ఆదికాండము 39:1-20

ఉద్దేశము
శోధనలు ఎదురైనప్పుడు మనలను మనము వాటికి దూరముగా ఉంచుకోవాలి అని బోధించుట.

ముఖ్యాంశము
ఇంటికి దూరముగా వెళ్ళుట - మీ స్నేహితులు ఎవరైనా వేరే ప్రాంతంలో ఉండి చదువుకుంటున్నారా? ఇప్పుడు రవాణా సౌకర్యాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి గనుక ఎంత దూరమైనా చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి మనుష్యులు వెళ్ళగలుగుతున్నారు, కానీ పాత రోజులలో కార్లు, విమానాలు లేవు కనుక నడిచి వెళ్లాలి లేదా జంతువుల మీద ప్రయాణించాలి.

గతవారము
గతవారం మనము నేర్చుకున్న కథ మీకు గుర్తుందా? యోసేపు సహోదరులు ఎంతో ఈర్ష్య, ద్వేషముతో నిండినవారై అతనిని చంపాలని అనుకున్నారు. వారికి ఎందుకు యోసేపు పట్ల అంత ద్వేషం? రూబేను అడ్డుపడి యోసేపును చంప నివ్వలేదు. వారు ముందుగా ఒక గుంటలో పడవేసి తరువాత ఐగుప్తు వెళ్లుచున్న వర్తకులకు యోసేపును అమ్మివేశారు. దాదాపు 500 కిలోమీటర్ల దూరము ప్రయాణం చేసిన తరువాత అక్కడకు చేరుకున్నారు. వారి ప్రయాణానికి కొన్ని వారాల సమయం పట్టి ఉండవచ్చు. యోసేపు ఆ ప్రయాణం వలన ఎంతగానో అలిసిపోయి ఉంటాడు. ఐగుప్తులో తనకు ఏమి జరగబోతున్నది యోసేపుకు ఏ మాత్రం తెలియదు.

యోసేపు దాసునిగా అమ్మి వేయబడుట
యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల దగ్గరనుండి పోతీఫరు యోసేపును దాసునిగా కొనుక్కున్నాడు. ఈ పోతీఫరు ఫరో యొక్క ఉద్యోగస్తుడు మరియు రాజ సంరక్షక సేనాధిపతి.

తన దేశాన్ని, తండ్రిని, పెద్ద కుటుంబాన్ని విడిచి వచ్చిన యోసేపు పరిస్థితి ఎలా ఉండి ఉండవచ్చు ఒక్కసారి ఆలోచించండి. ఎంతో ఒంటరితనంతో దిగులు పడుతూ తనకు ఏమి జరగబోతుందో అర్థంకాని పరిస్థితులలో ఉండి ఉంటాడు. దేవుడు ఎందుకు తనకు అలా చేశాడు అని కూడా ఆలోచించి ఉంటాడు. కాని దేవుడు తనకు ఇచ్చిన కలలను గుర్తు చేసుకుని ఆదరణ పొంది ఉండవచ్చు. ప్రభువు యోసేపు పట్ల గొప్ప ప్రణాళిక కలిగియున్నాడు మరియు యోసేపు జీవితములో జరుగుచున్న వాటన్నింటిని ప్రభువు చూస్తూ ఉన్నాడు. అక్కడ ఐగుప్తులో అన్నీ క్రొత్తగా ఉన్నాయి. యోసేపు తన దేశములో గుడారములలో నివసిస్తూ, పశువులను, గొర్రెలను చూసుకునేవాడు. ఐగుప్తులో గుడారములకు బదులుగా పెద్ద ఇండ్లు ఉన్నాయి. గొర్రెలు ఎక్కడా కనిపించలేదు. వారు మాట్లాడే భాష వేరుగా ఉంది. యోసేపును అమ్మివేయడానికి ఆ ఇష్మాయేలీయులు సంతకు తీసుకొని వెళ్లి ఉండవచ్చు. జంతువులను అమ్మివేసి నట్లుగానే యోసేపును కూడా అమ్మి వేయడానికి సంతలో ఉంచారు. తండ్రికి ఎంతో ప్రియమైన కుమారుడిగా ఉన్న యోసేపు ఎటువంటి కష్టాలు ఎదుర్కుంటున్నాడు కదూ! యోసేపును ఎవరు కొంటారు? యోసేపు బలము కలిగిన యౌవనస్థుడు. మనము పైన చూచినట్లుగా పోతీఫరు యోసేపును కొన్నాడు కనుక యోసేపును పోతీఫరు తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు.

