నిజ క్రైస్తవ జీవితం

రచయిత: పల్లె శాంతిరాజు

విషయసూచిక

పరిచయం

నేటి క్రైస్తవ సమాజంలో దేవుడంటే కేవలం ఆశీర్వదించువాడు, స్వస్థపరచువాడు. తప్పులు చేసినా శిక్షించడు అనే బోధలు అధికంగా వినబడుతున్నాయి. అందువల్ల క్రైస్తవుల్లో దేవుని భయం క్రమంగా తగ్గిపోతూ.. విచ్చలవిడితనం పెరుగుతుంది. దీని వెనుక సాతానుడు, అతని సేవకులు చాపక్రింద నీరులా క్రైస్తవ సమాజంలో పని చేస్తుండడం గమనార్హం.

పరిశుద్ధుడైన దేవుడు తన పిల్లలు తప్పులు చేస్తే ఆయన సహించడని, వారి మేలు కోసం క్రమశిక్షణ చేస్తాడనే సత్యం క్రైస్తవుల్లో అత్యధికులకు తెలియకపోవడం బాధను కలిగిస్తుంది. వీరికి సత్యం తెలియకపోడానికి కొందరు బోధించే బోధ ఒక కారణం. ఈ నేపథ్యంలో.. ‘‘..పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను’’ (యూదా 1:3). అనే వాక్యం నన్ను ప్రోత్సాహపరించింది. చిన్నవాడినే అయిన తెలిసిన సత్యాలను క్రైస్తవ సమాజానికి అందించడానికి ప్రభువు సహాయంతో ఈ పుస్తకాన్ని రాయగలిగాను.

ఈ గ్రంథంలో.. ప్రాముఖ్యంగా దేవుని క్రమశిక్షణ అనే ప్రక్రియ పాతనిబంధన భక్తుల కాలం (ఆదికాండం)లో ప్రారంభమై ఆదిమ అపొస్తలుల కాలం (బైబిల్‌లోని చిట్టచివరి పుస్తకమైన ప్రకటన) వరకు కొనసాగిందనే సత్యాన్ని క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశాను.

అందులో భాగంగా.. దేవుడు చేసే క్రమశిక్షణ వల్ల కలిగే మేలు,  క్షేమం తెలియజేశాను. తప్పుడు మార్గాలలో జీవిస్తూ మొండి వైఖరిని ప్రదర్శించిన వ్యక్తులు ఎలా మరణించారో కూడా తెలిపాను.

పాఠకులు గుర్తించాలి: ‘‘ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలిసికొని ఆయన మార్గములలో నడుచుకొనునట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను’’ (ద్వి.కా 8:5-6).  ఈ లేఖనాలు, దేవుడు శిక్షిస్తాడు అనే సత్యాన్ని ఆయన పిల్లలు గ్రహించి భయంతో జీవిస్తూ.. ఆజ్ఞలను అనుసరించి దైవమార్గంలో నడవాలని మాట్లాడుతున్నాయి.

‘‘నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును’’ (సామె 3:11-12). ఈ వచనాలు - దేవుని క్రమశిక్షణలో గద్దింపులు ఉంటాయని, ఆయన తన పిల్లలను తండ్రిలా ప్రేమిస్తూ.. గద్దిస్తాడని చెబుతున్నాయి.

‘‘ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతినొందించువాడును బ్రదికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలోనుండి విడిపించు వాడెవడును లేడు’’ (ద్వి.కా 32:39). ఈ లేఖనం - దేవుడంటే కేవలం స్వస్థపరచువాడు మాత్రమే కాదు గాయపరచువాడని; జీవాన్ని, మరణాన్ని ఆయన ఇవ్వగలడనే సత్యాన్ని తెల్పుతుంది. పాఠకులు ఈ పుస్తకాన్ని చదివి, సత్యాన్ని గ్రహించి, దేవునికి సాక్షులుగా జీవించాలని ఆశిస్తున్నాను.

రచయిత

మొదటి భాగం

ఏదెనువనంలో నుండి వెలివేయబడిన ఆదిదంపతులు

1

  1. ఆదిదంపతులను క్రమశిక్షణ చేసిన దేవుడు:

దేవుడు భూమి ఆకాశం, సూర్య, చంద్ర నక్షత్రాలు, పక్షులు, జంతువులు, మొక్కలు మొదలగునవి సృష్టించాడు. ఆ తరువాత తన పోలిక, స్వరూపంలో మనుష్యులను చేశాడు.

మనుష్యుల నిర్మాణం: నేలమట్టితో మానవ ఆకారాన్ని నిర్మించి నాసిక రంధ్రాలలో జీవ వాయువును ఊది ఊపిరి పోశాడు. ఇలా మొదటిగా పురుషున్ని చేశాడు. ఇతనికి తోడుగా మరో వ్యక్తి అవసరమని ఆదామును నిద్రపుచ్చి, అతని ప్రక్కటెముకను తీసి స్త్రీగా నిర్మించాడు. ఈ ఇద్దరు మనుష్యులు ఏదెను వనంలో జీవించేవారు.

దేవుని ఆజ్ఞ: ‘‘..దేవుడైన యెహోవా  ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు..’’ (ఆది.కా 2:15-16).

జంతువుల్లో సర్పం యుక్తిగలదై హవ్వతో 'మీరు దేవుడు తినవద్దని చెప్పిన వృక్ష ఫలాలు తింటే దేవునిలా ఉంటారని చెప్పింది. ఆ మాటలు హవ్వలో దురాశను కలిగించాయి. ఆమె ఆ వృక్ష ఫలాలను తిని, కొన్ని ఆదాముకు ఇవ్వగా అతడు భుజించాడు. అప్పుడు వారు దేవునిలా కాలేదు కాని తమ శరీరాలపై వస్త్రాలు లేవని గుర్తించి సిగ్గుపడ్డారు.

దేవుని క్రమశిక్షణ: ఈ దంపతులు దేవుని ఆజ్ఞను మీరి పాపం చేశారు. ‘‘దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును’’ (యాకోబు 1:15). దేవుడు హవ్వతో మాట్లాడుతూ.. వేదనతో పిల్లలకు జన్మ ఇస్తావని, ఆదాముతో చెమట కార్చి ఆహారం భుజిస్తావని చెప్పాడు. అనంతరం ఆ దంపతులను ఏదెనులో ఉండకుండా.. బయటికి పంపించాడు (ఆది.కా 1-3 అధ్యాయాలు). దాంతో ప్రతి దినం దేవునితో ఉండే చక్కటి సహవాస, సంబంధానికి వారు దూరమైనారు.

రెండవ భాగం

పాత నిబంధన కాలంలో..

పాతనిబంధన కాలంలో దేవుడు తన చిత్తానుసారంగా ప్రజలను ఆయా విధాలుగా క్రమశిక్షణ చేశాడు.

 

  • గాయం ఆశీర్వాదం కోసమే:
  •  

    ‘‘యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగు లాడుట వలన యాకోబు తోడ గూడు వసిలెను.

    ఆయన - తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు - నీవు నన్ను ఆశీర్వదించితినే గాని నిన్ను పోనియ్యననెను. ఆయన - నీ పేరేమనియడుగగా అతడు - యాకోబు అని చెప్పెను.

    అప్పుడు ఆయన - నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలేగాని యాకోబు అనబడదని చెప్పెను... యాకోబు - నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని

    ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను’’ (ఆది 32:24-30).

    2

    యాకోబు తన అన్నయైన ఏశావును ఎదుర్కొనే ముందు ప్రార్థిస్తుండగా ఒక నరుడు తన వద్దకు వచ్చాడు. అతనితో చాలా సమయం మాట్లాడాడు. ఆ నరుడు తెల్లవారుతుంది నన్ను వెళ్లనివ్వమని అన్నప్పుడు యాకోబు వినకుండా అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడా నరుడు అతన్ని కొట్టాడు. దాంతో గాయమైన యాకోబు నన్ను ఆశీర్వదిస్తేనే కాని నేను నిన్ను పోనివ్వనని అన్నాడు. వాస్తవంగా యాకోబుకు భార్యలు, పిల్లలున్నారు. విస్తారమైన పశుసంపదతో పాటు సేవకులున్నారు. అయినా, నన్ను ఆశీర్వదించుమని అడగడం ఆసక్తిని కలిగించే అంశం.

    అతను ఆశీర్వదించడానికి ముందు, నీ పేరు ఏమిటని యాకోబును ప్రశ్నించాడు. పూర్వం తన తండ్రి కూడా - నీ పేరు ఏమిటని అడిగినప్పుడు ఏశావని అబద్ధం చెప్పాడు (ఆదికాండము 27:18-19). ఆ నరునితో మాత్రం కన్నీళ్లు కారుస్తూ.. నా పేరు యాకోబు అని సత్యం చెప్పాడు. యాకోబు పేరుకు మడిమెను పట్టుకొనినవాడు లేక మోసగాడు అని అర్థం (ఆదికాండము 25:25). యాకోబు తన పేరు చెప్పే క్రమంలో మోసగాడినని ఒప్పుకున్నాడు. అప్పుడా నరుడు అతన్ని ఆశీర్వదిస్తూ  ఇక మీదట నీవు యాకోబు (మోసగాడివి) కాదు ఇశ్రాయేలు (రాజకుమారుడవు) అనబడుదువని అన్నాడు.

    సందర్భంలో యాకోబును ఆశీర్వదించిన నరుడు ఎవరు?

    యాకోబే ఇలా చెప్పాడు - నేను ముఖాముఖిగా దేవుని చూచితిని. యాకోబు చూసింది నరునిగా ప్రత్యక్షమైన దేవుణ్ణి (ఆది 32:30). ఇదే సత్యాన్ని ప్రవక్త హోషేయా ధృవీకరించాడు. ‘‘తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను’’ (హోషేయా 12:3-4). యాకోబు ఏ దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడో ఆయనే ఇంచుమించు రెండువేల సంవత్సరాల క్రితం ఈ భూమిపై నరరూపిగా అవతరించాడు (మత్తయి 1:18-25). ఆయన ఎవరో కాదు ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తుతి కలుగును గాక!

    తిరిగి ముఖ్యాంశంలోకి వస్తే.. యాకోబు దేవునిచే గాయం చేయబడిన తరువాత అబద్ధం చెప్పే స్వభావం నుండి సత్యం మాట్లాడే వ్యక్తిగా మారాడు. గతంలో తన అన్న ఏశావును మోసం చేసి పారిపోయినప్పటికీ తిరిగి అతనితో సమాధానపడ్డాడు (ఆది.కా 33వ ఆధ్యాయం). ఆశీర్వాదమంటే, కేవలం భౌతిక సంబంధమైన వస్తు సంపద, ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, హోదా, ఆరోగ్యం మొదలగునవి మాత్రమే కాదు. ఆశీర్వాదంలో ఉన్నతస్థాయి.. వ్యక్తి స్వభావం మారడం.

    నిజానికి దేవుడు యాకోబు తొడగూటిపై కొట్టినప్పుడు ఆయన ఎంతో బాధపడి ఉండొచ్చు. అయినా నేడాయన పేరుతో ఇశ్రాయేలు దేశం ఉండడం, ఆ దేశంలోనే క్రీస్తు జన్మించడం గొప్ప విషయం. ‘‘.. ప్రస్తుతమందు సమస్త శిక్షయు దు:ఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగినవారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును’’ (హెబ్రీ 12:11).

    ఉదాహరణ: ప్రమాదం జరిగి ఒక వ్యక్తి కాలు విరిగినప్పుడు.. వైద్యుడు చికిత్స చేసే సమయంలో.. విరిగిన ఎముకను అతికించడం కోసం మత్తు సూది ఇస్తాడు. కాలుపై ఉన్న చర్మాన్ని, మాంసాన్ని కోస్తాడు. విరిగిన ఎముకను అతికించి, కుట్లు వేస్తాడు. మత్తు దిగిపోయిన తరువాత ఎంతో బాధ, నొప్పి కలుగుతుంది. కొద్ది దినాలకు ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడై సరిగా నడుస్తాడు. ఈ కథలో వైద్యుడు వ్యక్తి క్షేమాన్ని కోరి చికిత్స చేశాడు; ద్వేషంతో కాదు.

    అలాగే.. దేవుడు చేసే క్రమశిక్షణలో ప్రేమ ఉంటుంది. ఇది మనం గుర్తించాలి. ఆ శిక్ష మనకు కొంత బాధ, నొప్పి కలిగించినా అవి మనలోని చెడుతనాన్ని తొలగించి, క్రీస్తు స్వరూపంలోకి మారుస్తాయి.  ‘‘గాయములు చేయుదెబ్బలు అంతరంగములలోచొచ్చి చెడుతనమును తొలగించును’’ (సామె 20:30).

    1. గాయం చేసి.. స్వస్థపరిచిన దేవుడు:

    యోబు దేవునియందు భయ భక్తులతో, యథార్థంగా జీవించేవాడు. అతన్ని ఓర్వలేని సాతాను యోబును నష్టపర్చడం కోసం ప్రత్యేకంగా దేవుని అనుమతి పొందాడు. అప్పుడు దేవుడు యోబు చుట్టు వేసిన కంచెను తీసేశాడు. అపవాది యోబుకు సంబంధించిన అంతటిపై దాడి చేయడంతో అతని కుమారులు కుమార్తెలు, సేవకులు మరణించారు. పశుసంపద పోయింది. యోబు ప్రాణానికి హాని కలిగించొద్దని దేవుడు సాతానుకు ఆజ్ఞాపించడం వల్ల అపవాది యోబును చంపలేకపోయాడు. కాని తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగించాడు (యోబు 1,2 అధ్యాయాలు). ఈ మొత్తం ప్రక్రియ అంతా సార్వభౌముడైన దేవుని అధికార పరిధిలో జరిగింది.

    యోబు తనకు జరిగిన నష్టాలన్నింటి విషయంలో నిండు మనస్సుతో స్తుతించాడు. అప్పుడు అపవాది ఎంతో సిగ్గుపడి ఉంటాడు. ఎందుచేత అనగా, యోబును శ్రమలపాలు చేస్తే, దేవున్ని దూషిస్తాడని అతడనుకున్నాడు. కాని అలా జరుగలేదు. యోబు దేవుణ్ణి మహిమపరిచాడు. దీనివల్ల ఆయన భక్తి ప్రత్యక్షమైంది.

    శ్రమలపాలైన యోబును పరామర్శించి, ఓదార్చడానికి అతని స్నేహితులు వచ్చారు. అప్పుడు వారి మధ్యలో చాలా సంభాషణలు జరిగాయి. దేవుడు పలు అంశాల కోసం యోబును ప్రశ్నలు అడిగాడు (యోబు 38,39 అధ్యాయాలు).

    స్పందించిన యోబు ఇలా అన్నాడు ‘‘యోబు యెహోవాకు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను - చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటిమీద నా చేతిని ఉంచుకొందును. ఒక మారు మాటలాడితిని నేను మరల నోరెత్తను. రెండు సారులు మాటలాడితిని ఇకను పలుకును’’ (యోబు 40:3-5).

    ‘‘నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని.. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకుని, ధూళిలోను బూడిదలోను ఉండి పశ్చాత్తాపపడుచున్నాను’’ (యోబు 42:2-6).

    3

    ఆ తర్వాత యోబు తన మిత్రుల కోసం ప్రార్థించగా.. దేవుడు అతన్ని బాగుచేసి, తాను కోల్పోయిన దానికి రెండంతల ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ‘‘మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను’’ (యోబు 42:10). ‘‘యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి పదునాలుగు వేల గొఱ్ఱెలను ఆరువేల ఒంటెలును వెయ్యిజతల యెడ్లును వెయ్యి అడుగాడిదలను కలిగెను. మరియు అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి’’ (యోబు 42:12-13).

    యోబు వృత్తాంతంలో..

