బైబిల్ గ్రంథంలో రాయబడిన సంఘటనలను అసంబద్ధాలుగా నిరూపించడానికి ప్రయత్నించిన, ప్రయత్నిస్తున్న బైబిల్ విమర్శకులు ఈ ఆధునిక ప్రపంచంలో కోకొల్లలు. కానీ ఇంతవరకూ వారిలో ఏ ఒక్కరూ కూడా ఏ ఒక్క బైబిల్ సంఘటనను కూడా అసంబద్ధంగా నిరూపించి విజయం సాధించలేకపోయారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రేరేపితమైన బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతీ సంఘటనా సందర్భమూ సత్యమైనవి (యోహాను 17:17, కీర్తనలు 119:160). అందులో చాలామట్టుకు ఇంతవరకూ వెల్లడించబడిన (పరిశీలించబడిన) చరిత్రపరంగానూ (History) శాస్త్రపరంగానూ (Science) కూడా తిరుగులేకుండా రుజువయ్యాయి. అందుకే చరిత్రలో బైబిల్ విమర్శకుల ఆ ప్రయత్నాలన్నీ కేవలం మభ్యపెట్టేవిగానే మిగిలిపోయాయి.
అయినప్పటికీ "భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు అది నిమ్మళింపనేరదు దాని జలములు బురదను మైలను పైకి వేయును" (యెషయా 57:20), "యన్నే, యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు" (2తిమోతికి 3:8) అని రాయబడినట్టుగా భక్తిహీనులైన బైబిల్ విమర్శకులు బైబిల్ సంఘటనలను అసంబద్ధాలుగా చూపించాలనే ప్రయత్నం నేటికీ చేస్తూనే ఉన్నారు. అందులో ఒకానొకటే నోవహు జలప్రళయం సంఘటనను పురాతన మట్టి పలకలు(Clay Tablets) లోని కథలను దొంగిలించి రాసుకున్నారు అని వాదించే ప్రయత్నం. అయితే ఆ ప్రయత్నం కూడా బైబిల్ చరిత్ర ముందు ఎంత సులభంగా విఫలమౌతుందో కేవలం మభ్యపెట్టేదిగా మాత్రమే మిగిలిపోతుందో ఆధారాలతో రుజువు చెయ్యడానికే ఈ వ్యాసం రాస్తున్నాను.
మొదటిగా నోవహు జలప్రళయం ఎప్పుడు సంభవించింది అనేది పరిశీలిద్దాం. బైబిల్ చరిత్రలో ఏయే సంఘటనలు ఎప్పుడు జరిగాయనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి కొందరు బైబిల్ పండితులు కాలక్రమ లెక్కలకు ప్రయత్నించారు. అందులో క్రీ.శ. 17వ శతాబ్దానికి చెందిన జేమ్స్ అషర్ (James Ussher) అత్యంత ప్రసిద్ధమైన పండితుడు. ఆయన బైబిల్‌లోని వంశావళులు, కచ్చితంగా రాయబడిన కాలాలు, యూదా రాజుల పరిపాలన సంవత్సరాలు, మరియు చరిత్రలో స్పష్టంగా రుజువైన సంఘటనల ఆధారంగా ఒక సమగ్ర కాలక్రమాన్ని రూపొందించాడు.
