సంఘము

రచయిత: పల్లె శాంతిరాజు

 

మీతో ఓ మాట...

క్రీస్తును విశ్వసించి, ఆయనను వెంబడిస్తున్న క్రైస్తవ సమాజానికి వందనాలు. దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘంలో ఎవర్ని సంఘపెద్ద అంటారు? ఆయనను ఎవరు నియమిస్తారు? సంఘపెద్ద, అధ్యక్షుడు, పాస్టర్ ఒక్కరేనా? ఒకవేళ సంఘపెద్ద పాపం చేస్తే, సంఘసభ్యులు ఏం చేయాలి? పాపమందు పట్టబడిన పాస్టర్ గారిని చర్చి సభ్యులు సంఘబహిష్కరణ చేస్తే, సంఘాన్ని ఎవరు నడిపిస్తారు? సంఘంలో ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు పాస్టర్లుగా సేవ చేయడానికి అవకాశముందా? సామాజికంగా పని చేస్తూ ప్రభువు పరిచర్యను కూడా చేయవచ్చా? మొదలైన అంశాలను లేఖనాల వెలుగులో ఈ చిన్ని పుస్తకంలో చర్చించడం జరిగింది. కావున పాఠకులు నేటి క్రైస్తవ ఆచారాలలో కాకుండా దేవుడిచ్చిన లేఖన కాంతిలో చదవగలరు.


ప్రభువా, నీ బిడ్డలకు సత్యాన్ని చూచే కన్నులను దయచేయుము.

1. సంఘపెద్దల నియామకంలో లక్షణాలే ప్రామాణికం

సహజంగా ఏదైనా సంస్థలో ఉద్యోగం చేయాలంటే, అ ఉద్యోగాన్ని అశించే వ్యక్తి యొక్క చదువు, సామర్థ్యాలు, వ్యక్తిత్వ లక్షణాలను ఆ సంస్థ యజమాని పరిశీలిస్తాడు. తన సంస్థలో ఇవ్వబోయే ఉద్యోగాన్ని సదరు వ్యక్తి చేయగలడా లేదా అని ఆలోచించిన తరువాతే ఉద్యోగంలో చేర్చుకుంటాడు. అశాశ్వతమైన సంస్థలో పని చేయాలంటే ఇన్ని రకాలుగా పరిశీలన చేస్తే సర్వశక్తిమంతుడు, మహోన్నతుడైన దేవుని సేవ చేయడానికి ఇష్టపడే వ్యక్తులను దేవుడు పరిశీలించడా?


అరణ్యంలో గొఱ్ఱెలను కాసే దావీదును, మిద్యాను అరణ్యంలో యిత్రో మందను కాయుచున్న మోషేను దేవుడు పరిశీలించాడు. ఆ తరువాతే వారిని తన సేవలోకి పిలిచి, నియమించాడు. “తన దాసుడైన దావీదును కోరుకొని గొఱ్ఱెల వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును,తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థహృదయుడై వారిని పాలించెను కార్యములయందు నేర్పరియై వారిని నడిపించెను” (కీర్తన 78:70-72). (నిర్గ.కా. 3:1-6, ద్వితి.5 34:10-12). ఇలాగు దేవుడు తన భక్తులను ఆయా పరిస్థితులలో వారెలా జీవిస్తున్నారో, వారిలో ఏలాంటి లక్షణాలున్నాయో పరిశీలించిన పిమ్మటే వారికి వివిధ బాధ్యతలను అప్పగించి తన చిత్రాన్ని ఈ భూమిపై కొనసాగిస్తూ వస్తున్నాడు. ఈ విషయాన్ని మనమందరం గుర్తించాలి.


న్యాయాధిపతుల ఎన్నిక: దేవుడు మోషేను ఇశ్రాయేలీయులపై ప్రవక్తగా, వారిని నడిపించే నాయకునిగా నియమించాడు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కొరకు ఆయన వద్దకు వస్తుండేవారు. అతడు వారి సమస్యలు పరిష్కరించడానికి ఉదయం నుండి సాయంకాలం వరకూ వారితోనే గడిపేవాడు. ఎందుకంటే, అప్పటి ప్రజలు 6 లక్షల మంది. మోషే మామయైన యిత్రో తనతో ఇలా అన్నాడు - "నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి, వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలువలెను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి, లంచగొండులు కాని మనుష్యులను ఏర్పరచుకొని, వేయిమందికి ఒకనిగాను, నూరుమందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పదిమందికి ఒకనిగాను, వారిమీద న్యాయాధిపతులను నియమింపవలెను. దేవుడు ఈలాగు చేయుటకు నీకు సెలవిచ్చినయెడల నీవు ఈ పని చేయుము...” (నిర్గ.కా 18:20-23). యిత్రో చెప్పినట్లు చేయటానికి దేవుడు మోషేకు అనుమతించాడు (సంఖ్య.కా 11:16, ద్వితి.కా 1:11-18). కాగా సామర్థ్యత, దైవభక్తి, సత్యాసక్తి కలిగివుండి, లంచం పుచ్చుకోని లక్షణాలున్న ఆయా గోత్రాలకు సంబంధించినవారిని మోషే నియమించాడు.


భోజన పరిచర్య కొరకు ఏడుగురి ఎన్నిక: సంఘంలో విధవరాండ్రను చిన్నచూపు చూశారనే సమస్య వచ్చినప్పుడు, అపొస్తలులు "... సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతము” (అపొ.కా 6:2-3). సంఘంలో భోజనాన్ని పంచిపెట్టే సేవ చేసే వ్యక్తులకు ఉండాల్సిన అర్హతలు -  ఆత్మతో, జ్ఞానంతో నిండుకుని, మంచి సాక్ష్యం కలిగి ఉండటం.

సంఘంలో పరిచారకులకు ఉండాల్సిన అర్హతలు : “...సంఘ పరిచారకులు గౌరవింపదగినవారై ఉండాలి. నీతిపరులై ఉండాలి. త్రాగుబోతులు కాకూడదు. మోసాలు చేసి లాభాలు పొందేవాళ్ళు కాకూడదు. దేవుడు చెప్పిన సత్యాలను వాళ్ళు పవిత్ర హృదయంతో ఆచరించాలి. వాళ్ళు మొదట పరీక్షింపబడాలి. ఆ తర్వాత ఎవ్వరికీ ఏ ఆక్షేపణ లేనట్లయితే వాళ్ళను పరిచారకులుగా ఎన్నుకోవచ్చు. అదే విధంగా పరిచర్య చేసే స్త్రీలు కూడా గౌరవింపదగినవారై ఉండాలి. వాళ్ళు యితరులను నిందిస్తూ మాట్లాడరాదు. అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. నమ్మదగినవారై ఉండాలి. పరిచారకుడు కూడా ఏకపత్నీవ్రతుడై ఉండాలి. తన పిల్లల్ని, కుటుంబాన్ని సక్రమంగా నడపాలి (1తిమోతి 3:8-12). (వరల్డ్ బైబిల్ ట్రాన్స్ లేషన్ సెంటర్ వారి ఈజీ టూ రీడ్ వర్షన్ తెలుగు మాధ్యమ బైబిల్). పై లేఖనాలలో పేర్కొనబడిన స్త్రీలు పరిచారకుల భార్యలు కావొచ్చు లేక పరిచారకులకు సహకరించే సహాయకులై ఉండొచ్చు.

> మోషే కాలంలో ప్రజలపై న్యాయాధిపతులగా ఉండి సేవ చేయాలకునే వ్యక్తులకు దైవభక్తి, సత్యాసక్తి కలిగి వుండి, లంచం పుచ్చుకోని లక్షణాలు అవసరమైనాయి.

> ఆదిమ అపొస్తలుల కాలంలో భోజనం పంచి పెట్టే పరిచర్య చేయడానికి వ్యక్తులకు ఆత్మతో, జ్ఞానంతో నిండుకుని, మంచి సాక్ష్య జీవితమనే లక్షణాలే ప్రాముఖ్యమైనాయి.

> సంఘంలో పరిచారకులగా ఉండి సేవ చేయాడానికి 1తిమోతి 3:8-12 వచనాలలో పేర్కొనబడిన లక్షణాలు తప్పనిసరి అయినప్పుడు...

దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘంపై పెద్దగా వుండి సేవ చేయాలనే వ్యక్తులకు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ద్వారా వ్రాయబడిన 1తిమోతి 3:1-7, తీతు 1:6-9 లేఖనాలలో పేర్కొనబడిన లక్షణాలు తప్పనిసరిగా ఉండాల్సిందే కదా! సంఘపెద్ద (నాయకుని) పరిచర్య చేయటానికి వాక్యంలో సూచించబడిన లక్షణాలే అత్యంత ప్రామాణికమై ఉన్నాయి.

1

2. సంఘపెద్దలకు ఉండాల్సిన లక్షణాలు

అపొస్తులుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తిమోతికి, తీతుకు వ్రాసిన పత్రికల్లో సంఘపెద్దలను నియమించుటకుగాను వారికుండాల్సిన లక్షణాలను క్రింది విధంగా తెలియజేసాడు.


“ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్నీ పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధిగలవాడును, మర్యాదస్థుడును, అతిథి ప్రియుడును, బోధింపతగినవాడునైయుండి మద్యపానియు కొట్టువాడును కాక, సాత్వికుడును, జగడమాడనివాడును, ధనాపేక్షలేనివాడునై, సంపూర్ణ  మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు, తన యింటివారిని బాగుగా ఏలువాడునై యుండవలెను. ఎవడైనను తన యింటివారిని ఏలనేరక పోయినయెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరినవాడై యుండకూడదు. మరియు అతడు నిందలపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారిచేత మంచి సాక్ష్యము పొందినవాడై యుండవలెను” (1తిమోతి 3:1-7).


“ఎవడైనను నిందారహితుడును, ఏకపత్నీ పురుషుడును, దుర్వ్యాపార విషయము నేరము మోప బడనివారై అవిధేయులుకాక విశ్వాసులైన పిల్లలుగలవాడునైయున్నయెడల అట్టివానిని పెద్దగా నియమింప వచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహనిర్వాహకునివలె నిందరహితుడై యుండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్గాభము అపేక్షించువాడును కాక, అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధిగలవాడును, నీతిమంతుడును, ప్రవిత్రుడును, ఆశా నిగ్రహముగలవాడునైయుండి, తాను హిత బోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడువారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై యుండవలెను” (తీతు 1:6-9).

