దుర్బోధలకు జవాబు

రచయిత: జి. బిబు
ఆడియో

(ముంగమూరు దేవదాసు అయ్యగారి బోధనల వాక్యానుసారమైన పరిశీలన)

విషయసూచిక

I. ఈ పరిశీలన ఎందుకు?

బైబిల్ కావాలా బైబిల్ మిషను కావాలా అనే ప్రశ్నకు, 'రెండూ కావాలి' అనే సమాధానం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇక్కడ నేను మాట్లాడేది ముంగమూరు దేవదాసు అయ్యగారు స్థాపించిన బైబిల్ మిషను గురించి. బైబిల్ మిషను ప్రచురణలు పరిశీలించినప్పుడు దేవదాసు అయ్యగారు చెప్పిన అనేక మాటలు వాక్యానుసారం కావని ఇట్టే తెలిసిపోతుంది. అందుకే, బైబిల్ మరియు బైబిల్ మిషను, ఈ రెండూ కావాలనుకోవడం సాధ్యం కాదు. రెండు పరస్పర విరుద్ధ బోధలు ఉన్నప్పుడు ఏదో ఒకటే నిజమవ్వాలి కాబట్టి, ఒకటి అంగీకరిస్తే మరొకటి తిరస్కరించినట్లే ఔతుంది.

మనుష్యులందరు పొరపాట్లు చేస్తారు కదా, ఎందుకు దేవదాసు అయ్యగారిని మాత్రమే ఇలా పరీక్షకు నిలబెట్టడమని ఎవరైనా అడగొచ్చు. అలా అడిగేవారు ఒక సంగతి ఆలోచించాలి. ఒక మనిషి పొరపాట్లు చేయడం సహజమే. అయితే, దేవదాసు అయ్యగారివి పొరపాట్లే అని గుర్తించే నిజాయితీ బైబిల్ మిషనువారు కనపరచి ఉంటే, నేను ఈ ప్రయాసకు పూనుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు. కానీ వారు సంవత్సరాల తరబడి, ఎలాంటి సవరణలు చేయకుండా, దేవదాసు అయ్యగారి తప్పుడు సిద్ధాంతాలను యథాతథంగా ప్రచురిస్తూనే ఉన్నారు.

ఇక్కడ మరింత ప్రమాదకరమైన సంగతి ఏమిటంటే, దేవదాసు అయ్యగారు నేరుగా దేవుని ప్రత్యక్షతతో బోధించేవారని నమ్మబలికే అనేక మాటలు ఈ ప్రచురణలలో కనిపిస్తాయి. ఆయన జీవిత చరిత్రలో బైబిల్ మిషనువారు ఈ మేరకు చేసిన కొన్ని ప్రకటనలు గమనించండి:

"దేవదాసు అయ్యగారు ప్రసంగించినపుడెల్లా, "ప్రభువు నా పక్కన కుర్చీలో కూర్చున్నారు.ఆయనను మీరు చూడగలరా? ఆయన నాకు బోధ చెప్పుచున్నారు. ఆ బోధ మీరు వినగలరా? ఆయన ఏమి చెప్పుచున్నారో అవి నేను విని మీకు బోధించుచున్నాను. నా స్వంత మాటలు నేనేమి మీకు చెప్పుట లేదు," అని చెప్పేవారు. మహాసభలలో బోధించేటపుడు వెయ్యి మాటలలో ఒకమాట ఏదైనా ఆయన స్వంతమాట చెబితే ఇది నా స్వంత మాట అని చెప్పేవారు" (జీవిత చరిత్ర పేజీ నెం. 2, 2006).

"అయ్యగారు ప్రసంగం చేస్తే, దానిని ప్రభువు దగ్గర్నుండి చెప్పించుకొనేవారు. అంటే, ప్రభువు వచ్చి దగ్గర నిలువబడి, ఆయన చెవి దగ్గర చెపుతారు. దాన్ని అయ్యగారు విని చెప్పుతారు.కనుక బాగా ప్రభువు స్వరం వినుటకు ఆయన ఒక్కొసారి చెవి లాక్కొనేవారు. ఆ మాటలను అయ్యగారి దగ్గరున్నవారు పెద్దగా చెప్పేవారు". (జీవిత చరిత్ర పేజీ నెం. 157, 2006).

ఈ మాటల ప్రకారం వారు, అయ్యగారు చేసిన బైబిలేతర ప్రకటనలకు ఆయనను కాదు దేవుడినే జవాబుదారీగా నిలబెడుతున్నారు అనిపిస్తుంది. ప్రత్యక్షత అనగానే ఇక మరో మాట ఆలోచించకుండా గుడ్డిగా నమ్మే అమాయకులెందరో ఉన్న మన తరంలో అయ్యగారి బోధలు అనేకులను బైబిల్నుండి తప్పుదోవ పట్టిస్తూనే ఉంది అయితే బైబిలో దేవుడు ప్రత్యక్షపరచిన బోధకు భిన్నంగా ఎవరు బోధించినా అది దేవుని కార్యం కాదని, అది మానవ పొరపాటు లేదా సాతాను దుర్బోధ అయ్యుండాలని వేరే చెప్పాల్సిన పని లేదు.

కాబట్టి, ప్రతి బోధకుని మాటలను మనం వాక్యపు వెలుగులో పరిశీలించాలి. అది బైబిలుకు భిన్న బోధ అని తేలితే దానిని తిరస్కరించి ఖండించాలి. ఇందుకు దేవదాసు అయ్యగారు కూడా మినహాయింపు కాదు. ప్రస్తుత పరిశీలనకు నన్ను ప్రేరేపించింది దేవుని వాక్యం పట్ల కనపరచాల్సిన విశ్వాస్యత మాత్రమే తప్ప, ఇందులో ఎలాంటి వ్యక్తిగత ద్వేషానికి, దూషణకు తావులేదని గమనించాలి. కేవలం దేవుని మాట వెలుగులో దేవదాసు అయ్యగారి మాటలను పరిశీలించటం, వాక్యభిన్న ఆలోచనలను బహిర్గతం చేయటం మాత్రమే నేను ఇక్కడ చేసిన పని. మీరు కూడా నాతో కలసి పరిశీలిస్తారని, బైబిల్ మిషను కాదు, బైబిల్ మాత్రమే కావాలనే తీర్మానానికి నడిపించబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే యేసు ప్రభువుకు చెందిన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. అందుకు భిన్నంగా మాట్లాడేది అన్యుని స్వరమని గుర్తించి దాన్ని విసర్జిస్తాయి.

 II. ఇంతలా హెచ్చించటం మోసం చేయటం కోసం కాదా?

దేవదాసు అయ్యగారి జీవిత చరిత్రలో, బైబిల్ మిషను వారు ఆయనను హెచ్చిస్తూ చేసిన పరిచయం వాస్తవాతీతమైనది. ఆయనకు ఆపాదించిన సంగతులు బైబిల్ లో దేవునికే తప్ప ఒక మానవమాత్రునికి ఎప్పుడూ ఆపాదించబడలేదు. బైబిల్ అరుదుగా చదివి, కేవలం కల్పనాకథలకు మాత్రం ఎక్కువగా చెవియొగ్గే అనేక అమాయక క్రైస్తవులకు ఇదంతా ఏమి తెలుస్తుంది పాపం? వారు నిజమే కాబోలు అనుకుంటారు. అంత గొప్ప వ్యక్తి స్థాపించిన బైబిల్ మిషను ఎంత గొప్పదయ్యుంటుందో అని భ్రమపెట్టే విధంగా ఉన్నాయి ఈ అతిశయోక్తులు. అలాంటి కొన్ని బడాయి మాటలను దేవదాసు అయ్యగారి జీవిత చరిత్ర అనే పుస్తకం నుండి ఈ క్రింద పొందుపరిచాను, గమనించండి:

"ఆయన నేత్రములు మన కన్నులు చూడలేనంత మహిమగలవిగా ఉండేవి. ఆ కండ్లు ఎదుటివారి యొక్క హృదయంలోనికి మనస్సులోనికి, ఆత్మలోనికి దూరునటులనుండేవి . ఆయన నేత్రములలోని దైవాత్మ శక్తి అటువంటిది." (జీవిత చరిత్ర పేజీ నెం.1, 2006).

"ఆయన వస్త్రములు ఆదివారం ధగధగ మెరిసినట్లుండేవి. " (జీవిత చరిత్ర పేజీ నెం. 1, 2006).

"వీరు అన్ని భాషలు గ్రహించగల 'కీ' (key ) ఎరిగినవారు... దేవుని లక్షణములన్నీ సంపాదించుకొన్నవారు. ఆయన జీవితమే దేవుని మర్మము. M అనగా Mystery(మర్మము),D అనగా Divine (దేవుని యొక్క మర్మము)". (జీవిత చరిత్రపేజీ నెం. 2, 2006).

"ఆ వేదిక మీద ఒక్క కుర్చీ మాత్రం వేసినారు. ఆ కుర్చీ ప్రసంగం చేయుటకు ఏర్పాటైన అయ్యగారు కూర్చుండుటకే గదా! గనుక ప్రభువు అక్కడే ఉన్నారు. అయ్యగారు - 'ప్రభువా! మీరు కుర్చీలో కూర్చొనండి' అన్నారు. ప్రభువు- 'ఆ కుర్చీ నీ కొరకే వేసినారు. నీవు కూర్చో అన్నారు. అయ్యగారు- 'ప్రభువా! నీవు కూర్చుండుము' అన్నారు. ఈలాగు మాట్లాడుకొని ఆ ఒక్క కుర్చీలోనే ప్రభువు, అయ్యగారు ఇద్దరు కూర్చుండిరి. ఇట్టి సహవాస భాగ్యం ఏ వాక్య సేవకుని దగ్గర వినలేము, చూడలేము. భక్తులనిపించుకొన్నవారి దగ్గరకూడ చూడలేము. " (జీవిత చరిత్ర పేజీ నెం. 13, 2006).

"ఆ తరువాత త్రిత్వ దేవుడు వచ్చి, బరంపురం సన్నిధి కూటములలో వారికి పాదిరి పనికి ఆర్డినేషన్ ఇచ్చిరి. ఇది 40 సంవత్సరాల క్రిందటి సంగతి. 'రాజమండ్రి సంఘం మీద పాదిరిగా ఉండుటకు నీవు ఒప్పుకొనలేదు గనుక అన్ని సంఘములపై పాదిరిగా ఉండడానికి ఆర్డినేషన్ ఇచ్చానని' ప్రభువు అన్నారు". (జీవిత చరిత్ర పేజీ నెం. 13, 2006).

"అయ్యగారు ఆత్మ ద్వారా అందరికి లేక అనేక మందికి కనబడుచున్నారు. అక్కడ వరండా మీద కూర్చొనియున్నవారిలో 52మందికి వారివారి ఊళ్లలో కనబడుచున్నారు. గనుక నేను నిన్ను అనేక సంఘాలకు పాదిరిగా అభిషేకించుచున్నాననేది దీని ద్వారా నెరవేరుచున్నది." (జీవిత చరిత్ర పేజీ నెం.14, 2006).

"అయ్యగారి ప్రార్థన స్విచ్ వేస్తే వెలిగే లైటువలె పనిచేస్తుంది". (జీవిత చరిత్రపేజీ నెం.57, 2006).

"అయ్యగారి గీతాలలో ఎక్కువ భాగం పరతంత్రత లేక భక్తి ప్రపత్థతను సూచిస్తాయి. ఎందుకంటే, అయ్యగారి కీర్తనలన్ని ప్రభువే స్వయంగా అందించగా వాటిని అందుకొని రచించినవి గనుక. " (జీవిత చరిత్రపేజీ నెం. 91, 2006).

"అయ్యగారు బైబిల్ తరగతిలో 66 పుస్తకములకు ఉపోద్ఘాతము ఉపదేశించిరి. ఏ పుస్తకమును వివరించునపుడు ఆ గ్రంథకర్త వచ్చి, అక్కడ ఉండి, వారు చెప్పు వివరము సరిగానున్నది అని చెప్పేవారు" (జీవిత చరిత్ర పేజీ నెం.93-94, 2006).

"పరలోకమునుండి భక్తులు వచ్చి పాటలు పాడితే అయ్యగారు విన్నారు" (జీవిత చరిత్రపేజీ నెం. 117-119, 2006).

"సువార్త వినుటకు ఒక రోజు అయ్యగారి వద్దకు ఎవరు రాలేదు - ప్రభువా! ఈ దినము ఎవరు నా దగ్గరకు రాలేదని మనసులో అనుకొనగా, పరలోకము నుండి భక్తులు, పరిశుద్ధులు, ఆయన గదిలోకి వచ్చి నిండిపోయిరి. అప్పుడు అయ్యగారు-"మహోన్నతులగు మనుష్యులను ఈ గృహాన జేర్చెను యహోవా తండ్రి" అనే కీర్తన పాడిరి." (జీవిత చరిత్ర పేజీ నెం. 125, 2006).

"అయ్యగారి ఎదుట ఎవరు నిలువబడినా, కూర్చున్నా ఆయన వారి అంతరంగంలో ఉన్న సంగతులను చూచి మాట్లాడెడివారు . ఏలాంటి మనస్సుతో ఆయన దగ్గరకు వెళ్లుదుమో, దానిని బట్టి మనకు జవాబు దొరికెడిది." (జీవిత చరిత్ర పేజీ నెం. 145, 2006).

పై మాటలను జాగ్రత్తగా పరిశీలించండి. బైబిల్ మిషను వారు వారి అయ్యగారిని దేవుడని చెప్పకనే చెప్పేశారు. మనం చూడలేని మహిమ, మనస్సుల్లోనికి దూరే కంటి చూపు, ధగధగ మెరిసే వస్త్రాలు, అన్ని భాషలూ అర్థం చేసుకునే సామర్థ్యం, దైవ లక్షణాలన్నీ సంపాదించుకోవటం, ఇలా ప్రతి విషయాన్ని గమనించండి. ఇది వ్యక్తి పూజ మాత్రమే కాదు, మిగితా మిషనులన్నిటి కంటే బైబిల్ మిషను మిన్న అని చెప్పే ప్రయత్నం. అయ్యగారి బోధలు బైబిలుకు భిన్నంగా ఉన్నా, వాటిని ప్రశ్నించకుండా అంగీకరింపజేసే ప్రయత్నం. ఇవన్నీ మనం ఈ పరిశీలనలో ముందుకు వెళుతున్న కొలది రుజువు ఔతాయి.

ఏమిటేమిటి? అయ్యగారికి వేసిన కుర్చీ కాబట్టి స్వయంగా యేసు ప్రభువే అందులో కూర్చోటానికి మొహమాటపడ్డారా? అయ్యుండొచ్చులే!! ఇద్దరికీ సమాన లక్షణాలు ఉన్నాయి కదా మరి!!! త్రిత్వ దేవుడు వచ్చి ఆర్డినేషన్ ఇస్తే ఇచ్చారు గాని, మరి 'పాదిరిగా' ఆర్డినేషన్ ఇవ్వటం ఏమిటి? అలాంటి పదవి ఒకటి ఉన్నట్లు బైబిల్ లో ఎక్కడ చదువుతాము? ఒక స్థానిక సంఘానికి కాపరులు ఉన్నట్లు చదువుతాము కాని విశ్వవ్యాప్తంగా ఉన్న సార్వత్రిక సంఘానికి యేసు ప్రభువే కాపరి. ఆ హోదా ఏ మానవునికి ఇవ్వబడలేదు. రోమన్ కాథలిక్ ప్రభావం ద్వారా సంఘంలోనికి ప్రవేశించిన 'పాదిరి' పదవికి, అది చాలదన్నట్లు విశ్వవ్యాప్త సంఘానికి పోపును పోలిన స్థానానికి ఆర్డినేషన్లు ఇచ్చిన త్రియేక దేవుడు ఏ దేవుడో మరి! బైబిల్ లో ఉన్న త్రియేక దేవుడు మాత్రం కాదు సుమా! యేసు ప్రభువే స్వయంగా చెవిలో చెబుతుంటే విని బోధించిన బోధలు, స్వయంగా బైబిల్ రచయితలే వచ్చి సత్యమని ధ్రువీకరించిన బోధలు, వాక్యభిన్నంగా ఉండకూడదనే కనీస ప్రమాణాన్ని తృప్తిపరచియుంటే, నా ఈ విమర్శనా రచనకు అసలు తావే ఉండేది కాదు. ప్రభువే వాక్యభిన్నంగా చెబితే అయ్యగారు అలా బోధించారా? ప్రభువే చెప్పింది కాబట్టి ఇక చేసేది లేక బైబిల్ రచయితలు కూడా సమ్మతించాల్సొచ్చిందా? లేకపోతే, ప్రతి దుర్బోధకుడు చేసేలా, తన తప్పుడు బోధలకు 'ప్రభువు చెప్పాడు' అనే ముద్ర వేసుకుని, దానికి ప్రత్యక్షత రంగు పులిమే ప్రయత్నమే ఇక్కడ జరిగుంటుందా? ప్రభువు తన మాటకు భిన్నంగా తాను బోధించడని వేరే చెప్పనవసరం లేదు. అయితే, అలా బోధించేవారిని ఎలా చూడాలో దేవుని బిడ్డలందరికీ తెలుసనుకుంటున్నాను. అలాంటి ప్రవక్తలను దేవుడు పంపడు, వారే వస్తారు (యిర్మీయా 23:21). అలాంటి వారిని పోగు చేసుకునే దురద చెవులుగలవారు ఉన్నంతకాలం అలాంటి వారు అనేకులు వస్తూనే ఉంటారు. "" (యెషయా 8:20, వాడుక భాష అనువాదం).

III. సొంత డబ్బాలు

దేవదాసు అయ్యగారిని గొప్పగా హెచ్చించి, దాదాపుగా దేవుని స్థానంలో కూర్చోపెట్టటం బహుశా ఆయన అనుచరులు చేసిన పని కావొచ్చు. అందులో ఆయన తప్పేముంటుందిలే అని ఒకవేళ మీరు అనుకుంటే పొరపాటే. ఆయన అనుచరులకు ఆయన పట్ల ఈ భక్తి భావాలు ముదరటానికి ఆజ్యం పోసింది ఆయన తన గురించి చేసుకున్న స్వీయ ప్రకటనలే. స్వయానా అయ్యగారే సెలవిచ్చిన మాటలను ఆయన జీవిత చరిత్ర నుండి ఈ క్రింద పొందుపరుస్తున్నాను -

"నాకు ఒకే సమయంలో ఏడు చోట్ల బహిరంగంగా ప్రసంగించగల వరం దేవుడు అనుగ్రహించినారు. దీనిని గురించి మీలో మీరు ఏమి అనుకొనవద్దు అని సామాన్యంగా చెప్పిరి". (జీవిత చరిత్ర పేజీ నెం. 52, 2006).

"1918లో బరంపురంనకు 9 మైళ్ళ దూరంలో సముద్ర తీరంనందున్న గోపాలపురంలో డా. ఆట్మనమ్మగారి కూటంలో త్రియేక దేవుడు నాకు ఆర్డినేషన్ అనగా పాదిరి పని ఇచ్చినారు. అందుకు బరంపురం ఒరియా చర్చికి పాస్టరుగా ఉన్న అనామ్ పాత్రోగారు నేటి వరకు జీవించియున్నారు... సంఘం ఆర్డినేషన్ ఇస్తే సంఘమునకు మాత్రమే సరిపోవును. దేవుడు ఇచ్చాడు గనుక లోకమంతటికీ సరిపోయేదై ఉన్నది. (దేవుడు లోకమంతటికి సరిపోయే ఆర్డినేషన్ ఇచ్చారు) కాబట్టి నేను బాప్తిస్మములు ఇవ్వవచ్ఛును. సంస్కారములు ఇవ్వవచ్ఛును. అన్ని దేశములలో ఎక్కడ బడితే అక్కడ ఊరూరికి, కోరినవారికి ఇవ్వవచ్ఛును. కాని పాదుర్లు ఉన్నచోట నేను ఇవ్వను . (యేసు ప్రభువు) ఎప్పుడును ఎవ్వరికిని బాప్తిస్మము ఇవ్వలేదు గాని ఆయన శిష్యులు ఇచ్చి రి." (జీవిత చరిత్ర పేజీ నెం.63, 2006).

"1938 జనవరి చివరి వారం దేవుడు నా గదిలో పట్టపగలు గాలిలో 'బైబిల్ మిషను' అను వ్రాతవ్రాసి నన్ను ప్రేరేపించిరి. కాబట్టి నేను బైబిలుమిషనును వెల్లడిలోనికి తెచ్చినాను." (జీవిత చరిత్ర పేజీ నెం. 65, 2006).

