సువార్త

రచయిత: పీటర్ మాస్టర్స్
అనువాదం: శామ్యూల్ బొప్పూరి
చదవడానికి పట్టే సమయం: 42 నిమిషాలు

 నీ మనస్సాక్షి గురించి నువ్వు ఏమి తెలుసుకోవాలి?

విషయసూచిక

  1. మనస్సాక్షి ఎలా నిర్మింపబడింది?
  2. మనస్సాక్షికి అంతా గుర్తే
  3. మనస్సాక్షి అల్లకల్లోలం సృష్టిస్తుంది
  4. మన ప్రవర్తనపై మనస్సాక్షి యొక్క ప్రభావం
  5. ఆ.... బరువైన మనస్సాక్షికి విడుదల ఏలా?
  6. మనస్సాక్షి యొక్క చివరి మాట!

“అట్టివాని మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పుమోపుచు, తప్పులేదని చెప్పుచుండగను ..... ” రోమా 2:15

ఈ రోజు మానవుడు విజ్ఞాన, సాంకేతిక రంగాలలో అభివృద్ధి సాధించినట్లు ముందెన్నడూ సాధించలేదు. అయినా, ఈ రోజు మానవుడు మానసిక సమస్యలతో కలవరం చెందినట్లు ఎన్నడూ కలవరం చెందటం లేదు. ఒక్కసారి మనస్సాక్షి గురించి ఆలోచించండి, ఈ విచిత్రమైన బుద్ధి ఎమిటి ? ఇది ఎలా పనిచేస్తుంది ? మనస్సాక్షికి వ్యతిరేకంగా నడిచినప్పుడు ఏమి సంభవిస్తుంది?

మనస్సాక్షి ప్రతి ఒక్కరినీ అనుభవపూర్వకంగా అంతులేని శ్రమలకు గురిచేస్తున్నప్పటికీ, ఎన్నో మానసిక ఒత్తిళ్ళకు ప్రజలు లోనవుతున్ననప్పటికీ, దానిని గురించి మనకు సరైన అవగాహన లేకపోవడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శరీరంలో అనేక రకాలైన అవయవాల గురించి లోతుగా తెలుసుకోవటం వైద్యులకు కూడా శ్రమే. మనస్సాక్షిని అణచివేయటం వలన భయంకరమైన వ్యాధులు సంభవిస్తాయని బైబిల్ చెబుతుంది. (1 కొరింథీ 11:28-30). పూర్వం, గొప్ప గొప్ప వ్యక్తులు జీవితంలో జరిగే విచిత్రమైన శ్రమలలో మనస్సాక్షి యొక్క అద్భుతమైన అదృశ్యహస్తాన్ని చూడగలిగారు కానీ ఈ రోజు దానినెవరూ గుర్తించలేకపోతున్నారు. ఇది ఎంత శోచనీయం!

సొలోమోను మహారాజు వ్రాసిన సామెతలు గ్రంథంలో “మనస్సాక్షిని” ఒక స్వతంత్రపూర్వకమైన పరిశోధకునిగా వర్ణించాడు. ఇది ఒక మనిషి యొక్క ఆత్మ అని సొలోమోను మహారాజు అంటున్నాడు. ఇది మనిషి యొక్క అంతరంగాలను పరిశీలించే దేవుని యొక్క దీపము అని కూడా సొలోమోను మహారాజు చెబుతున్నాడు. దీనికి అన్నిటినీ వెదకి వెంటాడి పరిశీలించే గుణం ఉంది. అంతర్గత భావాలను అణచివేసే పనులను చేస్తే, ఆ అపరాధభావాన్ని స్పష్టంగా బయటికి చూపెడుతుంది.

నూతన నిబంధనలో “మనస్సాక్షి" అనే గ్రీకు పదాన్ని 'కలిసి తెలుసుకోవటం' లేక 'కలసి గ్రహించటం' అని తర్జుమా చేశారు. దీని అర్థం ఏమిటంటే మనం చేసే పనులను నిరాటంకంగా తనిఖీ చేసే ఒక గొప్ప శక్తి అని అర్థం. దేవుడు తన న్యాయవిధులను, ప్రమాణాలను మన హృదయం మీద ఒక చెరగని ముద్రగా వేసాడు. ఇది ఒక పోలీసువలే లేక ఒక న్యాయవాదివలే పనిచేస్తుంది.

అనేక దేశాలలో న్యాయవాదుల విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవు. వారు స్వతంత్రబద్ధులు. వారు తమ ఉన్నతస్థానాన్ని చాలా గౌరవంగా, శ్రద్ధతో కాపాడుకుంటారు కాని కొన్ని దేశాల్లో ఈ పద్ధతి లేదు. అలాంటి దేశాల్లో కొన్నిసార్లు ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయవ్యవస్థను కూడా తమ స్వంత లాభాల కోసం ఉపయోగించుకోవటానికి ఎడతెగని ప్రయత్నం చేస్తారు. “ఫలాన అతని మీద నేరములు ఎందుకు మోపారు”? అని అడుగుతారు. వాళ్ళు ఈ విధంగా తమ దేశంలో చేయగలరని తలచి ప్రపంచంలో అన్ని దేశాల్లో ఇలా చేయవచ్చు అని అనుకోవటం తెలివితక్కువతనం. ప్రతీ న్యాయవ్యవస్థకు సార్వభౌమాధికారం, స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. ఆయా ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ తీర్పు తీర్చే విషయంలో జోక్యం చేసుకోవు. అయితే ఈ విషయం కొంతమందికి బోధపడదు. మనకున్న మనసాక్షికి కూడా అంతే సార్వభౌమాధికారం ఉంటుంది. కానీ దానిని నిశ్శబ్దపరచవచ్చు, వంచవచ్చు, ఎటుబడితే అటు త్రిప్పవచ్చు, దానిని అసహ్యకరంగా కూడా తయారుచేయవచ్చు. మనము ఏమి చేసినా సరే, మనస్సాక్షికి కొంత స్వతంత్రం తప్పకుండా ఉంటుంది. ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా దాని యొక్క ప్రమాణాలను జ్ఞప్తికి తెచ్చుకొని అవమానము, అపరాధము లాంటి మానసిక ఒత్తిళ్ళను తెప్పించగలదు. మనము దానిని మార్చటానికి ఎంతగా ప్రయత్నం చేసినా సరే, మనస్సాక్షి ఎన్నటికీ సహించదు, ఒప్పుకోదు. దానికి స్వభావసిద్ధమైన స్వాతంత్య్రము ఉంది. అయితే దానిని తప్పకుండా విలువలేనిదానిగా మలచుకోవచ్చు, కానీ పూర్తిగా దాని నోరు మూయలేము.

గాయపరచబడిన మనస్సాక్షి, వ్యక్తి యొక్క బాహ్య ప్రవర్తనతో నిమిత్తం లేకుండా అంతర్గత సంఘర్షణకు గురి అవుతుంది. వెంటనే ఆ వ్యక్తి విపరీతమైన ఆందోనళకు గురి కావడంతో పాటు తన జీవితంలో నిరాశ, నిస్పృహ, నిర్లిప్తత చోటు చేసుకుంటాయి. ఇది కొందరిని తీవ్రమైన మానసిక కృంగుబాటులోనికి నెడుతుంది (అన్ని మానసిక ఒత్తిళ్ళకు మనస్సాక్షియే కారణం కాదని గమనించాలి). “భక్తిహీనులు కదులుచున్న సముద్రంవంటివారు అది నిమ్మళింపనేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు” అని ప్రవక్తయైన యెషయా (యెషయా 57:20, 21 లో) సెలవిచ్చుచున్నాడు.

మనస్సాక్షి ఎలా నిర్మింపబడింది?

అసలీ మనస్సాక్షి ఇన్ని శ్రమలను మనకు ఎందుకు కలగజేస్తుంది అని ప్రశ్నించుకున్నట్లయితే, దానికి నాస్తికులు ఇచ్చే సమాధానం ఏమంటే ఇది కేవలం మనం పిల్లల్ని పెంచే తీరును బట్టి మనస్సాక్షి నిర్మితమౌతుందని అంటారు. ఇది కేవలం ఊహకందని అహం అని, తల్లిదండ్రుల వలనో, సమాజం వలనో, పరిసరాల ప్రభావం వలనో వస్తుందని భావిస్తుంటారు. కాకపోతే, దీనికి ప్రత్యేకమైన నీతి విలువలంటూ ఏమీ లేవని కొట్టిపారేస్తారు. దీనివలన వచ్చే సమస్య ఏమిటంటే జీవితంలో విలువలంటూ లేని ఒక క్రొత్త తరం వస్తుంది.

