గ్రంథపరిచయం;1:1, 1:2, 1:3 , 1:4 , 1:5 , 1:6-8 , 1:9-10 , 1:11-13 , 1:14-19 , 1:20-23 , 1:24-25 , 1:26 , 1:27 , 1:28 , 1:29-31
గ్రంథపరిచయం
ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనంలోని హీబ్రూపదమైన בְּרֵאשִׁית (bereshit) కు ఆది లేదా ప్రారంభం అనే అర్థం వస్తుంది. ఆ పదం ఆధారంగానే ఈ గ్రంథానికి ఆదికాండము అనే పేరు వచ్చింది, కాండము అనగా గ్రంథం అని అర్థం. ఈవిధంగా ఈ గ్రంథంలో అన్నిటి ప్రారంభాన్నీ మనం చూడగలుతాం. భూమ్యాకాశముల ప్రారంభం (1:1), జీవం యొక్క ప్రారంభం (1:20), మానవుడి యొక్క ప్రారంభం (1:26), ఆరాధన, దేవునితో సహవాసం యొక్క ప్రారంభం (2:19), వివాహం యొక్క ప్రారంభం (2:21), మానవుడి పతన, మరణాలు ప్రారంభం (3:17). వివిధ వృత్తులయొక్క ప్రారంభం (4:2,21), భాషల యొక్క ప్రారంభం (11:8), అబ్రాహాము సంతానం ద్వారా ఈలోకంలో మెస్సీయ జన్మించాలనే ప్రవచనం యొక్క ప్రారంభం (12:3), ఇలా ఈ గ్రంథంలో అనేకమైన ప్రారంభాలు మనకు కనిపిస్తుంటాయి.
ప్రాచీన యూదుల మరియు యేసుక్రీస్తు, అపోస్తలుల అంగీకారం ప్రకారం ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండాలను మోషే పరిశుద్ధాత్మ ప్రేరణతో రచించాడు (మార్కు 12:26, యోహాను 1:17, 5:46, 7:19, 7:23, ఆపో.కార్యములు 7:37,38, 13:39, 15:1, 28:23). వీటిని యూదులు తోరా అని పిలుస్తారు. ఈ పుస్తకాలను గురించి కొన్ని సందర్భాలలో, ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం, మోషే అని కూడా రాయబడింది (2 కొరింథీ 3:16 English version, అపో.కార్యములు 21:21, 24:14, లూకా 24:44).
ఆదికాండము 1:1 ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృష్టించెను.
బైబిల్ గ్రంథం ప్రారంభ వచనంలోనే దేవుడు ఉన్నాడనీ ఆయన ఈ సమస్త సృష్టినీ తన ప్రణాళిక చొప్పున క్రమబద్ధంగా సృష్టించాడనీ తెలుపబడింది. ఈ వాక్యభాగం పైన ఎన్నో సిద్ధాంతాలు ఆధారపడి ఉన్నాయి.
1. ఆదియందు దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు లేడనే నాస్తిక మతానికి ఇక్కడ స్థానంలేదు. దేవుడు ఉన్నాడు.
2. ఆదియందు దేవుడు ఉన్నాడు కాబట్టి అనేక దైవాలను నమ్మే బహుదేవతారాధన మతాలకు ఇక్కడ స్థానం లేదు. దేవుడు ఒక్కడే.
3. ఆదియందు దేవుడు సృజించాడు కాబట్టి అన్నిటికీ అదృష్టమే ప్రధానం అనే కర్మసిద్ధాంతాన్ని నమ్మడానికి వీలు లేదు, దేవుని చిత్తప్రకారమే అంతా జరుగుతుంది.
4. దేవుడు భూమ్యాకాశాలను సృష్టించాడు కాబట్టి దేవుడు వేరు, జగత్తు వేరు. సర్వం ఈశ్వరుడే అని చెప్పే సర్వేశ్వరవాదానికి ఇక్కడ స్థానం లేదు. దేవుడు ఆత్మ (యోహాను 4:24) ఈ సమస్త సృష్టి దేవుని చేత సృష్టించబడిన పదార్థం మాత్రమే. అందుకే బైబిల్ గ్రంథం సృష్టిలో దేనికైనా దేవుడు అనే హోదాను ఆపాదించి దానిని పూజిస్తే పాపం అని చెబుతుంది (నిర్గమకాండము 20:3).
5. దేవుడు భూమ్యాకాశాలను సృష్టించాడు; కాబట్టి భూమ్యాకాశాలు నిత్యమైనవి కావు, సమస్త సృష్టి దేవుని చిత్తానికీ ఆజ్ఞకు లోబడి పనిచేస్తుంది. దేవుడు మాత్రమే తనకు తానుగా ఉనికిని కలిగి ఉంటాడు.
బైబిల్ గ్రంథంలోని ఈ ప్రారంభవచనం దేవుడు సృష్టిని చేసాడని చెప్పడం మాత్రమే కాదు, ఆ సృష్టిని ఎప్పుడు చేసాడో కూడా తెలియచేస్తుంది. "ఆదియందు" అన్నప్పుడు దేవుడు కాలాన్ని ఉనికిలోనికి తీసుకునివచ్చిన వెంటనే ఈ సమస్త సృష్టిని కూడా క్రమబద్ధంగా సృష్టించడం ప్రారంభించాడు. ఇక్కడ క్రమబద్ధంగా అని అంటున్నాను ఈ మాటలు బాగా గుర్తుంచుకోండి.
అదేవిధంగా బైబిల్ గ్రంథంలోని ఈ ప్రారంభ వచనంలోనే మనకు దేవుని యొక్క గుణలక్షణాలు అర్థమౌతున్నాయి. మిగిలిన లేఖనాలన్నీ వాటికి ముక్తకంఠంతో సాక్ష్యమిస్తున్నాయి. వాటిలో కొన్నిటిని మనం పరిశీలిద్దాం.
1. దేవుడు సృష్టికర్త; సృష్టిలో ఉన్న సమస్తాన్ని ఆయనే కలిగించాడు ఆయన లేకుండా ఏదీ కలుగలేదు (1కోరింథీ 8:6, హెబ్రీ 11:3).
2. దేవుడు సార్వభౌముడు; ఈ సమస్త సృష్టినీ సృష్టించిన దేవుడు దానిని సృష్టించకుండా కూడా ఉండగలడు. అయినప్పటికీ తన నిర్ణయం చొప్పున ఈ సమస్తాన్నీ కేవలం తన మహిమకోసం సృష్టించాడు (కీర్తనలు 19:1, ఎఫెసీ 1:12).
3. దేవుడు కాలాతీతునిగా ఉనికి కలిగి ఉన్నవాడు; కాలాన్ని ఆయనే కలిగించడం ద్వారా ఆయన కాలానికి ముందు నుండీ ఉనికిలో ఉన్నవాడని మనకు అర్థమౌతుంది. కనుకనే బైబిల్ గ్రంథంలో ఈ దేవుడు యెహోవా అనే పేరుతో పరిచయం చెయ్యబడ్డాడు. యెహోవా అనే పేరుకు ఉన్నవాడని అర్థం (నిర్గమకాండము 3:14).
4. దేవుడు సృష్టికి వేరుగా ఉన్నవాడు; సమస్త సృష్టినీ ఆయనే సృష్టించడం వల్ల ఆయన సృష్టికి వేరుగా ప్రత్యేకంగా ఉనికిని కలిగి ఉన్నవాడని మనకు అర్థం ఔతుంది. సాధారణంగా నాస్తికులు సంధించే ఒక ప్రశ్నను ఆలోచిస్తే హాస్యంగా అనిపిస్తుంది. సర్వజగత్తును సృష్టించిన సృష్టికర్త సర్వజగత్తుకు వేరై ప్రత్యేకంగా ఉంటాడని కనీస అవగాహన కలిగిన ఎవరైనా గ్రహించగలరు. కానీ నాస్తికులు ఆ దేవుణ్ణి ఈ సృష్టిలో ఏదో ఒక చోట చూపించమని అడుగుతుంటారు. వారి ప్రశ్నలోనే వారికున్న తర్కలోపం మనకు అర్థం ఔతుంది. అందుకే కీర్తనలు 53:1లో దేవుడు లేడనేవాడు బుద్దిహీనుడని రాయబడింది. ఏదైనా ఒక చిత్రాన్ని గీసిన వ్యక్తి తాను గీసిన చిత్రానికి వేరుగా ఉంటాడు. ఆ చిత్రంలో ఆ వ్యక్తిని చూపించడం అసాధ్యం. అయినప్పటికీ ఆ గీయబడిన చిత్రాన్ని మనం పరిశీలించినపుడు ఆ వ్యక్తి యొక్క లక్షణాలను, దానిని గీయడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని గుర్తించవచ్చు. అలాగే సమస్తాన్ని సృష్టించిన దేవుణ్ణి మనం ఈ సృష్టిలో చూపించలేము కానీ ఆయన చేత సృష్టించబడిన ఈ సృష్టిని మనం పరిశీలించినప్పుడు ఆయన యొక్క లక్షణాలను గుర్తించవచ్చు (రోమా 1:20).
5. దేవుడు సర్వశక్తిమంతుడు; ఆయన సృష్టించిన వాటిలో ఆయనను అధిగమించే శక్తి దేనికీ ఉండదు కనుక ఆయన సర్వశక్తిమంతుడు (నిర్గమకాండము 6:3).
6. దేవుడు సర్వజ్ఞాని; ఆయన సృష్టించినవాటిలో ఆయనకు తెలియనిది ఏదీ ఆయన సృష్టించలేడు కనుక ఆయన సర్వజ్ఞాని (కీర్తనలు 147:56:3, యిర్మియా 10:12).
7. దేవుడు సర్వవ్యాపి; సమస్తాన్ని ఆయనే సృష్టించి నిర్వహించడం వల్ల ఆయనకు ఆయన సృష్టిలో కనిపించనిది, ఆయన ప్రవేశించలేనిది ఏదీ లేదు (కీర్తనలు 139:7-10, హెబ్రీ 4:13).