" 'నేనెవరినైన చూచి జాగ్రత్త అంటే వారు బ్రతుకరబ్బాయ్. మరి నేను ఆలాగు గద్దించను' అని అయ్యగారు అన్నారు" (జీవిత చరిత్రపేజీ నెం. 82, 2006).

"రాజమండ్రిలో ఒక మిషనరీ చాలా కాలం పని చేసినాడు. రాజమండ్రిలో, భీమవరంలో చాలా కాలం చేసినా రెవ.డా.హెచ్.సి.స్మిత్ దొరగారు. ఇలా వ్రాయకపోతే వారియొక్క వివరం తెలియదు. ఇప్పుడు జరుగుచున్న ఈ మీటింగు సమయంలో దర్శనంలోనికి వచ్చి, వారు ఈ మాటలు చెప్పిరి: 'దేవదాసుగారు నా జతపనివాడు. (అయ్యగారి గుండె దడదడలాడుచున్నది. ఎందుకనగా మీటింగుల యొక్క ఆయుష్కాలము తక్కువ(అనగా మీటింగులో బోధిచే బోధనా సమయం తక్కువ). ఈ విషయములన్ని, విశ్వాసులకు ఎప్పుడు చెప్పాలి అని!). అయితే, ఇప్పుడు ఆయన పరలోకంలో మాకందరకీ అధికారి అయినాడు. మేము ఆయన చేతిక్రింద పనివారంగా ఉన్నాము. అయ్యగారు పరలోక భక్తులకు క్రొత్త సంగతులు బోధించుచున్నారు. అందుకే త్వరగా రమ్మని వారు పిలుచుచు ఉన్నారు." (జీవిత చరిత్ర పేజీ నెం. 84-85, 2006).

"దేవుడు సర్వవ్యాపి అను లక్షణం గలవాడు, నాకును సర్వవ్యాపకత్వం గలదు అని చెప్పిరి. అంతేకాదు, 'దేవుడు ఈ లక్షణం అందరకును ఇచ్చినాడుగాని వాడుకొనుట లేదు' అని బోధించిరి." (జీవిత చరిత్రపేజీ నెం.93, 2006).

"భూలోకంలో, పరలోకంలో, పాతాళ లోకములోనికి ప్రభువు నన్ను తీసుకొని వెళ్లుచున్నారు. నేను వెళ్లుట లేదు" (జీవిత చరిత్రపేజీ నెం.95, 2006).

"అప్పుడు అయ్యగారు- నాకును, దేవునికినిగల సంబంధములు ఎన్నో గలవు. ఇక మీదట ఎప్పుడు అట్లు అడగవద్దు. ఈ సారి మాత్రమే చెప్పుతాను విను! నేను పనిచేస్తున్నా, పరుండియున్నా, ప్రయాణంలో ఉన్నా, నా ఆత్మ దేవునితోనే ఉండును. ఒక్కొక్కప్పుడు నా ఆత్మ దేవునితో కూడ మరియొక చోటికి వెళ్ళిపోవును. అప్పుడు ఒక వేళ నేను ప్రయాణంలో ఉంటే, నా శరీరంలో నేను లేను కనుక పడిపోవుదునేమో! అని పట్టుకోమన్నాను గాని అంత పడిపోయే పరిస్థితి రాదులే అన్నారు." (జీవిత చరిత్రపేజీ నెం. 134, 2006).

ఇది పరిస్థితి. అయ్యగారికి దేవునివలే సర్వవ్యాపకత్వం ఉందని, దేవుడే స్వయంగా పాదిరి ఆర్డినేషన్ ఇచ్చాడని, అది దేవుడిచ్చాడు కాబట్టి ఆయన సర్వలోక పాదిరి అయ్యాడని, పరలోక భక్తులకు ఆయన అధికారి అయ్యాడని, ఆయన ఆత్మ శరీరము నుండి బయటకు వచ్చి దేవునితో సంచరిస్తుందని - ఇవన్నీ ఎవరో పుట్టించిన వదంతులు కావు. స్వయంగా అయ్యగారే చెప్పుకున్న సంగతులు. అయ్యగారు మృదుస్వభావి కాబట్టి సరిపోయింది కానీ, ఆయనే కనుక ఎవరినైనా చూసి 'జాగ్రత్త ' అని అంటే మాత్రం ఇక అంతే సంగతులట! ఇలా భయపెట్టే కదా బాబాలందరూ దేవుళ్ళైపోయేది.

అయితే, ఇవన్నీ కేవలం బైబిల్ మిషను వారు కల్పించినవే తప్ప అయ్యగారు మాత్రం అలాంటివారు కాదని ఎవరైనా అనుకోవొచ్చు. అలా అయితే, ఇక బైబిల్ మిషను ప్రచురణలనేవి నమ్మటానికి వీలు లేదు. అయ్యగారి రచనలన్నీ వారి కల్పితాలే అనుకోవాల్సి ఉంటుంది. ఆయన గురించి ఇక ఏమీ తెలుసుకునే అవకాశం కూడా ఉండదు. అంతే కాదు ఒక మంచి దైవజనుని గురించి ఇంత తప్పుడు ప్రచారాలు చేసిన సంస్థ నుండి నిజాయితీ ఉన్న దేవుని బిడ్డలందరూ తక్షణమే తెగతెంపులు చేసుకోవాలి, లేదా వారి రచనలను ఉపసంహరించుకొని క్రైస్తవ సమాజానికి క్షమాపణ చెప్పమని ఒప్పించాలి. అలా కాదు, బైబిల్ మిషను నమ్మదగిన సంస్థయే, అయితే, వివరాలన్నీ ఉన్నదున్నట్లుగానే ప్రచురించారు అన్నది నిజమైతే, అప్పుడు అయ్యగారి నిజాయితీ మరియు విశ్వసనీయత ఇరుకున పడుతున్నాయి. ఎంత ప్రజాదరణ కోరితే మాత్రం ఇలా కూడా గొప్పలు చెప్పుకుంటారా! మరీ దేవుని స్థాయికి హెచ్చించుకొని, పరలోక విశ్వాసులకే అధికారిగా తమను తాము ప్రచురించుకుంటారా? 'అయినా అబద్ధాలాడాల్సిన అగత్యం అయ్యగారికేముంది? మీరే నమ్మటం లేదు కాని ఆయన చెప్పుకున్నవన్నీ నిజాలే' అని ఎవరైనా మాకు హితవు పలికే ప్రయత్నం చేయవచ్చు. అలా ఊరికే తిరస్కరించటానికైతే ఇదంతా నేను రాయాల్సిన పనుండేది కాదు. కాని నా తిరస్కారం న్యాయమైనదే, వాక్యానుసారమైనదే; ఈ తిరస్కారం సంఘక్షేమానికి అవసరమే అని రుజువు చెయ్యటానికే నా ఈ ప్రయాస.

అయితే ఇన్ని స్వంత డబ్బాల మధ్య, అక్కడక్కడా అయ్యగారి తగ్గింపు స్వభావాన్ని నిదర్శించే కొన్ని మాటలు కూడా అడపాదడపా కనిపిస్తుంటాయి. కాని ఇన్ని డాంబిక పలుకుల నడుమ అవి ఏ కోశానా సరిపోలేవు. ఉదాహరణకు ఆయన జీవిత చరిత్రలో ఇలాంటివి చదువుతాము:

"ఒక రోజున చార్లెసుగారు తన పెండ్లికార్డులు తీసుకొని వెళ్ళి అయ్యా పెండ్లికార్డు ఇదిగోండి! అన్నారు. అయ్యగారు అందులో ఏముందో చదివి వినిపించు అన్నారు. చార్లెస్ గారు చదవకుండానే, మరలా తీసుకోండి అన్నాడు. అప్పుడు అయ్యగారు, చదవకపోతే వెళ్ళు అన్నారు. వెళ్ళి బయట దిగులుతో కూర్చున్నారు. కొంత సేపటికి అయ్యగారే పిలిపించి, నీవు ఈ కార్డును నేను మొదట ముట్టవలెనని తలంచుచున్నావు. ఇది మంచిది కాదు. 'ఇది నరభక్తి' అని చెప్పి ప్రార్థన చేసి పంపినారు." (జీవిత చరిత్రపేజీ నెం. 48, 2006).

"బైబిల్ మిషను నాయకుడు ప్రభువే, నేను వెళ్ళిపోతాను నన్ను సమాధి చేయవద్దుగాని దహనం చేయండి. ఒకవేళ సమాధిచేస్తే ప్రజలందరు వచ్చి నాకే నమస్కారం చేస్తారు. వారంతా దేవునికి నమస్కారం చేయాలి కానీ, నాకు కాదు కదా! ఆయనకు చెందవలసినది నాకు వస్తే, అది గొప్ప నేరం. నేను 'దేవునికి లెక్క చెప్పాలి' " (జీవిత చరిత్ర పేజీ నెం. 148, 2006).

ఔను మరి. దేవునికి చెందాల్సినవి తమకు తామే ఆపాదించేసుకొని, మిగతావారు అలా చూస్తే మాత్రం అది గొప్ప నేరం అని చెప్పే ఈ రెండు నాలుకల ధోరణి అయ్యగారి వేషధారణకు అద్దం పడుతుందే తప్ప ఆయన తగ్గింపుకు కాదు. ఆయన సమాధి నుండి తీసిన మట్టికి ఎన్నో మహిమలు ఆపాదించే పిచ్చి భక్తికి, ఆ పిచ్చి కాస్తా ముదిరి, మీటింగ్ వేదికల మీద నాలుగు కుర్చీలు అనగా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలకు సమానంగా అయ్యగారికి కూడా ఒక కుర్చీ వేయడం, ఇవన్నిటికీ కేవలం భక్తులు మాత్రమే కాదు, అయ్యగారు కుడా దేవునికి లెక్క చెప్పి తీరాలి. ఎందుకంటే, ఆ మూఢభక్తికి ఆజ్యం పోసి పిచ్చి రగిలించేది అయ్యగారు చేసుకున్న స్వీయప్రకటనలే. భక్తులు అయ్యగారిని విగ్రహంగా చేసుకోవడం వారి తప్పే అయినా,  అందులో వారి తప్పు మాత్రమే కాదు అయ్యగారి మరియు బైబిల్ మిషనువారి తప్పు కూడా ఉంది కాబట్టి వారు కూడా దేవునికి లెక్క చెప్పి తీరాలి.

IV. రక్షణకు సంబంధించిన దుర్బోధలు

దైవ లక్షణాలన్నీ సంపాదించేసుకొని, స్వయంగా దేవుడే ప్రత్యక్షపరిచే బోధలు చేసే అయ్యగారి ప్రకటనలలో వాక్యవిరుద్ధమైన రక్షణసిద్ధాంతాలు ఉండటం సాధ్యం కాదు. కాని ఆయన రక్షణ సిద్ధాంతంలోనే దుర్బోధలు పుష్కలంగా కనిపిస్తుంటే, తనకు తాను ఆపాదించుకున్న దైవిక సుగుణాలను ఎవ్వరైనా ఎందుకు నమ్మాలి? బైబిల్ లో ఉన్న రక్షణ సువార్తకు భిన్నమైన సువార్త ఎవరు ప్రకటించినా వారు శాపగ్రస్తులే. ఇందుకు అపొస్తలులు మరియు పరలోకము నుండి దిగివచ్చిన దూతలు కుడా మినహాయింపు కారు (గలతి 1:8-9). అందుకే వాక్యభిన్న సువార్త బోధించిన దేవదాసు అయ్యగారు శాపగ్రస్తుడని వాక్యపు వెలుగులో దైర్యంగా నిర్ధారించి చెప్పగలను. ఇంతకూ అయ్యగారు రక్షణ సువార్తకు వ్యతిరేకంగా చేసిన దుర్బోధలు ఏమిటి? అక్కడికే వస్తున్నాను, ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం:

1) యేసు క్రీస్తులో మాత్రమే రక్షణ ఉందా లేదా యేసు క్రీస్తులో కూడా రక్షణ ఉందా?

"అయ్యగారు ఒకసారి మేరీ సీతమ్మ గారికి బూర ఇచ్చి , అంతదూరంలో నిలువబడి నాకు ఈలాగు ప్రసంగం చేయమన్నారు ( ప్రసంగం చేయుట నేర్పించుట కొరకు). ఎలాగంటే "మిమ్మల్ని మేము విగ్రహారాధన వదిలి పెట్టమని అనడం లేదు. యేసు ప్రభువుని తెలుసుకొని, ఆయనకు కూడా ప్రార్థన చేయండి అని మేము చెప్పుచున్నాము" " (జీవిత చరిత్రపేజీ నెం. 141, 2006).

ఇది పూర్తిగా వేరొక సువార్త. విగ్రహారాధన పరవాలేదని దేవుడు ఇవ్వని రాయితీలు ప్రకటించి ప్రజలను మభ్యపెట్టే బోధ నేర్పిస్తున్నారు. దానితో పాటు యేసు క్రీస్తుకు కూడా ప్రార్థన చేయమని అనటం మరింత బాధ కలిగించే బోధ. బైబిల్ 'యేసుక్రీస్తు కుడా' అనటం లేదు, 'యేసుక్రీస్తు మాత్రమే మార్గం, సత్యం, జీవమని, మరే నామంలోను రక్షణ లేద'ని బోధిస్తుంది (యోహాను 14:6, అపొ. కార్యములు 4:12). ఈ సత్యంతో రాజీపడమని నేర్పించే ఆత్మ, దేవునివద్ద నుండి వచ్చే ఆత్మ కాదు. ఇది తప్పకుండా సాతాను ప్రభావితమైన బోధ. ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పి కప్పిపెట్టాలని ప్రయత్నించినా, ఇదిగో అసలు రంగు ఇక్కడ బయటపడింది. ఇది వేరొక సువార్త కాకపోతే మరేంటి? 'ఏదేమైనా మేము మాత్రం ఆయననే సమర్థిస్తాం' అన్నది మీ తీర్మానమైతే, ఇందులో కూడా మీకు అబద్ధబోధ కనిపించకపోతే, మీరు పూర్తిగా వివేచన కోల్పోయి, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారని తెలుసుకోండి (యెషయా 5:20).

2) బాప్తిస్మము తీసుకుంటే పరలోకానికి వెళ్తామా?

"ఒక సంవత్సరములో ఆ గ్రామంలోని పెద్దలు చనిపోయిరి. గనుక క్రీస్తు మతంలోనికి వెళ్ళితే చనిపోతారు అనే ప్రచారం వచ్చినది. మతం మంచిది కాదన్నారు. అయ్యగారు దానికి సమాధానం ఒకటి చెప్పిరి. "వారు బాప్తిస్మము పొందకపోయినచో, చనిపోవుదురు. గనుక బాప్తిస్మము పొంది, పరలోకమునకు వెళ్ళే నిమిత్తం, ప్రభువు వారికి మరణమునకు ముందే బాప్తిస్మము ఇప్పించెను" అని చెప్పిరి. అప్పుడు మరలా వారికి నిరీక్షణ దొరికినది". (జీవిత చరిత్రపేజీ నెం.15, 2006).

ఇది అయ్యగారు బోధించిన వాక్యవ్యతిరేక సువార్త. బాప్తిస్మము ద్వారా పరలోకానికి వెళ్ళిపోవచ్చునని బైబిల్ బోధించదు. ఒక వేళ బాప్తిస్మము ద్వారా రక్షణ వస్తే, రక్షణ కృప చేత విశ్వాసం ద్వారా కాదు క్రియల మూలంగా కలుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇది అపోస్తలీయ బోధకు వ్యతిరేకం (ఎఫెసీ 2:8-9). క్రీస్తు చెల్లించిన క్రయధనం మాత్రమే పరలోకానికి చేర్చే సాధనం. ఆ స్థానాన్ని బాప్తిస్మానికి, లేదా ఇంకేదైనా నీతికార్యానికి ఇవ్వటం పూర్తిగా వేరొక సువార్తే ఔతుంది. బాప్తిస్మము లేకుండానే సిలువ మీద దొంగ ఎలా పరము చేరాడో (లూకా 23:43), బాప్తిస్మము పొందిన తరువాత కూడా గారడీ సీమోను ఘోర దుష్టత్వం మరియు దుర్నీతి బంధకము నుండి ఎందుకు విడిపించబడలేదో (అపొ. కార్యములు 8:13,21,23) ఆలోచించండి. రక్షింపబడినవారు అవకాశమున్న కొలది బాప్తిస్మము తప్పక పొందాలి, వాక్యానికి విధేయత కనపరచాలి. కానీ, బాప్తిస్మము పొందినవారందరు రక్షింపబడరు. ఇలా బాప్తిస్మము ద్వారా పరలోకం వెళ్ళారని వాక్యాభిన్న సువార్త ప్రకటించిన దేవదాసు అయ్యగారు వేరొక సువార్త బోధించారని చెప్పక తప్పదు. (బాప్తిస్మము ద్వారా రక్షణ కలుగుతుందని చెప్పేవారు వక్రీకరించిన వాక్యభాగాలకు వేరొక వ్యాసంలో వివరణ ఇచ్చాను( జయశాలి పరాజయం ); దానిని ఈ లింక్ ద్వారా చదవగలరు:).

జయశాలి పరాజయం

3) భాషల వరం లేకపోతే పరలోకానికి వెళ్ళలేమా?

"ఒక విడ్డూర సంగతి. అయ్యగారి ప్రార్థనా కూటంలోనికి పరలోకమునుండి ఒక పాత మిషనరీ వచ్చి, భూలోకంలో నేనున్నప్పుడు భాషనుగూర్చి నాకు తెలిసినది కాదు. అది సంఘ ప్రారంభ కాలం వారికే అనుకొన్నాను. నేను చనిపోయేటప్పుడు, 'అందరు చనిపోయాను' అని అనుకున్నారు. గాని 15 నిమిషాలు నా ప్రాణం నాలోనుండగా పరిశుద్ధాత్మవచ్చి , నాకు భాష నేర్పగా నాకు భాష వచ్చినది. అప్పుడు మోక్షమునకు వెళ్లగలిగితిని అని చెప్పిరి. భాష రానివారు మోక్షమునకు వెళ్ళే వీలు లేదని అయ్యగారు చెప్పిరి." (జీవిత చరిత్రపేజీ నెం.85, 2006).

ఇది అయ్యగారు బోధించిన వేరొక సువార్త. భాషావరం లేకపోతే పరలోకానికి వెళ్లరని బైబిల్ బోధించటం లేదు. ఆత్మవరాలను పరిశుద్ధాత్మ తన చిత్తం చొప్పున సంఘంలో పంచి ఇస్తాడని, ఆ క్రమంలో "కొందరికి" భాషల వరం, "కొందరికి" ప్రవచన వరం, "కొందరికి" స్వస్థత వరం, ఇలా మిగతా వరాలలాగే భాషావరం కూడా "కొందరికి" ఇవ్వబడే వరమని చదువుతున్నాము (1కొరింథీ 12:7-11). మిగతా వరాలకు భిన్నంగా భాషావరం మాత్రం "కొందరికి" కాదు, అందరికీ అందాలని బైబిల్ ఎక్కడా బోధించదు. "అందరూ భాషలతో మాట్లాడువారా?" అని అపొస్తలుడు అడిగిన ప్రశ్నకు కాదు అన్నదే సందర్భానికి తగిన జవాబు (1 కొరింథీ 12:28-31). అలా విశ్వాసులలో "కొందరికి" మాత్రమే ఇవ్వబడుతుందని, అందరికీ కాదని స్పష్టంగా చెప్పబడిన భాషావరాన్ని, మోక్షప్రవేశానికి షరతుగా విధించటం వేరొక సువార్త అని చెప్పక తప్పదు. చచ్చిపోయిన మిషనరీ వచ్చి చెప్పినంత మాత్రాన అది నమ్మాల్సిన అవసరం లేదు. (నిజాంగా వచ్చాడా అన్నది వేరే సంగతి). పరలోకము నుండి దూత దిగి చెప్పినా, అలా చెప్పినవాడు శాపగ్రస్తుడు. ఎందుకంటే అది వాక్యం చెప్పని వేరొక సువార్త. మరి భాష రానివారికి మోక్షం నిషేధించిన దేవదాసు అయ్యగారు ఎందుకు శాపగ్రస్తుడు కాదు?

4.మరణం తరువాత కూడా రక్షణ పొందే అవకాశం ఉంటుందా?

