రక్షణ

రచయిత: ఆర్థర్. డబ్ల్యు. పింక్
అనువాదం: సుహాసిని ముఖర్జీ

విషయసూచిక

 1. ఉపోద్ఘాతం
 2. దాని అర్థం
 3. దాని ఆవశ్యకత
 4. దాని ఆవశ్యకత (ముగింపు)
 5. దాని సమస్య
 6. దాని పరిష్కారం
 7. దాని పరిష్కారము (ముగింపు)
 8. దాని స్వభావం
 9. దాని స్వభావము (కొనసాగింపు)
 10. దాని స్వభావం (ముగింపు)
 11. దాని కర్త
 12. దాన్ని సమకూర్చేవాడు (1 భాగం)
 13. దాన్ని సమకూర్చేవాడు (2వ భాగం)
 14. దానిని సమకూర్చేవాడు (చివరి భాగం)
 15. దానిని భద్రపరిచేవాడు
 16. దానిని భద్రపరిచేవాడు (ముగింపు)
 17. దాని నియమం
 18. దాని నియమం (కొనసాగింపు)
 19. దాని నియమం (కొనసాగింపు)
 20. దాని నియమం (ముగింపు)
 21. దాని సాధనం
 22. దాని సాధనం (చివరి భాగం)

1. ఉపోద్ఘాతం

నీతిమంతులుగా తీర్చబడుటను గురించిన సిద్ధాంతము" అనే పుస్తకంలో మనం దేవుని మహనీయమైన కృప గురించి ధ్యానించాము. ఆ కృప, దేవుని ప్రజలస్థానంలో, ఆయన పరిశుద్ధ ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా అనుసరించి, వారి విస్తారమైన అతిక్రమాలను బట్టి కలిగిన శాపాన్ని, వారికి బదులుగా అనుభవించే ఒక పూటకాపును వారికి అనుగ్రహించింది. తత్ఫలితంగా మనం దేవుని న్యాయపీఠం ఎదుటకు తీసుకురాబడి మరణశిక్ష విధింపబడవలసిన వారమైనప్పటికీ నేరస్థులమైనప్పటికీ మన స్థానంలో మనకు బదులుగా నిలిచినవాని పరిచర్య అంగీకరించబడిన కారణాన్నిబట్టి మనం శిక్షను తప్పించుకోవటం మాత్రమే కాకుండా, ఉన్నతమైన పరలోక న్యాయస్థానంలో 'నీతిమంతులముగా' ప్రకటించబడ్డాము. “కనికరం, తీర్పును మించి అతిశయపడింది.” అయినప్పటికీ దేవుని ధర్మశాస్త్రంలో వ్యక్తపరచబడిన ఆయన అధికారయుక్తమైన నీతికి పూర్తి ఘనత కలగకుండా ఇది జరగలేదు. దేవుని ప్రజల ప్రతినిధిగా, అవతారమూర్తి అయిన దేవునికుమారుడు, ఆ ధర్మశాస్త్రానికి లోబడి, అది జారీ చేసిన శిక్షను అనుభవించి, శ్రమపొంది, మరణించాడు. ఈ విధంగా దేవుని నియమాలన్నీ నెరవేరి, న్యాయం ఘనతను పొంది, ఆదాము సంతానంలోని ప్రతీ వ్యక్తి, స్వయంగా ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను నెరవేర్చడం వలన కలిగే ఘనతకు మించిన ఘనతను ధర్మశాస్త్రం పొందింది.

కాబట్టి నీతిమంతులుగా తీర్చబడే విషయమై విశ్వాసులకు ఇక ధర్మశాస్త్రంతో పని లేదు. ధర్మశాస్త్రంతో ఏ సంబంధం లేకుండానే (రోమా 3:21), అంటే స్వయంగా వారు దానిని నెరవేర్చకుండానే వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. మనం ధర్మశాస్త్రపు నీతిని నెరవేర్చలేము. అందులోని అజ్ఞలకు కట్టుబడి ఉండనూ లేము. మన స్థానంలో మనకు బదులుగా నిలిచినవాడే ధర్మశాస్త్రం ఆజ్ఞాపించినవన్నీ శాశ్వతంగాను, సంపూర్ణంగాను నెరవేర్చి ముగించాడు. తత్ఫలితంగా క్రియలు లేకుండానే అనగా వ్యక్తిగతంగా మనం విధేయత చూపకపోయినప్పటికీ నీతిమంతులుగా తీర్చబడ్డాము. “ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు” (రోమా 5:19). అయితే, ధర్మశాస్త్రంతో మనం ఇతర సంబంధాలు కలిగి ఉండవచ్చు; కలిగి ఉన్నాము కూడా. దాని పరిశుద్ధతలో ఆనందించడం మన నూతన స్వభావానికి ఉండే లక్షణం. అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు మనం ఆనందిస్తున్నాము. ధర్మశాస్త్రానికి, ప్రవక్తల వచనాలకు మూలాధారమైన ఆ మొదటి రెండు ఆజ్ఞల సంపూర్ణత మరియు దీవెన మనకు తెలుసు."ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.” మన త్రోవకు వెలుగైన దేవుని పరిశుద్ధ ఆజ్ఞలను మనం నిరసించము, ఎందుకంటే అవి యేసు శీలంలో, ఆయన నడవడిలో సజీవంగా రూపుదాల్చాయి; అయితే వాటి ద్వారా నీతిమంతులంగా తీర్చబడవచ్చు అనే ఆలోచనతో వాటికి లోబడము. సాధించబడింది ఇక సాధించబడనవసరం లేదు. నీతిమంతులంగా తీర్చబడిన తర్వాత మనం చూపించే అసంపూర్ణ విధేయతను, మనలను నీతిమంతులుగా తీర్చిన "మన దేవుడును రక్షకుడును”అయినవాని సంపూర్ణ విధేయతతో సమానం చేసి, ఆయన నీతిని అవమానపరచనూలేము. మనం నీతిమంతులుగా తీర్చబడడం వల్ల, క్రీస్తును బట్టి, కృప మన అసంపూర్ణ విధేయతను సంతృప్తికరమైన విధేయతగా పరిగణించి అంగీకరిస్తుంది. అయితే, మనం నీతిమంతులుగా తీర్చబడినందుకు ఫలితంగా ఇది జరుగుతుంది. కాబట్టి దీనిని నీతిమంతులుగా తీర్చబడడానికి హేతువుగా పరిగణించకూడదు. అంతేకాదు, నీతిమంతులుగా తీర్చబడడానికి కొంచెమైనా అసంపూర్ణమైనదానిని దేవునికి అర్పించకూడదు. ఈ విషయంలో దేవుని ప్రమాణాలతో సరితూగే సంపూర్ణతకు తక్కువైన దేనినీ దేవుని న్యాయస్థానం ఎంత మాత్రం అంగీకరించదు.

ఇంతకు ముందు 'నీతిమంతులుగా తీర్చబడుటను గూర్చిన సిద్ధాంతము' అనే నా పుస్తకంలో అశీర్వాదకరమైన కొన్ని మూలసత్యాలను కొంతవరకు ధ్యానించాము. దీనితో దగ్గర సంబంధమున్న 'పరిశుద్ధపరచబడుట'ను గురించిన సిద్ధాంతాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. అయితే 'పరిశుద్ధపరచబడుట' అంటే ఏమిటి ? ఇది ఒక గుణమా లేక ఒక స్థితా? ఇది చట్టపరమైనదా లేక ఆచరణాత్మకమైనదా? అనగా విశ్వాసి దీనిని క్రీస్తులో కలిగి ఉన్నాడా లేక తనలోనే కలిగి ఉన్నాడా? ఇది ఒక్కసారే పరిపూర్ణంగా జరుగుతుందా లేక దశలవారీగా జరుగుతుందా? ఇది మార్పు చెందనిదా లేదా పురోగతి చెందేదా? మనం నీతిమంతులుగా తీర్చబడినప్పుడే పరిశుద్ధపరచబడ్డామా లేక అది ఆ తరువాత పొందే దీవెనా ? ఈ దీవెనను ఎలా పొందాలి ? ఇది దేవుడు మనకొరకు చేసిన కార్యం వలన కలుగుతుందా, లేక మన క్రియలను బట్టి కలుగుతుందా, లేదా ఈ రెండింటి వలన కలుగుతుందా? తాను పరిశుద్ధపరచబడ్డాడని ఒక వ్యక్తి ఖచ్చితంగా ఎలా నిర్ధారించుకోగలడు? దాని లక్షణం, రుజువు, ఫలం ఏమిటి? తండ్రి ద్వారా కలిగే పరిశుద్ధత, కుమారుని ద్వారా కలిగే పరిశుద్ధత, పరిశుద్ధాత్మ ద్వారా కలిగే పరిశుద్ధత, విశ్వాసం ద్వారా కలిగే పరిశుద్ధత, వాక్యం ద్వారా కలిగే పరిశుద్ధత - వీటి మధ్య ఉన్న భేదాన్ని ఎలా తెలుసుకోగలం?

పరిశుద్ధపరచబడుటకు, పవిత్రతకు మధ్య ఏదైనా భేదముందా? ఉంటే అది ఏమిటి? పరిశుద్ధపరచబడుట మరియు శుద్ధీకరించబడుట ఒకటేనా? పరిశుద్ధపరచబడుట ఆత్మకు సంబంధించిందా, లేక శరీరానికి సంబంధించిందా, లేక ఈ రెండిటికీ సంబంధించిందా? దేవుని వరాల క్రమంలో ఇది ఏ స్థానాన్ని కలిగి ఉంది? పునరుజ్జీవానికీ, పరిశుద్ధపరచబడటానికీ మధ్య ఉన్న సంబంధమేంటి? నీతిమంతులుగా తీర్చబడటానికి, పరిశుద్ధపరచబడటానికి మధ్య ఉన్న సంబంధమేంటి? పరిశుద్ధపరచబడుట మహిమపరచబడుటతో ఎక్కడ ఏకీభవించదు? రక్షణ విషయంలో పరిశుద్ధపరచబడుటకు ఉన్న స్థానమేంటి? ఇది రక్షణకు పూర్వం జరుగుతుందా, లేక ఆ తరువాత జరుగుతుందా, లేక అందులో అంతర్భాగమా? ఈ అంశంపై ఎన్నో భిన్నాభిప్రాయాలు ఎందుకు కలుగుతున్నాయి? ఈవిధంగా ప్రశ్నలను పెంచుకుంటూ పోవడం నా ఆలోచన కాదు గాని ఈ అంశానికి ఉన్న విభిన్న కోణాలను చూపించి, దీనిని పరిశీలించడానికి ఉన్న వివిధ మార్గాలను తెలియపరచటమే నా ఉద్దేశం.

పై ప్రశ్నలకు ఎంతోమంది ఎన్నోవిధాలుగా జవాబులిచ్చారు. బరువైన, కష్టతరమైన ఈ అంశాన్ని గురించి రాయడానికి వివేకవంతులెందరో భయపడుతుంటే, అందుకు సామర్ధ్యంలేని వారెందరో అనాలోచితంగా దీని గురించి రాయడానికి తొందరపడ్డారు. మరికొందరు ఈ అంశాన్ని తమ అసమగ్రమైన విశ్వాసప్రమాణాలను ఆధారం చేసుకుని పైపైనే పరిశీలించారు. ఇతరులు తమ సొంత ప్రయత్నమేమీ చేయక, అంతకుముందు దీని గురించి రాసిన విషయాలనే సత్యమని నమ్మి, వాటినే పునరుద్ఘాటించారు. నేను ఈ అంశాన్ని దాదాపు ఇరవై అయిదు సంవత్సరాలుగా చదువుతున్నప్పటికీ, దీని గురించి రాసే పరిపక్వత, ఆత్మీయత లేనివాడనని భావిస్తున్నాను. ఇప్పుడు కూడా ఈ పనిని భయంతోను, వణుకుతోను చేస్తున్నాను. ఇందులో వ్యక్తపరచిన నా తలంపులు సత్యాన్ని తారుమారు చెయ్యకుండా, దేవుని ఘనతకు భంగం కలిగించకుండా, ఆయన ప్రజలను తప్పు త్రోవకు నడిపించకుండా పరిశుద్ధాత్మ దేవుడు కాపాడునుగాక.

నా గ్రంథాలయంలో ఈ అంశంపై వివిధ వ్యక్తులు రచించిన యాభైకి పైగా పుస్తకాలు ఉన్నాయి. అందులో ప్రాచీన రచయితలు, ఆధునికులు, కాల్వినిస్టులు, అర్మీనియన్లు, ఈ రెండు శాఖలకు చెందనివారు కూడా ఉన్నారు. కొందరు పోపుకు ఉన్న అధికారం తమకున్నట్టు గర్వంతో మాట్లాడారు. మరికొందరు భయభక్తులతో కూడిన జాగ్రత్తతో, కొందరు వినయంతో కూడిన సంకోచంతో రాసారు. వీటిని జాగ్రతగా ఆకళింపు చేసుకుని ముఖ్య అంశాలలో వీటికి ఉన్న తారతమ్యాన్ని కూడా శ్రద్ధగా గుర్తించాను. విభజనలు తెచ్చే విధానం నాకు అసహ్యం అలాంటి పక్షపాత వైఖరి నుండి విడుదల పొందాలని ఆశిస్తున్నాను. అందరి ప్రయాసల నుండి లాభం పొంది వారందరికీ రుణపడి ఉన్నానని అంగీకరిస్తున్నాను. ఈ అంశానికి సంబంధించిన కొన్ని కోణాలలో “రిఫార్మర్స్”, “ప్యూరిటన్స్”ల కన్నా “ప్లిమౌత్ బ్రదరన్” శాఖ వారే మరింత సహాయకులుగా ఉన్నారని నా అభిప్రాయం.

పరిశుద్ధ లేఖనాలలో ఈ అంశానికి ఇవ్వబడిన ప్రాధాన్యత దీని గొప్ప ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. “పరిశుద్ధత, పరిశుద్ధపరచబడుట” అనే పదాలు లేఖనాలలో వందలాదిసార్లు ఉపయోగించబడ్డాయి. ఈ అంశానికి ఆపాదించబడిన గొప్ప విలువను బట్టి కూడా దీనికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించవచ్చు. ఇది దేవునికి, దేవదూతలకు, సంఘానికి ఉన్న శ్రేష్టమైన ఘనత. నిర్గమ 15:11 లో ప్రభువైన దేవుడు “పరిశుద్ధతను బట్టి మహనీయుడు” అని రాయబడి ఉంది. అదే ఆయన శ్రేష్టతా కిరీటం. మత్తయి 25:31లో “పరిశుద్ధ దూతలు" అని ప్రస్తావించబడింది. వారికి ఇంతకంటే గొప్ప ఘనతను ఆపాదించలేము. సంఘం యొక్క మహిమ, ఆడంబరాలలో కాని, బాహ్యాలంకారాలలో కాని లేదని పరిశుద్ధతలోనే ఉందని ఎఫెసీ 5:26,27 నుండి మనం నేర్చుకున్నాం. అంతేకాక ఈ అంశం యొక్క మరింత ప్రాముఖ్యత, అన్ని కాలాలలోను ఇదే దేవుని ఉద్దేశమై ఉండడాన్ని బట్టి స్పష్టమౌతుంది. తన ప్రజలు “పరిశుద్ధులుగా ఉండడానికే" ఆయన వారిని ఎన్నుకున్నాడు. (ఎఫెసీ 1:4). తన ప్రజలను “పరిశుద్ధపరచుటకై” క్రీస్తు మరణించెను (హెబ్రీ 13:12) “దేవుని పరిశుద్ధతలో పాలు పొందుటకే” ఆయన శిక్షను అనుమతిస్తున్నాడు (హెబ్రీ 12:10).

పరిశుద్ధపరచబడుట అంటే అర్థం ఏదైనాసరే, అది తన ప్రజల పక్షాన క్రీస్తుకు ఇవ్వబడిన నిబంధన వాగ్ధానం. థామస్ బోస్టన్ చక్కగా చెప్పినట్లు “పరిశుద్ధపరచబడుట అన్నది చిన్న తారల మధ్య ప్రకాశించే చంద్రునివలె, కృపానిబంధనకు అతి ముఖ్యమైనదై దాని ద్వారా సాధించడానికి ఉద్దేశింపబడిన దేవుని మహిమకు మాత్రమే ద్వితీయమైనదై ఉంది. మరణించిన ఆత్మను జీవింపచేయడం, విశ్వాసం పొందడం, నీతిమంతులుగా తీర్చబడటం, సమాధానపరచబడటం, దత్తత పొందటం, భద్రపరచబడటం, దేవునిని మన సొంత దేవునిగా అనుభవించటం మొదలైన ఈ వాగ్ధానాలన్నిటికీ పరిశుద్ధపరచబడటమే కేంద్రంగా ఉంది. వీటికి దానితో ఉన్న సంబంధం, ఒక లక్ష్యానికి దానిని సాధించే సాధనాలతో ఉన్న సంబంధమే. పాపులను పరిశుద్ధులుగా రూపాంతరం చేయడానికే ఈ వాగ్ధానాంశాలన్నీ రూపొందించబడ్డాయి. ఇది ఈ క్రింది మాటల ద్వారా స్పష్టంగా రూఢిచేయబడింది. “మన తండ్రియైన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసికొనుటకును మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి, మన జీవితకాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను, నీతిగాను, ఆయనను సేవింపను................” (లూకా 1:75). ఆ నిబంధన క్రీస్తుకు సాదృశ్యమైన మన ఆత్మీయ తండ్రి అయిన హెబ్రీ 2:18 అబ్రహాముకు ప్రమాణం చేయబడింది. ఆయన సంతానం పరిశుద్ధతలో ప్రభు సేవ చేస్తారన్నదే మధ్యవర్తికి ఇవ్వబడిన ముఖ్యవాగ్ధానంగా ఇక్కడ చూపించబడింది. ఆత్మసంబంధమైన శత్రువుల నుండి విడుదల దీనిని నెరవేర్చడానికి సాధనం.

సామెత. 8:11లో పరిశుద్ధతను గురించిన గొప్ప ఘనత నొక్కి చెప్పబడింది. "జ్ఞానము ముత్యముల కన్న శ్రేష్టమైనది. విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు”. సామెతల గ్రంథాన్ని జాగరూకతతో చదివిన ప్రతి ఒక్కరూ “జ్ఞానము” అంటే పరిశుద్ధత, “బుద్ధిహీనత” అంటే పాపము, "జ్ఞాని” అంటే పరిశుద్ధుడు , బుద్ధిహీనుడు అంటే పాపి అనే అర్థంతో సోలోమోను ఈ పదాలను వాడాడని గ్రహించగలరు."జ్ఞానులు మహిమను పొందుదురు, బుద్ధిహీనులకు అవమానము కలుగును”- ఇక్కడ జ్ఞానులు అనగా పరిశుద్ధులని, 'బుద్ధిహీనులు' అనగా పాపులని ఎవరు సంశయించగలరు! “యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము” (సామెత 9:18) దీనిని బట్టి నిజమైన జ్ఞానము నిజమైన పరిశుద్ధతయే అని అతడు నొక్కి చెప్తున్నాడు. కాబట్టి "పరిశుద్ధత ముత్యములకన్నా శ్రేష్ఠమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటికావు. పరిశుద్ధత యొక్క అపారమైన విలువ మరియు ఔన్నత్యాన్ని, అత్యంత అమూల్యమైన, అందమైన ముత్యాలతో పోల్చటం కంటే వేరేవిధంగా వర్ణించటం అసాధ్యం, ఊహాతీతం." (ఎన్. ఇమ్మోన్స్)

పరిశుద్ధపరచబడుట అతిప్రాముఖ్యం, అత్యంత అవసరం, చెప్పశక్యం కాని విలువైనది మాత్రమే కాదు; అది పూర్తిగా మానవాతీతమైనది.

సౌవార్తిక పరిశుద్ధత యొక్క స్వభావాన్ని గురించి పరిశోధించడం మన బాధ్యత. ఎందుకంటే అది మనలో పరిశుద్ధాత్మ చేసే కార్యం యొక్క ఫలం. అది గ్రహింపశక్యం కాని మర్మం, అది శారీరక దృష్టితో కనుగొనలేనిది. యోబు జ్ఞానాన్ని గురించి చెప్పిన విధంగా మనమిక్కడ పరిశుద్ధత గురించి చెప్పవచ్చు. “జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును? వివేచన దొరకు స్థలమెచ్చటనున్నది? అది సజీవులందరి కన్నులకు మరుగైయున్నది. ఆకాశ పక్షులకు మరుగు చేయబడి యున్నది. మేము చెవులార దానిని గురించిన వార్త వింటినని నాశనమును, మరణమును అనును. దేవుడే దాని మార్గమును గ్రహించును. దాని స్థలము ఆయనకే తెలియును. ..................మరియు యెహోవాయందు భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను" (యోబు 28:20-23, 28) “దేవుడు తన్ను ప్రేమించు వారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు”. మనం కూడా ఈ సంగతులను గ్రహించడం మన సహజేంద్రియాల సామర్థ్యం కాదు, ఆయితే “వీటిని దేవుడు తన ఆత్మ ద్వారా మనకు బయలుపరచియున్నాడు.” ( 1 కొరింథీ 2:9,10)

“విశ్వాసులు కూడా చాలాసార్లు దీని నిజస్వభావాన్ని, మూలాన్ని, మరియు ఫలితాలను గురించి కాని లేదా కనీసం వారికి ఇందులో ఉన్న ప్రయోజనాలను మరియు పాలిభాగత్వాన్ని గురించి కాని సరైన అవగాహన లేకుండా ఉన్నారు. దేవుని ఆత్మ మనలో జరిగించే కార్యాలను మనమెరుగం కాబట్టే వాటి విషయమై ఆయన మనకిచ్చే ఉపదేశం అనుసరించి నడవవలసిన విధంగా మనం నడవడం లేదు. విశ్వాసులందరూ పరిశుద్ధపరచబడి, పరిశుద్ధులుగా తీర్చబడినప్పటికీ, వారు తమలో మరియు తమ కొరకు సంభవించినదానినీ, తమలో నివసిస్తున్నదానినీ, అర్థం చేసుకోలేకపోవడం విచిత్రమే. ఆయ్యో, మన గురించి మనకెంత తక్కువ తెలుసు? ప్రకృతి సంబంధంగా సహితంగా మనమెలాంటివారమో, ఎలాంటి శక్తియుక్తులు కలిగి ఉన్నామో తెలియనివారమై ఉన్నాం. “తల్లి గర్భంలో శరీర అవయవాలు ఎలా రూపింవబడ్డాయో నీకు తెలియునా?” (జాన్ ఓవన్).

పరిశుద్ధపరచబడుట అనేది పూర్తిగా మానవాతీతమైనది. అది నూతనజన్మ అనుభవం లేనివారి బుద్ధికి మించినది. అనేకులు శరీర సంబంధమైన అనుకరణల వల్ల, మరియు సాతాను సంబంధమైన నకిలీలవల్ల పూర్తిగా మోసపోవడం దీనికి గొప్ప నిదర్శనం. సౌవార్తిక పరిశుద్ధతగా చలామణి అయ్యే ప్రతి నకలును పరిగణనలోనికి తీసుకోవడం మన ప్రస్తుత చర్చా పరిధికి చెందినది కాదు. అయితే తమ సంఘం చేత “పుణ్యాత్ములు”గా ఆమోదించిన వారిని మాత్రమే, పరిశుద్ధులుగా పరిగణించే రోమన్ క్యాథలిక్ సంఘం మాత్రమే ఈ కీలకమైన అంశం విషయమై పొరపడిందనడం సబబు కాదు. ఆత్మచేత బోధింపబడని వారందరి జ్ఞానాన్ని కప్పి ఉంచిన ఆ చీకటి శక్తి గురించి దేవుని వాక్యం స్పష్టంగా బయలుపరిచి ఉండకపోతే- ఎంతో తెలివిగలవారు సైతం మానవ సౌఖ్యాలను విడిచి పేద వస్త్రాలను ధరించి, అతిసామాన్య జీవితం జీవిస్తూ దేవుడెన్నడూ ఆజ్ఞాపించని కఠోర నియమాలను పాటించడంలోనే పరిశుద్ధతకలదని తలచడం చూసి ఆశ్చర్యపడి ఉండేవారం.

దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో బయలుపరిచేందుకు ఇష్టపడినదాని నుండి మాత్రమే- ఆత్మసంబంధంగా పరిశుద్ధపరచబడుటను గురించి సరైన విధంగా గ్రహించగలం. పరిశుద్ధాత్ముని కృపాకార్యాల ద్వారానే దీనిని అనుభవాత్మకంగా తెలుసుకోగలం. మన ఆలోచనలు లేఖనాల ద్వారా రూపుదిద్దబడితేనే తప్ప, ధన్యకరమైన ఈ అంశాన్ని గురించి ఖచ్చితమైన గ్రహింపుకు తేబడడం సాధ్యం కాదు. ఆ లేఖనాలను ప్రేరేపించినవాడే వాటిని మన హృదయంపై రాయనిష్టపడితేనే తప్ప మనం ఆ శక్తిని అనుభవించలేం. ఆ పదం కనిపించే కొన్ని వచనాల పై దృష్టి నిలపడం ద్వారా కాని లేదా అదే రకమైన వాక్యభాగాలన్నిటిపై దృష్టిని కేంద్రీకరించడం ద్వారా కాని “పరిశుద్ధపరచబడుట” అనే పదం యొక్క అర్థాన్ని సంపూర్ణంగా గ్రహించలేం. ఆ పదం, మరియు దానితో సంబంధం ఉన్న పదాలు కనిపించిన ప్రతి లేఖన సంధర్భాన్ని శ్రద్ధతో పరీక్షించాలి; అప్పుడు మాత్రమే సమగ్రమైన దీని బహుముఖాంశాలను గురించి ఏక పక్ష, అసమగ్ర, తప్పుడు అభిప్రాయాలు ఏర్పడటం నుండి కాపాడబడగలం.

లేఖనాలను పైపైన చదివినా పరిశుద్ధత అంటే పాపానికి వ్యతిరేకమని గ్రహించగలం. అయినా ఈ గ్రహింపు వెంటనే మనల్ని ఒక మర్మంలోకి కొనిపోతుంది. మనుష్యులు ఒకే సమయంలో పాపులుగానూ పరిశుద్ధులుగానూ ఎలా ఉండగలరు? నిజమైన విశ్వాసులను లోతుగా కలవరపరిచే సమస్య ఇదే. వారు తమలో శరీరస్వభావాన్ని, మలినాన్ని, దుష్టత్వాన్ని కనుగొనడం వల్ల, తాము పరిశుద్ధులని నమ్మడం వారికి కష్టసాధ్యమౌతుంది. అంతేకాక “నీతిమంతులముగా తీర్చబడుటను గురించిన సిద్ధాంతము” అనే నా పుస్తకంలో చెప్పినట్లు "మనలో మనం పూర్తిగా అపవిత్రులమై ఉన్నాసరే, క్రీస్తులో పరిశుద్ధులమ”ని భావించినప్పటికీ ఇక్కడున్న సమస్య తీరదు. దేవుని చేత పరిశుద్ధపరచబడినవారు తమలో తాము పరిశుద్ధులు అని దేవుని వాక్యం స్పష్టంగా బోధిస్తుందని చెప్పడం తప్ప వివరాల్లోకి వెళ్ళడం ఈ అధ్యాయంలో సాధ్యం కాదు. రానున్న అధ్యాయాలను ధ్యానించడానికి ప్రభువు మన హృదయాన్ని దయతో సిద్ధపరచును గాక.

 

పరిశుద్ధపరచబడుటను గురించిన సిద్ధాంతం

2.దాని అర్థం

నీతిమంతులుగా తీర్చబడినప్పుడు దేవుని ప్రజల స్థితిలో కలిగే చట్టబద్ధమైన మార్పు గురించి కొంత ఆలోచించాం. కాబట్టి ఇప్పుడు వారి స్థితిలో కలిగే అనుభవాత్మకమైన మార్పును పరిశీలించడం అవసరం. ఈ మార్పు వారు పరిశుద్ధులుగా తీర్చబడినప్పుడు ప్రారంభమై మహిమలో సంపూర్ణత పొందుతుంది. విశ్వసించిన పాపి నీతిమంతునిగా తీర్చబడడం, పరిశుద్ధపరచబడడం అనేవి వేర్వేరుగా, ప్రత్యేకంగా ఆలోచించవలసిన అంశాలైనప్పటికీ, అవి విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకంటే దేవుడు వీటిలో ఒకదానిని ఇచ్చి మరొక దానిని ఇవ్వకుండా ఉండదు. వాస్తవానికి, మనం నీతిమంతులుగా తీర్చబడ్డామో లేదో ఖచ్చితంగా నిర్ధారించుకోడానికి పరిశుద్ధపరచబడడం తప్ప మరొక మార్గం కాని, రుజువు కాని లేదు. కాబట్టి పరిశుద్ధపరచబడటం యొక్క అర్థాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దానికి నీతిమంతునిగా తీర్చబడటంతో ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడం అవసరం. పరిశుద్ధపరచబడడం, నీతిమంతులుగా తీర్చబడడం అనే ఈ వేర్వేరు అంశాల జంటను విడదీయరాదు. “ధర్మశాస్తంలో ప్రక్షాళన, నైవేద్యం, అనగా పవిత్రపరుచుకోవడం మరియు బలులు అర్పించడం జంటగా నిర్వహించబడ్డాయి” (తామస్ మేంటన్).

పాపం విడదీయరాని రెండు ముఖ్యపరిణామాలకు దారితీస్తుంది; అపవిత్రత కలగజేయడం, భయంకరమైన దోషారోపణ పుట్టించడం. కాబట్టి పాపం నుండి రక్షణ పొందడానికి, రక్షింపబడవలసిన వ్యక్తి, ప్రక్షాళన పొందడం మరియు అతనికి ప్రాయశ్చిత్తం జరగడం, ఈ రెండూ తప్పక అవసరం. పైగా పరలోకమందున్న దేవునితో కలిసి జీవించడానికి, ఎవరికైనా సరే రెండు విషయాలు తప్పనిసరిగా అవసరం. ఆ స్వాస్థ్యం పొందడానికి హక్కు మరియు ఆ ధన్యతను అనుభవించడానికి వ్యక్తిగతమైన యోగ్యత. ఈ రెండిటిలో మొదటిది నీతిమంతునిగా తీర్చబడటంలో లభిస్తుంది. రెండవది పరిశుద్ధపరచబడటంలో ప్రారంభమౌతుంది. ఈ క్రింది వాక్యాలలో ఈ రెండింటికీ ఉన్న విడదీయరాని సంబంధం స్పష్టంగా తెలపబడింది.

“యెహోవా యందే నీతి బలములున్నవి” (యెషయా 45:24), “అయితే ఆయన మూలముగ మీరు క్రీస్తు యేసునందున్నారు.దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయెను” (1 కొరింథీ 1:30,31); “మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి.” (1 కొరింథీ 6:11); “మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును” (1 యోహాను 1:9).

ఈ దీవెనలు చేతిలో చేయివేసి నడుస్తున్నట్టు మిళితమై ఉన్నాయి. ఇవి ఎప్పుడూ వేరుగా లేవు, ఎప్పుడూ వేరు చెయ్యబడవు, ఎప్పుడూ వేరుచెయ్యబడజాలవు. అద్భుతమైన పరిమళం అందమైన రోజా పువ్వును విడవని విధంగా, పువ్వు వికసిస్తుండగా సువాసన వ్యాపించేవిధంగా ఈ రెండూ కలిసి ఉంటాయి. "రాయి నుండి గురుత్వాకర్షణను విడదీయగలవేమో ప్రయత్నించు! లేదా మంట నుండి వేడిని విడదీయగలవేమో చూడు! ఈ వస్తువులు వాటి గుణాల నుండి విడదీయరానివైనవిధంగా మనం నీతిమంతులుగా తీర్చబడడం, పరిశుద్ధపరచబడడం ఒకదానితో ఒకటి పెనవేసుకొని ఉన్నాయి" (జేమ్స్ హర్వీ, 1770).

సమస్తాన్ని పతనానికి గురి చేసిన తన పాపం చేత ఆదాము ఒక్కడే వ్యక్తిగతంగా ఆ మొదటి నిబంధనను భగ్నం చేసినప్పటికీ, దాని ద్వారా దోషులుగా ఎంచబడిన వారందరు, అతని నుండి పొందుకున్న పతనానికి తగినట్టు స్వభావసిద్ధంగా పాపులైన విధంగానే క్రీస్తు ఒక్కడే రెండో నిబంధనకు అవసరమైన షరతును నెరవేర్చినప్పటికీ, దాని ద్వారా ఆయన నీతి ఆపాదించబడినవారందరూ తన ఆత్మ ద్వారా తాము పొందుకున్న కృపకు తగినవిధంగా స్వభావసిద్ధంగా నీతిమంతులౌతారు. “మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై, ఆ యొకని ద్వారానే ఏలిన యెడల కృపాబాహుళ్యమును, నీతిదానమును పొందువారు జీవముగలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తనుఒకని ద్వారానే ఏలుదురు.” (రోమా 5:17).

“ఆదాము పాపం వలన మరణం ఏ విధంగా ఏలింది? దోషం ఆపాదించబడడం వలన తన సంతతి వారందరు నాశనానికి అప్పగింపబడడంలో మాత్రమే కాదు, తమ అపరాధముల చేత, పాపముల చేత చచ్చినవారై “మంచి” అనబడే ప్రతిదాని విషయమై మృతులై ఉన్నారు. కనుక “నీతి వరం" పొందినవారు, తద్వార జీవంగలవారై, చట్టబద్ధంగా నీతిమంతులుగా తీర్చబడటంలో మాత్రమే కాదు, నైతికంగా పరిశుద్ధపరచబడటంలో కూడాా ఏలుబడి చేస్తారు ” (టి. బోస్టన్ 1690).

దేవుని కృప అనుగ్రహించిన ఈ రెండు దీవెనలు విడదీయరానివైనప్పటికీ ఈ రెండూ ఒకటి కావు. పరిశుద్ధపరచబడడంలో మనకు ఒకటి ఇవ్వబడుతుంది. నీతిమంతులుగా తీర్చబడుటలో అది మనకు కేవలం ఆపాదించబడింది. నీతిమంతులుగా తీర్చబడడం అనేది మనకొరకు చేయబడిన కార్యం. పరిశుద్ధపరచబడడం అనేది మనలో చేయబడే కార్యం. నీతిమంతులుగా తీర్చబడడం ఒక చట్టబద్ధమైన మార్పును కలిగిస్తుంది. అనగా అది శిక్ష నుండి విడుదల మరియు దీవెనలు పొందే హక్కు కలిగిస్తుంది. అది దేవుని కొరకు ప్రేమను, అంగీకారయుక్తంగా ఆయనను ఆరాధించే శక్తిని, పరలోకం చేరే అర్హతను కలిగిస్తుంది. నీతిమంతులుగా తీర్చబడడం మనలో ఉన్న నీతి వల్ల కలగదు. పరిశుద్ధపరచబడడం మనలో పవిత్రత కలిగిస్తుంది. మనలో లేని నీతి ద్వారా మనం యాజకుడైన క్రీస్తు చేత నీతిమంతులుగా తీర్చబడతాం. అది పాపపుశిక్షకు సంబంధించింది. పరిశుద్ధపరచబడడం రాజైన క్రీస్తు ద్వారా జరుగుతుంది. అది పాపానికి‌ ఉన్న ఏలుబడికి సంబంధించింది. మొదటిది దాని నశింపచేసే శక్తిని తీసివేస్తే రెండవది దాని అధికారం చేసే శక్తి నుండి విడుదల కలిగిస్తుంది.

ఇవి వాటి క్రమం రీత్యా వేరుగా వున్నాయి (ఈ క్రమం సమయానికి సంబంధించింది కాదు గాని స్వభావానికి సంబంధించినది). అంటే ముందు నీతిమంతులుగా తీర్చబడిన తరువాత పరిశుద్ధపరచబడడం జరుగుతుంది. క్రీస్తు స్వరూపంలోకి నూతనపరచబడేలా చెయ్యడానికి ఆత్మ దయచేయబడకముందే పాపి క్షమించబడి దేవుని దయకు పాత్రుడౌతాడు. ఇవి వాటి ఉద్దేశంలో వేరుగా ఉన్నాయి. నీతిమంతునిగా తీర్చబడడం పాపికి శిక్ష విధించవలసిన అవసరతను తొలగిస్తుంది. పరిశుద్ధపరచబడడం పాపిలోని అపవిత్రతను తొలగిస్తుంది. ఇవి వాటి రూపంలో వేరుగా ఉన్నాయి. నీతిమంతునిగా తీర్చడం న్యాయసంబంధమైన కార్యం. దాని ద్వారా పాపి నీతిమంతునిగా ప్రకటించబడతాడు. పరిశుద్ధపరచబడడం నీతిసంబంధమైన కార్యం. దీని ద్వారా పాపి పరిశుద్ధునిగా చెయ్యబడతాడు. ఈ రెండింటిలో ఒకటి మనం దేవుని యెదుట నిలవడానికి సంబంధించింది, మరొకటి ముఖ్యంగా మన నడతకు సంబంధించింది. ఇవి వాటి హేతువులను బట్టి వేరుగా ఉన్నాయి. ఒకటి క్రీస్తు ప్రాయశ్చిత్తకార్యం యొక్క యోగ్యత నుండి కలగగా మరొకటి దాని సామర్థ్యం నుండి కలుగుతుంది. ఇవి వాటి లక్ష్యంలో వేరుగా ఉన్నాయి. ఒకటి నిత్య మహిమకు అర్హతను కలుగచెయ్యగా, మరొకటి అక్కడికి మనలను కొనిపోయే రాజమార్గంగా ఉంది. “అక్కడ దారిగా నున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధమార్గమనబడును” (యెషయా 35:8).

పరిశుద్ధపరచబడడం, ప్రతిష్ఠింపబడడం అనే ఈ రెండు పదాలు హెబ్రీ, గ్రీకు మూలంలో ఉన్న ఒకే పదానికి అనువాదంగా మన ఇంగ్లీషు, మరియు తెలుగు బైబిలులో ఉపయోగించబడ్డాయి. అవి వివిధ అర్థాలలో, వివిధ ఉద్దేశాలతో వాడబడ్డాయి. కాబట్టి బైబిల్ పండితులు వీటికి వివిధమైన నిర్వచనాలు ఇవ్వడాన్ని బట్టి మనమెంత మాత్రం ఆశ్చర్యపడనవసరం లేదు. వాటిలో ఈ క్రిందివి ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. వీటిలో చివరి దానిలో తప్ప మిగిలిన నిర్వచనాలలో రవ్వంత సత్యముంది.

పరిశుద్ధపరచబడుట” “పరిశుద్ధత అనగా హృదయంలోనూ జీవితంలోనూ దేవుని ధర్మశాస్త్రానికి అనుగుణంగా నడవడం”. “పరిశుద్ధపరచబడడం పాపం యొక్క నిరంకుశత్వం నుండి విడుదల పొంది నీతిమత్వమనే స్వేచ్ఛను పొందడం”. “పరిశుద్ధపరచబడడం ఆత్మ యొక్క కార్యం. దాని వల్ల మనం దేవుణ్ణి ఆరాధించే అర్హతను పొందుతాము” .“పరిశుద్ధపరచబడడం, పాపమనే మాలిన్యం నుండి పవిత్రపరచబడే ప్రక్రియ”. “అది మన స్వభావంలో కలిగే నైతికమైన మార్పు. దాని ద్వారా మరింతగా మనం క్రీస్తు స్వరూపాన్ని పొందుతాము.” “పరిశుద్ధపరచబడడం అంటే శరీరస్వభావం పూర్తిగా నిర్మూలం చెయ్యబడడం. కాబట్టి పాపరహితమైన పరిపూర్ణతను, ఈ జీవితంలోనే పొందగలం.”

కొందరిచేత ఘనులుగా ఎంచబడే ఒక తరగతికి చెందిన రచయితలు (వారి గ్రంథాలు ఇప్పుడు ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి) “పరిశుద్ధపరచబడుట” అనే పదానికి తప్పుడు అర్థాన్ని లేదా అసంపూర్ణ నిర్వచనాన్ని ఇస్తున్నారు. ఈ పదం వాడబడిన కొన్ని వాక్యాలకు మాత్రమే పరిమితం చేసుకుని, కొన్ని వాస్తవాలను మాత్రమే ఆధారం చేసుకున్న కారణంచేత వారు అలాంటి అసమగ్ర అర్థాన్ని గ్రహిస్తున్నారు. ఉదాహరణకు పాత నిబంధనలో “పరిశుద్ధత” అనే పదం గుడారంలోని పాత్రలు మొదలైన నిర్జీవమైన వస్తువులకు ఆపాదించబడిన వచనాలను ఎన్నో చూపించి, ఆ పదంలో నైతికమైన విలువ ఏమీలేదని వారు వాదిస్తారు. అయితే ఇటువంటి వాదన లోపభూయిష్టమైనది, ఇది "చిరకాల పర్వతములు” (ఆది కా 49:26), “ ఆదికాల పర్వతములు” (హబక్కూకు 36) అని ఉన్నది కనుక దేవుడు “చిరకాలముండువాడు” అని చెప్పలేమని అన్నట్లు ఉంటుంది. అనేక సార్వత్రికవాదులు చెప్పే హేతువాదం ఇటువంటిదే. దుష్టులకు కలగబోయే నిత్యశిక్ష నిజమైంది కాదని చెప్పడానికి వారీవిధంగా చేస్తున్నారు.

పదాలను ఆత్మీయ అర్థంలో వాడడానికి ముందు వాటిని కనిపించే వస్తువులకు వాడాలి. మన ఊహలన్నీ ఇంద్రియాల ద్వారానే మనలో ప్రవేశిస్తాయి. కాబట్టి మొదట ఆ పదాలు బాహ్యవస్తువులకు ఆపాదించి, విశ్లేషణ సామర్థ్యం పెరిగినప్పుడు వాటిని భౌతికం కానివాటికి ఉపయోగిస్తాం. మానవచరిత్ర ప్రారంభ దశలలో దేవుడు తన ప్రజలతో ఇదే సూత్రం అనుసరించి వ్యవహరించాడు. "దేవుడు సబ్బాతుదినమును పరిశుద్ధపరచెను అంటే ప్రత్యేకపరచెను” అన్నదే దాని ప్రాథమిక అర్థం. అంత మాత్రాన ఈ పదానికి నీతిపరమైన కోణం అసలే లేదని వాదించడం హేతుబద్ధం కాదు. అదే విధంగా చాలా భాగాల్లో బాప్తిస్మం అంటే ఒక వ్యక్తి నీటిలో మునగడం అని అర్థం కాబట్టి దాన్ని ఒక మర్మం లేనిదిగా, లేక ఆత్మీయ భావం మరియు విలువ లేనిదిగా భావించడం సబబు కాదు. అలాంటి దృక్పథాన్ని లూకా 12:50 మరియు 1 కొరింథీ 12:13 వచనాలు వ్యతిరేకిస్తున్నాయి.

హెబ్రీయులకు దేవుడు ఆజ్ఞాపించిన బాహ్యఆచారాలన్నీ ఆత్మీయ అంతరార్థాన్ని నేర్పించే విధంగానే రూపొందించబడ్డాయి. అయితే “పరిశుద్ధపరచబడుట” అనే పదంలో ఉన్న నీతి విలువను తీసివెయ్యడానికి ఆధునికులు ఎంత గట్టి నిశ్చయతతో ఉన్నారంటే, “వారును సత్యమందు ప్రతిష్ట చేయబడునట్లు వారికొరకై నన్ను ప్రతిష్ట చేసికొనుచున్నాను” (యోహాను 17:19) వంటి వచనాలను వారు ఉదాహరణలుగా చూపించి, తనను తాను కడుగుకొనవలసిన పాపమేమీ ప్రభువునందు లేదు కనుక ఈ పదంలో పరిశుద్ధపరచబడడం అనే భావం ఎంతమాత్రం లేదని వారు రూఢిగా తేల్చి చెబుతున్నారు. ఇది కూడా తీవ్రమైన పొరపాటే. దీనిని న్యాయవాదులు "సందిగ్ధార్థపు మాటలచేత తప్పించుకోవడం” (Special pleading) అంటారు. ఇది "శోధింపబడుట” అనే పదం మత్తయి 4:1, హెబ్రీ 4:15 లో క్రీస్తు విషయమై వాడబడింది కాబట్టి ఈ పదానికి “పాపానికి మొగ్గుచూపటం” అనే భావం లేనే లేదు, అని వాదించినంత అవివేకంగా ఉంది. “పరిశుద్ధపరచబడుట” అనే పదం యొక్క అర్థాన్ని లేక అర్థాలను పరిశుద్ధగ్రంథంలో అది కనబడిన ప్రతి వాక్యభాగాన్ని జాగ్రత్తగా పరిశీలించి, దానిని వాడిన సందర్భాన్ని, దానికి వ్యతిరేకంగా నిలిచే ప్రతి పదాన్ని తూచి చూచి, అది ఏ వ్యక్తులకు లేదా వస్తువులకు ఆపాదించబడిందో పరిశీలించడమే సరైన మార్గం. దీనికి ఎంతో సహనం, శ్రద్ధ అవసరం. అయితే ఈ విధంగా పఠించినపుడే “సమస్తమును పరిశీలించి మేలైన దానిని చేపట్టుడి” (1 థెస్సలో. 5:21) అనే ఆజ్ఞకు మనం లోబడినవారమౌతాం. ఈ పదం "ప్రత్యేకపరచుట” లేదా "ప్రతిష్టించుట" అనే సామాన్య అర్థాలను మించినదని సంఖ్యాకాండము 6:8నుండి స్పష్టమౌతుంది.అక్కడ నాజీరు అయ్యేవాడి గురించి ఈ విధంగా చెప్పబడింది."అతడు ప్రత్యేకంగా ఉండు దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్టితుడుగా (పరిశుద్దునిగా) నుండును”. దీనికి కొందరు చెప్పిన విధంగా అర్థం చెబితే “అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నియు అతడు దేవునికి ప్రత్యేకముగా ఉండును,” అని చెప్పినట్లు ఉంటుంది. కాని ఇది అర్థరహితమైన పద పునరుక్తి మాత్రమే ఔతుంది. అలాగే ప్రభువైన యేసు పవిత్రుడును, నిర్ధొషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ......” (హెబ్రీ 7:26) అని రాయబడి ఉన్నది. "పవిత్రత” అనగా “ప్రత్యేకత” కు మించినదని ఈ వాక్యం స్పష్టం చేస్తుంది.

ఈ క్రింది వాక్యభాగాలను చూసినపుడు "పరిశుద్ధపరచబడుట” లేదా “ప్రతిష్టించుట” అనే మాటలకు హెబ్రి, గ్రీకులలో ఒకే పదం వాడబడినప్పటికీ ప్రతి సందర్భంలోను అది ఒకే అర్థంతో వాడబడలేదని తెలుస్తుంది యెషయా 66:17 లో కొందరు దుష్టులు గురించి “తోటలోనికి వెళ్లవలెనని మధ్య నిలుచున్న యొకని చూచి తమ్ము ప్రతిష్టించుకొనుచు పవిత్రపరచుకొనుచున్న వారై పందిమాంసమును హేయ వస్తువులను పందికొక్కులను తినువారును” అని రాయబడి ఉంది. బబులోను సామ్రాజ్యాన్ని కూలద్రోయడానికి తాను ఏర్పాటు చేసిన మాదీయులను గురించి దేవుడు యెషయా 13:3లో ఈ విధంగా అంటున్నాడు. “నాకు ప్రతిష్టితులైనవారికి నేను ఆజ్ఞ యిచ్చియున్నాను. నా కోపము తీర్చుకొనవలెనని నా పరాక్రమశాలురను పిలిపించియున్నాను”. ఈ పదాన్ని దేవునికి ఆపాదించినప్పుడు అది వర్ణనాతీతమైన ఆయన రాజసాన్ని సూచిస్తుంది. “మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు” (యెషయా 57:15, కీర్తన 99:3 హబక్కూకు 3:3 . ఇందులో అలంకరించడం సిద్ధపరచడం అనే అర్థం కూడా ఇమిడి ఉంది. “దాని ప్రతిష్టించుటకు దానికి అభిషేకము చేయవలెను” (నిర్గమ 29:36, 40:11) “అతని ప్రతిష్టించుటకై అతని అభిషేకము చేయవలెను” (లేవీయ. 8.12, 30) "ఎవడైనను వీటిలో చేరక తన్నుతాను పవిత్రపరచుకొనిన యెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై.... ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును” ( 2 తిమోతి 2:21)

పరిశుద్ధము” లేదా “పరిశుద్ధపరచబడుట” అనే పదం అనేక వాక్యభాగాలలో నైతిక సంబంధమైన అర్థంలో వాడబడిందని, ఈ క్రింది వచనాల ద్వారా స్పష్టమౌతుంది... కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది” (రోమా 7:12). ఈ గుణవాచకాలన్నీ నైతికతకు సంబంధించినవి. వాక్యానుసారమైన సంఘ అధ్యక్షులకు ఉండవలసిన అర్హతను బట్టి అతడు “అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడను, ఆశానిగ్రహముకలవాడును.. ఉండవలెను” (తీతుకు 1:8). ఇవన్నీ నీతికి సంబంధించినవే. ముఖ్యంగా "పవిత్రత" అని వాడబడిన ఈ సందర్భాన్ని బట్టి ఇది "వేరుగా ఉంచడం” ప్రతిష్టించడం అనే బాహ్య అర్ధాన్ని మించిందని రుజువైతుంది. “అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలా అప్పగించితిరో, ఆలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి” (రోమా. 6:19): ఇక్కడ "పరిశుద్ధత” అనే పదం “అపవిత్రతకు ” వ్యతిరేకంగా వాడబడింది. అదే విధంగా (1 కొరింథీ 7:14) “మీ పిల్లలు అపవిత్రులైయుందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు” అని ఉంది. ఎన్నో విధాలుగా మనం ఆలోచించినప్పుడు, పరిశుద్ధపరచబడడంలో "కడుగబడుట ” లేదా “శుద్ధిచేయబడుట" అనే అర్థం కూడా ఇమిడి ఉందనేది స్పష్టం. ఉదాహరణకు “నీవు ప్రజల యొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుకుకొని మూడవ నాటికి సిద్ధముగా నుండవలెను”(నిర్గమ 19:10) రెండవది మొదటిదానికి గుర్తు. రోమా 6:19 లోను 1 కొరింథీ 7:14లోను చూసినవిధంగా ఇది అపవిత్రతకు వ్యతిరేకమైనది. అదే విధంగా 2 తిమోతి 2:21లో చెప్పబడినవిధంగా దేవుని సేవకుడు “ఘనతలేని పాత్రల నుండి తనను తాను పవిత్రపరచుకొనవలెను. ఇలా చేస్తే “వాడు పరిశుద్ధపరచబడి , యజమానుడు వాడుకొనుటకు తగిన పాత్రగా ఉంటాడు.” క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి... దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచెను” అని ఎఫెసీ 5:26లో ఉంది. “అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక అది పరిశుద్ధముగా ఉండుటకు (27) తన్ను తాను అప్పగించుకొనెను.” “మేకల యొక్కయు, కోడెల యొక్కయు, రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను” (హెబ్రీ 9:13). ఇంతకన్నా స్పష్టంగా చెప్పడానికేముంది. శుద్ధిచెయ్యబడడం అనే మార్గం ద్వారానే ధర్మశాస్త్రం క్రింద ఆచారసంబంధమైన పరిశుద్ధత లభించింది.

ఆంతరంగిక యధార్థ పవిత్రతే పరిశుద్ధపరచబడడానికి మొట్టమొదటి సరైన భావం. అపవిత్రంగా ఉండడం, పరిశుద్ధంగా ఉండడం ఒకదానికొకటి వ్యతిరేకం. శుద్ధీకరించబడడం అనే పదం పరిశుద్ధమైన వ్యక్తికి చెందినవిధంగా ,పాపం నుండి శుద్ధీకరించబడకపోవడం అనే మాట అపవిత్రమైన వ్యక్తికి చెందుతుంది. ఈ శుద్ధీకరణ, పరిశుద్ధపరచబడడంలో సమస్త కారణాలకు, సాధనాలకు ఆపాదించబడింది. పరిశుద్ధపరచబడడంలో పూర్తి ఆంతర్యం ఇదేనని కాదుగాని ప్రప్రధమంగా ఇది అవసరమైనది. “మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీమీద శుద్ధజలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను (యెహెజ్కె.36:25). ఈ విధంగా శుద్ధజలాన్ని మనపై చల్లడం ఏర్పాటు చెయ్యబడిన గమ్యం కొరకు (పరిశుద్ధపరచుటకు) పరిశుద్ధాత్మను మనపై కుమ్మరించడమే. ఈ కారణంవల్లే పరిశుద్ధాత్మ నీటితో సాదృశ్యింపబడ్డాడు. అది పరిశుద్ధాత్మునినే సూచిస్తుందని ఆ తరువాతి వచనంలో స్పష్టం చేయబడింది. “నా ఆత్మను మీ యందుంచి, నా కట్టడల ననుసరించువారిగా మిమ్మును చేసెదను” (26). ఈ రీతిగా ఆయన మొదట మనలను పాపమాలిన్యం నుండి కడిగి, ఆ తరువాత దేవుని కట్టడలను అనుసరించేవారిగా చేస్తానని వాగ్దానం చేసాడు.

కాబట్టి పరిశుద్ధపరచబడడం అంటే (చాల సందర్భాలలో) దేవుని కొరకు నియమించబడడం, ప్రతిష్టించబడడం లేదా ఒక పరిశుద్ధమైన, ప్రత్యేక ఉపయోగం కొరకు ప్రత్యేకపరచబడడం అని అర్థం. అయినప్పటికీ ఆ విధంగా ప్రత్యేకించే ప్రక్రియ, వేరుపరచడానికి మాత్రమే పరిమితం కాక దేవునికి తగినదిగా తీర్చిదిద్దే కార్యం కూడా అందులో అంతర్భాగమై ఉంటుంది. కాబట్టి పరిశుద్ధపరచబడిన యాజకులు (లేవీయ.8) నీటితో కడుగుకోవడం ద్వారానూ తీతుకు 3:5 ). తమపై రక్తము చల్లుకోవడం ద్వారానూ రోమా 5:9 నూనెతో అభిషేకించబడం వలననూ 1 యోహాను 2:20,27;), శుద్ధీకరించబడ్డారు. పరిశుద్ధపరచబడడం అనే పదం క్రైస్తవులకు అన్వయించినప్పుడు, మూడు విషయాలను లేక ఒకే విషయానికి చెందిన మూడు కోణాలను సూచించడానికి అది వినియోగించబడింది. మొదటిది, వారిని దేవుని కొరకు ప్రత్యేకించే లేదా పరిశుద్ధంగా చేసే ప్రక్రియ (హెబ్రీ13:12;) 2 థెస్సలొ 2:13;), రెండవది, వారు ప్రత్యేకించబడి, నడిపించబడిన పరిశుద్ధస్థితి (1కొరింథీ.1:2;), ఎఫెసీ 4:24;), మూడవది ఆ స్థితి నుండి కలుగే వ్యక్తిగత పవిత్రత లేక పరిశుద్ధ జీవితం (లూకా 1:75;), 1 పేతురు 1:15;).

నూతన నిబంధన సిద్ధాంత ప్రకటనలకు శ్రేష్టమైన అర్థమిచ్చే పాత నిబంధన ఛాయలవైపు మనం తిరుగుదాం. అయితే మనం ఒక విషయాన్ని మనసులో ఉంచుకోవాలి. వస్తువు దాని నీడకన్నా ఎలా ఉన్నతంగా ఉంటుందో, బాహ్యాచారాలకు అందులోని అంతర్లీనమైన విషయాలు ఎలా శ్రేష్టంగా ఉంటాయో, అలాగే అసలు విషయం కూడా సాదృశ్యంగా చెప్పబడినదానికన్నా ఎల్లప్పుడూ ఉన్నతంగానే, శ్రేష్టంగానే ఉంటుంది. “ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్టించుము. అది నాది” (నిర్గమ 13:2). పస్కా పశురక్తం చేత ప్రథమ సంతానం విడిపించబడడాన్ని గురించి ఆ ముందు అధ్యాయంలో చెప్పిన వెంటనే ఈ మాట చెప్పబడింది. మొదట నీతిమంతులుగా తీర్చబడడం, ఆపై ప్రతిష్టింపబడడం (పరిశుద్ధపరచబడుట) ఈ రెండూ ఒకే కార్యంలోని రెండు భాగాలు. “కావున మీరు పవిత్ర పక్షులకును, అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైనదని నేను మీకు వేరు చేసిన యే జంతువు వలననే గాని, ఏ పక్షి వలననే గాని నేల మీద ప్రాకు దేని వలననే గాని మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడాదు. మీరు నాకు పరిశుద్ధులైయుండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై యుండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరు పరచితిని” (లేవీయ 20: 25-26). ఇక్కడ అన్ని అపవిత్రతల నుండి ప్రత్యేకించబడి నిష్కపటంగా, సంపూర్ణంగా ప్రభువుకు ప్రతిష్టించబడి ఉండే ఒక ప్రత్యేకతను చూస్తున్నాం.

 

పరిశుద్ధపరచబడుటను గురించిన సిద్ధాంతం

3.దాని ఆవశ్యకత

ఈ పుస్తకాన్ని ఒక దైవశాస్త్ర ధోరణిలో అస్పష్టంగా కాకుండా, ఆచరణయోగ్యమైన విధంగా రాయలన్నదే నా యధార్థమైన ఆశ . అక్కరగల మన హృదయాలతో ప్రభువు మాట్లాడి, చలనం లేని మన మనసాక్షిని పరిశీలించడానికి ఆయన ఇష్టపడే విధంగా ఈ పుస్తకాన్ని రాయాలని ఆశిస్తున్నాను. పరిశుద్ధపరచబడవలసిన అవసరత గురించి చర్చించటం ఈ అంశంలో ఉన్న అతి కీలకమైన భాగమైనప్పటికీ శరీరానుసారమైన మన మనసుకు అది అయిష్టకరమైనది. అందుకే దానిని పరిశీలించకుండా తప్పించుకుంటూ ఉంటాము. అపరాధంలో రూపు దాల్చి పాపంలో తల్లి గర్భంలో పడటం వలన (కీర్తన. 51:5;) సహజంగానే మన హృదయాలు పరిశుద్ధతను ద్వేషిస్తాయి. దానితో ఆచరణాత్మకమైన పరిచయం కలిగి ఉండడాన్ని వ్యతిరేకిస్తాయి. యేసు ప్రభువు ఆనాటి "మతనాయకులతో చెప్పిన విధంగా “ఆ తీర్పు ఇదే ; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక “ చీకటినే ప్రేమించిరి” (యోహాను 3:19). దీనికి “మనుషులు పరిశుద్ధతను ప్రేమించక పాపాన్నే ప్రేమించారని ” అర్ధం చెప్పవచ్చు. ఎందుకంటే వాక్యంలో “చీకటి” అంటే పాపం “ చీకటిశక్తి పై దుష్టునికి ఉన్న అధికారాన్ని అది సూచిస్తుంది. అదే విధంగా “వెలుగు” పరిశుద్ధుడైన దేవునికే చిహ్నంగా ఉంది (1 యోహాను 1:5;).

స్వభావసిద్ధంగా మానవుడు వెలుగును వ్యతిరేకించినప్పటికీ "అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండ ఎవడును ప్రభువును చూడడు” (హెబ్రీ. 12:14) అని రాయబడింది. అదే విధంగా యేసు ప్రభువు కూడా “హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు” (మత్తయి 5:8) అని చెప్పాడు. శరీర సంబంధులకు, అవినీతిపరులకు దేవుడు సమీపంగా ఉండడు. “సమ్మతింపడకుండ ఇద్దరు కూడినడతురా?” (ఆమోసు. 3:3) ఒక అపవిత్రమైన వ్యక్తికి అతి పరిశుద్ధుడైన దేవునికి మధ్య ఏమి పొత్తు? మన దేవుడు “పరిశుద్ధతను బట్టి మహనీయుడు ” (నిర్గమ 15:11). కాబట్టి ఆయన తన కొరకు ప్రత్యేకపరచుకున్నవారు ఆయనకు సరిపోలినవారై ఉండాలి, కాబట్టి వారు “ఆయన పరిశుద్ధతలో పాలుపొందవలెను” (హెబ్రీ 12:10). మనుష్యులతో ఆయన వ్యవహరించే విధానాలన్నిటిలో ఈ సూత్రం ప్రదర్శింపబడింది. “నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీమొద్ద చోటు లేదు” (కీర్తన 5:4) అని ఆయన వాక్యం ఎడతెగక ప్రకటిస్తుంది.

ఆదాము పతనం వలన మనం దేవుని కటాక్షం మాత్రమే కాకుండా మన స్వభావంలోని పరిశుద్ధతను సైతం కోల్పోయాం. కాబట్టి మనం దేవునితో సమాధానపడడం మాత్రమే కాకుండా, అంతరంగ పురుషుడు పరిశుద్ధపరచబడవలసిన అవసరం కూడా ఉంది. మన స్వభావమంతటిపైన ఆత్మసంబంధమైన కుష్టువ్యాధి వ్యాపించి ఉన్న కారణాన్ని బట్టి దేవునికి మనం అసహ్యులమై ఉన్నాం. అది మనల్ని ఆయన నుండి వేరు చేసింది. ఈ భయంకరమైన వ్యాధి నుండి విడుదలకు పాపి ఎంత ప్రయత్నించినా అతడు దానిని దాచగలడే తప్ప దానిని కడుగుకోలేడు. ఆదాము అంజూరపు ఆకులతో చేసుకున్న కచ్చడాలు అతని దిగంబరత్వాన్ని కాని, సిగ్గును కాని కప్పలేకపోయాయి. కాబట్టి స్వభావికమైన అపవిత్రతను దాచుకోవడానికి బాహ్యమతం తప్ప వేరేమీ లేనివారు తమ ఆత్మీయ దిగంబరత్వాన్ని మరియు సిగ్గును బట్టబయలు చేసుకుంటున్నారే తప్ప దాచలేక ఉన్నారు. ఈ విషయంలో మీరెంతమాత్రమూ పొరపడవద్దు. మేము క్రైస్తవులమని ప్రకటించడం వలన కాని, కొన్ని మంచి పనులు చేయడం వలన కాని మనం అతి పరిశుద్ధుడైన ఆయనను సమీపించలేము. పరిశుద్ధాత్మ చేత, క్రీస్తు రక్తం చేత స్వభావికమైన అపవిత్రత నుండి కడగబడితేనే తప్ప మనం దేవుని రాజ్యంలో ప్రవేశించలేము.

అయ్యో, భక్తి ప్రదర్శనతోను, పై వేషంతోనూ, బాహ్యాచారాలతోనూ ఎంతోమంది తృప్తిపడుతున్నారు. వారు ఛాయను వాస్తవికత అనీ, సాధనాన్ని ఫలితమనీ భ్రమపడుతున్నారు. “తాము దౌర్భాగ్యులమని దిక్కుమాలినవారమని దరిద్రులమని గ్రుడ్డివారమని దిగంబరులమని” తెలియని ఎందరో లవొదికయులు ఈనాడు కూడా ఉన్నారు.

ఏ బోధ కూడా వారిపై పని చెయ్యదు. “నా దేవా, నా దేవా, నా ముఖము నీ పైపు ఎత్తికొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనైయున్నానని” ప్రవక్తవలె వారు చెప్పగలిగేలా (ఎజ్రా 9:6) ప్రేరేపించబడరు. మనుష్యుల మధ్య శిక్షార్హమని గుర్తించబడిన పాపాల నుండి వారు తమను తాము కాపాడుకుంటున్నప్పటికీ మిగతా విషయాలలో వారి మనస్సాక్షి మృతతుల్యమే. వారి ఆత్మలకు దేవునికి మధ్య ఉన్న ఏ అడ్డంకిని గురించి కూడా వారు సిగ్గుపడరు. ముఖ్యంగా వారి స్వభావంలో ఉన్న అంతర్గత చెడుతనం మరియు అపవిత్రతలను బట్టి ఎంత మాత్రం సిగ్గు చెందరు. వాటిని గురించి వారు ఏ మాత్రమూ ఎరుగరు, గ్రహించరు, దుఃఖించరు.

"తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యమునుండి కడుగబడని వారి తరము కలదు” (సామెత 30:12). వారెన్నడూ పరిశుద్ధాత్మ చేత శుద్ధి చేయబడకపోయినప్పటికి, విశ్వాసం వలన వారి హృదయాలు పవిత్రపరచబడక పోయినప్పటికి తమకు తామే పవిత్రులమని తలచి, తాము అపవిత్రులమనే భావన కొంచమైనా లేకుండా ఉన్నారు. క్రీస్తు జీవించిన దినాలలోని పరిసయ్యులు కూడా ఇలాంటి స్వనీతిపరులైన తరమువంటివారే. వారు నిత్యం తమ చేతులను, పాత్రలను కడుగుకుంటూ, ఆచార పూరితంగా నానావిధాలైన ప్రక్షాళనలలో తలమునకలై ఉండి, లోపట వారు “దోపిడీతోనూ, ఇంద్రియనిగ్రహలేమితోను” నిండి ఉన్నారని గ్రహించలేకపోయారు. ఈనాడు సంఘంలోని అనేకులు కూడా ఈ విధంగానే ఉన్నారు. వారు సంప్రదాయక అభిప్రాయాలు కలవారై , పైకి భక్తిగలవారిలా కనిపిస్తూ, క్రమం తప్పకుండా కానుకలిస్తారు, కాని వారి హృదయ స్థితి ఎలా ఉందని ఆలోచించరు.

పరిశుద్ధపరచబడడం లేదా వ్యక్తిగత పరిశుద్ధత ఎంతో అవసరమని ఇక్కడ నేను చూపించాలని ఆశిస్తున్నాను. పరిశుద్ధపరచబడడంలో మూడు విషయాలు ఉన్నాయి. మొదటిది మన అంతరంగంలో మార్పు లేదా ఆత్మీయంగా నూతనపరచబడడం; కోరికలు, చిత్తం దేవునితో ఐక్యమవడం. రెండవది - బయలుపరచబడిన దేవుని చిత్తాన్ని (బైబిలును) అనుసరించి, మన విధులను విధేయతతో చెయ్యడం, దుష్టత్వం నుండి వైదొలగడం. ఇవి విశ్వాసం మరియు ప్రేమ నియమం నుండి కలుగుతాయి. మూడవది, మనం చేసే పనులన్నీ సువార్తను అనుసరించి, యేసుక్రీస్తు నందు దేవుని మహిమ కొరకు మాత్రమే చెయ్యడం. ఇది మాత్రమే, దీనికి తక్కువగా ఉండనిది మాత్రమే, సౌవార్తికమైన, రక్షణార్థమైన పరిశుద్ధత. దేవుని స్వభావానికి, ఆయన చిత్తానికి అనుగుణంగా హృదయం మార్పుచెందాలి. దాని ఉద్దేశాలు, కోరికలు, ఆలోచనలు, కార్యాలన్నీ పరిశుద్ధపరచబడాలి. చీకటి ఎంత మాత్రమూ లేని ఆయనకు అంగీకారయోగ్యంగా మన బాహ్యక్రియలను పవిత్రం చేసే పరిశుద్ధపరచే పరిశుద్ధాత్మ మన అంతరంగంలో ఉండాలి.

సౌవార్తిక పరిశుద్ధత, బాహ్యంగా కనిపించే పవిత్ర కార్యాలలోను, ప్రేమలోను మాత్రమే ఉండదు. అది పరిశుద్ధమైన తలంపులను, కోరికలను, నిస్వార్థమైన ప్రేమను కలిగి ఉంటుంది. పరలోకం నుండి అంగీకారం పొందాలంటే, మంచి కార్యాలన్నీ ఈ నియమం నుండే ఉద్భవించాలి. పాపసంబంధమైన వాంఛలను విడిచిపెట్టడం మాత్రమే కాకుండా దేవుని చిత్తాన్ని సంతోషంతో నెరవేర్చాలనే వాంఛ కూడా ఉండాలి. బరువైన కాడిని మోస్తునట్టు విధి నిర్వహణలో దుఃఖం కాని, గొణుగుడు కాని ఉండరాదు. సౌవార్తిక పరిశుద్ధత అంటే మనం దేవుణ్ణి అత్యధికంగా ప్రేమించేలా చేసే హృదయ పవిత్రత. తద్వారా మనం అన్ని విషయాలలోను దేవుణ్ణి నిత్యం సేవించడానికి మనలను మనం అప్పగించుకుంటాము. ఆయనను మన ప్రభువుగా చేసుకుంటాము అంటే సంపదలోను, కష్టంలోను, జీవంలోను, మరణంలోను ఆయన చిత్తానుసారంగా వ్యవహరించబడేలా మనలను మనం అప్పగించుకోవడమే. మనవలె మన పొరుగువారిని ప్రేమించటం కూడా ఈ పరిశుద్ధతలో ఇమిడి ఉంటుంది.

ఈ విధమైన అంతరంగ మరియు బాహ్య పవిత్రత తప్పక అవసరం. జీవితం మారాలంటే స్థితిలో మార్పు రావాలి. “చెట్టు మంచిదని యెంచి దాని పండును మంచిదే అని యెంచుడి” (మత్తయి 12:33). కాబట్టి మహిమపరచబడక ముందు పరిశుద్ధపరచబడాలి. మనం పాపపు కాలుష్యం నుండి పవిత్రపరచబడకపోతే మనమెన్నటికీ దేవునితో సంబంధం కలిగి ఉండలేము. "నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైన దానిని అబద్దమైన దానిని, జరిగించువాడైనను దానిలో ప్రవేశింపనే ప్రవేశింపడు” (ప్రకట 21:27). "పరిశుద్ధపరచబడని పాపి ధన్యకరమైన దేవుని సంతోషంలో పాల్గొనగలడు అనడం, ధర్మశాస్త్రాన్ని, సువార్తను పడత్రోసి క్రీస్తు వ్యర్థంగా చనిపోయాడని అనడమే” (జాన్. ఒవెన్, వాల్యూం 2: పే 511). నిత్యమైన ఆనందం పొందడానికి పాపక్షమాపణ ఎంత అవసరమో వ్యక్తిగత పరిశుద్ధత కూడా అంతే అవసరం.

పైన చెప్పిన మాటలు ఎంత స్పష్టంగా, అంగీకారయోగ్యంగా ఉన్నప్పటికీ కొందరు క్రైస్తవులు విశ్వాసి రక్షణ అంతా అతడు నీతిమంతునిగా తీర్చబడడంలోనే ఉందని భావిస్తున్నారు. అది అందులో ఒక భాగం మాత్రమే అని గుర్తించడం లేదు. అలాంటివారు తమకు ఆపాదించబడిన క్రీస్తు నీతియందే ఆనందిస్తూ తమ వ్యక్తిగత పరిశుద్ధత గురించి ఏమాత్రం పట్టించుకోరు. మరొకవైపు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడతామని ఏకపక్షంగా వాదించేవారిని తీవ్రంగా ఎదిరించేవారు అనేకులున్నారు. కేవలం పరిశుద్ధపరచబడుట మాత్రమే వారి తలంపులను, బోధను ఆక్రమించేలా చేస్తున్నారు. అయితే మనం ఒక విషయాన్ని గ్రహించాలి. ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడడం అనే సిద్ధాంతాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నప్పటికీ అతడు దేవుని ఎదుట నీతిమంతునిగా తీర్చబడకపోవచ్చు. అదే విధంగా అతడు పరిశుద్ధత గురించి అతిగా మాట్లాడేవారిలో సైతం తప్పులను ఎత్తి చూపగలడు కాని తాను పూర్తిగా అపవిత్రుడుగా ఉండవచ్చు. అయితే ముఖ్యంగా నేనిప్పుడు ఈ రెండింటిలో మొదటి తప్పును ఎత్తి చూపించాలనుకుంటున్నాను. దీనిని గురించి చక్కగా వివరించిన ఒకరి వివరణను ఇక్కడ ప్రస్తావించటం ప్రయోజనకరం.

"క్రీస్తునందలి విశ్వాసం ద్వారా పొందిన రక్షణలో పరిశుద్ధత ఒక ముఖ్యమైన భాగమని గ్రహించాలి. కొందరు రక్షణకు మంచి కార్యాలు అవసరమనే భ్రమలో మునిగి, మనం రక్షణకు సత్క్రియలు అవసరం లేదని చెబుతున్నామని మనలను నిందిస్తున్నారు. క్రీస్తునందు పాలిభాగస్తులవడానికి కాని, ఆయనను విశ్వాసం ద్వారా అంగీకరించేలా సిద్ధపడడానికి కాని సత్క్రియల అవసరత లేదని మనం చెబుతున్నామని వారు నిందిస్తున్నారు. మరికొందరు తాము కృపచేతనే రక్షింపబడుతున్నారని, సత్క్రియలు అవసరం లేదని వాక్యంలో చదివి రక్షణ పొందడానికి ధర్మశాస్త్రానికి లోబడనవసరం లేదని, కేవలం కృతజ్ఞతగా మాత్రమే దానికి విధేయత చూపిస్తే చాలని, దానిని పూర్తిగా నిర్లక్ష్యం చేసినా ఉచితంగా ఇయ్యబడే కృప వలన రక్షింపబడతామని తలుస్తున్నారు. కొందరైతే బలమైన స్వేచ్ఛావాద ఊహలకు లోనై క్రీస్తురక్తం ధర్మశాస్త్ర బంధకం నుండి స్వేచ్ఛనిచ్చిందని తలంచి తమ ప్రవర్తనలో ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి కూడా మనస్సాక్షి గద్దింపనివారై ఉన్నారు.”

ఇలా పరస్పర విరుద్ధంగా ఉన్న ఈ పొరపాట్లకు ఒకానొక కారణం - రక్షణ అంటే నరకంనుండి విడిపింపబడి, పరలోక సంతోషాన్ని, మహిమను అనుభవించడమే అని అనేకులు తలంచడమే. కాబట్టి మహిమపరచబడటానికి సత్క్రియలు సాధనమైనట్లయితే, అవి మన సంపూర్ణ రక్షణకు అవసరమని, ఒకవేళ సంపూర్ణ రక్షణకు అవి సాధనం కాని పక్షంలో, మహిమపరచబడడానికి కూడా అవి ఎంతమాత్రమూ అవసరం లేదని వారు తీర్మానిస్తారు. అయితే తరచుగా వాక్యం రక్షణలో ఉన్న విశిష్టతను పరలోక పరిపూర్ణతగా చిత్రీకరించినప్పటికీ, విశ్వాసం ద్వారా ఈ లోకంలో కాని, మహిమపరచబడడం వలన పరలోకంలో కాని, మనం దుష్టత్వం నుండి విడుదల పొంది క్రీస్తు అనుగ్రహించే పరిపూర్ణ పవిత్రత మరియు ఆనందంలో పాల్గోవడమే రక్షణ యొక్క సంపూర్ణమైన, సరైన అర్థమని మనం గ్రహించాలి. ఈ విధంగా నీతిమంతులుగా తీర్చబడడం, పరిశుద్ధాత్మ మనలో నివసించే వరం, దత్తపుత్రులం అయ్యే ఆధిక్యత, రక్షణలో ఒక భాగం. వీటిని ఈ జీవితంలోనే మనం అనుభవిస్తాం. అదే విధంగా మన హృదయాలు దేవుని ధర్మశాస్త్రానికి లోబడడం , ఈ జీవితంలో క్రీస్తు యేసు ద్వారా నీతిఫలాలతో నింపబడటం, మన రక్షణలో అత్యవసరమైన భాగమే. దేవుడు ఈ లోకంలోనే మన పాపపు అపవిత్రత నుండి పరిశుద్ధాత్ముడు ఇచ్చే నూతనజీవం ద్వారా శుద్ధి చేసి ఆ తరువాత నరకం నుండి మనలను రక్షిస్తాడు (యెహెజ్కె. 36:29;); తీతుకు 3:5;). క్రీస్తు, “యేసు” (అనగా రక్షకుడు) అని పిలవబడ్డాడు. ఎందుకనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును (మత్తయి 1:21). కాబట్టి మన పాపాల నుండి విడుదల మన రక్షణలో ఒక భాగం. అది ఈ జీవితంలోనే నీతిమంతులుగా చేయబడడం మరియు పరిశుద్ధపరచబడడం ద్వారా ప్రారంభమై, రానున్న జీవితంలో మహిమపరచబడడం ద్వారా సంపూర్ణమౌతుంది. మనం మన అపరాధముల‌ చేతనూ పాపముల చేతనూ చచ్చినవారమై ఉండగా దేవుని కొరకు జీవించడానికి క్రీస్తు చేత బ్రతికించబడి, పరిశుద్ధతగలవారమై, దేవుని రూపాన్ని కలిగి, పతనం ద్వారా కొల్పోయిన నీతిని తిరిగి పొందడం, సాతానుకూ మన సొంత శరీరవాంఛలకూ దాస్యం చెయ్యడం నుండి విడుదల పొంది దేవుని దాసులుగా పరిశుద్ధాత్మద్వారా నడిచే ఘనత పొందడం, ఆత్మఫలాలు ఫలించడం, ఇవన్నీ మన రక్షణలో భాగం‌ కాదేమో అని న్యాయంగా అనుమానించగలమా? ఇదంతా హృదయంలోను, జీవితంలోను ఉండవలసిన పరిశుద్ధత కాకపోతే మరేంటి?

కాబట్టి నేను ఈ ముగింపుకు వచ్చాను. ఈ లోకంలో పరిశుద్ధులుగా ఉండడం రక్షణ పొందడానికి తప్పక అవసరం. అది గమ్యం చేర్చే సాధనం మాత్రమే కాదు కాని మరింత ఉదాత్తమైన అవసరతగా గమ్యంలో ఒక భాగమై ఉంది. సత్క్రియలు ద్వారా మనం రక్షణ పొందకపోయినా సత్క్రియలు చెయ్యడానికి రక్షించబడి ఉన్నాం. అవి రక్షించే కృప యొక్క ఫలాలు మరియు ఫలితాలు. అవి “వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచినవి” (ఎఫెసీ 2:10;). సత్క్రియలు చేయవలసిన నిబంధన యొక్క దాస్యం నుండి (ధర్మశాస్త్రం నుండి) విడుదల పొందటం రక్షణలో ఒక భాగమైనప్పటికీ, దాని ఉద్దేశం పాపం చెయ్యడానికి స్వేచ్ఛనివ్వటం కాదు (అది బానిసత్వంలో అతి నీచమైనది) కాని "స్వాతంత్రము నిచ్చు సంపూర్ణమైన నియమం” మనం నెరవేర్చడమే. ఎందుకంటే మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితిగలవారం కాకుండా ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చెయ్యడానికి పిలువబడ్డాం. (గలతీ. 5:13;). రోమా 7:6;). ఔను ఈ జీవితకాలంలో పరిశుద్ధులుగా ఉండటం రక్షణలో ఒక భాగం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం అవ్వడానికి ఇది అవసరమైన సాధనమై ఉంది. ఎందుకంటే “పరిశుద్ధత లేకుండ ఎవడును ప్రభువును చూడడు” (హెబ్రీ 12:14). ఈ లోకపు రాజమందిరంలోనికి పందికి ప్రవేశం లేని విధంగా, పరిశుద్ధత లేనిదే మహిమగల దేవుని సన్నిధికి మనం తగము.

