నిజ క్రైస్తవ జీవితం

రచయిత: జి. బిబు
అనువాదం: పి. ఉషశ్రీ
చదవడానికి పట్టే సమయం: 19 నిమిషాలు
ఆడియో

Article Release long క్రీస్తు కొరకు శ్రమ పొందుట min

ఒక సాధారణ వేదిక నుండి, మన చర్చ యొక్క అంశము “క్రీస్తు కొరకు శ్రమ పొందటం” అని ప్రకటిస్తే, ఇంతకంటే మంచి ప్రత్యామ్నాయం లేదా! అని అనేకులు అసంతృప్తి చెందుతారు.

క్రీస్తుసంఘానికి ప్రొత్సాహకరంగాను, ఉత్తేజపూర్వకంగాను ఉన్న ఈ అంశం ఈ విధంగా తృణీకరించబడటం ఎంత విచారకరం! ఈ రోజుల్లో క్రీస్తు సేవకులుగా చెప్పుకునేవారి బోధలోనే క్రీస్తుసువార్తలోని అతి కీలకమైన అంశాలు తప్పించబడటం మనం గమనించగలం. మన ప్రస్తుత చర్చాంశవిషయం కూడా ఇలాగే ఉపేక్షించబడిందని, నేటి సువార్త ప్రసంగాలను, రచనలను పరీక్షించినప్పుడు తేటతెల్లమౌతుంది. అయినా ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే  క్రీస్తు కొరకు శ్రమ పొందటాన్ని గురించిన అనుభవం నేటి క్రైస్తవ్యానికి లేదు. కాబట్టి, అనుభవానికి సంబంధం లేని ఈ అంశం గురించి సైద్ధాంతికమైన విశ్లేషణ అంత అవసరమా అన్నది వారి సహజ భావన. కానీ ఈ అనుభవాత్మక లోపమే నేటి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా సాక్ష్యము చెబుతూ, అది కలుషరహితమైన, రాజీపడని, దేవుని సన్మానించే వాక్యానుసారమైన క్రైస్తవ్యం కాదని రూఢిపరుస్తుంది. బైబిలులో వివరించబడిన క్రైస్తవానుభవంతో ఎటువంటి పొందికలేని నేటి క్రైస్తవ్యాన్ని గురించి ఇంతకన్నా ఏమి చెప్పగలం! అయితే బైబిలులో ప్రస్తావించబడిన క్రైస్తవుల అనుభవం ఏమిటో ఒకసారి ఈ వచనం చదివి గమనించండి. “.... కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను, మరి బంధకములను ఖైదును అనుభవించిరి. రాళ్ళతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసికొని, దరిద్రులైయుండి శ్రమపడి హింసపొందుచు, అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి..” [హెబ్రీ 11:35-38]

నేటి క్రైస్తవసంఘానికి లోకం నుండి శ్రమ ఎందుకు కలగడం లేదన్న ప్రశ్నకు ఈ రెండు కారణాలలో ఒకటి సరైన జవాబునిస్తుంది. 1.లోకం క్రీస్తుతో సమాధానపడి ఆయన ప్రజలతో ఉన్న వైరాన్ని విడనాడి ఉండాలి, లేదా 2.సంఘమే ఈ లోకంతో స్నేహం చేసి, దేవునికి దూరమై ఉండాలి. (యాకోబు 4:4). అయితే 'యూదా సువార్త (gospel of Judas)', 'డావిన్సీ కోడ్' వంటి రచనలతో క్రీస్తును అవహేళన చేస్తున్న ఈ లోకం ఆయనతో సమాధానపడిందనటానికి ఏ అస్కారమూ లేదు. కాబట్టి సంఘం శ్రమనొందకపోవటానికి పైన సూచించిన మొదటి కారణం ఎంత మాత్రమూ సరైన వివరణ కాదని స్పష్టమౌతుంది. ఇక మిగిలింది ఒకే ఒక ప్రత్యామ్నాయం, అది సంఘములోనున్న లోపమే. "...ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును” అని యాకోబు 4:4లో పరిశుద్ధాత్ముడు సంఘాన్ని సంభోదిస్తూ చెప్పాడని మనము జ్ఞాపకముంచుకోవాలి. ఈ అంశాన్ని మనము అధ్యయనం చేస్తుండగా ఆయన సన్నిధిలో స్వపరిశీలన చేసుకోవడానికి దేవుడు మనకు తన మెండైన కృపను అనుగ్రహించును గాక.

