దుర్బోధలకు జవాబు

రచయిత: కె. విద్యా సాగర్
చదవడానికి పట్టే సమయం: 16 నిమిషాలు

Article Release lion long 2 min

పీడీ సుందరరావు - తెలుగు క్రైస్తవులలో ఈయన పేరు తెలియనివారు చాలా అరుదు. ఈయన BOUI అనే ఒక సంస్థను స్థాపించి సార్వత్రిక క్రైస్తవసంఘం ప్రాముఖ్యమైన విశ్వాస పునాదులుగా నమ్మే లేఖనాధారమైన సిద్ధాంతాలను విస్మరిస్తూ, బైబిల్ రాయబడిన మూలభాషలను కానీ, సంఘచరిత్రను కానీ, లేఖనాలను సందర్భానుసారంగా అర్థం చేసుకునే పద్ధతిని కానీ ఏమాత్రం అనుసరించకుండా తనకున్న స్వంత జ్ఞానంతో ఎన్నో దుర్బోధలను ఆ సంస్థ ద్వారా వ్యాపింపచేసి, తనకున్న వాక్చాతుర్యంతో గొప్ప బోధకుడిగా పేరు సంపాదించాడు. ప్రస్తుతకాలంలో ఈయనగారి బోధలు తెలుగు భాషలోనే కాకుండా భారతదేశంలోని కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా వారివారి స్వంతభాషల్లో విస్తరిస్తూ క్రైస్తవ సంఘానికి ఒకపెద్ద ప్రమాదంగా మారాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఈయన చర్చలపేరుతో లోకంలో పేరు ఘడించిన శాస్త్రవేత్తలకూ, నాస్తికులకూ లెటర్లు రాసి ఈయనకున్న academical status బట్టి వారు ఎలాగూ ఈయనతో చర్చలో పాల్గోరు కాబట్టి వారందరినీ ఓడించేసానని ప్రగల్భాలు పలుకుతూ లోకజ్ఞానం‌ పైన కూడా సరైన అవగాహన లేని అమాయకుల దృష్టిలో మహాజ్ఞానిగా కొలువుదీరాడు. చివరికి సార్వత్రిక క్రైస్తవ సంఘానికి తానే రథసారథినని తన అనుచరుల చేత బిరుదును కూడా పొందుకున్నాడు (ఒకవిధంగా చెప్పాలంటే Pope గారి టైప్).

ఇప్పటికే ఈయన చేస్తున్న కొన్ని దుర్బోధలను మేము లేఖనాధారాలతో ఖండిస్తూ మూడు వ్యాసాలను ప్రచురించడం జరిగింది. ఇకపై కూడా ఈయన 'జయశాలి సింహగర్జన' అనే పేరుతో ప్రచురించిన పుస్తకంలోని వాక్యవిరుద్ధమైన దుర్బోధలను వీలైనంతమట్టుకు బహిర్గతం చేసి సంఘానికి ఆ ప్రమాదకరమైన బోధలపట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వ్యాసాలను భాగాలుగా రాయడం జరుగుతుంది. కాబట్టి పీడీ సుందరరావుగారి శిష్యసమూహంలో ఎవరైనా సత్యసంబంధులు ఉన్నట్లైతే, వ్యక్తివైపు కాకుండా వాక్యంవైపు చూసి, నేను చెబుతుంది వాక్యానుసారంగా ఉందో, వారి గురువుగారు చెబుతుంది వాక్యానుసారంగా ఉందో పరిశీలించి సత్యాన్ని గ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను.

జయశాలి సింహగర్జనలోని వాక్యవిరుద్ధమైన బోధలను పరిశీలించడానికంటే ముందుగా, ఆయన ఆ పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, ఆ పుస్తకం మహాజ్ఞాన గ్రంథంగా గొప్పలు చాటించడానికి చేసినటువంటి కొన్ని అబద్ధపు చర్యలను వివరించే ప్రయత్నం చేస్తాను. దీనికి ఆధారంగా ఆయన పుస్తకం ప్రారంభంలో కొందరికి రాసినట్టుగా ప్రస్తావించిన లెటర్లనే ఆధారంగా తీసుకుంటున్నాను. ఈ లెటర్లలో చాలామట్టుకు మన పీడీ సుందరరావుగారు NASA శాస్త్రవేత్తలకూ, దేశాధ్యక్షులకూ రాసినట్టుగా కనిపిస్తాయి, వారెవ్వరికీ ఈయనెవరో అసలు తెలీదు.