    1). దేవుని సార్వభౌమాధికారం, కనికరం, జాలి మొదలగు గుణగణాలు ప్రత్యక్షమై ఆయనకు మహిమను కలిగించాయి. ‘‘సహించిన వారిని ధన్యులని పరిగణిస్తున్నాం గదా. యోబు ఓర్పును గురించి మీరు విన్నారు. తుదకు ప్రభువు వల్ల కలిగిన ఫలితం ` ప్రభువు కరుణామయుడు, ఎంతో జాలిగలవాడని చూశారు’’ (యాకోబు 5:11). (గ్రెస్‌ మినిస్ట్రీస్‌ వ్యాఖ్యాన సహిత పవిత్ర గ్రంథం).

    ‘‘...కష్టాలు అనుభవించి కూడా విశ్వాసంతో ఉన్నవాళ్ళను మనము ధన్యులుగా భావిస్తాము. యోబు సహనాన్ని గురించి మీరు విన్నారు. ప్రభువు చేసిన దాన్ని చూసారు. ప్రభువులో దయాదాక్షిణ్యాలు సంపూర్ణంగా ఉన్నాయి’’ (యాకోబు 5:12). (వరల్డ్‌ బైబిల్‌ ట్రాన్స్‌లేషన్‌ ఇండియా వారి తెలుగు ఈజీ టూ రీడ్‌ వర్షన్‌).

    2). యోబు శరీరమందు అనారోగ్యాన్ని అనుమతించిన దేవుడే తన కనికర హస్తాలతో స్వస్థపరిచాడు. అప్పుడాయనకు కుమారులు, కుమార్తెలు జన్మించారు. రెండంతల ఆశీర్వాదాలు వచ్చాయి.  ‘‘ఆయన గాయపరచి గాయమును కట్టును ఆయన గాయముచేయును, ఆయన చేతులే స్వస్థపరచును’’ (యోబు 5:18).

    3). దేవునికీ, భక్తునికీ మధ్యలో వచ్చిన అపవాదికే అవమానం, సిగ్గు కలిగింది. యోబు సందర్భం మాట్లాడుతున్నప్పుడెల్లా అపవాదికి అవమానం.. దేవునికి మహిమ కలుగుతూనే ఉండడం గమనీయం.

    దేవుని అనుమతి వల్ల కొన్నిసార్లు క్రైస్తవులకు శ్రమలు, వ్యాధులు రావొచ్చు. ఆ స్థితిలో దేవుడే తన ప్రజల ద్వారా సహాయం చేస్తాడు.

    1. గర్భాలను మూసి.. సంతానాన్ని ఇచ్చుట:

    అబ్రాహాము తన భార్యయైన శారాతో గెరారులో నివసించినప్పుడు ఆ ప్రాంత రాజైన అబీమెలెకు శారాను పిలిచి తన ఇంట చేర్చుకున్నాడు. అతడు శారాతో లైంగికంగా తప్పిదం చేయకుండా దేవుడు స్వప్నమందు ఆ మనుష్యుని భార్యను అతనికి తిరిగి ఇవ్వమని చెప్పాడు. లేదంటే, నీవును నీ ఇంటివారు మరణిస్తారని హెచ్చరించాడు. ఆ తరువాత అబీమెలెకు అబ్రాహామును పిలిచి, శారాను అతనికి అప్పగించెను.

    శారా కోసం దేవుడు అబీమెలెకు ఇంటిలోని ప్రతీ స్త్రీ గర్భాన్ని మూశాడు. ప్రవక్తయైన అబ్రాహాము ప్రార్థించగా దేవుడు ఆలకించి అబీమెలెకు భార్య, దాసీలను బాగుచేయగా వారు పిల్లలకు జన్మనిచ్చారు. ‘‘అబ్రాహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగుచేసెను. వారు పిల్లలు కనిరి. ..శారానుబట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను’’ (అది.కా 20:17-18). దేవుని శక్తిగల కార్యాలకు ఈ సంఘటన ఒక ఉదాహరణగా చూడొచ్చు.

     

    1. మారా అనుభవం మధురంగా..:

    న్యాయాధిపతులు ఏలుతున్న దినాలలో.. ఎలీమెలెకు, అతని భార్య నయోమి, తన ఇద్దరు కుమారులు బేత్లెహేము అనే రొట్టెల ఇంటిని విడిచి, అన్య దేశమైన మోయాబు దేశానికి వలస వెళ్ళారు. అక్కడ ఎలీమెలెకు మరణించాడు. తన ఇద్దరు కుమారులకు ఆ దేశ స్త్రీలతో వివాహం జరిగిన కొద్దికాలానికే వారూ మరణించారు.

    ‘‘...కాగా ఆ స్త్రీ తాను కనిన యిద్దరు కుమారులును తన పెనిమిటియు లేనిదాయెను. వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్లుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి’’ (రూతు 1:5-6).

    నయోమి తన ఇద్దరి కోడళ్లతో మీ స్వగృహాలకు వెళ్లుమని చెప్పగా.. ఒక కోడలు వెళ్ళింది. మరో కోడలు రూతు తనతో కలిసి జీవించడానికి ఇష్టపడిరది. అందువల్ల నయోమి రూతును తీసుకుని బేత్లెహేముకు తిరిగి వచ్చింది.

    అప్పుడు ఆ ఊరివారు ఈమె నయోమి గదా! అని అన్నారు. అప్పుడు నయోమి ఇలా అంది ‘‘.. - సర్వశక్తుడు నాకు చాలా దు:ఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి’’ (రూతు 1:20). ‘‘నేను సమృద్ధిగలదాననై వెళ్లితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేల? యెహోవా నామీద విరుద్ధముగ సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను’’ (రూతు 1:21).

    నయోమి అనే పేరుకు మధురం అని, మారా అంటే చేదు అని అర్థం. అన్య దేశానికి వెళ్ళి దేవునిచే క్రమశిక్షణ చేయబడి తిరిగి రిక్తురాలిగా స్వదేశానికి వచ్చింది.  మనలో కొందరికి తాము ఎంచుకున్న మార్గం వారి దృష్టికి మంచిగా కనబడుతుంది.అందులో కొనసాగడం లాభకరం అనుకుంటారు. అయితే అది ప్రభువు చిత్తానికి వ్యతిరేకమై ఉండొచ్చునేమో! ‘‘ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును’’ (సామె 16:24).

    నయోమి భర్తకు బంధువైన బోయజుతో రూతుకు వివాహం జరిగింది. దేవుడు ఆ దంపతులను ఆశీర్వదించి కుమారుణ్ణి ఇచ్చాడు. భర్తను, కుమారులను కోల్పోయి ఎడారిలా మారిన నయోమి జీవితాన్ని దేవుడు కరుణించడంతో నిత్యం పారే జలపాతంలా మారింది.

    4

     ‘‘అప్పుడు స్త్రీలు - ఈ దినమున నీకు బంధువుడు లేకుండచేయని యెహోవా స్తుతినొందును గాక. నిన్ను ప్రేమించి యేడుగురు కుమారులకంటె నీ కెక్కువగా నున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ` ఆ బిడ్డను తీసికొని కౌగిటనుంచుకుని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు - నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రియైన యెష్షయి యొక్క తండ్రి’’ (రూతు 4:13-17).

    నయోమి మనవడైన ఓబేదు దావీదుకు తాత. యేసుక్రీస్తు వంశావళి గమనిస్తే అందులో ఓబేదు పేరు ఉండడం హర్షించదగ్గ విషయం (మత్తయి 1:5). మారాలాంటి జీవితాలను దేవుడు మధురంగా మార్చగల శక్తిగలవాడు. అంత మాత్రమే కాదు; చక్కగా క్రమశిక్షణ చేస్తాడని నయోమి జీవిత అనుభవాల ద్వారా అర్థమవుతుంది.

    1. ఫిలిష్తీయులను, బేత్షెమెషు ప్రజలను శిక్షించిన దేవుడు:

    - రహస్య స్థలాలలో గడ్డలు.. మరణం.

    ఏలీ కుమారుల పాపం తారాస్థాయికి చేరిన సందర్భంలో... యుద్ధంలో దేవుని తోడు తమకు ఉండాలని ఇశ్రాయేలీయులలోని పెద్దలు భావించి మందసాన్ని యుద్ధభూమిలోకి తీసుకొచ్చారు. అయినా ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. విజయం సాధించిన ఫిలీష్తీయులు మందసాన్ని తమతోపాటు తీసుకెళ్ళి వారి దేవాలయంలో ఉంచారు. అప్పుడు వారి దేవత విగ్రహం ఛిన్నాభిన్నమైంది. అంతేకాదు, అష్డోదు అనే ప్రాంతంలో నివసించేవారికి గడ్డలు, రోగం వచ్చేలా దేవుడు చేశాడు. అందువల్ల వారు అక్కడ నుండి మందసాన్ని గాతు ప్రాంతానికి తీసుకోచ్చారు. ఆ ప్రదేశంలోను పెద్దలకు, చిన్నలకు రహస్య స్థలాలలో గడ్డలు పుట్టగా... మందసాన్ని ఎక్రోనులోనికి తీసుకెళ్ళారు. అక్కడి ప్రజలు సహితం గడ్డలతో బాధపడి కేకలు వేశారు. కొందరు మరణించారు.ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనెజరునుండి అష్డోదునకు తీసికొనివచ్చి దాగోగు గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. అయితే మరునాడు అష్డోదువారు ప్రాత:కాలమందు లేవగా, ఇదిగో దాగోగు యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి యుండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరల ఉంచిరి.ఆ మరునాడు  వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లపడి యుండెను. దాగోనుయొక్క తలయు రెండు అరచేతులును తెగవేయబడి గడపదగ్గర పడియుండెను. కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చు వారేమి నేటివరకు ఎవరును అష్డోదులో దాగోనుయొక్క గుడి గడపను త్రొక్కుటలేదు.యెహోవా హస్తము అష్డోదు వారిమీద భారముగా ఉండెను. అష్డోదువారిని దాని సరిహద్దులలో నున్నవారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా అష్డోదువారు సంభవించినదాని చూచి - ఇశ్రాయేలీయుల దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహు భారముగా నున్నదే. ఆయన మందసము మన మధ్య నుండుటయే దీనికి కారణము గదా! అది యిక మన మధ్య నుండకూడదని చెప్పుకొని ఫిలిష్తీయుల సర్దారులనందరిని పిలువనంపించి - ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మనము ఏమి చేయుదుమని అడిగిరి.అందుకు వారు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మనము ఏమి చేయుదుమని అడిగిరి. అందుకు వారు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును ఇక్కడనుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా, జనులు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును అక్కడనుండి గాతునకు మోసికొని పోయిరి. అయితే వారు అష్డోదు నుండి గాతునకు దానిని మోసికొనిపోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి, గొప్ప నాశనము జేసెను.

    5

    వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి - మనలను మన జనులను చంపివేయవలెనని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మన యొద్దకు తీసికొని వచ్చిరనిరి. కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులనందరిని పిలువనంపించి - ఇశ్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జనులను చంప కుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి. దేవుని హస్తము అక్కడ బహు భారముగా ఉండెను గనుక మరణభయము ఆ పట్టణస్థులందరిని పట్టియుండెను. చావక మిగిలియున్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశము వరకు వినబడెను’’ (1సమూ 5:1-12).

    దేవునిచే శిక్షింపబడిన ఫిలిష్తీయులు మందసాన్ని ఇశ్రాయేలు దేశానికి ఎడ్లబండి ద్వారా పంపారు. బండిని నడపటానికి ఎవరూ లేకపోయినా అవి సరిగా నడుచుకుంటూ వెళ్ళాయి.ఈ మొత్తం సంఘటనల ద్వారా.. ఇశ్రాయేలీయులు యుద్ధంలో ఓడిపోయినంత మాత్రాన వారి దేవుడు ఓడిపోయినట్లు కాదని, ఆయన సర్వశక్తిగలవాడని ఫిలిష్తీయులు తెలుసుకుని ఉండొచ్చు (1స 4:6-8).

    దేవుని ఆజ్ఞ: ‘‘కాబట్టి నీవును నీ కుమారులును బలిపీఠపు పనులన్నిటి విషయములోను అడ్డ తెరలోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవచేయవలెను. ..అన్యుడు సమీపించిన యెడల మరణశిక్షనొందును’’ (సంఖ్య 18:7).

    వాస్తవంగా మందసం ప్రత్యక్ష గుడారంలోని అతిపరిశుద్ధ స్థలంలో ఉండేది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఆ స్థలంలోకి వెళుతాడు. ఇతరులు వస్తే దేవుడు శిక్షిస్తానని ముందుగానే ధర్మశాస్త్రంలో చెప్పాడు. అయితే బేత్షెమెషు ప్రజలు మందసాన్ని తెరచి చూడగా దేవుడు 50 వేలమందిని శిక్షించగా వారు మరణించారు.

    ‘‘బేత్షెమెషువారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతముచేసి ఆ జనులలో ఏబదివేల డెబ్బదిమందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దు:ఖాక్రాంతు లైరి. అప్పుడు బేత్షెమెషువారు  ఇలా అన్నారు - పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు’’? (1సమూ 6:19-20).

    యుద్ధంలో గెలిచిన ఫిలిష్తీయులు మందసాన్ని స్వాధీనపర్చుకుని దేవునిచే శిక్షింపబడ్డారు. ఆ తరువాత మందసాన్ని బేత్షెమెషు ప్రజలు తెరచి చూడడం వల్ల దేవుడు వారిని శిక్షించాడు. పరిశుద్ధుడైన ప్రభువు ఇచ్చిన ఆజ్ఞలను మీరి ప్రవర్తించే వ్యక్తులను తన విధానంలో శిక్షించాడని ఈ సందర్భం ద్వారా అర్థమవుతుంది.

    1. దేవుడు శిక్షించగా మరణించిన నాబాలు:

    సౌలు దావీదును తరుముతున్న దినాలలో.. అతడు తప్పించుకుని అరణ్యంలో నివసించాడు. కర్మెలులోని మాయోనునందు నాబాలు అనే ఆస్తిపరుడికి గొఱ్ఱెలు, మేకలు అధికంగా ఉండేవి. అతని కాపరులు అరణ్యంలో వాటిని మేపుతుండగా దావీదు, అతనితోవున్న వ్యక్తులు నాబాలు కాపరులకు ఏ హాని చేయలేదు. పైగా కూృరమృగాల నుండి పశువులను కాపాడారు.

    నాబాలు గొఱ్ఱెబొచ్చు కత్తిరించే సమయంలో గొప్ప విందు చేశాడు. ఆ సమయంలో దావీదు  నాబాలు దగ్గరకు మనుష్యులను పంపి - నీ పశువులను, కాపరులను దావీదు అతని సేవకులు అరణ్యంలో కాపాడారు. అందువల్ల నీకు ఇష్టమైనవి ఆయనకు ఇవ్వమని వర్తమానం పంపాడు. అప్పుడు నాబాలు దావీదు ఎవడు? యెష్షయి కుమారుడు ఎవడు? అని అవమానపరిచాడు. వారు ఆ సమాచారాన్ని దావీదుకు తెలియజేయగా అతడు వెంటనే కత్తిని ధరించాడు.

    అతనితోపాటు 400 మంది కత్తులతో నాబాలును హతమార్చుటకు బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న దాసుడొక్కడు నాబాలు భార్యయైన అబీగాయిలుకు చెప్పాడు. ఆమె వెంటనే దావీదును ఎదుర్కొని తన భర్తను చంపవద్దని బ్రతిమిలాడి కానుకలను ఇచ్చింది. దావీదు ఆమెలోని మంచిబుద్ధిని గమనించి నాబాలుకు ఏ హాని చేయక తిరిగి వెళ్ళిపోయాడు.

    ఆమె ఇంటికి రాగా నాబాలు మద్యంతో మత్తుడై ఉన్నాడు. మరుసటి రోజు ఆమె తన భర్తతో జరిగిన సంఘటన చెబుతుండగా అతని గుండె పగిలి బిగుసుకపోయింది. పది దినాల తరువాత ప్రభువే నాబాలును శిక్షించగా అతడు మరణించాడని లేఖనం స్పష్టంగా చెబుతుంది. ‘‘పది దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను’’ (1 సమూ 25:38).

