దేవుడు ఘనంగా ఎంచి (హెబ్రీ 13:4), ఈ భూమిపై మానవపునరుత్పత్తికి మూలంగా (ఆదికాండము 1:27,28) తయారుచేసినటువంటి వివాహ వ్యవస్థపై సాతాను మొదటినుండీ దాడిచేస్తూనే ఉన్నాడు, ఆ క్రమంలో వాడు ఘనమైన ఆ వివాహవ్యవస్థకు వ్యతిరేకంగా లేదా అవమానకరంగా ఎన్నో నకిలీలను సృష్టించాడు. అందులో భాగమే అక్రమసంబంధాలూ హస్తప్రయోగాలు. అయితే ఈ వ్యాసంలో నేను వీటికంటే నీచమైన నకిలీల గురించి చర్చించబోతున్నాను, ఎందుకంటే ప్రస్తుత సమాజంలో ఈ నీచమైన నకిలీలు అన్ని ప్రదేశాల్లోనూ విపరీతంగా పెట్రేగిపోతున్నాయి. వాటినే LGBTQ+ అని అంటారు. అసలు ఈ LGBTQ+ అంటే ఏంటి, ఇవి దేవుడు ఘనంగా ఎంచిన వివాహవ్యవస్థపై సాతాను నకిలీలుగా ఎలా దాడిచేస్తున్నాయి లేక ఎలా దానిని అవమానిస్తున్నాయి, దేవునివాక్యం వీటిని ఎంత తీవ్రంగా ఖండిస్తుంది అనేది వివరంగా తెలుసుకునేముందు, మనుషుల్లో ఎన్ని రకాలైన లింగాలు (Genders) ఉన్నాయి అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలి.
ఎందుకంటే ఈ LGBTQ+ గుంపులో కొన్ని (TQ+), తాము చేస్తున్న నీచపుపనులను సమర్థించుకోవడానికి తమను తాము స్త్రీగానూ పురుషునిగానూ కాకుండా వేరొక లింగం (Gender) గా పేర్కొంటుంటారు. మేము అటు స్త్రీలమూ కాదు, ఇటు పురుషులమూ కాదు కాబట్టి, స్త్రీ పురుషుల నియమానుసారంగా ప్రవర్తించవలసిన అగత్యం మాకు లేదన్నది వీరి వాదన. కానీ స్త్రీ పురుషులు కాకుండా మరో లింగం అంటూ ఉండదని ఎవరైనా వాదిస్తే వీరు బైబిల్ లోని కొన్ని వాక్యభాగాలను కూడా వక్రీకరించి దానిని రుజువు చేసుకుంటుంటారు. అందుకే మొదటిగా బైబిల్ ప్రకారంగా ఈ భూమిపై ఎన్ని లింగాలు (Genders) ఉన్నాయి అనేదాన్ని వివరించదలిచాను.
ఆదికాండము 1:27,28 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.
ఆదికాండము 5:1,2 ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను.
మత్తయి 19:4,5 ఆయనసృజించిన వాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా?
ఈ వాక్యభాగాల ప్రకారం; దేవుడు ఈ భూమిపై రెండే రెండు లింగాలను సృష్టించాడు. వారే పురుషుడు మరియు స్త్రీ. ఆ ఇరువురి సృష్టి గురించీ ఆదికాండము 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వివరించబడింది. వీరినుండే మానవజాతి స్త్రీగానూ పురుషుడిగానూ విస్తరించింది. అప్పటినుండి ఇప్పటివరకూ ఈ భూమిపై మనకు కనబడేవారంతా ఈ స్త్రీ పురుషులే మనం కూడా ఈ రెండింటిలో ఏదో ఒక లింగానికి చెందినవారమే అయ్యుంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు ప్రస్తావించిన నంపుసకుల సంగతి ఏంటన్నది ఈ LGBTQ+ లోని TQ వారి వాదన. ఇప్పుడు ఆ మాటలకు కూడా వివరణ చూద్దాం.
మత్తయి 19:12 తల్లి గర్భమునుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యులవలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులును గలరు, పరలోకరాజ్యమునిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసికొనిన నపుంసకులును గలరు. అంగీకరింపగలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పెను.
ఈ వాక్యభాగంలో యేసుక్రీస్తు ప్రభువు నపుంసకులు అనేవారిగురించి ప్రస్తావిస్తూ వారిని;
A. తల్లి గర్భమునుండి నపుంసకులుగా పుట్టినవారు.
B. మనుష్యులవలన నపుంసకులుగా చేయబడినవారు.
C.పరలోకరాజ్యమునిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసికొనినవారు.
అనే మూడు భాగాలుగా వివరిస్తున్నాడు. కానీ గమనించండి, అసలు యేసుక్రీస్తు ప్రభువు వీరి ప్రస్తావన చేస్తుంది స్త్రీ పురుషులు కాకుండా మరో లింగం కూడా ఉందని చెప్పడానికి కానేకాదు. మరెందుకో క్రింద వివరిస్తాను. అంతకుముందు ఈ మూడింటిగురించి తెలుసుకుందాం, ఈ క్రమంలో నేను C నుండి A కి వెళ్తాను. ఎందుకంటే వారి వాదనకు A అత్యంత కీలకం.
C: పరలోకరాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసికొనినవారు అంటే యేసుక్రీస్తు ఇక్కడ దేవునిసేవకోసం వివాహం చేసుకోకుండా ఉన్నవారికోసం మాట్లాడుతున్నాడు. ఉదాహరణకు యిర్మియా (యిర్మియా 16:2) పౌలు కూడా దీనిగురించి వివరించినట్టు చదువుతాం (1 కొరింథీ 7:25-35). వారు తమకు తాము స్వచ్చందంగా దేవునికి అలా ప్రతిష్టించుకున్నవారు. కాబట్టి ఈమాటల్లో నపుంసకులు అంటే దేవునిసేవ కోసం వివాహానికి అతీతులుగా ఉన్నవారు అని మాత్రమే తప్ప మరో లింగంవారు అని అర్థం కానేకాదు. వారు పురుషులే కానీ దేవునికోసం ఆ కోరికలను చంపివేసుకున్నారు. ఇలా ఈ ప్రతిష్టించుకునేవారిలో స్త్రీలు కూడా ఉంటారు, ఐతే వారు స్త్రీలు కాదు అని అర్థమా?
ఇక్కడ మరో రెండు విషయాలకు కూడా స్పష్టత ఇవ్వదలిచాను.
1. ప్రస్తుతం వివాహం చేసుకోకుండా పరిచర్యలో ఉన్నవారంతా ప్రభువు చెబుతున్న ఈ నపుంసకులే అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే వారిలో కొందరు దేవునిపేరిట వివాహం చేసుకోనప్పటికీ రహస్యంగా అక్రమసంబంధాలు లేక హస్తప్రయోగం వంటివి కొనసాగిస్తుంటారు. నిజానికి వీరు దేవునిపేరిట వివాహాన్ని త్యజించి ఇలాంటి చీకటికార్యాలు చెయ్యడం వల్ల దేవునిదృష్టికి యేసుక్రీస్తు చెబుతున్న నంపుంసకులుగా కాదు కామతప్తులయ్యే ఉగ్రతపాత్రులుగా ఉన్నారు. అందుకే పౌలు అలాంటి పాపాల్లో చిక్కుకోకుండా వివాహం విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దని హెచ్చరించాడు (1కొరింథీ 7).
2. పరలోకరాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసికొనినవారు అంటే దేవునికోసం తమ రహస్య అవయవాలను ఖండించుకున్నవారు అని కూడా కొందరు అభిప్రాయపడతారు. ఎందుకంటే ప్రాచీనకాలంలోని కొన్ని మతాల్లో ఇలాంటి మొక్కుబడులు కూడా ఉండేవంట. కానీ ప్రభువు చెబుతుంది ఇలా చేసుకున్నవారి గురించి కానేకాదు. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా ఎవరూ ఇతరుల శరీరానికే కాదు, తమ శరీరానికి కూడా ఏ హానీ చేసుకోకూడదు (లేవీకాండము 19:28). ఎందుకంటే ఈ దేహం దేవునిది. ఆయన జారత్వం విషయంలో జాగ్రత్తలు చెప్పడానికి ఈ శరీరసంబంధమైన హానులు కూడా ఒక కారణం (సామెతలు 7:26).
మరి యేసుక్రీస్తు "నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరముగదా. నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచినయెడల దాని నరికి నీయొద్దనుండి పారవేయుము నీ దేహమంతయు నరకములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా" (మత్తయి 5:29,30) అని బోధించారుగా అనంటే ఈ సందర్భంలో ఆయన మన అవయవాల పాపాన్ని ఆ అవయవాలను ఖండించుకునేంతగా నియంత్రించుకోవాలని, అంతగా వాటి ఆశలను చంపిచెయ్యాలని తెలియచెయ్యడానికి అలంకారంగా ఆ బాషను ఉపయోగించారు. దీనిని పౌలు ఎంత స్పష్టంగా వివరిస్తున్నాడో చూడండి.
