కొన్నిసార్లు బైబిల్ లో కొంతమంది వ్యక్తుల పేర్లు మనకు ఒకచోట ఒకరకంగానూ మరోచోట మరో రకంగానూ కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి వాటి గురించి ఆలోచించినప్పుడు మనకు ఠక్కున గుర్తొచ్చే కొన్ని పేర్లు ఏంటంటే, అబ్రాము - అబ్రాహాము (ఆదికాండము 17:5), శారయి - శారా (ఆదికాండము 17:15). దేవుడే స్వయంగా వీరిద్దరి పేర్లను మార్చాడు. అలాగే నూను కుమారుడైన హోషేయ పేరును మోషే యెహోషువ గా మార్చాడు (సంఖ్యాకాండం 13:16). ఏశావును ఎదోము అని కూడా అంటారు (ఆదికాండము 25:30; 36:1,8,19; ద్వితీయోపదేశకాండం 23:8). యాకోబు పేరును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు (ఆదికాండము 32:28; 35:10). వీరికి రెండేసి పేర్లు ఎందుకున్నాయి దానికి కారణాలు ఏంటి అనే విషయాలను బైబిల్ లో ప్రత్యేకంగా వివరించడం జరిగింది. అందువల్ల వీరి విషయంలో మనకు ఎలాంటి సమస్యాలేదు, ఎలాంటి గందరగోళమూ లేదు. అయితే కొంతమంది విషయంలో ఎలాంటి వివరణా ఇవ్వకుండా వారికి ఉన్న వేరు వేరు పేర్లను బైబిల్ లో వేరు వేరు సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. బైబిల్ రచయితల రచనాశైలి గురించి సరైన అవగాహన లేని వాళ్ళు, ఇటువంటి వాక్యభాగాలను చూసినప్పుడు బైబిల్ లో వైరుధ్యాలు ఉన్నాయి అని అపార్థం చేసుకుంటూ ఉంటారు. ఏశావు భార్యల పేర్లు కూడా ఈ కోవకే చెందుతాయి.
"ఏశావు నలువది సంవత్సరములవాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెండ్లిచేసికొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి" అని ఆదికాండము 26వ అధ్యాయం 34-35 వచనాలలో ఉంటుంది. ఆ తరువాత ఆదికాండము 28వ అధ్యాయం 8-9 వచనాల ప్రకారం, "కనాను కుమార్తెలు తన తండ్రియైన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్లి, తనకున్న భార్యలుగాక అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడ పెండ్లి చేసికొనెను." అని ఉంటుంది. అయితే ఆదికాండము 36వ అధ్యాయం 2-3 వచనాలలో ఏశావు వంశావళి గురించి చెబుతూ, "ఏశావు కనాను కుమార్తెలలో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తెయైన అనా కుమార్తెయగు అహోలీబామాను, ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన బాశెమతును పెండ్లియాడెను." అని ఉంటుంది. ఈ వాక్యభాగాల ప్రకారం ఏశావునకు మొత్తం ముగ్గురు భార్యలు. అయితే మొదట చూసిన రెండు వాక్యభాగాల ప్రకారం అతని మొదటి భార్య పేరు బేయేరీ కుమార్తెయగు యహూదీతు. రెండవ భార్య పేరు ఏలోను కుమార్తెయగు బాశెమతు. మూడవ భార్య పేరు ఇష్మాయేలు కుమార్తెయగు మహలతు. కానీ ఆదికాండము 36వ అధ్యాయం ప్రకారం ఒక భార్య పేరు అనా కుమార్తెయగు అహోలీబామా. మరొక భార్య పేరు ఏలోను కుమార్తెయగు ఆదా. ఇక మూడవ భార్య పేరు ఇష్మాయేలు కుమార్తెయగు బాశెమతు. మొదటి రెండు వాక్యభాగాలతో మూడవ వాక్యభాగాన్ని పోల్చిచూసినప్పుడు ఒకరు కాదు ఇద్దరు కాదు, మొత్తం ముగ్గురి పేర్లూ కూడా తేడాగానే ఉన్నాయి. ఎందుకు? కొంతమంది అనుకుంటున్నట్లుగా నిజంగానే ఇది contradiction? లేకపోతే వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? దీని గురించి ఈ వ్యాసంలో మనం వివరంగా మాట్లాడుకుందాం.
ముందుగా అసలు ఈ విషయం గురించి యూదుల సంప్రదాయ వ్యాఖ్యానాలు ఏమి చెబుతున్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యూదా వ్యాఖ్యాతలు కొంతమంది ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేశారు. కానీ వారు ప్రతిపాదించిన ప్రతిపాదనల్లో కొన్ని లోపాలు ఉన్నాయి. కాబట్టి ముందుగా వాటి గురించి మాట్లాడుకుని, ఆ తరువాత ఈ సమస్యను పరిష్కరించడానికి మనకు బైబిల్ లోనే ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో పరిశీలించే ప్రయత్నం చూద్దాం.
ఈ సమస్యను పరిష్కరించడానికి యూదా వ్యాఖ్యాతలు ప్రతిపాదించిన కొన్ని ప్రతిపాదనలు ఏంటంటే,
- ఏశావు తన భార్యల పేర్లను మార్చాడు.
- ఏశావు భార్యలకు ఏకకాలంలో ఒకటి కంటే ఎక్కువ పేర్లు ఉండేవి.
- ఏశావునకు ముగ్గురు కంటే ఎక్కువమంది భార్యలు ఉన్నారు.
ఈ మూడు కారణాల్లో ఎదో ఒక కారణం లేదా ఒకటి కంటే ఎక్కువ కారణాలను బట్టి బైబిల్ లోని వేరు వేరు వాక్యభాగాల్లో ఏశావు భార్యల గురించి వేరు వేరు పేర్లను ప్రస్తావించడం జరిగింది అనేది వారి ఉద్దేశ్యం. అంటే వారి ఆలోచనా దృక్పథం ప్రకారం, ప్రతీ చిన్న విషయాన్ని కూడా మనకు తెలియచేయాలి అనే ఉద్దేశంతో బైబిల్ గ్రంథం వ్రాయబడలేదు. అక్కడున్న సందర్భాన్ని బట్టి ప్రధానమైన అంశాలను, అందులోనుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటిమీద ఎక్కువ focus ఉంటుంది. అంతేకానీ ఏశావు, తరువాత ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అతను తన భార్యల పేర్లను ఎప్పుడు ఎందుకు మార్చాడు? ఇలాంటి secondary events ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వబడలేదు. అంతేకాకుండా ఈ గ్రంథాలు ప్రాథమికంగా ఎవరికైతే వ్రాయబడ్డాయో వారికి ప్రాచీన హెబ్రీయుల సంస్కృతీ సంప్రదాయాలు వారి ఆచార వ్యవహారాల గురించి ఒక అవగాహన అనేది ఉంటుంది. ఒక పురుషుడు తన జీవితకాలంలో ఒకరికంటే ఎక్కువమంది స్త్రీలను వివాహం చేసుకోవడం గురించి కానీ, వివాహం అయిన తరువాత భార్య పేరును మార్చడం గురించి కానీ, జీవితంలో జరిగిన కొన్ని ప్రత్యేకమైన సంఘటనలు లేదా ఏవైనా కారణాల వలన మనుష్యులు వేరొక పేరుతో పిలవబడటం గురించి కానీ... ఇలాంటి వాటి గురించి ప్రాచీన హెబ్రీయులకు ఒక అవగాహన అనేది ఉంటుంది. కాబట్టి కొన్ని కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా వివరించకపోయినప్పటికీ అది వారికి పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. తెర వెనుక ఏమి జరుగుతుంది అనేది వారు అర్థం చేసుకోగలరు.