నిర్వచనం : ముందుగా లేఖనానుసారంగా 'క్రీస్తు కొరకు శ్రమ' అనే మాటను నిర్వచించడం అవసరం . ఈ లోకం క్రీస్తును ద్వేషిస్తుందని, ఆయన నామాన్ని బట్టి తనవారిని కూడా ద్వేషిస్తుందని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. లోకం నుండి మనం ఎదురుకునే ఈ ద్వేషమే "శ్రమ". ఈ ద్వేషాన్ని మనం కొన్నిసార్లు శారీరకంగా, మరికొన్నిసార్లు మానసికంగా, కొన్నిసార్లు తీవ్రంగా, ఇంకొన్ని సార్లు సామాన్యంగా ఎదుర్కుంటాము. దీని స్వభావం మరియు తీవ్రత ఎలా ఉన్నా, క్రీస్తును బట్టి లోకం ఎల్లప్పుడూ నిజమైన క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తుంది. అయితే క్రైస్తవుడు తన సొంత దుష్కార్యాలను బట్టి కొనితెచ్చుకునే బాధలు ఇప్పుడు మనము చర్చించుకునే అంశపు పరిధిలోనికి రావు. కానీ క్రీస్తు కొరకు మరియు ఆయన సువార్త కొరకు కలిగే బాధలు మాత్రమే శ్రమలుగా పరిగణించబడతాయి (1 పేతురు 2:19-24). “ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను” (1 పేతురు 4:16). కాబట్టి క్రీస్తు నామాన్ని బట్టి పొందే శ్రమ తప్ప మరే విధమైన బాధలూ క్రీస్తు కొరకు శ్రమలుగా పరిగణించబడవు.

కొన్ని ముఖ్య విషయాలు:

ఈ అంశంలోని నాలుగు ముఖ్య విషయాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను .

1. 'శ్రమ’ నిజమైన క్రైస్తవ్యము నుండి వేరుచేయలేనిది:

“నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్దముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి”(మత్తయి 5:10-12). నిజమైన క్రైస్తవ అనుభవము నుండి శ్రమ వేరుపరచలేనిదని ఈ లేఖనభాగం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది వాక్యమునుండి, దాని సందర్భం నుండి, దానికి సంబంధిత ఇతర వాక్యాల నుండి మరియు పరిశుద్దలందరి అనుభవాల నుండి మనకు నిర్ధారణమౌతుంది.

(ఎ) వాక్యం నుండి నిర్ధారణ : మత్తయి 5:11లో మనము “హింసించబడినట్లయితే” ధన్యులమని చెప్పబడలేదు కానీహింసింపబడినప్పుడు” ధన్యులమని చెప్పబడింది. కాబట్టి నిజమైన క్రైస్తవుని జీవితములో శ్రమ అనేది కేవలము యాదృచ్ఛికమైనది కాదు కానీ వేరుపర్చలేని వాస్తవం .

(బి) సందర్భానుసారమైన నిర్ధారణ : పైన చెప్పబడిన వాక్యభాగం లేఖనాలలోని 'ధన్యతలు' అనే శ్రేష్టమైన వాక్యభాగానికి చెందింది. 'ధన్యతలు' కేవలము దేవుని ప్రజలు పొందే అత్యున్నతమైన ఆశీర్వాదాల జాబితా మాత్రమే కాదు కాని, నిజక్రైస్తవుని లక్షణాలను మరియు అనుభవాలను ఎత్తి చూపుతూ, వీటితో అనుగుణంగా లేని వ్యక్తి, దేవుని రాజ్యంలో ప్రవేశింపనేరడని ఉద్బోధిస్తున్నాయి. వేరే మాటలలో చెప్పాలంటే, ప్రతి నిజమైన క్రైస్తవుడు ఇక్కడ ప్రస్తావించబడిన లక్షణాలన్నిటికీ తగిన స్వభావాన్ని తప్పనిసరిగా కలిగుండాలి, కలిగుంటాడు కూడా. అయితే ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఒక నిజమైన క్రైస్తవుడు రక్షణ పొందటానికి తన సంపూర్ణమైన అసమర్ధతను మరియు అనర్హతను గ్రహిస్తాడు గనుక అతడు ఆత్మవిషయమై దీనుడైయున్నాడు (మత్తయి 5:3). దేవుని కృపను పొందటానికి యోగ్యతలేని తన దివాళాతనాన్ని చూసి, "అయ్యో, నేను నశించితిని.....” అని విలపిస్తాడు. అతడు ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యముచాలక, రొమ్ము కొట్టుకొనుచు, 'దేవా, పాపినైన నన్ను కరుణించుమని' ప్రాధేయపడతాడు. (లూకా 18:13).

