పాత నిబంధన
రచయిత: కె విద్యా సాగర్

gen16 thumb

16:1, 16:2, 16:3, 16:4, 16:5, 16:6, 16:7,8, 16:9, 16:10, 16:11, 16:12, 16:13, 16:14, 16:15,16

ఆదికాండము‌ 16:1

అబ్రాము భార్యయైన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి యుండెను.

ఆదికాండము 12:16 వచనం ప్రకారం, అబ్రాహాము ఐగుప్తుకు‌ వెళ్లినపుడు ఆ దేశంలో ఫరో వల్ల చాలామంది దాసులను దాసీలను సంపాదించాడు; ఈ హాగరు అనే స్త్రీ వారిలో ఒకరు.

ఆదికాండము 16:2

కాగా శారయిఇదిగో నేను పిల్లలు కనకుండ యెహోవా చేసి యున్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము; ఒకవేళ ఆమెవలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను; అబ్రాము శారయి మాట వినెను.

ఈ సందర్భంలో, తనకిక పిల్లలు పుట్టరని గ్రహించిన శారాయి హాగరు అనే దాసి వల్ల సంతానం పొందుకునే ప్రయత్నం చేస్తుంది; తాము సంపాదించుకున్న దాసీల విషయంలో ఆ విధంగా చేయడం, ఆ కాలంలో సాధారణంగా మనకి కనిపిస్తుంది, ఉదాహరణకు యాకోబు సందర్భాన్ని చూడండి.

ఆదికాండము 30:1-6 - రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనక పోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతోనాకు గర్భఫలము నిమ్ము; లేనియెడల నేను చచ్చెదననెను. యాకోబు కోపము రాహేలుమీద రగులుకొనగా అతడునేను నీకు గర్భఫలమును ఇయ్యక పోయిన దేవునికి ప్రతిగా నున్నానా అనెను. అందు కామెనా దాసియైన బిల్హా ఉన్నది గదా; ఆమెతో పొమ్ము; ఆమె నా కొరకు పిల్లలను కనును; ఆలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసియైన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతియై యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పుతీర్చెను; ఆయన నా మొరను విని నాకు కుమారుని దయ చేసెననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను.

అదేవిధంగా ఆ సందర్భంలో అబ్రాహాము శారాయి మాట వినెనని రాయబడింది; అంతకుమునుపు దేవుడు అతనికి ప్రత్యక్షమైన సందర్భాలలో, నీకు ‌గర్భఫలాన్ని ఇస్తానని చెప్పాడే తప్ప, శారాయి వల్లే ఆ గర్భఫలం రాబోతుందని ఖచ్చితంగా చెప్పలేదు; ఈ సంఘటన జరిగిన తరువాతనే దేవుడు ఆ స్పష్టతను తనకి ఇచ్చాడు. బహుశా ఈ కారణం చేత, అబ్రాహాము హాగరు మూలంగా దేవుడు తనకి సంతానాన్ని ఇవ్వబోతున్నాడని అర్థం చేసుకుని శారాయి మాట వినియుండవచ్చు.

ఆదికాండము 16:3

కాబట్టి అబ్రాము కనాను దేశములో పదియేండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్యయైన శారయి తన దాసియైన హాగరను ఐగుప్తీయు రాలిని తీసికొని తన పెనిమిటియైన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను.

ప్రాచీన సంస్కృతుల్లో ఒకరికంటే ఎక్కువ భార్యలను కలిగియుండడం సాధారణంగా మనకి‌ కనిపిస్తుంది, ఆ కాలంలో కొందరు భక్తులు కూడా ఆవైపుగా ప్రభావితమయ్యారు, ఇది వారికి పాపంగా ఎంచబడనప్పటికీ, నూతన నిబంధన కాలంలో విశ్వాసులు దీన్ని పాటించకూడదని, ఒక పురుషుడు ఒకే భార్యను కలిగియుండాలని ఖచ్చితమైన ఆజ్ఞలు రాయబడ్డాయి.

ఆదికాండము 16:4

అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయెను. అది తాను గర్భవతి నైతినని తెలిసికొనినప్పుడు దాని యజమానురాలు దానిదృష్టికి నీచమైనదాయెను.

