విషయసూచిక
- యెహోవా దూత దేవుడైన యెహోవా;
- యెహోవా దూత యెహోవా దేవుడనే లేఖనాధారమైన బోధపై, వ్యతిరేక వాదనలు;
- యెహోవా దూత,యేసుక్రీస్తు;
పాతనిబంధనలో యెహోవా దూతగా ప్రస్తావించబడే ఒక దూత హాగరు శారా దగ్గరనుండి పారిపోయిన సందర్భం నుండి మనకు పరిచయం చెయ్యబడతాడు (ఆదికాండము 16:6-13). బైబిల్ గ్రంథంలో దేవదూతలను గురించిన ప్రస్తావన మనకు చాలా చోట్ల కనిపిస్తుంటుంది. కానీ ఈ యెహోవా అలాంటి సాధారణ దేవదూత కాడు. ఎందుకంటే దేవదూతలు ఎక్కడా కూడా తమని తాము దేవునిగా కానీ లేక యెహోవాగా కానీ ప్రకటించుకోరు. లేఖనంలో కూడా వారు దేవుడని కానీ యెహోవా అని కానీ రాయబడదు. అది దేవదూషణ ఔతుంది. అదేవిధంగా వారు దేవునికి చెందవలసిన మహిమను ఎంత మాత్రమూ స్వీకరించరు (దీనిగురించి చివరిలో మాట్లాడతాను). అయితే యెహోవా దూత మాత్రం ప్రతీ సందర్భంలోనూ దేవునివలే మాట్లాడడం, భక్తులు ఆయనను దేవునిగా భావించడం, లేఖనం కూడా ఆయనను దేవునిగా యెహోవాగా పేర్కోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన దేవుడు మరియు తండ్రితో పాటుగా యెహోవా అనే నామాన్ని కలిగినయున్న యేసుక్రీస్తు ప్రభువు. ఈ విషయం మీకు అర్థమయ్యేవిధంగా మొదటిగా నేను యెహోవా దూత దేవుడని స్పష్టంగా రాయబడిన వాక్యభాగాలను చూపించి, రెండవదిగా దీనిపై కొందరు చేసే వ్యతిరేక వాదనలకూ అపోహలకూ సమాధానం ఇచ్చి, చివరిగా ఆయన యేసుక్రీస్తు ప్రభువే అని స్పష్టం చేస్తాను.
1. యెహోవా దూత దేవుడైన యెహోవా:
ఆదికాండము 16:7-10 యెహోవా దూత అరణ్యములో నీటిబుగ్గయొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద, ఆమెను కనుగొని శారయి దాసివైన హాగరూ, ఎక్కడనుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది - నా యజమానురాలైన శారయియొద్దనుండి పారిపోవుచున్నాననెను. అప్పుడు యెహోవా దూత - నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత - నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను; అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను.
ఈ సందర్భంలో శారాయి దాసియైన హాగరుకు అరణ్యంలో ప్రత్యక్షమైన యెహోవా దూత నేను నీ సంతానాన్ని విస్తరింపచేస్తానని ఆమెకు వాగ్దానం చేస్తున్నాడు. గమనించండి. ఇలాంటి వాగ్దానం కేవలం దేవుడు మాత్రమే చెయ్యగలడు. ఎందుకంటే విస్తరింపచేసేది ఆయన మాత్రమే (ద్వితియోపదేశకాండము 1:10) దీని ఆధారంగా ఆయన ఇక్కడ తనను తాను దేవునిగా కనపరచుకుంటున్నాడు. అలా ఆయన కనపరచుకోవడమే కాదు హాగరు కూడా ఆయనను ఎలా గుర్తించిందో చూడండి;
ఆదికాండము16:13 అది - చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను.
ఈ సందర్భంలో హాగరు తనకు యెహోవా దూతగా ప్రత్యక్షమైన వ్యక్తి దేవుడని ఆమె గుర్తించింది. ఇక్కడ ఆమె మాత్రమే ఆయనను దేవునిగా సంబోధించడం లేదు కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ సంఘటనను రాస్తున్న మోషే కూడా ఆ మాట్లాడిన దూత యెహోవా అని స్పష్టం చేస్తున్నాడు. ఇక ఈ దూతను గురించిన మరికొన్ని సందర్భాలను పరిశీలిద్దాం.
ఆదికాండము 21:17,18 దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశమునుండి హాగరును పిలిచి - హాగరూ నీకేమివచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని యున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. వానిని గొప్ప జనముగా చేసెదనని ఆమెతో అనెను.
ఈ సందర్భంలో యెహోవా దూత హాగరుకు మరలా ప్రత్యక్షమై ఇష్మాయేలు గురించి గతంలో తాను చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు అబ్రాహాముకు ఆయన ప్రత్యక్షమైన సందర్భాన్ని చూడండి;
ఆదికాండము 22:10-14 అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలిచెను; అందుకతడు - చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవానిమీద చెయ్యి వేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయ లేదుగనుక నీవు దేవునికి భయపడువాడవని యిందవలననాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రాహాము కన్ను లెత్తి చూడగా పొదలో కొమ్ములుతగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును.
ఈ సందర్భంలో అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించే తరుణంలో యెహోవా దూత అతనిని అడ్డుకుంటూ నువ్వు నీ కుమారుడిని నాకు ఇవ్వడానికి వెనుతీయలేదని పలుకుతున్నాడు. దీనిప్రకారం అబ్రాహాము ఏ దేవుని మాట ప్రకారమైతే ఇస్సాకును ఆయనకు బలిగా అర్పించబోయాడో (ఆదికాండము 22:1,2) ఆ దేవునిని నేనేయని ఈ యెహోవా దూత ప్రకటించుకుంటున్నాడు. అబ్రాహాము ఆ ప్రదేశానికి యెహోవా ఈరే అని పేరుపెట్టడం ద్వారా (ఆదికాండము 22:14), అతనికి ప్రత్యక్షమైన యెహోవా దూత యెహోవా గా పిలవబడుతున్నట్టు మరోసారి స్పష్టం ఔతుంది. అదేవిధంగా ఆయన హాగరుకు ఇష్మాయేలు విషయంలో వాగ్దానం చేసినట్టుగానే ఇస్సాకు విషయంలో కూడా "యెహోవా దూత రెండవ మారు పరలోకమునుండి అబ్రాహామును పిలిచి యిట్లనెను నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు" (ఆదికాండము 22:15-18) అని వాగ్దానం చెయ్యడం మనం చూస్తాం. ఇస్సాకు సంతానాన్ని విస్తరింపచేసింది దేవుడైన యెహోవాయే కదా! (ద్వితియోపదేశకాండము 1:10).
పాతనిబంధన లేఖనాలను మనం పరిశీలించినప్పుడు తండ్రియైన యెహోవాతో పాటు మరొకవ్యక్తి కూడా అదే యెహోవా అనే నామాన్ని కలిగియున్నట్టు మనకు అర్థమౌతుంది. ఉదాహరణకు ఈ వాక్యభాగం చూడండి.
ఆదికాండము 19:24 అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొఱ్ఱా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించి-
ఈ సందర్భంలో ఒక యెహోవా మరొక యెహోవా యొద్దనుండి అగ్నినీ గంధకాన్నీ కురిపించి సొదొమ, గొమొఱ్ఱా పట్టణాలను నాశనం చేసినట్టు స్పష్టంగా రాయబడింది. ఇదే సంఘటన గురించి రాయబడిన మరో సందర్భాన్ని కూడా చూడండి.
ఆమోసు 4:11 దేవుడు సొదొమ గొమొఱ్ణాలను బోర్లదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలోనుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించుకొంటిరి; అయినను మీరు నా తట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.
ఈ సందర్భంలో యెహోవా దేవుడు మాట్లాడుతూ (అందుచేతనే చివరిలో తన మాటలు యెహోవా వాక్కు అని పలుకుతున్నాడు) "దేవుడు సొదొమ గొమొఱ్ణాలను బోర్లదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనముచేయగా మీరు మంటలోనుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించుకొంటిరి అయినను మీరు నా తట్టు తిరిగినవారు కారు" అని అంటున్నాడు. ఒకవేళ ఈ మాటలు పలుకుతుంది ప్రవక్త ఐతే మీరు నాతట్టు తిరిగినవారు కాదని, నేను మీలో కొందరిని నాశనం చేసానని ఎలా అనగలడు?
ఆదికాండము 18వ అధ్యాయం నుండి 19 వ అధ్యాయం వరకూ జరిగిన ఆ చరిత్రను మనం పరిశీలించినప్పుడు ఆ సందర్భంలో అబ్రాహాముకు మొదటిగా ముగ్గురు వ్యక్తులు ప్రత్యక్షం ఔతారు. ఆ ముగ్గురిలో ఒకరిని మాత్రమే అబ్రాహాము ప్రభువుగా సంబోధించి వారికి ఆతిథ్యం చేస్తాడు. వారిలో ఒకరు యెహోవా మిగిలిన ఇద్దరూ దేవదూతలు (ఆదికాండము 18:1-4). వారు భోజనం చేసిన తర్వాత అబ్రాహాము ఇంటినుండి ఆ ఇద్దరు దేవదూతలూ సొదొమ గొమొఱ్ణాల పట్టణంలోని లోతు ఇంటికి వెళ్తే (ఆదికాండము 18:16,22, 19:1), యెహోవా మాత్రం అబ్రాహాము గుడారానికి సమీపంలోనే ఉండి అతనితో సంభాషిస్తాడు. ఆ సంబాషణ ముగిసిన తర్వాత ఆయన అక్కడినుండి వెళ్ళిపోతాడు (ఆదికాండము 18:16-33). మరునాడు ఆయన సొదొమ గొమొఱ్ణా పట్టణాలను సమీపించి దేవదూతలు ఆ పట్టణం నుండి బయటకు తీసుకుని వచ్చిన లోతుతో మాట్లాడి పైనున్న మరో యెహోవా యొద్దనుండి అగ్నినీ గంధకాన్నీ కురిపించి ఆ పట్టణాలను నాశనం చేస్తాడు (ఆదికాండము 19:17-25).