ఈ విషయంలో ఆఖరుగా గుర్తుంచుకోవలసింది ఏంటంటే, మన రక్షణలో ప్రధాన పాత్ర వహించే హృదయ పరిశుద్ధతనూ జీవితంలో పవిత్రతనూ విశ్వాసం ద్వారా ఆసక్తితో వెదకాలి. సువార్త క్రింద అజ్ఞానంతో జీవించే అనేకులు పాపం వలన హృదయాలను కఠినపరచుకుని, తమ ఆత్మలను శాశ్వతంగా నాశనం చేసుకుంటున్నారు. వీరు కేవలం ఊహాకల్పితమైన రక్షణ కొరకు క్రీస్తును నమ్ముతున్నారు. ఇలాంటి రక్షణలో పాపక్షమాపణ మరియు నిత్యయాతన నుండి విడుదల మాత్రమే ఉంటుంది కాని పరిశుద్ధత లేదు. పాపపు శిక్ష నుండి వారు విడుదల పొందాలని కోరతారు కాని పాపవాంఛతో పరిశుద్ధతను ద్వేషిస్తూ పాపాన్ని సేవించడం నుండి రక్షణ పొందాలని ఆశించరు. ఇలాంటి అపాయకరమైన భ్రమను వ్యతిరేకించే విధానం కొందరు చేసేవిధంగా క్రీస్తునందు విశ్వాసముంచడమే రక్షణార్థమైన కార్యం అనే వాస్తవాన్ని త్రోసిపుచ్చడం కాదు కాని పరిశుద్ధత కొరకు ఆయనను విశ్వసించనివారు నిజమైన రక్షణ కొరకు ఆయనను నమ్మడం లేదనీ, తమ హృదయంలోను, జీవితంలోను పరిశుద్ధతను నీతిని కావాలని ఆశించనిదే వారు నిజమైన రక్షణను కోరడం లేదని నిరూపించడమే. దేవుడు మరియు క్రీస్తు నీకు రక్షణ ఇచ్చినట్లయితే పరిశుద్ధత అందులో ఖచ్చితంగా ఒక భాగమై ఉంటుంది. క్రీస్తు నిన్ను నీ పాపమాలిన్యం నుండి కడగనిదే నీకు ఆయనతో పాలు ఉండదు (యోహాను 13:8;).

పరిశుద్ధతను కోరనివారు ఎంత చిత్రమైన రక్షణను కోరుకుంటున్నారు! వారు రక్షించబడతారంట. అయినా ఇంకా దేవుని రూపాన్ని కోల్పోయి, సాతాను వికృతరూపాన్ని కలిగి, వాడికి బానిసలై, తమ సొంత శరీరాశలకు లోనై మహిమలో దేవుని సంతోషాన్ని పొందడానికి తగనివారిగానే ఉండిపోతారంట. కాని అలాంటి రక్షణ కొరకు క్రీస్తు తన రక్తాన్ని ధారపోయలేదు. దానిని వెదకేవారు క్రీస్తునందలి దేవుని కృపను దుర్వినియోగపరచి, దానిని కామాతురతగా మారుస్తున్నారు. వారు క్రీస్తు ద్వారా రక్షణ పొందాలని కోరతారు కాని శరీరానుసారమైన మనసుకలవారై క్రీస్తుకు వెలుపలే ఉండిపోతారు. అయితే క్రీస్తుయేసునందున్నవారిని మాత్రమే దేవుడు శిక్షావిధి నుండి విడిపిస్తాడు. వారు శరీరానుసారంగా నడిచేవారు కాదు కాని ఆత్మానుసారంగా నడిచేవారే, లేని పక్షంలో వారు క్రీస్తును విభాగించి ఆయన రక్షణలో ఒక భాగంలో మాత్రమే పాలివారై మిగిలిన భాగాన్ని విడిచిపెట్టినవారు ఔతారు. కాని క్రీస్తు విభజించబడలేదు (1కొరింథీ 1:13;) తమ పాపములు క్షమించబడాలని వారు కోరినప్పటికి అది ప్రేమ కలిగి దేవునితో నడవడానికి కాదు కాని శిక్షావిధి యొక్క భయం లేకుండా దేవునితో వైరంలో(పాపంలో) కొనసాగేందుకే. కాని మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. అలాంటివారికి నిజమైన రక్షణ అంటే ఏమిటో తెలియదు. వారు తమ నశించిన స్థితిని సరైన విధంగా గుర్తించలేరు. పాపం వలన కలిగే గొప్ప కీడు వారు ఎరుగరు. వారు క్రీస్తును విశ్వసించింది కేవలం తమ మేథస్సు నుండి పుట్టిన ఊహాకల్పితమైన రక్షణ కొరకే. అటువంటి విశ్వాసమంతా వ్యర్థమే.

సువార్త యందలి విశ్వాసం, మనం ఆకలిదప్పులతో క్రీస్తు వద్దకు వచ్చి జీవజలం త్రాగేలా అనగా పరిశుద్ధపరచే ఆయన ఆత్మను పొందేలా (యోహాను 7:37,38;) చేసి, నరకం నుండి మాత్రమే కాకుండా పాపం నుండి కూడా రక్షించమని హృదయపూర్వకంగా ఆయనను వేడుకుని “నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమున నన్ను నడిపించును గాక (కీర్తన 143:10); " నీవు నా మనస్సును త్రిప్పిన యెడల నేను తిరుగుదును” (యిర్మియా 31:18); "దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగచేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము” అని ప్రార్థించేలా చేస్తుంది. (కీర్తన 51:10). ఈ విధంగా కృపచేత రక్షణ అనే సిద్ధాంతం క్రీస్తు ద్వారా ఉచితంగా అనుగ్రహించబడిన రక్షణలో ఒక సారవంతమైన భాగంగా ఉండి, పరిశుద్ధ జీవితాన్ని విశ్వాసంతో వెదకడానికి బలవంతం చేస్తుంది (వాల్టర్ మార్షల్, 1962).

అయ్యో ! ఈనాడు రక్షణ అంటే ఏమిటో వాక్యానుసారంగా ఎరుగనివారు అనేకులుండడం ఎంతో విచారకరం. బోధకులు అనేకులు కేవలం ఒక “ఊహాకల్పితమైన రక్షణను నిజరక్షణకు మారుగా ప్రకటిస్తూ వారి శ్రోతలను మోసగిస్తున్నారు. ప్రియ పాఠకుడా, నువ్వు ఈ విషయంలో పొరపడవద్దని నిన్ను బ్రతిమాలుతున్నాను. నీ హృదయం పరిశుద్ధపరచబడకపోతే నువ్వు ఇంకా రక్షింపబడనివాడవే. ఆత్మపరిశుద్ధత కొరకు దాహం నీలో లేకపోతే దేవుడిచ్చే రక్షణ కొరకు నిజమైన వాంఛ నీకు లేదు. క్రీస్తు తన ప్రజల కొరకు కొన్న రక్షణలో నీతిమంతులుగా తీర్చబడడం మరియు పరిశుద్ధపరచబడడం - ఈ రెండూ ఇమిడి ఉన్నాయి. ప్రభువైన యేసు పాపపు దోషం మరియు శిక్ష నుండి మాత్రమే కాకుండా దాని శక్తి మరియు మాలిన్యం నుండి కూడా రక్షిస్తాడు. పాప వాంఛ నుండి విడిపించబడాలనే కోరిక ఉన్న చోట నిజరక్షణ పొందాలనే వాంఛ కూడా ఉంటుంది. కాని ఆచరణాత్మకంగా పాపపు దాస్యం నుండి విడుదల కలగకపోతే రక్షించే ఆయన కృపకు మనమింకా అన్యులమే. క్రీస్తు “మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును మనము శత్రువుల చేతిలో నుండి విడిపించబడి, మన జీవిత కాలమంతయు నిర్భయులమై, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను, అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను” (లూకా. 1:75). దీనిని బట్టి మనలను మనం బేరీజు వేసుకోవాలి, పరీక్షించుకోవాలి. మనమాయనను పరిశుద్ధతయందు, నీతియందు సేవిస్తున్నామా? లేని పక్షంలో మనమింకా పరిశుద్ధపరచబడలేదు. పరిశుద్ధపరచబడకపోతే మనమాయనవారం కాము.

 

పరిశుద్ధపరచబడుటను గురించిన సిద్ధాంతం

4.దాని ఆవశ్యకత (ముగింపు)

పరిశుద్ధపరచబడడం అవసరమని వివరించిన మునుపటి అధ్యాయాలలో, ఒక పాపి రక్షణకు, అతడిని పరిశుద్ధంగా చెయ్యడం అవసరమని చూసాం. ఔను, పరిశుద్ధపరచబడడం రక్షణలో అంతర్భాగం. ప్రాముఖ్యమైన ఈ మూలసత్యాన్ని నిర్లక్ష్యం చెయ్యడమే ఆధునిక పరిచర్యలోని తీవ్రమైన లోపం. ఈనాడు మారుమనస్సు పొందామని చెప్పుకునే అనేకులను గురించి “ఎఫ్రాయిము తిప్పివేయబడని అప్పము” (హోషేయ 7:8) అని చెప్పడానికి ఎంతో కారణం ఉంది. అది క్రింద మాడి, పైన కాలనట్టు ఉంది. క్రీస్తు నరకం నుండి తప్పించే సాధనంగా చూపించబడుతున్నాడే తప్ప, అంతరంగంలో నివసించే పాపం నుండి స్వస్థపరచే పరమవైద్యునిగా, పరలోకంలో ఉండటానికి తగినట్టు మార్చగలవానిగా ప్రకటించబడడం లేదు. పాప క్షమాపణ ఎలా పొందాలనే అంశంపై ఎంతో చెబుతారు. కానీ పాపపంకిలం నుండి ఎలా శుద్ధీకరించబడాలి అనే అంశంపై ఏమీ బోధించరు. విమోచించే ఆయన రక్తం యొక్క ఆవశ్యకతను గురించి ఎన్నో చెబుతారు కాని ఆచరణాత్మకమైన పరిశుద్ధత యొక్క అవసరత గురించి ఏమీ చెప్పరు. దీని ఫలితంగా క్రీస్తు బలిదానం యొక్క పరిపూర్ణతను మేథాసంబంధంగా ఒప్పుకునే వేలాదిమందికి, హృదయశుద్ధి గురించి ఏమీ తెలియదు.

అదేవిధంగా, నేడు విశ్వాసానికి ఇవ్వబడుతున్న స్థానానికీ, మరియు పరిశుద్ధపరచబడడం వలన కలిగే విధేయతకు లేఖనాలిచ్చిన ప్రాధాన్యతకూ మధ్య సమతుల్యం కొల్పోవటం చాలా విచారంగా ఉంది. “విశ్వాసము లేకుండ దేవునికిష్టుడై యుండుట అసాధ్యము” (హెబ్రీ11:6) అనేది ఎంత సత్యమో “పరిశుద్ధత లేకుండ ఎవడును ప్రభువును చూడడు” (హెబ్రీ12:14) అన్నది కూడా అంతే సత్యం. "క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందేమియు లేదు. పొందక పోవుటయందేమియు లేదు” (గలతీ 6:15) అని మాత్రమే చెప్పబడలేదు కాని “దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమియులేదు, సున్నతి పొందకపోవుట యందేమియు లేదు” (1కొరింథీ 7:19) అని కూడా రాయబడి ఉంది. “దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును” (1తిమోతి4:8) అని దేవుడు మనతో వ్యర్థంగా పలకలేదు. వాగ్దానాలన్నిటిలో కేవలం ఆచరణాత్మకమైన, కీలకమైన, వ్యక్తిగతమైన, దైవభక్తికి ప్రాధాన్యత ఇవ్వబడటం మాత్రమే కాక, విశ్వాసిని ఆ వాగ్దానాలకు అర్హునిగా తీర్చిదిద్దేది కూడా ఆ దైవభక్తే అని స్పష్టమౌతుంది.

అయ్యో, ఈనాడు ఎక్కువమంది పరిశుద్ధత లేకుండా, విశ్వాసముంటే చాలు తప్పక పరలోకం చేరతామని అనుకుంటున్నారు. విశ్వాసాన్ని గౌరవిస్తున్నామనే నెపంతో సాతాను వెలుగుదూత వేషంలో అనేకులను మోసగించాడు; ఇంకా మోసగిస్తూనే ఉన్నాడు. అయితే వారి “విశ్వాసం” పరీక్షించబడినపుడు దాని విలువ ఏపాటిది? పరలోక ప్రవేశానికి నిశ్చయత కలిగించే విషయంలో దాని విలువ ఏమీ లేదు. అది శక్తి లేనిది, జీవం లేనిది, ఫలం లేనిది. ఇలాంటి విశ్వాసం కేవలం దయ్యాలకు ఉన్న విశ్వాసం వంటిదే (యాకోబు 2:19;) దేవుడు ఏర్పరచుకొన్నవారి విశ్వాసం “భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవజ్ఞానము” (తీతుకు 1:1) రక్షణార్థమైన విశ్వాసం “అతి పరిశుద్ధమైనది” (యూదా. 20) అది "హృదయమును పవిత్రపరచు” విశ్వాసం (అపోస్త. 15:9). అది “ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసం”(గలతీ 5:6). అది "లోకమును జయించు విశ్వాసం” (1యోహాను 5:4). అది సమస్తమైన మంచి క్రియలను బయలుపరచు విశ్వాసం (హెబ్రీ 11). ఇప్పుడు వ్యక్తిగత పరిశుద్ధత యొక్క ఆవశ్యకత ఏమిటో మరింత వివరంగా చూద్దాం.

దేవుని స్వభావం మనం పరిశుద్ధులుగా ఉండాలని కోరుతుంది. పరిశుద్ధత దైవస్వభావం యొక్క ఔన్నత్యం మరియు ఘనత. తన కరుణ విషయమై దేవుడు "కరుణా సంపన్నుడు” (ఎఫెసీ 2:4;), అని రాయబడి ఉండగా, తన పరిశుద్ధత విషయంలో మాత్రం "పరిశుద్ధతను బట్టి” ఆయన “మహానీయుడు” (నిర్గమ 15:11) అని రాయబడి ఉంది. కరుణ ఆయన సంపద అయితే పరిశుద్ధత ఆయన మహిమ. ఆయన తన ఈ పరిపూర్ణతను బట్టే ప్రమాణం చేసాడు. “నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసితిని” (కీర్తన 89:37) “ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధుడనని" 30సార్లకు పైగా ఆయన పిలవబడ్డాడు. దీనిని బట్టే పరమందలి దూతలు, నీతిమంతుల ఆత్మలు “పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని" ఆయనను స్తుతిస్తారు (యెషయా 6:3;); ప్రక 4:8;). బంగారం అన్నిటికంటే శ్రేష్టమైనది కనుక దానికంటే తక్కువ విలువగలవాటిపై అది పొదగబడునట్టు దేవునిలోని ఈ పరిపూర్ణత ఆయనకు సంబంధించిన అన్నిటిపై పొదగబడింది. ఆయన సబ్బాతు దినం " పరిశుద్ధమైనది ” (నిర్గమ 16:23;). ఆయన ఆలయము 'పరిశుద్ధమైనది' (నిర్గమ 15:13;). ఆయన నామము 'పరిశుద్ధమైనది” (కీర్తన 99:3;) ఆయన కార్యములన్నీ 'పరిశుద్ధమైనవి' (కీర్తన 145:17;) పరిశుద్ధతే మహిమగల ఆయన గుణాల సంపూర్ణత. ఆయన శక్తి పరిశుద్ధమైనది. ఆయన కనికరం పరిశుద్ధమైనది, ఆయన జ్ఞానం పరిశుద్ధమైనది.

వర్ణించలేని దైవస్వభావం యొక్క పవిత్రత లేఖనాలంతటా పేర్కోబడింది. మనలో పరిశుద్ధత ఉండవలసిన ఆవశ్యకతకు మూలకారణమిదే. తన స్వభావంలో ఉన్న పరిశుద్ధతను బట్టే దేవుడు తన ప్రజలు కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆశిస్తున్నాడు. “నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను” అని సెలవిస్తున్నాడు. ఇదే మూలసూత్రం సువార్తలోకి కూడా బదిలీ చెయ్యబడింది. “నేను పరిశుద్ధుడనైయున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడ”ని రాయబడి ఉన్నది. “కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీ కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారం మీరునూ సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి” (1 పేతురు 1:15,16). తన స్వభావం ఈ విధమైంది కాబట్టి మనం పరిశుద్ధపరచబడకపోతే మనకూ ఆయనకూ మధ్య ఎలాంటి సంబంధమూ ఉండదని దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. “ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను (లేవియకాండము 11:45). మనం పరిశుద్ధులం కాకపోతే, “దేవుని కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది” (హబక్కూ 1:13). ఆయన స్వభావం అత్యంత పవిత్రమైనది కాబట్టి దేవుడు తన విరోధులనూ, అపవిత్రమైన పాపులనూ, అపరాధాలు చేసేవారినీ చూసి ఆనందించలేడు. యెహోషువా ప్రజలను హెచ్చరిస్తూ, దేవుడు పరిశుద్ధుడు మరియు రోషం గలవాడు కనుక వారు పాపములోనే కొనసాగినట్లయితే ఆయనను సేవింపజాలరని స్పష్టంగా చెప్పాడు ( యెహోషువ 24:19;). అటువంటి దేవునికి అపరిశుద్ధులైనవారు చేసే సేవ అంతా వ్యర్థమే. అది త్రోసివేయబడుతుంది, ఎందుకంటే దానిని అంగీకరించడం ఆయన స్వభావానికి విరుద్ధం. అపోస్తలుడైన పౌలు ఇదే సత్యాన్ని ఈ మాటలలో చెబుతున్నాడు. "ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము, ఏలయనగా మన దేవుడు దహించు అగ్నియైయున్నాడు” (హెబ్రీ. 12:29). దేవునిని ఆరాధించడానికి కృప, పరిశుద్ధత అవసరమని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధ స్వభావం దహించు అగ్ని కాబట్టి దానికి అనర్హమైనదానిని, దానికి విరోధమైన ప్రతిదానిని అది దహించి వేస్తుందని చెబుతున్నాడు.

ఒకడు తాను పరిశుద్ధంగా ఉండనని నిశ్చయించుకుంటే, తాను ఆరాధించి సేవించటానికి వేరొక దేవునిని వెతుక్కోవాలి, ఎందుకంటే అలాంటివాడు దేవుని అంగీకారాన్ని ఎన్నడూ పొందలేడు. అన్యజనులు పూర్వమే దీనిని గ్రహించి “వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి” (రోమా. 1:28) గనుక వారు సమస్తమైన దుష్టత్వానికీ ,దురాశకూ లోనై దేవుని సత్యాన్ని అసత్యానికి మార్చి, తమకొరకు అపవిత్రమైన, దుష్టమైన దేవుళ్ళను కల్పించుకుని, ఆ దేవుళ్ళను పోలినవారై తృప్తితో వారిని సేవించారు. అపవిత్రమైన జీవితాలు కలవారు దేవుడు కూడా పరిశుద్ధుడు కాడని రహస్యంగా తలుస్తున్నారని దేవుడే సెలవిచ్చాడు. దేవుడు, “నేను కేవలము నీవంటి వాడనని నీవను కొంటివి, అయితే నీ కన్నులయెదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను” (కీర్తన 50:21) అని సెలవిస్తున్నాడు. ఈనాడు దేవుని పరిశుద్ధతను నమ్ముతున్నామని చెప్పే మరికొందరు, ఆయన కృపను గురించి దురభిప్రాయంగలవారై తాము అపవిత్రులైనా దేవుడు అంగీకరిస్తాడని అనుకుంటున్నారు. “నేను పరిశుద్ధుడను కావున మీరును పరిశుద్ధులై ఉండుడి”. ఎందుకు? ఎందుకంటే దీని వలన మాత్రమే మనం ఆయన స్వరూపాన్ని పోలి ఉంటాము. ప్రారంభంలో మనం దేవుని పోలికలో సృష్టింపబడ్డాం. పరిశుద్ధతే ఆ స్వారూప్యంలో ఉన్న మూలాంశం. మిగిలిన ప్రాణులపై మానవుని ఆధిక్యత, ధన్యత, ప్రాధాన్యత, ఇందులోనే ఇమిడి ఉన్నాయి. కాబట్టి మనం సృష్టింపబడినపుడే మనలో రూపించబడిన దేవుని యొక్క ఈ పోలిక, మరియు ఆత్మపై ఆయన ముద్ర లేకుండ దేవునితో సంబంధం కలిగి ఉండలేము. పాపం ప్రవేశించినందువల్ల మనం ఈ రూపాన్ని కోల్పోయాము. దీనిని తిరిగి పొందే మార్గం లేకపోతే, మనం నిరంతరం దేవుని మహిమను పొందలేకుండా ఉండేవారం. అయితే ఇది మనం పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడడం ద్వారా సాధ్యపడుతుంది. ఎందుకంటే దీని వలనే దేవుని స్వరూపం తిరిగి మనలో మళ్ళీ ముద్రించబడుతుంది ( ఎఫెసీ 4:22,24;); కొలస్స 3:10;) దేవుని పోలికలోనికి మార్చబడాలని నిజంగా ప్రయాసపడనివారెవరైనా సరే, తాము దేవునిపట్ల ఆసక్తి చూపిస్తున్నామని అనుకోవడం వ్యర్థం.

నీతిమంతునిగా తీర్చబడడం ఎంత అవసరమో పరిశుద్ధపరచబడడం కూడా అంతే అవసరం. పరిశుద్ధత లేకుండా తాను దేవునియందు ఆనందిస్తున్నానని అనుకునేవాడు, దేవునిని అపవిత్రుణ్ణి చేసి, ఆయనను అవమానిస్తున్నాడు. మనం పాపాన్నైనా విడిచిపెట్టాలి లేదా దేవునినైనా విడిచిపెట్టాలి. మరో ప్రత్యామ్నాయం లేదు. పరలోకాన్ని నరకంతో సమాధానపరచడం ఎంత అసాధ్యమో, వెలుగుకు చీకటికి, మేలుకు కీడుకు మధ్య ఉన్న వ్యత్యాసం తీసివేయడం ఎంత దుర్లభమో, అపవిత్రులైనవారిని దేవుడు అంగీకరించడం కూడాా అంతే అసాధ్యం. మనకు దేవునితో ఉన్న సంబంధం మన పరిశుద్ధతపై ఆధారపడిలేదన్నది ఎంత సత్యమో, పరిశుద్ధత లేనిదే దేవునితో ఏ సంబంధాన్ని కలిగి ఉండలేమన్నది కూడా అంతే సత్యం. పరిశుద్ధత, విధేయత రక్షణ సంపాదించడానికి అవసరం కాబట్టి అవి లేకుండా తాము పరలోకం చేరగలమని చాలామంది పొరబడుతున్నారు. యేసుక్రీస్తు ద్వారా దేవుడు పాపుల పట్ల ఉచితంగా చూపిన కృప, పరిశుద్ధతను అనవసరమైనదిగానో, నిరుపయోగమైనదిగానో చేయలేదు. క్రీస్తు పాపానికి పరిచారకుడు కాదు, దేవుని మహిమను నిలబెట్టేవాడు. ఆయన తన ప్రజలకు పాపంలో భద్రతను కొనిపెట్టలేదు కాని పాపం నుండి రక్షణను కొనిపెట్టాడు.

దేవుని స్వారూప్యంలోకి మనం ఎదగడాన్ని బట్టే మనం ఆయన మహిమను సమీపించగలం. ప్రతిరోజూ రచయిత మరియు చదువరి, ఈ లోకంలో తమ పరుగును కడముట్టించే ఘడియను సమీపిస్తున్నారు. (ఎ.డబ్ల్యు. పింక్ తన పరుగును 1952 సం. జూలైలో కడముట్టించారు). మనం పరలోకాన్ని సమీపిస్తున్నామని తలుస్తూ నరకానికి దారి తీసే మార్గాలను అనుసరిస్తే మనలను మనమే మోసపుచ్చుకుంటున్నాం. కృపయందు ఎదగకుండానే మహిమ దిశగా ప్రయాణం చేస్తున్నామని తలచినట్లయితే అది మన భ్రమ మాత్రమే ఔతుంది. క్రీస్తు పోలిక కలిగి ఉండడమే విశ్వాసి మహిమపరచబడడం యొక్క సారం ( 1 యోహాను3:2;). ఇప్పుడు తాను ద్వేషించేదాన్ని ఆ తరువాత ప్రేమించగలనని ఎవరైనా అనుకుంటే అది అవివేకమే ఔతుంది. పరిశుద్ధులమవ్వడం ద్వారానే దేవుని స్వారూప్యాన్ని పొందగలం. ఆ విధంగా మాత్రమే మనం “మహిమ నుండి అధిక మహిమను పొందుచు.............. ఆయన పోలికకు మార్చబడుచున్నాము” (2 కొరింథీ 3:18). అంటే మహిమ ఉన్న ఒక కృపాదశ నుండి మరొక దశకు మార్చబడుతూ చివరికి సమస్త సుగుణాలూ మరియు పరిశుద్ధతా, నిత్యమహిమలో కలిగే మార్పును పొందుతాము.

అయితే క్రీస్తు ద్వారా తన వద్దకు వచ్చే ఎటువంటి భయంకర పాపినైనా క్షమించి చేర్చుకోవడానికి దేవుడు సిద్ధంగా లేడా? వారి విలువను కాని నీతిని కాని లెక్కలోకి తేక వారిని క్షమించగలిగే గొప్ప కరుణ, ఉచితమైన కృప ఆయనకు లేదా? ఒకవేళ ఉంటే, పరిశుద్ధత అంత అవసరమని నొక్కి చెప్పడం ఎందుకు? వేవేల ఏండ్ల నుండి ఉన్న ఈ అభ్యంతరం ఈనాటికీ వినిపిస్తూనే ఉంది. శరీరసంబంధమైన మనస్సు కలిగి తర్కించేవారు పరిశుద్ధత తప్పనిసరి అయితే, ఇక కృప అవసరం లేదని వాదిస్తారు. మనుష్యులు తమ అపవిత్రతను బట్టి నశించినట్లైతే దేవుడు కృపగలవాడు ఎలా ఔతాడో వారికి అంతుపట్టదు. కృప విస్తరిస్తుందని, కాబట్టి మనం పాపంలో జీవించవచ్చనే తలంపు తప్ప మరేదీ వారికి హేతుబద్దంగా అనిపించదు. అపోస్తలుడైన పౌలు రోమా 6:1;)లో కృప విస్తరించినప్పటికీ విశ్వాసులు ఎందుకు పరిశుద్ధులుగా ఉండాలో వివరిస్తున్నాడు. మనలో పరిశుద్ధత ఉండవలసిన అవసరత లేనట్లయితే కృపను అవమానించినట్టు ఔతుంది.

దేవుడైన యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గలవాడని (నిర్గమ 34:6) చెప్పబడిన వెంటనే ఆయన దోషులను నిర్ధోషులుగా ఎంచడని ( నిర్గమ 34:7;) కూడా చెప్పబడటం ప్రత్యేకంగా గమనించాలి (ఎవరు ఈ దోషులు అంటే అవిధేయులై పాపంలో కొనసాగేవారని అర్థం).

దేవుని ఆజ్ఞలను బట్టి మనం పరిశుద్ధులంగా ఉండటం అవసరం. ఇది క్రియల మూలమైన నిబంధన (పాత నిబంధన) క్రింద మాత్రమే కాకుండా కృపామూలమైన నిబంధన (క్రొత్త నిబంధన) క్రింద కూడా విడదీయరానిదిగా జతపరచబడి ఉంది. పరిశుద్ధత కలిగి ఉండడం, పాపం లేకుండా జీవించడం అనే విధులను తప్పక నెరవేర్చాలని సువార్తలో కూడా ఉంది. పరిశుద్ధతలో సువార్త ధర్మశాస్త్రం కన్నా ఏమాత్రం తక్కువ కాదు. ఎందుకంటే ఇవి రెండూ పరిశుద్ధ దేవుని నుండి వెలువడినవే. అనేకమైన పాపాలు క్షమించబడడానికి, క్రైస్తవుని అసంపూర్ణ విధేయత అంగీకరించబడడానికి ఒక ఏర్పాటు చెయ్యబడినప్పటికీ, నీతి ప్రమాణం ఏ మాత్రం తక్కువ చేయబడలేదు, ఎందుకంటే పరిశుద్ధులుగా ఉండాలనే బాధ్యత తక్కువ చెయ్యబడటం కానీ, స్వల్ప పాపం చేసే అనుమతి ఇయ్యబడటం కానీ సువార్తలో మనకు ఎక్కడా కనిపించదు. ఈ నిబంధనల మధ్య రెండు భేదాలున్నాయి. మొదటి నిబంధనలో పరిశుద్ధులుగా ఉండవలసిన విధులన్నీ దేవుని యెదుట మన నీతిగా కనబడడానికి అవసరం. వాటి వలన మనం తీర్పు తీర్చబడతాము ( రోమా 10:5;) - కృప క్రింద ఇలా ఉండదు. స్వల్పమైన అపజయంకైనా అనుమతి లేదు ( యాకోబు 2:10;) అయితే ఇప్పుడు క్రీస్తు మధ్యవర్తిత్వం వలన న్యాయం, కనికరం కలసిపోయాయి.

పరిశుద్ధత కొరకు సువార్త ఇచ్చే ఆజ్ఞ వలన మూడు విషయాలపై గౌరవం ఉంచాలి. మొదటిగా వాటిని జారీ చేసేవాని అధికారానికి గౌరవం చూపించాలి; మనలను విధేయతకు బద్ధులుగా చేసేదే ఆ అధికారం. మలాకి 1:6;) చూడండి మనలను పరిశుద్ధులుగా ఉండమని కోరేవాడు సార్వభౌముడైన ధర్మశాస్త్ర దాత. తనకిష్టమైనదానిని చేయమని ఆజ్ఞాపించే అధికారం ఆయనకుంది. కాబట్టి, దానిని చేయనివాడు దైవ శాసనాన్ని ధిక్కరిస్తున్నాడు. పరిశుద్ధులుగా ఉండాలనే దేవుని ఆజ్ఞ క్రింద ఉండి, అన్ని విషయాలలోను యథార్థంగా, ఆసక్తితో అనుదిన జీవితంలో దానిని ఆచరించడానికి ప్రయాసపడకపోతే అది ఆయన అధికారాన్ని ధిక్కరించి జీవించటమే. తన దైనందిన జీవితంలో పరిశుద్ధతను వెదకడానికి ప్రాధాన్యత ఇవ్వనివాని స్థితి కూడా ఇటువంటిదే. దీనిని మరచిపోవడం లేదా మనం లక్ష్యపెట్టవలసిన రీతిగా దీనిని లక్ష్యపెట్టకపోవడం మన నడతలో ఉన్న నిర్లక్ష్య వైఖరికి కారణం. మన హృదయాలలో, మనస్సులలో దేవుని ఆజ్ఞల వెనుక ఉన్న అధికారాన్ని సదా గుర్తు చేసుకోవటం ద్వారా అవిధేయత నుండి మనలను మనం కాపాడుకోగలం.

రెండవదిగా, మనలను పరిశుద్ధులుగా ఉండమని ఆజ్ఞాపించినవాని శక్తిని మన మనస్సుల ఎదుట ఉంచుకోవాలి. “ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు; ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై యున్నాడు; పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు?” (యాకోబు 4:12) దేవునికి ఉన్న ఆజ్ఞాపించే అధికారంలో ఎంత శక్తి ఉందంటే విధేయతగలవారిని ఆయన శాశ్వతంగా ఆశీర్వదించి, అవిధేయులను నిత్యం శిక్షిస్తాడు. దేవుని ఆజ్ఞలతో ఒకవైపు నిత్యమైన ఆనందాన్ని ఇచ్చే వాగ్దానాలూ మరొక వైపు నిత్యమైన దుఃఖం ఇచ్చేహెచ్చరికలూ జతపరచబడి ఉన్నాయి. మనం పరిశుద్ధంగా లేదా అపరిశుద్ధంగా ఉండడాన్ని బట్టి అవి మనకు అన్వయించబడతాయి. మనం పరిశుద్ధులుగా ఉండవలసిన అవసరతకు మరొక ముఖ్య కారణం ఇదే. మనం అలా లేకపోతే పరిశుద్ధుడు, శక్తిమంతుడు అయిన దేవుడు మనలను నాశనం చేస్తాడు. దేవుని వాగ్ధానాలు మరియు హెచ్చరికల పట్ల గౌరవం చూపడం ఆధ్యాత్మిక స్వేచ్ఛలో ఒక ప్రధానమైన భాగం. “నేను సర్వశక్తి గల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము” (ఆది కా. 17:1) నిందారహితుడుగా నడుచుకునే మార్గమేమిటంటే అలా నడవమని కోరినవాడు సర్వశక్తుడైన దేవుడని, మనం నిత్యం ఆయన యెదుటనే ఉన్నామని గుర్తుంచుకోవడమే. మన ఆత్మల విలువను మనం ఎరిగి ఉంటే ఆ విధంగా నడవడానికి కావలసిన కృపను వెదకుతాం.

మూడవదిగా, దేవుని అనంత జ్ఞానాన్ని, మంచితనాన్ని మనం గౌరవించాలి. దేవుడు తన ఆజ్ఞలలో మనపై తన అధికారం చూపడమే కాకుండా తన నీతిని, ప్రేమను కూడా ప్రదర్శిస్తాడు. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, అధికార దాహం ఉన్న నియంత ఇచ్చే ఆజ్ఞలుగా ఉండవు కానీ మన మేలును మనఃపూర్వకంగా కోరే వ్యక్తి జారీ చేసిన జ్ఞానయుక్తమైన శాసనాలుగా ఉంటాయి. “ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు” (1యోహాను. 5:3). అవి మన స్వేచ్ఛను అరికట్టేవి కావు కాని న్యాయంగా, ఆరోగ్యకరంగా, మిక్కిలి మేలుకరంగా ఉంటాయి. వాటిని గైకొంటే గొప్ప లాభం కలుగుతుంది. వాటిని శిరసావహిస్తే ఎప్పుడూ, ఎల్లప్పుడూ సంతోషం కలుగుతుంది. సాతానుకూ పాపానికీ దాసులుగా ఉండాలని కోరుకునేవారికి మాత్రమే అవి భారమైనవిగా అనిపిస్తాయి. అయితే దేవునితో నడిచేవారందరికి అవి సరళమైనవి, ఇంపైనవి. దేవుణ్ణి ప్రేమించినపుడు ఆయనను సంతోషపెట్టాలనే వాంఛ కలుగుతుంది. ఆలా చేయడానికి క్రీస్తు మనకు కృప అనుగ్రహిస్తాడు.

క్రీస్తు మధ్యవర్తిత్వం కారణంగా మన వ్యక్తిగత పరిశుద్ధత అవసరం. దేవుడు తన కుమారునిని ఈ లోకంలోకి పంపడంలో ఉన్న ప్రాముఖ్యమైన ఉద్ధేశం మనం కోల్పోయిన పరిశుద్ధతను మనకు తిరిగి ఇవ్వడమే - “అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను” (1యోహాను 3:8). అపవాది క్రియలలో అతి ముఖ్యమైనది ఏమిటంటే, పాపనియమాన్ని మరియు దేవునితోవైరాన్ని మన స్వభావంలో వ్యక్తిత్వంలో నాటి దేవునికి విరోధంగా ఉండేలా చెయ్యడమే. పరిశుద్ధత మరియు విధేయతానియమం మనలో నాటబడనిదే దుష్టుని కార్యం లయపరచబడదు. పాపం వలన మనలోని దైవస్వరూపం నాశనమైంది, దానిని తిరిగి నెలకొల్పడమే క్రీస్తు మధ్యవర్తిత్వంలోని ముఖ్యోద్దేశం. తన ప్రజలు దేవుని నిత్యమహిమలో పాలు పొందే విధంగా జీవింపచేయడమే క్రీస్తు యొక్క ముఖ్య ప్రణాళిక. ఇది పరిశుద్ధత ద్వారానే సాధ్యమౌతుంది.

క్రీస్తు మధ్యవర్తిత్వపు నెరవేర్పులో మూడు ముఖ్య కోణాలు ఉన్నాయి. తన యాజకత్వం వలన ఆయన దేవుని న్యాయాన్ని సంతృప్తిపరచి మనలను దేవునితో సమాధానపరచడం మాత్రమే కాకుండా మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడి పరిశుద్ధపరచబడడాన్ని కూడా సంప్రాప్తింప చేసాడు. “ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, సత్ క్రియల యందాశక్తి గల ప్రజలను తనకోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్ను తానే మనకొరకు అర్పించుకొనెను” (తీతుకు 2:14). కాబట్టి పవిత్రత యందు ఆసక్తి లేనివారు క్రీస్తు చేసిన బలి వలన ప్రయోజనం పొందినట్లు ఏ రుజువూ కనిపించడం లేదని దీనివలన తెలుస్తున్నది.

ప్రవక్తగా క్రీస్తు దేవుని ప్రేమను, ఆయన చిత్తాన్ని మనకు బయలుపరచాడు. దీని ద్వారా ఆయన దేవునిని మనకు తెలియజేసి మనలను ఆయనకు విధేయులుగా చేస్తాడు. ప్రవక్తగా క్రీస్తు తన పరిచర్యను ప్రారంభించినప్పుడే ధర్మశాస్త్రానికి పూర్వం ఉన్న పవిత్రతను తిరిగి నెలకొల్పి యూదుల వక్రభాష్యాల నుండి దానిని శుద్ధిచెయ్యడం మనం చూడగలం (మత్తయి 5). రాజుగా ఆయన మనలోని దుర్వాంఛలను అణచి, విధేయులం అవ్వడానికి కావలసిన శక్తినిస్తాడు. ఈ సంగతులను బట్టి మనలను మనం పరీక్షించుకోవాలి. తెలిసి తెలిసి పాపంలో జీవిస్తూ క్రీస్తు మనలను రక్షించాడని అనుకోవడం సాతాను యొక్క అతి గొప్పదైన మోసం.

క్రీస్తు చేసే పై కార్యాలలో దేని నుండి నేను లాభం పొందాలని కోరుతున్నాను? యాజకునిగా ఆయన చేసే కార్యం నుండా? అయితే ఆయన రక్తం నన్ను శుద్ధిచేసిందా? దాని వలన నేను పరిశుద్ధుడనయ్యానా? దాని ద్వారా లోకం నుండి నేను విడిపించబడ్డానా? దాని వలన దేవునికీ, ఆయన సేవకూ అంకితమయ్యానా? ప్రవక్తగా ఆయన చేసే కార్యం నుండి నేను లాభం పొందాలని కోరుతున్నానా? అయితే ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఈ లోకంలో స్వస్థబుద్దితో, నీతితో, భక్తితో బ్రతకడం ఆయన నుండి నేర్చుకున్నానా? దేవునితో, మనుష్యులతో నేను సాగించే వ్యవహారాలన్నిటిలో, నా మార్గాలన్నిటిలో యథార్థంగా ప్రవర్తించేలా ఆయన నాకు నేర్పించాడా? ఆయన రాజుగా చేసిన కార్యం నుండి నేను లాభం పొందాలని కోరుతున్నానా? అయితే ఆయన నాలోనూ, నామీదనూ నిజంగా ఏలుబడి చేస్తున్నాడా? నన్ను సాతాను శక్తి నుండి విడిపించి తన కాడిని నేను ఎత్తుకునేలా చేశాడా? ఆయన రాజదండం నాలో ఏలుతున్న పాపాన్ని విరగగొట్టిందా ? ఆయన రాజ్యంలో నేను నమ్మకమైన పౌరునిగా ఉన్నానా? లేదంటే ఆయన చేసిన త్యాగం నుండి నేనెలాంటి ప్రయోజనమూ పొందలేదు. మనలను పరిశుద్ధులుగా చెయ్యడానికే క్రీస్తు చనిపోయాడు కాని అపవిత్రులుగా ఈ లోకంలో సుఖభోగాలు అనుభవించేందుకు కాదు.

క్రీస్తు మహిమ కొరకు మనం పరిశుద్ధులుగా ఉండటం అవసరం. మనం నిజంగా ఆయన శిష్యులమైతే, ఆయన వెల చెల్లించి మనలను కొన్నాడు. “మనము మన సొత్తు కాదు,” ఆయన వారం. మనం ఆయన వారమైనందుకు ఆత్మయందు శరీరమునందు ఆయనను మహిమపరచాలి. (1కొరింథీ 6:19,20;) అంత గొప్ప వెల చెల్లించి మనలను కొన్నందుకు మనం ఇప్పటి నుండి మన కోసం కాక ఆయన కోసమే జీవించాలి. అయితే దీనిని ఎలా చేయాలి? క్రీస్తు తన శిష్యుల నుండి కోరే ఘనత అనే మూల్యం మన పరిశుద్ధతలోనే ఇమిడి ఉంది. మనం చూపించే విధేయత కంటే అధికంగా ఆయనను మహిమపరచేదేదీ లేదు, మన అవిధేయత కంటే అధికంగా ఆయనను గాయపరచేది, అవమానపరచేది మరేదీ లేదు.

లోకం ఎదుట మనం ఆయన పరిశుద్ధతను, ఆయన సిద్ధాంతాల పరలోక స్వభావాన్ని, ఆయన మరణం యొక్క ప్రశస్తతను మన జీవితపు నడక ద్వారా ప్రదర్శించాలి. (1 పేతురు 2:9;) ఆయనను తిరస్కరించే ఈ లోకం ఎదుట మనం ఆయనను ఈ విధంగా ఘనపరచడం చాలా అవసరం. క్రీస్తు జీవితం కంటే తక్కువైనదేదీ మనకు మాదిరిగా ఉండటానికి వీలులేదు. క్రైస్తవుడు "అనుసరించడానికి” పిలువబడింది దీనిని మాత్రమే. అతడు తన జీవితంలో క్రీస్తు జీవితాన్ని ప్రదర్శించబద్ధుడై ఉన్నాడు. వేరే ఏ ఉద్దేశంతో క్రైస్తవ్యాన్ని చేపట్టినా అది తనను తాను భయంకరంగా మోసగించుకోవడమే. క్రీస్తు నామాన్ని ధరించినవారు శరీరాశలకు లోబడి ఈ లోకమర్యాదలను అనుసరించి సాతాను ప్రోద్భలానికి లొంగడం కంటే, ఆయన నామాన్ని అవమానించేదీ మరేదీ లేదు. క్రీస్తు సిద్ధాంతాలే మన నియమమై, ఆయన మహిమయే మన లక్ష్యమై, ఆయన మాదిరియే మన ఆచరణ అయితేనే తప్ప, మనం మన రక్షకునికి సాక్ష్యులుగా ఉండలేము. క్రీస్తును ఘనపరిచేది భావోద్రేకాలతో కూడిన పదజాలం కాదు కాని అన్ని విషయాలోనూ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండటమే. ఆయన నామాన్ని ధరించి దుష్టక్రియలు చేసేవారి జీవితాలకన్నా క్రీస్తు సువార్తకు ఘనహీనత కలిగించేది మరేదీ లేదు. నేను పరిశుద్ధమైన, విధేయతా జీవితాన్ని జీవించకపోతే నేనాయన పక్షాన ఉండకుండా ఆయనను వ్యతిరేకిస్తున్నానని అది తెలుపుతుంది.

గమనిక: ఈ వ్యాసంలో అధికభాగం జాన్ ఓవెన్ గారు ఇదే అంశంపై వ్రాసిన గ్రంథం(3వ భాగం)లోని విషయాల సంక్షిప్త సారాంశం.

 

పరిశుద్ధపరచబడుటను గురించిన సిద్ధాంతం

5.దాని సమస్య

పరిశుద్ధపరచబడడంలో ఉన్న సమస్యలని చెప్పేటప్పుడు, దేవుని పక్షాన ఏదైనా సమస్య ఉందని కాదు, మన పరిమిత జ్ఞానానికి సమస్యలని అనిపించేవాటినే ఉద్దేశిస్తున్నానని వేరే చెప్పనవసరం లేదు. అయితే ఈ రోజుల్లో ఏ విషయాన్నీ అంత తేలికగా తీసుకోవడం జ్ఞానయుక్తం కాదు; ఎందుకంటే కొందరు, తమకు తృప్తి కలిగేలా వివరించకపోతే ఒక చిన్నమాటను కూడా తప్పుపడతారు. మరి కొందరికైతే అతి సులువైన మాటలను సైతం వివరంగా చెప్పవలసి వస్తుంది. పరిశుద్ధపరచబడడం కాని లేదా వేరేదైనా కార్యం కాని మహాఘనుడైన యెహోవాకు ఒక సమస్యను కొనితెస్తుంది అనడం దైవదూషణ ఔతుంది. సర్వజ్ఞుడైన దేవునిని ఏ కష్టమూ ఎదిరించలేదు. ఎలాంటి అత్యవసర పరిస్థితినీ కలిగించలేదు. అయితే పాపం వలన కలవరమైన క్రైస్తవుని పరిమిత జ్ఞానానికి పరిశుద్ధత నిజంగా ఒక సమస్యే. ఇది 'నీతిమంతునిగా తీర్చబడుట' అనే అంశంలో ఉన్న సమస్య కన్నా మరింత కలవరపరిచే సమస్య.

ఈ అంశంలో వివిధ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వీటిని ఉపోద్ఘాతంలోని నాలుగు, ఐదు పేరాలలో తెలియచేసాను. అవేమిటంటే పరిశుద్ధపరచబడడం అనేది ఒక గుణమా లేక స్థితా? అది చట్టపరమైనదా లేక అనుభవాత్మకమైనదా? అది పరిపూర్ణమైనదా లేక పురోగమించేదా? ఈ ప్రశ్నలన్నీ సంతృప్తికరమైన విధంగా వివరింవబడవలసిన అవసరత ఉంది. అన్నిటికంటే క్లిష్టమైన సమస్య ఏమిటంటే నైతికపరమైన కుష్టురోగి దేవుని పరిశుద్ధాలయంలో ఎలా ఆరాధించగలడు? ఆధ్యాత్మికంగా ఉన్నతస్థితిలో ఉన్నవారికే ఈ సమస్య ఎంతో కష్టతరమైనదిగా తోచడం వింతైన విషయం. స్వనీతిపరులైన పరిసయ్యులు, స్వీయసంతృప్తి ఉన్న లవొదికయులకు ఈ విషయాన్ని గురించి ఏ చింతా లేదు. “కేవలం కృప” అనే నెపంతో సత్క్రియలన్నిటినీ విసర్జించే “ఆంటినోమియన్లు” ఈ చిక్కుముడిని విప్పటానికి బదులు తాడునే త్రుంచేసారు. క్రీస్తు నీతి మనకు ఆపాదించబడుతుంది గనుక ఇక ఇందులో సమస్య ఏమీ లేదు అని వారంటారు. అయితే దేవుడు వ్యక్తిగత పరిశుద్ధతను కోరుతున్నాడని గ్రహించినవారు మాత్రం తాము అపవిత్రులమని గ్రహించి దానిని గురించి చాలా చింతిస్తారు.

నేడు పరిస్థితులు ఎంతగా దిగజారాయంటే పరిశుద్ధపరచబడడంలో ఏదో సమస్య ఉందని నేను ప్రస్తావించడం చూసి పాఠకులలో కొందరు ఆశ్చర్యపడవచ్చు. ఈనాడు చాలాచోట్ల ఈ సిద్ధాంతం ఎంత అసంపూర్ణంగా, ఎంత శక్తిహీనంగా బోధించబడుతుందంటే లేదా దానిని ఎంత లోపభూయిష్టంగా ఆచరణలో పెడుతున్నారంటే, అది లేకుండా ఎవడూ దేవునిని చూడలేడని చెప్పబడిన పరిశుద్ధత యొక్క నిజస్వభావాన్ని గుర్తించడం కానీ, దాని విషయమై తమ మనస్సాక్షిని అభ్యసించేలా చేయడం కానీ, ఎవరికీ సాధ్యపడుతుందని అనిపించడం లేదు. ప్రస్తుత కాలంలో దేవుని ఆజ్ఞల అనుసరణ తగ్గింది, పరిశుద్ధ లేఖనాల ఘనత నిర్లక్ష్యం చేయబడుతోంది. హృదయ పవిత్రతను నొక్కి చెప్పటం లేదు. అందుచేత ఎవరూ తమ వ్యక్తిగత స్థితిని గురించి చింతించడం లేదు.

విశ్వాస రహితమైన సత్కార్యాలు రక్షణకు నిరుపయోగం అని కొందరు ప్రసంగీకులు బోధిస్తే, తమలో వ్యక్తిగత పరిశుద్ధత, విధేయతతో కూడిన విశ్వాసం లేదని, తమది వట్టి ఖాళీ విశ్వాసమని విలపించేవారు కూడా అనేకులుంటారు.

నేటి ఆత్మీయ జీవితం ఎంత దిగజారిన స్థితిలో ఉందంటే, దేవుని ప్రజలు సైతం, తాము ఎంతవరకు దేవుడు తన వాక్యంలో చెప్పిన ప్రమాణం ప్రకారం పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నారో గ్రహించలేకపోతున్నారు. క్రైస్తవ జీవితాన్ని గురించి నేడు ఎటువంటి బలహీనమైన, లోపభూయిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయంటే, లోకం సైతం ఖండించే దుష్టత్వం నుండి తప్పించుకున్నవారు "సీయోనులో” నిర్విచారంగా జీవిస్తున్నారు. దేవుని భయం మనుషులపై ఎంత స్వల్పంగా ఉందంటే, క్రైస్తవులమని చెప్పుకునేవారిలో సైతం చాలామంది తమ హృదయంలోని తెగులును గురించి ఎంత అస్పష్టంగా తెలుసుకుని ఉన్నారంటే, పరిశుద్ధపరచబడడంలోని సమస్యను గురించి మాట్లాడడం వారికి అన్యభాషలో మాట్లాడినట్టే అనిపిస్తుంది. క్రైస్తవులలో పదికి తొమ్మిదిమందిపై భయంకరమైన మత్తులో ఉన్నారు. అది ఇంద్రియాలను చంపి, ఆత్మీయ నేత్రాలను మూసేసి, ఆత్మశుద్ధిని నిర్వీర్యం చేసి, తద్వారా అన్నీ దేవునికి అంగీకారమైనవే అని అనుకునే దుస్థితి దాపరించేలా చేసింది.

పైగా మనలో కొందరు ఈ సమస్యను మరింత క్లిష్టంగా మార్చుకున్నారు అనడంలో సందేహం లేదు. ఎలాగంటే, పరిశుద్ధపరచుబడడం అంటే ఏమిటో ఈ జీవితానికి సంబంధించి, అందులో ఇమిడే కోణాలేంటో అనే అంశాలను గురించి తప్పుడు అభిప్రాయాలు కలిగి అనవసరమైన కష్టాలను మనకు మనమే కల్పించుకున్నాము. అటువంటి పరిశుద్ధతను సాధించలేక అనేకులు నిరుత్సాహపడుతున్నారని నాకు తెలుసు. ఈ జీవితంలో పరిపూర్ణత పొందగలవని అబద్ధ బోధకులు చెప్పిన స్థితిని పొందలేక ఆత్మహత్యకు పాల్పడినవారు నాకు తెలుసు, అటువంటి బోధలు విన్న ఇతరులనేకులు ఆవిధంగా చేయకపోవటం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ విధంగా ఈ సమస్యను జటిలపర్చుకోవలసిన అవసరత లేదు. వాక్యానుసారమైన పరిశుద్ధత అంటే పాపనిర్మూలన కాదు, శరీర సంబంధమైన స్వభావాన్ని పవిత్రపరచటం లేదా శరీరాన్ని కొంత వరకు మొద్దుబారేటట్లు చేయటం కాదు. సాతాను పెట్టే చికాకుల నుండి, వాని దాడుల నుండి తప్పించుకోవటం అంతకంటే కాదు.

అయినప్పటికీ క్రీస్తే నా పరిశుద్ధత అని విశ్వసించే పాపి ఆయన యందు నిలిచి జీవితాంతం వెనక్కి మరలకుండా ఉంటాడని నిశ్చయించుకోవటం ద్వారా ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందని ఊహించి ఈ సమస్యను మనం తక్కువగా చూడకూడదు. మనం అపవిత్రులుగా మరణిస్తే నిత్యనాశనానికి గురికావడం ఖాయం. ఎందుకంటే హృదయశుద్ధిగలవారు మాత్రమే దేవుని చూడగలరు (మత్తయి 5:8). ఆ హృదయశుద్ది ఏమిటో, దానిని పొందడం ఎలాగో తెలుసుకోవడమే అసలు సమస్య. దేవుడు హృదయాన్ని పరిశీలిస్తాడు (1సమూయే16:7;). కాబట్టి ఆ హృదయాన్ని గురించే మనం శ్రద్ధ వహించాలి, ఎందుకంటే " హృదయములో నుండియే జీవధారలు బయలుదేరును” (సామెత. 4:23). మనుష్యుల బాహ్య ప్రవర్తన సరిగా లేనందువలన క్రీస్తు వారిని ఖండించలేదు కాని వారి హృదయాలు “చచ్చినవారి ఎముకలతోను సమస్త కల్మషముతోను” నిండి ఉన్నందుకే వారిని ఖండించాడు.

మునుపటి అధ్యాయంలో పరలోకంలో ప్రవేశించడానికి పరిశుద్ధత మిక్కిలి అవసరమని వివరంగా చూసాము. అతి భయంకరమైన పాపాలే కాకుండా మనుషులు స్వల్పపాపాలని తలచేవి కూడా దేవుని రాజ్యంలో చేరకుండ చేస్తాయని 1కొరింథీ 6:9,10;)లో స్పష్టపరచబడింది. మనం ఎదుర్కొనే ప్రశ్న ఏమిటంటే “అపరిమితమైన పరిశుద్ధత ఉన్న దేవునికి తగిన విధంగా మనుషులు ఎలా పరిశుద్ధపరచబడగలరు? నీతిమంతుడైన దేవుని యెదుట నిలిచేందుకు మనం నీతిమంతులుగా తీర్చబడడం ఎంత అవసరమో పరిశుద్ధ దేవుని సన్నిధిలో నివసించడానికి మనం పరిశుద్ధపరచబడాలన్నది కూడా అంతే అవసరం. అయితే మానవునిలో పరిశుద్ధత ఎంతమాత్రమూ లేదు. ఔను అతడు అపవిత్రుడు, చెడ్డవాడు, మలినంతో నిండినవాడు. దీని‌ గురించి వాక్యం ఇచ్చే సాక్ష్యం స్పష్టమైనది, సంపూర్ణమైనది. ".............వారు చెడిపోయినవారు. అసహ్యకార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు." కీర్తన 14:1-3 వచనాలు మనుషులందరూ చెడినవారై, అవినీతిపరులై ఉన్నారనీ, వారు వ్రేళ్ల నుండి కొమ్మల చివరివరకు, మూలం నుండి ప్రవాహమంతా, హృదయంలో, జీవితంలో అవిధేయులు మాత్రమే కాకుండా అపవిత్రులై ఉన్నారు కాబట్టి దేవుని సన్నిధిలో నిలవడానికి అనర్హులనీ సాక్ష్యమిస్తుంది. ప్రభువైన యేసు మానవ హృదయం ఎరిగినవాడై - “లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలును, జారత్వమును, దొంగతనమును, నరహత్యలును, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవ దూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నియు లోపలి నుండియే బయలువెడలును” (మార్కు 7:21-23) అని చెప్పి, మానవ హృదయం ఎంత అసహ్యకరమైన గుహవంటిదో తన వెలుగులోనే బహిర్గతం చేసాడు. పరిశుద్ధులు తమ గురించి తామే చేసిన ఒప్పుకోలు దేవుని ఈ సాక్ష్యంతో ఏకీభవిస్తుందని మనం మరువకూడదు. దావీదు "నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను” (కీర్తన 51:5) అని ఒప్పుకొన్నాడు. యోబు "నేను అపవిత్రును, నన్ను నేను అసహ్యించుకొనుచున్నానని" (యోబు 40:4,6) ప్రకటించాడు. యెషయా “అయ్యో, నేను అపవిత్రమైన పెదవులుగలవాడను నేను నశించితిని, రాజును సైన్యములకధిపతియునగు యెహోవా ను నేను కన్నులార చూచితిననుకొంటిని” అన్నాడు (యెషయా 6:5).

అయితే అపవిత్రతను గురించి వీటన్నిటికంటే సంపూర్ణమైన ఒప్పుకోలు పాతనిబంధన సంఘం చేసింది. ఈ వాక్యాన్ని తమ సహజస్థితిని తెలపడానికి విశ్వాసులందరూ వాడతారు. “మనమందరము అపవిత్రులవంటి వారమైతిమి, మా నీతిక్రియలన్నియు మురికి గుడ్డలవలెనాయెను” (యెషయా 64:6) ఇవి చాల కఠినమైన మాటలైనా పతనం మనకు కొనితెచ్చిన మురికిని, బురదను వర్ణించేందుకు ఇవి సరిపోవు. నీతిమంతునిగా తీర్చబడుటను గురించిన సిద్ధాంతాన్ని మనం పరిశీలించినపుడు మానవుని స్వచిత్తం, అధర్మం, అవిధేయతల నేపథ్యంలో “దేవుని యెదుట మానవుడు నీతిమంతుడెలా కాగలడు?” అని ప్రశ్నించడం తగినదే, అని మనం కనుగొన్నట్టు, ఇప్పుడు పరిశుద్ధపరచబడడం అనే సిద్ధాంతాన్ని గురించి ఆలోచించేటప్పుడు మానవుని అపవిత్రత మరియు మలినం నేపథ్యంలో “పాపసహితునిలో నుండి పాపరహితునిని ఎవరు తేగలరు?” (యోబు 14:4) అని ప్రశ్నించడం కూడా సమంజసమే.

మనలను మనం పరిశుద్ధులుగా చేసుకోగల శక్తి మనలో లేదు. మన హృదయాలను మనం శుద్ధి చేసుకోవడం మన తరం కాదు. పాపం చేత పరిపాలించబడటమే "మనోవ్యాధి” (1రాజులు 8:38;). తెగులును మించిన మరణకరమైన వ్యాధి లేనట్టే మనోవ్యాధిని మించిన తెగులు లేదు. “కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన యెడల కీడుచేయుటకు అలవాటుపడిన మీరును మేలుచేయ వల్లపడును” (యిర్మీయా 13:23) గర్విష్టుడు తనను తాను సాత్వికునిగా మార్చుకోలేడు. శరీరానుసారి తనను తాను ఆత్మానుసారిగా మార్చుకోలేడు. ఈ లోకసంబంధి తనను తాను పరలోక సంబంధిగా రూపాంతరపరచుకోవడానికి అశక్తుడు. పరిశుద్ధపరచబడడం సంపూర్ణంగా మానవశక్తికి అతీతం. అయ్యో, ఈ సత్యాన్ని ఈనాడు ఎవ్వరూ గ్రహించడం లేదు.

వాక్యానుసారం అని పిలిపించుకోవాలని ఆశించే బోధకులలో సైతం, పతనం ఒక చారిత్రాత్మక సత్యమని ఒప్పుకొనేవారిలో కూడా దాని భయంకర ఫలితాలను తెలుసుకున్నవారు చాలా అరుదు. ఒక ప్రఖ్యాత గీతం చెప్పినట్లు "పతనం వలన గాయపడి” అన్నది ఈ సత్యాన్ని చాలా తేలికగా చిత్రీకరిస్తుంది. మొదటి నిబంధనను అతిక్రమించడం వలన మానవులందరూ వారికి ఉన్న దేవుని రూపాన్ని కోల్పోయి ఇప్పుడు సాతాను రూపాన్ని కలిగి ఉన్నారు. (యోహాను. 8:44;). వారి ఇంద్రియాలన్నీ ఎంతగా చెడిపోయాయంటే వారు (2 కొరింథీ3:5;) నిజమైన మంచిని, దేవునికి అంగీకారమైనదానిని ఆలోచించలేరు, మాట్లాడలేరు, చేయలేరు. జన్మతః గుణంలో, హృదయంలో, జీవితంలో, వారు పూర్తిగా అపవిత్రులు, అపరిశుద్ధులు, అసహ్యులు, విద్వేషులు. దీనిని మార్చుకునే శక్తి వారికి లేదు. అంతేకాకుండా వారిపై ధర్మశాస్త్రం విధించిన శాపం వారిని దేవుని నుండి వేరుచేసి, పరలోకంతో సహవాస సంబంధాలను త్రుంచివేసింది. మన ఆది తల్లిదండ్రులు ఏదేను వనం నుండి తరిమివేయబడటం, ఆ ద్వారాన మండుతున్న ఖడ్గం ధరించిన కెరూబులను నిలవబెట్టటం, పరిశుద్ధులుగా చేసే ప్రభావాలేమీ వారిని చేరవని తెలియచేస్తున్నాయి. (ఆ ప్రభావమే మానవునిని దేవునితో ఐక్యపరిచి, అతనికి దైవ స్వరూపమిచ్చే శక్తి కలిగించింది. కాబట్టి మానవుడు పొందగలిగే అతిశ్రేష్టమైన దీవెన అదే). శాపం, దేవునికి పతనమైన ప్రాణులకు మధ్య ఒక అగాధాన్ని నిలిపింది. దీనివలన మానవునిని పరిశుద్ధపరచే దైవ ప్రభావం అతనిని చేరలేదు. అదే విధంగా మానవుని అపవిత్రమైన కోరికలు, ప్రార్థనలు దేవునిని చేరవు. “భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు” (సామెత 15:8) అని, "దుష్టుని ఆలోచనలు యెహోవాకు హేయములు” (సామెత 15:26) అని రాయబడి ఉన్నది.

అందువలన "మనం పరిశుద్ధులుగా చెయ్యబడటంలో ఉన్న మర్మం నీతిమంతులుగా తీర్చబడటంలో ఉన్న మర్మం కంటే ఏ మాత్రం స్వల్పమైనది కాదు” - (టి. బోస్టన్). చెడిపోయిన మానవ స్వభావం ఎల్లప్పుడూ బాహాటంగా కనబడటం వలన అది లోకం యొక్క దృష్టిని సైతం తప్పించుకోలేనిదిగా ఉంది. కాబట్టి పూర్వం నుండి మానవులు దీనికొక విరుగుడు కనిపెట్టాలని వెదకుతున్నారు. సరియైన విధంగా వారు తమ జ్ఞానం ఉపయోగిస్తే దానిని కనుక్కోవచ్చని అనుకున్నారు. అయితే దాని ఫలితంగా, పైపైకి పరిశుద్ధతలా కనిపించే కొన్ని 'నీతి సుగుణాలు' మాత్రమే వారు అలవరుచుకోగలిగారు. అయితే వెలుగై ఉన్న దేవుని ప్రమాణాలను అది చేరలేకపోయింది. ఒకసారి పరలోకపు కాటుకతో అభిషేకించబడగానే మానవ నేత్రాలకు ఆ నీతి మురికిగుడ్డలవలె కనిపిస్తుంది. మానవులు పునర్జన్మ పొంది కృపానియమం అనుసరించి, నడిస్తేనే తప్ప అవన్నీ నిజమైన విధేయతకూ, పరిశుద్ధతకూ అనుకరణలే గాని, వాస్తవాలు కావు. అది కోతి మనిషిని అనుకరించినట్టు ఉంటుంది.

పాపయుక్తమైన తమ జీవితాలు నీతియుక్తంగా మారక ముందు తామున్న స్థితిలో మార్పు జరగాలనే గ్రహింపు లేకుండానే తమ ప్రవర్తన మార్చుకోవడానికి ప్రయత్నించడం తిరిగి జన్మించనివారు చేసే సాధారణమైన పొరపాటు. ఫలాలు మంచివి అవ్వడం కొరకు చెట్టు మంచిదిగా చేయబడాలి. దేవుని శాపం క్రిందనున్నవాడు ఆయనకు అంగీకారమయ్యే పనులను చేయాలని ప్రయత్నించడం ఒక గడియారపు స్ప్రింగు తెగినపుడు ఆ గడియారాన్ని బాగు చేయడానికి దానిని తుడిచి, మెరుగులు దిద్దినట్టు ఉంటుంది. నికొదేము చేసిన గొప్ప పొరపాటు ఇదే. పరలోకానికి అంగీకారమయ్యే క్రియలు చెయ్యడానికి గాను కేవలం సరైన బోధ పొంది దానికి అనుగుణంగా తన నడవడిని సరిచూసుకుంటే చాలని అతడు భావించాడు. అయితే యేసు అతనితో “మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దని" చెప్పాడు (యోహాను 3:7). ఇందులోని అర్థమేమిటంటే, 'నికోదేమూ, నువ్వు ఆత్మ సంబంధమైన నైజం లేకుండా ఆత్మకార్యాలు చేయలేవు. అయితే ఈ ఆత్మీయ నైజం కావాలంటే మొదట నువ్వు క్రొత్తగా జన్మించాలి'.

చాలామంది తమ దుష్టస్వభావాన్ని అణిచివేయటానికి తమ ఆలోచనలను, ఆకాంక్షలను దేవుని ధర్మశాస్త్రానికి సరిపడేలా చేయడానికి దీర్ఘకాలం ఎంతగానో శ్రద్ధగా శ్రమించారు. సమస్త పాపాలను విడిచిపెట్టాలనీ, అన్ని విధులను నెరవేర్చాలనీ వారు ప్రయత్నించారు. వారు ఎంతో భక్తిశ్రద్ధలు కలిగి తమ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా తమ పాపపు కోరికలను చంపడానికి ఉపవాసాలతో, కఠోరనిష్టతో తమను తాము చంపుకోవడానికి సైతం సిద్ధపడ్డారు. రక్షణకు పరిశుద్ధత తప్పనిసరి అని తలంచి నిత్య నాశనానికి మిక్కిలి భయపడి లోకాన్ని త్యజించి, మఠాలలో ఆశ్రమాలలో తమను తాము నిర్భందించుకున్నారు. ఇంతచేసినా పరిశుద్ధపరచబడుటను గురించిన మర్మాన్ని, నూతన జీవితానికి ముందు నూతన స్థితి ఉండాలన్న సత్యాన్ని గ్రహించడంలో విఫలమయ్యారు.

“శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచలేరు” (రోమా. 8:8) అని దైవావేశము చేత ఖచ్చితంగా చెప్పబడింది. అయ్యో, 'శరీరము నందు' అనే మాటల అర్థం ఎంత తక్కువ మంది గ్రహిస్తున్నారు. చాలా నీచ శరీరాశలు గలవారినే అవి సూచిస్తున్నాయని అనేకులు తలస్తున్నారు. కాని, శరీర స్వభావమంటే ప్రకృతి సంబంధమైన పతనం, దేవుని నుండి వేరుపడిన పాపాత్మమైన స్థితి అని అర్థం. శరీరస్వభావం అనేది దేవుని పరిశుద్ధ ధర్మశాస్త్రాన్ని వ్యక్తిగతంగా మీరడాన్ని కాకుండా సమస్త పాపాలకు మూల కారణమైనదానిని సూచిస్తుంది. “శరీరమంటే” ఆదాము పతనం వలన పాడైన మానవస్వభావం. అది ఆదాము నుండి పుట్టుక ద్వారా మనకు సంక్రమించింది. “శరీరానుసారిగా ఉండటం అనగా సాతాను శక్తికి పూర్తిగా లొంగిపోవడం. ఎవరైనా తన సొంత శక్తితో, తన సొంత ఆయుధాలతో పోరాడితే సాతాను తప్పక అతన్ని ఓడిస్తాడు. ఒక శవానికి రాయడం, రుద్దడం వలన దానిని బ్రతికించడం ఎంత అసాధ్యమో అలాగే తీక్షణమైన మానవ ప్రయత్నాలన్నిటి చేత శరీరంలో పరిశుద్ధత కలిగించడం కూడా అంతే అసాధ్యం. నీతిమంతులుగా తీర్చబడటంలోని సమస్యలో చేరిన వివిధ అంశాలేమిటంటే - తన శాసనాలకు సంపూర్ణమైన విధేయత మన నుండి రావాలని దేవుని ధర్మశాస్త్రం ఆజ్ఞాపించినప్పటికీ దానిని చెయ్యడంలో మనం పూర్తిగా విఫలమయ్యాం. కాబట్టి మనం ధర్మశాస్త్రం విధించే శిక్షకూ, శాపానికీ గురయ్యాం. న్యాయాధిపతి న్యాయాన్ని తప్పక జరిగిస్తాడు. ఆయన దోషిని నిర్దోషిగా ఎంత మాత్రం ఎంచడు. అటువంటి పరిస్థితిలో న్యాయం భంగం కాకుండా కనికరం చూపడం ఎలా సాధ్యం? పరిశుద్ధపరచబడుటలోని సమస్యలో గల వివిధ అంశాలేమిటంటే, ధర్మశాస్త్రం అంతరంగ మరియు బాహ్య విధేయతను కలిగివుండాలని ఆదేశిస్తుంది. అయితే మనం పూర్తిగా చెడిపోయినవారమై ఈ లోకంలో జన్మించాము. ఏవిధంగానైనా ధర్మశాస్త్రానికి లోబడలేని స్వభావంతో జన్మించాము. దేవుడు పరమ పవిత్రుడు. ఇటువంటి పరిస్థితిలో పాపపు కుష్టుతో మనలను ఆయన తన సన్నిధిలోనికి ఎలా రానిస్తాడు? మనలో పవిత్రత ఏమాత్రం లేదు. కూషు దేశస్తుడు తన చర్మాన్ని ఏ విధంగా మార్చుకోలేడో అదే విధంగా మనలను మనం పవిత్రులుగా చేసుకోలేం. పునర్జన్మ ద్వారా పవిత్ర స్వభావం ఇవ్వబడినప్పటికీ మారని శరీరస్వభావంతో పరలోక ఆలయంలో ఎలా ఆరాధించగలం? నేను పాపంతో నిండి ఉన్నానని తెలిసికూడా వ్యక్తిగతంగా నేను పవిత్రుడనని ఎలా చెప్పగలను? నాలో అవినీతి సముద్రం వలె ఎగసిపడుతుంటే, “నా హృదయం శుద్ధికలదని" ఎలా చెప్పగలను? నా జీవితం దేవునికి అంగీకారం కాక ముందు నా స్థితి మారాలంటే అలాంటి మార్పు కలిగేలా నేనేం చేయగలను? నేను అమిత పాపినని నేనే ఎరిగి ఉండగా నేను తన సన్నిధికి రాదగినవాడినని ఆయన ఎలా ఎంచగలడు?

 

పరిశుద్ధపరచబడుటను గురించిన సిద్ధాంతం

6.దాని పరిష్కారం

పరిశుద్ధపరచబడడం అనే గొప్ప సత్యంతో ఒక మర్మం, ఒక సమస్య ముడిపడి ఉన్నాయి. మొదటిది పునర్జన్మ పొందని వారికి సంబంధించింది. రెండవది పునర్జన్మ పొందిన వారిని లోతుగా కలవరపరిచేది. ఎంత ఆసక్తితో భక్తితో చేసినా తన కార్యాలు దేవునికి ఎందుకు అంగీకారం కావో, ప్రకృతి సంబంధి అయిన మానవుడు అర్థం చేసుకోలేని విధంగా అది అతనికి మరుగు చెయ్యబడింది. ఫలం మంచిది అవ్వాలంటే ముందు చెట్టు మంచిదిగా చెయ్యబడాలని, అతని క్రియలు దేవునికి అంగీకారం అవ్వడానికి అతని స్థితి, స్వభావం ఆయనకు అంగీకారాలుగా చెయ్యబడాలని తెలిసినా సరే దానిని ఎలా సాధించాలో అతనికి ఎంత మాత్రం తెలియదు. అయితే ఆత్మ సంబంధమైన వ్యక్తిని కలవరపరిచేది ఏమిటంటే- ఇంకా పాపంతో నిండిన వ్యక్తి తన స్థితి స్వభావం దేవునికి అంగీకారమౌతాయని ఎలా చెప్పగలడు? అంతరంగంలో అవినీతి నిండి ఉన్నవాడు తాను పరిశుద్ధుడనని యదార్థంగా ఎలా చెప్పగలడు? దేవుడు మనకు సామర్ధ్యం ఇచ్చిన కొలది ఈ అంశాలను పరిశీలిద్దాం .

ప్రకృతి సంబంధియైన మనిషికి పరిశుద్ధపరచబడుటను గురించిన మర్మం ఏమాత్రమూ తెలియదు. ఇతడు మనస్సాక్షి కదిలింపబడడం వలన కాని, నరక భయం వలన కాని, పరలోకానికి వెళ్ళాలనే ఆశతో కాని తనలో నివసిస్తున్న పాప కార్యాలను జయించేందుకు శ్రద్ధతో కృషి చేసినప్పటికీ తనకు తెలిసిన ప్రతి విధిని ఎంతో ఆసక్తితో నెరవేర్చినప్పటికీ తన కార్యాలు దేవునికి అంగీకారాలుగా చెయ్యబడడానికి మొదట తన స్థితి ఎందుకు మారాలో అర్థం చేసుకోలేకపోతున్నాడు.ఒక పని మంచిదిగా మరియు దేవునికి అంగీకారంగా అవ్వడం అనేది దాని స్వభావంపై ఆధారపడదు కానీ, ఆ పని ఏ నియమం నుండి ఉద్భవించింది అనేదానిపై ఆధారపడి ఉంటుందని అతను గ్రహించలేకపోతున్నాడు. ప్రకృతి సంబంధి అయిన మనిషి మేలు, కీడులకు మధ్య భేదాన్ని కనుగొనగలడు అన్నది నిజమే. అతడు పొందిన ఉపదేశాన్ని బట్టి చాలా వరకు మంచిని చేసి చెడుని విసర్జించవచ్చు. అయినప్పటికీ ఆ పనులు కృతజ్ఞతతో విధేయతతో చేసినవి కాక, భయం వలన చేసినవి కాబట్టి అవి సహజంగా చెట్టున పండిన ఫలాలులా కాకుండా కృత్రిమ పద్ధతుల ద్వారా పండిన కాయలులా ఉంటాయి.

ఆజ్ఞ (లేదా ధర్మ శాస్త్రము) యొక్క ధ్యేయం (ఉద్దేశం) "పవిత్ర హృదయం నుండియు మంచి మనస్సాక్షి నుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే" (1తిమోతి. 1:5) .దీనికి తక్కువైనదేదీ దేవుని ఉన్నత ప్రమాణాలను అందుకోలేదు. కేవలం ఆయన ఆజ్ఞల పట్ల ఉన్న గౌరవాన్ని బట్టి, ఆయన మంచితనానికి కృతజ్ఞతను బట్టి, ఆయన అంగీకారం మరియు దీవెన విషయంలో చేసిన వాగ్దానాలను లక్ష్యపెట్టే విశ్వాసాన్ని బట్టి కలిగే సత్ క్రియలు మాత్రమే దేవునికి ప్రీతికరమైనవి. ఈ గుణాలు లేని పనులను పరలోకం అంగీకరించదు. మన బాధ్యతను గురించిన గ్రహింపు మనస్సాక్షిని కదిలించాలి. నిస్వార్థ ప్రేమ హృదయాన్ని స్పందింపచెయ్యాలి. ఆచరణాత్మకమైన విశ్వాసం కార్యాలను నడిపించాలి. కాబట్టి దీనిని ఇలా ఎందుకు చేస్తున్నావని అడిగితే - దేవుడు ఆ విధంగా చెయ్యమని ఆజ్ఞాపించాడు అన్నదే నా జవాబై ఉండాలి. అంతటి యధార్ధత, ప్రేమ ఎందుకు? అని తిరిగి ప్రశ్నిస్తే దేవుడు నా నుండి శ్రేష్టమైన వాటిని కోరుతున్నాడు కాబట్టి, నేను ఆయనను ఘనపరచాలని కోరుతున్నాను అన్నదే నా జవాబై ఉండాలి. విధేయత దేవుని అధికారాన్ని, ప్రేమను, విశ్వాసాన్ని, ఆయన యిచ్చే ప్రతి ఫలాన్ని గౌరవిస్తుంది.

“కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి” (1కొరింథీ 10:31). మన క్రియలు దేవునికి అంగీకారాలుగా ఉండాలంటే అన్నిటిలో ఆయనకు మహిమ కలిగించడమే మన ఆశయం కావాలి. ఈ లోకపు విధులను జరిగించడంలో కాని, కనికరం, ప్రేమ చూపడంలో కాని, భక్తి పరిశుద్ధత కలిగి ఉండడంలో కాని ఆయన చిత్తాన్ని అనుసరించే ధ్యేయంతోనే వాటిని జరిగించాలి. ప్రకృతి సంబంధి అయిన మనిషి కష్టకాలంలో దేవునికి మొరపెడతాడు. అయితే అది కేవలం తన అవసరతలు తీర్చుకోవడానికే. అనేకులు కష్టంలో ఉన్నవారికి ధారాళంగా సహాయం చేస్తారు, అయితే అది కేవలం మనుష్యుల మెప్పు కొరకే (మత్తయి 6:2;). ప్రభువుదినాన అనేకులు ఆరాధనకు హాజరై భక్తి ప్రదర్శిస్తారు, అయితే అది కలవరపరిచే మనస్సాక్షిని తృప్తిపరచడానికి కాని లేదా దాని ద్వారా పరలోకానికి చేరతామనే ఆశతో కాని చేసిన పని.

పైన చెప్పిన అంశాలను బట్టి పునర్జన్మ లేనివారి మంచి కార్యాలు దేవుడు కోరిన ప్రమాణాలను చేరడం లేదని స్పష్టమౌతుంది. ప్రకృతి సంబంధి చేసే కార్యాలు దేవుని మెప్పు పొందలేవు, ఎందుకంటే వాటి కర్తకాని, వాటిని కొనసాగించేవాడు కాని దేవుడు కాదు. ఆయన పట్ల ఉన్న ప్రేమ నుండి అవి ఉద్భవించటం లేదు. దేవునిని మహిమపరచడం వాటి ధ్యేయం కాదు. దానికి బదులు, అవి వారిలో ఉన్న పాపస్వభావం నుండి ఉత్పన్నం అయి కేవలం స్వలాభానికి ఉద్దేశించబడినవి. ఇందుకు భిన్నంగా అది ఉండదు. నీరు దానంతట అదే మట్టం పెంచుకోలేదు. మలిన జలం ఉబికే ఊట నుండి నిర్మలమైన నదీ ప్రవాహం పుట్టదు. “శరీర మూలముగా జన్మించినది శరీరము” (యోహాను 3:6) అది కేవలం శరీరమే తప్ప ఇంకేదీ కాలేదు. విద్య, నాగరికత, మతాసక్తి ఇవన్నీ శరీరాన్ని ఆధ్యాత్మికంగా మలచలేవు. ఒకని క్రియలు పరిశుద్ధపరచబడాలంటే ముందు అతడు పరిశుద్ధపరచబడాలి.

