విమర్శలకు జవాబు

రచయిత: కె విద్యా సాగర్

 

బైబిల్ గ్రంథంపై మతోన్మాదులు మరియు ఇతర విమర్శకులు చేస్తున్న కుట్రపూరితమైన ఆరోపణలకు సమాధానమిస్తున్న క్రమంలో యొఫ్తా కూతురి బలి ఆరోపణకు కూడా ఈ వ్యాసంలో వివరణ ఇవ్వదలిచాను. కొందరు విశ్వాసులు కూడా గురౌతున్న ఈ అపార్థానికి ఈ వివరణ అవసరం అనిపించింది. విషయానికి‌ వస్తే న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో యెఫ్తా అనబడే న్యాయాధిపతి మనకు కనిపిస్తాడు. ఇతను అమ్మోనీయులతో యుద్ధం చేసేముందు "ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించినయెడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగివచ్చునప్పుడు, నన్ను ఎదుర్కొనుటకు నా యింటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. మరియు దహన బలిగా దాని నర్పించెదనని" (న్యాయాధిపతులు 11:30,31) దేవుని సన్నిధిలో మ్రొక్కుబడి చేసుకుంటాడు. తీరా అతను యుద్ధంలో అమ్మోనీయులను జయించివచ్చేటప్పటికి అతని కూతురే అతనికి ఇంటినుండి ఎదురువస్తుంది (న్యాయాధిపతులు 11:34-36). అది చూసి అతను ఎంతో వేదనపడినప్పటికీ యెహోవాకు మ్రొక్కుబడి చేసుకున్నాడు కాబట్టి దాని ప్రకారంగానే ఆమెకు చేసినట్టుగా ఉంటుంది.

న్యాయాధిపతులు 11:39 ఆ రెండు నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగిరాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిచొప్పున ఆమెకు చేసెను.

దీని ఆధారంగానే కొందరు మతోన్మాదులూ మరియు బైబిల్ విమర్శకులు బైబిల్ దేవుడు నరబలులను కోరేవాడంటూ ఆరోపిస్తుంటారు. ఈ వాదనకు అనుకూలంగా "అయితే మనుష్యులలోగాని జంతువులలోగాని స్వాస్థ్య మైన పొలములలోగాని తనకు కలిగినవాటన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్టించిన యెడల ప్రతిష్ఠించినదానిని అమ్మకూడదు, విడిపింపను కూడదు, ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేని నైనను విడిపింపక హతము చేయవలెను" (లేవీయకాండము 27:28,29) అనే వాక్యభాగాన్ని కూడా ఆధారం చేసుకుంటుంటారు. ఎందుకంటే ఈ వాక్యభాగంలో చాలా స్పష్టంగా "మనుష్యులలో గాని జంతువులలో గాని....వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను" అని రాయబడింది. అందుకే యెహోవా దేవుడు నరబలులు కోరేవాడనే ఈ ఆరోపణలో వాస్తవం ఎంతో క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఎందుకంటే లేఖనంలో రాయబడినమాటలను బట్టి మనం ఒక నిశ్చయానికి వచ్చేముందు దానికి సంబంధించిన మిగిలిన లేఖనాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి, లేకపోతే అపార్థం చేసుకోవడం తప్ప అంతకుమించి ఒరిగేదేమీ ఉండదు. అందుకే "యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి" (యెషయా 34:16) అని రాయబడింది.

ఆ క్రమంలో ముందుగా యెహోవా దేవుడు నరబలుల‌ గురించి ఏం‌ చెబుతున్నాడో పరిశీలిద్దాం.

ఆదికాండము 9:5,6 మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దానిగూర్చి ప్రతిజంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.

ఈ సందర్భంలో దేవుడు నరహత్యలను నిషేధిస్తూ దానికి‌ గల కారణాన్ని వివరించడం మనం చూస్తాం. "ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను" కాబట్టి నరహత్య చెయ్యకూడదనంటే ఒక నరుడ్ని బలిగా ఇవ్వడాన్ని ఆయన మరెంతగా ఖండిస్తున్నట్టు ఔతుంది? దీనిగురించి ఇంకా వివరంగా చూద్దాం.‌

ద్వితియోపదేశకాండము 12:30,31 వారి దేవతలను ఆశ్రయింపగోరిఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసెదనని అనుకొనకుండ జాగ్రత్తగా ఉండవలెను. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవు డైన యెహోవాను గూర్చి చేయవలదు, ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి.

ఈ సందర్భంలో దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి కనానుకు నడిపిస్తుండగా ఆ కనాను ప్రజలు తమ దేవతలకు చేసినట్టుగా లేక పూజించినట్టుగా ఆయనను పూజించకూడదని ఎందుకంటే "ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి" అని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. ఇదేమాటలను ఆయన మరలా మరలా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు.

లేవీయకాండము 18:3 మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు, వారి కట్టడలను బట్టి నడవకూడదు.

ద్వితియోపదేశకాండము 12:4 వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు.

ఇంతకూ "యెహోవా ద్వేషించే హేయక్రియను" వారు తమ దేవతలకు ఏం చేసారు? సమాధానం ఆయనే చెబుతున్నాడు చూడండి;

ద్వితియోపదేశకాండము 12:31 తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవు డైన యెహోవాను గూర్చి చేయవలదు, ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. "వారు తమ దేవతలపేరట తమ కూమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చి వేయుదురు గదా"

దీనిప్రకారం ఆ కనానీయులు తమ పిల్లలను తమ దేవతలపేరట బలులు ఇచ్చేవారు. అందుకే ఆయన "తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు, ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి" అని నరబలులు అనేవి ఆయన ద్వేషించే హేయక్రియగా ఆయన హెచ్చరిస్తున్నాడు. "వారి బలి పీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చట లేకుండ నశింపజేయవలెను" (ద్వితియోపదేశకాండము 12:3) అని ఆయన ఖండితంగా ఆజ్ఞాపించింది కూడా అందుకే. వారు ఆ విగ్రహాల దగ్గరే తమ పిల్లలను బలులు ఇచ్చేవారు. దీనికి సంబంధించిన ఆధారాల కోసం ఈవ్యాసం చదవండి.

ఇశ్రాయేలీయులు కనానీయులను సంహరించడం నేరమా? న్యాయమా?

దీనినిబట్టి యెహోవా దేవుడు నరబలులు కోరేవాడు అని ఆరోపిస్తున్నవారు, అదే నిజమైతే నరబలులు అనేవి ఆయన ద్వేషించే హేయక్రియగా ఎందుకు ఇంత స్పష్టంగా ప్రస్తావించాడో అలా నా పేరిట చెయ్యకూడదని నన్ను నేను చెప్పిన పద్ధతిలో మాత్రమే సేవించాలని ఎందుకు ఇంత ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడో సమాధానం చెప్పాలి.

