బైబిల్

రచయిత: జాషువ జూడ్

 

ప్రకాశకుల ప్రశంస

“అపొస్తలుల కార్యములు” అనేకంటే “పరిశుద్ధాత్మ కార్యములు" అనడం అర్థవంతంగా ఉంటుంది. 30 సంవత్సరాల ఆది సంఘ చరిత్ర ఈ గ్రంథంలో నిక్షిప్తం చేయబడింది.

ప్రభువు తన శిష్యులతో 3 సంవత్సరాలు జీవించి, వారికి తర్ఫీదునిచ్చి, వారిని సేవకు పంపిన వైనం ఈ గ్రంథంలో చదువుతాం.

1 నుండి 12 అధ్యాయాల వరకు శిష్యుడైన పేతురు సేవను గూర్చి, 13 నుండి 28 అధ్యాయాల వరకు అపొస్తలుడైన పౌలు సేవను గూర్చి ప్రధానంగా చదువుతాం.

శిష్యుల్ని సేవకు పంపిస్తూ ప్రభువు తన “మేనిఫెస్టో" ను విడుదల చేశాడు. అది మొదటి అధ్యాయం 8వ వచనంలో చదవగలం. ఈ మాటలు ఈ గ్రంథం అంతటికీ చాల కీలకమైనవి.

ఈ అద్భుత సేవా వృత్తాంతాన్ని ప్రియులు జాషువ జూడ్ గారు వారి రేడియో కార్యక్రమం 'జుంటితేనె ధారలు'లో ధారావాహికంగా వినిపించారు. ఆ పాఠాల్ని ఉన్నవి ఉన్నట్టు, పాఠకుల ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం పుస్తక రూపంలో మేం మీకు అందించగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

ఈ రేడియోపాఠాల్ని పుస్తకరూపంలో వెలువరించడానికి అనుమతించి సహకరించిన ప్రియులు జాషువ జూడ్ గారికి మా కృతజ్ఞతలు.
సువార్తీకరణ పట్ల భారం గలవారంతా తప్పక చదవాల్సిన గ్రంథం ఇది.

జీవన్ జ్యోతి, నరసాపురం, ఆగష్టు 2005
పబ్లిషర్ - కె. విల్సన్

1]

సువార్తలను, మిగిలిన పత్రికలను కలిపే లింకులాంటిది అపొస్తలుల కార్యముల గ్రంథం. యేసుక్రీస్తు పరిచర్య ఈ గ్రంథంలో కొనసాగడం చూడగలం. యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన 'సర్వలోకానికి సువార్త ప్రకటించడం' అనే ప్రధాన నియామకానికి ఆయన శిష్యులు సంపూర్ణంగా లోబడడం ఈ గ్రంథంలో చూడగలం. భూమిమీద యేసుక్రీస్తు సంఘం స్థాపింపబడి, బహుగా విస్తరించడం ఈ గ్రంథంలో చూడగలం. సంఘ ప్రారంభదశలోని ముప్పై సంవత్సరాల చరిత్రను ఈ గ్రంథం వివరిస్తుంది. లూకా సువార్తను వ్రాసిన లూకాయే ఈ గ్రంథాన్ని కూడా వ్రాసాడు. లూకా ఒక చరిత్రకారునివలె జరిగిన సంగతులన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలిసికొని వాటిని గురించి వరుసగా రచించాడు. స్పష్టమైన, ఖచ్చితమైన వివరాలు పొందుపరిచాడు. లూకా తన రెండు గ్రంథాలను థియోఫిలా అనే ఘనత వహించిన ఒక రోమా అధికారికి వ్రాసాడు. థియోఫిలా అనే పేరుకు 'దేవుణ్ణి ప్రేమించువాడు' అని అర్థము. చరిత్రను అందించాలనే లూకా ఉద్దేశ్యాన్ని దీనిలో చూడగలం. సంఘం ఏరీతిగా ప్రారంభమై, వర్థిల్లిందో, క్రైస్తవ్యం ఎంత చారిత్రాత్మకమైందో లూకా వ్రాసాడు. క్రైస్తవ విశ్వాసాన్ని అన్యుల ఎదుట, యూదుల ఎదుట అపొస్తలులు ఏ విధంగా సమర్థించారో ఈ గ్రంథంలో వ్రాయబడింది. యెరూషలేము నుండి రోమా పట్టణం వరకు సువార్త ఎలా వ్యాపించిందో, క్రైస్తవ్యం క్రూరమైన హింసను తట్టుకొని ఎలా జయించిందో ఈ గ్రంథం తెలియజేస్తుంది.

మొదటి 12 అధ్యాయాలలో సంఘం ప్రారంభం, పేతురు పరిచర్యల గురించి వ్రాయబడ్డాయి. 13వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు అంతియొకయ నుండి రోమా పట్టణం వరకు సంఘవిస్తరణ, పౌలు పరిచర్యల గురించి వ్రాయబడింది. ఈ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ కార్యాల గ్రంథంగా కూడా వేదాంత పండితులు వర్ణించారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే అపొస్తలులను బలపరచి సంఘస్థాపన, అభివృద్ధి కొరకు వాడుకున్నాడు. శిష్యులు పరిశుద్ధాత్మలో బాప్తీస్మము పొంది, శక్తి పొంది ప్రభువుకు సాక్షులై జీవించారు. అపొస్తలుల కార్యాల గ్రంథ సారాంశము మొదటి అధ్యాయం 8వ వచనంలో ఉన్నట్టుగా ప్రభువు శిష్యులు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములందంతటను, భూదిగంతముల వరకు ఆయనకు సాక్షులై ఉండుటయే. యేసే మెస్సీయ అన్న సువార్త యూదులకు మాత్రమేకాక లోకమంతటికి అని ఈ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. అపొస్తలుల కార్యాల గ్రంథం పరివర్తన సమయాన్ని మనకు చూపిస్తుంది. సువార్తలలో ఉన్న క్రీస్తు పరిచర్య నుండి అపొస్తలుల పరిచర్యకు పాత నిబంధన నుండి క్రొత్త నిబంధనకు ఇశ్రాయేలీయుల నుండి సంఘానికి కలిగిన పరివర్తనను గమనించగలం. సంఘ ప్రారంభ దినాలలో ప్రభువు తన వాక్యాన్ని స్థిరపరచడానికి అపొస్తలులను తానే పంపినట్లు గురుతుగా సూచక క్రియలను, మహాత్కార్యాలను జరిగించాడు. సూచక క్రియలు, మహాత్కార్యాలు సంఘ ప్రారంభదశ అనే పరివర్తన సమయానికి చెందినవని పాఠకులు గమనించాలి.

ఈ సమయంలో మొదటి అధ్యాయంలోని సారాంశాన్ని చూద్దాం. యేసు ప్రభువు సిలువలో మరణించి తిరిగి లేచి నలభై రోజులు తన శిష్యులకు కనపడుతూ దేవుని రాజ్య విషయాలను గూర్చి వారికి బోధిస్తూ అనేక ప్రమాణాలు చూపించి, వారికి తనను తాను సజీవునిగా కనపరచుకున్నాడు. అందుకే ఆయనను సైనికులు పట్టుకున్నప్పుడు భయపడి పారిపోయిన శిష్యులు ఆయన పునరుత్థానుడైన తర్వాత ధైర్యవంతులయ్యారు. మన ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు, ఆయన సజీవుడు. అందుకే ఆయన ప్రకటన 1:18లో ఇలా అన్నాడు, “నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను; మృతుడనైతిని గాని, ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణము యొక్కయు, పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి.” మన ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచినట్లు అనేక ప్రమాణాలు, రుజువులు చూపించాడు. మరణాన్ని జయించి సజీవుడైనట్లు చారిత్రాత్మక రుజువులు కలిగినవాడు యేసుక్రీస్తు ఒక్కడే. పరిశుద్ధాత్ముని పంపిస్తానని తాను చేసిన వాగ్దానం కొరకు శిష్యులు కనిపెట్టాలని ప్రభువు వారికి బోధించాడు. 'మీయొద్ద ఎల్లప్పుడు ఉండడానికి వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియైన ఆత్మను మీకనుగ్రహిస్తానని' ఆయన వాగ్దానం చేసాడు. ఆ పరిశుద్ధాత్ముడు మీతో కూడా నివసిస్తాడు, మీలో ఉంటాడు, మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడని ప్రభువు చెప్పాడు. ప్రభువు పరలోకానికి ఆరోహణుడైన 10 రోజులకు పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు అను పండుగ దినాన్న అనుగ్రహింపబడ్డాడు. అప్పటినుండి ఆయన పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకాన్ని ఒప్పుకొనచేస్తూ సువార్తను వ్యాపింపజేస్తూ, సంఘాన్ని ప్రభువు రెండవ రాకడ కొరకు సిద్ధం చేస్తున్నాడు. ఆ పెంతెకోస్తు పండుగ దినం వరకు శిష్యులు పరిశుద్ధాత్మ దేవునికొరకు కనిపెట్టారు. ఆయన అనుగ్రహింపబడ్డాడు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టనవసరం లేదు.

కొందరు భావిస్తున్నట్లు రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్ముని పొందడానికి ఆయన కొరకు కనిపెట్టడం వాక్యానుసారం కాదు. ఒక వ్యక్తి రక్షింపబడినప్పుడే పరిశుద్ధాత్మను పొంది ఆయనిచ్చే దైవ జీవాన్ని, దైవ స్వభావాన్ని పొంది దేవుని బిడ్డ అవుతాడు. ఈ రీతిగా రక్షింపబడడంలోనే పరిశుద్ధాత్మను పొందడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అనే అంశం తరచు అపార్థం చేసుకోబడింది. 1:5లో ఇలా ఉంది, "యోహాను నీళ్ళతో బాప్తిస్మమిచ్చెను గానీ, కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను". ఆ పండుగ దినాన్న పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడినప్పుడు వారంతా పరిశుద్ధాత్మలో బాప్తీస్మం పొందారు. పరిశుద్ధాత్మ బాప్తీస్మం అంటే క్రీస్తు శరీరమైన సంఘంలో చేర్చబడుట. 1కొరింథీ. 12:12, 13 వచనాలలో ఏమని వ్రాయబడి ఉందో చూడండి, “ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేక అవయవములు కలిగి యున్నదో, యేలాగు శరీరము యొక్క అవయవములన్నియు అనేకములై యున్నను ఒక్క శరీరమైయున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతిమి.”

ఒక వ్యక్తి రక్షింపబడినప్పుడు పరిశుద్ధాత్మను పొందుటద్వారా క్రీస్తు ప్రభువు సంఘములో చేర్చబడును. పరిశుద్ధాత్మ బాప్తీస్మం పొందమని వాక్యంలో ఎక్కడా లేదు. గనుక ఇది మనం ఆశించే అనుభవం కాదుగాని ఒప్పుకొనే సత్యం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొంది నాకు సాక్షులై ఉంటారని ప్రభువు సెలవిచ్చాడు. ఆయనకు ఈ భూమిమీద సాక్షులై ఉండటానికి మనకు పరిశుద్ధాత్మ శక్తి అవసరం. అంతేకాదు, పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ప్రభువుకు సాక్షులుగా ఉండటానికి బలమిస్తుందే కాని ఏదో అర్థంలేని చేష్టలు చేయించదు. పాఠకులారా, మీకొరకు ప్రాణం పెట్టిన ప్రభువుకు సాక్షులుగా ఉంటున్నారా? ప్రభువు ఈ విషయాలు తన శిష్యులకు బోధించి పరలోకానికి ఆరోహణుడయ్యాడు. శిష్యులు ఆకాశంవైపు తేరిచూస్తుంటే ఇద్దరు దేవదూతలు వచ్చి - ఏరీతిగా యేసుప్రభువు మహిమ శరీరంతో మేఘాలపై పరలోకానికి చేర్చబడ్డాడో, ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడని వారితో చెప్పారు. యేసుప్రభువు తిరిగి రానైయున్నాడు. ఆయన తనయందు విశ్వాసముంచినవారిని తన రాజ్యానికి తీసుకువెళతాడు. పాఠకులారా, ఆయన రాకడ కొరకు కనిపెడుతూ, దానిని ఆశతో ఆపేక్షించాలి. ఆయన ప్రత్యక్షత కొరకు అపేక్షించేవారికందరికీ నీతికిరీటం అనుగ్రహింపబడుతుంది. ఆయన రాకడ కొరకు సిద్ధపడి కనిపెట్టండి.

అపొస్తలుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయంలో శిష్యులు. సహోదరులు, భక్తిగల స్త్రీలు ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నట్టు 14వ వచనంలో వ్రాయబడి ఉంది. ప్రార్థన ప్రాముఖ్యత ఎంత తెలిసినా చాలా శాతం మనం ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నాం. ఈ విషయం తీవ్రంగా ఆలోచించాలని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. ఐక్యతతో కలిసి ఎడతెగక ప్రార్థిద్దాం, భక్తిని
కాపాడుకుందాం.

యూదా ఇస్కరియోతు తప్పిపోయి పోగొట్టుకున్న పరిచర్యను, అపొస్తలత్వాన్ని దేవుడు మత్తీయకు అనుగ్రహించాడు. శిష్యులు ప్రార్థన ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకున్నారు. ఈ అపొస్తలుల కార్యాల గ్రంథ ధ్యానాలను దేవుడు మనకందరికీ ఆశీర్వాదకరంగా చేయునుగాక!

ప్రార్థన:- పరలోకమందున్న మా తండ్రీ! వాక్యాన్ని ధ్యానించడానికి మాకిచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి మీ కొరకు సాక్షులుగా జీవించడానికి మాకు సహాయం చేయండి. మీ రాకడకై ఎదురు చూడడానికి ఎడతెగక ప్రార్థించడానికై సహాయం చేయండి, యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రీ, ఆమేన్!

2]

“పెంతెకోస్తు పండుగ దినము వచ్చినపుడు అందరూ ఒకచోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.” ఈ రెండవ అధ్యాయంలో పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడడం, 3000 మంది బాప్తిస్మము పొంది సంఘం ప్రారంభించబడడం జరిగింది. అది పెంతెకోస్తు పండుగ రోజు. పెంతెకోస్తు అంటే 50వ రోజు అని అర్థం. పస్కాపండుగ రోజు నుండి 50వ రోజునాడు ప్రథమ ఫలముల పండుగను ఇశ్రాయేలీయులు జరుపుకోవాలని దేవుడు సెలవిచ్చాడు. ఇశ్రాయేలీయులు ఆ రోజున కొత్త ఫలముల అర్పణను ఇచ్చేవారు.

పరిశుద్ధాత్ముడు ఆ పండుగ రోజు అనుగ్రహింపబడడంలో మనం పొందబోయే పరలోక స్వాస్థ్యానికి ప్రథమ ఫలముల సంచకరువుగా మనకు అనుగ్రహింపబడ్డాడు. ఆయన అనుగ్రహింపబడినట్లు దేవుడు రెండు స్పష్టమైన గురుతులు ఇచ్చాడు. వేగముగా వీచే బలమైన గాలి వంటి ఒక ధ్వని. రెండవది - అగ్నిజ్వాలలవంటి నాలుకలు. గాలి లేదా ఊపిరి పరిశుద్ధాత్మకు పోలికగా బైబిల్లో వ్రాయబడింది (యెహె. 37:9; యోహాను 3:8). అగ్ని కూడా దేవుని సన్నిధికి సాదృశ్యం అని నిర్గమకాండం 3వ అధ్యాయం 2 నుండి 6 వరకు చూడగలం. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన అనుగ్రహించిన వాక్ శక్తిని బట్టి అన్యభాషలతో మాట్లాడారు. ఆ సమయంలో పండుగకు యెరూషలేముకు ఆయా దేశాల నుండి వచ్చిన భక్తిగల యూదులు గలిలయులైన శిష్యులు అనేక భాషలతో మాట్లాడడం చూచి విభ్రాంతి చెందారు. కొందరైతే శిష్యులు ఏదో కొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యం చేసారు. పరిశుద్ధాత్మ శక్తితో శిష్యులు, మిగిలిన సహోదరులు అన్యభాషలతో మాట్లాడుతూ దేవుని గొప్పకార్యాలు వివరించారు. శిష్యులు మాట్లాడింది భూమిమీద వాడబడే భాషలేగానీ, ఏదో అర్థంలేని పిచ్చి మాటలు కాదు. పరిశుద్ధాత్మ శక్తితో వారికి తెలియని భాషలో దేవుని కార్యాలను వారు వివరించినపుడు ఆ భాష తెలిసిన యూదులు విని ఆశ్చర్యపడ్డారు. వారు మాట్లాడినది భాషలు. ఈ రోజుల్లో చాలామంది పరిశుద్ధాత్మ శక్తితో భాషలు మాట్లాడుతున్నాం అంటారుగానీ, వారు మాట్లాడేది భాష కాదు. ఏదో అర్థం లేని పదే పదే పలికే కొన్ని అక్షరాల సముదాయం. అటువంటిది పరిశుద్ధాత్మ పనికాదు. మనుష్యుల సొంత ప్రయత్నమే.

1కొరింథీ. 14:22 ప్రకారం భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నాయి. సువార్తను నమ్మని అవిశ్వాసులైన యూదులకు దేవుని తీర్పు విషయమై ఒక సూచనగా వారికి ఇవ్వబడింది. యూదులకు తీర్పు విధింపబడింది. కనుక ఇప్పుడిక ఆ సూచనకు అవశ్యకత లేదు. అపొస్తలుల కార్యముల గ్రంథంలో భాషలు మాట్లాడడం మరి రెండుసార్లు మాత్రమే జరిగింది. అప్పటినుండి దేవుని ప్రజలు అన్ని జాతుల నుండి వస్తారని, ఇశ్రాయేలీయుల నుండి సంఘానికి పరివర్తన జరిగినట్లు భాషలు కనపరిచాయి. ఇటువంటి ఉద్దేశ్యంతో దేవుడు భాషలను అనుగ్రహిస్తే కొందరు భాషలు మాట్లాడినవారిని చూసి వారేదో మద్యం తాగి మత్తులైయున్నారని అపహాస్యం చేసారు. ఈ మాటను తీసుకొని చాలా మంది పరిశుద్ధాత్మ నింపుదల పొందడం అంటే మద్యంతో మత్తులైనట్టు ప్రవర్తించడం అనుకుంటున్నారు. దేవుని కార్యాన్ని అపహాస్యం చేసిన వారి మాట తీసుకొని అర్థంలేని చేష్టలు చేయడం, దానిని పరిశుద్ధాత్ముని పని అనడం పరిశుద్ధాత్మను అపహసించడమే. మోకాళ్ళ మీద తిరుగుతూ ఒంటి మీద వస్త్రాలు చెదిరిపోతున్నా వింతగా ప్రవర్తిస్తూ ఇది పరిశుద్ధాత్మ పని అనడం పరిశుద్ధాత్మను అపహసించడమే. పేతురు నిలువబడి వాక్యాన్ని బోధిస్తూ అంత్యదినాలలో జరగబోయే యోవేలు ప్రవచనాన్ని గుర్తుచేసాడు. అంత్యదినాలలో దేవుడు మనుష్యులందరి మీద ఆయన ఆత్మను కుమ్మరించి ఆకాశంలో మహాత్కార్యాలు, భూమి మీద సూచక క్రియలు సూర్య చంద్రులలో మార్పు కలుగజేస్తాడు. దీనికి ముందస్తుగా అపొస్తలుల కాలంలో కొన్ని సూచనలు నెరవేరాయి. పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడ్డాడు. అయితే యోవేలు ప్రకటించినట్లు మనుష్యులందరి మీద ఆత్మ కుమ్మరింపబడడం అనేది ప్రభువు వెయ్యేండ్ల పరిపాలనలో జరగనై ఉంది.

ఈ క్రీస్తు సిలువ వేయబడడం దేవుడు నిశ్చయించిన సంకల్పాన్ని బట్టి ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించే జరిగిందని పేతురు బోధించాడు. యేసుక్రీస్తు మానవుల పాపం కోసం మరణించాలని జగత్తు పునాదికి ముందే నిర్ణయించబడింది. 'జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొఱ్ఱె పిల్ల' అని ప్రభువును గూర్చి ప్రకటన 13:8లో వ్రాయబడి ఉంది. దేవుని సంకల్పం ప్రకారం ప్రభువు మనకొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఇటువంటి ప్రభువునే నిరాకరించారని పేతురు వర్తమానం ద్వారా విని యూదులు హృదయంలో నొచ్చుకొని 'ఇప్పుడు మేమేం చేయాలని' అపొస్తలులను అడిగారు. అందుకు పేతురు మారుమనస్సు పొందమని మూర్ఖులైన ఆ తరమువారికి వేరై రక్షణ పొందమని తాము నిరాకరించిన ప్రభువు పేరట బాప్తిస్మం పొందమని చెప్పాడు. ఆరీతిగా వారు పాపక్షమాపణ పొంది పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారని చెప్పాడు. అప్పుడు అతని వాక్యం అంగీకరించిన ఇంచుమించు 3000 మంది బాప్తిస్మము పొందారు. మనం కూడ మారుమనస్సు పొంది యేసుప్రభువును నమ్మి రక్షణ పొంది బాప్తిస్మం తీసుకోవాలి. ప్రభువును తిరస్కరించే మూర్ఖతరానికి వేరైతేనే రక్షణ పొందగలము. వాక్యాన్ని అంగీకరించినవారు బాప్తిస్మం తీసుకున్నారు. చాలామంది వాక్యాన్ని అంగీకరించాము అంటారేగానీ, బాప్తిస్మము తీసుకోరు. వాక్యాన్ని నిజంగా అంగీకరిస్తే ప్రభువు ఆజ్ఞకు లోబడి బాప్తిస్మము తీసుకోవాలిగదా! ప్రియ పాఠకులారా, మీరు ప్రభువు నామాన్ని బట్టి బాప్తిస్మం తీసుకున్నారా? సంఘంగా చేర్చబడిన వీరందరూ అపొస్తలుల బోధలోను, సహవాసంలోను, ప్రభువు బల్లలో పాలు పొందుటలోను, ప్రార్థన చేయుటలోను ఎడతెగక ఉన్నారు. దేవుడు అపొస్తలుల ద్వారా బైబిల్ లో అనుగ్రహించిన వాక్యమే సత్యము. దీనికి మించి లేదా భిన్నంగా మనుష్యులు బోధించే ఏ సిద్ధాంతాలనూ అనుసరించకూడదు. విశ్వాస జీవితానికి తోటి విశ్వాసుల సహవాసం ఎంతో ప్రాముఖ్యమైనది. అందుకే హెబ్రీ 10:24,25లో ఇలా ఉంది, “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును, సత్ కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” ప్రియ పాఠకులారా, సహవాసం యొక్క అవసరాన్ని, విలువను గుర్తించారా? మంచి సహవాసాన్ని కలిగి ఉన్నారా? ప్రభువు బల్లలో పాలుపొందడం, ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ. ప్రభువు రాకడవరకు విశ్వాసులందరు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, దానిని ప్రచురించడానికి ప్రభువు బల్లలో పాలు పొందాలి.

ప్రియ పాఠకులారా, క్రమంగా ప్రభువు బల్లలో పాలుపొందుతూ ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారా? మీరు ప్రభువు బల్లలో పాలుపొంది ఎంత కాలమైంది? రొట్టె విరుచుటలో ఎడతెగక ఉండాలని పాఠం నేర్చుకుంటున్నాం. ప్రార్థన వ్యక్తిగతంగానూ, సంఘంతో కలిసి ఎడతెగక చేయడం భక్తి జీవితానికి ఎంతో అవసరం, ఎడతెగక ప్రార్థిస్తున్నారా? శిష్యులందరూ ఏకమనస్సుతో దేవాలయంలో తప్పక కూడుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ప్రజలందరి వలన దయపొంది ఆనందంతో, నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకొనేవారు. ఎంత చక్కటి మాదిరిని ఇక్కడ చూడగలమో కదా! సంఘాలలోని విశ్వాసులందరూ ఏకమనస్సుతో, ఆనందంతో, నిష్కపటమైన హృదయంతో ఇతరుల అక్కరలు తీరుస్తూ, ఇక జీవించడం ఎంతో అవసరం. ప్రియులారా, మీ సంఘంలో మిరీరీతిగా ఉంటున్నారా? 'ప్రభువు రక్షణ పొందుతున్నవారిని అనుదినం వారితో చేర్చుచుండెన'ని వారు ఉంది. రక్షణ అనేది దేవుడే చేసే కార్యం. దేవుడే ప్రజలను రక్షించి సంఘంలో చేరుస్తాడు. రక్షింపబడినవారే నిజముగా దేవుని సంఘంలో సభ్యులు, మందిరానికి వచ్చేవారందరూ దేవుని సంఘబిడ్డలు కారు. పాఠకులారా, మీరు రక్షించబడ్డారా? నిజముగా క్రీస్తు శరీరమైన ఆయన సంఘంలో భాగస్తులయ్యారా? ఏదో ఇప్పటివరకూ నామకారంగా జీవించారేమో, మారుమనస్సు పొంది ప్రభువువైపు తిరిగి రక్షణ పొందండి.

ప్రార్థన:- పరిశుద్ధాత్మను మాకు ఆదరణకర్తగా అనుగ్రహించిన దేవా, ఆయన శక్తిద్వారా మీకు సాక్షులుగా ఉండడానికి సహాయం చెయ్యండి. సత్యవాక్యంలో మంచి సహవాసంలో మమ్మల్ని స్థిరపరచండి. ఏకమనస్సుతో ఆనందంగా, నిష్కపటంగా సహవాసంలో ఉండడానికి సహాయం చెయ్యండి. ప్రభువైన యేసు నామంలో వేడుకొంటున్నాము తండ్రీ! ఆమేన్!

3]

ఈ పాఠంలో అపొస్తలుల కార్యాలు 3, 4 అధ్యాయాలలోని ముఖ్య అంశాలు ధ్యానించుకుందాం. ఈ అధ్యాయాలలో, పుట్టింది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుని పేతురు యేసుక్రీస్తు నామంలో స్వస్థపరచడం, ఈ అద్భుతం ద్వారా అయిదు వేలమంది పురుషులు ప్రభువును నమ్మడం, దీనిని చూసి శాస్త్రులు, పెద్దలు పేతురు,యోహానులను బంధించి, బెదిరించడం జరిగింది. శిష్యులు ఏక మనస్సుతో ప్రార్థించి పరిశుద్ధాత్మతో నింపబడి హింసలలో కూడ దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు. కుంటివాడైన ఆ మనుష్యుడు ప్రతిదినం శృంగారమనే దేవాలయం ద్వారం దగ్గర మనుష్యులచేత మోసికొని పోబడి భిక్షాటన కొరకు ఉంచబడేవాడు. వాడు పేతురు, యోహానులు దేవాలయంలో ప్రవేశింపబోతున్నప్పుడు వారిని భిక్షమడిగాడు. పేతురు అతనితో 'వెండి, బంగారాలు నా దగ్గర లేవుగానీ నాకు కలిగినదే నీకిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నడువుమని' చెప్పి వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తాడు. వెంటనే అతని పాదాలు చీలమండలు బలము పొంది అతడు లేచి నడిచి గంతులు వేసాడు. దేవుని స్తుతిస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడు. అందరూ జరిగినదాన్ని చూసి విస్మయంతో నిండి పరవశులయ్యారు.

ప్రజలందరూ పేతురు, యోహానుల వల్ల ఈ అద్భుతం జరిగిందన్నట్టు వారి దగ్గరకు గుంపుగా పరిగెత్తి వచ్చి వారి తట్టు తేరిచూచారు. అందుకు పేతురు 'మా సొంత శక్తిచేత గానీ, భక్తిచేతగానీ కుంటివానిని నడిపించినట్టు మీరెందుకు మాతట్టు తేరి చూస్తున్నారు? యేసుక్రీస్తు నామమందలి విశ్వాస మూలముగానే అతనికి పూర్ణస్వస్థత కలిగిందని' చెప్పాడు. యేసుక్రీస్తు నామంలోనే స్వస్థతలు, రక్షణ, ఉపకారాలు, ఆశీర్వాదాలు పొందగలం. నా వద్ద వెండి, బంగారాలు లేవుగానీ, నాకు కలిగిందే నీకిస్తాను నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నడువుమని పేతురు చెప్పినప్పుడు ఆ కుంటివాడు బాగుపడ్డాడు. ఆ భిక్షకునికి పేతురు ఒకవేళ వెండి, బంగారాలిచ్చినా అవి అతని కుంటితనాన్ని పోగొట్టలేవు కదా! వెండి, బంగారాలు చేయలేని మేలు యేసుక్రీస్తు నామం ద్వారా అతనికి కలిగింది. డబ్బు, ఆస్తి, కులం, మతం, మనుష్యులు చేయలేని మేలు దేవుడు చేయగలడు. వెండి, బంగారాలు లేకపోయినా యేసు ప్రభువును కలిగి ఉంటే జీవితానికి కావలసిన ప్రతి మేలు ఆయన ద్వారా పొందగలం.

పేతురు దగ్గర వెండి, బంగారాలు లేకపోవడమే మేలయ్యింది. యేసుక్రీస్తు నామాన్ని ఆ కుంటివానికి పరిచయం చేసాడు.

పాఠకులారా, యేసుక్రీస్తు నామం ఎంత విలువైందో గ్రహించారా? లోకంలో ఉన్నదానంతటికంటే యేసుక్రీస్తు నామం శ్రేష్ఠమైంది. యేసుక్రీస్తు నామంలోనే మానవులందరికి పాపశిక్ష నుండి పాపపుశక్తి నుండి రక్షణ దొరుకుతుంది. ఇంకే నామంలోను ఇటువంటి రక్షణ దొరకదు, అందుకే 4వ అధ్యాయం 12వ వచనంలో పేతురు స్పష్టంగా, ఖచ్చితంగా, నిర్మొహమాటంగా ఇలా బోధించాడు, “మరి ఎవని వలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెనుగానీ, ఆకాశము క్రింద, మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము” అనెను. యేసుక్రీస్తు నామమే మనల్ని రక్షించే నామం. మనుష్యులు కొలిచే మరి ఏ నామంలోకూడ రక్షణ లేదు. ఇది బైబిల్ బోధించే సత్యం. యేసుక్రీస్తే దేవుడు, రక్షకుడు అని సువార్త ప్రకటింపబడినప్పుడు చాలామంది యేసు ప్రభువేనా రక్షకుడు? ఏ నామమైనా ఒకటే అంటారు. యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడు అనే సత్యం క్రైస్తవులు కల్పించింది కాదు, దేవుడే తన వాక్యంలో తేటగా, ఖచ్చితంగా సెలవిచ్చిన సత్యం. ఈ సత్యాన్ని నమ్మితే రక్షణ, పరలోకం. నమ్మకపోతే నాశనం, నరకం. అందుకే ప్రభువు మార్కు 16:15, 16 వచనాలలో ఇలా అన్నాడు “మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మనివానికి శిక్ష విధింపబడును.” పాఠకులారా, యేసుప్రభువులో మీ విశ్వాసముంచారా? ఆయనే రక్షకుడని, ఆయన ద్వారానే పరలోకం చేరగలరని ఆయననే విశ్వసించారా?

పుట్టినప్పటి నుండి 40 సంవత్సరాలకు పైగా కుంటివాడై ఉన్న ఆ మనుష్యునికి పూర్ణస్వస్థత ఇచ్చింది యేసు ప్రభువే. 'మా సొంత శక్తిచేతగానీ, భక్తిచేతగానీ నడువను వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మాతట్టుతేరి చూస్తున్నార'ని పేతురు ప్రజలతో అన్నాడు. 3వ అధ్యాయం 16వ వచనంలో పేతురు ఏమన్నారో , నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరిచెను; ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణస్వస్థత కలుగజేసెను.” యేసు ప్రభువు నామం స్వస్థపరిచి, రక్షించే నామమని చూసాం. అయితే ఆయన ద్వారా ఆ మేళ్ళు పొందాలి అంటే మార్గం విశ్వాసమే. మనకోసం ప్రార్థన చేసే భక్తుల సొంత శక్తివల్ల మనకు మేలు కలుగదు. ఆఖరికి వారి భక్తివల్ల కూడ మనకు స్వస్థత కలుగదు. దైవభక్తులు, దైవసేవకులు కాదు, మనకు స్వస్థత, రక్షణ, మేలు కలిగించేది, రక్షించినా, స్వస్థపరిచినా యేసుప్రభువే చేయాలి. చాలామంది ఆ భక్తునికి స్వస్థత వరం ఉంది, ఈ భక్తుడు బాగుచేస్తాడు అని భక్తులమీద విశ్వాసముంచుతారు. మన విశ్వాసం మనకొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మన రక్షకుడైన యేసుక్రీస్తు మీదే ఉండాలికాని, ఏ సంఘ స్థాపకుని మీదగానీ, నాయకుని మీదగానీ ఉండకూడదు. నిజమైన దైవ సేవకులు ప్రజలను తమవైపు ఆకర్షించుకోరు. యేసుక్రీస్తు వైపే ఆకర్షిస్తారు. తమకేవో వరాలున్నాయని తమ శక్తి, భక్తి గొప్పవని చెప్పుకోరు. ఒకవేళ దేవుడు అద్భుతం జరిగించినా అది వారి సొంత శక్తిచేత, భక్తిచేత జరగలేదని, దేవునివల్లే జరిగిందని దేవుణ్ణి మహిమపరుస్తారు. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడండి అని ప్రభువు ముందుగానే చెప్పాడు. అబద్ధ ప్రవక్తలు ప్రజలను తమ వైపుకు, తమ సిద్ధాంతాల వైపుకు, తమ సంస్థల వైపుకు ఆకర్షించుకుంటారే గానీ, ప్రభువు వైపు ఆకర్షించరు. ఈ రీతిగా చేసేవారిని అబద్ధప్రవక్తలని మనం గుర్తించాలి.

