కాల్వినిజం పేరుతో పిలవబడుతున్న దేవుని సార్వభౌమత్వాన్ని చాటిచెప్పే వాక్యానుసారమైన బోధపై విషం కక్కేందుకు కొంతకాలంగా అహర్నిశలూ కష్టపడుతున్న ప్రవీణ్ పగడాలగారు, ఆ క్రమంలో భాగంగా వాక్యాలను వక్రీకరించడమే కాకుండా మరొక వాదనను కూడా తెరపైకి తీసుకు వచ్చి 'వాక్యపునాది' అనే తన వెబ్ సైట్ లో 'నీ బ్రతుకు బస్టాండు- నా మహిమకే' అనే పేరుతో ప్రకటించారు. దానిని ఈ లింక్ ద్వారా మీరు చదవొచ్చు.
నీ బతుకు బస్టాండు - నా మహిమకే..!!
ప్రవీణ్ పగడాలగారు చేసిన ఈ ప్రయత్నం సరిగ్గా మతోన్మాదుల వాదనకు సరిపోయేలా కనిపిస్తుంది; గతంలో అటువంటి వాదనలు చేసే మతోన్మాదులను ఖండించడానికి ముందుండే ప్రవీణ్ పగడాలగారు, ఆయన ఇంగితానికి ఏమైందో ఏమో, ఇలా తయారయ్యారు.
ఇక విషయానికి వస్తే, ప్రవీణ్ పగడాలగారు ఒక కాల్వినిస్టు ప్రొఫెసర్ తాను ఒంటబట్టించుకున్న కాల్వినిజ భావజాలం, తాను నమ్మే శాడిస్టైన దేవుని కారణంగా ప్రదర్శించిన శాడిజానికి తన బైబిల్ కాలేజి విద్యార్థి రెండు కాళ్ళను పోగొట్టుకున్నాడని వాపోయాడు. ఇక్కడ విచిత్రమేంటంటే, ఒకవైపు కాల్వినిజ భావజాలంలోనూ, తాము నమ్మే దేవునిలోనూ ఇటువంటి శాడిజం ఉంది కాబట్టే దానిని నమ్మేవారు ఆ విధంగా ప్రవర్తిస్తారని రాస్తూ, మరోవైపు బ్రేకట్ పెట్టి నాకు తెలిసిన కొంతమంది కాల్వినిస్టులు మృదువుగా స్నేహభావంతో ఉంటారు కాబట్టి కాల్వినిస్టులంతా అలా ఉంటారన్నది నా భావన కాదని తూచ్ అంటున్నాడు. ఈయనకిలా తూచ్ తూచ్ అని మాటలు మార్చడం బాగా అలవాటైపోయింది. ప్రవీణ్ పగడాలగారు చెబుతున్నట్టు కాల్వినిజంలోనే శేడిజం ఉండి, దాన్ని నమ్మేవారంతా దాన్నే ఒంటబట్టించుకుంటుంటే, కొందరు కాల్వినిస్టులు మాత్రం మృదువుగా, స్నేహభావంతో ఎలా ఉంటున్నారు? వారు వేరే టైప్ కాల్వినిజాన్ని ఏమన్నా నమ్ముతున్నారా? ప్రవీణ్ గారే జావాబు ఇచ్చుకోవాలి.