ఆ కాలక్రమ లెక్కలో ముఖ్యమైనది యెరూషలేము పతనం. బబులోను రాజైన నెబుకద్నెజరు-II (Nebuchadnezzar II) 586 BCలో యెరూషలేమును నాశనం చేసాడని చరిత్ర స్పష్టంగా చెబుతుంది (2 రాజులు 25:8-10). అందుకే జేమ్స్ అషర్ మొదటిగా ఆ తేదీని ప్రామాణికంగా తీసుకుని అక్కడి నుండి బైబిల్ లోని యూదా రాజుల పరిపాలన సంవత్సరాలను వెనక్కు లెక్కించాడు. ఆ లెక్క ప్రకారం ఇశ్రాయేలు రాజైన సొలొమోను కాలంలో యెరూషలేము దేవాలయ నిర్మాణం సుమారు 1012 BCలో ప్రారంభమైనట్టు వస్తుంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన 480 సంవత్సరాల తర్వాత ఆ ఆలయ నిర్మాణం ప్రారంభమైందని బైబిల్‌లో చెప్పబడింది (1 రాజులు 6:1). అందువల్ల ఈ 480 సంవత్సరాలను వెనక్కు లెక్కిస్తే నిర్గమకాండము (Exodus) జరిగిన కాలం సుమారు 1491 BCగా వస్తుంది (1492 వస్తుంది కానీ James Ussher ఒక సంవత్సరాన్ని విడిచిపెట్టి 1491 గానే లెక్కించాడు). ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరాలు (నిర్గమకాండము 12:40). అందువల్ల నిర్గమకాండము జరిగిన 1491 BCనుండి వెనక్కు లెక్కిస్తే యాకోబు కుటుంబం ఐగుప్తులో ప్రవేశించిన కాలం 1876 BCగా వస్తుంది (ఇక్కడ అషర్ పూర్తి 430 సంవత్సరాలూ తీసుకోలేదు, ఒక ప్రశ్నకు జవాబు కోసం 385 సంవత్సరాలనే తీసుకున్నాడు). ఆ సమయంలో యాకోబు వయస్సు 130 సంవత్సరాలు (ఆదికాండము 47:9). అంటే యాకోబు జననం సుమారు 2006 BCలో జరిగింది. యాకోబును ఇస్సాకు 60 సంవత్సరాల వయస్సులో కన్నాడు (ఆదికాండము 25:26). అంటే ఇస్సాకు జననం 2066 BCలో జరిగింది. ఇస్సాకును అబ్రాహాము 100 సంవత్సరాల వయస్సులో కన్నాడు (ఆదికాండము 21:5). ఈ లెక్క ప్రకారం అబ్రాహాము జననం 2166 BCలో జరిగింది. 2066 + 100 = 2166 BC.
అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించింది జేమ్స్ అషర్ లెక్కించినట్టు 385 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాలు కూడా కాదు, కేవలం 215 సంవత్సరాలే. నిర్గమకాండము 12:40 వాక్యభాగం అబ్రాహాము కనానులో ప్రవేశించినప్పటి నుండి లెక్కించి 430 అని చెబుతుంది (గలతీ 3:17) దానికి సంబంధించిన ఆధారం ఈ వ్యాసం చివరిలో సూచిస్తాను. అలా ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరాలు కాదు, 215 సంవత్సరాలే అని తీసుకుంటే అబ్రహాము జననం లెక్క మారుతుంది. ఎలాగంటే, నిర్గమకాండము జరిగిన 1491 BCనుండి 215 సంవత్సరాలు వెనక్కు లెక్కిస్తే యాకోబు కుటుంబం ఐగుప్తులో ప్రవేశించిన కాలం 1706 BCగా వస్తుంది. ఆ సమయంలో యాకోబు వయస్సు 130 సంవత్సరాలు (ఆదికాండము 47:9). అంటే యాకోబు జననం 1836 BCలో జరిగింది. యాకోబును ఇస్సాకు 60 సంవత్సరాల వయస్సులో కన్నాడు (ఆదికాండము 25:26). అంటే ఇస్సాకు జననం 1896 BCలో జరిగింది. ఇస్సాకును అబ్రాహాము 100 సంవత్సరాల వయస్సులో కన్నాడు (ఆదికాండము 21:5). ఈ లెక్క ప్రకారం అబ్రాహాము జననం 1996 BCలో జరిగింది. 1896 + 100 = 1996 BC.