"ఒకనాడు నేను ప్రాతఃకాలముననే అయ్యగారికి 'మరనాత' చెప్పుటకు నమస్కరించుటకు వెళ్ళితిని. అయ్యగారు-అబ్బాయ్ నేను ఇప్పుడే నా సేవ ముగించుకొని వచ్చాను. పాతాళలోకము వెళ్ళి సువార్త చెప్పి వచ్చివేసాను. అక్కడ చాలామంది విద్యావంతులు ఉన్నారు. బి.ఎ.లు, యం.ఎ.లు చదివినవారున్నారు. వారు ఆడుకొనుచున్నారు, తిట్టుకొనుచున్నారు, కొందరు కొట్టుకొనుచున్నారు. భూమి మీద ఉండగా ఏ పనులు చేసిరో ఆ పనులే చేస్తున్నారు. మారలేదు. సువార్తకు చెవి పెట్టలేదు. అయితే, కొందరు వృద్ధులైన స్త్రీలు బాగా విన్నారు. ప్రతి దినం అయ్యగారు పాతాళలోకం వెళ్ళి బోధించి వచ్చి- నేను పాతాళ లోకంలో బోధచేసి వచ్చాను అని చెప్పేవారు. ఒకసారి అయ్యగారు విజయరత్నం గారితో- విజయరత్నం! నీవు సిద్ధపడు, ఈ రాత్రి మనం పాతాళమునకు వెళ్ళి బోధ చేసి వచ్చేదమన్నారు. అయ్యగారి ఆత్మ పాతాళం వెళ్ళి అక్కడ బోధించి వచ్చినది. మరుసటి దినమున "పాతాళంలో ఏడూ అంతస్తులు ఉన్నవి. వారు ఖైదీలు ఏ రీతిగా ఊసలలో ఉందురో అలాగే బంధింపబడి యున్నారు. తిట్టుకునే వారు తిట్టుకుంటూనే ఉంటారు. కొట్టుకునేవారు కొట్టుకుంటూనే ఉంటారు. వారు కఠినమైపోయి వాక్యం విన్నా నిర్లక్ష్యముగా ఉంటారని" చెప్పిరి. ఇక్కడ, మార్పు రాలేదు గనుక దేవుడు వారికి ఇంకా మారడానికి గడువు ఇచ్చి పరలోకమునుండి, భూలోకంనుండి బోధకులను పంపిబోధించుచున్నారు. అయినా మారుటలేదు మారినవెంటనే మోక్షం లోనికి వారిని చేర్చుకొనును." (జీవిత చరిత్రపేజీ నెం.126, 2006).

అయితే మొత్తానికి మన అయ్యగారు పాతాళలోకానికి కూడా వెళ్ళి సువార్త చెప్పారు. కాని ఇది యేసు ప్రభువు చెప్పిన విధంగా ధనవంతుడు యాతన పొందిన పాతాళం కాదు (లూకా 19:23-24). ఇది అయ్యగారి ఊహలలో పుట్టిన పాతాళం. ఇక్కడ రక్షణ లేకుండా చనిపోయినవారు చక్కగా ఆడుకుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. కానీ అలాంటి ప్రదేశమేదీ ఉన్నట్లు మనం బైబిల్లో ఎక్కడా చూడము. అయితే, ఇక్కడ మరింత ప్రమాదకరమైన బోధ ఏమిటంటే, మరణించి పాతాళానికి వెళ్ళేవారికి కూడా మరలా సువార్త విని రక్షింపబడే అవకాశం కల్పించబడుతుందట! ఇలాంటి బోధ రోమన్ కాథలిక్కులు మాత్రమే బోధిస్తారనుకుంటే అది పొరపాటే. దేవదాసు అయ్యగారు, సాధు సుందర్ సింగ్ గారు, తదితర పేరుగాంచిన "గొప్ప దైవజనులు" కూడా ఇలాంటి బోధకు వత్తాసు పలికారు. అయితే ఇది పూర్తిగా వాక్య వ్యతిరేకమైన సువార్త. గమనించండి, పరలోకము నుండి, భూలోకము నుండి దేవుడు భక్తులను పంపి పాతాళంలో ఉన్నవారికి సువార్త బోధిస్తున్నాడని, వారు నమ్మితే మోక్షం ప్రసాదిస్తాడని అయ్యగారు బోధించారు. కాని యేసు ప్రభువు మాత్రం, పాతాళానికి మరియు పరలోకానికి మధ్య ఉన్న అగాధం కారణంగా అక్కడ నుండి ఇక్కడికి లేదా ఇక్కడ  నుండి అక్కడికి రాకపోకలు సాధ్యం కాదని బోధించారు (లూకా 16:25-26). పరలోకము నుండి పాతాళానికి సువార్తికులను పంపుతున్నాడని అయ్యగారు ప్రకటిస్తే, పరలోకము నుండి ఒకనిని కనీసం భూలోకానికి పంపే వెసులుబాటును సయితం యేసు ప్రభువు కల్పించలేదు (లూకా 16:27-31). నేనైతే యేసు ప్రభువు బైబిల్ లో సెలవిచ్చిన మాటలే నమ్ముతాను. బైబిల్ లో చెప్పినదానికి భిన్నంగా అయ్యగారికి మాత్రం ప్రభువు వచ్చి చెవిలో చెప్పారని ఎవరైనా నమ్మాలనుకుంటే ఇక అంతకంటే విడ్డూరమేదీ ఉండదు. అయ్యగారు పాతాళలోకం గురించి చెప్పిన వివరాలు నిజం కావని వాక్యము నుండి నిర్ధారించుకోవచ్చు. కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి సువార్త చెప్పొచ్చేవారు అని చెప్పటం పచ్చి అబద్ధం. మరణాంతరం రక్షణ అవకాశం అనే సిద్ధాంతం కూడా పచ్చి అబద్ధం.

5) మరణానంతర రక్షణ అనే బోధను సమర్థిస్తూ అయ్యగారు తగిలించుకున్న వాక్యభాగాల సంగతి ఏమిటి?

"భూలోకంలో మారకుండా చనిపోయినవారు ఇక్కడ కడవరితీర్పు వరకు ఉందురు. ఆ తీర్పు రాకముందు యెవరును నరకములోనికి వెళ్ళరు. మారుటకై ప్రతివారికిని ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు ఎదో ఒక విధముగా దేవుడు సమయమిచ్చును. తృణీకరించువారు ఎక్కడను మారరు. (1పేతురు 4:6, 1 సమూయేలు 2:6, ఫిలిప్పీ 2:9-11, మత్తయి 8:12, ఆమోసు 9:2, హొషేయ 13 : 14. కీర్తన 139:8. ప్రకటన 1:18, లూకా 4:18, ఎఫెసీ 4:8,9)." (మహిమ వార్తావాళి,పేజీ నెం.6).

ఇందులో అయ్యగారు ఉదహరించిన ఏ ఒక్క వాక్యభాగం కూడా, చనిపోయిన తరువాత సువార్త వినే అవకాశం వస్తుందని బోధించటం లేదు.

A) 1పేతురు 4:6లో మృతులకు సువార్త ప్రకటించబడెను అనే ప్రస్తావన చేయబడింది. సజీవులుగా ఉన్నప్పుడు సువార్త విని, పేతురు ఈ పత్రిక రాస్తున్న కాలానికి చనిపోయిన మృతుల గురించి ఇక్కడ ప్రస్తావించబడింది తప్ప, చనిపోయిన మృతులకు పాతాళంలో సువార్త ప్రకటించబడుతుందనీ, అప్పుడు కూడా వారు రక్షణ పొందే అవకాశం ఉందని దీని అర్ధం కాదు. పేతురు మాటల సందర్భాన్ని 1 పేతురు 3:18 మొదలుకొని విశ్లేషిస్తే ఈ భావం స్పష్టమవుతుంది. నోవహు కాలంలో సజీవులుగా ఉండి హెచ్చరిక పొందిన వారిని ఇక్కడ ఉదాహరణగా పేర్కొనటం ఈ భావాన్ని ద్రువీకరిస్తుంది. వారు నేటికి మృతులైనప్పటికీ వారికి కూడా సువార్త ప్రకటించబడింది కదా.

B) 1సమూయేలు 2:6 ప్రకారం మరణ పునరుత్థానాలకు దేవుడే కర్త అని అర్థం ఔతుంది. దేవుడు సజీవులుగా చేస్తాడు, మృతులను పాతాళం నుండి రప్పిస్తాడని అని ఉంది తప్ప మరణం తరువాత సువార్త వినిపించి రక్షింపజేస్తాడనే అర్థంలో ఇక్కడ ఏమీ చెప్పబడలేదు. తీర్పు కొరకు పాతాళంలో ఉన్నవారిని దేవుడు సజీవులుగా రప్పిస్తాడని ఎన్నో వాక్యభాగాలు ఉన్నాయి (దానియేలు 12:2, యోహాను 5:28-29). అన్నట్లు "పాతాళం" అనే పదం హీబ్రూ భాషలో ఉన్న "షియోల్" అనే పదం నుండి అనువదించబడింది. దీనికి "సమాధి" అని కూడా అర్థం.

C) ఫిలిప్పీ 2:9-11లో యేసు నామమున ప్రతి మొకాలు వంగి, ప్రతి నాలుక యేసు ప్రభువని ఒప్పుకునే సందర్భం గురించి మాట్లాడుతుంది. ఇది అందరిలో క్రీస్తు మహిమపరచబడి, అన్ని నామములకు పైగా ఆయన నామం హెచ్చించబడే అంతిమ విజయాన్ని గురించే తప్ప అందరి రక్షణ గురించి మాట్లాడటం లేదని అయ్యగారికి తప్ప అందరికి తెలుసనుకుంటున్నాను. ఇది రక్షణ గురించి అయితే, నిత్య నరకాన్ని గురించి, అందులో నిత్య నాశనాన్ని అనుభవించేవారి గురించి బైబిల్ లో ఉన్న వచనాలన్నీ కొట్టివేయాల్సి ఉంటుంది. అది తెలిసే కాబోలు, సాతాను మరియు దయ్యముల రక్షణ కొరకు ప్రార్థిస్తూ, నరకాన్ని, నిత్యశిక్షను కూడా రద్దు చేయమంటూ దేవుని న్యాయానికి వ్యతిరేకమైన ప్రార్థన చేయటానికి సహితం అయ్యగారు తెగించారు. ఇది దేవుని న్యాయానికి వ్యతిరేకమైన ప్రార్థన అని ఒప్పుకుంటూనే బైబిల్ మిషనువారు ఈ సంఘటనను నమోదు చేయడం అభినందనీయం (జీవిత చరిత్ర పేజీ నెం. 97-98, 2006). ఇదే నిజాయితీ ఇతర అంశాల పట్ల కూడా వారు కనపరచి ఉంటే నాకు ఈ ప్రయాస తప్పి ఉండేది. అయినా, దేవునికంటే అధికనీతి తనకే తెలుసన్నట్లు, దేవునికంటే ఎక్కువ ప్రేమకనికరాలు తనకే ఉన్నాయనే విధంగా ఇంతటి ధిక్కారాన్ని ప్రదర్శించిన అయ్యగారిని తెలిసి-తెలిసి ఇంకా తమ భుజస్కందాల మీద మోస్తున్న వీరి నిజాయితీ ఏపాటిదో?

D) మత్తయి 8:12, ఆమోసు 9:2, హొషేయ 9:13, ఇవన్నీ తీర్పుకు సంబంధించిన వచనాలు. కీర్తనలు139:8 దేవుడిని సర్వవ్యాపి అని, ప్రకటనలు 1:18 యేసుక్రీస్తు ప్రభువు మృత్యుంజయుడు, నిత్యం సజీవుడని తెలుపుతున్నాయి. లూకా 4:18 మెస్సియా సువార్త పరిచర్యకు సంబంధించిన ప్రవచనం క్రీస్తులో నెరవేరిందని తెలుపుతుంది. ఈ వాక్యభాగాలకు మరణానంతర రక్షణ అనే అయ్యగారి వింత సిద్ధాంతంతో సంబంధమేమిటో!

E) ఎఫెసీ 4:8-9 వచనాలలో మృతులను గురించి ఏమీ చెప్పబడలేదు. అక్కడ క్రీస్తు ఈవులను తన సంఘానికి అనుగ్రహించాడనే సందర్భాన్ని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఆ ఈవులు ఏమిటో 11 నుండి 13 వచనాలలో చెప్పబడింది. ప్రవక్తలు, అపొస్తలులు, కాపరులు, సువార్తికులు, ఉపదేశకులు అనే ఈ ఈవులు బ్రతికున్న సంఘానికి ఇచ్చాడు తప్ప చనిపోయినవారికి కాదు. చెరలో ఉన్నవారు అనగానే భౌతికంగా చనిపోయినవారు అనే అర్థం రానవసరం లేదు. ఆధ్యాత్మిక బంధకంలో ఉన్నవారిని విమోచించి వారికి ఈవులను ఇచ్చాడు అని చెప్పటమే సందర్బోచితమైన వివరణ. అలాగే యేసు భూమి యొక్క క్రింది భాగములకు దిగెను అన్నప్పుడు భూమి నుండి పాతాళానికి దిగాడని కాదు, పైనున్న పరలోకము నుండి భూమి క్రింది భాగములకు దిగి వచ్చాడని దాని అర్థం. లేకపోతే, ప్రవక్తలు, అపొస్తలులు అనే ఈ తదితర ఈవులను ఆయన సంఘానికి కాదు పాతాళం నుండి చేరగా పట్టుకెళ్ళిన మృతులకు ఇచ్చాడని చెప్పాల్సి ఉంటుంది. అదే నిజమైతే, అది సందర్భంలో చెప్పబడిన సంఘాభివృద్ధి అనే ఉద్దేశాన్ని ఎలా నెరవేరుస్తుందో ఆలోచించండి.

అబద్ధబోధ చేయటమే గొప్ప నేరం. దానికి వాక్యం జోడించి సమర్థించుకోవటం ఆ అపరాధాన్ని వందరెట్లు అధికం చేస్తుంది. తన అబద్ధబోధ వాక్యానుసారమని మోసగించే కుట్ర ఫలించింది కాబట్టే, ఇంకా అనేకులు బైబిల్ మిషనులో కొనసాగుతున్నారు, వారి మోసానికి భాగస్వాములు ఔతున్నారు.

6) పరిశుద్ధాత్మను పొందటం ఇంత సులభమా?

"మనం మంచి నీరు త్రాగేటప్పుడు అందులోనుండి ఆయన ఆత్మ అల్లాడుచూ మనలోనికి వెళుతుందని మనం తెలుసుకోవాలి అని అయ్యగారన్నారు.అందుకనే అయ్యగారు నీరుకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు " (జీవిత చరిత్రపేజీ నెం. 52, 2006).

ఇది అయ్యగారి దుర్బోధ అనుకోవాలో అజ్ఞానమనుకోవాలో తెలియదు కాని, దైవలక్షణాలన్నీ సంతరించుకొని, ఆత్మపూర్ణులుగా, స్వయంగా ప్రభువు చెవిలో చెప్పినవే సెలవిచ్ఛే జగత్పాదిరికి ఆ రెండూ తగవు. యేసు క్రీస్తునందు విశ్వసించటం ద్వారా మనం పరిశుద్ధాత్మను పొందుతామని (యోహాను 7:37-39), అది యేసు మనకొరకు చేసిన రక్షణ కార్యంతో విడదీయరాని దీవెన అని (మత్తయి 3:11-12, యోహాను 14:16-17, ఎఫెసీయులకు 1:13-17) వాక్యం స్పష్టం చేస్తుంది. పరిశుద్ధాత్మ జలములపై అల్లాడింది సృష్టి చేసే క్రమంలోనే తప్ప ఎల్లప్పుడూ ఆయన ఎక్కడ నీళ్ళు కనిపిస్తే అక్కడ అల్లాడుతూ ఉంటాడని, ఆ నీళ్ళు త్రాగటం ద్వారా పరిశుద్ధాత్మను పొందగలమని వాక్యం చెప్పదు.ఇలా రక్షణతో సంబంధం లేకుండా నీళ్లు త్రాగే సామాన్య ప్రక్రియ ద్వారా పరిశుద్ధాత్మ మనలోకి ప్రవేశిస్తాడని చెప్పటం, వాక్యవిరుద్ధం, రక్షణ సిద్ధాంతానికి వ్యతిరేకం, జగమెన్నడూ కనివిని ఎరుగని విడ్డూరం. ఈ మాటలకు నవ్వుకుంటారో, జాలిపడతారో మీ ఇష్టం. అయితే ఈ దుర్బోధ దోషాన్ని తనతో పాటుగా బైబిల్ రచయితల ఖాతాలో కూడా జమకట్టాలని చూడటం మరింత గొప్ప నేరం. బైబిల్ రచయితలే స్వయంగా వచ్చి ఆయన చెప్పిన బైబిల్ వివరం సరియైనది అని ధృవీకరించేవారట (జీవిత చరిత్ర పేజీ నెం. 93-94, 2006). అంటే, ఈ పచ్చి అబద్ధాన్ని మోషే స్వయంగా ద్రువీకరించి, ఆదికాండము1:2కి అయ్యగారు చెప్పిన అన్వయింపు సరియైనదే అని నిర్థారించినట్లేనా? అంతే కాబోలు! ఇలా దేవుని వాక్యంపై మాత్రమే కాదు, వాక్య రచయితలపై కుడా అయ్యగారు తమ దుర్బోధల ప్రతాపాన్ని ప్రయోగించారు. ఏమి సాధించటానికో ఇంతటి దిగజారుడుతనం!

7) చివరికి సువార్తను ఇలా జంతువులపాలు చేసేశారా?

"జీవ రాసులకు బోధించే అనుభవం: ఎవరైనా సరే నడుము కట్టుకొని ప్రాణత్యాగం చేసివస్తే, మృగములకు, పక్షులకు, జంతువులకు బోధించే భాష నేర్పించెదనని దేవదాసు అయ్యగారు అన్నారు. అవి పొడిచేవైనా, చంపేవైనా, వాటికి సువార్త చెప్పితే వాటి స్వభావం మారిపోయి, వాటికి మన మీద ప్రేమ పుట్టును. ఆలాగు వాటికి చెప్పకపోతే మనదే నేరం, మనదే అజ్ఞానం, మనదే మందము, మనదే పొరపాటు" (జీవిత చరిత్ర పేజీ నెం.83-84, 2006).

"సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి" (మార్కు 16:15) అనే ఆజ్ఞ అయ్యగారి దైవజ్ఞానానికి బహుశ ఇలా గోచరించి ఉంటుంది. అందుకే కష్టపడి జంతువుల భాషలన్నీ నేర్చేసుకున్నారు కాబోలు! వాటికి పేర్లు పెట్టిన ఆదాము కూడా ఇంత ప్రయాసపడి ఉండకపోవచ్చు. కాని మార్కు 16:15లో ఉన్న ఆజ్ఞకు సమాంతర వాక్యభాగాలన్నీ అది మనుష్యులనే ఉద్దేశించి ఇవ్వబడిన ఆజ్ఞ అని దృవీకరిస్తున్నాయి (మత్తయి 28:19-20, లూకా 24:44 అపొ. కార్యములు 1:8). మనుష్యుల కొరకే గాని, మరే జీవరాసుల కొరకైనా యేసు క్రీస్తు ప్రభువు తన రక్తాన్ని చిందించలేదు కాబట్టి, సువార్త క్రూర జంతువులను సాధుజంతువులుగా మార్చటానికి దోహదపడుతుందని, మనం వాటికి బోధించకపోవటం నేరం అని చెప్పటం ఘోరం. అయితే ఇక్కడ కూడా అయ్యగారు హాస్యం పండించటం మరచిపోలేదు. తమకు అన్ని జీవరాసుల భాషలు వచ్చని, తెగించి వచ్చేవారికి నేర్పిస్తానని చెప్పటం, టార్జాన్, మోగ్లీ వంటి కొందరు చిరపరిచయస్తులను తలపించే విధంగా ఉంది.