అనంతమైన పరిశుద్ధత ఉన్న దేవుని సన్నిధిలో నిలబడగలిగేలా మానవులు పరిశుద్ధులు ఎలా కాగలరు? స్వభావసిద్ధంగా వారిలో పరిశుద్ధత ఏ మాత్రం లేదు. వారు 'పాడైన వారు, మలినంతో నిండిన వారు, పవిత్రతలేని వారు' అయ్యున్నారు. ఒక వినూత్న లోకాన్ని సృష్టించే కార్యానికి వారు ఎంతశక్తిహీనులో, తమను తాము పరిశుద్ధపరచుకోవడానికి కూడా అంతే శక్తిహీనులు. మన శరీరాశలను లోపరచుకోవడం కన్నా అరణ్యంలో ఉన్న పులిని లోబరచడం సులభం. మన హృదయం నుండి గర్వాన్ని పారద్రోలటం కన్నా సముద్రాన్ని ఖాళీ చెయ్యడం సులభం. మన కఠిన హృదయాన్ని కరిగించడం కన్నా గుండు రాతిని కరిగించడం తేలిక. మనలోని పాపాన్ని తీసివేయడం కన్నా సముద్రంలోని ఉప్పును తొలగించడం సులభం. “నీవు క్షారముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది; ఇది ప్రభువగు యెహోవా వాక్కు” (యిర్మీయా. 2: 22).

“మన స్వభావం అతి శ్రేష్టమైన స్థితిలో ఉన్నపుడు, ప్రారంభంలో మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధ స్థితిలో మనం ఉన్నప్పుడు అనగా దేవుని రూపాన్ని ధరించినవారమై మనం ఆదాములో ఉన్నపుడే మనం ఆ పరిశుద్ధతను నిలుపుకోలేకపోయాము. అలాంటిది ఇప్పుడు పతనమైన పాపపు స్వభావంతో మనలను మనం పునరుద్ధరించుకోవడం, మన ఆత్మను దేవుని పోలికకు మార్చుకోవడం, మరింత అసాధ్యం కాదా? ఒకవేళ పరిశుద్ధతను మన శక్తితో స్వాభావిక ఇంద్రియాల నుండి వెలికి తీయగలిగినట్లయితే దేవుడే తన అమితమైన జ్ఞానంతో దానిని బాగు చేయ పూనుకోవడం ఎందుకు? "మలినమైన స్వభావం దానంతట అదే పరిశుద్ధ పరుచుకోగలదని, పతనమైన స్వభావం దానిని అదే బాగు చేసుకోగలదని, మనలో దేవుడు సృష్టించిన ఆయన స్వరూపాన్ని కోల్పోయిన మనమే మన సొంత ప్రయత్నాలతో తిరిగి దానిని సంపాదించుకోవచ్చని అనుకోవడం కంటే గొప్ప భ్రమ ఏదీ మనుషులకు కలగలేదు" (జాన్ ఒవెన్). అయినప్పటికీ ఒక విషయం ఇక్కడ స్పష్టం చేస్తాను. అదేమిటంటే దేవుడు కోరిన ప్రమాణాలను చేరలేని ఈ శక్తిహీనత బలహీనత కాదు, అది శిక్షార్హమైన గొప్ప పాపం. అది మనలో దుష్టత్వాన్ని పెంపొందింపచేసి మన దోషాన్ని మరింత తీవ్రం చేస్తుంది. దేవుడు ఏర్పరచిన వ్యక్తిగత పరిశుద్ధతా ప్రమాణాన్ని అందుకోలేని మన బలహీనత అలా చెయ్యగల శక్తి లేకపోవడం వల్లకాని కావలసిన సామర్థ్యం లేకపోవడం వల్ల కాని కాదు. నిజమైన పవిత్రతను ఆచరణలో పెట్టడానికి సిద్ధమైన మనస్సు మరియు హృదయం లేకపోవడమే అందుకు కారణం. ఒకవేళ సహజ స్థితిలో ఉన్న మానవుడు నిజమైన పవిత్రత పట్ల ప్రేమ, దానిని యదార్ధంగా ఆచరించే కోరిక కలిగిఉండి కూడా అందులో విఫలమైతే, అత్యవసర పరిస్థితిలో పాపం చెయ్యవలసి వచ్చిందని ఏదో ఒక వంకతో అనేకులు చెప్పినట్లు చెప్పగలడు. కాని సత్యమేమిటంటే మానవునిలోవున్న శక్తిహినతకు కారణం మొండితనమే. “మీరు నా వద్దకు రారు” (యోహాను 5:40;) అని యేసు ప్రభువు చెబుతున్నాడు. తన ఆస్తినంతా ఇష్టానుసారంగా ఖర్చు చేసిన ఒక అప్పుల వాని రుణం, అప్పు తీర్చడానికి అతని శక్తిహీనత వలన కొట్టి వేయబడదు. త్రాగుబోతు చేసిన పిచ్చిపనులు, హింసాత్మక చర్యలు త్రాగిన మైకంలో చేసాడు అనే కారణంతో క్షమింపబడవు, పైగా అది అతని దోషాన్ని మరింత అధికం చేస్తుంది. మానవుడు తన దుష్టత్వం వలన విధేయత చూపే శక్తిని కోల్పోయినా, దేవుడు మాత్రం ఆజ్ఞాపించే అధికారం కోల్పోలేదు. “శరీరము ఆత్మకు విరోధముగా అపేక్షించి”నా (గలతీ. 5:17;). దేవునికి లోబడకపోవడానికి ఇది ఒక కారణంగా చూపించలేము. “పాపము చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును” అనే మాట వారిని సమర్థించదు. ఎందుకంటే వారు “చీకటిని ప్రేమించిరి” (యోహాను 3:19,20;). రక్షకుడైన యేసు స్పష్టంగా చెప్పినట్లు అది వారి దోషాన్ని అధికం చెయ్యడానికి సహాయపడుతుంది. " ఆ తీర్పు ఇదే ” అయితే “నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడు మరి అపవిత్రుడు కదా?” (యోబు 15: 16). అతనికి ఇష్టం లేదు కాబట్టి పరిశుద్ధతను అలవరచుకోడు.

మనుషులు తమ సామర్థ్యాన్ని సరిగా ఉపయోగించరు కాబట్టి వారికి న్యాయంగా శిక్ష విధించబడింది. పరిశుద్ధపరచబడని వ్యక్తిలో ఉన్న ప్రాణం మరణించింది కాదు. అది జీవిస్తూ పని చేస్తూ ఉన్నది. కాబట్టి అది గ్రహించగలదు, ఆశించగలదు, ఇష్టపడగలదు. హేతువు చూపి తన అవకాశాలను మెరుగుపరచి సమయాన్ని సద్వినియోగం చెయ్యగలదు. ప్రకృతి సంబంధి తన హృదయంలో కృపను ఉద్భవింపచేయలేకున్నప్పటికీ కృపా సాధనాలపై ఆధారపడి కృపకై వేచి ఉండగలడు. పరిశుద్ధపరచబడని వ్యక్తి చలన చిత్రాన్ని చూసినట్టే వాక్యాన్ని వినగలడు. వార్తా పత్రికలు, నవలలు చదివే కళ్లతో పరిశుద్ధ గ్రంధం కూడా చదవగలడు. దైవదూషణ చేసేవారితో కలసి ఉన్నట్టే ఒట్లు పెట్టుకునేందుకు భయపడే మంచివారితో కూడా కలిసి ఉండగలడు. న్యాయ తీర్పు దినాన ఇలాంటి వారు చెయ్యలేని పనుల కొరకు కాదు చెయ్యడానికి ఇష్టపడని వాటి కొరకు శిక్షింపబడతారు.

మనుషులు తమను తాము శుద్ధి చేసుకోలేరని, పాపాన్ని మానలేరని, పశ్చాత్తాపం పొందలేరని, క్రీస్తునందు విశ్వాసముంచలేరని, పవిత్ర జీవితాన్ని జీవించలేరని ఫిర్యాదు చేస్తారు కాని వారు యధార్ధపరులైతే, నిజంగా దీనమనసు కలిగున్నవారైతే, తమపై పాపానికి ఉన్న అధికారాన్నిబట్టి చింతించేవారైతే కృపాసింహసనం వద్దకు పరుగెత్తి ఉండేవారు, తమను బంధించిన గొలుసులను తెంపమని రాత్రింబగళ్ళు దేవునికి మొరపెట్టుకుని ఉండేవారు, సాతాను శక్తి నుండి విడిపించమని, ఆయన ప్రియ కుమారుని రాజ్యానికి కొనిపొమ్మని వేడుకొని ఉండేవారు. తమ శక్తిహీనతను గురించి ఫిర్యాదు చేయడంలో యధార్థ పరులై ఉంటే, వారు దేవునిని సమీపించి శుద్ధజలం తమపై జల్లమని, ఆయన పరిశుద్ధాత్మను తమలో ఉంచమని, నూతన హృదయాన్ని ఇమ్మని, ఆయన ఆజ్ఞల జాడలలో నడవచెయ్యమని ప్రార్థిస్తారు. (యెహెజ్కేలు36:25-28;). అయితే వారు ఈ విధంగా చెయ్యనందుకు వారి రక్తం వారి తలపై ఉన్నది. ఇది న్యాయమే.

“పాపులారా, మీ చేతులను శుభ్రము చేసికొనుడి, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి” (యాకోబు 4:8). దుష్టత్వంనుండి, అపవిత్రతనుండి పైపైకి విడిపొతే సరిపోదు. హృదయ పవిత్రత తప్పక ఉండాలి. “నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు” (కీర్తన 51:6). దేవుని చట్టం దొంగతనాన్ని నిషేధించడమే కాకుండా "ఆశించకూడదని” కూడా ఆజ్ఞాపిస్తుంది. ఇది బహిరంగ పాపం కాదు కాని అంతరంగంలో చెయ్యబడే పాపం. స్వభావంలో పరిశుద్ధత ఉండాలని ధర్మశాస్త్రం ఆజ్ఞాపిస్తుంది. ఇదిలేనిదే ఒకడు తన పూర్ణహృదయంతోను, ఆత్మతోను, మనసుతోను, బలముతోను తన దేవుడైన యెహోవాను ప్రేమించి, తనవలె తన పొరుగు వానిని ఎలా ప్రేమించగలడు? దేవుడు ముఖ్యంగా పవిత్రమైన గుణం గలవాడు. అపవిత్రత కన్నా ఆయనకు విరుద్ధమైనది మరొకటి ఉండదు. ఒక తోడేలు, గొర్రెపిల్ల లేదా రాబందు, పావురం ఎలా కలిసి జీవించగలవు? "నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము?” (2 కొరింథీ 6:14,15)

అయితే ఈ మర్మం ఎలా వీడుతుంది? ఏ విధంగా పరిశుద్ధపరచబడిన వారు దేవుని పరిశుద్ధ సన్నిధికి తగిన ధన్యకరమైన గుణం పొందగలరు? ఒక చెడు వృక్షం తన ఫలం మంచిదిగా, అంగీకారయోగ్యమయ్యేలా మంచి వృక్షంగా చెయ్యబడే ప్రక్రియ ఏమిటి? ఈ ప్రశ్నలకు ఇక్కడ పూర్తి సమాచారం ఇవ్వలేమన్నది స్పష్టం. అలాచేస్తే రానున్న అధ్యాయాల్లో నేను చెప్పాలనుకున్న మరిన్ని విషయాలు ఇక్కడే ప్రస్తావించవలసి వస్తుంది. అయితే ఆ గొప్ప చిక్కుముడి ఏ విధంగా విప్పబడుతుందో ఇక్కడ కొంత సూచించడానికి ప్రయత్నిస్తాను. ఆ విధానాన్ని మనమెన్నడూ ఊహించకపోవచ్చు. అయితే వెలిగింపబడిన కన్నులతో ఒకసారి దానిని చూస్తే అది దైవికంగా, తృప్తికరంగా ఉంటుంది. అడ్డుగా నిలిచే పొరపాట్లు అనే బండలు తప్పించుకుని నిర్మలమైన నీరు అనే సత్యాన్ని చేరేందుకు దేవుడు మనకు దయతో సహాయం చేయును గాక.

నేను ముందే సూచించిన విధంగా దేవుని చేత పరిశుద్ధపరచబడిన వారు ఆయన పరిశుద్ధ ధర్మశాస్త్రాన్ని వ్యక్తిగతంగా నెరవేర్చడానికి బాధ్యులైనప్పటికీ, వారికది అసాధ్యం. “నా హృదయమును శుద్ధపరుచుకొని యున్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిననుకొనదగిన వాడెవడు?” (సామెత 20:9). ధర్మశాస్త్రాన్ని నేరవేర్చడానికి పరిపూర్ణ, పరిశుద్ధమైన స్వభావాన్ని కలిగి ఉండాలని నిత్యత్వం నందే నియమించబడింది. "పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ప్రధానయాజకుడు మనకు సరిపోయిన వాడు” (హెబ్రీ 7:26). ఆ అవసరత రెండు విషయాలను కోరింది, మొదట దేవుని ప్రజలకు శిరస్సయి ఉన్నవాడు పరిశుద్ధమైన మానవస్వభావం కలిగి ఉండాలి. రెండవది ఆ పరిశుద్ధ స్వభావాన్ని అంతర్గతంగా కలిగి ఉండాలి. వీటిని క్లుప్తంగా పరిశీద్దాం.

మానవాళి వేరుచిగురైన ఆదాముకు పవిత్ర స్వభావం ఇవ్వబడింది. అతడు దానిని నిలుపుకుని తన సంతానానికి దానిని అందించవలసి ఉంది. ఆ కారణంగా మనుషులందరు పరిశుద్ధంగా జన్మించాలని ధర్మశాస్త్రం కోరుతుంది. దీనికి విరుద్ధంగా వారు అపరిశుద్ధులని, “దైవోగ్రత పుత్రులు” అని వాక్యం సెలవిస్తుంది (ఎఫెసీ 2:3;) అయితే పాపంలో పుట్టినవారు ఈ ఆజ్ఞను ఎలా నెరవేర్చగలరు? వారు తిరిగి తల్లి గర్భంలో ప్రవేశించి రెండవసారి పాపం లేకుండా పుట్టలేరు. అయినా సరే ధర్మశాస్త్రం తన ఆజ్ఞను ఉపసంహరించుకోదు. కాబట్టి ఆత్మ సంబంధమైన తన సంతానానికి ప్రతినిధి మరియు వేరుచిగురు అయిన రెండవ ఆదామగు క్రీస్తు పరిశుద్ధునిగా జన్మించాలని, ఏర్పరచబడిన వారు పాపపు స్వభావంతో ఈ లోకానికి వస్తే ఆయన మాత్రం పరిశుద్ధునిగా పుట్టాలని నియమించబడింది (లూకా 1:35;). తత్ఫలితంగా విశ్వాసులందరూ చివరి ఆదాములో పరిశుద్ధులుగా జన్మించినట్టు ధర్మశాస్త్రం లెక్కిస్తుంది. వారు క్రీస్తు సున్నతి ద్వారా సున్నతి పొందిరి అని రాయబడింది. (కొలస్స 2:11;) సున్నతికి ముందు పుట్టుక అవసరం అనే అంతర్భావం ఇందులో ఉంది. అయితే అంత మాత్రం చాలదు. ఈ రెండవ ఆదాము పాపంతో నిండిన ఈ లోకంలో జీవించినపుడు తన పరిశుద్ధ స్వభావానికి మచ్చ, మాలిన్యం అంటకుండా దానిని కాపాడుకోవాలి. ధర్మశాస్త్రం పరిశుద్ధ స్వభావాన్ని మాత్రమేకాకుండా స్వభావం యొక్క నిర్మలత్వం, నమ్మకత్వం కూడా కాపాడుకోవాలని కోరుతుంది. ఈ నియమాన్ని తృప్తిపరచడానికి విశ్వాసులకు శిరస్సయినవాడు పరిపూర్ణమైన తన పవిత్రతను కాపాడుకోవలసి ఉంది. “అతడు అలసిపోడు, సొమ్మసిల్లడు” (యెషయా 42:4;)

మొదటి మానవుడు ఓటమి చెందాడు, మంచి బంగారం త్వరలోనే కాంతిని కోల్పోయింది. త్వరలోనే అతని పరిశుద్ధత పాపం వల్ల ఆర్పబడింది. అయితే రెండవ మానవుడు ఓటమి చెందలేదు. మానవుడైనా, అపవాది అయినా అతనిని పాడు చెయ్యలేకపోయారు. ఆయన చివరి వరకు తన పరిశుద్ధమైన స్వభావంపై మచ్చ పడనియ్యలేదు.కాబట్టి పరిశుద్ధులను ఆయన తనలోనే చూసుకుని వారిని పరిశుద్ధులుగా పరిగణిస్తున్నాడు (ఎఫెసీ 1:1).

ఇది న్యాయపరంగా ధర్మశాస్త్రాన్ని పూర్తిగా తృప్తి పరచినప్పటికీ దేవుణ్ణి తృప్తి పరచి ఆయన ప్రజల అనుభవాత్మక అవసరతలు తీర్చేందుకు ఇంకాస్త అవసరమైంది. ఆదాము పాపం వల్ల వారు మలినపరచబడి అతని ద్వారా మాలిన్యం వారిలో ప్రవేశించడాన్ని బట్టి పుట్టుక ద్వారా వారికి వచ్చిన స్వభావం కూడా మలినమైపోయింది. ఆదాము అపరాధతత్వం వారికి ఆపాదించబడడం మాత్రమే కాదు, అతని స్వభావం కూడా వారికి సంక్రమించింది. కాబట్టి ఎన్నుకోబడినవారు చట్టబద్ధంగా క్రీస్తులో పరిశుద్ధులుగా జన్మించడం మాత్రమే కాదు, ఆయన నుండి పవిత్రమైన స్వభావాన్ని కూడా పొందారు. “ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి అయెనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయెను” ( 1 కొరింథీ 15:45). ఈ కార్యం త్రిత్వంలోని మూడవ వ్యక్తి యొక్క మానవాతీత శక్తి ద్వారా జరిగింది. దీనివల్ల ఏర్పరచబడినవారు తమ శిరస్సుతో చక్కగా అతకబడ్డారు. “ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయైయున్నాడు” (1 కొరింథీ 6:17).

“కాబట్టి ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. ఇదిగో సమస్తమును క్రొత్త వాయెను” (2 కొరింథీ 5:17). పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసంతో మనం క్రీస్తుతో ఏకమవ్వడం వల్ల ఆయనతో అదే ఆత్మసంబంధమైన పరిశుద్ధ స్వభావంలో పాలు పొందుతాము. హవ్వ ఆదామ ఎముకలో ఎముక, మాంసములో మాంసమై అతనితో ఏకశరీరమైనట్లే సంఘం కూడా ఆయనతో (క్రీస్తుతో) ఏకమౌతుంది. విశ్వాసులు పరిశుద్ధుడైన క్రీస్తుతో ఏకమవ్వడం వల్ల వారు “యేసు క్రీస్తు నందు పరిశుద్ధపరచబడిరి” (1 కొరింథీ 1:2;). క్రీస్తు తనకు అతికించబడిన కొమ్మలను తన స్వభావంగలవిగా మార్చగల వేరు కాబట్టి ఆయనతో ఏకమవ్వడం వల్ల విశ్వాసి “ఒక నూతన సృష్టి” అయ్యాడు. “వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే” (రోమా 11:16). “కొలత లేకుండ” (యోహాను 3:34;) క్రీస్తు పొందిన ఆత్మయే ఆయన శరీరంలో సభ్యులైన వారందరికి ఇయ్యబడింది. కాబట్టి "ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి” (యోహాను 1:16) అని రాయబడింది. విశ్వాసం ద్వారా క్రీస్తుతో ఏకమవ్వడం మరియు క్రీస్తు వల్ల జీవింపచేసే ఆత్మ పొందడం ద్వారా విశ్వాసి నీతిమంతునిగా తీర్చబడి దేవునితో సమాధాన పరచబడడం మాత్రమే కాకుండా పరిశుద్ధపరచబడి, అతడు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యానికి తగినవానిగా చేయబడి, దేవుని వారసునిగా మార్చబడతాడు.

 

పరిశుద్ధపరచబడుటను గూర్చిన సిద్ధాంతం

7.దాని పరిష్కారము (ముగింపు)

ఆరవ అధ్యాయ ప్రారంభంలో పరిశుద్ధపరచబడడం అనే గొప్ప సత్యంలో ఒక మర్మం, ఒక సమస్య ఉన్నాయని, మొదటిది పునర్జన్మ పొందని వారికి రెండవది పునర్జన్మ పొందినవారికి సంబంధించిందని సూచించాను. ఎంత ఆసక్తితో భక్తితో చేసినా తన కార్యాలు ఎందుకు దేవునికి అంగీకారం అవ్వడం లేదో ప్రకృతి సంబంధి అయిన వ్యక్తి అర్థం చేసుకోకుండా అతనికి మరుగు చెయ్యబడింది. ఎంత శ్రద్ధగా మనఃపూర్వకంగా, జాగ్రత్తగా, భక్తితో చేసినా తన కార్యాలు దేవునికి అంగీకారం కావని అతనికి చెబితే అది కేవలం అతని గ్రహింపుకు అతీతంగానే ఉంటుంది. ఆదాములో తాను ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడం వల్ల తనకూ దేవునికీ మధ్య అగాధం ఏర్పడి, అది ఉన్నంత కాలం దేవుని కృప తనకు దొరకదని, తాను చేసే ప్రార్థనలు, అర్పణలు దేవునిని చేరవని అతనికి తెలియదు. కయీను అర్పణను ఆయన అంగీకరించని విధంగా ప్రకృతి సంబంధి చేతుల నుండి ఆయన దేనినీ అంగీకరించడు. ఆయన మానవులందరిని వారి ప్రకృతి స్థితిలోనే విడిచిపెట్టి ఉంటే కాలాంతం వరకు మానవాళి అంతా అదే స్థితిలో మిగిలిపోయేది.

తమ వేరు మరియు ప్రతినిధి అయిన ఆదాము దేవుని స్వరూపంలోనూ ఆయన పోలిక చొప్పుననూ సృష్టింపబడిన కారణంగా మనుషులందరికి పరిశుద్ధమైన స్వభావం ఇవ్వబడింది. అది వారికి అతని నుండి సంక్రమించవలసి ఉంది. కాబట్టి ధర్మశాస్త్రం మానవులందరి నుండి ఆ పరిశుద్ధతను కోరి అది లేని వారు శాపగ్రస్తులని తీర్పు తీరుస్తుంది. మనం ఈ లోకంలో అపవిత్రులంగా మాలిన్యంతో పుట్టినప్పటికీ (యోహెజ్కె. 16:3-6;) మనలో నివసిస్తూ మన అంతరంగ స్వభావంగా మారిన పాపం, మనం చేసే వాటన్నిటిని మలినపరుస్తున్న కారణం చేత, ధర్మశాస్త్రం కోరే విధేయత చూపడానికి మనం పూర్తిగా అసమర్ధులం. దేవుని వలన కలిగే జీవంలో నుండి వేరుపరచబడినవారం కాబట్టి ధర్మశాస్త్రపు కట్టడలకు మనం చూపించే బాహ్య విధేయత దానికి ఆమోదకరమైన నిస్వార్ధమైన ప్రేమ, నిష్కపటమైన విశ్వాసం అనే మూలం నుండి ఉత్పన్నమవ్వడం అసాధ్యం. తత్ఫలితంగా ప్రకృతి సంబంధి అయిన మానవుని స్థితి నిరీక్షణ లేనిది.

తన ప్రజల అత్యవసరతలను తీర్చడానికి దేవుడు తన అనంత జ్ఞానంతో, సార్వభౌమ్య కృపతో చేసిన ఏర్పాటు నిత్యనిబంధన వాగ్దానంగా వెల్లడి చెయ్యబడింది. దేవునికి మరియు మానవులకు మధ్యవర్తిగా ఉండేవాడు మనుష్యకుమారుడై ఉండాలని, అయినప్పటికీ ఆయన మానవ సహజ పాపం నుండి పూర్తిగా వేరవ్వడం మాత్రమే కాకుండా “అది చాల మంచిదిగా ఉన్నదని" సృష్టికర్త ప్రకటించిన ఆదాము పవిత్రత కన్న నిర్మలంగా ఉండాలని నిత్య త్రిత్వ వ్యక్తుల మధ్య ఒప్పందం ఉండింది. ఈ నియమం కన్య గర్భాన జన్మించేటట్టు చేసిన పరిశుద్ధాత్ముని మానవాతీత కార్యమందు నెరవేర్చబడింది. దేవుని కుమారుడు "పరిశుద్ధునిగా” మరియ గర్భాన జన్మించాడు. ఈ మధ్యవర్తియైన క్రీస్తు, తన కొరకు కాకుండా దేవుడు ఎన్నుకున్న తన ప్రజల ప్రతినిధిగా మరియు శిరస్సుగా జన్మించాడు కాబట్టి వారుకూడా తమ పూటకాపునందు, తమకు జామీను ఉన్న వానియందు పరిశుద్దంగా పుట్టినవారని తద్వార పరిశుద్ధతా ప్రమాణాలను తృప్తిపరిచారని ధర్మశాస్త్రం పరిగణిస్తుంది. క్రీస్తునూ, ఆయన మర్మమైన శరీరాన్నీ ధర్మశాస్త్రం వేరుగా ఎప్పుడూ ఎంచలేదు.

ఇది చెప్పశక్యం కానంత ధన్యకరం అయినప్పటికీ అంతటితో ఇది అయిపోలేదు. ధర్మశాస్త్రం యెదుట నీతిగా తీర్చబడిన ఈ స్థితి దేవుడు ఏర్పరచుకున్న ప్రజల అవసరతలు సగం మాత్రమే తీర్చింది. వారి వ్యక్తిగత స్థితి కూడా చట్టబద్ధంగా పొందిన ఈ స్థితికి అనుగుణంగా ఉండాలి. ఇది కూడా సర్వకృపానిధియగు దేవుని అనంత ప్రేమ కనికరాల ద్వారా సిద్ధపరచబడింది. ఎలాగైతే ఆదాము దోషము తాను ప్రతినిధిగా ఉన్న వారందరికీ ఆపాదించబడిందో అదేవిధంగా క్రీస్తు నీతి కూడా ఆయన ఎవరిస్థానంలో మరణించాడో వారికీ ఆపాదించబడాలనీ, అంతేకాకుండా ఆదాము యొక్క ఆధ్యాత్మిక మరణం మరియు అపవిత్రం చేసే దాని దుష్ ప్రభావాలన్నీ, తన సంతానం అంతటికీ ఎలా సంక్రమించిందో అదే విధంగా క్రీస్తు ఆధ్యాత్మిక జీవం, మరియు పరిశుద్ధపరచే దాని ప్రభావాలన్నీ ఆయన సంతతికి సంక్రమించాలని దేవుడు ఏర్పరిచాడు.

మానవులందరు తమ పాపయుక్తమైన అపవిత్ర స్వభావాన్ని తమ ప్రకృతి సంబంధమైన శిరస్సు (ఆదాము) నుండి ఎలా పొందారో, అదే విధంగా పరిశుద్ధపరచబడిన వారు, ఆత్మ సంబంధమైన తమ శిరస్సు (క్రీస్తు) నుండి పాపరహితం మరియు పవిత్రం అయిన స్వభావాన్ని పొందుతారు. వారు మంటి నుండి పుట్టినవాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలిక కూడా ధరిస్తారు. మనం పరిశీలిస్తున్న ఈ అంశంలో సమస్యంతా తీరిపోయిందని మనలో కొందరు పాఠకులు తలంచవచ్చు, కాని విశ్వాసి కాస్త ఆలోచిస్తే అన్నిటినీ మించిన అతి సంక్లిష్టమైన అంశం ఇంకా స్పష్టం కాలేదని తెలుస్తుంది. ధర్మశాస్త్రం కోరినవన్నీ పరిశుద్ధపరచబడిన వారి పక్షంలో తమ శిరస్సు అయినవాడు (యేసు క్రీస్తు) చేసి ముగించినందువల్ల, ధర్మశాస్త్రం వారిని ఆయనయందు పరిశుద్ధులుగా పరిగణిస్తుందన్నది వాస్తవమైనప్పటికీ, పునర్జన్మలో వారిలో క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ ద్వారా ఆయనను పోలినటువంటి నూతనమైన పరిశుద్ధ స్వభావం తమలో అంతకంతకు అధికమౌతున్నప్పటికీ వారిలోని ప్రాచీన స్వభావం మార్పులేనిదిగా, దినదినం వారిని మరింత మలినపరుస్తున్నట్టుగా వారు కనుగొంటారు. పాపం తమలో నిలిచి ఉండడమే కాకుండా తమ కోరికలను, ఆలోచనలను, ఊహలను కార్యాలను మలినపరుస్తున్నదనీ, దానిని అరికట్టే శక్తి వారికి లేదనీ వారు బాధాకరంగా తెలుసుకుంటారు. యథార్థ హృదయులకు, సున్నిత మనస్సాక్షి గల వారికి ఇది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే తమను తామే అసహ్యించుకునేవారు పరిశుద్ధుడైన దేవునికి ప్రీతి పాత్రులుగా ఎలా ఉండగలరు? తమ మాలిన్యం మరియు నీచత్వం ఎరిగిన వారు అతి పరిశుద్ధుడైన వానిని ఎలా సమీపించగలరు? బాధాకరమైన ఈ ప్రశ్నకు కొందరు పౌలు “దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని యికను నేను కాదు” అని రోమా 7:20లో చెప్పిన మాటల భావాన్ని వక్రీకరించి ఇచ్చే జవాబు, వారిని సంతృప్తి పరచలేదు. పాపం చేస్తున్నది పునర్జన్మ పొందినవాడు కాదుకాని అతనిలో ఉన్న పాపమే అని చెప్పడం క్రైస్తవుని బాధ్యతను తప్పించుకోవడానికి ఒక మార్గం కనిపెట్టడం ఔతుందే తప్ప పునరుజ్జీవింపబడిన మనస్సాక్షికి అది ఎలాంటి ఆదరణను కలిగించలేదు. ఈ విధంగా తప్పును సమర్థించుకోవడానికి ఏ ఆస్కారం లేని విధంగా వాక్యం ఈ విషయాన్ని మిక్కిలి స్పష్టం చేస్తుంది. పాత క్రొత్త నిబంధనలు రెండూ, పాపం చేసేది పునర్జీవింపబడిన ఆ వ్యక్తియే అని స్పష్టం చేస్తున్నాయి! “నీకు, కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను” (కీర్తన 51:4) పౌలు కూడా రోమా పత్రిక 7వ అధ్యాయాన్ని ఈ విధంగా ముగిస్తున్నాడు. “అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను”.

ఈ సందర్భంలో కొందరు ఆధునిక వేదాంతులు, ప్రాచీన స్వభావాన్ని, నూతన స్వభావం నుండి వ్యత్యాసపరచే విధానాన్ని ఇతర విషయాలలో వారు అన్వయించకుండా తమ బుద్ధికుశలతను ఉపయోగించి జాగ్రత్తపడడం మనం చూడగలం. భౌతిక విషయాలను గురించి కూడా ఈ విధంగానే ఆలోచించాలని వారికి తోచనే తోచదు. ఒక దొంగ, న్యాయాధికారి యెదుట తాను తప్పు చేశానని, దొంగిలించానని ఒప్పుకుని అయితే దానికి తాను బాధ్యుడను కాదని తప్పంతా తనలోని “దుష్ట స్వభావానిదే" అని చెబితే ఎలా ఉంటుందో ఊహించండి!. అతని మాటలు విన్న న్యాయాధిపతి ఆ దొంగను జైలుకు పంపాలా లేక పిచ్చివారు ఉండే ఆస్పత్రికి పంపాలా అని అయోమయంలో పడతాడు, ఈ విషయం ఒక సంఘటనను గుర్తుకు తెస్తుంది. బిషప్పులందరు కూడుకునే "హౌజ్ ఆఫ్ లాడ్స్” సభలో ఒక బిషప్పు దేవదూషణ చేశాడనే దోషం అతని పై మోపబడింది. దానిని చూసి సేవకుడతనిపై కోపించగా ఆ బిషప్పు ఇలా అన్నాడు "శపించినది బిషప్పు కాదు ప్రభువు”. దానికా సేవకుడు “సాతానుడు ప్రభువునే" పట్టుకుంటే ఇక "బిషప్పు పరిస్థితేంటి?” అని జవాబిచ్చాడు. పాఠకుడా, జాగ్రత్త. నిన్ను సమర్థించుకోవడానికి నిందను నీ పాప స్వభావం పై నెట్టి వేసే ప్రయత్నం చెయ్యకు సుమా!.

కాబట్టి పరిశుద్ధపరచబడిన వ్యక్తికీ అతని ప్రాచీన స్వభావానికీ మధ్య ఉన్న భేదంలో కాకుండా మన సమస్యకు పరిష్కారం వేరొక చోట వెదకాలి. దేవునితో నడుస్తున్న ఒక వ్యక్తి ఒకానొక శోధనలో కాలు జారి పాపంలో పడినపుడు లేదా అంతర్గత దుష్టత్వం (తాత్కాలికంగా) పైకి పొంగిపొర్లి అతనిని లొంగదీసుకున్నపుడు అతడా సత్యాన్ని గ్రహించి చింతిస్తాడు. అప్పుడు అతడు తాను అతిగా ప్రేమించిన తన అత్యంత సన్నిహితునికి వ్యతిరేకంగా పాపం చేసినందుకే కాకుండా ఆయనతో తన సహవాసం తెగిపోయినందుకు, తాను ఆయన సన్నిధిలో కనబడే అర్హత కోల్పోయినందుకు మిగుల దుఃఖిస్తాడు. తన పాపానికి వచ్చే శిక్షను గురించిన భయాలను అతడు తెలుసుకున్న సువార్త తీసివేసినప్పటికీ, అతని మనస్సాక్షికి అంటిన మాలిన్యాన్ని అది తీసివేయదు. పునర్జన్మ పొందని వారికి పొందినవారికి మధ్యఉన్న ముఖ్య భేదం ఇదే. పునర్జన్మ పొందని వాడు పాపం చేసినపుడు తాను దోషిననే ఆలోచన, దాని వల్ల కలిగే శిక్ష అతన్ని వేధిస్తుంది. పునర్జన్మ పొందిన వానిని తాను అపవిత్రుడయ్యాడన్న బాధ వేధిస్తుంది.

పాపంలో రెండు అంశాలు ఉన్నాయి. అవి విడదీయరానివైనప్పటికీ వ్యత్యాసమైనవి. ఒకటి దోషం, మరొకటి అపవిత్రత. పాపంలో ఉన్న అపవిత్రత అంటే, దేవుని పరిశుద్ధతకు వ్యతిరేకమైన దాని లక్షణమే. అందువలనే “నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనది” అని రాయబడింది. వెలుగైయున్న దేవుని దృష్టికది హేయమైనది, అసహ్యమైనది. అందువలనే ఆయన “నాకసహ్యమైన ఈ హేయ కార్యమును మీరు చేయకుండుడి” (యిర్మీయా 44:4) అని ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ పాపాన్ని ఒప్పుకునేలా చేసినపుడు దాని అసహ్యతను ఎంతగా బహిర్గతం చేస్తాడంటే పాపులు దానిని గురించి సిగ్గుపడి తలవంచి ముఖం చిన్నబోయి ఆత్మ గౌరవాన్ని కోల్పోతారు.

పాపం యొక్క దోషం, విడదీయరానిదిగా దానితో ముడిపడి ఉన్న భయంవలన మనకు ఎలా బోధపడుతుందో అదేవిధంగా పాపం యొక్క మాలిన్యం, తప్పించుకోలేని విధంగా అది మనలో కలిగించే సిగ్గు వలన మనకు బోధపడుతుంది. పాత నిబంధన కాలంలో పాప దోషం కొరకు దేవుడు బలులను ఏర్పాటు చెయ్యడం మాత్రమేకాకుండా దాని అపవిత్రతను పోగొట్టుకుని పరిశుద్ధపరచబడడానికి కట్టడలను, విధులను ఏర్పరిచాడు. ఆ కాలంలో ఆత్మ సంబంధమైన పాపమాలిన్యం గురించి దేవుడు అనేక విధాలుగా తన ప్రజలకు ఉపదేశించాడు. పవిత్ర జంతువులకు అపవిత్ర జంతువులకు మధ్య ఉన్న భేదం, అపవిత్రం చేసే వివిధ శారీరిక రోగాలు, కుష్టురోగులను వేరుగా ఉంచడం, అనుకోకుండా శవం ముట్టినందుకు ధర్మశాస్త్రం వలన అపవిత్రులుగా ఎంచబడడం మొదలైనవి ఇందుకు ఉదాహరణలు. ఇవన్నీ అంతరంగిక, ఆధ్యాత్మిక మాలిన్యానికి ఛాయలు, సాదృశ్యాలు. అందువలన, “ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై ఊట ఒకటి తీయబడును" (జెకర్యా 13:1) అని పరిశుద్ధపరచబడే ప్రక్రియ అంతటిని గురించి వర్ణించబడింది.

పాపం నుండి నైతిక మాలిన్యాన్ని వేరుపరచలేం. ఈ నైతిక మాలిన్యం నుండి సిగ్గును వేరుపరచలేం. అందువలన ఒక వ్యక్తి నిజంగా పాపాన్ని గురించి ఒప్పింపబడినపుడు తన నైతిక మాలిన్యం గురించి బాధాకరమైన గుర్తింపు మరియు సిగ్గు కలుగుతుంది. దీనిని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే పరిశుద్ధపరచబడుట యొక్క నిజ స్వభావాన్ని గుర్తించగలం. దేవుని పోలిక కలిగి ఉండడమే ఆత్మ యొక్క సౌందర్యత. కృప అందాన్ని ఇస్తుంది. అందుకే క్రీస్తు నరులకంటే సౌందర్యవంతుడని చెప్పబడింది (కీర్తనలు 45:2). దేవుని స్వారూప్యము కలిగి ఉన్నందువలనే ఆయన ఆ అందం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుని స్వారూప్యానికి వ్యతిరేకమైంది పతనం. కృపకు వ్యతిరేకమైనది పాపం. అది ఆత్మను శిథిలం చేసి దానికి అందవికారతను, అసహ్యతను తెస్తుంది.

పవిత్రతకు లేదా దేవుని స్వరూపానికి వ్యతిరేకమైనవన్నీ నీచం, అనర్హం, అపవిత్రం అయ్యున్నాయి. పాపం, ఆత్మను అగౌరవపరచి ,అవమానించి, సిగ్గు కలిగిస్తుంది. మనం దేవునికి ఎంత దగ్గరగా నడుస్తామో ఆయన వెలుగులో అంత అధికంగా మనలను మనం చూసుకుని మన నిజస్వరూపాన్ని, నీచత్వాన్ని కనుగొనగలం. మన ఆత్మీయ దిగంబరత్వం చూడగలిగేలా మన కనులు మొదట తెరవబడినప్పుడు మనకు మనమే ఎంత అసహ్యులంగా కనబడ్డాం! అప్పుడు మనమెంత అపవిత్రులం అనిపించింది! అది దేవుని దృష్టి యొక్క ప్రతిబింబం, ఎందుకంటే ఆయన తన పవిత్రతకు వ్యతిరేకమైన సమస్తాన్ని అసహ్యించుకుని దానిని ఆయనకు అసహ్యకరమైనదిగా ఎంచుతాడు. “దైవ స్వభావమందు పాలివారగునట్లు” చేయబడినవారు (2 పేతురు1:4;) వారి ప్రమాణం ప్రకారం చేస్తారు. వారు దేవుని కన్నులతో తమను చూసుకుని తాము దౌర్భాగ్యులు, దిగంబరులు, అవమానం పొందిన వారు, అసహ్యులు, భయంకరులుగా గ్రహించి యోబువలె తమను తాము అసహ్యించుకుంటారు.

చివరి నాలుగు పేరాలు జాన్ ఓవెన్ గ్రంధం యొక్క సంక్షిప్త సారాంశం. తమలో ఇంకా పాతుకుని ఉన్న అపవిత్రతను బాగా ఎరిగిన వారే నిజంగా పరిశుద్ధపరచబడిన వారు మరియు పవిత్రులైనవారు అని వాటి నుండి గ్రహించగలం. ఆ పాపం నిత్యం పైకి పొంగి తమను అపవిత్రపరుస్తున్నదని ఎరిగి వారు మిగుల దుఃఖిస్తారు. అదే దేవునిని అధికంగా దుఃఖపరచి, తమ మనశ్శాంతిని పాడు చేస్తుంది కనుక ఆ పాపాన్ని పూర్తిగా నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తారు. మిగుల భక్తిపరులు మరియు పరిశుద్ధులు అయిన వారే తమ పాపాలను గురించి ఒప్పుకుని ఎక్కువగా దుఃఖిస్తారన్నది అందరికీ తెలిసిన విషయం. "అతడు యధార్ధవర్తనుడు న్యాయవంతుడు అయి దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు” (యోబు. 1:8) అని ఎవరిని గురించి దేవుడే స్వయంగా చెప్పాడో అతడే "నేను నీచుడను” (యోబు 40:4;) అని విలపించాడు. దేవునికి “అతి ప్రియుడైన” వాడే (దానియే 10:18) 'నా సొగసు వికారమాయెను' అని ఒప్పుకున్నాడు (10:8;). మూడవ ఆకాశానికి కొనిపోబడి తిరిగి భూలోకానికి వచ్చినవాడే, “అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను; ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును?” (రోమా 7:24) అని దుఃఖించాడు.

దేవుని పరిశుద్ధులలో ప్రముఖులైన వారిలో కొందరు స్వయంగా ఒప్పుకుని చెప్పిన మాటలను పైన తెలియచేసాను. వాటి నుండి మనం గ్రహించేది ఏమిటంటే “పవిత్ర హృదయం” అంటే పాపం లేని హృదయమని కాని, విశ్వాసి నుండి శరీర స్వభావమంతా తుడిచి పెట్టబడిందని కాని అర్థం కాదు. నిజంగానే దానిని నిర్మూలించలేము. సాతాను చేత పూర్తిగా గ్రుడ్డివారైన వారు తప్ప వేరెవ్వరు అటువంటి అబద్దం ఒప్పుకోరు అయితే వాక్యానుసారంగా "పవిత్ర హృదయం”లో ఏమి ఉంటుందో ఇప్పుడు నిర్వచించి వర్ణించవలసిన అవసరం ఉంది. ఇలా చెయ్యడానికి ప్రయత్నించేటప్పుడు ఎదురయ్యే రెండు ప్రమాదాలను బట్టి మనం జాగ్రత్తపడాలి. మొదటిది నామకార్థ క్రైస్తవులు సుఖంగా విశ్రాంతి తీసుకునేలా ఒక దిండు అమర్చడం. రెండవది పునర్జన్మ పొందినవారిలో ఉన్న నిరీక్షణను భంగం చేసేవిధంగా మాట్లాడడం.

మొదటిగా “పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ నూతన స్వభావము కలుగజేయుట”ను (తీతుకు 3:5) అనుభవించిన వాడే పవిత్ర హృదయం గలవాడు. అది నూతన జన్మ కలిగినపుడు సంభవించి క్రైస్తవుని జీవితమంతా ఆత్మ ద్వారా కొనసాగించబడుతుంది. ఇందులో ఉన్న విషయాలన్నిటిని ఇప్పుడు వివరించలేము. విశ్వాసి యొక్క జ్ఞానం పవిత్రపరచబడి, ఆపై సాతాను ద్వారా అంధత్వం కలగకుండడం ఇందులో ఇమిడి ఉంది. దానికి బదులు అతడు మానవాతీతమైన రీతిలో వెలిగించబడతాడు. తత్ఫలితంగా అతడు లోకసంబంధమైనవి వ్యర్థమని చూడగలడు. దేవుని సత్యం ప్రకాశించడం వలన మనసు చాలావరకు తప్పిదం మరియు కాలుష్యం నుండి విడిపించబడుతుంది. కోరికలు పవిత్రపరచబడగా పాపాన్ని ప్రేమించకుండా దానిని అసహ్యించుకుంటుంది. దేవుని నుండి దూరంగా పోవడమూ, ఆయనను తప్పించుకోవడమూ మాని ఆయనను వాంఛించి వెదుకుతుంది.

పునర్జన్మ సమయంలో పవిత్రమైన కోరికలు, పవిత్రమైన ఉద్దేశాలు, పవిత్రమైన పనులతో కూడిన వేరు ఆత్మలో నాటబడుతుంది. దేవుని భయం నాటబడి దేవుని ప్రేమ హృదయంలో కుమ్మరించబడుతుంది. తత్ఫలితంగా ఆత్మ, దేవుని యందు తృష్ణ కలిగి, ఆయన చిత్తానికి లోబడి అన్ని విషయాలలోను ఆయనను సంతోష పెట్టాలని కోరుతుంది. అందువలన ఆత్మ సంబంధమైన అతని ఆశలకు భంగం కలిగినప్పుడు, ఆత్మీయంగా పైకి ఎదగాలన్న అతని ప్రయత్నాలకు ఆటంకం కలిగినపుడు ఇది, క్రైస్తవునికి అన్నిటికంటే అధిక దుఃఖం కలిగిస్తుంది. తనలో ఇంకా అపవిత్ర జలాలు నిలిచి ఉన్నాయని , వాటి నుండి బురద, మురికి పైకి లేచి అతని కార్యాలన్నిటిని మలినం చేస్తుందని గ్రహించినపుడు గొప్ప భారంతో కృంగిపోవడమే పవిత్ర హృదయ యొక్క లక్షణం. కాబట్టి పవిత్ర హృదయం బుద్ధిహీనమైన, దుష్టమైన ఆలోచనలను, చెడు కోరికలను గుర్తిస్తుంది. గర్వం, అసంతృప్తి, అవిశ్వాసం, శత్రుత్వాలను గురించి చింతించి అపవిత్రతను చూసి లోలోపల దుఃఖిస్తుంది.

రెండవదిగా పవిత్ర హృదయం “మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము” (హెబ్రీ 10:22). క్షమించబడని పాపం వల్ల దోషాన్ని ఎత్తి చూపి, మనిషిని అణచివేసేదే " కల్మషమైనా మనస్సాక్షి”. అటువంటి మనస్సాక్షి కలిగినవాడు తీర్పు దినం గురించి భయపడుతూ, దానిని గురించిన తలంపులన్నిటిని పారద్రోలే ప్రయత్నం చేస్తాడు. అయితే పరిశుద్దాత్మ ఉదారంగా క్రీస్తు ప్రాయశ్చిత్త రక్తాన్ని మనస్సాక్షికి అన్వయింప చేసినప్పుడు, మనశ్శాంతిని పొంది దేవుణ్ణి సమీపించడానికి ధైర్యం కలుగుతుంది. దీని ఫలితంగా మూఢ నమ్మకాలు, భయం, బాధ తొలగిపోతాయి. దేవుని యందు అయిష్టానికి మారుగా ఆయన యందు ఆనందం కలుగుతుంది.

కాబట్టి మూడవదిగా మనం “వారి హృదయములను విశ్వాసము చేత పవిత్రపరచి” (అపోస్త. 15:9) అని చదువుతాం. అవిశ్వాసం అపవిత్రపరచినట్లే విశ్వాసం పవిత్రపరుస్తుంది. విశ్వాసం తనవైపు కాక క్రీస్తువైపు చూస్తుంది కనుక “ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును” (1యోహాను 1:7) అని గ్రహిస్తుంది.

పైన ఇచ్చిన వివరణ ప్రకారం ప్రతి క్రైస్తవునికి "పవిత్ర” హృదయం ఉంది. అయితే ప్రతి క్రైస్తవునికి “శుద్ద” హృదయం లేదు (కీర్తన 51:10). అతని హృదయాన్ని మలినపరచేది 'తీర్పు తీర్చబడని పాపము'. మనం పాపాన్ని అనుమతించినపుడు మనకు దేవునితో ఉన్న సహవాసం తెగిపోతుంది. నిజమైన పశ్చాత్తాపంతో, మనలను మనం ఖండించుకుని, పాపం చేసినందుకు దుఃఖించి, దానిని ఒప్పుకుని, విడిచిపెట్టి, దానివల్ల మరొకసారి ఓటమి పొందకుండా జాగ్రత్త పడాలనే మనః:పూర్వకమైన, యధార్థమైన హృదయవాంఛ కలిగిఉండడం వల్ల తిరిగి దేవునితో సహవాసం ఏర్పడుతుంది. శుద్ధ హృదయంలో ఇష్టపూర్వకంగా చేసే పాపం నిలువలేదు. కాబట్టి “ఆత్మ సంబంధమైన జీవితంలో విశ్వాసం వల్లే పశ్చాత్తాపం కూడా కొనసాగించబడటం అవసరం” అని జాన్ ఒవెన్ గారు చెప్పింది నిజమే. పశ్చాత్తాపం, పాపపు ఒప్పుకోలు జరిగిన తరువాత “పాపము కడుగు కొనుటకు అపవిత్రత పరిహరించుటకు తియ్యబడిన” ఊట వద్దకు (జెకర్యా 13:1) నిత్యం పరుగులు తీసి విశ్వాసం ద్వారా క్రొత్తగా క్రీస్తు రక్తాన్ని అన్వయించుకోవాలి.

ఈ అధ్యాయంలో (రెండు భాగాలలో) ఐదవ అధ్యాయం చివరిలో లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నించాను. ధర్మశాస్త్రం కోరిన నిబంధనలను మనం మన పూటకాపునందు (క్రీస్తు) నేరవేర్చాము. శుద్ధి చేసే క్రీస్తు రక్తం యొక్క విలువ మన ఖాతాలో చెల్లుబడి అయినందువలన తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం అవ్వడానికి మనం పాత్రులుగా చేయబడ్డాము. క్రీస్తు స్వభావాన్ని పరిశుద్ధాత్ముడు మనకు ఇచ్చినందువల్ల దేవుని సమీపించే శక్తి మనకు కలిగింది. విశ్వాసం ద్వారా క్రీస్తు నందు పరిశుద్ధులుగా మనలను మనం ప్రశంసించుకోవచ్చు. పునర్జన్మ ద్వారా “శుద్ధ హృదయాన్ని” పొందాము. దీనికి రుజువేమిటంటే మనం అపవిత్రతను అసహ్యించుకుంటాం. నిత్యం శరీరక్రియలను చంపడం ద్వారా మనకు తెలిసిన ప్రతి పాపాన్ని తీర్పుతీర్చి మన నుండి తీసివేసి, మన హృదయాలను శుద్ధీకరించుకోవడం ద్వారా దేవునితో సహవాసాన్ని సదా నిలుపుకోవాలి.

 

పరిశుద్ధపరచబడుటను గూర్చిన సిద్ధాంతం

8.దాని స్వభావం

మన అంశంలో అతి ముఖ్యమైన భాగానికి ఇప్పుడు చేరుకున్నాం. పరిశుద్ధపరచబడడం యొక్క స్వభావాన్ని స్పష్టంగా పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం. అందులో ఉన్నదంతా తెలుసుకోవాలి, లేని పక్షంలో మనం కలవరానికి గురి ఔతాము. అందరూ ఒప్పుకున్నట్టు పరిశుద్ధతయే నీతికి పరాకాష్ట. అదే అత్యున్నతమైన, అత్యవసరమైన సాధన. కాబట్టి నకిలీలను వేరుచేసి దాని నిజ స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధపరచబడడం అంటే ఏంటో తెలుసుకోకపోతే మనం నిజంగా పరిశుద్ధులం అయ్యామో లేదో ఎలా తెలుసుకోగలం? పరిశుద్ధత యొక్క నిజస్వరూపాన్ని, స్వభావాన్ని గ్రహించనిదే మనం పరిశుద్ధతను ఎలా అలవరచుకోగలం? వాక్యంలోని అనేక భాగాలను అర్ధం చేసుకోవడానికి, దైవ సంపూర్ణతను గురించి సరైన అవగాహన ఏర్పరచుకోవడానికి, అసత్య మతం నుండి సత్యమతాన్ని వేరు పరచడానికి, పరిశుద్ధపరచబడడం యొక్క స్వభావాన్ని గురించిన సరైన అవగాహన గొప్ప సహకారి ఔతుంది.

అనేక కోణాలు ఉన్న ఈ అంశంలో అతి క్లిష్టమైన భాగానికి మనం చేరాము. ఈ కోణాలను మనసులో ఉంచుకుని దాని పరిపూర్ణ అర్థాన్ని గ్రహించడం అవసరం. కాబట్టి పరిశుద్ధపరచబడుట యొక్క స్వభావాన్ని వర్ణించడం ఏ మాత్రమూ సులభం కాదు. వాక్యంలో తండ్రియైన దేవుని ద్వారా విశ్వాసి పరిశుద్ధపరచబడతాడని కొన్ని చోట్ల చెప్పబడితే, మరికొన్ని భాగాలలో క్రీస్తు, ఆయన బలి మనలను పరిశుద్ధపరుస్తుందని ఉంది. ఇంకా కొన్ని చోట్ల పరిశుద్ధాత్మ, వాక్యం, విశ్వాసం, శిక్ష ద్వారా ఇది జరుగుతుందని రాయబడింది. ఇవి వేర్వేరు పరిశుద్ధతలను గురించి మాట్లాడడం లేదు కాని ఒకే సంపూర్ణమైన కార్యంలో ఉన్న వివిధ శాఖలను గురించి చెబుతుంది. అయినా వీటిని వేరువేరుగా మనం మనసులో ఉంచుకోవాలి. కొన్ని లేఖనభాగాలు పరిశుద్ధపరచబడడాన్ని బాహ్యమైనదిగా చూపిస్తుంటే మరికొన్ని భాగాలు దానిని అంతరంగమైనదిగా చూపిస్తున్నాయి. కొన్నిసార్లు ఇది సంపూర్ణమైనదిగా పరిగణించబడుతుండగా మరికొన్ని సార్లు ఇది అసంపూర్ణమైనదిగా పురోగతి చెందేదిగా చూపించబడింది. ఈ అంశం యొక్క వివిధ దశలను రానున్న అధ్యాయాలలో పరిశీలిద్దాం.

ఈ అంశంపై ఇతరులు రాసిన పుస్తకాలను చూసినపుడు దీని స్వభావాన్ని గురించి వారు ఎంతో స్వల్పంగా చెప్పారని ఆశ్చర్యం కలుగుతుంది. చాలమంది రచయితలు దీని అర్థం గురించి ఎంతో విస్తారంగా రాసారు. ఈ వరం విశ్వాసికి ఏ విధంగా ఇవ్వబడిందో, దీనిని ఇవ్వడంలో పరిశుద్ధాత్మ పనిచేసే విధమేంటో, ఈ జీవితంలో అది ఎంత పరిమాణంలో కనిపిస్తుందో వీటిపై కొందరు రాసినప్పటికీ పరిశుద్ధత అంటే ఏంటో స్పష్టంగా వర్ణించిన వారు కొందరే. వారి రచనల్లో అబద్ధపు ఊహలు తప్పించుకోగలిగినా, ఈ సత్యాన్ని వారు అసంపూర్ణంగానే వివరించారు. ఈ అతిముఖ్య విషయాన్ని నిర్లక్ష్యం చెయ్యడం వల్ల కలిగిన వైఫల్యమే క్రైస్తవులమని చెప్పుకునే వారిలో దీనిని గురించి భిన్నాభిప్రాయాలు ఉండడానికి కారణమని నా బలమైన నమ్మకం. ఇక్కడ చేసే ఒక పొరపాటు ఎన్నో రకాల భ్రమలకు తావిస్తుంది. మన పాఠకుల హృదయంలో చేరిన చెత్తను కొంత తొలగించి, ఈ సత్యాలను వారు తిరిగి గ్రహించేలా మార్గం సిద్ధం చెయ్యడానికి దీని ప్రతికూల పక్షాన్ని క్లుప్తంగా చూద్దాం. మొదటిగా, వాక్యానుసారమైన పరిశుద్ధత నీతిమంతులుగా తీర్చబడడం నుండి విడదీయరానిదైనప్పటికీ వాటి మధ్య దీర్ఘకాల వ్యవధి ఉంటుందని చెప్పేవారిచేత అవి తరచుగా విడగొట్టబడుతున్నాయి. “రెండవ కృపాకార్యం కలగాలని చెప్పేవారు పశ్చాత్తాపపడే పాపి క్రీస్తునందు విశ్వసించిన క్షణంలోనే నీతిమంతునిగా తీర్చబడతాడు కానీ, ప్రభువుకు పూర్తిగా సమర్పించుకుని పరిశుద్ధాత్మను పూర్తిగా పొందితేనే కానీ పరిశుద్ధపరచబడడు అని వాదిస్తారు. ఇది, ఒక వ్యక్తి క్రీస్తుకు పూర్తిగా సమర్పించుకోకపోయినప్పటికి మారుమనస్సు కలిగినవాడయ్యాడనీ, పరిశుద్ధాత్ముడు అతనిలో నివసించకపోయినప్పటికి అతడు దేవుని బిడ్డ కాగలడనీ చెప్పినట్టుంది. ఇది తీవ్రమైన పొరపాటు. ఆత్మ ద్వారా విశ్వాసం వల్ల ఒకసారి మనం క్రీస్తుతో ఐక్యపరచబడినప్పుడు, మనం “క్రీస్తు తోడివారసులమై" ఆయనలో సమస్త దీవెనలు పొందడానికి అర్హులమౌతాము. మనం రక్షకునిని విభజించలేము. ఆయన తన ప్రజల యొక్క పరిశుద్ధత మరియు నీతి అయ్యున్నాడు. ఆయన క్షమాపణ అనుగ్రహించినప్పుడు దానితోపాటు హృదయశుద్ధి కూడా దయచేస్తాడు.

రెండవదిగా, వాక్యానుసారమైన పరిశుద్ధత క్రైస్తవుడు పరలోకం చేరడానికి అర్హుడయ్యేలా చేసే ఒక సుదీర్ఘ ప్రక్రియ కాదు. రాబోవు ఉగ్రత నుండి తప్పించే దైవ కృప యొక్క కార్యమే నిత్య మహిమను అనుభవించే అర్హతను కూడా అనుగ్రహిస్తుంది. పశ్చాత్తాపం పొందిన తప్పిపోయిన కుమారుడిని తండ్రి ఎప్పుడు అంగీకరించాడు? అతడు వచ్చి తన పాపం ఒప్పుకున్న వెంటనే శ్రేష్టమైన అంగీని అతనికి తొడిగించి, చేతికి ఉంగరం పెట్టి పాదాలకు పాదరక్షలు ధరింపచేశాడు. "క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడుదము, ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రదికెను, తప్పిపోయి దొరికెను ” అనే మాట సెలవియ్యబడింది. (లూకా 15:23,24) ఉన్నత స్థలములలో నివసించడానికి పరిశుద్ధాత్మ జరిగించే ఒక సుదీర్ఘ ప్రక్రియ అవసరమైనట్లయితే, యేసును నమ్మిన వెంటనే అదే దినాన చనిపోయిన దొంగకు పరదైసులో ఉండడానికి అర్హత లేదు. “కాని ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మ యందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగ తీర్చబడిరి” (1కొరింథీ. 6:11). ఆ మూడూ విడదీయరానివి. “పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలెను” ( కొలస్స 1:12 ).

మూడవదిగా, వాక్యానుసారమైన పరిశుద్ధత శరీర స్వభావాన్ని నిర్మూలించదు. ఈ జీవితంలోనే 'పరిపూర్ణత కలుగుతుందనే' సిద్ధాంతం ఆత్మలను భ్రమలో పడేసి, కీడును మేలని అంటూ పాపంలో కొనసాగనిస్తుంది. క్రీస్తునందలి విశ్వాసం ద్వారా సరైన మార్గంలో పరిశుద్ధులవ్వడానికి ప్రయాసపడే యధార్థ ఆత్మలను అది ఎక్కువగా నిరుత్సాహపరుస్తూ, ఆ పరిశుద్ధతను పొందడానికి చేయవలసిన సమస్తం చేసినప్పటికి తామింకా పాపంలోనే ఉండి సంపూర్ణతకు సుదూరంగా ఉన్నందుకు తాము వ్యర్థంగా కష్టపడుతున్నారని అనుకునేలా చేస్తుంది.రోమా 6:12;) 2 కొరింథీ 7:1;); ఎఫెసీ 4:22;); 2 తిమోతి 2:22;), మొదలైన వాక్యభాగాలలో ఉన్న హెచ్చరికలను అది అర్థరహితంగా చేస్తుంది. “నీవు యౌవనేచ్ఛల నుండి పారిపొమ్ము” అనే మాటను బట్టి భక్తి ఉన్న తిమోతి కూడా అటువంటి ప్రమాదంలో పడే అవకాశం ఉందని అర్థం వస్తుంది. క్రైస్తవుని నుండి శరీర స్వభావం నిర్మూలం చేయబడినట్లయితే పాపాలను ఒప్పుకోవడం ( 1యోహాను. 1:9;), వాటిని చేసినందుకు తనను తాను అసహ్యించుకోవడం ( యోబు 40:4;), వాటిని క్షమించమని ప్రార్థించడం ( మత్తయి 6:12;), దైవ చిత్తానుసారంగా దుఃఖించడం(2 కొరింథీ. 7:10;), ప్రభువు శిక్షను అంగీకరించడం (హెబ్రీ12:5-11;), ఆయన తీర్పులు న్యాయమైనవని ఒప్పుకోవడం (కీర్తన 119:75;), విరిగి నలిగిన హృదయమును అర్పించడం (కీర్తన 51:17) ఇవన్నీ విశ్వాసికి అనవసరమే కదా!.

నాల్గవదిగా, వాక్యానుసారమైన పరిశుద్ధత కేవలం క్రీస్తునందే ఉండి మనం ఏమాత్రం సంప్రాప్తించుకోలేనిది కాదు. పాపరహితమైన సంపూర్ణతను పొందవచ్చనే సిద్ధాంతాన్ని ఎదిరించే అత్యాసక్తిలో కొందరు మరొక పెద్ద పొరపాటుకు గురయ్యారు. ఏంటీనొమీయన్లు క్రైస్తవుడ్ని మెరుగుపరిచే ఎట్టి మార్పును కలిగించని పరిశుద్ధతను క్రీస్తులో కలిగిఉన్నామని వాదిస్తారు. ఇది సాతాను పన్నిన మరొక కుయుక్తి. తనలో ఉన్న పరిశుద్ధత క్రీస్తు నందు మాత్రమే ఉందని ఊహించడం తప్పక మోసమే. వాస్తవానికి క్రీస్తునందు మనకు ఉన్న పరిశుద్ధత మరియు పరిపూర్ణతను వ్యక్తిగత హృదయశుద్ధి మరియు నీతిలో నడవడం నుండి వేరుపరచడం సాధ్యపడదు.యేసుక్రీస్తును ఒక్కసారి నమ్మితే నిత్యత్వం వరకు శిక్షలేకుండా పాపంలో దొర్లడానికి అనుమతి దొరకుతుందనడం శరీరాన్ని సంతోషపరచే ఎంతటి మూర్ఖపు సిద్ధాంతం. ప్రియ చదువరీ, స్వభావాన్ని రూపాంతరం చేయని, నడతను సంస్కరించని విశ్వాసం వ్యర్థమైనది. దైవభక్తి అనే పుష్పాలు పూయని, వ్యక్తిగత పవిత్రత అనే ఫలాలు కాయని విశ్వాసం, రక్షణార్థమైన యథార్థ విశ్వాసం కాదు.

పరిశుద్ధత యొక్క స్వభావం తెలుసుకునే ప్రయత్నంలో కొన్ని నిశ్చితమైన ఆలోచనలను స్థిరంగా మనముందు ఉంచుకుని వాటిని అనుసరించాలి. మొదటదిగా: దేవుని పరిశుద్ధతను గుర్తించినపుడు తన సృష్టి యొక్క పరిశుద్ధత - అది దేవదూతలదే కాని, క్రైస్తవునిదే కాని - దేవుని పరిశుద్ధతను పోలి ఉండాలి. పరిశుద్ధతలో అనేక రకాలైన పరిశుద్ధతలు లేవు. రెండవదిగా ఆదాము మొదట కలిగియుండి ఆ తరువాత కోల్పోయింది, తన ప్రజలకొరకు క్రీస్తు తిరిగి సంపాదించింది, ఏదో దానిని నిశ్చయంగా తెలుసుకోవడం. క్రైస్తవుడు మొదటి ఆదాములో కోల్పోయిన దానికన్నా రెండవ ఆదాములో పొందింది అధికమనేది నిజమే అయినా ఈ అంశం బహు ప్రాముఖ్యమైంది. మూడవదిగా పరిశుద్ధతకు సరిగా వ్యతిరేకమైనది పాపం కనుక పాపనైజం అంటే ఏమిటో కనుక్కోవడం. నాల్గవదిగా, పరిశుద్ధపరచబడడం రక్షణలో ఒక అంతర్భాగమే కాని దానికి అదనమైనది కాదని గుర్తుంచుకోవడం.అయిదవదిగా, ఈ పదంలో ఉన్న మూడంతల అర్ధంలో ఇవ్వబడిన ఆధారాన్ని అనుసరించడం.

దేవుని పరిశుద్ధత అంటే అర్థమేమిటి ? ఈ ప్రశ్నకు జవాబు కనుక్కోవడానికి దైవశాస్త్ర గ్రంథాలు ఎక్కువగా సహాయపడవు. రచయితలు స్పష్టమైన అర్థం ఇవ్వని మాటల గారడితో సరిపెట్టుకుని అసలు భావం చీకటిలో విడిచిపెట్టేశారు. ఇందులో చాలా మంది దేవుని పవిత్రతే ఆయన పరిశుద్ధత అంటారు. ఈ పవిత్రత ఎందులో ఉందని ప్రశ్నిస్తే అది పాపానికీ, అపవిత్రతకీ వ్యతిరేకమైన అంతటిలో ఉన్నదన్నది సాధారణంగా వచ్చే జవాబు. ఈ జవాబు మనకు ఏవిధంగాను సహాయపడదు. పాపమంటే ఏమిటో తెలుసుకునేంతవరకు దేవుని పవిత్రత అంటే ఏమిటో తెలుసుకోలేము. ఎందుకంటే పాపాన్ని గురించి సరైన ఆలోచన దొరకనంత వరకు పరిశుద్ధత అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకోలేము. అయినా, పవిత్రత ఏమిటో తెలియనిదే పాపమంటే ఏమిటో కూడా తెలుసుకోలేము. ఎందుకంటే పాపమంటే ఏదో తెలుసుకోవడాన్ని బట్టి పరిశుద్ధతకు సరైన అర్థం తెలుసుకోలేంగాని, పరిశుద్ధత అంటేఏంటో తెలుసుకోవడాన్ని బట్టి పాపాన్ని సరిగ్గా గుర్తించగలం.పేరుగాంచిన అనేక వేదాంత పండితులు దైవ పరిశుద్ధత, దేవుని ప్రత్యేక గుణం కాదు కాని నీతిపరమైన ఆయన సంపూర్ణత యొక్క సౌందర్యం, మహిమ, అయి ఉన్నదని వివరించే ప్రయత్నం చేసారు. అయినా ఈ సౌందర్యం, మహిమ ఏమైయున్నదో మనం గ్రహించనిదే దీని నుండి ఒక స్పష్టమైన అర్థం కనుగొనలేము. ఇదే "పరిశుద్ధత” అని జవాబు ఇస్తే అది అసలేమీ చెప్పకపోవడంతో సమానం.జాన్ గిల్ దానికి ఇస్తున్న నిర్వచనం ఏమిటంటే “దేవుని పరిశుద్ధత అంటే ఆయన స్వభావంలోని పవిత్రత, సత్ ప్రవర్తన”. నాత్ ఇమ్మోను అనే వేదాంతి ఇలా చెబుతున్నాడు. “దేవుని మంచితనాన్ని, ఉదారతను తెలిపే సాధారణ పదం పరిశుద్ధత. ఇది నీతిపరంగా అంగీకారమైన మరియు శ్రేష్టమైన ప్రతిదానిని కలిగియుంటుంది”. వీరి మాటలలోని విషయం సరైనదే అయినప్పటికీ అవి దైవ పరిశుద్ధత యొక్క నిశ్చయమైన అర్థాన్ని కనుగొనాలని ఆశించే వారికి ఎలాంటి సహాయం అందించవు.

స్టీఫెన్ చార్నాక్ అనే ప్యూరిటన్ దేవుని పరిశుద్ధతకు ఒక మంచి వర్ణన చేసాడు. “ఇది దేవుని స్వభావం యొక్క నైతికత లేదా యధార్ధత లేదా తన ఔన్నత్యానికి అనుగుణంగా తన నిత్య నియమాలపై ఆధారితమైన, చిత్తానికి అనుగుణమైన వాటన్నింటిలోనూ సంతోషించి సంతృప్తిపడి, దానికి వ్యతిరేకమైన ప్రతి దానిని అసహ్యించుకునే, ఆయన కోరిక, ప్రవర్తన.” ఇది ఖచ్చితంగా కొంత అర్థవంతంగా, మనసుకు తృప్తినిచ్చేదిగా ఉంది. అయితే దీనికి మరొక అంశం చేర్చడం సమంజసం. ధర్మశాస్త్రం దేవుని మనసుకూ స్వభావానికీ ప్రతిరూపం కాబట్టి వాటితో ఆయన సమ్మేళనమే ఆయన పరిశుద్ధత. ఆయనకు మహిమ తెచ్చే విధంగా సమస్తం నిర్దేశించడమే ఆయన పరిశుద్ధత, ఎందుకంటే ఇది ఆయన స్వయం పరిపూర్ణత మరియు ప్రత్యేకాధికారం. కాబట్టి దానికి మించిన లక్ష్యం వేరొకటి లేదు.

దేవుని చిత్తం మరియు దేవుని ధర్మశాస్త్రం ఒకటే అని, దానికి అనుగుణమైన దేవుని కోరిక మరియు ప్రవర్తనే ఆయన పరిశుద్ధత అని నేను చర్నాక్ గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అన్నిటిలో ఆయనకు మహిమ తెచ్చుకోవడమే ఆయన లక్ష్యమని ఈ నిర్వచనానికి నేను జత చేసాను.దేవుని పరిశుద్ధత అంటే దేవుని ఉన్నత నైతిక ప్రమాణాల మొత్తం అనే ఈ భావన క్రైస్తవునిలో ఉండవలసిన పరిశుద్ధత ఏంటో గ్రహించే సహాయం చేస్తుంది. ఇది దేవుని చేత నీతిమంతునిగా ఎంచబడడాన్ని మించింది. ఇది దానిని కలిగి ఉన్నవారిలో, దేవుని చిత్తం లేదా ధర్మశాస్త్రానికి లోబడి సమస్తంలోనూ దేవునిని మహిమపరచాలనే లక్ష్యాన్ని పుట్టించే ఒక నైతికగుణం. ఇది మాత్రమే దేవుని ప్రమాణాలను తృప్తిపరచగలదు. ఇది దేవుడు తన ప్రజలపై కురిపించిన గొప్పవరం.

ఆదాము మొదట కలిగియుండి, ఆ తరువాత కోల్పోయింది ఏంటి? అతని కన్నా తక్కువ స్థితిలో ఉన్న ప్రాణులకు అతనికి మధ్య ఉన్న భేదమేంటి? అది అతడు ఆత్మను కలిగి ఉండడం మాత్రమే కాదు కాని దానిపై అతని సృష్టికర్త నీతి స్వరూపం ముద్రించబడి ఉండడం. అందువలనే అతడు ధన్యుడయ్యాడు. ఈ కారణంగానే అతడు దేవునితో సహవసించగలిగాడు. దీని మూలంగానే అతడాయన మహిమ కొరకు సంతోషంగా జీవించే అర్హత కలిగి ఉన్నాడు. అతడు పతనమైనపుడు కోల్పోయింది ఇదే. రెండవ ఆదాము తన ప్రజలకు తిరిగి సమకూర్చింది ఇదే. ఇది కొలస్స 3:10;), ఎఫెసీ. 4:23 లో చెప్పిన మాటలను పోల్చి చూడడం వలన స్పష్టమౌతుంది. పునర్జన్మ వల్ల పుట్టిన “నూతన పురుషుడు” జ్ఞానమునందు నూతనపరచబడి (కొలస్స 3:10) అతి కీలకమైన దేవుని గురించిన అనుభవజ్ఞానమందు(ఎఫెసీ 4:23;) అంటే అదిలో ఆదాముకు ఇవ్వబడిన పోలిక గలవాడై “ఈ నూతన పురుషుడు”, “నీతియు యధార్థమైన భక్తియు గలవాడై దేవుని పోలికగా సృష్టింపబడెను” (ఎఫెసీ 4:24) అని స్పష్టంగా చెప్పబడింది.

కాబట్టి మొదటి ఆదాము కోల్పోయింది చివరి ఆదాము తన ప్రజల కొరకు సంపాదించింది హృదయముపై ముద్రించిన నీతి, మరియు పరిశుద్ధత ఉన్న పోలిక. అందుచేత నూతన జన్మలో క్రైస్తవుడు పొందే వ్యక్తిగత మరియు అనుభవాత్మక పరిశుద్ధత యొక్క లక్షణాన్ని గ్రహించడానికి మనం ఆదియందు దేవుడు మానవుని‌ని సృష్టించినప్పుడు అతనిలో పుట్టించిన యదార్థత ( ప్రసంగి 7:29;) యొక్క లక్షణం లేదా గుణం ఏమిటో గ్రహించాలి. మొదటి మానవునికి పరిశుద్ధత‌ మరియు నీతి అనుగ్రహించబడింది. దీనివలన అతడు దేవుని యందు ఆనందిస్తూ ఆయనకు ప్రీతికరమైన కార్యాలు చేసి దేవుని నీతిని మరియు పరిశుద్ధతను తనకు అనుగ్రహించబడిన పరిమాణం చొప్పున తనలో పుట్టించుకోగలిగాడు. ఇక్కడ కూడా పరిశుద్ధత అన్నది దానిని కలిగియున్న వారిని దేవుని ధర్మశాస్త్రానికి లేదా ఆయన స్వారూప్యానికి లోబరిచి దేవుని మహిమపరచడమే వారి లక్ష్యంగా మార్చే నైతిక స్వభావమని కనుగొనగలం.

పాపమంటే ఏంటి? దీనికి సరైన సమాధానం ఇవ్వగల మానవుడు ఎవడు? “తన పొరపాటులు కనుగొనగలవాడెవడు?” (కీర్తన19:12). దీనిని గురించి ఒక గ్రంథం రాసినా ఆ పాపం ఎవరికి వ్యతిరేకంగా చేయబడిందో ఆయనే దాని స్వభావాన్ని అర్థం చేసుకోగలడు. ఆయనే దాని గంభీరతను కొలవగలడు. అయినప్పటికీ లేఖనాల బోధనుబట్టి దీనికి కొంతవరకూ సమాధానం సమకూర్చగలం. ఉదాహరణకు, 1యోహాను. 3:4 లో ఆజ్ఞ అతిక్రమమే పాపమని చెప్పబడి ఉంది. ఇటువంటి పాపం బహిరంగంగా చేసే పనులకు మాత్రమే పరిమితమైంది కాదని “మూర్ఖుని యోచన పాపము” (సామెత 24:9) అన్న మాటను బట్టి స్పష్టమౌతుంది. అయితే “ఆజ్ఞాతిక్రమమే పాపము” అంటే అర్థమేంటి? దీని అర్థమేంటంటే దేవుని పరిశుద్ధమైన ఆజ్ఞను కాదనటం, ఆజ్ఞను జారీచేసిన వానిని ధిక్కరించటం. ధర్మశాస్త్రం "పరిశుద్ధమైనది నీతిగలది ఉత్తమమైనది” కాబట్టి దానిని ఉల్లంఘించడం ఎంతటి దుష్టత్వం. దాని పరిమాణం దేవుడొక్కడే కొలవగలడు.

పాపమంటే నిత్యమైన న్యాయ ప్రమాణాన్ని ఉల్లఘించడమే. అంతేకాదు, అది పైకి కనిపించే అతిక్రమం ద్వారా లోపల ఉన్న శత్రుత్వాన్ని ప్రదర్శిస్తుంది. అది నియంత్రించబడడాన్ని నిరసించి, అధికారాన్ని త్యజించి, పరిపాలించబడడాన్ని ధిక్కరించడంలో పెల్లుబికే గర్వం, స్వచిత్తం. నీతియుక్తమైన ధర్మశాస్త్ర నియంత్రణకు లోబడకుండా అబద్దపు స్వేచ్ఛతో ప్రలోభపెడుతూ సాతాను మన మొదటి తల్లిదండ్రులకు మీరు దేవతలవలే ఉంటారని చెప్పాడు. వాడు ఇప్పటికీ అదే వాదన చేస్తూ అదే ఎరను వేస్తున్నాడు. “శిష్యుడు బోధకుని కంటే అధికుడా ? సేవకుడు యజమాని కంటే గొప్పవాడా ?” అని ప్రశ్నించి క్రైస్తవుడు దానిని ఎదుర్కోవాలి. క్రీస్తు “ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను” (గలతీ 4:5) ఆయన సంపూర్ణ విధేయతతో జీవించి, తన అడుగు జాడలయందు నడుచుకొనునట్లు మనకు ఒక మాదిరి ఉంచిపోయెను (1 పేతురు 2:21) మనం ధర్మశాస్త్రాన్ని ప్రేమించి, భయంతో దానికి విధేయులవడం వలన మాత్రమే పాపం చెయ్యకుండా ఉండగలం.