పేతురు భక్తుడు తన వర్తమానంలో 'మీ పాపాలు తుడిచివేయబడు నిమిత్తం మారుమనస్సు పొంది తిరుగుడి' అని బోధించాడు. ప్రభువును యూదులు నిరాకరించి సిలువవేసారు. ఇల్లు కట్టువారు తృణీకరించిన రాయి మూలకు తలరాయి అయ్యింది. వారు సిలువవేసిన ప్రభువే వారి రక్షకుడు గనుక వారు మారుమనస్సు పొంది ప్రభువువైపు తిరిగితే వారి పాపాలు తుడిచివేయబడినట్లు పరిహరింపబడతాయి. పాఠకులారా, మారుమనస్సు పొంది యేసుప్రభువు వైపు తిరగండి - మీ పాపాలు ఆయన క్షమిస్తాడు. పేతురు వర్తమానం విని దాదాపు అయిదు వేలమంది ప్రభువును నమ్మారు. అయితే పరిసయ్యులు శాస్త్రులు, ఇతర పెద్దలు అసూయతో పేతురు యోహానులను బలాత్కారంగా పట్టుకొని కావలిలో ఉంచారు. కుంటివాడు బాగుపడలేదని అనలేరు గాబట్టి ఇక చేసేదిలేక, పేతురు యోహానులను బెదిరించి ప్రభువు నామాన్నిబట్టి ఎంతమాత్రం బోధించకూడదని ఆజ్ఞాపించారు. అప్పుడు వారేమన్నారో 4:19,20 వచనాలలో చూడండి, “అందుకు పేతురును యోహానును వారిని చూచి - దేవుని మాట వినుటకంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి; మేము కన్నవాటిని, విన్నవాటిని చెప్పకయుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి.” మనుష్యులు ఎంతటివారైనా వారు చెప్పిన మాట, దేవుని మాటకు వ్యతిరేకంగా ఉంటే, దేవుని మాటే మనం వినాలి. పాఠకులారా, మనుష్యుల బెదిరింపులకు భయపడి దేవుని మాటకు బదులు వారి మాట వింటున్నారా? మీరే చెప్పండి. ఎవరి మాట వినటం న్యాయం? వారెంత బెదిరించినా మేం చూసినవాటిని, విన్నవాటిని చెప్పక ఉండలేం అన్నారు. ప్రవక్తయైన యిర్మియా కూడ అలానే అన్నాడు. యిర్మీయా 20:9 చూడండి, “ఆయన పేరు నేనెతని నామమునుబట్టి ప్రకటింపను, అని నేననుకొంటినా? అది నా హృదయములో అగ్నివలె మండుచు నా ఎముకలలోనే మూయబడియున్నట్లున్నది; నేను యోర్చి విసికియున్నాను, చెప్పక మానలేదు.” పాఠకులారా! మిమ్మల్ని ఎవరో ఎదిరించారని, బెదిరించారని, వాక్యం బోధించడం మానేసారా? మీరు న్యాయంగా దేవుని మాటే వినేవారైతే వాక్యం చెప్పకుండా ఉండలేరు.

శిష్యులందరూ జరిగినది విని ఏకమనస్సుతో దేవునికి మొఱ్ఱపెట్టారు. 'నీ దాసులు బహు ధైర్యంగా నీ వాక్యం బోధించేటట్లు అనుగ్రహించుమని' ప్రార్థించారు. అప్పుడు వారున్న చోటు కంపించింది. అప్పుడు వారంతా పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు. మనం కూడా హింస వచ్చినప్పుడు ఐక్యతతో ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ నింపుదలను పొంది దేవుని కోసం ధైర్యంగా నిలవాలి. పరిశుద్ధాత్మ నింపుదల పదే పదే పొందే అనుభవం. పేతురు అనేకసార్లు పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యాన్ని బోధించినట్టు ఈ గ్రంథంలో వ్రాయబడింది. ఎఫెసీ. 5:18లో ఉన్నట్టు మనం ఆత్మపూర్ణులైయుండాలి. పరిశుద్ధాత్మపూర్ణులై ఉండడమంటే పిచ్చి చేష్టలు చేయడం కాదు. ధైర్యంగా వాక్యాన్ని బోధిస్తూ, పాపాన్ని జయిస్తూ, హింసలు సహిస్తూ అన్ని విషయాలలో ప్రభువుకు లోబడడమే. ఇటువంటి అనుభవాన్ని మనం పొందాలి. యేసు ప్రభువు సిలువ వేయబడడం దేవుని అనాది సంకల్పమని శిష్యులు గ్రహించారు. 3:18లో సిలువను గూర్చి పేతురు ఇలా అన్నాడు. “దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఈలాగు నెరవేర్పెను." చాలామంది యేసు ప్రభువును యూదులు, రోమా సైనికులే సిలువ వేసి చంపారనుకుంటారు. కానీ, ప్రభువు సిలువ వేయబడడం అనేది దేవుని సంకల్పం. మన పాపాల నిమిత్తం దేవుడు తన కుమారుణ్ణి సిలువకు అప్పగించాడు. దేవుని ప్రణాళికే నెరవేరింది. విశ్వాసులందరూ ఏకహృదయంతో, ఏకాత్మతో, ఒకరి అక్కరలు ఒకరు తీరుస్తూ సంఘంగా కలిసి జీవించారు. మన సంఘాలు కూడా ఈ రీతిగానే ఉండాలి.

బాగుపడిన కుంటివాడు భిక్షాటన కొరకు ప్రతిదినం దేవాలయాన వచ్చేవాడు. చాలామంది భక్తిని, సేవను వ్యాపారంగా వాడుకుంటున్నారు. బాగుపడిన తర్వాత మొదటిసారిగా అతడు దేవాలయంలో దేవుణ్ణి స్తుతిస్తూ గంతులు వేసుకుంటూ ప్రవేశించాడు. దేవుని వాక్యం కోసం దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. మనం కూడా మందిరానికి దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన వాక్యం కోసం వెళ్ళాలి. బాగుపడిన అతను దేవుణ్ణి స్తుతించాడు. పొందిన మేళ్ళనుబట్టి మనం కూడా దేవుణ్ణి స్తుతించాలి. కుంటివాడు బాగుపడి గంతులు వేయడంలో అతని ఆనందం, ధైర్యం కనపడుతుంది. మనం కూడా దేవునిలో ఆనందిస్తూ ఆయన కొరకు బహిరంగ సాక్షులుగా నిలబడాలి. ఆ బాగుపడిన వ్యక్తి పేతురు, యోహానులను పట్టుకొని వారి శ్రమలో వారితో నిలబడ్డాడు. దేవుని భక్తులు దేవుని కొరకు పొందే హింసల్లో వారితో కలిసి మనం నిలవాలని పాఠం నేర్చుకుంటున్నాము. దేవుడు మనకిట్టి ఆత్మీయ జీవితాన్ని అనుగ్రహించును గాక!

ప్రార్ధన:- పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు. మమ్మల్ని రక్షించడానికి నీ కుమారున్ని సిలువకప్పగించి ఆయన నామంలో మాకు రక్షణ ప్రకటించినందుకై మీకు వందనాలు. నీ కుమారునియందు విశ్వాసం అందరికీ దయచేయండి. యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రీ! ఆమేన్!

4]

అపొస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. ఆ సంఘంలో విశ్వాసులు తమకు కలిగినవాటిలొ ఏదీ తమదని అనుకోకుండా దేవుడే సమస్తానికి యజమాని అని గ్రహించారు. భూములుగానీ, ఇండ్లుగాని కలిగినవారు వాటిని అమ్మి, అమ్మినవాటి వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెడుతూ వచ్చారు. వారు ప్రతివానికి వాని వాని అక్కరకొలది పంచిపెట్టారు. కనుక వారిలో ఎవరికీ కొదువలేకపోయింది. అటువంటి పరిస్థితుల్లో అననీయ, సప్పీరా అనే భార్యాభర్తలు సంఘంలో ఉంటూనే శాస్త్రులు, పరిసయ్యులవలె వేషధారులుగానే ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు తాము మనుష్యులకు కనపడాలనే తమ పనులన్నీ చేసేవారు. అలాగే అననీయసప్పీరాలు కూడా ఇతర విశ్వాసులవలెనే తాము కూడా నిస్వార్థంగా ఉన్నట్టు తమ పొలం అమ్మి దాని వెలలో కొంత దాచుకొని, కొంత తెచ్చి అపొస్తలుల పాదముల దగ్గర పెట్టారు. భార్యభర్తలిద్దరూ ఆ భూమిని అంతకే అమ్మారని అబద్ధమాడదామని చెప్పుకున్నారు. అందరి ఎదుట భక్తిపరులుగా నటించారు. పేతురు వారితో అన్నట్టు వారు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడారు. పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికీ, పరిశుద్ధాత్మను శోధించడానికీ, సాతాను వారి హృదయాన్ని ప్రేరేపించడానికీ వారు ఒప్పుకున్నారు. దేవుని ఉగ్రతకు గురై, ఒకరి తర్వాత ఒకరు, ఇద్దరూ చనిపోయారు. వేషధారణ అనేది దేవునికి అసహ్యం. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే ఎంతటి పాపినైనా దేవుడు క్షమిస్తాడు. పాపాన్ని దాచిపెట్టి లేదా దాన్ని సమర్థించుకుంటూ భక్తిగలవాళ్ళుగా నటిస్తే దేవుని ఉగ్రత పొందవలసిందే. వారు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడారని వ్రాయబడి ఉంది.

ఏ పాపమైనా ప్రప్రథమంగా దేవునికి వ్యతిరేకంగా చేసేదే. యోసేపు వ్యభిచార పాపాన్ని దేవునికి వ్యతిరేకంగా చేసే గొప్ప దుష్కార్యమని ఎంచాడు. ప్రతి పాపం మొదటిగా మనుష్యులకంటే దేవునికి వ్యతిరేకంగా చేసేదని గ్రహించి దేవునికి భయపడదాం. అననీయసప్పిరాలు అబద్ధమాడారు. అబద్ధమనేది చేసిన తప్పును కప్పిపెట్టుకోవడానికి చెప్పేదే. అంటే అబద్ధం రెండంతలుగా తప్పన్నమాట. అబద్ధాలు చెప్పేవారు సైతాను యొక్క సొంత భాషను మాట్లాడినట్టే. సత్యవంతుడైన దేవుణ్ణి అనుసరించేవారు సత్యాన్నే అవలంభించాలి, సత్యాన్నే పలకాలి. పాఠకులారా! అబద్ధాల్ని చెపుతున్నారా? ఇది విశ్వాసులకు తగదు. అబద్ధాలు చెప్పేవారికి జ్ఞాపకశక్తి ఎక్కువ అవసరమట. అబద్ధం ఎప్పటికైనా బయటపడుతుంది. అవమానం, నష్టం కలుగుతాయి. ఏదో చిన్న విషయంగా కొట్టిపారేయకుండా, దేవుడు అబద్ధమాడే పెదవులను అసహ్యించుకుంటాడని ఎరిగి అబద్ధాన్ని విడిచిపెట్టండి. పాపానికి వచ్చే జీతం మరణం. ఈ విషయం తర్వాత తరాలన్నిటికీ తెలిసేటట్లు దేవుడు అననీయ, సప్పీరాల మరణాన్ని గుణపాఠంగా చేసాడు. సంఘమంతటికీ, ఈ సంగతులు వినినవారికందరికీ మిగుల భయం కలిగిందని 11వ వచనంలో చూడగలం. ద్వితీ. 19:20లో ఉన్నట్టు తప్పు చేసినవాడిని శిక్షిస్తే మిగిలినవారు విని భయపడి దేశంలో అటువంటి దుష్కార్యం ఇంక చేయరు. దేవుని దృష్టిలో వేషధారణ, అబద్ధంలేని యథార్థమైన భక్తి విలువైనది. వేషధారులను దేవుడు శిక్షిస్తాడు. అననీయ, సప్పీరాలు పరిశుద్ధాత్మను శోధించడానికి, మోసపుచ్చడానికి సాతాను ప్రేరేపణకు లొంగిపోయారు. తమ భూమి అమ్మిన వెల అంతా దేవునికిస్తామని సంఘం ఎదుట దేవునికి వాగ్దానం చేసి ఉండొచ్చు. అయితే వారు మాట మీరారు. పాఠకులారా, సాతాను ప్రేరేపణకు లొంగి దేవునికి మీరిచ్చిన మాట మీరుతున్నారా? దేవునికే లోబడండి. అననీయ, సప్పీరాలు ప్రభువు ఆత్మను శోధించడానికి ఏకీభవించారు. ఒకవేళ వారిలో ఎవరు ఏకీభవించకపోయినా ఇద్దరూ చావు తప్పించుకొనేవారు. ఎందుకంటే సత్యం చెప్పేస్తారని రెండవ వ్యక్తి భయపడి తప్పుచేయడానికి తెగించకుండా ఉండేవారు. తప్పులో ఇతరులతో ఏకీభవించడంవల్ల ఆ తప్పు బలపడుతుంది. తప్పు చేయడానికి ప్రజలు ధైర్యం తెచ్చుకుంటారు. పాఠకులారా, పాపం చేయడానికి, చూడకూడనివి చూడడానికి ఎవరితోనైనా ఏకీభవిస్తున్నారా? డబ్బు విషయంలో తప్పులెక్కలు వ్రాస్తూ అబద్ధికులతో ఏకీభవిస్తున్నారా? తప్పులో ఏకీభవించిన అననీయ, సప్పీరాలు శిక్షలో కూడా ఏకీభవించవలసి వచ్చింది. కలిసి పాపం చేస్తే శిక్షలో కూడా పాలుపొందాల్సి వస్తుంది.

సంఘంలో విశ్వాసులైన పడుచువారు బాధ్యత వహించి చనిపోయిన అననీయ, సప్పీరాలను మోసికొనిపోయి సమాధిచేసి వచ్చారు. సంఘ బాధ్యతలు విశ్వాసులు నెరవేర్చాలి. అపొస్తలుల ద్వారా ప్రభువు చాలా మహాత్కార్యాలు జరిగించాడు. అందువల్ల అనేకమంది ప్రభువును నమ్మారు. ప్రధానయాజకులు అసూయపడి అపొస్తలులను బలాత్కారంగా పట్టుకొని చెరశాలలో ఉంచారు. అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరశాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొచ్చి మీరు దేవాలయములో నిలువబడి సువార్త చెప్పమన్నాడు. వారాలాగు చేసారు. చెరశాలలో అపొస్తలులు కనపడనందున ప్రధానయాజకులకు ఏమి చేయాలో తోచలేదు. అయితే వారు దేవాలయంలో ప్రజలకు బోధిస్తున్నారని తెలుసుకొని వారిని పిలిపించి మేము వద్దన్నా ఎందుకు ప్రభువు నామం పేరట బోధిస్తున్నారని అడిగారు. అందుకు పేతురు 'మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడాలి కదా' అన్నాడు. చెరశాల నుండి అద్భుతంగా వారిని విడిపించిన ప్రభువుకే అపొస్తలులు లోబడి ఆయన చెప్పినట్టు హింసలెదురైనప్పటికీ సువార్త ప్రకటించారు. పాఠకులారా! మనుష్యులకు లోబడుతున్నారా? మిమ్మల్ని రక్షించిన దేవునికి లోబడుతున్నారా? అపొస్తలులు యెరూషలేము పట్టణాన్ని తమ బోధతో నింపేసారని ప్రధాన యాజకులు అన్నారు. మనం కూడా మన గ్రామాలను, పట్టణాలను సువార్తతో నింపాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించి సమస్త జనులను ప్రభువు శిష్యులుగ చేయాలి. ఇది మన ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ.

పేతురు బోధిస్తూ దేవుడు తనకు విధేయులైనవారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడని ప్రకటించాడు. సువార్తకు లోబడేవారందరికీ పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహిస్తాడు. సువార్తకు లోబడి రక్షింపబడినవారందరూ పరిశుద్ధాత్మను కలిగినవారే. అయితే కొందరు రక్షణ అనుభవం వేరు, పరిశుద్ధాత్మను పొందడం వేరు అని తప్పుగా భావిస్తున్నారు. అయితే రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి హృదయములో ప్రవేశించి, అతన్ని కడిగి, దైవజీవాన్ని ఇచ్చి రక్షిస్తాడు. 2థెస్స. 2:13లో ఇలా ఉంది - “ప్రభువువలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను, మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణ పొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను.” తీతుకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం కూడా ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం - “మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.” ఈ వచనాలను బట్టి రక్షణ కార్యంలోనే పరిశుద్ధాత్మను పొందడం జరుగుతుందని గ్రహించగలం. కొంతమంది భాషలు మాట్లాడేవరం నిలిచిపోయిందని చెప్పేవారిని చూసి 'వారికి ఆత్మ లేదు' అంటారు. పరిశుద్ధాత్మను ఆయన అని పిలవాలేగాని, వ్యక్తిత్వం లేని ఏదో శక్తిలాగా అది,ఇది అనకూడదు. క్రీస్తు ఆత్మ లేనివాడు, క్రీస్తువాడు కాడు అని రోమా 8:9లో ఉన్నట్టు క్రీస్తు ఆత్మలేనివారు క్రైస్తవులే కాదు. సిద్ధాంతపరంగా కొన్ని బేధాభిప్రాయాలున్నప్పటికీ, దేవుని సువార్త సత్యానికి లోబడినవారందరూ పరిశుద్ధాత్మను కలిగియున్నారని గ్రహించాలి.

గమలియేలు అనే ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి అపొస్తలులను చంపవద్దని, వారు చేసే పరిచర్య మనుష్యులవలన కలిగినదైతే వ్యర్థమవుతుందని, దేవుని వలన కలిగిందైతే మీరు వాటిని వ్యర్థపరచలేరు, మీరొకవేళ దేవునితో పోరాడువారగుదురు సుమీ' అని హెచ్చరించాడు. యూదుల పెద్దలు ఆ మాట విని, సమ్మతించి అపొస్తలులను చంపకుండా కొట్టించి, వాక్యం చెప్పొద్దని ఆజ్ఞాపించి పంపివేసారు. గమలియేలు దేవుని వలన కలిగిన కార్యాన్ని ఎవరూ వ్యర్థపరచలేరని, దేవునితో పోరాడి ఎవరూ జయించలేరని గ్రహించాడు. పాఠకులారా! ఏ విషయములోనైనా దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నారా? దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తున్నారా? యోబు 9:4లో ఉన్నట్లు ఆయనతో పోరాడ తెగించి హాని నొందనివాడెవడు? గమలియేలు దేవునికి వ్యతిరేకంగా పోరాడేవారిని దేవుని పక్షంగా నివారించాడు. మనం కూడా దేవుని పక్షంగా ప్రజలను దేవునితో సమాధానపడమని చెప్పాలి. అపొస్తలులు ప్రభువు కొరకు దెబ్బలు తినినప్పకీ, ఆయన నామం కొరకు అవమానం పొందడానికి పాత్రులుగా ఎంచబడినందుకు సంతోషించారని 41వ వచనంలో చదవగలం. ప్రభువుకోసం నిందపొందడం మన భాగ్యంగా ఎంచుకోవాలి. 1 పేతురు 4:16, 19 వచనాలలో ఇలా ఉంది “ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తనగలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను.” ప్రభువు మత్తయి 5:11 వచనంలో చెప్పినట్లు ప్రభువు నిమిత్తం వచ్చే శ్రమలలో మనం సంతోషించి ఆనందించాలి. అపొస్తలులు తమకు ఎన్ని హింసలెదురైనప్పటికీ ప్రతి దినం దేవాలయంలోనూ, ఇంటింటను మానక బోధిస్తూ యేసే క్రీస్తని ప్రకటించారు. ఎన్ని శ్రమలెదురైనా సువార్త ప్రకటించడం మానకూడదని పాఠం నేర్చుకుంటున్నాం. ప్రభువు కృప మీకందరికి తోడైయుండును గాక!

ప్రార్ధన:- నీతిగల దేవా, మీకు స్తోత్రాలు, యథార్థవంతులుగా జీవించడానికి మాకు సహాయం చెయ్యండి. మీ నిమిత్తం వచ్చే నిందలకు, శ్రమలకు భయపడకుండా సహాయం చెయ్యండి. యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రీ, ఆమేన్.

5]

అపొస్తలుల కార్యాలు గ్రంథం 6, 7 అధ్యాయాలు ధ్యానించుకుందాం. శిష్యులు సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూసారని హెబ్రీయులు మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సణగసాగారు. అప్పుడు 12 మంది అపొస్తలులు శిష్యుల సమూహాన్ని పిలిచి 'మేము దేవుని వాక్యం బోధించడం మాని ఆహారం పంచి పెట్టడం యుక్తం కాదు. కాబట్టి ఆత్మతో, జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుష్యులను మీలో ఏర్పరచండి మేము వారిని ఈ పనికి నియమిస్తాం' అని చెప్పారు. శిష్యుల సమూహం ఏడుగురిని ఏర్పరచి అపొస్తలుల ఎదుట నిలవబెట్టారు. వీరు ప్రార్థనచేసి వారి మీద తమ చేతులుంచారు.

ఇక్కడ కొన్ని విషయాలు గ్రహించాలి. ఏదైనా సంఘంలో విశ్వాసుల సంఖ్య పెరుగుతున్నప్పుడు సమస్యలు రావచ్చు. సంఘ నాయకులు జ్ఞానంగా పరిష్కరించాలి. సంఘంలో విభేదాలకు తావు ఇవ్వకుండా, ఏ పక్షానికీ పక్షపాతం చూపించకుండా అందరికీ న్యాయం జరిగేలా చూడాలి. అదే సమయంలో సంఘనాయకులు గొడవలు తీర్చడంలో మునిగిపోకుండా వారి ముఖ్యకర్తవ్యాలైన ప్రార్థన, వాక్య పరిచర్యలను ఎన్నడూ నిర్లక్ష్యపెట్టకూడదు. అపొస్తలులవలె ప్రార్థనయందు, వాక్య పరిచర్యయందు ఎడతెగక ఉండాలి. చాలామంది సంఘనాయకులు సమాజ సేవను వారి ముఖ్యపరిచర్యగా ఎంచుకుంటున్నారు. అయితే అన్నిటికంటే ఉన్నతమైన పరిచర్య వాక్యపరిచర్యే. సంఘంలో పనుల నిమిత్తం ఏర్పరచిన మనుష్యులకు కొన్ని అర్హతలుండాలని అపొస్తలులు చెప్పారు. ఆత్మతోను, జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందినవారుగా ఉండాలి. ప్రభువు పనిలో అయోగ్యులను వాడడం వల్ల చాలాచోట్ల పరిచర్య దెబ్బతింటుంది. డబ్బు, హోదాలను బట్టి కాకుండ నిందారహితంగా జీవిస్తూ, మంచి పేరుగలవారికి జ్ఞానంతో, ఆత్మతో నింపబడ్డవారికి సంఘ బాధ్యతలు అప్పగించడం ఎంతయినా శ్రేయస్కరం. పనికొరకు ఏర్పరచబడిన ఏడుగురిలో స్తెఫను ఒకడు. ఇతడు విశ్వాసముతోను, పరిశుద్ధాత్మతోను నిండుకొనినవాడు. అంతేకాదు, కృపతోను, బలముతోను నిండుకొని మహత్కార్యాలు, గొప్ప సూచకక్రియలు చేసాడు. యూదులు అతనితో వాదించారు గాని మాటలాడటంలో అతను అగుపరచిన జ్ఞానాన్ని, అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. దేవుడు తన బిడ్డలకు జ్ఞానం, మాట్లాడే శక్తి, ధైర్యం అనుగ్రహిస్తాడు. లూకా 21:15 వచనంలో ప్రభువు ఇలా సెలవిచ్చాడు, - విరోధులందరు ఎదురాడుటకును, కాదనుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును.” దేవుడిచ్చే జ్ఞానం వయసువల్లగానీ, చదువువల్లగాని వచ్చే జ్ఞానానికి మించిన జ్ఞానం. అందుకే కీర్తనకారుడు 119వ కీర్తనలో 98-100వ వచనం వరకూ ఇలా అన్నాడు, “నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటె నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధులకంటే నాకు విశేష జ్ఞానము కలదు.” దేవుని ద్వారా ఆయన వాక్యాన్నిబట్టి ఇటువంటి గొప్ప జ్ఞానాన్ని పొందగలం. స్తెఫనును మాటలతో ఎదిరించలేక యూదులు అబద్ధసాక్షులను కుదుర్చుకొని స్తెఫను మీద దేవదూషణ నేరం మోపారు. అప్పుడు స్తెఫను సభలో ప్రసంగించాడు. పితరుడైన అబ్రాహాము మొదలుకొని మోషేవరకు ఇశ్రాయేలీయుల చరిత్రను వివరించాడు.

అబ్రాహాము దేవుని పిలుపుకు లోబడి తన దేశాన్ని, తన స్వజనాన్ని విడిచి బయలుదేరాడు. అబ్రాహాము విశ్వాసంతో దేవుడు చూపించబోయే దేశానికి బయలుదేరాడు. సంతానాన్ని గూర్చిన వాగ్దానం దేవుని ద్వారా పొందాడు. మనం కూడా అబ్రాహాము వలె కుల, మత ఆచారాలను విడిచిపెట్టి విశ్వాసముతో దేవుని వాగ్దానాలు నమ్మి ఆయనను వెంబడించాలి. గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తు వెళ్ళేలా అమ్మివేసారు. కాని దేవుడతనికి తోడైయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను, జ్ఞానమును ఫరో ఎదుట అతనికనుగ్రహించి ఐగుప్తు దేశానికి అతన్ని అధిపతిగా నియమించాడు. దేవుడు యోసేపుకు తోడైయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి అతన్ని హెచ్చించాడు. సొంతవారు అన్యాయం చేసినా దేవుడతన్ని విడిచిపెట్టలేదు. పాఠకులారా! సొంతవారి ద్వారా అన్యాయాన్ని భరిస్తూ నిరుత్సాహపడుతున్నారా? దేవుని సంకల్పాలు, వాగ్దానాలు ఎన్నడు మారవు. దేవుడు న్యాయకర్త. మీ శ్రమలన్నిటినుంచి విడిపించి మిమ్మల్ని హెచ్చించగల సమర్థుడు. మీ పరిస్థితుల్లో యోసేపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని ధైర్యం తెచ్చుకోండి. మోషే పుట్టినప్పుడు చిన్నపిల్లలను చంప నిర్ణయించినా ఫరో యొక్క కుమార్తె ద్వారానే దేవుడు మోషేను కాపాడబడేలా చేసాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి, ఫరో అధికారం నుండి విడిపింపబోయే నాయకుడు ఫరో ఎదుటే ఐగుప్తీయుల సకల విద్యలు అభ్యసించి మాటల్లో, కార్యాల్లో ప్రవీణుడయ్యాడు. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. అందుకే యోబు 9:10 లో ఇలా అన్నాడు “ఎవడును తెలిసికొనలేని మహత్తయిన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు.” మోషే సీనాయి పర్వతారణ్యంలో ఉన్నప్పుడు ఒక పొదలోని అగ్నిజ్వాలల్లో నుండి దేవుడు ప్రత్యక్షమై అతనితో మాట్లాడి ఇశ్రాయేలీయుల విమోచకునిగా నియమించాడు. 'ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచాను. వారి మూలుగు విన్నాను. వానిని విడిపించడానికి దిగివచ్చాను.' అని దేవుడు సెలవిచ్చాడు. దేవుడు తన ప్రజల దురవస్థను నిదానించి చూచేవాడు. వారి ప్రార్థన విని వారిని విడిపించేవాడు. 'మా బాధలు ఎవరికి తెలుసు, ఎవరు చూస్తారు?” అని అనుకుంటున్నారా? దేవుడు మీ దురవస్థంతటినీ నిదానించి చూస్తున్నాడు. మన దేవుడు మన గురించి చింతించేవాడు. అందుకే దావీదు 40:17వ వచనంలో ఇలా అన్నాడు. “నేను శ్రమలపాలై దీనుడనైతిని. ప్రభువు నన్ను తలచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే.” తగిన కాలంలో దేవుడు మన శ్రమల నుండి మనల్ని విడిపిస్తాడు. అద్భుతకార్యాలు చేసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశాన్నుంచి విడిపించాడు. మనల్నికూడా అద్భుత రీతిగా విడిపిస్తాడు. మోషే ప్రవక్త తనవంటి ఒక ప్రవక్తను దేవుడు పుట్టిస్తాడని క్రీస్తు గురించి ప్రవచించాడు.

స్తెఫను మాట్లాడుతూ సర్వోన్నతుడైన దేవుడు మానవ హస్తకృతాలయాలలో నివసింపడని, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమని, ఆయన కొరకు ఎలాంటి మందిరం కట్టగలమని గద్దించాడు. యూదులు మెడవంచనివారుగా హృదయమందు, చెవులయందు సున్నతి పొందనివారుగా, దేవుని వాక్యానికి లోబడకుండా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారని స్తెఫను గద్దించాడు. ధర్మశాస్త్రాన్ని మీరు పొందారేగానీ, దానిని గైకొనలేదని చెప్పాడు. పాఠకులారా! మరి మీ సంగతేంటి? భక్తి అనే కాడిని మెడవంచి మోస్తున్నారా? వాక్యాన్ని విని అనుసరించేలా మీ చెవుల్ని, హృదయాన్ని దేవునికి లోబరుస్తున్నారా? ఇశ్రాయేలీయుల లాగా వాక్యాన్ని పొందికూడ గైకొనట్లేదా? యాకోబు 1:22లో ఉన్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. “మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునై యుండుడి.” స్తెఫను ఈ రీతిగా బోధించినపుడు పశ్చాత్తాపపడవల్సింది బదులు యూదులు కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికారు. పాఠకులారా, దైవసేవకులు వాక్యం ద్వారా మిమ్మల్ని గద్దించి, మీ తప్పులు సరిచేయ ప్రయత్నించినపుడు మీరు ఏ రీతిగా స్పందిస్తున్నారు? దావీదు 141:5 లో ఇలా అన్నాడు, “నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక.” యూదులు తైలాభిషేకం వంటి స్తెఫను గద్దింపును త్రోసివేసి కోపంతో మండిపడ్డారు. స్తెఫను పరిశుద్ధాత్మతో నిండినవాడై ఆకాశం తెరువబడడం, యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండడం చూస్తున్నానని చెప్పాడు. అప్పుడు వారు పెద్దకేకలు వేసి చెవులు మూసికొని ఏకముగా అతని మీదపడి పట్టణం వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి, రాళ్ళు రువ్వి చంపారు. దేవదూషణ చేసాడని చెప్పి తీర్పు తీర్చకుండానే దొమ్మీగా పడి రాళ్ళురువ్వి చంపారు. ఇశ్రాయేలీయులు తమ అవిధేయతకు తోడు తమను సరిచేసిన ప్రవక్తలను చంపి తమ పాపాన్ని అధికం చేసుకున్నారు. తప్పించుకోలేని దేవుని ఉగ్రతను పొందారు. నమ్మకమైన దైవసేవకులను ద్వేషించడం, హింసించడం మాని వారి గద్దింపును అంగీకరించాలని పాఠం నేర్చుకుంటున్నాం. తనను రాళ్ళతో కొడుతున్నప్పుడు స్తెఫను మోకాళ్ళూని 'ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకు'మని గొప్ప శబ్దంతో ప్రార్థించాడు. తనను అన్యాయంగా హత్య చేస్తున్నవారి గురించి ప్రార్థించాడు. యేసు ప్రభువు తనను సిలువవేస్తున్నవారిని క్షమించమని తండ్రికి మొఱ్ఱపెట్టినట్టు స్తెఫను కూడా చేసాడు. ప్రభువు మత్తయి 5:44 లో ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుందాం. “మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించువారి కొరకు ప్రార్థన చేయుడి.” యూదులు తనను రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు స్తెఫను ప్రభువును గూర్చి మొఱ్ఱపెడుతూ, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని ప్రార్థించాడు. 'దేవుని చిత్తప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తనగలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెనని' 1 పేతురు 4:19 వచనంలో చదవగలం. శ్రమలలో మనలను మనం దేవునికి అప్పగించుకోవడమే ఉత్తమం. నీతిగా జీవిస్తున్న నాకే శ్రమలెందుకు రావాలని దేవుణ్ణి ఎదిరించకూడదు. స్తెఫనువంటి భక్తి కలిగి ఉండేలా దేవుడు మనకు సహాయపడును గాక!

