నిజ క్రైస్తవ జీవితం

రచయిత: పల్లె శాంతిరాజు

ఆడియో

విషయసూచిక

మీతోమాట...

ఈ పుస్తకములో -  సృష్టికర్తయైన దేవుని ప్రేమ మానవులయెడల ఎలా ప్రత్యక్షపరచబడింది? అమ్నోను అనే యవ్వనస్తుడు తామారు అనే యువతిని గాఢంగా ప్రేమిస్తూ, ఆమె కొరకై నిత్యం ఆలోచిస్తూ, తనను కలుసుకోలేక ఆయనెలా పరితపించాడు? తాను ప్రేమించిన అమ్మాయి తన గదిలోకి వచ్చినప్పుడు ఆయనేమి చేసాడు? తన ప్రేమను ఎలా వ్యక్తపరిచాడు? తామారు అమ్నోను ప్రేమను అంగీకరించిందా? తిరస్కరించిందా? ఇంతకు ఏమి జరిగి ఉంటుంది?? వివాహమైనవారు తన జీవిత భాగస్వామితో కాకుండా ఇతరులతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తే కలిగే పరిణామాలేమిటి? ప్రేమ ముసుగులో మోసపోయినవారు ఎలా విడుదల పొందగలరు? తండ్రియైన దావీదు, తన కుమారున్ని ఎందుకని మందలించలేకపోయాడు? ఇత్యాది విషయాలను మీరు తెలుసుకోవటానికి తప్పక ఈ పుస్తకాన్ని సంపూర్తిగా చదివి, దైవ దీవెనలు పొందుకోగలరు.

గమనిక: పాఠకుల క్షేమార్థమై మొదటి ముద్రణలో ఉన్న కొన్ని విషయాలను ఈ రెండవ ముద్రణలో మార్పులు, చేర్పులు చేయాల్సి వచ్చింది.

పరలోకమందున్న నా తండ్రి, నీ కృపలో ఈ చిన్ని పుస్తకాన్ని రెండవసారి వ్రాయుటకు, ముద్రించుటకు కృప చూపినందులకై మీకు స్తోత్రములు. దేవా, చదివే పాఠకులను నీ కృపలో దర్శించుము. ఇందులోని విషయాలను సరిగ్గా అర్థం చేసుకొని, సాతాను చెర నుండి విముక్తులై నీ చిత్తానుసారముగా జీవిం చుటకై వారిలో మీ ఆత్మ కార్యం చెయ్యండి. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్.

 

మొదటి భాగం

 

1. ప్రేమలోని రకాలు

 

 ప్రేమ అనే పదానికి గ్రీకు భాషలో ఫిలియో,స్టోర్జి, ఇరోస్, అగాపే అనే నాలుగు పదాలున్నాయి.

ఫిలియో: స్నేహితుల మధ్యలో ఉండే ప్రేమానురాగాలకు ఈ ఫిలియో అనే పదాన్ని వాడారు. ఓ క్రైస్తవ తెలుగు రచయిత 'ప్రేమ యేసుని ప్రేమ' అనే పాటలో, వివిధ ప్రేమలను వర్ణిస్తూ - 'బంధు మిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపం నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోతుందని' చెప్పాడు. నిజానికి ప్రమిదెలో నూనె ఎంత కాలముంటుంది? కొన్ని గంటలే! కాబట్టి దీపం కొంత సమయమే వెలుగునిచ్చి ఎలాగైతే ఆరిపోతుందో అలానే ఈ ఫిలియో (స్నేహితుల) ప్రేమ శాశ్వత కాలముండదు.

స్టోర్టి: కుటుంబ సభ్యుల మధ్యలోవుండే ప్రేమకు ఈ స్టోర్జి అనే పదమును ఉపయోగించారు. ఇలాంటి ప్రేమను రచయిత - 'తల్లి దండ్రుల ప్రేమ నీడవలె గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవునని' తెలిపాడు. నీడ మరియు కల అనేవి నిత్యముండేవి కావు. కావున ఈ స్టోర్జి ప్రేమ కూడా నిరంతరముండదు.

ఇరోస్: వ్యక్తులు తమ శరీర అవసరాలను తీర్చుకోవడానికై ఇతరులపట్ల కలిగి ఉండే ప్రేమకు ఈ ఇరోస్ అనే పదం వాడారు. ఈ ప్రేమ కలిగి ఉన్న వ్యక్తులు తమ శారీరక (లైంగిక) వాంఛల కోసమై ప్రేమించడం తప్ప మరేమి ఉండదు.

అగాపే: ఈ పదం దైవ సంబంధమైన ప్రేమకు వాడబడిందని పండితుల అభిప్రాయం. అగాపే ప్రేమ తల్లిదండ్రల, కన్న బిడ్డల, భార్య-భర్తల, స్నేహితుల, ప్రేయసి-ప్రియుని మొదలగు ప్రేమల కన్న పవిత్రమైంది. ఈ అగాపే ప్రేమ హెచ్చు తగ్గులు, కుల, ప్రాంత, వర్గ, ధనిక, పేద, రంగు, సంస్కృతి మొదలగు బేధాలు లేనిది. ఇతరులకు హానిని కలిగించక, అవసరమైతే ఎదుటి వారి నిమిత్తమై ప్రాణమిచ్చేది. ఈ దైవ ప్రేమ నిస్వార్థమైంది, నిత్యమైంది, పవిత్రమైంది, అత్యంత అమూల్యమైంది. ఇలాంటి అమూల్యమైన దేవుని అగాపే ప్రేమ మనుష్యులు ఏ స్థితిలో ఉండగా ప్రత్యక్షమైంది?

మనుష్యులందరి స్థితి: ఒక ఉదాహరణ ద్వారా చూసే ప్రయత్నం చేద్దాం రండి, ఒక రోజు రైతు తన భూమిని సాగు చెయ్యడానికి వెళ్ళిన సందర్భంలో అక్కడతనికి కొంతమంది వ్యక్తులు ఓ చిన్న పామును కర్రలతో కొట్టడం చూసి, ఆ రైతు వారి వద్దకు వెళ్ళి, మీరెందుకు ఈ చిన్న పామును చంపుతున్నారు? ఇది మీకు ఏమి హాని చేసింది? అని వారిని ప్రశ్నించి, గాయపడిన ఆ చిన్న పామును తన ఇంటికి తెచ్చుకొని ఆ పాముకు ప్రతి రోజు పాలు పోసి పెంచాడు. కొన్ని నెలల తరువాత ఆ పాము పెద్దదిగా అవుతుంది. అయితే ఓ రోజు రైతు, పాముకు పాలు పొయ్యడం మరచిపోయి, తన చేను పనులకు వెళ్ళిన సమయములో పాముకు చాలా ఆకలి అవుతుంది. సాయంత్ర కాలం రైతు తన పనిని ముగ్గించుకొని ఇంటికి వచ్చి, పాముకు పాలు పొయ్యడం మరచిన సంగతిని జ్ఞాపకం చేసుకొని వెంటనే పాముకు పాలు పోస్తాడు. అయితే పాము, పాలుత్రాగడానికి బదులుగా కోపముతో ఆ రైతును కాటు వేస్తుంది. ఆ తదుపరి సమయములోనే రైతు నోటిలో నుండి నురుగులు కారుస్తూ తన తుది శ్వాసను విడిచి మరణిస్తాడు. ఎందుకనగా, పాము కాటు వేయ్యడం వల్ల దానిలోని విషం రైతు శరీరంలోకి ప్రవేశించి, ఆయన మరణిస్తాడు.

ప్రియ పాఠకులారా, ఈ క్రింది ప్రశ్నలకు జవాబులను ఆలోచించండి.

- రైతు, పాముకు ప్రతి రోజు ఏం పోసి పెంచాడు ?

- చిన్నతనం నుండి పాలు త్రాగిన పాములోకి విషం ఎలా వచ్చింది?

- ఎప్పటి నుండి విషం ఆ పాములో ఉంది?

 రైతు ప్రతి రోజు పాముకు పాలుపోసి పెంచినప్పటికీ, అది పుట్టడమే (జన్మత:) విషం చిమ్మే లక్షణంతో పుట్టింది. గనుక పాము పాలు త్రాగినప్పటికి దానిలో విషాన్ని చిమ్మే లక్షణం పోదు కదా! అలాగుననే మంచి భోజనం చేసే మనుష్యుల్లో అపవిత్రమైన ఆలోచనలు రావడం, ఆ ఆలోచనల ప్రకారం చెడు క్రియలు, అబద్ధాలు చెప్పడం, దొంగతనాలు, ఇతరులను మోసం చెయ్యడం మొదలగునవి ఏ కారణంచే కలుగుతుంది? పాము ఏ విధంగా విషం చిమ్మే లక్షణంతో జన్మించిందో, అలాగే మనుష్యులందరు పాప స్వభావముతో జన్మించారు/జన్మిస్తున్నారు. కాబట్టే పాపం చేస్తున్నారు. వాక్యం చెబుతుంది, "ఏ భేదము లేదు; అందరు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు" (రోమా 3:23).

మనుష్యులు జన్మతః పాప స్వభావముతోనే జన్మిస్తూ, పాప క్రియలు చేస్తూ సృష్టికర్తకు విరోధంగా జీవిస్తున్నారు. ఇట్టి వారిలో ఎలాంటి కుల, మత, వర్గ, ప్రాంతీయ, దేశ, భాష మొదలగు భేదాలు లేవు. అందుకే లేఖనం చెబుతుంది - అందరునూ పాపులే అని. ప్రియ చదువరీ, మనుష్యుల పాప స్థితినిబట్టి వారికి వచ్చే ఫలమేమిటి? 'మరణము” రోమా 6:23. అనగా సృష్టికర్తయైన దేవునితో సంబంధం తెగిపోయి ఆత్మీయంగా, భౌతికంగా పతనమై నరకానికి వెళ్ళే స్థితి. అయ్యో! ఈ నరక బాధ తప్పించుకోవడం ఎలా? పాపములు ఎలా పరిహరింపబడుతాయి?

పాపములు పరిహరింపబడాలంటే, నీతి కార్యములు, దాన ధర్మాలు మొదలగునవి చేస్తే, పాపములకు ప్రాయశ్చిత్తం కలుగదు. ఇక్కడ నేను దాన ధర్మాలు చెయ్యకూడదని చెప్పడం లేదు; కాని వాటిని చెయ్యడం వల్లనే జన్మ, కర్మ పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుందని విశ్వసించడం సరియైంది కాదని చెప్పుచున్నాను. ఎట్లనగా, ఒక వ్యక్తి 5లక్షల రూ||లు దొంగతనం చేసి, పేద ప్రజల క్షేమంకై 4లక్షలు ఖర్చు చేసి, 1లక్ష రూ||లు మాత్రం తన వ్యక్తిగత అవసరాలకై వాడుకుంటే ఆయన పేద ప్రజలకు మంచివాడిగా కనబడవచ్చునేమో కాని చట్టం దృష్టిలో ఆయన నేరస్తుడే కదా! కాబట్టి ఆ వ్యక్తిని చట్టం తప్పక శిక్షిస్తుంది. అలాగే పాప స్వభావముతో వున్న మనుష్యుల, పాపములు పరిహరింపబడటానికి ఎన్ని మంచి కార్యాలు (దాన ధర్మాలు) చేసినా ప్రజల నుండి మంచి పేరు, ప్రఖ్యాతలు వస్తాయేమో కాని దేవుని దృష్టిలో పాపులుగానే ఉంటారు. మరియు వ్యక్తిగతంగా తమ పాపములకు క్షమాపణ, ప్రాయశ్చిత్తం కలుగదు. అందుకే ప్రవక్త - 'మా నీతిక్రియలన్నియు మురికి గుడ్డలవలెనాయెను” ( యెషయా64:6.) అని అంటున్నాడు. అయితే ఎలా మన పాపములు క్షమించబడుతాయి? మనమెలా నరక శిక్ష తప్పించుకుంటాము? ధర్మశాస్త్రము చెబుతుంది - "రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు” (హెబ్రీ 9:22). సకల మానవాళి పాపములు పరిహారం కావాలంటే? దాన ధర్మాలు చేస్తే పాపములు పరిహారం కావుగాని; రక్తం చిందించాల్సి వుంటుంది. అందుకోసమై జంతువుల, పక్షుల రక్తాన్ని ఒలికించడం అవసరం లేదు. "ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము" (హెబ్రీ 10:4). సకల మనుష్యుల పాపములు పరిహారం కావాలంటే పరమాత్ముని రక్తమే కావాలి. ఎందుకనగా, దేవుడు మాత్రమే పరిశుద్దుడు. కావున ఆయన రక్తమే ప్రజల పాపములకు ప్రాయశ్చిత్తం కలిగించేదై వుంటుంది.

- అయితే ఎవరు ఈ లోకంలో జన్మతః పరిశుద్ధంగా జన్మించారు?

- అలా జన్మించి, పవిత్రతతో జీవించినవారు చరిత్రలో ఎవరైనా ఉన్నారా?

- సకల మానవాళి పాప ప్రాయశ్చితార్థంకై తన పవిత్ర రక్తాన్ని కార్చిన అవతారమూర్తి ఎవరు?ఆ దేవుడెవరు?

'గ్రీకులో చెప్పబడిన నాలుగు పదాలు ఇంటర్నెట్ ద్వారా పొందుకున్నవి.

2.దైవప్రేమ

నకల మానవాళి పావ పరిహారమై జన్మతః వరిశుద్ధముగా జన్మించింది చరిత్రలో ఒకే ఒక్కడు కనబడుతున్నాడు. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. మనుష్యులు తమ పాపముల చేత సృష్టికర్తతో ఉండే సత్సంబంధాన్ని కోల్పోయి, దుష్టుడైన సాతాను చెరలో ఉంటూ, అతని ప్రేరేపణకు లొంగిపోయి, పాపపు క్రియలు చేస్తూ, వాటి ఫలితంగా నిత్య నరకములోకి వెళ్ళడం జరుగుతుంది. ఇలాగు మానవజాతి నశించిపోవడం ఇష్టం లేని ప్రేమాస్వరూపియైన సృష్టికర్త ప్రజల పాప పరిహారముకై తన కుమారున్ని ఈ లోకంలోకి మానవరూపిగా పంపాడు యోహాను 3:16. "దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి వంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను" (1యోహాను 4:9) అని వాక్యం చెబుతుంది.

దేవుడే మానవునిగా అవతరించి, ప్రాణత్యాగం చెయ్యడం: యేసు ప్రభువు, పురుషుని వీర్య కణాల ద్వారా, స్త్రీ అండాశయ ఫలదీకరణ ద్వారా కాకుండా వరిశుద్ధునిగా (జన్మతః పాపం లేనివాడిగా) కన్యకకు (పురుషునితో ఎలాంటి లైంగిక నంబంధం లేని స్త్రీకి) జన్మించాడు. ఆయన మన ఆసియా ఖండంలోని ఇశ్రాయేలు దేశంలో బేత్లేహేము అనే ప్రాంతంలో అవతరించాడని చరిత్ర సహితం సాక్ష్యమిస్తుంది. ఆ ప్రభువు నజరేయుడైన యేసుగా పిలవబడుతూ, పవిత్రతతో తన జీవితాన్ని కొనసాగిస్తూ, ఎన్నో భవ్యమైన బోధలు చేస్తూ, అనేక రోగులను పరమవైద్యునివలె బాగుచేస్తూ, మరెన్నో అద్భుతమైన నూచక క్రియలను చేసి చివరికి సకల మానవాళి పాపములకు రావాల్సిన శిక్షను తానే కల్వరి సిలువలో భరించి, దైవ గొఱ్ఱెపిల్లవలె ప్రజల పాపప్రాయశ్చిత్తమై తన వవిత్ర రక్తాన్ని ఒలికించి, బలియాగమైనాడు.

ఎలాగనగా, యేసు ప్రభువు ఏ నేరం చెయ్యనప్పటికీ అన్యాయపు తీర్పు తీర్చబడి, రోమన్ సైనికులకు అప్పగించబడ్డాడు. వారాయనను పట్టుకొని తన ముఖంపై ఉమ్మివేసి, తన తలపై ముళ్ల కిరీటం పెట్టి అవమానవరుస్తూ, అపహాస్యం చేస్తూ, కొరడాలతో ఆయనను భయంకరంగా కొట్టిన నమయములో తన వీపు, రైతు నాగలితో భూమిని దున్నితే ఎలా చారలు చారలుగా అవుతుందో ఆ విధంగా చేయ్యబడింది; అలా చీల్చబడిన ఆయన వీపుపై సిలువను మోపి ఇశ్రాయేలీయుల వీధుల గుండా ఈడ్చుకుంటూ కొండపైకి తీసుకొని వెళ్ళి, అక్కడ ఆయన కాళ్లు చేతుల్లో సీలలు దింపారు.

ప్రభువు పొందిన గాయాల ద్వారా ఆయన వరిశుద్ధ రక్తం తల నుండి పాదముల వరకూ ఏరులై స్రవించుచుండగా, ప్రభువు తనను హింసించుచున్నవారిని దూషింపక,"తండ్రీ, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని" ప్రార్థించిన ఏకైక దైవావతారం,కరుణామూర్తి ప్రభువైన యేను క్రీస్తే! ఇలాగు ప్రభువు సిలువలో మరణించి, భూమిలో పాతి పెట్టబడినవాడై, తిరిగి మూడవ దినమున నజీవునిగా లేచాడు. ఆ తరువాత ఆయన మరల మరణించలేదు నుమా! ప్రభవైన యేసుక్రీస్తు నేటికీ నజీవుడై ఉన్నాడు (మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు). ప్రియులారా, సృష్టికర్తయైన దేవుడు నమన్త మానవాళిపై చూపిన ప్రేమను ఎవరు వర్ణించగలరు? ఓ భక్తుడు ప్రయత్నిస్తూ ఇలా చెప్పాడు - 'భూమిపై ఉన్న చెట్లన్నింటిని ఓ కలముగా చేసి, అందులో సముద్రమనే నీరంతా సీరాగా పోసి, ఆకాశమును ఓ కాగితముగా మలిచి, దానిపై దేవుని ప్రేమను గూర్చి వ్రాస్తున్నప్పుడు నీరనే సిరా అంతా అయిపోతుంది, కాగితమనే ఆకాశం కూడా సరిపోదని' చెప్పాడు. నిజానికి ప్రభువు ప్రేమను ఎవరు వర్ణించలేరు, వ్రాయనూ లేరు.

