నిజ క్రైస్తవ జీవితం

రచయిత: జాన్ ఒవెన్
అనువాదం: జి. బిబు

 

కృతజ్ఞతలు

డాక్టర్ జాన్ ఓవెన్ గారి 'ది మార్టిఫికేషన్ ఆఫ్ సిన్ ఇన్ బిలీవర్స్' అనే పుస్తకాన్ని తెలుగు భాషలో అనువదించే అవకాశాన్ని నాకివ్వటంతో పాటు, పూర్తి ఆర్థిక సహాయం అందించిన సహోదరులు జీ. అజయ్ రెడ్డి గారు, ఎడిటింగ్ చేసిన సహెూదరుడు యం.చంద్రశేఖర్, డి.టి.పి.లో సహకరించిన సహెూదరులు బి. నవీన్ కుమార్ మరియు జి. శ్రీనివాస్, ప్రూఫ్ రీడింగ్ చేసిన సోదరి ఎన్. గ్లోరీ ప్రసన్న, ప్రింటింగ్ జరిగించిన సహెూదరుడు డేవిడ్ బొల్లంపల్లి, పబ్లిషింగ్ కావించిన హిస్ కామ్ పబ్లిషర్స్ మరియు ఎన్నో ప్రతికూల సవాళ్ల నడుమ ఈ పనిని కొనసాగించి ముగించటానికి అవసరమైన ప్రోత్సాహంతో సహకరించిన నా భార్య లీల, శ్రేయోభిలాషులైన జి. విజయ్ ప్రసాద్ మరియు శ్రీమతి జి. సుశీలరెడ్డి గారి ద్వారా సమస్తము సమకూర్చి జరిగించిన త్రియేక దేవునికి ప్రభు యేసుక్రీస్తు నామములో స్తుతులు చెల్లిస్తున్నాను. మా ఈ చిరు ప్రయత్నాన్ని, పాపంతో పోరాడటంలో తన బిడ్డలకు తగిన నడిపింపును అనుగ్రహించటానికి తన మహిమార్థమై దేవుడు వాడుకుంటే, ఈ మా ప్రయాసకు అంతకంటే గొప్ప ప్రతిఫలమేదీ లేదు.

 

ముందుమాట

ఈ పుస్తకం వ్రాయబడినప్పటి పరిస్థితులను గమనిస్తే, దీని రచయిత జాన్ ఓవెన్ (1616 - 24 ఆగస్టు 1683) గారీ వ్యక్తిత్వాన్ని, సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడంలో అవి మనకు ఎంతో సహాయపడతాయి. క్రీ.శ. 1656వ సంవత్సరములో ఈ పుస్తకం ప్రచురించబడినపుడు, జాన్ ఓవెన్ గారు క్రైస్ట్ చర్చ్ లో ముఖ్యాధ్యక్షులుగాను (డీన్), ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి వైస్-ఛాన్సలర్ గాను తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ, అంతర్యుద్ధాల వలన కలిగిన పతనావస్థ నుండి ఆ సంస్థలను పునర్నిర్మించే సత్కార్యంలో తలమునకలైయున్నారు. ఉదారభావంతోను, సాధనతోను ఆయన తలపెట్టిన ఈ కృషి, క్లారెండన్ సమాలోచన సభవారీ అభినందనలు సైతం ఆర్జించేంతగా ఆ సంస్థలను అభివృద్ధి చేసింది. రెండు వారాలకోసారీ ఓవెన్ గారు పంచుకున్న ఆదివార సందేశాలు, ఫిలిప్ హెన్రీ వంటి పెద్దల మనసులలో మెదులుతూ వారి భక్తి జీవితాన్ని ఎంతో బలపరచాయి. ప్రజాసంక్షేమానికి సంబంధించిన ముఖ్యవిషయాలలో ఆయన సలహా పొందడానికి, శాసనసభ ఎదుట ప్రసంగించడానికి, తరచూ ఆయనను లండన్ నగరానికి ఆహ్వానించేవారు. ఈ బాధ్యతలు చాలవన్నట్లు, సోసినియన్ దుర్భోదలకు బదులు వ్రాయమని, కౌన్సిల్ ఆఫ్ స్టేట్ వారు మరో అదనపు భారాన్ని ఆయన పై మోపినపుడు, 'విండీషియా ఎవాంజెలికా' అనే పేరుతో ఒక పుస్తకాన్ని పాండిత్య ధోరణిలో రచించి, విశ్వాసాన్ని కాపాడే ఈ బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చారు. అందులోని బలమైన ఆధారాలను, పాండిత్య సుదీర్ఘతను ఎదిరించేందుకు సోసినియన్ వాదులెవరూ సాహసించలేకపోయారు. ఆ గొప్ప రచనను విడుదలచేసిన కొన్ని నెలలకే, “విశ్వాసులలోని పాపం సంహరించబడుట” అనే ప్రస్తుత పుస్తకాన్ని మనకు బహూకరించి, విశ్వవిద్యాలయంలోని పర్యవేక్షక బాధ్యతలు గాని, ప్రజాసంక్షేమ కార్యక్రమాల వత్తిడిగాని, దుర్భోదను ఖండించడంలో చోటుచేసుకున్న కటువైన వివాదాలుగాని, ఆయన వ్యక్తిగత దైవభక్తికి ఎలాంటి అభ్యంతరాలు కలిగించలేకపోయాయని, ఇతరులను నిజమైన దైవభక్తికై ప్రోత్సహించే ఆయన ఆసక్తిని ఏ విధంగానూ అవరోధించలేకపోయాయని నిరూపించుకున్నారు.

ఓవెన్ గారు బోధించినపుడు, దేవుని మార్గాలనెరిగిన పలువురి చేత ఆమోదించబడి, ప్రచురింపదగినవని వారు ప్రోత్సహించిన పలు అంశాలు ఈ పుస్తక రూపాన్ని దాల్చాయని, దీని ఉపోద్ఘాతం నుండి తెలుస్తుంది. అంతేగాక, ఆ రోజుల్లో కొందరు బోధకులు మరియు రచయితలు గురైన కొన్ని ప్రమాదకరమైన అపోహలను సరిచేయాలనే ఓవెన్ గారి ఆసక్తి, ఈ పుస్తకం వెలువడడానికి మరో ముఖ్యకారణం. ఎందుకంటే పాపాన్ని చంపడానికి అలాంటివారు విశ్వాసులకు నేర్పించి, ఆచరించమని వారిని బలవంతపెట్టిన పద్దతులు సువార్త సూత్రాలపై ఆధారపడినవి కావు. మనస్సాక్షిని చిక్కునపడవేయడానికి, స్వనీతి తత్త్వాన్ని మరియు మూఢ నమ్మకాలను పెంపారజేయడానికి తప్ప అవెందుకూ పనికిరావు. అయితే, అంతరంగంలో ఉన్న అపవిత్రతను అంతమొందించడానికి ఓవెన్ గారు సూచించిన నిర్దేశాలు, సంకుచిత సన్యాసానికి దారితీసే నిష్ట నియమాలు మరియు నిబద్దత పద్దతులతో కూడినవి కావు. ఇదే అంశంపై ఇతరులెందరో వ్రాస్తూ, తమ సన్యాసత్వ ఏకాంతత వలన పుట్టుకొచ్చిన అహంకారాన్ని మరియు కృత్రిమ భక్తిని కనపరిచిన శైలి, ప్రస్తుత పుస్తకంలో లేశమైనా కనిపించదు. మానవస్వభావం యొక్క నిజస్వరూపం మరియు నిజజీవిత వేదికపై అది సాధారణంగా ప్రవర్తించే తీరును గురించి ఓవెన్ గారి అవగాహన ఎంతో లోతైనది. అయితే, దేవుని వాక్య సత్యాల గురించి, అవి మానవ హృదయం మరియు స్వభావంపై చూపించే ప్రభావం మరియు పని చేసే తీరును గురించిన వారి జ్ఞానం ఎంతో అపారమైనది. వీటన్నిటిని మించిన గొప్ప దీవెన ఏమిటంటే, తమ పాపవాంఛలను నాశనమొందించడానికి వాటిని మేకులతో బిగించవలసింది యేసుక్రీస్తు ప్రభువు తమకై శాపముగా చేయబడిన ఆ మ్రానుకే తప్ప, స్వీయ నిష్ఠ నియమాలతో కల్పించుకున్న వారి ఊహాకల్పిత సిలువలకు కాదనే అనుభూతి ఈ పుస్తకము చదివే వారికి కలుగుతుంది.

ఈ పరిశోధనకు ఆధారంగా తీసుకున్న లేఖన భాగాన్ని (అనగా రోమా 8:13 వచనాన్ని) మొదట విడమరచి వివరించి, ఆపై దాని నుండి కొన్ని సాధారణ నియమాలను వెలికి తీయడం ఈ పుస్తకంలో మనం చూస్తాము. మొదట నిజంగా పాపాన్ని సంహరించడమంటే ఏమిటో నిర్వచించి, తర్వాత ఏ సాధారణ నిర్దేశాలు పాటించకుండా పాపాన్ని యధార్థంగా సంహరించడం సాధ్యపడదో తెలియజెప్పి, చివర ఆత్మీయ అభ్యాసానికి అవసరమైన కొన్ని ప్రత్యేక నియమాలను విపులంగా చర్చించే ఉద్దేశ్యముతో మన ముందున్న అధ్యాయాలు రూపొందించబడ్డాయి.

ఈ పుస్తకం, దాని రచయిత జీవిత కాలంలోనే ఎన్నో ముద్రణలకు నోచుకొని, దాని విలువను స్వయంగా చాటుకుంది. ప్రస్తుత అనువాదం 1658లో విడుదలైన రెండవ ముద్రణ ఆధారంగా చేయబడింది.

- విలియం హెచ్.గూల్డ్

 

రచయిత ముందుమాట

క్రైస్తవ చదువరి,

ఈ పుస్తకాన్ని ప్రచురించడం అవసరమని నన్ను ఒప్పించిన కొన్ని సంగతులను క్లుప్తంగా నీతో పంచుకుంటాను. విశ్వాసులమని చెప్పుకునేవారు ఈ లోకంతో రాజీపడి అనుభవించే సమాధానం వలన మరియు ఒకరితో ఒకరికున్న విబేధాల వలన వారికీ అనేక శోధనలు కలుగుతున్నాయని, అయితే వారిని ముట్టడించే ఈ శోధనలను ఎదుర్కోవడంలో వారి హృదయాలు మరియు ఆత్మలు నిస్సహాయ స్థితిలో ఉన్నాయని, స్పష్టమైన కొన్ని బాహ్య గుర్తులు నేను వారిలో గమనించాను. ఇది ఈ పుస్తకాన్ని ప్రచురించమని నన్ను త్వరపెట్టిన కారణాలలో అతిముఖ్యమైంది. ఈ రచన తమ నడతను సరిచూసుకునేలా వారిని పురిగొల్పి, ఇందులోని సూత్రాలు వారి విశ్వాసజీవితానికి కొంత చేయూతనివ్వగలిగితే, ఈ ప్రయాసకై అదే నాకు చాలిన దీవెన.

ఇకపోతే, యేసుక్రీస్తు సువార్త మర్మాన్ని గురించి మరియు ఆయన మరణానికున్న సామర్థ్యాన్ని గురించి గ్రహింపులేని కొందరు, పాపాన్ని జయించడానికి ఇటీవలే ప్రవేశపెట్టిన కొన్ని స్వయంకల్పిత విధానాలు, వారు కానీ, వారి పితరులు కానీ మోయలేని బరువైన కాడిని వారీ శిష్యులమెడపై మోపే ప్రమాదకరమైన పొరపాట్లని గమనించాను. ఇది ఈ రచనను ప్రచురించమని నన్ను బలవంతపెట్టిన రెండవ కారణం. పాపాన్ని చంపడానికి వారు పాటించమని ఒత్తిడి చేసే పద్ధతులు, వాటి స్వభావంలోగాని, సందేశంలోగాని, ఉద్దేశాలలోగాని, ఉద్దేశ్యాలు అందుకోవడానికి ప్రయోగించే విధానాలలోగాని, వాటి ఫలితాలలోగాని, సువార్తతో ఎలాంటి పొంతన లేనివిగా ఉన్నాయి. పైగా, ఆ కాడిని మోయాలనుకున్నవారిని అది మూఢనమ్మకాలకు, స్వనీతికి మరియు మనస్సాక్షిలో కలవరానికి గురిచేస్తుంది. అయితే, ఈ రచన ద్వారా నేను చేసిన అల్పమైన ప్రయాస, సువార్తతో అక్షరంలోను, ఆంతర్యంలోను అనుగుణ్యత కలిగి యుంటుందని, కృపాసహిత నిబంధన ద్వారా దేవునితో ఐక్యం చేయబడి, ఆ నిబంధనాధారంగా ఆయనతో నడవడమంటే ఏమిటో తెలిసినవారి అనుభవాలతో కూడా ఏకీభవిస్తుందని వినయంగా విశ్వసిస్తున్నాను. ఈ రచన ద్వారా కాకపోయినా, ఏదో ఒక విధంగా సువార్తాధారిత విధానంలో పాపాన్ని ఓడించడం అవసరమనే భావాన్ని విశ్వాసుల హృదయాలలో కలిగించి, పెంపారజేసి, సురక్షిత మార్గంలో నడవడానికి కావలసిన దిశానిర్దేశాన్ని, వారి ఆత్మలకు విశ్రాంతిని చేకూర్చే సత్యాలను వారికందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించాలి.

నాకు సంబంధించిన ఒక విషయాన్ని కూడా పంచుకుంటాను. విత్తువానికి విత్తనం దయచేసే ఆయన కృపను బట్టి, బహుసమర్థవంతంగా ఈ అంశాన్ని గురించి నేను ప్రసంగించినపుడు, ఆ సందేశాలను అవసరమైన సవరణలతో పుస్తక రూపంలో ప్రచురిస్తే బాగుంటుందని కొందరు నన్ను ప్రోత్సహించారు. ఈ నా క్రైస్తవ మిత్రులకు నేను ఇదివరకే వాగ్దానము చేసిన 'దేవునితో సహవాసం' అనే పుస్తకం కూడా కొన్ని సంవత్సరాలుగా వారికి బాకీ ఉన్నాను. ఇంతకాలం వారు ఓపిక పట్టినా ఆ బాకీకి కనీసం వడ్డీగా ఈ ప్రస్తుత పుస్తకాన్ని వారు ఆమోదిస్తారని కోరుకుంటున్నాను. అంతేగాక, విశ్వాససంబంధమైన పలు వివాదాలలో నేను బహిరంగంగా పాల్గొనడం, వాటికి నేనిచ్చిన పరిష్కారాలను వినియోగించగోరేవారికి ఉపయుక్తంగా పరిణమిల్లడానికి దేవుని ఏర్పాటుననుసరించి అనుమతించబడిందని నేను విశ్వసిస్తున్నాను. అదే క్రమంలో వెలువడిన ఈ సందేశాలను ఇపుడు పుస్తక రూపంలో మీకందిస్తున్నాను. దేవుని ఏర్పాటుననుసరించి ఆయన నన్నుంచిన స్థితిని బట్టి, నా జీవితంలోను,ఇతరుల జీవితాలలోను పాపం చంపబడి, ఆయన కోరే పరిశుద్దతను పెంపారజేసి, ఆయన మహిమార్థమై మన ప్రభువగు రక్షకుడైన యేసుక్రీస్తు సువార్తను ధరించిన వారిగా చేయాలన్నదే నా హృదయపూర్వక వాంఛని, నా జీవిత లక్ష్యమని, యధార్థంగా ఆయన ఎదుట ఒప్పుకోగలనని నమ్ముతున్నాను. ఈ లక్ష్యాన్ని అందుకోవడానికి దోహదపడే అంశాలతోనే ప్రస్తుత పుస్తకం రూపొందించబడింది కనుక, ఒక్క బలహీనమైన విశ్వాసినైనా, నిజమైన పరిశుద్దత దిశగా ఇది నడిపించగలిగితే, ఈ ప్రచురణ విషయమై నేను చేసిన ప్రార్థనకు అదే చాలిన సమాధానమని సంతృప్తి చెందుతాను.