సరే, ముందుగా అసలు యూదా వ్యాఖ్యాతలు ఏమి చెప్పారు అనే దాని గురించి కొంచెం వివరంగా చూద్దాం. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో జీవించిన ప్రఖ్యాత యూదా రబ్బీ - రబ్బీ ష్లోమో ఇస్సాక్ (ఇతనిని సాధారణంగా అందరూ రషీ అని కూడా అంటారు). ఇతను Tanakh (అంటే హీబ్రూ బైబిల్) కి వ్యాఖ్యానం రాశాడు, Babylonian Talmud కి వ్యాఖ్యానం రాశాడు, ఇంకా అనేక ఇతర రచనలు కూడా చేశాడు. ఏశావు భార్యల పేర్ల విషయంలో రషీ గారు తన వ్యాఖ్యానంలో ఏమి రాశారంటే - హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాశెమతు అసలు పేరు ఆదా. ఈమె విగ్రహారాధీకురాలు. ఈమె విగ్రహాలకు ధూపదీప నైవేద్యంగా సువాసనలు వెదజల్లే సుగంధ పరిమళ ద్రవ్యాలను అర్పిస్తూ ఉండేది. సుగంధ ద్రవ్యాలను హీబ్రూ భాషలో "బెసమీమ్" అని అంటారు. అందువల్ల ఏశావు ఈమెకు బాశెమతు అనే పేరు పెట్టాడు అని రషీ గారు అంటారు. అలాగే హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతు అసలు పేరు హివ్వీయుడైన సిబ్యోను కుమార్తెయైన అనా కుమార్తెయగు అహోలీబామా. ఈమె కూడా విగ్రహారాధీకురాలే. అయితే ఈమె తన విగ్రహారాధనను విడిచిపెట్టింది అని ఏశావు తన తల్లిదండ్రులను మభ్యపెట్టడం కోసం ఆమెకు యహూదీతు అనే పేరు పెట్టాడు అని రషీ గారు అంటారు (Rashi on Genesis 36:2). యహూదీతు అనే పదానికి 'నేను యెహోవాను స్తుతిస్తాను' అనే అర్థం వస్తుంది. యహూదీతు అనే పదం యూదా అనే పదానికి feminine form. అలాగే ఇష్మాయేలు కుమార్తెయగు మహలతు అసలు పేరు బాశెమతు. హీబ్రూ భాషలో "మహాల్" అని అంటే క్షమాపణ. ఈ వివాహంతో తన తప్పులన్నీ కూడా క్షమించబడాలి అనే ఉద్దేశంతో ఏశావు ఆమెకు మహలతు అనే పేరు పెట్టాడు అని రషీ గారు రాశారు (Rashi on Genesis 36:3). మీరు మూలభాషలోకి కానీ లేదా English translation లో అయినా చూసినట్లయితే ఆదికాండము 36:2 లో ఏశావు "తన భార్యలను" కనాను కుమార్తెలలో నుండి తీసుకున్నాడు అని ఉంటుంది. కానీ ఆదికాండము 26:34 లో ఏశావు యహూదీతును బాశెమతును పెళ్లి చేసుకున్నాడు అని ఉంటుంది. ఈ రెండిటి మధ్య ఉన్న చిన్న తేడాను గమనించండి. సాధారణంగా ఉపయోగించే పదప్రయోగం 'Esau took as wives' అని అనడానికి బదులు ఆదికాండము 36వ అధ్యాయంలో 'Esau took his wives - తన భార్యలను' అనే పదాన్ని ఉపయోగించారు కాబట్టి ఇక్కడ ప్రస్తావించబడిన ఏశావు భార్యలు - వీళ్ళు కొత్తవాళ్ళేమీ కాదు కానీ వీళ్ళ గురించి అంతకుముందే బైబిల్ లో చెప్పబడింది అనేది రషీ గారి అభిప్రాయం. అందువల్ల ఆదికాండము 36వ అధ్యాయంలో ఉన్న ఆదా అహోలీబామాలు అలాగే 26వ అధ్యాయంలో ఉన్న బాశెమతు యహూదీతులు వీరు వేరు వేరు వ్యక్తులు కాదు కానీ వీరు ఒక్కరే, కాకపొతే ఏశావు వీరి పేర్లను మార్చాడు అని రషీ గారు అంటారు.