తర్వాత జేమ్స్ అషర్ అబ్రాహాము నుండి వెనక్కు వెళ్ళి నోవహు జలప్రళయాన్ని లెక్కించడానికి ఆదికాండము 11లో ఉన్న వంశావళి సంఖ్యలను ఉపయోగించాడు. దాని ప్రకారం, జలప్రళయం తర్వాత రెండు సంవత్సరాలకు షేము అర్పక్షదును కన్నాడు (ఆదికాండము 11:10). తర్వాత అర్పక్షదు 35 సంవత్సరాల వయస్సులో షేలహును కన్నాడు (ఆదికాండము 11:12), షేలహు 30 సంవత్సరాల వయస్సులో ఏబెరును కన్నాడు (ఆదికాండము 11:14), ఏబెరు 34 సంవత్సరాల వయస్సులో పెలెగును కన్నాడు (ఆదికాండము 11:16), పెలెగు 30 సంవత్సరాల వయస్సులో రేయూను కన్నాడు (ఆదికాండము 11:18), రయూ 32 సంవత్సరాల వయస్సులో సెరూగును కన్నాడు (ఆదికాండము 11:20), సెరూగు 30 సంవత్సరాల వయస్సులో నాహోరును కన్నాడు (ఆదికాండము 11:22), నాహోరు 29 సంవత్సరాల వయస్సులో తెరహును కన్నాడు (ఆదికాండము 11:24). అంటే జలప్రళయం నుండి తెరహు జననం వరకు మొత్తం 222 సంవత్సరాలు వస్తుంది. 2+35+30+34+30+32+30+29 = 222. తెరహు 70 సంవత్సరాల వయస్సులో అబ్రాహామును కన్నాడు (ఆదికాండము 11:26). ఈ 70 సంవత్సరాలను 222 సంవత్సరాలకు కలిపితే జలప్రళయం నుండి అబ్రాహాము జననం వరకు మొత్తం 292 సంవత్సరాలు ఔతుంది. ముందు చూసినట్టుగా అబ్రాహాము జననం 1996 BC అనుకుంటే, జలప్రళయం (292+1996) 2288 BCలో జరిగినట్టు వస్తుంది. కానీ జేమ్స్ అషర్ తెరహుకు అబ్రాహాము 70వ యేట కాదు 130వ యేట జన్మించాడనే వాదన తీసుకుని జలప్రళయం 2348 BCలో సంభవించిందని నిర్థారించాడు. 1996+222+130 = 2348 BC.
అంటే జేమ్స్ అషర్ లెక్క ప్రకారం జలప్రళయం సంభవించింది 2348 BCలో. కానీ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించింది 430 సంవత్సరాలు కాదు, 215 సంవత్సరాలే అని మరియు అబ్రాహాము తెరహుకు 130వ యేట కాదు, ఆదికాండము 11:26లో రాయబడినట్టుగా 70వ యేటే జన్మించాడని లెక్కిస్తే జలప్రళయం సంభవించింది 2288 BCలో. మరికొందరు బైబిల్ పండితులు జలప్రళయం సంభవించింది 2458 BCగా కూడా లెక్కించారు. కానీ అందులో నాకున్న సమస్యలను బట్టి ఆ లెక్కను విడిచిపెడుతున్నాను.
ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే, బైబిల్ లో రాయబడిన జలప్రళయం సంఘటన తరహాలోనే మరికొన్ని సంస్కృతుల్లో కూడా క్యూనిఫామ్ (Cuneiform) లిపిలో జలప్రళయం గురించి రాయబడిన మట్టి పలకలు (Tablets) మనకు లభించాయి. అందులో ప్రాచీనమైనది "సుమేరియన్ కింగ్ లిస్ట్ (Sumerian King List)" అనే మట్టి పలక (Tablet). ఇది సుమారు 2100 BCకి చెందిందిగా భావించబడుతుంది. అయితే ఈ మట్టి పలక జలప్రళయం యొక్క పూర్తి కథను మనకు వివరించదు, కేవలం "ఆ తర్వాత జలప్రళయం దేశాన్ని కప్పేసింది" అంటూ జలప్రళయం జరిగిన సంఘటనను మాత్రమే సూచిస్తుంది.
కానీ పూర్తి జలప్రళయం కథగా మనకు దొరికిన అత్యంత ప్రాచీనమైన మట్టి పలక "ఎరిడు జెనెసిస్ (Eridu Genesis)". ఇది 1893 ADలో ఇరాక్ లోని నిపుర్ (nippur) ప్రాంతంలో కనుగొనబడింది. అవ్వడానికి ఈ మట్టి పలక సుమారు 1600 BCకి చెందిందే అయినప్పటికీ అందులోని కథ యొక్క మూలం 2300 BC నుండి 2000 BC మధ్య కాలంలో ఏర్పడిందని పురాతత్వ శాస్త్రవేత్తలు వెల్లడించారు. తర్వాత ఈ సంప్రదాయం అక్కాడియన్ భాషలో అభివృద్ధి చెంది మరో కథగా కనిపిస్తుంది. ఈ కథను "అత్రహసిస్ ఎపిక్ (Atrahasis Epic)" అని పిలుస్తారు. ఇది సుమారు 1650 BCకి చెందిన మట్టి పలకలలో కనిపిస్తుంది. ఇందులో దేవతలు మనుష్యుల సంఖ్య ఎక్కువగా పెరిగి వారి శబ్దం ఇబ్బంది కలిగిస్తుందని భావించి వారిని నాశనం చెయ్యాలని నిర్ణయిస్తారు. ఒక దేవుడైన ఎన్లిల్(Enlil) ఈ నిర్ణయం తీసుకుంటాడు. అయితే ఆ విషయంలో ఎన్కి(Enki) అనబడే మరో దేవుడు నీతిమంతుడైన అత్రహసిస్ అనే మనిషిని రహస్యంగా హెచ్చరించి ఒక పెద్ద పడవ నిర్మించమని చెబుతాడు. అతను పడవ నిర్మించి తన కుటుంబాన్నీ మరియు జంతువులనూ పడవలోకి తీసుకుంటాడు. తర్వాత భారీ జలప్రళయం వచ్చి భూమిని కప్పేస్తుంది.
