దుర్బోధలకు జవాబు

రచయిత: కె విద్యా సాగర్
చదవడానికి పట్టే సమయం: 14 నిమిషాలు

 కొంతకాలం క్రితం TV5 అనే చానెల్ లో హైందవ క్రైస్తవ్యం అనే పుస్తకంపైన దాని రచయిత అయినటువంటి అద్దంకి రంజీత్ ఓఫీర్ గారికీ, కొందరు హిందూ స్వామీజీలకూ మధ్య "సత్యమేవ జయతే" అనేపేరుతో ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో ఓఫీర్ గారిని కొందరు హిందూమత పెద్దలు మీరు రాసిన హైందవ క్రైస్తవ్యం అనే పుస్తకంలో హిందూ మతగ్రంథాలలోని శ్లోకాలను తీసుకుని వాటిని యేసుక్రీస్తుకు ఎందుకు ఆపాదించారని ప్రశ్నించినప్పుడు, అద్దంకి రంజీత్ ఓఫీర్ గారు దానికి సమాధానంగా "యోహాను సువార్త 5:39లో" యేసుక్రీస్తు పలికిన మాటలను ఉదహరిస్తూ, తన గురించి పూర్వపు గ్రంథాలలో రాయబడ్డాయని యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడనీ, అందుకే తాను ఆ పుస్తకంలో హిందూ గ్రంథాలలోని‌ కొన్ని శ్లోకాలను ఆయనకు ఆపాదించానని నిందనంతా  యేసుక్రీస్తు మీదకు నెట్టివేసే ప్రయత్నం చేశాడు. 

ఆ మాటలను మీరు ఆయన చెప్పిన ఒక అబద్ధ ప్రవచనాన్నీ, అన్యబోధనూ ఖండిస్తూ బ్రదర్ బిబు మాట్లాడిన వీడియోలో చూడవచ్చు. "రంజీత్ ఓఫీర్ అబద్ధ ప్రవక్త-ఇదే యెహోవా వాక్కు"

సాధారణంగా ఓఫీర్ గారు తాను నవయుగ అపోస్తలుడననీ, ఈతరానికి పౌలులాంటి ప్రవక్తననీ, ఆధునిక యోసేపుననీ తనగురించి ఎన్నెన్నో చెప్పుకుంటూ ఉంటారు (అవన్నీ ఉత్తుత్తి మాటలే అని వాక్యపు అవగాహన ఉన్న అందరికీ తెలుసనుకోండి). కానీ హిందూ స్వామీజీలకు ఆయన ఇచ్చిన ఆ సమాధానం అపవాది శక్తితో, తాము చేస్తున్న దుర్బోధలను సమర్థించుకోడానికి లేఖనాలను వక్రీకరించే అబద్ధప్రవక్తల ప్రయత్నంతో 100% సరిపోయిందిగా ఉంది.

యిర్మియా 23: 36 జీవముగల మన దేవుని మాటలను, సైన్యముల కధిపతియు దేవుడునగు యెహోవా మాటలను, మీరు అపార్థముచేసితిరి.

యిర్మియా 8: 8 మేము జ్ఞానులమనియు, యెహోవా ధర్మశాస్త్రము మాయొద్దనున్న దనియు మీరేల అందురు? నిజమే గాని శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది.

అది ఎలాగో ఈ వ్యాసం పూర్తయ్యేసరికి మీకే అర్థమౌతుంది. అసలు ఓఫీర్ గారు ప్రస్తావించిన యోహాను సువార్త 5:39లో‌ యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నారో చూడండి.

యోహాను 5: 39 లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు( లేక, పరిశోధించుండి), అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చు చున్నవి.

