నిజ క్రైస్తవ జీవితం

రచయిత: జి. బిబు

ఆడియో

Article Release long sharing gospel min

మన ప్రభువు తన శిష్యులకు అప్పగించిన గొప్పబాధ్యత ఈ సువార్తీకరణ. కనుక, ఆయన శిష్యులమైన మనం ఈ గొప్పబాధ్యతకు ఎల్లప్పుడూ విధేయులై ఉండటము ఎంతో ఆవసరం.

''యజమానుడు వచ్చినపుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు''(మత్తయి 24:46)

ఐతే, మనం యథార్థమైన సువార్తీకరణకు పూనుకునే ముందు, ఆ విషయమై లేఖనంలోని ప్రాథమిక సూత్రాలను ధ్యానించడం అత్యవసరం. లేఖనమిచ్చే బాధ్యత తప్పనిసరిగా లేఖనాధారమైన సూత్రాల ద్వారానే నడిపించబడి, బైబిల్ అనే పునాది మీద మాత్రమే కట్టబడాలి. పునాదిలో లోపముంటే దానిపై కట్టబడిన నిర్మాణం కూడా లోపభూయిష్టమౌతుంది. దోషరహితమైన దేవుని వాక్యంపై కట్టబడని ప్రతినిర్మాణం దోషపూరితమౌతుంది. అంతేకాక, ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించని ఏ విధానాన్నీ ప్రభువు సమ్మతించడు. కాబట్టి , సువార్తీకరణ విషయంలో ఆయన దృష్టికి అంగీకారమైనదేదో తెలుసుకోవటానికి అత్యంత శ్రద్ధాసక్తులతో  బైబిలును పరిశీలించాలి. సువార్తీకరణ గురించి సరైన పునాది ఏర్పరచుకోవటానికి లేఖనాలలో కొన్ని అంశాలను ఇపుడు ప్రార్థనాపూర్వకంగా ధ్యానిద్దాము.

ఈ ధ్యానానికి మనము అనుసరించబోయే విధానం చాలా సులువైంది. ముందుగా ఒక ప్రశ్నను లేవనెత్తి , ఆపై ఆ ప్రశ్నకు సమాధానం బైబిలు నుండి ఇస్తాము. దీనివలన మౌలిక సూత్రాలపై మనం దృష్టి కోల్పోయి, మనకు తోచిన విధంగా సువార్తీకరణ చేయడం నుండి తప్పించుకోగలం.

ప్రాథమికసూత్రాలు

1.సువార్తీకరణ అంటే ఏమిటి?

మత్తయి 28:19-20లో, ఈ గొప్పబాధ్యతను మనకు అప్పగిస్తూ, ప్రభువు స్వయంగా సెలవిచ్చిన మాట ప్రకారం మాత్రమే మనము సువార్తీకరణను నిర్వచించాలి. ''కాబట్టి మీరు వెళ్ళి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను''.
ఈ వాక్యభాగంలో ప్రభువు మనల్ని,
ఎ) సమస్తజనులను శిష్యులను చేయమని,
బి) తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తీస్మమివ్వమని,
సి) ఆయన ఏయే సంగతులను ఆజ్ఞాపించాడో వాటినన్నిటిని గైకొనేలా వారికి బోధించమని ఆజ్ఞాపించాడు.
ఇక్కడ మనం, ''శిష్యులనుగా చేయుడి'' అన్న మాటని ''నేను ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైగొనవలెనని వారికి బోధించుడి'' అనే మాటతో కలిపి చదివినపుడే మనకు నిర్వచనం పూర్తిగా అర్థమౌతుంది. బోధకుడు ఏమి బోధించాలని కోరుకుంటున్నాడు  లేదా శిష్యుడు ఏమి నేర్చుకోవాలని కోరుకుంటున్నాడు అని కాకుండా, ఆయన ఏయే సంగతులను గైకొనాలని ఆజ్ఞాపించాడో వాటిని బోధించి వారిని యేసుక్రీస్తు ప్రభువుకు శిష్యులుగా చేయాలని పై లేఖనభాగం స్పష్టం చేస్తుంది. ఈ వెలుగులో సరిపోల్చినపుడు నిజమైన సువార్తీకరణకీ, ఒక వ్యక్తి తనకై అనుచరులను పెంచుకోవటానికి మధ్య ఎంతో తేడా ఉందని స్పష్టమౌతుంది. బైబిల్ ప్రకారం సువార్తీకరణ అంటే యేసుక్రీస్తు ప్రభువుకు శిష్యులుగా చేయటమే కానీ, ప్రజలు నా బోధలను అనుసరించేలా చేయటమూ కాదు, నా సంఘంలో సభ్యులసంఖ్యను పెంపొందించుకోవడము అంతకన్నా కాదు. దీనిని మనం గమనించాలి.

