పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

32:1, 32:2, 32:3, 32:4,5, 32:6, 32:7, 32:8, 32:9, 32:10-12, 32:13-16, 32:17-21, 32:22,23, 32:24,25, 32:26, 32:27,28, 32:29, 32:30, 32:31,32

ఆదికాండము 32:1 యాకోబు తన త్రోవను వెళ్లుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి.

ఈ వచనంలో యాకోబును దేవదూతలు ఎదుర్కొన్నట్టు మనం చూస్తాం. ఇది అతనిపై దేవుని కాపుదలను సూచిస్తుంది. ఈ కాపుదల గురించే "యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును" (కీర్తనల 34:7) అని రాయబడింది.‌

ఆదికాండము 32:2 యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను.

ఈ వచనంలో యాకోబు తనను ఎదుర్కొన్న దూతల సమూహానికి మహనయీము అని పేరు పెట్టడం మనం చూస్తాం. దానికి రెండు సేనలు లేక రెండు శిబిరాలు అని అర్థం. అంటే అతను తన సేన/శిబిరం తో దేవుని సేన/శిబిరం కూడా ఉందనే‌ భావంలో ఆ పేరు పెట్టాడు. అలానే అతనిక్కడ తనను ఎదుర్కొన్నవారిని దేవదూతలుగా గుర్తించాడు, కానీ బేతేలులోనూ లాబాను ఇంటిదగ్గర స్వప్నంలోనూ ప్రత్యక్షమైన దేవుని దూతను మాత్రం దేవునిగా గుర్తించాడు (ఆదికాండము 28:11-22, 31:11). అంటే పాతనిబంధన భక్తులకు దేవదూతలకూ దేవునిగా గుర్తించబడిన దేవునిదూత (యెహోవాదూత) కూ వ్యత్యాసం తెలుసని ఈ సందర్భం స్పష్టంగా రుజువు చేస్తుంది. ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే యెహోవా దూత కూడా సాధారణ దేవదూతే అయినప్పటికీ భక్తులు ఆయనను దేవునిగా అపార్థం చేసుకుని అలా సంబోధించారని కొందరు తప్పుడు బోధలను చేస్తున్నారు.

ఆదికాండము 32:3 యాకోబు ఎదోము దేశమున, అనగా శేయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి -

ఈ వచనంలో యాకోబు తన సహోదరుడైన ఏశావుకు తాను వస్తున్న సమాచారం తెలియచేస్తున్నట్టు మనం చూస్తాం. సిరియా నుండి కనానుకు వెళ్ళేమార్గంలో ఎదోము తారసపడదు, ఆ ప్రాంతం మృతసముద్రానికి దక్షిణంగా ఉంటుంది. అయినప్పటికీ యాకోబు అతనికి తన సమాచారం తెలియచేస్తున్నాడు. అంటే అతనితో సమాధానపడాలి అనుకుంటున్నాడు. ఎందుకంటే; గతంలో అతనిపట్ల మోసానికి పాల్పడ్డాడు కాబట్టి ఇప్పుడు దేవుని విశ్వాసిగా సమాధానపడే తీరాలి. అది ప్రతీవిశ్వాసిపై ఉండే నైతికబాధ్యత. అందుకే "కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీమీద నీ సహోదరునికి విరోధమేమైననుకలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చినయెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ యర్పణము విడిచిపెట్టి, మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధానపడుము; అటు తరువాత వచ్చి నీ యర్పణము నర్పింపుము" (మత్తయి 5:23,24) అని కచ్చితంగా రాయబడింది.

అదేవిధంగా మోషే ఈ సందర్భాన్ని రాసే సమయానికి ఏశావు నివసించిన శేయీరు దేశం అతని పేరుతోనే ఎదోముగా పిలవబడుతుంది. అందుకే అతను ఆ పేరును కూడా ప్రస్తావించాడు.

ఆదికాండము 32:4,5 మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లాబానునొద్ద నివసించియుంటిని. నాకు పశువులు గాడిదలు మందలు దాసదాసీజనమును కలరు. నీ కటాక్షము నాయందు కలుగునట్లుగా నా ప్రభువునకిది తెలియచేయనంపితినని నీ సేవకుడైన యాకోబు అనెనని చెప్పుడని వారికాజ్ఞాపించెను.