ఈ గ్రహింపు అతనిని దేవునియెదుట దుఃఖపడేలా చేస్తుంది (మత్తయి 5:4), ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనుస్సుకు అతన్ని నడిపిస్తుంది (2 కొరింథి 7:10). ఎందుకంటే, విరిగి నలిగిన హృదయమును యెహోవా అలక్ష్యము చేయడు (కీర్తన 51:17). ఈ విధంగా క్రీస్తునందు మహిమకరమైన రక్షణ పొందినవాడై విశ్వాసి ఇప్పుడు తన రక్షణకర్త యొక్క లక్షణాలను ప్రతిబింబించడం ఆరంభిస్తాడు గనుక అతని నడవడి సాత్వికంగా మారి ( మత్తయి 5:5 ), నీతి కొరకు ఆకలిదప్పులు కలిగి (మత్తయి5:6), ఆయన నామమును బట్టి నీతిమార్గములలో నడవడానికి ఇష్టపడి (కీర్తన 23:3), కనికరము కలిగి ( మత్తయి 5:7);[/simple_tooltip] తానే స్వయముగా కనికరము పొందెను గనుక) హృదయశుద్ధి కలిగియుంటాడు (మత్తయి 5:8). క్లుప్తంగా చెప్పాలంటే క్రీస్తును పోలియుంటాడు (హెబ్రీ 7:26). ఆ తరువాత అతడు సువార్త బోధిస్తూ దేవునికీ, మనుష్యునికీ మధ్య సమాధానము కలగజేసే రాయబారిగా ఉంటాడు (మత్తయి 5:9). ఈ లక్షణాలు లేని వ్యక్తి నిజక్రైస్తవుడు కాలేడు. అయితే ఈ లక్షణాల జాబితా ఇంతటితో ముగియలేదు, చివరిగా మరొక లక్షణం కూడా ఇక్కడ జతచేయబడి ఈ లక్షణాలతో విడదీయరానిదిగా కలపబడింది. అదే 'నీతి నిమిత్తము హింసించబడుట మరియు క్రీస్తు నిమిత్తము నిందించబడి, హింసించబడుట' (మత్తయి 5:10-12). ఒక్క మాటలో చెప్పాలంటే, 'క్రీస్తు కొరకు శ్రమ పొందటం'. అయితే ఇక్కడ గమనించదగిన విషయం ఏమిటంటే నిజ క్రైస్తవానుభవానికి అనివార్యమైన లక్షణాల జాబితాలో "క్రీస్తుకొరకు శ్రమనొందుట” అనేది కూడా చేర్చబడింది. కాబట్టి, పైన చూపించిన విధంగా క్రైస్తవుడు క్రీస్తు స్వభావములోనూ, ఆయన పరిచర్యలోనూ ఏ విధంగా పాలిభాగస్థుడౌతాడో, అలాగే ఆయన శ్రమలలో కూడా, ఈ లోకంలో ఆయన ఎదురుకున్న ప్రతి చేదు అనుభవంలోనూ తప్పక పాలిభాగస్థుడౌతాడు. ఈ విధంగా నిజమైన క్రైస్తవ అనుభవము నుండి 'శ్రమ' వేరు చేయబడజాలనిది. గనుక "క్రీస్తు కొరకు శ్రమ” అనుభవించని జీవితం, నిజ క్రైస్తవజీవితం ఎన్నటికీ  కానేరదు.

(సి) ఇతర సంబంధిత వాక్యాలతో నిర్ధారణ : బైబిలులోని అనేక వాక్యాలు, పైవాక్యభాగంతో సమ్మతించి 'శ్రమ' నిజమైన క్రైస్తవ అనుభవం నుండి విడదీయరానిదని రూఢి చేస్తున్నాయి. ఈ ఉదాహరణలు గమనించండి. "దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి. లోకులు నన్ను హింసించిన యెడల మిమ్మును కూడా హింసింతురు; నా మాట గైకొనినయెడల, మీ మాట కూడా గైకొందురు"(యోహాను 15:20).

