సువార్త

రచయిత: అజ్ఞాత క్రైస్తవుడు
చదవడానికి పట్టే సమయం: 6 నిమిషాలు

 భారత దేశం బహుసౌందర్యమైంది. ఎతైన పర్వతశిఖరాలు, సుందరమైన అడవులు, మనోహరమైన నదీతీరాలు, మైదానాలతో శోభిల్లే దేశం. అయినా గోపాల్ కి ఈ సుందరదృశ్యాలు చూసే భాగ్యం లేదు. అందుకు కారణం గోపాల్ పుట్టుగ్రుడ్డివాడిగా పుట్టడమే. అంతేకాక పసితనంలోనే తల్లిదండ్రులు ఇద్దరినీ పోగొట్టుకున్న దౌర్బాగ్యుడు అతను. అయితే గోపాల్ కు మిగిలిన ఒకే ఒక ఆశ్రయం 'అమ్మమ్మ'. పేదరికం, వృద్ధాప్యంతో కృంగిపోయిన యీ ముసలమ్మ గోపాల్ ను ఎలా పెంచగలదు? దిక్కులేనివారికి దేవుడే దిక్కు!

అది పర్వత ప్రాంతమవ్వడం వల్ల ఒక చిన్న గుహను ఇల్లుగా చేసుకుని గోపాల్, వాళ్ళ అమ్మమ్మ వారికి తోడు ఒక ముసలికుక్క దానిలో నివసించేవారు. అవ్వ పాతరాట్నంతో రోజూ కొన్ని చిలపల దారం వడికేది. గోపాల్ కి కంటిచూపు లేకపోయినా, మెదడు బహుపదునైంది. ఒక త్రాటిని కుక్కమెడకు కట్టి, దాని కొసను తన చేతికి కట్టుకుని ఆ ఊళ్ళో ప్రతి ఇంటికీ వెళ్ళి తమకు కావలసిన ఆహారాన్ని సంపాదించేవాడు. కొంతకాలం వారికి ఆహారానికి కొరత లేదు. కానీ రానురానూ జీవనం కష్టతరమైంది. ఒక్కోరోజు ఆ గుహలోని మూడు జీవులు పస్తులుండేవి.

ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒకరోజు దయగల దేవుని కన్ను గోపాల్‌పై పడింది. ఆ రోజు ఎండ భరించలేకుండా ఉంది. ఇళ్ళన్నీ తిరిగి అలసిపోయిన ఆ ముసలి కుక్క ఆ రోజు పస్తు ఉండక తప్పదని గ్రహించి, చివరి ప్రయత్నంగా ఆ గూడానికి కొంచెం దూరంగా  చెట్ల మధ్యలో ఉన్న ఒక బంగళా దగ్గరకు గోపాల్ ను నడిపించింది . గేటు తీసిన చప్పుడు విని తెల్లని దుస్తులు ధరించిన ఒక పెద్దమనిషి బయటకు వచ్చాడు. అది చూసిన కుక్క తాము ఒక గొప్ప వ్యక్తి ముందు ఉన్నామన్నట్టుగా మెల్లగా మొరిగింది.


దేవుని ప్రేమను గురించీ, క్రీస్తుద్వారా కలిగే విమోచనం గురించీ తెలియచేయడానికి వచ్చిన మిషనరీకి గోపాల్ దీనావస్థను చూడగానే హృదయం కరిగిపోయింది. 'అయ్యా! ఆకలేస్తుంది బాబూ, నాకు, మా అవ్వకు నిన్నటి నుంచి భోజనం లేదు. ధర్మం చేయిబాబూ' అంటూ గోపాల్ మళ్ళీ వంగి దణ్ణం పెట్టాడు. ఆ బాలుడు నిజంగా గ్రుడ్డివాడా, కాదా? అని తెలుసుకోవాలనుకుని, ఆ మిషనరీ ఒక పావలా నాణేన్ని వాడి ముందు పడవేసాడు. కానీ గోపాల్ దానిని ఏమాత్రం చూడలేదు కనుక అలానే నిలబడ్డాడు.

నమ్మకం కుదిరిన మిషనరీ గోపాల్ ను తాను నిర్వహిస్తున్న బడికి వచ్చి దేవుని వాక్యం వినమని కోరాడు. గోపాల్ రోజూ ఆ బడికి వెళ్ళి వరండాలో కూర్చుని దేవుని వాక్యం నేర్చుకునేవాడు. రోజుకొక వాక్యం కంఠస్థం చేసి మిషనరీకి అప్పచెప్పేవాడు. ఆ మిషనరీ వారి పోషణకై కొంత ద్రవ్యమిస్తూ ఉండేవాడు. ఇప్పుడు గోపాల్ కు భిక్షాటన చేసే బాధ తప్పింది.

"దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటు వంటి ఖడ్గముకంటెను వాడిగానుంది. ప్రాణాత్మలను కీళ్ళను, మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది".