ఈ సందర్భంలో హాగరు, తమ యజమానురాలికి విశ్వాసఘాతకురాలిగా మారినట్లు మనకి అర్థం అవుతుంది, ఈవిధంగా ఆమె మారినందువల్ల శారాయి తొందరపడి‌ చేసే తప్పిదాల‌వల్ల కలిగే ప్రతిఫలాన్ని ఎదుర్కుంది.

ఆదికాండము 16:5

అప్పుడు శారయినా ఉసురు నీకు తగులును; నేనే నా దాసిని నీ కౌగిటి కిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలిసికొనినప్పుడు నేను దానిదృష్టికి నీచమైనదాననైతిని; నాకును నీకును యెహోవ న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను.

ఈ సందర్భంలో తెలుగు తర్జుమా కంటే ఇంగ్లీషు తర్జుమాలో శారాయి మాటలు అర్ధవంతంగా ఉంటాయి చూడండి.

And Sarai said unto Abram, My wrong be upon thee: I have given my maid into thy bosom; and when she saw that she had conceived, I was despised in her eyes: the LORD judge between me and thee.

ఈ సందర్భంలో శారాయి, తాను అబ్రాహాముకు హాగరునిచ్చి పెళ్ళి చేయడం తప్పని గ్రహించినట్లుగా, అతనితో నా తప్పు నీపైన కూడా మోపబడుతుందని మాట్లాడుతుంది; తెలుగులో దాన్ని‌ 'ఉసురు' అని తర్జుమా చేసారు. అబ్రాహాము కూడా హాగరును ఇష్టపూర్వకంగా వివాహమాడినప్పటికీ, పైన చెప్పినట్లుగా, దేవుడు ఆమె ద్వారా గర్భఫలాన్ని ఇస్తాడేమో అనుకున్నప్పటికీ అది తొందరపాటు నిర్ణయమే.

ఆదికాండము 16:6

అందుకు అబ్రాముఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది; నీ మనస్సు వచ్చినట్లు దాని చేయుమని శారయితో చెప్పెను. శారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్దనుండి అది పారిపోగా-

ఈ సందర్భంలో హాగరు చేసినదానికి ప్రతిఫలంగానే అబ్రాహాము ఈవిధంగా స్పందిస్తున్నాడు; గర్భవతిగా ఉన్న స్త్రీని శ్రమపెట్టడం మన దృష్టిలో తప్పే అయినప్పటికీ, హాగరు శారాయి విషయంలో చేసింది కూడా మరింత తప్పుగా కనిపిస్తుంది; అందుచేతనే తన యజమానురాలి పట్ల అహంకారం ప్రదర్శించిన హాగరు ప్రతిఫలాన్ని ఎదుర్కుంటుంది.

ఆదికాండము 16:7,8

యెహోవా దూత అరణ్యములో నీటిబుగ్గయొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద, ఆమెను కనుగొని శారయి దాసివైన హాగరూ, ఎక్కడనుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగి నందుకు అదినా యజమానురాలైన శారయియొద్దనుండి పారిపోవుచున్నాననెను.

ఈ సందర్భంలో హాగరుకు ప్రత్యక్షమైన యెహోవా దూత సాధారణమైన దేవదూత కాదు కానీ, ఆయన సాక్ష్యాత్తూ ప్రభువైన యేసుక్రీస్తు; దీని గురించిన వివరణను ఈ లింక్ ద్వారా చదవండి.

https://hithabodha.com/books/god/269-the-angel-of-the-lord-is-jesus-christ.html

ఆదికాండము 16:9

అప్పుడు యెహోవా దూతనీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను. హాగరు చేసిన తప్పు విషయంలో‌ అబ్రాహాము ఏమీచేయలేనప్పటికీ, యెహోవా దూతగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు ఆమెపైన దయచూపించి ఈవిధంగా ఆమెను వెనక్కు వెళ్లమని ఆజ్ఞాపిస్తున్నారు.

ఆదికాండము 16:10

మరియు యెహోవా దూతనీ సంతానమును నిశ్చయముగా విస్త రింపజేసెదను; అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను.