ఈ వచనాలలో యాకోబు తన దాసులకు తాను ఇంతకాలం ఎక్కడ నివసించాడో ప్రస్తుతం ఎలా ఉన్నాడో ఏశావుకు తెలియచెయ్యమని ఆజ్ఞాపిస్తూ అతన్ని నా ప్రభువు అని సంబోధించడం మనం చూస్తాం. ఇక్కడ వాగ్దానానికి వారసుడైన యాకోబు ఎన్నికలేని ఏశావు విషయంలో ఎంతగానో తగ్గించుకుంటున్నాడు. కారణం: ఆ ఏశావు ఇతని స్వంత సహోదరుడు. అందుకే ఆధ్యాత్మికంగా ఇతడు‌ ఘనుడైనప్పటికీ శారీరకబంధాన్ని బట్టి తగ్గించుకుంటున్నాడు.

గమనించండి; ఇప్పటికే యాకోబు చేసిన ద్రోహానికి దేవుడు అతడిని తీవ్రంగా క్రమశిక్షణ చేసినట్టు గడచిన అధ్యాయాల్లో చదివాము. అయినా సరే ఇక్కడ యాకోబు తాను ఎవరి పట్ల పొరపాటు చేసాడో వారి కటాక్షాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి విశ్వాసులుగా మనం ఎవరిపట్లైనా పొరపాటు చేసినప్పుడు దానివిషయమై దేవుడు క్షమించేస్తాడులే అనుకోకుండా మన బాధ్యతగా వారినే క్షమాపణ కోరుకోవాలి, వారితో సమాధానపడాలి.

ఆదికాండము 32:6 ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగివచ్చి మేము నీ సహోదరుడైన ఏశావునొద్దకు వెళ్లితిమి. అతడు నాలుగువందలమందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా-

ఈ వచనంలో యాకోబుకు ఏశావు నాలుగు వందల మందితో తనదగ్గరకు వస్తున్నాడని తెలియడం మనం చూస్తాం. ఏశావు ఇంతమందితో రావడాన్ని బట్టి అతనికి ఇంకా యాకోబుకు హానిచేసే ఉద్దేశం ఉందని కొందరు బైబిల్ పండితులు అభిప్రాయపడ్డారు. కానీ అతను యాకోబుతో వ్యవహరించిన తీరును బట్టి ఆ అభిప్రాయం సరికాకపోవచ్చు. బహుశా ఏశావు యాకోబును కలుసుకోవాలనే తాపత్రయంతోనే ఇంతవేగంగా వస్తూ తన అభివృద్ధిని కూడా అతనికి చూపించడానికే అంతమందితో వస్తున్నాడేమో.

ఆదికాండము 32:7 యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి-

ఈ వచనంలో యాకోబు ఏశావు నాలుగు వందలమందితో వస్తున్నాడనే సమాచారం తెలుసుకుని, తనకు హానిచేసే ఉద్దేశంతోనే అలా వస్తున్నాడని భయపడడం మనం చూస్తాం. దేవుడు ఎన్నోసార్లు తన కాపుదలను ప్రకటిస్తున్నప్పటికీ ప్రమాదం సంభవించబోతుందనే అనుమానం కలగగానే యాకోబు భయానికి గురౌతున్నాడు. ఇలాంటి భయం అబ్రాహాము, ఇస్సాకుల్లో కూడా కనిపిస్తుంది. ఇది మానవ బలహీనతను సూచిస్తుంది. కాబట్టి విశ్వాసులుగా మనం మానవ బలహీనతను బట్టి భయాలకు లోనైనప్పటికీ దిగులుపడి కృంగిపోకుండా వెంటనే దేవునిపై ఆధారపడాలి. యాకోబు ఆవిధంగానే దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థించినట్టు క్రింది వచనాల్లో గమనిస్తున్నాం.

ఆదికాండము 32:8 ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసినయెడల మిగిలిన గుంపు తప్పించుకొనిపోవుననుకొని, తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభాగించెను.