ఇదే మనస్సాక్షి మీద ప్రజలకున్న నూతనమైన అభిప్రాయం. కానీ ఈ అభిప్రాయంతో చరిత్రకు ఏమాత్రం సంబంధము లేదు. ఇలాంటి అభిప్రాయం భయంకరమైనదిగా కూడా నిర్థారించబడినది. అసలు అపరాధభావన అంటూ ఏమీ లేదని, ఒకవేళ అది వచ్చినా అంత మంచిది కాదని దానిని వీలైనంత త్వరలో మర్చిపోవాలని నిపుణులు ప్రజలను తప్పు దారి పట్టిస్తుంటారు. ఇతరులకు మనం ఏ హాని చేయనంత సేపు, ప్రజలు వారికి ఇష్టమొచ్చినట్లు చేయవచ్చని ఈ విధంగా చేస్తే మళ్ళీ మనస్సాక్షి మామూలు దారిలోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కానీ, నిపుణులు మనస్సాక్షిని కేవలం ఒక తలనొప్పిగా భావిస్తారు. దానిని మార్చటానికి సాధ్యపడదని చెబుతారు. అయితే మనస్సాక్షిని లోబరచటం ఎవరివలన సాధ్యం కాదు. దానితో కలసి పనిచేయటం అస్సలు వీలుపడదు. మనసాక్షి ద్వారా బాధ కలిగినవారు బాధపడుతునే ఉంటారు. మానసికంగా కృంగినవారికి, మనోవ్యధ కలిగినవారికి ఉపశమనం ఉండనే ఉండదు. వారు విచిత్రమైన వ్యాధులతో బాధపడుతూ ఉంటారు.

నీతి విలువలను వ్యతిరేకించే మానసిక శాస్త్రవేత్తలు మనస్సాక్షి యొక్క నిర్వచనం పలుమార్లు మార్చిన తరువాత మనకు అర్థమైనదేమంటే దేవుని యొక్క వెర్రితనము మనుష్యుల జ్ఞానముకంటే గొప్పదని స్పష్టంగా తెలుస్తుంది. మనస్సాక్షి మానవ పద్ధతుల ద్వారా లేక ప్రత్యేకమైన తర్ఫీదు ద్వారా నిర్మింపబడదని బైబిలు గ్రంథం చెబుతుంది. దేవుడే మనస్సాక్షిని మొట్టమొదటసారిగా కలగజేశాడు. ఆయన మనుష్యుల జీవితాలపై అధికారం కలిగున్నాడని గుర్తుచేసేదే ఈ మనస్సాక్షి.

ప్రజలు ఎటువంటి సాంస్కృతిక మతసంప్రదాయాలకు చెందినవారైనా మంచిచెడులను గ్రహించే శక్తి ఉంటుందని అపోస్తులుడైన పౌలు మనకు చెబుతున్నాడు. అపోస్తలుడైన పౌలు 'దేవుడు పక్షపాతి కాదు' అని కూడా చెబుతున్నాడు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు (ఇశ్రాయేలీయులు కానివారు మరియు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి తెలియనివారు), సహజముగా ధర్మశాస్త్ర సంబంధమైన (నీతిక్రియలు) క్రియలు చేసినయెడల ధర్మశాస్త్రము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుతున్నారు. అంటే ధర్మశాస్త్రము తెలిసినా, తెలియకపోయినా దేవుని ధర్మశాస్త్రము (మనస్సాక్షి) ప్రతి ఒక్కరి గుండెలో చెరిగిపోని విధంగా దేవుడు ముద్రించాడని మనకు స్పష్టంగా అర్థమౌతుంది.

మతసంబంధమైన విషయాలలో, నీతిసంబంధమైన విషయములలో ప్రజలు తర్ఫీదు పొందినా, పొందకపోయినా అందరి హృదయాలలో దేవుని నీతిని సూచించే సంకేతం మాత్రం వ్రాయబడి ఉంటుంది. ప్రపంచంలో ఏ పద్ధతైనా దానిని మార్చలేదు, తుడిచివేయనూ లేదు. ప్రజలు మనస్సాక్షి నుండి ఎంత దూరమైపోతారో, అంతే అవేదన వారికి కలుగుతుంది. మనస్సాక్షి ఎంత అమోఘంగా పనిచేస్తుందో ప్రజలు చేసే క్రియలు ద్వారా తెలుస్తుంది. అందుకే వారు దానిని గాయపరచినప్పుడు, ఆ గాయపూరితమైన బాధల నుండి తప్పించుకోవడానికి ఎన్నో సాకులను చెప్పాల్సి వస్తుంది.

అయితే, మనస్సాక్షి మన శరీరంలో ఎక్కడ దాగి ఉంది ? ఒక శవంలో మనస్సాక్షి ఎక్కడ ఉంటుంది అని ఒక వైద్యుణ్ణి అడిగినట్లయితే, అతను ఏమని సమాధానం చెబుతాడు ? అటువంటి ప్రశ్నలకు సమాధానం దొరకదు. కానీ, అది కనబడటం లేదు అనే నిజం తెలిసినప్పటికీ, దాని  ఉనికిని ప్రశ్నించటం మనకందరికీ శ్రేయస్కరం కాదు. మనస్సాక్షి ఉందని అందరికీ తెలుసు, ఎందుకంటే మనము అనుభవపూర్వకంగా దానిని తెలుసుకున్నాము. మనస్సాక్షి నిశ్శబ్దంగా ఉంటే ఎంత బాగుండునో అని ఎన్నిసార్లు కోరుకోలేదు! మనస్సాక్షి మనమీద ఆరోపణలను చేయకుండా మనకు అభయకరంగా మారితే ఎంతటి అవమాన్నానైనా, బాధనైనా లేక అలజడిని సైతం మూలన పెట్టవచ్చు.

అయితే రకరకాల పద్ధతుల ద్వారా, మనస్సాక్షిని మత్తెక్కింపచేసి సరిగా పనిచేయకుండా చేయవచ్చు. కానీ అది కొంతసేపు మాత్రమే. మనస్సాక్షిని నోరు ఎన్నటికీ మూయించలేము.

మనస్సాక్షికి అంతా గుర్తే

తిర్పు దినమునందు మనమందరము దేవుని ఎదుట నిల్చుని ఉన్నప్పుడు, మనస్సాక్షి మన అతిక్రమాలకు విరోధంగా సాక్ష్యమిస్తుంది. అప్పుడు మన మనస్సాక్షి మనకు విరోధంగా మాట్లాడుతుంది. అది మన పాపాన్నంతటినీ గుర్తుచేస్తుంది. ఎందుకంటే మనస్సాక్షికి అంతా గుర్తే (రోమా 2:15,16). గతంలో మాట ద్వారా, ఆలోచన ద్వారా మరియు క్రియ ద్వారా మనం చేసిన నేరాలన్నీ జ్ఞాపకముంచుకుని, వాటన్నిటినీ అప్పుడప్పుడు మనకు గుర్తుకు వచ్చేలా చేస్తుంది. ఆఖరి క్షణాన మనము దేవుని ఎదుట నిలుచున్నప్పుడు, మన అపరాధభావమంతా మన మీదకు ఒక మహా సైన్యంవలే వచ్చినప్పుడు “నేనే! అది నేనే చేశాను! అని గట్టిగా అరుస్తూ, ఏడుస్తూ ఉంటుంది". మహా పండితుడు జాన్ బన్యన్ (హోలివార్) 'పరిశుద్ధ సమరం' అనే పుస్తకంలో మనస్సాక్షికి 'మిస్టర్ రికార్డర్' అని పేరు పెడతాడు. ఎంత సమంజసం! నిజంగా మనస్సాక్షి ఒక రికార్డరే !

గర్విష్ఠులైన పరిసయ్యుల మనస్సాక్షి వారు గతంలో చేసిన పాపాలను గుర్తుకు వచ్చేలా చేసి, వారిని పూర్తిగా కట్టిపడేసేలాంటి ఒక సంఘటన మనము యోహాను సువార్తలో చదువుతాము. వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని క్రీస్తు ఆలయంలో వాక్యం బోధిస్తుండగా తీసుకొని వచ్చి, మోషే ధర్మశాస్త్ర ప్రకారము పరిసయ్యులు ఈమెను రాళ్ళతో కొట్టి చంపవలెనని ఉద్దేశించి, యేసు వైపునకు చూడగా, మొదట యేసు చూసీ చూడనట్లుండి, తలవంచుకొని వినిపించనట్లు నేలమీద ఏదో రాసిన పిదప, ఎవరైతే పాపము చేయలేదో వాడు మొదట రాయి వేయండి అని అంటాడు. వెంటనే వారి యొక్క మనస్సాక్షి వేధింపును వారు భరించలేక, పెద్దవారి దగ్గర నుండి చిన్నవారి వరకూ ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారు మత పెద్దలైనప్పటికీ, వారు వట్టి వేషధారులు, వ్యభిచార నేరము చేసినవారు. ఎప్పుడయితే ఎదురు ప్రశ్న వేయబడిందో, చాలాకాలంగా వారి మనస్సాక్షి నోరు మెదపకుండా చేసినప్పటికీ, అది వారి గుండెలో సింహగర్జన చేసింది, వెంటనే వారు మెల్లగా అక్కడ నుండి జారుకుని సమాజం ముందు అవమానింపబడ్డారు. మనస్సాక్షి కొన్ని సంవత్సరాల తరువాత అయినా సరే తిరిగి లేస్తుంది. ఎంత గొప్ప ఆత్మవిశ్వాసము గలవారైనా మనస్సాక్షి ముందు తలవంచాల్సిందే.

