బైబిల్ గ్రంథం ముక్త కంఠంతో పరిశుద్ధుడిగా న్యాయవంతుడిగా పరిచయం చేస్తున్న యెహోవా దేవునిపై ప్రపంచవ్యాప్తంగా ఆయా భావజాలాలకు సంబంధించినవారి నుండి లెక్కకుమించిన అన్యాయపు విమర్శలు, అడ్డకోలు ఆరోపణలు చెయ్యబడడం మనం చూస్తూనే ఉన్నాం. వారిలో స్త్రీవాదులుగా పిలవబడే గుంపు ఒకరు. వీరు పైకి మేము స్త్రీల హక్కుల కోసం పోరాడేవారమని చెబుతుంటారు కానీ పురుషులను మాత్రం చాలా చిన్నచూపు చూస్తుంటారు, వారిని విపరీతంగా ద్వేషిస్తారు. చివరికి స్త్రీలు వారిపై చేస్తున్న దాడులను కూడా దుర్మార్గంగా సమర్థించుకుంటుంటారు. ఉదాహరణకు; ఒక భార్య భర్తపై దాడి చేస్తే వాడు ఎంతగా వేధిస్తే ఆమె అలా చేసుంటుంది, అక్రమసంబంధం పెట్టుకున్నాడంట అందుకే అలా చేసింది అంటూ దాడి చేసిన భార్యను సమర్ధించుకుంటారు. అదే పని భర్త చేస్తే మాత్రం ఆ కారణాలేమీ పరిగణలోకి తీసుకోరు. ఆ భార్య నిజంగానే వేధించడం వల్ల లేక, అక్రమసంబంధం పెట్టుకోవడం వల్ల అతను అలా చేసినప్పటికీ వీరు అదంతా అనుమానం, అబద్ధం అన్నట్టుగానే కొట్టిపడేస్తారు. కఠినంగా శిక్షించాలంటూ హడావుడి చేస్తుంటారు. ఒకవైపు మేము పురుషులతో పాటు సమానహక్కుల కోసం పోరాడుతున్నామని అంటూనే పురుషులతో పాటు సమాన బాధ్యతలు, సమాన శిక్షలు తీసుకోకుండా చివరికి మేమే గొప్పవారం, చివరికి దైవాలమని కూడా ప్రగల్భాలు పలుకుతుంటారు.
వీరి ప్రగల్భాలూ ప్రవర్తనా చూస్తుంటే నాకు తూరు రాజు, పురుగులు పడి చచ్చిన హేరోదులు జ్ఞాపకం వస్తుంటారు (యెహెజ్కేలు 28:2,9, అపొ. కార్యములు 12:21-23).
ఈవిధంగా మనుషులమని మర్చిపోయి దుర్మార్గంగా స్త్రీల నేరాలను సమర్థించుకుంటూ పురుషులపై విరుచుకుపడే వీరు కూడా బైబిల్ పైనా బైబిల్ దేవునిపైనా అడ్డకోలు ఆరోపణలూ చేస్తుంటారు.
ఉదాహరణకు; వీరిలో కొందరు దేవుడు కనాను ప్రాంతపు ప్రజలను నాశనం చెయ్యమని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినప్పుడు అక్కడున్న స్త్రీలను కూడా చంపేయమన్నాడు. ఇది స్త్రీలపై వివక్ష కాదా అంటూ వాపోతారు. ఆయన ఆ సందర్భంలో కేవలం స్త్రీలను మాత్రమే చంపమంటే ఆవిధంగా ఆలోచించే అవకాశం ఉందేమో కానీ అక్కడ ఆయన పురుషులతో పాటుగా స్త్రీలనూ చంపమని చెబుతున్నాడు. పైగా వారిలో ఎవరూ కూడా నిర్దోషులు లేరు (లేవీకాండము 18:25). దీనిని బట్టి ఆ విమర్శలో ఎంత కుయుక్తి దాగుందో మీరే గ్రహించండి. బహుశా వీరు అలాంటి సందర్భాలను బట్టి అంతగా వాపోతున్నారంటే వీరు పోరాడుతున్నట్టుగా స్త్రీ పురుషుడికి సమానం కాదేమో? అందుకే పురుషుడితో పాటుగా స్త్రీని సమానంగా శిక్షించకుండా జాలి చూపించాలేమో?. కానీ బైబిల్ దేవుడు స్త్రీ పురుషులు ఇద్దరినీ వారు చేసే నేరాలను కూడా సమానంగా చూస్తాడు. అందుకే సమానంగా శిక్షిస్తాడు.
