ఒకానొక లోయలో ఒక భూస్వామి ఉండేవాడు. అతనికి విస్తారమైన పంటభూములు, వృక్షసంపద ఉన్న అనేక అడవులు, కొండలు ఉన్నాయి. అతను ప్రతిరోజు గుఱ్ఱాన్ని ఎక్కి పొలాలనూ, వాటి పంటలనూ చూసివచ్చేవాడు. ఆ లోయలో అతనే అతి పెద్ద ఐశ్వర్యవంతుడు. అతని క్రింద కష్టపడి పనిచేసే శ్రామికులు చాలామంది ఉన్నారు. వారిలో జాన్ అనే దైవభక్తిగల వృద్ధుడు కుడా ఉన్నాడు. అతను ఎన్నోయేళ్ళుగా నమ్మకంగా ఆ ఐశ్వర్యవంతునికి సేవ చేస్తున్నాడు. ఒక రోజు మధ్యాహ్నం వృద్ధుడైన జాన్ తలపై టోపి తీసి పాతబడ్డ టిఫిన్ బాక్సును ముందు పెట్టుకుని కన్నులు మూసి ఆ పూట భోజనం కోసం ఎంతో కృతజ్ఞతతో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు.
ఆ బాక్సులో చల్లబడ్డ ఆహారం కొంచమే ఉంది. ఆ సమయంలో భూస్వామి అక్కడికి వచ్చి జాన్ ని చూసి 'జాన్, నీకేముందని దేవుణ్ణి స్తుతిస్తున్నావు? ఆయన నీకేమి ఇవ్వలేదు కదా?' అనన్నాడు. 'ఓ అయ్యగారు, ఆయన నాకు లెక్కింపసాధ్యం కానన్ని మేళ్ళు, ఉపకారాలు చేశాడు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా లభించని పాపక్షమాపణను, హృదయశాంతిని, మానసిక ఆనందాన్ని, పరలోక ప్రాప్తిని దయచేశాడు. అనుదినం ఆహారమిచ్చి పోషిస్తున్నాడ'ని జాన్ సవినయంగా సమాధానం ఇచ్చాడు.
'పిచ్చివాడు' అననుకుంటూ ఆ ధనికుడు లెక్కలు సరిచూసుకుని గుఱ్ఱాన్ని ఎక్కి అదిలించగా అది పెద్ద అడుగులతో అప్పటికే కొంత దూరం వెళ్ళింది. 'అయ్యగారు, ఒక్కనిమిషం వెనక్కిరండ'ని జాన్ పిలిచాడు. అప్పుడు ఆ ధనికుడు వెనక్కు తిరిగివచ్చి కళ్లెపు పగ్గాలు చేతితో పట్టుకుని 'ఏమిటి?' అన్నట్టుగా వృద్ధుడి వైపు చూశాడు.
అప్పుడు జాన్, 'రాత్రి నేనో కల కన్నాన'ని అతనితో చెప్పాడు; 'ఏమిటా కల అంటూ?' ఆ యజమాని ప్రశ్నించాడు. 'ఈ రాత్రి 12 గంటలకు ఈ లోయలో ఉన్న గొప్ప ఐశ్వరంవంతుడు చనిపోవడం నా కలలో చూశాన'ని జాన్ నిశ్చయతతో చెప్పాడు. అప్పుడు ఆ యజమాని, 'ముసలివాళ్ళకు ఇలాంటి కలలే వస్తాయిలే జాన్' అంటూ గుఱ్ఱాన్ని అదిలించాడు. ఆ ఎస్టేట్ గూండా, అందమైన చెట్లు, పొలాలు దాటుతూ ఆ గుఱ్ఱం దూసుకునిపోతూ ఎంతో దూరం వెళ్ళింది కానీ ముసలివాడి మాటలు ధనవంతుడిని విడిచిపెట్టలేదు. "లోయలో ఉన్న ఐశ్వర్యవంతుడు ఈ రాత్రి 12 గంటలకు చనిపోతాడు" - ఈ మాటలు అతని మనస్సును, హృదయాన్ని ఆవరించాయి. మరిచిపోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు.
