3:1, 3:2,3, 3 :4,5 , 3:6 , 3:7 , 3:8 , 3:9 , 3:10 , 3:11 , 3:12 , 3:13 , 3:14 , 3:15 , 3:16 , 3:17-19 , 3:20 , 3:21 , 3:22,23 , 3:24
ఆదికాండము 3:1 దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదైయుండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను.
ఈ వచనంలో సర్పం దేవుని ఆజ్ఞ విషయమై హవ్వను ప్రశ్నిస్తున్నట్టు మనం చూస్తాం. ఆ సర్పం యెహోవా చేసిన భూ జంతువులలో ఒకటని ప్రస్తావించబడడాన్ని బట్టి దానిని నిజమైన సర్పంగానే భావించాలి. హీబ్రూబాషలో కూడా ఇక్కడ సర్పము అన్నచోట הַנָּחָ֑שׁ (హ'నాహాస్) అనేపదం వాడబడింది. పాములు నోటితో చేసే హిస్ హిస్ శబ్దాన్ని బట్టి హెబ్రీయులు ఆ పేరుతో పిలిచేవారంట. అయితే దేవుడు చేసిన ఏ భూ జంతువులలోనూ మాట్లాడగలిగేవి మనకు కనిపించవు. పైగా ఈ సర్పం దేవునిపై సందేహం పుట్టించేలా ప్రేరేపిస్తుంది. ఈ కారణాన్ని బట్టి అక్కడ నిజమైన సర్పం ఉన్నప్పటికీ దానిని వాడుకుంటూ (ఆవహించి) మరెవరో యుక్తికలిగి ("కుయుక్తి" 2కొరింధీ 11:3) అలా మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఎవరు చేసుంటారు? ఎందుకు చేసుంటారు అనేదానిని మిగిలిన లేఖనాల ఆధారంగా పరిశీలిద్దాం.
యోహాను 8: 44 మీరు మీ తండ్రియగు అపవాది (అనగా,సాతాను) సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.
ఈ సందర్భంలో యేసుక్రీస్తు అపవాది గురించి మాట్లాడుతూ వాడు ఆది నుండీ నరహంతకుడునూ అబద్ధికుడునూ అంటున్నాడు. సర్పం హవ్వతో మాట్లాడుతున్న సందర్భం అంతటినీ మనం పరిశీలించినప్పుడు, సర్పం ద్వారా హవ్వతో మాట్లాడుతున్న వాడు ఆమెతో అబద్ధాలను చెప్పడం గమనిస్తాం. పైగా వాడు చేసిన మోసం కారణంగానే ఆదాము హవ్వలు మంచిచెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం తిని మొదట ఆత్మీయంగా తరువాత శారీరకంగా చనిపోయారు దీనిని బట్టి యేసుక్రీస్తు అక్కడ ఆది నుండీ వాడు నరహంతకుడూ అబద్ధికుడూ అని ఏ అపవాది గురించైతే మాట్లాడుతున్నాడో ఆ అపవాదే ఈ సర్పం ద్వారా హవ్వతో మాట్లాడుతున్నాడు.
మరొక సందర్భం చూడండి,
2 కొరింథీయులకు 11:2,3 దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగియున్నాను; ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని, మిమ్మును ప్రధానము చేసితిని గాని, సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు పవిత్రత నుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను.
ఈ సందర్భంలో పౌలు, సర్పం హవ్వను మోసగించిన సంఘటనను ఉటంకిస్తూ అదేవిధంగా ఎవరో కొరింథీ సంఘాన్ని కూడా పాడు చెయ్యాలని చూస్తున్నట్టు పేర్కొంటున్నాడు. ఇంతకూ కొరింథీ సంఘాన్ని పాడుచెయ్యాలని చూస్తుంది ఎవరో పౌలు మాటల్లోనే చూడండి.
2 కొరింథీయులకు 11:13-15 ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును.
ఈ మాటల ప్రకారం కొరింథీ సంఘాన్ని పాడుచెయ్యాలని చూస్తుంది వెలుగు దూత వేషం ధరించుకుంటున్న సాతాను పరిచారకులే అని అర్థమౌతుంది (సాతాను మరియు అపవాది ఒక్కరే "ప్రకటన 20:2") కాబట్టి పౌలు మొదటిగా ప్రస్తావించినట్టు హవ్వను సర్పం ద్వారా మోసగించింది కూడా వాడే.
ఇంతకూ వాడు ఎందుకలా చేసాడో చూద్దాం;
దేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు దేవదూతలతో పాటు, మరికొందరు పరలోక నివాసులను కూడా సృష్టించాడు (కీర్తనలు 148:1-5). అలా సృష్టించబడినవారిలో ఒకానొక కేరూబే ఈ సాతాను, ఈ కేరూబును దేవుడు అభిషేకించి పరలోకంలో ఒక ఉన్నత స్థానంలో నియమించాడు (యెహెజ్కేలు 28:13,14). అయితే ఈ విధంగా దేవునిచేత అభిషేకించబడిన ఆ కేరూబు తనకు దేవుడిచ్చిన స్థితిని బట్టి గర్వించి, దేవునితో సమానంగా ఉండాలని ఆలోచించాడు (యెషయా 14:12-14). అప్పుడు దేవుడు ఆ కేరూబునూ దానితో జతచేరిన దూతలనూ పరలోకం నుండి భూమిపైకి గెంటివేసాడు (యెహెజ్కేలు 28:16, ప్రకటన 12:7-9). ఈ విధంగా భూమిపై పడవెయ్యబడిన అపవాది దేవుని సృష్టిని పాడుచెయ్యాలనే ఉద్దేశంతోనే ఏదెనులో సర్పాన్ని ఆవహించి హవ్వతో మాట్లాడుతున్నాడు (ప్రకటన 12:12).
అయితే సాతాను సర్పాన్ని ఆవహించి హవ్వతో మాట్లాడాడన్న ఈ వాదనపై, సాధారణంగా కొన్ని ప్రశ్నలు తలెత్తుతుంటాయి, అవేంటో క్రింది వచనాలలో చూద్దాం. ప్రస్తుతానికైతే సర్పం ద్వారా మాట్లాడుతుంది సాతానుడే అని మనకు స్పష్టమైంది. దీనిప్రకారం పాము మాట్లాడడమేంటనే నాస్తికుల హేళనకు కూడా ఇక్కడ అవకాశం లేదు. అక్కడ సర్పం ఉందనేది ఎంతవాస్తవమో ఆ సర్పం ద్వారా మాట్లాడుతుంది సాతానుడే అనేది కూడా అంతేవాస్తవం.
ఇంతకూ దేవుని తోటయైన ఏదెనులోకి సాతానుడు ఎలా ప్రవేశించగలిగాడు?
ఆదికాండము 1:31 ప్రకారం; దేవుడు చేసిన సమస్తమూ చాలా మంచిదిగా ఉండింది. "దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను" (ఆదికాండము 1:31). అంటే అలా మంచిగా ఉన్న సమస్తంలో సర్పం కూడా ఒకటి. మరి అలాంటి మంచి సర్పాన్ని వాడు ఎలా ఆవహించగలిగాడు? ఇది మనం చాలా ప్రాముఖ్యంగా ఆలోచించవలసిన ప్రశ్న. ఎందుకంటే బైబిల్ గ్రంథం యెహోవా దేవుణ్ణి సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సార్వభౌముడని మనకు పరిచయం చేస్తుంది (ఆదికాండము 17:1, రోమా 9:5, ప్రకటన 4:8, ఎఫెసీ 1:12, ప్రసంగి 11:5, దానియేలు 4:35, కీర్తనలు 115:3).
దీనిప్రకారం దేవుని సృష్టిలోకి దేవుని అనుమతి లేకుండా (దేవుని చిత్తం కాకుండా) ఏదైనా ప్రవేశించగలిగితే అది తప్పకుండా దేవుని శక్తిని అధిగమించే ప్రవేశించాలి. అప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సార్వభౌముడు ఎలా ఔతాడు? ఆయనను అధిగమించినదే సర్వశక్తిగలది ఔతుంది. అది అసాధ్యం కాబట్టి సాతానుడు కూడా దేవుని అనుమతితోనే ఏదేనులోకి ప్రవేశించాడు.
కీర్తనలు 119:91 సమస్తము నీకు సేవచేయుచున్నవి కావున నీ నిర్ణయముచొప్పున అవి నేటికిని స్థిరపడి యున్నవి.
అలాంటప్పుడు మనకిక్కడ మరో రెండు ప్రాముఖ్యమైన ప్రశ్నలు వస్తాయి.
1. దేవుని అనుమతితోనే సాతానుడు ఈ సృష్టిలో ప్రవేశిస్తే దేవుడే పాపానికి కర్తనా? పాపం కూడా దేవుని చిత్తంలో భాగమా?
2. ఈ సృష్టిలోకి పాపం దేవుని అనుమతితోనే ప్రవేశించినప్పుడు పాపం చేసినవారికి శిక్షెందుకు? ఉదాహరణకు, పాపం చేసిన ఆదాము హవ్వలనూ దానికి ప్రేరేపించిన సాతానుడినీ ఆయనెందుకు శపించాడు?
వీటికి వరుసగా సమాధానాలు చూద్దాం.
1A. బైబిల్ గ్రంథం దేవుణ్ణి సార్వభౌముడు, సర్వశక్తిమంతుడు గానే కాకుండా పరిశుద్ధుడుగా కూడా మనకు పరిచయం చేస్తుంది (నిర్గమకాండం 28:36, లెవీకాండము 21:8, కీర్తనలు 99:3,5, యెషయ 6:3) కాబట్టి ఆయన తన సార్వభౌమ నిర్ణయం ప్రకారం ఈ సృష్టిలోకి పాపాన్ని అనుమతించినప్పటికీ (ఎఫెసీ 1:12, ప్రసంగి 11:5) ఆయన ఆ పాపానికి కర్తకాదు, ఎవరు చేసే పాపానికి వారే బాధ్యులు. ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన నైతిక నియమం ప్రకారం మానవుడు పాపం చెయ్యకూడదు. ఉదాహరణకు; ఆయన ఆదాము హవ్వలకు మంచిచెడ్డల తెలివినిచ్చే వృక్షఫలాలు తినవద్దని ముందుగానే చెప్పిన కారణాన్ని బట్టి వాటిని తినకుండా ఉండడం వారి బాధ్యత. ఒకవేళ తింటే దానికి వారే బాధ్యులు. ఎందుకంటే వాటిని వారు దేవుని బలవంతం చొప్పున కాదు తమంతట తాముగానే తిన్నారు.
