దుర్బోధలకు జవాబు

రచయిత: కె విద్యా సాగర్
చదవడానికి పట్టే సమయం: 13 నిమిషాలు

ఈ మధ్యకాలంలో అద్దంకి రంజిత్ ఓఫిర్, తెలుగు క్రైస్తవ సంఘంలో ఆయన ఇప్పటిదాకా చేస్తున్న గలిబిలి చాలదన్నట్టుగా, దేవునిలో ఉన్న గుణలక్షణాలన్నీ తనలో సంపూర్ణంగా ఉన్నాయంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై బ్రదర్ బిబుతో సహా మరికొందరు దైవజనులు కూడా స్పందించి ఆయనకు కొత్త దేవుడనే బిరుదును కూడా  ఇచ్చారు. వారి ఉద్దేశంలో రంజిత్ ఓఫిర్ కొత్త దేవుడంటే మరో సృష్టికర్తయైన దేవుడని కాదు కానీ సాతానుడు అని అర్థం.

దీనిని సమర్థించుకునే దిశగా అద్దంకి రంజిత్ ఓఫిర్ తన HP, పరలోకంలో సెక్స్ సిద్ధాంతాలలో పాలిభాగస్తుడైన మార్కుబాబుతో కలసి ఒక‌ వీడియో‌ మాట్లాడాడు. (ఆ‌ వీడియో లింక్ -  https://youtu.be/bKttlnyNzCA)

ఆ వీడియోలో మార్కు‌బాబు ఓఫిరును ప్రశ్నిస్తూ, దేవుని లక్షణాలు మీలో ఉన్నాయని చెప్పుకున్నందువల్ల కొంతమంది‌ మిమ్మల్ని కొత్తదేవుడు అంటున్నారు, పైగా ఆ కొత్తదేవుడు ఎవరో కాదు సాతానుడు అని కూడా అంటున్నారు. అంటే వారి దృష్టిలో సాతానులో దేవుని గుణలక్షణాలు ఉన్నట్టా అని తెలివిగా విషయాన్ని ఓఫిరును ఖండించినవారిపైకి నెట్టే ప్రయత్నం చేసాడు. బాబూ మార్కు బాబూ, నీకు మార్కు‌బాబని పేరు‌ ఎవరు పెట్టారో తెలీదు కానీ మట్టిబాబు అని పెట్టుంటే ఆ పేరు నీకు కరెక్ట్ గా సూట్ అయ్యేది‌.

ఎందుకంటే ఓఫిరుకు కొందరు కొత్తదేవుడని పేరుపెట్టి ఆ దేవుడు సాతానుడే అని‌ చెబుతుంది, సాతానులో దేవుని లక్షణాలు ఉన్నాయనే భావంతో కాదు. సాతాను ఏ విధంగా ఐతే దేవునితో సమానంగా ఉండాలని ఆరాటపడ్డాడో, అలాంటి సాతాను లక్షణాలు ఓఫిరులో కూడా ఉన్నాయని మాత్రమే.

యెషయా గ్రంథము 14:12-14 తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును మేఘమండలము మీదికెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?

మట్టిబాబూ, ఈ వచనాలు చూసాకైనా కొందరు ఓఫిరును కొత్తదేవుడని సంబోధిస్తూ ఆ దేవుడు సాతానుడే అని‌ ఎందుకు అంటున్నారో అర్థమయ్యిందా? ఇక ఓఫిరు రంగంలోకి దిగి ఎప్పటిలానే కొన్ని లేఖనాలను వక్రీకరించి, దేవునిలో ఉన్న లక్షణాలన్నీ తనలో సంపూర్ణంగా ఉన్నాయన్న తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేసాడు. ఆయన వాదన ప్రకారం, మోషేను దేవుడు అహరోనుకూ, ఫరోకూ దేవుడిగా నియమించాడు. కీర్తనలు 82:6 లో కూడా మీరు దైవాలని రాయబడింది; దాని గురించి యేసుక్రీస్తు కూడా యోహాను సువార్త 10:34,35 వచనాలలో ప్రస్తావించాడు. ఈవిధంగా వాక్యబీజానికి జన్మించినవారు దైవాలని సృష్టికర్తయైన దేవుడే చెబుతున్నాడు కాబట్టి, ఆయన కూడా అలాంటి వ్యాఖ్యలు చేసాడట. ఆయనను విమర్శించే ఎవరికీ ఈ లేఖనాలు తెలీదట పాపం.