ద్వితియోపదేశకాండము 12:32 నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు.

ఆయన నరబలులు కోరేవాడైతే నాకూ అలానే చెయ్యండని చెప్పాలి కానీ నాకు అలా చెయ్యకూడదని, ఎందుకంటే అది నాకు హేయమైన క్రియయని చెప్పకూడదుగా? దీనినిబట్టి చిన్నపిల్లవాడికి కూడా ఆయన నరబలులు కోరేవాడు కాదని సులభంగానే అర్థమైపోతుంది. అలాంటప్పుడు ఆయన నరబలులను ద్వేషించేవాడని ఇంతస్పష్టంగా ఉన్న వాక్యభాగాలను ప్రక్కనపెట్టి అపార్థం చేసుకున్న వాక్యభాగాల ఆధారంతో ఆయన నరబలులను కోరేవాడని ఆరోపించడం ఎంతవరకు సబబు? గమనించండి. బైబిల్ విమర్శకుల బుద్ధి ప్రతీ ఆరోపణ విషయంలోనూ ఇలానే వక్రంగా ఉంటుంది.

ఇప్పుడు వారు ఈ వాదనకు ఆధారంగా తీసుకుంటున్న వాక్యభాగాన్ని పరిశీలిద్దాం.

లేవీయకాండము 27:28 అయితే "మనుష్యులలో గాని" జంతువులలోగాని స్వాస్థ్య మైన పొలములలోగాని తనకు కలిగినవాటన్నిటిలో దేని నైనను ఒకడు యెహోవాకు ప్రతిష్టించిన యెడల ప్రతి ష్ఠించినదానిని అమ్మకూడదు, విడిపింపను కూడదు, ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో "దేనినైనను విడిపింపక" హతము చేయవలెను.

ఈ సందర్భంలో దేవుడు తనకు ప్రతిష్టించబడిన ప్రతీదీ హతం చెయ్యబడాలని అనగా ఆయన బలిపీఠంపై దహనబలిగా అర్పించబడాలని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. దీనికి వివరణ చూసేముందు కొన్ని తలంపులు మీతో పంచుకుంటాను.

1. మోషే ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకు నియమించబడింది. ఈ ధర్మశాస్త్రంలో నేను పైన చెప్పినట్టుగా ఒకవైపు ఆయన నరబలులను ద్వేషించేవాడిగా, అవి నాకు ఇవ్వకూడదని ఖండితంగా ఆజ్ఞాపిస్తూ మరోవైపు ఆయన పై వాక్యభాగం ప్రకారం నరబలులు స్వీకరించేవాడిగా ప్రకటించుకున్నాడు అనుకుందాం, అప్పుడు ఇశ్రాయేలీయులు కానీ మోషే కానీ ఆయనను ఎలా భావిస్తారు? రెండింటిలో దేనిని పాటిస్తారు? అలాంటి సమస్య వారు ఎదుర్కొన్నట్టు ఎక్కడైనా రాయబడిందా?

2. మతోన్మాదుల మతగ్రంథాల ప్రకారం నరబలులు అంటే తలలు నరకడమే అయ్యుండొచ్చు. కానీ యెహోవా దేవునికి బలి అర్పించాలంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. మీరు లేవీకాండము చదువుతున్నప్పుడు ప్రతీ బలిలోనూ ఒకోవిధంగా వేరు వేరు భాగాలను ఆయనకు బలిపీఠంపై దహించాలి. ఉదాహరణకు సమాధాన బలిలో పశువుయొక్క క్రొవ్వునూ మూత్రపిండాలనూ దాని చుట్టూ ఉండే క్రొవ్వునూ ఆయనకు బలిపీఠంపై దహించాలి (లేవీకాండము 3) మిగిలిన మాంసంలో కొంత యాజకుడికీ మిగతాదంతా బలిపశువును తీసుకువచ్చినవాడికీ ఇవ్వబడుతుంది (లేవీకాండము 7:15-18). కానీ దహనబలుల్లో మొత్తం మాంసమంతా బలిపీఠంపైనే దహించబడుతుంది (లేవీకాండము 1). పాపప్రాయుశ్చిత్త బలిలోనైతే క్రొవ్వు మూత్రపిండాలూ దాని చుట్టూ ఉండే క్రొవ్వూ బలిపీఠంపై దహించబడి మిగిలిన భాగమంతా పాళెం వెలుపల దహించబడుతుంది (లేవీకాండము 4).

యెహోవాకు అర్పించబడే బలుల క్రమం ఈవిధంగా ఒకోదానికీ ఒకోలా‌ ఉంటుంది. అవన్నీ లేవీకాండములో వివరించబడ్డాయి. అలానే ఆయనకు వేటిని అర్పించాలో కూడా వివరంగా రాయబడ్డాయి. పశువుల్లోనైతే గోవులు (కోడెదూడ), గొర్రెలు, మేకలు (లేవీకాండము 1:2), పక్షుల్లోనైతే తెల్లగువ్వలు, పావురాలు (లేవీకాండము 1:14) ఇవే ఆయనకు అర్పించబడాలి. వీటినుండి మాత్రమే బలి సందర్భాన్ని బట్టి కొన్నిటికి ఆడవి కొన్నిటికి మగవి, (లేవీకాండము 1:3, 4:28, 5:6) మరికొన్నిటికి రెండింటిలో ఏదైనా సరే (లేవీకాండము 3:1, 3:6) ఆయనకు అర్పించబడాలి. ఈవిధంగా యెహోవాకు అర్పించబడే బలులకు ఒక క్రమం ఉంటుంది. ఆ బలులు ఆయన ఆజ్ఞాపించినట్టుగా, ఆజ్ఞాపించినవాటిని, ఆజ్ఞాపించిన చోటనే అర్పించాలి (ద్వితీయోపదేశకాండము 12:8-14) ఎందుకంటే అవన్నీ క్రీస్తు బలికి ఛాయగా నియమించబడ్డాయి (హెబ్రీ 9:10-12, హెబ్రీ 10:1) ఆ కారణంగా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టుగా అర్పించడానికి ఉండదు.

ద్వితియోపదేశకాండము 4:2 మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయ కూడదు.

ద్వితియోపదేశకాండము 12:31,32 తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవు డైన యెహోవాను గూర్చి చేయవలదు, ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతలపేరట తమ కూమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చి వేయుదురు గదా. నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు.

