నిజ క్రైస్తవ జీవితం

రచయిత: ఆర్థర్ డబ్ల్యు పింక్
అనువాదం: ఎ.జె. ఇమ్మాన్యుయేల్
ఆడియో

Article Release long comporttochristians min

విషయసూచిక

1. ఏ శిక్షావిధియు లేదు.

2. క్రైస్తవుని అభయం

3. శ్రమలకు పరిహారం

4. అనుగ్రహించే గొప్ప దేవుడు

5. జ్ఞాపకం చేసుకునే దేవుడు

6. అగ్నిచేత పరీక్షింపబడటం

7. దైవిక శిక్షణ

8. దైవశిక్షణను స్వీకరించటం

9. దేవుని స్వాస్థ్యం

10. దేవుడు తన స్వాస్థ్యాన్ని భద్రపరచటం

11. దు:ఖపడటం

12. ఆకలిగొనుట

13. హృదయ శుద్ధి

14. ధన్యతలు మరియు క్రీస్తు

15. శ్రమ మరియు మహిమ

16. సంతృప్తి

17. ప్రశస్తమైన మరణము

పరిచయం

క్రీస్తుసేవకై పిలువబడిన ఒక దాసుని పరిచర్యలో వివిధ కోణాలు ఉన్నాయి. అతడు రక్షింపబడనివారికి సువార్త బోధించి, జ్ఞానముతోను, వివేకముతోను దేవుని ప్రజలను పోషించి (యిర్మియా 3:15). “వారి మార్గములో నుండి అడ్డు చేయుదానిని (యెషయా 57:14). తొలగించడం మాత్రమే కాక,“యెలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుచు నా ప్రజలకు వారి తిరుగుబాటును, పాపములను తెలియజేయుము” (యెషయా 58:1; 1తిమోతి 4:2; ) అనే ఆజ్ఞకు కూడా కట్టుబడి పనిచేయాలి. వీటన్నిటితో పాటు అతడు మరో ప్రాముఖ్యమైన విధిగా “నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి” (యెషయా 40:1) అనే దేవుని మాటకు కూడా కట్టుబడి పరిచర్య చేయవలసినవాడుగా ఉన్నాడు.

“నా జనులు !” అన్నది ఎంత ఘనమైన పిలుపు! "మీ దేవుడు!” అన్నది ఎంత అభయమిచ్చే అనుబంధం! “నా జనులను ఓదార్చుడి!" అన్నది ఎంత దీవెనకరమైన బాధ్యత! "ఓదార్చుడి” అనే ఆజ్ఞను రెండు సార్లు నొక్కి చెప్పటానికి మూడు కారణాలను సూచించవచ్చు. 

1.కొన్నిసార్లు విశ్వాసుల ఆత్మలు ఓదార్చబడటానికి  నిరాకరిస్తాయి ( కీర్తన 77:2; ). కాబట్టి అలాంటి సమయాల్లోనే మరింత ఓదార్పు ఇవ్వడం అవసరం.

2.విశ్వాసులను ఉత్తేజపరచే విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదని బోధకుడికి తెలియజేయటం అవసరం.

3.స్వయంగా దేవుడే  తన ప్రజలు ఆనందంగా ఉండే విషయంలో శ్రద్ధ కలిగున్నాడని మనకు అభయమివ్వటం అవసరం   ( ఫిలిప్పీ 4:4; ). దేవుడికి తన జనులు ఉన్నారు, వారు ఆయన ప్రేమకు పాత్రులగునట్లు ఏర్పరచబడిన జనులు.

“నా ప్రజలు" అని పిలవటం చేత  దేవుడు వారితో సన్నిహిత సంబందాన్ని కలిగున్నాడని అర్థం అవుతుంది. కాని, వాళ్ళు చాలాసార్లు ఓదార్పు పొందలేకుండా ఉన్నారు. వారి స్వాభావికమైన పాపం, సాతాను శోధనలు, లోకంలో ఉన్నవారిచేత కఠినంగా వ్యవహరించబడటం, క్రీస్తుకు సంబంధించిన విషయాలకు లోకములో గల దీనస్థితి మొదలైన కారణాలచేత తరచుగా వారు ఆదరణ లేకుండా ఉన్నారు. ఐతే “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు” (2 కొరింథీ 1:3) వారి పట్ల ఎంతో వాత్సల్యాన్ని కనపరుస్తున్నాడు. అందుకే విరిగిన మనస్సుగలవారిని బలపరచి, వారి గాయములలో గిలాదు గుగ్గిలము పోయమని దేవుడు తన దాసులకు ఆజ్ఞాపించాడు. దేవుని ఆజ్ఞలను, కట్టడలను సర్వదా అతిక్రమించి, ఆయన ఆధిపత్యాన్ని వ్యతిరేకించి తిరుగుబాటు చేసిన జనులకు సహితం ఆదరణను కలిగించే ఈ దేవుణ్ణి గురించి “నీతో సముడైన దేవుడున్నాడా?” (మీకా 7:18; ) అని పొగడటానికి ఇది తావిస్తుంది !

ఈ పుస్తకంలో పొందుపరచబడిన లేఖన వ్యాఖ్యానాలు, కృంగినవారిని ఆదరించటానికి ఉపయోగపడేలా దేవుడు కృప చూపించును గాక ! ఆమెన్.

1వ అధ్యాయం

ఏ శిక్షావిధియు లేదు.

“కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు” (రోమా 8:1).

రోమీయులకు వ్రాసిన ఈ అద్భుతమైన పత్రికలోని మొదటి సగభాగనికి ముగింపుగా 8వ అధ్యాయం వ్రాయబడింది. అందుకే ఈ అధ్యాయం “కాబట్టి” అనే మాటతో ప్రారంభమవుతుంది. (రోమా 3:21;) లో పౌలు ప్రారంభించిన వాదనకు ముగింపుగా ఈ మాట చెప్పబడింది. అపోస్తలుడు ఇక్కడ తన వాదనను ముగిస్తున్నాడు. ఈ ముగింపుకు చేరే దిశగానే మొదటి నుండి అతడు తన వాదనను నిర్మాణాత్మకంగా క్రమపరుస్తూ వచ్చాడు.

''...........క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను” (రోమా 3:26 ; ). కాబట్టి, “ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను” (రోమా 4:25) కాబట్టి, “ఒకని (క్రీస్తుని) విధేయత వలన అనేకులు (విశ్వాసులందరు) నీతిమంతులుగా చేయబడుదురు” (రోమా 5:19) కాబట్టి, “పాపము విషయమై (విశ్వాసులందరు) చనిపోయారు” (రోమా 6:2). కాబట్టి, “ధర్మశాస్త్రము (తీర్పు) విషయమై (విశ్వాసులందరు) మృతులైరి” (రోమా7:4). కాబట్టి, " ఇప్పుడు క్రీస్తు యేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు”.

"కాబట్టి" అనే మాట ముందుగా చెప్పబడిన వాదనలకు ముగింపు మాత్రమే కాదు. ముందున్న అధ్యాయంలోని చివరి భాగంతో కూడా దానికి సంబంధం ఉన్నట్లు గమనించగలము.రోమా పత్రిక 7వ అధ్యాయంలోని రెండవ భాగంలో తిరిగి జన్మించిన ఒక వ్యక్తిలోని పరస్పర విరోధమున్న రెండు స్వభావాల మధ్య చెలరేగే బాధాకరమైన నిరంతర పోరాటాన్ని అపొస్తలుడు తన సొంత క్రైస్తవ అనుభవాన్ని ఉదాహరణగా తీసుకుని వివరించాడు. ఒక దేవుని బిడ్డ ఎదుర్కునే ఆత్మీయ పోరాటాన్ని తన సొంత అనుభవంలో చిత్రీకరించిన తరువాత, ఇప్పుడు అలాంటి బాధాకరమైన దయనీయ స్థితికి అవసరమైన దైవిక ఆదరణ వైపుకి దృష్టి సారిస్తున్నాడు. 7వ అధ్యాయాన్ని మదనపడుతూ ముగించిన స్వరం, విజయఘోషతో 8వ అధ్యాయాన్ని ప్రారంభించటం ఆశ్చర్యంగా, ఆకస్మికంగా అనిపించినప్పటికీ అది హేతుబద్ధమైనదే, స్వాభావికమైనదే. ఒకవేళ విశ్వాసులు పాపమరణాలతో పోరాడుతూ దాని ప్రభావం వలన మూల్గుతున్నారన్న మాట వాస్తవమైతే, శాపం మరియు శిక్షావిధి నుండి విడిపింపబడే విజయాన్ని బట్టి వారు ఆనందించటం కూడా అంతే వాస్తవం. భిన్నమైన ఈ రెండు అనుభవాలు ఇక్కడ వివరింపబడినట్లుగా మనం చూడగలం. 7వ అధ్యాయంలోని చివరి సగభాగంలో అపోస్తలుడు, విశ్వాసులు ఈ లోకంలో జీవించే కాలమంతా వారిలో చెలరేగే పాపప్రభావాన్ని గురించి వివరించాడు. 8వ అధ్యాయంలోని ప్రారంభ వచనంలో, వారు క్రీస్తుతో ఏకమైనప్పుడు పాపదోషం నుండి వారికి కలిగిన సంపూర్ణ విడుదలను ప్రస్తావిస్తున్నాడు. 7:24 లో అపోస్తలుడు, “ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును” అని ప్రశ్నిస్తున్నాడు. కానీ 8:2లో "నన్ను విడిపించెను” అంటే “పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను” అని ప్రకటిస్తున్నాడు.

“కాబట్టి ఇప్పుడు ఏ శిక్షావిధియు లేదు.” ఇక్కడ1 యోహను 3:21; లో ప్రస్తావించబడిన విధంగా, మన హృదయం మనపై నేరారోపణ చేస్తున్నదా అనేది ప్రశ్న కాదు. మనలో శిక్షార్హమైనది ఏమి లేదని కూడా ఇది చెప్పటం లేదు. మనకు బదులుగా, యేసుక్రీస్తును తమ రక్షణ కొరకు విశ్వసించినవారికి దేవుడు శిక్ష విధించడనే దీవెనకరమైన సత్యాన్ని ఇది తెలియజేస్తుంది. న్యాయంగా మనం పొందినవాటికి మరియు అనుభవాత్మకంగా మనం పొందేవాటికి మధ్యగల భేదాన్ని తెలుసుకోవటం ఎంతో అవసరం. లేదంటే ప్రస్తుతం మన ముందున్న లేఖనభాగం అందించే ఆదరణను మరియు సమాధానాన్ని పొందటంలో విఫలమవుతాం. “క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు”. క్రీస్తుయేసునందు దేవుని యెదుట ఒక విశ్వాసికి గల స్థితిని ఇది సూచిస్తుంది. శరీరానుసారమైన అతని స్థితి గురించి ఇది ప్రస్తావించటం లేదు. ఆదాములో నేను శిక్షావిధికి లోనయ్యాను (రోమా 5:21; ). అయితే క్రీస్తులో సమస్తమైన శిక్షావిధి నుండి సంపూర్ణంగా  విడిపింపబడ్డాను.

“కాబట్టి ఇప్పుడు ఏ శిక్షావిధియు లేదు” , “ఇప్పుడు” అనేమాట, ఒకప్పుడు, క్రైస్తవులు విశ్వాసులుగా మారకమునుపు, శిక్షావిధికి లోనై ఉన్నారని సూచిస్తుంది. ఇది వారు క్రీస్తుతో కూడా మరణించక ముందు (గలతీ 2:20; ) అంటే, దేవుని ధర్మశాస్త్ర నియమానుసారమైన శిక్షావిధి విషయమై మరణించక ముందు వారు ఉండిన స్థితిని తెలియజేస్తుంది . కాబట్టి “ఇప్పుడు” అనే మాట ఈ రెండు స్థితులకు మధ్యగల వ్యత్యాసాన్ని ఎత్తి చూపిస్తుంది. స్వాభావికంగా మనం  “మరణ శాసనం” క్రింద ఉన్నాము , ఇప్పుడు “కృపలో ఉన్నాము  (రోమా. 6:14; ). స్వభావసిద్ధంగా మనం దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము (ఎఫెసీ. 2:3; ).కాని ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారులుగా స్వీకరించబడ్డాము (ఎఫెసీ. 1:6; ). మొదటి నిబంధన ప్రకారం మనం ఆదాములో ఉన్నాము  (1కొరింథీ 15:55; ). కాని ఇప్పుడు క్రీస్తులో ఉన్నాము (రోమా 8:1). క్రీస్తులో ఉన్న విశ్వాసులమైన మనమందరం నిత్యజీవము కలిగున్నాము కాబట్టి ఇప్పుడు ఏ శిక్షావిధియు లేదు.

“శిక్షావిధి" అనేది ఒక గంభీరమైన విషయం . దాని నుండి మనలను తప్పించిన దేవుని కృప యొక్క మహత్యాన్ని తెలుసుకోవడానికి దాని తీవ్రతను అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. మన న్యాయస్థానాలలో "శిక్షావిధి" అనే మాట ఒక దోషిపై భయంకరమైన ప్రభావాన్ని కలిగియుంటుంది. చూసేవారిలో సహితం అది దు:ఖాన్ని, భయాన్ని కలిగిస్తుంది. ఐతే దేవుని న్యాయస్థానంలో ఆ మాట వివరించలేనంత గంభీరమైనది. ఆ న్యాయస్థానం ముందు పతనమైన ఆదాము సంతతివారందరూ నిలబడాలి.

“పాపములో గర్భము ధరింపబడి, పాపములోనే రూపింపబడి”, నేరస్తులుగా ముద్రవేయబడి, ధిక్కారం అనే సంకెళ్ల చేత బిగింపబడి, పాపపు బందీలుగా అందరు ఈ లోకంలోనికి ప్రవేశిస్తారు. భయంకరమైన ఆ శిక్షావిధికి కారణామైన పాపం నివారించబడటం మాత్రమే అలాంటివారు శిక్ష నుండి తప్పించుకోటానికి ఏకైక మార్గం. అపరాధం తొలగిపోతే ఇక శిక్షావిధి ఉండదు.

ఐతే పాపదోషం  తీసివేయబడిందా? అంటే విశ్వసించిన పాపి నుండి పాపదోషం తొలగించబడిందా? లేఖనాలు ఇచ్చే సమాధానమేమిటో చూద్దాం .

"పడమటికి తూర్పు ఎంత దూరమో, ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచియున్నాడు” కీర్తన 103:12.

“నేను నేనే నా చిత్తానుసారంగా నీ యతిక్రమములను తుడిచి వేయుచున్నాను” యెషయా 43:25

“నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నియు నీవు పారవేసితివి” యెషయా 38:17

“వారి పాపములను, వారి అతిక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసికొనను” హెబ్రీ. 10:17

ఐతే పాపము ఏలా తీసివేయబడింది ? అది కేవలం బదిలీ చేయబడటం ద్వారా మాత్రమే సాధ్యపడింది. దేవుని పరిశుద్ధతకు పాపదోషాన్ని అలక్ష్యపెట్టడం సాధ్యపడదు, కాని ఆయన కృపకు దానిని బదిలీ చేయటం సాధ్యం కాబట్టి అలాగే చేసింది. విశ్వసించేవారి పాపాలు క్రీస్తు భరించేలా అవి ఆయన మీద మోపబడ్డాయి.

“యెహెూవా మన అందరి దోషమును అతని మీద (క్రీస్తు మీద) మోపెను” (యెష. 53:6).

“పాపమెరుగని ఆయనను (క్రీస్తును) మనకోసము పాపముగా చేసెను” (2కొరింథి 5:21).

“కాబట్టి ఇప్పుడు ఏ శిక్షావిధియు లేదు”. ఇక్కడ “లేదు” అనేమాట నొక్కి చెప్పబడింది. ఇక ఏ విధమైన శిక్షావిధియు లేదు అని రూఢి చేయబడింది. ధర్మశాస్త్రం నుండి గాని అంతర్గత దౌర్బల్యాన్ని బట్టి గాని, సాతాను మోపే నేరారోపణను బట్టి గాని మరే మూలం నుండి గాని ఏ ఇతర కారణాల చేతనైన ఇక ఏ శిక్షావిధియు లేదు, అంటే అది ఇక ఎన్నటికీ లేదు, ఉండబోదు అని అర్థం. నేరారోపణ ఇక లేదు గనుక (రోమా 8:33; ) ఇక ఏ శిక్షావిధియు లేదు; ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన కారణాన (రోమా 4:8) ఇక నేరారోపణ ఎన్నటికీ సాధ్యపడదు.

“కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు”. ఒక విశ్వాసి అంతరంగంలో తన ప్రాచీన మరియు నూతన స్వభావాల మధ్య చెలరేగే పోరాటాన్ని వివరించినపుడు, అపోస్తలుడు మునుపటి అధ్యాయంలో తన స్వీయానుభవాన్ని ఉదాహరణగా చేసుకోవటాన్ని బట్టి, కృపలో ఎంతగానో ఎదిగినవానికి సహితం అటువంటి ఆత్మీయపోరాటం నుండి ఏ మినహయింపు ఉండదని స్పష్టం చేసాడు. ఐతే ఆ వర్ణన అంతటిలోను అపొస్తలుడు “నాకు” అని చేసిన ఏకవచన ప్రయోగానికి బదులుగా రోమా 8:1లో బహువచన ప్రయోగం చేయటం గమనించదగిన విషయం. అంటే తాను "క్రీస్తు యేసునందున్న నాకు” అని కాక "క్రీస్తు యేసునందున్నవారికి” అని చెబుతున్నాడు. ఇలా వ్రాయించటం కూడా పరిశుద్ధాత్ముని కృప. ఒకవేళ అపొస్తలుడు ఇక్కడ కూడా ఏకవచన ప్రయోగమే చేసుంటే, కేవలం పౌలంతటి గొప్ప దైవజనునికి మాత్రమే అలాంటి మహాభాగ్యం చెందుతుందని, మనవంటివారికి అది వర్తించదని అనుకోవటానికి ఆవకాశం ఉండేది. అందుకే పరిశుద్ధాత్ముడు ఇక్కడ బహువచన ప్రయోగం చేయటానికి పౌలును ప్రేరేపించి ఈ గొప్ప భాగ్యం క్రీస్తు యేసునందున్నవారందరికీ వర్తిస్తుందని స్పష్టం చేసాడు.

“ కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు”. "క్రీస్తు యేసునందుండటం ” అంటే దేవుని న్యాయార్థమైన వ్యవహారమంతటిలో క్రీస్తుతో ఏకంగా పరిగణించబడటమే. అది విశ్వాసం ద్వారా క్రీస్తుతో ఏకమవటమే. శిక్షావిధి నుండి తప్పించబడటం మన స్వీయనీతిని బట్టి కాక కేవలం క్రీస్తు యేసునందుండటాన్ని బట్టి మాత్రమే కలిగింది .  క్రీస్తుయేసునందున్న విశ్వాసి ఓడలో భద్రంగా దాచబడిన నోవహువలె ఉన్నాడు.పైన ఆకాశంలో నల్లని మేఘలు ఆవరించినా, అగాధజలములు పైకి ఎగసిపడుతున్నా, ఆ ప్రళయములోని ఒక్క నీటి చుక్కైనా తన ఓడలోనికి చొరబడకుండా, వడిగాలి చేత ఆ ఓడ తల్లడిల్లినప్పుడు సహితం తన నెమ్మదికి భంగం కలుగకుండా కాపాడబడిన నోవహు వలె అతడున్నాడు. క్రీస్తు యేసునందున్న విశ్వాసి - ఇస్సాకు వివేచించకుండా తన సహోదరుని దుస్తులలో దాగివున్న యాకోబువలె భద్రంగా వున్నాడు. క్రీస్తు యేసునందున్న విశ్వాసి - ప్రతిహత్య చేయువాని నుండి తప్పించుకొనుటకై ఆశ్రయపురంలో తల దాచుకున్న ఒక నరహంతకుని వలె భద్రంగా ఉన్నాడు.” (డా|| విన్లో 1857). అవును, క్రీస్తు యేసునందున్న కారణాన ఇక ఏ శిక్షావిధియు లేదు. హల్లెలూయ.

2వ అధ్యాయం

క్రైస్తవుని అభయం

“దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము” (రోమా 8:28).

శతాబ్దాల తరబడి దేవుని ప్రేమించే వారెందరో ఈ ధన్యవచనం ద్వారా ఆదరణ పొంది బలపరచబడ్డారు. శ్రమలలో, శోధనలలో, కలవరలలో ఆ వాక్యం వారి పాదాల క్రింద కదలని బండవలె ఉండింది. వెలిచూపును బట్టి పరిస్థితులు వారికి వ్యతిరేకంగా కనిపించినప్పటికీ, వారి సహజ ఆలోచనను బట్టి అన్నీ వారి కీడుకే పని  చేస్తున్నట్లుగా  అనిపించినప్పటికీ, వారి విశ్వాసం మాత్రం ఇందుకు వ్యతిరేకంగానే ఆలోచించింది. అలాగే ఈ దైవ వాగ్దానంపై ఆధారపడటంలో విఫలమైనవారు ఎంతో  నష్టపోయారు, అనవసరమైన భయాందోళనలకు గురి అయ్యారు.

“సమస్తమును సమకూడి జరుగుచున్నవి.” ఇక్కడ మొదటిగా మన ఆలోచనకు తట్టే విషయం, సమస్తమును సమకూడి జరిగేలా చేసే దేవుడు ఎంత మహనీయుడు! ఎంత భయంకరమైన దుష్టత్వం ఎడతెగకుండా పనిచేస్తుంది ? సృష్టిలో లెక్కకు మించిన జీవరాశులు ఎన్ని ఉన్నాయి? అవరోధాలు తలపెట్టే స్వార్థపూరితమైన కోరికలు ఎంత విస్తారంగా ఉన్నాయి? దేవునితో పోరాదే విరోధులు ఎంతటి అసంఖ్యాకులు? దేవుని కార్యాలను నిరంతరం వ్యతిరేకించే ఆకాశమండలంలోని అపవిత్ర శక్తులు ఎన్ని ఉన్నాయి? అయినప్పటికీ అందరికి, అన్నిటికి పైగా సర్వాధికారిగా ఆసీనుడైయున్న దేవుడు కదల్చబడకుండా పరిస్థితులన్నిటిని తన స్వాధీనంలో ఉంచుకుని ఉన్నాడు. అక్కడ తన మహిమాన్విత సింహసనం నుండి “తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యాలను జరిగించుచున్నాడు.” “ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే యుండును. ఆయన దృష్టికి అవి అభావముగాను, శూన్యముగాను ఎంచబడును” (యెషయా 40:17).

ఇలాంటి దేవుని ఎదుట భయము కలిగుందాము. “మహఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైన" (యెషయా 57:15; ) ఈయన యెదుట భక్తితో ప్రణమిల్లుదాము. సరాసరి కీడు నుండి అతి శ్రేష్ఠమైన మేలును కలగజేయగల ఈయనకే స్తుతి ఆరాధనను ఆపాదిద్దాము.

“సమస్తమును సమకూడి జరుగును”. ప్రకృతిలో శూన్యం అనేదేది లేదు, అంతేకాకుండా సృష్టించబడిందేది కూడా వాటి నియమిత ఉద్దేశాల నేరవేర్పులో విఫలం కావు. ఏదీ నిష్క్రియగా ఉండదు. ప్రతిది వాటికి నియమించబడిన లక్ష్యాన్నిపూర్తి చేసేవిధంగా దేవునిచేత చైతన్యపరచబడుతున్నాయి. ప్రతిది వాటి సృష్టికర్త దృష్టికి అనుకూలమైన ముగింపుకు చేరేవిధంగా నిత్యం పని చేస్తున్నాయి. ప్రతిది నిరర్థకం కాలేని ఆయన శాసనం చొప్పునే జరుగుతున్నాయి.

“సమస్తమును సమకూడి జరుగుచున్నవి”. అవి జరగటం మాత్రమే కాదు, సమకూడి జరుగుతాయి. అన్నీ సమగ్రంగా సమ్మిళితమై పనిచేస్తాయి. ఐనా ఆత్మీయ వినికిడి గల చెవులు మాత్రమే వాటి సమతాళ స్వరాన్ని వినగలుగుతాయి. అన్నీ సమకూడి కలసికట్టుగా పరస్పర సహాయంతో పనిచేస్తాయి. అందుచేతనే కష్టాలు, బాధలు ఒంటరిగా రావటం అరుదు. మేఘము వెంట మేఘము, తుఫాను వెంట తుఫాను వస్తాయి. యోబుకులా ఒక దుర్వార్త వెంబడి మరింత బాధాకరమైన దుర్వార్త వస్తుంది. ఒక వంటకం విలువ దానిలో కలిసే పదార్థాల మిశ్రమంతోనే తెలుస్తుంది. దేవుని కార్యాలు కూడా ఇలాగే ఉంటాయి. ఆయన ప్రణాళికలో జరిగే సంభవాలన్నీ కేవలం జరగటం మాత్రమే కాదు, సమకూడి జరుగుతాయి. దీనిని గుర్తెరిగిన ఇశ్రాయేలు మధుర గాయకుడు, “ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహ జలరాసులలో నుండి తీసెను” (కీర్తన 18:16) అని చెప్పాడు.  “మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి”. విశ్వసించేవారికి, వారు ఎంతటి ప్రతికూల పరిస్థితులలో ఉన్నా, అవి ఎంత అసంఖ్యాకములైనా, సమస్తమూ వారి మేలుకొరకే జరిగేలా అంటే పరలోక సంబంధమైన శాశ్వత స్వాస్థ్యాన్ని వారు పొందేలా సమస్తం సమకూడి జరుగుతాయని ఈ మాటలు నేర్పుతాయి. స్వాభావికంగా ఎంతో అపాయకరమైనవాటి నుండి కూడా మనకు అత్యధిక మేలులు కలిగించగల దేవుని ఏర్పాటు ఎంత అద్భుతకరమైనది! ఆకాశమండల గ్రహాలను తమతమ గోళ్కుాపరిమితం చేసి నియంత్రించగల ఆయన మహాశక్తిని బట్టి మనమాశ్చర్యపోవచ్చు; ఋతువులు, కాలాలు వాటివాటి నియమల కాలంలో కలగటం, తద్వారా భూమి నూతనపరచబడటం మనకెంతో విస్మయం కలిగించే విషయం కావచ్చు; ఐతే మన జీవితంలోని కఠిన పరిస్థితులన్నిటి నుండి మేలును కలగచేసి, చివరికి సాతాను శక్తి, ద్వేషం మరియు స్వాభావికంగా వినాశకరమైన వాని కుతంత్రాలన్నిటి నుండి సహితం తన బిడ్డలకు క్షేమాన్ని చేకూర్చగల దేవుని సామర్థ్యం, వీటిన్నిటి కంటే ఎంతో అద్భుతకరమైనది.

“మేలు జరుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి”. ఈ విధంగా జరగటానికి మూడు కారణాలు ఉన్నాయి. మొదటిది, సృష్టిలోని సమస్తము, దాని నిర్వహణకర్త యొక్క సంపూర్ణ స్వాధీనంలో ఉన్నందు వలన; రెండవది, దేవుడు మన మేలును, కేవలం మన మేలును మాత్రమే కోరుతున్నందు వలన; మూడవది, సాతాను కూడా దేవుని అనుమతి లేకుండా మన తలవెంట్రుకనైనా ముట్టుకోలేడు; ఒకవేళ ముట్టినా ఆది మన మేలు కొరకే అనుమతించబడుతుంది గనుక అన్ని వాటి వాటి ప్రవృత్తులలో స్వతహాగా మంచివి కావు కాని దేవుడు వాటన్నిటిని మనకు మేలుకరంగా మలుస్తాడు .మన జీవితంలోనికి యాదృచ్చికంగా ఏది ప్రవేశించదు; ఒక ఉద్దేశ్యం లేకుండా ఏది రాదు. ప్రతిది దేవుని ఉద్దేశానుసరంగా మన మేలు నిమిత్తమే జరుగుతుంది.  ప్రతిది దేవుని నిత్య ఉద్దేశానికి సాధనమై, ఆయన కుమారుని సారూప్యములోనికి రావటానికి నిర్ణయింపబడినవారికి ఆశీర్వాదమే.మన పరలోకపు తండ్రి, సమస్త శ్రమలను, నష్టలను, హింసలను తాను ఏర్పరచుకున్న వారి మేలు కొరకే వినియోగిస్తున్నాడు.

“దేవుని ప్రేమించువారికి” ఇది నిజమైన క్రైస్తవుని ప్రత్యేక గుర్తింపు. ఇందుకు వ్యతిరేకమైనది తిరిగి జన్మించనివారికి గుర్తు. ఐతే, పరిశుద్ధులందరూ దేవుణ్ణి ప్రేమిస్తారు. వారి విశ్వాస ప్రమాణాలలో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చు; వారి సంఘక్రమాలలో వ్యత్యాసాలు ఉండవచ్చు, వారు కలిగున్న ఆత్మీయవరాలు సమమైనవి కాకపోవచ్చు; అయినా ఈ ఒక్క విషయంలో వారు ఐక్యంగా ఉన్నారు - వారందరూ క్రీస్తును నమ్ముతారు, దేవుణ్ణి ప్రేమిస్తారు. రక్షకుణ్ణి బహుమానంగా అనుగ్రహించినందుకు వారు దేవుణ్ణి ప్రేమిస్తారు. అభయమిచ్చే తండ్రిగా వారు దేవుణ్ణి ప్రేమిస్తారు. ఆయన ఔన్నత్యాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి, జ్ఞానాన్ని బట్టి, విశ్వాస్యతను బట్టి వారు ఆయనను ప్రేమిస్తారు. ఆయన ప్రవర్తనను బట్టి వారు ఆయనను ప్రేమిస్తారు. ఆయన అనుగ్రహించేవాటిని బట్టి, అనుగ్రహించటానికి నిరాకరించేవాటిని బట్టి, ఆమోదించేవాటిని బట్టి, గద్దించేవాటిని బట్టి వారు ఆయనను ప్రేమిస్తారు. ఆయన సమస్తము బాగుగా చేస్తాడని తెలిసి, క్రమశిక్షణ కొరకు ఆయన వాడే  బెత్తాన్ని బట్టి కూడా వారు ఆయనను ప్రేమిస్తారు. ఆయనలో ఉన్నదేదీ, ఆయన నుండి వచ్చేదేది ,వారు ఆయనను ప్రేమించకుండా ఉండటానికి కారణం కానేరదు. దీనిని బట్టి వారికి ఉన్న నిశ్చయత ఇదే "ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము (1 యోహాను 4:19).

“దేవుని ప్రేమించువారికి”. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ! నా దేవుణ్ణి నేనెంత అల్పంగా ప్రేమిస్తున్నాను. నాలోని ప్రేమరాహిత్యాన్ని బట్టి నేను దు:ఖిస్తున్నాను. చల్లారిన నా ప్రేమను బట్టి నన్ను నేనే చీధరించుకుంటున్నాను. అవును, స్వయాన్ని, లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. కాని 'నిజంగా నా దేవుణ్ణి ప్రేమిస్తున్నానా?' అనే ప్రశ్న నన్ను వేధిస్తుంది. ఐతే, దేవుణ్ణి ప్రేమించాలనే తపనే ఒక మంచి సూచన కాదా? నేనెంత స్వల్పంగా ఆయనను ప్రేమిస్తున్నాననే దు:ఖమే నేనాయనను ద్వేషించటం లేదనటానికి ఖచ్చితమైన ఆధారం కాదా? తమ హృదయ కాఠిన్యాన్ని బట్టి, కృతజ్ఞతారాహిత్యాన్ని బట్టి, ప్రతి తరంలోను పరిశుద్ధులనేకులు ఈ విధంగా విలపించారు. 'దేవుణ్ణి ప్రేమించాలన్నది ఒక పరలోక సంబంధమైన అభిలాష. ఐతే ఐహిక ఆకర్షణలు, ఒత్తిళ్ళు దీనికి అవరోధాలుగా నిలువటం వలన, ఆత్మ ఈ దీన శరీరం యొక్క నిర్బంధం నుండి తప్పించుకుని, ప్రకాశవంతం మరియు స్వేచ్ఛాయుతమైన ఆ దే నికి చేరుకునేంత వరకూ అ దుస్థితి నుండి మనం విడుదల పొందలేము' (డాక్టర్ చామర్స్).

“ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి”. క్రొత నిబంధన పత్రికలలో "పిలువబడినవారు” అనే పదం, కేవలం సువార్తను నమ్మటానికి  బాహ్యాంగా ఆహ్వనింపబడినవారు అన్న భావంలో ఎక్కడా ఉపయోగించబడలేదు. ఈ పదం ప్రతిసారి అంతరంగాన్ని పురికొల్పి రక్షణను సార్థకము చేసే పిలుపును సూచించటానికి వాడబడింది. ఈ పిలుపును ఉత్పన్నం చేయటానికి గాని, భగ్నం చేయటానికి గాని దీనిపై మనకు ఏలాంటి నియంత్రణ లేదు. 7మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తువారుగా ఉండుటకు పిలువబడి యున్నారు.']రోమా 1:6-7  మొదలైన వచనాలలో ఈ పదం, ఈ అర్థములోనే వాడబడింది. "..............రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికి, అనగా పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడిన వారందరికి” (శుభమని చెప్పి)............." .

ప్రియ చదువరీ! ఈ పిలుపును నువ్వు విన్నావా? సేవకుల పిలుపు విన్నావు, సువార్త పిలుపు విన్నావు, మనస్సాక్షి పిలుపు విన్నావు కాని అంతరంగిక, అజేయమైన పరిశుద్ధాత్మ పిలుపు విన్నావా? అంధకారం నుండి వెలుగునకు, మరణం నుండి జీవముకు, లోకం నుండి క్రీస్తు చెంతకు, స్వయం నుండి దేవుని చెంతకు నువ్వు పిలవబడ్డావా? నువ్వు దేవుని వలన పిలవబడ్డావో లేదో నిర్ధారించుకోవటం నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయం. మరి ఆ పిలుపు యొక్క ఉల్లాసకరమైన, జీవదాయకమైన సంగీతనాదం నీ హృదయాంతరంగంలో మారుమ్రోగిందా ? ఐతే ఇలాంటి అనుభవం నాకు కలిగిందని నేను ఎలా నిర్ధారించుకోగలను ? మన శీర్షిక వచనంలోనే దీనిని నిర్ధారించుకోవటానికి ఒక ఖచ్చితమైన ప్రమాణం ఇవ్వబడింది. ఎవరైతే రక్షణార్థంగా దేవుని చేత పిలవబడతారో, వారు ఆయనను ఎక్కువగా ప్రేమిస్తారు. ఆయనను ద్వేషించటానికి బదులు ఆయనను ఘనపరుస్తారు. ఆయన సన్నిధి నుండి భయపడి పారిపోవటానికి బదులు ఆయనను వెదుకుతారు. ఆయన ఘనతను అలక్ష్యపెట్టటానికి బదులు, కేవలం ఆయనను సంతృప్తిపరచి, మహిమపరచటానికే వాంఛిస్తారు.

“ఆయన సంకల్పము చొప్పున”. ఈ పిలుపు మానవుల అర్హత అనర్హతలపై ఆధారపడినది కాదు. ఇది కేవలం దేవుని సంకల్పం చొప్పున కలిగే పిలుపు.

“ మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు, అనాదికాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను ” (2తిమోతి 1:9-10).

“ఆయన సంకల్పము చొప్పున” అనే మాటను ఆ వచనంలో పొందుపరచటాన్ని బట్టి, కొందరు దేవుణ్ణి ప్రేమించటానికి, మరి కొందరు ప్రేమించకపోవటానికి కారణం దేవుని సార్వభౌమత్వమే అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఇది వారి గొప్పతనాన్ని బట్టి కాదు, కేవలం ఆయన సార్వభౌమ్య కృప వలన కలిగినది. ఈ మాటలో ఆచరణాత్మక విలువ కూడా ఇమిడి ఉంది. కృపాసిద్ధాంతాలు ఇవ్వబడినది కేవలం విశ్వాసప్రమాణాలు రూపొందించుకోవటానికి కాదు. అవి అనుగ్రహించబడటానికి ఒకానొక ముఖ్య ఉద్దేశ్యం భయాందోళనలతో కృంగిన హృదయాలను దేవుని ప్రేమతో తెప్పరిల్లజేయటమే. ఈ ప్రేమ మన హృదయాలలో నిరంతరం ప్రవహించేలా, దానిని పుట్టించిన మూలముపై, దానిని పెంపొందింపజేయగల ఊటపై ఎడతెగక ఆధారపడాలి. ఒక అందమైన దృశ్యం లేక చిత్రంపై గల మన ప్రశంసాభావాన్ని నూతనపరచటానికి దానిని మళ్ళీ మళ్ళీ చూడటం అవసరం. అదేవిధంగా, మన హృదయాలలో దేవుని ప్రేమను నూతనపరచుకోవటానికి మనం విశ్వసించిన సువార్త సత్యాలను మరలా మరలా జ్ఞప్తికి తెచ్చుకోవటం అవసరం. ఈ సూత్రాన్ని లేఖనాలు స్పష్టంగా బోధిస్తున్నాయి.

