పాత నిబంధన

రచయిత: కె విద్యా సాగర్

38:1, 38:2, 38:3-7, 38:8, 38:9,10, 38:11, 38:12, 38:13,14, 38:15-19, 38:20,21, 38:22,23, 38:24, 38:25,26, 38:27-30

ఆదికాండము 38:1
ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయునియొద్ద ఉండుటకు వెళ్లెను.

ఈ అధ్యాయంలో యాకోబు కుమారుడైన యూదా గురించి వివరించబడడం మనం‌ చూస్తాం. ఈ వచనంలో చెప్పబడినదాని ప్రకారం యూదా తన సహోదరులకు దూరంగా ఒక స్నేహితుడితో కలసి జీవించడానికి వెళ్ళాడు. సాధారణంగా వీరికున్న మందలను బట్టి అందరూ ఒకేచోట నివసించడం వీలుకాక అలా చేసేవారు.

ఆదికాండము 38:2
అక్కడ షూయ అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెను తీసికొని ఆమెతో పోయెను.

ఈ వచనంలో యూదా కనానీయుడి కుమార్తెను వివాహం చేసుకోవడం మనం చూస్తాం. అబ్రాహాము కనానీయులతో ఎంత సన్నిహితంగా జీవించినప్పటికీ తన కుమారుడైన ఇస్సాకు వారి కుమార్తెల్లో ఎవరినీ వివాహం చేసుకోకుండా జాగ్రత తీసుకున్నాడు (ఆదికాండము 24:3). ఎందుకంటే వారు శపించబడినవారనీ దేవుడు త్వరలో తన సంతానమైన ఇశ్రాయేలీయుల ద్వారానే వారికి తీర్పుతీర్చబోతున్నాడని అతనికి చెప్పబడింది (ఆదికాండము 15:16). ఇస్సాకు కూడా తన కుమారుడైన యాకోబు విషయంలో ఇదే జాగ్రతను తీసుకున్నాడు (ఆదికాండము 28:1).

కానీ యాకోబు కుమారుడైన యూదా మాత్రం కనానీయుల కుమార్తెతో సంబంధం‌ పెట్టుకున్నాడు. అప్పటికి అతను‌ తన సోదరులకు దూరంగా ఉండడం‌ వల్ల తన తండ్రియైన యాకోబుకు ఈ విషయం తెలిసియుండదు. ఎందుకంటే వీరి వివాహాలు ఎక్కువ ఆర్భాటం లేకుండా ఇద్దరూ ఏకమవ్వడంతోనే జరిగిపోతుంటాయి.

ఆదికాండము 38:3-7
ఆమె గర్భవతియై కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతియై కుమారుని కని వానికి ఓనాను అను పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతియై కుమారుని కని వానికి షేలా అను పేరు పెట్టెను. ఆమె వీని కనినప్పుడు అతడు కజీబులోనుండెను. యూదా తన జ్యేష్ఠకుమారుడైన ఏరునకు తామారు అనుదానిని పెండ్లి చేసెను. యూదా జ్యేష్ఠకుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతని చంపెను.

ఈ వచనాలలో యూదా కనానీయురాలైన స్త్రీ ద్వారా ముగ్గురు కుమార్తెలను కన్నట్టు, అందులో పెద్దకుమారుడి చెడుతనాన్ని బట్టి దేవుడు అతడిని చంపివేసినట్టు మనం చూస్తాం. దేవుడు తన సార్వభౌమ అధికారాన్ని బట్టి తాను అనుకున్నవారికి తీర్పుతీరుస్తాడు. ఆ కాలంలో ఏరు కంటే చెడ్డవారు జీవించే ఉండవచ్చు అయినప్పటికీ దేవుడు అతడిని మాత్రం చంపిచేసాడు, అది ఆయన చిత్తం.

ఆదికాండము 38:8
అప్పుడు యూదా ఓనానుతో నీ అన్న భార్యయొద్దకు వెళ్లి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయుమని చెప్పెను.

