సువార్త

రచయిత: నరసింహుడు కె

ఆడియో

who is god thumb

రమేష్ అనే ఒక  వ్యక్తి తనకు కలిగిన శ్రమలను, కష్టాలను బట్టి తనకు తెలిసిన అన్ని దేవుళ్ళకు మ్రొక్కిన తర్వాత కూడా అవి తొలగకపోవడంతో ఎంతో నిరాశతో, దుఃఖంతో తాను ఆత్మహత్య చేసుకోవాటానికి వెళ్తున్న సమయంలో తన స్నేహితుడు సురేష్ దారిలో కలుస్తాడు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ గమనించండి -

సురేష్: ఏమైంది మామ, ఏం జరిగింది?

రమేష్: నాకు బ్రతకాలని అనిపించడం లేదు మామ, నాకున్న సమస్యలన్నీ పోవాలని అందరు దేవుళ్లకు మొక్కాను; ఒక్క దేవుడు కూడా నా మొర ఆలకించలేదు. నాకు బ్రతకాలని లేదు మామ

సురేష్: దేవుని గురించి తెలుసుకోకుండా , ఆయన నిన్ను ఏ ఉద్దేశంతో సృష్టించాడో తెలుసుకోకుండా అలా మాట్లాడొద్దు మామ.

రమేష్: ఇంకా ఏం తెలుసుకోవాలి, అన్నీ తిరిగాను కదా!

సురేష్: తెలుసుకోవాల్సింది చాలా ఉంది, అసలు దేవుడు ఉన్నది మనకున్న సమస్యలన్నీ తీసివేయడానికే అనుకుంటున్నావా? మనం ఈ లోకంలో సుఖసౌఖ్యాలతో, సంతోషంగా, ఏ సమస్యలు లేకుండా జీవించడానికే అనుకుంటున్నావా?

రమేష్: నాకు తెలిసినంతవరకు అదే అనుకుంటున్నాను మామ. టెంపుల్ లో పూజారి అలానే చెప్పాడు, చర్చికి వెళితే పాస్టర్ కూడా అలానే చెప్పాడు, ముస్లిం దగ్గరికి వెళ్తే అతనూ అలానే చెప్పాడు. దేవునిని నమ్మితే ఏరోగమైనా పోతుందని, అన్ని కష్టాలు పోతాయని చెప్పారు. ఒక వ్యక్తి ఇంట్లో దోషం ఉందన్నాడు. దోషనివారణ కావాలంటే ఏదో మంత్రం కొనమన్నాడు, అది కూడా కొన్నాను. ఒక పాస్టర్ ఏమో ప్రేయర్ ఆయిల్ కొనమన్నాడు, అది కూడా కొన్నాను. ముస్లిం ఏమో తాయత్తు కొనమన్నాడు, అది కూడా కొన్నాను. అయినా ఎలాంటి ప్రయోజనం లేదు. దేవుడు ఉన్నది మనకోసం కాకపోతే ఎందుకున్నట్టు? దేవుళ్లను నమ్మి ఏం ప్రయోజనం?

సురేష్ఒక విషయం ఆలోచించు. దేవుడు ఉన్నది మన కోసమే అన్నట్టయితే ఈ లోకంలో భక్తులు మాత్రమే అన్ని రంగాలలో అభివృద్ధి కలిగి ఉండాలి కదా? మరి అలా లేదు కదా! కావాలంటే గూగుల్ సెర్చ్ చేసి చూడు, మొదటి పదిమంది ధనవంతుల జాబితాలో ఏడు మంది నాస్తికులే ఉంటారు.

రమేష్: నిజమా! నేను ఎప్పుడూ ఇలా ఆలోచించలేదే. (గూగుల్ సెర్చ్ చేసిన తర్వాత) అవును మామా, నువ్వు చెప్పింది నిజమే, మొదటి పది మందిలో ఏడు మంది (1.Jeff Bezos, 2.Bill Gates, 3.Mark Zuckerberg, 7.Warren Buffett, 8.Larry Page, 9.Elon Musk, 10. Sergey Brin - as of 7th Aug 2020) నాస్తికులే  ఉన్నారు. అయితే దేవుళ్ళను ఎందుకు నమ్మాలి? నమ్మడం వలన ప్రయోజనం ఏంటి?

సురేష్: ఈ లోకంలో దాదాపు 90% మంది ఏదో ఒక మతానికి చెందినవారు. దాదాపుగా అన్ని మతాలు మరణం తర్వాత మోక్షం, నరకం ఉన్నాయని చెబుతున్నాయి. దేవుడు మన క్రియలను బట్టి తీర్పు తీర్చి, ఆయన దృష్టికి నీతిమంతులుగా కనబడినవారికి మోక్షం ప్రసాదిస్తాడని చెబుతున్నాయి.