"............ నేను ఏ ఉపదేశరూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారైయుందురు” అని పౌలు చెప్పాడు (1 కొరింథీ. 15:2).

"......... పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా యిచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసికొవలెనను విషయమును మీరు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను” అని పేతురు చెప్పాడు (2 పేతురు 3:1-2).

“నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడి” అని ప్రభువు చెప్పాడు. కాబట్టి మనం దుర్మార్గులం మరియు అయోగ్యులమై ఉన్నప్పుడు, దేవుడు తన కృప వలన మనలను పిలిచిన ఆ గడియను జ్ఞప్తికి తెచ్చుకోవటం వలన, ఆయన ప్రేమ మన హృదయాలలో నూతనపరచబడుతుంది. నరకపాత్రుడవైన నిన్ను అగ్నిలో నుండి తీసిన కృపను స్మరించుకునే కొద్దీ, నీ హృదయం కృతజ్ఞతాభావంతో ఉప్పొంగిపోతుంది. పైగా ఇతరులెందరో విడవబడగా, కేవలం దేవుని సార్వభౌమ్య నిత్యసంకల్పం చొప్పున మాత్రమే నువ్వు పిలవబడ్డావన్న వాస్తవాన్ని గ్రహించినప్పుడు, ఆయనపై నీకున్న ప్రేమ మరింత బలపడుతుంది.

శీర్షిక వచనం చివర అపొస్తలుడు "యెరుగుదుము” అన్న మాటను వాడటాన్ని గమనించండి. 'మేలు కొరకు సమస్తమును సమకూడి జరుగుచున్నవన్న సత్యం పై అవగాహన, ప్రతి విశ్వాసి యొక్క అనుభవం అన్నట్టుగా ఇక్కడ అపొస్తలుడు మాట్లాడుతున్నాడు. ఈ యెరుక కేవలం ఒక ఊహాజనితమైన విశ్వాసం కంటే ఎంతో నాణ్యమైనది. మేలు కొరకే సమస్తమును సమకూడి జరుగుచున్నవన్న విశ్వాసం, కేవలం ఒక విశ్వాసి యొక్క మనఃపూర్వకమైన కోరిక లేక నిరీక్షణ మాత్రమే కాదు. అది అతనికి గల ఖచ్చితమైన నిశ్చయత. “యెరుగుదుము” అన్న మాటకు భావం ఇదే. ఇది మేథోసంబంధంగా ఎరుగుట కాదు; ఆత్మీయంగా “యెరుగుట”. ఇది మన హృదయాలలో నాటబడి మనకు అభయం కలిగించే నిశ్చిత జ్ఞానం. ఇది ఆ కృపామయుని వివేకంగల హస్తం నుండి కలిగే సమస్తాన్ని అంగీకరించే విశ్వాసయుతమైన జ్ఞానం. ఐతే దేవుని సహవాసం కోల్పోయినప్పుడు ఈ జ్ఞానం నుండి ఏలాంటి ఆదరణ పొందలేము. విశ్వాసం అమలులో లేనప్పుడు కూడా ఇది మనకు ఆధారం కానేరదు. అయితే మనం ప్రభువుతో సహవాసం కలిగున్నప్పుడు, మన బలహీనతలలో ఆయనపై పూర్తిగా ఆనుకున్నప్పుడు, ఈ ఆశీర్వాదకరమైన అభయం మన సొంతమౌతుంది.

“ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గల వానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి యున్నాడు”. (యెషయా. 26:3).

అనేక విధాలుగా మనందరి జీవితాలతో పోలికగల యాకోబు చరిత్ర, మన శీర్షికవచనాన్ని వివరించటానికి ఒక చక్కటి ఉదాహరణ. ఒక అంధకారమైన, భారమైన మేఘం అతనిని అవరించింది. తీవ్రమైన పరీక్ష అతని విశ్వాసానికి వణుకు పుట్టించింది. అతని పాదములు జారుటకు కొంచెమే తప్పింది. అతని బాధాకరమైన ఫిర్యాదు వినండి. "అప్పుడు వారి తండ్రియైన యాకోబు వారిని చూచి - మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు; యోసేపు లేడు; షిమ్యోను లేడు; మీరు బెన్యామీనును కూడా తీసుకొనిపోవుదురు; ఇవన్నియు నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను”. ( ఆది. 42:36). మందగించిన అతని విశ్వాసపు దృష్టికి, ఈ పరిస్థితులు ప్రతికూలంగా కనిపించినప్పటికీ, ఆ సమయంలోనే అవి మహిమతో కూడిన ప్రభావవంతమైన వెలుగును, మేఘరహితమైన సూర్యాస్తమయాన్ని చూడటానికి చివరి ఘడియలలో అతనికి దోహదపడిన పరిస్థితులను వికసింపజేసి సఫలీకృతం చేస్తూ ఉన్నాయి. అన్నీ తన మేలు కొరకు సమకూడి జరుగుతూ వచ్చాయి. కాబట్టి కలవరం చెందే హృదయమా, “అత్యంత శ్రమకాలము” త్వరలోనే ముగిసిపోతుంది. దేవుని రాజ్యంలో ప్రవేశించినప్పుడు, ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా కాక ఏ ఛాయయులేని ఆయన ముఖకాంతిని చూసి, సమస్తాన్ని మన వ్యక్తిగత మరియు శాశ్వత మేలు కొరకే సమకూడి జరిగిందని గుర్తెరుగుతాము.

3వ అధ్యాయం

శ్రమలకు పరిహారం

“మన యెడల ప్రత్యక్షము కాబోవు మహిమ యెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని యెంచుచున్నాను” (రోమ 8:18).

ఈ మాటలు వ్రాసినవారు కష్టాలకు పూర్తిగా అపరిచితులు అని లేదా అల్పమైన వేదనలు తప్ప పెద్దగా శోధనలేమీ అనుభవించి ఉండకపోవచ్చు అని కొందరు అనుకోవచ్చు. కాని,ఈ మాటలు, అతిక్లిష్టమైన పరిస్థితులలో జీవితం కొనసాగించి, శోధనలను, శ్రమలను, హింసలను విస్తారంగా అనుభవించిన అపోస్తలుడు, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాసిన మాటలు. ఆయన సొంత సాక్ష్యాన్ని వినండి.

“యూదులుచేత ఐదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని; ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని; ఒక రాత్రింబవళ్ళు సముద్రములో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులవలననైన ఆపదలలోను, దొంగలవలననైన ఆపదలలోను, నా స్వజనులవలననైన ఆపదలలోను, అన్యజనులవలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరులవలని ఆపదలోను ఉంటిని. ప్రయాసతోను, కష్టముతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి." (2 కొరింథి. 11: 24-27).

“మన యెడల ప్రత్యక్షము కాబోవు మహిమ యెదుట ఇప్పటికాలపు శ్రమలు ఎన్నదగినవి కావు”. ఇవి సుఖానుభవం చేత సంతృప్తి చెంది జీవితయాత్రలో గులాబీ పుష్పాల అంచులు కలిగిన తివాసీలపై సుకుమారంగా నడచిన అనుభవం ద్వారా వచ్చిన మాటలు కావు. ఇందుకు భిన్నంగా తన స్వకీయుల చేత ద్వేషింపబడి, ఒళ్ళు కమిలిపోయేలా బాధింపబడి, సుఖానుభవం మాట అలా ఉంచితే, కనీసం అత్యవసర అక్కరలను కూడా తీర్చుకోలేని దుర్బరమైన పరిస్థితులలో నుండి వచ్చిన మాటలివి. ఇటువంటి చేదు అనుభవాలను ఎదుర్కున్న వ్యక్తి, ఇంతటి మధురమైన నిరీక్షణ వ్యక్తపరచటాన్ని ఎలా వివరించగలం? తనకు కలిగిన ఈ శోధన బాధలను అధిగమించగలిగిన ఆ రహస్యం ఏమై ఉంటుంది?

ఎంతగానో శ్రమలనుభవించిన ఈ అపోస్తలుడు, మొదటిగా క్రైస్తవునికి శ్రమలు ఉంటాయి కాని అవి తాత్కాలికమైనవే అని తనను తాను ఓదార్చుకున్నాడు. అవి “ఇప్పటి కాలము"నకే పరిమితమైన శ్రమలు. ఈ శ్రమలకు మరియు క్రీస్తును తిరస్కరించేవారికి కలిగే శ్రమలకు మధ్య ఎంతో గంభీరమైన వ్యత్యాసం ఉంది. వారి శ్రమ శాశ్వత కాలం ఉంటుంది. వారు నిత్య నరకాగ్నిలో నిరంతరం యాతన అనుభవిస్తారు. కాని విశ్వాసికి కలిగే శ్రమలు ఇందుకు సరిగ్గా భిన్నమైనవి. అతని శ్రమలు, వికసించి రాలిపోయే పుష్పంతోను, తొలగిపోయి ఇక కనిపించని నీడతోను పోల్చదగిన ఈ ఐహిక జీవితానికే పరిమితమైనవి. మహా అయితే ఇంకొన్ని సంవత్సరాలు; ఆపై మనం ఈ కన్నీటిలోయను దాటి మూల్గులు, నిట్టూర్పులు ఇక ఎన్నడూ వినిపించని ఆ ఆనందకరమైన దేశంలోనికి ప్రవేశిస్తాము.

రెండవదిగా, అపొస్తలుడు విశ్వాసపు కన్నులతో మనలో ప్రత్యక్ష్యం కాబోయే “మహిమను” చూశాడు. ఈ “మహిమ” ఆయనకు ఒక మధురస్వప్నం కంటే ఎంతో  మించినది. అది ఆయనకు ఒక క్రియాశీలమైన సత్యం. ఆ విశ్వాసం అతనిని బలంగా ప్రభావితం చేసి, అత్యధికంగా తనను శ్రమలకు గురి చేసిన ప్రతికూల పరిస్థితులలో సైతం ఓదార్పు అందించగలిగినది. శ్రమలలో విశ్వాసానికి ఇది నిజమైన పరీక్ష; క్రీస్తును అంగీకరించినవారికి శ్రమలలో గొప్ప ఆదరణ లభిస్తుంది; అయితే అవిశ్వాసికి అది లభించదు. తమ తండ్రి సన్నిధిలో పరిపూర్ణ సంతోషం ఉందని దేవుని పిల్లలకు తెలుసు. "ఆయన దక్షిణ హస్తమునందు నిత్య సంతోషములు" కలవని వారికి తెలుసు. కాబట్టి విశ్వాసి వాటిని గట్టిగా పట్టుకుని, విపత్తులన్నిటిలో వాటిని అన్వయించి, ఇప్పుడు కూడా అవి అందించే ఆదరణను, ఆనందాన్ని అనుభవిస్తాడు. అలనాడు అరణ్యములో ఇశ్రాయేలు తమకు వాగ్దానదేశంలో కలగబోయేవాటిని చూసి ప్రోత్సహింపబడిన విధంగానే , (సంఖ్యా 13:23-26;) ఈనాడు కూడా వెలిచూపును బట్టి కాక, విశ్వాసాన్ని బట్టి నడిచేవారు, కంటికి కనిపించని, చెవికి వినిపించనివాటిపై, అంటే దేవుడు తన ఆత్మచేత బయలుపరిచినవాటిపై దృష్టి ఉంచుతాడు. (1 కొరింథి 2:9,10;).

మూడవదిగా అపోస్తలుడు “మన యెడల ప్రత్యక్షము కాబోవు మహిమ”ను బట్టి ఆనందిస్తున్నాడు. దీని సంపూర్ణ భావమేమిటో మనకిప్పుడు తెలియదు. అయినా, దీని గురించి కేవలం సూచనప్రాయంగా కాకుండా ఎక్కువ వివరణే లేఖనాలు మనకు ఇస్తున్నాయి. ఆ రోజున మనము :

1.పరిపూర్ణ శరీరం యొక్క మహిమను కలిగి ఉంటాము:

“మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము”(1కొరిం15:49)

ఘనహీనమైనదిగా విత్తబడిన శరీరం మహిమగలదిగా లేపబడుతుంది. బలహీనమైనదిగా విత్తబడిన శరీరం శక్తివంతంగా లేపబడుతుంది. మృతమైనది అమర్త్యమైనదిగా లేపబడుతుంది, పాపసహితంగా పాతిపెట్టబడిన శరీరం పాపరహితంగా లేపబడుతుంది. ఈ మాటల అంతర్భావం ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రికలో వివరించబడింది.

“మన పౌరస్థితి పరలోక మందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనురక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము. సమస్తమును లోపరచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదిగా మార్చును” (ఫిలిప్పీ 3:20,21).

2.రూపాంతరం చెందిన మనస్సు యొక్క మహిమను కలిగి ఉంటాము:

'ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే ఎరిగియున్నాము. అప్పుడు నేను పూర్తిగా యెరుగబడిన ప్రకారము పూర్తిగా యెరుగుదును.” (1 కొరింథి 13:12).

ఆహా..... ఆ మహిమగల జ్ఞానం ఎంత ప్రజ్వలమైనదిగా, ప్రకాశమానమైనదిగా ఉంటుంది!  అది ఎంత వెలుగును ప్రసరింపచేస్తుంది! గ్రహించే సామర్థ్యాన్ని ఆ జ్ఞానం ఎంత అధికంగా కలిగి ఉంటుంది. అప్పుడు రహస్యములన్నీ తెలియపరచబడతాయి, అన్ని సమస్యలూ తీరిపోతాయి, అన్ని లొసుగులు సవరించబడతాయి. అప్పుడు దేవుని లేఖనంలోని ప్రతి సత్యాన్ని, ఆయన ఏర్పాటులోని  ప్రతి సంఘటనను, ఆయన ప్రభుత్వంలోని ప్రతి నిర్ణయాన్ని విశదంగా, తేటగా సూర్యుని ప్రకాశం కన్నా గొప్ప వైభవంతో చూడగలం. ఇప్పుడు నువ్వు నీ ఆత్మీయ జ్ఞాపకశక్తి లేమిని బట్టి,నీ జ్ఞాన సామర్థ్యానికున్న పరిమితిని బట్టి చింతిస్తున్నావా? అయితే నీలో ప్రత్యక్ష్యం కానున్న ఆ మహిమ యొక్క నిరీక్షణలో ఆనందించు. ఆ రోజున నీ జ్ఞాన సామర్థ్యమంతా నూతనపరచబడి, అభివృద్ధి చేయబడి, సంపూర్ణం చేయబడి, ''నీవు పూర్తిగా యెరుగబడిన ప్రకారము పూర్తిగా యెరుగుదువు'' .

3.పరిపూర్ణ పరిశుద్ధత యొక్క మహిమను కలిగి ఉంటాము:

ఇది అన్నింటి కంటే శ్రేష్ఠమైనది. దేవుడు మనలో జరిగించే కృపాకార్యం సంపూర్ణం చేయబడుతుంది. “యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును” (కీర్తనలు 138:8) అన్న వాగ్దానం కలిగివున్నాము. పరిశుద్ధత కూడా మనలో పరిపూర్ణం చేయబడవలసియున్నది. “యెందుకనగా, తన (దేవుని) కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగానిర్ణయించెను.” (రోమా 8:29)

“అప్పుడు మనము దేవుని చూచెదము గనుక మనము ఆయనను పోలియుందుము.” (1 యోహాను 3:2) అప్పుడు మన హృదయాలు, దురాలోచనలచేత ఇంకెంత మాత్రము అపవిత్రపరచబడవు. మన మనస్సాక్షి దోషారోపణచేత ఇంకెన్నడూ మలినం చేయబడనేరదు. మన ఆశయాలు అయోగ్యమైనవాటి వలన ఇంకెప్పుడూ నియత్రించబడవు.

ఎంత అద్భుతమైన ధన్యత! కాంతి కిరణాలను ఏ మాత్రం ప్రతిబింబించలేని నాలో ఎంతటి మహిమ ప్రత్యక్షం కాబోతుంది ! ఎంత అవిధేయుడ్ని, ఎంత అయోగ్యుడ్ని, ఎంత పాపాత్ముడ్ని, జ్యోతిర్మయుడైన తండ్రితో ఎంత అల్పంగా సహవాసం కలిగి జీవిస్తున్నాను! ఇటువంటి నాలో ఈ మహిమ ప్రత్యక్షం అవ్వటం సాధ్యమా? సాధ్యమే అని మాటతప్పని దేవునివాక్యం రూఢిపరుస్తుంది. నేను ఒకవేళ దేవుని మహిమ యొక్క ప్రతిబింబమైనవానియందు నివసించటం ద్వారా వెలుగు బిడ్డనైతే, ప్రస్తుతం ప్రపంచంలోని అంధకార నీడల మధ్య నివసిస్తునప్పటికీ, ఒక రోజు ఆకాశజ్యోతికి మించి ప్రకాశిస్తాను. మన ప్రభువైన యేసు ఈ భూమి మీదికి తిరిగి వచ్చినప్పుడు ఆయనను విశ్వసించినవారందరి యందు ప్రశంసింపబడుతుంది. “ఆ దినమున తన పరిశుద్దులయందు మహిమపరచబడుటను, విశ్వసించినవారందరియందు ప్రశంసింపబడుటకును  .........'' 2థెస్సలోనిక 1:9.

చివరిగా అపోస్తలుడు ప్రస్తుతం మనం అనుభవిస్తున్న “శ్రమలను” మనలో ప్రత్యక్షం కానున్న “మహిమ” తో పోల్చిచూచి ఈ రెండిటి మధ్య పొలిక లేదని తేల్చి చెబుతున్నాడు. ఒకటి అశాశ్వతమైనది మరొకటి శాశ్వతమైనది. మితమైనవాటికి అమితమైనవాటితో ఏ పోలిక లేనట్లే ఐహికశ్రమలకు పరలోక మహిమతో ఏ విధమైన సామ్యమూ లేదు.

మహిమలో ఒక్క క్షణము, జీవితకాల శ్రమలకు అధికంగా తూగుతుంది. శ్రమ జీవిత సంవత్సరాలు, అనారోగ్యం, పేదరికం, ప్రతి విధమైన దు:ఖాలు, విచారాలు ఇమ్మానుయేలు దేశం యొక్క మహిమతో పోల్చినప్పుడు ఏపాటివి! దేవుని కుడిచేతిలోని నిత్యసుఖపు నదిలోని ఒక్క బిందువు, పరదైసునందు ఒక్క ఊపిరి, రక్తముచే ప్రోక్షింపబడిన సింహసనము వద్ద ఒక్క ఘడియ ఈ లోకపు కన్నీళ్ళకు కష్టాలకు ఎన్నదగని పరిహారం. “మన యెడల ప్రత్యక్షము కాబోవు మహిమ యెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు” అని ఎంచుచున్నాను.

దేవుని కృపామహిమకు కీర్తి కలిగేలా ఈ మాటలను విశ్వాసంతో అంగీకరించి, తమ ప్రస్తుత పరిస్థితులకు వీటిని అన్వయించుకుని, అవి అందించే ఆనందాన్ని అనుభవించటానికి పరిశుద్ధాత్ముడు చదువరికి, రచయితకు సహాయం చేయును గాక!

4వ అధ్యాయం

అనుగ్రహించే గొప్ప దేవుడు

“తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతోపాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు” (రోమా 8:32).

దైవికతర్కానికి పై వచనం చక్కటి ఉదాహరణ. ఇందులో ఒక హేతువు, మరియు దాని ఆధారంగా తేలిన ఫలితార్థం , ఈ రెండు ఇమిడి ఉన్నాయి. దేవుడు తన ప్రజలందరి కొరకు క్రీస్తును సహితం అనుగ్రహించటానికి వెనుదీయలేదనే వాస్తావాన్ని ఆధారం చేసుకుని, వారికి అవసరమైనవన్నీ దేవుడు తప్పక అనుగ్రహిస్తాడనే నిర్థారణకు రావటాన్ని మనమిక్కడ గమనిస్తాము.పరిశుద్ధ లేఖనాలలో ఇలాంటి  దైవిక తర్కాలు తరచుగా వాడబడటం మనం గమనిస్తాము. ఉదాహరణ :

“నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. (మత్తయి 6:30).

“ఏలయనగా శత్రువులమైయుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన యెడల సమధానపరచబడినవారమై, ఆయన జీవుంచుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము” (రోమా 5:10)

“మీరు చెడ్డవారైయుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్యనెరిగి యుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును.” ( మత్తయి 7:11).

పై వచనాలలో చూసిన విధంగానే మన శీర్షిక వచనంలోని తర్కం కూడా నిర్వివాదంగా, స్పష్టంగా అర్థం అయ్యేదిగా మరియు సూటిగా మనస్సును తాకేదిగా ఉంది. తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించటాన్ని బట్టి ప్రేమామయుడైన మన దేవుడు ఎంత కృపామయుడో ఈ వచనం వ్యక్తపరుస్తుంది. ఇది కేవలం మన మనస్సులకు బోధ చేయటానికి మాత్రమే కాక మన హృదయాలకు ఆదరణ మరియు అభయమివ్వటానికి వ్రాయబడింది. తన కుమారుణ్ణి ఈవిగా ఇవ్వటం, దేవుడు తన ప్రజలకు అవసరమైనవన్నీ అనుగ్రహిస్తాడనటానికి హామీగా ఉంది. గొప్పవాటిలో అల్పమైనవి ఇమిడి ఉన్న విధంగా చెప్పనశక్యమైన ఈ గొప్ప ఆత్మీయదీవెన మన తాత్కాలిక అవసరతలు కూడా అనుగ్రహించే విషయంలో హామీ ఇచ్చేదిగా ఉంది. ఈ శీర్షిక వచనంలో ఉన్న నాలుగు అంశాలను అర్థం చేసుకుందాము.

1. తండ్రి యొక్క ప్రశస్తమైన త్యాగం

ఇది మనం అతి తక్కువగా ధ్యానించే ఒక ప్రాముఖ్యమైన సత్యపు కోణాన్ని మన దృష్టికి తెస్తుంది. క్రీస్తు త్యాగాన్ని తరచుగా ధ్యానిస్తూ ఆయన ప్రేమ మరణం కంటే బలమైనదని, తన ప్రజల నిమిత్తం ఎంత శ్రమైనా అధికమని తలంచని ఆయన కనికరము గొప్పదని మనం కొనియాడుతుంటాము. ఐతే, తన ప్రియకుమారుడు తన పరలోక గృహాన్ని విడిచి వెళ్ళటం దేవునికి ఎంత దుఃఖకరమై ఉండవచ్చు ! దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమకంటే సున్నితమైనది మరొకటి వుండదు. దేవుడు భావోద్వేగాలు లేనివాడని చెప్పే 'స్టోయిక్' లు అనబడే గ్రీకు తత్వవేత్తల అభిప్రాయంతో నేను ఏకీభవించను. తన ప్రియకుమారుణ్ణి పంపటం దేవుని హృదయాన్ని నొప్పించిన గొప్ప త్యాగం.

ఈ వచనంలోని వాగ్దానానికి ఆధారమైన గంభీరవాస్తవాన్ని శ్రద్ధగా ఆలోచించండి. దేవుడు తన సొంతకుమారుణ్ణి అనుగ్రహించటానికి వెనుదీయలేదు. ఈ మాటలు గంభీరమైనవి, స్పష్టమైనవి, కరిగింపజేసేవి. విమోచనకు ఏమి అవసరమో మరెవరికీ తెలియనంత స్పష్టంగా ఆయనకే తెలుసు. ధర్మశాస్త్రం కఠినమైనది, వంగనిది, విధేయతకై నిలువరించేది మరియు దానిని అతిక్రమించేవారికి మరణదండన విధించేదిగా ఉండగా, న్యాయం రాజీపడకుండా, సంతాపపడకుండా దోషిపై దయ చూపించటానికి నిరాకరించగా, విమోచన కలిగించగల ఏకైక మార్గమైన తన కుమారుణ్ణి పంపటానికి దేవుడు వెనుదీయలేదు.

దేవుడు " తన సొంతకుమారుని అనుగ్రహించుటకు వెనుదీయలేదు”. పశువులపాకలో పరుండాల్సిన దీనస్థితి మరియు అవమానం, మనుషుల కృతజ్ఞతారాహిత్యం, తలవాల్చుకోవటానికైనా స్థలములేని దుస్థితి, దైవవిరోధుల ద్వేషం మరియు వ్యతిరేకత, సాతాను యొక్క వైరం మరియు వాడు కలగజేసే గాయం ఇవన్నీ ఎదుర్కుంటాడని తెలిసి కూడా దేవుడు తన కుమారునిని అనుగ్రహించటానికి వెనుదీయలేదు. దేవుడు తన పరిశుద్ధ విధిని నెరవేర్చటంలో ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. పాపశాపము యొక్క తీవ్రతను ఏ మాత్రమూ తగ్గించలేదు. తన కుమారుణ్ణి పంపటానికి దేవుడు వెనుదీయలేదు. కడపటి కాసు వరకూ చెల్లింపవలసిందే. దేవుని ఉగ్రతపాత్రలోని చివరి బొట్టు వరకు (మడ్డి వరకు) త్రాగి తీరాల్సిందే. “తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్దనుండి తొలగిపోనిమ్మని” గెత్సెమనెలో తన ప్రియకుమారుడు వేడుకున్నప్పటికీ, దేవుడు అతనిని బలిగా అర్పించటానికి వెనుదీయలేదు. దుష్టుల చేతులు ఆయనను సిలువ వేసి, చేతులలో సీలలు దిగగొట్టినప్పుడు కూడా," ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను, నా సహకారి మీదను పడుము; ఇదేసైన్యమునకధిపతియగు యెహోవా వాక్కు.గొట్టెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము” (జెకర్యా 13:7) అని పరలోకపు తండ్రి బిగ్గరగా విలపించాడు. అప్పుడు సహితం దేవుడు తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించటానికి వెనుదీయలేదు.

2. తండ్రి యొక్క కృపాయుతమైన ఉద్దేశ్యం:

'మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు'. ఇంత విలువైన త్యాగం చేయటంలో తండ్రికున్న ఉద్దేశాన్ని ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాయి. మనందరి కొరకు అప్పగించాడు అంటే మనం రక్షించబడటానికి ఆయనను సైతం అప్పగించటానికి వెనుదీయలేదని అర్థం. ఇది క్రీస్తుపై ఆయనకు ప్రేమ లేదని కాదు కాని మనపై ఆయనకున్న ఆశ్చర్యకరమైన, అసమానమైన, వర్ణణాతీతమైన ప్రేమను సూచిస్తుంది. మహోన్నతుని ఈ అద్భుతకరమైన ప్రణాళికనుబట్టి ఆశ్చర్యపడండి.

“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పోందునట్లు ఆయనను అనుగ్రహించెను”. (యోహాను 3:16)

నిజంగా ఈ ప్రేమ ఊహకు అందనిది. అంతేకాక ఆయన చేసిన ఈ విలువైన త్యాగం సణుగుతూ, అయిష్టంగా కాకుండా తన అత్యంత ప్రేమ చేత ఉచితంగా చేశాడు -

ఒకప్పుడు తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలు జనంతో దేవుడు, “ఎఫ్రాయిమూ, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును ఇశ్రాయేలూ, నేను నిన్ను యెట్లు విసర్జింతును?” (హెూషేయ 11:8) అని తన ప్రేమను వెల్లడి చేసాడు. నిశ్చయంగా తాను ప్రతి దినం ఆనందించిన పరిశుద్ధుడైన తన ప్రియకుమారుని గురించి ఇలా చెప్పటానికి మరింత గొప్ప కారణం ఉంది. అయినా, సిగ్గును, అవమానాన్ని భరించేలా, ద్వేషాన్ని, శ్రమలను సహించేలా తన కుమారునిని అప్పగించటానికి ఆయన వెనుదీయలేదు. తిరుగుబాటు చేసిన ఆదాము సంతతివారమై పతనమైన, అపవిత్రమైన, క్షయమైన, పాపులమైన, విలువలేని మనకొరకు, దేవుణ్ణి విడచి దూరదేశములోనికి తోలగిపోయి, అక్కడ మన ఆస్తినంతటిని దుర్వ్యాపారం చేత పాడు చేసిన మనకొరకు ఆయనను అప్పగించటానికి వెనుదీయలేదు. తప్పిపోయిన గొర్రెలవలె , మనకిష్టమైన త్రోవలకు తిరిగిన మన కొరకు ఆయనను అప్పగించాడు. ఇతరులవలె స్వభావసిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమైయుండిన మనకొరకు, మంచిది ఏదీ లేని మనకొరకు ఆయనను అప్పగించాడు, ఆయన పరిశుద్ధతను ద్వేషించి ఆయన వాక్యం నిర్లక్ష్యం చేసి, ఆయన ఆజ్ఞలను అతిక్రమించి ఆయన ఆత్మను ఎదిరించిన మనకొరకు ఆయనను అప్పగించాడు. నిత్య నరకాగ్ని పాత్రులమై, మన పాపాలు సంపూర్తిగా సంపాదించిపెట్టిన జీతాన్ని పొందుకోవలసిన మన కొరకు ఆయనను అప్పగించాడు.

అవును తోటి విశ్వాసీ! కొన్నిసార్లు శ్రమలు ఎదుర్కోవలసి వచ్చినప్పుడు, దేవుడు కఠినాత్ముడని విమర్శించటానికి శోధింపబడి పేదరికంలో జీవించవలసి వచ్చినప్పుడు, దేవుడు నీ పట్ల నిర్లక్ష్య వైఖరిగలవాడని అనుకుని, అంధకార ఘడియల ద్వారా పయనిస్తున్నప్పుడు నిన్ను విడిచిపెట్టేశాడని భావించే నీ కొరకే ఆయనను అప్పగించాడు. అందుకే దేవుని ఘనహీనపరచే అలాంటి సందేహల దోషాన్ని వెంటనే ఒప్పుకుని, తన సొంత కుమారునిని అనుగ్రహించటానికి వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన దేవుని ప్రేమను ఇక ఎన్నడూ ప్రశ్నించకు.

శీర్షిక వచనంలో “ అందరికి" అనే మాటను పరిమితం చేసే 'మన' అనే సర్వనామన్ని ఎత్తిచూపించాలని విశ్వాస్యత నన్ను బలవంతపెడుతుంది. ఇక్కడ 'అందరికొరకు అప్పగించెను' అని కాక 'మనందరి కొరకు అప్పగించెను' అని వ్రాయబడి ఉంది. ఈ 'మన' అనే మాట ఎవరిని సూచిస్తుందో, ముందువున్న వచనాలు స్పష్టంగా నిర్వచిస్తున్నాయి. రోమా 8:31వ వచనంలో “దేవుడు 'మన' పక్షముగా వుండగా మనకు విరోధి ఎవడు?” అని ప్రశ్నించబడింది. రోమా 8:30లో ఈ 'మన' అనే మాట ముందుగా నిర్ణయింపబడి, పిలవబడి నీతిమంతులుగా తీర్చబడినవారిని సంభోదిస్తుందని స్పష్టమౌతుంది. కాబట్టి 'మనందరి కొరకు ' అంటే 'పరలోక మహిమ కొరకు ఏర్పరచబడిన దేవుని సార్వభౌమ్య కృపకు పాత్రులందరి కొరకు' అని అర్థం. వారు దేవునిచే ఎన్నిక చేయబడినవారు. స్వభావసిద్ధంగా మరియు ఆచరణాత్మకంగా వారు కూడా కేవలం ఉగ్రతపాత్రులే. అయినా దేవునికి స్తోత్రములు; ఈ వాగ్దానం 'మనందరికి' వర్తింపచేయబడింది. అల్పులకేమి, అధికులకేమి, అయిదు వందల దేనరములు అచ్చియున్నవానికి, యేబదికాసులు అచ్చియున్నవానికి, క్లుప్తంగా 'మనందరికి' ఈ వాగ్దానము వర్తిస్తుంది.

3. పరిశుద్ధాత్ముడు తేల్చి చెప్పిన దీవెనకరమైన ఫలితార్థం :-

శీర్షిక వచనంలోని మొదటి భాగాన్ని ఆధారం చేసుకుని పరిశుద్ధాత్ముడు ఇక్కడ తేల్చి చెప్పే ఫలితార్థాన్ని సూక్ష్మంగా ధ్యానించండి. “తన సొంత కమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?” అపోస్తలుడు దైవావేశం చేత ఇక్కడ ప్రయోగించిన తర్కం ఎంత నిర్దిష్టమైనది, ఎంత ఆదరణాత్మకమైనది ! అత్యధికమైనది అనుగ్రహించటానికి వెనుదీయని దేవుడు, దానికంటే అల్పమైన అవసరతలను తీర్చుటానికి సంసిద్దంగా ఉన్నాడని విశ్వాసికి హామీ ఇస్తున్నాడు. దేవుడు తన సొంత కుమారుణ్ణి ఇష్టపూర్వకంగా, బేషరతుగా మనకు అనుగ్రహించాడనే వాస్తవం ఇతర అవసరతలను తీర్చేందుకు వెనుదీయడనటానికి హామీగా ఉంది.

అనేక శ్రమల ద్వారా అలసిన హృదయంగల విశ్వాసికి, ఈ సందేశం దేవుని మార్పులేని నిత్య నిరీక్షణతో కూడిన కావలిగా ఉంది. అధికమైనది చేసిన దేవుడు, అల్పమైనది చేయడా ? శాశ్వత ప్రేమ ఎన్నడూ మారదు. క్రీస్తును సైతం అనుగ్రహించటానికి వెనుదీయని ప్రేమ ఇతర ఆశీర్వాదాలను ఇవ్వటానికి వెనుకాడదు. విచారకరమైన సంగతి ఏంటంటే మన హృదయలు కలిగున్నవాటిని గురించి కాకుండా, మనకు లేనివాటి గురించి ఎక్కువగా చింతిస్తుంది. కాబట్టి దేవుని ప్రేమను, దాని ద్వారా కలిగే ఆశీర్వాదాలను, నిరంతరం జ్ఞాపకం చేయటం వలన, దేవుని ఆత్మ మన అలసిపోయిన హృదయాలోచనలను నెమ్మది పరచి, మన అసంతృప్తితో కూడిన ప్రాణాన్ని సత్యజ్ఞానం చేత తృప్తిపరుస్తున్నాడు.

శీర్షిక వచనంలో ఉన్న తర్కాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మొదటిగా అడగకుండనే గొప్ప బహుమానంగా తన కుమారుణ్ణి దయచేసినవాడు, అడిగితే, ఇతర ఈవులను ఇవ్వటానికి ఏందుకు నిరాకరిస్తాడు? మనలో ఏ ఒక్కడూ తన స్వంత కుమారునిని అనుగ్రహించమని దేవుణ్ణి బ్రతిమాలుకోలేదు. అయినా దేవుడు ఆయనను మనకు అనుగ్రహించాడు. అయితే ఇప్పుడు మనం క్రీస్తుని బహుబలమైన నామమున దేవుని కృపాసింహాసనము వద్దకు మన విన్నపాలను తీసుకురావటానికి గొప్ప అవకాశం ఉంది.

రెండవది, మనకు దేవుడిచ్చిన ఆ గొప్ప బహుమతి (క్రీస్తు) ఎంతో విలువైనది. కాగా, ఏ విలువలేని ఇతర ఈవులను ఇవ్వటానికి ఎందుకు నిరాకరిస్తాడు. ఒకవేళ ఒక స్నేహితుడు నాకు ఒక చిత్రపటాన్ని బహుమతిగా ఇస్తే దానితో పాటు దానిని భద్రపరచటానికి కాగితాన్ని మరియు కట్టటానికి దారం కూడా ఇవ్వడా? లేక ఒకవేళ ఒక  ప్రియుడు తన ప్రియురాలికి ఒక ప్రశస్తమైన ఆభరణాన్ని బహుమతిగా ఇస్తే, దానితో పాటు దానిని భద్రపరచటానికి చిన్న పెట్టెను (డబ్బాను) కూడ ఇవ్వడా? ఆలాగైతే తన సొంతకుమారునిని అప్పగించటానికి వెనుదీయని పరలోకపు తండ్రి యథార్థంగా ప్రవర్తించేవారికి సమస్త మేలును చేయక ఎలా మానగలడు?