అదేవిధంగా పౌలు, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండమని చెప్పడం ఎఫెసీ 5:22 వాక్యభాగంలో మనకు కనిపిస్తుంది. వీరు ఆ మాటలను కూడా పట్టుకుని అవేవో స్త్రీలను బానిసలుగా మార్చేవిగా ఉన్నట్టు పౌలుపై విరుచుకుపడుతుంటారు. ఆ సందర్భంలో పౌలు లోబడడం అంటే అర్థం ఏంటో క్రీస్తుతో పోలుస్తూ వివరిస్తున్నాడు. ఒకవేళ ఆ పోలికను ప్రక్కనపెట్టినప్పటికీ అదే పౌలు ఆ క్రింది వచనాలలోనే పురుషులకు కూడా మీ భార్యలను మీ శరీరంవలే ప్రేమించండి, క్రీస్తువలే వారికోసం ప్రాణం పెట్టండని చెబుతున్నాడు (ఎఫెసీ 5:25:28). భర్తకు లోబడమని చెప్పడం స్త్రీని బానిసగా మార్చడమే ఐతే నీ భార్యను నీ శరీరం వలే ప్రేమించమనడం, ఆమెకోసం క్రీస్తువలే ప్రాణం పెట్టమనడం ఏమౌతుంది? తనకు లోబడని భార్య కోసం ప్రాణం పెట్టేంతలా ప్రేమించే అవసరం భర్తకు ఏముంటుంది?
వీరు బైబిల్ పై చేసే విమర్శలు ఇలానే కుయుక్తిగా ఉంటాయి. అలాంటివాటిలో ఒక ప్రధానమైన విమర్శను ఇప్పుడు చూద్దాం -
ద్వితీయోపదేశకాండము 22:13-17 ఒకడు స్త్రీని పెండ్లి చేసికొని ఆమెను కూడిన తరువాత ఆమెను ఒల్లక ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరచి ఈ స్త్రీని నేను పరిగ్రహించి యీమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమెయందు కన్యాత్వము నాకు కనబడలేదని చెప్పిన యెడల ఆ చిన్నదాని తలిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరిపెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యాత్వలక్షణములను తీసికొని రావలెను. అప్పుడు ఆ చిన్నదాని తండ్రి నా కుమార్తెను ఈ మనుష్యునికి పెండ్లి చేయగా ఇదిగో ఇతడీమె నొల్లకనీ కుమార్తెయందు కన్యాత్వము నాకు కనబడలేదనియు అవమానక్రియలు చేసినదనియు ఆమెమీద నింద మోపెను; అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గురుతులివే అని పెద్దలతో చెప్పి పట్టణపుపెద్దల యెదుట ఆ బట్టను పరచవలెను.
ఈ సందర్భంలో ఒక భర్త తన భార్యను ద్వేషించి ఆమె శీలంపై ఆరోపణ చేస్తున్నట్టు ఆమె తల్లితండ్రులు ఆ ఆరోపణను నిర్వీర్యం చెయ్యడానికి ఆ భార్యాభర్తలు తొలిరాత్రి కలిసినప్పటి రక్తపు మరకలున్న వస్త్రాన్ని తీసుకువచ్చి పెద్దల ముందు సాక్ష్యంగా చూపించి అతడిని ఒప్పిస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను బట్టి దీనిని ఆలోచించినప్పుడు ఈ పద్ధతి స్త్రీలను అవమానించే విధంగానే కనిపిస్తుంటుంది. పైగా ఈ పద్ధతి ద్వారా దేవుడు భార్య శీలంపై ఆరోపించే అవకాశం భర్తకు కల్పించినట్టుగా భర్త శీలంపై ఆరోపించే అవకాశం భార్యకు కల్పించడం లేదు.
మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే; కొందరు స్త్రీలు పెళ్ళికి ముందు పురుషసంయోగం ఎరుగకున్నప్పటికీ భారమైన పనులు చేసినప్పుడూ ఏదైనా తీవ్రమైన భయానికి లోనైనప్పుడూ వారి కండరాల్లో జరిగిన మార్పులను బట్టి మొదటిరాత్రి వారికి రక్తస్రావం అవ్వకపోవచ్చు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి స్త్రీ పైన మనం చూసిన పద్ధతిలో చెప్పబడినట్టుగా తన కన్యాత్వానికి రుజువు చూపించలేదు. కాబట్టి తన భర్త చేసిన ఆ ఆరోపణ కారణంగా 21వ వచనం ప్రకారం; ఆమె రాళ్ళతో కొట్టబడి అన్యాయంగా చంపబడుతుంది. ఇలాంటి ఒక పరీక్షను దేవుడు మోషే ధర్మశాస్త్రంలో రాయించాడు కాబట్టి దీని ప్రకారం బైబిల్ లో స్త్రీపై లింగవివక్ష చూపబడింది అనేదే మనముందున్న ఆరోపణ.
కొందరు బోధకులు దీనికి సమాధానం చెబుతూ ఇది క్రొత్తగా యెహోవా దేవుడు ప్రవేశపెట్టింది కాదనీ చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఇది అప్పటికే అమలులో ఉందని వివరణ ఇచ్చారు. అది వాస్తవమే అయినప్పటికీ దానిని మన దేవుడు కూడా ఎందుకు అనుమతించాడో ఎలాంటి పరిధులతో అనుమతించాడో లేఖనాల ఆధారంగా వివరణ ఇవ్వడానికే ఈ వ్యాసం రాస్తున్నాను.
1. మొదటిగా ఈ పరీక్ష స్త్రీలపై వివక్ష చూపించడానికి కాదు, ఆ స్త్రీకి భద్రత కల్పించడానికే దేవుడు అనుమతించాడు. ఎలాగంటే; ఆ కాలంలో భార్య శీలంపై అనుమానం కలిగిన భర్తలు తమకు తామే ఆ భార్యలను శిక్షించేవారు. దానివల్ల ఏ తప్పూ చెయ్యని భార్యలు కూడా అన్యాయంగా శిక్షించబడే లేక భర్త కోపానికి బలయ్యే అవకాశం ఉంది. అలా జరక్కుండా ఉండాలనే అనగా అనుమానం కలిగిన భర్తలు తమకు తాముగా తమ భార్యలను శిక్షించకుండా తన అనుమానం ఎంత వాస్తవమో నిర్థారించుకోవాలనే దేవుడు ఈ పరీక్షను అనుమతించాడు. ఈ పరీక్షను దేవుడు స్త్రీకి భద్రతగా అనుమతించాడు కాబట్టే నిర్దోషియైన భార్యతో ఇకపై జాగ్రతగా నడుచుకోవాలని ఆజ్ఞాపిస్తున్నాడు (ద్వితీయోపదేశకాండము 22:19) అంతమాత్రమే కాదు దోషం చెయ్యని ఆమెను అలా అనుమానించి, అవమానించినందుకు ఆ భర్తకు శిక్ష కూడా విధిస్తున్నాడు (ద్వితీయోపదేశకాండము 22:18,19). అంటే నిర్దోషియైన భార్యను ఒక భర్త అనుమానించి, అవమానించినందుకు అతనిపై శిక్ష మరియు నష్టపరిహారం మోపబడింది. ఇది ఏ తప్పూ చెయ్యని స్త్రీలకు భద్రత కాదా? ఇది స్త్రీపై వివక్షే ఐతే అనుమానించి శీలపరీక్షకు సిద్ధపడిన భర్తకు శిక్షెందుకు? జీవితాంతం ఆమెను విడిచిపెట్టకూడదనే హెచ్చరిక ఎందుకు?