ఇక్కడ మరో ధర్మసందేహాం! అయ్యగారు శాసిస్తే బల్లమీద పడగ విప్పి ఉన్న ఒక పాము దిగివచ్చి, నేలమీద‌ తన తల కొట్టుకుని - కొట్టుకుని చచ్చిపోయిన సంఘటన ఒకటి బైబిల్ మిషన్ వారు ఎంతో గొప్పగా రాసి ప్రచురించుకున్నారు (జీవిత చరిత్ర పేజ్. 111-112, 2006). అయ్యగారికి జంతువుల భాషలు అన్నీ వచ్చు అన్నది  నిజమైతే, మరి ఆ పాముకు దాని భాషలో బుసబుసమంటూ సువార్త బోధించి, దానిని సాధుజంతువుగా ఎందుకు‌ మార్చనట్లో! అలా సువార్త చెప్పుంటే దాని స్వభావం మారిపోయి దానికి అయ్యగారి మీద ప్రేమ పుట్టుందేది కదా!!  ఆలాగు దానికి చెప్పకపోవడం ఆయనదే  "నేరం", ఆయనదే  "అజ్ఞానం", ఆయనదే  "మందము", ఆయనదే  "పొరపాటు" అని కనీసం ఆయన మాటలనైనా ఆయనకు అన్వయించి ఆలోచించరా? అయినా, అప్పుడు వాడకపోతే వాడకపోయారు, తన అనుచరులకు మాత్రం అయ్యగారు ఆ సర్పబాష‌ బాగా వంటపట్టించారు లెండి. వారి ప్రచురణలు అనర్గలంగా కొట్టే బుసబుసలే అందుకు నిదర్శనాలు. వివేచన అనుగ్రహించబడినవారు తప్ప ఆ మోసపు‌ మాటలను ఎవరు తప్పించుకోగలరు?

8) యేసుక్రీస్తు శరీరరక్తాలు ఇలా కూడా అందుతాయా?

"ప్రభువు భోజన సంస్కారం ఎంత తరచుగా ఆచరిస్తే అంత మంచిది. విశ్వాసికి అంతరంగంగా క్రీస్తుయొక్క శరీరరక్తములు దానిలో అందును. సమభోకత్వము పుచ్చూకున్న వెంటనే కొందరు రోగులు స్వస్థపడుదురు" (బైబిల్ మిషను,పేజీ నెం.4, 2007).

ప్రభువు భోజన సంస్కారంలోని రొట్టెద్రాక్షారసాలు అక్షరాలా ప్రభువు శరీరరక్తాలుగా పదార్థాంతరం చెందుతాయని ఒక తప్పుడు రోమన్ కాథలిక్ సిద్ధాంతం నుండి పుట్టిన ఆలోచనను ఇక్కడ అయ్యగారు బోధిస్తున్నారు. కాని ఇలా రొట్టె ద్రాక్షారసం ద్వారా యేసు శరీరరక్తాలు మనకందుతాయని బైబిల్ ఎక్కడా బోధించదు. అదే నిజమయ్యుంటే, మన రక్షణకు అదే సరిపోయుండేది. యేసు క్రీస్తు సిలువపై మరణించకుండానే అది సాధ్యపడుండేది. ఎందుకంటే యేసు ప్రభువు తన శిష్యులకు ప్రభురాత్రి భోజన సంస్కారం మొదట ఇచ్చినప్పుడు అయన ఇంకా మరణించలేదు. అయితే, ఇలాంటి పదార్థాంతరవాద బోధ రక్షణ సువార్తను, ప్రభువు వ్యక్తిత్వాన్ని, వాక్యంలో అనేక సత్యాలను ఎలా తూలనాడుతుందో నిరూపిస్తూ వేరొక పుస్తకం మీకు అందుబాటులో ఉంది. ఈ లింక్ (ప్రభురాత్రిభోజన వివాదము - దాని పరిష్కారం ) ద్వారా అది చదివి అయ్యగారి ఈ బోధ ఎంత వాక్య విరుద్ధమైనదో గ్రహించగలరు.

ప్రభురాత్రిభోజన వివాదము దాని పరిష్కారం

ఇక్కడ నేను బహిర్గతం చేసిన బైబిల్ మిషను దుర్బోధలకు జవాబుగా బహుశ వారు తమ రచనలలో ఉన్న కొన్ని సత్యబోధలను చూపించే ప్రయత్నం చేయవచ్చు. ఉదాహరణకు, యేసుక్రీస్తులో మాత్రమే రక్షణ ఉందని, రక్షణ కృప చేత విశ్వాసము ద్వారా కలుగుతుందని రాసుకున్న సందర్భాలు కుడా బైబిల్ మిషను ప్రచురణలలో లేకపోలేదు. అయితే, అలాంటివి ఎత్తి చూపించటం వారిని మరింత సమస్యలోనికి నెడుతుందే తప్ప పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే, బైబిల్ మిషనులో పరస్పర భిన్న బోధలు చేయబడతాయని చెప్పటానికి, దుర్బోధను తెలివిగా సత్యబోధతో కలగలిపి మోసగిస్తున్నారని నిరూపించటానికి తప్ప అవి ఎందుకూ పనికిరావు.

V. దయ్యం కథలు

మనకు తెలిసిన రక్షణ బోధలోనే ఇన్ని అబద్ధలు కల్పించిన అయ్యగారు, మనకు తెలియని లేదా నిర్థారించుకోలేని సంగతులు చెబితే వాటిని ఎందుకు నమ్మాలి? దేవుని గురించి అబద్ధాలు చెప్పినవారు, దయ్యం గురించి మాత్రం నిజాలు చెబుతారా? అయినా, అయ్యగారు చెప్పుకున్న దయ్యం కథలు అలాంటి ఇలాంటి కథలు కావు. దేవుడు మొదలుకొని దయ్యం వరకు అయ్యగారి అబద్ధాలకు ఎవ్వరూ మినహాయింపు కారని మీకు కూడా తెలియాలి కదా! అందుకే ఈ హార్రర్ దృశ్యాలను మీ ముందు ప్రసారం చేస్తున్నాను. అయితే, ఈ కథలను ఆస్వాదించటంలో పడి, వాటిని వాక్యపు వెలుగులో పరిశీలించే పని మాత్రం మరచిపోకండి. ఇక కథలలోనికి వెళ్ళిపోదాం:

1) సర్కస్ దయ్యం:

"లూథర్ గిరిలో అయ్యగారు సేవకులకు వాక్యం చెప్పుట ప్రారంభించారు. అనగా బైబిలు తరగతులు నిర్వహించేవారు.అయ్యగారు బంగళా పై గదిలో బల్ల వేసికొని, అక్కడ బైబిలు చదువుకుంటూ బోధిస్తూ ఉండేవారట. ఆ బంగళా ఎదురుగా ఉన్నపెద్ద ఈతచెట్టుమీద ఒక దయ్యం తలవిరబోసుకొని, అయ్యగారి వైపు చూస్తూ ఉండేదట. ఎందుకనగా ఏదో ఒక విధంగా పాడుచేయాలని. అయితే ఆయనకు దయ్యాలంటే ఏమి భయం?

ప్రతి నెలలోను అక్కడ మిషనరీల సదస్సు జరిగేది. ఒకసారి హాస్టల్లో కలరా వస్తే, పిల్లలందరిని ఇళ్లకు పంపేసారు.అప్పుడు మిగిలిన పిల్లలు కొందరు అయ్యగారి దగ్గరకు రాగా, దయ్యాన్ని చూస్తారా! అని వారిని అడిగి, ఆ ఈత చెట్టుమీద దయ్యాన్ని చూపించారట. అది ఆ ట్రైనింగ్ బంగళా దగ్గరనున్న బావిమీదనుండి ఆ గట్టు మీదనుండి ఈ గట్టు మీదకి, ఈ గట్టు మీదనుండి ఆ గట్టు మీదకి, తల మీద కుంపటి పెట్టుకొని గంతులేస్తున్నదట! వారు భయపడకుండా అప్పుడు అయ్యగారు వారికొరకు ప్రార్థన చేశారట." (జీవిత చరిత్ర పేజీ నెం. 10-11, 2006).

ఈ కథలోని దయ్యం వట్టి సర్కస్ దయ్యం మాత్రమే. బైబిల్ ప్రకారం దయ్యాలు వచ్చేది ఇలాంటి వినోద విన్యాసాలు చూపించటానికి కాదు. అయినా ఈ పతనమైన ఆత్మలు శరీరం ధరించుకోగలవని చెప్పటానికి బైబిల్ లో ఎలాంటి ఆధారాలు లేవు. అందుకు భిన్నంగా, అవి ఎప్పుడూ ఇతరుల శరీరాన్ని ఆవహించి, వాటి క్రియలు జరిగించేవని చదువుతాం. దర్శనరూపంలో కాకుండా నేరుగా, ప్రభువు తప్ప ఎవరైనా వాటిని చూశారని చెప్పటానికి బైబిల్ లో ఎలాంటి దాఖలాలు లేవు. యేసు ప్రభువు దయ్యాలను పారద్రోలినట్లు చదువుతామే తప్ప వాటిని ఎవ్వరికైనా, ఎప్పుడైనా చూపించలేదు. బైబిల్ లో భక్తులెవ్వరూ అలా చేయలేదు. అలాంటప్పుడు, అయ్యగారు చెప్పిన ఈ కథ ఎందుకు నమ్మాలి? దీనికంటే ఆసక్తిగొలిపే దయ్యంకథలు మనం కూడా మన అమ్మమ్మలు, తాతయ్యలు చెప్పగా వినివుంటాం. వారేమీ మన అయ్యగారిలా తప్పుడుబోధలు కూడా చేసుండరు. అయినా వారి కథలన్నీ నమ్మేస్తున్నామా ఏంటి? దురాత్మలను ఎదుర్కోవటం భౌతికం కాదు ఆధ్యాత్మికం (ఎఫెసీ 6:12).

2) పెంపుడు దయ్యం:

"అయ్యగారి గది దగ్గర ఎప్పుడు ఒక భూతముండెడిది. అది అయ్యగారిని ఆవరించి మ్రింగివేయవలెనని ఆయనను వదిలిపెట్టకుండా ఎదురుచూస్తా ఉండేది. అది ఆ స్థలమును వదిలి పెట్టుట లేదు. ఆ గదియందు మకాం వేసుకొనినది. అది ఉండుట అయ్యగారికి క్షేమం. అది కట్టబడిన గాడిదవలె కట్టుకర్రకే కట్టబడియున్నది. గాని ఆ కట్టనుండి కదిలిపోవాలని దానికున్నను, అయ్యగారు దానిని పోనీయకుండ కట్టివేసిరి. ఆయన కట్టు విప్పనిదే అది ఎట్లు పోవును. అది పోవుటకు పరిగెత్తుచుండగా గదిలోనే కట్టివేసినారు. అయ్యగారి అంతమును చూడవలెనని, అది సెలవు తీసుకొని చూచిపోదామని వచ్చిన, భూతమును. 'వచ్చినదానవు రానే వచ్చావు, నా గదిలోనే ఉండు నిన్ను కట్టి వేస్తానని' అయ్యగారు కట్టివేసినారు. అయ్యగారు దానిని కట్టి వేయుటకు కారణమేమనగా, ఉన్న దయ్యములను భూతములకు బుద్ధి వచ్చునని అయ్యగారు ఆ పని చేసిరి. కట్టబడిన గాడిద కట్టు విప్పితే పోవును గాని కట్టివేస్తే ఎట్లు పోవును? అయ్యగారు దానికి కట్టిన కట్టును విప్పిపొమ్మంటే పరిగెత్తుకొని పోవును. (జీవిత చరిత్రపేజీ నెం. 53-54, 2006).

ఇంకా నయం, దయ్యాన్ని కట్టి పడేశారని మాత్రమే చెప్పి సరిపెట్టుకున్నారు. అది పాలిచ్ఛేదని, గుడ్లు పెట్టేదని, చివరికి దానిని వండి తిన్నారని ఇలాంటివేమీ చెప్పనందుకు సంతోషిద్దాం. అయినా నాకు తెలియక అడుగుతాను, దయ్యాన్ని ఏ తాడుతో కట్టేసుంటారో! సరే అది అలా ఉంచండి, కట్టేసిన దయ్యాన్ని చూసి ఇతర దయ్యాలకు బుద్దొచ్చేస్తోందా? అలా బుద్ధి చెప్పటానికే కదా దయ్యాన్ని కట్టేసింది. నిత్య నాశనపు తలంపులే రప్పించలేని బుద్ధి (మత్తయి 8:29), అయ్యగారు కట్టేస్తే వచ్చేస్తుందా? అయ్యగారు, తమరి కథలు బైబిల్ మిషను వారు నమ్ముతారేమో కానీ, బైబిలును మాత్రమే ప్రమాణంగా తీసుకునేవారికి వీటిని ఎలా చూడాలో బాగా తెలుసు.

3) మెకానిక్ దయ్యం:

"ఒకప్పుడు రాజమండ్రి నుండి బండిపై కోరుకొండ తీర్థమునకు సువార్త చేయుటకు వెళ్లుచుండగా, దయ్యము ఆయనను పడవేయవలెననే ఉద్దేశంతో బండి చక్రమునకున్న సాయి మేకు ఊడదీసెను. ఆత్మనేత్రం కలిగిన అయ్యగారు బండి దిగి ఆ దయ్యమును పిలిచి,మేకు లాగివేసినావు గాన నీ వ్రేలు ఆ రంధ్రములో ఉంచి త్వరగా బండిని తోలుమని ఆజ్ఞాపించెను. ఆ దయ్యము ఆలాగే ఆ రంధ్రములో తన వ్రేలు పెట్టి, బండిని కోరుకొండ గ్రామం చేరువరకు తోలుకొని వెళ్లెను. అక్కడ ఆ బండివానితో చక్రం మేకు ఊడిపోయింది. చూచుకొమ్మని జాగ్రత్తగా వెళ్ళమని అయ్యగారు చెప్పెను. బండి ముసలాయన 'అయ్యో అయ్యగారిని పడవేసేవాడనే' అనెను. పాపం అతనికేమి తెలుసు అసలు సంగతి. (జీవిత చరిత్ర పేజీ నెం. 54, 2006).

కథ రసవత్తరంగానే ఉందిగానీ, బైబిల్ చెప్పే వాస్తవాలతో పొసగటం లేదు. "నా చేతులను, నా పాదములను చూడుడి. నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని" (లూకా 24:39) స్వయంగా యేసు ప్రభువే సెలవిచ్చాడు. భూతానికి కాళ్ళుచేతులు, మాంసము ఎముకలు ఉండవుగాని, సాయి మేకు రంధ్రములో పెట్టటానికి వ్రేలు మాత్రం ఎలా వచ్చిందో? భౌతికమైన బండి, భౌతికమైన మేకు, భౌతికమైన రంధ్రం, కాని భూతం వ్రేలు మాత్రం ఆత్మీయమైనదని కావాలంటే చెప్పుకోవచ్చు. అయ్యగారు పడిపోకుండా పట్టుకోవటానికి ఎదో ఒకటి చెప్పుకోవాలిగా మరి!!! అయినా మిగతా మాటలన్నీ ప్రభువు వాక్యంతో పెద్ద పొసిగినట్లు, ఇక్కడ మాత్రం పొసగకపోతే ఎవరికట నష్టం?

4) చిలిపి దయ్యం:

"గుడివాడ వాస్తవ్యుడు ఒకాయన పుస్తకం వ్రాసి అయ్యగారిని దిద్దమన్నారు. అయ్యగారు దిద్దినారు. అయితే, అయ్యగారు ఈ మాటన్నారట.ఇప్పుడు దిద్దిన పుస్తకంపై సిలువగుర్తువేసి ఉంచండి. లేకపోతే దయ్యం ఎత్తుకొని పోతుందన్నారు. ఆయన నిజంగా దయ్యం ఎత్తుకుపోతుందేమో అని తలంచి ఆ పుస్తకం పై సిలువగుర్తు వేయించినారు. మరునాడు ఉదయమున లేచి చూస్తే ఉంది. అప్పుడు అచ్చు ఆఫీసుకు వెళ్లి అచ్చు వేయించినారు. దయ్యమెత్తుకొని పోలేదు.

రాజమండ్రిలో ఒకాయన పుస్తకం రాసినారు. అయ్యగారిని దిద్దమన్నారు. అయ్యగారు పై వ్యక్తికి చెప్పిన మాటనే ఈయనకు కూడా చెప్పినారు. అయితే ఆయన ఈలాగన్నారు. దయ్యమునకు కాళ్లున్నవా? చేతులున్నవా? ఏమి! అయితే పెట్టెలో పెడతాను. పెట్టికి తాళం వేస్తాను. అప్పుడు ఏలాగు ఎత్తుకు వెళ్లగలదో చూస్తాను అన్నాడు. సిలువ గుర్తు వేయలేదు. అయితే, ఇప్పటికి 30 సంవత్సరాలు అయినది. గాని ఇంతవరకు ఆ పుస్తకం అచ్చుపడలేదు. మొదటి వ్యక్తి విశ్వసించినాడు, నమ్మినాడు. సిలువగుర్తు వేసినాడు. గాని ఈ రెండవ వ్యక్తి నమ్మలేదు. కాబట్టి సిలువ వేయలేదు. అందుచేత ఈ 30 సంవత్సరాలకు కూడా ఆ పని జరగలేదు." (జీవిత చరిత్ర పేజీ నెం. 90, 2006).

ఈ కథ నుండి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి. సిలువ గుర్తుకు దేవుని శక్తి ఆరోపించే ఒక్క వచనమైనా బైబిల్ లో ఉందా? సిలువ గుర్తును ప్రోత్సహించటం విగ్రహారాధనను ప్రేరేపించటం అవ్వదా? సిలువగుర్తు యేసు ప్రభువు కంటే శక్తిగలదా? సిలువగుర్తు లేనిదే దయ్యం నుండి దేవుడు కాపాడడని, ఉంటే అది దయ్యము నుండి భద్రపరుస్తుందనటానికి వాక్య ఆధారాలు ఏమున్నాయి? అన్యులు తాయత్తులు, మంత్రాలు వాడే విధంగా క్రైస్తవులు సిలువ గుర్తును వాడాలా? క్రీస్తు సిలువ మరణానికి, దానిని ఆధారం చేసుకున్న సువార్తకు నిత్య జీవము అనుగ్రహించే శక్తి ఉందని వాక్యం బోధిస్తుంది. కాని సిలువ గుర్తుకు ఏ మహిమలైనా ఉన్నట్లు మూఢభక్తిని ప్రభలపరిచే ఇలాంటి అబద్ధ బోధకులు మాత్రమే చెబుతారు. దయ్యాన్ని దూరం చేసేదిపోయి దయ్యానికి ఆతిథ్యమిచ్చే ఇలాంటి విగ్రహారాధన పద్ధతుల నుండి మనలను మనం కాపాడుకుందాం.

5) ఆడ దయ్యం:

"ఆత్రేయపురం టి.సుందరరావు అనే ఆయన అయ్యగారినొద్దనుండగా, ఒక సారి ఆయన అయ్యగారితో 'సాతాను ఎలాగుంటదని' అడిగారు. ఒక రాత్రి ఒంటి గంటకు అయ్యగారు సుందరరావు గారితో 'అబ్బాయ్! రోడ్డుమీద ఒక స్త్రీ వెళ్ళిపోతుంది, పాపం భర్తమీద కోపముంచి కాబోలు ఆమెను పిలుచుకొని రా, లేక ఏ సంగతి తెలుసుకొని రా' అని పంపిరి. ఆయన ఆమె వెంట వెళ్లుచు, ఏమ్మో? నిన్నే పిలిచేది! మాట్లాడవేమిటి! ఆగవమ్మా! అనగా కోరుకొండ వెళ్లే రోడ్డు రెండుమైళ్ళు దూరం వరకు పరిగెత్తినదట, వెనుదిరిగి మాట్లాడలేదట. అప్పుడు ఈయనగారికి ఆయాసంవచ్చి తిరిగి వచ్చినారట. మరుసటి ఉదయం, అయ్యగారు, అబ్బాయ్! రాత్రి సంగతి చెప్పావు కాదు? అని అడుగగా- 'నేనెన్ని పిలుపులు పిలిచినను ఆమె మాట్లాడలేదు, ఎంతో దూరం వెలుతూనేయున్నది. నాకు ఆయాసమువచ్చి తిరిగి వచ్చానండి అని చెప్పగా- అబ్బాయ్! నీవు కోరుకున్నావుకదా! ఆమే దయ్యము, బాగాచూచావా! అని అన్నారట" (జీవిత చరిత్ర పేజీ నెం. 99, 2006).

ఇంతకంటే విడ్డూరమేముంటుంది? సాతాను ఎలాగుంటదని అడిగిన పాపానికి, దారెమ్మట వెళ్ళే ఒక ఆడమనిషి వెంట పంపించి, ఆమె ఆగకుండా వెళ్ళిపోతే, అదే దయ్యం అంటాడా? సర్కస్ దయ్యం తలవెంట్రుకలు విరబూసుకొని ఉందని వర్ణించినప్పుడే అనుకున్నాను, ఇక్కడ నిర్ధారణమైపోయింది. సాతాను ఎలా ఉంటాడో అందరికి అర్థమయ్యింది కదా?  రూపం సంతరించుకోగలదని బైబిల్ లో ఏ ఆధారం లేని దయ్యానికి అయ్యగారు ఒక స్త్రీ రూపాన్ని అమర్చటం అద్భుతం!! అమోఘం!!! ఎందుకైనా మంచిది, రాత్రి ఒంటిగంట దాటాక, కోరుకొండ మార్గంలో వెళ్లేవారు ఏ స్త్రీ జోలికీ వెళ్ళకండి సుమా!!!