ప్రభువు యోసేపును ఆశీర్వదించుట
పోతీఫరు పెద్ద ఇల్లు, పొలము కలిగినవాడై ఎంతోమంది పనివారిని పెట్టుకుని ఉండవచ్చు. మొదట యోసేపుకు చిన్న చిన్న హేయకరమైన పనులు ఇచ్చి ఉండవచ్చు. యోసేపు తనకు ఇవ్వబడిన పని ఎటువంటిదైనా కష్టపడి నైపుణ్యంతో చేస్తుండేవాడు.

యోసేపు చేస్తున్న పనిని ప్రభువు ఆశీర్వదించాడు. పోతీఫరుకు నిజమైన దేవుని గూర్చి తెలియదు. ఐగుప్తీయులు విగ్రహారాధన చేసేవారు. ప్రభువు యోసేపుకు తోడుగా ఉన్నాడనియు, అతడు చేస్తున్న పనిఅంతటిని దేవుడు సఫలము చేస్తున్నాడనియు పోతీఫరు గ్రహించగలిగాడు. పోతీఫరుకు యోసేపు మీద కటాక్షము కలిగింది గనుక యోసేపును తన దగ్గర పరిచర్య చేయుటకు నియమించాడు. అంతేకాకుండా యోసేపును తన ఇంటి మీద విచారణకర్తగా నియమించి తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించాడు. పోతీఫరు యోసేపు పై పూర్తిగా నమ్మకం ఉంచాడు. అప్పటినుండి ప్రభువు యోసేపు నిమిత్తము పోతీఫరుకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించాడు.

పోతీఫరు భార్య
ఒకరోజు భయంకరమైన సంఘటన జరిగింది. పోతీఫరు తన ఉద్యోగానికి వెళ్ళిన సమయములో యోసేపు తన పనిమీద ఇంటి లోపలికి వెళ్లాడు. అప్పుడు ఆ ఇంటి మనుష్యులలో ఎవరూ అక్కడ లేరు. పోతీఫరు భార్య యోసేపును కలిసికొని తనతో స్నేహముగా ఉండమని కోరింది. వివాహమైన స్త్రీ ఆ విధముగా కోరడం ఎంతో పాపము. యోసేపు రూపవంతుడు, అందమైన వాడు గనుక యోసేపుతో సన్నిహితంగా ఉండాలని పోతీఫరు భార్య ప్రయత్నించింది. అంతకుముందు కూడా ఆమె ఎన్నోసార్లు ఆ విధముగా ప్రయత్నించినప్పటికి, యోసేపు ఎంతమాత్రము అందుకు ఒప్పుకొనలేదు. యోసేపు పోతీఫరు భార్యతో - "నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను గదా. నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడెరుగడు. ఈ ఇంటిలో నాకంటె పై వాడు ఎవడును లేడు నీవు అతని భార్యవైనందున నిన్నుతప్ప మరిదేనిని నా కప్పగింపకయుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును" అని చెప్పాడు. తాను చేస్తున్న దానినంతటినీ ప్రభువు చూస్తున్నాడు అని యోసేపుకు తెలుసు గనుక పోతీఫరు భార్య కోరికను అంగీకరించలేదు.

ఆమె ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో పనిమీద లోపలికి వచ్చిన యోసేపు దగ్గరకు వెళ్లి తనతో స్నేహంగా ఉండమని మరల కోరింది. ఆమె యోసేపు పై వస్త్రమును పట్టుకొనగా, అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి పెట్టి తప్పించుకుని బయటకు పారిపోయాడు. అప్పుడు పోతీఫరు భార్యకు మరొక చెడ్డ ఆలోచన కలిగింది. యోసేపు తన కోరికను అంగీకరించడం లేదు గనుక ఎలాగైనా అతడిని చెడ్డవాడుగా అందరియెదుట నిలబెట్టాలని నిర్ణయించుకుంది. యోసేపు బయటకు వెళ్ళిన తరువాత తన ఇంటి మనుష్యులను పిలిచి - "చూడుడి అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మనయొద్దకు తెచ్చియున్నాడు, నేను పెద్ద కేకలు వేయగా వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయెను" అని చెప్పి పోతీఫరు వచ్చువరకు యోసేపు వస్త్రము తన దగ్గర ఉంచుకుంది. ఎంత భయంకరమైన అబద్ధము! పోతీఫరు భార్య ఎంతో క్రూరమైనది యోసేపు ఎటువంటి పాపము చేయకపోయినా అతనిపై నిందలు మోపింది.