ఈ కథ తర్వాత మెసొపొటేమియా (Mesopotamia) సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన గిల్గమేష్ (Gilgamesh) ఇతిహాసంలో కూడా కనిపిస్తుంది. ఈ ఇతిహాసాన్ని "ఎపిక్ ఆఫ్ గిల్గమేష్ (Epic of Gilgamesh)" అని పిలుస్తారు. ఈ కథ యొక్క మూలం సుమారు 2100 BCకి వెళ్తుంది. కానీ మనకు దొరికిన దీని ప్రసిద్ధ మట్టి పలకల కాపీలు క్రీ.పూ. 7వ శతాబ్దానికి మాత్రమే చెందినవి. ఈ కథలో ఉట్నపిష్టిం (Utnapishtim) అనే వ్యక్తి గిల్గమేష్ కు జలప్రళయం కథను చెబుతాడు. అది దాదాపుగా నోవహు జలప్రళయం సంఘటనను పోలియుంటుంది. ఉదాహరణకు, జలప్రళయం తర్వాత భూమి ఎండిందో లేదో తెలుసుకోవడానికి అతను కాకినీ పావురాన్నీ వానకోవెల పక్షిని కూడా పంపడం, ఓడ నుండి బయటకు వచ్చి బలి అర్పించడం వంటి పోలికలు.
వీటి ఆధారంగానే కొందరు బైబిల్ విమర్శకులు "ఎరిడు జెనెసిస్ (Eridu Genesis)" మూలంగా నిర్మాణమైన "ఎపిక్ ఆఫ్ గిల్గమేష్ (Epic of Gilgamesh)" జలప్రళయం కథను దొంగిలించే (ఎరిడు జెనెసిస్ - అత్రహసిస్ ఎపిక్ - ఎపిక్ ఆఫ్ గిల్గమేష్) బైబిల్ లో నోవహు జలప్రళయం కథను రాసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఎందుకంటే, జేమ్స్ అషర్ లెక్క ప్రకారం నోవహు జలప్రళయం సంభవించింది 2348 BC అనుకుంటే 2300 BCకి చెందిన ఎరిడు జెనెసిస్ మూలంగా నిర్మాణమైన ఎపిక్ ఆఫ్ గిల్గమేష్ జలప్రళయం కథ ఆ సమయానికి చాలా దగ్గరగా ఉంది. 2288 BC అనుకుంటే నోవహు జలప్రళయానికి 12 సంవత్సరాల ముందే అది రాయబడింది, అందుకే అలా ఆరోపిస్తున్నారు.
యూదా 1:10 - వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై, వివేక శూన్యములగు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటివలన తమ్మును తాము నాశనము చేసికొనుచున్నారు.
కానీ గమనించండి, ఎరిడు జెనెసిస్ (Eridu Genesis) జలప్రళయం కథ కచ్చితంగా 2300 BC అని తేల్చబడలేదు. కేవలం 2300 BC నుండి 2000 BC మధ్య కాలానికి చెందిందని మాత్రమే చెప్పబడుతుంది. అది ఎంతవరకూ వాస్తవమో తెలియదు. ఒకవేళ ఈ ఎరిడు జెనెసిస్ (Eridu Genesis) మూలంగా నిర్మాణమైన అత్రహసిస్ ఎపిక్, ఎపిక్ ఆఫ్ గిల్గమేష్ లోని జలప్రళయం కథలు 2300 BCవి కాదు, 2500 BCవి అయినప్పటికీ ఆ కథలను దొంగిలించే బైబిల్ లో నోవహు జలప్రళయం సంఘటనను కల్పించుకున్నారని బైబిల్ విమర్శకులు రుజువు చెయ్యలేరు. పైగా వారి తర్కం ప్రకారం బైబిల్ లోని జలప్రళయం సంఘటన ఆధారంగానే ఆ కథలన్నీ కల్పించబడ్డాయని ఒప్పుకుని తీరాలి. Its my lifetime challenge.