6) దయ్యం, దయ్యం, దయ్యం:

"అయ్యగారు శానిటోరియం కొండమీదనుండగా అయ్యగారి గదియొద్దకు ఎన్నో దయ్యాలు వచ్చేవి. అప్పుడు అయ్యగారిదగ్గర ఏలీయాగారు ఉన్నారు. అబ్బాయి నీవు ప్రభు యేసు రక్తమునకు జయము- సైతాను క్రియలకు లయము అని ద్వారబంధములకు వ్రాయుము. స్తుతి మానకుము అని చెప్పిరి. అలాగే ఆయన స్తుతించిరి. రక్తస్తుతి చేయగా ప్రభు యేసు రక్తము కనబడి, ఆ దయ్యములు ఇంటి లోపలికి రాలేదు." (జీవిత చరిత్ర పేజీ నెం. 114, 2006).

సాతానుతో మనం చేయాల్సిన అసలు పోరాటం నుండి ఇలాంటి కథలు మన దృష్టి మళ్ళిస్తాయి. ఇది కూడా సాతాను కుట్రలో భాగమే అని మనమంతా గుర్తించాలి. సర్వాంగకవచం ధరించుకొని, పోరాడి జయించాల్సిన శత్రువును, రక్త స్తుతి, సిలువ చిహ్నం, తదితరమైనవాటితో ఎదుర్కోవచ్చని నేర్పించటం, అసలు పోరాటం నుండి మన దృష్టిని ఒక కల్పితదృశ్యం వైపుకు తిప్పుతుంది. మనం ఈ యుద్ధాన్ని పోరాడే జయించాలన్నది దీని ఉద్దేశం (ఎఫెసీ 6:10-18). ఈ యుద్ధంలో చిహ్నాలు, మంత్రాలు ఏ సహాయమూ చేయవు. స్వయంగా యేసు ప్రభువు దగ్గరకు సాతాను వచ్చాడు (మత్తయి 4:3). దేవుని సన్నిధిలో సాతాను నిలువబడినట్లు అనేక సందర్భాలలో చదువుతాము( యోబు 1:6,2:1, జెకర్యా 3:1). అలా రాకుండా దేవుడు ఆపలేక కాదు. రక్తస్తుతి , సిలువగుర్తు ఆయనకంటే గొప్పవి కావు. ఆయనే అనుమతిస్తున్న పోరాటాన్ని, వాక్యంలో ఆయన నేర్పించిన పద్ధతి ద్వారా జయించటం ఆయనకు మహిమ తెస్తుంది. అయ్యగారి కల్లబొల్లి కథలతో యుద్ధాన్ని తప్పుగా అర్థం చేసుకొని, తప్పుడు పరిష్కారాల వైపుకు తిరగకండి. యేసు రక్తము, మనం రక్తస్తుతి చేసి ప్రత్యక్షపరచుకొగలిగే శక్తి కాదు. అది మనలను దేవునితో సమాధానపరచటానికి ఒక్కసారే చిందించబడి, సదా మనలను భద్రపరిచే సాధనం. ఈ భద్రత రక్షణ ద్వారా మన స్వంతం చేయబడింది. మళ్లీ మంత్రం చెప్పి దానిని ప్రయోగించటం లాంటిది వాక్యం మనకు నేర్పించదు. ఈ భద్రత, యుద్ధం నుండి మనలను మినహాయించదు, సాతాను మనవద్దకు రాకుండా ఆపదు. కానీ వచ్చినప్పుడు వానిని ఎదుర్కోటానికి అవసరమైన ధైర్యాన్ని మరియు మనం యేసురక్తము ద్వారా వెలపెట్టి కొనబడిన దేవుని బిడ్డలం అనే నిశ్చయతను ఇస్తుంది.

7) అసలు దయ్యం:

"ఆలాగు ఆయన జీవితమంతటిలో దయ్యాల్ని ఆట ఆడించారు. ఆయన రమ్మంటే అవి వచ్చినవి, పొమ్మంటే పోయినవి." (జీవిత చరిత్రపేజీ నెం.55, 2006).

అన్నిటికంటే కుటిలమైన సాతాను కుతంత్రం నకిలీ సువార్తలు పుట్టించే దుర్బోధకులను దైవజనులుగా నమ్మబలకటమే (1 కొరింథీ 11:3-4,14-15). ఇందుకు గొప్ప నిదర్శనం దేవదాసు అయ్యగారే అని ఆయన బోధించిన పలురకాల భిన్న సువార్తలను బహిర్గతం చేయటం ద్వారా ఇప్పటికే రుజువు చేసాను. అసలు దయ్యాన్ని మరుగు చేసేలా కల్పిత దయ్యం కథలను చమత్కారంగా చిత్రీకరించిన అయ్యగారిని, వాటిని ప్రచురము చేస్తూ ఇంకా సహకరిస్తున్న బైబిల్ మిషను వారిని ఎలా అర్థం చేసుకోవాలో, దేవుని బిడ్డలకు తెలుసనుకుంటాను. అసలుదయ్యాన్ని గుర్తించి అప్రమత్తంగా ఉంటే, నకిలీ దయ్యాలతో భయపడాల్సిన అవసరం ఉండదు.

VI. అంతా అబద్ధం

బైబిల్ మిషను ప్రచురణలలో ఎన్నో అబద్ధాలు, అసంబద్ధాలు కనిపిస్తాయి. సామాన్య విషయాలలో నిజాయితీ లేనివారు, బైబిల్ బోధల పట్ల నమ్మకత్వం చూపించనివారు చెప్పుకునే దర్శనాలు, దైవిక అనుభవాలు ఎవ్వరూ నమ్మాల్సిన పని లేదు. వారి గ్రంథాలలో కనిపించే స్వస్థతలు, అద్భుతాలు మరియు ప్రత్యక్షతలను అస్సలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఇక్కడ నేను ఉదాహరించే సందర్భాలలో వారి అబద్ధాలు, అసంబద్ధాలు, పరస్పర వైరుధ్యాలు గమనించండి. "మిక్కిలి కొంచంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయంగా ఉండును" (లూకా 16:10). ఈ చిన్నచిన్న విషయాలలో కనబడే నిజాయితీరాహిత్యం, వారి సిద్ధాంత బోధలన్నిటినీ, వారు చేసిన పెద్దపెద్ద పరిచర్యలన్నిటినీ ప్రశ్నార్థకంగా మార్చేసాయనటంలో ఎలాంటి సందేహమూ లేదు.

1) అయ్యగారు లూథర్ మిషను నుండి వేరై బైబిల్ మిషను స్థాపించటానికి కారణం ఏమిటి?

అయ్యగారే ఈ ప్రశ్న లేవనెత్తి దానికి ఒక జవాబు చెప్పారు. ఒకసారి అది చదివిన తరువాత, ఆయన చెప్పిన జవాబులో ఎంత నిజాయితీ ఉందో పరిశీలిద్దాం:

"ప్రశ్న: మిమ్మును పైకి తీసుకొని వచ్చిన అమెరికన్ ఇవాంజిలికల్ లూథరన్ మిషనును విడిచిపెట్టుట న్యాయమా?"

జవాబు: నేను ద్వేషభావము చేతగాని, నాకు ఏదో ఒక కష్టం కలుగుట వలనగాని, ఏదో ఒక నేరస్థాపన ఉండుట వలనగాని, పోషణ చాలకపోవుట వలన గాని, విడిచిపెట్టియుండిన యెడల గొప్ప దోషమే. కాని దేవుడు వచ్చివేయుమని చెప్పగా వచ్చివేయుట న్యాయమే గదా! మిమ్మును దేవుడు రమ్మనిన రారా యేమి? నన్ను గౌరవంతోను, ప్రేమతోను చూచుచున్న మిషనును విడిచిపెట్టుట ఎంత కష్టమైయుండును?" (జీవిత చరిత్ర పే నెం. 29, 2006).

అయితే, ఈ జవాబులో అయ్యగారు దేవుడు పిలిచాడు కాబట్టే లూథర్ మిషను నుండి బయటకు వచ్చానని చెప్పటం నిజం కాదని ఇతర సందర్భాలలో ఆయన చెప్పిన మాటల నుండి బహిర్గతం ఔతుంది. ఆయనను వ్యక్తిగతంగా కష్టపెట్టిన ఒక సంఘటన ఈ వేర్పాటుకు అసలు కారణం. అలాంటి కారణంతో బయటకు వచ్చియుంటే అది గొప్ప దోషమని అయ్యగారు చెప్పిన మాట పైన చదివారు కదా? అంటే తన మీద తానే తీర్పు చెప్పుకున్నారన్నమాట. ఇంతకూ అయ్యగారు లూథర్ మిషను నుండి వేర్పడటానికి అసలు కారణం ఏమిటో ఈ క్రింది మాటలలో గమనించండి:

"అప్పుడాయన (కోల్మన్ దొరగారు) చెప్పినదేమనగా, "వల్లపడదు, 'step out 'బైటకు వెళ్లు. మరొక సంఘముగా ఏర్పడి, బోధించుకొనండి. అప్పడు మేము ఇతర మిషనులను గౌరవించినట్లు మిమ్మును కూడా గౌరవింతుము. (జీవిత చరిత్ర పే నెం . 23, 2006).

"మీటింగు అయిన తరువాత న్యూడార్ఫర్ గారు వచ్చి నాతో చాలా సేపు సంభాషణ చేసి, మిషనులోనికి రమ్మని చెప్పిరి. అప్పుడు నేను "స్టెప్ ఔట్ (బయటకు వెళ్ళు!) అని వారు అన్న తర్వాత వెళ్లిపోవలెను గాని వెనుకకు ఎందుకు రావలెను? ఆ మాట మీరు విన్నారు గదా!" అని అన్నాను.

"మీరు లూథరన్ మిషనులోనే ఉండి పని చేయుట పరిశుద్ధాత్మయొక్క ఇష్టమని' నాకు ప్రార్థనలో తోచినది అని న్యూడార్ఫర్ గారు నాకు రాసిరి. step out అని అనకపోతే లూథరన్ మిషను లోనే ఉండిపోదును. కాని రిజైన్ చేయకముందే స్టెప్ ఔట్ అని, వారు కొట్టివేసికొంటే, ప్రభువు నాకేమి చెప్పునో సంగతి ఏలాగు ఉండునో నాకు ఏలాగు తెలియును?" (జీవిత చరిత్ర పే నెం. 24, 2006).

ఈ మాటలలో స్పష్టంగా తెలిసిన విషయమేమిటంటే లూథర్ మిషను వారు 'స్టెప్ ఔట్' అనటాన్నిబట్టి అయ్యగారు నొచ్చుకున్నారు. మళ్ళీ వచ్చినా వినిపించుకోకుండా, దేవుని ప్రత్యక్షతను అడ్డంపెట్టుకొని వారి నుండి వేరయ్యారు. 'స్టెప్ ఔట్' అనుండకపోతే అందులోనే కొనసాగుండేవాడినని అయ్యా గారు చెప్పింది ప్రత్యేకంగా గమనించండి. అంటే వారు 'స్టెప్ ఔట్' అనుండకపోతే దేవుడు బైబిల్ మిషనును బయలుపరచకపోయుండేవాడే అన్నమాట!! అబద్ధాలాడినప్పుడు అవి అతకకపోతే చూడండి ఎన్ని తంటాలో!!!

2) ఇలా కూడా ప్రవచనాలొస్తాయా?

"అప్పుడు అయ్యగారు, కాంతమ్మగారు 'వేరు' శనగపప్పు తెచ్చినారు అన్నారు. అయ్యగారు ఆలాగు అనిన మరసటి సంవత్సరంలో 'బైబిలు మిషను' లోనుండి ఇండియా బైబిలు మిషను వేరైపోయినది." (జీవిత చరిత్ర పే నెం. 18-19, 2006).

ఒక మిషనునుండి మరో మిషను వేరుకావటానికి కాంతమ్మగారు వేరుశనగపప్పు తెచ్చారనటానికి మధ్య ఎంత సంబంధముందో, అయ్యగారి ప్రవచనాలకూ మరియు సత్యానికీ మధ్య అంతే పొంతన ఉందని అర్థం చేసుకోవాలి. మా అమ్మ మైసూరు బజ్జి చేసిందని చెప్పి సంవత్సరంలోపు నేను మైసూరు వెళ్లివస్తే అది ప్రవచన నెరవేర్పు ఔతుందా? ఆయన ఎదో ప్రవచనమని సంబరపడితే పడ్డారు కాని రాసి ప్రచురించేవారికైనా ఉండొద్దా కాస్తయినా? లేదా చదివేవారంతా మరీ అలా కనిపిస్తున్నారా?

3) పరలోకం కూడా సాంకేతికంగా అభివృద్ధి చెందుతుందా?

"కనుక బైబిళ్ళు పరలోకములో అచ్చుపడి వస్తాయి అని చెప్పిరి" (జీవిత చరిత్ర పే నెం. 2, 2006).

జాన్ గూటన్ బర్గ్ గారు పరలోకం వెళ్ళిన తరువాత ఇక్కడ వారు కనిపెట్టిన అచ్చుయంత్ర పరిజ్ఞానాన్ని పరలోకానికి పరిచయం చేసుంటాడులే. అంతకుముందే పరలోకం ఈ పరిజ్ఞానాన్ని వాడుంటే, మోషే కాలము మొదలుకొని యోహాను ప్రకటనల వరకు అన్నీ అచ్చు వేయబడే వచ్చుండేవి. రాతిపలకలు, చర్మపు చుట్టాలు, పెపైరస్ కాగితాలతో పనుండేది కాదు. అలా అయితే, చార్లెస్ బాబేజ్ గారు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కూడా పరలోకానికి నేర్పించేసుండొచ్చు కాబట్టి ఇక ఏకంగా బైబిళ్లు అచ్చు వేయబడి కాకుండా, కిండిల్ వర్షన్లలో పంపబడతాయేమో.

4) పరలోకంలో బైబిళ్ళతో పాటు దొంగ నోట్లు కూడా అచ్చు వేస్తారా?

"ఒకసారి వీరు కొన్ని కరపత్రములు ప్రచురణ కొరకు ఇచ్చారు. అయితే వాటిని తిరిగి తెచ్చుటకు, 'డబ్బు లేదని' అయ్యగారితో అనగా, అయ్యగారు మోకరించి ప్రార్థించమన్నారు. ఒక అరగంట తరువాతవెళ్ళి చూడమన్నారు వెళ్లి చూడగా, పెట్టెలో డబ్బు లేదు. మరలా రెండు గంటలు మోకరించి ప్రార్థించమన్నారు. ఆ తర్వాత మరలా వెళ్ళి పెట్టెలో చూడమన్నారు. వెంటనే వీరు పెట్టె తెరిచి చూసారు. అంతే, పెట్టెనిండా డబ్బే. కావాలసినంత వరకు తీసుకొని ప్రింటింగ్ కొరకు మహా హుషారుగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు. చాలా ఆనందంగా వెళ్లి ప్రింటింగ్ కు డబ్బులు కట్టివేశారు. కావాలసినంత సొమ్ము తీసుకొన్న తరువాత పెట్టెలో చాలా డబ్బులున్నవని పెట్టెకు మూడు తాళాలు వేశారు, ఆ తరువాత అంత డబ్బు ఉన్నదో లేదో, అని పెట్టె తీసిచూస్తే, డబ్బు లేదు. పెట్టె ఖాళీగా ఉన్నది. అపుడు అయ్యగారు అన్నారు- 'ఇప్పుడు నీకు డబ్బుతో అవసరము ఏమిటీ? మరలా నీకు డబ్బు అవసరమైతే, ప్రార్థన చేయి ప్రభువు ఇస్తారు. నీకు కావాల్సినంత ఇస్తారు' అని అన్నారు." (జీవిత చరిత్ర పే నెం. 148-149, 2006).

ప్రభుత్వం అచ్చు వేసిన సంఖ్యకు మించి ఒక్క అదనపు నోట్ కూడా ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశించకూడదు. అలా వచ్చేవి దొంగ నోట్లుగా పరిగణించబడతాయి. సంఘ విద్రోహశక్తులు ఇలాంటి పనులు చేస్తాయని మనకు తెలుసు. అలాంటి చర్యను అయ్యగారు దేవునికి ఆపాదించటం, తనకు అవసరమొచ్చినప్పుడు తన పెట్టెను డబ్బులతో నింపటం, దేవునికి దొంగనోట్ల నేరాన్ని ఆపాదించటమే ఔతుంది. దేవుడు అలాంటి పని చేయడని మనకు తెలుసు కాబట్టి ఇది పచ్చి అబద్ధమని మనం తేల్చేసేయొచ్చు. పన్ను కట్టటానికి అవసరమైన నాణెం పేతురుకు చేప నోటిలో దొరికిందే తప్ప ఇంటిలో ఉన్న పెట్టెలోకి ప్రత్యక్షం కాలేదు (మత్తయి17:27). నీటిలో పడిపోయిన నాణెం చేప నోటిలోనికి పోయే అవకాశం ఉంది కాబట్టి ఆ ఉదాహరణ ఇక్కడ పనికి రాదు. కొందరు, దేవుడు దర్శనంలో పరీక్ష పేపరు బయలు పరిచాడని, ఇంటర్వ్యూలో అడగబోయే ప్రశ్నలు ముందే చూపించాడని, ఇలాంటివేవో చెప్పి తమకు తెలియకుండానే దేవునిని మోసగానిగా చేస్తున్నారు. ఇక్కడ అయ్యగారు కూడా అలాంటి పొరపాటే చేశారు. అర్థశాస్త్ర మూలపాఠాలు తెలియక పప్పులో కాలేశారు. దేవుడు ఎన్నడూ చేయకూడని పనిని ఆయనకు అన్యాయంగానో, అమాయకంగానో ఆపాదించిన అయ్యగారి ఇతర సాక్ష్యాలను కూడా మనం అస్సలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఒక సాక్ష్యం అబద్ధమని తేలాక కూడా నమ్మటం, ఆత్మవంచన చేసుకోవటమే ఔతుంది, ఈ మోసంలో పాలుపంపులు పొందటమే ఔతుంది.

5) డబ్బులు ముట్టుకుంటే ఏంటి, ముట్టుకోకపోతే ఏంటి?

"డబ్బులు ముట్టుకొనుట వీరికి అలవాటు లేదు. చందా వేయునప్పుడు కాగితములో చుట్టి చందావేయువారు. డబ్బులు ముట్టుకొనినవారిని, లోషన్ తో చేతులు కడుగుకొనిన పిదప ఆయన గదిలోనికి రానిచ్చేవారు, అప్పుడు మాత్రమే ఆయన వస్తువులు ముట్టుకొన-నిచ్చేవారు." (జీవిత చరిత్ర పే నెం. 1-2, 2006).

అబ్బో, చాలా మంచి అలవాటు!! కాని ఎందుకలా? డబ్బులు ముట్టుకుంటే పాపమా? లోషన్ తో కడుగుకుంటే ఆ పాపం పోతుందా? మొత్తానికి దీని వల్ల మనం నేర్చుకోవాల్సిన నైతిక సూత్రం ఏమిటో తెలియదు కాని ఇది కూడా మరో అబద్ధమని మాత్రం ఈ క్రింది మాటలనుండి అర్థం చేసుకోవచ్చు:

"అందులో అయ్యగారు చెయ్యి ఉంచి ప్రార్థన చేసి పది రూపాయల కాగితములు క్రొత్తవి నాలుగు తీసి, బైట ఉన్న పాలవాడికి ఇచ్చిరా! అనగానే ఆయన వెళ్ళి పాలవాడికి ఇచ్చి వచ్చారట." (జీవిత చరిత్ర పే నెం. 99-100, 2006).

ఆయన డబ్బులు ముట్టుకోకపోతే మనకొరిగే లాభం కాని ముట్టుకుంటే వచ్చే నష్టం కాని ఏమిలేదు. అలాంటప్పుడు, ఇంత పనికిమాలిన అబద్ధమాడాల్సిన అగత్యమేమొచ్చిందో మరి!!

6) కాకి ఏమని అరుచును?

