సువార్త

చాలాకాలం క్రితం గ్రీకు దేశాన్ని ఆర్కియాస్ అనే రాజు పరిపాలించాడు. అతను చాలా స్వార్థపరుడు. ప్రజల అవసరాలు, ఇబ్బందులు గురించి ఏమాత్రం పట్టించుకునేవాడు కాడు. ఎంతసేపూ వినోదంగా గడుపుతూ, బాగా తింటూ ఉండాలన్నదే అతని తత్త్వం. భవిష్యత్తు గురించి ఆలోచించడం అతని దృష్టిలో తెలివితక్కువతనం. కాబట్టి ప్రజలు అతనిని ద్వేషించేవారు. చివరికి వారిలో కొందరు అతని హత్యకు కుట్ర కూడా పన్నారు.

ఈ కుట్ర గురించి ఆర్కియాస్ కు ఏమీ తెలియదు‌ కానీ, దూరంగా ఏథెన్సు పట్టణంలో ఉన్న అతని మిత్రుడికి మాత్రం తెలిసింది. వెంటనే రాజుకు సమాచారం చెప్పి ప్రమాదం నుండి తప్పించుకోవలసిందిగా హెచ్చరించడానికి ఒక ఉత్తరం రాసి “రాజా, రేపు నిన్ను చంపడానికి ఒక పెద్ద కుట్ర పన్నారు. వెంటనే జాగ్రత్త వహించి తప్పించుకో" అని అతను ప్రాధేయపడ్డాడు. అందులో ఆ కుట్రనుండి తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని కూడా అతను సూచించాడు. ఒక దూత (పోస్ట్ మేన్) ఆ లేఖను తీసుకుని ఆర్కియాస్ దగ్గరకు వచ్చాడు.

ఆ సమయంలో ఆర్కియాస్ ఒక గొప్ప విందు ఏర్పాటు చేయించి స్నేహితులతో తిని త్రాగుతూ ఉన్నాడు. దూత చాలా దూరంనుండి రావడం చేత, తనవద్ద రాజుకు ఇవ్వవలసిన అతి ప్రాముఖ్యమైన లేఖ ఉందని చెప్పడం చేత అతను రాజు దగ్గరకు వెళ్ళడానికి ద్వారపాలకులు అనుమతించారు. చివరికి అతను రాజు దగ్గరకు వచ్చి, "నా యేలినవాడా, ఈ లేఖను పంపిన నీ మిత్రుడు దీనిని వెంటనే చదవమని మనవి చేసాడు. ఇందులో గొప్ప ప్రమాదం గురించిన విషయాలు ఉన్నాయంట" అని సవినయంగా పలికాడు. మద్యంచేత మత్తుడైన ఆర్కియాస్ ఆ లేఖను చదవడానికి ఇష్టంలేనివాడై "హహహ, ప్రమాదకర విషయాలా, రేపు చూద్దాంలే" అని పలికి తిరిగి విందు భోగాల్లో నిమగ్నమయ్యాడు.

కానీ పాపం! ఆర్కియాస్ కు "రేపు" అనేది మరలా రాలేదు. ఎలాంటి హెచ్చరికా లేకుండా హఠాత్తుగా కుట్రదారులు ఆ విందు జరుగుతున్న భవనాన్ని చుట్టుముట్టారు. లోపల వినోదం, విలాసం బాగా జరుగుతుంది. మత్తులో మునిగి తేలుతున్న ఆర్కియాస్, అతని స్నేహితులపై కోపోద్రేకులైన కుట్రదారులు ఒక్కుమ్మడిగా దూకి కత్తులతో వారిని హతమార్చారు.