కానీ ఈయన మాత్రం వారందర్నీ లెటర్లలో చాలెంజీలు చేసి వారిని ఓడించేసానని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. ఒకవేళ వారు ఈయన లెటర్లకు స్పందిస్తూ ప్రత్యుత్తరమిస్తే దానిని గొప్పగా చెప్పుకోవాలే తప్ప ఇతను రాసినవాటిని మాత్రమే చూపించి గొప్పగా చెప్పుకోవడం ఎంత హాస్యాస్పదమో మీరే ఆలోచించండి. మనం కూడా NASA వాళ్ళకీ, దేశాధ్యక్షులకీ మన అభిప్రాయాలు, చాలెంజీలు రాసి పంపవచ్చు.‌ ఉదాహరణకు మీలో ఎవరైనా NASA వారికి భూమి గుండ్రంగా లేదు‌ బల్లపరుపుగా ఉందని‌ చాలెంజ్ చేస్తూ లెటర్ రాయండి, వారు స్పందించి‌ మీతో చర్చకు‌ వస్తారేమో చూద్దాం. ఎందుకంటే అలాంటివారితో చర్చలు చెయ్యాలంటే academical status మరియు లోకంలో ఉన్నతమైన పేరు చాలా అవసరం.

ఇంతకంటే హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే, ఈ సింహగర్జన పుస్తకం మూడవ పేజీలో, మన పీడీ సుందరరావుగారు ఈ పుస్తకాన్ని విదేశాల్లో ఉన్న కొందరు ముఖ్యమైన వ్యక్తులకీ, పెంగ్విన్, Oxford వంటి సంస్థలకీ పంపినట్టు, వారు దానిని చదివి ఈయనగారిని పొగుడుతూ ప్రత్యుత్తరాలు పంపినట్టుగా ప్రస్తావించారు. అవినిజమే అయితే వారు స్పందనగా రాసి ‌పంపిన లెటర్ కాపీలను ఆ పుస్తకంలో ఎందుకు పొందుపరచలేదో ఆయనే సమాధానం చెప్పాలి (లేదా ఇప్పుడైనా చూపించాలి).

ఇక పుస్తకంలో రాయబడిన వాక్యభాగాల వివరణ దగ్గరకు వెళ్దాం.

 (1) ఈ పుస్తకంలో , పేజ్ నంబర్ 1 నుండి 14 వరకూ "క్రీస్తుకే బోధకుడైన శోధకుడు" అనే పాఠం మనకు కనిపిస్తుంది;

ఈ పాఠంలో మన పీడీ సుందరరావుగారు ప్రధానంగా బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారిని ప్రస్తావిస్తూ, వారి ద్వారా అపవాది మన బైబిల్ తర్జుమాలో కొన్ని పొరపాట్లను చేర్పించినట్టుగా ఆరోపించారు. ఈయన ఆ విధంగా ఆరోపించడానికి బైబిల్ సొసైటీవారు తర్జుమా చేయని మాటలు కూడా వారికి ఆపాదించాడు.

ఉదాహరణకు;
మత్తయి సువార్త 13:56 - ఇతని సోదరీమణులందరు మనతోనేయున్నారు కారా?

బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు చేసిన అనువాదం ప్రకారం, ఈ వచనంలో యేసుక్రీస్తుకు సోదరీమణులు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. సోదరీమణులు అంటే చెల్లెళ్ళు, అక్కలు - ఇద్దరికోసమూ కూడా వాడవచ్చు, యేసుక్రీస్తు తరువాత మరియకు యేసేపుకు పుట్టిన కుమార్తెల గురించి ఈ మాటలు రాయబడ్డాయి. అయితే మన పీడీ సుందరరావుగారు ఈ వచనాన్ని వక్రీకరించి అక్కాచెల్లెళ్ళు అని తన పుస్తకంలో రాసి, బైబిల్ సొసైటీవారు యేసుక్రీస్తుకు అక్కలు ఉన్నారని చెబుతున్నారు, దీనిప్రకారం మరియ కన్య కాకుండా పోతుందంటూ తన కపటబుద్ధిని బయటపెట్టుకొన్నాడు.