ప్రార్థన:- నమ్మకమైన సృష్టికర్తవైన దేవా, నీకు స్తోత్రాలు. మీ వాక్యానికి లోబడుతూ గద్దింపును అంగీకరిస్తూ, శత్రువును సహితం ప్రేమించి, వారికోసం ప్రార్థించడానికి సహాయం చెయ్యండి. నిష్కారణంగా శ్రమలు అనుభవిస్తున్నా, మీకే అప్పగించుకోడానికి సహాయం చెయ్యండి. యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రీ, ఆమేన్

6]

అపొస్తలుల కార్యాల గ్రంథం సంఘప్రారంభం మరియు విస్తరణ గురించి మనకు తెలియజేయడమే కాదు, సువార్తీకరణలో, సంఘస్థాపనలో, మరియు సంఘపరిచర్యలో చక్కటి మాదిరిని మనకందిస్తుంది. ఈ గ్రంథం ఈ రీతిగా ఎంతో ప్రాముఖ్యమైంది. ఈ సమయంలో 8వ అధ్యాయంలో సువార్త ప్రచురమవడం గురించి ధ్యానించుకుందాం. యాజకులలో అనేకులు విశ్వసించినందువల్ల యూదులు అసూయతో స్తెఫనును రాళ్ళతో కొట్టి చంపారు. భక్తిగల మనుష్యులు స్తెఫనును సమాధిచేసి అతని గురించి చాలా ప్రలాపించారు. నిజంగానే స్తెఫనులాంటి గొప్ప ఆశీర్వాదకరమైన వ్యక్తి మరణించడం దుఃఖకరం. మరణ సందర్భాలలో తమ ప్రియులను కోల్పోయినందుకు విశ్వాసులు దుఃఖించడం సహజమే. అయితే నిరీక్షణలేని ఇతరులవలె మనం దుఃఖపడకూడదు. ఎందుకంటే దుఃఖానికి మించిన ఆదరణ ప్రభువులో మనకున్నది. స్తెఫను మరణానికి సమ్మతించిన సౌలు అను ఒక యౌవనుడు ఇంటింటజొచ్చి పురుషులను, స్త్రీలను ఈడ్చుకొనిపోయి చెరశాలలో వేయించి సంఘమును పాడుచేస్తూ ఉన్నాడు. తద్వారా యెరూషలేములోని సంఘానికి గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములలో చెదరిపోయారు. ఈ రీతిగా చెదరిపోయినవారు సువార్త వాక్యాన్ని ప్రకటిస్తూ సంచారం చేసారు. ఈ రీతిగా సువార్త ప్రబలమవ్వడం ప్రారంభం అయ్యింది.

సంఘానికి కలిగిన హింసను దేవుడు తన చిత్తానుసారంగా సువార్త ప్రాబల్యం కోసం ఒప్పుకొని మేలుగా మార్చాడు. దేవుడు శ్రమలను మేలుగా మారుస్తాడు. " దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి మేలు కలగడానికై దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు” అని రోమా 8:28 సారాంశము. పాఠకులారా! ప్రభువు కొరకు మీరెదుర్కొనే హింసలు ప్రభువు చితానుసారమైనవే అని, వాటిని ఆయన మేలుగా మారుస్తాడని నమ్ముతున్నారా? సంఘపని కొరకు ఏర్పరచబడిన ఏడుగురిలో ఒకడైన ఫిలిప్పు సమరయ పట్టణం వరకూ వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించాడు. జనసమూహాలు విని ఫిలిప్పు చేసిన సూచకక్రియలను చూసి అతడు చెప్పిన మాటలపై ఏకమనస్సుతో లక్ష్యముంచారు.

అనేక అద్భుతాలు జరిగినందున ఆ పట్టణంలో చాలా సంతోషం కలిగింది. సీమోను అనే గారడీవాడు తానేదో ఒక గొప్పవాడినని చెప్పుకోవడం ద్వారా అందరూ 'దేవుని మహాశక్తి అతనే' అని చెప్పుకొనేవారు. గారడీలు చేస్తూ ప్రజలను విభ్రాంతిపరచేవాడు కాబట్టి వారతన్ని లక్ష్యపెట్టేవారు. ఫిలిప్పు క్రీస్తునామం గురించి ప్రకటించినపుడు ప్రజలందరితో పాటు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొందాడు. ఫిలిప్పును వెంబడిస్తూ సూచక క్రియలు, గొప్ప అద్భుతాలు జరగడం చూసి విభ్రాంతినొందేవాడు. యెరూషలేము నుండి అపొస్తలుడైన పేతురు, యోహానులు ఆ పట్టణానికి వచ్చి అప్పటివరకు వారిలో ఎవనిమీదను పరిశుద్ధాత్మ దిగియుండలేదని వారికొరకు ప్రార్థనచేసి వారి మీద చేతులుంచారు. అప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందారు. దీనిని చూసిన సీమోను - పేతురు, యోహానుల ముందు డబ్బు పెట్టి 'నేనెవరిమీద చేతులుంచుతానో వారు పరిశుద్ధాత్మను పొందేలా ఈ అధికారము నాకివ్వండి' అని వారినడిగాడు. అప్పుడు పేతురు 'నీవు డబ్బిచ్చి దేవుని వరం సంపాదించుకోవచ్చని తలంచినందున నీ వెండి నీతో కూడ నశించును గాక! నీ హృదయం దేవుని ఎదుట సరియైనదికాదు కాబట్టి నీకీ పరిచర్యలో పాలుపంపులు లేవు. నీవు ఘోరదుష్టత్వంలోనూ, దుర్నీతిబంధకాలలోను ఉన్నావు కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారుమనస్సు పొంది ప్రభువును వేడుకో. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును' అని గారడీవాడైన సీమోనుతో చెప్పాడు. అయితే సీమోను పశ్చాత్తాపపడడానికి ఇష్టపడకుండా కేవలం శిక్ష తప్పించుకోవాలని 'మీరు చెప్పినవాటిలో ఏదియు నా మీదికి రాకుండా మీరే నాకోసం ప్రభువును వేడుకోండి' అన్నాడు. గారడీవాడైన సీమోను జీవితం వింతైనది. ఫిలిప్పు ద్వారా దేవుడు జరిగించిన ఆ అద్భుతకార్యాలు చూసి ఆకర్షింపబడ్డాడుగానీ, నిజంగా మారలేదు. అందరితోపాటు ప్రభువును నమ్మినట్టు బాప్తిస్మం పొందాడు. ఫిలిప్పును విడిచిపెట్టకుండా, సూచకక్రియలు, గొప్ప అద్భుతాలు జరగడం చూసి విభ్రాంతి చెందేవాడు. డబ్బిచ్చి దేవుని వరాన్ని పొందాలని తలంచాడు. దేవుని భక్తిని, పరిచర్యను వ్యాపారంగా ఎంచాడు. ప్రజలను ఆకర్షించడానికి గారడీలు చేసినప్పటిలాగానే తానేదో ఒక గొప్పవాడుగా కనపర్చుకోవాలని ఆశించాడు.

ఈరోజుల్లో కూడా చాలామంది విశ్వాసులు దైవభక్తిని, దైవసేవను వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ప్రజలను ఆకర్షించడానికి, డబ్బు సంపాదించడానికి గొప్పవారుగా తమ్మును తాము కనుపర్చుకోవడానికి స్వస్థతల్లాంటివి చేస్తూ ఘోర దుష్టత్వంలోనూ, దుర్నీతి బంధకాలలోనూ ఉన్నారు. వారు ఆ చెడుతనాన్ని మానుకొని మారుమనస్సు పొంది ప్రభువును వేడుకోకపోతే వారు క్షమింపబడరు. సీమోనువలె బాప్తిస్మము పొందినంతమాత్రాన సరిపోదు. నిజమైన విశ్వాసంతో ప్రభువు ఇచ్చే జీవితమార్పును పొందాలి. స్వస్థతలను, అద్భుతాలను దేవునికంటే, దేవుని వాక్యం కంటే ఎక్కువగా ఎంచడం సీమోను చేసిన పొరపాటు. పేతురు మారుమనస్సు పొందమని అతన్ని గట్టిగా హెచ్చరించినా పశ్చాత్తాపపడి క్షమాపణ పొందడానికి అతడు ఇష్టపడలేదు. కేవలం శిక్షతప్పేలా నాకోసం మీరే ప్రార్థన చేయండని అన్నాడు. నిజమైన పశ్చాత్తాపం పాపశిక్షను తప్పించుకోవాలని ఆశించడం కంటే దేవుణ్ణి దుఃఖపెట్టినందుకు బాధపడుతుంది. పేతురు, యోహానులు ప్రార్థించి సమరయుల మీద చేతులుంచినపుడు వారు పరిశుద్ధాత్మను పొందారు. ఆ సమరయులు అప్పటికే ఫిలిప్పు చెప్పిన వాక్యాన్ని అంగీకరించి, నమ్మి బాప్తిస్మం తీసుకున్నవారే. అయినా వారిమీదికి పరిశుద్ధాత్ముడు అప్పటివరకు దిగియుండలేదు. దీని అర్థం రక్షింపబడడం, పరిశుద్ధాత్మను పొందడం వేరువేరు అనుభవాలని మాత్రం కాదు. అపొస్తలులకార్యాల కాలం పరివర్తనాకాలం. సంఘ ప్రారంభకాలంలో ఐక్యత కొరకు సమానత్వం కొరకు యూదులనేంటి, అన్యులనేంటి, సమరయులనేంటి అందరూ ఒకే అనుభవంగుండా వెళ్ళేలా దేవుడు చేసాడు. యూదులు అప్పటివరకూ రక్షణ కేవలం యూదులకే అని తలంచేవారు. సమరయులను అంటరానివారిగా చూసేవారు. ఫిలిప్పు వాక్యపరిచర్య ద్వారా విశ్వాసముంచిన సమరయులకు, యెరూషలేము సంఘాన్నుండి అపొస్తలులైన పేతురు, యోహానులు వచ్చి ప్రార్థనచేసి వారిమీద తమ చేతులుంచేవరకు వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడలేదు.

అపొస్తలులు అంటరానితనాన్ని పక్కన పెట్టి సమరయులపై చేతులుంచడం ద్వారా, దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించడం ద్వారా వారి మధ్య భేదాన్ని కొట్టివేసి క్రీస్తులో వారిని సమానపర్చాడు. అపొస్తలులు పొందిన సమానమైన అనుభవాన్ని సమరయులు కూడ అపొస్తలుల సమక్షంలోనే పొందడం ద్వారా దేవుడు సంఘంలో ఐక్యతను, సమానత్వాన్ని స్థాపించాడు. అంతేగాని, ఇప్పుడు కూడ సేవకులు విశ్వాసులపై చేతులుంచితే గానీ, పరిశుద్ధాత్ముడు వారికనుగ్రహింపబడడని అనుకోవడం వాక్యవిరుద్ధం. ఫిలిప్పును ప్రభువు దూత 'నీవు లేచి యెరూషలేమునుండి గాజాకు వెళ్ళే అరణ్య మార్గమును కలుసుకోమని చెప్పాడు. ఆ మార్గంలో ఐతియోపీయుల రాణి ఐన కందాకే క్రింద మంత్రి అయిన నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేము వెళ్ళి తిరిగి వెళ్తూ రథముమీద కూర్చుని యెషయా గ్రంథం చదువుతున్నాడు. అపుడు ఆత్మ ఫిలిప్పుతో 'నీవు ఆ రథము దగ్గరకు వెళ్ళి దానిని కలుసుకోమని చెప్పాడు. ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తుకొని వెళ్ళి 'నీవు చదివేది గ్రహిస్తున్నావా' అని అతనిని అడిగాడు. అప్పుడతడు ఎవడైనా నాకు త్రోవ చూపకపోతే ఎలా గ్రహింపగలనని' చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకున్నాడు. అప్పుడు ఫిలిప్పు ఆ లేఖనాలను అనుసరించి యేసును గూర్చి సువార్త ప్రకటించాడు. వారు త్రోవలో వెళ్తుండగా నీళ్ళు కనబడిన చోట ఆ నపుంసకుడు 'నాకు బాప్తిస్మమివ్వడానికి ఆటంకమేమిటి” అని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాడు. ఫిలిప్పు, నపుంసకుడు ఇద్దరూ నీళ్ళలోనికి దిగారు. అపుడు ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాడు. వారు నీళ్ళలోనుండి బయటకు వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాడు. నపుంసకుడు సంతోషిస్తూ తన త్రోవలో వెళ్ళాడు. ఈ సందర్భాన్నుండి కొన్ని పాఠాలు నేర్చుకుందాం. ఫిలిప్పు పరిశుద్ధాత్మ ప్రేరేపణకు, నడిపింపుకు, లోబడ్డాడు. ఎక్కువమందికి పట్టణంలో సువార్త చెప్పే ఫిలిప్పును ఒక్కవ్యక్తికి సువార్త చెప్పడానికి అరణ్యమార్గానికి వెళ్ళమన్నప్పుడు ఫిలిప్పు లోబడ్డాడు. దేవుడు నూతన విశ్వాసియైన నపుంసకుని ద్వారా ఐతియోపియ దేశానికి సువార్తను వ్యాపింపజేసాడు. ఈ రీతిగా దేవుని నడిపింపుకు లోబడడం ఎంతైనా మంచిది. ఒక్కడేయైనా, నపుంసకుడైనా ఆ మంత్రి కొరకు దేవుడు శ్రద్ధ వహించాడు. దేవుడు అందరినీ ప్రేమించి రక్షించాలని కోరుతున్నాడు. పాఠకులారా, మీరు ఎటువంటివారైనా, ఏ స్థితిలో ఉన్నా ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనీ, మిమ్మల్ని రక్షించాలని కోరుతున్నాడనీ గ్రహించండి.

ఎవరైనా తనకు త్రోవ చూపకపోతే చదివే వాక్యాన్ని ఎలా గ్రహింపగలనని నపుంసకుడు అన్నాడు. ఇతర విశ్వాసుల సహవాసం, దైవసేవకుల వాక్యపరిచర్య, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా వాక్యాన్ని సొంతంగా అర్థం చేసుకోవాలని ప్రయత్నించడం వ్యర్థప్రయాసే. ఫిలిప్పువంటి దైవసేవకుల వాక్యపరిచర్య మనకెంతో అవసరం. అతనికి అర్థంకాని వాక్యభాగాన్ని ఫిలిప్పు అర్థమయ్యేలా చేశాడు. అతను చదువుతున్న వాక్యభాగంలోనే వధకు తేబడినా నోరుతెరువని గొట్టెపిల్ల యేసు ప్రభువే అనీ, ఆయనే మానవుల పాపాన్ని పరిహరించడానికి సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడనీ ఫిలిప్పు బోధించాడు. మానవుల కోసం ప్రాణం పెట్టింది యేసుప్రభువు ఒక్కడే. మనం పొందవలసిన దైవోగ్రతను మనకు బదులు మనకోసం ఆయన సిలువలో భరించాడు. ఇప్పుడు యేసు ప్రభువునందు ఎవరు విశ్వసిస్తారో వారు దైవోగ్రత నుండి రక్షింపబడతారు. ఈ సువార్తను మంత్రియైన ఆ నపుంసకుడు నమ్మి బాప్తిస్మము తీసుకున్నాడు. పాఠకులారా! యేసుప్రభువే మానవుల్ని రక్షించడానికి ప్రాణం పెట్టిన ఏకైక నామమని, ఆయన తప్ప మన పాపాలు తీసివేయగలవారు ఇంకెవరూ లేరని ఆయనయందు విశ్వాసముంచారా? బాప్తిస్మము తీసుకున్నారా? బాప్తిస్మము అనే మాటకు ముంచబడుట అని అర్థము. ముంచబడిన బాప్తిస్మము తీసుకున్నారా? వారు నీళ్ళలో నుండి బయటకు వచ్చినపుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాడు. అకస్మాత్తుగా ఫిలిప్పు అదృశ్యమవడం ద్వారా ఫిలిప్పు దేవునిచేత తనకోసమే పంపబడినట్టు నపుంసకునికి నిర్ధారణయ్యింది. అతని విశ్వాసం బలపడింది. దేవుడు తనపట్ల చేసిన ఈ అద్భుతాన్ని, చూపిన ప్రేమను బట్టి నపుంసకుడు సంతోషిస్తూ తన త్రోవన వెళ్ళాడు. ఆరాధించడానికి దేశాలు దాటుకొని యెరూషలేముకు వచ్చి తిరిగి వెళుతూ కూడా వాక్యాన్ని చదువుతున్న ఆ నపుంసకుని భక్తినీ, ఆశనూ దేవుడు అంగీకరించి అతన్ని అద్భుతంగా రక్షించి సంతోషంతో నింపాడు. అద్భుతాల ద్వారా కాకుండా కేవలం వాక్యం ద్వారానే అతడు దేవునియందు విశ్వాసముంచాడు. దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుని వాక్యం కీలమైనది. వాక్యాన్ని చదవండి. దానిని గ్రహించాలని ఆశించి వెంటనే లోబడండి. అతడు వెంటనే బాప్తిస్మం తీసుకున్నట్టు మీరు కూడా ప్రభువును అంగీకరించి, వెంటనే బాప్తిస్మం తీసుకోండి. ప్రభువు మీకు సహాయపడునుగాక!

ప్రార్థన :- తండ్రీ మీకు వందనాలు. ప్రతి వ్యక్తిపట్ల మీకున్న ప్రేమనుబట్టి మీకు వందనాలు. మా కొరకు మరణించిన నీ కుమారుడైన క్రీస్తును నమ్మి మీరిచ్చే రక్షణను పొందడానికి సహాయం చేయండి. యేసుప్రభువు నామంలో వేడుకుంటున్నాము తండ్రి! ఆమేన్.

7]

సంఘ ప్రారంభ చరిత్రను తెలిపే అపొస్తలుల కార్యాల గ్రంథాన్ని ధ్యానించుకుంటున్నాం. 9వ అధ్యాయంలో సంఘాన్ని హింసించి, పాడుచేసిన సౌలును ప్రభువు పట్టుకొని పౌలుగా తనకోసం ప్రాణం పెట్టేటంత నమ్మకమైన అపొస్తలునిగా మార్చుకున్నాడు. ఇంత ఆసక్తికరమైన సంగతులున్న ఈ అధ్యాయాన్ని ఈ సమయంలో ధ్యానించుకుందాం. సౌలు ప్రభువు శిష్యులను బెదిరిస్తూ వారిని హత్య చేయడం తనకు ప్రాణాధారమైనట్టు అనుకున్నాడు. యూదా మతాన్ని నిష్ఠతో అనుసరిస్తూ క్రైస్తవుల్ని హతమార్చడం గొప్ప దైవసేవ అనుకున్నాడు. దేవునికి వ్యతిరేకంగా పోరాడుతూనే అదే గొప్ప దైవసేవ అనుకున్నాడు. ప్రజలు ఈ రీతిగా ఉంటారని ప్రభువు ముందుగానే యోహాను 16:1,2 వచనాలలో ఇలా చెప్పాడు “మీరు అభ్యంతరపడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములలోనుండి వెలివేయుదురు; మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది.” ఇతరులను చంపడం దైవసేవ అనుకొనేవారు మతఛాందస్సులు. ఈ సౌలే పౌలుగా యేసుప్రభువు సేవకునిగా మారిన తర్వాత తన సొంత ప్రజలను గురించి రోమా 10:2,3 వచనాలలో ఇలా వ్రాసాడు. “వారు దేవునియందు ఆసక్తిగలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను; అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు, దేవుని నీతికి లోబడలేదు.” భక్తిలో ఆసక్తి కలిగి ఉండడం ప్రాముఖ్యమే అయినప్పటికీ ఆ ఆసక్తి దైవ జ్ఞానానుసారమైనదిగా ఉండాలి.

క్రైస్తవ విశ్వాసం ఒక మతంగా కాకుండా ఒక మార్గంగా ఈ గ్రంథంలో ఎంచబడింది. నిజమే, క్రైస్తవ్యం మతం కాదు. దేవుణ్ణి చేరే సత్యమార్గం. ఇది క్రీస్తు మార్గమని 19:23లో వ్రాయబడి ఉంది. సౌలు ఈ మార్గమందున్నవారిని బంధించడానికి దమస్కు పట్టణానికి బయలుదేరాడు. మార్గంలో అకస్మాత్తుగా ఆకాశాన్నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అప్పుడతడు నేలమీద పడి 'సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని' ఒక స్వరము తనతో పలుకుట విన్నాడు. 'ప్రభువా, నీవెవడవని' అతడడుగగా ఆయన 'నేను నీవు హింసించుచున్న యేసును, అని చెప్పాడు. సౌలు నేలమీద నుండి లేచి కళ్ళు తెరచినా ఏమీ చూడలేకపోయాడు కాబట్టి వారతన్ని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించారు. అతడు 3 రోజులు చూపులేక అన్నపానములు తీసుకోలేదు. సౌలు విశ్వాసులను హింసించడానికి వెళ్తుంటే ప్రభువు అతన్ని హతమార్చాల్సింది బదులు అతనికి దర్శనమిచ్చి తన శిష్యునిగా మార్చుకున్నాడు. ప్రభువు ఆశ్చర్యకరమైన ప్రేమను ఇందులో చూడగలం. దూషకుడు, హింసకుడు, హానికరుడైన సౌలును పూర్ణమైన దీర్ఘశాంతంతో కనికరించి రక్షించడం మాత్రమే కాకుండా తన పరిచర్యకు నియమించి నమ్మకమైనవానిగా ఎంచి బలపర్చాడు. ఇటువంటి ప్రధాన పాపిని రక్షించిన ప్రభువు ఎటువంటివారినైనా రక్షిస్తాడు. సౌలును పౌలుగా, శత్రువును శిష్యునిగా, హంతకుడిని హతస్సాక్షిగా మార్చగలిగిన ప్రభువు ఎటువంటి పాపినైనా మార్చగలడు. గొంగళి పురుగును సీతాకోక చిలుకగా మార్చినట్టు పాపులను పరిశుద్ధులుగా ప్రభువు మారుస్తాడు. మధ్యాహ్నం అకస్మాత్తుగా ఆకాశాన్నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. యేసు ప్రభువు తన మహిమతో అతనికి ప్రత్యక్షమయ్యాడు. ప్రభువు మహిమ ప్రకాశం సూర్యుని వెలుగుకు మించినది. సౌలు నేల మీదపడి 'సౌలా, సౌలా నీవేల నన్ను హింసిస్తున్నావని' తనతో ప్రభువు పలకడం విన్నాడు. ప్రభువు 'సౌలా నీవేల నా సంఘాన్ని హింసిస్తున్నావు?” అని అనలేదు. 'నన్ను హింసిస్తున్నావు” అన్నాడు. సంఘం ఆయన శరీరం కాబట్టి సంఘాన్ని హింసించడం ఆయనను హింసించడమే అవుతుంది. క్రీస్తుకూ, ఆయన సంఘానికీ ఉండే గొప్ప విడదీయరాని బంధాన్ని గమనించాలి. తన ప్రజల శ్రమల్లో ప్రభువు వారిని విడిచిపెట్టేవాడు కాదు. షద్రక్, మేషకు, అబేద్నెగో అనే ముగ్గురిని ప్రతిమకు మొక్కనందున అగ్నిగుండంలో పడవేసినపుడు వారితో పాటు ప్రభువు ఉన్నాడు. పాఠకులారా! ఆయనకోసం మీరు పొందే శ్రమల్లో ఒంటరివారమనుకుంటున్నారా? శ్రమలోనే ఆయన సన్నిధి మనతో ఎక్కువగా ఉంటుంది.

సౌలు 3 రోజులు చూపు కోల్పోయి ఆహారం తీసుకోకుండా ఉన్నాడు. కొద్దికాలం లోక విషయాలపై దృష్టిపెట్టకుండా క్రీస్తుకు వ్యతిరేకంగా జీవించినందుకు పశ్చాత్తాపపడడానికి అతడు దృష్టిని కోల్పోయాడు. పశ్చాత్తాపంతో ఆహారాన్ని ముట్టలేదు. అననీయతో ప్రభువు చెప్పినట్లు సౌలు ఆ మూడు దినాలు ప్రార్థనలో గడిపాడు. ప్రభువు సౌలుతో నీవు మునుకోలలకు ఎదురుతన్నలేవని చెప్పాడు. క్రైస్తవులను బంధించి యెరూషలేముకు తీసుకురావాలని బయలుదేరిన సౌలు గ్రుడ్డివాడై ఇతరులతో నడిపించబడ్డాడు. పాఠకులారా, దేవునితో పోరాడడానికి తెగించి హాని పొందకుండా ఉండగలమా? దేవుణ్ణి ఎదిరించి జయించలేం. సౌలు మారినట్టు సంఘానికి ఋజువు చేయడానికి ప్రభువు అననీయ అనే భక్తిగల అతన్ని సౌలు మీద చేతులుంచి అతనికోసం ప్రార్థించడానికి పంపించాడు. అననీయ మొదట సంశయించినప్పటికీ ప్రభువు మాటనుబట్టి సౌలు మారాడని నమ్మి ప్రభువుకు లోబడి సౌలు దగ్గరకు వెళ్ళాడు. సౌలును చూసి 'సహోదరుడా' అని పిలిచి అతడు చూపుపొందేలా అతని మీద చేతులుంచాడు. సంఘాన్ని హింసించినవాడైనప్పటికి సౌలును శత్రువుగా చూడక ప్రభువు క్షమించినందుకు తాను కూడా క్షమించి అంగీకరించాడు. పాఠకులారా ! దేవుడు క్షమించినవారిని మీరు క్షమిస్తున్నారా? లేదా దేవుడు ఒక వ్యక్తిని మారిన తరువాత కూడా ఆ వ్యక్తి యొక్క గతంలోని పాప జీవితాన్నిబట్టి అతన్ని ద్వేషిస్తున్నారా? సౌలును ప్రభువు క్షమించడం మాత్రమే కాకుండా ఆయన నామాన్ని అందరి ఎదుట భరించడానికి సాధనంగా ఏర్పరచుకున్నాడు. ప్రభువు ఏర్పాటు ఎంత గొప్పది?

అననీయ అతని మీద చేతులుంచినపుడు సౌలు దృష్టి పొంది లేచి బాప్తిస్మం పొందాడు. అననీయ చెప్పినట్టు తడవు చేయకుండా వెంటనే బాప్తిస్మం తీసుకున్నాడు. 3 రోజులు ఉపవాసంతో ఉన్నప్పటికీ దృష్టిరాగానే భోజనం చేయడంకంటే బాప్తిస్మం తీసుకొని దేవుని నీతిని నెరవేర్చడమే అతడు ముఖ్యంగా ఎంచుకున్నాడు. అతని మార్పుకు ఇది నిదర్శనం. చాలామంది మేము ప్రభువును నమ్ముకున్నాం, మార్పు చెందాం అంటారేగానీ, బాప్తిస్మం తీసుకోరు. మీ మార్పు నిజమైనదైతే మీరు తప్పక బాప్తిస్మం తీసుకుంటారు. అప్పటినుండి సౌలు యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించడం ప్రారంభించాడు. విన్నవారంతా విభ్రాంతి చెందారు. యూదులైతే అతన్ని చంపడానికి విశ్వప్రయత్నాలు చేసారు. అయితే దేవుడతన్ని వారి చేతులనుండి తప్పించాడు. సౌలు యెరూషలేముకు వచ్చి శిష్యులతో కలవాలని ప్రయత్నం చేసాడుకానీ, అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడ్డారు. అయితే బర్నబా అతన్ని చేరదీసి అపొస్తలుల దగ్గరకు తీసుకువెళ్ళి అతడు త్రోవలో ప్రభువును చూసాడని ప్రభువు అతనితో మాట్లాడాడని అతడు దమస్కులో యేసు నామాన్నిబట్టి ధైర్యంగా బోధించాడని వారికి వివరంగా చెప్పాడు. అప్పుడు శిష్యులు సౌలును నమ్మి అంగీకరించారు. బర్నబా నిజంగా తన పేరుకు తగ్గవాడే. బర్నబా అంటే ఆదరణపుత్రుడు అని అర్థం. సౌలును చేరదీసి, అతని పక్షంగా మాట్లాడి అతనికి ఆదరణ కలిగించాడు.

హింసించే సౌలు ఇప్పుడు మార్పుచెంది సంఘానికి మేలుకరంగా ఉన్నాడు గాబట్టి సంఘానికి హింసలు తగ్గినందువల్ల సంఘం క్షేమాభివృద్ధి పొంది సమాధానం, ప్రభువునందు భయము, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి విస్తరించింది. సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘంలో సమాధానం, ఐక్యత ఎంతో అవసరం. సంఘస్తులలో భేదాలు, గొడవలు ఉంటే సంఘ క్షేమాభివృద్ధికి ఆటంకమే. సంఘంలో ఉండవలసిన మరొక ముఖ్య లక్షణం - ప్రభువునందు భయం. దైవభయం వల్లే మనం పాపానికి దూరంగా ఉండగలం. ఈ రీతిగా పవిత్రత ఉన్నపుడే సంఘ క్షేమాభివృద్ది చూడగలం. అంతేకాదు, పరిశుద్ధాత్మ ఆదరణ శ్రమలలో కూడ సంఘాన్ని స్థిరపరుస్తుంది. పేతురు ఐనెయ అనే పక్షవాతంగల వ్యక్తిని బాగుచేసినపుడు లుద్ద, షారోను అనే ప్రదేశాలవారు ప్రభువుతట్టు తిరిగారు. అలాగే యెప్పేలో దోర్కా అనే ఆమెను బ్రతికించడం ద్వారా అక్కడ కూడ అనేకులు ప్రభువునందు విశ్వాసముంచారు. ఇటువంటి అద్భుత కార్యాలు దేవుడు జరిగించడం ద్వారా అపొస్తలులను, వారి అనుచరులను తన రాయబారులుగా రుజువు చేసి వాక్యాన్ని స్థిరపరచాడు. తండ్రియైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును అలాగే రుజువు చేసాడు. ఇదే గ్రంథం 2:22 వచనం చూడండి, “దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములను మహత్కార్యములను సూచకక్రియలను మీ మధ్యను చేయించి, ఆయనను తనవలన మెప్పుపొందినవానిగా మీకు కనపరచెను; ఇది మీరే యెరుగుదురు.” అద్భుతాల ద్వారా ప్రభువు మెస్సీయగా రుజువయ్యాడు. ఆయన శిష్యులు బయలుదేరి వాక్యం ప్రకటించినపుడు ప్రభువు వారికి సహకారుడై వెనువెంట జరుగుతూ వచ్చిన సూచకక్రియల వలన వాక్యాన్ని స్థిరపరచాడు. ప్రస్తుతం సూచక క్రియలకు ఆవశ్యకత లేదు. ఒక డాక్టరుగారు వైద్యశాస్త్రం చదివి పరీక్షలు పాసయి పట్టా పొందారు. ఇప్పుడు ప్రతి రోగి వచ్చి, 'డాక్టర్ గారూ, మీరు మళ్ళీ పరీక్షలు వ్రాసి పాసవ్వండి. అప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను' అంటే అర్థం లేదు. అలాగే యేసుప్రభువు దేవుడని, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాల వల్ల, ఆయన మరణ పునరుత్థానాలవల్ల రుజువయింది. ఇంక ఎల్లప్పుడు రుజువులు కోరడం అర్ధరహితం.

దోర్కా లేదా తబితా అనే శిష్యురాలు సత్క్రియలు, ధర్మకార్యాలు విస్తారంగా చేసింది. విధవరాండ్రకు అంగీలూ, వస్త్రాలూ కుట్టింది. ఆమె కాయిలాపడి చనిపోయినపుడు యూదులు తమ అలవాటు ప్రకారం వెంటనే సమాధి చెయ్యకుండా పేతురుకు కబురు చేసారు. పేతురు వచ్చి మోకాళ్ళూని ప్రార్థనచేసి - తబితా, లెమ్మనగా ఆమె బ్రతికింది. తబితా చేసిన ధర్మకార్యాలవల్ల, మేలు పొందినవారు ఆమె బ్రతకాలని ఆశించారు. తబితా సత్క్రియల వల్ల ఆమెకు ఎంత గొప్ప ఘనత, మేలు కలిగిందో కదా. అందుకే హెబ్రీ. 13:16లోనూ, గలతీ. 6:9,10లోనూ ఇలా వ్రాయబడింది. “ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికిష్టమైనవి.” “మనము మేలుచేయుటయందు విసుకకయుందము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి యెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరిన వారి యెడలను మేలు చేయుదము” ఈ రీతిగా చేయడానికి ప్రభువు మనకు సహాయపడునుగాక!

ప్రార్థన :- అద్భుతకరుడవైన దేవా మీకు సోత్రాలు. సౌలును పౌలుగా మార్చినందుకు మీకు వందనాలు. మా జీవితాలను క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చండి. సత్క్రియలు చేయడానికి ఆసక్తి అనుగ్రహించండి. యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రీ, ఆమేన్.