ఈ వాక్యభాగాన్ని పైపైన చదివినా కూడా, ఆ చర్చలో ఓఫీరు గారు కేవలం తన వాదనను సమర్థించుకోడానికే దీనిని వక్రీకరించాడని, దానిద్వారా తాను చేస్తున్న దుర్బోధకు హైందవుల ముందూ, క్రైస్తవులముందూ యేసుక్రీస్తును కారకుడిగా నిలబెట్టాడని స్పష్టంగా అర్థమౌతుంది.
ఎందుకంటే;

1. ఆ మాటలను యేసుక్రీస్తు యెరుషలేములోని యూదులతో చెబుతున్నాడు; చరిత్రపరంగా కానీ, లేఖనాల పరంగా కానీ యూదులు తమ లేఖనాలుగా గుర్తించేది కేవలం మోషే ధర్మశాస్త్రం, ప్రవక్తల రచనలు, కీర్తనలను మాత్రమే. మా చర్చిలో సండే స్కూల్ పిల్లాడికి కూడా ఈ అవగాహన ఉంటుంది. తన గురించి సాక్షమిస్తున్నాయని యేసుక్రీస్తు ఏ‌ లేఖనాల గురించైతే యోహాను సువార్త 5:39లో ప్రస్తావించారో ఆ లేఖనాలు ఏమేంటో కూడా ఆయనే మరోచోట స్పష్టతను ఇచ్చాడు చూడండి.

లూకా సువార్త 24:44-47 అంతట ఆయన 'మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోనూ' నన్నుగూర్చి వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను.   అప్పుడు 'వారు లేఖనములు గ్రహించునట్లుగా' ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలోనుండి లేచుననియు  యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది.

ఈ వాక్యభాగంలో యేసుక్రీస్తు తాను యూదులదగ్గర ప్రస్తావించిన లేఖనాలు ఏమేంటో స్పష్టంగా తన శిష్యులకు‌ వివరించాడు. ఆ వివరణలో మనకు ఎక్కడా కూడా ఓఫీర్ గారు తన పుస్తకంలోనూ, ప్రసంగాలలోనూ ప్రస్తావిస్తున్న హిందూ మతగ్రంథ శ్లోకాలు కనిపించడం లేదు. యేసుక్రీస్తు ప్రభువు కానీ, మిగిలిన అపోస్తలులు కానీ లేఖనాలు అని ఎక్కడ ప్రస్తావించినా అవి పాతనిబంధనలో ఉన్న లేఖనాల గురించే తప్ప వాక్యవిరుద్ధమైన రాతలున్న ఇతర మత గ్రంథాలనుండి కాదు.

మత్తయి సువార్త 21:42 మరియు యేసు వారిని చూచిఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువువలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువ లేదా?

మత్తయి 26: 56 అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరు ఆయనను విడిచి పారిపోయిరి.

రోమీయులకు 1: 4 దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానముచేసెను.

మొదటి కొరింథీయులకు 15:3,4 నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను.

2. ఆ సందర్భంలో యేసుక్రీస్తు యూదులతో మీరు లేఖనాలలో నిత్యజీవం కలదని తలంచుచూ వాటిని పరిశోధిస్తున్నారు అంటున్నాడు. ఇంతకూ, యూదులు తరచుగా పరిశీలించే లేఖనాలు ఏంటి? మోషే ధర్మశాస్త్రం ప్రవక్తల రచనలా లేక హిందూ గ్రంథాలు కూడానా? ఈ వచనం చూడండి;

అపొస్తలుల కార్యములు 13:27 యెరూషలేములో కాపురముండువారును, వారి అధికారులును, ఆయననైనను, ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక, ఆయనకు శిక్షవిధించుటచేత ఆ వచనములను నెరవేర్చిరి.

అపొస్తలుల కార్యములు 15: 21 ఏలయనగా, సమాజమందిరములలో ప్రతి విశ్రాంతిదినమున మోషే లేఖనములు చదువుటవలన మునుపటి తరములనుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను.

అపొస్తలుల కార్యములు 17:10,11 వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.

