ఇతర అంశాలు

రచయిత: కె విద్యా సాగర్
"గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానము" (కీర్తనలు 127:3). ఈ వాక్యభాగం మనకు ప్రధానంగా రెండు విషయాలను తెలియచేస్తుంది.
 
1. ఇది దేవుడు మాత్రమే తన కృపచొప్పున ఇస్తున్న బహుమానం, ప్రపంచంలో మరెవ్వరూ కూడా ఇటువంటి‌ బహుమానం ఇవ్వలేరు. కనీసం ఆ బహుమానంలో ఒక్క అవయవాన్ని కూడా తయారుచెయ్యలేరు. ఎందుకంటే ఆ బహుమానం వెనుక సర్వజ్ఞానియైన దేవుని జ్ఞానం (సంక్లిష్టమైన డిజైన్) దాగియుంది. అందుకే భక్తుడైన దావీదు "నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది" అంటున్నాడు (కీర్తనలు 139: 14).
 
2. సాధారణంగా మనకు ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి ఏదైనా విలువైన బహుమానం ఇచ్చినప్పుడు దానిని చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా చూసుకుంటాం, కాపాడుకుంటాం. గర్భఫలం విషయంలో అంతకంటే జాగ్రత్త, శ్రద్ధ కలిగియుండాలనే అది ఈ సమస్త సృష్టినీ కలిగించిన మహా దేవుని బహుమానంగా చెప్పబడింది" 
 
ఒక దేశాన్ని పరిపాలించే రాజు తన పరిపాలన క్రింద జీవిస్తున్న వ్యక్తికి ప్రేమతో ఏదైనా ఒక బహుమానం పంపించాడు అనుకోండి. తీరా ఆ వ్యక్తి ఆ బహుమానాన్ని అజాగ్రత్తతో అశ్రద్ధతో పాడు చేసాడని రాజుకు తెలిస్తే, ఆ రాజు దానిని ఎంత తీవ్రమైన నేరంగా పరిగణిస్తాడో ఊహించండి, ఎందుకంటే ఆ వ్యక్తి అలా చెయ్యడం ఆ రాజును అవమానించడమే ఔతుంది. అలాంటిది దేవాది దేవుడు  ఎంతో జ్ఞానంతో నిర్మించి (కీర్తనలు 139:13, యెషయా 44:2) ఇచ్చిన బహుమానం పట్ల అజాగ్రత్తగా, అశ్రద్ధగా వ్యవహరించడం ఆయనను మరెంత దారుణంగా అవమానించడమో కదా! అలాంటి వైఖరి మరెంతో తీవ్రమైన నేరంగా ఎంచబడుతుంది.
 
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ప్రస్తుతం చాలామంది తల్లితండ్రులు చేస్తుంది ఇదే. 
అదెలాగో చూద్దాం.
 
తండ్రుల వైఖరి:
దేవుడు ఆదామును సృష్టించినప్పుడు అతనికి ఏదేను తోటను సేద్యపరచాలనే పనిని అప్పగించాడు (ఆదికాండము 2:15). అంటే అతడిని వ్యవసాయం చెయ్యమన్నాడు. అతను శపించబడిన తరువాత కూడా కష్టతరమైనదిగా మార్పుచెందిన అదే వ్యవసాయపు పనిలో‌ కొనసాగమన్నాడు (ఆదికాండము 3:19). అప్పటినుండి పురుషులపై పని చేసి కుటుంబాన్ని పోషించాలనే బాధ్యత మోపబడి అది ఇప్పటిదాకా కొనసాగుతూ వస్తుంది. కానీ ఈరోజు చాలామంది తండ్రులు పని విషయంలో‌ సోమరిపోతులుగా ఉంటూ, లేదా త్రాగుబోతులుగా మారుతూ‌ (అందుకు కారణాలు అప్రస్తుతం) తమ‌‌‌ పిల్లలకు అవసరమైన‌ పోషణ, విద్య, వైద్యం‌ వంటివి కూడా అందించలేని కాఠిన్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ పరిస్థితి నేను చాలా కుటుంబాల్లో‌ గమనించాను.
 
1తిమోతికి 5: 8
ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడైయుండును.
 