మరి ఆయన నరబలులను కూడా కోరితే ఏ సందర్భంలో అవి అర్పించాలి, యేయే భాగాలు దహించబడాలి, ఏ బలిలో ఆడదానిని అర్పించాలి, ఏ బలిలో మగవాడిని అర్పించాలి, ఏ బలిలో ఆడ మగ ఇద్దరిలో ఎవర్నైనా అర్పించవచ్చు అనే వివరాలు ధర్మశాస్త్రంలో ఎక్కడ రాయబడ్డాయి? ఆ ఆరోపణ చేసేవారు ఆధారాలు చూపించాలి. మాకేంటి సంబంధం అంటే కుదరదు. ఆరోపణ చేసేవాడు ఆధారాలు చూపించాలి. ఎందుకంటే బైబిల్ బలులకు క్రమం ఉంది.

ఇప్పుడు "మనుష్యులలో గాని జంతువులలోగాని స్వాస్థ్యమైన పొలములలోగాని తనకు కలిగినవాటన్నిటిలో దేని నైనను ఒకడు యెహోవాకు ప్రతిష్టించిన యెడల ప్రతిష్ఠించినదానిని దేనినైనను విడిపింపక హతము చేయవలెను" అనే వాక్యభాగం గురించి మాట్లాడుకుందాం. మనం ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు అందులో ముందుగా వివరించబడిన కొన్ని విషయాలు మరలా ఆ వివరణ లేకుండా ప్రస్తావించబడడం చూస్తుంటాం. ఉదాహరణకు; ఇదే వాక్యభాగంలో "అయితే మనుష్యులలోగాని జంతువులలోగాని స్వాస్థ్య మైన పొలములలోగాని తనకు కలిగినవాటన్నిటిలో దేని నైనను ఒకడు యెహోవాకు ప్రతిష్టించిన యెడల ప్రతిష్ఠించినదానిని అమ్మకూడదు, విడిపింపనుకూడదు" ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేని నైనను "విడిపింపక హతము చేయవలెను" అని ప్రతిష్టించబడినవాటిని విడిపించకూడదనే మాట కచ్చితంగా రాయబడింది. కానీ అందులో విడిపించవలసినవి కూడా ఉంటాయి. వాటి గురించి పైనే రాయబడింది చూడండి.

లేవీయకాండము 27:11-27 జనులు యెహోవాకు అర్పింపకూడని అపవిత్ర జంతువులలో ఒకదానిని తెచ్చినయెడల ఆ జంతువును యాజకుని యెదుట నిలువబెట్టవలెను. అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను. యాజకుడవగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును. అయితే ఒకడు అట్టిదానిని విడిపింపగోరిన యెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవవంతు వానితో కలుపవలెను. అది అపవిత్రజంతువైన యెడల వాడు నీవు నిర్ణయించు వెలలో అయిదవవంతు దానితో కలిపి దాని విడిపింపవచ్చును. దాని విడిపింపని యెడల నీవు నిర్ణయించిన వెలకు దాని అమ్మవలెను.

కాబట్టి ప్రతిష్టించినవాటిని విడిపించకుండా హతం చెయ్యాలి అన్నప్పుడు అవి ఆయనకు అర్పించవలసిన పవిత్రజంతువులైతే (అవేంటో పైన తెలియచేసాను) వాటిని విడిపించకుండా హతం చెయ్యాలని అర్థం. ‌

లేవీయకాండము 27:9,10 యెహోవాకు అర్పణముగా అర్పించు పశువులలో ప్రతిదానిని యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను. అట్టిదానిని మార్చకూడదు. చెడ్డదానికి ప్రతిగా మంచిదాని నైనను మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను, ఒకదానికి ప్రతిగా వేరొకదానిని ఇయ్యకూడదు. పశువుకు పశువును మార్చినయెడల అదియు దానికి మారుగా ఇచ్చినదియు ప్రతిష్ఠితమగును.

అదే ఆయనకు అర్పించకూడనివి ఆయనకు ప్రతిష్టించబడితే దానికి మారుగా వేరొక పశువును ఇచ్చి విడిపించడం కానీ లేక యాజకుడు నిర్ణయించి సొమ్మును చెల్లించడం కానీ చెయ్యాలి.

నిర్గమకాండము 13:13 ప్రతి గాడిద తొలి పిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొఱ్ఱెపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని యెడల దాని మెడను విరుగదీయ వలెను. నీ కుమారులలో తొలిచూలియైన ప్రతి మగ వానిని వెలయిచ్చి విడిపింపవలెను.

ఈవిధంగా ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను మిగిలిన భాగాల్లోని వివరణ ప్రకారంగా అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రం విషయంలోనే కాదు బైబిల్ అంతటికీ ఇది వర్తిస్తుంది. ఇలా ఆలోచించినప్పుడు ఆయనకు అపవిత్రజంతువులనే కాదు, మనుషులను కూడా బలిగా అర్పించకూడదని ఆయన తెలియచేసాడు. కాబట్టి ప్రతిష్టించబడిన మనుషుల విషయంలో ఏం చెయ్యమంటున్నాడో చూడండి.

నిర్గమకాండము 13:1-15 మరియు యెహోవా మోషేతో ఈలాగు సెల విచ్చెను
ఇశ్రాయేలీయులలో మనుష్యుల యొక్కయు పశువులయొక్కయు ప్రథమ సంతతి, అనగా ప్రతి తొలి చూలుపిల్లను నాకు ప్రతిష్ఠించుము. అది నాదని చెప్పెను. ప్రతి తొలి చూలుపిల్లను, నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగసంతానము యెహోవాదగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొఱ్ఱెపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని యెడల దాని మెడను విరుగదీయ వలెను. నీ కుమారులలో తొలిచూలియైన ప్రతి మగవానిని వెలయిచ్చి విడిపింపవలెను. ఇకమీదట నీ కుమా రుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి బాహుబలముచేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులోనుండి మనలను బయటికి రప్పించెను. ఫరో మనలను పోనియ్యకుండ తన మనస్సును కఠినపరచుకొనగా యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తుదేశములో తొలి సంతాన మంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెలయిచ్చి విడిపించుదునని చెప్పవలెను.

కాబట్టి ఆయనకు బలిగా అర్పించబడవలసిన పశువులు ప్రతిష్టించబడితే వాటిని విడిపించకుండా హతం చెయ్యాలని, అదే బలిగా అర్పించకూడని అపవిత్రజంతువులు కానీ మనుషులు కానీ ప్రతిష్టించబడితే వారిని వేరొక ప్రత్యామ్నాయం ద్వారా విడిపించాలని ఆ మాటల అర్థం. ‌అసలు ఆ భావం ఆ అధ్యాయపు మొదటిభాగంలోనే స్పష్టంగా‌ వివరించబడింది చూడండి.