కొలస్సీయులకు 3:5,6 కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి. వాటివలన దేవుని ఉగ్రత అవిధేయులమీదికి వచ్చును.
B: మనుష్యులవలన నపుంసకులుగా చేయబడినవారు అంటే ప్రాచీనకాలంలో కొందరు రాజులు యుద్దాలలో చెరపట్టబడిన యువకులకు శాస్త్రీయ పద్ధతుల ద్వారా వృషణాలను (Testicles) తొలగించి రాజభవనంలోని రాణులకు కాపలా పెట్టడం లేదా కొన్ని కీలకమైన పదవుల్లో నియమించడం వంటివి చేసేవారు. యేసుక్రీస్తు ప్రభువు మనుషులవలన నపుంసకులుగా చెయ్యబడినవారని ప్రస్తావించింది వీరికోసమే. గమనించండి, వీరిలో ఇక లైంగిక కోరికలు ఉండనప్పటికీ వీరు పురుషులే. సహజంగా పురుషులకు ఉండే శారీరక బలం, పని చేసే శక్తీ వీరిలో అలానే ఉంటుంది. వీరు అలా చెయ్యబడింది కూడా ఆ రాజులకు వీరికి పురుషబలం, పనిచేసే శక్తి ఉండాలి (పురుషులుగానే ఉండాలి) కానీ లైంగిక కోరికలు ఉండకూడదనే ఉద్దేశంతోనే. ఎందుకంటే అప్పుడు వీరు తమ పురుషబలంతో రాణులకు కాపలాగా నియమించబడినప్పటికీ వారితో లైంగికసంబంధం కొనసాగించలేరు. అలానే ఇతరులవలే ఇక తమ జీవితంలో వివాహానికి కానీ అక్రమసంబంధాలకు కానీ చోటివ్వకుండా ఆ కీలకమైన పదవులే లేక రాజు సేవవే తమకున్న ఏకైక జీవితంగా కొనసాగగలుతారు. రాజైన నెబుకద్నెజరు క్రింద, ఐతియోపీయుల రాణియైన కందాకే క్రింద వీరు కీలకమైన పదవుల్లో నియమించబడింది అందుకే (దానియేలు 1:3, అపొ.కా 8:27). ప్రభువైన యేసుక్రీస్తు పరలోకరాజ్య పరిచర్యకు సంపూర్ణంగా సమర్పించుకుని (వివాహం చేసుకోకుండా) దేవునిసేవే తమ జీవితంగా గడుపుతున్నవారిని నపుంసకులు అని ప్రస్తావించింది ఒకవిధంగా ఈ కోణంలోనే.
ప్రస్తుతం కూడా కొంతమంది లైంగికకోరికలపై అసహ్యంతో శస్త్రచికిత్సల ద్వారా ఇలా మారుతున్నారు, అలానే కొందరు ఆవేశంలో తనకు తామే ఆవిధమైన హాని చేసుకుంటున్నారు. మరికొందరు ఇతరుల చేత అలాంటి క్రూరమైన దాడులకు కూడా గురౌతున్నారు. ఆ క్రమంలో వారి వృషణాలు (Testicles) తొలగించబడినప్పటికీ పురుషాంగం (penis) తొలగించబడినప్పటికీ వారు పురుషులే. కేవలం వారిక లైంగికసంబంధానికి మాత్రమే పనికిరారు. ఇలాంటి దాడులు స్త్రీలపై కూడా జరుగుతుంటాయి, అయినంతమాత్రాన వారు స్త్రీలు కాకుండా పోరుకదా!. ప్రమాదాల వల్ల కూడా కొందరికి ఇలాంటి పరిస్థితి వస్తుంది, అయినప్పటికీ వారు స్త్రీలే పురుషులే. వారు కేవలం లైంగిక సంబంధానికి మాత్రమే పనికిరారు. అలాంటి దాడుల వల్ల, ప్రమాదాల వల్ల వీరిలో కొన్ని మానసికరుగ్మతలు ఏర్పడినప్పటికీ అవి వీరు వేరే లింగానికి చెందినవారు అని రుజువు చెయ్యడం లేదు. ఇక;
A. తల్లి గర్భమునుండి నపుంసకులుగా పుట్టినవారు. ఈమాటలు బైబిల్ ప్రకారం స్త్రీ పురుషులు కాకుండా మరో లింగం కూడా ఉందనే LGBTQ+ లోని TQ వారి వాదనకు అత్యంత కీలకం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ మాటల్లో "తల్లి గర్భమునుండే" కొందరు అలా పుడుతున్నట్టుగా ప్రస్తావించారు. దీనిఆధారంగా వారు దేవుడు తల్లిగర్భం నుండి స్త్రీ పురుషులను జన్మింపచేస్తున్నట్టే ఆ లింగం వారిని కూడా జన్మింపచేస్తున్నాడని, కాబట్టి సృష్టిలో స్త్రీ పురుషులే కాకుండా ఇతర లింగాలు కూడా ఉన్నాయని వాదిస్తున్నారు. అయితే ఈమాటలను యేసుక్రీస్తు ప్రభువు "వివాహ జీవితానికి పనికిరాకుండా పుడుతున్నవారు" అనే భావంలోనే ప్రస్తావించారు తప్ప, మరో లింగంవారిగా ప్రస్తావించలేదని గమనించాలి. ఆ సందర్భాన్ని మనం పరిశీలిస్తే శిష్యులు ఆయనతో "భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసికొనుట యుక్తము కాదని" (మత్తయి 19:10) చెప్పినప్పుడు ఆయన "అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు" (మత్తయి 19:11) అని బదులుస్తూ ఆ క్రమంలో మొదటిగా వీరి గురించి ప్రస్తావించారు, తర్వాత మనుష్యుల వల్ల నపుంసకులుగా మారినవారి గురించి ప్రస్తావించారు. అంటే మనుషుల వల్ల నపుంసకులుగా మారినవారు ఎలాగైతే ఇక వివాహ జీవితానికి పనికిరానివారిగా ఉంటున్నారో అలానే పుట్టుకనుండే కొందరు లైంగికసంబంధానికి పనికిరానివారిగా అనగా వివాహంతో సంబంధంలేని (సామర్థ్యం లేని) వారిగా పుడుతున్నారు అని చెబుతున్నారు. చివరిగా దేవునికోసం స్వచ్చందంగా వివాహాన్ని త్యజించిన వారికోసం కూడా చెబుతున్నాడు. కాబట్టి ఈ మాటలు వివాహా జీవితానికి పనికిరానివారిగా (ఆ అవయవాలకు సంబంధించిన వైకల్యాలతో) పుడుతున్నవారికోసమే చెప్పబడ్డాయి తప్ప, మరో లింగమేదో ఉందనే భావంలో కాదు. పుట్టి గుడ్డివారు, పుట్టి కుంటివారు పుడుతున్నట్టే వారు కూడా లైంగికసంబంధానికి అవసరమైన అవయవాల వైకల్యంతో పుడుతుంటారు. ఈ సమస్య స్త్రీలలో కూడా ఉంటుంది, కొందరిలో పెద్దయ్యేకొద్దీ అది బయటపడుతుంది. ఎక్కువశాతం ట్రైన్లలో లేక షాపుల్లో మనదగ్గర డబ్బులు తీసుకునేవారూ లేక కొన్ని కార్యక్రమాల్లో నృత్యాలు చేసేవారూ అలాంటి వైకల్యాలతో లేక సమస్యలతో పుట్టిన స్త్రీ పురుషులే.
వారు ఇలా పుట్టడానికి గల కొన్ని కారణాలు:
1. వావివరసలు లేని వివాహసంబంధాలు (Incest) వీటిద్వారా పుట్టేపిల్లలకు ఇలాంటి పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంది, మేనరికాలు కూడా ఈ పరిధిలోకే వస్తాయి. అందుకే దేవుడు ఎవరు ఏ వరసవారిని వివాహం చేసుకోకూడరు అనే నియమాలను లేవీకాండము 18:6-16లో స్పష్టంగా బోధించాడు. నైతికపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా అవి నియమించబడ్డాయి.
2. స్త్రీలోని X పురుషుడి X/Y తో ఫలధీకరణం చెందుతున్నప్పుడు, కలిగే కొన్ని భంగాల వల్ల కూడా ఇలా పుడుతుంటారు. ఉదాహరణకు గర్భవతిగా ఉన్న స్త్రీ Nuclear radiation కి గురికావడం, పొగత్రాగడం లేదా ఆమె తీసుకునే ఆహారంలోని కొన్ని చెడు రసాయనాల వల్ల కూడా ఇలా జరిగేప్రమాదం ఉంది. అందుకే గర్భవతులకు Scan centers లోని కొన్నిప్రాంతాల్లో నిషేధపు హెచ్చరికలు చెయ్యబడుతుంటాయి.