ఇప్పుడు స్త్రీవాదులకు ఒక ప్రశ్న: ప్రస్తుతం గృహహింస కేసుల్లో ఎంతోమంది భార్యలు నిర్దోషులైన భర్తలను దోషులుగా ఆరోపించి ఇరికిస్తున్నారు, అవమానిస్తున్నారు. అలా చేసినవారికి ఏమన్నా శిక్షలు పడుతున్నాయా? లేదు కదా. మరి వాటిపై మీరేందుకు పోరాడరు?. మళ్ళీ మేము స్త్రీలము కాబట్టి స్త్రీల విషయంలో జరిగేవాటిపైనే పోరాడుతున్నామని సమర్థించుకోవద్దు సుమా? అలాగైతే మీరు మనుషులు కాదని ఒప్పుకోవలసి వస్తుంది. ఎందుకంటే మీరు మనుషులైతే పురుషులూ మనుషులేగా. అలాగే మేము స్త్రీలం కాబట్టి స్త్రీలకోసం మేమే పోరాడుకుంటాం, పురుషులు మాకోసం ఏం చెయ్యవద్దు, మమ్మల్ని గౌరవించవలసిన అవసరం కూడా మీకు లేదు, మా స్త్రీలను మేమే గౌరవించుకుంటాం, మీరు పురుషులు కాబట్టి మీ పురుషుల్నే మీరు గౌరవించుకోండి అని పురుషులకు చెప్పడం కూడా ఔతుంది. అలాంటప్పుడు స్త్రీని గౌరవించండి, వారిని కాపాడండి, వారిని అమ్మగా అక్కగా చెల్లిగా భావించండని అని పురుషులకు ఇక బోధించలేరు సుమా! "మేము స్త్రీలం కాబట్టి స్త్రీలకోసమే పోరాడుకుంటామనే" మీ లింగపక్షపాత కొలమానం ప్రకారం అలా చెయ్యవలసిన అవసరం వారికేముంటుంది?
అదేవిధంగా శీలపరీక్షలో ద్వితీయోపదేశకాండము 22:18,19 ప్రకారం; అనుమానించిన భర్తా అనుమానించబడిన భార్యా మళ్ళీ కలసి జీవించాలి కాబట్టి, దేవుడు ఆ అనుమానపు భర్తకు కేవలం ఏదో ఒక శిక్ష, నష్టపరిహారంతో సరిపెట్టాడు కానీ అదే బయటి వ్యక్తి కనుక మరొకరిపై ఉద్దేశపూర్వకంగా అబద్ధపు ఆరోపణ చేస్తే ఆ వ్యక్తి నిజంగా నేరం చేస్తే ఎలాంటి శిక్షపడుతుందో ఆ అబద్ధపు ఆరోపణ చేసిన వ్యక్తికి కూడా అదే శిక్ష విధించమని ఆయన ఖండితంగా ఆదేశించాడు (ద్వితీయోపదేశకాండము 19:16-19). ప్రస్తుత సమాజంలో కొందరు స్త్రీలు పురుషులపై అన్యాయంగా చేసే లైంగికవేధింపుల విషయంలో కానీ గృహహింస ఆరోపణల విషయంలో కానీ ఈ నియమాన్ని అమలుచేస్తే అలా నిజంగా చేసినవారు ఏవిధంగా శిక్షించబడాలో అన్యాయంగా ఆరోపణలు మోపినందుకు వీరు కూడా అదేవిధంగా శిక్షించబడాలి. ఇది స్త్రీవాదులకు సమ్మతమేనా? లేక ఇలాంటి నిష్పక్షపాత న్యాయాన్ని కనపరుస్తున్న దేవునిపై ఈ కారణంతో కూడా మరికొన్ని విమర్శలు చెయ్యడానికి సిద్ధపడతారా?
2. ఈ పరీక్ష ద్వారా భార్య శీలంపై ఆరోపణ చేసే అవకాశం భర్తకు ఉన్నట్టుగా భర్త శీలంపై ఆరోపణ చేసే అవకాశం భార్యకు ఎందుకు లేదంటే పైన వివరించినట్టుగా అప్పటి సమాజ పరిస్థితులను బట్టి దేవుడు దీనిని స్త్రీలకే భద్రతగా అనుమతించాడు. ఒకవేళ ఆ కాలంలో భార్యలు కూడా ఇప్పటి కొందరు భార్యల్లా అనుమానపు పిశాచులై తమ భర్తలను శిక్షిస్తుంటే భర్తల కోసం కూడా అలాంటి పరీక్షను ప్రవేశపెట్టేవాడేమో? అలాంటి అవసరం అప్పుడు లేదు కాబట్టి భర్తలకు అలాంటి పరీక్ష లేదు.