దేవుడు సర్వవ్యాపి అనంటే సర్వాంతర్యామి అని అర్థం కాదు. దేవుడు సర్వాంతర్యామి అయితే ఈ సృష్టిలోని ప్రతీవస్తువులోనూ ఆయన భాగంగా ఉన్నాడని అర్థం. కానీ బైబిల్ దేవుడు ఈ సృష్టికి వేరుగా ఉన్నాడని మనం చూసాం, అయినప్పటికీ ఆయన ఈ సృష్టిలో తన సన్నిధిని ప్రకాశింపచేసాడు, అవసరమైనప్పుడు ఆ సన్నిధిని ఆ ప్రదేశం నుంచి ఉపసంహరించుకున్నాడు కూడా (నిర్గమకాండము 40:34, 1 సమూయేలు 4:21).
8. దేవుడు సర్వసమృద్ధి గలవాడు; దేవుడు ఈ సృష్టిని చెయ్యకముందు కూడా దేవునిగానే ఉన్నాడు. ఆయన ఈ సృష్టిని చేసింది ఈ సృష్టిపై ఆధారపడడానికో లేక దీనిద్వారా తనకు లేని మహిమను పొందుకోవడానికో కానేకాదు. తనకున్న మహిమను కనపరచడానికే ఆయన ఈ సృష్టిని చేసాడు. సృష్టించబడిన ప్రతీవస్తువూ ఆయన మహిమను కనపరుస్తుంది (కీర్తనలు 19:1, యోబు 26:14).
ఆదికాండము 1:2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.
మొదటి వచనంలో దేవుడు భూమ్యాకాశాలను సృజించినట్టు రాయబడితే ఈ రెండవ వచనంలో ఆ భూమి నిరాకారంగానూ శూన్యంగానూ ఉన్నట్టు, చీకటి అగాధజలాలపైన కమ్మియున్నట్టు రాయబడింది. దీనిపై కొందరు బైబిల్ పండితులు యెషయా 45:18 లోని "ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను" అనే మాటలనూ మరియు యిర్మియా 4:23 లోని "నేను భూమిని చూడగా అది నిరాకారముగానూ శూన్యముగానూ ఉండెను, ఆకాశము తట్టు చూడగా అక్కడ వెలుగు లేకపోయెను" అనే మాటలను కూడా ఆధారం చేసుకుని ప్రారంభంలో దేవుడు ఈ భుమ్యాకాశాలను నివాసయోగ్యంగానే సృష్టించినప్పటికీ పరలోకంలో దేవునిపైన తిరుగుబాటు చేసిన కేరూబు కారణంగా (పడద్రోయబడడం వల్ల) ఈ భూమి శూన్యంగా నిరాకారంగా మారిందని చెబుతుంటారు (యెహెజ్కేలు 28:13-16, ప్రకటన 12:7-9). ఆ వాదన ప్రకారం మొదటి వచనానికీ రెండవ వచనానికీ మధ్య కొన్ని కోట్లసంవత్సరాలు గడచింది. అపవాది కారణంగా పాడైపోయిన భూమినే దేవుడు మరలా ఈ రెండవ వచనం నుండి బాగుచేస్తున్నాడు, దీనినే "గ్యాప్ థియరీ" అంటారు.
అయితే మేము ఈ థియరీతో పూర్తిగా విభేదిస్తున్నాము. ఎందుకంటే;
1. మొదటి దినాన దేవుడు భూమిని సృష్టించాడు కానీ అది ఇంకా నివాసయోగ్యంగా చెయ్యబడలేదు. ఆ పనినే దేవుడు క్రమంగా ఆరు దినాల్లో చేస్తూ వచ్చాడు. భూమిని నివాసయోగ్యంగా తీర్చిదిద్దాడు (ఆదికాండము 2:1,2). ఒక కుమ్మరి ఒక మట్టి ముద్దను తీసుకుని ఒక అందమైన ఆకారంలోకి మలచి, దానిని ఎలా రూపుదిద్దుతాడో అలాగే దేవుడు ఈ భూమిని క్రమక్రమంగా రూపుదిద్దాడు, లేదా నింపాడు.
2. గ్యాప్ థియరీని నమ్మేవారు చూపించే యెషయా గ్రంథంలోని మాటలు, యిర్మియాలోని మాటలు సందర్భానుసారంగా మనం అర్థం చేసుకుంటే అవి ఎంతమాత్రమూ ఆ థియరీకి అనుకూలంగా లేవు.
A. ఆరుదినాల్లో నివాసయోగ్యంగా సృష్టించబడిన భూమి గురించి యెషయా గ్రంథంలో రాయబడింది. మొదటివచనంలో సృష్టించబడిన భూమి గురించి కానే కాదు. ఎందుకంటే ఆ సందర్భంలో నరులు కూడా ఉన్నారు (యెషయా 45:11,12) గ్యాప్ థియరీ ప్రకారం దేవుడు మొదటివచనంలో సృష్టించిన భూమిలో నరులు లేరు కదా!
B. ఇక యిర్మియా గ్రంథంలోని మాటలు ఇశ్రాయేలు దేశానికి రాబోతున్న కీడు గురించి అలంకారంగా చెప్పబడ్డాయి. ఆ సందర్భం చూడండి.
యిర్మీయా 4:20-27 కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది, నా గుడారములును హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలును దోచు కొనబడియున్నవి. నేను ఎన్నాళ్లు ధ్వజమును చూచు చుండవలెను బూరధ్వని నేనెన్నాళ్లు వినుచుండవలెను? నా జనులు అవివేకులు వారు నన్నెరుగరు, వారు మూఢు లైన పిల్లలు వారికి తెలివిలేదు, కీడుచేయుటకు వారికి తెలియును గాని మేలు చేయుటకు వారికి బుద్ది చాలదు. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; ఆకాశముతట్టు చూడగా అచ్చట వెలుగులేకపోయెను. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి కొండలన్నియు కదులుచున్నవి. నేను చూడగా నరుడొకడును లేకపోయెను, ఆకాశపక్షు లన్నియు ఎగిరిపోయియుండెను. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి యెడారి ఆయెను, అందులోని పట్టణములన్నియు యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన యెదుట నుండకుండ పడగొట్టబడియుండెను. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుఈదేశమంతయు పాడగును గాని నిశ్శేషముగా దాని నాశనము చేయను.
"భూమి నిరాకారముగానూ, శూన్యముగానూ ఉండెను, చీకటి అగాధజలములపై కమ్మియుండెను"
ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృష్టించాడు అన్నప్పుడే ఈ సృష్టిలో ఏదైనా ఉనికిలోకి వచ్చింది. చీకటికూడా అప్పుడే సృష్టించబడింది. అయితే కొందరు ఈ అధ్యాయంలో దేవుడు వెలుగును సృష్టించినట్టు రాయబడింది కానీ చీకటిని సృష్టించాడని రాయబడలేదు కాబట్టి చీకటి ముందునుండే ఉనికిలో ఉందని అభిప్రాయపడుతుంటారు. ఒకవేళ దేవుడు చీకటిని సృష్టించనప్పటికీ అది సృష్టిలో ఉన్నట్టైతే ఆ చీకటి స్వయం ఉనికి కలది ( self existent) అని ఒప్పుకోవలసి వస్తుంది. అది అసాధ్యం ఎందుకంటే దేవుడు మాత్రమే తనకు తానుగా ఉనికి కలిగియున్నవాడు. కాబట్టి ఈ సృష్టిలో ఉన్నట్టుగా రెండవ వచనంలో రాయబడిన ప్రతీదీ ఆయన చేత మొదటివచనంలో సృష్టించబడిందే. ఆయన ఈ సృష్టిని చెయ్యకముందు ఏదీ కూడా (అగాధజలాలైనా చీకటైనా) ఉనికిలో లేదు (యెషయా 45:7, సామెతలు 8:24).
బైబిల్ లో కొన్నిసార్లు పాపాన్ని చీకటితో పోల్చినప్పటికీ చీకటిలో మనకేమీ కనిపించదు కాబట్టి, చీకటిలో ప్రయాణిస్తే పడిపోయే అవకాశం ఉంది కాబట్టి, అలా అలంకారంగా పోల్చబడిందే తప్ప మనం రాత్రివేళ చూస్తున్న చీకటి నిజంగా చెడ్డదనే ఉద్దేశంతో కాదు. ఒకవేళ చీకటే చెడ్దదైతే దేవుడు దానిని ఎందుకని సృష్టించాడు? లేక రోజులో సగం అదే ఉండేలా ఎందుకు నియమించాడు? ప్రాముఖ్యంగా 31వ వచనంలో ఆయన చేసింది యావత్తూ మంచిదిగా ఉండెను అన్నప్పుడు ఆ ఆరుదినాలలోనూ వెలుగుతో పాటు చీకటి కూడా ఉంది. దాని ప్రకారం చీకటి కూడా మంచిదే. కొందరు భావిస్తున్నట్టుగా ఈ రెండవ వచనంలోని భూమిపై ఉన్న చీకటి కానీ అగాధజాలాలు కానీ అపవాది కారణంగా వచ్చిన దైవశాప పర్యవసానాలే ఐతే ఆయన ఆరు దినాల్లో సృష్టిని చేస్తున్నప్పుడు వాటిని తొలగించియుండేవాడు కదా!
