సువార్త

రచయిత: జె.సి.రైల్
అనువాదం: పి. జోయెల్ సామ్యేల్ సెరాఫ్

పౌలు ఏథెన్సులో వారికొరకు కనిపెట్టుకొని యుండినప్పుడు, ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచి అతని ఆత్మ రగులుకొనెను. కాబట్టి సమాజమందిరములో యూదులతోను భక్తిపరులతోను, ప్రతిదినము సంతవీధిలో తనను కలుసుకొనిన వారితోను అతడు తర్కించుచుండెను.” (అపొ. కార్యములు 17:16-17)

బహుశా ఈ వ్యాసాన్ని చదివేవారు ఏదైనా ఒక పట్టణంలోనో లేదా నగరంలోనో నివసిస్తూ ఉండవచ్చు. పచ్చని పొలాల కంటే ఇటుకలు, గచ్చుతో నిర్మించిన భవనాలనే ఎక్కువగా చూస్తూ ఉండవచ్చు. లేదా బహుశా మీ బంధువుల్లోనో లేదా స్నేహితుల్లోనో ఎవరైనా ఒక పట్టణంలో నివసిస్తూ ఉండవచ్చు, సహజంగానే వారి క్షేమం పట్ల మీకు ఎంతో ఆసక్తి ఉండవచ్చు. ఈ రెండు సందర్భాల్లో ఏది నిజమైనా ఈ పేజీ ప్రారంభంలో ఉన్న లేఖన భాగాలు మీ పూర్తి ఏకాగ్రతను కోరుతున్నాయి. ఈ వాక్యభాగంలో ఉన్న పాఠాలను మీకు చూపించడానికి నేను ప్రయత్నించే ఈ కొద్ది నిమిషాలు మీ పూర్తి శ్రద్ధను నాకు ఇవ్వండి.

మీ ముందున్న ఈ వచనాల్లో మీరు ముఖాముఖిగా చూస్తున్నది ఒక సామాన్యమైన పట్టణాన్ని కాదు, ఒక సామాన్యమైన వ్యక్తిని కాదు.

ఆ పట్టణం, ప్రసిద్ధి గాంచిన ఏథెన్సు నగరం - రాజనీతిజ్ఞులు, తత్వవేత్తలు, చరిత్రకారులు, కవులు, చిత్రకారులు మరియు వాస్తుశిల్పులకు నేటికీ ప్రఖ్యాతి గాంచిన ఏథెన్సు అది - ప్రాచీన గ్రీకు దేశం అన్యజనుల లోకానికి ఎలాగైతే ఒక కన్ను లాంటిదో ఆ ప్రాచీన గ్రీకు దేశానికి ఈ ఏథెన్సు ఒక కన్ను లాంటిది.

ఆ వ్యక్తి అన్యజనులకు పంపబడిన గొప్ప అపొస్తలుడైన పౌలు - ఈ ప్రపంచం చూసిన అత్యంత కష్టపడే విజయవంతమైన సేవకుడు, మిషనరీ అయిన పౌలు - దైవికమైన తన ప్రభువు తప్ప, స్త్రీకి జన్మించిన వారిలో మరెవ్వరూ చెయ్యలేనంతగా తన కలంతోనూ తన వాక్కుతోనూ మానవాళిపై అత్యంత లోతైన ముద్ర వేసిన పౌలు.

క్రీస్తు యొక్క గొప్ప సేవకుడైన పౌలు మరియు ప్రాచీన అన్యమతానికి గొప్ప కంచుకోటయైన ఏథెన్సు మన ముందు ముఖాముఖిగా ఉంచబడ్డాయి. దాని ఫలితం మనకు చెప్పబడింది - వారి కలయిక చాలా జాగ్రత్తగా వివరించబడింది. నేను ధైర్యంగా భావించే విషయం ఏంటంటే ఈ అంశం మనం జీవిస్తున్న ప్రస్తుత కాలానికి, అలాగే నేటి లండన్, లివర్‌పూల్, మాంచెస్టర్ మరియు ఇతర గొప్ప ఇంగ్లీషు పట్టణాల్లో నివసించే అనేకుల పరిస్థితులకు సరిగ్గా సరిపోయేది. (మన తెలుగు పట్టణాలలో ఉన్న అనేకులకు కూడా అలాగే వర్తిస్తుంది - అనువాదకుడు).

ముందుమాట ఇక చాలించి, ఈ వాక్యభాగంలో ఉన్న మూడు విషయాలను గమనించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను -

1. ఏథెన్సులో పౌలు ఏమి చూశాడు?
2. ఏథెన్సులో పౌలు ఏమి అనుభూతి చెందాడు?
3. ఏథెన్సులో పౌలు ఏమి చేశాడు?

              1. ఏథెన్సులో పౌలు ఏమి చూశాడు?

వాక్యమిచ్చే జవాబు స్పష్టమైనదిగా తిరుగులేనిదిగా ఉంది. "ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట" అతడు చూశాడు. ప్రతి వీధిలో విగ్రహాలు అతని కంటపడ్డాయి. విగ్రహ దేవతల మరియు దేవతామూర్తుల గుడులు ప్రతి ముఖ్యమైన స్థలాన్ని ఆక్రమించాయి. ప్లినీ (Pliny) అభిప్రాయం ప్రకారం, కనీసం నలభై అడుగుల ఎత్తు ఉన్న మినర్వా (Minerva) యొక్క అద్భుతమైన విగ్రహం అక్రోపోలిస్ (Acropolis) పైన ఆకాశమంత ఎత్తులో నిలబడి, ఏ వైపు నుండి చూసినా అందరి దృష్టిని ఆకర్షించేదిగా ఉంది. ఒక విస్తృతమైన విగ్రహారాధన వ్యవస్థ ఆ ప్రదేశమంతటా వ్యాపించి, ప్రతిచోటా అతని దృష్టిని బలంగా ఆకర్షించింది. "దేవతల ఆరాధనకు ఇచ్చే ప్రాముఖ్యతలో ఏథెన్సు వాసులు మిగతా అన్ని రాజ్యాలను మించిపోయారు” అని పురాతన రచయిత పౌసానియాస్ (Pausanias) స్పష్టంగా చెబుతున్నాడు . క్లుప్తంగా చెప్పాలంటే ఆ పట్టణం "విగ్రహాలతో నిండిపోయింది."

అయినప్పటికీ మీరు గుర్తుంచుకోవాలని నేను కోరుకునేది ఏంటంటే పౌలు చూసిన అన్యజనుల పట్టణాలలో బహుశా ఇది చాలా అనుకూలమైన ఉదాహరణ అయ్యిఉండొచ్చు. దాని పరిమాణానికి తగ్గట్టుగా బహుశా ప్రపంచం మొత్తం మీద అత్యంత నేర్పరులైన, నాగరికులైన, తాత్వికులైన, ఉన్నత విద్యావంతులైన , కళాత్మకమైన, మేధోపరమైన ప్రజలు అందులో ఉన్నారు. కానీ మతపరమైన కోణంలో చూస్తే అది ఎలా ఉంది? సోక్రటీస్ (Socrates), ప్లేటో (Plato) లాంటి జ్ఞానుల పట్టణం - సోలన్ (Solon), పెరిక్లెస్ (Pericles), మరియు డెమోస్తనీస్ (Demosthenes) ల పట్టణం - ఇస్కిలస్ (Aeschylus), సోఫోక్లెస్ (Sophocles), యూరిపిడెస్ (Euripides), మరియు తుసిడైడెస్ (Thucydides) ల పట్టణం - మేధస్సుకు, తెలివికి, కళలకు, మరియు అభిరుచికి కేంద్రమైన ఈ పట్టణం - "పూర్తిగా విగ్రహారాధనకు అప్పగించబడింది."

నిజమైన దేవుడు ఏథెన్సులోనే తెలియబడకపోతే - భూమి మీది అంధకార ప్రదేశాలలో ఆయన ఇంకెంత అజ్ఞాతంగా ఉండియుంటాడు? గ్రీకు దేశపు కన్ను ఆత్మీయంగా అంత మసకబారిపోయి ఉంటే బబులోను, ఎఫెసు, తూరు, అలెగ్జాండ్రియా, కొరింథు, అంతేకాక రోమా లాంటి ప్రదేశాల పరిస్థితి ఎలా ఉండియుంటుంది? పచ్చని చెట్టు పరిస్థితే ఇంత దయనీయంగా ఉంటే ఎండిన చెట్టు పరిస్థితి గురించి ఏమంటారు?

ఈ విషయాలను బట్టి మనం ఏమి చెప్పగలం? వీటి ద్వారా మనం అనివార్యంగా చేరుకునే ఫలితార్థాలు ఏమిటి?

1. ఇక్కడ దైవిక ప్రత్యక్షత మరియు పరలోకం నుండి వచ్చే బోధ ఎంత అత్యవసరమో మనం కచ్చితంగా నేర్చుకోవాల్సిన ఒక విషయం కాదా? మనిషిని బైబిల్ లేకుండా వదిలేస్తే అతడు ఏదో ఒక రకమైన మతాన్ని కల్పించుకుంటాడు. ఎందుకంటే, మానవ స్వభావం ఎంత భ్రష్టమైనదైనా దానికి ఒక దేవుడు అవసరం. కానీ అది వెలుగు, సమాధానం, లేదా నిరీక్షణ లేని మతంగానే మిగిలిపోతుంది.

"లోకము తన జ్ఞానముచేత దేవుని ఎరుగదు" (1 కొరింథీ 1:21). ప్రాచీన ఏథెన్సు నగరం మనం శ్రద్ధగా గమనించదగిన ఒక సజీవ పాఠం. ప్రత్యక్షత సహాయం లేకుండా సృష్టి ఎప్పటికైనా పతనమైన మానవుణ్ణి సృష్టికర్తయైన దేవుని దగ్గరకు నడిపిస్తుందని అనుకోవడం వ్యర్థం. బైబిల్ లేని ఏథెన్సు వాసులు కఱ్ఱలకు, రాళ్ళకు సాగిలపడి, తమ స్వహస్తాలతో చేసుకున్నవాటినే పూజించారు. ఒక అన్యమత తత్వవేత్తను, ఒక స్టోయిక్ లేదా ఎపిక్యూరియన్ తత్వవేత్తను ఒక తెరిచి ఉన్న సమాధి ప్రక్కన నిలబెట్టి, రాబోయే లోకం గురించి అతనిని అడగండి, అతడు మీకు కచ్చితమైన, సంతృప్తికరమైన, లేదా సమాధనకరమైన జవాబు ఏదీ ఇవ్వలేడు.