(గతంలో ఒకరు నన్ను అబ్రాహాము ఇంటికి వచ్చిన యెహోవానే సొదొమ గొమొఱ్ణా పట్టణాలకు వెళ్ళి వాటిని నాశనం చేసాడని ఎలా చెప్పగలవు? ఆయన అబ్రాహాముతో మాట్లాడాక వెళ్ళిపోయాడుగా ఈ సంఘటన మరునాడు కదా జరిగింది అని ప్రశ్నించారు. కానీ యెహోవా అబ్రాహాము ఇంటికి వచ్చిన రెండవ కారణం: సొదొమ గొమొఱ్ణా పట్టణాలను నాశనం చెయ్యబోతున్నానని అతనికి తెలియచెయ్యడానికి (ఆదికాండము 18:17-21) అలాంటప్పుడు మరునాడు ఆ పట్టణాలను నాశనం చేసింది ఈ యెహోవాయే కదా!)
దీనిప్రకారం, సొదొమ గొమొఱ్ణాలు నాశనమైన ఆ సందర్భంలో ఇద్దరు యెహోవాలు ఉన్నట్టు లేఖనం మనకు స్పష్టంగా తెలియచేస్తుంది. ఈ ఇద్దరు యెహోవాలను గురించిన మరికొన్ని సందర్భాలు, యెషయా గ్రంథంలోనూ జెకర్యా గ్రంథంలో కూడా మనకు కనిపిస్తాయి వాటిని చివరిలో చూద్దాం.
ఆవిధంగా అబ్రాహాముకూ హాగరుకూ ఈ యెహోవాయే పై సందర్భాలలో యెహోవా దూతగా ప్రత్యక్షమై వారితో మాట్లాడాడు. ముఖ్యంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ సంఘటనలను రాస్తున్న రచయితలు ఆయన దేవుడని ప్రస్తావించారు. ఇప్పుడు ఆయన యాకోబుకు ప్రత్యక్షమైన సందర్భాన్ని చూడండి;
ఆదికాండము 31:10-13 మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొఱ్ఱెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవైయుండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబూ అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పితిని. అప్పుడు ఆయన - నీ కన్నులెత్తి చూడుము; గొఱ్ఱెలను దాటుచున్న పొట్టేళ్లన్నియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి; ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని నీ వెక్కడ స్తంభముమీద నూనె పోసితివో, యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి యీ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుమని నాతో చెప్పెననెను.
ఈ సందర్భంలో యాకోబు తనకు స్వప్నంలో ఒక దేవుని దూత ప్రత్యక్షమై నీవు బేతేలులో నూనె పోసి మ్రొక్కుబడి చేసుకున్న దేవుడను నేనే అని పలికినట్టుగా సాక్ష్యమివ్వడం మనం చూస్తాం. ఇంతకూ ఈ యాకోబుకు బేతేలులో ప్రత్యక్షమైంది దూతనా లేక యెహోవా నా? ఒకసారి ఆ సందర్భం చూడండి.
ఆదికాండము 28:11-18 యాకోబు ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశమునంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును; నీవు పడమటి తట్టును తూర్పుతట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడైయుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు; అది నాకు తెలియక పోయెననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే గాని వేరొకటికాదు; పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను.
ఈ వాక్యభాగం ప్రకారం యాకోబుకు స్వప్నంలో ప్రత్యక్షమైంది యెహోవా దేవుడే. కాబట్టి పై సందర్భంలో ఏ దేవుని దూతయైతే నీ తండ్రి ఇంటికి తిరిగివెళ్ళమని అతనికి ఆజ్ఞాపిస్తున్నాడో ఆయనే గతంలో యాకోబుకు యెహోవాగా ప్రత్యక్షమయ్యాడు (బేతేలులో). గమనించండి. దేవుని దూత మరియు యెహోవా దూత ఇద్దరూ ఒక్కరే. ఆయన కొన్ని సందర్భాలలో దేవుని దూతగానే కాదు, దూతగా కూడా ప్రస్తావించబడ్డాడు. ఉదాహరణకు ఈ వాక్యభాగం చూడండి.
ఆదికాండము 48:15,16 అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవని యెదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటివరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలోనుండి నన్ను తప్పించిన దూత యీ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రాహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక. భూమియందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను.
ఈ సందర్భంలో యాకోబు అతనికి తన మామ ఇంటిదగ్గర ఉండగా ప్రత్యక్షమైన దేవుని దూతను అనగా మొదట బేతేలులో అతనికి ప్రత్యక్షమైన యెహోవాను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను దూతయని మాత్రమే సంబోధిస్తున్నాడు. దీనిప్రకారం, యాకోబుకు ప్రత్యక్షమైన దేవుని దూత, దూత ఒక్కరే. ఇప్పుడు ఈ దూత యెహోవా దూతయే అనడానికి స్పష్టమైన ఆధారం చూడండి.
నిర్గమకాండము 23:20-23 ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగానుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు; మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినయెడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునై యుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగావెళ్లుచు, అమోరీయులు హిత్తీయులు పెరిజ్జీయులు కనానీయులు హివ్వీయులు యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించెదను.
లేఖనం యెహోవా దేవునిగా పేర్కొంటున్నటువంటి యే దూతను లేక దేవుని దూతనైతే యాకోబు తన మరణ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాడో అదే దూత గురించి ఇక్కడ తండ్రియైన యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటల్లో మనం ప్రాముఖ్యంగా గుర్తించవలసిన విషయం ఏంటంటే ఆ దూతకు దేవుని నామం ఉంది. అందుకే ఆయన యెహోవాగా పిలవబడుతున్నాడు. తండ్రియైన యెహోవా మాట చొప్పున ఆ దూతయే ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి విడిపించి కనానుకు నడిపించాడు. ఇప్పుడు ఆ దూత ఎవరని రాయబడిందో చూడండి;
న్యాయాధిపతులు 2:1-3 యెహోవా దూత గిల్గాలునుండి బయలుదేరి బోకీమునకు వచ్చి యీలాగు సెలవిచ్చెను నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి, మీ పితరులకు ప్రమాణముచేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడును మీరను. మీరు ఈ దేశనివాసులతో నిబంధన చేసికొనకూడదు; వారి బలిపీఠములను విరుగగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాటను వినలేదు. మీరు చేసినపని యెట్టిది? కావున నేను మీ యెదుటనుండి ఈ దేశనివాసులను వెళ్లగొట్టను, వారు మీ ప్రక్కలకు శూలములుగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను.
తండ్రియైన దేవుడు ఇశ్రాయేలీయులకు ముందుగా పంపినటువంటి, దూత లేక దేవుని దూత ఈ సందర్భంలో "యెహోవా దూత" గా సంబోధించబడ్డాడు. కాబట్టి యెహోవా దేవునిగా ప్రత్యక్షం ఔతున్న దేవుని దూత, దూత, యెహోవా దూత ఒక్కరే. ఈ విషయం ముందుకు వెళ్ళేకొద్దీ మరలా జ్ఞాపకం చేసుకుందాం. ప్రస్తుతమైతే యెహోవా దూత దేవుడని రుజువుచేసే మరికొన్ని సందర్భాలను పరిశీలిద్దాం. ఈ విషయం మనం పైన చూసినటువంటి వాక్యభాగంలో కూడా స్పష్టంగా రాయబడింది. ఎలాగంటే; నిర్గమకాండము 34:11-13 వాక్యభాగంలో యెహోవా దేవుడు మోషేతో పలికినటువంటి "నేడు నేను నీ కాజ్ఞాపించుదాని ననుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీయులను కనానీయులను హిత్తీ యులను పెరిజ్జీయులను హివ్వీయులను యెబూసీయులను నీ యెదుటనుండి వెళ్ల గొట్టెదను. నీవు ఎక్కడికి వెళ్లుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసికొనకుండ జాగ్రత్తపడుము. ఒకవేళ అది నీకు ఉరికావచ్చును. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను" అనే మాటలను అక్కడ యెహోవా దూత తాను పలికినవిగా ఆపాదించుకుంటున్నాడు చూడండి: "నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి, మీ పితరులకు ప్రమాణముచేసిన దేశమునకు మిమ్మును చేర్చినీతో చేసిన నిబంధన నేనెన్నడును మీరను. మీరు ఈ దేశనివాసులతో నిబంధన చేసి కొనకూడదు; వారి బలిపీఠములను విరుగగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాటను వినలేదు"
ముందుకు వెళ్దాం;
నిర్గమకాండము 3:1-6 మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద యేల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి యీ గొప్పవింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమనుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవునివైపు చూడ వెరచెను.
ఈ సందర్భంలో యెహోవా దూత మోషేకు ప్రత్యక్షమై తనను తాను దేవునిగా సంబోధించుకోవడం, ఆయన యెహోవా అని లేఖనంలో కూడా రాయబడడం మనం చదువుతున్నాం. మోషే ఇక్కడ తనకు కనిపించిన ఆ దూతను తన చివరి దినాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యెహోవా దేవుడని ఒప్పుకుంటున్నాడు.
ద్వితీయోపదేశకాండము 33:16 సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠపదార్థములవలన యెహోవా అతని భూమిని దీవించును పొదలో నుండినవాని కటాక్షము యోసేపు తలమీదికి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతినొందినవాని నడినెత్తి మీదికి అది వచ్చును.
అసలు ఆ సందర్భంలో మోషేకు "నేను ఉన్నవాడను అను వాడనైయున్నాను, అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యెహోవాను నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము" అని పరిచయం చేసుకుందే ఈ యెహోవా దూత (నిర్గమకాండము 3:14,15) .
