దుర్బోధలకు జవాబు
రచయిత: జి. బిబు

 

పరిచయం

ఇది ఎవరినీ తప్పు పట్టడానికి చేసిన రచన కాదు. ఎవరు దేవుని బిడ్డలు ఎవరు కాదు అని తీర్పు తీర్చడానికి ఉద్దేశించినది అంతకంటే కాదు. ఆ మాటకొస్తే, దేవుని బిడ్డలు కానివారికి ఈ అంశంతో సంబంధమే లేదు. రక్షణ లేనివారు క్రిస్మస్ చేసుకుంటే ఏంటి, మానేస్తే ఏంటి? యేసుక్రీస్తుతో  ఎలాంటి వ్యక్తిగత పరిచయం లేనివారు కూడా ఎంతో హంగూ, ఆర్భాటంతో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. బయట స్టార్, లోపల బార్ - ఇదీ వారి తీరు! మరోవైపు యేసుక్రీస్తు దైవత్వాన్ని, పరిశుద్ధాత్ముని దైవత్వాన్ని, వాక్యం బోధించే త్రిత్వసత్యాన్ని తూలనాడే ఎన్నో అవాంతర శాఖలకు చెందినవారు క్రిస్మస్ జరుపుకోరు. కాబట్టి క్రిస్మస్ చేసేవారందరూ భక్తిపరులు కాదు, మానేసేవారందరూ నిజాయితీపరులు కాదు. అయినంత మాత్రాన ఈ అంశాన్ని మనం వాక్యానుసారంగా పరిశీలించకూడదు అని భావించడం సరికాదు. ముఖ్యంగా క్రిస్మస్ వాక్యానుసారం కాదని ప్రాథమిక బైబిల్ అవగాహన ఎవరినైనా  ఒప్పించగలదు. కానీ ఆ వాస్తవాన్ని  కప్పిపుచ్చి, మనస్సాక్షికి  సర్దిచెప్పుకునే  కొన్ని సాకులు దేవునిబిడ్డలు కూడా చెబుతుంటారు. ఆ సాకులకు కూడా వారు సమర్థించాలని  చూసే  ఈ  పండుగ లాగే  ఎలాంటి  వాక్యాధారమూ  లేదని, అవి  నిజానికి  వారి  నిజాయితీని  ప్రశ్నార్థకంగా చేసే  సాకులని  బహిర్గతం  చేసే  ఉద్దేశంతో  ఈ  చిరువ్యాసాన్ని  మీ  ముందు  ఉంచుతున్నాను. ఈ  వివాదానికి  సంబంధించిన అన్ని  కోణాలు  విస్తారంగా  పరిశీలించటం  ఈ  వ్యాసంలో  వీలుపడదు. కానీ  కేవలం  సాధారణంగా  వినిపించే  కొన్ని సాకులను  మాత్రమే  ముఖ్యంశాలుగా  పేర్కొని, వాటిని  పరిశీలించే  కొన్ని  తలంపులను  ఇక్కడ  క్రోడీకరించాను. మరింత లోతైన  పరిశీలనతో  పాటుగా  స్వపరిశీలనకు  కూడా  ఇది  కొందరినైనా  ప్రేరేపిస్తుందనే  ప్రార్థనతో  ఇది  మీ  ముందు  పెడుతున్నాను.

సాకులు - సమాధానాలు

1) ఇది చాలా చిన్న విషయం

"క్రిస్మస్ వాక్యానుసారమా?" ఈ ప్రశ్నను చులకన చేస్తూ చాలామంది ఇది అసలు చర్చకే నోచుకోనంత చిన్న విషయం అన్నట్లు మాట్లాడతారు. అంత హడావిడి పెట్టించే విశ్వవ్యాప్తమైన ఈ పండుగ చాలా చిన్న విషయమని గుర్తించటానికైనా ఈ ప్రశ్న దోహదపడినందుకు సంతోషం. కాని చిన్నదా ,పెద్దదా అన్నది కాదు, వాక్యానుసారమా, కాదా అన్నది ఇక్కడ ప్రశ్న. ఎంతో భక్తి పారవశ్యంతో చేసుకుంటామని, అందరిలా లోకానుసారంగా కాకుండా యథార్థ ఆరాధనాభావంతో జరుపుకుంటామని, సువార్త చెప్పటానికి ఇదొక సదవకాశమని సమర్థింపులు చెప్పుకునే ఈ మహత్తర దినాన్ని వాక్యానుసారమైన పరిశీలన నుండి తప్పించటానికి మాత్రమే చాలా చిన్నది చేసేయటం క్రిస్మస్ సమర్థకులకు అన్యాయంగా తోచదా? అలా తోచకపోయినా పర్వాలేదు. మీరన్నట్లే దీనిని చాలా చిన్న విషయంగానే ఉండనిద్దాం. అలా అయినా దానికి కొంత ప్రాధాన్యత చేకూరుతుంది. ఎందుకంటే చిన్న చిన్న విషయాలలో నమ్మకంగా ఉన్నామో, లేదో తెలుసుకుంటే, పెద్ద పెద్ద విషయాలలో ఎలా ఉంటామో వేరే చెప్పనవసరం లేదట. ఈ నియమాన్ని నేర్పించింది స్వయంగా మన ప్రభువే ( లూకా 16:10 ). అయినా, ఒక అంశంతో పోల్చుకున్నప్పుడు మరో అంశం ప్రాధాన్యతలో చిన్నది అవ్వొచ్చేమో కాని, దానికదే ఏదీ చిన్నది కాదు. చేసుకున్నప్పుడు లేని చిన్నతనం, పరిశీలించే దగ్గరే రావటం చిత్రమేమీ కాదు. ఎందుకంటే దేనినైనా పరిశీలించాలనే ప్రతిపాదనను చులకన చేయటానికి అంతకంటే సరళమైన పద్ధతి వేరొకటి లేదు. కాని మనం మాత్రం, అన్నిటినీ పరిశీలించి, మేలైనదానిని చెప్పట్టాలనే లేఖనానుసారమైన బాధ్యతను ఎప్పుడూ శిరసావహించాలి ( 1థెస్సలొనికయులకు 5:22).

