పాత నిబంధన
రచయిత: కె విద్యా సాగర్

 ఆదికాండము 35:1

దేవుడు యాకోబుతోనీవు లేచి బేతేలునకు వెళ్లి అక్కడ నివసించి, నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా-

ఆదికాండము 28:22వ వచనంలో యాకోబు తన తండ్రిమాట ప్రకారం పద్దనరాముకు బయల్దేరినప్పుడు బేతేలులో అతనికి స్వప్నంలో దేవుడు ప్రత్యక్షమైనట్టు, అప్పుడు యాకోబు నీవు నన్ను క్షేమంగా ఈ దేశానికి తీసుకువస్తే ఇక్కడ బలిపీఠం కడతానని మొక్కుబడి చేసుకున్నట్టు మనకు కనిపిస్తుంది.

దేవుడు అక్కడ యాకోబుతో చెప్పినట్టుగానే అతనిని ఆశీర్వదించి, ఆ దేశానికి మరలా రప్పించినప్పటికీ యాకోబు వెంటనే తన మొక్కుబడిని చెల్లించకుండా దాని విషయంలో అశ్రద్ధ చూపించాడు/మరచిపోయాడు.

ప్రసంగి 5:4 నీవు దేవునికి మ్రొక్కుబడి చేసికొనినయెడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము.

వాస్తవానికి ఈ కారణం చేత‌ దేవుడు యాకోబును శిక్షించాలి కానీ ఆయన కృప కలిగినవాడు కాబట్టి అతను మరచిపోయిన ఆ పనిని వెంటనే చెయ్యమని  జ్ఞాపకం చేస్తున్నాడు.

నేటి విశ్వాసులు కూడా చాలాసార్లు యాకోబులా దేవునిపట్ల చేయవలసినవి చెయ్యకుండా మరచిపోతుంటారు లేదా వాటి విషయంలో అశ్రద్ధ వహిస్తుంటారు. ఆ విషయంలో మనం జాగ్రతగా ఉండాలి. ఎందుకంటే దేవుడు కృప కలిగినవాడు మాత్రమే కాదు న్యాయవంతుడు కూడా.

అదేవిధంగా ఆయన యాకోబుకు బేతేలుకు వెళ్ళి బలిపీఠం కట్టమని ఇదే సమయంలో జ్ఞాపకం చెయ్యడానికి మరో కారణం కూడా ఉంది.  అదేంటంటే, గత అధ్యాయంలో యాకోబు కుమారులు తమ చెల్లెలి విషయంలో షెకెము చేసినదానిని బట్టి ఆ ఊరి పురుషులందరినీ కౄరంగా చంపి వారి సమస్తాన్నీ దోచుకున్నారు. దీనిని బట్టి అ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తనపై దాడిచేసి తన కుటుంబం మొత్తాన్నీ నాశనం చేస్తారనే ఆందోళనతో యాకోబు అక్కడ నివసిస్తున్నాడు. కానీ ఇప్పుడు దేవుడు నువ్వు ఈ చోటి నుండి బేతేలుకు వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టమని ఆజ్ఞాపించడం ద్వారా యాకోబు తానున్న చోటి నుండి క్షేమంగా తప్పించుకోగలననే ధైర్యంతో‌ ముందుకు సాగుతాడు.

ఆదికాండము 35:2

యాకోబు తన యింటివారితోను తనయొద్దనున్న వారందరితోను మీయొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి.

ఈ సందర్భంలో యాకోబు దేవుడు తనకు ఆజ్ఞాపించినదాని ప్రకారం బేతేలుకు వెళ్ళడానికి సిద్ధపడుతూ,‌ తనతో ఉన్న అందరూ అందుకు సిద్ధపడేలా చేస్తున్నాడు. వారందరికీ యజమానుడిగా ఇది అతని బాధ్యత. గతంలో అబ్రాహాము కూడా, ఇదేవిధంగా తనతో ఉన్నవారంతా దేవునికి విధేయత చూపేలా వారిని ప్రేరేపించడం మనకు కనిపిస్తుంది.

ఆదికాండము 18:19 ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలును తన యింటి వారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించినట్లు నేనతని నెరిగియున్నాననెను.

కాబట్టి కుటుంబ యజమానుడిగా కానీ, సంఘపెద్దగా కానీ ఉన్న ప్రతీ ఒక్కరూ తమతో ఉన్నవారు దేవునికి విధేయత చూపేలా, అబ్రాహాములా, యాకోబులా వారిని సిద్ధం చెయ్యాలి.