ప్రభువు అమూల్యమైన రక్తమిచ్చి కొన్న తన సంఘంపై నాయకులుగా ఉండి పాలన చేసే వ్యక్తులకు లేఖనాలలో సూచించబడిన లక్షణాలే ప్రమాణికం. ఇట్టి లక్షణాలు సంఘాలలో ఎవరిలోనైతే ఉంటాయో వారినే నాయకులుగా నియమించాలని అపొస్తలుడైన పౌలు తిమోతికి, తీతుకు తెలియజేశాడు. ఈ క్రమంలో వారు సంఘంలో ఎవరికి ఈ లక్షణాలున్నాయో లేవో అని పరిశీలన చేసిన పిమ్మటనే నాయకుల నియామకం జరిగివుంటుంది. ఆ లక్షణాలే నేటి సంఘ పెద్దల నియమానికి శిరోధారమై ఉన్నాయి.


లక్షణాల వివరణ

1. నిందారహితుడు: ప్రభువైన యేసుపై నేరాలు అరోపించబడ్డాయి. పిలాతు ప్రభువును సుదీర్ఘంగా విచారించి, “ఈ మనుష్యునియందు నాకు ఏ నేరమును కనబడలేదని” (లూకా 23:4) చెప్పాడు. సంఘ నాయకత్వాన్ని ఆశించే వ్యక్తిపై ఏమైనా ఆరోపణలు ఉంటే, వాటి విషయంలో ఆ వ్యక్తి తప్పు చేశాడా? లేదా? అని విచారించాల్సిన అవసరం సంఘానికి ఉంటుంది.

2. ఏకపత్నీ పురుషుడు: నాటి దినాల్లో ఒక వ్యక్తికి బహుభార్యలు ఉండేవారని సామాజికవేత్తల అభిప్రాయం. అయితే సంఘపెద్దగా వుండే వ్యక్తి, భార్య బ్రతికి ఉండగానే మరో స్త్రీని వివాహం చేసుకోకూడదు. ఒకవేళ భార్య మరణిస్తే, మరో క్రైస్తవ స్త్రీని వివాహమాడడం పాపం కాదు (1కొరింథీ 7:39). 

నేటి దినాలలో కొందరు - దావీదు బెత్షెబాతో లైంగికంగా కలిశాడు కదా, సొలొమోను చాలామంది స్త్రీలను వివాహమడాడు కదా, కాబట్టి ఇతర స్త్రీలతో లైంగిక సంబంధాలు కలిగుంటే అది పెద్ద తప్పే కాదని చెప్పడం సిగ్గుచేటు. పాపం చేయకుండా బుద్ధి కలిగి జీవించటానికి ఇవ్వబడిన లేఖనాలను వీరు వక్రీకరించి, పాపం చేయడానికి వాక్యాలనే లైసెన్సుగా వినియోగించుకోవడం దౌర్భాగ్యం. ఇలాంటి ధోరణి వల్ల సంఘంలోని ప్రజలు పాపం చేయటానికి పురికొల్పబడి వ్యభిచారం, జారత్వం చేయడానికి ప్రేరేపించబడతారు. తద్వార సంఘం లైంగిక పాపంతో నింపబడుతుంది. అయితే పరిశుద్ధుడైన దేవుడు, తన సంఘాన్ని నడిపించే నాయకుడు ఏకపత్నిపురుషుడై ఉండాలని నిక్కచ్చిగా లేఖనాలలో వ్రాయించాడు.


ఆలోచించండి: అపోస్తులుడైన పౌలుగారికి దావీదు, సొలొమోను, సమ్సోనుల జీవితాలను గూర్చి తెలియదా? వారు ఇతర స్త్రీలతో వ్యవహరించినట్లు సంఘనాయకుడు ఇతర స్త్రీలతో ప్రవర్తిస్తే తప్పే కాదని ఎందుకు వ్రాయలేదు? సంఘ నాయకులుగా వుండి సేవ చేయడానికి ఇష్టపడేవారు ఏకపత్నిపురుషుడై ఉండాలని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఎందుకని వ్రాశాడు? నాటి ఆదిమ అపొస్తలుల ద్వారా పవిత్రుడైన దేవుడు సంఘానికి నేర్పించిన విషయాలకు విరుద్ధమైన అంశాలను కొందరు నేటి సంఘనాయకత్వంలోకి తీసుకుని రావడం అత్యంత హేయమైన చర్య.

నేటి రోజుల్లో నైతిక విలువలు లేకుండా విచ్చలవిడిగా జీవిస్తూ కొందరు దేవుని సంఘాన్ని కాసే పాస్టర్ హోదాలో కొనసాగడం హృదయాన్ని కలిచి వేస్తుంది. “ఎవడైనను దేవుని సంఘమును పాడుచేసిన యెడల దేవుడతనిని పాడుచేయును” (1కొరింథీ 3:17). న్యాయవంతుడైన దేవుడు కన్నులు, చెవులు మూసుకొని లేడు; ఇలాంటివారి ఫలము వారికివ్వటానికై సిద్ధముగా ఉన్నాడు. “చెవులను కలుగచేసినవాడు వినకుండునా? కంటిని నిర్మించినవాడు కానకుండునా?” “ప్రభువా, మనుష్యులకందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు” (కీర్తన 94:9,62:12).

వ్యభిచారం తప్పేకాదని బోధించే వారి కొరకు మాత్రమే...

- వ్యభిచారం, జారత్వం తప్పు కాదని భావించే సంఘనాయకుని సతీమణి ఒకవేళ ఇతరులతో తప్పులు చేస్తే - శభాష్, చాలా మంచి పని చేస్తున్నావని నాయకుడు సమర్థిస్తాడా?

- ఇలానే జీవించాలి, అప్పుడే దేవుని పవిత్ర నామానికి మహిమ కలుగుతుందని నాయకుడు చెప్పగలడా? వెంటనే నాయకుడు తన భార్యకు విడాకులివ్వాలని అనుకుంటాడు కదా!

- సంఘపెద్ద ప్రభువు సంఘాన్ని వ్యభిచారపాపముతో నింపితే, దేవుడు ఆయన శరీరాన్ని శిక్షించటానికి సాతానుకు అప్పగిస్తాడు (1కొరింథీ 5:4-5).

- సంఘపెద్ద కుమార్తె ఒకవేళ వేరొక పురుషుడితో తప్పు చేస్తే, ఎంతో కోపముతో ఆ కుమార్తెను శిక్షించి, అవసరమైతే బయటికి వెళ్ళగొట్టటానికి ప్రయత్నిస్తాడు. అలాంటిది, నాయకుడు ఇతరులతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తే ప్రభువు, అతన్ని తన సంఘంలో నుండి బయటికి త్రోసివేయడా?

- సంఘపెద్ద కుటుంబ సభ్యులు తప్పులు చేస్తే ఒక న్యాయం, దేవుని కుటుంబమైన సంఘసభ్యులతో నాయకుడు తప్పులు చేస్తే మరో న్యాయమా?

3. మితానుభవుడు: మితానుభవుడు అంటే? ఈ.ఎస్.వీ ఆంగ్ల బైబిల్ లో SOBER - MINDED అని వ్రాయబడింది. ఈ పదానికి అర్థం - తెలివి కలిగినవాడు, వివేకశాలి అనే అర్థాలున్నాయి. ఏదైనా సంస్థను నడిపించాలంటే తెలివి, వివేకం అవసం. అలాంటిది ప్రభువుసంఘాన్ని వాక్యక్రమంలో నడిపించాలంటే తెలివి, వివేకం మరెంతో అవసరం కదా! సొలొమోను దేవునికి ఇలా ప్రార్థించాడు - "ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడైన నాకు వివేకముగల హృదయము దయచేయుము. సొలొమోను చేసిన యీ మనవి ప్రభువుకు అనుకూలమాయెను” (1రాజులు 3:9-10).

4. స్వస్థబుద్ధిగలవాడు: స్వస్థబుద్ధి అంటే? ఆంగ్ల బైబిల్ లో SELF CONTROLLED అని వ్రాయబడి ఉంది. ఈ పదానికి అర్థం - ఇంద్రియనిగ్రహం. నాయకుడు తన ఇంద్రియాలను (కళ్లు, చెవులు, ముక్కు, నోరు, చర్మమును) మాత్రమే కాకుండా తన హృదయాన్ని పవిత్రతతో ఉంచుకోవాల్సినవాడై ఉండాలి. పాపంతో నిండిన ఈ లోకంలో సంఘనాయకుడు పాపం చేయకుండా ప్రభువును పోలి జీవించాల్సి వుంది. అప్పుడే ఆయన సంఘానికి మంచి మాదిరికరంగా జీవించగలడు. అందుకుగాను ఆయన స్వస్థబుద్ధితో ఉండాలి.

5. మర్యాదస్థుడు: వివిధ సామాజిక నేపథ్యాలలో నుండి క్రీస్తును అంగీకరించినవారు సంఘంలో ఉంటారు. అందర్నీ గౌరవిస్తూ, మర్యాదతో వ్యవహరించాలి.

6. అతిథిప్రియుడు: తల్లి కడుపు చూస్తుందనేది సామెత. సంఘపెద్దకు క్రీస్తులాంటి మనసు ఉన్నప్పుడే సంఘసభ్యులకు ఆతిథ్యం చెయ్యగలడు.

నేటి సంఘపెద్దలలో కొందరు క్రీస్తుబిడ్డలకు ఆతిథ్యం చేయాలనే ఆలోచన ఉండదు. కాని సంఘసభ్యులచే మంచి ఆతిథ్యం స్వీకరించాలనే ఆశ ఉంటుంది. ఈ సందర్భంలో... గౌరవనీయులైన నాయకులు స్వపరీక్ష చేసుకోవడం మంచిదేమో! “పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి” (రోమా 12:13). "సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయమరవకుడి...” (హెబ్రీ 13:1). ఈ వచనాలు మొదటగా సంఘనాయకుడు పాటించాలి. అప్పుడే సంఘసభ్యులకు మంచి మాదిరిని చూపగలడు.

