"నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము ....."(కీర్తన 141:5)
ప్రసంగించడం అనేది దేవుడు మనకు అప్పగించిన ఒక పవిత్రమైన బాధ్యత. సంఘ నిర్మాణం వాక్యోపదేశం ద్వారా జరగాలనేది దేవుని ఉద్దేశం. మృతమైనవారి హృదయాలను మేల్కొలపడం కోసం, సజీవులైనవారిని పరిశుద్ధపరచడం కోసం వాక్యోపదేశమే దేవుడు ఏర్పరచిన శ్రేష్టమైన మాధ్యమం. ప్రసంగించడం అంటే ప్రభువును గురించి నమ్మకంగా ప్రకటించడం. ప్రజలను అలరించడం కోసం మనకున్న ప్రతిభలను ప్రదర్శించడం కాదు. ప్రభువును నమ్మకంగా ప్రకటిస్తూ క్రీస్తును ఘనపరిచే, సువార్తను ఎత్తిపట్టే, వివరణాత్మక ప్రసంగాలను మనం ప్రసంగిస్తూ ఉండవచ్చు. అయినప్పటికీ ఆ విషయంలో పూర్తి credit దేవునికే చెందాలి. ఎందుకంటే ప్రపంచంలోనే అతి గొప్ప ప్రసంగీకుడు సైతం పతన స్వభావం కలిగిన అల్పుడే, బలహీనుడే. అటువంటి అల్పులమైన, బలహీనులమైన మనలను దేవుడే ఈ గొప్ప పని కోసం వాడుకుంటున్నాడు. మనలో గద్దింపు, దిద్దుబాటు అవసరం లేనివారు ఎవ్వరూ లేరు కాబట్టి మన ప్రసంగాల విషయంలో వినయ మనస్సు కలిగి, ఆత్మ చేత నింపబడిన నమ్మకమైన సహోదరీసహోదరులు లేదా తోటి పెద్దలు చేసే విమర్శను స్వాగతించడం వల్ల మొదట మన ఆత్మకు , తరువాత సంఘమంతటికీ క్షేమాభివృద్ధి కలుగుతుంది. సద్విమర్శను స్వాగతించడం సహాయకరంగా ఉంటుందని మాత్రమే చెప్పడం నా ఉద్దేశం కాదు; అది వాక్యానుసారమైనది, అలాగే తప్పక అవసరమైనది.
నేను ఎంతగానో అభిమానించే ఒక సేవకుడి ప్రసంగాలను ప్రత్యక్షంగా వినే భాగ్యం నాకు తరచూ కలుగుతూ ఉంటుంది. అయితే దాదాపుగా ప్రతి ప్రసంగం తరువాత ఆ సేవకుడు తన సన్నిహితులను నిర్దిష్టమైన ప్రశ్నలు అడిగి తన ప్రసంగం గురించిన feedback తీసుకుంటూ ఉంటారు. ఆ సేవకుని మాదిరి, అతని తగ్గింపు, సరిచెయ్యబడటానికి మొగ్గు చూపే వైఖరి, నేర్చుకోవడానికి ఇష్టపడే మనస్సు నా సంఘ జీవితంపై, పరిచర్యపై చెరగని ముద్ర వేశాయి. అలాగే నేను ఆ సేవకుని సమక్షంలో ప్రసంగించినప్పుడల్లా ఆయన ఇచ్చే feedback తీసుకోవడం ద్వారా గడచిన సంవత్సరాల్లో నేను ప్రసంగించే విధానంలో ఊహించని మార్పులెన్నో జరిగాయి. చాలా విషయాలు ఆయన దగ్గరి నుండి నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు.
ఈ వ్యాసంలో సద్విమర్శ వల్ల కలిగే ప్రయోజనాలను క్లుప్తంగా మీ ముందు ఉంచుతున్నాను. మీరు వాటిని చదివి, సద్విమర్శను స్వాగతించే విషయంలో ప్రోత్సహించబడాలని మీ కోసం ప్రార్థిస్తున్నాను.