కాబట్టి పాపం దుష్టక్రియలను పుట్టించేలా చేసే ఒక అంతరంగ స్థితి. దేవునికి లోబడనొల్లని హృదయస్థితి. అది దేవుని ఆజ్ఞను పక్కనపడవేసి దాని స్థానంలో స్వచిత్తాన్ని, సొంత ఆనందాన్ని నిలుపుతుంది. పరిశుద్ధత పాపానికి వ్యతిరేకమైంది కాబట్టి పరిశుద్ధపరచబడడం యొక్క స్వభావాన్ని మరికొంత గ్రహించడానికి ఇది సహాయపడుతుంది. పరిశుద్ధపరచబడడం అనేది విశ్వాసిని దేవునితో తిరిగి సమాధానపరచి, ఆయన చిత్తానుగుణంగా తన కొరకు, మన క్రియలను క్రమపరిచి అతని హృదయంపై ఆయన ధర్మశాస్త్రాన్ని రాసి (హెబ్రీ. 10:16;) దేవుని మహిమపరచడమే తన లక్ష్యంగా దేవుని కృప అతనిలో చేసే కార్యం. ఈ దైవకార్యం పునర్జన్మతో ప్రారంభమై మహిమపరచబడటంతోనే ముగుస్తుంది. అయితే ముందున్న పేరాలలో ఒకదానిలో చెప్పిన దానిని నేను ఇక్కడ వ్యతిరేకించినట్టు మీకు అనిపించవచ్చు. కానీ అది నిజం కాదు. దేవుని వెలుగులో మనం వెలుగును చూస్తాం. పరిశుద్ధతా నియమం మనలో నాటబడితేనే కాని పాపం యొక్క నిజస్వరూపాన్ని గుర్తించలేం. అయితే ఇది పొందిన తరువాత పాపాన్ని సరిగ్గా గుర్తించడం వలన పరిశుద్ధపరచబడుట యొక్క స్వభావాన్ని సరిగా గుర్తించగలం.

పరిశుద్ధపరచబడుడం “రక్షణ”లో ఒక భాగం. ఈ అంశం మూడవ అధ్యాయంలో క్షుణ్ణంగా చర్చించాం కాబట్టి దాని గురించి ఇక్కడ మరలా చెప్పవలసిన అవసరం లేదు. దేవుని రక్షణ పాపశిక్ష నుండి విడిపించడం ఒక్కటే కాదు, మరి ముఖ్యంగా పాప మాలిన్యం నుండి దాని శక్తి నుండి విడిపించడం అనీ చివరికి దానినుండి సంపూర్ణ విడుదల కల్గిస్తుందనీ, స్పష్టమైనప్పుడు రక్షణ ప్రక్రియలో ఇది కేంద్రస్థానం ఆక్రమించిందని గ్రహించడం కష్టం కాదు.అనేకులు తమ పాప క్షమాపణ కొరకు క్రీస్తు చనిపోయాడని అనుకుంటూ ఈనాడు క్రీస్తు తమ హృదయాలను నూతనపరచి, ఆత్మలకు స్వస్థత ఇచ్చి దేవునికి లోబడేలా చెయ్యడానికి కూడా తమ కొరకు మరణించాడని బహుకొద్దిమంది మాత్రమే ఆలోచించడం చాలా విచారకరం. తాము క్రైస్తవులమని ప్రకటించుకునే పదిమందిలో ఒకరైనా “ఇంత గొప్ప రక్షణ” (హెబ్రీ. 2:3;)తో అనుభవాత్మకమైన పరిచయం కలిగి ఉన్నారా? అని తరచు ఆశ్చర్యపడేందుకు కారణం ఉంది.

పరిశుద్ధపరచబడడం రక్షణలోని ఒక ముఖ్య భాగం కాబట్టి దాని స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి మరొక మార్గం ఉంది. రక్షణ అంటే పాపవిమోచన కలగడం, సాతాను బంధకాల నుండి విడుదల పొందడం, దేవునితో సరైన సంబంధంలోకి రావడం. పరిశుద్ధపరచబడుట దీనిని విశ్వాసి అనుభవంలో సాక్షాత్తు జరిగించేది.

పరిశుద్ధపరచబడడం రక్షణలో ఒక మూలభాగం మాత్రమే కాదు రక్షణ పొందటానికి ఒక ముఖ్య సాధనం కూడా. పాపం యొక్క శక్తి నుండి రక్షించబడటంలో పాపాన్ని ప్రేమించడం నుండి విడుదల పొందటం కూడా ఇమిడి ఉంది. ఇది పవిత్రతను, దైవభక్తిని ప్రేమించే పరిశుద్ధత వలన మాత్రమే జరుగుతుంది. విధేయతలో మనం నడిస్తేనే తప్ప (1యోహాను 1:5-7;) మనకు దేవునితో సహవాసముండదు, ఆయనతో నడవలేము. ఆయనయందు ఆనందించలేం. పరిశుద్ధతానైజం మనలో లేనిదే ఇది సాధ్యపడదు.

ఇప్పుడీ నాలుగు అంశాలను కలిపి చూద్దాం. వాక్యానుసారమైన పరిశుద్ధత అంటే ఏంటి? మొదట ఇది పునర్జీవింపబడిన వారిలో దేవుని చిత్తానికి లోబడి అన్ని విషయాలలోను ఆయనను మహిమపరచడమే గురిగా కలిగి ఉండే దైవికమైన నీతి స్వభావం. రెండవదిగా-ఇది మొదటి ఆదాము కోల్పోయి, చివరి ఆదాముచేత పునరుద్ధరించబడి, హృదయంపై ముద్రించబడిన నీతి, పరిశుద్ధత ఉన్న దేవుని నైతిక స్వరూపం. మూడవదిగా - ఇది పాపానికి వ్యతిరేకమైనది. దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడమే పాపం కనుక ఇది రక్షణలోని ఒక ముఖ్యభాగం. ఎందుకంటే పాపిని పాపమాలిన్యం నుండి, దాని శక్తి నుండి విడిపించి, అతడొకనాడు అసహ్యించుకున్న నీతిని ప్రేమించి, గతంలో ప్రేమించిన పాపాన్ని ఇప్పుడు ద్వేషించేలా చేస్తుంది. ఈ విధంగా అది పరిశుద్ధుడైన దేవునితో మనం సహవాసం చేసి, ఆయన యందు ఆనందించడానికి అర్హులుగా చేస్తుంది.

 

పరిశుద్ధపరచబడుటను గూర్చిన సిద్ధాంతం

9.దాని స్వభావము (కొనసాగింపు)

“పరిశుద్ధపరచబడుట” అనే పదానికి మూడంతల అర్ధం ఉంది. పరిశుద్ధపరచబడుట యొక్క గుణం సరిగా అర్థం చేసుకోవడానికి ఆ పదం యొక్క అర్థం అనుసరించడమే సరైన పద్ధతి. ఎందుకంటే లేఖనాలలో వస్తువుల పేర్లు ఎప్పుడూ వాటి స్వభావంతో ఖచ్చితంగా సంబంధాన్ని కలిగి ఉంటాయి. దేవుడు అస్పష్టమైన అర్థరహితమైన మాటలతో మనలను కలవరపరచడు, కానీ ఒక వస్తువుకు ఆయన ఇచ్చే పేరు దానిని చక్కగా వర్ణిస్తుంది. కాబట్టి ఇక్కడ “పరిశుద్ధపరచుట” అంటే పవిత్రంగా ఉపయోగించబడడానికి ప్రతిష్టించడం లేదా ప్రత్యేకించడం, శుద్ధి చెయ్యడం, అలంకరించడం. ఈ అర్ధాలు రకరకాలుగా కనిపించినా ఇవన్నీ సమ్మేళనం కలిగున్నట్టు మనం చూడబోతున్నాం. దీనిని తాళపుచెవిగా ఉపయోగించి ఆ పదం యొక్క అర్థాన్ని తెరిచి ఈ అంశంలోని ప్రధానభాగాలలోనికి ప్రవేశించగలమేమో చూద్దాం.

పరిశుద్ధపరచబడుట ప్రధమంగా తన ప్రజలను తనకొరకు, తన ఆనందం కొరకు, మహిమ కొరకు ప్రత్యేక పరచుకునేందుకు త్రిత్వమైన దేవుడు చేసే కార్యం. ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి సహాయపడేలా యూదా పత్రిక 1లో “తండ్రియైన దేవుని చేత పరిశుద్ధపరచబడిన వారికి” అని చెప్పబడడం గమనించండి. ఇది “యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి” అని పేర్కొనక ముందు చెప్పబడింది. ఇది తండ్రి తాను సృష్టించాలనుకున్న జనాంగంలో నుండి తన ప్రజలను ఎన్నిక చేసుకోవడాన్ని గురించి, ఆయన తిరస్కరించిన వారి నుండి తాను ప్రేమించిన వారిని ప్రత్యేకించడాన్ని గురించి చెప్పబడింది. హెబ్రీ 10:10 లో ఇలా ఉంది- “యేసుక్రీస్తు శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచే ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి యున్నాము”. ఆయనను బట్టి ఆయన ప్రజలను ప్రతి పాపపు డాగు నుండి కడిగి లోకం నుండి వారిని వేరుచేసి, దేవునికి వారిని ప్రతిష్టించి ఆయన అర్పణ యొక్క శ్రేష్ఠ ఫలంగా వారిని ఆయన ఎదుట నిలిపెను. 2 థెస్సలో 2:13 లో ఇలా ఉంది. “ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను.” పరిశుద్ధాత్మ, జీవింపజేసే తన కార్యం ద్వారా పాపంలో మరణించిన వారి నుండి తన వారిని వేరు చేయడాన్ని గురించి ఇది చెప్పబడింది.

రెండవదిగా, పరిశుద్ధపరచబడుట అంటే దేవుడు ఉపయోగించుకోవాలని ఆశిస్తున్న వారిని శుద్ధిచేయడం. ఈ “శుద్ది” చెయ్యబడడం చట్టబద్దం మరియు అనుభవాత్మకం. మనం ఈ అంశాన్ని విచారిస్తున్నపుడు మనం పరిశుద్ధపరచబడుట లేదా పరిశుద్ధత అన్నది పాపానికి వ్యతిరేకమైనదని నిరంతరం మనసులో గుర్తుంచుకోవాలి. పాపంలో దోషం,మాలిన్యం రెండూ ఇమిడి ఉన్నాయి. కాబట్టి దాని విరుగుడు కొరకు ఈ రెండిటి ప్రభావం తీసి వేయవలసిన అవసరం ఉంది. ఇంకా శాపం క్రింద ఉన్న వానివలె అసహ్యమైన కుష్టు వంటి మాలిన్యం గలవాడు కూడా పరలోకానికి అనర్హుడే. దోషంతో మాలిన్యంతో నిండిన దేవుని బిడ్డలకు ఉన్న ఈ రెండు అవసరతలను దేవుని కృప తీర్చిందని మన రక్షకుని గాయపరచబడిన ప్రక్కనుండి కారిన 'రక్తము, నీళ్ళు' ద్వారా స్పష్టం చేయబడింది. సాదృశ్యరీతిగా పాత నిబంధనలో గుడారంలో ఉన్న వస్తువులు కూడా ఈ రెండు అవసరతలు తీర్చాయి. బలులు అర్పించే బలిపీఠం ఎంత అవసరమై ఉందో నీళ్ళతో కడుగుకునేందుకు ఒక గంగాళం కూడా అంతే అవసరమై ఉంది.

క్రీస్తు మరణంలోని ఒకానొక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఆయన ప్రజలను నీతి పరంగా శుద్ధి చేయటమే అని అనేక వాక్యభాగాలనుండి స్పష్టమౌతుంది. “అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరును మృతి పొందిరనియు, జీవించు వారికమీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచిన వానికొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతిపొందెననియు నిశ్చయించుకొనుచున్నాము ” (2 కొరింథీ 5:15); “సత్ క్రియల యందు ఆసక్తిగల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్ను తానే మనకొరకు అర్పించుకొనెను” (తీతుకు 2:14); “నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును” (హెబ్రీ 9:14), “మనము పాపముల విషయమై చనిపోయి, నీతి విషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను” (1 పేతురు 2:24). పైన చెప్పిన ఈ వాక్యభాగాల నుండి, మన రక్షకుడు పడ్డ శ్రమలన్నిటి ఉద్దేశం తన ప్రజలను పాపశిక్షనుండి తప్పించడం మాత్రమే కాదు, వారిని పాప మాలిన్యం నుండి కడిగి, దాని దాస్యం నుండి విడుదల చేసి, వారిని నీతిమంతులుగా చెయ్యడం కూడా అని స్పష్టమౌతుంది.

క్రీస్తు తన ప్రజల కొరకు కొన్న రక్షణ కేవలం శిక్ష నుండి తప్పించడమే అని అనేకులు అనుకోవడం విచారకరం. ఆ శిక్షకు కారణమైన పాపం నుండి విడుదల కూడా ఆ దీవెనలో సమానమైన ప్రాముఖ్యత కలిగి ఉందని వారు మరచిపోతున్నారు. “పతనమైన ప్రాణులు, పాపం వలన కలిగే శిక్షనుండి తప్పించబడటం ఎంత అవసరమో, వారి మాలిన్యం నుండి నీతి పరమైన శక్తిహీనత నుండి విడుదల పొందటం కూడా అంతే అవసరం. తద్వారా వారు దేవుని దయయందు పునఃస్వాస్థ్యము పొందినప్పుడు, ఆయనను నిరంతరం ప్రేమించి, సేవించి, ఆనందించటం సాధ్యపడుతుంది. ఈ విషయంలో సువార్త బయలుపరచే నివారణ మన పాపస్థితికి తగినదిగా పాపం నుండి, అది తెచ్చిన శిక్షనుండి పూర్తి విడుదల కలిగించటానికి చాలినదిగా ఉంది.” (టి. క్రాఫోర్డ్ “ద అటోన్మెంట్"). క్రీస్తు తన ప్రజలను నీతిమంతులుగా తీర్చడమే కాకుండా వారిని పరిశుద్ధపరచాడు.

పరిశుద్ధపరచబడటంలో శుద్ధి చేయబడటం అంతర్భాగమని పాతనిబంధన సాదృశ్యాలు తెలియచేస్తున్నాయి. “మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును, మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు, శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన యెడల..”(హెబ్రీ 9:13). రక్తం, బూడెద, వాటిని చల్లటం - ఇవన్నీ 'అపవిత్రత పోగొట్టటానికి దేవుడు దయతో చేసిన ఏర్పాటులే. ఇవి శరీర శుద్ధి' కలగచెయ్యడానికే. ఇవి లేవియ 18:4;), సంఖ్యా 19:2;) సంఖ్యా 19:17-18;) కి సంబంధించినవి.

ఈ ఛాయల వెనుక ఉన్న నిజస్వరూపం ఆ తరువాత వచనంలో ఉంది. “నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము, నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధి చేయును”( హెబ్రీ 9:14) ఛాయ తాత్కాలికమైన, లాంఛనప్రాయమైన పరిశుద్ధతను మాత్రమే కలిగించగా దాని నిజస్వరూపం యదార్థమైన నిత్యమైన శుద్ధిని కలిగిస్తుంది. ఇదే విషయాన్ని గురించిన ఇతర ఉదాహరణలు ఈ క్రింద ఉదహరించిన వాక్యాలలో చూడగలం. “నీవు ప్రజల యొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఉతుకుకొని” (నిర్గమ. 19:10). “నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను” (నిర్గమ 29:44). ఇది ఎలా ఆచరించబడిందో నిర్గమ 40:12-15;). అక్కడ వారికి నీళ్లతో స్నానం చేయించి, ప్రతిష్టిత వస్త్రాలను ధరింపచేసి నూనెతో అభిషేకం చేసినట్టు చదవగలం.

క్రీస్తు మనకు బదులుగా చేసిన బలియాగం ఆయన ప్రజలకొరకు వారిని మూడు విధాలుగా శుద్ధి చేసింది. మొదటిది చట్టసంబంధమైనది. ఆయన ప్రజలు చేసిన పాపాలన్నీ అవి లేనట్టే తుడిచివేయబడ్డాయి. వారి పాపమాలిన్యం, దోషం పూర్తిగా తొలగించబడటం చేత సంఘం దేవుని యెదుట క్రీస్తుకున్న అదే సంపూర్ణనీతిగలదిగా కనిపించింది. రెండవది వ్యక్తిగతమైనది. “పునర్జన్మసంబంధమైన స్నానం ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను”. మూడవది అనుభవాత్మకమైనది. శుద్ధి చేయు రక్తమును విశ్వాసము వినియోగించుట వలన మనస్సాక్షి శుద్ధి చేయబడినప్పుడు ఇది జరుగును "హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి” (అపోస్త 15:9) “మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై” ( హెబ్రీ 10:22). మొదటి రెండిటిలా కాకుండా ఈ చివరిది పదేపదే జరిగే ప్రక్రియ. “మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును” (1యోహాను 1:9) క్రీస్తుచేత జరిగించబడే మన పరిశుద్ధత గురించి మరింత లోతుగా పరిశీలించినపుడు ఇందులోని వివిధ అంశాలను గుర్తిస్తాము.

మూడవది - పరిశుద్ధపరచబడుట అంటే దేవుడు శుద్ధి చేసి తన కొరకు ప్రత్యేకపరచిన వారిని అలంకరించడం లేదా అందంగా తీర్చిదిద్దడం. పరిశుద్ధాత్ముడు ఆత్మను నీతిపరంగా నూతనపరచడం ద్వారా ఇది జరుగుతుంది. దీని వలన విశ్వాసి అంతరంగంలో పరిశుద్ధపరచబడతాడు. పరిశుద్ధాత్మ యిచ్చేది పునరుత్థానుడైన క్రీస్తు జీవం. అది పవిత్రతకు మూలమై దేవుని యందు ప్రేమ పుట్టిస్తుంది. దేవుని యందు ప్రేమ అంటే ఆయనకు లోబడడమే. ఈ విధంగా పరిశుద్ధత దేవుడు ఆజ్ఞాపించిన దానిని అంతరంగంలో అనుసరించడం. ".....మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు...... మీరు పరిశుద్ధులగుటయే... దేవుని చిత్తము.” (1 థెస్సలో 4:1-3;) దేవుని చిత్తానికి లోబడడమే పరిశుద్ధపరచబడుట. పరిశుద్ధపరచబడుట వలన హృదయం దేవునికి ప్రధాన స్థానాన్ని ఇచ్చి, ఆయనను మహిమపరచడమే దాని ముఖ్య ధ్యేయంగా కలిగి ఉంటుంది.

తన కార్యాలన్నిటిలో తనకు మహిమ తెచ్చుకోవడమే దేవుని అంతిమ ఉద్దేశం. ఈ ఉద్దేశంతోనే ఆయన అన్నిటిని క్రమపరుస్తున్నాడు, జరిగిస్తున్నాడు, నిర్దేశిస్తున్నాడు. అదేవిధంగా ఆయన సారూప్యంలోనికి మారుతూ ఆయన పరిశుద్దుడుగా ఉన్నట్టు మనం పరిశుద్ధులుగా ఉండడం ఆయనను మహిమపరచాలనే ఉద్దేశంతోనే అయ్యుండాలి . దేవునిని సంతోషపెట్టి ఘనపరచడమే తన ఆశగా చేసుకునే హృదయపు మార్పే క్రియాత్మకమైన పరిశుద్ధత. ఇది మన స్వభావసిద్ధమైన గుణం కాదు, ఎందుకంటే పునర్జన్మ పొందని వారిలో తమను తాము ప్రేమించుకునే స్వభావం ఏలుబడి చేస్తుంది. కష్టాలు మారుమనస్సులేని వారిని దేవుని వైపుకు నెట్టవచ్చు. ఆయినా అది వారికి కాస్త ఉపశమనం కల్గించడానికే. నరకంలో పడతాననే భయం ఒక వ్యక్తి దేవుని దయకొరకు ప్రాధెయపడేలా చేయవచ్చు, అయినా అది విడుదల పొందడం కొరకు మాత్రమే. ఇలాంటి పనులు స్వభావసిద్ధంగా ఒక వ్యక్తి తనను తాను రక్షించుకోవడానికి చేసేవి మాత్రమే. వీటిలో ఆత్మీయమైనది కానీ సహజాతీతమైనది కానీ ఏమీ లేదు. అయితే పునర్జన్మ సమయంలో మానవుడు తన పతనస్థితి నుండి లేపబడి ఒక క్రొత్త పునాదిపై నిలపబడతాడు.

క్రియాత్మకమైన పరిశుద్ధత అంటే దేవుని పోలికలోకి మారి ఆయన చిత్తం నెరవేర్చి ఆయనను మహిమ పరచేలా, హృదయం మార్చబడటం లేదా నూతనపరచబడటం. “పరిశుద్ధపరచబడుట అంటే హృదయాన్ని దైవ వాక్యం అనే మూసలో పోయడం (లోహాలను మూసలో పోసినట్టు). దీని వలన హృదయం దేవుని వాక్యాన్ని పోలిన ముద్రను కలిగి ఉంటుంది” (ధోస్. గుడ్విస్). “ఏ ఉపదేశక్రమముకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయ పూర్వకముగా లోబడినవారైతిరి” ( రోమా 6:17). కళలు, విజ్ఞానం అనుసరించవలసిన నియమాలను మనకు నేర్పిస్తాయి కానీ, దేవుని ప్రజలలో ఆయన జరిగించే కృప యొక్క అద్భుతకార్యం ఆయన చిత్తానుసారమైన నియమాలకు అనుగుణంగా మనలను మారుస్తుంది. దాని వలన వారి హృదయంపై ఆయన ఆజ్ఞలు ముద్రించబడే విషయాన్ని గురించి గుడ్విస్ గారు చెప్పిన మరికొన్ని మాటలను క్రింద చెబుతున్నాను. “ఆయన చెప్పిన తారతమ్యం లోని సారాంశమిదే. మొదట వారి హృదయం వాక్యం కోరిన రీతిగా మారింది. తరువాత వారు హృదయపూర్వకంగా ఆ వాక్యానికి లోబడ్డారు. ఇప్పుడూ ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, ఎందుకంటే హృదయం వాటికనుగుణంగా మలచబడింది. హృదయ పూర్వకంగా లోబడటానికి ముందు హృదయం మంచిదిగా మారాలి.
వారికి ఇవ్వబడిన ధర్మశాస్త్ర మరియు సువార్త నియమాలను ఒక నామూనా లేదా మూసతో పోల్చాడు. వాటిని కనుల యెదుట ఉంచుకోవటం వలన దాని ప్రకారం వారు తమ ప్రవర్తనను మలచుకోగలుగుతారు".

అద్భుతమైన ఈ గొప్ప మార్పు వ్యక్తి యొక్క గుణం, శక్తియుక్తులలోనిది కాదు. అది మనః ప్రవృత్తికి చెందిన మార్పు. ఎలా అంటే ఒక లోహన్ని కరిగించి మూసలో పోసినపుడు ఆ లోహం యొక్క గుణం మారదు గాని దాని రూపం మారుతుంది. హృదయం దీనత్వం కలిగి సాధుపరచబడినపుడు అది ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమును అయి ఉన్న దేవుని చిత్తమేదో గుర్తించి అది తనకు మేలు కరమని అంగీకరిస్తుంది. ఈ విధంగా మనం మనసు మారి రూపాంతరము చెందుతాము (రోమా 12:2). లోహము అది పోయబడిన మూసయొక్క సమరూపంలోనికి మారినట్టే మైనం దానిని మలచినదాని రూపం కలిగి ఉన్నట్టే మునుపు దేవుని ప్రతి ఆజ్ఞకు విరోధంగా ఉన్న మనసు ఇప్పుడు దానికి తన మనఃప్రవృత్తిలో సమ్మతి కనుగొని అంతరంగ పురుషుని యందు దానిలో ఆనందిస్తుంది. హృదయం మానవాతీతంగా మార్చబడి దేవుని స్వారూప్యం లోనికి మలచబడినప్పుడు “ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు” (1యోహాను 5:3) అని తెలుసుకుంటాము.

పైన చెప్పబడిన మాటలు దీని ముందు అధ్యాయంలో (మరింత సరిగా చెప్పాలంటే) ఈ అధ్యాయపు మొదటి భాగంలో ప్రస్తావించబడిన అంటే పరిశుద్ధత నిర్మలం, అద్భుతం, మేలుకరం అయిన ప్రతిదానియందు ఆనందించే ఒక నైతిక లక్షణం, ఒక నూతన స్వభావం, ఒక మనోస్థితి, అది దేవుని ప్రేమ హృదయంలో కుమ్మరించబడడం, ఎందుకంటే ప్రేమ ద్వారా మాత్రమే దేవుని పరిశుద్ధ ధర్మశాస్త్రం నెరవేర్చబడగలదు. స్వార్థ రహితమైన ప్రేమ మాత్రమే మనఃపూర్వక విధేయతను పుట్టించగలదు.రోమా. 5: 5 తెలిపినట్టు "పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడినది”. మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ వలన మనం పరిశుద్ధపరచబడుతున్నాం. ఆయన మనలో, మన ద్వారా పరిశుద్ధత యొక్క ఫలములను కలిగిస్తున్నాడు. ఇందు కోసమే “యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలిసికొనుడి” (కీర్తన 4:3) అని రాయబడింది.

మునుపటి అధ్యాయంలో “పరిశుద్ధపరచబడుట” అంటే ఏమిటో తెలుసుకోకపోతే మనం పరిశుద్ధపరచబడ్డామో లేమో మనకెలా తెలుస్తుంది ?” అని ప్రశ్నించాను. మనం తండ్రి చేతను, కుమారుని చేతను పవిత్రపరచబడ్డామా? అనేది పరిశుద్ధాత్మ మనలను పవిత్రపరచటం వలనే తెలుస్తుంది. ఇది దాని ఫలాల వలన మాత్రమే తెలుస్తుంది. ఇది మనలను పరిశుద్ధపరచబడుట యొక్క స్వభావంలోని మూలాంశానికి అంటే మన పరిశుద్ధమైన నడవడి లేదా పరిశుద్ధాత్మ మనలో కలిగించిన అంతరంగిక పరిశుద్ధత వలన కలిగే మన బాహ్య ప్రవర్తన అనే విషయానికి నడిపిస్తుంది. ఈ విధంగా క్రైస్తవుడు దేవుని కొరకు ప్రతిష్టించబడటం ద్వారా కలిగే నైతిక మరియు ఆధ్యాత్మిక స్థితి మరియు ఆ స్థితి నుండి ఉత్పన్నమయ్యే పవిత్ర జీవితం- వీటిని వేరువేరుగా ఎత్తి చూపుతున్నాను. ఇప్పుడు ఈ చివరి దానిని ధ్యానిద్దాం. “ప్రత్యేకించబడడం” లో సాతాను సేవ నుండి విడిపింపబడడం మరియు దేవుని సేవలోకి నడిపించబడడం అనే రెండు భాగాలు ఉన్నట్టే పరిశుద్ధంగా జీవించడం అంటే చెడు నుండి విడిపించబడటం మరియు మంచిని వెంబడించటం.

మాంటన్ అనే ప్యూరిటను ఇలా చెబుతున్నాడు “పరిశుద్ధపరచబడుటలో మూడురకాల అర్థాలు ఉన్నాయి. మొదటిది - క్రీస్తు మనలను అర్హులుగా చేసిన పరిశుద్ధత. అంటే తన సంఘంలో పరిశుద్ధాత్ముడు నివాసం చేసి, వారు పరిశుద్ధపరచబడేలా కృప ఇవ్వబడే అధిక్యతను వారికై క్రీస్తు తన యోగ్యత చేత సంపాదించడం (హెబ్రీ 10:10;). రెండవది - క్రీస్తునందు మనకు అన్వయించబడే పరిశుద్ధత. ఇది క్రీస్తు పునర్జీవింపచేసే ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడిన వారి హృదయాంతరంగాలను నూతనపరచే ప్రక్రియ. దీని ద్వారా ఒకడు మరణం నుండి జీవానికి, ప్రకృతి సంబంధ స్వభావం నుండి కృపకూ మార్చబడతాడు. దీనిగురించి తీతుకు 3:5;)లో చదవగలం. ఇది మనకు ఆపాదించబడిన క్రీస్తు విలువనుబట్టి పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా అనుదినం పరిశుద్ధపరచే ప్రక్రియ. మూడవది, క్రీస్తునందున్నవారు ఆచరించే పరిశుద్ధత. దీని ద్వారా క్రీస్తు ఎవరిలో తనను తాను ప్రతిష్ట చేసుకున్నాడో వారు పరిశుద్ధాత్మ చేత నూతన పరచబడినవారై, విశ్వాసం వలన క్రీస్తులో నాటబడినవారై, మాట, క్రియ, తలంపులలో తమను తాము మరింత పరిశుద్ధపరచుకుంటారు. (1 పేతురు 1:15;) (1యోహాను 3:3;).

పరిశుద్ధపరచబడటం అంటే దేవునికి ప్రతిష్టించబడటం అని అర్ధం. కనుక మన ఆత్మ దేవునిని అత్యున్నతమైన ప్రభువుగా సమస్త మేలులకు మూలంగా భావిస్తుందని, దానికి అనుగుణంగా మన ఆత్మలు దేవునికి కట్టుబడి ఆయన ధన్యకరమైన ప్రేమలో జీవించి కృతజ్ఞతతో ఆయనకు లోబడి ఉంటాయని తెలుస్తుంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే- 1, ఇది దేవుని వైపుకు మొగ్గుట అంటే అలవాటుగా పరిశుద్ధపరచబడడం. 2. మనలను మనం దేవునికి సమర్పించుకోవడం. దీని వలనే అసలైన పవిత్రత ప్రారంభమౌతుంది. నిత్యం ఆయన కోసం వాడబడటం వలనే అది కొనసాగింపబడుతుంది. ఆయనను ప్రేమించడం వలన అది మనలో అంతకంతకు అభివృద్ధి చెందుతుంది. చివరికి ఆయన మహిమలో ఇవన్నీ పరిపూర్ణత పొందుతాయి.

పరిశుద్ధపరచబడడం అంటే శుద్ధి చెయ్యబడడం, కడగబడటం అనే అర్థమిస్తుంది కాబట్టి ఆత్మ లోకాన్ని ప్రేమించడం నుండి శుద్ధి అవ్వడం అనే అర్థం ఇస్తుంది. మనిషి దేవుని కొరకు సృష్టించబడినప్పటికి ఆయనను మరియు నిత్య మహిమను మించి లోకాశలను ప్రేమించడం వలనే అపవిత్రుడు ఔతున్నాడు. తన సృష్టికర్తను ధిక్కరించి అవిధేయత చూపేవాడు పరిశుద్ధపరచబడలేడు. అతడు ఈ లోక వ్యర్ధతలను, అశాశ్వతమైన సుఖభోగాలను దేవునికి బదులుగా ఆశించడం వలన ఆయనను ధిక్కరిస్తున్నాడు. అయితే ఇహలోక సంబంధమైన ప్రేమ తొలగించబడి దేవుని ప్రేమకూ ఆయనపట్ల విధేయతకూ మరలా నడిపించబడినప్పుడు అతడు పరిశుద్ధపరచబడతాడు. లోకాన్ని అతిగా ప్రేమించే రోగం నుండి బాగుపడిన వారు పరిశుద్ధపరచబడిన వారు. ఎందుకంటే వారి శరీరాశలు విరగగొట్టబడినవి”.

“సమాధాన కర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును, శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడ యందు నిందారహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక” (1థెస్సలో 5:23). బహుశా ఇక్కడ పౌలు తన ఈ విజ్ఞాపనలో మూడు విషయాలను గురించి మాట్లాడుతుండవచ్చు. మొదట ఆయన థెస్సలోనీకయుల సంఘంలోని వారందరు పరిశుద్ధపరచబడాలని ప్రార్థన చేసాడు. రెండవది, ప్రతీ ఒక్క సభ్యుడు ఆత్మ, జీవము, శరీరములయందు పరిశుద్ధపరచబడాలని ప్రార్థన చేసాడు. మూడవది వారిలో ప్రతివాడు మరింత పరిపూర్ణంగా పరిశుద్ధపరచబడి సంపూర్ణంగా పరిశుద్ధులయ్యేలా ముందుకు సాగిపోవడానికి ప్రార్థించాడు. 1 థెస్సలో 5:23;) దాదాపు హెబ్రీ 13:20,21;) కి సమాంతరంగా ఉంది. క్రైస్తవుని శరీరభాగాలు, ఇంద్రియాలు ఆయన కార్యసాధకమైన కృప క్రింద దేవునికి యథార్థంగా లోబడేలా చెయ్యమని, అన్ని వేళలలో, అన్ని సందర్భాలలో ప్రతి మంచి విషయంలోను ఆయన చిత్త ప్రకారం చెయ్యడానికి అతనిని సిద్ధపరచమని, అపోస్తలుడు ప్రార్థిస్తున్నాడు. ఇది మన విధి అయినా అలా చేసే శక్తి మనలో లేదు. అది దేవుడు మనలో మన ద్వారా జరిగించాలి. దీని నిమిత్తం మనం సదా ప్రార్థించాలి. పై భాగంలో రెండు విషయాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మొదటిది క్రైస్తవుని స్వభావం సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలి, పాక్షికంగా కాదు. ఆత్మ యొక్క వైఖరి మరియు దాని శక్తి సామర్థ్యాలు, ప్రాణం దాని అంతరంగంలోని సమస్తం, శరీరం, దానిలోని అవయవాలన్నీ సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలి. శరీరం 'కూడా' పరిశుద్ధపరచబడింది. అది క్రీస్తు యొక్క అవయవంగా చేయబడింది. అది పరిశుద్ధాత్మకు ఆలయం (1 కొరింథీ 6:19;). అది విశ్వాసి అంతర్భాగం అవ్వడం వలన దాని ఆకర్షణలు, ఆశలు ఆత్మను ప్రభావితం చేసి, నడత పై ప్రాబల్యం చూపుతాయి “గనుక ప్రతివాడును పరిశుద్ధత యందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగి యుండునట్లు” (1 థెస్సలో 4:5) శరీరం ఆత్మ జీవముల అధీనములో ఉండాలి. “అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి” (రోమా 6:9).

రెండవది దైవకృప యొక్క ఈ కార్యం సంపూర్ణమయ్యేలా కొనసాగుతుంది. ఎందుకంటే వెనువెంటనే అపోస్తలుడు చెప్పిన వాక్యాలు “మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక ఆలాగు చేయును” (1 థెస్సలో 5:24), “మీలో ఈ సత్ క్రియ నారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను” (ఫిలిప్పీ 1:4) వాక్యాలు సమాంతరంగా ఉన్నాయి. సంపూర్ణంగా దేవుని కొరకు తన అవయవాలు మరియు సామర్ద్యాలు దేవునికి ప్రతిష్టించబడటం కంటే తక్కువదేదీ క్రైస్తవుని గురి కాకూడదు. అయితే ఇది అతడు మహిమపరచబడినప్పుడే పూర్తిగా పరిపూర్ణం ఔతుంది. ..... ఆయన ప్రత్యక్షమైనప్పుడు..ఆయనను పోలి యుందుము...”(1యోహాను3:2;) అంతరంగంలోనే కాక బాహ్యంగా కూడా. “ఆయన... మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును” (ఫిలిప్పీ 3:21).

 

పరిశుద్ధపరచబడుటను గూర్చిన సిద్ధాంతం

10.దాని స్వభావం (ముగింపు)

దీని ముందున్న అధ్యాయాలలో నేను చెప్పడానికి ప్రయత్నించిన విషయం ఏమిటంటే క్రైస్తవుడు పరిశుద్ధపరచడబడటం అంటే దేవుని కొరకు ప్రత్యేకపరచబడడం ఒక్కటే కాదు, అది ముఖ్యంగా అతని ఆత్మలో జరిగిన కృపాకార్యం. దేవుడు తన ప్రజలను పరిశుద్ధులుగా ఎంచడం మాత్రమే కాకుండా వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. పాత నిబంధనలోని మందిరంలోని వస్తువులు, ఉపకరణాలన్నీ దేవునికి ప్రతిష్టించబడినపుడు అవి వాడకంలోనే మార్పు చెందాయి, అయితే మానవుడు దేవునికి ప్రతిష్టించబడినపుడు అతని స్వభావం మారుతుంది. కాబట్టి ఇతరులకు అతనికి మధ్య ఎంతో భేదం ఉండడమే కాకుండా అతనికి, అతనితోనే భేదం కలుగుతుంది (1 కొరింథీ. 6:11;) - అంటే అతడు గతంలో ఉన్నదానికి ప్రస్తుతం ఉన్న దానికి ఉన్న భేదం. స్వభావంలోని ఈ మార్పు చాలా అవసరం. ఎందుకంటే అతని ప్రవర్తనలో పరిశుద్ధత రావాలంటే అతడు పరిశుద్ధుడుగా మారాలి. కృప అతని హృదయంలో నాటబడి, దాని ప్రభావం అతని జీవిత శాఖలన్నిటిలో ప్రసరించింది. అంతరంగిక పరిశుద్ధత అంటే పాపాన్ని అసహ్యించుకుని నీతిని ప్రేమించడం, బాహ్య పరిశుద్ధత అంటే వెంబడించడం. హృదయం మారగానే ప్రవర్తనలో సత్ఫలితాలు కనిపిస్తాయి.

లేఖనాలలో వాడబడిన విధంగా చూసినట్లయితే 'రక్షణ' త్రికాలరక్షణ. అంటే 1. గతంలో రక్షణ: (2 తిమోతి 1:9;). 2. వర్తమానంలో రక్షణ ( ఫిలిప్పీ 2:12; ) 3. భవిష్యత్తులో రక్షణ: (రోమా 13:11;) కాబట్టి పరిశుద్ధపరచబడడాన్ని కూడా భూత, వర్తమాన, భవిష్యత్కాలాల క్రింద పరిశీలించాలి. దేవుడు ఎన్నిక చేసిన వారందరూ ఇంతకు పూర్వమే పరిశుద్ధపరచబడ్డారు అనడం నిజం. - యూదా 1;); హెబ్రీ 10:10;); 2 థెస్సలో 2:13.;) ఈ భూమిపై ఉన్న దేవుని ప్రజలు అనుదినం పరిశుద్ధపరచబడుతున్నారు అన్నది నిజం - 2 కొరింథీ 4:16;); 2 కొరింథీ 7:1;); 1థెస్సలో 5:23;) క్రైస్తవులు రానున్న కాలంలో సంపూర్ణంగా పరిశుద్ధపరచబడతారు అనేది కూడా నిజమే. రోమా 8:30;), హెబ్రీ 12:23;), 1యోహాను 3:2;).ఈ మూడింటికీ ఉన్న వ్యత్యాసం స్పష్టంగా మనసులో ఉంచుకోకపోతే మనం కలవరానికి లోనౌతాం. దేవుని కోణం నుండి మనం పరిశుద్ధపరచబడటం ఇంతకు పూర్వమే జరిగిపోయింది (1 కొరింథీ. 1:2;). ఇది పరిశుద్ధులందరికీ సమానంగా ఉన్న అధిక్యత. మన కోణం నుండి చూస్తే పరిశుద్ధపరచబడటం ఈ జీవితంలో పూర్తి అయ్యే ప్రక్రియ కాదు.( ఫిలిప్పీ 3:12;). ఇది ఇక్కడ ఒక్కో క్రైస్తవునిలో ఒక్కో పరిమాణంలో ఉంటుంది. అయినా ఫిలిప్పీ 1:4;) లోని వాగ్దానం అందరికీ ఒకేవిధంగా చెందుతుంది.

మనం పరిశుద్ధులుగా చేయబడటంలో అన్ని భాగాలు పూర్తి అయినప్పటికీ అవి సంపూర్ణదశకు ఇప్పుడే చేరవు. నూతనంగా జన్మించిన శిశువులో జీవం, శరీరం, అన్ని భాగాలు ఉన్నప్పటికీ అవి ఇంకా ఎదిగి పరిపూర్ణతను పొందవలసియున్న విధంగానే క్రైస్తవుడు (రానున్న జీవితంతో పోల్చినపుడు) ఈ జీవితకాలం ముగిసే పర్యంతం "క్రీస్తునందు శిశువుగానే” ఉంటాడు. (1 పేతురు 2:2;) మనము కొంతమట్టుకే ఎరుగుదుము (1కొరింథీ 13:12;), మనం కొంత భాగం మాత్రమే పరిశుద్ధపరచబడ్డాము. ఎందుకంటే “స్వాధీనపరచుకొనుటకు అతివిస్తారమైన దేశము ఇంక మిగిలియున్నది” (యెహోషువా 13:1). ఎంతో మృదు స్వాభావం కలిగిన వారిలో సైతం రెండు నియమాలు మిగిలి ఉన్నాయి. శరీరం మరియు ఆత్మ, ప్రాచీన పురుషుడు మరియు నూతన పురుషుడు, ఇలా ప్రస్తుత స్థితిలో మనం రెండు స్వభావాలు కలిగియున్నాము. మనలో పనిచేస్తున్న ఈ రెండు నియమాల (పాపం- కృప) మధ్య ఒక పోరాటం ఉంది, కాబట్టి మనం చేసే కార్యాలు ఈ రెండు స్వభావాల చేత ప్రభావితం చేయబడతాయి! వెండిలో మలినం, బంగారంలో మష్టు కలిసి ఉన్నాయి. మన మంచికార్యాలన్నీ అపవిత్రములే, కనుక మనం ఇంకా “చేదు కూరలతో” (నిర్గమ 12:8) గొర్రెపిల్ల మాంసమును భుజిస్తున్నాం.

హృదయంలో పరిశుద్ధత, దైవచిత్తానుసారమైన దుఃఖం మరియు దైవిక ఆశయం ద్వారా ఇది నిర్ధారణ ఔతుంది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు” (మత్తయి 5:4). అతిశయం ఉప్పొంగడం వలన, అవిశ్వాసం వలన, అసంతృప్తి చెలరేగటం వలన “దుఃఖపడతారు”. బలహీనమైన విశ్వాసం వలన, వారి చల్లారిన ప్రేమవలన, క్రీస్తును పోలి నడవడంలో తమ వైఫల్యం వలన “దుఃఖపడతారు”. విరిగినలిగిన హృదయం, పరిశుద్ధతకు వ్యతిరేకంగా ఉండడాన్ని గురించిన దుఃఖం కన్నా ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడ్డాడు అనడానికి రుజువు లేమీ లేవు. దీనిగురించి "జాన్ ఓవెన్" అనే ఫ్యూరిటను చెప్పిన మాటలెంతో సరైనవి. “విశ్వసించే వ్యక్తికి తన అపజయాలు, బలహీనతలు, మరియు పాపాలన్నీ చూపించేదే సౌవార్తిక మారుమనస్సు. దానిని అభ్యాసంలో ఉంచకుండా అతడు ఒక దినమైనా జీవించలేడు. ఆత్మీయ జీవితం కొనసాగడానికి విశ్వాసమెంత అవసరమో ఇది కూడా అంతే అవసరం. అది దేవుని ఔన్నత్యం, పరిశుద్ధత మరియు మన ఘోర వైఫల్యాలను గుర్తెరగడం వలన ఎడతెగక అలవాటు పూర్వకంగా మనలో తగ్గింపు కలుగుతుంది . దీనిని బట్టే నిజమైన క్రైస్తవుడు రోమా 7 ను గురించి ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటాడు, ఎందుకంటే అది సరిగా అతని ఆంతరంగిక అనుభవానికి సరిపోలి ఉందని అతడు కనుగొంటాడు.”

పరిశుద్ధపరచబడిన వ్యక్తి తనకు కలిగిన పరిశుద్ధతతో ఎంత మాత్రం తృప్తి పొందడు. తన లోపల బలహీనతను, తన ఆత్మీయ బలహీనతను, తన అంతరంగ మాలిన్యాన్ని ఎరిగి చింతిస్తాడు. అయితే “నీతి కొరకు ఆకలిదప్పులు కలవారు ధన్యులు” ( మత్తయి 5:6 ), ఇది ఆత్మ యొక్క ప్రస్తుత స్థితిని తెలుపుతుంది. తాను ఆపాదించే నీతి కొరకు, అందచేసే నీతి కొరకు ఆకలిదప్పిక కలవారు “ధన్యులు”అని క్రీస్తు ప్రకటిస్తున్నాడు. 'వారు నీతిమంతులుగా తీర్చబడడం వలన కలిగే నీతికొరకు, పరిశుద్ధపరచబడటం వలన కలిగే నీతి కొరకు దప్పిక కలిగిఉంటారు' - అంటే పరిశుద్ధాత్మ మన ఆత్మలోనికి పరిశుద్ధమైన నియమాలను, మానవాతీతమైన కృపలను, ఆత్మ సంబంధమైన గుణాలను పంపి అవి అభివృద్ధి అయ్యేటట్టు బలపరుస్తాడు. ప్రతీ తరంలోను పరిశుద్ధుల అనుభవం ఇలాగే ఉంది. “దుప్పి నీటి వాగుల కొరకు ఆశగొనునట్లు దేవా, నా ప్రాణము నీకొరకు ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను?” ( కీర్తన 42:1,2 ). సువార్త కురిపించే దీవెనలను గురించి స్పష్టత లేకుండా వాటిని వారి మనస్సులలో కలగలపుకుని కలవరపడుతున్నారు కనుక పరిశుద్ధపరచబడడం యొక్క స్వభావం గురించి ఎంతో మంది సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. విశ్వాసి అనుభవించే ఆత్మసంబంధమైన ఆధిక్యతలన్నీ దేవుని ఎన్నికాయుతమైన ప్రేమ యొక్క క్రీస్తు మధ్యవర్తిత్వం యొక్క ఫలాలే. అదే విధంగా ఆ మొత్తంలోని ప్రతీ భాగం దాని ఫలమే. అయినా ఆ భాగాల వ్యత్యాసం ప్రత్యేకంగా గుర్తించకపోతే అది మనకు నష్టమే. సమాధానపరచబడటం మరియు నీతిమంతులుగా తీర్చబడడం, దత్త స్వీకారం మరియు క్షమాపణ, పునర్జన్మ మరియు పరిశుద్ధపరచబడటం ఇవన్నీ తండ్రి కుమారుని వద్దకు ఆకర్షించిన వారి ధన్యతలో భాగాలుగా ఇమిడి ఉంటాయి. అయినప్పటికీ ఈ పదాలన్నీ “వారికి ఏర్పరచబడిన గొప్ప రక్షణలోని వివిధ శాఖలు.” వీటిని వేర్వేరుగా అర్థంచేసుకోవడం మనకు మనశ్శాంతిని, హృదయానందాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ అధ్యాయంలోని మిగిలిన భాగంలో పరిశుద్ధపరచబడటాన్ని క్రైస్తవుని యొక్క ఇతర దీవెనలతో పోల్చడం కోసమై ప్రత్యేకించాను.

పునర్జన్మ, పరిశుద్ధపరచబడుట:
“పునర్జన్మ"ను గురించిన నా వ్యాసాలను విమర్శనాత్మకంగా చదివి పరిశుద్ధపరచబడడాన్ని గురించిన నా చర్చలను జాగ్రత్తగా పరిశీలించిన వారికి, దేవుడు నూతన జన్మ సమయంలో మనలో జరిగించిన దానికి, పరిశుద్ధపరచినపుడు ఆయన మనలో చేసిన కార్యానికి మధ్య ఉన్న భేదం నేను దాదాపు చెరిపివేసినట్టు అనిపించవచ్చు. ఈ రెండిటి మధ్య ఒక ఖచ్చితమైన గీత గియ్యడం సులభం కాదు, ఎందుకంటే ఈ రెండింటిలోను సామాన్యంగా కనపడేవి అనేకం ఉన్నాయి, అయినా మన మనసులో వీటి వ్యత్యాసం తెలుసుకునేందుకు వీటి మధ్యఉన్న ముఖ్య భేదాలను గ్రహించడం అవసరం. కాబట్టి దీనిని పరీక్షించడానికి రెండు మూడు పేరాలను కేటాయిద్దాం. అందులో వీటి మధ్య ఉన్న సంబంధం గ్రహించడానికి ప్రయత్నిద్దాం.
పునర్జన్మకు, పరిశుద్ధపరచబడడానికి మధ్య ఉన్న సంబంధం గ్రహించడంలో అది శిశువుకు మరియు వయసు వచ్చిన వానికి మధ్య ఉన్న సంబంధం వంటిదని చెబితే, ఒక విధంగా అది మనకు చాలా సహాయపడవచ్చు.

పై విధంగా పోల్చడంలో నేను ఆచరణాత్మక పరిశుద్ధత మరియు అంతకంతకు అభివృద్ధి చెందే పరిశుద్ధతకు మధ్యఉన్న భేదాన్నే సూచిస్తున్నాను కాని ఇదేవుని కోణం నుండి చుసే పరిపూర్ణ పరిశుద్ధత గురించి మాట్లాడడం లేదు. సంపూర్ణమైన మన పరిశుద్ధత దేవుని ముందు మనకు ఉన్న స్థితికి సంబంధించినంతవరకూ మన పునర్జన్మతో పాటు జరిగేది. పునర్జన్మలో ముఖ్య విషయమేమిటంటే పరిశుద్దాత్మ మనలను నూతనత్వంలోకి జీవింప చెయ్యడం. అప్పటి నుండి మనం దేవుని నివాసస్థలంగా ఉంటాము. ఇది పరిశుద్ధాత్ముడు మనలో నివసించడం ద్వారా జరుగుతుంది. ఆ తరువాత మన ఆత్మీయ జీవితంలో కనిపించే అభివృద్ధి అంతా ప్రారంభంలోని ఈ అభిషేకం లేదా ప్రతిష్టితమవ్వడం యొక్క ప్రభావం, ఫలం మరియు ప్రత్యేకత అయి ఉన్నాయి. గుడారాన్ని ఆ తరువాత దేవాలయాన్ని ప్రతిష్టించడం ఒకేసారి జరిగిన కార్యం. ఆ తరువాత దాని కొనసాగింపుకు అనేక నిదర్శనాలు ఉన్నాయి.

పునర్జన్మ సమయంలో పరిశుద్ధతా నియమం మనలో నాటబడుతుంది. దేవుని కొరకు జీవించడం అనే నియమాన్ని కార్యరూపంలో పెట్టడమే ఆచరణాత్మక పరిశుద్ధత. పునర్జన్మ సమయంలో పరిశుద్ధాత్ముడు రక్షణార్థమైన కృపను అనుగ్రహిస్తాడు. పరిశుద్ధపరచే ఆయన పనిలో దీనినే ఆయన బలపరచి అభివృద్ధి చేస్తాడు. మనం జన్మించినపుడు "పుట్టుకతో వచ్చిన పాపం” లేదా లోపల నివసించే మాలిన్యంలో సమస్త పాపబీజం దాగి ఉంటుంది. అదే విధంగా నూతన జన్మలో మనకు అనుగ్రహింపబడిన కృప ఆత్మసంబంధమైన సమస్త సుగుణాల బీజం కలిగి ఉంటుంది. మనం ఎదుగుతుండగా మన పాప స్వభావం ఏవిధంగా ఎదిగి పైకి కనబడుతుందో, పరిశుద్ధ స్వభావం విషయంలో కూడా అలాగే జరుగుతుంది. నూతన పురుషుడు ప్రతీదినం అంతకంతకు పాపం విషయమై మరణిస్తూ, దేవుని విషయమై జీవించటం వలన, ఎడతెగక నూతనత్వంలో అభివృద్ధి చెందడమే పరిశుద్ధపరచబడటం. పునర్జన్మ అనగా పుట్టుక, పరిశుద్ధపరచబడడం అనగా పుట్టిన ఈ శిశువు కృపలో ఎదగటం. పునర్జన్మలో పరిశుద్ధత అనే సూర్యుడు ఉదయించగా, పరిశుద్ధపరచబడటంలో అది తన పరుగును కొనసాగిస్తూ అంతకంతకు తేజరిల్లి పట్టపగలు ఔతుంది (సామెత 4:18;). మొదటిది చీకటి నుండి వెలుగుకు మారటం (ఎఫెసీ 5:8;). రెండవది ఆ కృపావెలుగు ఒక దశ నుండి మరొక దశకు చేరటం (కీర్తన 84:7;) దీని వలన క్రైస్తవుడు సీయోనులో దేవుని యెదుట నిలిచేవరకూ బలాభివృద్ధి పొందుతాడు. (స్విన్నోక్ 1660).

ఈ విధంగా పునర్జన్మలో పరిశుద్ధతా నియమం మనలో నాటబడడం వలన పరిశుద్ధపరచబడడానికి పునాది వేయబడుతుంది. ఈ పరిశుద్ధతా నియమం పాపం నుండి పరిశుద్ధతకు, సాతాను నుండి క్రీస్తువైపుకు, లోకంనుండి దేవుని వైపుకు తిరగడంలో వ్యక్తమౌతుంది. ప్రాచీన పురుషుని అణిచివేస్తూ, నూతన పురుషుని ధరించే ప్రక్రియలో ఇది కొనసాగి మహిమపరచబడటంలో ముగుస్తుంది. పునర్జన్మకు, పరిశుద్ధపరచబడడానికి ఉన్న గొప్ప భేదం ఏమిటంటే మొదటిది ఒకేసారి జరిగే దైవకార్యం అయితే రెండవది దాని కొనసాగింపచేసి, పరిపూర్ణం చేసే దేవుని కృపాకార్యం. దీనిలో ఆయన మనలను నిలబెట్టి, అభివృద్ధి చేసి, కొనసాగించి, తాను ప్రారంభించిన పనిని పరిపూర్ణం చేస్తాడు. ఒకటి జన్మించడం, మరొకటి ఎదుగుదల. దేవుడు మనలను పునరుజ్జీవింపచేసి పరిశుద్ధులుగా చెయ్యడమే ఆయన దృష్టిలో ఉన్న ఉద్ధేశం. ఇది అంతం వరకు చేరడానికి అవసరమైన సాధనం, ఎందుకంటే రక్షణ కార్యానికి కిరీటం పరిశుద్ధపరచబడడమే.పునర్జన్మే విశ్వాసియొక్క ఆధ్యాత్మిక జీవితపరమార్థం అని బోధించడం.

ఈ అంశంపై ఆధునిక బోధలో ఉన్న లోపంగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే, అది గమ్యం కాదు కాని ప్రారంభం మాత్రమే. అది లక్ష్యం కాదు కాని లక్ష్యం చేరుకునే సాధనం మాత్రమే. పునర్జన్మకు పరిశుద్ధత చేర్చబడాలి, లేదంటే ఆత్మ నిశ్చలంగా నిలిచిపోతుంది. (అటువంటిది సాధ్యమైతే) పురోగమించకపోతే, తిరోగమించటం తథ్యమన్నది ప్రతి విషయంలోనూ మారని సూత్రం.అత్యవసరమైన ఈ ఆధ్యాత్మిక ఎదుగుదల పరిశుద్ధపరచబడడంలోనే దాగి ఉంది. నూతన జన్మలో నాటబడిన పరిశుద్ధత ఆత్మలోని ప్రతీ భాగాన్నీ పరిశుద్ధపరచి పరిశుద్ధతా నియమం యొక్క ప్రభావం క్రిందికి తెస్తుంది. ఈవిధంగా మాత్రమే మన శిరస్సైన 'క్రీస్తు వలె నుండుటకు మనమన్ని విషయములలోను ఎదుగుదుము” (ఎఫెసీ 4:15).

నీతిమంతులుగా తీర్చబడటం, పరిశుద్ధపరచబడటం. ఈ రెండిటి మధ్యఉన్న సంబంధం రోమా 3:8;)లో స్పష్టంగా చెప్పబడింది. 5వ అధ్యాయంలో, విశ్వసించే పాపి దేవుని ఎదుట నీతిమంతునిగా తీర్చబడి, దేవునితో సమాధానపడి ఆయన కృపలో స్థిరమైన స్థానం పొంది, తన భద్రత విషయమై నిశ్చయత కలిగి, దేవుని మహిమ యొక్క నిరీక్షణలో ఆనందించడం మనం చూస్తాం. ఈ దీవెనలు బహు గొప్పవైనా పునరుజ్జీవింపబడిన ఆత్మకు మరొక అవసరత ఉంది. అదేమిటంటే స్వాభావికంగా పొందిన పాపశక్తి నుండి, మాలిన్యం నుండి విడుదల. అందుచేత దీనిని గురించి రోమా 6:7-8;) లో వివరించబడింది. అక్కడ పరిశుద్ధతను గురించిన వివిధ మూలాంశాలు చెప్పబడ్డాయి. మొదట విశ్వాసి చట్టబద్ధంగా పాపం నుండి, ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి పవిత్రపరచబడ్డాడు. కాబట్టి అతను పాపం యొక్క అధికారం నుండి విడుదల పొంది ధర్మశాస్త్రంలో ఆనందిస్తూ, సేవించే వీలు కలిగింది. క్రీస్తుతో ఏకమవ్వడంలో ఆయన మరణంలో పాలివారం అవ్వడమే కాకుండా ఆయన పునరుత్థానంలో పాలు పొందడం కూడా ఇమిడి ఉంది.

అక్కడ పౌలు నీతిమంతులుగా తీర్చబడడాన్ని గురించి వివరించిన తరువాత పరిశుద్ధపరచబడటాన్ని గురించి చర్చించినప్పటికి, ఈ రెండు కార్యాలకు మధ్య కొంత విరామం ఉంటుందని అనుకోవడం కాని, నీతిమంతులుగా తీర్చబడిన తరువాత పరిశుద్ధపరచబడడం దాని ఫలితంగా జరుగుతుందని అనుకోవడం గాని పొరపాటు. దీని కన్నా అజ్ఞానం ఏమిటంటే, నీతిమంతులుగా తీర్చబడిన తరువాత పరిశుద్ధపరచబడడానికి ప్రయత్నించాలనీ, అది లేకపోతే తప్పక నశిస్తామని కొందరు బోధిస్తున్నారు. దీని ప్రకారం మనం నీతిమంతులుగా నిలిచి ఉండటం మన పరిశుద్ధతపై ఆధారపడినట్టు వారు చేస్తున్నారు. ఇది సరికాదు. ఈ రెండు సత్యాలను గురించి పౌలు వేర్వేరుగా ప్రస్తావించినా అవి విడదీయరానివి. వాటిని విడివిడిగా ధ్యానించవలసిన అవసరం ఉన్నప్పటికీ, వాటిని విభజించకూడదు. క్రీస్తును రెండుగా విడదీయలేము. విశ్వసించే పాపికి ఆయన యందు నీతి మరియు పరిశుద్ధత, ఈ రెండూ కలుగుతాయి. సువార్తలోని ప్రతి భాగాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలి. అయితే ఒకదానికొకటి పోటీగా నిలపకూడదు. నీతిమంతులుగా తీర్చబడడాన్ని గురించి రోమా 3:5 లోను, పరిశుద్ధపరచబడడాన్ని గురించి రోమా 6:8లోను చెప్పబడినందుకు మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఒక భాగం మరొక భాగాన్ని సమర్థిస్తుంది. ఈ రెండూ ఒకే మొత్తంలో రెండు సగభాగాలు.

క్రైస్తవుడు పరిశుద్ధపరచబడడానికి కారణం అతడు నీతిమంతునిగా తీర్చబడటం కాదు. అదే విధంగా అతడు నీతిమంతుడిగా తీర్చబడడానికి కారణం అతని పునర్జన్మ కాదు. ఎందుకంటే ఈ మూడింటికీ కారణం క్రీస్తే అయినప్పటికీ వీటి మధ్య ఒక క్రమం ఉంది. అది కాలసంబంధమైనది కాదు కాని స్వభావ సంబంధమైన క్రమం. మొదట మనమాయన రూపాన్ని తిరిగి పొందుతాము, తరువాత ఆయన దయను, ఆ తరువాత ఆయనతో సహవాసం పొందుతాం. నీతిమంతులుగా తీర్చబడడం, పరిశుద్ధులుగా చేయబడడం ఎంతగా కలిసున్నాయంటే ఒకటి ముందు చెప్పబడటం కొన్నిసార్లు రెండవది ముందు చెప్పబడటం జరుగుతుంది. రోమా 8:1;) మరియు రోమా 8:13;), 1యోహాను 1:9;); తరువాత మీకా 7:19;) మరియు 1కొరింథీ. 6:11;) చూడండి. మొదట దేవుడు చనిపోయిన ఆత్మను జీవింపచేస్తాడు. ఆత్మ సంబంధంగా సజీవుడవ్వడం వలన అతడిపుడు క్రీస్తునందు విశ్వసించగలడు. దాని ద్వారా అతడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. నీతిమంతుడవ్వడం ద్వారా అతనికి దేవునితో ప్రారంభమయ్యే ఆ సంబంధం ఆధారంగా పునర్జన్మలో ప్రారంభమయ్యే "కార్యం" పరిపూర్ణమయ్యేంతవరకూ పరిశుద్ధపరచబడడం అనే పక్రియద్వారా పరిశుద్ధాత్మ అతనిలో కొనసాగిస్తాడు. చట్టబద్ధంగా దేవునితో అతను సమాధానపరచబడడం వలన ఆయనతో సహవాసం కలిగి ఉంటాడు. పరిశుద్ధాత్ముడు అతనిలో పరిశుద్ధపరచే పనిని కొనసాగించడం వలన ఆ సహవాసం కొనసాగుతుంది.

నీతిమంతులుగా తీర్చబడడం మరియు పరిశుద్ధపరచబడడం, ఈ రెండూ కృప అనుగ్రహించేవే అయినా అవి ఎంతో వ్యత్యాసమైనవి. నీతిమంతునిగా తీర్చబడడంలో ఒక వ్యక్తి చట్టబద్ధంగా నీతిమంతుడని పరిగణించబడతాడు. అది ఒకేసారి జరిగే కృపాకార్యం. మార్పు వచ్చినపుడు అది ముగిసిపోతుంది. అంటే శిక్ష నుండి విడుదల పొంది జీవించే హక్కును అనుగ్రహించేదే ఆ మార్పు. పరిశుద్ధపరచబడడం, నిజమైన మార్పు కలిగేంతవరకూ కొనసాగే ఒక కృపాకార్యం. మొదటిది మనలో లేని నీతివలన, రెండవది మనలో తేబడిన పరిశుద్ధతవలన జరుగుతుంది.
నీతిమంతులుగా తీర్చబడడం యాజకుడైన క్రీస్తు ద్వారా పాప దోషాన్ని పరిహరించడానికి సంబంధించింది. పరిశుద్ధపరచబడడం రాజైన క్రీస్తు ద్వారా ఆయన ప్రభుత్వం క్రిందకు తేబడటానికి సంబంధించింది. నీతిమంతులుగా తీర్చబడటం ఒక్కసారే పూర్తిగా జరుగుతుంది, అయితే పరిశద్ధపరచబడడం దశలవారీగా జరుగుతుంది. (ఎ.బూత్ 1813)

శుద్ధీకరించబడడం మరియు పరిశుద్ధపరచబడడం - ఈ రెండూ విడదీయరానివి అయిన్నప్పటికీ పూర్తిగా ఒకే పోలికలో ఉండవు. వాటిని వ్యత్యాసమైనవిగా గుర్తించగలం. ఈ విషయాన్ని జి.స్మిటన్ గారి మాటల్లోకంటే వివరంగా చెప్పడం కంటే సాధ్యం కాదు. “ఇశ్రాయేలీయుల సంస్కారాలలో “పరిశుద్ధపరచడం, “శుద్ధి” చెయ్యడం అనే పదాలు తరచూ కనిపిస్తాయి. వాటి అర్థం దాదాపుగా ఒకటే అవ్వడం వల్ల చాలమంది వాటిని ఏకార్థంతో ప్రయోగిస్తున్నారు. వాటి మధ్య స్వల్పంగా, ఛాయా మాత్రంగా ఉన్న అర్థభేదాన్ని ఈ క్రింది విధంగా గ్రహించవచ్చు. పదేపదే చేసే పాపాల వలన కలిగే మాలిన్యాన్ని బలి ఇవ్వడం ద్వారా తొలగించవచ్చు. ఈ సంస్కారాన్ని శుద్ధి చెయ్యడం అని పిలిచేవారు. ఈ పాపపు మరకలు ఆరాధించడానికి వచ్చిన వారికి దేవుని సన్నిధిలో నిలిచే అర్హత లేకుండా చేసేవి. వారు ప్రజలతో కలిసి సహవాసం చెయ్యలేరు. అయితే ఇదే ఇశ్రాయేలీయుడు బలి ఇవ్వటం వలన శుద్ధి అయినపుడు అతడు తన పూర్తి ఆధిక్యతను తిరిగి పొంది పవిత్రుడు లేదా పరిశుద్ధుడు ఔతాడు. ఈ విధంగా రెండవది మొదటి దానికి ఫలితం. కాబట్టి పూర్వపు ఆరాధన సందర్భంలో వాడిన ఈ రెండు పదాలు చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి. అవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఇది క్రొత్త నిబంధనలో ఈ రెండు పదాలు వాడిబడిన ఉద్దేశ్యాన్ని స్పష్టపరుస్తుంది. ఎఫెసీ. 5:25,26;); హెబ్రీ 2:11;), తీతుకు 2:14;). ఈ వాక్యభాగాలన్నీ పాపం చేత అపవిత్రుడై దేవునికి దూరం చేయబడి, బలిరక్తం ప్రోక్షింపబడగానే సహవాసంలోకి ఆహ్వానించబడి పరిశుద్ధునిగా ప్రకటించబడిన వ్యక్తిని సూచిస్తాయి. సాధారణంగా "కడగడం”, శుద్ధిచెయ్యడం” అనే పదాలలో (ప్రత్యేకంగా హెబ్రి పత్రికలో) నీతిమంతునిగా చేయబడడం కూడా చేర్చబడింది.”

దేవుని కోణం నుండి చూసినపుడు పరిశుద్ధత అనేది ఒక వస్తువును లేదా వ్యక్తిని తన సొంత సంతోషం కొరకు ప్రత్యేకించుకోవడం వలన ఆయనతో కలిగిన సంబంధానికి ఫలం. ఒక వస్తువు లేదా వ్యక్తి దేవుని కొరకు ప్రత్యేకింపబడినపుడు అతడు దేవునికి వ్యతిరేకమైన ప్రతీదాని నుండి వేరు కావాలి. క్రీస్తు బలియాగం ద్వారా విశ్వాసులందరూ దేవునికి ప్రతిష్టించబడ్డారు లేదా ఆయన కొరకు ప్రత్యేకించ బడ్డారు. మానవ కోణం నుండి చూసినపుడు పరిశుద్ధత అనేది దేవుని కార్యం అంతరంగంలో జరిగింపబడడానికి ఫలం. ఈ విధంగా ఆయన చేత వాడబడడనికి అతనిని ప్రత్యేకపరుస్తాయి. ఈవిధంగా “పరిశుద్ధత” లో ముఖ్యమైన రెండు కోణాలున్నాయి. రెండవదానిలో నుండి ఒక వ్యక్తి తనపై దేవునికి ఉన్న అధికారం, ఆయనచేత మాత్రమే వాడబడడానికి తనను తాను సమర్పించుకోవడం ( రోమా 12:1;) మొ.వి) జరుగుతుంది. ఇది ఆచారణాత్మకమైన పరిశుద్ధత. ఈ మూడింటికి గొప్ప ఉదాహరణ దేవుని పరిశుద్ధుడైన యేసు క్రీస్తులో కనిపిస్తుంది. దేవుని కోణం నుండి ఆయన "తండ్రి ప్రతిష్ట చేసి ఈ లోకములోనికి పంపినవాడు” (యోహాను 10:36). మానవ కోణం నుండి ఆయన “కొలతలేని ఆత్మను పొందినవాడు” (యోహాను 3:34). కార్యకారియై ఆయన 'ఆచరణాత్మకంగా దేవుని మహిమకొరకు జీవించి, ఆయన చిత్తం జరిగించాడు'. మనకు ఆయనకు మధ్య ఉన్న ఒకే గొప్ప భేదం - ఆయనకు మనలా అంతరంగిక శుద్ధీకరణ అవసరం లేదు.

సంక్షిప్తంగా చెప్పాలంటే పరిశుద్ధత అంటే ఒక సంబంధం మరియు ఒక నీతి స్వభావం. అది అనుకూల, ప్రతికూల కోణాలను కలిగియుంటుంది. అపవిత్రత నుండి కడగబడటం, ఆత్మ యొక్క కృపచేత అలంకరించబడటం. పరిశుద్ధత అంటే మొదట దేవుడు తన ప్రజలకిచ్చే ఘనమైన స్థితి. రెండవది వారికొరకు క్రీస్తు కొని తెచ్చిన పవిత్రమైన స్థితి. మూడవది పరిశుద్దాత్ముడు వారిలో కలగచేసే ప్రేరేపణ. నాల్గవది పై దానికి తగిన విధంగా భక్తి గల నడత. ఐదవది వారెపుడూ గురిగా ఉంచుకోవలసిన నీతి ప్రమాణం - ( 1 పేతురు 1:15;). జగత్తు పునాది వేయబడక మునుపు క్రీస్తులో ఏర్పరచబడి, (ఎఫెసీ.1:4;). క్రీస్తు రక్తము చేత పాప దోషమునుండి శుద్ధి చేయబడి ( హెబ్రీ 13:12;). లోపల నివసించే పరిశుద్ధాత్మ ద్వారా దేవునికి ప్రతిష్ట చేయబడి (1 కొరింథీ 1:21,22;). కృప చేత అంతరంగంలో పరిశుద్ధునిగా చేయబడి, (1 ఫిలిప్పీ 1:4;) దానికి తగినట్టు నడవడమే తన బాధ్యత,తన ఆధిక్యత మరియు తన గమ్యంగా కలిగున్నవాడే పరిశుద్ధుడు.

 

పరిశుద్ధపరచబడడాన్ని గురించిన సిద్ధాంతం

11.దాని కర్త

సమస్త పరిశుద్ధతకూ మూలం, ఊట దేవుడొక్కడే. ఆ పరిశుద్ధుని వల్ల కలిగేది తప్ప ఏ సృష్టిలో పరిశుద్ధత ఎంత మాత్రమూ లేదు. దేవుడు మొదటి మానవునిని సృష్టించినప్పుడు అతనిని తన రూపంలో చేశాడు, అంటే “నీతిమంతునిగానూ, నిజమైన పరిశుద్ధతలోనూ” (ఎఫెసీ. 4:24; చేశాడు. ప్రాణి ప్రాణాన్ని ఉత్పత్తి చేయలేనట్టే పరిశుద్ధతను కూడా ఉత్పత్తి చెయ్యలేదు. ఈ రెండింటి కొరకూ అతడు దేవుని మీదనే ఆధారపడతాడు. ఇదిలా ఉండగా పతనమైన, పాపానికి దాసుడై మలినమైన మానవుడు తనను తాను ఎలా పవిత్రుడిగా చేసుకోగలడు? కూషు దేశస్తుడు తన చర్మాన్ని, చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేరు. ఎక్కడైనా నిజమైన పరిశుద్ధత మానవహృదయంలో కనిపిస్తే అది కలిగినవాడు పౌలుతో కలిసి “నేనేమైయున్నానో అది దేవుని కృపవల్లే అయ్యానని” (1కొరింథీ. 15:10) చెప్పగలగాలి. కాబట్టి పరిశుద్ధపరచబడడం అనేది దేవుని కార్యం మరియు వరమై ఉంది.

మలినమైన స్వభావం తనను తానే శుద్ధి చేసుకోగలదని, పతనమై నాశనమైన మానవుడు తనను తాను సరిదిద్దుకోగలడని, దేవుడు సృష్టించిన ఆయన రూపం కోల్పోయినవాడు దానిని తిరిగి తానే సంపాదించుకోగలడనీ అనుకోవడం కంటే మోసం వేరే లేదు. ఇది అందరూ ఎరిగిన సత్యమే అయినా గర్వం దానిని ప్రక్కకు తొలగించేందుకు నిత్యం ప్రయత్నిస్తుంది. విధి మరియు దానిని నిర్వర్తించగల సమర్థత కలిసి ఉంటాయని స్వయం సమృద్ధి తలుస్తుంది. అది నిజం కాదు. మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపించడం నిజమే, ఎందుకంటే ఆయన తన అధికారం వదులుకోడు, తన ప్రమాణాన్ని తగ్గించడు. అయినప్పటికీ దానిని నెరవేర్చే శక్తి మనకుందని ఆయన ఆజ్ఞ ఎంతమాత్రం తెలపడం లేదు. ఆయన మన యెదుట సంపూర్ణమైన ప్రమాణం ఉంచడంలో దానిని మనం అందుకోగలమని అర్థం కాదు. దేవుడు కోరే వాటిని మనం నెరవేర్చలేమని ఒకటి తెలుపుతుండగా రెండవది మనం దీన మనస్కులమై దుమ్ముతో సమానంగా మనల్ని ఎంచుకునేలా మనం దేవుని మహిమకు ఎంతో తగ్గించుకుని ఉండాలని తెలుపుతుంది.

అయితే మనం స్వయంసమృద్ధి కలవారమని తలుస్తూ స్వనీతిలో ఉప్పొంగే స్వభావం కలవారం కాబట్టి, దేవుడు కృపతో తన ప్రజల్లో కార్యం జరిగిస్తానని వాగ్దానం చెయ్యడంలో మనం ఆయన కోరిన దానిని చేయడానికి శక్తిలేనివారమనే విషయం స్పష్టమౌతుందని జ్ఞాపకం చేయవలసిన అవసరం ఉంది. ఈ క్రింది వాక్యాలను ఒక నిమిషం ధ్యానిద్దాం.“వారి మనసులలో ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద దాని వ్రాసెదను, నేను వారికి దేవుడనైయుందును వారు నాకు జనులగుదురు” (యిర్మియా 31:33,34). “వారు నాకు ప్రజలై యుందురు, నేను వారికి దేవుడనైయుందును. మరి వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏకహృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయమానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను, వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములో నా యెడల భయభక్తులు పుట్టించెదను (యిర్మియా 32:38-41). నూతన హృదయమును మీకిచ్చెదను, రాతి గుండె మీలో నుండి తీసి వేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీయందుంచి, నాకట్టడల ననుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసెదను (యోహెజ్కే 36:26, 27). ధన్యకరమైన ఈ మాటల్లో మాత్రమే మనం పరిశుద్ధ పరచబడతామన్న నిశ్చయత ఉంది కానీ మరెక్కడా లేదు. ఇదంతా దేవుని శక్తి, కృప మరియు ఆయన కార్యాలపై ఆధారపడి ఉంది. తన వాగ్దానాలను ఆయన మాత్రమే నెరవేర్చుతాడు.

మనం పరిశుద్ధపరచబడడానికి మూలకారకుడు త్రిత్వమైన‌ దేవుడు. ఇక్కడ నేను “త్రిత్వమైన దేవుడ”ని చెప్పడానికి కారణం ఏమిటంటే, లేఖనాలలో “దేవుడు” అనే బిరుదు ఏ గుణవాచకం చేర్చకుండా వాడబడ్డప్పుడు అది ఒకే విధమైన ప్రత్యేకతతో వాడబడలేదు. కొన్ని సార్లు 'దేవుడు' అనే పదం త్రిత్వంలోని మొదటి వ్యక్తిని, కొన్నిసార్లు రెండవ వ్యక్తిని, మరికొన్నిసార్లు మూడవ వ్యక్తిని సూచిస్తూ వాడబడింది. 1కొరింథీ 5:28; లాంటి మిగిలిన వాక్యభాగాల్లో ఆ పదంలో ఈ ముగ్గురూ ఉన్నారు. సంఘాన్ని పరిశుద్ధపరచడంలో నిత్యులగు ఈ ముగ్గురూ ఉండి, ప్రత్యేకమైన ప్రాత్రను వహిస్తున్నారు. పరిశుద్ధపరచబడడాన్ని గురించిన స్పష్టమైన దృక్పధం కలిగి ఉండాలంటే మనం ఈ విషయాన్ని చక్కగా గ్రహించటం అవసరం. మనల్ని పరిశుద్ధపరచడంలో త్రిత్వంలోని ప్రతి దైవిక వ్యక్తి ఎలా పని చేస్తారో జాగ్రత్తగా తెలుసుకోవలసిన సమయానికి మనం ఇప్పుడు చేరుకున్నాం, ఎందుకంటే దీనిని మనం చక్కగా గ్రహించినప్పుడే ఎవరికి చెందవలసిన స్తుతిని వారికి మనం అర్పించగలం.

పరిశుద్ధపరచడంలో మూల కారకుడు త్రిత్వమైన దేవుడని చెప్పడంలో నేను సంఘాన్ని పరిశుద్ధపరచడంలో తండ్రి ఎటువంటి పాత్రను వహిస్తున్నాడో సరిగ్గా అదే పాత్రను కుమారుడు, పరిశుద్ధాత్మ కూడా వహిస్తున్నారని చెప్పడం లేదు కానీ క్రైస్తవుడు పరిశుద్ధపరచబడే కార్యం తండ్రి వల్ల వాస్తవంగా ఎలా జరిగించబడుతుందో అలాగే‌ కుమారుడు, పరిశుద్ధాత్మల వల్ల కూడా వాస్తవంగా జరిగించబడుతుందనే సత్యాన్ని నేను నొక్కి చెబుతున్నాను. కుమారుని వల్ల ఎంత వాస్తవంగా జరిగించబడుతుందో అంతే వాస్తవంగా పరిశుద్ధాత్మ మరియు తండ్రి వల్ల కూడా జరిగించబడుతుంది. కాబట్టి అతడు త్రిత్వంలోని ముగ్గురికీ సమానంగా రుణపడి ఉన్నాడు. చాలామంది రచయితలు ఈ అంశాన్ని స్పష్టం చెయ్యలేకపోయారు. అయినప్పటికీ రక్షణలో ఈ పరిశుద్ధ త్రిత్వం ఆచరించి భద్రపరిచే అధికారిక క్రమం ఒకటుంది. అందులో సమస్తం తండ్రి నుండీ సమస్తం కుమారుని ద్వారా సమస్తం పరిశుద్ధాత్మచేత అని మనం గ్రహించగలం. ఈ అధికారిక క్రమం ఈ త్రిత్వంలో ఒకరు అధికులు ఒకరు అల్పులు అని చూపించదు కానీ, అందులో ప్రతి ఒక్కరూ తనను తాను ప్రత్యేకంగా ప్రత్యక్షపరచుకుంటూ ప్రతీ ఒక్కరూ తన సొంతమహిమను ప్రదర్శిస్తూ ప్రతీ ఒక్కరూ ఆయన ప్రజలచే వేర్వేరుగా ఆరాధించబడాలని తెలియచేస్తున్నారు.

ఇక్కడ సంఘంపట్ల ఉన్న దైవ ప్రేమలోని అన్ని శాఖల్లోనూ ఆచరించబడే ఒక చక్కని క్రమం గమనించడం ఎంత ధన్యకరం. అందువల్ల త్రిత్వంలోని ముగ్గురూ క్రీస్తు శరీరమైన సంఘం పట్ల ప్రత్యక్షంగా ఈ కృపాకార్యంలో పాల్గోవడం మనం చూడగలం. ఈ ముగ్గురూ కలిసి పనిచేసినా కూడా ఒక్కొక్కరికీ ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. దీనివలన ముగ్గురికీ ఘనత కలిగేలా ఒకరికొకరు అవకాశం‌ ఇస్తున్నారు. కుమారుని మహిమకోసం తండ్రియొక్క ప్రేమ, పరిశుద్ధాత్ముని శక్తి కోసం కుమారుని మహిమ అవకాశం ఇస్తున్నాయి. ఈ విధంగా మన ఎదుట ఉన్న ఈ అంశం విషయమై కూడా ఇది వాస్తవమని గుర్తించగలం. వాక్యంలో ఒకచోట సంఘం "తండ్రియైన దేవుని” వల్ల పరిశుద్ధపరచబడినట్టు రాయబడింది (యూదా1:1). మరొకచోట “యేసుకూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను” (హెబ్రీ 13:12) అనీ రాయబడింది. అదేవిధంగా “ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన ....... దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను”‌(2 థెస్స 2:13) అని కూడా రాయబడింది. ఒకే విధంగా కాకపోయినా త్రిత్వంలోని ముగ్గురూ మనల్ని పరిశుద్ధపరుస్తున్నారు.

