రక్షణ

రచయిత: పి. శ్రావణ్ కుమార్
చదవడానికి పట్టే సమయం: 19 నిమిషాలు
ఆడియో

Article Release long works salvation min

విషయసూచిక

 1. 1) మానవుడు పాపంలో పూర్తిగా చనిపోయాడు
 2. 2) మానవుడు తన రక్షణను సంపాదించుకోలేడు
 3. 3) దేవుడే రక్షణను అనుగ్రహించువాడు
 4. a) ప్రకటించేవారిని పంపడం)

  b) ఆ మాటలను గ్రహించడానికి హృదయాన్ని తెరవడం

  c) రక్షణకు మూలమైన విశ్వాసాన్ని వరంగా అనుగ్రహించడం

  d) జీవార్థమైన మారుమనస్సు/పశ్చాత్తాపం అనుగ్రహించడం

  e) మనకు కావలసిన సమస్తాన్ని దేవుని గురించిన అనుభవజ్ఞానము ద్వారా అనుగ్రహించడం

 5. 4) నూతన జీవితం & మంచి పనుల మధ్య సంబంధం
 6. a) దేవుని కోణం

  b) మానవుని బాధ్యత

 7. 5) మన రక్షణకు మార్గంగా బైబిల్ మంచి పనులను చూపిస్తుందా

మనకు కలిగిన రక్షణకు మరియు బైబిల్ ఆజ్ఞాపిస్తున్న మంచి పనులకు మధ్య ఉన్న సంబంధం ఏంటి ఎన్ని పరిశీలిద్దాం. ఈ పరిశీలనను నేను 5 విభాగాలుగా విభజించాను. ఇక్కడ ప్రస్తావించబడిన సంగతులన్నీ మీరు చదివిన తరువాత, రక్షణకు మరియు మంచి పనులకు మధ్య ఉన్న సరైన (వాక్యానుసారమైన) సంబంధాన్ని గ్రహిస్తారు అని భావిస్తున్నాను.

1) మానవుడు పాపంలో పూర్తిగా చనిపోయాడు

మానవుడు పాపంలో పూర్తిగా చనిపోయాడు. మానవుడు పాపి అని, 'పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను' అనేది బైబిల్ బోధిస్తున్న సత్యం. ఇందుకు భిన్నంగా, అనేకులు మానవుడు పుట్టుకతో మంచివాడు అని, జన్మపాపం అనేది లేదని ఉన్నప్పటికీ, మానవుడు పూర్తిగా చనిపోలేదు అని బోధిస్తుంటారు.

మరి సత్యమేంటి? నిజంగా మానవుడు పాపంలో చనిపోయాడా? లేక పాపం తనలో ఉన్నపటికీ, ఇంకా ఎంతో కొంత బ్రతికే ఉన్నాడా?

“ నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు (evil) యెహోవా చూచి" ఆది 6:5

ఈ వచనంలో రెండు పదాలను గమనించండి - "ఎల్లప్పుడు/Always", "ఊహ అంతయు/every intention."

ఇక్కడ దేవుడు ఏమి చెప్తున్నాడు? మానవుని ఊహ కొంత చెడ్డది అంటున్నాడా? లేక అంతా చెడ్డది అంటున్నాడా? అదేవిధంగా, ఈ చెడుతనము, కొంతకాలమే ఉంటుంది అంటున్నాడా లేక ఎల్లప్పుడూ ఇలానే ఉంది అంటున్నాడా? దీనిని బట్టి మానవుని స్థితి ఏంటో మనకు అర్థం అవుతుంది, మానవుడు కొంచెం మంచివాడు కొంచెం చెడ్డవాడు కాదు. కొంచెం నీతిమంతుడు, కొంచెం అవినీతిపరుడు కాదు, వాడు సంపూర్ణంగా చెడ్డవాడు, దుష్టత్వాన్ని ప్రేమించేవాడు, దుష్టహృదయాన్ని/పాపపు హృదయాన్ని కలిగి ఉన్నవాడు.

