బైబిల్ గ్రంథం దేవుడైన యెహోవాను సర్వశక్తిగల సృష్టికర్తగా మనకు పరిచయం చేస్తుంది. ఎందుకంటే ఆయనే ఈ సమస్త సృష్టినీ జీవరాశులనూ మానవులనూ సృష్టించాడు (ఆదికాండము 1,2 అధ్యాయాలు). లేఖనాలలో ఈ సాక్ష్యం మనకు పదేపదే జ్ఞాపకం చెయ్యబడుతుంది. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని దైవగ్రంథంగా భావించే యూదా మరియు క్రైస్తవ మత విశ్వాసులందరూ తమ దేవుడైన యెహోవాను సృష్టికర్తయైన దేవునిగా ఆరాధిస్తుంటారు. అయితే 19వ శతాబ్దానికి చెందిన "చార్లెస్ డార్విన్" అనే ప్రకృతి శాస్త్రవేత్త Beagle అనే ఓడలో ప్రయాణం చేస్తూ "Galapagos" అనే ప్రదేశానికి చేరుకుని అక్కడ తాను చూసిన పక్షులలో గమనించిన మార్పులను బట్టి "జీవపరిణామ సిద్ధాంతం" (Biological Evolution Theory) ను ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ సృష్టిలో జీవులన్నీ ఒకదానినుండి మరొకటి వాటంతట అవే పరిణామం చెందుతూ విస్తరించాయి. మనిషి కూడా అలానే ఉద్బవించాడు. దీనినే "ప్రకృతి వరణ సిద్ధాంతం" (Theory of Natural Selection) అంటారు.
డార్విన్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ "The Origin of Species" అనే పుస్తకాన్ని రాయగానే అప్పటి నాస్తికులంతా ఎంతో సంబరపడి, దేవుడు లేడనే తమ వాదనకు బలమైన ఆధారంగా ఈ సిద్ధాంతాన్ని ప్రయోగిస్తూ యూదా, క్రైస్తవ మరియు ముస్లిం మతస్తులను కలవరపెట్టడం ప్రారంభించారు. ఇప్పటికీ చాలామంది నాస్తికులు పనిగట్టుకుని మరీ ఈ ప్రచారం చేస్తున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే నాస్తికులందరూ ఎంతగానో సంబరపడుతున్న ఈ జీవపరిణామ సిద్ధాంతం (Biological Evolution Theory) సత్యమని ఇప్పటికీ Science (Genetics) పరంగా నిర్థారించబడలేదు. దీనిగురించి మనం Science లో "థియరీలకూ" మరియు "లా" లకూ ఉండే తారతమ్యాన్ని అర్థం చేసుకోవాలి.
Scienceలో "థియరీలు" అనేవి కేవలం అభిప్రాయాలను బట్టో లేక కేవలం కొన్ని పరీక్షల ఆధారంగానో ఏర్పడుతుంటాయి, అవి నిజం కావొచ్చు, కాకపోవచ్చు కూడా. కానీ అదే Scienceలో కాదనలేని సత్యంగా రుజువైనదానిని "లా" (నియమం) అంటారు (ఉదాహరణకు; Newton's 1,2,3 laws). డార్విన్ "జీవపరిణామ సిద్ధాంతం" ఇప్పటికీ కేవలం ఒక "థియరీ"నే తప్ప "లా" కాదు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, డార్విన్ ఈ "జీవపరిణామ సిద్ధాంతాన్ని" ప్రతిపాదించేసరికి జన్యుపరమైన పరీక్షలు అందుబాటులోకి రాలేదు. కాబట్టి అతను ఏదో ఒక Science Lab లో కూర్చుని సుదీర్ఘమైన పరీక్షలు చెయ్యడం ద్వారా కాకుండా కేవలం "Galapagos" అనే ప్రదేశానికి చెందిన పక్షులలో గమనించినటువంటి మార్పులను బట్టే ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అందుకే Science పరంగా ఈ సిద్ధాంతానికి కచ్చితమైన ఆధారాలు లేకపోగా, దానిలో ప్రాముఖ్యమైన లోపాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి గుర్తించిన సుమారు 1200 మంది శాస్త్రవేత్తలు "Dissent from Darwin" అనే నినాదంతో ఈ సిద్ధాంతానికి వ్యతిరేకంగా సంతకాలు చేసారు. మీరు ఆ PDFను Download చేసుకుని ఆ శాస్త్రవేత్తల గురించి వివరంగా తెలుసుకోవచ్చు.