"ప్రతి రోజు అయ్యగారి గది పక్కనే సరిగ్గా సాయంత్రం ఐదు గంటలు అవ్వగానే నిమ్మ చెట్టు మీదకి పిచ్చుకలన్నీ చేరి సన్నిధి చేసేవి. ఒక గంట సమయం, అనగా సాయంత్రం ఐదు గంటలనుండి ఆరు గంటల వరకు ఒకే కాకి వచ్చి కావ్ కావ్ అని అరిచేది. అయ్యగారు అదేమంటుందో వినండి, చూడండి అనే వారు. అది రాకడ, రాకడ అంటుంది అని చెప్పారు" (జీవిత చరిత్ర, పే నెం. 143-144, 2006).

కాకి నిజంగా 'రాకడ, రాకడ' అనే అరిచిందనుకుందాం. ఎవరి రాకడో చెప్పనిది ఆ అరుపు వలన ప్రయోజనం ఏముంటుంది? దేవుడు ఇలాంటి పనికిమాలిన అద్భుతాలు చేస్తాడని ఎందుకు నమ్మాలి? యేసు ప్రభువు రాకడ ప్రకటించే బాధ్యత సంఘానికి ఇవ్వబడింది. అది సమర్థవంతంగా ప్రకటించటానికి పరిశుద్ధాత్మ శక్తి వాగ్దానం చేయబడింది. మనం చేయాల్సిన పని కాకులు, గద్దలు చేస్తున్నాయని సంబరపడిపోవటం వల్ల ప్రయోజనం ఏముంది? ప్రభువును ప్రస్తావించకుండా కాకి 'రాకడ, రాకడ ' అని అరిచినా, పావురం 'పోకడ, పోకడ' అని అరిచినా ఎందుకు పట్టించుకోవాలి? మన మనసు చిన్నపిల్లలవంటిదవ్వాలి, తెలివి కాదు.

7) దీనికి శీర్షిక ఏమని పెట్టాలో?

{91} "సాయంకాలము ఐదు గంటల తరువాత అయ్యగారు Enema ఇవ్వమన్నారు. ఆ చివరి రోజు అమ్మా! నా దగ్గరికి పరిశుద్ధులు వస్తారు. గాలిపోతే వారికి బాగోదు అని చెప్పి ఇవ్వమన్నారు. అప్పుడు ఎనిమా ఇస్తే, ఏదో కొంచెం motion అయ్యింది. చివరి వరకు అంతగొప్ప శుద్ధిని వారు పాటించారు. ఒక రోజున డాక్టర్ కురిగుంట్ల కాంతయ్యగారు వచ్చి, అయ్యగారిని బార్లీ త్రాగమంటే, దేవుడిచ్చిన నీళ్లు వదిలేసి, మనుష్యులు కల్పించిన కల్తీ నీళ్ళు త్రాగమంటారా! అని అయ్యగారన్నారు. ఇక ఆయనకు నోట మాట రాలేదు"( జీవిత చరిత్ర పే నెం. 157).

అంత మూర్ఖంగా కూడా ఆలోచిస్తారా అని ఆశ్చర్యంతో బహుశ డాక్టరుగారికి నోట మాట రాకపోయుండవచ్చు. అదేదో పెద్ద గర్వకారణమన్నట్టు రాసి ప్రచురించుకుంటున్నారు. 'దేవుడిచ్చిన నీళ్లు' అనటం బాగానే ఉంది కాని బార్లీ 'మనుష్యులు కల్పించిన కల్తీ నీరు' ఎందుకౌతుంది? బార్లీ పంట అనుగ్రహించింది నీళ్లు సృష్టించిన దేవుడు కాదా? మనుష్యులు కల్పించిన బార్లీ వాడకూడదు కాని ఎనిమా మాత్రం వాడొచ్చా? లేదా ఆ ఎనిమా ప్రత్యేకంగా పరలోకము నుండి పంపబడిందా? ఇలాంటి దైవజ్ఞానము బయలుపరచటానికి ఒక అయ్యగారు!! అది ప్రచురించి లోకాన్ని ఉద్ధరించటానికి ఒక మిషను!!!

8) ఆత్మ సంచారం, పరకాయప్రవేశం, ఇవి కూడా క్రైస్తవ్యంలో ఉన్నాయా?

"నా కట్టే మంచమీదనే ఉన్నది కాని సర్వదేశాలకు ఆత్మ వెళ్లి సంచారం చేయుచూ వస్తున్నది. ఒక్క నిమిషంలో ఏడూ స్థలాలకు ఆత్మ వెళ్లి వస్తున్నది అని దైవ జనులు చెప్పిరి". (జీవిత చరిత్ర పే. నెం.14, 2006).

"ఒక సారి తణుకు దగ్గరనున్న 'వేలివెన్ను' గ్రామములో భీమవరం యాకోబుగారు మీటింగ్ లో ప్రసంగించుచుండగా, అయ్యగారే ఆయనలో ఉండి ప్రసంగించుచుండినట్లుగా ఉన్నది. ఈ విషయం స్టేజ్ మీద ఉన్న మిగతా ముగ్గురు పెద్దలు మీటింగు బయటికి వచ్చి గ్రహించిరి. దేవదాసు అయ్యగారి దగ్గరకు వచ్చి ఈ విషయములన్ని చెప్పగా... మీటింగుకు నేను కూడా వచ్చాను కదా! యాకోబు నోవాహు ప్రసంగము మాట్లాడుతుంటే నేను మాట్లాడాను గదా!" అన్నారు. అయ్యా నిజమేనండి మేము కూడా గ్రహించాము అనగా అయ్యగారు ముసిముసి నవ్వు నవ్వుకున్నారు" (జీవిత చరిత్రపే నెం. 153-154, 2006).

ఇక్కడ అయ్యగారు చెప్పిన ఆత్మ సంచార అనుభవం, మరియు వేరొకరి శరీరంలోనికి ప్రవేశించటం వంటివి, ప్రాచీన భారత దేశ సాధువులు చెప్పుకునే అనుభవాలు. ఉదాహరణకు ఆదిశంకరాచార్యుని జీవిత చరిత్రలో ఇలాంటివి కనిపిస్తాయి. అన్యులు చెప్పినప్పుడు అబద్ధమని సునాయాసంగా కొట్టిపారేస్తాం. ఇప్పుడు 'క్రైస్తవుడు' చెప్పుకున్నంత మాత్రాన ఇవి నిజమైపోతాయా?స్వస్థతలు, అద్భుతాలు, ప్రత్యక్షతలు అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి, వాక్యాధారం లేని ఇలాంటి అన్యమత మూఢనమ్మకాలను క్రైస్తవ్యంలోనికి ప్రవేశపెట్టి సంఘాన్ని ఏమి చేద్దామని? ఇలాంటి ఆలోచనలు చెప్పి, వాటిని ద్రువీకరించి మోసగించే అద్భుతాలు చేసింది ఏ దేవుడో? బైబిల్ లోని దేవుడు మాత్రం కాదు సుమా!

ఇన్ని అబద్ధాలు ఆడిన బైబిల్ మిషనువారు చెప్పిన ఏ మాటనైనా, ఎవ్వరైనా ఎందుకు నమ్మాలి? దేవుడు అయ్యగారిని పిలిచాడని,ఆయనకు కనబడ్డాడని, ఆయనతో, ఆయన ద్వారా మాట్లాడాడని, పరలోకానికి వెళ్లి ఎవరినో దిగబెట్టి వచ్చాడని, ఎన్నో స్వస్థతలు చేశాడని, ఇంకా ఎన్ని మహిమలు ఆయనకు ఆపాదించినా, ఎన్ని పుస్తకాలు రాసి ప్రచురించినా, ఈ అబద్ధాలకు, తప్పుడుబోధలకు సంజాయిషీ చెప్పుకోకపోతే అన్నీ ఉత్తుత్త మాటలే. వాటిని వెంబడించేవారు బైబిల్ మిషనుకు నమ్మకంగా ఉంటారేమో కాని బైబిల్ కు మాత్రం కాదు!!

 VII. దొంగ దర్శనాలు, దయ్యపు ప్రత్యక్షతలు

దేవదాసు అయ్యగారు చెప్పుకున్న కొన్ని దర్శనాలు మరియు ప్రత్యక్షతలను పరిశీలించినప్పుడు, అవి అబద్ధపు దర్శనాలని, సాతాను ప్రభావం క్రింద కలిగిన మోసపూరిత అనుభవాలని ఇట్టే పట్టేయొచ్చు. వాటిలో కొన్నిటిని మీ ముందు ఉంచుతాను, శ్రద్ధగా పరిశీలించండి:

1) భూతముల బోధ 

"బైబిల్ మిషను ఎందులో ఎక్కువ?

1.దర్శనవరములో ఎక్కువ అనగా ధ్యాన కాలమందు విశ్వాసికి, క్రీస్తు, దేవదూతలు, పరలోక భక్తులు, మొదలగువారు వంతుల ప్రకారము కనబడి మాటలాడుట. భూలోకములోని భక్తుల ఆత్మలు, భక్తి హీనుల ఆత్మలు కనబడి మాటలాడుట. క్రీస్తును యెరుగకుండా చనిపోయి పాతాళములో నున్నవారు కనబడి మాటలాడుట. భూతములు కనబడి మాటలాడుట. వీరందరు క్రీస్తు సెలవు మీదనే వత్తురు. తరువాత క్రీస్తు కనబడి పిశాచి మాటలను నమ్మవద్దు, భయపడవద్దు అని ఆదరించుట." (మహిమ వార్తావళి, పే నెం. 91).

చచ్చిపోయినవారి ఆత్మలు, పాతాళానికి సహితం వెళ్లినవారి ఆత్మలు వచ్చి బోధించటం అనేది బైబిల్ భక్తుల అనుభవాలలో ఎక్కడా కనిపించదు. వాస్తవానికి ఆత్మలోకంతో ఎలాంటి సంప్రదింపులైనా జరిపే వ్యవస్థను బైబిల్ ఖండిస్తుంది, నిషేధిస్తుంది (లేవీయకాండము 19:31, 20:6,27, ద్వితీయోపదేశకాండము 18:10-12). దేవునివాక్యం నిషేధించిన పద్ధతిలో దేవుడు ప్రత్యక్షతలు పంపిస్తాడని చెప్పటం, ప్రజలను నిషిద్ధమైనవాటి వైపుకు తిప్పే సాతాను కుతంత్రమే తప్ప మరేమీ కాదు. ఈ చనిపోయినవారి ఆత్మలు, భూతాలు వచ్చి మాట్లాడే అదే 'ధ్యానకాలాలలో' యేసుప్రభువు కూడా వచ్చి మాట్లాడతాడు అని చెప్పటం, ఈ మోసానికి కావాల్సినంత బలం చేకూరుస్తుంది. వీరి అబద్ధబోధలకు యేసు క్రీస్తుని బాధ్యుని చేసే ఈ కుతంత్రం సామాన్య నేరమేమీ కాదు. భూతం వచ్చి బోధిస్తాడన్నది బహుశ నిజం కావొచ్చు. వీరి బోధలన్నీ దాదాపుగా అలాగే ఉంటాయి కదా. అయితే, భూతం వచ్చి బోధించిన తరువాత యేసుప్రభువు వచ్చి భూతం మాటలు నమ్మొద్దని చెప్పటం అనేది నిజంగా జరిగుంటే, ఇన్ని అబద్ధ బోధలు చేస్తున్న బైబిల్ మిషను అసలు ఉనికిలోనికి వచ్చుండేది కాదు.

2) ఈ బైబిల్ ఎంత!! దానికి వందరెట్లు ఎక్కువే ఉన్నాయి మా దగ్గర!!!

మిస్సమ్మగారు ప్రభువు చెప్పేవన్నీ నోట్స్ లో వ్రాసి, టిన్ డబ్బాలో పెట్టి సీలు చేసేవారు. మన ఎదరనున్న గదికంటే అది పెద్దగది. ప్రభువు చెప్పగా వ్రాసిన పుస్తకాలన్నిటితో ఆ గది నిండిపోయినది. అయ్యగారి పుస్తకం కూడా అందులో ఉన్నది. ఆ 5గురు చనిపోయిరి కాని ఆ గదిని, ఆ గదిలోనున్న వ్రాతలు అన్ని రాకడ వరకు ఉండునని వారు నిరీక్షించారు. వారు రాకడ వరకు ఉంటామని నమ్మి, ఆ వ్రాతలు వారికి ప్రభువు అప్పజెప్పితే, రాకడ వరకు ఉంటవని భద్రపరచిరి. ఆ వ్రాతలన్నీ తీసి అచ్చువేస్తే తెలుగు బైబిళ్లు సుమారు 100 బైబిళ్లు అవ్వచ్చు. అవి లోకమంతటికి పంపాలి. ఆ పుస్తకమునకు దిట్టమైన ఖరీదు వేయాలి. అని ప్రభువు చెప్పారు. ఈ మెంబర్లంతా భయపడ్డారు. ఆ ఖరీదు కూటస్థులు పెట్టుకోవాలి. రాబోయే ప్రజలు అనగా ఇవి కొనబోయే ప్రజలు భాగ్యవంతులై ఉంటారనుకొన్నారు. వారికి ఇప్పుడున్నంత జీతములులేవు. (జీవిత చరిత్ర, పే నెం.59,60, 2006).

అసలు ఏమి మాట్లాడుతున్నారో తెలివుండే మాట్లాడుతున్నారా? ఈ ప్రత్యక్షతలు రాసినవారు రెండవ రాకడ వరకు ఉండాలని ప్రభువు ఉద్దేశించియుంటే వారు ఎలా చనిపోయినట్లు? ఈ మెంబర్ల ద్వారా వంద బైబిళ్ళంత ప్రత్యక్షతను పంపుతానని దేవుడు బైబిల్ లో ఎక్కడైనా చెప్పాడా? కొత్తనిబంధన వస్తుందని పాత నిబంధనలోనే స్పష్టంగా చెప్పబడినట్లు, ఈ బైబిల్ కాకుండా మరో ప్రత్యక్షత గ్రంథం అనుగ్రహించబడితే అది దేవుడు ముందే తెలియజేసుండాలి కదా? లోకమంతటికీ పంపాలని దేవుడు చెప్పిన ప్రత్యక్షతలు గదిలో తాళం వేసి ఉంచే అధికారం మీకెవరిచ్చారు? దిట్టమైన ఖరీదు వేసి అమ్మమని కూడా దేవుడు చెప్తాడా! దేవునిలో హఠాత్తుగా ఇంత ధనాపేక్ష ఎందుకు పుట్టిందంటారు? దిట్టమైన ఖరీదు వేయమంటే ఆ మెంబర్లు భయపడటమెందుకు? కరపత్రాలు ప్రింట్ చేయాలంటేనే, పెట్టెను ధనంతో నింపిన దేవుడు, తానే ఇచ్చిన ఈ శ్రేష్ఠమైన ప్రత్యక్షతను అచ్చు వేయటానికి ఎన్ని పెట్టెలనైనా నింపలేడా? బైబిళ్లు పరలోకంలో అచ్చు వేయబడి వస్తున్నాయని అయ్యగారు సెలవిచ్చినట్లు, ఇవి కూడా పరలోకంలో ఎందుకు అచ్చు వేయబడి రావటంలేదు? అలా ఇచ్చేస్తే, దిట్టమైన ధర ఎక్కడ నష్టపోవాల్సుంటుందో అని దేవుడేమైనా టెన్షన్ పడుతున్నాడా? అదంతా సరే, ఇంతకు ఈ మిస్సమ్మగారి ప్రత్యక్షతను దాచిన గది ఎక్కడుందో కాస్త చెప్తారా? ఆ గది మరియు అందులోని రాతలు రెండవ రాకడ వరకు వుంటాయన్నారు కదా? అది ఎక్కడుందో చెప్పే కనీస సాహసమేమైనా బైబిల్ మిషనువారు చేయగలరా?

3) సవాల్, సవాల్, సవాల్:

 "ఆట్మనమ్మ గారు వ్రాతలున్నవి. అవి ఎప్పుడు తీస్తారు. ఎప్పుడు అచ్చువేస్తారు? అని వారు ప్రభువును అడిగినవారు. ఆ పుస్తకము ఎప్పుడు అచ్చువేస్తారు. ఆ గది తాళము తీయడానికే ఇంకా తండ్రి సెలవు రాలేదు. ఆ తాళము ఎవరైనా విప్పితే వారికి హాని. దైవ సన్నిధి, దైవ వ్రాతలు; ఏర్పాటు ఉంటే తప్ప ఇతరులు వెళ్లితే చనిపోతారు" (జీవిత చరిత్ర పే నెం. 61, 2006).

ఇలా ఇతరులు వెళితే చనిపోతారు అని చెప్పిన ఆ గది ఎక్కడుందని అడుగుతున్నాను. బైబిల్ చదువుతున్న అన్యులు చనిపోనప్పుడు, కేవలం ఆట్మనమ్మగారి రచనలు ఉన్న గదిలోకి వెళితేనే ఎవ్వరైనా ఎందుకు చనిపోతారు? ఈ రచనలు బైబిల్ కంటే గంభీరమైనవి, పవిత్రమైనవి, ప్రతిష్ఠితమైనవి అని చెప్పదలిచారా? నేను చావటానికైనా తెగిస్తాను కాని సత్యనిర్ధారణ నుండి వెనుకకు తగ్గను. నాకు చావంటే భయం లేదు. కాబట్టి నేను బైబిల్ మిషనువారికి విసిరే సవాలేమిటంటే, నిజంగా అలాంటి గది ఒకటుంటే అది ఎక్కడుందో చూపించండి. చూపించలేకపోతే, మీ ప్రచురణలలో చెప్పుకున్నవన్నీ ఇలాంటి అభూతకల్పనలు మాత్రమే అని ఒప్పుకొని క్రైస్తవ సమాజానికి, దేవునికి క్షమాపణ చెప్పండి. మీ రచనలన్నిటినీ ఉపసంహరించుకోండి. మీ రచనలలో సత్యముందా, లేక నా రచనలలో సత్యముందా అనేది దీనిని బట్టి అందరి ముందు రుజువౌతుంది. నేను మీకు సవాలు చేస్తున్నాను. మీ నిజాయితీ నిరూపించుకోవటానికి ఇదో సువర్ణ అవకాశం. సాకులు చెప్పి వెనుకకు తగ్గితే అదే మీ ఓటమిగా అందరూ అర్థం చేసుకుంటారు. మీరు అబద్ధికులని అందరూ తెలుసుకుంటారు. అలా కాకుండా, ఆ గది నిజంగానే ఉంటే, కాస్త అది ఎక్కడుందో చెబితే, అందులోనికి వెళ్లి నేను చనిపోతే, మీరు చెప్పింది నిజమే అని ప్రపంచం గుర్తిస్తుంది. ఈ సవాలు నా గర్వము వల్లనో, అత్యుత్సాహం వల్లనో, అధికసాహసం వల్లనో చేయటం లేదు. బైబిల్ తప్ప దేవుడు ప్రత్యక్షపరచిన ఏ రాతలూ, ఎక్కడా లేవు అనే స్థిరమైన, బలమైన, విశ్వాసం ఆధారంగా మాత్రమే ఈ సవాలు చేస్తున్నాను. బైబిల్ మాత్రమే దేవుని ప్రత్యక్షత అని నిరూపించటానికి ఈ సవాల్. ఈ సవాలు నేను జూన్ 2021లో ప్రచురిస్తున్నాను. ఆట్మనమ్మగారి రచనలున్న గది అడ్రస్ నాకు 31డిసెంబర్ 2021 వరకూ ఇవ్వకపోతే, అందులోనికి నేను మీడియాముఖంగా ప్రవేశించి చనిపోకపోతే, బైబిల్ మిషను మొత్తం బూటకమని తేలిపోతుంది.

4) ఈ పాదిరి ప్రభువు ఎవరబ్బా?

"అప్పుడు అయ్యగారు 'ప్రభువా! మనుష్యులు నన్ను బల్ల దగ్గరకు రావద్దు అంటున్నారు. నీవే వచ్చి ఇవ్వుము' అని ప్రార్ధించేసరికి బల్ల దిగి వచ్చేసింది. ప్రభువు అంగీవేసికొని పాదిరిగారి వలె అన్ని సిద్ధం చేసుకొని అయ్యగారికి పాదిరిగారు చెప్పినట్లు చెప్పి, సంస్కారం ఇచ్చారు" (జీవిత చరిత్ర పే నెం.21, 2006).

