బైబిల్

రచయిత: కె. నరసింహుడు

దేవుడు ఉన్నాడా?
దేవుడు ఉన్నాడు అనడానికి ఈ సృష్టిలో చాలా ప్రాముఖ్యమైన ఆధారాలు ఉన్నాయి.

1. సృష్టి

2. నైతిక విలువలు 

దేవుడు ఉన్నాడు అనడానికి ఇలాంటి ప్రాముఖ్యమైన ఆధారాలు మన కళ్ళముందే కనిపిస్తున్నప్పటికీ కొందరు నాస్తికులుగా తయారయ్యి దేవుడు అనేవాడు లేడని వాదిస్తుంటారు. ఈ గుంపుకు చెందిన వారే మానవుడు కోతి నుండి వచ్చాడని కూడా మభ్యపెడుతుంటారు. అందుకే బైబిల్ గ్రంథం "దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు" (కీర్తనల 14:1) అని వీరిని బుద్ధిహీనులుగా మనకు పరిచయం చేస్తుంది. దేవుడు ఉంటే ఆయన ఎలా ఉన్నాడు? నేను ఎవరు? నన్ను ఎందుకు సృష్టించాడు? మరణం తర్వాత జీవితం ఉందా? మరణం తర్వాత జీవితం ఉంటే అసలు నేను ఎక్కడికి వెళ్తాను? ఇలాంటి మానవాతీతమైన ప్రశ్నలకు జవాబు దొరకాలంటే దేవుణ్ణే అడగాలి. దేవుడేమో కనపడడం లేదు. మరి ఎలా? కాబట్టి దేవుని ఉనికిని తెలుసుకోవడానికి, మన గురించి మనం తెలుసుకోవడానికి, ఆయనతో మాట్లాడటానికి ఆయన ఏదో ఒక గ్రంథాన్ని కచ్చితంగా ఇచ్చి ఉండాలి. అది మానవులకు అర్థమయ్యే విధంగా రాయబడాలి. 

ఆ గ్రంథమే బైబిల్. దేవుడు తన గురించి తెలియచెయ్యడానికి మనిషి ఎవరో అతని గురించి అతనికి బోధించడానికి ఆ మనిషికి ఇచ్చిన ఏకైక గ్రంథం బైబిల్. అందులో ఆయన నేనే దేవుణ్ణి నేను తప్ప వేరొక దేవుడు లేడంటూ తన గురించి స్పష్టంగా ప్రకటించుకున్నాడు. సాధారణంగా మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొందరు హిందువులు మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు ఇంకొక దేవుడు మాకు అవసరం లేదు అంటుంటారు. నా దేవుడే గొప్పవాడు, నాది మాత్రమే గొప్ప మతం అని ప్రకటించకూడదని మనకు సలహాలు కూడా ఇస్తుంటారు. నిజానికి మనం అలా చెప్పడం లేదు.
ఎందుకంటే మనం ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఇంకొక దేవుడు కాదు ఈయనే ఏకైక దేవుడు, నిజమైన దేవుడు. సరిగ్గా ఆలోచిస్తే కొందరు పొరపడుతున్నట్టుగా ప్రాంతానికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు ఉండడు. దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయనే ఈ భూమ్యాకాశాలను సృష్టించాడు‌. ఆయనే బైబిల్ ప్రకటిస్తున్నటువంటి దేవుడు. మన మతమే గొప్ప అని కూడా మనం చెప్పడం లేదు. ఉన్నది ఒకే ఒక్క దేవుడు అయినప్పుడు ఆ దేవుణ్ణి ప్రకటిస్తున్న మతమే ఒకేఒక్క నిజమైన మతం అని చెబుతున్నాము. ఆ దేవుడు బైబిల్ లో తనను తాను బయలుపరచుకున్నాడు.