దీనిప్రకారం యూదులు పరిశీలించేది (సమాజ మందిరాలలో చదవబడేది) ప్రవక్తల ద్వారా దేవుడు వారికి అనుగ్రహించిన లేఖనాలు మాత్రమే.   యేసుక్రీస్తును శోధిస్తున్న ఆనాటి యూదులు కొందరు వాటిని ఎంతో ఆసక్తితో చదువుతున్నప్పటికీ వాటిలో ఆయన గురించి రాయబడినవి అర్థం చేసుకోలేక ఆయనను తృణీకరిస్తున్నారు కాబట్టి యేసుక్రీస్తు వారికి సమాధానంగా మీరు చదువుతున్న లేఖనాలు నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయని చెప్పాడు.

అపోస్తలులు కూడా యేసుక్రీస్తు‌ తమ మనస్సులను తెరచి ఏ లేఖనాలలో ఐతే తనగురించి రాయబడిందని వారికి వివరించాడో (లూకా 24:45) వాటినే వివరిస్తూ సువార్తను ప్రకటించారు. దేవదర్శనం ద్వారా క్రీస్తు మర్మాన్ని తెలుసుకున్న పౌలు కూడా ఇదే చేసాడు. వారి సువార్తలలోనూ పత్రికలలోనూ యేసుక్రీస్తు గురించి రాయబడిన లేఖనాలు ఏమేంటో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. వాటిలో ఎక్కడా కూడా వారు ఇతరమత గ్రంథాల నుండి ఆయన‌ పోలికలు ప్రస్తావించినట్టు కనిపించదు.  వారు ఉటంకించిన లేఖనాలన్నీ మోషే ధర్మశాస్త్రం, ప్రవక్తల గ్రంథాలు, కీర్తనలులోనివే.

అపొస్తలుల కార్యములు 28:23 అతనికి ఒక దినము నియమించి, అతని బసలోనికి అతనియొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయమునుండి సాయంకాలమువరకు అతడు దేవుని రాజ్యమునుగూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు, మోషే ధర్మశాస్త్రములో నుండియు ప్రవక్తలలోనుండియు సంగతులెత్తి యేసునుగూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను.

అపొస్తలుల కార్యములు 26:22,23 అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటివరకు నిలిచియుంటిని;క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటివాడగుటచేత, ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలును మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమియు చెప్పక, అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని.

ఓఫీరు గారు ఏథెన్సులో పౌలు చేసినబోధను కూడా వక్రీకరించి, తనది పౌలు పంథా అని చెప్పుకుంటాడు. ఆయన అనుచరులు కూడా  పౌలు ఏవిధంగా ఐతే  కొందర్ని రక్షించడానికి అందరికీ అన్నివిధముల వంటివాడయ్యాడో మా ఓఫీరు కూడా హిందువులను రక్షించడానికి వారి మతగ్రంథాలనుండే యేసుక్రీస్తు‌ పోలికలను చూపిస్తున్నాడని సమర్థించుకుంటారు. ఈ సమర్థింపు ఎంత అడ్డకోలుగా ఉంటుందో, అసలు పౌలు ఏథెన్సులో చేసినదానికీ ఓఫీర్ చేస్తున్నదానికి ఏమైనా సంబంధముందో వివరిస్తూ నేను రెండు వ్యాసాలను రాయడం జరిగింది.

అన్యమత గ్రంథాలలో దేవుని వాక్యం రాయబడడం వాస్తవమా?

ఏథెన్సులో పౌలు చేసిన బోధ సువార్తకు అన్యమతగ్రంథాలు అవసరమనే వాదనకు ఆధారమా?

సువార్త ప్రకటించి అనేకులను రక్షించమని మనకు ఆదేశించిన ప్రభువు ఆ సువార్తను ఎలా ప్రకటించాలో కూడా లేఖనాలలో తెలియచేసాడు. దానికి భిన్నంగా వాక్యవిరుద్ధమైన సంగతులున్న ఇతర మతగ్రంథాలతో కలిపిచెరిపి చేసేది సువార్త అవ్వదు సరి కదా, లేఖనాల ప్రకారం దుర్భోధ మాత్రం ఔతుంది, అది చేసినవాడు కూడా అబద్ధ ప్రవక్త/దుర్భోధకుడు ఔతాడు.
ఇది ఓఫీర్ గారూ ఆయన అనుచరులూ బాగా గుర్తుంచుకోవాలి.

