దుర్బోధలకు జవాబు

రచయిత: హితబోధ నెట్వర్క్
చదవడానికి పట్టే సమయం: 7 నిమిషాలు

 

కాల్వినిజాన్ని దుర్బోధగా చిత్రీకరించి, అందరిచేత దాన్ని ఛీకొట్టించటానికి పగడాలగారు వాక్యాన్ని ఎన్ని విధాలుగా వక్రీకరిస్తున్నారో పాఠకులకు గత మూడు భాగాలలో నిరూపించాం. ఈ క్రమంలోనే కాల్వినిజం దేవునిని పాపానికి కర్తగా చేసే బోధ అని అందరినీ నమ్మించే ప్రయత్నమే ఇతని ఎత్తుగడలలో అత్యంత హాస్యాస్పదమైన ప్రయోగమని చెప్పుకోవచ్చు. కాల్వినిస్టుల వాక్యపరిణతిని ఎదిరించే సత్తా తన వక్ర వ్యాఖ్యానాలకు లేవని తెలుసు కాబోలు, అందుకే పేరెన్నికగల కాల్వినిస్టుల మాటలకయినా కొంత రంగు పులమగలిగితే, అదైనా, కనీసం కొందరి దృష్టినైనా మరల్చదా అని ఈ స్కెచ్ వేసినట్టున్నారు.

A.W. పింక్ గారు పాపం కూడా దేవుని చిత్తంలో భాగమని చెప్పిన మాటలు మాత్రమే చూపించి, అంతమాత్రాన అది దేవునిని పాపానికి కర్తగా చేయదని ఆయన చెప్పిన మాటలను తెలివిగా  దాచిపెట్టిన ఇతను, మళ్ళీ అదే  వక్రప్రయోగాన్ని జాన్ మెకార్థర్ గారిపై చేయటం, అసలు ఈ వ్యక్తికి మనఃసాక్షి అనేదేమైనా ఉందా అనే అనుమానాలకు  తావిస్తుంది. ఈమేరకు ఒక వీడియో చేసి , 'పాపాన్ని దేవుడు ఎందుకు అనుమతించాడు' అనే ప్రశ్నకు జాన్ మెకార్థర్ గారు చెప్పిన సమాధానం, దేవునిని పాపానికి కర్తగా చేస్తుందని అబద్ధ చిత్రీకరణ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఆ వీడియో లింక్ ఇవ్వబడింది - https://youtu.be/jDBCyU2cBQk

ఇంతకూ పాపాన్ని దేవుడు అనుమతించాడా లేదా అనే విషయంలో పగడాలగారికి సందేహమేమీ లేనట్టు కనబడుతుంది. 'ఎందుకు అనుమతించాడు?' అనే తన ప్రశ్నలో పరిశీలించేది కారణమే తప్ప అనుమతించాడా లేదా అన్నది కాదు కదా. కాబట్టి దేవుడు పాపాన్ని అనుమతించాడని కాల్వినిస్టులతో ఆర్మీనియన్లు, ఈ రెండు కామని చెప్పుకునే పగడాలలాంటివారు కూడా ఏకీభవిస్తారన్నమాట. దేవుడు అనుమతించలేదని చెబితే, మరి దేవునిని అధిగమించి పాపం ప్రవేశించిందా అనేది అంతకంటే చిక్కు ప్రశ్న ఔతుంది కదా మరి?

సరే, అదలా ఉంచి, ఈ ప్రశ్నకు జాన్ మెకార్థర్ గారి సమాధానమేమిటో ఒకసారి పరిశీలిద్దాం. 'అది దేవుని నిర్ణయం, ఆయన చిత్తంలో భాగం, అయినా అది దేవునిని బాధ్యుడ్ని చేసేవిధంగా ఆయనను పాపానికి కర్తగా చేయదు' అన్నది మెకార్థర్ గారు, పింక్ గారు, ఇంకా అనేకమంది కాల్వినిస్టులు చెప్పే సమాధానం. పాపాన్ని అనుమతించటం ఆయన నిర్ణయమైతే, ఆ నిర్ణయం ఆయన చిత్తంలో భాగమైతే, దానిని ఒప్పుకున్నవారు దేవునిని పాపానికి కర్తగా చేస్తున్నారని చెప్పటం పరమఛండాలమైన తర్కమని మన వక్రగురువులకు తెలియక కాదు, వేరే గత్యంతరం లేక ఆ చివరి అస్త్రాన్ని కాల్వినిస్టులపై ప్రయోగిస్తున్నారు. అనుమతించాలా, వద్దా అనే రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడు, అనుమతించాలని తీర్మానించుకోవటాన్ని నిర్ణయమని పిలవకూడదా? నిర్ణయాలు చిత్తంతో నిమిత్తం లేకుండానే చేయబడతాయా?