ఈ వచనంలో యూదా తన రెండవ కుమారుడితో చనిపోయిన నీ అన్న భార్యను వివాహం చేసుకుని అతడికి సంతానం కలుగచెయ్యమనడం మనం చూస్తాం. ఇది ప్రాచీనకాలంలో ప్రజలు అనుసరించిన ఒక పద్ధతి, దీనిగురించి మోషే ధర్మశాస్త్రం‌లో కూడా ఆజ్ఞాపించబడింది (ద్వితీయోపదేశకాండము 25:5,6). ప్రస్తుతం మనం నివసిస్తున్న దేశ సంస్కృతిని బట్టి ఇది కొందరికి హేయంగా అనిపిస్తుంది కానీ ఈ ఆచార‌ంలో ఎలాంటి అ‌నైతికతా లేదు పైగా ఒక ప్రత్యేకమైన కారణంతోనే ఈ ఆచారం ప్రవేశపెట్టబడింది. ఇందులో సంతానం లేకుండా చనిపోయిన వ్యక్తి భార్యను తన తమ్ముడు వివాహం చేసుకోవడం ద్వారా ఆమెకు పుట్టిన మొదటిబిడ్డ చనిపోయిన వ్యక్తి సంతానంగా పరిగణించబడుతుంది. భర్త చనిపోయిన స్త్రీ వితంతువుగా ఉండిపోకుండా వేరేవారిని వివాహం చేసుకోవడం మంచిదే అయినప్పుడు, ఆ వివాహం చనిపోయిన భర్త తమ్ముడితో జరిగితే అందులో అభ్యంతరం ఏముంది?. కాబట్టి దేశీయ సంస్కృతులను బట్టి బైబిల్ పై ఆరోపణలు చెయ్యడం వీలుపడదు.

ఆదికాండము 38:9,10
ఓనాను ఆ సంతానము తనది కానేరదని యెరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతనికూడ చంపెను.

ఈ వచనాలలో యూదా రెండవ కుమారుడైన ఓనాను తన తండ్రి చెప్పినట్టుగా తన అన్న భార్యతో కలసి, కేవలం తన సోదరుడికి తనద్వారా సంతానం‌ కలుగకూడదనే దురుద్దేశంతో తన వీర్యాన్ని నేలను విడిచిపెట్టినట్టు అందుకు దేవుడు అతడిని కూడా చంపివేసినట్టు మనం చూస్తాం. యూదా కుమారుల చెడు నడత ఎంత తీవ్రంగా ఉందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, అతను చనిపోయిన తన అన్నపై గౌరవం లేకుండా ఈ పని చేసాడు. ఒకవేళ తన అన్న భార్యను వివాహం చేసుకోవడం అతనికి ఇష్టం లేకపోతే దానిని తృణీకరించే అవకాశం కూడా అతనికి ఉంటుంది (ద్వితీయోపదేశకాండము 25:7-9). అయినప్పటికీ‌ అతను అలా చెయ్యకుండా ఒకవైపు అన్న భార్యతో కలసి ఉండడానికి ఇష్టపడుతూనే ఆ ఆచారానికి మూలమైన ఉద్దేశానికి విరుద్ధంగా ప్రవర్తించాడు. అందుకే దేవుడు అతడిని కూడా చంపివేసాడు. గమనించండి; భార్యాభర్తలు ఏకాంతంగా గడుపుతున్నప్పుడు వీర్యం బయటకు విడుదల కాకూడదనే నిషేధంతో ఈ సంఘటన రాయబడలేదు. భార్యభర్తల ఏకాంత జీవితంలో అలాంటివి సహజం. ఇక్కడ ఓనాను "ఆ సంతానము తనది కానేరదని యెరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండునట్లు తన రేతస్సును నేలను విడిచాడు" అందుకే అది పాపంగా ఎంచబడింది. ఈ సంఘటనను కొందరు అలా కూడా అపార్థం చేసుకుంటున్నారు కాబట్టి ఈ స్పష్టతను ఇవ్వడం జరిగింది.

ఆదికాండము 38:11
అప్పుడు యూదా ఇతడు కూడ ఇతని అన్నలవలె చనిపోవునేమో అనుకొని నా కుమారుడైన షేలా పెద్దవాడగువరకు నీ తండ్రియింట విధవరాలుగానుండుమని తన కోడలైన తామారుతో చెప్పెను. కాబట్టి తామారు వెళ్లి తన తండ్రి ఇంట నివసించెను.