2.‌ ఇక్కడ అత్యున్నతమైన మేధోపరమైన శిక్షణ, మతపరమైన కటిక చీకటి నుండి ఎలాంటి భద్రతను ఇవ్వలేదని మనం కచ్చితంగా నేర్చుకోవాల్సిన మరొక విషయం కాదా? అన్యజనుల లోకంలో మరెక్కడైనా ఉందో లేదో కానీ ఏథెన్సులో మేధస్సు మరియు తార్కిక ఆలోచన అత్యున్నత స్థాయిలో ఉన్నాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్రీకు తత్వశాస్త్ర విద్యార్థులు చదువురానివారు, అజ్ఞానులు కారు. వారు తర్కం, నీతిశాస్త్రం, వక్తృత్వం, చరిత్ర మరియు కవిత్వంలో మంచి ప్రావీణ్యం కలవారు. కానీ ఈ మేధోపరమైన క్రమశిక్షణ అంతా ఆ నగరం "పూర్తిగా విగ్రహారాధనలో మునిగిపోకుండా" ఆపలేకపోయింది. అయితే పంతొమ్మిదవ శతాబ్దంలో లేఖనాల గురించిన జ్ఞానం లేకుండా చదవడం, రాయడం, అంకగణితం, గణితం, చరిత్ర, భాషలు మరియు భౌతిక శాస్త్రం వంటివి నేర్చుకుంటే విద్య సంపూర్ణమౌతుందని మాకు చెప్తారా? ఎంతమాత్రం కాదు! మనం క్రీస్తును అలా నేర్చుకోలేదు. కొంతమంది వ్యక్తులు మేధోశక్తిని ఆరాధించడానికి, మరియు ప్రపంచం గ్రీకు మేధస్సుకు ఎంతగా రుణపడి ఉందో గొప్పగా మాట్లాడడానికి ఇష్టపడవచ్చు. ఏది ఏమైనా ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. హెబ్రీ జనాంగానికి పరిశుద్ధాత్ముడు బయలుపరచిన జ్ఞానం కనుక లేకపోతే, ప్రాచీన గ్రీకు దేశం ఈ ప్రపంచాన్ని చీకటి విగ్రహారాధనలోనే పాతిపెట్టి ఉండేది. సోక్రటీస్ లేదా ప్లేటో యొక్క అనుచరుడు ఎన్నో విషయాల గురించి బాగా అనర్గళంగా మాట్లాడి ఉండవచ్చు, కానీ "రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను?" (అపొ.కార్యములు 16:30) అని చెరసాల నాయకుడు అడిగిన ప్రశ్నకు అతడు ఎప్పటికీ సమాధానం చెప్పి ఉండలేడు. తన చివరి ఘడియలో అతడు, "ఓ మరణమా, నీ ముల్లెక్కడ? ఓ సమాధీ, నీ విజయమెక్కడ?" అని ఎప్పటికీ చెప్పి ఉండలేడు.

3. కళలలో అత్యున్నత ప్రావీణ్యత కలిగియుండడం అనేది ఘోరమైన మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా రక్షణ కల్పించలేదన్నది మనం నేర్చుకోవాల్సిన మరొక పాఠం కాదా? ఎథెన్స్ నగరపు నిర్మాణకళ మరియు శిల్పకళ యొక్క పరిపూర్ణత ఒక కాదనలేని గొప్ప వాస్తవం. ఎథెన్స్‌లో పౌలు కళ్ళు ఎన్నో "అందమైన వస్తువులను" చూశాయి, అవి కళాత్మక మనస్సులకు ఇప్పటికీ ఆనందాన్ని ఇస్తాయి. అయినప్పటికీ ఎథెన్స్ యొక్క అద్భుతమైన భవనాలను ఆలోచించి నిర్మించిన ఆ మనుష్యులు సత్యదేవుని గురించి ఏమాత్రం ఎరుగని అజ్ఞానులుగానే ఉండిపోయారు. నేటి ప్రపంచం కళలు మరియు శాస్త్రాలలో మనం సాధించిన ప్రగతిని బట్టి అహంకారపు మత్తులో ఉంది. అసాధ్యమైనది ఏదీ లేదు అన్నట్లుగా మనుష్యులు యంత్రాల గురించి మరియు ఉత్పత్తుల గురించి మాట్లాడుతున్నారు, రాస్తున్నారు. కానీ అత్యున్నతమైన కళ లేదా యాంత్రిక నైపుణ్యంతో పాటు ఆత్మీయ మరణ స్థితి కలిసి ఉండడం సాధ్యమన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఫిడియస్ యొక్క ఎథెన్స్ నగరం, "విగ్రహారాధనకు పూర్తిగా అప్పగించబడిన నగరం." ఎథెన్స్ నగరానికి చెందిన ఒక శిల్పి సాటిలేని సమాధిని రూపొందించి ఉండవచ్చు, కానీ అతను దుఃఖిస్తున్నవారి కంటి నుండి ఒక కన్నీటి బొట్టును కూడా తుడవలేడు!

ఈ విషయాలను మర్చిపోకూడదు. వీటిని జాగ్రత్తగా ధ్యానించాలి. ఇవి మనం జీవిస్తున్న కాలానికి సరిగ్గా సరిపోతాయి. మనం సందేహాస్పదమైన, అవిశ్వాసంతో కూడిన యుగంలో వచ్చిపడ్డాం. దేవుని ప్రత్యక్షత యొక్క సత్యం మరియు విలువల గురించి నలుదిక్కులా మనకు సందేహాలు మరియు ప్రశ్నలు ఎదురౌతున్నాయి. "కేవలం మానవ తర్కం మాత్రమే సరిపోదా?" "మనుష్యులను రక్షణార్థమైన జ్ఞానము గలవారిగా చేయడానికి బైబిల్ నిజంగా అవసరమా?" "మనుష్యుడిని సత్యం వైపుకు దేవుని వైపుకు నడిపించడానికి అతనిలో అంతర్గత వెలుగు, నిర్ధారించే శక్తి లేదా?" ఇలాంటి ప్రశ్నలే మన చుట్టూ వడగళ్ళలా రాలుతున్నాయి. చంచలమైన అనేక మనస్సులను కలవరపెట్టే ఊహాగానాలు ఇవే.

దీనికి ఒక స్పష్టమైన సమాధానం వాస్తవాలను పరిశీలించడమే. ఐగుప్తు, గ్రీసు మరియు రోమా వంటి అన్యసామ్రాజ్యాల శిథిలాలు మనతో మాట్లాడతాయి. దైవిక ప్రత్యక్షత లేకుండా కేవలం మేధస్సు మరియు తర్కం ఏమి చెయ్యగలవో చూపే స్మారక చిహ్నాలుగా అవి దేవుని ఏర్పాటులో నేటి వరకూ భద్రపరచబడ్డాయి. పార్థినాన్ లేదా కొలిసియం వంటి దేవాలయాలను రూపొందించినది మూర్ఖుల మనస్సులు కావు. వారి డిజైన్లను అమలు చేసిన నిర్మాతలు ఆధునిక కాలంలోని ఏ కాంట్రాక్టర్ చెయ్యలేనంత మెరుగ్గా ఎక్కువ కాలం నిలచేటట్టుగా నిర్మించారు. “ఎల్గిన్ మార్బుల్స్” అని మనం పిలిచే శిల్పకళాకృతులను రూపొందించిన వ్యక్తులు అత్యున్నత శిక్షణ మరియు మేధస్సు గలవారు. అయినప్పటికీ ఆత్మీయత విషయానికి వస్తే ఈ మనుష్యులు చీకటియై ఉన్నారు (ఎఫెసీ 5:8). దైవిక ప్రత్యక్షత లేకుండా మనుష్యుడు తన ఆత్మకు మేలు చేసేదేదీ తెలుసుకోలేడనడానికి ఎథెన్స్‌లో పౌలు చూసిన దృశ్యమే తిరుగులేని నిదర్శనం.

       2. ఏథెన్సులో పౌలుకు ఏమి అనిపించింది?

"ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట" అతడు చూశాడు. ఆ దృశ్యం అతనిపై ఎలాంటి ప్రభావాన్ని చూపించింది? అతనికి ఏమి అనిపించింది?

ఒకే దృశ్యం వేర్వేరు వ్యక్తులను వేర్వేరుగా ఎలా ప్రభావితం చేస్తుందో గమనించడం ఎంతో బోధనాత్మకంగా ఉంది. ఇద్దరు వ్యక్తులను ఒకే చోట ఉంచండి; వారిని ప్రక్కప్రక్కనే నిలబెట్టండి; వారి కళ్ళ ముందు ఒకే దృశ్యాలను ఉంచండి. ఒక వ్యక్తిలో కలిగే భావోద్వేగాలు మరొకరిలో కలిగే వాటికి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. వారిలో పుట్టే ఆలోచనలు తరచుగా ఉత్తర దక్షిణ ధృవాలంత భిన్నంగా ఉంటాయి.

మొదటిసారి ఏథెన్సును సందర్శించే ఒక సాధారణ కళాకారుడు నిస్సందేహంగా అక్కడి భవనాల అందంలో లీనమైపోయుండేవాడు. ఒక రాజనీతిజ్ఞుడు లేదా వక్త ఐతే పెరిక్లెస్ లేదా డెమోస్తనీస్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఉండేవాడు. ఒక సాహిత్యవేత్త ఐతే థుసీడస్, సోఫోక్లెస్ మరియు ప్లేటోల గురించి ఆలోచించి ఉండేవాడు. ఒక వ్యాపారి ఐతే పిరయస్, దాని నౌకాశ్రయం మరియు సముద్రం వైపు చూసి ఉండేవాడు. కానీ క్రీస్తు యొక్క అపొస్తలునికి అంతకంటే ఎంతో ఉన్నతమైన ఆలోచనలు వచ్చాయి. అన్నింటికంటే ఒకే ఒక విషయం అతని దృష్టిని పూర్తిగా ఆకర్షించింది, అది మిగిలినవన్నింటినీ చిన్నవి చేసింది. ఆ ఒక్క విషయం ఏంటంటే ఏథెన్సు ప్రజల ఆత్మీయ స్థితి, వారి ఆత్మల పరిస్థితి. అన్యజనులకు పంపబడిన ఆ గొప్ప అపొస్తలుడు ప్రధానంగా ఒకే ఒక లక్ష్యం కలిగిన వ్యక్తి. తన ప్రభువు వలే అతడు ఎల్లప్పుడూ తన "తండ్రి పనుల" గురించే ఆలోచిస్తూ ఉండేవాడు (లూకా 2:49). అతను ఏథెన్సులో నిలబడి, ఏథెన్సు ప్రజల ఆత్మల గురించి తప్ప మరేమీ ఆలోచించలేదు. మోషే, ఫీనెహాసు మరియు ఏలీయాల వలే "ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినప్పుడు అతని ఆత్మ అతనిలో రేగెను."