1. సద్విమర్శ తగ్గింపునూ, దేవునిపై ఆధారపడటాన్నీ పెంపొందిస్తుంది.
తగ్గింపును పెంపొందించడం అనేది సద్విమర్శ ద్వారా చేకూరే మొట్టమొదటి, గొప్ప ప్రయోజనం. ఆత్మీయ ఎదుగుదలకు బద్ధశత్రువు గర్వము. "దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును" అని లేఖనము పదే పదే హెచ్చరిస్తోంది (యాకోబు 4:6). ఇతరుల అభిప్రాయాలను స్వీకరించడానికి సముఖంగా ఉండటం అంటే 'నేను చెప్పేదే సత్యమని అంగీకరించి తీరాలి' అనే ధోరణి మనలో లేదని ఒప్పుకోవడమే. తరచూ సంఘపెద్దల మధ్య ప్రసంగాలు సమీక్షించబడం ద్వారా సంఘపెద్దలు నేర్చుకునే మనస్సును కోల్పోకుండా ఉంటారు. సద్విమర్శను తిరస్కరించే పాస్టర్ నేను నేర్చుకోవాల్సింది ఇంకేమీ మిగిలి లేదని చెప్పకనే చెప్తున్నాడు. సువార్త చేత మలచబడిన నాయకుడు, క్రీస్తు తప్ప పరిపూర్ణ ప్రసంగీకుడు వేరెవ్వరూ లేరని గుర్తిస్తూ, దిద్దుబాటును అంగీకరిస్తాడు. నీ పనితనాన్ని విమర్శించే విషయంలో అంతిమ న్యాయనిర్ణేతవు నువ్వు కాదు, దేవుడే. అయితే దేవుడు తరచుగా ఆ పనిని తన ప్రజల ద్వారా జరిగిస్తూ ఉంటాడు.
'యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు' అని నిలబడి ప్రకటించే మనమే, మొదటిగా ఆ వాక్య అధికారానికి అప్పగించుకొనవలసినవారము. మనం సందేశం యొక్క ప్రభువులము కాదని, గృహనిర్వాహకులము మాత్రమేనని సద్విమర్శ మనకు జ్ఞాపకం చేస్తుంది.
కీర్తనాకారుడు తెలియజేసిన ఒక గంభీరమైన సత్యం ఏంటంటే, "భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీనోట వచించెదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము గదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు" (కీర్తన 50:17). దేవుని శాసనాలను వివరించేవారిలో, ఆయన నిబంధనను పలికేవారిలో కొందరిని భక్తిహీనులు అని సంబోధిస్తూ, వారిలో కనబడే ఒక లక్షణం గురించి దేవుడు ఈ కీర్తనలో వెల్లడిపరిచాడు. వారు దిద్దుబాటును అసహ్యించుకుంటారట. దిద్దుబాటుకు సుముఖంగా లేకపోవడం అనేది వ్యక్తిత్వంలో ఉన్న చిన్న లోపం మాత్రమే కాదు. అది భక్తిహీనతనూ తిరుగుబాటుతనాన్నీ సూచిస్తుంది. దైవిక గద్ధింపును తిరస్కరించడం తనను ప్రమాదకరమైన స్థితిలోకి నెడుతుందని జ్ఞానవంతుడైన ఏ బోధకుడైనా అర్థం చేసుకోగలడు. ఒక ప్రసంగీకుడు కృపలో ఎదగాలంటే మలచబడటానికీ సరిద్దిదబడటానికీ అవసరమైన దీనమనస్సు అతను కలిగి ఉండాలి.