- జాన్ ఓవెన్

 

అధ్యాయం-1

రోమా 8:13 వివరణ

(ప్రస్తుత అంశానికి పునాది)

విశ్వాసులలో పాపం ఎలా చంపబడాలనే దిశగా నేను పంచుకోబోయే విషయాలు, క్రమంగాను, తేటగాను వ్యక్తపరచడానికి, రోమా 8:13లో అపోస్తలుడు సెలవిచ్చిన మాటలను ఆధారంగా తీసుకొని, అందులో ఉన్న గొప్ప సౌవార్తిక సత్యాన్ని, మర్మాన్ని విశదపరుస్తున్నాను.

“మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారైయుందురు, కాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు” (రోమా 8:13)

విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడతారనే తన సందేశ సారాంశాన్ని పునరుద్ఘాటిస్తూ, కృపచేత అందులో పాలివారైన వారి ధన్యకరమైన స్థితిని అభివర్ణిస్తూ (రోమా 8:1-3), విశ్వాసులను పరిశుద్ధతకై పురిగొల్పడానికి మరియు వారికి ఆదరణ కలిగించడానికి ఆ సత్యాలను అపోస్తలుడు వినియోగిస్తున్నాడు.

ప్రస్తుత వచనంలో పరిశుద్దత మరియు పాపం వలన కలిగే పరస్పర వ్యతిరేక ఫలితాలను ఎత్తి చూపించడం, పరిశుద్ధతను ప్రోత్సహించడానికి అపోస్తలుడు ప్రయోగించిన తర్కాలలో ఒక తర్కం. “మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారైయుందురు” (రోమా 8:13). శరీరానుసారంగా ప్రవర్తించడమంటే ఏమిటో, దాని మూలంగా చావడం అంటే ఏమిటో వివరించడం, ప్రస్తుత సందేశానికి సంబంధించిన అంశాలు కావు. కాబట్టి, మన ప్రస్తుత ధ్యానానికీ ఆధారంగా నేను విశ్లేషించబోయే ఈ వచనంలోని రెండవ భాగపు పరిమితిలోనే వాటికీ వివరణ ఇస్తాను.

ప్రస్తుత ధ్యానానికి మనం ఎన్నుకున్న వాక్య భాగంలో మొదటిగా ఒక బాధ్యత ప్రతిపాదించబడింది; 'శరీర క్రియలను చంపిన యెడల'

రెండవదిగా, ఆ బాధ్యత ఎవరికి చెందిందో తెలుపబడింది; 'మీరు', 'మీరు... చంపిన యెడల'

మూడవదిగా, ఆ బాధ్యతకు ఒక వాగ్దానం జతచేయబడింది; 'మీరు... జీవించెదరు’

నాల్గవదిగా, ఆ బాధ్యత నెరవేర్చే సాధనం సూచించబడింది; 'ఆత్మ', “మీరు... ఆత్మ చేత' .

ఐదవదిగా, ఈ బాధ్యత, సాధనం మరియు వాగ్దానానికి సంబంధించిన షరతు పేర్కొనబడింది; 'యెడల', 'మీరు... చంపిన యెడల

 

1) పాపాన్ని చంపే బాధ్యత ఒక షరతుతో కూడినది

ఇక్కడ 'యెడల' అని షరతుగా ప్రతిపాదించబడిన మాటను మొదట గమనించాలి. షరతును వ్యక్తపరచే ఈ మాటను రెండు విధాలుగా అర్థం చేసుకునే వీలుంది. 

(a) ఈ వచనంలోని బాధ్యత ఎవరికి ఉద్దేశించబడిందో, వారికి అందులో చేయబడిన వాగ్దానం ఖచ్చితమైనది కాదేమో అనే అర్థం కూడా రావచ్చు. అయితే, వాగ్దానం నెరవేరడానికి షరతు కూడా నెరవేరడం తప్పనిసరైయుండి ఆ షరతు నెరవేరడమనేది వాగ్దానం పొందేవానికి తెలియని అనిశ్చిత పరిస్థితులపై ఆధారపడి ఉన్నపుడు, ఇలాంటి భావం కలుగుతుంది. ఉదాహరణకు, బ్రతికి ఉంటే ఆ పని/ ఈ పని చేస్తాను' అని మనమంటుంటాం. (ఆ పనులు ఈ పనులు చేయడమనేది బ్రతికుండాలనే షరతుపై ఆధారపడుంది. అయితే, బ్రతికుంటామా లేదా అనేది మనకు ఏ మాత్రం తెలియని లేదా మనతో నిమిత్తం లేని అనిశ్చిత పరిస్థితులపై ఆధారపడుంది). కాని, ఈ వచనంలో ఉన్న షరతును ఈ అనిశ్చిత భావంలో తీసుకోలేము. ఎందుకంటే, ఈ వాగ్దానం ఎవరికైతే ఉద్దేశించబడిందో, వారికి ఏ శిక్షావిధియు లేదని' ఇదే అధ్యాయంలోని మొదటి వచనంలో రూఢి చేయబడింది.

(b) ప్రస్తావించబడిన అంశాల మధ్య పరస్పర సంబంధముండి, అవి ఒకదానితో ఒకటి ముడిపడివున్నాయన్న అర్ధాన్ని ఈ షరతు వ్యక్తపరుస్తుంది. ఉదాహరణకు, 'ఫలానా మందులేసుకుంటే, లేదా ఫలానా చికిత్స చేయించుకుంటే నీ వ్యాధి నయమవుతుందని' మనమంటుంటాం. ఆ మందు లేదా చికిత్సకు మరియు వ్యాధి నయమవడానికి మధ్య సంబంధముందని ఆ షరతు స్పష్టంచేస్తుంది. ప్రస్తుత వచనంలోని షరతు కూడా ఈ భావంలోనే పేర్కొనబడింది. జీవించడం అనేది శరీర క్రియలను చంపడంతో సంబంధం కలిగియుందని ఈ షరతు వ్యక్తపరుస్తుంది.

అయితే, విషయాలకు మధ్యగల సంబంధాలు పలు విధాలుగా ఉంటాయి. అది హేతువుకు మరియు ఫలితానికి మధ్యగల సంబంధమైయుండొచ్చు. లేదా మాధ్యమానికి మరియు లక్ష్యానికి మధ్యగల సంబంధమైనా అయ్యుండొచ్చు. శరీర క్రియలను చంపడానికి మరియు జీవించడానికి మధ్య ఉన్న సంబంధం, హేతువు మరియు ఫలితానికి ఉన్న సంబంధం కాదు. ఎందుకంటే, నిత్య జీవమనేది దేవుడు యేసు క్రీస్తునందు అనుగ్రహించిన ఉచితమైన వరం. కాబట్టి వాటి మధ్యగల సంబంధం మాధ్యమం మరియు లక్ష్యానికి మధ్య ఉన్న సంబంధమే. దేవుడు తాను ఉచితంగా వాగ్దానం చేసిన లక్ష్యాన్ని అందుకోడానికి ఈ మాధ్యమాన్ని ఏర్పరచాడు. మాధ్యమం అవసరమైనదే ఐనప్పటికీ, అది ఉచితమైన వాగ్దానంగా అనుగ్రహించబడిన లక్ష్యానికి సహకరించేదిగా ఉండాలనడం న్యాయమే. ఉచితంగా అనుగ్రహించే వరాన్ని పొందేవానిలో, దానిని సంపాదించుకోగలిగే హేతువేదైనా ఉందనడం తర్కబద్దం కాదు. కాబట్టి షరతుతో కూడిన ఈ మాట, పాపాన్ని చంపడానికి మరియు నిత్యజీవానికి మధ్య ఉన్న ఖచ్చితమైన సంబంధాన్ని తెలిపే ఉద్దేశ్యంతో వాడబడింది. ఈ మాధ్యమాన్ని వినియోగిస్తే, ఆ లక్ష్యాన్ని అందుకుంటావు; పాపాన్ని చంపితే జీవిస్తావు. ఇదే ఇక్కడ ప్రతిపాదించబడిన బాధ్యతను నెరవేర్చేందుకు ప్రోత్సాహంగాను, దానికై త్వరపెట్టేదిగాను ఉంది.

2. ఈ బాధ్యత ఎవరికి చెందుతుంది?

ఇకపోతే, ఈ వచనంలో ఉన్న బాధ్యత ఎవరికి చెందిందో తెలిపే మాటను ఇక్కడ గమనిస్తాము. 'మీరు' అనే మాటలో ఇది వ్యక్తపరచబడింది. 'మీరు... చంపిన యెడల' అంటే, విశ్వాసులైన మీరు; 'ఏ శిక్షావిధియు లేని’ మీరు (వ1); శరీర స్వభావము' కాక 'ఆత్మ స్వభావము కలవారై ఉన్న మీరు (వ9); 'క్రీస్తు ఆత్మ ద్వారా జీవింపజేయబడిన మీరు (వ 10-11). మీకు ఈ బాధ్యత ఉద్దేశించబడింది. ఈ బాధ్యతను ఇంకెవ్వరి మీదైన రుద్దే ప్రయత్నం, లోకమంతటిని ఆవరించిన మూఢనమ్మకం మరియు స్వనీతి పుట్టించే ఫలమే; అది సువార్త విషయమై అజ్ఞానులైన భక్తిపరుల చేతుల్లో రూపుదిద్దుకున్న పని మాత్రమే (రోమా 10:3-4; యోహాను 15:5). ఈ బాధ్యత ఎవరికి ఉద్దేశించబడిందో, వారిని ఈ వచనం ప్రత్యేకంగా గుర్తిస్తుందన్న వాస్తవం మన ప్రస్తుత ధ్యానానికి పునాది. పాపపు శిక్షావిధి నుండి తప్పించబడిన విశ్వాసులలో అతి శ్రేష్ఠులైనవారు సైతం, అంతరంగంలో పోరాడే పాపపుశక్తిని మృతమొందించే పనిలో తాము జీవించు పర్యంతం ప్రతిదినం ప్రయాసపడాల్సిందే.

3. ఈ బాధ్యత మనం నెరవేర్చేలా సహయపడేది పరిశుద్ధాత్మ మాత్రమే

“... ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల.... ఇక్కడ 'ఆత్మ'( గ్రీకులో - న్యూమా) అంటే క్రీస్తు ఆత్మ, దేవుని ఆత్మ (వ9); మనలో నివసించే ఆత్మ, మనలను బ్రతికింపజేసే ఆత్మ (వ11); పరిశుద్దాత్మ (వ14); మనలను దత్తపుత్రులుగా చేసిన ఆత్మ (వ15); మనకొరకు విజ్ఞాపన చేసే ఆత్మ (వ26). పాపాన్ని చంపే ఏ ఇతర విధానమైనా అది వ్యర్థమే; ఏ ఇతర సహాయమైనా మనకు నిస్సహాయకరమే; ఆత్మ వలన మాత్రమే దీనిని జరిగించాలి. అపోస్తలుడు సూచించిన విధంగా (రోమా 9:30–32), తాము కలిగున్న ఇతర మాధ్యమాలు మరియు అవకాశాలపై ఆధారపడి, ఇతర నియమాలననుసరించి ఈ పని చేయ చూసేవారు ఎప్పుడూ ఉన్నట్లే ఇప్పుడు కూడా లేకపోలేదు. ఐనా ఇది ఆత్మవలనచేయవలసిన కార్యమని, ఆయన చేతనే ఇది జరగాలని, మరే శక్తి మీదైనా ఆధారపడి దీనిని తలపెట్టే ప్రయత్నం తగదని ఇక్కడ అపోస్తలుడు బోధిస్తున్నాడు. స్వశక్తినాశ్రయించి, స్వీయకల్పిత మాధ్యమాల ద్వారా, స్వనీతిని సంపాదించడమే, ప్రపంచంలోని ఏ అబద్దమతమైనా బోధించే సారాంశం. ఇది మన ధ్యానంలో గమనించాల్సిన రెండవ సూత్రం.

4. 'శరీర క్రియలను చంపుట' అని ఇక్కడ ప్రతిపాదించబడిన బాధ్యత: 

ఈ బాధ్యతనే ఇప్పుడు వివరించాలి. దీనికై మూడు విషయాలను మనం తెలుసుకోవాలి;

(a) శరీరమంటే ఏమిటి?

(b) శరీర క్రియలంటే ఏమిటి?

(C) వాటిని చంపడమంటే ఏమిటి?

(a) శరీరమంటే ఏమిటి?

ఈ వచన ప్రారంభంలోను అంతంలోను శరీరమనే మాట ఒకే భావంలో వినియోగించబడింది. “మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసినవారైయుందురు; కాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు”. తన సందేశమంతటిలోను, అపోస్తలుడు 'శరీరము' అని ఉ ద్దేశించింది 'ఆత్మ' చేత చంపబడవలసిన దానినే అని, మునుపు మరియు తదుపరి ప్రస్తావనలలో 'శరీరము' అనే మాటను 'ఆత్మ' కు వ్యతిరేక భావంలో వ్యక్తపరచడాన్ని బట్టి తెలుస్తుంది. ఇక్కడ శరీరమంటే మన స్వభావాలు లోనైయున్న అవినీతి మరియు భ్రష్టత్వమే. ఎందుకంటే, ముఖ్యంగా అది శరీరాన్నే తనకు ఆలవాలంగా మరియు మాధ్యమంగా వాడుకొని, శరీర అవయవాలను దాని దాస్యానికి లోబరచుకుంది (రోమా 6:19). కాబట్టి, అంతరంగమందున్న పాప స్వభావం, శరీరం గురి చేయబడిన భ్రష్టత్వం, లేదా దురాశే ఇక్కడ 'శరీరం' అని ఉద్దేశించబడింది. 'శరీరం' అనే మాటను ఇలా అలంకారరీతిగా వాడడానికి ఎన్నోకారణాలు ఉన్నాయి కానీ ప్రస్తుతం నేను వాటిలోనికి వెళ్ళను. ప్రాచీన పురుషుడు' [గ్రీకులో - పలయోస్ ఆంత్రోపోస్] 'పాపానికి లోనైన శరీరం' (రోమా 6:6) [గ్రీకులో - సోమా హమర్టీయా] అనే మాటలకు సమాన భావంలో ఇక్కడ 'శరీరం' అనే మాట వాడబడింది. దురాశకు మరియు తెగుళ్లలా పుట్టుకొచ్చే వాంఛలకు మూలమైన పతన స్వభావాన్ని సూచిస్తూ ఈ మాట వాడబడింది.

(b) శరీర క్రియలంటే ఏమిటి?

ఇక్కడ 'క్రియలు' [గ్రీకులో - ప్రాక్సిస్)అనే మాటకు బాహ్యంగా కనిపించే క్రియలు అని ప్రాథమిక అర్థం. గలతీ 5:19ను పోల్చి చూస్తే, 'శరీర క్రియలు' [గ్రీకులో - ఎర్గాన్] బయటకు కనిపించేవని , అవి స్పష్టమైనవని వివరిస్తూ, వాటి జాబితా కూడా అక్కడ పేర్కొనబడింది. అయితే, బాహ్య క్రియలు మాత్రమే ప్రస్తావించబడి నప్పటికీ, వాటిని పుట్టించే అంతర్గత కారణాలతో వ్యవహరించాలన్నదే ఇక్కడ ప్రాథమిక ఉద్దేశ్యం. చెట్టును దాని కూకటివేళ్ళతో పెరికివేయాలి. శరీర క్రియలను అవి ఉబికే మూలాల నుండే చంపివేయాలి. ప్రతి దురాశ పుట్టించేది క్రియనే కాబట్టి, క్రియారూపంలో వ్యక్తపడడానికి కొన్నిసార్లు అవి విఫలమైనా, వాటి ఉద్దేశ్యం మాత్రం పాపచర్యలకు దారితీయడమే కాబట్టి, వాటిని అపోస్తలుడు క్రియలు అని పేర్కొన్నాడు.

