పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

4:1, 4:2, 4:3, 4:4, 4:5, 4:6,7, 4:8, 4:9, 4:10, 4:11,12, 4:13, 4:14, 4:15, 4:16,17, 4:18, 4:19, 4:20-22, 4:23,24, 4:25, 4:26

ఆదికాండము 4:1
ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియై కయీనును కని యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను.

ఈ వచనంలో ఆదాము హవ్వలకు కయీను అనే కుమారుడు జన్మించినట్టు మనం చూస్తాం. దీనిప్రకారం; "ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడనే" (ఆదికాండము 1:28) దేవుని ఆశీర్వాదం నేరవేర్పుగా ఈ భూమిపై స్త్రీ పురుషుల కలయిక ద్వారా జన్మించిన‌ మొట్టమొదటి మానవుడు కయీను. గమనించండి; ఇక్కడ ప్రసవవేదనతో ఆ కయీనును కన్నటువంటి హవ్వ అది తన గొప్పతనమని కానీ, లేక తన భర్త గొప్పతనమని కానీ భావించకుండా యెహోవా దయవలనే తాను కుమారుని కనగలిగానని గుర్తించి ఆయనను మహిమపరచడం మనం చూస్తున్నాం (13 వ వచనపు వ్యాఖ్యానం కూడా చూడండి). కానీ నేటిసమాజంలో చాలామంది దీనికి భిన్నంగా "దేవుని దయవల్ల కనిన పిల్లలకు తామే  దైవాలమని, అదంతా వారి గొప్పతనమే అని బోధిస్తున్నారు". దానికారణంగా ప్రస్తుత ప్రపంచంలో చాలామంది చిన్నతనం నుండే ఈ విగ్రహారాధనకు లోనౌతున్నారు. ఈ భూమిపై ప్రతీమానవుడూ ఆదాము హవ్వలకు దేవుడిచ్చిన ఆశీర్వాద నెరవేర్పుగానూ, హవ్వ ఒప్పుకుంటున్నట్టుగా, ఆయన దయచేతనే జన్మిస్తున్నాడు. ఈ విషయం మరచిపోయి దేవునికి చెందవలసిన మహిమను తమకు అపాదించుకునేవారంతా అపవాది సంబంధులు. ఎందుకంటే మనిషిలోకి ఈ భావజాలాన్ని ప్రవేశపెట్టిందే వాడు (అదికాండము 3:5 వ్యాఖ్యానం చూడండి).

కీర్తనలు 100: 3 యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱెలము.

కీర్తనల గ్రంథము 127:3 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే.తల్లిగర్భంలో మానవనిర్మాణమనేది సాక్ష్యాత్తూ దేవుని చేతిపనియే అని కూడా బైబిల్ తెలియచేస్తుంది.

యోబు గ్రంథము 10:8-12 నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించియున్నను నీవు నన్ను మింగివేయుచున్నావు. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసికొనుము నీవు నన్ను మరల మన్నుగా చేయుదువా? ఒకడు పాలుపోసినట్లు నీవు నన్ను పోసితివి గదా జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి గదా. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. జీవము ననుగ్రహించి నా యెడల కృప చూపితివి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి.

కీర్తనల గ్రంథము 139:13-16 నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.

మానవ నిర్మాణాన్ని నిజాయితీగా అధ్యయనం చేసిన ఎవరూ కూడా దానివెనుక దేవుడు లేడని అనడం సాధ్యం కాదు. ఎంతో సంక్లిష్టమైన designs తో నిండియున్న మన శరీరం, దానివెనుక నిర్మాణకుడు లేకుండా ఎలా ఏర్పడుతుంది? అందుకే పై వచనాలలో కీర్తనాకారుడు తన నిర్మాణం గురించి ఆలోచించినప్పుడు భయం, ఆశ్చర్యం కలుగుతుందని ఆ నిర్మాణాన్ని చేసిన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు.

అదేవిధంగా, కయీనును లేఖనాలు దుష్టుని సంబంధియని పలికిన‌ మాటలనూ (1యోహాను3:12) యేసుక్రీస్తు యూదులను సర్పములారా సర్పసంతానమా అని పలికిన మాటలను కూడా కొందరు వక్రీకరించి, ఏదెనుతోటలో అపవాది సర్పం రూపంలో హవ్వతో శయనించాడని, దానికి ఫలితంగానే కయీను జన్మించాడని నీచమైన బోధను చేస్తున్నారు. కానీ మనం చూసిన వచనంలో ఆదాము తన భార్యయైన హవ్వను కూడగా, యెహోవా దయవల్ల కయీను జన్మించాడని రాయబడింది. కాబట్టి కయీను దుష్టుని సంబంధి అన్నప్పుడు అతడు కనపరచిన అపవాది స్వభావం గురించే చెప్పబడుతుంది తప్ప, అతను ఎవరికి పుట్టాడు అనేదాని గురించి కాదు. కయీను ఎవరికి పుట్టాడో లేఖనాలు స్పష్టంగా మనకు బోధిస్తున్నాయి. ఇక యేసుక్రీస్తు యూదులను‌ సర్పములారా, సర్ప సంతానమా (మత్తయి 23:33) అన్నప్పుడు అక్కడ కూడా, వారిలో ఉన్న అపవాది స్వభావం గురించే మాట్లాడుతున్నాడు. వాస్తవానికి యూదులు షేతు ద్వారా అబ్రాహాము సంతానం.

ఆదికాండము 4:2
తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను.హేబెలు గొఱ్ఱెల కాపరి; కయీను భూమిని సేద్యపరచువాడు. భూమిమీద వ్యవసాయంతో పాటుగా, మరొకవృత్తి కూడా ఉద్భవించినట్లు ఈ వచనాలలో చూడగలం.

ఈ వచనంలో ఆదాము హవ్వలకు హేబెలు కూడా జన్మించినట్టు, మరియు కయీను హేబెలులు ఏయే వృత్తులు చేసేవారో అది కూడా రాయబడడం మనం చూస్తాం. అంటే ఇక్కడ వ్యవసాయంతో పాటుగా, మరొకవృత్తి కూడా ఉద్భవించింది. ఈవిధంగా బైబిల్ గ్రంథం మానవులు భూమిపైన ఏ విధంగా విస్తరించారో అది మాత్రమే కాకుండా, జీవనోపాధి నిమిత్తం వివిధ వృత్తులు కూడా ఎలా ఉనికిలోకి వచ్చాయో తెలియచేస్తుంది. తరువాత సందర్భాలలో ఈ వివరణ మరింత స్పష్టంగా ఉంటుంది. కాబట్టి మన దేశంలోని ఒక మతసంస్కృతి చెబుతున్నట్టుగా, కొన్ని వృత్తులు శ్రేష్టమైనవి మరికొన్ని వృత్తులు నీచమైనవీ కావు. మానవ జీవనానికి ఉపయోగపడే ప్రతీ (నైతికతకు విరుద్ధంకాని) వృత్తీ శ్రేష్టమైనదే. బైబిల్ గ్రంథం కేవలం ఏ పనీ చెయ్యకుండా ఉండే సోమరితనాన్ని తప్పుపడుతుందే తప్ప, నైతికత పరిథిని దాటని ఏ వృత్తినీ నిషేధించదు, నీచంగా చూడదు (2 థెస్సలోనిక 3:10-12).