ఈ అంశం పరిమిత జ్ఞానం కలిగిన మనం అర్థం చేసుకోవడం కష్టంగా అనిపించవచ్చు కానీ లేఖనాలు ఒకవైపు దేవుడు సార్వభౌముడు (అన్నిటినీ నిర్ణయించినవాడు), సర్వశక్తిమంతుడు (ఏదీ ఆయన శక్తిని అధిగమించి పనిచెయ్యలేదు), అని చెబుతూ ఆయన పరిశుద్ధుడు (పాపం లేనివాడు) అని కూడా చెబుతున్నాయి కాబట్టి, మనమిక్కడ లేనిపోని తర్కాలు ఉపయోగించి రెండింటినీ సమన్యయ పరచాలని చూడకుండా లేఖనాలు చెబుతున్నదానిని ఉన్నది ఉన్నట్టుగా నమ్మాలి. ఇందులో ఏది నమ్మకపోయినా దేవుణ్ణి అవమానించడమే ఔతుంది. నిజానికి దేవుని గురించిన కొన్ని విషయాలు, మనం పూర్తిగా అర్థం చేసుకోలేము. ఎందుకంటే దేవుడు అనంతుడు, మనం పరిమితి కలిగినవారం. ఒకవేళ దేవుని గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోగలిగితే మనం కూడా దేవుళ్ళం అయిపోతాం. అనంతత్వాన్ని అనంతత్వమేగా పూర్తిగా అర్థం చేసుకోగలదు. కాబట్టి ఆ దేవుడు లేఖనాలలో ఎంతవరకూ బయలుపరిచాడో అంతవరకే మనం పరిమితులం.
ప్రసంగి 11:5 చూలాలి గర్బమందు ఎముకలు ఏరీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి యే త్రోవను వచ్చునో నీవెరుగవు, ఆలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవెరుగవు.
ద్వితియోపదేశకాండము 29:29 రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మ శాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.
ఈ అంశం గురించి మరింత వివరంగా తెలుసుకోడానికి, ఈ వ్యాసాలను చదవండి.
దేవుణ్ణి పాపానికి కర్తగా చూపిస్తుంది ఎవరు?
దేవుని సార్వభౌమత్వం
2A. ఈ సృష్టిలోకి పాపం (సాతాను) దేవుని అనుమతితోనే ప్రవేశించినప్పటికీ ఎవరు చేసే పాపానికి వారే బాధ్యులు. ఎందుకంటే జరిగే ప్రతీదీ దేవుని నిర్ణయమే అయినప్పటికీ అందులో ప్రమేయం చూపుతున్న వ్యక్తులు తమంతట తాముగా స్వచిత్తంతో పాపం చేస్తున్నారు, దేవుడు అలానే నిర్ణయించాడు కాబట్టి దానిని నెరవేర్చుదామని కానేకాదు (ఎందుకంటే దేవుని సార్వభౌమ నిర్ణయమేంటో జరిగేదాకా వారికి కూడా తెలీదు). ఉదాహరణకు, సాతానుడు దేవుని నిర్ణయాన్ని నెరవేర్చడానికి ఏదేనులో ప్రవేశించలేదు, దేవుని సృష్టిని పాడు చెయ్యాలనే ఉద్దేశంతో ప్రవేశించాడు. ఇక్కడ వాడికంటూ ఒక ఉద్దేశం ఉంది కాబట్టి వాడు చేసినదానికి శిక్షించబడడం న్యాయమే. హవ్వ మంచి చెడ్దలను తమంతట తాముగా గ్రహించి దేవతలలా ఉండాలనే ఉద్దేశంతో పండు తినింది, దేవుని నిర్ణయాన్ని నెరవేర్చాలని కాదు. ఆదాము కూడా అంతే. ఇక్కడ వారు దేవుని నిర్ణయాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో కాకుండా తమ మనస్సులో పుట్టిన దురుద్దేశంతో పాపం చేసారు, వారిముందు దేవుడు పెట్టిన ఆజ్ఞను తమంతట తాముగా అతిక్రమించారు. ఈ కారణం చేత వారు శిక్షించబడడం న్యాయమే.
దీనికి కొన్ని ప్రాముఖ్యమైన ఉదాహరణలు చూద్దాం;
A. యెషయా 10:5,6 అష్షూరీయులకు శ్రమ వారు నా కోపమునకు సాధనమైన దండము నా దుడ్డుకఱ్ఱ నా ఉగ్రత వారిచేతిలో ఉన్నది. భక్తిహీనులగు జనములమీదికి నేను వారిని పంపెదను దోపుడుసొమ్ము దోచుకొనుటకును కొల్లపెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులగు జనులనుగూర్చి వారి కాజ్ఞాపించెదను.
ఈ సందర్భంలో దేవుడు అష్షూరీయులు చేసేదంతా తాను ఆజ్ఞాపించినదేయని (తన సార్వభౌమ నిర్ణయమని) చెబుతూ అయినప్పటికీ వారికి శ్రమ అంటున్నాడు. ఎందుకంటే అష్షూరీయులూ బబులోనీయులూ యుద్దాలు చేసి దేవుని నిర్ణయాన్నే నెరవేర్చినప్పటికీ వారు అలా చెయ్యడంలో వారికి కూడా వ్యక్తిగత/స్వార్థపూరిత ఉద్దేశాలు (ఆలోచనలు) ఉన్నాయి. ఈ కారణం చేత వారు చేసిన దానికి శిక్షించబడుతున్నారు.
యెషయా 10:7-12 అయితే అతడు ఆలాగనుకొనడు అది అతని ఆలోచనకాదు; నాశనము చేయవలెననియు చాల జనములను నిర్మూలము చేయవలెననియు అతని ఆలోచన. అతడిట్లనుకొనుచున్నాడు నా యధిపతులందరు మహారాజులు కారా? కల్నో కర్కెమీషువలె నుండలేదా? హమాతు అర్పాదువలె నుండలేదా? షోమ్రోను దమస్కువలె నుండలేదా? విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి గదా? వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహములకంటె ఎక్కువైనవి గదా? షోమ్రోనునకును దాని విగ్రహములకును నేను చేసి నట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయక పోదునా అనెను. కావున సీయోను కొండమీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరురాజుయొక్క హృదయగర్వమువలని ఫలమునుబట్టియు అతని కన్నుల అహంకారపు చూపులనుబట్టియు అతని శిక్షింతును.
B. ఆదికాండము 50:19,20 యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడుచేయ నుద్దేశించితిరి గాని నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను.
ఈ సందర్భంలో యోసేపు అతని అన్నలు తనను ఐగుప్తుకు అమ్మివెయ్యడం దేవుని ఉద్దేశమని చెబుతున్నాడు. అది వాస్తవమే. దేవుడే యోసేపును ఐగుప్తుకు పంపించాడు అనగా అలా నిర్ణయించాడు (కీర్తనలు 105:17). అయినప్పటికీ అతని అన్నలు అది దేవుని ఉద్దేశమని కాకుండా అతనికి కీడు చెయ్యాలనే అలా చేసారు కాబట్టి వారు చేసింది నేరమే దానికి వారు బాధ్యులే.
C. అపో.కార్యములు 2:23 దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి.
ఈ సందర్భంలో పేతురు, యేసుక్రీస్తు మరణం దేవుడు నిశ్చయించిన సంకల్పం, ఆయన భవిష్యత్తు జ్ఞానమని చెబుతున్నాడు. అయినప్పటికీ అందులో ప్రమేయం చూపిన ఇస్కరియోతు యూదా యూదులు దోషులుగా ఎంచబడ్డారు. ఎందుకంటే యేసుక్రీస్తును చంపడంలో వారికంటూ స్వంత దురుద్దేశాలు ఉన్నాయి.
అపో. కార్యములు 4:27,28 ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో, వాటి నన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.
కాబట్టి జరిగేదంతా దేవుని అనుమతి (నిర్ణయం) తోనే జరుగుతున్నప్పటికీ అందులో ప్రమేయం చూపుతున్న వ్యక్తులు తమకున్న ఉద్దేశాలను బట్టి శిక్షించబడతారు/బాధ్యులౌతారు. ఇక్కడ మనిషి చాలా ఆలోచిస్తున్నాడు, చాలా చేస్తున్నాడు. కానీ దేవుడు అందరికీ పైగా ఉన్న సర్వశక్తిమంతుడూ సార్వభౌముడూ కాబట్టి చివరికి తన చిత్తాన్నే నెరవేర్చుకుంటున్నాడు. అదేవిధంగా ఎవరు చేసిన క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తున్నాడు. ఎందుకంటే వారి పాపంతో ఆయనకు సంబంధం లేదు. ఈవిధంగా ఏదెనులోకి సాతానుడు దేవుని అనుమతితోనే ప్రవేశించినప్పటికీ అది ఆయన చిత్తంలో భాగమే అయినప్పటికీ వాడూ మరియు ఆదాము హవ్వలూ తమకున్న దురుద్దేశాలతో పాపం చేసారు కాబట్టి, దేవుడు వారిని శిక్షించాడు ఇందులో ఎలాంటి అన్యాయమూ లేదు.
"అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను"
ఈ సందర్భంలో సర్పం ద్వారా హవ్వతో మాట్లాడుతున్న సాతానుడు ఇది నిజమా అని ప్రశ్నిస్తూ దేవుని ఆజ్ఞపై ఆమెకు సందేహం కలిగిస్తున్నట్టు మనం చూడగలం. సాతానుడు ఈవిధంగానే మానవులను దేవుని వాక్యానికి/ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తింపచెయ్యడానికి మొదట దానిపై వారికి సందేహం పుట్టిస్తుంటాడు. ఈరోజు ఎంతోమంది అలానే అపవాది పుట్టించే సందేహాలకు లోనై దేవుని వాక్యాన్ని విసర్జించి నాశనం ఔతున్నారు, ఆయన అజ్ఞలకు విరుద్ధంగా పాపం చేస్తున్నారు. కాబట్టి మనమంతా విశ్వాసపు డాలును చేతపట్టుకుని అపవాది సందించే సందేహపు బాణాలను ఎదిరించాలి. అలా అని మనం సందేహాలను కలిగుండకూడదని కాదు. వాక్యంలో ఒక అంశంపై సందేహం కలిగుండడం దానిని నివృత్తి చేసుకోడానికి ప్రయత్నించడం పూర్తిగా వేరు. అలాంటి సందేహాలకు లోనైనవారిపై కనికరం చూపించమని బైబిల్ చెబుతుంది (యూదా 1:22) కాబట్టి ఆ సందేహాలు పాపం కాదు కానీ ఒక విశ్వాసికి అసలు దేవుని వాక్యం నిజమేనా? అనే సందేహం మాత్రం అపవాది మూలంగానే కలుగుతుంది.