శిష్యులను చేసుకోవాలని అత్యుత్సాహం కనపరచిన కొందరిని మన ప్రభువు ఖండించినట్లు మనం బైబిలులో చూస్తాము.  ఒకనిని తమ మతంలో కలుపుకోవటానికి (అంటే, తమ శిష్యులుగా చేసుకోవటానికి) వారు సముద్రాన్ని, భూమినీ చుట్టి వస్తారు. కానీ, అతడు కలిసినపుడు, అతనిని వారికంటే రెండింతలు నరకపాత్రునిగా చేస్తారని మనం మత్తయి 23ః15 వ వచనంలో పరిసయ్యుల విషయమై చదువుతాము. ఆ పరిసయ్యుల్ని గద్దించటానికి గల ఒకానొక కారణమేంటంటే, వారు దేవుడైన యెహోవాకు శిష్యులను తయారుచేసి దేవుడిని తమ యజమానిగానూ, తండ్రిగానూ పిలవటానికి ఆ శిష్యులను నడిపించటం మాని, తమకే శిష్యులుగా చేసుకుని, వారి చేత బోధకులుగా పిలిపించుకోవాలని ఇష్టపడ్డారు (మత్తయి 23:7) . అటువంటి పరిసయ్యుల సువార్తీకరణను మనమీనాడు ప్రతి చోటా చూడగలము. వారి ప్రసంగాల్ని వినటానికి క్రమంగా మనుష్యులు హాజరైతే చాలు, ఈ చౌకబారు సువార్తీకులు దానితోనే సరిపెట్టుకుంటారు. మనుష్యులను చర్చికి తీసుకురావటం మరియు వారిని క్రీస్తు దగ్గరకు తీసుకురావటం, ఈ రెండిటి మధ్య ఉన్న తేడాను వారు చూడరు. వారి బోధను వింటూ, తమ కానుకలను ఇస్తూ, తమ విశ్వాసాన్ని బహిరంగంగా ప్రదర్శించే జనం క్రమం తప్పకుండా వారి చర్చిలకు హాజరైతే వారు సంతృప్తిపడిపోతారు.

తమకు శిష్యులను చేసుకోవడానికీ, మరియు క్రీస్తుకు శిష్యులను చేయడానికీ మధ్య ఉన్న తేడాను వారు అర్థం చేసుకొనుంటే, వేరెక్కడో కాక వారి సంఘాల్లోనే  ఎంతో సువార్తీకరణ చేయవలసిన అవసరాన్ని స్పష్టంగా చూడగలిగి ఉండేవారు. ఎందుకంటే తమ పెదాలతో క్రీస్తు నామాన్ని ఉచ్చరించే అనేకులు, తమ జీవితాలలో ఒక్కసారి కూడా ఆయన కాడిని మోసినవారు కారు, ఆయనకు నిజమైన శిష్యులుగా ఉండటానికి ఆయనను తెలుసుకున్నవారు అంతకన్నా కాదు; సువార్తికుని అసలు పిలుపు వారిని యేసుక్రీస్తు ప్రభువుకు శిష్యులుగా చేయటమే. ప్రజల్ని ఒక మతాన్ని అనుసరింపజేయటము సులువైన విషయమే కానీ వారిని ప్రభువైన యేసుక్రీస్తును అనుసరింపజేయటమే అసలు విషయం. చూడటానికది ఎంత గంభీరంగా ఉన్నాసరే, యేసుక్రీస్తు ప్రభువుకు శిష్యులను చేయటం కాకపోతే, అసలది సువార్తీకరణే కాదు.