ఆయన బిలాముకు ప్రత్యక్షమైన సందర్భం చూడండి;
సంఖ్యాకాండము 22:31-35 అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక, దూసిన ఖడ్గము చేతపట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా యెహోవా దూత యీ ముమ్మారు నీ గాడిదను నీవేల కొట్టితివి? ఇదిగో నా యెదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని. ఆ గాడిద నన్ను చూచి యీ ముమ్మారు నా యెదుటనుండి తొలిగెను; అది నా యెదుట నుండి తొలగని యెడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి యుందునని అతనితో చెప్పెను. అందుకు బిలాము నేను పాపము చేసితిని; నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు. కాబట్టి యీ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్లెదనని యెహోవా దూతతో చెప్పగా యెహోవా దూత నీవు ఆ మనుష్యులతో కూడ వెళ్లుము. అయితే నేను నీతో చెప్పు మాటయేకాని మరేమియు పలుకకూడదని బిలాముతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడ వెళ్లెను.
ఈ సందర్భంలో యెహోవా దూత బిలాముతో దేవునివలే మాట్లాడడం, బిలాము కూడా ఆయనను దేవునిగా గుర్తించి సాష్టాంగ నమస్కారం చెయ్యడం మనకు కనిపిస్తుంది.
ఆయన గిద్యోనుకు ప్రత్యక్షమైన సందర్భాన్ని చూడండి;
న్యాయాధిపతులు 6:11-22 యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకివృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమముగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై యున్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తము నా యేలినవాడా, యెహోవా మాకు తోడైయుండినయెడల ఇదంతయు మాకేల సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెనని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతకార్యములన్నియు ఏమాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను. అంతట యెహోవా అతనితట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా అతడు చిత్తము నా యేలిన వాడా, దేని సహాయముచేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనైయున్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా అయిన నేమి? నేను నీకు తోడై యుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతముచేయుదువని సెలవిచ్చెను. అందుకతడు నాయెడల నీకు కటాక్షము కలిగినయెడల నాతో మాటలాడుచున్న వాడవు నీవే అని నేను తెలిసికొనునట్లు ఒక సూచన కనుపరచుము. నేను నీయొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టువరకు ఇక్కడనుండి వెళ్లకుమీ అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చువరకు నేను ఉండెదననెను. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయనకొరకు ఆ మస్తకివృక్షముక్రిందికి దానిని తీసికొనివచ్చి దగ్గర ఉంచగా దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయుమని అతనితో చెప్పెను. అతడాలాగు చేయగా యెహోవా దూత తన చేత నున్న కఱ్ఱను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలోనుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చి వేసెను, అంతట యెహోవా దూత అతనికి అదృశ్యమాయెను. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలిసికొని అహహా నా యేలినవాడా, యెహోవా, ఇందుకే గదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితిననెను.
ఈ సందర్భంలో మొదటిగా గిద్యోనుకు యెహోవా దూత ప్రత్యక్షమైనట్టు, తర్వాత ఆ దూత అతనివైపు చూసినప్పుడు ఆయన యెహోవాయే అన్నట్టు స్పష్టంగా రాయబడింది. అదేవిధంగా ఇక్కడ యెహోవా దూత, దేవుని దూతగా కూడా ప్రస్తావించబడ్డాడు. దీనినిబట్టి పై సందర్భంలో యెహోవా దేవునిగా తన ఉనికిని చాటుకుంటున్న యెహోవా దూత, దేవుని దూత, దూత ఒక్కరే అని మనకు మరింత స్పష్టత లభించింది. కొంచెం ముందుకు వెళ్తే మరో సందర్భంలో కూడా ఇలాంటి స్పష్టతే మరలా మనకు కనిపిస్తుంది.
ఆయన సంసోను తల్లితండ్రులకు ప్రత్యక్షమైన సందర్భాన్ని చూడండి;
న్యాయాధిపతులు 13:19-22 అంతట మానోహ నైవేద్యముగా నొక మేకపిల్లను తీసికొని యొక రాతిమీద యెహోవాకు అర్పించెను. మానోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత యొక ఆశ్చర్య కార్యము చేసెను. ఎట్లనగా, జ్వాలలు బలిపీఠము మీదనుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠముమీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. మానోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి. ఆ తరువాత యెహోవా దూత మరల మానోహకును అతని భార్యకును ఇక ప్రత్యక్షము కాలేదు. ఆయన యెహోవా దూత అని మానోహ తెలిసికొనిమనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా-
ఈ సందర్భంలో యెహోవా దూత, సంసోను తల్లితండ్రులకు ప్రత్యక్షమైనట్టుగా మనకు కనిపిస్తుంది. మనోహా తనకు ప్రత్యక్షమైన యెహోవా దూత, దేవుడు అని తెలుసుకుని, ఆయనను చూసినందువల్ల మనం చనిపోతామేమో అనే తీవ్రభయానికి గురౌతున్నాడు. అదేవిధంగా ఇక్కడ యెహోవా దూత, దూతగా మరోసారి ప్రస్తావించబడ్డాడు.
ఆయన దావీదుకు ప్రత్యక్షమైన సందర్భం చూడండి;
1 దినవృత్తాంతములు 21:15-19 యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను; అతడు నాశనము చేయబోవుచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపమొంది నాశనముచేయు దూతతో చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవియ్యగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్లమునొద్ద నిలిచెను. దావీదు కన్నులెత్తి చూడగా, భూమ్యాకాశముల మధ్యను నిలుచుచు, వరదీసిన కత్తిచేత పట్టుకొని దానిని యెరూషలేముమీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలును గోనె పట్టలు కప్పుకొనినవారై సాష్టాంగపడగా దావీదుజనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చినవాడను నేనేగదా? పాపము చేసి చెడుతనము జరిగించినవాడను నేనేగదా? గొఱ్ఱెలవంటివారగు వీరేమి చేసిరి? నా దేవుడవైన యెహోవా, బాధపెట్టు నీ చెయ్యి నీ జనులమీద నుండ కుండ నామీదను నా తండ్రి యింటివారిమీదను ఉండనిమ్మని దేవునితో మనవిచేసెను. యెబూసీయుడైన ఒర్నాను కళ్లమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్లవలెనని దావీదునకు ఆజ్ఞ నిమ్మని యెహోవా దూత గాదునకు సెలవియ్యగా యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్లెను.
ఈ సందర్భంలో దావీదు చేసిన పాపం కారణంగా దేవుడు ఇశ్రాయేలీయులపైకి కీడును రప్పించినప్పుడు యెహోవా దూత వారిని నాశనం చెయ్యడం మనకు కనిపిస్తుంది. ఇక్కడ జరిగినదానిని మనం జాగ్రతగా పరిశీలిస్తే దావీదు ఆ దూతను గుర్తించి ఆయన ముందు సాష్టాంగపడి మనవి చేసినట్టు, ఆ మనవిని అతను దేవునితో చేసినట్టు, అప్పుడు యెహోవా దూత గాదు అనే ప్రవక్తకు బలిపీఠం కట్టమని ఆజ్ఞాపించినట్టు రాయబడింది. ఇప్పుడు ఇదే సంఘటన గురించి వివరించబడిన మరో రెండు లేఖనభాగాల్లో అసలు దావీదుకు ఆ ప్రదేశంలో ఎవరు ప్రత్యక్షమయ్యారో గాదు అనే ప్రవక్తకు బలిపీఠం కట్టమని ఎవరు ఆజ్ఞాపించారో చూడండి.
2 దినవృత్తాంతములు 3:1 తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రియైన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరీయా పర్వతమందు దావీదు సిద్ధపరచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్లమందు దావీదు ఏర్పరచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను.
2 సమూయేలు 24:19 దావీదు గాదుచేత యెహోవా యిచ్చిన ఆజ్ఞచొప్పున పోయెను.
ఈ లేఖనభాగాల్లో దావీదుకు ఆ ప్రదేశంలో ప్రత్యక్షమైంది యెహోవా దేవుడేయనీ ఆయనే గాదుకు బలిపీఠం కట్టమని ఆజ్ఞాపించాడని స్పష్టంగా రాయబడింది. కాబట్టి యెహోవా దూత యెహోవా దేవుడే అని మరొకసారి మనకు స్పష్టం ఔతుంది. అదేవిధంగా ఈ సందర్భంలో కూడా ఆయన యెహోవా దూతగా దూతగా ప్రస్తావించబడ్డాడు చూడండి.
2 సమూయేలు 24:16,17 అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు, యెహోవా ఆ కీడును గూర్చి సంతాపమొంది-అంతే చాలును, నీ చెయ్యి తీయుమని జనులను నాశనముచేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్లము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థించెను.
పాతనిబంధనలో ఈ యెహోవా దూతను గురించిన సందర్భాలు మరికొన్ని కూడా మనకు కనిపిస్తున్నప్పటికీ ఇప్పటికే ఆయన దేవుడైన యెహోవా అని అనేకసార్లు మనకు స్పష్టత లభించింది కాబట్టి ఇంక ముందుకు సాగుతున్నాను.
2. యెహోవా దూత యెహోవా దేవుడనే లేఖనాధారమైన బోధపై, వ్యతిరేక వాదనలు:
కొంతమంది ఈ యెహోవా దూత గురించి మాట్లాడుతూ ఆయన వాస్తవంగా యెహోవా దేవుడు కాడనీ భక్తులు దేవదూతను చూసి తెలియక దేవుడని సంబోధించారనీ దూత యొక్క మాటలు దేవునివి కాబట్టి లేఖనంలో ఆ దూత దేవుడని రాయబడిందనీ వాదిస్తుంటారు. దానికి అనుకూలంగా వారు నూతన నిబంధన నుండి ఒక వాక్యభాగాన్ని కూడా తీసుకుంటారు. అదేంటో చూడండి.
అపొస్తలుల కార్యములు 7:30 నలువది ఏండ్లయిన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికగపడెను.