అంతరంగంలో ఉన్న దురాశే పాపకార్యాలకు ఊట అనీ, పాపమే వాటిని కలుగజేసే నీయమమనీ 7వ మరియు ప్రస్తుత అధ్యాయాల ప్రారంభంలో వివరించీ, ఇప్పుడు దానిని చంపమని చెబుతున్నపుడు, అది పుట్టించే ప్రభావాల పేరుతో దానిని ప్రస్తావిస్తున్నాడు. పాపస్వభావం ఇక్కడ 'శరీర క్రియలు' అనే మారుపేరుతో పిలువబడినట్లే, రోమా 8:7లో అది 'శరీరానుసారమైన మనసు' ( గ్రీకులో - సారక్స్) అని కూడా పిలువబడింది. అలాగే, గలతీ 5:2లో శరీరాన్ని సిలువ వేయడమంటే, పాపపు క్రియలనే ఫలాలను పుట్టించే 'ఇచ్ఛలను' మరియు 'దురాశలను' గ్రీకులో - సారక్స్) సిలువ వేయడమే అన్న భావం స్పష్టం చేయబడింది. ఈ పాపనైజమే ప్రస్తుత వచనంలో 'శరీరం' అనీ, 'శరీర క్రియలు'అని సాదృశ్యరీతిగా పిలువబడింది. రోమా 8:10లోని “శరీరము పాపవిషయమై మృతమే” అనే మాటయొక్క భావం, ఈ వివరణను ధృవీకరిస్తుంది.

(C) వాటిని చంపడమంటే ఏమిటి?

“చంపడం' (మీరు చంపిన[గ్రీకులో - తనలో'ఒ] యెడల) అనే మాట, ఏదైనా ఒక జీవి నుండి దాని ప్రాణం తీసివేసే అలంకారభావంలో వినియోగించబడింది. ఓ మనిషిని కానీ ఇంకేదైనా జీవిని కానీ చంపడమంటే, ఏ పని అయినా చేయగలిగే, శ్రమించగలిగే, యత్నించగలిగే దాని శక్తికి, ప్రాణానికి, సామర్థ్యానికి ఆధారమైన నీయమాన్ని తీసివేయడమే. ప్రస్తుత సందర్భంలో కూడా అదే దాని అర్థం. అంతరంగంలో ఉన్న పాప నియమం, అవయవాలు, గుణాలు, జ్ఞానము, తెలివీ, యుక్తి మరియు శక్తి కలిగిన ఒక వ్యక్తితో, సజీవమైన ఒక వ్యక్తితో పోల్చబడి, 'ప్రాచీన పురుషుడు' అని పిలువబడింది. ఈ ప్రాచీన పురుషుడినే చంపమని, సంహరించమని, మృతమొందించమని, అంటే దాని ప్రభావం చూపించలేని విధంగా, దాని శక్తిని, ప్రాణాన్ని, బలాన్ని, ఆత్మ ద్వారా హరించివేయమని ఇక్కడ అపోస్తలుడు అంటున్నాడు. అధికారికంగాను, మాదిరికరంగాను అది క్రీస్తు సిలువ ద్వారా సంపూర్ణంగా సంహరించబడి అంతమొందించబడింది. మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడిందని (రోమా 6:6), మనము కూడా ఆయనతో మరణించామని ( రోమా 6:8) చెప్పబడింది. అలాగే, అనుభవాత్మకంగా అది చంపబడడం, మనము తిరిగి జన్మించినపుడు ( రోమా 6:3-5) దానికి వినాశకారిగాను, విరోధముగాను ఉన్న నూతన స్వభావము ( గలతీ 5:17) మనలో నాటబడడంతో ప్రారంభమయ్యింది. అయితే, ఈ పూర్తి పనిని పరిపూర్ణత దిశగా దశలవారీగా మన జీవితాంతం కొనసాగించాలి. ఈ చర్చలో దీనిని గురించి మరింత విశదంగా తెలుసుకుంటాము. ఏది ఏమైనా, మనలో నిలిచున్న పాపనీయమానికి, శరీర క్రియలు పుట్టించే శక్తి లేకుండా దానిని చంపడం మన బాధ్యత అని తెలియజేయడానికే ఈ బాధ్యతను అపోస్తలుడు నొక్కి చెపుతున్నాడు.

5. ఈ బాధ్యత నెరవేర్చినవారికి జీవం వాగ్దానం చేయబడింది:

“మీరు... జీవించెదరు”. ఇక్కడ వాగ్దానము చేయబడిన జీవం, ఈ వచన మొదటిభాగంలో హెచ్చరించబడిన మరణానికి వ్యతిరేకమైనది: “మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసినవారైయుందురు”. ఈ అపోస్తలుడే, ఈ హెచ్చరికను, 'శరీరము నుండి క్షయమను పంట కోయడం ( గలతీ 6:8) లేదా దేవునినుండి నాశనం పొందుకోవడమని' మరో విధంగా కూడా వ్యక్తపరచాడు. ఐతే, ఇక్కడ అపోస్తలుడు 'జీవించెదరు' అని చెప్పినపుడు, బహుశా నిత్యజీవాన్ని మాత్రమే కాక, క్రీస్తులో ప్రస్తుతం మనం కలిగున్న ఆత్మీయజీవాన్ని కూడా ఉద్దేశించి ఉండవచ్చు. అంటే, ఈ జీవము యొక్క ఉనికి మరియు నిజస్వరూపానికి శరీరక్రియలను చంపడమే ఆధారమని భావం కాదు. ఎందుకంటే ఆ జీవాన్ని విశ్వాసులు ప్రస్తుతం కూడా తమలో కలిగున్నారు. అయితే, దాని ఆనందం, ఆదరణ, బలము ఈ బాధ్యత నెరవేర్పుపై ఆధారపడుంది. “ఏలయనగా, మీరు ప్రభువునందు స్థిరంగా నిలిచితిరా మేమును బ్రతికినట్టే” అని 1థెస్స 3:8లో అపోస్తలుడు చెప్పిన అదే భావంలోనే ప్రస్తుత సందర్భంలో కూడా మాట్లాడుతున్నాడు. అంటే, ఇలా జరిగితే నేను బ్రతకడం వల్ల ప్రయోజనం; లేదా అప్పుడు నా బ్రతుకు నాకు ఆనందాన్ని, ఆదరణను ఇస్తుందని ఆ మాటల భావం. అలాగే, “మీరు.. శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు" అనంటే, ఇక్కడ మీరు మేలైన, ఆదరణతో కూడిన, శక్తిగల ఆత్మీయ జీవితాన్ని, ఇకముందు నిత్యజీవాన్ని అనుభవించగలరు అని ఈ మాటలకు అర్థం.

నిత్యజీవం పొందడం మరియు పాపాన్ని చంపడం మధ్య గల సంబంధం, లక్ష్యానికి మరియు దానిని సాధించడానికి ఉపకరించే మాధ్యమానికి మధ్య ఉన్న సంబంధం వంటిదే అని నేను మునుపు వివరించిన వాస్తవంతో పాటు, పాపాన్ని చంపాలనే ఈ బాధ్యత ఎందుకు నెరవేర్చాలో మరో కారణం కూడా సూచిస్తున్నాను. మన ఆత్మీయ జీవితానికి అవసరమైన శక్తి, బలం మరియు ఆదరణ, ఈ బాధ్యత నెరవేర్పుపై ఆధారపడి ఉంది.

 

 

అధ్యాయం-2

పాపాన్ని చంపడం విశ్వాసులందరి భాధ్యత

(పాపాన్ని చంపడంలో మొదటి సాధారణ సూత్ర ప్రతిపాదన, దాని వివరణ)

త అధ్యాయంలో ఈ చర్చకు అవసరమైన పునాది వేశాను కాబట్టి, నా ఉద్దేశాన్ని మరింత తేటపరిచే కొన్ని మూలసూత్రాలను ఇప్పుడు ప్రతిపాదిస్తాను.

1. సిలువపై పాపం చంపబడినప్పటికీ, ఇంకా పాపం ఉనికిలోనే ఉంది

శిక్షావిధికి గురిచేసే పాపపు శక్తి నుండి నిజంగా తప్పించబడినప్పటికీ, అంతరంగంలో పనిచేసే పాపపు శక్తిని చంపడం అనేది, విశ్వాసులలో అతి ఉత్తములైనవారు కూడా, మరణపర్యంతం ప్రతిదినం జరిగించాల్సిన ప్రాముఖ్యమైన విధి. “భూమి మీదనున్న మీ అవయవములను చంపుడని” ( కొలొస్సీ 3:5)లో అపోస్తలుడు ఎవరిని సంభోదించి హెచ్చరించాడు? 'క్రీస్తుతో కూడా లేపబడిన' వారిని ( వ1), ఆయనతో కూడా 'చనిపోయిన' వారిని ( వ5), ఎవరి జీవము క్రీస్తునందు దాచబడియున్నదో, ఎవరు 'ఆయనతో' మహిమలో ప్రత్యక్షం కానున్నారో వారిని ( వ4) ఉద్దేశించి ఈ హెచ్చరిక చేశాడు.

మరి నువ్వు పాపాన్ని చంపుతున్నావా? అనుదినం ఆ పని జరిగిస్తున్నావా? నువ్వు బ్రతికున్నంత వరకు ఆ పనిని నిత్యం జరిగించు. ఒక్క రోజు కూడా విరామం తీసుకోకుండా అది కొనసాగించు. పాపాన్ని చంపడం నువ్వు మానితే, అదే నిన్ను చంపుతుంది. నువ్వు క్రీస్తుతో కూడా మరణించి, ఆయనతో పాటు తిరిగి లేపబడ్డావన్న వాస్తవం, ఈ బాధ్యత నుండి నిన్ను మినహాయించదు. తనలో ఫలించే ప్రతి తీగతోను తన తండ్రి వ్యవహరించే తీరును మన ప్రభువు మనకు తెలియజేశాడు. “ఫలించు ప్రతి తీగె, మరెక్కువగా ఫలించవలెనని, దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును” ( యోహాను 15:2). ఒకటి రెండు రోజులు చేసి ఆపై మానేస్తాడని కాదు; ఈ లోకంలో అది తీగగా ఉన్నంత కాలం తండ్రి దానిపై ఆ పని జరిగిస్తూనే ఉంటాడు. అలాగే, అపోస్తలుడు కూడా తాను అలవర్చుకున్న క్రమశిక్షణ ఎలాంటిదో మనకు తెలియజేస్తూ, “నా శరీరమును నలగగొట్టి, లోబరచుకొంటున్నాను” ( 1కొరింథి 9:27) అనన్నాడు. 'అది నేను ఎడతెగకుండా చేస్తున్న పని. మానకుండా ఆ పనిని జరిగిస్తున్నాను. అది నా జీవితంలో భాగం' అని అతని భావం. సాధారణ విశ్వాసులకు అనుగ్రహించిన పరిమాణంతో పోల్చలేనన్ని రెట్లు కృప, ప్రత్యక్షతలు, అనుగ్రహాలు, అర్హతలు మరియు ఆదరణ ప్రాప్తించిన అపోస్తలుడే ఇలాంటి క్రమశిక్షణకు తనను తాను లోబరుచుకున్నపుడు, ఆ బాధ్యత నుండి మనకు మినహాయింపు ఉంటుందని అనుకోవడానికి ఏమిటి ఆధారం.

ప్రతిదినం ఇది చేయడం ఎందుకు అవసరమో తెలిపే కొన్ని కారణాలను గమనిద్దాం :

a) ఈ లోకంలో మనము బ్రతికున్నంత వరకు అంతరంగ పాపం ఎల్లప్పుడు మనలో నివసిస్తుంది కాబట్టి దానిని చంపడం అవసరం.

దేవుని ఆజ్ఞలను సంపూర్ణంగా పాటించడం, పరిపూర్ణ స్థాయిని ఈ జీవితంలోనే అందుకోవడం, పాపరాహిత్య స్థితిని కలిగుండడం లాంటి అజ్ఞానంతో కూడిన మూర్ఖపు వ్యర్థవాదనలతో ప్రస్తుతం నేను వ్యవహరించను. దేవుని ఆజ్ఞలలో ఒక్కదానినైనా నెరవేర్చడం అంటే ఏమిటో అలాంటి మాటలు చెప్పేవారికి బహుశ ఏమీ తెలియదు. దేవుడు నియమించిన ప్రమాణాలకు వారు ఎంత దూరంగా ఉన్నారంటే, సంపూర్ణంగా కాదు కదా, కనీసం పాక్షికంగా కూడా విధేయత చూపించడానికి యదార్థమైన ప్రయత్నమే చేయరు.

ఈ రోజుల్లో పరిపూర్ణతను గురించి మాట్లాడే కొందరు బహు జ్ఞానము కలవారమని చెప్పుకుంటూనే, మంచికి చెడుకు మధ్య వత్యాసాన్ని చెరిపివేసే విధంగా పరిపూర్ణతను నిర్వచించారు. 'మంచి' అని మనము గుర్తించేదానిలో వారు పరిపూర్ణులు కాలేదు కాని, దుష్టత్వపు అంచులలో ఉంటూ దానినే పరిపూర్ణత అని పిలుస్తున్నారు. ఇంకొందరు మరో కొత్త పద్దతిని కనిపెట్టారు. జన్మపాపమంటూఏమీ లేదని, అంతరంగంలో పాపస్వభావమనేదేమీ ఉండదని చెబుతూ, ఆత్మీయమైన దేవుని ధర్మశాస్త్రాన్ని మనుష్యుల శరీర సంబంధమైన మనసుకు తగినట్లుగా మలచుకున్నారు. క్రీస్తు జీవాన్ని గురించి కాని, విశ్వాసులలో అది కార్యం చేసే శక్తిని గురించి కాని తాము అజ్ఞానులని తమకు తామే నిరూపించుకున్నవారై, సువార్తకు అపరిచితమైన ఒక కొత్త నీతిని వారు కల్పించుకొని, అదే పరిపూర్ణత అన్నట్లు తమ శరీర సంబంధమైన మనస్సుల్లో ఊరికే ఉప్పొంగిపోతున్నారు.

వాక్యంలో వ్రాయబడిన దానికంటే జ్ఞానులమన్నట్లు మాట్లాడే వీరిలా, దేవుడు నాలో జరిగించని వాటి గురించి డంబపు మాటలు చెప్పుకునేందుకు నేను సాహసించను. ఈ లోకంలో జీవించి ఉన్నంత వరకు నాలో పాపస్వభావం కొంతమేరకైనా నీలిచుంటుందని గుర్తిస్తున్నాను. “ఇది వరకే గెలిచితినని కానీ, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితినని కానీ” చెప్పుకునే సాహసాన్ని నేను చేయజాలను ( ఫిలిప్పీ 3:12). ఈ లోకంలో నేను జీవించు పర్యంతం, నా “ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు” ( 2కొరింథీ 4:16). ప్రాచీనమైనది భగ్నపడి,క్షీణించి, నూతనమైనది బలోపేతం చేయబడే కొలది ఇది జరుగుతుంది. “ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగియున్నాను” ( 1కొరింథీ 13:12), కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు జ్ఞానమందు అభివృద్ధి పొంది క్రమేపీ తొలగించుకోవాల్సిన చీకటి ఇంకా నాలో ఎంతో మిగిలుంది.

అంతేకాదు, “శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఉన్నవి గనుక మీరేమి చేయనిశ్చయింతురో వాటిని చేయకుందురు.” ( గలతీ 5:17). ఇందుచేతనే విధేయతలోనూ, వెలుగులోనూ మనము కొరబడియున్నాము ( 1యోహాను 1:8). మరణానికి లోనయ్యే శరీరాన్ని మనము కలిగున్నాము ( రోమా 7:24). శరీరం మరణించేంత వరకు దాని నుండి మనకు విడుదల ఉండదు ( ఫిలిప్పీ 3:21). పాపం మనలో నిలిచున్నంత వరకు దానిని చంపడం మన బాధ్యత కాబట్టి నిత్యము మనము ఆ పనిలో ఉండాలి. ఒక శత్రువును చంపడానికి నియమించబడినవాడు, ఆ శత్రువు చావకముందే వానిని కొట్టడం ఆపివేస్తే, తనపని సగంలోనే విడిచిపెట్టినవాడౌతాడు ( గలతీ 6:9; హెబ్రీ 12:1; 2 కొరింథి 7:1).

b) పాపము మనలో నివసించడమే కాదు; అది ఎల్లప్పుడు క్రియ చేస్తూ, శరీర క్రియలను మనలో పుట్టించడానికి ప్రయాసపడుతుంది కాబట్టి దానిని చంపడం అవసరం.