2.సువార్తీకరణ ఎందుకు చేయాలి?

ఎందుకు సువార్తీకరణ చేయాలి అన్న విషయమై లేఖనాలలో నుండి మూడు కారణాలని ఉదహరించవచ్చు.

ఎ) ప్రభువే సువార్త చెప్పమని మనల్ని ఆజ్ఞాపించాడు. ( మార్కు 16:15 , మత్తయి 28:19,20 ) సువార్త చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంచాడు. చెప్పకపోతే ఆయన మనల్ని ఉత్తరవాదుల్ని చేస్తాడు. ( రోమీయులు 1:14-16, 1కొరింథి 9:16, అపో కార్యములు 18:6, యెహెజ్కేలు 3:18-21)

బి)లోకానికి వెలుగుగా ఉండటం తిరిగి జన్మించినవారి స్వభావం (మత్తయి 5:14-16). అలాగే, సువార్త విషయమై సిగ్గుపడటం తిరిగి జన్మించనివారి లక్షణం.

సి) సువార్త, దేవుడు ఎన్నుకున్నవారికి రక్షణార్థమైన కృపను తెలియజేయటానికీ, నశించేవారికి తమ భక్తిహీనతకు తగిన శిక్ష విధించటానికీ, దేవుడే ఏర్పరచిన ఉపకరణం (2కొరింథీ 2:14-16). సువార్త, తప్పిపోయిన తన గొఱ్ఱెలను వెదకి రక్షిస్తూ, వాటిని తన గొఱ్ఱెలు కానివాటినుండి వేరుపరిచే కాపరి స్వరం (యోహాను 10:26-27, 1యోహాను 4:6; మార్కు 16:16).

3.సువార్తీకరణ ఎపుడు చేయాలి?

''వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్ధించుము బుద్ధి చెప్పుము'' (2 తిమోతి 4:2)

సమయమందును, అసమయమందును. ఇంకొకమాటలో చెప్పాలంటే, పరిస్థితులు అనుకూలించినపుడు, ప్రతికూలించినపుడు, అవి సహకరించినపుడు, అడ్డగించినపుడు, శ్రమలో, సమాధానంలో, అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో, మనం సువార్తను నమ్మకంగా ప్రకటించాలి.

4.సువార్తీకరణ ఎక్కడ చేయాలి?