ఈ వాక్యభాగంలో స్తెఫను మోషేకు కనిపించిన యెహోవా దూత (నిర్గమకాండము 3:1,2) దేవదూత అని ప్రస్తావిస్తున్నాడు. దీని ఆధారంగానే వారు యెహోవా దూత దేవుడు కాదు, ఒక సాధారణ దేవదూతయే అని వాదిస్తున్నారు.
ఇప్పుడు ఈ వాదనలకు వరుసగా సమాధానం చూద్దాం. మొదటిగా; పాతనిబంధనలో యెహోవా దూత ప్రత్యక్షమైనటువంటి భక్తులకు, సాధారణమైన దేవదూతలకూ తమకు ప్రత్యక్షమైన దేవుడైన ఈ దూతకూ తేడా తెలుసని వారి మాటల్లోనే స్పష్టంగా అర్థమౌతుంది చూడండి.
ఆదికాండము 32:1,2 యాకోబు తన త్రోవను వెళ్లుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను.
ఈ సందర్భంలో యాకోబు తనకు ఎదురుపడిన దేవదూతలను చూసినప్పుడు అతనికి సాధారణ దూతలకూ యెహోవా దూతకూ తేడా తెలుసు కాబట్టే వారిని ఇక్కడ దేవుని సేనగా గుర్తించాడు. కానీ ఇదే యాకోబు గతంలో తనకు స్పప్నంలో ప్రత్యక్షమైన యెహోవా దూతను లేక దేవుని దూతను దేవునిగా యెహోవాగా గుర్తించాడు (ఆదికాండము 31:10-13).
న్యాయాధిపతులు 13:20-23 ఎట్లనగా, జ్వాలలు బలిపీఠము మీదనుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠముమీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. మానోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి. ఆ తరువాత యెహోవా దూత మరల మానోహకును అతని భార్యకును ఇక ప్రత్య క్షము కాలేదు. ఆయన యెహోవా దూత అని మానోహ తెలిసికొని మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా అతని భార్య యెహోవా మనలను చంపగోరినయెడల ఆయన దహనబలిని నైవేద్యమును మనచేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటిని మనకు చూపింపడు, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను.
ఈ సందర్భంలో సంసోను తండ్రికి కూడా సాధారణ దేవదూతలకూ దేవుడైన యెహోవా దూతకూ తేడా తెలుసు కాబట్టే అతనికి కనిపించింది యెహోవా దూత అని తెలుసుకుని దేవుణ్ణి చూసిన కారణంగా తాము చనిపోతామని భయపడ్డాడు. ఆ దూత సాధారణ దేవదూతయే ఐతే మనోహకు అలా భయపడవలసిన అవసరం లేదు కదా!
అయితే నూతన నిబంధనలో కూడా యోహాను తండ్రియైన జెకర్యా యేసుక్రీస్తు తల్లియైన మరియలు వారికి ఒక దూత ప్రత్యక్షమైనప్పుడు భయానికి లోనయ్యారు (లూకా 1:11,12, 1:28-30). నిజానికి అక్కడ వారు చనిపోతామనే కారణంతో అలా భయపడలేదు కానీ ఆ దూత తీసుకువచ్చిన సమాచారం నిమిత్తమే అలా స్పందించారు. మనం పైన చూసిన భక్తులు మాత్రం దూత తీసుకువచ్చిన సమాచారం నిమిత్తం కాదు ఆ దూత దేవుడు కాబట్టే చనిపోతామని భయపడ్డారు.
న్యాయాధిపతులు 6:22,23 గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలిసికొని అహహా నా యేలినవాడా, యెహోవా, ఇందుకే గదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితిననెను. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను.
ఈ సందర్భంలో గిద్యోను కూడా యెహోవా దూతను ముఖాముఖిగా చూసానని అనుకుంటున్నప్పుడు, యెహోవా అతనితో నీవు చావవని అతనికి భరోసా కల్పిస్తున్నాడు. గిద్యోనుకు ప్రత్యక్షమైన యెహోవా దూత సాధారణ దూతయే ఐతే అతను ఆ మాటలు పలుకవలసిన అవసరం లేదు. దీనినిబట్టి, పాతనిబంధన భక్తులకు సాధారణ దేవదూతలకూ దేవునికీ తేడా తెలుసనీ వారికి కనిపించిన యెహోవా దూత దేవుడు కాబట్టే వారు ఆయనను దేవునిగా గుర్తించారని మనకు బాగా అర్థం ఔతుంది.
ఒకవేళ ఇక్కడ నేను చూపించిన వాక్యభాగాలను కాసేపు ప్రక్కన పెట్టి వాదనకోసం ఆ భక్తులు సాధారణ దేవదూతనే చూసి దేవుడని భ్రమపడ్డారు అనుకున్నప్పటికీ మనం ఈ యెహోవా దూత గురించి చూసిన సందర్భాలలో ఆయన దేవుడని భక్తులు మాత్రమేకాదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ చరిత్రను లిఖిస్తున్నటువంటి రచయితలు కూడా దానిని ఒప్పుకుంటూ ఆయన దేవుడనీ యెహోవాయనీ స్పష్టంగా రాసారు. ఒకవేళ దీనిపై మరికొందరు వాదిస్తున్నట్టుగా దూత పలికిన మాటలు దేవునివి కాబట్టి ఆవిధంగా రాసారని అనుకుంటే మిగిలిన సందర్భాలలో సాధారణ దేవదూతలు మాట్లాడినప్పుడు అక్కడ మాట్లాడుతుంది దేవుడని ఎందుకు రాయబడలేదు? ఆ దూతలు కనిపించినప్పుడు కూడా దేవుడని ఎందుకు రాయబడలేదు. భక్తులు కూడా వారిని దేవుడని ఎందుకు సంబోధించలేదనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి వస్తుంది.
ఉదాహరణకు, యోహాను తండ్రియైన జెకర్యాకూ యేసు తల్లియైన మరియకూ ప్రకటన గ్రంథం రాసిన యోహానుకూ పేతురుకూ కొర్నేలికీ దేవదూతలు కనిపించిన ఆ సందర్భాలలో వారు దేవుడని రచయిత రాయలేదు. వారు కూడా ఆ దూతల్ని దేవునిగా గుర్తించలేదు. అంటే ఆ దూతలు పలికిన మాటలు దేవునివి కావా?. గమనించండి. లేఖనాలు దేవుని స్థానాన్నీ నామాన్నీ దేవదూతలకు ఆపాదించే అవకాశం ఎట్టిపరిస్థితుల్లోనూ లేదు. అది దేవదూషణ ఔతుందని ప్రారంభంలోనే తెలియచేసాను.
ఇప్పుడు స్తెఫను మోషేకు కనిపించిన దేవుడైన యెహోవా దూతను దేవదూతయని ఎందుకు ప్రస్తావించాడో చూద్దాం (అపొ.కా 7:30).
1. "యెహోవా దూత" గా "దూత" గా "దేవునిదూత" గా పిలవబడిన వ్యక్తి, దేవుడు అయినప్పటికీ యెహోవా నామాన్ని కలిగియున్నప్పటికీ భక్తులయొద్దకు సమాచారం తీసుకువచ్చిన కారణంతో దూతగా పిలువబడ్డాడు. ఎందుకంటే సమాచారాన్ని తీసుకువచ్చే వారిని దూతలు అని సంబోధించడం సర్వ సాధారణం. మనం ఇక్కడ యెహోవా దూతగా పిలవబడిన వ్యక్తిని ఆ పదప్రయోగాన్ని బట్టి దేవునిగా గుర్తించడం లేదు. ఎలాగైతే ఆ యెహోవా దూత, దూతగానూ దేవుని దూతగానూ సంబోధించబడ్డాడో అలానే స్తెఫను కూడా తన మాటల్లో ఆయనను దేవదూతగా ప్రస్తావించాడు. అదే స్తెఫను ఆ దేవదూత గురించి పలికిన మిగిలిన మాటలు కూడా చూడండి.
అపొస్తలుల కార్యములు 7:30-34 నలువది ఏండ్లయిన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికగపడెను. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా నేను నీ పితరుల దేవుడను, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను గనుక మోషే వణకి, నిదానించి చూచుటకు తెగింప లేదు. అందుకు ప్రభువు నీ చెప్పులు విడువుము; నీవు నిలిచియున్నచోటు పరిశుద్ధభూమి. ఐగుప్తులో నున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని; వారి మూలుగు వింటిని; వారిని విడిపించుటకు దిగివచ్చియున్నాను; రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను.
నిర్గమకాండం 3లో మోషేకు యెహోవా దూత ప్రత్యక్షమైనప్పుడు, ఆ దూత యెహోవాగా దేవునిగా ఎలా వర్ణించబడ్డాడో దానిని స్తెఫను ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగానే ప్రస్తావిస్తున్నాడు. కానీ ఇక్కడ అతను కేవలం యెహోవా దూతకు బదులు దేవదూత అని ప్రస్తావించాడు. దూతగా వచ్చిన దేవుణ్ణి దేవదూత అని సంబోధించినప్పటికీ అందులో ఎలాంటి ఇబ్బందీలేదని అతనికి తెలుసు. నిజానికి ఆ కాలపు యూదులు యెహోవా అనే నామాన్ని ఉచ్చరించేవారు కారు, ఆ స్థానంలో ప్రభువు (అదోనాయ్, ఎలోహీం) అనే ఆయనను సంబోధించేవారు. అందుకే నూతననిబంధనలో మనకు యెహోవా అనే పేరు ఎక్కడా కనిపించదు. అందుకే స్తెఫను అక్కడ యెహోవాకు బదులు ప్రభువు అనీ యెహోవా దూతకు బదులు దేవదూత అనీ ప్రస్తావించాడు. అలా యెహోవా దూత, దేవదూతగా కేవలం స్తెఫను మాటల్లో మాత్రమే ప్రస్తావించబడలేదు కానీ పాతనిబంధనలో కూడా ఆయన ఒకచోట దేవదూతగా ప్రస్తావించబడ్డాడు.