3. కొందరు పిల్లలు పుట్టడం సరిగా పుట్టినట్టే అనిపించినప్పటికీ వారిలోని నిర్మాణకణాల అసమతుల్యత (Hormones imbalance) కారణంగా ఎదిగేకొద్దీ వారిలో మార్పులు సంభవిస్తాయి. ఉదాహరణకు ఒక అమ్మాయికి 13,14 వయసు వచ్చేకొద్దీ గొంతుమారడం, స్త్రీకి ఉండవలసిన అవయవ సంబంధమైన లక్షణాలు ఉండకపోవడం. ఈ నిర్మాణకణాల (Hormones) ను Estrogen, Testosterone అని అంటారు. ఇవి స్త్రీ పురుషుడు ఇద్దరిలోనూ ఉండేవే అయినప్పటికీ స్త్రీకి స్త్రీ లక్షణాలు Estrogen Hormone వల్ల వస్తాయి. అలానే పురుషుడికి పురుష లక్షణాలు Testosterone Hormone వల్ల వస్తాయి. కానీ స్త్రీలకు Estrogen Hormones ఉండవలసినంత ఎక్కువగా ఉండకున్నా లేక Testosterone Hormones ఎక్కువగా ఉన్నా వారికి ఆ విధమైన సమస్యలు వస్తాయి. అలానే పురుషుడికి Testosterone Hormones ఉండవలసినంత ఎక్కువగా ఉండకున్నా లేక Estrogen Hormones ఎక్కువగా ఉన్నా వారికి ఆ విధమైన సమస్యలు వస్తాయి. ఈ Hormones imbalance సమస్యవారికి పుట్టుకనుండే ఉంటుంది కానీ ఎదిగేకొద్దీ బయటపడుతుంది.
4. మగపిల్లలు గర్భంలో ఉన్నప్పుడు వారి వృషణాలు (Testicles) వారి కడుపులోనే ఉంటాయి. ప్రసవానికి కొంతకాలం ముందు మాత్రమే అవి క్రింద వృషణాల సంచిలోకి చేరుకుంటాయి. కానీ కొందరికి అలా అవ్వదు. తరువాత వారికి శస్త్రచికిత్సలు చేసినప్పటికీ అందరివిషయంలోనూ ఫలితం లేకపోవచ్చు. ఇలా కూడా లైంగికసంబంధానికి పనికిరానివారుగా పుడుతుంటారు.
యేసుక్రీస్తు ప్రభువు "తల్లిగర్భము నుండి నపుంసకులుగా జన్మించినవారు" అని ప్రస్తావించింది ఇలాంటివారికోసమే. గమనించండి, వీరంతా కొన్ని సమస్యల కారణంగా ఇలా పుడుతున్నారు తప్ప మరో లింగంగా కాదు. అలా లింగవైకల్యంతో పుడుతున్నవారిని వేరొక లింగంగా పరిగణించడం చాలా దారుణం. సందర్భంలో ఆయన వారిని నపుంసకులు అని పేర్కొంది, వైవాహిక జీవితానికి పనికిరానటువంటి వారి ఆ వైకల్యాన్ని ఎత్తిచూపించడానికే తప్ప, వారు మరో లింగానికి చెందినవారని కాదు.
మరో వాక్యభాగానికి కూడా వివరణ ఇవ్వదలిచాను.
యెషయా 56:3-5 యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలోనుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండుడునేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుచు నాకిష్టమైనవాటిని కోరుకొనుచు నా నిబంధన నాధారము చేసికొనుచున్న షండులను గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నా యింటను నా ప్రాకారములలోను ఒక భాగ మును వారికిచ్చెదను కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె శ్రేష్ఠమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను.
ఈ సందర్భంలో యెహోవా దేవుడు షండులు అనగా నంపుంసకులుగా మార్చబడినవారి గురించి మాట్లాడుతూ "కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె శ్రేష్ఠమైన పేరు వారికి పెట్టుచున్నాను" అని అంటున్నాడు. దీని ఆధారంగా కొందరు బైబిల్ దేవుడు కూడా వారిని కొడుకులు (పురుషులు) అనీ లేక కూతుర్లు (స్త్రీలు) అనీ కాకుండా మరొక లింగంగానే గుర్తిస్తున్నాడు. అందుకే వారికి వేరొకపేరు పెడతాను అంటున్నాడని వాదిస్తారు. కానీ ఇక్కడ ఆయన చెబుతుంది అది కానేకాదు. నపుంసకులు ఈలోకంలో అటు కొడుకులు (పురుషులు) గా కానీ ఇటు కూతుర్లు (స్త్రీలు) గా కానీ గుర్తించబడకుండా చాలా అవమానాలకు గురౌతుంటారు. అందుకే ఆయన తన కట్టడలను అనుసరించే నపుంసకులతో వారు ఈలోకంలో ఏ కుమారులుగా లేక కూతుర్లుగా పిలవబడాలని (కొడుకులు కూతుళ్లు అని యనిపించుకొనుటకంటె) ఆశపడి అలా పిలవబడకుండా నిరాశపడ్డారో అంతకంటే శ్రేష్ఠంగా వారిని గుర్తిస్తానని ఓదారుస్తున్నాడు. నిజానికి లోకం వారిని కుమారులుగా కానీ కుమార్తెలుగా కానీ గుర్తించలేదు తప్ప ఆయనకాదు. అందుకే ఆ లోకంనుండి మీరు ఆశించినదానికంటే శ్రేష్టమైన పేరు మీకు పెడతాను అంటున్నాడు. ఇంతకూ ఏంటి ఆ కొట్టివేయబడని నిత్యమైన పేరు? ఇది వారికి మాత్రమే సొంతమా? ఈ వాక్యభాగాలు చూడండి.
ప్రకటన గ్రంథం 3:12 జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలుపలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.
ప్రకటన గ్రంథం 2:17 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును. మరియు అతనికి తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన యొక క్రొత్తపేరుండును; పొందిన వానికే గాని అది మరి యెవనికిని తెలియదు.
ఈ వాక్యభాగాల ప్రకారం; పరలోకంలో ప్రవేశించే ప్రతీ ఒక్కరికీ ఆయన క్రొత్తపేరు పెడుతున్నాడు. అందులో నపుంసకులే కాదు ఈ లోకంలో కుమారులు (పురుషులు) గా కుమార్తెలు (స్త్రీలు) గా గుర్తించబడిన విశ్వాసులకు కూడా ఆ పేరు పెట్టబడుతుంది. ఈవిధంగా ఆ మాటలను అర్థం చేసుకుంటే పరలోకంలో మనకున్నట్టుగా లింగాలు ఉండవు మనమంతా దేవదూతలవలే ఎలాంటి లింగం లేకుండా ఉంటాము (మత్తయి 22:29,30). ఎందుకంటే ఆయన స్త్రీ పురుష లింగాలను ఈలోకంలో మాత్రమే ఒక ఉద్దేశంతో సృష్టించాడు (ఆదికాండము 1:27,28, 5:1,2). కాబట్టి ఆయన షండులతో మీరు నాకట్టలను అనుసరించినప్పుడు, పరలోకంలో ఈలోకం నుండి ఎదుర్కొన్నట్టుగా ఎలాంటి అవమానాన్నీ ఎదుర్కోకుండా ఇతరులలానే శ్రేష్టమైన పేరుతో జీవిస్తారని చెబుతున్నాడు. ఎందుకంటే వారు తాము నపుంసకులుగా మార్చబడడాన్ని బట్టి లోకంలానే దేవుడు కూడా తమను స్వీకరించడేమో అని ఆలోచిస్తున్నారు. అందుకే ఆయన "షండుడునేను ఎండిన చెట్టని అనుకొనవద్దు" అని ప్రారంభించి పరలోకంలో వారికి కలుగబోయే ఘనత గురించి వివరిస్తున్నాడు. "నిత్యమైన పేరు" అని స్పష్టంగా ఉన్నప్పటికీ అది పరలోకానికి సంబంధించినదని అర్థం కాకుంటే ఎలా? ఈలోకంలో అవమానాలు పాలైన నపుంసకులకు ఆయన పరలోకాన్ని బట్టి ఇస్తున్న ఓదార్పును మరో లింగానికి ముడిపెడితే ఎలా? తమ దరిద్రపు బ్రతుకులను సమర్థించుకోవడానికి బైబిల్ లో కూడా మరో లింగం ఉందని రుజువు చెయ్యాలి అందుకేగా ఈ కుట్రపూరితమైన ప్రయాస. మరో విషయం ఈలోకంలో అన్యాయంగా ఎక్కువ అవమానాలూ శ్రమలూ ఎదుర్కొన్నవారిని ఆయన మిగిలినవారికంటే ఘనపరుస్తూ మాట్లాడడం లేఖనాలలో సర్వసాధారణం (మత్తయి 5:10,11, ప్రకటన 7:13-17). అంతమాత్రాన వారంతా ఈలోకంలో అంతగా అవమానాలూ శ్రమలూ ఎదుర్కోని స్త్రీ పురుషులులా కాకుండా మరో లింగానికి చెందినవారని అర్థమా?
ఇంకా మాట్లాడితే ఆ సందర్భంలో అన్యుల గురించి కూడా ప్రత్యేకంగా రాయబడింది;
యెషయా 56:3-7 యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలోనుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండుడునేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. విశ్రాంతిదినమును అపవిత్రపరచకుండ ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసికొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలు లును నాకు అంగీకారములగును నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమనబడును.