అయితే మీరు ఒక ప్రశ్న అడగొచ్చు, ఈ మాట చెప్పింది నోవహు కాలంలో ఉన్నవారి గురించే కదా, మరి ఇది అందరికీ ఎలా వర్తిస్తుంది అని? అందుకే బైబిల్ అందరి గురించి ఎలాంటి మాటలను చెప్తుందో చూద్దాం:

“ నరుల హృదయము చెడుతనముతో నిండియున్నది" ప్రసంగి 9:3

“ వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవునివలన కలుగు జీవములో నుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు" ఎఫెసీ 4:18

“ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు; వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడియున్నవి" తీతుకు 1:15

“ మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను" రోమా 1:28

ఇక్కడ మనకు ఏమి అర్థం అవుతుంది?

మనిషి "చెడుతనముతో నిండిపోయినవాడు" అని సొలొమోను చెప్తున్నాడు; "అంధకారమైన మనస్సు", "అపవిత్రమైన మనసాక్షి", "వ్యర్థ మనస్సు(hardness of heart)","భ్రష్ట మనస్సు" కలిగినవాడు అని పౌలు చెప్తున్నాడు.

యేసు ఇలా చెప్పాడు, “నన్ను సత్పురుషుడని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు.” (యేసుక్రీస్తుని ఈ విధంగా సంబోధించిన వ్యక్తి ఆయనను దేవుడుగా గ్రహించి 'సద్బోధకుడు' అని ప్రస్తావించి ఉండొచ్చు; లేక మానవరీతిగా యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్ఠుడని గ్రహించి అలా ప్రస్తావించి ఉండొచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభువు, దేవుడు మాత్రమే సత్పురుషుడని స్పష్టంగా తెలియజేశారు.)

చాలా స్పష్టంగా, మంచివారు అనేవారు ఎవరూ లేరు అని ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, దేవుడు ఒక్కడే మంచివాడు (యేసు క్రీస్తు దేవుడు), మానవులు అందరు చెడుతనమును జరిగించువారే. దేవుడు మానవుల పాపాన్ని బట్టి దుష్టత్వాన్ని బట్టి, నోవహు సమయంలో అందరినీ నాశనం చేసిన తర్వాత, ఈ విధంగా చెప్తున్నాడు -

“ ఇక మీదట నరులనుబట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది" ఆది 8:21

ఇక్కడ దేవుడు చెప్తున్న మాట "నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది."

నోవహు సమయం తర్వాత మనుషులు మంచివాళ్ళు అయిపోలేదు (ఆ సమయానికి ముందు మంచివారిగా లేరు) అన్ని సమయాలలో, మానవుడు సంపూర్ణంగా పతనమైన స్థితిలో, పాపానికి బానిసగా, పాపాన్ని మాత్రమే చేయగలిగేవాడిగా ఉన్నాడు.

2) మానవుడు తన రక్షణను సంపాదించుకోలేడు

ఇలా దుష్టునిగా, పాపిగా, హృదయకాఠిన్యము మరియు భ్రష్టమనస్సు కలిగినవాడిగా ఉన్న మానవుడు, దేవుని ముందు మంచివాడిగా ఎలా నిలబడగలడు? ఇది మానవ శక్తికీ, మానవ ప్రయత్నానికీ అందుబాటులో ఉన్న పనేనా?

“ కూషుదేశస్ధుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగినయెడల కీడుచేయుటకు అలవాటుపడిన మీరును మేలుచేయ వల్లపడును" యిర్మీయా 13:23

“ పూర్వికులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును" (“ As the proverb of the ancients says, ‘Out of the wicked comes wickedness") - 1 సమూయేలు 24:13

“ ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు" రోమా 8:7,8

మానవుడు దేవుని ముందు మంచివాడిగా కనబడగలడా? దీనికి బైబిల్ స్పష్టంగా, ఇది అసాధ్యం అని చెప్తుంది.

కూషుదేశస్ధుడు తన చర్మాన్ని మార్చుకోలేడు, చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేదు, పాపి తన పాపస్వభావాన్ని మార్చుకోలేడు. దుష్టులు, దుష్టత్వము మాత్రమే చేయగలరు, శరీరానుసారులు శరీరరీతిగా మాత్రమే ప్రవర్తించగలరు.

ఇది చాలా స్పష్టంగా మానవుడు తన స్వభావాన్ని మార్చుకోలేడు అనే సూత్రాన్ని మనకు తెలియజేస్తుంది. మానవుడు పాపి, తన పాప స్వభావాన్ని తాను మార్చుకోలేడు, శరీరాన్ని విడిచి ఆత్మానుసారంగా తన ప్రయత్నాన్ని బట్టి నడుచుకోలేడు.