అయితే నిజానికి ఈ అంశం చిన్నదేమీ కాదు. ఇక్కడ సమస్య క్రిస్మస్ ఒక్కటే కాదు. ఇది ఆరాధనా నియామాలకు సంబంధించిన సమస్య. దేవునిని ఎలా ఆరాధించాలో తీర్మానించాల్సిన అధికారం ఆరాధన పొందే దేవునిదా లేదా ఆరాధన అర్పించే మానువుడిదా అనే ప్రశ్నకు బైబిల్ లో ఒకే సమాధానం లభిస్తుంది. ఆ అధికారం దేవునిది మాత్రమే. దేవుడు నియమించిన ఆరాధనావిధులను మానవుడు ఆచరించాలి. మానవకల్పిత ఆరాధనలను ఎంత యథార్థంగా అర్పించినా దేవుడు వాటిని ఆమోదించడు, అంగీకరించడు. కయీను మొదలుకొని  (ఆదికాండము 4:5-7)
ఉజ్జా వరకు (2 సమూయేలు 6:6)  నమోదు చేయబడిన ప్రతి మానవకల్పిత ఆరాధనకథనాలు ఈ పాఠాన్నే నేర్పిస్తున్నాయి. కొత్త నిబంధన కూడా ఇదే నియమాన్ని ఎత్తి పట్టుకున్నదని స్పష్ఠం ఔతుంది ( మత్తయి 15:6-9  మత్తయి 28:20 అపొస్తలుల కార్యములు 2:42 2 థెస్సలొనీక 2:15) . కాబట్టి క్రిస్మస్ తో సహా దేవునికి ఆరాధనగా చేసే ప్రతి చర్యను, వాక్యపు వెలుగులో తప్పక పరిశీలించాలి. 'దేవునిని ఆరాధించటం ఆషామాషీ కాదు, చాలా గంభీరమైనది, దేవుని ఆమోదం దానిపై ఉండాలి, అది ఆయన అంగీకరించాలి' అని ఒప్పుకునేవారెవ్వరూ ఇలాంటి పరిశీలిన అనవసరమైందని కాని, అత్యాసక్తి అని కాని లేదా ప్రాధాన్యత లేనిదని కాని భావించరు.

2) అన్నీ బైబిల్లో  ఉంటాయా?

సమర్థకులూ, విమర్శకులూ అందరు ఒప్పుకొని తీరాల్సిన ఒక వాస్తవమేమిటంటే క్రిస్మస్ అనే ఆచారం అపోస్తలీయ సాంప్రదాయంలో భాగం కాదు. అది వాక్యపు ఆజ్ఞ లేదా అపోస్తలీయ మాదిరి వల్ల స్థాపించబడలేదు. అందుకు భిన్నంగా, అపోస్తలీయకాలం అంతరించిన కొన్ని వందల సంవత్సరాల తరువాత సంఘంలోనికి ప్రవేశించిన ఒక ఆచారం. అది సరే కానీ, మనం చేసేవన్నీ బైబిల్లో ఉంటాయా? పళ్ళు తోముకోవాలని బైబిల్లో ఎక్కడుంది అని ప్రశ్నించి, వెకిలి నవ్వులు నవ్వి కొందరు క్రిస్మసుకు వాక్యాధారం లేకపోవటం అంత గంభీరమైన సమస్యేమీ కాదని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేస్తారు. అయితే, దేవుడు చెప్పిన విధంగానే కాలకృత్యాలు తీర్చుకోవాలనే నియమం ఎక్కడా లేదు కానీ, దేవుడు చెప్పని విధంగా ఆరాధించకూడదనే నియమం మాత్రం వాక్యంలో మొదటి నుండీ కనిపిస్తుంది. కాబట్టి, క్రిస్మస్ అనే ఆచారానికి వాక్యాధారం ఉందా అని అడగటానికి, పళ్ళు తోముకోవటానికి వాక్యాధారం ఉందా అని హేళన చేయటానికి చాలా తేడా ఉందని గమనించే విజ్ఞత కొరకు మొదట ప్రార్థన చేసుకోవాలని మనవి.