    6

    దావీదు, నాబాలును చంపకుండ విడిచిపెట్టాడు. అయితే దేవుడు తన చిత్తానుసారంగా అతన్ని శిక్షించగా మరణించాడు. ఆ సమయంలో దావీదు - ‘‘..యెహోవా నాబాలు చేసిన కీడును అతని తలమీదికి రప్పించెను గనుక తన దాసుడనైన నేను కీడు చేయకుండ నన్ను కాపాడి, నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అనెను’’ (1సమూ 25:39). ఈ మాటలను చదువుతున్న క్రైస్తవులతో లేఖనాలు మాట్లాడుతున్నాయి - ‘‘కీడుకు ప్రతికీడు చేసెదననుకొనవద్దు యెహోవా కొరకు కనిపెట్టుకొనుము ఆయన నిన్ను రక్షించును’’ (సామెతలు 20:22).

    1. ఉపవాసంతో ప్రార్థించినా.. శిశువు మరణించెను:

    ఊరియా సైనికునిగా విధులు నిర్వహించేవాడు. ఇతను యుద్ధంలో ఉండగా.. రాజైన దావీదు అతని భార్య బత్షెబాతో శారీరకంగా కలవడం వల్ల ఆమె గర్భవతి అయింది. ఈ విషయం ఏ మాత్రం తెలియని ఊరియాను యుద్ధంలో చనిపోయే విధంగా దావీదు పథకం రచించి, అమలు చేశాడు. ఊరియా మరణించాడు. ఆ తరువాత దావీదు బత్షెబాను తనకు భార్యగా స్వీకరించాడు.

    దావీదు చేసిన పనుల విషయంలో ఆకాశమందున్న దేవుడు స్పందించి, ప్రవక్తయైన నాతానును పంపించాడు. అప్పుడాయన ఇలాగు ప్రకటన చేశాడు. ‘‘నీ యింటివారికి సదాకాలము యుద్ధము కలుగును నా మాట ఆలకించుము.యెహోవానగు నేను సెలవిచ్చునదేమనగా నీ యింటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి చేరువవాని కప్పగించెదను. పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివిగాని ఇశ్రాయేలీయులందరు చూచుచుండగా పగటియందే నేను చెప్పినదానిని చేయింతును అనెను."(2సమూ 12:10-12).

    ప్రవక్త మాటలను విన్న దావీదు పశ్చాత్తాపడాడు - ‘‘నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా.. (2సమూ 12:13). అందుకు ప్రవక్త దావీదుతో ఇలా చెప్పాడు - ‘‘..నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన యింటికి వెళ్లెను’’ (2సమూ 12:13-15). దావీదు చేసిన పాపాన్ని ఒప్పుకున్నప్పటికీ పర్యవసనాలు అనుభవించాల్సి వచ్చింది.

    ‘‘యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడియుండి బిడ్డకొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నికయైనవారు లేచి అతనిని నేలనుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితోకూడ భోజనము చేయకయుండెను. ఏడవ దినమున బిడ్డ చావగా...’’ (2సమూ 12: 16-18).

    7

    శిశువు కోసం దావీదు ఉపవాసంతో ప్రార్థన చేసినా దేవుని నిర్ణయం మారలేదు. ప్రవక్త చెప్పిన ప్రకారం శిశువు మరణించాడు. ఉపవాస ప్రార్థన ప్రభువు చిత్తాన్ని కోరేదై ఉండాలి (1యోహాను 5:14). దేవుని సంకల్పానికి విరుద్ధమైన అంశాలు నెరవేరాలని ప్రార్థన చేయకూడదు. ఒకవేళ చేసినా ప్రభువు సన్నిధి నుండి ప్రతికూల సమాధానం రావొచ్చు. ఈ విషయం దావీదు చేసిన ప్రార్థనవల్ల తెలుస్తుంది.

    దేవుని క్రమశిక్షణ చర్యల్లో భాగంగా.. దావీదు చేసిన తప్పిదాలకు పర్యవసనాల రూపంలో శ్రమ, బాధ, దు:ఖం ఎదుర్కొన్నాడు. ఆ పరిస్థితుల్లో దేవుడాయనను శిక్షిస్తునే సహాయం చేస్తూ వచ్చాడు. అందువల్ల దావీదు 40 సంవత్సరాలు పాలన చేసి, తన తరంలో దేవుని చిత్తాన్ని సంపూర్తి చేయకలిగాడు. ‘‘దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమువారికి సేవచేసి నిద్రించాడు...’’ (అపొ.కా 13:36).

    రక్షణ అనుభవం కలిగిన క్రైస్తవులలో ఎవరైన తప్పిదాలు చేసి మారుమనస్సు పొందితే ప్రభువు క్షమించవచ్చు. ‘‘మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతు డును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును’’ (1యోహాను 1:9). అయినా.. కొన్నిసార్లు పర్యవసనాలు అనుభవించాల్సి ఉంటుందేమో!

    1. వినాశనం:

    ఓ సందర్భంలో.. మందసాన్ని తీసుకుని వస్తుండగా ఉజ్జా అను ఒకడు మార్గం మధ్యలో మందసాన్ని పట్టుకున్నాడు. అప్పుడు దేవుడు అతన్ని శిక్షించడంతో మరణించాడు. ఈ వాక్య భాగాన్ని మొదటిసారిగా బైబిల్‌లో చదువుతున్న పాఠకునికి దేవుడు ఎందుకు ఇలా చేశాడు? అనే ప్రశ్న వస్తుంది.

    ‘‘..నాకోను కళ్లము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పునుబట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను’’ (2 సమూయేలు 6:6-7).

    ఇశ్రాయేలీయులలో లేవీయులే తప్ప మరెవరూ మందసాన్ని పట్టుకొనుటకు అనుమతి లేదు. ఒకవేళ ఎవరైన తాకినా మరణిస్తారని దేవుడు ముందుగా చెప్పాడు. ఉజ్జా మందసాన్ని పట్టుకున్న కారణంచేత దేవుడతన్ని చంపాడు. ఈ విషయంలో దేవుడు న్యాయవంతుడు.

    ‘‘నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటిమీదను లేవీయులను నియమింపుము. వారే మందసమును దాని ఉపకరణములన్నిటిని మోయవలెను. వారు మందిరపు సేవచేయుచు దానిచుట్టు దిగవలసినవారై యుందురు. మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాని విప్పవలెను. మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను. అన్యుడు సమీపించిన యెడల వాడు మరణశిక్ష నొందును’’ (సంఖ్య.కా 1:50-51) ‘‘..అన్యుడు సమీపించినయెడల వాడు మరణశిక్షనొందును’’ (సంఖ్య.కా 3:10). ‘‘..అన్యుడు సమీపించినయెడల అతడు మరణశిక్షనొందును’’ (సంఖ్య.కా 3:38).

    8

    ఉజ్జా మరణించిన స్థలానికి దావీదు వినాశనం (పెరజ్‌) అని పేరు పెట్టాడు. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరజ్‌ ఉజ్జా అను పేరు పెట్టెను’’ (2 సమూయేలు 6:8). ఆ తరువాత మందసాన్ని లేవీయులే తప్ప మరెవరూ ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చాడు.

    ‘‘దావీదు ..దేవుని మందసమునకు ఒక స్ధలమును సిద్ధపరచి, దానిమీద గుడారమొకటి వేయించెను. మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పి - వారు తప్ప మరి ఎవరును దేవుని మందసము ను ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను’’ (1దిన 15:1-2). అన్యజనాంగమైన మనలను పరిశుద్ధుడైన దేవుడు తన రక్తం ద్వారా విమోచించడం ఎంతో అమూల్యమైన అంశం. అందువల్ల కృతజ్ఞతతో జీవించాలి. దేవునికి విరుద్ధంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించాల్సి ఉంటుందేమో!

    1. సంతానం లేని మీకాలు:

    మరో సందర్భంలో మందసాన్ని ఊరేగింపుగా తీసుకుని వస్తుండగా దావీదు నాట్యం చేశాడు. అనంతరం ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారిని దావీదు దీవించాడు. తన ఇంటివారిని కూడా దీవించుటకు గృహానికి రాగా.. మీకాలు దావీదును అపహాస్యం చేసింది. దాంతో ఆమెకు పిల్లలు జన్మించలేదు. చెడు ప్రవర్తనవల్ల దీవెనకు బదులు శాపాలను తెచ్చుకునే ప్రమాదముంది. జాగ్రత్త!

    ‘‘తన యింటివారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి - హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి యెంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు - నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనులమీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను యేర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేనాలాగు చేసితిని. యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని. ఇంతకంటె మరి యెక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుడనగుదునని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకయుండెను’’ (2సమూ 6:20-22).

    1. సిరియనులకు అంధత్వం - కనుచూపు కలగడం:

    ఇశ్రాయేలీయులను ఓడించాలని సిరియనులు గుఱ్ఱపు రథాలతో గొప్ప సైన్యంతో పట్టణం నలుదిక్కుల చుట్టుముట్టారు. ఆ సమయంలో ప్రవక్తయైన ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభువు ఆలకించి వారిని అలాగున చేశాడు.

    ‘‘ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా - ఈ జనులకు అంధత్వముతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. ...వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు - యెహోవా, వీరు చూచునట్లు వీరి కండ్లను తెరవచేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య  ఉన్నామని తెలిసికొనిరి’’ (2రాజు 6:18`20).

    ప్రభువు బోధ, ఆయన చిత్తాన్ని సరిగా అర్థం చేసుకుని ప్రార్థిస్తే దేవుడు జవాబు ఇస్తాడు. ‘‘ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే’’ (1యోహాను 5:14). సిరియనుల కన్నులు మూయబడి ఎక్కడికి వెళ్ళుచున్నారో తెలియక షోమ్రోను పట్టణానికి వచ్చారు.

    దైవజనుడు మరల ప్రార్థించగా దేవుడు విని వారి కండ్లను తెరిచాడు. అప్పుడు వారు షోమ్రోను అనే పట్టణంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆ సమయంలో ప్రవక్త వీరిపై దాడి చేయకండి, భోజనం పెట్టి, తిరిగి పంపించుమని ఇశ్రాయేలు రాజుకు చెప్పాడు.

    ‘‘అంతట ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి - నాయనా వీరిని కొట్టుదునా, కొట్టుదునా? అని ఎలీషాను అడుగగా అతడు - నీవు వీరిని కొట్టవద్దు. నీ కత్తిచేతను నీ వింటిచేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్లుదురని చెప్పెను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవుపొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటినుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయెను’’ (2రాజు 6:21-23).

    ఈ సందర్భంగా క్రైస్తవులతో లేఖనాలు మాట్లాడుతున్నాయి - ‘‘..మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి’’ (మత్తయి 5:44). ‘‘..శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధాన ముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి - పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడియున్నది. కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పి గొనియుంటే దాహమిమ్ము. ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు’’ (రోమా 12:17`20).

    ఇశ్రాయేలీయులను నాశనం చేయడానికి వచ్చిన సిరియనులకు రాజు అన్నపానాలను ఇవ్వడం వల్ల వారు భుజించి వెళ్ళి.. కొంతకాలం వరకు వారు ఇశ్రాయేలుపై యుద్ధం చేయలేదు. ‘‘కీడువలన జయింపబడక, మేలుచేత కీడును జయించుము’’ (రోమా 12:21).

    1. వ్యాధితో బాధపడుతూ మరణించుట:

    తన తండ్రి మరణించిన తరువాత యెహోరాము రాజ్యపాలన ప్రారంభించాడు. అప్పుడు అతని వయస్సు 32 సం॥లు. 8 సం॥ల పాలనలో దైవాజ్ఞలను మీరి తన సోదరులను, అధిపతులలో కొందరిని చంపించాడు. సృష్టికర్తయైన దేవుణ్ణి విడిచి, విగ్రహారాధన చేశాడు. పర్వతములయందు బలిపీఠాలను కట్టించి, ప్రజలు విగ్రహారాధన చేసే విధంగా ప్రోత్సహించాడు. జనులు సృష్టికర్తను విడిచి, సృష్టిని పూజిస్తూ వ్యభిచరించారు.

    దేవుని ఆజ్ఞలు: ‘‘నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్ల యందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను (చెక్కిన విగ్రహము) నీవు చేసికొనకూడదు’’. ‘‘నరహత్య చేయకూడదు’’ (నిర్గ.కా 20:3-4,13).

    దేవుని ఆజ్ఞలను మీరి ప్రవర్తించిన రాజుకు ప్రవక్తయైన ఏలీయా పత్రికతో వర్తమానాన్ని పంపాడు. పత్రికలోని సందేశాన్ని చదివిన రాజు పశ్చాత్తాపపడలేదు. అప్పుడు దేవుడు రాజు కడుపు భాగంలో వ్యాధిని కలిగించాడు. అందువల్ల ఆయన 2 సం॥లు వ్యాధితో బాధపడ్డాడు. ఆ సమయంలో ఎన్నో ఔషధాలు వాడి ఉండొచ్చు అయిన బాగుకాలేదు. పేగులు చెడిపోయి బాధపడుతూ మరణించాడు.

    ‘‘ప్రవక్తయైన ఏలీయా యొక పత్రిక వ్రాసి అతనియొద్దకు పంపెను - నీ పితరుడగు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా - నీవు నీ తండ్రియైన యెహోషాపాతు మార్గములందైనను యూదారాజైన అసా మార్గములందైనను నడువక ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడచి అహాబు సంతతివారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్థులను వ్యభిచరింపజేసి, నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతివారగు నీ సహోదరులను నీవు చంపియున్నావు. కాబట్టి గొప్ప తెగులుచేత యెహోవా నీ జనులను నీ పిల్లలను నీ భార్యలను నీ వస్తు వాహనములన్నిటిని మొత్తును. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివైయుందువు. దిన క్రమేణ ఆ వ్యాధిచేత నీ పేగులు పడిపోవును’’ (2దిన 21:12-15).

    సామాన్యుల స్థలంలో సమాధి: యెహోరాము ప్రభువుకు, ప్రజలకు ఇష్టం లేనివాడై జీవించాడు. అందు వల్ల ఆనాటి ప్రజలు రాజు భౌతిక దేహనికి చేయాల్సిన కార్యాలు చేయలేదు. రాజుల సమాధుల్లో కాకుండా సామాన్య ప్రజల స్థలంలో సమాధి చేశారు.

    9

    ‘‘యెహోవా యెహోరాము మీదికి ఫిలిష్తీయులను కూషీయుల చేరువనున్న అరబీయులను రేపగా వారు యూదా దేశము మీదికి వచ్చి దానిలో చొరబడి రాజనగరునందు దొరకిన సమస్త పదార్థములను అతని కుమారులను భార్యలను పట్టుకొనిపోయిరి. అతని కుమారులలో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను విడువబడలేదు. ఇదియంతయు అయిన తరువాత యెహోవా కుదరచాలని వ్యాధిచేత అతనిని ఉదరమున మొత్తినందున రెండు సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధిచేత అతని పేగులు పడిపోయి బహు వేదన నొందుచు అతడు మరణమాయెను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తరక్రియలు అతనికి చేయలేదు. అతడు ఏలానారంభించినప్పుడు ముప్పది రెండేండ్లవాడు. యెరూషలేములో ఎనిమిది సంవత్సరములు ఏలి యెవరికిని ఇష్టము లేనివాడై అతడు చనిపోయెను. రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరు చోట జనులు అతని పాతిపెట్టిరి’’ (2దిన 21:16-20).  ఎంతో ఉన్నతంగా ప్రారంభమైన యెహోరాము జీవితం దేవుని ఆజ్ఞలను, హెచ్చరికను విస్మరించడం వల్ల ఇలా ముగించాల్సి వచ్చింది. ప్రభువు ఇచ్చిన ఆజ్ఞలకు లోబడి జీవించడంవల్ల ఆశీర్వదించబడుతాము. దేవునికి విరోధంగా వ్యవహరిస్తే వ్యర్థులమయ్యేది మనమే కదా!