2. వాక్యభాగం యొక్క స్పష్టతను మెరుగుపరుస్తుంది
సత్యవాక్యాన్ని సరిగ్గా ఉపదేశించడం (2 తిమోతి 2:15) కోసం ప్రసంగీకులు ప్రయాసపడాలి. ఎంతో నమ్మకంగా వివారణాత్మకంగా బోధించే ప్రసంగీకుడు సైతం తనకు తెలియకుండానే అనవసరమైనవి ఎక్కువగా చెప్పడం, అవసరమైనవాటిని చెప్పాల్సినంత వివరంగా, స్పష్టంగా చెప్పకపోవడం లాంటి పొరపాట్లు చేసే అవకాశం ఉంది. ఇతరులు చెప్పకపోతే మనకు మనముగా ఎన్నటికీ గుర్తించలేని పొరపాట్లు ఎన్నో మనం చేస్తూ ఉంటాము. సద్విమర్శ ద్వారా వాక్యభాగానికి మనం ఇచ్చిన వివరణ సరైనదేనా, సమతుల్యతతో బోధించామా, స్పష్టంగా వ్యక్తపరచగలిగామా అనే సంగతులను పరిశీలించుకోవచ్చు. చాలాసార్లు సిద్ధపడేటప్పుడు మన మనస్సులో ఏర్పడిన స్పష్టత ప్రసంగ వేదికపై నిలబడి మాట్లాడేటప్పుడు కనబడదు. ఒక యథార్థవంతుడైన ప్రసంగీకుడు "నేను చెప్పింది మీకు అర్థం అయ్యిందా? నేను వాక్యాన్ని నమ్మకంగా ఉన్నది ఉన్నట్లుగానే బోధించానా?" అని వాక్యపరిచర్య కిందున్న తన సంఘసభ్యులను అడుగుతాడు. ఒక ప్రసంగీకుడు విశ్వాసులకు చెయ్యగల గొప్ప అపకారం ఏంటంటే అన్వయించుకోవడానికీ అనుసరించడానికీ వీలు కాని విధంగా సత్యాన్ని బోధించడం. సద్విమర్శ ద్వారా ప్రజలకు విషయం అర్థం కాకుండా అడ్డుతగిలే అపోహలు, అయోమయాలు, పొరపాటులేవైనా మన మనసులో ఉన్నాయేమో గుర్తించి వాటిని సరిచేసుకోవచ్చు. అపో.కార్య. 17:11లోని బెరయనులు ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి, పౌలు సీలలు చెప్పిన సంగతులు అలాగున్నావో లేదో లేఖనాలను పరిశోధించినందుకే ఘనులని ప్రశంసించబడ్డారు. బోధించబడిన సంగతులను పరీక్షించడం అనేది ఎంతో విలువైనదని బెరయనుల మాదిరి ధృవీకరిస్తుంది. మన సంఘాలలో బెరయనుల మాదిరిగా ఆసక్తితో ప్రసంగాలు వినడాన్ని ప్రోత్సహించడం అంటే విశ్వాసులు లేఖనాల వెలుగులో మన మాటలను జాగ్రత్తగా పరీక్షించమని చెప్పడమే; అలాగే మనము వారి ప్రశ్నలకు జవాబులు చెప్పడానికీ వారి అభిప్రాయాలు తీసుకోవడానికీ సముఖంగా ఉన్నామని చెప్పడమే. పౌలు సీలలు ఆలాగు ఉండినారు గనుకనే "వారిలో (బెరయనులలో) అనేకులును, ఘనతగల గ్రీసుదేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలమందియు" యేసు క్రీస్తును నమ్ముకున్నారు (అపో. కార్య. 17:12). పౌలు సీలలు జ్ఞానుల మాదిరిగానే బెరయనులతో వ్యవహరించారు అని ఈ కింది వచనాలు చదివితే తెలుస్తుంది.
"అపహాసకుని గద్దింపకుము గద్దించినయెడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానముగలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును" (సామెతలు 9:8).
"అపహాసకుడు తన్ను గద్దించువారిని ప్రేమించడు వాడు జ్ఞానులయొద్దకు వెళ్లడు"(సామెతలు 15:12).
