రక్షణ

రచయిత: పి. శ్రావణ్ కుమార్

బాప్తిస్మం

బాప్తిస్మం పొందడానికి ఏమి అవసరం ?

మనమందరం స్వభావరీత్యా, పుట్టుకతో పాపులమని బైబిల్ స్పష్టంగా చెబుతోంది. మనం దేవుని నుండి వేరైపోయాము, మనం దేవుని కోపానికి పాత్రులం, ఆయన ముందు మనం దోషులం, ఆయన ముందు నిలబడే హక్కు మనకు లేదు. మనం మరణానికీ, నరకానికీ అర్హులం. దేవునితో తెగిపోయిన సంబంధాన్ని సరిచేసుకోవడానికి మనం ఏమీ చేయలేము.

“అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు" రోమా 3:23

“పాపమువలన వచ్చు జీతము మరణము" రోమా 6:23

“మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారైయుండగా" ఎఫెసీ 2:1

“దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనత మీదను, దర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది" రోమా 1:18

మరి పరిష్కారం ఏమిటి?  మనిషికి మరియు దేవునికి మధ్య విచ్ఛిన్నమైన సంబంధాన్ని తిరిగి స్థాపించడానికి దేవుడు ఏదైనా చేయడమే ఏకైక పరిష్కారం అని బైబిల్ స్పష్టంగా చెబుతుంది.

దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపాడు. ఎవరైతే ఆయన నామమందు విశ్వాసముంచుతారో వారు నశించక నిత్యజీవం పొందుతారు.

రక్షణ విషయంలో జరిగేవి:

a) పాపిని అని గ్రహించడం - పాపానికి శిక్ష మరణమని, మనం మరణానికి పాత్రులమని గ్రహించడం రక్షణలో మొదటి భాగం. నేను ఘోరమైన పాపిని అని తెలుసుకోలేని ఎవరైనా స్వనీతిపరులే తప్ప దేవుని నీతి కోసం ఆశపడేవారు కారు.

b) మన పాపాల విషయమై ప్రభువు దగ్గర పశ్చాత్తాపపడి, ఆయనయందు విశ్వాసముంచడమే రక్షణ.

c) పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితంలో ప్రభువు మార్గంలో నడవడం, వాక్యానుసారమైన ఆశలు కలిగి ఉండడమే మనం పొందుకున్న రక్షణకు రుజువు.

బాప్తిస్మం పొందడానికి క్రీస్తు సువార్తను వినడం అవసరం, దానిని వినకుండా రక్షణ రాదు, రక్షణ లేకుండా బాప్తిస్మము లేదు.

కాబట్టి ఎవరైనా బాప్తిస్మం పొందడానికి ఏమి అవసరం అంటే మీరు చెప్పాల్సిన విషయాలు -

a) యేసు క్రీస్తు సువార్త వినడం

b) విని పశ్చాత్తాపపడి ప్రభువు నామమందు విశ్వాసముంచడం

1. బాప్తిస్మం అంటే ఏంటి ? ఎవరు దానిని నియమించారు?

a) బాప్తిస్మం అనేది మన అంతరంగంలో జరిగిన మార్పుకు సంబంధించిన బహిరంగ ఒప్పుకోలు.

b) బాప్తిస్మం అనేది, "నేను యేసు ప్రభువుకు చెందినవాడిని/దానిని అని బాహాటంగా ఒప్పుకోవడం".

c) బాప్తిస్మం అంటే యేసుతో పాతిపెట్టబడి తిరిగి లేవడం అనే బహిరంగ సాదృశ్యం, మరణం నుండి జీవానికి దాటాను అని ఒప్పుకోవడం.

d) బాప్తిస్మం అనేది నేను క్రీస్తును ధరించి ఉన్నాను అని అందరి ముందు ఒప్పుకోవడం.

“మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడ పాతిపెట్టబడినవారై ఆయనను మృతులలోనుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతోకూడ లేచితిరి" కొలొస్సి 2:12

“క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు" గలతీ 3:27

బాప్తిస్మం మానవులు సృష్టించిన ఒక పద్ధతి కాదు. అపొస్తలులు గాని, పెద్దలుగాని దీనిని నియమించలేదు. స్వయంగా దేవుడే ఈ ఆచారాన్ని నియమించాడు.