ప్రపంచంలోని అన్ని పుస్తకాలలో బైబిల్ ప్రత్యేకమైనది మరియు దాని సందేశం మొత్తం 66 పుస్తకాలలో ఏకీకృతం చెయ్యబడింది. ఇది 1,500 సంవత్సరాల వ్యవధిలో గొర్రెల కాపరులు, రాజులు, యాజకులు, పండితులు, మత్స్యకారులు మరియు ప్రవక్తలతో సహా 40 మందికి పైగా విభిన్న రచయితల చేత రాయబడింది. పాత నిబంధన పుస్తకాలు సుమారుగా 1400 BC నుండి 400 BC వరకు రాయబడ్డాయి. కొత్త నిబంధన పుస్తకాలు దాదాపు AD 40 నుండి AD 95  వరకు రాయబడ్డాయి. చరిత్రలో ఎంతో మంది జీవితాలను మార్చిన గ్రంథమే ఈ బైబిల్. 3,658 వేరే ఇతర భాషల్లోకి అనువాదం చెయ్యబడిన గ్రంధం బైబిల్. చరిత్రలో ఇన్ని బాషల్లోకి అనువాదం చెయ్యబడిన గ్రంథం మరోటి లేదు. అదేవిధంగా ప్రపంచంలో ఎంతోమందిని మార్చిన గ్రంథం కూడా బైబిలే. ఉదాహరణకు; ఒక నాస్తికుడు New Hebrides అనే ఐలాండ్ లో ఒక గుంపుదగ్గరకు వెళ్తాడు.‌ అక్కడ అతనికి ఒక వృద్ధుడు బైబిల్ చదువుతూ కనిపిస్తాడు. అతను దానిని చూడగానే ఒకలాంటి అసంతృప్తితో ఈ పుస్తకాన్ని ఇంకా చదువుతున్నారా అని ప్రశ్నిస్తాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ వ్యక్తి మేము ఈ పుస్తకాన్ని చదువుతున్నాము కాబట్టే నువ్వు ఇంకా బ్రతికున్నావు లేదంటే మాకు ఆహారం అయ్యేవాడివని సమాధానం ఇస్తాడు. ఎందుకంటే సుమారు వంద సంవత్సరాల క్రితం నరమాంస భక్షకులైన ఆ గుంపుదగ్గరకు John G Paton అనే మిషనరీ వచ్చి వారిలో మార్పు తీసుకువస్తాడు. ఈవిధంగా బైబిల్ నరమాంసభక్షకులను కూడా మార్చివేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. 24,733 చేవ్రాతప్రతులు ఉన్నటువంటి గ్రంథం కూడా బైబిలే. ఇప్పుడు ఈ గ్రంథం యొక్క ప్రామాణీకరణ (Canonicity) గురించి వివరంగా తెలుసుకుందాం.

బైబిల్ ప్రామాణీకరణ ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది?

ఈ బైబిల్ లో కేవలం 66 పుస్తకాలు మాత్రమే అనగా పాతనిబంధనలో 39 పుస్తకాలు, క్రొత్తనిబంధనలో 27 పుస్తకాలు మాత్రమే ఎందుకు ఉన్నాయి? ఒకటి ఎక్కువగా కాకుండా ఒకటి తక్కువగా కాకుండా ఇలా 66 పుస్తకాలు మాత్రమే ఎందుకు ఉన్నాయి. పోని ఈ సంఖ్య బైబిల్ లో ఎక్కడైనా రాయబడిందా? లేక మనుష్యులు నిర్ణయించారా? లేక దేవుడే నిర్ణయించాడా? ఈ విషయాలన్నీ ఇప్పుడు వరుసగా చూద్దాం.