అయితే రషీ గారు ప్రతిపాదించిందాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆదా మరియు అహోలీబామాల పేర్లను ఏశావు మార్చడం వెనుక ఉన్న కారణాల్లో కొంత contradiction అనేది కనిపిస్తూ ఉంది. విగ్రహాలకు సుగంధ పరిమళ ద్రవ్యాలను అర్పించేది కాబట్టి ఆదా పేరును ఏశావు బాశెమతుగా మార్చాడు; అంటే ఆమె విగ్రహారాధీకురాలు అనే విషయాన్ని నొక్కి చెప్పినట్లుగా ఉంది. కానీ దీనికి విరుద్ధంగా అహోలీబామా యొక్క విగ్రహారాధనను కప్పిపుచ్చడానికి ఆమె పేరును యహూదీతుగా మార్చాడు. ఇది అంత సహేతుకంగా అనిపించడం లేదు. అయితే ఇక్కడ ఉన్న ఒక possibility ఏంటంటే, బహుశా ఆదాను పెళ్లి చేసుకున్న తరువాత కొంత కాలానికి ఏశావు అహోలీబామాను పెళ్లి చేసుకుని ఉండి ఉండవచ్చు. ఆదాను పెళ్లి చేసుకున్నప్పుడు ఏశావునకు విగ్రహారాధన పట్ల సానుకూలమైన దృక్పథం ఉన్నప్పటికీ, ఆ తరువాత తన భార్యలు చేస్తున్న విగ్రహారాధన అనేది తన తల్లిదండ్రులకు మనోవేదన కలుగజేస్తున్న కారణంగా విగ్రహారాధన పట్ల తనకున్న అభిప్రాయాన్ని ఏశావు మార్చుకుని ఉండి ఉండవచ్చు. అందువల్ల అహోలీబామాకు ఏశావు యహూదీతు అనే పేరు పెట్టాడు అని మనం అనుకోవడానికి అవకాశం ఉంది. అయితే విగ్రహారాధన పట్ల తనకున్న అభిప్రాయాన్ని మార్చుకున్న తరువాత తన రెండవ భార్యకు యహూదీతు అనే పేరు పెట్టినట్లుగానే ఏశావు తన మొదటి భార్య పేరును కూడా మరోసారి మార్చొచ్చు కదా? అలా ఎందుకు చేయలేదు అనే ప్రశ్న మాత్రం అలానే ఉంటుంది. అంతేకాకుండా ఆదికాండము 26వ అధ్యాయంలో ఉన్న వాక్యభాగాన్ని ఉన్నది ఉన్నట్లుగా తీసుకుంటే ఏశావు ముందు యహూదీతును ఆ తరువాత బాశెమతును పెళ్లి చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. మరి ఆదికాండము 36వ అధ్యాయంలో ముందుగా ఆదా పేరును ఆ తరువాత అహోలీబామా పేరును ప్రస్తావించారు కదా అనే సందేహం మీకు రావొచ్చు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే ఆదికాండము 36వ అధ్యాయంలో ఉన్నది ఏశావు వంశావళి. సాధారణంగా వంశావళుల గురించి చెప్పేటప్పుడు ఎవరిని ముందుగా వివాహం చేసుకున్నాడు అనేదానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. ఎవరికి ముందుగా సంతానం కలిగింది, అలాగే తన సంతానంలో ఎవరికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది అనే విషయాల ఆధారంగా వంశావళులలో పేర్లను నమోదు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆదికాండము 36వ అధ్యాయంలో ఉన్న క్రమం ఏదైతే ఉందో it might not be according to the priority of their marraiges but rather according to the number of their offspring, in descending order.
మరొక విషయం ఏంటంటే రషీ గారి అభిప్రాయం ప్రకారం మార్చిన కొత్త పేర్లన్నీ కూడా బైబిల్ లో ముందుగా ప్రస్తావించబడ్డాయి. అసలు పేర్లను తరువాత వేరొక వాక్యభాగంలో ప్రస్తావించారు. అంటే తన వివాహ సమయంలో ఇష్మాయేలు కూతురికి మహలతు అనే పేరు పెట్టినట్లుగానే బహుశా ఆదా మరియు అహోలీబామాలకు కూడా వారి వివాహ సమయంలోనే పేర్లను మార్చారు అని అనుకోవచ్చు. అందువల్లే ఏశావు వారిని వివాహము చేసుకున్నాడు అని బైబిల్ లో మొట్టమొదటిసారిగా చెప్పిన సందర్భంలోనే వారి మారు పేర్లు లేదా వివాహ సమయంలో వారికి పెట్టబడిన పేర్లను ప్రస్తావించారు అని కూడా అనుకోవచ్చు. కానీ బైబిల్ లోని వాక్యభాగాలను అలాగే రషీ గారి వ్యాఖ్యానం ఈ రెండిటినీ కలిపి కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆదా మరియు అహోలీబామాలను ఏశావు పెళ్లి చేసుకున్న తరువాత కొంత కాలానికి వారి విగ్రహారాధన కారణంగా ఇస్సాకు రిబ్కాలకు మనోవేదన కలగడం వలన ఏశావు వారి పేర్లను మార్చాడు అని రషీ గారు చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ మనం గమనించవలసిన మరొక విషయం ఏంటంటే, రషీ గారు అలాగే ఇతర యూదా వ్యాఖ్యాతలు చెప్పినట్లుగా తమ కోడళ్ల విగ్రహారాధన కారణంగానే ఇస్సాకు రిబ్కాలకు మనోవేదన కలిగింది అని బైబిల్ లో ఎక్కడా కూడా లేదు. Ofcourse, వాళ్ళు చెప్పింది నిజమే అయ్యుండొచ్చు, నేనేమి కాదనట్లేదు. కానీ ఇస్సాకు రిబ్కాల మనోవేదనకు కారణం నిజంగానే వారి కోడళ్ల విగ్రహారాధనేనా లేక ఇంకేదైనా కారణం ఉందా అనేది మనకు ఖచ్చితంగా తెలీదు.
సుమారు క్రీస్తు శకం 12వ శతాబ్దంలో జీవించిన మరొక ప్రఖ్యాత యూదా రబ్బీ - Avraham Ben Meir Ibn Ezra - ఈయన్ని అందరూ Ibn Ezra అని కూడా అంటారు. ఈయన తన వ్యాఖ్యానంలో రషీ గారితో కొంతవరకు ఏకీభవిస్తారు కానీ కొన్ని విషయాల్లో విభేదించారు కూడా. ఏలోను కుమార్తెయగు ఆదా మరియు ఏలోను కుమార్తెయగు బాశెమతు వీరిద్దరూ కూడా ఒక్కరే, ఆమెకు రెండు పేర్లు ఉన్నాయి అనే విషయంలో Ibn Ezra గారు రషీ గారితో ఏకీభవించారు (Ibn Ezra on Genesis 26:34). అలాగే ఇష్మాయేలు కుమార్తెయగు బాశెమతు మరియు ఇష్మాయేలు కుమార్తెయగు మహలతు వీరిద్దరూ కూడా ఒక్కరే, ఆమెకు కూడా రెండు పేర్లు ఉన్నాయి అనే విషయంలో Ibn Ezra గారు రషీ గారితో ఏకీభవించారు (Ibn Ezra on Genesis 28:9). లేఖనాలలో ఇలాంటివి కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి దీని గురించి పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పని లేదు అని కూడా అంటారాయన. అయితే హివ్వీయుడైన సిబ్యోను కుమార్తెయైన అనా కుమార్తెయగు అహోలీబామా మరియు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతు - వీరిద్దరూ ఒక్కరు కాదు కానీ వీరు వేరు వేరు స్త్రీలు అనేది Ibn Ezra గారి అభిప్రాయం. ఆయన ఏమంటారంటే యహూదీతుకి సంతానం లేరు (Ibn Ezra on Genesis 26:34). అందువల్ల ఆదికాండము 36వ అధ్యాయంలోని ఏశావు వంశావళిలో ఆమెకు చోటు దక్కలేదు. ఎందుకంటే వంశావళి అనేది ప్రాథమికంగా ఏశావు యొక్క సంతానం గురించి చెప్పడానికి వ్రాయబడింది. ఈ వంశావళిలో యహూదీతుకు బదులు మనకు కనబడే అహోలీబామా ఏశావు యొక్క నాలుగవ భార్య అని Ibn Ezra గారు అంటారు.