మనస్సాక్షి అల్లకల్లోలం సృష్టిస్తుంది

'జాన్ బన్యన్' పరిశుద్ధ సమరం అన్న పుస్తకంలో “మిస్టర్ రికార్డర్” (మనస్సాక్షి) 'మానవ ఆత్మపుర నివాసులను' ఎంతగా విసిగించాడంటే అతని (మిస్టర్ రికార్డర్) నోరు మూయించడానికి, వాళ్ళందరూ కలసి అతడిపై దాడి చేసి చేరశాలలో వేసి బాధించారు. కానీ అవకాశం చిక్కినప్పుడల్లా, అతడు తప్పించుకుని, ఆత్మపురంలో సింహగర్జన చేసి ఆ పురవాసులనందరినీ గడగడ వణికించేవాడు. నువ్వు మనస్సాక్షిని నిశ్శబ్దపరచవచ్చు, దాని నుండి పరిగెత్తుకొనిపోవచ్చు, కానీ కొన్నిసార్లు అది భరింపశక్యము కాని స్వరముతో అరుస్తుంది. దానిని ఆపడం ఎవరి తరమూ కాదు.

ఇదే సంఘటన ఒక అమెరికన్ స్త్రీ జీవితంలో జరిగింది. మానసిక ఒత్తిళ్ళ సంక్షోభంలో ఆమె చిక్కుకున్న రీతి, ఆమెకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చి పెట్టింది. 1960 లో విద్యార్థి పోరాట సంఘానికి కార్యనిర్వహకురాలుగా ఉంటూ, 1970లో కల్లా తీవ్రవాదంలో చేరిపోయింది. “బ్లాక్ పేంథర్స్” అనే తీవ్రవాద బృందానికి సహాయం చేయటానికి, ఒక బ్యాంకును దోపిడీ చెయ్యడానికి ఇతరులతో కలిసి ఉపాయం పన్నింది. తీరా సమయం వచ్చేసరికి ఆ ఉపాయం కాస్తా గాడి తప్పింది, ఒక పోలీసు కాల్చబడ్డాడు. ఈ హత్యలో ప్రమేయమున్న అనేకమంది పట్టుపడ్డారు. దోషులుగా కూడా తీర్చబడ్డారు. కానీ ఈవిడ మాత్రం తప్పించుకొనిపోయింది. ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని మార్చుకొని మరొక ప్రాంతానికి తరలిపోయింది. ఈమెను పట్టుకోవటానికి ఎఫ్.బి.ఐ. ఎంత ప్రయంత్నించినా ఆమె మాత్రం ఎవరికంటా పడలేదు. ఇక 23 సంవత్సరాల తరువాత ఆమె కేసు కొట్టివేశారు. ఆ పాత నేరాన్ని జ్ఞప్తికి తెచ్చుకునే ఓపిక ఎవరికీ లేదు. కానీ ఆమె మనస్సాక్షి తనను కుదిపివేసింది.

అప్పుడు ఆమె ఒక విద్యార్థి, ఇప్పుడు ఒక మధ్యవయస్కురాలు, సమాజంలో గౌరవనీయురాలు. అయినప్పటికీ ఆ పాత జ్ఞాపకాలతో నివసించలేకపోయింది. ఎన్నడూ లేని విధంగా మనస్సాక్షి ఆమె గుండెను పిండినప్పుడు ఇక ఆ బాధని భరించలేక ఒక ఆసుపత్రిలో మానసిక ఒత్తిళ్ళకు సంబంధించిన క్లాసులకు హాజరయ్యింది. 'అంతటి మానసిక బాధను ఎవ్వరిలోను నేనెన్నడూ చూడలేదు' అని ఆమె క్లాసు బోధకుడు జ్ఞప్తికి తెచ్చుకొన్నాడు. ఒక రోజు ఆమె ఆశలన్నీ వదిలివేసింది. యావజ్జీవ కారాగార శిక్షకైనా, మృత్యువుకైనా వెనుకంజ వేయకుండా సిద్ధపడింది. ఆమెలో ఉన్న మనస్సాక్షి చెఱసాల నుండి విముక్తుడై సింహగర్జన చేసినప్పుడు, ఈవిడ జీవితానికి శాంతి అనేది లేకుండా పోయింది. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. ప్రతి సంఘటన మనస్సాక్షి యొక్క ఉనికిని తేటతెల్లం చేస్తుంది. లేకపోతే ప్రజలు వారికి తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ బాధలు ఎందుకు నోరు విప్పి చెప్పుకొంటారు?

ప్రఖ్యాతి వహించిన ఒక గొప్ప సంగీత విద్వాంసుడు, క్విజ్ షో నిర్వహణకర్త యొక్క జీవితంలో తన మనస్సాక్షికి ఉన్న జ్ఞాపకశక్తి మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. తనకున్న తలాంతులతో బాగా డబ్బు గడించిన తరువాత తను బాల్యంలో చేసిన తప్పిదాలను తలచుకొని, ఆవేదన అనే కెరటంలో మునిగిపోయాడు. యుక్తవయస్సులో ఉన్నప్పుడు, ఒక దుకాణంలో దొంగతనం చేశాడట, కొన్ని సంవత్సరాల వరకు ఈ విషయం అస్సలు గుర్తుకు రాలేదు. కాని అకస్మాత్తుగా నేను తప్పు చేశాననే ఆవేదన అతనిని కుదిపివేసింది. అనేకమైన విజయాలు, పేరు ప్రఖ్యాతులు, లెక్కకు మించిన అభిమానులు, డబ్బు, కంటికి కనిపించిన సమస్తమయిన సుఖసంతోషాలు కూడా ఆత్మలో ఘోషించే మనస్సాక్షి ఆవేదనను తీర్చలేకపోయాయి. ఆ బాధని తట్టుకోలేక ఓ వార్తా పత్రికలో తన మనసులో బిగపట్టి ఉంచుకొన్న పాత కథనంతా వెళ్ళగక్కాడు. జరిగినదంతా పూర్తిగా, ప్రతి వివరంతో పత్రికలో వ్రాసాడు. కానీ ఇలాంటివన్నీ సరైన పరిష్కారాలు కావు. జీవితంలో అపజయాల్లాగ మిగిలిపోతాయి. బాధతో రగులుతూ గుచ్చుతున్న మనసాక్షిని ఎవరు అనుగ్రహించారో ఆయనే ఆ గాయాన్ని మాన్పగలడు. ఈ పుస్తకం చదువుతున్న కొలదీ ఈ విషయాన్ని మీరు గ్రహించుకొంటారు.

గవర్నరు ఫెలిక్సు అనే కుతంత్రుడు బహుక్రూరుడైన రోమా ప్రభుత్వాధికారి అపోస్తలుడయిన పౌలును నిర్భందించినప్పుడు, పౌలు అంతరాత్మ గురించి ఫెలిక్సును గుచ్చి గుచ్చి అడిగాడు. అప్పటిదాకా జీవచ్ఛవంలాగ ఉన్న అతని మనస్సాక్షి జీవంతో తొణకిసలాడి మిగిలిన అధికారుల ముందు అతన్ని భయంతో గడగడ వణికింపజేసింది. మూగబోయిన మనస్సాక్షి పనిచేయటం మాత్రం ఆగలేదు !

ఈ రచయిత ఈ చిన్న పుస్తకం రాయకముందు, ఉత్తర ఇంగ్లాడులో, ఒక చిన్న పట్టణంలో, ఒక సంఘటన జరిగింది. ఒక పాతగృహాన్ని బాగుచేసి చక్కగా అలంకరించారు. వారీ పనిలో ఉండగా, పైకప్పు క్రింది భాగంలో, ఆత్మహత్యకు సంబంధించిన ఒక నోటు పత్రాన్ని కనుగొన్నారు. అది ఆగష్టు 1901లో వ్రాయబడింది. ఆ ఇంటి యజమానుడు, అక్కడ పనిచేసే అమ్మాయిని చంపేసి తప్పించుకున్నాడు, ఈ నేరం కాలగర్భంలో కలసిపోయింది. కానీ, కాలం గడుస్తున్న కొద్దీ, మనస్సాక్షి బరువును భరించలేక తన ప్రాణాన్ని తీసుకొని, ఒక ఉత్తరం రాసి కంటికి కనిపించని సుదూర లోకాలకు వెళ్ళిపోయాడు. మనస్సాక్షి యొక్క బాధ భరింపరానిదని ఎంతమంది ఒప్పుకోరు?