7. బోధించడం: జన్మించిన శిశువులకు పాలు పట్టించడం వారి ఎదుగుదలకు కారణమైనట్లే సంఘాన్ని నడిపించే నాయకుడు వాక్యమనే పాలను, బలమైన ఆహారాన్ని సంఘసభ్యులకు అందించాలి. అనగా బోధించాలి. సంఘపెద్ద అనే వ్యక్తి దేవుని వాక్యాన్ని చదువుతూ, పరిశీలిస్తూ, ధ్యానించడం వల్ల వ్యక్తిగతంగా తాను వాక్యంతో నింపబడతాడు. తద్వారా అతడు సంఘాన్ని వాక్యంతో పోషించగలడు. “తాను హితబోధ (ఆరోగ్యకరమైన బోధ) విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడువారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై యుండవలెను” (తీతు 1:9). లేనట్లయితే సంఘం వాక్యాహారం లేక మరణావస్థలోకి వెళుతుంది. క్రూరమైన తోడేళ్ళు సంఘంలోకి చొరబడి క్రీస్తు గొఱ్ఱెలనే విశ్వాసులకు అబద్ధబోధలు చేసి, మోసం చేస్తూ తమవైపుకు త్రిప్పుకుంటారు. కాబట్టి నాయకుడు దైవవాక్యాన్ని సరిగా బోధించాలి. ఒకవేళ బోధించే సామర్థ్యం లేని వ్యక్తి సంఘపెద్ద పదవి ఆశించవద్దు.

8. మద్యపానం చెయ్యనివాడు: మద్యాన్ని నిషేధించాలని స్త్రీ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో పోరాటాలు చేశారు. నేటికి అక్కడక్కడా చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే, మద్యం మత్తులో వున్న వ్యక్తి నీచమైన కార్యాలు చేయటానికి పూనుకుంటాడు. అవి దొంగతనాలు, వ్యభిచారం, నరహత్య, నెలకు వచ్చే జీతాన్ని రెండు, మూడు రోజుల్లోనే ఖర్చు చేయడం, పైగా అప్పులు చేస్తూ కుటుంబాన్ని అర్థికంగా నష్టపర్చడం, మత్తులో కుటుంబ సభ్యులతో నిత్యం గొడవలు పెట్టుకోవడం. అందుకే పెద్దగా ఉండాలనుకునే వ్యక్తి మద్యాన్ని సేవించరాదు. అతడే మద్యాన్ని సేవిస్తే, సంఘంలోని విశ్వాసులు కూడా మద్యాన్ని సేవించటానికి ప్రోత్సహింపబడతారు.

9. సాత్వికుడు: సంఘాన్ని నడిపించే నాయకునికుండాల్సిన లక్షణాలలో ఒకటి సాత్వికం. ప్రభువు చెప్పాడు - "సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు” (మత్తయి 5:5). సంఘపాలన చేయడమంటే కేవలం పాటలు పాడడం, సభలు పెట్టడం మొదలైన కార్యక్రమాలు చేయడం మాత్రమే కాదు. కొన్నిసార్లు సంఘసభ్యులలో కొందరు నాయకుడిపై తిరుగుబాటు చేసే అవకాశముండొచ్చు లేదా సమాజం నుండైనా విషమపరిస్థితులను నాయకుడు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఆ సమయంలో సంఘపెద్దగా వుండే వ్యక్తి దేవుని ఎదుట సాత్వికంతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ విషయంలో మంచి మాదిరి భక్తుడైన మోషే. ఆయనపై ఇశ్రాయేలీయులు పలుమార్లు సణిగినప్పుడు ఆయన సాత్వికం వహించగా దేవుడు మోషే పక్షంగా ప్రజలతో వాజ్యమాడాడు.

10. జగడమాడనివాడు: సంఘంలోవున్న వ్యక్తులలో కొందరు విశాల దృక్పథం కలిగినవారైతే,  ఇంకొందరు సంకుచితంగా ఆలోచించేవారు. కాబట్టి సంఘంలో అభిప్రాయబేధాలు, సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. ఆ క్రమంలో, సంఘనాయకుడినే దోషిగా భావించే పరిస్థితులేర్పడొచ్చు. అలాంటప్పుడు సంఘపెద్దగా వుండే వ్యక్తి ఇతరులతో జగడం అడరాదు. నాయకుడనేవానిలో ప్రతి చిన్న విషయానికి జగడాలు పెట్టుకునే స్వభావముంటే, అతను సంఘపెద్దగా ఉండకపోవడమే మంచిదేమో! లేదంటే సంఘసహవాసం జగడాల సహవాసంగా మారుతుంది.

11. ధనాపేక్షలేనివాడు: లేఖనం చెబుతుంది - 'ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను హాని కరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి" (1తిమో 6:9-10). బిలాము, అకాను, గేహః, ఇస్కారియోతు యూదా మొదలగువారు బహుమానాలు, ధనం, వస్తువులపై అధిక వాంఛ కలిగి వక్రమార్గంలో నడిచి, ఎంతో నష్టపోయారు.

ప్రియులారా, గడిచిన సం||రాలలో క్రైస్తవ సమాజంలోకి ఒక స్కీమ్ వచ్చింది. ఆ స్కీమ్ లో పనిచేసే సిబ్బంది సంఘాలను నడిపించే నాయకులకు మంచి ఆఫర్స్ ఇచ్చారు. ఎట్లనగా, సంఘంలో ఒక సభ్యుడు 10,000 రూ||లు చెల్లిస్తే, ఫలితంగా ప్రతినెల కొంత డబ్బులు తిరిగి వస్తూనే ఉంటాయని నమ్మబలికారు. ఈ మాటలను ఏమాత్రం వివేచించలేని నేటి సంఘ పెద్దలలో అనేకులు తమ సంఘాలలోని క్రీస్తు బిడ్డల (విశ్వాసుల) చేత 10,000 రూ||లు కట్టించారు. వారినే కాకుండా క్రీస్తును ఎరుగని అన్యులచేత కూడా డబ్బులను కట్టించడం జరిగింది. అయితే అతికొద్ది కాలంలోనే కోట్ల రూపాయలను సమకూర్చుకున్న ఆ స్కీమ్ సంస్థ త్వరలోనే మూతపడింది. ఈ విషయం ఈ నోట ఆ నోట పడగానే 10,000 రూ||లు కట్టిన సంఘ సభ్యులు, క్రైస్తవేతరులు అందరు కలిసి సంఘ పెద్దల (పాస్టర్స్)ను తమ డబ్బులు తమకు ఇవ్వాల్సిందిగా నిలదీశారు. అప్పుడు సంఘ పెద్దలు చేసేదేమి లేక మేమూ మోసపోయామని చెప్పిన సందర్భంలో... జరిగిన తీవ్రమైన పరిణామాల వల్ల కొందరు సంఘ పెద్దలు తమ సాక్ష్యాన్ని కోల్పోయి, క్రైస్తవుల దృష్టిలో, సమాజంలోను మోసగాళ్ళు అనే ముద్ర వేయబడినారు. తరువాత దేవుని సేవను, చివరికి వారి సొంత గ్రామాలను, ప్రాంతాలను విడిచి మరో ప్రాంతాలకు వలస పోవాల్సి వచ్చింది. ఇలాంటి సంఘటనలు నేడు సంఘ పెద్ద హోదాను ఆశించేవారికి దృష్టాంతములుగా ఉన్నాయి.

12. తన ఇంటిని సరిగా ఏలువాడై ఉండాలి: ఆత్మీయతలో కుటుంబం... సంఘంలో పెద్దగా వుండే వ్యక్తి మొట్ట మొదటగా తన కుటుంబాన్ని సరిగా ఏలువాడై ఉండాలి. కుటుంబ సభ్యులలో ఎవరైన దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే, వారి నిమిత్తం దైవ సన్నిధిలో ప్రార్థించాలి. వారు మరలా పాపం చేయకుండునట్లు ప్రేమతో   హెచ్చరించాలి. ముఖ్యంగా తన పిల్లలు దేవుని మార్గంలో నడుచునట్లు కుటుంబ యాజమానుడైన తండ్రి వారిని వాక్య బోధలో పెంచుతూ, క్రమశిక్షణ చేయాలి. మొదటగా తాను వ్యక్తిగతంగా వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, మంచి మాదిరిని కుటుంబ సభ్యులకు కనుపరచాలి. ఇశ్రాయేలీయులను నడిపించిన నాయకుడైన యెహోషువ - "...మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను" (యెహోషువ 24:15). కావున నాయకత్వం కోరే వ్యక్తికి తన కుటుంబ సభ్యులు ప్రభువునుబట్టి లోబడాలి.

నాయకునిగా ఉండాలనుకునే వ్యక్తి తన కుటుంబాన్ని ప్రేమించాలి. ప్రేమించలేనట్లయితే సంఘాన్ని ఎలా ప్రేమించగలడు?

భౌతిక అవసరతలలో కుటుంబం... నాయకుడు తన కుటుంబ సభ్యుల అవసరతలను గుర్తించి, వారికి కావాల్సినవి సమకూర్చువాడై ఉండాలి. వాస్తవంగా నేటి దినాలలో కుటుంబం పోషించబడాలంటే? ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. తన కుటుంబ అవసరతలు తీర్చుబడుటకై సంఘ విశ్వాసులతో మీరు దేవునికి కానుకలు ఇవ్వాలని వారిపై అధిక ఒత్తిడిని తీసుకొని రావడం సంఘ పెద్దకు తగదేమో! పనివాడు జీతానికి పాత్రుడే అని చెప్పిన లేఖనాలు ఈ విషయాన్ని కూడా చెబుతున్నాయి - “అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించి వారితో మాట్లాడుతూ ... ఎవని వెండినైనను, బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియును. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు - పుచ్చుకొనుట కంటె ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసికొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను” (అపొ.కా 20:17, 33-35). ఈ లేఖనాలను అనుసరించి... 

పౌలు పిలిపించింది ఎవరిని? 
సంఘ పెద్దలను.

పౌలు ప్రజల నుండి ఆశించలేనివి ఏమిటి?
వెండి, బంగారము, వస్త్రములను.