భూమిపై ఉన్న దృశ్యాలన్నింటిలోనూ ఒక మహానగరం ఇచ్చే అనుభూతి సాటిలేనిది. అది ఆలోచించే ప్రతి మనిషిని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. సహజంగా ఒక పట్టణంలో మనుషుల మధ్య ఉత్పన్నమయ్యే దైనందిన సంభాషణలు, పల్లెటూళ్ళలో లేదా ఇతర ఏకాంత ప్రదేశాల్లో నివసించేవారు గ్రహించలేనంతగా బుద్ధికి పదునుపెట్టి, మానసిక కార్యకలాపాలను ప్రేరేపించేవిగా అనిపిస్తాయి. అది తప్పైనా ఒప్పైనా ఒక పల్లెటూరి నివాసి కంటే నగర నివాసి రెండింతలు ఎక్కువగా రెండింతలు వేగంగా ఆలోచిస్తాడు.

''సాతాను సింహాసనమున్నది'' నగరంలోనే (ప్రకటన 2:13). ప్రతి రకమైన కీడు అత్యంత వేగంగా గర్భం ధరించి, విత్తబడి, పండి, పరిపక్వతకు చేరుకునేది, నగరంలోనే. ఇల్లు వదిలి జీవితంలోకి అడుగుపెట్టే యౌవనుడు, ప్రతిరోజూ పాపాన్ని చూడడానికి అలవాటు పడటం వల్ల అతి త్వరగా కఠినపరచబడేది, వాతవేయబడిన మనస్సాక్షి గలవాడయ్యేది నగరంలోనే. కాముకత, సంయమనం లేకపోవడం, అతి నీచమైన ప్రాపంచిక వినోదాలు విపరీతంగా వర్ధిల్లి, వాటికి అనుకూలమైన వాతావరణాన్ని కనుగొనేది నగరంలోనే. భక్తిహీనత, అవిశ్వాసం గొప్ప ప్రోత్సాహాన్ని పొందేది నగరంలోనే. విశ్రాంతిదినాన్ని అతిక్రమించే దూరదృష్టవంతుడూ లేదా కృపాసాధనాలన్నింటినీ నిర్లక్ష్యం చేసేవాడు ఇతరుల ఉదాహరణల వెనుక తనను తాను సమర్థించుకుంటూ "నేనొక్కడినే కాదు" అని భావించే దౌర్భాగ్యపు ఓదార్పును పొందేది నగరంలోనే! ప్రతి రకమైన మూఢనమ్మకాలకు, ఆచార వ్యవహారాలకు, మతపరమైన ఉన్మాదానికి, మూర్ఖత్వానికి ఎంచుకోబడిన నివాసం నగరమే. ప్రతి రకమైన అబద్ధ తత్వశాస్త్రాలకు అంటే వైరాగ్యవాదం (Stoicism), భోగలాలసత్వం (Epicureanism), అజ్ఞేయవాదం (Agnosticism), లౌకికవాదం, సంశయవాదం (Skepticism), ప్రత్యక్షవాదం (Positivism), అవిశ్వాసం, నాస్తికత్వాలకు పుట్టినిల్లు నగరమే. మంచికి, చెడుకు అపారమైన శక్తి గల ఆధునిక ఆవిష్కరణలలోకెల్లా గొప్పదైన ముద్రణాయంత్రం, నిరంతరం నిద్రలేని కార్యకలాపాలతో పనిచేస్తూ ఆలోచనల కోసం కొత్త విషయాలను వెలువరించేది నగరంలోనే. దినపత్రికలు నిరంతరం ఆలోచనలకు ఆహారాన్ని ఇస్తూ ప్రజల అభిప్రాయాలను తీర్చిదిద్దుతూ నిర్దేశించేది నగరంలోనే . దేశవ్యాప్త వ్యాపారాలన్నింటికీ కేంద్రం నగరమే. బ్యాంకులు, న్యాయస్థానాలు, స్టాక్ మార్కెట్లు, పార్లమెంటు లేదా అసెంబ్లీలు ముడిపడి ఉన్నది నగరంతోనే. ఒక అయస్కాంతం లాంటి ప్రభావంతో దేశంలోని హోదాలను, పోకడలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, సమాజపు అభిరుచులకు, మార్గాలకు దిశానిర్దేశం చేసేది నగరమే. వాస్తవానికి ఒక దేశపు భవిష్యత్తును శాసించేది నగరమే!

ఒక దేశాన్ని ఏలేది నగరాలే. సెయింట్ పాల్స్ కేథడ్రల్ (Saint Paul's Cathedral) శిఖరంపై నిలబడి, లండన్ నగరాన్ని కిందకు చూస్తూ ఎలాంటి భావోద్వేగానికి గురికాని వ్యక్తిని, అలాగే మొత్తం నాగరిక ప్రపంచమంతటా స్పందించే హృదయాన్ని తాను చూస్తున్నానని గ్రహించలేని వ్యక్తిని చూస్తే నాకు జాలి కలుగుతుంది. అలాంటప్పుడు అన్యులకు అపొస్తలుడైన అలాంటి గొప్ప వ్యక్తి ఏథెన్స్ నగరాన్ని చూసినప్పుడు అతని "ఆత్మ కలవరపడింది" అనడంలో నేనేమైనా ఆశ్చర్యపడాలా? నేను ఏమాత్రం ఆశ్చర్యపడను. మారుమనస్సు పొందిన తార్సు వాసుని, అనగా రోమీయులకు పత్రికను రాసి, యేసుక్రీస్తును ముఖాముఖిగా చూసిన ఆ వ్యక్తి హృదయాన్ని కదిలించగలిగే దృశ్యమే అది.

అతను పరిశుద్ధమైన కనికరంతో కదిలించబడ్డాడు. దేవుడు లేకుండా క్రీస్తు లేకుండా నిరీక్షణ లేకుండా జ్ఞానం లేక నశించిపోతూ నాశనానికి నడిపే విశాల మార్గంలో ప్రయాణిస్తున్న ఎంతోమందిని చూసి అతని హృదయం కలవరపడింది!

అతడు పవిత్రమైన దుఃఖముతో కలచివేయబడ్డాడు. అంతటి సామర్థ్యం దుర్వినియోగం కావడం చూసి అతని హృదయం కలత చెందింది. అద్భుతమైన కార్యాలు చెయ్యగల చేతులు, ఉన్నతంగా ఆలోచించే మనస్సులు అక్కడ ఉన్నాయి. అయినప్పటికీ జీవాన్ని, శ్వాసను, శక్తిని అనుగ్రహించిన దేవుడు అక్కడ మహిమపరచబడట్లేదు.

పాపం పట్ల, అపవాది పట్ల పవిత్రమైన ఆగ్రహంతో అతడు రగిలిపోయాడు. ఈ యుగ సంబంధమైన దేవత తన తోటి మనుష్యులైన అనేకుల కళ్ళకు గుడ్డితనం కలుగచేసి, వారిని తన ఇష్టానుసారంగా బందీలుగా నడిపించడం అతడు చూశాడు. ఒక పెద్ద నగర జనాభానంతటినీ మనిషిలో ఉన్న సహజమైన భ్రష్టత్వం ఒక అంటువ్యాధిలా సంక్రమించడం, దానికి ఎలాంటి ఆత్మీయమైన ఔషధం కానీ విరుగుడు కానీ పరిష్కారం కానీ ఏమాత్రం లేకపోవడం అతడు చూశాడు.

తన ప్రభువు మహిమ కొరకు పవిత్రమైన ఆసక్తితో అతడు కదిలించబడ్డాడు. న్యాయబద్ధంగా తనది కాని ఇంటిని "ఆయుధాలు ధరించిన ఒక బలవంతుడు" ఆక్రమించుకొని, దాని నిజమైన యజమానిని బయట ఉంచడం అతడు చూశాడు. తన ప్రభువు ఆయన స్వంత సృష్టి చేతనే ఎరుగబడకపోవడం, గుర్తించబడకపోవడం మాత్రమే కాకుండా రాజుల రాజుకు దక్కవలసిన ఘనతను విగ్రహాలు పొందడం అతడు చూశాడు.

చదువరీ అపొస్తలుని రేకెత్తించిన ఈ భావాలు ఆత్మ మూలంగా జన్మించిన వ్యక్తికి ఉండే ప్రధాన లక్షణాలు. వాటి గురించి మీకు ఏమైనా తెలుసా? నిజమైన కృప ఎక్కడ ఉంటుందో అక్కడ ఇతరుల ఆత్మల గురించి ఎల్లప్పుడూ సున్నితమైన పట్టింపు ఉంటుంది. దేవునిలో నిజమైన పుత్రత్వం ఎక్కడ ఉంటుందో అక్కడ తండ్రి మహిమ కోసం ఎల్లప్పుడూ ఆసక్తి ఉంటుంది. భక్తిహీనుల గురించి ఏం రాయబడిందంటే, వారు నాశనానికి తగిన కార్యాలు చెయ్యడమే కాకుండా ''వాటిని చేయువారియందు ఇష్టపడుదురు'' (రోమా 1:32). భక్తిపరులు తమ సొంత హృదయాలలో ఉన్న పాపాన్ని బట్టి దుఃఖించడమే కాకుండా ఇతరులలో ఉన్న పాపాన్ని బట్టి కూడా దుఃఖపడతారని అంతే సత్యంగా చెప్పవచ్చు.

సొదొమలో ఉన్న లోతును గూర్చి ఏమి వ్రాయబడిందో వినండి - ''వారి అక్రమమైన క్రియలకై దినదినము తన నీతిగల మనస్సును నొప్పించుకొనుచుండెను'' (2 పేతురు 2:8). దావీదును గూర్చి ఏమి వ్రాయబడిందో వినండి - ''జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపక పోయినందున నా కన్నీరు ఏరులై పారుచున్నది'' (కీర్తన 119:136). యెహెజ్కేలు కాలంలోని భక్తిపరులను గూర్చి ఏమి వ్రాయబడిందో వినండి - ''దేశము మధ్యను చేయబడుచున్న సమస్తమైన హేయక్రియలను బట్టి మూల్గుచు ప్రలాపించుచున్నవారు…'' (యెహెజ్కేలు 9:4). మన ప్రభువు మరియు రక్షకుని గూర్చి ఏమి వ్రాయబడిందో వినండి - ''ఆయన పట్టణమును చూచి దాని విషయమై యేడ్చి…'' (లూకా 19:41). పాపాన్ని చూచి దుఃఖించని వ్యక్తికి ఆత్మానుసారమైన మనస్సు లేదన్నది లేఖనానుసారమైన భక్తికి ప్రాథమిక సూత్రాలలో ఒకటిగా ఖచ్చితంగా చెప్పవచ్చు. దేవుని పిల్లలు ప్రత్యక్షమయ్యేలా మరియు అపవాది పిల్లల నుండి వారు వేరుపరచబడేలా చేసే విషయాలలో ఇది ఒకటి.