ఆ క్రమంలో యాకోబు మొదటిగా తనతో ఉన్నవారికి వారి దగ్గర ఉన్న అన్యవిగ్రహాలను తీసివేయమని చెబుతున్నాడు. అతను జీవము గల దేవుణ్ణే సేవిస్తున్నప్పటికీ తనతోపాటుగా కొందరు అన్యులకు చెందిన దాసదాసీలు ఉన్నారు కాబట్టి  వారి దగ్గర అన్యవిగ్రహాలు ఉండడం సహజం. పైగా అతని కుమారులు గత‌ంలో ఒక ఊరిని నాశనం చేసి వారి సొత్తును దోచుకున్నపుడు అందులో భాగంగా వారు పూజించే విగ్రహాలు కూడా ఉంటాయి.

విగ్రహాలు అనేవి దేవుని దృష్టికి హేయమైనవి కాబట్టి వారు వాటితో కలసి దేవుని సన్నిధికి వెళ్ళడం సరికాదని గుర్తించిన యాకోబు వాటిని వారి దగ్గర నుండి తీసివేయాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఈరోజు ఎంతోమంది దేవునికి హేయమైన విగ్రహాలను మనసులో ఉంచుకుని దేవునిని చేరుకోవాలి అనుకుంటున్నారు, అది ఏమాత్రమూ సాధ్యం కాదు. దేవునికంటే ఎక్కువగా దేనిని ప్రేమించినా, దైవవిరుద్ధమైన కార్యాలు వేటికి మన మనసులో చోటు కల్పించినా అవి  విగ్రహాల పరిధిలోకే వస్తాయి.

2కోరింథీయులకు 6:16 దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవముగల దేవుని ఆలయమైయున్నాము.

ఇక రెండవదిగా యాకోబు తనతో ఉన్నవారి వస్త్రాలను మార్చుకుని శారీరక శుభ్రత పాటించమని చెబుతున్నాడు. మనం మోషే ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు కూడా వారు  దేవుని సన్నిధికి ప్రవేశించేటప్పుడు శారీరక శుభ్రతను పాటించాలని రాయబడడం మనకు కనిపిస్తుంది. ఈ శారీరక శుభ్రత నూతననిబంధన విశ్వాసుల ఆత్మీయ శుభ్రతకు ఛాయగా ఉంది.

హెబ్రీయులకు 10:22 మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునైయుండి, విశ్వాసవిషయములో(లేక, విశ్వాసముయొక్క) సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.

అలా అని కొందరు బోధిస్తున్నట్టుగా, మనం  దేవుడు హృదయాన్నే చూస్తాడు శరీరాన్ని కాదు అంటూ ఆరాధనకు హాజరయ్యేటపుడూ, వాక్యధ్యానంలో, ప్రార్థనలోనూ గడిపేటప్పుడు శారీరక శుభ్రతను విస్మరించకూడదు. ఎందుకంటే మన శారీరక శుభ్రతపైనే కొన్నిసార్లు మన ఏకాగ్రత కూడ ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మన హృదయమే కాదు, మన శరీరం కూడా దేవునిదే.

ఆదికాండము 35:3

మనము లేచి బేతేలునకు వెళ్లుదము; నా శ్రమదినమున నాకుత్తరమిచ్చి నేను వెళ్లిన మార్గమున నాకు తోడైయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పెను.

ఈ సందర్భంలో యాకోబు తనతో ఉన్నవారికి మనం‌ బేతేలుకు వెళ్ళి దేవునికి బలిపీఠం కడదామని మాత్రమే కాకుండా ఆయనకు బలిపీఠం ఎందుకు కట్టబోతున్నాడో కారణం కూడా వివరిస్తున్నాడు. కాబట్టి మనతో ఉన్నవారికి మనం ప్రకటించే భక్తిని ఒక ఆచారంలానే కాకుండా దానివెనుకున్న కారణాలను (ఆయన చేసిన మేలులను) కూడా తెలియచెయ్యాలి.
లేదంటే వారిమనసుల్లో అది ఒక మూఢభక్తిగా మిగిలిపోతుంది.

ఆదికాండము 35:4 

వారు తమయొద్దనున్న అన్యదేవతలన్నిటిని తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను.

ఈ సందర్భంలో వారు యాకోబు చెప్పిన మాట ప్రకారం తమ దగ్గర ఉన్న అన్యదేవతలనూ చెవుపోగులనూ తీసివేసి అతనికి అప్పగించారు. కొన్నిసార్లు మనం దేవుని గురించి మన కుటుంబానికి కానీ, ఇతరులకు కానీ చెప్పేటప్పుడు వారు వింటారా లేదా అనే సంశయంలో ఉండి కొన్ని విషయాలు చెప్పడానికి ఆలోచిస్తుంటాం. కానీ ఎవరైనా సరైనవిధంగా చెబితే తమ బ్రతుకును దేవునికి అనుకూలంగా మార్చుకునే మనసుతో చాలామంది ఉంటారు. కాబట్టి మనం దేవుని గురించి ఎవరికైనా చెప్పడానికి తడవు చెయ్యకూడదు.