మొట్టమొదటిగా పాతనిబంధన:
ప్రాముఖ్యంగా ఇందులో యేసుక్రీస్తు ప్రభువు అనగా మెస్సీయా వస్తాడని, పాపుల కోసం ఆయన ప్రాయశ్చిత్తం చేస్తాడనే సందేశం రాయబడింది. పైన తెలియచేసినట్టుగా ఇందులో 39 పుస్తకాలు ఉన్నాయి. ఇది సృష్టి ప్రారంభం నుండి 400 BC వరకూ ఉన్న చరిత్రను తెలియచేయడంతో పాటుగా భవిష్యత్తునంతా ప్రవచిస్తుంది, ఉదాహరణకు మెస్సీయా ఆయన నిత్యరాజ్యం. ఆదికాండము మొదలుకుని మలాకీ వరకూ ఈ విషయాలన్నీ రాయబడ్డాయి. కొత్త నిబంధనతో పోలిస్తే ఈ పాతనిబంధన ప్రామాణికణపై చాలా తక్కువ వివాదం ఉంది. ఈ పాతనిబంధనలో చాలామట్టుకు చరిత్రనే ఉంటుంది. నిజానికి మానవుడు సృష్టించబడిన ప్రారంభంలో రాయడానికి లిపి లేదు. కాబట్టి ఆ కాలంలో ఉన్న దేవుని ప్రజలు నోటి మాటల ద్వారానే ఒక తరం నుండి ఇంకో తరానికి సమాచారాన్ని అందించేవారు. ఆ ప్రారంభంలో మానవుడు దాదాపుగా 1000 సంవత్సరాలు జీవించేవాడు కదా దానికి ఒకానొక కారణం కూడా ఇదే. ఎందుకంటే లిపి కనిపెట్టే సమయానికి ఎక్కువ తరాలు గడచిపోతే ఒక తరం నుండి ఇంకో తరానికి ఆ సమాచారం అందించబడేక్రమంలో అందులో లోపాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. దేవుడు అందుకనే వారు ఎక్కువ సంవత్సరాలు జీవించేలా చేసాడని నేను భావిస్తున్నాను. చూడండి; ఆదాము చనిపోయిన తర్వాత కేవలం 50 సంవత్సరాలకే దేవుడు హనోకును తీసుకొనిపోయాడు. ఆదాము అన్ని సంవత్సరాలు జీవించాడు కాబట్టే సృష్టి ప్రారంభం నుండీ జరిగిందంతా హనోకుకు తెలియచేసాడు.

ఈ విధంగా మోషే తరం వరకు ఆ సమాచారం పితరుల ద్వారా అందించబడుతూ ఉంది. అందుకే ముందునుండే మోషేకు బైబిల్ దేవుడు తెలుసు. ఆ కారణాన్ని బట్టే మోషేకు ఆయన ప్రత్యక్షమై నేను “అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల” దేవుణ్ణి అని పరిచయం చేసుకోగానే అతను సాగిలపడి నమస్కారం చేసాడు. అప్పటినుండి దేవుడు ప్రతి తరంలో కూడా తన వారిని ఏర్పాటు చేసుకుని వారి చేత గ్రంథాలు రాయించే వాడు. మొదట మోషే ద్వారా రాయించాడు తర్వాత చాలామంది ప్రవక్తలు రాసారు. వారు చేసిన అద్బుతాల ద్వారా వారు చెప్పిన ప్రవచనాలు నెరవేర్చడం ద్వారా వారు రాసినవి దైవ ప్రేరేపిత లేఖనాలని దేవుడు ధృవీకరించేవాడు. ఈ పాతనిబంధన మాలకీతో ముగుస్తుంది. యేసు ప్రభువు జన్మించే సమయానికి యూదుల చేతుల్లో ఆదికాండం నుండి మాలకీ వరకూ ఉన్న బైబిల్ వారియొద్ద ఉండేది. వాటిని లేఖనాలుగా ఆయన ధృవీకరించారు. అవే లేఖనాలు 39 పుస్తకాలు కలిగిన పాతనిబంధనగా మన బైబిల్ లో ఉంది.

ఒకానొక సందర్భంలో ఈ సంపూర్ణ పాతనిబంధన లేఖనసముదాయం గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ "ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరువరకు దానినుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను" (మత్తయి 5: 17,18) అని అన్నారు. యేసుక్రీస్తు పరిచర్య చేసిన కాలమంతా పాతనిబంధన లేఖనాలను ఆయన దైవప్రేరిత లేఖనాలని అనేక విధాలుగా ధృవీకరించినట్టు సువార్తల్లో చదువుతాము. పరిసయ్యులు, సద్దుకయ్యులతో ఆయన వాదించినప్పుడు కూడా గ్రంథాల విషయంలో ఎలాంటి బేధాభిప్రాయాన్ని వ్యక్తపరచలేదు. ఇప్పటికీ యూదులు ఆ పాత నిబంధననే కలిగి ఉన్నారు.   