8]

అపొస్తలుల కార్యాలు గ్రంథం 10, 11 అధ్యాయాలు ఈ సమయంలో మనం ధ్యానించుకుందాం. యూదుల దురభిప్రాయానికి భిన్నంగా దేవుడు అన్యజనులను కూడా ఏ భేదమూ లేకుండా సంఘంలో చేర్చుకోవడం ఈ అధ్యాయాలలోని విశేషం. దేవునికి పక్షపాతం లేదని, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునేవారిని ఆయన అంగీకరిస్తాడని, యేసుక్రీస్తు అందరికీ ప్రభువని ఈ 10,11 అధ్యాయాలు స్పష్టంగా బోధిస్తున్నాయి. ఇటలీ పటాలములో శతాధిపతియైన కొర్నేలీ అనే భక్తిపరుడు తన ఇంటివారందరితో కూడ దేవునియందు భయభక్తులు కలిగి ప్రజలకు బహుధర్మము చేస్తూ ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేసేవాడు. కొర్నేలీ అన్యుడైనప్పటికీ యెహోవా దేవుణ్ణి పూజిస్తూ తన మతాన్ని విడిచిపెట్టినవాడు. సున్నతిపొంది యూదా మతాన్ని పూర్తిగా అవలంభింపకపోయినా పాతనిబంధన నైతికతను చక్కగా పాటించేవాడు. దేవుడు కొర్నేలీ విశ్వాసాన్ని అంగీకరించాడు. అతని ప్రార్థనలూ, ధర్మకార్యాలూ దేవుని సన్నిధికి ఇంపైన సువాసనగా చేరాయి. అయితే అతనికి యేసుక్రీస్తులో విశ్వాసం అవసరమై ఉన్నది. అందుకే దేవుడు కొర్నేలీ దగ్గరకు దూతను పంపి పేతురును పిలిపించి రక్షణ వర్తమానమును వినమని చెప్పాడు. కొర్నేలీ భక్తిగలవాడైయుండి ధర్మకార్యాలు, ప్రార్థనలు ఎన్ని చేసినా అతడు యేసుక్రీస్తు ద్వారా కలిగే రక్షణను గురించిన వర్తమానము వినవల్సిందే. దేవదూత కొర్నేలీకి కనపడి పేతురును పిలిపించుకోమని చెప్పాడేగానీ, తాను అతనికి సువార్త చెప్పలేదు.

దేవదూత యొక్క పాత్ర కొర్నేలీని, పేతురును కలపడమేగానీ, సువార్త ప్రకటించడం కాదు. రక్షింపబడడానికి ప్రజలు రక్షణ సువార్తను మానవ వర్తమానికుని ద్వారానే వినాలి. రథం మీద వెళ్తూ యెషయా గ్రంథాన్ని చదువుతున్న ఇథియోపియా నపుంసకుని వద్దకు దూత ఫిలిప్పును పంపాడేగానీ, తాను సువార్త చెప్పలేదు. సువార్తను చెప్పే ఆధికత్యను దేవుడు మానవులకు ఇచ్చాడు. మనం చేసే నీతిక్రియలు అవి ఎంతటివైనా సరే మనల్ని రక్షించలేవు కాబట్టి యేసుక్రీస్తుపై విశ్వాసముంచి ఆయనిచ్చే ఉచిత రక్షణను అందరూ పొందాలి. దేవుడు చెప్పినట్లు కొర్నేలి పేతురును పిలవడానికి పనివారిని పంపాడు. ఈలోగా దేవుడు పేతురును దర్శనము ద్వారా అన్యజనులకు సువార్త చెప్పడానికి సిద్ధపరిచాడు. పేతురు యెప్పేలో సీమోననే ఒక చర్మకారుని దగ్గర చాలా రోజులు నివసించాడు. చర్మకారులంటే యూదులకు హేయము. ఎందుకంటే వారు చనిపోయిన జంతువుల చర్మాన్ని వాడుతూ అపవిత్రంగా ఉంటారు గాబట్టి. అయితే పేతురు ఆ చర్మకారుడైన సీమోను ఇంట నివసించడంలో అప్పటికే యూదుల హద్దులు మీరి అన్యజనులను చేరడానికి ఒక అడుగు ముందుకువేసాడు. దానితో పాటు దేవుడు పేతురుకు దర్శనం ద్వారా ఏ మనుష్యుడు నిషేధింపదగినవాడనియైననూ, అపవిత్రుడనియైననూ
చెప్పకూడదని చూపించాడు.

దేవుడు పేతురు మిక్కిలి ఆకలిగొనేలా చేసి ఇంటివారు భోజనం సిద్ధం చేస్తుండగా ప్రార్థించడానికి మిద్దె మీదికెక్కిన పేతురును పరవశుడయ్యేలా చేసాడు. ఆ దర్శనంలో ఆకాశం తెరవబడి నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర దిగటం చూసాడు. అందులో భూమి మీద ఉండే అనేక రకాల నాలుగు కాళ్ళ జంతువులు, ప్రాకే పురుగులు, ఆకాశపక్షులు కనపడ్డాయి. 'నీవు లేచి చంపుకొని తినమని' ఒక స్వరము అతనికి వినబడింది. అయితే పేతురు 'వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనా నేనెప్పుడూ తినలేదని' చెప్పాడు. 'దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైనవాటిగా ఎంచవద్దని' మరలా రెండవసారి ఆ శబ్దము అతనికి వినబడింది. ఈ రీతిగా మూడుసార్లు జరిగింది. ఈ దర్శనమేంటో అని పేతురు ఎటూ తోచకయున్నప్పుడు కొర్నేలీ పంపిన మనుష్యులు ఇంటికి వచ్చి పేతురు అనే ఆయన ఉన్నాడా? అని అడిగారు. అప్పుడు ఆత్మ పేతురుతో 'ఇదిగో ముగ్గురు మనుష్యులు నిన్ను వెదుకుతున్నారు. సందేహించక వారితో వెళ్ళు, నేనే వారిని పంపానని' చెప్పాడు. పేతురు ఆ మనుష్యుల్ని చేర్చుకొని కొర్నేలీ సంగతి తెలుసుకొని వారికి ఆతిథ్యమిచ్చాడు.

పేతురు ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా పాటించేవాడు. దేవుడు ఇశ్రాయేలీయులను విగ్రహారాధికులైన తమ పొరుగువారి నుండి ప్రత్యేకంగా ఉంచడానికి కొన్ని ఆహార నియమాలు వారికిచ్చాడు. అపవిత్రమైన జంతువులను తినవద్దన్నాడు. అయితే క్రొత్త నిబంధనలో దేవుడు ఈ ఆహార నియమాన్ని తొలగించాడు. అన్ని రకాల జంతువులను తినమని చెప్పడంలో దేవుడు పేతురుకు ఇంకా ముఖ్యమైన పాఠాన్ని నేర్పించాడు. అన్యజనులు యేసు ప్రభువులో విశ్వాసముంచేలా వారి దగ్గరకు కూడా వెళ్ళి సువార్త ప్రకటించాలని నేర్పాడు. యూదులు అన్యజాతి వారితో సహవాసం చేయడంగానీ, అట్టివారిని ముట్టుకోవడంగానీ, వారికి తగదనుకొనేవారు. అయితే దేవుడు పక్షపాతి కాడు. కాబట్టి ఏ మనుష్యుడు నిషేధింపదగినవాడని గానీ, అపవిత్రుడనిగానీ చెప్పకూడదు. పాఠకులారా! కులాన్నిబట్టి గానీ, జాతినిబట్టి గానీ, భాషనుబట్టి గానీ, దేశాన్ని బట్టిగానీ భేదం చూపిస్తున్నారా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువని మీరు నమ్మినట్లయితే దేవుడు తన స్వారూప్యంలో చేసిన మానవులందరినీ మనం అంగీకరించి వారి రక్షణ కోరి సువార్త ప్రకటించాలి. పేతురు కొర్నేలీ పంపిన మనుష్యుల్ని లోపలికి పిలిచి వారికి ఆతిథ్యం ఇచ్చాడు. అన్యులను, యూదులు ద్వేషించే రోమా సైనికుల్ని పేతురు చేర్చుకొని ఆతిథ్యమివ్వడం మంచి విషయం. కొర్నేలీ పేతురుకోసం ఎదురుచూస్తూ తన బంధువుల్ని, ముఖ్య స్నేహితులను పిలిపించి వారు కూడా పేతురు చెప్పే వాక్యం వినాలని కోరాడు. మనం కూడా మన బంధువులు, స్నేహితులు ప్రభువును నమ్మి రక్షణ పొందేలా వారికి వాక్యం అందేలా చూడాలి. పేతురు లోపలికి వచ్చినప్పుడు కొర్నేలీ అతన్ని ఎదుర్కొని అతని పాదాల మీదపడి నమస్కారం చేసాడు. అయితే పేతురు అతన్ని లేవనెత్తి నేను కూడా నరుడనే అని చెప్పి దేవునికే చెందవలసిన ఆరాధనను తన కొరకు అంగీకరించలేదు.

ఈశాన్య దేశాల ప్రజల ఆచారం ప్రకారం తాము గౌరవించేవారి పాదాలకు నమస్కారం చేయడం జరుగుతుంటుంది. తల, పాదాల మట్టుకు వంచి పాదాలు పట్టుకొని నమస్కరించడం వాక్యానుసారం కాదు. దేవుడొక్కడే మనం తలవంచి పూజించడానికి పాత్రుడు. ప్రకటన గ్రంథం వ్రాసిన యోహాను కూడ తెలియక దేవదూతకు నమస్కారం చేస్తే దేవదూత రెండు పర్యాయాలు కూడ వద్దు సుమీ! దేవునికి నమస్కారం చేయమని చెప్పాడు. ప్రకటన 19:10లోను 22:8,9 వచనాలలోను ఈ విషయం వ్రాయబడింది. "యోహానను నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను; నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, అతడు -వద్దు సుమీ! నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొనువారితోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను.” చూశారా, మనుష్యుల పాదాలకు నమస్కారం చేయడం ఎంత వాక్య విరుద్దమో; ఇప్పటినుండి ఈ తప్పు చేయడం మానేయండి. ఎంతటి భక్తులైనా ఎవరినీ దేవునితో సమానం చేయకూడదు. భక్తులైనవారు కూడ ఎవరైనా వారి పాదాలు పట్టుకొని నమస్కరిస్తుంటే మురిసిపోకుండా అది దేవునికి చెందవల్సిన మహిమను అపహరించడం అని ప్రజలను అలా చేయకుండా నివారించాలి. లేదు కదా. అపొస్తలుడైన పేతురు, ఆఖరికి దేవదూత కూడ పాదాభివందనాన్ని అంగీకరించలేదు కదా.

ప్రభువు నీకాజ్ఞాపించినవనీ వినడానికి ఇప్పుడు మేమందరం దేవుని ఎదుట ఇక్కడ కూడియున్నామని కొర్నేలీ పేతురుతో అన్నాడు. మనకు నచ్చినవే కాకుండా దేవుడాజ్ఞాపించినవన్నీ వినడానికి మనం ఇష్టపడాలి. పేతురు బోధిస్తూ యేసుక్రీస్తు అందరికి ప్రభువు అని మరణించి తిరిగి లేచాడని, ఆయనే సజీవులకు, మృతులకు న్యాయాధిపతి అని, ఆయనయందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామం మూలంగా పాపక్షమాపణ పొందుతాడని సువార్త ప్రకటించాడు. పాపక్షమాపణ నదీ స్నానాలవల్లగానీ, పుణ్యకార్యాలవల్లగానీ కలగదు. మానవుల పాపశిక్షను సిలువలో భరించిన యేసుక్రీస్తు నామంలోనే పాపక్షమాపణ పొందగలం. పాఠకులారా! మీ పాపాలు క్షమింపబడి మీకు నరక శిక్ష తొలగిపోవాలా? యేసుక్రీస్తు ద్వారానే పాప క్షమాపణ కలుగుతుంది. ఈ సత్వాన్ని ప్రజలకు ప్రకటించి ధృఢ సాక్ష్యమివ్వాలని ప్రభువు ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞను శిష్యులు పాటించారు. విశ్వాసులైన మీరు యేసుప్రభువే రక్షకుడని ప్రకటిస్తూ దృఢ సాక్ష్యమిస్తూ దేవుని ఆజ్ఞకు లోబడుతున్నారా? సువార్త ప్రకటించకపోవడం పాపమే. ఎందుకంటే సువార్త ప్రకటించకపోవడం ఆయన ఆజ్ఞను మీరడమే. కొర్నేలీ ఇంటివారు పేతురు చెప్తున్న వాక్యాన్ని వింటుండగా వారి మీదికి పరిశుద్ధాత్మ దిగాడు. పేతురుతో వచ్చిన విశ్వాసులు పరిశుద్ధాత్మ వరం అన్యజనుల మీద సయితం కుమ్మరింపబడడం చూసి విభ్రాంతి చెందారు. దేవుడు యూదులకు ఇచ్చిన పద్ధతిలోనే అన్యజనులకు కూడ పరిశుద్ధాత్మ వరాన్నిచ్చి భాషలు మాట్లాడేలా చేసాడు. సంఘంలో యూదులను, సమరయులను, అన్యజనులను ఒకే రీతిలో చేర్చాడు. అందుకే దీనికి గుర్తుగా అన్యజనులు భాషలతో మాట్లాడారు. మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందాలని పేతురు వారిని ఆజ్ఞాపించాడు. తర్వాత పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు నీవు సున్నతి పొందనివారి దగ్గరకు వెళ్ళి వారితో కూడ భోజనం చేసావని అతనితో వాదం పెట్టుకున్నారు. అందుకు పేతురు మొదటినుండి వరుసగా వారికా సంగతి వివరించి చెప్పాడు. కొర్నేలీకి దేవదూత కనపడడం, తనకు దర్శనం రావడం, తాను కొర్నేలీ ఇంటికి వెళ్ళి వాక్యం చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారిమీదకు దిగడం వివరించాడు. అప్పుడు వారు మరేమీ అడ్డం చెప్పకుండ అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారుమనస్సు దయచేసాడని చెప్పుకుంటూ దేవుణ్ణి మహిమపర్చారు. ఈ రీతిగా అన్యజనులను దేవుడు సంఘంలో చేర్చాడు.

మారుమనస్సు జీవార్థమైనది. ఒక వ్యక్తి మనస్సు మార్చుకోవడంలో పాపం నుండి పశ్చాత్తాపంతో వెనుతిరిగి విశ్వాసంతో దేవుణ్ణి సమీపిస్తాడు. అపుడు దేవుడు అతన్ని రక్షించి నిత్యజీవాన్ని అనుగ్రహిస్తాడు. జీవార్థమైన మారుమనస్సు పొందారా? అంతియొకయలో అనేకులు ప్రభువుతట్టు తిరిగారని యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అక్కడికి పంపారు. బర్నబా పరిశుద్ధాత్మతోను, విశ్వాసంతోనూ నిండుకొన్న సత్పురుషుడు. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిరహృదయంతో హత్తుకోవాలని అందరినీ హెచ్చరించాడు. మనమును ప్రభువును స్థిరహృదయంతో హత్తుకోవాలని హెచ్చరింపబడుతున్నాము. తరువాత బర్నబా తార్సుకు వెళ్ళి సౌలును వెదకి అంతియొకయకు తీసుకొచ్చాడు. వారు కలిసి అనేకమందికి వాక్యాన్ని బోధించారు. కలిసి దేవుని పనిచేయడం ఎంతో ఆశీర్వాదకరం. అంతియొకయలో మొట్టమొదట శిష్యులు క్రైస్తవులనబడ్డారు. వ్యతిరేకులు హేళనగా అన్నప్పటికీ ఈ పేరు శిష్యులకు తగినది. క్రైస్తవులంటే క్రీస్తుకు సంబంధించినవారని అర్థము. యెరూషలేములో విశ్వాసులు కరువు ఎదుర్కోబోతున్నారని తెలిసి శిష్యులలో ప్రతివాడు తన తన శక్తికొలది సహాయాన్ని పౌలు, బర్నబాల చేత పంపారు. పాఠకులారా! ఇతర విశ్వాసుల అవసరాలలో మీ శక్తికొలది సహాయపడుతున్నారా? అలా చేయడానికి ప్రభువు మీకు సహాయపడును గాక.

ప్రార్థన :- అందరికి ప్రభువైన, పక్షపాతంలేని దేవా, మీకు స్తోత్రాలు. అన్యజనులమైన మాకును జీవార్థమైన మారుమనస్సు అనుగ్రహించినందుకు వందనాలు. మీ సువార్త ప్రకటిస్తూ దృఢంగా సాక్ష్యమివ్వడానికి సహాయం చెయ్యండి. యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రీ. ఆమేన్.

9]

అపొస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం చదవండి. రాజైన హేరోదు సంఘపువారిలో కొందరిని హింసించడానికి బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాడు. ఈ హేరోదు బాప్తిస్మమిచ్చు యోహానును చంపిన హేరోదు మేనల్లుడు. అప్పులు చేసి రోమ్ పట్టణాన్నుండి పాలస్తీనాకు పారిపోయాడు. నిర్లక్ష్యంగా పలికిన మాటలను బట్టి తైబీరియా చక్రవర్తి చేత చెరశాలలో వేయబడి, చక్రవర్తి మరణానంతరం విడిపింపబడి పాలస్తీనా అధికారిగా చేయబడ్డాడు. రోమ్ తో సరియైన సంబంధాలు లేనందువల్ల యూదులను మంచి చేసుకోవాలని వారిని సంతోషపెట్టడానికి క్రైస్తవులను హింసించాడు. స్వలాభం కోసం సంఘాన్ని హింసించి యాకోబును ఖడ్గంతో చంపించాడు. అయితే దేవుడు తన చిత్తానుసారంగా ఈ హింసనంతటినీ ఒప్పుకున్నాడు. అపొస్తలులలో యాకోబు మొదటి హతస్సాక్షి. బాప్తిస్మమిచ్చు యోహాను చంపబడినట్లు యాకోబు కూడా ఖడ్గంతో చంపబడ్డాడు. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని హేరోదు పేతురును కూడా పట్టుకొని పండుగ తర్వాత ప్రజల దగ్గరకు తీసుకురావాలని చెరశాలలో వేయించాడు. 16 మంది సైనికులకు అతనినప్పగించాడు. 'సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను.” ప్రభువు సంఘప్రార్థన ఆలకించి తన దూతను పంపి పేతురును చెరశాల నుండి విడిపించాడు. తెల్లవారితే హేరోదు పేతురును చంపనైయుండగా ఆ రాత్రే ప్రభువు అతన్ని విడిపించాడు. హేరోదు పేతురును గట్టి కావలిలో ఉంచాడు. ఇద్దరు సైనికులు పేతురు సంకెళ్ళను తమకు బిగించుకున్నారు. పేతురు తప్పించుకోవడానికిగానీ, అతనిని ఇంకెవరైనా విడిపించడానికిగానీ వీలులేకుండ ఇలా చేసారు. మరి ఇద్దరు సైనికులు తలుపు ఎదుట చెరశాలకు కాపలా కాసారు; పేతురును విడిపించడం ఏ మానవునికే గానీ, దేవునికేగానీ వీలుకాకుండా హేరోదు చేయాలనుకున్నాడు. దేవుడు హేరోదును సిగ్గుపరిచాడు. దేవదూత చెరశాల తలుపులు వేయబడినప్పటికీ లోపలికి వచ్చాడు. ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతున్న పేతురును తట్టి లేపాడు. అంతే, సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడ్డాయి. వారు వెలుపలికి వస్తుంటే ఇనుప తలుపులు తమంతట అవే తెరుచుకున్నాయి. పేతురు అద్భుతంగా విడిపింపబడ్డాడు. దేవుని శక్తిముందు ఏ అధికారం నిలబడదని, ఎటువంటి అసాధ్యమైన పరిస్థితులనైనా దేవుడు సాధ్యపరచగలడని గ్రహించగలం.

సంఘమంతా పేతురు విడుదలకై దేవునికి అత్యాసక్తితో కలిసి ప్రార్థించారు. భక్తునికి కలిగిన శ్రమలో సంఘం అతని పక్షంగా దేవునికి మొఱ్ఱపెట్టింది. శ్రమ సంభవించినప్పుడు ప్రార్థించాలని యాకోబు వ్రాసినట్టు మనం కూడా శ్రమల్లో దేవునికి ప్రార్థించాలి. పేతురు విడిపింపబడడానికి మానవరీత్యా ఏ మాత్రం అవకాశాలు లేనప్పటికీ నిరాశపడకుండా ప్రార్థించారు. ఐక్యతతో ప్రార్థించారు. అనేకులు కూడి ప్రార్థించారని వ్రాయబడింది. ప్రభువు ఐక్యప్రార్థనను గౌరవించేవాడు. మత్తయి 18:19లో ప్రభువు ఇలా సెలవిచ్చాడు. “మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనినిగూర్చియైనను భూమిమీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న నా తండ్రివలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను.” పాఠకులారా! ఏకమనస్సుతో కలిసి ప్రార్థిస్తున్నారా? వ్యక్తిగత రహస్య ప్రార్థనే కాకుండా సంఘ ప్రార్థనను కూడా ప్రాముఖ్యంగా ఎంచాలి. వారు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేసారు. మనం ప్రార్థనలు ఆసక్తితో చెయ్యాలి. ఏలీయా మనవంటి స్వభావంగలవాడైనా వర్షం కురవకుండేలా ఆసక్తితో ప్రార్థన చేస్తే, 37 సంవత్సరాలు భూమి మీద వర్షం కురవలేదు. మనం కూడా ఆసక్తితో ప్రార్థించాలి. రాత్రి చాలా సేపు వరకు వారు ప్రార్ధిస్తూనే ఉన్నారు. పేతురు విడిపింపబడి ఆ ఇంటికి వచ్చేసరికి వారు ప్రార్థిస్తూ ఉన్నారు. తెల్లవారితే హేరోదు పేతురును చంపాలనుకుంటున్నాడు కాబట్టి సమస్య తీవ్రతను బట్టి వారు తీవ్రంగానే ప్రార్థించారు. దేవుడు ప్రార్థనలు ఆలకించి పేతురును హేరోదు చేతిలో నుండి తప్పించాడు. ప్రార్థనల వల్ల ఎంత మేలు ఉందో కదా!

పేతురు విడిపింపబడి ప్రార్థన జరుగుతున్న ఇంటికి వచ్చి తలుపు తట్టినప్పుడు రొదే అను ఒక చిన్నది ఆలకించడానికి తలుపు వద్దకు వచ్చింది. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషంచేత తలుపు తీయకుండా లోపలికి పరుగెత్తుకెళ్ళి పేతురు తలుపు దగ్గర ఉన్నాడని చెప్పింది. అందుకు వారు నీవు పిచ్చిదానవన్నారు. అయితే తాను చెప్పిందే నిజమని ఆమె దృఢంగా చెప్పింది. పేతురు ఇంకా తలుపు తడుతున్నందువల్ల వారు తలుపు తీసి అతన్ని చూసి విభ్రాంతిచెందారు. రొదే అను ఆ చిన్నదాని జీవితం ఎంతో ఆసక్తికరమైనది. సంఘం హింసింపబడే రోజుల్లో సంఘం లోపల ప్రార్థిస్తున్నప్పుడు తలుపు తడుతున్న శబ్దం విని కంగారుపడి వెంటనే తీయకుండా ఆలకించింది. చిన్నదైనప్పటికీ జ్ఞానంగా ప్రవర్తించింది. ఏదైనా మాట్లాడేముందు రెండుసార్లు ఆలోచించాలంటారు. అలాగే ఏదన్నా చేసేముందు బాగా ఆలోచించాలి. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టింది. పేతురు బోధలు తరచూ వినడంవల్ల అతని స్వరం గుర్తుపట్టింది. మనం దేవుని స్వరం గుర్తుపట్టాలి.

వాక్యాన్ని ఎక్కువగా తెలుసుకుంటే మనకొచ్చే తలంపులు దేవుని సంబంధమైనవో కావో గుర్తుపట్టగలం. రొదే పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషంవల్ల తలుపు తీయకుండా లోపలికి పరుగెత్తుకెళ్ళి ప్రార్థించేవారికి ఆ సంగతి చెప్పింది. ఆమె అత్యానందంతో దేవుడు ప్రార్థనలు ఆలకించి పేతురును చెరశాల నుండి విడిపించాడనే సత్యాన్ని ఇతర శిష్యులకు తెలిపింది. దేవుని కార్యాలనుబట్టి మనం కూడా సంతోషించాలి. పాపంలో, అపవిత్రతలో సంతోషించడం విశ్వాసులకు తగదు. దేవుని వాక్యంలో సంతోషించాలి. ఫిలిప్పీ. 4:4లో పౌలు వ్రాసిన మాట జ్ఞాపకం చేసుకుందాం. “ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి; మరల చెప్పుదును ఆనందించుడి.” పాఠకులారా! ప్రభువులో ఆనందిస్తున్నారా? ఇది భక్తికి ఎంతో అవసరం. రోదే పరుగెత్తుకెళ్ళి పేతురు వచ్చిన సంగతి ప్రార్థిస్తున్నవారికి చెప్పినప్పుడు వారు చెరశాలలో నుండి పేతురెలా వస్తాడు? నీవు పిచ్చిదానవన్నారు. అయితే తాను చెప్పిందే నిజమని ఆమె దృఢంగా చెప్పింది. పేతురు విడుదల కోసం ప్రార్థిస్తున్నవారే పేతురొచ్చాడని చెప్పినా నమ్మడం లేదు. మన ప్రభువు చేసే కార్యాలు అడిగినదానికీ, ఊహించినదానికీ మించినవి. వారు నమ్మశక్యము కానంత అద్భుతాన్ని ఆయన జరిగించాడు. మన జీవితాల్లో కూడా ఇది కలా? నిజమా? అన్నంత ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. రొదే పేతురు వచ్చిన సంగతి చెప్పినప్పుడు వారు ఆమెను పిచ్చిదానవన్నా ఆమె ఏమో పేతురో కాదో అని సందేహించకుండా తనకు తెలిసిన సత్యానికి దృఢంగా కట్టుబడి ఉంది. చాలాసార్లు ప్రజలు తెలీక మనం చెప్పే సత్యాన్ని విమర్శిస్తే మనం బలహీనపడుతూ ఉంటాం. లోకం వేసే నిందలకు బెదరకుండా ఇంకా సత్యాన్ని గట్టిగా చేపట్టాలి. ఒకతను సంతలో మేకపిల్లను కొని తీసుకువెళ్తుంటే ముగ్గురు దొంగలు అతన్ని అడ్డుకొని ఒకరితర్వాత ఒకరు అది కుక్కపిల్ల, మేకపిల్ల కాదు అని నమ్మబలికారు. తాను కొన్నది మేకపిల్లే అని అతనికి తెలిసినప్పటికీ వాళ్ళూ, వీళ్ళూ అన్న మాటనుబట్టి ఎందుకొచ్చిందనుకొని ఆ మేకపిల్లను వదిలి వెళ్ళిపోయాడు. ఇది ఎంత అవివేకం! చాలామంది ప్రజలు పెట్టే నిందలకు భయపడుతూ ప్రభువునూ, ఆయనిచ్చే పరలోకరాజ్యాన్నీ వదులుకుంటున్నారు. రొదేను వారు పిచ్చిదానవన్నారు. కానీ, ఎవరు పిచ్చివారో తరువాత తెలిసింది. అలాగే విశ్వాసులమైన మనల్ని యేసుప్రభువే దేవుడంట, ఆయనను నమ్ముకుంటేనే పరలోకమంట అని హేళన చేస్తూ క్రైస్తవులు పిచ్చివారని అంటుంది లోకం. రొదే విషయంలో ఎవరు పిచ్చివారో తర్వాత తెలిసినట్లు మన విషయంలో కూడ ఎవరు పిచ్చివారో తెలుస్తుంది. ప్రభువును ఆయన బిడ్డలను నిందించినవారందరూ సిగ్గుపరచబడతారు. ప్రభువు తన బిడ్డలను పరలోకం చేరుస్తాడు. ఆయనను నమ్మని వారందరూ నరకాగ్నిగుండం పాలవుతారు.

అప్పుడు వారు తెలుసుకుంటారు రక్షించలేని నామాల్ని నమ్ముకొని నరకంలో పడ్డ తామే పిచ్చివాళ్ళని. పాఠకులారా! రొదేవలె మీకు దేవుడు బైబిలు ద్వారా తెలియచేసిన సత్యాన్ని ఎన్ని నిందలొచ్చినా విడిచిపెట్టకండి.

తెల్లవారగానే పేతురు ఏమాయెనో అని సైనికులలో కలిగిన గలిబిలి యింతంత కాదు. హేరోదు అతనికోసం వెదకినపుడు అతడు కనబడనందున కావలివారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించాడు. దేవుడు హేరోదును సిగుపర్చాడు. దేవునికి వ్యతిరేకంగా అతను పోరాడి నెగ్గలేడని ఋజువుచేసాడు. ఒకరోజు హేరోదు తళతళలాడే వెండితో చేయబడిన రాజవస్త్రాలు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుని ఉపన్యాసం చేసినప్పుడు జనులు ఇది దైవస్వరమేగానీ, మానవ స్వరము కాదని కేకలు వేసారు. హేరోదు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువుదూత అతన్ని మొత్తాడు కాబట్టి పురుగులు పట్టి ప్రాణం విడిచాడు. చరిత్రకారుడైన యోసెఫస్ వ్రాసినట్టు హేరోదు 5 రోజులు భయంకరమైన బాధననుభవించి మరణించాడు. దేవుణ్ణి మహిమపరచనివారి గతి ఇంతే. "మరియు వారు దేవునినెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదుగాని, తమ వాదములయందు వ్యర్థులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు, ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి, సేవించిరి. దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది” (రోమా 1:21,23,25, 18). పాఠకులారా! దేవుణ్ణి మహిమపరుస్తున్నారా? హేరోదు సంఘాన్ని హింసించి యాకోబును ఖడ్గంతో చంపి పేతురును కూడా చంపాలని చూసాడు. దేవుడు హేరోదును కఠినంగా మొత్తాడు . దేవుడు న్యాయకర్త. తన కనుగుడ్డులాంటి తన ప్రజలను ముట్టినవారికి ఆయనే బుద్ధి చెప్పాడు. అన్ని పరిస్థితుల్లో దేవుడు న్యాయం చేస్తాడని ఆయనకే అప్పగించుకోండి. ప్రభువు కృప మీకు తోడైయుండును గాక!

ప్రార్థన:- ప్రార్ధనలాలకించి అద్భుతాలు చేసే దేవా, మీకు స్తోత్రాలు. పేతురును విడిపించినందుకు మీకు వందనాలు. కలిసి, అత్యాసక్తితో ప్రార్థించడం మాకు నేర్పండి. అన్ని విషయాలలో మిమ్మల్నే మహిమపరచడం నేర్పండి. ఎన్ని నిందలొచ్చినా సత్యాన్ని దృఢంగా చేపట్టడానికి సహాయం చెయ్యండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.

10]

దేవుని వాక్యంలో ఆనందిస్తూ ఎల్లప్పుడు దానిని ధ్యానించేవారు నీటి కాలువల దగ్గర నాటబడిన ఆకువాడని ఫలించే చెట్టులా ఉంటారని, వారు చేసేదంతా సఫలమవుతుందని మొదటి కీర్తనలో వ్రాయబడి ఉంది. దేవుని వాక్యం నీటి కాలువలలాంటిది. కాలువలలో నీళ్ళు సమృద్ధిగా ఉన్నట్టు దేవుని వాక్యం మనకు సమృద్ధిగా ఇవ్వబడింది. కాలువలలో నీళ్ళు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండడంవల్ల తాజాగా ఉన్నట్టు దేవుని వాక్యం జీవంగలదై మనకెప్పటికప్పుడు తగిన హెచ్చరికనూ, ఆదరణనూ, జ్ఞానాన్నీ, సంతోషాన్నీ ఇస్తుంది. ఎంతోమంది ఇటువంటి గొప్ప వాక్యాన్ని ధ్యానించకపోవడం వల్ల ఎంతో ఆత్మీయ దరిద్రతను అనుభవిస్తున్నారు. ఒక వృద్ధురాలు తన ఏకైక కుమారుడు ఇతర దేశంలో ఉండి తనకేమీ డబ్బులు పంపట్లేదని బాధపడేది. ఎంతో పేదస్థితిలో ఉన్న ఆమెను ఒకాయన పలకరిస్తూ ఏమ్మా! నీకు ఒక కొడుకు ఉండాలి కదా, అని అడిగాడు. అందుకామె ఉన్నాడయ్యా విదేశంలో పెద్ద ఉద్యోగం చేసుకుంటున్నాడు అంది. అందుకా పెద్దాయన విదేశంలో ఉంటూ ఎంతో సంపాదిస్తు కూడా తల్లి ఇబ్బందిలో ఆమెకేమీ సహాయపడడం లేదా? కనీసం ఉత్తరాలైనా రాస్తాడా అని అడిగాడు. ఎంతో ప్రేమ ఉన్నట్లు పెద్ద పెద్ద ఉత్తరాలు వ్రాస్తాడు. ఏవో కొన్ని బొమ్మలున్న కాగితాలు పంపిస్తాడు అంది. వాటిని తెమ్మని ఆవ్యక్తి వాటిని చూచినప్పుడు ఆమె ఏవో బొమ్మలనుకున్న ఆ కాగితాలు ఆ దేశపు చెక్కులని అవి ఎన్నో లక్షల విలువచేసేవని అతడు గ్రహించాడు. ఆ వృద్ధురాలు ఎంతో డబ్బును కలిగి ఉండి కూడ పిచ్చిదానిలా అనవసరంగా దారిద్య్రం అనుభవించింది. ఆ వ్యక్తి ఈ విషయం చెప్పినప్పుడు ఆమె ఆ బ్యాంకు చెక్కులు మార్చుకోవడం ప్రారంభించి చెప్పలేనంత సమృద్ధిని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని పొందింది. మనంకూడా చాలాసార్లు దేవుని వాక్యం యొక్క విలువ గ్రహించక ఎంతో ఆత్మీయమైన పేదరికాన్ని అనుభవిస్తున్నాం. ఇది ఏమాత్రం జ్ఞానంలేని పని. దేవుని వాక్యముయొక్క విలువనూ, సంపదనూ గుర్తించి ఇకనుంచైనా ఆత్మీయంగా ఐశ్వర్యవంతులు అవ్వండి.