బాప్తిస్మమిచ్చు యోహాను పశ్చాత్తాప సంబంధమైన బాప్తిస్మం ఇచ్చాడు అని, యేసు క్రీస్తు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తాడు అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. గనుక ప్రభువు నామమందు విశ్వాసముంచి (పాపం విషయంలో పశ్చాత్తాపపడి దానిని ఒప్పుకొని) నూతనసృష్టిగా చేయబడినవారు మాత్రమే పరిశుద్ధాత్మను పొందుకుంటారు, వీరు మాత్రమే ప్రభువు నియమించిన నీటి బాప్తిస్మాన్ని అంగీకరించాలి/తీసుకోవాలి.

“కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి." మత్తయి 28:19,20

“మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మనివానికి శిక్ష విధింపబడును." మార్కు 16:15,16

చాలామంది నిజమైన మారుమనస్సు లేకుండా, వివిధ కారణాలను బట్టి బాప్తిస్మం తీసుకుంటారు. ఉదాహరణకు : పెళ్లి, క్రైస్తవ కుటుంబంలో పుట్టాము గనుక, ఇతరులు ఏమనుకుంటారో అని. అయితే ఈ కారణాలను బట్టి బాప్తిస్మం పొందినవారు, దేవుని ప్రజలు (బిడ్డలు) కారు అని చెప్పడంలో నేను ఏమాత్రము సంకోచించను. నిజంగా ప్రభువుని తెలుసుకోకుండా బాప్తిస్మం తీసుకోవడం ఆయన నామాన్ని అవమానించడమే.

2. బాప్తిస్మము యొక్క అవసరం ఏంటి ?

• దేవుడు దానిని నియమించాడు గనుక మనం ఆ ఆచారాన్ని పాటించాలి

• దేవుని సంఘంలో సభ్యులుగా ఉండడానికి బాప్తిస్మమనే ఒప్పుకోలు చేయాలి

   o క్రీస్తుతో మేము ఒక్క శరీరం అనే ఒప్పుకోలు

   o స్థానిక సంఘంతో పాటు బల్లలో పాలుపంచుకోవడం

   o దేవుని పరిచర్యలో పాలుపొందడానికి

“కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేలమంది చేర్చబడిరి" అపో. కార్య. 2:41

3. బాప్తిస్మాన్ని పాటించే పద్ధతి

బాప్తిస్మం అనేది దేవుని నామంలో అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో నీటిలో ముంచి పైకి లేపడం. అయితే బాప్తిస్మము అంటే నీటిలో ముంచి పైకి లేపడం అని వాక్యంలో ఎక్కడ చెప్పబడింది అని మీరు నన్ను అడగొచ్చు. దీనిని అర్థం చేసుకోడానికి మనం బాప్తిస్మం అనే గ్రీకు పదాన్ని తెలుసుకోవాలి - “బాప్టిజో (Baptizo) & బాప్తిస్మ (Baptisma)”. ఈ పదానికి అర్థం "ముంచడం", "మునక" (దీనిని మనం గ్రీకు నిఘంటువులో పరిశీలించొచ్చు). ఈ పదం బైబిలేతర సాహిత్యంలో "బట్టలకు రంగు అద్దడం" అనే విషయాన్ని సూచించడానికి ఉపయోగించబడింది.

“గ్రీకు, యూదు మరియు పాట్రిస్టిక్ సాహిత్యంలో బాప్టిజం మరియు బాప్టిజం యొక్క అర్థం" అనే గ్రీకు పరిశోధన అధ్యయనం ప్రకారం (According to a Greek research study “The meaning of Baptizo & Baptisma in Greek, Jewish, and Patristic literature”) ఈ పదాల యొక్క ప్రాథమిక అర్థం ఏమిటంటే "ఇముడ్చుకుని ఒక పదార్థంలో ఉంచడం" - ఎప్పుడైతే బాప్తిస్మం అనే పదాన్ని మనం వాడతామో అప్పుడు దేనితో బాప్తిస్మం పొందుతామో కూడా చెప్పబడింది. ఉదాహరణకు, నీటి బాప్తిస్మం (Baptize with water), పరిశుద్ధాత్మ బాప్తిస్మం (Baptize with the Holy Spirit)

ఈ కారణాలను బట్టి బాప్తిస్మము అనేది ఒక సాంకేతిక పదం (technical term) కాదు అని, ఆ ఆచారాన్ని పాటించే పద్ధతి ఆ పదంలోనే ఇమిడి ఉంది అని చెప్పాలి.

“సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడ అక్కడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మము పొందిరి" యోహాను 3:23

“అంతట యూదయ దేశస్థులందరును, యెరూషలేమువారందరును, బయలుదేరి అతని యొద్దకు వచ్చి, తమ పాపములను ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి " మార్కు 1:5

“ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను. " మార్కు 1:9,10

“వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చెను. వారు నీళ్లలోనుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్లెను; అతడు ఫిలిప్పును మరియెన్నడును చూడలేదు " అపో. కార్య. 8:36-39

కొన్ని సంఘాలలో నీటిని తల మీద చిలకరించి దానిని బాప్తిస్మం అని పిలుస్తున్నారు. పైన చూపించిన విషయాన్ని క్షుణ్ణంగా (బైబిల్ వచనాలతో సహా) మనం పరిశీలించినప్పుడు, బాప్తిస్మం అనేది నీటిలో ముంచి పైకి లేపడం అని, అందుకు యేసు ప్రభువే ఒక మాదిరిని చూపించాడు అని మనకు ఖచ్చితంగా అర్థం అవుతుంది.

మీకు ఎవరైనా చిలకరింపు బాప్తిస్మం ఇచ్చేవారు ఎదురైనప్పుడు వారితో ఈ విషయాన్ని పంచుకోండి. అది వాక్యానుసారం కాదు అని తెలియజేయండి.

4. బాప్తిస్మానికి అనుగుణంగా జీవితాన్ని గడపడం (మన ఒప్పుకోలుకు అనుగుణంగా)

ఇక్కడ మనం రోమా 12వ అధ్యాయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం

“సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని” అని పౌలు చెప్పాడు

“కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. " రోమా 12:1

మనం జాగ్రత్తగా ఆలోచిస్తే Sacrifice/ బలి అనేది మరణానికి చిహ్నంగా ఉంది. అయితే దేవుడు మనల్ని ఆ రకమైన బలి కోరట్లేదు గాని, తన కోసం సజీవ యాగంగా ఉండాలి అని కోరుతున్నాడు. అవసరమైతే క్రీస్తు మనకోసం తన ప్రాణాలు అర్పించినట్టు, మనం కూడా అవసరమైతే ఆయన నిమిత్తం మనం ప్రాణాలు అర్పించబద్ధులమై ఉన్నాం.

a) ఆచరణాత్మక పరివర్తనను అనుభవించడం (Experiencing Practical Transformation)

“మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి " రోమా 12:2

మనం మన పాపాలు ఒప్పుకొని, ప్రభువు నామంలో విశ్వాసముంచినప్పుడు రక్షణ పొందుకున్నాం. బాప్తిస్మము ద్వారా దానిని బహిరంగంగా ప్రకటించాం. మన ఒప్పుకోలుకు సంఘస్థులు సాక్షులుగా ఉన్నారు. నూతనసృష్టిగా అయిన మనం, ఆ విధంగానే బ్రతుకుతాము అని ఒప్పుకున్నాం. ప్రతి రోజు మనం ఒప్పుకున్న విధంగానే బ్రతకాలి. ఈ విధంగా జీవించాలి అంటే మనకు అవసరమైనవి కొన్ని ఉన్నాయి (మీ మనస్సు మారి నూతనమగుటవలన - By the renewing of your mind)

 దేవుని వాక్యం - ఇది లేకుండా మనం ఏ విధంగా నడవాలో తెలుసుకోలేము

 ప్రార్ధన - ఇది లేకుండా దేవునితో సహవాసం చేయలేము, మన ఆధ్యాత్మిక అవసరాల కోసం ప్రార్థించాలి (భౌతిక అవసరాల కోసం కూడా), నేర్చుకున్న వాక్యాన్ని పాటించడానికి అవసరమైన కృపను అనుగ్రహించమని దేవుని అడగాలి

 సంఘ సహవాసం - ఒక్క శరీరంగా ఉండడాన్ని దేవుడు కోరుతున్నాడు, సంఘంగా కూడి దేవుని ఆరాధించడం, సంఘస్థులతో సహవాసం చేయడం తప్పనిసరి

“మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనినవారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి " రోమా 13:14

“కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి. వాటివలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి" కొలొస్సి 3:5-7

b) దేవుడు ఇచ్చిన బాధ్యతలను నిర్వహించడం (Performing God given responsibilities)

“ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను, ఈ అవయవములన్నిటికిని ఒక్కటే పనియేలాగు ఉండదో, ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమైయున్నాము. మనకనుగ్రహింపబడిన కృపచొప్పున వెర్వేరు కృపావరములు కలిగినవారమైయున్నాము గనుక…." రోమా 12:4-6