అయితే మానవుడు ఏమీ చేయలేడా? చేయగలిగిన ప్రయత్నం కూడా ఏమీ లేదా? అని మీరు నన్ను అడగొచ్చు. బైబిల్ చెప్తున్న సత్యాన్ని మీకు మరొకసారి తెలియజేస్తాను. -

“ భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు" సామెతలు 15:8

“ నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తర మిచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును" సామెతలు 15:28

“ భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును" సామెతలు 15:29

“ అహంకారదృష్టియు గర్వహృదయమును భక్తిహీనులక్షేమమును పాపయుక్తములు" సామెతలు 24:4

భక్తిహీనులు ఎంటువంటి క్రియలు చేసినా, అవి దేవుని ముందు మురికిగుడ్డలులాంటివే అని ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. భక్తిహీనుల క్షేమము కూడా పాపయుక్తమైనదే అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంతే కాదు, భక్తిహీనుల మార్గము (వారి ఆలోచన విధానం మరియు జీవన శైలి), వారు అర్పించే బలులు, వారి నోటి మాటలు, మరియు వారి ప్రార్థన సహితము దేవునికి అయిష్టమైనవని, యెహోవా దృష్టికి హేయమైనవి అని చెప్పబడింది. అంటే తన సహజస్థితిలో (శరీర స్వభావంలో/పాపస్వభావంలో) ఉన్న మానవుడు దేవుని దృష్టిలో నీతిమంతుడు అని అంగీకరించబడాలి అంటే, దేవుని కృప మరియు విశ్వాసం అనే ఆయన బహుమానం లేకుండా ఏమీ చేయలేడు. మానవుడు తన ప్రయత్నాన్ని బట్టి రక్షణను సంపాదించుకోలేడు.

మరొక మాటని అర్థం చేసుకుందాం:

“ కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావముగలవారు కారు" రోమా 8:8

“ విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము" హెబ్రీ 11:6

శరీరస్వభావము గలవారు అంటే, దేవుని ఆత్మ లేనివారు అని అర్థం. ఆత్మ స్వభావము, శరీర స్వభావానికి వేరుగా ఉంటుంది అని ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, శరీరస్వభావం గలవారు దేవునిని సంతోషపరచలేరు, ఆత్మస్వభావం గలవారు మాత్రమే దేవునిని సంతోషపరచగలరు, మరియు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులుగా ఉండలేరు.

దీనిని బట్టి, విశ్వాసం అనేది ఆత్మస్వభావం గలవారికి మాత్రమే ఉంటుంది అని, పాపపు స్థితిలో ఉన్న ఏ మనిషికీ విశ్వాసం స్వతహాగా పుట్టదని, దేవుని ఆత్మ ప్రమేయం వలెనే విశ్వాసం కలుగుతుంది అని మనకు తెలుస్తుంది.

కనుక ఏ మనిషీ తన రక్షణను సంపాదించుకోలేడు.

3) దేవుడే రక్షణను అనుగ్రహించువాడు

'నేనే రక్షణకర్తను' అని దేవుడే స్వయంగా చెప్పుకున్నాడు.

“ నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించినవాడను నేనే రక్షించినవాడను నేనే దాని గ్రహింపజేసినవాడను నేనే." యెషయా 43:11,12

దేవుడు తప్ప వేరొక రక్షణకర్త లేడు. ఈ సందర్భంలో దేవుడు ఇశ్రాయేలీయులతో, తమను ఐగుప్తు నుండి విడిపించిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఐగుప్తు నుండి తమను తాము విడిపించుకోవడానికి వారు చేయగలిగింది ఏమీ లేదు, దాదాపు 400 సంవత్సరాలు  అలా బానిసత్వంలోనే ఉన్నారు, వారు చేసింది తమను విడిపించమని దేవునికి మొరపెట్టుకోవడమే. ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను విడిపించిన దేవుడే నిజమైన రక్షణకర్త, తన బలమైన హస్తంతో వారిని విడిపించాడు.

శరీర సంబంధమైన విడుదల, అనగా ఐగుప్తు చెర నుండి విమోచన అనేది తమ సొంతంగా పోరాడి పొందుకోలేదు, మరి ఆత్మసంబంధమైన విడుదల, అనగా సాతాను చెర నుండి మానవుడు తనని తాను ఎలా కాపాడుకోగలడు? దేవుడు తన బలమైన హస్తంతో సాతాను చెరలో ఉన్నవారిని లాగకపోతే, వారు ఎప్పటికి అక్కడే ఉండిపోతారు.