ఎందుకంటే, బైబిల్ కాలక్రమం ప్రకారం నోవహు జలప్రళయం సంభవించింది జేమ్స్ అషర్ లెక్కించినట్టు 2348 BCలోనూ కాదు, 2288 BCలోనూ కాదు, 2458 BCలో కూడా కాదు. మరెప్పుడో తెలియాలంటే మొదట ఆదికాండము 11వ అధ్యాయపు వంశావళిలో చోటు చేసుకున్న సంఖ్యాపరమైన పొరపాట్ల గురించి తెలుసుకోవాలి. ఆ అధ్యాయంలో అర్పక్షదు నుండి నాహోరు వరకూ (ఆదికాండము 11:12-24) వారు కుమారులను కన్నారని రాయబడిన వయస్సులు 35,30,34,30,32,30,29 కాదు. మన బైబిళ్ళు ఏ హీబ్రూ ప్రతి ఆధారంగా తర్జుమా చెయ్యబడ్డాయో ఆ మెసొరెటిక్ (Masoretic) ప్రతిలో అక్కడ సంఖ్యాపరమైన పొరపాట్లు జరిగాయి. ఆదికాండము 5వ అధ్యాయపు వంశావళిలో కూడా ఆ సమస్య ఉంది (ఆదికాండము 5:3 వ్యాఖ్యానం). చేతులతో ప్రతులు రాసేటప్పుడు అలాంటివి సహజం. మనం మెసొరెటిక్ ప్రతి కంటే పురాతనమైన అధికారిక గ్రీకు తర్జుమా సెప్టుఅజింట్ (Septuagint) LXX నూ మరియు సమరిటన్ పెంటట్యూక్ (Samaritan Pentateuch) ప్రతినీ మనం పరిశీలించినప్పుడు వారు కుమారులను కన్నారని రాయబడిన వయస్సులకు మరో వందేసి (నాహోరు విషయంలో యాభై) సంవత్సరాలు అదనంగా ఉంటుంది. అంటే అర్పక్షదు షేలాహును కన్నది 35 యేళ్ళకు కాదు 135 యేళ్ళకు, షేలాహు ఏబెరును కన్నది 30 యేళ్ళకు కాదు 130 యేళ్ళకు, ఏబెరు పెలెగును కన్నది 34 యేళ్ళకు కాదు 134 యేళ్ళకు, పెలెగు రెయూను కన్నది 30 యేళ్ళకు కాదు 130 యేళ్ళకు, రెయూ సేరూగును కన్నది 32 యేళ్ళకు కాదు 132 యేళ్ళకు, సేరూగు నాహోరును కన్నది 30 యేళ్ళకు కాదు 130 యేళ్ళకు, నాహోరు తెరహును కన్నది 29 యేళ్ళకు కాదు 79 యేళ్ళకు. గుర్తుంచుకోండి, ఈ సంఖ్యలన్నీ నేను క్రీ.పూ 3వ శతాబ్దానికి చెందిన అధికారిక గ్రీకు తర్జుమా సెప్టుఅజింట్ LXX నుండి తీసుకున్నాను. అంతేకాదు అదనపు ఆధారంగా సమరిటన్ పెంటట్యూక్ ను కూడా పరిశీలించాను. అంటే ఈ వయస్సులు కాదనలేని సత్యం. దాని ప్రకారం, మన బైబిళ్ళలో ఆదికాండము 11లోని ఈ వంశావళికి మనం అదనంగా మరో 650 సంవత్సరాలను కలిపి లెక్కించుకోవాలి. అలా లెక్కిస్తే జేమ్స్ అషర్ పాత లెక్క 2348 మరియు 650 జలప్రళయం 2348+650 = 2998 BCలో సంభవించింది. ఆ సంఖ్యను ప్రక్కనపెట్టి, నేను నిజాయితీగా లెక్కించిన తక్కువ సంఖ్య 2288 BCనే ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ జలప్రళయం సంభవించింది 2288+650 = 2938 BCలో. అంటే బైబిల్ కాలక్రమం ప్రకారం నోవహు జలప్రళయం గడిచిపోయిన కొన్ని వందల సంవత్సరాల తర్వాతే ఆ కథలన్నీ రాయబడ్డాయి.