అపో.పౌలుగారు ఇలా చెబుతున్నాడు - "నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివాని కొరకు ఎవడైన ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై, శత్రువులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపొయెను" (రోమా 5:6-10).

ప్రియ చదువురీ, ఒక మంచివాని కొరకు ఎవరైన చనిపోవాల్సి వస్తే, ఎవరు ముందుకు రాగలరు? జన్మతః పాపులుగా జన్మించి, పాపపు క్రియలను కొనసాగించేవారి కొరకు రక్తం కార్చి, ప్రాణదానం చేసి మరణించడమంటే, నిజముగా అది దైవ ప్రేమనే! ప్రియ చదవరీ, అలాంటి ప్రేమను సృష్టికర్తయైన దేవుడు మానవులందరి (నీ, నా) పై చూపాడు.

మనుష్యులందరూ చెయ్యాల్సిన పని: మీ సృష్టికర్తతో తెగిపోయిన బంధాన్ని తిరిగి నిర్మించుకోవటానికి ప్రభువును హృదయమందు విశ్వసించి, మారుమనస్సునొంది చేసిన పాపములను ఆయనయెదుట ఒప్పుకోండి.అప్పుడు ప్రభువు మిమ్మును క్షమించి తన పవిత్ర రక్తములో మీ పాపములను కడిగి, తన దైవనీతిని మీకు అనుగ్రహిస్తాడు. తద్వారా మీరు దేవుడి పిల్లలగుటకు అధికారం పొంది, సృష్టికర్తతో సమాధానపర్చబడి, శాశ్వత దైవ సంబంధాన్ని, సహవాసాన్ని ఇహ, పరమందును పొందుకొని, నరక శిక్ష తప్పించుకొని, నిత్య జీవం పొందుకొనగలరని మరియు రక్షణ నిశ్చయతను కలిగి వుండగలరు (యోహాను 3:16.,రోమా 10:9.) ప్రియ పాఠకుడా, పాఠకురాలా...

• నీ సృష్టికర్తతో నీకు వ్యక్తిగత సంబంధం ఉందా?

- నీ పాపములు పరిహారం కావాలంటే, నీవు ఏం చెయ్యాలి?

- నీవు పాపివని నీకు తెలుసా? నీ పాపాలకు శిక్ష ఏమిటి?

• ఈ భూమిపై నీ పాప ప్రాయశ్చితార్థం పరిశుద్ధ జన్మనెత్తింది ఎవరు ?

- నీ పాప పరిహారం కొరకు ప్రభువు సిలువలో పవిత్ర రక్తాన్ని చిందించి, మరణించి, పాతిపెట్టబడి, తిరిగిలేచాడని నమ్ముచున్నావా?

- ఆయన నేటికి సజీవుడై ఉన్నాడని విశ్వసిస్తున్నావా? - నరక శిక్షను తప్పించుకోవాలంటే ఇప్పుడు నీవు ఏం చేయ్యాలి? ఆలోచించు!

దేవుడు - "...అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు”(అపొ.కా 17:30).

 

3. అమ్నోను తన చెల్లిపట్ల కలిగివున్న ప్రేమ

అమ్నోను గూర్చి... తండ్రి దావీదు. తల్లి అహీనోయము. 'దావీదునకు.... యెజ్రెయేలీయురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు (1దిన 3:1).

అమ్నోనుకు తామారుకు ఉన్న రక్త సంబంధం: రాజైన దావీదుకు అబ్షాలోము మూడవ సంతానం. 'దావీదునకు.... గెషూరు రాజైన తల్మయి కుమారైయైన మయకాకు పుట్టిన అబ్షాలోము మూడవవాడు” (1దిన 3:1-2). 'దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారను ఒక సుందరవతియైన సహోదరి వుంది” (2 సమూ 13:1). అమ్నోను తల్లి అహీనోయము. అబ్షాలోము - తామరుల తల్లి మయకా. వీరి తల్లులు వేరైనప్పటికి తండ్రి మాత్రం ఒక్కడే, ఆయనే దావీదు. కావున అమ్నోనుకు, తామారు సోదరి. దావీదుకు పుట్టిన కుమారులందరికి తామారు సహోదరి'(1దిన 3:9).

అమ్నోను తామారును మోహించుట (ప్రేమించుట): దైవ లేఖనం చెబుతుంది - 'అమ్నోను తన సహోదరిని మోహించెను” (2 సమూ 13:1). ఇదే వచనం ఆంగ్లములో David's Son (Amnon) Loved Her. ఈ ఆంగ్ల వాక్యం అర్థమేమిటంటే, దావీదు కుమారుడైన అమ్నోను ఆమెను (తామారును) ప్రేమించెను. అయితే ఎందుకని తెలుగు బైబిల్ లో ప్రేమించెనని కాకుండా మోహించెనని తర్జుమా చేయాల్సి వచ్చింది? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇలా చెబుతుంది - 'అమ్నోను తామారును పట్టుకొని నా చెల్లీ రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా ఆమె నా అన్నా! నన్ను అవమానపరచకుము;ఈలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు ఇట్టి జారకార్యము నీవు చేయవద్దు, నా అవమానము నేనెక్కడ దాచుకొందును? (2సమూ 13:11-12). అమ్నోను తన సహోదరిపట్ల ప్రవర్తించిన ప్రవర్తనను పరిశీలిస్తే ఒక విషయం అర్థమవుతుంది. అమ్నోను తన శరీర వాంఛను తీర్చుకోవడానికి తామారును బలవంతం చేసాడు. అమ్నోను, తామారు పట్ల ఇరోస్ ప్రేమను కలిగివున్నాడు. ఇలాంటి ప్రేమను తెలుగు ప్రజలు సులువుగా అర్థం చేసుకొనుటకు మరియు ప్రాముఖ్యంగా భావం పోకుండు నిమిత్తమై బైబిల్ పండితులు తర్జుమాలో మోహించినాడనే పదాన్ని ఉపయోగించారు. ఈ విషయాన్ని పాఠకులు గ్రహించమనవి.

మోహం అంటే? మోహం అంటే, వలపు, రక్తి మొదలగు అర్థాలు వస్తాయి. తెలుగు బైబిల్ లో 'మోహం' అనే పదాన్ని వాడినప్పుడెల్ల ఇంగ్లీష్ లో 'లవ్' అనే పదాన్ని వాడారు. ఈ విషయము మీకు మరింతగా తెలియాలంటే, 31,32 పేజీలలోని సమాచారాన్ని చదవండి. ఇక అంశములోకి వస్తే, అమ్నోను తన చెల్లిని పవిత్ర మనస్సుతో ప్రేమించలేదు కాని తన కామ వాంఛను తీర్చుకొనుటకు ఆమెను మోహించాడు.

అమ్నోను కలిగి ఉన్న ప్రేమ యొక్క లక్షణం: అధికమైన మోహంతో ఉండేవారు ఎవరితోనైన (చివరికి తమ రక్త సంబంధికులతోనైన) శరీర కోరికలను తీర్చుకొనుటకు వెనుకాడరు. అందుకోసమై వారు దేనికైనా తెగిస్తారు. ఇలాంటివారికి వావి వరసలనేవి ఉండవు. ఈ విషయం మనకు అమ్నోను, తన సహోదరి పట్ల ప్రవర్తించిన ప్రవర్తన బట్టి తెలుస్తుంది.

యోచించండి! అమ్నోనుకు తామారు ఏమవుతుంది? అమ్నోను తామారుపై ఏలాంటి ప్రేమను కలిగి ఉన్నాడు? - తెలుగు వ్యాకరణము విద్యార్థి మార్గదర్శిని పుస్తకం. పే నెం 202.

 

4.అమ్నోను తన ప్రేమ ద్వారా పొందుకున్నవి

1) చింతాక్రాంతుడై చిక్కిపోయాడు: అమ్నోను రాజ కుమారుడు 2సమూ 13:4.సహజంగా రాజకుమారులు భుజించే ఆహారం బహు పౌష్ఠికమైనదై ఉంటుంది; వారు మంచి వాతావరణములో నివసిస్తూ, వినోద కార్యక్రమాలతో ఆనందిస్తూ అష్ఠైశ్వర్యాలతో జీవిస్తారు. అయితే అమ్నోను మానసిక స్థితి భిన్నంగా వుంది. ఎందుకని? ధన సంపదలు, పేరు ప్రఖ్యాతలు, మంచి ఆహారం, వస్త్రాలు మొదలగునవి అమ్నోనుకు లేవా? అతనికి అన్నీ ఉన్నాయి; కాని 'అమ్నోను తామారు కన్యయైనందున ఆమెకు ఏమి చేయవలెనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారు బట్టి చిక్కిపోయెను (2 సమూ 13:2).అమ్నోను తన మనస్సులో శరీరానుసారమైన ప్రేమకు చోటిచ్చి తన సోదరితో కామవాంఛ తీర్చుకోలేక చింతిస్తూ, తాను చిక్కిపోవడానికి కారణమైంది. ప్రేమిస్తున్నామని అనుకోనేవారు తమ కోరికలు నెరవేర్చబడనప్పుడు సమయానికి భోజనం చెయ్యాలనే ఆలోచన ఉండదు. కావున శారీరకంగా బలహీనులయ్యే అవకాశముంటుంది. వారి ఆలోచనలు సరియైనవిగా ఉండవు. తద్వారా O.C.D (Obsessive Compulsive Disorder) మానసికంగా దయనీయమైన స్థితిలోకి వెళ్ళే ప్రమాదముంటుందని కొందరి మానసిక వైద్యుల అభిప్రాయం. అమ్నోను జీవితాన్ని చదువుచున్న పాఠకుడా, పాఠకురాలా, ఇతరుల యెడల (రక్త సంబంధికులపట్ల) నీవు ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నావు? నీ మానసిక ఆరోగ్య స్థితి ఎలా వుంది?

2) అమ్నోను తన తండ్రితో అబద్ధములు చెప్పడం, నటించడం: అమ్నోనుకు మిత్రుడొక్కడున్నాడు, ఆయన పేరు యెహోనాదాబు. ఈయన అమ్నోనుతో - నీవు రోగివైనట్టు నటించుమని, నీ దగ్గరకు వచ్చే నీ తండ్రితో అబద్ధం చెప్పుమని సలహా ఇవ్వగా అమ్నోను అలాగే చేసాడు. 'అమ్నోను కాయిలాపడెనని రాజు అతని చూడవచ్చినప్పుడు అమ్నోను - నా చెల్లెలగు తామారు చేతి వంటకము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు రెండు అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవి చేయగా' (2సమూ 13:6). ధర్మశాస్త్రములో ఇవ్వబడిన పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ - అబద్ధ సాక్ష్యం పలుకకూడదు. ఈ ఆజ్ఞను అమ్నోను అతిక్రమించి తన తండ్రితో అబద్ధం చెప్పాడు. సహజంగానే శరీర సంబంధమైన ప్రేమను కొనసాగించేవారు అబద్ధములు చెప్పకుండా ఉండలేరు. అంతేకాదు, వారు వేషధారణను (లోపల ఒకటి, బయటికి మాత్రం నటించే తత్వాన్ని) తమ జీవితాల్లో కలిగి వుంటారు. రాజకుమారుడైన అమ్నోను ఇలాగే చేసాడు. ఈ మాటలను చదువుచున్న ప్రియ సోదరి, సోదరుడా....

- ప్రేమ పేరుతో నీ దగ్గరికి వచ్చే అబ్బాయి/అమ్మాయి ఎన్ని సార్లు నీతో అబద్ధములు చెప్పి ఉండొచ్చు?

- తల్లిదండ్రులతో, పెద్దలతో నటించడానికి ఇష్టపడే వ్యక్తి, నీతో నటించదు/నటించడని ఎలా చెప్పగలవు? ఆలోచించండి!

3) అమ్నోను అసంతృప్తికి గురియై, ప్రేమించిన అమ్మాయిని ద్వేషించడం: 'ఆమెను బలవంతము చేసి అవమానపరచి తన చెల్లెలైన తామారుతో శయనించెను. ఇలాగు చేసిన తరువాత ఆమె యెడల అత్యధికమైన ద్వేషము పుట్టి అప్పటి వరకు ఆమెను ప్రేమించినంతకంటే అతడు (అమ్నోను) మరి యెక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా ఆమె - నన్ను బయటకు తోసి వేయుట వలన నాకు నీవిప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చేయకుమని చెప్పినను అతడు ఆమె మాట వినలేదు (2సమూ 13: 14-16).తానెంతో చిక్కిపోయ్యెంతగా ప్రేమించిన అమ్నోను, తన సోదరితో పోరాడి తన కామ వాంఛ తీర్చుకున్న తరువాత ఆమెను బయటికి త్రోసివేసాడు. ఎంతగానో ప్రేమించిన అమ్నోను ఇలాగు ప్రవర్తిస్తాడని బహుశ ఎవరు ఊహించరు కదూ! అయితే ఇది అక్షరాల చరిత్రలో జరిగిన నిజ సంఘటన.

వివాహం కాకమునుపు యువతియువకుల (స్త్రీ-పురుషుల) మధ్యలో జరిగే లైంగిక చర్యలు  ఏనాటికి సంతోషాన్ని ఇవ్వలేవు. అమ్నోను తన వివాహానికి ముందుగా తన సోదరితో శరీరేచ్చ తీర్చుకొనుటకై ఆమెను మోహించి చిక్కిపోయాడు. రోగియైనట్టు కాకమునుపు నటించి, అబద్ధములు చెప్పి, తన గదిలోకి ఆమెను రప్పించుకొని, ఆమెతో తన కోరికను తీర్చుకున్నాడు. అయినప్పటికీ ఆయనకు ఆనందం, సంతృప్తి లేదు. ప్రియ  సోదరి, సోదరుడా నీవు....
 > ఎలాంటి ప్రేమ మైకములోవున్నావు? నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే వ్యక్తి, నీ పట్ల ఎలాంటి ప్రవర్తనను కలిగి వున్నాడు? కలిగి ఉంది?
> నీ అవసరం తీరిన తరువాత నిన్ను ఆమె ద్వేషిస్తుందో లేక ఆయన నిన్ను ద్వేషిస్తాడో నీకు తెలుసా?

> ఒకవేళ మీ వివాహానికి ముందుగానే మీరు శరీర సంబంధం పెట్టుకుంటే మీకు లాభమా? నష్టమా?ప్రియ మిత్రమా, మీ వివాహనికి ముందుగా మీ శరీర సంబంధం వల్ల పిల్లలు జన్మిస్తే ఎలా?

>అలా జన్మించిన పసికందులను కాలువల్లోనో, చెత్త కుండీల్లోనో పడవేసి పందులకు, కుక్కలకు ఆహారంగా మారుస్తారేమో!

ఒకవేళ మీ వివాహనికి ముందుగా పుట్టిన/పుట్టబొయ్యె బిడ్డలు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి?

> మాదిరికరమైన జీవితాన్నా? లేక ........??? ఆలోచించండి!

నేటి యువతలో కొంతమంది తమ వివాహాలకు ముందే ఇతరులతో ఈ ఇరోస్ ప్రేమ ముసుగులో విచ్చిలవిడి (పశుతుల్యం)గా తమ శరీర కోరికలను తీర్చుకుంటూ చిన్న వయస్సులోనే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులుగా మారి ఆత్మహత్యలు చేసుకోవడం, నానా రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తమపట్ల దేవుడు కలిగివున్న ప్రణాళికలో నుండి తప్పిపోతూ, తమ జీవితాలను స్వయంగా తామే నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి ప్రజలతో ప్రభువు మాట్లాడుచున్నాడు...
'తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజలవైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను' (యెష 65:2). ఈ మాటలు నీ హృదయాంతరంగాన్ని స్పర్శిస్తున్నప్పుడు ప్రేమాస్వరూపియైన ప్రభువు వైపుకు తిరగండి. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని గుర్తించి, తన చెంతకు రండి.
4) దేవుడు రక్తసంబంధీకుల విషయమై ఇచ్చిన ఆజ్ఞలను అమ్నోను మీరుట: 'మీలో ఎవరును తమ రక్తసంబంధుల మానాఛ్చాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు; నేను యెహోవాను. నీ సహోదరి మానాచ్ఛాదనమును, అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపల పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్కయైనను నీ తల్లి కుమార్తె యొక్కయైనను మానాచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి; ఆమె మానాచ్చాదనమును తీయకూడదు. ఒకడు తన సహోదరిని, అనగా తన తండ్రి కుమార్తెనేగాని తన తల్లి కుమార్తెనేగాని చేర్చుకొని ఆమె దిసమొలను వాడును, వాని దిసమొలను ఆమెయు చూచిన యెడల అది దురనురాగము. వారికి తమ జనులయెదుట మరణశిక్ష విధింపవలెను. వాడు తన సహోదరిని మానాచ్ఛాదనమును తీసెను; తన దోషశిక్షను తాను భరించును” (లేవి 18:6,9,11;20:17). రక్తసంబంధికుల విషయమై ప్రభువు ఇచ్చిన దైవాజ్ఞను అమ్నోను మీరి తన చెల్లిని అవమానపర్చి, చెరిచాడు 2సమూ 13:14-16. ఇలాగు ఆయన దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల అతనికి కలిగిన ఫలం ఏదనగా.....
5) మరణించడం: దైవ వాక్యం ఇలా చెబుతుంది - 'దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయ పూర్వకముగా దుష్క్రియలు చేయుదురని'(ప్రసంగి 8:11). బహుశ అమ్నోను తప్పు చేసినప్పుడు - 'నేను చేసిన కార్యమునుబట్టి నన్ను శిక్షించేవారే లేరని' అనుకొని ఉండొచ్చు. నేడు మనలలో అనేకులు - 'మేము చేసిన తప్పును ఎవరు చూడలేదు, ఒకవేళ చూసిన మా తప్పునుబట్టి మమ్మల్ని ఎవరు శిక్షిస్తారని? భావించేవారు లేకపోలేదు. ప్రియ పాఠకులారా, ఆకాశమందున్న దేవుడు కన్నులు మూసుకొని లేడు; ఆయన నేత్రాలకు మరుగైంది ఏదియు లేదు. 'చెవులను కలుగ చేసినవాడు వినకుండునా? కంటిని నిర్మించినవాడు కానకుండునా? (కీర్త 94:9). అమ్నోను చేసిన తప్పుకు వెంటనే ప్రతిఫలం రాకపోయినప్పటికి రెండు సం||రాల తరువాత 'అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసము వలన సంతోషియై యుండుట మీరు కనిపెట్టియుండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పునప్పుడు భయపడక అతని చంపుడి. ...అబ్షాలోము ఆజ్ఞ మేరకు తన పనివారు అమ్నోనును చంపినారు.' 2సమూ 13:28-34. ఎంతో భవిష్యత్తు వున్న రాజకుమారుడైన అమ్నోను దైవాజ్ఞను మీరి తప్పు చేశాడు. అందుకు ఫలితంగా తాను హత్యకు గురియైనాడు.