అయితే యహూదీతుకు ఏమయ్యింది? ఏశావు అహోలీబామాను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు? మహలతును పెళ్లి చేసుకోవడానికి ముందా లేక ఆ తరువాతా? ఇలాంటి విషయాల గురించి Ibn Ezra గారు ఏమీ మాట్లాడలేదు. అయితే ఇతనికి సమకాలీనుడైన Rashbam అనే మరొక ప్రఖ్యాత యూదా రబ్బీ ఈ ఖాళీలను పూరించే ప్రయత్నం చేశాడు. ఇతని పూర్తి పేరు ఏంటంటే Rabbi Shmuel Ben Meir. అందరూ ఇతన్ని Rashbam అని అంటారు. ఇతను రషీ గారికి మనవడు కూడా. Ibn Ezra గారు చెప్పినదానితో ఏకీభవిస్తూ Rashbam గారు ఇంకా ఏమన్నారంటే - ఏశావు మహలతును పెళ్లి చేసుకున్న తరువాత యహూదీతు సంతానం లేకుండా మరణించింది. ఆ తరువాత ఏశావు కనాను దేశాన్ని వదిలి శేయీరు ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ అహోలీబామాను పెళ్లి చేసుకున్నాడు (Rashbam on Genesis 36:2).
రషీ గారు చెప్పినదానితో Ibn Ezra గారు విభేదించడానికి గల ముఖ్యకారణం ఏంటంటే, ఏశావు కేవలం తన భార్య అయిన అహోలీబామా పేరును మాత్రమే కాకుండా ఆమె తండ్రి అయిన అనా పేరును కూడా ఎలా మార్చాడు? ఈ విషయాన్ని రషీ గారు వివరించలేకపోయారు. అంతేకాకుండా రషీ గారు చెప్పినదాని ప్రకారం ఇస్సాకు రిబ్కాలకు మనోవేదన కలిగించినటువంటి, వారికి ఆమోదయోగ్యం కానటువంటి ఏలోను కుమార్తె, ఆమె చేసే విగ్రహారాధనను ఎత్తిచూపే విధంగా బాశెమతు అనే పేరును ఏశావు ఆమెకు పెట్టినప్పుడు, అదే పేరును కలిగినటువంటి ఇష్మాయేలు కూతురిని ఎలా పెళ్లి చేసుకున్నాడు? ఇది అంత సహేతుకంగా అనిపించడం లేదు అనేది Ibn Ezra గారి అభిప్రాయం. అందుకే ఆయన ఈ పేర్లు మార్చడం అనే అంశం జోలికి పోకుండా వారికి రెండేసి పేర్లు ఉన్నాయి అని అన్నారు. అయితే Ibn Ezra గారు చెప్పినదానితో ఉన్న సమస్య పోకపోగా ఇంకా కొత్త ప్రశ్నలు అనేవి ముందుకు వచ్చాయి. ఏలోను కుమార్తెయగు బాశెమతుకు అలాగే ఇష్మాయేలు కుమార్తెయగు మహలతుకు రెండేసి పేర్లు ఉన్నప్పుడు మరి యహూదీతుకు అలాగే వాళ్ళ నాన్నకు రెండేసి పేర్లు ఎందుకు ఉండకూడదు? అలా ఉండే అవకాశం కూడా ఉంది కదా. అలాంటప్పుడు అహోలీబామా మరియు యహూదీతులు ఇద్దరూ ఒక్కరు కాదు వీరు వేరు వేరు స్త్రీలు అని ఎలా చెప్పగలం?
అందుకే ఈ గందరగోళాన్నంతా తీసివేయడం కోసం Ramban అనే మరొక ప్రఖ్యాత యూదా రబ్బీ ఒక పరిష్కారాన్ని సూచించారు. ఇతని అసలు పేరు ఏంటంటే Rabbi Mōšeh ben-Nāḥmān. ఇతన్ని Nachmanides అని కూడా అంటారు లేదా Ramban అని కూడా అంటారు. ఇతను క్రీస్తు శకం 13వ శతాబ్దంలో జీవించిన ప్రఖ్యాత యూదా పండితుడు, రబ్బీ, తత్వవేత్త, వైద్యుడు, మరియు బైబిల్ వ్యాఖ్యాత కూడా. ఈయన ఏమంటారంటే బేయేరీ కుమార్తెయగు యహూదీతు అలాగే ఏలోను కుమార్తెయగు బాశెమతు - వీరిద్దరూ కూడా సంతానం లేకుండానే మరణించారు. బహుశా ఇస్సాకు రిబ్కాలకు మనోవేదన కలుగజేసిన కారణంగా దేవుడు వీరిని శిక్షించాడేమో అని అంటారాయన. ఆ తరువాత ఏశావు, బాశెమతు చెల్లెలు అయిన ఏలోను కుమార్తెయగు ఆదాను అలాగే సిబ్యోను కుమార్తెయైన అనా కుమార్తెయగు అహోలీబామా అనే మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత కొంత కాలానికి ఇష్మాయేలు కుమార్తెయగు మహలతును కూడా పెళ్లి చేసుకున్నాడు. అయితే హీబ్రూ భాషలో మహలతు అనే పేరుకి కొంత ప్రతికూలమైన అర్థం ఉన్న కారణంగా ఏశావు ఆమెకు బాశెమతు అనే పేరు పెట్టాడు. ఎందుకంటే, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం... "బెసమీమ్" అని అంటే సుగంధ పరిమళ ద్రవ్యాలు. సుగంధ పరిమళం అనేది మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇష్మాయేలు కుమార్తెను పెళ్లి చేసుకోవడం ద్వారా తన తల్లిదండ్రులైన ఇస్సాకు రిబ్కాలకు సంతోషం కలుగుతుంది అని, వారి మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది కాబట్టి ఏశావు ఆమెకు ఆ పేరు పెట్టాడు (Ramban on Genesis 36:3). Ramban గారు చెప్పినదాని ప్రకారం మహలతు ఏశావునకు ఐదవ భార్య.
మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ యూదా రబ్బీల యొక్క వ్యాఖ్యానాలు అన్నీ కూడా ఉహాజనితమైనవే. వీళ్ళు చెప్పేవన్నీ కూడా జరిగే అవకాశం ఉన్నప్పటికీ వీటికి సంబంధించి మనకు బైబిల్ లో ఎలాంటి ఆధారాలు లేవు. రషీ గారు చెప్పినదాని ప్రకారం ఏశావునకు ముగ్గురు భార్యలే. కాకపొతే ఏశావు వారి ముగ్గురి పేర్లూ మార్చాడు. కానీ అహోలీబామా తండ్రి పేరు ఎందుకు మారింది అనే విషయాన్ని వివరించలేదు. Ibn Ezra గారు మరియు Rasbam గారు చెప్పినదాని ప్రకారం ఏశావునకు నలుగురు భార్యలు. వారిలో ఇద్దరికి రెండేసి పేర్లున్నాయి. అంతేకాకుండా వీరు చెప్పినదాని ప్రకారం ఏశావు మహలతును పెళ్లి చేసుకున్న తరువాత మరో కనాను స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఇది అంత సహేతుకంగా లేదు ఎందుకంటే అప్పటికే అంతకుముందు ఇద్దరు కనాను స్త్రీలను పెళ్లి చేసుకున్నందుకు పశ్చాత్తాపపడి ఇష్మాయేలు కుమార్తె అయిన మహలతును పెళ్లి చేసుకున్న ఏశావు ఆ తరువాత మళ్ళీ మరో కనాను స్త్రీని పెళ్లిచేసుకున్నాడు అని అంటే అది అంత నమ్మశక్యంగా లేదు. ఇక Ramban గారు చెప్పినది అయితే మరీ విడ్డూరంగా ఉంది. ఈయన చెప్పినదాని ప్రకారం ఏశావునకు మొత్తం ఐదుగురు భార్యలు. వారిలో ఒక్క మహలతుకు మాత్రమే రెండు పేర్లు ఉన్నాయి. తాను మొదట పెళ్లి చేసుకున్న ఇద్దరు కనాను స్త్రీల కారణంగా ఇస్సాకు రిబ్కాలకు మనోవేదన కలిగినప్పటికీ, వాళ్ళు చనిపోయిన తరువాత ఏశావు మళ్ళీ మరో ఇద్దరు కనాను స్త్రీలను, అందులోనూ ఒక ఆమె అయితే చనిపోయిన భార్య యొక్క చెల్లెలు, ఇలా మరో ఇద్దరు కనాను స్త్రీలను పెళ్లి చేసుకుని ఏశావు తన తల్లిదండ్రులను మరింత మనో వేదనకు గురిచేశాడు అని అనుకోవలసి ఉంటుంది. అంతేకాకుండా ఆ తరువాత కొంత కాలానికి పశ్చాత్తాపపడి, తన తల్లిదండ్రులను సంతోషపెట్టడం కోసం ఇష్మాయేలు కుమార్తెయగు మహలతును పెళ్లి చేసుకున్న ఏశావు, పోయి పోయి మళ్ళీ తన తల్లిదండ్రులకు మనోవేదన కలుగజేసినటువంటి తన చనిపోయిన భార్య బాశెమతు పేరును మహలతుకు పెట్టాడు. ఇలా చేస్తే ఇస్సాకు రిబ్కాలకు సంతోషం కలుగుతుందా? కలగదు కదా! కాబట్టి ఇది కూడా అంత నమ్మశక్యంగా లేదు.
మరి ఈ సమస్యను పరిష్కరించేదెలా? బైబిల్ లో ఉన్న కొన్ని ఆధారాలను అలాగే "biblical narrative" లో ఉన్న కొన్ని "major themes" ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే గనక ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనచ్చు. ఆదికాండము 26, 27, 28 అధ్యాయాల్లో ఉన్న "chronological sequence of events" ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. ముందుగా ఏశావు యహూదీతును అలాగే బాశెమతును పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ కూడా ఇస్సాకునకు రిబ్కాకు మనోవేదన కలుగజేశారు అని ఆదికాండము 26వ అధ్యాయం చివర్లో ఉంటుంది.ఆ తరువాతి అధ్యాయంలో ఏశావునకు బదులు యాకోబు హెచ్చింపబడటాన్ని, ఏశావునకు ఏశావు సంతానానికి రావాల్సిన ఆశీర్వాదం యాకోబుకు యాకోబు సంతానానికి దక్కడాన్ని మనం చూస్తాం. "జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు (ఆదికాండము 27:29)" అని ఇస్సాకు యాకోబును దీవించాడు. దానితో ఏశావు యాకోబు మీద పగబట్టి అతనిని చంపాలనుకుంటాడు. అందువల్ల యాకోబును కాపాడటం కోసం రిబ్కా అతనిని తన సోదరుడైన లాబాను దగ్గరకు పంపించాలనుకుంటుంది. ఈ సందర్భంలో రిబ్కా ఇస్సాకుతో ఏమంటుందో ఒకసారి కొంచెం జాగ్రత్తగా గమనించండి. "హేతు కుమార్తెలవలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసి కొనినయెడల నా బ్రదుకువలన నాకేమి ప్రయోజనము (ఆదికాండము 27:46) అని అంటుంది. అప్పుడు ఇస్సాకు యాకోబును పిలిపించి - నీవు కనాను కుమార్తెలలో ఎవరినీ కూడా వివాహము చేసుకొకూడదు. నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసికొనుమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రాహామునకిచ్చిన దేశమును, నీవు స్వాస్థ్యముగా చేసికొనునట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడ నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని యాకోబును దీవించి అక్కడి నుండి పంపేస్తాడు. ఇస్సాకు యాకోబును దీవించి, పద్దనరాములో పెండ్లిచేసికొని వచ్చుటకై అతనిని అక్కడికి పంపెననియు, అతన్ని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని కూడా పెళ్లి చేసికొనవద్దని అతనికి ఆజ్ఞాపించెననియు, ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రియైన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు, ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్లి, తనకున్న భార్యలుగాక అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడ పెళ్లి చేసుకున్నాడు (ఆదికాండము 28:1-9). దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్ధమవుతున్న ఒక విషయం ఏంటంటే తాను ముందుగా వివాహం చేసుకున్న ఇద్దరు కనాను స్త్రీలు కూడా తన తల్లిదండ్రులకు ఇష్టం లేదు కాబట్టి, వారిని సంతోషపెట్టడం కోసం ఏశావు ఇష్మాయేలు కూతుర్ని కూడా పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇక్కడ ఒక చిక్కొచ్చి పడింది. అదేంటంటే ఇష్మాయేలు కూతుర్ని ఏశావు వివాహం చేసుకోవడం తన తల్లిదండ్రులకు ఇష్టమే అయినప్పటికీ, తాను ముందుగా వివాహం చేసుకున్నటువంటి ఇద్దరు కనాను స్త్రీలలో ఒకరైన బాశెమతు అలాగే ఇష్మాయేలు కూతురు - వీళ్లిద్దరి పేర్లు కూడా ఒక్కటే. అందువల్ల ఏశావు ఇష్మాయేలు కూతురికి మహలతు అనే పేరు పెట్టాడు.