ఈ రక్షణకర్త అయిన దేవుడు రక్షణను ఎలా అనుగ్రహిస్తాడో చూద్దాం:

      a) ప్రకటించేవారిని పంపడం

“ వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు?”" రోమా 10:14,15

దేవుడు తన సువార్తను ప్రకటించేవారిని పంపుతున్నాడు. సువార్త వినకుండా ఎవరూ రక్షణ పొందలేరు, తెలియనివానిని (యేసును గురించి వినకుండా) ఎవరూ విశ్వసించలేరు.

      b) ఆ మాటలను గ్రహించడానికి హృదయాన్ని తెరవడం

“ అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను”" అపొ. కార్య 16:14

పౌలు మాటలను గ్రహించటానికి లూదియ కన్నులు తెరిచినట్టు, దేవుడు తాను ఎన్నుకున్నవారి హృదయాన్ని తెరిచి, వారికి ప్రకటించబడే వాక్యాన్ని/సువార్తను గ్రహించడానికి ప్రేరేపిస్తాడు.

      c) రక్షణకు మూలమైన విశ్వాసాన్ని వరంగా అనుగ్రహించడం

“ మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు” ఎఫెసీ 2:8,9

ఇక్కడ, పౌలు రక్షణ గురించి మాట్లాడుతూ, ఇది క్రియల వలన కలిగినది కాదు అని చెప్తున్నాడు. రక్షణ క్రియల వలన కలగకపోతే, రక్షణకు మూలమైన విశ్వాసం కూడా క్రియ కాదు అని మనం గ్రహించాలి. రక్షణ దేవుడు అనుగ్రహించిన బహుమానం అయితే, రక్షణకు మూలమైన విశ్వాసం కూడా బహుమానమే. అంటే, సువార్త వినిపించిన దేవుడు, ఆ సువార్తను గ్రహించడానికి మన హృదయాన్ని తెరిచి, ఆ సువార్త సత్యం ద్వారా యేసు క్రీస్తునందు విశ్వాసాన్ని బహుమానంగా అనుగ్రహించాడు.

      d) జీవార్థమైన మారుమనస్సు/పశ్చాత్తాపం అనుగ్రహించడం

“ వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారుమనస్సు దయచేసి యున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.”" అపొ. కార్య 11:18

“ సత్యవిషయమైన అనుభవజ్ఞానము వారికి కలుగుటకై, దేవుడొకవేళ ఎదురాడువారికి మారుమనస్సు దయచేయును………”" 2 తిమోతి 2:24

“ ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటివారితో నేను చేయబోవు నిబంధన యేదనగా,వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయములమీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునైయుందును వారు నాకు ప్రజలైయుందురు”" హెబ్రీ 8:10

ఈ వచనాలను బట్టి చాల స్పష్టంగా, హృదయాన్ని మార్చేది దేవుడని, పశ్చాత్తాపంలోకి నడిపించేది దేవుడని, జీవార్థమైన మారుమనస్సు అనుగ్రహించేది దేవుడే అని తెలుసుకుంటున్నాం.

      e) మనకు కావలసిన సమస్తాన్ని దేవుని గురించిన అనుభవజ్ఞానము ద్వారా అనుగ్రహించడం

“ తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున….”" 2 పేతురు 1:2

దేవుడు మనకు అవసరమైనవన్నీ అనుగ్రహిస్తున్నాడు అని చెబుతూ, 'జీవమునుకు మరియు భక్తికి', అంటున్నాడు. భక్తి విషయమై దేవుడు సమస్తాన్ని ఆయన ప్రజలకు అనుగ్రహిస్తున్నాడు. అందుకే పేతురు తర్వాత మాటల్లో వాగ్దానాల గురించి మాట్లాడుతూ, "దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను (v4)" అని అంటున్నాడు. రక్షణ పొందుకున్న తర్వాత మనల్ని పరిశుద్ధపరిచేది కూడా దేవుడే.