ఆదికాండము 3:2,3 అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును; అయితే తోట మధ్య వున్న చెట్టు ఫలములనుగూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను.
కొందరు ఆదికాండము 2:16,17 వచనాలను బట్టి మంచిచెడుల వృక్షఫలాలను తినవద్దని దేవుడు ఆదాముకు ఆజ్ఞాపించాడే తప్ప హవ్వకు ఆజ్ఞాపించలేదని అందుకే ఆమె వాటిని తిన్నదని పొరపడుతుంటారు. స్త్రీవాదులైతే ఏమీ తెలియని హవ్వను శపించడం అన్యాయమని కూడా ఆరోపిస్తుంటారు. కానీ ఇక్కడ హవ్వ ఆ వృక్షఫలాలను తినకూడదనే దేవుని ఆజ్ఞను స్పష్టంగా ప్రస్తావించడం ద్వారా ఆమెకు కూడా ఆ ఆజ్ఞ తెలుసని మనకు స్పష్టమౌతుంది. కాబట్టి ఇక్కడ అలాంటి ఆరోపణలకు స్థానం లేదు.
యెహోవా దేవునిపై ఈ స్త్రీవాదులు చేస్తున్న మరికొన్ని ఆరోపణలకు సమాధానాలు తెలుసుకోవడానికి ఈ వ్యాసాలు చదవండి.
స్త్రీకి శీలపరీక్ష, బైబిల్ దేవుని వివక్షేనా?
బైబిల్ దేవునికి స్త్రీలపై వివక్ష వాస్తవమా లేక ఆరోపణా?
అదేవిధంగా కొందరు ఇక్కడ హవ్వ మాటలను కూడా అపార్థం చేసుకుని, దేవుడు తినవద్దని చెబితే ఆమె ముట్టవద్దని కూడా చెప్పినట్టు అబద్ధం చెప్పిందని భావిస్తుంటారు కానీ అది సరికాదు. ఎందుకంటే దేవుడు మొదట ఆదాముకు చెప్పినప్పుడు తినవద్దని మాత్రమే చెప్పినప్పటికీ తర్వాత ఇద్దరికీ కలిపి చెబుతున్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలని ఆవిధంగా కూడా చెప్పియుండవచ్చు.
ఆదికాండము 3:4,5 అందుకు సర్పముమీరు చావనే చావరు; ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగినవారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా-
ఈ వచనాలలో సాతాను హవ్వను మోసగించడానికి, మొదటిగా మీరు చావనే చావరని అబద్ధం చెబుతూ ఆమెకు భరోసా కల్పించడం మనం చూస్తాం. కానీ ఆ ఫలాలు తిన్నప్పుడు ఆదాము హవ్వలు చనిపోయారు, దాని గురించి క్రింది వచనాల్లో చూద్దాం. ఇక్కడ మొదటిగా సాతాను తన అబద్ధపు స్వభావాన్ని కనపరుస్తున్నాడు అందుకే యేసుక్రీస్తు ప్రభువు వాడిని అబద్ధానికి జనకుడంటూ సంబోధించాడు (యోహాను 8: 44).
అదేవిధంగా సాతాను హవ్వతో ఆ ఫలాలను తింటే మీ కన్నులు తెరవబడతాయని, మంచి చెడ్డలను గుర్తించి దేవతలవలే ఉంటారని చెబుతున్నాడు. ఆదాము హవ్వలు అప్పటిదాకా దేవుని నుండే మంచిచెడ్డలు నేర్చుకుంటున్నారు. దేవుడు చెయ్యమన్నదే వారికి మంచి, చెయ్యవద్దు అన్నదే చెడు. కానీ ఇక్కడ సాతాను మీ కన్నులు తెరవబడతాయి, మీ అంతట మీరుగా మంచిచెడ్డలను గుర్తిస్తారని చెప్పడంలో వారిని దేవుని అధికారం, ఆయన బోధనుండి తొలగించాలనే కుట్ర దాగియుంది. ఇది వారి జీవితాలకు తీరని నష్టాన్ని కలుగచేస్తుంది. గతంలో వాడు ఏ దురాలోచనతోనైతే పరలోకం నుండి గెంటివెయ్యబడ్డాడో (యెషయా 14:12-14, యెహెజ్కేలు 28:13-16, ప్రకటన 12:7-9) అలాంటి దురాలోచనే హవ్వ మనసులో స్థాపిస్తున్నాడు. కాబట్టి, సృష్టించిన సృష్టికర్తయైన దేవుడు వేరేగా ఉండగా ఆయనవలే దేవతలుగా గుర్తించబడాలి, పొగడబడాలి అనే ఆలోచన, ఆయనతో సమానంగా కానీ ఆయనకంటే ఎక్కువగా కానీ హెచ్చించుకునే స్వభావం, సమాజంలో ఎక్కడ కనిపించినా దానివెనుక అపవాది హస్తం ఉందని, ఆ భావజాలం వాడి చేతనే నడిపించబడుతుందని మనం గ్రహించాలి. ఇది ప్రస్తుతం ఎంత దారుణంగా వ్యాపిస్తుందో మనందరికీ తెలుసు (ముఖ్యంగా మన దేశంలో).
ఆదికాండము 3:6 స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమై నదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలము లలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను.
ఈ వచనంలో హవ్వ అపవాది మాటమేరకు దేవుడు తినవద్దన్న చెట్టు ఫలాలలో కొన్నిటిని తిని, తన భర్తకు కూడా ఇచ్చినట్టు అతను కూడా వాటిని తిన్నట్టు మనం చూస్తాం. కొందరికి ఇది చదువుతున్నప్పుడు ఏదో చిన్న తప్పిదంలా అనిపింవచ్చు. ఉదాహరణకు; పిల్లలు తమ తల్లితండ్రులు తినవద్దన్న ఆహారాన్ని తినడంలా. కానీ హవ్వ వాటిని తినడం వెనుక ఆమెకు చాలా పెద్ద దురుద్దేశమే ఉంది.
1. ఆమె మీరు ఆ ఫలాలను తిన్నా కూడా "చావనే చావరు" అనే అపవాది మాటలను నమ్మి వాటిని తిన్నదంటే "మీరు వాటిని తిన్నదినమున నిశ్చయంగా చస్తారన్న" దేవుని మాటలను అబద్ధంగా భావించింది.
2. ఆమె వాటిని "మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలను గుర్తించి దేవతలవలే ఉంటారన్న" సాతాను మాటలను నమ్మి తిన్నదంటే మంచి చెడ్డలను దేవుని ద్వారా కాకుండా తమంతట తాముగా గుర్తించాలనే తిరుగుబాటు ఆలోచనతోనే అలా చేసింది. అంటే ఆమె ఇకపై దేవుని అధికారం తమపై ఉండకుండా తామే దేవతలలా ఉండాలని ఆశించింది. ఇది తనను సృష్టించిన దేవుని పట్ల తీవ్రమైన విశ్వాసఘాతకం ఔతుంది.
3. పైగా ఆమె మీరు మంచి చెడ్డలను గుర్తించి, దేవతలవలే ఉంటారని దేవునికి తెలుసు, అందుకే వాటిని తినవద్దన్నాడు అనే సాతాను మాటలకు సానుకూలంగా స్పందించిందంటే దేవుణ్ణి స్వార్థపరుడిగా కూడా నిందించింది. అందుకే దేవుడు దానిని తీవ్రమైన పాపంగా పరిగణించి ఆమెను శిక్షించాడు.
ఇక్కడ మరొక విషయం; ఆ ఫలాలను ఆమె తినడం మాత్రమే కాదు, తన భర్తతో కూడా వాటిని తినిపించి తన పాపంలో పాలిభాగస్తుడ్ని చేసింది. అయితే అందులో ఆమె ఉద్దేశం తన భర్తను ఏదో నాశనం చెయ్యాలని కాదు కానీ అతను కూడా ఇకపై మంచిచెడ్డలను తనకు తానుగా గుర్తించి దేవతలా ఉండాలనే అలా చేసింది. అయినప్పటికీ ఆమె తన భర్తను ప్రేరేపించింది దేవుని పట్ల తిరుగుబాటుకే కాబట్టి, అది అతనికి కూడా తీవ్రమైన నష్టమే కలిగించింది. ఈ సంఘటనను ప్రతీ క్రైస్తవ కుటుంబం జ్ఞాపకం ఉంచుకుని భార్యాభర్తలు ఒకరిని ఒకరు ఏదైనా కార్యం విషయంలో ప్రేరేపించుకుంటున్నప్పుడు అది ఎంతమట్టుకు దైవచిత్తమో అనగా వాక్యానుసారమో లేక వాక్య వ్యతిరేకమో బాగా పరీక్షించుకోవాలి.