ఇప్పుడు ఈ సిద్ధాంతంలో ఉన్న ప్రధానమైన లోపం గురించి చూద్దాం
Scienceలో జన్యుపరమైన పరీక్షలు (Genetics) అందుబాటులోకి వచ్చాక "నియో డార్వినిజం" అనేది ఏర్పడి, డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని రుజువు చెయ్యడానికి చాలా ప్రయాసపడింది. ఎందుకంటే Scienceలో జన్యుపరమైన పరీక్షలు (Genetics) అందుబాటులోకి వచ్చాక జీవులలో పరిస్థితుల ప్రభావంగా జన్యువులు పరిణామం చెందడం వాస్తవమని నిర్థారించబడింది. దీనినే "మైక్రో ఎవల్యూషన్" అంటారు, ఐతే ఇది కేవలం ఒకే జాతి జీవులలో జరిగే ప్రక్రియ. ఉదాహరణకు; పక్షులకు మునుపటికంటే ముక్కులు పొడవుగా మారడం, కష్టతరమైన పనులు చేసేవారి కండరాలు బలంగా తయారవ్వడం, వారికి పుట్టే పిల్లలు కూడా అవే బలమైన దేహాలను సంతరించుకోవడం లాంటి మార్పులు. కానీ డార్విన్ "జీవపరిణామ సిద్ధాంతం" ప్రకారం ఒకే జాతి జీవుల్లో మార్పులు సంభవించడం కాదు కానీ ఆ జీవులు ఒక జాతి నుండి మరో జాతికి పరిణామం చెందాలి. ఉదాహరణకు; పక్షులు పక్షుల్లా కాకుండా మరో జీవుల్లా మార్పు చెందాలి, మనిషి మనిషిలా కాకుండా మరో జీవిగా పరిణామం చెందాలి. ఎందుకంటే జీవులన్నిటికీ ఒకే ఉమ్మడి పూర్వికుడు (Common Ancestor) ఉందనేది, ఆ ఒక్క జీవే పరిణామం చెందుతూ ఆయా జీవులుగా విస్తరించిందనేది డార్విన్ యొక్క వాదన, అదే అతని సిద్ధాంతానికి ఆయువుపట్టు.
ఈవిధంగా జీవులు ఒక జాతి నుండి మరోజాతికి పరిణామం చెందడాన్ని Science (Genetics) లో "మేక్రో ఎవల్యూషన్" అంటారు. ఇది ఇప్పటికీ రుజువు కాలేదు. "మైక్రో ఎవల్యూషన్" అంటే ఒకే జాతి జీవులలో జన్యుపరమైన మార్పులు సంభవించడం. "మేక్రో ఎవల్యూషన్" అంటే జీవులు ఒక జాతి నుండి మరో జాతికి పరిణామం చెందడం. ఈ తారతమ్యాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. డార్విన్ చెప్పినటువంటి జీవపరిణామ సిద్ధాంతం వాస్తవమని మనం అంగీకరించాలంటే Science ప్రకారం "మైక్రో ఎవల్యూషన్" కాదు "మేక్రో ఎవల్యూషన్" సత్యంగా రుజువు చెయ్యబడాలి. కానీ ఆ విధంగా జరగలేదు (జరగదు కూడా). అయినప్పటికీ చాలామంది నాస్తికులు డార్విన్ "జీవపరిణామ సిద్ధాంతం" Science ప్రకారం పూర్తి సత్యమంటూ Scienceపై అవగాహన లేని ఆస్తికులను దేవుడు లేడని మోసగిస్తుంటారు. ఈ భావజాలాన్ని "డార్వినిజం" అని కూడా పిలుస్తుంటారు.