కొందరు క్రైస్తవ ప్రబుద్ధులు బైబిల్ విమర్శకులు సంధిస్తున్న ఈ ఆరోపణకు ఇలా ప్రతులను పరిశీలించి సమాధానం చెప్పలేక ఆదికాండము 11 లోది 'విడిచిపెట్టు వంశావళి' (Skip Genealogy) అంటూ దాటవెయ్యబోతున్నారు. కానీ ఆదికాండము 11లోనూ 5లోనూ విడిచిపెట్టు వంశావళి ఉన్నట్టు ఏవిధంగానూ రుజువు చెయ్యలేము, ఎందుకంటే అక్కడ స్పష్టంగా ఎవరు ఎవర్ని ఎప్పుడు కన్నారో చాలా వివరంగా రాయబడింది. ఒకవేళ లూకా 3:36 ప్రకారం, అర్పక్షదుకూ షేలహుకూ మధ్య కెయినాను ఉన్నాడుగా అంటే ఆ పేరు లూకా సువార్తకు సంఘం ప్రతులు రాస్తున్నప్పుడు సెప్టుఅజింట్ ను బట్టి చేర్చబడిందిగానే కొందరు బైబిల్ పండితులు భావిస్తారు. ఎందుకంటే మన బైబిళ్ళలో ఆదికాండము 11లోనే కాదు, 1 దినవృత్తాంతములు 1లోని వంశావళిలో కూడా ఆ పేరు మనకు కనిపించదు. యూదా చరిత్రకారుడైన ఫ్లేవియస్ జోసెఫస్ కూడా అతను చరిత్రలో ఉన్న వ్యక్తిగా తన వంశావళిలో ప్రస్తావించలేదు.
ఇప్పుడు, "సుమేరియన్ కింగ్ లిస్ట్ (Sumerian king list)" మట్టి పలకలోని సుమేరియా రాజుల వంశావళితో పోల్చినప్పుడు నోవహు జలప్రళయ కాలక్రమం సరిపోవట్లేదు, ఆ జలప్రళయం నిజంగానే సంభవించియుంటే ఐగుప్తు రాజుల వంశావళిలో అంతరాయం ఎందుకు కలగలేదు అనేది విమర్శకులు లేవనెత్తుతున్న మరో సమస్య.
మొదటిగా, "సుమేరియన్ కింగ్ లిస్ట్ (Sumerian king list)" అనే దానిని కచ్చితమైన చరిత్ర (accurate history) గా ఏ పురాతత్వ శాస్త్రవేత్తా భావించడు. ఎందుకంటే అందులో చరిత్రతో పాటు పురాణ కథలు కూడా కలగలిసిపోయి ఉంటాయి. అలాంటి మట్టి పలకను ఆధారం చేసుకుని నోవహు జలప్రళయపు కాలక్రమాన్ని ప్రశ్నించడం బైబిల్ విమర్శకుల అజ్ఞానం లేదా కుతంత్రం. ఆ వాదన ప్రక్కనపెట్టినప్పటికీ ఆ మట్టి పలక రాయబడిన కాలం సుమారు 2100 BCలో. అంటే బైబిల్ కాలక్రమం ప్రకారం నోవహు జలప్రళయం గతించిపోయిన 800 సంవత్సరాల తర్వాత అది రాయబడింది. అందువల్ల ఆ మట్టి పలకలోని జలప్రళయానికి సంబంధించిన మాటలు 2900 BC- 3000 BC మధ్యవి అని రాయబడినప్పటికీ నోవహు జలప్రళయానికి ముందే ఆ కథ రాయబడిందని రుజువు చెయ్యడం సాధ్యపడదు. ఎందుకంటే ఆ మట్టి పలక రాయబడింది సుమారు 2100 BCలో. ఈ వాదన కూడా ప్రక్కనపెట్టి ఆ మట్టి పలకలో జలప్రళయం జరిగిందని ప్రస్తావించబడిన మొదటి సంఖ్య 2900 BCని పరిగణలోకి తీసుకున్నప్పటికీ ఆ కాలానికి 38 సంవత్సరాలు ముందే నోవహు జలప్రళయం గతించిపోయింది. ఎందుకంటే బైబిల్ ప్రకారం జలప్రళయం సంభవించింది 2938 BCలో.