ఈ వచనంలో యూదా ఆ స్త్రీని వివాహం చేసుకున్నాకే తన పెద్దకుమారుడు చనిపోవడం, మరలా రెండవ కుమారుడు కూడా చనిపోవడం చూసి, ఆ చావులు తన కుమారుల చెడుతనాన్ని బట్టి కాకుండా ఆ స్త్రీని బట్టే కలుగుతున్నాయనే ఒక మూఢనమ్మకానికి‌ లోనవ్వడం మనం చూస్తాం. అందుకే అతను షేలా ఇంకా చిన్నవాడు అనే కారణాన్ని సాకుగా చూపుతూ అతను పెద్దవాడు అయ్యేవరకూ నీ తండ్రి ఇంటికి వెళ్ళిపోమని ఆమెను పంపివేసాడు. ఇలాంటి మూఢనమ్మకాలు మన దేశంలో కూడా కోకొల్లలుగా మనకు కనిపిస్తుంటాయి. అప్పటికి షేలా వాస్తవంగానే చిన్నవాడు అయినప్పటికీ అతను పెద్దవాడు అయ్యాక కూడా యూదా అతనితో తామరుకు వివాహం జరిపించకపోవడం‌ వల్ల యూదాలో ఆ మూఢనమ్మకం ఉందని మనం తప్పకుండా గమనించవచ్చు.

ఆదికాండము 38:12
చాలా దినములైన తరువాత షూయ కుమార్తెయైన యూదా భార్య చనిపోయెను. తరువాత యూదా దుఃఖనివారణ పొంది, అదుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాతునకు తన గొఱ్ఱెల బొచ్చు కత్తిరించువారి యొద్దకు వెళ్లెను.

ఈ వచనంలో యూదా తన భార్య చనిపోయాక తన స్నేహితుడితో కలసి గొఱ్ఱెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళినట్టు మనం చూస్తాం. ఈ సంఘటన తన కుమారుడు ఇంకా చిన్నవాడని సాకులు చెప్పి తామారును తన తండ్రి ఇంటికి పంపివేసిన చాలాకాలం తర్వాత జరిగింది.

ఆదికాండము 38:13,14
దాని మామ తన గొఱ్ఱెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు వెళ్లుచున్నాడని తామారునకు తెలుపబడెను. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికిని తాను అతనికియ్యబడకుండుట చూచి తన వైధవ్యవస్త్రములను తీసివేసి, ముసుకువేసికొని శరీరమంతయు కప్పుకొని, తిమ్నాతునకు పోవు మార్గములోనుండు ఆనాయిము ద్వారమున కూర్చుండగా-

ఈ వచనాలలో యూదా ఆ మార్గం ద్వారా వెళ్తున్నాడని తెలుసుకున్న తామారు అతను తన కుమారుడిని ఇంకా ఈమెకు ఇవ్వకుండా మాట తప్పడంవల్ల, ఒక వేశ్యలా వేషం ధరించి ఆ మార్గంలో కూర్చున్నట్టు మనం చూస్తాం. కొందరు బైబిల్ పండితుల వివరణ ప్రకారం, ఆ కాలంలో వేశ్యలు మార్గాలపక్కన ముసుగుతో కూర్చుని కొన్ని‌ సుగంధద్రవ్యాలను కాల్చేవారు, వాటిని బట్టి ఆ మార్గంలో వెళ్ళే పురుషులు వారు వేశ్యలని గ్రహించి వారితో వ్యభిచరించేవారు.

ఆదికాండము 38:15-19
యూదా ఆమెను చూచి, ఆమె తన ముఖము కప్పుకొనినందున వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు బోయి, ఆమె తన కోడలని తెలియక నీతో పోయెదను రమ్మని చెప్పెను. అందుకామె నీవు నాతో వచ్చినయెడల నాకేమి యిచ్చెదవని అడిగెను. అందుకతడు నేను మందలో నుండి మేకపిల్లను పంపెదనని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైన కుదువ పెట్టినయెడల సరే అని చెప్పెను. అతడు నేను నీయొద్ద ఏమి కుదువ పెట్టవలెనని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు దాని దారమును నీ చేతికఱ్ఱయునని చెప్పెను. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను. ఆమె అతనివలన గర్భవతియాయెను. అప్పుడామె లేచిపోయి తన ముసుకు తీసివేసి తన వైధవ్యవస్త్రములను వేసికొనెను.