"సంఘము ప్రభువు భోజనము తీసుకొనుచుండగా పరలోకమునుండి ఒక బల్ల , ఆ బల్ల మీద తెల్లటి బట్ట, దానిమీద పాదిర్లు ఇచ్చే రొట్టెలు, ద్రాక్షారసము పాత్ర వచ్చెను. యేసు ప్రభువే పాదిరి డ్రస్సుతో నిలువబడిరి. ప్రభువు భోజనము తీసుకొంటిని. నా ప్రక్కన కూర్చుని యున్న డాక్టరుగారికి గాని తక్కినవారికి గాని ఈ సంగతి తెలియదు. ఆయన రాకముందు సమరయ స్త్రీ ధవళ వస్త్రధారియై నీళ్లు తోడుచుండెను" (జీవిత చరిత్ర పే నెం. 25, 2006).

కొందరిని పాదిరీలుగా ప్రతిష్టించి, వారిది సంఘస్థులకంటే ఉన్నతస్థానం అని సూచించే ప్రత్యేక అంగీ తొడగటం అన్నది రోమన్ కాథలిక్కులు ప్రవేశపెట్టిన వాక్యవిరుద్ధ యాజకత్వ వ్యవస్థ. దానిని ఇప్పటికీ కొన్ని ప్రొటెస్టెంట్ సంఘాలు కూడా ఆచరించటం ఎంతో శోచనీయం. సంఘంలో యాజకులనే ప్రత్యేక వ్యక్తులెవ్వరూ లేరు. సంఘమంతా "రాజులైన యాజక సమూహం" అని ప్రకటించబడింది (1 పేతురు 2:9). యేసు ప్రభువు చేసిన మధ్యవర్తిత్వ పరిచర్య, యాజకత్వ పరిచర్య యొక్క సంపూర్ణ ఉద్దేశాన్ని నెరవేర్చింది కాబట్టి ఇక ప్రత్యేక యాజకత్వ పదవులేవీ సంఘంలో లేవు. సంఘంలో కాపరులు, నాయకులు ఉన్నప్పటికీ, వారెవ్వరూ పాదిరీలు కాదు. వారిని విశిష్టపరచే అంగీలు కాని, అగ్రస్థానాలు కాని, వాక్యం ఆమోదించదు (మత్తయి 23:5-9). అందుకే ఈ పాదిరి వ్యవస్థ పూర్తిగా వాక్య విరుద్ధమైనది. ఇదిలా ఉండగా, అయ్యగారికి ఈ రోమన్ కాథలిక్ దుస్తులలో ప్రత్యక్షమైన యేసు ఎవరు? బైబిల్ భిన్న పద్ధతిని సమర్థించటానికి యేసు ప్రభువు తనకు విరోధంగా తానే ఈ వేషం ధరించి ప్రత్యక్షమయ్యాడా? లేదా అయ్యగారు అబద్ధమాడుతున్నారా? లేదా మోసపరచే వేరొక ఆత్మ దర్శనరూపంలో అయ్యగారిని ఇలా భ్రమపరచిందా??మొదటి ప్రత్యామ్నాయం మాత్రం అసాధ్యం. అన్నట్లు సమరయ స్త్రీ ఇంకా బావిలో నీళ్ళు తోడుకుంటూనే ఉందట!! ఇలా పాదిరి వేషంలో ప్రత్యక్షమయ్యే ప్రతిచోటకూ యేసుప్రభువు, సమరయ స్త్రీని కూడా వెంటపెట్టుకెళ్తారు కాబోలు, నీళ్లు తోడుకోటానికి!!!

5) చిన్నపిల్లలను చెత్త అని సంబోధించిన ఈ ప్రభువు ఎవరబ్బా?

"అయ్యగారు పిల్లల బోర్డింగ్ లో వార్డెన్ గా పని చేసేటప్పుడు, పిల్లలు అందరూ నిద్రపోయిన తర్వాత అయ్యగారు సూదికొండ పైకి వెళ్ళి తన పని ముగించుకొని 3 గంటలకు వచ్చేవారు. రాత్రి అంతా వారు ఆలాగున కొండ పైకి ఎక్కి ఆయన సహవాసంలో గడిపేవారు. అప్పుడు అయ్యగారి దగ్గరుండే కొందరు పిల్లలు 'అయ్యగారూ! ప్రతి రోజు మీరెక్కడికి వెళ్లుచున్నారు? 'మేము నిద్రబోయేటప్పుడు చూస్తే, మీ బట్టలు అలా తగిలించే ఉంటున్నవి. అయితే మధ్యలో మెలుకువ వచ్చి చూచినపుడు అవి కనబడుట లేదు. మరలా తెల్లవారుజామునచూస్తే అలాగే తగిలించి ఉంటున్నాయి. కాబట్టి మేము కూడ మీతో వస్తాము' అని అడిగినప్పుడు, అయ్యగారు- 'సూదికొండకు వెళ్తున్నానని' వారితో చెప్పి, తాను వెళ్ళే సమయమునకు వారిని కూడ లేపుకొని వెళ్లి కాలినడకను సూదికొండ ఎక్కారు. అందరూ అక్కడ కొద్దిసేపున్న తరువాత పిల్లలు అందరూ అలసట వలన నిద్ర పోయారు.అప్పుడుప్రభువు వచ్చి, ఎందుకబ్బాయ్! ఈ చెత్త అంతా తెచ్చావు? అని అన్నారు. అపుడు అయ్యగారు చూస్తానన్నారు ప్రభువా! అందుకని తెచ్చినానన్నారు'. అప్పుడు ప్రభువు, అయ్యగారు చాలా సమయం మాట్లాడుకొన్నారు. ఈలాగున చిన్నపిల్లల కోరికను కూడ తృణీకరించక వారికిని ప్రభువును చూపించవలెనని వారి మనస్సులో ఉండెడిది." (జీవిత చరిత్ర పే. నెం. 83, 2006).

భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభువు "చిన్న బిడ్డలను నాయొద్దకు రానియ్యుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యం ఈలాంటి వారిదే" (మార్కు 10:14) అని సెలవిచ్చాడు. కాని ఇక్కడ అయ్యగారికి ప్రత్యక్షమైన యేసు, పిల్లలను చూసి 'ఈ చెత్త ఎందుకు తెచ్చావబ్బాయి' అంటాడా? అంటే యేసు ప్రభువు ఇప్పుడు చాలా మారిపోయాడన్న మాట!! కనీసం ఇక్కడున్నప్పుడు కనపరచిన కనికరం, కూడా ఇప్పుడు లేకపోయిందన్నమాట!! ఇలా చిన్నచిన్న పిల్లల కోరిక తీర్చి, వారికి ప్రభువును చూపించాలని అయ్యగారి దయార్థత మనస్సులో ఉండేదట కాని ప్రభువు కనీసం ఆమాత్రమైనా లేకుండా ఇలా దురుసుగా మాట్లాడాడట!!! ఏ ప్రభువయ్యా ఇంతకూ ఈయన? బైబిల్ లో బయలుపరచబడిన యేసుప్రభువు మాత్రం కాదని స్పష్టం ఔతుంది.

6 ) ఇదెక్కడి శ్రమ!!

"అట్లే ప్రభుయొక్క సిలువ శ్రమ కూడా అయ్యగారు మనోదృష్టితో చూచి వచ్చి చెప్పేవారు. అంతగా అయ్యగారు ప్రభువుతో పాటు, ఆయన శ్రమల వెంబడి వెళ్లివచ్చి, శ్రమల ధ్యానములో బోధించేవారు." (జీవిత చరిత్ర పే నెం. 16, 2006).

ప్రభువు ఒక్కసారే శ్రమపడి మరణించాడు (హెబ్రీ 9:26). అది ఆయన జీవితకాలంలో జరిగిపోయిన సంగతి. అది మళ్ళీ, మళ్ళీ జరిగే తంతు కాదు. ప్రతి సంవత్సరం మానవకల్పిత శ్రమలదినాలు అనే ఒక ఆచారం ఉన్నంత మాత్రాన ఆ కాలంలో ప్రభువు నిజంగా శ్రమపడతాడని, అది అయ్యగారు వెళ్లి చూసోచ్చారని చెప్పటం నిజంగా వింతగా, విడ్డూరంగా, హాస్యాస్పదంగా కూడా ఉంది. క్రీస్తు శకం 589 సంవత్సరంలో రోమన్ కాథలిక్ చర్చి ఆదేశాల మేరకు సంవత్సరిక వేడుకగా చేయబడిన ఈ ఆచారానికి ఆమోద ముద్ర వేసేలా అయ్యగారి ఎదుట శ్రమపడి చూపించిన ఈ ప్రభువు ఎవరో!! తప్పక దేవదాసు అయ్యగారు ఎదో దురాత్మ ప్రభావం క్రింద ఉండుండాలి. లేదా, ఒక మానసిక రోగి అయ్యుండాలి. లేదా, ఉద్దేశపూర్వకంగా అబద్ధాలాడి మోసగించే ప్రయత్నమే చేసుండాలి. నాలుగవ ప్రత్యామ్నాయం ఏది లేదు.

VIII. ఇలాంటి స్వస్థతలు మీకు కావాలా? 

'అయ్యగారు వేరొక సువార్త చెప్పినా, అబద్ధలాడినా, కల్పనా కథలు చెప్పినా మాకు సంబంధం లేదు. అయ్యగారి కాకాని తోటలో జరిగే స్వస్థత కూటాలకు వెళ్తే దేవుడు కార్యం చేస్తాడని నమ్ముతున్నాము. అందుకే వెళ్తున్నాము' అనుకునే అనేకులు ఉన్నారు. వారు తప్పక ఈ మాటలు చదవాలని ప్రభువు ప్రేమనుబట్టి మనవి చేస్తున్నాను.

 
ప్రభువైన యేసుక్రీస్తు మారుమనస్సు సువార్తతో ప్రజలను ఆహ్వానించాడు (మత్తయి 4:17). ఆయన ఎన్ని స్వస్థతలు చేసినా, ఎన్ని అద్భుతాలు జరిగించినా, వాటి కోసం రమ్మని ఎప్పుడూ, ఎవ్వరినీ ప్రోత్సహించలేదు. ఆయన కోసం కాకుండా, ఆయన ఇచ్చేవాటి కోసం వచ్చినవారికి ఎలా స్పందించాడో మీరే చదవండి (యోహాను 6:26-35). మా వద్దకు వస్తే ప్రభువు మీ అవసరతలన్నీ తప్పక తీరుస్తాడని చెప్పి అనేకులను ఆకర్షించుకునేవారిలో ఉన్నది ఈ క్రీస్తు ఆత్మ కాదని ఖచ్చితంగా తెలుసుకోండి. (1 కోరింథీ 15:19, గలతీ 1:8-10).
 
ఇప్పటివరకూ మనం చూసిన విధంగా అయ్యగారు ఎన్నో అబద్ధబోధలు చేశారు. ఆ అబద్ధబోధలకు వత్తాసు పలికేలా దేవుడు అయ్యగారి ద్వారా ఎలాంటి స్వస్థత కార్యమైనా జరిగించాడని గ్రహించటానికి ప్రత్యేక విచక్షణ జ్ఞానమేమీ అవసరం లేదనుకుంటాను. అయ్యగారి దేవుడు బైబిల్ ప్రకటించే దేవుడు కాదని ఆయన తన దర్శనాల ద్వారా దేవునికి ఆపాదించిన అనేక సంగతులను బట్టి నిర్ధారణ ఔతుంది. అలా వేరొక దేవునిని మోసపూరితంగా ప్రకటించేవారు నిజంగా సూచక క్రియలేవైనా చేసినా, వాటిని నమ్మొద్దని లేఖనాలు మనకు హెచ్చరిస్తున్నాయి (ద్వితీయోపదేశకాండం 13:1-5). 'అయినా మాకు కార్యం జరగటమే కావాలి, సత్యంతో మాకేంపని' అనుకునేవారితో నాకు కూడా ఏంపని? వారు దేవునికే లెక్క చెప్పుకోవాలి. అయితే, దేవునిని ప్రేమించేవారికి, ఆయన సత్యం కొరకు నిలబడాలని సమర్పించుకున్నవారికి ఈ హెచ్చరిక చాలనుకుంటున్నాను.
 
ఇక స్వస్థతల గురించి బైబిల్ మిషను వారి ప్రచురణలలో కనిపించే కొన్ని సంగతులు మీ దృష్టికి తెస్తున్నాను. వాటిని ఆలోచించి అప్రమత్తం ఔతారని నా ఆశ:
 
"అయ్యగారి చివరి దినాలలో, 23 రోగాలు చెప్పారు. చివరి కాలములో ముఖ్యంగా గుటక పడటం లేదు అన్నారు. ఆ కాలములో అయ్యగారిని హాస్పిటల్ కు తీసుకొని వెళ్లేదమని అంటే అనేకమంది మనద్వారా బాగవుతుంటే మనం హాస్పిటల్ లో చేరితే అది ప్రభువుకి అవమానం కాదా! అని హాస్పిటల్ కు వెళ్ళుటకు దైవజనుడు ఇష్టపడలేదు" (జీవిత చరిత్ర పే నెం. 157, 2006).
 
అనేకులను బాగు చేసినవారు, హాస్పిటల్ కు వెళ్లనంత మాత్రాన ప్రభువును అవమానం నుండి కాపాడేసాడనుకుంటే పొరపాటే. ఇతరులను బాగు చేశామని చెప్పుకుంటూ వారు మాత్రం 23 అనారోగ్యాలతో చనిపోవటం ప్రభువు నామానికి ఘనత తెస్తుందా? లేదా ఇతరులకు చేసిన స్వస్థతలు కూడా కేవలం ఈపాటివేనా? అయితే, దీనికి ఎదురుప్రశ్నగా కొందరు ఇలా అడగొచ్చు: 'గొప్ప స్వస్థతలు చేసినవారికి అనారోగ్యం రాకూడదని, ఆ కారణం చేత వారు చనిపోకూడదని ఎలా అంటాము? అలా వారిని స్వస్థపరచకపోవటం దేవుని చిత్తమైయుండొచ్చు కదా?' ఇది నిజంగా వాక్యానుసారమైన ప్రశ్న. స్వస్థతలపై వాక్యం చెసే సత్యబోధవైపుకు నడిపించే ప్రశ్న. కాని ఈ ప్రశ్న అయ్యగారిని ఈ చిక్కుముడి నుండి తప్పించటానికి సరిపోదు. అది ఆయన సమస్యను మరింత జటిలం చేస్తుంది. కొన్నిసార్లు స్వస్థపరచకపోవటం దేవుని ఇష్టం కాకుండా ఉండే ప్రసక్తే లేదన్నది అయ్యగారి బోధ. అది ఆయన మాటలలో మీరే చదవండి:
 
"ప్రశ్న: జబ్బు బాగు చేయుట ప్రభువునకు ఇష్టమో కాదో మాకెట్లు తెలియును?
 
జవాబు: ఇష్టము కలదనియు, శక్తి కలదనియు మత్తయి 8వ అధ్యాయం వల్ల తెలుసుకొనవచ్చును. ఇది విశ్వాసికి హరణముగా ఇవ్వబడిన అధ్యాయమని చెప్పుదురు. నరుడు జన్మింపక ముందే భూమ్యాకాశములు అతని సదుపాయం నిమిత్తమై కలుగజేసిన దేవుని ప్రేమకు ఇష్టము ఉండదా? ఇంత పెద్ద లోకమును కలుగజేసిన దేవుని శక్తికి శక్తియుండదా?" (మహిమ వార్తావళి, పే నెం. 82).
 
ఇది వాక్యానుసారమైన బోధ కాదు. కొన్నిసార్లు సమస్యను తొలగించటం దేవుని ఇష్టం కాదు (1 కొరింథీ 12:7-9, 1 తిమోతి 5:23). కానీ, అయ్యగారి బోధనలలో స్వస్థపరచకపోవటం కూడా దేవుని ఇష్టం కావొచ్చు అనే ఆలోచనకే తావు లేదు. అయితే, అయ్యగారి ప్రకారం దేవునికి స్వస్థపరచటమే ఇష్టమైనా, కొన్నిసార్లు స్వస్థతలు జరగక పోవటానికి కారణం ఏమయ్యుంటుంది? చివరికి అయ్యగారు సహితం స్వస్థపడకుండా అనారోగ్యంతో చనిపోవటానికి కారణమేమిటి? స్వస్థతల గురించి అయ్యగారు ప్రశ్నోత్తరాల రూపంలో చేసిన ఒక చర్చను కాస్త విశ్లేషించి, ఈ అంశంపై అయ్యగారి అవగాహన ఎంత వరకూ వాక్యంతో సరిపోతుందో మరింత దగ్గరగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం.
 

1) దైవికం కాని స్వస్థతలు కూడా ఉంటాయా?

 
 "ప్రశ్న 1: దైవిక స్వస్థత అనగానేమి?
 
జవాబు: వ్యాధిని బాగుచేయుటకు వైద్యునకు ఇవ్వవలసిన సమయము దేవునికి ఇవ్వగా ఆయన ఔషధము వేయకుండ తన ప్రభావము వల్ల బాగు చేయును. దీనికే దైవిక స్వస్థత అని అందురు." (మహిమ వార్తావళి పే. 80).
 
అయ్యగారి ఈ జవాబు ప్రకారం అన్ని స్వస్థతలు దైవిక స్వస్థతలు కావన్నమాట!! ముఖ్యంగా వైద్యుల మాధ్యమం ద్వారా జరిగేవి అస్సలు దైవిక స్వస్థతలు కావట!!! మరి స్వస్థపరచటానికి వైద్యునికి సామర్థ్యం ఇచ్ఛేది దయ్యమే అంటారా? బైబిల్ ఇందుకు సమ్మతించదు. ప్రతి మంచి ఈవి జోతిర్మయుడైన దేవునివద్దనుండి కలుగుతున్నాయని వాక్యం స్పష్టం చేస్తుంది (యాకోబు 1:18). అయితే, దేవుడు ఔషధం లేకుండా చేసేదే దైవికస్వస్థత అనే నిర్వచనం ఎంతో ప్రమాదకరమైన పర్యవసానాలకు దారి తీస్తుంది. అలాంటి బోధను ఆచరించడం ఆత్మ హత్య చేసుకోవడమే అవుతుంది. వైద్యులను సంప్రదించడం దేవునికి అవమానమని, ఔషధం తీసుకోవటం విశ్వాసలేమి అని ఈ రోజున అనేకమంది అమాయక క్రైస్తవులు భావించటానికి ఇలాంటి తప్పుడు బోధకులే కారణం. ఇలా బోధించటం వాక్యవిరుద్ధం మాత్రమే కాదు, చట్టవిరుద్ధం కూడా. ఆరోగ్యానికి హాని కల్పించే మతబోధలను మన రాజ్యాంగం కూడా నిషేధిస్తుంది (article 25[1]). వీరి బైబిల్ మిషను నియమావళిలో "ఔషధాలు నిషిద్ధము" కావని రాసుకున్నారన్నది నిజమే. కాని అది ఈ సమస్యకు ఏమాత్రం పరిష్కారం కాదు. దేవునికి అవమానం తెచ్చే సంప్రదింపులు, దైవిక స్వస్థతలో దేవుడు వాడని సాధనాలు ఎందుకు నిషిద్ధము కావు అనే కొత్త చిక్కుముడికే ఇది దారి తీస్తోంది. అయితే ఇంతకంటే విడ్డూరమేమిటంటే, ఔషధం వేయకుండా దేవుడు తన ప్రభావంతో చేసేది మాత్రమే దైవిక స్వస్థత అని అయ్యగారు చెప్పిన నిర్వచనం, బైబిల్ కి మరియు చట్టానికి మాత్రమే కాదు, అయ్యగారి స్వంతమాటలకు కూడా వ్యతిరేకమే. తరువాతి ప్రశ్నలో ఆయనే తన స్వీయనిర్వచనంతో ఎలా విబేధించారో మీరే గమనించగలరు.
 

2) క్రైస్తవ్యాన్ని మూఢభక్తిగా చిత్రీకరించే స్వస్థత విధానాలు

 
"ప్రశ్న 2: దేవుడు దేని చేత బాగుచేయును?
 