ప్రొఫెసర్ శాడిజం వల్ల రెండు కాళ్ళు కోల్పోయిన విద్యార్థితో, ఆయన ఇదంతా దేవుని చిత్తం, దేవుని నిర్ణయం, ఆయన మహిమ కోసమే ఇలా అయిందని చెబితే, అది తప్పు అన్నట్టుగా ప్రవీణ్ పగడాలగారు చిత్రీకరిస్తున్నాడు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, దేవునిపైన ఎంతో ఆసక్తితో ఉన్న ఆ విద్యార్థిని ప్రవీణ్ పగడాలగారు నమ్మే దేవుడు కాళ్ళు పోకుండా ఎందుకు కాపాడలేకపోయాడు? అదంతా తన చిత్తం కానప్పుడు వారికి ప్రమాదాలు జరిగినా, వారిపై దాడులు జరుగుతున్నా కాపాడలేనంత అసమర్థుడా నాన్ కాల్వినిస్టులు నమ్మే దేవుడు? తన పిల్లలపై తన నిర్ణయం కాకున్నా, దాని ద్వారా ఆయనకి మహిమ రాకున్నా, దాడులు, ప్రమాదాలు జరుగుతుంటే కాపాడలేని దేవుడు ఏం దేవుడో మరి! ఆయనే ప్రవీణ్‌గారు నమ్మే గొప్ప దేవుడు.
ఇంతకూ కాల్వినిస్టులు నమ్మే దేవుడు అన్నిటినీ తన చిత్తప్రకారం, తన నిర్ణయానుసారంగా చేస్తున్నాడా లేదా అని మచ్చుకు ఈ వచనాలు చూడండి -
దానియేలు 4: 35
భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు.
ఈ వచనంలో ఆయన సమస్తమూ కూడా తన చిత్తప్రకారమే జరిగిస్తాడని రాయబడింది. (అది నెబుకద్నెజరు మాట్లాడుతున్నా, అతనికి బుద్ధి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాడు). ప్రవీణ్ పగడాల గారు చదివే బైబిల్‌లో ఇటువంటి వాక్యభాగాలను, తన అసమర్థ దేవుణ్ణి ప్రకటించే భావజాలానికి అడ్డువస్తున్నాయని చింపేసుకున్నాడనుకుంటా.
అపొస్తలుల కార్యములు 2:23
దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత(లేక, అక్రమకారులచేత) సిలువ వేయించి చంపితిరి.
ఈ సందర్భంలో పేతురు దేవుడు నిర్ణయించిన సంకల్పాన్ని బట్టి, యేసుక్రీస్తు అప్పగించబడి దుష్టుల చేత సిలువ వేయబడ్డాడని చెబుతున్నాడు, ప్రవీణ్ పగడాలగారేమో దేవునికి ముందు నిర్ణయమంటూ ఏమీ ఉండదు అంటున్నాడు.
ఆదికాండము 50:19,20
యోసేపుభయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను.
ఈ సందర్భంలో యేసేపు తనను తన అన్నలు అమ్మివేయడం దేవుని ఉద్దేశం కాబట్టే అలా జరిగిందని చెబుతున్నాడు.
లేఖనాలు చెప్పేదాని ప్రకారం, జరిగే అన్నిటికీ దేవుని నిర్ణయమే కారణమైనా, అందులో పాల్గొనే వ్యక్తులు తమ క్రియలను బట్టి పాపులుగా తీర్పు తీర్చబడుతున్నారు.
మనం పైన చూసిన లేఖనాల్లో స్పష్టంగా రాయబడినదాని ప్రకారం, యేసుక్రీస్తు దేవుని సంకల్పాన్ని బట్టే అప్పగించబడి దుష్టుల చేత సిలువ వేయబడినా, ఆయనని అప్పగించిన యూదా, చంపినవారు దోషులు అయ్యారు, యేసేపు అన్నలు కూడా తనని అమ్మివేసి దోషులయ్యారు. ఇదంతా దేవుని నిర్ణయమైనప్పటికీ దేవుడు పాపానికి కర్త అవ్వడం లేదు, అందులో పాల్గొనే వ్యక్తులే పాపులు. ఇదే దేవుని సార్వభౌమత్వం అంటే, త్రిత్వ సిద్ధాంతంలానే దీన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోలేకున్నా ఇదే లేఖనాలు చెప్పే సత్యం. గతంలో ప్రవీణ్ పగడాలగారు, దేవుణ్ణి మనం పూర్తిగా అర్థం చేసుకుంటే మనమూ దేవుళ్ళం ఔతాం కాబట్టి లేఖనంలో బయలుపరచబడినంత మట్టుకే అర్థం చేసుకోగలమని స్పీచ్చులిచ్చి, ఇక్కడ మాత్రం తూచ్ అంటూ, లేఖనాలు పరిధిలో కాకుండా ఏవేవో ఫిలాసఫీలు తీసుకువచ్చి, ఆ మూసలో కాల్వినిజం ఇమడటం లేదు కాబట్టి ఈ బోధ తప్పు, దీని ప్రకారం దేవుడే పాపానికి కర్త, ఆయనకి ముందు నిర్ణయం లాంటిదేమీ లేదంటున్నాడు.