ఈ భావజాలానికి సంబంధించినవారు డార్విన్ థియరీపై సంధించబడుతున్న "మేక్రో ఎవల్యూషన్" ఆరోపణ నుండి తప్పించుకోవడానికి, ఈ "మేక్రో ఎవల్యూషన్" జరగడానికి లక్షల సంవత్సరాలు పడుతుందని, అందుకే దానిని రుజువు చెయ్యలేకపోతున్నామని చెబుతుంటారు. ఇంతకూ అలా జరుగుతుందని, జరిగిందని దేనిని బట్టి అలా నమ్ముతున్నారో ఆధారాలు మాత్రం చూపించలేరు. అలా జరిగిందని, జరుగుతుందని వీరికెలా తెలుసు? పోని ప్రస్తుత జీవులన్నీ పరిణామం చెందాయంటే, ప్రారంభ జీవులకూ ఇప్పటిజీవులకూ మధ్యస్థమైన శిలాజాలు (Fossils) ఎక్కడున్నాయి? ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్న త్రవ్వకాలలో అలాంటి మధ్యస్థమైన జీవియొక్క శిలాజం ఒకటి కూడా ఎందుకు లభించలేదు? "మేక్రో ఎవల్యూషన్"ను జన్యుపరంగా ఎలాగూ రుజువు చెయ్యలేకపోతున్నారు, కనీసం అలాగైనా రుజువు చెయ్యాలిగా? ఎందుకు చెయ్యలేకపోతున్నారు?
డార్విన్ థియరీపై సంధించబడుతున్న ఈ ప్రధానమైన ప్రశ్ననుండి తప్పించుకోవడానికి "Smith Woodward" అనే సైంటిస్ట్ చాలా తెలివిగా ఒక నకిలీ శిలాజాన్ని కల్పించి, అది Ape (తోక లేని కోతి) మనిషిగా పరిణామం చెందుతున్ననాటి మధ్యస్థమైన శిలాజం (పుర్రె) అని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసాడు. దానిని "Piltdown Man" అంటారు. కానీ కొద్దికాలంలోనే అది నకిలీది అనీ, "Smith Woodward" డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని రుజువు చెయ్యడానికి పన్నిన కుట్ర అనీ సులభంగా తేలిపోయింది. డార్విన్ "జీవపరిణామ సిద్ధాంతం" కేవలం ఊహాజనితమైనది కాబట్టే, దానిని రుజువు చెయ్యడానికి "Smith Woodward" వంటి కొందరు శాస్త్రవేత్తలు నకిలీ శిలాజాలను కల్పించి, కుట్రలు పన్నవలసి వచ్చింది. అది సత్యమైతే ఇలాంటి తంటాలు వారికి లేకపోను పాపం. దీనికి సంబంధించిన ఆధారాలను పరిశీలించండి.
ఇప్పటివరకూ నేను వివరించిందే కాకుండా ఈ "ఎవల్యూషన్ థియరీ" లో అడుగడుగునా (ప్రారంభ మెట్టు నుంచి) మరెన్నో సమస్యలూ, ఊహాజనితమైన ఆలోచనలూ మనకు దర్శనమిస్తుంటాయి. ఉదాహరణకు "missing link" అనేది ఈ థియరీని మరింత బలహీనంగా, ఊహాజనితంగా చేస్తుంది. విషయం ఇప్పటికే అర్థమైంది కాబట్టి ప్రస్తుతం నేను ఇవేమీ వివరించుకోదలచుకోలేదు. ఆసక్తి ఉన్నవారు Google చేసి వాటి గురించి కూడా వివరంగా తెలుసుకోగలరు.