1 రాజులు 19:5-8 అతడు బదరీవృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి - నీవు లేచి భోజనము చేయుమని చెప్పెను. అతడు చూచినంతలో అతని తలదగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనముచేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవమారు వచ్చి అతని ముట్టి-నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైయున్నది, నీవు లేచి భోజనము చేయుమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనముచేసి, ఆ భోజనపు బలముచేత నలువది రాత్రింబగళ్లు ప్రయాణముచేసి, దేవుని పర్వతమని పేరుపెట్టబడిన హోరేబునకు వచ్చి -
ఏలియాకు కలిగిన ఈ ప్రత్యక్షతలో ఆయన మొదట దేవదూతయనీ తరువాత యెహోవా దూతయనీ ప్రస్తావించబడ్డాడు. దీనినిబట్టి మనం దేవదూత, యెహోవా దూత, దేవుని దూత అనే పదప్రయోగాన్ని బట్టీ కాకుండా ఆయన గురించి లేఖనం చెప్పినదానిని బట్టీ ఆయనను భక్తులు గుర్తించినదానిని బట్టీ వారికి కనిపించింది ఎవరు అనేది అర్థం చేసుకోవాలి.
అదేవిధంగా కొన్ని సందర్భాలలో సాధారణ దేవదూతలనూ మరియు యాజకులనూ ఉద్దేశించి కూడా వారు యెహోవా దూతలనే పదప్రయోగం చెయ్యబడింది. కానీ ఆ సందర్భాలను మనం పరిశీలించినప్పుడు వారు సాధారణ దేవదూతలు మరియు మానవులే అని సులభంగానే అర్థమైపోతుంది (ఆవివరాలు క్రింద తెలియచేసాను).
2. యెహోవా దూత దేవుడు అయినప్పటికీ ఆయన భక్తులకు దూతగా కనిపించాడు కాబట్టి వారు ఆయనను దూత, యెహోవా దూత, దేవదూత, దేవుని దూత అని సంబోధించారు. లేఖనాలు కూడా మొదట ఆయనను ఆలానే పరిచయం చేసి, తర్వాత ఆయన దేవుడనే స్పష్టతను ఇస్తున్నాయి. ఉదాహరణకు ఈ సందర్భం చూడండి;
ఆదికాండము 32:24-30 యాకోబు ఒక్కడు మిగిలి పోయెను; ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలువకుండుట చూచి తొడగూటిమీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుటవలన యాకోబు తొడ గూడువసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యననెను. ఆయన నీ పేరేమని యడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన నీవు ఎందునిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని నాశీర్వదించెను. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను.
ఈ సందర్భంలో యాకోబుతో పెనుగులాడిన వ్యక్తి మొదటిగా నరుడు అని పరిచయం చెయ్యబడుతున్నాడు కానీ ఆయన దేవుడని ఆ క్రింది మాటల్లోనే స్పష్టం చెయ్యబడుతుంది. యాకోబుతో పెనుగులాడిన వ్యక్తి దేవుడు అయినప్పటికీ ఆయన నరుడిలా అతని దగ్గరకు వచ్చాడు కాబట్టి లేఖనం ఆయనను మొదట అలానే ప్రస్తావించి చివరిగా ఆయన దేవుడని స్పష్టం చేస్తుంది. ఇదే సందర్భం గురించి మరొక వాక్యభాగం చూడండి;
హొషేయ 12:3-5 తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాటలాడెను; యెహోవా అని, సైన్యములకధిపతియగు యెహోవా అని, ఆయనకు జ్ఞాపకార్థనామము.
ఈ సందర్భంలో యాకోబుతో పెనుగులాడినప్పుడు, నరునిగా కనిపించిన దేవుడు, దూత/యెహోవా దూతయని రాయబడింది. దీనినిబట్టి యెహోవా దూతగా ప్రత్యక్షమౌతున్న దేవుడు ఆయన ప్రత్యక్షమైన విధానాన్ని తెలియచెయ్యడానికే దూతయనీ నరుడనీ ప్రస్తావించబడ్డాడు. అందుకే స్తెఫను మాటల్లోనూ ఏలియా సందర్భంలోనూ ఆయనను దేవదూతగా ప్రస్తావించారు తప్ప ఆయన సాధారణమైన దేవదూతయని కాదు.
యెహోవా దూత దేవుడు కాదని వాదించేవారు తీసుకువచ్చే మరొక వాదన చూడండి. బైబిల్ గ్రంథంలో ఎన్నోచోట్ల దేవుడైన యెహోవా సీనాయి పర్వతంపై మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్టుగా రాయబడింది (నిర్గమకాండము 19,20 అధ్యాయాలు).
నెహెమ్యా 9:13,14 సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చి ఆకాశమునుండి వారితో మాటలాడి, వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలు కరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప నాజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషేద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించితివి.
కానీ నూతన నిబంధనలోని మూడు సందర్భాలలో ధర్మశాస్త్రాన్ని మోషేకు దేవదూతలు ఇచ్చినట్టుగా రాయబడింది (గలతీ 3:19, అపొ.కా 7:53, హెబ్రీ 2: 2). యెహోవా దూత, దేవుడైన యెహోవా కాదని చెప్పేవారు వీటినన్నిటినీ చూపించి, పాతనిబంధనలో మోషేకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్టుగా రాయబడింది, కానీ కొత్తనిబంధనలో ఆ ధర్మశాస్త్రాన్ని దేవదూతలే ఇచ్చారని రాయబడింది. దీనిప్రకారం ధర్మశాస్త్రాన్ని దేవదూతలే ఇచ్చినప్పటికీ ఆ ప్రజలకు అర్థం కావడానికీ దేవుడని రాయబడిందనీ ఇదేవిధంగా పాతనిబంధనలో యెహోవా దూత ప్రత్యక్షమైనప్పుడు కూడా అతను సాధారణమైన దేవదూతయే అయినప్పటికీ ఆ ప్రజలకు అర్థం కావడానికే దేవుడనీ యెహోవాయనీ రాయబడిందని చెబుతారు. కానీ పాత నిబంధనలో మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది దేవుడైతే (ఆ దేవుడు కూడా 24వ అధ్యాయం నుండి యెహోవా దూతనే), నూతన నిబంధనలో దానిని దేవదూతలు ఇచ్చినట్టుగా ఎందుకు రాయబడిందో ఈ వాక్యభాగం పరిశీలించండి.
ద్వితీయోపదేశకాండము 33:2-4 శేయీరులోనుండి వారికి ఉదయించెను ఆయన పారాను కొండనుండి ప్రకాశించెను వేవేల పరిశుద్ద సమూహముల మధ్యనుండి ఆయన వచ్చెను ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియుచుండెను. ఆయన జనములను ప్రేమించును ఆయన పరిశుద్ధులందరు నీ వశమున నుందురు వారు నీ పాదములయొద్ద సాగిలపడుదురు నీ ఉపదేశమును అంగీకరింతురు. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను అది యాకోబు సమాజ స్వాస్థ్యము.
ఈ సందర్భంలో సీనాయి కొండపైన దేవుడు ధర్మ శాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు, జరిగిన దానిగురించి మోషే రాస్తున్నాడు. ఆ సమయంలో ఆయనతో పాటుగా పరిశుద్ధ సమూహములు (దేవదూతలు) కూడా ఉన్నట్లుగా ఇక్కడ స్పష్టం ఔతుంది. దీనిగురించి మరో సందర్భం చూడండి;
కీర్తనల గ్రంథము 68:17 దేవుని రథములు సహస్రములు సహస్రసహస్రములు ప్రభువు వాటిలోనున్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయెను.
ఇక్కడ కూడా సీనాయి కొండపైన దేవుడు తన సైన్యంతో దిగినట్టు, ఇదే వాక్యభాగాన్ని ఇంగ్లీషు బైబిల్ లో చదివితే ఆ సైన్యంలో వేలకొలదీ దేవదూతలు ఉన్నట్టు రాయబడింది.
Psalm 68: 17 The chariots of God are twenty thousand, even thousands of angels: the Lord is among them, as in Sinai, in the holy place.
దీనిప్రకారం దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు ఆయనతో పాటుగా దేవదూతలు కూడా ఉన్నారు. అనగా ఆ పరిచర్యలో వారు కూడా ప్రమేయం కలిగియున్నారు. అందుకే నూతన నిబంధన నుండి మనం చూసిన లేఖనభాగాల్లో మోషేకు వారే ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్టుగా రాయబడింది. గమనించండి. పాతనిబంధనలో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చే సమయంలో దేవుడు ఇచ్చినట్టుగా ఉన్నది తప్ప, దేవుళ్ళు ఇచ్చినట్టుగా లేదు. ఆ దేవుడు వీరు చెబుతున్నట్టుగా ఒక దేవదూతయే ఐతే ప్రజలకు అర్థం అవ్వడానికే ఆ దేవదూతను దేవుడని రచయిత రాసుంటే దానికి ఆధారంగా వారు చూపిస్తున్నటువంటి నూతన నిబంధన లేఖనాల్లో ఒక దేవదూత మోషేకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్టూ పలికినట్టూ రాయబడాలే తప్ప "దేవదూతలు అని బహువచనం" ఎందుకు ప్రయోగించబడింది? అపో. కార్యములు 7:53, గలతీ 3:19లో ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది దేవదూతలు అని బహువచనం ప్రయోగించబడడం మనం చూస్తాం.
ఇక హెబ్రీ 2:2 లోని "దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున" అనే మాటలకు కూడా అర్థం చూసేముందు; మనం పైన సమాధానం చూసినటువంటి వాదనకు కొనసాగింపుగా వారు, నూతన నిబంధనలో దేవుణ్ణి ఎవరూ చూడలేదు, ఆయన స్వరాన్ని ఎవరూ వినలేదనే లేఖనాలను కూడా చూపించి, వాటిప్రకారం కూడా మోషేకు ప్రత్యక్షమై ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడు కాదు దేవదూతలే అనీ యెహోవా దూత కూడా సాధారణమైన దేవదూతయేయనీ మాట్లాడుతుంటారు. ఆ వాదనకు కూడా సమాధానం చూద్దాం.
