రక్షణ

రచయిత: జిమ్ మెక్లార్టీ
అనువాదం: విజయుడు

విషయసూచిక

    తొలి పలుకులు

    పరిచయం

  1. సంపూర్ణ పతనము
  2. బేషరతు ఎన్నిక
  3. పరిమిత ప్రాయశ్చిత్తం
  4. అబేధ్యమైన కృప
  5. పరిశుద్ధుల పదిలత

'నేను బోధించేది కొత్త సిద్ధాంతమేమీ కాదు, వినూత్నమైనదేమీ కాదు; కాల్వినిజమ్ అనే మారుపేరుతో పిలవబడే బలమైన పురాతన సిద్ధాంతాలను బోధించటం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇవి క్రీస్తులో ప్రత్యక్షపరచబడిన దేవుని సత్యాలు. ఈ సత్యాధారంగా గత శతాబ్దాల సంఘచరిత్రలోనికి అడుగిడితే, ముందుకు వెళ్తున్న కొద్దీ పితామహుల వెంబడి పితామహులు, సాక్షుల వెంబడి సాక్షులు, హతస్సాక్షుల వెంబడి హతస్సాక్షులు, తదితరులు బారులు తీరి నాతో కరచాలనం చేయటం చూడగలను. ఒకవేళ నేను స్వేచ్ఛావాద సిద్ధాంతాన్ని నమ్మే పెలేజియన్ ను అయినట్లైతే శతాబ్దాల తరబడి ఒంటరి పయనం సాగించవలసి ఉండేది. అక్కడక్కడా కొందరు అబద్ధబోధకులు, గుణహీనులు నన్ను వారిలో ఒకనిగా, సహోదరునిగా పరిగణించి పలకరించేవారేమో. అయితే, ఈ సత్యాలను నా విశ్వాసప్రమాణంగా తీసుకున్నప్పుడు మన పితరులదేశము నా సహోదరులతో నిండియుండినట్లు చూడగలుగుతున్నాను. అనేక ప్రజా సమూహాలు నావలె ఒప్పుకోలు చేస్తూ దేవునిసంఘము యొక్క విశ్వాసప్రమాణం ఇదే అని అంగీకరించటం చూడగలను.'

చార్లెస్. హెచ్. స్పర్జన్ 

మెట్రోపాలిటన్ టాబర్నకల్ (1884-1892)

తొలి పలుకులు

నేను బైబిలు బోధకుడను గనుక మీ సంఘము ఏమి నమ్ముతుందని చాలామంది నన్ను తరచుగా ప్రశ్నిస్తుంటారు. అయితే దీనికి జవాబుగా “మేము బైబిలునే నమ్ముతాము” అని చెప్పటం సరిపోదు. దాదాపు క్రైస్తవ సంఘాలన్నీ ఇచ్చే జవాబు అదే కదా. అందుకే గ్రేస్ క్రిస్టియన్ అసెంబ్లీ ఏమి నమ్ముతుంది? ఎందుకు నమ్ముతుంది? మొదలైనవి వివరించటమే ఈ పుస్తకము యొక్క ప్రధాన ఉద్దేశం.

సమకాలీన కాలంలో ఈ సిద్ధాంతాలను ప్రతిపాదించి అందించిన రచయితను నేనొక్కడినే కాదు. అయితే ఈ అంశాలు చాలా లోతైనవి, గంభీరమైనవి; తరచుగా ఇటువంటి విషయాలను సగటు మానవుడికి అర్థంకాని విధంగా కఠినమైన పదజాలంతో వివరిస్తుంటారు. గనుక మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు అంతా అగమ్యగోచరంగా అనిస్తుంది. కాని నా యీ పుస్తకంలో పొందుపరచబడ్డ విషయాలు, “చూచుటకు కన్నులు గల వారికి” సులభంగా, స్పష్టమైన విధానంలో, అందరూ చదవదగిన విధంగా ఉండాలని నా ఆకాంక్ష, నిరీక్షణ.

బైబిలు వివరణలో మొదటి నియమము - బైబిలు ఏమి సెలవిస్తుందో దానినే ఉద్దేశిస్తుంది; దేనిని ఉద్దేశిస్తుందో దానినే సెలవిస్తుంది. రెండవ నియమము కూడా మొదటి నియమము వంటిదే - లేఖనాలే లేఖనాలకు వివరణ ఇస్తాయి. సాధారణంగా బోధకులు లేఖనాలను సందర్భరహితంగా ఏరికోరి చెబుతూ ఎన్నో విధానాలలో వివరించి బోధిస్తుంటారు. అది కూడా వారి సిద్ధాంతాలను బలపరచుకోవటానికో లేదా వారి సంఘ సంప్రదాయాలు కాపాడుకోవటానికో లేదా వారి వారి మత శాఖలను బలపరచుకోవటానికో చేస్తుంటారు. కాని పౌలు ఇలా హెచ్చరించాడు - "ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెఱపట్టుకొను పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి” (కొలొస్సీ 2:8). అందుకే ఇక్కడ ప్రస్తావించిన సిద్ధాంతాల్ని అనేక లేఖనభాగాలతో బలపరిచాము. అయినా ఇదొక లోతైన అధ్యయనము కాదు. ఎందుకంటే, క్రీస్తు యొక్క క్రియలు మరియు సేవాపరిచర్యను గురించి అపోస్తలుడైన యోహాను సహితం "...వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినయెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది” అని అన్నాడు ((యోహాను 21:25).

ప్రతి లేఖనభాగములో కూడా దేవుని సార్వభౌమాధికారం మరియు కృప కలిపి నేయబడింది. మనము లేఖనాలకే ప్రభువైనవానిని ఎరిగినపుడు, లేఖనాల్లో బయలుపరచబడిన ఆయన అధికారాన్ని సహజంగా అంగీకరిస్తాము. క్రీస్తులోని రక్షణసత్యమును అన్వేషించే దిశగా మన ఆలోచలను రేకెత్తించటానికి దోహదపడటంలో ఈ పుస్తకము కేవలం పర్వతపు కొనవలె వున్నది.

మీరు చదువుతుండగా దేవుడు మిమ్మును దీవించును గాక!

 

పరిచయం

కృపాసిద్ధాంతాలు

ఈ పుస్తకం వాక్యానుసారమైన రక్షశాస్త్రానికి సంబంధించినది. రక్షణశాస్త్రం అనేది దేవుడు సంపూర్తి చేసిన రక్షణ కార్యాన్ని అధ్యయనం చెయ్యడానికి దైవశాస్త్రపరంగా వాడే పదం. మనుషులు మానవదేహంతో చుట్టబడిన ఆధ్యాత్మిక జీవులని లోకవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాముఖ్యమైన మతాలు ఒప్పుకుంటాయి. దేహం మృతమైన తరువాత కూడా ఆత్మ ఏదో ఒక రూపంలో సజీవంగానే ఉంటుందని చాలా మతాలు ఒప్పుకుంటాయి. ఆ ఆధ్యాత్మిక జీవానికి సృష్టికర్త దేవుడే అని వాక్యానుసారమైన క్రైస్తవ్యం బోధిస్తుంది. అయినప్పటికీ చనిపోయే ప్రతి వ్యక్తి పరిశుద్ధుడైన దేవుని ఎదుట క్షమించబడి అంగీకరించబడడని కూడా బైబిల్ ఎంతో స్పష్టంగా ప్రకటిస్తుంది. అలా కొందరు రక్షించబడి, కొందరు రక్షించబడకుండా ఉండడం అనేది ఎందుకు జరుగుతుందనే విషయంపైనే ఈ అధ్యయనంలో మనం దృష్టి సారించబోతున్నాం.

'సిద్ధాంతం' అనే మాటను బట్టి అభ్యంతరపడకండి. దైవభక్తిలో భాగంగా బోధించే ఏదైనా నియమాన్ని లేదా విశ్వాసప్రమాణాన్నే సిద్ధాంతం అని పిలుస్తారు, అంతే. బైబిల్లో అంతర్లీనమైయున్న సూత్రాలను, నియమాలను మరియు బోధలను మెరుగ్గా అర్థం చేసుకోవడానికి సమగ్రమైన దైవశాస్త్రంగా క్రమబద్ధీకరించబడిన వాక్యానుసారమైన క్రైస్తవ నియమాలనే ఇక్కడ మనం అధ్యయనం చేయబోతున్నాం. అపొస్తలుడైన పౌలు సరైన సిద్ధాంత బోధను బలంగా సమర్థించాడు.

నేను వచ్చువరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము (1 తిమోతి 4:13).

దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది (2 తిమోతి 3:16,17).

అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినవారమైనట్లుండక... (ఎఫెసీ 4:14).

ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, సత్యమునకు చెవినియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలము వచ్చును. (2 తిమోతి 4:3,4).

సంఘం క్రీస్తు సిద్ధాంతాలలో మంచి శిక్షణ కలిగి ఉండటం అవసరం, ఎందుకంటే ఆ పునాదిరాళ్లపైనే నిజమైన క్రైస్తవ్యం కట్టబడుతుంది.

ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహనిర్వాహకునివలె నిందారహితుడై యుండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక, 8 అతిథిప్రియుడును, సజ్జన ప్రియుడును స్వస్థబుద్ధిగలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశానిగ్రహముగలవాడునై యుండి, 9 తాను హితబోధవిషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడువారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై యుండవలెను (తీతుకు 1:7-9).

నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధిం చుము (తీతుకు 2:1).

చరిత్ర

సాధారణంగా కృపాసిద్ధాంతాన్ని కాల్వినిజమ్ అని పిలుస్తారు. దీనికి గొప్ప ఐరోపా చరిత్ర ఉన్నది. అమెరికా అవతరణ సమయంలో ఈ సిద్ధాంతం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. మార్టిన్ లూథర్ స్థాపించిన సంఘమునకు, దేవుని ఎన్నిక మరియు ముందుగా నిర్ణయించబడటం వంటి సిద్ధాంతాలే పునాదులు. ప్రెస్బీటేరియన్ సంఘ స్థాపకుడైన జాన్ నాక్స్ ఈ సిద్ధాంతాలను నమ్మాడు. ప్లీమత్ రాక్ దగ్గర దిగిన ప్రయాణికులందరు కాల్విన్ సిద్ధాంతాన్ని నమ్మినవారేననీ ప్రెస్బిటేరియన్ల ఆదిమ అమెరికా చరిత్ర తెలియచేస్తుంది.

ఆదిమ అమెరికాలోని కాంగ్రిగేషనలిస్ట్ సంఘాలు ఒకప్పుడు ఈ సిద్ధాంతాన్ని నమ్మేవి. మరియు బాప్టిస్టువారు 'దేవుడు ముందే ఏర్పరచుకున్నాడు' అనే సిద్ధాంతాన్ని నమ్మేవారు. అందుకే ఆదిమ బాప్టిస్టు విరోధులు ('వారూ మేమూ ఒకటి కాదు' అని చెప్పటానికి) 'స్వేచ్ఛా-చిత్తపు బాప్టిస్టులని' తమ్మును తాము పిలుచుకునేవారు.

మధ్య అట్లాంటిక్ మరియు దక్షిణ ప్రాంతాలలో స్థిరపడిన, న్యూయార్క్ మరియు న్యూజెర్సీవారైన డచ్ కాల్వనిస్ట్ లద్వారా, పెన్సిల్వేనియా మరియు మేరిలాండ్ వారైన జర్మన్ రిఫామ్స్ వారి ద్వారాను మరియు స్కాచ్-ఐరిష్ ప్రెస్బిటేరియన్ల ద్వారాను కాల్వినిజమ్ బలపరచబడింది. అక్కడ స్థిరపడినవారందరూ ప్రొటెస్టెంట్ వారు కారు, ప్రొటెస్టెంట్లందరూ కాల్వినిస్ట్లు కాదు. అయినా సరే, ప్రారంభము నుండి కూడాను, అమెరికావారి ఆలోచనా ధోరణిపై మరియు సంస్థలపై కాల్వినిస్ట్ల బలమైన ప్రభావముండేది. కాల్వినిస్ట్లు విశ్వవిద్యాలయాలను స్థాపించటం, న్యూ ఇంగ్లాండ్ సభలకు నాంది పలకటం, ప్రభుత్వంలో అధికార వేర్పాటుకై పోరాడటం, బానిస నిర్మూలనకై నడుము కట్టటం తదితరమైనవి ఎన్నో చేపట్టారు. క్లుప్తంగా చెప్పాలంటే, అమెరికా యొక్క ఆధ్యాత్మిక, మత చరిత్రలో నేరుగా దోహదపడినది కాల్వినిజం ఒక్కటే కాకపోయినప్పటికీ, ఇది ఎంత ప్రాముఖ్యమైనదంటే, అమెరికా చరిత్రను, సంస్కృతిని క్షుణ్ణంగా ఎరిగినవారెవరూ, అందుకు తోడ్పడిన కాల్వినిస్టుల పారంపర్యాన్ని అభినందించకుండా ఉండలేరు.

మేము ఇక్కడ పరిగణించే విషయాలు ఇటీవల త్రవ్వి వెలికి తీసిన క్రొత్త సత్యాలు కావు. ఇవి పురాతన సత్యాలు, విశ్వాసపునాదులు. కాబట్టి మనము ఎక్కడ నుండి వచ్చాము, ఎలా ఇక్కడికి చేరుకున్నామో అర్థం చేసుకోవాలంటే తప్పనిసరిగా సంఘసంస్కరణ చరిత్రను క్లుప్తంగా పరికించాలి. ఐతే ఈ పుస్తకము సంఘ చరిత్రకై ఉద్దేశించబడినది కాదు, కనుక సంస్కరణోద్యమానికి సంబంధించిన అనేక విషయాలు మరియు వ్యక్తుల ప్రస్తావనను దాటవేస్తూ ఇక్కడ చేయబోయే సిద్దాంతవిశ్లేషణకు నేరుగా సంబంధించిన పేరులను మరియు చారిత్రాత్మక సంఘటనలను మాత్రమే పరిచయం చేసుకుందాం.

సంఘము ఉనికిలోనికి వచ్చిన మొదటి మూడు శతాబ్దాలలో రచయితలు, వేదాంతులు ప్రాథమికంగా క్రీస్తు స్వభావము, ఆయన దైవత్వము మరియు ఆయన మానవత్వము మొదలైనవాటిపై దృష్టి సారించారు. తత్ఫలితంగా 5వ శతాబ్దము వరకు 'కృపాసిద్ధాంతమును' గూర్చిన మాటే లేదు. దానికర్థం బైబిలు గ్రంథములో అది లేదని కాదు. కానీ ఒక విషయము మనము జ్ఞాపకముంచుకోవాలి:  కొన్ని వందల యేళ్ళ వరకు బైబిలు ప్రామాణీకరణ జరగలేదు.

మొదటి నుండి కూడా, అన్యులు, ధర్మశాస్త్ర ఆచరణ ద్వారా కాక కృప ద్వారా నీతిమంతునిగా తీర్చబడటం అనే పౌలుబోధను అనుసరించినవారు. అయితే, యూదామతము నుండి క్రైస్తవ్యములోనికి వచ్చినవారు, వారి పాత సంప్రదాయాలను, ఆచారాలను పాటించేవారు. ఈ రెండు గుంపుల వారి మధ్యన క్రైస్తవ్యం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చింది. “మనము పుట్టుకతో యూదులమేగాని, అన్యజనులలో చేరిన పాపులము కాదు. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్రసంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక, క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసముంచి యున్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియలమూలమున ఏ శరీరము నీతిమంతుడని తీర్చబడదు గదా” (గలతీ 2:16). సహజముగానే సంఘములో కృప-ధర్మశాస్త్ర విభేదాలు నెలకొని వివాదాలకు దారితీశాయి. ఒకవైపు అన్యులైయుండి క్రైస్తవులైనవారు పౌలుబోధలను సమర్థిస్తే, మరొకవైపు యూదులైయుండి క్రైస్తవులైనవారు మోషే ధర్మశాస్త్రాన్ని ఆచరించటం వలన నీతిని సంపాదించుకుని రక్షణ పొందుకోవచ్చనే తలంపును కలిగి తమ పితరుల సంప్రదాయాలను సమర్థించేవారు.

హిప్పోవాడైన అగస్టీన్ (354-430 క్రీ.శ.), మానవుని పతనావస్థ, దేవుని బేషరతు ఎన్నిక మరియు కృపాధారపు రక్షణ మొదలైన బైబిలు ఆధారిత సత్యాలను ప్రజల్లోకి తీసికొనిపోయి, వాటిని ప్రాచుర్యం గావించాడు. పెలేజియస్ (360–420) బోధలను కొట్టివేస్తూ అగస్టీన్ బైబిలు ఆధారిత దైవశాస్త్రాన్ని క్రమపరిచాడు. పెలేజియస్ రోమా నగరాన్ని క్రీ.శ.411లో విడిచి వెళ్ళి దాదాపు క్రీ.శ.418లో చరిత్రకు మరుగయ్యాడు. ఆదాము పాపము కేవలం అతని వ్యక్తిగత పతనమేనని, అది మానవాళిపై ఎటువంటి ప్రభావము చూపలేదని పెలేజియస్ బోధించాడు. క్రీస్తు మరణము కేవలము హతస్సాక్షిలాంటి ఓ మాదిరి అని, మానవుడు తన సహజదశలో తన స్వేచ్ఛాచిత్తం మరియు దృఢసంకల్పం ఆధారంగా తన స్వీయరక్షణను పొందుకోవచ్చని అతడు బోధించాడు. కాబట్టి అతని బోధలకు విరుద్దంగా అగస్టీన్ ఇలా బోధించాడు.

1) మానవ జాతి యావత్తూ ఆదాములో పతనమైంది.

2) స్వభావరీత్యా, మానవులందరు పతనావస్థలో ఉన్నారు. వారు ఆధ్యాత్మికంగా చచ్చినవారు.

3) మానవుని చిత్తం స్వతసిద్ధంగా పాపం చేస్తుంది గాని దేవుని కార్యాలు స్వతస్సిద్ధంగా చేయజాలదు.

4) ఎన్నిక చేయబడినవారి కొరకు, వారి స్థానములో క్రీస్తు మరణించాడు.

5) వ్యక్తుల యోగ్యతకు అతీతంగా, వారిని తన చిత్తానుసారంగా దేవుడు ఎన్నిక చేసాడు.

6) ఆ రక్షణార్థమైన కృప, ఎన్నుకోబడిన వ్యక్తులకు పరిశుద్ధాత్ముని ద్వారా కార్యసిద్ధి కలిగేలా అన్వయించబడుతుంది.

అపొస్తలుడైన పౌలుబోధలను చక్కగా విశ్లేషించిన మొట్టమొదటి వ్యక్తి అగస్టీన్; ఆతను ఆదిమసంఘానికి ఈ బోధలను అంగీకారమయ్యేలా వివరించగలిగాడు. ఆ తరువాత అధికారము, ప్రాధాన్యత విషయమై రోమన్ కేథోలిక్ సంఘం పైకెదిగింది. కాలము గడిచే కొలది లేఖనాల విషయమైన అజ్ఞానం, మూఢనమ్మకాలు మున్నగువాటిని రోమా నగరం ప్రబలం చేసింది. పోపులు రాజకీయపరంగా, సంఘపరంగా బలం పుంజుకున్నారు. తత్ఫలితంగా రోమా అధికారం క్రిందికి ఐరోపాలో చాలా భాగం వచ్చింది.మత గురువులు మరింత భ్రష్టుపడుతుండగా, సంఘనాయకుల నైతికత అంతకంతకూ దిగజారుతూ వచ్చింది, క్షమాపణ పత్రాలను(తమ పాపశిక్షలను తగ్గించుకోవడానికి లేదా పర్గేటరీ/ప్రాయశ్చిత్త స్థలంలో ఉన్న తమ ప్రియుల పాపక్షమాపణ నిమిత్తం ధనం చెల్లించడం) అమ్మడం ప్రారంభించడంతో ఇది తారాస్థాయికి చేరుకుంది. ఆ చీకటి యుగపు రోజుల్లోనే రోమా సంఘము అన్యసంప్రదాయాలు మరియు బబులోను మతాచారాలతో కూరుకుపోయి, దేవుని వాక్యం కంటే సంఘాచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అవి అతిపవిత్రమైనవి, చాలా క్లిష్టమైనవి కాబట్టి కేవలం మతగురువులకు మాత్రమే అర్థమౌతాయి అన్న సాకుతో సగటు మానవునికి లేఖనాలు పూర్తిగా మరుగు చేయబడ్డాయి.

5వ శతాబ్దంలోని ఉత్తర ఐరోపా అటవిక జాతులు, రోమాసామ్రాజ్యపు రాజకీయ సంస్థలను, దాని పాండిత్యాన్ని, కళలను మొదలైనవాటిని చిన్నాభిన్నం చేశాయి. ఇలా భారీ ఎత్తున రోమాసామ్రాజ్యపు సంస్కృతి నాశనము చేయబడినపుడు, ఐరోపా వెయ్యేండ్ల చీకటియుగాల్లోకి కూరుకుపోయింది. విద్యాజ్యోతి చాలా మట్టుకు ఆరిపోయింది, కాబట్టి దీనిని చీకటియుగమని పిలిచారు. అంతటా అజ్ఞానం ప్రబలింది.

చాలామంది ఐరోపీయులకు ఆధ్యాత్మికత అంటే రెండే విషయాలు ప్రధానంగా ఉండేవి. అవేమనగా: మూఢాచారాలను అనుసరించడం మరియు మతగురువులపై ఆధారపడటం. విద్యకు గ్రహణం పట్టినంతపనైంది. ప్రామాణికమైన లేఖనాల సైద్ధాంతిక బోధ లేకపోయేసరికి, ప్రజలు విస్తారమైన మూఢాచారాలలో మునిగిపోయారు. సగటు వ్యక్తులు ఈ లోకము దేవదూతలు,దెయ్యాలు మరియు మానవాతీత శక్తులతో నిండి అవి తమ జీవితాల్ని,తమ భవిష్యత్తును నియంత్రిస్తాయని నమ్మేవారు.

రోమన్ కేథోలిక్ సంఘము, ఐరోపా రాజకీయాలను మరియు సంస్కృతిని శాసించటం ప్రారంభించింది. తత్ఫలితంగా ప్రతి ఒక్కరు కూడా వారివారి నిత్యరక్షణ కొరకు సంఘముపై ఆధారపడ్డారు. ఒకవైపు, సంఘము ఏడు మతాచారాలను ఆధ్యాత్మికతతో ముడిపెట్టి ప్రవేశపెట్టింది. ఆ మతాచారాలే రక్షణార్థమైన కృపకు రహదారులని బోధించింది. మరోవైపు వెలివేసే బలమైన అధికారం సంఘం చేతిలో ఉండింది. పోప్ తన అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ, అతని దృష్టికి దుర్బోధకులు, పాపులు అనిపించినవారిని, కొన్నిసార్లు దేశం యావత్తును, ఈ రక్షణార్థపు కృపనందించే మతాచారాలలో పాలుపొందకుండా బహిష్కరించేవాడు. ఐరోపావారందరూ కూడా ఉగ్రుడైన దేవుడు తన దివ్యచిత్తాన్ని కేవలము రోమన్ సంఘం ద్వారా మాత్రమే కనుబరచాడని నమ్మే విధంగా మతాచారాలను రూపొందించారు.

ఇట్టి అంధకారపు ఊబి నుండి అగస్టీనియన్ సన్యాసి అయిన మార్టిన్ లూథర్ (1483-1546) జర్మనీలో సంఘసంస్కరణ ప్రారంభించాడు. 'దేవుడు ముందుగా ఏర్పరచుకొనుటను' లూథర్ బలంగా నమ్మాడు (ప్రిడెస్టినేరియన్). ఈ సిద్ధాంతాన్ని తన గ్రంథమైన 'బాండేజ్ ఆఫ్ ద విల్' లో విస్పష్టముగా ప్రస్తావించి వ్రాశాడు. దురదృష్టవశాత్తు, కాలక్రమములో లూథరన్ సంఘము వారు ఈ సిద్ధాంతాన్నే ప్రక్కన పెట్టేశారు. తత్ఫలితంగా వారు రోమన్ కేథలిక్ వారి భావాలైన “సార్వత్రిక కృప” మరియు “సార్వత్రిక ప్రాయశ్చిత్తము” మొదలైనవాటిని తిరిగి అవలంభిస్తున్నారు.

మార్టిన్ లూథర్ వేసిన పునాదులపై జాన్ కాల్విన్ తన సిద్ధాంతాలను కట్టాడు (1509-1564). జాన్ కాల్విన్, హుల్డ్రిక్ జ్వింగ్స్ (1484-1531) జాన్ నాక్స్, వారి అనుచరులు (1513-1572) సంస్కరణకర్తలుగా పేరొందారు. ఎందుకంటే వారి లక్ష్యమంతా కూడా బైబిలు ఆధారిత సిద్ధాంతాన్ని సమకూరుస్తూ రోమా సంఘపు సిద్ధాంతాన్ని మరియు మూఢాచారాలను రూపుమాపటమే. రోమన్ కేథలిక్ సంఘము దానికి విరోధముగా రూపుదిద్దుకున్న దైవశాస్త్రాన్ని అరికట్టు నిమిత్తము “విశ్వాసపు ప్రకరణలను” ఏర్పరచింది. ఎవరైతే వాటిని ధిక్కరిస్తారో వారిని ఉరి తీయటానికి లేదా కాల్చి వేయటానికి ఆదేశాలిచ్చింది. కాబట్టి సంస్కరణ సంఘము/ ప్రొటెస్టంటు సంఘము తరుచుగా, కేవలం వారు నమ్మినదానిని ఒప్పుకున్నందుకు ప్రాణాల్ని పరిత్యజించారు లేదా కాళ్ళు, చేతులు పోగొట్టుకున్నారు.

ఆర్మీనియనిజమ్

జేకబ్ (జాన్) ఆర్మీనియస్ (1560-1609) జాన్ కాల్విన్ యొక్క అనుచరుడైన తీయోడర్ బేజ యొక్క విద్యార్థి. ఈయన స్విట్జర్లాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ జెనీవాలో బోధించాడు. 1588లో ఆర్మీనియస్, పెల్జియన్ వేదాంతియైన డార్చ్ కూర్న్హర్ట్ (1522-1591) యొక్క రచనలు చదివాడు. ఆ విధంగా వాటిని చదివి తన సొంత నమ్మకాలకంటే ఆ గ్రంథాల్లోని వాదనలు బలమైనవని తలంచాడు. తదుపరి 'సార్వత్రిక కృప', 'స్వేచ్ఛా చిత్తము' అనే సిద్ధాంతాల వైపు తిరిగాడు.

సంఘ సిద్దాంత విషయమై ఒక అధికారిక సమదృక్పథం కలుగు నిమిత్తము ఒక సంఘాలసమావేశాన్ని ఏర్పరచాలని అలనాటి హాలెండ్ ప్రభుత్వాన్ని ఆర్మీనియస్ కోరాడు. జనరంజకమైన అగస్టీనియన్/కాల్వినిస్ట్ సిద్దాంతాల్లో ప్రాథమికంగా రెండింటి విషయమై ఆర్మీనియస్ విబేధించాడు.

1) దేవుడిచ్చే రక్షణ, షరతుతో కూడినదా లేదా బేషరతుగా ఇవ్వబడినదా? మరో మాటలో చెప్పాలంటే దేవుడు కేవలం తన సర్వాధికారపు సంతృప్తి కొరకు మనుష్యులను ఏర్పరచుకుంటాడా లేక వారివారి ఒప్పుకోలు, విశ్వాస్యత తదితర కారణాలను బట్టి ఎన్నుకుంటాడా?

2) కృప భేద్యమైనదా లేక అభేద్యమైనదా(ఎదిరించబడటం సాధ్యమా లేక అసాధ్యమా)? అంటే రక్షించు ఉద్దేశముతో దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటే,అతడు దేవుణ్ణి ఎదిరించగలడా? లేదా అతని వ్యక్తిగత చిత్తము, అభీష్టానికి అతీతంగా రక్షింపబడతాడా?

నవంబరు 13, 1618లో హాలెండ్ లో డార్ట్ అనే స్థలంలో ఓ జాతీయ సమావేశం ఏర్పరచబడింది. ఆ సమావేశంలో చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ తో పాటు రిఫార్మడ్ సంఘాలన్నీ పాల్గొని ప్రాతినిధ్యం వహించాయి. ఆ సమావేశం మే 9, 1619 వరకు కొనసాగింది. ఆ సమావేశంలో ఆర్మీనియన్లు దిగువ ప్రతిపాదనలు చేశారుః

1) దేవుడు అనంతజ్ఞాని కాబట్టి విశ్వసించేవారెవరో, విశ్వసించనివారెవరో మున్ముందే చూసి విశ్వాసులను ఎన్నుకుంటాడు. అవిశ్వాసులను తిరస్కరిస్తాడు. దేవుని ఈ భవిష్యద్ జ్ఞానమే ఆయన చేసే ఎన్నికకు ఆధారము.

2) విశ్వసించినవారే రక్షించబడినప్పటికీ, అందరికొరకూ, ప్రతీ ఒక్క వ్యక్తి కొరకు, క్రీస్తు మరణించాడు.

3) మానవుడు పతనావస్థలో ఉన్నాడు గనుక విశ్వాసములోనికి నడిపించబడటానికి దేవుని కృప అవసరమే.

4) అయినా ఆ కృపను ఒక వ్యక్తి ఎదిరించగలడు.

5) నిజంగా తిరిగి జన్మించిన వ్యక్తి కూడా తన విశ్వాసమును కోల్పోయి, తన రక్షణను పోగొట్టుకోగలడు.

డార్ట్ సమావేశం ఆర్మీనియన్ సిద్ధాంతాలను లేఖనాలతో పోల్చి సమన్వయపరిచే ప్రయత్నం చేసింది కాని వీలుపడలేదు. దాని ఫలితంగా, వాటిని పూర్తిగా త్రోసిపుచ్చింది. అయినా మనిషి, అహానికి పట్టం కట్టి, మానవ స్వేచ్ఛాచిత్తానికి పీఠం వేసి, దేవుని నాయకత్వాన్ని ధిక్కరిస్తాడు కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘాల్లోను ఈ సిద్ధాంతాలు నేటికీ బోధించబడుతున్నాయి. ఏళ్ళ తరబడి ఆర్మీనియన్ సిద్ధాంతానికి, పౌలు బోధించిన చారిత్రాత్మక విశ్వాసానికి మధ్య ఎన్నో విభేదాలు నెలకొన్నాయి. అట్టివాటిలో ప్రాచుర్యము పొందిన కొన్ని ఆర్మీనియన్ సిద్ధాంతాలను కింద చూద్దాము.

1. పాపము మానవస్వభావములో అంతర్లీనమైనది కాక ఉద్దేశపూర్వకంగా చేసే క్రియల్లోనే ఉంటుంది.

2. పాప కలుషము ఆదాము పతనము నుండి సంక్రమించినప్పటికీ అతని పాపదోషము తన సంతతిలో ఎవరిపైనా మోపబడలేదు.

3. మనిషి యొక్క పతనఫలితమైన నిస్సహాయతను సంపూర్ణమైనదిగా పరిగణించకూడదు.

4. మంచి చేయటం కొరకైన సామర్థ్యాన్ని, దృఢసంకల్పశక్తిని మానవుడు కోల్పోలేదు.

5. క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తబలి సమానంగా అందరికీ, ప్రతి ఒక్కరికీ, ఉద్దేశించబడింది. అది రక్షణను కేవలం సుసాధ్యము చేసింది. పశ్చాత్తాపపడిన విశ్వాసి దానిని స్వీకరించినప్పుడు మాత్రమే క్రీస్తు రక్తము ప్రభావవంతంగా మారుతుంది.

6. తిరిగి జన్మించటానికి ముందే పశ్చాత్తాపము, విశ్వాసము కలుగుతాయి.

7. తిరిగి జన్మించటానికి మానవ చిత్తము ఒకానొక కారణం.

8. విశ్వాసము అనేది మానవుని యొక్క సత్క్రియ, అదే దేవునిచే అంగీకరించబడటానికి ఆధారము/కారణము.

9. క్రీస్తు యొక్క నీతి విశ్వాసికి ఆపాదించబడలేదు.

10. విశ్వాసి “పరిపూర్ణుడు” అని పిలవబడే విధముగా ఈ జీవిత కాలంలోనే దైవచిత్తముతో మమేకం కాగలడు.

11. ప్రేమ అనేది దేవుని అతి శ్రేష్ఠగుణము. దేవుడంటే ప్రేమే.

12. ఒక వ్యక్తికి సువార్త అందించబడినప్పుడు, అతడు దానిని స్వీకరించలేనంత అశక్తుడు కాడు. అలాగే దానిని ధిక్కరించలేనంతటి విధంగా దేవుని నిర్భంధములో లేడు.

13. తన విశ్వాసము కాపాడుకొని కృపలో తనను తాను పదిలపరచుకోవటమనేది విశ్వాసిపై ఆధారపడి ఉంటుంది. తమ విశ్వాసము కాపాడుకోవటంలో విఫలమైనవారు వారి రక్షణను కోల్పోతారు.

కృపా సిద్ధాంతాలు

ఆర్మీనియనిజమ్ యొక్క ఐదు సిద్ధాంతాలు ఖచ్చితంగా లేఖనేతరమైనవని తీర్మానిస్తూ ఈ సమావేశం, “కాల్వినిజం యొక్క ఐదు సిద్ధాంతాలుగా” పిలవబడుతున్న ఈ క్రింది వాటిని ఓ క్రమబద్ధమైన దేవశాస్త్రముగా పొందుపరిచింది. అన్నిటిలోను దేవుడు సర్వాధికారి అన్న సత్యముపై ఈ సిధ్ధాంతాలు ఏర్పరచబడ్డాయి. పౌలు చేత బోధించబడి మనకు అందించబడ్డ ప్రాథమిక ప్రధాన రక్షణ సిద్ధాంతాలు ఇవే.

ఇక్కడ మనము కొన్ని విషయాలను నిర్వచించటం అవసరము. ఈ కృపా సిద్ధాంతాలకు 'కాల్వినిజమ్' అనే వెక్కిరింపు పేరు పెట్టబడింది. నేను ఖచ్చితముగా కాల్వినిస్టును కాను, కాల్విన్ ఆరాధకుడను అసలే కాను. వాస్తవానికి నేను ఒప్పుకోని విషయాలను కాల్విన్ ఎన్నో నమ్మాడు. ఉదాహరణ: మనము చాలినంత నీతియుతంగా జీవించినప్పుడు వెయ్యేండ్ల పరిపాలన ప్రారంభమౌతుందని ఆయన నమ్మాడు. నేను దీనిని ఒప్పుకోను. దేవుడు భూమికి పునాదులు వేయబడక మునుపే మానవ చరిత్ర విషయమై ఓ దిశ నిర్దేశించాడని, అన్నీ ఆయన నిర్దిష్టసమయంలో నెరవేరుతాయని నేను నమ్ముతాను.

జాన్ కాల్విన్ సబ్బాతు దినాన్ని ఖచ్చితంగా ఆచరించేవాడు. కాని సంపూర్ణము చేయబడ్డ క్రీస్తు కార్యమందు విశ్రమిస్తే పాతనిబంధన సబ్బాతును ఆచరించినట్లేనని నేను నమ్ముతాను. ఎందుకంటే ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులోనున్నదని పౌలు స్పష్టముగా చెప్పాడు (కొలొస్సీ 2:16,17).

రిఫార్మ్డ్ సంఘానికి వ్యతిరేకంగా తిరగబడుతున్న అనబాప్టిస్టులను ప్రభుత్వ అధికారము ఉపయోగించి అణచజూసినవాడు కాల్విన్. ఈయన, దుర్బోధకులను దహించివేశాడు.

ఏళ్ళ తరబడి కొన్ని తప్పులను సవరిస్తూ, మరి గొప్పగా కాల్వినిజమ్ ఎదిగిందని, రిఫార్మేషన్ వేదాంతవేత్తలు కూడా ఒప్పుకుంటారు.

మనుష్యుల్లో అత్యంతజ్ఞానులు సహితం పతన స్వభావము గలవారు. అందుకే మనం మనుష్యుల్ని కాక క్రీస్తునే అనుసరిస్తాం. అయినా లేఖనాలను చదివి గొప్ప తలంపులను గంభీరమైన ఆలోచనలను వ్యక్తపరచగలిగే వరాన్ని దేవుడు కొందరు వ్యక్తులకు ఇచ్చాడు. వారు ఆ విధముగా క్రమపరిచే దైవశాస్త్రము, బైబిల్ ను మరింత సరళముగా అర్థంచేసుకోవటానికి దోహదపడుతుంది కూడా. జాన్ కాల్విన్ మరియు నేను కొన్ని విషయాలలో విభేదించినప్పటికి డార్ట్ సమావేశం ఆమోదించిన సిద్ధాంతాలు మాత్రం లేఖనానుసారమైనవే, యథార్థమైనవే.

కొన్ని యేళ్ళ తరువాత ఈ సిద్ధాంతాలు కాల్వినిజం అనే పేరుతో కాక 'కృపా సిద్దాంతాలు' అనే పేరుతో పిలువబడటం మొదలైంది. తద్వారా ఈ సిద్ధాంతలను కాల్విన్ పేరు నుండి వేరు చేసి అవి సబబుగా ఎవరికి అపాదించబడాలో ఆ దేవుని గుణలక్షణమైన కృపతో జతచేయబడింది. కొంతమంది ఈ ఐదు సిద్దాంతాలను క్లుప్తంగా "TULIP" (టులిప్) అని పిలుస్తారు.

T - Total Depravity - సంపూర్ణ పతనం

U - Unconditional Election - బేషరతు ఎన్నిక

L - Limited Atonement - పరిమిత ప్రాయశ్చిత్తము

I - Irresistable Grace - అభేద్యమైన/ధిక్కరించలేని దేవుని కృప

P - Perseverance of the Saints - పరిశుద్దుల పదిలత

ఈ సిద్ధాంతాల్ని GRACE (గ్రేస్) అను మాటలోని అక్షరాలను ఉపయోగించి కూడా తెలుసుకోవచ్చు.

G - Gracious Election - కృపాయుతమైన ఎన్నిక

R - Ruined Sinners - పతనమైన పాపులు

A- Accomplished Redemption- నెరవేర్చబడిన విమోచన

C- Compelling Love - బలమైన ప్రేమ

E - Everlasting Life - నిత్యజీవము

కృప మరియు రక్షణలోని ఐదు దశలను నొక్కివక్కాణించే సిద్ధాంతాలను తెలుసుకునే మరొక విధానాన్ని ఇపుడూ చూద్దాం.

1. మానవుడు సంపూర్ణపతనము అనగా సంపూర్ణనిస్సహాయతకు లోనైనందున రక్షణ నిమిత్తము దేవుని కృప ఆవశ్యమైనది.

2. కృపాయుతమైన తన రక్షణ ప్రణాళికను దేవుడు బేషరతు ఎన్నిక ద్వారా కనపరిచాడు.

3. ఎన్నిక చేయబడినవారికై ఉద్దేశింపబడిన ఈ రక్షణ యేసుక్రీస్తు ప్రాయశ్చిత్తము ద్వారా కొనబడింది.

4. ఈ రక్షణ పరిశుద్ధాత్ముని ప్రభావవంతమైన పిలుపు ద్వారా ఎన్నిక చేయబడినవారికి అన్వయించబడుతుంది.

5. ఇలా రక్షించబడినవారిని శాశ్వతముగా పదిలపరచడమే ఈ రక్షణార్థ కృప యొక్క విజయము మరియు నెరవేర్పు.

వ్యత్యాసాలు

క్రైస్తవ సంఘాలన్నీ మానవులు పాపులని ఒప్పుకుంటాయి. అయితే మానవులు ఎంతమేరకు పాపులు? ఆదాము పాపము, పతనము తక్కిన మానవాళిని ఎంతమేరకు ప్రభావితము చేసింది? అన్నదే వివాదాంశము.

కాబట్టి ఇక్కడ మొదటి ప్రశ్న ఏమిటంటే, ఆరంభంలో కంటే ఇప్పుడు మానవులు కొంచెము తక్కువ మంచివారుగా ఉన్నారా? లేక ఆదాము పాపాన్ని బట్టి మానవులందరూ సంపూర్ణముగా పతనమయ్యారా?

దేవుడు కొన్ని ప్రత్యేక కార్యాలు చేయటానికి,కొన్ని ప్రత్యేక గమ్యాలు చేరటానికి  కొందరిని  ఎన్నుకుంటాడని బైబిలు సెలవిస్తుంది. కాబట్టి రెండో ప్రశ్న ఏమిటంటే, సత్క్రియల వలన సంపాదించుకున్న మంచితనాన్ని బట్టి మనుష్యుల్ని దేవుడు ఎన్నుకుంటాడా? లేక మానవ పరిస్థితులకు, ప్రమాణాలకు అతీతంగా, పతనమైన పాపులను కేవలం తన చిత్తానుసారముగా రక్షింపబడతానికి ఎన్నుకుంటాడా? యేసుక్రీస్తు సిలువలో మరణించాడని క్రైస్తవులందరూ ఒప్పుకుంటారు, అయితే ఆయన వ్యక్తిగతంగా నిర్దోషి గనుక తన కొరకు కాక మరొకరి స్థానంలో మరణించి ఉండాలి. అయితే ఈ ప్రాయశ్చిత్తకార్యము నుండి ప్రయోజనం పొందేది ఎవరు అనేదే ఇక్కడ వివాదాంశము.

కాబట్టి మూడో ప్రశ్న ఏమిటంటే, భూమి మీద జీవించిన ప్రతిఒక్కరి కొరకు యేసు మరణించాడా? లేక కేవలము తన అభీష్టము ప్రకారం, నిత్యజీవముకై ఎన్నుకొనబడినవారి కొరకు మాత్రమే యేసు ప్రాయశ్చిత్తపు వెల చెల్లించాడా?

ఒక వ్యక్తి రక్షింపబడటానికి పరిశుద్దాత్ముని ఆవశ్యకతను గూర్చి పరిశుద్ధ గ్రంథములో ఎన్నో వాక్యాలు ఉన్నాయి. గనుక నాలుగవ ప్రశ్న ఏమిటంటే: ఒక వ్యక్తి పరిశుద్దాత్ముని పిలుపును ఎదురించగలడా? లేక దేవుడు ఒక పాపిని ఎన్నుకొన్న తరువాత, క్రీస్తు అతని కొరకు మరణించిన పిమ్మట, ఆ వ్యక్తి తప్పనిసరిగా దేవుని పిలుపుకు లోబడి రక్షింపబడతాడా?

చివరిగా, ఒక వ్యక్తి తన జీవిత దశలో ఎప్పుడైనా రక్షింపబడిన పిమ్మట కొంతకాలం భూమి మీద నివసిస్తాడు. కాబట్టి ఐదవ ప్రశ్న ఏమిటంటే: ఒక వ్యక్తి ఎన్నుకొనబడ్డాక, విమోచింపబడ్డాక, దేవుని పిలుపును స్వీకరించాక, తెలిసీతెలియక తన నిర్లక్ష్యము వలన లేదా రక్షణను త్యజించటం వలన తన రక్షణ కోల్పోతాడా? లేదా దేవుని మార్పులేని ఎన్నిక ప్రణాళిక, క్రీస్తు చెల్లించిన క్రయధనము యొక్క సంపూర్ణత, రక్షణ పిలుపు యొక్క నిశ్చయత మరియు ఈ రక్షణను అన్వయించటంలో పరిశుద్ధాత్ముని యొక్క సాఫల్యత, ఆ వ్యక్తిని మరెన్నడూ రక్షణలో నుండి వైదొలగకుండా పరలోక గమ్యానికి చేరవేస్తాయా?

ఈ కృపాసిద్ధాంతాల అధ్యయనములో ఇలాంటి ప్రశ్నలను మనము పరిశీలించబోతున్నాము. ఈ సిద్ధాంతాలను మీరు అర్థం చేసుకోనంత కాలము, అవి లేఖనాలంతటా వ్యాపించి ఉన్నాయని, అవి ఏవో కొన్ని అప్రస్తుతమైన వచనాలను సందర్భరహితంగా వివరించటం వలన నిరూపించబడే సిద్ధాంతాల వంటివి కావని తెలుసుకోలేరు. ఈ సిద్ధాంతాలే లేఖనాల మూలము, కేంద్రమునైయున్నాయి.

ఒకటవ అధ్యాయము

సంపూర్ణ పతనము

ఇతర అంశాలవలే ఈ అంశాన్ని కూడా ప్రారంభము నుండే ఆరంభించాలి. 'సంపూర్ణ పతనం' అనగా ప్రకృతి సంబంధియైన మానవుని ప్రతి అణువు పాడైపోయింది, అతడు సంపూర్ణముగా చెడియున్నాడు, దేవుని ప్రీతిపరిచే ఏ మంచిపనీ చేయజాలని అశక్తుడు. సరళంగా చెప్పాలంటే, 'మానవుడు పాపి' అని ఈ మొదటి సిద్ధాంతాము బోధిస్తుంది.

 మానవుడు ఏ మంచి చేయజాలనివాడని, తనకు తాను సహాయము చేసుకోలేని అశక్తుడని బోధించే ఈ సిద్ధాంతాన్ని 'సంపూర్ణ అశక్తత' అని కూడా వేదాంతులు పిలుస్తారు. ఇది కేవలం పదజాలంలో మార్పే తప్ప మరింకేమీ కాదు. బైబిలుపరమైన వివరణ ఏమిటంటే, మానవుడు దుర్భలుడు, దౌర్భాగ్యుడు.

ఇదంతా ఏదేను వనంలో ప్రారంభమైంది. ఆదాము, హవ్వల అవిధేయత ఫలితముగా “దేవుని పోలిక” లో చేయబడిన మానవులు, పతనమైన ఆదాము పోలికలోనికి దిగజారారు. ఈ విధంగా మానవుని స్వభావము మారింది. ఆ స్వభావము నాశనకరమైనది, పాపపూరితమైనది. ఆ మారిన స్వభావము ఆదాము సంతతిలో, ప్రతి ఒక్కరికీ సంక్రమించింది.

“ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశీంచెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికీని సంప్రాప్తమాయెను” (రోమా 5:12). ఈ పాపపు దుస్థితి వలన మానవులు అడపాదడపా దుష్క్రియలు చేస్తారని కాదు కాని, పాపమే వారి అంతరంగిక స్వభావముగా మారిపోయింది. ఆదికాండము 6:5లో, 'నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలలోని ఊహా అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచినట్లుగా' మనము చదువుతాము. ఇక్కడ మనము గమనించినట్లయితే ఆదాము ఆదిమసంతానము యొక్క ఊహ, తలంపు మరియు కోరికలు సహితం  చెడినవని, అవి ఎల్లప్పుడు చెడ్డవైనవిగానే ఉన్నాయని, వారిచెడుతనము ఎడతెగనిదని, మంచితనము కొద్దిగా కూడా లేదని చూడగలము. దేవుడు ప్రతివ్యక్తిని వారి పాపస్వభావము చొప్పున ఈ విధంగానే చూస్తాడు.

పౌలుబోధ ప్రకారము మానవజాతిలోనికి ఈ పాపపుస్వభావము ప్రవేశించినప్పటి నుండి, ప్రతియొక్క నరుడు కూడా ఆ స్థితిలోనే పుడుతున్నాడు. మనమందరము పతనమైనవాళ్ళము. అయితే ఈనాటికీ ఈ అభిప్రాయాన్ని త్రోసిపుచ్చేవారు ఉన్నారు, గనుకనే ప్రశ్నలు పుట్టుకొస్తాయి. ఏ దశలో ఒక వ్యక్తి పాపిగా మారుతాడు? తాను ఇలానే పుట్టాడా? లేక తరువాత నేర్చుకున్నాడా? శిశువులు దోషులుగా పుడతారా? లేక తెలివొచ్చాక పాపము జోలికి వెళతారా?