ఆదికాండము 4:3
కొంతకాలమైన తరువాత కయీను పొలముపంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను.

ఈ వచనంలో కయీను యెహోవా దేవునికి తన పొలంలోని పంటను అర్పణగా తెచ్చినట్టు మనం చూస్తాం. కానీ దేవుడు ఆ అర్పణను తిరస్కరించినట్టుగా క్రింది వచనాలలో రాయబడింది. కొందరు బోధిస్తున్నట్టుగా దానికి కారణం కయీను శ్రేష్టమైన పంటను తీసుకురాకపోవడం కాదు. అలాగైతే అతను అసలు అర్పణే తెచ్చేవాడు కాదుకదా? మరి దేవుడు ఆ అర్పణను ఎందుకు తిరస్కరించాడంటే, దేవుడు ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వారి పాపప్రాయశ్చిత్తం కోసం బలి అవసరమని తెలియచేసేవిధంగా వారికోసం ఒక జంతువును వధించి దాని చర్మంతో వారికి చొక్కాయిలు చేసిచ్చాడు (ఆదికాండము 3:21). అప్పటినుండి పాపియైన మానవుడు దేవుణ్ణి చేరుకోవాలంటే మొదటిగా తన పాపప్రాయశ్చిత్తం కోసం బలి అర్పించాలనే నియమం ప్రవేశపెట్టబడింది. ఆ వివరణను మనం లేవీకాండములో స్పష్టంగా చదువుతాము.

కానీ ఇక్కడ కయీను తన పాప ప్రాయశ్చిత్తం కోసం ముందుగా బలి అర్పించి, తరువాత తన అర్పణను చెల్లించకుండా, తనకు అందుబాటులో ఉన్న పంటను మాత్రమే తీసుకువచ్చాడు. అతను ఇలా చెయ్యడం ద్వారా, దేవుని‌ ముందు నేను పాపిని కాదని, కాబట్టి నేను నీదగ్గరకు రావాలంటే ముందుగా నాకు పాపప్రాయశ్చిత్తం అవసరం లేదని చెబుతున్నాడు. ఇది దేవుని పట్ల అతనికున్న అవిశ్వాసాన్ని అవిధేయతనూ రుజువు చేస్తుంది.

ఆదికాండము 4:4
హేబెలు కూడ తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్వినవాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్య పెట్టెను.

ఈ వచనంలో హేబెలు దేవుడు నియమించిన క్రమంలో తన మందలోని కొవ్వినవాటిని ఆయనకు అర్పించినట్టు మనం చూస్తాం. కాబట్టి అతను కయీను వలే స్వనీతిని ప్రకటించకుండా, నేను పాపిని అని ఆయనముందు ఒప్పుకుంటున్నాడు. అందుకే దేవుడు అతని అర్పణను లక్ష్యపెట్టాడు. అనగా మిగిలిన కొన్ని సందర్భాలలో జరిగినట్టుగా ఆకాశం నుండి తన అగ్నిని పంపి ఆ బలి మాంసాన్ని దహనబలిగా స్వీకరించియుంటాడు (లేవీకాండము 9:24, 2 దినవృత్తాంతములు 7:1, 1 రాజులు 18:38). కయీకు అర్పణ విషయంలో మాత్రం అలా జరగలేదు.

ఈ సందర్భం మనకు దేవుడు ఒక వ్యక్తిని అంగీకరించాలంటే, ఆ వ్యక్తి దేవుడు నియమించిన క్రమంలోనే భక్తిని‌ కలిగియుండాలని తెలియచేస్తుంది. హేబెలు ఇలాంటి భక్తినీ, పాపాన్ని ఒప్పుకునే స్వభావాన్నీ కలిగియుండడానికి అతనికి దేవునిపై ఉన్న విశ్వాసమే కారణం. అందుకే "విశ్వాసమునుబట్టి హేబెలు కయీనుకంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలనుగూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను" (హెబ్రీ 11: 4) అని రాయబడింది.

ఆదికాండము 4:5
కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా-

ఈ వచనంలో దేవుడు కయీను అర్పణను లక్ష్యపెట్టనట్టు, అందువల్ల అతను కోపం తెచ్చుకుని తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నట్టు మనం చూస్తాం. ఇంతకూ దేవుడు అతని అర్పణను ఎందుకు లక్ష్యపెట్టలేదో పై వచనాల్లో వివరించుకున్నాం. కాబట్టి దేవుడు నియమించిన క్రమానికి వ్యతిరేకంగా కానీ, లేక తనకు తానుగా కల్పించుకున్న పద్ధతుల్లో కానీ ఆయనను సమీపించాలని ప్రయత్నిస్తే అతని జీవితం కయీను అర్పణలానే తిరస్కరించబడక తప్పదని గుర్తుంచుకోవాలి. అంతేకాదు అహరోను కుమారులైన నాదాబు అబీహులు అలా ప్రవర్తించినందుకే ఆయన చేతిలో మరణశిక్షకు కూడా గురయ్యారు.

లేవీయకాండము10:1,2 అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యమువేసి, యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను; వారు యెహోవా సన్నిధిని మృతి బొందిరి.

కాబట్టి పరిశుద్ధుడైన దేవునిపట్ల పతనస్వభావియైన మానవుడు తనకు తానుగా కల్పించుకున్న పద్ధతుల్లో భక్తిని ప్రదర్శించకూడదు. శాస్త్రులూ పరిసయ్యులూ అలా చేస్తున్నందుకే యేసుక్రీస్తు ప్రభువు వారిని "వారు, మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే" (మార్కు 7:7) అని గద్దించాడు.

దీనిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు సంఘంగా మనం‌ చేసే ఆరాధన, మరియు వ్యక్తిగత భక్తి కార్యక్రమాలూ వాక్యప్రకారంగా ఉండేటట్టు జాగ్రతపడాలి. అందుకే పౌలు సంఘాన్ని ఏమని హెచ్చరిస్తున్నాడో చూడండి.

2 థెస్సలొనికయులకు 2:15 కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి మా నోటిమాటవలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను (పారంపర్యములను) చేపట్టుడి.

1 కోరింథీయులకు 4:6
సహోదరులారా, మీరు మమ్మును చూచి, లేఖనముల యందు వ్రాసియున్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని, మీరొకని పక్షమున మరియొకని మీద ఉప్పొంగకుండునట్లు, ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపొల్లో మీదను పెట్టుకొని సాదృశ్యరూపముగా చెప్పియున్నాను.

అదేవిధంగా కయీను, దేవుడు తన అర్పణను లక్ష్యపెట్టకపోవడానికి తన అవిశ్వాసమే కారణమని గ్రహించకుండా, కోపంతో తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నట్టు మనం చూస్తాం. ఇది అతనిలోని పతనస్వభావాన్ని రుజువుచేస్తుంది, ఎందుకంటే పతన స్వభావియైన మనిషి తన పొరపాటును గుర్తించి ఒప్పుకోడు కానీ, దానివల్ల అతనికి ఎదురయ్యే పరిణామాలను బట్టి కోపాన్ని మాత్రం బయటపెడుతుంటాడు. దీనివల్ల దేవునిముందు అతనికే నష్టం వాటిల్లుతుంది.

