పాత నిబంధన
రచయిత: కె విద్యా సాగర్

gen14.1

14:1-10, 14:11-13, 14:14-17, 14:18-20, 14:21-24

ఆదికాండము 14:1-10

షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీ యుల రాజైన తిదాలు అనువారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొఱ్ఱా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయీయుల రాజైన షెమేబెరుతోను, సోయరను బెలరాజుతోను యుద్ధము చేసిరి. వీరందరు ఉప్పు సముద్రమైన సిద్దీములోయలో ఏకముగా కూడి పండ్రెండు సంవత్సరములు కదొర్లా యోమెరుకు లోబడి పదమూడవ సంవత్సరమున తిరుగు బాటు చేసిరి. పదునాలుగవ సంవత్సరమున కదొర్లా యోమెరును అతనితో కూడనున్న రాజులును వచ్చి అష్తా రోత్‌ కర్నాయిములో రెఫాయీయులను హాములో జూజీయులను షావే కిర్యతాయిము మైదానములో ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఏల్పారాను వరకు తరిమి శేయీరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేషను ఏన్మిష్పతుకువచ్చి అమాలేకీయుల దేశమంతటిని హససోన్‌ తామారులో కాపురమున్న అమోరీయులనుకూడ కొట్టిరి. అప్పుడు సొదొమ రాజును గొమొఱ్ఱా రాజును అద్మా రాజును సెబోయీము రాజును సోయరను బెల రాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో, అనగా ఏలాము రాజైన కదొర్లాయోమెరు గోయీయుల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ యైదుగురు రాజులు యుద్ధము చేసిరి. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొఱ్ఱాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి.

ఈ వచనాలలో, కొందరు రాజుల మధ్య జరిగిన యుద్ధం గురించి రాయబడింది; సొదొమ, గొమొఱ్ఱా, మరో మూడు పట్టణాలు,మృతసముద్రానికి తీర్పుదిక్కుగా ఉండేవి. వీటిపైన, ఎక్కడో మెసపతోమియా(బాబేలు/షీనారు) ప్రాంతంలో నివసిస్తున్న రాజులు యుద్ధం చేయడానికి ఎలా వచ్చారు, కదొర్లాయెమెరు అనే రాజు 12 సంవత్సరాలు వారినెలా లోపరచుకున్నాడనే ప్రశ్నలు వస్తుంటాయి. అయితే, క్రీస్తు శకం 1920వ సంవత్సరంలో, Dr.Nelson Glueek అనే పురాతత్వ శాస్త్రవేత్త పరిశీలన ప్రకారం, మెసపతోమియా నుండి, మృతసముద్రం తూర్పుదిక్కున సొదొమ, గొమొఱ్ఱా వైపు చేయబడిన ఒక పురాతన మార్గం బయటపడింది; ఆ మార్గం ద్వారా ఆ రాజులు సొదొమ, గొమొఱ్ఱాలపై యుద్ధానికి వచ్చారు.

ఈ రాజులలో మనం ప్రధానంగా గుర్తించవలసిన రాజు అమ్రాపేలు, షీనారు(బాబేలు) దేశం, ఆదికాండము 11వ అధ్యాయానికే నాగరికతపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా మనకు కనిపిస్తుంది. ఆ ప్రాంతాన్ని అబ్రాహాము కాలంలో ఇతనే పరిపాలించాడు; ఇతనే హమ్మురాభి, ఇతనిపేరుతో ఒక 282 చట్టాలను కలిగియున్న, ఏడు అడుగుల రాతిపలకను పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు; పురాతత్వ శాస్త్రవేత్తలకు లభ్యమైన పురాతన చట్టప్రతుల్లో అది ఒకటి. దీని గురించిన ఆధారాలు ఈ లింక్స్ ద్వారా పరిశీలించవచ్చు;

https://www.newadvent.org/cathen/01441a.htm

https://booksnthoughts.com/one-of-the-oldest-law-code-in-the-world/

ఆదికాండము 14:11-13

అప్పుడు వారు సొదొమ గొమొఱ్ఱాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నియు పట్టుకొని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపుర ముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొనిపోగా తప్పించుకొనిన యొకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రా మునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసికొనినవారు.