3) ఇది ప్రభువును జ్ఞాపకం చేసుకోటానికి కదా!

అయినా ఈ పండుగ ప్రభువు మన కోసం వచ్చిన సంగతిని జ్ఞాపకం చేసుకోటానికే కదా, అలా జ్ఞాపకం చేసుకోవటం కూడా తప్పేనా అన్నది చాలామంది యథార్థంగా అడిగే ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకు జవాబు రెండు మూడు కోణాలలో విశ్లేషించుకోవటం అవసరం. మొదటిగా, తనను ఎలా జ్ఞాపకం చేసుకోవాలో ప్రభువే ఆజ్ఞాపించిన ఒక పద్ధతి వాక్యంలో ఉంది ( లూకా 22:20). అది ఆయనను జ్ఞాపకం చేసుకోవటానికి సరిపోకపోతే వేరొక పద్దతిని కూడా అదనంగా కనిపెట్టాలి. కానీ ఆయనే స్వయంగా ఎన్నుకున్న పద్ధతి చాలదు అనుకోవటం కంటే విడ్డూరం ఇంకొకటి ఉండదు. రెండవదిగా, ఆయన పుట్టుకదినం బైబిల్ ఆధారంగా నిర్ధారించుకునే వీలు ఉన్నప్పటికీ, ఎలాంటి వాక్యాధారమూ లేని డిసెంబర్ 25ను ప్రభువు జననదినంగా ఎన్నుకోవటం వెనుక కారణం ఏంటి? ఆ చరిత్ర ఎవరికి తెలీదు? అన్యాచారాలకు క్రైస్తవభావాలు పులిమి క్రైస్తవ్యాన్ని కలుషితం చేసిన అనేక రోమన్ కాథలిక్ కసరత్తులలో భాగంగానే అన్యదేవతలకు ఆచరించిన శీతాకాలపు సోల్స్టిస్ వేడుకలను యేసుక్రీస్తు జననోత్సవంగా సంఘంపైన రుద్దటం జరిగిందని ఏ ఎన్సైక్లోపీడియా చూసినా తెలుస్తుంది. అన్యులు తమ దేవతలకు చేసినట్లు మీరు నాకు చేయకూడదనే ఖండితమైన ఆజ్ఞను బేఖాతరు చేస్తూ ( ద్వితీయోపదేశకాండం 12:30-31), వారు తమ దేవతకే చేసుకున్నారేమో కానీ నేను మాత్రం యేసుప్రభువు కొరకు దానిని మార్చుకుంటానని నిర్ణయించే హక్కు బైబిల్ ఏ వ్యక్తికీ, ఏ సంఘానికీ ఇవ్వలేదు. మూడవదిగా, తేదీ ఒక్కటేనా లేక ఈ కథంతా కల్పితమేనా అనే అనవసరమైన అభ్యంతరానికి తావిచ్ఛే ఈ అబద్దం కొనసాగటానికి పారంపర్యాచారం తప్ప వేరే కారణం ఏమీ లేదు. పారంపర్యాచారాలకు కొమ్ము కాస్తూ దేవునివాక్యం నిర్వీర్యం అవ్వకుండా చూడటం ఎవరికి సాధ్యం? (మత్తయి 15:6-9).

 4) నా పుట్టిన రోజు జరుపుకుంటున్నప్పుడు ప్రభువు పుట్టినరోజు జరుపుకోకుండా ఎలా ఉండగలను?

అదంతా కాదు, నా పుట్టిన రోజు జరుపుకుంటున్నప్పుడు నా ప్రభువు పుట్టినరోజు జరుపుకోకుండా ఎలా ఉంటాను అని కొందరు భావోద్రేకంతో స్పందిస్తారు. 25 డిసెంబరున ఆయన పుట్టకపోయినా ఎదో ఒక రోజు పుట్టాడు కదా, అది ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటే తప్పేంటి అంటారు. ఇది న్యాయమైన వాదనగానే కనబడినా, ఇది కూడా క్రిస్మస్ సమర్థనకు వాడే యథార్థత లేని ఇతర సాకులవంటిది మాత్రమే. ఆయన పుట్టినరోజే జరుపుకోవాలనుకుంటే, దానికి రోమన్లు నియమించిన ఒక అన్యాచార పండుగ దినాన్నే పట్టుకొని వేలాడాల్సిన అగత్యమేమీ లేదు. ఎందుకంటే ఆ తేదీ పూర్తిగా ఒక క్రైస్తవేతర నేపథ్యం నుండి సంఘంలోనికి చొరబడింది. దానికంటే ఎంతో కొంత వాక్యాధారమున్న వేరొక రోజును ఆయన పుట్టినతేదీగా నిర్ధారించుకునే సమాచారం బైబిల్ మనకు అందిస్తుంది. పూర్తి వివరాలు కాకపోయినా, ఆ తేది కనుక్కోవటానికి ఏ దిశగా పరిశీలన చేయాలో కొన్ని విషయాలు సూచిస్తాను.