ఈ విషయాలను చదువుచున్న ప్రియ యువజనమా, బహుశ మనం అమ్నోను లాంటి తప్పుడు పనులు చెయ్యకపోయినను మరో విధమైనవి చేసి ఉంటాము. కావున 'మనము పాపము లేనివారమని చెప్పుకొనినయెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు' (1యోహా 1:8). ఒకవేళ మనం పాపములు చేస్తూ, వాటిలో కొనసాగుచున్నట్లయితే వాటి ఫలితాలు దేవుని కృపగల సన్నిధికి దూరం కావడం, శరీర అనారోగ్యం, మానసిక అశాంతి, కుటుంబాలు విచ్ఛిన్నమౌవడం. భవిష్యత్ లేక అకాల మరణాలు మొదలగు వాటికి దారి తీసే అవకాశముంది. మిమ్మల్ని భయపెట్టుటకు నేను చెప్పడం లేదు. జరుగబోవు సంగతులను లేఖనాల వెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.

గమనిక: మనం చేసిన పాపాల విషయమై పాశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తే, దేవుడు క్షమిస్తాడు. కాని ఆ పాప ఫలితాలు మనం ఈ భూమిపై అనుభవించాల్సి వుంటుంది. దేవుడు, తన ప్రవక్తయైన దావీదు పాపాన్ని క్షమించాడు. కాని, తాను చేసిన చెడు పనికి ప్రతిఫలాలు ఆయన ఈ భూమిపై కొన్ని సం||రాలుగా అనుభవించాల్సి వచ్చిందని మరువద్దు 2సమూ 12:7-15.

5. అన్న చేతిలో మోసపోయిన చెల్లెమ్మ

తామారు కుటుంబం: తండ్రి దావీదు, తల్లి మయకా. తామారు సుందరవతి. ఈమెకు అబ్షాలోము అనే సొంత సహోదరుడున్నాడు (1దిన 3:2,2సమూ 13:1.)

1) తండ్రి మాట వినే తనయురాలు: ఒకనాడు దావీదు తన కుమార్తెయైన తామారుతో 'నీ అన్నయగు అమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనము సిద్ధము చేయుమని తామారు ఇంటికి వర్తమానము పంపెను. కాబట్టి తామారు తన అన్నయగు అమ్నోను ఇంటికిపోయెను” (2 సమూ 13:7).తామారు తన తండ్రి నుండి వచ్చిన మాటకు విధేయత చూపి, అమ్నోను ఇంటికి వెళ్ళింది. ధర్మశాస్త్రములో చెప్పబడిన వాగ్దానముతో కూడిన ఆజ్ఞకు తామారు లోబడింది. 'నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము” (నిర్గమ 20:12).

ప్రభువును వెంబడించే ప్రియ యవ్వనస్తులారా, మీరు మీ తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలు వినడం వారికి లోబడడం చాలా అవసరం. లేఖనం చెబుతుంది- పిల్లలారా, ప్రభువునందు మీ తల్లి దండ్రులకు విధేయులై యుండుడి; ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది' (ఎఫెసీ 6:1-3). అయితే కొన్నిసార్లు సాతానుడు తన కుయుక్తిచేత మీ తల్లిని తండ్రిని ప్రేరేపించి, మిమ్మల్ని తప్పు త్రోవలో నడిపించే ఆస్కారముంది. ఎట్లనగా, అపవాది కుటుంబములో విగ్రహారాధికులైన తల్లిని లేక తండ్రిని ప్రేరేపించి విశ్వాసియైన వ్యక్తిని (కుమార్తెను/కుమారునినైనను) లేఖన విరుద్ద మార్గములో నడిపించే ప్రయత్నాలు చేయొచ్చు. అప్పుడు మీరు ప్రభువును వెంబడించే శిష్యుడిగా, శిష్యురాలిగా వివేకముతో కూడిన విధేయతను మీకు జన్మనిచ్చినవారి యెడల కనపర్చడం మీకెంతో మేలు.

ప్రభువు చూపిన మాదిరి: 12 సం||రాల వయస్సులో యేసు, యోసేపు మరియమ్మతో కలిసి యెరూషలేము దేవాలయముకు వెళ్ళినప్పుడు ఆయన అక్కడే ఉండిపోయాడు. ఆ సంగతిని గ్రహించక మరియమ్మ, యోసేపు చాలా దూరం నడిచిన తరువాత యేసు వారవెంట లేనందుచేత మరియమ్మ మరల దేవాలయముకు వచ్చి ... కుమారుడా, మమ్మును ఎందుకీలాగు చేసితివి? ఇదిగోనీ తండ్రియు నేనును దు:ఖపడుచు నిన్ను వెదకుచుంటిమని ఆయనతో చెప్పగా (లూకా 2:48). ఆయన - మీరేల నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా? అని ప్రశ్నించి, వారికి లోబడియుండెను (లూకా 2: 49–51). ప్రభువు తన బాల్య వయస్సులో పరమ తండ్రి విషయాలపై ఆయకున్న ఆసక్తి గొప్పది. ఈ క్రమములో మరియమ్మ బాలుడైన యేసయ్య యెడల లోక సంబంధమైన ప్రేమను కనుపరుస్తున్నప్పుడు ప్రభువు స్వౌమ్యముతో వారిని ఆలోచింప చేయుటకై - మీరేలా నన్ను వెదకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీకు తెలియదా? అని ప్రశ్నించి, వారికి లోబడి ఉన్నాడు. ప్రియ యవ్వన పిల్లలారా, మీ తల్లిదండ్రులు దైవ చిత్తానికి విరుద్ధంగా చేయుటకు మిమ్మల్ని ప్రేరేపిస్తే, స్వౌమ్యముతో వారితో సంభాషించండి. అదే క్రమములో వారికి లోబడి ఉండాలి.

మరో సందర్భములో ప్రభువు చూపిన మాదిరి: ఆయన సహోదరులును తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టు కూర్చుండిరి. వారు - ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును వెలుపల ఉండి, నీకోసరము వెదుకుచున్నారని ఆయన (ప్రభువు)తో చెప్పగా ఆయన - నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టు కూర్చున్న వారిని కలయచూచి - ఇదిగో నా తల్లియు నా సహోదరులును; దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను” (లూకా 3:31-34). ప్రభువు ఈ భూమి మీద తనకు తల్లిగా, తమ్ముళ్లుగా ఎంచబడిన వారితో కలిసి, సంతోషముతో జీవించడానికంటే కూడా పరలోక తండ్రి ఈ జగత్తుపై తనకు అప్పగించిన పనిని కొనసాగించడానికి ఇష్టపడ్డాడు. దేవుని చిత్తానికి మరియమ్మ గాని, తన సోదరులుగాని అడ్డువస్తే, ప్రభువు యొక్క స్పందన ఏమిటంటే? తండ్రియైన దేవునికి విధేయత చూపుతూ... ఆయన పనిని కొనసాగించడమే! యేసయ్యా - తండ్రి చిత్తం చొప్పున జరిగించువాడే నా సహోదరుడును, సహోదరియు, తల్లి అని చెప్పెను.కావున సోదరి, సోదరుడా నేడు దేవుని మందిరముగావున్న సంఘంలో నీవు, నీవంతు చొప్పున సేవ చేయుటకు ఆయన నీకిచ్చిన కృపావరాన్ని వాడుచున్న ప్పుడు... మీ తల్లి దండ్రులు, మీ తోబుట్టువులు మిమ్మల్ని ఆటంకపరుస్తున్నట్లయితే వారిని గౌరవించండి.కాని మొదట దేవునికి విధేయులై ఆయన పనిని చెయ్యడమే ప్రాముఖ్యం. ఈ క్రమములో.... కుటుంబ సభ్యుల నుండి తిరస్కారాలు వచ్చే అవకాశాలుంటాయి. అందుకే ప్రభువు చెప్పాడు - 'ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నా కంటె ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుకాడు...?(మత్తయి 10:36-37) అని.

ప్రియ స్నేహితులారా, ప్రభువును వెంబడిస్తుండగా... ఆయన ద్వారా మనకివ్వబడిన తల్లిదండ్రులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు మొదలగువారు అడ్డు వస్తున్నప్పుడు మొదట మనం ప్రభువుకే విధేయత చూపించాల్సిన అవసరముందని మరోసారి తెలియజేస్తున్నాను. ప్రభువు నిమిత్తమై మన తల్లిని, తండ్రిని, రక్తసంబంధికులను, ఆస్తులను, వస్తువులను వదులుకోవాల్సి వస్తే అందుకు సిద్ధపడి ఉండాలి. అట్లాగని మీరు తొందరపాటుతోనో, మిడిమిడి జ్ఞానంతోనే ఎవరితోను బంధాలను తెంచుకోవద్దు. మీ ఇంటిలో క్రీస్తు నిమిత్తమై శ్రమలు లేకున్నప్పటికి అనవసరంగా ఇల్లు విడిచి బయటికి రాకండి. అలాగు చెయ్యడం మంచిది కానే కాదు.

మీకు ఈ విషయం తెలియును గదా! ప్రభువు సిలువలో మరణించే సమయంలో ఆయన మరియమ్మను గూర్చిన బాధ్యతను తన శిష్యుడైన యోహానుకు అప్పగించాడు యోహాను 19:26-27: ఇది ఏమి సూచించుచున్నది? ప్రభువు మరియమ్మతో ఉండిన తల్లి బంధాన్ని, బాధ్యతనుగాని తెంచుకోలేదని తెలియజేస్తుంది కదా! అలాగే మనం కూడా ప్రభువును పోలి నడుచుకొందుము గాక. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొనుటకు పరిశుద్దాత్ముడు మీలో కార్యం చేయును గాక!

గమనిక: దైవ పరిచర్య విషయమై కాలేజిల్లో చదువుకునే క్రైస్తవ విద్యార్థిని, విద్యార్థులు దయతో మీ చదువును ఏ మాత్రం నిర్లక్ష్యం చెయ్యవద్దు. నేటి డిజిటల్ యుగంలో చదువుకోవడం మీ వ్యక్తిగత, కుటుంబ జీవితానికి ప్రాముఖ్యంగా ప్రభువు పరిచర్యకు ఎంతో అవసరమైవుంది. మీలో ఎవరైన దేవుని సేవ చేసే ప్రయత్నంతో చదువును మధ్యలోనే ఆపు చేసి ఉన్నట్లయితే, ప్రియమైన నా తమ్ముడు, అన్నా, అక్క చెల్లి దయతో మీరు మీ చదువును తిరిగి ప్రారంభించండి. ఒకవేళ రెగ్యులర్ గా చదువుకునే అవకాశాలు లేకపోతే దూరవిద్య ద్వారా అంబేద్కర్, కాకతీయ, పొట్టి శ్రీరాములు, ఇందిరా గాంధీ, నాగార్జున మొదలగు యూనివర్సిటీస్ ద్వారానైన మీరు, మీ విద్యను మరల పునఃప్రారంభించండి.

గమనిక: దేవున్ని నుండి ప్రత్యేకమైన ఆజ్ఞ, నడిపింపు ఉంటే తప్ప విద్యను మధ్యలో ఆపొద్దు.

2) పాపముతో పోరాడిన యువతి: లేఖనం చెబుతుంది - 'అన్నయైన అమ్నోను భుజింపవలెనని తామారు కొన్నింటిని తీసికొని వచ్చినప్పుడు అతడు, ఆమెను పట్టుకొని - నా చెల్లీ రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా ఆమె - నా అన్నా, నన్ను అవమానపరచకుము; ఈలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు, ఇట్టి జారకార్యము నీవు చేయవద్దు, నా యవమానము నేనెక్కడ దాచుకొందును? నీవును ఇశ్రాయేలీయులలో దుర్మార్గుడవగుదువు; అయితే ఇందును గూర్చి రాజుతో మాటలాడుము; అతడు నన్ను నీకియ్యకపోడని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరచి ఆమెతో శయనించెను (2సమూ 13:11-14). నైతిక విలువలు కోల్పోయిన అమ్నోననే కామాంధుని ప్రేరేపణకు తామారు స్వచ్ఛందంగా లొంగిపోక, ఆ గదిలో ఆయన చేతికి చిక్కకుండా తిరుగుతూ, తన పరిశుద్ధతను కాపాడుకోనుటకు తన శాయశక్తుల పోరాడిన వీర వనిత తామారు. (చెరుపబడని హృదయం కలిగిన యువతి).

తామారు పాపముతో పోరాడుటలో చేసినవి: దేవుని ఆజ్ఞలను జ్ఞాపకం చేయుట: తనతో వరుసకు అన్నయైన వ్యక్తి తన శరీర వాంఛను తీర్చుకోవాలని బలవంతం చేస్తున్నప్పుడు తామారు ఇది ఇశ్రాయేలీయులు చెయ్యకూడని పని అని చెప్పింది. 'వ్యభిచారం (జారత్వం) చెయ్యకూడదు? (నిర్గ.కా 20:14. లేవి 18:6,9,11;లేవి 20:17:

బ్రతిమాలుట, తామారు, అమ్నోనును ఎంతగానో బ్రతిమిలాడుతూ నన్ను అవమానపర్చకుము, నా అవమానమును నేనెక్కడ దాచుకోవాలని? పాపముతో పోరాడే క్రమములో అతన్ని ప్రాధేయపడింది.

సలహా ఇవ్వడం' తొందరపడి నాతో పాపం చెయ్యకు, కావాలంటే, నీవు రాజుతో మాట్లాడుము అతడు నన్ను నీకియ్యపోడని సలహా ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రియులారా, తామారు పెళ్లికాని ఒక యువతి. తన శీలాన్ని కాపాడుకునే దిశలో మంచి అంతరంగ సౌందర్యము, పరిశుద్దత కలిగి వుంది. ఆ కారణం చేతనే అమ్నోనుకు దేవుని ఆజ్ఞను జ్ఞాపకం చేయ్యడం, బ్రతిమాలడం, సలహా ఇవ్వడం చేసింది. అయితే కామముతో కండ్లు, చెవులు మూసుకొని పోయిన అమ్నోనుకు ఇవేమి అర్థం కాలేదు. తామారు జీవితాన్ని చదువుచున్న ప్రియ సోదరీ, సోదరుడా! పరిశుద్ధత విషయమై మనమెలా జీవిస్తున్నాము? మనలను గూర్చి దేవుని వాక్యం - 'మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు” (హెబ్రి 12:4) అని చెబుతుంది. అపో|| పౌలుగారు మనకిలా బోధిస్తున్నాడు - 'మీ దేహములు క్రీస్తునకు అవయవములైయున్నవని మీరెరుగరా?... జారత్వమునకు దూరముగా పారిపొవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి, మీలోనున్న పరిశుద్దాత్మకు ఆలయమైయున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి' (1కొరి 6:15-20).

ప్రియులారా, మనకు నచ్చినట్లు జీవించుటకు మనం మన సొత్తు కాదనే విషయాన్ని మరువకండి. మనం ప్రభువుచేత కొనబడినవారమై దేవుని సొతై వున్నాము. కావున మన దేహముల ద్వారా జారత్వ, వ్యభిచార క్రియలు చేయకుండా పాపముతో పోరాడే శక్తిని పొందుకొనుటకు అనుదినం ప్రయాసపడువారమై యుండాలి. ...పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండ ఎవడును ప్రభువును చూడడు (హెబ్రీ 12:14). 'పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు” (1థెస్స 4:7).