జవాబు: కొందరు బైబిలు చదువుకొనుట వల్ల బాగుపడుదురు. కొందరు స్తుతి చేయుట వల్ల బాగుపడుదురు. కొందరు ప్రభు యేసు రక్తమునకు జయమని చెప్పుట వల్ల బాగుపడుదురు. కొందరు దేవుడు నా జబ్బు బాగు చేసినాడని నమ్మి మరచి వెళ్ళుట వల్ల బాగుపడుదురు. కొందరు ప్రభు యేసు పేరు ఉచ్చరించుట వల్ల బాగుపడుదురు. (అనగా యేసు నామము వల్లనే రక్షణ). ఈ నామము వల్లనే రోగనివారణ అని పలుకుట వల్ల బాగుపడుదురు. కొందరు ప్రభువు భోజనము పుచ్చుకొనుట వల్ల బాగుపడుదురు. కొందరు వ్యాధి ఉన్నను పక్షవాయువు రోగి వలె నడుచుటవల బాగుపడుదురు. కొందరు ప్రార్థనలో కనిపెట్టుట ద్వారా బాగుపడుదురు. కొందరు నమ్మి బాగుగా నిద్రపోవుట వల్ల బాగుపడుదురు. కొందరు దేవుని మీద ఆనుకొని ఆయన దీవెన కోరి ఔషధములు వేసికొని బాగుపడుదురు. ఓ వ్యాధి పిశాచీ, క్రీస్తు ప్రభువు నిన్ను వెళ్లగొట్టుటకు మాకు అధికారము ఇచ్చినాడు అని పలుకుట వల్ల బాగుపడుదురు. కొందరు విశ్వాసముతో పథ్యపు కూరలు మాని సామాన్య ఆహారం సంతోషంతో భుజించుట వలన బాగుపడుదురు. కొందరు స్తుతి కీర్తనలు పాడుట వలన బాగుపడుదురు. కొందరు విశ్వాసులను పిలిచి ప్రార్థనలు పెట్టుట ద్వారా బాగుపడుదురు. కొందరు ప్రభువును అడిగి స్వప్నములోనో -దర్శనములోనో తెలియబడిన మందులు వేసుకొని బాగుపడుదురు. కొందరు స్వస్థత ప్రసంగములు వినుట వల్ల బాగుపడుదురు. కొందరు బైబిలు లోని స్వస్థత వాక్యములన్ని చదువుట వల్ల బాగుపడుదురు. కొందరు ప్రభువు దర్శనములో ముట్టుకొన్నట్టు చూచి బాగుపడుదురు. కొందరు ప్రభువు యొక్క సన్నిధి నాయొద్ద గలదు అను స్పర్శజ్ఞానము వల్ల తెలిసికొని బాగుపడుదురు." (మహిమ వార్తావళి పే నెం. 80-81).
 
ఈ మాటలు జాగ్రత్తగా గమనిస్తే, దేవుడు స్వస్థపరచే క్రమంలో మందులు వాడుతారని రెండుసార్లు అయ్యగారు ఒప్పుకున్నారు. అది మునుపటి ప్రశ్నకు వారు సెలవిచ్చిన జవాబుతో విభేదిస్తుంది. పరస్పర విరుద్ధ బోధలు చేసేవారి మాటలు నమ్మటానికి నా మతిస్థిమితం సమ్మతించదు. అలాగే, ప్రభుభోజనం ప్రభువును జ్ఞాపకం చేసుకునే సాధనంగా నియమించబడిన ఆచారమే తప్ప అందులో స్వస్థత ఇచ్చే ప్రభావమేదైనా ఉందని వాక్యం ఎక్కడా బోధించదు. అదేవిధంగా, బైబిల్ చదవటం వల్ల దేవుని మార్గము తెలుసుకుంటామే తప్ప అదేమీ రోగనివారణ మంత్రం కాదు చదివేయగానే తగ్గిపోవటానికి.  యేసు నామజపం, యేసు రక్తమునకు జయమని చెప్పటం, ఇవేవీ రోగనివారణకు మార్గాలుగా బైబిల్ బోధించదు. దర్శనాలలో, కలలలో దేవుడు బయలుపరిచే ఔషధాలు వేసుకుని కూడా బాగుపడొచ్చని అయ్యగారు సూచించారు. దేవుడు చెబుతున్నాడనుకుని వెలుగు దూతవలె మోసగించే దయ్యం చెప్పిన మందులు వేసుకుని చనిపోతే (2 కొరింథీ 11:14), దానికి బైబిల్ మిషనువారు బాధ్యత వహిస్తారా? అది సరే, ఇన్ని స్వస్థతాసాధనాలలో ఒక్కటి కూడా అయ్యగారి 23 రోగాల నివారణకు ఎందుకు పనికి రానట్లో!! ఆయనకే పనికిరాని వైద్యబోధతో బైబిల్ మిషనువారు ఇతరులను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు? ఎందుకు దీనిని ప్రచురించి దేవునికి అవమానం తెస్తున్నారు?
 
విశ్వాససహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచగలదు. దీనిని ఎవ్వరూ కాదనరు. కాని అన్ని ప్రార్థనలకూ దేవుని చిత్తమే నిర్ణయమైనదనే గ్రహింపు (1 యోహాను 5:14) అయ్యగారి ఈ మాటలలో ఎక్కడ కనిపించకపోగా, అందుకు వ్యతిరేకంగా ఎప్పుడూ స్వస్థపరచటమే దేవునికి ఇష్టమని బోధించారు. ఇది వాక్య సమతుల్య బోధను విస్మరించటమే అని చెప్పక తప్పదు. ఆ సత్యాన్ని విస్మరించే అయ్యగారి వింతైన స్వస్థతబోధలో, విశ్వాసికి ఆదరణ కానీ, దేవునికి మహిమ కానీ కలగటం సాధ్యం కాదు.
 

 3) షరతులు బాబు షరతులు!!

 
ప్రశ్న 3: కొందరు ఎన్ని ప్రార్థనలు చేసినను జబ్బులు పోవుట లేదు ఎందుకో?
 
జవాబు: ఆత్మీయ జీవితములో ఏదో యొక బలహీనత ఉండుట ఒక కారణము. గత కాలమందు ఒకరికి విరోధముగా చేసిన నేరము. వారియొద్దకు వెళ్ళి ఒప్పుకొనుకపోవుట ఒక కారణము. ప్రభువును పూర్తిగా నమ్మకపోవుట ఒక గొప్ప కారణము. ప్రార్థన చాలకపోవుట ఒక కారణం.వ్యాధి కాలమున ప్రభువు ఆదుకొనే సమయమైయున్నది గనుక ఆ సమయము అయిపోయిన తరువాత స్వస్థత కలుగును" (మహిమ వార్తావళి, పే నెం. 81-82).
 
ప్రశ్న 6: ఒకరు అన్ని షరతుల ప్రకారము చేసినను బాగు కాలేదేమి?
 
జవాబు: గడచిన కాలమునందు దేవుడు చేసిన మేళ్ళు తలంచుకొని కృతజ్ఞత కనపరచినాడా? లేదు, దైవ లక్షణములను కొనియాడినాడా? వాక్యమును, కుమారుని యాత్మను యిచ్చినావు తండ్రీ! నీకు స్తోత్రము అని చెప్పినాడా? లేదు అందుచేతనే పోలేదు." (మహిమ వార్తవళి, పే నెం.83).
 
ఇలా ఇతరులపై విధించిన షరతులు పట్టిక అయ్యగారి 23 రోగాల విషయంలో వర్తించదా? ఆయన స్వస్థపడకుండా మరణించటానికి, ఇతరులకు విధించిన షరతులు తాను నిర్వర్తించకపోవటమే కారణమయ్యుంటుందా? అయ్యగారు తమ కంటిలోని దూలం తీయకుండానే ఇతరుల కంటిలోని నలుసు తీసే ప్రయత్నం చేసుంటారా? అయినా, దైవలక్షణాలన్నీ సంపూర్ణంగా సంపాదించేసుకున్న అయ్యగారికే ఈ షరతుల ఆధారంగా స్వస్థత సంప్రాప్తమవ్వకపోతే, సామాన్యులైన మన మీద ఎందుకు ఈ బ్రహ్మాస్త్ర ప్రయోగం? ఇంతకు, అనారోగ్యంతో చనిపోయినవారందరూ ఈ షరతులలో చూపించిన ఎదో ఒక లోపం, లేదా పాపం కారణంగానే చనిపోతున్నారని చెప్పదలిచారా? ఇది నిజానికి రోగభారంతో పాటు దోషభారాన్ని కూడా అదనంగా ఒక వ్యక్తిపై మోపే క్రూరమైన బోధ. పాపం ఒకని రోగానికి కారణం కాగలదు. క్రమశిక్షణకు బెత్తంలా దేవుడు అనారోగ్యాన్ని వాడుకుంటాడన్నది కూడా నిజమే. కాని ప్రతి అనారోగ్యానికి, ప్రతి నయం కాని జబ్బుకి ఇదొక్కటే వివరణ అయితే మాత్రం అది వాక్యానుసారమైన బోధ కాదు. యోబు, హేమాను (కీర్తనలు 88) వంటి నీతిమంతులకు కూడా అనారోగ్యాలు వస్తాయి. కేవలం దేవునికి మహిమ హేతువుగా కొందరికి అనారోగ్యం అనుమతించబడుతుంది (యోహాను 9:1-3). అలాంటి సందర్భాలలో పాపం, లోపం, షరతులు అంటూ మాట్లాడటం పూర్తిగా అప్రస్తుతమే కాగలదు. అలా మాట్లాడటం, యోబు స్నేహితులు చేసిన అదే పాపానికి మనలను లోను చేస్తుంది (యోబు 4:7-8, 8:4-6, 11:13-15, 42:7). కాని అయ్యగారి స్వస్థత శాస్త్రంలో మాత్రం, షరతులు నెరవేర్చటం, స్వస్థత పొందడం తప్ప ఏమీ కనిపించదు. అయితే, అయ్యగారి షరతులు ఆయన రోగనివారణకు పనికి రాకపోతే, ఆయన స్వస్థతలపై కలిగియున్న అవగాహన ఎంత అపరిపక్వమైనదో నా సహాయం లేకుండానే విజ్ఞులు ఆలోచించుకోగలరు.
 

4) అసలు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థం ఔతుందా?

 
"ప్రశ్న 7: ఇవన్నియు చేసినను ఒకరికి పోలేదు ఎందుకు?
 
జవాబు: ప్రభువా నీ ప్రేమను బట్టి జబ్బు రాణించుచున్నావు అని స్తుతించలేదు అందుచేతనే పోలేదు" ( మహిమ వార్తావళి?, P. 83).
 
"ప్రశ్న 9: దేవుడే జబ్బును పంపుచున్నాడనుచున్నారు ఇది నిజమా?
 
జవాబు: పంపితే వ్యాధులు బాగు చేసుకొను మూలికలు ఎందుకు సృజించెను? వాగ్దానములు, స్వస్థత చరిత్రలు బైబిలులో ఎందుకు వ్రాయించెను? ప్రభువు సిలువ మ్రానుమీద మన వ్యాధులను ఎందుకు భరించెను? (యెషయా 53, మత్తయి8). వ్యాధి ఆయన పంపితే మనిషి నశించును. దేవుడు తన సృష్టికి హాని చేయునా? తండ్రి తన బిడ్డలను నాశనము చేయగలడా? రోగులను బాగు చేసేనను బైబిలు కథలు దయ్యములు వెళ్లగొట్టెనను బైబిలు కథలు చదువువారు దేవుడు వ్యాధులకు కారకుడని చెప్పలేదు." (మహిమ వార్తావళి, పే నెం. 83-84).
 
అయ్యగారు ఏం మాట్లాడుతున్నారో కనీసం ఆయనకైనా అర్థమయ్యుంటుందంటారా? దేవుడు తన ప్రేమను బట్టి జబ్బు రాణిస్తున్నాడని గుర్తించి స్తుతించకపోతే జబ్బు నయంకాదని ఒక పక్క హెచ్చరిస్తూనే, దేవుడు అసలు వ్యాధిని పంపుతాడనుకోవటం నిజమే కాదంటాడు మరో వైపు. ఆయన రచనలలో ఉన్న తప్పుడు బోధలు చాలవనేమో ఇలా పరస్పర విరుద్ధ బోధలకు కూడా ఏ కొరత లేకుండా చూసుకున్నారు.
 
మేలైనా, కీడైనా, సర్వోన్నతుడైన దేవుని నోట నుండి బయలు వెళ్తాయని (విలాప వాక్యములు 3:38), అయితే దేవుని ప్రేమించువారికి సమస్తము మేలు నిమిత్తమే సమకూడి జరిగేలా అన్నిటిని దేవుడు నియంత్రిస్తున్నాడని (రోమా 8:28) ఇలా మన ప్రతికూలతలలో కూడా దేవుని హస్తము చూడగల బోధ బైబిల్ మనకు అందిస్తుంది. గాయపరిచేవాడు, గాయం మాన్పెడివాడు ఆయనే అయినప్పుడు, అనారోగ్యాలు ఆయన పంపకనే వస్తున్నాయనటమేమిటి? అదే నిజమైతే, ఆయన ప్రేమను బట్టి అవి రప్పించబడ్డాయని స్తుతి చెల్లించటం ఎందుకు? దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తూ, తనను తానే వ్యతిరేకిస్తూ చేసిన అయ్యగారి బోధలను అయ్యగారితోనే సమాధి చేసేసుంటే, ఈ రోజు కాకానితోట నుండి మట్టి తెచ్చుకొని తినే మూఢభక్తికి అనేకులు బలవ్వకుండా కాపాడబడి ఉండేవారు. ఇప్పటికీ ఆలస్యం కాలేదు. ఇప్పుడైనా ఆ పని చేయండి.
 

5) పుస్తకాలు ఇలా కూడా అమ్ముకోవచ్చనమాట!!

 
"ప్రశ్న 8 : జబ్బులు బాగు చేయించుకొనగోరువారు యేమి చేయవలెను?
 
 జవాబు: మిత్ర స్వస్థి పత్రిక, సదర్ధము, ప్రార్థనమెట్లు, వారబోధిని, దైవ సన్నిధి, రాకడ ధ్వని, ప్రకటన వివరము, పరమగీత వివరము, విమలాత్మక ప్రోక్షణము, ఆరాధన క్రమము, తెలుగు క్రైస్తవ కీర్తనలు- ఇవన్నియు బైబిలు మిషనుయొక్క వ్రాతయై యున్నవి. ఇవి చదువుట మంచిది." (మహిమ వార్తావళి, పే నెం. 83).
 
ఏమిటేమిటేమిటి? బైబిల్ మిషను ప్రచురణలు చదవటం రోగనివారణకు మంచిదా? రాసినవారికే అలాంటిదేమీ ఒరగనప్పుడు చదివేవారికి ఏమి వెలగబెడుతుందనో!!! మామూలుగా అమ్మితే ఎవ్వరూ పట్టించుకోవట్లేదనేమో పుస్తకాలమ్మటానికి ఈ వింత కహానీ!! రాసినవారు 23 రోగాలతో చనిపోయారు. చదివినవారికి మాత్రం రోగనివారణకు మంచిదట!! చెవిలో పువ్వు పెట్టటం, పెట్టించుకోవటం, ఈ రెండూ నాకు అలవాటు లేదు. బైబిల్ మిషనువారు కూడా ఆ అలవాటు మానుకుంటే వారికి మంచిది.
 

ముగింపు

సైద్ధాంతిక సంగతులు మొదలుకొని సాధారణ విషయాలు వరకు అయ్యగారి మాటలుగాను, తమ స్వంత మాటలుగాను బైబిల్ మిషను వారు బోధిస్తున్న అనేక విషయాలు వాక్య విరుద్ధమైనవి, వాస్తవాతీతమైనవి, సాధారణ తర్కానికి సయితం నిలువనివి. ఇలాంటి బోధలు చేసే సంస్థ నుండి, సంఘాల నుండి, పరిచర్యల నుండి, నిజాయితీగల దేవుని బిడ్డలందరూ బయటకు రావాలి (రోమా 16:17-18, 1 తిమోతి 6:5, 2 తిమోతి 3:5,4:3-4, గలతీ 1:8-9).

వారి పుస్తకాలలో బైబిల్ మిషను వారు ఇంకా చాలా గొప్ప-గొప్ప సంగతులు సాక్ష్యాలు రాసుకున్నప్పటికీ, అవన్నీ నమ్మి మోసపోకుండా వారిని ఎలా వివేచించాలో చూపించే కొన్ని సంఘటనలు మాత్రమే ఇక్కడ పేర్కొనటం జరిగింది. నా సద్విమర్శ వాక్యానుసారంగా లేకపోతే అది నిరూపించండి, నేనే సరి చేసుకుంటాను. కాని నేను చెప్పినవి న్యాయమైనవే అయితే, మీ బాధ్యతకు తగినవిధంగా స్పందించమని ఈ మిషనులో కూరుకుపోయిన వారందరినీ ప్రభువు ప్రేమను బట్టి అభ్యర్ధిస్తున్నాను.

అయ్యగారి త్యాగం చూడండి, సేవ చూడండి, ఎన్ని సంఘాలు స్థాపించారో చూడండి, ఎందరు సేవకులను నిలబెట్టారో చూడండి, ఎన్ని ఆత్మలను సంపాదించారో చూడండి, అని హితవు పలికే చాలామంది ఉంటారని నాకు తెలుసు. మీరు అందులో ఒక శాతమైనా చేశారా, చేయగలరా అని సవాలు విసురుతారని కూడా తెలుసు. అయితే, మీరు ఒక విషయం ఆలోచించండి. ఎన్ని త్యాగాలు చేసినా, ఎన్ని సంఘాలు స్థాపించినా, ఎన్ని సత్క్రియలు చేసినా, అవి దుర్బోధ చేసే అధికారాన్ని ఎవ్వరికీ సంపాదించిపెట్టలేవు. దుర్బోధలను సమర్ధించే మంచి క్రియలంటూ ఏవీ లేవు. నేను అయ్యగారంత త్యాగశీలిగా, సంఘస్థాపకునిగా, గొప్ప సేవకునిగా ఉండలేకపోయినా, ఆయనవలే దుర్బోధ చేయకుండా ఉంటే, దుర్బోధలను సమర్ధించేలా నా నోరు, నా కలం మూగబోకుండా ఉంటే, కనీసం "శాపగ్రస్తుడు" అనే తీర్పునైనా తప్పించుకుంటాను (గలతీ 1:8-9). కాబట్టి, ఈ పనికిమాలిన సాకులను, సమర్ధనలను పక్కనపెట్టండి. మీకు బైబిల్ కావాలంటే, బైబిల్ మిషనును విస్మరించి తీరాల్సిందే అని నిరూపించాను. అలా చేయగల కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక.

 ముగించే ముందు ఒక్క మాట. ఈ మధ్య అన్యులను విమర్శిస్తుంటే దానిని వారు చర్చలో భాగంగా చూసి తగిన విధంగా స్పందిస్తున్నారు, ఊరుకుంటున్నారు. కాని క్రైస్తవులే ఎందుకో చాలా అభద్రతాభావానికి లోనై, 'మీ మీద పోలీస్ కేసు పెడతాం, ఊసలు లెక్కపెట్టిస్తాం' అంటూ వింత బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. బైబిల్ మిషను వారికి నా మీద అలాంటి ఆలోచన ఏమైనా కలిగితే, క్షణం కూడా ఆలోచించకుండా ముందుకు వెళ్లిపోండి.నన్ను నేను కాపాడుకునే క్రమంలో, బైబిల్ మిషను వారిది మూఢభక్తి అని చట్టం చేత కూడా చెప్పించటానికి, చట్టరీత్యా బైబిల్ మిషను పై ఆంక్షలు తీసుక రావటానికి అది నాకు సహాయం చేస్తుంది. మొదట నేను చట్టాన్ని ఆశ్రయించాననే అభియోగం నా మీద ఎందుకు? కాని అవకాశం మీరే ఇస్తే ఇక అంతకంటే కావలసిందేముంది?

 

Add comment

Security code
Refresh

Comments  

# BIBLE KAAVALAA r BIBLE MISSION KAAVALAA ??Kishore Kumar 2021-07-20 11:20
Anna Praise the Lord nd Chalabaaga Explain Chesaru nd Ma Mama Vaallu Kooda Gooty lo Adhbutha Kumar Swasthatha shalaku Veltharu Yenni Cheppinavinaru nd Meeru Kanuvippukaligincharu nd Yekanga Ma Bava Yesukristhu Rendavaraakada Kooda Ayyagariki Chupinchadu Yeppudosthadanii Clear ga Telusu anii Chala Asathyabodhalu Chesthunnadu nd Bible Aadharanga Chupisthu Ela Bible lo Ledhante Oppukovatledhu nd Vaallandharu Aa Bramalonundi Bayatapadalanii Prarthisthunnanu nd Any Hav Thanks AnnA ... Glory 2 GOD n Praise the Lord .....KK
Reply
# Praise the lord. Thank you AnnaBobby 2021-07-21 19:51
I am very interested in this issues you are facing in Christianity.
Thank you for your message. I am appreciate you sir
Praise the lord..
Reply
# Praise GodG Anil Kumar 2021-07-29 15:41
Dear Brother, great work. Keep it up.
Reply
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.