లేవీయకాండము 27:2-8 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఒకడు విశేషమైన మ్రొక్కుబడి చేసినయెడల నీవు నిర్ణయించిన వెలచొప్పున వారు యెహోవాకు దాని చెల్లింపవలెను. నీవు నిర్ణయింపవలసిన వెల యేదనగా, ఇరువది ఏండ్లు మొదలుకొని అరువది ఏండ్ల వయస్సు వరకు మగవానికి పరిశుద్ధస్థలము యొక్క తులమువంటి యేబది తులముల వెండి నిర్ణయింపవలెను. ఆడుదానికి ముప్పది తులములు నిర్ణయింపవలెను. అయిదేండ్లు మొదలుకొని యిరువది ఏండ్లలోపలి వయస్సుగల మగవానికి ఇరువది తులముల వెలను, ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను. ఒక నెల మొదలుకొని అయిదేండ్లలోపలి వయస్సుగల మగవానికి అయిదు తులముల వెండి వెలను ఆడుదానికి మూడు తులముల వెండి వెలను నిర్ణయింపవలెను. అరువది ఏండ్ల ప్రాయముదాటిన మగవానికి పదునైదు తులముల వెలను ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను. ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత బీదవాడైన యెడల అతడు యాజకుని యెదుట నిలువవలెను; అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును. మ్రొక్కుకొనిన వాని కలిమిచొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను.

ఈవిధంగా మ్రొక్కుబడి చేసుకున్నవారు లేక ప్రతిష్టించబడిబవారు వెల చెల్లించడం ద్వారా విడిపించబడతారు. బలిగా‌ అర్పించబడరు. కానీ విమర్శకులకు ఇంత స్పష్టంగా ఉన్న వివరణతో సంబంధం ఉండదు అందుకే అధ్యాయపు ప్రారంభంలోనే రాయబడిన ఈ మాటలను పట్టించుకోకుండా ఆ నియమాల పరిధిలో రాయబడిన "మనుష్యులలోగాని జంతువులలోగాని మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేని నైనను విడిపింపక హతము చేయవలెను" అనే మాటలకు పెడార్థం పుట్టించాలని చూస్తున్నారు.

సరే వాదనకోసం యెహోవా దేవుడు నరబలులు కోరేవాడే అనుకుందాం, మరి ఆయన నేను ప్రారంభంలో తెలియచేసిన సందర్భాల్లోనే కాకుండా మరికొన్ని సందర్భాల్లో కూడా ఆ నరబలులు తనకు అసహ్యమైనవి ఎందుకు ప్రకటించినట్టు? ఉదాహరణకు;

యెషయా 66:3 ఎద్దును వధించువాడు నరుని చంపువానివంటివాడే
గొఱ్ఱెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువానివంటివాడే నైవేద్యము చేయువాడు పందిరక్తము అర్పించువాని వంటివాడే ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువానివంటి వాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి వారి యసహ్యమైన పనులు తమకే యిష్టముగా ఉన్నవి.

ఈ సందర్భాన్ని మనం పరిశీలిస్తే ఆయన తన ఆజ్ఞలకు వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రజల బలులపట్ల అసహ్యంతో మాట్లాడుతున్నాడు. అందుకే వారు అర్పిస్తున్న గొఱ్ఱెపిల్ల బలిని ఆయన కుక్క మెడను విరచడంగా వారి నైవేద్యాన్ని పందిరక్తం అర్పించడంగా పోల్చి అసహ్యించుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన పేరిట కుక్క మెడను విరగదీయడం కానీ పంది రక్తాన్ని ఆయనకు అర్పించడం కానీ చెయ్యకూడదు (పంది అపవిత్రజంతువు - లేవీకాండము 11:7). ఆయనకు పశువుల్లోనైతే గోవులు, గొర్రెలు, మేకలు (లేవీకాండము 1:2), పక్షుల్లోనైతే తెల్లగువ్వలు, పావురాలు (లేవీకాండము 1:14) మాత్రమే అర్పించాలి. ఆ క్రమంలో ఆయన మొదటిగా "ఎద్దును వధించువాడు నరుని చంపువానివంటివాడే" అంటున్నాడు. అంటే నరబలి కూడా ఆయనకు మరింత అసహ్యమైనదని లేక ఆయన ఆజ్ఞాపించనిదని, కానీ ఎద్దును అర్పిస్తున్నవాడి ప్రవర్తనను బట్టి అది ఆయనకు నరున్ని అర్పిస్తున్నట్టే అసహ్యంగా ఉందని అర్థమౌతుంది కదా!. ఆయన నరబలి కోరేవాడైతే నరున్ని అర్పించడం ఆయనకు అసహ్యం, లేక ఆయన ఆజ్ఞాపించనిది అన్నట్టుగా పోల్చకూడదుగా? కానీ ఆయన నరబలిని కోరేవాడు కాడు దానిని అసహ్యించుకునేవాడు. అందుకే "వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి వారి యసహ్యమైన పనులు తమకే యిష్టముగా ఉన్నవి" అని కూడా అంటున్నాడు.

ఇంతవరకూ యెహోవా దేవుడు నరబలులు కోరేవాడు కాడు, వాటిని హేయక్రియగా అసహ్యించుకునేవాడని, లేవీయకాండము 27:28,29 వాక్యభాగంలోని మాటలు మనుషులను కూడా బలిగా అర్పించబడాలనే ఉద్దేశంతో చెప్పబడలేదని వివరంగా చూసాం. ఇక చివరిగా యెఫ్తా కుమార్తె బలి దగ్గరకు వద్దాం.

వాదనకోసం యెఫ్తా తన కుమార్తెను బలిగా అర్పించాడే అనుకుందాం (న్యాయాధిపతులు 11:39) దానికీ యెహోవా దేవునికి ఏంటి సంబంధం? అలా చెయ్యమని ఆయన ఎక్కడా ఆజ్ఞాపించలేదు పైగా అలా చెయ్యవద్దని అవి తనకు హేయక్రియ అని హెచ్చరించాడుగా? (ద్వితీయోపదేశకాండము 12:31). అలాంటప్పుడు అది ఆయన పేరిట చేసినప్పటికీ ఆయనకు దానితో ఏ సంబంధం ఉండదు. ఉదాహరణకు ఎవరైనా వ్యక్తి తనకు ఇష్టమైన నాయకుడి పేరిట ఆ నాయకుడికి అసహ్యమైనది అతను చెప్పనిది చేస్తే అప్పుడు దానికి ఆ నాయకుడు బాధ్యత వహిస్తాడా? లేదు కదా! మరి దీనినీ అలానే కదా ఆలోచించాలి. నేను కేవలం ఈమాటలు వాదనకోసం మాట్లాడుతున్నాను.