పరిశుద్ధ జీవితం యొక్క ఫలం: కొన్నివేల సం||రాల క్రితం యోసేపు అనే యవ్వనస్తుడు ఈ భూమిపై జీవించాడు. ఆయనపై యాజమానుడిగా ఫోతిఫర్ ఉండేవాడు. ఈ ఫోతిఫర్ భార్య యోసేపుపై మోజుతో పాపం చెయ్యమని ప్రతి దినం యోసేపుతో మాట్లాడుచున్నప్పటికీ ఆయన ఆ స్త్రీ మాటలు వినకుండా ఉంటూ ఉండగా... ఒక దినం ఇంటిలోఎవరులేని వేళ ఆ స్త్రీ తనతో శయనించుమని అతన్ని ఎంతో ఒత్తిడికి గురి చేసింది. అందుకతడు - 'నా దేవుని దృష్టికి ఇలాంటి దుష్కార్యం ఎలా చేస్తానని' ఆమెతో అనగా ఆమె యోసేపు దేహంపై చెయ్యి వేసి, తన వస్త్రములను పట్టుకొని లాగినప్పుడు... ఒక వ్యక్తి దేహానికి అగ్ని అంటుకొన్నప్పుడు తన ప్రాణాలను కాపాడుకొనే క్రమములో ఏలాగైతే వస్త్రములను విప్పి వేస్తాడో అలాగే యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకొనుటకై తన వస్త్రములను ఆమె చేతిలో విడిచిపెట్టి పారిపోయాడు. తరువాత ఆ స్త్రీ తన భర్తతో- యోసేపు నన్నుఅవమానపర్చాడని అతనిపై  నిందవేసి, చెరసాల పాలు చేస్తుంది. తన వివాహానికి ముందుగా శరీర వాంఛను తీర్చుకొనే అవశాకాన్ని సాతానుడు కల్పించినప్పటికి, దైవభయంచేత యోసేపు పాపం చెయ్యలేదు. అందుకు ప్రతిఫలంగా దేవుడతన్ని చెరసాల నుండి వెలుపలికి రప్పించి, ఐగుప్తుదేశానికి ప్రధానిగా చేసి, కరువులో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే విధంగా దీవించాడు (ఆది.కా 39వఆధ్యాయం).పరిశుద్ధుడైన ప్రభువుకే సమస్త మహిమ కలుగును గాక

ఎక్కడ పరిశుద్దత ఉండాలి? క్రీస్తును వెంబడించే యువత తమ అంతరంగమందు, మనస్సుయందును, శరీరమందును పరిశుద్ధులుగా ఉండాలి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము' (2కొరి 7:1), 1థెస్స 5:23:

3) ప్రతీకారం చెయ్యని యవ్వనస్తురాలు: తామారు వరుసకు అన్నయైన వ్యక్తి చేతిలోనే దారుణంగా మోసపోయినప్పటికీ వ్యక్తిగతంగా ఆమె అమ్నోనుపై ఎలాంటి ప్రతీకార చర్యకు పూనుకోలేదు. 2 సమూ 13:11-14: అయితే నేటితరం యువతీయువకులలో కొంతమంది పెళ్ళి కాకమునుపే ఈ కామపూరితమైన (ఎరోస్) ప్రేమ మైకములో పడి ఒకరి చేతుల్లో మరొక్కరు మోసపోతున్నారనేది ఎవరూ కాదనలేని నగ్నసత్యం! ఇలా మోసపోతున్న...

అబ్బాయిలలో కొందరు - 'ఆ అమ్మాయి నన్ను నమ్మించి మోసం చేసింది. ఇలాంటిదని ముందే తెలిస్తే, అస్సలు ప్రేమించేవాడినే కాదు, ఇప్పుడు నన్ను కాదని, వేరొక వ్యక్తితో వివాహం చేసుకుంటుంది; ఇకామె బ్రతుకడానికి వీలులేదు, ఆమెను చంపేస్తానంటూ' హత్యాప్రయత్నాలు చేసేవారు ఉన్నారు. అలాగుననే...

అమ్మాయిలలో కొందరు - 'అతడు నన్ను ఒక పావుగా వాడుకొన్నాడు. తన అవసరం తీరిన తరువాత నన్ను ద్వేషించాడు. కాబట్టి వాడికి తగిన శాస్తి చెయ్యాల్సిందే, ఇలాంటివాడని ముందే తెలిస్తే, అస్సలు వీడిని ప్రేమించేదానినే కాదు' అనే అమ్మాయిలున్నారు. ఇలా వీరు ఒక్కరిపై మరొక్కరు దాడులు చేసుకోవడం వల్ల తమ చదువును, మంచి భవిష్యత్తును కోల్పోయి, మానసిక రోగులుగా (పిచ్చివారిగా) కొందరు మారుతున్నారు. ఇంకొందరు పోలీస్ స్టేషను వెళ్ళి ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకోవడం, కోర్టుల చుట్టు తిరగడం, యువకులలో కొందరు ప్రతీకారంగా యాసిడ్ దాడులు, దారుణంగా హత్యలు చెయ్యడం, లేదా పశుతుల్యంగా తమ కామ వాంఛలు తీర్చుకొని, యవ్వన స్త్రీలను వ్యభిచార గృహాలకు అమ్మడం. ప్రేమ ముసుగులో మోసపోయిన కొందరు యువతీమణులు - 'ఇకా నా జీవితం నాశనమైపోయిందని భావించి ఆత్మహత్య ప్రయత్నాలు చెయ్యడం లేదా సమస్యల ఒత్తిడిలకు తలొగ్గి స్వచ్ఛందంగా వేశ్య వృత్తిని ఎంచుకుంటున్నవారు ఉన్నారు. అయ్యో ఇది ఎంత బాధాకరం. ఇంతకు ఎవరు ఎవరిని మోసం చేసారు? అమ్మాయిలు అబ్బాయిలనా? లేక అబ్బాయిలు అమ్మాయిలనా?ఎవరిని ఎవరు మోసం చేసారు అనే విషయాన్ని కొంచెము ప్రక్కనుంచి 'నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను” (మత్త 22:37) అనే ఆజ్ఞకు ఎంత వరకు లోబడినారు? మిమ్మల్ని తన చివరి రక్తధార కారునంతగా ప్రేమించిన ప్రభువుకు మీ హృదయాలలో చోటిచ్చి, ఆయనను ప్రేమించినారా? ఆయన అధికారానికి లోబడినారా? ఆయనిచ్చిన లేఖనాల యెడల మోసపూరితముగా ప్రవర్తించిన సందర్భాలు లేవా? ఆలోచించండి! నా ప్రియమైన సహోదరీ, సహోదరుడా! మీరు మొదట దేవుని యెడల మోసపూరితమైన వైఖరి కలిగివున్నారేమో! కాబట్టే ఇతరులు మిమ్ములను (కొంత మంది అమ్మాయిలు అబ్బాయిలను, అబ్బాయిలు అమ్మాయిలను) మోసం చేశారు, చేస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం: మనం ప్రభువుకు అవిధేయులమై తప్పులు చేస్తే, ఆయన మనపై ప్రతిచర్యగా ఏం చేస్తున్నాడు? ప్రభువు 'మన పాపములనుబట్టి మనకు ప్రతీకారము చెయ్యలేదు, మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమివ్వలేదు' (కీర్తన 103:10) గాని మన పాపం కోసమై ఆయనే సిలువలో బలియాగమైనాడు. ప్రేమాస్వరూపియైన ఆ ప్రభువు,గాయపడిన తన హస్తాలతో చెదిరిపోయిన మీ మనస్సులను, పగిలిన మీ హృదయాలను, ఒకసారి స్పర్శించాలనే ఆశతో మాట్లాడుచున్నాడు - 'నిన్ను స్వస్థపర్చువాడను (బాగుచేయు వాడును) నేనే' (నిర్గ.కా 15:26). ప్రభువు మిమ్మల్ని తన ఒడిలోనికి ప్రేమతో రమ్మని ఆహ్వానిస్తుండగా మీరిప్పుడు, మిమ్మల్ని మోసం చేసినవారిపై ప్రతీకారం చూపక, మిమ్మల్ని ఇప్పటికి తన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న ఆ ప్రభువు వైపు పాశ్చాత్తాప హృదయాలతో తిరిగి, తన ప్రేమ కౌగిలిలో ఒదిగిపోయి, ఆయనిచ్చే ఆదరణను పొందుకోండి.

గమనిక: 'ఎవడైనను తనకు హాని చేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు (ఒకరి నొకరు) సహించుచు ఒకనినొకడు (ఒకరినొకరు) క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి (కొలొస్స 3:13). ఇతరులను క్షమించే మనస్సును ప్రభువు మనకిచ్చును గాక!

4) ధైర్యవంతురాలైన వనిత: 'అమ్నోనుకు ...ఆమె యెడల అత్యధికమైన ద్వేషము పుట్టి అదివరకు ఆమెను ప్రేమించినంతకంటే అతడు మరి యెక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా ఆమె - నన్ను బయటకు తోసివేయుట వలన నాకు నీవిప్పుడు చేసిన కీడు కంటే మరి యెక్కువ కీడు చేయకుమని చెప్పినను అతడు ఆమె మాట వినక తన పనివారిలో ఒకని పిలిచి - దీనిని నాయొద్ద నుండి వెళ్ళగొట్టి తలుపు గడియ వేయుమని చెప్పెను. కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములుగల చీరలు ధరించువారు ఆమె యట్టి చీర యొకటి ధరించియుండెను. పనివాడు ఆమెను బయటికి వెళ్ళగొట్టి మరల రాకుండునట్లు తలుపు గడియ వేసెను” (2 సమూ తప్పులు13:15-18). రాజకుమార్తె హోదాలో తామారు అమ్నోను వద్దకు వస్తున్న చేస్తున్నవారేప్పుడు... అక్కడి పనివారు ఆమెకు మంచి స్వాగతము (ఆహ్వానము)ను తెలిపి ఉంటారు. అయితే తామారు, అమ్నోను చేతిలో మోసపర్చబడిన తరువాత,స్వాగతం పలికిన పనివాడి చేతనే వెలివేయబడింది. అప్పుడు ఆమెను చూసినవారంత ఎన్నెన్ని విధాలుగా మాట్లాడి (coments చేసి) ఉండొచ్చు .వాటినన్నిటిని ఎందుర్కొన తామారు - 'ఇకా నేను చనిపోతా! ఇంతటి ఆత్మహత్యలు చేసుకోవాలి?అవమానం చెందాకా నేనెందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతుకాలి? అనే పిరికి ఆలోచనకు (సాతాను ప్రేరేపణకు) తన మనస్సులో చోటివ్వని ధైర్యశాలి తామారు.

ఈమె జీవితాన్ని చదువుచున్న ప్రియమైన సోదరీ, సోదరుడా, ఒకవేళ నీవు చెయ్యని పాపమునకు ఈ సమాజము, నీ బంధుమిత్రులు, నీ రక్తసంబంధికులు, చివరికి నిన్ను కన్న తల్లితండ్రి నిన్నే నిందిస్తూ, నీ హృదయాన్ని గాయపరుస్తున్నట్లయితే, తామారు జీవితాన్ని ధ్యానించి, ధైర్యం తెచ్చుకో! ఆమె ప్రమేయం లేకున్నా తామారు బహుగా అవమానపర్చబడింది.అప్పుడామె - ఇకా ఈ జీవితమెందుకు? నేను మరణిస్తానని అనుకోలేదు. గాని నేనెందుకు మరణించాలని అనుకున్నదేమో! ప్రియ సోదరి, సోదరుడా, దయతో ఆత్మహత్య ప్రయత్నాలు చేయ్యకండి. ఎందుకనగా, మనలను మనమే సృష్టించుకోలేదు కదా! కీర్త 100: 3: మీ జీవితాలకు అధిపతియు, మిమ్మల్ని సృష్టించిన ప్రభువువైపు మీ మనస్సులను త్రిప్పండి. ఆయన శూన్యంలో సర్వాన్ని సృష్టించినవాడై వున్నాడు. ఇప్పుడు మీ పరిస్థితి నేలకూలిన ఇల్లువలె ఉన్నప్పటికీ, ఆయన మీ జీవితమనే గృహాన్ని మరల చక్కగా నిర్మించగలడు. అవసరమైతే నిన్ను మోసం చేసి, అవమానించినవారియెదుటనే నిన్ను నిలబెట్టగలడు. కావున కీర్తనకారుడు అంటున్నట్లుగా మన నిండు మనస్సుతో - 'నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను' కీర్తన 118:17 అని పలుకుదాం. మరణిస్తేనే మంచిదనే సాతాను ఆలోచన నుండి ప్రభువు మిమ్ములను విడిపించి, భూమిపై జీవించుటకు మీకు ధైర్యం అనుగ్రహించును గాక!

5) ఆదరణ పొందుకున్న అబల: తామారు జీవితాన్ని గమనించినట్లయితే, తాను ఊహించని దారుణమైన మోసానికి గురియై నిస్సహాయ స్థితిలోవున్న తనను, తన అన్నయైన అబ్షాలోము ఆమెతో - నీవెందుకు అతని ఇంటికి వెళ్ళావు? నీవు ముందుగా ఆలోచించవద్దా? నీకు తోడుగా ఎవరినైన తీసుకొని వెళ్ళవద్దా? అని ప్రశ్నించలేదు కాని ఆమెను తన ఇంటిలోకి చేర్చుకున్నాడు (2సమూ:13:20). ఇది తామారు జీవితములో ఒక ఆదరణాంశముగా చూడొచ్చు. అయితే ప్రేమ ముసుగులో మోసపోయి అవమానాలు, నిందలు, సమస్యల వలయములో చిక్కుకొని గుండె చెదరిపోయి, దిక్కుతోచని స్థితిలో వున్నవారిని ఈ లోకంలో ఎవరు సరిగ్గా అర్థం చేసుకుంటారు? ఎవరు వారిని చేర్చుకొని ఆదరిస్తారు???

అధైర్యపడవద్దు: అబ్షాలోము కన్నా బహు శ్రేష్ఠుడైన మన అన్నయ్యగా (జ్యేష్ఠునిగా) యేసు క్రీస్తు ప్రభువులవారు ఉన్నాడు' రోమా 8: 29: ఈయన తన పరిశుద్ధ రక్తాన్ని మన కోసం ధారపోసి, మనలను కొన్నవాడు. ఆయన మిమ్ములను తన ఇంటిలోనే కాదు; తన గుండెల్లో ఉంచుకొనుటకు సిద్ధంగా వుండి, తన రెండు చేతులను మీ వైపు చాపి పిలుచుచున్నాడు - 'ఒకని తల్లివానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను? 'నా దగ్గరకు వచ్చువారిని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను” (యెషయా 66:13, యోహాను 6:37). తల్లి ఒడిలో శిశువు ఒదిగిపోయినట్లు, మీ సృష్టికర్తయైన ప్రభువు ఒడిలో మీరు ఒదిగిపోయి ఆయనిచ్చు ఆదరణను, మంచి భవిష్యతను పొందుకొండి! ప్రభువు కృప మీకు తోడైయుండును గాక!

అమ్నోను - తామారుల పునఃస్మరణ

తామారును మోసం చేసిన అమ్నోను: తన చెల్లితో శరీర కోరికను తీర్చుకొనుటకై అనారోగ్యమొచ్చినట్లు నటించి, తన తండ్రితో అబద్ధములు చెప్పి, తామారును తన గదిలోకి రప్పించుకొని, అత్యంత హేయంగా ప్రవర్తించాడు.దాని ఫలితంగా అమ్నోను హత్యకు గురియై తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకోవాల్సి వచ్చింది.

అమ్నోను చేతిలో మోసపోయిన తామారు: సుందరవతియైన తామారు, తన తండ్రి మాటకు విధేయత చూపించే క్రమములో అమ్నోను చేతిలో దారుణంగా మోసపోయింది. అయినప్పటికి పిరికితనముతో ఆత్మహత్య చేసుకొనే ప్రయత్నం చెయ్యలేదు. అలానే అమ్నోనుపై ప్రతీకారం చూపలేదు. కాని తన అన్నయ్యయైన అబ్షాలోము దగ్గర వెళ్ళి, తన జీవితాన్ని సు:ఖాంతం చేసుకొని, అనేకులకు మాదిరిగా నిలిచింది. ప్రియ చదువరీ, నీవు ఏ మార్గంలో నడవాలని ఆశిస్తున్నావు?

అమ్నోను దైవాజ్ఞలను ధిక్కరించి జారత్వమనే విత్తనం విత్తి, తాత్కాలిక సుఖాన్ని అనుభవించి, చివరికి అకాల మరణమనే పంటను కోసాడు..

తామారు విధేయత అనే విత్తనం విత్తి, అవమానం, దు:ఖం ఎదుర్కొనప్పటికి, తన అన్నయైన అబ్షాలోముచే ఆదరించబడి, చిరకాల జీవితమనే పంటను కోసింది.

రెండవ భాగం

 

6. వివాహేతర సంబంధాలకు మూలం ఏమిటి?

 

వివాహేతర సంబంధాలకు మూలం ఏమిటో తెలుసుకొనుటకు ఈ క్రింద ఇవ్వబడిన లేఖనాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తే అర్థమవుతుందని భావిస్తున్నాను.

వివాహమైన ఓ స్త్రీ: వేరొక పురుషునితో ఇలా అంటుంది - పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణము వెళ్లియున్నాడు, అతడు సొమ్ము సంచి చేతపట్టుకొని పోయెను. నా పరుపు మీద బోళము అగరు దాల్చిన చెక్క చల్లియున్నాను. ఉదయము వరకు వలపుదీర తృప్తి పొందుదము రమ్ము పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము!! Come let us take our fill of LOVE till morning; let us delight ourselves with LOVE (సామె 7:16-20). భర్తను కలిగియున్న స్త్రీ, పర పురుషునితో దుష్ కార్యం చేయుటకు పూనుకుంటుంది.

సొలొమోను రాజు: రాజైన సొలొమోను భార్యను కలిగి ఉన్నప్పటికీ, జనులలో ఇంక అనేకమంది పరస్త్రీలను మోహించి కామాతురతగలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను” Now King Solomon LOVED many foreign women, along with the daughter of Pharao (1రాజు: 11:1-2). వివాహమైన సొలొమోను చాలామంది స్త్రీలను పెళ్ళిల్లు చేసుకున్నాడు.

బలవంతుడైన సమ్సోను: 'వివాహమైన సమ్సోను గాజాకు వెళ్లి వేశ్య నొకతెను చూచి ఆమెయొద్ద చేరెను (న్యాయ 16:1). పిమ్మట అతడు శోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా' After this he LOVED a woman in the Valley of Sorek, whose nanne was Delilah (న్యా య 16:4). సమ్సోను దెలీలా అనే స్త్రీని మోహించి ఆమెతో కొంత కాలం సహజీవనం చేసాడు. ఈ ముగ్గురు వ్యక్తుల ప్రవర్తనను పరిశీలించినట్లయితే ఒక స్త్రీ, తన భర్తను కాకుండ మరొక పురుషునితో పాపం చేయుటకు సుముఖతను వ్యక్తపరుస్తుండగా సొలొమోను, సమ్సోను తమ భార్యలను కాకుండ పరస్త్రీలతో సంబంధాలను కలిగివున్నారు.