    1. రాజైన యోవాషు దుర్మరణం:

    అతల్యా రాజకుమారులను హత్య చేస్తుండగా.. శిశువుగావున్న యోవాషును యెహోషబతు కాపాడుతుంది. దేవుని మందిరంలో 6 సం॥లపాటు ఎవరికీ కనబడకుండా యాజకుడైన యెహోయాదా అతన్ని పెంచి, పోషించాడు.

    యోవాషు రాజ్యవంశీయుడు కావడం వల్ల యాజకుడైన యెహోయాదా అతన్ని రాజుగా ప్రకటించడంతో.. ప్రజలు అందరూ సమ్మతి తెలిపారు. అదే సమయంలో అతల్యా చంపబడుతుంది. (2దిన 22: 10-12, 23:1-15). రాజైన యోవాషు యాజకుడైన యెహోయాదా జీవించిన కాలంలో దేవునికి ఇష్టునిగా జీవిస్తూ పాలన సాగించాడు. (2ది 24:15). యాజకుని మరణం తర్వాత దేవునికి విరోధంగా ప్రవర్తించాడు.

    10

    దేవుని ఆజ్ఞలు: ‘‘నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందే గాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను (చెక్కిన విగ్రహము) నీవు చేసికొనకూడదు’’. ‘‘నరహత్య చేయకూడదు’’ (నిర్గ.కా 20:3`4,13).

    ఇతను ప్రజల మెప్పుకోసం విగ్రహారాధనను అనుమతించాడు. జనులు మార్పు చెందడం కోసం దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అయినా వారు ఏ మాత్రం వినకుండా జీవించారు. ఆ సందర్భంలో యాజకుడైన యెహోయాదా కుమారుడైన జెకర్యా దైవాత్మ ప్రేరణతో ఇలాగు అన్నాడు - ‘‘..మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్థిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించి యున్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను’’ (2దిన 24:20).

    11

    బాల్యంలోనే మరణించాల్సిన యోవాషును యాజకుడైన యెహోయాదా ప్రాణాలకు తెగించి రక్షించి, రాజుగా అభిషేకించాడు. అందుకు ప్రతిగా అతడు యాజకుని కుటుంబంపట్ల కృతజ్ఞత చూపలేదు.

    దేవుని వాక్కును ప్రకటించిన యెహోయాదా కుమారుడైన జెకర్యాను దేవుని మందిర ఆవరణంలో హత్య చేయించాడు. తల్లి పాలుతాగి తల్లి రొమ్మును గుద్దినట్లు, అన్నం పెట్టిన చేతిని నరికినట్లు... యోవాషు ప్రవర్తించాడు. ‘‘అందుకు వారతని మీద కుట్ర చేసి, రాజు మాటనుబట్టి యెహోవా మందిరపు అవరణము లోపల రాళ్ళు రువ్వి అతని చావగొట్టిరి. ఈ ప్రకారము రాజైన యోవాషు జెకర్యా తండ్రియైన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచినవాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోవునప్పుడు - యెహోవా దీని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక యనెను’’ (2దిన 24:21`22).

    న్యాయాధిపతియైన దేవుడు ప్రవక్తయైన జకర్యా మరణించిన సంవత్సరంలోనే.. సిరియా సైన్యం చేతిలో యోవాషు ఓడిపోయే విధంగా చేశాడు. అప్పుడాయన రోగియైనాడు. తన సేవకులచే హత్యచేయబడి ప్రాణాలు కోల్పోయాడు.

    ‘‘సిరియనులు చిన్న దండుతో వచ్చినను యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతివిస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా యోవాషుకు శిక్ష కలిగెను. వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగియైన యుండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతనిమీద కుట్రచేసి, అతడు పడకమీద ఉండగా అతని చంపిరి..’’ (2దిన 24:23-25).

    అంత్యక్రియలు: యాజకుడైన యెహోయాదా మరణించినప్పుడు ప్రజలు అతన్ని రాజుల సమాధుల స్థలంలో భూస్థాపితం చేశారు.  ‘‘యెహోయాదా దినములు గడచిన వృద్ధుడై చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు నూట ముప్పది ఏండ్లవాడు. అతడు ఇశ్రాయేలీయు లలో దేవుని దృష్టికిని తన యింటివారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజులదగ్గర అతని పాతిపెట్టిరి’’ (2దిన 24:15-16).

    అయితే.. రాజైన యోవాషు చనిపోయినప్పుడు ప్రజలు అతని మృతదేహాన్ని సామాన్య ప్రదేశంలో పాతిపెట్టడం గమనార్హం. ‘‘...అతడు చనిపోయిన తరువాత జనులు దావీదు పట్టణమందు అతని పాతిపెట్టిరిగాని రాజుల సమాధులలో అతని పాతిపెట్టలేదు’’ (2దిన 24:25). ప్రభువు మనలను ప్రేమించి ఆశీర్వదించినప్పుడు నమ్మకంగా, కృతజ్ఞతతో జీవించాలి. యోవాషులా ప్రవర్తిస్తే అందుకు తగ్గ ప్రతిఫలం చూస్తామేమో!

    ప్రజల మెప్పే ప్రధానమని

    ప్రభువు ఆజ్ఞలు మీరి

    సృష్టికర్తను విడిచి

    విగ్రహారాధనను ప్రోత్సాహించాడు

    మేలు కోసం ప్రవక్త ప్రవచిస్తే

    దిద్దుబాటు చేసుకోక

    దేవాలయంలో

    హత్య చేయించాడు

    దేవుని కోపం రగులుకుంది

    శత్రువు చేతిలో ఓటమిపాలై

    అనారోగ్యంతో మరణించాడు

    సామాన్యుల స్థలంలో

    పాతిపెట్టబడినాడు

    1. హోమ్‌ ఐసోలేషన్‌కు పరిమితమైన ఊజ్జియా:

    ఊజ్జియా తన ప్రారంభ దినాలలో ప్రభువును ఆశ్రయించి, ఆయనకు ఇష్టుడిగా జీవించాడు. దేవుడు అతనికి తోడైయుండడంతో యుద్ధంలో విజయాలను సాధించాడు. అందుచేత అమ్మోనీయులు అతనికి పన్ను చెల్లించేవారు.

    ఈయన తన పాలనలో వ్యవసాయ, రక్షణ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేశాడు. కీర్తి ప్రతిష్ఠతలతో ఉన్నత స్థాయికి ఎదిగాడు. (2దిన 26:1-16). ఆ తరువాత అతడు గర్వించి, దేవుని ఆలయంలోకి ప్రవేశించి ధూపం వేయడానికి ప్రయత్నించాడు.

    ‘‘అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవామీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితోకూడ ధైర్యవంతులైన యెహోవా యాజకులు ఎనుబది మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి - ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుట ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతివారైన యాజకుల పనియేగాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములోనుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసియున్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తినిచేత పట్టుకుని రౌద్రుడై, యాజకులమీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచునే యున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రధానయాజకుడైన అజర్యాయును యాజకులందరును అతనివైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై యుండెను. గనుక వారు తడవుచేయక అక్కడనుండి అతనిని బయటికి వెళ్లగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెనని యెరిగి బయటికి వెళ్లుటకు తానును త్వరపడెను. రాజైన ఊజ్జియా తన మరణదినము వరకు కుష్ఠరోగియైన యుండెను. కుష్ఠరోగియైన యెహోవా మందిరములోనికి పోకుండ ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక యింటిలో నివసించుచుండెను... ఊజ్జియా తన పితరులతో కూడ నిద్రించెను. అతడు కుష్ఠరోగియని రాజుల సంబంధమైన శ్మశానభూమిలో అతని పితరుల దగ్గర అతని పాతిపెట్టిరి. ...’’ (2దిన 26:16-23).

    12

    దైవాజ్ఞను జ్ఞాపకం చేసిన యాజకులు: ధైర్యవంతులైన 80 మంది యాజకులు రాజైన ఉజ్జియాను ఎదిరించారు. ధూపం వేయడం ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతివారైన యాజకుల పని గాని నీ పని కాదని చెప్పారు. అయినా.. వినకుండా దేవునికి విరోధంగా ఊజ్జియా దేవాలయంలో ధూపం వేయుటకు ధూపార్తిని చేతపట్టు కున్నాడు. వెంటనే దేవుడు అతని నొసటిపై కుష్ఠ రోగం వచ్చునట్లు చేశాడు. అది గమనించిన యాజకులు అతన్ని దేవాలయంలో నుండి వెలుపలికి నెట్టివేశారు. తనకు కుష్ఠు వ్యాధి వచ్చినట్లు ఊజ్జియా గ్రహించి వెంటనే వెలుపలికి వచ్చాడు. ఒకవేళ ఆలస్యం అవుతే చనిపోవునేమో! కుష్ఠు రోగిగా మారిన ఊజ్జియా తాను మరణించేంత వరకు హోమ్‌ ఐసోలేషన్‌ (ప్రత్యేకంగా ఒక ఇంటి)లో ఉన్నాడు. అతడు మరణించగా రాజుల శ్మశాన భూమిలో పాతిపెట్టారు. ఊజ్జియా రాజుకు కుష్ఠు రావడానికి గల కారణం ఆయనలోని గర్వం అతన్ని తప్పు దారిలో నడిపించడమే!

    13

    ‘‘నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును’’ (సామె 16:18). ‘‘...దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును’’ (1పేతురు 5:5), (యాకోబు 4:6).

    1. అబద్ధ ప్రవక్త హనన్యా అంతం:

    దేవుని ప్రజలు ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను మీరి ప్రవర్తిస్తుండగా.. యిర్మీయా ప్రవక్త దేవుని ఆత్మతో - ప్రజలు నెబుకద్నెజరు వశం కాబోతున్నారని ప్రవచించాడు (యిర్మీయా 25:8-11,26:1-15).

    మరో ప్రవక్త హనన్యా దేవుని నామంలో అబద్ధాలను ప్రకటిస్తు దేవుని ప్రజలకు క్షేమం కలుగుతుందని తెలిపాడు. ఒక వ్యక్తి దేవుని నామంలో చెప్పిన ప్రవచనం నెరవేరితే అది సత్యం. అప్పుడా ప్రవచనాన్ని ప్రకటించిన వ్యక్తి దేవుని ప్రవక్తగా గుర్తింపు పొందుతాడు. అలాగే ఒక వ్యక్తి దేవుని పేరిట చెప్పిన మాటలు నెరవేరకపోతే ఆ ప్రవచనం అబద్ధమని, ఆ వ్యక్తి అబద్ధికుడని ధృవీకరించబడుతాడు.

    యిర్మీయా ఇలా అన్నాడు - ‘‘..క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్తయున్నాడే, అతని మాట నెరవేరినయెడల యెహోవా నిజముగా అతని పంపెనని యొప్పుకొనదగునని ..’’ (యిర్మీయా 28:9). హనన్యా ప్రకటించిన మాటలు అబద్ధాలు. అందువల్ల దేవుడు హనన్యాను శిక్షించాడు.

    ‘‘అంతట ప్రవక్తయైన యిర్మీయా ప్రవక్తయైన హనన్యాతో ఇట్లనెను - హనన్యా వినుము. యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు- భూమి మీదనుండి నేను నిన్ను కొట్టివేయు చున్నాను, యెహోవామీద తిరుగుబాటుచేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమౌదువు అని చెప్పెను. ఆ సంవత్సరమే యేడవ నెలలో ప్రవక్తయైన హనన్యా మృతినొందెను’’ (యిర్మీయా 28:15-17).

     ‘‘..ఏ ప్రవక్తయు అహంకారము పూని, నేను చెప్పుమని తనకాజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో, యితర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయును చావవలెను’’ (ద్వి.కా 18:20, 13:1-5). నాడు ఇశ్రాయేలు సమాజంలో అబద్ధప్రవక్తలు ఉన్నట్లే నేటి క్రైస్తవ సమాజంలోను ఉన్నారు. అందువల్ల ప్రతి బోధకుణ్ణి, బోధను తప్పక పరిశీలన చేయాలి. లేదంటే, క్రైస్తవ సమాజం దేవుని మార్గంలో నుండి దయ్యం మార్గంలోకి వెళ్ళే ప్రమాదముంది.

    ‘‘ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి’’ (1యోహాను 4:1).

    1. ఇశ్రాయేలీయుల చెర - విడుదల

    రాజులు, ప్రజలు ధర్మశాస్త్ర ఆజ్ఞలను మీరి విగ్రహారాధన చేస్తూ.. విచ్చలవిడిగా జీవించారు. ఫలితంగా.. సొలొమోను నిర్మించిన మందిరం అన్యరాజుచే మొదటిసారిగా ధ్వంసం చేయబడింది.

    వెండి, బంగారు వస్తువులతో పాటు ప్రజలు, రాజు నెబుకద్నెజరు వశమైనారు.

    ఆలివ్‌ రాజర్స్‌ రాసిన బైబిలు భౌగోళిక చరిత్ర పుస్తకం 58పేజి ప్రకారం

     ‘యిర్మీయా చెప్పినట్లే అంతయు జరిగెను. రాజైన నెబుకద్నెజరు క్రీ.పూ 597లో యెరూష లేము మీద దండెత్తి ప్రజలను ముమ్మారు తన దేశమునకు చెరగా తీసుకొనిపోయెను’. ‘‘సిద్కియా యేలనారంభించినప్పుడు ఇరువది యొకటేండ్లవాడై యెరూషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడత నడచుచు, ఆయన నియమించిన ప్రవక్తయైన యిర్మీయా మాట వినకయు, తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమునుబట్టి తనచేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజుమీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరచుకొనెను. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులగువారు, అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములును పెట్టుకొని బహుగా ద్రోహులై, యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాసస్థలమందును కటాక్షముగలవాడై వారియొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచువచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఆయన వారిమీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధస్థలముగానున్న మందిరములోనే వారి యౌవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యౌవనులయందైనను, యువతుల యందైనను, ముసలి వారియందైనను, నెరసిన వెండ్రుకలు గల వారియందైనను కనికరింప లేదు. దేవుడు వారినందరిని అతని చేతి కప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దవేమి, చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటిని, యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి, దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసికొనిపోయెను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులపెట్టి, యెరూషలేము ప్రాకారమును పడగొట్టి, దానియొక్క నగరులన్నిటిని కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడుచేసిరి. ఖడ్గముచేత హతులు కాకుండ తప్పించుకొనిన వారిని అతడు బబులోనునకు తీసికొనిపోయెను. రాజ్యము పారసీకులదగు వరకు వారు అక్కడనే యుండి అతినికిని అతని కుమారులకును దాసులైరి. యిర్మీయా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతిదినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న డెబ్బది సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములననుభవించెను’’ (2దిన 36:11-21).

    1) మానని గాయాలు: దేవుని ప్రజలు చెరగా కొనిపోబడి 70 సంవత్సరాలు అన్యరాజుల పాలన క్రింద బానిసలుగా జీవిస్తూ శిక్షలు భరించారు. ఇశ్రాయేలు దేశం పాడు దిబ్బగా మారింది.

    ‘‘యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది. నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమునుబట్టి నేను నీకు కఠినశిక్షచేసి నిన్ను గాయపరచియున్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యెమాడు వాడెవడును లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరు నిన్ను మరచియున్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయముచేత నీవు అరచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఈలాగు చేయుచున్నాను’’ (యిర్మీయా 30:12-15).

    2) సహాయం చేయని విగ్రహాలు: దేవుని ప్రజల అవిధేయత వల్ల బబులోనుకు చెరగా వెళ్ళాల్సి వచ్చింది. అక్కడివారు మానసికంగా, శారీరకంగా నలిగిపోయారు. ఆ స్థితిలో వారు పూజించిన విగ్రహాలు సహాయం చేయలేదు. చెర నుండి విడిపించలేదు. మరియు వారి అంతరంగ గాయాలను బాగుచేయలేదు. ఎందుకంటారు?