 "అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములోనికి ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.” అపో.కా. 14:22.

" క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించువారందరు హింసపొందుదురు ” - 2 తిమోతి 3:12.

"ఏలయనగా మీరు నాయందు చూచినట్టియు, నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగియున్నందున, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను” - ఫిలిప్పీ 1:29,30.

ఈ వాక్యాలన్నీ 'శ్రమ పొందటం' ప్రతి క్రైస్తవునికీ అనివార్యమని తెలియజేస్తున్నాయి. కాని క్రీస్తునామాన్ని తమ పెదవులతో ఉచ్ఛరించే అనేకులు ఆయన కాడిని ఎత్తుకోవడంలో విఫలమయ్యారు కాబట్టి ఈ అనుభవానికి వారు అపరిచితులు.

(డి) పరిశుద్ధులందరి అనుభవాల ద్వారా నిర్ధారణ : క్రైస్తవ జీవితంలో శ్రమ అనివార్యమనే వాస్తవాన్ని మరింత బలపరస్తూ పూర్వమందుండిన పరిశుద్దుల అనుభవాలని క్రీస్తు ఉదాహరణగా పేర్కొన్నాడు. “ ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి ”(మత్తయి 5:12). అన్ని కాలాలలోనూ భక్తులు లోకం యొక్క ద్వేషాన్ని చవిచూశారు. కొందరిని వారు చంపారు, ఇంకొందరిని సిలువ వేశారు, మరి కొందరిని వారి వారి సమాజమందిరాలలో కొరడాలతో కొట్టి, పట్టణం నుండి పట్టణానికి తరిమారు (మత్తయి 23:34,35). కానీ వారు ఏ ఒక్క ప్రవక్తనూ సాదరంగా అంగీకరించలేదు. తన శిష్యుల అనుభవం కూడా ఇలాగే ఉంటుందని యేసు స్పష్టం చేసాడు ( మత్తయి 5:11-12). పరిశుద్ధుల జీవితగాథలను చదివినప్పుడు ఈ ప్రవచనం యొక్క వాస్తవికతను గ్రహించగలం. యోహాను తప్ప అపోస్తలులందరూ హతస్సాక్షులయ్యారు. యోహాను కూడా దేవునివాక్యం మరియు యేసు సాక్ష్యం కొరకు, పత్మాసు ద్వీపంలో పరవాసిగా శిక్ష అనుభవించాడు.

జాన్ ఫాక్స్ గారి ప్రసిద్ద హతస్సాక్షుల పుస్తకంలో క్రోడీకరించబడిన శ్రమల పట్టికను చదివితే ఆదిమ సంఘంలోను, చీకటియుగంలోను, సంస్కరణోద్యమ కాలములోను క్రైస్తవులు, ఎడతెరపి లేకుండా మొదట రోమా సామ్రాజ్యము నుండి, పిదప రోమన్ క్యాథలిక్ సంఘము నుండి మునుపెన్నడూ కనీవినీ ఎరుగని విధంగా శ్రమలను ఎదుర్కున్నారు. పురుషుల శరీరాల నుండి చర్మాలను వలిచారు, స్త్రీలను బలాత్కారం చేసి చంపారు, వారి పిల్లలు నిర్దాక్షిణ్యంగా ఖడ్గానికి గురిచేయబడ్డారు, శిశువులను నీటిలో ముంచి చంపారు మరియు గర్భిణీస్త్రీల గర్భాలను ఖడ్గంతో కోసి హతమార్చారు. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. కొన్ని సందర్భాలలో వారు భయంకరంగా గాయపరచబడి రక్తము స్రవించి చనిపోతుంటే వారి మూల్గులను ఏడ్పులను విని పైశాచికంగా ఆనందించారు. ఇలా హింసించిన ప్రతి సందర్భములోను, క్రీస్తును తిరస్కరిస్తే విడిచిపెట్టేస్తామని వారికి అవకాశం ఇచ్చారు. అయితే ఆ అవకాశాన్ని కాదని, అంతం వరకు అన్నిటిని సహించి, తమకై చనిపోయిన క్రీస్తు కొరకు ఆనందంతో బాధనొందారు.పరలోకంలో శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని ఎరిగి, వారి ఆస్తులను కోల్పోటానికి సంతోషంగా ఒప్పుకున్నారు. మరికొందరు తమ స్వంత బంధువులచేత తృణీకరించబడి, గేలిచేయబడి, స్నేహితులచేత మోసగించబడి, శత్రువులచేత కించపరచబడి, అవమానించబడి, వారి హక్కులను పోగొట్టుకుని, నెపములు మోపబడి, మనుష్యులందరి చేత అలక్ష్యం చేయబడి, ద్వేషించబడ్డారు. ఇంకా ఎన్నో విధాలుగా శ్రమలకు గురిచేయబడ్డారు. శ్రమ తీవ్రత ఎలా ఉన్నా వారి రక్షకుడు తాగిన గిన్నెలోనిది కొంతమేరకైనా వారు కూడా పాలుపంచుకున్నారు. అయితే నేటి క్రైస్తవ్యం దీనికి ఎంత భిన్నంగా ఉంది! అనేకుల ప్రేమ చల్లారింది. భక్తి కేవలం ఆడంబరంగాను, మేథోసంబంధమైనది గాను, వారి వేషధారణను కప్పుకునే ముసుగుగాను మిగిలిపోయింది. విశ్వాసగృహానికి చెందినవారమని చెప్పుకునేవారు సైతం అల్పకాల పాప ప్రలోభాలచేత గృహాధిపతికి విరోధంగా వ్యభిచరించారు. నేటి క్రైస్తవ్యానికి లోకం నుండి శ్రమలేకపోవడం దాని భ్రష్టత్వనికి సూచనగా ఉంది. ఇది మనల్ని ఈ చర్చ యొక్క రెండవ విషయానికి నడిపిస్తుంది.