ఈ ముగ్గురు వ్యక్తులు ఇతరులయెడల ఏలాంటి ప్రేమను కలిగివున్నారు? మొదట మనం చూసిన నాలుగు రకాలైన ప్రేమలలో మూడవదైన శరీర సంబంధమైన ప్రేమను కలిగివున్నారు. ఈ ప్రేమ కలిగినవారే ఇతరులతో వివాహేతర సంబంధాలను పెట్టుకుంటారు. కావున ఇలాంటి సంబంధాలకు మూలం ఇరోస్ ప్రేమనే (మోహమే) కారణమని తెలుస్తుంది.

గమనిక: మోహం అంటే శరీరసంబంధమైన ప్రేమకు నిదర్శనమని మరోసారి మీకు జ్ఞాపకం చేయుచున్నాను. మరింత సమాచారము కోసం 5వ పాయింటును చూడండి.

 

7. అక్రమ సంబంధాల ద్వారా కలిగే నష్టాలు

 

ప్రియ పాఠకుడా, పాఠకురాలా, సృష్టికర్తయైన దేవుడు నిన్ను ఎంతో ప్రేమించి, తన కనికరంచేత నీ జీవితాంతము కష్టములోను, సుఖములోను, ఆరోగ్యములోను, అనారోగ్యములోను తోడుటకు తన పోలికలో, తన స్వరూపములో రూపించబడిన వ్యక్తితో నిన్ను జత చేసి, వివాహమనే బంధం ద్వారా కుటుంబంగా నిర్మించాడు. 'దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు” (కీర్తన 68:6).

కావున నీవు నీ జీవిత భాగస్వామితోనే సంసారధర్మాన్ని కలిగి ఉండాల్సి వుండగా వివాహబంధానికి వెలుపల ఇతరులతో సంబంధాన్ని కలిగి ఉండడం పరిశుద్ధుడైన దేవుని నిబంధనను మీరడమే! జీవిత భాగస్వామితో కాకుండా ఇతరులతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉండడాన్ని అక్రమసంబంధమంటారు. అంటే అది క్రమమైంది కాదని బైబిల్ తెలియని ఈ సభ్యసమాజమూ చెబుతుంది. ఇట్టి వికృత వివాహేతర సంబంధాలు కలిగినవారి కష్టార్జితము అన్యుల ఇల్లు చేరుతుంది. వీరు దెబ్బలకును, అవమానమునకు పాత్రులవుతారు. చివరికి వీరి మాంసమును, శరీరము క్షీణిస్తుంది. ఇలాంటి వివాహేతర సంబంధాలు పెట్టుకొని మరణించినవారు లెక్కలేనంత మంది. ఇలాంటి వారి మార్గము పాతాళమునకు మరణశాలకు నడుపుతుంది (సామె 5:9-11సామె 6:33,సామె 7:26-27:). ఈ లేఖనాలన్ని బైబిల్ తెరచి సంపూర్తిగ చదువాల్సిందిగావిజ్ఞప్తి.

మీకు తెలుసా! దేవునికి ప్రతిష్ఠితుడై, బలవంతుడుగావున్న సమ్సోను పరస్త్రీ తోటి సంబంధం వలన శత్రువుల చేతికి చిక్కి తన కన్నులను ఊడదీసి, తన వెంట్రుకలను క్షౌరము చెయ్యబడే దుస్థితిని తెచ్చుకున్నాడు (న్యాయ 16:21-22). జ్ఞానవంతుడైన సొలొమోను అనేకమంది స్త్రీలను వివాహము చేసుకొని; సృష్టికర్తను విడిచి, సృష్టిని పూజించే స్థాయికి దిగజారాడు. తద్వారా ప్రభువు, సొలొమోనుకు విరోధంగా శత్రువును లేపి, ఆయన రాజ్యాన్ని రెండు భాగాలుగా విభజించాల్సి వచ్చింది . ప్రవక్తయైన దావీదు పరస్త్రీని ఆశించి, ఆమెతో శయనించి, ఆమె భర్తను చంపించాడు. ఈ సంఘటనను న్యాయాధిపతియైన దేవుడు చూసి దావీదుతో... నీ యింటివారికి సదాకాలము యుద్ధం కలుగును.నీ యింటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును; నీవు చూచు చుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వాని కప్పగించెదను” (2 సమూ 11:1-27, 12:1-15) అని చెప్పి, అలాగుననే ఆయన జీవితంలో చేసాడు. ఈ భక్తుల జీవిత వృత్తాంతాలు మనకు హెచ్చరికలుగా ఉన్నాయి.

క్రైస్తవుల అక్రమ సంబంధాలవల్ల మొదటగా వివాహ విషయమై దేవుని నిబంధనను మీరి, పరిశుద్ధ దేవుని నామము దూషణపాలు కావడం వల్ల దేవుని శిక్షకు గురియై సంఘ సహవాసం నుండి వెలివేయ్యబడి, సమాజం నుండి తిరస్కారం ఎదుర్కొవడం, ఆర్థికంగా డబ్బు కోల్పోవడం, ఆరోగ్యం చెడిపోయి హెచ్.ఐ.వి రావడం, ఈ వ్యాధి జీవిత భాగస్వామికి,పిల్లలకు సోకడం మరియు సమాజంలో గౌరవ మర్యా దలను కోల్పోయి, అవమానాల పాలుకావడం తద్వారా జీవిత భాగస్వామి నుండి విడాకులు తీసుకోవడం, మానసికంగా కృంగిపోవడం, అర్థాంతరంగా మరణించడం, అలాగు జీవిత భాగస్వామిని,పిల్లలను అనాథులుగా చెయ్యడం, ఇట్టి ప్రభావం పిల్లలపై పడి, వారు నైతిక విలువలు లేక దారి తప్పి తిరగడం లాంటి మరెన్నో దుష్పరిణామాలు ఉండే ఈ అక్రమ సంబంధాలు అవసరమా??? "వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్పును" హెబ్రీ 13:4. "... వ్యభిచరించి ఒక్క దినముననే 23000 మంది కూలిరి" 1కొరింథీ 10:8. ఒకవేళ మీలో ఎవరైన అక్రమ సంబంధాల్లో ఉన్నట్లయితే, ఇప్పుడే మారుమనస్సు నొంది ఆ పాపములను ప్రభువుయెదుట ఒప్పుకొని విడిచిపెట్టండి. లేనట్లయితే న్యాయాధిపతియైన దేవుని తీర్పు మీ జీవితాల్లోకి, మీ కుటుంబాల్లోకి ప్రభువైన యేసు క్రీస్తు నామములో రాబోవుచున్నది.జాగ్రత్త!

వివాహమై తల్లి, తండ్రి స్థాయిలోవున్న ప్రతి ఒక్కరు ఈ లేఖనాలను తప్పక చదువండి. (సామె: 5,7 అధ్యాయాలు, [simple_tooltip content='20 నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. 21 వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించు కొనుము నీ మెడచుట్టు వాటిని కట్టుకొనుము. 22 నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును. 23 ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. 24 చెడు స్త్రీయొద్దకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను కాపాడును. 25 దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొన నియ్యకుము. 26 వేశ్యాసాంగత్యము చేయువానికి రొట్టెతునక మాత్రము మిగిలియుండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. 27 ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొనినయెడల వాని వస్త్రములు కాలకుండునా? 28 ఒకడు నిప్పులమీద నడిచినయెడల వాని పాదములు కమలకుండునా? 29 తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. 30 దొంగ ఆకలిగొని ప్రాణరక్షణకొరకు దొంగిలిన యెడల యెవరును వాని తిరస్కరింపరు గదా. 31 వాడు దొరికినయెడల ఏడంతలు చెల్లింపవలెను తన యింటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. 32 జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే 33 వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి యెన్నటికిని తొలగిపోదు. 34 భర్తకు పుట్టు రోషము మహా రౌద్రముగలది ప్రతికారము చేయు కాలమందు అట్టివాడు కనికర పడడు. 35 ప్రాయశ్చిత్తమేమైన నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పు కొనడు.']సామె: 6:20-35,సామె: 9:13-18, సామె: 14:1సామె: 30:10-31, 1కొరి7:3-5, ఎఫె 4:32,ఎఫె 5:22-33, కొలొ 3:13, కొలొ 3:18-19, 1తిమో 2:8-14, తీతు:2:5).

 

8. యువత మోసపోకుండా ఉండుటకు 

మరియు

ఆత్మీయతలో ఎదుగుటకు...

 

1) అనుదిన ప్రార్థన: మనం దేవునితో మాట్లాడడం. ఆయన కూడా మనతో సంభాషించడమే ప్రార్థన. కావున ప్రార్థించుట ఏ మాత్రం నిర్లక్ష్యం చెయ్యకూడదు. నేటి క్రైస్తవ యవ్వనస్తులలో అనేకులు మేము - దేవుని ఆజ్ఞను మీరి పాపం చేసాం. కావున ఏలాగు ప్రార్థించగలమనే ఆలోచనలతో అనేకులు కృంగిపోవుచున్నారు.

మనం దేవుని కృపాసింహానమును సమీపించుటకు కృప పొందినవారం: ప్రభువు స్వభావసిద్ధంగా పరిశుద్దుడైనప్పటికి ఆయన కూడా మనం ఎదుర్కొనే శోధనలు ఎదుర్కొన్నాడు. అయితే ఆయన ఏ పాపం చెయ్యక పరిశుద్ధునిగా జీవిస్తూ వాటిని జయించాడు. లేఖనం సెలవిస్తుంది - 'తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడని? సహజంగా మనకు వచ్చే శరీర అనారోగ్య సమస్యలను డాక్టర్ గార్కి సిగ్గుపడకుండా తెలియజేస్తాం కదా! అలాంటిది, మన పరమ వైద్యుడును, మనలను అర్థం చేసుకొని, సహాయం చేసే సామర్థ్యంగల యేసయ్య వద్ద మనమెందుకు మన సమస్యలను, బలహీనతలను, పాపములను చెప్పకూడదు? మనం ప్రభువును సమీపించుటకు ఆయనచేత కృప నొందినవారం కామా? పాపం చేసిన నేను మరియు మన ప్రధాన యాజకుడు (ప్రభువైన యేసుక్రీస్తు) మన ప్రభువుకు ఏలా బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపములేనివాడుగా ఉండెను; తాను శోధింపబడి శ్రమపొందెను గనుక శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృపపొందునట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదము' (హెబ్రీ 2:18, 4:14-15). రండి! మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదము'. ఈ క్షణమే ఆయన కృపా సింహానమువద్ద ప్రార్థిస్తూ చేసిన పాపములను ఆయనతో ఒప్పుకొని విడిచిపెట్టుదాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల మనము అన్యోన్య సహవాసముగలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును” (1యోహా 1:7). 'అతిక్రమములు దాచి పెట్టువాడు వర్ణిల్లడు వాటిని ఒప్పుకొని విడిచి పెట్టువాడు కనికరము పొందును” (సామె 28:13). 'నా దోషమును కప్పుకొనక నీ యెదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతి క్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి యున్నావు” (కీర్తన 32:5). ఒకవేళ మీరు ప్రార్థించి, ప్రభువు నుండి క్షమాపణ పొందుకోలేనట్లయితే శత్రువైన సాతానుకు అవకాశమిచ్చినట్లే! కావున అపవాది మీతో - ఆ రోజు నీవు పాపం చేశావు. కాబట్టి నీవు పాపివి, పాపివని వేధిస్తూనే ఉంటాడు. తద్వారా మీరింకా మానసికంగా కృంగిపోయి, ప్రభువుతో సహవాసం చెయ్యలేరు. ఆ కారణంచేత ఆత్మీయ జీవితములో ముందుకు కొనసాగలేరు. అప్పుడతడు చాలా ఆనందిస్తుంటాడు. కావున మీరు శత్రువుకు అవకాశమివ్వకండి. 'అపవాదికి చోటియ్యకుడి' (ఎఫె 4:27). ప్రభువు పాద సన్నిధిలో అనుదినం ప్రార్థిస్తూ ఆయనతో సహవాసం కలిగి ఉండండి."పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు"(1థెన్స 4:7) .

width="291" height="344" />గమనిక: ప్రభువు తన కృపచేత మనలను క్షమించుట అనేది, మనం తన పరిశుద్ధతలో కొనసాగుటకే కాని, మరల మనం పాపములలో కొనసాగుటకు దేవుడు లైసెన్స్ ఇస్తున్నట్లుగా భావించకూడదు. 'అలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవించుదుము? (రోమా 6:1-2). ప్రభువుచేత క్షమించబడి, స్వస్థతనొందిన వ్యక్తులతో ప్రభువు - ఇక పాపము చేయకుమని (యోహాను 5:14,8:11 ) ఆజ్ఞాపించలేదా?

2) అనుదినం వాక్యమును చదువుట, పరిశీలించుట, కంఠస్తం చేయుట, ధ్యానించుట, అన్వయించుకొనుట: ప్రభువు తన కృపలో మనకు అనుగ్రహించిన యీవులలో శ్రేష్ఠమైంది ఆయన వాక్యం.

చదువుట: దేవుని వాక్యాన్ని ప్రతి దినం చదవడం మన ఆత్మీయ జీవితాలకు ఎంతో అవసరం. పౌలుగారు తిమోతికి ఇలా చెప్పాడు - 'నేను వచ్చువరకు చదువుటయందు...జాగ్రత్తగా ఉండు” (1తిమో 4:13).

పరిశీలించుట: బెరయ సంఘ సభ్యులు దేవుని లేఖనాలను ఎంతగానో పరిశీలించారు. '...ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి (అపొ.కా 17:11). దైవ వాక్యాన్ని కేవలం చదవడం మాత్రమే కాకుండా పరిశీలించడం నేర్చుకోవాల్సిన అవసరముంది.

కంఠస్తం చేయుట: దేవుని మాటలను కంఠస్తం చెయ్యడం వల్ల ఆయన వాక్యం మన మనస్సుపై ప్రింట్ చేసినట్లుగా ఉండే అవకాశముంది. తద్వారా పాపపు తలంపుల విషయమై పరిశుద్ధాత్ముడు లేఖన హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు. కావున తప్పుగా ప్రవర్తించకుండా ఉండగలం.

ధ్యానించుట: కీర్తనకారుడు ఇలా సెలవిస్తున్నాడు - 'యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దివారాత్రము దానిని ధ్యానించాలి (కీర్తన 1:2). వాక్యాన్ని ధ్యానించాలంటే, మొదటగా మనం దైవ వాక్యాన్ని ప్రేమించాల్సినవారమై ఉన్నాం. ప్రభువును ప్రేమిస్తున్నామంటూ ఆయన వాక్యాన్ని చదువకుండా, పరిశీలించకుండా, కంఠస్తం చెయ్యకుండా, ధ్యానించకుండా ఉన్నట్లయితే ప్రభువును, ఆయనిచ్చిన వాక్యాన్ని ప్రేమిస్తునట్లా? దేవుని ప్రేమించేవారు ఆయన మాటల కొరకు దప్పిక కలిగి ఉంటారు. 'యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దివారాత్రము దానిని ధ్యానించుడి.' ఎప్పుడెప్పుడు ధ్యానించమని కీర్తనకారుడు చెప్పుచున్నాడు? దివా రాత్రము. పగలు,రాత్రి దేవుని వాక్యం ముందే కూర్చొనివుంటే, దినంలో చెయ్యాల్సిన పనులు ఎవరు చేస్తారు? అనే సందేహం మనలో అనేకులకుంటుంది. ధ్యానించుట అనేది కన్నులతో చూస్తూ, నోటితో చదివేది కాదు; ధ్యానించుట అనేది మనస్సుతో చేసే పనియైవుంది. కావున ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారైన, విద్యార్థులైన ఏ వయస్సువారైన ప్రతి దినం ఉదయ కాలమైన, సాయంత్ర కాలమైన దేవుని వాక్యాన్ని చదివి, మీ పనులలో మీరు నిమగ్నమైనప్పుడు కూడా దైవ వాక్యాన్ని మనస్సుతో ధ్యానించే అవకాశముంది. ఇది అక్షరాల సాధ్యమైయ్యే పనియైయుంది.దావీదు అంటున్నాడు - 'రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది... ' (కీర్తన 63:4-5).

అన్వయించుకొనుట: దైవ వాక్యాన్ని చదివి, పరిశీలన చేసి, కంఠస్తం చేసి, ధ్యానించినప్పటికి వ్యక్తిగత జీవితానికి అన్వయించుకొనకపోతే అది వ్యర్థమే అవు తుంది. 'ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలి యున్నాడు” (యాకోబు 1:23).

నీ వాక్యమునుబట్టి నేను నడుచుకొనుచుందును' (కీర్త 119:17). 'నేను నీ వాక్యము ననుసరించునట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను' (కీర్త 119:101). 'నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకొనియున్నాను ఇది తుదవరకు నిలుచు నిత్యనిర్ణయము' (కీర్తన 119:112). దేవుని పరిశుద్ధ లేఖనాలను ప్రతి దినం చదువుతూ, పరిశీలన, కంఠస్తం చేస్తూ, ధ్యానిస్తూ, ఆ వాక్యాన్ని జీవితానికి అన్వయించుకొని దాని ప్రకారంగా జీవించుటకు పరిశుద్ధాత్ముడు మనలో కార్యం చేయును గాక!

3) ఒంటరిగా ఉండకూడదు: భక్తుడైన దావీదు ఒంటరిగా ఉన్నవేళ చూడరాని దృశ్యాన్ని చూసి, వ్యభిచార సంబంధమైన శోధనకు తన మనస్సులో చోటిచ్చి, తన శరీరముతో తప్పు చేశాడు (2 సమూ 11:1-27). ప్రియులారా...

* మన యొక్క లీజర్ టైమ్ లో మనము ఎలా ప్రవర్తిస్తున్నాము?

* మన ముందు స్త్రీగాని, పురుషుడుగాని వెళ్ళచున్నప్పుడు మన తలంపులు, చూపులు ఎలా ఉంటున్నాయి?