అదేవిధంగా ఈ సందర్భంలో యాకోబు తమదగ్గర ఉన్న అన్యదేవతలను తీసివేయమన్నపుడు వారు తమ చెవులకున్న పోగులను కూడా తీసి అతనికి అప్పగించినట్టు రాయబడింది. దీని ఆధారంగా క్రైస్తవ స్త్రీలు చెవిపోగులు పెట్టుకోకూడదని కూడా కొందరు బోధిస్తుంటారు. ప్రస్తుతం దాని గురించి మేమిక్కడ ఒక స్పష్టతను ఇవ్వదలచుకోలేదు కానీ, వారు చెవిపోగులు పెట్టుకోకూడదనడానికి ఆధారంగా చూపిస్తున్న ఈ వచనంలో మాత్రం ఆ భావం లేదు.

ఎందుకంటే, కొంతమంది బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం వారి చెవులకున్న పోగులు సాధారణమైనవి కావు కానీ, అవి రక్షరేకుల్లా పెద్దగా ఉండి, వాటిపైన అన్యదేవతల పేరిట శుభవచనాలు, వాటి రూపాలు చెక్కబడి ఉంటాయి. అందుకే అవి కూడా విగ్రహసంబంధమైనవిగా వారు భావించి అతనికి అప్పగించారు.  కానీ ఈ అభిప్రాయానికి తగినన్ని ఆధారాలు వారు చూపించలేకపోయారు.

అయితే, మరికొందరు బోధకుల వివరణ ప్రకారం ఆ చెవిపోగులు వారి చెవులకున్నవి కావు కానీ ఆ విగ్రహాలకు ఉన్నవే. ఆ వాక్యభాగ‌ంలో వారి చెవులకున్న అని రాయబడినచోట హీబ్రూ భాషలో వాడిన be-aaz-ne-hem అనే పదానికి వాటియొక్క అనే అర్థం కూడా వస్తుంది. ఆ ప్రజలు తమ విగ్రహాలకు బంగారం, వెండితో చేయబడ్డ ఆభరణాలతో అలంకరించేవారు. అందులో భాగంగా వాటి చెవులకు రంధ్రాలు చేసి వాటికి బంగారు/వెండి పోగులను పెట్టేవారు.
ఈ వచనం చూడండి.

ద్వితీయోపదేశకాండము 7:25 వారి దేవతల ప్రతిమలను మీరు అగ్నిచేత కాల్చివేయవలెను; వాటి మీదనున్న వెండిబంగారములను అపేక్షింపకూడదు. నీవు దానివలన చిక్కుబడుదువేమో గనుక దానిని తీసికొనకూడదు. ఏలయనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము.

దీనిప్రకారం, యాకోబు మీదగ్గరున్న అన్యదేవతలను తీసివేయమని‌ తనతో ఉన్నవారికి ఆజ్ఞాపించినప్పుడు వారు కేవలం ఆ విగ్రహాలను మాత్రమే అతనికి అప్పగించి వాటియొక్క చెవులకున్న బంగారు/వెండి  పోగులను దాచుకోకుండా, అవి కూడా హేయమైనవిగా భావించి అతనికి అప్పగించారు.

తరువాత యాకోబు వాటిని మస్తకివృక్షం క్రింద దాచిపెట్టడం ద్వారా,  హేయమైన ఆ విగ్రహాలు మరెవ్వరికీ ఉపయోగపడకుండా చేసే ప్రయత్నం చేసాడు. ఎందుకంటే దైవవిరుద్ధమైనవాటిని మనం విడిచిపెట్టేటపుడు వాటిద్వారా మరొకరు చిక్కుబడకుండా చెయ్యడం కూడా మన బాధ్యతే.

ఉదాహరణకు ఈ సందర్భాలు చూడండి.

2రాజులు 10: 26 ​బయలు గుడిలోని నిలువు విగ్రహములను బయటికి తీసికొని వచ్చి వాటిని కాల్చివేసిరి.

అపో.కార్యములు 19:19 మరియు మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల యేబదివేల వెండి రూకలాయెను.

ఆదికాండము 35:5

వారు ప్రయాణమై పోయినప్పుడు, దేవునిభయము వారి చుట్టున్న పట్టణముల మీదనుండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు.

ఈ సందర్భంలో యాకోబు కుమారులైన లేవీ షిమ్యోనులు గతంలో జరిపిన‌ నరహత్యలను బట్టి యాకోబు బయపడినట్టుగా ఆ చుట్టుపక్కల ప్రజలు వారిని నాశనం చేసే ప్రయత్నం చెయ్యకుండా దేవుడు ఆ ప్రజలకు భయం కలుగచేసాడు.