ఈ మహలతు అనే పేరు חלה (halah - హలాహ్) అనే క్రియా పదం నుండి వచ్చింది. 'హలాహ్' అని అంటే "to make the face of someone sweet or pleasant" - ఎవరినైనా సంతోషపెట్టడం లేదా వారికి ఆహ్లాదకరమైన పని చేయడం. బాశెమతు అనే పేరు "బెసమీమ్" అనే పదం నుండి వచ్చిందనీ, మనసుకు ఆహ్లాదకరమైన సుగంధ పరిమళ ద్రవ్యం అనే అర్థం వస్తుంది అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. కాబట్టి కొంచెం అదే అర్థం వచ్చేలాగా ఏశావు ఆమెకు మహలతు అని సరైన పేరే పెట్టాడు. అంతేకాకుండా "మహాల్" అనే మూల పదం నుండి తీసుకున్నట్లయితే రషీ గారు చెప్పినట్లుగా 'తాను క్షమించబడాలి' అనే అర్థం వచ్చేలాగా కూడా ఏశావు ఆమెకు ఆ పేరు పెట్టాడు అని మనం అనుకోవచ్చు.
కనాను స్త్రీలను వివాహం చేసుకోవడం ద్వారా తన తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన ఏశావు, తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడి నూతన జీవితాన్ని ప్రారంభించాలి అనే ఉద్దేశంతోనూ అలాగే తన తల్లిదండ్రులు తనను క్షమించాలి అని కోరుకుంటూ, ఇష్మాయేలు కూతుర్ని వివాహం చేసుకున్నాడు. తన మనస్సులో ఉన్న ఈ భావనను వ్యక్తపరచడం కోసం తన మూడవ భార్య పేరును మహలతుగా మార్చాడు. అయితే ఏశావు అక్కడితో ఆగిపోలేదు. ఎందుకంటే తన తల్లిదండ్రులకు ఇష్టంలేని కోడళ్లలో అప్పటికే బాశెమతు అనే పేరుతో ఒక కోడలు ఉంది. మళ్ళీ అదే పేరు కలిగిన మరో స్త్రీని వివాహం చేసుకున్నాడు కాబట్టి దీనిని అవకాశంగా తీసుకుని తన మూడవ భార్య పేరును మార్చాడు కానీ నిజంగా అతనిలో మార్పేమీ రాలేదు అని ఎవరూ అనుకోకుండా ఉండటం కోసం మిగిలిన ఇద్దరు భార్యల పేర్లు కూడా మార్చాడు. యహూదీతు మరియు బాశెమతు పేర్లను 'అహోలీబామా' మరియు 'ఆదా'గా మార్చడం ద్వారా తాను నిజంగానే మారాననీ, ఏదో మిమ్మల్ని మోసం చేయడానికో లేకపొతే మిమ్మల్ని మభ్యపెట్టడానికో కాదు కానీ నిజంగానే చిత్తశుద్ధితో మార్పు చెందాను అనే సంకేతాలను ఏశావు తన తల్లిదండ్రులకు పంపించినట్లయింది.
అదెలా అంటే, "ఓహేల్" (אֹהֶל) అనే పదానికి tabernacle (గుడారము) అనే అర్థం వస్తుంది. "బామాహ్" (במה) అనే పదానికి 'a place of worship (ఆరాధనా స్థలము)' అనే అర్థం వస్తుంది. కాబట్టి అహోలీబామా అనే పేరుకి "my tent is a place of worship (నా గుడారము ఒక ఆరాధనా స్థలము)" అనే అర్థం వస్తుంది. "ఆదాహ్" (עָדָה) అనే పదానికి "దాటిపోవడము, సాగిపోవడము లేదా ముందుకు వెళ్ళడము" అనే అర్థం వస్తుంది. అయితే ఇక్కడ ఈ పేరుకి ఉన్న అర్థం కంటే కూడా దాని వెనుక ఉన్న చరిత్ర చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఆదికాండము 4:19-20 వచనాలు చూసినట్లయితే "లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు; వారిలో ఒకరి పేరు ఆదా. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించువారికి మూలపురుషుడు" అని ఉంటుంది. అంటే గుడారములలో నివసించువారికి మూలపురుషుడైన యాబాలును కన్నతల్లి ఆదా పేరును ఏశావు తన భార్యకు పెట్టాడు. ఇక్కడ మనకు గుడారము లేదా "tabernacle" అనే ఒక "theme" అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏశావు తన భార్యలకు ఈ "tabernacle" అనే theme కి సంబంధించిన పేర్లు పెట్టడానికీ, అలాగే ఇస్సాకు రిబ్కాలు ఏశావు నిజంగానే మారాడు అని అనుకోవడానికి ఏంటి సంబంధం? మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఏశావునకు రావాల్సిన ఆశీర్వాదాలను పొందుకున్న ఏశావు తమ్ముడైన యాకోబును గురించి చెబుతూ "సాధువై గుడారములలో నివసించుచుండెను" అని బైబిల్ లో ఉంటుంది. "ఏశావు వేటాడుటయందు నేర్పరియై అరణ్యవాసిగా నుండెను; యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను" అని ఆదికాండము 25:27 వచనంలో వ్రాయబడింది. ఇది కేవలం వారి నివాసస్థలం గురించి మాత్రమే చెప్పే వాక్యం కాదు. దీని వెనుక చాలా విశాలమైన అర్థం ఉంది. ఇక్కడ వాళ్ళ వ్యక్తిత్వం గురించి వారిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం గురించి చెప్పడానికే ఈ వాక్యం వ్రాయబడింది. అయితే ఇప్పుడు ఏశావు తన భార్యలకు ఈ "tabernacle" అనే theme కి సంబంధించిన పేర్లు పెట్టడం ద్వారా, తాను మారాననీ, ఇకమీదట అరణ్యవాసిగానూ వేటగాడిగానూ ఉండబోననీ, తన తమ్ముడి వలే తాను కూడా సాధువై గుడారములలో నివసిస్తాను అని ఏశావు తన తల్లిదండ్రులకు చెప్పకనే చెప్పాడు.