తెలుసో లేదో ఇప్పుడు బాగా చూద్దాం. నిర్గమకాండం, 4;16, 7:1 వచనాల ప్రకారం; మోషేను దేవుడు అహరోను, ఫరోలకు దేవుడిగా నియమించాడనేది వాస్తవమే అయినప్పటికీ, దానర్థం దేవునిలో ఉన్న గుణలక్షణాలన్నీ మోషేలో సంపూర్ణంగా ఉన్నాయని కాదు. ఉదాహరణకు దేవుడు సృష్టికర్త, మోషే సృష్టికర్తనా? దేవుడు సర్వశక్తిమంతుడు, మోషే సర్వశక్తిమంతుడా? దేవుడు పరిశుద్ధుడు, మోషే దేవునిలా పరిశుద్ధుడా? కాదేషులో మోషే కూడా దేవుని యెదుట చెడునడత నడిచి కానానులో ప్రవేశించకుండా చనిపోయాడు.

దేవుని లక్షణాల గురించి రాయబడ్డ మరోమాటను చూద్దాం -

యోబు గ్రంథము 12:15,16 ఆలోచించుము ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును వాటిని ప్రవహింపనియ్యగా అవి భూమిని ముంచి వేయును. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశముననున్నారు.

ఈ లక్షణాలేవీ మోషేలో లేవు, ఉన్నాయని ఆయన కూడా ఎక్కడా చెప్పుకోలేదు. కానీ మన ఓఫిరు ఐతే  దేవునిలో ఏ లక్షణాలైతే ఉన్నాయో అవన్నీ అతనిలో‌ సంపూర్ణంగా ఉన్నాయని చెప్పుకున్నాడు, ఒకసారి ఆ వీడియోను చూడండి. కాబట్టి‌ ఓఫిర్ తన గురించి చేసిన వ్యాఖ్యలకూ దేవుడు మోషేను దేవుడిగా నియమించినదానికీ ఎటువంటి సంబంధమూ లేదు. దేవుడు మోషేను అహరోనుకూ, ఫరోకూ దేవునిగా నియమించడమంటే, మోషే వారితో దేవుని ప్రతినిధిగా వ్యవహరించడమే అని ఆ సందర్భంలోనే‌ మనకు స్పష్టంగా అర్థమౌతుంది.

నిజమే దేవునిలో ఉన్న కొన్ని లక్షణాలు‌ మనలో కూడా ఉన్నాయి; ఉదాహరణకు దేవుడు ప్రేమిస్తాడు, మనం కూడా ప్రేమిస్తున్నాం. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే, దేవునిలో ఉన్న అన్ని లక్షణాలూ మనలో ఉండవు, అవేంటో ఇప్పటికే వివరించాను. అదేవిధంగా మనలో ఉన్న ఆ కొన్ని లక్షణాలు కూడా దేవునికి ఉన్నంతగా సంపూర్ణంగా ఉన్నాయని చెప్పలేం. కానీ‌ ఓఫిర్ దేవునిలో ఉన్న లక్షణాలు అన్నీ తనలో ఉన్నాయన్నాడు, పైగా సంపూర్ణంగా ఉన్నాయన్నాడు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే కొత్తదేముడ్ని సాతానుడు అనక సత్యప్రవక్త అంటారా?

ఇక కీర్తనలు 82:6 దగ్గరకు వద్దాం; 

కీర్తనల గ్రంథము 82:6 మీరు దైవములనియు మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను.

ఓఫిర్ ఈమాటలు ప్రస్తావించి, యోహాను 10:34,35లో యేసుక్రీస్తు మాటలను ఆధారంగా చేసుకుని వాక్యబీజం ద్వారా జన్మించివారు దైవాలనే భాష్యం చెప్పచూసాడు. వాస్తవానికి ఈయనే కాదండోయ్, మన పీడీ సుందరావుగారు కూడా ఇదే చేస్తుంటాడు. కానీ, ఆ మాటలు ఎవరికొరకు రాయబడ్డాయో సందర్భం చూడండి.