ఈ వచనంలో పౌలు విశ్వాసియైన తండ్రిని దృష్టిలో పెట్టుకుని అతను తన కుటుంబాన్ని "పోషించకపోతే" (ఇదే సరైన తర్జుమా) అవిశ్వాసి కంటే చెడ్డవాడు అంటున్నాడు.‌ అంటే అవిశ్వాసి అలా ఉన్నప్పటికీ వాడు దేవుని దృష్టిలో చెడ్డవాడే ఔతాడు, కాదంటే ఒక విశ్వాసి అలా ఉంటే మాత్రం వాడికంటే చెడ్దవాడిగా గుర్తించబడతాడు. దేవుడు తల్లితండ్రులకు పిల్లల‌ విషయంలో అప్పగించిన సాధారణ బాధ్యతల్లో విశ్వాసి అవిశ్వాసి అనే బేధం ఉండదు. ఆయన ఆ తేడా లేకుండా అందరికీ‌ బహుమానం ఇస్తున్నట్టే, అందరూ ఆ బహుమానం పట్ల బాధ్యత కలిగియుండాలి.
 
మరికొందరు తండ్రులు తమకు సమయం దొరికినప్పుడు కూడా పిల్లలతో గడపరు, న్యూస్ చూస్తూనో, మొబైల్ ఫోన్ లో రీల్స్ చూస్తూనో గడిపేస్తుంటారు. దీనివల్ల ఆ పిల్లల వైఖరిని గుర్తించి తగిన జాగ్రతలు తీసుకోవడంలో‌ ఘోరంగా విఫలమౌతుంటారు. చిన్నపిల్లలు ఎదుగుతున్నపుడు సహజంగానే వారిలో చెడు లక్షణాలు కూడా పెరుగుతుంటాయి, ఈ కారణంగా ఎప్పటికప్పుడు వారి ప్రవర్తనను గమనించి వాటిని నియంత్రించడానికి చర్యలు తీసుకోకపోతే వారి జీవితం తప్పుదారి పడుతుంది.
 
సామెతలు 22: 15
బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వానిలోనుండి తోలివేయును.
 
మరికొందరు తండ్రులు ఊరికే తమ పిల్లలకు కోపం రేపేవారిగా, స్థాయికి మించి వారిని దండించేవారిగా క్రూరులుగా ఉంటారు. ఇలాంటివారికి క్రూరులు అనేమాటే సరైనది. 
 
ఎఫెసీయులకు 6: 4
తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.
 
కొలస్సీయులకు 3: 21
తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.
 
కాబట్టి తండ్రులు తమ పిల్లలకు అవసరమైన పోషణ, విద్య, వైద్యం, అందించేవారిగా సమయం దొరికినప్పుడల్లా వారితో గడుపుతూ, వారి వైఖరిని గమనిస్తూ తగిన స్థాయిలో క్రమశిక్షణ చేసేవారిగా ఉండాలి. 
 
తల్లుల వైఖరి:
బైబిల్ ప్రకారం పురుషుడికి పని చేసి కుటుంబాన్ని పోషించాలనే బాధ్యత అప్పగించబడితే, స్త్రీకి గృహపరిపాలన చేసే బాధ్యత అప్పగించబడింది‌ (1తిమోతీ 5:14 , తీతుకు 2:4). గృహపరిపాలన అంటే కుటుంబానికి ఆహారాన్ని సిద్ధపరచడం, భర్తపై పిల్లలపై శ్రద్ధ తీసుకోవడం. కానీ ఈరోజు స్త్రీలు కూడా ఉద్యోగాల బాటపడుతున్నారు. స్త్రీలు ఉద్యోగాలు చెయ్యడానికి బైబిల్ కానీ, నేను కానీ వ్యతిరేకం కాదు, బైబిల్ లో చాలామంది భక్తురాళ్ళు కూడా జీవనోపాధి పనులను కలిగియున్నారు. ఉదాహరణకు; రాహేలు మందలను కాచేది (ఆదికాండము 29:9) లూదియ అనే భక్తిపరురాలు ఊదారంగు పొడి అమ్మేది (అపో.కార్యములు 16:14) ప్రిస్క్రిల్లా తన భర్తతో కలసి డేరాలు కుట్టేది (అపో.కార్యములు 18:1-3). మనం సామెతలు గ్రంథం 31:12-24 వచనాలు చూసినప్పుడు గుణవతియైన భార్య, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ తన చేతులతో పని చేస్తున్నట్టు, వ్యాపారం కూడా చేస్తున్నట్టు గమనిస్తాం (అప్పట్లో ఇవి ఉద్యోగాలే). 
 