మూడవది, దేవుడు ఈ ప్రశస్తమైన బహుమానాన్ని (క్రీస్తు) మనమింకా శత్రువులుగా ఉన్నప్పుడే అనుగ్రహించాడు. కాగా, ఇప్పుడు ఆయనతో సంధి చేసుకుని, ఆయన కృపలోనికి వచ్చి, ఆయనకు స్నేహితులమైన మనకు సమస్తం ఎందుకు అనుగ్రహించడు? మనమింకా పాపంలో ఉండగా, మనకొరకు అత్యుత్తమమైన తన ప్రేమసంకల్పం కలిగున్న దేవుడు, ఇప్పుడు ఆయన కుమారుని ప్రశస్తమైన రక్తం చేత కడగబడినవారమైన మన కొరకు మరింత అధికమైన మేలులు చేయటానికి ఇష్టపడతాడు.

4. ఆదరణపూరితమైన వాగ్దానం :

ఈ శీర్షిక వచనంలోని తదుపరి భాగంలో ఉన్న వాగ్దానంలో వాడబడిన కాలాన్ని గమనించండి. “ఆయనతో పాటు సమస్తమును అనుగ్రహించెను” అని కాక “ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహింపడు?" అని ఉంది. ఈ గొప్ప వాగ్దానం ఇదివరకే దేవుడు చేసిన మేళ్ళను లెక్కించటం మాత్రమే కాకుండా, ఇప్పటికీ, ఇంకెప్పటికీ అవసరమైన స్థిరమైన అభయాన్ని మనకు అందిస్తుంది. “ఎందుకు అనుగ్రహింపడు” అనే ఈ మాటపై కాలపరిమితులేవీ విధించలేము. నిన్న, నేడు, నిరంతరం దేవుడు తనను తాను “అనుగ్రహించే గొప్ప దేవునిగానే'' కనపరచుకుంటాడు. దేవుడు తనకు మహిమకరం మరియు మనకు మేలుకరమైన ఏ మేలైనా చేయక మానడు. క్రీస్తును మనకై అనుగ్రహించిన దేవునియందు ఏ చంచలత్వమూ లేదు.

దేవుడు అనుగ్రహించే రీతిని గమనించండి. “ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు” అనే ఈ మాటలను మూలభాష అనుసరించి చూస్తే 'ఆయనతో పాటు ఉచితంగా సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు' అని అనువదించాలి. (ఉచితముగా అనే మాట తెలుగు అనువాదంలో మనకు కనిపించదు) ఉచితముగా అనే ఈ మాట దేవుడు అనుగ్రహించే రీతిని మనకు తెలియచేస్తుంది. దేవుణ్ణి బుజ్జగించాల్సిన అవసరం లేదు. మనం అతిగా బ్రతిమాలి అధిగమించాల్సిన నిర్లక్ష్యం ఏది దేవునిలో లేదు. పుచ్చుకోవటానికి గల మన సంసిద్ధత కంటే ఇవ్వటానికి ఆయన సంసిద్ధుడైవున్నాడు. నిజానికి మనకు మేలు చేయటానికి ఆయన మనకు ఋణస్తుడు కాడు. ఒక వేళ ఆలాగైతే ఉచితముగా కాకుండా, ఒక ఋణస్తునిగా, మనకు మేలు చేసి ఉండేవాడు. తన సొమ్ముతో తనకు ఇష్టం వచ్చినట్టు చేయటానికి ఆయనకు అధికారం ఉందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. తన ఇష్టానుసారంగా ఎవరికైనా ఇవ్వటానికి ఆయనకు స్వేచ్ఛ ఉంది.

ఉచితంగా అనే పదం దేవుడు ఎలాంటి నిర్భందం లేకుండా స్వేచ్ఛగా అనుగ్రహిస్తాడనే భావనను వ్యక్తపరచటం మాత్రమే కాక ఆయన ఇచ్చే ఈవులపై ఎలాంటి మూల్యాన్ని విధించడని తన ఆశీర్వాదాలపై ఎలాంటి వెలనూ విధించడని కూడా అర్థాన్ని కుడా ఇస్తుంది . దేవుడు కనికరాల వర్తకుడు కానీ, మంచి ఈవులను అమ్మేవాడు కాని కాదు. ఒకవేళ అలా అయ్యుంటే న్యాయంగా తన ప్రతి ఆశీర్వాదానికి సరితూగే మూల్యాన్నే విధించవలసి వస్తుంది. అప్పుడు ఆయన కృపకు, ఆశీర్వాదాలకు గల మూల్యం చెల్లించటం ఆదాము సంతతి వారిలో ఎవరి వల్ల అవుతుంది ? దేవుని నామానికి మహిమకలుగును గాక.

దేవుని కృపకు మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదు. దానికి వెల లేదు, ఆయన కృపను కొలవటం మానవుని తరం కాదు. కొనుక్కోవటం అంత కన్నా కాదు. అది కేవలం ఉచితంగానే ఇవ్వబడుతుంది. (యెషయా 55:1;)

చివరిగా, ఆయన వాగ్దానాల విస్తీర్ణతను బట్టి ఆనందించండి. ఆయనతో పాటు సమస్తాన్ని మనకెందుకు అనుగ్రహించడు? అను మాటలోని దేవుని వాగ్దానం ఎంత విస్తారమైనదో పరిశుద్ధాత్ముడు ఇక్కడ మనకు బయలుపరుస్తున్నాడు. తోటి క్రైస్తవుడా! నీకు ఏం కావాలి ?

క్షమాపణ కావాలా ?

అయితే “మనము మన పాపములను ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును” (1 యోహను 1:9 ) అని దేవుడు వాగ్దానం చేయలేదా?

ఒకవేళ కృవ కావాలా ?

“అయితే మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సమృద్ధి గల వారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు” అని దేవుడు వాగ్దానము చేయలేదా? (2 కొరింథీ 9:8)

ఒకవేళ శరీరములో ముల్లా  ?:

ఇది కూడ ఇవ్వబడుతుంది. “నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపొకుండు నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను” ( 2 కొరింథి 12:7)

ఒకవేళ విశ్రాంతి కావాలా ?:

అయితే రక్షకుని ఆహ్వానాన్ని స్వీకరించు. “ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి,నేనుమీకువిశ్రాంతికలుగజేతును”(మత్తయి11:28)

ఒకవేళ ఆదరణ కావాలా?:

“అయితే ఆయన సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు కాడా?” (2 కొరింథి 1:3). 'ఆయనతో పాటు సమస్తమును ఉచితముగా మనకెందుకు అనుగ్రహింపడు.” ఒకవేళ చదువరి కోరేది ఐహిక అవసరాలా ? నీ గిన్నెలో ఆహారము, బుడ్డిలో నూనె అతి త్వరలో తగ్గిపోయి ఏమి మిగలకుండా పొతుందని చింతిస్తున్నావా ? అలా ఐతే నీ అవసరాన్ని దేవుని ముందు ఉ౦చి చంటి పాపలాంటి విశ్వాసాన్ని కనపరచు. దేవుడు ప్రశస్తమైన ఆత్మీయ ఈవులు అనుగ్రహిస్తాడు కాని తాత్కాలిక అవసరతలు అలక్ష్యపెడతాడని నీవ్వు అనుకుంటున్నావా ? అట్లనరాదు. " దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమతో మీ ప్రతి అవసరమును తీర్చును” ( ఫిలిఫ్ఫి 4:19).

నిజమే, నువ్వు అడిగేవన్నీ ఇస్తానని ఆయన వాగ్దానం చేయలేదు. ఎందుకంటే మనం తరచుగా మన భోగేచ్ఛల నిమిత్తం దురుద్దేశంతో అడుగుతాం. శీర్షిక వచనంలోని వాగ్దానానికి గల పరిమితిని అతి జాగ్రతగా గమనించండి 'ఆయనతో పాటు సమస్తమును ఉచితముగా మనకెందుకు అనుగ్రహింపడు?” 'ఆయనతో పాటు' అనే మాట ఈ వాగ్దానాన్ని పరిమితం చేసేమాట. అంటే ఆయన ఏమి అనుగ్రహించినా ఆయనతో పాటు అనుగ్రహిస్తాడు. అనేకసార్లు మనం మనకు, క్రీస్తుకు మధ్య అడ్డు వచ్చేవాటిని అడుగుతాము కనుక దేవుడు తన విశ్వాస్యతలో వాటిని మనకు ఇవ్వడు. ఇక్కడ నూతనపరచబడిన ప్రతి హృదయానికి ఆదరణ ఇచ్చే నాలుగు విషయాలను ధ్యానించాము.

తండ్రి యొక్క ప్రశస్తమైన త్యాగం. మన దేవుడు అనుగ్రహించే గొప్ప దేవుడు. యథార్థంగా ప్రవర్తించేవారికి ఆయన ఏ మేలునూ చేయక మానడు.

తండ్రి యొక్క కృపాయుతమైన ఉద్దేశ్యం. క్రీస్తు అప్పగింపబడినది కేవలం మన కొరకే. మనం అత్యధికంగాను, నిత్యంగాను ఆశీర్వాదించబడలన్నదే దేవుని కృపాయుతమైన ఉద్దేశ్యం.

పరిశుద్ధాత్ముడు తేల్చి చేప్పే దీవెనకరమైన ఫలితార్థం. అత్యధికమైనది అనుగ్రహించటానికి వెనుదీయని దేవుడు, దానికంటే అల్పమైన అవసరతలను తీర్చుటానికి సంసిద్ధంగా వున్నాడు. తన సొంత కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడన్న వాస్తవమే మన ఇతర అవసరాలు తీర్చుటానికి ఆయన వెనుదీయడనటానికి హమీగా ఉంది.

ఆదరణపూరితమైన వాగ్దానం. ఈ వాగ్దానం ప్రస్తుతానికి, రాబోయే యుగానికి, ఆశీర్వాదకరమై మన హృదయాలకు నిరీక్షణ మరియు మన మనస్సులకు సమాధానాన్ని కలగజేసే ఆదరణగా ఉంది. ప్రభువు ఈ చిన్ని ధ్యానాన్ని తన ఆశీర్వాదం చేత నింపును గాక.

5వ అధ్యాయం

జ్ఞాపకం చేసుకునే దేవుడు

 కీర్తన 136:23 - “మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసికొనెను ఆయన కృప నిరంతముండును”

"జ్ఞాపకము చేసికొనెను”. ఇది తరచూ మరచిపోయే మన స్వభావానికి విరుద్ధమైన దేవుని సులక్షణం. మనలోని ఇతర సామర్థ్యాలలాగే మన జ్ఞాపకశక్తి కూడా పతనం వలన ప్రభావితమై పాపభూయిష్టమైపోయింది. పనికిమాలినవి గుర్తుంచుకునే శక్తి, ఉపయోగకరమైనవాటిని మరచిపోయే బలహీనత ఇందుకు నిదర్శనాలు. అర్థంలేని ఒక చిన్నపిల్లల పద్యాన్ని లేదా యవ్వనంలో పాడిన, లేక విన్న పాటని ఒక మనిషి జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. అయితే లాభసాటియైన ఒక దేవుని వర్తమానం ఇరవై నాలుగు గంటలలోపే మరచిపోతాడు. అయితే అన్నిటికంటే విషాదకరం మరియు గంభీరమైన వాస్తవం ఏమిటంటే దేవుడినే, లెక్కించలేని ఆయన కనికరాలనే మనం సులువుగా మరచిపోతుంటాం. అయితే దేవునికి స్తోత్రము కలుగునుగాక! దేవుడు మనలను ఎన్నటికీ మరచిపోడు; ఆయన నమ్మకంగా జ్ఞాపకం చేసుకునే దేవుడైయున్నాడు.

“జ్ఞాపకము” అనే మాట లేఖనాలలో మొదటి ఐదు పర్యాయాలు దేవునికే సంబంధించి వాడబడటాన్ని చూసి ఆశ్చర్యపోయాను.

“దేవుడు నోవహును అతనితో ఓడిలో నున్న సమస్త జంతువులను, సమస్తపశువులను జ్ఞాపకము చేసికోనెను(ఆదికాండము8:1).

“ఆ ధనుస్సు మేఘములో ఉండును నేను దాని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరులతో ప్రాణముగల ప్రతిదానికిని మధ్యనున్న నిత్యనిబంధనను జ్ఞాపకము చేసికోందుననెను” ( ఆదికాండము 9:16).

“దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడుచేసినప్పుడు దేవుడు అబ్రాహమును జ్ఞాపకము చేసుకోని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మద్యన లోతు నశించకుండ అతని తప్పించేను (ఆది 19:29).

కాని మొదటిసారి మానవుని విషయంలో ఈ పదం వాడబడిన సందర్భం చూడండి

"అయితే పానదాయకుల అధిపతి యోసేపును "జ్ఞాపకము” చేసికొనక అతని మరచిపోయెను” ( ఆది 40:23).

శీర్షిక వచనంలో పేర్కొనబడిన చారిత్రాత్మక సందర్భం ఐగుప్తు ఇటుకబట్టీలలో పాట్లుపడిన ఇశ్రాయేలుకు సంబంధించినది. అక్కడ వారు నిజంగా ఎంతో దీనస్థితిలో వున్నారు. దాస్యంలో, కనికరములేని కార్యనియామకుల కోరడా దెబ్బలతో మూలుగుతూ, దేవుణ్ణి ఎరుగని కఠిన హృదయంగల రాజు చేత పీడింపబడిన స్థితిలో వారు ఉన్నారు. కనికరం చూపించటానికి ఎవరూ లేని ఆ దీనస్థితిలో యెహోవా వారిని చూశాడు; ఆపదలో ఉన్న వారి మొరలకు ఆయన చెవి యొగ్గాడు. వారి “ దీనదశలో” ఆయన వారిని "జ్ఞాపకము” చేసుకున్నాడు. ఇందుకు కారణం ఏమిటి? నిర్గమ 2:24,25;) ఈ విధంగా తెలియజేస్తుంది -  “కాగా దేవుడు వారియందు లక్ష్యముంచెను”

అయితే శీర్షిక వచనాన్ని కేవలం అక్షరార్థంలో అబ్రాహాము సంతతివారైన ఇశ్రాయేలీయులకు మాత్రమే పరిమితం చేయకూడదు. ఇది "దేవుని ఇశ్రాయేలు" (గలతీ 6:16;) అంతటికీ వర్తిస్తుంది. రక్షణలో పాలుపొందిన నేటి విశ్వాసులు కూడా కీర్తనకారునితో ఏకీభవించి “మనము దీనదశలో నున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసికొనెను” అని అనగలరు.

మన సహజస్థితి ఎంత దయనీయంగా వుండింది ! మన పతనావస్థలో, మనలను మనం రక్షించుకోలేనంత దౌర్భాగ్య స్థితిలో, దుష్టత్వంలో పడియున్నాము. కాని తన ఆశ్చర్యమైన కృప చేత దేవుడు మనపై కనికరం చూపించాడు. తన బలిష్టమైన హస్తాన్ని క్రిందికు చాచి మనలను విడిపించాడు. మనం పడియున్న చోటికి ఆయన వచ్చి మనలను చూసి మనపై జాలిపడ్డాడు. (లూకా10:30-33;) కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా “నాశనకరమైన గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను" (కీర్తన 40:2) అని చెప్పగలడు.

ఎందుచేత ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు? "జ్ఞాపకము చేసుకొనుట” అనే మాట పూర్వమే ఆయన మన పట్ల కలిగున్న కనికరపు తలంపును సూచిస్తుంది కదా! ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలవలే మన పతనావస్థలో మనలను కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. నిత్యత్వం నుండే మన పూటకాపుతో ఆయన చేసిన నిబంధనను “జ్ఞాపకము చేసుకున్నాడు”. తీతు 1:2-4లో మనం చదివిన ప్రకారం నిత్యజీవాన్ని అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశాడు. క్రీస్తు ఎవరి కొరకు తన ప్రాణాన్ని ఫణంగా పెట్టాడో వారికి ఆ నిత్యజీవం అనుగ్రహించబడుతుందన్న వాగ్దానం నిత్యత్వంలోనే క్రీస్తుతో చేయబడింది.

"జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను” ఎఫెసీ 1:4 అని దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు కాబట్టే యుక్తకాలమందు ఆయన మనల్ని మరణం నుండి జీవంలోనికి నడిపించాడు.

అయినా బహుదీవెనకరమైన ఈ శీర్షిక వచనంలోని మాట దేవుని రక్షణార్థమైన కృపను మనం పొందిన ప్రారంభ అనుభవానికి మాత్రమే పరిమితం కాదు. ఈ మాట వెనుక గల చరిత్ర, ఈ వాక్య సందర్భంలోనే నిర్ధారించబడిన విధంగా, కేవలం ఐగుప్తులో ఉన్నప్పుడే దేవుడు వారిని జ్ఞాపకము చేసుకున్నాడని చెప్పటం లేదు కాని అరణ్యంలో వాగ్దానదేశానికి ప్రయాణం చేసే మార్గమంతటిలో ఆయన వారిని జ్ఞాపకం చేసుకున్నాడని చూడగలం. అరణ్యంలోని ఇశ్రాయేలీయుల అనుభవాలన్నీ, శత్రువైన ఈ లోకముగుండా పయనించే ఒక విశ్వాసియాత్రకు ఛాయలుగా ఉన్నాయి. యెహోవా వారిని జ్ఞాపకం చేసుకుని, వారి అక్కరలను, ఆకలిని ప్రతిరోజు తీర్చటంలో కనపరచబడిన సత్యం, మన పరలోక నివాసానికి మనం పయనించేటప్పుడు, ఆయన మనయందుంచే కృపైశ్వర్యాలతో కూడిన ఏర్పాట్లకు సూచనగా ఉంది.

భూమిపై ఇప్పుడు మనమున్న స్థితి ఎంతో దయనీయమైనది. ఎందుకంటే మనమింకా ఎలుబడి చేసేవారిగా లేము. అయినా మన దేవుడు ఎల్లప్పుడు మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రతిక్షణం ఆయన మనకు తన కృపను అందిస్తున్నాడు.

“మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను”.

ఎల్లప్పుడూ అనుకూల పరిస్థితులు కలిగుండటం సాధ్యం కాదని, మన అనుభవాల ద్వారా మనకు తెలుసు. సూర్యకాంతిచేత ప్రకాశవంతమైన రోజుల వెంబడి, మేఘాలు కమ్ముకున్న చీకటి రోజులు కూడా వస్తాయి. వేసవి వెంబడి శీతాకాలం కూడా వస్తుంది. నిరాశలు, కష్టనష్టాలు, నిట్టూర్పులు మన జీవితంలోకి వచ్చి మన స్థితిని దయనీయంగా మార్చాయి, తరచూ మన స్నేహితుల ఆదరణ కావలసిన సమయంలోనే వారు మనలను నిరాశపరిచారు. మనకు సహాయం చేస్తారని మనం ఎంచినవారు మనలను ఎడబాపారు. అయినా అప్పుడు కూడా మనలను "జ్ఞాపకం చేసుకొని” తాను నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడినని నిరూపించుకున్న ఒకడు మనతో ఉన్నాడు. అప్పుడు మరలా మన జీవితంలో, “యెహెూవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును” 1 దిన 16:34 అనే సత్యం నిరూపించబడింది.

“మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను”. ఈ మాటలను మరో సందర్భానికి, అంటే, మొదట నీకున్న ప్రేమను, నువ్వు వదిలిన సమయాలకు కూడా అన్వయించవచ్చు. అప్పుడు నీ హృదయం చల్లబడి, నీ జీవితం ఈ లోకంతోను, దానిలోనున్నవాటితోను నిండియుండింది. అప్పుడు నువ్వు మరలా నీ వెనుకటి స్థితికి దిగజారావు. అప్పుడు నీ స్థితి అత్యంత దయనీయంగా ఉండింది. అయినా అప్పుడు కూడ విశ్వాస్యత గల మన దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అవును, మనలో ప్రతి ఒక్కరూ, కీర్తనాకారునితో ఏకీభవిస్తూ, “నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు (మూలభాషను అనుసరించి - 'నా ప్రాణమును ఆయన పునరుద్ధరించుచున్నాడు') తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు.” కీర్తనలు 23:4 అని చెప్పటకు ఎంతో కారణముంది.

“మనము దీనదశలో నున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను”. ఈ మాటలను విశ్వాసి యొక్క జీవితంలోని మరో పరిస్థితికి కూడా అన్వయించవచ్చు. అదేమిటంటే తన జీవితంలోని చివరిదైన అతిగొప్ప శోధన, అంటే అతడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే ఘడియ. తన శరీరంలో ప్రాణాధారమైనవన్నీ మందగించి, తన సహజశక్తులన్నీ కోల్పోతున్న సమయంలో కూడా తన స్థితి ఎంతో దయనీయమైనది. అయితే అప్పుడు కూడా ప్రభువు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు.

“ఆయన కృప నిరంతరముండును". మన బలహీనతలలో ఆయన శక్తి పరిపూర్ణమౌతుంది. ఇలాంటి సందర్భములోనే “నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను. దిగులుపడుకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియనే ఉ నా దక్షిణ హస్తముతో నిన్నుఆదుకోందును.” యెషయా 41:10 అనే తన ఆదరణవాగ్దానాలు నెరవేరుస్తూ మనలను " జ్ఞాపకము” చేసుకుంటాడు.

“మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసికొనెను.” నిజంగా ఈ శీర్షిక వచనం మనం నిత్య నివాసంలో ప్రభువు చెంత ఉన్నప్పుడు ఆయనను స్తుతించటానికి తగిన మాటలను మనకు అందిస్తుంది. ఆయన నిబంధన విశ్వాస్యతను బట్టి, సాటిలేని ఆయన కృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి, “మనము మన దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసికొనిన” దానిని బట్టి మనం  ఆయనను ఎంతగానో స్తుతిస్తాము, 'అప్పుడు మనం పూర్తిగా ఎరుగబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదుము'. అప్పుడు మన జ్ఞాపకశక్తి నూతనపరచబడి పరిపూర్ణం చేయబడుతుంది గనుక ఆయన మనలను నడిపించిన మార్గమంతటిని మనం జ్ఞాపకము చేసుకుంటాము. విశాస్యతతో కూడిన ఆయన జ్ఞప్తిని కృతజ్ఞత మరియు ఆనందంతో గుర్తుచేసుకుంటాము.  “ఆయన కృప నిత్యముండును” అని ఆరాధనాపూర్వకంగా ఒప్పుకుంటాము.

6 వ అధ్యాయం 

అగ్నిచేత పరీక్షింపబడటం

“నేను నడచు మార్గము ఆయనకు తెలియును, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలే కనబడుదును.” (యోబు. 23:10)

యోబు ఇక్కడ తనని తాను సరిదిద్దుకుంటున్నాడు. ఈ అధ్యాయం ఆరంభంలో, “నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను నా వ్యాధి నా మూలుగుకంటే భారముగా నున్నది” (యోబు 23:2) అని యోబు ఫిర్యాదు చేయటం మనం చూస్తాం. పాపం ! యోబు తనకు కలిగిన భారం భరించలేనిదని భావించాడు. అయితే యోబు ఈ వైఖరి నుండి కోలుకున్నాడు. తాను ఆవేశంతో కూడిన తొందరపాటును సరిచూసుకుని, మనోవికారం వలన కలిగిన తన ఆలోచనను సవరించుకున్నాడు. మనందరం కూడా మనల్ని మనం సరిదిద్దుకోవలసిన అవసరం ఉంది. అయితే ఈ భూమిపైన జీవించిన ఒకే ఒక్క నరునికి మాత్రం ఆ అవసరం రాలేదు.  

యోబు ఇక్కడ తనని తాను ఓదార్చుకుంటున్నాడు. దేవుని ఏర్పాటులో ఉన్న మర్మాలను అతను గ్రహించలేకపోయాడు. అయితే తాను నడిచే మార్గం దేవునికి తెలుసు. యోబు నెమ్మది కలిగించే దేవుని సన్నిధిని ఆశతో వెదకినా, ఆ సమయంలో మాత్రం అతడు దానిని కనుగొనలేకపోయాడు. అందుకే “నేను తూర్పు దేశమునకు వెళ్ళినను ఆయన కనబడుట లేదు, ఆయన పనులు జరిపించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కనబడుట లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకోనియున్నాడు నేనాయనను కనుగొనలేదు” (యోబు 23:8,9) అన్నాడు. అయితే యోబు ఈ వాస్తవంతో తన్ను తాను ఓదార్చుకున్నాడు . నేను దేవుణ్ణి చూడలేకపోయినా అంతకంటే వెయ్యిరెట్లు మెరుగైనది ఏమిటంటే దేవుడు నన్ను చూస్తున్నాడు. "ఆయనకు తెలియును”. దేవుడు మన పరిస్థితుల పట్ల అలక్ష్యత కాని ఉదాసీనత కాని చూపించేవాడు కాదు. ఒక పిచ్చుక నేల మీద పడటాన్ని గమనించే దేవునికి, ఒక తల వెంట్రుక రాలటం కూడ యెరిగిన దేవునికి, నిశ్చయంగా నేను నడిచే మార్గం తెలుసు.

యోబు ఇక్కడ జీవితం గురించి సరిమైన దృక్పథాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అతడు గొప్ప నిరీక్షణను కనపరుస్తున్నాడు. తనను విశ్వాసహీనునిగా చేయటానికి యోబు తన వ్యథలను అనుమతించలేదు. అతడు తన పైకి వచ్చే శోధనలను, శ్రమలను తనని అణచివేయటానికి అనుమతించలేదు. అతడు అంధకార మేఘాల మధ్య ప్రకాశవంతమైన కోణం అంటే ఇంద్రియగోచరం కాని దేవుని కోణాన్ని చూస్తున్నాడు. అతడు జీవితం యొక్క దీర్ఘకాల ప్రణాళికను చూసాడు. తన పైకి వచ్చిన శ్రమలకు అతీతంగా చూసి, వాటి ఫలితంగా అగ్ని చేత శుద్ధి చేయబడిన సువర్ణంలా తీర్చిదిద్దబడతాడని విశ్వసించాడు. "నేను నడచు మార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణమువలే కనబడుదును.” (యోబు 23:10) ఈ వచనంలో మూడు గొప్ప సత్యాలు వ్యక్తపరచబడ్డాయి. వాటిని ఇప్పుడు క్లుప్తంగా విశ్లేషిదాం.

నా జీవితం గురించి దేవుని ఎరుక “ నేను నడచు మార్గము ఆయనకు తెలియును”. దేవుని స్వర్వజ్ఞత ఆయన దైవత్వంలోని ఘనమైన గుణలక్షణాలలో ఒకటి. “ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడియుంది. ఆయన వారి నడతలన్నియు కనిపెట్టి చూచుచున్నాడు.” (యోబు 34:21)

“యెహెూవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును; చెడ్డ వారిని మంచి వారిని అవి చూచుచున్నది. (సామెతలు 15:3)

చార్లెస్ స్పర్జన్ గారు ఇలా అన్నారు - 'దేవుని యొక్క సర్వజ్ఞతతో నాకు ఎలాంటి సంబంధం ఉందన్నది విశ్వాసం యొక్క యథార్థతకు అతి గొప్పదైన పరీక్ష!'

ప్రియ చదువరీ! దేవుని స్వర్వజ్ఞతతో నీకు గల సంబంధం ఎమిటి ? అది నిన్ను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది ? అది నిన్ను కలవరపెడుతుందా? లేక ఆదరిస్తుందా ? దేవుడు నీ మార్గములన్నీ యెరిగియున్నాడు అనే వాస్తవం నుండి నువ్వు తప్పించుకోవాలనుకుంటున్నావా? అలాగైతే ఒకవేళ నీ నడత అబద్ధం, స్వార్థం, వేషధారణతో కూడినదై ఉండవచ్చు. తన మార్గాలన్నీ దేవునికి తెలుసన్న తలంపు పాపికి ఎంతో భయం పుట్టిస్తుంది. అతడు దానిని నిరాకరిస్తాడు లేదా మరచిపోవటానికి మార్గాలు వెదకుతాడు. అయితే క్రైస్తవునికి మాత్రం అది నిజమైన ఆదరణ ఇస్తుంది. నా శోధనలు, కష్టాలు, దు:ఖాలు, ఆయనను మహిమపరచటానికి నా ప్రయాస అంతా ఆయనకు తెలుసన్న గ్రహింపు ఎంత ప్రోత్సాహకరమైనది ! నేను నడిచే మార్గాలన్నీ దేవునికి తెలుసన్న సత్యం, క్రీస్తునందున్నవారికి ప్రశస్తమైనదైతే, క్రీస్తులో లేనివారికి అసౌకర్యమైనది.

“నేను నడచు మార్గము ఆయనకు తెలియును”. యోబు నడిచే మార్గం తన తోటివారికి తెలియలేదు. వారు ఆయనను తీవ్రంగా అపార్థం చేసుకున్నారు. అతనికి ఇదే ఎంతో బాధాకరమైన శోధన. ఆయన స్నేహితులే ఆయనను వేషధారి అని తలంచారు. అతడు ఘోరపాపి అని, అందుకే దేవుని చేత శిక్షింపబడుతున్నాడని వారు పరిగణించారు; అయితే యోబుకు తాను అయోగ్యుడైన విశ్వాసి అని, వేషధారి మాత్రం కాదని తెలుసు. వారు మోపిన నిందలు నిజం కావని అతడు మనవి చేసుకున్నాడు.

“నేను నడచు మార్గము ఆయనకు తెలియును ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును.” ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఒకటుంది. ప్రియచదువరి, యోబుకు కలిగినటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు స్వర్వజ్ఞుడైనవానికి అన్నీ “తెలియును” అనే దీవెనకరమైన సత్యం నుండి ఓదార్పు పోందుము.

“నేను నడచు మార్గము ఆయనకు తెలియును”. ఈ మాటలను సరిగ్గా  అర్థం చేసుకుంటే తాను నడిచే మార్గం యోబుకు కూడా తెలియదు. అదేవిధంగా మనము నడిచే మార్గం మనకు కూడా తెలియదు. జీవితం సమస్యలతో నిండి, అగమ్యగోచరంగా కనిపిస్తుంది. సంవత్సరాలు గడిచినా ఏ పరిష్కారం లభించటం లేదు. తాత్విక చింతన కూడా మనకు సహాయపడదు. మానవ స్వేచ్ఛాచిత్తం అనేది ఒక వింతైన కథ. మనం యాంత్రికంగా పని చేసే పరికరాలం కామని, మనలో ఉన్న విచక్షణను బట్టి స్పష్టమవుతోంది. ప్రతి అడుగులోను స్వయంగా నిర్ణయాలు తీసుకుని, మంచిచెడుల నుండి ఎంచుకోగలిగే సామర్థ్యాన్ని మనం వినియోగించుకుంటాము అనేది వాస్తవం అయినప్పటికీ, మన స్వేచ్ఛాచిత్తం స్వయం సామర్థ్యం కలది కాదని స్పష్టమవుతుంది. మనం ఎదురించలేని అనేక ఒత్తిళ్ళు (అవి మంచివైనా, చెడ్డవైనా) మన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. పారంపర్యం, వాతావరణం, ఇవన్నీ మనపై బలమైన ప్రభావాన్ని కలిగివుంటాయి. మన పరిసరాలు, పరిస్థితులు మొదలైనవాటిని విస్మరించలేము. పైగా మన గమ్యాలను నిర్దేశించే దేవుని ఏర్పాట్ల సంగతి ఏమిటి ?  మనం నడిచే  "మార్గము”లు మనకెంత తక్కువగా తెలుసు ? అందుకే ఈ విధంగా వ్రాయబడి ఉంది -

“యెహెూవా తమ మార్గము ఏర్పరచుకోనుట నరుల వశములో లేదనియు, మనష్యులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును” (యిర్మీయా 10:23) ఇది మర్మయుక్తమైన మాట, దీనిని విస్మరించే ప్రయత్నం వ్యర్థమే. కాబట్టి మనం కూడా జ్ఞానితో ఏకీభవించి ఇలా ఒప్పుకోవటం మంచిది - “ఒకని నడతలు యెహోవా వశము తనకు సంభవింపబోవునది యొకడెట్లు తెలిసికొనగలడు?” (సామెతలు 20:24)

అయితే ఒక పరిమిత భావంలో యోబుకు తాను నడిచే మార్గం తెలుసు. ఆ మార్గం ఏమైయున్నదో తదుపరి రెండు వచనాలలో అతడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు " నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడచినవి నేను ఇటు అటు తొలగక ఆయనమార్గముననుసరించితిని. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడచి తిరుగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే యెక్కువగా యెంచితిని” (యోబు 23 :11, 12)

యోబు ఎన్నుకున్న మార్గం శ్రేష్టమైన మార్గం, వ్యాక్యానుసారమైన మార్గం, దేవుని మార్గం,  “ఆయన మార్గము.” ప్రియ చదవరి! ఆ మార్గం గురించి నువ్వేమి అనుకుంటున్నావు ? ఇది అత్యున్నతమైన ఎన్నిక కాదా! యోబు ఓరిమి గలవాడు మాత్రమే కాదు జ్ఞాని కూడా ! నువ్వు కూడా అటువంటి మార్గాన్నే ఎన్నుకున్నావా? “నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము ననుసరించితిని” అని నువ్వు చెప్పగలవా? (11వ వచనము)  ఒక వేళ చెప్పగలిగితే నీకు ఆ కృప అనుగ్రహించిన దేవుణ్ణి స్తుతించు. ఆలా చెప్పలేకపోతే ఆయన కృప కొరకు వేడుకోలేనందుకు సిగ్గుతో నీ తప్పును ఒప్పుకో. వెంటనే మోకాళ్ళపై పడి హృదయంలో ఏమీ దాచుకోకుండా , ఏది ఒప్పుకోవటానికి వెనుకాడకుండా క్షమాపణ వేడుకో.

ఇలా వ్రాయబడింది జ్ఞాపకం చేసికో - “మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును” (1 యెహాను 1:9).

యోబు 23:12;) వ వచనం నీ, నా వైఫల్యాన్ని గురించి వర్ణించటం లేదా? దేవుని ఆజ్ఞలయెదుట వెరవకపోవటం, దేవుని వాక్యాన్ని చులకనగా చూడటం, మనం ఆయన మార్గం నుండి తోలగిపోవటానికి కారణాలు కావా? అయితే ఇప్పుడు, ప్రతిరోజు ఆయన ఆజ్ఞలకు లోబడటానికి, ఆయన వాక్యాన్ని హృదయంలో దాచుకోవటానికి ఆయన కృపను వేడుకుందాము

“ నేను నడచు మార్గము ఆయనకు తెలియును.” నీవు ఏ మార్గాన్ని అనుసరిస్తున్నావు ? జీవానికి నడిపించే ఇరుకైన మార్గాన్నా? లేక నాశనానికి నడిపించే విశాలమార్గాన్నా? ప్రియ స్నేహితుడా! ఈ విషయాన్ని రూఢి చేసుకో. లేఖనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి: 

“నాతోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును. ప్రతివాడును తన్ను గూర్చి దేవునికి లెక్క యొప్పగింపవలెను” (రోమా 14:11,12)

అయితే నీవు ఈ విషయంలో మోసపోనక్కర లేదు, సందేహించనక్కరలేదు. " నేనేమార్గమును” అని ప్రభువు సెలవిచ్చాడు. (యెహను 14:6).

దైవిక పరిశోధన

“ ఆయన నన్ను పరిశోధించిన తరువాత............. వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహెూవాయె” (సామెతలు 7:3)

ఇది పూర్వం దేవుడు పరిశోధించిన పద్ధతి. ఐతే ఇప్పుడు క్రైస్తవులను పరిశోధించే పద్ధతి కూడా ఇదే. కానానులో ప్రవేశించే ముందు ఇశ్రాయేలీయులను సంబోధించి ఐగుప్తును విడిచిన తరువాత వారి చరిత్రను వల్లిస్తూ మోషే పలికిన మాటలను గమనించండి - “నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలిసికొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీదేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము” ( ద్వితి 8:2).