యోహాను సువార్త 1:18 ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను.
ఈ వాక్యభాగంలో చాలా స్పష్టంగా ఎవ్వరూ ఎప్పుడూ తండ్రియైన దేవుణ్ణి చూడలేదని రాయబడడం మనం చూస్తాం. అయితే ఈ సందర్భాలు చూడండి.
యెషయా గ్రంథము 6:1-3 రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారుసైన్యములకధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.
దానియేలు 7:9,10 ఇంక సింహాసనములను వేయుట చూచితిని; మహా వృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తలవెండ్రుకలు శుద్ధమైన గొఱ్ఱెబొచ్చువలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలలవలె మండుచుండెను; దాని చక్రములు అగ్నివలె ఉండెను. అగ్నివంటి ప్రవాహము ఆయనయొద్దనుండి ప్రవహించుచుండెను. వేవేలకొలది ఆయనకు పరిచారకులుండిరి; కోట్లకొలది మనుష్యులు ఆయనయెదుట నిలిచిరి, తీర్పుతీర్చుటకై గ్రంథములు తెరువబడెను.
యెహెజ్కేలు 1:26-28 వాటి తలల పైనున్న ఆ మండలముపైన నీల కాంతమయమైన సింహాసనమువంటి దొకటి కనబడెను; మరియు ఆ సింహాసనమువంటి దానిమీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడైయుండెను. చుట్టు దాని లోపట కరుగుచున్న యిత్తడియు అగ్నియు నున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్నిస్వరూపముగా నాకు కనబడెను, చుట్టును తేజోమయముగా కనబడెను. వర్ష కాలమున కనబడు ఇంద్ర ధనుస్సుయొక్క తేజస్సువలె దాని చుట్టునున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడెను.
ఈ సందర్భాలలోనూ మరికొన్ని సందర్భాలలోనూ యెహోవా దేవుడు తన భక్తులకు దర్శనమైనట్టుగా రాయబడింది. మరి యోహాను 1:18 లో తండ్రియైన దేవుణ్ణి ఎవరూ చూడలేదని ఎందుకు రాయబడిందంటే ఈ సందర్భాలన్నీ కేవలం దర్శనాలు, కలలు. యోహాను 1:18లో యోహాను దేవుణ్ణి ఎప్పుడూ ఎవరూ చూడలేదన్న మాటలను, పాతనిబంధనలో ఎవరూ దర్శనాలు, కలలలో కూడా ఆయనను చూడలేదన్న ఉద్దేశంతో కాదు కానీ ఆయన ప్రత్యక్షంగా భౌతికంగా ఎవ్వరికీ కనబడలేదని శరీరధారిగా వచ్చిన క్రీస్తులో మాత్రమే ఆయన సంపూర్ణంగా సశరీరుడిగా బయలుపరచబడ్డాడని నొక్కి చెప్పడానికే ప్రస్తావించాడు. ఆ వాక్యభాగాన్ని సందర్భానుసారంగా చదివితే క్రీస్తు శరీరధారణ గురించే అతను ఆ మాటలు చెబుతున్నాడని సులభంగానే అర్థమైపోతుంది.
యోహాను 1:14 ఆ వాక్యము శరీరధారియై, కృపా సత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను. తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.
అందుకే యేసుక్రీస్తు "నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడని" శరీరధారియైన తనలో బయలుపరచబడుతున్న తండ్రి గురించి సాక్ష్యమిస్తాడు (యోహాను 14:9). అదేవిధంగా "దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నదని" కొలస్సీయులకు 2:9లో కూడా ఇదే విషయమై రాయబడింది. కాబట్టి పాతనిబంధనలో ప్రవక్తలు చూసిన దేవుని దర్శనాలకూ కలలకూ యోహాను 1:18లో చెప్పబడుతున్న మాటలకూ సంబంధం లేదు. శరీరధారియైన, భౌతికమైన దేవుని ప్రత్యక్షతను ఎవ్వరూ చూడలేదు, శరీరధారియైన క్రీస్తులో మాత్రమే దేవుణ్ణి అందరూ చూసారు. ఈ విషయం ఇంకాస్త వివరంగా అర్థమయ్యేందుకు, ఈ వాక్యభాగం చదవండి.
1 తిమోతికి 6:14-16 మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైయున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. "మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు" ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్.
ఈ సందర్భమంతా యేసుక్రీస్తు గురించే రాయబడింది. మనం ఎదురుచూసేది ఆయన ప్రత్యక్షత కొరకేకదా. కానీ ఈమాటల్లో ఆ యేసుక్రీస్తును ఎవ్వరూ చూడలేదనీ చూడలేరని పౌలు చెబుతున్నాడు. కానీ; యేసుక్రీస్తు మరణించి, తిరిగిలేచి, పరలోకానికి ఆరోహణుడయ్యాక, ఆయనను అననీయ చూసాడు (అపో.కా 9:10). పౌలు చూసాడు (అపో.కా 22:17). ఇలా చెప్పుకుంటూ వెళ్తే స్తెఫను (అపో.కా 7:55) యోహాను కూడా ఆయనను చూసారు (ప్రకటన 1:13-16). మరి 1తిమోతికి 6:14-16 వాక్యభాగం ప్రకారం; వీరంతా చూసింది యేసుక్రీస్తును కాదా? దేవదూతనా? కాదు కదా, వారు చూసింది యేసుక్రీస్తునే. మరి "ఆయనను ఎవరూ చూడలేదు, చూడనేరరు" అని ఎందుకు రాయబడిందంటే వీరంతా చూసింది కేవలం ఆయన దర్శనాలనే తప్ప నేరుగా అంటే ప్రత్యక్షంగా ఆయనను చూడలేదు. దర్శనాలలో చూడడం వేరు, నేరుగా అంటే ప్రత్యక్షంగా చూడడం వేరు. ఉదాహరణకు; ఆయన యోహానుకు దర్శనమైనప్పుడు ఆయన తన కుడిచేతితో ఏడు నక్షత్రాలను పట్టుకున్నవాడిగా వర్ణించబడ్డాడు, కానీ ఆ ఏడు నక్షత్రాలూ ఏడు సంఘాలకు చెందిన దూతలని అక్కడే వివరించబడింది (ప్రకటన 1:16,20). అంటే ఈ దర్శనం అలంకారసంబంధమైనది. అదేవిధంగా ఆయన వధింపబడిన గొఱ్ఱెపిల్లలా కూడా అలంకారప్రాయంగా దర్శనమయ్యాడు (ప్రకటన 5:6). ఈ విధంగానే పాతనిబంధనలో తండ్రియైన దేవుణ్ణి కూడా ఆయా భక్తులు దర్శనాలలోనూ కలలలోనూ చూసారు తప్ప, శరీరధారియైన క్రీస్తులో బయలుపరచబడినట్టుగా (క్రీస్తును చూసినట్టుగా) నేరుగా ఆయనను చూడలేదు. యోహాను 1:18లో యోహాను చెబుతుంది ఇదే. ఇదే విషయం అతను తన మొదటిపత్రికలో కూడా జ్ఞాపకం చేస్తాడు (1 యోహాను 4:12). మోషే కూడా దేవుని నుండి ధర్మశాస్త్రం పొందుకునే సమయంలోనూ మరికొన్ని సందర్భాలలోనూ కేవలం ఆయన మహిమను చూసి, ఆయన స్వరాన్ని మాత్రమే విన్నాడు తప్ప ఆయన రూపాన్ని ప్రత్యక్షంగా శరీరధారియైన క్రీస్తులో బయలుపరచబడినట్టుగా చూడలేదు. కాబట్టి "దేవుణ్ణి ఎవరూ చూడలేదని" రాయబడిన యోహాను 1:18 వాక్యభాగం ఆధారంగా మోషేకు సీనాయి పర్వతంపై ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది దేవుడు కాదు దేవదూతలే అని రుజువు చెయ్యడం సాధ్యం కాదు. అయితే ఈ వాదనతో విభేదిస్తున్నట్టుగా ప్రస్తావించబడుతున్న వాక్యభాగాన్ని కూడా పరిశీలిద్దాం?
యోహాను సువార్త 5:37 మరియు నన్ను పంపిన తండ్రియే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు; మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు; ఆయన స్వరూపము చూడలేదు.
ఈ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు "మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు; ఆయన స్వరూపము చూడలేదు" అని యూదులతో పలకడం మనం చూస్తాం. దీని ఆధారంగా కూడా పాతనిబంధన ప్రవక్తలు ఎవరూ దేవుణ్ణి చూడలేదని, ఆయన స్వరం వినలేదని కొందరు వాదిస్తుంటారు. కానీ ఈ సందర్భాన్ని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు పాతనిబంధనలో ప్రవక్తలు పొందుకున్న ప్రత్యక్షతల గురించి కాదు కానీ యూదులకు దేవుని స్వరూపమైన ఆయన గుణలక్షణాలపట్ల, ఆయన స్వరమైన ఆజ్ఞలపట్ల తరతరాలుగా ఉన్నటువంటి అవిధేయత, కాఠిన్యహృదయాల గురించే ఈమాటలు చెబుతున్నాడని స్పష్టమౌతుంది. అందుకే ఆయన ఈమాటలను "మరియు నన్ను పంపిన తండ్రియే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు" అని ప్రారంభించి, వారు ఆ తండ్రి సాక్ష్యాన్ని తిరస్కరించడాన్ని ఎత్తి చూపిస్తున్నట్టుగా "మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు; ఆయన స్వరూపము చూడలేదు" అని ముగిస్తున్నాడు. ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవ్వడానికి ఈ వాక్యభాగం చూడండి.