1తిమోతికి 1: 3 నేను మాసిదోనియకు వెళ్లుచుండగా సత్యమునకు "భిన్నమైన బోధ చేయవద్దనియు"

తీతుకు 2: 8 నీ ఉపదేశము మోసములేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను.

ఒకవేళ ఎవరైనా భిన్నమైన బోధను చేసినప్పుడు అతనికి వేలమంది ఆకర్షితులై అతని సంఘంలో కొనసాగుతున్నప్పటికీ వారంతా రక్షించబడిపోయినట్టు కాదు.

రెండవ తిమోతికి 4:3,4 ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,
సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును.

దానికి మంచి ఉదాహరణగా ఓఫీరు గారి అనుచరులనే తీసుకుందాం. ఓఫీర్ గారి అనుచరులు ఓఫీర్ గారికి ప్రాధాన్యతను ఇస్తారా లేక వాక్యానికా? పైన మనం చూసిన వివరణలో‌ ఓఫీర్ గారు చెప్పింది‌ తప్పని వాక్యప్రకారం రుజువైంది ఇది వారు ఒప్పుకుంటారా? నిజంగా రక్షించబడినవారైతే ఒప్పుకుని తీరాలి మరి. అదేవిధంగా ఓఫీరు గారి అనుచరులకు బైబిల్ మాత్రమే దేవుని‌ వాక్యమా లేక ఇతర మతగ్రంథాలతో కలపి‌ బైబిల్ కూడా దేవుని వాక్యమా? రక్షించబడినవారికి బైబిల్ మాత్రమే దేవుని వాక్యం‌ మరి.

రోమీయులకు 3: 2 ప్రతివిషయమందును అధికమే. మొదటిది, దేవోక్తులు (పాతనిబంధన కాలంలో) యూదుల పరము చేయబడెను.

దీనిప్రకారం ఓఫీర్ గారు ఇతరమత గ్రంథాలు కూడా దేవుని‌వాక్యమే అని చేసిన దుర్బోధను వారు ఖండిస్తారా?

ఇ‌ంతవరకూ మనం చూసిన లేఖన ఆధారాలను బట్టి (A) అయితే ఓఫీరు గారు యేసుక్రీస్తు పలికిన మాటలను అపార్థం చేసుకుని దానిని హిందూ మత గ్రంథాలకు ఆపాదించి తన పుస్తకంలో రాసాడని (బోధిస్తున్నాడని) అనుకోవాలి. అదే నిజమైతే ఓఫీరు గారు తనగురించి చెప్పుకుంటున్నట్టు ఆయన ప్రవక్తా కాదు, వాక్యపు అవగాహన ఉన్న బోధకుడు కూడా కాదు ఎందుకంటే ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేనివాడు అవి అయ్యే అవకాశం లేదుగా.

(B) పోని ఓఫీరు గారికి యేసుక్రీస్తు ఆ మాటలు పలికింది యూదులకోసమే అని తెలిసినప్పటికీ కేవలం అక్కడ చర్చలో వారి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికే అలా చెప్పాడని అనుకుంటే, తాను చేస్తున్న కలిపిచెరిపే బోధకు యేసుక్రీస్తును కారణం చేసి అన్యమతస్తుల చేత ఆయన నిందించబడేలా చేసివాడు ప్రవక్త ఎలా ఔతాడు? వాక్యాన్ని తన వాదనకు అనుకూలంగా వక్రీకరించేవాడు సత్య బోధకుడు ఎలా ఔతాడు?.

2పేతురు 2: 2 మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును.

2పేతురు 3: 16 వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, "తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు".