ఈ వచనంలో యాకోబు ప్రమాదం సంభవించబోతుందనే అనుమానం‌ కలగగానే వివేకంగా తనదగ్గరున్న దానిని రెండు గుంపులుగా చెయ్యడం మనం చూస్తాం. కాబట్టి మనకు ఏదైనా ప్రమాదం జరుగుతుందని అనిపించినప్పుడు దేవుడే కాపాడతాడులే అనుకోకుండా మన బాధ్యతగా వివేకంగా ప్రవర్తించాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి మనపై దాడికి పాల్పడబోతున్నప్పుడు దేవుడే కాపాడతాడులే అని ఎదురువెళ్ళకూడదు, అక్కడినుండి పారిపోవాలి. ఈవిషయంలో మన ప్రభువే మనకు మాదిరిని చూపించాడు (మత్తయి 2:13, యోహాను 12:37).

ఆదికాండము 32:9 అప్పుడు యాకోబు నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువులయొద్దకు తిరిగి వెళ్లుము, నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యెహోవా-

ఈ వచనంలో యాకోబు దేవునికి ప్రార్థించడం మనం చూస్తాం. మొదట అతను తన వివేకంతో చెయ్యవలసింది చేసాడు. అంతటితో ఆగిపోకుండా దేవునిపై ఆధారపడుతున్నాడు. కాబట్టి మనకేదైనా అపాయం సంభవించబోతున్నప్పుడు దానిని తప్పించుకోడానికి మొదటిగా మన ప్రయత్నం చెయ్యాలి. అలాగని అంతటితో ఆగిపోకుండా దేవుణ్ణి ఆశ్రయించాలి.

అదేవిధంగా యాకోబు తన ప్రార్థనలో అబ్రాహాము ఇస్సాకుల పేర్లను ప్రస్తావించడం ద్వారా వారితో దేవుడు చేసిన నిబంధన జ్ఞాపకం‌ చేసుకుంటున్నాడు. ప్రాముఖ్యంగా అతను నేను నీ మాట ప్రకారంగానే కనానుకు పయనమయ్యానని వేడుకుంటున్నాడు. ఇక్కడ యాకోబు ఆ దేవుని మాటను బట్టే వెనక్కు పారిపోకుండా ముందుకే వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే అతను ప్రమాదం సంభవిస్తుందని ఊహించినా దేవుడు చెప్పినదానిని (నీ తండ్రి ఇంటికి వెళ్ళు) నెరవేర్చడానికి సిద్ధపడుతున్నాడు. అందుకే మొదట భయపడినప్పటికీ తర్వాత దేవుణ్ణి ఆశ్రయించి కాపాడమని వేడుకుంటున్నాడు. మనం కూడా ఇలానే దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటుంటే ఇబ్బందికరమైన పరిస్థితులు సంభవించినప్పటికీ ధైర్యంగా ఆయన్ని ఆశ్రయించగలం. ఆయన ఆజ్ఞలను ధిక్కరించి జీవిస్తున్నవారిలో అలాంటి ధైర్యం ఉండదు.

ఆదికాండము 32:10-12 నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కఱ్ఱతో మాత్రమే యీ యొర్దాను దాటితిని. ఇప్పుడు నేను రెండు గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతినుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని, నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు, విస్తారమగుటవలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను.

ఈ వచనాలలో యాకోబు దేవుణ్ణి తననూ తన కుటుంబాన్నీ ఏశావు చేతినుండి కాపాడమని వేడుకుంటూ మరిముఖ్యంగా ఆయన ఇప్పటివరకూ చేసిన ఉపకారాలకు తాను అపాత్రుడనని ఒప్పుకోవడం మనం చూస్తాం. నిజమే పరిశుద్ధుడైన దేవుని మేలు పొందుకోవడానికి పతనస్వభావియైన ఏ మనిషికీ అర్హత లేదు. ఎందుకంటే ఏ మనిషి ప్రవర్తనా ఆయన నీతిని సంతృప్తిపరచలేదు. ఉదాహరణకు ఏ మనిషైనా ఒక్కరోజైనా ఆయన నీతిన్యాయాలకు, పరిశుద్ధత, క్షమాగుణానికి తగినట్టు జీవించగలడా?. క్రియల్లోనూ ఆలోచనల్లోనూ మాటల్లోనూ ఎన్నోవిధాలుగా మనం తప్పిపోతుంటాం. కొన్నిసార్లు ప్రాధమిక ఆజ్ఞల విషయంలో కూడా. అయినప్పటికీ ఆయన కేవలం తన కృపను బట్టే అందరికీ మేలు చేస్తున్నాడు. గమనించండి; లోపాలు ఉన్నప్పటికీ ఆయన మార్గంలో నడిచిన యాకోబు వంటివారే ఆ విషయం మనస్పూర్తిగా ఒప్పుకున్నారంటే మనం మరెంతగా ఒప్పుకోవాలి? ఆయన చేసే మేలులకు మనం అపాత్రులం అని గుర్తెరిగి మరెంతగా ఆయనకు విధేయత చూపించాలి? కానీ మనలో చాలామందిమి మనం ఆశించిన మేలు జరగకపోయేసరికి ఆయనపై ఆరోపణలకు సిద్ధపడుతుంటాం. ప్రశ్నిస్తుంటాం. ఇది యాకోబు వంటి విశ్వాసుల లక్షణం కాదు.