ఆదికాండము 4:6,7
యెహోవా కయీనుతో నీకు కోపమేల? ముఖము చిన్నబుచ్చుకొనియున్నావేమి? నీవు సత్క్రియ చేసినయెడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయనియెడల వాకిట పాపము పొంచియుండును; నీయెడల దానికి వాంఛ కలుగును నీవు దానిని ఏలుదువనెను.

ఈ వచనాలలో దేవుడు కోపంతో తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్న కయీనుతో మాట్లాడడం మనం చూస్తాం. ఈ మాటలు కయీనును తన అవిశ్వాసం విషయంలో సరిచేసుకోమని బోధిస్తున్నాయి. అందుకే ఆయన నీవు సత్క్రియ చేస్తే తల ఎత్తుకోవా? కాబట్టి ఆ సత్క్రియను చెయ్యమని (బలి అర్పించమని) ప్రేరేపిస్తున్నాడు. ఒకవేళ కయీను కానీ, మరెవరైనా కానీ దేవుడు సత్క్రియ చెయ్యడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మార్పు చెందకపోతే, ఇక్కడ దేవుడు చెబుతున్నట్టుగా వారి వాకిట పాపం పొంచియుంటుంది. దానికి వారిపై వాంఛకలిగి వారిని ఇంకా ఘోరపాపులుగా చేస్తుంది. అప్పుడు వారు ఒక భర్త తన భార్యను ఏలేటట్టు అనగా ఆమెకు భర్తగా కాపురం చేస్తున్నట్టు ఆ పాపంతో ఏకమై చివరికి నాశనానికి గురౌతారు.

ఆదికాండము 4:8
కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను.

ఈ వచనంలో కయీను దేవుడు బోధించినట్టుగా, హెచ్చరించినట్టుగా తన అవిశ్వాసాన్ని సరిచేసుకోకుండా, ఆయన హేబెలు బలిని అంగీకరించాడనే అక్కసుతో అతనిని చంపివేసినట్టు మనం చూస్తాం.‌ ఇక్కడ ఆదాము హవ్వలను మోసపుచ్చి వారి ఆత్మీయ మరియు శారీరక మరణాలకు‌ కూడా కారణమైన అపవాది స్వభావం (యోహాను 8: 44) కయీనులో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే "మనము కయీను వంటివారమై యుండరాదు. వాడు దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను; వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతిగలవియునై యుండెను గనుకనే గదా?" (1 యోహాను 3:12) అని రాయబడింది.

అయితే మనకు ఇక్కడ కయీనుకు హేబెలును చంపడం ఎలా తెలిసింది అనే ప్రశ్న రావొచ్చు. ఎందుకంటే; దీనికంటే ముందుగా ఏ మనిషీ మరో మనిషిని హత్యచెయ్యడం జరగలేదు. కానీ ఆదాము హేబెలులు దేవునికి బలులు అర్పిస్తున్నప్పుడు వాటిని ఎలా చంపుతారో అతనికి తెలుసు, అలానే వారు కూడా కొన్నిటిని చంపి ఆహారంగా వండి తింటారుగా దానిని బట్టే కయీను హేబెలును చంపియుండవచ్చు (అదేంటి? జలప్రళయం తరువాత కదా మనుషులు మాంసాహారం తినడం ప్రారంభించారు అనే ప్రశ్నకు అక్కడ సమాధానం చెబుతాను, ఆ బోధ తప్పు).

ఆదికాండము 4:9
యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీనునడుగగా అతడు నేనెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా అనెను.

ఈ వచనంలో దేవుడు కయీనును హేబెలు నిమిత్తం ప్రశ్నించడం, దానికి కయీను అగౌరవంగా ఆయనకు సమాధానం ఇవ్వడం మనం చూస్తాం. నిజానికి దేవునికి కయీను చేసిన హత్య గురించి తెలియక ఇలా ప్రశ్నించడం లేదు కానీ అతనికి తీర్పు తీర్చడానికే ప్రశ్నిస్తున్నాడు. ఆ క్రమంలో అతని మాటలను బట్టే అతని పతనస్వభావాన్ని బహిర్గతం చెయ్యబోతున్నాడు. ఇది ఆయన హేబెలు ప్రాణం గురించి చేస్తున్న విచారణ.

ఆదికాండము‌ 9:5 ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును.

అదేవిధంగా, ఆత్మీయంగా చనిపోయిన మనిషి దేవునియొక్క శక్తిని గుర్తించి ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేడని ఈ సందర్భం మనకు తెలియచేస్తుంది. ఇక్కడ కయీను దేవునికి తన సృష్టిలో జరిగే సమస్తమూ (తాను చేసిన హత్య కూడా) తెలుసనే కనీస అవగాహన కూడా లేకుండా (కీర్తనలు 139:7-12) "నేను ఎరుగను" అని మాట్లాడుతున్నాడు. 

కీర్తనల గ్రంథము 73:11,12 దేవుడు ఎట్లు తెలిసికొనును మహోన్నతునికి తెలివియున్నదా? అని వారనుకొందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు.

పైగా నా తమ్ముడికి నేను కావలివాడనా అంటూ, ఆయనకు అగౌరవంగా సమాధానం ఇస్తున్నాడు. కానీ, దేవుని కృపచేత తిరిగిజన్మించిన (మారుమనస్సు పొందిన) విశ్వాసులు, తమలోని పతనస్వభావంతో పోరాడుతూ, దేవుని ఔన్నత్యాన్ని గుర్తించి ఆయనకు స్తుతులు చెల్లిస్తారు. ఆయనకు లోబడి జీవిస్తారు. దీనిని మనం బైబిల్ గ్రంథంలోని అనేకమంది భక్తుల జీవితాల్లో చూస్తాం. ఈ అధ్యాయంలో కూడా హేబేలు అదే చేసాడు, హవ్వకూడా అదే చేసింది.

కీర్తనలు 22:25
మహా సమాజములో నిన్నుగూర్చి నేను కీర్తన పాడె దను ఆయనయందు భయభక్తులు గలవారియెదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను.

కీర్తనలు 111:1
యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.

ఆదికాండము 4:10
అప్పుడాయన నీవు చేసినపనియేమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది.

ఈ వచనంలో దేవుడు కయీనును విచారిస్తూ "నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది" అని పలకడం‌ మనం చూస్తాం. అయితే రక్తం అనేది కేవలం మన శరీరంలో ప్రవహించే ప్రాణాధారమైన ద్రవం (fluid) మాత్రమే. అది బయటకు వచ్చినకాసేపటికి అందులోని కణాలు (cells) అన్నీ చనిపోయి పాడైపోతుందే తప్ప దేవునికి మొరపెట్టలేదు‌. మరి దేవుడు ఎందుకిలా మాట్లాడుతున్నాడంటే, కయీను చేసిన ఆ హత్యకు భూమిపై‌ చిందించబడిన హేబెలు రక్తం సాక్ష్యంగా ఉందని ఆ మాటల భావం. ఇలాంటి సాక్ష్యసంబంధమైన అలంకార బాషనే మనం ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం.

ప్రకటన గ్రంథం 18: 24 మరియు ప్రవక్తల యొక్కయు, పరిశుద్ధులయొక్కయు, భూమిమీద వధింపబడిన వారందరియొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెననెను.