అయితే ఇప్పటివరకూ నేను చెప్పినవారిని వైద్యబాషలో కూడా ఇతర లింగాలుగానే భావిస్తారుగా అనే సందేహం మీకు రావొచ్చు. కానీ మనం ఇక్కడ బైబిల్ కోణం నుండి ఎన్ని లింగాలు ఉన్నాయనేది చర్చిస్తున్నామనీ అలానే వైద్యపరంగా ఇతర లింగాలుగా భావించబడుతున్నవారంతా జన్యుపరమైన వైకల్యాల కారణంగా దాడుల కారణంగా శస్త్రచికిత్సల కారణంగా లేదా మానసిక రుగ్మతల కారణంగా అలా మారారు తప్ప, అది మానవసృష్టిలో సహజమైనది కాదని గుర్తుంచుకోవాలి. మానసికంగానూ శారీరకంగానూ ఆరోగ్యంగా ఉన్న స్త్రీ పురుషుల్లా వారు మానసికంగానూ శారీరకంగానూ ఆరోగ్యంగా ఉన్నవారు కారు. లేక సహజసిద్ధమైనవారు కారు. అలాంటప్పుడు వారు స్త్రీ పురుషుడిలా మరో లింగం ఎలా ఔతారు? ఒకవేళ తల్లిగర్భంలో వారు జన్యుపరంగా ఎలాంటి సమస్యలకూ గురికాకుంటే లేదా ఆ అవయవ సంబంధమైన దాడులకూ ప్రమాదాలకూ గురికాకుంటే వారు మనలానే ఆ వైకల్యం లేకుండా పుట్టుండేవారు. అలానే బ్రతికేవారు. కాబట్టి జన్యుపరంగా కానీ దాడుల కారణంగా కానీ మానసికసమస్యల మూలంగా కానీ సంక్రమించిన లోపాలను వేరే లింగంగా గుర్తించడం భావ్యం కాదు. ప్రభుత్వాలు అలాంటివారిని వైకల్యం గల వారిగానే భావించి వారికి అవసరమైన సేవలు అందించాలి. ఒకవేళ వాదనకోసం వైద్యబాషనే పరిగణలోకి తీసుకున్నప్పటికీ అక్కడ మనిషి social animal (సామాజిక జంతువు) గా గుర్తించబడుతున్నాడు. అంటే మనిషి కూడా ఒకరకమైన జంతువేనా? కానీ బైబిల్ గ్రంథంలో ఈ మనిషికి జంతువులన్నిటికంటే ఎంతో ప్రత్యేకత ఉంది, మనిషిని దేవుడు తనపోలిక తన స్వరూపంలో అద్వితీయంగా సృష్టించాడు (ఆదికాండము 1:27,28).
ఇంతవరకూ మనం ఎవరి&ఎవరివాదనల గురించైతే మాట్లాడుకున్నామో ఆ LGBTQ+ అంటే ఎవరో ఇప్పుడు చూద్దాం.
L - అంటే Lesbians అని అర్థం అనగా సాటి స్త్రీలతో లైంగికసంబంధం కొనసాగించే స్త్రీలు. అలానే
G - అంటే Gays అని అర్థం అనగా సాటి పురుషులతో లైంగిక సంబంధం కొనసాగించే పురుషులు. తెలుగులో వీరిని స్వలింగసంపర్కులు అని అంటారు. నిజానికి Gender&sexual orientation అనేవి వేరువేరు ఆలోచనలు. ఈ L.G లు మేము ప్రత్యేకమైన Genders అని చెప్పుకోనప్పటికీ తమది సహజసిద్ధమైన Sexual orientation కాదు అన్నది వీరి వాదన. అంటే స్త్రీకి పురుషుడిపై కాకుండా స్త్రీపైనే పురుషుడికి స్త్రీపై కాకుండా పురుషుడిపైనే వీరికి కోరికలు కలుతాయి. అసలు వీరు సహజవిరుద్ధంగా ఎందుకు ఇలా మారారు అనేది క్లుప్తంగా పరిశీలిస్తే;
1. Freudian Theory లోని Psychosexual development కు సంబంధించిన ఐదు (Oral, Anal, Phallic, Latency, Genital) స్థాయిల్లో మూడవ స్థాయియైన Phallic అనేదాని ప్రకారం; కొంతమంది చిన్నపిల్లలకు కొడుకుకు తల్లిపైనా కూతురుకు తండ్రిపైనా లైంగికకోరికలు కలుగుతుంటాయి. అలా కొడుకుకు తల్లిపైన కలగడాన్ని Oedipus complex, కూతురుకు తండ్రిపైన కలగడాన్ని Electra complex అంటారు. కానీ మరికొందరు చిన్నపిల్లల్లో కూతురుకు తల్లిపైనా కొడుకుకు తండ్రిపైనా ఆ కోరికలు కలుగుతుంటాయి. ఆ క్రమంలో వారు సరిచెయ్యబడకపోవడం వల్ల రానురాను ఇలా స్వలింగసంపర్కులుగా మారుతుంటారు. అందుకే బైబిల్ "బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వానిలోనుండి తోలివేయును" (సామెతలు 22:15) అని చెబుతుంది. అలానే "తల్లికడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు" (కీర్తనలు 58:3) అని కూడా రాయబడింది.
2. విపరీతమైన లైంగికకోరికలు. వీరు వ్యతిరేకలింగం వారితో సరిగా సంతృప్తి చెందలేరు, ఇంకా కావాలి అనిపిస్తుంది. అందుకే వీరు తమ స్వలింగం వారితోనే ఆ సంబంధం కొనసాగిస్తారు.
3. తమ స్వంతశరీరంపై కోరికలు. కొందరికి మొదటినుండీ తమ స్వంతశరీరంపై చాలా ప్రేమ కోరికలు ఉంటాయి. ఆ క్రమంలో వారు Masturbation వంటివాటికి ఎక్కువగా అలవాటుపడి తమ శరీరంపై తమకే కలిగిన కోరికలను తీర్చుకుంటుంటారు. కొంతకాలానికి ఆ విపరీతకోరిక తమ శరీరంలానే ఉన్న మరో శరీరంపైకి మళ్ళుతుంది. అంటే ఒక అమ్మాయిది/అబ్బాయిది స్త్రీ/పురుష శరీరం కాబట్టి ఆ అమ్మాయి/అబ్బాయి తమ శరీరంపై ఉన్న అవే కోరికలను అలాంటి శరీరంతో ఉన్న ఇతరులపై కూడా పెంచుకుంటారు.
4. లింగద్వేషం. కొందరికి మొదటినుండీ పరాయి లింగంవారిపై విపరీతమైన ద్వేషం, తమ లింగంవారిపై అభిమానం ఉంటాయి. అలాంటివారు తాము ద్వేషించే లింగంవారిపై కాకుండా తమ లింగం వారిపైనే కోరికలు పెంచుకుంటారు.
5. క్రొత్తతనం కోసం, లేక ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం. కొందరు అప్పటివరకూ పరాయి లింగంవారితో కలిసుండి క్రొత్తతనం కోసమూ అలానే అప్పటికే వారికి పరాయి లింగంవారితో కలిసుంటే ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఇక స్వలింగం వారితో కలిస్తే ఎలా ఉంటుందనేది తెలుసుకోవడానికి కూడా ఇలా మారుతుంటారు.
ఇవి మన సమాజంలో కొందరు స్వలింగసంపర్కులుగా తయారవ్వడానికి గల కొన్ని కారణాలు. గమనించండి, ఇవి అసహ్యకరమైన కారణాలు. అలానే విపరీతమైన కామవాంఛతో ముడిపడిన కారణాలు. మానసికశాస్త్రం (psychology) గతంలో వీరిని (DSM 4) మానసికరోగులుగా (Gender identity disorder) గుర్తించింది, కానీ DSM 5 లో Gender dysphoria గా మార్చింది. అంటే వీరు అలా మారేటప్పుడు మానసికంగా కొంచెం బాధకు గురైనప్పటికీ తర్వాత ఎలాంటి బాధా ఉండదు, తాము చేస్తుంది సరైనదే అనుకుంటారు, అలా రుజువు చెయ్యడానికి ఎంతకైనా తెగిస్తారు. ఇప్పుడు వీరిగురించి బైబిల్ ఎలా తీర్పు తీరుస్తుందో చూడండి.
లేవీయకాండము 18:22 స్త్రీ శయనమువలె పురుషశయనము కూడదు; అది హేయము.
రోమా 1:24-28 ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనదిచేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతి ఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను.