మనస్సాక్షి బాధ భరించలేక, ఎంతటి అవమానాన్నయినా, జైలు శిక్షనైనా, మరణశిక్షకైనా, చివరకు తమ ప్రాణాలను తీసుకోవటానికైనా వెనుకాడరు. మనస్సాక్షి ఇంతగా ఆవేదనకు గురి చేస్తున్నప్పుడు, అనేకమయిన ఇతర ఒత్తిళ్ళకు కూడా లోను కావలసి వస్తుందని ప్రత్యక్షంగా కనబడుతుంది. మనస్సాక్షిని తప్పనిసరిగా కొంతకాలం వరకు కాదు, చాలా కాలం వరకూ నిశ్శబ్దపరచవచ్చు. దాన్ని ఆధారం చేసుకొని మనుష్యులు ఆ  జ్ఞాపకాలు చెరిగిపోయాయని భ్రమపడతారు. కానీ అది కేవలం భ్రమే అని తెలుసుకోరు. ఒక మందుల వ్యాపారి అతి తెలివితేటలు ప్రదర్శించి అనేకమందిని చాలా రోజుల వరకు మోసం చేశాడు. తప్పుడు లెక్కలు, జమలు, తన ల్యాప్ టాప్ కంప్యూటర్ లోకి ఎక్కించి, తనకు కావల్సినప్పుడు వాటన్నిటిని చెరిపేయవచ్చు అనుకొన్నాడు. చాలా రోజులవరకూ పోలీసులకు అతనిపై నేరం మోపటానికి సరైన ఆధారం దొరకలేదు. కొన్నిరోజుల తరువాత, ఈ చిన్న కంప్యూటర్ వారి చేతిలోకి చిక్కింది, నిపుణుల సహాయంతో, చెరిపివేయబడిన తప్పుడు లెక్కలన్నీ తిరిగి కంప్యూటర్ లోకి వచ్చేలా చేశారు. దొరికాడు దొంగ!

ఈ దొంగ బాసు తెలివిగలవాడు అయినప్పటికీ తను పూర్తిగా కంప్యూటర్ లో ఉన్న తప్పుడు లెక్కల్ని చెరిపేయలేడనీ, నిపుణులు కంప్యూటర్ లో ప్రతీది పరిశీలించి చెరిపివేయబడిన ఆ తప్పుడు లెక్కల్ని తిరిగి తీసుకొని వచ్చారని తెలుసుకోలేకపోయాడు పాపం! ఈ సంఘటన యొక్క పరిణామం ఏమిటంటే, పోలీసులు గొప్ప విజయాన్ని సాధించారు, దొరకని దొంగ పట్టుబడ్డాడు. మనసాక్షిని కూడా నువ్వు ఎన్నడూ చెరిపేయలేవు. దానిని ఎన్నటికీ నిశ్శబ్దపరచలేవు. సాధారణంగా ప్రజలు మనస్సాక్షిని నిశ్శబ్దపరచడానికి వాళ్ళకు తెలియకుండా ఈ నాలుగు పద్ధతుల్ని పాటిస్తుంటారు.

1. చెరిపివేయడం

మనస్సాక్షిని నిశ్శబ్దపరచడానికి నాలుగు ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి. దీనిలో అతి సాధారణమైన పద్ధతేమిటంటే, పాపపు ఆలోచనల వలన, మాటల ద్వారా, కార్యాల ద్వారా ఎడతెరిపి లేకుండా మనస్సాక్షిని చెరిపివేయడం. మన తప్పులతో మనస్సాక్షిని ముంచేసి, ఏమి ఎరగనట్టు నటించడం ద్వారా మనస్సాక్షి నిశ్శబ్దపరచవచ్చు. అల్లరిమూకలకు పాఠం చెప్తున్న టీచరును ఒక్కసారి ఊహించుకోండి - అరచి, అరచి, గద్గద స్వరంతో ఆమె గొంతు కొంత సేపు అయిన తరువాత మూగపోతుంది. అలాగే మనస్సాక్షి స్వరం కూడా మూగపోతుంది. మనం పాపం చేసినప్పుడు, అది మనల్ని బాధపెడుతుంది. కానీ, మనం పాపం చేస్తున్న కొద్దీ, ఆ బాధ కరిగిపోతుంది. ఒక రోజు వచ్చేసరికి అసలు బాధంటూ ఏమీ లేకుండా పోతుంది. అయితే ఈ పద్ధతి చాలామందికి అనుకూలంగా ఉన్నప్పటికీ, ప్రతీసారి పాపం చేయ్యడానికి మనస్సాక్షి సహకరించదు. పాపం అనే నిద్రలోకి జారుకున్న చాలామందిని మనస్సాక్షి అప్పుడప్పుడు నిద్ర లేపుతూనే ఉంటుంది.

2. ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ఆరోపణలు

మనస్సాక్షితో ఎప్పుడుపడితే అప్పుడు వాగ్వివాదానికి దిగటమే రెండవ పద్ధతి. ఆగ్రహంతో ఊగిసలాడుతున్న ఒక యువకుణ్ణి ఊహించుకోండి. తన తండ్రికి ఎదురుతిరిగినట్లు మనస్సాక్షికి ఎదురు తిరగడం, తను ఏది చేసినా సమర్థించుకోవటం, జరిగినది నా తప్పు కాదు అని మనస్సాక్షికి చెప్పడం, ఆ సమస్య అరుదైనదని చెప్పి, ఎవరూ ఊహించని రీతిలో దానిని పరిష్కరించానని సర్ది చెప్పడంలాంటిది చేస్తూ ఉంటారు. నీకున్న గొప్ప మానవతా విలువల్ని ఊహించుకొని గర్వంతో, మనస్సాక్షితో నువ్విక నోరు మూసుకొని, నీ పని చూసుకో, నా విషయాల్లో జోక్యం చేసుకోకు అని దాని నోరుమూయించడం చేస్తుంటాము. ఈ పద్ధతి చాలామందికి ఉపయోగకరంగా పనిచేస్తుంది కానీ మనస్సాక్షి మనలో అంతులేని అసంతృప్తిని సృష్టించి వెళ్ళిపోతుంది.

3. ప్రక్కకు మళ్ళించే పద్ధతులు

మనస్సాక్షి మాటలాడినప్పుడల్లా దాని నోరు కట్టేసి, ఆ బాధ మరిచిపోయేలా చేసే ఈ పద్ధతే ప్రక్కకి మళ్ళించే పద్ధతి. నువ్వు నిస్సహయ స్థితిలో రాత్రివేళ పడక మీద పడుకున్నప్పుడు నీ మనస్సాక్షి నిన్ను అకస్మాత్తుగా లేపితే వచ్చే బాధని ఈ పద్ధతి ద్వారా అరికట్టడం కష్టం. కానీ ఆశ్చర్యకరంగా చాలా మంది ఈ పద్ధతినే ఎన్నుకుంటారు. గబగబా టి.వి. స్విచ్ ఆన్ చేసి చూడటం, లేకపోతే ఏదైనా మంచి సంగీతం వినటం లేకపోతే ఏదో రకమైన వినోదాత్మకమైన అనుభూతికి లోనవడం చేస్తుంటారు. ఈ పద్ధతిని పురాతన రోజుల్లో కంటే ఈ రోజుల్లో అమలుపరచడం తేలిక.

కొంతమంది మనస్సాక్షి సణగడం ప్రారంభించిన వెంటనే వారి ఆలోచనలను ప్రక్కకు మళ్ళించి వాళ్ళ బాధ్యతల గురించి గానీ, శోధనల గురించి గానీ, సమస్యల గురించి చింతిస్తూ ఉంటారు. అది వారి పాపాలను గుర్తుచేయనంత వరకూ మాత్రం బాగానే ఉంటుంది. మరి కొంతమంది కలల్లో విహరిస్తూ ఉంటారు. ఏ ఇల్లు కొంటే బావుంటుంది, ఏ డ్రస్సు వేసుకొంటే బావుంటుంది అని కలలు కంటూ వుంటారు. మనస్సాక్షి నోరు మూయించడానికి ఏ పద్ధతిని అనుసరించాలన్నా వెనుకాడరు. ఎవరో చేసిన పాపాలకు విరోధంగా తీర్పు ఇస్తుంటారు. ఎడతెరిపి లేకుండా మాట్లాడుతూ, వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటూ ఉంటారు. ఈ వాగ్వివాదంలో మునిగిపోయి వాళ్ళు చేసిన తప్పుల్ని మరచిపోయి, వారికి వారు నీతిమంతులనుకుంటూ భ్రమపడిపోతూ ఉంటారు. దీనికోసం చాలామంది కాలక్షేపం చేసి కబుర్లు చెప్పే స్నేహితులను కోరుకొంటారు. కొంతమంది మద్యానికి, మత్తుమందులకు బానిసలౌతారు. ఈ పద్ధతితో వచ్చే సమస్య ఏమిటంటే, నువ్వు ఎంత పరిగెత్తినా తప్పించుకోలేవు, పరుగెత్తలేక అలసిపోతావు. నీవు వృద్ధుడవుతున్న కొద్దీ నీ మేథోశక్తి తరగిపోతున్నకొద్దీ, మనస్సాక్షి యొక్క వేగం పెరుగుతూ ఉంటుంది. అది ఒక రోజు నిద్ర మేల్కొంటుంది ! నువ్వు తప్పించుకోలేవు, పరుగెత్తలేక అలసిపోతావు.