ఆదికాండము 32:13-16 అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించినదానిలో తన అన్నయైన ఏశావు కొరకు ఒక కానుకను అనగా రెండువందల మేకలను ఇరువది మేకపోతులను రెండువందల గొఱ్ఱెలను ఇరువది పొట్టేళ్లను ముప్పది పాడి ఒంటెలను వాటి పిల్లలను నలుబది ఆవులను పది ఆబోతులను ఇరువది ఆడుగాడిదలను పది గాడిద పిల్లలను తీసికొని మందమందను వేరు వేరుగా తన దాసుల చేతికప్పగించి మీరు మంద మందకు నడుమ ఎడముంచి నాకంటె ముందుగా సాగిపొండని తన దాసులతో చెప్పెను.

ఈ వచనాలలో యాకోబు దేవునికి ప్రార్థించిన తర్వాత తన అన్నకోసం ఒక కానుకను పంపించడం మనం చూస్తాం. ఇక్కడ కూడా యాకోబు ప్రార్థన చేసి సరిపెట్టుకోకుండా తన ప్రయత్నం తాను చేస్తూ జ్ఞానయుక్తంగా నడుచుకుంటాడు. కాబట్టి మనం కూడా ఇబ్బందికర పరిస్థితి తలెత్తినప్పుడు ప్రార్థన చేసి ఆగిపోకుండా ఆ పరిస్థితిని దాటేందుకు మనవంతు ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే అలా చేసే జ్ఞానం కూడా దేవుడే అనుగ్రహించాడు. కష్టకాలంలో దేవునిపై ఆధారపడకుండా సొంత ప్రయత్నాలు చేస్తే తప్పు కానీ దేవునిపై ఆధారపడుతూ ప్రయత్నించడం సరైనదే. భక్తులందరూ అదే చేసారు‌.

అదేవిధంగా యాకోబు తన అన్నకు పంపిన కానుక చాలా విలువైనదిగా మనకు కనిపిస్తుంది. కానుకగానే అంత పంపిస్తున్నాడంటే అతని దగ్గర ఇంకా ఎంత ఉంటుందో కదా! దీనిని బట్టి దేవుడు అతన్ని ఎంతగా దీవించాడో మనం గ్రహించవచ్చు. అతను ఇంత విలువైన కానుక పంపడంలో గుర్తించవలసిన మరో కోణం ఏంటంటే; ఏశావు వచ్చి తనకున్న సమస్తాన్నీ నాశనం చేస్తాడని ఆలోచించిన అతను తనకున్న దానినుండి విలువైన కానుకను అతనికి పంపించి తనకున్న కొంచెం కోల్పోడానికి సిద్ధపడ్డాడు. అతను అలా కొంచెం కూడా కోల్పోడానికి ఇష్టపడకుండా వాటిపై ఆశతో ఉంటే అతను వచ్చి మిగిలినదానిని కూడా నాశనం చేసే అవకాశం ఉంది‌. చాలామంది తమకున్న అత్యాశతో ఉన్న మొత్తాన్నీ కోల్పోతుంటారు. దీనిని బట్టి, మనం జ్ఞానయుక్తంగా నడుచుకుంటూ కొన్నిసార్లు అవసరమైన చోట మన సొమ్మును ఖర్చు చెయ్యగలగాలి.