చాలామందిని అచ్చెరువొందించే విధంగా బైబిలు సెలవిచ్చేదేమిటంటే, మనుష్యులు ఈ పాప స్వభావంతోనే పుట్టారు. అంతేతప్ప ఇది వారిలో సంస్కృతి ద్వారా సంక్రమించింది కానీ, తరువాత వారు నేర్చుకుంది కానీ కాదు. చెడ్డ ఊహలు, తలంపులు, పుట్టుకతోనే సంతరించుకుంటాయి. “అప్పుడు యెహోవా ఇంపయిన సువాసననాఘ్రాణించి- ఇక మీదట నరులను బట్టి భూమిని శపింపను; ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరించను” (ఆది 8:21). “నేను పాపములోనే పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను” (కీర్తన 51:5). “తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు. పుట్టిన తోడనే అబద్దములాడుచు తప్పిపోవుదురు” (కీర్తన 58:3). దేవుని నుండి ఇటువంటి వేర్పాటు గర్భములోనే ప్రారంభమౌతుంది. పిల్లలు వారి పాపస్వభావాన్ని నిరూపిస్తూ, గర్భములో నుండే అబద్దాలు పలుకుతూ వస్తారు. “అందరికిని ఒక్కటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది. వారు బ్రదుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును, తరువాత వారు మృతులయొద్దకు పోవుదురు ఇదియును దుఃఖకరము” (ప్రసంగి 9:3); "హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహించువాడెవడు?”(యిర్మియా 17: 9).

పాపము మన నడవడి మరియు వ్యక్తిత్వము యొక్క మూలాన్ని ప్రభావితము చేస్తుంది. పాపము బాహ్య క్రియలైన త్రాగుబోతుతనము, లైంగిక విశృంఖలత్వము, నరహత్య మొదలైనవాటితో మొదలవదు. మనలో అంతరంగికముగా దాగివున్న తిరుగుబాటు స్వభావము వలన హృదయములోనే పాపము ప్రారంభమై బాహ్య క్రియల రూపంలో వ్యక్తపరచపడుతుంది.

ఈ పతన స్వభావము ఒక వ్యక్తిని కేవలం మంచి చేయటానికి అయిష్టునిగా చేయడమే కాక, దేవునికి ప్రీతికరమైనదేదీ చేయలేని అశక్తునిగా కూడా చేస్తుంది. ఇదే 'సంపూర్ణ పతనము'. తన తిరుగుబాటులో సంతసించటం తప్ప, దేవునికి ప్రీతిపాత్రంగా మారటానికి గాని, తనను తాను దేవునికి ఆకర్షితునిగా చేసుకోవటానికి గాని సమర్థతలేని నిర్భలుడు మానవుడు.

ఇందులో ఓ ప్రాముఖ్యమైన దైవశాస్త్ర సంబంధమైన సత్యము దాగి ఉంది. స్త్రీ, పురుషులు స్వభావరీత్యా మంచి చేయటానికి గాని దేవుణ్ణి సంతోషపరచటానికి కాని శక్తిలేని నిర్బలులన్నది నిజమైతే, నేడు చాలామంది చేస్తున్నదానికి వ్యతిరేకంగా, అలా సంపూర్ణంగా పతనమైనవారికి 'నమ్ము మరియు విశ్వసించు' లేదా 'క్రీస్తు కొరకై తీర్మానించు' అన్న విషయాలు, వ్యర్థంగాను, అతార్కికంగాను, లేఖనవిరుద్ధంగానూ ఉంటాయి. శరీరసంబంధులకు ఇసుమంతైనా మంచి చేయటానికి గాని విశ్వాసాన్ని కూడగట్టుకోవటానికి గాని శక్తి ఉండదు. వారి ఊహలు, తలంపులు ఎల్లప్పుడు కేవలము చెడ్డవి. అటువంటి మనుష్యులు నిత్యజీవాన్ని పొందటానికి దేవునియందు ఎలా విశ్వాసముంచగలరు?

“కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగినయెడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయుట వల్లపడును” (యిర్మీయా 13:23). 'మార్చుకోలేరు' అనేది దానికి స్పష్టమైన సమాధానము. కూషు దేశస్థుడు మరియు చిరుతపులి తమను తాము మార్చుకోలేని అశక్త జీవులు. మరో ప్రత్యామ్నాయం లేకుండా ఆ విధంగా పుట్టాయి/డు. అదే విధంగా దుష్టత్వము మరియు నాశనములో పుట్టిన పాపియైన మానవుడు, తన స్వంత స్వభావానికి ఎదురొడ్డలేని నిర్భలుడు; ఏ మంచీ చేయలేని దుర్భలుడు. “వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయువారును లేరు, ఒక్కడైనను లేడు” (కీర్తన 14:2,3) “ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా - నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు గ్రహించు వాడెవడును లేడు, దేవుని వెదకు వాడెవడును లేడు అందరు త్రోవ తప్పి యేకముగా పనికిమాలిన వారైరి మేలు చేయువాడులేడు, ఒక్కడైనను లేడు” (రోమా 3:10-12). “మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను” (యెషయా 53:6). “ఒకనియెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును” (సామెతలు 14:12).

మనుష్యులందరు దుష్టులనీ, నశించినవారనీ స్పష్టముగా దేవుడు చెబుతున్నాడు. ఏ ఒక్క వ్యక్తి కూడా దేవునిని అన్వేషించటం లేదు, ఆయనను అనుసరించటం లేదు, ఎన్నుకొనటమూ లేదు. ఆత్మ  విషయాలను గ్రహించగలవారు కానీ, ఆధ్యాత్మికంగా ప్రయోజకులు గాని ఎవరూ లేరు. లేడు, ఒక్కడైననూ లేడు అనన్నది క్రొత్త నిబంధనలోనూ, పాత నిబంధనలోనూ మనము చూడగలము.

సంపూర్ణ అశక్తత

మనుష్యులు ఆయనను అనుసరించటానికి అసమర్థులని యేసు చెప్పాడు. వారు తిరుగుబాటు చేయటానికి మరియు అపార్థము చేసుకోవటానికి వారి శరీరస్వభావాన్ని అనుసరించటం మాత్రమే కాకుండా అందుకు భిన్నంగా వేరేదీ చేయలేని అశక్తులు అని చెప్పాడు. కన్నులుండియు చూడలేని వారనియు, చెవులుండియు వినలేనివారనియు వారిని గూర్చి యేసు చెప్పాడు. వారు నాయొద్దకు రాలేని అబలులు అనే అర్థంతో ఈ క్రింది మాటలు యేసు పలికాడు. “మీరేల నా మాటలు గ్రహింపకున్నారు! మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా!" (యోహాను 8:43 ). "నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనేగాని యెవడును నా యొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును” (యోహాను 6:44). “మంచి చెట్టు కాని ఫలములు ఫలింప నేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు” (మత్తయి 7:18). “మీరు నన్ను వెదకుదురు గానీ నన్ను కనుగొనరు నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను” (యోహాను 7:34). “అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనేగాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను” (యోహాను 3:3). యేసు చేసిన ప్రకటనలు ఎంత సూటిగా ఉన్నాయో గమనించండి. ఆయనను దృష్టించి చూడటానికి, ఆ తరువాత తమకొరకు తాము నిర్ణయించుకోవటానికి మనుష్యులు సమర్థులని ఆయన చెప్పలేదు. వారి అశక్తతకు అనుగుణంగా మనుష్యులు స్పందిస్తారని చెప్పాడు. అలాగే పాతనిబంధనను వివరించి అర్థము చెప్పే అపోస్తలుడైన పౌలు ఈ విషయాలనే తన పత్రికలలో కూడా ప్రస్తావించాడు. “ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు” (రోమా 8:7-8).

మన చర్చ యొక్క సారాంశమంతా ఇదే. ఆదాము పతనము ద్వారా మానవులు కేవలము నలుగగొట్టబడ్డారని కానీ, లేదా వారికి మానగలిగే ఏదో గాయం తగిలందని కానీ బైబిలు సెలవివ్వటం లేదు. మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తింటే నిశ్చయముగా చచ్చెదవు అని ఆదాముతో దేవుడు చెప్పాడు. “మరియు దేవుడైన యెహోవా- ఆ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికాజ్ఞాపించెను” (ఆదికాండము 2:16,17).

తినవద్దన్న ఫలము తినిన తరువాత కూడా ఆదాము కొన్ని వందల యేళ్ళు జీవించాడు. అయితే దేవుడు పొరబడ్డాడా? కాదు. ఆదాము ఆ మరుక్షణమే ఆధ్యాత్మికంగా చనిపోయాడు. కేవలం ఆధ్యాత్మికంగా గాయపరచబడలేదు గాని పాపములో చనిపోయాడు. ఆత్మ సంబంధమైన మరణానికి ఫలితంగా భౌతికముగానూ మరణించడము ప్రారంభించాడు.

మన ప్రస్తుతపు సంపూర్ణపతనానికి దారి తీసిన విషయాలను మరింత క్షుణ్ణముగా చూద్దాం. ఆ మహిమాన్విత వనాన్ని కాయవలసిన ఏకైక హక్కుదారులు ఆదాము మరియు అతని భార్య హవ్వ. పతనము కంటే ముందు దేవుడు వారికి అన్నిటిపై సంపూర్ణ స్వేచ్ఛననుగ్రహించి, ఆ స్వేచ్ఛపై కేవలం ఒకే ఒక్క ఆంక్షను విధించాడు. ఆ ఒక నిషేధము తప్ప, తక్కిన అన్ని విషయాలలో మరియెవరికి ఎన్నడూ లేనంత స్వేచ్చ వారు కలిగివున్నారు.

అయితే (సాతాను) సర్పము తోటలో ప్రవేశించి, హవ్వను సమీపించి దేవుని నియమాన్ని ఉల్లంఘించే విధముగా ఆమెను ప్రలోభపెట్టింది. “దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తిగలదైయుండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా! ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను. అందుకు స్త్రీ- ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును; అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు- మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము - మీరు చావనే చావరు ఏలయనగా, మీరు వాటిని తిను దీనమున మీ కన్నులు తెరువబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగినవారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా...” (ఆది 3:1-5).

ఆ పండును ముట్టవద్దని, తినవద్దని చెప్పిన దేవుని ఆజ్ఞను ఎరిగినా, మీరు దేవతలవలె ఉంటారని మంచి చెడులను ఎరిగినవారవుతారు లాంటి విషయాలను చెప్పి సాతాను హవ్వను పండు తినేలా ప్రోత్సహించాడు. క్లుప్తంగా చెప్పాలంటే, హవ్వ తన మనస్సును దిట్టము చేసుకొని తన జీవితానికి, నిత్యత్వపు స్థితికి సంబంధించిన నియమాలను తానే మార్చుకుంది. దేవుని మాటను ఖాతరు చేయకుండా తన "స్వేచ్చాచిత్తమును" ఉపయోగించిన మొదటి వ్యక్తి హవ్వే అవుతుంది.

ఆర్మీనియన్ బోధలలో ఎన్నిక మరియు స్వేచ్ఛాచిత్తము ప్రధానంగా ఉంటాయి. మంచిచెడులు తెలుసు గనుక మంచినే సాధారణంగా ఎన్నుకొంటారు, చెడును త్రోసిపుచ్చుతారని ఆర్మీనియన్ల నమ్మకం. అయితే హవ్వ యొక్క నిర్ణయ ఫలితాలేమిటి? వాస్తవానికి ఆమె దేవునివలె మారిందా? ఆమె క్రొత్తగా కనుగొనిన జ్ఞానము ఆమె ఆధ్యాత్మిక పరిస్థితిని మెరుగుపరిచిందా?

"స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు, కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరువబడెను. వారు దిగంబరులని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోట మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని” (ఆది 3:6-10).

ఆదాము హవ్వల అవిధేయత సిగ్గు మరియు భయముగా ప్రతిఫలించింది. వారి స్వేచ్ఛా ఆలోచన మరియు స్వయం నిర్ణయం, తదనుగుణముగా చేసిన క్రియలు, ఇవన్నీ కలిసి వారిని దేవునికి దగ్గర చేయటానికి బదులుగా దూరం చేశాయి. అయితే అపొస్తలుడైన యోహాను ప్రకారము పాపము మూడు లోకసంబంధమైన విషయాలచేత ప్రభావితము చేయబడుతుంది - శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. “లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోక సంబంధమైనవే” (1 యోహాను 2:16).

హవ్వ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు (శరీరాశ), కన్నులకు అందమైనదియు (నేత్రాశ), వివేకమిచ్చు రమ్యమైనదియునై వున్నట్లుగా (జీవపుడంబము) చూసింది. అయితే దాని ఫలితంగా వారిరువురు ఏ విధంగా కూడాను దేవునివలె మారలేదు. కాని దానికి విరుద్ధమైందే జరిగింది. మొదట వారు దిగంబరులమని గ్రహించి సిగ్గునొందారు. వారు పాపులని, దేవుని ఆజ్ఞపై తిరుగబడ్డవారని వారికి బహిర్గతం చేయబడింది. వారు తమ దోషమును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.

వారు దైవసమానులు కాకపోగా దేవుని మంచి ఈవులను కోల్పోయారు, సర్వశక్తిమంతుని చేత శిక్షింపబడ్డారు. ఆయన తీర్పు ముందు వారు తలవంచారు. ఒక్కొక్కరిని (సర్పముతో సహా) దేవుడు శపించాడు. సర్వోన్నతుడైన దేవుని శాసనము ఎదుట వారు నిలువలేకపోయారు. దేవుని వలె మారటానికి బదులుగా (తమ స్వచిత్త ఆధారముగా చేసిన నిర్ణయఫలితంగా) వారు శపించబడిన పాపులుగానూ, సిగ్గుకు, తిరుగుబాటుతనానికి బానిసలుగానూ మారారు. వారు ఏదేను నుండి వెలివేయబడ్డారు, సమస్త మానవాళి జీవవృక్షానికి, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షానికి సుదూరముగా వెలివేయబడ్డారు.

దైవశాస్త్ర వర్గాల్లో ఆదామును మానవాళికి ప్రతినిధిగా పరిగణిస్తారు. దాని భావమేమిటంటే దేవుడు ఆదాము యొక్క నేరము విషయమై మనుష్యులందరినీ దోషులుగా లెక్కించాడని. మనమందరము ఆదాము రక్త సంబంధీకులము, ఆయన సంతతికి చెందినవారము. అందుకే మనమందరము ప్రథమ తిరుగుబాటుదారుల పతన సంతానమైయున్నాము. వారి పతనము మరియు దిగజారిన వారి ఆధ్యాత్మిక స్వభావం మనందరికి సంక్రమిస్తుంది. మనము ఆధ్యాత్మికంగా - తటస్థులంగా పుట్టలేదు. మనము పుట్టుకతోనే దైవ తిరుగుబాటుదారులము, మన పితరులవలె సర్వశక్తుడిని తాళలేనివారము, అశక్తులము, నిస్సహాయులము.

మన స్వభావము

మన నిస్సహాయ స్థితిని, పతనావస్థను తెలియజేస్తూ, పౌలు ఎఫెసు సంఘానికి ఇలా వ్రాశాడు. “మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రదికించెను. మీరు వాటిని చేయుచు, వాయుమండల సంబంధ అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు, మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలననుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలె స్వభావ సిద్దముగా దైవోగ్రతకు పాత్రులమైయుంటిమి” (ఎఫెసీ 2:1-3).

పై వచనములో పౌలు, వారు మరణము నుండి జీవములోనికి దాటారు అన్న వాస్తవంతో విశ్వాసులను ప్రోత్సహిస్తున్నాడు. అయితే ఇక్కడ మన సహజ స్వభావము ఎలా ఉంటుందో వివరించిన వర్ణనను గమనించండి.

1. పాపములచేతను అతిక్రమములచేతను/ మనము చచ్చినవారము.

2. సాతానుకనుగుణంగా నడచుకొనుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైనవారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించినవారము.

3. మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు స్వభావసిద్దముగా దైవోగ్రతకు పాత్రులమైయుంటిమి.

మనుష్యులు పాపములచేత, అతిక్రమముల చేత చచ్చినవారు. గాయపడినవారు కాదు, సోలిపోయినవారు అసలే కాదు. వారు చేయగలిగిన మంచి చేస్తున్నారని కాదు. రాయిలాగ మృతతుల్యమైనవారు. మృతుడు, తనకు తానుగా సహాయము చేసుకోలేనివాడు. నిస్సహాయుడైన లాజరును గూర్చి ఆలోచించండి. అతను తనకు తానుగా సమాధి నుండి బయటికి రాగలడా? లేదా యెహెజ్కేలు యొక్క ఎండిన ఎముకలు లోయలో నుండి, వాటంతట అవి ప్రాణం పోసుకొనిరాగలవా?

మన స్థితిని మార్చుకోలేని నిస్సహాయ స్థితిలో మనము పుట్టటమే గాక, మనము పాపాన్ని ఎదిరించలేని నిర్భలులం. మనము పాపానికి బానిసలమని లేఖనాలు చెబుతున్నాయి. దానికి మనం అమ్ముడుపోయాము. మనము దాని సొంతము. మనము పాపానికి బానిసలము కాబట్టి, పాపమనే యజమాని ఏది ఆదేశిస్తే అది జరిగించి తీరుతాము. “అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” (యోహాను 8:34). "వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెఱబట్టి లోబరచుకొనుచున్నది” (రోమా 7:23).

పౌలు తన శరీరములోని అవయవములలోగల సహజ నియమము నుండి తనను తాను విడిపించుకోలేని నిస్సహాయ స్థితిలోనున్నాడని గ్రహించి, తన సహజ నియమానికి బందీగా ఉన్నట్లు ప్రకటించాడు. తన మనస్సులో ఉన్న ధర్మశాస్త్రాన్ని పౌలు ఎరిగియున్నా, అతని శరీరంలో వ్యాపించి ఉన్న పాపనియమము అతనిని వెంటాడి చెఱపట్టింది. పాపముతో నశిస్తున్న శరీరము కాబట్టి, మరణానికి లోనయ్యే ఈ శరీరము నుండి నన్నెవడు విడిపించగలడని అతడు విలపించాడు, నిస్సహాయుడిగా ఎలుగెత్తి ఏడ్చాడు.

ఎలాగైతే ఒక వ్యక్తి గురుత్వాకర్షణ నియమము నుండి తనను తాను విడిపించుకోలేడో అలాగే, తన శరీరములోని పాపనియమము నుండి తనను తాను విడిపించుకోలేని స్థితిలో ఉన్నాడు.

“అయినా మనము మంచి పనులు చేస్తాము కదా!”

సంపూర్ణ పతనము అనే సిద్ధాంతము మంచి పనులు చేయగలిగే మానవుని సామర్థ్యాన్ని కొట్టివేయదు. వేదాంతులు చెప్పే విధంగా మనము బొత్తిగా దుర్మార్గులము కాము. ఇతర దుష్క్రియలతో పోల్చినప్పుడు, మనము సత్క్రియలు చేసే సామర్థ్యం కలిగియున్నాము. మనము ఎటువంటి కొలబద్దను ఉపయోగిస్తాము అనేది ప్రాముఖ్యమైనది. హిట్లర్ పనులతో పోలిస్తే మదర్ థెరిస్సా పనులు చాలా చక్కగా అగుపిస్తాయి. అయితే క్రీస్తు క్రియలు, ఆయన పరిపూర్ణ విధేయత మరియు మన:పూర్వకమైన అర్పణతో పోల్చినప్పుడు మనమందరము ఘోరంగా విఫలమైనవారమే. దేవుని నీతి మరియు పరిపూర్ణతతో మనల్ని మనము పోల్చుకున్నపుడు - యోబు వలె మనము కూడా స్పందిస్తాము. “నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎలా కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎలా శుద్ది కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగువంటి మనుష్యుడు పురుగువంటి నరుడు, ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా" (యోబు 25:4-6). అయితే వాస్తవానికి అమితమైన మూర్ఖత్వంతో మానవాళి ప్రవర్తించటం లేదు. ఎందుకంటే, దేవుడు అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తూ, మనిషి తన దుష్టస్వభావం చేత లొంగదీయబడి తన ఇష్టారాజ్యంగా చేయకుండా వారిని అదుపు చేస్తున్నాడు.

“నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు” (కీర్తన 76:10). మరో మాటలో చెప్పాలంటే, మానవులు ఉండదగినంత చెడ్డవారు కారు. తన రాజ్యమంతటిపై అధికారము కలిగి, అన్ని విషయాలను నియత్రిస్తూ దేవుడు దుష్టులను మ్రరింత దుష్టముగా ప్రవర్తించకుండా అదుపు చేస్తాడు. మనకు ధార్మిక లేక దయగల క్రియలు చేయటానికి సామర్థ్యం ఉంది. హత్య తప్పని గుర్తించి చంపుటకు మనము దూరంగా ఉండవచ్చు.నమ్మకమైన భర్తలుగాను, భార్యలుగాను ఉంటూ కుటుంబాన్ని చక్కగా పోషించి సంరక్షించవచ్చు. మంచి ఉద్యోగిగా, పౌరునిగా మెలగుతూ ఉండవచ్చు. అయినా పైన చెప్పిన ధార్మిక/దయగల క్రియలు మన సహజ స్వభావాన్ని మార్చలేవు. అయితే నీతి, పరిశుద్ధతగల దేవుడు అత్యున్నత ప్రమాణాలు గలవాడు గనుక, ఈ శరీర క్రియలు ఆయనను సంతోషపెట్టలేవు; దానికి ఆత్మ సంబంధమైన సుగుణాలైన విశ్వాసము, ప్రేమ మొదలైనవి కావాలి. “విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు, ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము ఇయ్యువాడనియు నమ్మవలెను గదా” (హెబ్రీ 11:6).

ప్రకృతి సంబంధియైన మానవునిలో దేవునియందు ఎటువంటి విశ్వాసమూ ఉండదు. ఎంత సదుద్దేశముతో అతడు సత్క్రియలను చేసినా ఆ విశ్వాసహీనతను అధిగమించలేడు. తత్ఫలితంగా ప్రకృతి సంబంధియైన మానవుడు చేసే ప్రతీ శరీరకార్యము ఎంత మంచిదైనా, దేవుడు మాత్రము దానిని పాపముగానే పరిగణిస్తాడు. “అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాప యుక్తములు” (సామెతలు 21:4) (క్షేమము అనే మాట మూలభాషను అనుసరించి పొలము దున్నటాన్ని సూచిస్తుంది) అహంకారదృష్టియు గర్వమును పాపయుక్తమని ఈ వాక్యము బోధిస్తున్నది. ఇది గ్రహించటం సులభమే. అయితే పొలము దున్నటం వంటి దైనందిన చర్యలు కూడా దేవుని దృష్టిలో పాపయుక్తములని ఈ వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి క్రియలు పాపయుక్తమా కాదా అని నిర్ణయించటం, ఆయా క్రియల యొక్క మంచిచెడులపై ఆధారపడి ఉండదు. దుష్క్రియలు చేస్తేనే పాపము కాదు. పాప స్వభావము కలిగి ఉండటమే పాపము. మనము పాపము చేస్తాము కాబట్టి పాపులము కాదు గాని పాపులము కాబట్టి పాపము చేస్తాము.

బైబిలు గ్రంథములో ‘పాపము' అనే పదానికి వాడబడిన గ్రీకు పదము 'హమర్టియా' -  దానికర్థము దేవుని పరిపూర్ణతను పొందలేకపోవటం; గురి తప్పటం; పరిపూర్ణత, పరిశుద్ధత మరియు నీతి విషయంలో దేవునికంటే తక్కువగా ఉండటాన్ని పాపముగా నిర్వచించవచ్చు. అయితే కేవలం గురి తప్పటం కాదు, వాస్తవానికి మనము అధోగతిలో ఉన్నామని బైబిలు సెలవిస్తుంది. “ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరివలె నున్నాడు” (కీర్తన 39:5). మన శ్రేష్ట దశలో కూడాను, పరిపూర్ణత పొందలేని వారముగానున్నాము”. “నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గము వారెరుగరు. వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు” (రోమా 3:16-18). మానవుని సహజ స్థితి ఆ విధముగా ఉంది. వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు. అయితే “యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము.” ఘోరమైన విషయమేమిటంటే, మన శ్రేష్ట క్రియలు, నీతియుక్తమైన నడవడి అంతయూ వ్యర్థమే (కీర్తన 111:10). “మేమందరము అపవిత్రులువంటి వారమైతిమి. మా నీతి క్రియలన్నియు మురికి గుడ్డలవలెనాయెను. మేమందరము ఆకువలె వాడిపోతిమి. గాలి వానకు కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయెను. నీ నామమును బట్టి మొఱ్ఱపెట్టు వాడొకడునులేకపోయెను. నిన్ను ఆధారము చేసికొనుటకై తన్నుతాను ప్రోత్సాహపరచుకొనువాడొకడును లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకొంటివి. మా దోషముల చేత నీవు మమ్మును కరిగించియున్నావు” (యెషయా 64:6,7).

పాపము యొక్క శక్తి

పాపము యొక్క అంతర్గుణమేమిటంటే, అది ఒకసారి ప్రారంభమైతే, దేవుడు మాత్రమే నిర్మూలము చేయగలిగే ఓ శక్తిగా మారుతుంది. ఒకసారి సాతానుడు తిరగబడ్డాక పరలోకము నుండి త్రోయబడ్డాడు (లూకా 10:18). వాడు వాని దుష్టమార్గము నుండి తనను తాను త్రిప్పుకోలేని అశక్తుడు. అంతిమంగా, వాని ఆగడాలను అరికట్టటానికి దేవుడు వానిని బంధించి అగ్నిగుండంలో పడవేస్తాడు (మత్తయి 25:41; ప్రకటన 19:20). అలాగే, దుష్టుని పిల్లలు వారి తండ్రివలె తిరుగుబాటు నుండి మరలక, శిక్షకు పాత్రులవుతారు. “మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుగోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు. వానియందు సత్యమే లేదు. వాడు అబద్దమాడునప్పుడు తన స్వభావము ననుసరించియే మాటలాడును; వాడు అబద్దీకుడును అబద్దమునకు జనకుడునైయున్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు” (యోహాను 8:44,45).

అంత్యకాలమందు సహితము, దేవుడు ఈ లోకాన్ని తీర్పు తీర్చేటపుడు, భూనివాసులు కృపకొరకు గాని, విశ్వాసయుక్తంగా రక్షింపబడటానికి గానీ ఎన్నుకొనరు. ఆ ఘోరశ్రమలు మరియు కష్టాల మధ్యలో వారు తమ దుష్టత్వము నుండి తిరగలేని అశక్తతను ప్రదర్శించటం మాత్రమేగాక దేవుని నుండి తప్పించుకొనిపోయే ప్రయత్నము కూడా చేస్తారు. “భూ రాజులును, ఘనులును, సహస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును, కొండగుహలలోను, బండ సందులలోను దాగుకొని సీంహాసనాసీనుడైయున్న వానియొక్కయు, గొఱ్ఱపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగుచేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు” (ప్రకటన 6:15-17).

ఒకవేళ, ఒక మనిషి 'నమ్ముటకు', 'పశ్చాత్తాపపడి విశ్వాసముంచుట'కు కావలసినదల్లా చాలినంత ప్రోద్భలం, ప్రోత్సాహమే అయితే ప్రస్తుతం అది చాలా అందుబాటులో ఉంది. కాని వారు అసలు పశ్చాత్తాపపడలేని నిర్బలులై “గొఱ్ఱపిల్ల ఉగ్రతనుండి తప్పించుడి” అని పారిపోయే ప్రయత్నం చేస్తారు.

ఒక వ్యక్తి దోషపూరిత పాపస్వభావము నుండి తప్పించుకుని బయటపడాలంటే దేవుడు తప్పనిసరిగా 'మారుమనస్సు' అనే అద్బుతక్రియను అతనిలో జరిగించాలి. పతనస్వభావము, నిత్యత్వపు ఆధ్యాత్మిక స్వభావంగా మార్చబడాలి. ఒకవేళ వారున్న పరిస్థితిలోనే వారిని వదిలేస్తే, మానవులు తమను తాము మార్చుకోలేని అశక్తులుగానే మిగిలిపోతారు.

కనుక మొదటి అడుగు దేవుడే వేయాలి, దేవుడే ఆ ప్రక్రియను ప్రారంభించాలి. మానవుడు అశక్తుడు, ఈ విధముగా మార్పు మరియు రక్షణ కార్యము రెండూ దైవాధీనములే.

ముగింపు

సంపూర్ణ పతనము అనే సిద్ధాంతాన్ని పునఃపరిశీలన చేద్దాము.

1. ఆదాము పతనము వల్ల మానవాళి అంతా పతనమయ్యింది కాబట్టి ఆదాము తిరుగుబాటు ఫలితముగా వచ్చిన శాపాన్ని మనమందరము పంచుకుంటాము “పాపము యొక్క జీతము మరణము” (రోమా 6:23). మానవులు క్రమేపీ మరణిస్తున్న కారణాన మనుష్యులందరూ పాపులని మనకు తెలుస్తుంది.

2. మానవులు మంచి పనులు చేయగలిగే సామర్థ్యము కలిగి ఉన్నప్పటికీ అవి మురికి గుడ్డలవలే ఘోరమైనవిగా ఉన్నాయి. పరలోకపు దృష్టిలో అవన్నీ వ్యర్థమే.

3. మానవుడు తనకు తాను సహాయము చేసుకోలేని నిస్సహాయుడు. అతడు పాపములచేతను, అతిక్రమములచేతను చచ్చినవాడు. అతడు పాపానికి బానిసయై, దుష్టమైన మోసకరమైన హృదయము కలిగి, ప్రతిక్షణమూ తన శరీరసంబంధమైన హృదయవాంఛలను అనుసరిస్తుంటాడు. విశ్వాస విషయములో అతడు సరైన ఎన్నిక చేయటానికి గాని, ధృఢనిర్ణయం తీసుకోవటానికి గాని, మేథాసంబంధముగా ఉత్తేజపరచబడటానికి గానీ ఒప్పింపబడలేడు, బలవంతపెట్టబడలేడు.

మనము ఈ విషయాన్ని అర్థము చేసుకుంటేనే తప్ప, బైబిలు గాని రక్షణ ప్రణాళికను కార్యసాధకము చేసిన దేవుని ప్రేమ గాని సరిగా బోధపడదు. ఈ సిద్ధాంతాన్ని సరిగా అర్థం చేసుకుంటే ఇతర కృపా సిద్ధాంతాలను అర్థము చేసుకోవటం సులభతరమౌతుంది (యెషయా 51:1). మనము ఏ బండ నుండి చెక్కబడ్డామో ఏ గుంట నుండి తవ్వబడ్డామో ఆలోచించనిదే, మనలను రక్షించటానికి క్రీస్తు ఎంత తగ్గించుకున్నాడో, మనల్ని అందుకోవటానికి ఎంత క్రిందికి తన హస్తాన్ని చాచాడో గుర్తించలేము, ప్రశంసించనూ లేము.

“యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు. నేను పాపులనే పిలువవచ్చితినిగాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను” (మార్కు 2:17). ఇక్కడే ఈ సిద్ధాంతము యొక్క ఓటమి - గెలుపు తెలుస్తుంది. “ఆరోగ్యవంతునికి వైద్యుడవసరము లేదు” (లూకా. 5:31). సజీవునికి పునరుత్థానము అవసరము లేదు. బ్రతికి ఉన్న వ్యక్తి “తిరిగి జన్మించాల్సిన అవసరము లేదు.” నశించినదానిని వెదకి రక్షించుటకు యేసు వచ్చాడు. రోగులను బాగు చేసి మృతులను లేపుటకే గాని మంచివారికి మేలు చేయటానికి, సమర్థులను ప్రోత్సహించటానికి రాలేదు. నీలో నీవు ఈ పతన స్వభావమును చూడగలిగితే, నిన్ను రక్షించటానికే క్రీస్తు వచ్చాడనటానికి ఎంతో ఆస్కారం ఉంది. కేవలము దేవుని కృప చేత మాత్రమే తప్ప మానవుడు తనను తాను రక్షించుకోలేని అశక్తుడనే వాస్తవాన్ని గ్రహించలేడు, తనకు రక్షకుడు తప్పక అవసరమని ఒప్పుకోనూలేడు.

సరేనండి జిమ్ గారూ, నేను ఖచ్చితంగా ఒప్పింపబడ్డాను; కాని మానవులందరూ దేవుని దృష్టిలో దుష్టులైతే, సంపూర్ణంగా పతనమై తమకు తాము సహాయము చేసుకోలేని అశక్తులైతే, అటువంటి మానవులు ఎలా రక్షింపబడగలరు? ఎందుకంటే కొందరు రక్షింపబడతారని బైబిలు సెలవిస్తుంది. అవును ఖచ్చితముగా! అందుకే ఈ సిద్ధాంతాలను కృపాసిద్దాంతాలని పిలుస్తున్నాము. దేవుణ్ణి ఆకర్షించే ఏ మంచీ మానవునిలో లేకపోయినా, కొందరు రక్షింపబడుతున్నారంటే, అది తప్పనిసరిగా దేవుని సార్వభౌమ చిత్తము వలననే గాని మానవుల క్రియల వలన కాదు, వారి విలువ వలన అసలే కాదు.

మనము దేవునిని ఎన్నుకోలేని అశక్తులము కాబట్టి దేవుడే ఆయన కృపను బట్టి మనలను ఎన్నుకుంటాడు. ఈ అవగాహన 'బేషరతు ఎన్నిక' అనే కృపా సిద్దాంతాలలోని రెండవ సిద్ధాంతానికి మనలను నడిపిస్తుంది.

రెండవ అధ్యాయము

బేషరతు ఎన్నిక

 
"ఎన్నిక" "ఎన్నుకోబడినవారు" అనే మాటలు పాత, క్రొత్తనిబంధనలలో 27 సార్లు కనబడతాయి. "దేవుడు ఎన్నుకొనుట" "దేవునిచేత ఎన్నుకోబడుట" అనే విషయమై సుమారు వందకు పైగా వచనాలు ఉన్నాయి. అయినప్పటికీ క్రైస్తవలోకంలో ఎక్కువగా అపార్థం చేసుకోబడిన సిద్ధాంతాలలో ఈ సిద్ధాంతం ఒకటి. "ఎవరిని ఎవరు ఎన్నుకుంటారు అనేది ప్రాథమికంగా మనం తెలుసుకోవలసిన విషయం". కొన్ని ప్రశ్నలు-జవాబుల ద్వారా "ఎన్నిక" అనే అంశం గురించి కొంతమేరకు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సిద్ధాంతాన్ని ఎవరితోనైనా ప్రస్తావించేటప్పుడు నా సంభాషణను ఈవిధంగా ప్రారంభిస్తాను.
 
"నువ్వు రక్షించబడ్డానని నమ్ముతున్నావా?" "ఔను" "సరే, నిన్ను ఎవరు రక్షించారు?" "దేవుడు" "చాలామంచిది. దేవుడు నిన్ను ఉద్దేశపూర్వకంగా రక్షించాడా లేక యాదృచ్చికంగా రక్షించాడా?" " ఉద్దేశపూర్వకంగానే రక్షించాడు" దేవుడు కొందర్ని రక్షిస్తాడు, ఉద్దేశపూర్వకంగానే రక్షిస్తాడు. దేవుని ఎన్నిక అంటే అదే. వేదాంతపరమైన వివరణ కొరకు పాస్టర్ డేవిడ్ మోరిస్ "ఎన్నుకోవడాన్ని" ఈ విధంగా నిర్వచించాడు. "మానవుని యొక్క పతనము మరియు అశక్తతను బట్టి చూస్తే, పాపము మరియు శిక్షనుండి కలిగే రక్షణ, సంపూర్ణంగా దేవునినుండే, త్రియేక దేవునినుండే కలుగుతుంది. గత నిత్యత్వంలో లోకాన్ని సృష్టించకముందే మనిషి లెక్కించలేని ఒక జన సమూహాన్ని క్రీస్తునందు దేవుడు ఏర్పరచుకున్నాడు. ముందే వారిలో‌ కనుగోబడిన సుగుణాలను‌ బట్టి కాకుండా, ఆదాములో నుండి, శిక్షకు నాశనానికి, పాత్రులైన వారిని కేవలం తన కృపచేతనే దేవుడు ఎన్నుకున్నాడు." ఈ ఎన్నికను దేవుడు కేవలం తన మహిమార్థమై ఏర్పరిచాడు. మానవులు పతనమైన దుష్టులనీ, చనిపోయిన పురుగులనీ, సంపూర్ణంగా అశక్తులనీ, నశించేపోయే పాపులనీ లేఖనాలు సెలవిస్తున్నప్పటికీ, నీతిమంతుడునూ, పరిశుద్ధుడైన దేవుని నుండి కొందరు నిత్యరక్షణ పొందుకుంటారని మనకు తెలుసు. కాబట్టి ఇదెలా సాధ్యమని అడగడానికి మనం బలవంతపెట్టబడుతున్నాం.
 
ముందుగానే తెలియచేసిన విధంగా దేవుడు కొందర్ని ఎన్నుకుంటాడని లేఖనాలు సెలవిస్తున్నాయని దాదాపు క్రైస్తవసంఘాలన్నీ ఒప్పుకుంటాయి. అయితే వివాదం ఏంటంటే, ఎటువంటి షరతుల కారణంగా దేవుడు ఎన్నుకుంటాడు? ఎంతవరకూ తన సృష్టిపై తన అధికారాన్ని ఉపయోగించి ఎన్నుకుంటాడు? కృపాసిద్ధాంతాలు దేవుని ఎన్నిక షరతులు లేనిదని సెలవిస్తున్నాయి; అసలు నశిస్తున్న పాపులు, దేవుడు వారిని రక్షించే అర్హతగలవారిగా చేసే ప్రీతిపాత్ర కార్యాలు ఎలా చెయ్యగలరు? ఈ కారణాలు గమనించండి.
 
1) పాస్టర్: మోరియస్ గారు తన నిర్వచనంలో పేర్కొన్నవిధంగా ఏమనుష్యుడూ కూడా ఏ క్రియలనూ చెయ్యకముందు "భూమికి పునాదులు వేయబడక ముందే" దేవుడు ఎన్నుకున్నాడు (ఎఫెసీ 1:4) కాబట్టి దేవుడు మానవుడ్ని ఎన్నుకోవడంలో అతని క్రియలు పరిగణలోకి రాలేవు.
2) దేవుని సార్వభౌమ్య కృపే ఈ ఎన్నికయొక్క లక్షణం-స్వభావం. ఒకవేళ ఈ ఎన్నిక ఒకని సుగుణాల ఆధారంగా జరిగితే కృప ఇక కృపే కాదు. "అపాత్రమైన దయ, కరుణ" ఇదే కృపయొక్క నిర్వచనం. ఒకవేళ మానవుల రక్షణ వారి వారి క్రియలపై ఆధారపడితే అది జీతం ఔతుందే తప్ప అయోగ్యుడికి అందిన దయగా ఎంచబడదు. 
 
"ఆలాగుననే అప్పటికాలమందు సయితము కృప యొక్క యేర్పాటు చొప్పున శేషము మిగిలి యున్నది. అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు; కానియెడల కృప ఇకను కృప కాకపోవును" (రోమీయులకు 11:5,6)
 
ఎన్నుకోవడం అనే పదజాలం:
అనేకమైన ఇతర పదజాలాలను అంటే "ముందుగా నిర్ణయించుట" "ముందుగా ఎరుగుట" "ముందుగా ఏర్పరచుకొనుట" తదితర పదజాలాలను తెలుసుకోకుండా మనం బైబిల్ ఆధారిత "ఎన్నిక సిద్ధాంతాన్ని" తెలుసుకోలేము. ఎన్నుకోవడం అనేది కేవలం క్రొత్తనిబంధన సిద్ధాంతం అనీ, పౌలు దీనిని లేఖనంలో ప్రవేశపెట్టాడని కొందరి వాదన. అయితే ఇది వాస్తవం కాదు. 
 
తన సృష్టియొక్క గమ్యాన్ని ఎన్నుకోవడంలో దేవుని హక్కు మరియు, సామర్థ్యతను గురించిన ఈ సత్యం, లేఖనాలు అంతటిలోనూ అంతర్లీనంగా  ఉంది. దేవుని సర్వాధికారిక ఎన్నిక విషయమై బైబిల్ లో ఈ ఉదాహరణలు చూడవచ్చు.
1) దేశాలు, ఉదా: ఇశ్రాయేలు
2) వ్యక్తులు, ఉదా: మోషే, దావీదు, దానియేలు
3) శేష జనాంగం, ఉదా: బయలు దేవతకు మొక్కని 7,000మంది
4) కాలాలు, ఉదా: పండుగలు, సబ్బాతు
5) స్థలాలు ఉదా: యెరుషలేము పట్టణం, ఇశ్రాయేలు దేశం, ఆయా గోత్రాలు నివసించడానికి ఏర్పాటు చేసిన స్థలాలు.
 
తనరాజ్యంపై ఏలుబడి చేసే రాజుయొక్క గుణం ఇది. దేవుడు తన సృష్టిపై ప్రభువు కాబట్టి, తన రాజ్య వ్యవహారాలన్నీ చురుకుగా చూసుకుంటూ ఉంటాడు. కాబట్టి తన అనంతమైన వికల్పాల నుండి ఆయన వీటిని ఎన్నుకుంటాడు. 
 
1) ఏం జరగాలి?
2) అది ఇతర సంఘటనలను ఎలా ప్రభావితం చేస్తుంది? 
3) ఒక్కొక్క సంఘటనలో ఎవరు పాల్గొంటారు? 
దీనిని "ముందుగా నిర్ణయించడం" "సంఘటనలు వాస్తవంగా సంభవించక ముందే వాటిని నిర్దేశించడం"  "ఆదేశించడం" అని  వేదాంతులు పిలిచారు. అలాగే దేవుని గుణలక్షణాలను వర్ణిస్తూ క్రైస్తవ సంఘం తరాల తరబడి ఈ పదాలను ఉపయోగిస్తుంది. 
1) సర్వశక్తిమంతుడు (అత్యున్నత శక్తిగలవాడు)
2) సర్వవ్యాపి (ఒకే సమయంలో అన్ని స్థలాలలోనూ ఉండేవాడు)
3) సర్వజ్ఞాని (అంతా క్షుణ్ణంగా ఎరిగినవాడు)
మొదటిగా దేవుడు సర్వశక్తిమంతుడైతే, ఆయన రాజ్యంలో ఆయన అనుమతి లేకుండా ఏదీ జరగదు. ఆయనకు వేరుగా మరో‌ శక్తి లేదు. ఒకవేళ ఆయన అనుమతి లేకుండా ఏదైనా ఆయన రాజ్యంలో ప్రవేశించగలిగితే వాస్తవంగా ఆయన సర్వశక్తిమంతుడు ఎలా కాగలడు? రెండవదిగా దేవుడు సర్వవ్యాపి కాబట్టి, ఆయన ఒకే సమయంలో ఆయన రాజ్యసంబంధమైన ప్రతీ చిన్న విషయంలో కూడా చురుగ్గా పాల్గోవాలి. లేకపోతే ఆయన అంతటా వ్యాపించినవాడు కాదు.  మూడవదిగా ఆయన సర్వజ్ఞాని అయితే, ఏ సంఘటనా కూడా ఆయనకు మరుగైయుండదు. ఆయనకు వేరుగా ఏదీ జరగదు‌. ఏదీ ఆయనను ఆశ్చర్యపరచలేదు. ఆయన ప్రతీచర్యనూ వాటివాటి పర్యవసానాలనూ క్షుణ్ణంగా ఎరిగినవాడై ఉన్నాడు. 
 
దేవునికి ఇలాంటి గుణలక్షణాలు ఉన్నాయని ఒప్పుకుంటే, ఇవి దాని ఫలితార్థాలు:
1) విశ్వంలో జరిగే ప్రతీసంఘటనా ఆయనకు తెలుసు.
2) ప్రతీ సంఘటనలోనూ ఆయన ఉంటాడు.
3) ప్రతీ కార్యాన్నీ ఆయనే జరిగిస్తాడు. 
అయితే బైబిల్ మరో అడుగు ముందుకు వేస్తూ తన రాజ్యంలో జరిగే ప్రతీ సంఘటనా ఆయన నిర్ణయం చొప్పున సంభవిస్తుందని, ఆయన ముందుగా నిర్ణయించనిదేదీ సంభవించదని సెలవిస్తుంది. అతి పెద్ద విషయం నుండి - "ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి" (రోమీయులకు 13:1) - అతి చిన్న విషయం వరకూ "చీట్లు ఒడిలో వేయబడును వాటివలని తీర్పు యెహోవా వశము" (సామెతలు 16:33); పట్టింపుకు రాని విషయాల నుండి "రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు" (మత్తయి సువార్త 10:29); అతి సాన్నిహిత్య విషయాల వరకూ "నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు" (కీర్తనల గ్రంథము 139:2) అన్నీ దేవుని నిర్ణయాలే. 
 
యోబుకు దేవుడు 38-41 అధ్యాయాలలో ఇచ్చిన ప్రత్యుత్తరంలో తన సృష్టిపై ఆయనకు ఉన్న అదుపు, నియంత్రణ, సృష్టి నిర్మాణం, కొలత, ప్రతిచిన్న జంతువు యొక్క పోషణ, సాతానును బంధించి అదుపులో ఉంచడం మొదలయ్యేవి తెలియచేయబడ్డాయి. మనం బేషరతు ఎన్నిక గురించి ఆలోచించినప్పుడు, దేవునికి తాను సృష్టించినదానితో తనకు ఇష్టమున్నట్టు వ్యవహరించడానికి ప్రభువుగానూ రాజుగానూ హక్కు మరియు సర్వశక్తిమంతునిగా సామర్థ్యం ఉందని గుర్తించాలి.
 
"భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు" (దానియేలు 4:35). 
 
"ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు" (కొలొస్సయులకు 1:16,17).
 
దేవుడు ఏది చేసినా ఆయన తన అతి శ్రేష్టమైన మహిమకోసమే చేస్తాడు. కాబట్టి సృష్టి అంతా ఏవిధంగా ఉండాలని ఆయన అభిలాషించాడో ఆ విధంగానే నిర్మించుకున్నాడు‌. ఆయన సర్వాధికారపు పాలనకు బయట ఏదీ ఉనికిలో ఉండదు. సృష్టి అంతా తమ సృష్టికర్త చిత్తానికి తలవంచుతుంది. ఆయన చిత్తానుసారంగా ఆయన సమస్తాన్నీ జరిగిస్తాడు. అలాగే మానవుల రక్షణ కూడా ఇందులో భాగం. ఇది కూడా ఆయన సార్వభౌమ చిత్తానుసారంగానే జరుగుతుంది. 