ఇక ఆదాము కూడా ఆ సమయంలో తనను సృష్టించిన దేవుని ఆజ్ఞకు కాకుండా తన భార్యమాటకే సానుకూలంగా స్పందిస్తూ ఆ ఫలాలను తిని పాపం చేసాడు, దేవుని నిబంధనను మీరాడు (హోషేయ 6:7). ఈ ఆదాముకు దేవుడు తీర్పు తీరుస్తున్నప్పుడు "నీభార్య మాట విని" అనేమాటను ప్రస్తావించడం ద్వారా తన భార్య మాటను బట్టే అతను ఇదంతా చేసాడని మనకు అర్థమౌతుంది. దీనంతటికీ ఆదాము దేవుని కంటే తన భార్యనే ఎక్కువగా ప్రేమించడం కారణం. ఒకవేళ ఆదాము ఆ సమయంలో దేవుణ్ణే ఎక్కువగా ప్రేమిస్తుంటే ఆయన మాటే వినేవాడు తప్ప, ఆయన మాటకు విరుద్ధంగా ప్రేరేపిస్తున్న తన భార్య మాటను కాదు. దీనివల్ల అతనికి జరిగిన నష్టమేంటో ఈ క్రింది వచనాలలో మనం గమనిస్తాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో మీరు నాకంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించినా నా ప్రేమకు పాత్రులుకాలేరని హెచ్చరించాడు (మత్తయి 10: 37).ఎందుకంటే మనం దేవునికంటే ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో సాతానుడు వారినే సాధనంగా వాడుకుని దేవుని నుండి మనల్ని దూరం చేసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనం మొదటిగా మనకు అందర్నీ, అన్నీ ఇచ్చిన దేవుణ్ణే ప్రేమించాలి. అదే న్యాయం.
ద్వితీయోపదేశకాండము 6:5 నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహో వాను ప్రేమింపవలెను.
ఈవిధంగా మనం అందరికంటే ఎక్కువగా దేవుణ్ణే ప్రేమించినప్పుడు సాతానుడు మన బంధాల ద్వారా మనల్ని పడద్రోయడానికి ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాదు, దీనివల్ల మనకే ఉపయోగం. ఈ విచక్షణ లేని కొందరు బైబిల్ విమర్శకులు, యేసుక్రీస్తు ప్రభువు మీరు నాకంటే ఎవర్నీ ఎక్కువగా ప్రేమించకూడదన్న మాటలను చూపించి, ఆయనేదో ఈర్ష్యతో ఆ మాటలు చెబుతున్నట్టు చిత్రీకరిస్తుంటారు. కానీ అందరికంటే తండ్రిని ఎక్కువగా ప్రేమించిన ఆయన సిలువపై ఉన్నప్పుడు కూడా తన తల్లిని ప్రేమించి తన శిష్యుడికి ఆమెను అప్పగించాడు (యోహాను 19:26,27). ఈవిధంగా మనం అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించినప్పుడే మనవారిని కూడా ఎంతగా ప్రేమించాలో మనకు బోధించబడుతుంది. ఎందుకంటే ప్రేమకు మూలం దేవుడే (1 యోహాను 4:7,8).
ఆదాము హవ్వలు చేసిన ఈ పాపాన్నే సార్వత్రిక క్రైస్తవ సంఘం మూలపాపమని పిలుస్తుంది. ఎందుకంటే దేవుడు ఆదాముతో "ఆ పండుతిను దినాన నీవు నిశ్చయంగా చస్తావని" ఆజ్ఞాపించడం మనం చూసాం (ఆదికాండము 2:16,17). దీనివల్ల ఆదాము హవ్వలు వాటిని తినగానే మొదటిగా ఆత్మీయ మరణానికీ (దేవునితో ఎడబాటు) రెండవదిగా శారీరక మరణానికీ (శరీరంతో లోకంతో ఎడబాటు) లోనయ్యారని ఆ సందర్భంలో వివరించుకున్నాం. ఈ మరణాలు వారికి మాత్రమే కాకుండా వారినుండి వస్తున్న ప్రతీ మనిషికీ ప్రాప్తించాయి, దీనిప్రకారం ఈ భూమిపై ప్రతీమనిషీ ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో మూలపాపంతోనే జన్మిస్తున్నాడు, దీనిని పాపస్వభావం అని కూడా పిలవవచ్చు. ఆందుకే దేవుడు మనల్ని మరలా తిరిగి జన్మింపచేసి తన రాజ్యవారసులుగా చేసుకుంటున్నాడు (ఎఫెసీ 2:1-3, యోహాను 3: 3, తీతుకు 3:5).
గమనించండి; మనం పాపం చేస్తున్నాము కాబట్టి, పాపులం కాలేదు మనం స్వభావసిద్ధంగా పాపులం కాబట్టే (స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి) పాపం చేస్తున్నాము. అందుకే పాపం విషయంలో యేసుక్రీస్తు తప్ప ఏమనిషీ మినహాయించబడలేదు (రోమా 3:10-12). దీనంతటికీ ఆదాము (హవ్వ) చేసిన ఈ పాపమే కారణం (రోమా 5:19).
అయితే మనుషులంతా ఆదాము హవ్వలు చేసిన పాపం కారణంచేత పాపస్వభావంతో పుట్టి పాపం చేస్తుంటే ఆదాము హవ్వలలో ఆ స్వభావం లేకుండా పాపమెలా చేసారనే ప్రశ్న మనకు రావచ్చు. ఏదేను తోటలో ఆదాము హవ్వలు పాపం విషయంలో స్వేచ్చతో ఉన్నారు. వారు దానిని చెయ్యగలరు, చెయ్యకుండా ఉండగలరు కూడా. అదంతా వారి స్వేచ్చపైనే ఆధారపడి ఉంటుంది. కానీ వారు చేసిన పాపం కారణంగా ఆత్మీయంగా చనిపోయి, పాపస్వభావంతో పుడుతున్న మనుషులంతా తమలో ఉన్న పాపస్వభావం కారణంగా పాపం చెయ్యకుండా ఉండలేరు. ఎందుకంటే వారు పాపానికి దాసులయ్యారు (కీర్తనలు 51:5, రోమా 6:17,18). ఈ అంశం గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి, ప్రశ్నలను నివృత్తి చేసుకోవడానికి ఈ క్రింద సూచించిన వ్యాసాలను చదవండి.
జన్మపాపం
Church of Christ దుర్భోధలు
ఆదికాండము 3:7 అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను; వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి.
ఈ వచనంలో దేవుడు తినవద్దన్న చెట్టు ఫలాలు తినగానే ఆదాము హవ్వల కళ్ళు తెరవబడినట్టు, వారికి సిగ్గు తెలిసి అంజూరపు ఆకులతో తమ దేహాన్ని కప్పుకున్నట్టు మనం చూస్తాం. ఇక్కడ వారి కళ్ళు తెరవబడ్డాయి అనేదానిని కొందరు అపార్థం చేసుకుని అప్పటినుండి వారిలో లైంగికకోరికలు ప్రారంభమయ్యాయని భావిస్తుంటారు. కానీ అంతకుముందు వారిమధ్య లైంగిక సంబంధం లేదని మనం చెప్పలేము. ఎందుకంటే దేవుడు వారిని జతగా చేసిన తర్వాత ఫలించి అభివృద్ధి చెందమన్నాడు, వారు ఏకదేహమై ఉంటారని చెప్పాడు. అదేవిధంగా ఆదాము హవ్వలు ఏదెనులో మంచి జ్ఞానవంతులుగా జీవిస్తున్నారు. అందుకే ఆదాము అన్ని జంతువులకు పేర్లు పెట్టగలిగాడు. కాబట్టి ఆదాము హవ్వలు ఆ చెట్టు ఫలాలు తినకముందు కూడా వారిమధ్య లైంగికసంబంధం ఉండియుండవచ్చు. భార్యభర్తల కలయిక అనేది పాపఫలితంగా వచ్చింది కాదు అది దేవుడే నిర్ణయించిన నిష్కలంకమైనది (హెబ్రీ 13:4). అయినప్పటికీ గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానం కాబట్టి, ఏదెనులో హవ్వ గర్భవతి కాకపోయి ఉండవచ్చు, పైగా వారు ఏదెనులో రోజులు ఉన్నారా? లేక నెలలూ సంవత్సరాలా అనేది మనకు తెలియదు. కాబట్టి వారి కన్నులు తెరవబడ్డాయి అన్నప్పుడు అప్పటి నుండి వారు తమకు తాముగా మంచి చెడులను నిర్ణయించుకునే స్వభావాన్ని సంతరించుకున్నారని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆ మంచిచెడులను వారు ఆత్మీయంగా మరణించిన స్థితిలో నిర్ణయించుకుంటారు కనుక ఆ నిర్ణయం లోపంతో కూడినదై ఉంటుంది.
ఉదాహరణకు ఈ వచనంలో వారు తమకు కలిగిన సిగ్గును చెడుగా అంజూరపు కచ్చడాలు చేసుకోవడం మంచిగా తమకు తామే నిర్ణయించుకున్నారు. మానవుడు తనకు తానుగా ఇది మంచి, ఇది చెడు అని నిర్ణయించుకుని ప్రవేశపెట్టిన స్వంత భావజాలాలకూ కల్పితమతాలకూ ఈ సందర్భం ప్రారంభంగా ఉంది. అప్పటినుండే మానవుడు స్వతంత్రుడిగా మంచినీ చెడును నిర్ణయించడం ప్రారంభించాడు. అయితే పైన చెప్పినట్టుగా మానవుడు ఆత్మీయంగా చనిపోయి, పాపస్వభావాన్ని సంతరించుకుని ఏది మంచి ఏది చెడు అనేదానిని నిర్ణయిస్తున్నాడు కాబట్టి అవి ఎక్కువశాతం దేవుడు బోధించే మంచిచెడుల వంటి ఉన్నతమైనవిగా ఉండలేవు. అందుకే ఆయన తన ప్రజలకు దర్శనాలనూ లేఖనాలనూ అనుగ్రహించి మంచి చెడులను బోధించాడు. మనకు కూడా ఆ లేఖనాలను బట్టే ఆయన మంచి చెడులను నిర్ణయిస్తున్నాడు. కొన్నిసార్లు మనిషి తనకు తానుగా చేసేవి కూడా మంచిగానే ఉంటుంటాయి, దీనికి వారిలోని దేవునిపోలిక, స్వరూపానికి సంబంధించిన మనసాక్షినే కారణం (రోమా 2:14,15)
ఆదికాండము 3:8 చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్ల మధ్యను దాగుకొనగా-
ఈ వచనంలో ఆదాము హవ్వలు తాము చేసిన పాపం కారణంగా ధైర్యం చెడినవారై దేవుని యెదుట నుండి దాక్కున్నట్టు మనం చూస్తాం. దేవుడు ఆత్మ, అనంతుడు (1 సమూయేలు 2:3, యోహాను 4:24, 1 తిమోతీ 6:16) అయినప్పటికీ ఆయన ఒక పరిమిత రూపంలో ఆదాము హవ్వలకు ప్రత్యక్షమై వారితో సహవాసం చేసేవాడు. కానీ ఆదాము హవ్వలు చేసిన ఆ పనిని బట్టి వారు దేవునితో ఈ ముఖాముఖి సహవాసాన్ని కోల్పోయారు. వారు మాత్రమే కాదు కానీ వారినుండి వస్తున్న యావత్తు మానవజాతి కూడా దేవునితో ఈ ముఖాముఖి సహవాసాన్ని కోల్పోయింది. అందుచేతే ఆదాముకు పుట్టిన పిల్లలు వారివలే మంచిచెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం తిని అపరాధం చెయ్యనప్పటికీ మరలా ఏదెనులో ప్రవేశించలేకపోయారు. ఎందుకంటే నేను పైన వివరించినట్టు వారంతా ఆదాము హవ్వలను బట్టి ఆత్మీయంగా చనిపోయి, పాపస్వభావంతోనే జన్మిస్తున్నారు. మరలా దేవుని నిర్ణయం చొప్పున క్రీస్తునందు విశ్వసించినవారు మాత్రమే, ఆదాము హవ్వలు కోల్పోయిన దేవుని ముఖాముఖి సహవాసాన్ని పరలోకంలో పొందుకుంటారు. ఎందుకంటే ఈలోకంలో తిరిగి ఆత్మీయంగా జన్మించిన విశ్వాసులు కూడా, ఈలోకంలో బ్రతికినంతకాలం తమలోని పాపస్వభావంతోనే పోరాడుతూ చివరికి పరలోకంలో మాత్రమే దానినుండి విడిపించబడి పరిపూర్ణ పరిశుద్ధులుగా మారుతారు (ప్రకటన 22: 4) దేవునితో పొందుకోబోయే ఆ ముఖాముఖి సహవాసానికి సాదృష్యంగానే ఇప్పుడు కూడా ఆయనతో సహవాసం కలిగియున్నాం (1 యోహాను 1:3).