రమేష్: అయితే దేవుడు కేవలం మోక్షం ప్రసాదించడానికేనా? ఈ కష్టాలు సమస్యలు తీర్చడా?

సురేష్: కష్టాలు తీర్చడు అని చెప్పడంలేదు కానీ దేవునికి ముఖ్యమైనది మనం శాశ్వతంగా సంతోషంగా ఉండటం. అందుకు మనం రెండు పనులు చేయాలి.

1.) మనం ఎవరి మీదైతే నమ్మకం ఉంచుతున్నామో ఆయన నిజమైన దేవుడై ఉండాలి, నమ్మదగినవాడై ఉండాలి.

2.) మనం యథార్థమైన హృదయంతో ఆయన్ను నమ్మాలి.

రమేష్: నిజమైన దేవుడేంటి? ఏ దేవుడైనా దేవుడే కదా? ఇదేరా నాకు నచ్చనిది. ఇంతమంది ఉన్నప్పుడు ఒక్కడే నిజమైన దేవుడు అని చెప్పడం ఏంటి?

సురేష్: ఒరేయ్ నన్ను 2 నిమిషాలు మాట్లాడనివ్వు

రమేష్: 2 నిమిషాలేగా, మాట్లాడు

సురేష్: నిజమైన దేవునిలో ప్రేమ, సత్యము అనే గుణాలు ఉంటాయి. దీనికి నువ్వు ఒప్పుకుంటావా?

రమేష్: అవును బాబు, అవి లేకపోతే దేవుళ్ళు ఎలా ఔతారు? అందరి దేవుళ్ళలో ఉంటాయి.

సురేష్: అందరిలో ఉండవు, నిజమైన దేవునిలోనే ఉంటాయి

రమేష్: అదెలా చెప్పు?

సురేష్: ఒక స్కూల్ మాస్టర్ కి ఒక సమస్య వచ్చింది. ఒక విద్యార్థి యొక్క పేపర్ ను కరెక్షన్ చేస్తున్నప్పుడు 34 మార్కులే వచ్చాయి, పాస్ మార్క్సు ఏమో 35 కదా?

రమేష్: అవును 100కి 35 రావాలి, అప్పుడే పాస్. ఇందులో సమస్యేముంది, '1' మార్కు కలిపి పాస్ చెయ్యొచ్చు కదా?

సురేష్: అవును మామా, నువ్వు చెప్పినట్లే '1' గ్రేస్ మార్కు కలిపి పాస్ చెయ్యవచ్చు, అపుడు ఆ మాస్టరులో సత్యముండదు. ప్రేమ చూపించి '1' కలిపితే సత్యముండదు. అలాగని కేవలం సత్యాన్నే పాటించి న్యాయంగా Correction చేస్తే 34 మార్కులే వస్తాయి. అప్పుడు ఆ విద్యార్థి ఫెయిల్ అవుతాడు. ఆ మాస్టారు దయ, ప్రేమ లేనివాడవుతాడు. ప్రేమ చూపిస్తే సత్యాన్ని పాటించలేకపోతున్నాడు, సత్యాన్ని అనుసరిస్తే ప్రేమ చూపించలేకపోతున్నాడు కదా మామా?

రమేష్: అవును కదా! నేనెప్పుడూ ఇలా ఆలోచించలేదే! ఇప్పుడెలా మరి!

సురేష్: విద్యార్థిని పాస్ చెయ్యాలి, అదే సమయంలో సత్యాన్నీ పాటించాలి. ఇది సాధ్యమేనా?

రమేష్: నాకు తెలిసి సాధ్యం కాదు. నువ్వు చెప్పినట్టుగానే ఈ మాష్టారు పెద్ద సమస్యలోనే ఉన్నాడు. ఇప్పుడెలా మరి?

సురేష్: ఇప్పుడు నీకు కొంచెమైనా అర్థం అయ్యుండాలి.  ఒక వ్యక్తి,  ఒకే సమయంలో సత్యము, ప్రేమ అనే గుణాలు కలిగి ఉండటం అంత సులభం కాదు.

రమేష్: సరేరా ఇప్పుడెలా మరి?

సురేష్: ఇది ఈ మాస్టారుకి వచ్చిన సమస్య. ఇదే విధమైన సమస్య ఒక రాజుకి వచ్చింది. ఆ రాజు ఈ సమస్యను పరిష్కరించాడు.

రమేష్: అవునా! అదెలా?