ఈ వాక్యభాగాల ప్రకారం వీరు ఎంతటి భ్రష్ట మనస్సుతో విపరీత బుద్ధితో అలా స్వాభావికమైన స్త్రీ పురుషధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారో మనం అర్థం చేసుకుంటున్నాం. మోషే ధర్మశాస్త్రం ప్రకారం వీరు రాళ్ళతో కొట్టి చంపబడవలసినంత హేయులు. ఎందుకంటే; దేవుడు మానవులను స్త్రీని గానూ పురుషునిగానూ సృష్టించి, వారిద్దరూ ఏకశరీరంగా ఉండాలనే ఉద్దేశంతోనే వారిలో లైంగిక కోరికలను ఉంచాడు. ఆ కోరికలను బట్టే వారు ఫలించేలా నియమించాడు. కానీ వీరు తమలోని విపరీత వాంఛలతో ఆ దేవుని ఉద్దేశాలకు విరుద్ధంగా ఇలా ప్రవర్తిస్తున్నారు, ఒకవిధంగా వీరు ఆయన స్వాభావికమైన సృష్టిని ఎగతాళి చేస్తూ ఆయనను అవమానిస్తున్నారు. ఒకప్పుడు ఇలా చేసినందుకే ఆయన సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసాడు (ఆదికాండము 19). అందుకే ఇప్పటికీ వీరు చేసే ఆ పనిని ఆ ప్రాంతం పేరుతో sodomy అని కూడా పిలుస్తారు. అలా ఆయన ఆ ప్రాంతాన్ని నాశనం చేసి, వీరి హేయకృత్యాలను తన వాక్యం ద్వారా ఖండిస్తున్నందుకే వీరు బైబిల్ పైనా ఆయనపైనా పగబట్టినట్టుగా మాట్లాడుతుంటారు. ఆయన పిల్లలకూ నమ్మకమైన సేవకులకు కూడా శత్రువులుగా వ్యవహరిస్తుంటారు. సొదొమ గొమొర్రాలపై అగ్ని కురిసినట్టే త్వరలో వీరిపై కూడా అగ్నికురవబోతుంది (2 పేతురు 3:7) బహుశా వీరిని బట్టే ఆయన ఈ లోకానికి అగ్నిద్వారా నాశనం నియమించాడేమో. ఎందుకంటే రాను రాను వీరి సంఖ్య సొదొమ తరహాలో అన్ని దేశాలలోనూ విపరీతంగా పెరిగిపోతుంది.
చింతించవలసిన విషయం ఏంటంటే; ఈ స్వలింగసంపర్కుల్లో కొందరు పాస్టర్లుగా కూడా చలామణీ ఔతూ అలాంటివారికి వివాహాలు కూడా జరిపిస్తున్నారు. లేఖన వక్రీకరణలతో వాటిని సమర్థించే ప్రయత్నమూ చేస్తున్నారు. ఆ లేఖన వక్రీకరణలు కూడా చూసేద్దాం.
రూతు 1:16,17 అందుకు రూతునా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి బొందుచోటను నేను మృతిబొందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినయెడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక అనెను.
ఈ సందర్భంలో రూతు తన అత్తగారైన నయోమితో "నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినయెడల యెహోవా నాకు ఎంత కీడైన చేయును గాక" అని పలకడం మనం చూస్తాం. ఈ వాక్యభాగాన్ని అప్పుడప్పుడే బైబిల్ అధ్యయనం ప్రారంభించిన వ్యక్తి చదివినా కూడా సందర్భం అర్థమైపోతుంది. రూతు తన అత్తగారైన నయోమీని ఎంతగానో ప్రేమించి ఈమాటలు పలుకుతుంది, నయోమీ కూడా తన కోడళ్ళను కుమార్తెలుగా భావిస్తుంది. "నా కుమార్తెలారా, తిరిగి వెళ్లుడి" (రూతు1:12). కానీ ఈ నీచులు ఈ సందర్భాన్ని వక్రీకరించి రూతు నయోమీలు స్వలింగసంపర్కులు (Lesbians) అనీ అందుకే రూతు ఆమెను విడిచిపెట్టలేకపోతుందని చెబుతుంటారు. ఒకవేళ వారు అదే ఐతే నయోమీ వారితో "నయోమినా కుమార్తెలారా, మీరు మరలుడి నాతోకూడ మీరు రానేల? మిమ్మును పెండ్లి చేసికొనుటకై యింక కుమారులు నా గర్భమున నుందురా? నా కుమార్తె లారా, తిరిగి వెళ్లుడి, నేను పురుషునితో నుండలేని ముసలిదానను; నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితోనుండి కుమారులను కనినను వారు పెద్ద వారగువరకు వారి కొర కు మీరు కనిపెట్టుకొందురా? మీరు వారికొరకు కనిపెట్టుకొని పురుషులు లేక యొంటరి కత్తెలై యుందురా? నా కుమార్తెలారా, అది కూడదు; యెహోవా నాకు విరోధియాయెను; అది మిమ్మును నొప్పించినంతకంటె నన్ను మరి యెక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను" (రూతు 1:11-13) అని ఎందుకు పలుకుతున్నట్టు? పైగా రూతుకు బోయజుతో వివాహం చెయ్యడానికి ఎందుకు ప్రయత్నించినట్టు? (రూతు 3).
మరో వక్రీకరణ చూద్దాం;
2సమూయేలు 1:26 నా సహోదరుడా, యోనాతానా నీవు నాకు అతిమనోహరుడవై యుంటివి నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమకంటెను అది అధికమైనది.
ఈ సందర్భంలో దావీదు యోనాతాను చనిపోయినప్పుడు వేదనతో పాడిన గీతాన్ని మనం చూస్తాం. ఈ క్రమంలో అతను యోనాతాను గురించి "నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమకంటెను అది అధికమైనది" అనేమాటలకు వీరు వక్రీకరించి దావీదు మరియు యోనాతానులు స్త్రీ పురుషుల్లా కలిసిఉండేవారని (Gays) అని వాదిస్తుంటారు. కానీ మనసులో అలాంటి నీచపు ఆలోచనలు లేకుండా సందర్భాన్ని చదివిన ఎవరూ అలా భావించలేరు. ఎందుకంటే ఇది దావీదు పాడుతున్న విలాపగీతం (2సమూయేలు 1:17). "నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమకంటెను అది అధికమైనది" అనంటే స్త్రీలు ఎలాగైతే తమవారిని, లేక ఒక తల్లి ఎలాగైతే తన పిల్లలను వారే తన సర్వస్వం అన్నట్టుగా ప్రేమిస్తుందో అంతలా యోనాతాను దావీదును ప్రేమించాడని అర్థం. యోనాతాను ప్రేమ అలానే ఉంది. అతను దావీదుకోసం రాజ్యాన్ని కోల్పోవడానికి కూడా సిద్ధపడ్డాడు. ఎందుకంటే అతను దావీదును మొదటినుండీ ప్రాణస్నేహితుడిగా భావించాడు (1 సమూయేలు 18:1-3). ప్రాణ స్నేహితులంటే ఈ నీచులకు అలానే అర్థమౌతుందనుకుంటా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఇలాంటివారి గురించే "సజ్జనుడు, తన హృదయమను మంచి ధననిధిలోనుండి సద్విషయములను బయటికి తెచ్చును దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును"(లూకా 6:45) అని బోధించాడు.
ఇప్పుడు ఒక కూతురు తన తండ్రికోసం మా అమ్మ చనిపోయినప్పటినుంచీ మా నాన్న నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు అనంటే మనకు ఎలా అర్థమౌతుంది? కానీ వీరికి మాత్రం ఆ తండ్రి ఈమెపై చూపించేది ఒకప్పుడు తన భార్యపై ఉన్న కామసంబంధమైన ప్రేమనే అని అర్థమౌతుంది. అందుకే దావీదు యోనాతాను గురించీ రూతు నయోమీ గురించీ పలికిన మాటలు వీరికి అలా అర్థమయ్యాయి. ఇంకా వీరు దావీదు యోనాతానులు స్వలింగసంపర్కులు అని రుజువు చెయ్యడానికి వారు ముద్దుపెట్టుకున్న సందర్భాన్ని కూడా వక్రీకరిస్తుంటారు. కానీ హెబ్రీయుల సంస్కృతిలో ముద్దుపెట్టుకోవడం, కౌగిలించుకోవడం అనేది అవతలివారిపై తమ ప్రేమను అభిమానాన్ని వ్యక్తపరచడంలో ఒక భాగం (ఆదికాండము 29:13), ఇప్పటికీ కొన్ని సంస్కృతుల్లో దానిని మనం గమనిస్తాం. ఒక తల్లి వయస్సు వచ్చిన కొడుకుకు, కూతురుకు కూడా ఒకోసారి ఎందుకు ముద్దు పెడుతుంది? తల్లిగా వారిపై తనకున్న ప్రేమతోనే కదా! కానీ వీరికైతే అందుకే (కామవాంఛతో) పెడుతుంది. అందుకే వాక్యంలో ఇలా రాయబడింది.
కీర్తనలు 36:1-4 భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తివలె పలుకుచున్నది వాని దృష్టియెదుట దేవుని భయము బొత్తిగాలేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగాకనబడు వరకు అది వాని దృష్టియెదుట వాని ముఖస్తుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు బుద్ధిగలిగి ప్రవర్తింపను మేలుచేయను వాడు మానివేసియున్నాడు. వాడు మంచముమీదనే పాపయోచనను యోచించును వాడు కానినడతలు నడచువాడు చెడుతనము వానికి అసహ్యము కాదు.