    3) పశ్చాత్తాప ప్రార్థన: తండ్రిచే క్రమశిక్షణ చేయబడిన పిల్లలు తిరిగి ఎవరి వద్దకు వెళ్ళాలి? తండ్రి వద్దకే కదా! ‘‘మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును’’ (హోషేయ 6:1). దేవుని ప్రజల పక్షంగా దానియేలు దేవుని సన్నిధిలో పశ్చాత్తాప ప్రార్థన చేశాడు.

    ‘‘..నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని, పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ..నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి. ..ప్రభువా, మా పాపములను బట్టియు మా పితరుల దోషమును బట్టియు, యెరూషలేము నీ జనులచుట్టునున్న సకల ప్రజలయెదుట నిందాస్పద మైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణము మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటినిబట్టి విజ్ఞాపనము చేసికొను చున్నాను. ..ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. ..నా ప్రార్థన వినుమని వేడుకొంటిని’’ (దానియేలు 9:1-19).

    14.1

    4) చెర నుండి విడుదల: సార్వభౌముడైన ప్రభువు, అన్యరాజైన కోరెషుకు తన ప్రజలపై జాలిగల మనస్సును కలిగించాడు. తద్వారా వారు చెర నుండి విముక్తులై క్రమక్రమంగా తమ స్వదేశానికి తిరిగి వచ్చారు.

    ‘‘పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యిర్మీయాద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీకదేశపు రాజైన కోరెషు అజ్ఞాపించునదేమనగా - ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకలజనములను నా వశముచేసి, యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు బయలుదేర వచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండునుగాక’’ (2దిన 36:22-23).

    5) స్వస్థపరిచిన దేవుడు: ధ్వంసమైన దేవాలయాన్ని ఎజ్రా, నెహెమ్యా కాలంలో దేవుని ప్రజలు దైవ కృపలో మరల తిరిగి నిర్మించే ప్రయత్నం చేసి సఫలం అయ్యారు. ఏ వైద్యుడు బాగుచేయని ఇశ్రాయేలీయుల అంతరంగ గాయాలను ప్రభువే బాగు చేశాడు. ‘‘... నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను ఇదే యెహోవా వాక్కు’’ (యిర్మియా 30:17).

    మందిర నిర్మాణానికి ప్రభువు సహాయం చేశాడు. ‘‘యెహోవాయే యెరూషలేమును కట్టువాడు చెదరిన ఇశ్రాయేలీయులను పోగుచేయు వాడు. గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు’’ (కీర్తన 147:2`3). తన ప్రజల జీవితాల్లో ఈ లేఖనాలు అక్షర సత్యం అయ్యాయి. మాట ఇచ్చి నెరవేర్చిన ప్రభువుకు సంపూర్ణ మహిమ కలుగును గాక!

    పాఠకులారా, దేవుడు ఊరికనే తన ప్రజలను అన్యరాజులకు అప్పగించలేదు. వారు చేసిన తప్పుడు పనులకు ప్రతిఫలంగా చెరలోకి వెళ్ళారు. ఆయన కృపవల్ల తిరిగి విడిపించబడ్డారు. ‘‘ఆయన బాధ పెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు’’ (విలాప 3:32-33).

    1. రెండవసారి ధ్వంసమైన యెరూషలేము మందిరం:

    హెబ్రీ ప్రవక్తలు ఏ క్రీస్తు కోసం ప్రవచించారో ఆ క్రీస్తు మానవునిగా ఆసియా ఖండంలోని ఇశ్రాయేలు దేశంలోని బేత్లెహేము ప్రాంతంలో కన్య మరియకు నరునిగా పరిశుద్ధుడై అవతరించాడు. సామాన్య జీవన శైలి కలిగివుండి, అసమానమైన బోధలు చేశాడు. రోగులను బాగుచేసి, దయ్యాలను వెళ్ల గొట్టాడు. చనిపోయిన కొందరిని సజీవంగా లేపాడు. ఆదర్శమైన పవిత్ర జీవితాన్ని జీవించాడు. నాటి యూదులు క్రీస్తును గుర్తించ లేదు. ఆయన కోసం రాసిన ప్రవచనాలను తెలుసుకోలేక పోయారు. పిలాతు ప్రభువును విచారణ చేస్తున్నప్పుడు ప్రజల అభిప్రాయం అడుగగా ‘‘ప్రజలందరు - వాని రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండుగాకనిరి’’ (మత్తయి 27:25).

    ప్రభువును సిలువ వేసి చంపారు. మృత దేహాన్ని సమాధి చేశారు. ఇది మనుష్యుల పాపపరిహారం కోసం దేవుడు చేసిన ప్రాణ త్యాగంగా చరిత్రలో నిలిచిపోయింది. అయినా.. ఆ క్రీస్తు మూడవ దినాన సజీవునిగా తిరిగి లేచాడు. ‘‘సహోదరులారా, .. రక్షణ వాక్యము మనయొద్దకు పంపబడియున్నది. యెరూషలేములో కాపురముండు వారును, వారి అధికారులును, ఆయన నైనను, ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక, ఆయనకు శిక్ష విధించుటచేత ఆ వచనములను నెరవేర్చిరి. ఆయనయందు మరణమునకు తగిన హేతువేదియు కనబడక పోయినను ఆయనను చంపించవలెనని వారు పిలాతు వేడుకొనిరి. వారు ఆయనను గూర్చి వ్రాయబడి నవన్నియు నెరవేర్చిన తరువాత ఆయనను మ్రానుమీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను’’ (అపొ.కా 13: 26-30).

    15

    ఆ తర్వాత కొన్ని సం॥లకు.. క్రీస్తును సిలువవేసి చంపినందుకు, ఆయన రక్తం మామీదను మా పిల్లల మీదకు ఉండును గాక అని యూదులు పలికిన కారణం చేతనేమో, తండ్రియైన దేవుడు యూదులను రోమా ప్రభుత్వానికి అప్పగించాడు. రోమా సైనిక నాయకుడు టైటస్‌ (తీతు) యూదులను తీవ్ర హింసలకు గురి చేయడంతో అనేకులు మృతి చెందారు. యెరూషలేము మందిరం రెండవసారి ధ్వంసం చేయబడింది.

    16

    ఆలివ్‌ రాజర్స్‌ రాసిన బైబిలు భౌగోళిక చరిత్ర పుస్తకం 66పేజి ప్రకారం

    ‘క్రీ.శ 70లో సేనాధిపతియైన తీతు యెరూషలేమును ముట్టడి వేసి దానిని నాశనము చేసెను. యూదులలో అనేకులు హతము చేయబడగా శేషించినవారు పూర్తిగా చెదర గొట్టబడిరి’.  

     

    జీవనజ్యోతి జ్యోతి ప్రెస్‌, పబ్లిషర్స్‌ వారి బైబిల్‌ నిఘంటువు 440పేజి ప్రకారం

    ‘క్రీ.శ 70లో రోమన్‌ సేనా నాయకుడు టైటస్‌ కోటగోడలను, దేవాలయాన్నీ ధ్వంసం చేయడంతో క్రీ.శ 66లో ప్రారంభమైన యూదుల తిరుబాటు ముగిసింది. క్రీ.శ 132లో ఇంకొక తిరుగుబాటు రావడంతో యెరూషలేము అన్యుల పట్టణంగా పునర్నిర్మించబడి, జూపిటర్‌ కేపిటలినసుకు ప్రతిష్టించబడిరది. యూదులు అందరిని నగరం నుండి వెళ్లగొట్టారు’.

    లేఖనం ఇలా చెబుతుంది - ‘‘వారి ప్రవర్తనను బట్టియు వారి క్రియలను బట్టియు వారిని శిక్షించి, నేను అన్యజనులలోనికి వారిని వెళ్లగొట్టగా వారు ఆయా దేశములకు చెదరిపోయిరి’’ (యెహెజ్కేలు 36:19). నేటి భారతదేశంలో కేరళ, ఆంధ్రప్రదేశ్‌ ఇతర రాష్ట్రాలలో యూదులుండడం గమనీయం.

      

    1. ఇశ్రాయేలీయులకు స్వాతంత్య్రం రావడం:

    రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం.. ఆయా దేశాలలో చెదరి పోయిన యూదులు మే 14, 1948 తేదిన స్వాతంత్య్రం పొందారు. సర్వశక్తిగల దేవుడు కనుమరుగైన యూదులకు స్వాతంత్య్రాన్ని ఇచ్చి, తమ స్వదేశానికి తీసుకుని రావడం చరిత్రలో అపూర్వ సంఘటన. ‘‘నేను అన్యజనులలో నుండి మిమ్మును తోడుకుని, ఆయా దేశ ములలో నుండి సమకూర్చి, మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించె దను’’ (యెహెజ్కేలు 36:24). యూదుల స్వాతంత్య్రం పొందిన 70 సం॥లకు..

    1) రాజధానిగా యెరూషలేము: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంపు ఇశ్రాయేలు దేశంలోని యెరూషలేమును ఆ దేశ రాజధానిగా డిసెంబర్‌ 6, 2018న ప్రకటించాడు.‘‘యెహోవాయే యెరూషలేమును కట్టువాడు చెదరిన ఇశ్రాయేలీయులను పోగుచేయువాడు’’ (కీర్తన 147:2). ఇప్పటి ఇశ్రాయేలు దేశానికి యెరూషలేమే రాజధాని.

    2) నిర్మాణం కానున్న మూడవ మందిరం: రాబోయే దినాలలో ఇశ్రాయేలు దేశంలో మందిర నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. లేఖనం చెబుతుంది - ‘‘ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును..’’ (2థెస్స 2:4).

    ఈ లేఖనం, అబద్ధపు క్రీస్తు దేవుని ఆలయంలో అంటే యూదులు పవిత్రంగా భావించే మందిరంలోకి వచ్చి కూర్చొనే సందర్భాన్ని తెలియజేస్తుంది. నేటి ఇశ్రాయేలు దేశంలో మందిరం ఇప్పటి వరకు నిర్మాణం జరుగలేదు. కాని భవిష్యత్తులో తప్పక మూడవ మందిర నిర్మాణం జరుగుతుంది. అందుకోసం దేవుడే వారికి సహాయం చేస్తాడు.

    3) యూదుల రక్షణ: నిర్మాణం కాబోయే మందిరంలో కూర్చొన్న వ్యక్తి తానే క్రీస్తునని ప్రకటించుకుని, బలులను, నైవేద్యాన్ని నిలిపి వేస్తాడు (దాని 9:27). అతడు క్రీస్తు కాదని గుర్తించిన యూదులు తిరుగుబాటు చేయడంతో యుద్ధం ప్రకటిస్తాడు. దాంతో వారు పారిపోతుండగా భూమి వారికి సహాయపడుతుంది (ప్రక 12:13-16).

    నేటి రోజుల్లో యూదులు పాక్షికంగా క్రీస్తును దేవునిగా అంగీకరిస్తున్నప్పటికీ ఆ దినాల అంతంలో.. యూదులు ఏ క్రీస్తును సిలువ వేసి, చంపారో ఆ క్రీస్తునే తమ దేవునిగా దేశ వ్యాప్తంగా విశ్వసించే సమయం రాబోతుంది. అప్పుడు వారు దు:ఖంతో ప్రార్థిస్తారు.

    ‘‘దావీదు సంతతివారి మీదను యెరూషలేము నివాసులమీదను కరుణనొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా(వాని)మీద దృష్టియుంచి, యొక్కడు తన యేక కుమారుని విషయమై దు:ఖించునట్లు, తన జ్యేష్ఠపుత్రుని దు:ఖించుచు ప్రలాపింతురు’’ (జెకర్యా 12:10). ‘‘ఆయనను పొడిచిన వారును చూచెదరు..’’ (ప్రకటన 1:7). అప్పుడు ప్రభువు తన ప్రజలను రక్షించి, స్వస్థపరుస్తాడు.‘‘యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశమువలె ఉండును సూర్యుని ప్రకాశము ఏడు దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును’’ (యెష 30:26). ఈ లేఖనాలు భవిష్యత్తులో అక్షర సత్యం కాబోతున్నాయి. నమ్మదగినవాడు, సత్యవంతుడైన ప్రభువుకే మహిమ కలుగును గాక!

    17

    స్మరణ: ఈ రెండవ భాగంలో ప్రాముఖ్యంగా ప్రజలు, రాజులు దేవునికి విరోధంగా జీవిస్తున్న సందర్భాలలో దేవుడే స్వచ్ఛందంగా స్పందించాడు. నయోమి, నాబాలు, ఉజ్జా, దావీదు, యెహోరాము, యోవాషు, ఊజ్జియా, హనన్యా, యూదులు మొదలగువారిని దేవుడు ఒకేలా కాకుండా ఒక్కో విధంగా, తన కాలంలో క్రమశిక్షణ చేశాడు. మార్పు చెందినవారిని స్వస్థపరిచి, ఆశీర్వదించాడు. మార్పు చెందని వ్యక్తులను శిక్షించాడు.

    మూడవ భాగం

    ఆదిమ అపొస్తలుల (కొత్త నిబంధన) కాలంలో..

    ప్రజల పాపపరిహారం కోసం ప్రభువు సిలువలో మరణించి, సమాధి చేయబడినాడు. మరణాన్ని గెలిచి, మూడవ దినాన సజీవునిగా తిరిగి లేచాడు. 40 దినాలు అనేకులకు తనను తాను సజీవునిగా, రుజువులతో ప్రత్యక్షపరుచుకున్నాడు. తన సత్య సువార్తను ప్రపంచానికి చాటి చెప్పాలని శిష్యులకు ఆజ్ఞాపించాడు.

    మరల తిరిగి వస్తానని ఆరోహణమై పరలోకమందు తండ్రి కుడివైపున సింహానమందు ఆసీనుడయ్యాడు. శిష్యులు పరిశుద్ధాత్ముని సహాయంతో క్రీస్తు సువార్తను ప్రకటించారు. అనేకులు విని యేసుక్రీస్తును విశ్వసించారు. ఇలా విశ్వసించినవారిలో కొందరు దేవునికి విరోధంగా జీవించిన సమయాల్లో ప్రభువు క్రమశిక్షణ చేశాడు.

    ఇంకొందరు ఏలాంటి తప్పులు చేయకపోయినా.. వ్యాధి, బాధలను అనుభవించారు. ఈ విషయాలు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో, అపొస్తలుల కార్యాల పుస్తకాలలో చూడగలం.

    అపొస్తలుల పరిచర్య: ప్రభువు ఆజ్ఞ ప్రకారం అపొస్తలులు దేవుని రాజ్య సువార్తను యెరూషలేం, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు ప్రకటించే పనికి పూనుకున్నారు. ఆ క్రమంలో ప్రభువు అపొస్తలులను వాడుకుని రోగులను స్వస్థపరిచాడు. దయ్యాలను వెళ్లగొట్టాడు. ‘‘ప్రజల మధ్య అనేకమైన సూచకక్రియలును మహత్కార్య ములును అపొస్తలులచేత చేయబడుచుండెను...’’ (అపొ.కా 5:12).

    అపొస్తలులు దండోరా శబ్ధంలా సువార్తను ప్రకటించారు. విన్నవారిలో అనేకులు మారుమనస్సు పొంది, రక్షింపబడినారు. ఇలా రక్షింపబడిన వ్యక్తులు సంఘంగా ఆయా గృహాలలో కూడుకున్నారు. దేవున్ని ఆరాధిస్తూ.. వాక్యాలను వింటూ ఆత్మీయంగా ఎదుగుతు వచ్చారు. ప్రభువు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘానికి ఆయనే శిరస్సుగా ఉండగా ప్రజలు భయ భక్తులతో జీవించారు.

    ఆ దినాలలో క్రైస్తవులు భూములను, ఇండ్లను అమ్మి సొమ్మును అపొస్తలుల వద్దకు తీసుకుని వచ్చేవారు. వారు విశ్వాసుల అక్కరలను గుర్తించి తగిన విధంగా పంచిపెట్టేవారు. అందువల్ల వారందరు కొదువ లేకుండా జీవించారు (అపొ.కా 4:35`36).