స్త్రీవాదులు అడ్డకోలుగా ఈ వివరణను ప్రక్కనపెట్టినప్పటికీ స్త్రీకి మాత్రమే శీలపరీక్ష లింగవివక్షగా రుజువుచెయ్యలేరు. ఎందుకంటే; బైబిల్ దేవుడు ఇశ్రాయేలీయుల చేత కొన్ని దేశాలపై యుద్ధాలను చేయించినప్పుడు వారిలో పురుషులను మాత్రమే చంపించాడు, స్త్రీలను మినహాయించాడు (ద్వితీయోపదేశకాండము 20:12-14). దీనిని బట్టి ఆయన పురుషులపై వివక్ష చూపించాడని భావించాలా? లేక పురుషులకు ఉండే శారీరక బలం వల్ల యుద్ధాలలో వారే పాల్గొంటారు కాబట్టి, వారిని మాత్రమే చంపమన్నాడా? ఆయన మరికొందరు రాజులపై ఆగ్రహించి వారిని నాశనం చేసేటప్పుడు కూడా ఆ రాజ వంశంలోని మగపిల్లలను మాత్రమే చంపించాడు, ఆడపిల్లలను మినహాయించాడు (1రాజులు 21:21). దీనినిబట్టి కూడా ఆయన పురుషులపై వివక్ష చూపించి మగపిల్లలను మాత్రమే చంపించాడని భావించాలా? లేక వంశవృక్షం పురుషుల నుండే అభివృద్ధి చెందుతుంది కాబట్టి, వారిని మాత్రమే చంపి ఆ ఆధిక్యత లేని స్త్రీలను మినహాయించాడని భావించాలా? అందుకే ప్రతీదానినీ వివక్షతో ముడిపెట్టేముందు కాస్త ఇంగితజ్ఞానంతో ఆలోచించుకోవాలి. బైబిల్ ప్రకారం కొన్ని విషయాలలో పురుషుడికి ఆధిక్యత ఇవ్వబడింది, కొన్నిటిలో స్త్రీకి మినహాయింపు ఇవ్వబడింది. వీటిని వివక్ష పరిధిలో చూడకూడదు. శీలపరీక్ష కూడా అంతే. అది స్త్రీలకు మాత్రమే పరిమితమైనప్పటికీ వివక్షగా చూడకూడదు.
హొషేయ 14:9 జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు; ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాని ననుసరించి నడచుకొందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు.
ఇక్కడ స్త్రీవాదులూ బైబిల్ విమర్శకులూ గుర్తుంచుకోవలసిన మరో విషయం ఏంటంటే; బైబిల్ ప్రకారం భార్య భర్తకు లోబడాలి, అతనిపట్ల పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే ఆ భార్య క్రీస్తు యేసు సంఘానికి ఛాయగా ఉంది (ఎఫెసీ 5:31,32). అందుకే ఆమె శీలానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వడింది. అలాగే భర్తలకు భార్య యొక్క భారం అప్పగించబడింది. అందుకే అతను ఆమెను పోషించాలి, సంరక్షించాలి. అలాగని పురుషుడి శీలానికి ప్రాముఖ్యత లేదా అంటే ఖచ్చితంగా ఉంది కాబట్టే "భర్తకే గాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు. ఆలాగున భార్యకే గాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు" (1 కోరింథీ 7:4) అని స్పష్టంగా హెచ్చరించబడింది.
3. మోషే ధర్మశాస్త్రంలోని ఈ పరీక్ష ప్రతీ పురుషుడూ తన భార్య విషయంలో తప్పనిసరిగా అనుసరించవలసిన క్రమంగా అనుమతించబడలేదు. కేవలం ఏ భర్తకైతే తన భార్య శీలంపై అనుమానం కలిగిందో అలాంటి వారికోసమే ఈ పరీక్ష అనుమతించబడింది.
ఒకవేళ ఇప్పుడు మీలో ఎవరికైనా స్త్రీకి భద్రత కల్పించాలన్నదే దేవుని ఉద్దేశమైతే ఇలాంటి పరీక్షను అనుమతించడం ఎందుకు, మీ భార్యలను అనుమానించవద్దని చెప్పి అనుమానించినవారికి శిక్ష విధిస్తే సరిపోతుందిగా అనిపిస్తే; ప్రతీ పురుషుడూ అమాయకురాలైన భార్యనే అనుమానిస్తుంటే ఆయన ఇలాగే చేసేవాడేమో కానీ కొన్నిసార్లు అవతలివారి ప్రవర్తనను బట్టి కూడా అనుమానం కలుగుతుంది. సమాజంలో పెళ్ళికి ముందు శీలం కోల్పోయే స్త్రీలు ఉండబట్టేగా ఆ అనుమానం పుట్టింది. అప్పుడు కూడా కారణాలు ఉన్న భర్తలు అనుమానించకుండా ఉండాలా? అలాగైతే కొందరు స్త్రీలు అమాయకులపై కూడా గృహహింస, లైంగిక వేధింపుల కేసులు పెడుతున్నారు కాబట్టి, ఆ చట్టాలను కూడా తీసెయ్యాలి సరేనా? కాబట్టి ఈ పరీక్షను మనం అమాయకురాలైన స్త్రీకి భద్రత కల్పించేదిగా శీలాన్ని కోల్పోయిన భార్యకు శిక్ష విధించేదిగా నియమించబడిందని అర్థం చేసుకోవాలి.