ఈ సందర్భంలో, అబ్రాహామును‌ విడిచివెళ్లిన లోతు బందీగా పట్టబడినట్లు మనకు కనిపిస్తుంది.

ఆదికాండము 14:14-17

అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడెనని విని తన యింట పుట్టి అలవరచబడిన మూడువందల పదునెనమండుగురిని వెంటబెట్టుకొని దానుమట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులును వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసికొని వచ్చెను. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు, రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను.

ఈ సందర్భంలో అబ్రాహాము లోతును‌ కాపాడుకునేందుకు ఆ రాజులతో యుద్ధం చేసి, దేవుని శక్తిని బట్టి కేవలం మూడువందల పద్దెనిమిది మందితో వారిని జయించినట్లు చూడగలం.

ఆదికాండము 14:18-20

మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసికొనివచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పు డతడు అబ్రామును ఆశీర్వదించిఆకాశమునకు భూమి కిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవునివలన అబ్రాము ఆశీర్వ దింపబడునుగాక అనియు, నీ శత్రు వులను నీ చేతి కప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్ని టిలో ఇతనికి పదియవవంతు ఇచ్చెను.

ఈ వచనాలలో మనకి మెల్కీసెదెకు అనే వ్యక్తి పరిచయం చేయబడతాడు. ఈయన గురించి, బైబిల్ గ్రంథంలో ఎక్కువ వివరణ లేనప్పటికీ, కొంతమంది మాత్రం ఈయన గురించి కొన్ని అపార్థాలకు లోనయ్యారు. వాటిని వరుసగా పరిశీలిద్దాం. మొదటిగా కొంతమంది యూదులు ఈయన్ని, నోవాహు కుమారుడైన షేము అని బోధిస్తుంటారు; బహుశా ఆ వాదాన్ని నిరూపించుకోవడానికే వీరు, ప్రస్తుతం మన బైబిళ్ళు తర్జుమా చేయబడిన 'Masoretic' రాతప్రతిలో అర్పక్షదు నుండి, సెరూగు వరకూ, ప్రతీ వ్యక్తీ తన కొడుకుల్ని కన్న వయస్సులో 100 యేళ్లు చొప్పున తగ్గించి 600 సంవత్సరాలని తప్పుగా రాశారు. అప్పుడు మాత్రమే నోవాహు కుమారుడైన షేము అబ్రాహాము కాలం వరకూ జీవించియుండడం సాధ్యమవుతుంది.

ఈ సంఖ్యాపరమైన పొరపాట్లు గురించి, ఆదికాండము 11వ అధ్యాయపు వివరణలో, ఆధారాలతో తెలియచేయడం జరిగింది. దాని ప్రకారం, నోవాహు కుమారుడైన షేము, అబ్రాహాము జన్మించేసరికే చనిపోయాడు, షేము జీవించిన కాలం 600 యేళ్లు; దీనిప్రకారం మెల్కీసెదెకు షేము అయ్యే అవకాశం లేదు.

ఇక రెండవదిగా, క్రైస్తవ సంఘంలో చాలామంది, మెల్కీసెదెకు ఎవరో కాదు యేసుక్రీస్తు ప్రభువే అని బోధిస్తుంటారు, వారు ఆ విధంగా అభిప్రాయపడడానికీ‌ హెబ్రీపత్రికలోని మాటలను సందర్భానికి వేరుగా అర్థం చేసుకోడమే కారణం; ఆ మాటలు చూడండి -

హెబ్రీయులకు 7:1-3 - రాజులను సంహారముచేసి, తిరిగి వచ్చుచున్న అబ్రాహామును ఎవడు కలిసికొని అతనిని ఆశీర్వదించెనో, యెవనికి అబ్రాహాము అన్నిటిలో పదియవవంతు ఇచ్చెనో, ఆ షాలేమురాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీ సెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రిలేనివాడును తల్లిలేని వాడును వంశావళి లేనివాడును, జీవితకాలమునకు(మూలభాషలో-దినములకు) ఆది యైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు.