కనాను దేశంలో ప్రవేశించిన ఇశ్రాయేలీయులు ఆయన ముందే చేసిన హెచ్చరికను ఖాతరు చెయ్యకుండా ఆ కనానీయుల ఆచారం చొప్పున ఆ కనానీయుల దేవతలకు తమ పిల్లలను బలిగా ఇచ్చినప్పుడు ఆయన ఏవిధంగా స్పందిస్తున్నాడో చూడండి.

యెహెజ్కేలు 23:36-39 మరియు యెహోవా నాకీలాగు సెలవిచ్చెను నరపుత్రుడా, ఒహొలాకును ఒహొలీబాకును నీవు తీర్పు తీర్చుదువా? అట్లయితే వారి హేయకృత్యములను వారికి తెలియజేయుము. వారు వ్యభిచారిణులును నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి, నాకు కనిన కుమారులను విగ్రహములు మింగునట్లు వారిని వాటికి ప్రతిష్టించిరి. వారీలాగున నాయెడల జరిగించుచున్నారు అదియుగాక ఆ దినమందే, వారు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచిన దినమందే, నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్యదినములుగా ఎంచిరి. తాము పెట్టు కొనిన విగ్రహములపేరట తమ పిల్లలను చంపిననాడే వారు నా పరిశుద్ధస్థలములో చొచ్చి దాని నపవిత్ర పరచి, నామందిరములోనే వారీలాగున చేసిరి.

యిర్మియా 32:35 వారు తమ కుమారులను కుమార్తెలను ప్రతిష్టింపవలెనని బెన్‌ హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠము లను కట్టించిరి, ఆలాగు చేయుటకు నేను వారి కాజ్ఞాపింప లేదు, యూదావారు పాపములో పడి, యెవరైన నిట్టి హేయక్రియలు చేయుదురన్నమాట నా కెన్నడును తోచలేదు.

ఈ సందర్భాల్లో దేవుడు ఇశ్రాయేలీయులు కూడా కనానీయుల్లా ప్రవర్తించినప్పుడు దానిని ఎంతగానో అసహ్యించుకుంటూ "యూదావారు పాపములో పడి, యెవరైన నిట్టి హేయక్రియలు చేయుదురన్నమాట నా కెన్నడును తోచలేదు" అని పలకడం మనం చూస్తాం. వారు "నీవు వారితో నైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసికొనవద్దు. నీవు వారి దేవతలను సేవించినయెడల అది నీకు ఉరియగును గనుక వారు నీచేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశములో నివసింప కూడదు" (నిర్గమకాండము 23:32,33), "మరియు నీ దేవు డైన యెహోవా నీ కప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనముచేయుదువు. నీవు వారిని కటాక్షింపకూడదు, వారి దేవతలను పూజింపకూడదు, ఏలయనగా అది నీకు ఉరియగును" (ద్వితియోపదేశకాండము 7:16), "మీరు స్వాధీనపరచుకొన బోవు జనములు గొప్ప పర్వతముల మీద నేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటిక్రిందనేమి, యెక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలములన్నిటిని మీరు బొత్తిగా పాడుచేయవలెను. వారి బలి పీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చట లేకుండ నశింప జేయవలెను. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు" (ద్వితియోపదేశకాండము 12:2-4) అనే తన ముందస్తు హెచ్చరికను ఖాతరు చెయ్యకుండా ఆ కనానీయుల్లానే ప్రవర్తిస్తున్నప్పుడు అసహ్యించుకుంటున్న దేవుడు, అది కూడా ఆయనకు కాకుండా ఆ దేవతలకు అర్పిస్తున్నప్పుడు, మరి యెఫ్తా కనుక తన కూతురుని ఆయనకే బలిగా అర్పిస్తే అది ఆయన దృష్టికి మరింత అసహ్యమౌతుందిగా? మరి ఆయన అసహ్యించుకున్నదానితో ఆయనకేంటి సంబంధం?. పోని యెహోవా దేవునికి బలి అర్పించిన సందర్భాల్లో ఆయన ఆ బలిని "ఇంపైన సువాసనను ఆఘ్రాణించి" (ఆదికాండము 8:20,21) అనే మాటలు పదేపదే మనకు కనిపిస్తాయి. లేవీకాండములో వివరించబడిన ప్రతీబలిలోనూ ఈమాటలు ఉంటాయి. "ఇంపైన సువాసనను ఆఘ్రాణించి" లేక "ఇంపైన సువాసనగా" అంటే దేవుడు ఆ బలిని స్వీకరించాడు అని భావం. యెఫ్తా కుమార్తె విషయంలో ఆయన ఆ బలిని స్వీకరించినట్టుగా ఇలా ఏమన్నా రాయబడిందా? లేదు.

అయితే యెఫ్తా దేవుని ఆత్మతో నింపబడినవాడని రాయబడిందిగా (న్యాయాధిపతులు 11:29) అతను చేసుకున్న మ్రొక్కుబడి దేవుడు అంగీకరించే యుద్ధంలో అతనికి విజయం ప్రసాదించాడుగా (న్యాయాధిపతులు 11:30-33), విశ్వాసవీరుల జాబితాలో అతనిపేరు కూడా చేర్చబడిందిగా (హెబ్రీ 11:32) అలాంటప్పుడు ఆ బలితో యెహోవా దేవునికి సంబంధం లేకపోవడమేంటి అని నన్ను ప్రశ్నించవచ్చు. ముందు వాటన్నిటికీ సమాధానం చెబుతాను, తర్వాత యెఫ్తా కూతురుకు ఏమైందో అక్కడిమాటలను బట్టే వివరిస్తాను.

1. యెఫ్తా పైకి దేవుని ఆత్మ వచ్చింది అతని క్రియలన్నిటినీ ఆ ఆత్మానుసారంగా చెయ్యడానికి కాదు. ఆయన ఆయా సందర్భాల్లో ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులనూ రాజులనూ ప్రేరేపించింది ఇశ్రాయేలీయుల శత్రువులను హతం చేసేలా‌ ప్రత్యేకంగా బలపరచడానికి మాత్రమే. ఈ సందర్భాలు చూడండి.

న్యాయాధిపతులు 14:6 యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతనిచేతిలో ఏమియు లేకపోయినను, ఒకడు మేకపిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితో నైనను చెప్పలేదు.

న్యాయాధిపతులు 14:19 యెహోవా ఆత్మ అతనిమీదికి మరల రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో ముప్పదిమందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పినవారికి బట్టలనిచ్చెను.