ముందుగా నిర్ణయించుట


ఇప్పుడు ఈ అవగాహనతో మనము 'ముందు నిర్ణయించుట' అనే విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఈ మాటకు అర్థమేమిటంటే, దేవుడు మనుష్యుల గమ్యాన్ని ముందుగానే నిర్ణయిస్తాడు. ఆ గమ్యానికి వారిని చేరవేయటానికి ఆయన దృఢసంకల్పమ్ మరియు శక్తిగలవాడు. ఈ విధంగా మాత్రమే ఎవరైనా పరలోకము చేరుకుంటారు. ఎలాగైతే మొదటి తిరుగుబాటుదారులను తోట నుండి వెలివేసే శక్తిని దేవుడు కలిగియున్నాడో అలాగే వారి సంతానమంతటినీ కాని, వారిలో కొందరిని గాని తిరిగి తన సన్నిధికి చేర్చుకునే అధికారం, శక్తి కలిగియున్నాడు.

ఆదాము తిరుగుబాటు ద్వారా పతనమైన మానవులు, కొండచరియల పైనుండి క్రిందికి దూకే (ఆత్మహత్యాసదృశ్యంగా) ‘లెమ్మింగ్' అనే అంటార్కిటికా సంచారజీవిని పోలి నరకానికే దిగజారుతున్నారు. వారికి నచ్చిన మార్గంలో వెళ్ళటం వారి స్వభావం, వారి కోరిక. అదే వారిని నాశనానికి నడిపించే మార్గం. “ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు” (మత్తయి 7:13). కాని దేవుడు తన కరుణను చూపించాలని, కృపను ప్రదర్శించాలని ఉద్దేశించి దోషులైన పాపులలో కొందరిని ఎన్నుకుని, వారిని తమ మార్గాలలో గాక రక్షణకు దారి తీసే వేరొక మార్గంలోనికి నడిపిస్తాడు. “జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునైయున్నది. దాని కనుగొనువారు కొందరే” (మత్తయి 7:14).

ఎన్నుకొనుట అనే పదజాలాన్ని వాడటంలో పౌలు ఎంతో నిపుణతగలవాడు. 'బంగారు విమోచన గొలుసు'గా పేర్కొనబడిన ఈ కింది వాక్యభాగంలో ఈ ఆలోచనను పొందుపర్చాడు. “ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యముగలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను” (రోమా 8:29,30).

ఇక్కడ మనము ఐదు కృపాసిద్దాంతాలను చర్చించుకుంటుండగా ఈ ఐదు సిద్ధాంతాలు కూడా చక్కగా పై వచనాలలో పొందుపరచబడినట్లుగా గ్రహించగలము.

1) "....ఎవరిని ముందుగా నిర్ణయించెనో” (ఎన్నుకొనుట).

2) "...వారిని పిలిచెను” (అభేద్యమైన కృప).

3) “ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను” (పరిమిత ప్రాయశ్చిత్తము).

4) “మరియు ఎవరిని నీతిమంతులనుగా తీర్చెనో వారిని ఆయన మహిమ పరిచెను” (పరిశుద్దుల పదిలత).

ఈ వాక్యభాగాన్ని తర్వాత పరిశీలించి, ఒక్కొక్క విషయము ఇందులో ఎలా పొందుపరచబడి ఉందో మనము విశ్లేషిద్దాము. అయితే ప్రస్తుతము పౌలు చేసిన నిర్దిష్టమైన భాషా ప్రయోగాన్ని మాత్రమే గమనిద్దాము- 'ఎవరినీ ఎరిగెనొ, వారినే నిర్ణయించాడు, ఎవరిని నిర్ణయించాడో వారినే పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారినే నీతిమంతులనుగా తీర్చాడు, ఎవరిని నీతిమంతులనుగా తీర్చాడో వారినే మహిమపరిచాడు.' ఈ విధానమంతటిలో కూడా ఒక ఫలానా గుంపువారు మాత్రమే మనకు కనిపిస్తారు - ఎవరైతే ముందుగా ఎరగబడ్డారో వారే చివరకు మహిమపరచబడ్డారు. పైగా, ఈ విధానమంతటిలో లేదా ఈ ప్రక్రియ అంతటిలో లేశమాత్రమైనా వారి ప్రమేయం ఉన్నట్లు కనీసం సూచనప్రాయంగానైనా చెప్పబడలేదన్నది గమనించండి. వారు కార్యసాధకులు కాదు కానీ కేవలము దేవుని కృపకు ప్రాప్తులుగా చేయబడినవారు.

దేవుడు దేనినెరుగును?

ఆర్మీనియన్ వేదాంతులకు కూడా రోమా 8:29 చాలా ప్రీతికరమైన వాక్యము. 'ముందుగా ఎరిగెను' అన్న మాటను చూడగానే, ఆ ఎరుగబడ్డ ప్రజలలో, దేవుడు ఏదో మంచిది, ప్రీతిపాత్రమైనది ఉన్నట్లు ముందుగా ఎరిగెనని, ఈ విషయాలే ఆయన వారిని ఎన్నుకుని, పిలిచి, నీతిమంతులుగా తీర్చి, మహిమపర్చే విధంగా తోడ్పడ్డాయని వారంటారు. కానీ మనము మానవుని సంపూర్ణ పతనాన్ని బట్టి చూస్తే, దేవుడు వారిలో చెడును తప్ప మరేదీ చూసి ఉండడు. కాబట్టి వారి యోగ్యతను బట్టి ఆయన వారిని ఏర్పరచుకోలేదు. వారు చేయబోయే సత్క్రియలను దేవుడు ముందుగా ఎరిగి తదనుగుణంగా వారిని రక్షణకై ఎన్నిక చేసాడనటానికి ఏ ఆస్కారము లేదు. ఎందుకంటే, ఈ సత్క్రియలు దేవుడు ముందుగా నిర్ణయించటానికి ఫలితాలే తప్ప కారణాలు కావని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి.

“మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్దపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడినవారమై ఆయన చేతిపనియైయున్నాము” (ఎఫెసీ. 2:10) అదే విధముగా, ఎవరు విశ్వసిస్తారు అనే ఆయన భవిష్యత్ జ్ఞానాధారముగా రక్షణార్థమైన 'ఎన్నిక' చేయబడిందని అనటానికి కూడా ఏ ఆస్కారమూ లేదు. ఎందుకంటే ఎన్నిక చేయబడినవారికి దేవుడే విశ్వాసాన్ని వరంగా ప్రసాదిస్తాడని బైబిల్ సెలవిస్తుంది.

“మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడినవారందరు విశ్వసించిరి” (అపొ.కా.13:48). ఈ వచనాన్ని మనము గమనించినట్లయితే, నమ్మినవారందరూ నిత్యజీవానికి నిర్ణయించబడ్డారని వాక్యము సెలవివ్వటం లేదు. మొదట, వారు నిత్యజీవానికై నిర్ణయింపబడ్డారు. ఆ తరువాత నమ్మే సామర్థ్యాన్ని దేవుడే వారికి ఇచ్చాడు.

“మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియలవలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు” (ఎఫెసీ 2:8,9).

ఈ విశ్వాసపువరము కృపాకార్యమని ఈ వచనం స్పష్టముగా తెలియజేస్తుంది. ఆ కృపావరం ద్వారా మనం రక్షింపబడ్డాము. అది కృపావరం కాబట్టి, మన క్రియల ద్వారా మనం రక్షింపబడలేదు. ఎందుకంటే వారి క్రియల ద్వారా సంపాదించుకున్నదైతే దానిని బట్టి విఱ్ఱవీగి అతిశయపడటం, ఈ విమోచన నా స్వార్జితమనటం పాపులైన మానవుల నైజం.

కానీ, 'కృప' అంటే దేవుని నుండి పొందే అనర్హమైన దయ'. మానవునిలోని ఏదో ఒక అంతర్గత సద్గుణాన్ని బట్టి, దేవుడు ఒక వ్యక్తికి విశ్వాసాన్ని అనుగ్రహిస్తే,  అది ఒకని స్వార్జితమవుతుందే గానీ కృప అవ్వదు. దేవుని రక్షణార్థమైన ఎన్నిక, సంఘంలో ఎవరు చేరతారు అనే ఆయన భవిష్యత్ జ్ఞానంపై కూడా ఆధారపడిలేదు. దానికి ప్రతిగా రక్షణ కొరకు నిర్ణయించినవారిని దేవుడు తన సంఘంలో చేర్చుచుండెను అని వాక్యము సెలవిస్తుంది. “మరియు ప్రభువు రక్షణ పొందుచున్నవారిని (మూలభాషలో- పొందవలసినవారిని') అనుదినము వారితో చేర్చుచుండెను” (అపొ.కా. 2:47).

 అపొ.కా. 2:47 కొందరు వ్యక్తులు సంఘంలో చేరాలని నిర్ణయించుకున్నారు; తద్వారా దేవుడు వారిని రక్షించాడు అని అపొ.కా. 2:47 సెలవివ్వడం లేదు. దీనికి విరుద్ధంగా, తాను రక్షింపనుద్దేశించినవారిని క్రీస్తు తన సంఘంలో జతచేర్చుతూ వచ్చాడు అని సెలవిస్తుంది.

పాపముచేత మృతులై సంపూర్ణంగా అశక్తులైన మనుష్యులలో కొందరు ఆయనను ఎన్నుకుంటారని దేవుడు ముందుగానే చూసి, వారిని ఎన్నుకున్నాడని బైబిలు బోధించట్లేదు.

“మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; . . . నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని” (యోహాను 15:16,) “మరియు ఆయన - తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ...” (యోహాను 6:65) అనెను.

మరొక మాటలో చెప్పాలంటే, ఎన్నిక అంటే ఆమోదం కాదు. ఆయన కొరకైన ఆపేక్ష లేదా ఆయనయందలి విశ్వాసాన్ని ఆమోదిస్తూ దానికి ఫలితంగా ఆయన మనలను ఏర్పరచుకోలేదు. మీరు నన్ను కోరుకున్నారు కాబట్టి, దానిని ఆమోదించి మిమ్మల్ని ఎన్నుకుంటున్నానని ఆయన చెప్పలేదు. అలాగే ఎన్నిక అంటే ఎంపిక కాదు. ఎందుకంటే ఎంచుకునేవి చాలా వుంటే వాటిలో శ్రేష్టమైనవి ఎన్నుకున్నప్పుడు దానిని ఎంపిక అంటాము. ఉదా: మనము చక్కగా పండిన టమోటాలు ఏరుకుంటాము లేదా మనకు మంచి బేరము కుదిరిన మంచి కారునే ఎంపిక చేసుకుంటాము. దేవుడు మనలను ఎంపిక చేసుకోలేదు. మన ఎన్నిక విషయంలో మనలోని ఏ మంచి ప్రస్తావనలోనికి రాదు, దేవుడు కేవలం కృప చేతనే ఎన్నుకుంటాడు.

ఆర్మీనియన్లు, రోమా 8:29-30 కి సందర్బరహితంగా పెడార్థం చెబుతుంటారు. వారి వాదమే నిజమైతే పౌలు తనతో తానే విభేదించినట్లవుతుంది. ఇప్పుడు మనం పౌలు వాదనను సందర్భసహితంగా అనుసరించి చూద్దాము.

1) రోమా 1:29-32లో దేవునియందు ఎటువంటి ఆసక్తి లేకుండా మానవులు సంపూర్ణంగా పతనమైనవారని పౌలు సెలవిస్తున్నాడు. ఇదిలా వుండగా దేవుడు తన భవిష్యత్ జ్ఞానంతో వారికి ఆయనయందు ఎలాటి ఆసక్తియు లేదని చూస్తూనే, వారిలో కొందరు ఆయనపై ఆసక్తిని కనపరచి ఆయనను ఎన్నుకుంటారని ఎలా చూస్తాడు?

2) రోమా2:11లో దేవుడు మనుష్యుల విషయమై పక్షపాతి కాడని పౌలు సెలవిస్తున్నాడు. ఐతే అటువంటి నిష్పక్షపాతియైన దేవుడు వారి వారి క్రియల ఆధారముగా మనుష్యులను ఎలా ఎన్నుకుంటాడు? అదే వాస్తవమైతే దేవుడు, క్రియల ఆధారంగా కొందరి పట్ల పక్షపాతం చూపుతూ తన మాటతో తానే విభేదిస్తున్నట్లు కాదా?

3) రోమా 3:9-18లో 'నీతిమంతుడు ఒక్కడునూ లేడు. దేవుణ్ణి వెదకువారు ఒక్కరునూ లేరు' అని చెప్పబడింది. పౌలు ఇక్కడ వర్ణనాత్మకమైన పదజాలాన్ని ఉపయోగించి మానవుల దుస్థితిని తెలియజేశాడు. “వారందరు దారి వైదొలిగారు, బొత్తిగా చెడియున్నారు, మంచి చేయువాడొక్కడునూ లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, వారి నాలుక మోసయుక్తమైనది. వారి పెదవులు విషయుక్తము. వారి నోటినిండా శాపము మరియు పగ ఉన్నాయి. రక్తము చిందించుటకై వారి పాదములు పరుగెడుతున్నాయి. వారి మార్గములో నాశనము దరిద్రత ఉన్నాయి. వారికి సమాధానమంటేనే తెలియదు. వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.”

ఇప్పుడు, పౌలు ఇంతగా శ్రమ తీసుకుని మానవాళి యొక్క సహజస్థితిని వివరించాక, రోమా 8:29,30 ప్రకారం కొందరు విశ్వాసముంచుతారని, దేవుణ్ణి ఎన్నుకుంటారని లేదా దేవుడు వారిని రక్షించే విధంగా నీతిక్రియలు చేస్తారని ఎలా వాదిస్తాడు? అలాగే అయితే తనతో తాను పౌలు విబేధిస్తూ, తన వాదననే విస్మరించి, త్రోసిపుచ్చుతున్నాడు గదా; ఇలాంటి పరస్పర విరుద్ద వ్యాఖ్యలు చేసినట్లయితే, పౌలు, సంఘము పరిగణించేంత గొప్ప పండితుడు కాకపోవును. పరిశుద్దాత్ముడు అలా వ్రాయిస్తే, గొప్ప తప్పు చేయించినవాడవుతాడు. ఆర్మీనియన్ వాదన ప్రకారము చూస్తే పౌలు గొప్ప గలిబిలి మరియు కలవరాన్ని సృష్టించినవాడవుతాడు. ఇక్కడ 'ముందుగా ఎరుగు' అని అనువదించబడిన 'ప్రోగినొస్కో' అనే గ్రీకు పదము యొక్క అర్థము తెలియకపోవటమే ఆర్మీనియన్ల గలిబిలి వాదనకు కారణం. ప్రొగినొస్కో (గ్రీకు) = ముందుగా ఎరుగుట (తెలుగు). ఈ మాటలో రెండు ధాతువులున్నాయి.

ప్రొ (గ్రీకు) = ముందు

గినొస్కో (గ్రీకు) = ఎరుగుట

ఐతే ఇక్కడ గినొస్కో అన్న మాటనే మనము క్షుణ్ణంగా తెలుసుకోవాలి. లేఖనాలలో చూస్తే ఈ పదానికి అర్థము 'లోతైన అంతరంగిక అనుబంధమ'ని తెలుస్తుంది. ఈ 'అనుబంధపూర్వకమైన ఎరగటం' అనేది లోతైన వ్యక్తిగత ప్రేమ నుండే పుడుతుంది. ఇటువంటి సంబంధం లేఖనమంతా నిర్వచించబడింది. ఉదా: “ఆదాము తన భార్యయైన హవ్వను 'కూడినప్పుడు' ఆమె గర్భవతియై కయీనును కని...' (ఆది. 4:1) “కూడినప్పుడు” అనే మాటకు ఇక్కడ “గినొస్కో' అనే పదమే వాడబడింది. ఐతే ఆదాము తన భార్యను కేవలం కూడుకుని వ్యక్తిగతంగా తెలుసుకున్నాడని కాదు ఇక్కడ అర్థం. వారు లోతైన వ్యక్తిగత అనుభవపూర్వక అనుబంధం కలిగున్నారని దాని భావం.

ఆది. 19:8 (లోతు చెప్పెను), ఇదిగో పురుషులు కూడని” (ఇక్కడ మరలా గినొస్కో అనే పదమే వాడబడింది) ఇద్దరు కుమార్తెలు నాకున్నారు.''

ఆ అమ్మాయిలు లోతును ఎరుగుదురు. పురుషులు అంటే కూడా ఎరుగుదురు. వారికి వారి సహోదరులు కూడా ఉండేవారు, వారి జాతి ప్రజలతో వారు పరిచితులుగా ఉండేవారు. కాని లైంగిక సంబంధం విషయంలో మాత్రం ఎవరిని ఎరుగని కన్యకలు వారు. ఆమోసు 3:2లో భూమి మీద సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను “ఎరిగియున్నాను” అని దేవుడు సెలవిచ్చాడు. ఇక్కడ కూడా 'ఎరిగియున్నాను' అనే మాటకు గినొస్కో అనే పదం వాడబడింది.

ఐతే, దేవుడు, సర్వజ్ఞుడైయుండి, భూమి మీద ఉన్నవారందరిని క్షుణ్ణంగా ఎరిగినవాడైయున్నాడు. కాని వివాహబంధాన్ని పోలిన సన్నిహిత సంబంధాన్ని కేవలం ఇశ్రాయేలు ప్రజలతో మాత్రమే కలిగియుండేవాడు. “మరియు (యోసేపు) ఆమె కుమారుని కనువరకు ఆమెను 'ఎరుగకుండెను' (గినొస్కో), అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను” (మత్తయి 1:25).

యోసేపు మరియతో ఎంతో చనువుగా ఉండేవాడు. వారు వివాహం కొరకు ప్రధానం చేయబడ్డారు. అయితే ఆమె కుమారుని కనేంతవరకు వారు లైంగిక సంపర్కానికి దూరముగా ఉండేవారు. “ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును; ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు, నేను మిమ్మును ఎన్నడును 'ఎరుగను' (గినొస్కో) అక్రమము చేయువారులారా, నా యొద్దనుండి పొండని వారితో చెప్పుదును” (మత్తయి 7:21-23).

రక్షణ పొందటానికి ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని భావించేవారితో యేసు ఈ మాటలు చెబుతున్నాడు. వారిని ఎన్నడు కూడా సన్నిహితంగా ఎరుగనని ఆయన వెళ్ళగొట్టాడు. అనుభవపూర్వక ప్రేమబాంధవ్యం అసలే లేదని వెళ్ళిపొమ్మన్నాడు. గమనించండి, ఒకవేళ వారి క్రియల/చర్యల ఆధారంగా దేవుడు ప్రజలను రక్షింపదలిస్తే, పైన పేర్కొనబడిన ప్రజలు తప్పకుండా దేవుని రక్షణకు, ఎన్నికకు అర్హులు అవుతారు.

అయితే ఎవరితో ఆయన ప్రేమపూర్వక అనుబంధాన్ని కలిగున్నాడో వారినే తన కుమారుని యొక్క స్వారూప్యము గలవారగుటకు ముందుగా నిర్ణయించెను.

ఎన్నిక ఎప్పుడు జరిగింది?

పాపులు మారుమనస్సు పొందే సమయంలో దేవుడు వారిని ఎన్నుకుంటాడా? వారు దేవునిని వెంబడించ తీర్మానించి ఆ తీర్మాన ఫలితంగా 'ఎన్నిక'ను సంపాదించుకుంటారా? అసలు ఈ ప్రక్రియలో మనం పాలు కలిగున్నామా? “ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునైయుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను” (ఎఫెసీ 1:4).

“మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి. . .” (ఎఫెసీ 1:11).

విశ్వంలోని మొదటి అణువును కూడా సృష్టించక మునుపే, ఆయన ప్రేమచేత రక్షించబడవలసినవారిని అప్పుడే నిర్ణయించాడు. ఇదంతా మరింత పటిష్టం చేయటానికి గాను గొఱ్ఱెపిల్ల జీవగ్రంథంలో వీరి పేర్లన్నీ ఆయన లిఖించాడు. ఎన్నుకోబడ్డవారి పేర్లన్నీ గ్రంథస్థం చేయబడ్డాయి.

నిత్యజీవ గ్రంథం యొక్క విషయం లేఖనాలలో అనేకమార్లు ప్రస్తావించబడింది. ఉదా: లూకా 10:20లో “అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడని యేసు శిష్యులతో చెప్పెను.”

"ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహాధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని యీ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించుకొందురు” (దానీ. 12:1).

“ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడును” (ప్రక.20:15). గనుక ఇక్కడ అడగవలసిన ప్రశ్న ఏంటంటే: ఇంత ప్రాముఖ్యతగల ఈ గ్రంథము ఎప్పుడు వ్రాయబడింది?

“నీవు చూచిన ఆ మృగము ఉండెను. గానీ యిప్పుడు లేదు; అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగముండెను గాని యిప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలిసికొని ఆశ్చర్యపడుదురు” (ప్రకటన 17:8).

దేవుడు భూమిని సృష్టింపక మునుపే ఈ 'బేషరతు ఎన్నిక' చేసాడు. మనుష్యుని సృష్టింప దేవుడు నిర్ణయించినప్పుడే ఎవరెవరిని ఆయన కుమారునికి స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానము చేసాడో వారి పేర్లు గ్రంథస్తం చేసాడు. అప్పటి నుండి ఆయన తన మాటను నిలబెట్టుకునే ప్రక్రియకు నాంది పలికాడు. 

ఆది నుండి...

ముందుగా తెలిపిన ప్రకారము, కోరి ఎన్నుకోవడం దేవుని గుణలక్షణం కాబట్టి, ప్రారంభం నుండి దేవుని ఎన్నికకు నిదర్శనాలు మనము లేఖనాలలో చూడగలగాలి; అలాగే చూస్తాం కూడా.

ఆదాముహవ్వలు తిరుగబడిన తర్వాత వారు దిగంబరులని తెలిసి సిగ్గుపడ్డారు. దేవుడు ఏదేను తోటలోనికి చల్లపూట వచ్చినప్పుడు ఆయన స్వరం విని వారు దాగుకున్నారు. దేవుడు వారి అవిధేయతను క్షుణ్ణంగా ఎరిగినవాడు. దేవుడు వారిని వెదక్కుంటూ రావడానికి బద్దుడేమి కాదు. దేవుడు వారిని దాటి వెళ్ళియుండవచ్చు. కాని ఆయన వారిని ఎదుర్కొన సంకల్పించాడు. రాబోయే గొఱ్ఱెపిల్లబలి, పాపాలను కప్పుతుందనటానికి ఛాయగా ఆయన ఎంతో కరుణతొ వారికి చర్మపు చొక్కాయిలు తయారుచేశాడు.

“నీ సంతానమునకును, స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసెదను” అని సర్పమును ఎదుర్కొని దేవుడు చెప్పాడు (ఆది. 3:15). దేవుడు మానవాళినంతటిని రెండు గుంపులుగా విభజించాడు. ఒకటి స్త్రీ సంతానము. మరొకటి సర్పసంతానము. వారిరువురి మధ్య వైరమును పెట్టాడు. స్త్రీ సంతానమైన క్రీస్తును, ఆయన వారసులను దేవుడు దీవించాడు. దుష్టుడిని, దుష్టుని సంతానాన్ని ఆయన శపించాడు. అయితే, ప్రాముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే కయీను మరియు హేబేలు వారి ప్రథమ సంతానాలను కనక మునుపే ఓ విభజన రేఖను దేవుడు గీశాడు.

కయీను, హేబెలు ఇరువురూ ఒకే వాతావరణంలో పెంచబడినవారు, ఇద్దరూ దేవునికి అర్పణలు తీసుకువచ్చారు. కయీను తన కష్టార్జితమైన భూఫలాలను తీసికొని వచ్చాడు. హేబెలు తన మందలోని ప్రథమగొఱ్ఱెపిల్లను రక్తబలిగా అర్పించాడు.

“హేబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్వినవాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతనియర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతనియర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి, కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా..” (ఆది. 4:4-5).

కాబట్టి, కయీను హేబెలును సంహరించాడు. ఈ రెండు అర్పణలను దేవుడు ఒకేలా ఎందుకు స్వీకరించలేదు? ఎట్టి అర్పణ ఆయనకు అంగీకారంగా ఉంటుందనే సంగతిని దేవుడు ఇరువురికెందుకు బయలుపరచలేదు? జవాబు: సార్వభౌమ్య ఎన్నిక.

సంపూర్ణ పతనమనే అధ్యాయంలో ఆది. కా. 6:5ను ప్రస్తావించాను. "నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహయంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచాడు.” అందుకే ప్రపంచాన్ని జలప్రళయంతో నాశనం చేయటానికి దేవుడు ఎన్నుకున్నాడు.

“అయితే నోవహు దేవుని దృష్టియందు కృపపొందినవాడాయెను” (ఆది.కా. 6:8).

నోవహు దేవుని నుండి అనర్హమైన దయను పొందుకున్నాడు. హీబ్రూ భాషలో ‘పొందుట' అనే మాటకు గ్రహీత అయ్యాడనే భావాన్ని ఇచ్చే పదం వాడబడింది. నోవహు దానికొరకు కనిపెట్టుకున్నాడని కాదు దానికర్థం. పతనమైన పాపులు అసంఖ్యాకంగా ఉన్నప్పటికీ వారిలో నుండి కేవలం నోవహును, ఆయన కుటుంబాన్ని లోకాన్ని నాశనం చేయక ముందు దేవుడు ఎన్నుకున్నాడు. అది కూడా కేవలము కృప చేతనే.

అయితే ఆదికాండము 6:9 ప్రకారము నోవహు నీతిమంతుడని ఆయన తరంలో నిందారహితుడని, అందుకే దేవుడు ఆయనను ఎన్నుకున్నాడని కొందరు వాదిస్తారు. ఇదే వాస్తవమైతే నోవహు పొందుకున్న కృప నిరర్థకమే కదా! ఒకవేళ నోవహు నీతిమంతుడని లేదా పరిపూర్ణుడని ఒప్పుకున్నా, ఆయన కుమారుల కుమార్తెల విషయంలో అది వాస్తవము కాదు. నోవహు హాముపై తరువాత పలికిన శాపవచనాలు ఇందుకు నిదర్శనాలు. పైగా నోవహు సహజంగా నీతిమంతుడైతే ద్రాక్షారసము సేవించి మత్తుడై, వస్త్రహీనుడై, అవమానం పొందేంత దుస్థితికి ఎందుకు దిగజారాడు?

ఆ తరువాత ఆదికాండంలో దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడని మనము చదువుతాము. చాలా కాలము తర్వాత అబ్రహాము మరియు ఆయన భార్యకు ఒక కుమారునిని దేవుడు అనుగ్రహించాడు. అబ్రాహాముతో దేవుడు ఇలా అన్నాడు, “నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగానుందువు. నిను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువారిని శపించెదను. భూమియొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా...” (ఆది. 12:2,3).

దేవుడు అబ్రహాముతో ఈ విషయము సెలవిచ్చినప్పుడు, అతడు విగ్రహారాధకుడు. అయితే, దేవుడు అతనిని ఎన్నుకున్నాడు. “అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను” (ఆది. 15:6). విశ్వాసులకు తండ్రిగా ఉండే నిమిత్తము దేవుడు అబ్రాహామును ఎన్నుకున్నాడు కాబట్టి, అతని విశ్వాసము (అనర్హమైన వరము) అతనికి నీతిగా ఎంచబడింది.

ఇస్సాకు కంటే ముందు అబ్రహాము తన దాసీ ద్వారా ఒక కుమారుని కన్నాడు. అతని పేరు ఇష్మాయేలు. అయితే, దేవుడు తాను చేసిన వాగ్దానం ఆ కుమారుడి విషయమై నిరాకరించాడు. ప్రతిగా, నిజకుమారుడు అద్భుతకరముగా జన్మిస్తాడని, అతడే వాగ్దాన సంతానంగా ఎంచబడతాడని దేవుడు సెలవిచ్చాడు. అయితే ఇష్మాయేలును దేవుడు తిరస్కరించాడు. ఈ చరిత్రను అపొస్తలుడైన పౌలు తన దైవశాస్త్ర బోధకు అన్వయించాడు. “అనగా శరీరసంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దానసంబంధులైన పిల్లలు సంతానమనియెంచబడుదురు"(రోమీయులు 9:8). దేవుడు తన చిత్తము మరియు ప్రణాళిక చొప్పున కొందరిని ఎన్నుకుంటాడు, కొందరిని తిరస్కరిస్తాడు. ఇంతలో ఇస్సాకుకు ఇద్దరు కుమారులు కలిగారు. వారు ఇంకా తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు యాకోబును ఎన్నుకుని, ఏశావును తిరస్కరించాడు. దేవుడు సార్వభౌమ్యంగా ఎన్నుకుంటాడనటానికి పౌలు దీనిని ఖచ్చితమైన రుజువుగా చూపించాడు. దేవుడు యాకోబును ఎన్నుకోవటానికి అతని వ్యక్తిగత యోగ్యత ఏదీ ఆధారం కాదు. అతడు ఇంకా తన తల్లి గర్భంలోనే వుండగా, మంచైనా చెడైనా చేయక మునుపే దేవుడు అతనిని ఎన్నుకున్నాడు. ఈ ఎన్నిక వీరిరువురి క్రియల ఆధారమే అని వాదించటానికి తావు లేకుండా “క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే” అని పౌలు స్పష్టము చేస్తున్నాడు. అదే విధంగా దేవుడు తన ప్రేమను, ద్వేషాన్ని గురించిన ప్రస్తావన భూతకాలంలో వ్యక్తపరచటాన్ని గమనించండి. ఇవన్నీ దేవుడు ముందుగా నియమించి నిర్ణయించిన విషయాలే.

యాకోబు యొక్క పేరు ఇశ్రాయేలుగా మార్చబడ్డాక, పండ్రెండు మంది కుమారులను కన్నాడు. యోసేపు కనిష్ఠ కుమారులలో ఒకడు, యోసేపు సహోదరులు అతని విషయమై అసూయపడ్డారు. తన సహోదరులు అతనికి సాగిలిపడతారనే విషయాన్ని తెలిపే కలను దేవుడు యోసేపుకిచ్చాడు. అతని సహోదరులు అతనిని చంపనుద్దేశించి బానిసగా అమ్మివేసారు. ఐగుప్తులో యోసేపు ఓ గొప్ప అధికారి అయ్యేంతవరకూ దేవుడు వారి జీవిత సంఘటనలన్నిటిని అదుపు చేసి నిర్దేశించాడు. దేవుడు రప్పించిన కరువులో యోసేపు సహోదరులు అలమటించారు. దేవుడు చెప్పినవిధంగానే యోసేపు సహోదరులు అతనికి సాగిలపడి అతని దయను పొందారు. ఈ కనిష్ట కుమారుడు ఇంతగా ఎందుకు హెచ్చింపబడ్డాడు? దేవుని 'సార్వభౌమ్య ఎన్నిక'కు ఇది మరొక చక్కని తార్కాణం.

ఈ యాకోబు యొక్క పన్నెండుమంది కుమారులు, ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రములుగా నామకారులయ్యారు. దేవుడు అన్ని దేశాలలోకెల్లా, జాతులలోకెల్లా, వారిపై దయను కురిపించాడు. " నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్టిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనములకంటే నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను” (ద్వితి 7:6). “అయినను నా సేవకుడగు యాకోబూ, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలూ, వినుము నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన యెషూరూనూ, భయపడకుము. ఇశ్రాయేలీయుల మధ్యన పరిచారకులుగా ఉండు నిమిత్తము లేవీయుల వంశమును దేవుడు ఎన్నుకొన్నాడు” (యెష 44:1,2). “నిత్యము యెహోవా నామమున నిలిచి సేవ చేయుటకు నీ గోత్రములన్నిటిలోను అతనిని, అతని సంతతివారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొనియున్నాడు” (ద్వితీ 18:5).

ఇశ్రాయేలీయుల నిమిత్తము దేవుడు దావీదును రాజుగా ఎన్నుకొన్నాడు. “గర్భము నుండి నన్ను తీసినవాడవు నీవేగదా నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే” (కీర్తన 22:9-10).

“తన దాసుడైన దావీదును కోరుకొని గొఱ్ఱెల దొడ్లలోనుండి అతనిని పిలిచెను” (కీర్తన 78:70). దావీదు సేవకుడు కాబట్టి, దేవుడు ఆయనను ఏర్పరచుకోలేదు. కానీ ఆయన తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుని సేవకునిగా ఉండు నిమిత్తము ఎన్నుకోబడ్డాడని ఈ రెండు వచనాలు తెలియజేస్తున్నాయి.

దేవుడు ప్రవక్తలను ఎన్నుకున్నాడు. దేవుడు రాజులను ఎన్నుకున్నాడు. యుద్ధాలలో విజయులను దేవుడు ఎన్నుకున్నాడు. ప్రతి హీబ్రూ శిశువును చంపమని ఫరో ఆజ్ఞాపించాడు కానీ - మోషే ఫరో రాజమందిరానికి తరలింపబడ్డాడు. అది దేవుని 'సార్వభౌమ కృప' కాదని ఎవరైనా చెప్పగలరా?

భూమి మీద పరిచర్య చేస్తున్న రోజులలో క్రీస్తు కూడా తన 'సార్వభౌమ అధికారం' చొప్పున కొందరిని ఎన్నుకున్నట్టుగా మనము చూడగలము. ఉదాహరణకు, ఆయనను అప్పగించువానితో కలిపి యేసు పండ్రెండుగురిని ఎన్నుకున్నాడు. “అందుకు యేసు - నేను మిమ్మును పండ్రెండుగురినీ ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా పండ్రెండు మందిలో ఒకడైయుండి ఆయననప్పగింపబోవుచుండెను గనుక వాని గూర్చియే ఆయన ఈ మాట చెప్పెను” (యోహాను 6:70,71).

యేసు బేతెస్థ కోనేరు దగ్గరకు వచ్చినప్పుడు, అక్కడ వందల కొద్దీ రోగగ్రస్తులు, గుడ్డి మరియు కుంటివారున్నారు. దేవదూత చేత నీళ్లు కదల్చబడినప్పుడు కోనేటిలో మొదట దిగినవాని వ్యాధి నయమౌతుందనే నమ్మకంతో వారందరూ ఎదురు చూస్తున్నారు (యోహాను 5వ అధ్యాయము). కానీ 38 సంవత్సరాలుగా రోగగ్రస్తుడైన ఆ ఒక్క ఫలానా రోగి దగ్గరకు మాత్రమే యేసు వెళ్లాడు, అతనిని బాగుపరిచాడు. అక్కడ ఎంతోమంది అదే దుస్థితిలో ఉన్నా బాగు చేయటానికి ఒక్కడిని మాత్రమే ఎన్నుకున్నాడు. మరొక సందర్భంలో యేసు శిష్యులు, ఆయన ఉపమానరీతిగా ఎందుకు బోధిస్తున్నాడని అడిగారు “అందుకాయన - దేవుని రాజ్యమర్మము (తెలుసుకోవటానికి) మీకు అనుగ్రహింపబడి యున్నది గానీ వెలుపలనుండువారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నియు ఉపమానరీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పెను'' - మార్కు 4:11,12. యేసు ప్రతి ఒక్క వ్యక్తికి తనను తాను ప్రత్యక్షపరచనుద్దేశించలేదని తప్ప మరే విధంగానైనా ఈ వ్యాక్య భాగాన్ని అర్థం చేసుకోవటం సాధ్యం కాదు. దేవుడు తాను ఎన్నుకున్నవారికి సత్యాన్ని గ్రహించే శక్తి కూడా అనుగ్రహించాడు. అయితే ఎన్నుకొనబడనివారికి పరలోక సత్యాలు మరుగు చేయబడేలా అంటే వారు తమ బుద్ధికుశలతను ఉపయోగించి వాటిని గ్రహించి పశ్చాత్తాపపడి వారిని క్షమించేలా ఆయనను బద్ధునిగా చేయకూడదని వారికి ఉపమానరీతిగా బోధించాడు. అనేకమంది చనిపోయి సమాధులలో వున్నప్పటికీ కేవలం లాజరును మాత్రమే బ్రతికించడానికి యేసు ఎందుకు ఎన్నుకున్నాడు? అది ఆయన 'సార్వభౌమ్య అభీష్టం' కనుక. కుష్టురోగంతో బాధపడుతున్నవారు అనేకమంది వున్నప్పటికీ, స్వస్థపరచటానికి కేవలం పదిమందిని మాత్రమే ఎందుకు ఎన్నుకున్నట్టు? అది ఆయన సార్వభౌమ అభీష్టం కనుక. యేసు గెరాసేనుల ప్రాంతానికి వచ్చినప్పుడు, పందులలోనికి వెళ్ళటానికి అనుమతినిమ్మని సేనదయ్యము వేడుకోగా యేసు ఆ విన్నపాన్ని మన్నించాడు ((మార్కు 5:13)), ఎందుకని? అది కూడా ఆయన సార్వభౌమ అభీష్టం కాబట్టి.

క్రీస్తును అనుసరించటానికైన పిలుపు ప్రపంచమంతటికీ అందించబడినా, ప్రత్యేకంగా ఎన్నుకొనబడినవారు మాత్రమే ఆ పిలుపుకు స్పందిస్తారు. "ఈ ప్రకారమే కడపటివారు మొదటి వారగుదురు, మొదటివారు కడపటివారగుదురు” (మత్తయి 20:16). ఎందుకంటే ఏర్పరచబడినవారు కొందరే.

క్రీస్తు కేంద్రితము

అతి గొప్పదైన, గంభీరమైన 'దేవుని ఎన్నిక' ఆయన దయగల కుమారునియందు కనపరచబడింది. ఈ సిద్ధాంతపు సౌందర్యమంతా ఇందులోనే దాగియుంది. ఈ సిద్ధాంతం పూర్తిగా క్రీస్తు కేంద్రితం. క్రీస్తునే కేంద్రంగా చేసుకుని, ఇది ఆయన చుట్టే పరిభ్రమిస్తుంది. క్రీస్తు దేవునిచేత ఎన్నుకోబడ్డాడు. “ఏలయనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచుకొనబడినదియు అమూల్యమునగు మూల రాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయనయందు విశ్వాసముంచు వాడు ఏ మాత్రమును సిగ్గుపడడు” (1 పేతురు 2:6 ). యెషయా 42వ అధ్యాయము పాత నిబంధనలోనే మెస్సీయాను గూర్చిన చాలా చక్కటి అధ్యాయం. ఇది ఇలా ప్రారంభమవుతుంది, “ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు. అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును.” ప్రకటన 13:8లో భూమి పునాదులు వేయబడక మునుపే వధింపబడిన దేవుని గొఱ్ఱపిల్లయని క్రీస్తుకు బిరుదు ఇవ్వబడింది. ఆయన ప్రథమ పునరుత్థాన ఫలము ((1 కొరింథీ 15:20,21)). మెస్సీయాగాను, క్రీస్తు (అభిషిక్తుని) గాను దేవుని చేత ఎన్నుకోబడినవాడు. దేవునిచేత ఎన్నుకోబడిన విశ్వాసులమైన మనకు, మన ఎన్నికకు ఆధారము క్రీస్తులోనే ఉన్నది. పేతురు సంఘానికి వ్రాస్తూ వారిని ఇలా సంబోధించాడు, “దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, ఆత్మవలని పరిశుద్దత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడినవారికి ... కృపయు సమాధానమును విస్తరిల్లును గాక” ఏర్పరచబడ్డ దేవుని సేవకుని రక్తము ద్వారా రక్షణ ప్రణాళిక ముగించబడి విమోచన, పరిశుద్ధపరచబడుట మనకు అనుగ్రహింపబడ్డాయి (1 పేతురు 1:2).

ఎన్నిక యొక్క గుణలక్షణాలు

పైన ప్రతిపాదించినదంతా వాస్తవమైనదైతే, దేవునిచే ఎన్నుకోబడినవారికి తగిన ప్రయోజనాలు, నిదర్శనాలు తప్పకుండా వుండాలి కదా. ఖచ్చితంగా లేఖనాలలో ఇట్టి ప్రయోజనాలు, నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి.

 ఉదాహరణకు

1) ఒకసారి దేవుని ఎన్నికార్థమైన కృపాసిద్ధాంతాన్ని మనం గ్రహించగలిగితే మన రక్షణసంపాదనాసంబంధ క్రియల భారముతో మనము క్రుంగిపోము. ఎందుకంటే మన ఎన్నికకు క్రియలు ఆధారము కావు. ఇది మనము తెలుసుకోదగిన ప్రాముఖ్యమైన విషయం. మన క్రియలు మరియు ప్రయత్నాల ద్వారా మన రక్షణను మనము సాధించలేము. అయినా దేవుని ఎన్నిక సత్క్రియలను కొట్టివేయదు. దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు అన్న వాస్తవానికి ప్రతిస్పందనగా సత్క్రియలు మనం చేస్తాము. మన ఎన్నికకు అసలు కారణము మన మంచిక్రియలు కానేకావు. మన మంచి క్రియలకు కూడా దేవుడే ఆధారం కాబట్టి రక్షణ ఏ విధంగా చూసినా సరే దేవుని కార్యమే. ఆయనను మహిమపరచి ప్రతిబింబించే విధంగా సత్క్రియలు జరిగించటానికి దేవుడు తన ప్రజలను ఎన్నుకున్నాడు. ఇది ఆయనకు మహిమకరం; మనకు శ్రేయస్కరము. “మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకుని నియమించితిని” (యోహాను 15:16). “మరియు వాటియందు మనము నడచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్దపరచిన సత్క్రియలు చేయుటకై, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము'' (ఎఫెసీ 2:10).

2) దేవుడు చరిత్రను నియంత్రిస్తాడు; ఆయన లోకానికి ఉగ్రత తీర్పు తీర్చినపుడు ఆయన ఎన్నుకున్నవారి నిమిత్తమై ఉగ్రత వ్యవధిని పరిమితము చేస్తానని వాగ్దానం చేశాడు. “ఆ దినములు తక్కువచేయబడక పోయినయెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును" (మత్తయి 24:22).

3) అబద్ద ప్రవక్తలు వారిని పెడత్రోవ పట్టించకుండా ఏర్పరచబడినవారిని ఆయన భద్రపరుస్తాడు. “అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచకక్రియలు మహత్కార్యములను కనబరచెదరు” (మత్తయి 24:24).

4) ఏర్పర్చబడినవారు పరలోకంలో ఉంటారు. క్రీస్తు భూమి మీద తీర్పు తీర్చటానికి వచ్చినప్పుడు ఎన్నుకొనబడినవారు ఆయనతో వస్తారు.

“మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివర వరకూ నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేయుదురు” (మత్తయి 24:31).

“వీరు గొఱ్ఱెపిల్లతో యుద్దము చేతురు గానీ,గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునైయున్నందున, తనతో కూడా ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచబడినవారై నమ్మకమైనవారైయున్నందునను, ఆయన ఆ రాజులను జయించును” (ప్రకటన 17:14).

5) దేవుడు, తాను ఎన్నుకున్నవారి పక్షాన పోరాడి వారికి న్యాయమిస్తాడు.

“దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా?” (లూకా 18:7)

“వారు కట్టుకొన్న యిండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతగును. నేను ఏర్పరచుకొనిన వారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. వారు వృథాగా ప్రయాసపడరు ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదించబడినవారగుదురు. వారి సంతానపు వారు వారి యొద్దనే యుందురు. వారికీలాగున జరుగును వారు వేడుకొనకమునుపు నేను ఉత్తరమిచ్చెదను. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను” (యెషయా 65:22,24).

6) దేవుడు, తాను ఎన్నుకున్నవారిని నీతిమంతులుగా తీర్చగా వేరెవరూ వారిని నేరారోపణ చేయలేరు. “దేవుని చేత ఏర్పరచబడినవారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులనుగా తీర్చువాడు దేవుడే” (రోమా 8:33).

7) పాపయుక్తమైన లోకమువలె కాక, దేవుని గుణగణాలను ప్రతిబింబింపజేసే విధంగా ఏర్పరచబడినవారి నడవడి, ప్రవర్తన మారుతుంది. "కాగా దేవుని చేత ఏర్పరచబడినవారును పరిశుద్దులును ప్రియులైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైననూ తనకు హానిచేసెనని ఒకడు అనుకొనినయెడల ఒకనికొకడు సహించుచు, ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించియున్నలాగున మీరును క్షమించుడి” (కొలొస్సీ 3:12,13).

8) ఏర్పరచబడినవారు రక్షింపబడే విధంగా బోధించటానికి దేవుడు పరిచారకులను పంపుతాడు. "అందుచేత ఏర్పరచబడినవారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను” (2 తిమోతి 2:10).

9) పరలోకంలో లూసిఫరు దేవునిపై తిరుగబడినప్పుడు, తిరుగుబాటులో చేరని దూతలను దేవుడు తన దయగల ఎన్నిక ద్వారా భద్రపరిచాడు.

“విరోధ బుద్ధితోనైన పక్షపాతముతోనైన ఏమియు చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని యెదుటను, క్రీస్తు యెదుటను, ఏర్పరచబడిన దూతల యెదుటను నీకు ఆనబెట్టుచున్నాను” (1 తిమోతి 5:21).

10) ఏర్పరచబడినవారికి యేసుక్రీస్తునందలి విశ్వాసము, సువార్త సత్యముల గ్రహింపు, నిత్యజీవపు నిరీక్షణ మొదలైనవి అనుగ్రహించడ్డాయి.

“దేవుడు ఏర్పరచుకొనినవారి విశ్వాసము నిమిత్తమును, నిత్యజీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్యవిషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడైన పౌలు, మనయందలి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడైన తీతునకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్యజీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను” (తీతు 1:1).

నిత్యజీవపు నిరీక్షణ దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు? ఏర్పరచబడినవారికి మాత్రమే!

 దాటిపోవటం/ తృణీకరించటం

ఇది నేరుగా మన అంశం కాకపోయినా, 'బేషరతు ఎన్నిక' సిద్ధాంతంలో అంతర్లీనమై అతిగా అపార్థం చేయబడే 'దాటిపోవటం/తృణీకరించడం' అనే ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించటం ఎంతో అవసరం. మానవాళి బుద్ధిపూర్వకంగా నరకం వైపు పరిగెడుతుండగా అగ్నిమంటల్లో నుండి తప్పించటానికి కొందరిని మాత్రమే ఆయన ఎన్నుకుంటే, తక్కినవారిని నాశనానికి విడిచిపెట్టినట్లే గదా?

ఈ సిద్ధాంత విమర్శకులు తరచుగా ఇలా వాదన చేస్తుంటారు. వారి వాదనాంశమేంటంటే, 'ఒకవేళ పాపులను రక్షించే శక్తి దేవునికి వుంటే, ఆయన అందరినీ ఎందుకు రక్షింపడు? కొందరినే ఎన్నుకుంటే అది న్యాయం కాదు కదా! క్రూరమైన విధానంలో దేవుడు కొందరిని నరకానికి విధించి పంపడమేమిటని చారిత్రాత్మక కాల్వీన్ వాద విమర్శకులు అంటుంటారు. ఈ విధంగా ఈ కాల్విన్ బోధ దేవునిని క్రూరునిగా చిత్రీకరిస్తుందని వారంటారు.

కాబట్టి దీనిని తిరస్కరించాలని వారు వాదిస్తారు. అటువంటి ఉద్వేగభరిత వాదనలకు జవాబు: అవును, రక్షణ ఏర్పరచబడినవారికే. మిగిలినవారిని దేవుడు దాటిపోతాడు/తృణీకరిస్తాడు. కానీ ఇందులో దేవునిని నిందించకుండా మనము జాగ్రత్తపడాలి. ఈ విషయమై అపొస్తలుడైన పౌలు ఒప్పించే విధంగా ఇలా వాదించాడు.

“కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వానిని కరుణించును. ఎవనిని కఠినపరచగోరునో వానిని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించినవాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేల అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఈలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దలోనుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా? అలాగు దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్ఛయించినవాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి? మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణా పాత్ర ఘటముల యెడల, అనగా యూదులలో నుండియు మాత్రమే గాక అన్యజనులలోనుండియు, ఆయన పిలిచిన మన యెడల, తన మహిమైశ్వర్యము కనపరచవలెననియున్ననేమి?” (రోమా 9:18-24).

పౌలు యొక్క వాదనను క్షుణ్ణముగా అనుసరించినట్లయితే రోమా పత్రికలోని మొదటి మూడు అధ్యాయాలలో అన్యులు దేవునియెదుట దోషులని, తరువాత యూదులు కూడా దోషులని, చివరికి మానవాళి అంతా పాపాత్ములని, తీర్పుకు , శిక్షకు అర్హులని ముగించాడు. అయినా సరే, వారికి రావలసిన శిక్ష నుండి కొందరిని తప్పించి దేవుడు కరుణ చూపుతాడు. కొందరిని దేవుడు కరుణిస్తాడు. అయితే దానిని ఎలా నిర్ణయిస్తాడో దేవుడు మనకు చెప్పలేదు. దేవుడు ఎవరిని కరుణించగోరుతాడో వారిని కరుణిస్తాడు. మనకు అంతమాత్రమే తెలుసు. తక్కినవారిని వారివారి పాపాలలోనే ఉండనిస్తాడు. కాని దేవుడు నిర్ణయించిన విధంగానే వారు చేస్తుంటే దేవుడు అటువంటివారిని ఎలా నిందించి తప్పుపట్టగలడు? అని విమర్శకులు ప్రశ్నిస్తుంటారు.

పౌలు వెంటనే దేవుని సార్వభౌమత్వాన్ని ప్రకటించి, మనము కేవలం సృష్టికర్త చేతుల్లో ధూళిలాంటివారమని అట్టి విమర్శకులకు తెలియజేశాడు. నువ్వు అలా ఎందుకు చేస్తున్నావని దుమ్ము లేచి సర్వశక్తిమంతుడగు దేవునిని ప్రశ్నించగలదా? ప్రశ్నించలేదనేదే దీనికి ఖచ్చితమైన జవాబు. ఆయన ఈ సృష్టికే యజమానుడు. ఆయన నిర్ణయాలను ఎవరు ప్రశ్నింపగలరు?

ఆ తరువాత యిర్మియా 18వ అధ్యాయములోని ఒక పాఠాన్ని పౌలు మనకు జ్ఞాపకం చేశాడు. కుమ్మరి తన చేతుల్లో ఉన్న మట్టి ముద్దను ఏమైనా చేయటానికి అధికారం కలిగియున్నాడు. అదే ముద్దలో నుండి కళాత్మకమైన, సుందరమైన, అభినందనకు యోగ్యమైన వస్తువులను తీర్చిదిద్దగలడు. ఆ ముద్ద నుండే తనకు ఇష్టంలేని లేదా సామాన్య అవసరతలకు ఉపయోగపడే విధంగా చేసి, వాటిని తన చిత్తము చొప్పున నాశనం కూడా చేయగలడు. అవి కేవలము ఆయన అభీష్టం బట్టియే. కుమ్మరి మట్టిపై కలిగియున్న ఇటువంటి అధికారాన్ని దేవుడు తన సృష్టిపై కలిగున్నాడు. పిమ్మట రోమా 9:18-20 వచనాలలోని ఎన్నిక చేయబడినవారిని గురించి, తీర్పుకై విధించబడినవారిని గురించి ప్రస్తావించబడింది. ఉగ్రతాపాత్రలపై ఉగ్రతను, తీర్పును కుమ్మరించటానికి ఆయన ఇష్టపడుతున్నాడని, రక్షణ నిమిత్తం ఎన్నుకున్నవారిపై తన మహిమాన్విత కృపను, కరుణను చూపే ఆ సమయం కొరకు సహనం, దీర్ఘశాంతంతో ఎదురుచూస్తున్నాడని మనం అక్కడ చదవగలం.

'దాటిపోవటం/తృణీకరించటం' అన్యాయం అని విమర్శించేవారు 'అసలు' విషయాన్ని గమనించటం లేదు. న్యాయాన్యాయాలు బట్టి చూస్తే వాస్తవానికి దుష్టులును, తిరుగుబాటుదారులునైన మానవులు తప్పనిసరిగా నరకానికే వెళ్ళాలని న్యాయం కోరుతుంది. అందుకే ఏ మానవుని నాశనానికీ దేవుడు మూలకారణం కాదు. మానవులు వారి దుష్టహృదయపు ఆశలకు గురై, వారే తమ నాశనమార్గాలలో నడుస్తున్నారు. కాబట్టి వారి క్రియలకు వారే బాధ్యులు. తన నిర్ణయము చొప్పున ఏర్పరచుకున్నవారిపై కరుణను ప్రదర్శించటంలో, అలాగే ఇతరుల విషయమై తన నీతిని, పవిత్ర న్యాయాన్ని ప్రదర్శించటంలో దేవునికే మహిమ కలుగుతుంది.

అయితే ఇక్కడ మనము గమనించవలసిన ఓ ప్రాముఖ్య విషయముంది. దేవుడేమి చేసినా తన మహిమ కొరకే చేస్తాడు. రక్షణ దేవుని మహిమాన్విత కృపకే చెందుతుంది. తీర్పు ఆయన మహోన్నత నీతి, పవిత్రతకే చెందుతుంది. ఇదంతా ఆయనకు, ఆయన మహిమకు చెందుతుంది. ప్రతి మానవునికి సమాన అవకాశమివ్వాలని మానవతాదృక్పథంతో కొందరు వాదిస్తుంటారు. కానీ అది లేఖనసత్యాలకు సుదూరమైనది. నిజంగా ఆ నిత్యత్వపు నియమాలను గ్రహించటం ఈ పరిమిత మానవులకు అసాధ్యమే. దేవుని మారని అపరిమిత నిర్ణయాలను మన మనస్సులు గ్రహించడం సాధ్యము కాని పని. అయినా బైబిలులో ఇటువంటి దేవున్ని మాత్రమే మనం చూడగలము. కాబట్టి దేవుడు లేఖనాలలో బయలుపరచిన ఈ సత్యాన్ని కాలదన్నటము కంటే ఆయన సర్వాధికార నిర్ణయాలకు తలవంచి వినయంతో ఆరాధించడమే జ్ఞానయుక్తం. కానీ ప్రకృతిసంబంధులైన మానవులు వివేకశూన్యములైన మృగాలవలే దేవుని అధికారాన్ని ససేమిరా ఒప్పుకోరు.

ఇస్సాకు యొక్క కవలపిల్లలను సూచిస్తూ పౌలు దేవుని ఎన్నికార్థపు కృపను గూర్చి తన ప్రసంగప్రవాహాన్ని ఈ విధంగా కొనసాగించాడు.

“ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడియున్నది కాబట్టి యేమందుము? దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు. ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని యెడల జాలి చూపుదునో వాని యెడల జాలిచూపుదును. కాగా పొందగోరు వానివలనైననూ, ప్రయాసపడు వానివలనైననూ కాదు కాని, కరుణించు దేవుని వలననే అగును.” (రోమా 9:13-16)

“నేను ఏశావును ద్వేషించితిని” అని దేవుడు అంటే అది నాకు ఆశ్చర్యం కానే కాదు. పాపం ఏ రూపంలో ఉన్నా దేవుడు దానిని తిరస్కరిస్తాడు. అయితే, “యాకోబును ప్రేమించానని” దేవుని కృప ప్రకటించటం అత్యంత ఆశ్చర్యకరం. మడిమెను పట్టుకున్న యాకోబు ఓ మోసగాడు. కానీ, 'అనర్హమైన కృపను' అతను పొందాడు. ఈ అధ్యాయ ప్రారంభంలో నేను చెప్పిన విషయాన్ని ఈ వచనం ధృడపరుస్తుంది. దేవుడు ప్రేమతో ముందుగా ఎరగటమే ఆయన 'బేషరతు ఎన్నిక'కు ఆధారం. తమ చిత్తాన్ని అనుసరిస్తూ ధర్మకార్యాలనే సుదీర్ఘ పరుగుపందెంలో ఒకరితో ఒకరు పోటీపడేవారి ప్రయత్నాలకు ఆయన ఇసుమంతైనా కదల్చబడడు. ఎన్నిక అనేది దేవుని కార్యం. కేవలం ఆయన అభీష్టము చొప్పునే దేవుడు కరుణ చూపుతాడు. దేవుడు దయతో కొందరిని ఎన్నుకుంటాడని, అటువంటివారిని విశ్వాసానికి చేరుస్తాడని, మిగిలినవారిపై ఉగ్రత నిలుస్తుందని యేసు చెప్పాడు.

“కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు కాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును” (యోహాను 3:36).

ఇది దేవునిని అన్యాయస్థునిగా చేస్తుందా? లేదు! అది ఆయనను దయగలవానిగా చేస్తుంది. ఆయన చేసేదాని ద్వారా న్యాయం నిర్వచింపబడుతుంది. దేవునిని మించి, ఆయనను జవాబుదారీగా చేయగల నైతిక ప్రమాణాలేవీ లేవు. ఆయన ఎవరిని కరుణిస్తాడు, ఎవరు ఆయన కనికరాన్ని పొందుతారనేవి కేవలం ఆయన అభీష్టమే.

"యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశనదినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను” (సామెతలు 16:4).

“నేను వెలుగును సృజించువాడను అంధకారమును కలుగజేయువాడను సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే యెహోవా అను నేనే వీటన్నిటిని కలుగజేయువాడను” (యెషయా 45:7-9). ఆకాశమండలాన్ని సృజించినవానితో వాదించేవానికి శ్రమ.

దయ్యాల లేదా మనుష్యుల దుష్టక్రియల ద్వారా దేవుడు పడద్రోయబడలేదు, ఇసుమంతైనా పరిమితం చేయబడలేదు; దేవుడు సమస్తాన్ని ఒకే ఉద్దేశంతో సృష్టించాడు. అదే ఆయన స్వకీయ మహిమ. నమ్మటానికి విఫలులైనవారి ద్వారా దేవుని నిత్యరక్షణ ప్రణాళికయైన విమోచన కార్యక్రమము ఏ మాత్రమూ భంగపరచబడదు, ఆగిపోదు. ఆయన సార్వభౌమ్య చిత్తాన్ని బట్టి వారు తమ అవిశ్వాసంలో విడిచిపెట్టబడతారు. క్రీస్తును చేరకుండా వారి నుండి సత్యము మరుగు చేయబడింది; వారి కన్నులు మూయబడ్డాయి, వారి చెవులూ బంధించబడ్డాయి. యేసుక్రీస్తు మానవ చరిత్రలో విభజనరేఖలా వున్నాడు. ఈ విభజన రేఖ ద్వారానే నిర్ణయించబడ్డవారు, వారి వారి గమ్యానికి వెళ్తారు.

“కట్టువారు వాక్యమునకవిధేయులై తొట్రిల్లుచున్నారు దానికే వారు నియమింపబడిరి” (1 పేతురు 2:8).

“కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు, మన అద్వితీయనాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడినవారు'' (యూదా 4).

“ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగలవారందరును శిక్షావిధి పొందుటకై, అబద్దము నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు...” (1 థెస్స. 2:11,12)

"... ఇదిగో తిరస్కరించువారలారా, ఆశ్చర్యపడి నశించుడి మీ దినములలో నేనొక కార్యము చేసెదను. ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరనెను” (అపొ.కా. 13:41)

ముగింపు

'బేషరతు ఎన్నిక' అనే సిద్ధాంతానికి సంబంధించి సమృద్ధియైన లేఖనాధారాలు ఒకవేళ లేకున్నా ఈ కాస్త తార్కికత సరిపోతుంది:

- మానవుడు సంపూర్ణంగా నశించి పాపాల మరియు అతిక్రమాలలో మరణించినప్పటికీ,

- దేవునితో  సంబంధం కొరకు ఎట్టి ఆకాంక్ష లేనివాడై దేవునిపై తిరగబడినవాడైనప్పటికీ,

- మానవుడు దేవునికి సంబంధించి ఏమీ చేయలేని అశక్తుడైన్పటికీ,

-దేవుని దృష్టికి ప్రీతికరమైన మంచి క్రియలు చేసి దేవునిని బద్ధునిగా చేయలేనివాడైనప్పటికీ, అట్టి అవగాహన కూడా కరువైనవాడైనప్పటికీ,

కొందరు దేవునిని తెలుసుకొని, ఆయనను ఆరాధిస్తున్నారంటే, దేవుని సన్నిధిలో నిత్యజీవపు వరాన్ని పొందుకుంటున్నారంటే, అది కేవలం దేవుని స్వచిత్తం, దయాసంకల్పం చొప్పున రక్షణ ప్రక్రియను ఆయనే ప్రారంభించటం వలన మాత్రమే సాధ్యపడుతుంది. ఇది మర్మయుక్తంగా ఉందా? అవును ఖచ్చితంగా మర్మయుక్తమే. మర్మయుక్తం కాబట్టి ప్రక్కన పెట్టేద్దామని దాని అర్థమా? కాదు. "పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోకజ్ఞానము కాదు గానీ దేవుని జ్ఞానము మర్మమైయున్నట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను" - 1 కొరింథీ. 2:6,7. కాబట్టి, పతనమైన మానవాళి నుండి, దేవుడు కొందరిని రక్షించే నిమిత్తము ఎన్నుకుని, వారిపై తన ప్రేమను కనపరిచాడు. ఆ రక్షణ యొక్క విధానము ఏమైయుంది, దానిని ఉద్భవింపజేసింది ఏమిటి? అది కేవలం దేవుడు తాను ఎన్నుకున్నవారిపై కనబరచగోరిన ప్రేమలో నుండి ఉద్భవించింది.

“మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమైయుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది” (1 యోహాను 4:10)

అయితే ఆ రక్షణకు మార్గం ఏమిటి? ఆయన కుమారుని ప్రాయశ్చిత్తకార్యమే; అదే 'పరిమిత ప్రాయశ్చిత్తము' అనే కృపాసిద్ధాంతాలలోని మూడవ అంశం. 

మూడవ అధ్యాయము

పరిమిత ప్రాయశ్చిత్తం

క్రీస్తు ఎవరి కొరకు మరణించాడు అనే ప్రశ్నకు 'పరిమిత ప్రాయశ్చిత్తం' అనే సిద్ధాంతంలో జవాబు కనుగొనగలం. ఎలాంటి మినహాయింపు లేకుండా సమస్త మానవాళి కొరకు ఆయన సిలువపై వ్రేలాడాడా? లేదా, కేవలం ఎన్నుకున్నవారి కొరకు మాత్రమే మరణించాడా? 

ఇదే మన ప్రస్తుత వివాదాంశం. అందరూ రక్షింపబడరని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. కాబట్టి, క్రీస్తు ఏ మినహాయింపు లేకుండా అందరికొరకు మరణించినట్లయితే ఆయన రక్షణను కేవలం సుసాధ్యం చేసినట్లు. అంటే ఎవరైనా ఆ అవకాశాన్ని సద్వినియోగం చెసుకోవాలనుకుంటే, వారి రక్షణ కోసం ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినట్లు. పాపులను రక్షించటానికి ఆయన మరణం చాలినది, ప్రభావవంతమైనది, ఐతే, తత్ఫలితంగా రక్షణ కార్యం సంపూర్ణం చేయబడినట్లయితే అందరూ రక్షణ పొందటంలేదన్న వాస్తవం, క్రీస్తు కేవలం ఎన్నుకోబడినవారి కోసం మరణించాడు అని నమ్మేలా ప్రోద్బలం చేస్తుంది. 

 దీనికి సంబంధించిన మన దైవశాస్త్రాన్ని స్థిరపరచుకోవటానికి, కల్వరిలో ఏమి జరిగిందో మొదట తెలుసుకోవాలి. క్రైస్తవ్యమంతా 'యేసు సిలువ' అనే ఈ కీలకాంశం చుట్టూ తిరుగుతుంది. యేసుక్రీస్తు దైవకుమారుడని, త్రిత్వంలో ఒక సభ్యుడని (ఉన్నాడు, ఉండేవాడు, ఉండబోవువాడని) సాంప్రదాయ క్రైస్తవ్యం ఎల్లప్పుడూ విశ్వసిస్తుంది. 

“ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్త్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా వుండుడి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది; మరియు ఆయనయందు మీరును సంపూర్ణులైయున్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సైయున్నాడు” (కొలొసీ. 2:8-10). 

యేసుక్రీస్తు తన దైవత్వాన్ని నిరూపించుకోవాలని బలవంతం చేయబడినప్పుడు, “యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్భములో ఉండును” (మత్తయి 12:40) అని అన్నాడు. 

“లేఖనాల ప్రకారం” నిజంగానే క్రీస్తు సిలువపై మరణించాడని, మూడు రాత్రింబవళ్లు సమాధిలో ఉండి తిరిగి లేచాడని మొట్టమొదట కళ్లారా చూచినవారు సాక్ష్యమిచ్చారు. చరిత్రలో ఈ అద్భుతమైన వాస్తవం లేనట్లయితే, అబద్ధీకుల ద్వారా తేబడి 'అబద్ధపు సాక్షుల' ద్వారా భద్రపరచబడి కొనసాగుతున్న మరొక వెర్రి మతంలా క్రైస్తవ్యం కూడా ఉండేది ((1 కొరింథీ. 15:5)). ఈ సంఘటనలు క్రైస్తవ్యానికి మూలమైనవి. 

'యేసు సిలువ వేయబడటం' అనే విషయం తరచి చూడతగిన ఓ చారిత్రాత్మక వాస్తవం. రోమా చరిత్రకారుడైన టాసిటస్, నజరేయుడైన యేసు అనే ఓ వ్యక్తి నిజంగా జీవించాడని,  సిలువ వేయబడ్డాడని గ్రంథస్థం చేస్తూ ఇలా వ్రాశాడు: 

'మానవ ప్రయత్నాలెన్ని చేసినా, చక్రవర్తి ఉదారంగా ఎన్ని ఈవులు  ఇచ్చినా , దేవుళ్ళను శాంతింపజేసినా ఇవన్నీ రోమా నగరం నీరో చక్రవర్తి ఆజ్ఞ చొప్పునే తగులబెట్టబడిందనే దురభిప్రాయాన్ని పారద్రోలలేకపోయాయి. అందుకే, ఆ నిందను తొలగించుకోవటానికి, నీరో క్రైస్తవులని పిలవబడుతున్నవారిపై ఆ నేరము మోపుతూ, చేయకూడని హేయ క్రియలు చేస్తున్నారని నిందిస్తూ, వారిని ఘోర హింసలకు గురి చేశాడు. 'క్రైస్తవులు' అనే పదం (క్రిస్టస్) యేసుక్రీస్తు అనే వ్యక్తి నుండి ప్రారంభమైంది. ఆయన టైబేరియస్ పరిపాలనలో పొంతి పిలాతు అధికారము క్రింద ఘోరమైన శిక్షను అనుభవించాడు.ఆ విధంగా ఆనాడు అదుపు చేయబడిన ఈ మూఢాచారం (క్రైస్తవ్యం), దానికి కేంద్రబిందువైన యూదయలో మాత్రమే కాక సమస్త అసహ్య,అవమానకరమైన విషయాల ప్రాచుర్యానికి కేంద్రస్థానమైన రోమ్ లో కూడా పున: ఆవిర్భవించింది. అందువల్ల  దోషులుగా నిర్ధారించబడిన కొందరిని నిర్భందంలోనికి తీసుకొని, వారిచ్చిన సమాచారం మేరకు ఒక గొప్ప జనసమూహాన్ని దోషులుగా నిర్ణయించారు. రోమును తగులబెట్టిన నేరానికి కాదు, మానవ జాతిని ద్వేషించేవారనే నిందను మోపుతూ పలువిధాలుగా అవమానాలకు గురిచేస్తూ వారిని హతమార్చారు. కొందరు జంతువుల చర్మముతో చుట్టబడి, కుక్కలచేత చీల్చబడి చంపబడ్డారు. మరికొందరు సిలువ వేయబడ్డారు. ఇంకొందరు రాత్రుళ్ళు దీపస్తంభాలపైన వ్రేలాడదీయబడి దీపాలుగా వెలిగించి వాడుకోబడ్డారు. ఈ విధముగా వారిని ఎక్కువ హింసకు గురిచేసారు. నీరో తన ఉద్యానవనాలను ఇలాంటి ప్రదర్శనల కోసం ఇచ్చాడు. అవి జరుగుతున్న సమయంలో నీరో ఒక  మామూలు రథసారథిలా ప్రజల్లోకి దూరి వారితో కలిసి ఆనందించేవాడు లేదా సుదూరంగా, ఒంటరిగా తన రథంలో వుండి ఆనందించేవాడు. వారు అలా శిక్షలకు గురవుతున్నప్పుడు ప్రజల్లో కనికర, దయా భావాలు పెల్లుబుకుతూ ఉండేవి. ఎందుకంటే ప్రజాక్షేమం కొరకు కాదు గానీ కేవలం ఒకని (నీరో) పైశాచిక ఆనందం కోసమే వారు (క్రైస్తవులను) ఈ హింసలకు గురి చేయబడ్డారు.' 

క్రీస్తు అనే వ్యక్తి పిలాతు అనే వాని ద్వారా తీర్పు తీర్చబడి సిలువ వేయబడ్డాడని, ఆయన అనుచరులు సైతం యేసు మరణించి తిరిగి లేచాడనే నమ్మకాన్ని చేపట్టినందుకు ఎంతో కఠినహింసను, శ్రమలను అనుభవించారని అటు బైబిలు, ఇటు చరిత్ర ఆధారాలు సెలవిస్తున్నాయి. 

అయితే విమోచన మరియు సత్యము కొరకు అన్వేషించే వ్యక్తికి ఈ చారిత్రక వాస్తవాల కంటే విలువైన విషయాలు తెలియాలి. ఆ భయంకర ఘట్టం యొక్క శాశ్వత, ఆధ్యాత్మిక పరిణామాలు తప్పనిసరిగా మనము తెలుసుకోవాలి. 

క్రీస్తు ఆ సిలువపై ఏమి సాధించాడు?

ఆదాము హవ్వ ఏదేను తోట నుండి బహిష్కరించబడిన తరువాత మనము కయీను మరియు హేబేలు సహోదరులను గూర్చి చదువుతాం. హేబేలు “తన మందలోని తొలిచూలు మరియు దాని క్రొవ్వును” దేవునికి అర్పణగా ఇచ్చాడు. “దాని కొవ్వును” అను పదము హేబెలు గొఱ్ఱెపిల్లను బలిగా వధించాడని సూచిస్తుంది. అలా చేయాల్సిన అవసరమేంటి?  హేబెలు తన పాపానికి దేవుని క్షమాపణను కోరుకొని దాన్ని పొందాడు. "యెహోవా హేబెలు అర్పణను లక్ష్యపెట్టెను" (ఆది. 4:4). 

'బలిపశువు రక్తము చిందించటం' అనే పద్దతి నోవహు కాలము వరకు కొనసాగింది. ''బలి అర్పించుటకు అనువుగా నుండులాగున అతడు పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును, పెంటులు ఏడును పవిత్రములు కానీ జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును తీసికొనెను'' (ఆది.కా. 7:2). అతని కుటుంబము ఆరిన నేలపై దిగిన వెంటనే యెహోవాకు బలిపీఠము కట్టి, పవిత్ర పశువులలో నుండి కొన్నిటిని తీసుకొని బలిగా అర్పించారు ((ఆది.కా. 8:20)). 

దేవునికి బలి ఇవ్వడం అన్నది హెబ్రీయుల పితరుడైన అబ్రహాము దినాలలో కూడా కొనసాగింది. తన ఏకైక కుమారుడిని బలిగా ఇవ్వమని దేవుడు కోరినప్పుడు “నా కుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱెపిల్లను చూచుకొనునని” (ఆది. 22:8) అబ్రాహాము చెప్పాడు. వధించటానికి అబ్రాహాము తన ఖడ్గాన్ని ఎత్తినప్పుడు దూత అతన్ని ఆపాడు. అంతట పొదలో కొమ్ములకు తగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడింది. ఇస్సాకుకు బదులుగా వధించబడటానికి కొమ్ములుగల పొట్టేలును దేవుడు దయచేశాడు ((ఆది. 22:9-13)). పాపపరిహారార్థ బలి లేవీయుల ధర్మశాస్త్రంలో కూడా కొనసాగించబడింది. తాత్కాలికంగా దేవుడు తన ఉగ్రతను మరియు శిక్షను తొలిగించేలా ప్రధాన యాజకుల నుండి, జనులనుండి రక్తాన్ని కోరాడు. 

“మరియు ధర్మశాస్త్రము ప్రకారము సమస్త వస్తువులును రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును” (హెబ్రీ 9:22). కానీ ఎడతెగని ఈ జంతుబలులు, వాటిని అర్పించినవారి దోషాలు పరిహరించటానికి ఎన్నటికీ చాలినవి కావు. 

"ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గానీ ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడునూ సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరవు. అలాగు చేయగలిగిన యెడల సేవించువారొక్కసారే శుద్ధి చేయబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము” (హెబ్రీ 10:1-4). 

మనుష్యులకు వారి పాపస్థితి జ్ఞాపకం చేయటానికి జంతుబలిని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇలా చిందింపబడిన రక్తము, పాపం మరణాన్ని కోరుతుందనటానికి సాక్ష్యరూపంగా వుంది. అయితే యేసుక్రీస్తు తనను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే తన ప్రత్యామ్నాయ మరణం ద్వారా పాపశిక్షను శాశ్వతంగా తొలగించాడని హెబ్రీపత్రిక గ్రంథకర్త ప్రకటించాడు. చారిత్రకంగా దేవుడెప్పుడూ రక్తబలినే కోరాడు. కానీ స్వయానా దేవుని రక్తాన్నే చిందింపజేసిన ఆ కడమ బలి, తన రక్తార్పణానికి చరమగీతం పాడింది. 

క్రీస్తు సిలువ వేయబడటానికి తనను తాను ఇష్టపూర్వకంగా అర్పించుకున్నప్పుడు అనేక విషయాలు నెరవేర్చాడని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆయన ఎవరికొరకు  మరణించాడు అన్న ప్రశ్నకు ఆయన సిలువ పైన నెరవేర్చిన ఈ ఎనిమిది విషయాలను సమీక్షించడం ద్వారా జవాబు తెలుసుకోగలం:  

1) పాపము విషయమై క్రీస్తు అంతిమ మరియు తిరుగులేని ప్రత్యామ్నాయ బలిగా మారాడు.

“అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, యిప్పుడు మనకొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించునట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లయిన యెడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసివచ్చును. అయితే అయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను” (హెబ్రీ 9:24-26). 

పాపఋణము తీసివేయలేని జంతుబలులన్నిటి వెనుకవున్న ఛాయను నెరవేరుస్తూ, ఒక్కసారే పాపాన్ని తొలగించు నిమిత్తం, క్రీస్తు తనను తాను బలిగా అర్పించుకున్నాడు. 

"మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఈయనయైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి.... దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను” (హెబ్రీ 10:11,12). 

తనను తాను బలిగా సమర్పించి క్రీస్తు ఎందుకు ఆసీనుడయ్యాడు? ఎందుకంటే, శాశ్వతంగా పాపాన్ని తొలగించే నిమిత్తమై ఆ కార్యాన్ని నెరవేర్చటానికి ఆయన వచ్చాడు. దేవుడు తన బలిని సంపూర్తిగా స్వీకరించాడనటానికి సూచనగా, అలాగే అధికారము మరియు శక్తికి సూచనగా దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు.

 

2) పాపము విషయమై క్రీస్తు ప్రాయశ్చిత్తము గావించాడు

క్రీస్తు మరణాన్ని వర్ణించటానికి పౌలు అన్యులుపయోగించే 'ప్రాయశ్చిత్తము' అనే పదం వాడాడు. వారి జీవితాల్లో కలిగే కష్టాలు దేవుళ్లు ఆగ్రహించినందున వచ్చినవని ప్రాచీన అన్యులు విశ్వసించి వారికీ బలులు అర్పించేవారు. మొలేకు దేవత నిమిత్తము తమ బిడ్డలను అగ్నిగుండాన్ని దాటింపజేయటం ఉదాహరణగా మనం చూడవచ్చు ((లేవి. 18:21). ఆ శిశువుల అరుపులు మరియు మరణము దేవుళ్ళను శాంతింపజేస్తాయని వారు విశ్వసించేవారు. 

సర్వశక్తిగల దేవుని ఉగ్రతను శాంతింపజేయటానికి యేసుక్రీస్తు ప్రాయశ్చిత్త బలిగా తనను తాను అర్పించుకున్నాడు.“పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనుపరచవలెనని” (రోమా 3:25).“మనము దేవునిని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమైయుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది” (1 యోహాను 4:10). 

3) పతనమైన పాపులను క్రీస్తు తన మరణం ద్వారా విమోచించాడు

'విమోచించటం' అనే పదము 'వెలపెట్టి కొని విడిపించటం' అనే భావాన్నిచ్చే 'ఎక్సాగరాజో ' అనే గ్రీకు పదము నుండి అనువదించబడింది. ఒక బానిసను విడిపించటానికి అతనిని వెలపెట్టి కొనటం, విడిపించటం అనే భావాన్ని ఇది వ్యక్తపరుస్తుంది. 'లూత్రొ ' అనే గ్రీకు పదాన్ని 'విడిపించటం' అని అనువాదము చేసారు. 'వెలచేత విడిపించబడటం', ' వెల చెల్లింపబడిన కారణాన బానిసను వాస్తవానికి విడుదల చేయటం' అని దీని భావము. 

 పాపులు పాపానికి బానిసలని క్రీస్తు చెప్పాడు” ((యోహాను 8:34)). పాపం వలన వచ్చే జీతము మరణమని పౌలు చెప్పాడు ((రోమా. 6:23). పైగా దేవుని పవిత్ర న్యాయం పాపి యొక్క పాప ఫలితంగా మరణాన్ని కోరింది. మన పాపానికి వెల చెల్లింపబడాలి. కానీ రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదు. (హెబ్రీ 9:22). 

ఈ వర్ణన దృశ్యం స్పష్టంగా ఉంది. పాపమనే సంతలో పాపులు బానిసలుగా ఉన్నారు. తగిన వెలగలవాని రక్తం ద్వారా మాత్రమే వారు విముక్తులుగా చేయబడతారు. కనుక క్రీస్తు తన హస్తంలో తన స్వరక్తాన్ని చేగొని దేవుని నీతి మరియు న్యాయం ఎదుట నిలబడి దోషులైన పాపులను కొని వారిని విడిపించాడు. 

“ఏ భేదమును లేదు; అందరును పాపము చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుదురు” (రోమా. 3:23,24). 

“మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను” (హెబ్రీ 9:12). 

విమోచనకార్యాన్ని సంపూర్తి చేయటానికి ఒక్కసారే క్రీస్తు దేవుని సన్నిధిని ప్రవేశింపవలసివచ్చింది, ఆయన కొన్న విమోచనం శాశ్వతమైనది: కనుక, విమోచింపబడినవాని వెల పూర్తిగా చెల్లింపబడింది మరియు అతను తిరిగి మరి ఎన్నటికీ బానిస అవ్వలేడు. 

4) అదే విధంగా, పాపులకు క్రీస్తు క్రయధనమై ఉన్నాడు

ఒకనిని ఋణం నుండి విడిపించటానికి చెల్లింపబడిన వెలయే క్రయధనం. మృతులైన పాపులు వారు చెల్లించలేని ఋణాన్ని అచ్చియున్నారు కానీ వెల చెల్లించి ఆ ఋణగ్రస్త ఆస్తిని తిరిగి సంపాదించటానికి క్రీస్తు చాలినవాడయ్యాడు. 

“అలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పెను” (మత్తయి 20:28). 

“దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన యేసుక్రీస్తను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలములయందు ఇయ్యబడును” (1 తిమోతి 2:5,6).

 

5) క్రీస్తు సిలువలో దేవునికి, నరునికి మధ్య సంధి చేశాడు.

ఇదివరకు వైరము కలిగున్న ఈ ఇరువురినీ కలిపాడు. మనుష్యునితో సమాధానపడటం దేవునికి అవసరమని కాదు కానీ, మనుష్యులు దేవునితో సమాధానపడకపోతే నశిస్తారు కాబట్టి ఈ ఇరువరి మధ్యనున్న వైరాన్ని తొలగించాడు.

“కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకముగల ప్రధానయాజకుడగు నిమిత్తము అన్ని విషములలో ఆయన సహోదరుల వంటివాడు కావలసివచ్చెను” (హెబ్రీ 2:17). 

“సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా సమాధానపరచుకొని, ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనుచు, ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను” (2 కొరింథీ. 5:18,19) 

“ఏలయనగా శత్రువులమైయుండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడినయెడల సమాధాన పరచబడినవారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము” (రోమా 5:10). 

మనం దేవునిపై తిరగబడి ఆయనను ద్వేషించేవారై ఉండగా ఆ సిలువలో ఆయన మరణం ద్వారా యేసు మనలను తిరిగి సమకూర్చాడు. మనం సమాధానపరచబడ్డాము గనుక ఆయన పునరుత్థానం ద్వారా నిశ్చయముగా రక్షించబడతామని పౌలు చెబుతున్నాడు. క్రీస్తు మన పాపములకై ఋణాన్ని చెల్లించి మన అతిక్రమాలను తొలగించినప్పుడు దేవునితో మనకు సమాధానం సంపాదింపబడింది. ఈ విధంగా నిత్యన్యాయాధిపతి ఎదుట మన రక్షణ, క్రీస్తు చిందించిన రక్తం ద్వారా సంపూర్ణం చేయబడి భద్రం చేయబడింది. 

6. ఆయన మరణం పాపులను నీతిమంతులుగా చేసింది

నీతిమంతునిగా తీర్చబడటం అనేది చట్టపరమైన లేదా న్యాయపరమైన పదజాలము. అనగా ఎన్నిక చేయబడినవారు తమంతట తాము పరిపూర్ణం చేయబడ్డారని కాదు. 

మరొక మాటలో చెబితే, దేవుని ఎదుట స్వీకరించబడేలా పాపులు వ్యక్తిగతంగా పరిశుద్దులుగానూ, నీతిమంతులుగాను తీర్చబడలేదు. వారి దోషాలు మరియు జీవితాలతో నిమిత్తం లేకుండా  పాపరహితులని ప్రకటించబడ్డారు. క్రీస్తు వారి పాపాలు భరించిన కారణాన వారెన్నడూ పాపం చేయలేదన్నట్లుగా దేవుడు వారిని చూస్తాడు. అప్పుడు క్రీస్తు యొక్క పరిపూర్ణమైన మరియు సంపూర్తియైన  కార్యము నుండి వచ్చిన నీతి న్యాయబద్ధంగా వారికి ఆపాదించబడుతుంది.

 మూడు ప్రాముఖ్య ఆపాదితములను బైబిలు బోధిస్తున్నది -
 
1. ఆదాము యొక్క పాపము ప్రతి మానవునికి ఆపాదింపబడింది, అందరూ మరణించటమే దానికి ఋజువు.
 
2. ఏర్పరచబడినవారి దోషం క్రీస్తుకు ఆపాదించబడుతూ వారి పాపాలు కలువరి చెంత ఆయనపై మోపబడ్డాయి.
 
3. విశ్వాసులకు క్రీస్తు యొక్క స్వంత నీతి ఆపాదింపబడింది. 

ఐతే ప్రస్తుతం గమనించవలసిన విషయమేమిటంటే క్రీస్తు ఎవరి నిమిత్తమైతే మరణించాడో వారిని సంపూర్తిగా, పరిపూర్ణంగా, వాస్తవంగా నీతిమంతులుగా తీర్చాడు.

“అతడు (దేవుడు) తనకు (క్రీస్తుయొక్క కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును” (యెషయా 53:11). 

“కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రమువలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియును గాక” (అపొ.కా. 13:38-39). 

“అందరును పాపము చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు” (రోమా 3:23,24). 

“అవిశ్వాసమువలన దేవుని వాగ్దానములను గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసిన వానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి నీతిగా ఎంచబడెనని మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసు మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులనుగా తీర్చబడుటకై లేపబడెను” (రోమా 4:20-25). 

7) నీతిమంతులుగా తీర్చబడినవారిని క్రీస్తు పరిశుద్ధపరిచాడు

అంటే 'దేవుడు వారిని తన కొరకు ప్రత్యేకపరచి ప్రతిష్టించాడని' అని దానికర్థము. 'హగియాజో' అనే గ్రీకుపదం 'పరిశుద్ధపరచబడటం'గా అనువదించబడింది. ఇది 'హగియోస్' అనే మూలపదము నుండి వచ్చినది. ఈ పదాన్ని సాధారణంగా 'పవిత్రం' అని అనువదిస్తారు. ఈ రెండు గ్రీకు పదాలు 'ప్రత్యేకింపబడటం' లేదా దేవునికై 'వేరుచేయబడటం' అన్న అర్థాన్నిస్తాయి. 'అయన ప్రత్యేక ఉద్దేశము కొరకై ప్రత్యేకింపబడటం' అని మనం గమనించగలము.

                  “యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ద పరచబడియున్నాము” (హెబ్రీ 10:10).

“పరిశుద్ధపరచువారికిని పరిశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక...” (హెబ్రీ 2:11).

“మీలో కొందరు అట్టివారైయుంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడిరి” (1 కొరింథీ. 6:11). 

8) తన ప్రజలను పరిశుద్ధపరచటం వలన క్రీస్తు వారిని “పరిపూర్ణులను”గా లేదా "సంపూర్ణులను”గా చేసి నీతిమంతుడును పరిశుద్ధుడునునైన దేవుని ఎదుట నిలబడే యోగ్యత వారికి కలగజేసాడు.

                 “ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడువారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు” (హెబ్రీ 10:14). వారు సదాకాలానికి సంపూర్ణులుగా చేయబడినట్లయితే, ఇక ఆయన వారిని ఎన్నడూ దోషులుగా ఎంచడు.
                  ఈ పరిపూర్ణత, 'ఆపాదించబడిన పరిపూర్ణత' అని మరలా జ్ఞాపకము చేస్తున్నాను. తన ప్రజల పాపాల కొరకు క్రీస్తును దేవుడు అపరాధిగా ఎంచాడు. పాపులు ఆయన ఉగ్రతకు అర్హులు. కాని ఆ ఉగ్రతను దేవుడు వారికి బదులుగా తన కుమారునిపై కుమ్మరించాడు. అప్పుడు, విమోచించబడిన పాపులను వ్యక్తిగతంగా, న్యాయబద్ధంగా, నిర్దోషులుగా దేవుడు ఎత్తిపట్టుకున్నాడు. క్రీస్తు ప్రాయశ్చిత్త కార్యం ఫలితంగా ఆయన వారిని పరిశుద్ధపరచబడిన, పరిపూర్ణులైన ప్రజలుగా చూస్తాడు.
 
 క్లుప్తంగా చెప్పాలంటే సిలువపై క్రీస్తు
 
1) పాపం విషయమై అంతిమ మరియు ప్రత్యామ్నాయ బలిగా మారాడు.
 
2) దేవుని ఉగ్రతను శాంతింపజేశాడు.
 
3) పాపులను కొనటానికి వెల చెల్లించాడు.
 
4) ప్రాయశ్చిత్త క్రయధనంగా మారాడు.
 
5) దేవునికీ మానవునికీ మధ్య సంధి చేశాడు.
 
6) దేవుని పవిత్ర న్యాయాన్ని తృప్తిపరుస్తూ దోషులైన పాపులను నీతిమంతులుగా తీర్చాడు.
 
7) ఆ ప్రజలను పరిశుద్ధపరిచాడు లేదా పవిత్రులనుగా ప్రత్యేకపరిచాడు.
 
8) ఆయన కొని, నీతిమంతులుగా తీర్చి, పరిశుద్ధపరిచినవారిని సదాకాలానికి పరిపూర్ణులుగా చేశాడు. 

'సమాప్తమైనది' అనే క్రీస్తు స్వీయ ప్రకటన ద్వారా, వాస్తవానికి ఆయన మరణ, పునరుత్థానాల ద్వారా ఇవన్నీ నెరవేర్చబడ్డాయని మనకు తెలుసు. ఇదంతా మనస్సులో ఉంచుకుని ఈ ప్రశ్నను మరలా అడుగుదాంః  

క్రీస్తు ఎవరి కొరకు మరణించాడు?

ఏ మినహాయింపు లేకుండా, జీవిస్తున్న ప్రతివ్యక్తి కొరకు, యావత్ ప్రపంచము కొరకు క్రీస్తు మరణించినట్లయితే, పైన ఉదహరించబడిన ఆయన మరణంలో గల ఉద్దేశాలన్నీ వారందరి యెడల నెరవేర్చినట్లవుతుంది. కాని క్రీస్తు ప్రాయశ్చిత్త కార్యం యొక్క ఫలితాలు ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా వర్తిస్తాయని లేఖనాలలో ఎక్కడా ప్రస్తావించబడలేదు. కాబట్టి అవి ఒక వ్యక్తికి వర్తిస్తే సంపూర్ణంగా వర్తిస్తాయి లేదా అసలే వర్తించవు. అలాగే ఎవరో ఒకరు అవకాశం తీసుకుని మేలు పొందుతారని, ఎవరికీ వర్తింపజేయకుండా క్రీస్తు ఇవన్నీ చేసి ఉంచాడని లేఖనాలు సూచించడం లేదు. ఆయన సమాప్తమైనదని చెప్పినప్పుడు నిజంగానే అంతా సమాప్తమైనది. ఆయన సాధించతలచినది సాధించాడు. 

“చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రీ, లోకము పుట్టక మునుపు నీయొద్ద నాకు ఏ మహిమ వుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమపరచుము” (యోహాను 17:4,5). 

అంతేకాక క్రీస్తు కార్యం ఒక వ్యక్తి జీవితములో ప్రభావవంతమవటానికి దానికి ఇంకేదో జతచేయాలని లేఖనాలలో ఇసుమంతైనా చెప్పబడలేదు. క్రీస్తు ప్రాయశ్చిత్తకార్యాన్ని కార్యసాధకం చేయటానికి మనం మన విశ్వాసం, మన ఎన్నిక, మన నిర్ణయం మొదలైనవేవీ దానికి జతచేయనక్కరలేదు. ఆయనే స్వయంగా ఈ ప్రాయశ్చిత్త కార్యాన్ని నెరవేర్చి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు.

ఇవన్నీ పరిగణలోనికి తీసుకున్నప్పుడు ఒకవేళ అందరికొరకు క్రీస్తు మరణించినట్లయితే, తత్ఫలితంగా అందరూ రక్షింపబడతారని మనం నమ్మబద్ధులమైయున్నాము. కాని ఇది వాస్తవము కాదని లేఖనాల నుండి మనకు తెలుసు. ప్రతి ఒక్కరూ రక్షింపబడరు. కొంతమంది శాశ్వతంగా దేవుని నుండి వేర్పరచబడతారు. 

“సముద్రము తనలో వున్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతులనప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరయినను జీవగ్రంథమునందు వ్రాయబడినట్లు కనబడనియెడల వాడు ఈ అగ్ని గుండములో పడవేయబడును” (ప్రకటన 20:13-15). 

అయితే ఒకసారి సమాధానపరచబడి, నీతిమంతులుగా తీర్చబడి, విమోచింపబడి, పరిశుద్ధపరచబడి మరియు సంపూర్ణులుగా చేయబడిన మనుష్యులు, న్యాయవంతుడైన దేవునిచే అగ్నిగుండంలో వేయబడి శాశ్వతంగా ఎలా శిక్షించబడగలరు? ఒకవేళ క్రీస్తు వారి ప్రాయశ్చిత్త వెల చెల్లించినట్లయితే, తిరిగి వారి పాపాల విషయమై వారినెలా తీర్పు తీర్చగలడు? 

జవాబు: క్రీస్తు ఆ అగ్నిగుండంలో పడబోయేవారి స్థానంలో మరణించలేదు. క్రీస్తు పాపభారాన్ని భరించినప్పుడు వారి పాపాలు ఆయన భుజాలపై లేవు. కాబట్టి నేను దీనిని సూటిగా ప్రకటిస్తున్నానుః 

 ఎన్నుకున్నవారికై మాత్రమే క్రీస్తు మరణించాడు

తత్ఫలితంగా, ఎన్నుకొనబడినవారు దేవునిచే కొనబడినవారుగా, సంధి చేయబడినవారుగా, వ్యక్తిగతంగా నిర్దోషులుగా, క్రీస్తునందు పరిశుద్దులుగా మరియు పరిపూర్ణులుగా ఎంచబడ్డారు. దేవుడు వారి పాపములను తూర్పునకు పడమర ఎంత దూరమో అంత ఎడమగా చేసియున్నాడు. కనుక పాపాలను బట్టి వారు మరెన్నడూ తీర్పు తీర్చబడరు (కీర్తనలు 103:12). దేవుడు వారికి బదులుగా తన కుమారునిపై ఉగ్రత కుమ్మరించాడు గనుక ఎన్నుకున్నవారిపై వారి పాపాన్ని బట్టి ఆయన తన ఉగ్రతను ఇక ఎన్నడూ కుమ్మరించడు. 

“మేకలయొక్కయు, కోడెలయొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను” (హెబ్రీ 9:12) 

పైగా ఈ సిద్ధాంతాల తార్కిక కొనసాగింపు మానవాళి అంతటి కొరకు క్రీస్తు మరణించలేదన్న ముగింపుకు నడిపిస్తుంది. ఇప్పటిదాకా విషయ పరిసమాప్తి చేసినంతవరకు చూస్తే, ఒకవేళ భూమి పునాదులు వేయబడక మునుపే కొందరిని దేవుడు ఎన్నుకుని, మిగిలిన శేషాన్ని తృణీకరించినట్లయితే, నశిస్తారని ముందుగా ఎరిగినవారి నిమిత్తం, దేవుడు తన కుమారుడిని ఎలా పంపుతాడు? 

తాను చేయనుద్దేశించనివాటిని చేయటానికి ప్రయాసపడేవానిగా దేవునిని చిత్రీకరిస్తే ఆయనను అవివేకిగా పరిగణించినట్లవుతుంది. 

ఎన్నుకున్నవారు మాత్రమే విమోచింపబడతారని క్రీస్తే తన ప్రార్థనలో స్వయానా ప్రకటించాడు. "తండ్రీ, లోకము పుట్టక మునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితివి, వారు నీ వారైయుండిరి, నీవు వారిని నాకనుగ్రహించితివి; వారు నీ వాక్యము గైకొనియున్నారు. నీవు నాకనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చియున్నాను. వారామాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి, నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నియు నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగియున్నారు. వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను; లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు, నీవు నాకనుగ్రహించియున్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను నావన్నియు నీవే, నీవన్నియు నావి. వారియందు నేను మహిమపరచబడియున్నాను” (యోహాను 17:5-10). 

క్రీస్తు మరణానికి సిద్ధపడుతుండగా చేసిన ఈ ప్రార్థనలో దేవుడు తనకనుగ్రహించిన ప్రజలను ఈ క్రింది విధంగా వర్ణించాడు. 

1. వారు దేవునికి చెందినవారు, వారు క్రీస్తుకు అనుగ్రహించబడ్డారు.
 