గమనిక: యూదుల బైబిల్ లో మనకు ఉన్నట్టుగా 39 పుస్తకాలు ఉండవు. కారణం ఏంటంటే మనకు సమూయేలు, రాజులు దినవృత్తాంతములు రెండేసి గ్రంథాలుగా ఉంటాయి. కానీ వారికి అవి ఒకటే గ్రంథం. ఆవిధంగా వారి బైబిల్ కూ మన బైబిల్ కూ సంఖ్యాపరంగా వ్యత్యాసం ఉంటుంది కానీ సందేశం మాత్రం ఒకటే. వారి బైబిల్ లో ఉన్న లేఖనాలే మన‌ బైబిల్ లోనూ ఉన్నాయి. ఇందులో ఎలాంటి మార్పూలేదు.

రెండవదిగా క్రొత్త నిబంధన:
పాత నిబంధనలో దేవుడు ఏదైతే వాగ్ధానం చేసాడో అది క్రొత్తనిబంధనలో నెరవేరింది. ఆయన ప్రవచింపచేసినట్టుగా పాపుల కోసం రక్షకుడు వచ్చాడు. ప్రజల పాపాల కోసం ఆయన ప్రాయశ్చిత్తం చేసి, చనిపోయి తిరిగి లేచాడు. పరలోకానికి ఆరోహణం అయ్యాడు. మళ్ళీ తిరిగి వస్తాడు అని కొత్త నిబంధనలో రాయబడింది. దాదాపు 65 సంవత్సరాల చరిత్రను ఈ పుస్తకం తెలియచేస్తుంది. ఇందులో 27 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన ఏవిధంగానైతే ఒక గురి కలిగి, ఒక ఉద్దేశం కలిగి మలాకీ తో ముగించబడిందో అలానే కొత్తనిబంధన కూడా ప్రకటన గ్రంధంతో ముగించబడింది. దేవుడు పాతనిబంధన రాయడానికి ప్రవక్తలని ఏవిధంగానైతే నియమించాడో అలానే 27 పుస్తకాలను రాయడానికి ఆయన అపోస్తలులను నియమించుకున్నాడు. వీరి ద్వారానే బైబిల్ సంపూర్ణం చెయ్యబడింది.

మార్కు 16: 20 వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి.ప్రభువు వారికి సహకారుడై యుండి, వెనువెంట జరుగుచువచ్చిన సూచక క్రియలవలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్.

అపొ.కార్యములు 14:3 ప్రభువు వారిచేత సూచకక్రియలను అద్భుతములను చేయించి, తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను.

ప్రకటన 22: 18-19 ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును; ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల. దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును.

అపోస్తలులు మరియు వారి పర్యవేక్షణలోనే ఈ క్రొత్తనిబంధన పుస్తకాలు రాయబడ్డాయి. ఆ పుస్తకాలను యెరుషలేము నుండి చెదరగొట్టబడిన సంఘంతో సహా మిగిలిన సంఘాలన్నీ చదువుకునేవి.

కొలస్సీ 4:16  ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవొదికయవారి సంఘములోను చదివించుడి; లవొదికయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి.

1 థెస్సలొనీకయులకు 5:27 సహోదరులకందరికిని యీ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువుపేర మీకు ఆనబెట్టుచున్నాను.

అందుకే క్రొత్తనిబంధనగా అవన్నీ సమకూర్చడానికి కొంచెం సమయం పట్టింది. అయితే అప్పటికే కొన్ని నకిలీ పత్రికలు కూడా రాయబడ్డాయి. అందుకే ప్రామాణీకరణ మరింత అవసరం అయ్యింది. ఇంతకూ 27 పుస్తకాలనూ క్రొత్తనిబంధనగా ఎలా ప్రామాణికరించినట్టు? కొందరైతే పరిశుద్ధాత్ముడు మానావాతీత పద్ధతిలో బోధించడం కారణంగా సంఘపెద్దలు అలా చేసారని అంటుంటారు కానీ అది అవాస్తవం. ఈ ప్రామాణికరను వారు పుస్తకం యొక్క
రచయిత అపొస్తలుడా లేదా అపొస్తలుడితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నారా? అపోస్తలుడు జీవించిన కాలంలోనే ఆ పుస్తకం రాసారా? ప్రారంభ సంఘం వాటిని అలానే గుర్తించిందా? అనే కొలమానంతోనే 27 పుస్తకాలనూ క్రొత్తనిబంధనగా నిర్ణయించారు. ఆ 27 పుస్తకాలే;