ఈ సందర్భంలో మెల్కీసెదెకు గురించి, నీతికి రాజుయనీ, సమాధానానికి రాజుయనీ, తల్లితండ్రి, వంశావళి, ఆది అంతము లేనివాడని, దేవునికుమారుని పోలియున్నాడనీ రాయబడడంతో, ఇవన్నీ యేసుక్రీస్తుకు మాత్రమే చెందేవిగా ఉన్నాయి కనుక, ఇతను యేసుక్రీస్తేయని వీరు అపార్థం చేసుకుంటున్నారు.

వీటన్నిటికీ, క్రింద వరుసగా సమాధానం చూద్దాం; అంతకంటే ముందు హెబ్రీగ్రంథ కర్త మెల్కీసెదెకు గురించి ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందో, ఆ అధ్యాయంలోనూ, తరువాతి అధ్యాయాల్లోనూ మనం సందర్భాన్ని చూస్తే, అర్థం ఔతుంది.

హెబ్రీ గ్రంథకర్త యేసుక్రీస్తును ప్రధానయాజకునిగా (సర్వోన్నతుడైన దేవునికి యాజకునిగా) తెలియచేస్తున్నాడు; అప్పుడు అతనికి ఒక ప్రధానమైన ప్రశ్న ఎదురౌతుంది.
ధర్మశాస్త్రం ప్రకారం యాజకులు అనేవాళ్లు లేవిగోత్రంలో పుట్టినవారైయుండాలి, యేసుక్రీస్తు యూదా గోత్రంలో పుట్టాడు.

దీనిప్రకారం యేసుక్రీస్తు రాజు అవ్వగలడేమో కానీ, ప్రధానయాజకుడు అవ్వలేడు; అందుకే హెబ్రీ గ్రంథకర్త యేసుక్రీస్తు ధర్మశాస్త్రం ప్రకారం, లేవీగోత్రంలో చేరిన ఇశ్రాయేలీయుల యాజకుడు కాదనీ, అబ్రాహాము కాలంలో, ‌సర్వోన్నతుడైన దేవునికి యాజకునిగా ఉన్న మెల్కీసెదెకు క్రమంలో చేరిన యాజకుడని, కీర్తనలు గ్రంథంలోని ప్రవచనం ఆధారంగా నిరూపిస్తున్నాడు.

కీర్తనల గ్రంథము 110:4 - మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు.

హెబ్రీయులకు 7:13-17 - ఎవనిగూర్చి యీ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోనివాడెవడును బలిపీఠమునొద్ద పరిచర్యచేయలేదు. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించె ననుట స్పష్టమే; ఆ గోత్రవిషయములో యాజకులను గూర్చి మోషే యేమియు చెప్పలేదు. మరియు శరీరాను సారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమునుబట్టి కాక, నాశనములేని జీవమునకున్న శక్తినిబట్టి నియమింపబడి, మెల్కీ సెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చియున్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమైయున్నది. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీ సెదెకు క్రమము చొప్పున యాజకుడవై యున్నావు అని ఆయనవిషయమై సాక్ష్యము చెప్పబడెను.

ఒకవేళ ఈ మెల్కీసెదెకే యేసుక్రీస్తు ప్రభువైతే, ఈ గ్రంథకర్త కానీ, కీర్తనలులో‌ని ప్రవచనంలో కానీ, ఆయనే ఈయన అని చెబితే సరిపోయేది; ఆ క్రమంలో చేరినవాడని మాత్రమే ఎందుకు రాయబడింది?