ఆదికాండము 32:17-21 మరియు వారిలో మొదటివానితోనా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొనినీవెవరివాడవు? ఎక్కడికి వెళ్లుచున్నావు? నీ ముందరనున్నవి యెవరివని నిన్ను అడిగినయెడల నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావు కొరకు పంపబడిన కానుక. అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను. అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుకవలన అతని సమాధానపరచిన తరువాత నేను అతని ముఖము చూచెదను. అప్పుడతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలెననియు మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలెననియు రెండవవానికిని మూడవవానికిని మందల వెంబడి వెళ్లినవారికందరికిని ఆజ్ఞాపించెను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను.

ఈ వచనాలలో యాకోబు ఏశావుకు కానుకగా వేరు చేసిన గుంపును మొదట పంపిస్తూ ఆ దాసులు అతన్ని ఎదుర్కొని ఎలా మాట్లాడాలో వివరించడం మనం చూస్తాం. ఇలా యాకోబు ఏవిధంగానైనా తన అన్నతో సమాధానపడాలి అనుకుంటున్నాడే తప్ప ప్రతిఘటించాలి అనుకోవడం లేదు. అనుకుంటే యాకోబు అలా చెయ్యగలడు కూడా. దీనికి కారణం ఇప్పటికే నేను వివరించినట్టుగా ఏశావు కోపంలో న్యాయం ఉందని అతను గ్రహించాడు. కాబట్టి మనం చేసిన అపరాధం వల్ల మన బంధువులకు కానీ పొరుగువారికి కానీ మనపై కోపం చెలరేగినప్పుడు వారితో సమాధానపడడానికి ప్రయత్నించాలి తప్ప మనకున్న బలంతో పోరుకు దిగకూడదు.

ఆదికాండము 32:22,23 ఆ రాత్రి అతడు లేచి తన యిద్దరు భార్యలను తన యిద్దరు దాసీలను తన పదకొండుమంది పిల్లలను తీసికొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసికొని ఆ యేరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను.

ఈ వచనాలలో యాకోబు తన కుటుంబంతో సహా యబ్బోకు రేవుదాటి వారిని పంపించి క్రింది వచనాల ప్రకారం ఒక్కడే మిగిలిపోయినట్టు మనం చూస్తాం. యబ్బోకు అనేది మృత సముద్రానికి 30 కిలోమీటర్లు ఉత్తరాన యొర్దాను నదిలోకి తూర్పునుంచి ప్రవహిస్తున్న వాగు.

ఆదికాండము 32:24,25 యాకోబు ఒక్కడు మిగిలిపోయెను‌. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుటవలన యాకోబు తొడ గూడువసిలెను.

ఈ వచనాలలో యాకోబు ఒక్కడే మిగిలిపోయినట్టు ఒక నరుడు యాకోబుతో పెనుగులాటకు దిగినట్టు, ఆ పోరాటంలో యాకోబు విజయం సాధిస్తున్నట్టు మనం చూస్తాం. బహుశా ఏశావు కోపం తనపైనే కాబట్టి అతను తన కుటుంబాన్ని ముందుగా పంపివేసి అతను అక్కడే నిలిచిపోయి ఉండవచ్చు. ఇక అతనితో పోరాడిన వ్యక్తి గురించి నరుడు అని రాయబడినప్పటికీ అతను నరుడు కాదు దేవుడు. ఆ విషయం క్రింద వచనాల్లో యాకోబు మాటల్లోనే స్పష్టంగా గ్రహిస్తాం. అబ్రాహాము ఇంటికి ఆయన నరుడిగా వచ్చినట్టే (18వ అధ్యాయం) ఇక్కడ యాకోబు దగ్గరకు కూడా ఆయన నరుడిగా వచ్చాడు. ఎందుకంటే ఆయన ఆత్మ అయినప్పటికీ అనుకున్న శరీరం ధరించగలడు. అందుకే ఇక్కడ లేఖనం ఆయన ప్రత్యక్షమైన విధానాన్ని బట్టి ఆయనను నరుడని ప్రస్తావించింది. ఈ సందర్భం గురించే "తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాటలాడెను. యెహోవా అని, సైన్యములకధిపతియగు యెహోవా అని, ఆయనకు జ్ఞాపకార్థనామము" (హొషేయ 12:3-5) అని రాయబడింది. దీనిప్రకారం యాకోబుతో పెనుగులాడిన నరుడు పాతనిబంధనలో యెహోవా దూతగా ప్రత్యక్షమౌతున్న యెహోవా దేవుడే (యెహోవాలో రెండవ వ్యక్తి). ఈయనే అతనికి బేతేలులోనూ లాబాను ఇంటిదగ్గరా దేవుని దూతగా ప్రత్యక్షమయ్యాడు. అందుకే లేఖనం ఇక్కడ ఆయనను దూతయని కూడా పేర్కొంటుంది. ఈయన గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