పరిశుద్ధ త్రిత్వం ఇదే విధమైన సహకారం మిగిలిన అనేక విషయాల్లో కూడా కలిగి ఉండడం‌ మనం చూడగలం. ఆదియందు దేవుడు చేసిన సృష్టిలో ఇది గమనించగలం. “జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున” (అపోస్త 17:24) ఇక్కడ సృష్టికర్తగా తండ్రియైన దేవుని గురించి చెప్పబడిందనేది స్పష్టం. అదే విధంగా కుమారుని గురించి “సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు” (యోహాను 1:3) అని చెప్పబడింది. ఇక‌ పరిశుద్ధాత్ముని గురించి యోబు 33:4లో ఇలా రాయబడింది "దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను" త్రిత్వంలోని ఇదేవిధమైన సహకారం మన విమోచకుడు పరిశుద్ధ మానవునిగా ఉద్భవించినప్పుడు కూడా గమనించగలం. కన్యక పరిశుద్ధాత్ముని వల్ల గర్భవతి అయ్యింది (లూకా 1:3), అయినప్పటికీ క్రీస్తు తనంతట తానే మానవ స్వభావాన్ని ధరించాడు. “దాసుని స్వరూపమును ధరించుకొని” (ఫిలిప్పీ 2:7 మరియు "పాలివాడాయెను” హెబ్రీ 2:15;) అయితే హెబ్రీ 10:5 లో కుమారుడు తండ్రితో ఇలా చెబుతున్నాడు “నీవు నాకొక శరీరమును అమర్చితివి”.

ప్రస్తుతం మన ఉనికి త్రిత్వం నుండే, వారు కలిసి చేసిన కార్యం వల్లే వచ్చింది. “మనకందరికి తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా?” (మలాకీ 2:10) అదే విధంగా కుమారుని గురించి ఇలా చెప్పబడింది. "ఆకాశమునందున్నవియు, భూమియందున్నవియు..... సర్వమును ఆయన యందు సృజింపబడెను” (కొలస్సి 1:16). ఇక పరిశుద్ధాత్ముడి గురించి కూడా యోబు 33:4లో ఇలా చెప్పబడింది “దేవుని ఆత్మ నన్ను సృజించెను. సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను”. అదేవిధంగా విశ్వాసుల “నిత్యజీవం” నిర్వివాదంగా త్రిత్వంలోని ముగ్గురికీ ఆపాదించబడింది. రోమా 6:23;లో ఇది తండ్రియైన దేవుని ఔదార్యమనీ, 1యోహాను 5:11;లో అది “కుమారునిలో కలదని”, గలతీ 6:8లో “ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయున”ని చదువుతాం. మనం తండ్రి చేత నీతిమంతులుగా తీర్చబడ్డాము (రోమా 8:33), క్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం (యెషయా 53:11;); పరిశుద్ధాత్మ ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం (1కొరింథీ 6:11;) మనం దేవుని చేత భద్రపరచబడుతున్నాం (1పేతురు 1:5;). మనము కుమారుని చేత భద్రపరచబడుతున్నాం (యోహాను 10:28;). ఆత్మ ద్వారా భద్రం చేయబడ్డాం (ఎఫెసీ 4:30;). మనము తండ్రి ద్వారా లేపబడతాం (2 కొరింథీ 1:9;) మనం కుమారుని ద్వారా లేపబడతాం (యోహాను 5:28). మనం ఆత్మ ద్వారా లేపబడతాం (రోమా 8:11;).

త్రిత్వంలోని వ్యక్తుల కార్యాలు ఆకాశంలో కనిపించే ధనుస్సులోని అందమైన రంగుల్ని పోలి ఉన్నాయి. అవి పరిపూర్ణంగా కలిసి ఉన్నా అందులో ప్రతి వర్ణం ప్రత్యేకంగా ఉంటుంది. అదేవిధంగా మనల్ని పరిశుద్ధపరచడంలో త్రిత్వం యొక్క అనేక కార్యాలు కూడా సమ్మేళనమై ఉన్నాయి. అద్భుతమైన ఈ కార్యానికి త్రియేక దేవుడే కర్త అన్నది సత్యమే అయినప్పటికీ పరిశుద్ధ లేఖనాలు ఈ అంశాన్ని వివరించడంలో చేసిన ప్రత్యేకతలను గమనిస్తే రక్షణ కార్యంలో ఈ ధన్యతకు తండ్రియైన దేవుడే మూలం అని గుర్తించవలసి ఉంది. విమోచనా పథంలో తండ్రియైన దేవుడే కృపయొక్క ఊటగా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన దీవెనలన్నీ ఆయన మంచితనం నుండే పుడతాయి. వాటిని ఆయన తన సార్వభౌమ చిత్తప్రకారం కుమ్మరిస్తాడు. ఈ సత్యం ఎఫెసీ. 1:3 నుండి స్పష్టమౌతుంది. “మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను”.

సంఘాన్ని పరిశుద్ధపరచేవాడు తండ్రియని 1థెస్సలోనిక 5:23 నుండి స్పష్టమౌతుంది. “సమాధాన కర్తయగు దేవుడే మిమ్మును పరిపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా ఉండునట్లు కాపాడబడును గాక”. ఇక్కడ తండ్రి ఈ వరాన్ని, కృపను పరిపూర్ణం చేసేవాడిగా గుర్తించబడ్డాడు. కాబట్టి తిరిగి హెబ్రీ 13:20,21 లో గ్రంథకర్త ఆయనను ఇలా సంభోదించడం చూస్తున్నాం. "గొర్రెల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక!” ఈ పనిని ఆయన తన ప్రజలలో విస్తరించెయ్యాలని గ్రంథకర్త దేవునిని ప్రార్థిస్తున్నాడు. ఈ రెండు వాక్యభాగాలలోను తండ్రియైన దేవునిగురించి సంబోధించబడడం మనం చూడగలం. “యేసు క్రీస్తు శరీరము అర్పింపబడుట ద్వారా ఒకేసారి మనమందరము పరిశుద్ధపరచబడియున్నాము" (హెబ్రీ 10:10). ఇక్కడ సంఘం పరిశుద్ధపరచబడడం దేవుని చిత్తమని, తండ్రి యొక్క ఈ ఉద్దేశాన్ని నెరవేర్చడానికే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడని రాయబడింది.

మనం పరిశుద్ధపరచబడడానికి త్రిత్వంలోని ప్రథమ వ్యక్తే మూలం అనేందుకు మరొక నిదర్శనం యూదా 1లో కనిపిస్తుంది. “తండ్రిచేత పవిత్రపరచబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, పిలువబడిన వారికి” - ఈ మాటల్లో “దేవుని చేత” అని కాకుండా “తండ్రియైన దేవుని చేత” అని రాయబడి ఉండడం గమనించండి. శ్రేష్టమైన ఈ పాఠ్యభాగానికి అర్థం చెప్పేముందు ఇది యోహాను 10:36లో యేసు చెప్పిన మాటలకు దగ్గర సంబంధం కలిగి ఉండటం గమనించాలి. “నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు, తండ్రి ప్రతిష్టచేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవ దూషణ చేయుచున్నావని చెప్పుదురా?” ఇక్కడ మన ప్రభువు తాను త్రిత్వంలో రెండవ వ్యక్తినని చెప్పకుండా దైవమానవ మధ్యవర్తిననీ దాని కొరకే తండ్రిచేత 'పంపబడ్డాననీ' చెబుతున్నాడు. ఆయన 'పంపబడడానికి' ముందు “ప్రతిష్ట చేయబడడం” అనేది ఆయన మానవునిగా పుట్టడానికి ముందు పరలోకంలో జరిగిన ఒక ఒప్పందాన్ని సూచిస్తుంది. జగత్తు పునాది వేయబడక ముందే తండ్రి క్రీస్తును ప్రత్యేకించి ఆయన సంఘానికి శిరస్సు, రక్షకుడు అయ్యేవిధంగా అభిషేకించాడు. ఈ గొప్ప కార్యాన్ని నెరవేర్చేందుకు ఆయనకు ఆత్మను సమృద్ధిగా దయచేసాడు.

ఇప్పుడు తిరిగి చూస్తే అందులో చెప్పిన మాటల క్రమాన్ని ముఖ్యంగా గమనించగలం. అక్కడ 'తండ్రియైన దేవుని చేత పరిశుద్ధపరచబడి' అనే మాటలు 'యేసు క్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి' అనే మాటలకు ముందుగా చెప్పబడ్డాయి. మన ఈ ప్రారంభ పరిశుద్ధత పునర్జన్మకు ముందే లేదా చీకటిలో నుండి వెలుగులోకి పిలువబడడానికి ముందే జరుగుతుంది. కాబట్టి ఇది దేవుని నిత్య నిర్ణయం. మనం పరిశీలిస్తున్న ఈ వచనంలో మూడు విషయాలున్నాయి. వాటిని వెనుక నుండి చూస్తే మొదట, మన "పిలుపు” గురించి - అది మనం మరణంలో నుండి జీవానికి తేబడడం.దానికి ముందు “యేసుక్రీస్తు నందు భద్రం చేయబడడం” గురించి - అంటే శారీరకంగా గర్భంలో మరణించడం లేదా చిన్నతనంలో మరణించడం, యవ్వనంలో నిర్లక్ష్యంగా ఉండడం వల్ల మరణించడం వీటి నుండి భద్రపరచబడటం. "తండ్రియైన దేవుని చేత పరిశుద్ధపరచబడడం” - అంటే మన పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో రాయబడి క్రీస్తు చేత నిత్యమైన ప్రేమతో ప్రేమించబడి ఆయనతో సహవారసులంగా నిత్యం ఉండడానికి ఏర్పరచబడడం అనే ఈ క్రమాన్ని గమనించగలం.

తండ్రిచేత పరిశుద్ధులంగా చేయబడడం అంటే ఆయన మనల్ని నిత్యంగా ఎన్నుకోవడమని అర్థం. ఆ ఎన్నికలోని సంపూర్ణ భావం ఇందులో ఇమిడి ఉంది. ఎన్నిక అంటే కేవలం వ్యక్తులను ఎంచుకోవడం కాదు. యేసుక్రీస్తు నందు మనల్ని ముందే తన పిల్లలుగా దత్తత చేసుకోవడం ఇందులో ఇమిడి ఉంది ( ఎఫెసీ 1:15;). ఇందులో మనం “మహిమ కొరకైన పాత్రలుగా” “ముందుగా సిద్ధపరచబడడం” కూడా ఇమిడి ఉంది (రోమా. 9:21,22;).

మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందడానికి నియమించబడడం ఇందులో ఇమిడి ఉంది. (1థెస్సలో 5:9;) ఆయన మహిమకు కీర్తి కలిగించేలా మనం ఆయన చేత ఏర్పరచబడడం ఇందులో ఇమిడి ఉంది. (ఎఫెసీ 1:12;). మనం తనయెదుట పరిశుద్ధులం నిర్ధోషులం అయ్యుండేలా తీర్చిదిద్దబడడం కూడా ఇందులో ఇమిడి ఉంది. (ఎఫెసీ 1:6;). తండ్రియైన దేవునిచేత ఈ విధంగా పరిశుద్ధపరచబడడం గురించి 2 తిమోతి 1:9లో ఇలా ఉంది. “మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది”

గత అధ్యాయం చివరి మాటల్లో నేను చెప్పిన విధంగా, “పరిశుద్ధపరచబడడం అనేది మొదట దేవుడు తన ప్రజలకు ఏర్పాటు చేసిన ఘనమైన స్థితి”. దేవుని నిత్య సంకల్పం వల్ల ఆయన శరీరంలో అవయవాలుగా ఉండడానికి “జగత్తు పునాది వేయబడక పూర్వము క్రీస్తులో ఏర్పరచబడడమే” ఆ ఘనమైన స్థితి. ఆహా ఇది ఎంత అద్భుతమైన ఘనత! ఇది దేవదూతలకు సైతం ఇవ్వబడని శ్రేష్ఠమైన ఘనత! ఇంత ఆశ్చర్యకరమైన కృప ఎదుట మన దీన మనస్సులు చలిస్తాయి. యోహాను 10:36; కు యూదా1;కి మధ్య ఉన్న సంబంధం ఇక్కడ స్పష్టమౌతుంది. తండ్రి కుమారుని ప్రతిష్ట చేసినప్పుడు ఆయన సంకల్పం అందులో ఉంది. తన కుమారుడు ఒక్కడే కాదు దైవనిర్ణయం చొప్పున పరిశుద్ధులుగా ఉండడానికి ప్రతిష్టింపబడిన ఒక జనానికి శిరస్సుగా ఉండడానికి క్రీస్తు అభిషేకించబడ్డాడు. క్రీస్తు పరిశుద్ధపరచబడినప్పుడు “పరిశుద్ధులని పిలువబడ్డ వారందరూ ఆయనలో నిత్యంగా ప్రత్యేకించబడి తండ్రి ఎదుట ఆయనతో పాటు నిలవడానికి అర్హులుగా ప్రత్యేకించబడ్డారు. ఇది పూర్తిగా తండ్రి తన సార్వభౌమాధికారంతో చేసిన కార్యం.

దేవునికున్న ధన్యతకు దేనినీ చేర్చలేం (యోబు 22:2, 3; యోబు 35:7;). కాబట్టి ఆయన చేసే ఏ కార్యానికీ ఆయనకు వెలుపటి నుండి ప్రేరేపణ ఉండదు. ఆయన సృష్టిని ఉనికిలోకి తేవడానికి ఇష్టపడితే దానికి ఆయన చిత్తమే కారణం. దాని ఉద్దేశం, ఆయన తన మహిమను ప్రదర్శించడమే. ఇది లేఖనాల్లో స్పష్టంగా చెప్పబడింది. “యెహోవా ప్రతి వస్తువును దానిదాని పని నిమిత్తము కలుగజేసెను. నాశనదినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను”. “నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి యుండెను, దానిని బట్టియే సృజింపబడెను.” ( ప్రకట 4:11). “ముందుగా ఆయనకు ఇచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి యుగములవరకు ఆయనకు మహిమ కలుగును గాక ఆమేన్”. (రోమా 11:35-36). కాబట్టి తాను సృష్టించినవారిలో కొందరికి ఘనత మహిమలు ఇవ్వడం, ఆ మహిమ కలిగేలా రక్షణ కొరకు ఏర్పరచబడడానికి దేవుని సార్వభౌమచిత్తమే కారణం. ఆయనకు మహిమ కలగడమే దాని ఉద్దేశం.

ముందు అధ్యాయాల్లో చెప్పిన విధంగా “పరిశుద్ధపరచడం” అంటే ప్రతిష్ఠించడం లేదా పవిత్రంగా ఉపయోగించడానికి ప్రత్యేకపరచడం, కడగడం లేదా శుద్ధి చేయడం, అలంకరించడం, అందంగా చేయడం. ఇంతకూ యూదా1లో ఉన్న ఈ పదం వీటిలో ఏ అర్థంతో వాడబడింది? “తండ్రియైన దేవునిచే ప్రేమించబడి” (పరిశుద్ధపరచబడి కింగ్ జేమ్స్ వర్షన్) అని అక్కడ రాడబడ్డ పదంలో ఆ మూడు నిర్వచనాలు ఇమిడి ఉన్నాయి. మొదటిది ఆయన నిత్య సంకల్పం చొప్పున ఎన్నుకోబడ్డ వారు మిగిలిన వారి నుండి వేరు చేయబడి, కుమారులుగా దత్తత చేయబడేందుకు ముందుగా నిర్ణయించబడ్డారు. రెండవది తాను ఎన్నుకున్న వారు ఆదాములో పతనమవ్వడం, వారి స్వభావం మలినమవ్వడం, వారు చేసిన పాపాల వల్ల అపవిత్రమవ్వడం ఆయన ముందే చూసి, ఒక మధ్యవర్తి వారి కొరకు ప్రాయశ్చిత్తం చేసి, ఆయన రక్తం ద్వారా వారి పాపం శుద్ధి చేయబడాలనీ ముందుగా నిర్ణయించాడు. మూడవది, వారిని క్రీస్తులో ఎన్నుకోవడం ద్వారా ఎన్నిక చేయబడ్డవారు క్రీస్తుతో ఏకమై, ఆయన అర్హత, సంపూర్ణత పొందుకుంటారు. ఆవిధంగా వారు అలంకరించబడ్డారు. దేవుడు వారిని క్రీస్తుకు వేరుగా ఎన్నడూ చూడడు.

“తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు - తనకు కుమారులనుగా స్వీకరించుటకు” (ఎఫెసీ 1:5); ఇక్కడ 'స్వీకరించు' అనే పదానికి గ్రీకు పదం “చారిటూ” దీనికి "యంగ్స్ కంకార్డెన్స్” ప్రకారం దయాన్వితంగా చేయడం లేదా మనోహరంగా చేయడం అనే అర్థం వస్తుంది. ఈ మాట లూకా 1:8;లో మాత్రమే మళ్ళీ కనిపిస్తుంది. అక్కడ దూత మరియతో “దయాప్రాప్తులారా, నీకు శుభం” అని అన్నాడు. దీనికి యంగ్ - దయను ఇవ్వడం, దయాన్వితంగా చూడడం - అనే అర్థం ఇచ్చాడు. ఎఫెసీ 1:6;లో కూడా ఇంతే బలంగానొక్కి చెప్పబడింది. దాని తర్వాత ఉన్న సందర్భాన్ని మనం జాగ్రత్తగా చదివితే ఇది జగత్తు పునాది వేయబడక ముందు జరిగిందని రుజువౌతుంది.

గడచిన అధ్యాయాల్లో చాలాసార్లు నేను చెప్పినట్టు “పరిశుద్ధపరచడం” అనే కార్యం ప్రత్యేకించడం మాత్రమే కాదు కానీ అందులో ఆ విధంగా ప్రత్యేకించిన వ్యక్తిని గాని వస్తువును గాని దేవుడు వాడుకునేందుకు తగినట్టు అలంకరించడం లేదా అందంగా తీర్చిదిద్దడం కూడా ఇమిడి ఉంది. దేవుని నిత్య సంకల్పంలో జరిగింది కూడా ఇదే. ఆయన తాను సృష్టించిన అనేక ప్రాణుల నుండి కొందర్ని ఎంచుకోవడం, వారిని ప్రత్యేకపరచడం మాత్రమే కాకుండా, ఆయన తన ప్రియుని యందు వారిని దయాన్వితంగా తీర్చిదిద్దాడు. ఇలా ఎన్నిక చేసిన వారిని క్రీస్తు శరీరంగా, ఆయన వధువుగా చేసి ఆయనతో ఐక్యపరిచాడు. ఇలా ఏకమవ్వడం వలన క్రీస్తుకుగల మనోహరత్వం ఆయన ప్రజలకూ సంప్రాప్తిస్తుంది. ఇందుచేతనే క్రీస్తు “నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివి” (యోహాను 17:23) అని చెబుతున్నాడు. ఈ అద్భుతమైన, మహిమాయుక్తమైన, ఉత్తమమైన సత్యాన్ని మనం అర్థం చేసుకోగలిగేలా పరిశుద్ధాత్ముడు బలహీనమైన మన జ్ఞానాన్ని వెలిగించును గాక. “తండ్రియైన దేవుని చేత పరిశుద్ధపరచబడి” క్రీస్తు శరీరంగా, వధువుగా ఉండడం కోసం ఆయనచేత ప్రత్యేకించబడి, ఆయన యందు “మిగుల దయనొంది” పరలోక సింహాసనం ఎదుట ఆయన పరిశుద్ధత పొంది నిలిచెదం గాక.

 

పరిశుద్ధపరచబడడాన్ని గురించిన సిద్ధాంతం

12. దాన్ని సమకూర్చేవాడు (1 భాగం)

మనం ఇప్పుడు ఈ అంశంలో అతి ప్రాముఖ్యమైన, ధన్యకరమైన భాగాన్ని చేరుకున్నాం. ఇది అతి ప్రాముఖ్యమైనదే‌ అయినప్పటికీ క్రైస్తవ లోకంలో అనేకులు దీనిని అతి స్వల్పంగా అర్థం చేసుకుంటున్నారు. విశ్వాసికి వెలుపల‌ ఉన్న పరిశుద్ధత, అంటే క్రీస్తునందున్న విశ్వాసులందరికీ క్రీస్తులో ఉన్న సంపూర్ణమైనదీ, కొల్పోలేనటువంటిదీ అయినటువంటి పరిశుద్ధత కోణం వైపుకు ఇప్పుడు తిరుగుతున్నాం. ఇప్పుడు మనం పరిశీలించే పరిశుద్ధత మనలో ఉండే స్వభావం లేదా గుణానికి సంబంధించింది కాదు. అది మన అనుభవానికి లేదా మనం సాధించే స్థితికి సంబంధించింది కూడా కాదు. కానీ దానిని పూర్తిగా మనకు వెలపల ఉన్న - అనగా క్రీస్తునందు మనకున్న స్థితి మరియు అర్హత కోణం నుండి ధ్యానించబోతున్నాం. దేవుడు క్రీస్తునందు పరలోక విషయాలలో మనకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలలో ఒకటి (ఎఫెసీ 1:3;) మనం ఇక్కడ ధ్యానించబోతున్నాం. ఇది ఆయన రక్తం కార్చడంవల్ల తక్షణమే కలిగిన ఫలితం “దేవుని పరిశుద్ధతతో” మనం ఏకమయ్యేందుకు కలిగిన ఫలితం . సంపూర్ణమైన ఆయన అర్పణ మనల్ని దేని కొరకు, దేని నుండి పరిశుద్ధపరిచిందో అది ఇప్పుడు ధ్యానించబోతున్నాం.

పాపం కలిగించే భయంకర ఫలితాలన్నిటిలో ముఖ్యమైనవి రెండున్నాయి. మొదటిగా అది దేవునినుండి మనల్ని వేరుచేస్తుంది. రెండవదిగా మనం ఆయనచేత శిక్షపొందేలా చేస్తుంది. పాపం, తప్పకుండా పాపిని దేవుని పరిశుద్ధ స్థలం నుండి వేలివేసి ఆయన ధర్మశాస్త్ర న్యాయపీఠం ఎదుట దోషిగా నిలబెడుతుంది. దీనికి భిన్నంగా క్రీస్తు బలియాగం కొనితెచ్చే ఫలంలోనూ, ఫలితాలన్నిటిలోనూ ముఖ్యమైనవి రెండున్నాయి. అవి నీతిమంతునిగా తీర్చడం, పరిశుద్ధపరచడం. క్రీస్తు బలియాగం ఆయన ప్రజల పాపాలను “తీసివేసి” (హెబ్రీ. 9:26;) వాటిని “అంతం చేయడం” వల్ల (దానియేలు 9:24;) వారు శిక్షనుండి విడుదల పొందడమే కాక, కడుగబడ్డ వారిగా దేవుణ్ణి ఆరాధించడానికి ఆయనను సమీపించే యోగ్యత కూడా పొందుతారు. పాపం మనల్ని దోషులుగా చెయ్యడమే కాకుండా అపవిత్రపరుస్తుంది కూడా. కాబట్టి క్రీస్తు రక్తం క్షమాపణను సంపాదించడమే కాకుండా శుద్ధి కూడా చేస్తుంది. ఈ రెండూ ఇంత సామాన్యం, స్పష్టం మరియు నిశ్చయమైన‌ సత్యాలైనప్పటికీ క్రైస్తవులు మొదటి భాగాన్ని గ్రహించినంత సులభంగా రెండవ భాగాన్ని గ్రహించలేకపోతున్నారు.

మనం మొదట క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు “మనపాప భారం తొలగిపోయినప్పుడు” (ఒక కీర్తన చెప్పినట్లు) “దినమంతా సంతోషం” పొందుతామని తలిచాం. దేవుని క్షమాపణ పొంది, నూతన జన్మ ద్వారా ఆయన కుటుంబంలో చేరి, క్రీస్తుతో నిత్యసంతోషంలో తేలియాడతామని అనుకున్నపుడు మన ఆనందాన్ని వమ్ము చేయగలిగింది ఏముంది? అయితే ఎంతో కాలం గడవకముందే, మనం ఇంకా పాపులమని, పాపలోకంలో జీవిస్తున్నామని కనుగొన్నాం . కాలం గతిస్తున్న కొద్దీ మనలో నివసిస్తున్న పాపపు ఊట వెలుపలికి ప్రవహింపచేసే అపవిత్రపు ధారలచేత మన ఆలోచనల్ని, మాటల్ని, క్రియల్ని మలినపరుస్తున్నట్టుగా గుర్తించగలిగాం. దీనివల్ల వేదన పొంది 'నావంటి అపవిత్రమైన మనుషులు పవిత్రుడైన దేవుణ్ణి ఎలా ప్రార్థించి, పూజించి, సేవించగలరు?' అనే ప్రశ్న తలెత్తింది. ఈ ప్రశ్నకు ఆయన వాక్యం మాత్రమే తగిన జవాబు ఇవ్వగలదు.

రోమీయులకు రాసిన పత్రికలో నీతిమంతునిగా తీర్చబడడాన్ని గురించి వివరంగా చెప్పబడిందని మనకు తెలుసు. ఆ పత్రికలో ప్రత్యేకంగా తన పవిత్రమైన న్యాయపీఠంపై కూర్చున్న న్యాయాధిపతిగా దేవుని గురించి ఆలోచించాలని మనకు బోధించబడింది. దానికి తగినట్లే ఆ పత్రికలో ఉపయోగించిన పదాలన్నీ చట్టపరమైనవి. ఆయన న్యాయస్థానంలో మనకు ఆయనతో ఉన్న సంబంధం, లేదా ఆయనకు మనతో ఉన్న సంబంధాన్ని గురించి అవి ప్రస్తావించాయి. అక్కడ తలెత్తే గొప్ప ప్రశ్న ఏమిటంటే, నేరస్థులకు నేరం ఆపాదించబడకుండా నీతిమత్వం ఆపాదించబడే సంబంధం ఆయనతో ఎలా కలుగుతుంది?

రోమీయులకు రాసిన పత్రికలో దేవుణ్ణి తన న్యాయస్థానంలో ఉన్న వానిగా చూసినట్లే హెబ్రీపత్రికలో దేవుణ్ణి తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నవాడిగా చూస్తాం. రోమీయులకు రాసిన పత్రికలో “నీతిమంతులుగా తీర్చబడడం”అనే పదానికి ఉన్న అదే ప్రాధాన్యత హెబ్రీ పత్రికలో “పరిశుద్ధపరచబడడం” అనే పదానికి ఉంది. "నీతిమంతునిగా తీర్చబడడం” అనేది న్యాయస్థానంలో మనకు దేవునితో ఉన్న సంబంధాన్ని ఎలా వర్ణిస్తుందో అదే విధంగా పరిశుద్ధపరచడం అనేది ఆలయానికి సంబంధించిన పదమై ఆయన ఆరాధన ఆవరణంలో మనకు దేవునితో ఉన్న సంబంధాన్ని వర్ణిస్తుంది. దేవునికి అంగీకారమయ్యే విధంగా ఆయనను సేవించడం లేదా ఆరాధించడం కంటే ముందు ఆయన న్యాయస్థానం, ఆయన ఆలయ ఆవరణాలు ఆదేశించేవి పూర్తిగా నెరవేరాలని ఆయన పరిశుద్ధత కోరుతుంది. దేవుని న్యాయస్థానంలో క్షమాపణ పొందకుండా నేరస్థునిగా పరిగణించబడ్డవాడు లేదా దేవుని ఆలయంలో తన దోషపు మాలిన్యంగలవాడు, దేవుని సేవకుల మధ్య నిలిచే అనుమతిని పొందుకోలేడు. పూర్తిగా శుద్ధుడు కాని కుష్టురోగి గుడారంలో సేవ చేయడానికి అనుమతించబడలేడు. ప్రాయశ్చిత్త బలిచేత కడగబడని ఒక్క మరక మిగిలి ఉన్నా అతడు దైవసన్నిధిలో నిలబడలేడు.

మనం దేవుని న్యాయస్థానంలో 'నేరస్థాపన' లేకుండా నిలవాలి. ఆయన ఆరాధనా అవరణంలో “నిష్కళంకంగా” నిలవాలి. వేరే విధంగా చెప్పాలంటే దేవుణ్ణి ఆరాధించడానికి లేదా సేవించడానికి ముందు మనం సంపూర్ణంగా “నీతిమంతులుగా తీర్చబడి” పరిపూర్ణంగా “పరిశుద్ధులంగా” చేయబడాలి. ఈ అర్థంతో వాడబడ్డ పరిశుద్ధతను నీతిమంతునిగా తీర్చడానికి భిన్నంగా చూడకూడదు. ఒక్కటి సంపూర్ణమైందనీ, మరొకటి అసంపూర్ణమైందనీ‌ లేదా పురోగమించేదనీ ఆలోచించకూడదు. విశ్వాసికి ఈ రెండూ సంపూర్ణమైనవే. రోమా 5 లో “నీతిమంతులుగా తీర్చబడడం” సంపూర్ణంగా జరిగిన అదే క్షణంలో “పరిశుద్ధపరచబడడం” సమానంగా సంపూర్ణంగా జరిగించాడు. ఆయన పరిశుద్ధత మన నుండి కోరేది సంపూర్ణమయ్యేలా ఈ రెండూ అవసరమై ఉన్నాయి. దేవుని పరలోక ఆలయంలో మనం ఆయనను ఆరాధించి సేవించడానికి ఇవి అవసరమే, ఎందుకంటే ఆయన ఉగ్రత తీరి మనయందు ఆయన తృప్తిపడేవరకూ పరలోక ప్రవేశం ఎవరికీ దొరకదు.

హెబ్రీ పత్రిక తొమ్మిది, పది అధ్యాయాల్లో యేసు రక్తం విశ్వాసులను పూర్తిగా పరిశుద్ధపరుస్తుందనే గొప్ప అంశం ప్రధానంగా ప్రస్తావించబడింది . ఎద్దుల యొక్క రక్తం చేత ప్రోక్షించబడ్డవారు పరిశుద్ధగుడారంలో ప్రవేశించడానికి అర్హత పొందారు కానీ ఆ అర్హత నిత్యం ఉండేది కాదు. అది ఎంత త్వరగా లభిస్తుందో ఒక పాపం చేయగానే అంత త్వరగా నశించిపోతుంది. కాబట్టి పదే పదే అర్పణలిచ్చి రక్తప్రోక్షణ పొందవలసిన అవసరత ఉండేది. కాబట్టి మరలా మరలా అర్పణలిచ్చి, మరలా మరలా ప్రోక్షింపబడడం అవసరం. అయితే ఆ విధంగా ఎన్నిసార్లు చేసినా అవి దేవుని చేత నిత్యంగా అంగీకరించబడవు. గుడారం, మరియు దానికి సంబంధించిన సేవలు వట్టి ఛాయలు మాత్రమే. “కోడెలయొక్క మేకలయొక్క రక్తప్రోక్షణ వల్ల తాత్కాలికంగా గుడారంలో ప్రవేశించడానికి అర్హత లభిస్తుంది. కాబట్టి క్రీస్తు రక్తం, ఒక్కసారే అర్పించబడినప్పుడు, దానితో ప్రోక్షించబడ్డ విశ్వాసులందరూ తాత్కాలిక ప్రవేశం కాకుండా దేవుని సన్నిధిలో నిత్యం అంగీకరించబడే‌ విధంగా పరలోక నిత్యవారసులైన పరిశుద్ధులుగా చేయబడతారు.” (బి. డబ్ల్యు. న్యూటన్).

“యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము” (హెబ్రీ 10:10). ధన్యకరమైన ఈ మాటల్లో పరిశుద్ధాత్మ క్రైస్తవుల్లో చేసే దేనిగురించీ ప్రస్తావించబడలేదు కానీ క్రీస్తు వారి కొరకు సంపాదించింది మాత్రమే వివరించబడింది. క్రీస్తుతో మనం ఏకమైనపుడు కలిగే ఫలితం మాత్రమే ఇక్కడ ప్రస్తావించబడింది. కల్వరిలో జరిగిన బలియాగాన్ని బట్టి ప్రతీ విశ్వాసి దేవుని న్యాయస్థానంలో నీతిమంతునిగా లెక్కించబడడమే కాకుండా ఆయన మందిరావరణంలో సంపూర్ణ పరిశుద్ధతతో నిలబడతాడని ఈ మాటలు నొక్కి చెబుతున్నాయి. ప్రశస్తమైన గొర్రెపిల్ల రక్తం నరకం నుండి విడుదల ఇవ్వడమే కాకుండా పరలోకంలో ప్రవేశించేందుకు తగిన వారిగా కూడా చేస్తుంది.

క్రీస్తు విమోచన కార్యం ద్వారా సంఘం ప్రత్యేకించబడి, దేవునిచేత ప్రతిష్టించబడి, అంగీకరించబడుతుంది. ఇందులో బహుబలహీనుడైన, ఎంతమాత్రం ఉపదేశం పొందని విశ్వాసికూడా, మొదట క్రీస్తు నందు విశ్వసించిన క్షణంలోనే దేవుని యెదుట మహిమాయుక్తమైన స్థితిలో పరలోకంలో నివసించేంతగా పూర్తిగా పరిశుద్ధపరచబడ్డాడనే సత్యం ఉంది. అప్పుడు అతనుండే స్థలం, పరిస్థితి ఇప్పటికీ భిన్నంగా ఉండడం సత్యమే అయినప్పటికీ పరలోక ప్రవేశానికి అతనికి ఉన్న అర్హత, పరిశుద్ధుని సన్నిధిలో నిలిచే స్థితి ఈనాడు ఉన్న స్థితికన్నా మెరుగ్గా ఉండదు. అతడు తండ్రి ఇంట ప్రవేశించడానికి అర్హత నిచ్చేది క్రీస్తుతో అతనికి ఉన్న సంబంధం మాత్రమే. ఈనాడు ఆయనను సమీపించడానికి అర్హత నిచ్చేది కూడా క్రీస్తుతో అతనికి ఉన్న సంబంధం మాత్రమే. విశ్వాసి మరణానికిలోనైన శరీరం - అంటే పతనస్వభావాన్ని కలిగి ఉంటాడు అనడం నిజమే అయినప్పటికీ, అది అతని సంపూర్ణస్థితిని, క్రీస్తునందు అతనికి ఉన్న పరిపూర్ణతను, అతడు దేవునిచేత అంగీకరించబడి నీతిమంతునిగా తీర్చబడి పరిశుద్ధపరచబడిన వాస్తవాన్ని ఏమాత్రం ప్రభావితం చెయ్యదు. అయితే ఇంతకు ముందు చెప్పినవిధంగా నీతిమంతునిగా తీర్చబడ్డాను అని నమ్మడం లేదా నీతిమంతునిగా తీర్చబడడం అనే సత్యాన్ని అర్థం చేసుకోవడం, ఇప్పుడు సంపూర్ణంగా పరిశుద్ధపరచబడ్డామనే సత్యాన్ని అర్ధం చేసుకోవడం కంటే చాలా సులభం. ఈ కారణం వల్ల మనం చర్చిస్తున్న ఈ ముఖ్యాంశంలో నెమ్మదిగా ముందుకు వెళ్దాం. “వారును సత్యమునందు ప్రతిష్ట చేయబడునట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసికొనుచున్నాను.” ఇక్కడ తన్నుతాను ప్రతిష్టించుకున్నానని చెప్పినప్పుడు ఆయన ఉద్దేశమేంటి? ఆయన అనుభవాత్మకంగా ఇది చెప్పి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన తన వ్యక్తిత్వంలో “దేవుని పరిశుద్ధుడు”గా ఉన్నాడు, కాబట్టి తన పరిశుద్ధతను ఎక్కువ చేసుకోవడం కానీ, మెరుగుపరచుకోవడం కానీ సాధ్యం కాదు. అయితే ఆయన తన మధ్యవర్తిత్వం గురించి ఈవిధంగా చెబుతుండవచ్చు.

“వారికొరకు నన్ను నేను ప్రతిష్ట చేసికొనుచున్నాను” అని క్రీస్తు చెప్పినప్పుడు దేవుని ధర్మశాస్త్రాన్ని, న్యాయాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి పాపం నిమిత్తం తన్నుతాను బలి చేసుకునే కార్యాన్ని పూర్తిగా నెరవేర్చడానికి తన్నుతాను ప్రతిష్ట చేసుకుంటున్నానని సూచించాడు. తన సంఘం కొరకు తండ్రియెదుట, వారికి బదులుగా శాంతికరమై బలిపీఠాన్ని ఎక్కేందుకు క్రీస్తు తన సంసిద్ధతను తెలియచేస్తున్నాడు. ఆయన “ఇతరుల కొరకు” తన్నుతాను ప్రతిష్ట చేసుకుంటున్నాడు. కృపాసహితమైన ఎన్నికలో ఉన్న వారి కొరకు ఆయన ఈ కార్యం నెరవేర్చాడు. వారి పక్షంగా వారి మేలు కొరకు మధ్య వర్తిత్వం చేసేందుకు ఆయన తన్నుతాను ప్రత్యేకపరచుకున్నాడు. తాను చేసిన బలియాగం యొక్క ఫలాన్ని వారు అనుభవించాలని దీనిని చేశాడు. క్రీస్తు తన ప్రజలు దాని ఫలితాలను అనుభవించేందుకు తన్ను తాను దేవునికి అర్పించుకున్నాడు.

క్రీస్తు తన్నుతాను పరిశుద్ధపరచుకోవడంలోని ప్రత్యేక ఉద్దేశం అక్కడే చెప్పబడింది. “వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడుటకు”. ఈ తర్జుమా మూలంలో ఉన్న అర్థాన్ని సరిగా చెప్పడం లేదు. దాని అసలు అర్థం ఈ రీతిగా ఉంటుంది- “వారు సత్యముగా ప్రతిష్ట చేయబడుటకు”. దీని అర్థమేమిటంటే - వారు నిజంగా, సత్యంగా పరిశుద్ధపరచబడేందుకు. ఇది మోషేకాలంలో సంస్కార ఆచారాల ద్వారా పొందిన పరిశుద్ధతకు భిన్నమైంది. "సత్యమందు” అనే మాటల కొరకు యోహాను 4:24;, కొలొస్స 1:6;, 1యోహాను 3:18; పోల్చి చూడండి. క్రీస్తు తన్ను తాను పరిశుద్ధపరచుకుని - దేవునికి పూర్తిగా దహనబలిగా అర్పించుకోవడం వల్ల ఆయన ప్రజలు సంపూర్ణంగా పరిశుద్ధులై వారి పాపాలు పరిహరించబడి,సమస్త మలినం నుండి కడగబడ్డారు. అంతేకాదు, ఆయన అద్భుతమైన నీతి వారికి ఆపాదించబడడం వల్ల వారు దేవుని చేత అంగీకరించబడి ఆయన సన్నిధికి చేరి, ఆయనను ఆరాధించే అర్హతను పొందారు.

“ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు” ( హెబ్రీ 10:14) ఇది వారిలో పరిశుద్ధాత్మ పని చేయడం వల్ల కాకుండా క్రీస్తు తనను తాను ప్రతిష్టించుకోవడం ద్వారా వారి కొరకు చేసిన కార్యం. క్రీస్తులోనూ ఆయన ద్వారానూ వచ్చిన ఈ పరిశుద్ధతే క్రైస్తవులను యాజకసమూహంగా చేసి, కడగబడినవారిగా ఆయనను సమీపించి ఆరాధించే అర్హతను ఇచ్చింది. దేవుని చేత నియమించబడిన యూదుల పద్ధతిలో దేవుణ్ణి చేరడం అంటే రక్తం ద్వారా ఆయనను సమీపించి ఆరాధించడమే కేంద్రం (హెబ్రీ 9:13). క్రీస్తు తన సంఘానికి సంపాదించి ఇచ్చిన దానికి ఇది ఛాయగా ఉండింది. తమతో పనిలేకుండా విశ్వాసులు ఇంతకు పూర్వమే పరిశుద్ధులుగా చేయబడ్డారు. ఇది రక్షకుని బలివల్ల కలిగిన తక్షణ ఫలితం. క్రీస్తు యాజకునిగా తన్నుతాను సమర్పించుకోవడం వల్ల వారు యాజకులుగా దేవుని సమీపించగలరు. దీని వల్ల మాత్రమే మనం “అతిపరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు ధైర్యము కలిగియున్నాము” (హెబ్రీ 10:20).

దేవుని యెదుట నీతిమంతులుగా తీర్చబడడానికి తాము క్రీస్తు వైపు మాత్రమే చూడాలని స్పష్టంగా గ్రహించిన క్రైస్తవులెందరో దేవుని ముందు ఆయనే వారి పరిశుద్ధతని తరచుగా గ్రహించలేకపోతున్నారు, ఇలా ఉండకూడదు. ఎందుకంటే లేఖనాలు ఈ రెండిటి గురించి అతి స్పష్టంగా చెబుతున్నాయి. నిజంగా ఇవి విడదీయరానివిగా లేఖనంలో కలపబడ్డాయి. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. - “అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను.... దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయెను” (1కొరింథీ 1:31). ఈ వచనానికి "hodge" తన వ్యాఖ్యానంలో ఇచ్చిన నిర్వచనాన్ని, అతని వంటి ఆలోచనగల మిగిలిన వారిచ్చిన అర్థాన్ని అంగీకరించకూడదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న “పరిశుద్ధపరచబడడం” అనేది పరిశుద్ధత యొక్క ఆత్మగా క్రీస్తు ఆత్మ ఆయన ప్రజల్లో నివసించి ఆయన రూపంలోకి వారిని మార్చడమని అర్థం చెబుతున్నారు. అయితే ఈ వచనం క్రీస్తు ద్వారా మనం చేయబడిన దాని గురించి కాక క్రీస్తు మనకొరకు చేసినదానిని గురించి మాట్లాడుతుంది. ఈ వ్యత్యాసం యథార్థమైనది మరియు కీలకమైనదై ఉంది. దీనిని నిర్లక్ష్యం చెయ్యడం కాని కలవరపడడం కాని చేసే వేదాంతి గొప్ప పొరబాటు చేస్తున్నాడు.

సిలువ వేయబడిన క్రీస్తు (1కొరింథీ.1:30 ని 1 కొరింథీ 1:17,18,23 సందర్భం వెలుగులో చూడండి) దేవుని మూలంగా మనకొరకు నాలుగు విషయాలుగా చేయబడ్డాడు. సరిగ్గా అదేవిధంగా దేవుడు ఆయనను (క్రీస్తును) మనకోసం పాపంగా చేసాడు (2కొరింథీ 5:21) అనగా ఆపాదితంగా ఇలా చేసాడు. మొదటిగా, క్రీస్తు మనతో నిమిత్తం లేకుండా మనకోసం జ్ఞానంగా చేయబడ్డాడు ఎందుకంటే “ఆయన యందే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు గుప్తములైయున్నవి” (కొలస్సీ 2:3). పరిశుద్ధాత్మ ద్వారా మనకు రక్షణార్థమైన జ్ఞానం సత్యమే ఆయినా మనం ఉండవలసినంత జ్ఞానులుగా ఉండడం లేదు. (1కొరింథీ 8:2 చూడండి).

అయితే మనలో ఉండాలని దేవుడు కోరిన జ్ఞానమంతా, క్రీస్తునందు మనకుంది. రెండవదిగా మనతో నిమిత్తం‌ లేకుండానే ఆయన “మనకొరకు నీతియాయెను”. కాబట్టి ఆయన తానే “మనకు నీతియగు యెహోవా” (యిర్మియా 23:6;) “యెహోవా యందే నా నీతి బలాలు ఉన్నాయి” (యెషయా 45:24;) అని విశ్వాసి చెప్పగలడు. నాకు వ్యతిరేకంగా ధర్మశాస్త్రం గొంతెత్తినపుడు క్రీస్తు తన విధేయత ద్వారా నా పక్షంగా అన్ని నిబంధనలను నెరవేర్చాడని ఆయన తట్టుకు చూడగలను. మూడవది, “క్రీస్తు మనతో నిమిత్తం లేకుండా మనకొరకు పరిశుద్ధత అయ్యాడు". సిలువపై ఆయన చేసిన కార్యం మనకు ఆపాదించబడడం వల్ల పాపం నుండి విడిపించబడి గతంలో దేవునికి దూరస్థులుగా ఉన్న మనం ఇప్పుడు ఆయనను చేరగలం. కొడెల యొక్క మేకల యొక్క రక్తాన్ని ప్రోక్షించడం వల్ల ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధజనమై యెహోవా దేవుణ్ణి ఆరాధించే అర్హతను పొందినట్లైతే క్రీస్తు యొక్క విలువైన రక్తం మనల్ని ఎంత అధికంగా పరిశుద్ధపరచి మనం దేవుణ్ణి సమీపించి ఆరాధించే అర్హతను ఇవ్వగలదు? ఈ పరిశుద్ధత మనలో స్వతః సిద్ధంగా ఉన్నదికాదు కానీ మనమాయన యందు విశ్వాసం ఉంచగానే క్రీస్తునందు మనకిది కలుగుతుంది. నాల్గవది, 'క్రీస్తు మనతో నిమిత్తం లేకుండా మనకొరకు విమోచనం ఆయ్యాడు. ఆయన మన విమోచకుడు, విమోచన అయ్యున్నాడు. “ఆయన యందు మనము విమోచన కలిగి యున్నాము” (ఎఫెసీ1:7). మనల్ని మనం విమోచించుకోగలిగే శక్తి గలవారంగా చేయడం ద్వారా కాకుండా క్రీస్తు “ఆయనే మనకు విమోచనం అవ్వడం ద్వారా మనల్ని విమోచించాడు” ఆ విలువను ఆయనే చెల్లించాడు.

1కొరింథీ 1:30 మనం క్రీస్తునందు సంపూర్ణులమై ఉన్నామని ప్రకటిస్తుంది. ధర్మశాస్త్రం అది కోరినదంతటినీ మనపక్షాన మన పూటకాపునందు పొందింది. క్రీస్తునందు (ఆయనతో ఏకమైన వారం) కాకుండా మనం ఉన్నవారం ఉన్నట్టే చూడబడితే మనపై వెయ్యి నేరాలు "మోపబడియుండేవి". మనం దేవుని చిత్తం ఎరుగని వాళ్ళమని నేరం మోపబడొచ్చు. అయితే దానికి తగిన జవాబు "క్రీస్తే మన జ్ఞానం”. మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డళ్ళాంటివనే నేరం మోపబడొచ్చు అయితే "క్రీస్తే మన నీతి” అనేది దానికి తగిన జవాబు. మనం చేయవలసినవి చేయక చేయకూడనివి చేస్తున్నామనీ దానివల్ల దేవుని సన్నిధిలో నిలవడానికి అయోగ్యులమనీ నిందారోపణ చేయబడొచ్చు. కానీ క్రీస్తే మన పరిశుద్ధత అనేది దీనికి తగిన జవాబుగా ఉంది.

1కొరింథీ 1:30 లో ఉన్న‌ నాలుగు విషయాలు ఒక విభాగానికి చెందినవి.‌ కాబట్టి ఇందులో జ్ఞానం మరియు పరిశుద్ధత, పరిశుద్ధాత్మ మనలో‌ జరిగించే కార్యాలనీ, “నీతి” మరియు “విమోచన” క్రీస్తు మనకొరకు జరిగించే కార్యాలని విడదీసి నిర్వచించకూడదు. ఈ నాలుగింటినీ మనలో జరిగే కార్యాలుగా అయినా వివరించాలి లేదా మనకొరకు మనతో నిమిత్తం లేకుండా జరిగించబడిన కార్యాలుగానైనా నిర్వచించాలి. క్రీస్తు మన 'పరిశుద్ధత' అయ్యున్నాడని ఇక్కడ చెప్పబడి ఉంది. ఏ విధంగా ఆయన మన నీతి, మరియు విమోచన అయ్యున్నాడో అదే విధంగా ఆయన మన పరిశుద్ధత కూడా అయ్యున్నాడు. ఇక్కడ చెప్పబడిన పరిశుద్ధత ఆయన మనలో కలిగించిన కార్యం అని చెబితే, ఇక్కడ చెప్పిన నీతి మరియు విమోచన కూడా మనలో ఆయన జరిగించే కార్యాలే అని వివరించవలసి వస్తుంది . అయితే ఇలాంటి ఆలోచనను "Hodge" గారు త్రోసిపుచ్చుండేవాడు. క్రీస్తు మనలో కలిగించే నీతి వల్లకాక ఆయనే మనకొరకు సాధించిన నీతి వల్ల, ఇక్కడ ఆయన మన నీతి అని పేర్కోబడ్డాడు. అదే విధంగా ఆయనే మన పరిశుద్ధత అని పేర్కోబడినప్పుడు అది మనయందున్న పరిశుద్ధతను సూచించడం లేదు. ఆయనలో ఉన్న పరిశుద్ధతను సూచిస్తుంది. అది అసంపూర్ణమైనదీ, పురోగమించేదీ కాదు. అది సంపూర్ణం, నిత్యమూ అయిన పరిశుద్ధత. క్రీస్తు బలియాగం యొక్క పవిత్రతను, ఔన్నత్యాన్ని మనకు ఆపాదించడం ద్వారా దేవుడు క్రీస్తును మన పరిశుద్ధతగా చేసి ఉన్నాడు. క్రీస్తు తన రక్తం ద్వారా మనం దేవుణ్ణి సమీపించేట్టు చేసాడు (ఎఫెసీ 2:13;). ఇది పరిశుద్ధాత్మ తన సార్థకమైన పిలుపు ద్వారా మనలను ఆయన సమీపానికి తీసుకురాకముందే ముందే జరిగింది (1పేతురు 2:9;). మొదటిది రెండవ దానికి పునాది. నూనె రక్తం పై పోయబడాలి అనేపాత నిబంధన ఆచారం దీనికి ఛాయగా ఉంది. దీని వల్లే మనం “క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులమని పిలువబడ్డాం” (1కొరింథీ 1:2;) “ఉన్నతమైన లేదా విజయవంతమైన జీవితాన్ని గురించి మాట్లాడే వారి మాటలకు, దానిని గురించి రాసే వారి రాతలకు ఇది ఎంత భిన్నంగా ఉంది. ఎంత శ్రేష్టంగా ఉంది. క్రీస్తు మనకొరకు ఇది, లేక అది చేసే సమర్థుడని కాదు కాని ప్రతి క్రైస్తవుడూ ఇంతకుముందే “క్రీస్తు నందు సంపూర్ణంగా పరిశుద్ధపరచబడ్డాడు”. అజ్ఞానం వల్ల‌ దీనిని నేను ఎరుగలేకపోయినా ఈ సత్యం మారదు. అంతేకాదు దీనిని స్పష్టంగా మనం ఎరుగలేకపోయినా, దీనిని గట్టిగా పట్టుకునే విశ్వాసం మనలో లేకపోయినా ఆ సత్యానికి ఏ విధంగాను దానికి భంగం కలగదు. నా అనుభూతులతో దానికి నిమిత్తం లేదు. దానిని దేవుడు చెప్పాడు, దేవుడే చేస్తాడు. ఏదీ దానిని మార్చజాలదు.

 

పరిశుద్ధపరచబడడాన్ని గురించిన సిద్ధాంతం

13. దాన్ని సమకూర్చేవాడు (2వ భాగం)

విశ్వాసి పరిశుద్ధపరచబడడం గురించి లేఖనాలు వివిధ కోణాల నుండి మాట్లాడుతున్నాయని అందులో ముఖ్యమైనది - పరిశుద్ధపరచబడడం దేవుని నిత్య సంకల్పమనీ మనం నిందారహితులంగానూ పరిశుద్ధులంగానూ ఉండడానికి ఆయన మనల్ని క్రీస్తులో ఎన్నిక చేసాడనీ (ఎఫెసీ 1:6;) గడచిన ఆధ్యాయాల్లో తెలియచేసాను. హెబ్రీ10:10;ప్రారంభంలో దీని గురుంచి "ఆ చిత్తాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నామ” ని చెప్పబడింది. ఇది తండ్రియైన దేవుని ద్వారా మనకు కలిగిన పరిశుద్ధత (యూదా1) దీని గురించి "దానికర్త" అనే అధ్యాయంలో (11వ అధ్యాయం) మనం పరిశీలించాం. రెండవదిగా దేవుని ఈ ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఆయన నిత్య సంకల్పాన్ని సంపూర్ణం చేస్తూ క్రీస్తు తన బలియాగం చేత మనల్ని వాస్తవంగా పరిశుద్ధపరిచాడు. దీని గురించి “కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకై" అని చెప్పబడింది (హెబ్రీ 13:12) దానినే మనమిప్పుడు పరిశీలిస్తున్నాం. మూడవదిగా - ఈ పరిశుద్ధతను పరిశుద్ధాత్ముడు వ్యక్తులకు ఆపాదిస్తాడు. ఇలా పరిశుద్ధపరచిన వారిని ఆయన పాపంలో మరణించిన వారిలో నుండి వేరు చేసి, నూతన జన్మ ద్వారా వారికి క్రొత్త స్వభావాన్ని ఇస్తాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే పరిశుద్ధత.

నాల్గవది - క్రైస్తవుని స్వభావంలోనూ, నడతలోను ఈ ఫలాలు కనబడతాయి. అందువల్ల అతడు దుష్టునియందున్న లోకం నుండి వేరుగా జీవిస్తాడు. నేరుగా ఇది పరిశుద్ధాత్ముడు అతనిలో పనిచేయడం వల్ల, వాక్యాన్ని అతనికి అన్వయించడం ద్వారా కలుగుతుంది. దీనివల్ల అతడు విశ్వాసం ద్వారా క్రీస్తు ప్రశస్త రక్తం చేత దేవుని కొరకు తాను ప్రత్యేకపరచబడ్డాడని గ్రహిస్తాడు. అయినప్పటికీ అతని బాహ్య అంతరంగిక నడత పరిపూర్ణంగా ఉండదు. ఎందుకంటే అతనికి ఆత్మ సంబంధమైన నూతన స్వభావం ఉన్నప్పటికీ శరీరం మాత్రం మార్పులేక ఈ లోక యాత్ర ముగిసే వరకూ అలాగే ఉంటుంది. అతని అంతరంగంలో జరుగుతున్న పోరాటం గురించి అతని చుట్టూ ఉన్న వారికి ఏమీ తెలియకపోవచ్చు. వారు బైటికి కనపడే అతని అపజయాలనే చూస్తారు తప్ప రహస్యంగా అతడు దేవున యెదుట పెట్టే మూల్గులను వినకపోవచ్చు. అతడు ఏమౌతాడో ఇంకా ప్రత్యక్షబడలేదు కానీ ఇప్పుడు తనలో ఉన్న పాపం వల్ల అసంపూర్ణుడుగా ఉన్నప్పటికీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనవలే ఉంటాము, ఎందుకంటే ఆయన ఉన్నట్టుగానే మనమాయనన్ని చూస్తామ”నే వాగ్దానం ఖచ్చితమైంది.

ఈ నాల్గవ కోణం నుండి చూసినప్పుడు ఆచరణాత్మకమైన మన పరిశుద్ధత అసంపూర్ణమైనదైనా ఇది పైన చెప్పినట్టుగా మన పరిశుద్ధత పూర్తిగా నిశ్చయమై ఉందనే వాస్తవాన్ని ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడే వారిని సదాకాలానికీ సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు (హెబ్రీ10:14;) అనే సత్యాన్ని మార్చలేదు, దానిని ఎంతమాత్రమూ నిరర్ధకం చేయలేదు. విశ్వాసి పరిశుద్ధపరచబడడంలో ఈ మూడు దశలు వాటి అభివృద్ధిలో లేదా ప్రత్యక్షతలో వ్యత్యాసమైనవిగా ఉన్నప్పటికీ, దేవుని ముందు మనం అంగీకరించబడే విషయమై విశ్వాసుల్లో అనేకులు ఆయన రక్తం చేత నీతిమంతులుగా తీర్చబడ్డారని (రోమా 5:9;) గుర్తెరిగినా, ఒప్పుకున్నా, కొందరు మాత్రం పరిశుద్ధజీవితాన్ని కలిగి ఉండాలనే తమ ఆసక్తిని బట్టి, దేవునికోసం తమను తాము సంపూర్ణంగా ప్రత్యేకపరచుకున్నామంటూ సంపూర్ణంగా ఆయనకు లోపరుచుకున్నామంటూ దానివల్లే మేము పరిశుద్ధులుగా మారమని భావిస్తూ తమకు తెలియకుండానే క్రీస్తు రక్తాన్ని అవమానిస్తున్నారు. ఎంతమేరకు పరిశుద్ధులైతే అంతమేరకు అనుకూలమైన సజీవయాగంగా దేవునికి సమర్పించబడతారని అపోహపడుతున్నారు. తాము ఊహించుకున్న “బలిపీఠంపై తమనుతాము” అర్పించుకోవడం ద్వారా తమ పాప స్వభావం “ఆత్మయనే అగ్నితో కాల్చివేయబడుతుందనే భ్రమలో ఉంటున్నారు. అయ్యో, వారు దేవుడు క్రీస్తు రక్తాన్ని ఎంత విలువైనదిగా ఎంచుతున్నాడో గ్రహించలేకపోతున్నారు. "హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది” (యిర్మియా 17:19) అనే సత్యాన్ని వారు అంగీకరించడం లేదు. దేవుడు క్రీస్తును వారి పరిశుద్ధతగా చేసి ఉన్నాడనే సత్యాన్ని కాని, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనదనే (రోమా 8:7) సత్యాన్ని కానీ వారు గ్రహించడం లేదు.

పాతనిబంధనలో‌ ఉన్న ఛాయలు, క్రొత్త నిబంధన సాక్ష్యం ఈ రెండూ దేవునితో మనకు ఉన్న సంబంధాలన్నిటిలో క్రీస్తు ప్రాయుశ్చిత్తపు సార్థకతను స్పష్టంగా చూపిస్తుండగా చాలమంది వేదాంతులు దానిని చట్టపరమైన దృక్పధానికి మాత్రమే పరిమితం చెయ్యడం చాలా విచారకరం. మనం క్రీస్తులో ఉన్నాము కాబట్టి ఆయన మనకేమై ఉన్నాడో అదంతా సంపూర్ణంగా మనకు చెందాలి. క్రీస్తు రక్తం మనల్ని ప్రతి పాపం నుండి శుద్ధి చేస్తుంది కాబట్టి ఒక విశ్వాసి దేవుని న్యాయం ఎదుట నేరమేమీ మోపబడని వాడివలే ఎలా నిర్ధోషిగా నిలుస్తాడో, అదే విధంగా దేవుని పరిశుద్ధత ఎదుట కళంకం లేని వాడిగా కూడా క్రీస్తులో నిలుస్తాడు. విశ్వాసి ఆయన రక్తం ద్వారా “నీతిమంతుడిగా తీర్చబడడం” మాత్రమే కాకుండా (రోమా 5:8) యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము (ప్రత్యేకించబడ్డాం, దేవునికి ప్రతిష్టించబడ్డాం, ఆయన సన్నిధిలో నిలవడానికి అర్హులంగా అలంకరించబడ్డాం) అని కూడా రాయబడింది (హెబ్రీ 10:10) పరిశుద్ధతలో‌ ఉన్న ఈ కోణాన్ని ప్యూరిటన్ల రాతలతో సహా అన్ని మత శాఖల విశ్వాస ప్రమాణాలు నిర్లక్ష్యం చేసాయి.

వెస్ట్ మినిస్టర్ అసెంబ్లి వారి ప్రశ్నోత్తరాల పెద్ద పుస్తకంలో (లార్జర్ కేటకిసం) “పరిశుద్ధపరచబడడం అంటేఏమిటి? అనే ప్రశ్న లేవనెత్తి, దానికి ఈ విధంగా జవాబు చెప్పారు. జగత్తు పునాది వేయబడక పూర్వం పరిశుద్ధులుగా ఉండడానికి దేవుని చేత ఎన్నిక చేయబడ్డవారు, నిర్ణయించబడ్డ సమయం వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ బలంగా పనిచేయడం ద్వారా, క్రీస్తు మరణ పునరుత్ధానాలను తమకు అన్వయించడం ద్వారా, దేవుని పోలికలోకి సంపూర్ణంగా నూతన పరచబడి, పశ్చాత్తాపం మరియు రక్షణార్థమైన సుగుణాలన్నీ వారి హృదయంలో నాటబడి, వృద్ధిచెంది బలపడి, వారు పాపం విషయంలో అంతకంతకు మరణించి, నూతన జీవంగలవారై నడచుకునేలా చేసే దేవుని కృపా కార్యం.

దేవుడు తన ప్రజల్లో వేలాదిమందికి దీవెనకరంగా చేసిన ఆ ప్రశ్నోత్తర సంగ్రహ గ్రంథంలో ఈ సహయకరమైన, శ్రేష్టమైన మాటలను విమర్శించడం లేక తీర్పు తీర్చడం నాకు దూరమౌను గాక. వీటిని రాసిన దైవజనుల చెప్పుల వారును సైతం విప్పడానికి అర్హతలేని నాకు వారిని కఠినంగా ఖండిచడం దూరమౌను గాక.

అయినప్పటికీ ఆ సంగ్రహ గ్రంథం (లార్జర్ కేటకిసం) తయారు చేసిన వారు ఈనాడు జీవించి‌ఉంటే “మేము పరిపూర్ణులమ”ని మేము రాసిన వాటిలో పోరపాట్లు లేవని ఎంత మాత్రమూ చెప్పి ఉండే వారు కాదని , వారి మాటలు లేఖనాల వెలుగులో పరిశీలింపబడడానికి వారు ఏ మాత్రం అభ్యంతరపడుండే వారు కారని నమ్ముతున్నాను. ఎంత శ్రేష్టుడైనప్పటికీ మానవుడు వట్టి మానవుడే, అందుకే ఏ మానవుడినీ మనం 'తండ్రి' అని పిలువకూడదు. దేవుని సేవకులను ఘనపరచడంలో, వారి ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని గౌరవించడంలో మునిగి “సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి” (1థెస్సలోనిక 5:21) అనే బాధ్యతను అనుసరించడానికి వెనుదీయకూడదు. పౌలు వంటి అపోస్తలుడి బోధల్ని సైతం అవి ఆలా ఉన్నాయో లేవో అని ప్రతిదినం లేఖనాలు పరిశోధించినందుకు బెరయ సంఘంవారు "ఘనులు అని" అభినందించబడ్డారు. (అపో, కార్యములు 17:11). ఈ భావంలోనే నేను పైన చెప్పబడిన‌ వెస్ట్ మినిస్టర్ వారి జవాబుపై రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను.

మొదటిగా వెస్ట్ మినిష్టర్ వారు పరిశుద్ధపరచబడడం గురించి ఇచ్చిన నిర్వచనం లేదా వివరణ అసంపూర్ణంగా ఉంది. ఎందుకంటే విశ్వాసి పరిశుద్ధపరచబడడంలో ఒకానొక ముఖ్యమైన కోణాన్ని ఇది పూర్తిగా విడిచిపెట్టింది. క్రీస్తు మనల్ని పరిశుద్ధపరచడం గురించి ఇదేమీ చెప్పడం లేదు. (హెబ్రీ 10:10;, హెబ్రీ 13:12;)

కాని కుమారునిపై ఆధారపడ్డ ఆత్మకార్యానికే ఇది పరిమితమై ఉంది. లోపంతో కూడిన ఈ నిర్వచనం , దేవుని వాక్యానికి సంబంధించిన అన్ని విషయాలు ఒక వ్యక్తికి లేదా ఒక సమూహానికి సంపూర్ణంగా తెలియదు అనడానికి ఉదాహరణగా ఉంది. పరిశుద్ధపరచబడడం అంటే ఏంటి? అనే ప్రశ్నకు సంపూర్ణమైన మంచి జవాబు ఏంటంటే, “మొట్ట మొదటగా పరిశుద్ధపరచబడడం అంటే జగత్తు పునాది వేయబడడానికి పూర్వం దేవుడు క్రీస్తులో తాను ఎన్నిక చేసుకున్న వారు పరిశుద్ధులుగా ఉండడానికి ఏర్పాటు చేసిన కార్యం. రెండవది, అది క్రీస్తులో సంఘం కలిగియున్న సంపూర్ణ పరిశుద్ధత. పవిత్రపరచే క్రీస్తు యొక్క రక్తం వల్ల దేవుని యెదుట ఉండే అద్భుతమైన పరిశుద్ధత. మూడవది, ఈ పరిశుద్ధాత్మ కార్యంచేత వారిని జీవింపచేయడం ద్వారా పాపంలో మరణించిన వారి నుండి వేరు చేసి, వారికి పరిశుద్ధ జీవితాన్ని లేదా స్వభావాన్ని ఇవ్వడం.

కాబట్టి “లార్జర్ కేటకిసం” ఇచ్చిన ఈ నిర్వచనంలో లోపం లేదని చెప్పలేము. ఎందుకంటే అది ప్రారంభంలో మొదలుపెట్టడానికి బదులుగా మధ్యలో ప్రారంభమౌతుంది. క్రీస్తులో దేవుడిచ్చిన పరిపూర్ణ పరిశుద్ధతను విశ్వాసి ఎదుట ఉంచకుండా, ప్రస్తుతం‌ అసంపూర్ణస్థితిలో ఉండి, పురోగతి చెందుతున్న పరిశుద్ధాత్మ కార్యాన్ని అతనికి చూపిస్తుంది. క్రైస్తవుడు తన పాప సహితమైన అపజయాలను చూడకుండా క్రీస్తునందు తనకు ఉన్న “పరిపూర్ణతను” (కొలస్సి2:10;) చూసేలా చెయ్యడానికి బదులుగా అతడు తన అంతరంగంలోకి చూసేలా ప్రోత్సహిస్తుంది. క్రొత్త సృష్టి అనే మేలిమి బంగారాన్ని పాత సృష్టియొక్క చిట్టెం మరియు బురద మధ్యలో ఇలా వెదకడం అనేకసార్లు వ్యర్థ ప్రయత్నంగానే మిగిలిపోతుంది. దానివల్ల అతడు తాను క్రీస్తు బలి వల్ల నిత్యంగా పరిపూర్ణుడయ్యాడని ఎరగడం వల్ల కలిగే సంతోషకరమైన నిశ్చయత నష్టపోయినవాడిగా ఉంటాడు. (హెబ్రీ 10:14;). అతడు నిత్యం అనుమానాలు, భయాలతో కలవరపడుతూ, ఎంత యధార్థంగా వెదకినా విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయతను కనుగోలేని వాడిగా ఉండిపోతాడు.

ఈ నిర్వచనంలో నేను గమనించిన రెండవ సమస్య ఏమిటంటే, అందులో పదాలు లోపభూయిష్టంగా, తప్పుత్రోవ పట్టించేవిగా ఉన్నాయి. పాపం‌ విషయంలో అంతకంతకు మరణిస్తూ నూతన జీవితంలో మరియెక్కువగా వృద్ధి చెందుతాడని ఒక నూతన విశ్వాసికి నమ్మబలికితే దాని ఫలితమేంటి? అతడు తన మార్గంలో ముందుకు సాగుతున్నకొద్దీ, అపవాది అతనిపై మరింత తీవ్రంగా దాడి చేస్తుండగా అతని అంతరంగంలో శరీరాత్మలకు మధ్య పోరాటం తీవ్రతరమవ్వడం చూస్తుండగా, దేవుని వాక్యమనే వెలుగులో అతని పాపాలు మరింత బహిర్గతం చేయబడగా చివరికి అతడు నేను నీచుడను “అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను?” అని విలపించడానికి బలవంత పెట్టబడుతుండగా, ఇప్పడు వీటి నుండి అతడు ఏమి గ్రహించాలి. ఇంకేముంది? లార్జర్ కేటకిసం (ప్రశ్నోత్తరాల సంగ్రహం)‌లో ఉన్న నిర్వచనం సరి అయితే అతను నిజంగా పొరపడినట్టే. అతను అసలు పరిశుద్ధపరచబడనే లేదు. పాపం విషయంలో “అంతకంతకు మరణించడం” అనేది తన అనుభవంలో లేకపోగా అందుకు విరుద్ధంగా తనలో పాపం మరింత బలంగా పని చేయడం అతను కనుగొంటాడు. పది సంవత్సరాల పూర్వం కంటే ఇప్పుడు పాపం తనలో మరింత సజీవమై పని చేస్తున్నట్టు కనుగొంటాడు.

ఇప్పుడు నేను పైన చెప్పిన మాటలను కాదనడానికి ఎవరైనా సాహసిస్తే, "నేను పాపానికి అంతకంతకూ మరణిస్తున్నానని దేవుని సన్నిధిలో ప్రమాణం చేసి చెప్పగలవా?" అని పరిపక్వత పొందిన దైవభక్తిగల పాఠకున్ని ప్రశ్నిస్తున్నాను. దానికి నువ్వు “ఔను” అని సమాధానమిచ్చినా ఆ మాట కనీసం నేనైతే నమ్మను. కానీ నువ్వలా అబద్ధం చెబుతావని నేను అనుకోవడం లేదు. దానికి బదులుగా, "నా కోరిక అదే. కృపా సాధనాలను వాడడంలో నా ఉద్దేశం అదే. ఇప్పటికీ అదే నా అనుదిన ప్రార్థన, అయితే అయ్యో, నేను గతంలో అయినా ఇప్పుడైనా కనుగొన్నదేమిటంటే - నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను (రోమా 7:19). మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది (రోమా 7:21). అని నువ్వు సమాధానం చెబుతావని నేను అనుకుంటున్నాను" ఈ విధంగా మనం చేయాల్సిన దానికి నిజంగా మన అనుభవంలో జరిగేదానికీ చాలా వ్యత్యాసం ఉంది.

నేను పక్షపాత ధోరణితో‌ ఇలా విమర్శిస్తున్నానని నిందించే అవకాశం ఎవరికీ ఇవ్వకుండా ఇక్కడ బాప్టిస్టు అసోసియేషన్ వారి "విశ్వాస ప్రమాణంలో" ఉన్న కొన్నిమాటలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నాను. ఈ అసోషియేషన్ 1742లో ఫిలడల్ఫియాలో సమావేశమై పరిశుద్ధపరచబడడం గురుంచి వారి క్లుప్త అధ్యాయంలో మొదటి రెండు భాగాలను ఈ విధంగా చేర్చారు 1. “క్రీస్తుతో ఏకమైన వారు, సార్థకంగా పిలువబడి, పునర్జన్మ పొంది, క్రీస్తు మరణ పునరుత్థాన ప్రభావం వల్ల నూతన హృదయాన్ని, నూతనాత్మను కలిగిన వారై మరియు A. అది మొదలుకుని వ్యక్తిగతంగానూ, వాస్తవంగానూ అదే ప్రభావం వల్ల, B. ఆయన వాక్యం, ఆత్మ వారిలో నివసించడం వల్ల, C. పాపం యొక్క అధికారం శరీరంలో పూర్తిగా నశించి, D. శరీరాశలు మరింతగా బలహీనమై, వారు రక్షణార్ధమైన కృపా సాధనంలో ఉజ్జీవించబడి, ఎటువంటి పరిశుద్ధత లేకుండ ఎవరూ దేవుణ్ణి చూడలేరో అలాంటి ఆచారణాత్మకమైన పరిశుద్ధతను అనుభవిస్తూ వ్యక్తిగతంగా, వాస్తవంగా పరిశుద్ధపరచబడతారు. 2. ఈ పరిశుద్ధత మానవుని సమస్తంలో వ్యాపించి ఉన్నప్పటికీ అది ఈ జీవితంలో అసంపూర్ణంగానే ఉంటుంది. ప్రతీ భాగంలో కొంత అపవిత్రత మిగిలి ఉండడం వల్ల దాని నుండి సమాధానపడలేని నిర్విరామమైన పోరాటం ఉద్భవిస్తుంది”.

ఇంతకు ముందు చెప్పిన లార్జర్ కేటకిసం నిర్వచనం‌లాగే పరిశుద్ధపరచబడుటను గురించిన ఈ నిర్వచనంలోనూ కొంత లోపం ఉంది, ఎందుకంటే ప్రతీ క్రైస్తవునికీ క్రీస్తులో ఉన్న మచ్చలేని, స్వచ్ఛమైన నిర్మలత్వాన్ని గురించి ఇది స్పష్టంగా సూటిగా ఏమీ చెప్పడం లేదు. ఇది దేవుడు తన కుమారుని బలియాగం ద్వారా విశ్వాసికిచ్చిన, పాపలోపరహితమైన పవిత్రత గురించి ఏమీ చెప్పడం లేదు. ఇలాంటి తీవ్రలోపాన్ని మనం నిర్లక్ష్యం చెయ్యలేము. రెండవదిగా నేను ఇటాలిక్స్ లో ఉంచిన మాటలు వెస్ట్ మినిస్టర్ కేటకిసంలో వాడబడిన తప్పుడు పదాలను ఎత్తిచూపడం మాత్రమే కాకుండా, క్రైస్తవుని ప్రస్తుత స్థితిని కూడా అది తప్పుగా చిత్రీకరిస్తుంది. “కొంత అపవిత్రత మిగిలి ఉందనే" వారు చెప్పిన మాటనుబట్టి ముందున్న అపవిత్రత చాలావరకూ తొలగించబడిందనీ, ఇప్పుడు అందులో కొద్దిగా మాత్రమే మిగిలి ఉందనీ అర్థం వస్తుంది. అయితే ప్రతి క్రైస్తవుడూ దీనికి పూర్తిగా భిన్నమైన తన స్థితిని కనుగొని అనుదినం దుఃఖిస్తూ సిగ్గుపడుతున్నాడు.

ప్రియ పాఠకులారా, క్రైస్తవునిలో “మిగిలి ఉన్న కొద్ది అపవిత్రత” అని ప్యూరిటన్ల రాతల్లో తరచుగా కనబడే మాటలను దైవిక మనస్సు కలిగిన జోనతాన్ ఎడ్వర్డ్ గారి ఈ యధార్థ ఒప్పుకోలుతో పోల్చిచూడండి. “నేను నా హృదయంలోకి తొంగి చూసి దాని దుష్టత్వాన్ని పరిశీలించినప్పుడు అది నరకం కంటే లోతైన అగాధం వలే కనిపిస్తుంది. దేవుడైన యెహోవా ఉచితంగా ఇచ్చే కృపతో తన శక్తివంతమైన చేతిని చాపి నన్ను పైకి లేవనెత్తకపోతే నా పాపంలో నేను నరకం కంటే లోతుగా కూరుకుని పోయేవాడినే. ఒక యవ్వన క్రైస్తవునిగా నా హృదయంలో మిగిలియున్న పాతాళమంత లోతైన దుర్మార్గత, గర్వం, వేషధారణ మాలిన్యం వీటి తీవ్రతను గురించి ఎంతో అజ్ఞానంలో ఉన్నాను. దేవునితో ఎంత సన్నిహితంగా నడిస్తే మన అంతరంగంలో ఉన్న దుర్మార్గత మనకంత స్పష్టంగా తెలుస్తుంది".

చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ (ఎపిస్కోపెలియన్) యొక్క ముప్పై తొమ్మిది సూత్రాలలో అతి ముఖ్య సిద్ధాంతమైన పరిశుద్ధపరచబడడం గురించి ఒక్క వివరణ కూడా లేదు. సంఘ సంస్కరణ నుండి పుట్టిన విశ్వాస ప్రమాణాలు, ఒప్పుకోలు, ప్రశ్నోత్తరాల సంగ్రహాలు (కేటకిసం) ఇవన్నిటిలోనూ క్రీస్తులో సంఘానికి ఉన్న పరిపూర్ణ పరిశుద్ధతను గురించిన వివరణ కాని, క్రీస్తు విశ్వాసికి పరిశుద్ధతగా చేయబడ్డాడనే సత్యాన్ని గురించిన వివరణ కానీ ఎంత వెదకినా కనిపించదు. దీనికి ఫలితంగా అనేక వేదాంత పండితులు చెప్పేదేమిటంటే పాపి క్రీస్తును నమ్మిన క్షణమందే నీతిమంతునిగా తీర్చబడినప్పటికీ, అతడు పరిశుద్ధపరచబడే ప్రక్రియ మాత్రం అప్పుడు ప్రారంభమై, దైవ వాక్యం వల్లనూ ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవడం వల్లనూ, శ్రమ, శోధనల వల్ల కలిగే క్రమశిక్షణ ద్వారాను అతని జీవిత కాలపర్యయంతం కొనసాగుతుంది. అదేనిజమైతే “అన్ని విషయాల నుండి నీతిమంతునిగా తీర్చబడినా దేవుని సన్నిధిలో కనిపించడానికి అనర్హుడు”గా ఎంచ బడలేని సమయం ఒకటి ప్రతి విశ్వాసి జీవితంలోనూ ఉండాలి. అతడు దేవుని ఎదుట నిలువడానికి ముందే ఈ ప్రక్రియ పూర్తికావాలి - "నాలో పాపములేదని” చెప్పగలిగినంతగా పూర్తిగా పరిశుద్ధుడుగా చేయబడాలి. అయితే 1యోహాను1:8; ని బట్టి చూసినపుడు ఇది తనను తాను మోసగించుకోవడమే ఔతుంది.

ఇక్కడ అసలైన సందిగ్ధంలో పడతాము. మనం పాపము లేని వారమని చెప్పుకున్న యెడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం; అయితే "క్రమక్రమంగా పరిశుద్ధపరచబడే” సిద్ధాంతాన్ని బట్టి అలా చెప్పేవరకూ (అది మరణ సమయాన అయినా సరే) తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమవ్వడానికి ప్రాత్రులం కాలేము. తమలో జరుగుతున్న పరిశుద్ధపరచబడే కార్యమింకా అసంపూర్ణమని తలంచేవారికి క్రీస్తు ఏక్షణమందైనా వస్తాడనే తలంపు ఎంత భయంకరం! అంతేకాదు పరిపూర్ణమైన పరిశుద్ధత లేని వారు నిత్య మహిమకు అనర్హులవ్వడానికి మాత్రమే కాకుండా ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ధైర్యంతో ప్రవేశించడం కూడా దుస్సాహసమే. - "నూతనమైన జీవ మార్గం” వారికింకా లభించలేదు వారు విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానానికి చేరలేరు. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని నమ్మేవారు కలవరపడడానికి దేవునిచేత అంగీకరించబడిన విషయంలో అస్పసష్టత నెలకొనడంలో ఆశ్చర్యం ఏముంది? అయితే దేవునికి స్తోత్రాలు, అనేకులు తమ విశ్వాస ప్రమాణాలపై విజయం సాధించారు, వారి హృదయాలు వారి మేదస్సు కన్నా మెరుగైనవి. లేకపోతే దేవునితో వారు సహవాసం కలిగియుండడం మరియు ఆయన కృపాసనాన్ని సమీపించడం వారికి సాధ్యపడి ఉండేది కాదు.