జెకర్యా అబీయా తరగతిలో తన యాజకధర్మాన్ని నిర్వర్తిస్తున్న సమయంలో దూత ఆయనకు ప్రత్యక్షమై బాప్తిస్మమిచ్చు యోహాను పుట్టుక విషయం తెలియజేశాడు (లూకా 1:5). 24 తరగతులుగా విభజించబడిన యాజకుల తరగతులలో అబీయా తరగతి ఎనిమిదవది ( 2 దినవృత్తాంతములు 24:7). యూదుల క్యాలెండర్ని మన క్యాలెండరుతో పోల్చి చూసినప్పుడు అబీయా తరగతి ఆలయంలో పరిచర్య చేసేది జూన్ నెలలో ఔతుందని ఎక్కువ పరిశీలన అవసరం లేకుండానే తెలుసుకోవచ్చు. జూన్ నెలలో ఎలిజబెత్ గర్భవతి ఐతే , అప్పటినుండి ఆరు నెలల తరువాత మరియ గర్భం ధరించింది. అంటే డిసెంబర్ మాసంలో మరియ గర్భవతి ఔతే, ఆ తరువాతి సంవత్సరం సెప్టెంబర్/అక్టోబర్ నెలలో మన ప్రభువు పుట్టుండాలి. సరిగ్గా ఇదే సమయంలో ఇశ్రాయేలీయుల పర్ణశాలల పండుగ జరుగుతుంది. ధర్మశాస్త్ర ఆచారాలు యేసుకు ముంగుర్తులని మనకు తెలుసు. లోకపాపమును మోసుకొనిపోయే దేవుని గొర్రెపిల్ల, ఆయన మరణానికి ముంగుర్తుగా ఉన్న పస్కా పండుగనాడే వధింపబడేలా నియమించిన దేవుడు, ఇమ్మానుయేలుగా మనుష్యులతో తన గుడారాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ఏతెంచాల్సిన దినం గుడారాల పండుగకు నిర్ణయించాడని భావించటం వాక్యసమ్మతమైన తర్కమే.

మన భక్తిశ్రద్ధలు నిజానికి ప్రభువు పుట్టుక మీదే అయితే, అన్యఆచారాలను క్రైస్తవీకరణ చేసిన తేదిని పక్కన పెట్టి, ఎంతో కొంత వాక్యాధారం ఉన్న పర్ణశాలల పండుగ సమయాన్ని యూదుల క్యాలెండరు నుండి తెలుసుకొని ఆయన జనన వేడుకను అప్పుడు ఎందుకు జరుపుకోకూడదు? ఏ దినమైతే ఏముంది అంటారని నాకు తెలుసు! కానీ, అది తేదీ నిర్ధారించలేని పరిస్థితుల్లో చెప్పుకునే సాకు కదా! ప్రస్తుత క్రిస్మస్ దినానికి లేని వాక్యాధారం మరో దినానికి ఉన్నప్పుడు కూడా అలాంటి సాకులు చెబితే, అది చిత్తశుద్ధికి సంబంధించిన సమస్య ఔతుంది. యేసుప్రభువు పుట్టుక 25 డిసెంబర్ ఆచారాన్ని నిలబెట్టడానికి కారణం కాదు, కేవలం ఒక సాకు మాత్రమే అన్నమాట!

అయితే, ఇదొక వాదన కోసం ప్రస్తావించిన వాస్తవమే తప్ప నిజానికి ఒక కొత్త పండుగ దినాన్ని సెప్టెంబర్ మాసంలో ప్రారంభించమని నా ఉద్దేశం కాదు. ఎందుకంటే ముందు నేను చెప్పిన విధంగా, ప్రభువు బల్ల ఆయనను జ్ఞాపకం చేసుకోవటానికి చాలినది. దానితో పాటుగా ఒక సంవత్సరీకం కూడా అవసరమయ్యుంటే ప్రభువే దానిని సంఘంలో నియమించి ఉండేవాడు. కాని ప్రభువు పుట్టినరోజు చేసుకోకపోతే నీ పుట్టినరోజు చెసుకోలేకపోతున్నావన్నది నీ సమస్య అయితే, ఎవరో పుట్టినరోజును ఆయనకు ఆపాదించకుండా, ఆయన పుట్టినరోజునే  జరుపుకోవటం కొంతైనా నిజాయితీ అనిపించుకుంటుంది. రేపు కృష్ణాష్టమిని యేసు ప్రభువు జననదినంగా మార్చేస్తామంటే అది క్రీస్తు ఔన్నత్యాన్ని కళంకం చేయటం అవ్వదా? దానికి నిరసనగా మనం ప్రతిఘటించమా? అయినా ప్రభుత్వానికున్న అధికారంతో అది సంఘంపై రుద్దేస్తే, రెండు మూడు తరాలు గడిచిన తరువాత  అదో ఆచారంగా స్థిరపడి అలవాటైపోతుంది. తప్పేముంది, ప్రభువుకే కదా, అయినా మనమేమైనా కృష్ణుడికి చేస్తున్నామా, అసలు మనకు ఆ ఆలోచనే లేదు, అలాంటప్పుడు ప్రభువు మన ఉద్దేశాన్నే చూస్తాడు కదా  అనే సమర్థనలు అప్పుడు కూడా వినిపిస్తాయి. క్రిస్మస్ కూడా సరిగ్గా ఇలాగే సంఘంలోనికి చొరబడి స్థిరపడింది. అందుకే, నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావన్నది కాదు, నువ్వు చేస్తున్నది అన్యాచార పద్దతా, లేక ప్రభువు నియమించిన ఆరాధన పద్దతా అనేది ఇక్కడ ప్రశ్న. అందుకే ప్రతి ఆచారానికీ ఉన్న ఆవిర్భావ నేపథ్యాన్ని కప్పిపుచ్చటానికి యథార్థత, ఉద్దేశం, భక్తిశ్రద్ధలు లాంటి సాకులు సరిపోవు. 

