దేవునిప్రజలందరూ ఆయన మనస్సు కలిగియుండాలని ఆజ్ఞాపించబడుతున్నారు (పిలిప్పీ 2:5). అలా ఆయన మనస్సు కలిగి దానిప్రకారంగా జీవించిన ఎందరో భక్తులను లేఖనాలలో మనం చూస్తుంటాం. వారిలో అహరోను మనువడైన ఫినేహాసు ఒకరు. అతనిలోని దేవుని మనసు గురించే ఇప్పుడు వివరించుకోబోతున్నాము.
ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనానుకు ప్రయాణం చేస్తున్నప్పుడు మోయాబీయుల దేశం గుండా పయనించవలసి వస్తుంది. అప్పుడు ఇశ్రాయేలీయులను చూసి భయానికి లోనైన మోయాబు రాజు తన శక్తితో వారిని ఓడించలేనని గ్రహించి, వారిని శపించడానికై బిలాము అనే సోదెగాడిని పిలిపిస్తాడు. దేవుని గద్దింపును బట్టి ఆ బిలాము ఇశ్రాయేలీయులను శపించలేకపోతాడు, ప్రతిగా దీవిస్తాడు (సంఖ్యాకాండం 22-24 అధ్యాయాలు). అయితే బహుమానంపై ఆశతో అతను మోయాబు రాజుకు నీ జాతి స్త్రీలతో వారు వ్యభిచారం చేసేలా ఆ స్త్రీల ప్రేరణ చొప్పున విగ్రహాలకు అర్పించినవాటిని భుజించేలా చెయ్యమని, అప్పుడు వారికి రక్షణగా ఉన్న దేవుడే వారిని నాశనం చేస్తాడని సలహ ఇచ్చి వెళ్ళిపోతాడు (ప్రకటన 2:14, సంఖ్యాకాండము 31:16). దానిప్రకారం; మోయాబు రాజు తన జాతి స్త్రీలను ఇశ్రాయేలీయులపైకి ఉసిగొల్పినప్పుడు ఇశ్రాయేలీయుల్లో చాలామంది పురుషులు వారితో వ్యభిచరించడం, వారి విగ్రహాలకు అర్పించినవి భుజించడం వల్ల దేవునికోపానికి గురౌతారు (సంఖ్యాకాండము 25:1,2).
దానివల్ల సమాజంలో తెగులు పుట్టి అనేకులు చనిపోయి, మిగిలినవారు ఏడుస్తుంటారు (సంఖ్యాకాండము 25:9). కానీ దానిని ఏమాత్రం లెక్కచెయ్యని జిమీ అనే ఒకడు వారి మధ్యకు ఒక మిద్యాను స్త్రీని తీసుకువచ్చి వ్యభిచరిస్తుంటాడు. అప్పుడు యాజకుడైన ఫీనెహాసు ఏం చేసాడో చూడండి.
"ఇదిగో మోషే కన్నుల యెదుటను, ప్రత్య క్షపు గుడారము యొక్క ద్వారము నొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వసమాజము యొక్క కన్నులయెదుటను, ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొనివచ్చెను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమా రుడునైన ఫీనెహాసు అది చూచి, సమాజమునుండి లేచి, యీటెను చేత పట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రా యేలీయుని వెంబడి వెళ్లి ఆ యిద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండ దూసిపోవునట్లు పొడిచెను; అప్పుడు ఇశ్రాయేలీయులలోనుండి తెగులు నిలిచిపోయెను" (సంఖ్యాకాండము 25:6-8).
ఇక్కడ ఫీనెహాసు మోషే చెప్పాడని కానీ ఇశ్రాయేలీయుల్లో మంచిపేరు సంపాదించాలని కానీ వారిని చంపలేదు. అందుకే అతని గురించి "అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు, వారి మధ్యను నేను ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవుటవలన" ఇశ్రాయేలీయుల మీదనుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును; ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తిగలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను" (సంఖ్యాకాండము 25:10-13) అని దేవుడే సాక్ష్యమిస్తున్నాడు.
అంటే; ఫీనెహాసు దేవుడు సహించలేని వ్యభిచారం, విగ్రహారాధనను తాను కూడా సహించలేక వారిని చంపేసాడు (చట్టపరంగా). కాబట్టి అతను దేవుని మనస్సు కలిగినవాడు. దీనిప్రకారం దేవుని మనస్సు కలిగిన విశ్వాసి సమాజంలోనూ సంఘంలోనూ దేవుడు సహించలేని ఏ కార్యాన్నైనా ఏ భావజాలాన్నైనా సహించలేడు, వాటిని బట్టి ఆనందించలేడు కానీ ఫీనెహాసులా ఖండిస్తాడు. అందుకే "నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారైయుండక వాటిని ఖండించుడి" (ఎఫెసీ 5: 11) అని రాయబడింది.
అయితే నేటి సంఘాల్లో (ముఖ్యంగా యువతలో) ఇలాంటి దేవుని మనస్సు కొరవడి ఆయన సహించలేని పాపాలతోనూ ఆయన వాక్యానికి విరుద్ధమైన భావజాలాలతోనూ ఏకీభవించడం, సహించడం వాటిలో ఆనందించడం జరుగుతుంది. గమనించండి; అలాంటివారు దేవుని నిబంధనకు పాత్రులు కాలేరు. ఫీనెహాసు దేవుని మనసు కలిగినవాడు కాబట్టే అనగా దేవుడు ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవడం వల్లనే దేవుడు అతని గురించి "అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను" (సంఖ్యాకాండము 25:12) అని ప్రకటించాడు. కాబట్టి ఆయన నిబంధన క్రింద కొనసాగాలంటే ఆయన మనస్సు కలిగియుండడం తప్పనిసరి.
"ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు. మనమాయనయందున్నామని దీనివలన తెలిసికొనుచున్నాము" (1యోహాను 2:6).
నేటి క్రైస్తవులు చాలామంది దైవవిరుద్ధంగా ఆనందిస్తున్న సినిమాల వంటి చిత్రీకరణల విషయంలో అప్రమత్తంగా ఉండడానికి ఈ వ్యాసం చదవండి.
దేవునిపై మన ప్రేమ వాస్తవమో లేక అపవాది కలిగించిన భ్రమనో తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
దేవునిపై నీ ప్రేమ వాస్తవమా లేక భ్రమా?
నిజమైన దేవుని పిల్లలు ఆ దేవునితో యెడబాటు అంటే ఎంతగా వేదనపడతారో ఆ యెడబాటుకు గురిచేసే పాపాన్ని ఎంతగా అసహ్యించుకోవాలో తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
యేసుక్రీస్తుకు తండ్రితో యెడబాటు కలిగించిన వేదన - నిజ దేవుని పిల్లల లక్షణం
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.