ఈ వచనాలలో యూదా తామారును వేశ్యగా భావించి ఆమెతో వ్యభిచరించడానికి ఒక మేకపిల్లకు ఒప్పందం చేసుకోవడం, అంతవరకూ తన వస్తువులు కొన్ని‌ ఆమెదగ్గర కొదువపెట్టడం మనం చూస్తాం. ఈ సంఘటనలో యూదా, తామారులు ఇద్దరూ దేవుని దృష్టికి పాపం చేసారు. యూదా తన భార్య చనిపోయాక వేరే స్త్రీని వివాహం చేసుకుని ఆమెతో కలిసుండవచ్చు, కానీ అలా చెయ్యకుండా ఒక వేశ్యతో వ్యభిచరించాలనుకున్నాడు. తామారు కూడా యూదా తనకు చేసిన వాగ్దానం విషయంలో తప్పిపోయినప్పుడు అతడిని ముఖాముఖిగా నిలదియ్యకుండా లేదా ఆ ఊరిలోని పెద్దమనుషులను ఆశ్రయించి న్యాయం పొందుకోకుండా తన మామతో కలసి గర్భవతి అవ్వాలనుకుంది. కాబట్టి వీరిద్దరూ దేవుని దృష్టికి హేయమైన వ్యభిచారమే చేసారు.

ఈ సంఘటనపై కొందరు బైబిల్ వ్యతిరేకులు బైబిల్ లో మామా కోడళ్ళ వ్యభిచారం గురించి ఉంటుందని హేళన చేస్తుంటారు కానీ వాస్తవానికి ఇది బైబిల్ కి ఉన్న యథార్థతను నిరూపిస్తుంది. ఈ గ్రంథంలో దేవుని పిల్లలుగా పిలవబడినవారు తప్పుచేసినప్పటికీ దేవుడు వారి చరిత్రను తెలియచేసేటప్పుడు ఆ పాపాలను దాచిపెట్టకుండా బహిర్గతం చేసాడు. దీనిద్వారా ఆయన మనకు మీరు అలా చెయ్యవద్దని బోధిస్తున్నాడు తప్ప చెయ్యమని ప్రోత్సహించడం లేదు ఈ వ్యాసం చదండి.

హిందూ మతోన్మాదుల అశ్లీలపు ఆరోపణలకు బైబిల్ సమాధానాలు

ఆదికాండము 38:20,21 తరువాత యూదా ఆ స్త్రీ యొద్దనుండి ఆ కుదువను పుచ్చుకొనుటకు తన స్నేహితుడగు అదుల్లామీయునిచేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు. కాబట్టి అతడు మార్గమందు ఏనాయిమునొద్దనుండిన ఆ వేశ్య యెక్కడనున్నదని ఆ చోటి మనుష్యులను అడుగగా వారు ఇక్కడ వేశ్య యెవతెయు లేదని చెప్పిరి.

ఈ వచనాలలో యూదా తాను తామారుకు ఇచ్చినమాట ప్రకారం ఆమెకు తన స్నేహితుడి ద్వారా ఒక మేకపిల్లను పంపడం ఆమె కనిపించకపోవడం వల్ల అతను వెనక్కు రావడం మనం చూస్తాం. ఇక్కడ యూదా స్నేహితుడు యూదా చేసిన పాపానికి సహకారిగా వ్యవహరిస్తున్నాడు. ఇలాంటి స్నేహితులు‌ ఉండడం వల్ల కూడా యూదా ఆవిధంగా ప్రవర్తించియుండవచ్చు.

1 కోరింథీయులకు 15:33 మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును.