మరియమ్మ కన్యగా ఉండి యేసుక్రీస్తును కన్నదని బైబిల్ లో ప్రవచనాలు, ఎన్నో వాక్యభాగాలు సాక్ష్యమిస్తున్నాయి. అటువంటప్పుడు ఆయనకు సహోదరీలు అని రాయనడినప్పుడు చెల్లెళ్ళు అని అర్థం చేసుకోకుండా, అక్కలు అని కూడా అర్థం చేసుకుంటే అది ఎవరి లోపం‌ ఔతుంది? ఇంగ్లీషు భాషలో కూడా అక్కల్ని, చెల్లెళ్ళని సంబోధించడానికి sisters అనేపదాన్నే వాడతాము. నూతన నిబంధన మూలభాషగా ఎంచబడుతున్న గ్రీకు భాషలో కూడా ఇదే పద్ధతి కొనసాగుతుంది, అక్కడ వాడిన పదం "ἀδελφαὶ" (adelphai) ఈపదానికి sisters అనే అర్థం వస్తుంది.

దీనినిబట్టే, మన తెలుగు బైబిల్ లో, బైబిల్ సొసైటీవారు సోదరీమణులు అని తర్జుమా చేసారు. అయినా మూలభాషలపైన ఏ అవగాహన లేకుండా, కేవలం తెలుగు బైబిల్ ని మాత్రమే ఆధారం చేసుకుని సిద్ధాంతాలు కట్టే పీడీ సుందరరావుగారు అదే తెలుగు బైబిల్ ని ప్రచురించిన బైబిల్ సొసైటీ వారిని అన్యాయంగా నిందించడం, ఈయనకేదో మూలభాషలు తెలిసినట్లుగా, తర్జుమా తప్పుగా చేసారని చెప్పడం ఎలా ఉందో మీరే చెప్పండి. పీడీ సుందరరావు గారి మహా జ్ఞానం‌అంటే ఇలానే‌‌ ఉంటుంది మరి.

 (2) ఇదేపాఠంలో, ఆయన రాసిన మరోమాట చూద్దాం;

హెబ్రీయులకు 11:17 అబ్రాహాము శోధింపబడి విశ్వాసమునుబట్టి ఇస్సాకును బలిగా అర్పించెను.

సుందరరావు గారు ఈ వచనాన్ని చూపించి, బైబిల్ సొసైటీవారు ఈ వచనంలో దేవుణ్ణి  శోధకునిగా చూపిస్తున్నారు, వాస్తవానికి దేవుడు ఆదికాండము 22:1 ప్రకారం అబ్రాహామును, ఇస్సాకు విషయంలో పరిశోధించాడే తప్ప శోధించలేదు, శోధించేవాడు సాతానుడు మాత్రమే అని వాపోయాడు. ఈ వాదన ఆయన చెయ్యడానికి, దేవుడు ఎవరినీ శోధించడు అని యాకోబు పత్రిక లోని మాటను అపార్థం చేసుకున్నాడు.

ఒకసారి ఆ సందర్భాన్ని మొత్తం చూద్దాం -
యాకోబు 1:13,14 దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింప బడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును.

ఈ సందర్భాన్ని మనం పరిశీలిస్తే దేవుడు, మనిషిని తప్పుదారి పట్టించేలా శోధించడని అర్థమౌతుందే తప్ప, విశ్వాసాన్ని పరీక్షించడానికి శోధించడని ఇక్కడ అర్థం లేదు. దేవుడు కూడా శోధిస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది.

యిర్మియా 11: 20 నీతినిబట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను, హృదయమును శోధించువాడు సైన్యములకధిపతియగు యెహోవాయే.

నిజానికి శోధించడం అన్నప్పటికీ, పరిశోధించడం అన్నప్పటికీ  ఇంచుమించు ఒకే అర్థం వస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో అబ్రాహాము శోధించబడినప్పుడు అని ఉన్నచోట గ్రీకుభాషలో, "πειράζω" (peirazo) అనే పదం వాడారు. దీనికి "Tempt" అని అర్థం. పాతనిబంధన గ్రంథం గ్రీకులోకి తర్జుమా చేయబడిన సెప్టువజింటు (LXX)లో కూడా ఆదికాండము 22:1లో "పరిశోధించెను" అన్నప్పుడు యూదులు ఇదే "πειράζω" (peirazo) పదం వాడారు. ఒకవేళ "పరిశోధించెను" అన్నచోట "శోధించెను" అనేపదాన్ని వాడకూడదంటే, యూదులు సెప్టువజింటులో ఇదే గ్రీకుపదాన్ని ఎందుకు వాడతారు? అదేవిధంగా హెబ్రీపత్రిక గ్రీకు ప్రతిలో అక్కడ ఏ పదం‌‌ ఉందో దానినే బైబిల్ సొసైటీవారు తర్జుమా చేసారు, ఇందులో వారు చేసిన పొరపాటు ఏమీలేదు.