* మన రహస్య జీవితాలు ఎలా కొనసాగుతున్నాయి? (ప్రసంగి  11:9:,రోమా 6:12-13).

* ఇంటర్ నెట్స్ లో, సెలఫోన్స్ లో నీలి చిత్రాలు చూస్తున్నామా?

ఓదేవా, మమ్మల్ని కడిగి, సరిదిద్దుము.

మనం ఒంటరిగా జీవించే సమయాల్లో పాపం చెయ్యడానికి అవకాశాలెక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయములోనే వాక్యం చదువుట లేదా వినుట, ప్రార్థన చేయుట, క్రైస్తవ గీతాలు పాడడం లేదా వినడం, వాయిద్యాలను వాయించడం లేదా భక్తులు వ్రాసిన మంచి పుస్తకములు చదవడం, ఇంటి పనులలో చెయ్యకుండా మిగిలిపోయినవి ఉన్నట్లయితే వాటిని చేయుటకు ప్రయత్నించాలి. కాని ఖాళీగా ఉండకూడదు.

వివాహంకాని అమ్మాయి, అబ్బాయి సహజీవనం చెయ్యరాదు: నేడు చదువుకునే విద్యార్థులు, వివిధ గవర్నమెంట్, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే యూత్ పిల్లలు, ఉద్యోగస్తులు అబ్బాయి-అమ్మాయి, స్త్రీ పురుషులు కలిసి చెట్టాపట్టాలు వేసుకుంటూ జీవించడం వారికి పెద్ద తప్పుగా అనిపించకపోవచ్చు. అయితే ఎవరైన మీరెందుకు ఇలా జీవిస్తున్నారని ప్రశ్నిస్తే, మేము మా హద్దులు (boundaries) దాటడం లేదని చెబుతున్నారు. లేఖనం చెబుతుంది - 'తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లుగా జాగ్రత్తగా చూచుకొనవలెను గదా! (1కొరి 10:12). మీరు మీ హద్దుల్లో ఉండడం మంచిదే, అయితే, మీ స్నేహితుల మరియు మీతోటి ఉద్యోగస్తుల విషయమేంటి? తామారు వరుసకు అన్నయైనవాడితోనే ఎందుకు మోసపోయిందో మీకు తెలుసా? (2సమూ 13:7- 20 ). ఆమ్నోనుకు తన శరీరం పై, తనకు నియంత్రణ లేని కారణం చేతనే కదా! యోసేపుకు తన దేహంపై నియంత్రణ ఉన్నప్పటికి ఎందుకు పారిపోయాడో, మీకు తెలుసా? (ఆది 39:6-12). పోతిఫర్ భార్యకు తన శరీరంపై, తనకు అదుపులేకపోవడం చేతనే కదా!

మనం మన శరీరాలపై నియంత్రణ కలిగి ఉన్నాము; కాబట్టి ఇతరులు అన్ని సమయాల్లో మనపట్ల వారి ఆధీనములో వారు ఉంటారనుకోవడం పెద్ద పొరపాటే! నా ప్రియ అక్క, అన్న, చెల్లి, తమ్ముడు జాగ్రత్త! 'సాతానుడు గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని ఎదురు చూస్తున్నాడు (1పే తు 5:8). అతడికి మనమెవరం ఆహారం కాకుందుము గాక! మనం పనిచేసే సంస్థల్లో, స్థలాలో, చదువుకుంటున్న కాలేజిల్లో, స్కూల్స్ లో మరెక్కడున్నా, క్రీస్తుతో వ్యక్తిగతంగా సహవాసం కలిగివుంటూ స్త్రీలైతే పురుషులపట్ల, పురుషులైతే స్త్రీలపట్ల వివేకముతో జీవించాలి. సర్వశక్తిగల ప్రభువు మనలను దుష్టుని నుండి, దుష్ట ఆలోచనలు కలిగివున్న ప్రజల నుండి నిశ్చయంగా కాపాడును గాక!

దైవాజ్ఞ: వాక్యం చెబుతుంది - స్త్రీని ముట్టకుండుట నరునికి మేలు (1 కొరి 7:1). అలానే పురుషున్ని ముట్టకుండుట స్త్రీకి మరింత మేలు. ఎందుకనగా, 'ఆదాము మోసపరచబడలేదుగాని, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను” (1తిమో 2: 14). ఈ ముట్టుకోవడం/తాకడం మన శరీరమందు మాత్రమే కాకుండా మన మనస్సులో ఎదుటి వ్యక్తిపట్ల (స్త్రీయైతే పురుషునిపట్ల, పురుషుడైతే స్త్రీపట్ల) మోహసంబంధమైన భావన కలిగి వుండకూడదు. ప్రభువు మనలను సరిచేయును గాక! 'వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా; నేను మీతో చెప్పున దేమనగా- ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయ మందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును” (మత్త 5:27-28).

4) చెడు స్నేహాన్ని విడుచుట: అమ్నోను జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, తాను అకాలంగా మరణించడానికి పరోక్షంగా తన స్నేహితుడైన యెహానాదాబు చేసిన బోధ (ఇచ్చిన సలహానే) ముఖ్య కారణంగా చూడొచ్చు. 'అమ్నోనునకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబూ. 'ఈ యెహోనాదాబు బహు కపటముగలవాడు. అతడు - రాజ కుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా అమ్నోను - నా తమ్ముడగు అబ్షాలోము సహోదరియైన తామారును నేను మోహించియున్నానని అతనితో అనెను. యెహోనాదాబు - 'నీవు రోగివైనట్టు వేషము వేసికొని నీ మంచము మీద పడుకొని యుండుము, నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు - నా చెల్లెలైన తామారుచేత సిద్ధపరచబడిన భోజనము నేను భజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకొనెను” (2 సమూ 13:3-5).

యెహానాదాబు దావీదు అన్నయైన షిమ్యా కుమారుడు. ఇతడు అమ్నోనుకు స్నేహితుడు (ఫ్యామిలీ ఫ్రెండ్). ప్రియులారా, ఈ మానవ సమాజంలో మనకు స్నేహితులుండడం సహజమే; అయితే వారిలో యెహోనాదాబులాంటివారు లేనట్లయితే క్షేమం. ఎందుకనగా, యెహోనాదాబు అమ్నోనుతో నీవు నీ సోదరుని చెల్లిని మోహించడం తప్పు అని అతన్ని గద్దించి, బుద్ధి చెప్పే ప్రయత్నం చెయ్యలేదు? చెడు స్నేహం మనలను దుష్ట క్రియలు చేయుటకు ప్రోత్సాహించేదై వుంటుంది. మంచి స్నేహం మనలోని చెడును దూరం చేసేదై వుంటుంది. 'మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును' (సామె 27:6). ప్రియ యవ్వన సోదరుడా, సోదరీ, మీ స్నేహితులు మిమ్మల్ని మంచికైనా చెడుకైనా ప్రభావితం చెయ్యగలరనే విషయాన్ని మరచిపోకండి. పాపం చేయుటకు వారు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే, ఆ స్నేహాన్ని త్వరగా విడిచిపెట్టడం మంచిదని మీ సోదరునిగా విజ్ఞప్తి చేస్తున్నాను. 'మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరపును” (1 కొరి 15:33). 'మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? (2 కొరి 6:14-15). ఒకవేళ మిమ్మల్ని పాపం చేయుటకు ప్రేరేపించేవారిలో మీ తల్లి-తండ్రి, అన్న-దమ్ములు, అక్కాచెళ్ళెళ్ళు, బంధుమిత్రులు, ఇరుగు పొరుగువారు మరెవరైనా కావొచ్చు. కావున వివేకముతో ఉండండి. వారిచ్చే ప్రేరేపణలు, సలహాలు పరిశీలించి, దైవ వాక్య సారాంశానికి విరోధంగా ఉన్నట్లయితే వాటిని త్రోసిపుచ్చి, ప్రభువుకు లోబడి జీవించండి.

 

ఆలోచించండి!

మీ స్నేహితులు/స్నేహితురాళ్ళు మిమ్మల్ని ఏలాంటి సినిమాలు చూడడానికి ప్రోత్సాహిస్తున్నారు?

స్త్రీలు రోడ్డుపై వెళ్ళుచున్నప్పుడు మీ స్నేహితులు, వారిని ఈవ్ టీజింగ్ చేసేవారిగా ఉన్నారా?

అలా చేయుటకు వారు నిన్ను ప్రేరేపిస్తున్నారా?

- మీ స్నేహితురాలు, పురుషులు కనబడినప్పుడు వారిని ఎలా కామెంట్స్ చేస్తున్నారు?

- ఒకవేళ మీరు కూడా వారితో కలిసి కామెంట్స్ చేయుటకు పురికొల్పబడుచున్నారా?

- ఇప్పటి వరకు మీ స్నేహితులు మిమ్మల్ని చెడు పనులు చేయుటకు ప్రేరేపించిన శాతమెంత?మంచి పనులు చేయుటకు ప్రేరేపించిన శాతమెంత?

-మీరు తప్పుడు ఆలోచనలు కలిగివుండి, చెడు పనులు చేస్తున్నప్పుడు మీ స్నేహితులు/స్నేహితురాలు ఎప్పుడైనా మిమ్మల్ని గద్దించారా?

• మీ స్నేహితులు/స్నేహితురాలు మీకు సరియైన మార్గాన్ని గూర్చి ఎప్పుడైనా చెప్పారా?

ఒకవేళ మీ స్నేహితుల్లో యెహోనాదాబులు ఉన్నారేమో? జాగ్రత్త!

లేనట్లయితే మంచిది. వాక్యం,'పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకుము' (సామె 1:10) అని చెబుతుంది. నైతిక విలువలు పతనమవుతున్న దినాల్లో వున్న మనం - 'మాకు మంచి స్నేహితులను అనుగ్రహించుమని' ప్రభువును ప్రార్థించడం మంచిది. ప్రభువు తన వాక్యములో ఇలా చెప్పుచున్నాడు - దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక (కీర్తన 1:1) అజ్ఞానుల సహవాసము (స్నేహం) చేయువాడు జ్ఞానముగలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును' (సామె 13:20).

చెడు సహవాసము చెయ్యకూడదని పాస్టర్స్/బోధకులు బోధిస్తూవుంటే...

> అందరికి సువార్త చెప్పాలనేది దేవుని ఆజ్ఞనే కదా?

> అన్యులతో స్నేహం చెయ్యకుండా, వారికి సువార్త ఎలా ప్రకటిస్తాము?

> సువార్త చెప్పకపోతే వారేలా రక్షింపబడుతారు?

అనే ప్రశ్నలు నేటి క్రైస్తవ యువత నుండి వస్తున్నాయి. వీటికి జవాబులను వాక్యములో చూద్దాం. క్రైస్తవులముగా చెడు కార్యక్రమాలకు దూరంగా ఉంటూనే, మనతోటి వారికి సువార్తను చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ విషయంలో ప్రభువు మనకు మంచి మాదిరిగా వున్నాడు. ప్రభువు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చునియుండగా ఒక స్త్రీ (ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని వ్రాయబడివుంది.) ప్రభువు పాదముల యొద్ద కన్నీరు కారుస్తూ తన కురులతో ప్రభువు పాదములను తుడిచి, ఆయన పాదములను ముద్దుపెట్టుకొనుట అక్కడున్న పరిసయ్యునికి ఇబ్బంది కలిగించింది. ప్రభువు మాత్రము ఆమె యొక్క పాపములను క్షమించాడు. (లూకా 7:34-50:).

మరో సందర్భంలో 'యేసు - జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను మీ ఇంట నుండవలసియున్నదని చెప్పగా........ అందరు (అక్కడి సమాజం) అది చూచి - ఈయన పాపియైన మనుష్యుని యొద్ద బసచేయ వెళ్లెనని చాలా సణుగుకొనిరి' (లూకా 19:5-7). ప్రభువు పాపులతోనే నివసించాడు కాని ఆయన ఎలాంటి పాపం చెయ్యలేదు. అందుకే హెబ్రీ గ్రంథకర్త ప్రభువును గూర్చి... 'పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా వున్నవాడని (హెబ్రీ 7:26) చెప్పాడు.

ప్రభువు, చెడు ప్రవర్తనతో జీవించేవారిని కలుస్తూ, వారితో మాట్లాడుతూ వారిని జీవమార్గంలోకి నడిపిస్తూ, తనవలె వారు ఈ భూమి మీద జీవించడానికి, మంచి మాదిరిని చూపాడు. ఆ క్రమములో, ఆయన ఏ పాపం చెయ్యలేదు. ప్రభువు చూపిన మాదిరిని బట్టి క్రీస్తును వెంబడించే మనం, వ్యక్తిగతంగా ప్రభువుతో సహవాసం చేస్తూ, ఇతరులతో నరియైన హద్దులు కలిగివుండి, వారితో స్నేహం చేస్తూ, సువార్తను ప్రకటించి, క్రమంగా వారిని గూర్చి ప్రార్థిస్తున్నట్లయితే తప్పక ఏదో ఒక రోజున వారు ప్రభువు రక్షణ మార్గములోకి వచ్చే అవకాశముంది. అయితే నేడు మనం ఏ ఉద్దేశం కలిగియుండి, మన తోటివారితో స్నేహం చేస్తున్నాము?

ఉదాహరణః ఒక క్రైస్తవ యవ్వనస్తుడు తన తోటి విద్యార్థినికి సువార్త చెప్పి, రక్షణ మార్గములోకి నడిపించాలనే ఉద్దేశంతో, ఆమెను పరిచయం చేసుకొని స్నేహం చెయ్యడం ఆరంభించాడు. ఇలా వారి మైత్రి కోనసాగుచూ చివరికి రక్షణ కార్యం కాదు ఆత్మీయ వినాశన కార్యానికి దారి తీసింది. ఎట్లనగా, వారిద్దరి స్నేహం క్రమ క్రమేణ ఇరోస్ ప్రేమ స్థాయికి చేరుకుంది. అక్కడితోనే ఆగిపోకుండా పెద్దల చొరువతో పెళ్ళి దగ్గరకు వచ్చి, తరువాత ఆ క్రైస్తవ సోదరుడు తన భార్య (తోటి స్నేహితురాలిని సంతోషపరుచుటకై తన)తో కలిసి విగ్రహారాధన చెయ్యడం మొదలుపెట్టాడు. ఈ యవ్వనస్తుడు - క్రీస్తు అన్యులను రక్షణ మార్గంలోకి నడిపించుటకై వారితో కలిసి భోజనం చెయ్యడం, వారికి సహాయం చెయ్యడం మొదలగునవి చేసాడు. కాబట్టి నేనెందుకు చెయ్యకూడదని అనుకొని ఉండొచ్చు. అయితే ఎందుకని తాను విగ్రహారాధన వైపు మళ్లించబడ్డాడు? ఈయన తన తోటి విద్యార్థిని రక్షణ కోసం ప్రార్థించడం మానివేసి, ఆమెకు దైవ వాక్యానికి బోధించడానికి (క్రీస్తు ప్రేమను చెప్పుటకు) బదులుగా తానే ఇరోస్ ప్రేమ పాఠాలకు ప్రభావితుడై, చివరికి విగ్రహారాధన వైపు మళ్లింపబడ్డాడు. ఇలాంటి సంఘటనలు నేటి క్రైస్తవ్యంలో అత్యంత వేగంగా జరుగుచున్న ఆత్మీయ వినాశన క్రియగా ఉంది.

గుర్తించాల్సిన విషయం: సువార్త భారం కలిగియున్న యవ్వన సహోదరీసహోదరులు ప్రభువు సిలువ సువార్తను తమ స్నేహితులకు తెలియజేయాలని ఎలాగు ప్రయత్నిస్తున్నారో, అలాగే క్రైస్తవ యువతను చాలా సులువుగా తప్పు త్రోవలో నడిపించుటకై సాతానుడు కూడా అంతకంటే ఎక్కువగా ప్రసవవేదన పడుచున్నాడు. అందులో భాగమే క్రైస్తవ యువతీయువకుల స్నేహితులనే వాడుకొని, విగ్రహారాధన వైపుకు త్రిప్పుటకై అపవాది తీవ్రంగా ప్రయత్నిస్తూ, మోహసంబంధమైన ప్రేమను స్వచ్ఛమైన ప్రేమగా చిత్రీకరిస్తూ అనేకులను మోసగించాడు, మోసగిస్తున్నాడు. ఈ సంగతిని నేటి యావత్తు క్రైస్తవ యువత గ్రహించాలి. '...సాతాను తంత్రములను మనము ఎరుగనివారం కాము' 2కొరింథీ 2:11.

                                క్రైస్తవ యవ్వన సువార్తికులకు(స్టుడెంట్స్ కు) సూచనలుః

 క్రైస్తవ యవ్వనస్తుడు: తన స్నేహితురాలి రక్షణ కోసం ప్రార్థించి, అవసరమైనప్పుడు ఆమెకు దేవుని కల్వరి ప్రేమను గూర్చి చెప్పి ఆ యువతిని మంచి ఆత్మీయ సహోదరీలకైనా లేదా పాస్టరమ్మగారికైనా పరిచయం చేయ్యాలి. ఆ తరువాత తాను తన స్నేహితురాలికి కొంత దూరంగా ఉంటూ, ఆమె రక్షణ నిమిత్తం ప్రార్థించాల్సిన అవసరముంది. ఈ విషయములో...

దైవజనురాలు లేదా ఆత్మీయానుభవముగల స్త్రీలు: ఇతడెందుకని ఈ అమ్మాయిని మాకు పరిచయం చేసాడు? వీరిద్దరి మధ్యలో ఏముంది? అని ఆ యవ్వనస్థునిని దోషిగా చూడక, అతడు సువార్తపట్ల కలిగియున్న భారాన్ని పరిశీలించి, అతనికింకా సువార్త ప్రకటనుగూర్చి సూచనలు ఇస్తూ అతడు నువార్త సేవలో ముందుకు సాగునట్లుగా, ప్రోత్సాహిస్తూ ప్రార్థించడం మంచిది. అలాగుననే...