ఇలాంటి అసంపూర్ణమైన వేదాంత సిద్ధాంతానికి భిన్నంగా దేవుని మహిమగల సువార్త ఒక “పరిపూర్ణుడైన” రక్షకుడిని మనకు బయలుపరుస్తుంది. అది నీతిమంతుడైన పరిపాలకుడినీ, న్యాయాధిపతినీ పూర్తిగా తృప్తిపరచి ఆయన ప్రజలకు పరిపూర్ణమైన నీతిని కలుగచేసిన ఒకనిని చూపడమే కాకుండా ఆయన బలియాగం వల్ల పరిశుద్ధుడైన దేవుణ్ణి పూజించి సేవించడానికి, ధైర్యంతోను, ప్రేమతోను తండ్రిని సమీపించేలా మనల్ని అర్హులుగా చేసింది. ఈ విధంగా హృదయానికి నిశ్చయత కలగడానికి నీతిమంతులుగా తీర్చబడడం అనే సత్యం తెలియడం మాత్రమే సరిపోదు. మనస్సాక్షి ఇంకనూ మలినంగా ఉంటే, మనమింకా అపవిత్రులంగా దేవుని దృష్టికి కనిపిస్తే ఆయన ఎదుట ధైర్యంతో నిలవలేము. ఎందుకంటే ఆయన పరిశుద్ధ సన్నిధికి మనం తగిన వారం కామని గుర్తిస్తాము. అయితే ఆయన ఘనమైన నామం నిరంతరం స్తుతింపబడును గాక, క్రీస్తు రక్తం ఈ అవసరతను కూడా తీరుస్తుందని ఆయన సువార్త ప్రకటిస్తుంది.

“వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరిహరార్థ బలి యింకను ఎన్నడును ఉండదు. సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్టించిన మార్గమున..... ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలము నందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది” (హెబ్రీ 10:18, 19). మనకు పాప క్షమాపణ కలుగచేసిన బలిఅర్పణే, మనం అంగీకరించబడిన ఆరాధికులంగా దేవుణ్ణి సమీపించే అర్హతను ఇస్తుంది. 'క్రీస్తు తానే నిత్యమైన విమోచన సంపాదించి....... తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను” (హెబ్రీ. 9:11,12;) మన స్థానాన్ని తీసుకున్న ఆయనకు పరలోక ప్రవేశం చేయడానికి ఏదైతే అర్హత ఇచ్చిందో, అదే మనకు కూడా ఆస్థలానికి వెళ్ళే అర్హత ఇస్తుంది. క్రీస్తు మన ప్రధానయాజకుడిగా పరలోకంలోనికి ప్రవేశించడానికి “అర్హతను ఇచ్చింది ఆయన రక్తమే". అతి బలహీనుడైన విశ్వాసి “ధైర్యంతో” దేవుని సింహాసనాన్ని చేరడానికి అర్హతను ఇచ్చేది కూడా ఆ “యేసు రక్తమే” ఇప్పుడు మనం ఆత్మలో పరలోకం ప్రవేశించడానికి మనకున్న అర్హత క్రీస్తుకున్నటువంటిదే.

దేవుని ఉగ్రతను శాంతింపజేసిన అదే ప్రశస్త రక్తం ప్రతి దోషాన్నీ మాలిన్యాన్నీ, మరకనూ కప్పుతుంది. అంత మాత్రమే కాదు అది మనల్ని శుద్ధిచెయ్యడంతో పాటు దాని ఔన్నత్యాన్ని కూడా మనపై‌ విడిచి వెళ్తుంది. ఆకారణం చేత దాని పవిత్రత శ్రేష్టతల వల్ల క్రైస్తవుడు నిర్దోషిగా పరిగణించబడం మాత్రమే కాకుండా మచ్చలేని పరిశుద్ధుడిగా కూడా చూడబడతాడు. ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పక్కన కూర్చున్న ప్రియ కుమారుడు పొందిన స్వాగతాన్ని ఇప్పుడు మనం కూడా పొందుతామన్న నిశ్చయతను విశ్వాసం ద్వారా మనం గ్రహించెదం గాక. ! దేవుడు “పరిశుద్ధుడైన” తన క్రీస్తు నందు మనల్ని కూడా పరిపూర్ణమైన పరిశుద్ధత మరియు నీతిగలవారంగా చూస్తాడు. ఈ రెండూ మనకు క్రీస్తు నుండి క్రీస్తు ద్వారా కలిగాయి కనుక అవి ఆయనవలె పరిపూర్ణమైనవి. "మనం ఆయన ఎదుట నిలిచినప్పుడు దేవుడు మనలో ఎలాంటి పాపాన్నీ చూడడు! అభిషిక్తుడైన తన కుమారుని వదనంలో ఆయన మనల్ని వీక్షిస్తాడు. అక్కడ మనల్ని పరలోకం కన్నా పరిశుద్ధులంగా ఆయన చూస్తాడు” (ఎలెక్స్ కార్సన్).

 

పరిశుద్ధపరచబడుటను గురించిన సిద్ధాంతం

14. దానిని సమకూర్చేవాడు (చివరి భాగం )

క్రీస్తులో సంపూర్ణమైన పరిశుద్ధత ఉంది. మొదట మనమాయన యందు విశ్వాసముంచిన క్షణంలోనే అది మన సొంతమైంది కానీ, ఆ సమయంలో మనం దానిని గ్రహించలేదు. మహిమను పొంది మనం పాప రహితమైన, ధన్యకరమైన స్థితిలో ప్రవేశించినప్పుడు దానితో సంపూర్ణమైన స్వారూప్యం‌ కూడా మనకు కలుగుతుంది. ఈ రెండింటికీ మధ్యలో విశ్వాసి ప్రస్తుత జీవితం ఉంది. అందులో కాంతి రేఖలు , చీకటి రేఖలు, ఆనందం, దుఃఖం, విజయం, ఓటములు మిళితమై‌ ఉంటాయి. చాలామందిలో జీవితం కొనసాగే కొలదీ ఆ రెండవ తరగతి సంఘటనలే ఎక్కువగా కనిపిస్తాయి. అందులో శరీరానికీ ఆత్మకూ మధ్య ఎడతెగని పోరాటం జరుగుతుంటుంది. ఈ రెండూ వాటి వాటి స్వభావానుసారమైన వాటి క్రియలను పుట్టిస్తుండగా క్రైస్తవుని పాటలతో పాటు మూల్గులు కూడా కలిసి‌ ఉంటాయి. విశ్వాసి ఒకసారి శోధనల నుండి తప్పించినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ, మరొకసారి శోధనలకు లొంగిపోయానని ఒప్పుకుని దుఃఖిస్తూ‌ ఉంటాడు. తరుచూ అతడు, “అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను!” అని దుఃఖిస్తాడు (రోమా 7:24). ఇరవై‌ ఐదు సంవత్సరాలకు పైగా నా అనుభవం కూడా అదే. ఇప్పటికీ అది అలానే ఉంది.

వాణిజ్య ప్రపంచంలో కుదరని అనేక రోగాలను క్షణంలో కుదురుస్తామని చెప్పుకుంటూ ఆ కాకమ్మ కథలను నమ్మే అమాయక ప్రజల నుండి ధనం దోచుకునే బూటకపు వైద్యులు ఉన్నట్టే మత ప్రపంచంలో సైతం లెక్కలేనంత మంది “అబద్ధపు వైద్యులు”న్నారు. వారు మనిషిలో ఉన్న పాప స్వభావాన్ని కుదర్చగలమని చెబుతారు. నేను పైన చెప్పిన పేరాను ఇలాంటి వారు ఆసక్తితో చేత పట్టుకుని కళ్ళను, చేతులను భయంతో పైకెత్తి అలాంటి అనవసరమైన దుఃఖం ఎందుకని విచారాన్ని వ్యక్తం చేస్తారు. అలాంటి అపజయ పూరితమైన అనుభవానికి కారణం ఆ దీనుడు ఎన్నడూ “పరిశుద్ధపరచబడకుండడమే” అనీ, అది జరగాలంటే అతడు "తన సమస్తాన్నీ బలిపీఠంపైన ఉంచి", “ఆత్మ బాప్తీస్మమనే” రెండవ ఆశీర్వాదం పొందాలని చెబుతారు, లేదా కొందరు చెప్పిన విధంగా విజయం కొరకు క్రీస్తును పూర్తిగా విశ్వసించడం ద్వారా విజయవంతమైన జీవితంలోకి ప్రవేశిస్తామని చెబుతారు.

సువార్తను వక్రీకరించేవారు కొందరున్నారు. పాపులు స్వనీతికార్యాలను సొంతంగా చెయ్యడానికి సహాయపడే వాడిగా వీరు క్రీస్తును చిత్రీకరిస్తున్నారు. క్రీస్తు పాపుల్లో ఉన్న లోపాన్ని పూరించేవాడిగా లేదా వారి అపజయాలపై తన దయా వస్త్రాన్ని కప్పేవాడిగా చూపిస్తారు. మేము పైన చెప్పిన కొందరు బూటకపు మత నాయకులు క్రీస్తులో దేవుడు చూపించే కృపను ఇలా వ్యతిరేకించడాన్ని బలంగా నిరసిస్తూ యేసు రక్తం ద్వారా తప్ప మనం నీతిమంతులముగా తీర్చబడలేమని అంటారు. అయితే పరిపూర్ణంగా పరిశుద్ధపరచబడే విషయానికి వచ్చినపుడు మాత్రం మనం ప్రయత్నించి పరాజయం పొందినవాటిని సాధించడానికి క్రీస్తు సహాయం చేస్తాడని, ఆయనను విశ్వసించడం ద్వారా ఇదివరకూ మనకు కష్టంగా అనిపించినవాటిని ఇప్పుడు సులభంగా చేయవచ్చని వారంటారు. అయితే ఈ జీవితంలో పాప రహితమైన సంపూర్ణతను పొందుతామని నమ్మడానికి దేవుని వాక్యం ఎలాంటి ఆధారాన్నీ ఇవ్వడం లేదు. అలాంటి ఉపదేశం ప్రాణాంతకమైన మోసాన్ని లేదా చేదైన నిరాశను మిగులుస్తుంది.

పైన మేము ప్రస్తావించిన బోధకులు సాధారణంగా నీతిమంతులుగా తీర్చబడడాన్ని, పరిశుద్ధపరచబడడాన్ని గురించిన సత్యాన్ని, అవి జరిగే సమయాన్ని విడదీస్తారు. ఒకడు నీతిమంతునిగా తీర్చబడినప్పటికీ, పరిశుద్ధపరచబడకుండా ఉండవచ్చని, ఇవి రెండూ ఆత్మలో జరిగే రెండు వేరు వేరు కార్యాలనీ వాటికి మధ్య కొన్ని సంవత్సరాల విరామం ఉండవచ్చని వారంటారు. వారు నీతిమంతులుగా తీర్చబడడానికి ప్రయత్నించమని పాపులకు ఉపదేశించిట్టే, పరిశుద్ధపరచబడండని క్రైస్తవులకు కూడా ఉపదేశిస్తారు. ఈ “పరిశుద్ధపరచబడడాన్ని ” సాధించిన వారు ఉన్నత దశలో ఉన్న క్రైస్తవుల గుంపులో చేరుతారని, వారిప్పుడు “ఉన్నత జీవితం”లో ప్రవేశించారని అంటారు. ఈ అనుభవాన్ని కొందరు రెండవ ఆశీర్వాదం అని పిలుస్తారు. మొదటి ఆశీర్వాదంలో విమోచనా కార్యంలో విశ్వసించడం ద్వారా పాపక్షమాపణ పొందితే, రెండవ ఆశీర్వాదంలో మనం క్రీస్తు శక్తిగల నామమందు విశ్వసించడం ద్వారా పాపశక్తినుండి విడుదల పొందుతామని వారంటారు. మరణించిన రక్షకుడు నరకం నుండి రక్షిస్తాడు, నిత్యం జీవించే రక్షకుడు సాతాను నుండి విడిపిస్తాడని వారంటారు.

అయితే క్రైస్తవుడు "తన శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించాలి కదా?” అనే ప్రశ్న రావచ్చు. ఔను సమర్పించాలి. కానీ అది పరిశుద్ధపరచబడడానికి కానీ, శరీరాన్ని‌ అనగా పాపస్వభావాన్నీ, ప్రాచీన పురుషున్నీ పవిత్రపరచడానికి లేదా బాగుచేయడానికి‌ కానీ ఉద్దేశించింది కాదు. రోమా 12:1;లో “కాబట్టి"...... “దేవుని వాత్సల్యాన్నిబట్టి” అనే మాటలు రోమా 6:5,6;; రోమా 8:30; మొదలగు వచనాల్లో ముందు తెలియచేసిన విషయాలు తిరిగి జ్ఞాపకం చేస్తున్నాయి. మన శరీరాలను “సజీవయాగంగా దేవునికి సమర్పించుకోవడం” మనమాయనకు ప్రతిష్టించబడ్డామనడానికి లేదా పరిశుద్ధపరచబడ్డామనడానికి గుర్తు. మన శరీరాలను పరిశుద్ధపరచబడడానికి అలా చెయ్యము కానీ అప్పటికే పరిశుద్ధులం అయ్యాము కాబట్టి ఆ నిశ్చయతతో అలా చేస్తాం.

నీతిమంతులంగా తీర్చబడడమనే దీవెన నుండి పరిశుద్ధపరచబడడాన్ని వేరు చేసినంత కాలం లేదా తనలో పరిశుద్ధాత్మ ద్వారా కొనసాగే కృపాకార్యానికి మాత్రమే తన తలంపును పరిమితి చేసుకున్నంత కాలం క్రైస్తవుడు పరిశుద్ధపరచబడుటను గురించిన సత్యాన్ని సరైన విధంగా గ్రహించలేడు. " ప్రభువైన యేసు క్రీస్తు నామమునకు మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి” (1కొరింథీ 6:11). మనం మరియొకని నామంలో ఇది వరకే నీతిమంతులంగా తీర్చబడినవిధంగానే ఇది వరకే పరిశుద్ధపరచబడ్డామని కూడా గమనించండి. “పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యంను వారు పొందునట్లు” (అపొస్త. 26:18;). మనం విశ్వాసం ద్వారా “పాపక్షమాపణ” పొందినప్పుడే “పరిశుద్ధపరచబడ్డ వారితో స్వాస్థ్యాన్ని” కూడా పొందాము. “సత్యమందు వారిని ప్రతిష్టచేయుము, నీ వాక్యమే సత్యమని క్రీస్తు చేసిన ప్రార్థన పరిశుద్ధాత్మ‌ మనకు ఆధ్యాత్మికంగా సత్యాన్ని గురించిన జ్ఞానం కలుగచేసినపుడు నెరవేరింది. మన స్వప్రయత్నం వల్ల కానీ, మనల్ని మనం ప్రతిష్టించుకోవడం వల్ల కానీ మన సమస్తాన్నీ బలిపీఠంపైన ఉంచడం వల్ల కానీ క్రీస్తు తన ప్రజల కొరకు సంపాదించిన దానిలోనికి ప్రవేశించము కానీ, దేవుని వాక్యం మనయెదుట ఉంచిన దానిని విశ్వాసం ద్వారా సొంతం చేసుకోవడం ద్వారానే అది జరుగుతుంది. క్రీస్తునందే, ఆయన యందు మాత్రమే విశ్వాసి సంపూర్ణమైన పవిత్రతను పొందగలడు. క్రీస్తు మన పక్షంగా దేవునికి తనను తాను అర్పించుకోవడం ద్వారా మనల్ని దేవునికి ప్రతిష్టించాడు. ఆయన బలి మనల్ని అపవిత్రత నుండీ తద్వారా దేవుని నుండి కలిగిన ఎడబాటునుండీ విమోచించింది. దేవుని దయను, సహవాసాన్నీ మనకు తిరిగి కలిగించింది. తండ్రి తానే క్రైస్తవునిని తన పరిశుద్ధతతో ఐక్యపడ్డ వాడిగా గుర్తిస్తాడు. ఈ పరిశుద్ధతకు దశలవారిగా జరిగే “అభివృద్ధి” లేదు. మారు మనస్సు లేనివాడు సంపూర్ణంగా అపరిశుద్ధుడు. పరిశుద్ధాత్మ ఇక్కడ మనలో జరిగించే కార్యం వల్ల దేవుడు క్రైస్తవుని పరిశుద్ధతను కొలత వేయడు కానీ దేవుని కుడి పార్శ్వమున కూర్చున్న క్రీస్తును బట్టే కొలత వేస్తాడు. విశ్వాసులను “పరిశుద్ధులని” సంబోధించే క్రొత్త నిబంధన వాక్యభాగాలన్నీ విశ్వాసి ఇంకా పరిశుద్ధపరచబడలేదు, అతని మరణ ఘడియ వరకూ అది జరగదనే ఆలోచనలను కొట్టివేస్తున్నాయి.

దశలవారీగా జరిగే పరిశుద్ధపరచబడడం ద్వారా క్రైస్తవుడు పాపం విషయమై “అంతకంతకు చనిపోతాడు" అనే భావం అనుభవజ్ఞులైన విశ్వాసులు రాసిన అనుభవాలతో ఏకీభవించడం లేదు. భక్తుడైన జాన్ న్యూటన్ తాను క్రైస్తవుడైన ప్రారంభంలో కలిగిఉండిన అనుభవం చెబుతూ ఇలా రాసాడు “అయ్యో, ఈ నా బంగారు కలలన్నీ కరిగిపోయాయి. ఇప్పటి వరకూ నేను ఒక దౌర్భాగ్యుడనైన పాపిగా జీవించాను. అలాగే మరణిస్తానని అనుకుంటున్నాను. అయితే నేనే లాభాన్నీ పొందలేదా? కాదు అంతకు ముందు నాకు లేనిది ఒకటి సంపాదించాను - అదేంటంటే నా హృదయంలో భయంకరమైన మోసం, దుష్టత్వం గూడు కట్టిందనడానికి రుజువు సంపాదించుకున్నాను. “నేను నీచుడను” అని చెప్పునప్పుడు దాని అర్థమేంటో దేవుడు కొంత వరకూ నేర్పించాడు. నేను ఆయనను సేవించడం మొదలు పెట్టినప్పుడు నా గురించి నేనే సిగ్గుపడ్డాను. ఇప్పుడు మరింత సిగ్గుపడుతున్నాను. నన్ను తన యొద్దకు చేర్చుకోవడానికి ఆయన వచ్చినప్పుడు ఇంకా అధికంగా సిగ్గు పడతాను. అయితే ఆహా ఆయన నన్ను బట్టి సిగ్గుపడకుండా ఉండడం చూసి నేను ఆనందిస్తాను!” క్రైస్తవుడు దేవుని కృపయందు ఎదుగుతుండగా తనను తాను ప్రేమించుకోవడం తగ్గిపోతుంది.

“మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దానిమీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది పాగా మీదనుండునట్లు నీలిసూత్రముతో దాని కట్టవలెను. అది పాగా ముందటి వైపున నుండవలెను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్టించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసట నుండవలెను. వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలెను” (నిర్గమ.28:36-38). ఈ వచనాలు పాత నిబంధనలో కనబడే అతివిలువైన సాదృశ్యాన్ని మన ఎదుట ఉంచుతున్నాయి. ప్రధాన యాజకుడగు అహరోను యెహోవా కొరకు ప్రత్యేకంగా ప్రతిష్టించబడ్డాడు. ఇతరుల పక్షంగా వారి మధ్యవర్తిగా అతడు ఆ సేవలో కొనసాగేవరకూ అతడు ఇశ్రాయేలు ప్రజల ప్రతినిధిగా వారి పేర్లను తన భుజాలపైనా, ఛాతిమీద ధరించి (నిర్గమ .28:12,29;) దేవుని ఎదుట నిలిచాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు అహరోను నందు ప్రాతినిధ్యం వహించబడి అంగీకరించబడ్డారు.

నిర్గమకాండము 28:38 లో చెప్పబడిన మాటలు “రక్షణ మార్గం” యొక్క ఛాయకాదు కానీ పాపులై అపజయం పొందిన తన స్వంత ప్రజలు అతి పరిశుద్ధుడైన దేవుణ్ణి సమీపించడానికి ఏది చెయ్యాలో పూర్తిగా తెలియచేస్తున్నాయి. సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్త దినాన అర్పించే బలులు వారిని ధర్మశాస్త్రపు శాపం నుండి విడిపించినప్పటికీ, భక్తిగలవారు తమ విధేయతను, ప్రార్థనలను, స్తుతులను తమ పాపాలు మలినపరుస్తున్నాయని గ్రహించారు. అయితే ప్రధాన యాజకుడి ద్వారా తమ సేవ, ఆరాధన దేవునికి అంగీకారమయ్యాయి. అతని నొసటిపై గల “యెహోవా పరిశుద్ధుడు” అనే రాత దేవుని సన్నిధి పరిశుద్ధమనీ, అపరిశద్ధుడెవడూ ఆయనను సమీపించలేడని ఇశ్రాయేలు ప్రజలకు స్పష్టంగా తెలియచేసింది. లేవికాండము 8:9; లో ఈ రాత ఉన్న బంగారు రేకును “పరిశుద్ధకిరీటమ"ని పిలిచారు; ఎందుకంటే అహరోను ధరించిన వస్త్రాలన్నిటికీ పైగా దీనిని ధరించాడు.

“దేవుని ఇల్లంతటి మీద” గొప్ప ప్రధాన యాజకుడైన క్రీస్తుకు (హెబ్రీ 10:21) అహరోను ముంగుర్తుగా ఉన్నాడు. ఆయన విశ్వాసులకు ప్రతినిధి. వారు ఆయనయందు అంగీకరించబడ్డారు. అహరోను తలపై ఎప్పుడూ ఉండే "యెహోవా పరిశుద్ధుడు” అనే రాత " మన కొరకు నిత్యం విజ్ఞాపన చేసే క్రీస్తు పరిశుద్ధతను తెలుపుతుంది. మనం చట్టబద్ధంగా మరియు ప్రాణాధారంగా క్రీస్తుతో ఐక్యమవ్వడం వల్ల, ఆయన పరిశుద్ధత మనదైంది. ఈ గొప్ప ప్రధాన యాజకుడి పరిపూర్ణత దేవుడు మనల్ని అంగీకరించడానికి ప్రమాణమై ఉంది. “పరిశుద్ధస్థలపు సేవలోని దోషాలయొక్క అపరాధాన్ని కూడా” క్రీస్తు భరించి, మన ఆరాధనలో లోపాలను సవరించి, అవి మనపై మోపబడకుండా చేసాడు. ఆయన సద్గుణాలనే ధూప ద్రవ్యం (ప్రకటన 8:3;) మన ఆరాధనను దేవునికి అంగీకారంగా చేసింది. ఆయన ద్వారా మన పాపాలు తొలగి మనం అంగీకరింపబడడమే కాకుండా మన సేవ, ఆరాధన దేవునికి ప్రీతికరంగాను “యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులుగాను ” (1 పేతురు 2:5) తీర్చి దిద్దబడింది.

పాపమనే కుష్టు వ్యాధిగలవాడు దేవుని సన్నిధికి ఎలా అర్హుడు కాగలడు? అనే ప్రాముఖ్యమైన ప్రశ్నకు ఇక్కడ జవాబు ఉంది. దేవునిని సమీపించడానికి మనకు సంపూర్ణ పరిశుద్ధత, సంపూర్ణ నీతిమత్వం అవసరం. పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని చూడలేడు. మనల్ని అపవిత్రులుగా ఆయన చూస్తే మనమాయనను సమీపించలేము. మన సమస్యలన్నిటికీ క్రీస్తే చాలినవాడు. ఆయన మన అవసరతలన్నీ తీర్చేవాడు. క్రీస్తు విలువైన రక్తం విశ్వాసిని సమస్త దుష్టత్వం నుండి వేరు చేసి, అపవిత్రత అంతటినీ తీసి వేసి ఆయన కుమారుని యందు అతడు దేవుని సన్నిధిలో అంగీకరించబడేలా చేసింది. మన అనుభవాలకు, విజయాలకు ముడిపడ్డ పరిశుద్ధతకు దీనికి ఎంత వ్యత్యాసమైనది! మానవుని మార్గం కంటే దేవుని మార్గమెంత శ్రేష్టమైనది! ఈ విషయం గురించి మనకున్న తలంపులకంటే ఆయన అలోచనలెంత ఉన్నతమైనవి!

యూదమతంలో సాదృశ్యపరచబడ్డ వాటి వాస్తవికత క్రొత్త నిబంధన పత్రికల్లో పూర్తిగా చూపబడింది. మొదటిగా “పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచబడు వారికిని అందరికి ఒక్కటే మూలము” (హెబ్రీ 2:11) అని చదువుతున్నాం. క్రీస్తు మన పరిశుద్ధతయు, మనల్ని పరిశుద్ధపరచేవాడు కూడా అయ్యున్నాడు. మెదటిగా ఆయన తన రక్తంతో మన పాపాలను తీసివేసి మలినమంతా కడగడం వల్ల ఆయన మనల్ని పరిశుద్ధపరచేవాడు అయ్యాడు. రెండవదిగా పరిశుద్ధాత్మ కార్యాల వల్ల ఆయన మనల్ని పరిశుద్ధపరిచేవాడు అయ్యాడు. ఎందుకంటే ఆ కార్యాలు పరిశుద్ధాత్ముడు చేసేవైనప్పటికీ అది తన ప్రజల కొరకు ఆయనను సంపాదించిన క్రీస్తు ఆత్మగానే ఆయన జరిగిస్తాడు (అపో 2:33;). మూడవదిగా తన పరిశుద్ధజీవాన్ని మనకివ్వడం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచేవాడు అయ్యాడు (యోహాను 10:10;). కృప మరియు పరిశుద్ధత ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి వాటిని తన ప్రజలకిస్తున్నాడు. (యోహాను 1:16;). నాల్గవదిగా మన ప్రతినిధిగా పరలోకంలో కనబడడం ద్వారా ఆయన మనకొరకు “దేవుని పరిశుద్ధతైయున్నాడు". ఐదవదిగా తన ప్రజలు కడగబడేలా తన వాక్యాన్ని తన ప్రజలకు అన్వయించడం, అనుగ్రహించడం ద్వారా (ఎఫెసీ 5:26;). ఆయన పరిశుద్ధ స్వభావం, ఆయన విధేయత మనకు ఆపాదించడం వల్ల ఆయన మన పరిశుద్ధతై ఉన్నాడు (1కొరింథీ1:30;).

“యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము” (హెబ్రీ 10:10). దేవుని యెదుట తన పరిశుద్ధత కల్వరి వద్ద సంపూర్ణమైందని గ్రహించే వరకూ ఈ అంశాన్ని గురించి క్రైస్తవుడు ఎప్పుడూ సరైన అవగాహన కలిగి ఉండలేడు. మనం కొలస్సీయులకు 1:21,22లో చదివినట్టు - “గత కాలమందు దేవునికి దూరస్తులును, మీ దుష్క్రి యలవలన మీ మనసులో విరోధ భావమును కలవారై యుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్థులుగాను నిర్దోషులు గాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన యిప్పుడు మిమ్మును సమాధానపరచెను” కల్వరిలో ఆయనచేసిన కార్యం వల్ల క్రీస్తుతన సంఘాన్ని తన పరిపూర్ణ యాగం యొక్క ఔన్నత్యంలో దేవునికి సమర్పిస్తాడు. ఈ వాక్యభాగాల్లో మనలో జరిగించబడే ఏ కార్యాన్ని గురించీ ప్రస్తావన లేనేలేదు కానీ, క్రీస్తు అర్పణ వల్ల మనకొరకు సంపాదించిన దాని ప్రస్తావన మాత్రమే ఉంది. ఆయన చేసిన బలివల్ల విశ్వాసులు క్రీస్తు పవిత్రత, శ్రేష్టత కలవారై దేవుని కొరకు ప్రత్యేకించబడ్డారు. దీనిమూలంగా పరలోకం కొరకు వారికి స్థిరమైన అర్హత కలిగింది. క్రీస్తు బలి యొక్క పరిశుద్ధతనుబట్టి దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఎంచుతాడు. ఇందువల్ల‌ ఈ భూమిపై ఏ మాత్రం బోధనొందని, అతి బలహీనుడు, అలసిన వాడైన క్రైస్తవుని ఖాతాలు సైతం ఆ బలి యొక్క పూర్తి విలువ జమకట్టబడతాయి. క్రీస్తు మనకొరకు చేసిన బలి ఎంత చాలినదంటే “ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదా కాలమునకు సంపూర్ణులనుగా చేసి యున్నాడు” (హెబ్రీ 10:14). మనం కొలస్సయులకు 2:10;లో చదివినట్టు - ఆయన కార్యం సంపూర్ణమైనందు వల్ల మాత్రమే నిజమైన విశ్వాసులందరూ దేవుని నిత్య చిత్తంలో ఉన్నారు. యేసు ప్రభువు ఆ చిత్తాన్ని నెరవేర్చడం వల్ల అది సంపూర్ణంగా వారిని నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధపరచింది. అయితే విశ్వాసులందరికీ ధన్యకరమైన ఈ సత్యం తెలియదు. పైగా అనేకులు ఈ అంశంపై సరైన అవగాహన లేక కలవరపడుతున్నారు. దీనికి ఉన్న ఒకానొక కారణం ఏమిటంటే, వారిలో చాలమంది దీనిని గురించిన ఉపదేశం కొరకు పరిశుద్ధాత్ముడిపై ఆధారపడి లేఖనాలను వెదకకుండా మానవ బోధకులవైపు చూస్తున్నారు. ఈనాటి మత ప్రపంచం “బాబేలుభాషల”ను పోలిఉంది. దైవ వాక్యంపై ఆధారపడక బోధకుల వైపు చూస్తే స్థిరత్వముండదు. గురువులు చెప్పిన దానికి ఎదురు ప్రశ్న వేయకుండా అంగీకరించే అమాయకమైన కేథలిక్కుల కంటే ప్రోటెస్టెంటులు ఏ మాత్రమూ మెరుగైన స్థితిలో లేరని చెప్పవలసి రావడం విచారకరం.

క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని చదివి దానిని విశ్వసించినప్పుడే (హెబ్రీ 4:2;), ఆ వాక్యాన్ని తనకు అన్వయించుకున్నప్పుడే అతడు తన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాన్ని గ్రహించగలడు. విశ్వాసి పరిశుద్ధలేఖనాలను చదివినప్పుడు మాత్రమే తన కొరకు దేవుడు క్రీస్తును ఏమైయుండేలా చేసాడో, క్రీస్తు కొరకు విశ్వాసి ఏమైయ్యుండేలా చేసాడో గ్రహించగలడు. (మనలో అనగా ఆదాము పతనం, పాడైన స్వభావం ఉన్న మన శరీరంలో మంచిది ఏదీ నివసించదు ( రోమా 7:18;) మనల్ని గురించిన సత్యాన్ని కూడా ఆ లేఖనాల నుండి మాత్రమే మనం నేర్చుకోగలం) మనకూ మరియు మనలో నివసించే పాపానికీ మధ్యగల బేధాన్ని గ్రహించేవరకూ ( రోమా 7:20;) మనకు స్థిరమైన శాంతి లభించదు. "ప్రాచీన పురషుడు” పరిశుద్ధపరచబడడం గురించి పరిశుద్ధ లేఖనాలు ఏమీ తెలియచేయడం లేదు. అతనిలో మెరుగుదల చూడగలమని ఆశించినంత కాలం మనం తప్పక నిరాశ ఎదుర్కొంటాం. మనం దేవుణ్ణి “ఆత్మలో ఆరాధించి”, “యేసు క్రీస్తునందు ఆనందించాలనుకుంటే “శరీరాన్ని ఆస్పదం చేసుకోకూడద”ని మనం నేర్చుకోవాలి. (ఫిలిప్పీ 3:3;).

“కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను” (హెబ్రీ13:12). ప్రశస్తమైన క్రీస్తురక్తం చేసింది వారి పాపాలకు ప్రాయశ్చిత్తం మాత్రమే కాదు - మరిముఖ్యంగా అది దేవుని ప్రజగా ఉండడానికి వారిని ప్రత్యేకపరచింది. దీనివల్లే వారు తండ్రితో సహవాసం చేయగలుగుతున్నారు. క్రీస్తు మనకొరకు రక్తం చిందించడం ద్వారా, దేవుడు మనల్ని తన ఘనతకూ పరిశుద్ధతకూ తగినవారిగా తన ప్రత్యేక ప్రజగా చేసుకోవడం సుసాధ్యపరిచాడు. పునర్జన్మ ద్వారా మన ఉన్నత పిలుపుకు తగిన ఆధిక్యతలకూ బాధ్యతలకూ మనల్ని అర్హులుగా చేసిన పరిశుద్ధాత్మను కూడా ఇది మనకొరకు సంపాదించింది. మనమాయన స్వరక్తం వల్ల పరిశుద్ధపరచబడ్డాము. మొదటిగా అది దేవునికి నైవేద్యంగా, రెండవదిగా దాని యోగ్యత మనకు ఆపాదించడం వల్ల, మూడవదిగా దాని శక్తి మనకు అన్వయించడం వల్ల, క్రీస్తు రక్తం “ప్రతిపాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును” (1యోహాను.1:7). ఇది మూడు విధాలుగా ఆయన జరిగిస్తాడు.

మొదటిది దేవుని పట్ల, మనం చేసిన పాపాలను తుడిచివేసి, తన కళ్ళ ఎదుట నుండి మన అపవిత్రతను తొలగించడం ద్వారా (న్యాయాధిపతిగా). రెండవది మనం “పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని" ఎవరి వల్ల పొందాలో ఆ పరిశుద్ధాత్ముడిని మన కొరకు సంపాదించడం ద్వారా (తీతుకు. 3:5;). మూడు, మన మనస్సాక్షి “కడగబడడం” ద్వారా (హెబ్రీ 9:4;). ఈ సత్యాలను విశ్వాసం ద్వారా చేపట్టినప్పుడు "సజీవుడైన దేవుణ్ణి సేవించడానికి” మనం అర్హత పొందుతాం. మన పతనాన్ని పరిహరించేవాడిగా మరియు అపవాది క్రియలను విజయవంతంగా లయపరచేవాడిగా (1యోహాను 3:8;) మాత్రమే కాకుండా, మనకు తన పరిపూర్ణతను ఇచ్చి దేవుని యెదుట నిలవడానికి అర్హతను ఇచ్చేవాడిగా మరియు తన పవిత్ర స్వభావాన్ని తన ప్రజలకి ఇచ్చేవాడిగా చేయడం వల్ల ఎంత సంపూర్ణ ఘనతతో దేవుడు తన కుమారుడిని ఘనపరస్తున్నాడో గ్రహించగలం. ద్రాక్ష చెట్టులోని జీవాన్ని పొందనిది దానిలో నిలువలేదు.

దేవుని సన్నిహిత పరిశీలనకు నిలువగల పరిశుద్ధతను ఆయన క్రీస్తునందు కనుగొంటున్నాడు, ఔను అది ఆయన హృదయానికి తృప్తిని ఆనందాన్ని ఇస్తుంది. దేవుని యెదుట క్రీస్తు ఏమై‌య్యున్నాడో తన ప్రజలకు కూడా అదే అయ్యున్నాడు - "యేసు అందులోకి మనకంటే ముందుగా మనపక్షాన ప్రవేశించాడు” (హెబ్రీ 6:20). “మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను (హెబ్రీ 9:24;). క్రీస్తుకు ఉన్న పరిశుద్ధత ద్వారా దేవునికృప మనల్ని ఉన్నత స్థలంలో నిలవడానికి అర్హులుగా చేసింది. దీని వల్ల “క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను ” (ఎఫెసి 2:7). ఇది ఏదో ఒక అనుభవం ద్వారా సాధించేది కాదు. నీతిమంతునిగా తీర్చబడిన తరువాత చాల కాలానికి జరిగేది కాదు. అది క్రీస్తును ప్రప్రధమంగా విశ్వసించిన క్షణంలోనే జరుగుతుంది. మనం క్రీస్తులో ఉన్నాం; ఆయనలో ఉండి కూడా సంపూర్ణంగా పరిశుద్ధపరచబడకుండా ఉండేవాడెవడు? మనం “ఆయనతో ఏకశరీరములమైన మొదటి క్షణంనుండీ (1కొరింథీ 6:17) “పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులము” (హెబ్రీ 3:1). క్రైస్తవుని విశ్వాసం దీనిని పట్టుకుని దీని పైనే నిలవాలి. అబద్ధమాడనేరని ఆయన అధికార ప్రకటనపై ఆధారపడాలి. అయినప్పటికీ శ్రేష్టమైన ఉపదేశం పొందిన వాడు, మిగుల ఆత్మ సంబంధియైన పరిపక్వత చెందిన క్రైస్తవుడు సైతం దీనిని బలహీనంగా అసంపూర్ణంగా గ్రహిస్తున్నాడు, ఎందుకంటే ఇప్పుడు అద్దంలో చూసినట్టు సూచనగా చూస్తున్నాము.

పరిశుద్ధపరచబడడం గురించి గ్రహించడంలో అభివృద్ధి ఉందనేది సత్యమే. అది దేవుని వాక్యం ద్వారా మన ఆలోచనలు రూపొందినప్పుడు జరుగుతుంది. విశ్వాసం ద్వారా మన ఆలోచనలు, అలవాట్లు, అనురాగాలు, బాంధవ్యాలు ప్రభావితమయ్యేవిధంగా క్రీస్తులో మనకిచ్చిన మహిమాయుక్తమైన స్థితిని గ్రహించి, దానిని మన స్వభావంలోనూ ప్రవర్తనలోను ప్రదర్శించడమూ జరుగుతుంది. అయితే మనమిప్పుడు దాని గురించి మాట్లాడడం లేదు. అతడు అతని పాపమంతా తీసివేయబడి ఆత్మ, ప్రాణం‌ మరియు శరీరంలో మహిమాన్వితుడిగా దేవుని యెదుట నిలిచేటప్పుడు ఎంత పరిశుద్ధుడిగా ఉంటాడో, విశ్వాసంతో క్రీస్తును అంగీకరించిన క్షణమందు కూడా దేవుని దృష్టిలో అంతే పరిశుద్ధునిగా చేయబడ్డాడనే విషయాన్ని ఇక్కడ పరిశీలిస్తున్నాము.

అయితే పరిశుద్ధపరచబడిన తరువాత దేవుని ప్రజలు పాపం చేస్తే వారి అవసరాన్ని తీర్చడానికి ఆయన ఏ సదుపాయాన్ని కలిగించాడనే ప్రశ్న తలెత్తవచ్చు. ఇది ప్రస్తుతం మనం చర్చించే కోణం యొక్క పరిధిలోనికి రాదు. అయినప్పటికీ క్లుప్తంగా చెప్పాలంటే ఉన్నత స్థలంలో ఆయన మన ప్రధాన యాజకుడు (హెబ్రీ 7:25;), ఆయన మన ఉత్తరవాది (1యోహాను 2:1;) కాబట్టి పాపాలను పశ్చాత్తాపంతో ఒప్పుకుంటే క్షమాపణ, పవిత్రత దొరుకుతుంది. (1యోహాను 1:9;), క్రైస్తవుని పాపం దేవునితో అతనికి ఉన్న సహవాసాన్ని పాడు చేసి అతడు రక్షణలో ఆనందించడానికి ఆటంకం కలిగిస్తుందే తప్ప క్రీస్తులో అతని స్థితిని పాడు చేయదు. పాపం వల్ల కలిగిన అపజయాలను, పతనాలను బట్టి నన్ను నేను తీర్పు తీర్చుకోకపోతే ఆయన క్రమశిక్షణ దండం నా పైకి వస్తుంది. అయినప్పటికీ అది కోపంతో దేవుడిచ్చే శిక్ష కాదు. అది ప్రేమగల తండ్రి చేసే క్రమశిక్షణే. (హెబ్రీ 12:5-11;).

ఈ అధ్యాయంలో చెప్పిన అనేక విషయాలను ఈ లోకసంబంధులైన నామకార్ధ విశ్వాసులు తమ స్వకీయ నాశనం కొరకు వక్రీకరించే ప్రమాదం కలదని నాకు తెలుసు. అయినప్పటికీ వారి చేతుల్లో వక్రీకరణకు గురికాని లేఖన సత్యమేముంది? అలా అని అత్యంత బలాన్నిచ్చే జీవహారాన్ని దేవుని ప్రజలకు పంచకుండా ఉండడం సరికాదు ! మిగిలిన అధ్యాయంలో ఈ సత్యం యొక్క సమతుల్యతను భద్రపరిచేందుకు అవసరమైన కోణాలు జాగ్రత్తగా పొందుపరచబడ్డాయి.

 

పరిశుద్ధపరచబడుటను గురించిన సిద్ధాంతం

15. దానిని భద్రపరిచేవాడు

క్రైస్తవుడు త్రిత్వమైన యెహోవా ద్వారా పరిశుద్ధపరచబడియున్నాడు. అనంత జ్ఞానం, ఊహకందని కృప అతడు ఆ నిత్యత్రయానికి రుణపడి ఉండాలని ఉద్దేశించాయి. త్రిత్వంలోని ప్రతి ఒక్కరినీ మనం ప్రత్యేకంగా స్తుతించేలా తన ప్రజలను పరిశుద్ధులుగా చేయడంలో త్రిత్వంలోని వారందరునూ ఘనత పొందేటలా ప్రభువైన దేవుడు ఏర్పాటు చేసాడు. మొదటిగా తండ్రియైన దేవుడు నిత్యమైన తన ప్రణాళిక చొప్పున జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు ద్వారా మనలను స్వీకరించడానికి నిర్ణయించడం వల్ల మనలను పరిశుద్ధపరిచాడు. రెండవదిగా కుమారుడైన దేవుడు తాను చేసి ముగించిన బలియాగపు సుగుణాలను తన ప్రజల ఖాతాలో రాయడం ద్వారా సర్వలోకానికి తీర్పు తీర్చేవాని ఎదుట (తండ్రి ఎదుట) వారి కొరకు సంపూర్ణమును, వేరు చేయలేనిదైన ప్రవేశాన్ని సంపాదించి వారిని పవిత్రపరిచాడు. మూడవదిగా, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి నిర్ణయాన్ని నేరవేరుస్తూ క్రీస్తు తన సిలువకార్యం ద్వారా వారికొరకు సంపాదించిన దానిని వారికి ఆపాదించాడు. పరిశుద్ధతను భద్రపరచేది పరిశుద్ధాత్మ దేవుడే, ఆయనే మనకు దానిని అన్వయిస్తాడు. ఈ విధంగా విశ్వాసి తండ్రి కుమార పరిశుద్ధాత్మలను ఆరాధించి మహిమపరచడానికి ఇది గొప్పకారణంగా ఉంది.

ఎన్నిక చేయబడినవారిని పరిశుద్ధపరచడంలో త్రిత్వంలోని ముగ్గురు చేసే ప్రత్యేక కార్యాల మధ్య చక్కని సమ్మేళనం ఉండడం గమనించదగిన విషయం. “పరిశుద్ధపరచబడడం" అనే పదంలో మూడు విశేషాలు ఉన్నాయి. ముందున్న ఒక అధ్యాయంలో " పరిశుద్ధపరచబడడం” అనే పదంలో ప్రత్యేక పరచడం, పవిత్రపరచడం, అలంకరించడం అనే మూడు అర్థాలు ఉన్నాయని నిదర్శనాలు చూపించాను. మొదటిగా ఒక వ్యక్తి కాని, వస్తువుకాని ప్రతిష్టించబడినప్పుడు లేదా సాధారణమైన వాడుక నుండి పవిత్రంగా వాడబడడానికి వేరు చేయబడినప్పుడు దానిని లేఖనంలో పరిశుద్ధపరచబడడం అని పిలిచారు. కాబట్టి తండ్రి యొక్క నిత్య నిర్ణయంలో ఎన్నికచేయబడిన వారు తాను సృష్టించబోయే అసంఖ్యాకులైన మానవులనుండి ఆయన సంతోషం కొరకు మరియు మహిమ కొరకు వేరుగా ఉంచబడ్డారు. రెండవదిగా, ఈ వస్తువులు లేదా వ్యక్తులు అపవిత్రంగా ఉన్నందుకు వారు దేవునిచేత వాడబడడానికి తగిన వారిగా పరిశుద్ధపరచబడాలి. ఈ ప్రత్యేకమైన కార్యం కుమారునికి అప్పగించబడింది. ఆయన ప్రశస్తరక్తం మనకు పరిశుద్ధత ఇచ్చింది. మూడవదిగా, ఈ వస్తువులు లేదా వ్యక్తులు పరిశుద్ధపరచబడిన తరువాత దేవుని సేవకొరకు అందంగా అలంకరించబడాలి. దీనిని పరిశుద్ధాత్ముడు పూర్తి చేసాడు.

మనలను పరిశుద్ధులుగా చేయడంలో ఈ త్రిత్వం చేసిన అనేక కార్యాల మధ్య ఉన్న సంబంధాన్ని మరియు వాటి క్రమాన్ని పరిశీలించడం ధన్యకరం. దీనికి మూలం “దేవుని నిత్య చిత్తం” లేదా “ దేవుని నిర్ణయం”, “ఆ చిత్తాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడియున్నాము” (హెబ్రీ 10:10) మన పక్షంగా క్రీస్తు దేవుని చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చినప్పుడు దాని నిజస్వరూపం బయలుపడింది. "యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను" (హెబ్రీ 13:12). దానిని భద్రపరచేవాడు పరిశుద్ధాత్ముడు .ఆయన తన కార్యం ద్వారా సంఘానికి, దాని శిరస్సునందున్న (క్రీస్తునందున్న) పరిశుద్ధతను అన్వయిస్తాడు - “పరిశద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడి” (రోమా 15:15;). ఆదరణ కర్త మన హృదయంలో నివసించేంత వరకూ తండ్రి చిత్తం నేరవేరడం ప్రారంభం కాదు. కుమారుని కార్యం యొక్క సాఫల్యత మనలో నేరవేరే నిదర్శనం కనిపించదు. కాబట్టి ఈ మహిమాయుక్తమైన ఈ వరం తండ్రి నుండి కుమారుని ద్వారా, పరిశుద్ధాత్మ వల్ల, మనపైకి దిగివస్తుంది. తన ప్రజల నిమిత్తం క్రీస్తు చేసిన పనియొక్క స్వభావాన్ని మరియు ఆయన వారిని దేవుని ఎదుట నిలువబెట్టిన పరిపూర్ణతను చూసినప్పుడు దేవుని కృప, జ్ఞానం మరియు శక్తి ఇంతగొప్ప కార్యాన్ని జరిగించిన తరువాత వారి స్థితిలో మాత్రం ఎలాంటి మార్పు కలిగించకుండా అలాగే విడిచిబెట్టబడ్డారని ఒక్క క్షణమైనా ఊహించడం సాధ్యం కాదు. వారి స్థాయి మహిమాన్వితంగా మర్చబడినప్పటికీ వారి స్థితిమాత్రం ఇదివరకులా పాపయుక్తంగానే ఉంటుందని దేవుని ఉగ్రత నుండి తప్పించబడినవారిగా పాపాన్ని సుఖంగా అనుభవించడానికి విడిచిపెట్టబడ్డారని ఎంత మాత్రం ఊహించకూడదు. మన స్వభావం దిగజారడం, మలినమవ్వడం మరియు సంపూర్ణంగా పతనమవ్వడం, మనం దేవుని నుండి దూరమవ్వడం, ఆత్మీయంగా మరణించడం, మన శాప పరంపర ఇవన్నీ పాపం వలన కలిగిన ఫలితాలు. వీటి నుండి వెంటనే మనకు విడుదల కలగకపోతే క్రీస్తునందలి పాపక్షమాపణ, నీతి మరియు విమోచన, వీటి అర్థమేంటి? అలా జరగకపోతే మనం క్రీస్తునందు దేవుని నీతిగా అవ్వడం కేవలం నామకార్థమే. ( 2కొరింథీ5:21;) పాపం పోగొట్టిన వాటన్నిటినీ తిరిగి సంపాదించి అది తెచ్చి పెట్టినవాటన్నిటినీ, పోగొట్టకపోతే ఇదంతా వట్టి పేరుకు మాత్రమే. దేవునికి స్తోత్రం. చివరికి మనం మహిమపరచబడినప్పుడు ఇవన్నీ జరుగుతాయి.

మొదట క్రీస్తు తన ప్రజలను కనుగొన్నప్పుడు వారిలో ఏమాత్రం పరిశుద్ధత లేదన్నది నిజమే. వారు కనీసం దానికొరకు ఆశ కూడా లేనివారిగా ఉన్నారన్నదీ నిజమే. అయినప్పటికీ ఆయన వారిని ఆస్థితిలోనే విడిచిపెట్టడు అలా విడిచిపెడితే ఆయనకు ఘనత కలగదు, తండ్రి చిత్తం నెరవేరదు. పాపిని నీతిమంతునిగా తీర్చడంలో, క్రీస్తు పూటకాపుగా ఉండి చేసిన కార్యం ద్వారా, దేవుని కృప సాధించిన విజయం మహిమకరమైనదే అయినప్పటికీ, అది గమ్యం చేరడానికి మార్గంగా మాత్రమే పరిగణించబడాలి. ఈ సత్యం, విమోచించబడిన వారి పట్ల కృపకు ఉన్న ఉద్దేశాన్ని, లేదా విమోచకుని కార్యాన్ని ఆయన పొందిన శ్రమల ఆంతర్యాన్ని వివరించే ప్రతి లేఖనభాగంలోనూ ఎలా స్పష్టపరచబడిందో గమనిద్దాం. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని”(యోహాను.10:10).“ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్ క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సోత్తుగా చేసికొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించు కొనెను” (తీతుకు 2:14). “ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్ధానములను అనుగ్రహించియున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్ధానముల వలనమీరుతప్పించుకొని, దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. (2 పేతురు. 1:4) “మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి” (1యోహాను 3:1).

క్రీస్తులో మనం దేవుని నీతిగా చేయబడ్డాం కాబట్టి దానిఫలితంగా క్రైస్తవుడు ఆ పరిపూర్ణతకు తగినట్టుగా ఉండాలి. మరో మాటలో చెప్పాలంటే తండ్రియైన దేవునితోనూ ఆయన కుమారునితోనూ సహవాసంలోకి నడిపించబడడం కంటే తక్కువైనదేదీ క్రీస్తు మన పాపాల కొరకు మరణించి, తిరిగిలేవడం ద్వారా ఆయన యందు విశ్వసించిన మనకు నూతన జీవమివ్వడానికి, శిరస్సునూ మూలమునూ అవ్వడంలో ఆయనకున్న ఉద్దేశాన్ని నెరవేర్చదు. మనం ఆదాములో కొల్పోయిన జీవాన్ని తిరిగి ఇవ్వడం మాత్రమే కాకుండా "సమృద్ధియైన జీవం" కలిగియుండి, ఆదామువలే సేవకులుగా ఉండడమే కాకుండా కుమారుల స్థానాన్ని పొంది, ఈ లోక సంబంధమైన పరదైసును కాకుండా పరలోకంలో దేవుని సన్నిధిని నిత్యంగా ఆనందంతో అనుభవించేలా చెయ్యాలన్నదే తండ్రి ప్రేమ‌ మరియు కుమారుని కృపయొక్క లక్ష్యం.

క్రీస్తు తన ప్రజల కొరకు మరణించి సంపాదించిన దాని ఆధారంగా మరియు వారిని మహిమపరచాలనే తండ్రి ఉద్దేశం నెరవేర్చబడేవిధంగా ఏర్పరచబడినవారికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు. ఆయనకు స్తుతి, మరియు వారికి సమాధానం కలగడానికి వారి అంతరంగంలో ఆయన జరిగించే కార్యాన్ని స్పష్టంగా గ్రహించడం అవసరం. అయితే అలాంటి గ్రహింపు పైపైన తొందరపాటుగా చదవడం వల్ల లభించదు. పరిశుద్ధాత్ముడు వేరువేరు కార్యాలు లేదా అనేక కార్యాలు చేసినప్పటికీ అవన్నీ ఒకే పునాది నుండి ఆవిర్భవించి ఒకే గంభీరమైన లక్ష్యం వైపు కొనసాగుతాయి. ఇప్పుడు మనం “ఆత్మవలని పరిశుద్ధతను గురించి” పరిశీలించబోతున్నాం. దీనిగురించి 2థెస్సలోనిక 2:18 లోను 1 పేతురు1:2; లోను మనం చదువుతాం .ఈ రెండు వాక్యభాగాలలో ఉన్న సందర్భాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు కలిగించే పరిశుద్ధత, మన రక్షణలో ఒక అంతర్భాగమని, అది సత్యాన్ని మనం విశ్వసించడంతో సన్నిహిత సంబంధం కలిగి ఉందనీ దాని నుండి మన విధేయత బయలు పడుతుందని స్పష్టమౌతుంది. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందా రహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక.

1థెస్సలోనిక 5:23 ఈ వచనాన్ని ఆధారంగా చేసుకుని జాన్ ఓవెన్ గారు పరిశుద్ధాత్మ ఇచ్చే పరిశుద్ధత గురించి ఇలా నిర్వచిస్తున్నారు. "పరిశుద్ధపరచబడడం విశ్వాసుల హృదయాల్లో దేవుని ఆత్మ జరిగించే కార్యం. ఆ కార్యం వారి స్వభావాన్ని, పాప కాలుష్యం నుండీ అపవిత్రత నుండీ శుద్ధిచేసి, వారిలో దేవుని స్వరూపాన్ని తిరిగి ప్రతిష్టిస్తుంది. యేసు క్రీస్తు యొక్క జీవ మరణాల ద్వారా నూతన నిబంధన యొక్క తాత్పర్యం మరియు నియమాల ప్రకారం దేవునికి లోబడే శక్తిని స్వభావాన్ని ఇస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, దేవుని స్వరూపంలోకి యేసుక్రీస్తు ద్వారా,పరిశుద్ధాత్ముని చేత మన స్వభావం సంపూర్ణంగా పునరుద్ధరించబడుతుంది". ఈ నిర్వచనం స్పష్టంగా ఉన్నప్పటికీ ఇది సరిపోదని, అంత సరైనదిగా లేదని వినయంతో చెబుతున్నాను.

సరిపోదని ఎందుకు అంటున్నానంటే, ఇది చెప్పవలసిన అనేక విషయాలను విడిచిపెట్టింది. సరైనదనిగా లేదని ఎందుకు అంటున్నానంటే, ఇది ఫలితాన్ని కారణంతో కలిపి కలవరపరస్తుంది. తరువాత జాన్ ఓవెన్ గారు ఇలా చెబుతున్నారు. “విశ్వాసులు పరిశుద్ధపరచబడడానికి పరిశుద్ధాత్ముడు వారిలో పని చేస్తాడు. వారి ఆత్మలో మనసులో చిత్తంలో ఆపేక్షలో దేవుని కొరకు జీవించడానికి కృపాయుతంగా సహజాతీతమైన నియమాన్ని పుట్టిస్తాడు. ఇదే పరిశుద్ధపరచబడడం యొక్క నిజస్వరూపం, అంతరార్ధం, ఉనికి మరియు జీవం"

దీని గురించిన ఒక వ్యాసంలో ఎస్.ఇ పియర్స్ ఇలా చెప్పారు, "ఏ పరిశుద్ధత లేకుండా మనం దేవుణ్ణి చూడలేమో ఆ సౌవర్తిక పరిశుద్ధతలో పునర్జన్మ మొదలుకుని నిత్యమహిమను పొందేవరకూ మనపై మరియు మనలో దేవుని ఆత్మ జరిగించే ప్రతీ కార్యమూ ఇమిడి ఉంటుంది. ఆయన మన అంతరంగంలో నివసించడానికి మరియు పునర్జన్మ ద్వారా ఆయన మనలో కొనసాగించే కార్యం, అంటే ఆధ్యాత్మిక సంగతులను అంగీకరించి వాటిచేత సరైనవిధంగా ప్రభావితం చెయ్యబడే ఒక నూతనస్వభావాన్ని మనలో పుట్టించడం యొక్క ఫలితం మరియు ధన్యకరమైన పర్యవసానంగా ఇది మనలో జరుగుతుంది. పునర్జన్మ అనేది మూలం కాగా పరిశుద్ధపరచబడడం అనేది దానిద్వారా మనలో పుట్టించబడే ఫలం. పరిశుద్ధాత్మ మనలో కలుగచేసే పునర్జన్మ కారణంగా మనం దేవుని విషయమై సజీవులుగా చేయబడడాం. క్రీస్తునందు ఉన్న మన విశ్వాసంలో ఇది ప్రత్యక్షమౌతుంది. మనం క్రీస్తుతో కూడా లేపబడిన కారణాన్ని బట్టి మనలోని దురాశలు చంపబడ్డాయి. పునర్జన్మ తరువాత ఆత్మవలన పరిశుద్ధపరచబడడం అంటే, పునర్జన్మలో మనకు అనుగ్రహించబడిన జీవాన్ని వినియోగించుకుని క్రీస్తుకొరకు ఆధ్యాత్మిక విషయాలను అభ్యసిస్తూ పరిశుద్ధమైన మార్గాలలో నడిచేవిధంగా మన సామర్థ్యాలను ఉజ్జీవింపచెయ్యడమే. దీనివల్ల దేవుని విషయమై మనం క్రీస్తు యేసునందు సజీవులమైయున్నామని రుజువు చేయబడుతుంది” ఇది జాన్ ఓవెన్ గారి నిర్వచనం కంటే మెరుగైంది. అయినప్పటికీ ఇందులో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి.

ఆత్మవల్ల పరిశుద్ధత అంటే ఖచ్చితమైన అర్థమేంటి? ఈ ప్రశ్నకు ఒక మాటలోనే తృప్తికరమైన జవాబు దొరకదేమో అన్నది నా అనుమానం. ఎందుకంటే ఆ ఒక్కమాటను చెప్పే ప్రయత్నంలో దేవునితో ఉన్న సంబంధంలోను, సంఘానికి శిరస్సైన క్రీస్తుతో ఉన్న సంబంధంలోనూ పునర్జన్మపొందని వారితో ఉన్న సంబంధంలోను, దేవుని ధర్మశాస్త్రంతో ఉన్న సంబంధంలోను కలిగే మార్పులన్నిటినీ మనం పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది.

మన స్థితిని బట్టి చూస్తే పరిశుద్ధాత్మ మనలను పరిశుద్ధపరచడం ఆయన మనలను‌ క్రీస్తుతో ఐక్యపరచడానికి ఫలితంగా జరిగింది. ఎందుకంటే, మనం ఆయనతో సజీవంగా ఐక్యపడిన క్షణమందే ఆయన పరిశుద్ధత మనదౌతుంది కాబట్టి, దేవుని యెదుట ఆయనకున్న అదే అర్హతను మనం కూడా కలిగియుంటాము. అయితే స్థాయిని బట్టి చూస్తే పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడడం అనేది ఆయన మనలను నూతనపరచే పక్రియ ద్వారా జరుగుతుంది. ఎందుకంటే, ఆయన మనలను బ్రతికించిన క్షణం నుండే పాపంలో మరణించిన వారినుండి మనం వేరు చేయబడ్డాం. వ్యక్తిగతంగా చూస్తే పరిశుద్ధాత్మ మనలో జీవించడం వల్ల మనం దేవునికి ప్రతిష్టించబడి మన శరీరాలు ఆయనకు ఆలయంగా‌ చేయబడతాయి. ఆచరణాత్మకంగా చూస్తే, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడడం అనేది ఒక నూతన నియమాన్ని అంటే ధర్మ శాస్త్రానికి విధేయత చూపించగలిగే ఆత్మ సంబంధమైన స్వభావాన్ని మనలో నాటడం ద్వారా జరుగుతుంది.ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.

సమస్తం క్రీస్తుతో మన ఐక్యతమీదనే ఆధారపడి ఉంది. ఆయనకు వేరుగా ఉండి ఆత్మ సంబంధమైనవి ఏవీ మనం చెయ్యలేం. మనం పునర్జన్మ పొందక ముందు ఉన్న స్థితిని వర్ణిస్తూ పౌలు ఇలా చెబుతున్నాడు. "ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడు లేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులైయుంటిరి" అని అంటున్నాడు (ఎఫెసీ2:12). అయితే పరిశుద్ధాత్ముడు మనల్ని ఉజ్జీవింపచేసి క్రీస్తుతో ఐక్యపరచగానే ఆయనవన్నీ మన సొంతమౌతాయి. అప్పుడు మనయాయనతో “సహ వారసులమౌతాం. ఒక స్త్రీ ఒక పురుషునిని వివాహం చేసుకున్న వేంటనే భర్తకు ఉన్న సమస్తంలో పాలిభాగస్తురాలైన విధంగా దౌర్భాగ్యుడైన పాపి పరిశుద్ధునితో ఏకమైన క్షణంలోనే దేవునియెదుట పరిశుద్ధుడౌతాడు. దేవుడు మన నుండి కోరేదంతా, మనకు అవసరమయ్యేదంతా మనకొరకు క్రీస్తునందు దాచబడింది.

మనం క్రీస్తుతో ఐక్యమవ్వడం ద్వారా ఒక నూతనమైన, పవిత్రమైన స్వభావాన్ని పొందుతాము. దానివల్ల పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి శక్తిగలవారమౌతాం. ఆయనతో ఆచరణాత్మకమైన, అనుభవాత్మకమైన సహవాసం కలిగిఉండడం వల్ల ఆ పరిశుద్ధజీవితం స్థిరపరచబడి క్రమపరచబడుతుంది. మొదటి ఆదాముతో మనకు ఉన్న సంబంధం వల్ల అతని అవిధేయత యొక్క దోషం మనకు సంక్రమించడమే కాకుండా అతని పాప స్వభావాన్ని కూడా సంతరించుకున్నాం. అది మన ఇంద్రియాలన్నిటిపై బలంగా ప్రభావం చూపుతుంది. అదే రీతిగా చివరి ఆదాముతో చట్టబద్ధంగా ఏకమవ్వడం వల్ల ఎన్నిక చేయబడినవారు ఆయన నీతిని మాత్రమే కాకుండా, ఆత్మద్వారా ఆయన పరిశుద్ధ స్వభావాన్ని కూడా పొందుతారు. అది వారి శక్తి సామర్థ్యాలనన్నిటినీ నూతనపరచి వారిక్రియలపై ప్రభావం చూపిస్తుంది. మనం ఒకసారి ద్రాక్షావల్లియైన యేసుతో ఐక్యమైతే, ఆయనలో ఉన్న జీవం మరియు పరిశుద్ధమైన గుణాలు మనలో ప్రవేశించి, ప్రవహించి పరిశుద్ధాత్మ ఫలాలను ఫలింపచేస్తాయి. ఈ విధంగా ఆత్మ మనల్ని క్రీస్తుతో ఏకంచేయగానే మనం "క్రీస్తులో పరిశుద్ధపరచబడతాం" (1కొరింథీ 1:2)

దేవుడు తనకొరకు ప్రత్యేకపరచుకున్నవారు ఆయనకు తగినట్టు ఉండాలి. అనగా వారు పరిశుద్ధులుగా ఉండాలి. లేఖనాలు స్పష్టం చేసే మరొక సంగతి ఏంటంటే దేవుడు చేసిన ప్రతికార్యం వల్ల వచ్చే ఘనత క్రీస్తుకే కలగాలి. ఎందుకంటే దేవుని ఉద్దేశాలన్నిటికీ ఆయనే కేంద్రం. క్రీస్తు యేసు నందు మనల్ని నూతన సృష్టిగా చెయ్యడం ద్వారా తన సొంత పరిశుద్ధతలో మనల్ని పాలిభాగస్తులుగా చెయ్యడం వల్ల ఈ రెండు మూల విషయాలు నేరవేర్చబడ్డాయి. స్వల్ప పాపం ఉన్నప్పటికీ దేవుడు అలాంటి వాడిని అంగీకరించడు. క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడినప్పుడే మనం దేవుని మార్పులేని ప్రమాణానికి తగినవారం ఔతాం. మన స్థితి మరియు స్థాయి ఇవి రెండూ పరిశుద్ధమైనవై ఉండాలి. గత మూడు అధ్యాయాల్లో నేను వివరించిన విధంగా క్రీస్తే మన పరిశుద్ధత అయ్యున్నాడు. అలాగే ఇప్పుడు క్రీస్తునందే పరిశుద్ధపరచబడతామని చూపించే ప్రయత్నం చేస్తున్నాను.

“అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు” (1కొరింథీ 1:30) - 'ఆయన మూలంగా పరిశుద్ధాత్మ శక్తి వల్ల, బ్రతికించే ఆయన కార్యం వల్ల క్రైస్తవులు సహజాతీతంగా, సజీవంగా క్రీస్తులో కలిసి ఉన్నారు. “మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము” (ఎఫెసీ 2:10). ఆయనతో ఐక్యమవ్వడం వల్ల నూతన సృష్టి జరుగుతుంది. ఇదే మన ఆత్మీయ స్థితి. ఒక "నూతనపురుషుడు”నీతిలోనూ యథార్థమైనభక్తిలోనూ సృష్టింపబడ్డాడు” (ఎఫెసీ4:24). దీనిని మనం ధరించాలని లేదా ప్రదర్శించాలని ఉపదేశించబడి ఉన్నాం. ఇది అభివృద్ధికి కానీ సాధనకు కానీ సంబంధించిన విషయాలు ఎంతమాత్రం కాదు కానీ ప్రతీ క్రైస్తవుడు తిరిగి జన్మించగానే జరిగే వాస్తవం. “నీతిలో సృష్టింపబడడం (నీతిగా తీర్చబడడం) మరియు నిజమైన పరిశుద్ధత (పరిశుద్ధపరచబడడం) అనే పదాలు క్రీస్తులో “నవీన స్వభావం" (నవీన పురుషుడు) అంటే ఏమిటో వివరిస్తాయి. "ధరించుకొనవలెను" అనే మాటలో సూచించబడిన విధంగా మనం సాధనచేయవలసిన అవసరత ఉన్నప్పటికీ అది కేవలం సాధన చేయవలసిన విషయంగా చెప్పబడలేదు. ఇది ప్రతి క్రైస్తవుడు ఏమై ఉన్నాడనే వాస్తవాన్ని సూచిస్తుంది. క్రీస్తులో వారు పరిశుద్ధపరచబడ్డారు అన్నది నెరవేర్చబడిన సత్యం. క్రైస్తవులు “పరిశుద్ధులు” కనుక వారు పరిశుద్ధమైన జీవితాలను జీవించాలి.

విశ్వాసి క్రీస్తులో సంపూర్ణంగా పరిశుద్ధపరచబడిన వాడై తన క్రైస్తవ జీవితాన్ని ప్రారంభిస్తాడు. మొదటి ఆదాముతో మనం ఏకమవ్వడం వల్ల మనస్థితి, మరియు స్థాయి పూర్తిగా మారినట్టే మనం చివరి ఆదాముతో ఐక్యమవ్వడం వల్ల మన స్థితి మరియు స్థాయి పూర్తిగా మారాయి. క్రీస్తుతో ఐక్యమవ్వడం వల్ల విశ్వాసి దేవుని ఎదుట పరిపూర్ణమైన పరిశుద్ధతస్థాయి మాత్రమే కాకుండా పరిశుద్ధ స్థితిని కూడా కలిగి ఉన్నాడు. అతడు క్రీస్తులోను క్రీస్తు అతనిలోనూ ఉన్నారు. పరిశుద్ధాత్మ చేసిన పునర్జన్మ కార్యం వల్ల మనం “ప్రభువుతో కలుసుకున్నాం” (1కొరింథీ 6:17). తిరిగి జన్మించిన క్షణంలోనే క్రైస్తవులందరూ పరిశుద్ధపరచబడతారు. దానికి కృపలో ఎదగడం కానీ, పరిశుద్ధంగా జీవించడంలో దేనినైనా సాధించడం కానీ కొంచమైనా చేర్చబడదు. వారు ఆయన యందు నీతిగా ఎలా తీర్చబడ్డారో అలాగే వారు ఆయన యందు పరిశుద్ధపరచబడ్డారు (కొలస్స 2:10;). క్రీస్తే వారి జీవితం. ఏదీ ఎడబాపలేని సంబంధంలో వారితో ఐక్యమవ్వడం వల్ల ఆయన వారి జీవం అయ్యాడు. నూతన జన్మ పొందిన క్షణమందే ప్రతి దేవుని బిడ్డా "క్రీస్తు యేసు నందు పరిశుద్ధుడు (రోమా1:7)”పరిశుద్ధ సహోదరుల్లో ఒకడు (హెబ్రీ 3:1;). వారలా ఉండడం వల్లే పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి పిలువబడ్డారు. దేవుని కృప, జ్ఞానం మరియు శక్తిని కొనియాడడానికి ఇంతకు మించిన కారణమేముంది?

దేవుడు ఎన్నుకున్న ఒక వ్యక్తి నూతన జీవంలోకి నడిపించబడగానే, తన సాటి మనుషులతో అతనికి ఉన్న సంబంధంలో గొప్ప మార్పు కలుగుతుంది. అంతకు పూర్వం అతడు కూడా భక్తిహీనులతో కలిసి ఈ లోకాన్ని అనుభవిస్తూ వారి సహవాసంలో సంతోషించేవాడు. అయితే తిరిగి జన్మించినప్పుడు అతడొక నూతన కుటుంబ సభ్యుడై, అనగా దేవుని కుంటుంబంలో ప్రవేశించి అతడు ఇకపై “క్రీస్తులేని వారి మధ్య” నిలువడు. “ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులుగా చేసెను” (కొలస్స 1:13). ఈ విధంగా ఒకడు క్రీస్తునందు పరిశుద్ధాత్మ ద్వారా బ్రదికించబడగానే "పాపముల చేతనూ అపరాధముల చేతనూ" చచ్చిన వారినుండి వేరౌతాడు. కాబట్టి ఇది " ఆత్మ చేత పరిశుద్ధపరచబడడం"లోని మరొక కోణం. ఇది పూర్వమే సాదృశ్యంగా చూపబడింది. దేవుడు అబ్రహాముకు తనను‌ తాను ప్రత్యక్షపరచుకున్నప్పుడు అతనికి “నీదేశం నుండీ, నీబంధువుల యొద్ద నుండీ, నీతండ్రి యింటి నుండీ బయలుదేరు” (ఆదికాండము12:1) అని సెలవియ్యబడింది. ఇశ్రాయేలీయుల విషయంలో కూడా ఇది మరలా చూస్తాం . గొర్రెపిల్ల రక్తం ద్వారా సంహార దూత నుండి విడుదల పొందిన వెంటనే ఐగుప్తు విడిచి వెళ్ళమని దేవుడు వారిని ఆజ్ఞాపించాడు.

వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ మనలో నివసించడం ద్వారా మనం దేవునికి ప్రతిష్ట చేయబడ్డాం లేదా పరిశుద్ధపరచబడ్డాం. మన శరీరాలు ఆయనకు ఆలయాలై ఉన్నాయి. క్రీస్తుకు పరిశుద్ధాత్మ కొలత లేకుండ అనుగ్రహించబడినట్టే తగిన కాలమందు ఆయన శరీరంలోని అవయవాలకు (మనకు) కూడా అనుగ్రహించబడతాడు. “మీరు పరిశుద్ధుని వల్ల అభిషేకం పొందిన వారు” “ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీలో నిలుస్తుంది” (1యోహాను 2:20, 27;). దీని నుండే మనం “క్రైస్తవుడు” అనే పేరును పొందాం. దీని అర్థం “అభిషేకం పొందినవారు” ఇది కీర్తనలు 133:2;లో ఉన్న సాదృశ్యం నుండి తియ్యబడింది. ఒక విశ్వాసిలో పరిశుద్ధాత్ముడు నివసించడం వల్లే పరిశుద్ధుడౌతాడు. కనానును “పరిశుద్ధ దేశంగా చేసింది, యెరుషలేమును పరిశుద్ధ పట్టణంగా చేసింది మరియు ఆలయాన్ని పరిశుద్ధ స్థలంగా చేసింది ఆయన సన్నిధి మరియు ఆయన ప్రత్యక్షతే. అదేవిధంగా ఏ మనుష్యుడైనా పరిశుద్ధపరచబడేది పరిశుద్ధాత్మ తనలో నివసించడం కారణంగా మాత్రమే. ఆయన మనలో నివసించినప్పుడు మన హృదయంలోను జీవితంలోను పరిశుద్ధ ఫలాలు ఉంటాయని వేరే చెప్పవలసిన అవసరం లేదు. దీని గురించి రాబోయే అధ్యాయాల్లో చూస్తాం.

పునర్జన్మ పొందిన వారిలో పరిశుద్ధాత్మ నివసించేటప్పుడు వారి శరీరాలు సజీవుడైన దేవుని ఆలయాలు అవ్వడం అద్భుతమైన, ధన్యమైన, మహిమాన్వితమైన సత్యం. “క్రీస్తుతో వారు ఐక్యమవ్వడం వల్ల పరిశుద్ధాత్ముడు వారి పైకి దిగి, వారిలో ప్రవేశిస్తాడు. వారికీ క్రీస్తుకూ ఉన్న ఈ ఐక్యతను తెలియచెయ్యడానికి ఆయన పరలోకం నుండి దిగి వస్తాడు. ఆ ఐక్యతను చూపేవాడు ఆయనే. నిత్యజీవం పొంగిపొర్లడం అంటే ఆయన మనలో నివసించడమే. దేవుడు ఆదరణకర్తగా మనలో ఉండి, మరణపర్యంతం నడిపించి, జీవమిచ్చే తన ప్రభావాన్ని మనలో కొనసాగిస్తూ నిత్యం మనలో నివసిస్తూ, పరమందున్న దేవుని పరిపూర్ణతతో నిత్యం మనల్ని నింపుతాడు” (ఎస్. ఇ. పియర్స్).

దేవుడు నియమించిన క్రమంలో మనలో పరిశుద్ధాత్మ నివసించడమనేది మనం యేసు రక్తం వల్ల పరిశుద్ధపరచబడిన తరువాత దాని ఫలితంగా జరుగుతుంది. ఎందుకంటే శిక్షావిధి క్రిందనున్న వారిలో దేవుడు “నివాసం” చెయ్యడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మన శరీరాలను ఆయన ఆలయాలుగా చెయ్యడం క్రీస్తు బలిదానం ద్వారా మనకు దొరికిన పరిశుద్ధత యొక్క పరిపూర్ణతకూ నిత్యత్వానికీ రుజువు ఇస్తుంది. క్రీస్తు మన కొరకు విలువనిచ్చి కొన్న ఆశీర్వాదాలను మరల సంపాదించడానికి కాకుండా వాటిని మనకు తెలియచేయడానికే పరిశుద్ధాత్ముడు మన వద్దకు వస్తాడు. " దేవుని వలన మనకు దయ చేయబడిన వాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది యున్నాము” (1కొరింథీ 2:12). క్రీస్తు జీవమిప్పుడు ఎవరిలో ఉందో వారిలో ఆ జీవం కొనసాగింప చెయ్యడానికి ఆయన వస్తాడు.

 

పరిశుద్ధపరచబడుటను గురించిన సిద్ధాంతం

16. దానిని భద్రపరచేవాడు (ముగింపు)

“ఆత్మ వల్ల పరిశుద్ధపరచడం” ( 2 థెస్సలొ 2:13;) అనేది అనేక కోణాలు కలిగి ఉన్న మాట. ఇందులో కనీసం నాలుగు కోణాలున్నాయి. మొదటగా పాపి, క్రీస్తు యేసు నందు సృష్టించబడి (ఎఫెసీ 2:10) ఆయనతో ఏకమై ఆయన పరిశుద్ధతలో పాలు పొందే మానవాతీతమైన ఆత్మ కార్యాన్ని ఇది సూచిస్తుంది. రెండవది భక్తిహీనులతో అతనికి ఉన్న సంబంధంలో ఇది కలిగించే గొప్ప మార్పును సూచిస్తుంది. నూతన జీవితం పొందేవిధంగా అతను క్రీస్తునందు బ్రదికించబడగానే అతను స్థితిలోనూ స్థాయిలోనూ పాపంలో చచ్చిన వారినుండి వేరుచేయబడతాడు కాబట్టి సాతాను, పాపం మరియు లోకం విషయంలో వారితో కలసి ఉండడు. మూడవది, క్రీస్తునందు బ్రదికించబడిన వ్యక్తిలో పరిశుద్ధాత్మ తానే నివసిస్తూ వ్యక్తిగతంగా అతనిని పరిశుద్ధునిగా చేస్తాడు. నాలుగవది, హృదయాన్ని దేవుని ధర్మశాస్త్రానికి అనుగుణంగా చేయడాన్ని గురించి ప్రస్తావిస్తుంది. ఈ చివరి అంశాన్ని పరిశీలించడానికి ముందు, మూడవ దాని గురించి మరికొన్ని విషయాలను తెలియచేస్తాను.

పతనమైన పాపిలో నివసించడానికి దేవుడు మహిమాన్వితుడిగా వ్యక్తిగా రావడం అద్భుతం‌ మరియు గొప్ప మర్మం. అంత పవిత్రుడైన వాడు ఇంతటి అపవిత్రునిలో నివసించడం ఎలా సాధ్యం? చాలమంది ఇది అసాధ్యమని చెప్పారు. లేఖనాలు దీని గురించి ఇంత స్పష్టంగా ప్రకటించకపోతే మనం కూడా అదే తీర్మానానికి వచ్చేవారం. అయితే దేవుని మార్గాలు మన మార్గాలకు భిన్నమైనవి. ఆయన ప్రేమ మరియు కృప సాధించిన కార్యాలు మన ఊహలకు అందనివి. ఇది క్రీస్తు అద్భుత జన్మలోనూ మరింత అద్భుతమైన మరణంలోనూ స్పష్టంగా గుర్తించగలం. అయితే విశ్వాసుల్లో నివసించడానికి పరిశుద్ధాత్మ దిగిరావడం అంత ఖచ్చితంగా గ్రహించలేకపోతున్నాం.