ఈ విషయంపై నా చదువరుల ప్రత్యేక దృష్టిని నేను కోరుతున్నాను. మనం దీనిని సూటిగా పరిశీలించాలని ఈ కాలం కోరుతోంది. పాపం, అన్యమతాచారం, మరియు అబద్ధ మతం పట్ల మనకు ఉండే భావాలు ప్రస్తుత దినాల్లో ఎంతో ప్రాముఖ్యమైన విషయం.

మొదటిగా మన స్వంత దేశం వెలుపల చూసి, అన్యజనుల ప్రపంచం యొక్క స్థితిని గమనించవలసినదిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కనీసం అరవై కోట్ల అమర్త్యులు ఈ క్షణంలో అజ్ఞానం, మూఢనమ్మకాలు మరియు విగ్రహారాధనలో కూరుకుపోయి ఉన్నారు. వారు దేవుడు లేక, క్రీస్తు లేక, నిరీక్షణ లేక జీవిస్తూ మరణిస్తున్నారు. అనారోగ్యంలోనూ దుఃఖంలోనూ వారికి ఎలాంటి ఆదరణ లేదు. వృద్ధాప్యంలోనూ మరియు మరణసమయంలోనూ సమాధిని దాటి వారికి జీవం లేదు. విమోచకుని ద్వారా లభించే నిజమైన సమాధాన మార్గం గురించి కాని, క్రీస్తునందున్న దేవుని ప్రేమ గురించి కాని, ఉచితమైన కృప గురించి కాని, అపరాధము నుండి సంపూర్ణ క్షమాపణ గురించి కాని, నిత్యజీవానికి తారకమైన పునరుత్థానం గురించి కాని వారికి ఏమాత్రం జ్ఞానం లేదు. క్రీస్తు సంఘం యొక్క నెమ్మదైన కదలికల కోసం వారు అనేక అలసిపోయిన శతాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు; అయితే క్రైస్తవులు నిద్రపోతూ లేదా పనికిరాని వివాదాలపై తమ శక్తిని వృధా చేస్తూ ఆచారాలు, పద్ధతుల గురించి గొడవపడుతూ వాదించుకుంటూ ఉండిపోయారు. ఇది మన "ఆత్మను రగులుకొల్పవలసిన" దృశ్యం కాదా?

తర్వాత తిరిగి మన స్వంత దేశం వైపు చూసి, మన మహానగరాల స్థితిని గమనించమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మన గొప్ప మహానగరం, లివర్‌పూల్, మాంచెస్టర్, బర్మింగ్‌హామ్, మరియు బ్లాక్ కంట్రీ ప్రాంతాలలోని కొన్ని జిల్లాలలో క్రైస్తవ్యం అనేది ఆచరణాత్మకంగా ఏమాత్రం తెలియనిదిగా కనిపిస్తుంది. ఈస్ట్ లండన్, లేదా సౌత్‌వార్క్, లేదా లాంబెత్ యొక్క ఆత్మీయ పరిస్థితిని పరిశీలించండి. శనివారం సాయంత్రం, లేదా ఆదివారం, లేదా ఒక సెలవుదినాన లివర్‌పూల్ ఉత్తర ప్రాంతంలో నడిచి చూడండి; ప్రభువు దినాన్ని ఉల్లంఘించడం, మత్తుపానీయాల ఆసక్తి, మరియు సాధారణ భక్తిహీనత ఏ విధంగా అనియంత్రితంగా పాలిస్తూ ఏలుబడి చేస్తున్నాయో చూడండి. "బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనునప్పుడు వాని ఆస్తి భద్రముగా ఉండును" (లూకా 11:21). ఒక క్రైస్తవ దేశంగా చెప్పుకోబడే దేశంలో ఒక స్థిరమైన సంఘం ఉన్న దేశంలో ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్‌లకు కొన్ని గంటల దూరంలో ఉన్న ప్రాంతంలోనే ఈ పరిస్థితి ఉందన్న విషయాన్ని అప్పుడు గుర్తుంచుకోండి! నేను మళ్ళీ అడుగుతున్నాను, ఈ విషయాలు మన హృదయాలను "రగులుకొల్పవద్దా?"

అన్యమతత్వం, అవిశ్వాసం మరియు అబద్ధ మతాల పట్ల ఉదాసీనత, నిర్లిప్తత మరియు నిర్లక్ష్యం చూపే ఒక తరం వారు నేటి దినాల్లో మన చుట్టూ ఉన్నారనేది ఒక విచారకరమైన వాస్తవం. స్వదేశంలోనైనా లేదా విదేశాల్లోనైనా జరిగే క్రైస్తవ సువార్త పరిచర్యల గురించి వారు ఏమాత్రం పట్టించుకోరు. వాటి అవసరతను వారు గుర్తించరు. ఏ సంఘము లేదా సమాజము చేసే సువార్త పరిచర్యపైన వారు ఆసక్తి చూపరు. వారన్నిటినీ నిర్మోమాటంగా అసహ్యించుకుంటారు. వారు మిషనరీ సభా ప్రాంగణాన్ని (exeter hall) ఏహ్యభావంతో చూస్తారు. వారు ఎప్పుడూ కానుకలు ఇవ్వరు. వారు ఎప్పుడూ కూటాలకు హాజరుకారు. వారు ఎప్పుడూ మిషనరీల నివేదికను చదవరు. మనిషి నిజాయితీగా ఉంటే సరిపోతుందని, ప్రతి మనిషి తన సొంత నియమాలు లేదా శాఖ ద్వారా రక్షింపబడతాడని; అలాగే దానిని ఆచరించేవారు చిత్తశుద్ధితో ఉంటే సరిపోతుందని, ఒక మతం మరొక మతం వలెనే మంచిదని వారు భావిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆత్మీయ యంత్రాంగాన్ని లేదా మిషనరీ పరిచర్యలన్నిటినీ నిందించడం, కించపరచడం వారికి ఇష్టం. స్వదేశంలోనైనా విదేశాల్లోనైనా ఆధునిక మిషనరీ సంస్థలు చేసేదేమీ లేదని, వాటికి మద్దతు ఇచ్చేవారు కేవలం బలహీనమైన ఉత్సాహవంతులకంటే ఏమాత్రం మెరుగైనవారు కారని వారు నిరంతరం నొక్కి చెబుతుంటారు. వారి మాటలను బట్టి చూస్తే, మిషనరీ సంస్థల వలన కాని, ఉధృతమైన క్రైస్తవ ఉద్యమాల వలన గానీ లోకానికి ఎలాంటి ప్రయోజనం లేదని, లోకాన్ని యథాతథంగా వదిలేయడం ఉత్తమమైన మార్గమని వారు భావిస్తున్నట్లు కనిపిస్తుంది. అలాంటి వ్యక్తులకు మనం ఏమి చెబుదాము? వారు మనకు ప్రతిచోటా కనపడతారు. ప్రతి సమాజంలో వారి మాటలు వినబడతాయి. ప్రక్కన కూర్చుని, అపహాస్యం చేస్తూ విమర్శిస్తూ ఏ పనీ చెయ్యకుండా ఉండడమే వారి సంతోషం మరియు వృత్తిగా కనిపిస్తుంది. వారికి మనం ఏమి చెబుదాము?

వారు మన మాట వినడానికి ఇష్టపడితే వారు అపొస్తలుడైన పౌలుకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారని వారికి స్పష్టంగా చెబుదాం. ఏథెన్సు వీధుల్లో నడుస్తూ "ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచి" తన ఆత్మలో "కలవరపడిన" (అపొ. కార్యములు 17:16) ఒక క్రైస్తవ మిషనరీ యొక్క బలమైన మాదిరిని వారికి చూపిద్దాం. చైనా, హిందూస్థాన్ , ఆఫ్రికా మరియు దక్షిణ సముద్రాలలోని విగ్రహారాధన గురించి కాని, లేదా లండన్, లివర్‌పూల్, మాంచెస్టర్, బర్మింగ్‌హామ్ మరియు బ్లాక్ కంట్రీ లాంటి సగభాగం అన్యమతత్వంతో నిండిన జిల్లాల గురించి కాని, అతడు పొందిన ఆవేదనను వీరెందుకు పొందడం లేదో వారిని అడుగుదాం. దేవుని స్వభావంలో కాని, పతనమైన మానవుని అవసరతలలో కాని, విగ్రహారాధనలోని పాపభరిత స్థితిలో కాని, క్రైస్తవుల బాధ్యతల్లో కాని ఈ 1800 సంవత్సరాలు ఏదైనా మార్పును తీసుకువచ్చాయా అని వారిని అడుగుదాం. సరైన సమాధానం కోసం మనం అడగడం వృధా - మనకు ఏ సమాధానం దొరకదు. మన బలహీనతలను చూసి చేసే అపహాస్యాలు మన సిద్ధాంతాలకు వ్యతిరేకమైన వాదనలు కాజాలవు. మన లోపాలను, వైఫల్యాలను చూసి చేసే ఎగతాళి మన లక్ష్యాలు తప్పు అని నిరూపించలేవు.

ఔను - ఈ లోక సంబంధమైన వివేకం మరియు జ్ఞానం వారి వైపు ఉండవచ్చు; కానీ క్రొత్త నిబంధన యొక్క నిత్యమైన నియమాలు స్పష్టంగా తేటగా మరియు ఎలాంటి సందేహానికి తావులేకుండా రాయబడ్డాయి. బైబిల్ బైబిల్‌గానే ఉన్నంత కాలం, ఆత్మల పట్ల ప్రేమ కలిగియుండడం అనేది క్రైస్తవ సద్గుణాలలో మొట్టమొదటిది, అంతేకాకుండా అన్యుల మరియు మారుమనస్సు పొందని ప్రజలందరి ఆత్మల పట్ల కనికరం కలిగియుండడం అనేది ఒక గంభీరమైన బాధ్యత. ఈ భావనను గురించి ఏమాత్రం తెలియనివాడు, క్రీస్తు పాఠశాలలో నేర్చుకునే వాడిగా మారాల్సి ఉంది. ఈ భావనను తృణీకరించేవాడు పౌలు యొక్క అనుచరుడు కాడు, కానీ "నా సహోదరునికి నేను కావలివాడనా?" అని అడిగిన కయీను యొక్క అనుచరుడు.

        3. ఏథెన్సులో పౌలు ఏమి చేశాడు?