పౌలు తన అవసరముల నిమిత్తం ఏం చేశాడు?
తన స్వంత చేతులతో కష్టపడినాడు.

పౌలు - పుచ్చుకొనుకంటే ఇచ్చుట ధన్యమని ఎవరికి చెప్పాడు?
సంఘ పెద్దలకే! (పాస్టర్స్ కే్)

పౌలు ఏం చేసి మాదిరిని చూపాడు?

తన స్వహస్తములతో పని చేస్తూ తాను, తనతోపాటు బలహీనులను పోషించడం ద్వారా...
ప్రభువును పోలి నడుచుకున్న పౌలు, సంఘ పెద్దలతో మాట్లాడుతూ... నా అవసరముల కొరకు మీవద్ద ఉన్న బంగారమును, వెండిని, వస్త్రములను నాకివ్వాలని అనలేదు; వాటిని ఆశించనూ లేదు. ప్రభువు చెప్పినట్లు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమనే మాటను ఆధారం చేసుకొని, నా స్వహస్తాలతో కష్టపడి, సంపాదించిన డబ్బుతో నా అవసరములు తీర్చుకున్నాను. అలానే బలహీనులైవున్న సంఘ సభ్యులకు సహాయం చేసి, మీకు మాదిరి చూపించానని చెప్పాడు.

నేటి సంఘంలో నాయకుని పదవిని ఆశించేవారు పుచ్చుకొనుకంటె ఇచ్చుట ధన్యమనే లేఖన ప్రకారం చేయాలంటే, కుటుంబ సభ్యుల అవసరతల కొరకు తమ చేతికి వచ్చిన మంచి పనిని (వ్యాపారమైన) చేయాలి. అదే క్రమంలో దేవుడు తమకు అప్పగించిన సంఘ నాయకుని పనిని కొనసాగించాలి. ఈ విధానం భవిష్యత్ తరాల వారికి మంచి మాదిరిని చూపగలదు. పూర్తికాల (ఫుల్ టైమ్) సేవ చేస్తున్నామని చెబుతూ దినంలో 24 గంటలలో కేవలం 2,3 గంటలు మాత్రమే సేవ చేస్తూ, మిగిలిన అధిక సమయాన్ని వృధా చేస్తున్నవారు మనలో అనేకులు. వీరు ఏదేని మంచి ఉద్యోగం, వ్యాపారం చేయడం పాపం కాదు కదా! అయితే నిజంగా పూర్తి కాల సేవ చేయడానికి సమర్పించుకుని అపొస్తలులవలె "...ప్రార్ధనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగక...” (అపొ.కా 6:4). సంఘ క్షేమాభివృద్ధే ధ్యేయంగా పని చేయుచున్న
వారినిబట్టి దేవునికి స్తోత్రం .

నా తోటి క్రైస్తవులారా, దైవ లేఖనాలు చెబుతున్నాయి - “వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను” (గలతీ 6:6). “బాగుగా పాలనచేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను” (1తిమో 5:17). సన్మానించడమంటే, వాక్యాన్ని ఉపదేశించేవారికి కేవలం శాలువాలు కప్పి, సన్మానించమనికాదు. వారి సేవ ద్వారా ఆత్మీయంగా ఎదుగుచున్న వ్యక్తులు తమకున్న శ్రేష్ఠమైన వాటిలో నుండి తమపై నాయకులకు, వాక్యాంతో పోషించే వారికి ఇవ్వాలని పరిశుద్ధాత్మడు లేఖనాల ద్వారా తెలియజేస్తున్నాడు.

గమనిక: సంఘ పెద్దలు గలతీ 6:6, 1తిమో 5:17 వచనాలను విశ్వాసులకు చూపించి వారిపై అజమాయిషీ చేయరాదు. దేవుని ప్రజలు వాక్యానికి, దైవాత్మ ప్రేరేపణకు లోబడి ఇచ్చినదే శ్రేష్ఠం.

13. గర్వం లేనివాడు: సాతానుడు పరలోకమందు గర్వించి దేవునిచేత అక్కడి నుండి త్రోసివేయబడ్డాడు. లేఖనం చెబుతుంది - "నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకుముందు అహంకారమైన మనస్సు నడచును” (సామె 18:18). "తేజో నక్షత్రమా, వేకువ చుక్కా నీవెట్లు ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి? - నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును. మేఘమండలము మీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా? నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే!? (యెషయా 14:12-14). సంఘాన్ని నడిపంచే నాయకుడు గర్వమనే స్వభావాన్ని ప్రతీ దినం సిలువ వేస్తూండాలి. లేనట్లయితే అతడు క్రీస్తు అధికారాన్ని ధిక్కరిస్తాడు. ఎందుకనగా, గర్వంతో నిండిన వ్యక్తి సంఘంలో దేవుని చిత్తం కంటే, తన చిత్తమే జరగాలని ప్రయత్నిస్తూ, సంఘానికి శిరస్సుగావున్న ప్రభువుపై తిరుగుబాటు చేస్తాడు. తద్వారా సంఘంలో తన సొంత రాజ్యాన్ని స్థాపించి, పాలన కొనసాగిస్తూ... దేవుని మహిమను దొంగిలిస్తాడు. ఇలాంటి వ్యక్తిని సంఘ నాయకునిగా నియమించడమంటే, సాతాను కుమారున్ని నియమించడమేమో! ప్రియులారా, ఈ భూమిమీద సాతాను రాజ్యాన్ని కూల్చడానికి జీవంగల దేవుని సంఘముంది కాని సాతాను రాజ్యవిస్తరణకై లేదు. కావున నాయకుడు గర్వంతో ఉండకుండా దైవ ప్రభుత్వానికి విధేయుడై ఉండాలి.

14. క్రొత్త వ్యక్తియై ఉండరాదు: దైవ కృపలో ఒక వ్యక్తి మారు  మనస్సునొంది, రక్షింపబడిన వ్యక్తికి వెంటనే సంఘ నాయకుని బాధ్యత అప్పగించకూడదు. తానింక ఆత్మీయతలో పాలు త్రాగే బాలుడే కాని వయస్సు వచ్చినవాడు కాదు. అప్పుడే జన్మించిన శిశువు ఒక సైన్యాన్ని నడిపించే యోదుడెలా కాలేడో! అలానే ఆత్మీయంగా కొత్తగా జన్మించిన వ్యక్తి దేవుని సంఘాన్ని నడిపించే నాయకుడు కాలేడు. అందునుబట్టియే దేవుడు తన లేఖనాలలో కొత్తగా జన్మించిన వ్యక్తికి సంఘ నాయకుని బాధ్యత అప్పగించకూడదని చెప్పాడు. ఒకవేళ ఆ వ్యక్తిని సంఘ నాయకున్ని చేస్తే దేవుని సంఘం సంపూర్ణస్థితిలోకి వెళ్ళక, దేవుని చిత్రాన్ని నెరవేర్చలేక విఛిన్నమవుతుంది. అప్పుడు అపవాది సంతోషిస్తాడు.

15. మంచి సాక్ష్యం: ప్రభువు సంఘంపై పెద్దగా ఉండాలనుకునే వ్యక్తి సంఘ వెలుపలి వారిచేత అనగా క్రైస్తవులు కానివారిచే మంచి సాక్ష్యం కలిగినవాడై ఉండాలి. అందుకుగాను ఆయన సంఘంలోనే కాదు, సమాజంలోను ప్రభువును పోలి నడుచుకోవాలి అప్పుడే వెలుపటివారు మంచి సాక్ష్యం ఇవ్వగలరు.

గుర్తించాల్సిన విషయం: లేఖనాలలో సంఘ పెద్దలకుండాల్సిన లక్షణాలు ఒక వ్యక్తి కలిగి వుండాలంటే, నిశ్చయంగా అతడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి, ప్రభువు కొరకై జీవించేవాడై ఉండాల్సిందే!

మనలో కొందరు వాక్యాన్ని బాగా బోధించేవారు, పాటలు పాడేవారు, వినసొంపుగా వాయిద్యాలు వాయించేవారు, చాలా చక్కగా సందేశాలు వ్రాసి ప్రచురించేవారు, క్రమంగా అధిక మొత్తంలో కానుకలిచ్చేవారు. సేవ పిలుపుందని, బైబిల్ తర్ఫీదు (ట్రెయినింగ్) పూర్తి చేసినప్పటికీ... సంఘ పెద్దకుండాల్సిన లక్షణాలు లేనప్పుడు వారిని సంఘ పెద్దలుగా నియమించకూడదు. గాని దేవుడు వారికేలాంటి కృపావరమిచ్చాడో గుర్తించి, ఆ కృపావరం చొప్పున ఇతర పరిచర్యల్లో వాడుకోవడం మంచిది. ఇట్టి విషయాలను క్రైస్తవ ప్రతీ క్రైస్తవుడు గమనించాలి. దేవాలయంలో యాజకులు మాత్రమే వెళ్ళి దైవ సేవ చేయాల్సివుండగా ఉజ్జీయా తాను రాజుననే గర్వంతో దేవాలయంలోకి వెళ్ళాడు. అప్పుడా సమయంలో యాజకులు - బయటికి వెళ్ళు అని అతనికి చెప్పినప్పటికీ ఆయన వారి మాట వినని కారణంచే దేవుడు తన నొసటిపై కుష్టు వ్యాధిని కలిగించాడు (2దిన 26:16-21).

అయితే నేడు ప్రభువు మందిరంగా వున్న క్రీస్తు బిడ్డలందరు యాజకులైయుండగా... 1 పేతు 2:9. పరిశుద్ధాత్ముడు ఎవరికి ఏ కృపావరమిచ్చాడో, ఎలాంటి పరిచర్య చేయుటకు సామర్థ్యమిచ్చాడో, ఎవరే బాధ్యత తీసుకుంటే సంఘానికి క్షేమమో అనే విషయాలను సంఘంలోని ప్రతి వ్యక్తి ఆలోచించి, నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా సంఘ పెద్దకు ఉండాల్సిన లక్షణాలు లేకున్నప్పటికీ సంఘ నాయకుని పరిచర్య చేయుటకు పూనుకొని, సంఘమనే దేవుని మందిరాన్ని పాడుచేస్తే, పరలోకమందున్న దేవుని దగ్గర నుండి వచ్చే క్రమశిక్షణ చర్యలకు గురికాక తప్పదేమో! ప్రభువు నిన్న, నేడు ఏకరీతిగా ఉన్నాడు. “ఎవడైనను దేవుని ఆలయమును (సంఘమును) పాడు చేసినయెడల దేవుడు అతనిని పాడుచేయును" (1కొరి 3:17).

