ఈ విషయాన్ని అర్ధం చేసుకోవడానికి దేవుని గుణ లక్షణాలను మనం పరిశీలించాలి. దీని కోసం నేను ఈ అంశాన్ని వివిధ భాగాలుగా విభజించాను. క్షుణ్ణంగా చదవడానికి ప్రయత్నించండి.
1) దేవుడే సార్వభౌముడు, పరిపాలకుడు; సాతానుడు కాదు
మనం మన దేవుని విశ్వసిస్తున్నాం. మన దేవుని యొక్క గుణ లక్షణాలలో దేవుని యొక్క సార్వభౌమత్వం గురించి మనం ఆలోచన చేసినప్పుడు, దృఢమైన విశ్వాసము, విశ్వాసపు పెంపుదల మనలో కలుగుతుంది.
పాత నిబంధన గ్రంధంలో ఉన్న ఒక ప్రధాన అంశం ఏంటంటే, యెహోవా పరిపాలకుడు, యెహోవా యొక్క రాజత్వము. ఇది గ్రహించిన పాత నిబంధన భక్తులు దేవుడే సర్వాన్ని పరిపాలించేవాడని, సమస్తము దేవుని యొక్క నియంత్రణలోనే ఉందని చాలా స్పష్టంగా గ్రహించారు.
రాజైన దావీదు ఈ విధంగా దేవుని స్తుతిస్తున్నాడు
“ రాజైన దావీదుకూడను బహుగా సంతోషపడి, సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు, యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి; యెహోవా, రాజ్యము నీది, నీవు అందరిమీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని యున్నావు, ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించు వాడవును అందరికి బలము ఇచ్చువాడవును నీవే, మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావముగల నీ నామమును కొనియాడుచున్నాము." 1 దిన.వృ 29:10-13
తాను రచించిన కీర్తనలలో సహితం, ఈ విషయాన్ని దావీదు చాలా స్పష్టంగా మాట్లాడాడు.
“యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియున్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్యపరిపాలన చేయుచున్నాడు. " కీర్తన 103:19
“మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు" కీర్తన 115:3
“ఆకాశమందును భూమియందును సముద్రములయందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు " కీర్తన 135:6
దీనిని బట్టి దేవుడు రాజని, తానే సమస్తాన్ని పరిపాలిస్తున్నాడని, మనకు అర్ధం అవుతుంది. అయితే మనలో కొంతమంది, ఈ లోకాన్ని పాలిస్తుంది సాతానుడు అని నమ్మే అవకాశం లేకపోలేదు.
“ఇకను మీతో విస్తరించి మాటలాడను; ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధమేమియులేదు." యోహాను 14:30
“దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను" 2 కొరింథీ 4:4
“మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము" 2 కొరింథీ 4:4
సాతానుడు, ఈ యుగానికి దేవుడని, లోకాధికారి అని, లోకాన్ని నియంత్రిస్తున్న దుష్టుడు అని వాక్యం మనకు తెలియజేస్తుంది. అయితే, సాతానుడి యొక్క అధికారం, దేవుని అధికారానికి లోబడినదే గాని, దేవుని అధికారానికి సమానమైనది కాదు.
అనేక బైబిల్ ఆధారాలను బట్టి దీనిని మనం నిర్ధారించవచ్చు. ఉదాహరణకు: పరలోకంలో యుద్ధం జరిగిందని, ఆ యుద్ధంలో సాతానుడు మరియు వాడితో ఉన్నవారు పడద్రోయబడ్డారు అని రాయబడి ఉంది. దీనిని బట్టి, సాతానుకి దేవుని లాగ సంపూర్ణమైన శక్తి లేదు అని అర్ధం అవుతుంది. సాతానుడు సృజించబడిన వాడు గనుక, సృష్టిలో ఒక భాగమే గాని సృష్టికర్త లాంటి మహిమ ఉన్నవాడు కాదు.
బైబిల్ గ్రంథం నుండి, కనీసం కొన్ని సార్లైనా సాతానుడు, దేవుని అనుమతి లేకుండా తన శక్తిని నాశనానికి ఉపయోగించలేడు అని అర్ధం చేసుకోగలం. ఇందుకు ఉదాహరణలుగా ఇద్దరు వ్యక్తులను చూద్దాం:
ఒక వ్యక్తి యోబు, రెండవ వ్యక్తి సీమోను పేతురు.
“యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది; అతనికి మాత్రము ఏ హానియు చేయ కూడదని అపవాదికి సెలవియ్యగా వాడు యెహోవా సన్నిధినుండి బయలు వెళ్లెను" యోబు 1:14
“అందుకు యెహోవా అతడు నీ వశమున నున్నాడు; అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను " యోబు 2:6
యోబుని నాశనం చేయడానికి దేవుని అనుమతి కోరిన విధంగానే, సీమోను పేతురు విషయంలో కూడా సాతానుడు చేసాడు.
“సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని, నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను" లూకా 22:31,32
పేతురును మరియు ఇతర శిషులను నాశనం చేద్దాం అని సాతానుడు అనుకున్నాడు. దీనిని బట్టి కనీసం కొన్ని సార్లైనా దేవుని అనుమతి లేకుండా సాతానుడు, తనకు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించలేడు అని తెలుస్తుంది. ఈ విషయాలను నేను ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడే సర్వాధికారి, దేవుడే పాలకుడు, సాతానుని దుష్ట చేష్టలన్నిటిని తుదకు తన చిత్తాన్ని నెరవేర్చుకోడానికే దేవుడు వాడుకుంటున్నాడు.
మనం దేవుని యందు నమ్మిక ఉంచుతున్నాము, మన దేవుడే గొప్పవాడు, ఆయన మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవరు లేరు.
2) ఈ భూమి మీద జరిగే వాటికి దేవుడే బాధ్యత తీసుకుంటున్నాడు
దేవుడు అనుమతించకపోతే ఏది జరగదు అనేది సర్వ సత్యం. సూర్యోదయము గాని, సూర్యాస్తమయము గాను దేవుని అనుమతి తోనే జరుగుతుంది. యెహోషువ, సూర్యాస్తమయము కాకూడదు అని, దేవునిని వేడుకున్నప్పుడు దేవుడు సూర్యాస్తమయాన్ని ఆపేసాడు. ఈ ప్రకృతి దేవుని ఆదీనంలో ఉంది, జంతువులు అన్ని దేవుని ఆదీనంలో ఉన్నాయి (అందుకే ఎలీషా రెండు ఎలుగుబంట్లను పిలవగానే అవి వచ్చాయి), మనుషులు దేవుని ఆధీనంలోనే ఉన్నారు, సాతానుడు వాడి అనుచరులు దేవుని చిత్తాని నిష్ఫలం చేసేలాగా ఏమి చేయలేరు, దేవదూతలు కూడా దేవుని ఆధీనంలోనే ఉన్నారు.
దేవుని అధికారానికి వెలుపల ఏది లేదు. దేవుడే సమస్తాన్ని తన చిత్తానుసారముగా నడిపిస్తున్నాడు. ఉదాహరణకు:
“నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే యెహోవా అను నేనే వీటినన్నిటిని కలుగజేయు వాడను" యెషయా 45:7
“పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా? యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా?" ఆమోసు 3:6
“అందుకతడు మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు; మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను" యోబు 2:10
“ఆయన చీకటి కమ్మజేయక మునుపే, మీ కాళ్లు చీకటి కొండలకు తగులకము నుపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునుపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి." యిర్మీయా 13:16
“మహోన్నతుడైన దేవుని నోటనుండి కీడును మేలును బయలు వెళ్లునుగదా?" విలాపవాక్యములు 3:38
3) దేవుడు విపత్తును అనుమతిస్తాడు, వాటిని రెప్పపాటులో తొలగించ సమర్ధుడు
దేవుని అధికారాన్ని, ఆయన శక్తిని మీ దృష్టికి తీసుకురావడానికి, మనం ఒక వాక్యభాగాన్ని చదువుకుందాం.
“అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి యుండగా గాడిదయొక్క తల ఎనుబది రూపాయలకును, అరపావు పావురపు రెట్ట అయిదు రూపాయలకును అమ్మ బడెను; వారు అంత కఠినముగా ముట్టడి వేసియుండిరి, అంతట ఇశ్రాయేలురాజు పట్టణపు ప్రాకారముమీద సంచారముచేయగా ఒక స్త్రీ రాజును చూచిరాజవైన నా యేలినవాడా, సహాయము చేయుమని కేకలు వేయుట విని, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును? కళ్లములోనుండి యైనను ద్రాక్షగానుగలోనుండియైనను దేనినైనను ఇచ్చి సహాయముచేయ వల్లపడదని చెప్పి, నీ విచారమునకు కారణమేమని యడుగగా అదిఈ స్త్రీ నన్ను చూచినేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించుదుము, అని చెప్పినప్పుడు, మేము నా బిడ్డను వంటచేసికొని తింటివిు. అయితే మరునాటియందు నేను దాని చూచినేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పెను, రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని యింక ప్రాకారముమీద నడిచి పోవుచుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనబడెను, తరువాత రాజుషాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల యీ దినమున అతనిపైన నిలిచియున్నయెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను." 2 రాజులు 6:25-31
సిరియా దేశం వారు, సమారియా వాళ్లపై దాడి చేసినప్పుడు, ఒక గొప్ప కరువు సంభవించింది.