ఆదికాండము 3:9 దేవుడైన యెహోవా ఆదామును పిలిచినీవు ఎక్కడ ఉన్నావనెను.
ఈ వచనంలో దేవుడు తన యెదుటకు రాకుండా దాక్కున్న ఆదాముహవ్వలను ఎక్కడున్నారని ప్రశ్నించడం మనం చూస్తాం. వాస్తవానికి ఆదాము ఎక్కడ ఉన్నాడో ఆయనకు తెలియక ఆ ప్రశ్న అడగడం లేదు. ఎందుకంటే ఆయన అనంతుడు అంతటా వ్యాపించియున్నవాడు (కీర్తనలు 139:7-12). ఆందుకే "ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది" (హెబ్రీ 4:13) అని రాయబడింది. కానీ ఆయన ఆదాము చేసిన ఆ పాపం వల్ల తన యెదుటకు రాలేని ఎలాంటి పరిస్థితి దాపరించిందో తెలియచెయ్యడానికే అలా ప్రశ్నించాడు. "ఆయన కొరకు కనిపెట్టువారిలో ఎవడును సిగ్గునొందడు" కానీ "హేతువు లేకుండనే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు" (కీర్తనలు 25:3).
ఆదికాండము 3:10 అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిననెను.
ఈ వచనంలో ఆదాము తన దిగంబరత్వం కారణంగా సిగ్గుతో భయపడి దాక్కున్నానని దేవునికి బదులివ్వడం మనం చూస్తాం. నిజానికి వారు సిగ్గు కలగగానే అంజూరపు ఆకులతో తమ దేహాన్ని కప్పుకున్నప్పటికీ అవి ఎంతోసేపు తమ దిగంబత్వాన్ని దాచియుంచలేకపోయాయి. దీనిని బట్టి దేవుని యెదుట పాపంచేసిన మనిషి తనకు తానుగా ఎలాంటి పరిష్కారం తయారుచేసుకున్నప్పటికీ ఆ పాపపు పర్యవసానం నుండి అది తప్పించలేదని, దేవునిముందు ధైర్యంగా నిలువబెట్టలేదని మనకు అర్థమౌతుంది. మనల్ని దేవునిముందు ధైర్యంగా దేవుడే నిలబెట్టగలడు, ఆయన క్రీస్తు ద్వారా అదే చేసాడు.
హెబ్రీయులకు 10:20 ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది.
ఆదికాండము 3:11 అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీ కాజ్ఞా పించిన వృక్షఫలములు తింటివా? అని అడిగెను.
ఈ వచనంలో దేవుడు ఆదామును మరలా ప్రశ్నించడం మనం చూస్తాం. ఇక్కడ కూడా సర్వజ్ఞానియైన దేవుడు ఏం జరిగిందో తెలియక ఈవిధంగా ప్రశ్నించడం లేదు. అందుకే "నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది" (కీర్తనలు 139:2-4) అని రాయబడింది. అయితే జరిగిన సంగతి ఆదాము హవ్వలనోటివెంటే చెప్పించాలని ఆయన ఇలా ప్రశ్నించాడు. దీనికారణంగా పాపం వల్ల వారికి కలిగిన పతనస్థితి వారికే బాగా అర్థమౌతుంది. ఎందుకంటే మనం క్రింది వచనాలను పరిశీలించినప్పుడు ఆదాము హవ్వలు నేరాన్ని వేరొకరిపై నెట్టివేసే ప్రయత్నం చేసారే తప్ప, తమ తప్పును తమ తప్పుగానే ఒప్పుకుంటూ ఆయనను క్షమాపణ వేడుకోలేదు.
ఆదికాండము 3:12 అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిననెను.
ఈ వచనంలో ఆదాముయొక్క పతనస్థితిని మనం చూస్తాం. అతను దేవుని ఆజ్ఞకంటే తన భార్యను ఎక్కువగా ప్రేమించి ఆ ఫలాలను తిన్నాడు. కానీ తీరా దేవుడు ప్రశ్నించగానే భయంతో నేరాన్ని ఆమెపై నెట్టివేస్తున్నాడు. అందుకే ఆదాము తన దోషాన్ని ఒప్పుకోకుండా దాచిపెట్టుకునే ప్రయత్నం చేసాడని రాయబడింది (యోబు 31:33,34). ఇక్కడ మరో ప్రధానమైన విషయాన్ని మనం గమనించవచ్చు. ఈలోకంలో మనం దేవునికంటే ఎవరినైతే ఎక్కువగా ప్రేమించి, వారి కారణంగా దైవాజ్ఞలను అతిక్రమిస్తామో వారిపై మనకున్న ప్రేమ ఏదో ఒక సమయంలో అసహనానికి లోనౌతుంది. అంటే ఆ ప్రేమ ఎక్కువకాలం కొనసాగదు అని అర్థం. "యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు" (సామెతలు 21:30) అన్నప్పుడు ఆ మాటలు మన ప్రేమలకు కూడా వర్తిస్తాయి. చూడండి; ఇప్పుడు ఆదాముకు తనభార్యపై గతంలో ఉన్న ప్రేమనే ఉండుంటే దేవుడు ఆమెను ఎక్కడ శిక్షిస్తాడో అనే భయంతో అతను నేరాన్ని తనపైనే వేసుకునేవాడు, కానీ అతను అలా చెయ్యడం లేదు. ప్రస్తుతసమాజంలో భార్యాభర్తల మధ్య మనం విస్తృతంగా చూస్తున్నటువంటి అసహనం మొదటిసారిగా ఇక్కడే ప్రారంభమైంది. కారణం: పతనస్వభావం.
అంతేకాదు; ఒకవిధంగా ఆదాము ఇక్కడ తనకు భార్యను చేసిచ్చిన దేవునిపై కూడా నిందమోపుతున్నట్టుగా "నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినని" పలుకుతున్నాడు. కానీ ఇదే ఆదాము గతంలో ఆమెను నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము అంటూ సంబోధించాడు. ప్రస్తుత సమాజంలో నేరం తాము చేసి పరిస్థితుల సాకుతో ఆ నిందను దేవునిపైకి నెట్టి వేసే సంఘటనలకు కూడా ఇదే ప్రారంభం.
ఆదికాండము 3:13 అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది యేమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననెను.
ఈ వచనంలో హవ్వ కూడా నేరాన్ని సర్పంపైకి నెట్టివెయ్యడం మనం చూస్తాం. అంతేతప్ప ఆమె సర్పం మాటలకు ఎందుకు సానుకూలంగా స్పందించిందో ఏ దురుద్దేశంతో ఆ ఫలాలను తినిందో అవి మాత్రం ఒప్పుకోవడం లేదు. ఒకవిధంగా ఈమె నేను అమాయకురాలిని ఆ సర్పమే నన్ను మోసపుచ్చింది అన్నట్టుగా దేవుణ్ణే మభ్యపెట్టాలని చూస్తుంది. దేవుడు మన ఆలోచనలన్నిటినీ ఎరిగినవాడనే కనీస అవగాహనను కూడా ఈమె మరచిపోయింది. ఆత్మీయంగా చనిపోయి, పతనస్థితిలో ఉన్న మనిషి దేవునికుండే శక్తిసామర్థ్యాలను గుర్తించలేడు అనేందుకు ఇది మంచి నిదర్శనం.
కీర్తనలు 73:11,12 దేవుడు ఎట్లు తెలిసికొనును మహోన్నతునికి తెలివియున్నదా? అని వారనుకొందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు.
ఆదికాండము 3:14 అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడినదానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్ని మన్ను తిందువు.
ఈ వచనంలో దేవుడు ఆదాము హవ్వలను అడిగినట్టుగా సర్పాన్ని ఏమీ అడగకుండా దానిని శపిస్తున్నట్టు మనం చూస్తాం. ఎందుకంటే ఆ సర్పాన్ని ఆవహించిన అపవాది స్వభావం ఆయనకు తెలుసు కాబట్టి వాడిని ఆయన ఏమీ అడగడం లేదు. అదేవిధంగా ఈ శాపం కేవలం సర్పానికి/సర్పజాతికి వర్తించేదిగానే కనిపిస్తుంది కానీ అది ఆ సర్పాన్ని ఆవహించిన అపవాదికి కూడా వర్తిస్తుంది. దానిప్రకారం; సర్పం ఎలాగైతే నేలకు అంకితమై మనిషి కాళ్ళదగ్గరకు చేరుతుందో అపవాది పరిస్థితి కూడా చివరికి ఆవిధంగానే హీనంగా ఉంటుంది (యెషయా 14:12-16). ఆనాటి మెసపటోమియా వంటి నాగరికతల్లో శత్రురాజు యొక్క ఓటమిని వర్ణించేందుకు కూడా మన్నుతిన్నాడు, కడుపుతో ప్రాకాడు అనే మాటలను అలంకారంగా ఉపయోగించేవారని కొందరు బైబిల్ పండితులు తెలియచేస్తున్నారు. ఉదాహరణకు "అతని శత్రువులు మన్ను నాకెదరు" (కీర్తనలు 72:9).