ఇక భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నదంటే దానికి ఎలాంటి ఆకారమూ లేదని అర్థం కాదు. ఎందుకంటే ఆయన మొదటివచనంలోనే భూమిని సృష్టించాడు. కానీ ఆ భూమి దేవుడు ఆశించినట్టుగా నివాసయోగ్యంగా (పరిపూర్ణ ఆకారంలో) అప్పటికి ఇంకా మరల్చబడలేదు, అది ఆరవరోజుకు మరల్చబడింది (ఆదికాండము 2:1,2). అందుకే గ్రంథకర్త ప్రస్తుతం భూమి నిరాకారంగా ఉందని, ఆ భూమిపై ఎలాంటి జీవరాశులు కానీ వృక్షాలు కానీ లేవు కాబట్టి శూన్యంగా కూడా ఉందని పేర్కొంటున్నాడు. కొందరు దేవుడు తలచుకుంటే ఒక్క క్షణంలో ఈ భూమిని నివాసయోగ్యంగా చెయ్యగలడు కదా అలాంటప్పుడు మొదటిగా దానిని నిరాకారంగా శూన్యంగా ఎందుకు చేసాడని ప్రశ్నిస్తుంటారు. ఆయన ఒక్క క్షణంలో ఈ సృష్టిని చెయ్యశక్తిగలవాడు అయినప్పటికీ ఆయన దానిని అలానే చెయ్యాలా లేక ఎక్కువ సమయంలో చెయ్యాలా అనేది పూర్తిగా ఆయన ఇష్టం. నామట్టుకు నేను ఆయన విశ్రాంతిదినాన్ని ప్రవేశపెట్టేందుకే ఆరుదినాలలో ఈ సృష్టిని చేసాడని విశ్వసిస్తున్నాను.
నిర్గమకాండము 20: 11 ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్ర మించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.
"దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను"
బైబిల్ గ్రంథం దేవుడు ఒకడే అని ఖచ్చితంగా చెబుతూ ఆ దేవుడు అనే హోదాను ముగ్గురు వ్యక్తులకు సమానంగా ఆపాదిస్తుంది. వారే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. దీనిగురించి మరింత వివరంగా తెలుసుకునేందుకు ఈ వ్యాసం చదవండి.
ఈ రెండవ వచనంలో త్రిత్వంలో మూడవ వ్యక్తియైన పరిశుద్ధాత్ముడు దేవునితో కలసి సృష్టిని చెయ్యడంలో పనిచేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. "అల్లాడుచుండెను" అన్నప్పుడు దేవుడు చేస్తున్న సృష్టిని ఆయన భద్రపరుస్తున్నాడని/క్రమంలోకి తీసుకువస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి ఉదాహరణకు ఈ వచనం చూడండి.
ద్వితియోపదేశకాండము 32: 11 పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని "అల్లాడుచు" రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను.
ఒకవేళ ఈ దేవునిఆత్మ మరియు పరిశుద్ధాత్ముడు ఒక్కరేనా అనే సందేహం కలిగితే ఈ లేఖన భాగాలను పరిశీలించండి.
మత్తయి 3:16 యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను.
మార్కు 1:9,10 ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతునుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. వెంటనే ఆయన నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు, పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగివచ్చుటయు చూచెను.
బాప్తీస్మం సమయంలో యేసుక్రీస్తు పైకి వచ్చిన దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఒక్కరే అని ఈ వాక్యభాగాలలో మనకు స్పష్టం చెయ్యబడింది. పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మగానే కాకుండా ప్రభువగు యెహోవా ఆత్మ, క్రీస్తు ఆత్మ, ఆదరణకర్త, సత్యస్వరూపియగు ఆత్మ, కృపకు మూలమగు ఆత్మ, యెహోవా ఆత్మ, యేసు ఆత్మ, ఇలాంటి నామాలతో సంబోధించబడడం మనం చూస్తాం. ఈ అన్ని సందర్భాలలోనూ రాయబడింది త్రిత్వంలో మూడవ వ్యక్తియైన పరిశుద్ధాత్ముని గురించే.
ఈవిధంగా త్రిత్వంలో మూడవ వ్యక్తి అయిన పరిశుద్ధాత్ముడు దేవునితో కలసి సృష్టిని చేసాడు. పరిశుద్ధాత్ముడే కాదు త్రిత్వంలో రెండవ వ్యక్తి అయిన యేసుక్రీస్తు ప్రభువు కూడా దేవునితో కలసి సృష్టిని చెయ్యడంలో సమానంగా పనిచేసారు. సృష్టి చెయ్యబడిందే ఆయన మూలంగా అని బైబిల్ చెబుతుంది (యోహాను 1:3, కొలొస్సీ 1:15-17).
అదేవిధంగా దేవుడు ఈ భూమిని సృష్టిస్తున్నప్పుడు దేవదూతలు కూడా ఆయనతో ఉన్నట్టు మనకు లేఖనాలు తెలియచేస్తున్నాయి (యోబు 38:7). అయితే దేవదూతలు దేవునివలే నిత్యులు కాదు, వారు కూడా ఆయన సృష్టిలో భాగమే (కీర్తనలు 148:1-5). కానీ భూమిని సృష్టిస్తున్నప్పటికే వారున్నారు కాబట్టి, వారి సృష్టి ఈ భూమికంటే ముందుగానే జరిగింది. బహుశా కొంతసేపటి క్రితం. ఎందుకంటే సృష్టించబడిన ఏదైనా ఈ ఆరుదినాల్లోనే సృష్టించబడియుండాలి.
ఆదికాండము 1:3 దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.
ఈ వచనంలో దేవుడు తన వాక్కుతో వెలుగును సృష్టించినట్టు మనం చూస్తాం. క్రైస్తవ్యంలో కొందరు ఈ వచనాలను వేరు వేరు విధాలుగా అపార్థం చేసుకున్నారు; అవేంటో మొదటిగా చూద్దాం.
యోహాను 1:4 ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.
యేసుక్రీస్తు గురించి రాయబడిన ఈ మాటలను కొందరు ఆధారంగా చేసుకుని ఆదికాండం 1:3లో దేవుడు కలిగించిన వెలుగు యేసుక్రీస్తు ప్రభువే అని, ఆయన ద్వారా సృష్టికి వెలుగునివ్వడానికి ముందుగా ఆయన్ని కలిగించాడని చెబుతుంటారు. ఇది పూర్తిగా అసంబద్ధం "కలిగియున్నదేదియు ఆయన (యేసుక్రీస్తు) లేకుండ కలుగలేదు" (యోహాను 1:3) అలాంటప్పుడు దేవుడు వెలుగును చెయ్యడానికి ముందు భూమ్యాకాశములు ఎలా కలిగాయి? కలిగియున్నదేదీ ఆయనలేకుండా కలగనప్పుడు ఆయన లేకుండా ఆయనెలా కలిగాడు. యేసుక్రీస్తు ఒకానొక సమయంలో దేవుని చేత కలిగింపబడినవాడు కాదు, దేవునితోపాటుగా నిత్యత్వంలో ఉనికి కలిగి ఉన్నవాడు. దీనిగురించి మరింత వివరంగా తెలుసుకోడానికి ఈ వ్యాసం చదవండి.
యేసుక్రీస్తు నిత్యుడు కాదా? పరలోకంలో పుట్టినవాడా?
కొందరైతే బైబిల్‌లోని మిగిలిన సందర్భాలలో ఆత్మసంబంధమైన రక్షణను సూచిస్తూ ప్రస్తావించిన వెలుగు, ఆదికాండం 1:3లో చెప్పబడిన వెలుగు ఒకటే అని పొరపడుతుంటారు. ఆదికాండం 1:3లో చెప్పబడిన వెలుగు ప్రకృతిసంబంధమైన వెలుగు. మనం ప్రతీరోజూ ఉదయం నుండి రాత్రి అయ్యేవరకూ అనుభవిస్తున్నటువంటి వెలుగు. యోహాను 1:4లో చెప్పబడుతున్న యేసుక్రీస్తు ద్వారా కలుగుతున్న వెలుగు ఆత్మసంబంధమైన వెలుగు, ఇవి రెండూ ఒకటి కాదు.
ఆదికాండము 1:4 వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను.
ఈ వచనంలో దేవుడు సృష్టించిన వెలుగు మంచిగా ఉన్నట్టు మనం చూస్తాం. సృష్టింపబడింది ఏదైనా అది సృష్టికర్త ఉనికిని చాటేలా ఉంటుంది. సృష్టికర్త తనలో లేనిదేదీ సృష్టిలో చొప్పించలేడు (దీనిగురించి ఈ అధ్యాయపు ముగింపులో విస్తారంగా మాట్లాడతాను).
"వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను"
కేవలం వెలుగు మాత్రమే కాదు కానీ దేవుడు చేసిన ప్రతీదీ ప్రారంభంలో మంచిగానే ఉంది (అదికాండము 1:31). దేవుడు మంచివాడు కనుక ఆయన చేసే ప్రతీదీ మంచిగానే ఉంటుంది (యిర్మియా 33:11, కీర్తనలు 92:14, 1 యోహాను 1: 5). మంచివాడైన దేవుడు సృష్టించిన సమస్తమూ ఆదాము హవ్వలు పాపం చేసేవరకూ మంచిగానే ఉంది. తర్వాత వారి పాపపు పర్యవసానంగానే ఈ లోకంలోకి సమస్తమైన చెడూ ప్రవేశించింది. ఇక్కడ మీకు దేవుడు సృష్టించిన సమస్తమూ మంచిగానే ఉంటే ఆదాము హవ్వలు పాపం చేసేవరకూ లోకంలో ఏ చెడూ లేకపోతే ఆ తర్వాత కూడా చెడు ఎలా సృష్టించబడిందనే సందేహం రావొచ్చు. లోకంలో చెడును ఎవరూ సృష్టించలేదు. దేవుని సృష్టిలో మంచికి పోటీగా ఉన్న చెడును కూడా ఎవరైనా సృష్టించినట్టైతే దేవునితో పాటుగా మరో సృష్టికర్త కూడా ఉన్నాడని మనం ఒప్పుకోవాలి.