పాపం మనలను విడిచిపెడితే మనం దాని జోలికి వెళ్లనవసరం లేదు. అయితే అది చడీచప్పుడు చేయనపుడు సైతం ఏ మాత్రం తక్కువ హానికారం కాదు. కదలిక లేనప్పుడే దానితో ప్రమాదం ఎక్కువ. కాబట్టి, అన్ని సమయాలలోనూ, పరిస్థితులు ఎలా ఉన్నా, దాని చలనాన్ని అనుమానించే తావు లేనపుడు సైతం, దానిపై మన పోరాటం ఉధృతంగానే కొనసాగాలి. పాపం మనలో నివాసముండటం మాత్రమే కాదు, మన అవయవాలలో ఉన్న దాని నియమం మన మనస్సులో ఉన్న దేవుని ధర్మశాస్త్ర నియమంతో పోరాడేదిగా కూడా ఉంది (రోమా 7:23). అలాగే, “ఆయన మనలో నివసింపజేసిన ఆత్మ, మత్సరపడునంతగా అపేక్షించును” (యాకోబు 4:5). ఈ పోరాటం ఎడతెగనిది. “శరీరము ఆత్మకునూ, ఆత్మ శరీరమునకునూ విరోధముగా అపేక్షించును” ( గలతీ 5:17). దురాశ ఇంకా శోధిస్తూ, పాపాన్ని గర్భం ధరించేదిగా పని చేస్తుంది. ప్రతి నీతిచర్యలోను అది జోక్యం చేసుకొని, కీడువైపుకు మొగ్గేలా లేదా మంచి చేయకుండా అడ్డగించేలా లేదా దేవునితో సహవాసం చేసే మనః స్థితిని పాడు చేసేలా పని చేస్తుంది.

మనలో ఉన్న పాపం కీడు వైపుకు మొగ్గేలా చేస్తుందనే భావంలోనే “నేను చేయగోరని కీడు చేయుచున్నాను” (రోమా 7:19) అని అపోస్తలుడు అంటున్నాడు. ఎలా, ఎందుకు? ఎందుకంటే, “నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేనెరుగుదును” (రోమా 7:18). అంతేకాదు,మేలైనది చేయకుండా అది ఆటంకపరుస్తుందని కూడా వ్యక్తపరుస్తూ, “నేను చేయగోరు మేలు చేయక...” (రోమా 7:19) అని అపోస్తలుడు అంటున్నాడు. అంటే, 'నేను చేసే పవిత్ర క్రియలన్నీ ఈ పాపం మలినపరుస్తుంది కాబట్టి మేలైనది చేయ వల్లపడడం లేదు, లేదా చేయాల్సిన విధంగా చేయలేకపోతున్నాను' అని భావం.“ శరీరము ఆత్మకు విరోధంగా అపేక్షించును కనుక, మీరు ఏమి చేయ నిశ్చయించుకుందురో, వాటిని చేయకుందురు” ( గలతీ 5:17). మన మనస్సు గతితప్పేలా పని చేస్తుంది కనుకనే అది “సులువుగా చిక్కులబెట్టే పాపము” ( హెబ్రీ 12:1) అని పిలువబడింది. అందుకే అపోస్తలుడు దాని విషయమై ఇంతగా బాధతో ఫిర్యాదులు చేస్తున్నాడు (రోమా 7).

కాబట్టి పాపం నిత్యం క్రియ చేసేదిగా, నిత్యం కీడును గర్భం ధరించేదిగా, నిత్యం మరులు గొల్పి శోధించేదిగా ఉందని తెలుస్తుంది. దేవునితో లేదా దేవుని కొరకు తాను చేసిన కార్యాలలో, పాపం మలినపరచనిదేదైనా ఉందని ఎవరు చెప్పగలరు? మనం బ్రతికినంత కాలం మనలో ఈ పనిని అది కొద్దోగొప్పో కొనసాగిస్తూనే ఉంటుంది. పాపం నిత్యం పనిచేస్తున్నపుడు, నిత్యం దానిని మృతమొందించేవారిగా లేకపోతే, మనం నశించినవారమే. ఏమీ చేయకుండా శత్రువుల చేతిలో రెట్టింపు దెబ్బలు తినేవాడు, ఓటమి పాలవ్వడం ఖాయం. మన ఆత్మలను అంతమొందించడానికి పాపం జిత్తులమారిగా, మెలకువగా, బలంగా, ఎడతెగకుండా పనిచేస్తున్నప్పుడు, మనం దానిని నాశనం చేసే పనిని బద్దకస్తులుగా, నిర్లక్ష్యంగా, మూర్ఖంగా జరిగిస్తే, గెలుపు మనదౌతుందా? 

పాపం ఓడించని లేదా ఓడించబడని, గెలవని లేదా గెలవబడని రోజంటూ ఏదీ ఉండదు. ఈ లోకంలో మనం జీవించి ఉన్నంతవరకు ఈ పరిస్థితి మారదు. విధేయతకు అసలు భావం తెలిసుండి, పాపం ప్రయోగించే తంత్రాలను కూడా ఎరిగిన ఎవ్వరైనా, ఏ ఒక్క రోజైనా, కనీసం ఒక్క పనిలోనైనా అది జోక్యం కలిగించకుండా ఉందని చెప్పగలిగితే, దాని పై ఆయుధం పట్టకుండా విశ్రమించమనీ వానిని అనుమతించగలను. 'నా ప్రాణమా, ఈ బాధ్యత విషయమై ఇక నువ్వు విశ్రమించు' అని చెప్పుకోవడం అలాంటివాడికి తగిన మాట. అయితే, ఎడతెగని పోరాటం తప్ప పాపం నుండి భద్రతకు వేరే మార్గం లేదని, దాని అంతుపట్టని దాడుల నుండి విడుదల కొరకు పరితపించే పరిశుద్ధులకు తెలుసు.

c) పాపం నిత్యం క్రియ చేయడం,పోరాడడం, తిరగబడడం, చిక్కులు బెట్టడం, కృంగతీయడం మాత్రమే కాదు, విడిచిపెడితే అది మరింత ప్రమాదకరమైన, శాపగ్రస్తమైన, అక్రమమైన, ప్రాణాంతకమైన పాపాలను పుట్టిస్తుంది కాబట్టి, దానిని చంపడం అవసరం.

పాపం మనలో పుట్టించే క్రియలు,ఫలాలు ఏమిటో అపోస్తలుడు గలతీ 5:19-21లో తెలియజేసాడు “జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహరాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేధములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు.”

దావీదులోను, ఇంకా పలువురిలోనూ పాపం ఏమి చేసిందో మనకు తెలుసు. పాపం ఎప్పుడూ అత్యధికస్థాయినే తన గురిగా కలిగుంటుంది. శోధించి మరులుగొల్పడానికి లేచే ప్రతి పాపము, అడ్డగించకుండా దాని స్వేచ్ఛకు విడిచిపెడితే, దాని కోవలో తారాస్థాయినే అందుకోవాలని ప్రయత్నిస్తుంది. అంటే, సాధ్యమైతే ప్రతి అశ్లీలమైన తలంపు లేదా చూపు వ్యభిచారంగాను, ప్రతి దురాశ దౌర్జన్యంగానూ, ప్రతి అవిశ్వాసపు తలంపు నాస్తికత్వంగాను, ఇలా ప్రతి పాపము దాని కోవలో సాధ్యపడేంత ఉన్నత దశను అందుకోవాలని ప్రయత్నిస్తుంది.

పాపం మనస్సాక్షిని కదల్చలేని స్థితికి మనుషులు దిగజారవచ్చు. పెద్ద కుంభకోణాలలోనికి నెట్టే ప్రేరేపణేది పాపం కలిగించటం లేదని వారికి అనిపించవచ్చు. అయితే, మనస్సులో లేచే ప్రతి దురాశ, దాని స్వేచ్ఛకు విడిచిపెడితే, దానికి వీలుపడేంత అత్యధిక దుష్టత్వ స్థాయిని అందుకుంటుంది. అది ఎప్పుడూ తృప్తిపడని పాతాళం వంటిది. మనుష్యులను కఠినపరచి, నాశనం చేసేలా వారికి భ్రమ కలిగించే పనిలో పాపానికి బహుగా సహకరించేది దానికున్న ఈ లక్షణమే. మొదటిలో దానీ యోచనలు, సూచనలు మితమైనవిగానే అనిపిస్తాయి. ఈ విధంగా హృదయంలో బలమైన పట్టు సంపాదించుకున్న తరువాత,అంచెలంచెలుగా దాని వర్గానుగుణంగా ఎదగడానికి శ్రమిస్తుంది. ఈ క్రమంలో అది చేసే పని మరియు సాధించే పురోగతి వలన దేవుని నుండి దూరమయ్యే ప్రమాదం ఎంతగా తనలోనికి చొరబడిందో కనిపెట్టలేని విధంగా హృదయాన్ని భ్రమపరుస్తుంది. ఇంతటితోనే ఆగిపోతే మరేం పర్వాలేదని, అంతా బాగానే ఉందని ఆ హృదయం ఆత్మవంచన చేసుకుంటుంది. ఇలా ఏ పాపాన్నయినా పాపంగా గుర్తించలేని స్థితికి దిగజారిన కొలది, అంటే, సువార్త ప్రమాణాలు కోరే పరిమాణంలో పాపాన్ని పాపంగా చూడలేనంత మేరకు హృదయం కఠినపరచబడిందన్న మాట.

అయితే, పాపానికి ఎల్లలు లేవు కాబట్టి, దాని గురి దైవధిక్కారం మరియు ఆయనకు విరోధమే కాబట్టి, దాని పురోగతిని అది సాధించుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. హృదయాన్ని కఠినపరచి ఆక్రమించుకున్న స్థానాన్ని వాడుకుంటూ ఈలక్ష్యాన్ని క్రమేపీ అందుకునే సామర్థ్యం, దాని స్వభావంలో కాదు, అది పుట్టించే భ్రమలో ఉంటుంది. ఈ చొరబాటును అరికట్టాలంటే దాని వేరు వడలిపోయేలా చేసి, ప్రతి ఘడియలోను దాని నెత్తిని చితకగొట్టేలా పాపాన్ని చంపడం ద్వారా దాని ఉద్దేశాలను తారుమారు చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఈ బాధ్యతను విస్మరిస్తే, తమవంటి వారెందరో పడిపోయిన ప్రతి శాపగ్రస్తమైన పాపానికి గురికాకుండా ఉండగలిగే వారు పరిశుద్దులలో శ్రేష్టులైనవారిలో సహితం, ఎవ్వరూ లేరు.

d) పాపాన్ని దురాశను ఎదిరించే నియమం మనలో ఉండాలన్నదే, ఆత్మ మరియు నూతన స్వభావం మనకు అనుగ్రహించబడడంలో ఒకానొక ప్రాముఖ్యమైన ఉద్దేశ్యం.

'శరీరము ఆత్మకు విరోధముగా అపేక్షించును' అని ఉంది కదా? అయితే ఏమిటి? “ఆత్మ శరీరమునకునూ విరోధముగా అపేక్షించును” అని కూడా అక్కడే ఉందీ ( గలతీ 5:17).

ఆత్మకు, అంటే నూతనంగా జన్మించిన ఆత్మీయ స్వభావానికి, శరీరానికివ్యతిరేకంగా పనిచేసే నైజం ఉంటుంది. అలాగే ఆత్మకు విరోధంగా శరీరానికి కూడా ఉంటుంది. ఇదే 2పేతురు 1:4-5లో తెలియజేయబడింది. 'దురాశను అనుసరించటం వలన లోకంలో ఉన్న భ్రష్టత్వాన్నీ తప్పించుకోవడమనేది, దేవస్వభావమునందు పాలివారమవ్వడంతో ముడిపడి ఉన్నట్లు అక్కడ మనం చదువుతాము. అలాగే మనస్సులో ఉన్న ధర్మశాస్త్రం మరియు అవయవాలలో ఉన్న పాపనీయమాన్ని గురించి రోమా 7:23లో చదువుతాము.

ఓ ఇద్దరు పోరాటానికి దిగినప్పుడు, ఒకడు తన శాయశక్తులా పోరాడలేని విధంగా బంధించి, తనివితీరా గాయపరిచే స్వేచ్ఛకు మరొకడిని విడిచిపెట్టేస్తే దానంత అన్యాయమైనది, అసమంజసమైనది ఇంకేదీ ఉండదు. అలాగే, మన నిత్యజీవం, అనగా మన రక్షణార్ధమై పోరాడే వానిని బంధించి, మన నిత్య నాశనాన్నే కోరి, అందుకు బలంగా పనిచేసేవానీని తన ఇష్టానికి విడిచిపెట్టడం కంటే మూర్ఖత్వం కూడా మరొకటుండదు. ఈ పోరాటం మన జీవితాలకు, ఆత్మలకు సంబంధించినది. పాపాన్ని చంపడానికి ప్రతిదినము ఆత్మను, నూతన స్వభావాన్ని వినియోగించకపోవడం, మన అతిపెద్ద శత్రువును ఎదిరించడానికి దేవుడు ఇచ్చిన సహాయాన్ని అలక్ష్యం చేయడమే. దేవుడు అనుగ్రహించిన వాటిని వినియోగించకుండా వాటిని అలక్ష్యం చేస్తే, ఇక అదనంగా సహాయమేదీ అనుగ్రహించకుండానే వెనుదీయడం ఆయనకు న్యాయమే కదా! దేవుడు కృపలను మరియు వరాలను అనుగ్రహించేది, మనం వాటిని వినియోగించి, అభివృద్ది చేసి, వాటిని పనిలో పెట్టమనే. ప్రతి రోజు పాపాన్ని చంపే పని చేయకపోవడమంటే, అది చేయగలిగే నియమాన్ని మనలో పెట్టిన దేవుని మంచితనానికి, కనికరానికి, జ్ఞానానికి, కృపకు, ప్రేమకు విరోధంగా పాపం చేయడమే.

e) పాపాన్ని చంపే బాధ్యతను నిర్లక్ష్యం చేయడం వల్ల, అపోస్తలుడు సాక్షీకరించిన తన అనుభవానికి వ్యతిరేకంగా మన ఆత్మీయ స్థితిని దిగజార్చుకోవడమౌతుంది.

“మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు” ( 2కొరింథీ 4:16) అని అపోస్తలుడు తన అనుభవాన్ని వివరిస్తుండగా, పాపాన్ని చంపే బాధ్యతను విస్మరించేవారికి అందుకు భిన్నంగా, ఆంతర్య పురుషుడు కృశించడం, బాహ్య పురుషుడు దీనదినం నూతనపరచబడడం కలుగుతుంది. పాపం అంతకంతకు ప్రబలిన దావీదు కుటుంబంలా, కృప అంతకంతకు నీరసిల్లిన సౌలు కుటుంబంలా మారిపోతాయి (2 సమూ 3:1). కృపను హృదయంలో విలువైనదిగా చేసేది, దాని వినియోగం మరియు దాని ద్వారా కలిగే విజయమే. వాడకుండా విడిచిపెడితే అది వాడిపోయి నీరసిల్లుతుంది. కృపకు సంబంధించినవి చావనయ్యుండడం వల్ల (ప్రకటన 3:2 ), పాపానికి హృదయాన్ని కఠినపరచే తావు లభిస్తుంది (హెబ్రీ 3:13 ).