ఈ పాఠంలో ఈయన ఈ విధంగానే అమాయకంగా మరెన్నో వచనాలను చూపించి తానేదో మూలభాష పండితుడైనట్టుగా కనపరచబడే ప్రయత్నం చేసాడు; ఆయన చూపించిన ఏ వచనంలోనూ బైబిల్‌ సొసైటీవారు సాతానుడి ప్రేరేపణతో తప్పుడు తర్జుమాలు చేసినట్టుగా లేదు. అలా అని మనం వాడే బైబిళ్ళలో ఎటువంటి పొరపాటులు లేవని నేను అనడం లేదు, సుందరరావు గారు చూపించినవి మాత్రం పొరపాట్లు కాదని మాత్రమే చెబుతున్నాను, భాషకు ఉండే పరిధులను బట్టి, హీబ్రూ, గ్రీకు భాషల నుండి మిగిలిన భాషల్లోకి బైబిల్‌ను తర్జుమా చేసినపుడు కొన్ని పొరపాట్లు జరగడం, ఆ భాషలో ఉండే పదం మిగిలిన భాషలో లేనప్పుడు దగ్గరగా ఉన్నపదాన్ని చేర్చడం సహజం. వీటి గురించి హీబ్రూ, గ్రీకు భాషల్లో పండితులైనవారు తెలియచేస్తూనే ఉన్నారు. దయచేసి పీడీ సుందరరావు గారు అలాంటి పండితుల దగ్గర నేర్చుకుని పుస్తకాలు రాస్తే బావుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను.

మరొక పాఠాన్ని చూద్దాం;

(3) సింహగర్జన పుస్తకంలో 15 వ పేజీనుండి, 21 వ పేజీవరకూ దేవదూతలు దేవుని కుమారులా? సేవకులైన ఆత్మలా? అనే పాఠం మనకు కనిపిస్తుంది.

ఈ పాఠంలో మన పీడీ సుందరరావుగారు దేవదూతలను దేవుని కుమారులుగా చెప్పేవారిని తప్పుపడుతూ, దేవదూతలు దేవుని సేవకులని రాయబడిన వచనాలను చూపించే ప్రయత్నం చేసాడు; ఉదాహరణకు హెబ్రీ 1:14. అయితే, మన పీడీ సుందరరావుగారికి తెలియని మరో విషయం ఏమిటంటే, ఇదే బైబిల్ లో దేవదూతలు దేవుని కుమారులని కూడా రాయబడింది.

ఉదాహరణకు యోబు 1:6, 2:1 వచనాలు తెలుగు బైబిల్ ఫుట్ నోట్ లో వారు దేవుని కుమారులని రాయబడింది. మన పీడీ సుందరరావుగారు అది తప్పుడు తర్జుమా అంటారేమో, అక్కడ హీబ్రూలో వాడిన పదం "בני האלהים" - benay ha Elohim; ఈ మాటకు దేవుని కుమారులనే అర్థమే  వస్తుంది. అంతమాత్రనే కాదు మన తెలుగు బైబిల్‌లో కూడా మరోచోట దేవదూతలు దైవకుమారులని స్పష్టంగా కనబడుతుంది.

కీర్తనలు 89: 6 మింటను యెహోవాకు సాటియైనవాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటివాడెవడు?

దీనిని బట్టి దేవదూతలను దేవుని కుమారులని భావించినప్పటికీ  అందులో ఏ తప్పూ లేదు ఎందుకంటే బైబిల్ అలానే చెబుతుంది మరి. మరి మనం పైన చూసిన హెబ్రీపత్రికలోనూ, మరికొన్ని సందర్భాలలోనూ దేవదూతలు సేవకులని ఎందుకు రాయబడిందంటే, దానికీ సమాధానం చూద్దాం. అంతకంటే ముందు మన పీడీ సుందరరావుగారు ఇదే పాఠంలో మనమంతా దేవుని ఆత్మలో భాగాలమనీ, ఆదాము దేవునినుండి వచ్చాడని రాశారు, బైబిల్ లో ఆ విధంగా ఎక్కడ ఉందో ఆయన ఆధారాలు చూపించలేదు, బహుశా తరువాత పాఠాల్లో చూపిస్తారేమో.

బైబిల్ ప్రకారం దేవుడు మొదటిగా దేవదూతల్ని సృష్టించాడు;

కీర్తనల గ్రంథము 148:2,5 ఆయన దూతలారా, మీరందరు ఆయనను స్తుతించుడి ఆయన సైన్యములారా, మీరందరు ఆయనను స్తుతించుడి యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అవి యెహోవా నామమును స్తుతించును గాక.