కాబట్టి ఏవిధంగా చూసినా కూడా ఓఫీరు గారు ప్రవక్తా కాదు సత్య బోధకుడు కూడా కాదు. అవి కాకపోయినా పర్లేదు కేవలం ఒక విశ్వాసి అనుకుందాంలే అంటే, మనకు ఆ అవకాశం కూడా లేదు ఎందుకంటే  లేఖనాలను ఇలా తమ వాదనకు అనుకూలంగా (ఉద్దేశపూర్వకంగా) వక్రీకరించి అందులో లేని భావాన్ని చొప్పించి ప్రకటించేవాడు సాతానుడు/అబద్ధ ప్రవక్త, నాశనానికి పాత్రుడు అని వాక్యం చెబుతుంది. యేసుక్రీస్తును శోధించినప్పుడు సాతాను అలానే వాక్యాన్ని వక్రీకరించాడు. అబద్ధ ప్రవక్తలు, దుర్బోధకులు కూడా అదే చేస్తున్నారు. ఇంతకూ రంజీత్ ఓఫీరు గారు ఎవరో ఇది చదివినవారే నిర్ణయించుకోవాలి.

చివరిగా మరోమాట, కొంచెం సేపు వాదనకోసం మనం చూసిన వివరణ అంతా పక్కనపెట్టి ఓఫీరు గారు  చెబుతున్నట్టుగా యేసుక్రీస్తు నా గురించి రాయబడ్డాయని చెప్పిన లేఖనాలలో హిందూ గ్రంథాలు కూడా ఉన్నాయి అనుకుందాం. అయితే, అక్కడ కూడా మరో సమస్య  తలెత్తుతుంది. అదేంటంటే, ప్రస్తుతం హిందూ మతగ్రంథాలపై, అవి రాయబడిన బాషపై పరిశీలన చేసిన కొందరి వాదనప్రకారం వాటిలో ఒకటి కూడా క్రీస్తుకు పూర్వంలో రాయబడలేదు. ఆ గ్రంథాలన్నీ కేవలం క్రీస్తు శకంలోనే అది కూడా 100 సంవత్సరాల తర్వాతనే రాయబడ్డాయట. ఈ వాదన నిజమే అనేందుకు ఆ గ్రంథాలలో రాయబడిన కొన్ని సంఘటనలను కూడా వారు సాక్ష్యంగా చూపిస్తున్నారు. హిందూ మతపెద్దలు వారి గ్రంథాలు లక్షల యేళ్ళక్రితం రాయబడ్డాయని పైపై మాటలు చెప్పినంత మాత్రాన సరిపోదు కదా! వాటికి ఆధారాలు చూపించాలి.

కాబట్టి, ఆధారాలతో కూడిన ఆ వాదన ప్రకారం క్రీస్తు జీవించే కాలానికి అసలు హిందూ మతగ్రంథాలే రాయబడనప్పుడు అవి నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయని యేసుక్రీస్తు ఎలా చెప్పాడో దానికి కూడా ఓఫీరు గారు వివరణ ఇచ్చి హిందూ మతగ్రంథాలు క్రీస్తు పూర్వమే ఉనికిలో ఉన్నాయని ఆధారాలు చూపించాలి (ఓఫీర్ గారికి హిందూ గ్రంథాలపై ఎంత తీవ్రమైన  శ్రద్ధ ఉంటుందో చాలామందికి తెలుసు).

ఇది చదివిన ఓఫీర్ గారి భక్తులు విషయం పైన మాట్లాడకుండా ఆయన్ని విమర్శించడానికి నువ్వెవరు, నువ్వు ఎంతమందిని రక్షించావు ఇలాంటి అప్రస్తుతపు విమర్శలు చేస్తారని నాకు తెలుసు వారికి కూడా సమాధానంగా ఒక వ్యాసాన్ని రాసాను అది కూడా చదివి అందులో నేను సమాధానం ఇవ్వని విమర్శలు ఏమైన ఉంటే అప్పుడు మాట్లాడండి.

1యోహాను 4: 1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.

ప్రకటన గ్రంథం 20: 10 వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు.

దుర్భోధకులను ఏమడిగినా ఇవే అభ్యంతరాలు

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.