4) నూతన జీవితం & మంచి పనుల మధ్య సంబంధం

ఈ రెంటి మధ్య ఉన్న సంబంధాన్ని మనం రెండు కోణాలలో అర్థం చేసుకోవచ్చు.

      a) దేవుని కోణం

దేవుడు తన ప్రజలను, తాను సిద్ధపరచిన మంచి క్రియలలో నడిచే కృపను అనుగ్రహిస్తాడు. వారు కచ్చితంగా, ఆ క్రియలలో పాలిభాగస్తులుగా ఉండేలాగున దేవుడు వారిని (తన ప్రజలను) పురికొల్పుతాడు. దీన్ని బట్టి నిజమైన విశ్వాసులు, దేవుడు సిద్ధపరచిన మంచిక్రియలో పాలివారు అవ్వకపోవడం అనేది అసంభవం.

“ ముదటి దినమునుండి ఇదివరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై యుండుట చూచి, మీలో ఈ సత్‌ క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను”" ఫిలిప్పీ 1:3,4

అందుకే పౌలు “మీలో ఈ సత్‌ క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను” అని చెప్తున్నాడు.

      b) మానవుని బాధ్యత

రక్షణ విషయంలో మొత్తం దేవుడే చేస్తే నేను చేసేది ఏమి లేదా అని మీరు నన్నడగొచ్చు. బైబిల్ లో మనం విశ్వసించాలి అని లేదా? మనమే పశ్చాత్తాపపడాలని లేదా? ఇవన్నీ దేవుడు మనలని చేయమని ఆజ్ఞాపిస్తుంటే, మీరేంటి బ్రదర్, అవన్నీ దేవుడే చేస్తాడు అంటున్నారు?

ఇక్కడ మనం విశ్వసించట్లేదు అని నేను చెప్పట్లేదు, మనం పశ్చాత్తాపపడట్లేదు అని నేను చెప్పట్లేదు. విశ్వసించేది మనమే, మన సొంత ఇష్టంతోనే విశ్వసిస్తున్నాం, పశ్చాత్తాపపడేది మనమే, మన స్థితిని చూసి, మన పాపాన్ని గ్రహించి, పశ్చాత్తాపపడుతున్నాం.

ఇక్కడ నేను తెలియజేస్తున్న ముఖ్యమైన విషయం ఏంటి అంటే, దేవుని ప్రమేయం లేకుండా, దేవుడు మొదటి అడుగు వేయకుండా, దేవుడు మొదట మనలని ప్రేమించకుండా, మనం వీటిని అన్నిటిని చేయడం వీలుపడదు. రక్షణ విషయంలో మొదటి అడుగు వేసేది దేవుడే. నూతన హృదయాన్ని ఇచ్చేది దేవుడే, గ్రహింపు అనుగ్రహించేది దేవుడే, వీటికి మనం స్పందిస్తున్నాం, సత్యాన్ని తెలుసుకొని విశ్వసిస్తున్నాం, పశ్చాత్తాపపడుతున్నాం, అయితే వీటన్నిటికీ మూలం దేవుడే, మనం కాదు.

నూతన జీవితం/రక్షణ దేవుడు అనుగ్రహించిన తర్వాత, మనకొరకు దేవుడు ముందుగా సిద్ధపరచిన మార్గంలో మనం నడవాలి. అంటే యేసుక్రీస్తును పోలి నడుచుకోవాలి.

“ మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసు నందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.”" ఎఫెసీ 2:8-10

మనం రక్షించబడ్డాం గనుక (అంటే దేవుని దృష్టిలో నీతిమంతులం అయ్యాం గనుక), దేవుడు మనకోసం సిద్ధపరచిన సత్‌క్రియలు చేయటానికి సిద్ధంగా ఉండాలి.

“ ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను”" తీతుకు 2:14

ఇక్కడ మనం గమనిస్తే "సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని " అని చూస్తున్నాం. అంటే దేవుడు రక్షించుకున్నవారికి, దేవుడు చేయమన్న సత్రక్రియల విషయంలో ఆసక్తి ఉంటుంది.

ఒక చిన్న ఉదాహరణ చెప్తాను:

ఒక వ్యక్తి PG చేసాడు అనుకుందాం. అతను ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తే, ఆఫీస్ వాళ్ళు నువ్వు PG చేసావా? అని అడిగితే, చేశాను అని ఆ వ్యక్తి సమాధానం చెప్తాడు, అయితే అతను నిజంగా PG చదివాడా లేదా అని తెలుసుకోవాలంటే ఏమి చేయాలి? తన సర్టిఫికెట్ ను పరిశీలించాలి.