క్రైస్తవ సంఘ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి అపొస్తలుల కార్యాల గ్రంథం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సమయంలో పదమూడవ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. ఈ అధ్యాయం ఈ గ్రంథానికి ఒక మలుపులాంటిది. మొదటి 12 అధ్యాయాలు యెరూషలేము, యూదయలలో పేతురు పరిచర్య మరియు సంఘమును గూర్చి వ్రాయబడింది. మిగిలిన 16 అధ్యాయాలలో పౌలు పరిచర్య మరియు రోమా ప్రపంచమంతటా, అన్యజనులలో సంఘం విస్తరించుట వ్రాయబడింది. అంతియొకయలోనున్న సంఘంలో వారు ప్రభువును సేవిస్తూ, ఉపవాసం చేస్తుండగా పరిశుద్ధాత్మ 'నేను బర్నబాను, పౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని' వారితో చెప్పాడు. అప్పుడు వారు ఉపవాసముండి ప్రార్థనచేసి, వారి మీద చేతులుంచి, సువార్త పనికి వారిని పంపారు. దేవుని పరిచర్యను దేవుని పిలుపుతో చేయాలి. ఎవరిష్టప్రకారం వాళ్ళు సేవచేయడం కాకుండా దేవుని పిలుపు మేరకే పరిచర్యలోకి రావడం ఉత్తమం. పరిచర్యలోకి వచ్చేవారు దేవునిచేత పిలవబడ్డారని స్థానిక సంఘంచే గుర్తింపబడి, పంపబడాలి. పౌలు మొదటి సువార్త ప్రయాణం వారి స్వంత ప్రణాళిక ద్వారా కలిగినది కాదు కానీ, పరిశుద్ధాత్మ ప్రేరేపణవలన కలిగింది. సంఘ నాయకులు దేవుణ్ణి సేవిస్తూ, ఉపవాసంతో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారికి తన చిత్రాన్ని బయలుపరిచాడు. దేవుని స్వరాన్ని ఉపవాస ప్రార్థనలలో ఆయనతో గడిపేవారు గుర్తించగలరు. సంఘ ప్రారంభ దినాల్లో ఉపవాస ప్రార్థనలకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ప్రస్తుత రోజుల్లో ఉపవాస ప్రార్థనల కంటే విందులే ఎక్కువగా చూడగలం. పౌలు, బర్నబాలను సువార్త పరిచర్యకు పంపడానికి ముందుకూడ సంఘనాయకులు మరల ఉపవాసముండి ప్రార్థించారు. ఉపవాస ప్రార్థనలతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో ఈ రోజుల్లో పరిచర్య జరుగుతుందంటారా, పాఠకులారా? అలా జరగాలని ప్రార్థిద్దాం.

పౌలు, బర్నబాలు పరిశుద్ధాత్మ చేత పంపబడినవారై దేవుని వాక్యాన్ని ప్రచురం చేశారు. దేవుని వాక్యం శీఘ్రంగా వ్యాపించి దేవుడు మహిమపరచబడాలి. ప్రభువు పనికి ప్రత్యేకింపబడినవారు వాక్యప్రకటనే అత్యంత ప్రాముఖ్యంగా ఎంచాలి. వారు ఒక ఊరికి వచ్చినప్పుడు సెర్గిపౌలు అనే ఒక అధిపతి వారిని పిలిపించి దేవుని వాక్యం వినగోరాడు. అయితే ఎలుమ అనే ఒక అబద్ధ ప్రవక్తయైన గారడీవాడు ఆ అధిపతిని విశ్వాసమునుండి తొలగించాలని ప్రయత్నం చేసి వారిని ఎదిరించాడు. అప్పుడు పౌలు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభువు యొక్క తిన్నని మార్గాలు చెడగొట్టినందుకు కొంత కాలము గుడ్డివాడవై ఉంటావని గారడీవాడిని గద్దించాడు. వెంటనే అతడు గ్రుడ్డివాడయ్యాడు. అప్పుడు ఆ అధిపతి జరిగినదానిని చూసి పౌలు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాడు. ఎవరినైనా ప్రభువులో విశ్వాసము నుండి తొలగించాలని ఆ గారడీవానివలె ప్రయత్నించేవారు ప్రభువు శిక్షను ఎదుర్కొంటారు. మత్తయి 18:6లో ప్రభువు ఇలా సెలవిచ్చాడు. “నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు.” పౌలు, బర్నబాలు పిసిదియలోనున్న అంతియొకయకు వచ్చి సమాజమందిరములో వాక్యం
ప్రకటించారు. ఇశ్రాయేలీయుల చరిత్రను జ్ఞాపకం చేస్తూ ప్రవక్తయైన సమూయేలు, రాజులైన సౌలు, దావీదులను గూర్చి మాట్లాడుతూ దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుష్యుడని దేవుని ఉద్దేశ్యాలన్నీ నెరవేర్చేవాడని దేవుడతనిని గూర్చి సాక్ష్యమిచ్చాడని చెప్పారు. దావీదువలె మనంకూడ దేవుని ఇష్టానుసారులుగా జీవించాలి. దావీదు పాపం చేసినప్పటికీ, దానిని అంగీకరించి పశ్చాత్తాపపడ్డాడు. దేవుని హృదయానుసారులు పాపాన్ని సమర్ధించుకోరు, దాచుకోరు, పాపంలో నివసింపరు. ఒకవేళ పడిపోయినా తిరిగి లేస్తారు. పాఠకులారా! దేవుని యిష్టాన్ని అనుసరిస్తున్నారా? సాతాను ఇష్టాన్ని అనుసరిస్తున్నారా? దావీదు దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడని దేవుడే అతని గురించి సాక్ష్యమిచ్చాడు. పాఠకులారా! దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తున్నారా? మీ స్వంత ఉద్దేశాలను నెరవేరుస్తున్నారా? కొంతమంది విశ్వాసులు దేవుని ఉద్దేశాలు కొన్నిటిని నెరవేరుస్తారు కానీ దావీదువలె దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చాలని పాఠం నేర్చుకుంటున్నాం. దావీదు గురించి దేవుడు మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు. మన గురించి ఎటువంటి సాక్ష్యం దేవుడిస్తాడో ప్రశ్నించుకుందాం.

పౌలు బోధిస్తూ దేవుడు తన వాగ్దానాన్ని బట్టి రక్షకుడైన యేసును పుట్టించాడని యేసుక్రీస్తు పాతనిబంధన గ్రంథంలోని ప్రవచనాల నెరవేర్పేనని వివరించాడు. ఆయన గురించి చెప్పబడిన ప్రవక్తల వచనాలను తెలియకే ఆయనకు శిక్ష విధించుట చేత యూదులు ధర్మశాస్తాన్ని నెరవేర్చారు. యేసుక్రీస్తే దేవుడు వాగ్దానం చేసిన రక్షకుడు, మెస్సీయ. ఈ సత్యాన్ని ఋజువుపర్చేది యేసు ప్రభువు పునరుత్థానం. పౌలు ఈ సత్యాన్ని ప్రకటించి యేసుక్రీస్తు ద్వారానే పాపక్షమాపణ దొరుకుతుందని, మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములో నీతిమంతులుగా తీర్చబడలేకపోయారో ఆ విషయాలన్నిటిలో విశ్వసించు ప్రతివాడునూ ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడతాడని వారికి తెలియజేసాడు. 'ధర్మశాస్త్రంవల్ల ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే' అని గలతీ. 3:11లో చూడగలం. ధర్మశాస్త్రం ఇవ్వలేని నీతిని యేసుక్రీస్తు ద్వారానే పొందగలం. రోమా 3:23 24 వచనాలు చూడండి. "ఏ బేధమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తు "యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తిర్చబడుచున్నారు.” ఈ వచనాలను బట్టి నీతి దేవుని కృపవలనే, యేసుప్రభువును నమ్ముట ద్వారానే పొందగలం. పాఠకులారా, దేవుడిచ్చే నీతిని పొందారా? యేసు ప్రభువును నమ్మితేనే నీతిమంతులుగా ఎంచబడతారు.

దేవుని కృపలో నిలకడగా ఉండాలని పౌలు, బర్నబాలు ఆ ప్రజలను హెచ్చరించారు. తిరిగి పాత స్వనీతి మీద ఆధారపడకుండా, దేవుని కృపమీదే ఆధారపడి నిలకడగా ఉండాలని హెచ్చరించారు. పాఠకులారా! దేవుని కృపలో నిలకడగా ఉంటున్నారా? యూదులు పౌలు చెప్పిన వాక్యాన్ని వ్యతిరేకించి దూషించారు. అందుకు పౌలు, బర్నబా ధైర్యంగా 46వ వచనంలో ఇలా అన్నారు. “దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు, గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము.” తమకు చెప్పబడిన వాక్యాన్ని త్రోసివేసి నిత్యజీవాన్ని పోగొట్టుకున్నారు. ఎవరైనా తమకు బోధింపబడిన దేవుని వాక్యాన్ని త్రోసివేస్తే వారికి వారే నిత్యజీవానికి అపాత్రులుగా ఎంచుకున్నట్టు. మన మేలుకోసం దేవుడు మనకు వాక్యాన్ని అందిస్తుంటే ఆ వాక్యాన్ని నిరాకరించడం పాపమే. నిత్యజీవం పొందడానికి దేవుడేర్పరచిన మార్గాన్ని త్రోసివేస్తే నశించక ఏమౌతాం? పాఠకులారా! దేవుని వాక్యాన్ని ఎన్నడూ త్రోసివేయకండి. యూదులు వాక్యాన్ని నిరాకరించడంవల్ల పౌలు, బర్నబాలు అన్యజనులకు వాక్యాన్ని బోధించారు. అన్యజనులు సంతోషించి దేవుని వాక్యాన్ని మహిమపర్చారు. అంతేకాదు, నిత్యజీవానికి నిర్ణయింపబడినవారందరూ విశ్వసించారు. రక్షింపబడడంలో దేవుని నిర్ణయం, మన విశ్వాసం రెండూ ఉన్నట్టు గుర్తించాలి. 2 థెస్స. 2:13లో ఈరీతిగా వ్రాయబడి ఉంది - “ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణ పొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను”. ఎఫెసీ 1:4లో ఉన్నట్టు దేవుడు కొందరిని జగత్తు పునాది వేయబడక ముందే తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. విశ్వాసం కూడా దేవుడిచ్చే వరమే. ప్రియ పాఠకులారా! ప్రభువునందు విశ్వసించిన మీరు నిత్యజీవం పొందడానికి ముందుగానే దేవునిచేత నిర్ణయింపబడ్డారని గ్రహించి సంతోషించండి. ప్రభువు వాక్యం ఆ ప్రదేశమంతా వ్యాపించింది. కానీ, యూదులు పౌలుకు, బర్నబాకు హింస కలుగజేసి వారిని తమ ప్రాంతాలనుండి వెళ్ళగొట్టారు. ఈ రీతిగా వెళ్ళగొట్టబడినాసరే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నింపబడ్డారు.

పరిశుద్ధాత్మతో నింపబడినవారు ప్రభువు నిమిత్తం వచ్చే హింసల్లో కూడా ఆనందభరితులుగా ఉంటారు. శ్రమల్లో అవిశ్వాసపడరు. దేవుణ్ణి ఏ మాత్రమూ విడిచిపెట్టరు. పాఠకులారా! ప్రభువు నిమిత్తం వచ్చే నిందలను సహిస్తున్నారా? శ్రమల్లో ఆనందిస్తున్నారా? దేవుడు తన ఆత్మతో మిమ్మల్ని నింపి అన్ని పరిస్థితుల్లోనూ మిమ్మల్ని ఆనందభరితులుగా చేయునుగాక.

ప్రార్థన:- వాగ్దానాలిచ్చి నెరవేర్చే దేవా! మీ కుమారుణ్ణి మా కొరకు రక్షకునిగా అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఆయనను నమ్ముట ద్వారా నీతిమంతులుగా తీర్చబడడానికి చదువరులందరికీ సహాయం చెయ్యండి. నీ వాక్యాన్ని ఎన్నడూ త్రోసివేయకుండా, మీ కృపలో నిలకడగా ఉండడానికి సహాయం చెయ్యండి. మీ ఆత్మతో నింపి అన్ని పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండడానికి సహాయం చెయ్యండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాము తండ్రీ! ఆమేన్.

11]

సంఘ జీవితానికి కావల్సిన మెళకువలూ, హెచ్చరికలూ అపొస్తలుల కార్యాల గ్రంథం ద్వారా నేర్చుకుంటున్నాం. ఈ సమయంలో 14, 15 అధ్యాయాలు ధ్యానించుకుందాం. ఈకొనియలో పౌలు, బర్నబాలు తేటగా బోధించినందున అనేకులు విశ్వసించారు. వాక్యబోధకులు వాక్యాన్ని స్పష్టంగా, వినేవారికి అర్థమయ్యే రీతిలో తేటగా బోధించాలి. క్రైస్తవేతరులకు తెలియని క్రైస్తవ పదజాలం ఎక్కువగా వాడడంవల్ల చెప్పే విషయం ఇతరులకు అర్థం కాకపోవచ్చు. వినేవారు గ్రహించడమే చెప్పేవారి గురియై ఉండాలి. అవిధేయులైన యూదులు అన్యజనులను పురిగొల్పి వారి మనస్సుల్లో సహోదరుల మీద పగపుట్టించారు. అయితే వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుతూ అక్కడ చాలాకాలం గడిపారు. శిష్యులవలె మనం కూడ హింసల్లో ప్రభువుకు ఆనుకొని ధైర్యంగా మాట్లాడాలి. ప్రభువు వారిచేత సూచక క్రియలు, అద్భుతాలు చేయించి తన కృపావాక్యానికి సాక్ష్యమిచ్చాడు. అపొస్తలుల కాలంలో వారిని తానే పంపాడని, వారు దేవుని ఆజ్ఞను బట్టే వాక్యం ప్రకటిస్తున్నారని వారి పరిచర్యను నిర్ధారించడానికే ప్రభువు సూచకక్రియలు, అద్భుతకార్యాలు చేయించాడు, వాక్యం ప్రకటింపబడింది. అపొస్తలులు దేవునిచే పంపబడ్డారని రుజువైంది. ప్రభువు సంఘం స్థిరపడింది. తాత్కాలికంగా, సూచనగా ఉండడానికి అపొస్తలుల కాలంలో దేవుడు అద్భుతాలను జరిగించాడు.

లుస్త్ర అనే ఊరిలో బలహీన పాదాలుగల ఒకడు పౌలు చెప్పే వాక్యం విన్నాడు. పౌలు అతన్ని తేరిచూసి స్వస్థత పొందడానికి అతనికి విశ్వాసం ఉందని గ్రహించి, నీ పాదాలు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినపుడు అతడు నడవడం ప్రారంభించాడు. ప్రభువు ద్వారా ఎవరైనా మేలుపొందాలంటే వారిలో ప్రభువునందు విశ్వాసం అత్యంత అవసరం. విశ్వాసం లేనిదే ప్రార్థనకు కూడ జవాబు పొందలేం. విశ్వాసం కొదువగా ఉన్న తన శిష్యులకు ప్రభువు మత్తయి 17:17లో ఇలా గద్దించాడు. “విశ్వాసములేని మూర్ఖతరమువారలారా, మీతో నేనెంత కాలము ఉందును? ఎంతవరకు మిమ్మును సహింతును?” 'మేమెందుకు దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని' శిష్యులు ఆయనను అడిగినపుడు, 'మీ అల్పవిశ్వాసముచేతనే' అని ప్రభువు అన్నాడు. ప్రభువునందు విశ్వాసం ద్వారా మేలు పొందుతాం, అవిశ్వాసం ద్వారా ఎంతో కోల్పోతాం. పుట్టినప్పటి నుండి కుంటివాడైన అతడు బాగుపడేసరికి జనసమూహం చూసి - దేవతలు మనుష్యరూపముదాల్చి మనయొద్దకు దిగివచ్చారని కేకలువేసి పూదండలను తెచ్చి బలి అర్పించబోయారు. అప్పుడు పౌలు, బర్నబాలు వారి బట్టలు చింపుకొని సమూహంలోనికి చొరబడి, “ఈ వ్యర్థమైనవాటిని విడిచిపెట్టి జీవంగల దేవుని వైపు తిరగండ"ని సువార్త చెప్పి చాలా ప్రయాసపడి వారు తమకు బలి అర్పింపకుండా ఆపారు. దేవతలను, జీవములేని విగ్రహాలను పూజించడం వ్యర్థమని వారు బోధించారు. వారు బోధించిన సువార్తలోని సత్యాలను గ్రహిద్దాం . దేవుడు సృష్టికర్త. ఆకాశాన్నీ, భూమినీ, సముద్రాన్నీ, వాటిలో ఉండే సమస్తాన్నీ సృజించాడు. దేవుడే సమస్తాన్ని సృష్టించాడు కానీ దేవతలు కాదు. యిర్మీయా 10:11లో ఇలా వ్రాయబడి ఉంది, "ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద నుండకుండను ఆకాశము క్రింద ఉండకుండను నశించెను.” దేవుడే సృష్టికర్త అని బైబిలు చాలా ఖచ్చితంగా, స్పష్టంగా, పదే పదే వెల్లడి చేస్తుంది. ఆది. 1:1లో ఉన్నట్టు "ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.” నెహెమ్యా 9:6లో ఈరీతిగా వ్రాయబడి ఉంది, “నీవే, అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును, మహాకాశములను, వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది.”

దేవుడు జీవం గలవాడు. జీవంలేని ప్రతిమలను దేవుడు అనకూడదు. దేవుడే ఆకాశం నుండి వర్షాన్ని, ఫలవంతములైన రుతువులను దయచేస్తూ, ఆహారం అనుగ్రహిస్తూ, ఉల్లాసంతో మన హృదయాలను నింపుతూ, మేలు చేయడంవల్ల తనను గురించి సాక్ష్యం లేకుండ చేయలేదు. చూశారా, మనకు దేవుడు ఎన్ని మేళ్ళు చేస్తున్నాడో! వర్షం కురిపించి భూమిని తడిపి, తినడానికి పనికిరాని మట్టిలో నుండి మనం తినే ఆహారాన్ని మొలిపిస్తున్నాడు. ఫలవంతములైన రుతువులు దయచేసి ఆయా కాలాల్లో ఆయా రకాల ఫలాలు అనుగ్రహిస్తున్నాడు. ఉల్లాసంతో మన హృదయాలు నింపుతున్నాడు. కుటుంబం, ఆరోగ్యం, నవ్వు, ఆహ్లాదం, ఆటలు, పాటలు, సంగీతం, ప్రకృతి సౌందర్యం, స్నేహం, ప్రేమలను అనుగ్రహించి మన హృదయాలను సంతోషంతో నింపుతున్నాడు. ఈ రీతిగా దేవుడు మానవులమైన మనకు మేలు చేస్తూ తన్ను గురించి సాక్ష్యం కలగజేసాడు. దేవుడు చేసే మేళ్ళు ఆయన ఉన్నాడని రుజువు చేస్తున్నాయి. ఈ మేళ్ళు పొందిన తర్వాత కూడ దేవుణ్ణి నమ్మకపోవడం, ఆయనను స్తుతించకపోవడం పాపమే. అందుకు పౌలు లుస్త్ర అనే ఊరివారికి వ్యర్థమైన దేవతలను విడిచిపెట్టి సృష్టికర్తయైన, జీవముగల, సమస్తమేలులు చేసిన దేవుని వైపు తిరగాలని సువార్త బోధించాడు. పాఠకులారా! మేలు చేసిన దేవుణ్ణి పూజిస్తారా, ఏ మేలూ చేయని, చేయలేని దేవతలను స్తుతిస్తారా? జీవంగల దేవుణ్ణి స్తుతిస్తారా, జీవంలేని ప్రతిమలను పూజిస్తారా? మిమ్మల్ని చేసిన దేవుణ్ణి పూజిస్తారా, మీరు చేసుకున్న బొమ్మల్ని పూజిస్తారా? ఏది న్యాయమో మీరే ఆలోచించండి.

మానవమనసు ఎంత అస్థిరమైందో చూడండి. కుంటివానిని బాగుచేసినందుకు ఆ ఊరివాళ్ళు పౌలును, బర్నబాను దేవతలుగా భావించి వారికి పూదండలు, బలులు అర్పించబోయారు. పౌలు, బర్నబాలు - 'మేమూ మీకులాగనే నరులం, దేవతలను విడిచి దేవుణ్ణి పూజించండని' చెప్పారు. అయితే వారు యూదుల మాట విని పౌలు మీద రాళ్ళురువ్వి, అతడు చనిపోయాడని అనుకొని పట్టణం బయటికి ఈడ్చారు. దేవతగా ఎంచి పూజించబోయినవాళ్ళు మరుక్షణం మారిపోయి చంపబోయారు. ఎందుకు? పౌలు వారికి ఏ హాని చేసాడని? వాళ్ళ ఊరిలో ఒక కుంటివాణ్ణి బాగుచేసినందుకా? మానవమనసు ఎంత కృతజ్ఞతలేనిదీ, అస్థిరమైందో కదా! మేళ్ళు చేసిన దేవుణ్ణి స్తుతించడానికి బదులు చాలామంది ఆయన్ను ద్వేషిస్తుంటారు. ఇది పాపం. దేవుణ్ణి కృతజ్ఞతతో, స్థిరహృదయంతో సేవించండి. రాళ్ళతో కొట్టబడి పట్టణం బయటికి ఈడ్వబడిన పౌలును దేవుడు బ్రతికించి కాపాడాడు. దేవుని బిడ్డలమైన మనం దేవుని నిర్ణయకాలానికి ముందు మరణించం, మరణించలేం. ఆయన నిర్ణయించిన సమయం వరకూ మనం అమర్త్యులమే! పౌలు తిరిగి అనేక పట్టణాలు సంచారం చేసి శిష్యుల మనసులు దృఢపరచి, విశ్వాసమందు నిలకడగా ఉండాలని, అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలని హెచ్చరించాడు. భక్తిమార్గంలో శ్రమలు, ప్రభువు నిమిత్తం హింసలు ఎదుర్కోవలసి రావచ్చు. పాఠకులారా! శ్రమలు ఈ లోకంలోనే, అది కూడ కొంచెం కాలమే; పరలోకంలో శ్రమలు కావాలన్నా ఉండవు. శ్రమలు ఈలోకంలో సహజమని ఎంచండి.

పౌలు ప్రతి సంఘంలో పెద్దలను ఏర్పరచి, ఉపవాసముండి ప్రార్థనచేసి, వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించాడు. సంఘాలలో విందులు చేసుకోడానికి బదులు ఉపవాస ప్రార్థనలతో పౌలు వారితో గడిపాడు. 15వ అధ్యాయంలోని సారాంశాన్ని చూద్దాం. అంతియొకయకు యూదయ నుండి కొందరు వచ్చి మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించారు. సంఘంలో కలవరం కలిగినపుడు సహోదరులు పౌలును, బర్నబాను యెరూషలేములోని అపొస్తలుల యొద్దకు, పెద్దలయొద్దకు పంపించారు. వారు వచ్చి అన్యజనులు దేవునివైపు తిరిగిన సంగతి తెలియజేసి సహోదరులందరికీ మహాసంతోషము కలుగజేసారు. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయించాలని మోషే ధర్మశాస్త్రాన్ని గైకొనుమని వారికి ఆజ్ఞాపించాలని చెప్పారు. అయితే పేతురు లేచి దేవుడు అన్యజనులను యూదులను రక్షించినటే విశ్వాసం ద్వారా రక్షించాడు. కాబట్టి వారు మోయలేని కాడిని వారిమీద మోపవద్దని అన్నాడు. ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా! ఆలాగే వారును రక్షణ పొందుదురు అన్నాడు. రక్షణ ధర్మశాస్త్రాన్ని ఆచరించడం వలన కలుగదు గానీ, విశ్వాసము ద్వారా దేవుని కృపచేతనే కలుగుతుంది. సున్నతి పొందితేనే గానీ రక్షణ కలుగదని కొందరు తప్పు బోధ చేసి అంతియొకయలోని సంఘాన్ని కలవరపర్చారు. మనం చేసే నీతిక్రియలనుబట్టి మనం రక్షణ పొందగలిగితే యేసు ప్రభువు సిలువలో మరణించడం వ్యర్థమే. 'ధర్మశాస్త్ర సంబంధక్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా' అని గలతీ. 2:16లో చూడగలం. ఎఫెసీ. 2:8,9లో ఈరీతిగా ఉంది, “మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే; అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.” రక్షణ విశ్వాసము ద్వారా కృప చేతనే పొందగలమని గ్రహించగలం. యెరూషలేములోని సంఘ పెద్దలు అన్య జనులలో నుండి దేవునివైపు తిరిగినవారిని కష్టపెట్టక, విగ్రహములకు అర్పించినవాటిని, రక్తమును, గొంతు పిసికి చంపినదానిని, జారత్వమును విసర్జించాలని పత్రిక వ్రాసి పంపారు. యూదులకు అన్యజనుల ద్వారా అభ్యంతరం కలగకుండా ఉండాలని ఈ హెచ్చరిక చేసారు. సంఘంలో తప్పు బోధకులవల్ల వచ్చిన కలవరాన్ని పెద్దలు, అపొస్తలులు వాక్యసత్యాన్ని స్థిరపరుస్తూ పరిష్కరించారు. ఏ సమస్యనైనా వాక్యసత్యంతో పరిష్కరించాలని నేర్చుకుంటున్నాం.

అంతియొకయలోని శిష్యులు ఆ పత్రికను చదువుకొని అందువల్ల ఆదరణ పొంది సంతోషించారు. కొంతకాలం తర్వాత ఏఏ పట్టణాలలో ప్రభువువాక్యం ప్రచురించారో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలా ఉన్నారో చూద్దామని పౌలు బర్నబాతో అన్నాడు. సువార్త ప్రకటనతో పాటు క్రొత్త విశ్వాసులను భక్తిలో ఎదిగేలా చూడడం కూడా సేవకుల పనే. ప్రభువు మత్తయి 28:19,20లో 'సమస్తజనులను శిష్యులుగా చేసి వారికి బాప్తిస్మము ఇచ్చి నేను మీకు ఏఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటిని గైకొనాలని వారికి బోధించమని' సెలవిచ్చాడు. కాబట్టి సువార్త ప్రకటించి విడిచిపెట్టేయకుండా క్రొత్త విశ్వాసులకు వాక్యం బోధించి భక్తిలో ఎదిగేలా, స్థిరపడేలా చూడాలి. మార్కును తమతో తీసుకువెళ్ళాలని బర్నబా ఇష్టపడ్డాడు గానీ, అంతకుముందు మమ్మును విడిచిపెట్టినందుకు మార్కును తీసుకువెళ్ళడానికి పౌలుకు మనస్సు లేదు. పౌలుకు, బర్నబాకు ఈ విషయమై తీవ్రమైన వాదము కలిగినందువల్ల వారు విడిచి వేరైపోయారు. పౌలు క్రీస్తు అపొస్తలుడు గనుక అతని మాట బర్నబా వినవలసింది. తీవ్రమైన వాదం కలిగి విడిపోయినప్పటికీ పౌలు, బర్నబాలు మరి తిరిగి సమాధానపడినట్లు 1కొరింథీ. 9:6 ద్వారా గ్రహించగలం. మార్కు కూడా తర్వాత పౌలును వెంబడించి ఎంతో ప్రయోజనకారిగా పరిచర్యలో పాలుపొందాడు. విశ్వాసులమైన మనము కూడా భేదాభిప్రాయాలు మాని ఒకరితో ఒకరు సమాధానపడి ఐక్యతతో జీవించునట్లు ప్రభువు సహాయపడునుగాక!

ప్రార్థన:- విశ్వాసము ద్వారా మీ కృపచేత ఉచితంగా రక్షించే దేవా, మీకు స్తోత్రాలు. మా స్వనీతి మీద ఆధారపడకుండా మీ కృపమీదనే ఆధారపడి రక్షింపబడడానికి మాకందరికీ సహాయం చెయ్యండి. విన్న వాక్యాన్ని మాలో ఫలింపచేయండి. యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రీ! ఆమేన్.

12]

ఈ సమయంలో అపొస్తలుల కార్యాలు గ్రంథం 16వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఈ అధ్యాయంలో తిమోతి అనే ఒక మంచి దైవసేవకుడు పరిచయం అవుతున్నాడు. తిమోతి విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. తన అవ్వ నుండి, తల్లి నుండి ప్రభువు గురించి విని, విశ్వసించి శిష్యుడయ్యాడు. ఈకొనియలోనూ, లుహలోనూ ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందాడు. యౌవనుడైన ఈ తిమోతివలె మనం కూడా మంచి పేరు, సాక్ష్యము కలిగి ఉండాలని ఆశిద్దాం. తిమోతి తండ్రి గ్రీసు దేశస్తుడని తిమోతికి పౌలు సున్నతి చేయించాడు. సమాజ మందిరాలలో యూదుల ఎదుట తిమోతికి పూర్తి ప్రవేశం కలగడానికే, సువార్తపని నిమిత్తమే పౌలు ఈ రీతిగా చేసాడు. తీతు విషయంలో అతనికి సున్నతి చేయించలేదు. గలతీ. 2:3లో ఉన్నట్టు రక్షణ పొందడానికి సున్నతి కావాలని చెప్పేవారిని బట్టి తీతుకు సున్నతి చేయబడలేదు. సువార్త విరివిగా జరగడానికి పౌలు యూదులకు యూదుడుగాను, అన్యజనులకు అన్యుడుగాను ఉన్నానన్నాడు. సువార్త సత్యం విషయంలో ఏ మాత్రం రాజీపడకుండానే సంస్కృతులకు అనుకూలంగా పౌలు అనుసరించిన పద్ధతిని మనమూ అనుసరించి సువార్త వ్యాపకం కొరకు ప్రయాసపడాలి. సంఘాలు విశ్వాసంలో స్థిరపడి అనుదినం లెక్కకు విస్తరించాయి. సంఘాలు విశ్వాసంలో స్థిరపడినప్పుడు విస్తరించగలవు. పౌలు పరిచర్యలో పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడ్డాడు. ఆసియలో వాక్యము చెప్పకుండ పరిశుద్ధాత్మ వారిని ఆటంకపర్చి మాసిదోనియ ప్రాంతాలకు నడిపించాడు. పౌలు వేరేచోట్లకు వెళ్ళాలని చేసిన ప్రయత్నాలను ఆత్మ అడ్డుకున్నాడు. మనం చేసేది మంచిపనే అయినా అది మనపట్ల దేవుని చిత్తమో కాదో మనం తెలుసుకొని నడవాలి. యెషయా 55:8,9లో ఇలా ఉంది. “నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలవంటివి కావు, ఇదే యెహోవా వాక్కు, ఆకాశములు భూమికి పైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.” మనకంటే దేవుడు జ్ఞానవంతుడు గనుక ఆయన ఆత్మ నడిపింపు ప్రకారమే జీవించడం, సేవ చేయడం ఎంతైనా ఉత్తమం.

ఈరీతిగా వారు ఆత్మచేత నడిపింపబడి ఫిలిప్పీ పట్టణానికి వచ్చారు. అక్కడ యూదుల సంఖ్య తక్కువగా ఉన్నందున సమాజమందిరం లేదు. కాబట్టి నదీ తీరాన్న ప్రార్థనాకూడికకు వెళ్ళి వచ్చిన స్త్రీలకు వాక్యం బోధించారు. లూదియ అను ఒక దైవభక్తిగల స్త్రీ వాక్యం విన్నది. కొర్నేలీవలె లూదియకూడ అన్యురాలైనా నిజదేవునియందు విశ్వాసముంచింది. లూదియ దైవభక్తి కలిగినదై పౌలు బోధించే వాక్యం విన్నది. ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడు గాబట్టి పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచింది. ప్రభువు తన సార్వభౌమ అధికారంతో తనకిష్టం వచ్చినవారి హృదయం తెరచి వాక్యం గ్రహింపుచేస్తాడు. రక్షణలో దేవుని ఏర్పాటు, మన విశ్వాసం, రెండూ ఉన్నట్టు గ్రహించగలం. విశ్వాసం కలగడానికి మనం దేవుని వాక్యం లూదియవలె వినాలి. రోమా పత్రిక 10:13,14, 17 జ్ఞాపకం చేసుకుందాం. “ప్రభువు నామమునుబట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ...కాగా వినుటవలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.” వాక్యం విన్న లూదియలో ప్రభువునందు విశ్వాసం కలిగింది. ఆమె, ఆమె యింటివారు బాప్తీస్మం పొందారు. నిజమైన విశ్వాసం దేవునికి లోబడుతుంది. బాప్తీస్మం తీసుకోని విశ్వాసం సరియైన విశ్వాసం కాదు. పాఠకులారా! ప్రభువును నమ్ముకున్నారా? నమ్ముకున్నవారైతే మరి బాప్తీస్మం తీసుకున్నారా? ప్రభువుపట్ల మీకుండే విశ్వాసాన్ని, విధేయతను బాప్తీస్మం తీసుకోవడం ద్వారా రుజువు చెయ్యండి. లూదియ పౌలును, అతనితో ఉన్న సువార్త బృందాన్ని తన యింటికి వచ్చి ఉండండని వేడుకొని బలవంతం చేసి తీసుకెళ్ళి ఆతిథ్యమిచ్చింది. 40వ వచనంలో ఉన్నట్టు లూదియ ఇంటిలో సంఘం ఏర్పడింది. భక్తులను చేర్చుకొని, ఆతిథ్యమిచ్చి, తన యింటిని దేవుని సేవకు తెరచిన లూదియ మనకెంతో మాదిరిగా ఉంది. ఆమె హృదయం తెరవబడినప్పుడు, ఆమె చెవులు వాక్యం వినడానికి తెరవబడ్డాయి, ఆమె పెదవులు దేవుని ప్రార్థించడానికి ఆమె చేతులు ఆతిథ్యమివ్వడానికి, ఆమె ఇల్లు దేవుని సేవకూ, సేవకులకూ తెరవబడ్డాయి. ఇటువంటి భక్తిని కోరుకుందాం.