4. మనస్సాక్షిని మనకు అనుగుణంగా తయారుచేయడం

మనస్సాక్షిని మనకు ఇష్టమొచ్చినట్లు తయారుచేసుకోవచ్చు. మనశ్శాంతి పొందడానికే చాలామంది ఈ పద్ధతిని అనుసరిస్తుంటారు. ఈ పద్ధతిని సమర్థించుకోవడానికి నీతి అంటూ ఏమీ లేదు అని అంటారు. ఇదంతా నటులు, వేషధారులు జీవితంలో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని నాశనం చేయడానికి సృష్టించారు అని ఇతరుల్ని తీవ్రంగా విమర్శిస్తారు. అయితే హేతువాదులు దేవుడు లేడు అని చెప్పాలి కాబట్టి వారి అవసరం ప్రకారం దేవుణ్ణి వారి ఆలోచనల నుండి ప్రక్కకు నెట్టేస్తారు. హేతువాదాలకు సంబంధించిన సాహిత్యం చదవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి, దానిని చదవటం, నాస్తికులతో సాంగత్యాన్ని ఏర్పరుచుకోవటం లాంటివి చేస్తుంటారు. ఒక రోజు నువ్వు దేవుని సింహాసనం ఎదుట నిలబడే తీర్పు దినం ఒకటుంటుందని ఎవరూ గుర్తించరు. అది వాళ్ళ కళ్ళకు నిజంలా కనపడదు. దేవుడు లేడు, దెయ్యం లేదు, మరణంతో జీవితం ఆగిపోతుందని భ్రమపడి వాళ్ళను వాళ్ళు ఒప్పించుకునేలా చేసుకుంటారు. నువ్వు క్రొత్త సూత్రాలను తయారు చేసుకోవాలంటే మనస్సులో పాతుకుపోయిన నీతి సూత్రాలను మార్చివేయాల్సి వస్తుంది.

చాలా మంది సిగ్గువిడచి, అవమానానికి లొంగకుండా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. వారు సమాజంలో అధికారులుగా చెలామణి అవుతూ, వారు చేసిందే నీతి అని బోధిస్తూ ఉంటారు. సమాజాన్ని వారి తుచ్చమైన విలువలతో, సూత్రాలతో మార్చటానికి సమస్త ప్రయత్నాలు చేస్తారు. వచ్చే తరంవారు కూడా వారి బాటలో నడవాలని కలలు కంటూ ఉంటారు. లంచగొండితనం, కామాతురత సహజం అని భావించేటట్లుగా చేస్తారు. వీరు విజయం సాధిస్తారని ఎలా అనుకుంటున్నారు? వాళ్ళ లక్ష్యాన్ని ఛేదిస్తారని అనుకుంటున్నా అది కేవలం ఒక కలగా మిగిలిపోతుంది. భయంకరమైన, అసహ్యమైన పాపపు కార్యాలను ఎన్నిచేసినా బాధపడని స్థితికి చేరుకోవచ్చు. కానీ కథ ఇంతటితో అంతం కాదు.

ఒక్కసారిగా మనస్సాక్షి సరిగా పనిచేయడం ఆగిపోయినప్పటి నుండి వాళ్ళు పిచ్చివాళ్ళలా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు తలచిందొకటి, చేస్తున్నదొకటి. వాళ్ళ కాళ్ళు తిన్నని మార్గంలో నడవకుండా, వారికిష్టమొచ్చినట్లు త్రిప్పివేసుకొని, వాటిని లొంగదీసుకొని ఉండొచ్చు. దీని ద్వారా 'జీవితం' ఇంతకుముందుకన్నా ఎక్కువ చిక్కుముళ్లు వేయబడుతుంది. ప్రియ చదువరీ ! నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నావా? అలా వుంటే నువ్వు ఇప్పుడు ఒక మనస్సాక్షి బాధితుడవు. నీకు నువ్వే అర్థం కాని వ్యక్తివి. నువ్వు ఎన్ని చేసినప్పటికీ, మనసాక్షి దాని యొక్క అసలు సిసలైన శక్తి ఎన్నటికీ కోల్పోదు.

నిజం చెప్పాలంటే నీ మనస్సాక్షిని ఇష్టమొచ్చినట్లు కొట్టబడి గాయాలతో ఉన్న పిల్లవానితో పోల్చవచ్చు - పిల్లవాడిని హింసించే కఠిన హృదయుడైన ఒక తండ్రిని ఊహించుకోండి. వాడు ఆ పిల్లవాడు మాట్లాడినప్పుడల్లా వాణ్ణి గట్టిగా చరిచి నిశ్శబ్దపరుస్తూ ఉంటాడు. ఆ పిల్లవాడు గట్టిగా అరచేకొద్దీ, అతను మూర్ఖత్వంతో తన బలాన్నంతా కూడదీసుకుని గొడ్డుని బాదినట్లు బాది, వాడిని నిశ్శబ్దపరచి లొంగదీసుకొంటాడు. అప్పుడు పిల్లవాడు నోరు మెదపటానికి కూడా సాహసం చెయ్యడు. తన కన్నీటి బాధను బహుకష్టంతో దిగమింగుకొంటాడు. కాని ఇది తన చిన్న గుండెలో ఒక మానని గాయాన్ని రేపుతుంది. అది ఎప్పుడో ఒకప్పుడు బహిర్గతమౌతుంది. ఇప్పుడు మౌనంగానే ఉన్నాడు, కాని ఎప్పుడూ అలా ఉండడు. ఇది వాడి జీవితంలో మాయని మచ్చలా మిగిలిపోతుంది. ఇక దానిని ఎన్నటికీ మరువలేడు.

మనస్సాక్షి  ప్రతీకారం !

ఒక్క ఉదుటతో మనస్సాక్షిని ఎవరయితే గాయపరచి లొంగదీసుకొంటారో వారు భయంకరమైన మానసిక క్షోభని ఎదుర్కొంటారు. వారు చేసిన తప్పుకు వెల చెల్లించాల్సి వస్తుంది. మనస్సాక్షికి జీవం ఉంది. భయంకరమైన పరిణామాలను గుర్తించకుండా మనస్సాక్షిని ఇష్టమొచ్చినట్లు నలిపేస్తే అది ఊరుకోదు. మనస్సాక్షి నీ గురించి ఏమనుకుంటుందో తలచుకుంటేనే నీకు భయమేస్తుంది కదూ ! మూగబోయిన మనస్సాక్షి సూటిగా నీ కళ్ళలోకి చూస్తూ మాటల్లో వర్ణించలేని కోపాన్ని ఒక రోజు నీ మీద వెళ్ళగ్రక్కుతుంది.

చాలా సంవత్సరాల క్రితం రచయితకి తెలిసిన ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉండేవాడు. ఆయన విద్యలో చేసిన విశేష కృషికి ఫలితంగా ఆయనకు పేరు గడించిన ప్రతీ గ్రంథాలయంలో పుస్తకాలు తీసుకోవడానికి అనుమతి ఉండేది. ఆయన ఒక గ్రంథాలయం నుండి ఎక్కడా దొరకని ఒక అసాధారణమైన పుస్తకాన్ని దొంగిలించాడు. తరువాత ఆ పుస్తకం మీదనున్న ఆ పెద్ద గ్రంథాలయ ముద్రను చెరిపివేయలేకపోయాడు. దానిని మూసివేయడానికి తన స్వంత పేరున్న లేబుల్ ను ఆ ముద్ర మీద అతికించాడు.

కొన్ని సంవత్సరాల తరువాత ఆ పుస్తకాన్ని తన స్నేహితునికి చదువుకోవడానికి ఇచ్చాడు. అలాంటి అసాధారణ పుస్తకాన్ని దక్కించుకున్నందుకు చాలా గర్వపడ్డాడు. కానీ ఆ లేబుల్ కి ఏమయ్యిందో గుర్తించలేకపోయాడు. ఇతగాడి పేరున్న ఆ లేబుల్, గ్రంథాలయ ముద్రనంతా పీల్చుకోవడంతో ఆ ముద్ర మొత్తం స్పష్టంగా కనబడింది. ఆ పుస్తకం ఏ గ్రంథాలయంకి చెందిందో కూడా స్పష్టంగా కనబడింది. ఆ స్నేహితుడు ఆ పుస్తకాన్ని ఇచ్చివేసిన తరువాత కానీ తనకీ విషయం తెలియలేదు. తరువాత ఇతని బాధ అంతా ఇంతాకాదు. తన స్నేహితుడు తనని దొంగగా భావిస్తాడని ఊహించి లబోదిబోమన్నాడు. సిగ్గుతో అతని మనస్సు కలిచివేసింది కానీ ఏమి చెయ్యగలడు? ఏమి చెప్పగలడు? అతడు అంతా వివరించి ఏలా చెప్పగలడు?

తరువాత ఎమయ్యిందో రచయిత చెప్పదలుచుకోలేదు. కానీ ఆయన యొక్క మనస్సాక్షి ఆ పుస్తకంలోని గ్రంథాలయ ముద్రలాగ ప్రవర్తించింది. దానిమీద ఏది అతికించినా అవినీతి సూత్రాలైనా, ఏమయినా సరే, చివరకు సత్యం ప్రస్పుటమవుంది. మనస్సాక్షి ఎన్నడూ కూడా దేవుడిచ్చిన నీతి సూత్రాలను దులుపుకొని తిరగలేదు. ఎప్పటికీ అర్థం కాని రీతిలో అది నిన్ను సతమతం చేస్తునే ఉంటుంది.