2. శ్రమ లేకపోవడం నేటి క్రైస్తవ్యంలో ఉన్న భ్రష్టత్వానికి సూచన:

ఈ రోజు మనకు తెలిసిన క్రైస్తవ్యం నిజానికి ఒక గులాబీపాన్పు. ఈ రోజు లోకంలో క్రైస్తవులకు మంచి స్థానం ఉంది. క్రీస్తుకు ప్రచండ శత్రువులు కూడా వారిని ద్వేషించడం లేదు. పూర్వం  ఒక పరిశీలనాత్మకమైన ప్రశ్న అడగబడింది, “సమ్మతింపకుండ ఇద్దరు కూడి నడుతురా?” (ఆమోసు 3:3). కాబట్టి ఈ లోకంతో సమ్మతించడానికి, రాజీపడటానికి సంఘం పూనుకుందని స్పష్టమౌతుంది. నేను ముందు చెప్పిన విధంగా లోకం క్రీస్తుకూ ఆయన బిడ్డలకూ వ్యతిరేకమైన ద్వేషాన్ని విడిచిపెట్టేలా, దాని భ్రష్టత్వం ఏ మాత్రమూ తక్కువ కాలేదు. దీనికి భిన్నంగా, లోకము మరింత భ్రష్టత్వంలోకి దిగజారినట్లు చూడగలం. దీనిని స్పష్టంగా సూచిస్తూ ఇలా వ్రాయబడింది. "అయితే దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు” (2 తిమోతి 3:13).

లోకానికీ, క్రైస్తవ్యానికీ మధ్యనున్న ఈ వింత సంబంధాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? దీనిని వివరించడానికి మన ప్రభువు మాటల కంటే శ్రేష్టమైన మాటలు ఏవీ లేవు -  యేసు తన శిష్యులను సంబోధిస్తూ ఇలా చెప్పాడు, “మీరు లోకసంబంధులైన యెడల లోకము తనవారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.”(యోహాను 15:19). ఈ పై మాటలకన్నా బలమైన ఋజువు ఇంకేం కావాలి? యోహాను 15:20 వచనాన్ని ఇదివరకే ధ్యానించాము. ఆ వచనంలో ప్రభువు మాటలు గైకొనని ఈ లోకం ఆయన దాసుల మాటలు కూడా గైకొనదని చెప్పబడింది. వారి క్రియలన్నీ దుష్క్రియలు కాబట్టి ఆయన మాటలను వారు ద్వేషిస్తున్నారని మనకు తెలుసు కదా? కానీ అదే లోకం నేటి క్రైస్తవులని సాదరంగా అంగీకరించడం ఈ లేఖన ఆరోపణను వారికి వర్తించేలా చేస్తుంది. "వారు లోకసంబంధులు గనుక లోకసంబంధులైనట్టు మాటలాడుదురు, లోకము వారి మాట వినును” - 1 యోహాను 4:5.

