేవాడు.

“యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నొందినవానిని చంపనొల్లక పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. " 1 సమూయేలు 26:23

“నమ్మకమైనవానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందకపోడు." సామెతలు 28:20

దేవుడు తనని ప్రేమించి తనపట్ల విశ్వాస్యతను కనబరిచే వారికి ప్రతిఫలం అనుగ్రహిస్తాడు అని ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. నమ్మకంగా తమ పనిని చేసుకునే వారికి అభివృద్ధిని సమృద్ధిని దేవుడు కలుగజేస్తాడు. తన వాక్యానికి నమ్మకంగా కట్టుబడి ఉన్నవారిని దేవుడు హెచ్చిస్తాడు. తాను మనకు అప్పగించిన బాధ్యతలలో నమ్మకంగా ఉంటే మనకు మరిన్ని బాధ్యతలను అప్పగిస్తాడు.

అంత మాత్రమే కాకుండా, అలాంటివారికి జీవకిరీటాన్నీ, పరలోక రాజ్యంలో ప్రవేశాన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు.

“ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను" ప్రకటన 2:10

4c) నమ్మకమైన వారికి ప్రభువు శ్రమలు అనుమతిస్తాడు

ప్రభువు తాను ప్రేమించేవారిని పరిశుద్ధపరిచే క్రమంలో, తన ప్రజలందరినీ మందలిస్తాడు, క్రమశిక్షణ చేస్తాడు, సరిచేస్తాడు. తన గురించిన అవగాహనలో ఎదిగే నిమిత్తం మనకు శ్రమలు అనుమతిస్తాడు. అందుకే దావీదు ఇలా అంటున్నాడు

“యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యతగలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేనెరుగుదును." కీర్తన 119:75

“మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించుచున్నాడు. " హెబ్రీ 12:10

5) దేవుని నమ్మకత్వం మన నమ్మకత్వం మీద ఆధారపడి లేదు

దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తోంది, దేవుని విశ్వాస్యత మానవుని మీద ఆధారపడి లేదు.

“కొందరు అవిశ్వాసులైననేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాకపోవునా? అట్లనరాదు" రోమా 3:3

“మనము నమ్మదగని వారమైనను, ఆయన నమ్మదగినవాడుగా ఉండును; ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు." 2 తిమోతి 2:13

మనం దేవునికి నమ్మకంగా ఉండాలి అని వాక్యం తెలియజేస్తుంది, అయితే మనం నమ్మకంగా ఉన్నాం కాబట్టే దేవుడు కూడా నమ్మకంగా ఉన్నాడు అనుకోవడం పొరపాటు. దేవుని స్వభావమే నమ్మకమైన స్వభావం. ఆయన తన స్వభావానికి వ్యతిరేకంగా ఏదీ చేయలేడు. కొన్ని సార్లు మనం దేవుని పట్ల నమ్మకంగా లేకుండా తర్వాత బాధపడుతూ ఉంటాం, అయితే మనం నమ్మకంగా లేని సమయాలలో కూడా దేవుడు మనతో ఉండి తన నమ్మకత్వాన్ని బట్టి మనల్ని అనేకసార్లు నడిపిస్తుంటాడు.

ఉదాహరణకి, దేవుడు దావీదుతో చేసిన నిబంధన, దావీదు చేసిన పాపాన్ని బట్టి (దావీదు బత్షెబతో చేసిన పాపం) నెరవేరకుండా ఆగిపోలేదు. దేవుడు తన నమ్మకత్వాన్ని దావీదు పట్ల చూపడం మానుకోలేదు. అలానే మనం కూడా (నిజంగా రక్షణ పొందిన వారు) దేవునికి అనేకసార్లు వ్యతిరేకంగా ఉన్నా, దేవుడు తన దీర్ఘశాంతాన్ని బట్టి తన నమ్మకత్వాన్ని చూపిస్తున్నాడు.

దేవుడు ఎలా అయినా తన నమ్మకత్వాన్ని చూపిస్తాడు గనుక, నేను పాపంలో బ్రతికినా, దేవునికి వ్యతిరేకంగా బ్రతికినా పర్లేదు అని అనుకోకూడదు. మన పాపాలకి మనమే దేవుని దగ్గర జవాబుదారులం అవుతాం.

తన స్వభావాన్ని మరియు ఇశ్రాయేలీయుల స్వభావాన్ని గ్రహించిన దానియేలు ఈ విధంగా ప్రార్ధన చేసాడు:

“ప్రభువా, నీవే నీతిమంతుడవు; మేమైతే సిగ్గుచేత ముఖవికారమొందినవారము; మేము నీమీద తిరుగుబాటు చేసితివిు; దానినిబట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి… " దానియేలు 9:7

 ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని విశ్వాస్యతను గుర్తుంచుకోండి. తాను వాగ్దానం చేసిన విషయాల పట్ల ఎప్పుడూ నమ్మకంగా ఉండేవాడు మన దేవుడు. అయితే మనం మాత్రం అనేకసార్లు ఆయనపట్ల నమ్మకంగా లేకుండా, పాపం చేస్తూ, తిరుగుబాటు చేస్తూ, పరిశుద్ధాత్ముని దుఃఖపరుస్తూ ఉన్నాము. పరిశుద్ధంగా ఉండమని పిలుపిచ్చిన దేవుడే, నమ్మకంగా ఉండమని కూడా పిలుపిస్తున్నాడు. మరి నీ పరిస్థితి ఏంటి?

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.