నేను చెప్పేదేంటంటే, పాపాన్ని చంపే బాధ్యతను విస్మరించినపుడు, కృప క్షీణించి, పాపం వృద్ధి చెంది, హృదయస్థితి అంతకంతకు దిగజారడం జరుగుతుంది. ఇది ఎంతటి భయాందోళనలతో కూడిన సమస్యలకు అనేకులను గురిచేస్తుందో ఆ ప్రభువుకే తెలుసు. పాపాన్ని చంపే బాధ్యత నిర్లక్ష్యమవడం వల్ల, పాపం ఒక మోస్తరు పైచేయి సాధించినపుడు, అది ఎముకలను క్షీణింపచేసి (కీర్తనలు 31:10 , కీర్తనలు 51:8 ), బలహీనుడిగా, రోగగ్రస్తునిగా, మరణానికి చేరువగా చేసి (కీర్తనలు 38:3-5), ఒక వ్యక్తిని తలెత్తి చూడలేకుండా చేస్తుంది (కీర్తనలు 40:12, యెషయా 33:24). దెబ్బల వెంబడి దెబ్బలను, గాయాల వెంబడి గాయాలను, ఓటమి వెంబడి ఓటమిని తీసుకుంటూ, దానిని ఎదిరించే ప్రయత్నమేదీ తీక్షణంగా చేయకపోతే, పాపం వలన కలిగే భ్రమచేత కఠినపరచబడి ఆత్మీయంగా రక్తం కారి చావడం కంటే ఏమి అపేక్షించగలము?

నిజమే; ఈ బాధ్యత నిర్లక్ష్యం చేయబడడం వల్ల మన కళ్ళ ఎదుట ప్రతి దినము కనబడే భయానకమైన పర్యవసనాలు ఎంతో బాధాకరమైనవే! ఒకప్పుడు తగ్గింపు స్వభావం కలిగి, విరిగి నలిగిన హృదయానుభవంతో, పాపం చేయడానికి భయపడే సున్నిత మనస్సు మరియు దేవుని కొరకు, ఆయన మార్గాలు మరియు ఆజ్ఞలన్నిటి కొరకు ఆసక్తి కలిగియుండి, ఈ బాధ్యతను అలక్ష్యపెట్టిన కారణాన్ని బట్టి, క్రైస్తవ్యాన్నే సిగ్గుపరచి, తమకు సన్నిహితులైనవారిని సహితం శోధనలలోకి లాగే విధంగా, లోకానుసారులుగా, శరీర సంబంధులుగా, చల్లారిన జీవితాలు కలిగి, కోపిష్టులుగా, లోకంలో ఉన్నవారితో మరియు లోకంలో ఉన్నవాటితో సమ్మతించేవారిగ దిగజారిపోయిన క్రైస్తవులనెందరినో మనం చూడటం లేదా? సత్యమేమిటంటే, సౌవార్తికమైన మరియు యధార్థమైన విధంగా పాపాన్ని చంపడమనేది, దాదాపు సంపూర్ణంగా కోల్పోయాము. కొందరు దానిని , భూసంబంధమైన, స్వనీతితో కూడిన, తప్పులెన్నే, పక్షపాతంతో కూడిన పట్టుదల మరియు మొండి వైఖరిగా చేసుకున్నారు. అది వారి కోపం, ఈర్ష్య, దుష్టత్వం మరియు గర్వం చేత మలినపరచబడింది. ఇంకొందరు స్వేచ్ఛ, కృప, అంటూ ఏవేవో సాకులు చెప్పి దానిని ప్రస్తుతం వాడుకలో లేనిదానిలా పక్కన పడేశారు. దీని గురించి తరువాత విస్తృతంగా చర్చించుకుందాం.

f) దేవుని భయముతో పరిశుద్దతను సంపూర్తి చేసుకోవటం మన బాధ్యత

“దేవుని భయముతో పరిశుద్దతను సంపూర్తి చేసుకొనుచు” (2 కొరింథి 7:1), ప్రతి దినము కృపయందు అభివృద్ది పొందుచూ (1పేతురు 2:2, 2 పేతురు 3:18), ఆంతర్య పురుషుడ్ని దినదినము నూతనపరచడం (2కొరింథి 4:16) మన బాధ్యత. పాపాన్ని ప్రతిదినము చంపకపోతే ఇది సాధ్యపడదు. ప్రతి పరిశుద్ద కార్యానికి, మనం సాధించిన ప్రతి పురోగతికి విరోధంగా పాపం తన ప్రతాపాన్ని చూపిస్తుంది. తన దురాశలను కాలరాస్తూ నడవనివాడు, తాను పరిశుద్ధతలో ఎలాంటి ప్రగతినైనా సాధించాడని అనుకోరాదు. తనకు అడ్డుతగిలే పాపాన్ని చంపనివాడు, తన ప్రయాణంలో గమ్యం చేరడానికి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. దాని ఎదిరింపును అనుభవించినప్పటికీ, ప్రతి విధంగాను దానిని చంపే పోరాటం చేయనివాడు, దానితో సమాధానపడినవాడే తప్ప దాని విషయమై చచ్చినవాడు కాదు.

కాబట్టి మన ప్రస్తుత చర్చాంశమైన మొదటి సూత్రం ఇదే. క్రీస్తు సిలువలో సంపాదించిన సంపూర్ణ పాప వినాశనం వాస్తవమైనప్పటికీ, మొదట మారుమనస్సు పొందినప్పుడే పాపం విషయమై మేల్కొల్పబడి, సిగ్గుపరచబడి, దానిని ఎదిరించగల, దానికి వినాశనకారియైన ఒక నూతన నియమం మనలో నాటబడడం వల్ల, సర్వపాపాన్ని జయించే పునాది నిజంగా మనలో వేయబడిందన్నది కూడా వాస్తవమైనప్పటికీ, ఈ లోకంలో జీవించే ప్రతిదినము దానిని చంపడం ఎడతెగని విధిగా చేసుకోవాల్సినంతగా, విశ్వాసులలో అతి శ్రేష్ఠులైనవారిలో సహితం పాపం నిలిచియుండి, వారిలో క్రియ చేస్తుందన్నది కూడా అంతే వాస్తవం.

మరొక సూత్రానికి వెళ్ళిపోయే ముందు, ఈ రోజుల్లో విశ్వాసులమని చెప్పుకునేవారిలో, పాపాన్ని చంపే విషయమై గొప్పవి మరియు తేటవియైన ఫలాలు ఫలించాల్సిన చోట, కనీసం దాని ఆకులు సహితం లేకుండా జీవించేవారి గురించి నేను ఫిర్యాదు చేయడం మానలేను. ఈ తరంవారికి, విస్తారమైన వెలుగు అనుగ్రహించబడిందని, దానితో పాటు ఎన్నో ఆత్మీయు దీవెనలు జతచేయబడ్డాయని, ఇవి కొన్ని ఇతర పరిస్థితులతో కలసి విశ్వాసం మరియు విశ్వాసుల ఎల్లలు విస్తరింపజేసి, దాని ప్రభావం మరియు వారి సంఖ్య అద్భుతంగా పెరిగి అభివృద్ధి సాధించడానికి దారి తీస్తాయన్నది వాస్తవమే. దాని ఫలితంగా ప్రతి చోటా విశ్వాసము మరియు విశ్వాససంబంధమైన బాధ్యతలను గురించి చర్చలు వెల్లువెత్తుతున్నాయి. అంతట ప్రసంగాలు వినిపిస్తున్నాయి. ఇది వరకు ఏదో ఊరికే, తేలికగా, ఆషామాషిగా, వ్యర్థంగా కాకుండా, బోధించే వరసమృద్ధి కొలదీ ఇది జరుగుతుంది. వెలుగు, వరాలు, మరియు విశ్వాసాన్ని కొలబద్దగా తీసుకునే విశ్వాసుల సంఖ్యను లెక్కిస్తే, “వీరిని నాయందు కనిన వాడెవడు?” అని సంఘమే ఆశ్చర్యపోతుంది. అయితే, క్రైస్తవులను ఇతరులలో నుండి వేరుచేసే పాపాన్ని చంపడం అనే సుగుణాన్ని కొలబద్దగా తీసుకుంటే మాత్రం, వారి సంఖ్య ఏమంత విస్తారంగా కనపడకపోవచ్చు. తన మారుమనస్సుకై ఈ రోజుల్లో విస్తరించిన ఈ వెలుగుకు రుణపడి, ఒకప్పుడు సాధారణంగా ఎవ్వరు మాట్లాడలేని తరహాలో ఆత్మీయ సంగతుల గురించి మాట్లాడుతూ, (నేను తీర్పు తీరుస్తున్నాననికాదు), ప్రభువు తనలో చేసిన కార్యాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటూనే, పాపాన్ని చంపే సుగుణం తన హృదయంలో లేదనే నిదర్శనాలు కనబరచని విశ్వాసి ఎక్కడున్నాడు? వ్యర్థమైన కాలక్షేపాలు, సోమరితనం, నిష్ప్రయోజనంగా సమయాన్ని వెళ్లబుచ్చడం, అసూయలు, మత్సరాలు, క్రోధాలు, బేధాలు, కక్షలు, గర్వం, లోకానుసారమైన మనస్సు మరియు స్వార్థం, ఇవన్నీ క్రైస్తవ లక్షణాలైతే, అలాంటి క్రైస్తవులు మన చుట్టూ, మన మధ్య అనేకులున్నారు. రక్షణార్థమైనదనే నమ్మగలిగే వెలుగు విస్తారంగా అనుగ్రహింపబడిన వారి పరిస్థితే ఇలా ఉంటే, ఎంతో మతాసక్తి కలిగినవారిలా ఉంటూ, సువార్త వెలుగును విసర్జించి, మనమిక్కడ మాట్లాడుకునే బాధ్యతలలో పైపై జల్సాలను విసర్జించడం మాత్రమే తెలిసి, అది కూడా అరుదుగా ఆచరణలో పెట్టేవారి నుండి ఏమి అపేక్షించగలం? మన మనోవికారాలను లయపరచేలా, మన మంచి ప్రభువు, పాపాన్ని చంపే ఆత్మను మనకు అనుగ్రహించును గాక! లేని పక్షంలో మన పరిస్థితి దయనీయమే.

పాపాన్ని చంపని విశ్వాసి తప్పనిసరిగా ఎదుర్కొనే కీడులు రెండు ఉ న్నాయి. ఒకటి తనకే సంబంధించినదైతే, మరొకటి తనవల్ల ఇతరులకు కలిగేది.

1) తనకు కలిగే కీడు : తన గురించి తానేమనుకుంటున్నా సరే, పాపాన్ని గురించి, ప్రత్యేకించి అనుదిన బలహీనతల వల్ల చోటు చేసుకునే పాపాల గురించి అతనికున్న భావనలు ఎంతో తేలికైనవి. పాపాన్ని చంపని జీవితానికి మూలం, హృదయంలో చేదు అనుభవించకుండా పాపాన్ని జీర్ణించుకోగలగడమే. ఒక వ్యక్తి దేవుని కృపా కనికరాలను ఆసరాగా చేసుకునేలా తన ఊహలను ఒప్పించి, పాపాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతిరోజూ మింగి జీర్ణించుకోగలుగుతున్నాడంటే, అతడు దేవుని కృపను కామాతురత్వానికి దుర్వినియోగపరచి, పాపం వలన కలిగే భ్రమచేత కఠినపరచబడే పరిస్థితికి అతి చేరువగా ఉన్నాడన్న మాట. కృశించిన అబద్దపు హృదయానికి ఈ స్థితి కంటే గొప్ప నిదర్శనం ఇంకొకటి ఉండదు. మనలను పవిత్రపరచడానికి అనుగ్రహించబడిన యేసు రక్తాన్ని (1యోహాను 1:7, తీతు 2:14), మారుమనస్సు దయచేయడానికి హెచ్చించబడిన క్రీస్తును (అపోస్తలుల కార్యములు 5:31), భక్తిహీనతను విసర్జించమని నేర్పించే కృపాసిద్దాంతాన్ని వాడుకుంటూ పాపాన్ని సహించగలిగితే, అది చివరకు మన ఎముకలను విరుస్తుంది. విశ్వాసము నుండి వైదొలగి, మన నుండి వెలుపటికి పోయినవారు, ఈ ద్వారం గుండానే పోయారని మరచిపోవద్దు. వారిలో అనేకులు, కొంతకాలం మేల్కొలుపు కలిగుండి, అది వారిని విధులను పాటించేలా చేసి, విశ్వాసములోనికి నడిపించింది కనుక, మన ప్రభువైన యేసు క్రీస్తును గురించిన అనుభవజ్ఞానము చేత ఈ లోకమాలిన్యాన్ని తప్పించుకున్నారు (2 పేతురు 2:20). అయితే సువార్త సిద్దాంతం మాత్రమే బోధపడి, విశ్వాససంబంధమైన విధులకు అవసరమైన నియమమేది వారిలో లేని కారణంగా వాటిపై విసుకెత్తి, కృపా సిద్ధాంతం కోరే పలుబాధ్యతలను నిర్లక్ష్యపెట్టడం ప్రారంభించారు. ఈ కీడు వారిపై పట్టు సాధించినప్పుడు వారు త్వరపడి నాశనములోనికి బోల్తాపడతారు.

2) ఇతరులకు కలిగే కీడు : ఇతరులపై అది రెండింతల దుష్ప్రభావం చూపిస్తుంది.

a) గొప్ప గొప్ప విశ్వాసులలో ఉన్న చక్కదనం కంటే తమ స్థితి ఏమంత తీసిపోలేదనే ప్రోద్భలాన్ని ఇతరులలో పుట్టించి, వారినది కఠినపరుస్తుంది. ఆ గొప్ప విశ్వాసులు పాపాన్ని చంపని కారణంగా వారిలో ఉన్నవన్నీ మలినపరచబడినవే కనుక ఇతరుల దృష్టిలో వాటికి ఏ విలువ ఉన్నట్లు తోచదు. వారిలో మతాసక్తి ఉన్నప్పటికీ సహనం మరియు సాధారణ నీతి కొరవడినట్లు చూస్తారు. వారు దుబారాతనాన్ని విసర్జించినా, లోకానుసారమైన మనస్సును లోలోపల దాచుకొని లోకం నుండి వేరై, ప్రేమ కనికరాలు అలవర్చుకోకుండా స్వార్థంతో జీవిస్తుండడం చూస్తారు. లేదా, ఒకవైపు ఆత్మీయంగా మాట్లాడుతూ, మరోవైపు వ్యర్థమైన జీవితాలు జీవించడం, దేవునితో సహవాసాన్ని గురించి మాట్లాడుతూనే అన్ని విధాలా లోకానుసారులుగా ఉండడం, క్షమాపణ గురించి ఎంతో మాట్లాడి క్షమాశీలత ఏ మాత్రం కనబరచనివారిగా ఉండడం చూస్తారు.వారిని ఇలా చూసే ఇతరులు, దయనీయంగా రక్షణలేని స్థితిలోనే మిగిలిపోయేలా కఠినపరచబడతారు.

b) తామున్న ఈ స్థితికి ఎదగగలిగితే వారికి మేలని తోచే విధంగా ఇతరులను మోసపరుస్తారు. ఇది మతపరంగా పోటీపడడానికి దారి తీసి, వారిలో చూసే నీతిని మించేలా ఇతరులు పురిగొల్పబడినా, నిత్యజీవం లేని స్థితిలోనే మిగిలిపోతారు. వీటి గురించి మరియు పాపాన్ని చంపని కారణంగా కలిగే ఇతర కీడులను గురించి మున్ముందు చర్చించుకుందాం.

 

అధ్యాయం-3

పాపాన్ని చంపుటకు చాలినవాడు పరిశుద్దాత్మ మాత్రమే

(పాపాన్ని చంపడానికి అవసరమైన రెండవ సూత్రము)

చర్చకు పునాదిగా= తీసుకున్న రోమా 8:13లో, పాపాన్ని చంపే పనికి సార్వభౌమ సమర్థుడిగా ప్రస్తావించబడిన 'ఆత్మ' అనగా పరిశుద్ధాత్మకు సంబంధించిన సూత్రాన్ని ఇప్పుడు మనము చర్చించబోతున్నాము.