సురేష్ఒకానొక పట్టణాన్ని ఒక రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజుకు ఆ పట్టణంలో ప్రేమగలవాడని, మాట తప్పనివాడని, న్యాయం తప్పనివాడని చాలా మంచి పేరు ఉంది. రాజు ఆస్థానంలోనే తనెంతో ప్రేమించే స్నేహితుడు పని చేస్తుండేవాడు. ఆ స్నేహితునికి కూడా రాజంటే చాలా ఇష్టం, అందుకే అతను కూడా చాల నమ్మకంగా, యథార్థంగా పనిచేసేవాడు. ఒకసారి ఏమైందంటే ఆ రాజు స్నేహితుడు చాలా కష్టాలగుండా వెళ్తూ రాజుకి తెలియకుండా అదే పట్టణంలో చాలామంది ధనవంతుల దగ్గర పెద్ద మొత్తంలో డబ్బును అప్పుగా తీసుకుని, వారికి చెప్పిన సమయంలో డబ్బును తిరిగి ఇవ్వలేకపోయాడు. అప్పుడు ఆ ధనవంతులు రాజు దగ్గరికి ఆ స్నేహితుణ్ని తీసుకుని వచ్చి శిక్షించమని కోరతారు. అప్పుడు రాజు చాలా దుఃఖిస్తాడు. ఇప్పుడు ఆ రాజు సభలో సింహాసనం మీద కూర్చున్నాడు. ముద్దాయి స్థానంలో రాజు స్నేహితుడు నిలబడి ఉన్నాడు. ఇప్పుడు రాజు ఏమని తీర్పు తీర్చగలడు? తన స్నేహితుడని క్షమిస్తే ఆ పట్టణంలో ఉన్న ప్రజలు తన స్నేహితునికి ఒక న్యాయం, మాకొక న్యాయమా అంటారు. అప్పుడు ఆ రాజులో సత్యం ఉండదు. ఒకవేళ తాను కేవలం న్యాయాన్ని పాటించి శిక్ష వేస్తే, అదే ప్రజలు రాజు తన స్నేహితుడని కూడా చూడకుండా శిక్షించినా, రాజు మరి మమ్మల్నెలా ప్రేమిస్తాడు అనే అవకాశం ఉంది. ఇక్కడ రాజు ప్రేమ చూపిస్తే న్యాయం చెయ్యలేకపోతున్నాడు. న్యాయం చేస్తే ప్రేమ చూపించలేకపోతున్నాడు. ఇప్పుడు రాజు తన స్నేహితుణ్ని క్షమించగలగాలి మరియు న్యాయం కూడా చెయ్యాలి. ఇది సాధ్యమేనా?

రమేష్: సాధ్యం కాదు. ఇప్పుడు రాజు కూడా పెద్ద సమస్యలో ఉన్నాడు. మరి ఎలా?

సురేష్: ఈ రాజు ఈ సమస్యను ఎలా పరిష్కరించాడో తెలుసుకునే ముందు ఒక ప్రశ్న.

రమేష్: అడుగు.

సురేష్: ఈ లోకంలో ఒక్క తప్పు కూడా చెయ్యకుండా పరిపూర్ణమైన వ్యక్తి ఎవరైనా ఉంటారా?

రమేష్: లేదు ఏ ఒక్కరు Perfect కాదు.

సురేష్: దేవుడు న్యాయవంతుడని తెలుసు కదా. మరి ఈ లోకంలోని ప్రతి వ్యక్తిని న్యాయంగా శిక్షిస్తే ఏమవుతుంది?

రమేష్: అందరు నరకానికే వెళ్ళాలి. ఆమ్మో ఊహించడానికే ఎంతో భయంగా ఉంది. ఇప్పుడెలా మరి? నరకం నుండి రక్షణ ఎలా పొందాలి?

సురేష్: ఇప్పుడు ఆ కథలోని రాజు స్థానంలో దేవుళ్లుగా పిలవబడే ఏదైనా ఒక దేవుణ్ణి పెట్టు. ఆ ముద్దాయి స్థానంలో నువ్వు నిలువబడి నిన్ను ఆ నరకం నుండి ఎవరైనా రక్షిస్తారేమో ఒకసారి ఆలోచించు.

రమేష్: ఈ విధంగా చూస్తే నేను నరకం నుండి తప్పించబడటం అసాధ్యం అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు పాపానికి న్యాయమైన శిక్ష విధించకుండా నన్ను క్షమిస్తే దేవుడు అన్యాయంగా తీర్పు తీర్చినవాడవుతాడు. దేవుడు ఎప్పుడూ న్యాయమే చేస్తాడని నాకు తెలుసు. మరి నా పాపాలు క్షమించబడేదెలా? నరకం నుండి రక్షణ పొందేదెలా? నేను ఊహించిన దేవుళ్లందరిని ఆ రాజు స్థానంలో పెట్టాను. ఏ ఒక్కరికి ఈ రెండు గుణాలు (ప్రేమ మరియు సత్యం) ఉండడం సాధ్యం అనిపించడం లేదు. ప్రేమతో నన్ను తప్పిస్తే అది అన్యాయం అవుతుంది, న్యాయంగా శిక్షిస్తే ఇక ప్రేమెక్కడిది?