    18

    1. అననీయ, సప్పీర మరణాలు:

    అననీయ, సప్పీరా అపొస్తలుడైన పేతురు సమక్షంలో దేవుని ఎదుట అబద్ధం చెప్పారు. అందుచేత ప్రభువు వీరిని శిక్షించగ ఒకరి తరువాత ఒకరు వెంట వెంటనే మరణించారు. వీరి మరణాలు ఆనాటి క్రైస్తవ సంఘంలో, సమాజంలోను భయాన్ని కలిగించాయి.

    ‘‘అననీయ అను ఒక మనుష్యుడు తన భార్యయైన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య యెరకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు - అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. అది నీయొద్ద నున్నపుడు నీదే గదా? అమ్మిన పిమ్మట అది నీ వశమైయుండ లేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించు కొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికిని మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసికొనిపోయి పాతిపెట్టిరి. ఇంచుమించు మూడు గంటల సేపటికి వాని భార్య జరిగినది యెరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు - మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె - అవును ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు - ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టినవారి పాదములు వాకిటనేయున్నవి. వారు నిన్నును మోసికొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు, లోపలికి వచ్చి, ఆమె చనిపోయినది చూచి, ఆమెను మోసికొని పోయి, ఆమె పెనిమిటియొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికిని, ఈ సంగతులు వినినవారికందరికిని మిగుల భయము కలిగెను’’ (అపొ.కా 5:1-11). నేటి క్రైస్తవ సమాజంలో దేవుడు ఉన్నాడు. ప్రజల మాటలను వింటూ.. చేసే కార్యాలను చూస్తున్నాడు.

    ప్రజలు చేస్తున్న పనులకు ప్రభువు తన కాలమందు ప్రతిఫలాలు ఇస్తాడు. ‘‘ప్రభువా, మనుష్యులకందరికి వారివారి క్రియలచొప్పున నీవే ప్రతి ఫలమిచ్చుచున్నావు..’’ (కీర్తన 61:12), (2కొరి 5:10).

    1. పురుగులు పడి మరణించిన హేరోదు: ‘‘నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారియెదుట ఉపన్యాసము చేయగా జనులు - ఇది దైవస్వరమే కాని మానవ స్వరముకాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను’’ (అపొ.కా 12:21-23).

    19

    ఈ సందర్భంలో హేరోదు చేసిన ఉపన్యాసాన్ని విన్న ప్రజలు - ఇది దైవస్వరం కాని మానవ స్వరం కాదని పొగడినారు. అందుకు హేరోదు దేవున్ని మహిమపరచలేదు. అప్పుడు ప్రభువు దూత హేరోదును మొత్తడంతో పురుగులు పడి మరణించాడు. ఇది చాలా భయంకరమైన మరణం. దేవుడు మనకు ఇచ్చిన సామర్థ్యాలనుబట్టి సొంత మహిమను కోరుకొనక దేవున్ని స్తుతించాల్సిన వారమై ఉన్నాం.

    1. ఎదిరించి.. గ్రుడ్డివానిగా మారిన అబద్ధ ప్రవక్త: దేవుడు అంతియొకయ సంఘం ద్వార నియమించిన పౌలు, బర్నబాలు సువార్త ప్రకటిస్తూ పాఫు అనే ఊరికి వచ్చారు. అక్కడ అబద్ధ ప్రవక్తయైన బర్‌ యేసు ఉండెను. ఈయన దేవుని సేవకుల విశ్వాసాన్ని ఎదిరించే ప్రయత్నం చేశాడు. పౌలు అతని అంతరంగాన్ని చూస్తూ.. అపవాది కుమారుడా దేవుడు నీకు విరోధంగా చెయ్యి ఎత్తాడు. నీవు కొంతకాలం గ్రుడ్డివాడవై ఉంటావని చెప్పాడు. వెంటనే అబద్ధ ప్రవక్త చూపును కోల్పోయాడు.

    ‘‘వారు ఆ ద్వీపమందంతట సంచరించి పాఫు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్‌ యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకముగలవాడైన సెర్గి పౌలు అను అధిపతియొద్దనుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసమునుండి తొలగింపవలెనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను పేరునకు గారడీవాడని అర్థము.

    అందుకు సౌలు అనబడిన పౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరిచూచి - సమస్త కపటముతోను, సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది (సాతాను) కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువుయొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభువు తనచెయ్యి నీమీద ఎత్తియున్నాడు. 

    20

    నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైన చెయ్యిపట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను. అంతట ఆ అధిపతి జరిగినదానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను’’ (అపొ.కా 13:6-12).

    నేటి వర్తమాన కాలంలోవున్న అబద్ధ ప్రవక్తలను దేవుడు శిక్షించే అవకాశముంది. అది ఆయన చిత్తప్రకారం, తన సమయంలో చేస్తాడు.

    1. పౌలు శరీరంలో ముల్లు: క్రైస్తవులను ఎంతో హింసించిన సౌలును ప్రభువు దర్శించి ఆయనలో మార్పును తీసుకొచ్చాడు. మునుపు హానికరునిగా, హింసకునిగా ఉండిన సౌలు ప్రభువును విశ్వసించాడు. పౌలుగా పిలువ బడుతు దైవశక్తితో గొప్ప సేవను, ఎన్నో స్వస్థతలు చేశాడు. ఇలాంటి సేవకుని శరీరంలో ముల్లు ఉంది. అది ఏమిటో వివరంగా తెలియ జేయబడలేదు. పౌలును ఆది ఎంతో బాధించగా.. ఆ ముల్లును తొలగించుమని ప్రభువుకు ప్రార్థించాడు. అందుకు దేవుడు, పౌలు శరీరంలో నుండి ముల్లును తీసివేయక తన కృపను ఇస్తాను అన్నట్లు చెప్పాడు.

    కారణం.. పౌలుకు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతలు బహు విశేషమైనవి. ఆయన ద్వారా ప్రభువు చేసిన కార్యాలు అసమానమైనవి. అందువల్ల అతనిలో గర్వం రాకుండు నిమిత్తం ప్రభువు అతని ఆత్మీయ క్షేమాన్ని కోరి ముల్లును అనుమతించి ఉండొచ్చు! ఆ సమస్యను తట్టుకుని జీవించుటకు కావాల్సినంత శక్తిని దేవుడు ఇచ్చి, బలవంతునిగా చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన పౌలు బహుగా సంతోషించాడు. ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనని చెప్పాడు.

    21

    ‘‘నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్దనుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని.అందుకు - నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషంగా నా బలహీనతలయందే బహు సంతోషంగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించు చున్నాను’’ (2కొరి 12:7-10).

    మనం సేవిస్తున్న దేవుడు స్వస్థపరుచువాడు, అయినప్పటికి కొన్ని సమయాల్లో స్వస్థత కోసం ప్రార్థనలు చేసినా స్వస్థపరచడు. అనారోగ్యాన్ని, శ్రమను తట్టుకుని జీవించడానికి కావాల్సినంత శక్తిని తన కృప ద్వారా ఇస్తాడు. ఎందుకంటే, తన పిల్లలు గర్వం, అహంకారంతో సాతానులాగా మారొద్దని ప్రభువు ఉద్దేశమై ఉండొచ్చు.

    1. రోగిగా మారిన ఎపఫ్రొదితు:

    ‘‘మరియు నా సహోదరుడును, జతపనివాడును, నాతోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించినవాడునైన ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అతడు రోగియాయెనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మునందరిని చూడ మిగుల అపేక్షగలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగియైన చావునకు సిద్ధమైయుండెను గాని దేవుడతనిని కనికరించెను. అతనిమాత్రమే గాక నాకు దు:ఖము మీద దు:ఖము కలుగకుండు టకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరల సంతోషించు నిమిత్తమును నాకున్న దు:ఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా యెడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తుయొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమైయుండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టివారిని ఘనపరచుడి’’ (ఫిలిప్పి 2:25-30).

    దేవుని సేవలో కొనసాగుతున్న పౌలుకు సహకారిగా ఉన్న ఎపఫ్రొదితుకు అనారోగ్యం వచ్చింది. ఆ స్థితిలో ఆయన మరణానికి సమీపంగా వెళ్ళాడు. ప్రభువు అతన్ని కనికరించడం వల్ల బాగయ్యాడు. ‘‘...మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము’’ (కీర్తన 68:20). వ్యక్తులు పాపం చేయడం వల్లనే అన్నిసార్లు వ్యాధులు రాకపోవచ్చు. మంచి పనులు చేసే క్రమంలోను అనారోగ్యం పాలవుతారు.

    దయ్యపు శక్తుల వల్ల: మూగ దయ్యం వల్ల ఒక వ్యక్తి తరుచుగా అగ్నిలో, నీళ్లలో పడిపోయేవాడు. ప్రభువు అతన్ని స్వస్థపర్చడంతో దయ్యం వెళ్ళిపోయింది (మార్కు 9:14-27).

    బలహీనపరిచే దయ్యం వల్ల 18 సంవత్సరాలు ఒక మహిళ నడుము వంగిపోయింది. యేసయ్య బాగుచేయగా ఆమె సరిగా నడిచింది (లూకా 13:10-17). బలహీనపరిచే దురాత్మ వెళ్ళిపోయింది.

    మరో వ్యక్తిని అనేక దయ్యాలు పట్టి వేదించడంవల్ల అతని మానసిక పరిస్థితి సరిగా లేదు. శరీరంపై వస్త్రాలు లేకుండా సమాధుల్లో జీవించేవాడు. ప్రభువు ఈ వ్యక్తిలోనుండి దయ్యాలను వెళ్లగొట్టి, బాగు చేశాడు (లూకా 8:26-38). ప్రజలు కొన్నిసార్లు దయ్యపు శక్తులవల్ల అనారోగ్యం, ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొనే అవకాశముంది.

    ప్రకృతి ప్రభావం వల్ల: మనం జీవిస్తున్న ప్రదేశాలలో గాలి కాలుష్యం, త్రాగే నీరు కలుషితమై ఉన్నాయి. శరీరాలలో వ్యాధినిరోధక శక్తి అందరికి ఒకే స్థాయిలో లేదు. కొత్త స్థలాలకు వెళ్ళినప్పుడు త్రాగే నీరు, తీసుకునే ఆహారం సరిగా లేకపోవడం, అనారోగ్యంతో ఉన్న వ్యక్తుల రాకపోకలతో అంటు వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయి.

    నేటి కాలంలో విస్తరిస్తున్న కరోనా కూడా ఒక అంటువ్యాధియే! దేవుని కృప, ఆయుష్షు కాలముంటే అనారోగ్యంలో ఎపఫ్రొదితువలె జీవించగలం. లేదంటే, ఆయన సన్నిధికి వెళతాము.

    1. కడుపు నొప్పితో బాధపడిన తిమోతి:

    ‘‘ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చు కొనుము’’ (1తిమోతి 5:23). అపొస్తులుడైన పౌలుకు సేవలో సహాయకునిగా ఉన్న తిమోతి వివిధ ప్రాంతాలలో పరిచర్య చేశాడు. ఈయన తరచుగా బలహీనపడేవాడు. కడుపు నొప్పి వస్తూ ఉండేది.

    ఈ విషయాన్ని గుర్తించిన పౌలు ద్రాక్షారసాన్ని కొంచెంగా తీసుకోవాలని ఆయనకు చెప్పాడు. మద్యం సేవించే అలవాటు ఉన్న క్రైస్తవులలో కొందరు ఈ లేఖనాన్ని ఆధారం చేసుకుని ద్రాక్షారసం త్రాగుమని బైబిలు బోధిస్తుంది, అందుకనే మేము మద్యం తీసుకోవచ్చని అంటారు.

    లేఖనం చెబుతుంది - ‘‘మద్యముతో మత్తులై ఉండకుడని’’ (ఎఫెసీ 5:18). మద్యాన్ని నిషేధించాలని క్రైస్తవులు కానివారు పోరాటాలు చేస్తుంటే... మద్యం త్రాగమని బైబిల్‌ బోధిస్తుందని చెప్పడం సరైంది కాదు. ఆనాటికాల వైద్యంలో నూనె, ద్రాక్షారసం ఔషధాలుగా ఉండేవి. తిమోతికి వచ్చే కడుపు నొప్పి, బలహీనతల కోసం కొంచెముగా ద్రాక్షారసం తీసుకొమ్మని పౌలు చెప్పాడు. దేవునియందు భయభక్తులు కలిగిన హిజ్కియా రాజు శరీరమందు ఉన్న పుండుకు అంజూరపుపండ్ల ముద్దను వాడాలని దేవుడు ప్రవక్తయైన యెషయాకు చెప్పాడు. ‘‘...అంజూరపుపండ్ల ముద్ద తీసికొని ఆ పుండుకు కట్టవలెను. అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను’’ (యెష 38:21).

    స్వస్థతలనేవి (1) వైద్యం (2) వ్యక్తిగత, సంఘ విశ్వాసులు, పాస్టర్స్‌ చేసే ప్రార్థనలను దేవుడు విని స్వస్థపరుస్తాడు. (3) కొన్నిసార్లు నేరుగా ప్రభువు తన కృపచేత చేయొచ్చు. అయితే దేవుడు వైద్యాన్ని, పాస్టర్స్‌, సంఘ సహవాసాన్ని అందుబాటులో ఉంచినప్పటికీ అన్ని సమయాల్లో పరలోకమందున్న దేవుడే నేరుగా స్వస్థపర్చాలని అనుకోవడం వివేకం కాదు. అలా చేయడం స్వయంగా ప్రాణాపాయ స్థితిని కోరి తెచ్చుకోవడమే అవుతుంది.

    1. కొరంథీ సంఘంలో దేవుని క్రమశిక్షణ చర్యలు..

    ‘‘ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులునై యున్నారుÑ చాలామంది నిద్రించుచున్నారు. ...మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము’’ (1కొరి 11:30`32). నాటి కొరంథీ క్రైస్తవుల్లో అన్యజనులలో లేని జారత్వముంది. వారిలో శరీరానుసారులు, ప్రకృతి సంబంధులున్నారు. వారిలో కక్షలు, భిన్నాభిప్రాయాలు మొదలగునవి ఉన్నాయి. ఈ విషయాల్లో ప్రభువు తోను, తోటి ప్రజలతోను సరిచేసుకోవాల్సినవాటిలో సరిచేసుకోకుండా.. ప్రభువు బల్లలో పాలుపొందారు. అందుచేత కొరింథీ సంఘంలో కొందరిని ప్రభువు క్రమశిక్షణ చేయడంతో అనేకులు బలహీనులు, రోగులైనారు. చాలామంది మరణించారు.

    ఎందుకు ప్రభువుచేత శిక్షింపబడ్డారు? లేఖనం చెబుతుంది - ‘‘మనము తీర్పు పొందినయెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడుచున్నాము’’ (1కొరి 11:32).

    రక్షణ అనుభవం లేని వ్యక్తులు చేసిన కార్యాలకు న్యాయాధిపతియైన దేవుడు తీర్పు తీర్చే సమయం, సందర్భం ఒకటి ఉంది. వారితో పాటుగా కొరంథీ క్రైస్తవులు తీర్పు తీర్చబడి నిత్య నరకానికి వెళ్ళకుండా ఉండుటకు.. వారి క్షేమం, మేలు కోరి దేవుడు శిక్షించాడు. ప్రభువు  ప్రేమగలవాడై కొరంథీయులను శిక్షించినట్లే మనలను శిక్షించొచ్చు.

    దేవుడు తన స్వరక్తంతో కొన్న క్రైస్తవులు విచ్ఛల విడిగా జీవిస్తుంటే, నిశ్శబ్ధంగా ఉండకపోవొచ్చు. మన కోసం తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు, మన ప్రాణాలను హఠాత్తుగా తీసుకోవచ్చు! ‘‘జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు? చెవులను కలుగచేసినవాడు వినకుండునా? కంటిని నిర్మించినవాడు కానకుండునా? అన్యజనులను శిక్షించువాడు మనుష్యులకు తెలివి నేర్పువాడు దండింపకమానునా?’’ (కీర్త 94:8`10).