హెబ్రీగ్రంథ కర్త కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ "విశ్వాసమును బట్టి హేబెలు కయీనుకంటె శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలనుగూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమునుబట్టి నీతి మంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతినొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు" (హెబ్రీ 11:4) అని రాస్తున్నాడు. అనగా అతని విశ్వాసమే దేవుడు అతని విషయంలో కయీనుకు తీర్పు తీర్చేలా చేసిందని ఈమాటల అర్థం. గమనించండి అన్యాయంగా చిందించబడిన హేబెలు రక్తం దేవుడు కయీనుకు తీర్పుతీర్చేలా చేసింది (మొర్రపెట్టింది). కానీ అంతకంటే అన్యాయంగా చిందించబడిన క్రీస్తు రక్తం దేవుడు మనల్ని కరుణించేలా చేసింది (ప్రకటన 1:6, 5:8-10, 1 పేతురు 1:18,19, రోమా 3:26, 5:9,10, ఎఫెసీ 2:13, కొలస్సీ 1:20, హెబ్రీ 9:11-14). అందుకే "క్రొత్తనిబంధనకు మధ్యవర్తియైన యేసునొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు" (హెబ్రీ 12:24) అని రాయబడింది. ఎందుకంటే ఆయన రక్తం హేబెలు రక్తంలా తీర్పును కాకుండా కృపను కనుపరచింది. మనకు పాపక్షమాపణను అనుగ్రహించింది.

ఆదికాండము 4:11,12
కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోనుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన యీ నేలమీద ఉండకుండ, నీవు శపింపబడినవాడవు; నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు; నీవు భూమిమీద దిగులు పడుచు దేశదిమ్మరివైయుందువనెను.

ఈ వచనాలలో దేవుడు కయీను చేసిన హత్యకై అతనికి తీర్పు తీరుస్తున్నట్టుగా మనం చూస్తాం. దీనిప్రకారం అప్పటికే ఆదాము వల్ల శాపానికి లోనైన ఈ భూమి కయీను సేద్యపరిచేటప్పుడు (తనకు చెందింది) మరింత నిస్సారమౌతుంది. అలానే అతను దిగులుపడుతూ దేశదిమ్మరిగా జీవిస్తాడు. దానిగురించి క్రింది వచనాల్లో చూద్దాం.

ఆదికాండము 4:13
అందుకు కయీను నా దోషశిక్ష నేను భరింపలేనంత గొప్పది.

ఈ వచనంలో కయీను దేవుడు తనకు విధించిన శిక్షను బట్టి వేదనతో ఈ మాటలు పలుకుతున్నట్టు మనం చూస్తాం. ఇక్కడ కూడా అతను అతనికి విధించబడిన శిక్ష గొప్పది అంటున్నాడే తప్ప, తాను చేసిన దోషం మాత్రం గొప్పదని ఒప్పుకోవడం‌ లేదు. ఒకవిధంగా అతను నేను చేసిన నేరానికి ఈ శిక్ష చాలా ఎక్కువ అంటూ మరలా దేవుణ్ణే నిందిస్తున్నాడు. పతనస్వభావపు లక్షణం ఈ విధంగానే ఉంటుంది. ఆ స్వభావంతో నడిపించబడుతున్న మనిషి తాను చేసే దోషాన్ని గొప్పగా భావించడు కానీ, దేవుడు ఆ దోషానికి శిక్ష విధించినప్పుడు మాత్రం కయీనులానే విలపిస్తాడు, ఆయనను నిందిస్తాడు. 

అదే మనం హవ్వను పరిగణలోకి తీసుకుంటే ఆమె మొదటిసారిగా ప్రసవ వేదన అనుభవించి కుమారుడిని కన్నప్పుడు "కయీనులా నా దోషశిక్ష నేను భరించలేంత గొప్పది" అనలేదు. దానికి ప్రతిగా "యెహోవా దయవలన నేనొక మనుష్యుడ్ని సంపాదించుకున్నాను" అంటూ ఆ ప్రవవవేదన సమయంలో తననూ ఆ బిడ్డనూ కాపాడిన దేవుణ్ణి స్తుతించింది. ప్రసవ వేదన అంటే అది మామూలు విషయం కాదు, మిగిలిన సమయంలో మనుషులు అంతకంటే తక్కువబాధకే చనిపోతారు. కానీ హవ్వ అంతటి బాధను భరించి కూడా దానిగురించి ఏమీ మాట్లాడడం లేదు. ఎందుకంటే ఆమె తన పాపానికి దేవుడు విధించిన ఆ శిక్ష న్యాయమని ఒప్పుకుంటూ, ఆయన న్యాయానికి తలవంచింది. కారణం: ఆమె ఆ సమయానికి మారుమనస్సు పొందింది, ఆత్మీయంగా తిరిగి బ్రతికించబడి దేవుణ్ణి సేవిస్తుంది. కాబట్టి మారుమనస్సు పొందిన విశ్వాసుల‌ వైఖరి విశ్వాసుల ఇలా హవ్వను పోలే ఉంటుంది. దేవుడు తమ పాపాల విషయంలో తమను క్రమశిక్షణ చేసినప్పుడు అది బాధాకరంగా ఉన్నా సరే వారు దానికి లోబడతారు.

ఉదాహరణకు; దావీదు "గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీ దండమున నన్ను ఆదరించును" (కీర్తనలు 23: 4) అని పాడుతున్నాడు. ఆ మాటలను మనం సందర్భానుసారంగా అర్థం చేసుకుంటే అతను అక్కడ తన దేవుడైన యెహోవాను అతని కాపరిగానూ, తనను‌ తాను ఆయన మేపే గొర్రెగానూ పోల్చుకుంటున్నాడు. ఆ క్రమంలో గొర్రెలను కాచే కాపరిచేతిలో ఉండే కఱ్ఱను దృష్టిలో పెట్టుకుని తన కాపరియైన దేవుని దుడ్డుకఱ్ఱ, దండం తనను ఆదరిస్తుంద‌ని పలుకుతున్నాడు. వాస్తవానికి దుడ్డుకఱ్ఱ, దండం రెండూకూడా ఒకే చేతికఱ్ఱ. మరెందుకని దావీదు ఒకేచేతి కఱ్ఱను రెండువిధాలుగా వర్ణిస్తున్నాడో మనం గ్రహించాలంటే, కాపరి ఆ చేతి కఱ్ఱతో చేసేపనులను మనం గుర్తించాలి.

కాపరి రెండు ఉద్దేశాలతో తనచేతిలో ఆ కఱ్ఱను కలిగుంటాడు.
1 తనమందపై ఏదైనా జంతువు దాడికి ప్రయత్నించినప్పుడు దానితో ఎదుర్కొని మందను రక్షించడానికి.
2 మందలో ఏదైనా మార్గాన్ని విడిచిపక్కకు వెళ్తున్నప్పుడు దానితో బెదరించి/కొట్టి సరైనదారిలో నడిపించడానికి.‌ ఈవిధంగా ఆ కఱ్ఱ మందను కౄరజంతువుల నుండి కాపాడేటప్పుడు దుడ్డుకఱ్ఱగా పనిచేస్తే, మందలోనిది దారితప్పుతున్నపుడు శిక్షించి సరైనమార్గంలో నడిపే దండంగా కూడా అది పనిచేస్తుంది.