1సమూయేలు 11:6,7 సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశములోని నలుదిక్కులకు దూతలచేత వాటిని పంపి-సౌలుతోను సమూయేలుతోను చేరకుండువాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనులమీదికి వచ్చెను గనుక యొకడైనను నిలువకుండ వారందరు వచ్చిరి.

ఈ సందర్భాల్లో సమ్సోను పైకీ మరియు సౌలు పైకి కూడా దేవుని ఆత్మ వచ్చినట్టు మనం చూడగలం. కానీ వారి క్రియలు మనం పరిశీలించినప్పుడు అవి దేవునికి అంగీకారంగా ఉండవు. కానీ వారి ద్వారా ఆయన ఇశ్రాయేలీయులను వారి శత్రువులనుండి రక్షించదలిచాడు కాబట్టి ఆ బలం కోసం తన ఆత్మను వారిపైకి పంపాడు.‌ అంతేతప్ప వారిని ఆత్మానుసారంగా నడిపించడానికో లేక వారి క్రియలన్నిటికీ ఆయనే బాధ్యుడని ఒప్పుకోవడానికో కాదు. దేవుడు తన ఆత్మను పంపేది ఇలా వేరు వేరు ఉద్దేశాలతో కూడా. ఆవిధంగా యెఫ్తా పైకి ఆయన యుద్ధ సందర్భంలో దిగివచ్చినప్పటికీ, యుద్ధం ముగిసాక అతని చర్యలకు ఆయన దానికి బాధ్యుడు కాజాలడు. దేవుని ఆత్మ ఎవరినీ దేవుని ఆజ్ఞలకు‌ వ్యతిరేకంగా నడిపించడని గుర్తుంచుకోవాలి.

2. యెఫ్తా దేవునికి యుద్ధంలో నన్ను గెలిపిస్తే నా కుమార్తెను బలిగా అర్పిస్తానని మ్రొక్కుకోలేదు. అలానే అతని మొక్కుబడిని బట్టి కూడా దేవుడు అతనికి విజయం ప్రసాదించలేదు. ఎందుకంటే అతను మ్రొక్కుకోవడానికి ముందే దేవుని ఆత్మ అతనిపైకి దిగివచ్చి అతనిద్వారా శత్రువులను నాశనం చెయ్యబోతున్నట్టు నిర్ధారించాడు. ఎందుకంటే దేవుని ఉద్దేశం: ఇశ్రాయేలీయులను అతనిద్వారా విడిపించాలి. న్యాయాధిపతులు అందరివిషయంలోనూ అలానే జరిగింది. ఈ వాక్యభాగం చూడండి.

న్యాయాధిపతులు 2:16-18 ఆ కాలమున యెహోవా వారికొరకు న్యాయాధి పతులను పుట్టించెను. వీరు దోచుకొనువారి చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంక న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గమునుండి త్వరగా తొలగి పోయి యితర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి; తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారికొరకు న్యాయాధిపతులను పుట్టించి, ఆయా న్యాయాధిపతులకు తోడైయుండి వారి దినములన్నిటను వారిశత్రువుల చేతులలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించెను.

కానీ యెఫ్తా తొందరపాటు మ్రొక్కుబడి చేసుకున్నాడు, యుద్ధం నుండి తిరిగివస్తున్నప్పుడు ఇంటినుండి మనుషులు ఎదురువచ్చే అవకాశమే ఎక్కువగా ఉంటుందనే అవగాహన అతనికి ఆ సమయంలో లేకుండా పోయింది. నిజానికి దేవుడు ఆ సంఘటను రాయించింది కూడా అలా తొందరపాటు మ్రొక్కుబళ్ళు వద్దని చెప్పడానికే.

ప్రసంగి 5:2 నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియ్యక నీ నోటిని కాచు కొమ్ము; దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమిమీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను.

3. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయపు విశ్వాసవీరుల జాబితాలో యెఫ్తా పేరు రాయబడింది బలి సందర్భంలో కాదు. దేవునిపైన విశ్వాసంతో తమకంటే బలవంతులైన శత్రువులతో పోరుకు దిగడం, వారిని జయించడం గురించే.

హెబ్రీయులకు 11:32-34 ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు, ప్రవక్తలనుగూర్చియు వివరించుటకు సమయముచాలదు. "వారు విశ్వాసముద్వారా రాజ్యములను జయించిరి" నీతికార్యములను జరిగించిరి. వాగ్దానములను పొందిరి "సింహముల నోళ్లను మూసిరి" అగ్నిబలమును చల్లార్చిరి; ఖడ్గధారను తప్పించుకొనిరి. "బలహీనులుగా ఉండి బలపరచబడిరి. యుద్ధములో పరాక్రమశాలులైరి; అన్యుల సేనలను పారదోలిరి".

అంతేతప్ప వారు చేసిన క్రియలన్నీ విశ్వాసంబంధమైనవని చెప్పడానికి కాదు. ఆ క్రమంలో రాయబడిన సమ్సోను క్రియల గురించి ఇప్పటికే ప్రస్తావించాను, గిద్యోను కూడా చివరికి అలానే ప్రవర్తించాడు (న్యాయాధిపతులు 8:26,27). హెబ్రీగ్రంథ కర్త వీరు యుద్ధసమయంలో కనపరచిన విశ్వాసాన్ని ఎత్తిపట్టుకుని యుద్ధవాతావరణం లాంటి రోమీయుల నియంత్రణ వల్ల క్రీస్తుకు దూరమౌతున్న హెబ్రీయులను విశ్వాసం కోల్పోవద్దని బలపరుస్తున్నాడు. అది ఆ మాటల సందర్భం. కాబట్టి; యెఫ్తా తన కూతురును బలి అర్పించినప్పటికీ దానితో దేవునికి సంబంధం లేదు. అలానే తన నియమాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వారిని అడ్డుకోవలసిన అవసరం కూడా ఆయనకు లేదు, అలాగైతే పాపం చేసే ప్రతీ ఒక్కరినీ ఆయన అడ్డుకుంటూనే ఉండాలి, అప్పుడు మానవ బాధ్యత సంగతేంటి?. కానీ యెఫ్తా అలా చెయ్యలేదు. అదెలాగో ఇప్పుడు వివరిస్తాను.

న్యాయాధిపతులు 11:31 నేను అమ్మోనీయులయొద్ద నుండి క్షేమముగా తిరిగివచ్చునప్పుడు, నన్ను ఎదుర్కొనుటకు నా యింటి ద్వారమునుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. మరియు దహన బలిగా దాని నర్పించెదననెను.