దేవుడిచ్చిన సహజమయిన నీతి సూత్రాలకు వ్యతిరేకంగా మనస్సాక్షి గుండె మీద ఎప్పుడైతే క్రొత్త సూత్రాలను విలువలను అతికిస్తావో, అవి దాని మీద ఉన్నంత సేపు నీవు ఒక బానిసవి, ఒక బాధితుడవు. ఆత్మలో శాంతి లేకపోవటం వలన వివాహ సమస్యలు రావచ్చు, లేకపోతే నీవు పిచ్చివాడిలా అస్తమానం పనిచేసుకుంటూ ఉండవచ్చు. లేకపోతే ఒక త్రాగుబోతువి కావచ్చు. అనేకమయిన సమస్యల వలయంలో చిక్కుకొనిపోయి తప్పించుకోవడానికి రకరకాల మార్గాలు నిత్యం వెదకుతూ ఉంటావు. ఆత్మక్షోభ భరించలేక విపరీతమైన ఆగ్రహంతో శారీరక హింసకు, ఆత్మ సంక్షోభానికి, మానసిక సంబంధమైన రోగాలకు బానిసవైపోతావు. ఓడను తిప్పే చుక్కాని పాడైపోయినప్పుడు, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? అది ఎప్పుడు తలక్రిందులౌతుందో లేకపోతే ఎప్పుడు రాళ్ళకు గుద్దుకొంటుందో ఎవరికీ తెలీదు.

ఎవరైతే అబద్దాలు చెబుతారో వారి యొక్క మనస్సాక్షి ఎఱ్ఱగా కాలిన ఇనుము గడ్డతో కాల్చివేయబడిందని బైబిల్ గ్రంథం అంటుంది. వారి మనస్సాక్షులు బిగించుకొని ముడుచుకొనిపోయినందువల్ల వారు ఆరితేరిన అబద్ధికులుగా మారిపోతారు. మనస్సాక్షి తలుపులు మూయించడానికి వాళ్ళేదో ఆపరేషన్ చేసుకున్నట్లుగా మనకనిపిస్తుంది. అయితే మనస్సాక్షి నోరు మూగబోయినా, గుండెను గుచ్చడం మాత్రం మానదు. తీర్పు దినమందు మన పాపాలన్నీ గుర్తు పెట్టుకొని వాటి కొరకు తీర్పు అమలు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఒక్కసారి ఊహించండి ఎవరయితే మనస్సాక్షి గొంతు నలిపేసి భయంకరమైన హేతువాదులుగా మారిపోతారో వారి దగ్గరకెళ్ళి నీతి గురించి గానీ, మతం గురించి గానీ మాట్లాడితే, వారికి ఒళ్ళు మండిపోతుంది. నిరంతరం వాళ్ళ గుండెలో మనస్సాక్షి వల్ల ఒక యుద్ధం చెలరేగుతూనే ఉంటుంది. అందుకనే నాస్తిక సాహిత్యం సంపాదకీయం చేసి మత విషయాలను అపహాస్యం చేస్తూ, అగ్రహంతో వ్యాసాలు రాస్తూ ఉంటారు. అది వారి హృదయభావాలను తెలియజేస్తాయి.

మన ప్రవర్తనపై మనస్సాక్షి యొక్క ప్రభావం

ఎవరయితే మనస్సాక్షిని నలిపేసి, గొంతునులిమి మాటరాకుండా చేస్తారో వారు అనేకమయిన మానసిక ఒత్తిళ్ళు, బాధలే కాకుండా అనేకమైన పర్యవసానాలు కూడా ఎదుర్కోవల్సి వస్తుంది. అలాంటి వ్యక్తికి హద్దూ, అదుపూ ఏమీ ఉండదు. కామేచ్ఛలతో మునిగితేలుతూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. మనుష్యులను అదుపులో పెట్టడానికి చక్కగా పనిచేసే మనస్సాక్షి కావల్సి ఉంటుంది. లేకపోతే రోజురోజుకీ వారి వెర్రితనం, గర్వం పెరిగిపోతూనే ఉంటుంది. ఒక్కసారి మనస్సాక్షికి అవిటితనం వచ్చిందంటే దాని బాధ అంతా ఇంతా కాదు. ఇక పూర్తిగా అవిటివాళ్ళమైపోతాము. ఎలాంటి రహస్య అసభ్యత్వానికైనా లేకపోతే బహిరంగ పాపానికైనా తెగిస్తాము. అందుకే మనస్సాక్షి మనకు ఎంతో అమూల్యమైన, విలువైన దేవుడిచ్చిన బహుమతి.

అయితే, ఎప్పుడైతే మనస్సాక్షిని మత్తెకించి స్పృహ కోల్పోయేలా చేస్తావో నీ జీవితంలో సంతోషమంటూ ఉండదు. ఎందుకంటే మనస్సాక్షి కేవలం హెచ్చరించే ఒక పరికరం మాత్రమే కాదు, ఎంతో ఓదార్పునిచ్చే పరికరం కూడా. మనం తప్పుచేసినప్పుడు మన తప్పుని ఖండిస్తుంది. కానీ మన ప్రవర్తన సరిగా ఉన్నట్లయితే మన హృదయానికి ఎంతో సంతోషాన్నిస్తుంది.

మనస్సాక్షిని ఎప్పుడైతే దాని పెదవి విప్పకుండా చేస్తామో, వెంటనే దిక్కులేనివాళ్ళగా మారిపోతాము. బయటకు ఎంతో ఉల్లాసంగా కనబడినా, లోపల మాత్రం మనల్ని బాధ కబళించి వేస్తుంది. మనం చేసే పని ఎంతవరకు సరైనదో కాదో అనే నిర్ణయం తీసుకునే విచక్షణను కోల్పోతాము. మనకు ఏది తప్పో, ఏది ఒప్పో తెలియదు. మంచి అనే పదానికి అర్థం తెలియకుండా పోతుంది. జీవితపు అంచుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి శక్తంటూ ఉండదు. జీవితంలో అమూల్యమైన ప్రశ్నలకు సమాధానం దొరకక, తుఫానులో చిక్కుకొని జీవితపు ఒడ్డుకు చేరలేని కొంతమంది అనామకుల కోవలోకి వెళ్ళిపోతాము. కానీ మనం మనస్సాక్షిని గౌరవించినప్పుడు, మంచిచెడులను నిర్ణయించుకోవడానికి ఎంతగానో తోడ్పడుతుంది. మన ఆలోచనలకు పూర్తి సహకారం అందిస్తుంది.

ఆ.... బరువైన మనస్సాక్షికి విడుదల ఏలా?

మోయలేని బరువుని మోస్తున్న మనస్సాక్షిని తేలికపరచటం ఎలాగన్నదే ఈ పుస్తకం యొక్క ముఖ్యోద్దేశం. చాలామంది మనస్సాక్షిని ఎందుకు అణచి వేస్తారంటే, గతంలో చేసిన తప్పుల ఎదుట ముఖం ఎత్తుకోలేక, అవమానంతో కృంగిపోతూ ఉంటారు. మనస్సాక్షిని తేలికపరచడానికి అనేక మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. గాయపడిన మనస్సాక్షి గాయాలను మాన్పడానికి, కొన్ని మతాలు, అనేకమైన మ్రొక్కుబళ్ళను, పూజా కార్యక్రమాలను నిర్వహిస్తాయి. కానీ గుండెలోని ఆ అపరాధభావాన్ని ఎలా తీసివేసుకోగలరు? నిపుణులు కూడా చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిందే! వారిచ్చే చికిత్స కూడా ఫలితం లేకుండా పోతుంది.

బాధతో కృంగిపోతున్న మనస్సాక్షికి కేవలం ఒకే ఒక్క పరిష్కారముంది. అది ఏమిటంటే మనస్సాక్షినే సృష్టించిన మహాప్రభువు యొక్క పాదముల చెంత చేరి క్షమాపణ కోరడమే. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడడం ద్వారానే మనస్సాక్షికి నిజమైన విముక్తి.

మీరు ఒకవేళ పెద్ద మొత్తంలో ఒకరికి అప్పు ఉన్నారనుకోండి, ఆ అప్పు తీర్చేంతవరకూ మీకు నిద్రపట్టదు, ఆకలిదప్పులంటూ ఏమీ ఉండవు. ఆ పని జరిగేంత వరకూ మనశ్శాంతి ఉండదు. కానీ, ఈ అప్పు తీర్చడానికి తగినంత డబ్బులు మీ దగ్గర లేవు - ఇది తీర్చలేనీ ఒక అసాధారణమైన అప్పు. అప్పుడు మీ స్నేహితుడొకడు మీ అప్పుని తీర్చివేసాడన్న వార్త ఒక్కసారిగా వినేసరికి మీకు ఏమనిపిస్తుంది? మీ ఆనందానికి అవధులంటూ ఏమయినా ఉంటాయా? ఏదైతే మిమ్మల్ని బానిసగా పట్టుకొని మీ ఆనందాన్నంతా హరించివేసిందో, దానికి సంకెళ్ళు తెగిపోతాయి. షరతులు, బాధ్యతలు అన్నీ పూర్తిగా తీరిపోయి, ఆత్మకు శాంతి లభిస్తుంది.