వాస్తవానికి యాకోబు కుమారులు చేసిన ఆ అరాచకానికి వారు ఆ పట్టణస్తుల చేతిలో చంపబడడం సబబే. కానీ దేవుడు అబ్రాహాముతో, యాకోబుతో చేసిన నిబంధనను బట్టి వీరు ఎటువంటి హేయకార్యాలు చేసినా సహిస్తూ తన వాగ్దానం ప్రకారం వారిని కాపాడి విస్తరింపచేసాడు. వీరినే కాదు వీరి సంతానమైన ఇశ్రాయేలీయుల ప్రజలను కూడా ఆయన పూర్తిగా నాశనం చెయ్యకుండా సహించింది తన వాగ్దానం నిమిత్తమే.

మలాకీ 3:6 యెహోవానైన నేను మార్పులేనివాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు.

అలా అని దేవుడు అన్యాయాన్ని సహిస్తాడా అంటే అలా ఎప్పటికీ జరగదు, ఆయన తన వాగ్దానం నిమిత్తం వారిని పూర్తిగా నాశనం చేయనప్పటికీ దాని ఫలితం మాత్రం వేరేవిధంగా వారు అనుభవించక తప్పదు (పశ్చాత్తాపపడకపోతే). తమ జీవితంలో చేసిన హేయక్రియలకు దేవుని చేత ఈ లోకంలో శిక్షించబడని ఎవరైనా దానినుండి తప్పించుకున్నట్టు కాదు, తీర్పు దినాన ఆయన అందరికీ వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు.

ఆదికాండము 35:6,7

యాకోబును అతనితో నున్న జనులందరును కనానులో లూజుకు, అనగా బేతేలునకు వచ్చిరి. అతడు తన సహోదరుని యెదుట నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్షమాయెను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్‌ బేతేలను పేరు పెట్టిరి.

ఈ సందర్భంలో, యాకోబు దేవుడు అతనికి మొదటిగా ప్రత్యక్షమైన బేతేలుకు వచ్చి తన మొక్కుబడి ప్రకారం అక్కడ బలిపీఠం కట్టడం మనకు కనిపిస్తుంది. యాకోబు తనకు దేవుడు మొదటిసారి ఇదే ప్రాంతంలో తన దూతలతో కలసి ప్రత్యక్షమయ్యాడు కాబట్టి అప్పుడు దానికి దేవుని ఇళ్ళు అని అర్థం వచ్చేలా బేతేలు అని పేరుపెట్టాడు (ఆదికాండము 28:12-19).

ఇప్పుడు యాకోబు అదే ప్రాంతంలో తన మొక్కుబడి ప్రకారం ఆ దేవునికి బలిపీఠం కట్టాడు కాబట్టి ఆయన ఈ ప్రాంతంలో ఉన్న దేవుడని భావం వచ్చేలా, తనతో ఉన్నవారితో కలసి మరలా ఏల్ బేతేలు అని పేరు పెడుతున్నాడు‌ దానికి బేతేలు యొక్క/అక్కడ ఉన్న దేవుడని అర్థం.

యాకోబు ఈచోటికి బేతేలు అని పేరు మార్చినప్పటికీ  ఆ చుట్టుపక్కల ప్రజలు దీని స్వంత పేరైన లూజుతోనే దీనిని పిలిచారు. ఇశ్రాయేలీయుల సమయానికి ఇది ఒక పట్టణంగా అభివృద్ధి చెందింది. కాబట్టి యేసేపు గోత్రం వారు దీనిపై యుద్ధం చేసి స్వాధీనం చేసుకున్నారు.

న్యాయాధిపతులు 1:22-25 యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్లినప్పుడు యెహోవా వారికి తోడైయుండెను. పూర్వము లూజనబడిన బేతేలును వేగుచూచుటకు యోసేపు ఇంటివారు దూతలను పంపగా ఆ వేగులవారు ఆ పట్టణము నుండి ఒకడు వచ్చుట చూచి నీవు దయచేసి యీ పట్టణములోనికి వెళ్లు త్రోవను మాకు చూపినయెడల మేము మీకు ఉపకారము చేసెదమని చెప్పిరి.
అతడు పట్టణములోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణమును కత్తివాత హతము చేసిరిగాని ఆ మనుష్యుని వాని కుటుంబికులనందరిని పోనిచ్చిరి.

తరువాతి కాలంలో ఇశ్రాయేలీయుల పది గోత్రాలను పరిపాలించిన దుష్టుడైన యరొబాము ఇదే చోట విగ్రహాలను నిలిపి వారిని జీవముగల దేవుని నుండి దారి తప్పించాడు.