దేవుడు విశ్వాసులకు ఇచ్చిన బాధ్యతలను రెండుగా విభజించొచ్చు:

i) క్రీస్తు మహిమపరిచే విధంగా సంఘంలో పనిచేయడం (Working in the Church (for the glory of Christ))

ii) క్రీస్తును మహిమపరిచే విధంగా సంఘం తరుపున పనిచేయడం (Working for (on behalf of) the Church (for the glory of Christ))

సంఘంలో మనం చేయాల్సిన పరిచర్య ఉంది, దేవుడు మనకు ఇచ్చిన కృపావరము చొప్పున మనం పనిచేయాలి. సంఘం కోసం అనగా క్రీస్తు సంఘ విస్తరణలో భాగంగా సువార్త పరిచర్య చేయాలి.

ఎవరైనా మనల్ని చూసి మనల్ని హెచ్చించాలని మనం పని చేయకూడదు, కానీ దేవుడు మన పనిని చూసి సంతోషించేలా మన పని ఉండాలి.

5. క్రైస్తవ జీవనం యొక్క ప్రాథమిక నియమం (The Golden rule of Christian living)

The rule of Love - ప్రేమ అనే నియమం

ఈ విషయం గురించి మనం 1 కొరింథీ 13వ అధ్యాయంలో చూస్తాం ; మనకు అక్కడ పౌలు వివరించిన రీతిగా ప్రేమలేని వారమైతే:

i) మనం ప్రకటించుకునే మన ఆధ్యాత్మక స్థితే ఎందుకూ పనికి రాదు

ii) దేవుని గూర్చి మనకు కలిగిన జ్ఞానం వలన ఏమీ ఉపయోగం లేదు

iii) మన విశ్వాసం నిష్ఫలమైనదే

iv) మన దేవునికి అర్పించే అర్పణల వల్ల ఏమీ ప్రయోజనం లేదు

ప్రేమలేనివాడినైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును. (I become as sounding brass, or a tinkling cymbal)

ఇక్కడ పౌలు చూపిస్తున్న రెండు వాయిద్యాలు - మ్రోగెడు కంచు, గణగణలాడు తాళము అనేవి కొరింథులో అన్యమత ఆరాధన సమయంలో ఉపయోగించబడేవి. మీకు ప్రేమ లేకపోతే క్రైస్తవం పేరుతో మీరు చేసేదంతా అన్యమత ఆరాధన తప్ప మరేమీ కాదని పౌలు తెలియజేస్తున్నాడు.

అందుకే ప్రభువు, "నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను; నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను" అని చెప్పాడు.

పౌలు యొక్క ఉదాహరణ - పౌలు రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని, దేవుని పిలుపుకు తగ్గట్టుగా దేవుని పరిచర్యను మొదలు పెట్టాడు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, అపాయాలు, ఆకలిదప్పులు, తన సువార్తను నాశనం చేయాలి అనుకున్నవారు ఒకపక్క, తనను చంపాలి అనుకున్నవారు ఇంకొక పక్క. చాలా ప్రయాసతో దేవుని పనిని తుదముట్టించాడు.

ప్రేమ విషయంలో క్రీస్తును పోలినడుచుకున్నాడు. దేవుణ్ణి మరియు దేవుని సంఘాన్ని అపరిమితంగా ప్రేమించాడు. నశించినవారి పట్ల భారం కలిగి ప్రాథేయపడ్డాడు.

పౌలు మ్రోగెడు కంచుగా, గణగణలాడు తాళముగా లేడు. ఆచరణాత్మక పరివర్తనను తన జీవితంలో కచ్చితంగా చూసాడు, సంఘాన్ని హింసించే స్థాయి నుండి, క్రీస్తు సువార్త కోసం తన ప్రాణాన్ని అర్పించే స్థాయి వరకు దేవుని కృపను బట్టి ఎదిగాడు.నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగాడు.

ఇవాళ నా ప్రశ్న ఇదే

ఇది వరకే రక్షణ పొందుకొని బాప్తిస్మం తీసుకున్న మనం ఎలా జీవిస్తున్నాం? కొత్తగా రక్షణ పొందుకొని బాప్తిస్మము తీసుకున్న మీరు ఏవిధంగా ప్రవర్తించబోతున్నారు?

అందరికీ పౌలు ఒక మాదిరి, ఎందుకంటే పౌలు క్రీస్తు మాదిరిని అనుసరించాడు.

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.