అతను ఏమి చూశాడో మీరు విన్నారు; అతనికి ఏమి అనిపించిందో మీకు చెప్పబడింది; కానీ అతను ఏమి చేశాడు? అతను ఏదో ఒకటి చేశాడు. విగ్రహాలతో నిండిన నగరాన్ని చూస్తూ ఊరుకునేవాడు కాదు, ఆ పరిస్థితుల్లో నరమాత్రులతో సంప్రదించే రకం కాదు. తాను ఒంటరిగా ఉన్నానని, తాను పుట్టుకతో యూదుడనని, అపరిచిత దేశంలో అపరిచితుడని, విద్యావంతులైన మనుష్యుల పాతుకుపోయిన చాదస్తాలు, పాత అభిప్రాయాలు తాను వ్యతిరేకించవలసి వస్తుందని, ఒక నగరమంతా పాటించే పాత మతాన్ని ఎదిరించడమంటే సింహాన్ని దాని గుహలోనే ఎదిరించడం లాంటిదని, గ్రీకు తత్వశాస్త్రంలో మునిగిపోయిన మనస్సులపై సువార్త సిద్ధాంతాలు ప్రభావం చూపడం కష్టమని అతను తనలో తాను తర్కించుకుని ఉండవచ్చు. కానీ ఈ ఆలోచనలేవీ పౌలు మనస్సుకు తట్టినట్టు లేదు. ఆత్మలు నశించిపోవడం అతను చూశాడు; జీవితం అల్పమైనదని, సమయం గడిచిపోతోందని అతను భావించాడు; ప్రతి మనిషి ఆత్మను సంధించగల శక్తి తన ప్రభువు సందేశంలో ఉందని అతను నమ్మాడు; తాను స్వయంగా కనికరం పొందినవాడు కాబట్టి, మౌనంగా ఎలా ఉండాలో అతనికి తెలియదు. అతను వెంటనే చర్య తీసుకున్నాడు; తన చేతికి దొరికిన పనిని తన శక్తి అంతటితో చేశాడు. అయ్యో, ఈ రోజుల్లో మనకు ఇలాంటి కార్యశూరులు ఇంకా ఎక్కువగా ఉండి ఉంటే ఎంత మేలు!

అలాగే అతను ఏదైతే చేశాడో దానిని పవిత్రమైన ధైర్యంతో పాటు పవిత్రమైన జ్ఞానంతో కూడా చేశాడు. అతను ఒంటరిగా దూకుడుగా చర్యలు ప్రారంభించాడు, సహచరుల కోసం సహాయకుల కోసం ఎదురుచూడలేదు. కానీ సువార్తకు బలమైన పునాది దొరికే అత్యుత్తమ విధానంలో అతను పూర్తి నైపుణ్యంతో వాటిని ప్రారంభించాడు. మొదటగా అతను సమాజమందిరంలో "యూదులతోనూ” యూదుల ఆరాధనకు హాజరైన "భక్తిపరులైన వారితోనూ" లేదా యూదమతంలోకి మారిన వారితోనూ తర్కించాడని మనకు చెప్పబడింది. ఆ తర్వాత అతను "ప్రతిదినము సంతవీధిలో తనను కలుసుకున్న వారితో" తర్కించడానికి లేదా చర్చలు జరపడానికి వెళ్ళాడు. ఒక అనుభవజ్ఞుడైన సైన్యాధికారి వలే అతను అంచెలంచెలుగా ముందుకు సాగాడు. ఇక్కడ ఇతర చోట్లలాగే పౌలు మనకు ఒక ఆదర్శం - అతను అగ్నిలాంటి తన ఉత్సాహాన్ని మరియు ధైర్యాన్ని - వివేకంతో కూడిన వ్యూహంతోనూ పవిత్రపరచబడిన ఇంగితజ్ఞానంతోనూ మిళితం చేశాడు. అయ్యో, ఈ రోజుల్లో మనకు ఇలాంటి జ్ఞానవంతులు ఇంకా ఎక్కువ మంది ఉండి ఉంటే ఎంత మేలు! అయితే అపొస్తలుడు ఏమి బోధించాడు? యూదులతో అయినా గ్రీకులతో అయినా సమాజమందిరంలోనైనా సంత వీధులలోనైనా అతను వాదించి, తర్కించి మరియు చర్చించిన ఆ గొప్ప అంశం ఏంటి? అజ్ఞానంతో ఉన్న జనసమూహాలకు విగ్రహారాధన యొక్క మూర్ఖత్వాన్ని అతను బట్టబయలు చేశాడని - చేతులతో చేయబడిన ప్రతిమలను ఆరాధించేవారికి దేవుని నిజమైన స్వభావాన్ని చూపించాడని - దేవుడు మనందరికీ సమీపస్తుడన్న వాస్తవాన్ని గురించి, దేవుని ఎదుట లెక్క చెప్పుకునే గంభీరమైన తీర్పు తీర్పు దినం యొక్క కచ్ఛితత్వాన్ని గురించి అతను ఎపిక్యూరీయులకు (Epicureans), స్తోయికులకు (stoics) ప్రకటించాడు. ఇవి అరేయొపగు మీది అతని ప్రసంగం గురించి నమోదు చెయ్యబడిబన వాస్తవాలు.

విగ్రహారాధనతో నిండిన ఆ పట్టణంతో అపొస్తలుని వ్యవహారాల గురించి నేర్చుకోవలసినది ఇంతకంటే మరేమీ లేదా? పౌలు ఏథెన్సులో తెలియచేసిన క్రైస్తవ్యానికి చెందిన ప్రత్యేకమైన విశేషమైన విషయాలు మరేమీ లేవా? నిజానికి ఇంకా ఎక్కువే ఉంది. మనం చూస్తున్న అధ్యాయంలోని 18వ వచనంలో ఒక వాక్యం ఉంది, అది సువర్ణాక్షరాలతో లిఖించదగినది - అన్యజనుల గొప్ప అపొస్తలుడు కొన్నిసార్లు కేవలం సాధారణ దైవవాదం (Deism) లేదా ప్రకృతి సంబంధమైన భక్తిశాస్త్రాన్ని (Natural Theology) బోధించడంతో సరిపెట్టుకున్నాడని చెప్పడానికి సాహసించిన కొందరి మూర్ఖపు వాదనను శాశ్వతంగా మౌనపరచే వాక్యం అది! ఏథెన్సు వారి దృష్టిని ఆకర్షించిన ఒక విషయం ఏంటంటే పౌలు "యేసును గూర్చియు పునరుత్థానమును గూర్చియు ప్రకటించుటయే" అని 18వ వచనంలో మనకు చెప్పబడింది.

యేసు మరియు పునరుత్థానం! ఆ వాక్యంలో ఎంతటి గొప్ప భావం దాగి ఉందో! ఆ మాటల నుండి క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన ఎంతటి సంపూర్ణమైన సారాంశాన్ని గ్రహించవచ్చో! అవి కేవలం ఒక సారాంశంగా ఉద్దేశించబడ్డాయని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. వాటి అర్థాన్ని కుదించి, కేవలం క్రీస్తు యొక్క ప్రవక్త పరిచర్యగా ఆదర్శంగా మాత్రమే వ్యాఖ్యానించేవారిని చూసి నేను జాలిపడుతున్నాను. కోరింథు వెళ్ళివచ్చిన కొద్ది రోజుల తర్వాత "సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరేమియు ఎరుగకుందునని నిశ్చయించుకున్న" ఆ అపొస్తలుడే లేదా సిలువ సిద్ధాంతాన్ని బోధించిన అతడే ఏథెన్సు వారి చెవులకు సిలువను మరుగుచేశాడన్నది నమ్మశక్యం కాని విషయంగా నేను భావిస్తున్నాను. "యేసు మరియు పునరుత్థానం" అనే వాక్యం సంపూర్ణ సువార్తకు ప్రాతినిధ్యం వహించే ప్రకటన అని నేను నమ్ముతున్నాను. స్థాపకుడి పేరు, మరియు సువార్త యొక్క పునాది సత్యాలలో ఒకటి, సంపూర్ణ క్రైస్తవ్యం కోసం మన ముందు నిలుస్తున్నాయి.

అలాగైతే ఈ వాక్యానికి అర్థం ఏమిటి? పౌలు ఏమి ప్రకటించాడని మనం అర్థం చేసుకోవాలి?

(a) ఏథెన్సులో పౌలు ప్రభువైన యేసు వ్యక్తిత్వాన్ని గురించి ప్రకటించాడు - ఆయన దైవత్వం, ఆయన శరీరధారిగా రావడం, పాపులను రక్షించడానికి లోకంలోనికి ఆయన రాకడ, ఆయన జీవితం, మరణం మరియు పరలోకానికి ఆరోహణమవ్వడం, ఆయన స్వభావం, ఆయన బోధన, మనుష్యుల ఆత్మల పట్ల ఆయనకున్న అద్భుతమైన ప్రేమ.

(b) ఏథెన్సులో పౌలు ప్రభువైన యేసు చేసిన కార్యాన్ని ప్రకటించాడు - సిలువపై ఆయన చేసిన బలియాగం, పాపానికి ఆయన చెల్లించిన ప్రాయశ్చిత్తం, అనీతిమంతుల కోసం నీతిమంతునిగా ఆయన ప్రత్యామ్నాయం, ఆయన సంపాదించిన సంపూర్ణ విమోచన విశ్వసించువారందరి కొరకు అనుగ్రహించబడినది, తప్పిపోయిన మనిషి కొరకు పాపం, మరణం మరియు నరకంపై ఆయన సాధించిన సంపూర్ణ విజయం.

(c) ఏథెన్సులో పౌలు ప్రభువైన యేసు యొక్క పరిచర్యలను ప్రకటించాడు - దేవునికి సమస్త మానవాళికి మధ్య ఏకైక మధ్యవర్తిగా పాపమనే రోగంతో ఉన్న మనుష్యులకు గొప్ప వైద్యునిగా భారం మోస్తున్న హృదయాలన్నింటికీ విశ్రాంతిని మరియు సమాధానాన్ని ఇచ్చేవాడిగా దిక్కులేని వారికి స్నేహితుడిగా తమ ఆత్మలను ఆయన చేతులకు అప్పగించుకునే వారందరికీ ప్రధానయాజకునిగా ఉత్తరవాదిగా చెరపట్టబడినవారికి విమోచన క్రయధనం చెల్లించేవాడిగా దేవుని నుండి దూరంగా తిరుగుతున్న వారందరికీ వెలుగుగా మార్గదర్శకుడిగా.