గోపాల్ మొదట్లో పొట్టకొరకు మాత్రమే ఆ వాక్యాలు కంఠస్థం చేసినా, రానురానూ ఆ వాక్యాల్లోని సత్యాన్ని కొద్దికొద్దిగా గ్రహించ సాగాడు. దేవుడు వికలాంగులకు అసాధారణ తెలివితేటలనిస్తాడేమో ! కొద్దిరోజుల్లోనే గోపాల్ బైబిలు గ్రంథంలోని అనేక భాగాలు కంఠస్థం చేసి, వాటి భావాన్ని కూడ గ్రహించగలిగాడు. దేవుని వాక్యాలు తన హృదయంలో వెదజల్లిన కాంతిలో, తానొక పాపి అని గ్రహించాడు. కాబట్టి గోపాల్ తన పాపాలను దేవునియెదుట ఒప్పుకుని యేసు ప్రభువును రక్షకునిగా నమ్ముకుని ప్రార్థించాడు. చెప్పనశక్యంకాని పరలోక సంతోషాన్ని ఆ దీనుడు అనుభవించసాగాడు.

గోపాల్ యొక్క విశ్వాసం పరీక్షకు వచ్చింది. గోపాల్ ని హాస్టల్ లో ఉంచి 2 నెలలు సెలవు కాలంలో మిషనరీ తన స్వదేశానికి వెళ్ళాడు . ఇంటివద్ద గోపాల్ యొక్క అవ్వను ' పొట్టకూటి కొరకు మన మతాన్ని మన దేవుళ్ళను వదిలిపెట్టడం సిగ్గుచేట'ని ఇరుగు పొరుగువారు అనేక రకాలుగా నిందిస్తున్నారు. ఆ నిందలను భరించలేక, ఆమె గోపాల్ ను ఇంటికి తీసుకుని వచ్చింది. తరువాత ఆహారం లేకపోవడం వల్ల, అమ్మమ్మ ఒత్తిడివల్ల, అతను జ్వరపీడితుడై మంచమెక్కాడు. మెల్లగా లోలోపల ప్రభువు పాటలు పాడుకుంటూ వాక్యాలను గుర్తు చేసుకుంటూ దేవుని గురించిన ధ్యానంలో సంతోషంగా ఉన్నప్పటికీ, రోజురోజుకూ నీరసిల్లి బలహీనమైపోయిన గోపాల్ లేవలేని స్థితిలో పడి ఉన్నాడు.

మిషనరీ తిరిగివచ్చి హాస్టల్ లో తెలుసుకోగా కొన్ని వారాల క్రితం ముసలమ్మ గోపాల్ ను తీసుకుని వెళ్ళిపోయిందని అర్థమైంది. వెంటనే ఆ దయార్ద్రహృదయుడు ఆ గుహకు వచ్చి అతికష్టంతో వంగి లోపలికి వెళ్ళి 'ప్రియమైన గోపాల్, జబ్బు చేసిందా నాయనా?' అని పలకరించాడు, బాగా నీరసంతో ఉన్న గోపాల్ ఆ స్వరం ఎవరిదో గుర్తుపట్టలేక, 'అమ్మమ్మా, నన్ను చనిపోనివ్వు. ఈ చీకటిలోకంలో నేనెంతమాత్రం ఉండలేను. పైన చూడు ఎంత వెలుగుందో! బడిలో చెప్పినట్టు పరలోకం ఎంత తేజస్సుతో ప్రకాశిస్తుందో చూడు. అదే నా రాజ్యం . అక్కడికే వెళ్తున్నా. అక్కడికే...... ' అని గట్టిగా చెప్పి మళ్ళీ యథాప్రకారం వాక్యాలు మెల్లగా ఉచ్చరించాడు. ఇదంతా వింటున్న మిషనరీకి దుఃఖం, ఆనందం ఆపుకోలేనంతగా వస్తున్నాయి.

గోపాల్ చెప్పుకుంటున్న వాక్యాల్లో కొన్ని మిషనరీ హృదయాన్ని తాకాయి. "అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును. ఈలాగు నా చర్మము చీకి పోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను" (యోబు 19: 25,26). కుక్కి మంచంపై అలానే గోపాల్ వెనక్కు వాలిపోయాడు. కన్నీళ్ళతో మిషనరీ చాతిపై చొక్కాయి తడిసిపోతుంది. 'అమ్మమ్మా. నేను చూడగలుగున్నా, నేనిక గుడ్డివాణ్ణి కాదు, నాకు బాగా కనబడుతుంది. అదిగో ఆ గొప్ప వెలుగులో రక్షకుడు కనబడుతున్నాడు. మిషనరీ సాబ్ తో చెప్పమ్మా. గ్రుడ్డి గోపాలం చూపు పొందాడని చెప్పు, నా సాబ్ రాగానే చెప్పమ్మా. మహిమ, మహిమ, మహిమ' అంటూ ఆఖరిగా పలికి ప్రాణం విడిచాడు. ఆ మిషనరీ వాడి మంచం ప్రక్కనే మోకరించి, 'దేవా, కన్నులు లేని పేద గోపాల్ కు నీ మహిమను చూపించావు. నిన్ను నమ్మి ఆత్మ రక్షణ పొంది నీ మహిమలోనికి వచ్చాడు. కన్నులుండీ సత్యాన్ని చూడలేని అనేకుల కళ్ళు తెరువు తండ్రీ' అని ప్రార్థించాడు.

"దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. మనుష్య హృదయమునకు గోచరము కాలేదు" (1 కొరింథీ. 2:9).

Add comment

Security code
Refresh

Comments  

# RE: ధన్యజీవి గోపాల్Raghavulu 2021-01-28 07:55
నేనె ఇంకా గుడ్డి వాడిని అని గ్రహించాను sir
Reply
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.