    1. మోసకారి యెజెబెలును హెచ్చరించిన ప్రభువు:

    పాతనిబంధన కాలంలో అహబు రాజు భార్య యెజెబెలు రాణి ఉండేది. ఆమె విగ్రహారాధికురాలై దేవుని ప్రవక్తలను చంపుతూ.. ప్రజలు విగ్రహారాధన చేసేలా ప్రోత్సహించేది. అంతేకాదు ఆమె బయలు దేవతకు 450 ప్రవక్తలను, అషేరాదేవి కోసం 400 మందిని పెంచి పోషించేది. ఆమె నియమించిన ప్రవక్తలను ఏలీయా ప్రవక్త హతం చేశాడు (1రాజు 17-19 అధ్యాయాలు). దేవుని శిక్షలో భాగంగా యెజెబెలు గుర్రాలచేత త్రొక్కించబడిరది. కుక్కలు ఆమె శరీరాన్ని తిన్నాయి. (2రాజు 9:30-37), (1రాజు 21:23-24).

    తుయతైర సంఘంలో మోసకారి యెజెబెలు: ‘‘తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము - అగ్నిజ్వాలవంటి కన్నులును అపరంజిని పోలిన పాదములునుగల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా - నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియలకన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగుదును. అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసియున్నది.  ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచు చున్నది. మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితోకూడ వ్యభిచరించు వారు దాని (తమ) క్రియల విషయమై మారుమనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమలపాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘలన్నియు తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను’’ (ప్రకటన 2:18-23).

    తుయతైర సంఘంలో కనబడుతున్న యెబెజెలు జారత్వం చేయుటకు, విగ్రహాలకు అర్పించిన వాటిని తినుటకు దేవుని దాసులకు బోధిస్తూ మోసం చేసింది. ఈ విషయమై దేవుడు మారుమనస్సు పొందాలని ఆదేశించాడు. లేదంటే శ్రమల పాలుచేసి, మంచం పట్టిస్తానని, ఆమె ఉపదేశానికి అనుచరులుగా మారిన వ్యక్తులను (పిల్లలను) చంపుతానని హెచ్చరించాడు.

     

    డా.టామ్‌హేల్‌ వ్యవహారిక నూతన నిబంధన వాఖ్యానము 1100పేజి ప్రకారం

    ‘యెజెబెలు అనే స్త్రీని ఉండనిస్తున్నారు. బహుశా ఈమె సంఘములో ఒక ప్రాముఖ్యమైన స్త్రీయైయుండవచ్చు. ఆ కాలములో రోమాలోవున్న ఆలయాలు వేశ్యలతో నిండి ఉండేయి. తుయతైరలోని అన్య పురుషులు ఆరాధించడానికి ఏదన్నా గుడికి వెళ్లినప్పుడు అక్కడ వున్న వేశ్యలతో వ్యభిచరించి ఆ ఆలయములోని దేవత గౌరవార్థం జరిపే విందులో పాల్గొనేవారు. బహుశా ఈ యెజెబెలు విగ్రహాలలో యేమి లేదు కాబట్టి ఆలయములో పూజించడము తప్పు కాదని

    ఉండవచ్చు. మరో విధముగ చెబితే ‘‘వట్టి’’ దేవతలను పూజించడము పాపము కాదని చెప్పి ఉండవచ్చు’ (1కొరింథీ 6:12-13,15. 8:4-7).

    1. సంఘమా, మారుమనస్సు పొందు!

    ప్రజల కోసం తన ప్రాణాన్ని ధారపోసిన ప్రభువు ఎంతో ప్రేమగల వాడు. ఆయన ప్రేమ క్రమశిక్షణను ఇష్టపడుతుంది. క్రొత్త నిబంధన చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథంలో కనబడే లవొదికయ సంఘంతో ప్రభువు మాట్లాడుతూ - ‘‘నేను ప్రేమించు వారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనస్సు పొందుము’’ అన్నాడు (ప్రకటన 3:19).

    మారుమనస్సు: తప్పు మార్గంలో నడుస్తున్న వ్యక్తికి, నీవు సరైన మార్గంలో ప్రయాణించడం లేదు. నీవు వెళుతున్న మార్గం నిన్ను అపాయంలోకి తీసుకుని వెళుతుందని ఎవరైన చెప్పినప్పుడు.. ఆ వ్యక్తి తప్పుడు మార్గాన్ని విడిచి, అక్కడే అగిపోకుండా.. సరైన త్రోవలోకి వచ్చి అందులో కొనసాగడం లాంటిదే మారుమనస్సు (కీర్తన 37:27).

    ప్రాథమిక స్థాయిలో యేసుక్రీస్తు దైవత్వాన్ని తెలుసుకున్న వ్యక్తులు  విగ్రహారాధన విడిచిపెట్టి మారుమనస్సు పొంది, బాప్తిస్మం తీసు కుంటారు. ప్రభువును ఆరాధిస్తూ.. ఆయన మార్గంలో కొనసాగుతారు.

    ఆత్మీయ ప్రయాణం మధ్యలో ప్రభువుకు ఇష్టం లేని పనులు చేస్తుంటే.. దేవుడు - మారుమనస్సు పొందుమని క్రైస్తవులకు మరలా ఆజ్ఞాపిస్తాడు. లవొదికయ సంఘాన్ని దేవుడు మారుమనస్సు పొందాలని ఆదేశించాడు.

    ఆ సంఘం నులివెచ్చగా ఉండి, ఆత్మీయ గ్రుడ్డితనాన్ని, వస్త్రాలు లేకుండా దిగంబరత్వాన్ని కలిగివుంది. అయినా తనకు కొదువలేదని అహంకార దోరణితో ఉంది.

    డా.టామ్‌హేల్‌ వ్యవహారిక నూతన నిబంధన వాఖ్యానము 1103పేజి ప్రకారం

     ‘ఈ లవొదికయ పట్టణము గూర్చి ఒక ఆసక్తికరమైన చారిత్రక సత్యముంది. ఈ పట్టణానికి సమీపముగ పేరుగాంచిన కొన్ని వేడి నీటి ఊటలు ఉండేవి. వాటి నుంచి ధారాళంగ వేడి నీళ్లు ప్రవహించేవి. వాటికి రోగము బాగుచేసే శక్తి ఉందని నమ్మి చాలామంది ఆ నీటిని త్రాగడానికి వచ్చేవారు. అయితే ఆ వేడి జలము క్రిందికి ప్రవహిస్తూ త్వరగ చల్లబడిపోయేది.

    ఆ విధముగ దాని స్వస్థత శక్తిని కోల్పోయేదని ప్రజలనుకొనేవారు. రోగము బాగుచేయలేక పోవడమే కాకుండ అది దప్పిక కూడ తీర్చలేకపోయేది. అది ఎందుకూ పనికి రానిది! కాబట్టి క్రీస్తు లవొదికయ సంఘస్థులను ‘నులి వెచ్చని’ వారు అనగానే దాని వెనుకున్న అర్థాన్ని తప్పక అర్థము చేసుకుని ఉంటారు. పేర్గాంచిన వారి ఊరిలోని ఊటలాగ వారు కూడ పనికిరాకుండ పోయారు.

    రెండవ అర్థము, వారు ఆత్మసంబంధముగా చల్లారి పోయారని యేసు అంటున్నాడు. సార్దీసు సంఘస్తుల్లా లవొదికయ వారు చచ్చిన వారు కారు. వారు శవములాగ చల్లగా లేరు. పోనీ ఆత్మీయముగ వేడిగ కూడ లేరు. వారిలో పరిశుద్దాత్మ అగ్ని లేదు. ఆత్మపరమైన శక్తిగాని లేవు. ఆత్మీయంగా వారిలో సగం ఊపిరే ఉంది.

    ఒక నులివెచ్చని సంఘం చల్లబడిన సంఘంకంటే ప్రమాదకరమైన స్థితిలో ఉంది. దానికి కారణమేమంటే ఆత్మీయముగా చల్లగా ఉన్న క్రైస్తవులకు వారు చల్లగా ఉన్నారని, పశ్చాత్తాపపడాలనీ వారికి తెలుసు.

    అయితే నులివెచ్చని క్రైస్తవులు సాధారణముగా తాము వేడిగా ఉన్నామని, పశ్చాత్తాపడవలసిన అవసరము లేదని వారనుకుంటారు. తమ ఆత్మ పరిస్థితిని తెలిసికోకుండ లవొదికయ దగ్గరనున్న పారుతూ ఉండే నీటి ఊటలా వీరు క్రమ క్రమముగా నులివెచ్చగా తయారయ్యారు. ఆ సంగతి వారికి తెలియదు!’. లవొదికయ సంఘంలోని క్రైస్తవుల పరిస్థితిని పూర్తిగ తెలిసియున్న ప్రభువు - ‘‘మారుమనస్సు పొందమని హెచ్చరించాడు’’.

    గుర్తించాలి: పాతనిబంధన కాలంలో ప్రజలు తప్పిదాలు చేస్తున్నప్పుడు ప్రవక్తలు - ప్రజలారా దేవుని వైపుకు తిరగండి అని ప్రకటన చేశారు. ‘‘మనము యెహోవాయొద్దకు మరలుదము రండి..’’ (హోషేయా 6:1). కొత్తనిబంధన కాలంలోను ప్రజలు తప్పులు చేస్తున్నప్పుడు మారుమనస్సు పొందాలని దేవుని సేవకులు చెప్పారు (ప్రకటన 2:5,3:12).

    నాటి కాలంలో ప్రవక్తల ద్వారా హెచ్చరికలు చేసిన రాజులు, ప్రజలు వినకుండా ప్రవర్తించినప్పుడు ఆయన వారిని శిక్షించాడు. నేటి దినాల్లో మన మనస్సాక్షి, దేవుని వాక్యం, సత్య సేవకుల బోధ, పత్రిక, పుస్తకాలు, పరిస్థితుల ద్వారా దేవుడు  హెచ్చరికలు, గద్దింపులు ఇస్తాడు. వాటిని క్రైస్తవులు నిర్లక్ష్యం చేసి, మారుమనస్సు పొందకపోతే ఆయన ప్రేమచేత తన చిత్తప్రకారం శిక్షిస్తాడని గుర్తించాలి. ‘శిక్షకు భయపడడం కంటే పవిత్ర మనస్సుతో ప్రభువుకు లోబడి జీవించడం మంచిది’.

    నాల్గవ భాగం

    ప్రభువు తనను విశ్వసించిన ప్రజలకు తండ్రియైన ఉన్నాడు. అంతేకాదు; ఆయన వారి కోసం ప్రాణం పెట్టిన నిజమైన స్నేహితుడు. అందువల్ల వారి మేలును కోరి అవసరతనుబట్టి గాయాలు చేస్తాడు.

    1. పరిశుద్ధత కోసం క్రమశిక్షణ..

    హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4 నుండి 11 వచనాల అధ్యయనం.

    ‘‘మీరు పాపముతో పోరాడుటలో రక్తముకారునంతగా ఇంక దానిని ఎదిరించలేదు. మరియు - నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండిరచును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాంషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమాళ్లయిన వారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులైయుండిరి. వారియందు భయభక్తులు కలిగి యుంటిమిÑ అట్లయితే ఆత్మలకు తండ్రియైనవానికి మరి యొక్కువగా లోబడి బ్రదుకవలెను గదా? వారు కొన్నిదినములమట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరిగాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దు:ఖకరముగా కనబడునేగాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును’’ (హెబ్రీ 12:4-11).

    హెబ్రీ గ్రంథకర్త పత్రిక రాస్తూ 12వ అధ్యాయంలో విశ్వాసానికి కర్తయైన యేసువైపు చూస్తూ ఆత్మీయ యాత్రలో ఓపికతో పరుగెత్తాలని, ఆయన చేసే శిక్షవల్ల దేవుని పరిశుద్ధతలో పాలుపొందుతారని బోధిం చాడు. రక్షణ అనుభవమున్న ప్రతి క్రైస్తవుడు పాపంలో పడి, అందులో కొనసాగే ప్రమాదముంది. అందువల్ల దేవుని క్రమశిక్షణ అవసరం.

    ప్రభువు శిక్షలో హెచ్చరికలు, గద్దింపులుంటాయి. అవి మనస్సాక్షి ద్వారా, వాక్యం, సేవకులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం, ప్రభుత్వ అధికారుల, ప్రభుత్వ సంస్థలు, కోర్టు తీర్పులు, అనారోగ్యం, జీవితంలో వచ్చే వివిధ ప్రతికూల పరిస్థితుల ద్వారా వచ్చే అవకాశాలు ఉంటాయి.

    తండ్రిలా..: పిల్లలు తప్పులు చేస్తున్నప్పుడు వారికి సరైన మార్గాన్ని బోధిస్తూ క్రమశిక్షణ చేయడం తండ్రి బాధ్యత.  మనమందరం దేవునికి కుమారులం, కుమార్తెలమై ఉన్నాం. అందువల్ల ప్రభువు మనకు తండ్రిగా ఉండి ప్రేమతో క్రమశిక్షణ చేస్తాడు.

    ‘‘...ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండిరచును... దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు’’? ప్రభువు మనలను క్రమశిక్షణ చేస్తున్నాడంటే, ఆయనకు మనపై శ్రద్ధ, ప్రేమ ఉందని అర్థం. ఒకవేళ మనం దేవునిచేత శిక్ష పొందకపోతే... లేఖనం చెబుతుంది - ‘‘...కుమాళ్లయిన వారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు’’ (హెబ్రీ 12:8).

    మేలు కోరే స్నేహితునిలా..: హెబ్రీ గ్రంథకర్త దేవుడు చేసే శిక్ష మనకు మేలు చేస్తుందని తెలిపాడు. ‘‘మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును’’ (సామె 27:6).  కల్వరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించిన ఆ ప్రభువు మనకు మంచి స్నేహితుడు. ‘‘తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టు వానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు’’ (యోహాను 15:13).

    మన స్నేహితుడైన ప్రభువు, తన పరిశుద్ధతతో పాలుపొందడం కోసం మన మేలుకోరి గాయాలు చేస్తాడు. ఆ గాయాలు మనలోని చెడును తొలగించి, తన స్వారూప్యంలోకి మారుస్తాయి

    1. రోగులైన క్రైస్తవులపట్ల సంఘ బాధ్యత

    యాకోబు పత్రిక 5:14-16 వచనాల అధ్యయనం.

    ‘‘మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును. మీ పాపములను ఒకనితో నొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మన:పూర్వకమైనదై బహు బలముగలదై యుండును’’.

    సంఘంలో ఎవరైన అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ వ్యక్తి సంఘ పెద్దలకు అనగా పాస్టర్స్‌కు సమాచారాన్ని అందించాలని యాకోబు రాశాడు. ఆనాటి దినాల్లో సంఘ పెద్దలనే సేవకులు, విశ్వాసియైన రోగి ఇంటికి వెళుతుండగా వారివెంట నూనెను తీసుకుని వెళ్ళేవారు. ఎందుకంటే, రోగియైన వ్యక్తికి గాయాలేమైన ఉంటే వాటిపై నూనెను పోసి కట్టుకట్టడం నాటి వైద్యంలో ఒక భాగం.

    వైద్యంలో నూనె ఉపయోగం: ప్రభువు చెప్పిన మంచి సమరయుని కథలో.. దొంగల చేతిలో చిక్కి గాయాలపాలైన వ్యక్తికి సమరయుడు అతని గాయాలపై నూనెను, ద్రాక్షరసాన్ని పోసి కట్టుకట్టాడు (లూకా 10:30-34).

    నాటి కాల వైద్యంలో నూనెతోపాటు ద్రాక్షారసం, అంజూరపు పండ్లు (యెషయా 38:21). గుగ్గిలము మొదలగు వాటిని ఔషధాలుగా యూదులు ఉపయోగించేవారు.