ఇదే విధంగా దేవుడు మనలను పరిశోధించి, పరీక్షించి, మనలను మనం తగ్గించుకునేలా చేస్తాడు. '.......... ఆయన నన్ను పరిశోధించిన తరువాత...........' ఈ మాత్రం మనం అర్థం చేసుకుంటే, మన శ్రమల ఘడియలలో అధికమైన ఓర్పుతో సహించగలము. జీవితంలో ప్రతి రోజు ఎదుర్కోవలసిన అభ్యంతరాలు, మనలను ఆటంకపరచే విషయాలు - వీటి అర్థమేమిటి ? ఇలాంటివి ఎందుకు అనుమతించబడతాయి?  ఇదిగో దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు. ఆ ప్రశ్నలకు ఇదే జవాబు. నీ నిరుత్సాహాలకు, లోకానుసారమైన నీ నిరీక్షణ అణచివేయబడే ఆ ఘడియలకు, నీ జీవితంలోని గొప్ప నష్టాలకు దేవుడు నిన్ను పరిశోధించాడు, పరిశోధిస్తున్నాడు అన్నదే ఒక వంతు సరైన వివరణ. ఆయన నీ నెమ్మదిని, నీ ధైర్యాన్ని, నీ విశ్వాసాన్ని, నీ ఓపికని, నీ ప్రేమని, నీ నమ్మకత్వాన్ని పరిశోధిస్తున్నాడు.

. "......... ఆయన నన్ను పరిశోధించిన తరువాత.......". సర్వసాధారణంగా దేవునియందు భయభక్తులుగలవారు సైతం, తాము ఎదుర్కునే కష్టాలకు సాతానును కారణంగా అనుకుంటారు. శ్రమలకు, శోధనలకు వాడే, అంటే ఆ బద్ధశత్రువే (సాతానే) బాధ్యుడని పరిగణిస్తారు. అయితే ఇలా అనుకోవటం హృదయానికి ఎలాంటి ఆదరణనూ కలిగించదు. సాతాను ఎన్నో చిక్కులను, ఇబ్బందులను తెచ్చిపెడతాడనే వాస్తవాన్ని నేను తృణీకరించటం లేదు. అయినప్పటికీ సాతానుకు పైన సర్వశక్తుడైన దేవుడు ఉన్నాడు. దేవుని అనుమతి లేనిదే మన తలవెంట్రుకలను సైతం సాతాను కదిలించలేడు. ఒకవేళ సాతాను ఆలా మనలను కలవరపరచటానికి దేవుడు అనుమతించినా, అది కూడా కేవలం మనలను పరిశోధించటానికే వాడుకుంటున్నాడు.

కాబట్టి మనం, ముఖ్యం కాని ఈ హేతువులన్నిటికీ అతీతంగా చూచి “తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్తకార్యములను జరిగించే ” దేవుని వైపు చూడటం నేర్చుకుందాం. (ఎఫె. 1:11,12;). వాస్తవానికి యోబు చేసింది ఇదే.

యోబు గ్రంథం యొక్క ఆరంభ అధ్యాయంలో యోబును శ్రమపెట్టడానికి సాతాను దేవుని అనుమతి పొందాడని మనం చదువుతాం.వాడు (సాతాను) యోబు యొక్క పనివారిని హతం చేయటానికి షేబాయీయులను వాడుకున్నాడు (1:14-15వ వచనం). పనివారిని చంపి ఒంటెలను దోచుకునిపోవటానికి కల్దీయులను వాడుకున్నాడు (17 వ వచనం). యోబు యొక్క పిల్లలను చంపటానికి గొప్ప సుడిగాలిని వాడుకున్నాడు (19 వచనము). అయితే ఇవన్నీ జరిగినప్పుడు యోబు ఏ విధంగా స్పందించాడు? తనకు కలిగినదంతా “యెహెూవా ఇచ్చెను, యెహెూవా తీసికొనెను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక” (యోబు 1:2) అని ఆశ్చర్యరీతిగా పలికాడు. యోబు మానవ ఉపకరణాలకు, మరియు వాటిని ప్రయోగించిన సాతానుకు అతీతంగా, అన్నిటిని నియంత్రించే దేవుణ్ణి చూడగలిగాడు. తనను పరిశోధిస్తున్నది దేవుడే అని అతడు గ్రహించాడు. నూతన నిబంధనలో కూడా యోహాను స్ముర్న అనే సంఘానికి వ్రాసిన లేఖ ద్వారా ఈ విషయం ధృవీకరించబడింది .“నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము, ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు” (ప్రకటన 2:10).

వారు చెరలోనికి పంపబడటం దేవుని పరిశోధన. ఈ విషయాన్ని మరచిపోవటం ద్వారా మనమెంత నష్టపోతున్నాము? ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా, బాధను కలిగించే ఉపకరణం ఏదైనా, వీటన్నిటి వలన దేవుడే తన బిడ్డలను పరిశోధిస్తున్నాడని తెలుసుకోవటం, గుండె చెదరినవానికి ఎంతో ఊరటనిస్తుంది. ఎంత పరిపూర్ణమైన మాదిరి మన రక్షకుడు కనపరచాడు. తాను శ్రమకు అప్పగింపబడవలసిన సమయం సమీపిస్తున్నప్పుడు పేతురు మల్కు చెవిని తెగ నరికినప్పుడు ప్రభువు పలికిన మాటలు "కత్తి ఒరలో ఉంచుము. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా?” (యోహాను 18:11)

క్రోధావేశముతో నిండిన నరులు ఆయన ప్రాణం తీయటానికి పొంచియున్నారు. సర్పం ఆయన మడిమపై కాటువేయనైయున్నది కాని ఆయన మాత్రం వీటన్నటికి పైగా తన తండ్రి హస్తాన్ని చూశాడు.  ప్రియ చదువరీ! దేవుని యొద్ద నుండి వచ్చే పాత్రలోనిది త్రాగటానికి ఇష్టపడాలి, అది ఎంత చేదైనదైనా సరే ( ప్రభువు సహించినదాని కన్నా ఎక్కువ కాదు). కొన్ని పరిస్థితులలో దేవుని జ్ఞానాన్ని ప్రశ్నించేవారిగా ఉన్నాము. ఆయన మనకు కలిగించే కొన్ని అనుభవాలను బట్టి సణిగేవారిగా ఉన్నాము. నేను మోయలేని భారాన్ని దేవుడు ఎందుకు నాపై ఉంచాడు? ఇతరుల ప్రియులను బ్రతకనిచ్చివాడు నా ప్రియులను ఎందుకు తీసుకునిపోయాడు ? నాకు ఆరోగ్యం, బలం ఎందుకు కొదువ చేసాడు ? "ఓ మనుష్యుడా! దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు?” ఏ ప్రాణియైనా తన సృష్టికర్తయైన గొప్ప దేవుడు వ్యవహరించే విధానాన్ని ప్రశ్నించటం మూర్ఖపు దుష్ప్రవర్తనగా పరిగణింపబడుతుంది

" నన్నెందుకీలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా?" (రోమా 9:20).

ఆయన కృప చేత తిరుగుబాటు చేసే మన పెదవులను అదుపు చేసి, కఠినమైన మన హృదయాలలో చెలరేగే తుఫానులను నియంత్రించమని మనలో ప్రతి ఒక్కరం యథార్థంగా దేవునిని గోజాడవలసిన అవసరం ఉంది.

అయితే తగ్గింపుతో సర్వజ్ఞుడైన దేవుడు అనుమతించేవన్నిటికీ తలోగ్గేవారికి తమ సమస్యలను గురించి కొంత వెలుగు అందించబడింది. ఈ వెలుగు హేతుబద్ధమైనదిగా అనిపించకపోయినా, పసిపిల్లలవంటి విశ్వాసంతో మరియు వినయంతో స్వీకరించినప్పుడు అది ఆదరణ మరియు బలం అనుగ్రహిస్తుంది. 1 పేతురు 1:6,7లో ఈ విధంగా చదువుతాము "మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనలచేత ప్రస్తుతమున కొంచెముకాలము మీకు దుఃఖము కలాగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు, కలుగుటకు కారణమగును”

ఇక్కడ మూడు విషయాలు గమనిస్తాము; మొదటిగా - విశ్వాసానికి పరీక్ష అవసరం.  దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఈ మాటను మనం అంగీకరించాల్సిందే. రెండవదిగా ఈ విధంగా విశ్వాసం పరీక్షించబడటం బంగారం కంటే ఎంతో ప్రశస్తమైంది. ఇది దేవుని దృష్టిలో విలువగలది (కీర్తన 116:15;) కాబట్టి మన దృష్టికి కూడా విలువైనదిగా ఉండాలి. మూడవదిగా ప్రస్తుత పరీక్ష మన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంది. ఈ పరీక్షను సాత్వికంగా సహించి, ధైర్యంగా ఎదుర్కునేవారికి రక్షకుడు ప్రత్యక్షమయ్యే రోజున గొప్ప బహుమానం అనుగ్రహించబడుతుంది.

1 పేతురు 4:12 -14 వచనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. "ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడుకుడి, క్రీస్తు మహిమపరచబడినప్పుడు మీరు మహదానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైయున్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందలపాలైన యెడల మహిమాస్వరూపియైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీలో నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.” ముందు మనం చూసిన వచనాలలో వ్యక్తపరచబడిన తలంపులే ఈ వాక్యభాగంలో కూడా మనకు కనిపిస్తాయి. మనం శోధింపబడటం అవసరం, కాబట్టి అదేదో వింతగా అనుకోవద్దు. అది రావటం సహజమని గుర్తించి దాని కొరకు మనం సిద్ధపడియుండాలి. అయితే క్రీస్తు తిరిగివచ్చినప్పుడు మన శ్రమలు గొప్పగా పరిహరింపబడతాయనే దీవెనకరమైన నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఇక్కడ ప్రోత్సాహకరమైన మరొక మాట కూడా ఉంది. ఈ శ్రమల వలన మనం క్రీస్తు శ్రమలలో పాలివారిగా చేయబడతాం. కనుక వాటిని విశ్వాసంతో కూడిన ధైర్యంతో  మాత్రమే కాకుండా సంతోషంతో కూడా ఎదుర్కోవాలి.

“ఆయన నన్ను పరిశోధించిన తరువాత.” ప్రియ క్రైస్తవ చదవరీ! ఈ విషయంలో ఏ మినహాయింపు లేదు, దేవుడు పాపము లేని ఒక్క కుమారునినే  కలిగున్నాడు. అయితే బాధలు లేని కుమారుడు ఒక్కడు కూడా లేడు. త్వరలోనో, ఆలస్యంగానో, ఏదో ఒక రూపంలో, శ్రమల భారం మనం ఎదుర్కోవాల్సిందే.

“ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమై మిమ్ము హెచ్చరించుటకును మన సహోదరుడును, క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి మేము నీ యొద్ద నున్నప్పుడు, మనము శ్రమను అనుభవింప వలసియున్నదని మీతో ముందుగా చెప్పితిమి గదా? అలాగే జరిగినది. ఇది మీకును తెలియును. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడినవారమని మీరెరుగుదురు”. (1థెస్సలోనిక 3:2-4). ఇంకా ఇలా వ్రాయబడి ఉంది, "........... అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి” (అపో. కార్యములు 14:12).

ప్రతి తరములోను ఇలాగే జరిగింది. అబ్రాహాము శోధింపబడ్డాడు, “తీవ్రముగా శోధింపబడ్డాడు.” అదే విధంగా యోసేపు, యాకోబు, మోషే, దావీదు, దానియేలు, అపోస్తలులు మొదలైనవారు కూడా శోధింపబడ్డారు.

అంతిమ ఫలం

“నేను సువర్ణము వలె కనబడుదును” ఈ మాటలోని కాలాన్ని గమనించండి. తాను అదివరకే మేలిమి బంగారమని యోబు ఊహించలేదు. “నేను సువర్ణమువలె కనబడుదును” అని నిర్ధారించి చెప్పాడు. ప్రస్తుతం తనలో ఇంకా ఎంతో మాలిన్యం ఉందని తనకు బాగా తెలుసు. తాను సంపూర్ణుడని చాటి చెప్పుకోలేదు, డంబములు పలకలేదు. అందుకు వ్యతిరేకంగా యోబు 42:6లో “నన్ను నేను అసహ్యంచుకొని ధూళిలోను బుడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను” అని అన్నాడు. యోబు అలా చెప్పటం యుక్తమే. మనం కూడా మన శరీరంలో ఏ మంచి నివసించటం లేదని గుర్తెరిగి, యోబువలె ఒప్పుకోవటం మంచిది. దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మరియు మన నడతల్ని పరిశీలించినప్పుడు, లెక్కకు మించిన పాపాలచేత లెక్కించలేని మన వైఫల్యాలను మనం చూసుకున్నపుడు , మనల్ని మనం అసహ్యించుకోవటానికి ఎంతో కారణం ఉందని గుర్తించగలం! ప్రియ క్రైస్తవుడా! మనలో ఇంకా ఎంతో కల్మషం ఉంది. అయితే మన స్థితి శాశ్వతంగా ఇలాగే మిగిలిపోదు.

“నేను సువర్ణము వలె కనబడుదును.” యోబు - 'ఆయన నన్ను శోధించిన తరువాత సువర్ణము వలె కనబడుదునేమో' అనలేదు లేదా 'సువర్ణము వలె కనబడుదునని ఆశించుచున్నాను' అని అనలేదు. సంపూర్ణ విశ్వాసంతో, దృఢమైన నిశ్చయతతో, “నేను సువర్ణము వలె కనబడుదును” అని ప్రకటించాడు. అయితే ఆయనకు అది ఎలా తెలిసింది? మనం మన అంతిమఫలం క్షేమకరమైనదనే నిశ్చయతను ఎలా కలిగి ఉండగలం? దేవుని ఉద్దేశాలు ఎన్నటికీ మారవు, తప్పిపోవు కాబట్టి మనం అలాంటి నిశ్చయతను కలిగియుండగలం.

“మీలో యీ సత్ క్రియలు ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను” (ఫిలిప్పి 1:6). మనం మన అంతిమఫలం క్షేమకరమైనదనే నిశ్చయత ఎలా కలిగియుండగలం ? దేవుని వాగ్దానం నమ్మదగినది కనుక మనం ఆ నిశ్చయత కలిగియుండగలం.

“యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును” (కీర్తనలు 138:8). కాబట్టి శోధింపబడి, బాధింపబడినవాడా సంతోషించు, ఈ ప్రక్రియ ఇప్పుడు అసంతోషకరంగా మరియు భాదాకరంగా ఉండవచ్చు. అయితే దాని అంతిమఫలం ఆనందదాయకం అవుతుంది, అది తప్పనిసరిగా నెరవేరుతుంది.

“నేను సువర్ణము వలె కనబడుదును.” ఈ మాటలు బాధను, దు:ఖాన్ని మరెవ్వరూ ఎరగనంత బాగా ఎరిగినవాడు పలికినవి. అయిన ఈ అగ్నిపరీక్ష గూండా వెళ్తున్న సమయంలో కూడా సమస్తం సానుకూలమైన ఫలితానికే దారి తీస్తుందని విశ్వసించాడు. ఈలాంటి జయోత్సాహమైన పదజాలం మన నోట కూడా వెడలు గాక. “నేను సువర్ణమువలె కనబడుదును” అన్నది శరీరానుసారమైన, డాంబికమైన మాటలు కావు గాని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆశ్రయించినవాని మాటలు. ఇందులో మన గొప్పతనం ఏమి లేదు. సమస్త మహిమ, మనలను సువర్ణమువలె చేసే దేవునికే చెందుతుంది.

"శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును” (యాకోబు 1:12).

ఇప్పుడు మన ముందు రెండు మూలాంశాలు ఉన్నాయి. మొదటగా మనం తీవ్రమైన శోధన కొలిమిలో ఉన్న సమయంలో ప్రేమ మన ఓరిమిని కొలిచే ఉష్ణమాపకంగా ఉంది. “వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చోనియుండును” (మలాకీ 3:3). అగ్నిగంధకంలో హెబ్రీయులైన ముగ్గురు యౌవనస్తులతో ఉన్నట్టుగానే దేవుడు శోధనల కొలిమిలో మనతో తోడుగా ఉంటాడు (దానియేలు 3:25). రెండవదిగా పరలోకంలో మహా అద్భుతకరమైనవి బంగారు వీధులు, బంగారు సంగీత వాయిద్యాలు కావు కాని, దేవుని సారూప్యం ముద్రింపబడిన బంగారు ఆత్మలు అంటే తన కుమారునితో సారూప్యముగలవారవటానికి ముందుగా నిర్ణయించబడిన ఆత్మలు. ఇంత మహిమాన్వితమైన భవిష్యత్తుకు ఇంత విజయవంతమైన ప్రతిఫలానికి, ఇంత శ్రేష్ఠుడైన దేవునికి స్తోత్రములు.

7వ అధ్యాయం

దైవిక శిక్షణ

“నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును” అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికలను మరచితిరి. (హెబ్రి 12:5)

దేవుడు శిక్ష విధించటం, మరియు దేవుడు శిక్షణ చేయటం; ఈ రెండిటికి మధ్య ఉన్న భేదాన్ని ప్రప్రథమంగా గ్రహించటం అవసరం. దేవుని ఔన్నత్యాన్ని, మహిమను నిలపటానికి మరియు ఒక క్రైస్తవునికి నెమ్మది కలగటానికి ఈ వ్యత్యాసాన్ని గ్రహించటం ఎంతో ప్రాముఖ్యం. శీర్షిక వచనంలోని తెలుగు అనువాదం “శిక్ష”, “దండన” అని ప్రయోగించిన పదాలకు మారుగా మూలభాషను మరియు సందర్భాన్ని అనుసరించి 'క్రమశిక్షణ' అని అర్థం చేసుకోవాలి. వీటి మధ్యగల భేదాన్ని గ్రహించటం ఎంతో సులభం అయినప్పటికీ మనం తరచుగా ఈ విషయం నుండి దృష్టిని మళ్ళిస్తాము. దేవుని ప్రజలు వారి పాపం విషయమై శిక్షించబడటం ఎన్నడూ, ఏ విధంగానూ సాధ్యం కాదు. ఎందుకంటే వారి పాపాలు ఇదివరకే సిలువలో శిక్షింపబడ్డాయి. ప్రభువైన యేసుక్రీస్తు మనకు బదులుగా మన పాపాల కొరకు సంపూర్ణంగా శిక్షను భరించాడు. అందుకే ఈ విధంగా వ్రాయబడి ఉంది,“ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును” (1యోహాను 1:7). దేవుని నీతి మరియు ప్రేమ క్రీస్తు చెల్లించిన సంపూర్ణమైన మూల్యాన్ని తిరిగి మనపై విధించటానికి అనుమతించవు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన ప్రాముఖ్యమైన విషయమేమిటంటే శిక్ష మరియు శిక్షణకు మధ్య ఉన్న వ్యత్యాసం అవి కలిగించే శ్రమ యొక్క స్వభావాన్ని బట్టి గుర్తించడం సాధ్యం కాదు. ఈ రెండిటికీ మూడు వ్యత్యాసాలు ఉన్నాయి. మొదటిగా, దేవుడు ప్రవర్తించే రీతి. శిక్ష విషయంలో దేవుడు న్యాయమూర్తిగా (తీర్పరిగా ) వ్యవహరిస్తాడు. అయితే శిక్షణ విషయంలో ఆయన తండ్రిగా వ్యవహరిస్తాడు. నేరారోపణ స్థాపింబడిన తరువాత శిక్ష విధించేవాడు న్యాయమూర్తి. తీర్పును బట్టి కలిగే ఇలాంటి శిక్ష దేవుని బిడ్డపై పడదు. ఎందుకంటే అతని పాపదోషం క్రీస్తుపై మోపబడింది.

“మనము మన పాపముల విషయమై చనిపోయి, నీతి విషయమై జీవించునట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. (1 పేతురు 2:24)

కాబట్టి, ఒక విశ్వాసి తన పాపాన్ని బట్టి శిక్షింపబడడు అన్నది వాస్తవం అయినప్పటికీ, ఒక క్రైస్తవునికి ఇక యే శిక్షావిధియు లేదన్నది ( రోమా 8:1-3;) నిజమైనప్పటికీ, అతడు దేవుని చేత  తప్పక క్రమశిక్షణ చేయబడతాడు.

అతడు దేవుని కుటుంబసభ్యుడు. దేవునికీ అతనికీ మధ్య ఉన్న సంబంధం తండ్రిబిడ్డల సంబంధం వంటిది; కాబట్టి అతడు కుమారునిగా క్రమశిక్షణ కోసం గద్దింపబడాలి. మూఢత్యం ప్రతి దేవునిబిడ్డలోనూ స్వాభావికంగా ఉంటుంది. అందుకే గద్దించటం, అదుపు చేయటం, తగ్గింపు కలగచేయటం అవసరం.

రెండవదిగా దైవశిక్ష మరియు దైవశిక్షణకు మధ్య ఉన్న భేదం వాటిని పొందేవారిని బట్టి ఉంటుంది. శిక్ష దేవునికి విరోధులైన వారి కొరకు కాగా శిక్షణ ఆయన ప్రేమించే తన బిడ్డలకు క్రమశిక్షణ నేర్పుతుంది. ఈ విధంగా ఒకటి న్యాయతీర్పు ఐతే మరొకటి క్రమశిక్షణకు సంబంధించింది

మూడవదిగా ఈ రెండిటికి మధ్య ఉన్న భేదం వాటి ఉద్దేశ్యంలో కనిపిస్తుంది. ఒకటి ప్రతిదండన చేసేదైతే మరొకటి పరిహారార్థమైనది. ఒకటి దేవుని ఆగ్రహం ద్వారా కలిగేదైతే మరొకటి ఆయన మితిలేని ప్రేమ ద్వారా కలుగుతుంది. దేవుని శిక్ష పాపుల మేలు కొరకు ఎన్నడు విధించబడదు కాని దేవుని ధర్మశాస్త్రానికి ఘనత కలగటానికి మరియు ఆయన రాజదండం న్యాయార్థమైనదని నిరూపించబడటానికి పంపబడుతుంది. అయితే దేవుని శిక్షణ తన బిడ్డల క్షేమం కొరకు పంపబడుతుంది. “మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారియందు భయభక్తులు గలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రిమైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రతకవలెను గదా! వారు కాన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాటు పొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించుచున్నాడు” (హెబ్రి 12:9,10)

పైన చూపించిన వ్యత్యాసాలు దైవశిక్షను మరియు దైవశిక్షణను ఒకటిగా భావించే క్రైస్తవులను వాటి మధ్య ఉన్న బేధాన్ని గ్రహించటానికి హెచ్చరించేవిగా ఉన్నాయి. దైవశిక్షణ చేత క్రమపరచబడుతున్న విశ్వాసి దేవుడు తనను శిక్షిస్తున్నాడని అనుకోవటం సరి కాదు. అలా అనుకోవటం, క్రీస్తు చిందించిన రక్తాన్ని ఘనహీనపరచటం అవుతుంది. దేవుడు నిన్ను తన ప్రేమతో సరిచేస్తున్నాడే తప్ప ఉగ్రతతో మొత్తటం కాని, శిక్షించటం కాని చేయటం లేదని గుర్తుంచుకో. తప్పించుకోలేని కీడుగా, తప్పనిసరిగా తలొగ్గాల్సిన భారంగా దానిని  పరిగణించవద్దు. అది దేవుని మంచితనం మరియు నమ్మకత్వం నుండి కలిగేది కనుక కృతజ్ఞతలు చెల్లించవల్సిన గొప్ప దీవెనగా దానిని మనం పరిగణించాలి. దేవునిచేత క్రమశిక్షణ పొందటం మన కుమారత్వానికి రుజువు. ఏ తండ్రి కూడ తన కుటుంబసభ్యుడు కానివాని యెడల శ్రద్ధ చూపడు. అయితే తన యింటివారు సరియైన త్రోవలో నడవాలని క్రమశిక్షణ చేస్తాడు. దైవికశిక్షణ మన మేలు కొరకు మరియు మనకు అత్యంత ప్రయోజనకరంగా ఉండటానికి పంపబడుతుంది. కాబట్టి క్రమశిక్షణ చేసే బెత్తానికి అతీతంగా దానిని వాడే సర్వజ్ఞమైన హస్తాన్ని చూడటం నేర్చుకోవాలి.

ఎవరి కొరకు ఈ పత్రిక వ్రాయబడిందో, ఆ హెబ్రీయులు ఆ సమయంలో గొప్ప శోధనలకు, శ్రమలకు గురై ఎంతో బాధింపబడుతూ ఉన్నారు. వారు యేసుక్రీస్తు పరిచర్య సమయంలో మరియు ఆ తర్వాత అపోస్తలుల పరిచర్య ద్వారా, తమ మెస్సీయపై విశ్వాసముంచటానికి యూదులలో నుండి నడిపించబడిన శేషమైయున్నారు. వారు ఆ సమయంలో మెస్సీయ రాజ్యం వెంటనే స్థాపించబడి, భూమిపై పరిపాలన చేస్తుందని, అందువలన వారు ఆ రాజ్యములో అగ్రస్థానాలను అధీష్టించవచ్చని తలంచి ఉండవచ్చు. అయితే ఆ రాజ్యం స్థాపించబడకపోగా వారు ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కోవలసి వచ్చింది. వారు అన్యులచేత ద్వేషింపబడటమే కాకుండా  విశ్వసించని తమ స్వకీయుల చేత బహిష్కరింపబడ్డారు. అందువలన వారు సర్వసాధారణ జీవితం గడపటం కూడా దుర్లభం అయింది. దేవుని ఏర్పాట్లు సైతం ముఖం చిట్లించుకున్నట్లుగా అనిపించింది. క్రైస్తవ విశ్వాసాన్ని ఒప్పుకున్న కొందరు యూదులు కూడ ఎక్కువగా శ్రమలు ఏదుర్కోవలసి వచ్చింది కాబట్టి తమ ఈ నూతన విశ్వాసానికి వీపు తిప్పటానికి శోధింపబడ్దారు.ఒకవేళ వారు క్రైస్తవ్యాన్ని అంగీకరించి పొరపాటు చేసారా? నజరేయుడైన యేసును హత్తుకొటాన్ని బట్టి పరలోకం వారిపై ఆగ్రహించిందా? వారు శ్రమల గుండా వెళ్ళటం, దేవుడు వారితో అనుకూలంగా వ్యవహరించటం లేదనటానికి సూచన కాదా?

అపోస్తలుడు ఆందోళనతో కూడిన వారి ఇట్టి తలంపులను ఎదుర్కొన్న విధానం జ్ఞానయుక్తంగా మరియు దీవెనకరంగా ఉంది. వారి లేఖనాల నుండే సామెతలు 3:11,12;) లో ఉన్న హెచ్చరికలను జ్ఞాపకం చేసి, వాటిని వారున్న పరిస్థితికి అన్వయించాడు. శీర్షిక వచనంలో ఉన్న ఈ చివరి మాటలను జాగ్రత్తగా గమనించండి "కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి.” “మీతో సంభాషించు” అనే మాటలు పాతనిబంధన లేఖనాలు కేవలం పాతనిబంధన క్రింద వున్నవారికి మాత్రమే పరిమితం కావని స్పష్టం చేస్తున్నాయి. అవి క్రొత్త నిబంధన క్రింద ఉన్న మనతో కూడా సంభాషించే, మనకు కూడా వర్తించే హెచ్చరికలుగా ఉన్నవి.

"ఈ విషయాన్ని మరవకు ........... దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖన .......... ప్రయోజనకరమైయున్నది"(2 తిమోతి 3:16) పాతనిబంధన గ్రంథం కూడా, క్రొత్త నిబంధన గ్రంథంలాగే, మనకు బోధన జ్ఞానాన్ని కలిగించటానికి ఇవ్వబడింది. రెండవదిగా శీర్షిక వచనంలోని క్రియ' యొక్క కాలాన్ని గమనించండి - "మీతో సంభాషించుచున్నహెచ్చరికను......” అపోస్తలుడు దాదాపు వెయ్యేండ్ల క్రితం పలకబడిన దేవుని వాక్యాన్ని గురించి 'సంభాషించిన' అని కాక 'సంభాషించుచున్న' అని వ్రాస్తున్నాడు. ఇదే సూత్రం ఏడు సార్లు ప్రకటన 2,3 అధ్యాయాలలో 'ఆత్మ సంఘములతో చెప్పుచున్నమాట చెవిగలవాడు వినునుగాక' అని చెప్పబడింది. “చెప్పినమాట” అని కాకుండ “చెప్పుచున్న మాట” అని వాడటం గమనించండి; పరిశుద్ధ గ్రంథంలోని మాటలు సజీవంగా, నేడు కూడా మాటలాడేవిగా ఉన్నయి.

ఇప్పుడు శీర్షిక వచనంలో “మరచితిరి” అనే మాటలను గమనిద్దాం. అనాటి హెబ్రీ క్రైస్తవులకు సామెతలు 3:11,12;) వచనాలలోని హెచ్చరిక తెలియదు అని కాదు కాని వారు దానిని మరచిపోయరని ఇది సూచిస్తుంది. వారు తమ దేవుడైన యెహోవా యొక్క పితృత్వాన్ని మరచిపోవడం మాత్రమే కాకుండా బిడ్డలుగా వారు ఆయనతో కలిగియుండిన బాంధవ్యాన్ని కూడా మరచిపోయారు. అందుకే వారు దేవుడు తమతో వ్యవహరించిన తీరును మరియు ఉద్దేశాన్ని అపార్థం చేసుకుని, వాటిని ఆయన ప్రేమ వెలుగులో చూడకుండా, వారిపై ఆయన అసంతుష్టికి చిహ్నాలుగా, ఆయన వారిని మరచిపోవటానికి సూచనలుగా వాటిని పరిగణించారు. ఈ కారణంగా దేవునికి తమ్మును తాము సంతోషంగా సమర్పించుకోటానికి బదులుగా వారు నిరాశ, నిస్సహాయత  కనపరిచారు. ఇక్కడ మనకొక ముఖ్య హెచ్చరిక ఉంది. దేవుడు తన ఏర్పాటు చొప్పున మనతో వ్యవహరించే విధానాలను మనకు తోచిన హేతుబద్దతతోనో, వెలిచూపువలనో గాక, దేవుని వాక్యపు వెలుగులో మాత్రమే అర్థం చేసుకోవాలి. “నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము” అని కుమారులతో సంభాషించే విధంగా మనతో సంభాషిస్తున్న ఈ హెచ్చరికను మనం ఎంతో తరచుగా మరచిపోయేవారిగా ఉన్నాము !

ఇక్కడ బాధాకరమైన విషయమేమిటంటే, “శిక్ష”, “దండన” అని అనువదించబడిన గ్రీకు మూలభాషలోని “పాయ్ డియా” అనే పదానికి న్యాయం చేయగల పదమేది అంగ్ల భాషలో (తెలుగుభాషలో కూడ) లేదు. ఇది యోహాను 21:5;) మరియు హెబ్రి 2:13;) లో వాడబడిన 'పేయిడియాన్' అనే పదానికి పర్యాయపదంగా ఇక్కడ వాడబడి, చిన్నపిల్లలతో వ్యవహరించే సున్నితమైన విధానాన్ని సూచిస్తుంది. తెలుగు భాషలో “విద్యార్థి" మరియు "విద్య' అనే పదాలు విడదియ లేని సంబంధాన్ని కలిగున్న విధంగానే (విద్యను అభ్యాసించువాడే విద్యార్థి) గ్రీకు భాషలో 'క్రమశిక్షణ మరియు కుమారులు' అను పదాలు వీడదీయ లేని సంబంధం కలిగున్నాయి. (క్రమశిక్షణ పరచబడువాడే కుమారుడు). కాబట్టి ఇక్కడ తర్ఫీదు అను పదాన్ని ప్రయోగించటం మరింత సబబుగా ఉంటుంది. ఇది దేవుడు తన బిడ్డలకు నేర్పించి, శిక్షణ చేసి, వారిని క్రమపరచే కార్యాన్ని సూచిస్తుంది. ఇది తండ్రి తన బిడ్డలకు చేసే జ్ఞానయుతమైన దిద్దుబాటు లాంటిది.

తరచూ కుమారునికి దిద్దుబాటు చేయటానికి చేతిలో కర్ర పుచ్చుకోవలసిన అవసరత కలుగుతుంది. అయితే ఈ కోణానికే మన తలంపులను పరిమితం చేయటం గొప్ప పొరపాటే అవుతుంది. శిక్షణ అంటే ప్రతిసారి దేవుడు కేవలం తప్పుచేసిన తన బిడ్డకు దిద్దుబాటుగా కొట్టే దెబ్బలుగా భావించకూడదు. అతి పరిశుద్ధులైన దేవుని ప్రజలు మరియు అత్యంత విధేయులైన దేవుని పిల్లలు సైతం అనేకసార్లు ఎన్నో శ్రమలను అనుభవించారు, అనుభవిస్తున్నారు కూడా. అనేకసార్లు దేవుడు మనకు దిద్దుబాటు చేయటానికి శ్రమలు అనుమతిస్తాడు. స్వనీతి మరియు స్వయంసమృద్ధి నుండి మనలను రిక్తులుగా చేసి, మన అతిక్రమాలను మరియు మన హృదయంలో ఉన్న ఘోరవ్యాధిని బహిర్గతం చేయటానికి అవి పంపబడతాయి. కొన్నిసార్లు ఇలాంటి గద్దింపులు మనలను ఆత్మీయంగా బలపరచటానికి పంపబడతాయి. అవి మనం అనుభవంలో ఎదగటానికి, ప్రయోజనకరమైన స్థాయికి ఎదగటానికి సహాయపడతాయి. అంతే కాకుండా గర్వించకుండా జాగ్రతపడటానికి, మనం చేసే సేవను బట్టి ఉప్పొంగిపోకుండా ఉండటానికి దేవుని గద్దింపు తోడ్పడుతుంది. క్లుప్తంగా నాలుగు ఉదాహరణలు గమనిద్దాము.

దావీదు : దావీదు విషయంలో, తన యొక్క ఘోరపాపపు దుష్టత్వాన్ని బట్టి శిక్షణ చేసే దేవుని బెత్తం వాడబడింది. అది తనకున్న స్వనమ్మిక మరియు స్వనీతిని బట్టి కలిగింది. 2వ సమూయేలు 22, 23వ అధ్యాయలలో దావీదు పాడిన రెండు పాటలు లిఖించబడ్డాయి. ఇందులో మొదటిది తన జీవితారంభానికి, రెండవది జీవితం ముగింపుకు సంబంధించినవి. జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఈ రెండిటిలో చదువరి గొప్ప తేడాను కనుగొంటాడు. 2 సమూయేలు 22-25 చదివినప్పుడు దావీదు పడిపోటానికి దేవుడు అనుమతించటం ఏమంత ఆశ్చర్యం అనిపించదు అయితే 23వ అధ్యాయంలో ఉన్న దీవెనకరమైన మార్పును గమనించండి. 5వ వచనంలో తన వైఫల్యాన్ని గూర్చిన హృదయపూర్వక ఒప్పుకోలును మనం చూడగలం. 10 నుండి 12 వచనాలలో దేవుణ్ణి మహిమపరచి, ఆయనకే జయాన్ని ఆరోపించే ఒప్పుకోలును చూడగలం. దావీదును దేవుడు గద్దించటం వృథా కాలేదు.

యోబు : బహుశ ఈయన మానవులకు కలిగే అన్ని రకాల శ్రమలను భరించి వుండవచ్చునేమో. కుటుంబ నష్టాలు, ఆస్తి నష్టాలు, శారీరక బాధలు ఇలా  త్వరగా ఒకదాని వెంట మరొకటి సంభవించాయి. అయితే యోబు ఆ నష్టాల నుండి ఎక్కువ మేళ్ళను పొంది, మరింత ఎక్కువ పరిశుద్ధతలో పాలుపొందాలని దేవుని ఉద్దేశం. ప్రారంభం నుండి యోబు తాను నీతిమంతుడని వక్కాణించి చెప్తున్నాడు. అయితే చివరిలో మూడంతల పరిశుద్ధత గల వానిని ముఖాముఖిగా చూసినప్పుడు  యోబు తనను తాను అసహ్యించుకొని పశ్చాత్తాపడుతున్నానని ఒప్పుకున్నాడు (యోబు 42:6). దేవుడు దావీదు విషయంలో, శ్రమలను దిద్దుబాటుగా పంపాడు. అయితే యోబుకు కలిగిన శ్రమలు మాత్రం అతనికి తగ్గింపు కలిగించటానికి అనుమతించబడ్దాయి.

అబ్రహాము : ఈయన విషయంలో పూర్తిగా భిన్నమైన ఉద్దేశ్యముతో శ్రమలు అనుమతించబడటం చుస్తాం. ఆయనకు కలిగిన శ్రమలు ఆయన పాపాలకు ఫలితాలుగా గాని, ఆయన ఆంతర్గత పొరబాటులను సరిదిద్దటానికి గాని అనుమతించబడలేదు. కాని ఆయన ఆత్మీయఅభివృద్ధికే అనుమతించబడ్డాయి. ఓర్పు తన క్రియను కొనసాగించిలే విశ్వాసంలో తాను బలపరచబడేలా అబ్రహాము ఈ లోకసంబంధమైన విషయాల నుండి వేరు చేయబడి, యెహెూవా దేవుని స్నేహితుడుగా యెంచబడ్డాడు.