యెహోవా దూత, యేసుక్రీస్తు

అదేవిధంగా కొందరు యాకోబు ఆయనతో పోరాడిన ఈ సందర్భాన్ని చూపిస్తూ యాకోబు దేవుణ్ణే ఓడించేసాడని చెబుతుంటారు. కానీ సృష్టిలో ఏదీ/ఎవరూ కూడా ఆయనతో పోరాడి విజయం పొందలేదు. ఆయన సాతానునే నోటి ఊపిరితో (అంతసులభంగా) నాశనం చెయ్యగలడు (2 థెస్సలొనిక 2:8). అంత శక్తిమంతుడైనవాడు యాకోబును అంతసేపు ఎందుకు గెలవనిచ్చాడంటే ఆయన అలా చెయ్యడం ద్వారా యాకోబుకు తన శారీరక బలాన్ని గుర్తు చేస్తున్నాడు (లేకం బలం ప్రసాదిస్తున్నాడు). ఎందుకంటే ఆ సమయానికి అతను ఏశావు భయంతో ఉన్నాడు కాబట్టి, ఒకవేళ ఏశావు తనతో పోరుకు సిద్ధపడినప్పటికీ నువ్వు అతడిని ఓడించగలవని చెప్పేందుకే ఇదంతా చేస్తున్నాడు. ఇక్కడ దేవుని కృప యాకోబుపై ఎంత ఉన్నతంగా ఉందో ఆయన తగ్గింపును బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.

ఆదికాండము 32:26 ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యననెను.

ఈ వచనంలో యాకోబుతో పోరాడుతున్న ఆ నరుడు నన్ను వెళ్ళనిమ్మని అడగడం యాకోబు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ వెళ్ళనివ్వననడం మనం చూస్తాం. ఆయన ఒక్క దెబ్బతో ఎప్పుడైతే ఇతన్ని కుంటివాడిని చేసాడో ఆయన సాధారణ నరుడు కాదని యాకోబు గ్రహించాడు. అందుకే ఇలా పట్టుబడుతున్నాడు‌. ఆయన కూడా తాను వెళ్ళడానికి యాకోబు అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు‌. అయితే యాకోబులో ఉన్న పట్టుదలను తెలియచెయ్యడానికే అలా మాట్లాడుతున్నాడు.

ఆదికాండము 32:27,28 ఆయన నీ పేరేమని యడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను.

ఈ వచనంలో ఆయన యాకోబును నీపేరు ఏంటని అడిగి ఆ పేరును అతని నోటి వెంటే చెప్పించడం మనం చూస్తాం. యాకోబు అనే పేరుకు మోసగాడు అని అర్థం, ఇక్కడ ఆయన యాకోబు ఎలాంటివాడో అతని నోటి వెంటే ఒప్పింపచేస్తూ తర్వాత అతని పేరును ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలు అనే పేరుకు ఇక్కడ లేఖనం ఇచ్చే నిర్వచనం ప్రకారం దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడినవాడు. ఈరోజు సంఘంలోని విశ్వాసులంతా యాకోబులే (పాపులే) కానీ వారు ఆ సంగతిని దేవుని చేత ఒప్పించబడి నూతన పేరును పొందుకున్నారు (నూతన సృష్టి).

ఆదికాండము 32:29 అప్పుడు యాకోబునీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన నీవు ఎందునిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనినాశీర్వదించెను.

ఇక్కడ యాకోబు తిరిగి ఆ నరుడిని నీపేరు ఏంటని ప్రశ్నించడం మనం చూస్తాం. ఆయన సాధారణ నరుడు కాదని ఇతనికి అర్థమైనప్పటికీ ఆయన దేవుడే అనే స్పష్టత అతనికి ఇంకా రాలేదు. అందుకే అలా అడుగుతున్నాడు. ఆ స్పష్టత అతనికి క్రిందివచనంలో వచ్చింది.