1. యేసుక్రీస్తు శిష్యుడైన మత్తయి రాసిన సువార్త : 1
2. పేతురు పర్యవేక్షణలో (అపొ.కా 12:11,12, 1 పేతురు 5:13) మార్కు రాసిన మార్కు సువార్త : 1
3. పౌలు పర్యవేక్షణలో లూకా రాసిన లూకా సువార్త మరియు అపో.కార్యాముల గ్రంథం (కొలస్సీ 4:14 , 2 తిమోతీ 4:11 , ఫిలేమోనుకు 1:24 ) : 2
4. యేసుక్రీస్తు శిష్యుడైన యోహాను రాసిన యోహాను సువార్త, మూడు పత్రికలు మరియు ప్రకటన గ్రంథము : 5
5. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలు, వీటిని ప్రభువు శిష్యుడైన పేతురు కూడా లేఖనాలుగా నిర్ధారించాడు (2 పేతురు 3:15-16) : 13
6. తిమోతీ సన్నిహితుడైన ఒకరు రాసిన హెబ్రీ పత్రిక (హెబ్రీ 13:23 ) ఇతను తిమోతీకి సన్నిహితుడంటే పౌలు కూడా సన్నిహితుడైయుంటాడు : 1
7. యేసుక్రీస్తు సహోదరులైన యాకోబు మరియు యూదా రాసిన పత్రికలు : 2
8. పేతురు రాసిన పత్రికలు : 2

గమనించండి. ఈ ప్రామాణికరణ అనేది ఎప్పుడో క్రీస్తుశకం 400లో జరిగింది కాదు. క్రీస్తుశకం 100 నుండి 165 వరకూ జీవించి హతసాక్షిగా మరణించినటువంటి జస్టిన్ గారు ఆ కాలంలోనే మనకు నాలుగే నాలుగు సువార్తలు ఉన్నాయని ప్రస్తావించాడు. రోమాకు చెందిన క్లెమెంట్ (AD 95) ఈ పుస్తకాలలో ఎనిమిదింటిని ప్రస్తావించాడు. యోహాను శిష్యుడైన పోలికార్ప్ (AD 108) 15 పుస్తకాల పేర్లు ప్రస్తావించాడు. హిప్పోలిటస్ (AD 170-235) 22 పుస్తకాలను ప్రస్తావించాడు. అయితే మొదటినుండీ హెబ్రీ పత్రిక, యాకోబు పత్రిక, పేతురు రెండవ పత్రిక, యోహాను రెండు మూడు పత్రికలు నాలుగూ వివాదాస్పదంగా ఉండేవి. ముందుముందు అవి కూడా లేఖనాలే అని ఆధారాలతో నిర్థారణ అయ్యింది.

చివరిగా; బైబిల్ నమ్మ దగినది. ఎందుకంటే:

1. యూదులు మాత్రమే వారి తరాలు జ్ఞాపకం చేసుకుంటూ రాసి వచ్చారు. ఉదాహరణకు; మనకు మన తాతయ్య పేరు తెలుసు మహా ఐతే అతని తాతయ్య పేరు కూడా తెలిసియుండవచ్చు. అంతకుకుందుకు వెళ్తే మనకు ఏమీ తెలియదు. కానీ యూదుల వంశావళి మనం గమనించినప్పుడు ఆదాను నుండి వారి జాతి ఆవిర్భవం, అబ్రాహాము నుండి ప్రతీతరపు వ్యక్తి పేరు కూడా మనకు కనిపిస్తుంది. దేవుడు తన వాక్యాన్ని రాయించడానికి వారిని ఏర్పరచుకున్నాడు కాబట్టే ఇది వారికి సాధ్యమైంది.

2. ఇందులో స్థలాల పేర్లు, ఆ చరిత్రకు సంబంధించిన రాజులు మరియు ప్రముఖ వ్యక్తుల పేర్లు రాయబడ్డాయి. ఉదాహరణకు; లూకా "తిబెరికైసరు ఏలుబడిలో పదునైదవ సంవత్సరమందు యూదయకు పొంతిపిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియ అధిపతిగాను" (లూకా 3:1) అని రాస్తున్నాడు.‌ ఇదేమీ అతను‌ కల్పించి రాస్తున్నది కాదు. వారు ఉన్నారు అనడానికి చరిత్రలో కచ్చితమైన ఆధారాలు మనకు ఉన్నాయి.