ఈ వాక్యభాగం ప్రకారం; యెఫ్తా తనను ఎదుర్కోవడానికి ఏదైతే వస్తుందో అది "యెహోవాకు ప్రతిష్ఠితమగును; మరియు దహన బలిగా దాని నర్పించెదనని" మొక్కుకున్నాడు. అయితే నేను పైన లేవీకాండము 27:28,29 లోని మాటలకు వివరణ ఇస్తున్నప్పుడే ప్రతిష్ట కనుక మనుషుల విషయంలో జరిగితే వారిని విడిపించాలని ఆధారాలతో చూపించాను. ఆ ప్రకారంగా చూసినప్పుడు యెఫ్తాకు తన కూతురును తగిన ధనం చెల్లించి ఆమెకు మారుగా పశువును బలి అర్పించి విడిపించుకునే అవకాశం ఉంది. ఆవిధంగా చేసినప్పటికీ తన మ్రొక్కుబడి తీర్చుకున్నట్టే. కేవలం పశువుల విషయంలో మాత్రమే అది కూడా పవిత్రజంతువులైన గోవు, గొర్రె, మేకల విషయంలో మాత్రమే దహనబలిగా అర్పించవలసి ఉంటుంది. అలాంటప్పుడు యెఫ్తా "కాబట్టి అతడు ఆమెను చూచి, తన బట్టలను చింపు కొని అయ్యో నా కుమారీ, నీవు నన్ను బహుగా క్రుంగచేసితివి, నీవు నన్ను తల్లడింపచేయువారిలో ఒకతెవైయున్నావు నేను యెహోవాకు మాట యిచ్చియున్నాను గనుక వెనుకతీయలేని" (న్యాయాధిపతులు 11:35) ఎందుకు వేదనపడ్డాడు అనంటే, దానికి అక్కడే సమాధానం‌ ఉంది. అతనికి ఆ ఒక్క కూతురు తప్ప మరే సంతానం లేదు (న్యాయాధిపతులు 11:34). యెఫ్తా ప్రతిష్టిస్తాను, దహనబలిగా అర్పిస్తాను అన్నప్పుడు, ఐతే అతనికి దాసదాసిలు ఎదురుగా వస్తారు, లేదా పశువులు వస్తాయి. ఒకవేళ దాసదాసీలు వస్తే వారిని జీవితాంతం వివాహజీవితానికి దూరంగా ఉండేలా ప్రతిష్టిస్తానని మొక్కుకున్నాడు. గమనించండి. ఇది కూడా దేవుడు ఆజ్ఞాపించింది కాదు, కానీ అతను తొందరపడి అలా మొక్కుకున్నాడు. తీరా అతని కూతురే వచ్చేసరికి ఆమెను అలా ప్రతిష్టిస్తే అతనికి ఇతరసంతానమేమీ లేదు కాబట్టి, అతని వంశం ఆమెతోనే ముగిసిపోతుంది, అలాగని ఆ మొక్కుబడి‌ చెల్లించకుంటే దేవుని దృష్టిలో దోషిని ఔతాననే భయం. అందుకే అతను వేదనతో అలా మాట్లాడాడు.‌

కాబట్టి యెఫ్తా కుమార్తె జీవితాంతం ప్రతిష్టితురాలిగా కన్యగా ఉంచబడింది తప్ప దహనబలిగా అర్పించబడలేదు. దీనికి మంచి ఆధారం ఆమె మాటల్లోనే మనకు కనిపిస్తుంది. ఉదాహరణకు; ఎవరైనా ఒక అమ్మాయిని బలి ఇవ్వబోతుంటే ఆ అమ్మాయి తన ప్రాణాల పోతున్నాయని బాధపడుతుందా లేక తన కన్యాత్వం నిమిత్తమా? ప్రాణం పోతుందనే కదా! కానీ యెఫ్తా కూతురు ఏమంటుందో ఏం చేస్తుందో చూడండి‌.

న్యాయాధిపతులు 11:37,38 మరియు ఆమెనా కొరకు చేయవలసినదేదనగా రెండు నెలలవరకు నన్ను విడువుము, నేనును నా చెలికత్తెలును పోయి కొండలమీద ఉండి, నా కన్యాత్వమునుగూర్చి ప్రలాపించెదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి రెండు నెలలవరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెలికత్తెలతో కూడ పోయి కొండలమీద తన కన్యా త్వమునుగూర్చి ప్రలాపించెను.

చూడండి ఆ అమ్మాయి దేనికోసం ప్రలాపించిందో. అయితే ఆమె కన్యగానే చనిపోబోతుంది కాబట్టి అలా చేసిందని వాదిస్తారేమో దానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఆమె కన్యగా ఉండి చనిపోతున్నందుకే ఇలా బాధపడుతుంటే ఆ రెండు నెలలూ ప్రలాపించడానికి కాదు, వివాహ జీవితం కోసం ఆమె కోరుకోవచ్చు. యెఫ్తా ఆ ప్రజలకు అధికారిగా ఉన్నాడు కాబట్టి ఆమె త్వరలో చనిపోతుందని తెలిసినా ఆమెను వివాహం‌ చేసుకుని యెఫ్తాకు అల్లుడిగా అతని ఆస్తిని అనుభవించడానికి లేదా తండ్రి మాటకోసం ప్రాణం కోల్పోవడానికి సిద్ధపడిన ఆమెపై గౌరవంతో కూడిన జాలితోటి చాలామంది ఆమెను వివాహం చేసుకోవడానికి సిద్ధపడతారు. అలాంటప్పుడు ఆమె ప్రలాపించడం ఎందుకు? కాబట్టి ఆమె ప్రలాపించింది కన్యగా ఉండి బలి అవ్వబోతున్నందుకు కాదు, జీవితాంతం కన్యగా ఉండబోతున్నందుకే. ఆ కాలం గడిచిన తరువాత యెఫ్తా "ఆ రెండు నెలల అంత మున ఆమె తన తండ్రియొద్దకు తిరిగిరాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిచొప్పున ఆమెకు చేసెను" (న్యాయాధిపతులు 11:39). చూడండి ఈ మాటల వెంటనే ఆమె కన్యగా ఉంచబడిందని స్పష్టంగా "ఆమె పురుషుని ఎరుగనేలేదు" (న్యాయాధిపతులు 11:40) అని రాయబడింది. ఈవిధంగా తండ్రి మ్రొక్కుబడికి తలవంచి కన్యగా ఉండిపోయిన ఆమె త్యాగానికి గుర్తుగా "ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు నాలుగు దినములు గిలాదుదేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధిచేయుటకద్దు". ఇదండీ యెఫ్తా కుమార్తె విషయంలో జరిగిన యదార్థ గాధ. ఆమె దహనబలిగా అర్పించబడలేదు కానీ జీవితాంతం కన్యగా ఉండిపోయింది. మళ్ళీ చెబుతున్నాను ఇలాంటి ప్రతిష్ట చెయ్యమని దేవుడు ఆజ్ఞాపించలేదు. యెఫ్తా అలాంటి మ్రొక్కుబడిని తొందరపాటుగా చేసుకుని దానిని నెరవేర్చకపోతే దేవుని దృష్టిలో దోషిని ఔతాననే భయంతో అలా చేసాడు. అతను అలా చెయ్యకుండా తొందరపడి మ్రొక్కుకున్నానని దేవుణ్ణి వేడుకున్నా సరిపోయేది. ఆయన అలాంటి మ్రొక్కుబడులు చేసుకోమని ఆజ్ఞాపించనప్పుడు అలా మ్రొక్కుకోవడమే తప్పైతే దానిని నెరవేర్చడం ఇంకా తప్పు ఔతుంది. ఒకవిధంగా యెఫ్తా చేసిన ఈ మ్రొక్కుబడి పౌలును చంపుతామని యూదులు ఒట్టుపెట్టుకున్నట్టే (అపొ.కా 23:11) దైవ న్యాయానికి వ్యతిరేకంగా ఉంది.