క్రైస్తవులు సాదరంగా స్వీకరించబడటమే కాకుండా, అందరి చేత ఉత్తములుగా ప్రస్తావించబడుతున్నారు. ఈ విధంగా లోకం చేత సన్మానించబడుతున్న ప్రియక్రైస్తవుడా, క్రీస్తు చెప్పిన ఈ మాటలను ఒక్కసారి ఆలోచించు. "మనుష్యులందరు మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ; వారి పితరులు అబద్ద ప్రవక్తలకు అదే విధముగా చేసిరి"(లూకా 6:26)."వారు దేవుని మెప్పుకంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి”(యోహాను 12:43).“ఆయన - మీరు మనుష్యులయొదుట నీతిమంతులని అనిపించుకొనువారుగాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము”(లూకా 16:15). ఎలాగైతే ఈ లోకస్నేహం దేవునితో వైరమో, అలాగే దేవునితో స్నేహం ఈ లోకంతో వైరమని మనం గ్రహించాలి. అప్పుడు కీర్తనాకారునితో కలిసి ఇలా చెప్పగలము, “యెహోవా, నిన్ను ద్వేషించువారిని నేనును ద్వేషించుచున్నాను గదా? నీ మీద లేచువారిని నేను అసహ్యించుకొనుచున్నాను గదా? వారియందు నాకు పూర్ణ ద్వేషము కలదు, వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను”(కీర్తన 139:21,22).ఈ విధంగా ఒక వ్యక్తి ప్రభువు కొరకు ఆసక్తిగలవాడైతే తప్ప అతను నిజమైన క్రైస్తవుడని పిలవబడడు. ఇక నిజమైన క్రైస్తవ్యం కానిదేదైనా ఈ లోకానికి అంగీకారమే గదా.ఈ విధంగా శ్రమలేకపోవటం నేటి క్రైస్తవ్యంలో ఉన్న భ్రష్టత్వానికి సూచన ఆని నిర్ధారణమౌతుంది. ప్రియ చదువరీ, మరి నీ విషయమేంటి?

3. క్రీస్తు మరియు సువార్తపట్ల విశ్వాస్యత వలన కలిగే పరిణామమే శ్రమ:

వివాదాలు, తగవులు, మరియు జగడాలవల్ల  క్రైస్తవులు కొనితెచ్చుకునేవి మనం చర్చించుకునే శ్రమలు కావు. క్రైస్తవునికి ఇవి తగవు. ఎందుకంటే వారి యజమానుడు ప్రేమస్వరూపి, కాబట్టి వారు కూడా ఆయనను పోలి జీవించబద్దులైయున్నారు. అందరితో సమాధానం కలిగుండమని క్రైస్తవులు ఆజ్ఞాపించబడ్డారు. కాబట్టి లోకద్వేషాన్ని ఆకర్షించేది క్రైస్తవుని కఠినమైన ప్రేమరహిత ప్రవర్తన కాదు. క్రైస్తవుడు తన మాటలతో, ప్రవర్తనతో సువార్తను ప్రకటిస్తున్నందున ఈ లోకం అతన్ని ద్వేషిస్తుంది. ఐహిక మనస్సుకు అభ్యంతరకరమైనవెన్నో సువార్తలో అంతర్గతమై ఉన్నాయి. ఈ అభ్యంతరాలను తొలగించి బోధించటమే సువార్తను వక్రీకరించడం. ఇలా చేయటం వలనే నేటి క్రైస్తవులు లోకంచేత సన్మానింపబడుతున్నారు. ఒక క్రైస్తవుడు నమ్మకంగా సువార్తను చాటితే తన శత్రువులెవరో తెలుసుకుంటాడు. 'ఆరోగ్యము, సంపద, శ్రేయస్సు' అనే సువార్తలను వదిలి కలుషరహితమైన సత్యవాక్యాలను బోధించి, శిష్యత్వపు వెలను గూర్చి నొక్కి చెబుతూ, లోకపాపాలను బహిర్గతం చేసి, తమ పాపాల నుండి తిరగమని, ప్రతిదినము సిలువను మోసుకొని క్రీస్తును వెంబడించమని ప్రకటించినట్లయితే అది ఎంత ప్రేమపూర్వక, శాంతియుత ఆహ్వానమైనా లోకం అతన్ని ద్వేషిస్తుంది.