తరువాత మనుషుల్ని కూడా సృష్టించాడు ఈవిధంగా, మనుషులనూ, దేవదూతలనూ ఆయనే సృష్టించాడు కాబట్టి ఆయన ఇరువురికీ కొన్ని సందర్భాలలో తండ్రిగా పిలవబడ్డాడు. అయితే, దేవదూతల గురించి సేవకులని ఎందుకు రాయబడిందని అర్థం చేసుకోవాలంటే, అదే బైబిల్ లో విశ్వాసుల గురించి కూడా ఏమని రాయబడిందో మనకు తెలియాలి. పీడీ సుందరరావుగారికి ఇది తెలియకపోడం వల్లే పాపం ఇలాంటి‌ పాఠాలు కనిపెట్టాడు.

రోమీయులకు 8: 14,16 దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులైయుందురు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు.

ఈ వచనాల ప్రకారం క్రీస్తునందు విశ్వసించి ఆత్మద్వారా నడిపించబడుతున్నవారందరూ దేవుని పిల్లలు. ఇదే దేవుని పిల్లల కోసం ఇంకా ఏం రాయబడిందో చూడండి.

అపో.కార్యములు 4: 30 నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము.

ప్రకటన గ్రంథం 22: 4 ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు; ఆయన నామము వారి నొసళ్లయందుండును.

ఈ వచనాలలో అదే దేవుని పిల్లల గురించి దాసులు (సేవకులు) అని రాయబడింది. సుందరరావుగారి సిద్ధాంతం ప్రకారం, దాసులు అని రాయబడింది‌ కనుక వీరు దేవుని పిల్లలు కాదా? విశ్వాసులమైన మనమంతా దేవుని పిల్లలం, దాసులం. అదేవిధంగా దేవదూతలు కూడా దేవుని కుమారులు, సేవకులు కూడా. భలే ఉంది కదూ సుందరరావు గారి మహా జ్ఞానం!

 మరొక పాఠంలోనికి వెళ్దాం;

(4) ఈ పుస్తకం, 22 వ పేజీనుండి,27 వ పేజీవరకూ, క్రీస్తును కన్నందుకు కన్నీరేనా అనేపాఠం మనకు కనిపిస్తుంది.

ఈ పాఠానికి సంబంధించిన ఒక పాటను కూడా బీఓయూఐ సంస్థవారు విడుదల చెయ్యడం జరిగింది. ఈ పాఠంలో పీడీ సుందరరావుగారు లేఖనాలలో ఎటువంటి ఆధారమూ లేకుండా, తనకున్న ఊహతో మరియమ్మ భర్తయైన  యోసేపును తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి, మరియమ్మ చివరికి ఎవరూ లేని ఒంటరిగా మిగిలిపోయిందనీ, అందుకే యేసుక్రీస్తు ఆమెను యోహానుకు అప్పగించాడని‌ చెప్పే ప్రయత్నం చేసాడు. అదేవిధంగా యేసుక్రీస్తు పైన చిన్నప్పటి నుండీ యోసేపు వివక్షను చూపినట్టు, బాధ్యాతారహితంగా వ్యవహరించినట్లు ప్రకటించాడు.

వాస్తవానికి యోసేపు నీతిమంతుడని దేవునివాక్యం సెలవిస్తుంది. అందుచేతనే అతను మరియ గర్భవతి అని తెలిసినప్పుడు దానిని బహిర్గతం చెయ్యకుండా రహస్యంగా ఆమెకు దూరం అవ్వాలి అనుకున్నాడు. జరిగిన విషయాన్ని దేవదూత తెలియచేసాక అతను మరియను హత్తుకుని దేవుడు వెళ్ళమన్న ప్రతీచోటికీ వెళ్లాడు. అయితే మన సుందరరావుగారు తన పాఠంలో యేసుక్రీస్తు దేవాలయంలో, తన తల్లియైన  మరియతో నేను నా తండ్రి పనులమీద ఉండాలని మీరెరుగరా అని పలికిన మాటలు బట్టి, యోసేపు నొచ్చుకున్నట్లుగా రాశాడు.