ఒక వ్యక్తి తన నోటితో చెప్పే మాటల యొక్క నిరూపణ (PG చదివాడు లేదా) తాను చూపించే ఆధారం మీద ఆధారపడి ఉంటుంది. ఒక వేళ నేను PG చదివాను అనే సర్టిఫికెట్ చూపించకపోతే, నేను PG చదివినట్టేనా (పాస్ అయినట్టేనా)?

అదే విధంగా యేసు ప్రభుని నమ్మాము, విశ్వసించాము అని చెప్పుకునే వారు, నిజం చెప్తున్నారు లేదా అబద్ధం చెప్తున్నారు అని నిర్ధారించడానికి రుజువు కావాలి కదా? లేకపోతే ఎవరు నిజ విశ్వాసులో, ఎవరు అబద్ధ విశ్వాసులో ఎలా తెలుస్తుంది. అందుకే దేవుని చేత నేను రక్షించబడ్డాను, ఆయనను విశ్వసించాను అని చెప్పుకునేవారు, దేవుడు చేయమన్న పనులను చేసినప్పుడు, అది వారి రక్షణను నిర్ధారించే ఆధారంగా ఉంటుంది.

నువ్వు నీ సహోదరులను ప్రేమించవు, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయవు, దేవునికి ప్రార్థించవు, వాక్యాన్ని నేర్చుకోవు, సువార్త ప్రకటించవు, పాపంతో పోరాడవు...... ఈ లక్షణాలు నీలో కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పుడు, దేవుని సంతోషపరిచేలా ఈ విషయాలలో ఎదగాలి అనే ఆసక్తి నీలో కనబడనప్పుడు, నేను యేసుక్రీస్తును నమ్ముతున్నాను అని నువ్వు చెప్తే అది నిజమా? అబద్ధమా?

5) మన రక్షణకు మార్గంగా బైబిల్ మంచి పనులను చూపిస్తుందా

ఇక్కడ కొన్ని వచనాలను పరిశీలిద్దాం:

“ కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసమువలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము”" రోమా 3:28

“ మనుష్యుడు విశ్వాసమూలమున మాత్రముకాక క్రియల మూలమునను నీతిమంతుడని యెంచబడునని, మీరు దీనివలన గ్రహించితిరి”" యాకోబు 2:24

“ ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును”" యాకోబు 2:17

అబ్రాహాము విశ్వాసమూలంగా నీతిమంతుడు అయ్యాడు అని పౌలు చెప్తున్నాడు, యాకోబు "మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియలవలన నీతిమంతుడని తీర్పు పొందలేదా?" అని చెప్తున్నాడు.

ఇక్కడ మనం చూస్తుంది వైరుధ్యంగా అనిపించొచ్చు కానీ అవి నిజానికి వైరుధ్యాలు కావు.

పౌలు పత్రికలు అందుకున్నవారు ఎక్కువమట్టుకు ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు అవుతారు అనే వాదనను వింటున్నారు గనుక, నిజమైన రక్షణ విశ్వాసం ద్వారానే వస్తుంది, ధర్మశాస్త్రము మరియు క్రియల ద్వారా కాదు అని చెప్పాడు. అంతే గాని, విశ్వసించాము అని చెప్పుకొని దేవుడు కోరుకునే క్రియలు వారి జీవితంలో కనపడకపోయినా పర్లేదు అని చెప్పట్లేదు.

అదేవిధంగా యాకోబు పత్రికని అందుకున్నవారు, విశ్వాసముంటే సరిపోతుంది క్రియలు అవసరం లేదు అనే భావంలో ఉన్నారు గనుక, నిజమైన రక్షణ, విశ్వాసమూలమైనదై, క్రియల ద్వారా రుజువు పరచుకుంటుంది అని చెప్పాడు.

అందుకే యాకోబు ఇలా అన్నాడు:

“ మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠముమీద అర్పించినప్పుడు అతడు క్రియలవలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసెననియు, క్రియలమూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావుగదా? కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరుకలిగెను”" యాకోబు 2:21-23

“ యేసుక్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుటయందేమియు లేదు, పొందకపోవుటయందేమియు లేదు గాని ప్రేమవలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును”" గలతీ 5:6

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.