సురేష్: దేవుడు న్యాయంగా తీర్పు తీర్చగలగాలి మరియు మనలను క్షమించగలగాలి. దేవుళ్ళు కాని అసత్య దేవుళ్ళకు ఇది అసాధ్యం. అయితే మనలను సృష్టించిన నిజమైన దేవునికి సమస్తము సాధ్యమే. నీకు స్పష్టంగా అర్థం కావాలంటే మొదటగా రాజుగారు ఏం చేసారో వివరిస్తాను. తన స్నేహితుడు చేసిన నేరానికి న్యాయంగా తీర్పు తీర్చి పెద్ద మొత్తంలో జరిమానా విధించాడు. తరువాత తన రాజవస్రాన్ని పక్కనపెట్టి , సింహాసనం దిగివచ్చి, ముద్దాయి స్థానంలో తాను నిలబడి ఆ జరిమానాను తానే చెల్లించాడు. అంటే స్నేహితుడు చేసిన నేరానికి న్యాయంగా తీర్పు తీర్చాడు, అదేసమయంలో స్నేహితుడు చెల్లించవలసిన జరిమానాను ప్రేమతో తానే చెల్లించాడు.  ఈ విధంగా స్నేహితుణ్ని శిక్ష నుండి న్యాయంగా తప్పించాడు.

అదే విధంగా మన దేవుడు కూడా తాను ప్రేమించిన ప్రజల కోసం మానవునిగా వచ్చి, మానవుడు చేసిన ప్రతి పాపానికి, ప్రతి అవిధేయతకు తానే ఆ కలువరి సిలువలో న్యాయమైన శిక్ష పొందాడు. ఆయనలో పాపం లేదు అయితే ప్రజల పాపాన్ని అయన మోసాడు. ఆయన తన ప్రజల పాపముల నిమిత్తము చనిపోయి, పాతిపెట్టబడి మరియు మూడవ దినమున తిరిగి లేచాడు. క్లుప్తంగా చెప్పాలంటే దేవుడు సత్యవంతుడు కాబట్టి మానవునిగా రాకుండా, పాపానికి న్యాయమైన శిక్ష విధించకుండా ప్రజల యొక్క పాపాలు క్షమించలేకపోయాడు. అందుకే యేసుప్రభువులో మాత్రమే సత్యము మరియు ప్రేమ ఉన్నాయి.

రమేష్: నువ్వు ప్రారంభంలో చెప్పిన మాట నిజమే. నిజ దేవుడు ఎవరో ఇప్పుడు తెలుసుకున్నాను. నా పాపాలు క్షమించడం కోసం తన ప్రాణాల్ని సైతం పెట్టిన దేవుని ప్రేమను,  సత్యాన్ని ఇన్నాళ్ళూ తెలుసుకోలేక నా అవసరతలు తీర్చడానికే దేవుడున్నాడనుకున్నాను. కానీ ఇప్పుడు నా అసలు అవసరతను తెలుసుకున్నాను. నేను చనిపోవాలి అనుకున్నాను కానీ నాకు శాశ్వతమైన జీవం ఇవ్వడానికి ఏసుప్రభువే నాకోసం చనిపోయాడు. ఇప్పుడు నాకున్న అసలు సమస్య నుండి (శాశ్వత నరకం నుండి)  నన్ను కాపాడాడు కాబట్టి ఇప్పుడు నాకున్న సమస్యలన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి.

సురేష్: ఈ సత్యాన్నే ప్రకటించాలని చూస్తుంటే చాలామంది దానిని మతప్రచారమని, మత మార్పిడని, మతవిద్వేషాలు పుట్టించామని విమర్శిస్తున్నారు. అందరూ నీలాగా యథార్థమైన హృదయంతో ఆలోచిస్తే ఎంత బాగుంటుంది.

గమనిక: ఇందులోని సన్నివేశాలు కల్పితమైనవే అయినా చెప్పబడిన ఆధ్యాత్మిక సంగతులన్నీ అక్షరసత్యాలు.

Read this article in English

https://biblespokesman.com/books/gospel/311-who-is-god-and-why-believe-in-him.html

Add comment

Security code
Refresh

Comments  

# Life storyLavankumar 2021-07-15 10:39
:lol: All is well
Reply
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.