(వాస్తవానికి; మనం కూడా దేవునికి పుట్టిన చిన్న దేవుళ్ళం, కుక్క కుక్క పిల్లల్ని కన్నట్టుగా, పిల్లి పిల్లి పిల్లల్ని కన్నట్టుగా దేవుడు కూడా చిన్న దేవుళ్ళను కంటాడు అనే దుర్బోధను "ఎర్ల్ పార్క్, కెప్లో డాలర్" అనేవారు మొదటిసారిగా ఉనికిలోని తీసుకువచ్చారు)

కీర్తనల గ్రంథము 82:1-8 దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పుతీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనులయెడల పక్షపాతము చూపుదురు? పేదలకును తలిదండ్రులులేని వారికిని న్యాయము తీర్చుడి శ్రమగల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు దేశమునకున్న ఆధారములన్నియు కదలుచున్నవి. మీరు దైవములనియు మీరందరు సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను. అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. దేవా లెమ్కు, భూమికి తీర్పు తీర్చుము అన్యజనులందరు నీకే స్వాస్థ్యముగా ఉందురు.

ఈ సందర్భమంతా మనం పరిశీలిస్తే ఈ మాటలను ఆసాపు ఇశ్రాయేలీయులలోని న్యాయాధిపతుల గురించి రాస్తున్నాడు. దేవుని ప్రతినిధిగా అహరోనుతోనూ, ఫరోతోనూ వ్యవహరించిన మోషే ఏవిధంగా ఐతే దేవునిగా సంబోధించబడ్డాడో, అదేవిధంగా ధర్మశాస్త్రపరంగా ఇశ్రాయేలీయులకు దేవుని ప్రతినిధులుగా తీర్పుతీర్చే న్యాయాధిపతులు కూడా దైవాలుగా సంబోధించబడ్డారు.‌ ఇది ఓఫిరు చెబుతున్నట్టుగా,పీడీ సుందరావు చెబుతున్నట్టుగా  వాక్యబీజం ద్వారా జన్మించిన అందరికీ సంబంధించిన మాటలు కావు, దేవుని వాక్యమైన ధర్మశాస్త్రమూలంగా ప్రజలకు తీర్పుతీర్చే న్యాయాధిపతులకు సంబంధించినవి మాత్రమే.

ఇప్పుడు యేసుక్రీస్తు ఈమాటలను ఏ సందర్భంలో ప్రస్తావించాడో చూద్దాం -

యోహాను 10:30-33 వచనాల ప్రకారం యేసుక్రీస్తు తాను దేవుణ్ణని ప్రకటించుకున్నప్పుడు యూదులు దానిని దైవదూషణగా భావించి, ఆయనను రాళ్ళతో కొట్టచూసారు. అప్పుడు యేసుక్రీస్తు 34-36 వచనాల ప్రకారం కీర్తనలు 82:6లో రాయబడిన మాటలను ప్రస్తావించి దేవుని వాక్యమెవరికి వచ్చెనో అనగా ధర్మశాస్త్రమును బట్టి తీర్పుతీర్చే న్యాయాధిపతులు దైవాలని లేఖనంలో రాయబడటం మీరు దేవదూషణగా పరిగణించనప్పుడు, తండ్రి ద్వారా న్యాయాధిపతిగా ప్రతిష్ట చేయబడి ఈలోకానికి పంపబడిన నేను దేవుణ్ణని చెప్పుకుంటే దేవదూషణ ఎలా ఔతుందంటూ బదులిస్తున్నాడు. యేసుక్రీస్తు న్యాయాధిపతియని లేఖనం చెబుతుంది (యాకోబు 5:9).

ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన రెండు విషయాలు:
1. ఇక్కడ దైవాలుగా సంబోధించబడింది నేటి విశ్వాసులు కాదు. ఇశ్రాయేలీయులలో దేవుని ప్రతినిధులుగా ధర్మశాస్త్రమును బట్టి తీర్పుతీర్చే న్యాయాధిపతులు మాత్రమే.
2. వారు దేవుని ప్రతినిధులు కాబట్టి దైవాలుగా  సంబోధించబడినప్పటికీ  యేసుక్రీస్తు మినహా వారు ఎవ్వరిలోనూ దేవునిలో ఉన్న అన్ని లక్షణాలూ సంపూర్ణంగా లేవు.‌ ఉన్నాయని వారు కూడా చెప్పుకోలేదు.

ఇప్పుడు చెప్పండి "సువార్తకు అడ్డంకి" మిస్టర్ రంజిత్ ఓఫిర్ గారు, మీరు చెప్పుకున్నదానికీ మీరు చూపించిన లేఖనాలకూ ఏమైనా‌ సంబంధం‌ ఉందా? మిమ్మల్ని సాతాను అన్నవారికి లేఖనాలు తెలీదంటూ ఎద్దేవా చేసే ప్రయత్నం చేసారుగా, వారికి తెలియనిది లేఖనాలు కాదు, మీకులా లేఖనాలను అడ్డంగా వక్రీకరించడం తెలియదు. ఇది మాత్రం మీకు తెలియట్లేదు. లేఖనాలను అపార్థం చేసేవారు I mean వక్రీకరించేవారు తమ‌ స్వకీయ నాశనం కోసమే అలా చేస్తారని 2 పేతురు 3:16లో రాయబడింది. జాగ్రత.

ఓఫిర్ గారు ఈ అంశంపై చేసిన వక్రీకరణలు చాలవన్నట్టుగా, నేను క్రీస్తును పోలినడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలినడచుకోమన్న పౌలు మాటలను కూడా ప్రస్తావించి, పౌలులో ఎలాగైతే  యేసుక్రీస్తు లక్షణాలన్నీ ఉన్నాయో అలానే తనలోనూ ఉన్నాయన్నట్టుగా మభ్యపెట్టే ప్రయత్నం చేసాడు. ఓఫిర్ ఏం చెప్పినా గంగిరెద్దులా తల ఊపడం తప్ప మరేమీ చెయ్యలేని మార్కుబాబు, సారీ సారీ , మట్టిబాబు ఆ మాటలు విని తెగ మురిసిపోయాడు. కానీ అక్కడ పౌలు నేను క్రీస్తును పోలినడచుకుంటున్నాను అన్నప్పుడు, క్రీస్తు ఈలోకంలో మానవుడిగా చూపించిన మాదిరిని అనుసరిస్తున్నాడనే భావమే తప్ప, ఆయనలోని దైవలక్షణాలు పౌలులో ఉన్నాయని కాదు.

మొదటి పేతురు 2:21 ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తుకూడ మీ కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచి పోయెను.

ఫిలిప్పీయులకు 2:5-8 క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూ పము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.

కాబట్టి పౌలు యేసుక్రీస్తు మానవుడిగా చూపించిన మాదిరిని పోలి నడచుకున్నాడే తప్ప, ఆయనలో ఉండే దైవలక్షణాలు అన్నిటినీ సంపూర్ణంగా కలిగి లేడు. ఎందుకంటే నేను ప్రారంభంలో చెప్పినట్టుగా దేవునికుండే అద్వితీయమైన లక్షణాలు మరెవ్వరూ సంపాదించుకోలేరు. చివరికి మనం క్రీస్తు స్వరూపంలోకి మార్చబడతాము అన్నప్పుడు కూడా క్రీస్తు పరిశుద్ధతను, మహిమను సంతరించుకుంటామనే భావమే తప్ప, ఆయనలా దేవుళ్ళమైపోతామని కాదు.

ఉదాహరణకు ఈ మాటలు చూడండి -

మొదటి యోహాను 3:2,3 ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమైయున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము. ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడైయున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును.