ఈ లోకంలోకి ప్రభువైన యేసుక్రీస్తు రావడానికి, పరిశుద్ధాత్ముడు రావడానికి మధ్య చాలా పోలికలు ఉన్నాయి. మొదటి దానిలో ఉన్న అద్భుతమైన మర్మం రెండవ దాని కొరకు మనల్ని సిద్ధపరచాలి. అది చారిత్రక‌ వాస్తవం అయ్యుండకపోతే తండ్రి తన కుమారున్ని అంత దీనస్థితికి అనుమతించాడని మనలో ఎవరు ఊహించగలరు? మహిమాస్వరూపియగు ప్రభువు పశువులపాకలో ఎలా పరుండగలడు? అయితే ఇది చూసాక మనం పరిశుద్ధాత్ముడు మన నీచ హృదయంలోకి ప్రవేశించడం గురించి అంత ఆశ్చర్యపడడం ఎందుకు? ఇలాంటి దీన స్థితికి దిగజారడం ద్వారా కొంతకాలం తన కుమారుని మహిమ కనుమరుగవ్వడానికి తండ్రి అనుమతించినట్టే, పరిశుద్ధాత్మ మన శరీరంలో నివసించడం ద్వారా ఆయన మహిమ కూడా కొంతకాలం కనుమరుగయ్యేలా తండ్రి అంగీకరించాడు.

క్రీస్తు చేసిన కార్యం ఆధారంగా పరిశుద్ధాత్మ మనలోనికి వస్తాడు. మనమీలోకంలో పొందేదంతా క్రీస్తులో మనకివ్వబడిన పరిపూర్ణత యొక్క ఫలితం. సమాధానకర్తయగు ఆత్మగా ఆయన వచ్చి మనలో నివసిస్తున్నాడంటే, అది క్రీస్తు తన రక్తం ద్వారా మనకొరకు సంపాదించి ఇచ్చిన సమాధానానికి ఫలితమే. మహిమాన్వితమైన ఆత్మగా ఆయన మనలోకి వస్తున్నాడంటే, అది క్రీస్తు మహిమలో ప్రవేశించి మనకొరకు సంపాదించిన మహిమ ద్వారానే. కుమారత్వం కలిగించే ఆత్మగా ఆయన వస్తున్నాడంటే, అది యేసు మనకొరకు తండ్రి రొమ్మున చేరి తిరిగి అదే ప్రేమలోకి మనల్ని చేర్చడానికి ఫలితమే. జీవానిచ్చే ఆత్మగా ఆయన మనలోనికి వస్తున్నాడంటే అది మన జీవం క్రీస్తునందు దాచబడియుండడాన్ని బట్టే. ఈ విధంగా క్రీస్తు పునరుత్థానం మరియు ఆరోహణం వల్ల దేవునితో మనకు కలిగిన నిరంతర బాంధవ్యానికి ఫలితంగా ఆయన సాన్నిధ్యం నిత్యం మనలో నిలుస్తుంది. కాబట్టి మర్మమైన తన శరీరానికి ప్రతినిధిగా, శిరస్సుగా విమోచన యందు క్రీస్తు వారితో కలిగియున్న బాంధవ్యం ఎంత పరిపూర్ణమైనదో, నిత్యమైనదో ఆయన ఆత్మయొక్క సాన్నిధ్యం మనలో ఉండడం వల్ల మనలో నూతన పురుషుడు సృష్టింపబడడం వల్ల, కలిగే పరిశుద్ధత అంతే పరిపూర్ణమైనది మరియు నిత్యమైనది.

అయినప్పటికీ ధన్యకరమైన పరిశుద్ధాత్మ ఆయన మన హృదయాలను మొదట చూసిన పతనస్థితిలోనే వాటిని విడిచిపెట్టడని స్పష్టపరుస్తున్నాడు. ఇది మనల్ని నాలుగవ అంశానికి నడిపిస్తుంది. తీతుకు 3:5లో “తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను” అని మనం చదువుతాం. అక్కడ “స్నానం” అనే పదం లో ఉన్న ఆ అర్థమంతా చెప్పలేకపోయినా దేవుడు మన హృదయ సింహాసనంపై ఆసీనుడయ్యే‌లా మన హృదయంలో ఉన్న విగ్రహాలన్నిటినీ పార వేస్తాడు అనే అర్థం అందులో‌ ఉందని ఖచ్చితంగా చెప్పగలం. ఈ "పునర్జన్మ సంబంధమైన స్నానం” వల్ల హృదయంలో ఉన్న మాలిన్యం ఎంతగా తొలగించబడుతుందంటే అది పాపాన్ని ప్రేమించక దానిని అసహ్యించుకుని, దేవుని ధర్మశాస్త్రాన్ని అసహ్యించుకోకుండా దానియందు ఆనందించి, ఇహసంబంధమైన వాటిని ప్రేమించకుండా పైనున్న వాటినే ప్రేమిస్తుంది. ఇదే ఒక యథార్థమైన మనసాక్షి ఎక్కువగా శ్రద్ధ చూపించే విషయమని మనకు తెలుసు. అయినప్పటికీ హృదయం చూపించే ఈ శ్రద్ధ ఇక అవసరం లేనివిధంగా ఈ జీవితంలోనే దేవుడు మన సమస్యలన్నీ తీర్చేస్తాడు అన్నది వాస్తవం కాదు.

క్రైస్తవుని శరీరం మార్పు లేకుండా ఉండడం నిజమైనప్పటికీ కొన్ని సమయాల్లో అది చేసే పనులవల్ల పునర్జన్మకు ఉన్న నిదర్శనం మరుగున పడుతున్నప్పటికీ నూతన జన్మ మనలో గొప్ప మార్పు తెచ్చిందనేది నిజం. దాని ప్రభావం నిలిచే ఉంటుంది. మన లోపల హద్దులుదాటే దుష్టత్వం ఇంకా నిలిచి ఉండడం సత్యమే అయినప్పటికీ, కొన్నిసార్లు పాపం పెల్లుబికినందుకు దాని అధికారం నుండి మనం విడుదల పొందామని చెప్పుకోవడం అపహాస్యంగా అనిపించినప్పటికీ, మనలో అద్భుతమైన కృపా కార్యం జరిగించబడిందనే సత్యం మాత్రం మారదు. తనలో ఉన్న మాలిన్యాన్ని క్రైస్తవుడు ఎరిగి ఉన్నప్పటికీ అతడు “పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని” అనుభవిస్తాడు. నూతన జన్మ పొందకముందు క్రీస్తును చూసి ఆపేక్షించదగినట్టుగా సౌందర్యమేదీ ఆయనలో చూడలేదు. అయితే ఇప్పుడు ఆయన “పదివేలలో అతి సుందరుడి”‌గా కనిపిస్తున్నాడు. ఇంతకు పూర్వం అతడు తన వంటి వారినే ప్రేమించాడు; ఇప్పుడైతే "సహోదరులను ప్రేమిస్తాడు” (1యోహాను 3:14;). అంతేకాకుండా అతడు అపవిత్రమైన పొరపాట్ల నుండి అబద్ధ బోధలనుండి కడగబడి శుద్ధిచేయబడ్డాడు. చివరిగా, అతని కోరికల ఉటలన్నీ దేవుని వైపుకే పారుతున్నాయి.

అయితే "పునర్జన్మ సంబంధమైన స్నానం” ప్రతికూల పక్షం మాత్రమే (అది ఆయన మననుండి తొలగించేవాటిని సూచిస్తుంది). "పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావం కలగచేయడం" అనుకూల పక్షం (అది ఆయన మనలోకి తీసుకునివచ్చే వాటిని సూచిస్తుంది). ఈ నూతన పరచడం పరిశుద్ధులు మహిమ పరచబడబడేటపుడు జరిగేదానికంటే చాల తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ అది ఒక విప్లవాత్మకమైన అనుభవం, దీనిద్వారా ఆత్మలో గొప్ప మార్పు, పునరుద్ధరణ జరుగుతుంది. అది మనశక్తి, సామర్ధ్యాలన్నిటిపై మేలైన ప్రభావం కనపరస్తుంది. “పరిశుద్ధాత్ముడి నూతనపరచడం”లో రూపాంతరం పొందించే గొప్ప శక్తి ఉంది. దీని వల్ల మనం దేవునికి లోబడే వైఖరి హృదయంలోనూ, మనస్సులోనూ కలుగుతుంది. దేవుని చిత్తమే బహు “ఉత్తమం, అనుకూలం, సంపూర్ణం” (రోమా 12:1) అని గ్రహించి దాని పోలికలోకి రావడానికి ఆ హృదయం మిగుల ఆపేక్షించి, యథార్ధంగా ప్రయత్నిస్తుంది.

పరిశుద్ధపరచే ప్రక్రియలో పరిశుద్ధాత్మ చేసే పనులు ఎలాంటివో మరింత వివరించడానికి ముందు మన హృదయం చేపట్టి ఆధారపడవలసిన విషయాలు గడిచిన చివరి ఆధ్యాయాల్లో మనం ధ్యానించిన విషయాలే అని సూచిస్తున్నాను. తండ్రి నిర్ణయాలను అనుసరించి విశ్వాసి ఇది వరకే సంపూర్ణంగా పరిశుద్ధపరచబడ్డాడు. పరలోకమందు దేవునిసన్నిధిలో నిలవడానికి అతన్ని అర్హుడిగా చేయడానికి అవసరమైనదంతా క్రీస్తుచేసి, ముగించి అతని ఖాతాలో జమకట్టాడు. ఆత్మ చేత బ్రదికించబడిన క్షణంలోనే అతడు క్రీస్తులో సృష్టించబడ్డాడు. కాబట్టి “క్రీస్తులో పరిశుద్ధపరచబడ్డాడు” దానిని బట్టి అతని స్థితి మరియు స్థాయి రెండూ దేవుని దృష్టిలో పరిశుద్ధం” (అంతేకాక పరిశుద్ధాత్మ అతనిలో నివసించడం, అతని శరీరం దేవుని ఆలయమవ్వడం). దేవుని సన్నిధిలో ఉండడం చేత కనాను “పరిశుద్ధదేశం” యెరూషలేము “పరిశుద్ధ పట్టణం” అయినట్లే పరిశుద్ధాత్మ అతనిలో నివసించడం ద్వారా అతడిని పరిశుద్ధునిగా చేసాడు. ఈ అంశాన్ని క్రైస్తవుడు స్పష్టంగా అర్థం చేసుకోవడం చాల అవసరం. పరిశుద్ధకార్యాలు చెయ్యడం వల్ల మనం పరిశుద్ధులం కాలేము. అబద్ధ మతాలన్నీ చేసే పొరపాటు ఇదే. ప్రవాహాం పరిశుద్ధంగా ఉండాలంటే ఊట పరిశుద్ధంగా ఉండవలసినవిధంగా, పండ్లు ఆరోగ్యంగా ఉండాలంటే చెట్టు మంచిది కావలసినవిధంగా పరిశుద్ధమైన పనులు చెయ్యడానికి మనం మొదట పరిశుద్ధులం కావాలి. లేఖనాలు బయలుపరిచే క్రమాన్ని గమనించండి. లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. (ఎఫెసీ 5:3). “ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు. వెలుగు సంబంధుల వలె నడచుకొనుడి” (ఎఫెసీ 5:8, 10). "పరిశుద్ధతకు తగిన ప్రవర్తన కలవారై ” (తీతుకు 2:3). దేవుడు తన సేవకొరకు మన చేతులను ఉపయోగించమని చెప్పడానికి ముందు మన హృదయాలను నెమ్మదిపరుస్తాడు. మనం ప్రేమ కలిగి ఉండేలా ఆయన జీవాన్ని ఇస్తాడు పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండేలా ఆయన మనలో పరిశుద్ధ స్వభావాన్ని పుట్టిస్తాడు .రక్త ప్రోక్షణ వల్ల అతి పరిశుద్ధమైన స్థలంలో దేవుడు మనల్ని నిష్కళంకులుగా నిలువబెడతాడు. అప్పుడు నిర్మలమైన మనస్సాక్షితో ఆయనను మనం సంతోషపెట్టి, మహిమ పరచడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు ఇలాంటి పరిశుద్ధ స్వభావం మనలో కలగచెయ్యడం గురించి ఆలోచిద్దాం.

అది నియమంలోనూ క్రియల్లోనూ పరిశుద్ధమైనది, అది మానవాతీమైనది. మనం స్వయంగా సాధించలేనిది. అది స్వభావసిద్ధంగా గుర్తించబడే వాటిని చెయ్యడం పై ఆధారపడదు. అది నైతిక గుణాలు అని పిలువబడేది కాదు. అలాంటి వాటిని దేవుడిని ఎరిగిన తత్త్వవేత్తలు కూడా అధికంగా అనుసరించారు కానీ పరిశుద్ధతను ఏ మాత్రమూ పొందలేకపోయారు. దానికి భిన్నంగా వారు శరీరాశలతోను, అసూయ, గర్వం, ప్రతికారం మొదలైన వాటితోనూ నిండి ఉన్నారు. దేవుని వాక్యానికి పైపైన విధేయత చూపించడం దీని లక్షణం కాదు. జీవితాన్ని, జీవన విధానాలను పైపైన సంస్కరించడం వల్ల దానిని పొందలేం. అలాంటివి పరిసయ్యుల్లో ఎక్కువగా కనపించేవి. అందుకే వారు తమ దృష్టికి వారే నీతిమంతులమని, ఇతరులకన్నా పరిశుద్ధులమని తలంచి వారిని నీచంగా చూసారు. కానీ వారి హృదయాలు సమస్తవిధమైన కల్మషంతో నిండియున్నాయి.

“ఇది అదుపులో ఉంచే కృప కాదు. తల్లిదండ్రుల యొక్క గురువుల యొక్క ఆజ్ఞలవల్ల లేదా న్యాయాధిపతుల చట్టం వల్ల, దేవుని వాక్యోపదేశం వల్ల, భయంకరమైన పాపాలు చేయకుండా మనుష్యులు అదుపులో ఉంచబడొచ్చు. దేవుని దయవల్ల వారు లోక మాలిన్యం నుండి భద్రపరచబడొచ్చు అంతమాత్రాన వారు పరిశుద్ధ పరచబడ్డారని దాని అర్థం కాదు. ఆత్మవరాలు, అవి సాధారణమైనా, అసాధరణమైనా అవి పరిశుద్ధపరచబడడానికి నిదర్శాలు కావు. యూదా ఇస్కరియోతుకు ఈ రెండూ ఉన్నాయి. బోధించగలిగే సాధారణ వరం, అద్భుతాలు చేసే అసాధారణ వరం ఈ రెండూ అతనికి ఉన్నప్పటికీ అతడు పరిశుద్ధపరచబడినవాడు కాదు. వరాలు పరిశుద్ధపరచబడడానికి నిదర్శనాలు కావు. ఒకడు వరాలన్నిటికీ సమస్త జ్ఞానమంతటినీ కలిగియుండవచ్చు. మానవ భాషలతోను దేవదూతల భాషలతోను మాట్లాడవచ్చు కానీ కృప పొంది ఉండకపోవచ్చు. వెండి నాలుక ఉన్నవాడికి సైతం అపవిత్ర హృదయం ఉండవచ్చు. "పరిశుద్ధత ఆదాము కోల్పోయిన రూపాన్ని తిరిగి పొందడం కానీ, పాపం వల్ల మానవుడు కోల్పోయిన రూపాన్ని సరిదిద్దడం కానీ ప్రాచీన ప్రకృతి సూత్రాలను సవరించడం కానీ కాదు” (dr. జాన్ గిల్).

ఇంతవరకూ పరిశుద్ధాత్ముడు ఇచ్చే పరిశుద్ధమైన స్వభావం ఎలాంటిది కాదో చూసాం. ఇప్పుడు ఆ స్వభావం ఎలాంటిదో నిర్వచించడానికి ప్రయత్నిస్తాను. అది పూర్తిగా నూతనమైనది, అది ఒక నూతన సృష్టి, ఒక నూతన హృదయం, ఒక నూతన జీవం, ఒక నూతన పురుషుడు. మనల్ని వేరొక స్వరూపానికి, అనగా దైవకుమారుడైన రెండవ ఆదాము (క్రీస్తు) రూపంలోకి మార్చడం. ఇది పేడ కుప్పలో గులాబి మొక్కను నాటినవిధంగా అపవిత్రత మధ్య ఒక పరిశుద్ధ నియమాన్ని నాటడం. ఇది మనలో పునర్జన్మ జరిగినప్పుడు ప్రారంభించబడిన “సత్క్రియ ముందుకు కొనసాగించబడడం" (ఫిలిప్పీ. 1:4;) అది చాల పేర్లతో పిలువబడుతుంది. ఉదాహరణకు “ఆంతర్యపురుషుడు” (2కొరింథీ 4:16;)"హృదయపు అంతరంగ స్వభావం” (1 పేతురు 3:4;), దీనిని ఇలా పిలవడానికి అది లోపల నివసించేది అవ్వడమే కాక ఇతరులు దానిని చూడలేక పోవడమే కారణం. దీనికి “బీజం” అనే పేరు ఉంది. (1యోహను 3:9;), “ఆత్మ” అనే పేరు కూడా ఉంది. ఎందుకంటే ఈ కార్యం దేవుని ఆత్మ వల్ల జరుగుతుంది. అది “మంచి ధననిధితో” (మత్తయి 12:35;) “సిద్దెలలోని నూనెతో" (మత్తయి 25:4;) పోల్చబడింది. ఈ నూనె కృపను సాదృశ్యపరస్తుంది. ఎందుకంటే అది వివేచనను జ్ఞానాన్ని ఇస్తుంది. అది హృదయం నుండి కఠిన స్వభావాన్ని తొలగించి, మనసు నుండి మొండితనాన్ని తీసివేసి మృదువుగా చేస్తుంది.

మనం పరిశుద్ధపరచబడే ప్రక్రియలో ఉన్న ఈ కోణం పరిశుద్ధపరచబడుట అనే పదానికి ఉన్న మూడవ అర్థానికి మనల్ని నడిపిస్తుంది. ధన్యకరమైన పరిశుద్ధాత్మ పునర్జన్మ లేని గుంపు నుండి మనలను వేరు పరచి మన హృదయాల్లోని పాప మాలిన్యం నుండి శుద్ధి చెయ్యడమే కాకుండా ఇప్పుడాయన తాను నివసించే ఆలయానికి ఆయనకు తగినట్టుగా అలంకరిస్తాడు. మనల్ని “దేవ స్వభావమందు పాలివారుగా” చేయడం ద్వారా (2 పేతురు 1:4;) ఆయన ఈ కార్యాన్ని జరిగిస్తాడు. ఇది అనూకూలమైనది ఒక పరిశుద్ధ సూత్రాన్ని తెలియచేసేది. దీని ద్వారా మనం “దేవుని పోలికలోనే నూతన పరచబడతాం”. లేవియులు పరిశుద్ధ స్థలంలో సేవ చేసేటప్పుడు వారు తమ్మును తాము కడుగుకోవడమే కాకుండా యాజక వస్త్రాలనూ అభరణాలనూ ధరించుకోవాలి. అవి రమ్యమైనవి అందమైనవి. అదేవిధంగా విశ్వాసులు,“పరిశుద్ధయాజకులు”(1 పేతురు 2:5;), ఎందుకంటే వారు పాప మాలిన్యం నుండి కడగబడడమే కాకుండా “మహిమగలవారు” (కీర్తన 45:13;) వారు దేవుడిచ్చిన నీతి వస్త్రాలను ధరించడం మాత్రమే కాక (యెషయా 61:10) అలంకరించే ఆత్మ యొక్క కృప వారిలో నాటబడుతుంది.

ఇలాంటి పరిశుద్ధ స్వభావం ఇయ్యబడడిన కారణంగానే విశ్వాసి పాపపు అధికారం నుండి విడిపించబడి నీతియనే స్వాతంత్రంలోకి అడుగుపెడతాడు. మరణపర్యంతం అతనిలో పాపమనే వ్యాధి నిలిచి ఉన్నప్పటికీ నీతిమంతులుగా తీర్చబడ్డప్పుడు విశ్వాసులు చట్టపరమైన పరిశుద్ధతను పొంది వారు దేవుని యెదుట సంపూర్ణులుగా నిలిచే స్థితిని పొందుతారు. ఇది వారు దేవునితో నిబంధన సంబంధాన్ని కలిగి ఉండి వారు ఆయన ప్రతిష్టిత జనమూ స్వకీయధనమూ ఆయన స్వాస్థమూ భాగమూ అనడానికి నిదర్శనం. అంతేకాకుండా పరిశుద్ధాత్మ వారిలో చేసే కృపా కార్యం చేతవారు పరిశుద్ధపరచబడ్డారు. వారు సంపూర్ణంగా నూతనపరచబడి పాపపు విషం వారి శరీరమంతా ఎలా వ్యాపించిందో అదే విధంగా కృప ఇప్పుడు వారిని ఆవరిస్తుంది. అది బోస్టన్‌గారు చెప్పినవిధంగా “పరిశుద్ధత అనేది ఒక సుగుణం కాదు. అది పరిశుద్ధాత్మ కలిగించే అన్ని సుగుణాల సమ్మేళనం. అది ఆయన కలిగించే సుగుణాల కూటమి. అది అన్ని సుగుణాలకు ఆధారమైన బీజం, మూలం”.

క్రైస్తవుని వ్యక్తిత్వమంతా ఆత్మచేత నూతనపరచబడినప్పటికీ అతని ఇంద్రియాలన్నీ పునరుద్ధరింపబడినప్పటికీ అతని ప్రాచీన స్వభావం పై కృపా కార్యమేదీ జరగలేదు. కాబట్టి దాని కీడు అతని నుండి తొలిగిపోదు. "శరీరం” లో ఉన్న పాప నియమం తుడిచివేయబడదు, పరిశుద్ధపరచబడదు, మంచిదిగా చేయబడలేదు. మన “ప్రాచీనపురుషుడు” (ఇది ఆత్మ కార్యాలకు విరోధమైనది ). "మోసకరమైన దురాశల వల్ల మలినమై” మన ఇహలోక యాత్ర అంతమయ్యే వరకూ అలానే నిలిచి ఉండి, ఆత్మకు అంటే పరిశుద్ధతా నియమానికి లేదా నూతన పురుషునికి” విరోధిగా పోరాడతాడు. ఎలాగైతే మొదట గర్భంలో ఆత్మ శరీరంతో ఏకమైనపుడు పాప యుక్తమైందో అదే విధంగా శరీరం నుండి విడుదలైన తరువాతనే అది పాపరహితం ఔతుంది. ఒక భక్తుడు సెలవిచ్చినట్టు “పాపం ఈలోకంలోకి మరణాన్ని తెచ్చింది. దేవుడు తన పరిశుద్ధమైన రోషంతో ఆ మరణాన్నే తన పరిశుద్ధుల్లోని పాపాన్ని అంతం చెయ్యడానికి ఉపయోగించాడు.

ఇక్కడ కష్టతరమైన తికమక పెట్టే అంశంతో వ్యవహరిస్తున్నామని పాఠకులు ఇప్పటికే గ్రహించియుంటారు. మన అంతరంగ పరిశుద్ధత అనే ఈ అంశంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోయేవిధంగా దీనిని పరిపూర్ణంగా వివరించడమనేది ఎవరికీ సాధ్యం కాదు. మనం చేయగలిగిందల్లా ఏమిటంటే అది ఏదికాదో వివరించి తరువాత దాని నిజస్వభావాన్ని గుర్తించడానికి ఏ దిశగా ఆలోచించాలో సూచించడం మాత్రమే. విశ్వాసిలో పరిశుద్ధాత్మ అనుగ్రహించే పరిశుద్ధతా నియమంలో ఆత్మ సంబంధమైన వెలుగు ఉంది. ఈ వెలుగు పతనం వల్ల చీకటిలో కూరుకుపోయిన హృదయాన్ని విడిపిస్తుంది. అందుచేత మన జ్ఞాన నేత్రాలు తెరవబడి ఆత్మసంబంధమైన విషయాలను చూసి వాటి యొక్క ఔన్నత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధపరచబడడానికి ముందు వాటి యధార్ధతను అందాన్ని చూడలేని గ్రుడ్డి వారంగా ఉన్నాం. యోహాను.1:5, అపొస్త 26:18;, 2కొరింథీ4:6, ఎఫెసీ 5:8;కొలస్స 1:18;,1 పేతురు 2:9;) (వీటిని చదవండి) మొదలైన వాక్యాలు ఈ సత్యాన్ని స్పష్టపరుస్తున్నాయి.

అంతేకాకుండా పరిశుద్ధాత్మ విశ్వాసికి ఇచ్చే పరిశుద్ధతలో ఆత్మ సంబంధమైన జీవం ఉంది. దీనిని పొందడానికి ముందు ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన మరణస్థితిలో ఉన్నాడు. అంటే దేవుని నుండి వేరై దేవుణ్ణి వెదకడానికి శక్తిలేనివాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనల్ని నూతన పరచినప్పుడు మనం ఆత్మీయ జీవానికి ప్రాణాధారమైన నియమాన్ని పొందుతాం. యోహాను 5:24;,యోహాను 10:11,28; రోమా 8:2;, ఎఫెసీ 2:1; పోల్చి చూడండి. ఈ నూతన జీవమే దేవునికి లోబడి ఆయనతో సహవాసం చేయగలిగే శక్తిని మనకిస్తుంది. ఆ పరిశుద్ధత నియమంలో ఆత్మ సంబంధమైన ప్రేమ ఉందని మరోసారి నొక్కి చెబుతున్నాను. ప్రకృతి సంబంధియైన వాడు దేవునికి విరోధిగా ఉన్నాడు. అయితే పునర్జన్మలో దేవునితో సంతోషించి ఆయనను హత్తుకునే స్వభావం అతనిలో నాటబడుతుంది. ద్వితీయో 30:6;, రోమా 5:5;, గలతీ 5:24; పోల్చి చూడండి. ఈ పరిశుద్ధత “వెలుగు” వలే జ్ఞానాన్ని ఇస్తుంది. “జీవం” వలే ఇది మనసుపై ప్రభావం చూపించి దానిని కదిలిస్తుంది. “ప్రేమ” వలే మన కోరికలకు దారి చూపించి వాటిని రూపొందిస్తుంది. ఈ విధంగా వెలుగు, జీవం ప్రేమై ఉన్న ఆయన స్వభావంలో అతడు పాలిభాగస్తుడు ఔతాడు. “మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక” ! (కీర్తన 90:17). అంటే “ఈ పరిశుద్ధతా సూత్రం (వెలుగు, జీవం, ప్రేమ) మాలో నుండి, మా నుండి మా ద్వారా పైకి కనబడుతుంది గాక”ని అర్థం.

ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన అంశాన్ని పరిశీలిద్దాం. ఆత్మ మనల్ని పరిశుద్ధపరచిన ఈ పరిశుద్ధతా నియమం యొక్క స్వభావాన్ని పరీక్షిద్దాం. పరిశోధనాత్మకమైన దేవుని ధర్మశాస్త్రానికి మన హృదయాలు లోబడడమే ఆచరాణాత్మకమైన పరిశుద్ధత. ఈ సత్యం దానిని స్థిరపరచడానికి ఎలాంటి వాదననూ చేయనవసరం లేనంత స్పష్టంగా ఉంది. ఆజ్ఞాతిక్రమమే పాపం” (1యోహాను 3:4;) .కాబట్టి ధర్మశాస్త్రాన్ని జరిగించడమే పరిశుద్ధత. ప్రకృతి సంబంధియైన మనుష్యుడు ధర్మశాస్త్రానికి లోబడడు, నిజంగా అతడు లోబడలేడు. ( రోమా 8:7;) ఎందువల్ల? ఎందుకంటే విధేయత చూపించే పరిశుద్ధతా నియమం అతనిలో లేదు కనుక .ధర్మశాస్త్రం ముఖ్యంగా కోరేది ప్రేమ. దేవుని పట్ల ప్రేమ, పొరుగువాని పట్ల ప్రేమ. అయితే పునర్జన్మలేని వారి గురించి‌ ఇలా రాయబడింది. “దేవుని ప్రేమ మీలో లేదు”(యోహాను5:42). కాబట్టి ఆయన ఎన్నిక చేసిన వారికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, “నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకు సున్నతి చేయును” (ద్వితీయో 30:6) - ఎందుకంటే ప్రేమ కలిగి ఉండడం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే. (రోమా 13:10).

నిబంధన యొక్క గొప్ప వాగ్దానం ఇదే "వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను. వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును” (హెబ్రీ 8:10), మరియు, “నా యాత్మను మీయందుంచి, నా కట్టడలననుసరించు వారిగాను నా విధులను గైకొనువారిగాను మిమ్మును చేసెదను” (యెహెజ్కే 36:27). నేను దీనికి ముందు అధ్యాయంలో చెప్పినట్టు క్రీస్తు తన ప్రజల యొద్దకు వచ్చినప్పుడు వారిని పరిశుద్ధతలేని వారిగాను, దానియందు కోరికలేని వారిగాను కనుగొంటాడు. అయితే ఆయన వారిని అలాంటి భయంకరస్థితిలో విడిచిపెట్టడు. ఆయన పరిశుద్ధాత్మను పంపి దేవుని కొరకు నిజమైన ప్రేమను, వారిలో ఉంచి, దేవుని మార్గంలో ఆనందించే నియమాన్ని స్వభావాన్ని వారిలో పుట్టిస్తాడు. “శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచలేరు' (రోమా8:8). ఎందుకంటే ఆయనను సంతోషపరచగల ఏ పనైనా సరే స్వభావం నుండే కలగాలి. అది సరైన నియమంతో చేయబడాలి. అది సరైన లక్ష్యాన్ని (ఆయనకు మహిమ తేవడం) కలిగి ఉండాలి ఇవన్నీ పరిశుద్ధాత్మ పరిశుద్ధపరచబడడం వల్లే సాధ్యమౌతుంది. హృదయం‌ మరియు జీవితం దేవుని ధర్మశాస్త్రానికి తగిట్టుగా ఉండడమే ఆచరణాత్మకమైన పరిశుద్ధత. “ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, నీతిగలది, ఉత్తమమైంది” (రోమా 7:12), కాబట్టి అంతరంగంగాను,‌ బాహ్యంగాను మనం దానికి లోబడాలని ధర్మశాస్త్రం కోరుతుంది .ఈ అవసరతను దేవుడు తన ఏర్పాటు వలన ఉదారంగా తన బిడ్డలకు ఈ అవసరతను తీర్చాడు. ఇక్కడ కూడా త్రిత్వం మధ్య ఉన్న స్పష్టమైన, ధన్యకరమైన సహకారాన్ని చూడగలం. రాజుగా, న్యాయాధిపతిగా తండ్రి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. మన పూటకాపుగా కుమారుడు దానిని నెరవేర్చాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి దాని పోలి ఉండేటట్టు పరిశుద్ధాత్మ మనలో కార్యం చేస్తున్నాడు. మొదట దానిని ప్రేమించే గుణాన్ని మనకివ్వడం ద్వారా, రెండవది దాని ఆజ్ఞల యొక్క అపరిమితమైన జ్ఞానాన్ని మనకు బోధించడం ద్వారా; మూడవది దానికి మనం విధేయులమై ఉండేలా చేయడం ద్వారా, సంపూర్ణమైన క్రీస్తు విధేయత ఆయన ప్రజలకు ఆపాదించడం మాత్రమే కాకుండా ధర్మశాస్త్రంలో ఆనందించే స్వభావం కూడా ఆయన ద్వారా వారికి అనుగ్రహించబడింది. అయితే మనలో ఉన్న అంతరంగ పాపం వ్యతిరేకించడం వల్ల ఈ జీవితంలో ధర్మశాస్త్రానికి సంపూర్ణంగా లోబడడం సాధ్యంకాదు. అయినప్పటికీ క్రీస్తు కొరకు దేవుడు వారి యథార్థమైన అసంపూర్ణమైన విధేయతను అంగీకరిస్తాడు.

మనం పరిశుద్ధాత్మకూ, పునర్జన్మయందు ఆయన మనకనుగ్రహించే పరిశుద్ధ స్వభావానికీ మధ్య ఉన్న బేధాన్ని గుర్తించాలి. పునర్జన్మ సమయంలో ఆయన మనలో ఉత్పన్నం చేసిన స్వభావం, దానిని ఉత్పన్నం చేసిన వాడూ ఒక్కటే అని తలంచి కలవరానికి గురికాకుండా మనం జాగ్రత వహించాలి. సృష్టికర్తనూ ఆయన మనలో సృష్టించే స్వభావాన్ని కలిపి కలగాపులగం చెయ్యకూడదు. దేవునిలో నివసించడం ద్వారా ఆయన మనలో ప్రారంభించిన మంచికార్యం నిలిచేట్టు దానిని అభివృద్ధిపరచి కొనసాగించి అది సంపూర్ణమయ్యేట్టు చేస్తాడు. ఆయన మన ఆత్మను తన అధీనంలోకి తెచ్చుకుని దానిని బలపరచి, శక్తిసామర్థ్యాలు తన నియంత్రణలో ఉంచుకుంటాడు. ఆయన మనలో ఉత్పన్నం చేసిన పరిశుద్ధ స్వభావమే మననుండి పరిశుద్ధ ఫలాలు, పరిశుద్ధమైన కోరికలు, క్రియలు కలిగేటట్టు చేస్తుంది. అయినప్పటికీ ఈ నూతన స్వభావానికి స్వశక్తి లేదు. దానిని ఇచ్చిన వాడు ప్రతీదినం దానిని నూతనపరచి, బలపరచి, నియంత్రించి నడిపించినప్పుడే “పరిశుద్ధతకు తగినట్టు” మనం నడవగలం. మనల్ని పరిశుద్ధపరిచే ప్రక్రియ ప్రాచీన పురుషుని చంపి నూతన పురుషుని జీవింప చేయడం ద్వారా జరుగుతుంది.

పరిశుద్ధాత్మచేత పరిశుద్ధపరచబడడం యొక్క ఫలాలు మనం దుష్టత్వం నుండి లోకం నుండి వైదొలుగడంలో కనిపిస్తాయి. అయితే మనలో ఉన్న శరీరంవల్ల అనేకసార్లు మన నడత సంపూర్ణంగా ఉండదు. ఆత్మపూర్ణులైనవారికి మరియు ఈలోకంలో నీతిగా గౌరవంగా బ్రతికేవారికి మధ్య పెద్ద బేధం చాలాసార్లు మన కళ్ళకు కనిపించకపోవచ్చు. వారిని చూసి మనం అనేకసార్లు సిగ్గు పడతాం కూడా. “మనమేం‌ ఔతామో ఇంకా ప్రత్యక్షం కాలేదు”. “లోకం మనల్ని ఎరుగదు” అయితే తరుచూ పశ్చాత్తాపానికి పురికొల్పబడి, క్రైస్తవుడు కార్చే కన్నీటితో పాప వాంఛ నుండి అతని హృదయం శుద్ధిఔతుంది. శుద్ధి చేసే క్రీస్తు రక్తంలో విశ్వాసంతో చేసే ప్రతి కార్యాన్నీ ఆచరణాత్మకమైన పరిశుద్ధతను అభివృద్ధిపరస్తుంది. నయమాను తన కుష్టురోగాన్ని పూర్తిగా శుద్ధిచేసికోవడానికి ఏడు సార్లు యోర్ధాను నదిలో మునగవలసి వచ్చినట్టు తనలో ఉన్న పాప పంకిలాన్ని గుర్తించిన క్రైస్తవుడు కూడా “పాపం మరియు అపవిత్రతను శుద్ధిచెయ్యడానికి తియ్యబడ్డ ఊటలో (జెకర్యా 13:1) మరలా మరలా‌ మునగాలి. దేవునికి స్తోత్రం. “ఒక దినం క్రీస్తు తన సంఘాన్ని ముడతగాని మచ్చగానిలేని మహిమగలదిగా నిలువబెట్టుకుంటాడు” (ఎఫెసీ 5:27).

 

పరిశుద్ధపరచబడుటను గురించిన సిద్ధాంతం

17. దాని నియమం

సంఘం పరిశుద్ధపరచబడడంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు చేసిన ప్రత్యేక కార్యాలను పరిశీలించిన తర్వాత, మనం నిజమైన పరిశుద్ధతను ఏ నియమం ప్రకారం నిర్ధారిస్తామో, ఏ ప్రమాణాన్ని అనుసరించి అది ఇలా‌ ఉండాలని కొలత వేస్తామో జాగ్రత్తగా కనుగొనాలి. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది, ఎందుకంటే మనం పరిశుద్ధత యొక్క ప్రమాణాన్ని సరిగా గ్రహించకపోతే దాని పట్ల చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థమౌతాయి. మనం‌ ధ్యానించే అంశంలో ఈ కోణం గురించి కూడా ఈనాడు సంఘంలో అజ్ఞానం, కలవరం, ఎంతగానో వ్యాపించి ఉంది. అందుకే మనం నెమ్మదిగా ముందుకు సాగి, దానిలోకి లోతుగా వెళ్ళాలి. మన పాఠకుల్లో కొందరికి తమ విశ్వాసం బలపడడానికి తమ హృదయాలు ఆదరించబడడానికి క్రీస్తునందు విశ్వాసులకు ఉన్న సంపూర్ణ పరిశుద్ధతను పూర్తిగా తెలుసుకునే అవసరత ఉండగా, మరి కొందరు తమ మనసులు వెలిగించబడి, మనసాక్షిని పరీక్షించుకోవడానికి దేవుడు దయచేసిన “నియమాన్ని” వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నారు .

గడచిన అధ్యాయాల్లో పరిశుద్ధత పాపానికి వ్యతిరేకమని చూపించాను. “ఆజ్ఞాతిక్రమమే పాపము” (1యోహాను 3:4) కాబట్టి ఆజ్ఞకు లోబడడమే పరిశుద్ధత. “పాపం” అనే పదానికి సమస్త దుష్టత్వం, మలినం, అవినీతి అనే అర్థాలున్నట్టే, "పరిశుద్ధత” అనే పదం మంచివి, పవిత్రమైనవి మరియు నీతియుక్తమైన సుగుణాలన్నింటినీ సూచిస్తుంది. పాపంలో తనను తాను ప్రేమించుకోవడం, స్వచిత్తం, ఆత్మ సంతోషం, ఆత్మ తృప్తి ఉన్నట్టే పరిశుద్ధతలో - దేవునిపట్ల మరియు పొరుగువాని పట్ల నిస్వార్థమైన ప్రేమ ఉంటుంది. 1కొరింథీ 13వ అధ్యాయం పరిశుద్ధత యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తుంది. ఆ అధ్యాయమంతటిలో 'ప్రేమ' అనే పదం‌ ఉన్న చోట 'పరిశుద్ధత' అనే పదాన్ని‌ పెట్టవచ్చు. ఆజ్ఞను అతిక్రమించడం పాపమైతే ఆజ్ఞను నెరవేర్చడమే పరిశుద్ధత (రోమా 13:10).

మానవుడు తాను మొదట సృష్టింపబడిన స్థితిలో ఉన్నప్పుడు అతని ఆధ్యాత్మిక స్థితి మరియు మతం స్వభావసిద్ధంగా దేవుని ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా పోలి ఉండడమే అయ్యుండింది. ఎందుకంటే అతడు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు. అయితే అతడు తన నిర్ధోషత్వాన్ని కోల్పోయి దోషియై అపవిత్రత పొందినప్పుడు దేవుని ఉగ్రత వల్లే కాకుండా పాపపు అధికారం‌ వల్లకూడా పతనమయ్యాడు. దాని ఫలితంగా ఇప్పుడతనికి విమోచకుడు, పరిశుద్ధపరిచేవాడు కూడా అవసరమయ్యాడు. సువార్తయందు వారిద్దరూ దొరికారు. అయితే ఈనాడు తరుచుగా అసంపూర్ణమైన చిన్నాభిన్నమైన సువార్తే ప్రకటించబడుతుంది. పాపులు దానిని వినక ముందు కన్నా వినిన తరువాత “రెండింతలుగా నరక పాత్రులౌతున్నారు”. సువార్తలో మనకు క్షమాపణ కృపా మార్గం, పరిశుద్ధపరచబడే మార్గంపొందే దారి బయలుపరచబడింది. సువార్త క్రీస్తును రాబోయే ఉగ్రత నుండి తప్పించేవాడిగా మాత్రమే‌‌ కాకుండా (1థెస్సలో 1:10;) తన సంఘాన్ని పవిత్రపరిచేవాడిగా కూడా చూపిస్తుంది(ఎఫెస్సి 5:26;).

సంఘాన్ని పరిశుద్ధపరచడంలో క్రీస్తు “తన ప్రజలను మరలా ధర్మశాస్త్రాన్ని పోలియుండేవారిగా పునరుద్ధరిస్తాడు. దీనికొక నిదర్శనాన్ని చూపించడానికి ముందు ధర్మశాస్త్రం మననుండి ఏం కోరుతుందో జాగ్రత్తగా పరిశీలిద్దాం. “యేసు అతనితో నీపూర్ణ హృదయముతోను, నీపూర్ణాత్మతోను, నీపూర్ణమనస్సుతోను నీదేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు, మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమైయున్నవి” (మత్తయి 22:37-40). క్రీస్తు ఇక్కడ పది ఆజ్ఞల సారాన్నీ ఈ రెండు ఆజ్ఞల్లో ఇమిడ్చి చెప్పాడు. ధర్మశాస్త్రం ఇచ్చిన విధులన్నీ ప్రవక్తలు నేర్పినదంతా ఈ రెండిటినుండి వచ్చినవే, వీటి వివరణలే; వీటిలో అవన్నీ ఇమిడి ఉన్నాయి. ఇందులో మొదటిగా దేవుని పట్ల మరియు మన పొరుగువారి పట్ల ప్రేమ చూపడం మన విధి అని గమనిస్తాం. రెండవదిగా ఆ విధిని నెరవేర్చడానికి ఆయన మన “దేవుడైన ప్రభువై" ఉండడమే కారణమని గ్రహిస్తాం. మూడవదిగా మన “పూర్ణహృదయంతో" దానిని చేయడమే ఆ విధి నిర్వహణ యొక్క పరిమాణం అని కూడా గ్రహిస్తాం.

దేవుడు మన పూర్ణహృదయంతో ఆయనను ప్రేమించాలన్న ఆజ్ఞను ఇవ్వడానికి కారణం ఏంటంటే అది దాని స్వభావంలో మిక్కిలి న్యాయమైనది‌ మరియు తగినదై ఉంది. ఆ ఆజ్ఞ నిత్యమైనది, మార్చలేని నీతి నియమం. అది మార్పులేని దేవుని మారని నీతి గుణం యొక్క మార్పులేని వెల్లడి, కనుక అది లేశ మాత్రమైనా మారదు నిరర్థకం కానేరదు. దేవుడు తన ఆజ్ఞను మొట్టమొదట జారీ చేసినప్పుడు, దాని ఆధారం, కారణం ఎంత బలంగా ఉందో, ఎప్పటికి అది బలంగా ఉంది‌కాబట్టి, అది కోరేది న్యాయానికి తగింది కాబట్టి, ఈ విశ్వమంతటికీ, నీతి పరిపాలకునిగా దీనిని కోరడం ఎప్పటికీ ఆయనకు తగియుంది కాబట్టి ఆయన తన ఆజ్ఞను తీసివేస్తాడని కానీ మారుస్తాడని కానీ తలంచడాన్ని మనం బొత్తిగా అస్యహించుకుని దానిని త్రోసివేయాలి.

పరిశుద్ధత అంతటికీ ఆధారమైన మరియు సమస్త దుర్నీతినీ ఖండించే‌ నియమమైన నైతిక ధర్మశాస్త్రాన్ని దేవుడు రద్దు చేసాడని చెప్పడం ఆయనను మహిమపరచే బాధ్యతను ఆయనే మనుషులకు మినహాయించాడని, ఆయనకు చెందవలసిన మహిమను పూర్తిగా ఇవ్వకుండా వెనుదీయడానికి వారిని అనుమతించాడని చెప్పినట్టు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆయన తన ఆజ్ఞను వెనుకకు తీసుకోవడం, తాను సృష్టించిన వారు సరైన దానిని చేయకుండా, సరికాని వాటిని జరిగించడానికి ఆయన అనుమతి ఇచ్చినట్టే ఉంటుంది. ఇలాంటి దుష్టతలంపు దేవుని మంచితనానికి మచ్చతెస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకూ ఇది వారికి గొప్ప వరంగాను, మేలు కలుగచేసేదిగాను ఉంటూ, అది వారి ఆనందానికి అడ్డువస్తుందని ఇలాంటి ఆజ్ఞను తీసివేయడం కానీ మార్చడం కానీ గొప్ప మహిమాన్వితమైన ఆయన పరిపూర్ణతలను అతి ఘోరంగా తృణీకరించడమే ఔతుంది. ప్రమాదాన్ని కూడా కొని తెస్తుంది. భూమ్యాకాశాలు గతించిపోయినా ధర్మశాస్త్రంలో పొల్లయిననూ సున్నయిననూ తప్పిపోవడం అంగీకరించక దేవుడు దానిని భద్రపరచాడు. (మత్తయి 5:18;). ఈ దైవ నియమాన్ని మన దగ్గరనుండి తొలగించడానికి కానీ మన హృదయాలపై ఉన్న అధికారాన్ని బలహీనపరచడానికి కానీ దానికి వ్యతిరేకంగా మనల్ని త్రిప్పడానికి కానీ సాతాను చేసే ప్రయత్నాలను మనం ఎంతో గట్టిగా ఎదిరించాలి.

పైన వివరించిన విషయాన్ని బట్టి చూస్తే తన బిడ్డలు ధర్మశాస్త్రాన్ని మీరి చట్టవ్యతిరేకమైన స్వేచ్చను పోందడానికే కుమారుడు పరము నుండి దిగివచ్చి, అవతారమెత్తి, సిలువపై మరణించాడని తలంచడం వచింప శక్యం కాని దేవదూషణే ఔతుంది. ఆయన తన తండ్రి కోరికను, మహిమను ఆజ్ఞను నిర్లక్ష్యం చేసి ప్రజలు విచ్చలవిడిగా జీవించడానికి అనుమతి‌ నిమ్మని ఒప్పించడానికే తన ప్రశస్త రక్తాన్ని చిందించాడా? అలాంటి ఆలోచన నశించును గాక! ఈ ఆలోచన ఎవరు వ్యాపింపచేసినా, దేవుణ్ణి ప్రేమించేవారు రోషంతో దానిని వ్యతిరేకించి అది సాతాను చేసే దుష్పప్రచారంగా అసహ్యించుకోవాలి. పరిశుద్ధాత్మ చేత బోధించబడ్డ పాఠకుడు -క్రీస్తు ధర్మశాస్త్రాన్ని అంతం చేయడానికి వచ్చాడనే దుష్ట ఆలోచన ఆయనను పాపానికి మిత్రుడిగా, దేవునికి శత్రువుగా చేయడమే ఔతుందని అని గ్రహించాలి.

ఒక్క క్షణం ఆగి ఇందులో ఉన్న మెలికను జాగ్రత్తగా చూడండి. మనం మన పూర్ణహృదయంతో దేవుణ్ణి ప్రేమించాలనే ఆజ్ఞను ఎత్తివేస్తే ఆయన గొప్ప నామానికి చెందవలసిన ఘనత న్యాయమైనదని ఆయన ఎలా నిరూపిస్తాడు? ఆ‌విధంగా చేస్తే పూర్వం ఆయన మననుండి తనకు చెందవలసిన దానికి మించి కోరుకున్నాడని, ఇప్పుడు ముందు కోరుకున్నంతగా కోరడం లేదని అనడం కాదా? ఈ సమస్యను ఇంకోవిధంగా ఆలోచిస్తే, దేవుడు యేసు సిలువ వేయబడినప్పటి నుండి తన హక్కులను విస్మరించి జనులు తనను అసహ్యించుకుని ధైర్యంగా పాపం చెయ్యడానికి అనుమతించాడా? అసలు ధర్మశాస్త్రాన్ని తొలగించడానికి క్రీస్తు మరణించాడని చెప్పడంలో అర్థం ఏంటి? దాని అవసరం ఏంటి? దానివల్ల లాభం‌ ఏంటి? నిజంగా ధర్మశాస్త్రం తగనిదాన్ని ఆశిస్తే దేవుడు దానిని తొలగించడం న్యాయమే. అలా చెయ్యడానికి క్రీస్తు మరణించవలసిన అవసరమే లేదు. అలాగే ధర్మశాస్త్రం సరైనదానినే కోరితే న్యాయంగా దేవుడు దానిని తొలగించే అవకాశమే లేదు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ‌తొలగించడానికి క్రీస్తు మరణించాడని చెప్పడం ఆయన వ్యర్థంగా చనిపోయాడని చెప్పడమే ఔతుంది.

అయితే క్రీస్తు అలాంటి దుష్ట ప్రణాళికతో ఈ లోకానికి రాలేదు. ఆయన స్పష్టంగా ఇలా ప్రకటిస్తున్నాడు. “ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయినను గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి యొక పొల్లయినను సున్నయైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును; అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో గొప్పవాడనబడును. (మత్తయి 5:17-19). ఈ అధ్యాయమంతటిలో ఆయన దీని గురించే పరిసయ్యులను ఖండించాడు. వారు ధర్మశాస్త్రం తొలగించబడిందని, అది విధించిన నియమాలు సవరించబడ్డాయని ఈ సిద్ధాంతాన్నే బోధించారు. ధర్మశాస్త్రం కొన్ని బాహ్యపాపాలను ఖండించినప్పటికీ పాపానికి పురికొల్పే హృదయ తలంపులను స్వల్ప అపరాధాలను ఖండించలేదని వారు చెప్పారు.

ఉదాహరణకు నరహత్య చేయకూడదు కాని కోపపడంలో, నిందించి మాటలాడడంలో, మనసులో రహస్యంగా విరోధభావం ఉంచుకోడంలో హాని లేదని పరిసయ్యులు బోధించారు (మత్తయి 5:21-26;). వ్యభిచారం చేయకూడదు కానీ మోహపు తలంపులు కలిగి ఉండడంలో తప్పు లేదని వారు చెప్పేవారు. (మత్తయి 5:27-30;). అప్రమాణం చేయకూడదు కానీ మాటల్లో చిన్న చిన్న ఒట్లు పెట్టుకోవచ్చని వారు బోధించారు. (మత్తయి5:33-37;). స్నేహితులను ద్వేషించకూడదు కానీ శత్రువులను ద్వేషించడాన్ని వారు అనుమతించారు .(మత్తయి5:43-47;). ఇటువంటి వాటిని ధర్మశాస్త్రం అనుమతించింది కాబట్టి అవి పాపాలు కావని వారు చెప్పారు. అయితే ఇది తప్పుడు సిద్ధాంతమని మన రక్షకుడు ఖండించి మన తండ్రి పరిపూర్ణుడైనట్టు మనం కూడా పరిపూర్ణులంగా ఉండాలని సెలవిచ్చాడు. (48) మన నీతి పరిసయ్యులు, శాస్త్రుల నీతి కంటే అధికము కాని యెడల పరలోకములో ప్రవేశింపలేమని ఆయన బోధించాడు (మత్తయి 5:20). కాబట్టి పరిశుద్ధుడైన ప్రభువు దేవుని ధర్మశాస్త్రాన్ని కొట్టి వేసాడు లేదా దానిని నెరవేర్చవలసిన అవసరత లేదని చెప్పాడనడానికి ఏ మాత్రం తావులేదు.

క్రీస్తు సంఘాన్ని పరిశుద్ధపరచడంలో తన ప్రజలను మరలా ధర్మశాస్త్రాన్ని పోలియుండేవారిగా పునరుద్ధరిస్తాడని నేనుపైన చెప్పినదానికి ఇప్పుడు కొన్ని నిదర్శనాలు చూద్దాం. వాస్తవానికి ధర్మశాస్త్రం కోరినప్రేమ, ఘనత, విధేయతలన్నిటికీ దేవుడు అర్హుడని బహిరంగంగా ప్రకటించడానికి, చూపించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రంలో విధించబడిన శిక్షలు సూచించే విధంగా పాపం‌ మనకు ఎంతో గొప్ప కీడు కలిగిస్తుందని, దాని ద్వారా దేవుని నీతిని మరియు, ఆయనకు పాపం పట్ల ఉన్న అసహ్యతను ప్రకటించడానికి చివరిగా దేవుడు నీతిమంతుడై ఉన్నాడని నమ్మే ప్రతివిశ్వాసినీ నీతిమంతుడిగా తీర్చడానికి ఆయన వచ్చాడు. క్రీస్తు తన ప్రజల స్థానంలో ధర్మశాస్త్ర నియమాలకు విధేయుడై అది ప్రజలకు విధించిన మరణశిక్షను తానే భరించడం వల్ల ఈ పనిని సుసాధ్యం చేసాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని ఘనపరచే విధంగా ఆయన ప్రభుత్వాన్ని కొనసాగించి తన ప్రజలకు రక్షణ ఇవ్వడమే మన ప్రభువు యొక్క నరావతారం, జీవితం, మరియు మరణంలో ఉన్న గొప్ప ఉద్దేశం.

ధర్మశాస్త్రం కోరే దానిని నెరవేర్చడమే దేవుని ప్రియకుమారుడైన యేసు దాసుని రూపం ధరించడంలో ఉన్న ఉద్దేశం. మొదటిదిగా “ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాడు ”(గలతి 4: 5) మహిమ స్వరూపియైన ప్రభువు ఈ స్థానం తీసుకోవడం ఎంతో ఆశ్చర్యం. రెండవదిగా, "పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో నున్నది” (కీర్తన 40:7,8) అని ఆయన ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలకు నిష్కలంకుడిగా విధేయుడయ్యాడు. బాలుడిగా ఆయన తన తల్లి దండ్రులకు లోబడి ఉన్నాడు (లూకా 2:51); నరుడిగా ఆయన సబ్బాతును ఘనపరచి తన ప్రభువైన దేవుణ్ణి తప్ప వేరెవరిని పూజించి సేవించడానికి నిరాకరించాడు (లూకా 4:8;) .నాలుగవదిగా యోహాను ఆయనకు బాప్తిస్మమివ్వడానికి వెనుదీసినప్పుడు “ఇప్పటికి కానిమ్ము, నీతియావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని” ఆయన ఉత్తరమిచ్చాడు (మత్తయి 3:15). ధర్మశాస్త్రకర్త స్వయంగా తన ధర్మశాస్త్రానికి విధేయుడవ్వడం ఆయన ప్రేమకు ఎంత గొప్ప రుజువు! మరణదండన క్రిందున్న తన ప్రజల స్థానాన్ని స్వయంగా ఆయనే తీసుకోవడం తన ప్రజల పట్ల ఉన్న ఆయన ప్రేమకు ఎంత గొప్ప నిదర్శనం!

సత్యమేంటంటే ధర్మశాస్త్రాన్ని తొలగించడానికి దేవునికి ఉన్న అమితమైన అయిష్టత మరియు అలా చేయడాన్ని తగనిదానిగానూ, తప్పుగాను, పరిగణించడమే క్రీస్తు మరణించవలసిన అవసరతను కలిగించింది. ధర్మశాస్త్రాన్ని ఆయన తొలగించి ఉంటే ఆర్భాటమేమీ లేకుండానే పాపులు రక్షణ పొంది ఉండేవారు. అయితే అది తొలగించబడకుండా ఉంటే అది కోరిన వాటిని వేరే మార్గంలో సంతృప్తి పరచాలి. లేకపోతే ప్రతి పాపీ నిత్యనాశనం పొందుతాడు. ఈ కారణం చేత క్రీస్తుసంతోషంగా మధ్యలో నిలిచి “ధర్మశాస్త్రాన్ని ఘనపరచి గొప్పచేసాడు” (యెషయా 42:21;). దీని ద్వారా క్రీస్తు దేవుని పరిశుద్ధత న్యాయాలకు ఘనత తెచ్చాడు. ఆయన చట్టాన్ని పరిపాలననూ స్థాపించాడు. దేవుడు స్వల్పంగానైనా రాజీపడకుండా పాపులను క్షమించే మార్గాన్ని తెరిచాడు. “ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు.. క్రీస్తు మనకోసము శాపమై మనలను శాపము నుండి విమోచించెను” (గలతీ 3:10,14). క్రీస్తు తండ్రి ఘనతను ఎక్కువగా ప్రేమించిన కారణంచేత ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం కానీ, ఆయన ప్రజలను ఆయన అధికారానికి అవిధేయులుగా చేయడానికి ప్రయత్నించడం కానీ అసాధ్యం. ఆయన తన ప్రజలను ఎక్కువగా ప్రేమించడం వల్ల “స్వాతంత్రానిచ్చే సంపూర్ణ నియమం నుండి (ధర్మశాస్త్రం నుండి) వారు తొలగకుండా చేసాడు. భూలోకంలో ఆయన జీవించిన దినాల వృత్తాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. అందులో ఆయన ధర్మశాస్త్రాన్ని స్వల్పంగానైనా కించపరిచి మాటలాడినట్టు ఎక్కడా కనిపించదు. దానికి బదులుగా ఆయన తన శిష్యులకు "మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునైయున్నది.” (మత్తయి 7:12) అని బోధించాడు. అదే విధంగా ఆయన శిష్యులైన అపోస్తలుల సైతం ధర్మశాస్త్రం ఆజ్ఞాపించిన విధులను నిర్వహించమని బోధించారు. “ఒకని నొకడు ప్రేమించు విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చియుండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు” ( రోమా 13:8). "పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై యుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది” (ఎఫెసీ 6:1-20) అపోస్తలుడైన యోహాను ఒకరినొకరు ప్రేమించండని విశ్వాసులకు ఉపదేశిస్తూ 'మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు రాయడం లేదని చెప్పాడు (యోహాను 2:7). ఆ తరువాత మనం చూడబోయేవిధంగా పరిశుద్ధాత్మ మనల్ని పరిశుద్ధపరచడానికి గొప్ప సాధనం ధర్మశాస్త్రం.

ఇక్కడ తెగిపోని మూడు పేటల తాడు‌ లాంటి మూడంతల ఆలోచన ఉంది. అవి పరిశుద్ధ లేఖనాలకు లోబడే వారందరికీ ఈ అంశాన్ని స్థిరం చేస్తుంది. మొదటిది తండ్రియైన దేవుడు తన ప్రజలు తక్కువ వెలతో రక్షింపబడేలా ధర్మశాస్త్రాన్ని పలచన చేయకుండా దానిని ఘనపరిచాడు. తన సొంతకుమారుడు సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్దనుండి తొలగించు” మని అర్థించినప్పుడు సైతం ధర్మశాస్త్రం కోరిన దానిని జరిగించకుండా మానలేదు. కుమారుడైన దేవుడు దానికి సంపూర్ణంగా లోబడి దాని శిక్షను తానే అనుభవించడం వల్ల ధర్మశాస్త్రాన్ని ఘనపరిచాడు. యేసుక్రీస్తు నందున్న దేవుని కనికరాన్ని చూడడానికి ముందే, ధర్మశాస్త్రం తమను ఖండిస్తున్నన్నప్పటికీ అది పరిశుద్ధమునూ, నీతిగలది, ఉత్తమమునై ఉన్నదని (రోమా 7:12) చూసి గ్రహించి ఒప్పుకునెలా చేయడం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు ధర్మశాస్త్రాన్ని ఘనపరుస్తాడు. దానివల్ల ధర్మశాస్త్రం ఘనత పొందుతుంది. పాపం అసహ్యించబడుతుంది, పాపి అణచబడతాడు. కృప మహిమ పొందుతుంది.

క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడని కొందరు మనతో ఏకీభవిస్తారు కానీ ధర్మశాస్త్రం నెరవేరింది కాబట్టి విశ్వాసులిప్పుడు దాని ఆజ్ఞల నుండి పూర్తిగా విముక్తులయ్యారని అంటారు. అయితే ఇలా చెప్పడం అన్నిటికంటే హేతురహితం, అర్థరహితం. క్రీస్తు ధర్మశాస్త్రాన్ని ఘనపరచడానికి అంత వేదన అనుభవించింది ఇప్పుడు మనచేత దానిని ఘనహీనపరచడానికా? సిలువపై ఆయన దేవుని పట్ల తన ప్రేమను కుమ్మరించింది మనమాయనను ప్రేమించడం నుండి విడిపించడానికా? “విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు (రోమా. 10:4) అనేది సత్యమే- ఎందుకంటే అది నీతి మనకు నీతికలగడం కొరకు, ఔను, అయితే అది మనం పరిశుద్ధపరచబడడం కొరకు కాదు, “ఆయన యందు నిలిచియున్నానని చెప్పుకునువాడు ఆయన ఏలాగు నడుచుకున్నాడో ఆలాగే తానునూ నడుచుకొనబద్ధుడైయున్నాడని" (1 యెహను 2:6) లో రాయబడలేదా? క్రీస్తు ధర్మశాస్త్రాన్ని అసరించి నడుచుకోలేదా? కాబట్టి క్రీస్తు ఈ లోకంలోకి తన ప్రజలను ధర్మశాస్త్రం అనుసరించే వారిగా చేయడానికే తప్ప దాని నుండి విడిపించడానికి రాలేదు. వారి హృదయంలో ధర్మశాస్త్రాన్ని రాయడానికి క్రీస్తు తన ఆత్మను పంపాడే తప్ప (హెబ్రీ 8:10) దాని ఉన్నతమైన పరిశుద్ధమైన ఆజ్ఞలను వమ్ము చేయడానికి కాదు. దేవుడు తన ప్రజలను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే బాధ్యత నుండి విడిపించడానికి మారుగా తన ప్రజలను విమోచించడానికి తన కుమారున్ని ఈ లోకానికి పంపాడన్నది వాస్తవం. దానిని మరింత నెరవేర్చడానికి వారిని బద్ధులుగా చేస్తాడు అన్నది ఈ వాదనలేమీ అవసరం లేకుండానే విధితం. క్రైస్తవ పాఠకుడా, దేవుడు మనతో వ్యవహరించే విధానాలు ఒక్కక్షణం ఆలోచించు. మనం ప్రభువుపై తిరుగుబాటు చేసాం. ఆయనను అగౌరవపరిచాం, ఆయన అధికారాన్ని త్రోసివేశాం. ఆయన న్యాయపు శక్తిని ధిక్కరించాం. ఈ పరిస్థితిలో ఒకవేళ ఆయన వెంటనే తిరుగుబాటు చేసిన ఈ లోకాన్ని గాఢాంధకారంలో నాశనానికి అప్పగిస్తే అందులో ఆశ్చర్యం ఏముంది. అయితే ఆయన ఆ విధంగా చేయకుండా తన ప్రియకుమారుని తన అద్వితీయకుమారుని సమాధాన రాయబారిగా ఆయనకు వ్యతిరేకంగా ఎత్తిన ఆయుధాలను క్రిందపడవేసి, ఆయన ఇచ్చిన తేలికైన కాడిని ఎత్తుకున్నవారందరికీ ఉచితంగా పాప క్షమాపణ దొరుకుతుందనే మంచివార్తతో ఈ లోకానికి పంపాడు.

అంతేకాక దేవుని కుమారుడు మనుష్యుల చేత తృణీకరించబడినప్పుడు ఆయన తన కుమారుని పరలోకానికి తిరిగి రప్పించలేదు కానీ ఆయన యందు విశ్వాసముంచే వారందరి నిమిత్తం క్రయధనంగా తన ప్రాణాన్నర్పించి తన కృపాపరిచర్యను పూర్తి చేయడానికి అనుమతించాడు. ఇప్పుడాయన సువార్తను ప్రకటించడానికి తిరుగుబాటు ఆపి, తాము శిక్షకు పాత్రులని ప్రకటించే ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది నీతిగలది, ఉత్తమమైనదని ఒప్పుకుని ఉచితంగా దొరికే క్షమాపణ అనే వరం కొరకు యేసుక్రీస్తు ద్వారా తనవైపు చూడమని, తనకు పూర్తిగా లోబడి ఆయనను నిత్యం ప్రేమించి, ఆయన యందు ఆనందించమని ఆహ్వనించడానికి తన సేవకులను భూదిగంతముల వరకు పంపుతున్నాడు. ఇది మన హృదయాలను కరిగించి పరిశుద్ధమునూ దేవునికి అనుకూలమైన సజీవయాగంగా మనశరీరాలను ఆయనకు సమర్పించుకోవడానికి పురికొల్పదగిన తెలియని ప్రేమ, అనంతమైన దయ, అద్భుతమైన కృప కాదా? ఇట్టి సేవ మనకు యుక్తమైంది. (రోమా 12:1;).

ప్రియ పాఠకుడా దేవుడు కేవలం తన దయాసంకల్పం చొప్పున నిత్యసంకల్పం చొప్పున నరకం వైపు పరుగులు తీస్తున్న నిన్ను ఆపి, నీ పాపదోషం ఎంత ఘోరమైందో నీవు గ్రహించేలా చేసి, నీకు శిక్ష విధించిన తీర్పు న్యాయమైనదేనని ఒప్పింపచేసి, నీవు మోకాళ్ళపై యేసు క్రీస్తునందు ఉచితంగా కలిగే కృప ద్వారా క్షమాపణను పొంది ఆయన ద్వారా దేవునికి నిన్ను నీవు సమర్పించుకునేలా చేసాడు. ఆయన ఇప్పుడు నిన్ను తన కృపకు పాత్రుడిగా తన బిడ్డగా చేసుకుని శాశ్వత నిబంధనతో నీకు తండ్రిగా దేవునిగా మారి, నీకు బోధించి, నడిపించి, పోషించి, పెంచి, బలపరచి తప్పు దిద్ది, ఓదార్చి, కాపాడి, సంరక్షించి, ఈ లోకంలో ఉండగా నీ అవసరతలన్నీ తీర్చి అన్నీ నీ మేలు కొరకు సమకూడి జరిగేలా చేసి, ఇంతగొప్ప ధన్యతకు నడిపించాడు. ఇంతగా చేసిన ప్రభువైన నీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో ప్రేమించడం, నీ విధి కాదా? నీతియుక్తమైన ఆయన ధర్మశాస్త్రానికి విధేయుడవ్వడానికి ఆయన ప్రేమ నిన్ను పురికొల్పదా? ఆయనను సంతోషపరచి, గౌరవించి, మహిమపరచడానికి ఇలాంటి ప్రేమ నిన్ను బలవంతపెట్టదా?

 

పరిశుద్ధపరచబడుటను గురించిన సిద్ధాంతం

18. దాని నియమం (కొనసాగింపు)

ధర్మశాస్త్రాన్ని ఘనపరచి అది కోరే నీతియుక్తమైన విధులన్నిటినీ నెరవేర్చడానికే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడని, సత్యాన్ని ప్రేమించే ప్రతి పాఠకునికి స్పష్టంగా రుజువైందని నేను నమ్ముతున్నాను. యేసు ప్రభువు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి అది విధించిన శిక్షను అనుభవించడం ద్వారా తన బిడ్డలు దాని అనుగుణ్యతలోకి తేబడడానికి ఆయన పునాది వేసాడు. ఇది రోమా 8:2,3లో స్పష్టంగా వివరించబడింది. “ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయలేకపోయెనో (అనగా పాపులను నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధపరచలేకపోవడం, అపరాధ పరిహారాన్ని చెల్లించలేకపోవడం, పాపపు అధికారంనుండి విడిపించలేకపోవడం) దానిని దేవుడు చేసెను. శరీరము ననుసరింపక ఆత్మ ననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంతకుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను".

దేవుడు తన కుమారున్ని ఈ లోకానికి పంపడంలో ఉన్న ఉద్దేశమిదే. “మనం మన శత్రువుల చేతి నుండి విడిపించబడి, మన జీవితకాలమంతా నిర్భయులమై, ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను, నీతిగాను ఆయనను సేవింపను....... ఈ రక్షణ కలుగజేసెను” (లూకా 1:75). “ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్ క్రియల యందాసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను" (తీతుకు 2:14) మనము పాపము విషయమై చనిపోయి, నీతి విషయమై జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను” (1 పేతురు 2:24). తన ప్రజలు దేవునికి విధేయులవ్వడానికి, పరిశుద్ధులవ్వడానికి, వారు హృదయమందునూ జీవితంలోనూ దేవుని ధర్మశాస్త్రానికి అనుకూలంగా అవ్వడానికి క్రీస్తు “మరణం వరకు విధేయుడయ్యాడని”, అనేక వాక్యభాగాలు వివిధ విధాలుగా చెబుతున్నాయి”. ఇంతకంటే తక్కువైనదేదీ దేవుని అధికారం, ఆయన స్వభావం కోరేదానిని నెరవేర్చి - విమోచకుని అమూల్యమైన కార్యానికి ప్రతిఫలమైన విజయానికై ఆయనను కీర్తించలేదు.

అంతేకాక మన హృదయం ధర్మశాస్త్రానికి అనుగుణ్యంగా మారడం తప్ప వేరేదీ అతి పరిశుద్ధుడైన దేవుణ్ణి తృప్తిపరచదనడంలో‌ ఆశ్చర్యం లేదు. “మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును” (1సమూయేలు 16:7). పాత నిబంధనలో ఈ ప్రాథమిక సత్యం ఎంత ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమిస్తుందో గ్రహించని వారు దానిని చదువడం వ్యర్థం. “ హీబ్రూ ఇంగ్లీషు కంక్కార్డెన్స్” ఉన్నవారు "హృదయం”అనే పదం ఎన్ని వందల సార్లు అందులో వాడబడిందో ఒక చూపులో గ్రహించగలరు. పరిశుద్ధుడైన దేవుడు తాను సృష్టించిన మనుషులు పైపైన ప్రదర్శించే నడతతో తృప్తి చెందడు. అయ్యో, అయ్యో! హృదయ సంబంధమైన మతం ఈ లోకంనుండి వేగంగా అదృశ్యమౌతూ దానిని ఎరుగని వారికి నిత్యనాశనం కలుగచేస్తుంది. దేవుడు తన ప్రజల నుండి హృదయం కంటే తక్కువైననదేదీ ఎప్పుడూ కోరలేదు. "కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము” (సామెత 23:26). “నీవు కన్నులార చూచిన వాటిని మరువక యుండునట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము” (ద్వితీయో 4:9). (సామెత 4:23;) ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి........... మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. (యోవేలు 2:12,13) దేవుని ధర్మశాస్త్రంలో ఉన్నతమైన పరిశుద్ధమైన ప్రమాణాలు ఇశ్రాయేలీయుల్లో తిరిగి జన్మించినవారు స్పష్టంగా గుర్తించగలిగారు. “నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. (కీర్తన 51:6) అందుకే వారు ఈ విధంగా ప్రార్థన చేశారు. ముందటి అధ్యాయంలో నేను సూచించిన విధంగా యేసు క్రీస్తు మాటల్లోనే ధర్మశాస్త్రమంతా ఈ రెండు ఆజ్ఞలలో నిక్షిప్తమైయుంది. తన ప్రజలను ఇలా పునరుద్ధరించడానికే క్రీస్తు జీవించి మరణించాడు. వారిని దేవునికి తిరిగి ఇవ్వడానికి, వారాయనకు తిరిగి లోబడేలా చేయడానికి (ఆదాములో వారు దేవునికి అవిధేయులై పడిపోయిన పతనం నుండి ధర్మశాస్త్రమిచ్చిన దేవునికి వారిని‌ అప్పగించడానికే) ఆయన వచ్చాడు. దేవునికి మానవులకు మధ్య క్రీస్తే మధ్యవర్తి. విశ్వసించేపాపి క్రీస్తు ద్వారానే దేవుని యొద్దకు వస్తాడు. ఆయన తన పరిచారకులను సువార్త ప్రకటించడానికి పంపుతున్నాడు. “వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరుగడానికే” ఆయన తన పరిచారకులను సువార్త ప్రకటించడానికి పంపుతున్నాడు. (అపో.కార్యములు 26:8). “సమస్తమును దేవుని వలననైనవి. ఆయన క్రీస్తు ద్వారా మనలను తనతో సమాధానపరచుకొనెను” (2 కొరింథీ 5:18). పౌలు పరిశుద్ధులకు ఇలా రాస్తున్నాడు, “మీరు విగ్రహములను విడిచి పెట్టి, జీవముగల వాడును సత్యవంతుడనగు దేవుని దాసులగుటకు తిరిగి”.... (1థెస్సలొ. 1:9). క్రీస్తును గురించి అయితే ఇలా రాయబడి‌ంది. “తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు” (హెబ్రీ 7:25). మరలా ఇలా రాయబడింది. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు, ఆత్మ విషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను” (1 పేతురు 3:18).

క్రీస్తు తన ప్రజలను ధర్మశాస్త్రానికి అనుగుణ్యంగా ఎలా పునరుద్ధరిస్తాడో, ఆ ధర్మశాస్త్రం‌ ఇచ్చిన దేవునికి వారిని తిరిగి ఎలా అప్పగిస్తాడో ఇప్పుడు పరిశీలిద్దాం. మనం దేవుణ్ణి పూర్ణహృదయంతో ప్రేమించాలని ధర్మశాస్త్రం కోరుతుంది కాబట్టి మొదటిగా దేవుని గురించిన నిజమైన జ్ఞానం మనకు ఉండడం మేలని స్పష్టమౌతుంది. ఆయనపై మనస్సు పెట్టడానికి ఇది అవసరమని స్పష్టమౌతుంది. దేవుని గురించిన మన తలంపులు సరైనవి కాకపోతే అవి లేఖనాలతో సమ్మతించనివైతే, మనం సొంత ఊహలతో ఆయనను గురించిన తప్పుడు రూపాన్ని చిత్రీకరించామని అర్థం. అద్వితీయ సత్యదేవుణ్ణి ఎరగడం అనేది కేవలం సిద్ధాంతపరంగా ఆయనను గురించి తెలుసుకోవడంకంటే ఎంతో అతీతమైనది. ఆయన పరిపూర్ణతల గురించి తెలుసుకోవడం కంటే ఎంతో మించినది. అలాంటి సిద్ధాంతపరమైన జ్ఞానాన్ని దయ్యాలు కూడా కలిగి ఉన్నాయి. కాని అవి ఆయనను ప్రేమించవు కదా? దేవుణ్ణి ప్రేమించడానికి ముందు ఆయనను గురించిన ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. ఆయనకు ఉన్న వ్యక్తిగత సౌందర్యం, నీతి పరమైన ఔన్నత్యం, తరగని మహిమను గురించి తెలిసుండాలి.

స్వభావసిద్ధంగా మనం ఆయనపై ఇసుమంత ప్రేమ కలిగియుండడం‌ కూడా సాధ్యం కాదు. దానికి బదులు ఆయనను ద్వేషించాం. దానిని మనం గ్రహించి ఉండకపోవచ్చు. ఒకవేళ గ్రహించినప్పటికీ దానిని ఒప్పుకుని ఉండకపోదుము. “శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏమాత్రమును లోబడనేరదు (రోమా 8:7). దేవుని పట్ల శత్రుత్వం‌ ఎక్కడ ఉంటుందో అక్కడ ధర్మశాస్త్రానికి లోబడకుండా ఉండడం జరుగుతుంది. దీనికి భిన్నంగా దేవుణ్ణి ప్రేమించే చోట ఆయన ధర్మశాస్త్రానికి లోబడడం జరుగుతుంది. పునర్జన్మలేని వారికి దేవుని గురించిన నిజమైన జ్ఞానం లేదు కాబట్టి వారు దేవుణ్ణి ప్రేమించలేరు. ఈ వాస్తవం క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు కూడా వర్తిస్తుంది. సత్యం విషయంలో ఎక్కువ ఆధిక్యతలు కలిగిన విద్యావంతులైన యూదులతో క్రీస్తు "మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు” (యోహాను 8:19) అని చెప్పాడు. అలా ఎరగాలంటే ఒక అద్భుతం జరగాలి. “అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించెను” (2కొరింథీ 4:5). “మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించి యున్నాడని యెరుగుదుము” (1యోహాను 5:20).

ఆయన ఉన్నట్టుగానే ఆయనను మనం (మనం గ్రహించగలిగేంత పరిధిలో) ఆధ్యాత్మికంగా చూడడంలో దేవుని గురించిన నిజమైన జ్ఞానం ఇమిడి ఉంది. మనమాయనను ప్రేమకు ప్రతిరూపంగాను, సమస్త కృపలకు దేవునిగాను కృపామయుడైన తండ్రిగాను మాత్రమే‌ కాకుండా సర్వోన్నతుడిగాను అన్ని ప్రాణులకన్నా హెచ్చింపబడినవానిగాను, సార్వభౌముడిగాను, (ఎవరి అనుమతిని కోరక తన చిత్త ప్రకారం చేసేవానిగా) తాను చేసిన కార్యాలకు ఎవరికి లెక్క అప్పగించక, సమస్తం తన చిత్త ప్రకారం చేసేవానిగాను మార్పు లేనివానిగాను, ఏ చంచలత్వమైనా గమనాగమనాల వల్ల కలిగే ఏ ఛాయయైనా లేనివానిగాను దుష్టత్వం చూడలేనంత నిష్కళంకమైన కను దృష్టిగలవానిగాను, ఏ రహస్యాన్ని ఆయన నుండి దాచలేనంత సర్వజ్ఞుడిగాను, ఏ ప్రాణీ విజయవంతంగా ఆయనను ఎదురించలేనంత సర్వశక్తిమంతుడిగాను, పశ్చాత్తాపం పొందని తిరుగుబాటుదారుని తన సముఖం నుండి నిత్య నాశనానికి పారద్రోలే న్యాయాధిపతిగాను మనం ఆయనను చూడగలం. ఇవి నిజదేవుని గుణలక్షణాలు. ప్రియ చదువరీ, నీవు‌ ఆయనను ప్రేమిస్తున్నావా? రెండవదిగా దేవుణ్ణి ప్రేమించేవారు ఆయనను అధికంగా గౌరవించాలి. ఈ గౌరవంలో ఆయనను గురించిన ఉన్నతమైన ఆలోచనలు ఆయనకు ఉన్న గొప్ప విలువ దాగి ఉన్నాయి. ఇది ఆయన విలువను ఔన్నత్యాన్ని ఎరగడం వల్ల కలుగుతాయి. పునర్జన్మ లేనివారితో దేవుడు‌ ఇలా అంటున్నాడు. “నేను కేవలము నీవంటి వాడనని నీవనుకొంటివి” (కీర్తన 50:21). దీనికి కారణమేంటంటే దేవుణ్ణి గురించిన వారి ఊహలు నీచం, అధమం అవమానకరం‌ అయ్యున్నాయి. ఆత్మ మనల్ని పునర్జీవింప చేసినప్పుడు, ఆయన కాంతి మన జ్ఞానాన్ని వెలిగించినప్పుడు, దేవుని సౌందర్యాన్ని గ్రహించి ఆయనను ఆరాధించి ఘనపరుస్తాం. "సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు” అని పరమందలి దూతలతో కలిసి ఆయనను స్తుతిస్తాం. ఆయన అత్యున్నతుడని గ్రహించి, “ యెహోవా వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు (నిర్గమ 15:11) అని పలుకుతాం. “ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోని దేదియు నాక్కరలేదు” (కీర్తన 73:25) అని ఒప్పుకుంటాం.