ఇక్కడ "గాడిదయొక్క తల ఎనుబది రూపాయలకును, అరపావు పావురపు రెట్ట అయిదు రూపాయలకును అమ్మ బడెను" అని ఉంది. అయితే ఇంగ్లీష్ లో “donkey’s head for 80 shekels of silver, and a kab of dove’s dung for five shekels of silver.”
ఒక షెకెల్ బరువు 11 గ్రాములు. ఒక గాడిద తల 8,000 రూపాయలకు అమ్ముడైందని మనం అంచనా వేయవచ్చు (మన సమయంలో ఈ డబ్బును లెక్కిస్తే). “అరపావు పావురపు రెట్ట” అని ప్రస్తావించబడినప్పటికీ, మనం దానిని పావురం రెట్టగా తీసుకోలేము, ఎందుకంటే తినడానికి పావురం రెట్టను ఎవరూ కొనరు. ఇది ఒక మొక్కకి ఉన్న bulb (బంగాళాదుంపల లాంటి తెగకి సంబందించిన కూరగాయ), అని అనేకమంది వ్యాఖ్యానకర్తలు అభిప్రాయపడ్డారు. ఆ మొక్కల బల్బులను తినడానికి ముందు కాల్చడం లేదా ఉడకబెట్టడం జరుగుతుంది. ఇవి సాధారణంగా చౌకగా దొరుకుతాయి, కానీ ఆ కరువు సమయంలో ఇది చాలా ఖరీదైనది. నా అంచనాల ప్రకారం ఇది 500 రూపాయలకు పైగా ఉంది (మన సమయంలో ఈ డబ్బును లెక్కిస్తే).
ఎంతగా కరువు తీవ్రత ఉందంటే. ఇద్దరు మహిళలు తమ పిల్లలను చంపి, వారిని తినాలనుకున్నారు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. మొదటి స్త్రీ అలా చేసింది, మరి రెండవ స్త్రీ మలుపు వచ్చినప్పుడు, ఆమె తన పిల్లవాడిని దాచిపెట్టింది. అప్పుడు మొదటి స్త్రీ ఈ విషయాన్ని రాజుకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళింది. ఇది విన్న రాజు, తన వస్త్రాలు చింపుకొని, కోపంతో, ఎలీషానీ చంపాలని భావించాడు.
ఇప్పుడు 2 రాజులు 7వ అధ్యాయం చదువుదాం
“అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చునదేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒక టింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి రెండు మానికల యవలును అమ్మబడును, అందుకు ఎవరిచేతిమీద రాజు ఆనుకొని యుండెనో ఆ యధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను ఆలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా అతడునీవు కన్నులార దానిని చూచెదవు గాని దానిని తినకుందు వని అతనితో చెప్పెను. " 2 రాజులు 7:1,2
సుమారు 8.8 కిలోల (shekel) సన్నని పిండి 100 రూపాయల కన్నా తక్కువకు అమ్ముతారు (మన సమయంలో ఈ డబ్బును లెక్కిస్తే); మరియు 15 కిలోల కంటే ఎక్కువ బార్లీ 100 రూపాయల కన్నా తక్కువకు అమ్ముతారు (మన సమయంలో ఈ డబ్బును లెక్కిస్తే). దేవుడు ఈ కరువును శ్రేయస్సుగా మారుస్తాడని ఎలీషా చెప్తున్నాడు. మరియు ఒక రోజులో మాత్రమే “రేపు ఈ సమయానికి” అనేది ఎలిషా మాట.
దేవుడు సిరియన్లను వారి ఆహారం, బట్టలు మరియు వారి శిబిరంలో ఉన్నవన్నీ వదిలి పారిపోయేలా చేసాడు. "ప్రభువు సిరియన్ల సైన్యానికి రథాలు మరియు గుర్రాల శబ్దాన్ని, గొప్ప సైన్యం యొక్క శబ్దాన్ని వినిపించాడు". మీ ఖాళీ సమయంలో 2 రాజులు 7 వ అధ్యాయంలో మిగిలిన కథను మీరు చదువుకోవచ్చు.
ఎలిషా ఆ వాగ్దానం చేసినప్పుడు, రాజు పక్కనున్న అధిపతి " యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను ఆలాగు జరుగునా?" అని అన్నాడు. అతను దేవుని శక్తిని తక్కువ అంచనా వేశాడు. స్పష్టంగా చెప్పాలంటే, అతను దేవుణ్ణి అర్థం చేసుకోలేదు.
కరువు నుండి శ్రేయస్సుకు తీసుకు రావడంలో దేవుని పనిని చూడండి. ఈ కథలు పాత నిబంధనలో కొనసాగుతూనే ఉన్నాయి. కరువు నుండి వర్షం, తెగులు నుండి సంపూర్ణత. ఇదంతా దేవుడు చేస్తున్నది.