లేఖనాల బోధ ప్రకారం
1 దేవునికి అన్నిటిలోనూ ముందస్తు నిర్ణయముంది.
2 అయినప్పటికీ దేవుడు పరిశుద్ధుడు, పాపానికి కర్త కాడు.
టైపింగ్ మిస్టేక్ చేసినా దేవుడే కారణమా, కాలు జారిపడినా దేవుడే కారణమా అన్నట్టుగా ఎవరైనా వెటకారం చేస్తే వారు లేఖనాలని వెటకారం చేసే బుద్ధిహీనులని మనం గ్రహించాలి; ఎందుకో ఈ వచనం కూడా చూడండి -
మత్తయి సువార్త 10:29,30
రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు.
మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి.
ఈ వచనం ప్రకారం ఒక పిచ్చుక కూడా దేవుని సెలవుల లేక నేలనపడదు, మన తల వెంట్రుకలు కూడా మనమెంత పీక్కున్నా ఆయన సెలవైతేనే తప్ప రాలవు. ఆయన చిత్తం కాకుండా తలవెంట్రుకే రాలనప్పుడు కాళ్ళు విరుగుతాయా? ప్రవీణ్ గారే సమాధానం చెప్పాలి.
ప్రవీణ్ పగడాలగారు ఇంకా కొనసాగిస్తూ, తనతో ఫోన్లో మాట్లాడిన సోదరుడి తండ్రి విగ్రహారాధికుల మధ్యలో ఎంతో కష్టపడి సువార్త ప్రకటించి, ఒక సంఘాన్ని కట్టాడని, అటువంటి వ్యక్తితో కాల్వినిస్టులు దేవుడు ఆల్రెడీ కొందరిని పరలోకానికి ఎన్నేసుకున్నాడు కాబట్టి నువ్వు సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదని చెప్పడం పిచ్చి కాదా అని ప్రశ్నిస్తూ, అంత కష్టపడి సువార్త చేసిన వ్యక్తితో ఇందులో నీ కష్టమేమీ లేదు అంతా దేవుడే చేసాడని చెప్పడం అన్యాయమన్నట్టుగా వాపోయాడు. ఇంతకూ దేవుడు ఆల్రెడీ కొందరిని ఎన్నుకున్నాడు కాబట్టి మనం సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదని ఏ కాల్వినిస్టు పిచ్చిగా చెప్పాడో ప్రవీణ్ పగడాలగారు ఆధారం చూపించాలి. ఎందుకంటే, నిజమైన ఏ కాల్వినిస్టూ అలా చెప్పడు, దేవుడు ఎన్నుకున్నవారిని వెలుగులోకి తీసుకువచ్చే సాధనమే సువార్త ప్రకటన కాబట్టి, మనం ఎంతో ప్రయాసతో సువార్తను ప్రకటించాలని, అపోస్తలులు దానికోసమే ప్రాణం పెట్టారని వారు చెబుతారు. ప్రవీణ్ పగడాలగారు ఒక్కోసారి అబద్ధానికి జనకునివలే భలే మాట్లాడుతుంటారు. ఇంతకూ దేవుని ఎన్నికేమీ లేకుండా, సువార్త ప్రకటన ద్వారానే మనుషులు విశ్వాసులుగా మారిపోతుంటే సువార్త విన్న అందరూ ఎందుకు మారిపోవడం లేదో ఆయనే సమాధానం ఇచ్చుకోవాలి.