అలాగే ఎప్పుడైతే మనస్సాక్షి యొక్క షరతులకు కట్టుబడి జీవిస్తామో మనకు పరిపూర్ణమైన శాంతి, సమాధానము లభిస్తుంది. మనము దేవునికి అప్పున్నాము, ఆ అప్పు తీరిపోతేనే మనకు సమాధానం దొరుకుంది. ఆ అప్పు ఏమి చెపుతుంది అంటే, మనం దేవునికి వ్యతిరేకంగా పాపం చేసామని చెబుతుంది. మన హృదయంలో ఉన్న గర్వం, స్వార్థం, అవినీతి, కుళ్ళు, అవిశ్వాసం, నీచమైన స్వభావం, శత్రుత్వం, పగ ఇలాగ అనేకమైనవాటిని వెలికి తీసి చూపిస్తుంది. అందుకే ఆత్మశాంతి కోసం అంతగా వెంపర్లాడుతూ ఉంటాము. నేను మనస్సాక్షి కోరికలను ఏలా తీర్చగలను అనే ప్రశ్న మన మెదడులో బాణంలాగ గ్రుచ్చుకొంటుంది. గతకాలంలో నేను చేసిన తప్పుల నుండి వచ్చే ఆ అపరాధభావనని, ఆ ఘోరమైన బాధ నుండి ఎలా తప్పించుకోగలను? అనే మరొక ప్రశ్న గుండెను గుచ్చి వేస్తూ ఉంటుంది. ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే, అది ఏమిటంటే, దేవుని అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకాన్ని విడచి పాపము వలన వచ్చిన శిక్షని తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు అనే గొప్ప విషయాన్ని తెలుసుకోవడం ద్వారానే ఈ ఊపిరాడని శ్వాసకు ఉపశమనం. పాపక్షమాపణ ఎవరయితే కోరుకొంటారో, ఆయన వారికొరకు సిలువలో మరణించాడు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి.

ఆయన్ని వెదకి, ఆయన మీద విశ్వాసముంచినట్లయితే, ఆయన నా కోసం మరణించాడనే ఊహకందని విషయం మన హృదయాన్ని పిండివేస్తుంది. ఆయన నా కోసం ఊహకందని బాధని సిలువమ్రాను మీద భరించాడని, నా పాపాన్ని భరించి దానిని ఆయన మీద వేసుకొని, నన్ను క్షమించడానికి ఈ మహత్కార్యాన్ని చేసాడని గ్రహిస్తాము. ఇదంతా తలచుకుంటే గుండెని కలచివేస్తుంది కదా! ఆయనే మన అప్పుని తీర్చగలడు. మన పాపపు అప్పుని తీర్చగలడు. మదనపడే మనస్సాక్షిని ఏది సముదాయిస్తుందండీ? కేవలం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క క్షమాపణే మనస్సాక్షిని సముదాయిస్తుంది. ఎందుకంటే ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు, ఆయన మన పాపపు బరువును మోశాడు - “జీవించుచున్న దేవునికి సేవ చేయుటకు ... ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం నీ మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది” అని హెబ్రీయులకు వ్రాసిన పత్రిక చెబుతుంది.

“శుద్దీకరణ" అనే ఈ పదం గ్రీకుభాష నుండి నూతన నిబంధనలోనికి అనువదించబడినది. గ్రీకు భాషలో ఈ పదానికి ఎంతో నిగూఢమైన అర్థముంది. దీనిని గ్రీకుభాషలో “కెతార్సిస్" అంటారు. దీని అర్థం ఏమిటంటే, మనసు గుచ్చుకొన్నప్పుడు, భయంతో హృదయం కలవరం చెందినప్పుడు ఆ బాధని మన ఆవేదనలన్నిటి ద్వారా వెళ్ళగక్కుతాము. ఈ ఆవేదన వారి యొక్క హృదయాలను శుద్ధీకరణ చేస్తుందన్న మాట.

ఇలాంటి చికిత్సను ఎవరూ ఈ రోజుల్లో అమలుపరచకపోయినా, కొంత మంది మనస్తత్వ శాస్త్రజ్ఞులు మనసులో ఉన్న బాధను, రహస్యాలను ఇతరులతో పంచుకోవడం ద్వారా కొంత ఉపశమనం కలుగుతుంది అని చెబుతున్నారు. మనం భావోద్వేగానికి గురైన తరువాత మనసులోదంతా బయటకు తీసివేసినప్పుడు మనకు ఉపశమనం కలుగుతుంది మరియు ఎవరితోనైతే మనం ఈ విషయాల్ని పంచుకున్నామో వారిమీద ఒక ప్రత్యేకమైన నమ్మకం, విశ్వాసం ఏర్పడుతుంది.

నిజమే మనసులో ఉన్న విషయాలన్నీ ఇతరులతో పంచుకుంటే ఉపశమనం వస్తుంది, కానీ వారు లోపల పూడుకుపోయిన తప్పులను వెలికి తీయలేరు. నిజమైన ఉపశమనం కలగనే కలగదు. పైకి నీళ్ళు పోసుకున్నంత మాత్రాన హృదయాన్ని కడగలేము కదా!

మానవ హృదయ ప్రక్షాళనకు కేవలం ఒకే ఒక్క మార్గం. అదే బైబిల్ లో బోధించిన సత్య మార్గం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం నా పాపాన్ని కడిగి వేసిందన్న సత్యం ద్వారా మనలో వచ్చే ఉద్వేగభరితమైన ఆవేదన ద్వారా చెప్పలేని ఆనందాన్ని వెళ్ళగక్కే ఆనందభాష్పాల ద్వారా మాత్రమే మన హృదయం శుద్ధీకరించబడుతుంది. ఆంగ్ల భాషలో “వెస్లీ" భక్తుడు రాసిన కీర్తన ఇలా సాగుతుంది -

ఆయన పాపపు సంకెళ్ళు విరుస్తాడు 

ఒక ఖైదీని జైలు నుండి విడుదల చేస్తాడు

ఆయన రక్తం పనికిమాలినవాడిని కడుగుతుంది

ఆయన రక్తం నన్ను కడిగింది

దేవుడు మనలను క్షమించాడు అని తెలుసుకున్నప్పుడు మనసాక్షికి ఎంతో ఆదరణ. నువ్వు దేవుని దగ్గర నుండి దూరంగా పారిపోతూ, ఈ విషయాలన్నీ ఎప్పుడూ కూడా ఆలోచించనట్లయితే, ఇప్పుడు నువ్వు చేయవలసినదంతా ఏమిటంటే నీ పాపాన్ని ఆయన వద్దకు తెచ్చి ఆయన్ను క్షమాభిక్ష వేడుకోవాలి. అప్పుడు పాపమనే పర్వతాన్ని ఆయన కృప అనే సముద్రంలోనికి విసిరేస్తాడు. మన పాపమెన్నడూ తిరిగి గుర్తు తెచ్చుకోబడదు. ఇక అది మనలను ఖండించదు. ఆయన సిలువ మ్రాను మీద అనేకమైన శ్రమలు పొంది, మన పాపభారాన్ని తొలగించడానికి చేసిన ఆ గొప్ప కార్యాన్ని మాత్రమే మనము నమ్మాలి. మన పూర్తి జీవితాలు ఆయనకర్పించాలి. అప్పుడు మన మనస్సాక్షి శుద్దీకరించబడి, హృదయంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. మనకు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ పరమతండ్రితో సమాధానం, సాన్నిహిత్యం ఏర్పడుతుంది.

“దేవుని క్షమాపణ” ఒక అమూల్యమైన బహుమతి. అసలు దేవుడు మనలనెందుకు క్షమించాలి? మనల్ని ఆయన క్షమించాల్సిన అవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి పెట్టి ఈ లోకానికి వచ్చి ఊహింపశక్యముకాని మరణాన్ని ఆయన మన కోసం ఎందుకు పొందాలి? ప్రేమ, కృప , వాత్సల్యబాహుళ్యము లాంటి మధురమైన పదాలు ఆయన ప్రేమ సముద్రాన్ని వర్ణించడానికి సరిపోవు.

మనస్సాక్షి యొక్క చివరి మాట!