యోహాను 8:1 వారు నీ తండ్రి యెక్కడ ఉన్నాడని ఆయనను అడుగగా "యేసు మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు".
ఈ వాక్యభాగంలో యేసుక్రీస్తు ప్రభువు తనను తిరస్కరిస్తున్న అదే యూదులతో "మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు" అంటున్నాడు. యూదులు తండ్రియైన దేవుణ్ణి ఎరుగకపోతే వారు దేవాలయం కట్టుకుని పూజిస్తుంది ఎవర్ని? తండ్రియైన దేవుణ్ణి కాదా? ఆయననే కదా!. కానీ ఈ మాటలు దేవునిపట్ల వారి అవిధేయతను, సూచించడానికే ఆయన ఉపయోగించాడు. కాబట్టి "మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు; ఆయన స్వరూపము చూడలేదు" అనే మాటలు దేవుని ప్రత్యక్షల గురించి ప్రస్తావించబడినవి కావని, దేవుని ఆజ్ఞలకూ ఆయన స్వరూపమైన గుణలక్షణాలకూ యూదులు చూపిస్తున్న అవిధేయతను ఎత్తి చూపించడానికే చెప్పబడినవని మనం గమనించాలి. ఇంతటితో పాతనిబంధనలో దర్శనమైందీ తన స్వరాన్ని వినిపించిందీ "దేవుడు కాదు దేవదూతలే" అనే వాదన ముగిసిపోయింది.
ఇప్పుడు "దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున" అనే మాటలకు భావం చూద్దాం. ఆ మాటలను పరిశీలించండి.
హెబ్రీయులకు 2:1-4 కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టు కొనిపోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు భోధించుటచేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా సూచకక్రియలచేతను, మహత్కార్యములచేతను, నానావిధములైన అద్భుతములచేతను, వివిధము లైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుటచేతను, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢ పరచబడెను.
ఈ సందర్భమంతటినీ మనం పరిశీలిస్తే హెబ్రీగ్రంథ కర్త గతంలో దేవదూతలు పలికిన మాటలను అతిక్రమించినవారే న్యాయమైన ప్రతిఫలం పొందుకున్నారు కాబట్టి, నేరుగా ప్రభువు చెప్పిన మాటలనే మీరితే మనం మరింత ప్రతిఫలం పొందుకుంటామని విశ్వాసులను హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ ఆయన ఉద్దేశం ప్రభువు బోధించడం చేత ఆరంభమైన రక్షణను ఉన్నతంగా చూపించడమే.
ఇందులో "దేవదూతలు పలికిన మాటలు" అని ప్రస్తావించబడిన దాని గురించి మనం రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు.
1. మోషేకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు అందులో దేవదూతల ప్రమేయం కూడా ఉందని పైభాగంలో చూసాము. ఆవిధంగా మరి కొన్ని సందర్భాలలో కూడా భక్తులకు ఆయన దేవదూతల ద్వారా తన మాటలను చేరవేసాడని దీని అర్థం.
2. హెబ్రీ పత్రికలో రాయబడిన ఈమాటల క్రింద సందర్భంలో దేవదూతల గురించిన ప్రస్తావన ఉన్నంతమాత్రాన, మనం చూసిన వచనంలోని దేవదూతలు, వారే అని మనం భావించవలసిన అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో దూతలు అనే పదప్రయోగాన్ని ప్రవక్తలకు కూడా వాడినట్టు మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు;
హగ్గయి 1:13 అప్పుడు యెహోవా దూతయైన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తనుబట్టి జనులకు ప్రకటించినదేమనగా నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే యెహోవా వాక్కు.
ఈ సందర్భంలో ప్రవక్తయైన హగ్గయి దూతగా సంబోధించబడ్డాడు.
(నూతన నిబంధనలో యెహోవా అనే నామాన్ని యూదులు ఉచ్చరించని కారణంగా యెహోవా దూతకు ముందున్న యెహోవాను తీసివేసి దేవదూతగా ప్రస్తావించారని స్తెఫను మాటల వివరణలో మనం చూసాం)
అదేవిధంగా
మలాకీ 3:1 ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను.
ఈ సందర్భంలో బాప్తీస్మమిచ్చు యోహాను దూతగా సంబోధించబడ్డాడు. అదేవిధంగా,
మలాకీ 2: 7 యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారినోట ధర్మశాస్త్రవిధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమునుబట్టి బోధింపవలెను.
(నూతన నిబంధనలో యెహోవా అనే నామాన్ని యూదులు ఉచ్చరించని కారణంగా యెహోవా దూతకు ముందున్న యెహోవాను తీసివేసి దేవదూతగా ప్రస్తావించారని స్తెఫను మాటల వివరణలో మనం చూసాం)
2 దినవృత్తాంతములు 36 :15,16 వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాసస్థలమందును కటాక్షము గలవాడై వారియొద్దకు తన దూతలద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచు వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను.
ఈ సందర్భాలలో కూడా యాజకులను, ప్రవక్తలను ఉద్దేశించి యెహోవా(దేవ)దూతలనే పదప్రయోగాన్ని చేసినట్టుగా మనం చూడగలం. ప్రవక్తలు, యాజకులు దేవుని ధర్మశాస్త్రాన్ని, ఆయన మాటలనూ పలుకుతూ ఉంటారు. వారి మాటలు వినని ఇశ్రాయేలీయులు, దేవునిచేత న్యాయమైన ప్రతిఫలం పొందడం పాతనిబంధనలో అనేకసార్లు మనకు కనిపిస్తుంది. కాబట్టి హెబ్రీ గ్రంథకర్త దీనిగురించే అక్కడ ప్రస్తావిస్తున్నాడని మనం భావించవచ్చు.
దీనిప్రకారం; అదేవిధంగా పైన చూసిన వివరణల ప్రకారం; మోషేకు ధర్మశాస్త్రాన్ని దేవుడే అనుగ్రహించాడనీ ఆత్మప్రేరేపితులైన రచయితలు తమ లేఖనాలలో దేవదూతలను దేవునిగా యెహోవాగా ప్రస్తావించలేదని స్పష్టం అయ్యింది.
3 యెహోవా దూత, యేసుక్రీస్తు:
ఈ దూత గురించి యెహోవా దేవుడు చెప్పిన మాటలను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం;
నిర్గమకాండము 23:20-23 ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగానుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు; మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, "నా నామము ఆయనకున్నది". అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినయెడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునై యుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగావెళ్లుచు, అమోరీయులు హిత్తీయులు పెరిజ్జీయులు కనానీయులు హివ్వీయులు యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించెదను.
ఈ సందర్భంలో యెహోవా దేవుడు, యెహోవా దూతగా దేవుని దూతగా దూతగా యెహోవా దేవునిగా పిలవబడిన దూతగురించి మాట్లాడుతూ ఆయనకు "నా నామం" ఉందని తెలియచేస్తున్నాడు. ఈ కారణం చేతనే ఆయన యెహోవా అని పిలువబడ్డాడని ఇప్పటికే వివరించుకున్నాం. దీనిప్రకారం ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి కనానుకు నడిపించిన దేవుడు ఆ దూతయే అని మనకు అర్థం ఔతుంది, ఆ ప్రయాణంలో ఇశ్రాయేలీయులు తమను నడిపించిన దేవుణ్ణి ఎంతగానో శోధించినట్టుగా బైబిల్ మనకు సాక్ష్యమిస్తుంది (కీర్తనలు 78: 18, కీర్తనలు 78: 41, కీర్తనలు 106: 14). అంటే ఇశ్రాయేలీయులను కనానుకు నడిపించడానికి దేవుడు వారికి ముందుగా పంపినటువంటి దేవుడైన దూతను వారు శోధించారు. ఇప్పుడు పౌలు మాటల్లో వారు శోధించింది ఎవరినో చూడండి.
1 కొరింథీయులకు 10:8,9 మరియు వారివలె మనము వ్యభిచరింపకయుందము; వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి. మనము ప్రభువును (కొన్నిప్రాచీన ప్రతులలో-క్రీస్తును అని పాఠాంతరము) శోధింపకయుందము; వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి.
ఈ సందర్భంలో పౌలు మనం ప్రభువును శోధించకూడదనీ ఇశ్రాయేలీయులు ఆయనను శోధించి నశించారని చెబుతున్నాడు. ప్రాచీన ప్రతులలో అక్కడ క్రీస్తు అని ఉండడం గమనించండి దీనిప్రకారం ఆ దూత త్రిత్వంలో రెండవ వ్యక్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువే. మరికొన్ని సందర్భాలు చూడండి;
యోహాను 5: 43 నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను.
ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు తాను తండ్రి నామాన్ని కలిగియున్నట్టు తనగురించి సాక్షమిస్తున్నాడు. యెహోవా దేవుడు తన దూతకు ఆయన నామం ఉందని చెప్పినమాటలను ఇప్పటికే మనం చూసాం (నిర్గమకాండము 23:20,21).
మలాకీ 3:1 ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
ఈ సందర్భంలో బాప్తిస్మమిచ్చు యోహాను గురించీ ప్రభువైన యేసుక్రీస్తు గురించీ ప్రవచనాలు రాయబడ్డాయి. వచన ప్రారంభంలో చెప్పబడిన దూత యోహాను ఐతే తదుపరి చెప్పబడిన నిబంధన దూత యేసుక్రీస్తు ప్రభువు. ఇక్కడ ఆయన దూతగా ప్రస్తావించబడ్డాడు. దీనిప్రకారం కూడా యెహోవా దూత త్రిత్వంలో రెండవ వ్యక్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువేయని మరింత స్పష్టంగా అర్థం ఔతుంది.