మరి చెడు ఈ లోకంలోకి ఎలా ప్రవేశించిందంటే; మనం ఇనుముతో ఏదైన ఒక ఉపకరణాన్ని సృష్టిస్తాము కానీ తుప్పును సృష్టించము. ఇనుము తన స్వభావాన్ని కోల్పోయి తుప్పుగా మారుతుంది. అలాగే దేవుడు సమస్తాన్ని మంచిగా సృష్టించాడు కానీ ఆదాము హవ్వల పాపపు ఫలితంగా సృష్టిలోని మంచి తన స్వభావాన్ని కోల్పోయి చెడుగా మారింది. దీనికి కారణం ఆదిదంపతులు, వారిని ప్రేరేపించిన సాతానుడే.
"దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను"
ఈ సందర్భంలో దేవుడు వెలుగును సృష్టించడానికి ముందు ఉన్న చీకటినీ తర్వాత సృష్టించబడిన వెలుగునూ వాటివాటి సమయంలో భూమిపై ప్రసరించేలా వేరుచేసినట్టు మనం చూస్తాం. ఇదంతా సమస్త సృష్టిలో జరుగుతున్నది కాకుండా నరులకు నివాసయోగ్యంగా తీర్చిదిద్దబడుతున్న భూమిపై మాత్రమే జరుగుతున్న కార్యం. కొందరు దేవుడు వెలుగు చీకట్లను ఏవిధంగా వేరుపరిచాడని ప్రశ్నిస్తుంటారు. ఇది మనుషులు ఎప్పటికీ తెలుసుకోలేరని స్వయంగా దేవుడే సవాల్ విసురుతున్నాడు (యోబు 38:19-24).
ఆదికాండము 1:5 దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.
ఈ వచనంలో దేవుడు తాను సృష్టించిన వెలుగు, చీకట్లకు పేర్లు పెడుతున్నట్టు మనం చూస్తాం. కేవలం పేర్లు పెట్టడం మాత్రమే కాకుండా అవి ఎప్పటికీ అలానే కొనసాగేలా వాటికి కట్టడ (నిబంధన) కూడా చేస్తున్నాడు (యిర్మీయా 33:25,26).
"అస్తమయము ఉదయము కాగా ఒక దినమాయెను"
దేవుడు ఈ భూమిపై వెలుగును ప్రకాశింపచెయ్యడానికంటే ముందు చీకటి ఉంది (సృష్టించబడింది) తర్వాత ఆయన వెలుగును ప్రకాశింపచేసాడు. అందుకే హెబ్రీయుల సంస్కృతిలో వారు రాత్రిని (అస్తమయం) ఉదయాన్ని (పగలు) కలిపి ఒక రోజుగా గుర్తిస్తారు. దేవుడు మొదటి వచనంలో భూమ్యాకాశాలను సృష్టించిన సమయం నుండీ వెలుగును సృష్టించేంతవరకూ దినంలో సగం సమయం చీకటితో (అస్తమయం) గడచింది. వెలుగును సృష్టించాక మిగిలిన సగం దినం గడచింది. ఈ రెండూ కలిపే (అస్తమయం, ఉదయం) ఇక్కడ ఒక దినమని చెప్పబడింది.
అయితే ఈ అధ్యాయం అంతటిలో చెప్పబడుతున్న ఆరు దినాలను కొందరు అవి 24 గంటల వ్యవధి గల దినాలు కావని, ఒక్కో దినం కొన్ని కోట్ల సంవత్సరాలు అని బోధిస్తుంటారు. వారలా భావించడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.
1. ఈ భూమి పుట్టి ఎన్నో కోట్ల సంవత్సరాలు గడచిందని Science ప్రపంచం చెబుతుండడం.
2. దేవుడు నాలుగవ దినాన సూర్యుడిని చేసినట్టుగా ఉంటుంది కాబట్టి, సూర్యుడు లేకుండా మొదటి నాలుగు దినాలు మన దినాలుగా ఎలా ఉంటాయని సందేహించడం.
కానీ ఈ రెండు కారణాలలోనూ ఉన్న లోపాలను మనం సులభంగా గుర్తించవచ్చు. మొదటిగా ఏదైనా ఒక వస్తువు ఎంతకాలం నుండి ఉనికిలో ఉందనేది నిర్థారించడానికి Science "Carbon Dating" పై ఆధారపడుతుంది. ఈరోజు Science ప్రపంచం పలానా వస్తువు ఇన్ని వేల సంవత్సరాల క్రితంది అని చెబుతుందంటే ఆ వస్తువుకు Corbon-14 Isotope పరీక్ష చెయ్యడమే ప్రధానకారణం. Science ప్రపంచం దీనిపై ఆధారపడే ఈ భూమి కోట్ల సంవత్సరాల నుండి ఉనికిలో ఉందని చెబుతుంది. కానీ కొందరు శాస్త్రవేత్తలు వెల్లడించిన నివేదికల ప్రకారం Corbon Dating ద్వారా మూడు వేల సంవత్సరాలను మించి, ఆ వస్తువు ఎంతకాలం ముందటిదో ఖచ్చితంగా చెప్పలేము. మూడు వేల సంవత్సరాలు మాత్రమే ఖచ్చితం, ఆ తర్వాత అంచనా (approximate) మాత్రమే. కాబట్టి భూమి కొన్ని కోట్ల సవత్సరాల నుండే ఉనికిలో ఉందని Science చెప్పిన మాటల ఆధారంగా ఏర్పడిన ఈ అభిప్రాయం సరైనది కాదు. ఒకవేళ Science చెబుతున్నట్టుగా భూమిపుట్టి కొన్ని కోట్ల సంవత్సరాలు గడచిందనేది వాస్తవమే అయినప్పటికీ ఈ అధ్యాయంలో చెప్పబడుతున్న ఆరుదినాలూ సామాన్య దినాలు కావని చెప్పడానికి అవకాశం ఉండదు.
ఎందుకో ఈ ఉదాహరణ చూడండి. దేవుడు ఆదామును సృష్టించిన దినాన అతని శరీరానికి మన శరీరం వలే ప్రారంభ దశ లేదు. మనవలే పసితనం లేదు కానీ తోటను సేద్యపరచి కాపు కాచే యవ్వనుడుగా ఆదాము శరీరం చెయ్యబడింది. ఒకవేళ ఆదాము శల్యాలు కనుక మనకు ఇప్పుడు లభ్యమై, అతను ఎన్ని సంవత్సరాలు జీవించాడో కచ్చితంగా చెప్పగలిగే Science Lab కి ఆ శల్యాలను పంపితే ఆదాము వయస్సు గురించి బైబిల్ చెప్పినదానికీ ఆ Lab నివేదిక చెప్పేదానికీ కచ్చితంగా తేడా వస్తుంది. ఎందుకంటే Lab నివేదిక ఆదాము వయస్సును అతని శరీరప్రారంభ దశనుండీ చెబుతుంది. బైబిల్ ఆదాము వయసును అతను యవ్వనుడుగా దేవునిచేత సృష్టించబడిన దినం నుండే చెబుతుంది. రెండూ వాస్తవాలే.
అలాగే దేవుడు వృక్షాలను కూడా చిన్నచిన్నమొక్కలుగా నాటి పెద్దవిగా సంవత్సరాల పాటుగా ఎదిగేలా చెయ్యలేదు కానీ ఒకేరోజులో వాటిని పెద్దవిగా సృష్టించాడు. వాటివయస్సును తెలుసుకోవాలని కనుక మనం పరీక్షిస్తే వాటి ఫలితాలు ఆ వృక్షాలు విత్తనాలుగా మొక్కలుగా ప్రారంభమై ఎదిగిన స్థితినుండీ వస్తుంది. బైబిల్ ఐతే దేవుడు వాటిని పెద్దపెద్ద వృక్షాలుగా ఒకేరోజులో చేసినట్టుగా చెబుతుంది.
ఈవిధంగా దేవుడు ఈ సమస్త సృష్టినీ ఆరుదినాల్లో అద్భుతంగా సృష్టించి భూమిని నివాసయోగ్యంగా మార్చాడు. ఒకవేళ Science లో భూమి యొక్క, సృష్టి యొక్క వయస్సును కచ్చితంగా చెప్పే సూత్రం (Formula) ఉండి దానిప్రకారం పరీక్ష చెయ్యడం ప్రారంభిస్తే ఈ భూమి మరియు ఈ సమస్త సృష్టీ ప్రారంభం నుండీ సహజంగా ఎంత సమయంలో అభివృద్ది చెందుతూ నివాసయోగ్యంగా వచ్చిందో దానినే తెలియచేస్తుంది. అలా Science భూమి వయస్సు గురించి చెప్పేది నిజమే అయ్యిండి ఈ భూమి వయస్సు కోట్ల సంవత్సరాలే అయినప్పటికీ బైబిల్ దానిని ఆరు రోజుల సృష్టే అన్నప్పుడు ఏ ఇబ్బందీ లేదు కదా.
దేవుడు తన శక్తి చేత ఆరుదినాల్లో ఈ సృష్టిని చెయ్యకుండా ఇది చిన్నచిన్నగా అభివృద్ధి చెందుతూ నివాసయోగ్యంగా మారేలా నియమిస్తే ఈ భూమి అభివృద్ధి చెందడానికి కొన్ని కోట్ల సవత్సరాలే పట్టి ఉండేదేమో. దీని ప్రకారం ఈ భూమి పుట్టి కోట్ల సంవత్సరాలు గడచినప్పటికీ ఈ అధ్యాయంలో చెప్పబడుతున్న ఆరు దినాలు సామాన్య దినాలు కావని చెప్పడం సాధ్యం కాదు. అలాగే Corbon Dating ను ఆధారం చేసుకుని ఈ భూమి పుట్టి కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిందని Science చెబుతుంటే దానిని నమ్మడమూ సరైనది కాదు.