దీనిని బట్టి,
భక్తుడైన దావీదు దేవుణ్ణి ఆపాయంలో తనను రక్షించమనే కాదు, దారితప్పుతున్న సమయంలో శిక్షించి సరిచేయమని కూడా విన్నవించుకుంటూ తన యధార్థమైన భక్తిని కనుపరచుకుంటున్నాడు.

కీర్తనలు 139: 24 నీకాయాసకరమైన మార్గము నాయందున్న దేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము.

కీర్తనలు 119:67 శ్రమకలుగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొను చున్నాను.

ఇశ్రాయేలీయులు ఇలా ఆయన శిక్షకు లోబడలేదు కాబట్టే ఆయన "గనుక నీవు వారితో ఈలాగు చెప్పుము వీరు తమ దేవుడైన యెహోవా మాట విననివారు, శిక్షకు లోబడనొల్లనివారు, కాబట్టి నమ్మకము వారిలోనుండి తొలగిపోయియున్నది, అది వారి నోట నుండకుండ కొట్టి వేయబడియున్నది. తనకు కోపము తెప్పించు తరమువారిని యెహోవా విసర్జించి వెళ్లగొట్టుచున్నాడు" (యిర్మీయా‌ 7:28,29) "అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవాయందు విశ్వాసముంచదు, దాని దేవునియొద్దకు రాదు" (జెఫన్యా 3: 2) అని అసహ్యించుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన శిక్షకు లోబడకపోవడం అనేది వారు ఆయన పిల్లలు కాదు అనడానికి ఒక రుజువుగా ఉంది.

హెబ్రీయులకు 12:5-8,11 మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాంషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు; దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్బీజులేగాని కుమారులు కారు.

ఆదికాండము 4:14
నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్లగొట్టితివి; నీ సన్నిధికి రాకుండ వెలివేయబడి దిగులుపడుచు భూమిమీద దేశదిమ్మరినైయుందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను.

ఈ వచనంలో కయీను పలుకుతున్న మాటలను బట్టి గత వచనంలో అతను నా దోషశిక్ష గొప్పదని ఎందుకు విలపించాడో మనకు అర్థమౌతుంది.  ఆదాము హవ్వలు దేవుని దృష్టికి పాపులుగా మారినప్పడు ఆయన వారికి శిక్ష విధించినప్పటికీ, వారికి తన సన్నిధిని పూర్తిగా దూరం చెయ్యలేదు (వెలివెయ్యలేదు). అందుకే వారి సిగ్గును కప్పడానికి ఒక జంతువును‌ చంపి, బలిద్వారా వారి పాపాలను పరిహరించే నియమాన్ని ప్రవేశపెట్టాడు. కాబట్టే ఆదాము హవ్వలు ఏదెను నుండి గెంటివెయ్యబడి, దేవునితో‌ ముఖాముఖి సహవాసానికి దూరమైనప్పటికీ వారు ఇంకా ఆయన సన్నిధిని అనుభవిస్తున్నారు (ఆయన పిల్లలుగా జీవిస్తున్నారు). బలులు అర్పిస్తున్నారు.

కానీ కయీనుకు దేవుడిచ్చిన శాపం ప్రకారం అతను దేవుని సన్నిధికి ఎప్పటికీ చేరుకోలేడు (అర్పణలు అర్పించలేడు). ఎందుకంటే అప్పటినుండి దేవునితో అతనికున్న సంబంధం తెగిపోయింది (వెలివెయ్యబడ్డాడు). ఈ కారణం చేత విశ్వాసులకు ఆయనలో ఉండే గమ్యం కయీనుకు ఉండదు. ఆ పరిస్థితినే దేశదిమ్మరిగా మారడమని మనం గుర్తించాలి. ఇక్కడ దేశదిమ్మరి అంటే మనం ఈవిధంగానే అర్థం చేసుకోవాలి తప్ప, ఒక స్థిరమైన నివాసం లేనివాడని కాదు. ఎందుకంటే ఈ క్రిందివచనాలలో కయీను ఒక ప్రాంతం (నోదు) లో స్థిరపడినట్టు మనకు కనిపిస్తుంది. ఆవిధంగా కయీను ఇకపై తనకు దేవునినుండి గతంలో వచ్చినట్టుగా ఏ సహాయం రాదని భావించి తన దోషశిక్ష గొప్పదని పలికాడు.

పైగా తాను చేసిన హత్యను బట్టి,‌ ఆదాము సంతానంలోని మిగిలినవారు ఎవరైనా తనను చంపుతారనే భయం కూడా అతనిలో‌ ఉంది. దీని ఆధారంగా కొందరు ఆదాము హవ్వలకు అప్పటికి కయీను హేబెలులే కాకుండా ఇంకా సంతానం ఉంద‌ని భావిస్తుంటారు కానీ, అతను భవిష్యత్తులో పుట్టబోయేవారికోసం కూడా అలా పలికియుండవచ్చు కదా!

ఆదికాండము 4:15
అందుకు యెహోవా అతనితోకాబట్టి యెవడైనను కయీనును చంపినయెడల వానికి ప్రతిదండన యేడంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యెహోవ అతనికి ఒక గురుతు వేసెను.

ఈ వచనంలో దేవుడు కయీనును ఎవరూ చంపకుండా ఒక గుర్తును వెయ్యడం మనం చూస్తాం. ఎందుకంటే అతను ఆ దోషశిక్షను భరిస్తూనే బ్రతకాలి. ఇంతకూ ఆయన కయీనుకు వేసిన ఆ గురుతు ఏంటనే సందేహం మనకు కలుగుతుంది కానీ, అది మనకు వివరించబడలేదు. కానీ కయీనును చూసినప్పుడు అతనిని చంపకూడదని అర్థమయ్యేలా మాత్రం ఆ గురుతు వెయ్యబడింది.

ఆదికాండము 4:16,17
అప్పుడు కయీను యెహోవా సన్నిధిలోనుండి బయలుదేరివెళ్లి ఏదెనుకు తూర్పుదిక్కున నోదు దేశములో కాపురముండెను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టెను.

 ఈ వచనాలలో కయీను యెహోవా సన్నిధినుండి వెళ్ళి నోదు దేశంలో కాపురమునట్టు, తన భార్యతో కలసి ఒక కుమారుడిని కన్నట్టు మనం చూస్తాం. దీనిపై రెండు ఇబ్బందికర అభిప్రాయాలు మన క్రైస్తవ సంఘంలో ఉన్నాయి.

1 భూమిపై ఆదాము హవ్వలే మొదటి మానవులైతే కయీను సమయానికి నోదుదేశం ఎలా వచ్చింది? దీనిప్రకారం ఆదాము హవ్వలకంటే ముందే ఈ భూమిపై మనుషులు ఉన్నారు, కయీను వారి దేశమైన నోదుకు వెళ్ళి వారి అమ్మాయిలలో ఒకదానిని వివాహం చేసుకున్నాడు.

2 కయీను వివాహం చేసుకున్నది ఆదాము హవ్వలకు పుట్టిన తన స్వంత చెల్లినే, ఎందుకంటే ఆదాము నుండే ఈ భూమిపై మనుషులు‌ విస్తరించారు కాబట్టి, ఆమె కూడా తప్పకుండా ఆదాము కుమార్తెనే అయ్యితీరాలి.