2. పాపాన్ని చంపడానికి చాలినవాడు పరిశుద్ధాత్మ మాత్రమే

పరిశుద్దాత్మ లేకుండా ఏ ఇతర విధానమైనా సాధనమైనా వ్యర్థమే; ఆయన మాత్రమే ఇందుకు సమర్థుడు; తన చిత్రాన్ని ఆయనే మనలో కార్యసాధకం చేయగలడు

a) ఇతర పరిష్కార మార్గాలను వెతుక్కోవడం వ్యర్థం

ఎందుకంటే అవేవి వారిని స్వస్థపరచలేవు. పాపాన్ని చంపడానికి వారు నిర్దేశించే ఇతర మార్గాలన్నీ మనకు తెలిసినవే. రోమన్ కేథలిక్ వ్యవస్థలో మతనిష్ఠగా కనపడేదంతా, పాపాన్ని చంపే తప్పుడు పద్దతులతోనే తయారు చేయబడింది. అయితే అదంతా మోసగించే వారి 'గొంగళి' (జెకర్యా 13:4) వంటిది మాత్రమే. వారి మొక్కుబడులు, క్రమాలు, ఉపవాసాలు, ప్రాయశ్చిత్త కార్యాలు, మొదలైనవన్నీ పాపాన్ని చంపే మార్గాలుగానే రూపొందించబడ్డాయి. వారి ఉపదేశాలు, సందేశాలు, పుస్తకాలు, ఇవ్వన్నిటిని దీనికే మాధ్యమాలుగా చూస్తారు. అందుకే, పాతాళ అగాధము నుండి లేచిన మిడతలను (ప్రకటన 9:3) రోమన్ కేథలిక్ ఉపదేశకులకు సాదృశ్యమని విశ్వసించేవారు, మరణాన్ని వెదికేంతగా మనుష్యులను బాధించేది (9:5-6) వారి బాధ పుట్టించే బోధలే అని వ్యాఖ్యానిస్తారు. ఎందుకంటే వారి బోధలు పాపం విషయమై మేల్కొలిపినప్పటికీ, దానిని నివారించే పరిష్కారమేదీ అందించవు కాబట్టి అవి మనుష్యులను చచ్చిపోతే బాగుంటుందన్నంత ఆవేదనకు, భయానికి, మనస్సాక్షిలో అలజడికి గురిచేస్తాయి. వారి మతసారాంశం మరియు గొప్పతనమంతా ఇంతే. అయినా, పాపాన్ని చంపడమంటే ఏమిటో, అదెందుకు చేయాలో తెలియని మృతజీవులపై ఏమిటి ఈ శ్రమపెట్టే ప్రయోగాలు? పుణ్యం సంపాదించుకోవచ్చని ఆశ పెట్టి ఏమిటీ ఈ విషపూరితమైన పద్ధతులు? అనవసరమైన పుణ్యకార్యాలను రూపకల్పన చేసుకుని, వాటిని ఏవేవో గొప్పగొప్ప పేర్లతో పిలిచి , సిగ్గుపడాల్సినవాటిని బట్టి వారు అతిశయిస్తున్నారు. వారిని గురించి, పాపాన్ని చంపడానికి వారు కల్పించిన పద్దతులను గురించీ 7వ అధ్యాయంలో మరింత విస్తృతంగా చర్చించుకుందాం.

అయితే సువార్త వెలుగు కలిగుండి కూడా కొందరు పాపాన్ని చంపడానికి రోమన్ కేథలిక్లు ఆవిష్కరించిన పద్ధతులను ఇతరులపై బలంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ప్రొటెస్టెంట్లుగా చలామణీ అవుతున్న కొందరు, ఆ పద్దతులను సత్యవెలుగని పొరబడి ఎంత నిష్ఠతో అచరిస్తున్నారంటే, బహుశ మూడు-నాలుగు వందల సంవత్సరాల ముందు ఉండుంటే, వారు రోమన్ కేథలిక్ సంఘానికి అత్యుత్తమ శిష్యులై ఉండేవారు. క్రీస్తు కాని ఆయన ఆత్మ కాని లేశమాత్రమైనా ప్రస్తావనకు రాని వారి బాహ్య ప్రయాసలు, శరీర సంబంధమైన అభ్యాసాలు, స్వీయ ప్రయోగాలు, నిష్ఠతో చేసే విధులు, ఇవన్నీ పాపాన్ని చంపే సాధనాలు మరియు విధానాలంటూ వీటిని అలంకరించడానికి పలికే వ్యర్థమైన డంభపు మాటలు, వారికి దేవుని శక్తి మరియు సువార్త సత్యం పట్ల ఉన్న అజ్ఞానపు లోతులను బట్టబయలు చేసేవిగా ఉన్నాయి. ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి ఈ పరిస్థితే ఒకానొక కారణం.

ఇలాంటివారు ఏ ఒక్క పాపాన్నయినా నిజంగా చంపలేరనడానికి కొన్ని కారణాలను గమనిద్దాం:

(i) వారు పాపాన్ని చంపడానికి అవసరమని బలవంత పెట్టే విధి-విధానాలను దేవుడు ఆ పని కొరకు నియమించలేదన్నది మొదటి కారణం.

దైవభక్తి విషయంలో ఒక ఉద్దేశాన్ని నెరవేర్చడం, దాని కొరకు దేవుడు నియమించిన మాధ్యమాల ద్వారానే తప్ప సాధ్యపడదు. వారి గోనెపట్టలు, మొక్కుబడులు, ప్రాయశ్చిత్త కార్యాలు, స్వీయకల్పిత క్రమశిక్షణ, సన్యాస జీవితం, మొదలైనవాటిని చూసి దేవుడు, 'ఇవి మిమ్మును కోరినవాడెవడు' అని అడిగి, 'మనుష్యులు కల్పించిన పద్దతులు దైవోపదేశములని బోధించుచు, వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు' అని అంటాడు. ఎవరు ప్రవేశపెట్టిన స్వయంశికాపద్దతులైనా వాటి పరిస్థితి ఇదే.

(ii) దేవుడు నియమించిన సాధనాలను వారు, సరైన చోట, సరైన క్రమంలో వినియోగించడం లేదన్నది మరొక కారణం. ప్రార్థన, ఉపవాసం, మెలకువగా ఉండటం, వాక్యధ్యానం, తదితరమైనవి పాపాన్ని చంపడానికి ఉపకరించే కొన్ని సాధనాలే. అయితే వీటిని ధారలుగా కాక ఊటలుగా చూస్తున్నారు. ఉద్దేశాన్ని నెరవేర్చడానికి పరిశుద్ధాత్మ మరియు విశ్వాస ఆధీనంలో సాధనాలుగా మాత్రమే పనిచేసే వీటిని గురించి, ఇవి చేయడం వల్లనే లక్ష్యాన్ని అందుకుంటారని భావిస్తున్నారు. ఇంత ప్రార్థించి, ఇంత ఉపవసించి, ఇన్ని గంటలు కేటాయించి, సమయం సరిగా పాటిస్తే పని జరిగిపోతుందని పొరబడుతున్నారు. 'ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను, సత్యవిషయమైన అనుభవజ్ఞానము ఎప్పుడూ పొందలేని కొందరిని గురించి అపోస్తలుడు వేరొక సందర్భంలో చెప్పిన విధంగానే, వీరు కూడా ఎల్లప్పుడూ పాపాన్ని చంపుతున్నప్పటికీ ఎపుడు దానిని సమర్థవంతంగా చంపలేనివారిగా ఉన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే, భౌతిక శరీరాన్ని నలగగొట్టే పద్ధతులే తప్ప దురాశను దుర్నీతిని అణచివేయగలిగే విధానాలేవీ వారి వద్ద లేవు.

ఈ విషయమై సువార్త బోధించేదేమిటో తెలియనివారందరూ చేసే పొరపాటు ఇదే. లోకంలోకి తేబడిన స్వేచ్ఛారాధన మరియు మూఢవిశ్వాసాలన్నిటికీ మూలం ఇదే. ప్రాచీన సన్యాసభక్తిని అనుసరించినవారు అలవరచుకున్న నిగ్రహవిధానాలు ఎంత భయంకరమైనవి! తమ ప్రకృతి సహజత్వంపై ఎంతటిహింసకు పాల్పడ్డారు! ఎంతటి తీవ్ర వేదనకు తమ్మును తాము గురిచేసుకున్నారు! వారి ఈ పద్దతులకు, వాటిని ప్రోత్సహించిన సూత్రాలకు వెనుక ఉన్నదేమిటో లోతుగా పరిశీలించినపుడు, ఇవ్వన్నిటికి వీరు చేసిన ఒక పొరపాటు తప్ప వేరే మూలమేదీ కనబడదు. ఆ పొరపాటేమిటంటే, పాపాన్ని చంపుతున్నామనుకొని, ప్రాచీన పతన స్వభావంపై కాక తమ బాహ్య సహజ స్వభావంపై, 'మరణానికి లోను చేసే శరీరం' పై కాక భౌతిక శరీరంపై దాడిచేసారు..

ఏదో ఒక అపరాధభావం అంతరంగాన్ని కుదిపివేసినపుడు, ఇంకెప్పుడూ ఆ పాపం చేయనని ఒక వ్యక్తి తనకును దేవునికిని ప్రమాణం చేస్తాడు. కొంత కాలం మెలకువతో ప్రార్థనలతో జాగ్రత్త వహిస్తాడు. అయితే ఆ వేడిమి చల్లారి, ఆ అపరాధభావం తొలగిపోవడంతో పాటు, పాపాన్ని చంపే యత్నం కూడా ముగిసిపోతుంది; పాపపు ఏలుబడి యధాస్థానానికి మరలివస్తుంది. ఆరోగ్యంగా ఉన్నవానికి విధినిర్వహణ మంచి పోషకమే. అయితే రోగగ్రస్తునికి అది మంచి ఔషధం కానేరదు. ఆహారాన్ని ఔషధంగా వాడేవాడు, అది పని చేస్తుందని అపేక్షించకూడదు. ఆత్మీయ అనారోగ్యత గలవాడు, పని చేయడం ద్వారా తన రుగ్మతను వదిలించుకోలేడు. అయితే తమను తాము మోసపుచ్చుకునేవారు చేసేది సరిగ్గా ఇదే అని మనం మున్ముందు చూడబోతున్నాము.

ఈ పద్ధతులేమి పాపాన్ని చంపడానికి సమర్థవంతమైనవి కావనే వాస్తవం, ఆ బాధ్యతకున్న స్వభావమే మనకు తెలియజేస్తుంది. అందుకు సమకూర్చాల్సిన వివిధ ప్రయాసాలన్నీ మానవ సహజంగా జరిగేవి కావనీ, మానవాతీత శక్తిచేత మాత్రమే కార్యసాధకం చేయదగిన స్వభావం వాటికుందని మనం మున్ముందు నిర్ధారించుకోనయ్యున్నాము.

b) ఇది పరిశుద్దాత్మ కార్యము.

ఎందుకంటే :

i) ఈ పని చేయడానికి దేవుడు ఆయనను మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసాడు. రాతిగుండెను తీసివేయడం, అంటే మొండితనం, గర్వం,తిరుగుబాటుతనం మరియు అవిశ్వాస హృదయాన్ని తొలగించే పని సాధారణంగా పాపాన్ని చంపే పనిలో భాగమే. అయితే, ఇది పరిశుద్ధాత్మ వలన జరుగుతుందని వాగ్దానం చేయబడింది (యెహెజ్కేలు 11:19, యెహెజ్కేలు 36:27). 'నా ఆత్మనిస్తాను, నూతన హృదయాన్ని ఇస్తాను' అంటూ దేవుడు ఈ వచనాలలో సెలవిస్తున్నాడు. ఇతర మాధ్యమాలన్నీ విఫలమౌతాయి కాబట్టి, ఈ పనిని కార్యసాధకం చేసేది దేవుని ఆత్మ మాత్రమే (యెషయా 57:17-18).

i) పాపాన్ని చంపే సామర్థ్యమంతా క్రీస్తు మనకిచ్చే వరమే. క్రీస్తు అనుగ్రహించే వరాలన్నీ మనకు అందేది క్రీస్తు ఆత్మ ద్వారా మాత్రమే. క్రీస్తుకు వేరుగా మనం ఏమి చేయలేము (యోహాను 15:5). ఆయన ఇచ్చే ప్రతి దీవెన, ప్రతి విడుదల, ప్రతి కృప యొక్క ఆరంభం, అభివృద్ధి మరియు కార్యసిద్ధి, ఆయన ఆత్మ ద్వారా మాత్రమే మనం పొందుతాము. ఎందుకంటే, తన విశ్వాసుల మీదను వారి అంతరంగంలోను ఆయన కార్యం చేసేది తన ఆత్మ ద్వారా మాత్రమే. కాబట్టి పాపాన్ని చంపే సామర్థ్యం కూడా మనకు ఆయన నుండే కలుగుతుంది.

మనకు 'మారుమనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించియున్నాడు' (అపో.కా. 5:31). పాపాన్ని చంపడం మారుమనస్సుకి సంబంధించిన ఎంతో ప్రాముఖ్యమైన వరం. దానిని ఆయన ఎలా జరిగిస్తాడు? పరిశుద్దాత్మను గురించిన వాగ్దానమును పొందినవాడై, ఆ పరిశుద్దాత్మను మనలో కుమ్మరించి ఆ కార్యాన్ని మనలో జరిగిస్తాడు (అపో.కా. 2:33). పరిశుద్ధాత్మను పంపుతానని ఆయన చేసిన పలు వాగ్దానాలు మనకు తెలిసినవే. టెస్టులియన్ చెప్పిన విధంగా 'వికారియం నవరే ఓపెరమ్' అంటే 'మనలో కార్యసాధకం చేయనుద్దేశించిన తన క్రియలను జరిగించడానికే తన ఆత్మను ఆయన మనలోనికి పంపాడు.

ఒకటి లేదా రెండు ప్రశ్నలు లేవనెత్తి వాటికి పరిష్కారాన్ని తెలపడం ద్వారా నా ముఖ్యతలంపును మరింత స్పష్టం చేస్తాను.

మొదటి ప్రశ్న : పరిశుద్దాత్మ పాపాన్ని ఎలా చంపుతాడు?

సాధారణంగా, మూడు విధాలుగా ఆయన ఈ కార్యాన్ని చేస్తాడు :

(1) మన హృదయాలలో కృపను విస్తరింపచేసి, శరీరక్రియలకు భిన్నమైన ఆత్మఫలాలు మరియు వాటి నియమాలు మనలో వృద్ధి చెందించడం ద్వారా పాపాన్ని చంపుతాడు. శరీరక్రియలు మరియు ఆత్మఫలాలు ఒకదానికొకటి విరుద్దమని అపోస్తలుడు అంటున్నాడు. శరీర క్రియలు ఇలా ఉంటాయని (గలతీ 5:19-21), అయితే ఆత్మ ఫలాలు వాటికి భిన్నమైనవని, పూర్తిగా వ్యతిరేకమైనవని అంటున్నాడు (5:22-23). మరి ఆత్మ ఫలాలు విస్తరిస్తాయనుకుంటే శరీరక్రియలు కూడా విస్తరించే ప్రమాదముంది కదా? లేదన్నదే అపోస్తలుని జవాబు. “క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోను దురాశలతోను సిలువవేసియున్నారు” (  5:24). కాని ఎలా? ఆత్మననుసరించి జీవిస్తే, ఆత్మననుసరించి క్రమంగా నడుచుకుంటే ఇది జరుగుతుంది ( 5:25). అంటే, ఆత్మ ఫల సుగుణాలన్ని మనలో విస్తరించి, వాటిననుసరించి మనము నడుచుకోవడాన్ని బట్టి ఇది సాధ్యపడుతుంది. ఈ రెండు ఒకదానికొకటి విరుద్ధం అని అపోస్తలుడు అంటున్నాడు (5:17 ). కాబట్టి ఒకే సమయంలో ఈ రెండూ ఒక వ్యక్తిలో బహుగా లేదా బలంగా విస్తరించడమనేది సాధ్యపడదు. “పరిశుద్దాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయుట” (తీతు 3:5) అని పిలువబడిన ఈ కార్యము, పాపాన్ని చంపే ఒక గొప్ప మార్గం. శరీర క్రియలన్నిటిని మరియు అంతరంగ పాపాన్ని విస్తరించకుండా అడ్డగించేలా, వాటికి భిన్నమైన, వ్యతిరేకమైన, వినాశనకరమైన ఆత్మఫలాలయందు మనము ఎదిగి, అభివృద్ధిచెంది, విజయవంతంగా విస్తరించేలా ఆయన మనలో ఈ కార్యాన్ని జరిగిస్తాడు.