ఇదే ప్రశ్నకు మెకార్థర్ గారిని ఢీకొనటానికి వీరు వాడుకునే రవి జెకర్యాస్ వంటివారు చెప్పే సమాధానాన్ని కూడా ఒకసారి పరిశీలించండి. అన్నిటిని సృష్టించింది దేవుడు అయినప్పుడు పాపం ఎలా వచ్చింది, సాతాను ఎలా వచ్చాడు అని ఒకరు అడిగిన ప్రశ్నకు రవి జెకర్యాస్ గారు ఇలా సమాధానం చెప్పారు: 

అన్నిటిని సృష్టించిన దేవుని ఎదుట ఈ నాలుగు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి :

1. ఏమీ సృష్టించకపోవటం

 2. మంచిచెడులు లేని ప్రపంచాన్ని సృష్టించటం

3. మంచిని మాత్రమే చేయగలిగే ప్రపంచాన్ని సృష్టించటం

4. మంచిచెడుల మధ్య ఎన్నిక చేసుకోగలిగే ప్రపంచాన్ని సృష్టించటం

ఈ నాల్గవ ప్రత్యామ్నాయంలో మాత్రమే ప్రేమకు నిజమైన అర్థం ఉంటుంది. కాబట్టి దేవుడు అలాంటి ప్రపంచాన్ని సృష్టించాడు అనే భావం వచ్చేలా సమాధానం ఇస్తూ, అలా ఎందుకు చేసాడో ఇప్పుడు మనకు అర్థం కాదు కానీ, తరువాత అర్థం అవుతుంది అని రవి జెకర్యాస్ గారు ముగించి చెప్పారు. (ఆ వీడియో లింక్ ఇక్కడ ఇవ్వబడింది - https://youtu.be/-eUhVJEJqoQ). మరోమాటలో చెప్పాలంటే మంచితో పాటు చెడును కూడా ఎన్నుకునే వీలు దేవుడే కల్పించాడన్నమాట. ఎంత దోబూచులాడినా పై మాటల్లో వచ్చే సారాంశం ఇదే అంట..నిజమేనా?

ఏతావాతా వీరంతా చెప్పేదేమిటంటే, పాపాన్ని దేవుడు అనుమతించకపోతే నిజమైన ప్రేమ ఉండటం సాధ్యం కాదని, అంటే, నిజమైన ప్రేమ ఉండాలంటే, అది కనబరిచే విధంగా మనుష్యులు పాపాన్ని విసర్జించి తమను ఎన్నుకునే అవకాశం కల్పించాలన్నదే దేవుని చిత్తమని వీరు చెప్పకనే చెబుతున్నారు. అంటే, కారణాలు అలా ఉంచితే, మొత్తం మీద పాపానికి దేవుని చిత్తంతో నిమిత్తం లేదనటం సాధ్యం కాదని చెప్పకనే చెబుతున్నారండోయ్!

అయినా ఇదేం చిత్రమో అర్థం కాలేదు గురువుగారు! పాపం చేయటం అసాధ్యమైన దేవునికి ప్రేమించటం సాధ్యమే. అంటే, ప్రేమించటానికి పాపం చేయగలిగే వీలుండాలి, దానిని స్వచ్ఛందంగా విసర్జిస్తేనే ప్రేమ సాధ్యపడుతుందని, అలా కాకపోతే అది రోబోటిక్ ప్రేమ ఔతుందని గగ్గోలు పెట్టే మీరు, దేవునిది రోబోటిక్ ప్రేమ అంటారా? ఎందుకు సర్ ఈ డొంకతిరుగుడు మాటలు. దేవుడు పాపానికి కర్త కాకుండానే, తన ఉద్దేశ నేరవేర్పుకు పాపాన్ని తన చిత్తంలో భాగంగా కలిగి ఉండగలడు. దాన్ని వివరించటం మాకు చేతకాదని ఒప్పుకునే నిజాయితీ కాల్వినిస్టులు కనబరిస్తే, దానిని అవహేళన చేస్తూ, మీ దగ్గర అంతకంటే మంచి వివరణ ఉన్నట్టు బిల్డుప్పులెందుకంట! కల్లబొల్లి కథలతో తృప్తిపడిపోవటానికి తమరి ప్రత్యర్థులేమీ పిల్లలు కాదు, పిడుగులు.