ఆవిధంగా ఇక్కడ దేవుడు మోషేకు తెలిసిన అలంకారాన్నే తీసుకుని శపిస్తున్నాడు. కాబట్టి ఆ శాపం భూజంతువులలో ఒకటైన సర్పానికి ప్రత్యక్షంగానూ ఆ సర్పాన్ని ఆవహించిన అపవాదికి అలంకారంగానూ వర్తిస్తుంది. అయితే ఈ సర్పానికి ప్రత్యక్షంగా వర్తించే ఆ శాపంలో అది మట్టి తింటుందని కూడా కనిపిస్తుంది. కొందరు ఆ మాటలను ఆధారం చేసుకుని బైబిల్ దేవుడు శపించినట్టుగా ఏ పామూ కూడా మట్టి తినదని శాస్త్రీయ రుజువులను మనకు చూపిస్తుంటారు. పాముల విషయంలో దేవుడు చెప్పినట్టుగా జరగట్లేదు కాబట్టి బైబిల్ దైవగ్రంథం కాదనేది వారి వాదన. కానీ ఇక్కడ సర్పం తన బ్రతుకుదినాలన్నీ మన్ను తింటుందంటే మట్టితప్ప ఇంకేమీ తినదని కానీ ఆ మట్టి తిని జీర్ణించుకుంటుందని కానీ కాదు. పాములు తమ ఎరను వెతుక్కునేటప్పుడు ఆ ప్రదేశంలోని మట్టిని నాకుతూ ఆ ఎరను పసిగడుతుంటాయి. దీనినే దేవుడు మన్నుతింటావని ప్రస్తావించాడు, ఒక్కమాటలో చెప్పాలంటే ఇది సర్పం యొక్క హీనస్థితిని తెలియచేస్తుంది. అందుకే "సర్పములాగున వారు మన్ను నాకుదురు" (మీకా 7: 17) అని ఆ మాటలు భక్తిహీనుల గురించి కూడా వాడబడ్డాయి. కాబట్టి పాము మట్టి తినడమేంటనే బైబిల్ విమర్శకుల ఆరోపణకు ఇక్కడ అవకాశం లేదు.
అలాగే నేను ప్రారంభంలో ప్రస్తావించినట్టుగా అపవాది సర్పాన్ని ఆవహించడంపై ఒక ప్రధానమైన ప్రశ్న ఉత్పన్నం ఔతుంది. అదేంటంటే; అపవాది సర్పాన్ని ఆవహించి హవ్వను మోసగించడంలో సర్పం యొక్క ఉద్దేశపూర్వక తప్పిదమేమీ లేదు. తప్పిదమంతా కేవలం దానిని ఆవహించిన సాతానుదే. అలాంటప్పుడు దేవుడు సర్పాన్ని కూడా ఎందుకు శపించాడు? దీనికి సమాధానం;
హవ్వను మోసగించడంలో సర్పంయొక్క ఉద్దేశపూర్వక తప్పిదం లేనప్పటికీ అపవాది దానిని సాధనంగా వాడుకునే ఆ పని చేసాడు కాబట్టి, దేవుడు ఆ శాపాన్ని సర్పానికి ప్రత్యక్షంగా వర్తింపచేసి, నీ బ్రతుకు కూడా చివరికి నీవు ఆవహించిన సర్పంలానే హీనంగా ఔతుందని ఆ అపవాదికి సూచనగా ఉంచడం ఆయనకు న్యాయమే. ఈరోజు మనం ఎన్నో జీవులను మన జీవనం కోసం ఉపయోగించుకుంటున్నాము, చంపి తింటున్నాము. అలాంటిది సృష్టికర్తయైన దేవునికి తాను సృష్టించినవాటిని వాడుకునే హక్కు మరెంతగా ఉంటుందో ఆలోచించండి.
రోమీయులకు 9:20,21 అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీ వెవడవు? నన్నెందు కీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా? ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధి కారము లేదా?
ఒకవేళ దేవుడు సర్పానికి కూడా వర్తించేలా శపించనప్పటికీ ఆయన ఆదామును బట్టి సమస్తాన్నీ శపించినప్పుడు అందులో ఈ సర్పజాతి కూడా శపించబడిందే ఔతుంది. కానీ అపవాది మరేజీవినీ కాకుండా ఈ సర్పాన్నే సాధనంగా వాడుకున్నాడు కాబట్టి, దేవుడు అదే సర్పాన్ని వాడి యొక్క పరాజయానికి సూచనగా ఉంచుతూ దానిని ప్రత్యేకంగా శపించాడు. ఇప్పుడు సర్పజాతి ఏమీ దేవుడు మమ్మల్ని అన్యాయంగా శపించేసాడని బాధపడవు కదా! ఎందుకంటే ఆ విచక్షణ వాటికి ఉండదు. ఎలాగైతే ఆదామును బట్టి శపించబడిన నేల అతను కష్టపడి చెమట చిందించడానికి కారణమౌతుందో అదేవిధంగా సర్పం కూడా శపించబడి అపవాదికి వాడి పరాజయాన్నీ హీనస్థితినీ గుర్తుచేస్తుంది.
ఇకపోతే సర్పాలపై పరిశీలన చేసిన కొందరు శాస్త్రజ్ఞులు కూడా జన్యుపరంగా అవి మొదటినుండీ కడుపుతో ప్రాకేజీవులు కావని తేల్చారు. దీనిప్రకారం దేవుడు శపించడానికి ముందు అవి భూమిపై నడిచేజీవులే. అందుకే అది "భూజంతువులలో ఒకటని" ప్రస్తావించబడింది. దీనికి సంబంధించిన వివరాలను చదవండి.
https://answersingenesis.org/genetics/animal-genetics/snakes-appear-live-cursed-life/
ఆదికాండము 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతాన మునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.
ఈ వచనంలో దేవుడు చెబుతున్న మాటలు కూడా అటు సర్పానికీ ప్రత్యక్షంగానూ ఇటు అపవాదికి అలంకారంగానూ వర్తిస్తాయి. మొదటిగా ఈ భూమిపై పుడుతున్న ప్రతీమనిషీ హవ్వ సంతానమే కాబట్టి (ఆదికాండము 3:20) వారు సర్పాన్ని చంపేటప్పుడు సాధారణంగా తలను చితక్కొడతారు. సర్పం కూడా ఎక్కువగా నేలపై ప్రాకుతుంది కాబట్టి అది నడుస్తున్న మనిషి కాలి మడిమపై కాటువేస్తుంది. ఈవిషయం పంట పొలాలలో సంచరించేవారికి బాగా తెలుసు.
అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువుకూడా స్త్రీ యందేపుట్టి (గలతీ 4:4) అపవాది తీసుకువచ్చిన పాపం కారణంగా కాలికి మేకును కొట్టే సిలువమరణానికి లోనయ్యాడు. కానీ ఆయన ఆ మరణాన్ని జయించి అపవాదిపై విజయం సాధించాడు (హెబ్రీ 2:14,15). అపవాది ఆయన్ని స్వల్పకాలం మాత్రమే బాధపెట్టగలిగింది (మడిమెపై కొట్టింది) కానీ యేసుక్రీస్తు తన రాకడలో అపవాదిని శాశ్వతంగా నశింపచేస్తాడు (తలపై కొడతాడు). చివరికి యేసుక్రీస్తు సంతానమైన మనం కూడా అపవాది తలను చితకతొక్కే రోజు రాబోతుంది (రోమా 16: 20). అప్పటివరకూ వాడికీ మనకూ మధ్య వైరమే కొనసాగుతుంది (1పేతురు 5:8,9).
ఆదికాండము 3:16 ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను.
ఈ వచనంలో దేవుడు సర్పంచేత మోసపోయానని బదులిచ్చిన హవ్వకు కూడా శిక్ష విధిస్తున్నట్టు మం చూస్తాం. కొందరికి ఇది చదువుతున్నప్పుడు మోసగించినవారిని శిక్షించాలే తప్ప, మోసపోయినవారిని శిక్షించడమేంటనే ప్రశ్న రావొచ్చు కానీ మోసపోయే ప్రతీ ఒక్కరూ అమాయకులు కాదనే విషయం మనం గుర్తుంచుకోవాలి. చాలామంది తమకున్న దురాశలను బట్టే మోసపోతుంటారు. ఇక్కడ హవ్వ మోసపోవడానికి ఆమెలో పుట్టిన దైవవిరుద్ధమైన దురాలోచనలే కారణం అవేంటో పైన వివరంగా తెలియచేసాను. అందుకే న్యాయవంతుడైన దేవుడు ఆమెను మోసగించిన సర్పంతో పాటుగా ఈమెను కూడా దోషిగా తేల్చి శిక్షివిధించాడు. కాబట్టి మనం కూడా మోసపోయిన ప్రతీఒక్కరిపై సానుభూతి చూపించకుండా వారు మోసపోవడం వెనుక వారికేమైనా దైవవిరుద్ధమైన ఆలోచనలుంటే వారిని కూడా దోషులుగానే పరిగణించి గద్దించాలి.
యోబు 12:16 బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశముననున్నారు.
సామెతలు 18:17 వ్యాజ్యెమందు వాది పక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చినమీదట వాని సంగతి తేటపడును.