(2) పాపపు నైజం మరియు వేరుపై నేరుగా దాడిచేసి, దానిని బలహీనపరచి, నిర్వీర్యం చేసి, క్రమేపీ దానిని తొలగించి వేయడం ద్వారా పాపాన్ని చంపుతాడు. ఈ విధంగా మన కల్మషాన్నంతా దహించి శుద్ధిచేసేవాడు కనుకనే ఆయన “తీర్పు తీర్చు ఆత్మ” అని “దహించు ఆత్మ” అని పిలవబడ్డాడు (యెషయా4:4). తన సర్వశక్తిమంత సామర్థ్యంతో రాతిగుండెను తీసివేస్తాడు. ఆయన ఒక పనిని చేపడితే, అంచలంచలుగా దానిని సంపూర్తి చేసేవాడు. పాపపు వేరును సహితం దహించివేసే అగ్ని ఆయనే.

(3) విశ్వాసం ద్వారా ఒక పాపి హృదయంలోనికి యేసు సిలువను తెచ్చి, క్రీస్తు మరణంతో మనకు సమానానుభవాన్ని ఇచ్చి, ఆయన శ్రమలలో పాలివారిగా చేయటం ద్వారా పాపాన్ని చంపుతాడు. ఇది ఎలా జరిగిస్తాడన్నది మున్ముందు మరింత విపులంగా చర్చించుకుందాం.

రెండవ ప్రశ్న : పాపాన్ని చంపేది పరిశుద్దాత్మ కార్యమైతే, అది చేయమని మనలను హెచ్చరించడం ఎందుకు?

ఆ పని చేయడం పరిశుద్దాత్మకు మాత్రమే సాధ్యపడుతుంది కాబట్టి అది పూర్తిగా ఆయనకే విడిచిపెట్టాలి కదా?

(1) మనలో ఉన్న సుగుణాలు మరియు సత్క్రియలన్నిటిని మనలో పుట్టించినవాడు ఆయనే అన్న భావంలో మాత్రమే ఈ పని పరిశుద్దాత్మ చేసేదని చెప్పబడింది. 'మనము ఇచ్ఛయించుటకును, కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును, తన దయాసంకల్పము నెరవేర్చుటకై మనలో కార్యసిద్ధి కలుగజేయువాడు ( గ్రీకులో - ఎనర్గెయొ) ఆయనే' (ఫిలిప్పి 2:13). నిజముగా మన పక్షమున ఉండి మన పనులన్నిటిని సఫలపరచి (యెషయా 26:12), విశ్వాసయుక్తమైన ప్రతికార్యమును మనలో బలముతో సంపూర్తి చేసేవాడు' అయనే (2థెస్స1:11, కొలొస్సీ 2:12). ఆయన మనలను ప్రార్థించేలా చేసే విజ్ఞాపనాత్మ అయ్యున్నాడు (రోమా 8:26, జకర్యా 12:10). ఐనా ఇవన్ని చేయుమని మనం హెచ్చరించబడ్డాము, హెచ్చరించబడాలి.

(2) పాపాన్ని చంపడానికి మనం చూపించాల్సిన విధేయతను మినహాయించే విధంగా మనలో ఆ కార్యాన్ని ఆయన జరిగించడు. మారుగా, మనలో, మనపై తన కార్యం జరిగించతగినవారిగా మార్చే కార్యాన్ని మనలో మరియు మనపై చేస్తాడు. అంటే, మన స్వేచ్ఛను, స్వచ్ఛంద విధేయతను భంగపడనీయకుండానే పాపాన్ని చంపే ఆ కార్యాన్ని మనలో చేస్తాడు. మన గ్రహణశక్తి, చిత్తము, మనస్సాక్షి మరియు కోరికలపై వాటి సహజ సామర్థ్యాలకు అనుగుణంగానే కార్యం చేస్తాడు. మనకు వ్యతిరేకంగా లేదా మనం లేకుండా కాదు, మనలోను మనతోపాటుగాను ఆయన ఆ పనిని చేస్తాడు. కాబట్టి, ఆయన మనకు చేసే సహయం, ఆ పనికి ప్రోత్సాహంగా ఉంటుందే తప్ప దానిని నిర్లక్ష్యపెట్టే తావు ఎంత మాత్రము ఇయ్యదు.

పాపం విషయమై ఒప్పించబడి, దాని నేరారోపణకు తాళలేక, పాపాన్ని నిరోధించడానికి లెక్కలేని గందర గోళ పద్దతులను వీనుల విందు చేయపూనుకున్నప్పటికీ, దేవుని ఆత్మతో పరిచయం లేని కారణాన, ఆ ప్రయత్నమంతా వృథాగానే చేస్తున్న వారి మతిహీనమైన ప్రయాసలను గురించి నేను ఎంతో దు:ఖిస్తున్నాను. వారు పోరాడుతారు కానీ విజయం రాదు; యుద్దం చేస్తారు కాని సమాధానముండదు; వారి జీవితమంతా దాస్యంలోనే గడిచిపోతుంది. ఆహారం కానిదాని కొరకు తమ శక్తిని, ప్రయోజనమియ్యని దాని కొరకు తమ శ్రమను వారు వ్యయం చేసుకుంటున్నారు.

ఇంతకంటే బాధాకరమైన రణరంగం మరొకటుండదు. ధర్మశాస్త్రపు నేరారోపణ ఒత్తిడిని బట్టి ఒకడు పాపానికి వ్యతిరేకంగా పోరాడేలా బలవంత పెట్టబడుతున్నాడు. కానీ ఆ పోరాటానికి అవసరమైన శక్తి అతనికి లేదు. పోరాటం తప్పదు, విజయం రాదు; ఇదేదో చంపబడటానికి ఉ ద్దేశ్యపూర్వకంగానే శత్రువు ఖడ్గం మీదకు త్రోయబడినవాని వంటి పరిస్థితి. ధర్మశాస్త్రము వారిని ముందుకు తరిమితే పాపం వారిని వెనక్కి తిప్పికొడుతుంది. కొన్నిసార్లు వారు పాపాన్ని మట్టుపెట్టేసినట్లు భావిస్తారు కానీ, నిజానికి వారు రేపిన దుమ్ము పాపాన్ని కేవలం వారికి కనుమరుగు చేస్తుంది. అంటే, వారి భయం, బాధ, ఆందోళన వంటి తమ సహజ ప్రతిక్రియలు, పాపాన్ని స్వాధీనపరచుకున్నట్లు వారిని నమ్మబలుకుతాయి కాని నిజానికి వారు దానినితాకను కూడా లేదు. ఇదంతా చల్లారేసరికి, వారు మరలా రణరంగానికి మరలి రావాల్సిందే. వారు చంపామని తలంచిన పాపం, ఒక్క గాయమైనా లేనిదిగా అక్కడ వారిని మరలా ఎదుర్కొంటుంది.

ఇంతగా శ్రమకూర్చి పోరాడిన వీరే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేని బాధాకరమైన దుస్థితిలో ఉంటే, ఇవన్నిటిని ఏ మాత్రం పట్టించుకోకుండా, పాపపు శక్తి మరియు ఏలుబడి కింద ఉంటూ, అలా కొనసాగడాన్నే ప్రేమిస్తూ, శరీరేచ్ఛలను నెరవేర్చుకోవడానికి చాలినంత చేయలేకపోతున్నందుకు తప్ప మరిదేనికి దు:ఖపడని వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో?

 

అధ్యాయం-4

మన ఆత్మీయ జీవితం యొక్క ప్రాణం, బలం మరియు

ఆదరణ పాపాన్ని చంపడంపై ఆధారపడుంది

(పాపాన్ని చంపడం ఎందుకు అవసరమో తెలిపే మూడవ సూత్రం)

దేవునితో నడవటంలో శక్తి, ఆదరణ, బలం మరియు సమాధానం కలిగి జీవించాలనేది మన కోరిక. మనలను నెమ్మది లేకుండా చేసేదేమిటని సరిగ్గా ఆరా తీస్తే, దేవునితో నడిచే విధేయతకు అవసరమైన శక్తి, బలము, సామర్థ్యం మరియు జీవం, మనలో కొరవడ్డాయన్నది మొదటి కారణమయ్యుండాలి, లేదా అందులో పొందే శాంతి, నెమ్మది, ఆదరణ కొరవడ్డాయన్నది రెండవ కారణమయ్యుంటుంది. ఈ రెండింటితో సంబంధం లేకుండా విశ్వాసికి సంభవించేదేదైనా, అవి తన ఫిర్యాదుల్లో స్థానానికి నోచుకున్నవి కాలేవు.

అయితే, ఇదంతా మనం పాపాన్ని చంపడం మీద ఆధారపడుంటుంది. దీని విషయమై వీటిని గమనించండి:

a) పాపాన్ని చంపడం వల్ల జీవం, ఆదరణ మరియు బలం తప్పనిసరిగా కలుగుతాయని చెప్పలేము

పాపాన్ని చంపితే ఇవి తప్పనిసరిగా కలుగుతాయని నేను చెప్పడం లేదు. ఒక వ్యక్తి తన జీవితాంతం పాపాన్ని చంపే పనిని ఎడతెగకుండా జరిగించినా, నెమ్మది లేదా ఆదరణ అనుభవించిన ఒక్క రోజైనా లేకుండా ఉండడం సాధ్యమే. హేమాను అనుభవం అలాంటిదే (కీర్తనలు 88). అతడు ఎడతెగక పాపాన్ని చంపుతూ దేవునితో నడిచే జీవితాన్ని కలిగున్నప్పటికీ భయాలు, గాయాలు అతని అనుదిన భాగమయ్యాయి. అయితే దేవుడు తన ఉత్తమ స్నేహితుడైన హేమానును దు:ఖపడేవారికి ఒక మాదిరిగా ఉండేలా ఏర్పరచుకున్నాడు. నీ పరిస్థితి తన శ్రేష్టదాసుడైన హేమాను వంటిదే ఐతే ఫిర్యాదు చేయగలవా? ఇదే లోకాంతం వరకు అతనికి ఘనతగా మిగిలిపోతుంది. సమాధానాన్ని సెలవిచ్చే అధికారాన్నిదేవుడు తన వశంలో ఉంచుకున్నాడు (యెషయా 57:18-19). 'ఆ కార్యాన్ని నేనే చేస్తానని' ‘వారిలో దు:ఖించువారిని ఓదార్చుదును' అని దేవుడు సెలవిస్తున్నాడు (18వ వచనము). దేవుడు ఈ కార్యాన్ని ఎలా చేస్తాడు? ఒక నూతన సృష్టిగా దీనిని జరిగిస్తాడు. 'నేను దానిని పుట్టించెదను' అని దేవుడు సెలవిస్తున్నాడు. సమాధానం తెచ్చే సాధనాలను వినియోగించడం వరకు మన బాధ్యత, అయితే, సమాధానాన్ని దయచేయడం మాత్రం దేవుని వశంలోనే ఉంది..

b) జీవం, బలం,ఆదరణ అనేవి దేవుడిచ్చే ఆధిక్యతలే కానీ మన హక్కులుకావు

మనకు జీవము, బలము, ధైర్యము, సమాధానము కలుగజేయడానికి దేవుడు నియమించిన మార్గాలలో పాపాన్ని చంపడం ఒకానొక ప్రాథమిక మూలం కాదు. అవి దేవుడు మనలను దత్తత తీసుకున్నాడనే నిశ్చయత మన ఆత్మలకు అందించబడడం వల్ల కలిగే ఆధిక్యతలు. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమివ్వటం, తెల్లరాతిని, కొత్త పేరును, దత్తతను నీతిమత్వమును అనుగ్రహించటం అనగా, ఇవన్నీ మనకు ఇవ్వబడ్డాయన్న గ్రహింపును, నిశ్చయతను మనకు కలుగజేయడం మొదలైనవి, మనకు జీవము, బలము, ధైర్యము, సమాధానము కలుగజేయడంలో పరిశుద్దాత్మకు ఉపకరించే మూలసాధనాలు. ఐతే, ఇది కూడా నేను చెప్పాలి:

C) మన ఆత్మీయ జీవితానికి జీవం, ఆదరణ మరియు బలం పాపాన్ని చంపటంపై చాలా వరకు ఆధారపడుంటాయి

సాధారణంగా మనం దేవునితో నడిచే క్రమంలోను, ఆయన సాధారణంగా మనతో వ్యవహరించే పద్ధతిలోను, ఆలోచిస్తే, మన ఆత్మీయ జీవితానికి కావలసిన బలం మరియు ఆదరణ పాపాన్ని చంపడం పైన ఎంతో ఆధారపడి ఉంది. అది వాటికి తప్పనిసరిగా కావాల్సిన షరతుగా మాత్రమే కాదు, వాటిని కలిగించడానికి కార్యసాధకమైన ప్రభావంగా కూడా అవసరం.

(i) పాపాన్ని చంపడం మాత్రమే మనకు అవసరమైన బలాన్ని ఆదరణను దొంగలించకుండా పాపాన్ని ఆపగలదు.

చంపబడని ప్రతి పాపము రెండు పనులు తప్పక చేస్తుంది:

(1) ఆత్మను బలహీనపరచి నిర్వీర్యం చేస్తుంది.

దావీదు కొంత కాలం ఒక పాపాన్ని చంపకుండా తన హృదయంలో దాచుకున్నపుడు, అది అతని ఎముకలను విరిచి, ఆత్మీయ శక్తిని హరించివేసింది. అందుకు తాను రోగగ్రస్తుడిగాను, బలహీనుడుగాను, గాయపడినవాడుగాను, సొమ్మసిల్లినవాడిగాను ఉన్నట్లు ఫిర్యాదు చేసాడు. “నా ఎముకలలో స్వస్థత లేదు” (కీర్తనలు 38:3), “నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను” (38:3), “నేను తల ఎత్తి చూడలేక పోతిని” (40:12) అని అతడు విలపించాడు. చంపబడని ఒక దురాశ, మన ఆత్మలో ఉన్న సామర్థ్యాన్ని తాగివేసి, ఆత్మీయవిధులు నిర్వర్తించలేని శక్తిహీనులుగా చేస్తుంది. ఎందుకంటే

మొదటిగా, పాపం మన హృదయవాంఛలను చిక్కులబెట్టి, హృదయపు స్తితిగతులను తప్పేలా చేస్తుంది. దేవునితో లోతైన సహవాసానికి ఉండాల్సిన ఆత్మీయ ఆసక్తి నుండి హృదయాన్ని తిప్పివేసి, మరిదేన్నో ప్రేమించి, ఆశించేలా దాని వాంఛలను మరలుగొల్పి, దేవుని ప్రేమను మన హృదయాల్లో నుండి పారద్రోలేలా చేస్తుంది (1యోహాను 2:15-17). మరొకదానిని ప్రేమిస్తూ యెహెూవాయే నా స్వాస్థ్యమని యధార్థంగాను సత్యంగాను చెప్పడం ఇపుడు హృదయానికి వీలుపడదు. దేవునిపట్ల మాత్రమే కలిగుండాల్సిన భయము, కోరిక, నిరీక్షణ, వంటి ఆత్మీయ సుగుణాలు ఇపుడు హృదయాన్ని ఆక్రమించిన ఆ వేరొక విషయం పట్ల ఏదో విధంగా కనపరచడం జరుగుతుంది.