మొదటి రాజులు 12:27-29 యరొ బాము తన హృదయమందు తలంచి ఆలోచనచేసి రెండు బంగారపు దూడలు చేయించి, జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము; ఇశ్రాయేలువారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును, ఒకటి దానునందును ఉంచెను.

కాబట్టి ఈ భూమిపై ఒక సమయంలో ఒక స్థలం పవిత్రమైనదిగా ఎంచబడినా అది తాత్కాలికమే.

ఆదికాండము 35:8

రిబ్కా దాదియైన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూరవృక్షము క్రింద పాతిపెట్టబడెను, దానికి అల్లోను బాకూత్‌ అను పేరు పెట్టబడెను.

ఈ సందర్భంలో రిబ్కా దాది చనిపోయి బేతేలు ప్రాంతంలో పాతిపెట్టబడినట్టు మనకు కనిపిస్తుంది. యాకోబు పద్ద‌నరాము నుండి వచ్చిన తరువాత చాలా కాలం తాను కానానులోనే సంచరిస్తూ, ఈ అధ్యాయం చివరివరకూ తన తండ్రిని కలిసినట్టుగా మనకు కనిపించదు. కానీ జరిగిన ఈ సంఘటనలన్నీ అతను ఇస్సాకును కలవడానికి ముందుగానే జరిగినట్టు మనం భావించకూడదు. యాకోబు పద్దనరాము నుండి రాగానే తన తండ్రిని తప్పకుండా కలిసాడు ఆ సంఘటనను మోషే ఈ అధ్యాయం చివరి వరకూ రాయలేదు. ఎందుకంటే అతను ఆ విధంగా తన తండ్రి ఇంటికి వెళ్ళి అతడిని కలిసాడు కాబట్టే తన‌ తల్లియైన రిబ్కా దాదిని  తన కుటుంబంతో కలసి ఉండడానికి బేతేలుకు తీసుకువచ్చాడు.

గతంలో అబ్రాహామును దేవుడు కానానుకు పిలిచినప్పుడు అతనిని ఒకచోట స్థిరంగా ఉండనివ్వకుండా ఆ దేశం మొత్తాన్నీ సంచరించి చూడమన్నట్టుగా మనకు కనిపిస్తుంది.

ఆదికాండము 13:17 నీవు లేచి యీ దేశముయొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము; అది నీకిచ్చెదనని అబ్రాముతో చెప్పెను.

బహుశా ఆయన యాకోబుకు‌ కూడా ఆ విధంగా ఆజ్ఞాపించడం ద్వారా అతను‌ తన తండ్రిని మొదటిసారి కలిసినప్పుడు అక్కడే ఉండిపోకుండా కానాను అంతటా సంచరించాడు.

(యాకోబు పద్దనరాము నుండి వచ్చాక తన జీవితంలో జరిగినట్టుగా మనకు కనిపించేవి మోషే వరుస క్రమంలో రాయలేదు అనడానికి చివరిలో కూడా ఒక ఆధారం చూద్దాం)

అదేవిధంగా, రిబ్కా దాదియైన దెబోరా చనిపోయినప్పుడు యాకోబు కుటుంబం దానికి ఎంతగానో విలపించి ఆమెను పాతిపెట్టిన  సింధూర వృక్షానికి యాకోబు అల్లోను బాకూత్‌ అనేపేరు పెట్టాడు దానికి ఏడుపు వృక్షం అని అర్థం. దీనిని‌ బట్టి ఆమెకూ యాకోబు‌ కుటుంబానికీ మధ్య ఉన్న ఆప్యాయతను మనం గుర్తించవచ్చు. వారు ఆమెను దాసిగా కాదు తమలో ఒకరిగా ప్రేమించారు, మనం కూడా మనక్రింద పనిచేసేవారిని వారు మనకంటే తక్కువవారిగా చూడకుండా గౌరవించగలగాలి.

క్రైస్తవ సమాజంలో కొందరు బోధకులు మా దగ్గరకు వస్తే మీకు రోగాలు పోతాయి, బాధలు పోతాయంటూ జనాలను మభ్యపెడుతుంటారు. కానీ ఈ సందర్భాన్ని జాగ్రతగా పరిశీలించండి యాకోబుకు దేవుడు ప్రత్యక్షమైన బేతేలులోనే దెబోరా చనిపోయింది; అక్కడ దేవునికి కట్టిన బలిపీఠం కూడా ఉంది.

