ఆడియో
దేవుడు సువార్త ద్వారా మానవులను వారి పాపాలనుండి రక్షించాలని కోరుకుంటున్నాడు. అయితే ఆ సువార్తను మనుష్యులు నమ్మడం లేదు. "మా విస్తారమైన పాపాలు అంత సుళువుగా పోతాయా!" అనే అపనమ్మకాలలో వారు ఉంటున్నారు. అయితే వారికి సువార్త సత్యాన్ని ఈ క్రింది కథ చక్కగా చూపిస్తుంది.
ఒక పట్టణంలో గొప్ప ధనవంతుడు ఒకడు ఉండేవాడు. అతని ఇంట్లో చాలామంది పేదలు అద్దెకు ఉంటున్నారు. వారు అతనిదగ్గర ఒక పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. కానీ తమ పేదరికం చేత వారు ఇంటి అద్దెలు కానీ కౌలు సొమ్ము కానీ సకాలంలో చెల్లించలేకపోవడాన్ని బట్టి కొన్నాళ్ళకు అవి పెద్ద ఋణాలుగా తయారయ్యాయి. అలా బకాయిపడినవారందరూ ఆ ధనవంతుడికి ప్రామిసరీనోట్లు రాసి ఇచ్చారు.
ఇలా ఉండగా ఆ ధనవంతుడు ప్రభువును రక్షకునిగా నమ్మి దేవుని ప్రేమను రుచి చూసాడు. తానుకూడా ఇతరులను ప్రేమించి వారి పట్ల దయతో వ్యవహరించాలనే సంకల్పం అతనిలో కలిగింది.
కాబట్టి వెంటనే అతనికి తనవద్ద బాకీపడిన పేదలు, పేద రైతులు గుర్తుకువచ్చారు. వారికి సహాయం చేసే ఉద్దేశంతో అతను ఒక పథకాన్ని తన మనస్సులో రూపొందించుకున్నాడు.
"ఫలానా రోజు ఉదయం 10 గం॥ నుండి 12 గం॥ వరకూ కింద సంతకం చేసిన వారు (ధనవంతుడు) అతనికి బకాయిపడిన వారందరి ఋణాలనూ రద్దు చేయాలి అనుకుంటున్నారు. బాకీదారులు స్వయంగా అతని ఆఫీసులో హాజరై తమ కష్టాలను చెప్పుకుని ఋణ విమోచన పొంది తమ ప్రామిసరీ నోట్లు రద్దుపరచుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము" అని ప్రకటనలు రాయించి, కింద సంతకం చేసి తన ఎస్టేటులో ఆయా స్థలాల్లో వాటిని ఉంచాడు. ఈ వార్తకు ఆ పట్టణంలో పెద్ద కోలాహలం చెలరేగింది. ఏ నోట విన్నా ఇదే మాట.
బకాయిదార్లు- "ఇది నిజమా? వాస్తవంగా మన ఋణం కొట్టివెయ్యబడుతుందా? ఆయనవరకైతే ఆయన మాట తప్పనివాడే కాని, ఇంత డబ్బును ఊరకే వదలుకుంటాడా? ఇది జరుగుతుందా? ఇదంతా బూటకం" అనుకున్నవారు కూడా లేకపోలేదు.
ఆ రోజు రానే వచ్చింది. సరిగ్గా 10 గం॥లకు ధనవంతుడు, ఆయన గుమస్తా కలసి ఆఫీసులో ప్రవేశించారు. బయట బకాయిదార్లు అసంఖ్యాకంగా నిలబడి ఉన్నారు. మళ్ళీ బయట తర్జనభర్జనలు. ఒకవేళ లోపలికి వెళ్తే నవ్వులపాలు ఔతామేమో అనే భయం కొందరిని ఆవరించింది. ఎవరి మట్టుకు వారు ఎవరైనా ఒకరు లోపలికి వెళ్ళి ఋణవిమోచన పొందివస్తే ఆ తర్వాత మేము వెళ్ళవచ్చు అనుకుంటున్నారు. కానీ ఎవరూ వెళ్ళడానికి సాహసించడం లేదు. అలా పదకొండు గంటలైంది ఎవరూ లోపలికి వెళ్ళి తమ బాకీ రద్దుపరచమని కోరలేదు. ఒకాయన పక్కవాడితో "నీవు వెళ్ళి నీ సంగతి పరిష్కరించుకోకూడదా?" అని అన్నాడు. కానీ అతను "అబ్బే నా బాకీ అంత పెద్దదేమి కాదు, పెద్ద బాకీదార్లను ముందు వెళ్ళనివ్వండి, ఆ తర్వాత మనం చూద్దాం" అని నింపాదిగా అన్నాడు. అమూల్యమైన సమయం దాటిపోతుంది కాని ఎవరూ దానిని సద్వినియోగం చేసుకోవడంలేదు.