రెండవదిగా, పాపం గురించిన పథకాలతో నిండి ఉండేలా అది మన తలంపులను ఆక్రమిస్తుంది. మనోవాంఛలను తీర్చడానికి అవసరమైనవి అందించే గొప్ప మాధ్యమాలు మన తలంపులే. పాపం చంపబడకుండా హృదయంలో నిలిచుంటే, మన తలంపులు మన శరీరేచ్ఛలను నెరవేర్చటానికి శరీరం విషయమై నిర్విరామంగా ఏర్పాట్లు చేస్తూనే ఉంటాయి. శరీరేచ్ఛలను తృప్తిపరచేవాటినిమెరుగులు దిద్ది, అలంకరించి, ముస్తాబుచేసి, వాటిని ఇంటికి తెస్తాయి. ఇలా అవి చెప్పనశక్యమైన మలిన ఊహలకు సేవలు ఆతిథ్యమిస్తాయి.

మూడవదిగా, మన ఆత్మీయ విధులను ఆటంకపరచేలా పాపం విరుచుకుపడుతుంది. దేవునిని ఆరాధించాల్సింది పోయి, ఆసక్తిగలవాడు నేర్చుకోవటంలో, లోకస్తుడు పనులలో లేదా ప్రయత్నాలలో, శరీరసంబంధి వ్యర్థమైనవాటి కొరకు చేసుకునే ఏర్పాట్లలో తలమునకలయ్యుండేలా వారిని అది ప్రభావితం చేస్తుంది.

చంపబడని పాపం దారి తీసే అతిక్రమాలు, వినాశనాలు, అవి గురిచేసే బలహీనత, ఒంటరితనాలను వివరించడం నా ప్రస్తుత అంశమయ్యుంటే, పై విషయాలను మరింత విస్తృతంగా చర్చించి ఉండేవాడిని.

(2) ఆత్మను దు:ఖంలో ముంచెత్తి, నెమ్మది మరియు సమాధానం లేకుండా చేస్తుంది.

పాపం ఆత్మను బలహీనపరచినట్లే దానిని చీకటిమయంగా కూడా చేస్తుంది. అది దేవుని ప్రేమా కనికరాలను చూడలేకుండా మన మనోనేత్రాల ముందు నల్లని మేఘంలా కమ్ముకుంటుంది. మనకు ప్రాప్తించిన దత్తపుత్రాధిక్యతలను మరచిపోయేలా చేసి, ఒకవేళ హృదయం సమాధానపు ఆలోచనలను కూర్చుకునే ప్రయత్నం చేసినా అది వాటిని చెల్లాచెదురు చేస్తుంది.

మన ఆత్మీయ బలం మరియు సామర్థ్యం, పాపాన్ని చంపడంపై ఆధారపడి ఉందని నేను చెప్పింది ఈ భావంలోనే. వాటిని నిరోధించేదానిని తొలగించుకోవడమే వాటిని కలిగుండడానికి మార్గం. పాపపు ప్రభావం కింద రోగులైనవారు, గాయపడినవారు, సహాయం కొరకు ఎన్నో అభ్యర్థనలు చేస్తారు. వారి తలంపులు, ఊహలు వారిని స్వాధీనపరిచినపుడు వారు దేవునికి మొర పెట్టుకుంటారు. దేవునికే వారు మొరపెట్టినా వారికి విడుదల రాదు. వ్యర్థంగానే వారు ఎన్నో పరిష్కారాలు వెదుకుతున్నారు. వారికి స్వస్థత రాదు. హెూషియా 5:13లో మనం ఇదే చూస్తాము. తాను రోగియని ఎఫ్రాయీము చూసాడు, తనకు కలిగిన పుండును యూదా చూసాడు. దాని విషయమై కొన్ని పరిష్కారాలు కూడా వారు యత్నించారు. అయినా, తమ పాపాన్ని ఒప్పుకునేలా దేవుని తట్టుకు మనస్సు తిప్పుకొని వస్తేనే తప్ప ఏదీ వారికి సహాయపడదు (15వ వచనం). తమ రోగాన్ని, గాయాల్ని గురించి, వారు యుక్తమైన విధంగా దేవునిని అభ్యర్థిస్తేనే తప్ప వారికి ఎలాంటి స్వస్థత సిద్దించదు.

(ii) పాపాన్ని చంపడం, దేవుడు అనుగ్రహించిన ఆత్మఫలాలు పదును చేయబడి, అవి మన హృదయాలలో ఎదిగి విస్తరించడానికి తావిస్తుంది.

మన ఆత్మీయ జీవితం యొక్క ప్రాణం మరియు బలం, దేవుడు నాటిన కృపాసహిత మొక్కల ఆయువు మరియు ఫలసమృద్దిపై ఆధారపడి ఉంటాయి. ఒక తోటలో, ఒక ప్రశస్తమైన మొక్కను నాటి, దాని చుట్టూ భూమిని సేద్యపరచకుండా విడిచి పెట్టేస్తే, కలుపు మొక్కలు మొలవకుండా జాగ్రత్త వహించకపోతే, ఆ మొక్క బ్రతికే ఉంటుందేమో కాని, దయనీయమైనదిగా, వడలిపోయేదిగా, నిష్పలమైనదిగా మిగిలిపోతుంది. దానిని వెదికినా బహు కష్టంగా దొరుకుతుంది, దొరికినా నేను వెదికే చెట్టు ఇదేనా అని సంశయించేంతగా ,గుర్తుపట్టలేనిదిగా ఉంటుంది, ఒకవేళ గుర్తుపట్టినా ఏమాత్రం అక్కరకు రానిదిగా అది మిగిలిపోతుంది. అయితే దీనిని నాటిన భూమి వంటి బంజరు భూమిలోనే అలాంటి మరో మొక్కను నాటి, దాని చుట్టూ సరిగా సేద్యపరచి, దానిని అడ్డగించే లేదా హాని చేసేవన్నీటిని తొలగిస్తే, అది వృద్ధి చెంది ఫలించేదిగా ఉండి, తోటలోనికి చూసినపుడే తేటగా కనబడేదిగా ఉండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగించటానికి యోగ్యమైనదిగా సిద్దమౌతుంది. మన హృదయాలలో నాటబడిన ఆత్మఫలాల విషయం కూడా ఇదే. అవి ఉన్నాయన్నది నిజమే. అయితే, పాపాన్ని చంపే బాధ్యతను నిర్లక్ష్యపెట్టే ప్రవృత్తిగల హృదయంలో అవి నాటబడ్డాయి కాబట్టి, అవి చావనయ్యుండి (ప్రకటన 3:2 ), వాడిపోయి కృశించిపోతున్నాయి. అతని హృదయం, పైరు కనిపించకుండా కలుపు మొక్కలతో నిండిపోయిన సోమరివాని పొలం వంటిది . అలాంటివాడు, తన హృదయంలో విశ్వాసం, ప్రేమ, ఆసక్తిమున్నగు వాటికొరకు వెదుకుతాడేమో కానీ, అలాంటిదేదైనా కనిపించడం అరుదు. ఒకవేళ ఈ ఫలాలు ఇంకా సజీవంగాను యధార్థంగాను ఉన్నా, ఎంతో బలహీనపడి, దురాశలచేత అణగదొక్కబడి, బహుకొద్ది ప్రయోజనమే ఇవ్వగల స్థితిలో వాటిని చూస్తాడు. అవి మిగిలియున్నాయి కాని చావనైయున్నాయి. అయితే, పాపాన్ని చంపడం వల్ల హృదయం శుద్ధిచేయబడి, దురాశల కలుపుమొక్కలను ప్రతి రోజు పెరికివేసి (అవి ప్రతి రోజు మొలకెత్తుతాయి కాబట్టి), ఆత్మ ఫలాలు ఎదగడానికి అవసరమైన భూమి మన స్వభావమే కాబట్టి, కృపకు దానియందు విస్తరించే తావిస్తే, అది ఫలవృద్ది చెంది, ప్రతి ఫలము దాని పని అది చేయటం వల్ల, అన్నిటికి ఉపయోగపడేలా ఎదిగే వీలు కలుగుతుంది.

(iii) పాపాన్ని చంపే పనిలో యధార్థత ఉంటే అది సమాధానం కలుగజేస్తుంది

పాపాన్ని చంపకుండా మనలో యధార్థత ఉందని ఎలా రుజువు చేయలేమో అలాగే, అది చేస్తే మన యధార్థతను రుజువు చేయడంలో దానికి సాటియైన మరో ఆధారం లేదు. కాబట్టి ఇది మనకు సమాధానాన్ని కలిగించడానికి బలమైన పునాది. స్వార్థానికి బలమైన ఎదురుదెబ్బ పాపాన్ని చంపడమే కాబట్టి దానిలా యధార్థతను నిరూపించేది మరొకటి లేదు.

 

 

అధ్యాయం-5

ఏది పాపాన్ని చంపడం కాదు?

ప్పటి వరకు ఈ చర్చకు ఆధారమైన కొన్ని అంశాలను ప్రతిపాదించాను కాబట్టి, ఇప్పుడు విశ్వాసులకు పాపాన్ని చంపే బాధ్యతలో తలెత్తే కీలకమైన కొన్ని ప్రశ్నలతోను ఆచరణలో ఎదుర్కొనే కొన్ని పరిస్థితులతోను వ్యవహరించాలనే నా ముఖ్య ఉద్దేశానికి వస్తున్నాను.

ఇందుకు సంబందించిన ప్రశ్నలన్నీ ఇమీడియున్న ఒక్క అతిముఖ్యమైన ప్రశ్నను, ఈ క్రింది విధంగా ప్రతిపాదిస్తాను:

దేవునితో సహవాసంలో సమాధానాన్ని కోల్పోకుండా పాపంతో మనమెలా పోరాడాలి?

ఒక వ్యక్తి నిజమైన విశ్వాసి అయివుండి కూడా, తనలో ఉన్న శక్తివంతమైన అంతరంగ పాపం అతనిని చెరపట్టి లోపరచుకుంటుందని గుర్తెరిగాడనుకుందాం. అది అతని హృదయాన్ని కలవరంతో దహించి, తలంపులను గలిబిలిచేసి, దేవునితో సహవాసంలో అతని ఆత్మను బలహీనపరచి, సమాధానం లేకుండా కృంగదీసి, మనస్సాక్షిని కూడా కలుషితం చేసి, పాపం వలన కలుగు భ్రమచేత కఠినపరచబడే పరిస్థితికి అతన్ని గురిచేస్తుందనుకుందాం. ఇప్పుడతడు ఏమి చేయాలి? దానిని పూర్తిగా రూపుమాపలేకపోయినా, దానితో పోరాడే క్రమంలో, దేవునితో సహవాసంలో తనకుండాల్సిన శక్తిని, బలాన్ని, సమాధానాన్ని కోల్పోకుండా జాగ్రత్తపడేంత మేరకు, ఈ పాపాన్ని, దురాశను, వ్యాధినీ, లేదా దుర్నీతిని చంపేలా అతడు ఏ పరిష్కార విధానాన్ని అవలంభించాలి?

ఈ ముఖ్యమైన ప్రశ్నకు జవాబుగా ఈ క్రిందివాటిని వివరిస్తాను;

1. పునాదిలోనే పొరపాటు లేకుండా జాగ్రత్తపడడానికి, ఏ పాపాన్నయినా చంపడమంటే దాని అర్థమేమిటో, ఏది దాని అర్థం కాదో మొదట స్పష్టం చేస్తాను. (ప్రస్తుత అధ్యాయంలో ఏది దాని అర్థం కాదో చర్చించి, 6వ అధ్యాయంలో దాని అర్థమేమిటో విశ్లేషించబడింది).

2. ఇవి లేకుండా యధార్థంగాను ఆత్మీయంగాను పాపాన్ని చంపడం సాధ్యం కాదు అన్న కొన్ని సాధారణ నిర్దేశాలను సూచిస్తాను.( ఇవి 7 మరియు 8 అధ్యాయాలలో చదువుతాము).

3. ఈ నియమాలను నేను ప్రస్తావించే ప్రత్యేక పరిస్థితులకు ఎలా అన్వయించాలో వివరిస్తాను. (ఇది 9వ అధ్యాయం నుండి చూస్తాము).

ఒక పాపాన్ని చంపడం :

a) ఒక పాపాన్ని చంపడమంటే, దాని ఉనికి మన హృదయంలో లేకుండా చేసేలా దానిని హతం చేయడం, పెరికివేయడం, నిర్మూలం చేయడమని భావం కాదు.

మన గురి అదే అన్నది వాస్తవమైనప్పటికీ, ఈ జీవితంలో దానిని అందుకోలేము. ఏ పాపాన్నయినా యధార్థంగా చంపాలని పూనుకున్నవాడు, దాని వేరు కాని ఫలము కాని తన హృదయంలోనైనా జీవితంలోనైనా ఏ మాత్రం మిగలకుండా సంపూర్ణంగా నిర్మూలం చేయాలనే కోరిక, లక్ష్యము మరియు ఉ ద్దేశ్యము కలిగి ఉంటాడు. అదీ ఇంకెప్పుడు నిత్యత్వపర్యంతము కదలలేకుండా, కదల్చలేకుండా, అరవలేకుండా, పిలువలేకుండా, మోసగించలేకుండా, శోధించలేకుండా, దానిని మృతమొందించాలని అతడు కోరతాడు. గురి అదే అయినప్పటికి ఇప్పుడది సాధ్యపడేది కాదు. అయితే, క్రీస్తు ఆత్మ మరియు కృప చేత ఒక పాపాన్ని ఎప్పుడూ జయించే ఆశ్చర్యకరం మరియు ఉత్తమమైన విజయం ఒకవేళ సాధించే వీలు ఉంటుందనడంలో సంశయమేమీ లేదు. అయినా, దానిని సంపూర్ణంగా చంపి రూపుమాపడమనేది ఈ జీవితంలో జరుగుతుందని ఊహించలేము. “ఇది వరకే గెలిచితినని కాని, ఇదివరకే సంపూర్ణసిద్ధి పొందితినని గానీ అనుకొనుటలేదు” (ఫిలిప్పీ 3:12) అంటూ ఈ వాస్తవాన్ని పౌలు కూడా రూఢి చేసాడు. భక్తశ్రేష్టుడు మరియు విశ్వాసులకు మాదిరియైన పౌలు, విశ్వాసం, ప్రేమ, తదితర ఆత్మఫలాలన్నిటిలో తనకు సాటిలేని కారణాన్ని బట్టి, ఇతరులతో తారతమ్యంలో తాను సంపూర్ణుడని చెప్పుకున్నప్పటికీ (15వ వచనం), ఇంకా తాను గెలవనులేదు, సంపూర్ణసిద్ధి పొందను లేదు కానీ ఆ గురి వద్దకే పరిగెత్తుచున్నాడు. అయితే తనకు కూడా మనలా క్రీస్తు గొప్ప శక్తి చేత మార్చబడాల్సిన దీన శరీరమే ఉంది (21వ వచనం). సంపూర్ణతను మనం వాంఛించినప్పటికీ, మనంతట మనమే సంపూర్ణులము కావాలని కాదు, అన్నిటిలో మనము క్రీస్తునందు సంపూర్ణము చేయబడాలన్నది దేవుని ఉద్దేశ్యము (కొలొస్సీ 2:10). మనకు కూడా అదే శ్రేయస్కరం.

b) ఒక పాపాన్ని చంపడమంటే దానికి ముసుగువేయడం కాదు

ఇది వేరే చెప్పనవసరం లేదునుకుంటాను. కొన్ని బాహ్య కారణాలను బట్టి ఒక వ్యక్తి తాను ఇది వరకు చేసిన ఏదైన పాపాన్ని విడిచిపెట్టినపుడు, మనుష్యులు అతనిని ఒక మారిన వ్యక్తిగా పరిగణిస్తారేమో. అయితే, తన పూర్వ పాపానికి ఇప్పుడతడు శాపగ్రస్తమైన వేషధారణను తొడుగుకున్నాడని, మరింత సునాయాసంగా నరకానికి దారితీసే మార్గాన పయనిస్తున్నాడని, దానికి ముందున్నదాని స్థానంలో ఇప్పుడు ధరించుకున్నది, మరింత పరిశుద్దమైన నూతన హృదయం కాదు, మరింత కపటంతో నిండిన వేరొక హృదయమని దేవునికి తెలుసు.

c) పాపాన్ని చంపడమంటే శాంతంగా, మితంగా ఉండే స్వభావాన్ని అలవర్చుకోవడం కాదు.