(d) ప్రభువైన యేసు తన సేవకులను సర్వలోకానికి ప్రకటించమని ఆజ్ఞాపించిన సందేశాన్ని ఏథెన్సులో పౌలు ప్రకటించాడు - పాపులలో ప్రధానులను కూడా వెంటనే స్వీకరించడానికి ఆయనకున్న సంసిద్ధత మరియు సుముఖత; ఆయన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారందరినీ సంపూర్ణంగా రక్షించడానికి ఆయనకున్న సమర్ధత; విశ్వసించే వారందరికీ ఆయన అందించే సంపూర్ణమైన, తక్షణమైన క్షమాపణ; ఆయన రక్తంలో సకల పాపములను కడిగివేయగల సంపూర్ణ పవిత్రత; తమ పాపాలను గుర్తించి రక్షించబడాలని ఆశించే వారందరికీ అవసరమైన ఏకైక విషయం నమ్మకం లేదా హృదయపూర్వకమైన సరళమైన విశ్వాసం; ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వసించు వారందరికీ లభించే సంపూర్ణ నీతి.

(e) చివరగా ఏథెన్సులో పౌలు ప్రభువైన యేసు యొక్క పునరుత్థానాన్ని ప్రకటించాడు. యేసు స్వయంగా తన పరిచర్య యొక్క సంపూర్ణ విశ్వసనీయతను ఉంచిన అద్భుతమైన వాస్తవంగా ఆయన దానిని ప్రకటించాడు, అద్భుతాలను విమర్శించే ఏ ఒక్కరూ ఇంతవరకు నిజాయితీగా ఎదుర్కోవడానికి సాహసించనంత విస్తారమైన సాక్ష్యాలద్వారా నిరూపించబడిన వాస్తవంగా దానిని ప్రకటించాడు - క్రీస్తు తాను చేపట్టిన దానిని పూర్తిగా నెరవేర్చాడని, విమోచన క్రయధనం అంగీకరించబడిందని, ప్రాయశ్చిత్తం పూర్తయిందని, మరియు సమాధి తలుపులు శాశ్వతంగా తెరవబడ్డాయని నిరూపిస్తూ సంపూర్ణ విమోచన కార్యానికి మూలరాయిగా ఉన్న వాస్తవంగా ఆయన దానిని ప్రకటించాడు. శరీరంలో మన పునరుత్థానం యొక్క సాధ్యతను నిశ్చయతను ఎలాంటి సందేహం లేకుండా నిరూపిస్తూ "దేవుడు మృతులను లేపగలడా?" అన్న గొప్ప ప్రశ్నకు శాశ్వతంగా పరిష్కారం చూపే వాస్తవంగా ఆయన దానిని ప్రకటించాడు.

దీనితో పాటు ఇలాంటి మరెన్నో విషయాలను పౌలు ఏథెన్సులో బోధించాడనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఆయన ఒక చోట ఒక విషయాన్ని, మరొక చోట ఇంకొక విషయాన్ని బోధించాడని నేను ఏమాత్రం అనుకోలేను. ఆయన బోధ సారాంశాన్ని పరిశుద్ధాత్ముడు "యేసు, మరియు పునరుత్థానము" అనే ఆ గంభీరమైన వాక్యంలో అందిస్తున్నాడు. పిసిదియలోని అంతియొకయలో ఫిలిప్పీలో కొరింథులో మరియు ఎఫెసులో ఆయన ఈ విషయాలను ఎలా వివరించాడో అదే పరిశుద్ధాత్ముడు మనకు స్పష్టంగా తెలియజేశాడు. అపొస్తలుల కార్యములు మరియు పత్రికలు ఈ విషయాన్ని గురించి ఎలాంటి అనిశ్చితి లేకుండా స్పష్టంగా మాట్లాడుతున్నాయి. "యేసు, మరియు పునరుత్థానము" అనగా - యేసు మరియు ఆయన మరణం, సమాధి నుండి లేవడం ద్వారా ఆయన సాధించిన విమోచన, ఆయన ప్రాయశ్చిత్త రక్తము, ఆయన సిలువ, ఆయన ప్రత్యామ్నాయ స్థానము, ఆయన మధ్యవర్తిత్వము, పరలోకంలో ఆయన సాధించిన విజయవంతమైన ప్రవేశము, దాని ఫలితంగా ఆయనను విశ్వసించే పాపులందరికీ కలిగే సంపూర్ణ రక్షణ అని నేను నమ్ముతున్నాను. పౌలు బోధించిన సిద్ధాంతం ఇదే. ఏథెన్సులో ఉన్నప్పుడు ఆయన చేసిన పని ఇదే.

ఇప్పుడు, ఈ అన్యుల గొప్ప అపొస్తలుడు చేసిన కార్యాల నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదా? ఈ వ్యాసాన్ని చదివేవారందరి దృష్టికి నేను క్లుప్తంగా తీసుకురావాలనుకుంటున్న కొన్ని అత్యంత ప్రాముఖ్యమైన పాఠాలు ఉన్నాయి. నేను క్లుప్తంగా అంటున్నాను. వ్యక్తిగత ఆలోచన కొరకు విత్తనాల్లాగా నేను వాటిని కేవలం మీ ముందు ఉంచుతున్నాను.

() మొదటిగా ఏథెన్సులో పౌలు చేసిన కార్యాల నుండి ఒక సిద్ధాంతపరమైన పాఠాన్ని నేర్చుకోండి. ప్రతి చోట మన బోధకు ప్రధాన అంశం యేసుక్రీస్తే అయి ఉండాలి. మన శ్రోతలు ఎంత విద్యావంతులైనా లేదా నిరక్షరాస్యులైనా ఎంత ఉన్నత వంశస్తులైనా లేదా సామాన్యులైనా సిలువవేయబడిన క్రీస్తు - సిలువవేయబడిన, సజీవుడై లేచిన, విజ్ఞాపన చేస్తున్న, విమోచిస్తున్న, క్షమిస్తున్న, చేర్చుకుంటున్న, రక్షిస్తున్న క్రీస్తే - మన బోధకు ప్రధానాంశంగా ఉండాలి. మనం ఈ సువార్తకు మెరుగులు దిద్దకూడదు. ఇంతటి మేలు చేసే మరో అంశాన్ని మనం ఎప్పటికీ కనుగొనలేము. పౌలు కోసినట్లుగా మనం కోయాలంటే పౌలు విత్తినట్లుగానే మనం విత్తాలి.

(బి) రెండవదిగా ఏథెన్సులో పౌలు చేసిన కార్యాల నుండి ఒక ఆచరణాత్మకమైన పాఠాన్ని నేర్చుకోండి. క్రీస్తు కొరకు ఒంటరిగా నిలబడడానికి, ఏకాకిగా సాక్ష్యం ఇవ్వడానికి మనం ఎప్పుడూ భయపడకూడదు, అది భక్తిహీనులైన విస్తారమైన ప్రజల మధ్యనైనా మన స్వంత దేశంలోనైనా - తూర్పు లండన్‌లో లివర్‌పూల్‌లో మాంచెస్టర్‌లో ఒంటరిగానైనా - ఢిల్లీలో బెనారస్‌లో లేదా బీజింగ్‌లో ఒంటరిగానైనా సరే‌- అది ఎక్కడన్నది ముఖ్యం కాదు. దేవుని సత్యం మన పక్షాన ఉంటే మనం మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. ఏథెన్సులో ఒక పౌలు, ప్రపంచానికి వ్యతిరేకంగా ఒక అతనాసియస్, రోమన్ అధికారుల సైన్యానికి వ్యతిరేకంగా ఒక విక్లిఫ్, వోర్మ్స్ లో ఒక లూథర్ - వీరు, వీరే మన కళ్ళ ముందున్న దీపస్తంభాలు. మనుషులు చూసే విధంగా దేవుడు చూడడు. తలలు లెక్కపెట్టడానికి, జనాన్ని లెక్కించడానికి మనం నిలబడకూడదు. తన హృదయంలో క్రీస్తును, చేతుల్లో బైబిల్ ను కలిగిన ఒక వ్యక్తి, వేలాది మంది విగ్రహారాధకుల కంటే బలవంతుడు!

(సి) క్రైస్తవ విశ్వాసంలో ఉన్న సహజాతీత కోణాన్ని ఒక ముఖ్యమైన భాగంగా ధైర్యంగా నొక్కిచెప్పడం ఎంత ప్రాముఖ్యమో ఇంకా చెప్పాలంటే అది ఎంత ఆవశ్యకమో గ్రహించడం మనం నేర్చుకోవలసిన మరొక విషయం. బైబిల్ లోని అద్భుతాలను అపహాస్యం చేసేవారు, పనికిరాని చెత్తలాగా వాటిని పారేయడానికి లేదా అవి కేవలం కట్టుకథలని, అద్భుతాలు కావని తెలివైన వివరణల ద్వారా నిరూపించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్న అవిశ్వాసులు, సంశయవాదులు ఈ రోజుల్లో విస్తారంగా ఉన్నారని ఈ పేజీలను చదువుతున్న చాలామందికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి బోధనను స్థిరంగా ఎదిరించడానికి , పౌలు నిలబడిన పక్షం కొరకు నిలబడడానికి మనం ఎప్పుడూ భయపడకూడదు. ఆయనలాగే క్రీస్తు పునరుత్థానాన్ని మనం సూచిద్దాం, దానికి మద్దతునిచ్చే సాక్ష్యాలను ఖండించమని సహేతుకమైన మరియు న్యాయమైన మనుషులందరినీ నమ్మకంగా సవాలు చేద్దాం. సహజాతీత విశ్వాసానికి శత్రువులైనవారు ఆ సాక్ష్యాన్ని ఎన్నడూ తప్పు అని నిరూపించలేదు, ఇక ఎప్పటికీ నిరూపించలేరు. ఒకవేళ క్రీస్తు మృతులలో నుండి లేపబడకపోతే ఆయన లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అపొస్తలుల ప్రవర్తన మరియు బోధ అనేది పరిష్కరించబడని సమస్యగా అంతుచిక్కని మర్మంగా మిగిలిపోతుంది, దానికి సక్రమమైన మనస్సు గల ఏ మానవుడూ వివరించలేడు. కానీ మనం నమ్ముతున్నట్లుగా క్రీస్తు పునరుత్థానం అనేది కాదనలేని వాస్తవం ఐతే సహజాతీత విశ్వాసానికి వ్యతిరేకంగా ఉన్న సంశయవాద తర్కాల నిర్మాణం మొత్తం కుప్పకూలిపోతుంది. క్రీస్తు పునరుత్థానం అనే మహత్తర అద్భుతాన్ని ఒకసారి అంగీకరిస్తే బైబిల్‌లో ఉన్న మరే చిన్న అద్భుతమైనా నమ్మశక్యం కానిదని లేదా అసాధ్యమని చెప్పడం కేవలం అర్థరహితం.