ప్రియులారా, మనలో కొందరికి సంఘ నాయకుని లక్షణాలుండి సంఘ పెద్ద పరిచర్య చేయుటకు దేవుడు ప్రేరేపిస్తున్నా... నిర్లక్ష్యం చేయడం ప్రభువుకు అవిధేయత చూపడమేమో! కావున వెంటనే దేవునికి లోబడి, ఆత్మీయ పరిపక్వత కలిగిన వ్యక్తులతో సంభాషించి, నాయకుని పరిచర్య చేయుటకు పూనుకొండి.

3. ఓటింగ్ పద్ధతి ద్వారా పెద్దలను ఎన్నుకోవచ్చా?

ఈ విషయమై... యేసు ప్రభువులవారు - తన బోధలో మీరు ఎన్నికలు నిర్వహించి, సంఘ పెద్దను ఎన్నుకోవాలని ఎక్కడా ఆజ్ఞాపించలేదు. ఆదిమ అపొస్తలులు సంఘ పెద్దలను నియమించే విషయంలో ఎన్నికలు నిర్వహించలేదు.

ఓటింగ్ పద్ధతి ద్వారా కలిగే అనార్థాలు:

- సంఘ పెద్దగా వుండే అభ్యర్థి, నాకే మీరు ఓటు వేయాలనే ఒత్తిడిని సంఘ సభ్యులపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తేవడం.

- సంఘ పెద్దలుగావుండే అభ్యర్థులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం. - ఆ విమర్శలు కాస్త, భౌతిక దాడులకు దారి తీయడం. * ఇది గమనించిన సంఘ సభ్యులు - సంఘ పెద్దలంటే వీళ్ళా? అని తమ హృదయాలలో ఆవేదనకు గురికావడం.

- ఇట్టి ప్రభావం భావి తరాలైన సంఘ యువతపై పడి, వారు సంఘంలో ఎలా రౌడీయిజం చేయాలో నేర్చుకోవడం.

- ఇది భవిష్యత్ తరాల ఆత్మీయాభివృద్ధికి పెద్ద అవరోధం .

- చివరిగా తండ్రియైన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, ప్రభువును మరలా మరలా సిలువ వేస్తూ, పరిశుద్ధాత్మున్ని దు:ఖపరుస్తూ, పైశాచికంగా ప్రవర్తించడం.

ప్రియులారా, సంఘ పెద్దలను నియమించే విషయంలో దేవుని వాక్యంలో వివరించబడిన సంఘ పెద్ద లక్షణాలను ప్రమాణికంగా తీసుకోకుండా కొందరి అభ్యర్థుల పేర్లను ప్రకటించడం. ఎలెక్షన్స్ పేరిట కలెక్టు పాలుపాడుతూ... ఓటింగ్ పద్ధతి ద్వార ఎన్నుకోవడం తదుపరి కొంత కాలం తరువాత కొందరిని తొలగించడం, ఇంకొందరిని నూతనంగా ఎన్నుకోవడమనేది, ప్రభువు బోధించిన పద్ధతి కాదు; ఆదిమ అపొస్తలులు సంఘానికి నేర్పించి, పాటించమని చెప్పిన విధానం అంతకంటే కాదు.

సంఘంలో పెద్దలను ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నుకోవడం విరమించుకోవాలి. లేదంటే, పరలోకమందున్న ప్రభువు సన్నిధి నుండి క్రమశిక్షణ చర్యలు వస్తాయేమో!

గమనిక: అపొస్తలుల కార్యాలు 1:26-29లో 11మంది అపొస్తలులు యూదా స్థానంలో మరొక వ్యక్తిని అపొస్తలునిగా నియమించుటకు ప్రార్థన చేసి ఓట్లు వేసి ఎన్నుకున్నారు. ఇది ఇశ్రాయేలీయుల పద్దతి. అయితే నేటి ప్రభువు సంఘం ఆ పద్ధతిని పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకనగా, పరిశుద్ధాత్మ దేవుని సంపూర్ణమైన పరిపాలన సంఘంలో ప్రత్యక్షంగా లేని రోజులవి. మరియు సంఘ పెద్దల ఎన్నిక విషయంలో వేటిని ప్రమాణికంగా తీసుకోవాలో అప్పటికి పరిశుద్ధాత్ముడు లేఖనాలలో వ్రాయించలేదు. ఈ విషయాన్ని పాఠకులు గమనించాలి.

4. లేఖనాల ప్రకారం సంఘ పెద్ద, అధ్యక్షుడు, కాపరి ఒక్కరేనా?

మొదటగా సంఘ పెద్ద, సంఘ అధ్యక్షుడు, సంఘ కాపరి అనే పేర్ల అర్థాలు అలాగే వీరు చేసే పనులను గూర్చి తెలుసుకుందాం.

1). సంఘపెద్ద ఈ పదాన్ని గ్రీకులో PRESBUTEROS (ప్రెస్ బూటేర్సో) అని, ఆంగ్లంలో ELDER (ఎల్డర్) అంటారు. సంఘ పెద్ద అనే వ్యక్తి ప్రభువు సంఘాన్ని క్రమమైన మార్గంలో నడిపించుటకు తనకున్న అనుభవంతో, సామర్థ్యముతో నడిపిస్తాడు. కావున విశ్వాసులు క్రీస్తునుబట్టి ఇతనికి లోబడుతారు.

2). అధ్యక్షుడు అనే పదాన్ని గ్రీకులో EPISCOPOS  (ఎపికోపే) అని, ఆంగ్లంలో OVERSEER (ఓవర్ సీయర్) లేదా BISHOP (బిషప్) అని అంటారు. అధ్యక్షుడనే వ్యక్తి మొదటగా ప్రభువు పాలనకు లోబడుతూ... దేవుడు తనకిచ్చిన అధికారం క్రింద సేవ చేయుచున్నవారి పైనను, సంఘ క్షేమాభివృద్ధికై పాలన చేస్తాడు.

3). కాపరి అనే పదాన్ని గ్రీకులో POIMEN (పోయ్ మనే) అని ఇంగ్లీష్ లో SHEPHERD (షేపార్డ్) లేదా PASTOR (పాస్టర్) అని అంటారు. కాపరి లేక పాస్టర్ అనే వ్యక్తి దేవుడు తనకు ఇచ్చిన సంఘమనే మందను దుష్టమృగాల నుండి అనగా, లేఖన విరుద్ధమైన అబద్ధ బోధలనుండి కాపాడుతాడు. వాక్యమనే పాలు, పౌష్ఠికమైన ఆహారంతో సంఘాన్ని పోషిస్తూ సంరక్షించే పనిలో ఇతడు నిమగ్నమై ఉంటాడు.

లేఖనాలు: "అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడతడు వారితో ఇట్లనెను - ...దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగ ఉండుడి” (అపొ.కా 20:17-28). ఈ లేఖనాలను అనుసరించి...

1. పౌలుగారు పిలిపించింది ఎవరిని?
ఎఫెసు సంఘ పెద్దలను.

2. ఆ పెద్దలను పరిశుద్ధాత్ముడు ఏం చేసాడు?
అధ్యక్షులుగా నియమించాడు.

3. ఆ సంఘ పెద్దలనే అధ్యక్షులు ఏం చెయ్యాలి?

4. సంఘాన్ని ఎవరు కాయాలి?

5. పై వచనాలలో సంఘ పెద్దలను పిలిపించి, వారిని పరిశుద్ధాత్ముడు అధ్యక్షులనుగా నియమించాడు. అయితే వీరు సంఘాన్ని కాయవచ్చా?

సంఘాన్ని కాయుట ఎవరి పని? అపొ.కా 20:28వ వచన ప్రకారం ప్రభువు సంఘాన్ని కాయాల్సింది సంఘంపై పరిశుద్ధాత్ముడు నియమించిన సంఘ అధ్యక్షులే. ఈ సంఘ అధ్యక్షులే అపొ.కా 20:17వ వచన ప్రకారం సంఘ పెద్దలై ఉన్నారు.

సామాన్యంగా మందను కాసే వారిని ఏమని పిలుస్తారు? కాపరి అని. “పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని... కాపరులనుగాను... నియమించెను” (ఎఫెసీ 4:13).

సంఘాన్ని కాసే బాధ్యతను దేవుడు ఎవరికి ఇచ్చాడు? సంఘ పెద్దకా? సంఘ అధ్యక్షుడికా? సంఘ కాపరికా?

లేఖనాలు చూద్దాం. “తోటి పెద్దను, ...నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమిచేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్గాభాక్షతో కాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణ చేయుచు దానిని కాయుడి...” (1 పేతు 5:1-2,4). ఈ లేఖనాలను అనుసరించి...

1. అపొ॥ పేతురు ఎవరిని హెచ్చరిస్తున్నాడు?
సంఘ పెద్దలను.

2. పెద్దలు ఏం చేయాలి?
దేవుని మందపై పైవిచారణ చేయాలి
దేవుని మందను కాయాలి.

అపొ.కా 20:28 లేఖనం ప్రకారం సంఘ అధ్యక్షులు కాయాలి. 1 పేతురు 5:1-4 వచనాల ప్రకారం సంఘ పెద్దలు కాయాలి. ఇలా మందను కాసేవారిని కాపరులంటారని చూసాం.

> సత్యస్వరూపియైన పరిశుద్ధాత్ముడు వ్రాయించిన లేఖనాల సారాంశం ప్రకారం అలానే అపొస్తలులైన పౌలు, పేతురుగార్ల ఉద్దేశంలో సంఘ పెద్ద, సంఘ అధ్యక్షుడు, సంఘ కాపరి అని వేరువేరుగా సంబోధించబడిన ఆ ముగ్గురు సంఘాన్ని కాసే పనినే చేపడుతున్నారు.