పోతీఫరు భార్య పోతీఫరు ఇంటికి రాగానే తిరిగి అదే విధంగా అబద్ధాలు చెప్పింది. భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు పోతీఫరు కోపంతో మండిపడి యోసేపును పట్టుకుని రాజు యొక్క ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించాడు. యోసేపు ఎటువంటి పొరపాటు చేయకపోయినా జైలులో ఉండవలసి రావడం ఎంత బాధాకరం. పోతీఫరు ఇంటిలో విచారణకర్తగా, నమ్మకస్తుడిగా పనిచేసి వెంటనే చెరసాలలో వేయబడడం ఎంత ఆశ్చర్యం. కానీ వీటన్నింటిలో కూడా ప్రభువు యోసేపుకు తోడై ఉన్నాడు (అ.కా. 7:9).

సందేశము
యోసేపు పరిస్థితి ఎంత దుఃఖకరం! సహోదరులు వర్తకులకు అమ్మి వేస్తే, పోతీఫరు చెరసాలలో వేయించాడు. యోసేపు ఎటువంటి పొరపాటు చేయలేదు అని దేవునికి తెలుసు. చెరసాలలో ఉండవలసినప్పటికి, పోతీఫరు భార్య మాట విని ప్రభువుకు విరోధముగా పాపము చేయనందుకు యోసేపు ఎంతో సంతోషించాడు. తాను చేసిన పని ప్రభువుకు ప్రీతికరమైనది అని యోసేపుకు తెలుసు. సాతాను శోధనకు "లేదు" అని చెప్పగలిగినందుకు యోసేపు హృదయములో ఎంతో ఆనందించాడు. యోసేపు తాను చేయని పొరపాటుకు శిక్షను అనుభవిస్తున్నాడు. కాని శోధనను జయించ గలిగాడు .

అన్వయింపు
మనము కూడా యోసేపు వలె చెడు వాటిని చేయకుండా శోధనలను జయించాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని బైబిల్ చక్కగా వివరిస్తుంది గనుక ప్రతి దినం తప్పకుండా బైబిల్ చదవాలి. అప్పుడు మనము కూడా ప్రభువుకు లోబడి జీవించగలము.

ఉదాహరణ
సుజిత్ కష్టపడి చదివే యౌవనస్థుడు. అన్నిపాఠాలు ఎప్పటికప్పుడు చదువుకునే వాడు. కానీ క్లాస్ లో మిగిలినవారు కాపీలు కొట్టి తనకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకునేవారు. అది చూచినప్పుడు సుజిత్ కు బాధ కలిగేది కానీ కాపీ కొట్టడం, పేపర్ లో వ్రాసి చూచి కాపీ చేయడం ఇవన్నీ సరియైన పనులు కాదు అని సుజిత్ కు తెలుసు కనుక అటువంటి శోధనలకు ఎన్నడూ లోబడలేదు. తరువాత పబ్లిక్ పరీక్షల సమయంలో తనిఖీ చేయడానికి స్క్వాడ్ వచ్చింది. సుజిత్ క్లాసులో చాలామంది కాపీలు కొడుతూ పట్టుబడ్డారు. వారిని పరీక్షలు వ్రాయకుండా డిబార్ చేశారు. కాని సుజిత్ మంచి మార్కులతో స్కూల్ లో ఫస్ట్ వచ్చాడు. సుజిత్ కూడా కాపీలుకొట్టాలి అనే శోధనకు లోబడిఉంటే తన భవిష్యత్తును నాశనం చేసుకుని ఉండేవాడు. కాని ఆ శోధనను జయించడం వలన దేవుని ఆశీర్వాదము పొందగలిగాడు.

మీరు కూడా తప్పు అని తెలిసినప్పుడు వాటిని చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు కదూ! బైబిల్ లో ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనే విషయాలను దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. మనము పొరపాటు చేస్తే అది ఎదుటి వారికి తెలియదు, తెలిసినా వారు పట్టించుకోరు, కానీ దేవుడు మాత్రం మనము చేస్తున్న ప్రతి పనిని చూస్తాడు, మనము తప్పులు చేస్తే మన నిమిత్తము చింతిస్తాడు. ప్రభువు మన పాపములను క్షమించునట్లు మనము ప్రార్థించాలి. మనము పాపక్షమాపణ పొంది నూతన హృదయము పొందునట్లు యేసు సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు. చెడు పనులు చేయుటకు మనము శోధించబడినప్పుడు వాటిని జయించునట్లు ప్రభువు సహాయం కొరకు ప్రార్థించాలి. యోసేపు కూడా దేవుని సహాయాన్ని బట్టి తనకు ఎదురైన గొప్ప శోధనను జయించగలిగాడు.

కంఠతవాక్యం
అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును (యాకోబు 4:7).

ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.