(డి) ఏథెన్సులో పౌలు చేసిన కార్యాల నుండి విశ్వాసానికి ప్రోత్సాహకరమైన మరొక పాఠంగా నేర్చుకోండి. మనం సువార్తను ప్రకటిస్తే అది ఖచ్చితంగా మేలు చేస్తుందనే పరిపూర్ణ విశ్వాసంతో ప్రకటించవచ్చు. అరేయొపగు కొండపై ఒంటరిగా నిలబడిన ఆ తార్సు పట్టణపు యూదుడు ఆ సమయంలో ఏమీ చెయ్యనట్లుగా లేదా స్వల్పంగా మాత్రమే చేసినట్లుగా అనిపించాడు. తన దారిన తాను వెళ్ళిపోయాడు, విఫలమైనట్లుగా కనిపించాడు, స్టోయికులు మరియు ఎపిక్యూరియన్లు బహుశా తామే వివాదంలో గెలిచినట్లుగా నవ్వి అపహాస్యం చేసి ఉండవచ్చు. కానీ ఆ ఒంటరియైన యూదుడు ఆ రోజు వెలిగించిన దీపం ఆ తర్వాత ఎప్పటికీ ఆరిపోలేదు. ఏథెన్సులో ఆయన ప్రకటించిన వాక్యం పెరిగి, విస్తరించి, పెద్ద వృక్షంగా మారింది. ఆ కొద్దిపాటి పులిసిన పిండి చివరికి గ్రీసు దేశమంతటినీ పులియచేసింది. పౌలు ప్రకటించిన సువార్త విగ్రహారాధనపై విజయం సాధించింది. ఏథెన్సు వేదాంతశాస్త్రం చనిపోయి కనుమరుగైందనడానికి నిదర్శనంగా ఆ ఖాళీ గుడి (పార్థెనాన్) ఈనాటికీ నిలిచి ఉంది. ఔను; మనం మంచి విత్తనాన్ని కన్నీళ్ళతో విత్తవచ్చునేమో కానీ మనం మళ్ళీ "సంతోషముతో పంటకోత మోపులు మోసికొని వస్తాము" (కీర్తనలు 126:6).

నేను ముగింపుకు వస్తున్నాను. పౌలు ఏథెన్సులో ఏమి చూశాడు, ఏమి అనుభూతి చెందాడు, ఏమి చేశాడు అనే విషయాల పరిశీలన నుండి, ఆచరణాత్మకమైన విషయాల వైపుకు నేను మళ్ళుతున్నాను. ఈ వ్యాసం చదివే ప్రతి పాఠకుడిని నేను అడిగేదేంటంటే మనం ఏమి చూడాలి, ఏమి అనుభూతి చెందాలి, ఏమి చెయ్యాలి?

(1) మనం ఏమి చూడాలి? ఇది వింతలును వినోదాలను చూసే తరం. "కన్ను చూచుటచేత తృప్తిపొందదు" (ప్రసంగి 1:8). లోకం ఇటూ అటూ పరుగెత్తడంలో జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడంలో పిచ్చిగా ప్రవర్తిస్తోంది. మానవుని సంపద, కళలు, ఆవిష్కరణలు నిరంతరం లక్షలాది మందిని గొప్ప ప్రదర్శనల వైపుకు సమీకరిస్తున్నాయి. ప్రతి సంవత్సరం వేల కొద్దీ పదివేల కొద్దీ ప్రజలు మనుష్యుల చేతిపనులను పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆశ్చర్యంగా చూస్తున్నారు.

కానీ ఒక క్రైస్తవుడు చూడాల్సింది ప్రపంచ పటం వైపు కాదా? బైబిలును విశ్వసించే వ్యక్తి గంభీరమైన ఆలోచనలతో తేరి చూడాల్సింది, ఇంకా ఆత్మీయ అంధకారంలో మృతతుల్యంగా సువార్త వెలుగు లేకుండా ఉన్న ఆ పటంలోని విశాలమైన ప్రాంతాల వైపు కాదా? భూమిపై ఉన్న జనాభాలో సగం మందికి ఇంకా దేవుని గురించి, క్రీస్తు గురించి ఏమీ తెలియదని, వారు ఇంకా పాపంలోను, విగ్రహారాధనలోను కూరుకుపోయారని ఉన్నారని; క్రైస్తవులు ఆత్మల కొరకు ఎంతో తక్కువగా పనిచెయ్యడం వల్ల మన గొప్ప పట్టణాల్లోని మన స్వదేశీయులలో అనేకులు వాస్తవానికి అన్యుల కంటే ఏమాత్రం మెరుగైన స్థితిలో లేరనే వాస్తవాన్ని కాదా మన కళ్ళు చూడాల్సింది?

దేవుని కళ్ళు వీటిని చూస్తున్నాయి, కాబట్టి మన కళ్ళు కూడా వాటిని తప్పక చూడాలి.

(2) మనకు ఏమి అనిపించాలి? దేవుని దృష్టిలో మన హృదయాలు సరైనవిగా ఉంటే అబద్ధపు మతాలను, అన్యమతత్వాన్ని చూసినప్పుడు మనం చలించిపోవాలి. ప్రపంచ పరిస్థితులను చూసినప్పుడు మన హృదయాల్లో ఎన్నో భావాలు కలగాలి.

మనకు దొరికిన లెక్కలేనన్ని ఆధిక్యతలను బట్టి మనం కృతజ్ఞత కలిగియుండాలి. అధికశాతం ఇంగ్లాండు ప్రజలు (భారతీయ క్రైస్తవులు కూడా: అనువాదకుడు) క్రైస్తవ్యానికి ప్రతిరోజూ ఎంత ఋణపడి ఉన్నారో వారికి తెలిసింది చాలా తక్కువ. వారూ కొన్ని వారాల పాటు అన్యుల మధ్య నివసిస్తే వారి పరిస్థితి ఏమిటో వీరికి అర్థమయ్యేది.

ఇప్పటివరకు క్రైస్తవ వ్యాప్తి కోసం చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ (మన మెయిన్ లైన్ డినామినేషన్లు కూడా- అనువాదకుడు) ఎంత తక్కువగా కృషి చేస్తున్నాయో ఆలోచించినప్పుడు మనం సిగ్గు పడాలి. క్రాన్మర్, రిడ్లీ, లాటిమర్ లాంటి వారు అగ్నికాష్టానికి ఆహుతైన రోజుల నుండి దేవుడు మన కోసం గొప్పకార్యాలు చేశాడు - అనేక శ్రమల గుండా మనల్ని కాపాడాడు, అనేక ఆశీర్వాదాలతో మనల్ని సుసంపన్నం చేశాడు. అయితే ఆయనకు మనం ఎంత తక్కువగా బదులు చెల్లించాము! మన 15,000 సంఘాల్లో స్వదేశంలోనైనా విదేశాల్లోనైనా సువార్త పరిచర్య విషయమై చేసే పని ఎంత తక్కువ! ఆత్మల రక్షణ పట్ల కొన్ని సంఘాలు ఎంత తక్కువ ఆసక్తిని కనబరుస్తున్నాయో! ఈ విషయాలు ఇలా ఉండకూడదు!

మారుమనస్సు పొందని ఆత్మల దయనీయ స్థితిని గురించి, క్రీస్తు లేకుండా జీవించి మరణించే స్త్రీపురుషులందరి దీనావస్థను గురించి మనం కనికరపడాలి. ఈ దారిద్ర్యం లాంటి దారిద్ర్యం మరొకటి లేదు! ఈ రోగం లాంటి రోగం మరొకటి లేదు! ఈ బానిసత్వం లాంటి బానిసత్వం మరొకటి లేదు! విగ్రహారాధనలో అబద్ధ మతంలో పాపంలో చనిపోయే ఈ మరణం లాంటి మరణం మరొకటి లేదు! నశించిపోతున్నవారిని చూసి మనం స్పందించకపోతే మనలో క్రీస్తు మనస్సు ఎక్కడుందని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మారుమనస్సు పొందని ప్రజల స్థితిని చూసి ఒక వ్యక్తి చలించేలా చెయ్యని క్రైస్తవ్యం, 1800 సంవత్సరాల క్రితం పరలోకం నుండి ప్రత్యక్షపరచబడి, కొత్త నిబంధనలో భద్రపరచబడిన క్రైస్తవ్యం కాదని నేను ధైర్యంగా చెప్పగలను.అది కేవలం ఒక వ్యర్థమైన పేరు మాత్రమే తప్ప, అది పౌలు బోధించిన క్రైస్తవ్యం కాదు.

(3) చివరిగా మనం ఏమి చెయ్యాలి? నేను మీ మనస్సును తీసుకురావాలనుకుంటున్న ముఖ్యమైన విషయం ఇదే. చూడడం, అనిపించడం మంచిదే. కానీ ఆచరణే భక్తికి ప్రాణాధారం. క్రియలకు దారితీయని నిష్క్రియాత్మక భావాలు మనస్సాక్షిని కఠినపరచే స్వభావాన్ని కలిగి ఉంటాయి, అవి మనకు నేరుగా హాని చేస్తాయి. మనం ఏమి చెయ్యాలి? మనం ఇప్పటివరకు చేసిన దానికంటే ఇంకా ఎంతో ఎక్కువగా చెయ్యాలి. బహుశా మనమందరం మరింత చెయ్యగలము. సువార్త యొక్క ఘనత, విదేశాల్లోని సువార్త పరిచర్యల పరిస్థితి, స్వదేశంలో విపరీతంగా విస్తరిస్తున్న మన నగరాల పరిస్థితులు, ఇవన్నీ మనకు మరింతగా పని చెయ్యాలని పిలుపునిస్తున్నాయి.

మన యుద్ధోపకరణాలను చూసి సిగ్గుపడుతూ మనం అలాగే నిలబడిపోవాలా? సువార్త అనే ప్రాచీన విశ్వాస ప్రమాణం నేటి అవసరాలకు సరిపోదా? సువార్త గురించి మనం ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదని నేను ధైర్యంగా చెబుతున్నాను. అది పాతబడిపోలేదు. అది శక్తిహీనమైనది కాదు. అది కాలం చెల్లినది కాదు. మనకు ఏ కొత్తదనం అవసరం లేదు, సువార్తకు దేన్నీ కలపనవసరం లేదు, దానిలో నుండి దేన్నీ తీసివేయాల్సిన అవసరం లేదు. సంపూర్ణంగా ధైర్యంగా ప్రేమపూర్వకంగా ప్రకటించబడిన "పురాతన మార్గాలు", ప్రాచీన సత్యాలు తప్ప మనకు మరేమీ అక్కర్లేదు. సువార్తను సంపూర్ణంగా ప్రకటించండి, పౌలు ప్రకటించిన అదే సువార్త ఇప్పటికీ "నమ్ము ప్రతివానికిని రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తియైయున్నది", మతమని పిలువబడే మరే ఇతరమైనవాటికి ఎలాంటి నిజమైన శక్తి లేదు (రోమా 1:16).