1A ఆదికాండము 1:27, 2:7, 22 ప్రకారం దేవుడు చేసిన మొదటి మానవులు ఆదాము హవ్వలే. అపోస్తలుల కార్యములు 17:26, ఆదికాండము 3:20 ప్రకారం ఈ భూమిపై ఉన్న మనుషులంతా ఆదాము హవ్వల సంతానమే. కాబట్టి ఆదాము కంటే ముందే ఈ భూమిపై మనుషులు ఉన్నారని చెప్పడం కేవలం లేఖనసత్యానికి ఎదురుతిరగడ‌ం మాత్రమే. మరి నోదు దేశం ఎలా వచ్చిందంటే, అసలు భూమి దేశాలుగా విభాగించబడిందే పెలెగు కాలంలో (ఆదికాండము 10:25) అలాంటప్పుడు కయీను నోదు దేశానికి వెళ్ళేసరికి అది దేశమూ కాదు, దానికి ఆ పేరూ లేదు. అయితే, మోషే ఆదికాండాన్ని రాసే సమయానికి ఆ ప్రాంతం నోదు దేశంగా పిలవబడుతుంది, అందుకే ఆయన ఆ పేరుతో దానిని ప్రస్తావించాడు. ఇటువంటి సందర్భాలు లేఖనాలలో మనం చాలా చూస్తాం. ఉదాహరణకు ఆదికాండము 2:11 నుండి అతను ఏదెను వివరాలు తెలియచేస్తున్నపుడు కొన్ని దేశాల పేర్లను ప్రస్తావిస్తాడు కానీ అవన్నీ తరువాత ఏర్పడిన దేశాలే. అలానే అతను ఈ అధ్యాయంలో "ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియై కయీనును కని యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను, తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను" (ఆదికాండము 4:1) అని రాస్తున్నాడు. మిగిలిన లేఖనభాగాల్లో  కూడా కొన్నిసార్లు పలానా వారికి పలానా వ్యక్తి పుట్టాడని పేర్లతో సహా రాయబడడం మనం చూస్తాం.‌ అంటే వారు పుట్టడం పుట్టడమే ఆ పేర్లతో పుట్టారు అనా? కాదు కదా!. ఆ పేర్లు వారికి తరువాత పెట్టబడ్డాయి. చరిత్రలో ఆ పేర్లు ఏంటో ఆ గ్రంథకర్తలకు తెలుసు కాబట్టి వారు ఆ పేర్లతోనే వారి జననాలను ప్రస్తావించారు. అలానే ఈ నోదుదేశం పేరు కూడా రాయబడింది.

2A లేఖనాలలో ఎక్కడా కూడా కయీను తన స్వంత చెల్లినే వివాహం చేసుకున్నాడని రాయబడలేదు, అలాంటప్పుడు అతను తప్పకుండా తన చెల్లినే వివాహం చేసుకున్నాడని ఎందుకు భావించాలి?
అయితే‌ ఈ నా వాదనపై కొందరు స్పందిస్తూ "లేఖనాలలో కొన్ని విషయాలు మనకు వివరంగా రాయబడలేదు ఉదాహరణకు, ఆదాము హవ్వలకు చాలామంది పిల్లలు ఉన్నట్టు లేఖనంలో రాయబడింది (ఆదికాండము 5:4) కానీ వారిలో షేతు, కయీనులకు తప్ప మిగిలినవారికి వివాహాలు జరిగినట్టు (సంతానం) రాయబడలేదు. అప్పుడు వారికి వివాహాలు జరిగాయని మనం భావించకూడదా? అని ప్రశ్నించవచ్చు".

ఈ వాదన తర్కబద్ధమే కానీ, నేను కయీను తన చెల్లినే వివాహం చేసుకున్నాడనే బోధను తప్పని చెబుతుంది, లేఖనాలలో అది రాయబడలేదనే కారణంతో మాత్రమే కాదు. అదే నిజమైతే దేవుడు మనముందుంచిన నైతిక ప్రమాణాలపై ఆ ప్రభావం పడుతుంది కాబట్టి, దాని ఆధారంగా లేఖనంలో స్పష్టంగా లేనిదానిని ఎందుకు అలానే నిర్ధారించి బోధిస్తున్నారని ప్రశ్నిస్తున్నాను. గమనించండి. లేఖనాలు ఒక విషయం గురించి వివరంగా చెప్పనప్పటికీ, మిగిలిన సంఘటనల ఆధారంగా దానిని నిర్థారించుకోవచ్చు. ఉదాహరణకు ఆదాము‌ మృతిచెందాడని లేఖనంలో ఉంది కానీ, హవ్వ మృతిచెందినట్టు ఎక్కడా రాయబడలేదు. కానీ, దేవుడు ఆదాము హవ్వలు ఇద్దరికీ చెప్పినమాటలను బట్టి (పండు తింటే చస్తారు) ఆమెకూడా చనిపోయిందని భావించడంలో మనకేం సందేహం లేదు. అయితే లేఖనంలో వివరంగా లేని ఒక విషయం గురించి అటువంటి నిర్థారణకే వచ్చేముందు దానితో మరో లేఖనం విభేదిస్తుంటే మాత్రం అలా చెయ్యకూడదు. పైగా ఇది దేవుని నైతికప్రమాణానికి సంబంధించిన విషయం.

అయితే, లేఖనాలలో వివరంగా లేని ఒక విషయం గురించి అటువంటి నిర్థారణకే వచ్చేముందు దానితో మరో లేఖనం విభేదిస్తుంటే మాత్రం కాస్త ఆలోచించాలి. ఇంతకూ కయీను కానీ, అతని సహోదరులు‌ కానీ తమ స్వంత చెల్లెల్లనే (రక్తసంబంధికులనే) వివాహం చేసుకుంటే దానితో నాకు విభేదిస్తున్నట్టుగా అనిపిస్తున్న లేఖనాలేంటో చూద్దాం.

లేవీయకాండము 18:9,11 నీ సహోదరి మానాచ్ఛాదనమును, అనగా ఇంటిలో పుట్టిన దేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క యైనను నీ తల్లి కుమార్తె యొక్క యైనను మానాచ్ఛాదనమును తీయకూడదు. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి; ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.

మనం చూసిన ఈ లేవీకాండము 18వ అధ్యాయంలో 6వ వచనం నుండి ఏయే వరసల వారిని వివాహం చేసుకోకూడదో తెలుపబడింది, అందులో స్వంత‌ సహోదరి ఒకరు. ఏ దేవుడైతే ఇలాంటి నియమాన్ని తన ప్రజలకు నేర్పించాడో అదే దేవుడు ఒకప్పుడు కయీనుకు కానీ‌ తన సహోదరులకు కానీ తమ‌ తల్లితండ్రులకు పుట్టినవారినే వివాహం చేసుకునేలా అవకాశం కల్పిస్తే, దానికి ఆయనే బాధ్యుడు ఔతాడు కదా!. ఎందుకంటే ఆతరం వారికి వేరే ప్రత్యమ్నాయం లేదు కాబట్టే వారు అలా చేయవలసి వచ్చింది. పైగా వారు ఫలించి అభివృద్ధి చెందాలి అన్నదే ఆయన ప్రణాళిక కూడా.