యెషయా మాటలు ఎంత సత్యమైనవి
“నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే యెహోవా అను నేనే వీటినన్నిటిని కలుగజేయువాడను" యెషయా 45:7
ఇక్కడ నా ఉద్దేశం అనేక బైబిల్ కథలను మీ దృష్టికి తీసుకురావడం కాదు, దేవుడే సమస్తాన్ని నియంత్రిస్తున్నాడని, దేవుని యందు మనము అన్ని విషయాలలో నమ్మిక ఉంచొచ్చు అనే భరోసా ఇవ్వడమే. దేవుడు కరోనా వైరస్ను అనుమతించాడు; అది దేవుని ప్రణాళికకు వెలుపలది కాదు, ఇది దేవుని చిత్తప్రకారము జరుగుతుంది. నేను సామాజిక మాద్యమాలలో కొన్ని పోస్ట్‌లను చూస్తున్నాను, కరోనా సాతానుకు చెందినదని మరియు దీనికి దేవుడు బాధ్యత వహించడని అనేకులు భావిస్తున్నారు. వాస్తవానికి, ఈ విపత్తును అనుమతించినది దేవుడు, ప్రపంచంలో పెరుగుతున్న దుష్టత్వంపై ఆయన తీర్పుకావచ్చు కాకపోవచ్చు, అది నాకు తెలియదు. దేవుడు దీనిని అనుమతించాడని నాకు తెలుసు మరియు దీనిని పూర్తిగా తగ్గించడం లేదా దీనిని అంతం చేయడం దేవుని శక్తి పరిధిలోనే ఉంది.
ఇది తెలిసే కీర్తనకారుడు ఈ విధంగా అన్నాడు
“దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, కావున భూమి మార్పునొందినను నడిసముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము" కీర్తన 46:1-3
నహుము ఇలా అంటున్నాడు
“యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికయుంచువారిని ఆయన ఎరుగును." నహుము 1:7
మీకు ప్రభువుపై ఆ విశ్వాసం ఉందా, ఆయన మీ కోసం శ్రద్ధ వహిస్తాడని మీకు బాగా తెలుసా? మీరు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్న, దేవునిపై నమ్మకం కలిగి ఉంటే, మీ కోసం శ్రద్ధ వహించే బాధ్యత ఆయన తీసుకుంటున్నాడు. దేవుడు సహాయం చేయలేదని అనిపిస్తే, దేవుడు నా కుటుంబంలో ఈ కరోనాను ఎందుకు అనుమతించాడు? లేదా దేవుడు నా ప్రియమైనవారిలో ఒకరిని ఎందుకు పిలుచుకున్నాడు? దేవుడు పట్టించుకుంటే, ఆయన మన ఆశ్రయం అయితే ఇది ఎందుకు జరిగింది? నా ప్రియమైన సోదరి/సోదరుడా ఇది మీ ప్రశ్న అయితే, మన ఆశ ఈ భూసంబంధమైన సంక్షేమం కోసం మాత్రమేనా?
“భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము" 2 కొరింథీ 5:1
షడ్రక్, మేషాకు, అబేద్నెగోలను జ్ఞాపకం తెచ్చుకోండి, వారి స్పందన ఏంటి "దేవుడు ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినప్పటికీ". దేవుడు మనలను రక్షించడు అని కాదు. ఒక వేళ దేవుడు తన చిత్తానుసారముగా మనకు శ్రమ అనుమతిస్తే నీకు ఉన్నది భూసంబంధమైన నిరీక్షణయేనా?
“నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా." హెబ్రీ 13:5
“కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి" హెబ్రీ 12:12
4) సారాంశం
a) సాతానుడు సర్వశక్తిమంతుడు కాదు
b) దేవుడు ఈ విపత్తుని అనుమతించాడు
c) దేవుడు సంపూర్ణ నియంత్రణలో ఉన్నాడు
d) దేవుడు రెప్పపాటులో దీనిని తీసివేయగలడు. దేవుడు సమర్థుడు
e) మీలో కొందరు అస్వస్థతతో ఉన్న యెడల, లేదా మీ బంధుమిత్రులకు కరోనా సోకినంత మాత్రాన, దేవుని అనుమానించొద్దు, నిరీక్షణ కోల్పోవద్దు.
f) కరోనా కారణంగా కొంతమంది క్రైస్తవులు ప్రభువునందు నిద్రించిన యెడల భయపడకండి, అది దేవుని పరిపూర్ణ సంకల్పం మరియు సమయం అని తెలుసుకోవాలి
g) మన నిరీక్షణ కేవలం ప్రభువు నుండి భౌతిక రక్షణ కోసం మాత్రమే కాదు, అంతకంటే గొప్పదాని కొరకు, అనగా శాశ్వతమైన ఆనందం కొరకు.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.