పౌలు : “నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండు నిమిత్తం నాకు శరీరములో ఒక ముల్లు నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను” (2కొరింథీ 12:7 ). ఈ “ముల్లు" వైఫల్యాలను, పాపాలను బట్టి కాకుండ, అత్యధికంగా హెచ్చిపోకుండు నిమిత్తం, గర్వాన్ని నిరోదించటానికి పంపబడింది. “అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము” అనే మాటలు ఈ వచనంలో రెండుసార్లు వాడబడటం గమనించండి. ఈ “ముల్లు” పంపబడటానికి ఫలితంగా, అపోస్తలుడు తన బలహీనతల గురించి మరింత జాగురుకునిగా చేయబడ్డాడు. కాబట్టి, మన స్వయంసమృద్ధిని విరగొట్టి, మనలను రిక్తులుగా చేయటానికి శ్రమలు పంపబడతాయి.

పైన ఉదాహరించబడిన నాలుగు వేర్వేరు కారణాల చేత క్రమశిక్షణ చేయటానికి, దిద్దుబాటు చేయటానికి, ఆత్మీయ అభివృద్ధి కొరకు, గర్విత హృదయం నుండి కాపాడటానికి పంపబడుతున్నందున ఒకానొక శ్రమ ఒక వ్యక్తికి ఎందుకు కలిగిందో వివేచించటానికి మనమెంత అసమర్థులం! అలా చేయాలని ప్రయత్నించటం ఎంత అవివేకం! మన తోటి సహోదరుడైన క్రైస్తవుడు దైవికశిక్షణ గుండా వెళ్ళుచున్నప్పుడు తన పాపాలను బట్టే గద్దింపబడుతున్నాడని తలంచటం సరికాదు. తరువాత అధ్యాయంలో 'దైవశిక్షణను ఎలాంటి వైఖరితో స్వీకరించాలి' అనే అంశాన్ని ధ్యానిద్దాం.

8వ అధ్యాయం

దైవశిక్షణను స్వీకరించటం

“నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము” (హెబ్రీ 12:5)

అన్నివిధాల గద్దింపులు వాటిని పొందేవారికి దీవెనకరంగా ఉండవు. కొందరు ఇంకా కఠినంగా మారతారు. మరికొందరు దాని క్రింద నలిగిపోతారు. శ్రమలను మనం ఏ వైఖరితో ఎదుర్కుంటామనే దానిపై చాలా విషయాలు ఆధారపడి ఉన్నాయి. శోధనలలో మరియు శ్రమలలో స్వతహాగా మంచి ఏమీలేదు. వాటిని దేవుడు ఆశీర్వదించి పంపటం వల్ల మాత్రమే వాటి వలన మనం ప్రయోజనం పొందగలం. హెబ్రీ 12:11వ వచనంలో స్పష్టం చేయబడిన విధంగా, “సమస్త శిక్షయు దు:ఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును.” మనకు కావలసింది కేవలం సున్నితమైన మనస్సాక్షి మరియు మృదువైన హృదయం.

శీర్షిక వచనంలో క్రైస్తవుడు రెండు ప్రమాదాల గురించి హెచ్చరింపబడుచున్నాడు. “తృణీకరింపకుము”, “విసుకకుము” - ఈ రెండు అపాయకరమైన వైఖరుల విషయమై ఎక్కువ జాగ్రత్త వహించండి. లేఖనములోని ప్రతి సత్యానికి దానిని సమతుల్యపరిచే వేరొక కోణం ఉన్నట్లే ప్రతి కీడుకు వ్యతిరేకమైనది కూడా ఉంటుంది. ఒకవైపు క్రమశిక్షణ చేసే బెత్తాన్ని చూసి అపహసించే గర్వితహృదయం క్రింద తగ్గించుకోటానికి ఇష్టంలేని స్వచిత్తం ఉంది.మరోపైపు విసుగు చెంది దాని క్రింద నిస్పృహలో కృంగిపోయే వైఖరి కూడా ఉంది. చార్లెస్ స్పర్జన్ చెప్పిన విధంగా 'నీతి మార్గము పొరపాటు అనే రెండు పర్వతాల మధ్య ఉన్న సంకుచితమైన దారి వంటిది.ఈ ఇరుకైన లోయగుండా పయనిస్తూ తన గమ్యాన్ని చేరటమే క్రైస్తవ జీవిత రహస్యం.'

బెత్తాన్ని తృణీకరించటం: క్రైస్తవులు ఎన్నో విధాలుగా దేవుని శిక్షణను "తృణీకరించుదురు”. వాటిలో నాల్గింటిని గమనిద్ధాం.

          (ఎ) అనాసక్తత ద్వారా: అనాసక్తవైఖరి శరీరసంబంధమైన మనస్సుకు ఉండే లక్షణం. తన స్వశక్తినాశ్రయించి సమస్యలను ఎదుర్కోవటం కంటే మేలైన పద్ధతి ఏది లోకస్తునికి తెలియదు. దైవిక ఆదరణకర్త, ఆలోచనకర్త మరియు పరమవైద్యుడైనవాని సహాయం లేనివాడై అతడు తన భౌతిక వనరులనే ఆశ్రయిస్తాడు. అయితే దేవునిబిడ్డ కూడా సాతాను బిడ్డవలె ఇదే విధంగా ప్రవర్తించటం చెప్పలేనంత విచారం కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులలో తిరగబడే క్రైస్తవుడు, దేవుని క్రమశిక్షణను తృణీకరించేవాడైయున్నాడు.అనాసక్తవైఖరితో అన్నిటిని సహిస్తూ హృదయాన్ని కఠినం చేసుకోవటం కన్నా విరిగి నలిగిన హృదయం కలవాడు అవ్వటం మేలు.

          (బి) ఫిర్యాదు చేయటం ద్వారా :- అరణ్యంలో అనాడు హెబ్రీయులు చేసింది ఇదే; నేడు కూడా ఇలా చేసేవారు విశ్వాసగృహంలో అనేకులున్నారు. మనలో కొంత అనారోగ్యత ఏర్పడితే ఎంతగా విసుగు చెందుతామంటే, మన స్నేహితులు సైతం దగ్గరకు రావటానికి వెనకంజ వేస్తారు. కొద్ది రోజులు అనారోగ్యపడక మీద ఉన్నంతనే, కాడికి అలవాటుపడని ఎద్దులా చిర్రుబుర్రులాడతాం. మనకంటే తక్కువ భారాన్ని మోసేవారిని అసూయతో చూస్తూ నాకే ఇవన్నీ ఎందుకు సంభవించాయని విసుగుకుంటాం'.ఇవన్నీ అనుభవించటానికి నేను చేసిన పాపం ఏమిటి' అని ప్రశ్నిస్తాం.చదువరీ! జాగ్రత్త! సణుగువారికి శ్రమ. మొదటిసారి మనలో తగ్గింపు  కలగకపోతే దేవుడు రెండవసారి కూడా మనలను క్రమశిక్షణకు గురిచేస్తాడు. బంగారంలో మాలిన్యం ఇంకా ఎంతగా మిగిలి ఉందో నీకు నువ్వే గుర్తుచేసుకో. నీ హృదయంలో వున్న అక్రమాన్ని చూసి, దేవుడు నిన్ను ఇంతకు రెట్టింపుగా మొత్తనందుకు ఆశ్చర్యపడు. “నా కుమారుడా, ప్రభువు చేయుశిక్షను తృణీకరించుకుము”

          (సి) విమర్శల ద్వారా :- మనమెన్నిసార్లు గద్దింపు వల్ల కలిగే ప్రయోజనాన్ని ప్రశ్నిస్తుంటాము.క్రైస్తవులమై ఉండి కూడా తరచు మనం లోకస్తులుగా ఉన్నప్పుడు కలిగి ఉండిన బుద్ధిహీనతనే కనపరస్తుంటాం. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఇంట్లో బెత్తం ఒక అనవసరమైన వస్తువుగా ఎంచేవాళ్ళము. దేవుని పిల్లలైనవారు కూడా తరచూ ఇలాగే ఆలోచిస్తున్నారు. అన్నీ అనుకూలంగా జరిగినప్పుడు ఒకవేళ అనుకోని రీతిగా కొన్ని ఆశీర్వాదాలు మనపై కుమ్మరింపబడినప్పుడు, వాటిని దేవుని కనికరానికి ఆపాదించి, మేలుకరంగా ఎంచటానికి మనకేమీ యిబ్బందిగా ఉండదు కాని మన ఉద్దేశాలు భంగం చేయబడినప్పుడు గాని, నష్టం ఎదుర్కోవలసి వచ్చినప్పుడు గాని మన ఆలోచనావిధానం ఇందుకు వ్యతిరేకంగా ఉంటుంది. అయితే దీన్ని గురించి “నేను వెలుగును సృజించువాడను, అంధకారము కలుగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగజేయువాడను నేనే. యెహెూవా అను నేనే వీటన్నిటిని కలుగజేయువాడను” (యెషయా 45:7) అని వ్రాయబడిలేదా? ఎంత తరచుగా సృజింపబడినది సృజించినవానితో “నన్నీలాగున యెందుకు చేసితివి" అని ప్రశ్నిస్తుంది. దీనివల్ల నాకేం ప్రయోజనం? ఒకవేళ నాకు మంచి ఆరోగ్యం ఉండి ఉంటే, నేను తరచుగా ప్రార్థనామందిరానికి వెళ్ళి ఉండేవాడిని ! ఒకవేళ నాకు వ్యాపారంలో ఆ నష్టాలు కలగకుండా ఉండుంటే దేవుని పనుల కొరకు ఎక్కువ డబ్బు  నాదగ్గర ఉండేది. ఈ యిబ్బంది ద్వారా నాకేమి మంచి జరిగింది ? అని ప్రశ్నిస్తాము. యాకోబు వలె “అన్నియు నాకు ప్రతికూలముగానున్నవి” అని మనం నిర్ఘాంతపోతాము. ఇది దేవుని శిక్షను “తృణీకరించుట” కాకపోతే మరేమిటి ? నీ అజ్ఞానంతో దేవుని జ్ఞానాన్ని ప్రశ్నించవచ్చా ? నీ అల్పదృష్టితో సర్వజ్ఞుడైన దేవుని దూరదృష్టిపై నేరం మోపవచ్చా?

          (డి) అజాగ్రత్త ద్వారా :- అనేకులకు తమ మార్గాలను సరిచేసుకోవటం ఇష్టం లేదు. శీర్షిక వచనంలోని హెచ్చరిక మనందరికి ఎంతగానో అవసరం. దేవుని శిక్షను తృణీకరించేవారు ఎందరో ఉన్నారు. అందుకే వారు దాని నుండి ఏ లాభం పొందలేదు. దేవుని చేత దిద్దుబాటునొందిన క్రైస్తవులు ఎందరో అయినా, కొందరి విషయంలో అది వ్యర్థమే. రోగాలు, ప్రతికూలతలు, నష్టాలు ఏన్నో కలిగినా ప్రార్థనపూర్వకమైన ఆత్మపరిశీలన ద్వారా అవి దీవెనకరంగా చేసుకోబడలేదు. ఓ సహోదరీ, సహోదరుడా, జాగ్రత్త సుమా! ఒకవేళ దేవుడు మిమ్మల్ని గద్దిస్తున్నట్లైతే  “మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనుడి” (హగ్గయి 1:5), “నీవు నడచు మార్గమును సరాళము చేయుము”(సామెతలు 4:26). దేవుడు గద్దించటానికి తగిన కారణం ఉందని తెలుసుకోండి. తాము గద్దింపబడటానికి కారణాన్ని శ్రద్ధగా పరిశీలించి తెలుసుకుని ఉంటే ఆనేకమంది క్రైస్తవులు తాము అనుభవించే శ్రమలలో కనీసం సగమైనా తప్పించికుని ఉండేవారు.

              దాని క్రింద నిస్పృహనొందటం ః 

           దేవుని క్రమశిక్షణను తృణీకరించవద్దని హెచ్చరించిన తరువాత ఇప్పుడు ప్రత్యేకంగా దేవుని గద్దింపును బట్టి నిరాశ చెందొద్దని బోధించబడింది. క్రైస్తవుడు కనీసం మూడు విధాలుగా దేవుని గద్దింపును బట్టి నిస్పృహనొందుతాడు.

          (ఎ) తన ప్రయత్నాలన్నిటిని  విరమించుకున్నప్పుడు, నిరాశతో కృంగి ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. మొత్తబడినవాడు తరచూ ఇది తాను సహించగలదానికంటే మించినదని భావిస్తాడు. అతని గుండె చెదిరిపోతుంది, చుట్టూ అంధకారం ఆవరిస్తుంది. నిరీక్షణ అనే సూర్యునికి గ్రహణం పట్టినట్లుగా ఉంటుంది; కృతజ్ఞత చెల్లించే స్వరం మౌనమైపోతుంది. 'నిస్పృహనొందటం' అంటే మన విధిని నిర్వహించటంలో మనలను మనం అశక్తులుగా చేసుకోవటమే. ఒక వ్యక్తి నిస్పృహనొందితే సొమ్మసిల్లి, చలనం లేకుండా ఉంటాడు. ఎందరు క్రైస్తవులు తమ కృంగుదలలో సంపూర్తిగా తమ పోరాటాన్ని విరమించుకున్నారు ? శ్రమలు ముట్టడిచేసినప్పుడు ఎందరు అచేతనులైపోతున్నారు? ఎందరు  దేవునిహస్తం నాపై భారంగా ఉంది, నేనేమీ చేయలేననే దోరణిలో ఉన్నారు?  నిరీక్షణ లేని యితరులవలె మీరు దు:ఖపడకుండు నిమిత్తము “ఆయన గద్దింపునకు విసుగకుము". దేవుని చెంతకు వెళ్ళి ఆయన హస్తాన్ని గుర్తించండి, మీ శ్రమలు కూడా మీ "మేలుకై  సమకూడి జరుగు సమస్తము”లో భాగంగా ఉన్నాయని జ్ఞాపకముంచుకోండి.

          (బి) తన కుమారత్వాన్ని ప్రశ్నించినప్పుడు :- దేవునిబెత్తం వారి మీదకు వచ్చినప్పుడు తాము దేవుని కుమారులు కారేమో అని అనుమానించేవారు అనేకులు క్రైస్తవుల మధ్య లేకపోలేదు. “నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు” (కీర్తన 34:19) అని, "అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు'' (అపో 14:22) వ్రాయబడి ఉందని వారు మరచిపోతారు. ఒకవేళ నేను దేవుని కుమారుడనైతే నేను పేదరికం, రోదనబాధలలో ఉండకూడదు కదా ? అని ఎవరైనా అనవచ్చు, కాని చూడండి " కుమారులైన వారందరు శిక్ష (క్రమశిక్షణ)లో పాలుపోందుచున్నారు మీరు పొందనియెడల దుర్బీజులే గాని కుమారులు కారు” (హెబ్రి 12:8)

          కాబట్టి దేవుని బెత్తాన్ని, కల్మషాన్ని పోగొట్టే, జల్లించే, పవిత్రపరచే ఆయన ప్రేమకు రుజువుగా చూడటం నేర్చుకో. ఒక కుటుంబంలో తండ్రి తన గృహంలో ఉండేవారిని సంరక్షించి, నడిపించి, పోషించి తన చిత్తానుసారంగా వారు అతన్ని అనుసరించేలా చేస్తాడు. దేవుడు కూడ ఆలాగే చేస్తాడు.

          (సి) తాను నిరాశనొందినప్పుడు :- తమ శ్రమల్లో నుండి ఎప్పటికీ బయటకు రాలేరని కొందరు అపోహపడతారు. నేనుయెంతగా ప్రార్థించినా నా కష్టాలు నా జీవితం నుండి తొలగిపోలేదని  అంటారు. అయితే అరుణోదయానికి ముందే గాఢాంధకార ఘడియలు గడుస్తాయని గుర్తించి ఓదార్పు పోందాలి. కాబట్టి దేవుని గద్దింపునకు "విసుగకుము.” మరికొందరు, 'నేను దేవుని వాగ్దానాలు ఎత్తి పట్టుకొని ఆయనను బతిమిలాడాను, అయినా ప్రయోజనం కలగలేదు. ఆయనను పిలిచినవారి పిలుపు విని వారిని విడిపిస్తాడని నమ్మి నేను కూడా పిలిచాను కాని నా పిలుపుకు సమాధానం రాలేదు, ఇంకెప్పుడూ నాకు సమాధానం రాదేమో అని భయపడుతున్నాను' అని అనొచ్చు. ఏమిటి? దేవుని బిడ్డా! నీ తండ్రిని గురించి ఆలా మాట్లాడాతావా? 'ఇంత కాలం దేవుడు కోడుతూనే ఉన్నాడు కాబట్టి దేవుడు నన్ను కొట్టకమానడు అంటున్నావా. అలా కాకుండా, ఇంతకాలము దేవుడు నన్ను కోట్టాడు కాబట్టి త్వరగానే విడుదల వస్తుంది అని చెప్పు'. “తృణీకరింపకుము”, “విసుగకుము”. ఈ రెండు విధాల పాపాల నుండి దేవుని కృప రచయితకు, చదువరికి విడుదల అనుగ్రహించును గాక !

           

          9వ అధ్యాయం

          దేవుని స్వాస్థ్యం

          “యెహెూవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్యభాగము యాకోబే” (ద్వితి 32:9).

          ఈ వచనం ఎంతో ఆశ్చర్యకరమైన సత్యాన్ని మన ముందు ఉంచుతుంది. ఎంత ఆశ్చర్యకరమంటే అది ఏ మానవ తలంపు నుండి పుట్టలేనిదిగా ఉంది. సర్వశక్తిగల దేవునికి ఒక స్వాస్థ్యం ఉందని, ఆ స్వాస్థ్యం తన ప్రజలే అని ఇది మనకు తెలియజేస్తుంది. ఆయన ఈ లోకాన్ని తన స్వాస్థ్యంగా చేసుకోవటానికి నిరాకరించాడు. అది ఒకనాడు కాల్చివేయబడుతుంది. దూతల సమూహాలతో కూడిన పరలోకం సైతం ఆయన హృదయాన్ని సంతృప్తిపరచలేదు. గత నిత్యత్వంలో దేవుడైన యెహోవా ఆపేక్షతో సెలవిచ్చిన మాటలు.

          "........... నరులను చూచి ఆనందించుచునుంటిని” (సామెతలు 8:31). ఆయన పరిశుద్ధులే ఆయన స్వాస్థమైయున్నారని తెలుపుతుంది, కేవలం ఈ ఒక్క వాక్యం మాత్రమే కాదు. కీర్తన 135:4లో మనం ఈ విధంగా చదువుతాము ." యెహెూవా తన కొరకు యాకోబును యేర్పరచుకొనెను. తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను”.

          మలాకీ 3:17లో వారిని “నావారు నాస్వకీయ సంపాద్యము” అని సంబోధిస్తున్నాడు. వారు ఆయనకు ఎంత ప్రత్యేకమైనవారంటే ఆయన ఉన్నతమైన ప్రేమ వారి కొరకే ప్రత్యక్షపరచబడింది; పరలోకంలో ఉన్న నివాసస్థలాలు వారికొరకే సిద్ధం చేయబడుతున్నాయి.

          ఈ అద్భుతమైన సత్యం కొత్త నిబంధన గ్రంథంలో కూడా గ్రంథస్థం చేయబడింది. ఎఫెసీ 1ః18వ వచనం చూడండి - "మరియు మీ మనోనేత్రములు వెలిగించపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో పరిశుద్ధులలో ఆయన “స్వాస్థ్వము" యొక్క మహిమైశ్వరమెట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యమెట్టిదో మీరు తెలిసికొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించునట్లు నేను నా ప్రార్థన యందును మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.” పరిశుద్ధులు దేవునియందు స్వాస్థ్యం పొందటం మాత్రమే కాదు ఆయన వారియందు తన స్వాస్థ్యాన్ని స్థిరపరచి భద్రపరచాడు. ఇది ఎంత ఆశ్చర్యకరమైన మాట ! ఆయన అంత గొప్ప దేవుడై ఉండి మన విశ్వాసం, ప్రేమ, ఆరాధనలను బట్టి తనను తాను మరింత ఐశ్వర్యవంతునిగా  ఎంచుకుంటున్నాడు. ఇది ఎంత ఆశ్చర్యకరమైన తలంపు! దేవుడు పేదలైన పాపులను ఎన్నిక చేసి తన స్వాస్థ్యంగా మలచుకున్నాడన్న సత్యం లేఖనాలలో బయలుపరచబడిన అత్యంత అద్భుతకరమైన సత్యాలలో ఒకటి.

          అయితే దేవునికి మన అవసరం ఏముంది ? ఏవిధంగా మనం ఆయనను ఐశ్వర్యవంతునిగా చేయగలం? జ్ఞానం, శక్తి, కృప, మహిమ -  ఇవన్నీ ఆయనకు ఉన్నాయి కదా? అవును నిజమే కాని ఆయనకు కావలసింది మరొకటి ఉంది. ఆయనకు కావలసింది "పాత్రలు". ఏలాగైతే సూర్యునికి ప్రకాశించటానికి భూమి అవసరమో ఆలాగే దేవునికి నింపటానికి పాత్రలు కావాలి. తన మహిమను ప్రతిబింబించే పాత్రలు, తన కృప ఐశ్వర్యాన్ని క్రుమ్మరించగలిగే పాత్రలు ఆయనకు అవసరం.

          గమనించండి దేవుని ప్రజలు కేవలం ఆయన “వంతు” అని, ప్రత్యేకింపబడిన ఆయన "స్వకీయ ధనమని” మాత్రమేకాక, ఆయన “స్వాస్థ్యమ"ని పిలవబడ్డారు. ఇది మూడు విషయాలను సూచిస్తుంది.

          మొదటిది, స్వాస్థ్యం మరణం వలన కలుగుతుంది కాబట్టి దేవుని స్వాస్థ్యం తన అద్వితీయకుమారుని మరణం ద్వారా కలిగింది.

          రెండవది, స్వాస్థ్యం ఒక వ్యక్తికి మరియు అతని వారసులకు శాశ్వతంగా చెందుతుంది.

          మూడవది, స్వాస్థ్యం ఒక వ్యక్తికి స్వంతం. అందులోనికి ప్రవేశించటానికి, దానిని వాడుకోవటానికి, మరియు దానిని అనుభవించటానికి అతనికి అధికారం ఉంది.

          ఇప్పుడు దేవుని స్వాస్థ్యాన్ని గురించి ఐదు విషయాలు ధ్యానిద్దాం.

          1. తాను ఒక స్వాస్థ్యాన్ని కలిగి ఉండాలని దేవుడు ఉద్దేశించాడు :- “యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా యేర్పర్చకొను జనులు ధన్యులు” (కీర్తన 33:12) ఇందులో “జనులు” అనే మాట 1 పేతురు 2:9లోని "పరిశుద్ధులైన జనులు ఏర్పరచబడిన వంశములును రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధజనమును దేవునికి సొత్తయిన ప్రజలు నైయున్నారు” అనే మాటకు సమానంగా ఉంది. దయాప్రాప్తులైన ఈ జనమే ఆయన స్వాస్థ్యంగా ఉండటానికి ఎన్నిక చేయబడ్డారు. ఇది ఆయనకు తరువాత తట్టిన ఆలోచన కాదు కాని గత నిత్యత్వం నుండే ఆయన చేత నిర్ణయించబడిన విషయం. జగత్తు పునాది వేయబడక మునుపే వారిని తన స్వంతం చేసుకోవాలని తన హృదయంలో నిశ్చయించుకున్నాడు.

          2. దేవుడు తన ప్రజలను తనకు స్వాస్థ్యంగా ఉండటానికి వెలపెట్టి కొన్నాడు :- “దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాందించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు” అని ఎఫెస్సీ 1:14లో చెప్పబడింది. అదే విధంగా అపోస్తలుల కార్యములు 20:28లో " దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము” గురించి చదువుతాము. దేవుడు తన ప్రజలను కేవలము మరణం మరియు బంధకం నుండి విడిపించబడటానికి మాత్రమే కాదు, వారు తనవారిగా వుండటానికి కూడా వారిని విమోచించాడు. 

          3.దేవుడు వచ్చి తన స్వాస్థ్యము మధ్య నివసిస్తాడు :- “యెహోవా తన ప్రజలను యెడబాయువాడు కాదు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు" (కీర్తన 94 :14).  దేవుని స్వాస్థ్యం గురించిన పై వచనాలన్నీ శరీరసంబంధమైన ఇశ్రాయేలీయులకు మాత్రమే పరిమితం కాదనటానికి ఖచ్చితమైన రుజువు ఏమిటంటే, ఆనాడు, యెహోవా దేవుడు విమోచించబడిన ఇశ్రాయేలు మధ్య నివాసం ఉన్న విధంగా నేడు సంఘంలో సమిష్టిగా మరియు ప్రతి విశ్వాసిలో వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు - “మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? (1 కొరింథి 3:16) " మీ దేహము దేవుని వలన మీకనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైయున్నదని మీరెరుగరా?" (1 కొరింథి 6:19)

          4. దేవుడు తన స్వాస్థ్యాన్ని అలంకరిస్తాడు :- ఏలాగైతే ఒక వ్యక్తి ఒక ఇంటిని గాని స్థిరాస్తిని గాని కొని, దానిని తన స్వంతం చేసుకొని, దానిని అభివృద్ధి చేసి, అలంకరించటానికి పాటుపడతాడో, ఆలాగే దేవుడు కూడ తన ప్రజలను తనకు తగినవారిగా మలచుకోవటానికి వారిలో కార్యం జరిగిస్తున్నాడు. “మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను.” (ఫిలిప్పీ 1:6)

          ఇప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు సారూప్యంలోనికి మనలను మార్చే ప్రక్రియలో ఉన్నాడు. క్రీస్తును అంగీకరించిన ప్రతి వ్యక్తి కీర్తనాకారునితో కలిసి ఇలా చెప్పగలడు: “యెహోవా నాపక్షమున కార్యము సఫలము చేయును" (కీర్తన 138:8); మనం మహిమ పొందేవరకు దేవుడు సంతృప్తి చెందడు. “సమస్తమును తనకు లోబరచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును మహిమ గల తన శరీరముకు సమరూపము గలదానిగా మార్చును" (ఫిలిప్పీ 3:2). “ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము (యోహాను 3:12)

          5. భవిష్యత్తు సంగతేమిటి? :- దేవుడు తప్పక తన స్వాస్థ్యాన్ని సొంతం చేసుకొని, దానియందు నివసించి, దానిని అనుభవించి, దానిలో ఆనందిస్తాడు. రానున్న నిత్యత్వంలో "........... మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటముల యెడల తన మహిమైశ్వర్యము కనబరచవలెనని యున్ననేమి?" (రోమా 9:23)

          దేవుడు నిత్యం నివసించబోయే మహిమ స్వాస్థ్యం తన ప్రజలలో నుండే వస్తుంది. ఎఫెస్సి 2వ అధ్యాయానికి చివరిలో ఉన్న ఈ మాట ఎంత ఆశ్చర్యకరమైనది. "....... ప్రతి కట్టడమును ఆయనతో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధిపొందుచున్నది.” “ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమైయుండుటకు కట్టబడుచున్నారు.” (ఎఫెస్సి 2:22).

          ప్రకటన 21లో మన ముందుంచబడిన పరలోక దృశ్యం అద్భుతంగా, మహిమాన్వితంగా ఉంది. "అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది ఆయన వారితో కాపురముండును. వారాయన ప్రజలైయుందురు దేవుడు తానే వారి దేవుడై యుండి వారికి తోడైయుండును” (ప్రకటన 21:1-3). జెఫన్యా 3:17లో ఉన్న ఈ మాట ఎంత ఆశ్చర్యకరమైనది, “నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును నీయందు తనకున్న ప్రేమనుబట్టి శాంతము వహించి నీ యందలి సంతోషముచేత ఆయన హర్షించును".

          “నేను సంతృప్తి చెందితిని. ఇచ్చట నేను నిత్యము నివసించుదును ఇది నా స్వాస్థ్యము. నేనిక్కడ నిత్యము నివాసము చేతును. నేను రక్షించి విమోచించిన పాపులపైన సైతము నా మహిమను కుమ్మరింతును” అని గొప్ప దేవుడు ఇకను సెలవిస్తాడు. అందుకే, కీర్తనకారునితో మనం ఈ విధంగా ఏకీభవించాల్సిందే - “ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము అది నాకందదు ” (కీర్తన 139:6) దేవుని కృప మనం పిలువబడిన పిలుపుకు తగిన రీతిగా నడిచేలా మనకు తోడైయుండును గాక.

          10వ అధ్యాయం

          దేవుడు తన స్వాస్థ్యాన్ని భద్రపరచటం

          “అరణ్య ప్రదేశములోను, భీకర ధ్వని గల పాడైన యెడారిలోను వాని కనుగొని, ఆవరించి, పరామర్శించి తన కనుపాపవలె వాని కాపాడెను. (ద్వితి 32:10)

          శీర్షిక వచనానికి ముందు వచనంలో “యెహెూవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్యభాగము యాకోబే” అని చెప్పిబడింది. కాబట్టి దాని తరువాత ఉన్న ఈ వచనంలో అదే సత్యం మరొకరీతిలో చెప్పబడిందని గ్రహించటం కష్టం కాదు. " ఆయన స్వాస్థ్యభాగము యాకోబే”

          మన శీర్షిక వచనంలో దేవుడు తన స్వాస్థ్యాన్ని సంపాదించటానికి పడే ప్రయాస గురించి కొంత నేర్చుకోగలం. దీనిలో మనం గమనించి అనందించగలిగే నాలుగు అంశాలు ఉన్నాయి.

          1. యెహోవా తన ప్రజలను కనుగొనటం :-

          అరణ్య ప్రదేశములో వానిని కనుగొన్నాడు. "కనుగొనెను” అనే మాటలో, వెదకటం అవసరమై ఉండిందనే భావం ఉందని వేరే చెప్పనవసరం లేదు. ఇది 'వెదికే దేవుని' యొక్క ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని మనముందు ఉంచుతోంది. సృష్టానికి సృష్టికర్తకు మధ్య పాపం అడ్డు వచ్చి యెడబాటును పరాయత్వాన్ని కలిగించింది. అంతేకాక పతనం ఫలితంగా లోకంలోకి ప్రవేశించే ప్రతినరుడు " దేవునితో వైరము”ను సంతరించుకుని ఉన్నాడు. ఈ కారణంగా దేవుని వెదకువారేవ్వరు లేని దుస్థితి ఏర్పడింది. కాబట్టి దేవుడు అద్భుతకరంగా తనను తాను తగ్గించుకొని, అద్వితీయమైన తన ప్రేమ మరియు కృపచేత నరుని వెదకేవాడయ్యాడు.

          "కనుగొను” అనే ఈ పదం వెదకటాన్ని మాత్రమే సూచించటం లేదు కాని, వెదకబడినవారి అయోగ్యత మరియు పాపభూయిష్టతను పరిగణలోనికి తీసుకున్నప్పుడు, వెదికేవాని ప్రేమను కూడా అది సూచిస్తుంది. గొప్ప దేవుడు, తన సార్వభౌమ్య కృప చేత ఎన్నిక చేసుకున్నవారిపై తన మనస్సు ఉంచాడు. కాబట్టి వారిని వెదికేవాడయ్యాడు. దేవుడు అబ్రహాముపై మనస్సు ఉంచాడు కాబట్టి అతనిని ఉరు అను కల్దీయుల గ్రామములో విగ్రహారాధికుల మధ్య వెదకి కనుగొన్నాడు. దేవుడు యాకోబుపై మనస్సు ఉంచాడు కాబట్టి తన సహోదరుని పగవలన భయంతో పారిపోయి, వట్టి నేలమీద నిద్రిస్తున్నప్పుడు వానిని వెదకి కనుగొన్నాడు.అలాగే దేవుడు మోషేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు కాబట్టి మిద్యానులో యెడారి ప్రక్కన ఆతన్ని వెదకి కనుగొన్నాడు. ఇదే రీతిగా నేడు కూడా లోకములో ఉన్న ప్రతి నిజక్రైస్తవుణ్ణి ఇదే ప్రేమ వెంటాడి, వెదకి కనుగోంటుంది.

          “నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపనివారికి ప్రత్యక్షమైతిని” (రోమా 10:20-21). దేవుడు నిన్ను కనుగొన్నాడా ? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే శీర్షిక వచనంలోని మొదటి భాగములో చెప్పబడిన మాటను అర్ధం చేసుకోవాలి. “అరణ్య ప్రదేశములోను, భీకర ధ్వని గల పాడైన యెడారిలోను వాని కనుగొని..........". మరి నీకు ఈ లోకం ఆ విధం కనబడుతుందా? సూర్యుని క్రింద అంతా వ్యర్థంగా మరియు ఆత్మకు బాధ కలిగించేదిగా కనబడుతుందా ? ప్రతిరోజు నీ చుట్టూ జరిగే సంఘటనలను చూసి మూల్గే అంత భాదా అనుభవిస్తున్నావా? లోకములో నిజంగా సంతృప్తి కలిగించేది ఏదీ, శ్రేయస్కరమైనది ఏదీ లేదని నీకు అనిపిస్తుందా? ఈ లోకం నిజంగా నీకు ఒక అరణ్యప్రదేశంగాను, భీకర ధ్వనిగల పాడైన యెడారిగాను కనబడుతుందా? ఈ రెండవ పరీక్షను కూడా అన్వయించుకుందాము. దేవుడు తనవారిలో ఒకనిని కనుగొనప్పుడు అతనికి తనను తాను ప్రత్యక్షపరచుకుంటాడు. అతనికి దేవుడు తన సార్వభౌమ్య ఔన్నత్యాన్ని, అనంతమైన శక్తిని, ఉహాతీతమైన పరిశుద్ధతను, అద్భుతమైన కనికరాన్ని గురించిన జ్ఞానాన్ని బయలుపరుస్తాడు. మరి ఆయన ఆ విధంగా నీకు తనను తాను బయలుపరచుకున్నాడా? తన దివ్యమహిమను సార్వభౌమ్య కృపను మరియు ఆశ్చర్యకరమైన ప్రేమను ఏ మాత్రమైనా నీకు బయలుపరచాడా ?

          “ అద్వితీయ, సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును యెరుగటయే నిత్యజీవము” (యోహాను 17:3) ఈ మూడవ పరీక్షను కూడా అన్వయించుకుందాం. దేవుడు తనను తాను నీకు బయలుపరచుకుంటే నీ గురించి కూడా నీకు కనపరచే ఉంటాడు. ఎందుకంటే  ఆయన వెలుగులోనే మనం వెలుగును చూస్తాము. నీ స్థితి గురించిన బయలుపాటు ఎంతగానో అణచివేసే భాదాకరమైన మరియు ఎన్నటికీ మరువరానిదైన అనుభవమై ఉంటుంది. అబ్రహాముకు దేవుడు దర్శనమిచ్చినప్పుడు అతడు దేవునితో పలికిన మాటలు గమనించండి. “ఇదిగో ధూళియు, బూడిదైయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను” (ఆదికాండము 18:27). ఆయన ప్రవక్తయైన యెషయాకు ప్రత్యక్షమైనప్పుడు, అతడు, “అయ్యో! నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను” (యెషయా 6:5) అన్నాడు. దేవుడు యోబుకు ప్రత్యక్షమైనప్పుడు అతడు " నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను, బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను"(యోబు 42:6) అన్నాడు. గమనించండి ! అతడు 'నా క్రియలను అసహ్యించుకొనుచున్నాను' అనటం లేదు కాని “నన్ను నేను అసహ్యించుకొనుచున్నాను” అంటున్నాడు.

          ప్రియ చదువరీ! నీకు ఈ అనుభవం ఉందా ? నువ్వు తప్పిపోయినవాడవై పతనమైన స్థితిలో ఉన్నావన్న గ్రహింపుకు నడిపించబడ్డావా? నీలో ఏ మంచియు లేదని గ్రహించావా ? నువ్వు కేవలం నరకానికి మాత్రమే పాత్రుడవని చూడగలిగావా? నువ్వు యథార్థంగా ఇలాంటి అనుభవం కలిగి ఉన్నావా? ఆలాగైతే దేవుడు నిన్ను కనుగొన్నాడనటానికి ఇదే ఋజువు మరియు నిర్థారణ.