ఈవిధంగా స్త్రీలు ఉద్యోగాలు చెయ్యవచ్చు కానీ, వారు చేసే ఉద్యోగాలు వారి ప్రధాన బాధ్యతయైన గృహపరిపాలనను తిరస్కరించేవిగా (పిల్లలపై భర్తపై సరైన శ్రద్ధ తీసుకోలేనివిగా) ఉండకూడదు. పురుషుడు చేసే జీవనోపాధి‌ పని/వ్యాపారం కూడా కుటుంబాన్ని పట్టించుకోలేనంతగా ఉండకూడదు. అది ఆ కుటుంబానికి చాలా నష్టం కలిగిస్తుంది. ఈరోజు చాలామంది స్త్రీలు తమ పిల్లలు ఇంకా చిన్నవారిగా ఉండగానే, పాలు త్రాగే వయస్సులో ఉండగానే ఉద్యోగాల బాట పట్టడం వల్ల వారిపై సరైన శ్రద్ధను తీసుకోలేకపోతున్నారు, దీని కారణంగా ఆ పిల్లల ఆరోగ్యం కూడా పాడౌతుంది.
 
ఒకవేళ స్త్రీలు ఉద్యోగాలు చెయ్యకుండా గృహపరిపాల చెయ్యడం వల్ల ఎవరైనా వారిని‌ చులకనగా చూస్తుంటే వారు తమ‌ గృహపరిపాలన ఔన్నత్యాన్ని వివరించి చులకనగా చూసినవారి నోర్లను మూయించాలి తప్ప, పిల్లలపై వారికున్న బాధ్యతలను విస్మరిస్తూ ఉద్యోగాల బాట పట్టకూడదు (పిల్లలు చిన్నవారిగా ఉంటే). ఒకవేళ ఆ విషయంలో  భర్తనుండే సమస్యలు ఎదురైతే (ఉద్యోగం లేదని చులకనగా చూడడం) దానిని పరిష్కరించడానికి కుటుంబ పెద్దలు ఉంటారు, చట్టం ఉంది. ఆమాటకు వస్తే, చాలామంది స్త్రీలు కూడా పురుషులు చేసే జీవనోపాధి పనులను చులకన చేస్తూ స్త్రీ చేసే ఇంటిపనులతో పోలిస్తే అవేమీ గొప్పవి కాదన్నట్టు మాట్లాడుతుంటారు, హేళన చేస్తుంటారు. అందుకని పురుషులంతా ఉద్యోగాలు, ఇతర కష్టతరమైన పనులు మానేసి ఇంటిపనులు చేసుకుంటూ తమ భార్యలను అలాంటి కష్టతరమైన పనుల్లోకి పంపాలా? కాబట్టి స్త్రీలు ఉద్యోగాలు చెయ్యవచ్చు కానీ తమకు దేవుడిచ్చిన బహుమానానికి ప్రేమను పంచలేని విధంగా, సరైన జాగ్రతలు తీసుకోలేని విధంగా మాత్రం చెయ్యకూడదు.
 