ఇక అతని గురించి రాయబడిన మాటలు‌ పరిశీలిస్తే,

1 నీతికి రాజు, సమాధానానికి రాజు అని అర్థమిచ్చు మెల్కీసెదెకు అని పేరు; ఈ మాటల్లో హెబ్రీ గ్రంథకర్త మెల్కీసెదెకు అనే పేరుకున్న అర్థాన్ని చెబుతున్నాడు తప్ప, అతను యేసుక్రీస్తువలే సమాధానానికి కర్తయనో, నీతికి రాజుయనో చెప్పడం లేదు; ఉదాహరణకు నేటికాలంలో మన పేర్లకు కూడా చాలా అర్థాలు వస్తుంటాయి, అంతమాత్రాన ఆ పేరుకున్న భావం మనమే అని కాదు. ఈ మెల్కీసెదెకు ఒక సామాన్య మానవుడే అని చెప్పడానికి ఇతని పేరు కూడా మంచి ఆధారంగా ఉంది; ఎందుకంటే, ఈ మెల్కీసెదెకు అనే పేరు గురించి,
Ancient near Eastern Literature (కానాను ప్రాంతం) ను పరిశీలించి రాసిన Dictionary of the Old Testament Samaritan Pentateuchలో ఉన్న వివరణ ప్రకారం, మెల్కీసెదకు అనే పేరు, Malk/Melek, Sedeq అనే రెండు పదాల కలయిక, ఈ పదాలకున్న అర్ధాన్ని The Ancient near East (Fitzmyer 311,n.27) ప్రకారం పరిశీలిస్తే, Melek అంటే నీతి, సమాధానం అని అర్థం వస్తుంది. మనకి బైబిల్ లో కనిపించే కానానీయుల దేవతలలో ఇటువంటి పేరుతో మెలెకు అనే వాడు మనకి కనిపిస్తాడు.

Sedeq అంటే నా రాజు అని అర్థం. దీన్నే హెబ్రీ గ్రంథకర్త వివరిస్తూ అతని పేరుకు నీతికీ, సమాధానానికీ రాజు అని అర్థమని చెబుతున్నాడు. ఈ మెల్కీసెదెకు యేసుక్రీస్తు ప్రభువే అనేవారు ఆయన కానానీయుల సంస్కృతిలోని పేరుతో ఎందుకు పిలువబడ్డాడో సమాధానం చెప్పవలసి వస్తుంది. దీనిప్రకారం మెల్కీసెదె కు అనే వ్యక్తి, కానాను ప్రాంతానికి చెందిన వ్యక్తి అని మనకి అర్థం ఔతుంది, అప్పటికి అబ్రాహాము ఆ ప్రాంతం చుట్టుపక్కలే నివసిస్తున్నాడు.

ఇప్పుడు మీకు, దుష్టులైన కానానీయుల్లో మెల్కీసెదెకు అనే శ్రేష్టమైన దేవుని యాజకుడు ఎలా ఉన్నాడనే ప్రశ్న వస్తే, ఈ సంఘటన జరిగింది అబ్రాహాము కాలంగా మనం గుర్తించాలి. కానానీయులు శాపగ్రస్తులైనంత‌ మాత్రమున ఇశ్రాయేలీయులు వారి ప్రాంతాన్ని స్వాధీనపరచుకోవడానికి మునుపు కాలంలో వారందరూ అదేవిధంగా ఉన్నారని భావించడం సాధ్యం కాదు. అదేవిధంగా దేవుని చేత ఆశీర్వదించబడిన ఇశ్రాయేలీయుల్లో ఎంతోమంది దుష్టులను మనం చూస్తుంటాం.

2 తల్లి తండ్రి లేనివాడు వంశావళి లేనివాడు; మోషే ధర్మశాస్త్రం ప్రకారం, యాజకత్వం చేసే లేవీయులు తమ వంశావళిని బట్టి, యాజకత్వాన్ని చేస్తారు; వారు లేవీ గోత్రానికి చెందిన తల్లితండ్రులకు పుట్టినవారైయుంటారు. అయితే మెల్కీసెదెకు లేవీ గోత్రానికి చెందిన తల్లి తండ్రులకు పుట్టినవాడు కాదు, అప్పటికి లేవీగోత్రమే లేదు; అతని యాజకత్వం, ఆ వంశావళిని బట్టి కానీ, మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి కానీ వచ్చింది కాదని చెప్పేందుకే హెబ్రీ గ్రంథకర్త ఈ మాటలు వాడుతున్నాడు దానికి క్రింద వచనంలోనే వివరణ కూడా ఇస్తున్నాడు చూడండి -

హెబ్రీయులకు 7:6 - వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రాహామునొద్ద పదియవవంతు పుచ్చుకొని వాగ్దానములను పొందినవానిని ఆశీర్వదించెను.