2. వారు ఆయన వాక్యాన్ని గైకొన్నవారు.
 
3. క్రీస్తు కలిగియున్నవన్నీ దేవుని నుండి వచ్చినవేనని వారికి తెలుసు.
 
4. దేవుడు తనకు అనుగ్రహించిన మాటలను క్రీస్తు వారికిచ్చాడు.
 
5. వారు ఆ మాటలు స్వీకరించారు.
 
6. క్రీస్తు దేవుని నుండి వచ్చాడని వారికి ఖచ్చితంగా తెలుసు.
 
7. క్రీస్తును దేవుడు పంపాడనే విశ్వాసం వారికి ఉంటుంది.
 
8. వారు దేవునికి చెందినవారు గనుక ప్రత్యేకంగా వారి నిమిత్తమై క్రీస్తు దేవునిని వేడుకున్నాడు. ఈ ఖచ్చితమైన మాటలు గమనించండి. “నేను లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు కానీ వారికొరకే .."
 
9. వారియందు క్రీస్తు మహిమపరచబడతాడు. 

క్రీస్తు ఇలా ప్రార్థనలో కొనసాగుతూ దేవుడు ఎన్నిక చేసి తనకనుగ్రహించినవారినే దీవించి, భద్రపరచమని వేడుకున్నాడు. అయితే ఇక్కడ క్రీస్తు తన ప్రార్థనలో సహితం కలుపుకోని లోకాన్ని రక్షించటానికి, తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి ప్రాణాలనర్పించాడనటం ఎంతవరకు సమంజసం! అలాగైతే ఆయన కలవరంలో మూర్ఖంగా ప్రవర్తించాడని చెప్పినట్లవుతుంది. ఆయనకు చెందినవారికి మరియు ఆయన ప్రార్థించనివారికి మధ్య క్రీస్తు చూపిన వ్యత్యాసం ప్రత్యేకంగా గమనించండి. 'క్రీస్తు కేవలం ఎన్నుకొనబడినవారి కొరకు మాత్రమే మరణించాడనే' నా వాదన, ఆయనే స్వయంగా చూపించిన ఈ వ్యత్యాసాన్ని బట్టి నిర్ధారించబడుతుంది. 

 గొఱ్ఱెలు

'ఎన్నుకున్నవారిని మాత్రమే రక్షించటానికి యేసు మరణించాడు' అనే ఈ వాదాన్ని మరింత బలపరచటానికి, ఎన్నుకున్న తన విశిష్టప్రజలతో తనకున్న సంబంధాన్ని సూచించేలా ఆయన వాడిన పదజాలాన్ని మాత్రమే మనం గమనించి చూస్తే సరిపోతుంది. మొదటి శతాబ్ది శ్రోతలు సులభంగా గ్రహించేలా, వారి పరిస్థితులకు అనుగుణమైన అలంకారభాషను క్రీస్తు తరచుగా ఉపయోగించాడు. ఆ రోజులలో ఎక్కడ చూసినా వ్యవసాయం, పశుసంపద మరియు గొఱ్ఱెలు సాధారణ దృశ్యాలుగా కనిపించేవి. గనుక క్రీస్తు ఇలా అన్నాడు - “నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొఱ్ఱెల కొరకు తన ప్రాణము పెట్టును” (యోహాను 10:11). 

“నేను గొఱ్ఱెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును. నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును. మరియుగొఱ్ఱెల కొరకు నాప్రాణము పెట్టుచున్నాను.” (యోహాను 10:14,15) కనుక క్రీస్తు, తన గొఱ్ఱెలు అని సూచించినప్పుడు ఏ మినహాయింపు లేకుండా ప్రతీ మానవునిని ఉద్దేశించాడా అని విచారణ చేయటం యుక్తం. ఆ ప్రశ్నకు ఆయన చెప్పిన మాటలే సమాధానమిస్తాయి - “అయితే మీరు నా గొఱ్ఱెలలో చేరినవారు కాదు గనుక మీరు నమ్మరు” (యోహాను 10:26) 

"తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడైయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగుచేయబడుదురు; గొల్లవాడు మేకలలో నుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడాయన ఎడమవైపున వుండువారిని చూచి - శపింపబడినవారలారా, నన్ను విడిచి అపవాదికినీ వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి” (మత్తయి 25:31-33, 41). 

యేసు “నా గొఱ్ఱెలు” అని చెప్పినప్పుడు ఒక ప్రత్యేకగుంపును ఆయన సూచించాడు. వాస్తవానికి యేసు పరిసయ్యులను ఉద్దేశించి నన్ను మీరు విశ్వసించలేదు అననటంలో కారణం వారు ఆయన గొఱ్ఱెలు కారు. ఈ ప్రపంచమంతటినీ "గొఱ్ఱెలు” మరియు “మేకలు” అని రెండు గుంపులుగా క్రీస్తు విభజించాడు. తన మరణం మేకల కొరకు అని యేసు ఎక్కడా చెప్పలేదు. తత్ఫలితంగా మేకలు తీర్పు తీర్చబడి శిక్షింపబడతాయి. 

“గొఱ్ఱెలు” అనే ఈ పదజాలాన్ని ఉపయోగిస్తూ క్రీస్తు తన సంఘం కొరకే ప్రత్యేకంగా మరణించాడని పౌలు కూడా బోధించాడు. “దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్దాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి” (అపొ.కా.20:28). పౌలు వివాహసంబంధాన్ని గురించి మాట్లాడినప్పుడు కూడా క్రీస్తువిమోచన యొక్క పరిమితిని ప్రకటించాడు. 

“పురుషులారా, మీరునూ మీ భార్యలను ప్రేమించుడి అటువలెనే క్రీస్తు కూడా 'సంఘమును ప్రేమించి, దాని కొరకు' తన్ను తాను అప్పగించుకొనెను” (ఎఫెసీ. 5:25). 

 మరియ గర్భధారణ గురించి దూత యోసేపుతో “ఆమె యొక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను” (మత్తయి 1:21).

అంతేకాక యేసు విశదముగా ఇలా ప్రకటించాడు - "తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు. నేను మీకాజ్ఞాపించిన వాటిని చేసినయెడల మీరు నా స్నేహితులైయుందురు. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని” (యోహాను 15:13-15).

ఇక్కడ ఆయన ఎన్నుకున్న అపొస్తలులతో క్రీస్తు మాటలాడుతున్నాడు. ఆయన ఏర్పరచుకున్న గొఱ్ఱెలను గురించి మాట్లాడుతున్నాడు. ఆయన సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన స్నేహితులను గురించి మాట్లాడుతున్నాడు. వారికొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ఈ పదజాలాలలో 'మినహాయింపు భావాలను' స్పష్టంగా చూడగలం. 

క్రీస్తు ప్రభుత్వమును స్వీకరించక దానిననుసరించని వారు ఖచ్చితంగా ఆయన స్నేహితులు కారు, ఆయన గొఱ్ఱెలు కారు, ఆయన ప్రజలు కారు, ఆయన సంఘమసలే కారు. తత్ఫలితంగా క్రీస్తు వారికొరకు తన ప్రాణాన్ని పెట్టలేదు.

 

పాతనిబంధన పోలికలు

ఆదాము పతనం తర్వాత దేవుడు స్త్రీ సంతానానికీ, సర్పసంతానానికీ మధ్య వైరం కలుగుతుందని సర్పాన్ని శపించాడు. ఆది నుండి క్రీస్తు వరకు ఈ స్త్రీ సంతానపు వంశావళిని మరియు దేవుడు వారితో వ్యవహరించిన కాలక్రమాన్ని బైబిలు తెలియజేస్తుంది (గలతీ. 3:16).

ఈ స్త్రీ సంతానమే ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలుగా వృద్ధి చెందాయి . ఏర్పరచబడిన ఈ జాతిని చూసుకోవటానికి దేవుడు మూడు వేర్వేరు నాయకత్వపు వ్యవస్థలను ఏర్పరిచాడు. ప్రవక్తలు, యాజకులు మరియు రాజులు. ఇవి ప్రాతినిధ్యం వహించే వ్యవస్థలు. 

ఉదాహరణకు ప్రధానయాజకుడు సంవత్సరానికి ఒకసారి బలి అర్పించటానికి అతిపరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు ఆ ఏర్పరచబడిన జాతికి ప్రతినిధిగా దేవుని ఎదుట నిలిచేవాడు. దేవుడు మోషేను ఆజ్ఞాపించినట్లు, ఇశ్రాయేలు ప్రజలకు స్మారకార్థంగా యాజకుడు తన భుజాలపై ఒక “ఏఫోదు' ధరించేవాడు ((నిర్గ. 39:7).) తన రొమ్ముపై మూడు ప్రశస్తమైన రత్నాలు పొదగబడిన నాలుగు పంక్తులుగల పతకాన్ని ధరించేవాడు. ఆ రత్నాలు ఇశ్రాయేలీయుల పేర్ల చొప్పున పన్నెండు ముద్రలవలే చెక్కబడిన పన్నెండు గోత్రాల పేర్లు ఒకొక్కదాని మీద ఒకొక్క పేరు చెక్కబడింది. ఎవరి భారమైతే ఆ ప్రధానయాజకుని భుజాలపై ఉంచబడిందో, కేవలం ఆ ప్రజల పక్షాన మాత్రమే ఆయన విజ్ఞాపన చేసేవాడు. అతడు ప్రపంచపు పాపాల నిమిత్తం బలులర్పించలేదు. అతడు అమాలేకీయులకు గానీ, జేబూసీయులకు గానీ యాజకుడు కాదు. కేవలము అబ్రహాము సంతతియైన వాగ్దానజనానికి మాత్రమే యాజకుడు. 

దేవుడు ఏర్పరచిన రెండవ ప్రాతినిధ్యపు వ్యవస్థ - ప్రవక్తలు. ప్రవక్తలు దైవావేశం చొప్పున దేవుని వాక్కులు పలికేవారు. దేవుడు చెప్పదలిచినది వారు చెప్పేవారు. అయితే కేవలం ఇశ్రాయేలు ప్రజల కొరకు మాత్రమే (అంటే ఏర్పరచబడిన ప్రజల కొరకు మాత్రమే) ప్రవక్తలు పంపబడ్డారు ((హెబ్రీ 1:1).) మోయాబీయులకై లేదా ఫీలిష్తీయులకై ప్రవక్తలు పంపబడలేదు. ప్రవక్తలు ఇతర దేశాలనుద్దేశించి ప్రవచించినా, ఇశ్రాయేలు మరియు యూదా ప్రజలను హెచ్చరించి వారికి బోధించే నిమిత్తమే లేపబడ్డారు. 

ఉదాహరణగా - మోషేను గమనిద్దాము. మోషే దేవుని ప్రవక్తగా ఉండేవాడు, ఆయన ద్వారా ఇశ్రాయేలు ప్రజలు సీనాయి కొండ దగ్గర ధర్మశాస్త్రాన్ని పొందారు. ఆ ధర్మశాస్త్రం అన్యులకు అనుగ్రహింబడలేదు. ఏర్పరచబడిన ఆ ప్రజలకు మాత్రమే దేవుడు తన నీతి ప్రమాణాలను తెలియజేశాడు. క్రీస్తునొద్దకు మనలను నడిపించటానికి, ఈ ధర్మశాస్త్రమే మనకు బాలశిక్షకుడు ((గలతీ 3:24).) కనుక రక్షణ మార్గం ప్రపంచమంతటికీ ప్రత్యక్షపరచబడలేదు. ఎన్నుకోబడిన ఆ ప్రజలకు మాత్రమే ప్రవక్తల ద్వారా అది ప్రత్యక్షపరచబడింది. 

మూడవదిగా ఆయన ఎన్నుకున్న ప్రజలపై రాజుల ఏలుబడిని దేవుడు నియమించాడు. భూమిని ఏలిన ప్రతీ ఏలిక తన అధికారాన్ని దేవుని నుండి పొందుతాడన్నది వాస్తవమైనప్పటికీ భూసంబంధ రాజులలో ఏ రాజు కూడా దావీదు అంతటి ఘనత పొందుకోలేదు. ఆయన దేవుని హృదయానుసారుడుగా పిలవబడ్డాడు. ప్రతీరాజు ఒక ప్రత్యేకమైన రాజ్యంపై పరిపాలన చేస్తాడు. చరిత్రలో ఏ రాజు కూడా సార్వత్రిక ఆధిపత్యం కలిగుండలేదు. అలాగే ఇశ్రాయేలు రాజులు కూడా దేవునిచే ఎన్నుకోబడి, ప్రవక్తలచే అభిషేకించబడి, కేవలము ఇశ్రాయేలుపై మాత్రమే పరిపాలన చేసారు.  ఏ వ్యక్తి కూడా ఒకేసారి ఈ మూడు వ్యవస్థల కార్యాలను చేపట్టలేదు (క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్న మెల్కీసెదెకు తప్ప). దావీదు రాజుగాను, ప్రవక్తగాను ఉన్నాడు కానీ ఎన్నడూ యాజకుడుగా ఉండలేదు. అహరోను ప్రధానయాజకుడుగాను, ప్రవక్తగాను ఉన్నాడు కానీ ఎన్నడూ రాజుగా ఉండలేదు. ఉజ్జియా రాజు ఆ అవధులను దాటి ధూపము వేయ ప్రయత్నించాడు. అది యాజకునిధర్మం, కాబట్టి ఆయన మరణించే వరకు దేవుడాయనను కుష్టుతో మొత్తాడు ((2 దిన. 26:16-21). 

సౌలు రాజుగా ఉండి ప్రవచించాడు కాని ఎన్నడూ యాజకుడుగా ఉండలేదు. ఈ మూడు కార్యాలూ పోలికలుగాను, ఛాయలుగా ఉంటూ క్రీస్తుయేసునందు నెరవేర్చబడ్డాయి. 

రాబోయే 'మెస్సీయ'ను గూర్చి ప్రవక్తలందరూ ప్రవచించారు. 

“మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపకయుండిరి? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసినవారైతిరి” (అపొ.కా. 7:52). 

యాజకులు, నిజవిమోచకుడు వచ్చి తన స్వంత రక్తాన్ని బలిగా అర్పించేవరకూ, తాత్కాలికంగా విజ్ఞాపనకర్త బాధ్యతల్ని నిర్వహించారు. 

“అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించునట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశించలేదు. అట్లయినయెడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసివచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుట వలన పాపనివారణ చేయుటకై యొక్కసారే ప్రత్యక్షపరచబడెను” (హెబ్రీ 9:25, 26).

చరిత్ర వేదికపై దావీదు కుమారుడు అవతరించేవరకూ రాజులు ఇశ్రాయేలీయులపై పరిపాలన చేశారు. అలాగే జయశాలి వచ్చి తన రాజ్యాన్ని లోబరచుకునేంతవరకూ భూసంబంధ రాజులు ఏలుతారు.

“నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆదిసంభూతుడుగా లేచినవాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు కృపాసమాధానములు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగును గాక” (ప్రకటన 1:5,6). 

మెల్కీసెదెకు క్రమంలో ప్రవక్తగా, యాజకునిగా మరియు రాజుగా చెప్పబడిన ఏకైక మానవుడు యేసుక్రీస్తు. 

“నావంటి యొక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలోనుండి మీకు పుట్టించును అనీ ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడే” (అపొ.కా. 7:37). 

“పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను” (హెబ్రీ 1:1,2). 

“ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్యమిచ్చెను” (యోహాను 4:44). 

“కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమందు నమ్మకముగల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన సహోదరులవంటివాడు కావలసివచ్చెను” (హెబ్రీ 2:17)

“ఇందువలన పరలోకసంబంధమైన పిలుపులో పాలుపొందిన పరిశుద్ద సహోదరులలో, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధానయాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి” (హెబ్రీ 3:1). 

“మన ప్రభువైన యేసు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైయున్నాడు” (1 తిమోతి 6:14,15). 

"రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడియున్నది” (ప్రకటన 19:16). 

యేసుక్రీస్తు దేవుని కొరకు మాటలాడిన చివరి ప్రవక్త; దేవుని కరుణాపీఠం వద్ద తన స్వరక్తాన్ని ఒలికించిన మిక్కిలి హెచ్చయిన ప్రధాన యాజకుడు; యేసు రాజులందరికీ రాజు. 

అయితే, ఈ వ్యవస్థల విధినిర్వహణలో వాటి ఉద్దేశాన్ని, స్వభావాన్ని ఆయన మార్చలేదు. విశ్వాసమందు అబ్రహాము సంతానానికి అంటే, ఏర్పరచబడినవారికి ఆయన ప్రధానయాజకుడు; ఈ లోకం నుండి ఆయనకు అనుగ్రహింపబడినవారికి దేవునివాక్యాన్ని అందించిన ప్రవక్త. తిరుగుబాటుదారులను శిక్షించి ఆయనకు నమ్మకమైనవారికి ప్రతిఫలాలనిచ్చే న్యాయము, నిబద్ధతగల రాజు. క్లుప్తంగా చెప్పాలంటే ఏర్పరచబడినవారికి ఈ వ్యవస్థలన్నిటి నెరవేర్పు ఆయనే. 

 

ఆర్మీనియన్ల పరిమితి

క్రీస్తుకార్యంపై పరిమితులు పెట్టటం సరైనది కాదని, అలా చేయటం మూర్ఖప్రవర్తన అని ఈ సిద్ధాంత వ్యతిరేకులు వాదిస్తారు. అయితే మనం తెల్సుకోవాల్సిన సత్యం ఏమిటంటే, ఆర్మీనియన్ల 'సార్వత్రిక ప్రాయశ్చిత సిద్దాంతం' వాస్తవానికి క్రీస్తుకార్యంపై నేను వివరించినదాని కంటే మరింత కఠిన పరిమితిని విధిస్తుంది. 

ఒకవేళ క్రీస్తు మరణం రక్షణను కేవలం సుసాధ్యపరచి, ఎవరైతే దానిని వినియోగించుకోవాలనుకున్నారో, వారికే రక్షణ ఏర్పాటు చేసినట్లయితే, వాస్తవానికి క్రీస్తు ఎవరిని కూడా రక్షింపలేదు. ఎవరైనా ఒకవేళ క్రీస్తు ప్రాయశ్చిత్తాన్ని ఉపయోగించుకోవాలనుకుంటే, కేవలం వారి రక్షణకు వినియోగపడేలా క్రీస్తు పవిత్రపరిచే తన రక్తాన్ని ఒలికించాడని సార్వత్రికప్రాయశ్చిత్తవాదులు బోధిస్తారు. ఒక వ్యక్తి తన చిత్తానుసారంగా ఈ ప్రాయశ్చిత్తాన్ని తన జీవితానికి అన్వయించుకోగోరే తీర్మానమే రక్షణకు అసలు ప్రేరకమని వారి వాదన. 

కృపాసిద్ధాంతాలు ప్రాయశ్చిత్తపుపరిధిని పరిమితి చేస్తే ఆర్మీనియన్లు దాని శక్తిని పరిమితి చేస్తున్నారు. నిస్సందేహంగా క్రీస్తు యొక్క శ్రమ మరియు మరణం, జీవించిన ప్రతియొక్కరినీ రక్షించటానికి చాలినది; కాని ఎన్నుకోబడినవారికి మాత్రమే అది నిజంగా ప్రభావవంతమైనది. 

 ఒక ఆర్మీనియను క్రీస్తు ప్రాయశ్చిత్తకార్యాన్ని, మానవునికి దేవునికి మధ్యనున్న మహా అగాధము యొక్క సగం దూరాన్ని మాత్రమే పూడ్చే వంతెనగా చూస్తాడు ; మానవుడు తక్కిన సగదూరాన్ని పూరించుకుని పరలోకగమ్యం చేరుకోవాలి; అయితే ఒక కాల్వినిస్టు క్రీస్తు ప్రాయశ్చిత్తకార్యాన్ని, పతనానికి రక్షణకు మధ్యగల అగాధాన్ని సంపూర్ణంగా పూడ్చే  ఇరుకైన, బలమైన వారధిగా చూస్తాడు; కానీ ఈ మార్గం ప్రసిద్ధియైనది కాదు, దానిని కనుక్కోవటం కష్టం కూడా. 

“ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునైయున్నది. దాని కనుగొనువారు కొందరే” (మత్తయి 7:13-14). 

కనుక మనము ఆర్మీనియన్ భావననుసరించి ప్రాయశ్చిత్త ప్రభావాన్నైనా పరిమితం చేయడం, లేదా కాల్వినిస్టు భావాన్ననుసరించి ప్రాయశ్చిత్త పరిధినైనా పరిమితం చేయడం తప్పదు; మరో ప్రత్యామ్నాయం లేదు. బైబిలు ఒకవైపు క్రీస్తు మరణం యొక్క పరిపూర్ణతను, సంపూర్ణ సాఫల్యతను స్థిరపరుస్తూనే, మరోవైపు ఈ ప్రాయశ్చిత్తపు అన్వయింపు కేవలం దేవుని చేత ఎన్నిక చేయబడినవారికి మాత్రమే పరిమితమని కూడా దృఢపరుస్తుంది. కాబట్టి ఆర్మీనియన్ల పరిమితికి లేఖనాధారాలు లేవు. 

 

ఇతర వాదనలు

సందర్భరహితంగా చూసినపుడు పరిమితప్రాయశ్చిత సిద్ధాంతంలోని సత్యాన్ని కూలద్రోసేలా కనిపించే ఆయా లేఖనభాగాలను చూపించి ఈ సిద్ధాంతాన్ని సవాలు చేయటం దీనిని వ్యతిరేకించేవారి సాధారణ విధానం. కాని సందర్భసహితంగా చూసినప్పుడు ఆ వాక్యభాగాలు ఈ సిద్ధాంతాన్ని కూలద్రోసేవిగా కాక బలపరిచేవిగా నిర్ధారితం ఔతాయి. 

1) అందరు రక్షింపబడతారనే భావనను బలపరచుటకు “ఎవడును నశింపవలెనని యిచ్చయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు” అనే మాట అత్యధికంగా ఉపయోగించబడే లేఖనభాగం. ఈ మాట 2 పేతురు 3:9 నుండి ఉదహరింపబడింది. దీనిని సందర్భసహితంగా చూస్తే సువార్తను అపహసించి, “ఆయన రాకను గూర్చిన వాగ్దానమేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే” అనే చెప్పే అంత్యదినపు అపహాసకుల విషయాన్ని పేతురు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు (2 పేతురు 3:4). అయితే పేతురు “కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదు కాని ఎవడును నశింపవలెనని యిచ్చయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు “మీ యెడల దీర్ఘశాంతము గలవాడై యున్నాడు” (2 పేతురు 3:9) అని జ్ఞాపకము చేస్తున్నాడు. 

"ఎవడును నశింపవలెనని యిచ్చయింపక” అనే మాటను వివరించటంలో “మీ యెడల” అని ఈ వచనంలో ప్రయోగించబడిన పదం ఎంతో కీలకమైనది. పేతురు ఈ పత్రికను ఎవరికి వ్రాసాడో మనం స్థిరపరచగలిగితే “మీ యెడల” అని ఆయన ఎవరిని ఉద్దేశించి చెప్పాడో తెలుసుకోవచ్చు. 1 పేతురు 1:2లో 'తండ్రి దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి, ఆత్మ వలన పరిశుద్దత పొందినవారై విధేయులగుటకును, యేసు క్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడినవారని' ఆయన వారిని గుర్తించాడు. 

2 పేతురు. 1:1లో ''...దేవుని యొక్కయు రక్షకుడునైన యేసుక్రీస్తుయొక్కయు నీతిని బట్టి, మావలనే అమూల్యమైన విశ్వాసము పొందినవారని ఆయన వారిని గుర్తించాడు.” 

పేతురు చూపిన వ్యత్యాసాన్ని మనం గమనించటం చాలా ప్రాముఖ్యం. క్రీస్తు తిరిగి రావటం అనే భావాన్ని కొందరు అపహసిస్తారు. ఆయన వారిని అపహాసకులని, శరీర దురాశలను బట్టి నడుచుకునేవారని పిలుస్తున్నాడు. అపహాసంతో, అవిశ్వాసంలో ఉన్నవారికి భిన్నంగా దేవుని కృప పొందినవారి పట్ల దేవుడు దీర్ఘశాంతంగలవాడై ఉన్నాడని ఇక్కడ యిరువురి వ్యత్యాసాన్ని తెలుపుతున్నాడు. కాబట్టి పేతురు విశ్వాసులనుద్దేశించి “మీ యెడల” అని చెబుతున్నాడు.

ఇక్కడి సందర్భాన్ని బట్టి చూస్తే, ఏర్పరచబడిన మనలో ఎవరూ నశించాలని దేవుడు ఇచ్చయించలేదు గనుక మనలో ఎవడూ నశించడు. మనమందరమూ మారుమనస్సు పొందాలని ఆయన యిచ్చయిస్తున్నాడు గనుక మనమందరమూ తప్పక మారుమనస్సు పొందుతాము. ఎన్నుకోబడినవారందరూ మారుమనస్సు పొందేవరకూ ఆయన తన మహిమాన్విత ప్రత్యక్షతను, ఆయన తీర్పుయొక్క ఉగ్రతను ఆలస్యం చేస్తున్నాడు. అదే విధంగా పేతురు వ్రాసిన ఈ అధ్యాయం యొక్క సందర్భం నిత్యరక్షణ గురించి కాదు. పేతురు ఇక్కడ రాబోయే ప్రపంచ అంతాన్ని గురించి మాట్లాడుతున్నాడు. రక్షణ విషయమై దేవుని దృక్పథం తెలుసుకోవటానికి ఆ అంశాన్ని ప్రస్తావించే వాక్యభాగాలను మనం పరిశీలించాలి. ఇది అటువంటి వాక్యభాగం కాదు. లేదా మరో విధంగా ఆలోచించిస్తే ఈ వచనానికి పెడార్థం చెప్పేవారు మనలను విశ్వసించాలని కోరేలా అందరూ రక్షించబడటం దేవుని చిత్తమైతే తమ స్వచిత్తం చేత ఆయనను తిరస్కరించి నరకపాత్రులైనవారి పట్ల ఆయన చిత్తం భగ్నపరచబడిందనీ, క్రీస్తు తన రక్తాన్ని చిందించి వారికై భద్రపరచిన రక్షణకతీతంగా వారు నశించారనీ చెప్పినట్లవుతుంది. ఎవరునూ నశింపకూడదనే దేవుని చిత్తానికి భిన్నంగా వారు నశించారు గనుక మానవమాత్రుల స్వచిత్తమే దేవుని చిత్తము కంటే బలమైనదని చెప్పినట్లవుతుంది. అటువంటి దైవశాస్త్రం దేవునిని శక్తిహీనునిగాను, దయనీయమైనవానిగాను చూపించి తన ప్రియులు నిరంతరము నశిస్తూ ఉంటే, చూస్తూ దాని గురించి ఏమీ చేయలేని నిస్సహాయునిగా చిత్రీకరిస్తుంది. కాని బైబిల్లోని దేవుడు అటువంటి దేవుడు కాదు.

2) "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవమును పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” (యోహాను 3:16).

క్రీస్తు పరిచర్య సార్వత్రికమని వాదించే ఆర్మీనియన్లకు ఈ వచనం అతి ప్రియమైనది. పై వచనాన్ని ఇష్టమైన వచనంగా ఆర్మీనియను వేదాంతులు వాడతారు. వారి వాదనకు మూలపదము "లోకము”. లోకమంటే వారి భావమేమిటంటే ఎటువంటి మినహాయింపు, భేదమూ లేకుండా, జీవిస్తున్న ప్రతివ్యక్తికి దేవుని యొక్క విమోచనాత్మక ప్రేమ వర్తిస్తుందని వారి నమ్మకం. కాబట్టి ప్రతి భూనివాసికీ నిత్యజీవమనే ప్రతిఫలాన్ని పొందే అవకాశం అనుగ్రహింపబడిందని, అందరికీ సిలువ కార్యం వర్తిస్తుందని వారి వాదన. కానీ నిజంగా ఈ వచనం సెలవిస్తున్నదేమిటి? ''లోకము'' అంటే గ్రీకులో “కాస్మోస్” అని ఉంది. ఈ పదము నుండే 'కాస్మోపాలిటన్' అన్న మాట వచ్చింది.

ఆయా సందర్భాలలో అది విశ్వంలోనున్నదంతా లేదా గ్రహం పై ఉన్నదంతా అని అర్థమిస్తుంది. అయినప్పటికీ తరచుగా ఈ పదం ఇశ్రాయేలీయుల ప్రత్యేకతకు భిన్నంగా ప్రతి జాతి, భాష మరియు దేశానికి చెందిన మానవులను సూచించటానికి కూడా ప్రయోగించబడింది. కాస్మోస్ (లోకము) అంటే గ్రీకు భాషలో రెండు అర్థాలున్నాయి; వాటిని విడివిడిగా అర్థం చేసుకోవాలి లేకపోతే మనము చాలా గలిబిలికి గురౌతాము.

మొదటిగా క్రైస్తవులుగా మారినవారు యూదులు. “ఇశ్రాయేలులో తప్పిపోయిన గొఱ్ఱలయొద్దకు తొలుత వెళ్లమని క్రీస్తు తన శిష్యులకు ఆదేశమిచ్చాడు” (మత్తయి 10:6). కాబట్టి క్రైస్తవ్యం అన్యప్రపంచానికి కూడా వ్యాపించటం వారి సహజ భావనకు వ్యతిరేకమైనది. దీనికి ప్రత్యుత్తరంగా యోహాను యేసుక్రీస్తు సెలవిచ్చిన మాటను గ్రంథస్థం చేస్తూ- దేవుడు ప్రతిజాతి, వంశంలోనుండి ఆయా వ్యక్తులను ప్రేమించి వారికై తన కుమారుని ఇచ్చాడనే భావంతో 'దేవుడు లోకమును ఎంతో ప్రేమించెనని' వ్రాశాడు.

లేదా 'లోకమంటే లోకములో పుట్టిన ప్రతీ మానవుడు' అనే ఆర్మీనియన్ల అర్థం పరిగణలోనికి తీసుకున్నట్లయితే, యోహాను సొంత మాటలనే విభేదించినవారమౌతాము. మరో సందర్భములో యోహాను ఇలా వ్రాసాడు:

“ఈ లోకమునైననూ (కాస్మోస్) లోకములో వున్నవాటినైననూ ప్రేమింపకుడి, ఎవడైననూ లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు” (1 యోహాను 2:15).

దేవుడు తానే ప్రేమించి ఆయన కుమారుని అనుగ్రహించిన ఈ లోకమును ప్రేమించవద్దని యోహాను భావమా? కాదు, ఈ రెండు వ్యతిరేక భావాలను మేళవించటంలో “కాస్మోస్” అన్న పదం యొక్క సరైన అన్వయింపును గుర్తెరగటం ఎంతో అవసరం. దేవుడు ఇశ్రాయేలీయులను మాత్రమే గాక ప్రపంచలోని ప్రతి భాగం నుండి కొందరిని ప్రేమించాడు. అయితే మనం లోకంలో ప్రతిదానిని లేదా దాని బాహ్య స్వరూపాన్ని, ఆకర్షణలను, ప్రతి వ్యక్తిని ప్రేమించకూడదు ((కీర్తన 139:21,22).

దీనినే మరో విధంగా చూద్దాం: ఏశావు లోకములో ఉన్నాడా? అవును ఉన్నాడు. దేవుడు ఆయనను ప్రేమించాడా? లేదు. దేవుడు ఆయనను ద్వేషించాడు.

“నేను మీ యెడల ప్రేమ చూపించుచున్నాను, అయితే మీరు - ఏ విషయమందు నీవు మా యెడల ప్రేమ చూపితివందురు. ఏశావు యాకోబునకు అన్న కాడా? అయితే యాకోబును ప్రేమించితిని; ఇదే యెహోవా వాక్కు ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడుచేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కలపాలు చేసితివి” (మలాకీ 1:2,3).

“ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని ఏశావును ద్వేషించితిని” (రోమా 9:13) అని వ్రాయబడియున్నది.

లేదా పరిసయ్యుల మాటేమిటి? వారు లోకంలో ఉన్నారా? అవును ఉన్నారు. క్రీస్తు వారిని ప్రేమించి వారికై తనను తాను అప్పగించుకున్నాడా? ఖచ్చితంగా కాదు.

“సర్పములారా, సర్పసంతానమా నరకశిక్షను మీరెలాగు తప్పించు కొందురు?” (మత్తయి 23:33).

“మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమే లేదు. వాడు అబద్దమాడునప్పుడు తన స్వభావముననుసరించియే మాటలాడును. వాడు అబద్దీకుడును అబద్ధమునకు జనకుడైయున్నాడు. నేను సత్యము చెప్పుచున్నాను గనుకనే మీరు నన్ను నమ్మరు. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధియైన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను” (యోహాను 8:44-47).

ఆర్మీనియన్ భావనలోగల "లోకము”, ఏ మినహాయింపు లేకుండా ప్రతీ వ్యక్తిని ఇముడ్చుకుంటుంది గనుక ఈ శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఖచ్చితంగా అందులో భాగస్థులే కదా! అయితే నరకశిక్షను తప్పించుకోలేని అపవాదిసంబంధులను దేవుడు ప్రేమించాడనీ, వారు నశిస్తారని తెలిసి కూడా వారికొరకై ఆయన తన కుమారుని పంపాడని మనం నమ్మాలా? లేఖనబద్ధంగా మనం ఉండాలనుకుంటే అటువంటి నమ్మిక వీలుపడదు.

ఈ విషయం మనకింకా అర్థము కావాలంటే, దేవుడు సర్వలోకాన్ని ప్రేమించినట్లయితే, క్రీస్తు వారికై ప్రార్థించటానికి ఎందుకు నిరాకరించాడు?

3) “ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై యున్నది. ఆయన మనుష్యులందరూ రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే; దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే; ఆయనే క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలములయందు ఇయ్యబడును” (1 తిమోతి 2:3-6).

రెండు కారణాలను బట్టి ఆర్మీనియన్ వేదాంతులు ఈ వచనంపై ఎగబడతారు. మొదట, “మనుష్యులందరు రక్షణ పొంది” అన్న మాట. రెండవది, “ఆయన అందరి కొరకు విమోచనా క్రయధనముగా తన్నుతానే అర్పించుకొనెను” అన్న మాట. కానీ ఆ పత్రిక పూర్తిసందర్భాన్ని ఆధారం చేసుకుని ఈ రెండు వచనాలను అర్థం చేసుకోవాలి.

ఈ వాక్యభాగం అపొస్తలుడైన పౌలు నుండి వచ్చింది. పౌలు ప్రత్యేకంగా అన్యులకు పరిచర్య చేసేవాడు. వాస్తవానికి ఈ వాక్యభాగానికి తరువాయి వచనము దీనిని దృఢపరుస్తుంది.

“ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడనుగాను, అపొస్తలుడనుగాను, అన్యుజనులకు బోధకుడనుగాను నియమించబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు.”

పౌలు తన అపొస్తలత్వాన్ని పునరుద్ఘాటిస్తున్నాడు. “క్రీస్తునందు సత్యము చెప్పుచున్నానని” నొక్కి చెబుతున్నాడు. ఆయన పరిచర్య యావత్తు, సువార్త అన్యులకు చేరటం విషయమై అభ్యంతరపడిన యూదుల మధ్య జరిగింది. పేతురు సహితం ఈ భావంతో ఇబ్బందిపడ్డాడు (అపొ.కా.10). కాని తన బోధ, ఉపదేశం మరియు పరిచర్య ప్రత్యేకంగా అన్యులకే అని పౌలు ప్రకటించాడు. ఎందుకని? ఎందుకంటే యేసు యూదులకు మాత్రమే గాక అందరి నిమిత్తం క్రయధనంగా తన్ను తాను అర్పించుకున్నాడు మరియు దేవుడు యూదులను మాత్రమే రక్షింపనుద్దేశింపక, అందరినీ రక్షింపదలిచాడు. అందరూ అంటే లోకంలో పుట్టిన ప్రతీ వ్యక్తి అని కాదు గానీ, అన్ని వర్గాల ప్రజలు అని అర్థం. ఇక్కడ ప్రయోగించబడిన “పాస్” అనే గ్రీకు పదము 'అనేక రకాలు' అనే భావాన్ని కలిగుంది.

దేవుడు కొందరిని శాశ్వతంగా ఖండించాడని ఇదివరకే కొన్ని వచనాల వెలుగులో తెలుసుకున్నాము. కాబట్టి 1 తిమోతి 2వ అధ్యాయ వాక్యభాగం నుండి, దేవుడు ఏ మినహాయింపు లేకుండా ప్రతీ వ్యక్తిని విమోచనా క్రయధనం చెల్లించి రక్షింప నిశ్చయించాడని గ్రహించటం అసాధ్యం. కానీ మొదటి శతాబ్దపు యూదా సంఘపు భావన గమనిస్తే పౌలు చెప్పాలనుకున్నది మనకు అర్థమౌతుంది.

4) “ఎవరైతే విశ్వసిస్తారో”: శ్రద్దగా ఆలకించిన ప్రతీవారికి సువార్త ఉచితంగా ప్రకటింపబడినట్లు మనం లేఖనాలలో కనుగొంటాము. “చెవిగలవాడు వినునుగాక” (మత్తయి 11:15). ఎవరైతే విశ్వసిస్తారో అనే పదంలో ఒక వ్యక్తి యొక్క తీర్మాన సామర్థ్యమే వాక్యాన్ని ప్రభావితం చేసే నిర్ణయాత్మకాంశమనే బలమైన భావన ఇమిడియుందని వాదిస్తూ ఆర్మీనియన్ వేదాంతులు క్రొత్త నిబంధనలో రెండు ప్రత్యేకవచనాలను చూపిస్తారు.

“అంతట ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి - నన్ను వెంబడింపగోరువాడు తన్నుతాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను” (మార్కు 8:34).

“ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పిగొనినవానిని రానిమ్ము; ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకోనిమ్ము”(ప్రకటన 22:17).

అయితే కాల్వినిస్టు వేదాంతులు సువార్త సందేశపు స్వేచ్ఛాయుత పురోగమనాన్ని ఎన్నడూ పరిమితం చేయలేదని మనం మొదట గమనించాలి.

ఎవరైతే క్రీస్తుపై భారం మోపి సంపూర్ణం చేయబడిన క్రీస్తు కార్యంపై యథార్థంగా విశ్వసిస్తారో వారు తప్పక రక్షింపబడతారని నేను హృదయపూర్వకంగా సమ్మతిస్తున్నాను. అయితే ఈ ఉచిత వరాన్ని ప్రతి ఒక్క మానవుడు సద్వినియోగం చేసుకోడు అన్నది కూడా విధితమే. గనుక ఎవరైనా దేవుని కృపలో పాలుపొందుకోవచ్చు కానీ, అందరూ పాలుపొందుకోరు. కేవలం ఎన్నుకోబడినవారు మాత్రమే పాలుపుచ్చుకుంటారు.

కాని ఇక్కడ కాస్త వివరణ సహాయపడుతుంది. “ఎందరైతే” “ఎవరైనా” ఈ పదాలకు గ్రీకులో సమాన పదాలు లేవు. పై పదాలకు గ్రీకులో రెండు మాటలు ఉన్నాయి. “పాస్ హో” -  ఈ గ్రీకు పదాలను అనువదిస్తే “ఆ ఫలానా వారందరూ” అన్న అర్థం వస్తుంది. అది 'ప్రత్యేక ప్రజలను' అంటే “విశ్వసించేవారందరినీ” సూచిస్తుంది. కాబట్టి సమకాలీన భాషానువాదంలో వాడబడిన పదాల అర్థం చూస్తే, తమ స్వేచ్ఛాచిత్తాన్ని అభ్యసించేవారందరికి దేవుడు రక్షణ ద్వారాన్ని తెరచి వుంచినట్లు కనపడుతుంది , కానీ ఆదిమ భాషయైన గ్రీకులో ఆ భావనే లేదు.

అయితే ఇట్టి గ్రహింపు ఏ విధంగా కూడా కృపాసువార్తను అందరికి ప్రకటించటలో కాల్వినిస్ట్ల ఆతురతను అడ్డుకోదు, ఆపదు. ఒకానొక బోధకుడు ఇలా చెప్పటం నేను విన్నాను, 'దేవుడు తాను ఏర్పరచినవారిపై ఒక నీయాన్ ముద్రవేసి లేదా వారి తల వెంట్రుకలు నిలుచునేలా చేసి లేదా ఇంకేదయినా బాహ్యమైన గుర్తును వారిపైవుంచి తద్వారా వారి ఎన్నికను దృష్టికరించి వుంటే సువార్త బోధించటం ఎంతో సులువైయుండేది. కాని మేకల మధ్యన గొఱ్ఱెలు చెదిరి ఉన్నాయి. కనుక వినేవారందరికీ ఉచిత సువార్తను మరియు సార్వభౌమ కృపను బోధించట ప్రతి సువార్త పరిచారకుని బాధ్యత. వారి ఎన్నికను స్పష్టం చేస్తూ, దేవుడిచ్చిన చెవులుగలవారు విని స్పందిస్తారు.

సువార్త ధ్వని ప్రపంచమంతటా మారుమ్రోగుతుంది గాని ఎన్నుకోబడినవారు మాత్రమే నిజంగా దాని గ్రహిస్తారు. మనందరికి అద్భుతమైన ప్రసంగాన్ని విన్న అనుభవముంది. దానికి కొందరు హృదయమందు రేపబడితే మరికొందరు అదే వర్తమానం విని నిర్లిప్తంగా ఉంటారు, మనకు వారికి వ్యత్యాసమేమిటి? మనం వారికంటే అధిక తెలివి, అధిక ఆధ్యాత్మికత, ఎక్కువ సుముఖతగలవారమని అర్థమా? అలాకాదు. దేవుని ఎన్నికాయుతమైన కృప మన హృదయాలకు ఆ వాక్యాన్ని ఉజ్జీవపరిచి మనలను బ్రదికింపజేసింది. ఆయన కృపావరం ద్వారా మనం రక్షింపబడ్డాము. మనము కేవలం దానికి నోచుకోదగని అపాత్రులము. “నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్లు నీవు అతిశయింపనేల?” (1 కొరింథీ 4:7) అని వ్రాయబడియున్నది.

ప్రకటన 22:17వ వచనం విషయానికొస్తే, దాని సందర్భం చూడటం చాలా ప్రాముఖ్యం. లేఖనాలకు భిన్నమైన విధానంలో ఈ వచనం సువార్త ఆహ్వానానికై ఎక్కువగా వాడబడుతుంది. ఈ వచనం బైబిలు గ్రంథం చివర కనపడుతుంది - ఈ యుగసంబంధ విషయాలు ముగిసి, నూతన తరము ఉదయించటమనేది దీని సందర్బం. శత్రువులు ఓడింపబడ్డారు. గొప్పతీర్పు సంభవించింది. దుష్టుడు, వాని అనుచరులు, అవిశ్వాసులు అగ్నిగుండమందు పడద్రోయబడ్డారు. పరలోకం నుండి నూతన యెరూషలేము దిగివచ్చింది. ఇక "శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు” (ప్రకటన 22:3). "రాత్రి యికనెన్నడు వుండదు.... దేవుడైన ప్రభువే వారీ మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు” (ప్రకటన 22:5).

గనుక, 'ఆత్మయు మరియు పెండ్లి కుమార్తెయు రమ్ము, జీవజలములనీత్తునని' చెప్పినప్పుడు, వీటిని వారు ఎవరికిస్తున్నారు? యావత్ ప్రపంచానికా? అవిశ్వాసులకా? కాదు. ఇదివరకే రక్షింపబడి, నిత్యమహిమను పొందుకున్న వారికి ఇస్తున్నారు. వారినే, కేవలం వారినే జీవజలం మరియు జీవవృక్షం నుండి త్రాగి భుజించమని ఆహ్వానిస్తున్నారు.

ఆర్మీనియన్ బోధకులు సందర్భరహితంగా వచనాలు తీసుకుని బైబిలు అనాధారిత భావాలను బలపరచుకుంటారని ఈ నాలుగు ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి.

వారు సొంత అభిప్రాయాలతో ప్రారంభించి వారు ఆనుకున్నదే వాస్తవాలని చెప్పటానికి, వాటిని బలపరచటానికి ఆయా వచనాలను వెతుకుతారు. కానీ బైబిలు సొంతఅర్థము చెప్పేవారి భావానికి లొంగదు. మనము ప్రత్యక్షపరచబడిన వాక్యం ఎదుట సాగిలపడి అది వాస్తవానికి ఏమి చెప్పదలచుకుందో దానిని గ్రహించి అంగీకరించినట్లయితే సత్యం బయలుపడుతుంది.

చివరకు మన దైవశాస్త్రం, స్పష్టమైన లేఖనాల ప్రకటనతో విభేదించినట్లయితే మనము పొరబడినట్లే. దీనిని గుర్తెరిగినప్పుడు మనము తప్పక మారాలి. పవిత్ర లేఖనం యొక్క ప్రతి మాట దానిదాని స్థానంలో సరిగా కూర్చునేంత వరకూ మనం మన దైవశాస్త్రాన్ని సవరించుకోవాలి మరియు రూపుదిద్దుకోవాలి. మారని దేవుని వాక్యం మనకై మారదు గనుక మనమే మారాలి. 

 

ముగింపు

మనము తార్కికంగా, లేఖనాధారంగా ఒక మూలకు నెట్టబడ్డాము. ఈ దిగువ వ్యాఖ్యలు పరస్పరవిరుద్ధములు గనుక రెంటిలో ఏదో ఒకటి సరైనది కావాలి.

1) క్రీస్తు ఎవరికొరకైతే మరణించాడో వారి పాపరుణాన్ని సంపూర్ణంగా చెల్లించి వారిని వాస్తవానికి విమోచించి, నీతిమంతులుగా చేసి పరిపూర్ణులుగా మార్చాడు.

2) రక్షణను సుసాధ్యం చేస్తూ క్రీస్తు పాపభారాన్ని తొలగించాడు. గానీ ఆయన వాస్తవానికి ఎవరి రక్షణను కూడా సంపూర్ణంగా సిద్ధింపజేయలేదు. తమ వ్యక్తిగత విశ్వాసం, తీర్మానం మరియు చిత్తం యొక్క క్రియల ద్వారా ఎవరి విమోచనం వారే కార్యసాధకం చేసుకోవాలి.

మొదటి వ్యాఖ్య సరియైనదైతే, ఏ బేధము లేకుండా క్రీస్తు ప్రతి వ్యక్తికొరకై మరణించలేదు. ఆయన ఎన్నుకోబడిన వారికొరకు మాత్రమే మరణించాడు.

రెండవ వ్యాఖ్య సరియైనదైతే, ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత నిర్ణయం క్రీస్తు ప్రాయశ్చిత్త కార్యాన్ని సఫలం చేయటంలో లేదా కార్యసాధకం చేయటంలో నిర్ణయాత్మకమైన అంశం.

మొదటి వ్యాఖ్య సత్యమని బైబిలు ప్రకటిస్తుంది. ఇది బైబిలులోని వివరాల ద్వారా స్పష్టం చేయబడటం మాత్రమే గాక, అతి గంభీరమైన క్రైస్తవసత్యాలతో అది పొందిక కలిగుంది. ఉదాహరణకు, సమస్తమూ దేవుని మహిమ మరియు ఘనత కొరకే జరుగుతుందని మనకు తెలుసు. సమస్త విషయాలలో ఆయన కుమారునికి ప్రాధాన్యత ఇవ్వబడటమే దేవుని అంతిమ ధ్యేయం.