> అపొ.కా 20:17వ వచనంలో పేర్కొన సంఘ పెద్దలే సంఘ అధ్యక్షులని అర్థం. వీరు సంఘాన్ని కాస్తారని, కాసేవారిని ఎఫెసీ 4:13 ప్రకారం కాపరులని అంటారు.

మెట్టుకు లేఖనాల ప్రకారం సంఘ పెద్ద, సంఘ అధ్యక్షుడు, కాపరి ఒక్కరేనా అనే ఈ అంశం ద్వారా మీకు ఏం అర్థమావుతుంది? సంఘ పెద్దని, అధ్యక్షుడని, సంఘ కాపరని విభిన్న పేర్లుగా పిలువబడుచున్న వ్యక్తులు ఒకే పనిని చేస్తూ... ఒక్కరిగానే ఉన్నారని అర్థమవుతుంది కదా!

5. సంఘ పెద్ద (పాస్టర్ గారు) పాపం చేస్తే...

సహోదరని విషయమై ప్రభువు ఇలా చెప్పాడు - "మరియు నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసినయెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీమాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు విననియెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపర చబడునట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతనియొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు విననియెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాటయు విననియెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము” (మత్తయి 18:15-17). ప్రభువు చేయు పరిశు ద్దమైన క్రమశిక్షణలో భాగంగా మొదటగా... ఒక క్రైస్తవ సోదరుడు తన తోటి క్రైస్తవునియెడల తప్పిదం చేస్తే, ఎవరైతే తప్పిదం చేశారో ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా కలిసి ప్రేమతో గద్దించాలి. వినకుంటే, రెండవదిగా... ఇద్దరి ముగ్గురు క్రైస్తవులకు విషయాన్ని తెలియపర్చి వారితో మాట్లాడించే ప్రయత్నం చేయాలి. అప్పటికీ వినలేనట్లయితే, మూడవదిగా.... సంఘానికి చెప్పాలి. సంఘ సభ్యుల మాట కూడా వినలేని స్థితిలో వున్నప్పుడు ఆ వ్యక్తిని అన్యునిగా, సుంకరిగా ఎంచుకోవాలని ప్రభువు చెప్పాడు.

సంఘ పెద్ద పాపం చేసినప్పుడు... ప్రభువు సంఘంపై నాయకుడిగా నియమించబడిన వ్యక్తికి స్థానిక సంఘంలో అందరతనికి విధేయులై ఉండకపోవచ్చు! ఆ క్రమంలో... ఎవరైన ఒకరు - సంఘ పెద్ద/పాస్టర్ గారు పాపం చేయడాన్ని నేను చూసానని చెప్పే వ్యక్తి ఇచ్చే సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోకుండదేమో! లేఖనం చెబుతుంది - "ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేగాని పెద్దమీద దోషారోపణ అంగీకరింపకుము” (1తిమో 5:19). ఇద్దరు లేక  ముగ్గురు వ్యక్తులు తమ కన్నులారా చూసి, చెవులారా విన్న దానిని మాత్రమే పరిగణలోకి తీసుకొని, గౌరవనీయుడైన పాస్టర్ గారిని ప్రేమపూర్వక వాతావరణంలో చాలా జాగ్రత్తగా విచారించాలి. ఈ సందర్భంలో... సాక్ష్యమిచ్చిన వారు చెప్పింది ఎంత వరకు నిజం? అనే విషయాన్ని సంఘ సభ్యులు పరిశీలన చేయాలి. ఎందుకనగా, ప్రభువు సంఘాన్ని లేఖనాల ప్రకారంగా నడిపించే పాస్టరు కొందరు వ్యతిరేకు లుండొచ్చు. కావున వారు విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను నిందలు మోపొచ్చు. కావున సాక్ష్యాలను, ఆరోపణలను నిక్షపాతంతో పరిశీలన చేయాలి. ఆ తదుపరి సాక్ష్యాలు నిజమైనవే అని ఒకవేళ నిర్ధారణ అయినప్పుడు... సంఘంలోని సభ్యులు పాపం చేయకుండు నిమిత్తమై, మాదిరి జీవితాన్ని కోల్పోయిన ఆ దైవ సేవకున్ని ప్రేమతో గద్దించాలి. విన్నలేనట్లయితే, పాస్టర్ గారిని కొంతకాలం సంఘంలో కాపరి పరిచర్యను చేయకుండా అతనిని సంఘ సహవాసానికి దూరంగా ఉండునట్లు చర్యలు తీసుకోవడం అవసరం. (1కొరి 5:1-13).

“ఇతరులు భయపడు నిమిత్తం పాపము చేయువారిని అందరియెదుట గద్దింపుము” (1తిమో 5:19). అదే సమయంలో పాస్టర్ గారు చేసిన పాపం గూర్చి మారుమనస్సు పొందునట్లు సంఘం ప్రార్థించాలి. కొంతకాలం తరువాత ఆ దైవ సేవకుడు తాను చేసిన పాపం విషయమై దేవునియెదుటను, సంఘం యెదుటను నిజంగా పాశ్చాత్తాపపడినట్లయితే, అతనిని బయటికి పంపించిన సంఘ సభ్యులే తిరిగి తమ సహవాసములోకి చేర్చుకోవాలి. “గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేనియెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగి పోవును” (2కొరి 2:7). అయితే వెంటనే అతనికి సంఘాన్ని నడిపించే బాధ్యతను అప్పగింపక కొంతకాలం అతనిని పరిశీలన చేయాలి. నిజమైన మార్పు అతనిలో వచ్చిందని గుర్తించిన పిమ్మట దేవుడు తనకు పూర్వం అప్పగించిన (సంఘాన్ని నడిపించే) పనిలో అతనిని కొనసాగించొచ్చు.

“సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధమైన మీలో ప్రతివాడు తానును శోధింప బడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసికొని రావలెను” (గలతీ 6:1). “నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరియొకడు అతనిని సత్యమునకు మళ్లించినయెడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి యొక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలిసికొనవలెను” (యాకోబు 5:19-20). “అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధ మైనవారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి” (యూదా 1:23).

గమనిక: పాస్టర్ గారికి సతీమణి ఉండగానే మరో స్త్రీతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న క్రమంలో సంఘం ఆయనను గద్దించాలి. వినలేనట్లయితే ఆయనను సంఘంలో నుండి బయటికి పంపించాలి. పాస్టర్ గారు ఆ మరో స్త్రీని వివాహం చేసుకొని కొన్ని సం||రాల తరువాత పాశ్చాత్తాపపడిన పిమ్మట ఆయనను సంఘ సహవాసంలోకి చేర్చుకోవచ్చునేమో! గాని, సంఘాన్ని నడిపించే నాయకత్వ బాధ్యతను అతనికి అప్పగించకూడదు. ఎందుచేత అనగా, సంఘ నాయకుడు ఏకపత్ని పురుషుడై ఉండాలి. "నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశల అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి” (1 పేతు 1:14-16).

దేవుని లేఖనాలకు లోబడి ప్రభువు సంఘం చేయు క్రమశిక్షణ చర్యలను ఇతర క్రైస్తవులు చూస్తూ... వింటున్నప్పుడు భయంకలిగి లైంగిక పాపాలకు దూరంగా వుంటారు. నైతిక విలువలతో జీవించుటకు సుముఖత చూపుతారు. మరియు సంఘం వెలుపటివారు (క్రైస్తవేతరులు) క్రీస్తు బోధను, పరిశుద్ధతను గమనించి ప్రభువును మహిమపరుస్తారు. లేనట్లయితే, క్రైస్తవులలో అనేకులు బహిరంగంగా పాపం చేయడానికి ప్రోత్సాహింపబడుతారు. మరియు సమాజం యేసు ప్రభువును దేవునిగా గుర్తిస్తారేమోగాని మారుమనస్సు నొంది, ప్రభువు సంఘ సభ్యులు కూడుకొనే సంఘ సహవాసాలకు రావడానికి భయపడుతారు. ఇట్టి చర్యలకు ఎవరు కారకులు?
“వ్రాయబడిన ప్రకారము మిమ్మునుబట్టియే గదా దేవుని నామము అన్య జనుల మధ్యను దూషింపబడుచున్నది! ” (రోమా 2:24).

6. పాస్టర్ గారిని సంఘం క్రమశిక్షణ చర్యలకు గురిచేస్తే, సంఘాన్ని ఎవరు నడిపిస్తారు?

ఈ విషయమై లేఖనం చూద్దాం - "మరియు యెహోవా మోషేతో ఇట్లనెను - నీవు ఈ అబారీము కొండయెక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడుదువు. ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల యెదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరుగబడితిరి...” (సంఖ్య.కా 27:12-15). ఇశ్రాయేలీయులను ఐగుప్తు చెర నుండి విడిపించి, కానానుకు నడిపించుటకై దేవుడు మోషేను అహరోనులను నియమించాడు. దేవుడు మోషేను వాడుకొని, అంతకు ముందెన్నడు చేయని గొప్ప కార్యాలను చేశాడు. ఓ సందర్భంలో మోషే దేవుని మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించి, తప్పు చేసినప్పుడు, దేవుడు - నీ అన్నయైన అహరోను చనిపోయినట్లు నీవు కూడా కానాను చేరకముందే మరణిస్తావని చెప్పాడు.

మోషే చేసిన ప్రార్థన: “అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను - యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొప్టైలవలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకని నియమించుము. అతడు వారియెదుట వచ్చుచు, పోవుచు నుండి, వారికి నాయకుడుగా ఉండుటకు సమర్దుడై యుండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను - నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి, యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువబెట్టి వారి కన్నుల యెదుట అతనికి ఆజ్ఞ యిమ్ము” (సంఖ్యా. కా 27:15-19).