సామెతలు 15:28 నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తర మిచ్చు టకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును
బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా స్వలింగసంపర్కాన్ని హేయమైనదిగా బోధిస్తుంటే (లేవీకాండము 18:22, రోమా 1:24-28, 1కొరింథీ 6:9) వీరు అవన్నీ పక్కనపెట్టేసి అదే బైబిల్ వక్రీకరణలతో తమ హేయకృత్యాన్ని సమర్థించుకోవాలని చూస్తున్నారంటే వీరిని ఏమనాలో మీరే ఊహించండి. నాకైతే మాటలు కూడా సరిపోవడం లేదు. నిజానికి వీరికి బైబిల్ గ్రంథం తాము చేస్తున్నదానిని తీవ్రంగా ఖండిస్తుందని బాగా తెలుసు, ఆ మాటలు చాలా స్పష్టంగానే ఉన్నాయి కదా! కానీ వీరిలోని ఆ విపరీతమైన, నీచమైన కామవాంఛ చివరికి వక్రీకరణలకు సిద్ధపడి మరీ దానిని సమర్థించుకునేలా ప్రేరేపిస్తుంది. పాపాన్ని ప్రేమించేవారు అలాంటి కుట్రలకు పాల్పడడం సహజమే కదా!
యిర్మియా 2:33 కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు. అందువలన నీ కార్యములు చేయుటకు చెడుస్త్రీలకు నేర్పితివి గదా.
యెహేజ్కేలు 24:13,14 నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే. నిన్ను శుభ్ర పరచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతివి, నా క్రోధమును నీమీద తీర్చుకొనువరకు నీవు శుభ్ర పడకయుందువు. యెహోవానైన నేను మాటయిచ్చి యున్నాను, అది జరుగును, నేనే నెరవేర్చెదను నేను వెనుకతీయను, కనికరింపను, సంతాపపడను, నీ ప్రవర్తనను బట్టియు నీ క్రియలనుబట్టియు నీకు శిక్ష విధింపబడును, ఇదే యెహోవా వాక్కు.
B - Bisexual వీరు అటు స్వలింగసంపర్కులు గానూ ఉంటారు అలానే వ్యతిరేక లింగస్తులతో కూడా ఉంటారు. వీరు అలా మారడానికి నేను పైన చెప్పినట్టుగా విపరీతకామవాంఛతో పాటు, క్రొత్తతనాన్ని కోరుకోవడం, స్వలింగంపై మోజు కూడా కారణం. వీరిలో పెళ్ళికానివారు పెళ్ళైనవారు కూడా ఉంటారు. ఎంతోమంది భార్యలు అలానే భర్తలు వీరిని ఆ విషయంలో గుర్తించి వేదనకు గురౌతున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నవారు కూడా ఉన్నారు. బైబిల్ ప్రకారం వీరు కూడా హేయులు. హాస్టల్లలో ఉండే యువత, లేక తమ తమ పనుల నిమిత్తం ఒకే గదిలో నివసిస్తున్నవారు ఎక్కువగా ఇలాంటి కార్యాలకు పాల్పడుతున్నారు. అలానే బలవంతం చెయ్యబడుతున్నారు. గతంలో ఇది ఎక్కువగా వ్యతిరేక లింగంవారితో సంబోధించడానికి అవకాశం లేని జైళ్ళలోనూ కుటుంబాలకు దూరంగా సముద్రంలోనే గడిపే సముద్రపు దొంగల్లోనూ (pirates) ఉండేదంట. కానీ ప్రస్తుతం ఈ దరిద్రం ప్రపంచమంతా వ్యాపించి, L.G ల తరహాలోనే తమది సహజసిద్ధమైన Sexual orientation కాదని వాదించేంతగా తెగించింది
రోమీయులకు 1:28
మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను.
T - Transgender వీరు స్త్రీలుగానూ పురుషులుగానూ పుట్టుండి, లింగమార్పిడి చేసుకున్నవారు. వీరు ఒక ప్రత్యేకలింగంగా తమను తాము చాటుకుంటున్నారు. బైబిల్ లో కూడా మూడవ లింగం (Third Gender) ఉందని వాదించేవారు వీరూ (Q కూడా) మరియు ఎక్కువగా వీరి అనుకూలవాదులే. అసలు వీరు అంతదారుణంగా తెగించడానికి గల కారణాలేంటో కొన్ని పరిశీలిద్దాం.
1. కొందరు పిల్లలు ఎదిగేకొద్దీ తమ లింగానికి చెందినవారిలా కాకుండా మరో లింగంవారిగా ప్రవర్తిస్తుంటారు. ఉదాహరణకు ఒక అబ్బాయి అమ్మాయిల వస్త్రాలను ధరించడం, lipstick వేసుకోవడం ఇలాంటివి. వీరు తమ లింగాన్ని తమది కాదు అన్నట్టుగా భావిస్తుంటారు, తమ లింగాన్ని బట్టి అసంతృప్తికి లోనౌతుంటారు. ఎవరైనా నువ్వు అబ్బాయివి అని గుర్తుచేస్తే ససేమిరా ఒప్పుకోరు. లేదా uncomfortable గా ఇబ్బందిపడతారు. వారి పెద్దలు లేక శ్రేయోభిలాషులు ఆ సమయంలో వారిని సరిచెయ్యకుంటే లేక ప్రోత్సహిస్తుంటే ఒక వయసు వచ్చాక లింగమార్పిడి చేసుకోవడానికి సిద్ధపడుతుంటారు.
2. కొందరు అబ్బాయిలు లేక అమ్మాయిలు అవతలి లింగంవారికి సమాజంలో ఉన్న ఆధిక్యతలు, గౌరవాలు చూసి కూడా అవి పొందుకోవాలనే ఆశతో ఇలా మారుతుంటారు. కానీ గమనించండి, తీరా అలా మారాక వీరు అనుకున్నది ఏమాత్రం దక్కదు. ఎందుకంటే ఒక పురుషుడు స్త్రీగా మారినా స్త్రీ పురుషుడిగా మారినా సమాజం వారిని అలా అంగీకరించదు, పైగా మరింత అవమానం కలిగే సందర్భాలు కూడా ఉంటాయి. తీరా అవన్నీ గ్రహించి వెనక్కు వెళ్దామన్నా ఆ అవకాశం ఇక ఉండదు.
3. లింగబేధం. కొంతమంది తల్లితండ్రులు తమకు పుట్టిన అబ్బాయి లేక అమ్మాయిని వారికిలానే ప్రేమించకుండా పెంచకుండా అమ్మాయిపై ఆసక్తి ఉన్నవారు అబ్బాయితో అమ్మాయిలా వ్యవహరించడం లేదా ద్వేషించడం. అబ్బాయిపై ఆసక్తి ఉన్నవారు అమ్మాయితో అబ్బాయిలా వ్యవహరించడం లేదా ద్వేషించడం వంటివి చేస్తుంటారు. ఈకారణంగా కూడా కొందరు పెద్దయ్యాక అదే మనస్తత్వంతో ఉండిపోయి లింగమార్పిడి చేసుకుంటుంటారు. కొందరు తల్లితండ్రులు కూడా ఇలా చేయించిన సంఘటనలు ఉన్నాయి.
గమనించండి; ఇది ప్రమాదకరమైన శస్త్రచికిత్స. ఇవి కొన్నిసార్లు విఫలమయ్యే ప్రమాదం ఉంటుంది. అలా జరిగితే మరేదో రావడం కాదు, ఉన్నది కూడా పోతుంది. అంతేకాదు జీవితాంతమూ చనిపోవడమే మంచిది అనేంతగా ఒకోసారి నొప్పి కలుగుతుంది. అలానే లింగమార్పిడి చేయించుకున్న వారు ఎక్కువగా infections కి గురౌతారని సమాచారం. ఒక్కసారి ఈ తప్పుడు అడుగు వేసాక మళ్ళీ వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. ఇలా మారినవారు చాలామంది ఇలానే బాధపడుతుంటారు. ఒకవేళ శస్త్రచికిత్స సఫలం ఐనా వారు ఊహించుకున్నది సమాజంలో దొరకదు. అయినా సరే ఇంక ఏం చెయ్యలేం. ఒకవేళ శస్త్రచికిత్స సఫలం అయ్యి వారు ఊహించుకున్న సంతృప్తి వారికి లభించినప్పటికీ దేవుని దృష్టిలో వారు హేయులు. ఎందుకో చూద్దాం;
దేవుడు తన ఈ సృష్టిలో తన చిత్తప్రకారంగా మానవులను స్త్రీని గానూ పురుషుడిగానూ సృష్టించాడు (ఆదికాండము 1:27,28, 5:1,2). అప్పటినుండి మనుషుల్లో ఎవరు స్త్రీలుగా పుట్టాలో ఎవరు పురుషులుగా పుట్టాలో అన్నది పూర్తిగా ఆయన నిర్ణయం (కీర్తనలు 139:13-16, యోబు 10:8-12). అందుకే అలా పుట్టిన స్త్రీ పురుషులు చివరికి మరొకరిగా వేషం కూడా ధరించకూడదని ఆయన ఖండితంగా ఆజ్ఞాపించాడు.