ఆదికాండము 35:9-15

యాకోబు పద్దనరామునుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనినాశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు; ఇకమీదట నీ పేరు యాకోబు అనబడదు; నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అను పేరుపెట్టెను. మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను; నీవు ఫలించి అభివృద్ధి పొందుము. జనమును జనముల సమూహమును నీవలన కలుగును; రాజులును నీ గర్భవాసమున పుట్టెదరు. నేను అబ్రాహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చెదను; నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమునిచ్చెదనని అతనితో చెప్పెను. దేవుడు అతనితో మాటలాడిన స్థలము నుండి పరమునకు వెళ్లెను. ఆయన తనతో మాటలాడిన చోట యాకోబు ఒక స్తంభము, అనగా రాతిస్తంభము కట్టించి దానిమీద పానార్పణము చేసి నూనెయు దానిమీద పోసెను. తనతో దేవుడు మాటలాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి.

ఈ వచనాలలో మోషే యాకోబు పద్దనరాములో తన ప్రయాణం ప్రారంభించినప్పటి నుండీ దేవుని మాట ప్రకారం‌ బేతేలుకు వచ్చేవరకూ తనకు కలిగిన దేవుని ప్రత్యక్షతలన్నిటినీ, అందులో ఆయన పలికిన మాటలనూ మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మొదటిగా ఏ బేతేలులో అయితే యాకోబుకు ప్రత్యక్షమై నిన్ను మరలా ఈ దేశానికి క్షేమంగా తీసుకువస్తానని వాగ్దానం చేసాడో, ఆ బేతేలుకు యాకోబు క్షేమంగా చేరుకున్నాడు.

ఆదికాండము 35:16-18

ఎఫ్రాతాకు వెళ్లు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవవేదనతో ప్రయాసపడెను.ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము; ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతిబొందెను; ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను; అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను.

ఈ సందర్భంలో యాకోబు ప్రేమించిన రాహేలు ఆమె మొదటిగా కుమారుడిని కన్నపుడు ఏవిధంగా అయితే దేవుడు నాకు మరో కుమారుడిని దయచేయాలని ఆశించి అతనికి యేసేపు అని పేరుపెట్టిందో, ఆవిధంగానే మరో కుమారుడిని కన్నట్టు, ఆ సమయంలో ఆమె చనిపోయినట్టు మనం చూడగలం.

ఈ సందర్భం  మానవులకు సహజంగా కలిగే బాధలు ఎవ్వరికీ ఏ స్థలంలోనూ మినహాయింపు కాదని మనకు తెలియచేస్తుంది.
భక్తురాలైన రాహేలు ప్రసనవేదన పడి కుమారుడిని కని చనిపోయింది. భక్తుడైన యాకోబు తాను ప్రేమించిన భార్య చనిపోవడం వల్ల వేదనపడ్డాడు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకుంటే మనం అన్ని బాధల నుండీ తప్పించుకోగలమనే అభిప్రాయం ఎప్పుడూ కలిగియుండకూడదు.

అదేవిధంగా ఒక విశ్వాసికి తన జీవితంలో కొన్ని వేదనలు సంభవించినప్పటికీ అతను వాటిని మరచిపోయే ప్రయత్నం చెయ్యాలి. ఈ సందర్భంలో రాహేలు తాను చనిపోతూ కన్న కుమారుడికి  బెనోని అని పేరుపెట్టింది దానికి నా వేదన పుత్రుడు అని అర్థం. ఆ పేరుతో అతనిని పిలిచినప్పుడల్లా యాకోబుకు రాహేలు అతడిని కనే సమయంలో పడిన వేదన గుర్తువస్తుంది. అందుకే అతను ఆ కుమారుడికి బెన్యామీను అని పేరుపెట్టాడు, దానికి నా కుడిచేతి పుత్రుడు అని అర్థం.

ఆదికాండము 35:19,20

అట్లు రాహేలు మృతిబొంది బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము.

ఈ ప్రాంతంలో రాహేలు సమాధి ఉండడం ద్వారా దీనిని రాహేలు అని కూడా లేఖనాలు సంబోధించాయి. అందుకే యేసుక్రీస్తు పుట్టినపుడు హేరోదు బేత్లెహేము చుట్టుపక్కల ప్రాంతాలలోని మగపిల్లలను చంపిస్తే ఆ ప్రాంతపువారు పడిన వేదనను గురించి రాహేలు తన పిల్లల గురించి అంగలార్చిందని రాయబడింది.

మత్తయి సువార్త 2:16-18 ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, తాను జ్ఞానులవలన వివరముగా తెలిసికొనిన కాలమునుబట్టి, బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లలనందరిని వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహా రోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై యేడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకయుండెను అని ప్రవక్తయైన యిర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను.

ఆదికాండము 35:21

ఇశ్రాయేలు ప్రయాణమై పోయి మిగ్దల్‌ ఏదెరుకవతల తన గుడారము వేసెను.