3 జీవితకాలమునకు ఆది అంతము లేనివాడు; లేవీక్రమాన్ని బట్టి యాజకత్వం చేసేవారికి, తమ తండ్రులను బట్టి, తరగతుల ఏర్పాటు ఉంటుంది (1 దినవృత్తాంతములు‌ 24:7-20); వారు ఆ తరగతిలోని దినములలో యాజకత్వాన్ని చేసి ఇంటికి తిరిగివెళ్తారు.

ఉదాహరణకు: లూకా సువార్త 1:8,23 - జెకర్యా తన తరగతి క్రమముచొప్పున దేవునియెదుట యాజక ధర్మము జరిగించుచుండగా అతడు సేవచేయు దినములు సంపూర్ణ మైనప్పుడు తన యింటికి వెళ్లెను.

మెల్కీసెదెకు విషయంలో అలాంటి తరగతులు కానీ, దినముల నిర్ణయం కానీ ఏమీలేకుండా యాజకత్వం చేసాడని చెప్పేందుకు గ్రంథకర్త‌‌ ఈ మాటలు వాడుతున్నాడు తప్ప అతను నిత్యుడని చెప్పేందుకు కాదు; అందుకే ఆ సందర్భంలో జీవితకాలమునకు అన్నపుడు, మూలభాషలో దినములకు అని కూడా రాయబడింది.

4 అదేవిధంగా ఆయన దేవుని కుమారుని పోలినవాడని రాయబడింది; దీన్నికూడా కొందరు అపార్థం చేసుకోవచ్చు. అయితే, పాతనిబంధన కాలంలో బలులు, కొన్ని ఆచారాలు, క్రీస్తుకు ఛాయగా(పోలికగా) ఏవిధంగా అయితే ఉన్నాయో, అదేవిధంగా మెల్కీసెదెకు అనే సర్వోన్నతుడైన దేవుని యాజకుడు కూడా, యేసుక్రీస్తు అనే సర్వోన్నతుడైన దేవుని యాజకునికి(దేవుని కుమారునికి) అబ్రాహాము కాలంలో, పోలికగా ఉన్నాడు, పైన చెప్పినట్లుగా, మెల్కీసెదెకు ఎలా అయితే, లేవీగోత్రంతో కానీ, ధర్మశాస్త్రంతో‌ కానీ పని లేకుండా యాజకత్వం చేసాడో, యేసుక్రీస్తు కూడా వాటితో సంబంధం లేకుండా మెల్కీసెదెకు క్రమంలో యాజకత్వం చేస్తున్నాడు, ఇదే ఆ పోలిక.

ఈ విషయంలో, మరో అపార్థాన్ని కూడా చూడండి -

హెబ్రీయులకు 7:8 - మరియు లేవిక్రమము చూడగా చావునకు లోనైనవారు పదియవవంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా, జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు.

ఈ వచనంలో, జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు అనేమాటను కొంతమంది మెల్కీసెదెకుకు ఆపాదిస్తూ, ఆ కారణంతో కూడా, ఆయనే యేసుక్రీస్తని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు; అయితే‌ అక్కడ గ్రంథకర్త మెల్కీసెదెకు గురించి కాదు కానీ, అతని క్రమంలో చేరిన యాజకుడైన యేసుక్రీస్తు గురించే మాట్లాడుతున్నాడు. అందుకే, పుచ్చుకొన్నాడు అని కాకుండా పుచ్చుకొనుచున్నాడని, అది జరుగుతున్నట్లుగా రాస్తున్నాడు. ప్రస్తుత క్రైస్తవసంఘాలన్నీ ఇస్తుంది యేసుక్రీస్తుకే (ఆయన పనికొరకే) కదా! అలా అని, మనం ఖచ్చితంగా దశమభాగం ఆయనకి ఇవ్వాలని నూతన నిబంధన బోధించడం లేదు కానీ, ఆయనకి ఉత్సాహంగా ఎంతైనా ఇచ్చే క్రమాన్ని మాత్రం నేర్పిస్తుంది.

2 కోరింథీయులకు 9: 7 - సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.