“ఆయన కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆది సంభూతుడై యున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు, భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని అదృశ్యమైనవిగాని అవి సింహాసనములైననూ ప్రధానులైననూ అధికారములైననూ సర్వమును ఆయనయందు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాధాన్యత కలుగు నిమిత్తము ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆది సంభూతుడాయెను. ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, ఆయన సిలువరక్తము చేత సంధిచేసి, ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవియైనను పరలోకమందున్నవియైననూ, వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను” (కొలొసీ. 1:14-20).

మన విమోచనాక్రయధనాన్ని చెల్లించి, పాపబానిసత్వపు సంత నుండి మనలను కొని, దేవుని నీతి ప్రమాణాల ఎదుట మనలను నీతిమంతులుగా తీర్చి, సదాకాలం పరిపూర్ణులనుగా చేసిన దేవుని అద్వితీయ కుమారుని మరణం, ఖచ్చితంగా సువార్తకు లోబడక మెడవంచక, తిరుగుబాటు చేసినవారిని, దేవుని ద్వేషించి, ఆధ్యాత్మికంగా మరణించిన పాపులను అతిశయింపజేయటానికి ఉద్దేశింపబడిందనీ ఎన్నడూ భావించకూడదు. అన్నీ ఆయన కుమారుని మహిమపరచటానికే ఉన్నాయి. ఆ ఖచ్చిత ప్రాధాన్యతను మరెవరితోనైనా ఆయన పంచుకుంటాడని లేఖనాలలో ఎక్కడా చెప్పబడలేదు.

ఇప్పుడు, 'విమోచన ఎన్నుకొనబడినవారికే' అనే లేఖనాధార రక్షణశాస్త్రాన్ని ముగించుకున్నాక తరువాత ప్రశ్న ఏమిటంటే, ఒక వ్యక్తి ఈ రక్షణను ఎదిరించగలడా? ధిక్కరించగలడా?

అభేద్యమైన కృపా సిద్ధాంతంలో ఈ కీలకమైన ప్రశ్నను పరిగణిద్దాము. 

నాల్గవ అధ్యాయం

అబేధ్యమైన కృప  

భూమికి పునాదులు వేయబడక ముందే, పతనమై నశించిపోతున్న మానవాళి రక్షణ కొరకు దేవుడు కొందరు వ్యక్తులను ఎన్నుకున్నాడు. యేసు, దేవుని ఉగ్రతను భరించి, ఆయన ప్రాణాధారమైన రక్తాన్ని చిందించి, ఆ ఎన్నుకోబడ్డవారిని విమోచించి, కొని, వారి పక్షంగా దేవుని న్యాయాన్ని సంతృప్తిపరిచాడు. అయినా సరే దేవుని నిర్మలమైన పరిశుద్ధ సన్నిధిలో అపవిత్రమైనదేదీ కూడా నిలవలేదు. కనుక ఈ విమోచించబడ్డ పాపులు పరలోక మహిమను చూడకముందే వారి యొక్క ప్రవర్తన, స్వభావంలో మార్పు రావాలి. కానీ అలాంటి పరివర్తనకు ఖచ్చితమైన ఓ అద్భుతం జరగాలి!

పాపాత్ములైన మనుష్యులను పునరుజ్జీవింపచేయటం, వారిని నూతనంగా సృష్టించటం, వారికి నూతన హృదయాన్ని ఇవ్వటం, వారి చిత్తాలను, కోరికలను మార్చి, వారిని పశ్చాత్తాపంలోకి నడిపించటం మొదలైనవి ఈ సిద్ధాంతంలో ప్రాముఖ్యమైన అంశాలు. ఇలాంటి పునర్జన్మను నిరాకరించే సామర్థ్యం మానవుడు కలిగున్నాడా? అన్న ప్రశ్న మన ప్రస్తుత వివాదాంశం. కొంతమంది వేదాంతులు 'అజేయమైన కృప' అన్న పదాన్ని ప్రయోగిస్తుంటారు. కృప కేవలం వశపరచుకుంటుంది కాని, ఎన్నడూ వశపరచుకోబడదు అని అది సూచిస్తుంది. అభేద్యమైన కృప అన్న పదానికి 'మనుష్యుడు నిరాకరించలేని దేవుని కృప' అని అర్థం. ఈ రెండు పదాలు ఒకే భావాన్ని తేలియజేస్తాయి. దేవుడు సర్వశక్తిమంతుడు, మనుష్యుడు బొత్తిగా శక్తిహీనుడు. 

ఒకటవ అధ్యాయంలో మనం చూసిన విధంగా మానవులు పాపులు. ఈ పాప స్థితిని మన పితరుడైన ఆదాము నుండి మనం స్వతంత్రించుకున్నాం. ప్రారంభంలో ఆదాము దేవుని పోలిక మరియు రూపంలో సృష్టించబడ్డాడు. ఆయన భౌతిక జీవనం  కొనసాగుతూ, రోగం లేదా కృశింపు అనేది లేకుండా ఉండేది. దేవునితో సంభాషణ, సహవాసం అతని ఆధ్యాత్మిక జీవితంగా ఉండేది. అయితే అతను తిరగబడి, పాపంలో పడ్డ తర్వాత, అతని ఆధ్యాత్మిక జీవితం వెంటనే తిరగబడింది. అతను ఆధ్యాత్మికంగా మృతుడని దేవుడు సెలవిచ్చాడు. అతడు దేవుని నుండి వేరు చేయబడ్డాడు, సిగ్గునొంది భయపడ్డాడు. అదే సమయంలో అతని భౌతిక దేహం, చివరికి చనిపోయేంత వరకు పాపంలో క్రమేపీ కృశించటం ప్రారంభించింది. ఆదాము అతిక్రమం మానవ జాతియంతటికీ అనగా పారంపర్యరీత్యా, తరం వెంబడి తరానికి సంక్రమించింది. కాని, మరియగర్భం ధరిస్తుందని ప్రభువు దూత ప్రకటించినప్పుడు తన కన్యత్వాన్ని బట్టి అలాంటిది అసంభవమని ఆమె ఆశ్చర్యంతో స్పందించింది.

“అందుకు మరియ - నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్దుడై దేవుని కుమారుడనబడును” (లూకా 1:34,35).

మానవ జాతి యొక్క పాపపు పారంపర్యంలో యేసు పాల్గోలేదు. ఆయన రక్తపు స్వభావాన్ని ఆయన తండ్రి నిర్ణయించాడు. అది నిర్మలమైన, ప్రశస్తమైన దేవుని స్వరక్తమైయుండి నిష్కళంకమైందిగా, పవిత్రమైందిగానూ ఉంది . క్రీస్తు ఆ ప్రశస్తరక్తాన్ని చిందించినప్పుడు అది తగిన వెలగా, దేవునికి అంగీకారయోగ్యంగా ఉంది కనుక ఎన్నుకోబడ్డ పరిశుద్ధులు పాపఋణం నుండి విడిపించబడి నిత్యదండన నుండి తప్పించబడి, క్రీస్తుతో సహవారసత్వం మరియు పరలోక వాగ్దానం పొందుకున్నారు ((రోమా 8:17).

అయితే, క్రీస్తు పాపపరిణామాలన్నిటినీ భరించి, తన ప్రజల కోసం పాపాన్ని ఓడించినప్పటికీ మనమింకా భూసంబంధమైన జీవితం జీవిస్తూ, మానవదేహాలలో పుడుతూ మన పాపపుభావనల చేత హరించివేయబడుతున్నాం. కాబట్టి మనం దేవునిరాజ్యంలో ప్రవేశించడానికి మన అంతరంగ స్వభావంలో మార్పు రావడం చాలా అవసరం. కానీ మానవులకు ఓ తీవ్ర సమస్య ఉంది. చెడువృక్షాలు మంచి ఫలాలు కాయడం అసాధ్యమని క్రీస్తు భోదించాడు (మత్తయి 7:16-20). చెడు వృక్షాలు మంచి ఫలాలు కాయ లంటే ఆ వృక్షాలు మంచిగా చేయబడాలి. దీనికి ఓ అద్భుతం అవసరం. అభేద్యమైన కృప అనే సిద్ధాంతం నిర్దిష్టంగా దేవుడు తన జనులలో జరిగించే ఈ అద్భుత రూపాంతరంతో వ్యవహరిస్తుంది. ఈ మార్పు ప్రపంచంలో ఉన్నవారందరిలో జరగదు‌ కానీ, గొర్రెపిల్ల జీవగ్రంథంలో మన పేర్లను నమోదు చేసిన ఆ ఎన్నిక నియమమే మనం పరిశుద్ధాత్మను పొందుకుని తద్వారా మన సృష్టికర్తను చేరుకునే పయనాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది. 

త్రిత్వం 

మానవుల రక్షణ విషయంలో పరిశుద్ద త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తుల పాత్ర ఉంటుంది.

1) జగత్తు పునాది వేయబడక ముందే తండ్రి కొంతమందిని ఎన్నుకున్నాడు.

2) కుమారుడు వారి విమోచనను కొని, వారు పొందవలసిన శిక్షను తానే అనుభవించాడు.

3) పరిశుద్దాత్ముడు, ఇలా ఎన్నిక చేయబడి, విమోచింపబడ్డ ప్రజలను దేవుని చెంతకు ఆకర్షించి వారి హృదయాలను, మనస్సులను మార్చి, నాశనానికి నడిపించే పాపపు దాస్యానికి బదులుగా వారిని నిత్యజీవానికి నడిపిస్తాడు. క్రీస్తునందలి స్వాతంత్రం అంగీకరించేలా వారిని ఒప్పిస్తాడు.

క్రీస్తు ప్రాయశ్చిత్తకార్యంలో క్షమ, విమోచన, పాపులు నీతిమంతులుగా తీర్చబడటం మొదలైనవి ఉన్నాయని విశ్వసించటం ఎంతో సత్యం మరియు అత్యవసరమైనప్పటికీ ఇది ఆయన నిర్వహించిన కార్యంలో సగభాగం మాత్రమే . ఇందుకు అదనంగా ఆయన వారికి స్వాస్థ్యం కలగచేసి పరిశుద్ధాత్ముడు వారిలో నివసించడానికి మార్గం సిద్దపరిచాడు.

“అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను; నేను వెళ్ళి పోవుటవలన మీకు ప్రయోజనము, నేను వెళ్ళనియెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళినయెడల ఆయనను మీ యొద్దకు పంపుదును” (యోహాను 16:7).

“నేను తండ్రిని వేడుకొందును, ఎల్లప్పుడు మీ యొద్దనుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. లోకము ఆయనను చూడదు. ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్ములను అనాధలనుగా విడువను మీయొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు” (యోహాను 14:16-18).

ఇక్కడ యేసు ఎన్నో ముఖ్యమైన సంగతులను ప్రస్తావించాడు. దైవత్వంలోని త్రిత్వంలో ఉద్దేశసంబంధమైన ఐక్యతను ఎలా ప్రదర్శించాడో మొదట గమనించండి.

1) పరిశుద్ధాత్ముని పంపమని యేసు తండ్రిని వేడుకున్నాడు.

2) పరిశుద్ధాత్ముని గుణం క్రీస్తు గుణంలాగే ఉంటుంది - "వేరొక ఆదరణకర్త”

3) ఆదరణకర్త ఎన్నుకోబడ్డవారితో శాశ్వతకాలం నివసిస్తాడు కానీ దేవుడు ఎవరిని ఎన్నుకోలేదో, క్రీస్తు ఎవరికొరకైతే మరణించలేదో వారు సత్యస్వరూపియగు ఆత్మను పొందుకోరు.

4) కాని “మీరు” ఆయనను ఎరుగుదురు. ఎందుకు? ఎందుకంటే పరిశుద్ధాత్ముడు విమోచింపబడ్డవారిలో శాశ్వతంగా నివసిస్తాడు.

5) “మిమ్మును అనాధలుగా విడువను నేను మీయొద్దకు వత్తును” అని యేసు మరోసారి చెప్పాడు. ఎలాగైతే తండ్రి కుమారులు ఏకమైయున్నారో అలాగే పరిశుద్ధాత్ముడు మరియు క్రీస్తు ఒకటైయున్నారు. అయినప్పటికీ ఎవరికి వారు విలక్షణమైన వ్యక్తులు, ఎవరికి వారు ప్రత్యేక పాత్రలు, గుణలక్షణాలు కూడా కలిగియున్నారు.

పరిశుద్ధాత్మను ఎవరు పొందుకుంటారు, ఎవరు పొందుకోరు అనే విషయాన్ని నిర్ణయించేది క్రీస్తే అని గమనించటం చాలా ప్రాముఖ్యం. ఎలాగైతే లోకం పొందుకోలేదని క్రీస్తు నిర్ణయించాడో, అదేవిధంగా ఎవరు పొందుకుంటారు అనేది కూడా ఆయనే నిర్ణయించాడు. ఎలాగైతే ఇవ్వబడని జన్మదిన కానుకను మనం పొందలేమో, అలాగే దేవుడు ప్రత్యేకంగా దయగల వరంగా పరిశుద్ధాత్మను అనుగ్రహించితేనే తప్ప ఆయన్ను పొందలేము.

ఆదరణకర్త అంటే గ్రీకులో 'పారక్లిటోస్', దీనికి 'సహాయకుడ'ని అర్థం. సహాయం చేసే సామర్థ్యంగా ఈ పదం క్రియావిశేషంగా గ్రీకులో ప్రాథమికంగా వాడబడింది. దాన్ని న్యాయస్థానంలో చట్టసంబంధ సహాయకుడు, ఉత్తరవాది లేదా దోషి తరుపున వాదించే న్యాయవాదిగా అర్థం చేసుకోవచ్చు. గనుక ఎన్నుకోబడ్డ పాపులకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడి, పరలోక న్యాయస్థానంలో వారి పక్షంగా వాదిస్తాడు, వారి భూసంబంధ యాత్రలో వారితో నడుస్తాడు.

దైవిక త్రిత్వంలో ఒక వ్యక్తి మనలో నివసించడం, 'రూపాంతరం' అనే అద్భుత ప్రక్రియకు ప్రారంభం. ఏ శక్తైతే క్రీస్తును మృతుల్లో నుండి లేపిందో అదే శక్తి, గతంలో మృతులైయున్న పాపుల్లో ఇప్పుడు నివసిస్తుంది. ఆయన నూతన జీవానికై ఎలా లేపబడ్డాడో, అలాగే పరిశుద్ధాత్మ తనలో నివసిస్తున్న వ్యక్తి కూడా ఆధ్యాత్మిక మరణం నుండి నిత్యజీవానికి లేపబడతాడు. ఇది మన భౌతిక మరియు ఆధ్యాత్మిక విమోచనను పరిపూర్ణం చేస్తుంది.

ఆదాము సృష్టించబడ్డప్పుడు 'ఆధ్యాత్మిక జీవుని'గా ఉన్నాడు గాని అతను తిరుగుబాటు చేసిన తక్షణమే మృతుడయ్యాడు. దానికి సరిగ్గా వ్యతిరేకమైన విధానంలో ఎన్నుకోబడ్డ పాపులు, 'ఆధ్యాత్మికంగా మృతులై పుట్టి పరిశుద్ధాత్మ తిరిగి జన్మింపజేసిన వెంటనే ఆత్మ సంబంధమైన జీవాన్ని పొందుకుంటారు.

అదే విధంగా, ఆదాము భౌతిక పరిపూర్ణుడుగా సృష్టించబడ్డాడు, కానీ అతని పాపం అతని భౌతిక కృశింపును, చివరికి మరణాన్ని తెచ్చిపెట్టింది. దానికి సరిగ్గా వ్యతిరేకమైన విధానంలో, పాపులు కృశించే శరీరంతో జన్మిస్తున్నారు. మన మరణం వరకూ అనారోగ్యం మరియు వ్యాధులు జీవితాన్ని కబళించి వేస్తాయి. కానీ, ఏ దేవుని ఆత్మైతే మనలను మన ఆధ్యాత్మిక మృతతుల్యత నుండి లేపాడో అదే దేవుని ఆత్మ మన మర్త్య శరీరానికి పునరుత్థానమందు అమర్త్యతను ధరింపచేస్తాడు. ఈ ప్రక్రియను సంపూర్ణం చేసేలా, ప్రారంభంలో ఎలాగైతే ఆదాముకు ఆ జీవవృక్షం అందుబాటులో ఉందో అలాగే విమోచింపబడ్డవారు కూడా ఆ జీవవృక్షానికి హక్కుదారులుగా చేయబడతారు.((ప్రకటన 2:7; 22:3,4). 

సార్థకమైన పిలుపు 

దేవునికి ప్రతినిధిగా పనిచేస్తూ, మన ప్రభువుతో సమాధానపడే విధంగా పరిశుద్ధాత్ముడు మనలను ఆహ్వానిస్తాడు. కాని అది ఓ నిస్సహాయ బిక్షకుడి అర్థనలాంటిది కాదు. అది అధికారికమైన, ప్రభావవంతమైన, సార్థకమైన పిలుపు. అది నిత్యత్వపు ప్రణాళిక ఆధారంగా శాశ్వతమైన ప్రేమతో పిలిచే పిలుపు. దేవుడు పిలిచినప్పుడు, ఆయన ప్రజలు తప్పక ఇష్టపూర్వకంగా ఆయన అనంతశక్తి మరియు మార్పు చేయలేని నిర్ణయాలను బట్టి స్పందిస్తారు.

“శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను” (యిర్మీయా. 31:3)

“నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనేగాని ఎవడును నా యొద్దకు రాలేడు; అంత్య దినమున నేను వానిని లేపుదును” (యోహాను 6:44)

“అతనికి ద్వారపాలకుడు తలుపుతీస్తాడు; గొఱ్ఱెలు అతని స్వరము వింటాయి, అతడు తన సొంత గొఱ్ఱెలనన్నిటినీ వెలుపలికి నడిపించేప్పుడల్లా వాటికి ముందుగా నడుస్తాడు; గొట్టెలు అతని స్వర మెరుగును గనుక అవి అతనిని వెంబడించును” (యోహాను 10:3-4). దేవుడు వ్యక్తిగత దేవుడు. ఆయన తన ప్రజలను పేరుపెట్టి పిలుస్తాడు. ఆయన వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాసాడు.  వారి జీవితాల్లో వారు ఆయన స్వరాన్ని ఎప్పుడు విని గుర్తించి స్పందించాలో ఆయన ముందుగానే నిర్ణయించాడు. 

వాస్తవానికి ఏ పేరుతోనైతే విశ్వాసుల సమాజం పిలువబడుతున్నదో ఆ పేరు కూడా ఇదే సత్యాన్ని సూచిస్తుంది. “సంఘము” (చర్చ్) అనే పదం గ్రీకులో 'ఎక్లేషియా'గా పేర్కోబడింది. ఈ గ్రీకు పదం రెండుపదాల కలయిక. 

'ఎక్' అనేదానికి బయటికని, మరియు 'క్లిషియా' అనే పదానికి పిలుపు అని అర్థం. సంఘమంటే బయటకు పిలువబడ్డవారి సమూహం. వారు లోకం‌ నుండి బయటకు పిలువబడ్డవారు. ఆదిమంగా చూస్తే “ఏక్లిషియా” అనే పదం ప్రాచీన గ్రీకుల రాజకీయ ఊరేగింపులను మరియు ప్రసంగాలను సూచించేవి. ఒక వ్యక్తికెవరైనా శ్రోతలు కావల్సి వస్తే, ఆయన పట్టణం గుండా వెళ్లి ఫలానా స్థలంలో, సమయంలో ఆయన ప్రసంగం వినడానికి రమ్మని ఆయా ప్రజలను ఆహ్వానించేవాడు. అది ఆ సమావేశంలో పాల్గొనడానికి ఆహ్వానమిచ్చే సాధారణ పిలుపు. దీనికి భిన్నంగా యెషయా-మెస్సీయాను గూర్చి దేవుని పక్షాన ఇలా చెబుతున్నాడు.

“ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు” (యెషయా 42:1,2) దేవుడు సంఘాన్ని మూకుమ్మడిగా పిలువలేదు. ఆయన ఆయా వ్యక్తులను, వ్యక్తిగతంగా క్రీస్తు శరీరంలో భాగంగా ఉండేలా పిలిచాడు. పరిశుద్ధాత్ముని ద్వారా వచ్చే దేవుని పిలుపు తన గొఱ్ఱెల కొరకై ప్రధానకాపరి పిలుపు. ఎవరో ఒకరు స్పందిస్తారేమో అని వీధిలో పిలిచే పిలుపు లేదా సాధారణ పిలుపు కాదది.

దేవుని యొక్క వ్యక్తిగతమైన ప్రత్యేక పిలుపు లేఖనాలన్నిటిలో పదే పదే కనిపిస్తుంది.

1) దేవుడు తోటలో నడుస్తుండగా, ఆదామును పేరుపెట్టి పిలిచాడు. పతనమైన మొదటి మానవుడు మొదట పిలువబడ్డాడు ((ఆది. 3:8,9).

2) దేవుడు బాలుడైన సమూయేలును మూడుసార్లు పిలిచాడు. ఆ పిలుపు ప్రభువుదని ఏలీ గ్రహించాడు (1 సమూ. 3:4-10).

3) మోషే ఐగుప్తు నుండి అరణ్యానికి పారిపోయినప్పుడు అక్కడ దేవుడు మండుతున్న పొదలో నుండి మోషే, మోషే అని అతన్ని పిలిచాడు (నిర్గ.3:4).

4) యాకోబుతో దేవుని దూత పెనుగులాడిన తరువాత "ఇక నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలని పిలువబడతావు. నీవు దేవునితోనూ మనుష్యులతోను పోరాడి గెలిచితివని" చెప్పెను (ఆది. 32:28)

5) దేవుడు తార్సువాడైన సౌలును ఎదుర్కున్నప్పుడు, “సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావని......” పలికాడు (అపొ.కా. 9:4).

6) మృతుడైన లాజరును సమాధి నుండి లేపినప్పుడు, యేసు “లాజరూ, బయటకు రమ్మని పిలిచెను” (యోహాను 11:43).

దేవుడు ఆయా వ్యక్తులను పిలిచినప్పుడు వారు అజ్ఞానంలో, ధిక్కారంలో లేదా పూర్తి పతన స్థితిలో ఉన్నారు. అయినా కాపరి గొర్రెలను పిలిచినట్లు లేదా తండ్రి తన బిడ్డలను పిలిచినట్లు దేవుడు వారిని పిలిచాడు. ఆయన వారిని కనుగొన్న స్థితిలో వారిక ఉండలేరు. ఒక వ్యక్తిని మార్చటమే దేవునిపిలుపు యొక్క ముఖ్యఉద్దేశం. సర్వశక్తిమంతుడైన దేవుడు తన ఉద్దేశం నెరవేర్చుకోవడానికి సమర్థుడు.

పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో నివసించేటప్పుడు ఆయన ద్వారా ఆ వ్యక్తి ప్రభావితం చేయబడకుండా ఉండడం అసాధ్యం. క్రొత్త నిబంధనలో పరిశుద్దాత్ముని శక్తిని గురించి మాట్లాడినప్పుడు, 'డునామిస్' (బలమైన పేలుడు పదార్థము) అనే పదం ప్రయోగించబడింది. బలమైన ఒక పేలుడు పదార్థానికి 'డైనమైట్' అనే పేరు ఈ పదం నుండే పెట్టబడింది. ఎవరైనా డైనమైట్ ను వెలిగించి దానిపై కూర్చుని ఏ చలనం లేకుండా ఉండగలరా? అలాగే పరిశుద్ధాత్మ శక్తి పొందిన వ్యక్తి కూడా ఏ చలనం లేకుండా ఉండటం అసాధ్యం. 

మారుమనస్సు 

పరిశుద్ధాత్ముడు చేసే రెండవ కార్యం, ఒక వ్యక్తికి తన పాపస్థితిని తెలియచేసి దేవుని యెదుట అతనికి మారుమనస్సు కలగచేయడం.

“క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలోనుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సు పశ్చాత్తాపము పాపక్షమాపణయు ప్రకటించబడుననియు వ్రాయబడియున్నది (లూకా 24:46,47).

క్రీస్తు యొక్క మరణం మరియు పునరుత్థానం వలన సార్థకం చేయబడ్డ ఈ రెండు విషయాలను శిష్యులు ప్రకటించాల్సి ఉంది:

1) యేసు నామాన మారుమనస్సు 2) యేసు నామాన పాపక్షమాపణ

“పాప క్షమాపణ” దేవుని కృపావరమని, కేవలం దేవుడే దానిని సాధ్యపరచగలడని మనుష్యులను ఒప్పింపచేయడం కష్టమైన పని కాదు. కాని మారుమనస్సు కూడా ఆయన మరణపునరుత్థానాల ఫలితమేనని పై వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పశ్చాత్తాప కార్యం కూడా దేవుడే స్వయంగా జరిగించే కృపాకార్యం.

మారుమనస్సు అంటే 180° డిగ్రీలు తిరగటం(లేదా) 'ఒకదాని నుండి మరొకదానివైపు మరలటం'. మనం మన నుండి మరియు మన సహజ స్వభావాల నుండి దేవుని వైపు తిరగటం. మనల్ని మనం ఉపేక్షించుకుని దేవుని వైపు తిరగటం. దేవుడు న్యాయవంతుడని , ఆయన కృపలేని యెడల మనం దోషులుగా ఖండించబడి ఉండేవారిమని మనం గ్రహిస్తాము. అయితే శరీర సంబంధులైనవారికి పశ్చాత్తాపపడి తమ పాపస్థితి నుండి మరలాల్సిన అవసరత ఏ మాత్రం కనిపించదు, ఎందుకంటే తమ పాపస్థితిని గుర్తెరగని అంధులై అహంతో తమ స్వీయసామర్థ్యాన్ని ఆశ్రయిస్తూ తమను తాము దుష్టులుగా వారెన్నడూ చూడలేదు.

“ఒకని నడతలన్నియు వాని దృష్టికి నిర్దోషముగా కనబడును, యెహోవా ఆత్మలను పరిశోధించును” (సామెతలు 16:2).

“తమ దృష్టికి తాము శుద్దులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు” (సామెతలు 30:12).

“ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెట్టితనముగానున్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు” (1 కొరింథీ. 2:14).

అయినా, పాపియైన మానవుడు తన సొంత మార్గాలను విడిచిపెట్టి 'దేవుని నీతిని మరియు ఆయన రాజ్యాన్ని వెదకాలని' పరిశుద్దుడును నీతిమంతుడునైన దేవుని ప్రమాణాలు కోరుతున్నాయి (మత్తయి 6:33). కనుక ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, ప్రకృతి సంబంధియైన మానవుడు, తన స్వీయచిత్తాన్ని, బుద్ధిని అభ్యసించి పశ్చాత్తాపం పొందాలన్న ఈ పరిశుద్ధ ఆజ్ఞను గ్రహించి దాన్ని జరిగించగలడా? జరిగించలేడు. మానవుడు మారుమనస్సు పొందేలా చేసేవాడు దేవుడే.

“...దేవుడొకవేళ ఎదురాడు వారికి మారుమనస్సు దయచేయును; సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై.....అట్టివారిని సాత్వికముతో శిక్షించును” (1 తిమోతి 2:25).

“లేదా, దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా?” (రోమా 2:4).

అయితే, దుఃఖమే మారుమనస్సు అని తరచూ మనం పొరపడుతుంటాం. కాని దుష్క్రియల విషయమై దుఃఖపడటం మరియు దుష్టత్వం నుండి యథార్థంగా వెనుదిరగటం ఒక్కటి కావు. సాధారణంగా, ఒక వ్యక్తి పాపాలు బట్టబయలు చేయబడ్డప్పుడు అతడు నిజంగానైనా లేదా పైపైకైనా దుఃఖం వ్యక్తపరుస్తాడు. కానీ,  అతనిది మారుమనస్సు ఐతే యథార్థ మార్పు విషయమై కట్టుబాటును, ఆశను కలిగి ఉంటుంది. దేవుడు కొన్నిసార్లు మన పాపాల విషయమై మన హృదయాలను బద్దలు చేస్తాడు, అయితే ఆ దుఃఖం మారుమనస్సు కాదు. నిజంగా చూస్తే, దుఃఖం మారుమనస్సుకి దారి తీస్తుంది.

“మీరు దుఃఖపడితిరని సంతోషించుటలేదు గాని మీరు దుఃఖపడి మారుమనస్సు పొందితిరని యిప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై, దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సు కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును” (2 కొరింథీ. 7:9,10).

ఇలాంటి మార్పు ఒక వ్యక్తిలో కలిగించటం దేవుని కార్యం. బలవంతం చేసి, బోధించి, ఒత్తిడి చేసి ప్రలోభపెట్టి లేదా భయపెట్టి ఒకనిలో ఈ మారుమనస్సును పుట్టించలేము. తిరిగి జన్మించని ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మను స్వీకరించు అని బలవంతం చేయడం ఎంత మూర్ఖంగా ఉంటుందో అలాగే తన పాపస్థితి నుండి మరలే సామర్థ్యం లేని (లేదా) కనీసం తాను పాపినని గ్రహించలేని ఒక ప్రకృతిసంబంధియైన వ్యక్తిని మారుమనస్సు పొందమని ఒత్తిడి చేయడం కూడా అంతే మూర్ఖంగా ఉంటుంది. అవును, అతడు తప్పక మారుమనస్సు పొందాలి; కానీ అలా చేయలేడు. ఆ కార్యాన్ని దేవుడు మాత్రమే జరిగించే సమర్థుడు.

“నీవు పైనుండి జన్మించాలి”

యోహాను 3వ అధ్యాయంలో యేసు, పరిసయ్యుడైన నీకోదేముతో సంభాషించాడు. యేసు అతనిని ఇలా హెచ్చరించాడు...

“... ఒకడు క్రొత్తగా జన్మించితేనేగాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” (యోహాను 3:30).

దీనికి నికోదేము స్పందించి . . .

“ముసలివాడైన మనుష్యుడు ఏలాగు తిరిగి జన్మించలడు? రెండవ సారి తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించకలడా?'' అని ప్రశ్నించాడు. యేసు అతన్ని సరిదిద్దుతూ తానిక్కడ దగ్గరగా పోలివున్న రెండు వేర్వేరు జన్మలను గురించి ప్రస్తావిస్తున్నాడని సెలవిచ్చాడు.

“....ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించిన ఆత్మయునైయున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు” (యోహాను 3:5-7). ఎలాగైతే చెడ్డవృక్షం మంచి ఫలాలు ఇవ్వదో, అదే విధంగా శరీర మూలముగా ఆత్మ సంబంధమైన పునర్జన్మ సాధ్యపడదు. స్త్రీ పురుషుల కలయిక ద్వారా శరీర సంతానమే కలుగుతుంది. దీనినే నీటి మూలంగా జన్మించటం అని యేసు పిలిచాడు. 

కాని శరీరమూలంగా పుట్టిన శిశువు తన తల్లిదండ్రుల్లానే దోషియై, పాపిగా పుట్టాడు. భౌతికజన్మ పరలోక ప్రవేశానికి ఏ హామీ ఇవ్వదు. ఖచ్చితంగా దానికి రెండవ జన్మ అవసరం. అంటే “ఆత్మ మూలంగా జన్మించటం.”

వాస్తవానికి 'తిరిగి జన్మించటం' అనే మాటలో 'తిరిగి' అనే పదానికి గ్రీకు భాషలో 'అనాధేన్' అనే పదాన్ని ప్రయోగించారు. దీనికి 'పైనుండి' అని అర్థం. కనుక నికోదేమును 'పైనుండి' లేదా 'పరము నుండి' జన్మించాలని క్రీస్తు హెచ్చరించాడు. శరీర మూలముగా ఆత్మ సంబంధమైన పునర్జన్మ సాధ్యపడదు. కేవలం ఆత్మ మూలంగానే ఆత్మ సంబంధమైన పునర్జన్మ సాధ్యపడుతుంది.

“తన్ను ఎందరంగీకరించిరో వారందరికి, అనగా తన నామమునందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవునివలన పుట్టినవారే గానీ, రక్తము వలననైననూ శరీరేచ్చలవలననైననూ మానుషేచ్చలవలననైననూ పుట్టినవారు కారు” (యోహాను 1:12,13).

క్రీస్తును అంగీకరించి ఆయన నామమందు నమ్మకముంచేలా కొందరికి సామర్థ్యం అనుగ్రహింపబడింది. వారికి మాత్రమే “దేవుని పిల్లలవ్వడానికి” అధికారమివ్వబడింది. “ఆయన నామమందు విశ్వసించినవారికి” లేదా ఆయనను స్వీకరించేవారికి దేవుని పిల్లలయ్యే అధికారం తమ నిర్ణయానికి ప్రతిఫలంగా లేదా ప్రతిస్పందనగా ఇవ్వబడిందని యోహాను 1:12,13 వాక్యానికి పెడార్థం చెప్పే ఓ విధానం వాడుకలో ఉంది. అలా వారు నొక్కి చెబుతారు. కానీ, అది రక్తమువలనైంది, వంశ పారంపర్యమైంది కాదని చెప్పటం ద్వారా యోహాను అట్టి అభిప్రాయాన్ని ఖచ్చితంగా నిర్వీర్యం చేసాడు. అది ఏ శరీరసంబంధమైన గుణాల వలన కలిగింది కాదు. మంచి క్రియలు లేదా ధర్మశాస్త్ర ఆచరణ, ఈ నూతనజన్మను తెచ్చిపెట్టలేవు. మరెవరి వత్తిడి వల్లా అది జరగదు. 'నేను తిరిగి జన్మిస్తాను' లేదా ‘నూతన జన్మను స్వీకరిస్తాననీ' ఎవరూ ఎప్పుడూ నిర్ణయించనూ లేదు.

అయితే ఇక మిగిలిందేంటి? ఇంతటి మహాకృపాకార్యంలో ప్రేరకమైందేంటి? దీనికి జవాబుగా అది దేవుని వల్లే కలుగుతుందని యోహాను చెబుతున్నాడు. రక్షణకార్యాన్ని ప్రారంభించేది దేవుడే. క్రీస్తుసంతతిలోనికి కలిగే నూతనజన్మ కేవలం దేవుడు జరిగిస్తేనే సంభవిస్తుంది. దాని పుట్టించటానికి గాని, నిర్ణయించటానికి గాని మానవులకు సామర్థ్యం లేదు. మానవుని కలుషితరక్తం, పాపశరీరం మరియు మోసపూరితమైన చిత్తం ఆధ్యాత్మిక మేలుకొలుపును ఎప్పుడూ వెదకవు, వెదకలేవు. మానవప్రయత్నాలు దాన్ని ఉత్పత్తి చేయలేవు. కనుక ఒక వ్యక్తి నూతనంగా జన్మించటం దేవుని నిర్ణయం. రక్షించబడిన లేదా రక్షించబడని ఏ శరీరియు పరిశుద్ధాత్మయొక్క కదలికను నియంత్రించలేడు.

“గాలి తనకిష్టమైన చోటును విసరును. నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడనుండి వచ్చునో ఎక్కడికీ పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగేయున్నాడనెను” (యోహాను 3:8).

ఎలాగైతే గాలి తనకిష్టమైన చోటకు వీచునో అలాగునే పరిశుద్ధాత్ముడు తన చిత్తానుసారంగా సంచరిస్తూ తాను ఎన్నుకున్నవారికి నూతన జన్మను ప్రసాదిస్తాడు. వారు ఆయన దాటే శబ్దం వింటారు; అంతేగాని ఆయన రాకడను కాని పోకడను గాని ఎవరు నియంత్రించలేరు. నిరాక్షేపంగా ఈ నూతన జన్మ మరియు ఆధ్యాత్మిక మేలుకొలుపు పరలోక ప్రవేశానికి అత్యవసరం. అయినా అది సర్వాధికారియైన దేవుని అభీష్టం చొప్పున మాత్రమే జరుగుతుంది.

తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తన కిష్టము వచ్చినవారిని బ్రతికించును” (యోహాను 5:21).

“మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్దాత్మ మనకు నూతనస్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను” (తీతు 3:5).

ప్రభువు, పరిశుద్ధాత్మ వలన కలిగే నూతనజన్మను శిశువు జన్మతో సాదృశ్యపరిచింది అనాలోచితంగా కాదు. ఒక స్త్రీ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తన జన్మ విషయాన్ని ఎన్నుకోడానికి ఆ బిడ్డకు ఎలాంటి అవకాశం ఉండదు. జనన సమయం వచ్చినపుడు బిడ్డను తల్లి సంప్రదించదు. శిశువులు తమ జన్మను నిర్ణయించరు; వారి జనన సమయాన్ని గానీ, ఏ తల్లిదండ్రులకు పుట్టాలి అని గాని వారు నిర్ణయించలేరు. ఏకశరీరులుగా చేయబడిన ఓ ఇరువురి కలయిక ఫలితంగా వారు జన్మిస్తారు.

పురుషుడు తన బీజాన్ని స్త్రీలో విత్తినప్పుడు, అది ఒక సరికొత్త మానవునికి జన్మనిస్తుంది. ఇవన్ని ఆత్మ సంబంధమైన జన్మకు భూసంబంధమైన పోలికలు. క్రీస్తు తన సంతానాన్ని కలుగచెయ్యడానికి సిలువలో శ్రమపడ్డాడు (అపొ.కా. 17:28). ఒక వ్యక్తి తన నూతనజన్మ విషయాన్ని ఎన్నుకోడానికి ఎలాంటి అవకాశం ఉండదు.

నూతన జనన సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని సంప్రదించడు. మనం నూతన జన్మ యొక్క సమయం, స్థలం, పరిస్థితులు, చివరకు పరలోక తండ్రియైన దేవున్ని సహితం ఎన్నుకోము. కాని పరలోకపు తండ్రి మనలో పరిశుద్ధాత్మ అనే బీజాన్ని వేసినప్పుడు, మనం క్రీస్తుతో ఏకశరీరమవుతాం, ఈ కలయికే 'క్రైస్తవుడు' అనే ఒక సరికొత్త వ్యక్తికి జన్మనిస్తుంది.

"కాగా ఎవడైననూ క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను; ఇవిగో కొత్తవాయెను” (2 కొరింథీ. 5:17). 

విశ్వాసం 

పరిశుద్దాత్మ కార్యం వలన తిరిగి జన్మించినవారిలో తప్పనిసరిగా కలిగే చివరి ఫలితం 'విశ్వాసం'. 

క్రీస్తును విశ్వసించి, తండ్రిని నమ్మి, పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరించే సామర్థ్యం ఆ వ్యక్తికి ఓ వరంగా అనుగ్రహించబడుతుంది. ఈ సామర్థ్యం 'విశ్వాసం' అని పిలవబడుతుంది.

'విశ్వాసాన్ని' గ్రీకులో 'పిస్టిస్' అని అంటారు. ఇది నామవాచకం. అయితే ఇంగ్లీషు భాషలో విశ్వాసానికి క్రియాపదం లేదు కాబట్టి వివరణాత్మక సమస్య తలెత్తింది. అందుకని గ్రీకు క్రియాపదమైన 'పిస్టియో'ను కూడా బైబిలులో ‘విశ్వాసం - నమ్మిక' అని అనువదించారు. 'పిస్టిస్' లేదా విశ్వాసం, దేవుడు లేదా క్రీస్తు లేదా ఏదైన ఆత్మ సంబంధమైన సంగతులను వినడం ద్వారా ధృడమైన ఒప్పింపు కలిగి, విశ్వాసముంచడాన్ని సూచిస్తుంది. అయితే 'విశ్వసించు'(బిలీవ్) అనే ఇంగ్లీషు పదం విస్తార నిర్వచననాలను ఇస్తుంది. 'ఉనికిలోఉన్న దాన్ని నమ్మటం' అనే భావంలో 'విశ్వాసం' అనే పదం వాడబడింది. దేవుని గూర్చిన సిద్ధాంతాన్ని గ్రహించకుండా నామకార్థంగా అనేకులు దేవున్ని విశ్వసిస్తారు.

విశ్వాసం అనే పదాన్ని వివిధ అర్థాలతో వాడుతుంటాం. నేను ఈ పరీక్షలో ఉత్తీర్ణుడవుతానని విశ్వసిస్తున్నాను (లేదా) ఏదైనా ఒక అశ్చర్యకర సందర్భంలో 'ఆహా! అది ఎంత నమ్మలేనట్లు ఉందని' అంటుంటాము.

ఆధునిక భావనల్లో విశ్వాసమంటే చివరికి ఏది తోస్తే దాన్ని నమ్మే హక్కు ఉందనే అదోరకమైన ధోరణి కనిపిస్తుంది. అది ఎంత విడ్డూరంగా ఉన్నా - 'ఎవరి నమ్మిక వారిదేనండి' అని అంటుంటారు. కాని అలాంటి నాసిరకపు నిర్వచనాలను బైబిలు ఒప్పుకోదు. 'విశ్వాసం', 'నమ్మటం' అనే ఈ రెండు పదాలు 'పిస్టిస్' ,'పిస్టియో' అనే గ్రీకు పదాల నుండి వచ్చాయి. 'దేవుడున్నాడు' అని మాత్రమే కాకుండా, తన కుమారుని గురించి లేఖనాలలో ప్రత్యక్షపరచబడినదంతా దృఢంగా విశ్వసించడం, దేవునితో సరైన సంబంధం కలిగుండటానికి ఖచ్చితంగా అవసరం. ఇలాంటి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడిగా ఉండటం అసాధ్యం.

బైబిలు ఆధారిత క్రైస్తవ్యాన్ని విమర్శించే అనేకులు 'అయినా నేను దేవున్ని విశ్వసిస్తున్నాను కదా?' అనే ప్రకటనలో తలదాచుకోడానికి ప్రయత్నిస్తారు. కానీ, ఊరికే దేవుడున్నాడని విశ్వసిస్తే నిత్యరక్షణ హామీగా ఇవ్వబడుతుంది అనే నమ్మకం వ్యర్థమని యాకోబు హెచ్చరించాడు.

“దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగు నమ్ముట మంచిదే; దయ్యములును నమ్మి వణకుచున్నవి” (యాకోబు. 2:19).

యథార్థమైన విశ్వాసం, ఎక్కడో ఒకచోట దేవుడు ఉండే ఉండాలని మనస్సులో ఒప్పుకోవడంకంటే ఎంతో అతీతమైంది. నరకంలో ప్రతి దయ్యం అదే నమ్మి వణకుతుంది. 'పిస్టిస్' అనే పదంలో సూచించబడ్డ విశ్వాసంలో ఇంకా ఎంతో ఇమిడి ఉంది. తన కుమారున్ని మన స్థానంలో పంపిన ప్రేమగల, కృపగల దేవునిచేత మన నిత్యగమ్యమంతా నిర్ణయించబడిందని విశ్వాసం నమ్ముతుంది. తత్ఫలితంగా విశ్వాసమనేది వ్యక్తిగత గొప్పతనం, ధర్మం లేదా నీతిక్రియల మీద ఆధారపడదు కానీ నీతిగల విమోచకుని పై సంపూర్ణంగా ఆధారపడుతుంది. దేవుడు మనకు భద్రత మరియు పరిపూర్ణతను అనుగ్రహిస్తాడని విశ్వాసం నమ్ముతుంది.

మరొక విధంగా చెప్పాలంటే, ఒక కుర్చీని చూస్తూ, ఆ కుర్చీ మనకు సురక్షితంగా ఆధారం కలగజేస్తుందో లేదో నిర్ణయించటం చాలా తేలిక. అది మానసిక అంచనా. కానీ అది విశ్వాసం కాదు విశ్వాసం అనేది కుర్చీలో కూర్చోవటం. దేని మీదైతే మనం నమ్మకముంచామో దానిపై మన భారం మోపటం మొదలైనవి కోరుతుంది. విశ్వాసం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కుని ఎంత కష్టమైనా లేదా ఎంత అసాధ్యమైనా దేవుని వాక్యంపై నిలుస్తుంది. విశ్వాసం దేవుని ప్రతి ప్రకటనను జీవితపు పరిస్థితుల కంటే ఎక్కువగా పరిగణిస్తుంది. “యెహోవా ఈ విధంగా సెలవిచ్చుచున్నాడు” అనే ప్రకటనలపై మనం ఆధారపడేలా  చేస్తుంది. కానీ, పరిశుద్ధాత్ముని ప్రమేయం లేకపోతే ఒకడు ఎప్పుడూ ఇలాంటి ఒప్పింపుకు, నమ్మకానికి, విశ్వాసానికి రాలేడు. విశ్వాసమనేది పూర్తిగా దేవుని కృపావరం; అది మన బుద్ధికి సంబంధించిన తీర్మానం కాదు. దాన్ని బలవంతంగా రుద్దలేము. దాన్ని వెంబడించి, ఎన్నుకుని, వాడుకునేలా, కార్యసాధకం చేసుకునేలా మనుష్యులను బలవంతం చేయలేము. దేవుడు పూర్తిగా మనుష్యులలో నాటితేనే విశ్వాసం కలుగుతుంది.

“నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును” (యోహాను 6:44).

“మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు. ఇది మీవలన కలిగినది కాదు. దేవుని వరమే. అది క్రియలవలన కలిగినది కాదు. గనుక ఎవడును అతిశయపడ వీలులేదు” (ఎఫెసీ. 2:8,9).

మన రక్షణ కేవలం దేవుని కృపాకార్యం. అది మనపై దేవుని కారుణ్యం. అది విశ్వాసం ద్వారా కలుగుతుంది. ఆ విశ్వాసం సహితం మనవల్ల కలిగింది కాదు, అది దేవుని వరమే. క్రియల ద్వారా మనం రక్షింపబడము లేదా విశ్వాసాన్ని పొందలేము. ఎన్నుకోవడం, నిర్ణయించటం, స్వీకరించటం, ఒక తీర్మానం చేయడంతో సహా అన్ని కృపాకార్యాలే. అలా కాకపోతే మన స్వంతరక్షణ గురించి మనం అతిశయిస్తాము. కానీ దేవుడు ఎవరితోను తన మహిమను పంచుకోడు. (హెబ్రీ 12:2)."

క్రీస్తు మన విశ్వాసానికి కర్తయైతే, ఆయనే దాన్ని ప్రారంభించాడనేది స్పష్టం. ఆయన మన విశ్వాసాన్ని కొనసాగించేవాడైతే ఆయనే దాన్ని సంపూర్ణం చేస్తాడు. ఇందుకు ఆదనంగా ఏమి జత చేసే అవకాశం లేదు. కింగ్ జేమ్స్ అనువాదంలో హెబ్రీ 12:2ను చదివితే, 'మన' అనే పదాన్ని అనువాదకులు జతచేసారు. అందుకే కొన్ని ప్రతుల్లో ఈ పదానికి ఇటాలిక్సు ఉపయోగించారు. క్రీస్తే విశ్వాసానికి కర్త, దాని కొనసాగించేవాడని గ్రీకు భాషలో స్పష్టం . భూవాసుల్లో కానీ, పరలోకవాసుల్లో కానీ, ఎక్కడ దేవుని విశ్వాసం కనిపించినా దానికి క్రీస్తే కారణభూతుడు.

పౌలు పరిశుద్ధాత్మ వరాల గురించి ప్రస్తావించినప్పుడు ఈ భావాన్ని స్పష్టంగా వ్యక్తపరిచాడు.

“ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్థుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను” (1 కొరింథీ 12:3).

పైగా విశ్వాసానికి అద్వితీయ మాదిరి క్రీస్తే. ఆయన తండ్రి నుండి యెడబాటు చేయబడి, దేవుని ఉగ్రతకు అర్హుడు కాకపోయినా దాన్ని భరించాడు.

“ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడనాడితివని అర్థము” (మత్తయి 27:46).

అయినా, ఆయన్ను మొత్తిన దేవుడు మృతుల్లోనుండి తనను లేపుతాడని మరియు అధిక మహిమకు చేర్చుతాడని ఆయన నమ్మి విశ్వసించాడు. ''అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి - తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను” (లూకా 23:46).

అది యథార్థమైన విశ్వాసానికి గొప్ప మాదిరి. క్రీస్తు విశ్వాసం తన పరిశుద్దుల విశ్వాసానికి మార్గాన్ని నిర్దేశించింది. అంతేకాదు, ఆయన మనలో విశ్వాసాన్ని నాటిన విధంగానే, అంతం వరకూ మన విశ్వాసాన్ని కాపాడగల శక్తిసామర్థ్యాలు ఆయనకున్నాయి. నిజంగా ఆయన విశ్వాసానికి కర్త మరియు కొనసాగించేవాడు. 

అబేధ్యమైన కృప 

కాబట్టి ఇప్పుడు వేదాంత వివాదం తలెత్తుతుంది. పాపాల్లో కూరుకుపోయి, తిరుగుబాటులో సంతోషిస్తున్న వ్యక్తి తన ఇష్టం చొప్పున ఈ దయగల కృపను ఎదిరించి తిరిగి జన్మించడాన్ని నిరాకరించగలడా? అది అసంభవమని బైబిలు సెలవిస్తుంది. అందుకే ఆర్మీనియన్ సిద్ధాంతం తప్పు అని నిరూపించటానికి 'అభేద్యమైన కృప' అనే పదాన్ని వాడతాం.

ఒకవేళ మానవుడు పరిశుద్ధాత్మను ఎదిరించే సామర్థ్యాన్ని కలిగుంటే, ప్రతి వ్యక్తి కూడా ఆయన్ను తప్పకుండా ఎదిరించేవాడు, కానీ అలా జరగటం లేదన్న వాస్తవమే పరిశుద్ధాత్ముని కృప అబేధ్యమని నిరూపిస్తుంది. "ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది" (రోమా 8:7). మానవుడు తాను ద్వేషించేదాన్ని ఎన్నడూ ఎన్నుకోడు. కనుక ఒక వ్యక్తిని తన స్వంతనిర్ణయానికి వదిలేస్తే అతనెప్పుడూ రక్షణ పొందుకోలేడు, పొందాలని కోరడు. నీతి మార్గాన్ని ఎన్నుకోడం అతని సహజస్వభావానికి విరుద్ధమైంది. కనుక అతనెప్పుడూ రక్షింపబడడు. అతని మార్గాలు అపాయకరమైనవనే మేలుకొలుపు కలగనిదే అతడెప్పుడూ పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరుగడు. కనుక 'యేసును నీ ప్రభువుగా, రక్షకునిగా చేసుకో' అని అర్థించటం ఆధునిక సువార్తీకరణలో ఎంత ప్రాచుర్యం సంతరించుకున్న విధానమైనప్పటికీ అది వ్యర్థమే. అంతే కాదు, మనం యేసుని ప్రభువుగా చేయటం వల్ల ఆయన ప్రభువు కాలేదు. ఆయన తానే ప్రభువైయున్నాడు. మనం ఆయనను రక్షకునిగా అంగీకరించటం వలన ఆయన రక్షకుడు కాలేదు. కానీ, ఆయనే మనలను రక్షిస్తాడు కాబట్టి రక్షకుడయ్యాడు. తిరిగి జన్మించని వ్యక్తులు ఎప్పుడైనా మనస్సు మార్చుకుని దేవుని వైపు మరలడానికి సమర్థులని నేడు ప్రాచుర్యంలో ఉన్న స్వేచ్ఛాచిత్త సిద్ధాంతం మరియు మానవకల్పిత తత్వశాస్త్రం అనేకులను తప్పుద్రోవ పట్టిస్తుంది. కానీ అది కేవలం దుర్భోధ అని యేసు మాటల్లో స్పష్టమౌవుతుంది.

“ఆయనయందు విశ్వాముంచు వానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి” (యోహాను 3:18,19).

విని విశ్వసించడానికి అవకాశం కలగకముందే యేసు ఇక్కడ విశ్వసించనివారిని తీర్పు తీర్చటం సమంజసమని గ్రహించడానికి, మనం ముందుగా దేవుని యొక్క సార్వభౌమ భవిష్యత్ జ్ఞానం మరియు ముందుగా నిర్ణయించడాన్ని గ్రహించాలి. వారెన్నడూ పశ్చాత్తాపపడరని ఆయనకు తెలుసు; వారెల్లప్పుడూ చెడ్డ మార్గాలను ప్రేమించి వెలుగును ద్వేషిస్తారు. ఆయన వారిని ఎన్నడూ మార్చడు కనుక వారెన్నడు మారరు.

మరోవైపు, దేవునిచేత ఏర్పరచబడి, క్రీస్తు మరణం ద్వారా కొనబడ్డవారు, దేవుని పిలుపుకు స్పందించి యేసును వెంబడించి, ఆయన పునరుత్థాన శక్తి ద్వారా నూతనజీవానికి లేపబడతారని బైబిల్ సెలవిస్తుంది.

“తండ్రి నాకు అనుగ్రహించు వారందరును నా యొద్దకు వత్తురు; నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను” (యోహాను 6:37).

“ద్వారమున ప్రవేశించువాడు గొఱ్ఱెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొఱ్ఱెలు అతని స్వరము వినును; అతడు తన సొంత గొఱ్ఱెలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొఱ్ఱెలన్నిటినీ వెలుపలికి నడిపించునప్పుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్దనుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వానితో అనెను” (యోహాను 10:2-5). 

'స్వేచ్ఛా చిత్త వాదన' 

ఈ సిద్ధాంతంతో ఏకీభవించనివారు తమ అసమ్మతిని సాధారణంగా ఇలా ప్రకటిస్తారు - 'మీరు ప్రస్తావించే ఈ సిద్ధాంతం మానవుని స్వేచ్ఛా చిత్తాన్ని వ్యతిరేకిస్తుంది కదా!'

ఔను, స్వేచ్ఛా చిత్తమనే ఈ అపోహను తప్పుగా నిరూపించడం అవసరమే. అసలు రక్షణ సందర్భంలో స్వేచ్ఛాచిత్తం అనే పదం కొత్త నిబంధనలో మనకెక్కడా కనిపించదు. ఇది కేవలం పాత నిబంధనలో మాత్రమే, అది కూడా కేవలం అర్పణలు ఇచ్చే సందర్భంలో మాత్రమే వాడబడింది. కానీ మానవులకు తమ గమ్యాన్ని ఎంచుకునే స్వేచ్ఛ గలదని సూచించేలా ఈ పదం ఎప్పుడూ వాడబడలేదు. వాస్తవానికి యేసు పలికిన ఈ క్రింది మాటల్లో మానవ స్వేచ్ఛాచిత్తమనే ఈ అపోహ అతి స్పష్టంగా వ్యతిరేకించబడిందని మనం చూస్తాం.

“మరియు మీలో ఎవడు చింతించుట వలన తన యెత్తును మూరెడెక్కువ చేసికొనగలడు? కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేతకాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేల?” (లూకా 12:25, 26).

ఒకడు తన పొడవును పెంచుకోలేకపోతే, చర్మపు రంగు మార్చుకోలేకపోతే, వెంట్రుకల పొడవును పెంచుకోలేకపోతే, వయస్సు పైబడటాన్ని ఆపుకోలేకపోతే, అధికజ్ఞానం కలిగియుండడానికి నిశ్చయించుకోలేకపోతే, అతని చిత్తం స్వేచ్ఛలేనిదే‌ ఔతుంది కదా! వాస్తవానికి మానవుని చిత్తానికి ఎన్నో పరిమితులున్నాయి. ఒకడు తన సొంత శక్తిచేత ఎగరాలనుకోవచ్చు కాని ఆ సామర్థ్యం లేదు కాబట్టి అలా చేయలేడు. ఒకడు ఇంగ్లాండు దేశానికి రాజు అవ్వాలనుకోవచ్చు గాని అతనికి వారసత్వం లేదు కాబట్టి అలా జరగదు. ఒకడు చాలా ధనవంతుడు అవ్వాలనుకోవచ్చు, మూడు నిమిషాలలో ఒక మైలు పరుగెత్తాలనుకోవచ్చు, లేదా అదృశ్యుడు అయిపోవాలనుకోవచ్చు లేదా సెలవుల్లో పరలోకాన్ని దర్శించాలని కోరుకోవచ్చు. కాని చివరికి తన ఇష్టానుసారంగా చేయటానికి శక్తి లేదు.

దైవశాస్త్రపరంగా మాట్లాడితే, మానవచిత్తానికి స్వభావసిద్ధంగా కేవలం ఒకే స్వేచ్ఛ ఉంది. అది పాపాన్ని ఎంచుకునే స్వేచ్ఛ. మన చిత్తాలు దేవుని ప్రీతిపరచాలని కోరలేని విధంగా పాపబంధాలచేత అవి పరిమితం చేయబడ్డాయి. మన చిత్తం కేవలం శరీరాశలను, కోర్కెలను నెరవేర్చుకోడానికి ఇష్టపడుతుంది. కానీ మంచిగా ఉండి, దేవునికి విధేయులైయుండి, తద్వారా ఆయన్ను ప్రీతిపరచి మనలను రక్షింపబద్దునిగా చేయ సామర్థ్యం మన చిత్తానికి లేదు.

అయితే ఆర్మీనియన్ల వాదన ఏమిటంటే, మానవులు స్వేచ్ఛా చిత్తాన్ని అభ్యసించగలిగితే, కొందరు వ్యక్తులు దేవునికి లోబడడానికీ మరియు రక్షించబడడానికి ఎన్నుకుంటారు. కాని ఈ ఉదాహరణ నుండి ఒక విషయం నేర్చుకుందాం.

క్రీస్తు కంటే ముందు జీవించినవారిలో ఆదాము అతి స్వేచ్ఛ కలిగిన చిత్తాన్ని కలిగియున్నాడు. అతి ప్రాముఖ్యంగా ఆయన పాపరహిత వాతవరణంలో జీవించాడు. కనుక ఆయన సహజ  కోరికలు దేవునికి అనుకూలంగా ఉన్నాయి. ఆదాము సంపూర్ణ స్వేచ్ఛపై దేవుడు పెట్టిన ఏకైక పరిమితి మంచిచెడుల తెలివినిచ్చే వృక్షాన్ని ముట్టవద్దని మాత్రమే. అంతటి పరిపూర్ణ వాతావరణంలో తన స్వేచ్ఛపై కేవలం ఏకైక పరిమితి కలిగియున్న ఆ పరిపూర్ణ మానవుడైన ఆదాము తిరుగుబాటు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇదిలా ఉండగా పాపం మరియు తిరుగుబాటునందు నశిస్తూ అనేక శోధనలచేత చుట్టుముట్టబడి, దేవుని పట్ల కోపం మరియు ద్వేషంగల లోకంలో జీవిస్తున్న మానవులు, తమ స్వేచ్ఛా చిత్తాన్ని అభ్యసించి తమ నడవడికి మరియు శరీరేచ్ఛలకు భిన్నంగా దేవున్ని వెంబడించాలని నిశ్చయించుకుంటారని మనమెలా ఊహించాలి?

మనం పాపాల్లోనూ, అతిక్రమాల్లోనూ మరణించామని పరిశుద్ధగ్రంథం సెలవిస్తుంది (ఎఫెసీ. 2:1). అయితే మృతుడైన మనుష్యుడు తన చిత్తాన్ని ఎలా అభ్యసించగలడు? మృతుడైన లాజరు తాను సమాధి నుండి లేచేట్లు నిశ్చయించుకునే సామర్థ్యం కలిగున్నాడా? బేతెస్థ కోనేరు చెంతనున్న వ్యాధిగ్రస్తుడు తాను లేచి నడిచేలా తీర్మానించుకునే శక్తి కలిగున్నాడా? కుష్టువాడు తనను తాను శుద్ధి చేసుకునేట్లు తన చిత్తాన్ని అభ్యసించగలిగాడా? లేదు. వారలా చేయడానికి పూర్తిగా అసమర్థులు, వారి చిత్తాలు బొత్తిగా పరిమితమైనవి.

ఇప్పుడు మరొక చారిత్రాత్మక ఉదాహరణ నుండి కూడా దీన్ని ఆలోచిద్దాం. తార్సువాడైన పౌలు క్రైస్తవునిగా మారినప్పుడు తన చిత్తశక్తిని, నిర్ణయ స్వేచ్ఛను ఎంత ఉపయోగించాడు? కనీవినీ ఎరుగని రీతిలో ఎంతో ఘోరంగా అతడు ఆదిమ క్రైస్తవులను హింసించాడు. స్తెఫనును రాళ్లతో కొట్టి చంపడాన్ని అతడు సమ్మతించాడు. విశ్వసించిన యూదులు యెరూషలేము నుండి పారిపోవడానికి అతడే ముఖ్యకారణం, అతడు ఈ నూతన మతాన్ని స్వీకరించిన స్త్రీ పురుషులను బంధించి యెరూషలేముకు తీసుకురావాలని ప్రధాయాజకుని నుండి సిఫారసు పత్రాన్ని తీసుకుని స్వారీ చేస్తూ వెళ్తున్నాడు. అకస్మాత్తుగా ఆకాశం నుండి వెలుగు మొత్తగా తన గాడిద నుండి పడిపోయాడు. అతడు నేలపై పడగా యేసుస్వరం అతన్ని పిలిచింది. అంధుణ్ణి చేసి అటుపిమ్మట శిక్షణకై అరణ్యానికి తీసుకునివెళ్లింది.

ఆ మనుష్యుడు మనకు అపొస్తలుడైన పౌలుగా పరిచయమయ్యాడు. క్రొత్త నిబంధనలో మూడవవంతు గ్రంథాలు అతనే రాసాడు. అయితే ఆయన పత్రికల్లో తన మార్పును తనదైనట్లుగా ఎక్కడా చెప్పలేదు, అతిశయించనూ లేదు. దానికి విరుద్ధంగా, కృప మరియు ముందు నిర్ణయం విషయాల్లో పౌలు ఎక్కువగా మాట్లాడినట్లు మనం చూస్తాం.

యేసు, సీమోను పేతురు మరియు ఆయన సహోదరుడైన అంద్రియ సముద్రంలో వలవేస్తుండగా, నన్ను వెంబడించండి నేను మిమ్మును “మనుష్యులను” పట్టే జాలరులుగా చేస్తానని ఆయన చెప్పాడు. వారు ఆయన్ను వెంటనే వెంబడించారు (మత్తయి 4:19,20). అది ప్రభావవంతమైన పిలుపు. వారిని నిర్ణయించుకోండని కాని, ఎన్నుకోమని కాని, లేదా ఆయన్ను ప్రభువుగా, రక్షకునిగా చేసుకోమన్నట్లు కాని ఈ వాక్యభాగం చెప్పడంలేదు. ప్రతిగా, విశ్వానికి ప్రభువైనవాని శక్తివంతమైన ఆజ్ఞకు వారు ప్రతిస్పందించారు. ఆ పిలుపును ఎదిరించడానికి వారు శక్తిహీనులు. ఈ సిద్ధాంతంతో ఏకీభవించనివారి 'తరువాత వాదన' ఇలా ఉంటుంది. 

దేవుడు ఒక వ్యక్తి యొక్క చిత్తానికి వ్యతిరేకంగా బలవంతపెట్టి, అతను సమ్మతించకపోయినా అతన్ని పరలోకానికి ఈడ్చుకునిపోతాడని మీరు చెబుతున్నారా? కాదు, దేవుడు తన రక్షణ పిలుపును సార్థకం చేసే విధానం అది కాదు. మానవుని యొక్క చిత్తాన్ని, హృదయాన్ని మార్చి, ఆయన్ను అనుసరించే కోరికను అతనికి కలుగజేస్తాడు. దేవుడు మానవచిత్తంతో పోటీపడడు, దాన్ని ఓడించి లోబరచుకుంటాడు.

“నీవు నీ బలపరాక్రమాలు ప్రదర్శించే రోజున, నీ ప్రజలు ఇష్టపూర్వకంగా ముందుకు వస్తారు” (కీర్తన 110:3, వాడుక భాషలో)

“వారు నా కట్టడలను నా వీధులను అనుసరించి గైకొనునట్లు నేను వారి శరీరములోనుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి, వారికి ఏక మనస్సు కలుగజేసి వారియందు నూతన ఆత్మను పుట్టింతును. అప్పుడు వారు నాకు జనులైయుందురు నేను వారికి దేవుడనైయుందును” (యెహెజ్కేలు 11:19,20).

“ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదావారితోను చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయము మీద వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే నేను వారికి దేవుడనైయుందును వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడును - యెహోవాను గూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములు ఇక ఎన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు, ఇదే యెహోవా వాక్కు” (యిర్మీయా 31:33,34).

“ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే” (ఫిలిప్పీ. 2:13).

దేవుడు ఓ మానవుని చిత్తానికి వ్యతిరేకంగా పనిచేయడు. ప్రతిగా ఆయన వారిని తనవైపు ఆకర్షిస్తాడు. వారి హృదయాన్ని మరియు స్వభావాన్ని ఆయన చిత్తానుసారంగా మార్చుతాడు. ఎన్నుకోబడిన రక్తంచే కొనబడి పరిశుద్ధాత్ముని నివాసంగా చేయబడ్డ ఆ పరిశుద్దులు అతి ఇష్టపూర్వకంగా యేసును చేరుకుంటారు.‌ యేసు ఎలాగైతే తన ఆశలను మరియు చిత్తాన్ని తండ్రికి సమర్పించాడో, అదేవిధంగా మనం మనల్ని మన తండ్రి చిత్తానికి అప్పగించుకుంటాము.

“తండ్రీ, యీ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు) నీ చిత్తమైతే తొలగించుము అయినను నా యిష్టము కాదు, నీ చిత్తమే సిద్దించును గాక అని ప్రార్థించెను” (లూకా 22:42).

క్రీస్తు బలియాగం మనుష్యులను ధర్మశాస్త్ర బానిసత్వం నుండి విడిపించింది, మరియు “దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞలవలన మన మీద ఋణంగాను మనకు విరోధంగాను ఉన్న పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టాడు” (కొలొస్సీ. 2:14). ధర్మశాస్త్ర "శాపం”మనపై ఇక ఉండదు కనుక మనకేది ఇష్టం వస్తే అది చేయడానికి స్వతంత్రులుగా ఉన్నాం. కాని మనలో నివసించే పరిశుద్ధాత్మ మన ఆశలను మారుస్తాడు! ఆయన మన కోర్కెలను అనుసరించే స్వేచ్ఛ కలిగిస్తాడు. కాని మన కోర్కెలను పునఃరూపిస్తాడు. మనకిష్టం వచ్చినట్లుగా చేసే స్వతంత్రులుగా మనల్ని చేస్తాడు కానీ ఆయన్ను ఆనందింపచేయడయే మనకు అతి గొప్ప ఇష్టమయ్యేట్లు మన హృదయాలను మారుస్తాడు.

“అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గానీ నేను దేనిచేతను లోపరచుకొనబడనొల్లను” (1 కొరింథీ. 6:12).

క్రైస్తవ్యంలోని మహిమాన్వితమైన గొప్ప స్వాతంత్ర్యమందు మన అపరాధాలన్నీ తొలగించబడి ధర్మశాస్త్రం యొక్క శిక్షావిధి తీసివేయబడింది. అయితే అదే విధంగా మన దేవున్ని ప్రీతిపరిచేవాటిని మాత్రమే చేయాలన్న కోరిక కూడా మనలో ఉత్పన్నం చేయబడింది. మనం కీలుబొమ్మలవలె మన చిత్తంతో పని లేకుండా బలవంతంగా పరలోకానికి తీసుకునిపోబడం కానీ, మన సహజస్వభావాలకు వ్యతిరేకంగా మన రక్షకుని వెంబడించి ఆయనకు లోబడే ఆకాంక్షను మనం పొందాం. అందుకే మన రక్షణకు సంబంధించిన ప్రతిదీ మనకు కాక దేవునికే మహిమ తెస్తుంది. స్వేచ్ఛా చిత్తాన్ని సమర్థించే వాదనలు పైపైకి ఎంత ఆకర్షితంగా కనిపించినా, మనలోని అహాన్ని ఎంతగా ఆకట్టుకున్నా మనలో మనమే అతిశయపడడానికి తావిచ్చే ప్రవృత్తిని అవి కలిగిఉన్నా, వాటిని సమర్థించేదేదీ లేఖనాల్లో మనకు లేశమాత్రం కూడా కనిపించదు.

 

క్రీస్తు అధికారం 

యేసు భూమిపై నరావతారిగా నివసించినప్పుడు తన సృష్టియందు ప్రతిదానిపై తన అధికారాన్ని ప్రదర్శించాడు.

1. ఆయన జంతువుల స్వభావాలను మార్చాడు. ఉదాహరణకు ఎవరూ, ఎప్పుడూ కూర్చోని గాడిద పిల్లపై తాను ఎక్కినప్పుడు అది ఆయనకు లోబడింది (లూకా 19:30–35). 

2. ఆయన చేపలను వలలోకి దూకేలా చేసినప్పుడు వాటి స్వభావం మార్చాడు (యోహాను 21:6).

3. ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పుడు నీటి యొక్క స్వభావాన్ని మార్చాడు (యోహాను 2:1-11).

4. ఆయన కేవలం ఒక మాట చేత తుఫానును శాంతింపజేసినప్పుడు దాని స్వభావాన్ని మార్చాడు.

5. ఆయన కేవలం ఒక మాట చేత అంజూరపు చెట్టును ఎండిపోయేలా చేసినప్పుడు దాని స్వభావాన్ని మార్చాడు.

6. ఒకవేళ జన సమూహం ఆయన్ను స్తుతించటM మానేస్తే ఆ స్తుతి చెల్లించేలా ఆయన రాళ్ల యొక్క స్వభావాన్ని మార్చేవాడు. (లూకా 19:40).

ఆయన ఒక వ్యక్తి హృదయంలో పనిచేసేటప్పుడు కూడా అలాగే జరుగుతుంది. సర్వశక్తిమంతుడైన సృష్టికర్త మాట పలికినప్పుడు, ఆయన సృష్టం కేవలం దానికి తలొగ్గుతుంది. ఒక వ్యక్తి మార్పుపొందాలని ఆయన నిర్ణయిస్తే అందుకు నిరాకరించే శక్తి అతనికి లేదు.

మాటచేత సృష్టిని కలిగించి, సింహాసనాసీనుడై, ఆది నుండి కలుగబోవువాటిని ప్రకటించి, లేనివాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడు, ఆవిరి వంటి, ధూళియైపోయే, మానవుని చిత్తంచే పరిమితం చేయబడతాడు అననడం జ్ఞానయుక్తం కాదు. (మానవుడు తన శ్వాసపై అదుపు కలిగినట్టుగా ఉన్నాడు గానీ దేవుని అనుమతి లేకుండా మానవుడు కనీసం శ్వాస కూడా తీసుకోలేడు).

దేవుడు కొందరు వ్యక్తులను ఎన్నుకుని, క్రీస్తు వారి నిమిత్తం తండ్రి నుండి ఎడబాపబడేంతగా వేదన సహించిన తరువాత వారు తమ పాప, అజ్ఞానపూరితమైన, వ్యతిరేకమైన చిత్తానికి వదిలి వేయబడ్డారనడం దేవుణ్ణి శక్తిహీనునిగా, అవివేకిగా చిత్రీకరించడమే ఔతుంది.

ఒకని రక్షణను దేవుడు నిర్ణయిస్తే అతడు తప్పక రక్షింపబడతాడు. అతని అవినీతిని ఒప్పుకుని, రక్షకుని ఆవశ్యకతను అతడు గుర్తిస్తాడు. యోనా వలె “రక్షణ యెహోవాకు చెందునని” అతడు ప్రకటిస్తాడు (యోనా 2:9).

తండ్రి చిత్తానికి లోబడే కోరికను కలిగుండేలా అతడు దేవుని కుమారుని పోలికలో మరలా సృష్టింపబడతాడు. అతడు స్వనీతి అనే మురికి బట్టలను విడిచిపెట్టి తిరిగి జన్మించి శుభ్రమైన, స్వచ్ఛమైన క్రీస్తు నీతి వస్త్రాలను ధరిస్తాడు. సంపూర్ణం చేయబడ్డ క్రీస్తుకార్యమందు అతడు విశ్వసిస్తాడు మరియు తన భద్రతకు, నిత్యరక్షణకు ఆధారమైన ఆయన్ను పంపిన దేవునియందు నమ్మకముంచుతాడు.

పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన విధంగా మీ అందరి కొరకు నా నిరీక్షణ ఈ విధంగా ఉంది.

“మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలచిన పిలుపు వల్లనైన నిరీక్షణ యెట్టిదో పరిశుద్దులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి, విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించినట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి... పరలోకము నందు ఆయనను తన కుడి పార్వమున కూర్చుండబెట్టియున్నాడు” (ఎఫెసీ. 1:17-20).

మనం జ్ఞానాత్మను స్వీకరించి, ఆయన జ్ఞానప్రత్యక్షతను గ్రహించి, మన మనోనేత్రాలు వెలిగించబడి, ఆయన నిరీక్షణవల్లనైన పిలుపు ఎలాంటిదో తెలుసుకుంటాము గాక.

దేవుడు పిలుస్తాడు. మనం ఆయన కృపచే ప్రతిస్పందిస్తాము. ఆయన ముందుగా చేసిన నిర్ణయం, ఆయన సర్వాధికార ఎన్నిక, క్రీస్తు యొక్క సంపూర్ణ ప్రాయశ్చిత్తం మరియు పరిశుద్ధాత్ముని సార్థకమైన పిలుపును బట్టి మనకు పరలోక ప్రవేశం ఖచ్చితం చేయబడింది. రక్షణ సంబంధమైన ఈ అంశాలు ఎంతో ఖచ్చితమైనవి, ఎంతో బలమైనవి మరియు ఎంతో నమ్మదగినవి కనుక మనకు నిత్యజీవాన్ని అనుగ్రహిస్తున్నాయి. ఇది ఐదు కృపా సిద్ధాంతాలలో చివరిదైన 'పరిశుద్ధుల పదిలత' అనే సిద్ధాంతానికి మనల్ని నడిపిస్తుంది.

 

ఐదవ అధ్యాయం

పరిశుద్ధుల పదిలత


గత నాలుగు సిద్ధాంతాలు దైవశాస్త్రపరంగా ఆరోగ్యకరమైనవి మరియు లేఖనపరంగా సత్యమైనవైతే, ఈ ఐదవ సిద్ధాంతం కేవలం వాటి వలన తేలే ఫలితార్థం ఔతుంది.

1) 'సంపూర్ణ పతనం' అనే సిద్ధాంతం నిజమైతే మానవులంతా సహజంగా పాపాత్ములై, ఆధ్యాత్మికంగా మృతులై దేవుణ్ణి సంతోషపరిచేదేదీ చేయడానికి కాని తద్వారా వారిని రక్షింపబద్దునిగా ఆయన్ను చేయడానికి కానీ అసమర్థులైయున్నారు. కాబట్టి ఎవరైనా రక్షించబడాల్సి వస్తే పాపుల పక్షంగా దేవుడే కార్యం జరిగించాలి. నిస్సహాయ జీవులు దేవుని వెదకేటట్లు తమకు తామే లేవడం అసాధ్యం.

2) 'బేషరతు ఎన్నిక' అనే సిద్ధాంతం నిజమైతే, దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే ఒక నిర్దిష్ట జనసమూహాన్ని కేవలం తన ఉద్దేశం మరియు అభీష్టం చొప్పున తన కృపాకనికరాలను కనపరచడానికి ఏర్పరచుకున్నాడు. వారి పాపపు నాశనస్థితిని చూస్తే, ఆ వ్యక్తులలో మేలైనదేదీ ఆయన చూడలేదు. కనుక దేవుని బేషరతు ఎన్నిక ఎలాంటి షరతులు లేనిది.

3) 'పరిమిత ప్రాయశ్చిత్తం' అనే సిద్ధాంతం నిజమైతే, క్రీస్తు భూమికి వచ్చి దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలకు బదులుగా మరణించాడు. వారికి బదులుగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. క్రయధనం చెల్లించి వారి నిత్యపరిపూర్ణతను పదిలం చేశాడు. కానీ, క్రీస్తు బలియాగం మరియు జీవముకైన పునరుత్థానం, దేవుడు నిత్య జీవానికై ఎన్నుకున్నవారికి మాత్రమే పరిమితం. పాపాత్మక ప్రపంచం విశ్వాసంతో క్రీస్తును హత్తుకోదు; ఆయన ప్రాయశ్చిత్త కార్యం యొక్క మేలు పొందదు.

4) 'అబేధ్యమైన కృప' అనే సిద్ధాంతం నిజమైతే దేవునిచే ఎన్నుకోబడినవారందరిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తూ వారిని తండ్రి చెంతకు ఆకర్షిస్తూ, కుమారునియందు వారికి విశ్వాసము పుట్టిస్తాడు. ఏ దేవుని శక్తైతే మాట పలకగా విశ్వంలో వెలుగు కలిగిందో, అదే శక్తి అంధకారమైన ఆత్మల్లో వెలుగు కలిగించి, వారికి నూతన జన్మ కలిగించి, ఆత్మ సంబంధమైన ఇంద్రియాలను మేల్కొలిపి నిత్యజీవాన్ని దయచేస్తాడు. ఇలాంటి దేవుని శక్తి ఆయన సృష్టి ద్వారా ఓడించబడడం, నిర్లక్ష్యం చేయబడడం లేదా ధిక్కరించబడడం అసాధ్యం. దేవుడు ఎన్నుకున్న కడమ వ్యక్తి వరకు అందర్నీ యేసుక్రీస్తు తప్పక రక్షిస్తాడు.

ఇదంతా నిజమైతే, దేవుడు నిత్యజీవానికై ఎవర్నైతే బేషరతుగా ఎన్నుకున్నాడో వారంతా తప్పకుండా తండ్రి సన్నిధికి క్షేమంగా చేరుతారు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఖచ్చితంగా ఆయన ఉద్దేశాన్ని, ప్రణాళికను నెరవేరుస్తాడు. ఎలాగైతే ఒక వ్యక్తిలో ఉన్నదేదీ వాణ్ణి రక్షించడానికి దేవుణ్ణి బద్ధునిగా చేయలేదో అలాగే ఆ వ్యక్తిలో ఉన్నదేదీ అయన్ని తృణీకరించి నాశనానికి అప్పగించేలా దేవుణ్ణి పురిగొల్పదు.

ఒక పాపిని తిరిగి జన్మింపచేయడానికి ఎంత గొప్ప అద్భుతకార్యం జరగాలో, ఆ వ్యక్తి మరల తన పూర్వపు పతనస్థితికి దిగజారిపోవడానికి కూడా అంతే గొప్ప అద్భుత కార్యం జరగాలి.

అందుకే ఈ ముగింపు సిద్ధాంతం 'పరిశుద్దుల పదిలత' అని పిలవబడుతుంది. దేవునిచే ఎన్నుకోబడిన ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా మరియు నిశ్చయంగా, ముందుగా వారికై నిర్ణయించబడిన బహుమానం పొందుకుంటారని ఈ సిద్ధాంతం బోధిస్తుంది. పరిస్థితులు, అభ్యంతరాలు, శత్రువులు మరియు సుళువుగా చిక్కులబెట్టు పాపాలు మొదలైనవాటిని అధిగమించి, వారు తప్పకుండా తమ లక్ష్యాన్ని చేరుకుంటారు.

ఇక్కడ వివాదమంతా రక్షింపబడ్డవారు, యథార్థంగా తిరిగి జన్మించినవారు తమ విశ్వాసం నుండి తప్పిపోయి, తమ రక్షణను కోల్పోవడానికి అవకాశం ఉందనే ఆర్మీనియన్ల భావం చుట్టూ తిరుగుతుంది. ఈ వాదన తన జీవిత కాలంలో ఒక వ్యక్తి అనేకసార్లు రక్షించబడడానికి, ఆ రక్షణను కోల్పోవడానికి అవకాశం ఉందనే అపోహకు సహజంగా తావిస్తుంది.

అసమర్థులైన మానవులే తమ అంతిమ గమ్యానికి బాధ్యులని ఆర్మీనియన్ల వాదన. రక్షణకు చెందిన ప్రతి విషయంలోనూ, ప్రత్యేకంగా విశ్వాసుల భూసంబంధయాత్ర విషయంలోనూ వారి ఆత్మ యొక్క భద్రత విషయంలోనూ దేవుని సార్వభౌమాధికారమే కారణమని అంగీకరించడానికి బదులుగా ఆర్మీనియనులు రక్షించబడడానికే కాక రక్షణలో కొనసాగడానికి కూడా పాపభూయిష్టమైన మానవచిత్తమే నిర్ణయం తీసుకుంటుందని గట్టిగా వాదిస్తారు.

కానీ ముందుగా చెప్పబడ్డ విధంగా, మానవుల రక్షణ దేవుని పనైతే, ఆది నుండి సమస్తమూ సంకల్పించిన వాని కృప, కరుణ మరియు అభీష్టంపై అది ఆధారపడినట్లయితే, అలా రక్షింపబడిన వ్యక్తి తన స్వంత ఉపాయాల చేత నశించిపోయేలా దేవునిచేత విడిచిపెట్టబడటానికి తన నడవడిలో లేదా ప్రవృత్తిలో కలిగే మార్పు సమర్థవంతమైన కారణం కాలేదు. అలా జరగాలంటే మార్పు చెందని దేవునిచిత్తం, సంకల్పం మరియు శాశ్వత నిర్ణయంలోనే మార్పు జరగాలి.

దేవుని సంకల్పాల నిశ్చయత

దేవుని గుణలక్షణాలను వర్ణించడంలో దైవశాస్త్రవాదులు, 'మారనివాడనే' పదాన్ని వాడతారు. దానికర్థం 'దేవుడు మారలేనివాడు' . దేవుడు తన మనస్సు, దిశ, సంకల్పం మరియు ఆయన ఉద్దేశాలను మార్చుకోడు.

“యెహోవానైన నేను మార్పులేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు” (మలాకీ 3:6).

“యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు” (హెబ్రీ 13:8).

“దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా?” (సంఖ్యా. 23:19).

ఇది దేవుని ప్రధాన గుణలక్షణం మరియు స్వభావంగా ఉంది. ఆయనలో మరొక అంతర్గుణమేంటంటే ఆదియందు ఆయన చేయాలని ఉద్దేశించింది పరిపూర్ణమైంది కనుక, అది ఎప్పటికీ సవరించలేనిదై ఎన్నటికీ మెరుగుపరచలేనిదిగా ఉంది.". . . ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు” (యాకోబు 1:17)..

యోహాను తన సువార్త ప్రారంభంలోనే యేసుని పరిచయం చేసినప్పుడు ఆయనను “వాక్యము”(గ్రీకులో 'లోగోస్')గా సూచించాడు. అది దైవకుమారునికి అనుగ్రహించబడిన విశిష్టనామంగా, సృష్టించబడినదంతా ఉనికిలోని తెచ్చిన దైవత్వములోని “మాట్లాడే” వ్యక్తిగా ఆయన్ను ప్రకటిస్తుంది. క్రొత్త నిబంధనలో ఈ "లోగోస్” అనే పదం లేఖనాలను లిఖితపూర్వక దేవుని వాక్యంగాను మరియు యేసును దేవుని సజీవవాక్యంగాను సూచించడానికి అనేక పర్యాయాలు వాడబడింది.

ఎన్నుకోబడ్డవారికై ప్రత్యేక రక్షణ కార్యాన్ని సాధించడానికై దేవుడు తన కుమారుణ్ణి పంపినప్పుడు, ఆ కార్యసాఫల్యత విషయమై దేవుని తలంపుల్లో ఎటువంటి సంశయం తలెత్తలేదు. అది సర్వశక్తిమంతుడు, మార్పుచెందనివాడైన దేవుని ద్వారా ఆదేశించబడి బలపరచబడిన కార్యం. ఆయన పంపబడిన కార్యం సఫలం చేయకుండా యేసు తన తండ్రి దగ్గరకు తిరిగి వెళ్ళడు.

". . . అలాగే నా నోటనుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును” (యెషయా 55:10,11).

మనం దేవుని మౌఖికవాక్యం గురించి మాట్లాడినా, లిఖిత పూర్వక వాక్యం గురించి మాట్లాడినా లేదా శరీరధారియైన వాక్యం గురించి మాట్లాడినా, అవి ఒక ఉద్దేశంతో పంపబడ్డాయి. ఆ ఉద్దేశ నెరవేర్పులో అవి విఫలం కావు.
ఇదిలా ఉండగా దేవుడు తన కుమారుణ్ణి సమాధి నుండి లేపడని సందేహించే అవకాశం ఎప్పుడైనా ఎక్కడైనా ఉందా? క్రీస్తును తిరిగి లేపడంలో తండ్రి వైఫల్యం చెందే అవకాశం ఉందా? అలాంటి తలంపు ఎంత అసాధ్యమైందో కీర్తనాకారుడు ప్రవచించాడు.

“ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచి పెట్టవు, నీవు పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు” (కీర్తన 16:10).

దేవుడు తప్పకుండా ఆయన కుమారుని శరీరాన్ని లేపుతాడు. అదే విధంగా భూమి మీదున్న “క్రీస్తు సంఘమును” (సంఘము) పునరుత్థానపరచడంలో దేవుడు సఫలుడౌతాడనడంలో కొంచెమైనా సందేహం లేదు. దీనిగురించి యేసు మరియు పౌలు ఖచ్చితంగా చెప్పారు. ఎవరికొరకైతే యేసు మరణించాడో వారికి ప్రత్యేకంగా మరియు అజేయంగా నిత్యజీవం ఇవ్వబడింది.

“యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను - తండ్రీ, నా గడియవచ్చియున్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారందరికిని ఆయన నిత్య జీవము అనుగ్రహించునట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారమిచ్చితివి.” (యోహాను 17:1,2).

“అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదము. ఏలయనగా శత్రువులమైయుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడినవారమై, ఆయన జీవించుటచేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము” (రోమా 5:8-10).

ఇది దేవుని ప్రతిష్ట మరియు విశ్వాస్యతకు సవాలు.దేవుడు తన కుమారునికి ఒక ప్రజను స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేసి, దాన్ని నెరవేర్చడంలో విఫలమౌతాడా? తన కుమారునికి ఒక కన్యకను ప్రధానం చేసి వివాహం జరిపించడంలో వైఫల్యం చెందుతాడా? అంతేకాక ఇక్కడ క్రీస్తు స్వయంగా చేసిన వాగ్దానల స్థిరత్వం కూడా ఇరుకునపడుతుంది. నమ్మినవారికి యేసు నిత్యజీవాన్ని వాగ్దానం చేసి దాన్ని నేరవేర్చడంలో విఫలమౌతాడా? ఖచ్చితంగా అలా జరగదు.

రక్షణ వ్యవధి

క్రీస్తు వాస్తవంగా తన ప్రజల రక్షణను సిలువపై సఫలం చేసాడు. అయితే అది ఎలాంటి రక్షణ? అది ఎంతకాలం చెల్లుతుంది? అది మనగలుగుతుందా? లేదా దాని లక్ష్యాన్ని చేరడంలో అది విఫలమౌతుందా? బైబిల్ సిద్ధాంతాలలో ప్రాధానమైనది, ఖచ్చితమైనది “నిత్యజీవ”మనే అంశం.

“నిత్యజీవము అనుగ్రహింతుననునది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము” (1 యోహాను 2:25)

“ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందునిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైయున్నాడు” (హెబ్రీ 9:15).

“విశ్వసించినవాడే నిత్యజీవముగలవాడు” (యోహాను 6:47).

"నా మాటవిని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవముగలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములోనుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” (యోహాను 5:24).

యేసు కూడా “నిత్యజీవం” గురించి పదేపదే చెప్పాడు. “అందుకాయన- మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైననా మీరు ఈలాగు చేయలేదు కనుక నాకు చేయలేదని నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్యశిక్షకును నీతిమంతులు నిత్యజీవమునకును పోవుదురు” (మత్తయి 25:45-46).

“అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను” (యోహాను 3:15, 16).

“కాబట్టి యేసు - మీరు కూడా వెళ్ళి పోవలెననియున్నారా? అని పండ్రెండు మందిని అడుగగా సీమోను పేతురు ప్రభువా, యెవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవపు మాటలుగలవాడవు” (యోహాను 6:67,68).

“నా గొఱ్ఱలు నా స్వరమును వినును, నేను వాటినెరుగుదును, అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్యజీవమిచ్చుచున్నాను. గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు” (యోహాను 10:27,28)..

“యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లనెను - తండ్రీ, నా ఘడియ వచ్చియున్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారందరికిని ఆయన నిత్యజీవము అనుగ్రహించునట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారమిచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును యెరుగుటయే నిత్యజీవము” (యోహాను 17:1-3).

మనం 'శాశ్వత' మరియు 'నిత్యజీవమనే' పదాలను పరిగణించినప్పుడు, వాటిని దేవుని దృక్పథం నుండి చూడాలి. దేవుడు కాలమందు జీవించడు. లేదా దానిచేత పరిమితం కాడు. అంటే కాలానికి అతీతుడు. సమయమనేది దేవుని ఆవిష్కరణ, అది సృష్టికర్త ఆధీనంలో ఉంది. సమయానికి వెలుపల, దానికి అతీతంగా పనిచేస్తూ, ఆయన కుమారునిలో (వధింపబడిన గొఱ్ఱెపిల్లలో) తాను ఏర్పరచుకున్నవారి రక్షణ సాధించబడాలని ఆ దేవుడు ముందుగా నిర్ణయించాడు. ఆ ప్రాయశ్చిత్త కార్యం భూమికి పునాదులు వేయబడక ముందే నిర్ణయింపబడింది.

“పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్టుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువులచేత మీరు విమోచింపబడలేదు. గానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును, నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి రక్తము చేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలోనుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునియెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవునియందు ఉంచబడియున్నవి” (1 పేతురు 1:18-21).

“భూ నివాసులందరును, అనగా జగదుత్పత్తి మొదలుకొని వధించబడియున్నగొఱ్ఱెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో, వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు” (ప్రకటన 13:8).

నిత్యుడైన దేవుడు ఎవర్నైతే శాశ్వతంగా ప్రేమించాడో, అది వారి నిత్యరక్షణలో ప్రతిఫలించేలా శాశ్వతమైన ఆదేశం చేసాడు. వాటి స్వభావరీత్యా దేవుని ఆదేశాలు భవిష్యత్తు నిత్యత్వపు దిశగా పయనించడం మాత్రమే కాకుండా గత నిత్యత్వపు లోతుల్లోకి కూడా వేరుపారి ఉంటాయి. ఈ విధంగా క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త మరణఫలితాలు అంటే నిత్యజీవం మరియు నిత్యరక్షణ గత నిత్యత్వంలో నిర్ణయింపబడి నిత్యభవిష్యత్తు అంతటిలోనూ కూడా చెల్లుతుంది.

“దేవుడు చేయుపనులన్నియు శాశ్వతములని నేను తెలుసుకొంటిని; దానికేదియు చేర్చబడదు దాని నుండి ఏదియు తీయబడదు; మనుష్యులు తనయందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడిట్టి నియమము చేసియున్నాడు. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును. జరగబోవునది పూర్వమందు జరిగినదే; జరిగిపోయిన దానిని దేవుడు మరల రప్పించును” (ప్రసంగి 3:14,15).

ఏర్పరచబడ్డ విశ్వాసి పరలోకంలో ఎంత సుస్థిరంగా ఉంటాడో అంతే భద్రంగా ఈ భూసంబంధ జీవితంలో కూడా ఉంటాడు. వాస్తవానికి అతను మారుమనస్సు పొందడానికి ఎంతో కాలం ముందే అతని రక్షణ భద్రం చేయబడింది. అతని మారుమనస్సును ఉద్దేశించిన దేవుడు అతని జీవితపు పరిస్థితులను నియంత్రించి ప్రతి శ్వాసను, నాడిని తన అదుపులో ఉంచుకుంటాడు.

ఆయన నిర్ణయ సమయంలో ఆయన కృపాసంకల్పం చొప్పున ఏర్పరచబడిన వ్యక్తికి దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. కాని తన తల్లిగర్భంలో రూపించబడక ముందే ఆ వ్యక్తి యొక్క పరలోక గమ్యం అనే దేవుని నిత్య శాసనం జారీచేయబడి, భద్రం చేయబడింది.

నిత్యభద్రత అనేది ఒక వ్యక్తి చేసే తీర్మానంతో కానీ, విశ్వాసపు ఒప్పుకోలు, బాప్తిస్మం, పశ్చాత్తాపంతో కానీ ప్రారంభం కాదు. ఆదాము కూడా రూపించబడకముందే అది దేవుని మనస్సులో ప్రారంభమైంది. విశ్వాసి యొక్క జీవితసంఘటనలు అతన్ని ఈ వాస్తవం గ్రహించడానికి నడిపిస్తాయి.

“ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగునని మనమెరుగుదుము” (రోమా 8:28).

ఆర్మీనియన్ భావజాలం ప్రకారం రక్షణ అనేది మారుమనస్సుతో ప్రారంభమై నిత్యత్వంలోకి కొనసాగుతుంది. కాని అలాంటి రక్షణ 'పాక్షికమైనది' లేదా 'తాత్కాలిక' మైందే కానీ నిత్య రక్షణ కాదు. కోల్పోయే రక్షణ వాస్తవానికి “నిత్యరక్షణే' కాదు. మన రక్షణ పదిలత, మన చిత్తం, శరీరం మరియు తీర్మానశక్తి మొదలగు వాటిపై ఆధారపడదు. మన భద్రత, మార్పుచెందని దేవుని నిర్ణయాలతో స్థిరంగా బలపరచబడింది.

చివరి వ్యక్తి వరకూ

దేవుడు క్రీస్తులో ముందుగా నిర్ణయించిన రక్షణ శాశ్వతమైనదైతే, రక్షించాలని ఉద్దేశించి ఎన్నుకున్నవారిలో వాస్తవానికి ఎందరు రక్షించబడతారు? వారందరూ రక్షించబడతారు. ఏ గొఱ్ఱెల కోసమైతే యేసు తన రక్తాన్ని చిందించాడో వాటిలో ఒక్కదాన్ని కూడా ఆయన కోల్పోడు.

“మీకేమి తోచును? ఒక మనుష్యునికి నూరుగొఱ్ఱెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల తొంబది తొమ్మిదింటిని కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా? వారు దాని కనుగొనినయెడల తొంబదితొమ్మిదిగొఱ్ఱెలను గూర్చి సంతోషించునంతటి కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు” (మత్తయి 18:11-14).