అతను ఇంటికి వెళ్ళగానే పట్టణం నుండి కుటుంబవైద్యుడిని పిలిపించి, 'డాక్టర్, నా ఆరోగ్యాన్ని పూర్తిగా పరీక్షించండని ఆదేశించాడు.' ఆ మాటలు డాక్టర్ గారికి ఆశ్చర్యం కలిగించాయి. ఎంతోసేపు అన్ని పరికరాలతోనూ ఆ డాక్టర్ పరీక్షించి, 'మీ ఆరోగ్యం చాలా బావుంది, నిశ్చింతగా ఉండండని వెళ్ళడానికి సెలవిమ్మ'న్నాడు. కాని ధనవంతుడు ఒప్పుకోకుండా, 'ఈ రాత్రి అంతా మీరు నాతోనే ఉండాల'ని కోరాడు. డాక్టరు, ధనవంతుడు రాత్రంతా మెళకువగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నారు.
కోటలోని గడియారం గంభీరంగా గంటలు కొడుతుంది. తొమ్మిది, పది, పదకొండు.... భూస్వామి లేచి గదిలో అటూ ఇటూ తిరుగుతున్నాడు. చెమట కనుబొమ్మలు, నుదుటిపైన దట్టంగా పడుతన్నాయి. ముఖం ఆందోళనతో, కళ్ళు నిర్జీవంతో, శరీరం వణుకుతూ కంగారు కంగారుగా చూస్తుండగా ఆ డాక్టరు, 'మీరు నిశ్చింతగా ఉండండి, ఏమీ కాదు' అంటున్నాడు. మరణభయం, మృత్యుస్మరణతో ధనవంతుడు నెమ్మదిని కోల్పోయాడు. పదకొండున్నర - పదకొండు ముప్పావు - పది నిమిషాలు తక్కువ పన్నెండు - భూస్వామికి కాళ్ళు చేతుల వణుకు ఎక్కువౌతుంది. బిగబట్టుకుని ఆ పది నిమిషాలు ఎలాగో అతి కష్టంతో గడిపాడు.
కోట గడియారం 12 సార్లు మోగింది. 'హమ్మయ్య' అనుకుంటూ ధనవంతుడు వాలుకుర్చీలో వాలిపోయాడు. నెమ్మదిగా కాళ్ళవణుకు, గుండెదడ తగ్గిపోయింది. 'గండం గడిచిపోయిందిలే' అని ధనవంతుడు ఊపిరి పీల్చుకుంటున్నాడు.
12:30 కల్లా గది తలుపులు ఎవరో కొట్టసాగారు. గదిలోని ఆ ఇద్దరూ, 'ఇంత! రాత్రివేళలో ఎవరబ్బా తలుపు తట్టేది' అనుకున్నారు. డాక్టరు తలుపు తెరవగానే ఎదురుగా నిలిచిన పనివాడొకడు, 'అయ్యగారు, 12 గంటలప్పుడు వృద్ధుడైన జాన్ చనిపోయాడు' అని చెప్పాడు. ఔరా, ఆ లోయలో నిజంగా ఐశ్వర్యవంతుడైన వ్యక్తి సరిగ్గా రాత్రి 12 గంటలకే చనిపోయాడు వృద్ధజాన్ శోధింపశక్యం కాని క్రీస్తు ఐశ్వర్యాన్ని (Unsearchable riches of Christ) పొందాడు. అతడు దేవుని కృపా మహదైశ్వర్యాన్ని సంపాదించుకున్నాడు.
నేటి దినాల్లో మనమెందర్నో ధనవంతులను చూస్తున్నాం కానీ వారికి నిజమైన సంతోషం లేదు. పాపం వారిని దివాలా తీయించింది. కాబట్టి వారికి మానసిక ఆనందం లేక చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారు ఈ లోకంలో ధనవంతులే కాని పరలోకసంబంధంగా నిరుపేదలే. మానవుడు పాపక్షమాపణ మరియు రక్షణ పొంది పరలోకపు ఐశ్వర్యం పొందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ ఐశ్వర్యం తరిగిపోదు(అక్షయమైనది), దొంగలకు చిక్కదు, చిమ్మెటలు గాని తుప్పుగాని దానిని తినివేయలేవని ప్రభువు సెలవిచ్చాడు. "మరియు ఆయన ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించుకొందుమో అని చింతింపకుడి; ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును అని చెప్పాడు." (మత్తయి 6:31-33).
"యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు" (రోమా 10:9).
కావున ప్రియ చదువరీ, "ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము: అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు." (అపొ.కార్య. 16:31). తద్వారా దేవుని యొక్క కృపైశ్వర్యాన్ని, పరలోకప్రాప్తిని పొందుతావు.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
Comments