దేవుడు ఇచ్చిన ఇలాంటి అమితమైన కృపని తెలుసుకోకుండా ఒక అపరిచితునిగా ఎవరైనా వారి జీవితాలను వెళ్ళబుచ్చితే ఎంత విచారకరం! ఎంత ఆవేదన ! ఈ చిన్న జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక ముగిస్తే అంతకన్నా వెర్రితనం మరొకటి లేదు. ఒక రోజు ఈ ప్రపంచ కాంతి నీ మీద అస్తమించి, మరొక ప్రపంచకాంతి నీ మీద ఉదయిస్తుంది. అప్పుడేం జరుగుతుందో ఊహించారా? అప్పుడు నీ మనసు యొక్క స్థితి ఎలా ఉంటుంది? అది నీకు ఒక ఆనందదాయకమైన వేళా? నీ ఆత్మ యొక్క పరవశానికి హద్దులంటూ ఎమయినా ఉంటాయా? లేకపోతే ఆ దినం నువ్వు కలలో కూడా ఊహించనిదా? మనస్సాక్షి.... నువ్వు చేసిన సమస్త కార్యాలను కళ్ళారా చూసిన వ్యక్తి, నీ బాధల్ని పంచుకున్న స్నేహితుడు, ఆ రోజు తన గుండెలో తగిలిన గాయాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటాడు. గుర్తుకు తెచ్చుకొని ఊహింపశక్యము కాని బాధతో, నిన్ను నిలదీస్తాడు... “నువ్వు ఏంచేసావు? మనల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నీవు దారి తప్పినప్పుడు, ఎంతగానో మొత్తుకొన్నాను! నీవెన్నడూ నా మాట వినలేదు! నా ప్రతీ మాటను నువ్వు ప్రక్కన పెట్టేశావు! ఇక ఆలస్యమైపోయింది ఓ మిత్రమా! నేను నీకు ఎంతగా మొర్రపెట్టుకొన్నానో!” అని గద్గద స్వరంతో ఓ కంఠం నిత్యం నిట్టూర్పులు విడుస్తూనే ఉంటుంది.

ప్రియ చదువరీ! నీకు కూడా ఒక మనస్సాక్షి ఉంది... ఒక్కసారిగా దీని గురించి ఆలోచించు. అది ఏ దిశవైపు చూపిస్తుందో ఒక్కసారి చూడు... అది దేవుని వైపు చూపిస్తుంది. ఆయన నీతి విలువల వైపు చూపిస్తుంది. నువ్వు ఆయనకు సమాధానం ఒకటి ఇవ్వాల్సి వస్తుందని గుర్తు చేస్తుంది. నీకున్న ఆ గొప్ప అవసరాన్ని గురించి ఒక్కసారి ఆలోచించు... అది ఏమిటంటే నువ్వు దేవుని క్షమాపణ కోరుకోవాలి. నూతనమైన, ఆధ్యాత్మికమైన జీవితం దానితో పాటు వస్తుంది. దేవునితో సంభాషించటానికి ఒంటరిగా ఆయన సన్నిధిలోనికి వెళ్ళు. దేవుడు ఎల్లప్పుడూ ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళను త్రోసివేయకుండా తన అక్కున చేర్చుకొంటాడు. ఇంతకన్నా జీవితంలో ఏం కావాలి?!

మెట్రోపాలిటన్ టెబర్నికల్ సంఘ సంక్షిప్త చరిత్ర

Final Conscience Book Setting image

మెట్రోపాలిటన్ టెబర్నికల్ అన్న సంఘం లండన్ లోని ఎలిఫంట్ కాజెల్ లో ఉన్న ఒక పెద్ద స్వతంత్ర రిఫార్మడ్ బాప్టిస్టు చర్చి. ఇది 1861వ కల్లా అతిపెద్ద ఇండిపెండెంట్ (నాన్ కన్ ఫార్మిస్ట్) చర్చిగా రూపుదిద్దుకుంది. 1650వ సంవత్సరం నుండి టెబర్నికల్ సహవాసం ప్రభువును ఆరాధిస్తుంది. ఈ సహవాసానికి మొదటి సంఘకాపరి విలియమ్ రైడర్. ఇతర గుర్తించదగిన బోధకులు, సంఘకాపరులు ఎవరంటే బెంజమిన్ కీచ్, డాక్టర్.జాన్ గిల్, డాక్టర్.జాన్ రిప్పన్, చార్లెస్ స్పర్జన్. మెట్రోపాలిటన్ టెబర్నికల్ సంఘం ప్రస్తుత సంఘకాపరియైన డాక్టర్. పీటర్ మాస్టర్స్ గారి నడిపింపులో వాక్యానుసారమైన పునాదులు, సిద్ధాంతాలను కలిగి నేటికీ ప్రభువును ఆరాధిస్తుంది.

1650వ సం||లో ఇంగ్లీష్ పార్లమెంట్, స్వతంత్ర క్రైస్తవ సంస్థలన్నీ సమావేశమవటాన్ని నిషేధించటం వలన టెబర్నికల్ సహవాసం క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుంది.1688వ సం|| వరకూ అనేక శ్రమలను, హింసలను ధైర్యంగా ఎదుర్కొన్న తరువాత బాప్టిస్టులు ఇంకొకమారు స్వతంత్య్రంగా ఆరాధించటానికి అనుమతి లభించింది. ఈ సమయంలో వారు మొదటి ప్రార్ధనాలయాన్ని టవర్ బ్రిడ్జ్ ప్రాంతంలో నిర్మించుకున్నారు.

1720వ సం||లో డాక్టర్ జాన్ గిల్ గారు పాస్టరుగా ఎన్నుకోబడి 51 సంవత్సరాల పాటు సేవ చేశారు. 1771వ సంవత్సరంలో డాక్టర్.జాన్ రిప్పన్ గారు పాస్టర్ గా నియమించబడి 63 సంవత్సరాల పాటు సేవ చేశారు. ఈ సంవత్సరాలలో సంఘం గొప్పగా వృద్ధి చెంది, దేశంలోనే ఒక అతి పెద్ద సంఘంగా ఆవిర్భవించింది. ఆ తరువాత సంఘ పతనం ఆరంభమై 1850 నాటికి సంఘంలోని సభ్యుల సంఖ్య తగ్గిపోయింది.

1854వ సంవత్సరంలో మెట్రోపాలిటన్ సంఘంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పాస్టర్లలో ఒకరైన చార్లెస్ హెడెన్ స్పర్జన్ గారు తన యవ్వన ప్రాయపు 20వ సంవత్సరంలో సేవను ఆరంభించారు. ఆ కాలంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన బ్రిటిష్ బోధకునిగా ఆయన త్వరగా ఎదిగారు. స్పర్జన్ గారు సంఘకాపరిగా ఉన్నప్పుడు చర్చి న్యూపార్క్ స్ట్రీట్ చాపెల్ లో ఉండేది. కాని ఈ చర్చి త్వరగా పెద్దదై, ఆరాధనలు సర్రే గార్డెన్స్ మ్యూజిక్ హాల్ లో జరిగేవి.

స్పర్జన్ గారి పరిచర్య కాలంలో చర్చి శాశ్వతంగా అతి పెద్ద ప్రాగణంలోనికి మార్చబడాలని నిర్ణయించడమైనది. సౌత్ లండన్లో థేమ్స్ నది దగ్గర ఉన్న ఎలిఫెంట్ అండ్ కజెల్ (Elephant & Castle) అన్న స్థలాన్ని ఎంపిక చేసుకోవటం జరిగింది. అంతమాత్రమే కాకుండా, సౌత్ వార్క్ హతసాక్షులను కాల్చివేసిన స్థలంలోనే సంఘాన్ని నిర్మించడం జరిగింది. చర్చి బిల్డింగ్ విలియమ్ విల్మర్ పోకాక్ చే డిజైన్ చేయబడింది.

1861లో చర్చి బిల్డింగ్ పని ముగించబడి, మార్చి 18న ప్రతిష్టించబడింది. బోధకులకు, పరిచారకులకు తర్ఫీదు నిమిత్తమై స్పర్జన్ ఒక కాలేజ్ ని స్థాపించారు. ఇప్పుడు అది స్పర్జన్ కాలేజ్ గా పిలవబడుతుంది. స్పర్జన్ అనాథలైన బాలబాలికలకు అనాథాశ్రమాలను స్థాపించారు. స్పర్జన్ గారు అనేక క్రైస్తవ పుస్తకాలను రచించారు; అవి నేటికి కూడా ముద్రించబడుతున్నాయి.

డాక్టర్ పీటర్ మాస్టర్స్ - పీటర్ మాస్టర్స్ గారు 1970వ సంవత్సరం నుండి సంఘానికి కాపరిగా వ్యవహరిస్తున్నారు. ఆయన 25 కంటే ఎక్కువ క్రైస్తవ పుస్తకాలను వ్రాసారు. అవి అన్నీ కనీసము 23 ఇతర భాషలలోనికి అనువదించబడ్డాయి. అమ్ హారిక్, చైనీస్, డచ్, ఫ్రెంచ్, జర్మన్, గ్రీక్, హంగేరియన్, ఇండోనేషియన్, కొరియన్, మాల్టిస్, నేపాలి, పర్షియన్, పోలిష్, పోర్చుగీసు, రోమేనియన్, రష్యన్, సెర్బియన్, షోనా, స్లోవాక్, స్పానిష్, తమిళ, తెలుగు, ఉర్దూ. ఆయన యొక్క రేడియో, టెలివిజన్ ప్రసంగాలు ఇంగ్లాండు, అమెరికా దేశాలలో ప్రసారం చేయబడుతున్నాయి.

 

Add comment

Security code
Refresh

Comments  

# Who am I ? మనస్సాక్షి కి తెలుసు.RAMPRASAD Tanikonda 2021-02-05 12:02
Thank you to Peter masters and hitabodha team
Reply
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.