యహూదీతు మరియు బాశెమతు అనేవి ఏశావు భార్యల అసలు పేర్లు అని అనడానికి మనకు బైబిల్ లోనే మరికొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. మీరు ఆదికాండము 26వ అధ్యాయం మొదటి నుండీ కూడా చూసినట్లయితే అక్కడ ఇస్సాకు సంపాదనలో చాలా బిజీగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. మొదట ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు దగ్గరకు వెళ్లి అతనితో ఒప్పందం చేసుకుంటాడు (ఆదికాండము 26:1). ఆ దేశములో విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందాడు. అతడు మిక్కిలి గొప్పవాడగువరకు క్రమ క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొఱ్ఱెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహము ఉన్నాయి. దానితో ఫిలిష్తీయులకి ఇస్సాకు మీద అసూయ కలిగి అతన్ని అక్కడ నుండి ఎలాగోలా పంపించేస్తారు (ఆదికాండము 26:12-14). ఇస్సాకు అక్కడనుండి వెళ్లి గెరారు లోయలో గుడారము వేసికొని అక్కడ నివసించసాగాడు. తన తండ్రియైన అబ్రాహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులను ఇస్సాకు తిరిగి త్రవ్విస్తాడు (ఆదికాండము 26:17-18). ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జెలలుగల నీళ్లబావి ఒకటి దొరుకుతుంది, కానీ గెరారు కాపరులు ఆ బావి విషయంలో గొడవపడితే దాన్ని వదిలేసి ఇంకో బావి త్రవ్వుతారు. అక్కడ కూడా గొడవ జరిగితే దాన్ని కూడా వదిలేసి మళ్ళీ ఇంకో బావి త్రవ్వుతారు (ఆదికాండము 26:19-22). ఆ తరువాత ఇస్సాకు అక్కడ నుండి బెయేర్షెబాకు వెళ్ళాడు (ఆదికాండము 26:23). బెయేర్షెబాలో రెండు విషయాలు జరిగాయి. ఒకటేంటంటే అక్కడ కూడా వీళ్ళు బావి త్రవ్వడం మొదలుపెట్టారు. రెండో విషయం ఏంటంటే ఈలోగా అబీమెలెకు ఇంకొంతమందితో కలిసివచ్చి ఇస్సాకుతో ఒక శాంతి ఒప్పందం చేసుకుంటాడు (ఆదికాండము 26:25-26; 28-29). అతడు వారికి విందుచేయగా వారు అన్నపానములు పుచ్చు కొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసికొనిరి (ఆదికాండము 26:30-31). ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావినిగూర్చి అతనికి తెలియచేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనుక దానికి షేబ అను పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా (ఆదికాండము 26:32-33). వీళ్ళు అక్కడ త్రవ్విన ఆ బావి కారణంగానే ఆ ఊరికి బెయేర్షెబా అనే పేరు వచ్చింది. 'బెయేర్' అని అంటే బావి. ఆ బావి పేరు 'షేబ'. ఆ తరువాతి వచనంలోనే, "ఏశావు నలువది సంవత్సరములవాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెండ్లిచేసికొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగజేసిరి" అని ఉంటుంది (ఆదికాండము 26:34-35). బెయేర్షెబాలో జరిగిన రెండు సంఘటనలకు ఏశావు వివాహం చేసుకున్న ఇద్దరు భార్యలకు ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది. బావిని హీబ్రూలో 'బెయేర్ (בְּאֵר) ' అని అంటారు. బేయేరీ (בְּאֵרִי) కుమార్తెయగు యహూదీతును అంటే బావులు త్రవ్వించేవాడి కూతురు అయిన యహూదీతును ఏశావు పెళ్లి చేసుకున్నాడు. అలాగే బెయేర్షెబాలో ఇస్సాకు మరియు అబీమెలెకు మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరింది. వారు ఒకరితో ఒకరు ఒక ప్రమాణము చేసుకున్నారు. "ప్రమాణాన్ని" హీబ్రూలో 'అలాహ్ (אָלָה) ' అని అంటారు. ఏలోను (אֵילֹן) కుమార్తెయగు బాశెమతును అంటే ఒప్పందాలు కుదిర్చేవాడి (treaty-maker) కూతురు అయిన బాశెమతును ఏశావు పెళ్లి చేసుకున్నాడు.
సంపాదనలో పడి ఇస్సాకు తన పనులలో తలమునకలై ఉండటానికీ, ఏశావు తన తల్లిదండ్రులకు ఇష్టం లేని వివాహం చేసుకోవడానికీ మధ్య ఉన్న సంబంధం చదివిన వాళ్లకు స్పష్టంగా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో కావాలనే ఇక్కడ ఈ రకమైన పదప్రయోగాన్ని వాడటం జరిగింది. ఇస్సాకు ఎవరితో అయితే కలిసి పనిచేస్తున్నాడో వారి కుమార్తెలనే ఏశావు వివాహం చేసుకున్నాడు. ఇస్సాకునకు సరైన భార్యను చూసి వివాహం జరిపించే విషయంలో తన తండ్రి అయిన అబ్రాహాము తన బాధ్యతను సక్రమంగానే నిర్వర్తించాడు. కానీ ఇస్సాకు మాత్రం తన కుమారుడైన ఏశావు వివాహ విషయంలో నిర్లక్ష్యం వహించాడు. పొలం పనులతో తీరిక లేకుండా ఉన్న ఇస్సాకు, తన కుటుంబ వ్యవహారాలకు తగినంత సమయాన్ని కేటాయించలేకపోయాడు. ఏశావు విషయంలో ఇలా నిర్లక్ష్యంగా ఉన్నందుకు ఇస్సాకు తగిన మూల్యాన్ని చెల్లించాడు. ఏశావు తనకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకోవడం ద్వారా తన తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బతీశాడు. ఈ విధంగా చేసినందుకు ఏశావు కూడా తగిన మూల్యాన్నే చెల్లించుకున్నాడు. తనకు రావాల్సిన ఆశీర్వాదాలు తన తమ్ముడైన యాకోబుకు దక్కాయి. ఏశావు భార్యలు ఇస్సాకు రిబ్కాలకు మనోవేదన కలుగజేశారు కాబట్టి, వారి సంతానం ఇస్సాకు యొక్క దీవెనల ప్రతిఫలాన్ని పొందలేకపోయారు.