మరొక విషయం; ఇశ్రాయేలీయుల్లో యెహోవాకు బలి అర్పించాలంటే యాజకుడు మాత్రమే అర్పించాలి. దానిని‌ ధిక్కరించినందుకే సౌలు తిరస్కరించబడ్డాడు (1 సమూయేలు 13:8-14). అలాంటప్పుడు ఏ యాజకుడూ కూడా యెఫ్తా తన కూతురును బలిగా అర్పించడానికి సిద్ధపడినప్పటికీ ఆ పని చెయ్యలేడు. ఎందుకంటే నేను ప్రారంభంలో చెప్పినట్టుగా ప్రతీ బలికీ ఒక క్రమం ఉంటుంది, దేవుడు ఆజ్ఞాపించిన క్రమంలోనే యాజకుడు చెయ్యాలి. ధర్మశాస్త్రంలో నరబలికి సంబంధించిన ఏ క్రమమూ లేదు, పైగా అలా‌ చెయ్యవద్దని స్పష్టంగా ఆజ్ఞాపించబడినప్పుడు ఏ యాజకుడు మాత్రం ఆ సాహసం చెయ్యగలడు. ప్రజలు కూడా దానికి అంగీకరించరు. ఎందుకంటే అది ఇశ్రాయేలీయులంతా యెఫ్తా ద్వారా తమను శత్రువులనుండి రక్షించిన యెహోవాను అనుసరిస్తున్న సమయం. ఇలాంటి ప్రమాణమే సౌలు కూడా చేసి తన కుమారుడైన యోనాతానును చంపబోయినప్పుడు ప్రజలు దానిని‌ అడ్డుకుని అతన్ని రక్షించారు (1 సమూయేలు 14:44,45).

మతోన్మాదులకు ఇవేం అవసరం లేదు, ఎలాగైనా వారి దేవుళ్ళలో ఉన్న అరాచకత్వం, అనైతికత బైబిల్ దేవునిలో కూడా ఉన్నాయని రుజువు చెయ్యాలి. ఎందుకంటే వారి దేవుళ్ళ చరిత్రలు తెలుసుకునేగా చాలామంది వారిని విడిచిపెట్టి పరిశుద్ధుడునూ న్యాయవంతుడునైన యెహోవా దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. దానిని అరికట్టాలంటే వారికున్న మార్గాల్లో ఈ అక్రమపు ఆరోపణల మార్గం చాలా ప్రధానమైనది. బైబిల్ దేవుడు కూడా వారి దేవీ దేవతల వంటి వాడే అని కుట్రపూరితంగా రుజువు చేసేస్తే వారి గుడారాలు కాలీ అయ్యి మందిరాలు నింపబడడం ఎంతోకొంత ఆగిపోతుందిగా.

యెషయా 57:20 భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు అది నిమ్మళింపనేరదు దాని జలములు బురదను మైలను పైకివేయును.

ఆ క్రమంలో చివరికి వీరు దేవుడు ఇస్సాకు విషయంలో అబ్రాహామును పరిశోధించడాన్ని కూడా వక్రీకరించి ఆయన నరబలులు కోరేవాడని మాట్లాడుతుంటారు. కానీ ఆ సందర్భంలో ఆయన అబ్రాహామును పరిశోధించడానికే ఇస్సాకును బలిగా కోరాడని చాలా స్పష్టంగా రాయబడింది (ఆదికాండము 22:1) కాబట్టి అబ్రాహాము కూడా ఆయన ఇస్సాకును బలిగా స్వీకరించడని విశ్వసించే బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు (హెబ్రీ 11:18, 19) కాబట్టి, దానికిక వివరణ ఇవ్వదలచుకోలేదు (ఆదికాండము 22 వాఖ్యానం చూడండి).

బైబిల్ గ్రంథం నరబలులకు వ్యతిరేకమైనది కాబట్టే బ్రిటీష్ వారు దానికి అనుగుణంగా మన దేశంలో "నరబలి నిషేధచట్టం" చేసారు, ఉదాహరణకు Governor-Genaral of india Lord Hardinge - 1 (1844-1848) గారు. అంతకుముందు మన దేశంలో నరబలులు సర్వసాధారణం.

మతోన్మాదులు, బైబిల్ విమర్శకులు చేస్తున్నటువంటి మరికొన్ని ఆరోపణలకు సమాధానం కోసం ఈ వ్యాసాలు చదవండి.

హిందూ మతోన్మాదుల అశ్లీలపు ఆరోపణలకు బైబిల్ సమాధానాలు

కయీను తన చెల్లినే వివాహం చేసుకున్నాడా?

ఇశ్రాయేలీయులు కనానీయులను సంహరించడం నేరమా? న్యాయమా?

మోషే ధర్మశాస్త్రానికి‌ ముందు నైతిక ఆజ్ఞలు లేవా?

బైబిల్ దేవునికి స్త్రీలపై వివక్ష వాస్తవమా లేక ఆరోపణా?

స్త్రీకి శీలపరీక్ష, బైబిల్ దేవుని‌ వివక్షేనా?

బైబిల్ దేవునికి అంగవైకల్యం గలవారిపై వివక్ష వాస్తవమా?

తన వ్యభిచారాన్ని క్రైస్తవ్యానికి ఆపాదిస్తున్న EX ఓఫిరిస్ట్

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.