రెండవదిగా, ఐగుప్తు రాజుల దగ్గరకు వద్దాం. ఆధునిక ఐగుప్తు అధ్యయన శాస్త్రం (Egyptology) ప్రకారం 2600 BCతర్వాత రాజవంశాలే కచ్చితమైనవని చెబుతుంది. ఎందుకంటే ఆ కాలం నుంచే ఐగుప్తు చరిత్రకు బలమైన ఆధారాలు (నిర్మాణాలు) లభించాయి. ముందటి ప్రారంభ రాజవంశ కాలం (Early Dynastic Period) గా చెప్పబడుతున్న 3100 BC–2600 BCకాలం కేవలం అంచనా మాత్రమే, ఆ కాలానికి కచ్చితమైన ఆధారాలు లేవు. కాబట్టి ఆ కాలానికి చెందిన రాజవంశాలను ఆధారంగా చేసుకుని నోవహు జలప్రళయాన్ని ప్రశ్నించడం వీలుపడదు. 2600 BC తర్వాత రాజవంశాలు బైబిల్ ప్రకారం నోవహు జలప్రళయం గతించిపోయిన (2938 BC) తర్వాతటి కాలానికి చెందినవి. అలాంటప్పుడు ఆ రాజవంశాలలో జలప్రళయం కారణంగా అంతరాయం ఎందుకు కలుగుతుంది?
గమనించండి, ఐగుప్తు ప్రజలైనా సుమేరియా ప్రజలైనా నోవహు జలప్రళయం తర్వాత అతని కుమారుల సంతతి నుండే ఉనికిలోకి వచ్చారు. హాము కుమారుడైన మిస్రాయిము సంతతే ఐగుప్తీయులు (ఆదికాండము 10:6). జలప్రళయానికి ముందు ఐగుప్తూ లేదు, సుమేరియానూ లేదు. ఇక వాటికి రాజవంశాలు ఎక్కడుంటాయి? అవన్నీ జలప్రళయం గతించిపోయిన 2938 BC తర్వాత నోవహు కుమారుల సంతానం నుండి ఏర్పడినవే.
ఆదికాండము 10:32 వారివారి జనములలో వారివారి సంతతుల ప్రకారము, నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను.
ఈ విధంగా నోవహు కుమారుల సంతానం ద్వారానే భూమిపై జాతులు విస్తరించాయి కాబట్టి వారు తర్వాత కాలంలో విగ్రహారాధికులుగా మారినప్పుడు ఆ జలప్రళయాన్ని తమ దేవుళ్ళ పేర్లతో మరియు తమకు తగ్గట్టుగా మార్పులు చేసుకుని కథలుగా రాసుకున్నారు. మళ్ళీ చెబుతున్నాను, ఆ కథలన్నీ నోవహు జలప్రళయం మాదిరిగానే ఎందుకు ఉన్నాయంటే బాబేలు గోపురం వద్ద చెదరిపోయిన నోవహు సంతానమే అవి రాసుకున్నారు కాబట్టి అవి నోవహు జలప్రళయానికి దగ్గరగా ఉన్నాయి.
చివరిగా, బైబిల్ విమర్శకులు లేవనెత్తుతున్న మరో రెండు సమస్యలకు సమాధానం చెప్పి ఈ వ్యాసాన్ని ముగిస్తాను.
1. నోవహు జలప్రళయం ఎరిడు జెనెసిస్, ఎపిక్ ఆఫ్ గిల్గమేష్ వంటి కథలకు ముందే జరిగినప్పటికీ మోషే నోవహు జలప్రళయం సంఘటనను వాటి తర్వాతనే ఆదికాండములో రాసాడుగా? అలాంటప్పుడు మోషే వాటిని copy చేసి రాసాడని ఎందుకు అనుకోకూడదు?