అన్నట్టు మరిచిపోయాము, దేవుడు పాపానికి కర్త అని పైన రవి  జెకర్యాస్ గారు పరోక్షంగా ఒప్పుకున్నారు. పాపరహిత ప్రపంచాన్ని నిర్మించే ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు కూడా, ఏవేవో కారణాలకు పాపసహిత ప్రపంచాన్ని నిర్మించాడని, ఇది మనకిప్పుడు అర్థం కాకపోయినా, అర్థం చేసుకునే ఎదుగుదల తరవాత వస్తుందని చెప్పటంలో అంతరార్థం, పరమార్థం ఇదే అని తమరికి తప్ప అందరికి అర్థం అయ్యింది. ఇదే విషయాన్ని నేరుగా, డొంకతిరుగుడు లేకుండా ఒప్పుకునే కొందరు హైపర్ కేల్వినిస్ట్ ప్రబుద్ధులు కూడా లేకపోలేదు. తమరు గతంలో ప్రస్తావించిన R.C.స్ప్రౌల్ జూనియర్ (R.C.స్ప్రౌల్ కాదు సుమా), విన్సన్ట్ చ్యాన్గ్(Vincent Cheung) తదితరులు ఈ కోవకు చెందినవారే. మాకు మీ జెకర్యాస్ వద్దు, ఆ చ్యాన్గ్ వద్దు, మీరు వద్దు. ప్రస్తుతం, మెకార్థర్, R.C.స్ప్రౌల్, A.W.పింక్ లాంటి వారు చెప్పిన Balanced Viewతో సరిపెట్టుకుంటాం.

అయినా, తమరికి తెలియనిదొకటి ప్రతిపాదిస్తాం; దీనినైనా తప్పుగా చిత్రీకరించకుండా ఆలోచించే ప్రయత్నం చేయండి. పాపాన్ని ఎవ్వరూ సృష్టించాల్సిన పని లేదు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞ ఇచ్చినవాడు మంచిని నిర్వచించాడు, ఆ గురి తప్పడమే పాపం. దానిని ప్రత్యేకంగా Manufacture చేయటానికి ఒక కర్త, కర్మాగారం, కార్మిక బృందం, పనిముట్లు, పనివారు ఉండాల్సిన పని లేదు. దేవుని పరిశుద్ధ స్వభావానికి విరుద్ధమైనదంతా పాపమే; విరుద్ధమైనదానిని సృష్టించాల్సిన అవసరం లేదు. ఈ మాత్రానికి, పాపాన్ని సృష్టించినదెవరో చెప్పటం జాన్ మెకార్థర్ గారికి వల్లపడలేదని వేళాకోళమాడటం ఎవరి వెర్రితనాన్ని బయటపెడుతుందో పాఠకులు ఆలోచించుకుంటారు. చెత్తవాదనలు చేసి, "రక్షణ యెహొవా వలననే కలుగును" అనే లేఖన సత్యాన్ని ఎత్తిపట్టుకునే కాల్వినిజంపైన బురదచల్లటం ఆపితే తమరికి మంచిది. నిజాయితీ ఆనేది ఏమైనా మిగిలుంటే, దానిని నిలబెట్టుకోవటానికైనా పనికొస్తుంది. మళ్ళీ కలుద్దాం, Take Care.

 ముందు భాగాలు చదవండి

1- వాక్యపునాదా, వక్రపునాదా? Part-1

2-వాక్యపునాదా, వక్రపునాదా? Part-2 యోహాను 10లో ఏముంది?

3-వాక్యపునాదా, వక్రపునాదా? Part-3 మొదటి కొరింథీ 2:14 అసలు సందర్భమేంటి?

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.