3. ముందే చెప్పి నెరవేర్చబడిన అనేకమైన ప్రవచనాలు ఇందులో చూస్తాం. ఉదాహరణకు "కోరెషుతో నా మందకాపరీ, నా చిత్తమంతయు నెరవేర్చువాడా, అని చెప్పువాడను నేనే. యెరూషలేముతోనీవు కట్టబడుదువనియు దేవాలయ మునకు పునాదివేయబడుననియు నేను చెప్పుచున్నాను" (యెషయా 44:28) అనే ప్రవచనాన్ని యెషయా 700 BC లో ప్రవచించాడు. కానీ ఈ కోరేషు 539—530 BC మధ్యకాలంలో పరిపాలించాడు. అంటే సుమారు రెండువందల సంవత్సరాలకు ముందే పేరుతో సహా ఈ కోరేషు కోసం ప్రవచించబడింది. యెషయా 700 BCలో ప్రవచించాడు అనేది వాస్తవం, అలానే కోరేషు 539—530 BC లో పరిపాలించాడు అనేది కూడా వాస్తవం. ఇలాంటి ఆధారాలు మరేగ్రంథంలోనూ మనం చూడలేము. అలాంటివి రాయబడినప్పటికీ అవి రాయబడిన కాలం అదేనని నిరూపించబడలేదు. ఎందుకంటే కొన్ని గ్రంథాలలో జరిగిపోయినాటినే భవిష్యత్తులో జరగబోయేవిగా ప్రస్తావించి ఆ గ్రంథాలు ఎప్పటివో అని చెప్పే ప్రయత్నం కూడా కొందరు చేసారు కానీ దానిని రుజువు చెయ్యలేకపోయారు. అలానే వారి దేవుళ్ళు అవతారాలు ఎత్తబోతున్నట్టుగా కూడా రాసుకుని వారు ఆ అవతారాలు ఎత్తినట్టుగా కూడా రాసుకున్నారు. అవి కూడా చరిత్రపరంగా రుజువు చెయ్యబడలేదు. కానీ బైబిల్ విషయంలో అలా జరగలేదు. బైబిల్ లో ప్రస్తావించినబడిన ప్రతిదీ చరిత్రలో నేరవేరింది.

మన రక్షణకు సరిపోయినది:

లూకా 16: 27-31 అప్పుడతడు - తండ్రీ, ఆలాగైతే నాకయిదుగురు సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను. అందుకు అబ్రాహాము -వారియొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు; వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా అతడు తండ్రివైన అబ్రాహామా, ఆలాగు అనవద్దు; మృతులలోనుండి ఒకడు వారియొద్దకు వెళ్లిన యెడల వారు మారుమనస్సు పొందుదురని చెప్పెను. అందుకతడు మోషేయు ప్రవక్తలును (చెప్పిన మాటలు) వారు విననియెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెననెను."

ఈ సందర్భంలో ధనవంతుడు తన సహోదరుల యొద్దకు లాజరును పంపమన్నప్పుడు అబ్రాహాము అతనితో వారు మోషే మరియు ప్రవక్తల మాటలు (వాక్యం) విని మారుమనస్సు పొందాలని అలా వారి మాటలను బట్టి మారుమనస్సు పొందనివారు (రక్షించబడనివారు) మృతులలో నుండి లాజరు లేవడం ద్వారా అద్భుతం చూసినా నమ్మరని‌ బదులివ్వడం మనం చూస్తాం. ఎందుకంటే యేసుక్రీస్తు మరియు అపోస్తలుల ద్వారా ఎన్నో అద్భుతాలను చూసినవారు కూడా నమ్మి రక్షించబడలేదు. అంటే రక్షణకు వాక్యమే సరిపోయినది. అందుకే "సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి" (యాకోబు 1:21) అని రాయబడింది.

2 తిమోతికి 3:16-17 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.