రెండవదిగా సూర్యుడు నాలుగవ దినాన చెయ్యబడినప్పటికీ దేవుడు ప్రారంభ దినంలోనే వెలుగుని చేసి చీకటిని వేరు చేసినట్టు చూడగలం. ఒక దినము గడవడానికి వెలుగు చీకటి (అస్తమయం, ఉదయం) ఉంటే చాలు, సూర్యుడు అవసరం లేదు. సూర్యుని కంటే ముందు దేవుడు వెలుగును చేసాడు కనుక, సూర్యుని కంటే ముందు ఈ భూమిపైకి దేవుడు వేరే విధంగా వెలుగుని ప్రసరింపచేసాడు. ఆ విధంగా ముందటి దినాలలో అస్తమయం, ఉదయం కలిగి మూడు దినాలు గడిచాయి. నాలుగవ దినాన దేవుడు సూర్యుని చేసి భూమిపైన ఆ ప్రక్రియ సూర్యుని ద్వారా కొనసాగేలా నియమించాడు. కాబట్టి ఈ అధ్యాయంలోని ఆరుదినాలు సామాన్య దినాలు కావని చెప్పడానికి ఈ కారణం కూడా సరిపోదు. నిజానికి ఈ అధ్యాయం అంతటిలో చెప్పబడుతున్న దినాలు సామాన్య దినాలే అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఎందుకంటే దేవుడు ఆరవ దినాన మనిషిని సృష్టించాడు (ఆదికాండము1:27) ఆ మనిషి తొమ్మిదివందల ముప్పది యేండ్లు బ్రతికాడని రాయబడింది (ఆదికాండము 5:5). ఒకవేళ ఈ ఆరు దినాలు సామాన్య దినాలు కాకుండా ఒకోదినం కొన్ని కోట్ల సంవత్సరాలే ఐతే ఆదాము ఎన్నికోట్ల సంవత్సరాలు బ్రతికినట్టు రాయబడాలో ఆలోచించండి. అలానే దేవుడు ఆరు దినాలు సృష్టిని చేసి ఏడవ దినాన విశ్రమించి తాను విశ్రమించిన ఆ ఏడవ రోజును విశ్రాంతిదినంగా పాటించాలని ఆజ్ఞాపించాడు (ఆదికాండము 2:2,3, నిర్గమకాండము 20:11). ఇవి సామాన్య దినాలే కాకుంటే ఇశ్రాయేలీయులకు చేసిన ఆ కట్టడకు అర్థం లేదు. కాబట్టి ఈ అధ్యాయంలో చెప్పబడుతున్న దినాలు సామాన్య దినాలుగానే మనం భావించాలి. లేఖనాలలో ఏదో అలంకారంగా రాయబడిందో ఏది అక్షరాలా రాయబడిందో లేఖనాలను బట్టే నిర్ధారించుకోవాలి తప్ప మన ఊహలను బట్టి కాదు, Science ను బట్టి అసలే కాదు.
ఆదికాండము 1:6-8 మరియు దేవుడు జలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను.
రెండవ వచనం ప్రకారం; చీకటి అగాధ "జలములపై" కమ్మియున్నట్టు మనం చూసాం. ప్రారంభంలో సృష్టి మొత్తం జలాలతో నింపబడి ఉంది. ఈ వచనాలలో ఐతే దేవుడు విశాలము కలుగునట్లుగా ఆ జలములను వేరుపరచినట్టు మనం చూస్తాం. దేవుడు ఆనాడు వేరుపరచిన జలాలు నేటికీ ఆకాశానికి పైగా ఉన్నట్టు బైబిల్ చెబుతుంది (కీర్తనలు 148:4).
ఆదికాండము 1:9,10 దేవుడు ఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను.
ఈ వచనాలలో దేవుడు ఆకాశము క్రింద భూమిపై ఉన్న జలాలను ఒకచోట సమకూర్చి ఆరిన నేలగానూ సముద్రంగానూ విభాగించినట్టు మనం చూస్తాం. అంతకుముందు ఈ భూమిమొత్తం జలాలతోనే నిండియుంది (2వ వచనం మరియు 2 పేతురు 3:5). ఇక ఇవే వచనాలలో దేవుడు జలములకు సరిహద్దులను నియమించి వాటికి సముద్రాలని పేరుపెట్టినట్టు కూడా రాయబడింది. దీనికి మిగిలిన లేఖనాలు కూడా సాక్ష్యమిస్తున్నాయి (యోబు 38:8-113:5, యిర్మీయా 5:22).
ఆదికాండము 1:11-13 దేవుడుగడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను.
ఈ వచనాలలో దేవుడు ఈ భూమిపై వృక్షజాలాన్ని సృష్టించినట్టు మనం చూస్తాం. తదుపరి రోజుల్లో సృష్టించబడే జంతువులకూ మానవులకూ ఆహారంగా ఉండడానికే మొదట ఆయన వీటిని సృష్టించాడు. అయితే నాస్తికమతానికి చెందినవారు ఈ సందర్భాన్ని ఎత్తిచూపిస్తూ భూమిపైన వృక్షజాలం జీవించాలంటే సూర్యుని వెలుగు కావాలి. బైబిల్ లో ఆ సూర్యుడు నాలుగవ దినాన సృజించబడినట్టు రాయబడింది. అలాంటప్పుడు మూడవ దినాన దేవుడు సృష్టించిన వృక్షజాలం అంతా సూర్యుడు లేకుండా ఎలా బ్రతికిందంటూ ప్రశ్నిస్తుంటారు. కనీస అవగాహనతో ఈ అధ్యాయం చదివితే ఈ నాస్తిక మతస్తులకు ఈ ప్రశ్న రాకుండును పాపం. ఎందుకంటే ఈ అధ్యాయం ప్రారంభంలోనే దేవుడు వెలుగుని కలిగించినట్టు మనం చూస్తాం. వృక్షజాలం బ్రతకడానికి కావాల్సింది సూర్యుడు కాదు, వెలుగు. ఆ వెలుగు సూర్యుని కంటే ముందు మూడుదినాలు భూమిపైన ప్రసరించింది. తర్వాత దేవుడు అదే వెలుగును అదే వెలుగునుండి వచ్చే వేడిని సూర్యుని ద్వారా భూమిపైన ప్రసరించేలా సూర్యుణ్ణి నియమించాడు. నేను అదే వెలుగు అంటున్నాను, అనగా వేడితో కూడిన వెలుగు అని అర్థం. దీనిగురించి తదుపరి వచనాల్లో మాట్లాడుకుందాం.
ఆదికాండము 1:14-19 దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు, భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమిమీద వెలుగిచ్చుటకును, పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను.
ఈ వచనాలలో దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించినట్టు మనం చూస్తాం. దేవుడు ఈ నాలుగవ దినానికి ముందు మూడు దినాలూ ఆయన కలిగించిన వెలుగునూ దానికి ముందున్న చీకటిని భూమిపైకి క్రమబద్ధంగా ప్రసరించేలా చేసాడు. ఈ నాలుగవ దినంనుండీ సూర్యుని ద్వారా అలాంటి వెలుగే భూమిపైన ప్రసరించేలా చేసి, రాత్రివేళ కటికచీకటి కాకుండా చంద్రుడు, నక్షత్రాలు ప్రకాశించేలా నియమిస్తున్నాడు.
యిర్మీయా 31:35 పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.
ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయం గమనించాలి. ఈ చరిత్ర అంతా సృష్టి ప్రారంభదశ గురించి చెప్పబడుతుంది. అప్పటినుండి దేవుడు అన్నిటినీ క్రమబద్ధకరీస్తూ వచ్చాడు. ఉదాహరణకు ప్రస్తుతం మన భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఒక్క భూమి మాత్రమే కాదు సౌరకుటుంబంలో ఉన్న గ్రహాలన్నీ సూర్యాకర్షణశక్తి వల్ల సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. గ్రహాలు అలా క్రమబద్ధంగా తిరగడానికి సూర్యాకర్షణ శక్తే కారణం. సూర్యుడిని మధ్యలో ఉంచి ఇలాంటి ఒక క్రమాన్ని తీసుకువచ్చిందీ సూర్యుడిలో ఆ ఆకర్షణశక్తిని పెట్టిందీ దేవుడే. సూర్యుడు లేనప్పుడు ఆయన వేరే ఆకర్షణశక్తితో భూమినీ ఇతర గ్రహాలనూ నడిపించాడు. తర్వాత సూర్యుడి ద్వారా అవి నడిపించబడేలా నిర్ణయించి, ఆ సూర్యుడ్ని కలిగించాడు. ఉదాహరణకు "దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమిమీద వెలుగిచ్చుటకును, పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను" అని ఈ నాలుగవ దినం నుండి ఏం జరుగుతుందో రాయబడిందంటే అంతకుముందటి రోజుల్లో ఆ వెలుగూ ఆకర్షణా వేరేలా ఉందనేగా?
ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే ప్రస్తుతమున్న క్రమాన్ని బట్టి, ఆ క్రమం ఏర్పడుతున్ననాటి పరిస్థితిని (ప్రారంభ దశను) ప్రశ్నించకూడదు. ఈ క్రమం సౌరకుటుంబం విషయంలోనే కాదు, మానవనిర్మాణంలో కూడా మనం చూస్తాం. రెండవ అధ్యాయం ప్రకారం ఆయన మొదటి మనిషిని మట్టినుండి చేసాడు, అతని పక్కటెముక ద్వారా స్త్రీని చేసాడు. అప్పటినుండి ఒక క్రమం ఏర్పడి స్త్రీ పురుషుల కలయిక ద్వారా మానవులు జన్మిస్తున్నారు. మనం ఈ క్రమాన్ని ఆధారం చేసుకుని, స్త్రీ పురుషులు కలయిక లేకుండా ఆదాము ఎలా జన్మించాడు, హవ్వ ఎలా జన్మించిందని ప్రశ్నించడం సరికాదు. ఇప్పుడు మనం క్రమబద్ధీకరించబడిన సృష్టిని చూస్తున్నాం. దానికి పరిశీలించే మాట్లాడుతున్నాం. కానీ ఈ రెండు అధ్యాయాలలోనూ ఆ క్రమం లేనప్పటి పరిస్థితిని (ప్రారంభదశ) అనగా దేవుడు ప్రస్తుతమున్న ఈ క్రమాన్ని ఎలా తీసుకువచ్చాడు అనేదానిని మనకు వివరిస్తుంది.