పౌలు సీలలు బెరయనులను గద్దించకపోగా వారికి ప్రేమతో పరిచర్య చేశారు. మనము కూడా పౌలు సీలల మాదిరిని అనుసరిస్తూ మన సంఘంలోని విశ్వాసులను బెరయనుల మాదిరిని అనుసరించమని ప్రోత్సహించేవారంగా ఉండాలి. సద్విమర్శకు భయపడే ప్రసంగీకుడు తన ప్రసంగంలోని లోపాలు ఎక్కడ బయటపడతాయో అని భయపడుతున్నాడు. అలా భయపడే కొందరు పాస్టర్లు తమకు వాక్యానుసారమైన సలహాలు ఇచ్చే విశ్వాసులతో 'నీకు ఆత్మీయ పాఠాలు నేర్పించిన బోధకుడికే నువ్వు నేర్పించాలని చూస్తున్నావా?', 'నీకు దయ్యం పట్టింది' అంటూ వారి నోరు నొక్కేసే ప్రయత్నం చేస్తుంటారు. తనకు అప్పగించిన వాక్యపరిచర్యను నమ్మకంగా చేసే విషయంలో తానెక్కడైనా విఫలమవుతున్నాడేమో అని సరిచూసుకునే అవకాశంగా దాన్ని చూడాలే తప్ప తన పేరు ప్రతిష్ఠలకి ఏదో భంగం వాటిల్లుతుందని భయపడే బోధకుడు వాక్య పరిచర్యను నమ్మకంగా చెయ్యడం కంటే తన పేరుప్రతిష్ఠలనే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థం. మనలో ఎవ్వరూ అలాగుండకుండదని మనకు మనం బోధించుకుందాము.
3. వ్యక్తీకరణ మెరుగుపడుతుంది
చెప్తున్న విషయం గొప్పదైనప్పటికీ అది వినే వ్యక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది అది వ్యక్తపరచబడే విధానంపై ఆధారపడి ఉంటుంది. సద్విమర్శ ద్వారా కొన్ని అంతరాయం కలిగించే అలవాట్లను గుర్తించి, వాటి విషయంలో మార్పులు చేసుకోవచ్చు. ఉదాహరణకు, వేగంగా మాట్లాడటం, ప్రజలను సూటిగా కళ్ళలోకి చూడలేకపోవడం, మొత్తం ప్రసంగం అంతా ఒకే ధోరణిలో చెప్పడం, కొన్ని పదాలను ఊతపదాల్లాగా పదే పదే ఉపయోగించడం మొదలైనవి. సద్విమర్శ ద్వారా సత్యాన్ని వ్యక్తపరిచే విధానం కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది.
4. ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగజేసుకోవడం ద్వారా స్థానిక సంఘం, సంఘ నాయకత్వము బలపడుతుంది
సద్విమర్శను స్వాగతించే సంస్కృతిని ప్రోత్సహించే సంఘాలలోని విశ్వాసులు కలిసి ఎదుగుతారు. హృదయపూర్వకంగా సహవాసంలో ఆనందించగలుగుతారు. వారి మధ్య ఐక్యత ప్రేమానురాగాలు బలపడతాయి. ప్రసంగీకులు తమను విమర్శించమని అడిగినప్పుడు అది వారి తగ్గింపునూ, నేర్చుకునే తత్వాన్నీ తెలియజేస్తుంది. అలాగే ఒకరికొకరం జవాబుదారీలము అనే భావన విశ్వాసులలో కలుగజేస్తుంది. మార్యాదతో గౌరవప్రదంగా చేసే సద్విమర్శ ద్వారా ప్రసంగీకులు పదును పెట్టబడతారు. "ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును" (సామెతలు 27:17).