దేవుని గురించిన ఈ ఉన్నతమైన అభిప్రాయం ఆయనకున్న ప్రత్యేకాధికారాలను మన హృదయం అంగీకరించడమే కాకుండా వాటినిబట్టి ఆనందించేలా కూడా చేస్తుంది. విశ్వసింహాసనాన్ని అధీష్టించినవానిగా ఆయనకు ఉన్న ఔన్నత్యాన్ని ఆయనకు ఉన్న హక్కులను, అన్నిటిపై ఆయనకు ఉన్న అధికారాన్ని గుర్తించడం వల్ల ఇలా జరుగుతుంది. ఎందుకంటే ఆయన అత్యున్నతుడైన దేవునిగా ప్రాణులన్నీ తనకు సంపూర్ణంగా లోబడాలని ఆజ్ఞాపిస్తాడు. ఆయనను ఆ విధంగా గౌరవించని వారిని ఆయన నాశన పాత్రులుగా ఎంచుతాడు. “నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు. నా మహిమను ఎవరికీ ఇచ్చువాడను కాను” నేను దేవుడను కనుక మీరిలా చేయాలని ఆయన ప్రకటిస్తున్నాడు. ఇటువంటి ఘనతను తనకు ఆపాదించుకోవడం పరమందున్న అత్యున్నతుడైన దూతకు సైతం దుష్టత్వంగా పరిగణించబడుతుంది. సర్వశక్తిమంతుడైన దేవుడు‌‌ ఇలా చెయ్యడం ఆయనకు ఎంతైనా న్యాయమైనదే. ఆయన ఎంతో అత్యున్నతుడుగా ప్రాణులన్నీ కలిసి ఆయనకు అర్పించే ఘనత, ఆరాధనల కన్నా మిక్కిలి అమితమైన ఆరాధనకు ఆయన అర్హుడు. దేవుని సర్వాధికారాన్ని, అనంతమైన ఔన్నత్యాన్ని గొప్ప మహిమను ఘనపరచడానికి తగిన విధానాన్ని చూడడానికి మన హృదయ నేత్రాలు తెరవబడినప్పుడు, అలాంటివానిని అందరికన్నా అధికంగా గౌరవించి ఘనపరచడం ఎంత సరైనదో, ఎంత న్యాయమైనదో గ్రహించి “సర్వభూజనులారా, యెహోవా మీద పాడుడి” అని సంతోషిస్తాం (కీర్తన 96:1). త్రిత్వమైన యెహోవా యొక్క ఔన్నత్యాన్ని మహిమను ఆత్మీయ నేత్రాలతో చూసినప్పుడు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువని గ్రహించడమే కాకుండా మనమాయన పరిపాలనలో ఆయన ప్రజలంగా సేవకులంగా జీవిస్తున్నామని కూడా గుర్తించి కృతజ్ఞత కలిగి సంతోషిస్తాం. అప్పుడాయన ధర్మశాస్త్రానికున్న ఆధారాన్ని కారణాన్ని అర్థం చేసుకుంటాం. ఆయనను మన పూర్ణ హృదయంతో ప్రేమించడం ఎంత సరియైనది, తగినది ఔతుందో తెలుసుకుని ఆయన ఆజ్ఞలన్నీ శిరసావహించడం ఎంత న్యాయమో, స్వల్పపాపం చేయడం సైతం ఎంత భయంకరమో, దానికి వచ్చే శిక్ష ఎంత న్యాయమో బాగా గ్రహిస్తాం. అప్పుడు భూమిపైనున్న రాజ్యాలన్నీ ఆయన ఎదుట సముద్రంలో నీటి బొట్టువలే ఉన్నాయని మనమాయన ముందు శూన్యం కన్నా సల్పమని తెలుసుకుంటాం.

మూడవదిగా మనమాయనను ప్రేమించడంలో ఆయన మహిమను లోతుగాను, స్థిరంగాను ఆపేక్షించడం కూడా ఒక విధియై ఉంది. మన కన్నులకు అత్యున్నతుడుగా కనిపించిన వ్యక్తితో మనకు పరిచయం కలిగినప్పుడు, మనం అతనిని గౌరవించి, అతని సంతోషం కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధపడతాం. అదే విధంగా దేవుని యందలి ప్రేమ ఈ లోకంలో మనం ఆయన ఘనత పొందేలా కోరి అలా ప్రవర్తించేలా చేస్తుంది. ఆత్మ సంబంధంగా మనమాయన అనంత ఔన్నత్యాన్ని వీక్షించి, ప్రపంచమంతా ఆయన సర్వాధికారియని గ్రహించినప్పుడు అనంతమైన ఆయన యోగ్యత మన హృదయంలో సజీవమై నిలిచినప్పుడు పవిత్రమైన గౌరవం ప్రజ్వరిల్లుతుంది. అప్పుడు “జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి. మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి” (కీర్తన 96:7, 8). “దేవా, ఆకాశముకంటే అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము (కీర్తన 57:5), అని పాడతాం.

ఎలా అయితే మనలో స్వయాపేక్ష ఉన్నప్పుడు స్వలాభాన్ని ఆశించి మనల్ని మనమే హెచ్చించుకునే విధంగా ప్రవర్తించామో, అలాగే ఇప్పుడు మనలో దేవునిపై నిజమైన ప్రేమ కలిగినప్పుడు ఆయనకు ప్రథమ స్థానమిచ్చి ఆయన మహిమనుకోరేవిధంగా ప్రవర్తిస్తాం.

ఇలాంటి పవిత్రమైన ప్రేమ, దేవుడు మనలాంటి అనేక సహోదరులను తన ఆధిపత్యం క్రిందికి తేవడం ద్వారా తనను తాను మహిమ పరచుకుని తన ఘన నామాన్ని గొప్ప చేసేలా యథార్థంగా కోరుతుంది. యథార్థమైన ఆధ్యాత్మిక ప్రేమ యొక్క సహజమైన కోరిక “పరలోకమందున్న మాతండ్రీ, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక” అని పలుకుతుంది. దేవుడు తనను తాను గొప్ప చేసుకోవడానికి మహత్కార్యాలు జరిగించినప్పుడు అది గొప్పగా ఆనందిస్తుంది "ఆకాశము సంతోషించును గాక భూమి ఆనందించును గాక ...... న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకును ఆయన తీర్పు తీర్చును (కీర్తన 96:11,13). అదే విధంగా ఆయన నామానికి అవఘనత కలగడానికి హేతువేదైనా మనం అహ్వానించినప్పుడు అది మనకు అధిక దుఃఖం కలిగిస్తుంది. ఇశ్రాయేలీయుల హృదయ కాఠిన్యం బట్టి దేవుడు వారిని నాశనం చేస్తానని చెప్పినప్పుడు "నీ ఘన నామం ఏమౌతుంది? దీనిని చూచి ఐగుప్తీయులు ఏమని చెప్పుకుంటారని?” మోషే దుఃఖంతో ప్రశ్నించినవిధంగా మనం కూడా స్పందిస్తాం.

ఇలాంటి నిస్వార్థ ప్రేమ నుండి, సమస్తం దేవునికి సమర్పించాలనే నిజమైన కోరిక కలుగుతుంది ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయన ఆజ్ఞలన్నీ శిరసావహించాలన్న వాంఛ కలుగుతుంది. ఎందుకంటే మనం నిజంగా ఆయన మహిమపరచబడాలని ఆశిస్తే ఆయన మహిమను వెదకుతాం. ఆయన గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని ఆత్మీయ నేత్రంలో చూసినప్పుడు ఆయనను సంపూర్తిగా పూజించడం తగినదని, మనకొరకై మనం స్వార్ధంతో జీవించడం యుక్తం కాదనీ తెలుసుకుంటాం. దేవుడు తనను తాను మహిమపరచుకోవాలనే మనకోరిక దేవుని కొరకు జీవించాలని మనల్ని బలంగా పురికొల్పుతుంది. మనం దేవుణ్ణి పూర్ణమనస్సుతో ప్రేమిస్తే పూర్ణ శక్తితో ఆయనను సేవిస్తాం. ఆయనను ఘనపరిచి, ఆయనను మహిమపరచడం మన ప్రధానమైన లక్ష్యమౌతుంది. అలా దేవుణ్ణి ప్రేమించి సేవించమని ధర్మశాస్త్రం కోరుతుంది. మనల్ని మనం ప్రేమించి సేవించుకోవడం అత్యున్నతుడైన దేవునిపై తిరుగుబాటు చేయడమే.

నాలుగవదిగా, దేవుణ్ణి ప్రేమించడంలో దేవునిలో ఆనందించడం ఇమిడి ఉంటుంది. దేవునికి ఉన్న వ్యక్తిగత సౌందర్యాన్ని, అనంత మహిమను గ్రహించినప్పుడు మన జీవమంతా ఆయన వైపు ఆకర్షించబడుతుంది. ఆకర్షించబడాలి కూడా. దేవుని సుగుణాల్లో ఉన్న సంపూర్ణతను ఆత్మనేత్రాలతో చూసినప్పుడు హృదయం ఆరాధనా భావంతో నిండిపోతుంది. మనం తోటి మానవునిలో ఆనందించిప్పుడు అతని సహవాసంలో, అతనితో సంభాషించినప్పుడు సంతోషాన్ని తృప్తిని పొందుతాం. అతడు లేనప్పుడు అతన్ని చూడాలని ఆశిస్తాం, అతడున్నపుడు ఆనందిస్తాం. అతని సంతోషం మనకూ సంతోషం ఇస్తుంది. అదేవిధంగా పరిశుద్ధపరచబడిన విశ్వాసి దేవుని మహిమ మరియు ఔన్నత్యాన్ని చూసినప్పుడు ఆయనను పరిశుద్ధునిగా అత్యధికంగా ప్రేమించి ఆరాధించి, ఆయనలో అత్యధికంగా ఆనందిస్తాడు. అతను ఎంత ఎక్కువగా దేవుని ఔన్నత్యాన్ని గుర్తిస్తాడో అంత ఎక్కువగా ఆయనలో ఆనందిస్తాడు.

దేవునిలో ఇలా ఆనందించడం వల్ల ఆయనతో మరింత సన్నిహిత సహవాసం కలిగి‌ ఉండాలనే వాంఛ కలుగుతుంది. "దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశతో నీతట్టు కని పెట్టియున్నాను. నీళ్లు లేకయెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది. నీ కృప జీవముకంటె ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును." (కీర్తన 63:1-3)

దేవునియందలి పరిశుద్ధ ఆనందాన్ని మసకపరచలేని కొన్ని పరిస్థితులు ఉన్నాయి. “అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేక పోయినను, సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదను. రక్షణ కర్తయైన నా దేవుని యందు నేను సంతోషించెదను” (హబక్కూకు 3:17,18). ఇలాంటి ఆనందం మిగిలిన వాటినన్నిటినీ విడిచి దేవుని పైనే ఆధారపడి జీవించాలనే కోరికను పుట్టిస్తుంది. ఆయనయందే సంతృప్తి కనుగొంటుంది. “యెహోవా మా దేవా, నీవు గాక వేరు ప్రభువులు మమ్మునేలిరి. ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము” (యెషయా 26:13). “వాటిని క్రీస్తునిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను” (ఫిలిఫ్ఫి 3:8). గర్వం కలవాడు మానవులిచ్చే ఘనతను బట్టి తృప్తిపడేవిధంగా, లోకస్తుడు సంపదయందు ఆనందించేవిధంగా, పరిసయ్యుడు తన విధులను నెరవేర్చడంలో అతిశయించే విధంగా దేవుణ్ణి నిజంగా ప్రేమించేవారు ఆయనలోనే సంతృప్తి చెందుతారు.

ధర్మశాస్త్రమంతా, ప్రవక్తల వచనాలన్నీ ఆధారపడున్న మొదటి ఆజ్ఞయైన ప్రేమను పైన చెప్పిన నాలుగు అంశాలు విశదపరస్తున్నాయనే వాస్తవం వాటి విషయమై చూపబడ్డ కారణాలను బట్టి మాత్రమే కాకుండా ఇలాంటి ప్రేమ పరిశుద్ధమైన విధేయతకు మూలమై ఉందనే సత్యం కూడా స్పష్టం చేయబడుతుంది.

ఆయన ఆజ్ఞలను గైకొనేలా ప్రభావవంతంగా మనల్ని బలవంతపెట్టేది దేవుని పట్ల నిజమైన ప్రేమయే. “మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల, దీని వలననే ఆయనను ఎరిగియున్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను” (1యోహాను 2:3-5) అయితే ఇలాంటి ప్రేమ మనఃపూర్వకంగా మనమలా చేసేలా బలవంతపెట్టే స్వభావం కలది. మనల్నిమనం ప్రేమించుకుంటే మన సొంత మేలును ఏ విధంగా కోరతామో అదే విధంగా దేవుని పట్ల ఉంటే దేవుణ్ణి ఆపేక్షిస్తాం. పరలోకంలోని పరిశుద్ధుల ప్రేమకు భూలోకంలోనున్న పరిశుద్ధుల ప్రేమకు వ్యత్యాసం పరిమాణంలో మాత్రమే కనిపిస్తుంది.

క్రీస్తు ఈ లోకంలోకి రావడంలో ముఖ్య ఉద్దేశం ధర్మశాస్త్రపు ఆజ్ఞలకు లోబడి, అది ఇచ్చిన శిక్షను భరించడం ద్వారా దానిని ఘనపరచడానికే అని, అలా చెయ్యడం ద్వారా ఆ ధర్మశాస్త్రం ఇచ్చిన దేవునికి తన ప్రజలను తిరిగి సంపాదించాడని, వివరించాను కాబట్టి ఇప్పుడు వారు కూడా ఆ ధర్మ శాస్త్రానికి లోబడేలా ఆయన ఎలా చేస్తాడో వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడే చూసిన విధంగా దేవునికి వ్యతిరేకంగా వారు ఎత్తిన ఆయుధాలను క్రిందపడవేసి, తమ పూర్ణహృదయంతో ఆయనను ప్రేమించేలా చెయ్యడం ద్వారానే ఇలాంటి విధేయత సాధ్యపడుతుంది. ఈ కార్యాన్ని - ఆయన తన ఆత్మను పంపి వారిని నూతనపరచడం ద్వారా సాధిస్తాడు, ఎందుకంటే మనకనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడియున్నది "(రోమా 5:5). ఇది పరిశుద్ధాత్మ హృదయంలో చేసే ప్రత్యేకమైన, మానవాతీతమైన కార్యం. తిరిగి జన్మించిన వారికి తిరిగి జన్మించని వారికి మధ్యఉన్న భేదం ఇదే.

పరిశుద్ధాత్మ పునరుజ్జీవింపచేసి పరిశుద్ధపరచే కార్యం క్రమంగా అభివృద్ధి చెందుతుందని, సువార్త ద్వారా పరిశుద్ధాత్మ దానిని క్రమక్రమంగా అంచలంచలుగా జరిగిస్తాడని ఇంతకు ముందే వివరంగా తెలియచేసాను. పరిశుద్ధాత్మ కార్యం యొక్క క్రమమేంటంటే జీవింపచేయడం, వెలిగించడం, ఒప్పించడం, క్రీస్తు దగ్గరకు చేర్చడం, శుద్ధిచేయడం. మనం ఈ క్రమాన్ని బాగా గ్రహించడానికి దానికి వెనుక నుండి చూడాలి. అంటే, మన స్వంత అనునుభవంలో ఆధ్యాత్మికంగా మనకు సంభవించిన విషయాలను గుర్తించి ఫలితంనుండి కారణాన్ని అన్వేషించే ప్రయత్నం చెయ్యాలి. 5. పరిశుద్ధాత్మ మనల్ని క్రీస్తు దగ్గరకు నడిపించకపోతే మనం ఆయన రక్తంతో కడగబడలేం. 4. సువార్తలో చెప్పబడిన మారుమనస్సును పరిశుద్ధాత్మ మనలో కలిగించకపోతే రక్షించే విశ్వాసం కలగడం కానీ క్రీస్తు దగ్గరకు రావడం‌ కానీ‌ జరగవు. 3. పాపం గురించి దేవుని వల్ల ఒప్పింపబడకపోతే దాని గురించిన దుఃఖం ఉండదు. 2. పరిశుద్ధాత్మ హృదయాన్ని వెలిగించకపోతే మనలో భయంకరమైన పాపముందని గ్రహించలేం. దానిని చూడలేం. దేవుణ్ణి ఎదిరించడం స్వయాన్ని ప్రీతిపరచడమనే ఆ పాపాన్ని చూడలేం. 1. పరిశుద్ధాత్మ మనల్ని పునర్జీంపచేయకపోతే దేవుని యెదుట మనకు ఉన్న భయంకరమైన స్థితిని చూడలేం. దేవుని సంబంధమైన విషయాలు మనపై ప్రభావాన్ని చూపడానికి మరియు వాటిని గ్రహించడానికి ముందే మనం ఆత్మ సంబంధమైన జీవాన్ని పొందాలి.

పరిశుద్ధాత్మ ద్వారానే మనం మరణం నుండి జీవంలోకి నడిపించబడ్డాం. దేవుని ధర్మశాస్త్రాన్ని ఎంత మాత్రం పోలియుండలేదనే ఆత్మీయమైన గుర్తింపు మనకు అనుగ్రహించబడింది. ధర్మశాస్త్రం కోరేవన్నీ ఆత్మ సంబంధమైనవనీ, న్యాయమైనవనీ గ్రహించగలిగాం, దానికి వ్యతిరేకంగా చేసిన పాపం గురించి దుఃఖించాం, అది మనకు విధించిన శిక్ష న్యాయమని గ్రహించాం. పరిశుద్ధాత్మ ద్వారానే మనం దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించి దానిలో‌‌ ఆనందించే నూతన స్వభావాన్ని పొందాం. దానిని బట్టే మనహృదయం ధర్మశాస్త్రానికి అనుగుణంగా మారింది. ఈ జీవితంలో మనం ఎంతవరకు ఈ అనుగుణ్యత సాధిస్తామో, ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనది తనలో ఇంకా ఎంతో మిగిలి‌ఉందనే క్రైస్తవుని భాధాకరమైన సమస్యను ఎలా అర్థం చేసుకోవాలో తరువాతి అధ్యాయంలో పరిశీలిద్దాం.

 

పరిశుద్ధపరచబడుటను గూర్చిన సిద్ధాంతము

19.దాని నియమం (కొనసాగింపు)

మన పునర్జన్మలో మరియు మనకు మారుమనస్సు కలిగించడంలో ప్రారంభించిన పనిని కొనసాగించి ముగించడమే పరిశుద్ధాత్మ జరిగించే కార్యసాధకమైన పరిశుద్ధపరచబడే ప్రక్రియ అని గత అధ్యాయాల్లో చూపించాను. మనం పతనం నుండి పాపం నుండి విడిపించబడి దేవుని నీతి స్వరూపంలోకి మారడమే రక్షించబడడం ఇది దేవుని ధర్మశాస్త్రానికి అనుకూలంగా మారడంతో సమానం. దేవుణ్ణి అత్యధికంగా ప్రేమించి, ఆయన కొరకు జీవించి, ఆయన యందు ఆనందించి మనవలే మన పొరుగువానిని ప్రేమించడమే దేవుని ధర్మశాస్త్రానికి అనుగుణంగా నడవడం అని గత అధ్యాయాల్లో వివరించాను. కాబట్టి మనం స్వభావసిధ్ధంగా ఏమైయున్నామో దానినుండి విడిపించబడి, దేవునికి విధేయులంగా చేయబడడమే రక్షణార్థమైన మార్పుకు నిదర్శనం.

మనల్ని దేవునికి తిరిగి సంపాదించే ప్రక్రియలో క్రీస్తు తన ఆత్మ ద్వారా ధర్మశాస్త్రాన్ని మన మనస్సుకూ, హృదయానికీ శక్తితో అణ్వయింపచేస్తాడు “యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును” (కీర్తన 19:7). ధర్మశాస్త్రాన్ని ఇలా ఫలవంతంగా అన్వయించడం వల్ల తాను ఇంతకాలం దానినెలా దిక్కరించి జీవించాడని తాను మలినమైన కుష్టురోగియని, నిత్యశిక్షకు అర్హుడని, సర్వాధికారియైన వాని హస్తాల్లో ఉన్నాడని (రోమా. 9:18;) పాపి స్పష్టంగా గ్రహిస్తాడు. రోమా 7:8,9లో ఈ అనుభవం సరిగా వర్ణించబడింది. “అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము (మనం దానిని గ్రహించకుండా ఉన్నాం). ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండ జీవించుచుంటిని (నేను అందరివలే మంచివాడనని, నా మత ఆచారాలతో దేవుని మెప్పు సంపాదించగలనని తలంచాను). ఆజ్ఞ వచ్చినపుడు (శక్తితో నా మనస్సాక్షి మీద పని చేసినపుడు) పాపమునకు మరల జీవము వచ్చెను (నా హృదయ మాలిన్యాన్ని గుర్తెరిగి భయంకరమైన నా పాపస్థితి‌ ఎంత‌ వాస్తవమో తెలుసుకున్నాను) నేనైతే చనిపోతిని (నా స్వనీతి విషయమై నేను చనిపోయాను).".

అప్పుడు మొదటిసారిగా 'ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదనే గ్రహింపు కలిగింది (రోమా. 7:17;). అది పైపైన కనిపించే మంచి కార్యాలను కాకుండా పరిశుద్ధమైన తలంపులను, భక్తితో కూడిన ప్రేమను కోరుతుందని తెలుసుకున్నాను. సత్క్రియలన్నీ ఇలాంటి నియమంనుండే రావాలని, లేకపోతే అవి దేవునికి అంగీకారాలు కావని గ్రహించగలిగాను “నీ ధర్మోపదేశము అమితమైనది”(కీర్తన 119:96;). అది బాహ్య ప్రవర్తనను కాకుండా అంతరంగ స్థితిని కూడా పరిశీలిస్తుంది. అది కోరేది "ప్రేమ". ప్రేమ హృదయానికి సంబంధించింది. ధర్మశాస్త్రం ప్రేమను తప్ప వేరే దేనిని కోరలేదు (దేవుని పట్ల, పొరుగు వాని పట్ల). ధర్మశాస్త్రానికి విరోధమైన వానిలోనే పాపముంది కాబట్టి ప్రేమ లేకుండా చేసే కార్యాలు దానికి విరోధం మరియు పాపం అయ్యింది. అందుచేతనే క్రీస్తు “ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అపుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును” (మత్తయి 5:28) అని స్పష్టంగా చెప్పాడు.

మంచి బ్యాహ్య ప్రవర్తన కన్నా మించిన దానిని దేవుడు కోరుతున్నాడు,. “నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు” (కీర్తన 51:6). ధర్మశాస్త్రం హృదయంలోని తలంపులను ఉద్దేశాలను ఎరిగి “నీవు ఆశింపకూడదు” అని చెబుతుంది. ఇది శరీర కార్యం కాదు కానీ హృదయ సంబంధమైనదిగా ఉంది. ధర్మశాస్త్రం కోరే ఉన్నతమైన, పరిశుద్ధమైన ప్రమాణాలను పాపి గ్రహించినప్పుడు వాటిని నెరవేర్చడంలో తానెలా అపజయం పొందాడో అతడు తెలుసుకున్నపుడు, తన భయంకరమైన స్థితిని గ్రహిస్తాడు. ఎందుకంటే “ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది” ( రోమా 3:20). మేల్కొల్పబడిన పాపి ధర్మశాస్త్రం తనను దుర్మార్గం విడువని, క్షమించరాని, తిరుగుబాటు దారునిగా తీర్చి శపించడం న్యాయమేనని గుర్తిస్తాడు.

దీని వల్ల అతడు తనకు క్రీస్తు ఎంతగా అవసరమో తెలుసుకుంటాడు. ఎందుకంటే తాము నీతిమంతులమని నిశ్చింతగా ఉన్న వారు పరమ వైద్యుడైన యేసు వద్దకు వెళ్ళరు. ఈ విధంగా పరిశుద్ధాత్మ చేతిలో ఉన్న ధర్మశాస్త్రం సువార్త యొక్క పనికత్తె. సీనాయి పర్వతం దగ్గర సైతం ఇదే దైవిక క్రమాన్ని చూస్తాం కదా? అక్కడ నీతిపరమైన ధర్మశాస్త్రం మొదట ఇవ్వబడిండి. ఆ తరవాత యాజకధర్మం మరియు బలులను గురించిన ఆచారసంబంధమైన ధర్మశాస్త్రం ఇవ్వబడింది. మొదటిది - ఒక రక్షకుడు అవసరం అని ఇశ్రాయేలును ఒప్పింపచెయ్యడానికి ఇవ్వబడితే, రెండవది - రక్షకుడిని వివిధ సాదృశ్యాలు మరియు పోలికలలో చూపించడానికి ఇవ్వబడింది. పరిశుద్ధాత్మచేత ఒప్పించబడిన పాపికి మేల్కొల్పబడిన తన మనస్సాక్షిలో పాపం ఎంతగా విస్తరించిందనే గుర్తింపు కలిగితేనే కాని పరిశుద్ధాత్మచేత తెరువబడిన తన హృదయంలో కృప మరిఎక్కువగా విస్తరించింద‌‌నే గుర్తింపు కలగదు. ధర్మశాస్త్రం యొక్క న్యాయం, గౌరవం మరియు ఔన్నత్యాన్ని మనం ఎంతగా గ్రహిస్తామో సరిగా అంతే పరిమాణంలో పాపం యొక్క దుష్టత్వాన్ని కూడా గ్రహిస్తాము.

“అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు హృదయములలో ప్రకాశించెను” (2కొరింథీ 4:6) అని రాయబడింది. ధర్మశాస్త్రంలో దేవుని నీతియొక్క మహిమలోని అనుభూతిని, సువార్త యందలి కృపయొక్క అనుభవాన్ని, పరిశుధ్ధాత్మ హృదయంలో అనుగ్రహించగా, పాపి మధ్యవర్తియైన క్రీస్తు ద్వారా దేవుణ్ణి చేరడానికి పురికొల్పబడతాడు. అప్పుడతడు నిత్యంగా తనను తాను ఆయనకు అప్పగించుకుని ఆయనను అత్యధికంగా ప్రేమించి, ఆయన కొరకే జీవించి ఆయనలో ఆనందిస్తాడు. దీనివల్ల అతడు తన పొరుగువానిని తనవలెనే నిస్వార్థమైన ప్రేమతో ప్రేమిస్తాడు. ఈ విధంగా విధేయతకు అతని హృదయంలో పునాది వేయబడుతుంది, ఎందుకంటే మనఃపూర్వకంగా సంతోషంగా చూపే విధేయత మాత్రమే దేవునికి అంగీకారమౌతుంది. ఆ ప్రేమ కృతజ్ఞత నుండి రావాలి. అది కఠినమైన భారాన్ని మోసేవిధంగా దుఃఖంతో అయిష్టతతో రాకూడదు.

ఈ విధంగా క్రీస్తు తన ఆత్మ ద్వారా మనల్ని ధర్మశాస్త్రానికి అనుగుణంగా మారుస్తాడు. మొదటిగా ధర్మశాస్త్రం మననుండి ఆశించేవాటన్నిటినీ ఆత్మ సంబంధంగా మనం చూసేలా, మన జ్ఞానాన్ని వెలిగించడం ద్వారా. రెండవదిగా అది అడిగే వాటిలో ఉన్న న్యాయాన్ని, పరిశుద్ధతను గ్రహించేలా చెయ్యడం ద్వారా. మూడవదిగా మన జీవితకాలమంతా ధర్మశాస్త్రాన్ని మన కాలి క్రింద వేసి త్రొక్కుతూవచ్చామని ఒప్పించడం ద్వారా. నాల్గవదిగా, దాని అధికారాన్ని ధిక్కరించినందుకు మనం దుఃఖించేలా చెయ్యడం ద్వారా. ఐదవదిగా ఒక క్రొత్త స్వభావాన్ని లేదా పరిశుద్ధ నియమాన్ని మనలో నాటడం ద్వారా. ఇప్పుడు దేవుడే తన ధర్మవిధులను మన మనసులలో ఉంచి మన హృదయముల మీద రాస్తాడు (హెబ్రీ 8:10;), ఈ విధంగా సువార్త చూపే కృప ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చెయ్యదు కానీ దానిని మన హృదయంలో స్థిరపరస్తుంది” (రోమా 3:31;). ఆత్మ సంబంధమైన సార్వత్రిక విధేయతను ధర్మశాస్త్రం కోరుతుంది.

దేవుణ్ణి అన్నిటికంటే అధికంగా ప్రేమించడం, మన పొరుగువారిని ఆయనకొరకు ప్రేమించడం అనే ముఖ్య విధులు దేవుడు తన సార్వభౌమ చిత్తంలో‌ కోరుతున్నందుకు మాత్రమే కాదు స్వభావరీత్యా కూడా అవి "పరిశుద్ధమైనదియు, నీతిగలదియు, ఉత్తమమైనదియు” అయినందున (రోమా 7:12) వాటిని చెయ్యడం మనకు న్యాయమే. ఆ రెండూ ముఖ్యమైన వేర్లుకాగా, వీటి నుండే మిగిలిన అన్ని ఆత్మ ఫలాలు ఉద్భవిస్తాయి. దీనికి వేరుగా ఏ హృదయ పరిశుద్ధత కానీ, పరిశుధ్ధ జీవితం కానీ లేదు. ఈ గురిని చేరడానికి ఉన్న శక్తివంతమైన మార్గం పరిశుద్ధాత్మ పరిశుద్ధపరచే కార్యం. దీని ద్వారా మన హృదయాలు, జీవితాలు ధర్మశాస్త్రానికి అనుగుణంగా మారతాయి. ధర్మశాస్త్ర విధులను చేసే మంచి మనసు మరియు ఆకాంక్ష ఆయన మనకివ్వాలి. దానిని అవలంబించే శక్తి మనకివ్వాలి. ఎందుకంటే దీనిని చెయ్యాలనే ఆశ హృదయంలో లేకపోతే మనం ఈ కార్యాన్ని చెయ్యలేము.

దైవిక జీవితం ఇలా ప్రారంభమై ఇదేవిధంగా కొనసాగుతుంది. విశ్వాసి ఎంత పాపాత్ముడో, వ్యర్ధుడో, నరక పాత్రుడో దేవుని ఆత్మ అతనికి మరింత పరిమాణంలో చూపిస్తూ అతడు క్షమించబడి, పరిశుద్ధపరచబడడానికి క్రీస్తు యేసు నందు కలిగే కృప ఎంత అవసరమో, అతనికి తెలియచేస్తాడు. అతని బ్రతుకు దినములంతా వీటిని మరింతగా గుర్తెరుగుతూ, అతని హృదయం దీనంగా మారి, అతనియందు క్రీస్తు కృప మరింత ప్రశస్తమైనదిగా మారుతుంది. దేవుని ఆత్మ విశ్వాసికి మరింతగా ఆయన మహిమను ఔన్నత్యాన్ని చూపిస్తాడు. దీనివల్ల అతడు దేవుణ్ణి ప్రేమించడానికి, ఆయన కొరకు జీవించడానికి, హృదయ పూర్వకంగా ఆయన యందు ఆనందించడానికి పురికొల్పబడతాడు. దీనివల్ల తన పొరుగు వానిని తన వలె ప్రేమించే హృదయవైఖరి అతనిలో కలుగుతుంది. “పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతి మంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును” (సామెత 4:18).

నేను పైన చెప్పిన మాటలకు కొన్ని పరిమితులు జోడించవలసి‌ ఉంది. మారుమనస్సు పొందిన తర్వాత ఆత్మకార్యాల్లో రెండు కారణాల నుండి కలిగే రెండు వ్యత్యాసాలు కలిసి ఉంటాయి. మొదటిది మార్పు చెందిన వ్యక్తికి కలిగే భిన్నమైన స్థితి. విశ్వాసి ఇప్పుడు పూర్వంవలే నరక భయం కలిగి ఉండడు. ఎందుకంటే అతడిప్పుడు ధర్మశాస్త్రం క్రింద లేడు. ( రోమా 8:15;). దానికి బదులు అతడిప్పుడు తనపట్ల ఎంతో ఉదారత కనపరచిన దేవునికి వ్యతిరేకంగా తనలో ఉన్న పాపం చూపించిన కృతజ్ఞతా రహిత్యాన్ని గ్రహించి గుండె పగిలినవాడిగా ఉంటాడు. రెండవది, మారుమనస్సు పొందిన వ్యక్తిలో కలిగే భిన్నమైన స్వభావం. విశ్వాసి పాపం యొక్క శక్తి క్రింద లేకపోవడం‌వల్ల, దేవునితో విరోధం కలిగియుండనందువల్ల అంతకు పూర్వం చేసినవిధంగా ఆత్మ కార్యాలను ఇప్పుడు వ్యతిరేకించక పాపాన్ని‌ ఎదిరించడానికి పరిశుద్ధాత్మతో కలిసి పనిచేస్తాడు. దేవా, తప్పుదిద్ది, శిక్షించక, నీ చిత్తప్రకారం నాతో వ్యవహరించి నా అపరాధాలను అణచివేసి, నీ రూపాన్ని నాలో కలిగించమని ప్రార్థిస్తాడు.

ఇప్పుడు సువార్తకు దీనితో ఉన్న సంబంధం గురించి కొన్ని మాటలు చెప్పవలసి ఉంది. మొదటిగా ధర్మశాస్త్రానికి ఉన్న కఠినత్వాన్ని కొట్టి వేయడానికి కాని దేవుని పరిపాలనా విధానాన్ని తిరుగుబాటు చేసిన ఆయన శత్రువులకు అనుకూలంగా మార్చి వారి మనసులను ఊరడించడానికి కాని సువార్త యొక్క కృప ఇవ్వబడలేదు. ధర్మశాస్త్రం “పరిశుద్ధమును, నీతియుక్తమును, ఉత్తమము"నైయున్నది. క్రీస్తు మానవుడిగా జన్మించకముందు కూడా అది అలానేఉంది. దేవుడు నిరంకుశుడు కాదు, ఆయన కుమారుడు బలియయ్యింది ఆయన నిరంకుశత్వానికి కాదు. ఆయన మరణించింది క్రూరమైన ధర్మశాస్త్రం‌ చేత గాయపరచబడిన తన ప్రజలను దాని నుండి విడిపించడానికి‌ కాదు. ధర్మశాస్త్రం నీతిలేనిది అయ్యుంటే అది కోరే కోరికలను తీర్చడానికి దేవుని కుమారుడు చనిపోవడం సాధ్యమైయ్యుండేది కాదు. రెండవది, పరిశుద్ధాత్మ ధర్మశాస్త్రాన్ని మనకు అన్వయించినప్పుడు సువార్త కొరకు మన హృదయం సిద్ధపరచబడుతుంది. ధర్మశాస్త్రం నాకు పాపమంటే ఏంటో తెలియచేస్తుంటే, సువార్త దాని దోషం నుండి శక్తి నుండి ఎలా విడుదల పొందగలనో తెలుపుతుంది. మూడవది, మనం పరిశుద్ధపరచబడడానికి ధర్మశాస్త్రమే ప్రమాణం కాని సువార్త కాదు. ధర్మశాస్త్రం దేవుడు నా నుండి ఏం కోరుతున్నాడో తెలియచేస్తే సువార్త వాటిని సంపూర్తి చేసే సాధనాలను సరైన హృదయవైఖరిని అందిస్తుంది.

నాల్గవది ధర్మశాస్త్రం మరియు సువార్త ఒకదానినొకటి వ్యతిరేకించుకోవడం లేదు కాని ఒకదానితో ఒకటి సహకరిస్తుంది. ఒకటి మరొకదానికి పరిచారకురాలిగా ఉంది. విశ్వాసి అనుభవంలో ఈ రెండూ కలిసి పనిచేస్తాయి. ఐదవది, ధర్మశాస్త్రం కోరే ఉన్నతమైన పరిశుద్ధ ప్రమాణాలను సువార్త స్వల్పంగానైనా మార్చదు. “మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు” (మత్తయి 5:48). “మిమ్మును పిలిచినవాడు పరిశుధ్ధుడైయున్న ప్రకారము మీరును పరిశుద్ధులై యుండుడి” (1 పేతురు 1:16) - ఇది మన యెదుట ఉంచబడిన ప్రమాణం. ఆరవది, ఈ విధంగా క్రైస్తవుని నీతికి ప్రమాణం ధర్మశాస్త్రమే. అయితే అది మధ్యవర్తి ద్వారామాత్రమే నెరవేర్చడం సాధ్యపడుతుంది. (1కొరింథీ 9:21;). ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదల పొందిన తర్వాత సీనాయి పర్వతంపై మోషే అనే మధ్యవర్తి ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఇది క్రీస్తునందు ఉన్న మధ్యవర్తిత్వానికి ఛాయగా ఉంది. ఏడవది, పైన చెప్పిన వాటిని బట్టి దేవుని నైతిక ధర్మశాస్త్రమే క్రైస్తవుని నీతికి ప్రమాణం మరియు అతని జీవనవిధానానికి నియమం అనే సత్యాన్ని తిరస్కరించేవారి దైవధిక్కార సిద్ధాంతం ఎంత తీవ్రమైనదో తెలుస్తుంది.

"దేవుని పరిశుద్ధ ధర్మశాస్త్రం మరియు ఆయన కృపాసువార్త, ఈ రెండూ దేవుని మహిమను ప్రతిబింబింప చేస్తున్నాయి. పరలోకంలో ఈ రెండూ కలిసి మహిమను వెదజల్లుతాయి. ధర్మశాస్త్రం పరిశుద్ధత యొక్క సౌందర్యాన్ని పాపం యొక్క భయంకరత్వాన్ని చూపించి, ఉగ్రతా‌ పాత్రులను అక్కడికి నడిపించిన కృపను గొప్ప కాంతిలోను మహిమలోను ప్రదర్శిస్తుంది. అలాగే కృప అంతకు పూర్వం అపవిత్రంగానూ నీచంగానూ ఉన్న పాపులలో ఇప్పుడు వారు పరిశుద్ధపరచబడడాన్ని బట్టి ధర్మశాస్త్రం యొక్క పవిత్రత మరియు పరిశుద్ధత వారిలో కనపరచబడడాన్ని చూపించి ధర్మశాస్త్రానికి ఘనతనిస్తుంది. ధర్మశాస్త్రం కోరినవాటిని మరియు కృప కోరినవాటిని సమన్వయపరచి విడిదీయరానివిధంగా జతచేసిన వధింపబడిన గొర్రెపిల్లయైన క్రీస్తు ఆయన పరిశుద్ధులయందు మహిమపరచబడి, విశ్వసించిన వారిచేత ఘనపరచబడతాడు" (James fraser, "the scriptural doctrine of sanctification 1760).

ఈ విధంగా క్రీస్తు పునరుజ్జీవింపచేసి పరిశుద్ధపరచే తన ఆత్మద్వారా తన ప్రజలను ధర్మశాస్త్రానికి అనుగుణంగా సువార్తకు అనుకూలంగా చేస్తాడు. “మన మందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింప జేయుచు, మహిమ నుండి అధికమహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము” (2కొరింథీ 3:18). మొదటిగా ధర్మశాస్త్రమనే అద్దంలో ప్రకాశించే దేవుని మహిమను మనం చూస్తున్నాము, అందులో ఆయన నీతి మరియు పరిశుద్ధత యొక్క మహిమను, ఆయన పరిపాలనా, ఔన్నత్యం మరియు అధికారం యొక్క మహిమను, మన పూర్ణహృదయంతో ఆయనను మరియు ఆయనకొరకు మనవలె మన పొరుగువారిని కూడా ప్రేమించాలనే ఇంత గొప్ప ధర్మశాస్త్రాన్ని తయారుచేసిన ఆయన మంచితనం యొక్క మహిమను చూస్తున్నాము. రెండవదిగా, సువార్త అనే ఆద్దంలో ప్రకాశించే “దేవుని మహిమను” చూస్తున్నాము. విమోచించే ఆయన ప్రేమ యొక్క మహిమను, అద్భుతమైన ఆయన కృపామహిమను, అత్యంత దయామహిమను చూస్తున్నాము. నూతన పరచబడిన ప్రాణులంగా దీనిని చూసి మనం అదే పోలికలోనికి మార్చబడతాము (మార్చబడతామని ఇక్కడ అనువదించడిన అదే గ్రీకు పదం క్రీస్తు రూపాంతరము చెందాడని రాయబడిన సందర్భంలో కూడా వాడబడింది). ఈ విధంగా మహిమనుండి అధికమహిమకు క్రమక్రమంగా ఒక దశనుండి మరొక దశకు మనం దేవుని ఆత్మచేత మార్చబడతాము. అంటే ధర్మశాస్త్రానికి అనుగుణంగాను మరియు సువార్తకు అనుకూలంగాను నిజంగా మారతాము.

సువార్త మారుమనస్సు పొందమని మనకు ఆజ్ఞాపిస్తుంది. అయితే మనం ధర్మశాస్త్రానికి విరోధంగా పాపం చేసామని గ్రహించేవరకూ నిజమైన మారుమనస్సు కలగదు. ధర్మశాస్త్రానుసారంగా నడవకుండా‌ ఉండడం మన దోషమేయని మనం గ్రహించేలా పరిశుద్ధాత్మ మనలను వెలిగించేవరకూ నిజమైన మారుమనస్సు మనలో కలగదు. అప్పుడు మనమెన్ని మతాచారాలు పాటించినా, సత్ క్రియలు ఎన్నిచేసినా, నాశనపాత్రులమే‌యని మనం గ్రహిస్తాము. అప్పుడు మనమింతకు‌ ముందు జరిగించిన మతాచారాలన్నీ దేవునిపట్ల ప్రేమతోనూ ఆయన మహిమ కొరకూ కాక ఆచార ప్రకారంగానూ వేషధారణతోను, స్వయాన్ని ప్రేమించడం వల్ల నరకంలో పడతామనే భయంతోను, వాటి వల్ల పరలోకంలో ప్రవేశిస్తామనే ఆశతోను చేసినవే. అప్పుడు మననోరు మూయబడుతుంది. చెప్పిన సాకులన్నీ సర్దుబాట్లలన్నీ నిశ్శబ్దం చేయబడతాయి. ధర్మశాస్త్రం మనకు విధించిన శాపం న్యాయమేనని ఒప్పుకుంటాము. అప్పుడు దేవుడు మనోహరుడును, మహిమయుక్తుడుగా కనిపిస్తాడు కాబట్టి ఆయన పట్ల శత్రుత్వం వహించినందువల్ల మనలను మనం తృణీకరించుకుంటాం. ఇవే యథార్థమైన మారుమనస్సుకు ఉన్న కొన్ని లక్షణాలు.

విశ్వసించమని సువార్త మనల్ని ఆజ్ఞాపిస్తుంది. దేవుని మాటగా దానిని అంగీకరించమని పిలుస్తుంది. భయంకరంగా అవమానించబడిన దేవుడు తన శత్రువులపై కనికరం చూపనుద్దేశించాడని ఎవని ధర్మశాస్త్రం చులకన చేయబడి త్రొక్కబడిందో ఆ సర్వాధికారే తన వివేకం ద్వారా తన ధర్మశాస్త్రానికి అవమానం కలుగకుండా అది కోరే వాటిని కొట్టి వేయకుండా మనల్ని క్షమించే మార్గాన్ని ప్రవేశపెట్టాడని అలాంటి అద్భుత ప్రేమ వల్ల తన ఏకైక కుమారుడు ధర్మశాస్త్రం నెరవేర్చడానికి, దాని శిక్షను భరించడానికి మనకొరకు అర్పించాడని ఇలాంటి మంచివార్తను నమ్మడానికి ఆహ్వనిస్తుంది. ఒక పాపి పరిశుద్ధాత్మ ద్వారా బ్రదికించబడి, ఇలాంటి కృపను కనుగొన్నపుడు అది " నమ్మశక్యం కాని దీవెన” వలె కనిపిస్తుంది. తన పరిస్థితి నిరాశాయుతమని, కనికరం పొందలేనంతగా తాను పాపం చేసానని, క్షమించరాని పాపాలను చేసానని అతనికి అనిపిస్తుంది. ఇలాంటి స్థితిలో ఉన్నవాడు అతని హృదయంలోకి సువార్తను అంగీకరించడం ప్రపంచాన్ని నిర్మించేంత అసాధ్యకార్యం. పరిశుద్ధాత్ముడు మాత్రమే రక్షించే విశ్వాసాన్ని కుమ్మరించగలడు.

విధేయత చూపమని, క్రీస్తు ప్రభుత్వానికి పూర్తిగా అప్పగించుకోమని ఆయన కాడిని మనపై ఎత్తుకోమని, ఆయన నడిచినట్లు నడవమని సువార్త మనల్ని పిలుస్తుంది. క్రీస్తు ఎత్తుకున్న కాడి దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడడమే. ఆయన దేవుని ధర్మశాస్త్ర నియమాన్ని అనుసరించి నడిచాడు. కాబట్టి క్రీస్తు, “ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల, అతడు తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడించవలెన”ని చెప్పాడు (మత్తయి 16:24). ఎందుకంటే మనం తన అడుగు జాడలయందు నడుచుకొనునట్లు ఆయన మనకు మాదిరి యుంచిపోయెను (1 పేతురు 2:21). సువార్త చెప్పిన ఈ ఆజ్ఞను త్రోసి వేయడమే ఎవరైనా నాశనమవ్వడానికి కారణం. “ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయును” (2 థెస్సలో 1:6-8); అని రాయబడియున్నది. “తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చియున్నది. అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును? (1పేతురు 4:17) అని కూడా రాయబడింది. సువార్త కోరే ఇలాంటి విధేయత ఉదారమైన పరిశుద్ధాత్ముని పరిశుద్ధపరచే కార్యం ద్వారా మాత్రమే జరుగుతుంది.

పునరుజ్జీవింపచేసి నూతనపరచే తన కార్యాల ద్వారా పాపి హృదయంలో పరిశుద్ధాత్మ తెచ్చే మార్పు అద్భుతమైంది. అతడు క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడతాడు. నూతన పరిస్థితుల్లోకి నడిపించబడతాడు. దీని పోలిక అనాధలైన పిల్లలలో మనం చూస్తాం. తల్లిదండ్రులు కాని, పెద్దలనడిపింపు కాని లేక, అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్న అనాధబిడ్డలు ఒక సత్పురుషుని గృహంలోకి దత్తత తీసుకోబడ్డపుడు వీరు నూతన ప్రభావానికి లోనౌతారు. వారు చూపే ప్రేమ ఈ పిల్లల హృదయాలను లోపరచుకుంటుంది. నూతనమైన ఆలోచనలు వారి హృదయంలో నాటుకుంటాయి. వారి స్వభావం నూతన పరచబడుతుంది. క్రొత్త క్రమశిక్షణలకి వారు నడిపించబడతారు. పాత విషయాలు గతించి సమస్తమూ నూతన పరచబడతాయి. క్రైస్తవుని పరిస్థితి కూడా ఇదే. లోకంలో దేవుడు లేని వారునూ నిరీక్షణ లేని వారునై ఉండి, నిత్యనాశనం తట్టు పరుగెడుతుండగా వారు అంధకార శక్తి నుండి విడిపించబడి క్రీస్తు రాజ్యంలోకి తేబడ్డారు. వారికి నూతన స్వభావం ఇవ్వబడింది. పరిశుద్ధాత్మ తానే వారిలో నివసిస్తాడు. సమాధానపడిన దేవుడు వారిపట్ల తండ్రిచూపే శ్రద్ధను కనపరిచి, వారిని పోషించి నడిపించి సంరక్షించి చివరిగా నిత్యమహిమలోకి చేరుస్తాడు.

 

పరిశుద్ధపరచబడుటను గురించిన సిద్ధాంతం

20. దాని నియమం ముగింపు

మార్పులేని దేవునిధర్మశాస్త్రం, మనమాయనను పూర్ణహృదయంతో ప్రేమించాలని, మనవలె మన పొరుగువారిని ప్రేమించాలని కోరుతుంది.ఇదే విశ్వాసి జీవన నియమం. ఈ పరిశుద్ధ ప్రమాణంతో అతని స్వభావం, నడత, సరితూగాలి. ఇది అతని అంతరంగిక కోరికలు, తలంపులు మరియు బాహ్యక్రియలు ఇంతకు ముందు చూపిన విధంగా పరిశుద్ధాత్ముని పరిశుద్ధపరచే కార్యం ద్వారా ధర్మశాస్త్ర అనుగుణ్యతలోకి పోలికలోకి వస్తాయి. మనం పాపం యొక్క నీచత్వం చూసి గుర్తించేలా చెయ్యడం ద్వారా, దాని అధికారం నుండి విడిపించడం ద్వారా, ధర్మశాస్త్రం కోరే వాటిని చేసే ఇష్టాన్ని మనలో పుట్టించడం ద్వారా, పరిశుద్ధాత్ముడు ఆ పనిని జరిగిస్తాడు.దీనివల్ల మనకు విధేయత చూపించగల సామర్థ్యం లభిస్తుంది . దేవుని పట్ల విరోధభావం మనసులో ఉన్నపుడు (ఇది పునర్జన్మానుభవం లేని ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది) ధర్మశాస్త్రానికి విధేయత చూపడం అసాధ్యం.

పాపి నిజంగా దేవుని వైపు తిరిగినప్పుడు అతనిలో కలిగే అద్భుతమైన మార్పు గురించి కొంతవరకూ గత అధ్యాయంలో ప్రస్తావించాను. దేవునికి విధేయత చూపించడానికి తనను తాను ఆయనకు సమర్పించుకున్నవాడు ధర్మశాస్త్రాన్ని ఆమోదిస్తాడు. “బంగారు కంటెను, అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా నున్నవి. నీ ఉపదేశములన్నియు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నియు నాకసహ్యములు” (కీర్తన 119:127, 128). పునరుజ్జీవించబడని వారు ఈ విధంగా ఎందుకు చెయ్యరు? ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి వారు ప్రేమించరు.అయితే క్రీస్తు నందు పరిశుద్ధ దేవుణ్ణి ప్రేమించే విశ్వాసులు ధర్మశాస్త్రాన్ని కూడా ప్రేమించాలి. ఎందుకంటే దానిలో దేవుని పరిశుద్ధత ప్రతిబింబించబడింది. మారు మనస్సు పొందిన వారు ధర్మశాస్త్రమంతటినీ ప్రేమిస్తారు. “వేలకొలది వెండి బంగారు నాణెములు కంటె నీ విచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు” (కీర్తన 119:72); " నీ ఆజ్ఞలన్నియు నమ్మదగినవి” (కీర్తన 119:86). పునరుజ్జీవించబడిన వారిలో నిశ్చితమైన ఒక నియమం ఉంది. దానిని బట్టి వారు ధర్మశాస్త్రం నిషేధించిన వాటి నుండి తొలగిపోయి అది చేయమన్న వాటినే చేస్తారు.

మారుమనస్సు పొందినవారు తమ నడవడిని ధర్మశాస్త్రానికి అనుకూలంగా ఉంచుకోవడానికి నిత్యం ప్రయత్నం చేస్తారు. " ఆహా, నీ కట్టడలను గైకొనునట్లు నా ప్రవర్తన స్థిరపడి యుండిన నెంత మేలు. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగదు” (కీర్తన 119:5,6). వారు ధర్మశాస్త్రానికి లోబడేలా దానిని అర్థం చేసుకోవాలని కోరుకుంటారు. “యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును” “నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. దానియందు నన్ను నడువజేయుము” (కీర్తన 119: 33-35). పై వాక్యభాగాలన్నీ పాత నిబంధనలోనివే కదా అని ఎవరైన ఆక్షేపిస్తే అలాంటి ఆక్షేపణకు తావులేదు. పునర్జీవం యొక్క ఫలితాలు, మారు మనస్సు యొక్క ఫలితాలు అన్నికాలాల్లోనూ ఒకే విధంగా ఉంటుందనే సత్యాన్ని ఎవరూ ఎదిరించలేరు. అపోస్తులుడైన పౌలు కూడా తన అనుభవాన్ని దాదాపు ఇలాంటి పదాల్లోన్నే వర్ణించాడు. “అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను" ( రోమా 7:22).తన ప్రజల్లో తన ఆత్మ పనిచేసి వారిని ధర్మశాస్త్రం వైపు త్రిప్పి, దానిని ప్రేమించి విధేయులయ్యేలా చెయ్యడం ద్వారా క్రీస్తు వారిని ధర్మశాస్త్రానికి అనుగుణంగా చేస్తున్నాడు.

ఈ నియమంలో విశ్వాసి ఒక తీవ్రమైన కష్టం ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే యథార్థపరుడై క్రైస్తవుని హృదయం యథార్థమైనది. అది అసత్యాన్ని, వేషధారణను అసహ్యించుకుంటుంది. ఈ కష్టాన్ని ఈ విధంగా వివరింపవచ్చు. మారుమనస్సు పొందడం అంటే, దేవుని ధర్మశాస్త్రానికి ఉన్న పరిశుద్ధతను పోలి యుండడం దాని అధికారానికి లోబడడం దానిని అనుదినం ఆచరణలో పెట్టడం అయితే - నేను నిజంగా మార్పు చెందానని చెప్పలేను. ఎందుకంటే నాకు అలాంటి అనుభవం ఉందని నేను యథార్థంగా చెప్పలేను. నేను దుఃఖంతోను అవమానంతోను చెప్పేదేంటంటే పైన చెప్పిన దానికి నా అనుభవం సరిగా వ్యతిరేకంగా ఉంది. నాలో పాపం యొక్క శక్తి విరగడానికి బదులు శరీర వాంఛలు మునుపటికంటే అధికంగా చెలరేగడం‌ కనుగొన్నాను. నా హృదయం అన్ని అపవిత్రతలతో నిండి ఉంది.

పై మాటలు వణకుతున్న అనేక హృదయాల్లోని భావాలను ఖచ్చితంగా వ్యక్తపరుస్తున్నాయి. పరిశుద్ధత యొక్క నియమాన్ని గురించి దీనికి ముందు ఉన్న అధ్యాయంలో చెప్పిన విషయాలను బాగా ఆలోచించినప్పుడు చాలమంది తమ మనసులో కలవరపడి ఉంటారనడంలో సందేహం లేదు. ఒక వైపు అందులో రాసిన విషయాలు సరికావని‌ కూడా చెప్పలేరు. ఎందుకంటే అవి సత్యమే అని వారికి తెలుసు. అయితే మరొకవైపు అవి వారిపై దోషారోపణ చేస్తున్నాయి. ఎందుకంటే అటువంటి కొలతకు వారెంత తక్కువగా ఉన్నారో గ్రహించగలరు. ఆ ప్రమాణానికి వారు ఏ మేరకును ఏ భావంలోను సరికాజాలరన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనది వారిలో ఎంతో ఉన్నదని, తాము అంతరంగంలో కాని, బాహ్యంగా కాని దానికి లోబడడం లేదని గుర్తించి “అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను” ( రోమా 7:24) అని విలపిస్తారు.

దానికి నా జవాబు ఏంటంటే, ఇంత యధార్ధంగా సత్యంగా ఒప్పుకున్నందుకు దేవునికి స్తోత్రాలు! ఎందుకంటే నీవు నిజంగా మార్పుపొందావనడానికి ఇది స్పష్టమైన నిదర్శనం. ఏ వేషధారీ కూడా (మరణించే ఘడియలో తప్ప ) “నేనెంత దౌర్భాగ్యుడను” అని దుఃఖించడు. దేవుని ధర్మశాస్త్రానికి అనుగుణంగా లేనని పునర్జీవం లేని ఏ వ్యక్తీ చింతించడు. ప్రియ క్రైస్తవ చదువరీ, దైవ చిత్తానుసారమైన ఇలాంటి దుఃఖం కనీసం లేఖనంలోని ఒక వచనాన్నైనా నీకు అన్వయించుకునే శక్తి ఇస్తుంది. "రాత్రింపగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానము లాయెను” (కీర్తన 42:3) ఈ మాటలు నిరాశతో యూదా ఇస్కరియోతు పలికినవి కావు. “దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకునా ప్రాణము ఆశపడుచున్నది” (కీర్తన 42:1) అని పలికిన కీర్తనకారుడి మాటలివి. దుఃఖం ఆనందంతో కలగలిసిపోయిన క్రైస్తవుని యొక్క నిజమైన అనుభవం ఎలాంటిదో ఈనాడు అనేకులు గుర్తించలేకపోవడం ఎంత దుఃఖకరం.

పరిశుద్ధాత్ముడు పునరుజ్జీవం నందు ధర్మశాస్త్రాన్ని ప్రేమించి, దానికి లోబడగోరే ఒక నూతన స్వభావం మనకిస్తాడన్నది యథార్థమే. అయినప్పటికీ ప్రాచీన స్వభావం మాత్రం తీసి వేయబడదు. ధర్మశాస్త్రం మీద దానికి ఉన్న ద్వేషం, వైరం తొలగించబడదు. పరిశుద్ధాత్మ చేత మనకు మానవాతీతమైన పరిశుద్ధత నియమం అనుగ్రహించబడడం సత్యమే. అయినప్పటికీ పాపం యొక్క నియమం మరియు వేర్లు మనలో పాతుకుని ఉంటాయి. అవి నిర్మూలించబడవు, శుధ్ధిచేయబడవు. క్రైస్తవునిలో రెండు వ్యతిరేక నియమాలు ఉండడం వల్ల వాటి మధ్యలో నిరంతర పోరాటం జరుగుతుంది. “శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒక దానికొకటి వ్యతిరేకముగా నున్నవి కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు” (గలతీ 5:17) ఇక్కడ “చేయకుందురనే” పదం రెండు వైపులకూ మొగ్గుతుంది. “అదుపు చేసే ఆత్మ” “శరీరం” తన దుష్టకోరికలను తీర్చుకోడానికి అవకాశం ఇవ్వదు. అడ్డు నిలిచే “శరీర ముండడం వల్ల “ఆత్మ” తన ఆశను పూర్తిగా నెరవేర్చుకోలేదు.

ఈ రెండు స్వభావాలు అంటే‌ “శరీరం”, “ఆత్మ” - పాపం, పరిశుద్ధత ఉండడం‌ వల్ల వాటి మధ్యఉన్న పోరాటం కారణంగానే నిజమైన క్రైస్తవునికి భయంకరమైన, వ్యతిరేకమైన అనుభవం కలుగుతుంది. పరిశుద్ధ లేఖనం బోధించే దానిని పూర్తిగా చదివి, తనను తాను దానితో పోల్చుకున్నప్పుడు తాను అనుభవిస్తున్న కలవరం పై కొంత వెలుగు ప్రకాశిస్తుంది. మారుమనస్సు పొందిన వ్యక్తి యొక్క రెండు రకాల చరిత్రను రోమా ఏడవ ఆధ్యాయంలో పూర్తిగా, స్పష్టంగా చదవగలం. అక్కడ పౌలు పరిశుద్ధాత్మ చేత కదిలించబడి ఆత్మ సంబంధమైన తన స్వీయ చరిత్రను వివరంగా, సన్నిహితంగా చిత్రించాడు. రోమా 7వ అధ్యాయాన్ని అపవాది అతిగా ద్వేషించి అది ఇచ్చే ఆదరణకరమైన వర్తమానాన్ని క్రైస్తవుడికి అందకుండా దొంగలించాలని చూస్తాడు.

పైన చెప్పిన విధంగా క్రైస్తవుడు ధర్మశాస్త్రాన్ని అంగీకరించి అది “పరిశుద్ధమును, నీతియుక్తమును, ఉత్తమమును” ( రోమా 7:12) అని ఒప్పుకుంటాడు. తనలో నున్న అనేక గుణాలను అది ఖండించినా - తనలోని అపవిత్రతను, భక్తిహీనతను, నిరసించినా అతడు దానిని అంగీకరిస్తాడు. పైగా క్రైస్తవుడు తనను తానే ఖండించుకుంటాడు. “నేను చేయునది నేనెరుగను, నేను చేయనిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను” (రోమా 7:15). పాపం క్రైస్తవుడికి ఎంతమాత్రమూ తృప్తినివ్వక అతనికి అది గొప్ప దుఃఖం కలిగిస్తుంది. దేవుని ఔన్నత్యాన్ని మనుషుల నుండి ఆయన పొందవలసిన ఘనతను అతను చూసేకొలదీ దేవుని కృపకు తానెంత రుణపడియున్నాడో, కృతజ్ఞతో ఆయనకు తానెంత విధేయుడు కావాలో గుర్తెరుగుతున్నకొలదీ తాను ఉండవలసిన విధంగా లేడని జీవించవలసిన విధంగా జీవించడం లేదని బాధాకరమైన, ఎడతెగని ఆ వైఫల్యాన్ని బట్టి తన దుఃఖం మరింత అధికమౌతుంది.

తన హృదయంలో విజృంభిస్తున్న శరీర వాంఛలను భయాలను చూసి మిక్కిలి కలత చెంది తాను నిజంగా మార్పు చెందలేదని దుఃఖించే వారికి నేనిచ్చే రెండవ జవాబు ఇదే - సత్యమేంటంటే ఒక వ్యక్తి ఎంత అధికంగా పరిశుద్ధత కలిగి ఉంటాడో ఎంత అధికంగా అతని హృదయం పరిశుద్ధపరచబడుతుందో అంత ఎక్కువగా అతడు తనలోని దుష్టత్వాన్ని చూడగలడు. తన హృదయంలోని మాలిన్యాన్ని చూసి దుఃఖించి హృదయవేదనతో కఠినమైన మాటలతో తనకు వ్యతిరేకంగా తానే ఫిర్యాదు చేసుకుంటాడు. దేవుని వెలుగులో అతడు వెలుగును చూస్తాడు ఆ వెలుగు ఎక్కువగా మన హృదయంపై ప్రకాశించడం వల్ల పాపపు భయంకర కార్యాలను స్పష్టంగా చూడగలుగుతున్నాం. దాని దోషాన్ని మరింతగా గ్రహించగలుగుతున్నాం. పునరుజ్జీవం లేని వాడు బురదలో పొర్లే పంది లాంటివాడు. అతని అపవిత్రత, అపరాధాలు అతనికి తృప్తిని‌ ఇస్తాయి. వాటి గురించి అతనికి ఎలాంటి చింతా ఉండదు. బైటికి కనిపించే పాపం గురించే దిగులు లేని అతనికి తన హృదయంలో ఉన్న అపవిత్రతను గురించిన దిగులు ఏం ఉంటుంది?

పునరుజ్జీవం లేని వాడు పాప కార్యాలు చేస్తూనే తన గురించి తాను పొగుడుకుంటాడు. తన మంచితనం, దయ, ఉదారత, మంచి కార్యాలను‌ గురించి పలువురికి చెబుతూ అతిశయిస్తాడు. దీనికి భిన్నంగా నిజంగా పరిశుద్ధులైనవారు, పైకి మంచి ప్రవర్తన కలిగి ఉండి కూడా తమ అంతరంగంలో ఉన్న పాపాన్ని ఎరిగినవారై తమను తాము నిందించుకుంటారు. పునర్జీవంలేని వారు తమలో ఉన్న మంచి కార్యాలను మాత్రమే పరిగణలోనికి తీసుకుంటారు. పాపంలో కొనసాగుతున్నప్పుడు సైతం మనసాక్షిని చల్లార్చుకునేందుకు ఆ మంచి పై దృష్టి కేంద్రీకరిస్తారు. నిజంగా పరిశుద్ధపరచబడిన వారు తాము ఆత్మ సంబంధంగా సాధించిన విజయాలను ఫలాలను చూడకుండా తమ లోపాలపై తమలోనున్న అవరోధాలపై మరియు క్రీస్తు సారూప్యంలో మార్చబడడానికి దృష్టి నిలిపి, బాధపడతారు.

ఒక క్రైస్తవుడు ఈ విధంగా చెబుతాడు, ప్రభువు దయాళుడని నేను రుచి చూసాను అనుకున్నాను. నా హృదయం మారి దేవుని వైపుకు పరిశుద్ధత వైపు తిరిగింది అనుకున్నాను. నిజమైన మార్పు నాలో కలిగింది‌ అనడానికి మంచి నిదర్శ‌నం ఉందని, నా హృదయం పునర్జీవం పొందిందనీ తలంచాను. అయినప్పటికీ దాని ఫలితం కృపలో ఎదగడమూ పరిశుద్ధతలో ముందుకు సాగడమూ పాపం నుండి మరింతగా విడుదల పొందడమూ అని నాకు తెలుసు. కానీ అయ్యో, నేను దీనికి భిన్నంగా ఉన్నట్టు కనుగొన్నాను. కృప నాలో ఉంటే అది బలహీనపడుతుంది. పైకి నేను ధర్మశాస్త్రంలోని నియమాలను పాటిస్తున్నా, నా హృదయంలో పాపం మరింత బలపడుతుంది. చెడు వాంఛలు, శారీరక కోరికలు, లోకాశలు, ఆక్రమ వ్యామోహాలు నాలో అనుదినం తలెత్తుతున్నాయి. అవి బహుబలంగా పనిచేస్తూ నా ఆత్మను అపవిత్రపరస్తున్నాయి. అయ్యో, నా గత‌ అనుభవం నాలో భ్రమనూ భయాన్నీ కలిగిస్తుంది. దీని పర్యవసానాన్ని గురించి తలచుకుంటే అది నా ఆత్మలో గొప్ప కలవరాన్ని రేపుతుంది.

ప్రియ స్నేహితుడా, ప్రతి క్రైస్తవుడిలోను ఆత్మ పరీక్ష చేసుకుని దేవుని యెదుట దీనమనస్సుతో ఉండవలసిన అవసరత ఎంతో ఉందన్నది వాస్తవమే. అయితే దీనికీ మరియు పాపం మనపై ప్రభుత్వం చెయ్యడానికీ మధ్య చాల భేదం ఉంది. పాపం మనపై ప్రభుత్వం చేసేటప్పుడు హృదయ కాఠిన్యం మరియు ఆత్మ సంబంధమైన నిర్వేదం కలుగుతుంది. దుష్టులు పాపాన్ని సంతోషంతో సేవిస్తారు. అది వారికి తియ్యగా ఉండి ఆనందం ఇస్తుంది. అయితే నువ్వు పాపం‌ గురించి దుఃఖిస్తుంటే, దానిని తీవ్రంగానూ యథార్థంగానూ ఎదిరిస్తే, దానిని బట్టి నిన్ను నీవు నిందించుకుంటుంటే, ఇవిగో పాతవన్నీ గతించి సమస్తమూ నూతనపరచబడిందని తెలుసుకో. “మనస్సాక్షి నొప్పించబడి పాపాన్ని గురించిన చింత అధికమవ్వడం కృప విస్తరిస్తుందనడానికి, పరిశుద్ధత ప్రబలుతుందనడానికి గొప్ప నిదర్శనమని క్రైస్తవుడు తెలుసుకోవాలి. ఆ రెండూ వారు ఈ లోకంలో పొందుతారు. హృదయం ఎంత అధికంగా పరిశుధ్ధ పరచబడుతుందో పాపం‌‌ అది అంతే త్వరగా కనిపెడుతుంది" (James Fraser 1760).

క్రైస్తవుడి ఈ ద్వంద్వ అనుభవాలను పౌలు ఈ మాటలలో స్పష్టంగా తెలియచేస్తున్నాడు. “మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై యున్నాను” (రోమా 7:25). అయితే కొందరు ఆ తర్వాత అధ్యాయం “కాబట్టి యిప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి యే శిక్షావిధియు లేదు. వారు శరీరము ననుసరించి నడువక ఆత్మ ననుసరించువారు” అని ప్రారంభం ఔతుంది కదా అని జావాబిచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే లేఖన నిర్దిష్టతను గమనించండి. అక్కడ శరీరాన్ని అనుసరించి ప్రవర్తించని వారు అని లేఖనం ఒకవేళ చెప్పియుంటే మనం నిరాశ చెంది, మనం ఎంత మాత్రం క్రైస్తవులం కామనే నిశ్చయానికి రావచ్చు. అయితే "నడచుట” అనేది మనఃపూర్వంగా ఎంచుకునే మార్గం. అది స్వేచ్చగా ఒకవ్యక్తి ఎవరి ప్రోద్బలం లేక చేసేది. అతనిని బలవంతంగా లాగడం లేదా నడిపించడానికి ఇది వ్యతిరేకం. విశ్వాసి శరీరాన్ని అనుసరించి ప్రవర్తించినప్పుడు అది అతని హృదయంలోని పరిశుద్ధమైన కోరికలకు భిన్నమైంది. అతని నూతన స్వభావానికి అయిష్టమైంది. అయితే రోమా 8:4లో “ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి మనలో నెరవేర్చబడవలెనని” క్రీస్తు చనిపోయెనని చెప్పబడలేదా అని మరలా కొందరు ప్రశ్నించవచ్చు? దీనికి నేనిచ్చే జవాబు ఏంటంటే ఇక్కడ కూడా లేఖనం యొక్క అద్భుతమైన నిర్ధిష్టత ఎంతో అభినందనీయంగా కనిపిస్తుంది. అది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి ఇప్పుడు మనలో నెరవేరింది” అని చెప్పలేదు. అది ఈ జీవితంలో పరిపూర్ణత పొందదు కానీ మనం మహిమపరచబడినప్పుడు జరుగుతుంది.

అయితే మీరు తిరిగి ఇలా ప్రశ్నించవచ్చు. "అసలు దేవుడు క్రైస్తవుడిలో పాపస్వభావం నిలిచియుండడానికి ఎందుకు అనుమతించాడు? ఆయన దానిని సులువుగా తొలగించవచ్చు కదా? స్నేహితుడా; దేవుని అనంత జ్ఞానాన్ని ప్రశ్నించకుండా జాగ్రత్తపడు. ఏది శ్రేష్టమో ఆయనకు తెలుసు. ఆయన తలంపులు, మార్గాలు తరచూ మనకు భిన్నంగా ఉంటాయి. (యెషయా 55:8;).

అయితే నేను కూడా నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను. దేవుని శక్తిని అధికంగా ప్రదర్శించేది ఏది? తనలో పాప స్వభావమింకా ఉన్నవాడిని ఈ దుష్ట ప్రపంచంలో ఉంచి భద్రపరచడమా? లేక పరిశుద్ధమైన దేవదూతలవలే పాపం లేని వారిని ఈ లోకంలో ఉంచడమా? దీని జవాబు పట్ల ఏదైన అనుమానం ఉంటుందా?. అయితే దేవుడు నా పాపవాంఛలను ఎందుకు అణచివెయ్యలేదు? ఆ కార్యాన్ని జరిగిస్తే ఆయనకు మరింత మహిమ కలిగేది కదా అనేది నీ ప్రశ్న. దానికి మళ్ళీ నేను చెప్పే సమాధానం ఇదే. నీ తెలివితో దేవుణ్ణి కొలత వెయ్యకుండా జాగ్రత్త పడు. తనకు అధిక మహిమ కలిగించేది ఏదో అవసరమైంది ఏదో ఆయనకు తెలుసు. నీవు అధికంగా అణచబడి, ఇప్పుడు చేస్తున్నదానికంటే ఎంతో తక్కువగా పాపం చేస్తుంటే ఆయన కృపను ఇప్పుడు మెచ్చుకుని ఆరాధిస్తున్నట్టు అప్పుడు చేసుండేవాడివా?

తనలో కలిగిన మార్పు యథార్థమైనదా కాదా అని దుఃఖిస్తున్న వారికి నేనిచ్చే మూడవ జవాబు ఇదే. ఈ క్రింది పరీక్షలను నిజంగా నీకు నీవే అన్వయించుకో. మొదటిది, ఈ లోక వ్యవహారాల నుండి, వ్యాపారాల నుండి నువ్వు ఇంటికి చేరి విశ్రాంతి తీసుకుంటున్న సమయాల్లో, విశ్రాంతి దినాన నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతున్న సమయాల్లో లేదా నువ్వు ప్రతిరోజూ వాక్యం ధ్యానించే సమయాల్లో నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ మనోభావాలు ఎలా ఉన్నాయి? నువ్వు దేవుణ్ణి ఎరిగావా? ఆయనతో సంభాషించి ఆనందిస్తున్నావా? ఆయన వాక్యం విలువైనదిగా, ఆయనకు ప్రార్థించడం ఇష్టమైన అభ్యాసంగా నీకు ఉందా? దేవుని పరిపూర్ణతలో ఆనందించి ఆయనకు‌ఉన్న సర్వాధికారం, ఔన్నత్యాన్ని బట్టి ఆయనను గౌరవిస్తున్నావా? నీలో మిగిలిన గ్రుడ్డితనం మరియు అవివేకతను బట్టి చింతిస్తున్నావా? దేవుని ధర్మశాస్త్రానికి అనుగుణంగా నడవకుండా దానిని వ్యతిరేకించినందుకు సిగ్గుపడుతున్నావా? దానిని బట్టి నిన్ను నీవు ద్వేషిస్తున్నావా? నీవు మెలుకువతో పార్థన చేస్తూ నీ హృదయంలో ఉన్న అపవిత్రతకు వ్యతిరేకంగా పోరాడుతున్నావా? చేయవలసినంత పరిమాణంలో కాకపోయినా వాస్తవంగా, యథార్థంగా ఆ ప్రయత్నం చేస్తున్నావా?

రెండవదిగా నీవు దేవుణ్ణి ప్రేమించడానికి ఉన్న కారణాలు ఏంటి. ఆయనను ప్రేమించేలా నిన్ను ప్రభావితం చేసే ఉద్దేశాలు ఏమై ఉన్నాయి. ఆయన నిన్ను ప్రేమించాడని, ఆయన సర్వోన్నతుడని, మహిమా స్వరూపియని నీవు గుర్తించడం అందుకు కారణాలా ? ఆయన పరిశుద్ధుడని, అన్నింటిని ఆయన చూస్తున్నాడని ఆయన అన్నింటిని క్షుణంగా ఎరుగుతాడని ఆయన సర్వశక్తిగలవాడని ఎరగడం నీకు ఆనందం ఇస్తుందా? దేవుడే ఈ లోకాన్ని ఏలుతున్నాడని అందరూ ఆయనకు సాష్టాంగపడాలని ఆయన మాత్రమే ఘనపరచబడి హెచ్చింపబడాలనే సత్యాలు నీ హృదయానికి అంగీకారాలేనా? నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించడం చాలా సమంజసం అని ఎరిగి ఆయనకు వ్యతిరేకమైన అన్నింటిని నీవు ఆసహ్యించుకుని ఎదిరిస్తున్నావా? ధర్మశాస్త్రం కోరినదంతా చేయకపోడానికి నీవే బాధ్యుడవని ఒప్పుకుంటావా. మూడవదిగా నీ పొరుగు వానిని నిన్నువలె ప్రేమించి అతని మేలు మాత్రమే కోరుతున్నావా? దీని విషయమై నీలో ఉన్న వ్యతిరేక భావాలను ద్వేషించి వాటి గురించి దుఃఖిస్తున్నావా? ఈ ప్రశ్నలకు నీవిచ్చే జవాబులు నీవు ఎలాంటి ఆధ్యాత్మికస్థితిని కలిగియున్నావో తెలియచేస్తాయి.

పోరాటం లేకుండా సువార్త ఆశించే పరిశుద్ధతను హృదయంలో లేదా జీవితంలో ఎవరూ నిలుపుకోలేరు. దానిని కాపాడుకోవడానికి శ్రద్ధ, మెలకువ, పట్టుదల అవసరం. ఇది మనం చేసే యుద్ధం. మనం పోరాడే శత్రువులు, వారి శక్తియుక్తులు మరియు వారి నెదిరించే విధానాల గురించిన వివరణల అంతటిలో మనకు కనిపిస్తుంది. మన హృదయంలోను, జీవితంలోను సువార్త కోరే విధేయత దానిని ఎదిరించే శత్రువులకు వ్యతిరేకంగా నిరంతర పోరాటాన్ని కొనసాగించకుండగానే నిలుపుకోగలమని అనుకోవడం, లేఖనాలను మరియు దేవునిని యథార్థంగా విశ్వసించి విధేయతలో నడిచినవారి అనుభవాలను తిరస్కరించడమే ఔతుంది. సాతాను, పాపం, లోకం నిరంతరం సువార్తపై దండెత్తి దానిపై మనకున్న ఆసక్తిని నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తాయి. సాతాను మనపై దండెత్తినప్పుడు వాడిని ఎదిరించడం మనవిధి (1 పేతురు 5:8;). ఇలా వానిని ఎదిరించడానికి మనం సర్వాంగకవచాన్ని ధరించాలి (ఎఫెసీ 6:12;). శరీరాశలు మన ఆత్మకు విరోధంగా నిత్యం పోరాడతాయి (1 పేతురు 2:11;). వాటితో చివరివరకూ పోరాటం కొనసాగించకపోతే అవి మనల్ని నాశనం చేస్తాయి. లోకం యొక్క శక్తిని కూడా తప్పించుకోవడానికి, దానిని జయించడం తప్ప వేరే మార్గం లేదు ( 1యోహాను 5:40) అది పోరాటం వల్లే సాధ్యమౌతుంది.

“శోధనకాలంలో దేవునికి లోబడి, ఆయనను సేవించడం అంటే ఏంటో తెలిసిన వారికి కఠినమైన ప్రయత్నం, పరిశ్రమ, మెలకువ, పట్టుదలలేకుండా విశ్వాస జీవితాన్ని, పరిశుద్ధమైన పరుగును కాపాడుకోలేమనే సూత్రాన్ని నిర్ధారించడానికి, గొప్ప రుజువులేమీ అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఈ నియమాలపై ఆధారపడి మనం పరిశుద్ధులంగా ఉండడానికి ఇష్టపడకపోతే మనం దానినలా వదలివెయ్యడం మంచిది. ఎందుకంటే ఈ నియమాల పైన కాకుండా వేరే ఏ విధంగా పరిశుద్ధతను సాధించలేము. ఈ మార్గంలో మనం మూర్చిల్లితే, దానిని విడిచిపెడితే, దీనిని సాధించడానికి ఈ జీవితమంతా శ్రమించడం వ్యర్థమని తలస్తే అది లేకుండగానే తృప్తిపడాలి. సోమరితనంతో ఏవో కొన్ని విధులను మాత్రమే నెరవేర్చి, ఏవో కొన్ని పాపాలు చేయడం మానేసుకుంటే అదే మనం చూపే విధేయత అని, దానిని దేవుడు అంగీకరిస్తాడని తలంచడం నరకాన్ని, నాశనాన్ని ఈలోకంలో విస్తరింపచెయ్యడమే ఔతుంది. "పాపాన్ని సిలువ వేసి, దురాశను చంపి, శరీరం, సాతాను, లోకం యొక్క కోరికలకు వ్యతిరేకంగా పోరాడుతూ, అంతరంగంలో ఉండవలసిన సుగుణాలు మరియు బాహ్యంగా నిర్వర్తించవలసిన అన్ని నిధులనూ యెడతెగక మన జీవితకాలమంతా కొనసాగించడం పరిశుద్ధపరచబడడానికి అవసరం" (john Owen 1660)

పైన చె