ఇక దేవుడు సూచనలనూ కాలాలనూ దిన సంవత్సరాలను సూచించేలా కూడా ఈ సూర్యచంద్ర నక్షత్రాలను నియమించినట్టు రాయబడింది. అంటే ఈమాటల అర్థం కొన్ని మతాలవారు నమ్ముతున్నట్టుగా మానవుని జీవితాన్ని సూర్యచంద్ర నక్షత్రాలు నిర్దేశిస్తాయని కానీ వాటి ప్రభావం మనపైన ఉంటుందని కానీ కాదు. అప్పటినుండి ఈ సూర్యచంద్ర నక్షత్రాల ద్వారా దినాలూ నెలలూ సంవత్సరాలు గడుస్తాయని, మరియు ఆయన అనుకున్న సమయంలో వాటి ద్వారా మానవజాతికి కొన్ని హెచ్చరికలూ సూచనలు కూడా అవి తెలియచేసేలా నియమించాడని మాత్రమే ఆ మాటల అర్థం.
ఇవే వచనాలలో దేవుడు సూర్యున్ని పెద్దజ్యోతిగా వర్ణించడం జరిగింది. దీనర్థం నక్షత్రాలన్నిటిలోకీ సూర్యుడు పెద్దవాడని కాదు కానీ భూమిపైకి ఆ సూర్యుడు కనిపించే కోణం, భూమికీ ఆ సూర్యుడికీ ఉన్న సంబంధం గురించి ఈ విధంగా రాయబడింది. ఇలాంటి సందర్భాలు బైబిల్ లో మనకు చాలా కనిపిస్తాయి. దీనిని ఫినామినల్ లాజిక్ అంటారు. అనగా కంటికి కనిపించేది కనిపించినట్టు వర్ణించేదానిని ఈ విధంగా పిలుస్తారు. అయితే ఇదే సూర్యుని గురించిన సందర్భంలో చంద్రుడ్ని రాత్రిని ఏలే చిన్న జ్యోతిగా వర్ణించి ఈ సూర్యచంద్రులకు వేరుగా నక్షత్రాల గురించి ప్రస్తావించడం జరిగింది. నక్షత్రాలను మాత్రం అక్కడ చిన్న జ్యోతులుగా ప్రస్తావించలేదు. ఎందుకంటే నక్షత్రాలలో మన సూర్యుని కంటే ఎన్నో లక్షలరెట్లు పెద్దవి కూడా ఉన్నాయి. అందుకే మనకు చంద్రుడి కంటే ఇంకా చిన్నగా కనిపించే నక్షత్రాల గురించి చిన్న జ్యోతులు అనే ప్రస్తావన ఇక్కడ చెయ్యబడలేదు. అంతమాత్రమే కాకుండా ఈ సూర్యచంద్ర నక్షత్రాలలోనూ వాటినుంచి ప్రసరించబడే వెలుగులోనూ ఒకదానితో మరొకదానికి బేధం ఉంటుందని కూడా బైబిల్ చెబుతుంది (1 కోరింథీ 15:4).
(ఈ సృష్టి మానవుడి కోసమే ఐతే భూగ్రహానికే పరిమితమైన మానవుడి కోసం ఇన్ని కోట్ల నక్షత్రాలూ పాలపుంతలూ ఇవన్నీ ఎందుకు అనే ప్రశ్నకు ఈ అధ్యాయపు చివరిలో సమాధానం ఇచ్చాను)
ఆదికాండము 1:20-23 దేవుడు జీవము కలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యమును, జీవము కలిగి చలించువాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా అయిదవ దినమాయెను.
ఈ వచనాలలో దేవుడు సముద్ర జీవులనూ ఆకాశపక్షులనూ సృష్టించినట్టు మనం చూస్తాం.
కొందరు ఈ వచనాలను సందర్భానుసారంగా అర్థం చేసుకోలేక బైబిల్ గ్రంథం పక్షులు కూడా సముద్రంలోనే పుట్టాయని చెబుతుందని ఆక్షేపిస్తారు. కానీ ఈ వచనాలలో మొదటిగా జీవం కలిగి చలించువాటన్నిటినీ అన్నప్పుడు సముద్రంలోని జీవరాశుల గురించి చెప్పబడుతుంది. తర్వాత ఆకాశంలో సంచరించే పక్షులను గురించి రాయబడింది. అవి సముద్రంలో కాదు నేలనుండే నిర్మించబడ్దాయి (ఆదికాండము 2:19).
ఇక దేవుడు సముద్రంలోని జీవరాశులనూ ఆకాశంలోని పక్షిజాతులనూ ఫలించి అభివృద్ధి పొందమని దీవించడం మనం చూస్తున్నాం. ఆ దీవెనకారణంగానే నేటికీ వాటి ఉనికిని మనం చూడగలుగుతున్నాం. కోటానుకోట్ల మందికి అవి ఆహారంగా మారుతున్నప్పటికీ వాటి మనుగడ కొనసాగుతూనే ఉంది.
ఆదికాండము 1:24,25 దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను; ఆప్రకారమాయెను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను.
ముందటి వచనాలలో అనగా ఐదవదినాన సముద్ర జీవరాశుల పుట్టుక, ఆకాశ పక్షుల పుట్టుకల గురించి రాయబడితే ఈ వచనాలలో అనగా ఆరవదినాన భూమిపై సంచరించే జీవరాశులు సృష్టించబడినట్టు చదువుతున్నాం.
"అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను"
ఆదికాండము 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.
ఈ వచనంలో అనగా అదే ఆరవ దినాన నరుల సృష్టి గురించి రాయబడడం మనం చూస్తాం. ఇక్కడ దేవుడు "మన పోలిక మన స్వరూపమందు" నరులను చేయుదమంటూ బహువచనాన్ని ప్రయోగిస్తున్నాడు. దీనిప్రకారం దేవునిలో ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నట్టుగా మనకు అర్థమౌతుంది. ఆ మిగిలిన వ్యక్తులే కుమారుడు మరియు పరిశుద్ధాత్ముడు అని లేఖనాలు తెలియచేస్తున్నాయి. ఎందుకంటే ఆ లేఖనాల మొత్తంలో వారు మాత్రమే తండ్రితో పాటు దైవత్వం కలిగినవారిగా ఘనపరచబడ్డారు. ఆయన బాబేలు గోపురం వద్ద భాషలను తారుమారు చేసేటప్పుడు కూడా ఇలానే "మన" అని బహువచనంతో సంబోధించుకున్నట్టు చూడగలం (ఆదికాండము 11:7). అయితే కొందరు దేవుడు రాజు కాబట్టి తనను తాను అలా "మన" అని సంబోధించాడని అంటుంటారు. కానీ ఇతరసందర్భాలు అన్నిటిలోనూ దేవుడు తనను తాను ఏకవచనంతో "నేను" అనే సంబోధించుకున్నట్టు మనం చూడగలం. భక్తులు కూడా ఆయనను ఏకవచనంలోనే నువ్వు, నీకు అనే సంబోధించారు. ఎందుకంటే హెబ్రీభాషలో తమని తాము హుందాగా బహువచనంలో సంబోధించుకునే సాంప్రదాయం లేదు.
అలానే మరికొందరు ఇక్కడ దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు అనే బహువచనం దేవదూతలను ఉద్దేశించి పలుకుతున్నాడని పొరపడుతుంటారు. అది పూర్తిగా అవాస్తవం. ఈ వాదన చేసేవారు దేవదూతలు కూడా దేవునితో పాటు సహసృష్టికర్తలు అని బోధిస్తున్నారు. కానీ దేవుడు మాత్రమే సృష్టికర్త అని మనకు బైబిల్ చెబుతుంది. అలానే బైబిల్ గ్రంథం; నరులు దేవుని పోలిక, దేవుని స్వరూపంలో సృష్టించబడ్డారని బోధిస్తుంది తప్ప దేవదూతల పోలిక, స్వరూపంలో అని ఎక్కడా బోధించలేదు (క్రింది వచనం చూడండి).
ఆదికాండము 1:27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
ముందటి వచనంలో దేవుడు మన పోలిక మన స్వరూపమందు నరులను చేయుదుమని పలికి, ఈ వచనంలో ఆయన వారిని దేవుని స్వరూపమందు సృజించాడని రాయబడడం మనం చూస్తాం. అంటే ఆయనతో పాటుగా నరులను సృజించిన మిగిలిన వ్యక్తులు తనతో పాటుగా దైవత్వం కలిగినవారై ఉండాలి. కాబట్టి ఆ సందర్భంలో దేవుడు "మన" అని సంబోధించిన మిగిలిన వ్యక్తులు దేవదూతలు కాదు కానీ కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడే అని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. దీనికి సంబంధించిన లేఖన ఆధారాలు పరిశీలించండి.
యోబు 33: 4 దేవుని ఆత్మ నన్ను సృజించెను.
యోహాను 1:3 కలిగియున్నదేదియు ఆయన (క్రీస్తు) లేకుండ కలుగలేదు.
కొలొస్సయులకు 1:16,17 ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన (క్రీస్తు) ద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.