    గుగ్గిలం నుండి నూనె, సుగంధం: ‘‘గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా’’? (యిర్మీయా 8:22). దేవుని ప్రజలు ధర్మశాస్త్రానికి విరోధంగా జీవిస్తూ.. ఆత్మీయంగా మరణించిన స్థితిలో ఉన్నారు.

    ఆ సందర్భంలో యిర్మీయా వారి స్వస్థత కోసం గిలాదులో గుగ్గిలం లేదా? ఏ వైద్యుడు లేడా? స్వస్థత ఎందుకు కలగడం లేదని ప్రశ్నించాడు.

                                                                                                                                                                  22  23

    ఇంటర్‌నెట్‌ సమాచారం ప్రకారం  ‘గిలాదు ప్రాంతంలో గుగ్గిలం అనే మొక్కలుంటాయి. వీటి మొగ్గ, గింజల నుండి నూనె, సుగంధ ద్రవ్యం తయారవుతుంది. వాటిని రోగి స్వస్థత కోసం, వివాహం, మరణం తదితర సందర్భాల్లో సువాసన  నిమిత్తం యూదులు, కొన్ని అరబ్‌ దేశస్థులు ఉపయోగిస్తారు. (ఆది.కా 37:25, యెహెజ్కేలు 27:17). గుగ్గిలం మొక్కల నుండి తయారయే నూనెను ఇంగ్లీష్‌లో ‘‘బామ్‌ అఫ్‌ గిలాదు’’ అంటారు’.

    నూనె రక్తంగా మారదు: నేటి దినాల్లో కొందరు వ్యక్తులు నూనెకు ప్రార్థించిన తరువాత అది యేసు రక్తంలా మారుతుందని చెబుతున్నారు. అది నమ్మి క్రైస్తవులు మోసపోవడం చాలా బాధాకరం. నూనె రక్తంగా మారితే, ప్రభువు ఎందుకని సిలువలో మరణించాలి? నూనె తీసుకుని ఇది నా రక్తంలా మారును గాక! అని అనొచ్చు కదా? ఆయన అలా అనలేదు. కారణం, ప్రభువు రక్తం అంగడిలో దొరికే వ్యాపార వస్తువు కాదు. క్షయమైపోయే పదార్థం వంటిది కాదు. సత్యం తెలిసిన తర్వాత.. నూనెను ప్రభువు రక్తమంటే మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. జాగ్రత్త!

    ప్రభువు రక్తం అంగడిలో దొరికే వ్యాపార వస్తువు కాదు.

    24

    డబ్బా నూనె

    తలకు రాసుకునేది

    శరీర నొప్పులకు వాడేది

    దుకాణంలో ఛౌకగా దొరికేది

    సకల రోగ నివారిణిగా

    అవతారం ఎత్తింది

    ప్రార్థించగానే

    నిర్ణీత రుసుము కంటె

    అధిక ధర పలుకుతూ

    కాసుల వర్షం కురిపిస్తుంది

    క్రైస్తవుల విశ్వాసాన్ని

    వాక్యం నుండి తొలగిస్తు

    తన వైపుకు ఆకర్షిస్తుంది

    దినసరి కూలీ బేబుకు

    చిల్లు పొడుస్తు

    ప్రార్థించినవారి ఖాతాలో

    డబ్బును జమ చేస్తుంది

    స్వస్థత ప్రార్థనలు

    చేసిన వ్యక్తులను బాగుచేయదు

    ఆసుపత్రులకు పొమ్మని సలహా ఇస్తుంది

    నూనె ఇది

    పెద్ద డబ్బా నూనె

    యేసు రక్తం కాదు

    తిరిగి అంశంలోకి వస్తే.. నాటి ఆదిమ క్రైస్తవులలో కొందరు రోగులుగా ఉన్నారు. నేటి క్రైస్తవులకు వ్యాధులు రావు, రాకూడదని చెప్పె బోధలు అసత్యమైనవి. క్రీస్తు బిడ్డలు కూడా అనారోగ్యపాలవు తారని బైబిల్‌ సారాంశ బోధ చెబుతుంది. దేవుని పిల్లలు ఆయా కారణాలవల్ల అనారోగ్య సమస్యలో ఉంటే పాస్టర్స్‌, సంఘ విశ్వాసులు వారికి ప్రార్థనతోపాటు ఇతర సేవలు అందించాలి. ఇది సంఘ బాధ్యత.

    పాపం వల్ల అనారోగ్యమా! ప్రభువును విశ్వసించిన వ్యక్తి పాప జీవితంలో పడిపోతే అతన్ని సరిచేయడానికి దేవుడు కొన్నిసార్లు వ్యాధి, బాధలను అనుమతించొచ్చు. దావీదు అన్నాడు - ‘‘...నా పాపమును బట్టి నా యెముకలలో స్వస్థత లేదు’’ (కీర్తన 38:3).

    పశ్చాత్తాపం: క్రైస్తవుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు సంఘం, పాస్టర్స్‌ ప్రార్థిస్తారు. సదరు క్రైస్తవుడు వారితో ఏకీభవించే క్రమంలో పరిశుద్ధాత్మడు అతని పాపాలను జ్ఞాపకం చేసి, ఒప్పింప చేయొచ్చు.

    క్షమించడం: రోగిగావున్న వ్యక్తి సంఘానికి విరోధంగా తప్పులు చేసివుంటే వెంటనే దేవునిముందు, సంఘం ఎదుట ఒప్పుకోవాలి. అలాగే గతంలో సంఘం, పాస్టర్స్‌ రోగియైన విశ్వాసిని బాధపరిచివుంటే సంఘం, పాస్టర్స్‌ క్షమించుమని రోగిని అడగాలి. ‘‘మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి..’’ (యాకోబు 5:16). ‘‘ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనిన యెడల ఒకని నొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి’’ (కొలొస్స 3:13).

    స్వస్థత: పాస్టర్స్‌, క్రైస్తవులు రోగి కోసం విశ్వాసంతో చేసే ప్రార్థనను దేవుడు ఆలకించి స్వస్థపరుచొచ్చు. ‘‘విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును’’. స్వస్థతకంటే ప్రాముఖ్యంగా.. ఒకరికి విరోధంగా ఒకరు తప్పిదాలు చేసివుంటే, వాటిని ఒకరితో ఒకరు ఒప్పుకోవడం, ‘‘..తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు’’ (కీర్తన 32:1). సమాధానం, ఐక్యత కలిగివుండడం మంచిది. ‘‘సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!’’ (కీర్తన 133:1).

    చివరిగా.. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథపు సంఘటనల వరకు ప్రేమగల దేవుడు తన పిల్లలను స్వస్థపర్చడం మాత్రమే కాదు; ఆయన ఇష్టప్రకారం నానా రకాలుగా క్రమశిక్షణ చేస్తాడని ఆ క్రమంలో.. గాయాలు చేయువాడని అర్థమవుతుంది.

    ఈ సందర్భంగా.. బైబిల్‌లో ప్రత్యక్షమైన దేవుడు కేవలం రోగులను స్వస్థపరుస్తూ.. భౌతికంగా ఆశీర్వదిస్తాడు. అంతేకాని, ఆయన ఏ మాత్రం క్రమశిక్షణ (గాయాలు) చేయడని బోధించే బోధకులు పునరాలోచన చేసుకోవాలి.

    ప్రజల మెప్పు కోసం, వారు ఇచ్చే కానుకలే ధ్యేయంగా.. వారిని ప్రలోభాలకు గురి చేస్తూ బోధించడం ఇప్పటికైన మానితే మంచిది. లేదంటే, ప్రభువు ప్రత్యేకంగా చేసే క్రమశిక్షణకు గురికాక తప్పదేమో! ‘‘అబద్ధ ప్రవక్త హనన్యా మరణించాడు’’.

    ‘‘..అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్ధ బోధకులుందురు వీరు తమ్మును కొనిన ప్రభువునుకూడ విసర్జించుచు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును. వారు అధిక లోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు వారికి పూర్వమునుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు’’ (2పేతురు 2:1-3).

    ప్రశ్నలు - జవాబులు

    ప్రశ్న: ప్రభువు తన శరీరమందు మన నిమిత్తం గాయపర్చబడినాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అని యెషయా 53:5లో రాయబడి ఉండగా దేవుడు ఎందుకు గాయపరుస్తాడు?

    జవాబు: నిజానికి ప్రభువు ఎందుకోసం గాయపర్చబడ్డాడు? కేవలం స్వస్థత కోసం మాత్రమే కాదు. మన పాపపరిహారం కోసం కూడా.. ప్రభువు చిందించిన పవిత్ర రక్తమే మనం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం.

    ‘‘..అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా’’ (యెషయా 53:8). ‘‘ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను’’ (1పేతురు 2:24).

    దేవుని కృపతో రక్షింపబడిన క్రైస్తవులు పరిశుద్ధ జీవితాలు జీవించాలనేది ప్రభువు చిత్తం (1పేతురు 1:14-16). ఆయన చిత్తానికి విరోధంగా జీవించిన కొరంథీ క్రైస్తవులను క్రమశిక్షణ చేసిన దేవుడు, నేటి క్రైస్తవులలో కొందరు విచ్ఛలవిడిగా ప్రవర్తిస్తుంటే.. తన ప్రేమతో  క్రమశిక్షణ చేయడా? గాయపర్చడా?? మీరే ఆలోచించండి!

    ప్రశ్న: క్రైస్తవుడు ఆసుపత్రులను, వైద్యులను సంప్రదించవచ్చా? మాత్రలు వాడొచ్చా?

    జవాబు: వైద్యులు దేవుని సృష్టి. దేవుడు చేసిన సృష్టిలోని మొక్కలు, వివిధ వాటి వల్ల మాత్రలు తయారు చేయబడుతాయి. ఆసుపత్రులను, వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకుని మాత్రలు వాడితే పాపం చేసినట్లు కాదు. దేవునిపై విశ్వాసం లేనట్లు అంతకంటే కాదు.

    హిజ్కియాకు అంజూరపు పండ్ల ముద్ద వాడినట్లు లేఖనంలో రాయబడిరది. వ్యాధికి సరైన ఆసుప్రతిని, వైద్యున్ని సంప్రదించి, వేళకు మందులు వేసుకోవడం మంచిది.

    ప్రశ్న: ఆసుపత్రికి వెళ్ళక మందులు వాడకుండా స్వస్థపడినవారు లేరా?

    జవాబు: దేవుడు కొందరిని తన కృపలో నేరుగ స్వస్థపరిచిన సందర్భాలు ఉండొచ్చు. అయితే వాటిని క్రైస్తవ సమాజం అంతటికి ఆపాదించలేము. ఎందుకంటే, అనారోగ్య పరిస్థితుల్లో వైద్యులను, ఆసుపత్రులను సంప్రదించక మరణించిన క్రైస్తవులు కూడా ఉన్నారు. క్రీస్తును పోలి నడుచుకున్న పౌలు - కడుపు నొప్పితో బాధపడుతున్న తిమోతిని ద్రాక్షారసమనే ఔషధాన్ని తీసుకొమ్మని చెప్పిన విషయాన్ని మరచిపోరాదు (1తిమోతి 5:23).

    ప్రశ్న: ఇతరులు ఎన్నో మోసాలు, హత్యలు చేస్తుంటే... చిన్న చిన్న పాపాలు చేసే క్రైస్తవులనే దేవుడెందుకని క్రమశిక్షణ చేస్తాడు?

    జవాబు: మంచి ప్రశ్న. 100% ఉన్న విషంలో నుండి కేవలం 25% బయటికి తీసి వేరొక పాత్రలో ఉంచితే దానిని ఏమంటారు? 25% ఉన్నా విషమనే అంటారు. పాపం చిన్నదా పెద్దదా అనేది విషయం కాదు. చిన్నదైన పెద్దదైన పాపం పాపమే!

    ఉదాహరణ: బయట కొందరు వ్యక్తులు తప్పులు చేస్తున్నప్పటికీ.. ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో చెడు పనులు చేసే విద్యార్థిని మొదటగా క్రమశిక్షణ చేస్తాడు. ఎందుకంటే, ఆ విద్యార్థిని క్రమశిక్షణ చేయకపోతే అతడు పెరిగి పెద్దవాడై మరింత చెడు కార్యాలు చేస్తూ.. చెరసాలకు వెళ్ళే ప్రమాదముంటుంది. అందువల్ల ఆ విద్యార్థిని ఉపాధ్యాయుడు క్రమశిక్షణ చేస్తాడు.

    న్యాయాధిపతియైన దేవుడు, రక్షణ అనుభవం లేని వ్యక్తులు చేసే చెడు పనులకు తీర్పుతీర్చే సమయం, సందర్భముంది. వారితో పాటు.. చిన్న చిన్న తప్పులు చేసే క్రైస్తవులు నిత్య నరకానికి వెళ్ళకూడదని ప్రేమగల దేవుడు తన పిల్లల క్షేమం, మేలు కోరి క్రమశిక్షణ చేస్తాడు. ‘‘మనము తీర్పు పొందినయెడల లోకముతోపాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడుచున్నాము’’ (1కొరి 11:32).

    ప్రశ్న: క్రీస్తుయేసునందు ఉన్నవారికి ఏ శిక్షావిధియు లేదని లేఖనం చెబుతుంటే.. మీరు దేవుడు క్రమశిక్షణ చేస్తాడని ఎలా చెబుతున్నారు?

    జవాబు: మీరు అడుగుతున్న ప్రశ్న ‘‘కాబట్టి యిప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు’’ (రోమా 8:1). అనే వచనాన్ని ఆధారం చేసుకుని అడుగుతున్నారు. మీరు రోమా పత్రిక 8వ అధ్యాయంలోని మొదటి భాగానికి సంబంధించిన సందర్భాన్ని పరిశీలించండి. ధర్మశాస్త్రం మనుష్యులను పాపంలోనుండి విమోచించలేక పోయింది. ఎందుకంటే పాపపరిహారం కావాలంటే రక్తం అవసరం (హెబ్రీ 9:22).

    అందుకోసం ప్రభువే పాప శరీరాకారముతో లోకానికి వచ్చాడు. మనకు రావాల్సిన శిక్షను పరమ పవిత్రుడైన ఆయన భరించాడు. ప్రభువు ఒక్కసారే ప్రజల పాపపరిహారం కోసం తన పవిత్ర రక్తాన్ని సిలువలో కార్చాడు.

    ప్రాథమిక దశలో ఆ ప్రభువును విశ్వసించి, తన పవిత్ర రక్తంలో పాపాలను కడుగుకుని, ఆయన నీతిని పొందుకున్న వ్యక్తులకు పాపానికి రావాల్సిన నరక శిక్ష ఇకా ఉండదనేది రోమా 8:1 వచన భావం. అంతేకాని; రక్షణ అనుభమున్న వ్యక్తులు తప్పిదాలలో కొనసాగుతున్నప్పుడు ప్రభువు క్రమశిక్షణ చేయడని రోమా 8:1 వచనం చెప్పడం లేదు. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. రక్షణ పొందని వ్యక్తులకు కలిగే నరక శిక్ష, క్రైస్తవులను దేవుడు చేసే క్రమశిక్షణ రెండు ఒకటి కాదు. ఈ రెండు వేరు వేరు అంశాలు, వేరు వేరు సందర్భాలకు సంబంధించినవి.

    దేవుని క్రమశిక్షణ: బైబిల్‌ గ్రంథంలో ప్రత్యక్షమైన దేవుడు కేవలం స్వస్థతలు చేయువాడు మాత్రమే కాదు, ప్రేమతో క్రమశిక్షణ చేయు వానిగా.. మేలుకోరి గాయపరచువానిగా ఉన్నాడు. అందువల్ల ఆయన తన పిల్లలను పలు విధాలుగా క్రమశిక్షణ చేస్తాడు.

    ప్రార్థన

    పరలోకమందున్న మా తండ్రీ,

    ఈ పుస్తకం ద్వారా నీ చిత్తాన్ని జరిగించుమని

    యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్‌.

                                                                                                                - పల్లె శాంతిరాజు

      

    Add comment

    Security code
    Refresh

     

    హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

    హితబోధ యాప్ కొరకు Join WhatsApp

    సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

    ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.