ఆదికాండము 32:30 యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను.

ఈ వచనంలో యాకోబు తనతో పెనుగులాడి తనను ఆశీర్వదించిన వ్యక్తి దేవుడని గ్రహించడం మనం చూస్తాం. అందుకే ఆ చోటికి పెనూయేలు అనే పేరు పెడుతున్నాడు. దానికి దేవుని ముఖం అని అర్థం.

ఆదికాండము 32:31,32 అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడతడు తొడకుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటిమీది తుంటినరము కొట్టినందున నేటివరకు ఇశ్రాయేలీయులు తొడ గూటిమీదనున్న తుంటినరము తినరు.

ఈ వచనాలలో నరుడిగా వచ్చిన ఆయన కొట్టిన దెబ్బవల్ల యాకోబు కుంటుతూ నడవడం మనం చూస్తాం. ఈ సంఘటన రాస్తున్న మోషేకాలం వరకూ ఇశ్రాయేలీయులు దానిని జ్ఞాపకం చేసుకుంటూ జంతువులను తినేటప్పుడు వాటి తొడగూటి మీది నరం తినేవారు కాదు. వారు ఆ భాగాన్ని విడిచిపెట్టడం ద్వారా తమ పిల్లలకు ఆ చరిత్రను తెలియచేసి తరతరాలు దానిని మరచిపోకుండా జ్ఞాపకం చేస్తూవచ్చారు. సాధారణ ప్రజలకు రాతలు అంతగా వాడుకగా లేని సమయంలో వారు ఇలాంటివి చెయ్యడం ద్వారా తమ చరిత్రను ముందు‌తరాల వారికి చేరవేసేవారు.

అదేవిధంగా కొందరు ఆయన యాకోబును తొడమీద కొట్టిన సందర్భాన్ని అపార్థం చేసుకుంటూ అది Euphemism లో భాగంగా రాయబడిందని భావిస్తారు.‌ Euphemism అంటే కొన్ని ఇబ్బందికరమైన పదాలను వాడే సమయంలో ఆ పదాలకు బదులు ‌వేరే పదాలను ఉపయోగించడం. ఉదాహరణకు అబ్రాహాము ఎలీయెజెరును ప్రమాణం చెయ్యమన్నప్పుడూ యాకోబు తన కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నప్పుడూ వారి చేతిని తమ తొడక్రింద పెట్టమనడం మనం గమనిస్తాం. కానీ వారు ఆ ప్రమాణాన్ని మర్మాంగం క్రింద చేయి పెట్టి చేస్తారని ప్రాచీన సాంప్రదాయాలను అధ్యయనం చేసినవారు వెల్లడిస్తున్నారు. అయితే గ్రంథకర్తలు ఆ పదానికి‌ బదులు Euphemism అనే పద్ధతిని అనుసరిస్తూ తొడ అనే భాగాన్ని ప్రస్తావించారు (ఆదికాండము 24:9 వ్యాఖ్యానం చూడండి).

దీని ఆధారంగానే తొడ అని ఉన్న ప్రతీచోటా మర్మాంగం అని అర్థం చేసుకుంటూ యాకోబును ఆయన తొడపై కాకుండా ఆ చోటనే కొట్టాడని భావిస్తుంటారు. అయితే ఈ వివరణతో ఆ సందర్భం ఏమాత్రం ఏకీభవించడం లేదు ఎందుకంటే;
1. అక్కడ దేవుడు యాకోబును తొడగూటి "తుంటినరంపై" కొట్టాడని స్పష్టంగా రాయబడింది, అందుకే ప్రజలు దానికి జ్ఞాపకార్థంగా ఆ నరాన్ని తినడం లేదు.

2. యాకోబు అలా కొట్టబడినందువల్ల "తొడకుంటుచూ‌" నడిచాడని కూడా రాయబడింది. దీనిప్రకారం ఇక్కడ గ్రంథకర్తలు Euphemism పద్ధతిని అనుసరిస్తూ ఏమీ రాయలేదు, అక్కడ జరిగినదానినే ఖచ్చితంగా రాసారు

Add comment

Security code
Refresh

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.