దేవుడు హవ్వకు విధించిన శిక్షలో "నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు" అనేదానిని మొదటిగా గమనిస్తాం. ఇది ఆమెకు మాత్రమే కాకుండా స్త్రీలందరికీ సంక్రమిస్తుంది. విషయాన్ని పైపైన చూసేవారికి హవ్వ పాపం చేస్తే శిక్షగా విధించబడిన ప్రసవవేదన స్త్రీలందరికీ కూడా సంక్రమించడమేంటి, ఇది అన్యాయం కదా? అని అనిపిస్తుందేమో కానీ హవ్వకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ప్రకారం (ఆదికాండము 1:27,28) భర్తతో ఏకశరీరం ఔతున్న స్త్రీలూ పిల్లలను కంటున్న స్త్రీలూ ఆమె శిక్షలో భాగం కలిగి యుండడం న్యాయమే. అది అన్యాయమైతే హవ్వ ఆశీర్వాదాన్ని మాత్రం ఎందుకు అనుభవిస్తున్నట్టు? కాబట్టి హవ్వ ఆశీర్వాదం, ఆమె పతనస్వభావం స్త్రీలందరికీ సంక్రమించినట్టే ప్రసవవేదన కూడా సంక్రమించింది.
అలానే ఈ శిక్ష స్త్రీలపై మాత్రమే ప్రభావితం చూపిస్తుంది అనుకోవడం భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమానుబంధం గురించి తెలిసిన ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే తన భార్యపై ప్రేమున్న ఏ పురుషుడూ ఆ భార్య ప్రసవవేదన పడుతుంటే నాకేం బాధలేదులే అన్నట్టు ఉండదు. ఆమె శారీరకంగా బాధపడుతుంటే ఆ బాధను చూసిన ఇతను మానసికంగా బాధపడుతుంటాడు, అలానే తగిన ఏర్పాట్లను చేస్తుంటాడు. కాబట్టి దేవుడు స్త్రీకి ఇచ్చిన శిక్షయైనా పురుషుడికి ఇచ్చిన శిక్షయైనా ఇద్దరిపైన ప్రభావం చూపే విధంగానే ఉంటుంది. ఉదాహరణకు, ఆయన పురుషుడు చెమటను చిందించి ఆహారం తింటాడని శిక్షించాడు దానిప్రభావం స్త్రీపై పడకుండా ఉంటుందా? అతను మన్నే కనుక మరలా మన్ను అయిపోతాడాని మరణాన్ని విధించాడు (ఆదికాండము 3:17-19), అది స్త్రీ కి కూడా వర్తించి మరణిస్తుంది కదా!
ఇక స్త్రీలందరూ ప్రసవవేదన పడి పిల్లలను కనాలనేది దేవుని శిక్షయైతే C-Section (Caesarean section) ద్వారా పిల్లలను కంటున్నవారి సంగతేంటి? వారి విషయంలో దేవునిశిక్ష నెరవేరట్లేదు కదా అనే సందేహం కొందరికి కలుగుతుంది. కానీ "నువ్వు వేదనతో పిల్లలను కందువు" అన్నప్పుడు, ఒక బిడ్డను కనే స్త్రీ ఏదో విధంగా వేదనకు (బాధకు) గురౌతుందని ఆమాటల యొక్క భావం (నొప్పి లేకుండా ఏ స్త్రీ బిడ్డను కనలేదు). ప్రస్తుతం శాస్త్రప్రపంచం అభివృద్ధి చెంది C-Section ద్వారానే ఎక్కువ ప్రసవాలు జరుగుతున్నప్పటికీ ఆ ప్రసవాలేమీ వేదన (బాధ) రహితమైనవి కావు. C-Section చేసేటప్పుడు ఉపయోగించే మత్తువల్ల, ఆ సమయంలో వారికి నొప్పి తెలియకపోవచ్చు కానీ ఆ తర్వాత వారు ఎంత బాధకు గురౌతారో C-Section ద్వారా పిల్లలను కన్న స్త్రీలను అడగండి. సాధారణ ప్రసవంలో వేదన (బాధ) కొంతకాలమే కానీ C-Section అనేది చాలాకాలం వరకూ బాధిస్తూనే ఉంటుంది. కాబట్టి "నువ్వు వేదనతో పిల్లలను" కందువు అనే దేవునిశిక్ష C-Section ద్వారా పిల్లలను కనే స్త్రీల విషయంలో ఎంతమాత్రం తప్పిపోవట్లేదు. ఆ వేదన వారి విషయంలో కూడా నెరవేరుతూనే ఉంది. చివరికి పెళ్ళిచేసుకోకుండా పిల్లల్ని కనకుండా ఉండే స్త్రీలు కూడా ఈ శాపం నుండి తప్పించుకోవట్లేదు. ఎందుకంటే ఏ స్త్రీయైనా రుతుస్రావపు వేదన, చికాకు నుండి తప్పించుకోలేదు. ఏదెనులో ఆదాము హవ్వలకు వేదన అనేదే లేదు కాబట్టి రుతుస్రావం సమయంలో కలిగే వేదన కూడా శాపఫలితంగానే స్త్రీలోకి ప్రవేశించింది. అందుకే ఈ శాపానికి గుర్తుగానే మోషే ధర్మశాస్త్రంలో రుతుస్రావం అపవిత్రమని పేర్కోబడింది.
ఇక్కడ మరొక విషయానికి కూడా స్పస్టత ఇవ్వడాలిచాను. కొంతమంది బైబిల్ విమర్శకులు దేవుడు హవ్వకు విధించిన ఈ ప్రసవవేదనను ప్రస్తావించి, అది హవ్వ చేసిన పాపం కారణంగానే ఆమెకూ మరియు స్త్రీలందరికీ వచ్చుంటే మరి జంతువులకు కూడా ఆ ప్రసవవేదన ఎందుకు కలుగుతుందని ప్రశ్నిస్తుంటారు. ఇలాంటి ప్రశ్నలు వేసే వారు ఆదాము హవ్వల పాపఫలితంగా సృష్టిలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయో ముందుగా తెలుసుకోవాలి. ఆదాము హవ్వలు చేసిన పాపాన్ని బట్టి ఈ సృష్టిమొత్తమూ శాపానికి లోనయ్యింది (రోమా 8:19-22). ఎందుకంటే ఈ సృష్టిమొత్తం వారికోసమే చెయ్యబడింది (ఆదికాండము 1:26). కాబట్టి ఆదాముకు విధించబడిన మరణం, మనుషులకే కాకుండా జీవులన్నీటికీ ఎలా సంక్రమించిందో అలానే హవ్వకు విధించబడిన ప్రసవవేదన కూడా ఆ జీవులన్నిటికి (ఆడ) సంక్రమించింది. ఈ సృష్టియొక్క శాపం గురించి క్రింద వచనాలలో మరలా చర్చించుకుందాం.
అదేవిధంగా దేవుడు ఆ సందర్భంలో "నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని" పలకడం మనకు కనిపిస్తుంది. చాలామంది ఇక్కడ వాంఛ అనేదానిని లైంగికకోరికతో ముడిపెడుతుంటారు కానీ, ఇవే మాటలే వాడబడిన మరొక సందర్భం చూడండి.
ఆదికాండము 4:6,7 యెహోవా కయీనుతో నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చుకొనియున్నావేమి? నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీ యెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను.
ఇక్కడ కూడా దేవుడు కయీనుతో నువ్వు సత్క్రియను చెయ్యకపోతే పాపానికి నీపై వాంఛ కలుగుతుందని నువ్వు దానిని ఏలతావని అవే మాటలు చెబుతున్నాడు. దీనిప్రకారం హవ్వ విషయంలో వాంఛ అన్నప్పుడు ఆమెకు తన భర్తపై కలిగే శారీరక కోరిక కాదు. ఎందుకంటే అంతకుముందే వారిలో ఆ కోరికలు ఉన్నాయి. వారు ఆ ఫలాలు తినగానే తమ దిగంబరత్వాన్ని బట్టి సిగ్గుతో దాక్కుంది దేవుని పట్ల సిగ్గుతోనే తప్ప ఒకరిపట్ల ఒకరికి సిగ్గువేసి కాదు. అందుకే ఆదాము "నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటినిగనుక భయ పడి దాగుకొంటిని" (ఆదికాండము 3:10) అంటున్నాడు. కాబట్టి, ఇక్కడ హవ్వకు ఆదాముపై వాంఛకలగడం అంటే అప్పటినుండి ఆమెలో ఆదామును ఏలాలనే తప్పుడు కోరిక పుడుతుంది. తన భర్తకు ప్రేమతో లోబడియుండడం బానిసత్వంగా భావించి అతనిపై తిరుగుబాటు చెయ్యాలని, అతడిని పరిపాలించాలని కోరుకుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే అప్పటివరకూ ఆమెకు ఇబ్బంది కలిగించని తనపై తన భర్త పరిపాలన ఇప్పుడు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది, అందుకే ఆమెనే అతడిని ఏలాలి అనుకుంటుంది. కానీ ఆ కోరిక భంగపడేలా ఆదాముచేత ఏలబడుతుంది. గమనించండి; దేవుడు ఆ వాంఛను శిక్షగా విధించలేదు, అది పతనస్వభావాన్ని బట్టే ఆమెలో కలిగింది. కానీ దేవుడు దానిని అడ్డుకుంటూ ఆమెనే తన భర్తచేత పరిపాలించబడేలా నియమిస్తున్నాడు. ఆమె సృష్టించబడిన విధానం మరియు కారణాలను బట్టి అది సరియే ఐనా (1 కొరింథీ 11:9), అప్పటివరకూ తనపై ఆ భర్త పాలన ఇబ్బందిగా తోచకున్నా ఇప్పుడు మాత్రం అది ఆమెకు శిక్షగానే తోస్తుంది. ఎందుకంటే పతనస్వభావం ఎవరికీ లోబడియుండడానికి ఇష్టపడదు. తిరుగుబాటును కోరుకుంటుంది.
ఈరోజు కుటుంబంలోనూ సమాజంలోనూ స్త్రీలు పురుషులపై ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నించడానికి హవ్వ ద్వారా సంక్రమించిన ఈ స్వభావమే కారణం. చరిత్రకూడా దీనిని ధృవీకరిస్తుంది. స్త్రీలో కలిగిన ఈ తిరుగుబాటును దృష్టిలో పెట్టుకునే పౌలు విశ్వాసులైన స్త్రీలతో మీరు అలా ఉండకుండా మీ భర్తలకు లోబడియుండమని ఆదేశించాడు (కొలస్సీ 3:18, ఎఫెసీ 5:22).
ఆదికాండము 3:17-19 ఆయన ఆదాముతో నీవు నీ భార్యమాట వినితినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు; అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు; నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.