ఇదిలా ఉండగా మరికొందరు స్త్రీలు ఉద్యోగాలు లేకుండా ఇంటివద్దే ఉంటున్నప్పటికీ  గృహపరిపాలనను దారుణంగా తృణీకరిస్తున్నారు. వారు పిల్లలకు సరైన పోషకాహారం కూడా తయారు చెయ్యలేని విధంగా టీవీలలోనూ మొబైల్ ఫోన్లలోనూ విలీనమైపోతున్నారు. వారి దృష్టిలో ఆహారం సిద్ధం చెయ్యడం, పిల్లలపై జాగ్రతలు తీసుకోవడం కూడా బానిసత్వమే. ఇది వరకూ కర్రీ పాయింట్స్ అనగానే బ్యాచిలర్స్ కోసం అనుకునేవారు, ఇప్పుడు అక్కడ బ్యాచిలర్స్ కంటే ఎక్కువగా గృహిణులే/వారి భర్తలే దర్శనమిస్తున్నారు. మరికొందరు తల్లులకైతే  పిల్లలకు పాలు ఇచ్చే తీరిక కూడా ఉండట్లేదు (తమ అందం‌ క్షీణిస్తుందని కూడా కొందరు) కనీసం పిల్లలు ఆడుకుంటున్నప్పుడు కూడా సరైన జాగ్రతలు  తీసుకోవడం లేదు. దీనివల్ల ఎంతోమంది పిల్లలు ప్రమాదాల‌ బారినపడుతున్నారు. మీకు తెలిసిన ఏదైనా పెద్ద హాస్పిటల్లో ఎక్కువమంది పిల్లలు ఎలాంటి ప్రమాదాల కారణంగా అక్కడికి వస్తుంటారో చూడండి. ఎక్కువశాతం ప్రమాదాలు పిల్లలు ఆడుకుంటున్నప్పుడు పట్టించుకోకుండా  వదిలెయ్యడం, వారికి అందుబాటులో పదునైన వస్తువులు ఉంచడం వల్ల జరిగేవే. ఇలాంటి ప్రవర్తన అంతా దేవుని బహుమానంపై అశ్రద్ధగా అజాగ్రత్తగా వ్యవహరించడమే. ఆ బహుమానం ఇచ్చిన దేవుణ్ణి అవమానించడమే. చివరికి ఆయన దృష్టిలో నేరస్తులుగా మిగిలిపోవడమే.
 
బైబిల్ గ్రంథంలో ఒక మంచి తల్లి ప్రవర్తన ఎలా ఉంటుందో రాయబడిన మాటలు చూడండి.
 
సామెతలు 31:15-29
ఆమె చీకటితోనే లేచి, తన యింటివారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. తన యింటివారికి చలి తగులునని భయపడదు ఆమె యింటివారందరు రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె తన యింటివారి నడతలను బాగుగా కని పెట్టును పనిచేయకుండ ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు చాలమంది కుమార్తెలు పతివ్రతాధర్మము ననుసరించి యున్నారు గాని వారందరిని నీవు మించినదానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. 
 
ఈ వచనాలలో ఒక మంచి తల్లి/భార్య తన పిల్లలు (ఇంటివారి) పట్ల ఎలా ప్రవర్తిస్తుందో రాయబడింది. కానీ ప్రస్తుతం చాలామంది తల్లులు నిప్పుకోడిని పోలి ఉంటున్నారు. నిప్పుకోడి ప్రవర్తన ఎలా ఉంటుందో చూడండి;
 
యోబు గ్రంథము 39:13-16
నిప్పుకోడి సంతోషముచేత రెక్కల నాడించును. రెక్కలును వెండ్రుకలును దాని కున్నందున అది వాత్సల్యము కలదిగా నున్నదా? లేదుసుమీ, అది నేలను దాని గుడ్లను పెట్టును ధూళిలో వాటిని కాచును. దేనిపాదమైన వాటిని త్రొక్క వచ్చుననియైనను అడవి జంతువు వాటిని చితక ద్రొక్కవచ్చుననియైనను అనుకొనకయే యున్నది. "తన పిల్లలు తనవికానట్టు వాటియెడల అది కాఠిన్యము చూపును దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు".
 
కాబట్టి పిల్లల పట్ల అజాగ్రతగా బాధ్యతారహితంగా ప్రవర్తించే తల్లులందరూ నిప్పుకోడిలాగా "తన పిల్లలు తనవికానట్టు వాటియెడల అది కాఠిన్యము చూపేవారే". ఈవిధంగా అటు తండ్రులూ ఇటు తల్లులూ దేవుని బహుమానమైన గర్భఫలం పైన అజాగ్రతగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆ దేవుణ్ణి అవమానిస్తున్నారు. ఆయన దృష్టిలో నేరస్తులుగా మిగిలిపోతున్నారు. "మనుష్యులు పలికే వ్యర్థమైన మాటలకే విమర్శదినమందు దేవునికి లెక్కచెప్పవలసి ఉన్నప్పుడు" (మత్తయి 12:36) ఆయన ఇచ్చిన ఉన్నతమైన బహుమానం విషయంలో అజాగ్రత్తగా అశ్రద్ధగా ఉన్నవారు ఆయనకు మరి ఎక్కువగా లెక్క చెప్పవలసి ఉంటుంది సుమా.
 