          2.యెహెూవా తన ప్రజలను నడిపించటం :- 

          వాస్తవంగా “ఆవరించి” అనే శీర్షిక వచనంలోని మాటను మూలభాషను అనుసరించి "నడిపించి” అని అనువాదం చెయ్యాలి. దేవుడు తన ప్రజలతో వ్యవహరించే ప్రక్రియలో వారిని "కనుగొనుట” అంతం కాదు ప్రారంభం మాత్రమే. వారిని కనుగొన్న దేవుడు ఎన్నటికి వారిని విడనాడువాడు కాదు. తప్పిపోయి తిరుగులాడే తన బిడ్డను కనుగొన్న దేవుడు ఇప్పుడు అతనిని ఇరుకు మార్గంలో నడిపిస్తాడు. దేవుడు “నడిపించుట"ను గురించిన ఒక చక్కటి మాట హోషేయ గ్రంథంలో చదువుతాము. “ఎఫ్రాయిమును చేయిపట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే” (హోషేయ 11:3). బలహీనమైన చిన్న పాదాలతో నడిచే తన చంటి బిడ్డలను(ప్రజలను) చెయ్యిపట్టుకొని నడిపించే తల్లివలే ప్రభువు తన నామమును బట్టి తన భక్తుల పాదాలు తొట్ట్రిల్లకుండ కాపాడుతాడు (1 సమూయేలు 2:9;) దేవుని నడిపింపులో మూడు కోణాలు ఉన్నాయి.

          . సువార్త ద్వారా:-

          “నేనే మార్గమును, సత్యమును జీవమునైయున్నాను. నా ద్వారానే తప్పయెవడును తండ్రి యొద్దకు రాడు” (యోహాను 14:6). అయితే ఆయన ఈ విధంగా కూడా సెలవిచ్చాడు “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనేగాని యెవడును నాయొద్దకు రాలేడు” (యోహను 6:44). దేవుడు నడిపించే విధానం ఇది. అభ్యాగ్యుడైన పాపిని ఆయన యేసుక్రీస్తు వద్దకు నడిపిస్తాడు. ప్రియ చదువరీ! నువ్వు ఈ విధంగా రక్షకుని యొద్దకు నడిపించబడ్డావా? క్రీస్తే నీ నిరీక్షణ అయివున్నాడా? ఆయన ప్రశస్త రక్తం మాత్రమే నీకు చాలినదని నమ్ముతున్నావా? ఆలాగైతే తన కుమారుడైన యేసుక్రీస్తు వద్దకు నిన్ను నడిపించినందుకు తండ్రియైన దేవునిని స్తుతించటానికి నీకు ఎంత గొప్ప కారణం ఉంది!

          బి. బోధించటం ద్వారా :-

          “అయితే ఆయన, అనగా సత్య స్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును” అని యేసు చెప్పాడు. స్వతహాగా సత్యాన్ని కనుగొనే సామర్థ్యం మనలో లేదు కాబట్టి సత్యంలోనికి నడిపించబడాల్సిన అవసరత ఉంది. "దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు” (రోమా 8:14). మనలను దేవుని వాక్యమనే "పచ్చిక గల చోట్లను" నడిపించేవాడు ఆయనే. ఆయన వాక్యదీపం వెదజల్లే ప్రతి వెలుగు కిరణానికై మనమెంతో కృతజ్ఞులుగా ఉండాలి !

          సి. ఆయన ఏర్పాటు ద్వారా :-

          "వారు యెడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు; మార్గము గుండ వావారిని తోడుకొని పోవుటకు పగలు మేఘ స్తంభమును, దారిలో వారికి వెలుగిచ్చుటకు రాత్రి అగ్ని స్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను" ( నెహెమ్యా 9:19); అలనాడు యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించిన రీతిగానే, నేడు మనలను కూడా అరణ్యమనే ఈ ప్రపంచములో అడుగడుగునా నడిపిస్తున్నాడు. ఎంత గొప్ప కనికరమిది! “ఒకని నడత యెహెూవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును" ( కీర్తన 37: 28)

          అవును, మన జీవితంలో ప్రతి విషయం కూడా అత్యున్నతుడైన దేవుని వలన నడిపింపబడుతుంది.

          నా సమయములన్ని నీ చేతిలో ఉన్నవి

          అన్ని విషయాలు నీ ఆజ్ఞానుసారములే

          నా జీవితంలో జరుగునవన్నీ నా పరలోక స్నేహితుని చిత్తానుసారములే.

          3. దేవుడు తన ప్రజలకు ఉపదేశించటం :-

           ("పరామర్శించి" అనే శీర్షిక వచనంలోని మాట మూల భాషననుసరించి "ఉపదేశించి” లేదా “ఆలోచన చెప్పి" అని అనువదించబడాలి.) ఆయన మనకు ఉపదేశిస్తున్నాడు. మనకు ఉపదేశించటానికే దేవుడు తన గొప్ప కృప చొప్పున తన లేఖనాలను అనుగ్రహించాడు.మనం అంధకారంలో తడువులాడటానికి ఆయన మనలను విడిచిపెట్టలేదు కాని మన పాదాలకు దీపాన్ని, మన త్రోవకు వెలుగును అనుగ్రహించాడు. అంతేకాకుండా మనం ఆ వాక్యాన్ని అర్థం చేసుకునే పనిని నేర్పులేని మన స్వజ్ఞానానికి విడచిపెట్టలేదు. మనకు బోధించటానికి పొరపడజాలని ఉపదేశకుడు అనుగ్రహింపబడ్డాడు. పరిశుద్ధాత్ముడే మన బోధకుడు. “అయితే మీరు పరిశుద్దాత్ముని వలన అభిషేకము పొందియున్నారు కనుక సమస్తము యెరుగుదురు అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది. గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమేగాని అబద్దము కాదు. అది అన్నిటిని గూర్చిమీకు బోధించున్న ప్రకారముగాను, ఆయన మీకు భోదించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు” (1 యోహాను 2:20,27).

          దేవుని వాక్యాన్ని గురించిన సరైన అవగాహన మానవ మేథస్సు వలన సిద్ధింపజేసుకోగలిగేది కాదు కాని దేవుడే మనకనుగ్రహించిన వరం. దీన్ని గురించి  ఇలా వ్రాయబడింది, “పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని యెవడును ఏమియు పొందనేరడు”(యోహాను 3:27). అక్షరాలు ఎంత స్పష్టంగా రాయబడినా చదువరి నేత్రహీనుడైతే ఏం లాభం ?

          “ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి తనకు వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభమయు చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు” (1 కొరింథీ 2:14) అని వ్రాయబడియున్నది. ఆత్మీయ వివేచన కేవలం పరిశుద్ధాత్ముని వలన మాత్రమే అనుగ్రహింపబడుతుంది.

          “వానికి ఉపదేశించి” (శీర్షిక వచనం) ఎంత ఓపికగా దేవుడు మన మందత్వాన్ని భరిస్తున్నాడు ! ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము అని ఇలా ఎంత దయతో చెప్పిందే తిరిగి చెబుతూ మనకు నేర్పిస్తున్నాడు. మనమెంత సోమరులమైనా సరే “యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును” (కీర్తన 138:8) అని వాగ్దానం చేశాడు కాబట్టి మనలను అదేపనిగా వెంటాడుతున్నాడు. మానవుడు సంపూర్ణ పతనం అయ్యాడని, అతడు స్వతహాగా పాపం నుండి నివారణ పొందటానికి శక్తిహీనుడని, అయితే తిరిగి జన్మించటం అనేది కేవలం దేవుని వలన మాత్రమే జరుగుతుందని, అందులో మానవుని భాగం కాని ప్రమేయం కాని ఏ మాత్రం ఉండదని మొదలైన సత్యాలు ఆయన నీకు బోధించాడా? ఆయన తన కుమారుని యొక్క ప్రాయశ్చిత్త బలియాగం యొక్క ప్రశస్తతను గురించి, ఆయన రక్తం ప్రతి పాపం నుండి శుద్ధీకరించటానికి చాలినదని నీకు బయలుపరిచాడా? ఆలాగైతే ఆయనకు కృతజ్ఞుడవై ఉండటానికి ఇది ఎంత గొప్ప కారణం !

          4.దేవుడు తన ప్రజలను కాపాడటం :

          “తన కనుపాపవలె వానిని కాపాడెను” (ద్వితి 32:10). క్రైస్తవ్యం షరతులతో మరియు అనిశ్చయతతో కూడిన మతం కాదు. అలాంటి మతానికి తగిన పేరు ఆర్మీనియనిజం (మానవుని స్వచిత్తం మరియు స్వశక్తి చేత క్రీస్తునంగీకరించి, రక్షణ పొందవచ్చని బోధించే మతశాఖ). ఈ ఆర్మీనియనిజం అనేది రోమన్ కాథలిక్ వ్యవస్థకు పుట్టిన కుమార్తెలలో ఒకటి. దానిని గ్రుడ్డిగా అనుసరించేవారిని అది అనిశ్చయతతో సతమతమయ్యేలా చేస్తుంది, దేవుణ్ణి అగౌరవపరచి, లేఖనాన్ని వ్యతిరేకించి, ఆత్మలను నాశనం చేసేది ఈ రోమన్ కాథలిక్ దుర్వ్యవస్థే. దాని తండ్రి అపవాది అనే సాతాను కాబట్టి అది మానవ స్వనీతిని సమర్థించి రక్షణ పొందటానికి మానవునిలో సామర్థ్యం ఉందని బోధించి, స్వయాన్ని హెచ్చించి, సత్యవిరుద్ధమైన ఎన్నో అంశాల చేత అనిశ్చయత మరియు ఆందోళన పుట్టిస్తుంది. అయితే క్రైస్తవ్యం నిశ్చయతను కలిగిస్తుంది. ఆ నిశ్చయత ఒక మంచి కార్యాన్ని ప్రారంభించి, దానిని తప్పక తుదముట్టించే మార్పులేని దేవుని ప్రేమ మరియు ప్రణాళిక నుండి పుడుతుంది  “యేలయనగా, యెహోవాన్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నడెన్నటికి కాపాడబడుదురు" (కీర్తనలు 37:28). ఇది ఎంత ఆశీర్వాదకరం! నోవహు మత్తుడై ఉన్నప్పుడు యెహోవా అతనిని విడిచిపెట్టాడా? లేదు, ఖచ్చితంగా లేదు. బండను కొట్టినందువలన మోషేను ఆయన విడిచిపెట్టాడా ? ఖచ్చితంగా విడిచిపెట్టలేదు. రూపాంతర కొండపైన మోషే కనబడటం ద్వారా ఇది రూఢి చేయబడింది. దైవదూషణ చేయటానికి శత్రువులకు అవకాశం ఇచ్చిన పాపాలను బట్టి దావీదును ఆయన విడచిపెట్టాడా? లేదు, ఖచ్చితంగా లేదు. దానికి బదులు అతనిని పశ్చాత్తాపంలోకి నడిపించి, తన పాపాలను ఒప్పింపజేసిన తర్వాత తన దాసుని నోట ఇలా పలికించాడు, “ నీవు చావకుండనట్లు యెహెూవా నీ పాపమును పరిహరించెను” (2సమూయేలు 12:13) “యెహెూవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును పగలుయెండ దెబ్బయైనను నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండ యెహెూవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీరాక పోకలయందు యెహోవా నిన్ను కాపాడును" (కీర్తనలు121:5-8).

           దేవుని నిత్య నిబంధనకు ఋజువులు ఇవిగో! త్రియేక దేవుడైన యెహోవా యొక్క పొరబడజాలని వాగ్దానాలు ఇవిగో! అబద్దమాడటం అసాధ్యమైనవాని సత్య వాగ్దానాలు ఇవిగో. గమనించండి! దేవుని వాగ్దానంలో ఎలాంటి షరతులు కనిపించవు. 'ఒకవేళ' అనే మాటకు అందులో తావు లేదు. ఏ పరిస్థితి కూడా విశ్వాసిపై దేవుని కాపుదలకు అవరోధాలు కావు. ఏ మార్పు కూడా ఆ దైవిక స్థిరత్వాన్ని మార్చలేవు, ప్రభావితం చేయలేవు. ధనం ప్రలోభపెట్టినా, పేదరికం వస్త్రహీనునిగా చేసినా, సాతాను శోధించినా, అంతరంగ పాపాలు విసిగించినా, ఇవన్నీ క్రీస్తు గొర్రెలమైన మనలో ఒక్కరిని కూడా నశింపచేయలేవు. అందుకు భిన్నంగా ఇలాంటి అనుభవాలన్నీ మన దేవుని భద్రపరచే హస్తాన్ని మరింత ప్రత్యక్షంగా, మహిమాన్వితంగా బయలుపరచటానికే దోహదపడతాయి.

          “కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుటకును; ఆస్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.” (1 పేతురు 1:5)

          కోపావేశాలతో కూడిన అన్యులైన చక్రవర్తుల సింహపు బోనులు, అగ్ని గుండాలు ఏర్పరచబడినవారి విశ్వాసాన్ని పరీక్షించటానికి ప్రయత్నిస్తాయేమో గాని, అవి వారి విశ్వాసాన్ని గాయపరచలేవు, నాశనం చేయలేవు. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, కనుగొని, నడిపించి, ఉపదేశించి, కాపాడే త్రియేకుడైన దేవునికి ఏమని కృతజ్ఞతలు తెలపగలం?.

          11 అధ్యాయం

          దు:ఖపడటం

          “దు:ఖపడువారు ధన్యులు” (మత్తయి 5:4)

          దు:ఖపడటం అనేది మానవ స్వభావానికి అయిష్టకరమైంది మరియు విసికెత్తించేదిగా ఉంది. 

          అది శ్రమ, బాధ అనుభవించడానికి జంకుతుంది. సహజసిద్ధంగా మనం సంతోషంగా ఉండేవాళ్ళతో కలసి ఉండటాన్ని ఆశిస్తాము.‌ ఈ శీర్షిక వచనంలోని మాటలు తిరిగి జన్మించనివారికి అసహజంగా అనిపిస్తాయేమో కానీ, దేవునిచేత ఏర్పరచబడ్డవారికి మాత్రం అది అతిమధురమైన సంగీతంలా వినిపిస్తుంది. ఒకవేళ ధన్యులైతే దు:ఖపడటం ఎందుకు? దు:ఖపడితే ధన్యులు ఎలా అయినట్లు? ఈ మాటలను ధ్యానించే కొద్దీ 'ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడూ యెన్నడూ మాట్లాడలేదని' ఒప్పుకోవడానికి మనం బలవంతపెట్టబడతాం. “దు:ఖపడువారు ధన్యులు” అనేమాట లౌకికతత్వానికి సరిగ్గా వ్యతిరేకం. ప్రతి స్థలంలోనూ, ప్రతి తరంలోనూ మనుష్యులు ధనవంతులను మరియు సంతోషంగా బ్రతికేవారిని ధన్యులని భావిస్తారు; అయితే క్రీస్తు మాత్రం ఆత్మవిషయమై దీనులైనవారిని, దు:ఖపడేవారిని ధన్యులని చెబుతున్నాడు. అయితే ఇక్కడ అన్ని రకాలైన దు:ఖాలను గురించి ఆయన ప్రస్తావించడం లేదనేది వాస్తవం. మరణానికి దారితీసే దు:ఖం కూడా ఒకటుంది. (2 కొరింథి 7:10;) అయితే ఇక్కడ వాగ్దానం చేయబడ్డ ధన్యత కేవలం ఆత్మీయమైన దు:ఖానికి మాత్రమే పరిమితమైంది. ధన్యకరమైన దు:ఖం అనేది దేవుని పరిశుద్ధత, మంచితనం మరియు మన స్వీయ దుష్టత్వం, పతనస్వభావం వల్ల మన నడతలో ఉండే తిరుగుబాటు, మనలోని కల్మషం మొదలైన విషయాలను గుర్తించడాన్ని బట్టి కలిగే దైవికమైన దు:ఖం.

           

          సువార్తలో నాలుగు జతలుగా అమర్చబడ్డ ఎనిమిది ధన్యతలను గమనిద్దాం. ఈ ఎనిమిదిలోనూ మొదటి ధన్యత ఆత్మవిషయమై దీనులైనవారికి ఆపాదించబడింది. తాము వ్యర్థులమనే గ్రహింపుకు తేబడ్డవారిని ఇది సూచిస్తుంది. అయితే దీనికి వెనువెంటే “దు:ఖపడేవారి"ని గురించి ప్రస్తావన మార్చడాన్ని అర్థం చేసుకోవడం ఇప్పుడు సులభమే. దు:ఖం పేదరికంతో విడదీయలేని సంబంధం కలిగియుంది.

           

          ఇక్కడ “దు:ఖపడు" అనే మాటకు అర్థం - విహీనత్వం, కష్టం, నష్టం మొదలైన భావాల కన్నా ఎంతో మించింది. ఇక్కడ దు:ఖపడటం అంటే మన హృదయం యొక్క శూన్యత్వాన్ని బట్టి, మనలను దేవుని నుండి ఎడబాపిన అతిక్రమాలను బట్టి, మనం అతిశయించిన నీతిక్రియలను బట్టి, మనం ఆశ్రయించిన స్వనీతిని బట్టి, దేవుని యెడల వైరం సంతరించుకోవడాన్ని బట్టి, ఆయన చిత్తానికి  ఎదురుతిరగడాన్ని బట్టి దు:ఖపడడం. ఆత్మవిషయమై దీనులైనవారమనే గ్రహింపు నుండే ఇలాంటి దు:ఖం కలుగుతుంది. (డా|| పర్సన్)

           

          ఇక్కడ మన రక్షకుడు ధన్యుడని పిలిచిన వ్యక్తి ఎటువంటివాడో తెలిపే ఒక చక్కటి ఉదాహరణ లూకా 18లో‌ మనం చూడగలం. అక్కడ చిత్రీకరించబడ్డ భిన్నత్వం గమనించదగింది. మొదట స్వనీతిపరుడైన పరిసయ్యుడొకడు దేవాలయంలో ప్రార్థించడం గురించి మనం చదువుతాం, అతడు ఈ విధంగా ప్రార్థించాడు, "దేవా నేను చోరులును, అన్యాయస్థులను, వ్యభిచారులైన యితర మనుష్యుల వలెనైనను, ఈ సుంకరివలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదనయంతటిలో పదవవంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను” (లూకా 18: 11,12). అదంతా వాస్తవమే అయ్యుండవచ్చు కాని ఆ పరిసయ్యుడు తృణీకరింపబడ్డవాడై తిరిగి వెళ్ళాడు. అతని చక్కని వస్త్రాలు కేవలం మురికి గుడ్డలని, అతని తెల్లటి అంగీ మలినమైందని అతడు తెలుసుకోలేకపోయాడు.

           

          ఆ తరువాత సుంకరి గురించి మనం చదువుతాం; అతడు " నా దోషములు నన్ను తరిమిపట్టుకొనగా నేను తలయెత్తి చూడలేకపోతిని” (కీర్తన 40:12) అని చెప్పిన కీర్తనాకారునిలా ఆకాశం వైపు కన్నులెత్తడానికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ “పాపినైన నన్ను కరుణించు"మని అతడు తన ఆత్మీయ దీనత్వాన్ని గ్రహించి, దాని విషయమై యథార్థంగా దు:ఖించాడు కనుక నీతిమంతుడిగా తీర్చబడ్డవాడై తన ఇంటికి వెళ్ళాడు.

           

          ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, దేవుని పిల్లలైనవారి పుట్టుమచ్చలు (గుర్తింపు ముద్రలు) ఇవే. తాము ఆత్మీయంగా దీనులమని గుర్తించి, దాన్ని బట్టి దు:ఖించనివాళ్ళు, సంఘంలో సభ్యులైనా సరే, అందులో పరిచారకులైనా సరే, వారు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు, చూడనూలేరు. అంత గొప్ప దేవుడు కృపచేత తన్ను తాను తగ్గించుకుని, విరిగి నలిగిన హృదయంలో నివసిస్తాడని ఎరిగి, ఓ క్రైస్తవ చదువరీ, నీవు కృతజ్ఞుడై జీవించాలి!

           

          ఎవని దృష్టికి మహాకాశాలు పవిత్రంగా కనిపించవో, మానవుల చేత నిర్మించబడ్డ ఎంత మనోహరమైన ఆలయమైనా అది తనకు తగిన నివాస స్థలంగా ఎవనికి తోచదో, అట్టి ఘనుడైన దేవుడు మనలో నివసిస్తాడట. (యెషయా 66:22;) మరియు యెషయా 57:15;). 

           

          దు:ఖపడేవారు ధన్యులు. దు:ఖపడటం అనేది ప్రాథమికంగా ఒకడు తన పాపాల విషయమై ఒప్పించబడి, నొప్పించబడ్డప్పుడు కలిగే అనుభూతి. అయితే అక్కడికే దాన్ని పరిమితం చేయడం సరికాదు. ఇట్టి దు:ఖం క్రైస్తవ్యస్థితికిగల సహజ లక్షణమే. తన హృదయ వ్యాధి తనను దుఃఖితుడిని చేసి, “అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను?” అని రోదింపచేస్తుంది. సులువుగా చిక్కులుపెట్టే మన అవిశ్వాసం, మన తల వెంట్రుకల కన్నా విస్తారమైన పాపాలు మనలను దు:ఖభరితులుగా చేస్తాయి. నిష్ఫలం, నిరుపయోగమైన మన జీవితాలు నిట్టూర్పుకు, నిరుత్సాహానికి తరచుగా తావిస్తాయి. క్రీస్తు సన్నిధి నుండి తొలగిపోడానికి సుముఖత చూపే మూర్ఖపు ఆలోచన, ఆయనతో కలిసియుండాల్సిన సన్నిహిత సంబంధం విషయంలో కొరత, ఆయన పై గల అసంపూర్ణమైన ప్రేమ, ఇవన్నీ నిరవంజీ చెట్లకు మన సితారాలను తగిలించేంత దు:ఖం కలిగిస్తాయి. అంతేకాదు పైకి భక్తిగలవారివలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వేషధారులను చుట్టూ చూస్తుంటే, దేవుని సత్యాన్ని అవమానపరిచే విధంగా వేలాది వేదికలలో నుండి తప్పుడు సిద్ధాంతాలు బయలువెళ్ళుతుంటే, దేవుని ప్రజల మధ్యగల విభజనలు సహోదరుల మధ్య చెలరేగే వివాదాలు, ఇవన్నీ హృదయాన్ని ఎంతో ఆవేదనకు గురిచేస్తాయి. అంతేకాక ప్రపంచంలో గల భయంకర బలాత్కారాలు, మానవులు క్రీస్తును వ్యతిరేకించడం, అనేకులు అనుభవించే చెప్పశక్యం కాని బాధలు, వీటన్నిటినీ‌ తలచుకుంటే మనలో మనం మూలుగుతాము. క్రైస్తవుడు దేవునికి ఎంత సమీపస్తుడౌతాడో అంతే మేరకు ఆయన్ను అవమానపరిచేవన్నీ తనకు దుఃఖం కల్గిస్తాయి. అతని హృదయవైఖరి కీర్తనాకారునితోను (119:53;), యిర్మియాతోను (13:17;), యెహెజ్కేలుతోను (యెహెజ్కేలు9:4;) ఏకీభవిస్తుంది.

           

          “వారు ఓదార్చబడుదురు”. ఈ ఓదార్పు ప్రాథమికంగా నిందారోపణ చేసే మనస్సాక్షిని తొలగించడం వల్ల కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు రక్షకుని అవశ్యకతను గుర్తించడానికి తాను పురికొల్పిన వ్యక్తిలో, దేవుని కృపాసువార్తను అన్వయించడం ద్వారా ఇది సుసాధ్యం ఔతుంది. యేసుక్రీస్తు ప్రాయశ్చిత్త రక్తం వల్ల సంపూర్ణంగాను, ఉచితంగాను క్షమాపణ కలిగిందనే గ్రహింపు నుండి ఇది ఉద్భవిస్తుంది. ఇలాంటి ఓదార్పు “సమస్త జ్ఞానానికీ మించిన దేవుని సమాధానమై,” తాను యేసుక్రీస్తునందు స్వీకరించబడ్డాడు అని నిశ్చయత పొందినవాని హృదయంలో పొంగిపొర్లుతుంది. దేవుడు స్వస్థపరచడానికి ముందుగా గాయపరుస్తాడు, హెచ్చించడానికి ముందుగా తగ్గిస్తాడు. ముందుగా ఆయన న్యాయం మరియు పరిశుద్ధతను బయలుపరుస్తాడు తర్వాత ఆయన కృపాకనికరరాలను వెల్లడి చేస్తాడు.

           

          “వారు ఓదార్చబడుదురు” అనే మాట కూడ క్రైస్తవుని జీవితంలో ఎడతెగకుండా నెరవేరడం మనం గమనించాల్సిన విషయం. క్షమించరాని తన వైఫల్యాన్ని గూర్చిన దు:ఖంతో పాపాలన్నీ ఒప్పుకున్న తర్వాత తాను ప్రభువైన యేసు క్రీస్తు రక్తం చేత పవిత్రపరచబడతానన్న సమాధానాన్ని, ఓదార్పునూ అతను పొందుతాడు. తన చుట్టూ క్రీస్తుకు జరుగుతున్న అవమానాన్ని బట్టి మూల్గుచున్నప్పటికీ, సాతాను పూర్తిగా తొలగించబడి క్రీస్తురాజు తన కృపాసింహసనంపై కూర్చుని నీతి రాజ్యాన్ని స్థాపిస్తాడన్న ధైర్యం, అతనికి ఆదరణను కల్గిస్తుంది. ప్రభువు యొక్క క్రమశిక్షణ చేసే హస్తం అతని మీద పడుతున్నప్పటికీ ప్రస్తుతమందు సమస్త శిక్షయు దు:ఖకరంగా కనబడి సంతోషకరంగా కనబడకపోయినా, ఇవన్నీ రానున్న శ్రేష్ఠమైన మరియు నిత్యమైన మహిమకై తనను సిద్ధపరచడానికి ఉద్దేశించబడ్డవన్న గ్రహింపు అతనికి ఎంతో ఓదార్పునందిస్తుంది. తన ప్రభువుతో సహవాసం కలిగివున్న విశ్వాసి అపోస్తలునితో కూడా కలిసి "దు:ఖపడువారమైయుండియు ఎల్లప్పుడు సంతోషించుచున్నాము” (2 కొరింథి 6:10) అని చెప్పగలడు. అనేకసార్లు “మారా" అను చేదు నువ్వు త్రాగవలసివస్తుంది. అయితే దేవుడు ఆ చేదు నీళ్ళను తీపిగా మార్చే మొక్కను దాని పక్కనే నాటాడు. ఔను “దు:ఖపడే” క్రైస్తవులు ఈనాడూ దేవుని సేవకుల పరిచర్య ద్వారా, ఆదరణ కరువైన తోటి క్రైస్తవుల మాటల ద్వారా, వీరెవరూ అందుబాటులో లేనప్పుడు దేవుని వాక్యంలో గల వాగ్దానాలు వారి జ్ఞప్తికి తేబడి  వారి హృదయానికి, పరిశుద్ధాత్మ శక్తి చేత అన్వయించబడటం ద్వారా దేవుని ఓదార్పు పొందగలుగుతున్నారు.

           

          “వారు ఓదార్చబడుదురు.” శ్రేష్టమైన ద్రాక్షరసం చివరికై మిగల్చబడింది. “సాయంకాలమున ఏడ్పువచ్చి, రాత్రియుండిననూ ఉదయమున సంతోషము కలుగును” (కీర్తనలు 30:5). ఆయన లేని ఈ దీర్ఘరాత్రి సమయాన దేవునిసేవకులు దు:ఖక్రాంతుడైన ఆయనతో సహానుభవం కలిగిఉండడానికై పిలవబడ్డారు. అయితే దేవుడు స్తుతించబడునుగాక, “ఆయనతో శ్రమపడిన వారమైతే ఆయనతో మహిమలో కూడ కలిసియుందుమ”ని రాయబడియుంది. మబ్బులు లేని ఆ దినం ఉదయించినప్పుడు అది ఎంత గొప్పదై ఉంటుంది? అప్పుడు "దు:ఖమును, నిట్టూర్పును ఎగిరిపోవును” అని యెషయా 35:10లో చెప్పబడిన మాట నేరవేర్చబడుతుంది. అప్పుడు ప్రకటన 21:3-4లో సెలవియ్యబడ్డ మాట కూడా నేరవేర్చబడుతుంది - "అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపుర ముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని."

          12 అధ్యాయము

          ఆకలిగొనుట

          “నీతి కొరకు ఆకలిదప్పులుగలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు.” (మత్తయి 5:6).

          మొదటి మూడు ధన్యతల్లో పరిశుద్ధాత్ముని ద్వారా పురికొల్పబడేవాని హృదయం అభ్యసించే విషయాలపై దృష్టిపెట్టడం జరిగింది. మొదట మనలో ఒక అవసరతాభావం, వట్టివారం, రిక్తులమనే గ్రహింపు‌ మనకు  కలుగుతుంది. రెండవదిగా నన్ను నేను తీర్పు తీర్చుకుని నా దోషాలను గుర్తించి, నా పాపాల విషయమై దు:ఖపడటం జరుగుతుంది. మూడవదిగా దేవుని ఎదుట నన్ను నేను సమర్థించుకోవడం మానేసి నేను అతిశయించిన నా స్వనీతినంతటినీ విసర్జించి సాత్వికుడనై ధూళిలోను, బూడిదలోను పడి పశ్చాత్తాపపడతాను. 

          ఇప్పుడు ఈ నాలుగవ ధన్యతలో నా వెలుపల మరొకదాని మీదకు నా దృష్టి ఆకర్షించబడతుంది. అది నాలో లేదని గుర్తించి, అయినా అది నాకు అత్యవసరమని తెలుసుకుని దాని కొరకై ఆకాంక్షిస్తాను.

          శీర్షిక వచనంలోని “నీతి” అనే మాట విషయంలో కారణం లేకుండా ఎన్నో వ్యర్థవాదనలు వెలువడ్డాయి. దీని యొక్క ప్రాముఖ్యతను గ్రహించడానికి ఈ మాట ప్రయోగించబడ్డ పాతనిబంధన వచనాలను పరిగణించి వాటిని ఈ అంశంపై సంపూర్ణ వెలుగును అందించే క్రొత్త నిబంధన వ్యాఖ్యభాగాల కాంతిలో అర్థం చేసుకోవాలి.

          "ఆకాశ మండలము నీతిని కురిపించునట్లు అంతరిక్షమా, మహావర్షము వర్షించుము. భూమి నీతిని మొలిపించును గాక. యెహెూవానగు నేను దాని కలుగ జేసియున్నాను.” (యెషయా 45:8). ఈ వాక్యంలోని మొదటి భాగంలో మాటలు భూమి మీదకు క్రీస్తు యొక్క రాకడను గూర్చి సాదృశ్యరీతిగా వివరిస్తున్నాయి. రెండవభాగం మన కోసమైన ఆయన మరణాంతర పునరుత్థానం గురించి తెలుపుతుంది. 

          "కఠినహృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా, నామాట ఆలకించుడి. నా నీతిని దగ్గరకు రప్పించియున్నాను. అది దూరమున లేదు. సీయోనులో రక్షణ ఉండనియమించుచున్నాను. ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను.” (యెషయా 46:12-14)

          “నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును. ద్వీపవాసులు నాతట్టు చూచి నిరీక్షణగల వారగుదురు వారు నా బాహువును ఆశ్రయింతురు.” (యెషయా 51:5)

          “యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - నారక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది నా నీతి వెల్లడగుటకు సిద్ధముగా నున్నది. న్యాయవిధిని అనుసరించుడి. నీతిని అనుసరించి నడుచుకొనుడి” (యెషయా 56:1)

          “శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించు కొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసియున్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. భూమి మొలకలను మొలిపించినట్లుగాను తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించునట్లుగా నిశ్చయముగా సమస్త జనముల యెదుట ప్రభువగు యెహెూవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును.” (యెషయా 61:10,11) 

          ఈ వచనం ద్వారా “నీతి" మరియు “రక్షణ" దేవుని దృష్టిలో ఒకదానికొకటి పర్యాయపదాలై ఉన్నాయని స్పష్టమౌతుంది. ఈ వాక్యాలు సువార్తను సంపూర్ణంగా తెలియచేసే రోమీయులకు రాసిన పత్రికలో మరింతగా వివరించబడ్డాయి. రోమా 1:16,17 వచనాలలో‌  ఈ విధంగా‌ మనం చదువుతాము - “సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియైయున్నది. యెందుకనిన- నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది”

          అదే విధంగా,రోమా 3:22-24లో ఇలా రాయబడింది. “అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది. కాబట్టి నమ్ము వారు ఆయన కృప చేతనే, యేసు క్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు”.

          "ఏ బేధమును లేదు, అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.” రోమా 5:19 లో ఈ దీవెనకరమైన ప్రకటన చేయబడింది. "ఏలయనగా ఒక మనుష్యునిఅవిధేయత వలన అనేకులు పాపులుగా యేలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు”. కాగా రోమా 10:4 ఈ విధంగా తెలియచేస్తుంది. “విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియైయున్నాడు.”

          ఒక పాపిలో నీతి ఏ మాత్రమూ లేదు.

          “నీతిమంతుడు లేడు ఒక్కడైనను లేడు” అని రాయబడి ఉంది. అందుకే దేవుడు క్రీస్తునందు పరిపూర్ణమైన నీతిని తన ప్రజల్లో ప్రతివాని కొరకు అనుగ్రహించాడు. ఈ నీతి అనగా దేవునియొక్క ధర్మశాస్త్ర సంబంధమైన నియమాన్ని నెరవేర్చడం అనేది మన పక్షాన మరియొకడు(యేసుక్రీస్తు) వల్ల సుసాధ్యం చేయబడింది. ఇప్పుడు ఈ నీతి విశ్వసించే ప్రతి పాపికి న్యాయయుక్తంగా ఆపాదించబడుతుంది. దేవుని ప్రజల పాపాలు ఏ విధంగానైతే క్రీస్తుపై మోపబడ్డాయో ఆలాగే క్రీస్తు నీతి వారికి ఆపాదించబడుతుంది. (2కొరింథి 5:21;) చూడండి ఇది ఈ దీవెనకరమైన, అతికీలకమైన అంశంపై లేఖనంలో గల సిద్ధాంతానికి సంక్షిప్త సారాంశం.

          "నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు”. ఆకలి, దప్పిక ఒక వ్యక్తి తనలో కొరతగా ఉన్నదాన్ని గుర్తించి దానికై తీవ్రంగా ఆశించడాన్ని సూచిస్తుంది. మొదటగా పరిశుద్ధాత్ముడు దేవుని పరిశుద్ధ ఆజ్ఞలను మన హృదయం ఎదుట ఉంచుతాడు. తాను తగ్గించలేని తన పరిశుద్ధత యొక్క స్థాయిని మనకు బయలుపరుస్తాడు. శాస్త్రుల మరియు పరిసయ్యుల నీతికంటే మన నీతి అధికం కాని యెడల దేవుని రాజ్యంలో‌ మనం ప్రవేశించలేమని ఆయన మనకు జ్ఞాపకం చేస్తాడు. రెండవదిగా దేవుని స్థాయికి తానెంత వెనుకబడి‌ ఉన్నాడో గుర్తెరిగిన ఆ వ్యక్తి వణుకుతూ తానెంత నిస్సహాయుడో, ఆత్మీయంగా ఎంత దీనస్థితిలో ఉన్నాడో గుర్తిస్తాడు. ఇది అతన్ని దేవునియెదుట దు:ఖపడటానికి, మూలగడానికి నడిపిస్తుంది. నీకు ఇటువటి అనుభవం ఉందా? మూడవదిగా పరిశుద్ధాత్ముడు ఈ విధంగా మేల్కొల్పబడిన హృదయంలో లోతుగా ఆకలిదప్పులు పుట్టించి, ఉపశమనం కొరకూ, తనలో లేనిదాన్ని తనకు అందించటం కొరకూ తనకు బయట వెదకడానికి పురికొల్పతాడు. అప్పుడు అతని నేత్రాలు క్రీస్తువైపు త్రిప్పబడతాయి. అప్పుడు "యెహోవా మన నీతి” (యిర్మియా 23:6;) అని అతడు గుర్తిస్తాడు.