ద్వితియోపదేశకాండము 22:5 స్త్రీ పురుషవేషము వేసికొనకూడదు. పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. ఆలాగు చేయువారందరు నీ దేవుడైన యెహోవాకు హేయులు.
ఎందుకంటే స్త్రీ స్త్రీలా కాకుండా పురుషుడు పురుషుడిలా కాకుండా మరొకరిగా ప్రవర్తించడం వారి జననం పట్ల ఆయన ఉద్దేశాన్ని లేక నిర్ణయాన్ని ధిక్కరించడం, అవమానించడం ఔతుంది. అందుకే "ఆలాగు చేయువారందరు నీ దేవుడైన యెహోవాకు హేయులు" అని రాయబడింది. పై వేషధారణనే ఆయన హేయంగా భావిస్తుంటే ఏకంగా లింగమార్పిడే చేసుకోవడం ఆయన దృష్టికి మరెంతహేయమో మరెంతగా ఆయన ఉద్దేశాన్ని ధిక్కరించడం, అవమానించడం ఔతుందో ఊహించండి. మగపిల్లాడు పుట్టలేదని ఆడపిల్లని ఆడపిల్ల పుట్టలేదని మగపిల్లాడిని ఇతరులలా పెంచేవారూ ద్వేషించేవారూ చులకనగా చూసేవారు కూడా ఈవిషయం బాగా గుర్తుంచుకోవాలి. అలా చెయ్యడం వల్ల మీరు వారిని అలా పుట్టించిన దేవునితోనే వ్యతిరేకంగా పోరాడుతున్నారు సుమా. ఇక్కడ ఎవరైనా నన్ను నువ్వు మోషే ధర్మశాస్త్రం నుండి తీర్పుతీరుస్తున్నావని ఆక్షేపిస్తే నేను దానితో పాటుగా దేవుని సృష్టి, ఆయన నియమించిన సహజసిద్ధతను బట్టి కూడా మాట్లాడుతున్నానని గుర్తుంచుకోవాలి. అలానే మోషే ధర్మశాస్త్రంలో క్రీస్తుకు ఛాయలైన విధిరూపకమైన ఆజ్ఞలే కొట్టివెయ్యబడ్డాయి తప్ప, నైతికపరమైన ఆజ్ఞలు, ఆయన చిత్తానికి సంబంధించిన ఆజ్ఞలు కావని జ్ఞాపకం చేస్తున్నాను. ఇవి చదవండి.
మరోవిషయం; కొందరు లింగమార్పిడి చేసుకోనప్పటికీ వారి మానసికపరిస్థితిని బట్టి స్త్రీ పురుషుడిగా పురుషుడు స్త్రీగా ప్రవర్తిస్తుంటారు. Transgender గానే తమను తాము చాటుకుంటారు. వీరికి కూడా పై మాటలు వర్తిస్తాయి. ఎందుకంటే దేవుడు వీరిని ఎలా పుట్టించాడో అలా ఉండకుండా దానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ఒకవిధంగా మానసిక లింగమార్పిడి చేసుకోవడమే. అలాంటివారు తాము ఎలాంటి నీచపు పరిస్థితిలో ఉన్నారో గ్రహించి మానసిక వైద్యులను సంప్రదించాలి.
రెండు ప్రశ్నలు;
1. విశ్వాసియైన Transgender పరిస్థితి ఏంటి?
నాకు తెలిసి ఒక విశ్వాసి ఎప్పుడూ ఇంతగా దిగజారి లింగమార్పిడికి సిద్ధపడడు. అతను నిజంగా విశ్వాసే ఐతే దేవునివాక్యం మరియు అతనిలోని ఆత్మదేవునివల్ల అలాంటి సృష్టివిరుద్ధమైన కోరికల విషయంలో నియంత్రించబడి ఉంటాడు. ఒకవేళ ఎవరైనా లింగమార్పిడి తర్వాత విశ్వాసులుగా మారుంటే వారు ఎలా లింగం వారిగా పుట్టారో ఆ లింగం వారిగానే తమను చాటుకోవాలి. మార్పిడి చేసుకున్న లింగంగా కానీ మరో ప్రత్యేకలింగంగా కానీ గుర్తించబడే ప్రసక్తే లేదు. ఈ సృష్టిలో దేవుడు నిర్మించిన లింగాలు రెండేయని ఇప్పటికే వివరించాను. వారు నిజంగా మారుమనస్సు పొంది విశ్వాసులుగా మారుంటే ఆ వాక్యసత్యానికి లోబడాలి. అలానే వారిక వివాహం కూడా చేసుకోకూడదు. ఎందుకంటే వారు లింగమార్పిడి చేసుకున్నప్పటికీ మునుపటి స్త్రీ/పురుషుడే. కృత్రిమంగా లింగాన్ని మార్చుకుని Hormones ఎక్కించుకున్నంత మాత్రాన వారు అది కాలేరు. ఈ సత్యాన్ని ధిక్కరించి వైవాహిక జీవితానికి కానీ అక్రమసంబంధానికి కానీ సిద్ధపడితే మాత్రం వారూ స్వలింగసంపర్కులే. పైన వాక్యప్రకారం నేను ఆ స్వలింగసంపర్కుల పైకి ఏ తీర్పు రానుందని ప్రకటించానో అదే తీర్పు వీరిపైనా కుమ్మరించబడుతుంది. బాధాకరమైన విషయం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో లింగమార్పిడి చేసుకున్నవారు కూడా మార్పిడి చేసుకున్న లింగం పేరుతోటి సేవకురాళ్ళుగా చలామణి ఔతున్నారంట. పైగా మేము పెద్ద పండితులం అని చెప్పుకునేవారు కొందరు దానిని సమర్ధిస్తున్నారంట.
2. తల్లితండ్రుల కారణంగా అలా మార్చబడిన పిల్లల సంగతేంటి? ఆ పిల్లల ప్రమేయం లేకుండానే అలా జరిగిందిగా?
ఇలా జరగడం చాలా చింతించవలసిన విషయం. వాస్తవానికి ఇది ఒక క్రూరమైన దాడిలాంటిది. వీరికి కూడా మొదటి జవాబులోని నియమాలే వర్తిస్తాయి. అలానే నేను పైభాగంలో షండుల గురించి చెప్పినట్టుగా దేవునిపై ఆధారపడితే ఆయన వీరికి తన రాజ్యంలో ఘనమైన స్థానం కల్పిస్తాడు. అక్కడ వీరు ఈలోకంలో అనుభవించిన అవమానాలు గుర్తుకుకూడా రానంతగా ఆయన ప్రేమలో ఆనందిస్తారు.
చివరిగా;
Q- Queer or questioning వీరు కూడా T తరహాలో ఒక ప్రత్యేక లింగంగా చెప్పుకుంటుంటారు. అలానే L.G.B చేసే హేయకృత్యాలతో పాటుగా వీరు మరికొన్ని హేయకృత్యాలను కూడా అనుసరిస్తారు. ఉదాహరణకు జంతుశయనం లాంటివి. నిజానికి జంతుశయనం చేసేవారికి మానసిక శాస్త్రం (Psychology) లో Zoophilia అనే పేరు ఉన్నప్పటికీ వీరిలో అలా చేసేవారు కూడా ఉంటారు కాబట్టి ఉదాహరణకు L.G.B (స్వలింగసంపర్కం) తరహాలో ప్రవర్తించేవారు. అందుకే దానిని ప్రస్తావించాను. ఎందుకంటే వీరు తమను తాము పుచ్చకాయ వేషం వేసుకుని పుచ్చకాయలా లేక వేరే వస్తువుల్లా భావించుకున్నట్టే జంతువుల్లా భావించుకుని జంతుశయనం చేసేవారు కూడా ఉంటారు. ఎలా చూసినా వీరు చేసేవీ లేక భావించుకునేవన్నీ (Separate Gender గా లేక మనుషులమే కానట్టుగా) బైబిల్ కి విరుద్ధమైనవే అసహ్యమైనవే.
కీర్తనలు 14:1 వారు చెడిపోయినవారు అసహ్యకార్యములుచేయుదురు. మేలుచేయు వాడొకడును లేడు.
వీరి వాదన ఎలా ఉంటుందంటే "మతపరంగా కానీ సాంఘికంగా కానీ స్త్రీ పురుషులకు ఉన్న నియమాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే అవి మాతో సంబంధం లేకుండా ఎవరి చేతనో నియమించబడ్డాయి. కాబట్టి మేము మా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాము. మా ఇష్టం వచ్చినట్టు మా లైంగిక కోరికలు తీర్చుకుంటాము". ఈ వాక్యభాగం చదవండి.
యోబు 21:14-16 వారునీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కర లేదు నీవు మమ్మును విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుటచేత మాకేమి లాభము కలుగును? అని వారు చెప్పుదురు వారి క్షేమము వారి చేతిలో లేదు భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండును గాక.