ఆయన చిన్నపిల్లల విషయంలో చిన్నపాటి అజాగ్రత్తను, పొరపాటును కూడా సహించడు. అందుకే వారి పక్షంగా ఏమంటున్నాడో చూడండి.
 
మత్తయి 18: 10
ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు, పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను.
 
లూకా 17: 2
వాడీ చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుటకంటె వాని మెడకు తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు.
 
నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తున్న విషయం ఏమిటంటే ఈరోజు చాలామంది తల్లితండ్రులు పిల్లలపట్ల ఎంతో బాధ్యతారహితంగా ఉంటున్నారు. వారికి అత్యవసరమైన పాలు, పోషణను కూడా అందించకుండా కాఠిన్యం చూపుతున్నారు. కానీ సమాజంలో వీరిపై గుప్పించబడే పొగడ్తలు మాత్రం మామూలుగా ఉండవు. "అమ్మను మించిన దైవం లేదు, తండ్రిని మించిన హీరో లేడు" "తల్లి తన బిడ్డలకోసం జీవితాన్ని త్యాగం చేసుద్ది, తండ్రి తన బిడ్డలకోసం తన కష్టాన్ని దారపోస్తాడు" అంటూ Social Network లో బోలెడన్ని పనికిమాలిన పోస్టులు (అతి పొగడ్తలు) దర్శనమిస్తుంటాయి. కానీ వారి లోపాల గురించి మాట్లాడే సాహసం మాత్రం సాధారణంగా ఎవ్వరూ చెయ్యరు. తల్లితండ్రులను పిల్లలు పట్టించుకోవడం లేదని గొంతెత్తే సమాజం ఆ తల్లితండ్రుల్లో చాలామంది పిల్లలను పట్టించుకోనప్పుడు మాత్రం మౌనం వహిస్తుంది. తల్లితండ్రులను గౌరవించాలి, వారిని పట్టించుకోవాలి అన్నప్పుడు వారు కూడా గౌరవానికి పాత్రులుగా ఉండాలి, ఒకప్పుడు ఆ పిల్లలను పట్టించుకున్నవారిగా ఉండాలి. 
 
"తల్లితండ్రులను సన్మానించమని (పూజించమని కాదు), వారి మాట వినమని, వారి వృద్ధాప్య దశలో అశ్రద్ధ చెయ్యవద్దని ఇలా బైబిల్ వారి గురించి ఎన్నో విషయాలు  చెబుతుంది (నిర్గమకాండము 20:12, సామెతలు 23:22). తల్లితండ్రులపై తిరిగబడినా, వారిని కొట్టినా, దూషించినా మరణశిక్ష‌‌ విధించమంటుంది (నిర్గమకాండము 21:15, లేవీయకాండము 20:9, ద్వితీయోపదేశకాండము 21:18-21). అదే సమయంలో తల్లితండ్రులు పిల్లలపట్ల ఎలా ప్రవర్తించాలో, ఏం బోధించాలో కూడా స్పష్టంగా చెబుతుంది. 
 
ద్వితీయోపదేశకాండము 6:6,7
నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమా రులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పు డును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టు కొనవలెను. 
 
ఎఫెసీయులకు 6: 4
తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.
 
కొలస్సీయులకు 3: 21
తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.
 
2కోరింథీయులకు 12: 14
పిల్లలు తలిదండ్రుల కొరకు కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చతగినది గదా.
 
సామెతలు 19: 18
బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము అయితే వాడు చావవలెనని కోరవద్దు.
 
కానీ సమాజం చాలామట్టుకు తల్లితండ్రులకు అనుకూలంగా భజనలు చేస్తుంది తప్ప, పిల్లల విషయంలో వారి లోపాలను మాత్రం ఖండించలేకపోతుంది. దీనికారణంగా చాలామంది తల్లితండ్రులు తమ పిల్లలపట్ల‌ ఇప్పటివరకూ నేను వివరించినట్టు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే నేను ఈ విషయంలో దేవుని పక్షంగా స్పందించవలసి వచ్చింది.
 
(నేను ఈ వ్యాసంలో కావాలనే పిల్లలపై తల్లితండ్రులు చేస్తున్న దాడులను ప్రస్తావించలేదు, అలా చేస్తే కనుక పిల్లలపై బయటివారు చేసిన దాడులకన్నా తల్లితండ్రులు‌ చేసినవే చాలా దారుణంగా ఉంటాయి)

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.