4. ఒకవేళ శీలపరీక్షలో స్త్రీ నిర్దోషి అని రుజువై, ఆరోపణ చేసిన భర్తను శిక్షించినప్పటికీ ఆమెకు కలిగిన అవమానం మాసిపోతుందా అని ఎవరైనా ప్రశ్నిస్తే కొంచెం ఇంగితజ్ఞానంతో ఆలోచించినా ఇందులో వివక్ష ఏమాత్రం కనిపించదు. ఆ పరీక్షే లేకపోతే అనుమానం కలిగిన భర్త ఆ భార్యను విడిచిపెట్టడమో జీవితాంతం వేధించడమో చేస్తాడు. దానివల్ల ఆమెకే కదా అన్యాయం? ఒకవేళ ఇదే కొలమానాన్ని తీసుకుంటే ప్రతీరోజూ ఎంతోమంది ఎన్నో ఆరోపణలతో జైలుకు వెళ్తున్నారు; తర్వాత అందులోని కొందరు నిర్దోషులని రుజువు చెయ్యబడుతున్నారు. వారందరికీ కూడా అవమానమే కలుగుతుంది. దీనిని బట్టి చట్టవ్యవస్థను తప్పుపడదామా?
5. వివాహానికి ముందు ఏ తప్పూ చెయ్యని స్త్రీ తొలిరాత్రి రక్తపు మరకల వస్త్రం చూపించనప్పటికీ ఆ కారణంగా శిక్షించబడే అవకాశం లేదు. ఎందుకంటే శీలపరీక్షలోని రక్తపు స్రావం మాత్రమే అంతిమ రుజువు కాదు. ఒకవేళ ఆమె ఆ రుజువును చూపించలేకపోయినప్పటికీ ఆ విషయంలో ఆమె దోషం చెయ్యని నిర్దోషియైతే ఆమె ముందు మరికొన్ని ప్రత్యామ్నాయాలను కూడా ఆయన నియమించాడు. ఊరీము తుమ్మీము ద్వారా స్వయంగా దేవుడే న్యాయాన్ని తెలియచేసే కాలం అది (నిర్గమకాండము 28:30). ఒకవేళ నిర్దోషియైన భార్య రక్తపు మరకలు చూపించలేనప్పటికీ తన నిర్దోషత్వాన్ని యాజకుడి సమక్షంలో ఊరీము తుమ్మీము తీర్పు ద్వారా రుజువు చేసుకోగలదు. లేదా దానికి అద్భురకరమైన మరో ప్రత్యామ్నాయం ఉంది. ఈ వాక్యభాగం చూడండి-
సంఖ్యాకాండము 5:11-31 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఒకని భార్య త్రోవతప్పి వానికి ద్రోహముచేసినయెడల, అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనముగా శయనించిన యెడల ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగైయుండి ఆమె అపవిత్రపరచబడిన దనుటకు సాక్ష్యము లేక పోయినను, ఆమె పట్టుబడకపోయినను, వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్యమీద కోపపడిన యెడల, లేక వాని మనస్సులో రోషముపుట్టి అపవిత్ర పరచబడని తన భార్యమీద కోపపడినయెడల, ఆ పురు షుడు యాజకునియొద్దకు తన భార్యను తీసికొనివచ్చి, ఆమె విషయము తూమెడు యవలపిండిలో పదియవ వంతును తేవలెను. వాడు దానిమీద తైలము పోయకూడదు దానిమీద సాంబ్రాణి వేయకూడదు; ఏలయవగా అది రోషవిషయమైన నైవేద్యము, అనగా దోషమును జ్ఞాప కముచేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము. అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసికొనివచ్చి యెహోవా సన్నిధిని ఆమెను నిలువబెట్టవలెను. తరువాత యాజ కుడు మంటికుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసికొనవలెను, మరియు యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెము తీసికొని ఆ నీళ్లలో వేయవలెను. తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టి, ఆ స్త్రీ తల ముసుకును తీసి, రోష విషయమైన నైవేద్య మును, అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను. శాపము పొందించు చేదునీళ్లు యాజకుని చేతిలో ఉండవలెను. అప్పుడు యాజకుడు ఆ స్త్రీచేత ప్రమాణము చేయించి ఆమెతో చెప్పవలసిన దేమ నగాఏ పురుషుడును నీతో