మోషే చేసిన ప్రార్థనకు దేవుడు జవాబుగా, యెహోషువాను నియమించుమని చెప్పాడు. నేటి సంఘంలో నాయకుడు పాపం చేసి, సంఘంచే క్రమశిక్షణ చర్యలకు గురియైనప్పుడు ఆ సంఘంలోని సభ్యులందరు ప్రభువు సన్నిధిలో ప్రార్థించాలి. అనాటి ఇశ్రాయేలీయుల కొరకు మోషే స్థానంలో దేవుడు యెహోషువాను నియమించినట్లు, సంఘ ప్రార్థనకు జవాబుగా ప్రభువు అదే సంఘంలో ఒక వ్యక్తిని నాయకునిగా లేపొచ్చు. లేదా ఇతర ప్రాంతం నుండియైన తన సంఘ క్షేమముకై నాయకున్ని తీసుకొని రావొచ్చు. అయితే ఈ విషయంలో సంఘ సభ్యులందరు 1తిమో 3:1-8, తీతు 1:6-9 వచనాలను ప్రమాణికంగా తీసుకోవాలి.

7. సంఘంలో ఒకరి కంటే ఎక్కువ పాస్టర్స్ ఉండొచ్చా?

లేఖనం ఇలా చెబుతుంది - "మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను...” (యాకోబు 5:14). ప్రియ దేవుని జనాంగమా, మొదటి అపొస్తలుల కాలంలో స్థానిక సంఘంలో ఒకరి కంటే ఎక్కువ మంది పాస్టర్లు (పెద్దలు) ఉండేవారు; కావుననే యాకోబు - సంఘంలోని పెద్దలను పిలిపించమని చెబుతున్నాడు. ఈ విషయాన్ని మీరు మరింత తెలుసుకొనుటకు లేఖనాలను చదువండి. “బాగుగా పాలనచేయు పెద్దలను....” (1తిమో 5:17). “నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను” (1పేతు 5:1). “ఎఫెసు అనే ప్రాంతము నుండి సంఘ పెద్దలను పిలిపించుట” (అపొ.కా 20:17).

ఈ లేఖనాల ప్రకారం ఆయా స్థానిక సంఘాలలో ఒకరి కంటే ఎక్కువగా సంఘాన్ని కాసే కాపరులు (పాస్టర్స్, నాయకులు) ఉన్నట్లుగా అర్థమవుతుంది.

నేటి స్థానిక సంఘ సభ్యులు వందలు దాటి వేయ్యిల సంఖ్యలోకి విస్తరిస్తున్నప్పుడు... సంఘంలో ఒకే వ్యక్తి నాయకుడిగా కొనసాగడం వల్ల అతనిపై అధిక భారం మోపబడి వ్యక్తిగతంగా తాను చతికిలపడే అవకాశముంటుంది. “నీవును నీతో నున్న యీ ప్రజలును నిశ్చయముగా నలిగిపోవుదురు; ఈ పని నీకు మిక్కిలి భారము, సంఘ అది నీవు ఒక్కడవే చేయచాలవు” (నిర్గ.కా 18:18). కావున సంఘ పెద్దలు పెద్దకుండాల్సిన లక్షణాలు సంఘ సభ్యుల్లో ఎవరికైన ఉన్నట్లయితే వారిని పరిశీలించి పెద్దగా నియమించుకోవడం మంచిదేమో!

8. ఒకే సంఘంలో ఇద్దరు, ముగ్గురు నాయకులుంటే, భిన్నాభిప్రాయాలు రావా?

ఒక సంఘంలో ఇద్దరు, ముగ్గురు నాయకులుగా ఉండి, దేవుని సేవను కొనసాగిస్తున్నప్పుడు... ఏవేని కొన్ని పనులను సంఘ క్షేమాభివృద్ధికై చేయాల్సి వస్తున్నప్పుడు ఈ ముగ్గురిలో ఒకరికి ఒక అభిప్రాయం, మరో ఇద్దరికి వేరు వేరు అభిప్రాయాలుండొచ్చు.

భిన్నాభిప్రాయాలు వస్తే... అపొస్తలుల కార్యములు 6:1లో సంఘంలో సమస్య వచ్చినప్పుడు ప్రభువు అపొస్తలులకు మంచి ఆలోచనిచ్చి, ఆ సమస్యను పరిష్కరించాడు (అపొ.కా 6:2-6). మరియు అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయములో పేర్కొనబడిన విషయంలో... తీవ్రమైన తర్కాలు, వాదోపవాదాలు జరిగిన సందర్భంలోనూ పరిశుద్ధాత్ముడు కల్పించుకొని పేతురు, యాకోబులను వాడుకొని భిన్నాభిప్రాయాలను, సమస్యలను పరిష్కరించాడు. అలానే “యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటే రీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును” (హెబ్రీ 13:8). అనే లేఖన నేరవేర్పులో భాగంగా... నేటి స్థానిక సంఘాలలో ఇద్దరు ముగ్గురు సంఘ నాయకులు (పెద్దలు) పరిచర్య చేస్తున్నప్పుడు భిన్నాభిప్రాయాలు వస్తాయి. అప్పుడు ప్రభువే సంఘ నాయకుల్లో ఐకత్యను తీసుకొచ్చి, సమస్యలను పరిష్కరిస్తాడు.

సంఘ నాయకులు కలిగున్న ఐక్యతను అపవాది చేడగొట్టే ప్రయత్నాలు చాలా చేస్తాడని గ్రహించి, వానికి అవకాశం ఇవ్వకూడదు. ఆత్మ జ్ఞానంతో దేవుని రాజ్యవ్యాప్తి, సంఘ క్షేమాభివృద్ధే ధ్యేయంగా కలిసి పనిచేయాలి. “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!” (కీర్తన 133:1). “కాబట్టి, మీరు సమాధానమను బంధముచేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగినవారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని, ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను” (ఎఫెసీ 4:1-3).

9. పని చేస్తూ... సేవ చేస్తూంటే సంఘం, సమాజం ఆ వ్యక్తిని పాస్టర్‌గా గుర్తిస్తుందా?


పని గూర్చి ఆలోచన చేస్తే, దేవుడు ఆదాముకు ఏదేనులో పనిని నియమించాడు. “...దేవుడైన యెహోవా - నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకు దానిలో ఉంచెను” (ఆది.కా 2:15). ఆదాము హవ్వ దేవుని ఆజ్ఞను మీరి పాపం చేయకముందు నుండే పని చేయుట అనేది ఈ భూమిపై ఉంది. కాబట్టి నేడు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేస్తూ, వ్యవసాయం లేదా మంచి వ్యాపారం చేస్తూనే ప్రభువుకు మంచి సాక్షులుగా జీవించవచ్చు. పని స్థలాలో ఇతరులతో ప్రభువును గూర్చి సువార్త పంచుకోవచ్చు. ఒకవేళ పాస్టరు ఉండాల్సిన లక్షణాలు మీరు కలిగి ఉన్నట్లయితే మీరు సమాజంలో పని చేస్తూనే సంఘంలో కాపరిగా పరిచర్య చేయవచ్చు.

వివిధ పనులను చేస్తూనే దేవుని సేవను చేసిన వ్యక్తులు.

- యోసేపు ఐగుప్తు అధికారిగావుండి పాలన చేసి దైవ చిత్రాన్ని చేశాడు (ఆది.కా 41 అధ్యాయం).

- దావీదు ఇశ్రాయేలు దేశానికి రాజుగావుంటూనే... దేవుని ప్రవక్తగా ప్రభువు పనిని కొనసాగించాడు (అపొ.కా 2:25-35).

- దానియేలు వివిధ అన్య రాజుల అధికారం క్రింద ప్రజలపై అధికారిగావుంటూ విధులు నిర్వహిస్తూనే దైవ ప్రవక్తగా కూడా ఉండినాడు (దానియేలు గ్రంథం)

- నెహెమ్యా రాజుకు గిన్నె అందించే ఉద్యోగం చేస్తూనే... దేవాలయ ప్రాకార నిర్మాణ పనులు చేపట్టాడు (నెహెమ్యా గ్రంథం).

- పౌలు డేరాలు కుట్టుతూనే... అపొస్తలునిగా, సువార్తికునిగా, బోధకునిగా క్రైస్తవ సమాజంలో పని చేశాడు (అపొ.కా 18:1-4), (2తిమో 2:7).

- లూకా వైద్యునిగా (డాక్టర్)గా పని చేస్తూనే.... దేవుని పనిని కొనసాగించాడు (కొలొస్స4:14). (లూకా సువార్తను వ్రాశాడు).

గుర్తింపు గూర్చి... ప్రభువు చెబుతున్నాడు - "..శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయెడల కృప చూపుచున్నాను” (యిర్మీయా 31:3). మన విలువ గుర్తింపు దేవుని ప్రేమలోనే ఉంది. మనుష్యులలో లేదు. కావున దేవుని సేవ చేసే ఆయన సేవకులు ప్రభువు నుండి వచ్చే మెప్పును, ఘనతను కోరాలి గాని కేవలం ప్రజల నుండి వచ్చే అస్థిరమైన మెప్పు, ఘనతపై మనస్సుపెట్టుకోవద్దు. ఈ విషయంలో ప్రభువు మనందరికి సహాయం చేయును గాక! .... మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు ...” (1థెస్స 2:6-7).

10. వివాహం చేసుకున్న వ్యక్తి పాస్టర్ పరిచర్యకు అర్హుడా?

కుటుంబ వ్యవస్థకు ముఖ్య కారకుడు సృష్టికర్తయైన దేవుడు. ఆయన మొదటి మనుష్యుడైన ఆదామును చేసిన తరువాత అతనికి సహాయకురాలిగా స్త్రీని హవ్వను సృజించాడు. ఆ ఇరువురిని భార్య భర్తగా కుటుంబంగా చేశాడు. ఆ తదుపరి మీరు - ఫలించి అభివృద్ధి చెంది, భూమిని నిండిచాలని చెప్పాడు. (ఆది.కా 1:26-28, 2:18-25).

పాఠకులారా, భార్య భర్త మధ్యలోవుండే లైంగిక కలయిక పవిత్రమైంది. దేవుడే దంపతుల దాంపత్య జీవితాన్ని దీవించి పిల్లలను అనుగ్రహిస్తాడు. “ఇస్సాకు భార్యకు పిల్లలు పుట్టలేదు. కనుక ఇస్సాకు తన భార్య కోసం ప్రార్థించాడు. ఇస్సాకు ప్రార్థన యెహోవా విన్నాడు. రిబ్కాను గర్భవతి కానిచ్చాడు” (ఆది.కా 25:21). లేయాకు, రాహేలుకు దేవుడు సంతానమును ఇచ్చాడు (ఆది.కా 29:31-35,30:22-24). "ఒక స్త్రీకి పిల్లలు లేకపోవచ్చును. కానీ దేవుడు ఆమెకు పిల్లలను ఇచ్చి సంతోషపరుస్తాడు. యెహోవాను స్తుతించండి” (కీర్తన 113:9).