ప్రియ చదువరీ, నీవు కూడా రేపటి గురించి చింతలేకుండా ఇహలోక సుఖాలే ముఖ్యమని భావిస్తున్నావా? బాగా సంపాదించి, సంతోషంగా కాలం గడపడమే ఈ జీవిత లక్ష్యమని తలస్తున్నావా? మనసుకు నచ్చినదానిని జరిగించి అందులోనే సంతోషిస్తున్నావా? దైవభక్తి, ఆత్మరక్షణ, పాపక్షమాపణ అనే అత్యవసర విషయాలు గురించి ఆలోచించడానికి ఇష్టం లేక వాటిని రేపు చూద్దాంలే' అని ఆర్కియాస్ వలే చెబుతున్నావా?

ఒక్క క్షణం ఆగు! నీకు కూడ రేపు అనేది మరలా రాకపోవచ్చు. ఒకవేళ ఈ రోజే నీ జీవితయాత్ర ముగుస్తుందేమో ఎవరికి తెలుసు?

మనం ఊహించని విధంగా మరణ దినం మనకెలా ఎదురౌతుందో తెలియచెయ్యడానికి యేసుప్రభువు ఈ ఉపమానం చెప్పాడు: "ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు- నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతును? నా కొట్లు విప్పి, వాటికంటె గొప్ప వాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని. నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి యున్నది; సుఖించుము, తినుము, త్రాగుము. సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు - వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణమునడుగుచున్నారు. నీవు సిద్ధపరచినవి ఎవనివగునని అతనితో చెప్పెను” (లూకా 12: 16-20).

నీ ఆత్మకు ఒక విరోధి ఉన్నాడు. వాడే దేవుని విరోధి సాతాను. నిన్ను ఎలా అయినా మోసగించి నీ ఆత్మను నరకానికి పోయేటట్టు చేస్తూ దేవుని విషయాలు ఆలోచించకుండా నిర్లక్ష్యం కలిగిస్తున్నాడు. నీవు ఈ పత్రికలోని సందేశాన్ని కూడా అంగీకరించకుండా వాడు చేస్తాడు. అయితే నీ ఆత్మను ప్రేమించే దేవుడు నేడు సజీవంగా ఉన్న నిన్ను హెచ్చరిస్తున్నాడు. పాపం వలన వచ్చే జీతం మరణం (నరకం). దేవుని తీర్పు నీపై నిలిచియుంది. రాబోవు ఆ తీర్పును తప్పించుకోవడానికి ఒక తరుణోపాయాన్ని కూడా దేవుడు నీకు చూపిస్తున్నాడు.

ఆ మార్గం నీకొరకు సిలువ అనే బలిపీఠంపై ప్రాణదానం చేసిన యేసుక్రీస్తే. నీ పాపాల కొరకు నీవు పొందవలసిన దేవుని ఉగ్రతను, తీర్పును నీకు బదులుగా యేసుక్రీస్తే భరించాడు. చనిపోయి, పాతి పెట్టబడి మూడవదినాన తిరిగిలేచాడు. నేడు ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నత సింహాసనంపై కూర్చునియున్నాడు. విశ్వసించేవారందరికీ యేసుక్రీస్తు ద్వారా దేవుడు పాపక్షమాపణను, తీర్పు-నరకంలో నుండి విముక్తిని అనుగ్రహిస్తున్నాడు. "కాబట్టి మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు.... విశ్వసించు ప్రతివాడును ఈయనవలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియుగాక" (అపొ. కార్య. 13:38, 39).

రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు కాబట్టి నీవు నేడే నీ పాపాలను దేవునియెదుట ఒప్పుకో. మారుమనస్సు పొందు. నీ పాపాలను పరిహరించడానికి బలిగా మారి, రక్తాన్ని చిందించి మరణించిన దేవుని కుమారుడైన యేసుప్రభువును నేడే నమ్ముకో, "నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంత సేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరివంటివారే" (యాకోబు 4:13, 14).

"ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము- (2 కొరింథీ 6:2).

"యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు" ( రోమా 10:9).

"ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు" (అపొ. కార్య. 16:31)

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.