5) అన్ని దినాలు దేవుడు సృష్టించినవే కదా!

కొందరు ఇలా అంటారు: ఆదివారం కూడా సూర్యదేవుని ఆరాధనకు ప్రతిష్టించిన రోమన్ ఆచారమని మనందరికీ తెలుసు. వారు ఆదివారాన్ని అలా దుర్వినియోగం చేసినంత మాత్రాన మనం ఆ దినాన్ని వాడుకోమా?  అన్ని దినాలు దేవుడు సృష్టించినవే. ఏ దినాన్నైనా ఆయనకు ఆరాధన దినంగా ప్రతిష్టించుకోవచ్చు. వారు చేశారని మనం మానేయటమేమిటి? ఇది చాలామంది న్యాయంగా అడిగే ఒక ప్రశ్న.

అయితే ఒక ఆరాధన దినం ఎందుకు ఆవిర్భవించిందని పరిశీలించే అవసరత గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాము. ఆదివారాన్ని ప్రభువు పునరుత్థానాన్ని ఆధారం చేసుకొని అపోస్తలీయ కాలం నుండి "ప్రభువు దినము" అని గుర్తించారు (మార్కు16:9 యోహాను 20:19 26 అపో.కా. 20:7 1 కొరింథీయులు 16:2 ప్రకటన 1:10) . ఆదిమ సంఘం అన్యులను ఆకర్షించటానికి వారి ప్రతిష్ఠిత దినానికి క్రైస్తవ కారణాలను ఆపాదించలేదు కాని, ఆదివారాన్నే ప్రత్యేకంగా ప్రతిష్టించటం వెనుక వాక్యాధారమైన కారణం ఉంది. అన్యుల పండుగ దినాన మనం ఆరాధించకూడదన్నది విషయం కాదు. వారి పండుగనే క్రైస్తవీకరణ చేసిన చరిత్రేదైనా ఉంటే, దానితో నిలబడి దానిని ఆమోదించొద్దని మాత్రమే అంటున్నాను. క్రైస్తవ కారణం ఉండటానికి, క్రైస్తవీకరణ చేయటానికి చాలా తేడా ఉంది.

6) ప్రభువు హనోక పండుగకు వెళ్ళాడు కదా?

కొందరు ఇలా అంటారు: అంటియోకస్ ఎపిఫనేస్ అనే గ్రీకు అధిపతి యెరూషలేము ఆలయాన్ని అపవిత్రం చేసిన తర్వాత, తిరిగి ఆ ఆలయాన్ని యూదులు దేవునికి ప్రతిష్ఠించిన దినాన్ని ప్రతీ సంవత్సరం ఒక పండుగగా జరుపుకోవాలని అప్పటి యూదుల నాయకుడైన జూడాస్ మక్కబియస్ నియమించాడు. ఒకసారి ప్రభువు కూడా ఈ వార్షికోత్సవానికి వెళ్ళాడని వాక్యంలో చదువుతున్నాము (యోహాను 10:22). ఇది దేవుడు నియమించిన పండుగ కాకపోయినా ప్రభువు అందులో పాల్గొంటే తప్పు కానప్పుడు మనం ఆయన పుట్టినరోజు జరుపుకుంటే ఎందుకు తప్పు? ఐతే, పైన ప్రశ్నకు చెప్పిన జవాబే ఇక్కడ కూడా సరిపోతుంది. దేవుడు చేసిన ఏ మేలునైనా  జ్ఞాపకం చేసుకుని ఆయనకు కృతజ్ఞత చెల్లించవచ్చు. ఆయన సన్నిధిలో ఆనందంతో పండుగ చేసుకోవచ్చు ( కీర్తనలు 26:12 35:18).  కృతజ్ఞతాకూడికలకు వాక్యామోదం ఉందని ఎస్తేరు గ్రంథంలో కూడా వారు జరుపుకున్న పూరీము పండుగను ఆధారంగా తీసుకోవచ్చు ( ఎస్తేరు 9:26-28) . కానీ క్రిస్మస్ ఆ విధంగా ఆవిర్భవించిన ఆచారం కాదు. వేరొక దేవతకు చేసే పండుగ దినాన్ని క్రైస్తవులుగా కొనసాగించటానికి ఒక క్రైస్తవ సాకుగా క్రీస్తు పుట్టుకకు ఆ దినాన్ని తగిలించారు. పూరీము పండుగ కానీ హనోక పండుగ కానీ నిజంగా దేవుడు ఒక మేలు చేసిన దినం జ్ఞాపకం చేసుకోవటానికి నియమించబడిన కృతజ్ఞతా వార్షికోత్సవాలు కాగా , క్రిస్మస్ క్రీస్తు పుట్టుక ముసుగులో కొనసాగించబడుతున్న 'సోల్స్టిస్' సంబరాలు మాత్రమే.