5. సిద్ధాంతపరమైన అసమతుల్యతను నివారించడానికి దోహదపడుతుంది
ప్రతి ప్రసంగీకుడికి కొన్ని ఇష్టమైన అంశాలు ఉంటాయి. కొన్ని విషయాల గురించి ఎక్కువగా ప్రసంగించడానికి మొగ్గు చూపే స్వభావం దాదాపుగా అందరిలో ఉంటుంది. అలా చేసినప్పుడు ప్రాముఖ్యమైన ఇతర అంశాలను నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంది. చాలాకాలం పాటు అలాగే కొనసాగడం ద్వారా దేవుని సంకల్పమంతటినీ సమతుల్యతతో బోధించడం జరగకపోవచ్చు. అన్ని రకాల పోషకాలు గల ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎలాగైతే ఒక వ్యక్తిలో పోషకాహారలోపం ఏర్పడుతుందో, అదే విధంగా దేవుని వాక్యంలోని ప్రాముఖ్యమైన వివిధ అంశాలు బోధించకపోతే విశ్వాసి కూడా బలహీనపడతాడు. సద్విమర్శ సిద్ధాంతపరమైన అసమతుల్యతలను నివారించడానికి ఉపయోగపడే ఒక కవచంలా పని చేస్తుంది. మన ప్రసంగాలు వాక్యానుసారమైన సమతుల్యతను కలిగి, సువార్త కేంద్రితంగా ఉండేలా సహాయం చేస్తుంది.
గమనిక : సద్విమర్శలో భాగంగా వచ్చే అభిప్రాయాలన్నీ వాక్యానుసారమైనవిగా ఉపయోగకరమైనవిగా ఉండకపోవచ్చని గుర్తించడం ప్రాముఖ్యం. విమర్శలను బేరీజు వేసే విషయంలో బోధకుడు వివేచన కలిగి ఉండాలి. వ్యక్తిగత ప్రాధాన్యతలు, భిన్న సంస్కృతులు, విభిన్న నేపథ్యాలు, అపరిపక్వత లాంటివెన్నో విమర్శించేవారి ఆలోచనా ధోరణిని ప్రభావితం చేస్తాయి. వాటిని కూడా ప్రసంగీకుడు వివేచించగలగాలి.
వాక్యం ద్వారా కట్టబడినవారి నుండి దిద్దుబాటును పొందుకోవడం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. సత్యాన్ని ప్రేమించేవారు, ఆత్మల సంపాదన గురించిన భారం కలిగినవారు, బోధించడం గురించీ, దాని వెనుక జరిగే సిద్ధపాటు గురించీ కనీస అవాగాహన కలిగినవారు - ఇటువంటివారి నుండి సలహాలు తీసుకోవడం ఉత్తమం. ప్రతి అభిప్రాయానికి సమానమైన విలువ ఇవ్వాల్సిన అవసరమూ లేదు, అలాగని ఏ అభిప్రాయాన్ని పూర్తిగా త్రోసిపుచ్చాల్సిన అవసరమూ లేదు. పౌలు భక్తుడు చేసిన ఒక హెచ్చరిక ఈ సందర్భంలో సహాయకరంగా ఉంటుంది - "సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి" (1 థెస్స 5:21). ప్రార్థనాపూర్వకంగా వివేచించడం ద్వారా పొట్టునూ గోధుమలనూ వేరు చెయ్యవచ్చు.
కొన్ని ఆచరణాత్మక సూచనలు :
- మీ ప్రసంగాలను క్రమంగా సమీక్షిస్తూ, మీకు సలహాలు సూచనలు చెప్పే సంఘపెద్దలతో, పరిపక్వత కలిగిన సభ్యులతో కూడిన ఒక బృందాన్ని కలిగి ఉండండి.
- వారి వద్ద feedback తీసుకునేటప్పుడు నిర్దిష్టమైన ప్రశ్నలు అడగండి. ఉదాహరణకు, నేను ప్రసంగం ద్వారా చెప్పాలనుకున్న ప్రధాన అంశం స్పష్టంగా అర్థం అయ్యిందా? నేను సూచించిన అన్వయింపులు ఆచరణాత్మకంగా అన్వయించుకోదగిన విధంగానే ఉన్నాయా? మొదలైనవి.