ఫిలిప్పీ పట్టణంలో జరిగిన మరికొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఈ అధ్యాయంలో చూడగలం. పుతోను అను దయ్యంపట్టి, సోదె చెప్పడంవల్ల తన యజమానులకు చాల లాభం సంపాదిస్తున్న ఒక చిన్నది పౌలును, మిగిలినవారిని వెంబడిస్తూ - 'ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు; వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారైయున్నారని' కేకలు వేసి చాల రోజులు చెబుతూ వచ్చింది.

అపవాది పౌలు గురించి చెప్పడం ద్వారా తన వైపుకు ప్రజల్ని ఆకర్షించుకోవడానికి అలా చేసి ఉండవచ్చు, లేదా ఆ చిన్నది హేళనగా ఆ మాటలు అని ఉండవచ్చు. పౌలు వ్యాకులపడి, దానివైపు తిరిగి - 'నీవు ఈమెను వదలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని' ఆ దయ్యముతో చెప్పిన వెంటనే అది ఆమెను వదలిపోయింది. సాతాను ఆ చిన్నదాని జీవితాన్ని నాశనం చేసాడు. ఆ చిన్నదాని యజమానులు ఆమెను వ్యాపారం కోసం వాడుకున్నారేగాని ఆమె జీవితాన్ని గురించీ, భవిష్యత్తును గురించీ పట్టించుకోలేదు. దేవుడు ఆ చిన్నదానిని సాతాను నుండి విడిపించి మేలు చేసాడు. దేవతలూ, మనుష్యులూ చెయ్యలేని మేలు యేసుక్రీస్తులోనే పొందగలం. ఆ చిన్నదాని యజమానులు జరిగినదాన్ని బట్టి సంతోషించాల్సింది బదులు తమ లాభసాధనం పోయిందని పౌలును, సీలను పట్టుకొని అధికారుల దగ్గరకు ఈడ్చుకెళ్ళారు. ఒకవ్యక్తి రక్షణకంటే వారికి డబ్బే ముఖ్యం. జనసమూహం వారిమీదికి దొమ్మీగా వచ్చినప్పుడు న్యాయాధిపతులు వారి వస్త్రాలు లాగివేసి బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారు. వారు చాల దెబ్బలు కొట్టి లోపలి చెరశాలలోనికి త్రోసి, వారి కాళ్ళకు బొండవేసి బిగించారు.

పౌలు, సీలలు ఆ పట్టణానికి ఎంతో మేలు చేసి కీడు అనుభవించారు. అన్యాయంగా శిక్ష అనుభవించారు. ప్రభువునామం నిమిత్తం వారు పొందిన ఈ హింసలో వారు నిరుత్సాహపడలేదు కాని మధ్యరాత్రివేళ దేవునికి ప్రార్థన చేస్తూ స్తుతి పాటలు పాడారు. ఖైదీలు వింటున్నారు. అకస్మాత్తుగ మహాభూకంపం కలిగి చెరశాల పునాదులు అదిరాయి, వెంటనే తలుపులన్నీ తెరచుకున్నాయి, అందరి సంకెళ్ళు ఊడిపోయాయి. ఎంత అద్భుతం!!! దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టడని రుజువవుతుంది. శత్రువు ఎంత భద్రంగా లోపలి చెరశాలలో బొండవేసి బిగించినా దేవుడు తన సేవకులను సుళువుగా విడిపించాడు. దేవుడు ఎంత శక్తిమంతుడో గ్రహించారా? సాధారణంగా భూకంపం వస్తే చెరశాల పునాదులు అదరడమే కాదు చెరశాల కూలిపోయి అందరు మరణించడమో, గాయపడడమో జరుగుతుంది. దేవుడు పంపిన ఈ భూకంపం ఎంత వింతైందో చూడండి. తలుపులన్నీ తెరచుకున్నాయి, అందరి బంధకాలు ఊడిపోయాయి. దేవుడు తన బిడ్డలను ఆశ్చర్యంగా రక్షించాడు. చెరశాల నాయకుడు, మొదట ఖయిదీలు పారిపోయారని భయపడినా, ఈ అద్భుతాన్ని చూసి, పౌలుకు, సీలకు సాగిలపడి 'అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేమి చేయాలని' అడిగాడు. దయ్యం పట్టిన చిన్నది పౌలు, సీలలు సర్వోన్నతుడైన దేవుని దాసులని రక్షణ మార్గం ప్రచురించేవారని చెప్పడం విని ఉంటాడు. పౌలు, సీలలను దేవుడు చెరశాలలో నుండి రక్షించడం చూసాడు.

తనను తాను చంపుకోబోయినపుడు దేవుడు ఖయిదీల సంకెళ్ళు తెంపివేసినా వాళ్ళు పారిపోకుండ చేసి తనను మరణాన్నుండి తప్పించడం చూసి చెరశాల నాయకుడు రక్షింపబడాలని కోరాడు. మనం కూడ రక్షణ పొందాలని ఆశించాలి. పౌలు చెప్పినట్టు, రక్షణ పొందాలంటే ప్రభువైన యేసునందు విశ్వాసముంచాలి. చెరశాల నాయకుడు వారిని రాత్రి సమయంలోనే తీసికొనివచ్చి, వారి గాయాలు కడిగి, వెంటనే అతడూ, అతని ఇంటివారందరూ బాప్తీస్మం పొందారు. అతనిలో ఎంత మార్పు కలిగిందో చూడండి. అంతకుముందు చాల దెబ్బలు కొట్టి చెరశాలలోనికి త్రోసి కాళ్ళకు బొండవేసి బిగించినవాడు, మార్పుపొంది, వారి గాయాలు కడిగి, ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకు భోజనం పెట్టాడు. చెరశాల నాయకుడు రక్షణ పొందాడు. దానికి రుజువు అతనిలో కలిగిన గొప్ప మార్పే. ప్రభువునందు విశ్వాసముంచి, బాప్తీస్మం తీసుకుని ఇంటివారందరితో కూడ ఆనందించాడు. 'రక్షణను కోరుకొనువారికి నేను రక్షణ కలుగజేసెదనని' దేవుడు కీర్తన 12:5 లో సెలవిచ్చినట్టు, చెరశాల నాయకుని ఆశ, విశ్వాసాలనుబట్టి అతన్ని, అతని యింటివారిని రక్షించాడు. వారి విశ్వాసం నిజమైనదని వారు వెంటనే ఆ రాత్రే బాప్తీస్మం తీసుకోవడంలో రుజువు అవుతుంది.

చాలమంది బాప్తీస్మం తీసుకోవడంలో చాల సంవత్సరాలు ఆలస్యం చేసుంటారు. ఈ చెరశాల నాయకుణ్ణీ, లూదియానూ చూసి బుద్ధి తెచ్చుకోవాలి. బాప్తీస్మం తీసుకోడానికి రక్షింపబడినవారు ఆలస్యం చేయకూడదని ఈ గ్రంథంలోనే 22:16లో చూడగలం. పౌలు, సీలలు బెత్తాలతో చాల దెబ్బలు తిని, గాయాలైనప్పటికీ ఏడుస్తూ, దేవుణ్ణి నిందిస్తూ, సేవలో ఇన్ని కష్టాలు ఏమిటి అని నిరుత్సాహపడక అర్థరాత్రి కూడ దేవునికి ప్రార్థిస్తూ, ఖయిదీలు వినేంత గట్టిగా స్తుతి పాటలు పాడారు. అద్భుతంగా విడుదల పొందారు. పాఠకులారా! స్తుతిలో అద్భుతమైన జయముందని మీకు తెలుసా? ప్రతి విషయంలో కృతజ్ఞతాసుతులు చెల్లించమని 1థెస్స. 5:18 లో ఉన్నట్లు శ్రమల్లో దేవుని స్తుతిస్తే జయం పొందగలం. పౌలు, సీలలు స్తుతి, ప్రార్థనల ద్వారా శ్రమను సహించడమే కాదు, వారినీ, వారితోపాటు ఇతర ఖయిదీలనూ, చెరశాల నాయకుల్నీ, అతని కుటుంబాన్నీ రక్షించుకో గలిగారు. విశ్వాసులు శ్రమల్లో ఓర్పు, నిరీక్షణ Ser ఉంటే, వారు తమను, ఇతరులను కూడ రక్షించుకోగలరు.

ఉదయమైనపుడు న్యాయాధిపతులు - ఆ మనుష్యులను విడుదల చేయుమని చెప్పడానికి బంటులను పంపారు. చెరశాల నాయకుడు అప్పటికే వారిని విడిపించినట్టే. దేవుడు చెరశాల నాయకుడికి ల నాయకుణి ఈ విషయంలో కూడ ఆదుకు పౌలు తాము రోమీయులమని, న్యాయం విచారించకుండా బహిరంగంగా వారిని కొట్టించి చెరశాలలో వేయించారని న్యాయాధిపతులకు తెలిసేలా అన్నాడు. పౌలు ఇలా అన్నది దెబ్బతిన్న అహంవల్ల కాదు, ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని అన్యాయంగా హింసించకుండ ఉండాలని. పౌలు, సీలలు విడిపింపబడి లూదియ ఇంటికి వెళ్ళి అక్కడి సహోదరుల్ని చూచి, ఆదరించి వెళ్ళారు. శ్రమలు ఎదుర్కొని దెబ్బలు, గాయాలు పొందినా, ఇతరులను వారు ఆదరించారు. స్వసానుభూతి మాని ఇతరులను ఆదరించునట్లు దేవుడు మనకు సహాయపడునుగాక!

ప్రార్థన:- రక్షకుడవైన మా దేవా, మీకు స్తోత్రాలు. చెరశాల నాయకుణ్ణి, లూదియాను, వారివారి కుటుంబాలను రక్షించినట్లు మమ్మల్ని, మా కుటుంబికులందరినీ రక్షించండి. శ్రమల్లో మిమ్మల్ని స్తుతించడం నేర్పించండి. యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రీ, ఆమేన్!

13]

అపొస్తలుల కార్యాల గ్రంథంలో మన ధ్యానాలను కొనసాగిస్తూ 17,18 అధ్యాయాలు చదువుకుందాం. పౌలు థెస్సలొనీకకు వచ్చి సమాజ మందిరములో బోధిస్తూ యేసే క్రీస్తయి ఉన్నాడని లేఖనాలలో నుండి దృష్టాంతాలు ఎత్తి వారితో తర్కించాడు. పాత నిబంధనలోని ప్రవచనాలు క్రీస్తునే సంపూర్ణంగా సూచిస్తున్నాయి. క్రీస్తనబడిన మెస్సీయ దావీదు వంశంలోనుండి రావలసి ఉంది. క్రీ.శ. 70వ సంవత్సరంలో యెరూషలేము పట్టణం కాల్చబడినప్పుడు యూదుల వంశావళులు వ్రాయబడిన గ్రంథాలన్నీ కాల్చి వేయబడ్డాయి. అప్పటినుండి ఏ యూదుడు తాను ఖచ్చితంగా ఏ వంశానికి చెందినవాడో ఋజువుపర్చలేదు. కాబట్టి మెస్సీయ క్రీస్తు తప్ప వేరేవారు అవడానికి అవకాశమేలేదు. పౌలు బోధించినట్లు యేసుప్రభువే దేవుడు వాగ్దానం చేసిన లోకరక్షకుడు. పౌలు వారితో తర్కించినపుడు చాలామంది ఒప్పుకొని పౌలుతోను, సీలతోను కలిసారు. అయితే యూదులు అసూయపడి పట్టణమంతా అల్లరిచేసారు. పౌలు, సీలలను గూర్చి భూలోకాన్ని తలక్రిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చారు అన్నారు. ప్రభువు శిష్యులు నిజంగానే భూలోకాన్ని తలక్రిందులు చేసారు. క్రీస్తు సువార్త ప్రకటింపబడినప్పుడు వేలాదిమంది యూదులలోనుండి, అన్యజనులలోనుండి ప్రభువువైపు తిరిగి ఆయన శిష్యులయ్యారు. అపొస్తలులు, పెద్దలు ఎక్కడికి వెళితే అక్కడ ప్రకంపనలు సృష్టించి అనేకులను ప్రభువువైపు త్రిప్పారు. ప్రభువు సెలవిచ్చినట్టు మనం కూడ సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించి సమస్త జనులను ప్రభువు శిష్యులుగా చేయాలి. చీకటిలో నుండి ప్రజలు వెలుగులోనికి రావాలి. దేవుడులేని అజ్ఞానస్థితిలో నుండి నిజదేవుడైన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానంలోనికి రావాలి. మరణంనుండి జీవం లోనికి ప్రజలు దాటాలి. సాతాను అధికారంనుండి విడిపింపబడి దేవుని బిడ్డలుగా చేయబడాలి. లోకాన్ని దేవుని కోసం ప్రభావితం చేయాలి. పాఠకులారా! ఈ విషయంలో మీరు ప్రభువు కోరినట్టు మీరుండే గ్రామాల్లో మీరు పనిచేసే స్థలంలో ప్రభువుకొరకు పనిచేస్తున్నారా? మీరు లోకాన్ని ప్రభావితం చేస్తున్నారా? లోకం మిమ్మల్ని ప్రభావితం చేస్తుందా? భూలోకాన్ని ప్రభువుకొరకు తలక్రిందులు చేసేవారంగా ఉందుముగాక!

పౌలు నిమిత్తం యాసోను అను ఒకనిని పట్టుకొని అతని దగ్గర జామీను తీసుకున్నారు. కాబట్టి ఇక పౌలు థెస్సలొనీకలో పనిచేయలేక బెరయకు వెళ్ళాడు. అక్కడ సమాజమందిరంలో బోధించినపుడు బెరయ ప్రజలు థెస్సలొనీకలో ఉన్న వారికంటే ఘనులైయుండి ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలు, సీల చెప్పిన సంగతులు ఆలాగున్నాయో లేవో అని ప్రతిరోజు లేఖనాలను పరిశోధిస్తూ వచ్చారు. అందుచేత వారిలో చాలామంది విశ్వసించారు. బెరయలోని వారు నిజంగా ఘనులు. పౌలు చెప్పిన సంగతులను వాక్యంతో సరిపోల్చుతూ పౌలు బోధ వాక్యానుసారమే అని నిర్ధారించుకొని అప్పుడు నమ్మారు. ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన అన్నిటినీ గుడ్డిగా నమ్మకూడదు. ప్రతి బోధను దేవుని వాక్యానికి సరిపోల్చి చూసుకోవాలి. ఎఫెసీ. 4:14, 15 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం, “అందువలన మనమిక మీదట పసిపిల్లలమైయుండి, మనుష్యుల మాయోపాయములచేత వంచనతోను, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక, ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము”. 1యోహాను 4:1లో ఇలా ఉంది, “ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.” బెరయలోని వారు ప్రభువును నమ్మారని థెస్సలొనీకలోని యూదులు తెలిసికొని అక్కడికి వచ్చి జనసమూహాలను రేపి కలవరపర్చారు. కాబట్టి పౌలు అక్కడినుండి ఏథెన్సు పట్టణానికి వెళ్ళాడు. ఏథెన్సు పట్టణం విగ్రహాలతో నిండిపోయి ఉండడం చూసి పౌలు ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. కాబట్టి సమాజ మందిరాలలో, సంతవీధులలో అనేకులలో తర్మిస్తూ వచ్చాడు. ఎపికూరీయులు, పోయికులు కొందరు పౌలుతో వాదించారు. ఎపికూరీయులు మానవ జీవితానికి సంతోషమే పరమార్గమని ఎంచి తిని, త్రాగి, సుఖించడంలో నిమగ్నమయ్యేవారు. పోయికులు కోర్కెలను విడిచిపెట్టి సంతోషాన్ని, దుఃఖాన్ని ఒకేరీతిగా ఎంచాలని నమ్మేవారు. వారు పౌలును, అరేయోపగు అనే సభలోనికి తీసుకువెళ్ళి 'నువ్వు చెప్పే క్రొత్త సంగతులు వింటాం చెప్పమన్నా'రు. అపుడు పౌలు చక్కగా సువార్త ప్రకటించాడు. ఏథెన్సు ప్రజల అతి దేవతాభక్తిని ఒక రకంగా అభినందిస్తూనే, తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్న వారి బలిపీఠాన్ని గూర్చి పౌలు ప్రస్తావించాడు. ఏథెన్సు పట్టణం విగ్రహాలతో నిండి ఉండడం బట్టి వారిని పౌలు కఠినంగా విమర్శించడానికి బదులు వారి భక్తిని అభినందిస్తూనే వారు తెలియక పూజిస్తున్న దేవునివైపు వారిని ఆకర్షించాడు.

గ్రీకు ప్రజలు ఏ దేవతనైనా పొరపాటున మినహాయిస్తారేమో అని భయపడి తెలియబడని దేవునికి అని బలిపీఠం కట్టి వారికి తెలియని నామాన్ని కూడా ఆరాధించేవారు. వారికి సువార్త చెప్పడానికి పౌలుకు అది ఒక చక్కని అవకాశం. పౌలు జ్ఞానంగా దాన్ని వినియోగించుకున్నాడు. అన్యులకు సువార్త ప్రకటించేటప్పుడు సృష్టికర్తయైన దేవుణ్ణి వారికి ప్రకటిస్తూ సృష్టి ద్వారా దేవుడు తననుగూర్చి అనుగ్రహించిన సాధారణ ప్రత్యక్షతను వారికి కనుపర్చేవాడు. యూదులకు సువార్త ప్రకటించినపుడు పాత నిబంధనలోని దృష్టాంతాలను చూపి క్రీస్తును బోధించేవాడు.

ఏథెన్సులో ప్రసంగిస్తూ దేవుడు జగత్తును అందలి సమస్తాన్ని నిర్మించాడని తానే ఆకాశానికి, భూమికి ప్రభువైయున్నాడని కాబట్టి హస్తకృతాలైన ఆలయాలలో నివసింపడని చెప్పాడు. దేవుడు వ్యక్తి అని, వ్యక్తిత్వములేని శక్తికాదని, సృష్టించి, సృష్టికి ప్రభువుగా పరిపాలిస్తున్నాడని మనుష్యుల చమత్కార కల్పన వలన మల్చబడిన బంగారునైనా, వెండినైనా, రాతినైనా దేవత్వము పోలియుండునని తలంచకూడదు అని ప్రకటించాడు. దేవుడే అందరికీ జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేసేవాడు. యావత్ భూమిమీద కాపురముండడానికి ఆయన ఒకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించాడు. గ్రీకువారు తలంచేలా వారు తప్ప మిగిలిన జాతులు తక్కువవారు కాదని అందరూ ఒకే వ్యక్తిలోనుండి వచ్చినవారు కాబట్టి అందరూ సమానమే అని బోధించాడు. దేవుని సంతానమైన మనము దేవునియందే బ్రతుకుతూ, చలిస్తూ, ఉనికి కలిగియున్నామని మనం దేవుణ్ణి తెలుసుకోవడానికి సమీపంగా ఉన్నామని బోధించాడు. అందరు, అంతట మారుమనస్సు పొందాలని దేవుడు మనుష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడని, భూలోకానికి నీతిననుసరించి తీర్పు తీర్చబోయే ఒక రోజును దేవుడు నిర్ణయించాడని, మృతులలో నుండి క్రీస్తును లేపడంద్వారా దీనిని నమ్మడానికి అందరికి ఆధారం కలుగజేసాడని బోధించాడు. కొందరీ మాటలు విని అపహాస్యం చేసారు. మరికొందరు పౌలును హత్తుకొని విశ్వసించారు. పాఠకులారా! సృష్టికర్తయైన మన ఉనికికి కారకుడైన దేవుణ్ణి తెలుసుకున్నారా? మనకోసం ఆయన పంపిన తన కుమారుడైన యేసుక్రీస్తును అంగీకరించారా? మారుమనస్సు పొందారా? యేసుప్రభువు మరణాన్ని జయించి, తిరిగి లేచినందుకైనా ఆయనను నమ్మండి. లేకపోతే దేవుని తీర్పు ఎదుర్కోవలసి వస్తుంది. సృష్టిని పూజించడం మాని సృష్టికర్తను పూజించండి. ఏథెన్సు పట్టణాన్నుండి పౌలు కొరింథు పట్టణానికి వెళ్ళాడు. అక్కడ అకుల, ప్రిస్కిల్ల అనే భార్యభర్తలను కలుసుకుని వారితో నివసించి డేరాలు కుట్టేవారి వృత్తిని తాను ఎరిగినవాడు కాబట్టి వారితో కలిసి పనిచేసాడు. అకుల, ప్రిస్కిల్లలు రోమా చక్రవర్తి ద్వారా ఇటలీ నుండి పంపివేయబడ్డారు. ఈ శ్రమ, సువార్త వ్యాపకానికి దేవుడు మేలుగా మార్చాడు. పౌలు వారితో కలిసి డేరాలు కుటి ఇతరులకు భారంగా ఉండకూడదని జీవనం చేసుకొనేవాడు. ఏదో డబ్బు సంపాదించాలని పౌలు ఎన్నడూ ఆశించలేదు. ఇతరులకు భారంగా ఉండకూడదనే తాను రాత్రింబగళ్ళు కష్టపడి జీవనం చేసేవాడు. సేవకులైనవారు పేద విశ్వాసుల మీద భారంగా ఉండకూడదని నేర్చుకుంటున్నాం. అదే సమయంలో సేవకులు ధనా పేక్షతో సేవను మాని, జీవన సంబంధమైన వ్యాపారాలలో చిక్కుకోకూడదు.

కొరింథులో పౌలు వాక్యం బోధించడానికి ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగ సాక్షమిచ్చాడు. వారు ఎదురాడినపుడు, పౌలు తన వస్త్రాలు దులుపుకొని 'మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని' అన్నాడు. కావలి వారివలె మనం ప్రజలను హెచ్చరించాలి. హెచ్చరించినా విననివారు నాశనానికి వారే కారకులు, మనం నిరోషులం అవుతాం. అయితే హెచ్చరించకపోతే ఇతరుల నాశనానికి దేవుడు మనల్ని ఉత్తరవాదులుగ ఎంచుతాడు. దేవుడు పౌలుతో ఇలా సెలవిచ్చాడు. 'నీవు భయపడక మాటలాడుము, మౌనముగ ఉండకుము, నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీమీదికి ఎవడును రాడు. ఈ పట్టణంలో నాకు బహు జనమున్నది.' పౌలు దేవుని మాటకు లోబడి 18 నెలలు కొరింథులోనే ఉండి దేవుని వాక్యం బోధించాడు. ఆ భయంకరమైన పట్టణంలో అనేకులు సంఘంలో చేర్చబడ్డారు. దేవుని కొరకు భయపడక మాటలాడాలని, మౌనంగా ఉండక వాక్యం బోధించాలని పాఠం నేర్చుకుంటున్నాం. విద్వాంసుడు, లేఖనాలలో ప్రవీణుడైన అపొల్లో ప్రభువు గురించి ఉపదేశం పొంది తన ఆత్మలో తీవ్రపడి యేసును గురించి ధైర్యంగా బోధించాడు. అకుల, ప్రిస్కిల్లలు అపొల్లోను చేర్చుకొని, దేవుని మార్గం మరిపూర్తిగ అతనికి విశదపర్చారు. ఎవరినైనా సరిచేయాల్సి వస్తే, బహిరంగంగా అందరిముందు కంటే స్నేహపూర్వకంగా, ప్రేమతో, ఒంటరిగా సరిచెయ్యాలి. ఇతరులు మనపట్ల ఎంత ప్రేమగా, మృదువుగా ఉండాలని కోరుతామో మనము వారిపట్ల అలాగే ప్రవర్తించాలి. అపొల్లోవలె ఎవరైన మనల్ని సరిచేస్తే సంతోషంగా అంగీకరించాలి. అప్పుడే మనం ఎదుగగలం. దేవుడు మనకిట్టి కృపను దయచేయును గాక!!

ప్రార్థన:- సృష్టికర్తయైన దేవా మీకు స్తోత్రాలు. మీకోసం భూలోకాన్ని తలక్రిందులు చేయడానికి సహాయం చెయ్యండి. బెరయ సంఘస్తులవలె వాక్యాన్ని పరిశోధించడానికి సహాయపడండి. పౌలువలె భయపడక, మౌనంగా ఉండక వాక్యం బోధించడానికి సహాయం చెయ్యండి. యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రీ. ఆమేన్!

14]

ఈ ధ్యానంలో 19వ అధ్యాయం చదువుకుందాం. పౌలు ఎఫెసుకు వచ్చినప్పుడు కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడిగినప్పుడు వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని' చెప్పారు. వారు మారుమనస్సు నిమిత్తమైన యోహాను బాప్తీస్మము మాత్రమే పొందారు. అప్పుడు పౌలు వారికి యేసు ప్రభువును గురించి బోధించి యేసు నామంలో వారికి బాప్తిస్మం ఇచ్చాడు. తర్వాత పౌలు వారిమీద చెతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చాడు. అప్పుడు వారు భాషలలో మాట్లాడడం, ప్రవచించడం మొదలు పెట్టారు. ఈ భాగంద్వారా మనం కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలి. ఎఫెసులో ఉన్న 12 మంది శిష్యులు పూర్తి క్రైస్తవులు కారు. యేసు నామంలో అప్పటికి బాప్తిస్మము పొందలేదు, ప్రభువును గురించి సువార్తను పూర్తిగా విననూలేదు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే వారు వినలేదు. పౌలు వారిని పరిశుద్ధాత్మను పొందారా?' అని ప్రశ్నించడంలోనే వారి మార్పును పౌలు సంశయించినట్లు అర్థమవుతుంది. ఒకవ్యక్తి యేసును గూర్చిన సువార్తను విని ఆయనయందు విశ్వాసముంచినప్పుడు రక్షింపబడతాడు. రక్షణ కార్యములో త్రియేక దేవుని పాత్ర ఉన్నట్టు గ్రహించాలి. 1కొరింథీ. 6:11 లో ఇలా చదవగలము, "ప్రభువైన యేసుక్రీస్తు నామమునను, మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి.” ఈ వచనం ద్వారా రక్షణ కార్యంలోనే పరిశుద్ధాత్మను పొందడం జరుగుతుందని గ్రహించగలం. ఎఫెసులో సువార్త పూర్తిగా తెలియని సహోదరులకు పరిశుద్ధాత్మను పొందడం ఎలా? అని బోధించలేదు. కానీ, యేసుక్రీస్తును గూర్చి బోధించాడు. ఆ సహోదరులు వాక్యం విని నమ్మి యేసునామంలో బాప్తిస్మం పొందారు. తర్వాత పౌలు వారిమీద తన చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మ వారిమీదికి రాగా వారు భాషలతో మాట్లాడడం, ప్రవచించడం మొదలు పెట్టారు. పౌలు వారిమీద చేతులుంచడం అనేది అతని యొక్క అపొస్తలత్వాన్ని నిర్ధారిస్తుంది. అంతేకాకుండా ఈ నూతన విశ్వాసులు సంఘములో జతపర్చబడడాన్ని సూచిస్తుంది. భాషలతో మాట్లాడడం వారు సంఘములో పాలిభాగస్తులు అవడానికి ఋజువుగా జరిగింది. సంఘ ప్రారంభ దినమైన పెంతెకోస్తు పండుగ రోజున ప్రభువు శిష్యులు, వారితో ఉన్నవారు పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లు గుర్తుగా భాషలు మాట్లాడారు. వారికి కలిగిన ఈ అనుభవమే 8వ అధ్యాయంలో సమరయులకు కూడా కలిగింది. తరువాత కొర్నేలీ ఇంటిలో అన్యజనులు ఈ అనుభవాన్ని పొందారు. అలాగే మన ప్రస్తుత ధ్యానభాగమైన 19వ అధ్యాయంలో కూడ అదే అనుభవాన్ని వేరే గుంపువారైన పాతనిబంధన భక్తులై బాప్తిస్మమిచ్చు యోహానును అనుసరించినవారు పొందారు. ఈ నాలుగు రకాల గుంపులను సంఘంలో ప్రభువు జతపరిచి సమానులుగా చేసాడు. ఇకనుండి ఇశ్రాయేలీయుల రాజ్యము మాత్రమే దేవుని సాక్ష్యప్రజలుగా ఉండక యూదులు, అన్యులు, సమరయులు, పాతనిబంధన పరిశుద్ధులు అందరూ జతపరచబడి నూతన నిబంధన విశ్వాసులుగా చేయబడ్డారు. ఈ నాలుగు రకాలవారు సంఘములో సమానమే అనడానికి గుర్తుగా యూదులు 2వ అధ్యాయంలో పొందిన అనుభవానికి సమానమైన అనుభవాన్ని 8వ అధ్యాయంలో సమరయులు, 10వ అధ్యాయంలో అన్యులు, 19వ అధ్యాయంలో యోహాను బాప్తిస్మం పొందిన పాత నిబంధన భక్తులు కూడా పొందారు. సంఘ ప్రారంభదినాల్లో అన్నిరకాల వారిని సమానంగా దేవుడు చేర్చుకొన్నాడు అనడానికి గుర్తుగా ఆ నాలుగు సందర్భాలలో మాత్రం భాషలు ఇవ్వబడ్డాయి. భాషల యొక్క ఉద్దేశ్యం ఈ రీతిగా నెరవేరింది కాబట్టి భాషలు నిలిచిపోతాయని 1కొరింథీ. 13:8లో చెప్పబడినట్లు ప్రస్తుతం దేవుడిచ్చే భాషలు లేవుగానీ, ప్రజలు సొంత ప్రయత్నంతో మాట్లాడేవే కనిపిస్తున్నాయి.

1కొరింథీ 14లో భాషలు మాట్లాడటాన్ని నిరుత్సాహపరుస్తూ పౌలు ఈ రీతిగా అన్నాడు, “భాషతో మాట్లాడేవాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు”. అంటే “అవి దేవుడికే తెలియాలి” అని వ్యంగ్యంగా అన్నాడు. 'మనుష్యులెవ్వరికీ అర్థంకాని భాషతో పదివేల మాటలు పలకడంకంటే ఇతరులకు బోధకలిగేలా నా మనస్సుతో ఐదు మాటలు పలుకుట మేలు' అన్నాడు. దేవుడిచ్చిన ప్రతి ఆత్మవరం ఏ వ్యక్తి యొక్క స్వప్రయోజనానికి ఇవ్వబడలేదు కానీ, సంఘ క్షేమాభివృద్ధికే ఇవ్వబడ్డాయి. అందుకే భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటాడు గానీ ప్రవచించేవాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తున్నాడు అని భాషలు మాట్లాడడాన్ని పౌలు నిరుత్సాహపరిచాడు. 'సంఘమంతా ఏకంగా కూడి అందరూ భాషలతో మాట్లాడుతుంటే అవిశ్వాసులెవరైనా లోపలికి వస్తే మీరు వెర్రిమాటలాడుతున్నారని అనుకుంటారు కదా' అన్నాడు. భాషలు నిలిచిపోకముందు అవి దేవుడనుగ్రహించిన రోజుల్లోనే కొరింథు సంఘంలో వాటిని అక్రమంగా వాడారు. ఆ రోజుల్లోనే పౌలు కొన్ని నియమాలు విధించాడు. 'ఇద్దరు లేక ముగ్గురికి మించకుండా, అదికూడా వంతుల చొప్పున మాత్రమే భాషతో మాట్లాడాలి” అన్నాడు. అదికూడా 'అర్థం చెప్పేవాడు లేకపోతే అతడు మౌనంగా ఉండాలి, క్రొత్తవారు, స్త్రీలు భాషలు మాట్లాడకూడద'న్నాడు. భాషలవరం ఉన్న రోజుల్లోనే అందరికీ ఒకే ఆత్మవరం ఇవ్వబడలేదని పౌలు చెపుతూ 1కొరింథీ. 12:29,30లో “అందరు అపొస్తలులా?..... అందరు భాషలతో మాటలాడుచున్నారా?” అని ప్రశ్నించాడు. ఈ రోజుల్లో 'అందరు భాషలు మాట్లాడాలి' అంటారు. ఇది వాక్య విరుద్ధం. పౌలు చెప్పిన నియమాలు ఏమాత్రం పాటించకుండా స్త్రీలు, క్రొత్త వాళ్ళు అందరూ ఒకే సమయంలో, అర్థం చెప్పేవారు లేకపోయినా భాషలు మాట్లాడడం స్పష్టంగా వాక్యవిరుద్ధమే. వాక్యసత్యానికి లోబడాలని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. పౌలు చేతులుంచినపుడు వారు పరిశుద్ధాత్మను పొందారు. యూదులు, సమరయులు, అన్యజనులు, పాతనిబంధన భక్తులు సంఘంలో చేర్చబడిన ప్రతి సందర్భము అపొస్తలుల సమక్షంలోనే జరిగింది. అపొస్తలుల పరిచర్య సంఘానికి పునాది వేయడం కాబట్టి వివిధ రకాల ప్రజలు సంఘంలో చేర్చబడడం అపొస్తలుల సమక్షంలో జరిగింది. అంతేకానీ, ఇప్పుడు బోధకులు చేతులుంచడంవల్ల ఎవరూ పరిశుద్ధాత్మను పొందరు. ధర్మశాస్త్ర క్రియలవలన కాక విశ్వాసముతో వినుటవలనే ఆత్మను పొందడం జరుగుతుందని పౌలు గలతీ. 3:2లో బోధించాడు.