ఈ వచనాలలో దేవుడు ఆదాము చేసిన పాపాన్ని బట్టి మొదటిగా ఈ నేల శపించబడి అతని జీవనానికి కష్టంగా మారుతుందని ప్రకటించడం మనం చూస్తాం. ఎందుకంటే ఈ సమస్త భూమీ నరుడికోసమే సృష్టించబడింది కాబట్టి, నరుడు చేసిన పాపాన్ని బట్టి ఈ భూమి కూడా శపించబడింది. అప్పటినుండి ఆదాము తన మరియు తన కుటుంబసభ్యుల ఆహారంకోసం కష్టపడేలా చెయ్యడానికి కూడా ఆయన ఈవిధంగా నియమించాడు. ఇది కేవలం ఆదాముకు మాత్రమే పరిమితం కాదు కానీ వారి సంతానమైన అందరూ భూమి పంట విషయంలో ఆ కష్టాన్ని అనుభవిస్తున్నారు. ఈ శాపాన్ని బట్టే నోవహుకు ఆ పేరు పెట్టబడింది (ఆదికాండము 5:29). అలానే ఆదామును బట్టి కలిగిన ఈ శాపం ఈ నేలకు మాత్రమే కాదు ఈ సృష్టిలో ఉన్న అన్నిటికీ సంక్రమించింది (రోమా 8:19-22). ఎందుకంటే నేను పైన తెలియచేసినట్టుగా ఈ సృష్టి అంతా ఆదాము హవ్వలకోసమే సృష్టించబడింది. వారు చేసిన పాపమేంటో వారికి తెలియాలంటే వారికోసం సృష్టించబడిన ఈ సృష్టి కూడా శాపానికి గురై, వారిపై తిరుగుబాటు చేస్తూ వారు ఆయనపట్ల చేసిన తిరుగుబాటుకు రుజువుగా ఉండాలి. అందుకే దేవుడు ఈవిధంగా నిర్ణయించాడు. సృష్టిని సృష్టించిన సృష్టికర్తగా అది న్యాయమే.
రెండవదిగా ఆదాము తాను చేసిన అతిక్రమాన్ని బట్టి శారీరక మరణానికి కూడా లోనయ్యాడు. అతనిని బట్టే మరణం అనేది ఈలోకంలో ప్రవేశించి మనుషులందరికీ సంక్రమించింది (రోమా 5:12). అయితే యేసుక్రీస్తు మరణించి తిరిగిలేచి మరణపు ముళ్ళును విరవడం ద్వారా ఆయనయందు విశ్వాసముంచిన వారంతా ఈ మరణాన్ని జయించి నిత్యజీవాన్ని పొందుకుంటారు (1 కొరింథీ 15:21,22).
ఆదికాండము 3:20 ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి.
ఈ వచనంలో ఆదాము తన భార్యకు హవ్వయని పేరుపెట్టడం మనం చూస్తాం. ఎందుకంటే ఆమె నుండే ఆదాము సంతానం ఈ భూమిపై వ్యాపించింది. అయితే కొందరు ఇక్కడ జీవముగల ప్రతివానికీ తల్లియనే మాటలను ఆత్మీయ అర్థం లో తీసుకుంటుంటారు. కానీ ఇక్కడ సందర్భం చెబుతుంది మాత్రం ఆత్మీయ జీవంగురించి కాదు. హవ్వ ఎక్కడా కూడా ఆత్మీయజీవం గలవారికి తల్లిగా గుర్తించబడలేదు.
ఆదికాండము 3:21 దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను.
ఈ వచనంలో దేవుడు ఆదాము హవ్వలకు చర్మపు చొక్కాయిలు చేసివ్వడం మనం చూస్తాం. పాపఫలితంగా వారికి కలిగిన సిగ్గును కప్పుకునేందుకు వారు స్వతహాగా కల్పించుకున్న అంజూరపు కచ్చడాలు వారికి సరైన పరిష్కారం ఇవ్వలేకపోయాయి. అందుకే కృపకలిగిన దేవుడే వారికి పరిష్కారం చూపిస్తున్నాడు. ఈ సంఘటన, ఒకవైపు మనకు పాపంవల్ల కలిగిన సిగ్గును కప్పుకోవడానికి సరైన వస్త్రాలు ధరించాలని తెలియచేస్తుండగా మరోవైపు ఆ సిగ్గుకు కారణమైన పాపం నిర్వీర్యం అయ్యేందుకు బలి అవసరమని కూడా తెలియచేస్తుంది. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఆదాము హవ్వలకు చర్మపు చొక్కాయిలు చేసివ్వడానికి (పాపపర్యవసానం నుండి విముక్తి కల్పించడానికి) మొదటిసారిగా ఒక నిర్దోషమైన జంతువు ప్రాణాన్ని బలిగాచేసాడు. బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం; ఇక్కడ దేవుడు ఆదాముతోటే ఆ జంతువును చంపించి దాని చర్మంతో వారికి వస్త్రాలను చేసిచ్చాడు. దానికి సాదృష్యంగానే ధర్మశాస్త్ర బలుల్లో ఆ జంతువు యొక్క చర్మం దానిని చంపిన యాజకుడిదని నియమించబడింది (లేవీకాండము 7:8). ఈవిధంగా ఈ బలిని ధర్మశాస్త్ర బలులన్నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి.
ఎందుకంటే ఈ బలి యేసుక్రీస్తు బలికి ఛాయగా ఉంది. ఆయన బలినిబట్టే మనం పాపపర్యవసానం నుండి విడిపించబడి పరిశుద్ధులుగా మార్చబడి, పరలోకంలో ప్రవేశించబోతున్నాం (రోమా 4: 25, హెబ్రీ 10:14).
ఆదికాండము 3:22,23 అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డ లను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకని వంటివాడాయెను. కాబట్టి అతడు ఒక వేళ తన చెయ్యి చాచి జీవ వృక్షఫలమును కూడ తీసికొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేలనుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలోనుండి అతని పంపివేసెను.
ఈ వచనాలలో దేవుడు మంచిచెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకనివంటివాడు అయ్యాడని పలికి అతనిని ఏదెను నుండి పంపివెయ్యడం మనం చూస్తాం. "అతడు ఏ నేలనుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలోనుండి అతని పంపివేసెను" ఈ మాటలు బాగా గమనించండి. దేవునిపై తిరుగుబాటు కారణంగా అతను ఎందుకైతే సృష్టించబడ్డాడో ఆ దేవుని ఉద్దేశం నుండీ తాను ఎక్కడినుండి సృష్టించబడ్డాడో అనగా తన సృష్టికి మూలమైన ప్రాంతం నుండి అతను త్రోసివెయ్యబడ్డాడు. దేవుని పరిచర్యలో ఉన్నవారు ఈ విషయం బాగా గుర్తుంచుకోవాలి. ఒక్క తిరుగుబాటు లేక ఒక్క పాపం కారణంగా కూడా మనం మన పిలుపుయొక్క ఉద్దేశం నుండి త్రోసివెయ్యబడొచ్చు.
అలానే కొందరు ఇక్కడ "ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకని వంటివాడాయెను" అని దేవుడు పలకడాన్ని చూపించి సాతాను చెప్పినట్టుగానే ఆదాము హవ్వలు ఆ ఫలాలను తిన్నాక దేవతలవలే అయిపోయారని, అందుకే దేవుడు ఈర్ష్యతో వారిని శపించి ఏదెను నుండి వెళ్లగొట్టాడని విమర్శించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఆదాము హవ్వలు ఎప్పుడైతే అతిక్రమం చేసారో అప్పుడే ఏదెనులోని జీవవృక్షఫలాలను తినే అర్హతను కోల్పోయారు, వారు మరణానికే పాత్రులు. కానీ ఇకనుండి పతనస్థితి నుండి మంచినీ చెడునూ నిర్ణయించుకునే ఆదాము హవ్వలు, ఒకవేళ దేవుడు రాసిన మరణశాసనానికి ఎదురుతిరిగి నిరంతరం జీవించాలనే దురుద్దేశంతో వాటిని తింటారనే ఆయన ఏదేనునుండి వారిని వెళ్ళగొట్టాడు. ఇది ఆదాము పాపం పట్ల దేవుని న్యాయమైన ప్రతిదండనే తప్ప, ఈర్ష్యకాదు. మరలా దేవుడు మాత్రమే, తన నిర్ణయంలో ఉన్నవారికి ఆ జీవవృక్షఫలాలను తినే అధికారం ఇవ్వగలడు (ప్రకటన 2:7). అనగా వారిని మరణం నుండి బ్రతికించి శాశ్వతంగా జీవింపచెయ్యగలడు (1 కొరింథీ 15:21-26, ప్రకటన 21:4).
ఆదికాండము 3:24 అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.
ఈ ఏదెను అనేప్రాంతం ఎక్కడ ఉందో మనం ఆదికాండము రెండవ అధ్యాయంలో ఇవ్వబడిన ఆధారాలను బట్టి గ్రహించేప్రయత్నం చేసాం. నోవహు జళప్రళయం సంభవించినప్పుడు ఈ సమస్తభూమీ మునిగిపోవడం జరిగింది, అప్పుడు ఈ ఏదేను కూడా నాశనమైయుండవచ్చు. అందుకే మనం ఆ జీవవృక్షఫలాల చెట్లను ఎక్కడ ఉన్నాయో గుర్తించలేకపోతున్నాము. ఎందుకంటే మానవులకు ఇక వాటితో పనిలేదు కాబట్టి, వాటిని ఈ భూమిపై ఉంచవలసిన అవసరం దేవునికి లేదు.
Copyright Notice
ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని వాణిజ్యపరంగా ఉపయోగించాలనుకున్నవారు మా లిఖితపూర్వక అనుమతిని తప్పక తీసుకోవాలి. ఉచిత ప్రచురణ కొరకు మా అనుమతిని తీసుకోనవసరం లేదు.
ఐతే, పూర్తిగానైనా పాక్షికంగానైనా, ఈ వ్యాసాన్ని/పుస్తకాన్ని ప్రచురించేవారు ఈ కిందున్న కాపీరైట్ నోటీసును తప్పక జతచేస్తూ ప్రకటించాలి:
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి
అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
ఆదికాండము అధ్యాయము 3

"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"

Add comment