- మీ ప్రసంగాలను రికార్డు చేసి మీరే వినండి. అలా వినడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. మిమ్మల్ని మీరే విమర్శించుకోవడం ద్వారా కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు.
- 'ప్రసంగాన్ని విమర్శించడమా? ఆ పాపానికి ఒడిగట్టే సాహసం ఎవ్వరూ చెయ్యకూడదు' అనేది సగటు క్రైస్తవుని దృక్పథం. ఈ దృక్పథం మారాలి. సద్విమర్శ వాక్యానుసారమైనది అని మీ సంఘానికి బోధించండి. సద్విమర్శ యొక్క ప్రాముఖ్యతను, దానిని చేసే విధానాన్ని నేర్పించండి. విశ్వాసులు ప్రతి ఆదివారము తమ సొంత క్షేమాభివృద్ధి కోసమే సంఘంగా కూడివచ్చి వాక్యోపదేశం కింద కూర్చోవాలి, తమ సొంత ఆత్మ వాక్యపరిచర్య ద్వారా మేలు పొందాలి. అయితే ఆ పొందుకున్న ప్రయోజనాలనూ, చేసుకున్న తీర్మానాలనూ ప్రసంగ సమీక్ష కోసం ఏర్పాటు చేసుకున్న నిర్దిష్ట సమయంలో ప్రసంగీకునితో పంచుకొని అతనిని ప్రోత్సహించాలి. ఆ తరువాత ఇంకా ఏమి చేస్తే మరింత మెరుగ్గా, స్పష్టంగా ప్రసంగం ఉండేదో నిర్మాణాత్మక శైలిలో ప్రేమతో తెలియజేయాలి. ఈ పద్దతిని, ఈ విధానాన్ని మీ స్థానిక సంఘసభ్యులకు నేర్పించండి.
ముగింపు
సద్విమర్శ ద్వారా మనం విశ్వాసుల ఎదుట తక్కువైపోతాము అని భయపడాల్సిన అవసరం లేదు, అది మనం వారికి జవాబుదారీలుగా ఉండగలిగే ఒకానొక విధానం. నా ప్రియమైన తోటి సేవకులారా, దేవుని మహిమ నిమిత్తం, సంఘం యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తం మరియు మన ఆత్మలు పరిపక్వత చెందడం కోసం సద్విమర్శను దేవుడు అనుగ్రహించిన ఒక వరంగా స్వీకరిద్దాము. ఒకవైపు దేవుని శక్తికి వేరుగా ఏ మంచి జరగదని ఎరిగి ఆయన పైనే ఆధారపడుతూ ప్రసంగించడం కోసం ప్రసంగ వేదికపై నిలబడతాము, మరో వైపు ప్రసంగం కోసం ఎంత ప్రయాసపడాలో అంత ప్రయాసపడి సిద్ధపడతాము. పౌలు భక్తుడు ఇదే విషయాన్ని కోలస్సీ. 1:29లో అద్భుతంగా వ్యక్తపరిచాడు. "అందు నిమిత్తము నాలో బలముగా, కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను". ప్రయాసపడుతున్నది పౌలే కానీ కార్యసిద్ధి కలుగజేసేది దేవుని క్రియాశక్తి. అయితే ఆ పోరాటంలో, ప్రయాసపడటంలో భాగమే తోటి ప్రసంగీకుల నుండి, పరిపక్వత చెందిన సభ్యుల నుండి సద్విమర్శను స్వీకరించడం. ఈ క్రమశిక్షణను అలవరచుకొని దాని ద్వారా మేలు పొందాలని ఆశిస్తున్నవారికీ, ఆ దిశగా ప్రయాసపడాలని తీర్మానించుకున్నవారికీ దేవుని కృప తోడైయుండును గాక
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2025 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.