అదేవిధంగా, దేవుడు ఎన్నుకున్నవారిని ఆయన నిర్ణయించిన సువార్త సాధనాన్ని బట్టి ఆయనే విశ్వాసులుగా మారుస్తున్నాడు కాబట్టి, నువ్వూ నేనూ చేసిందేమీ లేదు, అంతా దేవుడే చేశాడని ఆయనకు మహిమను ఆపాదించడం ఏమాత్రం తప్పు కాదు. ఎందుకంటే లేఖనం ప్రకారం కష్టపడి సువార్త ప్రకటించే సామర్థ్యాన్ని కూడా మనకు దేవుడే ప్రసాదిస్తున్నాడు కాబట్టి, ఆయనకే మహిమ చెల్లించాలి. కష్టపడినందుకు మనకు రావలసిన జీతాన్ని ఆయనే ఇస్తాడు, మనం ఆయన మహిమను దొంగిలించక్కర్లేదు.
2కోరింథీయులకు 3: 5
మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది.
మొదటి కొరింథీయులకు 3:6-8
నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు. నాటువాడును నీళ్లుపోయువాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టముకొలది జీతము పుచ్చుకొనును.
చూడండి, తాను ముందుగా ఎన్నుకున్నవారిని సంఘంలో చేర్చడానికి సువార్త అనే సాధనాన్ని కూడా ఆయనే నిర్ణయించి, దానిని కష్టపడి ప్రకటించడానికి నీకూ నాకూ సామర్థ్యాన్ని, తపననీ కలగచేసిన దేవునికి, వృద్ధి కలగచేసిన దేవునికి అంతా ఆయనే చేసాడు నీదీ నాదీ ఏం లేదని కాల్వినిస్టులు చెప్పడం అన్యాయమో, లేక నేను సువార్త ప్రకటించకపోతే దేవుడు కూడా ఎవర్నీ మార్చలేడు కాబట్టి దేవుడు నాపై ఆధారపడతాడు, నా కష్టం లేకపోతే ఆయనకు గతిలేదన్నట్టుగా చెప్పే ప్రవీణ్ పగడాలగారి భావజాలం విడ్డూరమో మీరే గ్రహించాలి.
ప్రవీణ్ పగడాల(నాన్ కాల్వినిస్టుల) భావజాలం ప్రకారం, దేవుడు ఒక మూలన కుర్చీ వేసుకుని కూర్చునుంటాడు, వీళ్ళు స్తుతిస్తేనే తప్ప ఆయనకి స్తుతుల సింహాసనం ఉండదు, వీళ్ళు కష్టపడి ప్రకటించకపోతే ఆయనకు విశ్వాసులుండరు.
అందుకే ఈ నాన్ కాల్వినిస్టులు జనాల్ని ప్రలోభపెట్టైనా మతం మార్చాలనే ఉద్దేశంతో మతమార్పిడి మాఫీయాలుగా తయారౌతుంటారు. ఎందుకంటే వీళ్ళే కష్టపడి దేవుని కోసం మతం పేరుతో జనాల్ని పోగేయ్యాలి మరి. దీనికి మంచి ఉదాహరణగా, కాల్వినిస్టుల మాటలను సందర్భరహితంగా cut&paste చేసి విసుగెత్తించే పోస్ట్లు రాసే LK మృత్యుంజయగారిని తీసుకోవచ్చు. ఆయన ఒకసారి రక్షణ టీవీలో శ్రీనివాస బంగారు శర్మ అనే హైందవ మతపెద్దతో మాట్లాడుతూ, మేమున్నది Conversion (మతమార్పిడి) చేయడానికే అన్నట్టుగా, క్రైస్తవ్యాన్ని తప్పుపట్టేలా మతోన్మాదులకి అవకాశం ఇస్తూ అజాగ్రతగా మాట్లాడారు.