ఇప్పుడు మనం చేసిన ఈ విశ్లేషణ ద్వారా యహూదీతు లేదా అహోలీబామా యొక్క తండ్రి పేరు ఒకచోట బేయేరీ అని మరోచోట అనా అని ఎందుకు వ్రాయబడింది అనే విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ అనా అనే వ్యక్తే బేయేరీ అని మనం అనడానికి మరొక ఆధారం కూడా ఉంది. "హోరీయుడైన శేయీరు కుమారులు, లోతాను శోబాలు సిబ్యోను అనా" అని ఆదికాండము 36:20 వచనంలో ఉంటుంది. "సిబ్యోను కుమారులు అయ్యా అనా" అని 24వ వచనంలో ఉంటుంది. అంటే సిబ్యోనుకు అనా అనే పేరు కలిగిన ఒక సోదరుడు ఉన్నాడు అలాగే అదే పేరు కలిగిన ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరూ వేరు వేరు వ్యక్తులు. ఆ విషయాన్ని highlight చేయడం కోసమే "అనా తన తండ్రియైన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారలు కనుగొనిన వాడు" అని 24వ వచనంలో చెప్పబడింది. అంటే సిబ్యోను కుమారుడైన అనా చేసే పని ఏంటంటే భూమి లోపల నీటి లభ్యత ఎక్కడ ఉందో కనుగొని అక్కడ బావిని త్రవ్వించడం. దీన్ని బట్టి కూడా ఈ అనా అనే వ్యక్తే బేయేరీ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సరే మరి ఆదికాండము 26వ అధ్యాయంలో హిత్తీయుడైన బేయేరీ అని ఉంది, కానీ ఆదికాండము 36వ అధ్యాయం ప్రకారం అనా తండ్రి సిబ్యోను ఒక హివ్వీయుడు, అలాగే సిబ్యోను తండ్రి శేయీరు ఒక హోరీయుడు. మరి అలాంటప్పుడు ఈ బావులు త్రవ్వించేవాడు అయిన అనా - హిత్తీయుడా లేక హివ్వీయుడా లేక హోరీయుడా? దీన్ని ఎలా వివరిస్తాం? అది పెద్ద కష్టమేమీ కాదు. మనం చేయాల్సిందల్లా ఈ పదాలను ఏ అర్థంలో వాడారు అనే విషయాన్ని తెలుసుకోవడమే. హిత్తీయుడు అనే పదం కనానీయుడు అనే పదానికి పర్యాయపదం. అందుకే యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం నాలుగవ వచనంలో కనాను దేశం గురించి మాట్లాడుతూ హిత్తీయుల దేశము అని వ్రాయబడింది. ఇక హివ్వీయుడు అని అంటే గ్రామాల్లో గుడారాలు వేసుకుని జీవించేవాడు. అలాగే హోరీయుడు అని అంటే గుహల్లో జీవించేవాడు అని అర్థం. శేయీరు పర్వతప్రాంతాల్లో గుహల్లో జీవించేవాడు కాబట్టి అతన్ని హోరీయుడు అని అన్నారు. అలాగే సిబ్యోను మైదాన ప్రాంతాల్లో గుడారాల్లో జీవించేవాడు కాబట్టి అతన్ని హివ్వీయుడు అని అన్నారు. అంతేకాని ఇవి వారి జాతుల పేర్లు కాదు. ఇక చివరిగా మిగిలిపోయిన ఒక అంశం ఏంటంటే ఆదికాండము 36:2 వచనంలో "హివ్వీయుడైన సిబ్యోను కుమార్తెయైన అనా కుమార్తెయగు అహోలీబామా" అని ఉంటుంది. కానీ 24వ వచనం ప్రకారం ఈ అనా అనే వ్యక్తి సిబ్యోను కుమారుడు, కుమార్తె కాదు. ఇతను ఒక పురుషుడు, స్త్రీ కాదు. మరి రెండవ వచనంలో అలా ఎందుకు ఉంది? దీన్ని మూడు రకాలుగా వివరించొచ్చు. మొదటిది Septuagint... Septuagint లో ఏమని ఉంటుందంటే - Olibema daughter of Ana the son of Sebegon అని ఉంటుంది. అంటే సిబ్యోను కుమారుడైన అనా కుమార్తెయగు అహోలీబామా. Masoretic Text కంటే Septuagint ఇంకా పాతది కాబట్టి బహుశా Masoretic Text లో copy error ఏమైనా ఉందేమో అని మనం అనుకోవచ్చు. లేదు Masoretic text లో ఉన్నదే సరైనది అని అనుకుంటే గనక " אָהֳלִיבָמָה בַּת עֲנָה בַּת צִבְעוֹן (అహోలీవామాహ్ బత్ అనాహ్ బత్ త్సివ్'ఓన్)" అనే హీబ్రూ వాక్యాన్ని Oholibamah the daughter of Anah and granddaughter of Zibeon అని కూడా తర్జుమా చేయొచ్చు. ఎందుకంటే హీబ్రూ లో మనవరాలిని కోడలిని కూడా కూతురు అనే అంటారు. కాబట్టి ఇక్కడ "సిబ్యోను కుమార్తెయైన అనా కుమార్తెయగు అహోలీబామా" అని కాకుండా "సిబ్యోను కుమార్తెయు అనా కుమార్తెయు అయిన అహోలీబామా" లేదా "సిబ్యోను మనవరాలు, అనా కుమార్తెయు అయిన అహోలీబామా" అని కూడా తర్జుమా చేయొచ్చు. కొన్ని తర్జుమాలో అలానే తర్జుమా చేశారు కూడా. లేదు అలా తర్జుమా చేయకూడదు, "సిబ్యోను కుమార్తెయైన అనా కుమార్తెయగు అహోలీబామా" అని మాత్రమే తర్జుమా చేయాలి అని అనుకుంటే గనక, దీనికి రషీ గారు ఒక చక్కటి వివరణ ఇచ్చారు. ఆయన ఏమంటారంటే - హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదా అని అన్నప్పుడు, అదేవిధంగా అనా కుమార్తెయగు అహోలీబామా అని వ్రాసి ఉంటే సరిపోయేది కదా. మధ్యలో సిబ్యోను ప్రస్తావన ఎందుకు తెచ్చారు? ఎందుకంటే, సిబ్యోను కుమార్తెయైన అనా అని అంటే వాస్తవానికి ఇక్కడ అనా యొక్క భార్య, సిబ్యోను కోడలు. ఇక్కడ whole point ఏంటంటే ఏశావు వివాహం చేసుకున్న అహోలీబామా అనే స్త్రీ ఒక అక్రమ సంతానం. సిబ్యోను తన కోడలితో అక్రమ సంబంధం పెట్టుకుని అహోలీబామాను కన్నాడు అనే విషయాన్ని convey చేయడం కోసం ఇక్కడ ఆ విధంగా వ్రాశారు అని రషీ గారు తన వ్యాఖ్యానంలో రాశారు (Rashi on Genesis 36:2).
ఈ విధంగా మనం భాషాపరంగానూ, cultural point of view లోనూ, అక్కడున్న context ని అలాగే major theme - వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని విశ్లేషిస్తే మనకు అన్ని విషయాలూ చక్కగా అర్థం అవుతాయి ఎలాంటి contradictions కూడా ఉండవు.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.