జెకర్యా 2:5-11 "నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే యెహోవా వాక్కు". ఉత్తర దేశములో ఉన్నవారలారా, తప్పించుకొని రండి "ఆకాశపు నాలుగు వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసియున్నాను ఇదే యెహోవా వాక్కు". బబులోను దేశములో నివాసివగు సీయోనూ, అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము ఇదే యెహోవా వాక్కు. "సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా" మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యెంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి, మిమ్మును దోచుకొనిన అన్యజనులయొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. నేను నా చేతిని వారిమీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు "అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలిసికొందురు". సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును; సంతోషముగా నుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసముచేతును; అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలిసికొందురు.
ఈ సందర్భంలో యెహోవా మాట్లాడుతూ (నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును..), అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకుని ఆయనను జనులౌతారని, యెహోవా తనను పంపాడని వారు తెలుసుకుంటారని అంటున్నాడు. మనమధ్యకు వచ్చి నివాసం చేసిందీ (హెబ్రీ 2:14-16, ఫిలిప్పీ 2:6-8) అన్యజనులు తండ్రియైన యెహోవాను హత్తుకునేలా చేసిందీ (రాజ్యంగా - ప్రకటన 5:9,10) ప్రభువైన యేసుక్రీస్తే కదా!
యెషయా గ్రంథము 48:11-17 నా నిమిత్తము నా నిమిత్తమే ఆలాగు చేసెదను నా నామము అపవిత్రపరచబడనేల? నా మహిమను మరి ఎవరికిని నేనిచ్చువాడను కాను. యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నాకు చెవి యొగ్గి వినుము. "నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను నా హస్తము భూమి పునాదివేసెను నా కుడిచెయ్యి ఆకాశవైశాల్యములను వ్యాపింపజేసెను నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండ అవన్నియు నిలుచును". ఆదినుండి నేను రహస్యముగా మాటలాడినవాడను కాను అది పుట్టినకాలము మొదలుకొని నేను అక్కడనున్నవాడను "ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను". "నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు" నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.
ఈ వాక్యభాగంలో కూడా ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా మాట్లాడుతూ ఆయనను మరొక యెహోవా ఆయన ఆత్మ కలసి పంపినట్టుగా చెబుతున్నాడు. తండ్రియైన యెహోవా నిర్ణయం చొప్పున (గలతీ 4:4, 1 యోహాను 4:9,10), పరిశుద్ధాత్ముడి అద్భుతం కారణంగా (లూకా 1:35, యెషయా 11:1,2) ఈ భూమిపైకి దైవమానవునిగా విచ్చేసింది (పంపబడింది) యేసుక్రీస్తు ప్రభువే కదా!
అదేవిధంగా యెహోవా దూత దేవుడు కాడనే అభ్యంతరాలకు నేను సమాధానం ఇస్తున్న క్రమంలో యోహాను 1:18ను ప్రస్తావించి, ఆ వాక్యభాగం దేవుని దర్శనాలు, కలలకోసం కాదని శరీరధారియైన క్రీస్తులో మాత్రమే దేవుడు సంపూర్ణంగా భౌతికంగా బయలుపరచబడ్డాడన్న విషయం నొక్కి చెప్పడానికే యోహాను ఆ మాటలను రాస్తున్నాడని వివరించాను. అయితే "తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను" అన్నప్పుడు అది నూతనిబంధనలో మాత్రమే జరిగింది కాదు, యెహోవా/యెహోవా దూతయైన ఆయన శరీరం ధరించుకుని, ఆదికాండము 18వ అధ్యాయంలో అబ్రాహాముకు ప్రత్యక్షమైనప్పుడూ యాకోబుతో నరుడిగా పోరాడినప్పుడూ సంసోను తండ్రియైన మనోహకు ప్రత్యక్షమైనప్పుడు కూడా ఆయనలో వారికి తండ్రిని (దేవుణ్ణి) బయలుపరిచాడు. "ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను" అన్నప్పుడు ఆ మాటల్లో ఆయన శరీరధారిగా భౌతికంగా అనుగ్రహించిన ఈ ప్రత్యక్షలు కూడా నిక్షిప్తమైయున్నాయి. ఎందుకంటే నేను ఆ సందర్భంలో వివరించినట్టుగా దర్శనాలూ కలలలో తప్ప తండ్రియైన దేవుణ్ణి ఎవ్వరూ ఎప్పుడూ నేరుగా భౌతికంగా చూడలేదు. యెహోవా దూతగా సంబోధించబడి, శరీరధారిగా వచ్చిన ఆయనలో మాత్రమే ఎవ్వరైనా తండ్రిని (దేవుణ్ణి) చూసారు. ఈవిధంగా పాతనిబంధనలో యెహోవా దూతగా ప్రత్యక్షమైంది యేసుక్రీస్తు ప్రభువే అని చెప్పడానికి యోహాను 1:18 కూడా ఒక మంచి ఆధారం. పాతనిబంధనలో ఆయనే యెహోవా దూతగా ప్రత్యక్షమౌతూ వచ్చాడు. "బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను" (మీకా 5:2).
చివరిగా దేవదూతలు దేవునికి చెందవలసిన మహిమను పొందుకోవు అనేదానిని కూడా వివరించుకుందాం. ఈ వాక్యభాగం చూడండి;
ప్రకటన గ్రంథము 22:8,9 యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను; నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, అతడు - వద్దుసుమీ, నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొనువారితోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను.
ఈ సందర్భంలో యేసు శిష్యుడైన యోహాను ఒక దేవదూతకు నమస్కరించే ప్రయత్నం చేసినప్పుడు, ఆ దూత అతనిని అడ్డుకుంటూ దేవునికే నమస్కారం చెయ్యమని చెబుతున్నాడు. దీనిని బట్టి దేవదూతలు దేవునికి చెందవలసిన మహిమను స్వీకరించరని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే "ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నది" (మత్తయి 4:10). అయితే కొందరు లోతు ఇద్దరు దేవదూతలకు నమస్కరించిన సందర్భాన్ని చూపిస్తూ (ఆదికాండము 19:1,2) దేవదూతలు కూడా భక్తుల ఆరాధనను స్వీకరిస్తారని భావిస్తారు. కానీ ఆ సందర్భంలో లోతు ఇంటికి వచ్చిన దేవదూతలు, మనుష్యులుగా అతిధిలుగా వచ్చారు. ఆకాలంలో అతిథులకూ కొందరు ప్రముఖ వ్యక్తులకూ సాష్టాంగ నమస్కారం చెయ్యడం సర్వసాధారణం. అలానే లోతుకు తన ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులూ దేవదూతలు అని తెలియదు. దానిగురించే "ఆతిథ్యము చేయ మరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి" (హెబ్రీ 13: 2) అని రాయబడింది. ఒకవేళ లోతుకు వారు దేవదూతలని తెలిసుంటే సొదొమ మనుష్యులు వారిని బలత్కరించబోయినప్పుడు, వారిని కాపాడడానికి తన కూతుళ్ళను అప్పగించే ప్రయత్నం ఎందుకు చేస్తాడు? (ఆదికాండము 19:5-9). వచ్చిన వారు దేవదూతలు కాబట్టి తమను తాము కాపాడుకోగలరని ధైర్యంగా ఉండేవాడు. ఆవిధంగా ఆ దేవదూతలిద్దరూ మానవరూపాల్లో అతిథులుగా లోతు దగ్గరకు వచ్చారు కాబట్టి అతని సంస్కృతి ప్రకారం లోతు వారికి సాష్టాంగ నమస్కారం చేసినప్పటికీ వారు అతడిని అడ్డుకునే ప్రయత్నం చెయ్యలేదు.
మరికొందరు దానియేలు సందర్భాన్ని కూడా అపార్థం చేసుకుని దూతలముందు సాష్టాంగపడే పద్ధతి పాతనిబంధన భక్తులకు ఉందని చెబుతుంటారు, దానిని కూడా చూడండి.
దానియేలు 8:17 అప్పుడతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను; అతడు రాగానే నేను మహా భయమొంది సాష్టాంగపడితిని; అతడు నరపుత్రుడా, యీ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలిసికొనుమనెను.
ఈ సందర్భంలో దర్శనభావాన్ని తెలియచెయ్యడానికి వచ్చిన గబ్రియేలుకు దానియేలు సాష్టాంగపడినట్టుగా కనిపిస్తుంది. కానీ ఈ క్రింది వాక్యభాగాన్ని కూడా మనం పరిశీలిస్తే దానియేలు ఉద్దేశపూర్వకంగా దేవునికి చేసినట్టుగా అతనిముందు సాష్టాంగపడలేదనీ అతనికి కలిగిన భయం వల్ల, గాఢనిద్రపట్టి నేలన సాష్టాంగపడ్డాడని (కూలబడ్డాడని) అర్థమౌతుంది.
దానియేలు 8:18 అతడు నాతో మాటలాడుచుండగా నేను గాఢనిద్రపట్టినవాడనై నేలను సాష్టాంగపడితిని గనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలువబెట్టెను.
ఈవిధంగా మరో సందర్భం కూడా మనకు కనిపిస్తుంది.
దానియేలు 10:9,10 "నేను అతని మాటలు వింటిని; అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢనిద్ర పొందినవాడనైతిని. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేలమోపి నన్ను నిలువబెట్టి"
ఈ వ్యాసంలో ప్రస్తావించబడిన త్రిత్వ సిద్ధాంతం గురించి తెలుసుకోడానికి ఈ వ్యాసం చదవండి.
మరికొన్ని అవాంతర శాఖలవారు యేసుక్రీస్తు నిత్యుడు కాదని ఆయన దేవుని చేత పరలోకంలో ముందుగా సృష్టించబడినవాడని బోధిస్తుంటారు ఆ దుర్భోధకు సమాధానం తెలుసుకోవడానికి ఈ వ్యాసం కూడా చదవండి.
యేసుక్రీస్తు నిత్యుడు కాదా? పరలోకంలో పుట్టినవాడా?
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
Comments