మనం చేసే తప్పులకు సహకారులుగా ఉండేవారూ వాటిని ప్రోత్సహించేవారూ మనకు నిజమైన స్నేహితులు కారు. మనం తప్పు చేస్తున్నప్పుడు దానిని సరిచేసే ప్రయత్నం చేసేవారే నిజమైన స్నేహితులు.

సామెతలు 27:6 మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును.

ఆదికాండము 38:22,23
కాబట్టి అతడు యూదా యొద్దకు తిరిగి వెళ్లి ఆమె నాకు కనబడలేదు. మరియు ఆ చోటి మనుష్యులు ఇక్కడికి వేశ్య యెవతెయు రాలేదని చెప్పిరని అనినప్పుడు యూదా మనలను అపహాస్యము చేసెదరేమో; ఆమె వాటిని ఉంచుకొననిమ్ము. ఇదిగో నేను ఈ మేకపిల్లను పంపితిని, ఆమె నీకు కనబడలేదు అనెను.

ఈ వచనాలలో యూదా తన స్నేహితుడు తనదగ్గరకు తిరిగివచ్చి నువ్వు చెప్పిన వేశ్య నాకు కనబడలేదని చెప్పినప్పుడు ఆమెకోసం ఇంకా వెదికితే ప్రజలు తనను అపహాస్యం చేస్తారేమో అని భయపడి ఆ విషయాన్ని అంతటితో విడిచిపెట్టడానికి సిద్ధపడడం మనం చూస్తాం. దీనిప్రకారం యూదాకు వేశ్యతో వ్యభిచరించడం అపహస్యం చేసే తప్పిదమని బాగా తెలుసు. అతను ఇక్కడ తాను చేసిన తప్పిదాన్ని బట్టి ప్రజలు అపహాస్యం చేస్తారని దిగులుపడుతున్నాడు తప్ప దేవుని దృష్టికి పాపమని మాత్రం పశ్చాత్తాపపడడం లేదు. కాబట్టి విశ్వాసులుగా మనమైతే ఎవరో మనల్ని అపహాస్యం చేస్తారని, శిక్షిస్తారని కాకుండా దేవునిపరిశుద్ధతను బట్టి చెడుకు దూరంగా ఉండాలి.

1 పేతురు 1:14-16 నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీ కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.

ఆదికాండము 38:24
రమారమి మూడు నెలలైన తరువాత నీ కోడలగు తామారు జారత్వము చేసెను; అంతేకాక ఆమె జారత్వము వలన గర్భవతియైనదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా ఆమెను బయటికి తీసికొని రండి, ఆమెను కాల్చివేయవలెనని చెప్పెను.

ఈ వచనంలో యూదా తన కోడలైన తామారు జారత్వం చేసి గర్భవతి అయ్యిందని తెలుసుకుని ఆమెను సజీవదహనం చెయ్యడానికి ప్రయత్నించడం మనం చూస్తాం. ఎందుకంటే ఆమె చేసిన పని తన కుటుంబప్రతిష్టను దిగజార్చేదిగా అతను భావించాడు. తన భార్య చనిపోయాక వేశ్యతో వ్యభిచారం చెయ్యడానికి సిద్ధపడిన ఈ యూదా తన చిన్నకుమారుడిని ఆమెకు ఇవ్వకుండా విధవరాలిగా ఉంచడంవల్లే తాను అలా చేసిందని మాత్రం ఆలోచించలేకపోయాడు. ఇక్కడ మానవ పతన స్వభావం మనకు కనిపిస్తుంది. సాధారణంగా మనం మన పొరపాట్లను కప్పిపుచ్చుకుంటూ ఇతరులవి ఎత్తిచూపాలి అనుకుంటాము‌. ఇది దేవునిపిల్లల లక్షణం కాదు.

ఆదికాండము 38:25,26
ఆమెను బయటికి తీసికొని వచ్చినప్పుడు ఆమె తన మామయొద్దకు ఆ వస్తువులను పంపి ఇవి యెవరివో ఆ మనుష్యుని వలన నేను గర్భవతినైతిని. ఈ ముద్ర యీ దారము ఈ కఱ్ఱ యెవరివో దయచేసి గురుతు పట్టుమని చెప్పించెను. యూదా వాటిని గురుతు పట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటె నీతిమంతురాలని చెప్పి మరి యెప్పుడును ఆమెను కూడలేదు.