ఈ సందర్భంలో, యోహాను  ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనమంతా ఆయనను పోలియుంటామని (స్వరూపం) చెబుతూ ఆ క్రింది మాటల్లో పవిత్రత గురించి మాట్లాడుతున్నాడు. ఆ అధ్యాయం అంతా మనం ధ్యానిస్తే పాపం గురించే అతను హెచ్చరిస్తున్నాడు. కాబట్టి క్రీస్తు స్వరూపంలోకి మార్చబడతాము అన్నప్పుడు పాపం లేని స్థితి గురించీ, మహిమను గురించని మనం అర్థం చేసుకోవాలి.

అదే వీడియోలో ఓఫిర్ తనను దూషించేవారికి పాపక్షమాపణ లేదన్న వ్యాఖ్యను కూడా సమర్థించుకుంటూ తాను దేవుని బూరనని, పరిశుద్ధాత్మ ప్రేరణతోనే తన బోధలన్నిటినీ చేసానని ఈ కారణంచేత తనను దూషించేవారికి పాపక్షమాపణ లేదని ప్రస్తావించాడు. అయితే, మనకున్న అసలు సమస్య ఓఫిర్ చేసిన బోధలు పరిశుద్ధాత్మ సహాయంతో కాదు దురాత్మ ప్రేరణతోనే అనేదే కదా! ఎందుకంటే అతని‌ బోధలు పరిశుద్ధాత్మ ప్రేరణతోనే జరిగితే, అదే పరిశుద్ధాత్ముడు రాయించిన వాక్యానికి అంత విరుద్ధంగా ఎందుకుంటాయ్?

సరే వాదన కోసం, ఓఫిరిస్టుల ఆనందం కోసం ఆయన చేసే బోధలు పరిశుద్ధాత్మ ప్రేరణతోనే చేసాడు అనుకుందాం. అయితే‌ మాత్రం ఆయన్ని దూషిస్తే పాపక్షమాపణ ఉండదా? ఒకసారి వాక్యం ఏం చెబుతుందో చూద్దాం.

మత్తయి 12:32 మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.

ఈ సందర్భంలో‌ యేసుక్రీస్తు మాట్లాడుతూ, మనుష్యకుమారునికి (తనకు) విరుద్ధంగా మాట్లాడేవానికి పాపక్షమాపణ కలదు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు చేసిన బోధలు పరిశుద్ధాత్మ ప్రేరణతో చేసినవి కావా? యేసుక్రీస్తు దేవుని బూర కాదా?‌ యేసుక్రీస్తుకు విరోధంగా మాట్లాడినవాడికి కూడా పాపక్షమాపణ కలదని ఆయనే స్వయంగా చెబుతుంటే, ఈరోజు ఓఫిర్ వచ్చి నాకు విరోధంగా మాట్లాడితే పాపక్షమాపణ లేదని చెబుతున్నాడు.

దానిప్రకారం;
1. ఓఫిర్ యేసుక్రీస్తుకంటే గొప్పవాడైనా అయ్యుండాలి.
2. ఓఫిర్ పరిశుద్ధాత్ముడైనా అయ్యుండాలి.
3. ఓఫిర్ అబద్ధికుడైన అయ్యుండాలి.
మొదటి రెండూ ఓఫిర్ అయ్యే అవకాశం లేదు, దీనితో ఆయన కూడా ఏకీభవించక తప్పదు కాబట్టి, ఆయనకు మిగిలిన ఏకైన‌మార్గం అబద్ధికుడనని ఒప్పుకోవడం మాత్రమే. అబద్ధికులకు ఏ‌ గతిపడుతుందో ఈ వాక్యం చూడండి.

ప్రకటన గ్రంథం 22:15 కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు.

ఓఫిరే కాదు, ఆ అబద్ధికుడితో పాలివారైన అందరూ కూడా నరకాగ్ని పాలవ్వక తప్పదు కాబట్టి ఇప్పటికైనా ఓఫిరుస్టులు, ఓఫిర్ మినిస్ట్రీస్ నుండి బయటకు వచ్చి సత్యసంబంధులుగా జీవించండి.

 

Add comment

Security code
Refresh

Comments  

# Hitha bodha vaari maro vakhyanusaramaina bodhaVijay kumar 2022-04-02 12:03
Anna manchi article iccharu anna . Ilantivi inka inka raavali anna.
Reply
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.