11-45 ని॥లకల్లా ఆయాసపడుతూ ఒక వృద్ధ దంపతుల జంట అక్కడికి చేరింది. వారు అక్కడ నిలిచిన వారితో "ఈ రోజు మన ఖామందు మన బకాయిలన్నీ రద్దుపరుస్తున్నాడంట అది నిజమేనా?" అని అక్కడున్నవారిని అడిగారు. వెంటనే అక్కడున్నవారిలో ఒకరు ఇంత వరకూ ఒక్క బాకీని కూడా రద్దు చేయలేదు అని అంటే, 'ఇదంతా తంతు లేవయ్యా' అని మరొకరు అన్నారు. వృద్ధ దంపతులు చాలా నిరాశపడ్డారు. వారికి కళ్ళు చెమ్మగిల్లాయి. అయితే ఇదంతా వట్టిదేనంటారా. మేమెంతో ఆశతో వచ్చాము. అయ్యో చనిపోయేముందు అప్పుభారమంతా తీసివేసుకుని నిశ్చింతగా ఉందామనుకున్నామే అని తిరిగిపోవడానికి సిద్ధపడుతున్నారు. అంతలో ఒకాయన "ఇంతవరకూ ఎవరూ లోపలికి వెళ్ళి అసలు సంగతి తెలపలేదు. మీరెందుకు పోకూడదు? మీ బాకీ రద్దుచేస్తే వెంటనే వచ్చి మాకు చెప్పండి, మేముకూడ పోతాము" అని అన్నాడు. వృద్ధులు ఆ మాటకు సమ్మతించి భయపడుతూ తలుపు తెరచుకుని లోపలికి వెళ్ళారు. "రండి రండి, కూర్చొండి, మీ పేరు, చిరునామా....." అనే చల్లని మాటలు వారికి వినబడ్డాయి. "అయ్యగారు మా బాకీ రద్దుపరుస్తారన్నమాట నిజమేనా అండీ?" అని వృద్దుడడిగాడు. దానికి గుమస్తా "అయ్యగారు మిమ్మల్ని మోసగించి నవ్వులపాలు చేస్తారని అనుకుంటున్నారా?" అని జవాబిచ్చాడు.
తమ విషయమంతా చెప్పుకున్న తర్వాత వృద్ధులతో ధనవంతుడు. "మీరు నా మాట నమ్మి లోపలికి వచ్చి బాకీ రద్దుచేయమని కోరారు కాబట్టి ఇదిగో నేటినుండి మీ బాకీ పూర్తిగా రద్దు అయింది. అసలు వాయిదాలన్నీ కొట్టివేయబడ్డాయి. మీ నోటు మీరు తీసుకుని హాయిగా వెళ్ళిరండి" అని సంతోషవదనంతో చెప్పాడు. ఆ భార్యాభర్తలు ఆనందంతో ధనవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుని బయటికి వెళ్ళబోయారు. కానీ గుమస్తా వారిని 12 గంటలు పూర్తయ్యేవరకు లోపలే ఉండిపోవలసిందిగా కోరాడు. అందుకు వారు అయ్యా, బయట చాలమంది మా మాటకోసం ఎదురు చూస్తున్నారు. మేము వెళ్ళి మా బాకీ రద్దు గురించి వాళ్ళతో చెబితే వాళ్ళు లోపలికి రావడానికి సిద్ధంగా ఉన్నారు" అన్నారు. అందుకు ధనవంతుడు "మీరు నా మాటను నమ్మి నన్ను గౌరవించారు. అలానే వారుకూడా చేయాలి" అని వారిని ఆపేసాడు.
12 గంటలు కావొస్తుంది. బయటవాళ్ళు చాలా ఆతృతగా వృద్ధుల కోసం నిరీక్షిస్తున్నారు. కంగారుగా అటూ ఇటూ చూస్తున్నారే తప్ప లోపలికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. ముసలివాళ్ళు మేలుపొందారా లేక అవమాన పడ్డారా-ఇలా వారిలో వారు ప్రశ్నించుకుంటున్నారు. గడియారం 12 కొట్టింది. వృద్ధులు బయటకు వచ్చారు. "ధనవంతుడు మాట నిలబెట్టుకున్నాడా? " ఇదే అందరి ప్రశ్న. సంతోష వదనాలతో "ఆయన చాలా పెద్దమనిషి, బాకీ కొట్టివేశాడు. ఇదిగో మా ఋణపత్రం" అంటూ ఎర్ర సిరాతో "కొట్టివేయబడెను" అని రాసియున్న నోటును వారికి చూపించారు. ఇంతలో ధనవంతుడు, గుమస్తా బయటికి రాగానే అక్కడివాళ్ళందరూ ఒక్కుమ్మడిగా "మా బాకీలుకూడా రద్దు చేయండి, మమ్ముల్ని రక్షించండి” అంటూ గోల చేశారు. కానీ వారు "సమయం దాటిపోయింది. మీరు అవకాశాన్ని నిర్లక్ష్యం చేశారు. ఇక నేనేమి చేయలేను" అంటూ కారెక్కి వెళ్ళిపోయారు. నమ్మనివాళ్ళెంత దౌర్భాగ్యులు!
ప్రియ చదువరీ. మానవుల పాప ఋణాన్ని తీర్చడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు. మానవుల పాపానికై అతిక్రమానికై యేసుప్రభువు శిక్షించబడి, నలుగగొట్టబడ్డాడు.
"మన యతిక్రమ క్రియలనుబట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను" (యెషయా 53:5).
"యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి” (యెషయా 55:6)
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.