ఈ వచనాలలో తామారు ముందు జాగ్రతగా యూదా దగ్గర నుండి తీసుకున్న వస్తువులను అతనికి చూపించడం, యూదా కూడా ఆమె తనవల్లే గర్భవతి అయ్యిందని గ్రహించి తన తప్పును ఒప్పుకోవడం మనం చూస్తాం. పైగా అతను జీవితంలో మరలా ఆమెతో‌ కలసి ఉండలేదు. బైబిల్ లో మామాకోడళ్ళు వ్యభిచారం చేసారని అపహాస్యం చేసేవారు, ఇక్కడ యూదా తన కోడలు తనవల్లే గర్భవతి అయ్యిందని తెలుసుకుని మరలా అమెతో ఎందుకు కాపురం చెయ్యలేదో గమనించాలి.

ఆదికాండము 38:27-30
ఆమె ప్రసవకాలమందు కవల వారు ఆమె గర్భమందుండిరి. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచెను గనుక మంత్రసాని ఎఱ్ఱనూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటికి వచ్చెనని చెప్పెను. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చెను. అప్పుడామె నీవేల భేదించుకొని వచ్చితివనెను. అందు చేత అతనికి పెరెసు అను పేరుపెట్టబడెను. తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికివచ్చెను. అతనికి జెరహు అను పేరు పెట్టబడెను.

ఈ వచనాలలో తామారుకు ఇద్దరు కవలపిల్లలు జన్మించడం మనం చూస్తాం. ఈ ఇద్దరిలో మొదట జన్మించిన పెరెసు వంశంలోనే ప్రభువైన యేసుక్రీస్తు జన్మించారు (మత్తయి 1:1-17). దీనిని బట్టి కూడా కొందరు బైబిల్ విమర్శకులు యేసుక్రీస్తు వంశావళిలో వేశ్యల పేర్లు రాయబడ్డాయని, వారికి పుట్టిన పిల్లల నుండే ఆయన ఈలోకంలో జన్మించాడని అపహాస్యం చేస్తుంటారు. అయితే పరిశుద్ధుడైన దేవుని ముందు వేశ్యలు, వారికి పుట్టిన పిల్లలే కాదు.‌ ఆ వంశావళిలో నిజాయితీగా పెళ్ళి చేసుకుని పిల్లలని‌ కన్నవారు కూడా తమ క్రియలమూలంగానూ, స్వభావసిద్ధంగానూ పాపులే.‌ వారి వంశావళిలో ఆయన జన్మించడానికి అయోగ్యులే (రోమీయులకు 3:10). అయినప్పటికీ దేవుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో పాపులను రక్షించడానికి జన్మించేటప్పుడు పాపులున్న వంశావళినే ఎంచుకున్నాడు. అందుకే మత్తయి యేసుక్రీస్తు వంశావళిని ప్రస్తావిస్తూ ఆ క్రిందనే ఆయన గురించి దూత చెప్పినమాటలు తెలియచేసాడు.

మత్తయి 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.

ఈప్రకారంగా యేసుక్రీస్తు పాపాత్ములున్న వంశావళిలో జన్మించడం ద్వారా తాను ఎలాంటి ఘోరపాపినైనా బేధం లేకుండా కనికరించి రక్షిస్తానని తెలియచేస్తున్నాడు. అందుకే ఆయన వంశావళిలో ఇతర స్త్రీల పేర్లు కాకుండా తామారు పేరూ మోయాబీయురాలైన రూతు పేరు, వేశ్యయైన రాహాబు పేరు మాత్రమే ప్రస్తావించబడ్డాయి. దేవుడైన యేసుక్రీస్తు కలిగున్న నీతి ఆయన స్వకీయ నీతే తప్ప వంశావళిని బట్టి సంక్రమించిన నీతి కాదు. ఆయనకు వంశావళిని బట్టి నీతి రాలేదు, ఆ వంశావళిని బట్టి పాపం కూడా అంటలేదు.

లూకా 1:35 దూత పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును

Add comment

Security code
Refresh

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.