7) బైబిల్ రచయితలు అన్యుల ఆలోచనలు వాడుకున్నారు కదా!

ఇది నేటి కుహనా మేథావులు కొందరు, ఏమీ తెలియని సామాన్యులకు నేర్పించే ఒక కొత్త సాకు. బైబిల్ రచయితలు అన్యుల ఆలోచనలను తమ సిద్ధాంతాలు వ్యక్తపరచటానికి వాడుకున్నారని, కాబట్టి అన్యుల పద్దతులు సువార్త కోసం వాడటం అంత పెద్ద సమస్యేమీ కాదన్నది వీరి సలహా. వారు చెప్పే ఉదాహరణలలో మచ్చుకొకటి పరిశీలిస్తే, వారిని నేను కుహానా మేథావులనటం న్యాయమే అని మీరు కూడా ఒప్పుకుంటారు. "ఆదియందు వాక్యముండెను..." (యోహాను 1:1). ఇక్కడ "వాక్యం" అనేది గ్రీకుల "లోగోస్" నుండి యోహాను అరువు తెచ్చుకున్నాడని, అన్నిటిని సృష్టించిన "లోగోస్" గురించి గ్రీక్ తత్వవేత్తల రచనలలో కనిపిస్తుందని, ఆ ఆలోచననే ఇక్కడ యోహాను వాడుకున్నాడని వీరు నేర్పిస్తుంటారు. అయితే ప్లేటో లాంటి గ్రీక్ తత్వవేత్తలు తమ "లోగోస్' గురించిన అవగాహనను యూదుల 'తార్గుముల'(Targums) నుండి గ్రహించారని మాత్రం వీరు మనకు చెప్పరు. నుమినిస్ అనే ఒక పైథాగరన్ తత్వవేత్త, ప్లేటోను దేవుని గురించి, ఈ లోకాన్ని గురించి తనకున్న ఆలోచనలన్నీ యూదుల రచనలలో నుండి దొంగిలించినవే అని ఆరోపిస్తూ "ప్లేటో గ్రీకులో మాట్లాడే మోషే కాదా!!" అని హేళన చేసేవాడట. యూజబిస్ అయితే, ప్లేటో ఎక్కడెక్కడ నుండి యూదుల ఆలోచనలు సేకరించాడో కూడా నిరూపించాడు. కాబట్టి, యూదుల లేఖనాలు, వాటిపై ముందే రాయబడిన వ్యాఖ్యానాలు ఆధారంగా యోహాను ఈ "వాక్య" సిద్ధాంతాన్ని చెప్పాడే తప్ప అన్యుల వద్ద అరువు తెచ్చుకున్నది కానే కాదు. ఇలాంటి మేథావులు చూపించే ఇతర సందర్భాలను కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే, అన్యుల పద్దతులను క్రైస్తవీకరణ చేయొచ్చనటానికి వారు ఎంత వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నారో మనకర్థం ఔతుంది. పాండిత్య ధోరణిలో వినిపిస్తున్నంత మాత్రాన వారి మాటలకు మోసపోవద్దు సుమా!

8) ఇది క్రైస్తవ స్వేచ్ఛకు సంబంధించిన విషయం

ఇంకొందరు ఇది క్రైస్తవస్వేచ్ఛకు సంబంధించిన విషయంగా పరిగణించి, అలాంటి స్వేచ్ఛను అనుమతిస్తూ రోమా 14లో ఒకడు ఒక దినం ఆచరిస్తాడు, ఇంకొకడు ఆచరించడు, దీని విషయమై తీర్పు తీర్చొద్దని పౌలు అన్నాడు కదా అని వాదిస్తారు. అయితే ఇది యూదులకు దేవుడే పాత నిబంధనలో నియమించిన పండుగ దినాల విషయంలో చెప్పబడిన మాట తప్ప, అన్యుల పండుగ దినాలను క్రైస్తవీకరణ చేసి వాడుకునే స్వేచ్ఛకు సంబంధించిన విషయం కాదు. అలా దేవుని ధర్మశాస్త్ర విరుద్ధమైనదేదీ ఆత్మపూర్ణుడైన ఒక అపొస్తలుడు చెప్పలేదు. కాబట్టి క్రిస్మస్, ఈస్టర్, తదితర బైబిలేతర పండుగ దినాలకు రోమా 14లో చెప్పబడిన స్వేచ్ఛను ఆపాదించాలని చూడటం, మన పంతం నెగ్గటానికి వాక్యాన్ని దుర్వినియోగపరచటమే కాగలదు.