యవ్వన క్రైస్తవ సోదరి: తన స్నేహితుని రక్షణ కోసం ప్రార్థించి ఆయనకు క్రీస్తు వాక్యాన్ని బోధించిన తరువాత ఆ వ్యక్తిని పాస్టర్ గారికైనా లేదా ఆత్మీయానుభవం కలిగివున్న క్రైస్తవ సోదరులకైనా పరిచయం చేసి, అతన్ని ప్రభువులోకి నడిపించే బాధ్యత వారికప్పగించి, ఆ యవ్వనస్తునికి దూరంగా వుంటూ అతని రక్షణ కోసం ప్రార్థించడం మంచిది. ఆ క్రమములో....

పాస్టర్స్, ఆత్మీయానుభవం కలిగిన సోదరలు: ఆ యవ్వనస్తురాలిని అపార్థం చేసుకోకుండా, ఆమె నూతన ఆత్మలపట్ల కలిగివున్న ఆసక్తిని పరిశీలించి, ఆమె నిమిత్తం ప్రార్థిస్తూ, సువార్త ప్రకటను గూర్చి మెళుకువలు చెప్పడం మంచిది. ఇలాగున యవ్వనస్తులైన అమ్మాయిలు, అబ్బాయిలు వివేకముతో ప్రవర్తించడం వల్ల...

• వ్యక్తిగతంగా మీరు తప్పు త్రోవలో పోకుండా ఉండగలరు.

• మీ స్నేహితులు రక్షింపబడే అవకాశాలుంటాయి.

ఒకవేళ మీరు ఇతరులకు సువార్తను అందించే క్రమములో, మీరు తప్పు మార్గములో వెళ్ళుచున్నట్లు మీ పాస్టర్ కు, పాస్టరమ్మకు, మీతోటి ఆత్మీయులకు తెలిస్తే వారు మిమ్మల్ని క్రీస్తు ప్రేమతో సరిచేసే అవకాశముంటుంది. ఇది మీ ఆత్మీయ జీవితాలకు ఎంతో క్షేమం. కావున కొంత విశాల దృష్టితో ఆలోచించి, మీరు చేసే సువార్త సేవలో మీ తోటి ఆత్మీయులను భాగస్వాములను చెయ్యండి.

గమనిక: తొందరపడి ఆత్మల భారం ఏ మాత్రం లేని దైవజనుడని, దైవజనురాలని పిలువబడే వారికి మీ స్నేహితులను/ స్నేహితురాలిను రక్షణ మార్గములోకి నడిపించుటకు సహాయపడమని చెప్పడం అంత శ్రేయస్కరం కాదేమో! ఇటువంటి పరిస్థితుల్లో ఎలాగు నడుచుకోవాలో పరిశుద్దాత్ముడే మీకు సహాయం చేస్తూ, మిమ్మల్ని సరియైన మార్గములో నడిపించునుగాక!

5) ఆత్మీయ సహవాసము తప్పక కలిగి ఉండాలి: అపో.పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఈ విధంగా చెప్పుచున్నాడు - 'నీవు నీ యౌవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను (Charity) సమాధానమును వెంటాడుము' (2తిమో 2:22). ఇదే వచనమును మనం ఆంగ్ల భాషలో చూసినట్లయితే ఇలా వ్రాయబడింది. Flee also youthful lusts: but follow righteousness, faith, CHARITY (Love), peace, with them that call on the Lord out of a pure heart. పై లేఖన వచనం మనం పరిశీలిస్తే, ప్రేమ అనే తెలుగు పదానికి ఆంగ్లములో 'చారీటి' అని వ్రాయబడివుంది. Charity అనగా? 'ధర్మమ'ని అర్థం. లేనివారికి, అవసరతలోవున్న వారికి సహాయం చేసేదే ధర్మం. ఇది ఆచరణాత్మకమైనది.

ప్రియ మిత్రులారా, దుష్ట మార్గం నుండి, దుష్ట సాంగత్యం నుండి విడుదల పొందుకొనుటకై చాలాసార్లు మనం మన సొంత క్రియలను ఆధారం చేసుకొని ప్రయత్నిస్తుంటాము; కాని క్రీస్తు రక్తములో కడగబడి, శుద్ధహృదయులై జీవించుటకు అహర్నిశలు ప్రయాసపడేవారితో (సంఘసభ్యులతో) సహవాసం చెయ్యలేకపోవుచున్నాము. శరీరసంబంధమైన అపవిత్ర ప్రేమ నుండి విడుదల పొందుకొనుటకు క్రీస్తు సంఘ సహవాసం చాలా అవసరమై వుంది. క్రీస్తు రక్తంలో కడగబడి శుద్ధ హృదయులై జీవించేవారి చెంతకు వెళ్ళి చెయ్యాల్సినవి ఏవనగా ః

నీతి: దైవ లేఖనం చెబుతుంది - నీతిమంతుడు లేడు ఒక్కడును లేడని ... ' (రోమా 3:10). స్వభావసిద్ధంగా పాపులమైన మనలను ప్రభువు తన కృపనుబట్టి రక్షించి, తన పరిశుద్ధ రక్తముతో కడిగి, నీతిమంతులనుగా చేసాడు. ఇట్టి ధన్యతను పొందుకున్న అనాటి క్రీ.శ. మొదటి శతాబ్దపు క్రైస్తవులలో కొందరు, ప్రభువు ఇచ్చిన నీతిని తమ యవ్వనేచ్ఛలతో పాడు చెయ్యకుండ జీవించేవారేమో! కాబట్టియే పౌలుగారు తిమోతిని - క్రైస్తవులతో సహవాసము చేస్తూ నీతిని వెదుకుమని చెప్పాడు. మనము కూడా తిమోతివలె మన సహవాసాలలో క్రీస్తు కోసమై జీవిస్తున్నవారితో కలిసి దైవ సంబంధమైన నీతిని కొనసాగించాల్సిందే!

విశ్వాసం: ఆదిమ సంఘంలో అనేకులు ప్రభువుపట్ల విశేషమైన విశ్వాసాన్ని కలిగి ఉండేవారు. పౌలు తిమోతితో - నీవు వారి విశ్వాసమును వెదకమని సెలవిచ్చాడు. ఈ మాటను మనము వ్యక్తిగతంగా స్వీకరించి క్రీస్తుతోను, సంఘ ప్రజలతో సహవాసం కలిగి ఉంటూ విశ్వాస జీవితములో ముందుకు సాగుదాం.

ప్రేమ: ఆదిమ అపోస్తలుల కాలం నాటి క్రైస్తవులు, క్రీస్తు అగాపే ప్రేమను వారి క్రియల ద్వారా చూపించే ప్రయత్నం చేసేవారు. 'తబిత అను ఒక శిష్యురాలు ఉండెను; ఆమె సత్ క్రియలను ధర్మకార్యములను బహుగా చేసియుండెను. She Was Full Of Good Works AndActs Of Charity (అపో 9:36). మనం పైన చూసాము 2తిమోతి 2:22లో వ్రాయబడి ప్రేమ అనే పదాన్ని ఆంగ్లములో Charity అంటారని. ప్రభువు శిష్యురాలైన తబిత క్రీస్తు ప్రేమను విధవరాండ్రపై చూపించే క్రమములో, చాలా దానధర్మములు చేసింది. నాటి ఆదిమ సంఘంలో మరి కొంతమంది, తమ భౌతిక ఆస్తులను క్రీస్తు సంఘ సభ్యుల క్షేమాభివృద్ధికై ఖర్చు చెయ్యడానికి ఇష్టపడ్డారు (అపొ 2:45, హెబ్రీ 10:34:). బహుశ ఇలాంటివారితో సహవాసం చేయ్యమని అపో. పౌలు తిమోతికి చెప్పి ఉండొచ్చు. మనం కూడా సంఘములోవుండే మన తోటి సోదరి, సోదరులపట్ల శ్రద్ధ కలిగి ఉంటూ, వారిలో ఎవరైనా బీదవాళ్ళుంటే వారికి ఆర్థికంగా మనకు ఉన్న దానిలో నుండి సహాయం చేయ్యాలి. ఈ బాధ్యత మన అందరిపై ఉందని క్రైస్తవ యువత మరచిపోకూడదు. 'దిక్కుమాలిన పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ధైర్యము చెడినవారిని ధైర్యపరచుట, బలహీనులకు ఊతమియ్యుట, మనకు సమయము దొరికినకొలది అందరి యెడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరినవారి యెడలను మేలు చేయుదము” (యాకోబు 1:27, 1థెస్స 5:14, గలతీ 6:10). ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవుని కిష్టమైనవి (హెబ్రీ 13:16). ఈ విధమైన పనులపై నేటి సంఘం, క్రైస్తవ యువత శ్రద్ధ వహిస్తే యవ్వనేచ్ఛల (లోకసంబంధమైన మోసపూరితమైన ప్రేమ)పై ఉండే మనస్సు క్రమ క్రమముగా మారే అవకాశమెక్కువగా ఉంటుంది. కావున సంఘ నాయకులు యవ్వనస్తులను వాక్యం చదువుటయందును, ప్రార్థన చేయుటయందు మాత్రమే కాకుండా ఇలాంటి విషయాల్లో కూడా వారిని ప్రోత్సాహపరుస్తూ, అవసరమైతే క్రీస్తు ప్రేమను వారికి తమ పనుల ద్వారా తెలపాల్సిన అవసరముందని గౌరవనీయులకు విజ్ఞప్తి చేస్తున్నాను. తద్వారా క్రైస్తవ యువత తమ నాయకులను చూసి, వారు ప్రోత్సాహింపబడి ప్రభువు ప్రేమను ఇతరులకు తమ క్రియల చేత చూపుటకు సాహసిస్తారు. 'చిన్న పిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యము తోను ప్రేమింతము' (1యోహ 3:18).

సమాధానం: మనం ఊరికనే పరుల జోలికి పోకుండా సంఘ ప్రజలతోను, ఇతరులతోను సమాధానము కలిగి ఉండాల్సిన అవసరముంది. (1థెస్స 5:13). 'శక్యమైతే మీ చేతనైనంతమట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి” (రోమా 12:18).

6) నమ్మకమైన ఆత్మీయులతో మాత్రమే విషయాలను పంచుకొనుట: క్రీస్తు సంఘంలో యవ్వన సహోదరులైతే తమ బలహీనతలు నమ్మకమైన ఆత్మీయునితో, యవ్వన సహోదరీలైతే నమ్మకమైన ఆత్మీయురాలితో చెప్పుకోవడం (పురుషులు పురుషులతోనే, స్త్రీలు స్త్రీలతోనే వారి వారి సమస్యలను పంచుకోవడం) క్షేమకరం. ఇలా చెయ్యడానికి నేటి క్రైస్తవ యువత చాలా భయపడుతుంటారు. ఎందుకనగా?

మన బలహీనతలు ఇతరులకు తెలిస్తే, వారు మనలను చిన్నచూపు చూస్తారనే భయం. నేటి సంఘములో క్రీస్తు మనస్సును కలిగివున్నవారు చాలా కొద్దిమంది మాత్రమే! ఇది అత్యంత బాధను కలిగించే విషయం. మనలో అనేకులకు,క్రీస్తు రక్తముతో కొనబడిన మన తోటి సహోదరీసహోదరులతో ఎలా ప్రవర్తించాలో తెలియనివారుగా, ఆత్మీయతలో పసిపిల్లలవంటి వారైవున్నారు. కావున ప్రియ యువజనమా, మీ బలహీనతలను ఇలాంటి వారితో చెప్పుకోకండి. వారు మిమ్మల్ని సరిదిద్దుతూ, ధైర్యపరుస్తూ, ప్రోత్సాహిస్తూ, సరియైన మార్గంలో నడిపించడానికి బదులుగా, మీ బలహీనతలను ఇతరులతో చెప్పే అవకాశముంది. తద్వారా ఇతరులు సహితం మిమ్మల్ని నిందిస్తూ, బ్లాక్ మెయిల్ చేయొచ్చు. కాబట్టి ఆత్మీయ పరిపక్వతలేని వ్యక్తులతో మీ బలహీనతలు పంచుకోకండి; అలా పంచుకొని మరింత హృదయవేదనకు గురికాకండి. మిమ్మల్ని అర్థం చేసుకొనేవారితోనే మీ సమస్యను పంచుకొని, వారి ప్రార్థన ద్వారా ప్రభువు, మీ బలహీనతల నుండి విడుదలను,శారీరక, అంతరంగ స్వస్థతను ఇచ్చే అవకాశముంది. 'మీ పాపములు ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలముగలదై ఉండును” (యకోబు 5:16). క్రీస్తులో మన తోటివారి మనఃపూర్వకమైన ప్రార్థన బహుబలంగలదని మరకండి.

కావున ప్రియులారా సమస్యల్లో, ఇబ్బందుల్లో, మానసికంగా కృంగిపోయి, గుండె చెదరిన స్థితిలో వున్న ప్రజల యొక్క వేదనను అర్థం చేసుకొనుటకు ప్రయత్నించండి. బలమైన పట్టణము వశపరచుకొనుట కంటె ఒకని చేత అన్యాయమునొందిన సహోదరుని వశపరచుకొనుట కష్టతరము ” (సామె 18:19). పైకి సంతోషంగా కనిపిస్తున్నప్పటికి అంతరంగ గాయాలతో నిత్యం దు:ఖిస్తున్నవారు మనలో అనేకులున్నారని గుర్తించి ఏడ్చువారితో ఏడువుడి. ఒకనితో నొకడు మనస్సు కలిగియుండుడి” (రోమా 12:16:). కష్టాల్లో వున్నవారు మీతో స్వేచ్ఛగా, నిర్భయంగా మాట్లాడే అవకాశాన్ని వారికి కల్పిచండి. దయతో వారు చెప్పేది విసుగుకోకుండా ఓపికతో వినండి. తరువాత వారితో కలిసి ప్రార్థించండి. మీరు ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మీకు ఏదైనా వాక్యాన్ని లేక ఓ మంచి సంఘటనను జ్ఞాపకం చేస్తే, అది వారితో పంచుకోండి.

గమనించాల్సిన ముఖ్య విషయం: సంఘ సభ్యులు, ముఖ్యంగా యవ్వనస్తులు చాలాసార్లు ఈ విధంగా - 'మన బలహీనతలను, సమస్యలను ఎదుటివారు అర్థం చేసుకొని, మనకు సహాయం చెయ్యాలని మరియు మన రహస్య విషయాలను ఇతరులతో చెప్పకుండ గోప్యంగా ఉంచాలని అనుకుంటారు. ఇలా ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తారు కదా! అయితే మనం...

> సంఘంలో మన తోటివారి బలహీనతలను చూసినప్పుడు, వారిపట్ల ఎలా స్పందిస్తున్నాము?

> వ్యక్తిగతముగా మనము వారిపట్ల క్రీస్తు మనస్సును కలిగివున్నామా?

> వారి తప్పును వారికి ప్రేమతో ఎన్నిసార్లు తెలియచేసాము?

>వారు తమ బలహీనతల నుండి విడుదల పొందుకొనుటకు క్రమముగా ప్రార్థిస్తున్నామా? లేక

>అందరియెదుట వారి గూర్చి హేళనగా మాట్లాడుచున్నామా?

- మనమెన్ని సార్లు మన తోటివారిని అపార్థం చేసుకొని, వార్ని గూర్చి తప్పుడు సమాచారం ఇతరులకు ఇవ్వలేదు?

- మనం ఇతరులును నిష్కారణంగా నిందించిన సందర్భాలు లేవా?

ప్రభువు మనలను సరిచేయును గాక! క్రీస్తు చెప్పాడు - 'మనమేమి ఇతరుల నుండి ఆశిస్తున్నామో అదే మనము వారిపట్ల చేయువారమై ఉన్నాము' (మత్తయి:5:12). ఇతరులు మనలను అర్థం చేసుకోవాలనుకోవడం మంచి విషయమే, అయితే మనం కూడా ఇతరులను అర్థం చేసుకొనుటకు ప్రయత్నించాలి. అలా కాకుండా ఇతరులను త్వరగా అపార్థం చేసుకొని, అందరి యెదుట వారిని ఏ కారణం లేకుండా నిందించడం సాతాను లక్షణమే! (ప్రక:12:10). నేడు మనం ఎలాంటి లక్షణం కలిగివున్నామో స్వపరీక్ష చేసుకోవడం మంచిదేమో!

7) ప్రభువును ప్రేమించుట: కామవాంఛతో కూడిన ప్రేమ (మోహం) నుండి తప్పించుకోవాలంటే ప్రభువును తప్పక ప్రేమించాలి. నేడు మనమెవరిని ప్రేమిస్తున్నాము? ప్రభువునా? ఇతరులనా? లేక వస్తువులనా? అపొ.యోహాను ఈ విధంగా చెప్పుచున్నాడు - 'మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట' (1యోహాను 5:3).