తరువాత పౌలు సమాజ మందిరంలో ప్రసంగిస్తూ, దేవుని రాజ్యం గురించి తర్కిస్తూ, ఒప్పిస్తూ, ధైర్యంగా మాట్లాడాడు. అయితే కొందరు కఠినపరచబడినవారై సత్యాన్ని ఒప్పుకొనక ఈ మార్గాన్ని దూషించినందువల్ల పౌలు వారిని విడిచిపెట్టాడు. వాక్యసత్యాన్ని నిరాకరించడంవల్ల హృదయం కఠినపర్చబడుతుంది. అందువల్ల జీవాన్నిచ్చే రక్షణ వర్తమానం మరణార్థమైన మరణపు వాసనగా హెబ్రీ. 3:11లో ఉన్నట్టు మీ హృదయాన్ని కఠినపర్చుకొనకండి. క్రైస్తవ్యం మతం కాదు మార్గమని పదే పదే ఈ గ్రంథంలో చదువగలం. మతం అంటే అనంతుడైన దేవుణ్ణి చేరడానికి మానవుడు చేసే విఫలయత్నం. క్రైస్తవ మార్గం - దేవుడే మానవులు తనను చేరడానికి ఏర్పాటు చేసిన జీవమార్గం. ఈ మార్గాన్ని ఎఫెసులోని కొందరు దూషించినందువల్ల పౌలు వారిని విడిచిపెట్టాడు. మన ప్రభువు మత్తయి 7:6లో సెలవిచ్చినట్లు పందుల ముందు ముత్యాలు వేయకూడదు. ముత్యాలవంటి సువార్తను దాని విలువ తెలియక క్రూరంగా వ్యతిరేకించేవారికి మొండిగా చెప్పడం తగదు. పౌలువలె దేవుడిచ్చే సమయోచితమైన జ్ఞానంతో మెలగాలని పాఠం నేర్చుకుంటున్నాం. పౌలు ప్రతిదినం సువార్త బోధించినట్టు చూడగలం. కీర్తన 96:2లో ఉన్నట్టు, అనుదినం ఆయన సువార్తను ప్రకటించాలి. దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతాలు చేయించాడు. అద్భుతాలు, సూచకక్రియలు అపొస్తలుల కాలంలో వారిని దేవుడే పంపాడని రుజువుపర్చడానికి వాక్యాన్ని స్థిరపర్చడానికి దేవుడు జరిగించాడు. హెబ్రీ. 2:4 చూడండి, “అట్టి రక్షణ ప్రభువు బోధించుటచేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా సూచకక్రియలచేతను, మహాత్కార్యముల చేతను, నానావిధములైన అద్భుతములచేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢపరచబడెను.” ఈ వచనాన్నిబట్టి వాక్యాన్ని దృఢపర్చడానికి దేవుడు సూచకక్రియలు, అద్భుతాలు, కొన్ని ఆత్మవరాలు అపొస్తలుల కాలంలో అనుగ్రహించాడని గ్రహించగలం. వాక్యం దృఢపర్చబడింది. అపొస్తలుల కాలం ముగిసింది. క్రొత్త నిబంధన అనుగ్రహింపబడింది. ఈ సున్నితమైన విషయాన్ని మనం గ్రహించాలి. మాంత్రికులైన కొందరు యూదులు 'పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నా'మను మాట చెప్పి దయ్యాలు పోగొట్టడానికి ప్రయత్నించారు. కాని దయ్యం - 'యేసును, పౌలును ఎరుగుదును, మీరెవరని' చెప్పి ఎగిరి వారిమీద పడి వారిని గెల్చింది. ఇది విన్నవారందరికి భయం కలిగింది. ఈ రీతిగా ప్రభువైన యేసు నామం ఘనపర్చబడింది. విశ్వసించినవారు అనేకులు వచ్చి, తాము చేసినవాటిని తెలియచేసి ఒప్పుకున్నారు. మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరి యెదుట వాటిని కాల్చివేసారు. వాటి వెల 50,000 వెండి రూకలు . ఇంతగా ప్రబలిన మంత్రవిద్యను వదలిపెట్టి, ఇక ఎన్నడు పాతజీవితానికి తిరగకుండా ఉండటానికి ఆ పుస్తకాలు కాల్చేసారు. దీనిలో వారి మార్పు ఎంత నిజమైందో రుజువు అవుతుంది. పాఠకులూ, మీరు కూడా కాల్చేయాల్సినవేవైనా ఇంకా దాచిపెట్టి ఉంచారా? చెడ్డ పుస్తకాలు, అశ్లీల చిత్రాలు, సాహిత్యం , విగ్రహాలు మొదలైన భక్తికి వ్యతిరేకమైనవాటిని వెంటనే కాల్చేయండి. ఈ రీతిగా ఇంత ప్రభావంతో ప్రభువు వాక్యం ప్రబలమై వ్యాపించింది. దేమేత్రి అనే ఒక కంసాలి వెండి గుళ్ళను చేయటంవల్ల చాలా లాభం పొందుతూ చేతులతో చేయబడినవి దేవుడు కాదని పౌలు బోధించడం వల్ల తమ వృత్తి దెబ్బతింటుందని చాల అల్లరి రేపాడు. చాలామంది క్రీస్తు సత్యాన్ని అంగీకరించడానికి బదులు తమమతం బలహీనపడుతుందనో, తమ వృత్తి అంతం అవుతుందనో స్వార్థంగా ఆలోచిస్తూ దేవుణ్ణి నిరాకరిస్తున్నారు. ఎంత త్యాగమైనా చేసి క్రీస్తు సత్యాన్ని అంగీకరించండి. దేవుడు మీకిట్టి కృపననుగ్రహించును గాక.

ప్రార్థన:- పరిశుద్దుడైన దేవా మీకు స్తోత్రాలు. మీ కుమారుడైన క్రీస్తు చిందించిన రక్తంలో కడిగి సంఘంలో చేర్చుకొనినందుకు వందనాలు. సత్యవాక్యాన్ని సరిగా విభజించడానికి, గ్రహించడానికి సహాయం చెయ్యండి. తప్పు బోధల నుండి మమ్మును తప్పించండి. యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రీ. ఆమేన్.

15]

అపొస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం - ఆదివారమున వారు రొట్టె విరుచుటకు కూడినట్టు 7వ వచనంలో వ్రాయబడి ఉంది. సంఘం దేవుణ్ణి ఆరాధించడానికి ఆదివారం రోజున సమకూడేది - ఎందుకంటే క్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచినది ఆ రోజునే. ఆది సంఘ నాయకుల రచనలు కూడ వారు మొదటి శతాబ్దం తరువాత కూడ ఆదివారాలు సంఘంగా సమకూడేవారని నిర్ధారిస్తున్నాయి. క్రైస్తవులను శనివారపు సబ్బాతును ఆచరించమని వాక్యంలో ఎక్కడా చెప్పలేదు. సబ్బాతు మోషే నిబంధనకు సూచనగా ఇవ్వబడింది. యెహెజ్కేలు 20:12లో ఇలా ఉంది. “యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలిసికొనునట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించితిని.” అయితే క్రైస్తవులు క్రొత్త నిబంధన క్రింద ఉన్నారని రెండవ కొరింథీ 3వ అధ్యాయం, హెబ్రీ 8వ అధ్యాయంలో చెప్పబడింది. క్రొత్త నిబంధనలో సబ్బాతును ఆచరించమని ఆజ్ఞ ఇవ్వబడలేదు. యెరూషలేములోని సంఘపెద్దల సభ అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో సమకూడినప్పుడు అన్యజనులలో నుండి ప్రభువును విశ్వసించినవారికి వారు పాటించవలసిన ఆజ్ఞలు చెబుతూ సబ్బాతును ఆచరించమని చెప్పలేదు. పౌలు తన వాక్యపరిచర్యలోగాని, పత్రికలలో గాని క్రైస్తవులు సబ్బాతును మీరినందుకు ఎన్నడూ వారిని గద్దించలేదు. సబ్బాతును ఆచరించనవసరం లేదని క్రొత్త నిబంధన స్పష్టంగా బోధిస్తుంది. గలతీ. 4:10,11లో పౌలు ఇలా అన్నాడు: “మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను.”కొలస్సీ. 2:16,17 కూడ చూడండి: “కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశమియ్యకుడి. ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది.” ఈ వచనాలను బట్టి క్రొత్త నిబంధన విశ్వాసులమును, క్రైస్తవులమునైన మనము శనివారపు సబ్బాతును ఆచరించనవసరం లేదని బోధపడుతుంది. శనివారపు సబ్బాతును ఆచరించమని బోధించేవారు శనివారం సబ్బాతును ఆచరిస్తేనే నిత్యజీవం పొందగలమని అజ్ఞానంగా చెబుతారు. నిత్యజీవం, రక్షణ, పాపక్షమాపణ మన నీతిని అనుసరించి చేసిన క్రియలమూలంగా కలగదు గాని దేవుని కనికరం చొప్పుననే కలుగుతాయి. ఎఫెసీ. 2:8,9 వచనాలు చూడండి: “మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు. ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.” ఈ వచనాలనుబట్టి మనల్ని రక్షించేది ఏదేనా ఒక రోజు కాదని, దేవుడే తన కృపచేత రక్షిస్తాడని గ్రహించగలం. విశ్రాంతిదినాన్ని, శనివారపు సబ్బాతును ఆచరించమని బోధించేవారు మిగిలిన ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఆచరించరు? ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తే పూర్తిగా ఆచరించాలి గదా? అంటే వారు బలులు అర్పించి, సున్నతి చేయించుకోవాలి కదా? అయితే క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు కాబట్టి మనం ధర్మశాస్త్రం అనే కాడి క్రింద ఇకలేము. క్రీస్తు మనకొరకు ప్రాణం పెట్టి మన పాపాలకు తానే ప్రాయశ్చిత్తం చేసి మరణాన్ని జయించి తిరిగిలేచాడు.

యేసుక్రీస్తే మన పాపపరిహారకుడు, రక్షకుడు, విమోచకుడు. కనుక ఆయన మరణపునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోడానికి ఆయన పునరుత్థానాన్ని ఘనంగా ఆచరించి, ఆయనను స్తుతించడానికిగాను ఆదివారం సంఘంగా సమకూడండి. ప్రభువు బల్లదగ్గర చేరి ప్రభువు సిలువను జ్ఞాపకం చేసుకొని ఆ సిలువ ప్రేమనుబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. పౌలు ఇతర సహోదరులు ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినట్లు మనమును చేయుదుముగాక. పౌలు ప్రసంగిస్తున్నప్పుడు ఐతుకు అనే ఒక యౌవనస్తుడు మేడగది కిటికీలో కూర్చుండి గాఢనిద్రపోయి నిద్రాభారంవలన జోగి మూడవ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయాడు. అయితే దేవుడు పౌలు ద్వారా అతన్ని తిరిగి బ్రతికించి వారికి విశేషమైన ఆదరణ కలుగజేసాడు. చనిపోయినవారిని బ్రతికించడం యేసుప్రభువు తర్వాత అపొస్తలుల ద్వారా కూడా దేవుడు చేయించాడు. సూచక క్రియలు, మహాత్కార్యాలు, అద్భుతాలు చేయడం అపొస్తలులు నిజంగా అపొస్తలులని రుజువు చేయడానికి వారి ద్వారా వాక్యాన్ని దృఢపర్చడానికి దేవుడు అనుగ్రహించాడు. తాను కూడ అపొస్తలుడనని పౌలు తన ఏర్పాటును గురించి 2కొరింథీ. 12:11,12లో ఇలా అన్నాడు: “నేను ఏ మాత్రపువాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె నేను ఏ విషయములోను తక్కువవాడను కాను. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుటవలన, అపొస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనుపరచబడెను.” ఈ వచనాలనుబట్టి అపొస్తలులైనవారు సూచకక్రియలు, అద్భుతాలు, మహాత్కార్యాలు చేయగలరని అపొ.కా.1:22ను బట్టి అపొస్తలులు క్రీస్తు పునరుత్థానాన్ని గూర్చి సాక్షియై ఉండాలని, పునరుత్థానుడైన క్రీస్తును చూచినవారై ఆయనచేత ప్రత్యేకంగా అపొస్తలులుగా ఉండడానికి పిలువబడినవారై ఉండాలి.

ఎఫెసీ. 2:20 ప్రకారం అపొస్తలులు, ప్రవక్తలు సంఘానికి పునాదివేసే పరిచర్య కలిగినవారు. ఎఫెసి 3:5 ప్రకారం క్రీస్తు మర్మము ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులగు అపొస్తలులకు, ప్రవక్తలకు బయలుపరచబడెను. ఈ వచనాలను బట్టి క్రీస్తు అపొస్తలులు పౌలుతో పదముగ్గురేనని వారి తర్వాత అపొస్తలులు లేరని బోధపడుతుంది. అపొస్తలులు, ప్రవక్తలు క్రీస్తనే ముఖ్యమైన మూలరాయిపై సంఘపునాది వేయగా సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు ఆ పునాదిపై అప్పటినుండి కడుతున్నారు. కాబట్టి ప్రస్తుత దినాలలో అపొస్తలులు, ప్రవక్తలు లేరు. సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు మాత్రం సంఘాన్ని కడుతున్నారు. సంఘ పునాది అపొస్తలులు, ప్రవక్తల ద్వారా వేయబడినది కాబట్టి అపొస్తలుల, ప్రవక్తల కాలం ముగిసింది. ఈ రోజుల్లో ఎవరైనా అపొస్తలులు అని పిలువబడుతున్నారు అంటే వారు వేరొక పునాది మరలా వేస్తున్నారన్నమాట. పునాది ఒక్కసారే వేయబడుతుంది కదా. కాబట్టి క్రీస్తు అపొస్తలులు వేసిన పునాదే సరియైనది. దానిపైనే సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు కట్టాలి. ఈ సత్యాన్ని పాఠకులు గ్రహించి ఎంతటి భక్తులైనప్పటికీ ఈ కాలంలో ఎవరినీ అపొస్తలులుగా ఎంచకూడదని హెచ్చరింపబడుతున్నారు.

ఎఫెసులో ఉన్న సంఘపెద్దలను హెచ్చరిస్తూ పౌలు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు వారికి జ్ఞాపకం చేసాడు. వారిమధ్య తాను పరిచర్య చేసిన 3 సంవత్సరాలు అన్ని విషయాలలో వారికి మాదిరి చూపానని చెప్పాడు. పౌలు జీవితం పరిచర్య మనకును ఎంతో మాదిరిగా ఉన్నది. యూదుల కుట్రవలన శోధనలు సంభవించినా, కన్నీళ్ళు విడుస్తూ పూర్ణమైన వినయభావంతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియును అన్నాడు. మూడు సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్ళు విడుస్తూ ప్రతిమనుష్యునికి మానక బుద్ది చెప్పితినని మీరు జ్ఞాపకం చేసికొని మెలకువగా ఉండుడని చెప్పాడు. మూడు విషయాల గురించి పౌలు తన పరిచర్యలో కన్నీళ్ళు విడిచాడు. మొదటిది - ప్రభువును ఎరుగనివారి నిమిత్తం. క్రీస్తును అంగీకరించకుండా తన స్వంత ప్రజలైన ఇశ్రాయేలీయుల గురించి నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలవని' రోమా 9.1లో అన్నాడు. రెండవదిగా పౌలు కన్నీళ్ళు విడిచింది భక్తిలో ఇంకా ఎదగనివారి కొరకు. మూడవదిగా క్రూరమైన తోడేళ్ళవంటి తప్పుడు బోధకుల వలన కలిగే ఆపద గురించి. తప్పుడు బోధకులు శిష్యులను తమ వెంట ఈడ్చుకొనిపోవాలని వంకర మాటలు పలుకుతారని, క్రూరమైన తోడేళ్ళవలె వారు మందను కనికరింపరని 29,30 వచనాలలో చెప్పాడు. మన ప్రభువుకూడ తప్పుడు బోధకులు క్రూరమైన తోడేళ్ళని, గొఱ్ఱెచర్మం వేసుకొని గొఱ్ఱెలలోకి వస్తారని, వారిని గురించి జాగ్రత్తపడమని మత్తయి 7:15-23 వచనాలలో బోధించాడు. బాధ్యత కలిగిన ప్రతి దైవదాసుడు యేసు ప్రభువు వలె, పౌలువలె గొఱ్ఱెలవంటి ప్రజలను క్రూరమైన తోడేళ్ళవంటి అబద్ధ బోధకుల గురించి జాగ్రత్తపడమని హెచ్చరించాలి. పౌలువలె ఆత్మల కొరకైన భారంతో, కన్నీళ్ళు విడుస్తూ మానక ప్రతివానికి వాక్యం ద్వారా బుద్ధి చెప్పాలి. పౌలు మాదిరికరమైన పరిచర్యలో మరో ముఖ్యమైన విషయం - ప్రజలకు ప్రయోజనకరమైనదేదీ దాచుకొనక బహిరంగంగాను, ఇంటింటను తెలియజేసాడు. “దేవుని సంకల్పమంతా మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదని' 27వ వచనంలో అన్నాడు. బోధకులైనవారు పౌలువలె దేవుని సంకల్పాన్నంతటిని ప్రయోజనకరమైనదానినంతటిని దాచకుండ ప్రజలకు తెలియజేయాలి. 'దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యమిచ్చుటలో నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టించవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు' అని 24వ వచనంలో అన్నాడు. చూసారా! పౌలుది ఎంత మాదిరికరమైన జీవితమో! తన స్వంత ప్రాణంకంటే దేవుణ్ణి, ఆయన తనకప్పగించిన పనిని ఎక్కువగా ఎంచుకొని ప్రాణం పెట్టేంతగా ప్రభువును సేవించాడు. చదువరులూ, ప్రభువుని ఈ రీతిగా ప్రేమిస్తున్నారా? సంఘ నాయకులైనవారు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాస్తూ, యావత్తుమందను గురించి, తమమట్టుకు తమను గూర్చి జాగ్రత్తగా ఉండాలని 28వ వచనంలో అన్నాడు. సంఘం దేవునిది - ఆయన తన రక్తంతో సంపాదించుకున్నాడు. అటువంటి దేవుని సంఘాన్ని ఎంతో జాగ్రత్తతో కాయాలని పాఠం. ఎవని వెండినైనా, బంగారాన్నయినా, వస్త్రాలయినా నేను ఆశింపలేదు. నా అవసరాల నిమిత్తం, నా చేతులు కష్టపడ్డాయని 33,34 వచనాలలో తెలిపాడు. ఎవరిదీ, ఏదీ ఆశింపని నిస్వార్థమైన పరిచర్యను పౌలు మాదిరినిబట్టి అలవరచుకోవాలని పాఠకులను బ్రతిమాలుతున్నాను. పరిచర్య వ్యాపారంగా మారిపోతున్న ఈ అంత్యదినాల్లో పౌలు యొక్క మాదిరి ఎంత అనుసరింపదగినదో కదా! పౌలువంటి మాదిరికరమైన పరిచర్య జరిగేలా ప్రభువు పాదాలను ఆశ్రయిద్దాం.

ప్రార్థన :- అద్భుతకరుడైన దేవా మీకు స్తోత్రాలు. ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలతో వాక్యాన్ని దృఢపర్చిన దేవా మీకు వందనాలు. పౌలువంటి మాదిరికరమైన జీవితాన్ని పరిచర్యను మాకు అనుగ్రహించండి. యేసు నామంలో వేడుకొంటున్నాం తండ్రీ. ఆమేన్.

16]

ఈ భాగంలో 21,22,23 అధ్యాయాల్లోని అంశాలు ధ్యానించుకుందాం. పౌలు తన తోటివారితో ప్రయాణం చేస్తూ తూరు అనే ఊరిలో దిగి అక్కడున్న శిష్యులను కనుగొని ఏడు రోజులు అక్కడ ఉన్నాడు. తరువాత ప్రయాణమవుతూ సముద్ర తీరంలో మోకాళ్ళూని ప్రార్థన చేసాడు. చాలాసార్లు పౌలు ఇతర శిష్యులతో కలిసి మోకాళ్ళూని ప్రార్థించినట్లు చదువగలం. యేసు ప్రభువు కూడా మోకాళ్ళూని ప్రార్థించినట్లు వ్రాయబడింది. దేవుణ్ణి ప్రార్థించే విషయంలో మోకాళ్ళూనడం మంచి పద్ధతి. మనల్ని మనం తగ్గించుకోవడానికి, మన దేవుణ్ణి హెచ్చించడానికి మోకాళ్ళ ప్రార్థన ఎంతో అనువైనది. తూరు పట్టణంలోని శిష్యులు తమ భార్యలతోనూ, పిల్లలతోను పట్టణం వెలుపల వరకు వచ్చి పౌలును సాగనంపారు. విశ్వాసులకు, దైవసేవకులకు మధ్య ఈ విధమైన ప్రేమ, ఐక్యత ఉండాలి. అప్పుడే ప్రభువు పరిచర్య - ప్రభావంతో సాగగలదు. పాఠకులారా! తూరు పట్టణంలోని శిష్యులకున్న మిక్కుటమైన ప్రేమ దేవుని దాసులపట్ల కలిగి ఉన్నారా? కీర్తన 16:3లో దావీదు ఇలా అన్నాడు, “నేనీలాగందును - భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు; వారు నాకు కేవలము ఇష్టులు." ఎఫెసులోని విశ్వాసులు కూడ పౌలును తన ప్రయాణంలో సాగనంపుతూ, అతని మెడమీద పడి అతన్ని ముద్దుపెట్టుకున్నారు. పౌలు కైసరయకు వచ్చి ఏడుగురిలో ఒకడును, సువార్తికుడునైన ఫిలిప్పు ఇంటిలో చాలా రోజులు ఉన్నాడు. పౌలు, ఫిలిప్పు ఒకప్పుడు శత్రువులు. ఏడుగురిలో మరొకడైన స్తెఫనును యూదులు చంపినపుడు పౌలు సమ్మతించి వారి వస్త్రాలకు కావలి ఉన్నాడు. పౌలు ఒకపుడు సంఘాన్ని ఎంతో హింసించాడు. ఆ రీతిగా ఒకప్పుడు శత్రువులైన పౌలు, ఫిలిప్పులు ఇప్పుడు స్నేహితులుగా, కృపాసువార్తకు సహదాసులుగా ఉన్నారు. పాత భేదాలు మరచి ప్రభువు సేవలో ఏకీభవించారు. అగబు అనే ప్రవక్త యూదయ నుండి వచ్చి పౌలు నడికట్టు తీసుకొని, తన చేతులను, కాళ్ళను కట్టుకొని - యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుష్యుని ఈలాగు బంధించి, అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడన్నాడు. ఈ మాట విన్నపుడు అక్కడ వారు పౌలును యెరూషలేము వెళ్ళొద్దని బతిమాలుకొన్నారు గాని పౌలు - 'ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేల? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమేగాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాడు. ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్ముడు జరగబోయేదాన్ని తెలియజేసినందుకు శిష్యులు భయపడి పౌలును యెరూషలేము వెళ్ళకుండ నిరుత్సాహపర్చడానికి ప్రయత్నించారు. కాని పౌలు ప్రభువుకోసం బంధింపబడడానికి మాత్రమేకాదు, చనిపోవడానికి కూడ సిద్ధంగా ఉన్నానని ధైర్యంగా చెప్పాడు. పాఠకులారా, ప్రభువు నామాన్ని బట్టి ఎదురయ్యే శ్రమలకు, నిందలకు భయపడుతున్నారా? మనకోసం ప్రాణం పెట్టిన ప్రభువుకోసం మనం శ్రమలు భరించడం గొప్ప భాగ్యమని మీకు తెలీదా? ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 27,28,30 వచనాలలో ఏమని ఉందో చూడండి. “మీరు ఏ విషయములోను ఎదిరించువారికి బెదరక, అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు... క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచనయైయున్నది... యేసునందు విశ్వాసముంచుట మాత్రమేగాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను.” పౌలువలె మన ప్రభువుకోసం శ్రమపడడానికే కాదు, చనిపోవడానికి కూడ మనం సిద్ధంగా ఉండాలి. ఉగ్రవాదులు డబ్బుకోసమో, తమ సిద్ధాంతాలకోసమో, ప్రాణాలర్పిస్తుంటే, సత్యం కోసం, రక్షకుడైన మన ప్రభువుకోసం మన ప్రాణాన్ని త్యాగం చేయడం ఎంతైనా న్యాయమే. పౌలు వలె ప్రభువుకోసం హింసలు పొందడానికి సంసిద్ధులం కావాలని పాఠం నేర్చుకుంటున్నాం.

పౌలును యెరూషలేము వెళ్ళకుండ ఆపలేకపోయినందుకు వారు ప్రభువు చిత్తము జరుగును గాక అని చెప్పి ఊరుకున్నారు. పరిస్థితులు మన శక్తికి మించినప్పుడు దేవుని చిత్తము జరుగునుగాకని దేవునికే అప్పగించడం మంచిది. ఏ పని లేదా ప్రయత్నం చేయకుండ దేవుడే చూసుకుంటాడు, దేవుని చిత్తం జరుగు గాకని అనడం జ్ఞానం కాదు. ప్రజలు రక్షింపబడడం దేవుని చిత్తమైతే ఆయనే రక్షించుకుంటాడు, నేను సువార్త ప్రకటించనక్కరలేదు అని అనకూడదు కదా. మన ప్రయత్నానికి, శక్తికి మించిపోయిన పరిస్థితుల్లో నష్టమైనా, మరణమైనా, దేవుని చిత్తమే జరుగునుగాక అని దేవునికి అప్పగించడం మేలు. మరణకరమైన హింసల్లో కూడ దేవుని చిత్తమే జరుగునుగాక అని అంగీకరించడం మంచిది. దేవుని చిత్తం ఒక్కోసారి మనల్ని శ్రమకు అప్పగించడం అయినప్పటికినీ, దేవుని చిత్తమే మనకు మేలు అని గ్రహించాలి. దేవుని చిత్తములోనే మనకు శాంతి, మేలు ఉన్నాయి. కాబట్టి అన్ని విషయాలలో దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. పౌలు యెరూషలేముకు వచ్చినప్పుడు సహోదరులు సంతోషంతో చేర్చుకున్నారు.

తన పరిచర్యవల్ల దేవుడు అన్యజనులలో జరిగించినవాటిని వారికి వివరంగ చెప్పినప్పుడు వారు విని దేవుణ్ణి మహిమపర్చారు. పౌలు తానేదో అన్యజనులలో సాధించేసానని చెప్పలేదు కానీ, తన పరిచర్య ద్వారా దేవుడు అన్యులలో రక్షణ కార్యం జరిగించాడని, ఇది దేవుడే చేసాడని దేవుణ్ణి మహిమపర్చాడు. పరిచర్య జరిగింది పౌలు గొప్పతనాన్ని బట్టి కాదు, దేవుడే జరిగించాడు. కాబట్టి పౌలువలె పరిచర్య అభివృద్ధినిబట్టి దేవునినే మహిమపరచాలి.

ఆసియనుండి వచ్చిన యూదులు పౌలును దేవాలయములో చూచి సమూహమంతటిని కలవరపరచి అతనిని బలవంతంగా పట్టుకొని ప్రజలకు - ధర్మశాస్త్రానికి, ఈ స్థలానికి విరోధముగా అందరికీ, అంతటా బోధించుచున్నవాడు వీడే అని చెప్పి పౌలును చంపడానికి యత్నించారు. యెరూషలేమంతా గలిబిలిగా ఉన్నదని పటాలపు పైఅధికారికి తెలిసినప్పుడు అతడు వచ్చి పౌలును పట్టుకొని బంధించాడు. సమూహము పౌలును చంపుమని కేకలు వేస్తుండగా సైనికులు పౌలును మోసికొనిపోవలసి వచ్చింది. జనులతో మాట్లాడడానికి తనకు సెలవిమ్మని పౌలు పైఅధికారిని వేడుకున్నప్పుడు అతడు సెలవిచ్చాడు. పౌలు ప్రసంగిస్తూ తన మార్పును గురించిన సాక్ష్యం జనసమూహానికి చెప్పాడు. యూదుడుగా పుట్టి, గమలియేలు అనే యూదా మత పెద్ద పాదాలవద్ద పెరిగి, ధర్మశాస్త్ర సంబంధమైన నిష్ఠయందు శిక్షితుడై, దేవునిగూర్చి ఆసక్తితో క్రైస్తవులను బంధించి చెరశాలలో వేయిస్తూ మరణము వరకు హింసించిన తనను యేసుక్రీస్తు ప్రత్యక్షమై ఎలా మార్చాడో చెప్పాడు. దమస్కు పట్టణంలో ఉన్న క్రైస్తవులను కూడ బంధించి, దండించడానికి యెరూషలేముకు తేవాలని అక్కడకు వెళ్ళాడు. ప్రయాణంలో మధ్యాహ్నం ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టూ ప్రకాశించింది. పౌలు నేల మీద పడి 'సౌలా, సౌలా నీవెందుకు నన్ను హింసిస్తున్నావని' తనతో పలికిన ఒక స్వరం విన్నాడు. అందుకు పౌలు “ప్రభువా, నీవెవడవు?” అని అడిగినప్పుడు, ఆయన “నేను నీవు హింసించుచున్న యేసును' అని అతనితో చెప్పాడు. అప్పుడు పౌలు “ప్రభువా నేనేమి చేయవలెనని' ఆయనను అడిగాడు. అప్పుడు ప్రభువు 'నీవు లేచి దమస్కులోనికి వెళ్ళు, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడతా'యన్నాడు. ఆ వెలుగు యొక్క ప్రభావం వల్ల పౌలు చూడలేకపోయినందుకు తనతో ఉన్నవారు అతన్ని దమస్కుకు నడిపించారు. క్రైస్తవులను హింసిస్తున్న సౌలును ప్రభువు తన పూర్ణమైన దీర్ఘశాంతంతో కనికరించి, రక్షించి మార్చుకున్నాడు. పాఠకులారా! మన ప్రభువు ప్రేమ ఎంత విస్తారమైందో చూసారా! సౌలును పౌలుగా మార్చిన మన ప్రభువు, ఎంతటి శత్రువునైనా, ఎంతటి ఘోరపాపినైనా మార్చగలడు.

సౌలా, సౌలా, నీవెందుకు నన్ను హింసిస్తున్నావని ప్రభువు తనతో పలికినపుడు, పౌలు - ప్రభువా నేనేమి చేయవలెనని ఆయన్ను అడిగాడు. క్రైస్తవులను హింసించడం ద్వారా దేవునికి తానేదో గొప్ప సేవ చేస్తున్నాడని అప్పటివరకు తలంచిన పౌలు, తన ఘోరపాపాన్ని గ్రహించి, మారి ఒక బానిస తన యజమానిని అడిగినట్టు - ప్రభువా, నేనేం చేయాలని అడిగాడు. ఈ మాటలో ఎంతో మార్పు, విధేయత, దీనత్వం కనబడుతున్నాయి. నిజంగా మార్పుచెందినవారు ఈ మాటే పలుకుతారు. “ప్రభువా, ఇప్పటివరకు నాకు తోచినట్టు, నాకిష్టమొచ్చినట్లు చేసాను, ఇకనుండి నీ చిత్తప్రకారమే జీవిస్తాను, నీ చిత్తమేంటి చెప్పు' అని ప్రభువును అడుగుతారు. పాఠకులారా! ఇలా ప్రభువా, నేనేం చేయాలని అడుగుతున్నారా?

