ఒక వేసవికాలం సాయంత్రాన లండన్ మహానగరం వీధుల్లో ఒక యువకుడు అలసిపోయిన దేహంతో, విచారం కమ్మిన ముఖంతో అటుఇటు తిరుగుతున్నాడు. అతని వాలకం చూస్తే క్రమశిక్షణ లేకుండా జీవించి, డబ్బంతా వృథాగా ఖర్చు చేసుకుని, ఖాళీ జేబులతో ఆకలిగొన్నవాడిలా కనిపిస్తున్నాడు. మరునాటి ఉదయమే ఆతడు న్యూయార్కు వెళ్ళవలసియుంది. అది ఆదివారం కనుక ఇంగ్లాండులో అతడు గడిపే ఆఖరి రాత్రి సువార్త కూటానికి హాజరై దేవుని సందేశము వినాలని అతని స్నేహితుడొకడు బ్రతిమిలాడాడు. ఆ కూటంలో ప్రసిద్ధిగాంచిన సువార్తికుడు మాట్లాడవలసియుంది.
కూటం జరిగే హాలు జనంతో కిక్కిరిసి ఉంది. యువకులిద్దరూ ఒకే చోట చోటు చూస్కుని కూర్చుని శ్రద్ధగా వింటున్నారు. ఆ రాత్రి వర్తమాన భాగం 'సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము" (2వ కొరింథీ 2:11).ఈ వాక్యము చదివిన వెంటనే సువార్తికుడు ఈ ప్రస్తావన గురించి చెప్పాడు.
'నేనో వీధిలో నడిచి వెళ్తుండగా ఆసక్తికరమైన సన్నివేశమొకటి నా దృష్టిని ఆకర్షించింది. ఒక పందులమంద వరుసగా, చురుకుగా, మార్గము తొలగకుండా ఒక వ్యక్తి వెంటే వెళ్తుంది. పందులను ఒకే దిక్కులో నడిపించడం చాలా కష్టమైన పని. వాటిని మేపేవాడు ఒక వైపుకు వాటిని తోలితే మరో వైపునకు వెళ్ళే స్వభావం వాటిది. అయితే అతడు మాత్రము కష్టపడకుండా వాటిని ఒకే దిక్కులో చక్కగా తీసుకునిపోతున్నాడు. ఈ సన్నివేశం నాలో ఆసక్తి పుట్టించి నేను వాటి వెంటే వెళ్ళాను. అవి తొందరగా నడచి వధశాలలో ప్రవేశించగానే వాటి వెనుక తలుపు మూయబడింది. ఆ వ్యక్తి బయటికి వచ్చేంతవరకూ నేనక్కడే ఉండి, 'ఏమయ్యా, అంత పెద్ద గుంపును ఇంత సులభంగా నీవెలా నడిపించగలిగావని' ప్రశ్నించాను. దానికి ఆ వ్యక్తి బిగ్గరగా నవ్వి, 'నా చంకలో ఉన్న చిక్కుడు కాయల సంచిని నీవు చూడనట్లున్నావు! పందులకు చాలా ఇష్టమైన ఒక జాతి చిక్కుళ్ళను నా చేతి క్రింద సంచిలో వేసికుని ఒక్కొక్కటీ దారిపొడుగునా వేసుకుంటూ వస్తే సరిపోతుంది, మనకే బాధ లేకుండా వాటంతటవే మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాయని' సమాధానం ఇచ్చాడు.'
ఆ ప్రస్తావన ముగించాక ఆ బోధకుడు తనముందున్న ప్రజలవైపు చూస్తూ తన స్వరాన్ని పెంచి 'దయ్యము మీలో కొందరిని చెర పట్టి తన యిష్టానుసారంగా నరకానికి తీస్కుపోతున్నాడు. పాపమార్గంలో నిన్ను యీడ్చుకుని పోవడానికి నీకు ఏలాంటి చిక్కుడుకాయలు ఇష్టమో వాడికి తెలుసు. వాడు జారవిడుస్తున్న చిక్కుడుగింజల మోజులో నువ్వెక్కడికి పోతున్నావో నువ్వు గమనించలేదు. ఇదిగో , నువ్వు పట్టుకొనబోయే ఆఖరి చిక్కుడుకాయను పూర్తిగా తినకముందే నీ వెనుక తలుపు మూయబడుతుంది. నీవు నరకంలో బంధించబడతావని' హెచ్చరించాడు
సువార్తికుడి మాటలు ఆ యువకుడి హృదయాంతరంగంలోకి పదునైన బాణాల్లా దూసుకునిపోయాయి. నేను ఇన్నాళ్ళూ చిక్కుళ్ళకు ఎగబడే పందిలాగా పాపభోగాలకు ఎగబడ్డాను, అయ్యో నేనెక్కడికి పోతున్నాను? నా అంతం ఎట్లుంటుందని తనలో తాను ప్రశ్నించుకున్నాడు.
మరుసటి రోజు అతను ఓడ ఎక్కి న్యూయార్కుకు బయలుదేరాడు. కొన్ని రోజుల తరువాత ఇంగ్లాండ్ లో అతని స్నేహితునికి ఒక ఉత్తరం వచ్చింది. తెరచి చూస్తే అందులో ఇలా ఉంది: 'స్నేహితుడా, నేను మారుమనస్సు పొంది దేవుని తెలుసుకున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను, నీతో గడిపిన ఆఖరిరాత్రి నా జీవితంలో దేవుణ్ణి తెలుసుకున్న రాత్రి. ఆ మంచి బోధకుడి సందేశం కొరకు దాన్ని వినేలా నువ్వు నన్ను తీస్కుని వెళ్ళినందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను.'
ప్రియ చదువరీ, నీ సంగతెలా ఉంది? దయ్యం నిన్ను తన చిక్కుడుకాయలతో పాపభోగాలకు ఆకర్షించి మరణానికి, నరకానికి యీడ్చుకునిపోతున్నాడని గ్రహించావా?
"యౌవనుడా, నీ యౌవన కాలమందు సంతోషపడుము....నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క యిష్టము చొప్పునను ప్రవర్తింపుము; అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము" (ప్రసంగి 11:9).
"నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునొందుటవలన నాకు సంతోషములేదు; దుర్మార్గుడు తన దుర్మార్గతనుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును" (యెహెజ్కేలు 33:11).
"అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు: ఎట్లనగా మనమింకను పాపులమైయుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను" (రోమా 5:8).
"ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము." (రోమా 6:23).
"పావులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను." (1 తిమోతి 1:15).
తన పాపాలను బట్టి పరిశుద్ధ దేవునియెదుట నిలువబడలేనని తెలుసుకున్నవాడు రక్షింపబడతాడు.
నేడే ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకో. అంటే, నీ పాపాలను రక్షకుడైన యేసుప్రభువు దగ్గరకు తీస్కునిరా. ఆయన మాత్రమే నీ పాపాలను క్షమించి, నీకు శాశ్వతానందము కలుగచేసేవాడు.
"యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల నీవు రక్షింపబడుదువు" (రోమా 10:9).
"తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను" (యోహాను 1:12).
"ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు" (అపొ. కార్య. 16:31).
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.