ప్రభువును ప్రేమిస్తున్నట్లు అనుకుంటునే మోసపోవడం: ఎవరైనా 'మీరు ప్రభువుని ప్రేమిస్తున్నారా?' అని ప్రశ్నిస్తే మనలో అనేకులు - 'అవును మేము దేవున్ని ప్రేమిస్తున్నాము. అందుకే చర్చికి (సహవాసముకు) వెళ్ళుచున్నాము, పాటలు పాడుచున్నాను, కానుకలు వేస్తున్నామని చెప్పుతారు. ఈ క్రియలు చెయ్యడం మంచిదే అయితే ఇవి చేసినంత మాత్రాన మనం దేవున్ని సంపూర్తిగా ప్రేమిస్తున్నట్లా? క్రీస్తును ఎరుగనివారు (రక్షణానుభవం లేనివారు) కూడా అప్పుడప్పుడు క్రైస్తవ సమాజములోకి వచ్చి అందరితో కలిసి క్రైస్తవ భక్తిగీతాలు పాడుతూ, అర్పణలు అర్పిస్తారు. ఇలా వారు చేయ్యడం వల్ల ప్రభువును ప్రేమిస్తున్నట్లా? ఆలోచించండి. వాక్యము చెప్పుతుంది - ఆయన ఆజ్ఞలను పాటించడమే దేవున్ని ప్రేమించడమని! ఆయన ఆజ్ఞలు కేవలం కానుకలు సహవాసం కోసం సంబంధించినవి మాత్రమే కాకుండా మరిన్ని ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ లో వ్రాయబడి ఉన్నాయి. అందులో ఏవో కొన్నింటిని చేసి, మనం ప్రభువును ప్రేమిస్తున్నట్లు అనుకుంటూనే భ్రమపరచబడుతూ ఆయనకు విరోధులమై జీవిస్తున్నామేమో. ప్రభువు ఎఫెసు సంఘ దూతతో ఇలా చెప్పుచున్నాడు -నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులులు కాకయే తాము అపోస్తులులమని చెప్పుకొనువారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును, ఇన్ని మంచి క్రియలు ఎఫెసు సంఘముకు ఉన్నప్పటికీ, ప్రభువు - నీ మొదటి ప్రేమను నీవు వదలితివని అంటున్నాడు. ఎఫెను సంఘం దేవునియెడల ఉన్న ప్రేమను విడిచి, ముంచి క్రియలను చేస్తున్నది. ఇది ఆశ్చర్యం. నేటి క్రైస్తవులమైన మనం (యువత) దేవుని కొరకు చాలాసార్లు గొప్ప కార్యములను చేస్తున్నట్లు అనుకుంటూనే మోసపోయే ప్రమాదముంది. నిజానికి మనము ప్రభువును ఇష్టపడుతున్నాము కాని ప్రేమించడము లేదేమో! ప్రభువును ప్రేమించకుంటే ఏమవుతుంది? దైవలేఖనం చెబుతుంది - 'ఎవడైనను ప్రభువును ప్రేమింవకుంటే వాడు శపింపబడును గాక' (190:16:22) అని.

ప్రియులారా, మంచివారిని ప్రేమించడమే కష్టమైన ఈ మానవ సమాజములో ఏ మంచిలేని మనలను స్వభావసిద్ధంగా పావులుగావుండి ప్రభువుకు శత్రువులమై ఉన్నప్పటికీ ఆయన మన నిమిత్తం కలువరిలో తన పవిత్ర రక్తమంతయు కార్చాడు. రోమా 5:6-10:

మనలను మోసం చేసి, వంచనతో ప్రాణాలు తీసేవారిని ప్రేమించే మనం, మనలను తన శాశ్వత ప్రేమతో ప్రేమించి, మన నిమిత్తం ఆ కల్వరి సిలువలో తన రక్తాన్ని చిందించి, ప్రాణాన్ని క్రయధనంగా అర్పించిన ప్రేమాస్వరూపియైన ఆ ప్రభువునెందుకని మనం ప్రేమించకూదదు???

 

 

 

 

 

 

నిన్నే ప్రేమించెదను

పల్లవి: నిన్నే ప్రేమించెదను

మిమ్మల్నే యేసయ్య

పాపాత్ముడనే ప్రాణము నివ్వ

బలహీనుడ నాకై బలియైతివే       ||నిన్నే||

1.నా దు:ఖములో ఆనందమా 

నా ఒంటరితనములో నేస్తమా

నా భయములలో నా ధైర్యమా

నా శత్రువు యెదుట విజయమా  |2||పాపా ||

2.నీవే నా తల్లివి, నీవే నా తండ్రివి,

నీవే నా ఊపిరి,

నీవే నాదు స్నేహమా! |2||

I LOVE U, I LOVE U

I LOVE U, O MY LORD  ||2|| పాపా॥

రచన - పల్లె శాంతిరాజు

ప్రభువును మన నోటి మాటలతోనే కాకుండా క్రియలతోను ప్రేమించుటకు ఆ సర్వశక్తిమంతుడే మనకు సహాయం చేయునుగాక!

నేటి క్రైస్తవ యవ్వనస్తులు తమ వివాహాలకు ముందే ఇతరులతో ఈ ఇరోస్ ప్రేమ మైకంలోకి వెళ్ళకుండా... వివాహమైనవారు ఇతరులతో కలిగివున్న వివాహేతర సంబంధాల నుండి విడుదలను... ప్రభువు తన పరిశుద్ధ నామమును బట్టి అనుగ్రహించును గాక! ఆమేన్.

మూడవ భాగం

9. దావీదు తన కుమారుడైన అమ్నోనును

ఎందుకని మందలించలేదు?

ఈ అంశాన్ని మొదటి ముద్రణలోనే వ్రాయల్సిందిగా పరిశుద్దాత్ముడు ప్రేరేపించినప్పటికి కొన్ని కారణాలను బట్టి వ్రాయలేకపోయాను. ప్రభువు నన్ను క్షమించును గాక! నేను క్రీస్తునందున్న క్రైస్తవ తల్లిదండ్రులకు చెప్పేంతటి వయస్సుగాని, అనుభవంగాని నాకు లేకపోయినప్పటికీ, ప్రభువు కృపలో ఈ పుస్తకం ద్వారా మాట్లాడాల్సి వస్తుంది. కావున నన్ను మన్నించి, చదవండి.

ఈ భూమిపై పిల్లలు జన్మించినప్పటి నుండి వారికి అత్యంత సమీపంగా ఉండేవారు తల్లిదండ్రులే, కావున వారు ఏం మాట్లాడితే అవే మాటలను పిల్లలు మాట్లాడడం, తల్లి గృహాన్ని శుభ్రం చేస్తూ వుంటే గమనించిన కుమార్తె, తన తల్లిని అనుకరించి చీపురుతో ఇంటిని శుభ్రం చెయ్యడానికి ప్రయత్నిస్తుంది. అలాగే తండ్రి ఏదైన పని చేస్తుంటే, చూచిన బాలుడు తన తండ్రి చేసిన పనిని చేయుటకు యత్నిస్తాడు.పిల్లల జీవితాలను వారి తల్లిదండ్రులే అత్యధిక శాతం ప్రభావితం చెయ్యగలరనేది జగమెరిగిన సత్యమే!

అమ్నోను, తామారుల తండ్రియైన దావీదుగారు ఒక సందర్భములో దేవున్ని లక్ష్యము చేయక దైవాజ్ఞకు విరుద్ధముగా ప్రవర్తించాడు. ఊరియా భార్యతో తప్పు చేసాడు. అందుకు ప్రతిఫలంగా ఆమె గర్భవతి అవుతుంది. అప్పుడు రాజైన దావీదు ఆమె భర్తయైన ఊరియాను యుద్ధములో చంపించుటకు పథకము వేసి, హతమగునట్లుగా చేస్తాడు. ప్రవక్తయైన దావీదు చేసిన ఈ పనులను ఆకాశమందున్న న్యాయాధిపతియైన దేవుడు చూసి దావీదుగారిని తనదైన శైలిలో క్రమశిక్షణ చేసే క్రమములో... నీ యింటివారికి సదాకాలము యుద్ధము కలుగును. నీ యింటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును;నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువవాని కప్పగించెదను. (2 సమూ 11:1-27,12:1-15). ప్రభువు దావీదుతో చెప్పినట్లుగానే చేసాడు.

ఇక అంశంలోకి వస్తే. దావీదు తన కుమారుడైన అమ్నోను, తన కుమార్తెయైన తామారుతో చేసిన హేయమైన చర్యనుబట్టి అమ్నోనుపై తగిన క్రమశిక్షణ చెయ్యలేకపోయాడు. కాని రౌద్రం మాత్రం తెచ్చుకున్నాడు. "ఈ సంగతి రాజగు దావీదునకు వినబడినప్పుడు అతడు బహు రౌద్రము తెచ్చుకొనెను” (2 సమూ 13:21).

ఒకవేళ దావీదు అమ్నోనును గద్దిస్తే, తిరిగి అమ్నోను దావీదుతో - నాన్నగారు, మీరెందుకు వేరొక పురుషుని భార్య (బెత్షెబ)తో ఎందుకలా చేసారనిప్రశ్నిం చేవాడేమో! - ఇది నా వ్యక్తిగత ఆలోచన మాత్రమే.

ప్రియమైన క్రైస్తవ తల్లిదండ్రులారా, మనం మన వ్యక్తిగత జీవితాల్లో ప్రభువు ప్రభుత్వాన్ని ధిక్కరించి, దేవుని వాక్య క్రమానికి విరుద్ధంగా ఎప్పుడైతే ప్రవర్తిస్తామో, అప్పుడు మన పిల్లలు మనయెడల అవిధేయులై, వారికి నచ్చిన విధంగా జీవించే అవకాశాలుంటాయి.

కుటుంబ వ్యవస్థలో... మనలో నిత్యం ధూమపానం చేసే తండ్రి, తన కుమారునితో నీవు సిగరెట్టు త్రాగవద్దని ఎలా చెప్పగలడు? ఒకవేళ చెప్పిన తన కుమారుడు వింటాడా? వివాహమైన స్త్రీ, తన భర్తను కాకుండా మరో పురుషున్ని ఆకర్షిస్తూ, ఆ వ్యక్తితో చెయ్యకూడని తప్పు చేస్తే, ఆ స్త్రీ యొక్క కుమారుడు, కుమార్తె వేరొక అమ్మాయిలకు, అబ్బాయిలకు ఆకర్షితులై ప్రేమ ముసుగులో మోసపోరా? ఇతరులను మోసం చెయ్యరా?జారత్వ క్రియల్లో కొనసాగరా? తండ్రి, సినిమాహాల్ లో బ్లూ ఫిలిమ్స్ చూస్తే, కొడుకు/కూతురు స్మార్ట్ ఫోన్లో బూతు బొమ్మలు చూడరా? వారి మనస్సు చెడ్డవాటితో నింపబడి, అపవిత్ర పనులు చెయ్యరా? తండ్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నిత్యం మద్యంమత్తులో ఉండడాన్ని గమనించే ఈ సమాజం అతన్ని హేళన చేసి మాట్లాడుచున్నప్పుడు, ఆ మాటలు వినే తన పిల్లల హృదయాలు ఎంతగా గాయపర్చబడుతున్నాయో, నిత్యం మద్యంమత్తులోవుండే ఓ తండ్రి, నీవెప్పుడైనా ఆలోచించావా?

తల్లిదండ్రులమైన ప్రభువును విశ్వసించి, బాప్తిస్మం తీసుకున్నప్పటికి వ్యభిచారములో కొనసాగే మనమే, తల్లిని గూర్చి ఈ సభ్యసమాజం దుర్భాషలాడుచున్నప్పుడు ఆ మాటలు వినే పసిపిల్లల హృదయాలు తట్టుకోగలవా? వారెంతగా కుమిలి, కృశించి పోతున్నారో రక్షణ సంకల్పంలోకి పాపములో తేలియాడుతున్న ఓ తల్లి నీవు ఎరుగుదువా? తప్పిదములలో జీవిస్తున్న తల్లి తన కుమార్తెకు/కుమారునికి బుద్ధి చెప్పితే, పిల్లలు - మమ్మీ, నీవెందుకు ఫలానా అంకుల్తో................ చేసావని అడుగరా???

ఆదివారమున సంఘ సహవాసానికి వెళ్ళి, వాక్యం విన్నప్పటికీ ఆ దైవలేఖనాలకు ఏ మాత్రం లోబడని తల్లిదండ్రులున్నప్పుడు, వారి పిల్లలెలాగు దేవునియందు భయభక్తులు కలిగి జీవించగలరు? వారెలాగు దేవుని రక్షణ సంకల్పములోకి రాగలరు?

సంఘ పరిచర్యలో... పాస్టర్స్ లో కొందరు, సంఘ సహవాసానికి వచ్చే స్త్రీతో వ్యభిచారం చేస్తే, అది గమనించిన పాస్టర్ కుమారుడు, తన తండ్రి ఎవరితోనైతే తప్పు చేసాడో, ఆ స్త్రీ కుమార్తెతో జారత్వం చేయుటకు ప్రోత్సహింపబడడా? అయ్యో! ఇది ఎంతటి భయంకరం! దైవజనురాండ్లలో కొందరు, సంఘ సహవాసానికి వచ్చే పురుషులతో పాపం చేయుటకై ఫోతిఫర్ భార్యవలె వ్యవహరించడాన్ని ప్రత్యక్షంగా చూసే పిల్లల హృదయాలు తట్టుకోగలవా? ఇలాంటి తల్లులను చూసి,పిల్లలు ఏం నేర్చుకోవాలి? ఆడ పిల్లలు చర్చికి వచ్చే పురుషులతో తప్పులు చేయుటకు ప్రేరేపించబడరా? క్రీస్తునుయెరుగనివారిలో జరుగని హేయమైన క్రియలు క్రైస్తవ సమాజములో జరగడం అయ్యో! ఇది ఇంతటి దౌర్భగ్యం.

ప్రార్థన: మా రహస్య జీవితాలను యెరిగిన ఓ ప్రభువా, మమ్మల్ని నీ కృపచేత క్రమశిక్షణ చేసి, సరి చేయుము. నీయందు భయభక్తులు కలిగి ఉండుట నేర్పించు. మమ్మల్ని నీ మార్గంలో నడిపించు. దేవా నీవు మాకిచ్చిన నీ పిల్లలను నీ త్రోవలో నడిపించుటకు కావాల్సిన జ్ఞానం, ఓర్పును, మాదిరి జీవితాలను దయ చేయుము యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్.

పల్లవి: కృపనీయుమయ్య దేవా మా దేవా

కృపనీయుమయ్య దేవాది దేవా ||2||

అ ప: కూలిన మా జీవితాలను

నీ కోటవలె నుండుటకై  ||2||కృప

||2||కృప

మలినంబైన మా మనస్సులను

1.పవిత్ర పరచుము మా ప్రభువా ||2||

మహిమ గల నీ వాక్యములే

మా మదిలో ప్రవహింపజేయుము ||2||

2.అవకాశములే ఉన్న పౌలు

పాపము చేయక ఉండెగా

అమూల్యమైన నీ మాటలనే ||2||

మా హృదిలో నివసింపజేయుము ||కృప॥


ప్రశ్నలు - జవాబులు

 

ప్రశ్న: పరిశుద్ధ గ్రంథములో దేవుడెందుకు అమ్నోను కథను వ్రాయించాడు?

జవాబు: ప్రజలు, అమ్నోను జీవిత కథను చదువుచున్నప్పుడు, వారు తమ వ్యక్తిగత జీవితములో సరిచేసుకోవాల్సిన విషయాలను సరిచేసుకుంటూ, బుద్ధి కలిగి, నైతిక విలువలతో పరిశుద్ధంగా దేవుని మహిమ కోసమై జీవించాలనే ఉన్నతమైన ఉద్దేశముతోనే ప్రభువు తన భక్తున్ని ప్రేరేపించి ఈ అమ్నోను కథను వ్రాయించి ఉండొచ్చు. పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బుద్ధి కలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి. "ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను” (రోమా 15:4, 1కొరి 10:11).

ప్రశ్న: ఇరోస్ ప్రేమను కలిగి ఉండడం తప్పా?

జవాబు: ప్రియ మిత్రమా, ఈ పుస్తకమందు నేను చెప్పిన విషయాల్లోని సారాంశం మీకేమి అర్థమైంది? ఎవరు ఈ ఇరోస్ ప్రేమను కలిగివుండాలి? వివాహమైనవారు తమ జీవిత భాగస్వామితో మాత్రమే ఈ ప్రేమను కలిగి ఉండాలి. 'భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను' (1కొరి 7:3). అంతేకాని ఇతరులతో వివాహేతర (అక్రమ) సంబంధాలు పెట్టుకోకూడదు. అది దేవుని ఆజ్ఞను మీరి పాపం చెయ్యడమే అవుతుంది.

ప్రశ్న: భార్య-భర్త మధ్య కేవలం ఇరోస్ ప్రేమ ఉంటే చాలా?

జవాబు: చాలదు. సృష్టికర్తయైన దేవుడు, పురుషున్ని స్త్రీని వివాహబంధం ద్వారా వారిని ఒక కుటుంబంగా నిర్మించింది కేవలం, వారు తమ శరీర అవసరాలు లైంగిక కోరికలు తీర్చుకొనుట కొరకు మాత్రమే కాదు. వారు దైవికమైన ప్రేమచేత నింపబడి, ఒకరియెడల మరొకరు పవిత్ర సంబంధముతో జీవిస్తూ, తమయెడల ప్రభువు కలిగివున్న దైవ ప్రణాళికను ఈ భూమిపై సంపూర్తి చేయుటకై సృష్టికర్తయైన దేవుడు వారిని ఒక కుటుంబంగా ఏర్పాటు చేసాడు. లేఖనాలు ఇలా చెబుతున్నాయి - 'పురుషులు తమ భార్యలను ప్రేమింపబద్దులై యున్నారు', స్త్రీలు ప్రభువుకువలె ...సొంత పురుషులకు లోబడియుండుడి' (ఎఫెసీ 5:22-33: ), (కొలొస్స 3:18-20:), (1పేతు 3:1-7:).

ప్రభువుప్రేమ పురుషునిలో ఉన్నప్పుడు స్త్రీని ప్రేమించగలడు. అలాగే స్త్రీలోను దైవప్రేమ ఉన్నప్పుడే పురుషునికి లోబడి ఉండగలదు. ఎట్టకేలకు, ప్రభువే భార్యకు, భర్తకు మధ్యలో కేంద్రమై ఉండగా,వారు పవిత్రమైన ప్రేమ సంబంధాన్ని కలిగి ఉండగలరు. ఇలాగు వారు జీవించాలనేదే దైవ ఉద్దేశం.

ఈ పుస్తకమును చదువుచున్నప్పుడు మీకు వచ్చిన ప్రశ్నలను మాతో పంచుకోగలరు.

Add comment

Security code
Refresh

Comments  

# More insightGeedimatla Srinivas 2020-03-04 20:17
Dear Brother,

This article is very good in conveying the message for the present generation which is much more needed.

Praise God, the insight which God has given to the writer to explain clearly o. Particular types of Love. May the Lord bless.
Reply
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.