శయనింపనియెడలను, నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యముచేయక పోయినయెడలను, శాపము కలుగజేయు ఈ చేదునీళ్లనుండి నిర్దోషివి కమ్ము. నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు త్రోవతప్పి అపవిత్ర పరచబడినయెడల, అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమిచేసిన యెడల యెహోవా నీ నడుము పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుట వలన యెహోవా నీ జనుల మధ్యను నిన్ను శపథమునకును ప్రమాణమునకును ఆస్పదముగా చేయుగాక. శాపము కలుగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీచేత శపథ ప్రమాణము చేయించిన తరువాత ఆ స్త్రీ ఆమేన్ అని చెప్పవలెను. తరువాత యాజకుడు పత్రముమీద ఆ శపథములను వ్రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి శాపము కలుగజేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి త్రాగింపవలెను. శాపము కలుగజేయు ఆ నీళ్లు ఆమె లోనికి చేదు పుట్టించును. మరియు యాజకుడు ఆ స్త్రీ చేతినుండి దోష విషయమైన ఆ నైవేద్యమును తీసికొని యెహోవా సన్నిధిని ఆ నైవేద్య మును అల్లాడించి బలిపీఠము నొద్దకు దాని తేవలెను. తరువాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్య ములోనుండి పిడికెడు తీసి బలిపీఠము మీద దాని దహించి ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలెను. అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తరువాత జరుగునదేదనగా, ఆమె అపవిత్రపరపబడి తన భర్తకు ద్రోహము చేసినయెడల, శాపము కలుగజేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తరువాత ఆమె కడుపు ఉబ్బును ఆమె నడుము పడి పోవును. ఆ స్త్రీ తన జనులమధ్య శాపమున కాస్పద ముగా నుండును. ఆ స్త్రీ అపవిత్ర పరపబడక పవిత్రు రాలై యుండినయెడల, ఆమె నిర్దోషియై గర్భవతియగు నని చెప్పుము. రోషము విషయమైన విధియిదే. ఏ స్త్రీయైనను తన భర్త అధీనములో నున్నప్పుడు త్రోవ తప్పి అపవిత్రపడిన యెడలనేమి, లేక వానికి రోషము పుట్టి తన భార్య మీద కోపపడినయెడలనేమి, వాడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టినప్పుడు యాజ కుడు ఆమెయెడల సమస్తము విధిచొప్పున చేయవలెను. అప్పుడు ఆ పురుషుడు నిర్దోషియగును, ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలెను.
ఈ వాక్యభాగాన్ని మనం పరిశీలిస్తే ఒక భర్త తన భార్యను అవమానించినప్పుడు దానికి రుజువులు లేనప్పుడు, అతను ఆమెను యాజకుడి దగ్గరకు తీసుకువస్తాడు. యాజకుడు ఆమె చేత ప్రమాణం చేయించి, పరిశుద్ధస్థలపు ధూలి కలిపిన చేదునీటిని ఆమెతో త్రాగిస్తాడు. ఒకవేళ ఆమె నిర్దోషియైతే గర్భవతి ఔతుంది, కాకపోతే ఇక సంసారానికి పనికిరాకుండా పోతుంది. ఇది దేవుడే స్వయంగా అద్భుతం ద్వారా రుజువు చేస్తున్నాడు. కాబట్టి కన్యత్వం విషయంలో రక్తపు మరకలున్న వస్త్రాన్ని రుజువుగా చూపలేని స్త్రీ, ఆమె నిర్దోషియైతే ఈవిధంగా కూడా తన నిర్దోషత్వాన్ని రుజువుచేసుకోవచ్చు. ఇది వివాహం తర్వాత జరిగే వ్యభిచారం గురించని రాయబడినప్పటికీ శీలపరీక్ష విషయంలో వర్తించదని చెప్పలేము, ఎందుకంటే ఇది భర్తకు పుట్టే రోషాన్ని నివృత్తి చేసే పద్ధతిగా ప్రవేశపెట్టబడింది.