9) సువార్త చెప్పటానికి మాత్రమే

ఇదంతా నిజమే, మాకు కూడా ఈ పండుగ దినంతో సంబంధమేమీ లేదు, కేవలం సువార్త ప్రకటించటానికి మాత్రమే ఇదంతా చేస్తున్నామని ఇంకొందరు మాట్లాడతారు. సువార్త అన్ని సమయాలలోను ప్రకటించాలి. అయితే, సంఘ ఆవిర్భావం మొదలుకొని మొదటి ౩౦౦ సంవత్సరాలపాటు ఎలాంటి మానవకల్పిత ఆచారాల సహాయం లేకుండానే సువార్త పరిచర్యను ఎంతో విజయవంతంగా చేసిన క్రైస్తవ్యానికి, ఆ తరువాత ఇలాంటి ఒక పండుగ సహాయం ఎందుకు కావలసి వచ్చిందో ఎందుకు ఆలోచించరు? 1 సమూయేలు 15లో యెహోవా నిషేధించినవాటినే ఆయనకు అర్పించే నెపంతో కొన్నిటిని తెచ్చుకున్న సౌలు ఆలోచనకూ, దేవుడు ఆమోదించని పద్దతులను దేవుని పరిచర్యనే అడ్డంపెట్టుకొని సంఘంలోనికి ప్రవేశపెట్టే నేటి సువార్తికుల ప్రయత్నాలకూ ఎలాంటి వ్యత్యాసం లేదు. అలాంటివాటికి అప్పుడైనా ఇప్పుడైనా దేవుని స్పందన మాత్రం మారదు (1 సమూయేలు 15:22-23)
సువార్త పరిచర్యకు మానవకల్పిత పద్దతుల సహాయం అవసరం లేదు. కాని ఆ పండుగలు కాపాడుకోవటానికి మాత్రం సువార్త సాకు అవసరమే!!

10) క్రిస్మస్ మానేయకపోతే మనం పరలోకం పోమా?

ఈ ప్రశ్నకు బహుశా నా పరిచయ వాక్కుల్లోనే మీకు సమాధానం లభించి ఉండాలి. ప్రతిదీ పరలోకానికి, నరకానికి ముడిపెట్టి ఆలోచించటం కేవలం అపరిపక్వతకు సూచన. ఆ మాటకొస్తే, ఏదైనా చేయటాన్ని బట్టి కాని, ఏదైనా మానేయటం బట్టి కాని మనం నీతి సంపాదించుకోలేము. అలా సంపాదించుకోగలం అనుకునేవారికి అసలు సువార్తే అర్థం కాలేదు. యేసుప్రభువు సిలువపై చేసిన కార్యం తప్ప నన్ను పరలోకానికి తీసుకెళ్ళే నీతికార్యం ఏదీ లేదు. అయితే, అన్ని విషయాలలోనూ ఏది ప్రభువుకు ప్రీతికరమని పరిశీలించేది పరలోకానికి వెళ్ళటానికి కాదు, వెళుతున్నాం కాబట్టి అని దేవుని బిడ్డలకు తెలుసు.

11) ఎవ్వరికీ లేని జ్ఞానోదయం మీకే కలిగిందా?

ప్రపంచవ్యాప్తంగా అందరూ చేసుకుంటున్న ఈ పండుగ వాక్యానుసారం కాదని నీకు మాత్రమే తెలిసిందా? పెద్ద పెద్ద దైవజనులు కూడా చేసుకుంటుంటే నువ్వు వారికంటే గొప్పవాడివా? - ఇవి ఇంకొందరి ఆక్షేపణలు. ఐతే సంఘసంస్కరణ ప్రారంభమైన కాలం నుండి కూడా ఈ పండుగ ఒక రోమన్ కాథలిక్ ఆచారంగా గుర్తించి, ఖండించి, నిషేధించినవారు (దైవజనులు) ఎందరో ఉన్నారు. 16వ శతాబ్దంలో అమెరికాలోని ప్యూరిటన్ కాలనీలలో క్రిస్మస్ ఆచారాన్ని నిషేధించి శిక్షించే చట్టాలు కూడా తయారు చేసుకున్నారు. మొన్న 1957వ సంవత్సరం వరకు కూడా ఆ నిషేధ చట్టం స్కాట్లాండ్ దేశంలో కొనసాగింది. 'ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్' అని పేరు గడించిన చార్లెస్ స్పర్జన్ లాంటి నమ్మకమైన సేవకులందరూ క్రిస్మస్ ఆచారానికి తమ నిరసన వ్యక్తం చేశారు. కాబట్టి నేను మాత్రమే క్రిస్మస్ కు వ్యతిరేకం అని ఆరోపించడం సరికాదు. ఐనా వాదన కోసం నేను మాత్రమే అనుకుందాం; నేను చెప్పింది వాక్యానుసారమే ఐనా, నేను మాత్రమే చెప్పాననే సాకుతో దానిని తిరస్కరించడం ఎంతవరకూ న్యాయమో మీరే ఆలోచించుకోండి.