ఇక మెల్కీసెదెకు విషయంలో ఉన్న చివరి అపార్థాన్ని చూద్దాం; అబ్రాహామును మెల్కీసెదెకు కలిసిన ఆ సందర్భంలో, అతను అబ్రాహామును ఆశీర్వదించినట్లుగా కనిపిస్తుంది. దీని ఆధారంగా కూడా కొందరు అబ్రాహాము అంతటి గొప్ప భక్తుణ్ణి ఆశీర్వదించాడంటే, అతను సాధారణమైన వ్యక్తి అయ్యే అవకాశం లేదనీ, అతను‌ ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు అనో, లేక దైవత్వం కలిగిన ఒక వ్యక్తి అనో అభిప్రాయపడుతుంటారు; ఇది కూడా వాస్తవం కాదు, ఉదాహరణకు మనం మోషే ధర్మశాస్త్రాన్ని చదివినపుడు లేవీగోత్రికులు ఇశ్రాయేలు మిగిలిన ప్రజల్ని (యూదాగోత్రంతో సహా) ఆశీర్వదిస్తున్నట్లుగా ఆయా సందర్భాలలో కనిపిస్తుంది.

దీనిప్రకారం లేవీగోత్రికులు, ఇశ్రాయేలీయులు అందరికంటే గొప్పవారనే భావం రాదుకానీ, దేవుని సన్నిధిలో యాజకునిగా ఉన్నవారు దేవునికీ మానవునికీ మధ్య ప్రతినిధులుగా ఉన్న కారణంతో, ఆ విధంగా ఆశీర్వదిస్తూ ఉంటారు, అదేవిధంగా యాజకుడైన మెల్కీసెదెకు దేవుని ప్రతినిధిగా అబ్రాహాము దగ్గరకు వచ్చాడు కనుక అతన్ని ఆ విధంగా దీవిస్తున్నాడు. దీనివల్ల అతను యేసుక్రీస్తని కానీ, దైవత్వం కలిగిన మరెవరో వ్యక్తని కానీ మనం భావించవలసిన అవసరం లేదు.

ఈ విధంగా సందర్భంలో మనం చూసినపుడు, మెల్కీసెదెకు, యేసుక్రీస్తు ఇద్దరూ ఒకటి కాదనీ, యేసుక్రీస్తు యూదాగోత్రంలో పుట్టి, ధర్మ శాస్త్రాన్ని, లేవీగోత్రాన్ని బట్టి కాకుండా, మెల్కీసెదెకు క్రమాన్ని బట్టి సర్వోన్నతుడైన దేవునికి యాజకుడని చెప్పేందుకే గ్రంథకర్త ఇదంతా రాస్తున్నాడని అర్థమౌతుంది.

ఆదికాండము 14:21-24

సొదొమ రాజుమనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసికొనుమని అబ్రాముతో చెప్పగా అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీవాటిలో ఏదైనను తీసికొన నని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతు డును దేవుడునైన యెహోవాయెదుట నా చెయ్యియెత్తి ప్రమాణము చేసియున్నాను. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతోకూడ వచ్చిన ఆనేరు ఎష్కోలు మమ్రే అను వారికి ఏయే భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారిని తీసికొననిమ్మని సొదొమ రాజుతో చెప్పెను.

ఈ సందర్భంలో, అబ్రాహాము సొదొమరాజు ఇస్తున్నదాన్ని తృణీకరిస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది; దీని ఆధారంగా కొంతమంది, మనం ఇతరులు చేసే సహాయాన్ని తీసుకోకూడదని భావిస్తుంటారు. అయితే ఆ సందర్భంలో, అబ్రాహాము సొదొమరాజు ఇచ్చేదాన్ని తృణీకరించింది ఆ కారణంతో కాదు కానీ, తనను గొప్పవానిగా చేసిన పేరు దేవునికి మాత్రమే దక్కాలని అతను భావించి, ఆ పేరు సొదొమరాజుకు దక్కకుండా జాగ్రతపడుతున్నాడు. అప్పటికే అతను గొప్ప సంపద కలిగియున్నాడు.

 

Add comment

Security code
Refresh

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.