          గతంలోనివాటిలానే, ఈ నాలగవ ధన్యత కూడా రక్షణకు పూర్వమే మొదలుపెట్టబడిందై రక్షించబడ్డ పాపిలో పరిపూర్ణమౌతుంది. ఆకలిదప్పికల ఈ అనుభవం తనలో పదేపదే కలగచేయబడుతుంది. ఒకప్పుడు క్రీస్తుచేత రక్షింపబడటానికి వాంఛ కలిగిన ఈ వ్యక్తి ఇప్పుడు ఆయనలానే అవ్వడానికి ఆకాంక్షిస్తాడు. ఈ ప్రక్రియను మరింత విశాలదృష్టితో చూడగలిగితే అది నూతనపరచబడ్డ హృదయం దేవుని కొరకు తృష్ణగొనటమే; (కీర్తన 42:1;) ఆయనతో సన్నిహిత సహవాసాన్ని ఆపేక్షించడం; ఆయన కుమారుని సారూప్యంలోకి మార్చబడడానికి ఆరాటపడడం. నూతన స్వభావం ఇలాంటి లక్షణాలను బలపరచడానికి, ఉత్తేజపరచడానికి, తృప్తిపరచడానికి ఆధారమైన దైవాశీర్వాదాన్ని అన్వేషిస్తుంది.

          శీర్షిక వచనం అందించే ఇలాంటి అద్భుతమైన తలంపు మానవ మేథస్సు నుండి ఉద్భవించేది కాదు. జీవపు రొట్టెయై(జీవాహారమై) ఉన్నటువంటివానితో ఐక్యత కలిగి ఉండి పరిపూర్ణుడై ఉన్నవానియందు నివసిస్తూ ఇంకా ఆకలిదప్పులు కలిగి ఉండడం మనకు ఎలా సాధ్యమౌతుంది? ఇక్కడ క్రియలో కాలాన్ని జాగ్రత్తగా గమనించండి " ఆకలిదప్పులు కలిగినవారు' కాదు కాని “ఆకలిదప్పులు కలవారు” అని చెప్పబడింది. ప్రియచదవరీ! నీ విషయమేంటి? నీవు ఆకలిదప్పులు కలిగి ఉన్నావా? లేదా నీకు కలిగిన వాటివల్ల తృప్తిపడుతున్నావా? అంతటితోనే సరిపెట్టుకుంటున్నావా? నీతికొరకు ఆకలిదప్పులు కలిగి‌ ఉండడం ప్రతి తరంలోనూ దేవుని బిడ్డలకు స్వభావికంగా ఉన్నది.(కీర్తన 82:4;) ఫిలిప్పీ 3:8-14;), మొదలైనవి చూడండి)

          “వారు తృప్తిపరచబడతారు”. శీర్షిక వచనంలో మొదటి భాగం యొక్క తాత్పర్యంలానే ఇది కూడా రెండంతలుగా నెరవేర్పుకలదిగా ఉంది. ఒకటి రక్షణ ప్రారంభంలో కలిగే నెరవేర్పు, మరియొకటి రక్షణ జీవితంలో కొనసాగే నెరవేర్పు. దేవుడు ఒకని ప్రాణంలో ఆకలిదప్పులు పుట్టించేది దాన్ని తృప్తిపరచడం కోసమే. దీనుడైన ఒక పాపిలో తనకు క్రీస్తు అవసరమనే భావన కలిగించబడిందంటే అది ఆయన్ను తాను హత్తుకోడానికి ఆకర్షించబడి నడిపించబడడం కోసమే. పశ్చాత్తాపపడి తండ్రి యొద్దకు తిరిగి వచ్చిన తప్పిపోయిన కుమారుడిలా విశ్వసించిన పాపి ఇప్పుడు క్రొవ్విన దూడతో సాదృశ్యపరచబడినవాని చేత  పోషించబడుతున్నాడు. నిశ్చయంగా యెహోవాయందే నాకు నీతి ఉందని అతడు గుర్తెరుగుతాడు.

          “వారు తృప్తి పరచబడతారు” (మూలభాషను అనుసరించి 'వారు నింపబడతారు'). మద్యంతో కాకుండా “ఆత్మచేత నింపబడతారు”, సమస్త జ్ఞానానికీ మించిన దేవుని సమాధానం చేత వారు నింపబడతారు. దుఃఖం కలవని దైవాశీర్వాదం చేత వారు నింపబడతారు. మన పక్షాన మన కార్యాలన్నీ సఫలం చేసిన ఆయన కొరకు కృతజ్ఞతాస్తుతితో నింపబడతారు. ఈ పేదలోకం ఇవ్వలేనిదీ మరియు తీసుకోలేనిదైనదానితో వారు నింపబడతారు. వారి గిన్నె నిండి పొర్లేంతలా దేవుని కృపాక్షేమాలతో వారు నింపబడతారు.

          అయినప్పటికీ ఇవన్నీ దేవున్ని‌ ప్రేమించేవారికి  కేవలం రుచి చూసేంత తక్కువ పరిమాణంగానే ఇవ్వబడ్డాయి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన్ను పోలి ఉంటాము కనుక రానున్న మహిమలో మనం ఆయన పరిశుద్ధత చేత నింపబడతాము. అప్పుడు మన పాపస్వభావం పూర్తిగా నిర్మూలం చేయబడుతుంది. కనుక ఇక ఆకలైనా, దప్పికైనా ఉండదు. (ప్రకటన 7:16;).

          13 అధ్యాయము

          హృదయ శుద్ధి

          “హృదయ శుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు" ( మత్తయి 5:8).

          ఇది మన ప్రభువు యొక్క శత్రువుల చేతిలో వక్రీకరణకు గురైన మరొక ధన్యత. వీరు తమ పితరులైన పరిసయ్యుల్లాగా సత్యం విషయంలో తామే ఉన్నతులైనట్లుగా చలామణి ఔతూ, నిజమైన దేవుని ప్రజలు కలిగి ఉండే పరిశుద్ధతకు మించిన పవిత్రత వారిలో ఉందన్నట్లుగా అతిశయిస్తుంటారు. తమలో ప్రాచీన స్వభావం పూర్తిగా పవిత్రపరచబడిందనీ, లేదా తమలో శరీర స్వభావం పూర్తిగా నిర్మూలం చేయబడేంతగా దేవుడు వారిని నూతనపరిచాడని, దాని ఫలితంగా వారిక ఎన్నడూ పాపం చేయకపోడం మాత్రమే కాకుండా కనీసం పాపపు కోరికలైనా, తలంపులైనా వారిలోకి ప్రవేశించవని చెప్పుకుంటూ మోసగించబడ్డ దురదుష్టవంతులు క్రైస్తవ చరిత్రలో ఎప్పుడూ లేకపోలేదు. అయితే దేవుని వాక్యం ఈ విధంగా‌ తెలియచేస్తుంది. “మనం పాపములేని వారమని చెప్పుకున్న యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు.”

          సందేహం లేదు, ఇలాంటివారు తమ మోసకరమైన, వ్యర్థమైన ఆలోచనలను సమర్థించుకోవడానికి లేఖనాలనే చూపుతూ, వచనభాగాలను పలుకుతూ పాప పరిహారార్థ విషయమై దేవుని వాక్యసంబంధమైన న్యాయంతో కూడిన వాక్యాలను తమకు అన్వయించుకుంటారు. “యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును” అనంటే, అపవిత్రపరచే పాపస్వభావం తొలగించబడతుందని కాదు కాని న్యాయయుక్తంగా పాపపు దోషం తీసివేయబడుతుందని దీనికి అర్థం.

          "యెవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను. ఇదిగో సమస్తము క్రొత్తవాయెను” (2 కొరింథి5:17) అనే వాక్యం ఈ లోకంలో మనముండే స్థితిని గురించి కాదు కాని క్రీస్తును అంగీకరించడం వల్ల దేవుని సమక్షంలో మనం ఏవిధంగా పరిగణించబడతామో తెలియచేస్తుంది.

          హృదయశుద్ధి అంటే పాపరహితమైన జీవితం కాదని ఆత్మావేశం చేత రాయబడ్డ దేవుని పరిశుద్ధుల జీవితచరిత్రలను పరిశీలించినప్పుడు ‌స్పష్టమౌతుంది. నోవహు ఒక సమయంలో త్రాగిన మత్తులో ఉన్నాడు; అబ్రాహాము ద్వంద్వ వైఖరి కలిగి ఉన్నాడు; మోషే అవిధేయుడయ్యాడు. యోబు తన జన్మదినాన్ని శపించాడు; ఏలియా యెజెబేలు ధాటికి నిలువలేక పారిపోయాడు. పేతురు క్రీస్తును ఎరుగనని బొంకాడు. నిజమే! అయినా ఇదంతా క్రైస్తవ్యం స్థాపించబడక ముందు జరిగాయి కదా అని కొందరు ప్రశ్నించవచ్చు. అవును కాని ఆ తరువాత కూడా ఆలాగే జరిగింది. అపోస్తలుడైన పౌలు కన్నా ఎక్కువగా క్రీస్తును అనుసరించినవాన్ని కనుగొనడానికి ఎక్కడికి వెళ్ళగలం? మరి ఆయన అనుభవం ఎలా‌ ఉంది?

          రోమా పత్రిక 7వ అధ్యాయం చదివి చూడండి. “అతడు మేలుచేయగోరగ కీడు కలుగుచున్నదని" (రోమా 7:21) “వేరే నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోబరచుకొనుచున్నది” (రోమా 7:23) “కాగా మనస్సు విషయములో నేను దైవనియమమునకును, శరీర విషయములో పాపనియమమునకును దాసుడనైయున్నాను” అంటున్నాడు.

          ఓ క్రైస్తవ చదువరీ! మన పాత స్వభావం యొక్క అపవిత్రతను, మరియు పాత, నూతన స్వభావాలు రెండూ మనలో పక్కపక్కనే నివసిస్తున్నాయని గుర్తించడమే మనలో శుద్ధహృదయం ఉందనడానికి ఖచ్చితమైన రుజువు. శీర్షిక వచనాన్ని మరింత క్షుణ్ణంగా  పరిశీలిద్దాం.

          “హృదయ శుద్ధిగలవారు ధన్యులు”. కొండమీది ప్రసంగంలోని ఏ అంశాన్నైనా వ్యాఖ్యానించడానికి ముందుగా ప్రభువైన యేసు యూదామతంలో పుట్టిపెరిగినవాళ్ళని సంభోదిస్తూ ఈ మాటలు పలికాడని గుర్తుంచుకోవాలి. ఆత్మచేత బోధించబడ్డ ఒకడు ఇలా అన్నాడు, 'ఈ మాట ప్రయోగించడంలో మన ప్రభువు యూదులు ఆచరించిన బాహ్యసంబంధమైన శుద్ధీకరణ లేక పవిత్రతను గురించి, దేవునితో సంపర్కం కలిగి ఉండటంతో ఈ పవిత్రతకు గల సంబంధాన్ని గురించి, పరోక్షంగా సంబోధిస్తున్నాడని నేను తలచకుండా ఉండలేను.

          దేవుని ప్రజలనబడే ఈ యూదులు విగ్రహారాధన చేత అపవిత్రపరచబడ్డ అన్యజనాల్లో నుండి వేరుచేయబడి, యెహోవాకు పవిత్రజనంగా ప్రతిష్టించబడ్డారు. దేవుణ్ణి, అనగా జీవముగల నిజమైన దేవుణ్ణి ఆరాధనానియమాల ద్వారా సమీపించే ఆధిక్యత వీరికి అనుగ్రహించబడింది. ఇలాంటి పవిత్రత లక్షణం మరియు దేవునితో సంపర్కం ఏర్పడే ఆధిక్యత కలిగి ఉండటం వీరిలో గర్వాన్ని‌ కలిగించింది.

          అయితే మెస్సీయ రాజ్యానికి వారసులైనవారు ఇంతకంటే శ్రేష్టమైన లక్షణం మరియు ఇంతకంటే ఘనమైన ఆధిక్యత పొందుతారు. వారు కేవలం బాహ్యమైన పవిత్రతే కాక “హృదయ శుద్ధి" గలవారిగా, మరియు కేవలం దేవుని ఘనత ఉంచబడ్డ అతి పరిశుద్ధస్థలంలోకి ప్రవేశించడమే కాక దేవుణ్ణి చూడాల్సినవారిగా, ఆయనతో సన్నిహిత సహవాసంలోకి ప్రవేశించేవారిగా ఉన్నారు. మెస్సీయ యొక్క ప్రజల నియమాలు ఈ విధంగా యూదుల యొక్క బాహ్య నియమాలకు, విధులకు భిన్నంగా ఆత్మీయమైనవై ఉన్నాయి. మనముందున్న ఈ వాక్యభాగం అతి ప్రాముఖ్యమైంది, మరియు ఆసక్తితో కూడిన సత్యంతో నిండినదై ఉంది' - డా||జాన్ బ్రౌన్.

          “హృదయ శుద్ధిగలవారు ధన్యులు”. యేసు చెప్పిన ఈ మాటలు అక్షరార్థంతో కూడిందా లేక సూచనప్రాయంగా చెప్పబడిందా? ఒక వ్యక్తి తిరిగి జన్మించినప్పుడు అనుగ్రహించబడే నూతన హృదయం గురించి ప్రస్తావిస్తుందా లేక ఆ తరువాత దేవుని ఆత్మచేత పవిత్రపరచబడడం చేత, దినదినమూ అతనిలో కలిగే రూపాంతర ప్రక్రియను ఉద్దేశించి చెప్పబడిందా అనే విషయాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బహుశా ఇవన్నీ ఇందులో కలసి ఉండవచ్చు. ధన్యతల సరళిలో మనమిప్పుడు చర్చించే ధన్యతకు కేటాయించబడ్డ తరువాతి స్థానమే హృదయశుద్ధి అనేది.
          అది రక్షణ అనంతరం కలిగే రూపాంతర ప్రక్రియనే (అనగా ఆత్మీయ విషయమై దీనులుగా చేయబడటం, పశ్చాత్తాప దు:ఖంలోకి నడిపించబడటం, సాత్వికులుగా చేయబడటం, మొదలగునవి కలిగిన తరువాత జరిగే ప్రక్రియను) సూచిస్తుందని గ్రహించాలి. అయినప్పటికీ ప్రకృతిసంబంధమైన వ్యక్తిలో హృదయశుద్ధి అనేది ఏ మాత్రం ఉండదు కనుక ఇక్కడ ప్రస్తావించబడ్డ హృదయశుద్ధికి మూలం తిరిగి జన్మించడమేనని మనం గుర్తించాలి.

          కీర్తనాకారుడు చెప్పురీతి “నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. ఆంతర్యమున నాకు జ్ఞానమును తెలియజేతువు” (కీర్తన 51 :6) క్రైస్తవ్యం నేడు ఎంతో ప్రయాసతో పుట్టించే బాహ్యమైన ఉజ్జీవం మరియు సంస్కరణల కంటే ఇది ఎంత లోతైంది! చాలా వరకు నేడు మన చుట్టూ కనిపించే క్రైస్తవ్యం, క్రియల ద్వారా రక్షణను అన్వేషించే ఒక చేతి మతం లేదా కేవలం ఒక సనాతనమైన విశ్వాస ప్రమాణంతో సర్దుకుపోయే ఒక మేథోసంబంధ మతంవలే ఉంది. అయితే దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. ఇక్కడ హృదయం అనే పదంలో మనస్సు, ఆపేక్షలు, చిత్తం, అంతరంగంలోని సమస్తమూ ఇమిడి ఉన్నాయి. ఆయన అంతరంగాన్ని చూచేవాడు కనుక తన ప్రజలకు నూతన హృదయాన్ని ప్రసాదిస్తాడు. ఇట్టి హృదయం అనుగ్రహించబడ్డవారు ధన్యులు, ఇది పవిత్రమైన హృదయం.

          పైన సూచించిన విధంగా, ఈ ఆరవ ధన్యతలో తిరిగి జన్మించినప్పుడు మనకివ్వబడ్డ నూతన హృదయం మరియు ఆ తదుపరి స్వభావంలో కలిగే రూపాంతరం, ఈ రెండు ఉద్దేశించబడ్డాయని నమ్ముతున్నాను. మొదట మనకు పునర్జన్మ సంబంధమైన స్నానం కలుగుతుంది (తీతు 3:5;) దీనికి అర్థం మన లక్ష్యం పవిత్రపరచబడతుంది కాబట్టి మనం ఈ ఇహలోక సంబంధమైనవి కాక పైనున్నవాటినే వెదకుతాము. “హృదయము విశ్వాసము వలన పవిత్రపరిచి” అని అపో.కా. 15:8,9;)లో ఉన్న మాట కూడా అదే అర్థాన్ని కలిగి ఉంది. “మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయముగల వారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గల వారమునైయుండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానములో చేరుదము” (హెబ్రీ 10:22).

          ఈ వచనాలన్నీ మనస్సాక్షిపై ఉన్న పాపభారం తొలగించబడటం మరియు విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానపడటాన్ని సూచిస్తున్నాయి.

          అయితే ఇక్కడ క్రీస్తు ప్రోత్సహించిన హృదయశుద్ధి ఇంతటితో ఆగక ముందుకు సాగుతుంది. శుద్ధి అనగా ఏమిటి? అపవిత్రత నుండి విడుదల, అవిభక్తమైన ప్రేమ, నమ్మకత్వం మరియు యథార్థత. క్రైస్తవ స్వభావచిహ్నంగా దాన్ని మనం దైవిక నిష్కాపట్యంగా వివరిస్తాము. కపటానికీ, ద్వంద్వవైఖరికకీ ఇది విరుద్ధం. యథార్థమైన క్రైస్తవత్వం - అసూయ, ద్వేషం, మోసం మరియు వేషధారణను తృణీకరిస్తుంది. కేవలం మాటల్లో, బాహ్య ప్రవర్తనలో పవిత్రత కనపరచడం సరిపోదు. నిజమైన దేవుని బిడ్డ తన ఆకాంక్షల్లోనూ, ఆలోచనల్లోనూ, ఉద్దేశాల్లోనూ పవిత్రత కలిగి ఉండాలి, ఉంటాడు కూడా. ఇదే అతని లక్షణం. ఇక్కడ ప్రతి విశ్వాసీ అన్వయించుకోవాల్సిన పరీక్ష ఉంది, నా శ్రద్ధాసక్తులు పైనున్నవాటిపై కేంద్రీకరించబడి ఉన్నాయా? నా ఉద్దేశాలు పవిత్రంగా ఉన్నాయా? దేవుని ప్రజలతో నేనెందుకు సహవాసం చేస్తున్నాను? మనుష్యులకు కనబడాలనా? లేక దేవుని సహవాసమనే సన్నిధిని ఆనందించాలనా?

          “వారు దేవుని చూచెదరు.” ఈ ధన్యతలతో జత చేయబడ్డ వాగ్దానాల నెరవేర్పు ప్రస్తుతంలోనూ, భవిష్యత్తులోను ఏ విధంగా జరుగుతుందని మరోసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. హృదయశుద్ధిగలవారు ఆత్మీయ వివేచన కలిగి ఉంటారు. తమ మనోనేత్రాలు తెరవబడ్డవై వారు దేవుని స్వభావంలోని పరిశుద్ధతను చూచి ఆయన గుణలక్షణాల ఔన్నత్యాన్ని గ్రహిస్తారు. నీ కన్ను తేటగా ఉన్న యెడల నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది. సత్యమందు విశ్వాసం హృదయాన్ని శుద్ధి పరుస్తుంది, కాబట్టి వారు దేవుణ్ణి చూస్తారు.సత్యం అనగా ఏమిటి? యేసుక్రీస్తు ముఖము(నోరు)నందు కనపరచబడ్డ దేవుని ప్రత్యక్షతే కదా! అందులో దేవుని పరిశుద్ధత మరియు పరిపూర్ణ కృప మిళితంగా ప్రత్యేక్షపరచబడ్డాయి. విశ్వాసి దైవస్వభావం యొక్క రూపాన్ని స్పష్టంగాను, సంతృప్తికరంగాను కనుగొనడమే కాక సన్నిహితమైన, ఆనందభరితమైన దైవప్రత్యక్షతను మరియు సహవాసాన్ని అనుభవిస్తాడు. అతడిప్పుడు దేవునికి అతి సమీపస్తుడు ఔతాడు; దేవుని ఆలోచ‌న, దేవుని చిత్తం తనదౌతుంది. నిజంగా అతని సహవాసం తండ్రితోనూ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఉంటుంది.

          హృదయశుద్ధిగలవారు ప్రస్తుతకాలమందు ఈ విధంగా దేవుణ్ణి చూస్తారు. రాబోవు కాలంలో దేవుని గూర్చిన వారి జ్ఞానం మరింత అభివృద్ధి చేయబడి ఆయనతో వారికి గల సహవాసం మరింత సన్నిహితంగా మారుతుంది. గతించిన కాలంతో పోల్చుకుంటే ప్రస్తుత కాలమందు మనం ప్రభువు మహిమను మరింత స్పష్టంగా చూస్తున్నాము. అయినప్పటికీ రానున్న కాలంలో కలగబోయే ప్రత్యక్షతతో పోల్చుకుంటే ఇప్పుడు కేవలం అద్ధంలో చూచినట్టే సూచనగా చూస్తున్నాము, ఇప్పుడు పాక్షికంగా చూస్తున్నాము; పాక్షికంగానే గ్రహిస్తున్నాము; పాక్షికంగానే అనుభవిస్తున్నాము; అయితే ఈ పాక్షికమైంది గతించిపోతుంది; సంపూర్ణమైంది తప్పకుండా వస్తుంది. అప్పుడు ముఖాముఖిగా ఆయన్ను చూస్తాం కనుక మనం ఎరగబడ్డ ప్రకారం ఎరుగుతాము. (1 కోరింథి 13:9-12;) లేదా కీర్తనాకారుని మాటలలో చెప్పాలంటే మనం నీతి కలవారమై ఆయన ముఖదర్శనం చేస్తాము. మనం మేల్కొనప్పుడు దేవుణ్ణి చూస్తామనే మాటకు సంపూర్ణ అర్థాన్ని గ్రహించలేము. (డా|| జాన్ బ్రౌన్).

          14 అధ్యాయము

          ధన్యతలు మరియు క్రీస్తు

          ధన్యతలను‌ గురించిన మన ధ్యానం మనలను ప్రభువైన యేసుక్రీస్తు వ్యక్తిత్వం వైపుకు మరల్చకపోతే మన ఈ ధ్యానం అసంపూర్ణమైనదే. ధన్యతలు, ఒక క్రైస్తవుని స్వభావాన్ని అభివర్ణిస్తున్నాయని వివరించడానికి నేను ఇదివరకే కొంత ప్రయాసపడ్డాను. అయితే వాస్తవానికి క్రైస్తవ స్వభావం ఏ మాత్రమూ హెచ్చుతగ్గులు లేకుండా క్రీస్తు స్వభావంతో సారూప్యంగలదై ఉండాలి కాబట్టి ఈ ధన్యతలుగల వ్యక్తి యొక్క పరిపూర్ణమైన మాదిరి ఆయనలోనే కనుగొనగలము. ఈ దైవిక లక్షణాలు క్రీస్తునందే అత్యంత తేజోవంతంగా ప్రత్యక్షమై, అత్యంత శ్రేష్టంగా నిదర్శించబడి, ఆయన్ను వెంబడించేవారిలో అది కేవలం మసకమసకగా ప్రతిబింబించబడుతుంది. కేవలం ఒకటి రెండు కాదు, ఈ ధన్యతల్లో పేర్కోబడిన అన్ని దైవిక పరిపూర్ణతలు ఆయనలో సంపూర్ణంగా ఉన్నాయి. నా మట్టుకు నాకైతే ఆయన కేవలం "శ్రేష్టమైనవాడు” కాదు "సర్వశ్రేష్టమైనవాడు”. క్రీస్తును మహిమపరచడానికి పంపబడ్డ పరిశుద్ధాత్ముడు, క్రీస్తుకు చెందిన సంగతులను మన ఆత్మలకు బయలుపరుస్తాడు గాక!

          మొదటగా :- "ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు”, “ఆయన ధనవంతుడైయుండియు మీరు తన దారిద్య్రము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తమే దరిద్రుడాయెను” అని లేఖనాలు ఆయన గురించి చెబుతున్న ఈ మాట ఎంత దీవెనకరమైంది! తాను ప్రవేశించిన పేదరికం నిజంగా చాలా గొప్పది. పేదలైన తల్లిదండ్రులు కల కుటుంబంలో పుట్టి, తన జీవితాన్ని ఈ భూమిపై ఒక పశువులతొట్టి నుండి ఆరంభించాడు. ఆయన తన పసిప్రాయాన మరియు తొలి యవ్వనదశలో వడ్రంగిబల్లపై శ్రమించాడు. తన పరిచర్య ప్రారంభమైన తరువాత, “నక్కలకు బొరియలున్నాయి, ఆకాశపక్షులకు గూళ్ళుగలవుకాని మనుష్యకుమారుడు తలవాల్చుటకైనను స్థలము లేదు” అని సెలవిచ్చాడు. కీర్తనల్లో మెస్సీయాను గురించి ప్రవచనాత్మకంగా రాయబడ్డ వాక్యభాగాల్లో తన ఆత్మీయ దీనత్వాన్ని దేవునితో పదేపదే ఒప్పుకున్నట్లు చూడగలం.

          “నేను బాధపడినవాడనై వ్యాకులపడుచున్నాను దేవా నీ రక్షణ ఉద్దరించును గాక" (కీర్త 69:29).

          “ యెహోవా నేను దీనుడను, దరిద్రుడను, చెవి యొగ్గి నా కుత్తరమిమ్ము” (కీర్తన 86:1) “

          నేను దీన దరిద్రుడను, నా హృదయము నాలో గుచ్చబడియున్నది. (కీర్తన 109:22).

          రెండవదిగా:- “దు:ఖపడువారు ధన్యులు”. క్రీస్తు నిజంగా దు:ఖపడ్డవారిలో ప్రధానుడు. పాతనిబంధన ప్రవచనం ఆయన్ను “వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిననుభవించినవాడిగాను” చిత్రీకరిస్తుంది. ఆయన వారి హృదయకాఠిన్యాన్ని బట్టి దు:ఖపడడం చూడండి.  (మార్కు 3:5;)

          ఒక చెవిటివాణ్ణి స్వస్థపరచే ముందు ఆయన నిట్టూర్పు విడవడాన్ని చూడండి.(మార్కు 7:34;) లాజరు సమాధి దగ్గర ఆయన ఏడ్చింది గమనించండి; ఆలాగే ఆయన యెరూషలేము గురించి విలపించడం వినండి. “యెరూషలేమా, యెరూషలేమా ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచు వుండుదానా, కోడె తన పిల్లలను రెక్కల క్రిందికేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి"(మత్తయి 23:37). గెత్సెమనే తోటలో ఆయన మహారోదనతోను, కన్నీళ్ళతోను ప్రార్థనలను, యాచనలను సమర్పించడాన్ని భక్తితో చూడండి ([imple_tooltip content='శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి,భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను.']హెబ్రి 5:7[/simple_tooltip]) సిలువలో వ్రేలాడుతూ "నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచావ"ని రోదించిన ఆయనకు సాష్టాంగపడండి (మార్కు 15:34).

          ఆయన చేసే ఫిర్యాదును వినండి. "త్రోవ నడచువారలారా, ఈలాగు జరుగుట చూడగా మీకు చింతలేదా? యెహోవా తన ప్రచండ కోపదినమున నాకు కలుగజేసిన శ్రమవంటి శ్రమ మరి యెవనికైనను కలిగినదో లేదో, మీరు నిదానించి చూడుడి” (విలాపవాక్యములు 1:12)

          మూడవదిగా:- “స్వాతికులు ధన్యులు”. అత్యంత మహిమగల శరీరధారియైన దేవుడు కనపరచిన సాత్వికాన్ని గురించి  సువార్తల్లో ఎన్నో ఉదాహరణలు కనబడతాయి. ఆయన తనకై ఏర్పరచుకున్న రాయబారుల విషయంలో ఇది గుర్తిస్తాము. ఆయన జ్ఞానులను, విద్యావంతులను, గొప్పవారిని, అధికులను కాకుండా పేదవారై చేపలుపట్టేవారిని ఎన్నుకున్నాడు. ఆయన స్నేహం చేయడానికి ఎంచుకున్నవారిలో దీన్ని గమనించండి. ఐశ్వర్యవంతులకు ప్రఖ్యాతిగాంచినవారికీ  కాకుండా, సుంకరులకూ, పాపులకూ ఆయన స్నేహితుడనబడ్డాడు. ఆయన చేసిన అద్భుతకార్యాల్లో దీన్ని గుర్తించండి. ఆయన స్వస్థపరిచినవారితో వారికి సంభవించింది ఎవరికీ చెప్పవద్దని మరీమరీ ఆజ్ఞాపించడాన్ని చూడగలం. ఆయన చేసిన సేవలో, నిరాడంబరమైన సేవలో దీన్ని గమనించండి. ఆయన వేషదారుల్లాగా ఢంకా మ్రోగించకుండా, బయలుపడేట్లు కాకుండా, ప్రచారాన్ని తప్పించుకుంటూ, ఖ్యాతిని త్యజించి, సేవ చేస్తూ సర్వసాధారణంగా జీవించాడు. ప్రజలు ఆయన కీర్తిని ప్రచురించినప్పుడు ఆయన వారి నుండి తప్పించుకున్నాడు. (మార్కు 1:45;) మార్కు 7:17;).

          “రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు యెరిగి మరల కొండకు ఒంటరిగా వెళ్లెను"(యోహాను 6:15). తన (యేసు) సహోదరులు ఆయన బహిరంగంగా అంగీకరించబడాలని పస్కా పండుగ సమయంలో యూదయకు వెళ్ళాలని సూచించగా, ఆయన నా సమయం ఇంకా సంపూర్ణము కాలేదని చెప్పి తానున్న స్థలంలోనే నిలిచిపోయాడు. ఆ తరువాత పండుగకు రహస్యంగా వెళ్ళాడు. (యోహాను 7).

          లేఖనాలు నెరవేర్చునట్లు ఇశ్రాయేలు ప్రజలకు తన్ను తానే రాజుగా కనబరచుకున్నప్పుడు  దీనుడై గాడిదపిల్లను వాహనంగా చేసుకుని యెరూషలేములోకి ప్రవేశించాడు. (జెకర్యా 9:9).

          నాలుగవదిగా:- "నీతి కొరకై ఆకలిదప్పులుగలవారు ధన్యులు”, మనుష్యకుమారుడైన యేసుక్రీస్తుయొక్క అంతరంగిక జీవితం గురించి ఇట్టి సారాంశం ఎంత ఆశ్చర్యకరం! అతని నడుముకు నీతి, అతని తుంట్లకు సత్యం నడికట్టుగా ఉంటుందని(యెషయా 11:5) ఆయన శరీరధారిగా రాకముందే పరిశుద్ధాత్ముడు ఆయన గురించి సాక్ష్యమిచ్చాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఈ విధంగా అన్నాడు ( యెషయా 1:5;)

          “దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు వచ్చియున్నాను. (హెబ్రీ 10:7) పండ్రెండేళ్ల బాలునిగా యేసు, " నేను నా తండ్రి పని మీద నుండవలెనని మీరెరుగరా?" అని పలికెను. (లూకా 2:4)

          తన పరిచర్య ప్రారంభంలో ఆయన ఈ విధంగా సెలవిచ్చాడు "ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే కాని కొట్టివేయుటకు నేను రాలేదు” ( మత్తయి 5:17). తన శిష్యులకు ఆయన “నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైయున్నది” అని (యోహాను 4:34) సెలవిచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఆయన్ను గురించి “నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు, నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆయన తైలముతో అభిషేకించియున్నాడు"(కీర్తనలు 45:7) అని సాక్ష్యమిస్తున్నాడు. కాబట్టి ప్రభువే నా నీతి అని మనం ఆయన్ను గురించి చెప్పడం యుక్తమే. 

          ఐదవదిగా:- “కనికరముగలవారు ధన్యులు”. క్రీస్తు కనికరస్వరూపి. నశించిపోతున్న దీనులైన పాపులను పరలోకమహిమకై రూపాంతరపరిచేది ఆయన కనికరమే. తన ప్రజలకొరకు శాపంగా చేయబడడానికి ఆయన్ను సిలువ యొద్దకు నడిపించింది తన అద్భుతమైన, అద్వితీయమైన కనికరమే.

          కావున “మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తనకనికరము చొప్పున............... " (తీతుకు 3:5) కనికరం, నమ్మకత్వం గల దేవుని ప్రధానయాజకునిగా (హెబ్రి 2:17;) ఆయన ఇప్పటికీ కూడా తన ప్రజలకు కనికరం చూపుతున్నాడు. ఎందుకంటే “ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించును" (2తిమోతి 1:18). 

          ఆరవదిగా "హృదయశుద్ధిగలవారు ధన్యులు”. ఈ లక్షణం కూడా క్రీస్తులోనే పరిపూర్ణత సంతరించుకుంది. మచ్చయైనా, కళంకమైనా లేని దేవుని గొర్రెపిల్ల ఆయనే. పాపమాలిన్యం ఏ మాత్రమూ ఆయనకు అంటలేదు కనుక శరీరధారిగా ఉన్నప్పుడు సహితం ఆయన నిష్కల్మషుడుగానే ఉన్నాడు. ఆయన మానవత్వం పరిశుద్ధమైనదై ఉన్నది ( లూకా 1:36). “పవిత్రుడును, నిర్దోషియు, నిష్కళంకుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు”ను అయిఉన్నాడు.

          “ఆయనలో యే పాపము లేదు” (యోహాను 3:5) కావున, “ఆయన పాపము చేయలేదు” (1పేతురు2:22) “పాపమెరుగలేదు” (2 కొరింథీ 5:21) “ఆయన పవిత్రుడై యున్నాడు"(1యోహాను 3:3).

          ఆయన పరిపూర్ణ పరిశుద్ధస్వభావం కలిగి ఉన్నందున ఆయన క్రియలన్నీ పరిశుద్ధమైనవి. “నేను నా మహిమను వెదకుట లేదు” (యోహాను 8:50) అనే మాటలో ఆయన జీవిత సారాంశమంతా ఇమిడి ఉంది.

          ఏడవదిగా:- “సమాధానపరచువారు ధన్యులు". మన ప్రభువు విషయంలో ఈ ధన్యత నిజంగా ఎంతో ఉన్నతంగా సరిపోతుంది. తన సిలువ రక్తం చేత సంధి చేసి సమాధానపరచింది ఆయనే (కొలస్సీ 1:19-20;). “ఆయన కరణాధారముగా వుండుటకు నియమించబడెను” (రోమా 3:25;) అనగా దేవుని ఉగ్రతను చల్లార్చి, ఉల్లంఘించబడ్డ ఆయన ధర్మశాస్త్రాన్ని తృప్తిపరిచి, ఆయన నీతిని మహిమపరిచేవాడిగా నియమించబడ్డాడు. ఆయన అంతవరకూ వేరుగా ఉన్నటువంటి యూదులనూ, అన్యులనూ ఐక్యపరిచాడు (ఎఫెస్సీ 2:11;)ను చూడండి) రానున్న దినాన ఆయన పాపం చేత శపింపబడిన, రణభరితమైనదైన ఈ భూమిపై  సమాధానం నెలకొల్పుతాడు. ఆయన తన తండ్రియైన దావీదు సింహసనంపై కూర్చున్నప్పుడు “ఇది మొదలుకొని మితిలేకుండా దానికి వృద్ధియు, క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును, రాజ్యమును నియమించును” (యెషయా 9:7) అనే వాగ్దానం నెరవేరుతుంది. కనుక సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడడం యుక్తమే.

          ఎనిమిదవదిగా:- "నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు”. ఆ నీతిమంతుడు హింసించబడినంతగా ఎవరూ ఎప్పుడూ హింసించబడలేదు. ప్రకటన 12:4లో ఉన్నమాట ఎంత అద్భుతకరమైంది. అలాగే ఆయన ప్రవచనాత్మకంగా “బాల్యము నుండి బాధపడి చావుకు సిద్ధమైతిని” అని పలికాడు. ఆయన బహిరంగ పరిచర్య యొక్క తొలిదశలో వారు “ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్లగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండ పేటు వరకు ఆయనను తీసికొనిపోయిరి” (లూకా 4:29). “దేవాలయ సరిహద్దులో ఆయనను రాళ్ళతో కొట్టుటకు సిద్ధమైరి” (లూకా 8:59)

          తన పరిచర్యలో అడుగడుగునా ఆయనకు విరోధులు ఎదురయ్యారు. స్వనీతిపరులైన యూదులు ఆయనకు దయ్యం పట్టిందని నిందించారు (యోహాను 8:48). "గుమ్మములో కూర్చుండు వారు ఆయనను గూర్చి మాటలాడుకొనిరి. త్రాగుబోతులు ఆయనను గూర్చి పాటలు పాడుకొనిరి.” (కీర్తన 69:12) “ఆయన విచారణ సమయంలో వారు ఆయన వెంట్రుకలను పెరికి వేసారు" (యెషయా 50:6) “వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి”. ఆయన (యేసు) కొరడాలతో కొట్టబడి ముళ్ళమకుటం ధరింపచేయబడి తన సిలువను తన చేతనే మోయించి కల్వరి కొండకు తీసుకుని వచ్చి, అక్కడ ఆయన్ను సిలువ వేశారు. మరణక్షణాల్లో కూడా ఆయన్ను నెమ్మదిగా ఉండనివ్వలేదు. అల్లరితో, అపహాసంతో పలువిధాలుగా ఆయన్ను శ్రమపెట్టారు. వీటన్నిటితో పోల్చుకున్నప్పుడు మనం ఆయన కొరకు ఎదుర్కునే హింస ఎంత స్పల్పం!