ఈ సందర్భంలో మొట్టమొదటిసారిగా యాకోబును లేఖనం అతనికి దేవుడు పెట్టిన ఇశ్రాయేలు పేరుతో సంబోధించింది.

ఆదికాండము 35:22

ఇశ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్నియైన బిల్హాతో శయనించెను; ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను.

ఈ సందర్భంలో యాకోబు‌ కుమారుడైన రూబేను కానానీయుల పద్ధతి చొప్పున తన తండ్రి ఉపపత్నితో అక్రమసంబంధం పెట్టుకున్నట్టు మనం చూడగలం. ఇటువంటి హేయమైన కార్యాలు కానానీయులు చేసినందుకే దేవుడు వారిని నాశనం చేసాడు.

లేవీయకాండము 18:8,24,25 నీ తండ్రి భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ తండ్రిదే. వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొనకూడదు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వాటన్నిటివలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోషశిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్నవారిని వెళ్లగ్రక్కి వేయుచున్నది.

రూబేను చేసిన ఆ పనివల్ల యాకోబు ఎంతో వేదనకు లోనయ్యాడు. అందుకే  తన మరణ సమయంలో దీనిని ప్రస్తావించి అతడిని శపించి, అతని జ్యేష్ఠత్వపు‌ హక్కును యేసేపుకు ఇచ్చాడు.

ఆదికాండము 49:3,4 రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలముయొక్క ప్రథమఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే.  నీళ్లవలె చంచలుడవై నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచము మీదికెక్కితివి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచము మీదికెక్కెను.

మొదటి దినవృత్తాంతములు 5:1 ఇశ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడైయుండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకియ్యబడెను; అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు.

దీని ప్రకారం మోషే ధర్మశాస్త్రానికి ముందు తండ్రి భార్యతో శయనించకూడదనే ఆజ్ఞ‌ కూడా ఇక్కడ ఉన్నట్టు (మనస్సాక్షిలో) మనకు కనిపిస్తుంది. దీనిగురించి‌ మరింత వివరంగా తెలుసుకోడానికి ఈ లింక్ ద్వారా సూచించబడిన వ్యాసం చదవండి

https://hithabodha.com/books/miscellaneous/353-are-there-no-moral-precepts-before-the-mosaic-law.html

 

ఆదికాండము 35:23-26

యాకోబు కుమారులు పండ్రెండుగురు, యాకోబు జ్యేష్ఠకుమారుడగు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను; వీరు లేయా కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. రాహేలు దాసియైన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి.  లేయా దాసియైన జిల్పా కుమారులు గాదు, ఆషేరు వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు.

ఈ సందర్భంలో మొదటిసారిగా యాకోబు కుమారుల పేర్లు అన్నీ మనకు కనిపిస్తాయి. వీరి ద్వారానే ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాలు విస్తరించాయి. అయితే, ఇక్కడ మోషే వీరంతా యాకోబుకు పద్దనరాములో పుట్టారని రాస్తున్నాడు కానీ, బెన్యామీను కానానులోనే పుట్టి‌నట్టు ఇదే అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. కొందరు దీనిని తప్పుపట్టే ‍ ప్రయత్నం చేస్తారు కానీ, మోషే బెన్యామీను ఎక్కడ పుట్టాడో అప్పటికే వివరించాడు కాబట్టి అతను పుట్టిన స్థలం గురించి మరలా ఈ వచనాలలో ప్రస్తావించకుండా మిగిలినవారంతా పుట్టిన పద్దనరాము గురించే రాసాడు (అది క్లుప్తంగా చెప్పే ఒక పద్ధతి).

ఆదికాండము‌ 35:27

అబ్రాహామును ఇస్సాకును పరదేశులైయుండిన మమ్రేలో కిర్యతర్బాకు తన తండ్రియైన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను.

ఈ సందర్భంలో యాకోబు హెబ్రోనులో నివసిస్తున్న తన తండ్రి ఇంటికి వచ్చినట్టుగా రాయబడింది.  కానీ పైన దెబోరా సందర్భంలో చెప్పినట్టుగా యాకోబు పద్దనరాము నుండి బయలుదేరాక తన తండ్రిని కలుసుకోవడం ఇదే మొదటిసారి అని మనం భావించకూడదు. ఈ సందర్భంలో ఇస్సాకు మరణఘడియలు దగ్గరపడ్డాయి కాబట్టి మోషే దీనిగురించి ప్రత్యేకంగా ప్రస్తావించి రాస్తున్నాడు. అతను యాకోబు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు వరుసక్రమంలో రాయలేదు అనడానికి ఇప్పుడు మరో ఆధారం కూడా చూద్దాం.