ఇక దేవుడు తన "స్వరూపములో" నరుని చెయ్యడమంటే అర్థం ఏంటో చూద్దాం. ఎందుకంటే కొందరు దేవుడు తన పోలిక తన స్వరూపంలో నరులను చేసాడు అనే మాటలను మానవ భౌతికదేహానికి ఆపాదిస్తుంటారు. కానీ ఇక్కడ చెప్పబడిన దేవుని పోలిక దేవుని స్వరూపం భౌతికదేహం గురించి కాదు. ఎందుకంటే దేవుడు ఆత్మ, అదృశ్యుడు (యోహాను 4:24, కొలొస్సీ1:15).ఆత్మ, అదృశ్యుడైన దేవునికి మనవలే భౌతికదేహం ఉండదు.
అదేంటి ప్రవక్తల దర్శనాలలో ఆయన భౌతికదేహం ఉన్నవాడిగా కనిపించాడుగా లేఖనాలలో కూడా ఆయనకు అలాంటి బాష వాడబడిందిగా అనంటే అవి మానవునికి అర్థమయ్యేలా కనిపించిన రాయబడిన సందర్భాలని అర్థం చేసుకోవాలి. దైవశాస్త్రంలో ఆ దర్శనాలనూ రచనలనూ Anthropomorphism అంటారు. అంటే దేవుడు మానవులకు ఎలా దర్శనమిస్తే వారికి అర్థమౌతుందో ఆ రూపంలోనే ఆయన కనిపించాడు. అందుకే "ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను" (యోహాను 1:18) అని రాయబడింది.
దేవుని పోలిక స్వరూపం అనేవి ఆయన భౌతిక దేహానికి సంబంధించినవి కావని ఈ వచనంలోనే మనకు మంచి ఆధారం లభిస్తుంది. స్త్రీనీ పురుషుడినీ కూడా ఆయన పోలిక స్వరూపంలోనే సృజించినట్టు మనం చదువుతున్నాం, అది భౌతికదేహానికి సంబంధించిందే ఐతే ఆయనది పురుషుని భౌతిక దేహమా, స్త్రీ భౌతికదేహమా? కాబట్టి ఆ మాటలు భౌతికదేహం గురించి చెప్పబడలేదు.
అయితే World Mission Society Church of God (పరలోకపు తల్లి) అనే అవాంతరశాఖ ఆ మాటలను వక్రీకరించి దేవునిలో స్త్రీ కూడా ఉందని బోధిస్తున్నారు. కానీ వాక్యసత్యం ముందు ఆ అవాంతరశాఖ బోధ వక్రీకరణే తప్ప సత్యం కాజాలదు. అందుకే ఇంతకూ దేవుని పోలిక, స్వరూపం అంటే ఏంటో మానవుడిని ఆయన తన పోలిక, స్వరూపంలో చేసాడన్నప్పుడు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో చూద్దాం.
ఎఫెసీయులకు 4:23,24 మీ చిత్తవృత్తియందు నూతన పరచబడినవారై, నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను.
గలతియులకు 4: 19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీయందేర్పడు వరకు మీ విషయమై మరల నాకు ప్రసవవేదన కలుగుచున్నది.
రోమీయులకు 8:29 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.
ఈ వాక్యభాగాలలో దేవునిపోలిక క్రీస్తు స్వరూపం అనే మాటలను మనం చూస్తున్నాం. అనగా ఆయనవంటి పరిశుద్ధ స్వభావం మనం ధరించుకోవాలని ఇవి మనకు బోధిస్తున్నాయి. కాబట్టి ఆదాము హవ్వలు దేవుని పోలిక, స్వరూపంలో సృజించబడ్డారు అంటే దేవుని యొక్క నైతిక గుణలక్షణాలు కలిగి పాపమనేది లేకుండా సృష్టించబడ్డాడని అర్థం. కానీ వారు పాపం చేసాక వారూ మరియు వారి సంతానమైన మనమంతా కూడా ఆ దేవుని నైతికగుణలక్షణాలకు వ్యతిరేకంగా ప్రవర్తింపచేసే పతనస్వభావాన్ని ధరించుకున్నాము. అందుకే మనుషులందరూ పాపం చేస్తున్నారు. మరలా యేసుక్రీస్తు ద్వారా ఆ దేవుని పోలిక స్వరూపమైన ఆయన నైతికగుణలక్షణాలు మనలో తిరిగి స్థాపించబడుతున్నాయి.
కొలొస్సయులకు 3:9,10 ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడ మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనియున్నారు.
గమనించండి; మన మనసాక్షి కూడా ఆ దేవుని పోలిక దేవుని స్వరూపానికి సంబంధించిందే. అందుకే మనం తప్పు చేస్తున్నప్పుడు అది మనల్ని హెచ్చరిస్తుంటుంది. ఏ జంతువుల్లోనూ అలాంటిది ఉండదు. డార్విన్ జీవపరిమాణ సిద్ధాంతం కేవలం ఊహాజనితంగా మారడానికి ఇది కూడా ఒక ప్రధానకారణం.
అదేవిధంగా ఈ వచనంలో త్రిత్వమైన ఒకే దేవుడు తన పోలిక తన స్వరూపంలో పురుషుడినీ మరియు స్త్రీనీ సృష్టించాడని రాయబడడం వల్ల స్త్రీ పురుషులిద్దరూ సమాన ఆధిక్యత (ఒకే దేవుని స్వరూపం) గలవారని ఆయన వారికి అప్పగించిన భాధ్యతల్లో అసమానతలు ఉన్నప్పటికీ వారిలో ఎవరూ ఒకరికంటే ఎక్కువ కానీ తక్కువ కానీ కాదని అర్థమౌతుంది. ఈవిధంగా బైబిల్ గ్రంథం మాత్రమే అసలైన సౌమ్యవాదాన్ని బోధిస్తుంది (దీనిగురించి మరికొన్ని విషయాలు ఆదికాండము 2:21,22 లో వివరించాను). ఈ ప్రపంచంలో అనేకమైన మతాలు పుట్టుకువచ్చాయి, ఒకొక్క మతంలో మానవ ఆవిర్భావం గురించి ఒక్కో విధంగా చెప్పబడింది. అందులో కులాల పరంగా జాతుల పరంగా అసమానత్వాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతాం (ఉదాహరణకు హిందూ మతం). అలాంటి మతాల ప్రకారం మనుషులంతా ఒక్కటే అందరూ సమానమే అని చెప్పడం వారికి సాధ్యం కాదు.
కానీ బైబిల్ గ్రంథంలో పురుషుడూ స్త్రీ వారి నుండి విస్తరించిన మానవజాతి అంతా ఒకే దేవుని పోలిక, స్వరూపంలో సృష్టించబడుతున్నారు కాబట్టి మనుషులంతా ఒక్కటే అందరూ సమానమే. ఎలాంటి వర్ణ, లింగ, ప్రాంతీయ, వర్గ బేధాలు లేనే లేవు. అందుకే "నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించుము" అనే సిద్ధాంతం బైబిల్ నుండే పుట్టింది. ఏ నరుడినీ చంపకూడదనే నియమం కూడా బైబిల్ నుండే పుట్టింది. ఎందుకంటే "నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననేచిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను" (ఆదికాండము 9:6).
అదేవిధంగా ఈ అధ్యాయంలో దేవుడు ఆదాము హవ్వలను తన పోలిక తన స్వరూపంలో సృష్టించాడని రాయబడింది. ఆ సృష్టి యొక్క వివరణ మాత్రం తర్వాత అధ్యాయంలో వివరించబడింది. కొందరు దీనిని కూడా వైరుధ్యంగా ఆరోపిస్తున్నారు కాబట్టి ఈవిషయం స్పష్టం చేస్తున్నాను. ఈ అధ్యాయం వారి సృష్టియొక్క పరిచయం. ఆ అధ్యాయం ఆ సృష్టికి సంబంధించిన వివరణ.
ఆదికాండము 1:28 దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.
ఈ వచనంలో దేవుడు మనుషులను సృష్టించాక వారు ఫలించాలని, అభివృద్ది చెందాలని ఆశీర్వదిస్తున్నట్టు మనం చూస్తాం. కాబట్టి యవ్వన స్త్రీ పురుషులు ప్రభువునందు వివాహం చేసుకుని ప్రభువు చెప్పినట్టుగా ఫలించి అభివృద్ధి చెందడం ఆయన ప్రణాళికగా మనం అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం వివాహాన్ని నిషేధిస్తున్న కొన్ని దుర్భోధ సంఘాలు మన తెలుగు రాష్ట్రాలలో కూడా విస్తరిస్తున్నాయి కాబట్టి ఈ మాటలు ప్రత్యేకంగా చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే బైబిల్ ప్రకారం వివాహాన్ని నిషేధించేది దెయ్యపుబోధ (1 తిమోతి 4:1-3). అలా అని పరిచర్యకోసం వైవాహిక జీవితానికి దూరంగా ఉండేవారిని నేను తప్పుపట్టడం లేదు. దేవుని అనుగ్రహంతో సరైన ప్రణాళికతో వివాహజీవితం లేకుండా ప్రభువు కోసం పనిచెయ్యాలి అనుకునేవారు అలా కూడా ఉండవచ్చు (మత్తయి 19:11). అయితే అలాంటివారు తమకు ఆ వరం ఉందో లేదో బాగా పరీక్షించుకోవాలి. లేకుంటే కొంతకాలం తర్వాత శోధించబడి పాపంలో పడిపోయే అవకాశం పుష్కలంగా ఉంది. ఇలా పడిపోయి బ్రష్టులైనవారిని ఎంతోమందిని చూస్తున్నాం. అందుకే "కామతప్తులగుట కంటె పెండ్లిచేసికొనుట మేలు" (1కోరింథీ 7:9) అని స్పష్టంగా రాయబడింది.