ఏవిధంచేతనైనా కొందర్ని రక్షించాలని, అందరికీ అన్ని విధములవంటివాడనైతినని పౌలు మాట్లాడుతున్నపుడు అది ప్రలోభపెట్టి మతం మార్చడం కోసం కాదు కానీ, దేవుడు ఆయనకు కలగచేసిన సామర్థ్యాన్ని బట్టి, ఆయన నిర్ణయించిన సువార్త సాధనం పరిధిలోనే అని మనం గ్రహించాలి. ఇటువంటి భావజాలాన్నే కాల్వినిస్టులు కలిగుండి, తమకు సామర్థ్యం కలగచేస్తూ, విశ్వాసులను తిరిగి జన్మింపచేస్తున్న దేవునికే మహిమను ఆపాదిస్తుంటారు.
ఇక చివరిగా, ప్రవీణ్ పగడాలగారు బ్రేకట్ పెట్టి ఎంత తూచ్ అనే ప్రయత్నం చేసినా, ఆ శాడిస్టు ప్రొఫెసర్ గురించి ఈయన రాయడం వెనుక అసలు ఉద్దేశం, కాల్వినిస్టులంతా ఆ ప్రొఫెసర్ లానే ఉంటారని చెప్పడానికే. మేము ఆయనలా బ్రేకట్లు పెట్టి తూచ్ అని మాటమార్చకుండా ఇదే కొలమానాన్ని తీసుకుంటే, గతంలో ప్రవీణ్ పగడాలగారు ఈ మధ్య కాలంలో మరణించిన ఒకానొక పాపులర్ అపాలజిస్ట్ ని అడ్డుపెట్టుకుని కాల్వినిస్టులపై విషం కక్కే ప్రయత్నం చేశాడు, ఎందుకంటే ఆయన కూడా నాన్ కాల్వినిస్టే.
అసహ్యకరమైన విషయం ఏంటంటే, ఈయన కొందరు స్త్రీలతో లైంగిక సంబంధం కలిగి ఉన్నట్టు విచారణలో తేలి, దాన్ని ఆయన మినిస్ట్రీవారు కూడా ఒప్పుకున్నారు. ఒక వ్యక్తి ప్రవర్తనకు తాను నమ్మే భావజాలమే కారణం కాబట్టి, ఆ ప్రవర్తనను ఆ భావజాలమంతటికీ ఆపాదించాలనే ప్రవీణ్ పగడాలగారి వాదనే నిజమైతే, సదరు అపాలజిస్ట్ నాన్ కాల్వినిస్ట్ కాబట్టి, నాన్ కాల్వినిస్టు అపాలజిస్టులు ఆయనలాగే లైంగిక అపవిత్రతకు గురౌతుంటారా? మేమైతే అలా నమ్మడం లేదు, ప్రవీణ్ గారు మాత్రం అలానే నమ్ముతుంటారు, దీనివల్ల ఆయనకే సమస్య వస్తుంది సుమా!
ప్రవీణ్ పగడాలగారు తన వ్యాసం చివరిలో ఇలాంటి చిన్నచిన్న వివరాలతో కాల్వినిజానికి వ్యతిరేకంగా మన ముందుకు వస్తుంటానని ప్రతిజ్ఞ పూనారు, వాటితో పాటుగా మేము ఆయన రాతలకిస్తున్న కౌంటర్లకు కూడా సమాధానాలిచ్చుకునే ప్రయత్నం చేస్తూ ముందుకు రావాలని, అలా రాకున్నప్పటికీ ఆయన వక్రీకరణ రాతలన్నిటినీ ఎండగడుతూ మేము వస్తూనే ఉంటామని తెలియచేస్తున్నాము.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
Comments