అననీయ అను భక్తిపరుడు వచ్చి - సౌలా, సహోదరా, దృష్టిపొందుమని చెప్పినపుడు, అతడు దృష్టి పొందాడు. అననీయ భక్తిపరుడు; యూదులందరిచేత మంచి పేరు పొందినవాడు. ఇటువంటి యోగ్యుడనే ప్రాముఖ్యమైన పని నిమిత్తం ప్రభువు వాడుకున్నాడు. అననీయ వచ్చి సౌలును సహోదరా అని పిలిచాడు. అప్పటివరకు సౌలు చేసిన హింసంతటినీ క్షమించి సహోదరా అని పిలిచాడు. ప్రభువు క్షమించినవారిని మీరును క్షమిస్తున్నారా? పాఠకులారా! పౌలు సకల మనుష్యుల ఎదుట ప్రభువుకు సాక్షియై ఉంటాడని అననీయ చెప్పాడు. మనంకూడ ప్రభువు కొరకు మనుష్యులందరి ఎదుట సాక్షులై ఉండాలి. అననీయ వచ్చి 'నీవు తడువుచేయుట ఎందుకు? లేచి ఆయన నామాన్నిబట్టి ప్రార్థనచేసి బాప్తిస్మము తీసుకొని నీ పాపాలు కడిగివేసుకోమని' పౌలుతో చెప్పాడు. బాప్తిస్మం తీసుకోడానికి ఆలస్యం చేయకూడదని ఖచ్చితంగా అర్థమవుతుంది. పాఠకులారా! ప్రభువును నమ్మి రక్షింపబడ్డారా? అయితే తడవు చేయుట ఎందుకు? వెంటనే ప్రభువు ఆజ్ఞకు, సంకల్పానికి, నీతికి లోబడి బాప్తిస్మం పొందండి. బాప్తిస్మం పొందడంవల్ల పాపాలు కడిగివేయబడవు కానీ, లోపల కలిగిన శుద్ధికి గుర్తుగా బాప్తిస్మం పొందాలి. ప్రభువు నామాన్నిబట్టి ప్రార్థన చేయువారు రక్షింపబడతారని రోమా 10:13లో ఉన్నట్లు అననీయ పౌలును ప్రభువు నామాన్నిబట్టి ప్రార్థనచేసి బాప్తిస్మం తీసుకుని ఆరీతిగా తన పాపాలను కడిగివేసుకోమని చెప్పాడు. కేవలం బాప్తిస్మంవల్ల పాపాలు క్షమింపబడవు కానీ, యేసు ప్రభువునందు విశ్వాసముంచి రక్షణ కొరకై ప్రార్థించడం ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది. పౌలు చెప్పిన సాక్ష్యంలో దేవుడు తనను అన్యులకు సువార్త ప్రకటించడానికి పంపాడని చెప్పగానే యూదులు 'ఇటువంటివాడు బ్రతకతగడు. భూమిమీద ఉండకుండ వానిని చంపివేయండని' కేకలు వేసారు. అన్యులు యూదా మతంలో చేరకుండానే విశ్వాసంవల్ల దేవుడిచ్చే రక్షణ పొందడం యూదులు సహించలేకపోయారు. తమ బట్టలు విదిల్చికొని ఆకాశముతట్టు దుమ్మెత్తిపోసారు. పౌలేదో పెద్ద నేరస్తుడని అనుకొని సహస్రాధిపతి పౌలును కొరడాలతో కొట్టాలని ఆజ్ఞాపించాడు. అయితే పౌలు రోమా పౌరసత్వం కలిగినవాడని తెలుసుకొని రోమా పౌరసత్వం కలిగినవారికున్న ప్రత్యేక హక్కులనుబట్టి పౌలును కొరడాలతో కొట్టకుండా విడిచిపెట్టారు. పౌలు జ్ఞానయుక్తంగా తన హక్కును వినియోగించుకున్నాడు. సహస్రాధిపతి మహాసభ ఎదుట పౌలును నిలబెట్టినప్పుడు పౌలు 'నేను నేటివరకు కేవలం మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట నడుచుకొంటినని' చెప్పాడు. మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట నడుచుకోవాలని ఆశిద్దాం. ప్రధాన యాజకుడు ఆ మాటకు అతని నోటి మీద కొట్టండని ఆజ్ఞాపించినప్పుడు ఆ సాధారణ సభలో అననీయ ప్రధాన యాజకుని వస్త్రాలు ధరించనందువల్ల పౌలు అతన్ని గుర్తుపట్టక 'సున్నము కొట్టిన గోడా! దేవుడు నిన్ను కొట్టును' అన్నాడు. అతడు ప్రధాన యాజకుడని తెలుసుకొని తప్పు ఒప్పుకొని నీ ప్రజల అధికారిని నిందింపవద్దని వ్రాయబడి ఉన్నదన్నాడు. మృతుల పునరుత్థానాన్ని గూర్చి, నిరీక్షణను గూర్చి తాను విమర్శింపబడుతున్నానని సభలో చెప్పినప్పుడు మృతుల పునరుత్థానాన్ని నమ్మే పరిసయ్యులకూ, నమ్మని సద్దూకయ్యులకూ కలహం పుట్టింది. వారు పౌలును చంపకుండ సహస్రాధిపతి అతన్ని కోటలోనికి పంపాడు. ఆ రాత్రి ప్రభువు అతని దగ్గర నిలుచుండి 'ధైర్యముగా ఉండు యెరూషలేములోలాగానే రోమాలో కూడ నన్నుగూర్చి నీవు సాక్ష్యమివ్వవలసి ఉన్నదని చెప్పాడు. ఈ రీతిగా అనేక మరణ అపాయాల నుండి పౌలును దేవుడు రక్షించి ధైర్యపరిచాడు. పౌలును చంపాలను యూదుల కుట్రను పౌలు మేనల్లుని ద్వారా తెలుసుకొని సహస్రాధిపతి పౌలును రహస్యంగా కైసరయకు పంపించాడు. పౌలును అద్భుతంగా తప్పించిన దేవుడు మనల్ని కూడ మన మరణ సమయమువరకు ఎన్ని ఆపదలొచ్చినా విడిపిస్తాడని గ్రహించి ధైర్యంగా జీవించడానికి ప్రభువు మనందరికి సహాయపడును గాక!

17]

మన ధ్యానాలలో ముందుకు సాగుతూ 24, 25, 26 అధ్యాయాలు ధ్యానించుకుందాం. అధిపతియైన ఫేలిక్సు ఎదుట యూదులు రుజువుపర్చలేని అనేక నేరాలు మోపారు. పౌలును పీడవంటివాడని, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడని, నజరేయుల మతభేదానికి నాయకుడని, దేవాలయాన్ని అపవిత్రపర్చడానికి యత్నించాడని నేరం మోపారు. పౌలు మాట్లాడుతూ, తాను దేవుని ఎడలను, మనుష్యుల ఎడలను ఎల్లప్పుడు తన మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నానన్నాడు. యెరూషలేము పట్టణానికి కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చానని కరువులో ఉన్న తన స్వజనులైన యూదులకు దానద్రవ్యాలు, కానుకలు సమకూర్చి తీసుకొచ్చానని చెప్పాడు. అధిపతియైన ఫేలిక్సు - బంధకాలకు తగిన నేరం పౌలులో కనపడనందున, సహస్రాధిపతి లూసియ కూడ పౌలును నిర్దోషిగా పేర్కొన్నందున ఎటూ తోచక నిర్ణయాన్ని లూసియ వచ్చే వరకు వాయిదా వేసాడు. రోమీయుల చట్టం ప్రకారం న్యాయంగా పౌలును నిర్దోషిగా ప్రకటిస్తే యూదులు తిరగబడతారని భయపడ్డాడు. ఈ అధిపతియైన ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతో కూడవచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసముగూర్చి బోధించగా విన్నాడు. పౌలు నీతిని గురించి, ఆశానిగ్రహం గురించి, రాబోవు విమర్శను, తీర్పును గురించి బోధిస్తుండగ ఫేలిక్సు చాలా భయపడి 'ఇప్పటికి వెళ్ళు నాకు సమయమున్నప్పుడు నిన్ను పిలిపిస్తానని చెప్పాడు. ఈ ఫేలిక్సు ద్రుసిల్ల అందానికి ముగ్ధుడై ఆమె భర్తనుండి ఆమెను దూరంచేసి లొంగతీసుకున్నాడు. పౌలు నీతిని గురించి, ఆశానిగ్రహాన్ని గురించి, తీర్పును గురించి బోధించినప్పుడు తన పాపాన్నిబట్టి భయపడ్డాడు.

దేవుడు పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధులంగా జీవించాలి. అలా జీవించడానికి ఆశనిగ్రహం అవసరం. శరీరాన్ని, హృదయాన్ని దేవుని నీతిని జరిగించడానికి లోబరుచుకోవాలి. అలాకాని పక్షంలో దేవుని తీర్పు ఎదుర్కోవాలి. పాఠకులారా! దేవుని నీతిని జరిగిస్తున్నారా? కీర్తన 11:7 వచనం చూడండి: “యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యధార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు.” 1 పేతురు 1:16 చూడండి, “మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి.” హెబ్రీ. 12:14 కూడా చూడండి: “అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండ ఎవడును ప్రభువును చూడడు.” నీతి, పరిశుద్ధత ఇంత ప్రాముఖ్యమైనప్పుడు వాటిని కలిగి ఉండడానికి ఆశనిగ్రహం తప్పనిసరి. అందుకే భక్తులు తమ శరీరాన్ని, హృదయాన్ని లోపరచుకున్నారు. కీర్తన. 119:112 వచనం చూడండి: “నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకొనియున్నాను. ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము.” పౌలు భక్తుడు కూడా తన జీవితంలో ఆశానిగ్రహాన్ని ఎలా అభ్యాసము చేసుకున్నాడో 1కొరింథీ. 9:27లో చూడగలం, “గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదుగాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోబరచుకొనుచున్నాను.” ఈ రీతిగా దేవుడు కోరిన నీతిని ఆశానిగ్రహంతో నెరవేర్చకపోతే దేవుని తీర్పుకు లోనవుతాం. 2కొరింథీ. 5:10 చదువుకుందాం. “తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.” దేవుని నీతిని మీరి వ్యభిచారంలో జీవిస్తున్న ఫేలిక్సు ఆశానిగ్రహము లేనందువల్ల దేవుని తీర్పు వస్తుందని పౌలు బోధించినప్పుడు విని చాలా భయపడ్డాడు. అంతటి ఒప్పుదల కలిగినా అనుకూలమైన సమయంలో పశ్చాత్తాపపడి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసంతో ప్రభువువైపు తిరిగి రక్షింపబడవల్సింది బదులు 'ఇప్పటికి వెళ్ళు నాకు సమయమున్నప్పుడు నిన్ను పిలిపిస్తాన'ని పౌలుతో చెప్పి పంపివేశాడు. దేవుడిచ్చిన చక్కని తరుణాన్ని జారవిడిచాడు. పాఠకులారా! దేవుడు మీకు రక్షింపబడడానికి అనుగ్రహించిన అనుకూలమైన తరుణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా? వ్యభిచారియైన ఏశావు మారుమనస్సు పొందే అవకాశము దొరకక విసర్జింపబడ్డాడు. 'ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము.” ప్రభువు మీతో మాట్లాడి మీ పాపాన్ని గురించి మిమ్మల్ని ఒప్పించిన సమయంలోనే మీ హృదయాలు కఠినపర్చుకోకుండా ఆయనకు లోబడండి. దేవుని ఉగ్రతను, తీర్పును తప్పించుకోగలరు.

ఫేలిక్సు పౌలు ద్వారా లంచం దొరుకుతుందని ఆశించి మాటిమాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేసాడు. లంచగొండితనం దేవునికి వ్యతిరేకం. లంచం పుచ్చుకొనుటచేత మనస్సు చెడును, అని ప్రసంగి 7:7 లోను, న్యాయవిధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలోనుండి లంచం పుచ్చుకొనునని సామె. 17:23లోనూ, లంచము పుచ్చుకొనువాడు దేశమును పాడుచేయునని సామె. 29:4 లోనూ, లంచం తీసుకొనకూడదు, లంచము దృష్టిగలవానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయునని' నిర్గమ. 23:8లోనూ, 'లంచమును అసహ్యించుకొనువాడు బ్రతుకును' అని సామె. 15:27లోను వ్రాయబడి ఉంది. పాఠకులారా! లంచం ఎంత వాక్యవ్యతిరేకమో చూసారా? ఇప్పటినుండే లంచాన్ని తీసుకోవడం మానేయండి. నిజక్రైస్తవులుగా దేశాన్ని బాగుచేయండి. దేవుని నీతిని దేశంలో స్థాపించండి. విశ్వాసులైన వారే లంచాలు తీసుకుంటే దేశానికి పరిష్కార మార్గమే మరొకటి లేదు. దైవ భయంలో బ్రతకండి, ధనాపేక్షను విసర్జించండి. సామె. 16:8 జ్ఞాపకం చేసుకుందాం. "అన్యాయముచేత కలిగిన గొప్ప వచ్చుబడికంటె నీతితో కూడిన కొంచెమే శ్రేష్ఠము” లావుగా ఉండే బోదకాలుకంటే ఆరోగ్యంగా ఉన్న సన్నని కాలే శ్రేష్ఠము కదా. 'నీతి తప్పి తన నగరును స్థాపించువానికి, న్యాయము తప్పి తన మేడ గదులను కట్టించుకొనువానికి శ్రమ' అని యిర్మీయా 22:13లోను 'న్యాయవిరోధముగా ఆస్తి సంపాదించుకొనువాడు సగము ప్రాయములో దానిని విడువవలసి వచ్చునని' యిర్మీయా 17:11లోను చదువగలం. యాకోబు 5:1-4 వచనాలు చూడండి: "ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చెడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను; మీ వస్త్రములు చిమ్మెటలు కొట్టినవాయెను. మీ బంగారమును, మీ వెండియు తుప్పుపట్టినవి; వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును; అంత్యదినములయందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి.” ఇప్పటికైనా అన్యాయపు సొమ్మును, లంచాలను కాదనుకుంటారా పాఠకులూ? అధిపతియైన ఫేలిక్సుకు అతడు ఆశించినట్టుగా లంచము ఇచ్చి ఉంటే పౌలును అతడు చెరలోనుండి విడిపించేవాడు. నీతిమంతుడైన పౌలు లంచగొండితనాన్ని ప్రోత్సహించలేదు. బంధకాలలో ఉండడానికైనా ఇష్టపడ్డాడు కానీ లంచమిచ్చి విడిపింపబడడానికి ఒప్పుకోలేదు. 'ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవారు దుష్టుల్ని పొగడుతుంటారని, ధర్మశాస్త్రం అనుసరించేవారు వారితో పోరాడతారని' సామె. 28:4లో ఉంది. లంచం తీసుకోవడమే కాదు, లంచం ఇవ్వడం కూడా పాపమే. పౌలువలె ఎట్టి పరిస్థితుల్లోనూ లంచం ఇవ్వకూడదని తీర్మానం చేసుకోండి.

యూదులలో మంచివాడనిపించుకోవాలని కోరి ఫేలిక్సు పౌలును బంధకాలలోనే విడిచి పెట్టిపోయాడు. మనుష్యులను సంతోషపెట్టాలని, ఏదో రీతిగా పేరు తెచ్చుకోవాలనుకునేవారు నీతిన్యాయాలు తప్పి దోషులౌతారు. క్రొత్తగా వచ్చిన అధిపతి ఫేస్తు కూడ యూదులచే మంచివాడనిపించుకోవాలని పౌలును యూదుల కోరిక మేరకు యెరూషలేములో విమర్శింపకోరాడు. అయితే యూదుల కుట్ర ఎరిగినవాడై పౌలు కైసరు ఎదుట చెప్పుకొందునన్నాడు. నేను న్యాయం తప్పి మరణానికి తగినదేదైన చేస్తే మరణానికి వెనుక తీయనన్నాడు. ఫేస్తు దగ్గరకు వచ్చిన అగ్రిప్పరాజు కూడ పౌలు చెప్పుకొనేది వినకోరాడు. పౌలు మరల తన సాక్ష్యం చెప్పాడు. బహునిష్టగల తెగను అనుసరించి, పరిసయ్యుడుగా ప్రవర్తించి, యేసుక్రీస్తు నామానికి విరోధంగా జీవించిన తనను ప్రభువు ఏరీతిగా మార్చాడో చెప్పాడు. క్రైస్తవులను హింసించడానికి దమస్కుకు వెళుతున్న తనకు మధ్యాహ్నమందు ఆకాశమునుండి సూర్యతేజస్సుకంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు ప్రకాశించి 'సౌలా, సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు? మునుకోలలకు ఎదురుతన్నుట నీకు కష్టమని' ఒక స్వరం పలకడం విన్నానని చెప్పాడు. దేవునికి వ్యతిరేకంగా జీవించడం మునుకోలలకు ఎదురు తన్నడమే. 'ఆయన మహా వివేకి, అధికబల సంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందనివాడెవడని' యోబు 9:4లో ఉన్నట్టు దేవునితో పోరాడి ఎవరూ నెగ్గలేం. పాఠకులారా! ఏ విషయంలోనైనా దేవునితో పోరాడుతున్నారా? దేవునికి బేషరతుగా లోబడండి. ఈ ప్రజలవలన, అన్యజనుల వలన హాని కలగకుండ నిన్ను కాపాడతానని చెప్పినట్టు ప్రభువు పౌలును ఎన్నో భయంకర పరిస్థితుల్లో కాపాడాడు. ప్రజలు చీకట్లో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరిగి యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా పాపక్షమాపణను పరిశుద్ధపరచబడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరవడానికి నేను నిన్ను వారి దగ్గరకు పంపిస్తానని ప్రభువు పౌలుతో చెప్పాడు. ఆత్మీయ చీకట్లో ఉన్న ప్రజలు వాక్యసత్యంలోనికి, సాతాను అధికారంలోనుండి దేవుని వైపుకు ప్రజలు తిరగాలి. యేసుక్రీస్తులో విశ్వాసముంచడం ద్వారా పాపక్షమాపణ పొందగలం. పరిశుద్ధపరచబడినవారిలో సాస్థ్యము అనగా పరలోక స్వాస్థ్యాన్ని ప్రభువును నమ్మడంవల్ల పొందగలం. ఈ యుగసంబంధమైన దేవత మనోనేత్రాలకు కలుగచేసిన గ్రుడ్డితనం పోయి కన్నులు తెరవబడాలంటే యేసుప్రభువును నమ్మడం తప్పనిసరి. పాఠకులూ! సాతాను అధికారం నుండి దేవునివైపు తిరిగారా? మీ కన్నులు తెరవబడ్డాయా? పౌలు అప్పటి నుండి అందరికి 'మారుమనస్సు పొంది దేవునితట్టు తిరిగి మారుమనస్సుకు తగిన క్రియలు చేయాలని, ప్రకటించాడు. మారుమనస్సు పొంది దేవుని తట్టు తిరిగారా? మారుమనస్సుకు తగిన క్రియలు చేస్తున్నారా? 'ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాలేదు' అని పౌలు చెప్పాడు. దేవుని పిలుపుకు ఆయన చిత్తానికి, ఆయన అప్పగించిన పనికి విధేయులయ్యారా పాఠకులారా? పౌలు చెప్పిన సాక్ష్యం విని ఫేలిక్సు 'పౌలా నీవు వెఱ్ఱివాడవు' అన్నాడు. సిలువను గూర్చిన వార్త నశిస్తున్నవారికి వెఱ్ఱితనమే. అయితే రక్షింపబడుతున్నవారికి అది దేవుని శక్తి. అందరూ తనవలె యేసుప్రభువును నమ్మి రక్షింపబడాలని పౌలు ఎంతో కోరాడు. ఇటువంటి ఆత్మలభారం దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక!

18]

చివరిగా అపొస్తలుల కార్యాలు 27,28 అధ్యాయాలు ధ్యానించుకుని ఈ గ్రంథాన్ని ముగించుకుందాం. 'కైసరు ఎదుట చెప్పుకొందునని' అన్నందున ఫేస్తు అతనిని మరికొందరు ఖైదీలతో శతాధిపతి అయిన యూలికి ఇటలీ వెళ్ళడానికి అప్పగించాడు. యూలి పౌలుమీద దయగా ఉండి అతడు తన స్నేహితుల దగ్గరకు వెళ్ళి పరామర్శ పొందడానికి అతనికి సెలవిచ్చాడు. దేవుడు తన ప్రజలకోసం అన్యజనులను కూడ ఎలా వాడుకుంటాడో గ్రహించగలం. సముద్ర ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పుడు ఈ ప్రయాణంవల్ల సరకులకు, ఓడకు మాత్రమేకాక మన ప్రాణములకు కూడ హాని, చాలా నష్టం కలుగుతాయని పౌలు ఓడవారిని హెచ్చరించినా వారు వినక ప్రయాణము కొనసాగించి పెనుగాలిలో చిక్కుకున్నారు. ఓడను తేలిక చేయడానికి సరకులు పారవేసి తమ చేతులారా ఓడ సామగ్రి కూడా పారవేసారు. ప్రాణములతో తప్పించుకోగలమన్న ఆశ బొత్తిగా లేక 14 రోజులు ఆహారమేమి పుచ్చుకోకుండ ఉన్నవారిని చూసి 'నేను ఎవనివాడనో ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా, భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలువబడవలసి ఉన్నది అని చెప్పాడని' చెప్పి ప్రజలను ధైర్యపరిచాడు. దేవుడు తన దూతను పంపి క్లిష్ట సమయాలలో పౌలును ధైర్యపరిచాడు.

మన ప్రతి మార్గం తన వశంలో పెట్టుకున్న దేవుడు ఏ సమయంలో మనకు ఏ సహాయం కావాలో, అది తప్పక ఇస్తాడు. ఆదరణ అవసరమైనప్పుడు ఆదరణ, గద్దింపు అవసరమైనప్పుడు గద్దింపు, హెచ్చరిక అవసరమైనప్పుడు హెచ్చరిక, జ్ఞానం కావలసినప్పుడు జ్ఞానం అనుగ్రహిస్తాడు. ప్రాణభయంతో 14 రోజులు భోజనం లేకుండ ఉన్నవారితో ఆహారం పుచ్చుకోండి అని అందరినీ బ్రతిమాలి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తిన్నాడు. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకున్నారు. ఓడలో ఉన్నవారందరూ 276 మంది. ఇక్కడ పౌలు యొక్క నాయకత్వ లక్షణాలు కనపడుతున్నాయి. క్రైస్తవ నాయకుడు అత్యంత కష్టసమయాలలో కూడ ధైర్యం, నిరీక్షణ కలిగి ఆశావాదిగా ఉండాలి. సామె. 24:10లో ఇలా ఉంది: “శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు.” దేవుని వాగ్దానాల్ని నమ్మియే శ్రమల తీవ్రతను చూడకుండ దేవుని శక్తిని దృష్టించి ధైర్యంగా ఉండేదే క్రైస్తవ నాయకత్వం. నాయకుడే అధైర్యపడితే అతన్ని అనుసరించేవారు ధైర్యంగా ఉండలేరు కదా. క్రైస్తవ నాయకత్వం నిస్వార్థమైనది. ఇతరుల క్షేమం కోరేది. ఇతరులు దిగులుగా 14 రోజులు భోజనం లేకుండా ఉన్నందుకు పౌలు వారిగురించి పట్టించుకొని వారు ధైర్యం తెచ్చుకొని ఆహారం తినేలా వారిని బ్రతిమాలాడు. ఎవరెలా పోతే నాకెందుకులే అనుకోకుండా ఇతరుల మేలుకోరిన పౌలువలె మనం కూడ ఇతరుల క్షేమం కోరాలి. నిరాశలో ఉన్న మిగిలిన 275 మంది ధైర్యం తెచ్చుకొని ఆహారం తినేలా వారికి మాదిరిగా తానే మొదట దేవుణ్ణి స్తుతించి, అందరి ఎదుట రొట్టె తిన్నాడు. అది చూసి మిగిలినవారంతా ధైర్యం తెచ్చుకొని ఆహారం తిన్నారు. సరియైన నాయకత్వం ఇతరులకు బోధించడమే కాకుండ అనుసరించి చూపిస్తుంది. శాస్త్రులు, పరిసయ్యుల వలె చెప్పడమేకాని, అలా చేయనిది సరియైన నాయకత్వం కాదు. మాదిరికరమైన జీవితమే నాయకుని అత్యంత శక్తివంతమైన ఆయుధం. అంత శ్రమలోకూడా పౌలు రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. చాలాసార్లు శ్రమల్లో దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి కారణాలేమీ లేవు అనుకుంటాం. ఇంకా సజీవులుగా ఉండి ఊపిరి పీల్చుకోగలగడమే దేవుణ్ణి స్తుతించడానికి ఒక గొప్పకారణం. శ్రమల్లో దేవుడిచ్చే ఆదరణ, నిరీక్షణ, స్నేహం, సహవాసం ఇవన్నీ స్తుతించడానికి కారణాలే. 1థెస్స. 5:16-18 చూడండి. “ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.” శ్రమల్లో దేవుని స్తుతించడం, అంతేకాదు శ్రమలనుబట్టి దేవుణ్ణి స్తుతించడం ఆత్మీయ ఎదుగుదలకు గుర్తు. పాఠకులారా! ప్రతి విషయంలో అంటే కష్టాలలో కూడ దేవునికి స్తుతిస్తున్నారా? స్తుతిలో గొప్ప విజయం ఉంది. నిరుత్సాహపడి ఏడ్వడం కంటే శ్రమల్లో దేవుని చిత్తాన్ని, ప్రేమను గుర్తించి ఆయన్ను స్తుతించడం ఎంతైనా మేలు.

ఓడ కూరుకొనిపోయి అమరం ఆ దెబ్బకు బద్దలైపోతున్నప్పుడు ఖైదీలలో ఎవడూ ఈదుకొని పారిపోకుండా వారిని చంపాలని సైనికులకు ఆలోచన పుట్టింది. కానీ, శతాధిపతి పౌలును రక్షించాలని ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగనివ్వలేదు. పౌలు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడో చూడండి. చంపబడవలసిన ఖైదీలు పౌలు వల్ల బ్రతికారు. దేవుని బిడ్డలందరూ ఈరీతిగా ఎక్కడున్నాసరే అనేకమందికి ఆశీర్వాదకరంగా, రక్షణార్థంగా ఉండాలి. వారంతా తప్పించుకుని మెలితే అనే ద్వీపం చేరుకున్నారు. అనాగరికులగు ఆ ద్వీపవాసులు వారికి చేసిన ఉపచారం ఇంతింత కాదు. అనేక సత్కారములతో వారిని మర్యాద చేసి అత్యథ్యమిచ్చారు. ఉపచారం, ఆతిథ్యం, సత్కారాలతో మర్యాద చేయడానికి నాగరికతే అవసరం లేదని అర్థమవుతుంది. హెబ్రీ. 13:1, 16 చూడండి, “ఆతిథ్యము చేయ మరవకుడి.... ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి.” వర్షం కురుస్తు చలిగా ఉన్నందున ఆ ద్వీపవాసులు నిప్పు రాజబెట్టారు. అపుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పులమీద వేసినప్పుడు ఒక సర్పము ఆ వేడికి బయటికి వచ్చి అతని చేయిపట్టినప్పుడు వారు చూసి ఖచ్చితంగా ఈ మనుష్యుడు నరహంతకుడు సముద్రమునుండి తప్పించుకున్నా సరే న్యాయమతనిని బ్రతకనివ్వదని చెప్పుకున్నారు. పౌలైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించివేసి ఏ హానీ పొందలేదు. అది చూసి వారు ఇతడొక దేవత అని చెప్పుకున్నారు. పాములను ఎత్తిపట్టుకున్నా హానినొందరని అపొస్తలులకివ్వబడిన ప్రత్యేక ఆధిక్యతలను గురించి మార్కు 16:18లో వ్రాయబడినట్లు పౌలు ప్రమాదవశాత్తు విషసర్పాన్ని ఎత్తిపట్టుకున్నప్పుడు మరణాపాయాన్నుండి తప్పింపబడ్డాడు. ఆ ద్వీపంలో పొప్లి అనే ముఖ్యుడు వారందరినీ చేర్చుకొని 3 రోజులు స్నేహభావంతో ఆతిథ్యమిచ్చాడు. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరంచేత, రక్తభేది చేత బాధపడుతుండగా పౌలు అతని దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేసి అతనిమీద చేతులుంచి స్వస్థపరిచాడు. పొప్లి వారిని చేర్చుకొని ఆతిథ్యమిచ్చినందుకు ప్రతిఫలంగా అతని తండ్రి స్వస్థపరచబడ్డాడు. తన శిష్యులకు గిన్నెడు చన్నీళ్ళు త్రాగనిచ్చినవాడు తన ఫలము పోగొట్టుకొనడని ప్రభువు చెప్పినట్టు పొప్లి తను ఇచ్చిన ఆతిథ్యానికి చక్కని ప్రతిఫలం పొందాడు. దేవుని బిడ్డల్ని చేర్చుకొని ఆతిథ్యమిచ్చి ప్రతిఫలం పొందండి.

పౌలు ప్రయాణిస్తున్న ఓడకు ఆపద రావడం, దేవుడు మేలుగా మార్చి మెలితే ద్వీపవాసులకు సువార్త అందేలా చేసాడు. దేవుడు సమస్తాన్ని మేలుగా మారుస్తాడు. కాబట్టి ప్రతిపరిస్థితుల్లో దేవుని సార్వభౌమత్వాన్ని నమ్మి దేవుడు చేయబోయే మేలు కోసం కనిపెట్టడం మంచిది. వారు రోమాకు వచ్చినప్పుడు సహోదరులు వారిని ఎదుర్కొనడానికి చాలా దూరం వచ్చారు. పౌలు వారిని చూసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకున్నాడు. శ్రమల్లో తోటి విశ్వాసుల సహవాసం ఎంతో ధైర్యాన్ని, ఓదార్పును పుట్టిస్తుంది. ఒకరి విశ్వాసము ద్వారా మరొకరును ఆదరణ పొందగలరని రోమా 1:11లో తానే అన్నట్టు తన బంధకాలలో సహోదరుల సహవాసం వల్ల పౌలు ధైర్యం తెచ్చుకున్నాడు. సహవాసాన్ని నిర్లక్ష్యపెట్టకూడదు. హెబ్రీ. 10:24, 25 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.”

పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడ ప్రత్యేకంగా ఉండుటకు సెలవు పొందాడు. యూదులలో ముఖ్యులైనవారిని పౌలు తనవద్దకు పిలిపించి ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసం ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాడు. ఏ నేరమూ చేయకపోయినప్పటికీ యేసు నామం కొరకు పౌలు గొలుసులతో బంధించబడ్డాడు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రదుకనుద్దేశించువారందరూ హింస పొందుదురని చెప్పబడినట్లు పౌలు హింసించబడ్డాడు. అయితే ప్రభువు చెప్పినట్లు 'నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు పరలోక రాజ్యము వారిది.' తన దగ్గరకు వచ్చిన యూదులకు ఉదయం నుండి సాయంకాలము వరకు పౌలు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిస్తూ మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి యేసును గురించి వివరంగా బోధిస్తూ వారిని ఒప్పించాడు. పౌలు సువార్త పరిచర్యలో ముఖ్యవిషయాన్ని మనం గమనించాలి. అతడు యూదులకు సువార్త బోధించినప్పుడు పాత నిబంధన గ్రంథంలోని క్రీస్తును గూర్చిన దృష్టాంతాలు ఎత్తి యేసే క్రీస్తని బోధించాడు. పాత నిబంధన తెలీని అన్యజనులకు సువార్త ప్రకటించినప్పుడు మాత్రం దేవుణ్ణి సృష్టికర్తగా చూపించాడు. దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకొనిన ప్రాముఖ్యమైన విధానాలు రెండు. మొదటిది సాధారణ ప్రత్యక్షత -అంటే సృష్టి ద్వారా తన నిత్యశక్తిని, దైవత్వాన్ని బయలుపరిచాడు. రెండవది విశేష ప్రత్యక్షత -అంటే బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు తన్ను తాను ఇంకా స్పష్టంగా ప్రత్యక్షపరచుకున్నాడు. వాక్యం తెలిసినవారికి వాక్యం ద్వారాను, వాక్యం తెలీని అన్యులకు సృష్టి ద్వారాను దేవుణ్ణి పౌలు చూపించాడు. మనం కూడ సువార్త ప్రకటించేటప్పుడు ఈ పద్ధతిని అనుసరించడం ఉత్తమం. పౌలు చెప్పిన సంగతులు కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. యెషయా చెప్పినట్లు ఇశ్రాయేలీయుల హృదయం క్రొవ్వినందున వారు దేవుని మాటలు, కార్యాలు కన్నులార చూచి, చెవులారా విని, మనసార గ్రహించి ఆయనవైపు తిరిగి స్వస్థత పొందలేకపోయారు. అందుకే రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడింది. పాఠకులారా! దేవుని విషయాలు చూచి, విని, గ్రహించడంలో మీ హృదయాలు చెవులు, కన్నులు ఎలా ఉన్నాయి? పౌలు రెండు సంవత్సరాలు రోమాలో తన అద్దె ఇంట కాపురముండి తన వద్దకు వచ్చేవారినందరినీ సన్మానించి ఏ ఆటంకం లేక పూర్ణధైర్యంతో దేవుని రాజ్యాన్ని గూర్చి ప్రకటిస్తూ ప్రభువైన యేసుక్రీస్తును గురించిన సంగతులు బోధించాడు. బంధకాలలో ఉన్నప్పటికీ పూర్ణధైర్యంతో దేవుని రాజ్యాన్ని గురించి ఆ రాజ్యానికి మనల్ని చేర్చే ప్రభువైన యేసుక్రీస్తును గురించి బోధించాడు. పాఠకులారా! పూర్ణధైర్యంతో క్రీస్తును ప్రకటిస్తున్నారా? పరిస్థితులకు బెదరని, శ్రమలకు లొంగని పూర్ణధైర్యాన్ని ప్రభువు మీకు అనుగ్రహించును గాక.

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.