దీనిపై చాలామంది "మనం చూసిన ఆ మాటలు మోషేధర్మశాస్త్రంలో రాయబడితే అంతకుముందున్న ప్రజలకెలా వర్తిస్తుందనే ప్రశ్నను వేస్తుంటారు". కానీ ఆ అధ్యాయం 24వ వచనం నుండి మనం చదివితే, ధర్మశాస్త్రానికి ముందున్న కనానీయుల ప్రజలు, అటువంటి కార్యాలు చేసినందుకే వారిని నశింపచేస్తున్నట్టు ఆయన తెలియచేస్తాడు. కాబట్టి ఇలాంటి నైతిక విలువలు మోషే ధర్మశాస్త్రానికి ముందులేవని చెప్పడం సాధ్యపడదు. ఉదాహరణకు, నరహత్య చెయ్యకూడదనే నియమం కూడా ఆయన నోవహు కాలంలోనే విధించినట్టు (9:6) కనిపిస్తుంది. కానీ ఈ అధ్యాయంలో నరహత్య చేసిన కయీనును ఆయన ఎలా శిక్షించాడు? ఎందుకంటే నరహత్య చెయ్యకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధం చెప్పకూడదు వంటి నైతికవిలువలు మనిషికి ఆయన ప్రారంభం నుండీ మనసాక్షి ద్వారా బోధిస్తూవచ్చాడు. ఈ అంశం గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

మోషే ధర్మశాస్త్రానికి ముందు నైతిక విలువలు లేవా?

"మరికొందరు అబ్రాహాము కూడా తన చెల్లినే వివాహం చేసుకున్నాడు కదా అని ప్రశ్నిస్తుంటారు". ఒకవేళ అబ్రాహాము కానీ, మరి ఎవరైనా కానీ వరసలు తప్పి వివాహం చేసుకుంటే దానికి వారే బాధ్యులు ఎందుకంటే వారిముందు ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ వారు అలా చేసారు. కానీ, ఆదాము మొదటి సంతానం విషయంలో అలా ఆలోచించలేము. ఎందుకంటే వారికి వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టే వారలా చేయవలసివచ్చింది. దీనికి దేవుడు అనుమతించలేదు అన్నదే నా వాద‌న.

అపోస్తలుల కార్యములు 17:26 ప్రకారం ఒకని (ఆదాము) నుండే ప్రతీజాతి మనుష్యులూ సృష్టించబడ్డారు అనేది వాస్తవం. ఐతే ఆయన ఈ మాటలకు విరుద్ధం కాకుండా, ఆదాము చేసిన పాపంతో సంబంధం లేనట్టు కాకుండా, ఆయన నేర్పించిన నైతికవిలువలకు కూడా భంగం వాటిల్లకుండా ఆదాము సంతానపు మొదటి తరమంతటికీ వేరేలా భాగస్వాములను‌ అనుగ్రహించాడేమో? (క్రింద సూచించిన వ్యాసం చదవండి). ఈ కారణం చేత కయీను తన స్వంత చెల్లినే వివాహం చేసుకున్నాడని మనం భావించకూడదు.

ఇకపోతే, అబ్రాహాము తన స్వంతచెల్లి (తండ్రి కుమార్తె/తల్లికుమార్తె) నే వివాహం చేసుకున్నాడు అనేది వాస్తవం కాదు. అసలు అబ్రాహాముకు స్వంత చెల్లెళ్ళే లేరు. దీనిగురించి ఆ సందర్భంలో వివరంగా చూద్దాం.

మరికొందరు, అప్పుడున్న పరిస్థితిని బట్టి దేవుడు ఆ వివాహాలకు అనుమతించాడు. ఎందుకంటే అప్పటికి ఆదాము హవ్వల పిల్లలు తప్ప వేరే ఎవరూ ఈ భూమిపై లేరుకదా, ఆదాము నుండే ప్రతీజాతి మనుష్యులూ సృష్టించబడాలి అన్నప్పుడు అది తప్పదని భావిస్తుంటారు. పైగా, పాతనిబంధనలో ఆజ్ఞలకూ కొత్త నిబంధనలో ఆజ్ఞలకూ వచ్చిన వ్యత్యాసాన్ని కూడా చూపించి అక్కడ పాపమైనది ఇక్కడెందుకు పాపం‌కాదని ప్రశ్నిస్తుంటారు. వారి ఉద్దేశం ప్రకారం, మొదటిలో ఉన్న పరిస్థితులను బట్టి దేవుడు కొన్ని అనుమతించాడు (రక్తసంబంధికులను వివాహం చేసుకోవచ్చు) కానీ తరువాత పరిస్థితులు‌ చక్కబడి భూమిపై‌ మనుషులు విస్తరించినప్పుడు దానిని రద్దుచేసి పాపంగా చెప్పాడు.

అయితే ఈ వాదన పరిస్థితులను బట్టి దేవుడు నైతికవిలువల విషయంలో‌ రాజీపడతాడా అనే సందేహాన్ని రేకెత్తిస్తుంది. ఎందుకంటే, వీరు చెబుతున్నట్టుగా కొత్తనిబంధనలో కొట్టివెయ్యబడిన పాతనిబంధన ఆజ్ఞలన్నీ విధిరూపకమైనవే (ఆచారాలు, ఆహారం) తప్ప నైతికపరమైనవి కావు. నైతికపరమైన ఆజ్ఞలు ప్రతీకాలంలోనే ఒకేవిధంగా కొనసాగాయి. ఉదాహరణకు వ్యభిచారం, నరహత్య, దొంగతనం, అబద్ధం చెప్పడం ఇవన్నీ అన్ని కాలాలోనూ పాపంగానే ఎంచబడతాయి. వావి వరసలు కూడా ఈ నైతికపరమైన ఆజ్ఞలుగానే లేవీకాండము 18 వ అధ్యాయంలో ప్రస్తావించబడ్డాయి. ఒకవేళ నైతికపరమైన ఆజ్ఞలు కూడా కాలాన్ని బట్టి మారిపోతుంటే, నూతననిబంధనలోని ఆజ్ఞలను మనం అనుసరించవలసిందే అని ఎలా చెప్పగలం?

ఎందుకంటే అప్పటికాలానికీ ఇప్పటికాలానికీ చాలా వ్యత్యాసం ఉందికదా! ఉదాహరణకు, చాలా దేశాల్లో వివాహానికి ముందు డేటింగ్ అనేది సాధారణంగా కొనసాగుతుంది, మన దేశంలో కూడా వివాహానికి ముందు లైంగికసంబంధం నేరం కాదని‌ కోర్టు తీర్పుచెప్పింది. ఒక విశ్వాసిగా నేను దీనిని స్వాగతించగలనా? ఇక్కడ డేటింగ్ కూడా కొందరు కామం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే కాకుండా, వివాహం జరిగిన తరువాత వారు సంతృప్తిగా కలిసి జీవించగలరా లేదా, అనే ముందస్తు ఆలోచనతో కూడా ప్రారంభిస్తున్నారు.