12) నలుగురూ ఏమనుకుంటారు?

ఇదంతా నిజమే కానీ మా ఇంట్లో అర్థం చేసుకోరు, మా బంధువులు ససేమీరా ఒప్పుకోరు, నా స్నేహితులు వింతగా చూస్తారు, వారికోసమైనా నేను కొన్ని చేయక తప్పదు అని అంటారు ఇంకొంతమంది. మనం సువార్త చెప్పి, ఒక అన్య మతస్తుడు దానికి విధేయుడవ్వాలని, అతని బంధుమిత్రులు ఏమనుకున్నా, అదంతా సత్యం కోసం చెల్లించే మూల్యమని తెగ హడావుడి చేసే మనం, మన ఇంటివరకూ వచ్చేసరికి ఏ మూల్యమూ చెల్లించమా? ఇది తప్పించుకోవటానికే కదా నేను మొదట చెప్పినట్లు ఇదేదో చాలా చిన్న విషయమని చులకన చేస్తుంటారు? అన్యుల నుండి పెద్ద పెద్ద సమర్పణలు, తెగతెంపులూ కోరే మనం, ఇంత 'చిన్న' విధేయతలో రాజీపడిపోతున్నామా? ఔనులే, మనకు మూల్యం చెప్పటమే కానీ చెల్లించటం అలవాటు లేదుగా!! ఇతరులకు బోధించటం తర్వాత సంగతి. ముందు మనం విధేయత చూపించడం నేర్చుకుందాం. అలా చేయటానికి దేవుని కృపపై ఆధారపడదాం.

  ముగింపు

అన్యుల ఆచారాలను నిషేధించి (యిర్మీయా 10:2). వారు తమ దేవతలకు చేసినట్లు నాకు చేయొద్దని ఖచ్చితంగా ఆంక్షలు విధించి (ద్వితీయోపదేశకాండం 12:30-31), తాను ఆజ్ఞాపింపని ఆరాధనాపద్దతులను అన్యాగ్నిగా పరిగణించి (లేవికాండం 10:1-2), పారంపర్యాచారాలు తన వాక్యాన్ని నిరర్ధకం చేసి మన ఆరాధనను వ్యర్థమైనవిగా చేస్తాయని హెచ్చరించి (మత్తయి 15:6-9) , తాను ఆజ్ఞాపింపని పద్ధతుల విషయంలో తన చిత్తాన్ని ఇంత స్పష్టంగా బయలుపరచిన దేవుని మాటను కాదని, ఎవరి కోసం చేస్తున్నావు ఇదంతా? నాకొద్దని దేవుడు చెప్పిందే ఆయనకు సమర్పించటం ఆరాధించటం కాదు, ఆక్షేపించటం, అవమానించటం ఔతుంది. నీ స్నేహితుడు పదేపదే వద్దన్నదే ఆయనకు బహుమతిగా తీసుకువేళ్తే అతడు సంతోషిస్తాడా? ఒకసారి తెలియక చేసావేమో అనుకుంటాడు, రెండవసారి ఆటపట్టిస్తున్నావేమో అనుకుంటాడు, కాని సంవత్సరానికి రెండు మూడు సార్లు అలాగే చేస్తూ, ప్రతి సంవత్సరం అదే చేస్తున్నావంటే దానిని ఎలా అర్థం చేసుకుంటాడు? ప్రభువు నిషేధించినవి చేస్తూ, ఆయన చేయమన్నవి చేయకపోవటం నేటి క్రైస్తవ్యానికి పరిపాటి. నిజానికి ప్రభువు ఆజ్ఞాపించిన సంగతులే ఆయన శిష్యులు నేర్చుకోవాలని (మత్తయి 28:20) , అవి అపోస్తలీయ మాధ్యమం ద్వారా తెలుపబడిన విధులు మాత్రమే అని (2 థెస్సలొనీక 2:15)  వాక్యం స్పష్టంగా ప్రకటిస్తుంది. అవి మాత్రమే నమ్మకంగా చేయటానికి దేవుని కృపను వేడుకుందాం.

 

Add comment

Security code
Refresh

Comments  

# RE: క్రిస్మస్ సాకులు - క్రైస్తవ సమాధానాలుNaresh 2020-12-24 15:53
Thank you anna. For your info regarding this.
Thank you so much for your ministry . Please do many more like this . We need. Christ centred gospel.
May God bless you. Team.
Reply
# Great explanation.LP Babu 2020-12-24 18:26
Thanks hithabodha team for your hardwork for His glory alone.
Reply
దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.