గమనించండి; 31వ వచనం ప్రకారం ఈ పద్ధతిలో కూడా ఆ భర్త మోపిన నేరం (అనుమానం) రుజువైతే ఆమె శిక్షించబడి ఆ భర్త నిర్దోషి ఔతాడు. దానిప్రకారం; ఒకవేళ ఆమె నిర్దోషియైతే అనగా ఆ భర్త అనుమానం నిజం కాకుంటే దేవుని ముందు ఆ భర్తే దోషిగా నిలబడతాడు. కాబట్టి ప్రతీ భర్తా ఊరికే తన భార్యను శీలపరీక్షకు తీసుకుపోడు. ఎందుకంటే ఆమె నిర్దోషియైతే దోషి అయ్యేది ఆ భర్తే. అందుకే ఈ పరీక్షలు అనుమానం కలిగిన భర్తల అనుమానాన్ని నిర్వీర్యం చేసి నిర్దోషులైన భార్యలకు భద్రత కల్పించేవిగానూ అలానే దోషులైన భార్యలకూ ఊరికే అనుమానించే భర్తలకూ శిక్షవిధించేవిగానూ నియమించబడ్డాయని మరలా జ్ఞాపకం చేస్తున్నాను, అదే సత్యం.
గమనిక: ఈ వ్యాసంలో నేను ప్రస్తావించిన స్త్రీవాదులూ స్త్రీలు ఒకటి కాదు, స్త్రీవాదుల్లో స్త్రీలు ఉంటారు కానీ స్త్రీలందరూ స్త్రీవాదులు కాదు. ఉదాహరణకు టెర్రరిస్టులంతా మనుషులే కానీ మనుషులంతా టెర్రరిస్టులు కాదు కదా! కాబట్టి ఇందులో నేను స్త్రీవాదుల నైజంగా బయటపెట్టిన నిజాలు స్త్రీ అనీ పురుషుడు అనీ బేధం లేకుండా యధార్థంగా ఆలోచించే లేక ప్రవర్తించే స్త్రీలకు ఎంత మాత్రం వర్తించవు.
బైబిల్ దేవుడు స్త్రీలపై వివక్షచూపించాడని బైబిల్ విమర్శకులు ఆరోపిస్తున్న మరో మూడు సందర్భాల గురించి ఈ వ్యాసం చదవండి. అందులో స్త్రీవాదుల దుష్టనైజానికి సంబంధించి మరికొన్ని వాస్తవాలు కూడా బహిర్గతం చేసాను.
(మోషే ధర్మశాస్త్రంలో రుతుస్రావం అపవిత్రమని ఎందుకు రాయబడింది? స్త్రీ సంఘంలో మౌనంగా ఎందుకు ఉండాలి? బిడ్డను కన్నతల్లి కడగా ఉండవలసిన కాలంలో మగపిల్లాడికి 33 రోజులు ఆడపిల్లకు 66 రోజూలు ఈ బేధం ఎందుకు?)
బైబిల్ దేవుడికి స్త్రీలపై వివక్ష వాస్తవమా లేక ఆరోపణా?
మరి కొందరు ధర్మశాస్త్రంలోని "పురుషసంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి" (సంఖ్యాకాండము 31:18) అనే మాటలను కూడా ఆధారం చేసుకుని బైబిల్ దేవుడు శీలపరీక్షలను ప్రోత్సహించాడంటూ ఆరోపణ చేస్తుంటారు. కానీ అది పూర్తిగా అవాస్తవం. ఈ విషయం నేను ఇప్పటికే వివరించాను. ఈ వ్యాసం చదవండి (11వ భాగం).
హిందూమతోన్మాదుల అశ్లీలపు ఆరోపణలకు బైబిల్ సమాధానాలు
చదువరులకు విజ్ఞప్తి: మీకు ఏదైనా వాక్యభాగం విషయంలో ఇలాంటివేమైనా ఆరోపణలు ఎదురైనా లేక వ్యక్తిగతంగా సందేహాలు తలెత్తినా మా బైబిల్ వ్యాఖ్యానాలు పరిశీలించమనవి. మా దర్శనం ప్రకారం, సాధ్యమైనంతమట్టుకు, మా దృష్టికి వచ్చినంతమట్టుకు ప్రతీ ఆరోపణకూ సందేహానికీ సంబంధిత వాక్యభాగపు వ్యాఖ్యానంలో వాటి సమాధానం పొందుపరచడం జరుగుతుంది.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2025 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