సువార్తను ప్రకటించడం వల్ల కలిగే ఫలితాలను చూసి మనం సిగ్గుపడుతూ అలాగే నిలబడిపోవాలా? "పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ" తన శక్తిని కోల్పోయిందని, అది ఎలాంటి మేలు చెయ్యడం లేదని మనం తలదించుకుని ఫిర్యాదు చెయ్యాలా? మనం ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితమైన సిద్ధాంతపరమైన దైవశాస్త్రం తప్ప భూమిపై ఉన్న ఏ మత బోధ కూడా చెప్పుకోదగ్గ ఎలాంటి ఫలితాలను చూపించలేదని నేను ధైర్యంగా చెప్పగలను. హితబోధను తృణీకరించే ఆధునిక పోకడలు భూమిపై ఎలాంటి విడుదలను తీసుకువచ్చాయి? మహానగరాలలో మన గొప్ప ఓడరేవులలో మన ఉత్పాదక పట్టణాలలో మన బొగ్గుగనుల ప్రాంతాలలో మితిమీరి పెరుగుతున్న, సగం అన్యులుగా ఉన్న ఏ సంఘాలను వారు సువార్తీకరించి, నాగరికులుగా చేశారు? ఈ ఆధునిక కాలపు గొప్ప గొప్ప వ్యవస్థలు ఏ న్యూజిలాండ్, ఏ రెడ్ రివర్, ఏ సియెర్రా-లియోన్, ఏ తిన్నెవెల్లి వంటి వాటిని తమ వ్యవస్థ యొక్క ఫలంగా చూపించగలవు?

లేదు! ఒకవేళ "సత్యమంటే ఏమిటి?" అనే ప్రశ్నను ఫలితాలు మరియు ఫలాలను బట్టి పరిష్కరించవలసి వస్తే క్రొత్త నిబంధనా విశ్వాసం, మన సంఘ నిబంధనలు (Articles), విశ్వాసప్రమాణాలు (Creeds), మరియు ప్రార్థన పుస్తకం (Prayer Book) లో క్లుప్తీకరించబడి, సంగ్రహించబడి, భద్రపరచబడిన సూత్రాలు కలిగిన క్రైస్తవ విశ్వాసం సిగ్గుపడాల్సిన పనే లేదు.

గతించిన కాలం విషయమై మనలను మనం తగ్గించుకుని, రాబోయే కాలంలో దేవుని సహాయంతో మరింత ఎక్కువగా చెయ్యడానికి ప్రయాసపడడం తప్ప మనం ఇప్పుడు ఏమి చెయ్యగలం? మన కళ్ళను మరింతగా తెరిచి చూద్దాం. మన హృదయాలను మరింతగా తెరిచి అనుభూతి చెందుదాం. సమర్పణతో కూడిన కానుకల ద్వారా ఆసక్తికరమైన సహకారం ద్వారా ధైర్యంగా నిలబడడం ద్వారా ధైర్యమైన సమర్థింపు ద్వారా మనఃపూర్వకమైన ప్రార్థనల ద్వారా మరింత పని చెయ్యడానికి మనలను మనం రేకెత్తించుకుందాం. మన పిలుపుకు తగిన దేనినైనా చేద్దాం. యేసు పరలోకాన్ని విడిచిపెట్టి భూమిపైకి దిగిరావడానికి కారణమైన ఆ గొప్ప ఉద్దేశం, మనం చెయ్యగలిగిన అత్యుత్తమమైన సేవకు అర్హమైనది.

ఇక ఇప్పుడు, ఈ పత్రికను ఏ ఉద్దేశంతో ప్రారంభించానో అదే ఆలోచనతో ముగిస్తాను. బహుశా మీరు ఒక నగరంలోనో లేదా ఒక పట్టణంలోనో నివసించాల్సి వచ్చి ఉండవచ్చు. మన గ్రామీణ ప్రాంతాల జనాభా ప్రతి సంవత్సరం తగ్గిపోతుంది. పట్టణాల్లో నివసించే వారి సంఖ్య, పల్లెటూళ్ళలో నివసించే వారికంటే వేగంగా పెరిగిపోతుంది. మీరు గనక పట్టణవాసి ఐతే నేను చెప్పబోయే ఈ ముగింపు మాటలను స్వీకరించండి. నేను మీ ఆత్మను గురించి మీతో మాట్లాడుతుండగా దయచేసి శ్రద్ధగా వినండి.

(1) మొదటిగా మీరు ఒక ప్రత్యేకమైన ఆత్మీయ ప్రమాదంలో ఉన్నారని గుర్తుంచుకోండి. బాబెలు దినాల నుండి, ఆదాము పిల్లలు ఎక్కడైతే పెద్ద సంఖ్యలో గుమికూడారో అక్కడ వారు ఎల్లప్పుడూ ఒకరినొకరు పాపం మరియు దుర్మార్గం యొక్క అత్యంత తీవ్రమైన అంచుల వైపుకు ఆకర్షించుకున్నారు. మహానగరాలు ఎప్పుడూ సాతానుకు నిలయాలుగా ఉన్నాయి. నగరంలోనే ఒక యవ్వనస్థుడు భక్తిహీనతకు సంబంధించిన అనేక ఉదాహరణలను చూస్తాడు; అతను పాపంలో జీవించాలని నిశ్చయించుకుంటే అక్కడ అతనికి కావలసినంత మంది స్నేహితులు ఎల్లప్పుడూ దొరుకుతారు. నగరంలోనే థియేటర్లు, క్యాసినోలు, డ్యాన్స్ రూమ్‌లు మరియు బార్‌లు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. నగరంలోనే ధనాపేక్ష, వినోదాపేక్ష లేదా శారీరక ఇచ్ఛల పట్ల ఆపేక్ష లక్షలాది మందిని చెరపడతాయి. విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించడంలో కృపాసాధనాలను తృణీకరించడంలో బైబిలును నిర్లక్ష్యం చెయ్యడంలో ప్రార్థన చేసే అలవాటును మానుకోవడంలో ఒక వ్యక్తిని ప్రోత్సహించడానికి వందలాది మంది నగరంలో ఎప్పుడూ దొరుకుతారు. చదువరీ ఈ విషయాలను పరిగణించు. నువ్వు నగరంలో నివసిస్తున్నట్లయితే జాగ్రత్తగా ఉండు. నీ ప్రమాదాన్ని తెలుసుకో. నీ బలహీనతను, పాప స్వభావాన్ని గ్రహించు .క్రీస్తు నొద్దకు పరుగెత్తు, నీ ఆత్మను ఆయన భద్రతకు అప్పగించు. నిన్ను పట్టుకోమని ఆయనను అడుగు, అప్పుడు నువ్వు సురక్షితంగా ఉంటావు. అప్రమత్తంగా ఉండు. అపవాదిని ఎదిరించు. మెలకువగా ఉండి ప్రార్థించు.

(2) మరోవైపు, మీరు ఒకవేళ పట్టణంలో నివసిస్తున్నట్లయితే పల్లెటూళ్ళలో ఎల్లప్పుడూ దొరకని కొన్ని విశేషమైన వెసులుబాట్లు బహుశా మీకు ఇక్కడ దొరుకుతాయని గుర్తుంచుకోండి. పరలోకం వైపు మీరు చేసే ప్రయాణంలో మీకు సంతోషంగా సహాయం చేసే క్రీస్తు నమ్మకమైన సేవకులు దొరకని పట్టణాలు చాలా అరుదు. సువార్తను ప్రకటించే సేవకుడు, ఇరుకు మార్గంలో ప్రయాణిస్తూ తమ గుంపులో కొత్తవారిని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న కొందరు యాత్రికులు దొరకని పట్టణాలు అరుదుగానే ఉంటాయి.

చదువరీ ధైర్యంగా ఉండు, పట్టణంలో క్రీస్తును సేవించడం అసాధ్యం అనే నిరాశపూరితమైన ఆలోచనకు ఎప్పుడూ చోటు ఇవ్వొద్దు. దేవునికి సమస్తము సాధ్యమే అని తలంచు. సిలువను మోసి, అత్యంత గొప్ప శోధనల మధ్యలో కూడా మరణం వరకు నమ్మకంగా ఉన్న సాక్షుల పొడవైన జాబితాను గుర్తుచేసుకో. బబులోనులో ఉన్న దానియేలు మరియు ఆ ముగ్గురు యౌవనులను గురించి ఆలోచించు. రోములో నీరో చక్రవర్తి ఇంటిలో ఉన్న పరిశుద్ధులను గురించి ఆలోచించు. అపొస్తలుల దినాలలో కొరింథు, ఎఫెసు మరియు అంతియొకయలలో ఉన్న విశ్వాసుల సమూహాలను గురించి ఆలోచించు. ఒక వ్యక్తిని క్రైస్తవుడిగా చేసేది ప్రదేశం కాదు, దేవుని కృప మాత్రమే. ఇదివరకు జీవించిన దేవుని సేవకులలో అత్యంత పరిశుద్ధమైనవారు, ఉపయోగకరమైనవారు అరణ్యంలో నివసించిన సన్యాసులు కారు, వారు పట్టణాల్లో నివసించినవారే.

ఈ విషయాలను జ్ఞాపకముంచుకొని, ధైర్యంగా ఉండు. "పూర్తిగా విగ్రహారాధనకు అంకితమైన" ఏథెన్సు వంటి నగరంలో నువ్వు జీవించవలసి రావచ్చు. నువ్వు బ్యాంకులో కార్యాలయంలో వ్యాపార స్థలంలో లేదా దుకాణంలో ఒంటరిగా నిలబడవలసి రావచ్చు.

కానీ క్రీస్తు నీతో ఉంటే నువ్వు నిజంగా ఒంటరివాడవు కావు. ప్రభువునందును ఆయన బలాతిశయమునందును బలవంతులై యుండు. ధైర్యంగా, స్థిరంగా, ఖచ్చితమైన తీర్మానముతో, సహనంతో ఉండు. ఒక గొప్ప నగరంలో కూడా ఒక వ్యక్తి సంతోషకరమైన, ఉపయోగకరమైన క్రైస్తవునిగా జీవించగలడని, బ్రతికినంత కాలం గౌరవించబడి, చనిపోయినప్పుడు ఘనపరచబడతాడని నువ్వు గ్రహించే రోజు ఒకటొస్తుంది.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.