ఆయన ఎన్నుకున్నవారి విశ్వాసం యేసు కాపాడతాడనడానికి తన రాజ్యాన్ని ఏలగలిగే దేవుని శక్తే హామీగా ఉంది. విమోచించబడ్డవారిలో కడమవ్యక్తి వరకూ పరిశుద్ధులందరిని క్రీస్తు మహిమలోకి తీసుకుని రాడనడం, దేవుడు తన సింహాసనం నుండి పడద్రోయబడతాడని అనడమే ఔతుంది. ఎన్నిక చేయబడ్డవారిలో ఏ ఒక్కరైనా పరలోక వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడంలో విఫలమైతే, “ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును” (హెబ్రీ 2:13) అనే క్రీస్తు స్వీయప్రకటన తన తండ్రి వద్దకు వ్యర్థంగా చేరుతుంది. కానీ, సర్వాధికారియైన ఆయన చిత్తము పటిష్టమైంది మరియు నిశ్చయమైంది. అది తప్పక అమలు చేయబడుతుంది, ఎందుకంటే ఎవరూ కూడా ఆయన నిర్ణయాన్ని త్రోసివేయలేరు.

“నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటినెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవమిచ్చుచున్నాను. గనుక అవి ఎన్నటికిని నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను” (యోహాను 10:27-30).

“ఆయన నాకనుగ్రహించిన దానీయంతటిలో నేనేమియు పోగొట్టుకొనక, అంత్యదినమున వానీ లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమైయున్నది” (యోహాను 6:39).

ఈలోకం నుండి పరలోకానికి వెళ్తూ, ఆయన ఎన్నుకున్నవారిని భద్రపరచమని గెత్సెమనెలో యేసు తన తండ్రిని వేడుకున్నాడు.

“నేను వారియొద్దనుండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని; నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేర్చునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు” (యోహాను 17:12).

తాను (యేసు) ఏర్పరచిన ప్రతివారినీ సురక్షితంగా మహిమలోకి తేస్తాడని నిస్సందేహంగా ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. "దారి తప్పిన” ఒకడి వల్ల తండ్రి చిత్తం మరియు స్పష్టమైన కుమారుని ఉద్దేశం శాశ్వతంగా భగ్నం చేయబడుతుందని మనం ఊహించాలా? అహంకారి మరియు మొండివాడైన ఒక వ్యక్తి పరలోకంలోని నిత్య నిర్ణయాలను పాడుచేసేంతగా తన అధికారాన్ని అభ్యసిస్తాడా? అలా కుదరదు.

సర్పసంతానం

“అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందుకు పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడినదానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నియు మన్ను తిందువు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును; నీవు దాని మడిమె మీద కొట్టుదువని చెప్పెను” (ఆది. 3:45.46).

సాతాను తలను నలుగగొట్టిన దేవుని ఏకైక సంతానం యేసుక్రీస్తు. కానీ ఆ ప్రకటన చేసిన ఆ క్షణం నుండి మానవజాతి అంతటినీ దేవుడు రెండు గుంపులుగా విభజించాడు.

1. దీవించబడిన వంశం - స్త్రీ సంతానం

2. శపించబడిన వంశం - సర్పసంతానం

ఎన్నుకోబడి, పరలోకానికై నిర్ణయించబడ్డ విశ్వాసులు ఆ దైవిక వంశక్రమానికి చెందినవారు. మినహాయించబడి తిరస్కరించబడ్డ మానవాళి శపించబడ్డ వంశక్రమానికి చెందుతారు. వాటి మధ్యలో అటూ ఇటూ కాకుండా మరో ప్రాంతమేమీ లేదు. ఇక్కడ ఒక విషయముంది. ఒక వ్యక్తి తన నిత్యస్వాస్థ్యాన్ని కోల్పోడానికి, ఆ దైవిక వంశంలో తనకున్న స్థానాన్ని అమ్మేసి దుష్టుని సంతతిగా మారాలి. ఇది కేవలం మేథోసంబంధ నిర్ణయం కంటే ఎంతో అతీతమైంది. రక్షించబడిన వ్యక్తి తప్పిపోడానికి అతని నిత్యస్వభావం మరియు గమ్యాలు పూర్తిగా వ్యతిరేకం అవ్వాలి. అలాంటి ఊహ కూడా అసాధ్యమని బైబిలు బోధిస్తుంది.

ఒక్కసారి పరిశుద్ధాత్మ ఓ వ్యక్తిలో నివాసం చేసాక దుష్టుని దుర్మార్గాల నుండి, సాతాను నుండి వారు ప్రభావవంతంగా భద్రపరచబడతారు.

“దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టువానీ ఇల్లుడు వాని ముట్టడు” (యోహాను 5:18).

పరిసయ్యులు యేసును ఎదుర్కుని, ఆయన బయెల్జిబూలు శక్తిచేత దయ్యాలను వెళ్ళగొడుతున్నాడని అన్నపుడు ఇద్దరు బలమైన వ్యక్తులు ఒకే ఇంట్లో నివాసం చేయలేరని యేసు వారితో చెప్పాడు. కాబట్టి ముందు సాతాను చేత నియంత్రించబడ్డ ఒక వ్యక్తి లోకి పరిశుద్ధాత్మ ప్రవేశించగానే ఆ దురాత్మ అతనిలోనుండి వెళ్ళగొట్టబడుతుంది. ఒకసారి పరిశుద్ధాత్మ దేవుని అత్యున్నతమైన శక్తి ఆ గృహాన్ని ఆవరించినప్పుడు అది ఇంకెన్నడూ నాశనానికి గురికాదు.

“ఒకడు మొదట బలవంతుని బంధింపని యెడల ఏలాగు ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించినయెడల వాని ఇల్లు దోచుకొనును” (మత్తయి 12:29).

“అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది. బలవంతుడు ఆయుధములు ధరించుకొని, తన ఆవరణమును కాచుకొనునప్పుడు, అతని సొత్తు భద్రముగానుండును. అయితే అతనికంటే బలవంతుడైన ఒకడు అతనిపైబడి జయించునప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములనన్నిటిని లాగుకొని అతని ఆస్తి పంచిపెట్టును” (లూకా 11:20-22).

“చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించియున్నారు” (1 యోహాను 4:4).

మన ప్రభువుయొక్క అత్యున్యతమైన శక్తికి విరోధంగా పోరాడడానికి దుష్టుడు శక్తిహీనుడని ఎరిగి, క్రీస్తుచేత వెలపెట్టి కొనబడ్డవాళ్ళని వాడేమీ చేయలేడని తెలిసి కూడా, ఒకడు తన ఇష్టపూర్వకంగా తన పరలోక స్థితిని నరకం కొరకు మార్చుకునేంతగా శోధించబడటం ఎలా సాధ్యం? పౌలు బోధించినదాని ప్రకారం, ఈ జీవిత శోధనలు క్రీస్తునందు మనకున్న ప్రేమబంధాన్ని మరియు రక్షణను పాడుచేయలేవు.

“సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును” (1 కొరింథీ. 10:13).

అబద్ద ప్రవక్తలు మరియు క్రీస్తు విరోధి సైతం, దేవుడే చుట్టూ కంచె వేసి, ఆవరించి కాపాడుతున్నవారిని ప్రభావితం చేయలేరు (యోబు. 1:10).

“అబద్దపు క్రీస్తులును అబద్ద ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు” (మత్తయి 24:24).

కానీ, అది సాధ్యం కాదు. ఎన్నిక చేయబడ్డవారిని, దేవుని హస్తం నుండి సాతానుశక్తులు లాగివేయలేవు. వారు శాశ్వతంగా భద్రపరచబడ్డారు. వాస్తవానికి, మన రక్షణ నుండి మనలను ఎడబాపడానికి పోరాడి విఫలమయ్యే అనేక ప్రభావాలు మరియు శక్తుల పూర్తి జాబితాను పౌలు మనకు తెలియజేశాడు.

“క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమయైనను, బాధయైనను, హింసయైనను కరువైనను, వస్త్రహీనతయైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడినది మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను” (రోమా 8:35,38,39).

పై వాక్య భాగంలో 'సృష్టించబడినది మరీ ఏదైనను' అనే పదంలో మనుష్యులు కూడా ఇమిడియున్నారు. తన సొంతరక్షణను కాపాడుకోడానికి, కోల్పోవడానికి బాధ్యత వహించాల్సిన వ్యక్తి కూడా ఇందులో ఉన్నాడు. మనం నిర్దోషులం మరియు నమ్మకమైనవారం కాబట్టి సురక్షితమని కాదు కానీ దేవుడు నిర్దోషి మరియు నమ్మదగినవాడు గనుక మనం సురక్షితంగా ఉంటాము.

“మనము నమ్మదగని వారమైనను, ఆయన నమ్మదగిన వాడుగానుండును; ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు” (1 తిమోతి 2:13).

వాదనలు

కొన్ని లేఖనభాగాల అసమగ్ర వివరణలతో సహా కొన్ని అనుభవాల ఆధారంగా ఈ సిద్ధాంతంపై అసమ్మతి వెలువడుతుంది. సంఘంలో నిరంతరం విశ్వాసులుగా కనిపించి బాహ్యంగా కనబడే స్పష్టమైన మారుమనస్సు యొక్క ఫలాలను కనపరచి, ఆ తరువాత దేవుని విషయమందు ఆసక్తి కోల్పోయి దారితొలగిపోయే అనేకులు మనకు కనిపిస్తుంటారు. ఇది రక్షణ కోల్పోవడమని అనేకులు భావిస్తుంటారు. కానీ క్రీస్తు అలాంటివారి గురించి ముందుగానే హెచ్చరించాడు.

విత్తువాని ఉపమానంలో, ఆయన వాక్యమనే విత్తనం వేరు వేరు రకాల నేలలలో పడుతుందని చెప్పాడు.

“త్రోవప్రక్క నుండువారెవరనగా, వాక్యము వారిలో విత్తబడును గానీ వారు విన్న వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్య మెత్తికొనిపోవును. అటువలె రాతినేలను విత్తబడిన వారెవరనగా, వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు; అయితే వారిలో వేరు లేనందున, కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను, కలుగగానే వారు అభ్యంతరపడుదురు. ఇతరులు ముండ్లపొదలలో విత్తబడినవారు; వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములును ధనమోసమును మరీ ఇతరమైన అపేక్షలును, లోపల చొచ్చి, వాక్యమును అణచివేయుట వలన అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడినవారెవరనగా, వాక్యము విని, దానిని అంగీకరించి ముప్పదంతలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించువారని చెప్పెను” (మార్కు 4:15-20).

ఇక్కడ రాతినేలగా ప్రస్తావించబడ్డవారు సువార్త విని సంతోషంగా దాన్ని అంగీకరించి వెంటనే మొలకెత్తి, ఒక మంచి నేలకుగల ప్రతీ సూచనను వారు కనపరుస్తారు. కానీ వారు అభ్యంతరపడి తొలగిపోయేటపుడు వారి నిజస్వభావం బయటపడుతుంది. అలా వారు దేవుని నుండి బయటకు పోవడం, వారు ఆయన ఎన్నుకున్న సంఘానికి చెందినవారు కాదనడానికి స్పష్టమైన ఋజువుగా ఉంది.

“వారు మనలోనుండి బయలువెళ్లిరి గానీ వారు మన సంబంధులు కారు; వారు మన సంబంధులైతే మనతో కూడ నిలిచియుందురు; అయితే వారందరు మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడునట్లు వారు బయలువెళ్లిరి” (1 యోహాను 2:19).

‘అలాంటివారు క్రీస్తునందున్న విశ్వాసం నుండి తొలగిపోవటము, వారు పొందిన రక్షణ పోతుందనే వాదనను ఋజువుపరచదు కానీ, ఎంత యథార్థమైన శరీరసంబంధమైన ప్రయత్నాలు సహితం శాశ్వతంగా ఉండగలిగే నిజవిశ్వాసాన్ని పుట్టించలేవనడానికి ఖచ్చితమైన నిర్ధారణ. బాహ్యరూపాలు మోసపూరితమైనవి, సాతాను సహితం తాను విశ్వాసినని చూపించడానికి బాహ్య ఋజువులెన్నో కనపరచగలడు. కానీ చివరిగా సత్యం ప్రత్యక్షపరచబడుతుంది. క్రీస్తుశరీరమైన సంఘం పవిత్రపరచబడే విధంగా సమస్త మోసాన్ని తొలగించే దేవుని పట్ల మనమంతా కృతజ్ఞతగలవారమై ఉండాలి.

“కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను” (2 పేతురు 2:22).

కుక్క తన వాంతిని తిరిగి తినేలా మరియు పంది బురద వైపు మళ్ళేలా ఈ లేఖనాధారంగా, ఒక విశ్వాసి తన రక్షణ కోల్పోయి తిరిగి తన పూర్వస్థితికి చేరతాడని ఆర్మీనియన్ భావజాలకులు వాదిస్తారు.

కానీ పేతురు ఇక్కడ సహజంగా తమ అలవాట్లకు తిరిగి వెళ్ళే జంతువుల(కుక్క,పంది) గురించి మాట్లాడినపుడు, గొఱ్ఱెల విషయమై అసలేమీ ప్రస్తావించలేదని మనం గమనించాలి. క్రీస్తుచేత రక్షించబడినవారు తమ కాపరిని అనుసరిస్తారు కనుక వారు గొఱ్ఱెలని పిలవబడ్డారు. అయితే ఇక్కడ పేతురు, గొఱ్ఱెలు అకస్మాత్తుగా పందులు లేదా కుక్కల్లాగా మారతారని చెప్పలేదు. కుక్కలు, పందులు వాటి పూర్వస్థితికి తిరిగిపోవడానికి కారణం అవి వాస్తవంగా కుక్కలూ, పందులే, అవి గొఱ్ఱెలు కావు. అవి కాపరిని అనుసరించవు, అవి ఆయన మందకు చెందినవి కావు. ఎంత శుభ్రంగా తోమినా పంది పందే. గొఱ్ఱెల మధ్య నివసించినా కుక్కలు కుక్కలే. వాటి నిజస్వరూపం తప్పకుండా బయటపడుతుంది. అవి తమ పూర్వస్థితికి దిగజారిపోతాయి. మరోవైపు, ఒకడు తన రక్షణను కోల్పోతాడనే భావన దాని సొంత వేదాంత గలిబిలిని అదే సృష్టించుకుంటుంది.

ఉదాహరణకు - దేవుడు సర్వాన్ని ఎరిగినవాడైతే, ఒకసారి రక్షింపబడ్డవాడు వెనుదిరిగి తన సొంత భద్రతను పాడుచేసుకునేంత ధీర్ఘాయువును అతనికి అనుమతిస్తాడా? అలాంటి వ్యక్తి విశ్వాసపు స్థితిని కలిగియున్నప్పుడే అతన్ని మరణింపజేసి, తన విశ్వాసం కోల్పోయేంత కాలం అతనికి భూమిపై ఆయుష్షు అనుమతించకుండా ఉండడం దేవునికి న్యాయం కాదా? భూమ్మీదే ఉంటూ దారితొలగిపోడం కంటే దేవుడతన్ని చంపడమే న్యాయంగా ఉంటుంది. సర్వాన్ని ఎరిగిన దేవుని ముందుచూపు, ఒకన్ని రక్షించే అనుకూల సమయంలోనే దానిని సుసాధ్యం‌ చేయదా?

హెబ్రీ 10:14, ఈ వాక్యభాగం క్రీస్తు యొక్క బలి ద్వారా నమ్మేవారు సదా సంపూర్ణులుగా చేయబడ్డారని బోధిస్తుంది. ఇలా సదా సంపూర్ణునిగా చేయబడ్డ వ్యక్తి, తన సొంత చిత్తం లేదా సొంత శక్తి చేత పరిపూర్ణం చేయబడలేదని తెలుసుకుని, అతడు మరలా అపరిపూర్ణతలోనికి వెళ్ళిపోతాడని ఎలా భావించగలం? లేక పరిపూర్ణుడుగానే అతడు నరకానికి వెళ్తాడా?

'కృప నుండి వైదొలగడం, దీని మాటేమిటి?'
కృపలో నుండి వైదొలగడమనే మరో ప్రసిద్ధమైన సందర్భ‌విరుద్ధ వాదన లేఖనాలకు పెడార్థం చెప్పే కొందరివల్ల ఉత్పన్నమైంది. ఒక వ్యక్తి దేవుని భద్రపరచే కృప నుండి తొలగిపోయి తన రక్షణను కోల్పోవడం సాధ్యమని వారి వాదనలోని అంతర్భావం. అయితే సందర్భసహితమైన వివరణ చేత మనం వారి దుర్బోధను అరికట్టవచ్చు. కృప నుండి తొలిగిపోవడమనే ఈ పదం లేఖనాల్లో కేవలం ఒక్కసారే కనిపిస్తుంది.

“మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడియున్నారు; కృపలో నుండి తొలగిపోయియున్నారు” (గలతీ 5:4).

ఇక్కడ సందర్భాన్ని గమనిస్తే పౌలు యొక్క భావాన్ని అపార్థం చేసుకోడం అసాధ్యం. పౌలు అన్యులకు అపొస్తలునిగా ఉన్నాడు. క్రైస్తవులు ధర్మశాస్త్రాన్ని ఆచరింపబద్ధులని బోధించే యూదా మతబోధకులకు విరుద్ధంగా 'కృప ద్వారా రక్షణ' అనే నూతన నిబంధన సిద్ధాంతానికై ఆయన పోరాడాడు. అలాంటి బోధను ఖండిస్తూ ఎవడైనా తనను తాను రక్షించుకోవడంలో తన సొంత సామర్థ్యంపై ఆధారపడితే, అతడు కేవలం దేవుని కృపచేత కలిగే రక్షణ నుండి తొలగినట్లేయని ఇక్కడ పౌలు వాదించాడు. ధర్మశాస్త్రపు క్రియల చేత దేవుని యెదుట నీతిమంతులుగా తీర్చబడగలరని భావించేవారికి ఖచ్చితమైన, విశ్వసనీయమైన క్రీస్తు కార్యం నిర్వీర్యమైనట్లే. క్రొత్త మరియు పాత నిబంధనల మధ్య వ్యత్యాసాన్ని ఈ వచనం ఎంతో స్పష్టంగా తెలియచేస్తుంది. అయితే ఒక వ్యక్తి తన రక్షణను కోల్పోతాడని బోధించడానికి ఈ వచనం ఆధారం కాలేదు.

'మీ సొంత రక్షణను కొనసాగించండి'

మరొక వాదన ఈ విధంగా బయటపడుతుంది. మన సొంత రక్షణను భయంతోను, వణకుతోను కొనసాగించాలని బైబిలు బోధించడం లేదా? విశ్వాసులు వారంతట వారే ప్రయాసపడి, పరలోకాన్ని పొందుకునే ప్రక్రియలో చురుగ్గా తమ పాత్రను వహించాలంటూ పౌలు హెచ్చరించాడని ఈ వాదనలోని అంతర్భావం. దీన్ని కూడా మనం సందర్భసహితంగా చూద్దాం.

'రక్షణను కొనసాగించటం' అనే ఈ మాటను ఫిలిప్పీలోని విశ్వాసులకు పౌలు వ్రాస్తున్నాడు. అతను ఇదివరకే దేవుని సర్వాధికార కృపాసిద్ధాంతాన్ని వారికి బోధించాడు. వాస్తవానికి పౌలు తన పత్రికను ఈ ఆశీర్వచనంతో ప్రారంభించాడు:

“మన తండ్రియైన దేవుని నుండియు ప్రభువైన క్రీస్తునుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక, మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాలో పాలివారైయుండుట చూచి, మీలో ఈ సత్క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినమువరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడును సంతోషముతో ప్రార్థన చేయుచు, నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్ల నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను” (ఫిలిప్పీ. 1:2-6).

సువార్త సహవాసంలోకి విశ్వాసులను తెచ్చే సత్క్రియ ప్రారంభాన్ని పౌలు దేవునికే ఆపాదించాడు. అలాగే ఆయన ప్రారంభించింది ఆయన మాత్రమే కొనసాగించి సంపూర్తి చేస్తాడని దేవుని పట్ల అభయాన్ని పునరుద్ఘాటించాడు.
అయితే పౌలు మిషనరీగా పిలవబడ్డాడు. కాబట్టి చాలాకాలం ఒకే ప్రాంతంలో ఆయన ఎప్పుడూ నివసించలేదు. అంతేకాక ఫిలిప్పీ పట్టణం నుండి ఆయన వెళ్ళిపోయిన తరువాత ఈ పత్రికను వ్రాశాడు.

“కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులైయున్న ప్రకారము, నా యెదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి యెక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును, భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి” (ఫిలిప్పీ. 2:12).

తాను ఇప్పుడు వారి మధ్య లేని సమయంలో కూడా క్రీస్తుకార్యం కొనసాగించండని పౌలు ఫిలిప్పీవారిని హెచ్చరించాడు. ఇలా హెచ్చరిస్తూ, ఇది చెలగాటమాడవలసిన విషయం కాదని, ఈ కార్యాన్ని భయంతోను వణుకుతోను చేయాలని జ్ఞాపకం చేశాడు. ఇక్కడ “భయం” అనేదానికి “ఫోబస్” అనే గ్రీకుపదం వాడబడింది. అలాగే “వణుకు” అనేదానికి "ట్రామెస్” అను గ్రీకు పదం వాడబడింది. ఇక్కడ పౌలు - ఎవరి రక్షణను వారే భద్రపరచుకోవాలని బోధించాడంటూ ఈ వచనానికి పెడార్థం చెప్పేవారికి జవాబుగా ఆ తర్వాత వచనాన్ని చదివితే సరిపోతుంది.

“ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే” (ఫిలిప్పీ. 2:13).

ఫిలిప్పీ సంఘంపై దేవుడు సర్వాధికార శ్రద్ధను కలిగున్నాడనే ఈ నిశ్చయతే, పౌలుకు వారిని దేవుని హస్తాలలో ఉంచి వెళ్లే ధైర్యాన్ని ఇచ్చింది. మన దృష్టి ఆయన వైపు నిలిపేలా చేసేవాడు దేవుడేయని, ఆయన దయాసంకల్పం చొప్పునే మనం ప్రవర్తిస్తామని బోధించిన పౌలు మన రక్షణ విషయమై మనమే నిర్ణయాత్మక కారకమని ఖచ్చితంగా ఇక్కడ ప్రతిపాదించి ఉండడు. ఎవరైనా ఈ వచనానికి ఇలాంటి పెడార్థమిచ్చే భావాన్ని బోధిస్తే వారు పౌలు అర్థాన్ని పూర్తిగా అపార్థం చేసుకున్నవారు ఔతారు.

'అయితే ఆధ్యాత్మికంగా వెనుకబడేవారి సంగతేంటి?'

ఆధునిక క్రైస్తవ్యంలో ‘వెనుకబడటం' అనే ఈ పదం వాడుకలో ఉన్నప్పటికీ క్రొత్త నిబంధనలో ఈ పదమే కనిపించదు.

వెనుకబడిన, వెనుకబడటం, వెనుకబడినవాడు మొదలైన పదాలు క్రైస్తవునికి ఎప్పుడూ వర్తింపచేయబడలేదు. ఇశ్రాయేలు జాతి దేవుని ఆజ్ఞలు మరియు ఆయన నాయకత్వాన్ని అనుసరించడంలో విఫలమైన సందర్భాలలో, పాత నిబంధనలో మాత్రమే ‘వెనుకబడటం' అనే ఆలోచన వాడబడింది.
క్రైస్తవులనబడినవారు సంపూర్ణంగా వారి యజమానునికి అప్పగించుకుని, వారి కాపరిని వెంబడిస్తూ, వారి రాజును అనుసరించేవారు. అలా చేయని పక్షాన వారు క్రైస్తవులే కాదు. 'వెనుకబడిన క్రైస్తవుడు' లేదా 'శరీరసంబంధియైన క్రైస్తవుడు' అనే పదాలు బైబిలులో ఎక్కడా వాడబడలేదు. కృప ద్వారా రక్షించబడిన పాపుల గురించే మనం చదువుతాం. ఆర్మీనియన్ భావకుల బోధల ఫలితంగా 'వెనుకబడిన క్రైస్తవుడు' లేదా 'శరీర సంబంధియైన క్రైస్తవుడు' అనే పదాలు మన క్రైస్తవ నిఘంటువులో చేర్చబడ్డాయి. ఒక వ్యక్తి పరలోకాన్ని సంపాదించుకోవడానికి చేయవలసిందల్లా ఓ సాధారణ విశ్వాసపు ఒప్పుకోలు లేదా 'పాపి ప్రార్థన' అనే భావనతో ఇది ప్రారంభమౌతుంది. ఒక వ్యక్తి వారు నేర్పిన ప్రార్థన చేసి, వారు నిర్దేశించిన పద్దతిని అవలంభించగానే అతడు రక్షించబడ్డాడని, అతని గమ్యాన్ని ఏదీ మార్చలేదని వారు అభయమిస్తారు.

'ఒకసారి రక్షించబడితే ఎప్పటికి రక్షించబడినట్లే' అనే ప్రాచీన వేదాంతం ఇదే. ఇది బైబిలు బోధించే 'నిత్య భద్రత'కు' విరుద్ధంగా ఉంది. ఒకసారి రక్షించబడితే ఎప్పటికీ రక్షించబడినట్లే అనేవారు రక్షణను పాపి యొక్క ఒప్పుకోలుపై ఆధారితం చేస్తారు. ఆ బాధ్యత ఆ వ్యక్తిపై ఉంచుతారు. కానీ బైబిలు బోధించే నిత్యభద్రత, ఒకని రక్షణ కొరకైన బాధ్యతను పూర్తిగా సర్వాధికారియైన ప్రభువు పాదాల చెంత ఉంచుతుంది.

ఇక్కడ సమస్య ఏమిటంటే, ఇలా సులువుగా విశ్వాసంలోకి నడిపించబడ్డవారు యథార్థంగా పశ్చాత్తాపపడి, మారుమనస్సు నొంది నిజక్రైస్తవ్యంలో జీవించడంలో విఫలమౌతారు. వారిని ఎలా విభజించాలి? వారు ఇంక క్రైస్తవులు కారా? ఆర్మీనియన్ వేదాంతం ప్రకారం వారు మారుమనస్సుకు తగిన ఫలాలు ఫలించకపోయినా అది వారి నిజరక్షణను నిర్వీర్యం‌ చేయలేదని చెబుతారు. అలాంటివారిని కేవలం వెనుకబడిన లేదా శరీరసంబంధ క్రైస్తవులని పిలుస్తారు కానీ, విమోచించబడ్డవారిలో ఉపవిభజనను బైబిలు ఆమోదించదు. ఒక వ్యక్తి ప్రభావవంతంగా రక్షించబడైనా ఉండాలి లేదా అసలు రక్షణే పొందకుండా అయినా ఉండాలి - ఈ రెండిటికీ మధ్య మరో స్థితి లేదు. రక్షించబడ్డవారు మారుమనస్సుకు తగిన నీతి ఫలాలను తప్పకుండా ఫలిస్తారు.

క్రైస్తవులందరూ లేదా ఏ క్రైస్తవుడైనా పరిపూర్ణతను లేదా వ్యక్తిగత నీతిని సాధిస్తాడని నేనిక్కడ వాదించడం లేదు. నేను చెప్పదలచుకుంది ఏమిటంటే, వారు పాపేచ్ఛల నుండి మరల్చబడి వారి యజమానున్ని సంతోషపరిచే తపన కలిగుంటారు. యథార్థమైన మారుమనస్సు, మార్పును ప్రారంభిస్తుంది. మార్పు తక్షణమే జరగదు. మార్గంలో గొఱ్ఱెలు దారి తప్పుతాయి, పాపులు పాపం చేస్తారు మరియు అపరిపూర్ణులు తొట్రిల్లుతారు. అయితే పరిపూర్ణతను సాధించేట్లు మనలను భద్రపరచి కొనసాగింపజేసేది మన సొంత సామర్థ్యం కాదు.

“ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యము చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక” (1 తిమోతి 4:18).

మనం తొట్రిల్లినా విఫలం చెందని దేవుని కృప చేత నశించిపోకుండా కాపాడబడతాము.

యూదా 24,25 - "తొట్రిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగును గాక. ఆమేన్.”

“ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని యున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు. నేను చిన్నవాడనైయుంటిని ఇప్పుడు ముసలివాడనైయున్నాను. అయినను నీతిమంతులు విడువబడుటగాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు. దినమెల్ల వారు దయాళులై అప్పుయిచ్చుచుందురు వారీ సంతానపు వారు ఆశీర్వదించబడుదురు” (కీర్తనలు 37:23-26).

"భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనలనుండి పిలుచుకొనిన వాడా నీవు నా దాసుడవనియు నేను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడైయున్నాను. భయపడకుము నేను నీ దేవుడనైయున్నాను. దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును” (యెషయా 41:9,10).

నిజమే, క్రైస్తవులు విఫలమౌతారు. అయితే మన పదిలత, క్రీస్తును మన హృదయమందు భద్రపరచుకునే మన సామర్థ్యంపై ఆధారపడదు. అది కేవలం మనలను భద్రపరిచే క్రీస్తు సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఆయన కృపాయుత దీర్ఘశాంతం మనలను ఎన్నటికీ మోసం చేయదు.

“విజయమొందుటకు న్యాయవిధినీ ప్రబలము చేయువరకూ ఈయన నలిగిన రెల్లును వీరువడు మక మకలాడుచున్న అవిసె నారను ఆర్పడు” (మత్తయి 12:20).

“నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా” (హెబ్రీ 13:5).

శరీరమనే ఈ గుడారంలో మనం నివసించేంత కాలం పాపమనే క్యాన్సర్ (కొరుకుపుండు) మన నరనరాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. కనుక మనమెప్పుడు అసంపూర్ణులుగానే ఉంటాము. అందుచేత నిత్య జీవపు వాగ్దానమందు ఆ పరిపూర్ణగృహంలో ధరించటానికి మనకొక పరిపూర్ణ శరీరము అనుగ్రహించబడతుందనే వాగ్దానం కూడా ఇమిడి ఉందని చూడగలం.

''సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మీయ జీవమును శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును” (1 థెస్స. 5:23,24).

'పేతురు మాదిరి'

అపొస్తలులందరిలోనూ మనకు పేతురు వ్యక్తిగత వివరాలు క్షుణ్ణంగా దొరుకుతాయి. పేతురు జీవితంలో ఎడతెగని విశ్వాస వైఫల్యము, లోయలు, శిఖరాలు మొదలైనవాటితో నిండిన వర్ణన మనకు లభిస్తాయి. కానీ లోపల ఓ బంగారుతీగ లాగ క్రీస్తు ద్వారా ప్రోద్బలం పొందడం, క్షమించబడడం మరియు భద్రపరచబడడం అతని జీవితంలో అంతర అల్లికవలె కనిపిస్తాయి.

ఉదాహరణకు - పేతురు క్రీస్తు చేత “సాతానా” అని గద్దించబడిన ఏకైక శిష్యుడు. ఎందుకంటే క్రీస్తు మరణపు ఆవశ్యకతను, అందులోని ఆధ్యాత్మిక అంతరార్థాన్ని వివేచించడంలో పేతురు విఫలమయ్యాడు (మత్తయి 16:23). కానీ అతనిలో ఈ అవగాహనాలోపం అతని పతనానికి దారి తీసిందా? లేదు. “సీమోను, సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని అనీ అటు తరువాత అతనితో యేసు చెప్పెను.” తనకు తానుగా అతన్ని విడువబడుంటే, పేతురు అతని తిరుగుబాటులోనూ, అమాయకత్వంలోనూ కొనసాగేవాడు. కాని, క్రీస్తు అతని విశ్వాసాన్ని బలపరచి అతని నిమిత్తం ప్రార్థించి అతన్ని భద్రపరిచాడు.

యేసును చేరటానికి అలజడి కలిగిన సముద్రంపై నడచిన ఏకైక అపొస్తలుడు పేతురు. ఎంతటి అద్భుత క్షణమది! కాని మార్గం మధ్యలో భయం మరియు అనుమానం కలిగినవాడై అతడు మునిగిపోసాగాడు. యేసు అతన్ని "అల్ప విశ్వాసి” అని పిలిచాడు. పేతురు విశ్వాసలోపం అతని నిత్యనాశనానికి కారణమైందా? లేదు. ప్రభూ, నన్ను రక్షించు అని మొర్రపెట్టగానే వెంటనే క్రీస్తు తన హస్తం చాపి రేగిన అలల నుండి అతన్ని‌ కాపాడాడు. (మత్తయి 14:31). పేతురు విఫలమయ్యాడు కానీ క్రీస్తు విజయం పొందాడు.

రూపాంతరకొండపై యేసు ధర్మశాస్త్రం మరియు ప్రవక్తలకు ప్రతినిధులైన మోషే, ఏలియాలతో సంభాషిస్తున్నాడు.
పాత నిబంధనలో నాయకులపై క్రీస్తుకుగల ఆధిపత్యాన్ని గ్రహించడంలో పేతురు విఫలమయ్యాడు. వారిని సమానంగా గౌరవించేలా పేతురు మూడు గుడారాలు వేయాలనుకున్నాడు. అప్పుడు- “ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను; అయన మాట వినుడి” అని చెబుతూ దేవుడు పేతురును సరిచేశాడు (మత్తయి 17:5).

తన సొంత అవగాహనకు తనను వదిలేసుంటే క్రీస్తు ఆధిక్యతను మరియు కృప చేత విశ్వాసం ద్వారా రక్షణయనే నూతన నిబంధనను పేతురు ఎన్నటికీ గ్రహించేవాడు కాడు. కానీ పేతురు తన స్వబుద్ధిపై ఆధారపడేలా విడిచిపెట్టబడలేదు. అతడు దేవునిచే నడిపించబడి నేర్పించబడ్డాడు. పేతురులోని దైవిక జ్ఞానలోపం, అతని వైఫల్యానికి దారి తీసేది. కానీ, దేవుడు నమ్మదగినవాడు.

ప్రభురాత్రి భోజనం తర్వాత క్రీస్తు విషయమై మనుష్యులంతా అభ్యంతరపడినా, నేను అభ్యంతరపడనని పేతురు చెప్పాడు. అదే రాత్రి పేతురు ఆయన్ను ఎరుగనని ముమ్మారు బొంకుతాడని యేసు ముందే తెలియచేసాడు. తరువాత క్రీస్తు గెత్సెమనెలో ప్రార్థించినప్పుడు ఆయనతో పాటు మెలకువగా ఉండి ప్రార్థించమని యేసు పేతురును పలుమార్లు కోరాడు. కానీ పేతురు నిద్రించాడు; తరువాత ఆ రాత్రే, తీర్పు జరుగుతుండగా ప్రవచనం నెరవేరునట్లు తన ప్రభువును తిరస్కరించి ఆ తరువాత తన వైఫల్యం విషయమై ఏడ్చాడు. పేతురు క్రీస్తు విషయమై మూడు మార్లు బొంకినప్పుడు ఆయన విశ్వాసంలో నుండి శాశ్వతంగా తొలగిపోయి ఉండాల్సింది. విశ్వాసమందు కొనసాగడంలో పేతురుకు కలిగిన వైఫల్యం తన నిత్యనాశనానికి దారి తీసి ఉండాలి.

కానీ పునరుత్థానమైన తరువాత యేసు వ్యక్తిగతంగా పేతురును కలిసి “నీవు నన్ను ప్రేమించుచున్నావా?'' అని ముమ్మారు అతన్ని అడిగాడు. పేతురు అనుకూలంగా స్పందించిన ప్రతిసారి క్రీస్తు అతనితో నా గొఱ్ఱెలను మేపుమని చెప్పాడు (యోహాను 21:15-17). పేతురు తొట్రుపడ్డాడు, శపించాడు, బొంకాడు మరియు పారిపోయాడు. కాని క్రీస్తు అతన్ని లేవనెత్తి యథాస్థానంలో ఉంచి తన మందలోకి మరలా తీస్కునివెళ్ళి అతనికై తానే సిద్దపరచిన గమ్యాన్ని హామీగా ఇచ్చాడు. యాభై రోజుల తరువాత పెంతెకొస్తు సమయంలో నూతన నిబంధన సంఘాన్ని ఉనికిలోకి తెచ్చిన ఆ గొప్ప ప్రసంగాన్ని చేయడానికి క్రీస్తు పేతురును ఎన్నుకున్నాడు (అపొ.కా. 1,2 అధ్యాయాలు).

ఒకవేళ విశ్వాసుల పదిలత విషయమై ఆర్మీనియన్ భావన సరైనదైతే, పేతురు తన జీవితంలో పలుమార్లు రక్షణను కోల్పోయి తిరిగి పొంది ఉండాలి. కానీ పేతురు యొక్క ప్రతి వైఫల్యం మరియు తిరస్కారంలోనూ క్రీస్తే అతన్ని సంధిచేసి సమకూర్చి విశ్వాసమందు భద్రపరచాడు. పేతురు నిర్ణయాలన్నీ తన వినాశనానికే గాని విమోచనకు దోహదపడేవి కావు. అయితే క్రీస్తు నిర్ణయాలన్నీ పేతురును ఖండించటానికి కాక కాపాడటానికే ఎల్లప్పుడూ ఉద్దేశింపబడ్డాయి. ఇట్టి భద్రతను మనం ప్రభువులో కలిగున్నాము. మన పాపాల వెల చెల్లించబడింది. మన వైఫల్యాలన్నీ యేసుక్రీస్తు రక్తం చేత పరిష్కరించబడ్డాయి. మనలను శాశ్వతంగా ప్రేమించినవాని విశ్వాస్యత మన బలహీనతలకు అతీతంగా మనలను భద్రపరుస్తుంది.

రోమా 8:29,30

రోమా 8వ అధ్యాయంలో పౌలు ద్వారా బయలుపర్చబడ్డ దేవుని ప్రణాళిక మరియు ఉద్దేశం ఈ సిద్ధాంతం యొక్క పరకాష్టకు చేరాయి.

“ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందుగా ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యముగలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచేను. ఎవరిని పీలిచెనో వారిని నీతిమంతులగా తీర్చెను. ఎవరినీ నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను”

1) దేవుడు తన కరుణను బట్టి నిత్యత్యంలో క్రీస్తు సహోదరులుగా ఉండే నిమిత్తం కొందరు వ్యక్తులను ఏర్పరచుకున్నాడు. వారందరిలోనూ, యేసు వారసత్వ సర్వహక్కులు కలిగిన జ్యేష్ఠుడు. అది సంపూర్ణంగా పతనమైనవారిలో నుండి బేషరతు ఎన్నిక.

2) ఈ విధముగా ఏర్పరచబడ్డవారు ప్రభావవంతంగా పిలవబడ్డారు. అది అబేధ్యమైన కృప.

3) ఏర్పరచబడ్డ ఆ ప్రజలు మాత్రమే క్రీస్తు ప్రాయశ్చిత్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు; అది పరిమిత ప్రాయశ్చిత్తం.

4) ఇలా ఎన్నుకోబడి నీతిమంతులుగా తీర్చబడినవారు దేవుని దృష్టియందు మునుపే మహిమపరచబడ్డారు. ఇది పరిశుద్ధుల పదిలత.

దేవుని దృష్టిలో మనం మన జ్యేష్టుడు, మన ప్రభువైన కాపరియు రక్షకుడు, మన శరీరానికి శిరస్సు, మన పునాది రాయి, మన వరుడు, మరియు పెనిమిటి, మన ఆత్మల ప్రేమికుడు, మన పస్కా గొఱ్ఱె, మన ప్రతిక్షేపణ మరియు విడుదల, మన స్నేహితుడు, మరియు ఆదరణ కర్త, మన విమోచకుడు, మన విశ్వాసానికి కర్త మరియు దానిని కొనసాగించేవాడు, దేవుని శాశ్వత వాక్కు, తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు, పునరుత్థాన ప్రతిఫలము, జీవాహారం, మన జీవజలం, మరియు సర్వమైన క్రీస్తుతో కూడా పరలోక స్థలంలో సురక్షితంగా భద్రపరచబడ్డాము. ఆమేన్.

విమోచించబడ్డవారి విలువ

మానవులు శరీరానుసారులైన ఘోరపాపులు అని కృపాసిద్ధాంతాలు మనకు బోధిస్తున్నాయి. వారు స్వతహాగా ఏ విలువ, మంచితనం లేనివారు. కానీ దేవుని కృప వారికి వర్తింపజేయబడ్డపుడు, మాటలతో వర్ణింపశక్యం కానంతగా ఆశ్చర్యం కలిగేలా వారు పునఃనిర్మించబడి పునరుద్ధరించబడతారు. ఆయన ప్రియకుమారుని సారుప్యంలోకి వారు మరలా సృష్టించబడ్డారు.

“ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమైయున్నాము. మనమిక ఏమవుదుమో అది యింక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనపుడు ఆయనయున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము” (1 యోహాను 3:2).

ఆ గొప్ప మార్పు ఎన్నిక యొక్క అనివార్య ఫలితం. ఎన్నుకోబడి విమోచించబడ్డ పాపులు దేవుని పరిశుద్ధ సన్నిధిలో అంధులుగా మరియు తిరుగుబాటుదారులుగా మిగిలిపోతారని లేఖనాలు బోధించడం లేదు. దానికి ప్రతిగా దేవుడు వారిని ప్రశస్త నిధులుగా నిర్మించాడు.

“నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచినవాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపా సమాధానములు మీకు కలుగునుగాక” (ప్రకటన 1:5).

“మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు” (ప్రకటన 5:10).

దేవుని పరిశుద్దులు, రాజులకు రాజైనవానితో కలిసి పరిపాలించి ఏలుబడి చేయటానికి అధికారం కలిగుంటారు.

“పరిశుద్ధులు లోకమునకు తీర్పుతీర్చుదురని మీరెరుగురా? మీవలన లోకమునకు తీర్పు జరగవలసియుండగా, మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని యెరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరీ ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా?” (1 కొరింథీ. 6:2,3).

అంత మాత్రమే గాక, మనలను ఆయన సుందరమైనవారిగా చేస్తాడు. క్రీస్తు తన ప్రజలకు బూడిదకు ప్రతిగా పూదండయు, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలాన్ని, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇస్తాడు. ఒక దినాన ఈ పురాతన భూమి క్రీస్తు యొక్క ప్రేతవస్త్రంవలే చుట్టబడుతుంది. కాని మనమైతే ఊహించని విధంగా మహిమాన్విత దశకు మార్చబడతాము.

“అయినను దేవుడు కరుణా సంపన్నుడైయుండి, మనము మన అపరాధముల చేత చచ్చినవారమైయుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి యున్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉ పకారము ద్వారా అత్యధికమైన తన కృపామహిమైశ్వర్యమును రాబోవు యుగములలో కనబరచు నిమిత్తము...” (ఎఫెసీ. 2:4,6).

“మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమ యెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను” (రోమా 8:18).

దీన్ని ఆలోచించండి, తండ్రి ఎన్నుకున్న ప్రజలను కుమారునికి బహుమతిగా ఇచ్చాడు. దేవుడు ఆయన కుమారునికి అపరిశుభ్రమైన, విలువలేని బహుమతిని ఇవ్వడు. సంఘం, క్రీస్తునకు స్వచ్ఛమైన మరియు కన్యకయైన వధువుగా కూడా వర్ణించబడింది. ఎందుకంటే విలువలేని, అపరిశుభ్రమైనదాన్ని యేసు వివాహమాడి దానితో ఏక శరీరి కాలేడు.

“దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగియున్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని, మిమ్మును ప్రధానము చేసితిని” (2 కొరింథీ. 11:2).

". . . సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు; ఆయనను స్తుతించుడి,గొఱ్ఱెపిల్ల వివాహమహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తన్నుతాను పరిశుద్ధపరచుకొనియున్నది. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని మరియు ఆమె ధరించు కొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకియ్యబడెను. అవి పరిశుద్దుల నీతిక్రియలు. మరియు అతడు నాతో యీలాగు చెప్పెను. గొఱ్ఱెపిల్ల విందుకు పిలువబడినవారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యధార్థమైన మాటలని నాతో చెప్పెను” (ప్రకటన 19:7-9).

మరియు అదే విధంగా ఆ ప్రజలను కుమారుడు తిరిగి తండ్రికి బహూకరిస్తాడు. వారు ఎంతో విలువగలవారిగా కనిపించడం లేదా? నా భావమేమిటంటే, గొప్ప మార్పు రాబోతుంది. విమోచనావాగ్దానం పాపక్షమాపణకంటే అధికమైయుండి అద్భుతమైందిగా ఉంటుంది. ఎన్నుకోబడ్డవారి దేహ, ప్రాణ, ఆత్మల సంపూర్ణ విమోచన, క్రీస్తు ప్రాయశ్చిత్తకార్యం యొక్క అంతిమ ఉద్దేశం. ఏదైన ఒక వస్తువు విలువ, దానికై చెల్లించబడ్డ వెలను బట్టి నిర్ణయించబడతుంది. వెల ఎంత ఎక్కువగా ఉంటుందో విలువ అంత అధికంగా ఉంటుంది. ఎన్నుకోబడ్డవారికై చిందించబడ్డ దేవుని రక్తంకంటే మించిన వెల భూమిపై కానీ, పరలోకంలో కానీ ఎప్పుడూ చెల్లించబడలేదు. కానీ రక్షింపబడ్డవారిలో ఉన్న స్వీయవిలువను బట్టి ఆ గొప్ప త్యాగభరిత వెల చెల్లించబడలేదు, దానికి బదులుగా వారు “ఘనతకొరకైన పాత్రలుగా పునః సృష్టించబడ్డారు. మృతులై, విలువలేని తిరుగుబాటుదారులైనవారు తండ్రి యొక్క సర్వాధికార కరుణ మరియు కుమారుని ప్రాయశ్చిత్త వెల కొరకు తరాల నుండి సాక్షులుగా ఉండటానికి కృపామకుటాలుగా, ధవళ వస్త్రం ధరించినవారుగా క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డారు. ఎన్నుకోబడ్డవారి భద్రత కేవలం దేవుని విశ్వాస్యత పైనే ఆధారపడి ఉంది.

ఒక ప్రత్యేక ప్రజను లేపడంలో దేవుడే తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు. దేవుడు తన కుమారునికి ఒక వధువును సిద్ధపరుస్తాడు. శాశ్వతంగా “ఆత్మతోను, సత్యముతోను” ఆరాధించే ప్రజలను దేవుడు కలిగుంటాడు. దేవుని కృపామర్మం మానవ తర్కానికీ, అవగాహనకు అతీతంగా ఉంటుంది. అయినాకూడా ఆయన చేసేదానిలో ఓ దివ్య ఉద్దేశం ఉంటుందని మనం‌ తెలుసుకుంటాము. దేవుని స్వంత ఉద్దేశాల నిమిత్తం మరియు ఆయనకు మహిమ కలిగేలా, మనమాయన పవిత్రప్రేమను మరియు నోచుకోలేని కృపను పొందినవారం.

ఆయన మనలను పరిపూర్ణులనుగా, శోభాయమానంగా, నిత్యులుగా, పరిశుద్ధులుగా, నిర్మలంగా, అవినాశకులముగా మరియు క్రీస్తువలె చేస్తాడు. ఆయనకే సమస్త మహిమ, ఘనత, స్తుతి, ఆరాధన చెందే విధంగా ఇవన్నీ దేవుడే చేస్తాడు.

“సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతినీ జ్ఞానులైనను, ఘనులైననూ, గొప్ప వంశమువారైననూ అనేకులు పిలువబడలేదు గానీ ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండి వెళ్లివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడినవారిని, ఎన్నికలేనివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను” (1 కొరింథీ. 1:26-31).

ఇదే దేవుని సార్వభౌమత్వం, ఇదే ఆయన కృప. రక్షణ కృప చేత మాత్రమే. 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప హితబోధ ఎప్పుడూ, ఎవ్వరి నుండీ ఆర్థిక సహాయం అంగీకరించదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.