అదేవిధంగా ఈ సందర్భంలో ఆయన సమస్తజీవరాశులనూ తాను సృష్టించిన నరులకు లోపరుస్తున్నట్టు చూస్తున్నాం. దీనిగురించే కీర్తనాకారుడు "నీ చేతిపనులమీద వానికి అధికారమిచ్చియున్నావు. గొఱ్ఱెలన్నిటిని, ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్య ములను సముద్రమార్గములలో సంచరించువాటినన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచియున్నావు" (కీర్తనల 8:6-8) అని రాస్తున్నాడు. ఆదాము హవ్వలు పాపం చెయ్యకముందు సృష్టిలోని జీవరాశులన్నీ వారికి లోబడే ఉన్నాయి. ఏ జీవరాశి వారికి హానికరంగా లేదు. అయితే వారు పాపం చేసాక దేవుడు ఏ జీవరాశినైతే వారికి లోపరిచాడో వాటిలో కొన్ని హానికరంగా మారాయి (యిర్మియా 5:6). అంతే వాటి మనుగడకు కూడా ముప్పు వాటిల్లుతుంది, కొన్ని జీవరాశులు అంతరించిపోవడానికి ఇదే కారణం (యిర్మియా 12:4). సమస్తమునూ లోపరచిన దేవుని యెదుట తిరుగుబాటును ప్రదర్శించిన మానవజాతికి దక్కిన ఒకానొక ప్రతిఫలం ఇది.
ఆదికాండము 1:29-31 దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్ష మును మీ కిచ్చి యున్నాను; అవి మీ కాహారమగును. భూమిమీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.
ఈ వచనాల్లో దేవుడు నరులకూ మరియు మిగిలిన జీవరాశులకూ ఆహారంగా శాఖాల్ని నియమిస్తున్నట్టు మనం చూడగలం. మానవ పాపం వరకూ ఇదే కొనసాగింది. అయితే కొందరు దేవుడు నోవహుతో "ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను" (ఆదికాండము 9:3) అని పలకడాన్ని బట్టి జలప్రళయం తర్వాతనే మానవుడు మాంసం తినడం ప్రారంభించాడని భావిస్తుంటారు. కానీ నాకు ఆ విషయంలో అభ్యంతరం ఉంది. అదేంటో ఆ సందర్భంలో వివరిస్తాను. కానీ ఒకటి. ఆదాము హవ్వలు ఏదేనులో ఉన్నంతకాలం మాత్రం వారు కానీ ఇతర జంతువులు కానీ మరోజీవిని చంపుకుని తినే హక్కును కలిగిలేరు.
కొందరు బైబిల్ విమర్శకులు మొక్కల్లో పళ్ళల్లో విషతుల్యమైనవి కూడా ఉంటాయిగా ఆదాము హవ్వలూ మిగిలిన జీవరాశులూ వాటినే తినాలి అన్నప్పుడు వారికి ఏం తినాలో ఏం తినకూడదో ఎలా తెలిసిందని ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్న మరీ హాస్యాస్పదం. తినమని చెప్పిన దేవుడు ఏం తినాలో ఏం తినకూడదో చెప్పకుండా ఉంటాడా? ఆ అవగాహన జీవరాశిలో పుట్టించకుండా ఉంటాడా? (యెషయా 28:24-29) ఇలానే ఉంటాయి బైబిల్ విమర్శకుల ఆరోపణలు. అయినా ప్రారంభంలో దేవుడు చేసిన సమస్తమూ మంచిగానే ఉంది. 31వ వచనంలో ఆ మాటలనే చూస్తున్నాం. కాబట్టి ఆదాము హవ్వల పాపం వరకూ భూమిపై ఎలాంటి హానికరమైన చెట్లూ మొలవలేదు, అలాంటివన్నీ తర్వాతనే పుట్టుకువచ్చాయి (ఆదికాండము 3:17,18).
ఈ అధ్యాయపు ముగింపులో ఒక ప్రాముఖ్యమైన విషయం చర్చించదలిచాను. సృష్టికర్త తన జ్ఞానం, శక్తులతోనే దేనినైనా సృష్టించగలడు. తనలో లేని జ్ఞానం కానీ శక్తి కానీ తన సృష్టిలో ప్రవేశపెట్టలేడు, జీవం కూడా. ఇది మనసులో పెట్టుకుని ఈ జీవరాశుల సృష్టి గురించి మానవ సృష్టి గురించి ఆలోచించండి. ఆయన నేలమీద ప్రాకే చిన్న పురుగుల దగ్గరనుండి సముద్రంలోని మహా మత్స్యాల వరకూ ఆకాశంలో ఎగిరే చిన్న పక్షినుండి ఎంతోశక్తిగల మృగాల వరకూ ఒక్క మాటతో సృష్టించాడంటే జ్ఞానవంతుడైన మానవుడ్ని నేలమంటితో కలిగించాడంటే ఆయన ఎంత శక్తిమంతుడూ ఎంత జ్ఞానవంతుడూ అయ్యుంటాడు.
కీర్తనలు 104:24-26 యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి. జ్ఞానముచేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమి నిండియున్నది. అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాసులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి.
ఇక ఈ విశ్వం గురించి మాట్లాడుకోవాలంటే మన సామర్థ్యం చాలదు. దీనిగురించి మన శాస్త్ర ప్రపంచానికి తెలిసింది కూడా మహా సముద్రంలో ఒక నీటిబొట్టే. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే; ఇంత మహా శక్తివంతమైన సృష్టి విషయంలో "ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దముపాటిదే గదా. గర్జనలుచేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింప గలవాడెవడు?" (యోబు 26:14) అని రాయబడింది.
ఉదాహరణకు ఒక నక్షత్రం ఎంత శక్తివంతమైనది? ఒక పాలపుంత ఎంత జ్ఞానయుక్తమైనది? అలాంటి కోట్ల నక్షత్రాలను, పాల పుంతలను ఆయన సృష్టించాడు. పైగా అవన్నీ "ఆయన కార్యములలో స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దముపాటిదే". ఔను. అవన్నీ కేవలం " కలుగునుగాక" అని ఆయన పలికినమాటతో కలిగాయంటే అంతేగా!. ఈలెక్కన ఆయన ఇంకెంత శక్తిమంతుడూ జ్ఞానవంతుడూ అయ్యుంటాడు? అందుకే ఆయన "అనంతజ్ఞానియగు దేవుడు" (1సమూయేలు 2:3), "సర్వశక్తిగల దేవుడు" (ఆదికాండము 17:1) అని సంబోధించబడ్డాడు.
అలాంటి దేవుణ్ణి ఏ కారణంతోనైనా ప్రశ్నించేవారూ నిందించేవారంతా ఈ విషయం ఒకసారి ఆలోచించుకోవాలి. "ఆయన కార్యములలో స్వల్పములైన ఆయనను గూర్చి మనకు వినబడుచున్న మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దమైన" ఈ సృష్టిని పరిశీలించి ఆయన శక్తి జ్ఞానాలను కొద్దిగా అర్థం చేసుకున్నా సరే ఆయనను ఏ విషయంలోనూ ప్రశ్నించలేము, నిందించలేము. యోబు వంటి యధార్థవంతుడే ఆ విషయంలో గద్దించబడ్డాడు. దేవుడు దిగివచ్చి తన సృష్టి గురించి కొంచెం వివరించగానే (యోబు 38-42) "వివేచనలేని వాడనైన నేను ఏమియునెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని, కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను" (యోబు 42:3-6) అని ఆయన ముందు సిగ్గుపడ్డాడు. మనం ఇంకెంత?
కీర్తనలు 8:3 నీ చేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడే పాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?
ఇక్కడ ఒక సందేహాన్ని కూడా నివృత్తి చెయ్యదలిచాను. దేవుని ఈ సృష్టి వెనుక ఉద్దేశం మానవుడే అయినప్పుడు భూగ్రహానికే పరిమితమైన ఆ మానవుడికోసం ఇంత విస్తారమైన సృష్టి ఎందుకు అనే ప్రశ్న కొందరికి తలెత్తుతుంది. నిజమే; ఈ సృష్టి యొక్క ఉద్దేశం మానవుడే అయినప్పటికీ అతనికి తనయొక్క మహిమను చాటడానికే అనగా పైన వివరించినట్టుగా ఆయన శక్తి జ్ఞానాల గురించి మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్ధంగానైనా వివరించడానికే ఇంత విస్తారమైన సృష్టిని ఆయన సృష్టించాడు.
కీర్తనలు 19:1 ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.
అది గమనించిన మనిషికి "ఆయన చేతిపనియైన ఆకాశములను ఆయన కలుగజేసిన చంద్రనక్షత్రములను చూడగా ఆయన మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు? ఆయన నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?" (కీర్తనలు 8:3,4) అనేది అర్థమై కీర్తనాకారుడివలే ఆయనపట్ల భయభక్తులు నిలపాలి. "యెహోవా అనంతజ్ఞానియగు దేవుడు" (1సమూయేలు 2:3) అని ఆయనను స్తుతించాలి. అందుకే అది మర్చిపోతున్న మనిషికి బుద్ధి కలిగేలా "మీకు తెలియదా? మీరు వినలేదా? మొదటినుండి ఎవరును మీతో చెప్పలేదా? భూమిని స్థాపించుటనుబట్టి మీరుదాని గ్రహింపలేదా? నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు? అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు.
మీకన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలు దేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు" (యెషయా 40:21-26) అని రాయబడింది.
రోమా 1:20 ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి.
ఇదే మనిషి కోసమే ఐనా మనిషి ఊహకు కూడా అందనంత ఈ విస్తారమైన అద్భుత సృష్టి వెనుక దేవుని ఉద్దేశం.
చివరిగా; ఈ సమస్త సృష్టినీ అందులోని జీవరాసులను దేవుడే సృష్టించాడనీ ఇప్పటివరకూ మనం చూసిన బైబిల్ సత్యానికి వ్యతిరేకంగా నాస్తికులు ప్రస్తావించే డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం ఎంత ఊహాజనితమో Science ప్రకారం అది ఎంత అవాస్తవమో తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.
డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం వాస్తవమా లేక ఊహాజనితమా?
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
Comments
Sajeev
9949939869