ఇందుకు సమాధానంగా, దైవజనుడైన ఆర్థర్‌.పింక్‌ ఇలా అన్నాడు. 'ఇప్పుడు నేనెక్కడికి వెళ్ళాలి? అని నువ్వంటే, అది చాలా సులువని నేనంటాను. సులువా? అని నువ్వు ప్రశ్నిస్తే, అవును చాలా సులువని నేనంటాను. మిషనరీ పనిని ఎక్కడ ప్రారంభించాలని తెలుసుకోవడం కన్నా ప్రపంచంలో సులువైన విషయమేమీ లేదు. ఆ విషయమై అపో.కార్యాలు1ః8వ వచనంలో ఇలా చదువుతాము, ''అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను (వారున్న పట్టణంలోను) యూదయ (వారి పట్టణమున్న దేశంలోను) సమరయ (పొరుగు దేశంలోను) దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.'' మీరు మిషనరీ పనిని ప్రారంభించాలంటే, మీరు నివసించే ప్రదేశం నుండే మొదలుపెట్టాలి; ఆస్ట్రేలియాలో ఉన్న చైనీయుల రక్షణ పట్ల మీకు ఆసక్తి లేకపోతే ప్రియులారా, మీకు చైనాలో ఉన్న చైనీయుల రక్షణ పట్ల కూడా ఆసక్తి లేదని అర్థం. ఒకవేళ ఉందనుకుంటే, అది మిమ్మల్ని మీరు మోసపరచుకోవడమే (ఆర్థర్‌ డబ్ల్యూ.పింక్‌,గాస్పెల్‌ప్రీచింగ్‌ కమాండెడ్‌)
భారతదేశములో ఉన్న నా సహక్రైస్తవులకు నేను చెప్పాలనుకున్నది కూడా ఇదే. భారతదేశములో రక్షింపబడనివారి పట్ల మీకు ఆసక్తి లేకపోతే, మరెక్కడో ఉన్న రక్షింపబడనివారి పట్ల కూడా మీకు ఆసక్తి లేనట్లే. చేయాల్సింది ఎంతో ఇక్కడే ఉన్నప్పుడు, మిషనరీ పని కొరకు వేరెక్కడికో నడిపించమని ప్రభువును కోరడమెందుకు?

5.సువార్తీకరణ ఎలా చేయాలి?

''దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటనయను వెఱ్ఱితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసుదేశస్థులు జ్ఞానం వెదకుచున్నారు. అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునైయున్నాడు'' (1కొరింథీ 1:21-24)

సువార్తను బోధించడమొక్కటే సువార్తీకరణకు దేవుడు నియమించిన ఉపకరణం. ఇది పాతపద్ధతని చెప్పి, దీనికి తమ సొంత పోకడలని, కొత్త పద్ధతుల్ని జోడించేవారు, తాము దేవుని కన్నా జ్ఞానులమని, దేవుని కన్నా మెరుగుగా ఆలోచించగలమని చెప్పినట్లు  ఔతుంది. ఆయన నియమించిన పద్ధతికాక మరే విధానాన్నీ పరిశుద్ధాత్మ శక్తినిచ్చి ప్రభువు సమర్థించడు (1థెస్సలోనికయులు 1:5). ఎంత బలహీనంగా, వెఱ్ఱితనంగా, పురాతనంగా అనిపించినా, దేవుడు నియమించిన విధానము మాత్రమే చివరకు ఫలిస్తుంది. ( జెకర్యా 4:6, 1కొరింథీ 1:21)

నరుని హృదయం ఎంత ఘోరమైన వ్యాధి కలదంటే సువార్తీకరణ వంటి గంభీరమైన విషయాన్ని సైతం తన పాపేచ్ఛలను సమర్థించుకోవడానికి ఒక సాకుగా ఉపయోగించుకుంటుంది. ఇందుకే, సువార్తకు సహాయపడేంత మేరకు, వాక్యానుసారం కాని విధానాలు కూడా అనుసరించవచ్చని కొందరు చెబుతుంటారు. లక్ష్యం నెరవేరితే చాలు విధానాలు ఎలాంటివైనా పర్లేదని ఇటువంటివారి వాదన. ఉదాహరణకు, రక్షణ వైపు నడిపించటానికి, ఒక అవిశ్వాసిని పెళ్ళి కూడా చేసుకోవచ్చని వీరంటారు.ఇది లేఖనవిరుద్ధం; మారుమనస్సు కలిగించేది మానవప్రభావం కాదు గానీ, పరిశుద్ధాత్ముని కార్యమని ఇలాంటివారు మరచిపోయినట్టు అనిపిస్తుంది. అలాగే, క్రిస్‌మస్, ఈస్టర్‌ మొదలైన సాంప్రదాయిక చర్చి ఆచారాలను అనుసరించటం సామాన్యంగా మనకు కనిపించే ఇంకొక ఉదాహరణ.ఇటువంటి ఆచారాలు, అపోస్తలులబోధ నుండికాక, నిషేదింపబడిన అన్యమతాచారాల నుండి ఆవిర్భవించి, ఆపై రాజకీయ ప్రయోజనాల నిమిత్తం రోమన్‌ కేథలిక్కు సంఘం చేత క్రైస్తవీకరించబడినవని తెలిసి కూడా, సువార్తీకరణకు సహాయపడేంత మేరకు, ఈ ఆచారాల వల్ల ఏ ప్రమాదము ఉండదని వీరు భావిస్తారు. లేవీకాండం10ః1,2 వచనాలలో గ్రంథస్తం చేయబడిన హెచ్చరికను సైతము వీరు మరిచారేమో అనిపిస్తుంది. 1సమూయేలు 15ః22,23 వచనాల్లోని సూత్రాన్ని అన్వయిస్తూ సువార్తీకరణ చేయటం కంటే విధేయత చూపడం ఉత్తమమని నిజమైన క్రైస్తవుడు ఎన్నడూ మరిచిపోకూడదు. అంటే, నిజ క్రైస్తవుడు సువార్తీకరణ చేయకూడదని కాదుకానీ, అతడు బైబిల్లోని కట్టడలకు, శాసనాలకు ఖచ్చితంగా బద్ధుడై మాత్రమే సువార్తీకరణ చేయాలి. సువార్త బోధ మాత్రమే సువార్తీకరణను నిజంగా ఫలింపజేస్తుంది -  ఆ బోధ నోటిమాటైనా సరే, రాయబడినదైనా సరే, లేఖనం నిషేధించని మరే విధానమైనా సరే.