ఇప్పుడున్న పరిస్థితులను బట్టి సామాజిక కోణంలో ఆలోచించినప్పుడు ఇందులో పెద్ద ఇబ్బందేం లేదు. కానీ ఒక విశ్వాసిగా మాత్రం ఇది నాకు ఏ పరిస్థితిలో అయినా ఇబ్బందికరమే. ఎందుకంటే ఏకాలంలో అయినా, దేవుడు బోధించిన నైతికవిలువలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే (వ్యభిచరిస్తే) అది పాపమే ఔతుందని లేఖనాలను‌ బట్టి నేను నమ్ముతున్నాను. కాబట్టి‌ కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి దేవుడు నైతికవిలువల విషయంలో మినహాయింపు కల్పించాడనే వాదన నేను ఎప్పటికీ అంగీకరించను. దీనిగురించి మరింత‌ వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

కయీను తన చెల్లినే వివాహం చేసుకున్నాడా?

ఆదికాండము 4:18
హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లెమెకును కనెను.

ఈ వచనంలో కయీను సంతానం విస్తరిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ హనోకు అంటే, దేవునితో నడచిన హనోకు కాదు, అతని గురించి ఐదవ అధ్యాయంలో చదువుతాం.

ఆదికాండము 4:19
లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసికొనెను; వారిలో ఒకదాని పేరు ఆదా రెండవదాని పేరు సిల్లా.

ఈ వచనంలో కయీను వంశంలోని లెమెకు అనేవాడు మొట్టమొదటిగా ఇద్దరు భార్యలను కలిగియుండడం మనం చూస్తాం.‌ దేవుడైన యెహోవా, ఆదాముకు సాటి అయిన సహాయంగా ఒకే స్త్రీనే చేసివ్వడం ద్వారా, ఆయన ఒక పురుషునికి ఒకే భార్య ఉండాలని నిర్ణయించాడు. దానికి విరుద్ధంగా, ఒకరికంటే ఎక్కువమంది స్త్రీలను వివాహం చేసుకునే సాంప్రదాయం కయీను సంతానంలోనే ప్రారంభమైంది.

ఆదికాండము 4:20-22
ఆదా యాబాలును కనెను. అతడు పశువులుగలవాడై గుడారములలో నివసించువారికి మూలపురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయువారికందరికిని మూలపురుషుడు. మరియు సిల్లా తూబల్కయీనును కనెను. అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు. తూబల్కయీను సహోదరి పేరు నయమా.

మన శాస్త్ర ప్రపంచం మానవుడు నాగరికునిగా అభివృద్ధి చెందడానికి ఎన్నోవేల సంవత్సరాలు పట్టిందనీ, ఆ కాలాన్ని వివిధ యుగాలుగా విడదీసి వివరించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా నోవహు జళప్రళయానికి ముందే, అంటే సుమారు ఆదాము నుండి 1556 సంవత్సరాల కాలంలోపే మానవులు నాగరికులుగా అభివృద్ధి చెందారని, భూమి నుండి ఇనుమును, రాగిని సైతం వెలికితీసి ఉపకరణాలుగా మార్చే వివిధవృత్తులును వారు కలిగియున్నారని ఈ వచనాలు మనకు తెలియచేస్తున్నాయి.

ఆదికాండము 4:23,24
లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా, నా పలుకు వినుడి లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి నన్నుగాయపరచినందుకై ఒక మనుష్యుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతి దండన కయీను కోసము, వచ్చిన యెడల లెమెకు కోసము డెబ్బది యేడంతలు వచ్చుననెను.

ఈ వచనాలలో మొదటిసారిగా ఒకరికంటే ఎక్కువ స్త్రీలను పెళ్లిచేసుకున్న లెమెకు తన పితరుడైన కయీనులా నరహంతకుడిగా కూడా మారినట్టు మనం చూస్తాం.‌ అతన్ని గాయపరచిన పడుచువాడు ఎవరు? ఎందుచేత ఆ పడుచువాడు ఇతన్ని గాయపరిచాడనే వివరణ ఈ వచనాలు తెలియచేయనప్పటికీ, లెమెకు మాటల్లో తాను చేసిన హత్య విషయమై ఒకరకమైన అతిశయం మనకు కనిపిస్తుంది. తన పితరుడైన కయీను అన్యాయంగా హేబెలును చంపితేనే అతన్ని చంపినవాడికి ఏడంతలు ప్రతిదండన కలుగుతుందని దేవుడు నియమిస్తే, తనను గాయపరచిన కారణంతోనే అతను హత్య చేశాడు కనుక అతన్ని ఎవరైనా చంపితే వారికి డెబ్బదింతలు ప్రతిదండన కలుగుతుందని తనకు తానే ప్రకటించుకుంటున్నాడు. ఒకవిధంగా‌ హంతకులకు దేవుడు అనుకూలంగా రక్షణ కల్పిస్తున్నాడు అనేది ఇతని దుష్టహృదయపు ఉద్దేశం.

ఆదికాండము 4:25
ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించెనను కొని అతనికి షేతు అను పేరు పెట్టెను.

ఈ వచనంలో దేవునికి ఇష్టుడైన హేబెలుకు ప్రతిగా‌ ఆదాము హవ్వలకు షేతు జన్మించినట్టు మనం చూస్తాం. హెబేలుకు ప్రతిగా షేతు జన్మించాడన్నప్పుడు ఆదాము హవ్వలకు హేబెలు లోటుతీరుతుందనే కాకుండా, అతని విశ్వాసం కూడా ఇతడివల్ల కొనసాగుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఇతని వంశావళిని మనం పరిశీలించినప్పుడు హనోకు, నోవహు, అబ్రాహాము వీరంతా ఇతనినుండి వచ్చినవారే. అందులోనుండే మెస్సీయ (యేసుక్రీస్తు) ఈ భూమిపై జన్మించారు‌ (లూకా 3:23-38). 

ఆదికాండము 4:26
మరియు షేతునకు కూడ కుమారుడు పుట్టెను; అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది.

దీనికి పైవచనాల్లో కయీను అతని సంతానం పతనస్వభావంలో (ఆత్మీయ మరణంలో) దైవవిరుద్ధమైన కార్యాలు చేస్తూ ఉంటే, ఈ వచనంలో హేబెలుకు ప్రతిగా పుట్టిన షేతు యొక్క సంతానం హేబేలు వలే విశ్వాసం ద్వారా ఆత్మీయమరణపు స్థితి నుండి బ్రతికించబడి దేవుడు నియమించిన మార్గంలో జీవించే ప్రయత్నం చేస్తున్నట్టు మనం చూస్తాం. కాబట్టి ఆదాము తరువాత ప్రతీమనిషి ఆత్మీయ మరణంలోనే పుడుతున్నాడు. ఏర్పరచబడిన భక్తులు మాత్రం మరలా ఆత్మీయంగా బ్రతికించబడి అనగా మారుమనస్సు పొంది దేవునికి ఇష్టులుగా జీవిస్తున్నారు. ఆ క్రమంలోనే తిరిగి జన్మించబడిన ఎనోషను యెహోవా నామమున ప్రార్థన చెయ్యడం ప్రారంభించాడు.

దానియేలు 12:10
అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులును నిర్మలులును అగుదురు. దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు.

ఈ వ్యాసం కూడా చదవండి.

రక్షణ యెహోవాదే

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.