4. శిష్యరికపు వెల - "శ్రమ":

ప్రభువైన యేసుక్రీస్తుకు శిష్యునిగా మారిన కారణంగా ఒక వ్యక్తికి సంభవించే నష్టం ఏదైనా అది శిష్యత్వపు వెలగా పరిగణించబడుతుంది. క్రీస్తునకు శిష్యునిగా ఉండాలనుకునే ప్రతి వ్యక్తి, మొదట కూర్చొని లెక్కగట్టి, శిష్యరికపు వెల చెల్లించటానికి తాను సిద్దపడియున్నాడో, లేదో చూసుకోవాలని ప్రభువు తానే స్వయంగా బోధించాడు. ( లూకా 14:25-33 ). క్రైస్తవునికి తప్పనిసరిగా వాటిల్లే నష్టం ఒకటుంది. లోకమిచ్చే సన్మానాన్ని అతడు కోల్పోతాడు, అందుకు ప్రతిగా లోకము నుండి ద్వేషాన్ని ఎదుర్కుంటాడు. ఈ శత్రుత్వం మరి ఎక్కడి నుండో ఉద్భవించదు. ఒక క్రైస్తవునికి మొదటి శత్రువులు వాని కుటుంబ సభ్యులేనని ప్రభువు అన్నాడు, “నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనుష్యుని ఇంటివారే వానికి శత్రువులగుదురు”(మత్తయి 10:34-36). రెండవ శత్రుసమూహము, మతపరమైన లోకం;అవును, క్రైస్తవులమని తమ్మును తాము పిలుచుకొనేవారే. “లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు” ఆని యోహాను 15:18లో యేసు చెప్పాడు. ఏ “లోకము" క్రీస్తును ద్వేషించి, వెంటాడి చంపింది? దేవుని నామమున అత్యుత్సాహాన్ని కపటంగా ప్రదర్శించిన ఆ మతవ్యవస్థే గదా. ఇప్పుడు కూడా అలాగే ఉంది. 'క్రీస్తును ఘనహీనునిగా చేస్తున్న ఈ క్రైస్తవలోకానికి విరోధంగా ఒక క్రైస్తవుడు వెనుదిరిగినప్పుడు అతని ప్రచండ శత్రువులు - జాలిపడని, నీతినియమాలు లేని విరోధులు - ఎవరంటే తమను తాము క్రైస్తవులుగా ప్రకటించుకునేవారే!' (ఎ.డబ్లు.పింక్). మూడవదిగా, ఈ లోకం కూడా దానికంగీకారమైనదేదీ క్రైస్తవునిలో కనుగొనలేదు. ఎందుకంటే అతడు ఈ లోకమర్యాదను అనుసరించడానికి నిరాకరించటం మాత్రమే కాకుండా, దాని క్రియలు చెడ్డవని ఎల్లప్పుడూ సాక్ష్యమిస్తాడు. కాబట్టి క్రీస్తు శిష్యులుగా ఉండాలనుకునే వారెవరైనా, ముందుగా కూర్చొని, అనుభవాత్మకంగా శిష్యత్వపు వెలను చెల్లించటానికి స్థిరంగా ఉన్నారో లేదో పరీక్షించుకోవాలి.అదేమిటంటే "మీరు నా నామము నిమిత్తము అందరిచేత ద్వేషించబడుదురు; అంతమువరకు సహించినవాడు రక్షింపబడును” మత్తయి 10:22.

ఇక్కడ వ్యక్తపరచిన కొన్ని తలంపుల ద్వారా దేవుని సన్నిధిలో ఆత్మపరిశీలన చేసుకోవటానికి, మనం వాస్తవంగా క్రీస్తు శిష్యులమో కాదో గుర్తెరగటానికి ప్రభువు మనకు సహాయము చేయునుగాక.

Add comment

Security code
Refresh

Comments  

# LibraryJohn 2019-12-04 22:04
Praise god
Reply
# LibraryJohn 2019-12-04 22:05
Praise thegod
Reply
# LibraryJohn 2019-12-04 22:05
Praise
Reply
# LibraryJohn 2019-12-04 22:06
Pray
Reply
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.