వివాహ బంధానికి వెలుపల జరిగే జారత్వం, వ్యభిచారం పాపమని దేవుడు బైబిల్ ద్వారా ఆజ్ఞాపించాడు. హద్దులు మీరి ప్రవర్తిస్తే శిక్షిస్తానని ఆయన చెప్పి శిక్షించాడు కూడా. “వ్యభిచార పాపం నీవు చేయకూడదు” (నిర్గ.కా 20:14). "వివాహాన్ని అందరూ గౌరవించాలి. వివాహ పాన్పును నిష్కళంకంగా ఉంచాలి. వ్యభిచారుల్ని, వివాహితులతో లైంగిక సంబంధాలను పెట్టుకున్న వాళ్ళను దేవుడు శిక్షిస్తాడు” (హెబ్రీ 13:4). “మనం వాళ్ళు చేసినట్లు వ్యభిచారం చేయరాదు. వ్యభిచారం చేయ్యటం వల్ల ఒక్క రోజులో, వాళ్ళలో ఇరవై మూడు వేలమంది మరణించారు” (1కొరి 10:8).

పైన పేర్కొన విషయాలను చదువుచున్నప్పుడు ఏం అర్థమావుతుంది? దేవుడే వివాహ బంధాన్ని నిర్మించాడని, ఆయనే పిల్లలను అనుగ్రహిస్తాడని, అలానే జారత్వం, వ్యభిచారం చేస్తే దేవుడు తప్పకా శిక్షిస్తాడని లేఖనాల వెలుగులో చూశాం. కావున వివాహం చేసుకున్న వ్యక్తి, పెద్దకుండాల్సిన లక్షణాలుండి పాస్టర్ పరిచర్య చేయడానికి అర్హుడే! వివాహం చేసుకోవడమంటే జారత్వం, వ్యభిచారం చేస్తున్నట్లు కాదు.

నేటి క్రైస్తవ సమాజంలో ఓ గుంపువారు వివాహం చేసుకున్న వ్యక్తి పాస్టర్ పరిచర్యకు అనర్హుడని బోధించడం లేఖనాలకు, దేవునికి విరుద్ధమైంది. “అయితే కడవరి దినములలో కొందరు అబద్దికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్దికులు, వాతవేయబడిన మనస్సాక్షిగలవారై, వివాహము నిషేధించుచు...” (1తిమోతి 4:1-3). దేవుడు పవిత్రమైందని ఎంచినదానిని అపవిత్రమైందని బోధించేవారు దేవునిపై, దేవుడిచ్చిన లేఖనాలపై తిరుగుబాటు చేయుచున్నవారే! “దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దు...” (అపొ.కా 11:9). మెట్టుకు సంఘ పెద్ద పరిచర్య చేయుటకు 1తిమోతి 3:1-8 వచనాలలో పేర్కొన లక్షణాలలో ఏకపత్ని పురుషుడై ఉండాలని వ్రాయబడింది. అంటే వివాహం చేసుకున్న వ్యక్తి పాస్టర్ పరిచర్యకు అర్హుడేనని లేఖనమే సాక్ష్యమిస్తుంది. కావున పెద్దకుండాల్సిన లక్షణాలుండి, వివాహం చేసుకున్న వ్యక్తి కూడా పాస్టర్ పరిచర్య చేయవచ్చు.

11. సంఘంలో స్త్రీ పెద్ద (పాస్టర్) పరిచర్య చేయవచ్చా?

అపొస్తలుడైన పౌలు సంఘంలో పెద్దగా ఉండాలనుకునే వ్యక్తిని గూర్చి తెలియజేసిన అంశాలలో ఎక్కడా కూడా స్త్రీని గూర్చి ప్రస్తావన లేదు. అన్ని కూడా పురుషుని గూర్చియే రాయబడినట్లు చూడగలం (1తిమోతి 3:1-8, తీతు 1:6-9). ఏదైన ఒక విషయాన్ని నమ్మాలంటే లేఖనం ఇలా చెబుతుంది .... ఇద్దరు సాక్షుల మాటమీదనైనను ముగ్గురు సాక్షుల మాటమీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును” (ద్వి.కా 19:15). సంఘంలో పెద్ద (పాస్టర్) పరిచర్య చేయడానికి సంఘానికి శిరస్సైయున్న క్రీస్తు అనుమతించలేదని తెలుపుటకు క్రింది రెండు అంశాలను చూడండి.

- 1తిమోతి 3:1-8, తీతు 1:6-9 వరకు వ్రాయబడిన వచనాలలో సంపూర్తిగా పురుషుడినే సంబోధిస్తూ వ్రాసినట్లు చూడగలం. గాని స్త్రీని సంబోధించినట్లు ఎక్కడా చూడం.

- 1తిమోతి 3:2 ప్రకారం సంఘ పెద్ద ఏకపత్నీవ్రతుడై (Husband of one wife) ఉండాలని పరిశుద్ధాత్మ ప్రేరేపణచే పౌలు రాశాడు. కాని ఏక భర్త (Wife of one husband)ను కలిగుండాలని స్త్రీని గూర్చి రాయలేదు.

- 1తిమోతి 3:5లో ఎవడైనను తన ఇంటివారిని ఏలనేరకపోయిన యెడల దేవుని సంఘమును ఏలాగు పాలించును? అనే ప్రశ్నను పౌలు లేవనేత్తాడు. కుటుంబాన్ని పాలించేది ఎవరు? పురుషుడా,
స్త్రీనా?

"క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్నలాగున పురుషుడు భార్యకు శిరసైయున్నాడు...” (ఎఫెసీ 5:23). శిరస్సు అధికారానికి సూచన. పురుషుడికి శిరస్సుగావున్న క్రీస్తే, స్త్రీ పై పురుషున్ని శిరస్సుగా (అధికారిగా) నియమించాడు. అప్పుడు కుటుంబాన్ని పాలించేది ఎవరౌవుతారు? పురుషుడే. కావున సంఘ పెద్ద పరిచర్యలో స్త్రీకి స్థానం లేదని స్పష్టంగా లేఖనాల వెలుగులో అర్థమవుతుంది.

అయితే కొందరు గలతీ 3:27-28 “క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొని యున్నారు. ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరు ఏకముగా ఉన్నారు” ఈ వచనాలను చూపించి స్త్రీలు కూడా సంఘ పెద్దలుగా ఉండొచ్చని చెబుతారు. అయితే ఆ వచనాలలో పేర్కొన్న సందర్భం ఏమిటి?

పౌలు 3వ అధ్యాయంలో పేర్కొన సందర్భం ద్వారా ఏం తెలియజేస్తున్నాడు? ధర్మశాస్త్ర క్రియలను అనుసరించడం వల్ల రక్షణ లేదని. అబ్రాహాము దేవున్ని విశ్వసించడం వల్ల అది అతనికి నీతిగా ఎంచబడింది. గలతీ 3:26వ వచన ప్రకారం “యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసము వలన దేవుని కుమారులైయున్నారు”. అని తెలుపుచున్నాడు. దేవుడు ఇచ్చే రక్షణలో స్త్రీలు పురుషులు సమానమే! ఇందులో ఎలాంటి సందేహం లేదు. మెట్టుకు, గలతీ 3వ అధ్యాయంలో క్రియలనుబట్టి కాక, క్రీస్తును విశ్వసించడం వల్ల స్త్రీ, పురుషులందరు దేవుని పిల్లలై ఉంటారనేది సందర్భం.

ఆలోచించండి: గలతీ 3:26-29 వచనాలలో.... క్రియల ద్వారా కాకుండా విశ్వాసం ద్వారా దేవుని సంతానమగుట అనే సందర్భం. 1తిమోతి 3:1-8, తీతు 1:6-9 లేఖనాలలో.... సంఘ నాయకత్వానికి గూర్చి తెలియజేసిన సందర్భం ఒక్కటేనా? కాదు కదా! అలాంటప్పుడు గలతీలో పేర్కొన్న వచనాలను సంఘ పెద్ద పరిచర్యకు సూచించబడిన వాటితో ఎలాగు కలిపి చూడగలం? అవి రెండు పూర్తిగా వేరు వేరు అంశాలకు సంబంధించినవి. "...మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులవలె ఉండక, నిష్కాపట్యము గలవారమును దేవునివలన నియమింపబడినవారమునైయుండి, క్రీస్తునందు దేవునియెదుట బోధించుచున్నాము” (2కొరి 2:17).

సంఘంలో పాస్టర్ గా స్త్రీ విధులు నిర్వహించరాదని సంఘానికి శిరస్సైయున్న క్రీస్తే లేఖనాల ద్వారా అధికార పూర్వకంగా చెబుతున్నాడు. “స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషునిమీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను” (1తిమోతి 2:12-14). స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. వారు ఏమైనను నేర్చుకొనగోరిన యెడల, ఇంట తమ తమ భర్తల నడుగవలెను; సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము” (1కొరి 14:34-35). అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపణచే స్త్రీల విషయంలో కొరంథి స్థానిక సంఘానికి మాత్రమే కాకుండా సంఘములలో అని మాట్లాడుతూ సార్వత్రికంగా తెలియజేశాడు. కావున సంఘంలో స్త్రీ పాస్టర్ గా పని చేయకపోవడమే ఆమెకు క్షేమం.

దేవుని క్రమం
          క్రీస్తు

సంఘానికి, పురుషుడికి శిరస్సు (ఎఫెసీ 5:23, 1కొరి 11:3).
ప్రభువు, పురుషున్ని తన సంఘంపై సంఘ పెద్దగా నియమించాడు (1తిమోతి 3:1-8,తీతు 1:6-9).

 

Add comment

Security code
Refresh

Comments  

# RE: సంఘపెద్దలుపోచయ్య 2021-01-26 21:27
బైబిల్ వ్యాసాలు దయతో నా మెయిల్ కు ప౦పగలరు. ధన్యవాదాలు.
Reply
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.