ఆ సందర్భంలో దేవుని వాక్యం ఆ విధంగా చెప్పనే లేదు. అదేవిధంగా, యేసుక్రీస్తును మరియ యోసేపులు పండుగకు తీసుకెళ్ళినపుడు ఆయనను యోసేపు సరిగా పట్టించుకోలేదనీ, అందుచేతనే ఆయన తన బంధువులతో‌ ఉన్నాడులే అనే బాధ్యతారహితంతో ముందుకు సాగిపోయాడని సుందరరావుగారి శిష్యుడు ఒకతను గతంలో వివరించాడు. ఒకవేళ ఇదే నిజమైతే అక్కడ బాధ్యతారహితంగా ఉన్నది యోసేపు ఒకడే కాదు మరియ కూడా అలానే ఉన్నట్టు అర్థం చేసుకోవాలి.

ఇక యేసుక్రీస్తు సిలువపైన ఉన్నప్పుడు యోసేపు అతని మిగిలిన కుమారులు రాలేదని, మరియను ఒంటరిగా వదిలేసారని, అప్పటినుంచి ఆమె యోహాను దగ్గర ఉందని మన సుందరరావుగారు గొప్ప మర్మాన్ని తెలియచేసాడు. వాస్తవానికి కొందరు బైబిల్ పండితుల అభిప్రాయం, పరిశీలన ప్రకారం, యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభించేసరికే యోసేపు చనిపోయాడు. అందుకే యేసుక్రీస్తు అతని కుమారుడని జనులు‌ భావించినప్పటికీ అతని గురించిన మిగిలిన సమాచారం నాలుగు సువార్తల్లోనూ ఎక్కడా మనకు కనిపించదు. అదేవిధంగా యేసుక్రీస్తును మెస్సీయగా మొదట ఆయన సహోదరులు విశ్వసించనప్పటికీ, ఆయన సిలువవేయబడే సమయంలో వారు అక్కడకు రాకుండా ఉండడానికి అది కారణం కాదు.

యేసుక్రీస్తును రోమా సైనికులు బంధించినప్పుడు ఆయన శిష్యులు అందరూ చెదరిపోయినట్లు గా మనకు కనిపిస్తుంది, వారిలో యోహాను తప్ప మిగిలిన శిష్యులు ఎవరూ సిలువ దగ్గరకు రాలేదు. యేసుక్రీస్తుకు సంబంధించినవారిని కూడా సైనికులు ఎక్కడ బంధిస్తారో అనే భయంతో ఆయన సహోదరులు ఆ సిలువ దగ్గరకు రాకుండా ఉండియుండవచ్చు. అందుకే స్త్రీలు ‌మాత్రమే అక్కడ నిలచి ఆయన కోసం ఏడుస్తున్నారు, ఎందుకంటే అక్కడ స్త్రీలను బంధించవలసిన అవసరం లేదు.

యోహాను కూడా ఆ సిలువ దగ్గర ధైర్యంగా ఉండడానికి కారణం యోహాను ప్రధానయాజకునికి బంధువుడు.

యోహాను 18: 15 సీమోను పేతురును మరియొక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధానయాజకునికి నెళవైనవాడు గనుక అతడు ప్రధానయాజకుని యింటి ముంగిటిలోనికి యేసుతో కూడ వెళ్లెను.

ఈ కారణంతోనే యోహాను ధైర్యంగా, యేసు సిలువ దగ్గర నిలబడ్డాడు. ఆ సమయంలో యేసుప్రభువు మరియను అతనికి అప్పగించాడు. ఇదంతా జరిగిన తరువాత యేసుక్రీస్తు సహోదరులు ఆయనయందు విశ్వాసముంచి ఆయనకోసం శ్రమపడ్డారు, యేసుక్రీస్తు ఆరోహణం తరువాత మేడగదిలోకి ఎక్కిపోయినవారిలో ‌వారు కూడా ఉన్నారు‌. యాకోబు పత్రికనూ, యూదా పత్రికనూ రాసింది వారే. దీనివల్ల మరియమ్మ పీడీ సుందరరావుగారు చెప్పినట్లుగా యేసుక్రీస్తు‌ చనిపోడానికి ముందు ‌కానీ, తరువాత కానీ ఒంటరి కాలేదు.

త్వరలో రెండవ భాగంతో మళ్ళీ కలుద్దాం.

అప్పటివరకూ పీడీ సుందరావు చేస్తున్న మరికొన్ని దుర్బోధలను తెలుసుకోవడానికి ఈ వ్యాసాలు చదవండి. 

యేసుక్రీస్తు నిత్యుడు కాడా? పరలోకంలో పుట్టినవాడా?

వీరు దైవములా?

Church of Christ దుర్భోధలు

జయశాలి పరాజయం

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.