ఈవిధంగా వీరు కూడా విపరీతమైన కామవాంఛలతోనూ అలానే మితిమీరిన స్వేచ్చావాదంతోనూ ఇలా తయారయ్యారు. అలాంటి ప్రవర్తన బైబిల్ దృష్టిలో హేయంగా చెప్పబడింది కాబట్టి, కానీ వీరికి అలా హేయంగా జీవించడమే ఇష్టం కాబట్టి పై వాక్యభాగంలో చెప్పబడినట్టుగా "వారునీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కర లేదు నీవు మమ్మును విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు" "మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుటచేత మాకేమి లాభము కలుగును" అని ఆయనను అపహాస్యం చేస్తుంటారు. ఎందుకంటే;
యోహాను 3:20 దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్‌క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు.
సామెతలు 18:1 వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి.
ఉదాహరణకు; వీరిలో జంతుశయనం చేసేవారు కూడా ఉంటారని చెప్పాను. కానీ బైబిల్ దానిని ఎంత తీవ్రంగా ఖండిస్తుందో చూడండి.
లేవీయకాండము 18:23 ఏ జంతువు నందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగజేసికొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని యెదుట నిలువరాదు, అది విపరీతము.
లేవీయకాండము 20:16 స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాని సమీపించినయెడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి; ఆమెను దానిని చంపవలెను; తమశిక్షకు తామే కారకులు.
కానీ వీరిలో కొందరికి ఇలా నీచంగా ప్రవర్తించడం ఇష్టం మరియు వారి స్వేచ్చ కాబట్టి బైబిల్ నీ బైబిల్ దేవుణ్ణీ దూషిస్తుంటారు. మేము స్త్రీలమూ కాదు పురుషులమూ కాదు కాబట్టి ఆ నియమాలు మాకు వర్తించవని వాదిస్తుంటారు. చివరికి ఇందులోని స్త్రీలు స్త్రీ నామలతో (she, her) పురుషులు పురుషనామాలతో (he, him) పిలవబడడానికి కూడా ఇష్టపడరు. మేము non-Binary అంటారు. వీరిని they, them అని పిలవాలంట. అంతదారుణంగా ఉంటాయి వీరి వికృతాలు.
యిర్మియా 8:12 తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెనుగాని వారేమాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితిమని వారికి తోచనేలేదు గనుక పడిపోవువారిలో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించుకాలమున వారు తొట్రిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.
హోషేయా 14:9 జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాని ననుసరించి నడచుకొందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు.
ఇప్పటివరకూ మనం LGBTQ ల గురించి చూసాం, వీటితో పాటు + కూడా ఉంది. అందుకే LGBTQ+ అంటారు. + అంటే ఇంకా ఇలాంటివి వందల వేలు ఉన్నాయని చెబుతుంటారు. వారు కూడా వీరికిలానే స్త్రీ పురుషుల స్వభావసిద్ధమైన నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించి, సృష్టికర్తయైన దేవుడు ఏ పరిథిలో ఉండాలని ఎవరిమధ్యలో ఉండాలని లైంగికకోరికలను వారిలో ఉంచాడో ఆ వివాహవ్యవస్థకు నకిలీలులుగా మారి ఆ వ్యవస్థకు బయట స్వభావవిరుద్ధంగా కామతప్తులౌతున్నారు. ఇది వివాహ వ్యవస్థను ఘోరంగా అవమానించడమే.
ఐతే వీరిలో ఎక్కువశాతం ముఖ్యంగా కుటుంబవ్యవస్థ సరిగా లేని యువతే ఉందని మనం గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు US లో చాలామంది తమ పిల్లలకు 16,17 రాగానే ఇంటినుండి ప్రత్యేకంగా పంపేస్తుంటారు. ఎక్కువశాతం అలాంటివారే ఈ జాబితాల్లో మనకు కనిపిస్తున్నారు. లేఖనాల్లో దేవుడు కుటుంబ వ్యవస్థకు ఎందుకంత ప్రాముఖ్యతను ఇచ్చాడో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనమందరమూ ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. దేవుడు నియమించిన కుటుంబవ్యవస్థ సరిగా లేకుంటే ఈ ప్రపంచం ఇలాంటి మరెన్నో అరాచకాలను చూడకతప్పదు.
ఎఫెసీ 3:14-19 ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను మోకాళ్లూని మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారిస్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.
ముగింపు
నేను ఈ వ్యాసం రాయడానికి దేవుని సృష్టిలో లింగాలు రెండు మాత్రమేయని, LGBTQ+ అనేది దేవునివాక్యం దృష్టిలో అత్యంత నీచమైనదని, అది దేవుడు నియమించిన వివాహవ్యవస్థను అవమానిస్తుందని తెలియచెయ్యడానికే కాకుండా నేటి యువత విషయంలో నాకు కలుగుతున్న ఆందోళనలు కూడా దీనికి ప్రధానకారణం. ఎందుకంటే ప్రస్తుతం ఎక్కువశాతం యువత దీని బారినపడుతున్నారు. ముఖ్యంగా హాస్టల్స్ లో ఉండే యువతీ యువకులు ఎక్కువగా Lesbians గా Gays గా మారుతున్నారు. మానవస్వేచ్చ పేరుతో ప్రభుత్వాలూ న్యాయస్థానాలూ దీనిని సబబుగా ప్రకటించడం కూడా ఈ విపరీతానికి ఒకానొక కారణం. ఒకవిధంగా యేసుక్రీస్తు రాకడసంబంధమైన ప్రవచన నెరవేర్పుకు (లూకా 17:26-30) ఇది నిదర్శనం. కాబట్టి యువతీ యువకులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి, తల్లితండ్రులు వారికి అవగాహన కల్పించాలి.
దానియేలు 12:10 అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులును నిర్మలులును అగుదురు. దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు.
అంతేకాదు ఈ స్వలింగసంపర్కుల నుండి దానికి అంగీకరించనివారిపై వేధింపులూ దాడులు కూడా పెరుగుతున్నాయని సమాచారం. ఎవరికైనా అలాంటి అనుభవం ఎదురౌతుంటే మొదటిస్థాయిలోనే తెలివిగా జాగ్రత్తపడండి. స్వభావసిద్ధమైన కోరికలే (Opposite Gender పై) కొందరిని నీచమైన అత్యాచారాలకు ప్రేరేపిస్తుంటే స్వభావవిరుద్ధమైన వీరి కోరికలు ఇంకెంత అరాచకానికి సిద్ధపడతాయో ఊహించండి, కొన్నిరోజుల క్రితం చెన్నైలో Transgender గా మారిన ఒక అమ్మాయి తనతో సంబంధానికి ఒప్పుకోలేదనే కారణంతో తనను చేరదీసిన స్నేహితురాలినే అత్యంతదారుణంగా బ్లేడుతో కోసి, కొన ఊపిరితో ఉన్న ఆమెను సజీవదహనం చేసింది. అందుకే చెబుతున్నాను వీరి విషయంలో జాగ్రత్త.
సామెతలు 22:3,4 బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండును.
అలానే ఇది చదువుతున్నవారిలో ఎవరైనా ఇప్పటికే స్వలింగసంపర్కులుగా కానీ జంతుశయనాలు చేసేవారిగా (Zoophilia) కానీ జీవిస్తుంటే ఒకవేళ మీరు ఈ L.G.B.T.Q+ గా భావించుకోకున్నా సరే ఆ క్రియలనే చేస్తుంటే ఇప్పుడైనా మార్పు చెందండి. మీరు ఎలా పిలవబడుతున్నారు అనేదేకాదు మీరు ఏం చేస్తున్నారు అనేదానిని బట్టి కూడా మీరు వారే అని నిర్థారణ ఔతుంది కదా. సంబంధిత వాక్యభాగాలను ఇప్పటికే మీ ముందుంచాను. అందుకే ఆ హేయక్రియలను విడిచిపెట్టి మార్పుచెందండి. కృపగలిగిన దేవుడు తన వాక్యం ద్వారా మీకు ఆ అవకాశం కల్పిస్తున్నట్టు బోధించాడు, ఆయనపై ఆధారపడితే అది మీకు సాధ్యమే. కొరింథీయులలో అలాంటివారు చాలామంది ఉండేవారు కానీ ఆయన పౌలు ద్వారా వారిని రక్షించాడు. అందుకే పౌలు వారిని ఉద్దేశించి ఇలా మాట్లాడుతున్నాడు.
1 కొరింథీయులకు 6:9-11 అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను "ఆడంగితనముగలవారైనను (అంటే తమను తాము అలా మార్చుకున్నవారు - ఇది అప్పటికొన్ని సంస్కృతుల్లో ఉండేది) పురుష సంయోగులైనను" దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. "మీలో కొందరు అట్టివారైయుంటిరి గాని, ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి".
ఈ వ్యాసంలో వివరించబడిన స్వలింగసంపర్కం గురించి మేము English లో కూడా రాయడం జరిగింది. దానిని కూడా చదవండి.
విశ్వాసులమైన మనం LGBTQ+ వంటివాటికి అనుకూలంగా మారుతున్న చట్టాల విషయంలోనూ, న్యాయస్థానాల తీర్పుల విషయంలోనూ ఎలా స్పందించాలో కూడా ఈ వ్యాసం చదివి తెలుసుకోండి.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.