అబ్రాహామును బట్టే దేవుడు ఈవిధంగా ఆమె కుమారుని సంతానాన్ని విస్తరింపచేస్తున్నాడని మనం భావించవచ్చు; సాధారణంగా ముస్లిం మతస్తులు తమను తాము ఇష్మాయేలు సంతానంగా ప్రకటించుకుంటూ ఉంటారు, దాని ఆధారంగా కొంతమంది క్రైస్తవబోధకులు కూడా ఈ వచనాన్ని బట్టి, ఆ మతస్తులను దేవుడే విస్తరింపచేసారని ప్రకటిస్తుంటారు‌. అయితే, ఇది పూర్తి వాస్తవం కాదు; ఇష్మాయేలు నుండి కొన్ని అరబ్బు తెగలు మాత్రమే విస్తరించాయి; మహమ్మద్ క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ముస్లిం మతాన్ని‌ ప్రారంభించినపుడు, కొంతమంది అరబ్బులు‌ కూడా దాన్ని తిరస్కరించినట్లూ, మిగిలిన జాతుల ప్రజలు కూడా దాన్ని అంగీకరించినట్లూ చరిత్ర సాక్ష్యం చెపుతుంది. దీని ప్రకారం, నేటి ముస్లింలు అందరినీ ఇష్మాయేలు సంతానంగానూ, అరబ్బులుగానూ గుర్తించడం సాధ్యం కాదు.

ఆదికాండము 16:11

మరియు యెహోవా దూతఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై యున్నావు; నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు; ఇష్మాయేలు అనేపేరుకు దేవుడు మొరవినెను అని అర్థం వస్తుంది.

ఆదికాండము 16:12

అతడు అడవిగాడిదవంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి యెదుట నివసించునని దానితో చెప్పగా-

ఈ సందర్భంలో ఇష్మాయేలు గుణం గురించి దేవుడు తెలియచేస్తున్నాడు; ఇష్మాయేలు, అతని నుండి ఉద్భవించిన జాతి ఇతర ప్రజలతో కోరుకునే విరోధాన్ని ఇది సూచిస్తుంది. మన క్రైస్తవ బోధకులు చెపుతున్నట్లుగా ఇది ముస్లింల అందరికొరకూ అని మనం భావించకూడదు, ఎందుకంటే ముస్లింలు అందరూ ఇష్మాయేలు సంతానం కాదని పైన మనం చూసాం; దీనిప్రకారం, ఇది ఇష్మాయేలు సంతానమైన కొన్ని అరబ్బు తెగలకే వర్తిస్తుంది. సాధారణంగా ఆ అరబ్బు తెగలన్నీ ముస్లింలుగానే ఉన్నారు.

ఆదికాండము 16:13

అదిచూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను.

హాగరు ఈ సందర్భంలో యెహోవా దూతను దేవుడని గ్రహించి, తనలో పరివర్తన కలిగినట్లుగా ఆయనకు లోబడుతూ మాట్లాడుతుంది.

ఆదికాండము 16:14

అందుచేత ఆ నీటిబుగ్గకు బెయేర్‌ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేషుకును బెరెదుకును మధ్య నున్నది.

ఈ పేరుకు సజీవుడైన దేవుని బావి అని అర్థం.

ఆదికాండము 16:15,16

తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మా యేలను పేరు పెట్టెను. హాగరు అబ్రామునకు ఇష్మా యేలును కనినప్పుడు అబ్రాము ఎనుబదియారు ఏండ్ల వాడు.

ప్రభువగు యేసుక్రీస్తు హాగరుతో చెప్పినట్లుగా అబ్రాహాము ఆ కుమారునికి ఇష్మాయేలని పేరుపెట్టాడు; అయితే అతడు అబ్రాహాముకు పెద్ద కుమారుడైనప్పటికీ వాగ్దాన పుత్రుడు కాలేకపోయాడు.

రోమీయులకు 9:7,8 - అబ్రాహాము సంతానమైనంత మాత్రముచేత అందరును పిల్లలు కారు గాని ఇస్సాకువల్లనైనది నీ సంతానము అనబడును, అనగా శరీరసంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని యెంచ బడుదురు.

Add comment

Security code
Refresh

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.