ఆదికాండము 37వ అధ్యాయంలో మనకు యేసేపు చరిత్ర గురించి రాయబడింది. అతను 17 సంవత్సారాల వయసులో తన తండ్రి మందను మేపుతూ తన సహోదరులకు అతనిపట్ల కలిగిన ద్వేషం వల్ల ఇష్మాయేలీయుల ద్వారా ఐగుప్తుకు అమ్మబడినట్టు అక్కడ మనకు కనిపిస్తుంది. తరువాత అతను ఐగుప్తు రాజుచేత ఆ దేశానికి ప్రధానిగా నియమించబడిన సమయానికి అతనికి 30 సంవత్సరాలు (ఆదికాండము 41:46).

ఆ తరువాతి చరిత్రలో, అతను ఫరోకు వివరించిన కలభావం చొప్పున ఐగుప్తు దేశమంతటా సమృద్ధిగా పంటపండిన ఏడు సంవత్సరాలు వస్తాయి.‌ అవి పూర్తి అయ్యేసరికి అతనికి 37 సంవత్సరాలు. ఆ వెంటనే కరవు సంభవించే ఏడు సంవత్సరాలు వచ్చినపుడు అతని అన్నలు ఐగుప్తుకు వస్తారు, యేసేపు వారికి తాను ఎవరో తెలియచేసి యాకోబును తీసుకుని ఐగుప్తుకు రమ్మంటాడు.

ఆదికాండము 45:6,7 రెండు సంవత్సరముల నుండి కరవు దేశములోనున్నది. సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంక అయిదు వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగ రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను.

ఈ వచనాల ప్రకారం యాకోబు యేసేపు మాటప్రకారం ఐగుప్తుకు వచ్చేసరికి కరవు రెండు సంవత్సరాలు గడచిపోయాయి.
అప్పటికి యేసేపు వయస్సు 39 సంవత్సరాలు. ఇప్పుడు యాకోబు ఐగుప్తులో ప్రవేశించి ఫరోముందు మాట్లాడుతున్న మాటలు చూడండి.

ఆదికాండము 47:8,9 ఫరో నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబునడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు నూట ముప్పది.

ఈ మాటల ప్రకారం యాకోబు ఐగుప్తుకు వెళ్ళేటప్పటికి అతని వయస్సు 130 సంవత్సరాలు. అప్పటికి యేసేపు వయసు మనం పైన చూసినట్టుగా 39 సంవత్సరాలు. అంటే, యేసేపు పుట్టేసరికి యాకోబు వయసు 91 సంవత్సరాలు.

యాకోబు పుట్టేసరికి ఇస్సాకు వయసు 60 సంవత్సరాలు (ఆదికాండము 25:26). ఇస్సాకు ఈ క్రింది వచనాల ప్రకారం 180 సంవత్సరాల వయసులో చనిపోయాడు. అప్పుడు యాకోబు తన కుటుంబంతో కలసి అతని దగ్గరే ఉన్నాడు.

‌ఇస్సాకు‌ జీవించిన 180 సంవత్సరాలలో 60వ సంవత్సరంలో అతనికి యాకోబు పుడితే, అతను చనిపోయే సమయానికి యాకోబు వయస్సు 120 సంవత్సరాలు. యేసేపు యాకోబుకు 91వ సంవత్సరంలో పుట్టి 17 సంవత్సరాలకు ఐగుప్తుకు అమ్మబడితే అప్పటికి యాకోబు వయస్సు 108 సంవత్సరాలు.

అంటే ఇస్సాకు చనిపోయేటప్పటికే యేసేపు ఐగుప్తుకు అమ్మబడి, అప్పటికే 12 సంవత్సరాలు గడచిపోయాయి. కాబట్టి యాకోబు కుటుంబం ఇస్సాకు చనిపోయే సమయంలో అతనిదగ్గరకు వెళ్ళేటప్పటికి  యేసేపు వారితో లేడు. కానీ యేసేపు ఐగుప్తుకు అమ్మబడిన చరిత్ర మనకు 37వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి మోషే ఈ సంఘటనలను వరుసక్రమంలో రాయలేదు.

ఆదికాండము 35:28,29 ఇస్సాకు బ్రదికిన దినములు నూట ఎనుబది సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు యాకోబులు అతని పాతిపెట్టిరి.

ఆదికాండము 27:4వ వచనంలోనే ఇస్సాకు తాను చనిపోతానని భావించి ఏశావును దీవించాలని భావించాడు. కానీ ఆ తరువాత కూడా అతను యాకోబు కుమారులు పెద్దవారై తనయొద్దకు వచ్చేవరకూ జీవించాడు. ఈవిధంగా దేవుడు ఇస్సాకుకు తన సంతానపు ప్రముఖులను చూసి ఆనందించే భాగ్యం ప్రసాదించాడు.

 

Add comment

Security code
Refresh

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.