సామెతలు 21:30 యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు.
చివరిగా; ఈ సమస్త సృష్టివెనుకా, జీవరాశుల వెనుకా సృష్టికర్తయైన దేవుడు ఉన్నాడనేది, ఆయనే క్రమబద్ధంగా, సంక్లిష్టమైన డిజైన్ తో ఈ జీవులను (మనిషితో సహా) సృష్టించాడనేది సత్యం (ఆదికాండము 1,2 అధ్యాయాలు). అసలు నిర్జీవం నుండి జీవం ఎలా ఉద్భవించింది? జీవుల్లోకి సంక్లిష్టమైన డిజైన్ ఎలా వచ్చింది? జీవుల్లో ప్రేమ, మనుషుల్లో మంచిచెడుల విచక్షణ ఎందుకుంది? ఈ ప్రశ్నలకు డార్వినిస్టులు/ఎవల్యూషనిస్టులు కానీ, మరెవరైనా కానీ "ఖచ్చితమైన ఆధారాలతో" సమాధానం ఇవ్వగలరా? ("ఖచ్చితమైన ఆధారాలతో" అని ఎందుకంటున్నానంటే ఎవల్యూషనిస్టులు ఈ ప్రశ్నలలో కొన్నింటికి ఇస్తున్నటువంటి సమాధానాలు సైన్స్ నియమాల పరిధిలో కూడా ఖచ్చితమైన ఆధారాలతో లేవు). వాటంతట అవే వచ్చేసాయి, వాటికి అవే అలా పరిణామం చెందిపోయాయి అంటే సరిపోతుందా? అలా మాట్లాడితే బుద్దిహీనులు అంటారు. అందుకే బైబిల్ గ్రంథం ఈ సృష్టి వెనుక దేవుడు లేడు అనేవారిని బుద్దిహీనులు అంటుంది.
కీర్తనలు 14: 1 దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయినవారు అసహ్యకార్యములు చేయుదురు. మేలుచేయువాడొకడును లేడు.
ఆదియందు దేవుడు ఈ సమస్త జీవారాశులనూ సంక్లిష్టమైన డిజైన్ తో సృష్టించాడు. నిర్జీవమైన పదార్థంలోకి జీవాన్ని పంపించి, జీవులను జీవింపచేసాడు (ఆదికాండము 1:20-22, 2:19). మనిషిని ఆయన తన పోలిక తన స్వరూపంలో సృష్టించాడు (ఆదికాండము 1:26,27, 5:1,2). లేఖనాల ప్రకారం; దేవునిపోలిక, దేవుని స్వరూపం అంటే, ఆయనయొక్క నైతిక గుణలక్షణాలు మరియు సృజనాత్మకత అని అర్థం (ఆదికాండము 1:26,27 వ్యాఖ్యానం చూడండి ). ఆ దేవునిపోలిక, దేవుని స్వరూపాన్ని బట్టే ప్రతీమనిషీ మంచిచెడుల విచక్షణను, లేక మనస్సాక్షిని కలిగియున్నాడు. అందుకే అబద్ధం చెప్పడం అనేది అన్ని దేశాల్లోనూ, అందరు మనుషుల్లోనూ తప్పిదం. నరహత్య చెయ్యడం అనేది అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని తెగల్లోనూ నేరం. అందరు మనుషుల్లోనూ సహజంగా ఉన్న ఈ స్పృహ (విచక్షణ) దానంతట అదే పుట్టుకురాలేదు, ఎందుకంటే మరేజీవిలోనూ ఈ స్పృహ లేదు. సృష్టికర్తయైన దేవుని పోలిక ఆయన స్వరూపాన్ని బట్టే మనిషికి అది సంక్రమించింది. మనిషి తన పాపస్వభావం కారణంగా ఆ నైతిక గుణలక్షణాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడేమో కానీ, ఏది మంచి ఏది చెడు అనే విచక్షణను మాత్రం కోల్పోలేదు.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.