కాబట్టి విశ్వాసులు ఇతరుల లేక తమ అనుభవాలపై కాకుండా వాక్యంపైనే సంపూర్ణంగా ఆధారపడాలి. దానికి విరుద్ధంగా అనుభవాలపై ఆధారపడే తరం వస్తుందని తెలుసు కాబట్టే పేతురు "మేము ఆ పరిశుద్ధ పర్వతముమీద ఆయనతో కూడ ఉండిన వారమై, ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటె స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు." (2 పేతురు 1:17-19). అంటూ చివరికి వారి అనుభవాల కంటే కూడా వాక్యంపైనే దృష్టి‌ నిలపాలని బోధిస్తున్నాడు. ఉదాహరణకు; ఎవరైనా వ్యక్తికి యేసుక్రీస్తు కలలో కనిపించి ఏదో చెయ్యమన్నాడు అనుకుందాం, అలా చెయ్యవలసిన అవసరం ఇప్పుడు ఆ వ్యక్తికి లేదు, అలా చెయ్యలేదని తీర్పుదినాన దేవుడు లెక్క అడగడు. ఎందుకంటే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే "నేను చెప్పినమాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును" (యోహాను 12:48) అని అంటున్నాడు. అంటే అంత్యదినాన ఆయన మనకు తన వాక్యంలో రాయించిన మాటలను‌ బట్టి తీర్పు తీరుస్తాడు తప్ప కలలో చెప్పిన మాటలను బట్టి కాదు.‌ ఎందుకంటే కలలు అనేవి మన ఊహనుండి పుట్టేవే.

దీనికి మరో ఉదాహరణ చెబుతాను. కొంతకాలం క్రితం నేను హైందవకుటుంబానికి చెందిన మా బంధువులు ఒకామెకు సువార్త ప్రకటించి చర్చికి నడిపించాను. ఒకరోజు ఆమె నాతో ప్రార్థన చేస్తుండగా తనకు యేసుక్రీస్తు కనిపించి ఆశీర్వదించాడని చెప్పింది. అప్పుడు నేను మీరు గతంలో సాయిబాబాను కూడా పూజించేవారు కదా ఆయన కూడా కనిపించేవాడా అని ప్రశ్నిస్తే ఔనని చెప్పింది. అంటే గతంలో ఆమె తన ఊహను బట్టి సాయిబాబాను ఎలా చూసిందో ఇప్పుడు కూడా అలానే‌ యేసుక్రీస్తునూ చూసింది. ఆమె చెబుతుంది అబద్ధం కాదు అలాగని ఆమెకు కనిపించింది యేసుక్రీస్తు కూడా కాదు. మానసికశాస్త్రంలో దీని‌ గురించి చాలా వివరణ ఉంది. ప్రస్తుతం దర్శనాలు కలలు చూసేవారంతా ఈ జాబితాకు‌ చెందినవారే. వారికి దర్శనాలు కలలు వస్తున్నాయి అన్నది నిజమే కానీ అవన్నీ దేవుని నుండి‌ వస్తున్నవి కాదు. కేవలం అవి వారి ఊహకు సంబంధించినవే. కానీ దురదృష్టవశాత్తూ చాలామంది ఇలాంటి అనుభావాలను బట్టి వాక్యంపై కాకుండా వాటిపైనే దృష్టి సారించడం మొదలుపెడుతున్నారు. అందుకే మనం ఊహలపైనో అనుభవాలపైనో కాకుండా సంపూర్ణంగా దేవుని వాక్యంపైనే ఆధారపడాలి. మనకు తీర్పు తీర్చే ఆయన మాటల (వాక్యం)‌‌ పైనే లక్ష్యముంచాలి.

2 పేతురు 1:19 తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దానియందు మీరు లక్ష్యముంచినయెడల మీకు మేలు.

నేటి క్రైస్తవసమాజంలో చాలామంది దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి వాక్యంపై కాకుండా కలలపై దర్శనాలపై ఆధారపడుతున్నారు. అది ఎంత ప్రమాదకరమో తెలుసుకోవడానికి ఈ వ్యాసాలు చదవండి.

దేవుని చిత్తమును కనుగొనుట - పార్ట్ 1

దేవుని చిత్తమును కనుగొనుట - పార్ట్ 2

బైబిల్ ప్రామాణికరణ గురించి మరింత తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

66 పుస్తకాలు మాత్రమే దేవుని వాక్యమా?

దేవుడు లేడని వాదించే నాస్తికులు ప్రస్తావించే డార్విన్ జీవపరిమాణ సిద్ధాంతం ఎంత అసంబంద్ధమో తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం వాస్తవమా లేక ఊహాజనితమా?

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.