6.సువార్తీకరణ ఎవరు చేయాలి?

సువార్తీకరణలో ప్రతి క్రైస్తవుడూ పాల్గొనాలి (కీర్తన 107:2) . ఐనప్పటికీ, క్రైస్తవుడు ఇతరులకు సువార్త బోధిస్తున్నపుడు దేవుని వాక్యానికి అవిధేయంగా తన జీవితంలో ఎటువంటి క్రియలేదని మొదట రూఢిపరచుకోవాలి (రోమా 2:21-24) .  51 కీర్తనలోని దావీదు ప్రార్థన ఈ సత్యాన్ని మరింత బలపరుస్తుంది. అతను బత్షెబ విషయంలో చేసిన హేయమైన అతిక్రమాన్ని బట్టి పశ్చాత్తాపంతో, ''దేవా నా యందు శుద్ధహృదయము కలుగజేయుము.......... సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము'' అని ప్రార్థించిన తర్వాతే ''అపుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను'' అని ప్రకటించగలిగాడు. ప్రతీ సువార్తికుడు, ఈ విధంగా తన పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టిన తర్వాత మాత్రమే అతిక్రమం చేసేవారికి సరైన మార్గాన్ని బోధించటం ప్రారంభించాలి. దేవుని వాక్యాన్ని పెడచెవిని పెడుతూ, వారి జీవితాలలో దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేసేవారు, తమ సువార్త ప్రకటనను ప్రభువు ఆమోదిస్తాడని ఎన్నడూ ఉహించకూడదు (కీర్తనలు 50:16-17) . ఇతరులకు సువార్త ప్రకటించి వారే భ్రష్టులైౖపోయే ప్రమాదముంది (1కొరింథి 9:27) . ప్రతిరోజు దేవునితో సన్నిహితంగా నడిచే ప్రతి క్రైస్తవుడు సువార్తను బోధించాలి. అటువంటివారు మాత్రమే దేవుని రాజ్యవ్యాప్తిలో పాల్గొనాలి.

దేవుడు ఈ ధ్యానాన్ని దీవించి సరైన నిర్వచనంతో, సరైన కారణంతో, సరైన విధానంలో, సరైన హృదయంతో ఆయన కార్యాన్ని, ఆయన చెప్పిన రీతిగా మనం అన్ని వేళలా చేయటానికి, ఆయన తన కృపను అనుగ్రహించును గాక, ఆమెన్‌.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.