          అదేవిధంగా ఈ ధన్యతలతో జత చేయబడ్డ వాగ్దానాలు కూడా క్రీస్తునందు సంపూర్ణంగా నెరవేరాయి. ఆయన దీనుడై ఉన్నాడు; అయితే పరలోకరాజ్యం ప్రప్రథంగా ఆయనకు చెందిందే. ఆయన దు:ఖపడ్డాడు; అయితే అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తిపొందాడు. ఆయన సాత్వికుడు, వినయమూర్తి; ఆయన మహిమసింహాసనాన్ని అధిష్టించాడు. ఆయన నీతికొరకు ఆకలిదప్పులు కలిగి ఉన్నాడు, అయితే తన ప్రజలకు ఆపాదించడానికి ఆయన కలగచేసిన నీతిని బట్టి ఇప్పుడు తృప్తిపొందుతున్నాడు. ఆయన హృదయశుద్ధి కలవాడు; కావున ఎవరూ ఎప్పుడూ చూడని విధంగా ఆయన దేవుణ్ణి చూస్తున్నాడు. ఆయన సమాధానపరిచేవాడు. కనుక ఆయన రక్తం చేత కొనబడ్డవారందరూ ఆయన్ను దేవుని కుమారుడని ఒప్పుకుంటున్నారు. శ్రమపొందినవాడిగా ఆయనకు కలిగిన ప్రతిఫలం అద్వితీయమైంది. అన్ని నామాలకూ పైగా ఆయన నామం హెచ్చించబడింది. అతి సుందరుడైన ఆయనతో మన జీవితం నిండి ఉండేట్లు పరిశుద్ధాత్ముడు కృప చూపిస్తాడు గాక!

          15 అధ్యాయము

          శ్రమ మరియు మహిమ

          “......క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు యెక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది.” (2 కొరింథీ 4:17)

          శ్రమపడేటప్పుడు నిస్పృహపడకుండా ఉండేందుకు, ఆపదల్లో కృంగిపోకుండా ఉండేందుకు ఈ వచనం గొప్ప కారణాన్ని ఇస్తుంది. సమయపరిమితులు ఉండే ఈ అల్పకాలశ్రమలను నిత్యత్వపు వెలుగులో చూడటానికి ఈ మాటలు మనలను ప్రోత్సహిస్తున్నాయి. ప్రస్తుతకాలపు శ్రమలు అంతరంగపురుషునిపై మేలుకరమైన పరిణామాన్నే కలగచేస్తాయని ఈ మాటలు సెలవిస్తున్నాయి. ఈ సత్యాన్ని దృఢంగా విశ్వసిస్తే చేదైన ప్రస్తుతపు అనుభవాలను సులువుగా అధిగమించొచ్చు. క్షణమాత్రమైన ఈ చులకని శ్రమ మన కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమభారాన్ని కలుగచేస్తుంది. మన శ్రమలు తేలికైనవి, కొద్దిపాటి కాలానికే పరిమితమైనవి. అయితే రానున్న మహిమ ఘనమైంది, నిత్యమైంది. ఈ తారతమ్యం యొక్క ప్రశస్తతను స్పష్టంగా గ్రహించడానికి ఈ వచనంలోని ప్రతి భాగమూ, విడివిడిగా విశ్లేషించడం అవసరం. అయితే ఈ భాగాలను అవి పేర్కొనబడిన సందర్భంలో పరిగణలోకి తీసుకుందాం.

          1.అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారాన్ని కలుగచేస్తుంది:- "మహిమ" అని అర్థమిచ్చే “కాబోద్” అనే హెబ్రీ పదానికి “భారం” అనే అర్థం కూడా వస్తుందని ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం. బంగారానికి కానీ, విలువైన రాళ్ళకు కాని బరువు పెరిగితే వాటి విలువ పెరుగుతుంది. పరలోక సంతోషాన్ని లౌకికపదజాలంతో వర్ణించడం అసాధ్యం. అలంకారయుక్తంగా చేయబడ్డ వర్ణనలు అందించే అవగాహన కేవలం అసంపూర్ణమైనవిగానే ఉంటాయి. శీర్షిక వచనభాగంలో ఒకదానిపై ఒకటిగా ప్రశస్త వర్ణనలు అమర్చబడి ఉన్నాయి. విశ్వాసికై నిత్యత్వంలో మహిమ వేచి ఉంది. మహిమాయుతమైన వర్ణన మానవ పదజాలాలకు సాధ్యపడే వర్ణనల అత్యున్నతమైన దశ. అయితే విశ్వాసి కోసం వేచి ఉన్న మహిమ బరువైంది, ఐహికమైంది, మరేదీ దానితో సరితూగదు, దీనికి సాటియైనది ఏదీలేదు. దీని అపారమైన విలువ వర్ణనాతీతమైంది. పైగా అద్భుతకరమైన ఈ మహిమ క్షణభంగురమైందో లేక అశాశ్వతమైందో కాక దైవికమైనది మరియు నిత్యమైనదై ఉంది; అది దైవికం కాని యెడల నిత్యమై ఉండడం సాధ్యపడేది కాదు. ఔను, మన గొప్ప దేవుడు తనకు తగినది, తనను పోలినదైన అనగా ఆయనవలె అపరిమితం, నిత్యమునైనదాన్ని మనకు అనుగ్రహించబోతున్నాడు.

          2.క్షణమాత్రముండే చులకనైన మన శ్రమ:

          (ఎ) "శ్రమ” మానవ ఉనికిలో ఒక సాధారణ భాగమై ఉంది.

          “నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు” (యోబు 5:7) పాపపరిణామాల్లో ఇది ఒక భాగం. పతనమైన మానవుడు తన పాపస్థితిలో ఉండగా సుఖాన్ని అనుభవించడం వీలు కాదు. ఇందుకు దేవుని బిడ్డలు కూడా మినహాయింపు కాదు."అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను” (అపో 14:22). మహిమ మరియు అమరత్వంలోకి కొనిపోడానికి దేవుడు మనల్ని ఇరుకైన, కరుకైన మార్గం ద్వారా నడిపిస్తాడు.

          (బి) మన శ్రమలు చులకనైనవి:- స్వాభావికంగా శ్రమలనేవి తేలికగా ఉండకపోవచ్చు. తరచూ అవి భారంగాను, వ్యసనకరంగాను ఉంటాయి. అయినప్పటికీ తారతమ్యరీత్యా అవి తేలికైనవే. మనం దేనికి పాత్రులమై ఉన్నామో దానితో పోల్చి చూస్తే అవి తేలికైనవే. మన ప్రభువైన యేసు అనుభవించిన శ్రమలతో పోల్చి చూస్తే అవి తేలికైనవే. అయితే మన శ్రమల యొక్క నిజమైన తేలికత్వం మనం పొందనై ఉన్న పరలోకమహిమ యొక్క భారంతో పోల్చినప్పుడు మరింత ఎక్కువగా స్పష్టమౌతుంది. ఇదే అపోస్తలుడు మరోచోట ఇలా అంటున్నాడు "మన యెడల ప్రత్యక్షము కాబోవు మహిమ యెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని యెంచుచున్నాను” ( రోమా 8:18)

          (సి) అవి క్షణమాత్రముండేవి:- ఒకవేళ మన శ్రమలు మన జీవితాంతం మనతో ఉన్నప్పటికీ అలాంటి జీవితం మెతూషెల జీవితమంత ఎక్కువగా ఉన్నా మనముందున్న నిత్యత్వంతో పోల్చుకుంటే ఇది కూడా క్షణమాత్రమే. మన శ్రమలు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరివంటి ఈ జీవితకాలానికే పరిమితం. మన శ్రమలను సరైన దృక్పథంతో చూడటానికి దేవుడు మనకు వివేకాన్ని ఇస్తాడు గాక.

          3. ఈ రెండింటికీ గల సంబంధాన్ని గమనిద్దాం:- క్షణమాత్రముండే మన చులకని శ్రమ మన కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారాన్ని కలుగచేస్తుంది. ప్రస్తుతం భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. దీనిగురించి మనం తత్త్వజ్ఞానం చేత తర్కించడం సరైంది కాదు; దేవుడు చెప్పిన  ప్రకారంగా ఆయన వాక్యమందు విశ్వసించడం మనకు యుక్తం. ఇతరుల అనుభవం, అనుభూతి, గమనిక ఇందుకు భిన్నంగా కనిపించవచ్చు.

          అనేకసార్లు శ్రమలు మనల్ని తిరుగుబాటుకు, అసంతృప్తికీ గురిచేయడానికే సంభవించాయని అనిపిస్తుంది. మనం తెలుసుకుని జ్ఞాపకముంచుకోవాల్సిన విషయమేంటంటే, ఈ శ్రమలు మన శరీరస్వభావాన్ని పవిత్రపరచడానికి పంపబడినవి కావు. అవి మనలో ఉండే “నూతన పురుషుని” మేలు నిమిత్తం ఉద్దేశించబడ్డాయి. అంతమాత్రమే కాకుండా రాబోవు మహిమకై మనల్ని సిద్ధపరచడానికి ఈ శ్రమలు దోహదపడతాయి. శ్రమలు మనల్ని లోకంపై మనకు ఉండే ఆసక్తి నుండి దూరం చేస్తాయి. ఇవి పాపం మరియు దు:ఖాలతో కూడిన ఈ లోకం నుండి మనల్ని విడిపించబడే గడియ కొరకు మనల్ని ఎదురు చూసేట్లు చేస్తాయి. ఇవి దేవుడు తనను ప్రేమించువారికై సిద్ధపరిచినవాటిని మరింత అర్థం చేసుకుని అభినందించడానికి మనకు దోహదపడతాయి.

          కాగా విశ్వాసి చేయాల్సిన కార్యం ఇదే:- త్రాసులో ఒకవైపు శ్రమలు మరోవైపు రానున్న మహిమను ఉంచి సరితూచి చూడండి. అసలు వాటిని పోల్చడం సాధ్యమౌతుందా? ఏ మాత్రము కాదు. మహిమలో ఒక్క క్షణం జీవితకాల శ్రమలకు అధికంగా తూగుతుంది. శ్రమతో కూడిన ఈ జీవితసంవత్సరాలు, అనారోగ్యం, దారిద్య్రంలో సతమతమవ్వడం, హింసించబడడం, ఆఖరికి హతస్సాక్షులవ్వడం ఇవన్నీ దేవుని కుడిచేతిలో నిత్యసుఖంతో పోల్చుకుంటే ఏపాటివి! పరదైసులో ఒక్క ఊపిరి ఈ లోకపు ప్రతికూలమైన తుఫానులన్నిటినీ చల్లారుస్తుంది. తండ్రి ఇంట ఒక్క దినం, మనం గడిపిన భయంకర అరణ్యాన్ని పోలిన ఈ జీవితకాలానికి అధికంగా తూగుతుంది. భవిష్యత్తు కొరకు రానున్న మహిమలో మనకే సిద్ధపరిచి ఉంచినదాన్ని ప్రస్తుతమందు కూడా విశ్వాసంతో అనుభవించి ఆనందించడానికి కావాల్సిన విశ్వాసాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు గాక.

          16 అధ్యాయము

          సంతృప్తి

          “నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొనియున్నాను” (ఫిలిప్పీ 4:11).

          అసంతృప్తి! ఇటువంటి నెమ్మదిలేనితనం ప్రపంచంలో ఇదివరకెప్పుడైనా ఉండిందా? ఉండకపోవచ్చని అనుమానించక తప్పదు. మనం అతిశయపడుతున్న ప్రపంచంలో ఉన్న అభివృద్ధి, సంపద అధికం కావడం, సంతోషం కొరకు సమయం, ధనం వ్యయం చేసే విధం, ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రతిచోటా అసంతృప్తి. ఏ తరగతివారు కూడ ఇలాంటి అసంతృప్తికి మినహాయింపు కాదు. అన్నీ అస్థిరముగానే ఉన్నాయి. అందరూ అసంతృప్తులుగానే ఉన్నారు. దేవుని ప్రజలు సహితం ఏదోవిధంగా అసంతృప్తికి లోనై ఉన్నారు.

          సంతృప్తి! ఇటువంటి అనుభవం పొందడం అనుకూలమైందా? లేదా ఇదొక చక్కని ఊహ మాత్రమేనా లేక దాదాపు ఒక కలలో కథ లాంటిదా? ఇది భూమిపై పొందడం సాధ్యపడుతుందా? లేక పరలోక నివాసులకు మాత్రమే పరిమితమా? ఒకవేళ ఇక్కడ భూమిపై పొందడం సాధ్యమైతే అది స్థిరంగా ఉంటుందా? లేక కొన్ని గంటలు మాత్రమే ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ అపోస్తలుడైన పౌలు మాటల్లో సమాధానం ఉంది.

          “ నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండనేర్చుకొని యున్నాను” (ఫిలిప్పీ 4:11). మరొక పత్రికలో పేర్కొన్నట్లు తాను "ఖైదీగా” ఉన్నాడు. (ఎఫెస్సీ 4:1;)) ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా తాను సంతృప్తిని వెలిబుచ్చాడు.

          అయితే సూత్రానికి ఆచరణకు, ఆదర్శానికి అనుభవించి తెలుసుకోడానికి మధ్య ఎంతో భేదం ఉంది.

          కాని పౌలు విషయంలో సంతృప్తి అనేది ఒక ఎడతెగని యథార్థ అనుభవమై ఉంది. “నేను ఏ స్థితిలో ఉన్నను..” అనే ఆయన మాటను ప్రత్యేకంగా గమనిద్దాం. అయితే ఇలాంటి అనుభవంలోకి పౌలు ఏవిధంగా ప్రవేశించాడు? ఇలాంటి అనుభవం దేన్ని కలిగి ఉంటుంది? మొదటి ప్రశ్నకు జవాబు “సంతృప్తి కల్గి ఉండడం  నేర్చుకున్నాను” అనేమాటలో దొరుకుతుంది. అతడు 'నేను ఆత్మ బాప్తీస్మపు అనుభవం పొందాను కాబట్టి సంతృప్తి ఇక నాదే' అని అనడం లేదు. ఈ దీవెనను తాను సంపూర్ణంగా దేవునికై ప్రతిష్టించబడటానికి ఆరోపించడం లేదు. అది తన స్వాభావిక లక్షణం కారణంగా ప్రాప్తమైంది కాదన్నది కూడా అంతే స్పష్టం. అయితే అది క్రైస్తవానుభవం అనే పాఠశాలలోనే తాను నేర్చుకున్నాడు. తాను ఈ లోకంలో గడుపుతున్న చివరి సమయంలో ఈ మాటలు రాసాడన్నది ఇక్కడ గమనించదగ్గ మరొక విషయం.

          పౌలు అనుభవించిన “సంతృప్తి” సానుకూల సుఖమయ పరిసరాల్లో ఉండడాన్ని బట్టి ప్రాప్తించింది కాదని పైన సూచించిన వాస్తవం నుండి స్పష్టమౌతుంది. అందుకు భిన్నమైన కొన్ని సామాన్య అభిప్రాయాలను కూడా ఇవి దూరపరుస్తాయి. ఒకని హృదయ వాంఛలన్నీ తీరనిదే సంతృప్తి కనుగొనడం అసాధ్యమన్నది సర్వసాధారణమైన భావన. సంతృప్తి కనుగొన్న వ్యక్తిని ఖైదులో ఎవరూ వెదకరు. కాబట్టి ఒకటి మాత్రం స్పష్టం - ఇక్కడ ప్రస్తావించబడ్డ సంతృప్తి, వెలుపల నుండి కాక అంతరంగం నుండి పుట్టేది. దాన్ని దేవుని వద్దే తప్ప సృష్టిలో ఉన్న మరియే సుఖంలోను కనుగోలేము.

          ఇంకా కొంత లోతుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సంతృప్తి అంటే ఏంటి? అది దేవుడు సార్వభౌమ్యంగా వ్యవహరించే తన ఏర్పాట్లలో తృప్తిని కలిగుండడమే. అది సణగటానికీ, నన్నెందుకిలా చేసావని రూపించబడ్డది రూపించువాణ్ణి ప్రశ్నించ తెగించే తిరుగుబాటుకూ వ్యతిరేకమైంది.

          'దేవునికి విరుద్ధంగా ఫిర్యాదు చేయడం కంటే సంతృప్తి గల వ్యక్తి తన పరిస్థితి మరింత దిగజారి లేనందుకు యథార్థంగా వందనస్తుడై ఉంటాడు. తన అవసరతలకు మించినవేవో వాంఛించక దేవుడు తనను ఇంకా లక్ష్యపెడుతున్నాడని ఎరిగి ఆనందిస్తాడు. అలాంటివాడే తనకు కలిగినవాటితో తృప్తి పొంది ఉండగలడు.” ( హెబ్రి 13:5;).

          లోభత్వం (దురాశ) "సంతృప్తి” అనే మాటకు ఘోరమైన అడ్డుగోడగా ఉంది. అంతేకాదు అది ప్రస్తుతమున్న కొద్దిపాటి తృప్తిని సైతం కొరుకుపుండులా(Cancer) క్రమేపీ తినేస్తుంది. 

          “మీరు ఏ విధమైన లోభానికీ చోటివ్వకుండా జాగ్రతపడండి” ( లూకా 12:15) అనే పరిశుద్ధ హెచ్చరికను ప్రభువు తన శిష్యులకు ఇచ్చింది కారణం లేకుండా కాదు. కొన్ని విషయాలు మరి అధికంగా మోసకరంగా  ఉన్నాయి. పొదుపు మరియు భావిభద్రత నెపంతో అనగా 'వర్షకాలం కొరకు కూర్చుకోండి' అనే నెపంతో కొందరు లోభులై జీవిస్తున్నారు. అయితే “ధనాపేక్షను “విగ్రహారాధన” అని లేఖనం సెలవిస్తుంది. (కొలస్సీ 3:5;) దేవునిపై ప్రీతికన్నా ఐహికేచ్ఛలపై శ్రద్ధ పెట్టేవారికిది హెచ్చరిక. లోభత్వంతో కూడిన హృదయధోరణి "ఇమ్ము ఇమ్ము అనే జలగ కుమార్తె లాంటిది.” లోభియైనవాడు తనకు కొద్దిగా ఉన్నా, అధికంగా ఉన్నా ఇంకా కావాలని కోరుకుంటాడు. కాని, “సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైయున్నది.” (1తిమోతి 6:6-8;). లూకా సువార్తలోని ఈ మాటలు అత్యవసరమైనవి.".............. మీ జీతములతో తృప్తి పొంది యుండుడి” (లూకా 3:14).

          "సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైయున్నది.”(1తిమోతి 6:6). ఈ మాటలు మనల్ని కలవరం, వ్యసనం, అత్యాశ మరియు స్వార్థం నుండి విడిపిస్తాయి. అంతేకాక దేవుడిచ్చే వాటిని ఆనందించడానికి స్వేచ్ఛ కలిగిస్తాయి. అయితే తరువాత మాటల్లో ఉన్న భిన్నత్వాన్ని గమనించండి.

          “ ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములును, హాని కరమునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా భాదలతో తమ్మును తామే పొడుచుకొనిరి" (1తిమోతి 6:9-10) ఈ లోక ఆత్మ నుండి విడిపించబడి "కలిగిన వాటితో తృప్తిపడియుండడానికి" దేవుడు మనల్ని కాపాడునుగాక.

          సంతృప్తి అనేది దేవునిపై నిలిచి ఉండే హృదయం నుండి ఉత్పన్నమౌతుంది. “సమస్త జ్ఞానానికీ మించిన దేవుని సమాధానాన్ని" అనుభవించగలగడమే ఈ సంతృప్తి. నా చిత్తాన్ని దేవుని చిత్తానికి లోబరుచుకోడమే ఈ సంతృప్తి. దేవుడు అన్నీ సమర్థవంతంగా చేస్తాడని చివరికి అన్నీకూడా నా ఆత్మీయ మేలుకొరకే దోహదడేట్లు “సమకూడి జరిగిస్తున్నాడని” గ్రహించడమే ఈ సంతృప్తి.

          "ఈ అనుభవం ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోడం వల్ల పొందగలము.” (రోమా 12:2)

          మన జీవితంలోకి అనుమతించబడే ప్రతీదీ, పొరపడలేని సర్వజ్ఞుని హస్తం నుండి తన బిడ్డలు అనవసరంగా ఒక కన్నీటి బొట్టును కూడా విడవడం ఇష్టపడని తండ్రి హస్తం నుండి వచ్చిందనే వైఖరితో అంగీకరించినప్పుడే, నిజమైన సంతృప్తి కలిగి ఉండగలం. చివరిమాటగా, నిజమైన సంతృప్తి కేవలం ప్రభువైన యేసు క్రీస్తు సన్నిధిలో మాత్రమే లభిస్తుందనే సత్యాన్ని శీర్షిక వచనానికి తరువాత వచనాలు దృఢపరుస్తున్నాయి.

          “దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును;” “ప్రతి విషయములోను, అన్ని కార్యములలోను, కడుపు నిండియుండుటకును ఆకలిగొని యుండుటకును, సమృద్ధి కలిగి యుండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొనియున్నాను నన్ను బలపరచువాని (క్రీస్తుయేసు) యందే నేను సమస్తమును చేయగలను.” (ఫిలిప్పీ4:12,13) ఎప్పుడూ అసంతృప్తిపడనివానితో సన్నిహితబాంధవ్యం ఏర్పరచుకోడం అలవాటు చేసుకున్నప్పుడే సణుగుకోవడమనే పాపం నుండి విడుదల పొందగలం, దేవుని చిత్తం నెరవేర్చటానికి ఎల్లప్పుడూ ఆసక్తి కనపరిచే ఆయనతో సహవాసం కల్గి ఉన్నప్పుడే, ఈ సంతృప్తి రహస్యం మనకు గోచరం ఔతుంది. ఇది చదివేవారు, రాసినవారు  దేవుని వాక్యకోణం నుండి చూసి సరిచేసుకుంటూ, ముసుగులేని ముఖంతో ప్రభువు యొక్క మహిమను అద్ధంవలే ప్రతిబింబింపచేస్తూ, మహిమ నుండి అధిక మహిమను పొందుతూ, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడేట్లు దేవుడు ఆశీర్వదిస్తాడు గాక.

          17 వ అధ్యాయము

          ప్రశస్తమైన మరణము

          “యెహెూవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది” (కీర్తనలు 116:16).

          లేఖనంలోని ఈ మాట మన జీవితంలో అత్యంత వేదనకరమైన ఆ సమయంలో ఎంతో ఆదరణనిచ్చే ఆశీర్వాదకరమైంది. మన హృదయాలు అత్యధికంగా భయపడే ఆ ఘడియ గురించి లేఖనాల్లో ఉన్న ఆదరణ కల్గించే ఆశీర్వాదకరమైన మాటల్లో శీర్షిక వచనం కూడా ఒకటి. దేవుని ప్రజలు తరచుగా ప్రార్థనాపూర్వకంగా ఈ అంశాన్ని గురించి దేవుని వాక్యం సెలవిచ్చేదంతా అధ్యయనం చేసి, విశ్వసించి గ్రహించినట్లైతే మరణభీతి నుండి పూర్తిగా కాకపోయినా దాదాపుగా విడుదల పొందుతారు. కానీ, అయ్యో! అనేకులు ఆ విధంగా కాకుండా వారి ఆలోచనలు, ఊహల వైపు మరల్చుకుని లౌకిక భయాలకు తమ జీవితాల్లో తావిస్తూ విశ్వాసాన్ని బట్టి కాకుండా వెలిచూపును బట్టే నడచుకునేవారై ఉన్నారు. నడిపింపు కొరకు పరిశుద్ధాత్మ వైపు చూస్తూ దేవుని వాక్యపు వెలుగులో ఒక క్రైస్తవుని మరణ విషయంలో సహితం అవిశ్వాసం ఆవరింపచేసే విషాదాన్ని పారద్రోలే ప్రయత్నాన్ని చేద్దాం.

          “యెహెూవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది.” ఒక విశ్వాసి మరణించినప్పుడు దేవుడు ప్రత్యేకంగా తన దృష్టిని అతనిపై ఉంచుతాడని ఈ మాటలు సూచిస్తున్నాయి. "ఆయన దృష్టి”కి అనే మాటను గమనించండి. దేవుని దృష్టి ఎల్లప్పుడూ మనపై ఉన్నదనే మాట నిజమే. “ఆయన కునుకడు, నిదురపోడు.” “చూచుచున్న దేవుడవు నీవే” అని మనం ఆయన్ను గూర్చి చెప్పడం కూడా నిజమే. అయితే ఆయా పరిస్థితుల్లో మనల్ని ప్రత్యేక రీతిగా ఆయన దృష్టిస్తున్నట్లుగా, శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా లేఖనాలు తెలియచేస్తున్నాయి. “దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై యున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు” (కీర్త 46:1).

          “నీవు జలములలోబడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును. నదులలోబడి వెళ్ళునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు.” (యెషయా 43:2). "యెహెూవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది”. విశ్వాసులు మరణం గూర్చి ఎంతో అరుదుగా ఆలోచించే ఒకానొక కోణాన్ని ఈ మాటలు మనముందు ఉంచుతున్నాయి. ఇది ఈ అంశంలోని దైవికకోణంగా పరిగణించవచ్చు. ఇతర విషయాలు లానే మరణం గూర్చి కూడా తరచుగా మనం మన కోణంలోనే ఆలోచిస్తాము.

          అయితే శీర్షిక వచనం ఈ అంశాన్ని పరలోక కోణం నుండి ప్రస్తావిస్తూ దేవుని భక్తుల మరణం భయంకరమైందని కాని, ఘోరమైందని కాని, విషాదకరమైందని కాని, దారుణమైందని కాని కాకుండా విలువవైంది, ప్రశస్తమైందని పేర్కొంటుంది. ఈ భావం ఒక ప్రశ్నకు తావిస్తుంది. ఎందుచేత యెహెూవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువకలది? మానవుని జీవితంలో ఈ చివరిసంకటంలో ఆయన్ను ప్రీతిపరిచేది ఏముంది? వివరంగా కాకుండా క్లుప్తంగా దీనికి ఒకటి, రెండు సమాధానాలు తెలియచేసే ప్రయత్నం చేస్తాను.

          1 .యెహెూవా భక్తులు ఆయనకు విలువైనవారు కాబట్టి:

          వారు ఎప్పుడూ,ఎప్పటికీ ఆయనకు ప్రియులు. వారిపై జగత్తు పునాది వేయబడకముందే, ఆకాశాలు రూపించకబడక ముందే ఆయన ప్రేమ  ఉంది. అత్యున్నత స్థలంలోని తన నివాసాన్ని వదిలి వచ్చి తన ప్రశస్త రక్తాన్ని చిందించి, రక్షణను ఏర్పరచేట్లు సంతోషంగా తన ప్రాణాన్ని సహితం బలియాగంగా అర్పించుకుంది వారి కొరకే. ఆ ప్రధాన యాజకుని హృదయంపై రాయబడి, తన అరచేతులపై చెక్కబడింది వారి పేర్లే. వారు తన తండ్రిచేత ఆయనకు బహుకరించబడ్డ ప్రేమ కానుకై, ఆయన పిల్లలై, ఆయన శరీరం యొక్క అవయవాలై ఉన్నారు.కాబట్టి వారిదైన ప్రతీదీ ఆయన దృష్టికి ప్రశస్తమైందే. ఆయన వారిని ఎంత ఆపారంగా ప్రేమిస్తున్నాడంటే వారి తలవెండ్రుకలన్నీ ఆయన లెక్కించాడు. వారికి పరిచర్య చేయడానికి, సంరక్షించడానికి తన దూతలను పంపుతున్నాడు. వారు ఆయనకు ప్రశస్తం కనుక వారి మరణం కూడా ఆయన దృష్టికి విలువైంది.

          2.మరణం పరిశుద్ధుల దు:ఖబాధలను అంతమొందిస్తుంది కాబట్టి :

          మనం శ్రమపడడం అవసరమై ఉంది. “అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను"(అపో 14:22) అయినా "హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను, బాధనైనను కలుగజేయడు” (విలాపవాక్యములు 3:33) దేవుడు మన బాధలు, శ్రమల విషయమై పట్టింపులేనివాడు కాదు. నిర్లక్ష్యం కలవాడు అంతకంటే కాదు. పూర్వం తన ప్రజల విషయమై “వారి యావద్భాదలో ఆయన బాధనొందాడు" (యెషయా 63:9) అని రాయబడింది. “తండ్రి తన కుమారుల యెడల జాలిపడునట్లుయెహోవా తన యందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును"(కీర్త 103: 13).  "అదే విధంగా మన ప్రధానయాజకుడు మన బలహీనతల్లో మనతో సహానుభవం కలవాడని చెప్పబడ్డాడు” (హెబ్రి 4:15) కాగా తన భక్తుల మరణం ఆయన దృష్టికి ఎందుకు విలువైందో ఇక్కడ మరొక కారణాన్ని గుర్తించొచ్చు. వారి బాధలను, శ్రమలను అది అంతమొందిస్తుంది. కాబట్టి వారి మరణం ఆయన దృష్టికి ప్రశస్తమైంది.

          3.దేవుడు తానే మనకు చాలినవాడని కనబరచడానికి మరణం ఒక అవకాశంగా ఉంది కనుక:-

          ప్రేమ తనకు ప్రశస్తమైనవారి అవసరతల్లో వారికి పరిచర్య చేయడం కంటే మరెందులోను సంతృప్తిపొందదు. మరణఘడియలోకన్నా క్రైస్తవునికి అత్యవసరమైన నిస్సహాయత మరి ఇంకెందులోనూ వుండదు. అయితే మానవుని అత్యవసరత దేవుని అవకాశమే. అలాంటి క్లిష్ట పరిస్థితిలో తండ్రియైన దేవుడు వణుకుతున్న తన బిడ్డతో "........నీకు తోడైయున్నాను; భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను. దిగులుపడకు ........" (యెషయా 4:9,10) అని చెబుతాడు. ఇందుచేతనే ఒక విశ్వాసి నిశ్చయతగలవాడై ఇలా బదులు చెప్పగలడు - “గాఢాంధకారపు లోయలో (మూలభాషననుసరించి మరణాంధకారపు లోయలో) నేను సంచరించినను యే అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమును నన్ను ఆదరించును" (కీర్తన 23:4) మన ప్రతి బలహీనత ఆయన బలానికై మొఱ్ఱపెడుతుంది. మన అత్యవసరత ఆయన చాలిన సామర్థ్యానికి మొఱ్ఱపెడుతుంది. ఈ సూత్రం సుపరిచితమైన ఈ మాటల్లో దీవెనకరంగా ఇలా వ్యక్తపరచబడింది - "గొర్రెల కాపరివలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.” (యెషయా 40:11) ఔను మన బలహీనతల్లో ఆయన శక్తి పరిపూర్ణమౌతుంది. తన ప్రేమ, కృప మరియు శక్తి చేత తన భక్తులకు పరిచర్య చేయడానికి ఇదొక సదవకాశం కనుక వారి మరణం ఆయన దృష్టికి విలువైంది.

           

          4.మరణం ద్వారా భక్తుడు నేరుగా దేవుని చెంతకు చేరుతాడు కాబట్టి:

          దేవుడు తన ప్రజలు తనతో ఉండడాన్ని బట్టి ఆనందిస్తాడు, ఆశీర్వాదకరంగా ఈ విషయం తాను శరీరధారియై భూమిపై చేసిన పరిచర్య ద్వారా నిర్ధారణ చేయబడింది. తాను వెళ్ళిన ప్రతి చోటకు తాను ప్రేమించిన తన శిష్యులను కూడ తీసుకువెళ్ళాడు. కానాలోని వివాహానికైతే, యెరూషలేములో పరిశుద్ధ పండుగకైతే; యాయీరు గృహంలో చనిపోయిన కుమార్తెను లేపుటకైతే, రూపాంతరపు కొండకైతే? ప్రతిచోటా వారు ఎల్లప్పుడూ ఆయన్ను అనుసరించారు. “తనతో కూడ ఉండునట్లు ను....... ఆయన పండ్రెండు మందిని నియమించెను” (మార్కు 3:14) అనీ మాట ఎంత దీవెనకరమైంది. ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. అందుకే మనకు కూడా ఇలా నిశ్చయతను ఇస్తున్నాడు, “నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలవచ్చి నాయొద్దనుండుటకు మిమ్మును తీసికొనిపోవుదును.” (యోహాను 14:3)

          కాగా “యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది”. ఎందుకనగా మనం దేహం నుండి విడిపోయినప్పుడు ప్రభువు సన్నిధిలో ఉంటాము. (2 కొరింథి 5:8).

          మన మధ్యనుండి ఒక భక్తుడు వెళ్లిపోయినప్పుడు మనం దు:ఖిస్తుండగా, క్రీస్తు ఆనందిస్తున్నాడు. “తండ్రి నేనెక్కడ ఉందుంఓ అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెననియు నీవు నా కనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను.” (యోహాను 17:24) అని ఆయన చేసిన ప్రార్థనకు పరలోక ప్రవేశం చేసే తన ప్రతి బిడ్డలోనూ జవాబు దొరుకుతుంది. ఈ మరణ శరీరం నుండి విడిపించబడ్డ తన ప్రతి బిడ్డలోనూ తాను అనుభవించిన వేదనకు ప్రతిఫలాన్ని చూచి ఆయన తృప్తిపడతాడు. కాగా యెహెూవా భక్తుల మరణం ఆయన దృష్టికి “విలువైనది”, ఆనందించడానికి అది ఆయనకు కారణమిస్తుంది. “విలువైంది” అని ఇక్కడ అనువాదం చేయబడ్డ హీబ్రూపదం యొక్క సంపూర్ణతను కనుగొనడం ఎంతో ఆసక్తికరం, శ్రేయస్కరమై ఉంది. ఈ పదం “అమూల్యమైంది” అని కూడా అనువదించబడింది.

          “దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది” (కీర్తన 36:7) తన భక్తుని మరణం యెహోవా దృష్టికి “అమూల్యమైంది”. ఇదే హీబ్రూపదం "ఘనమైంద”ని కూడా అనువదించబడింది. “రాజు ఘనపరచనపేక్షించువానికి ఏమి చేయవలెనని రాజు అతని (హమాను) నడిగెను” (ఎస్తేరు6:6) భూమికి బదులుగా పరలోకం ఇవ్వబడడం అతి శ్రేష్టమైన ఘనత కాదా? ఔను ఈ ఘనత తన ప్రతి భక్తునికీ కలుగుతుంది. దేవునికి కృతజ్ఞతలు కలుగును గాక. ఇదే హీబ్రూ పదం "కాంతివంతం” అని కూడా అనువదించబడింది. "సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని. చంద్రుడు మిక్కిలి కాంతి” గలిగి నడచుచుండగా అతనినేగాని చూచి..........(యోబు 31:26)

          'ఒక భక్తుని మరణం తాను విడిచి వెళ్ళేవారికి విషాదకరంగా, చీకటిమయంగాను ఉండవచ్చు కాని యెహోవా దృష్టికి మాత్రం అది కాంతివంతమైందే.' దేవుని దృష్టిలో అది ప్రకాశవంతమై ఉంది.  

          “అస్తమయకాలమున వెలుగు కలుగును” యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి “విలువకలది”, “అమూల్యమైంది”, “ఘనమైంది”, “కాంతివంతమైంది". ఈ చిన్ని ధ్యానం మన ప్రభువు తన పరిశుద్ధులకు విలువైందిగా చేస్తాడు గాక.

          Add comment

          Security code
          Refresh

           

          హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

          హితబోధ యాప్ కొరకు Join WhatsApp

          సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

          ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.