A. నిజమే, మోషే జలప్రళయం సంఘటన ఉన్న ఆదికాండము గ్రంథాన్ని 1400 BC- 1500 BC మధ్యకాలంలోనే రాసాడు. అంటే ఆ మట్టి పలకలలోని జలప్రళయం కథ రాయబడిన తర్వాతే మోషే రాసాడు. అయినప్పటికీ మోషే వాటిని copy చేసే రాసాడని రుజువు చెయ్యడం సాధ్యం కాదు. ఎందుకంటే ఒక సంఘటన జరిగిన తర్వాత అది వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు కాలాల్లో రాయబడుతుంది. కాబట్టి ముందుగా రాయబడిందే అసలైనది, తర్వాతది దాని copy అని అర్థం కాదు. మోషే పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ సంఘటనను రాసాడు కాబట్టే దానికి సంబంధించి స్పష్టమైన, తర్కబద్ధమైన, నైతికపరమైన వివరాలనూ కారణాలనూ అతను తెలియచేసాడు. అలాంటివి మిగతా కథల్లో మనకు కనిపించవు, ప్రతిగా ఎపిక్ ఆఫ్ గిల్గమేష్ కథ చివరిలో దేవతలు ఉట్నపిష్టింకూ అతని భార్యకూ అమరత్వం ప్రసాదించినట్టు అసంబద్ధాలు ఉంటాయి.
2. జలప్రళయం నిజంగానే సంభవించి ఉంటే అంత నీరు ఎక్కడి నుండి వచ్చింది, భూమిలో అంత నీరు ఇంకిపోయినట్టు ఆధారం ఏముంది?
A. ఆ జలప్రళయం ఆకాశం నుండి కురిసే ప్రచండ వర్షంతో పాటు భూమి యొక్క అగాధ ఊటలు కూడా తెరవబడటం వల్ల సంభవించిందని బైబిల్ చెబుతుంది (ఆదికాండము 7:11,12, 8:2). 40 పగళ్ళు, రాత్రులు ప్రచండ వర్షం , అగాధ ఊటలు తెరవబడి అలానే భీకరంగా కొనసాగబట్టి పర్వతాలు సైతం మునిగిపోయేంత (అప్పటి కొలతలో) జలప్రళయం చోటు చేసుకుంది. అదేమీ అసంభవమైన విషయం కాదు. ఉదాహరణకు ఉన్నపాటుగా సముద్రంలోని నీరంతా భూమి పైకి వస్తే ఏమౌతుంది? అలానే ఆ జలప్రళయపు నీరు దేవుడు తన అద్భుతం ద్వారా వాయువును విసిరింపచెయ్యబట్టి తగ్గిపోయినట్టు రాయబడింది (ఆదికాండము 8:1). అంటే ఆ నీరు భూమిలోకి ఇంకిపోవడం వల్ల కాదు ఆయన అద్భుతంగా గాలిని విసిరింపచెయ్యబట్టి తగ్గిపోయింది. అందుకే భౌగోళిక జలప్రళయం (Global flood) జరిగిందని నిర్ధారించే "ఏకరూప అవక్షేప పొర (Uniform sediment layer)" కి సంబంధించిన ఆధారాలు మనకు ఇంకా దొరకలేదు. అయినప్పటికీ భౌగోళిక జలప్రళయం జరిగినట్టుగా పర్వత శిఖరాలపై ప్రాముఖ్యంగా Mount Everest పై సముద్రజీవుల అవశేషాలు (Marine fossils) మనకు చాలానే లభించాయి.
కీర్తనలు 8:1 యెహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా భూమియందంతట నీ నామము ఎంత ప్రభావము గలది.
ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించింది కేవలం 215 సంవత్సరాలే అనే నా లెక్కకు ఆధారం తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి - ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఎంతకాలం నివశించారు? 400/430/215?
అబ్రాహాము తెరహుకు 130వ యేట కాదు, 70వ యేటనే జన్మించాడనే నా వాదనకు ఆధారం తెలుసుకోవడానికి ఈ వ్యాఖ్యానం చదవండి - ఆదికాండము 11:32 వ్యాఖ్యానం
ఆదికాండము 5వ అధ్యాయంలోని వంశావళి సంవత్సరాలలో కూడా వందల సంవత్సరాలపైన వ్యత్యాసం ఉంటుంది, ఆ వివరాలు తెలుసుకోవడానికి ఈ వ్యాఖ్యానం చదవండి - ఆదికాండము 5:3 వ్యాఖ్యానం
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2025 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
